Monday, October 31, 2016

నొసటిగీతను ఎవరుమార్చగలరు?


నొసటిగీతను ఎవరుమార్చగలరు?



సాహితీమిత్రులారా!

ఈ నీతిశాస్త్రశ్లోకం చూడండి-

హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి
లలాట లిఖితా రేఖా పరిమార్ష్టుం నశక్యతే

విష్ణువుగాని, శివుడుగాని, బ్రహ్మగాని,
దేవతలుగాని, ఎవరైనను నుదుట వ్రాసిన
వ్రాతను తుడువలేరు అని శ్లోకభావం.

ఇది ఎంత కష్టమైనదో
నొసటన్ వ్రాసిన వ్రాత కలదా నూరేళ్లు చింతించినన్ 
అన్నడొక కవి. అది నిజమేకదా!


భ్రమరకీటన్యాయరీతిన్ పురిన్


భ్రమరకీటన్యాయరీతిన్ పురిన్



సాహితీమిత్రులారా!


పాండురంగమహాత్మ్యంలో కాశీలో మరణించిన
వారికి పరమశివుడు ఏలాగు చూస్తాడనే విషయం
ఈ పద్యంలో చెప్పబడింది చూడండి -

ప్రాలేయాచలకన్యకావదన శుంభత్పద్మ సౌరభ్యముం
గ్రోలంగల్గియు తుష్టిలేక ముహృత్కోడాబ్జ, సౌగంధ్యలీ
లాలిత్యమ్మును గోరునొక్క సితరోలంబంబు నైజాకృతిన్ 
దాలొంగించు పరాసులన్ భ్రమరకీటన్యాయరీతిన్ పురిన్

పార్వతీముఖపద్మసౌరభమును గ్రోలుచూకూడ తృప్తిచెందక
మునులహృదయపద్మముల సౌగంధమును కోరుకొనుచు
నొకానొక తెల్లతుమ్మెద, ఆ పురి(కాశి)లో కాయము
దొరగిన(విడిచిన)వారిని భ్రమరకీటక న్యాయవైఖరితో
తన ఆకృతి కలిగింపచేయునట, భ్రమరము నిరంతర
భ్రమణ, ఝుంకారములతో కీటకమును తనరూపు
వలె ఎట్లుమార్చునో అట్లే పరమేశ్వరుడును కాశిలో
మరణించినవారికి సారూప్యము నిచ్చును - అని భావం

Sunday, October 30, 2016

తెలుగు వెలుగు


తెలుగు వెలుగు

సాహితీమిత్రులారా!




తన్నీరు బాలాజీగారి తెలుగు వెలుగు
వచనకవిత చూడండి

మనసు మమతలఁ బంచు
మంచి మానవతలఁ బెంచు
అమ్మపాల అమృతసుధ
మన తేటతెలుగుభాష

సామెతల సొంపు
నుడికారపు ఒంపు
జాతీయాల మేళవింపు
మన తెలుగుభాష

అక్షరలక్షల సుమసౌరభాలమాల
అవధాన శ్లేష ధ్వని ప్రక్రియల హేల
రసమయ జనపద ఫలాల వ్రేల
మన ఆంధ్రభాష

కదళీఫలము కన్న
కమ్మని వెన్నకన్న
మామిడితీపికన్న గోరుముద్దల రుచికన్న
మధురమైన మురిపెంపు భాష
మన మాతృభాష

తెలుగుమాట అందరినోట
వెలుగుబాట కావాలి
విశ్వం వినువీధిలో తెలుగు వెలుగు
వేగుచుక్క కావాలి

తమ భార్యలను వదలి పరస్త్రీలను కోరడమా!


తమ భార్యలను వదలి పరస్త్రీలను కోరడమా!



సాహితీమిత్రులారా!





చింతలపూడి ఎల్లన(రాధామాధవకవి) 
తెనిగించిన బ్రహ్మరాజీయంలోనిది ఈ పద్యం.

అమరాధీశుడు స్వర్గమేలడె యహల్యాజారుడయ్యున్ శుచి
త్వము తోడం బందార సంగమము విద్వాంసుల్ని వారింపుటల్
తమ భార్యల్ని యమస్థులై సతతలీలాహీనులం బాయు దో
సములం దోసమలుంచు నేనెరుగనే సందేహమింకేటికిన్

ఒక బ్రాహ్మణుడు పతితుడై దేశసంచారంలో
ఒక బోయదాన్ని మోహించి ఆమెతో
పరదారాసంగమం తప్పుకాదు అని ఈ పద్యం చెప్పాడు.

పూర్వం ఇంద్రుడు గౌతమపత్ని అహల్యతో
వ్యభిచరించి స్వర్గాన్ని పాలించలేదా
పండితులు, ఎప్పుడూ నియమనిష్టలలో
మునిగి, శృంగార విలాసాలకు దూరంగా
ఉండే తమను తమ భార్యలు వదలి ఇతరుల
పొందుకోరతారేమో? అనే భయంతో
పరస్త్రీ సంగమమం పాపమనే నియమం
కల్పించారు అని నాకు తెలుసు. ఇందులో
అనుమానం లేదు - అని పద్యభావం.

విద్యార్థులకు నేర్పేవిద్యా ఫలితాలు ఏవరివి?


విద్యార్థులకు నేర్పేవిద్యా ఫలితాలు ఏవరివి?



సాహితీమిత్రులారా!




భవభూతి ఉతర రామచరితంలోని
ఈ శ్లోకం చూడండి-
విషయం మీకే తెలుస్తుంది.
విద్యనేర్పేవరే ఉపాధ్యాయుని
బాధ్యత అని గతంలో అనేవారు.
నేడు దానికి విరుద్ధంగా మారింది.
ఏది ఏమైనా భవభూతిగారి మాటలను
ఈ శ్లోకంలో చూడండి-

వితరతి గురు: ప్రాజ్ఞే విద్యాం యధైవ తథా జడే
నహి ఖలు తయో ర్ఞానే వృద్ధిం కరో త్యపహంతి వా
భవతి త తయో ర్భూయా న్భేద: ఫలం ప్రతి తద్యథా
ప్రభవతి శుచిర్బింబ గ్రహే మణి ర్న మృదాంచయ:


గురువు తన శిష్యులలో తెలివి కలవానికి బోధించినట్లే
మందబుద్ధిగలవానికి కూడ బోధిస్తాడు. వారిలో ఎవరికీ
జ్ఞానాన్ని కొత్తగా తాను చేర్చడు. మరెవ్వరితెలివిని తగ్గించడు
అయినా ఫలితాల విషయంలో వారిలో పెద్ద భేదం కనిప్స్తుంది
దానికి ఉదాహరణగా ప్రిబింబాన్ని గ్రహించటానికి నిర్మలంగా
ఉన్న మణి సమర్థమైందిగాని మట్టిముద్ద తనపక్కనున్న వస్తువు
ప్రతిబింబాన్ని ఇవ్వదుకదా - అని శ్లోక బావం.

ఇందులో చురుకైన బుద్ధిని మణితోను,
మందబుద్ధిని మట్టిముద్దతోను కవి పోల్చాడు.
దీన్ని బట్టి ఉపాధ్యాయుడు ఎలాంటి వారికైనా
ఒకలానే బోధిస్తాడు కాని
ఆ వ్యక్తికిగల గ్రహణ ధారణశక్తిని బట్టే
ఫలితం ఉంటుందని తెలుస్తుంది.

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి శుభాకాంక్షలు

సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు
దీపావళి శుభాకాంక్షలు

Saturday, October 29, 2016

దక్షపురి యొద్దసప్తగోదావరింబు


దక్షపురి యొద్దసప్తగోదావరింబు



సాహితీమిత్రులారా!

ద్రాక్షారామం వద్ద గోదావరిని
భీమఖండంలో శ్రీనాథుని వర్ణన చూడండి-

వేదండవదన శుండాదండచుళికిత
         ప్రోజ్ఝితాంభశ్చటా ప్లుతనభంబు
దేవగంధర్వాప్సరో వధూటీస్తన
         స్థాసకశ్రీగంధధవళితంబుఁ
గనకసౌగంధికగంధోత్తమాగంధ
         సారనిష్పందపుష్పంధయంబుఁ
జటులవీచీఘటాఝాటడోలారూఢ
         హంససంసన్నినాదాలసంబు
భూరితీరావనీ ఘనీభూత చూత
జాతివకుళవనీ సమాచ్ఛాద్యమాన
బహుళసింధు ధునీవనబకమరాళి
దక్షపురి యొద్దసప్తగోదావరింబు
(భీమఖండము - 1 - 106)


వేదండవదన శుండాదండచుళికిత  
ప్రోజ్ఝితాంభశ్చటా ప్లుతనభంబు =  
వినాయకుడు పుక్కిళించిన
నీటితోనిండిన ఆకాశంగలది.

దేవగంధర్వాప్సరో వధూటీస్తన  
స్థాసకశ్రీగంధధవళితంబుఁ  =
దేవగంధర్వాది స్త్రీలు స్తనములపై రాసికొన్న
కుంకుమాదుల పూతచేత తెల్లనైనది.

గనకసౌగంధికగంధోత్తమాగంధ 
సారనిష్పందపుష్పంధయంబుఁ  =
బంగారు చెంగల్వల వాసనలచే చిరుపాల మొక్క,
మంచిగంధపు మొక్కపైకి కదలని తుమ్మెదలు గలది.

జటులవీచీఘటాఝాటడోలారూఢ  
హంససంసన్నినాదాలసంబు = 
కెరటాలనే ఉయ్యెలలపై
ఊగు హంసల కూతలతో కూడినది.

భూరితీరావనీ ఘనీభూత చూత
జాతివకుళవనీ సమాచ్ఛాద్యమాన
బహుళసింధు ధునీవనబకమరాళి
దక్షపురి యొద్దసప్తగోదావరింబు =
ఒడ్డున మొలిచిన మామిడి, జాజి,
వకుళ వృక్షముల తోపులచే
కప్పబడిన గోదావరిలోని కొంగలు,
హంసలు కలది వృద్ధగౌతమీనది.

ఆయుష్షును హరించేవి ఏవి?


ఆయుష్షును హరించేవి ఏవి?



సాహితీమిత్రులారా!

ఏమీ చేయకపోయినా రోజులు గడిచే
కొద్ది ఆయుష్షు హరించుకుపోతుంది.
అలాకాకుండా మనం చేసే పనులతో
ఆయుష్షు హరించుకుపోయేవి తెలిపే
(నీతులు - రీతులులోని) ఈ శ్లోకం చూడండి-

బాలార్క ప్రేత ధూమశ్చ
వృద్ధ స్త్రీ పల్వలోదకమ
రాత్రం దధ్యన్న భుక్తశ్చ
ఆయు: క్షిణం దినే దినే

రోజు రోజుకూ ఆయుష్షును హరించివేసేవి-
1. ఉదయాన్నే ఎండలో కూర్చోవడం
2. కాలుతున్న శవం నుండి వచ్చే పొగ శరీరానికి తగలడం
3. తన కన్నా పెద్దవయసు స్త్రీతో సంభోగించడం
4. రాత్రిపూట పెరుగన్నం తినడం
   (పెరుగన్నం అంటే ఏమాత్రం నీటిని
     కలుపకుండా పెరుగుతో తినడం.
   నీటిని కొద్దిగా కలుపుకొని తినవచ్చు)

Friday, October 28, 2016

పాతాళమున నున్న బంధురధ్వాంతముల్


పాతాళమున నున్న బంధురధ్వాంతముల్



సాహితీమిత్రులారా!

ఎఱ్ఱాప్రెగ్గడ రచించిన హరివంశంలోని
ఈ పద్యం చూడండి-
ఏటాజరిగే ఇంద్రోత్సవం గోపాలకులు
శ్రీకృష్ణుని మాటలతో మానుకొని
గోవర్ధన పర్వతాన్ని పూజించడంతో
కోపోద్దీపుడైన ఇంద్రుడు వ్రేపల్లె మీద
భయంకరమైన వర్షం కురిపించాడు
ఆ వర్షాన్ని ఈ కవి వర్ణించిన విధం
ఇక్కడ చూడండి.

దిక్కరిణీ బృంద మొక్కట యీనిన
                          పిల్లలు దివిఁబ్రసరిల్లె ననఁగ
గోత్రాచలంబులు చిత్రవాతాహతి
                         వెసఁబెల్లగిలి మీఁదవెలసె ననఁగఁ
బాతాళమున నున్న బంధురధ్వాంతముల్
                         వెడలి భానుని మ్రింగ నడరె ననఁగ
నిల నాల్గుచెఱఁగుల జలధులు నలిరేఁగి
                         కడళుల నభ మెక్కఁ గడగె ననఁగ
నొప్పి యుద్ధురస్థూల పయోధరములు,
దెసల కడపటఁ బొడమి యాకసము మూసి
మెఱుఁగు జోతులు చూడ్కికి మిక్కుటముగఁ
నొదవెఁ బిడుగులు రాలును నుప్పతిల్లె

దట్టమయిన పెద్దమేఘాలు దిక్కుల చివర పుట్టి ఆకాశాన్ని కప్పివేశాయి.
ఇది దిక్కులనే ఆడఏనుగుల గుంపు
ఒక్కసారిగా కనిన పిల్లలు ఆకాశమంతా వ్యాపించినట్లున్నది.
మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం,
వింధ్యం, పారియాత్రం  అనే ఏడు కులపర్వతాలు తీవ్రమైన గాలివల్ల
మొదలంటా లేచి ఆకాశంలో వెలసినట్లుగా ఉంది.
పాతాళంలో ఉన్న దట్టమైన చీకట్లు సూర్యుని మింగడానికి వచ్చినట్లుంది.
భూమి నాలుగు దిక్కులా ఉన్న సముద్రాలు అలలతో ఆకాశం మీదికి
ఎక్కుతున్నట్లుగా ఉంది.
ఆకాశంనిండా మెరుపులు పుట్టాయి. పిడుగులూ రాళ్ళూ పుట్టాయి.


దీన్ని కవి  ఉత్ప్రేక్షాలంకారంలో
ఎంత కమనీయంగా వర్ణించాడో కదా!

చేతలు శూన్యమైన మాటలు


చేతలు శూన్యమైన మాటలు



సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం  చూడండి-

యథాపి పుష్పరాశినా
ముదామాలా గుణేబహు,
ఏవం జాతేన మచ్చేన
తత్తబృంక ఫలం బహం

పువ్వు ఏంత అందంగా ఉన్నా పరిమళం లేనిదైతే
ఏమి ప్రయోజనం అది నిష్ప్రయోజనమేకదా
అలాగే చేతలు శూన్యమైన మాటలు
ఎంత ఇంపుగా ఉన్నా పనకిరానివౌతాయి.


Thursday, October 27, 2016

పురుషుడు చూడకూడనివి


పురుషుడు చూడకూడనివి 


సాహితీమిత్రులారా!


మన పూర్వులు చెప్పిన విషయాలు
ఎంత గొప్పవో తెలుసుకోవడం
వాటిని ఆచరించడం మనం చేయాల్సిన విధి.
సూక్తులు ఎన్ని విన్నా లాభంలేదు
వాటిని వీలైనంతవరకు ఆచరణలో ఉంచాలి
ఇప్పుడు పురుషుడు చూడకూడనివేమిటో
తెలుసుకొందాము

నాం జయతీం స్వనేత్రచ
నచా భక్త్యా మనావృతమ్
నవ శ్యేత్ప్రసవం తీంచ
తేజస్కామో నరోత్తమ:

భార్య కంటికి కాటుక దిద్దుకుంటున్నా,
తలారా స్నానం చేస్తున్నా,
నగ్నంగా ఉన్నా, ప్రసవిస్తున్నా
చూడరాదు. ఇవి పురుషుని
తేజస్సును హరిస్తాయి - అని భావం.

ఆటవెలది


ఆటవెలది

సాహితీమిత్రులారా!


మన తెలుగు సాహిత్యంలో
ఆటవెలదికి ఉన్న ప్రత్యేకతను 
వైద్యం వేంకటేశ్వరాచార్యులవారి 
ఆటవెలదుల్లోనే చూడండి

పొసగనెసగిరన్న! - పోతన్న వేమన్న
ఆటవెలది గమన‌ - మలర జేసి
 ‌‌ ‌‌‌‌‌‌‌వారి పదము లెరుగు -వార లీపద్యజ్ఞు
‌ ‌ లున్నమాట వైద్యమన్న మాట

‌ మదికి నింపునింపు - పదసంపదల సొంపు
లలర సాగవలయు - నాటవెలది
పెట్టి రందు కొరకె - పెద్ద లీ పేరునె
ఉన్నమాట వైద్యమన్నమాట

‌ ‌ ‌‌‌‌‌‌‌ సోయగాల నడక - సొంపార బెంపార
హాయి గూర్ప వలయు - నాటవెలది
‌ అటులగాకయున్న- ఆపేరు తగదన్న
ఉన్నమాట వైద్యమన్న మాట

‌ ‌ ‌ తకిట తకిట ధిమిత - తద్ధిమి ద్ధిమితక్క
తత్త తోంత తత్త - తకిట తకిట
యనగ నాటవెలది - నాడించు పద్యజ్ఞు
డున్నమాట వైద్యమన్న మాట

భావసంపదలకు -పదసంపదలతోడు
గాగ నాటవెలది - గమన మరయ
కామితార్థమీయ-గా హాయిగా నొప్పు
నున్నమాట వైద్యమన్న మాట

ఆటవెలది మేలి-మాట గందమలది
మంచి మనిషి జేయు - మనసు కలదు
నార్లవారినుండి- నా దాక నరయుడీ
ఉన్నమాట వైద్యమన్నమాట

Wednesday, October 26, 2016

శరభ స్సాళువ: పక్షిరాజ:


శరభ స్సాళువ: పక్షిరాజ:

సాహితీమిత్రులారా!



శరభం పేరు శైవమతంలో కొందరు
తమ పిల్లలకు భక్తితో పెట్టుకుంటారు.
శరభ పేరుతో రాజులు, కవులు తెలుగువారిలో ఉన్నారు.
తెలుగు సాహిత్యం పోషించిన శరభోజీ, శరభకవి,
శరభాంకుడు మనకు కనిపిస్తారు. అలాంటి
శరభసాళ్వం అనేది ఉగ్రదేవతామూర్తి అని
మంత్రశాస్త్రంలో వర్ణించబడింది
ఆ శ్లోకం చూడండి-

చండార్కౌ ఉగ్రదృష్టి కురిశవర నఖశ్చం చలాత్యుగ్ర జిహ్వా
కాళీ దుర్గాచ పక్షౌ హృదయ జఠరలి గోభైరవో బాడబాగ్నిం:
ఊరుసౌ వ్యాధి మృత్యూ సరభసఖగతి శ్చండ వాతాది వేగ:
సంహర్తా సర్వశత్రూన్ సజయతి శరభ స్సాళువ: పక్షిరాజ:

సమస్త శత్రువులను సంహరించే
శరభ సాళువం సగం శరీరం జంతువు.
సగం శరీరం పక్షి. సూర్యచంద్రులు కన్నులు,
వజ్రమే గోళ్ళు, మెరుపు నాలుక, కాళి-దుర్గ రెక్కలు,
హృదయం భైరవుడు, జఠరం బడబాగ్ని,
వ్యాధి మృత్యువు తొడలు,
చండవాయువే ఆకాశగమనం,
అటువంటి క్రూరమైన, ఘోరమైన మూర్తి అది- అని భావం.

అందమైన కోతిపిల్ల యీ అరవపిల్ల


అందమైన కోతిపిల్ల యీ అరవపిల్ల


సాహితీమిత్రులారా!


మహాకవి శ్రీనాథుని దృష్టిలో పడని ఆడవాళ్ళుండరు.
ఒకమారు వికారంగా ఉన్న ఒక అరవపిల్లను చూచి,
ఆమె ఆహార విహార ప్రవర్తనలు చూచి వెగటుపుట్టి
చెప్పిన పద్యం ఇది చూడండి-

మేత కరిపిల్ల పోరున మేకపిల్ల
పారుబోతుతనంబున పందిపిల్ల
ఎల్లపనులను జెరుపంగ పిల్లిపిల్ల
అందమున కోతిపిల్ల యీ అరవపిల్ల

తిండిలో కరిపిల్ల(ఏనుగుపిల్ల)
పోరులో(పోట్లాడటంలో) మేకపిల్ల
తిరుగడంలో పందిపిల్ల
పనులన్నీ చెరపడానికి పిల్లిపిల్ల
కోతిపిల్లంత అందమైనది యీ అరవపిల్ల
-అని వ్యంగ్యంగా చమత్కరించాడు.

Tuesday, October 25, 2016

నాస్తి శోకసమో రిపు:


నాస్తి శోకసమో రిపు:


సాహితీమిత్రులారా!


రామాయణంలోని ఈ శ్లోకం చూడండి
ఎంత చక్కని సూక్తిని వివరిస్తున్నదో

శోకో నాశయతే ధైర్యం
శోకో నాశయతే శ్రుతమ్
శోకో నాశయతే సర్వం
నాస్తి శోకసమో రిపు:

శోకం ధైర్యాన్ని నాశనం చేస్తుంది
శోకం వివేకాన్ని నాశనం చేస్తుంది
శోకం అన్నిటినీ నాశనం చేస్తుంది
కావున శోకంతో సమానమైన శత్రువులేడు
- అని భావం.

యూరప్ క తెరీ రగోమ్మే కుచ్ ఖూన్ భీహై?


యూరప్ క తెరీ రగోమ్మే కుచ్ ఖూన్ భీహై?


సాహితీమిత్రులారా!


అగ్బర్ అనే ఉర్దూకవి యౌవనంలో
ఉన్నపుడు అంగ్లేయులు మనదేశాన్ని
సంపూర్ణంగా అధికారంలోనికి తెచ్చుకొన్నారు.
సిపాయిల తిరుగుబాటు తరువాత ముసల్మానులకు
ఆంగ్లేయులకు రాజీ కుదిరింది.
అప్పటికే అగ్బర్ ప్రభుత్వోద్యోగి.
కాని నాటి సామాజిక పరిస్థితులను
తన వ్యంగ్యరూపంమైన మాటలతో కవితలల్లేవాడు
ఈ మహాకవి రచనల్లో కొన్ని పంక్తులు చూడండి-

హర్ చంద్ కి కోట్ భీహై పత్లూన్ భీహై
బంగ్లాభీహై పాట్ భీహై సాబూన్ భీహై
లేకిన్ మై తుఝ్ సే పూచ్తా హూఁ హిందీ
యూరప్ క తెరీ రగోమ్మే కుచ్ ఖూన్ భీహై

(కోటూ కలదు. పట్లాం కలదు. బంగ్లా(భవనం)కలదు.
పాత్రలు(పాట్) సబ్బు మొదలైనవన్నీ కలవు.
ఓ భారతీయుడా! నీ రక్తనాళాలలో ఐరోపా రక్తమేమైనా కలదా!)


గోల్యోంకే జోర్ సే కర్తే హైఁ వో దున్యాకో హజ్మ్
ఇస్ నే బెహతర్ ఇస్ గిజాకె వాస్తే చూరణ్ నహీ
(వారు గోళీలు(మందుగుండ్లు - మందుగోళీలు)  
ఉపయోగించి  ప్రపంచాన్ని జీర్ణించుకొంటారు. 
ఈ ఆహారానికి అంతకుమించిన 
చూర్ణంలేదు(అరుగుటకు))

క్యా కహూఁ ఇస్కో మై బద్బఖ్తి యే - నేషన్ కే సివా
ఇస్కో ఆతా నహి అబ్ కుచ్ ఇమిటేషన్ కే సివా

(దీనిని జాతియొక్క దురదృష్టమనక ఏమంటారు
దీనికి అనుకరణ తప్ప ఇంకేదీ రాదు)
(దీనిలో ఆంగ్లపదప్రయోగం చేయబడింది)

Monday, October 24, 2016

భక్తి అంటే ఎలాగుండాలి?


భక్తి అంటే ఎలాగుండాలి?


సాహితీమిత్రులారా!


శ్రీమద్భాగవతాన్ని పరీక్షిన్మాహారాజుకు
శుకమహర్షి వారంరోజుల్లో చెప్పాడు.
అందులో ప్రహ్లాదచరిత్రలో ప్రహ్లాదుని
భక్తిని వివరిస్తూ చెప్పిన పద్యం
భక్తి అంటే ఎలావుండాలో చెబుతుంది.
ఆ పద్యం చూడండి-

పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ చింతనామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁడేతద్విశ్వమున్ భూవరా!

ఓ రాజా! మహానుభావుడైన ప్రహ్లాదునికి మంచినీరు త్రాగేప్పుడు,
మాటలాడేప్పుడు ఆ మాధవుని చింతనే. ఆహారం తీసుకునేటప్పుడు,
 ఆటలాడేప్పుడు కూడా ఆ అచ్యుతుని స్మరణే. నడుస్తున్నపుడు,
నవ్వుతున్నపుడు కూడ నారాయణుని ధ్యానమే. చివరకు నిద్రలో
కూడా ఆ నీరజాక్షుని కలవరింతలే.

ఇది ఆశ్చర్యం కాదు
భక్తికి ఇది సరైన పద్ధతి.
కాని ఏపని చేసినా అంతే ఏకాగ్రతతో చేస్తాంకదా
అది ముఖ్యమైనదంటే ఇలాగే మనం చేస్తుంటాం.
కాని భక్తిలో కాదు.
మరి సినిమాల్లో ప్రేమికులను చూస్తున్నాముకదా!
అదే ధ్యాసగా అండటం ఇదంతా వేరేమీకాదు.
మనం భగవంతుని భక్తికి తప్ప
మిగిలినవాటికి ఇలానే ఉంటాంకదా!
ఏం చేస్తాం మరి.

గజలంటే ఏమిటి?


గజలంటే ఏమిటి?



సాహితీమిత్రులారా!


గజలంటే ఏమిటి ? - అనే ఈ కవిత
తెలుగు గజళ్ళు అనే పుస్తకంలోనిది.
దీన్ని సి. నారాయణరెడ్డిగారు రచించారు. చూడండి-

గజలంటే మనదికాదనే గజిబిజి నీకెందుకు?
పరసీమల డిస్కోలంటే ఉరవడి నీకెందుకు?

ఆకాశం గొడుగు అండగా ఎదుట ఉండగా
కలకాస్తా చెదిరిందంటే అలజడి నీకెందుకు?

ఇంటిలో అందిన మమత మింటిలో పొందిన ఘనత
అంగాలను వేలంవేసే అంగడి నీకెందుకు?

పువ్వేమో భాషరానిది పులకరింత యాసలేనిది
అందమెక్కడుందో తెలిసీ సందడి నీకెందుకు?

ధ్యానమే ఒక అనుభూతి మౌనమే రాయని గీతి
స్వరహృదయం వింటూ వేరే సవ్వడి నీకెందుకు?

మనసులో శాంతం నిలిపీ తనువులో అమృతం నింపీ
చూపులతో ఓయీ 'సినారే' రాపిడి నీకెందుకు?

Sunday, October 23, 2016

ఏది వెలుగు చీకటులకు అవతలున్నది?


ఏది వెలుగు చీకటులకు అవతలున్నది?



సాహితీమిత్రులారా!


హరస్తుతిలోని
ఈ శ్లోకం చూడండి.

యతో భూమి స్తోయం జ్వలనపవనౌ వ్యోమ చ మనో
దిగాత్మనౌ కాల స్సకలమపి జాతం జగ దిదమ్
యదాస్తే పారే వాఙ్మనస మహసాఞ్చా2పి తమసామ్
తదేవ త్వం బ్రహ్మే త్యభిదధతి సన్త: పశుపతే

ఓ ఈశ్వరా! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, 
దిక్కులు, ఆత్మ, కాలము ఈ ప్రపంచమంతయూ దేనివలన పుట్టెనో, 
ఏది అవాఙ్మానస గోచరమో ఏది వెలుగు చీకటులకు ఆవల ఉన్నదో
ఆ నీవే బ్రహ్మమని సత్పురుషులు చెప్పుచున్నారు.

జానణదేవర! శ్రీపంచశర విరించి!


జానణదేవర! శ్రీపంచశర విరించి!



సాహితీమిత్రులారా!

భీమఖండంలో శ్రీనాథమహాకవి
దక్షారామంలోని వేశ్యలను
బ్రహ్మదేవుడు ఎలా సృజించాడో
ఈ పద్యంలో వివరించాడు చూడండి.

అంబుధరశ్రేణి, హరిలాంఛనరేఖ, 
                           కమ్రకార్ముకవల్లి, కామతల్లి
జలచరద్వందంబు, చంపకప్రసవంబు, 
                          బింబంబు, దాడిమబీజరాజి
శష్కులీయుగళంబు, చారుదర్పణములు, 
                          శంఖంబుబిసములు, జలరుహములు
పసిడి కుంభములు, బయలంబువీచులు, 
                          పుష్కరావర్తంబు, పులినతలము
కదళికా హేమకాహళకచ్ఛపములు
మణులబంతులు తారకామండలములు
సంఘటించి పురంబు వేశ్యల సృజించె
జాణదేవర! శ్రీపంచశర విరించి!
                                         (భీమఖండము - 1-94)

మబ్బులు, చంద్రకళ, హరివిల్లు, కామతల్లి చక్రవాకములజంట,
సంపంగెపువ్వు, దొండపండు, దానిమ్మగింజలు, బయటిచెవి దొప్పలు,
సుందరమైన అద్దములు, తామరతూండ్లు, తామరపువ్వులు,
బంగారుకుండలు, ఆకాశము, కెరటాలు, నీటిసుడులు,
ఇసుకతిన్నెలు, అరటికంబము, బంగరుమద్దెల, తాబేలు,
మణులబంతులు, నక్షత్రమండలము, మన్మథుడు
 వీటన్నింటిని సంఘటించి చాతుర్యంగల విరించి(బ్రహ్మ)
దక్షారామంలోని వేశ్యలను సృజించాడు - అని భావం.

(ఇందులో చెప్పినవన్నీ ఉపమానాలే,
ఉపమేయాలు వారి అవయవాలుగా గ్రహించాలి.)

Saturday, October 22, 2016

ఖడీహో సురజ్ కీ తపస్యా రకే


ఖడీహో సురజ్ కీ తపస్యా రకే



సాహితీమిత్రులారా!

ఉర్దూసాహిత్యంలో ఫాయజ్ అనే కవి పేరెన్నిక గన్నవాడు.
ఇతని అసలుపేరు సదరుద్దీన్ మొహమ్మద్.
ఈయన ఢిల్లీ ఆస్థానంలో
ఉన్నత ఉద్యోగిగా పనిచేసినవాడు,
గొప్పవిద్వాంసుడు, శ్రీమంతుడు.
పారసీకంలో అనేక రచనలు చేసినవాడు.
ప్రొఫెసర్ మసూద్ హసన్ రిజ్వీ ఇతని
ఉర్దూకావ్య సంగ్రహాన్ని అమూల్యమైన
పీఠికతో అందించారు.
ఈ కవి  రచనల్లో ఆనాటి సాంస్కృతిక,
సామాజిక జీవన చిత్రాలు చూడ
ముచ్చటగా ఉంటాయి.
ఢిల్లీలోని ఒక ప్రదేశాన్ని వర్ణించిన
ఈ కవితను చూడండి-

హై ఇందర్ కి మానో సభా జల్వగర్
కి హర్ నార్ దిస్తీ హై రంభాసొఁవర్
కమర్ పర్ జో పడ్తే హై సబ్ మూయె-సర్
ఉనా బీచ్ మిల్ జాతా మూయే-కమర్
లజాతీహైఁ జూఁ అప్సరా జీకో చల్
కీ దేఖ్ ఉన్కో పానీమె దిల్ జాయె జల్
హర్ ఎక్ నార్ సూరజ్ సి శోభా ధరే
ఖడీహో సురజ్ కీ తపస్యా కరే

దీని భావం ఈవిధంగా ఉంది -
ఇంద్రుని సభ శోభాయమానమై ఉన్నట్లున్నది.
ప్రతి స్రీ రంభకంటె అందకత్తె.
నడుముపై శిరోజాలు పడినప్పుడు
శిరోజమువంటి నడుమందే ఎక్కడో లుప్తమైపోయినది.
వారు అప్సరసలవలె హృదయాన్ని బాధిస్తారు.
వీరిని నీటిలో చూడగా హృదయం దహించుక  పోతుంది.
ప్రతి స్త్రీ సూర్యనివంటి శోభకలది.
నిలుచుండి సూర్యుని గూర్చి
తపస్సు చేస్తున్నట్లుంటుంది.

భవభూతి కాళిదాసులలో ఎవరు ఎక్కువ?


భవభూతి కాళిదాసులలో ఎవరు ఎక్కువ?

సాహితీమిత్రులారా!


ఈ కథ వినండి. ఒకమారు కాళిదాసు
భవభూతి తమతమ కావ్యాలను తీసుకొని
సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళారట. తమలో
ఎవరు గొప్పనో తేల్చుకోవటానికి. అదే ఆమెను అడిగారు.
అప్పుడు ఆమె ఒక త్రాసు తెప్పించి అందులో
వారిద్దరి కావ్యాలను త్రాసులో చెరోవైపు ఉంచింది.
భవభూతి కావ్యంగల వైపు కొంచెం పైకి లేచిందట.
అది చూచి ఆమె వెంటనే తన చెవిపైనుండే కలువపూవును
తీసి కొంచెం విదిలించిందట. వెంటనే దాన్నుండి
ఒక తేనె బిందువు ఆ కావ్యంపై పడిందట.
వెంటనే రెండువైపులా సమానమైనవట.
ఈ వృత్తాంతాన్ని భోజప్రబంధం అనే కావ్యంలో
భల్లాలసేనుడు వివరిస్తూ
సరస్వతిని ప్రార్థించిన
ఈ శ్లోకం చూడండి-
అహోమే సౌభాగ్యం మమచ భవభూతేశ్చ భణితి
తులాయామరోప్య ప్రతిఫలతి తస్యాం లఘిమని
గిరాం దేవి సద్య: శ్రుతి కలిత కల్హార కళికా
మ ధూళీ మాధుర్యం క్షిపతి పరిపూర్త్యై భగవతి

కాళిదాసు కాళీభక్తుడు, భవభూతి సరస్వతీ ఉపాసకుడు.
అది తెలిసిన సరస్వతి తన భక్తుడైన భవభూతిని కాళిదాసుకంటె
 తేలిక కాకుండా ఆ విధంగా కాపాడుకున్నది.
కావున అటువంటి సరస్వతిని నేను వాక్కుకొరకు ప్రార్థిస్తున్నాను.


ఇందులో కాళిదాసు భవభూతి సమకాలీనులుకాదు కాని
అభిజ్ఞానశాకుంతలం, ఉత్తరరామచరితం రెండింటిని తులనాత్మకంగా
చూస్తే నాటక కల్పనలో ఉత్తరరామచరితం  శాకుంతలం కంటె కొంచె తగ్గినా
దానిలోని భాషాగౌరవం చేత రసస్పూర్తిచేత శాకుంతలానికి సరితూగుతుందని
ఈ కల్పన యొక్క సారాంశం

Friday, October 21, 2016

మృదూని కుసుమాదపి


మృదూని కుసుమాదపి

సాహితీమిత్రులారా!

భవభూతి ఉత్తరరామచరిత నాటకంలో
రాముని స్వభావంలోని భేదాలను వర్ణిస్తూ
చెప్పిన ఈ శ్లోకం చూడండి-

వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి
లోకోత్తరాణాం చేతాంసి కోను విజ్ఞాతు మర్హతి

సామాన్యంగా కొందరి హృదయాలు సహజకఠినంగా ఉంటాయి.
వాళ్ళు అన్ని సమయాల్లో అందరితో పరుషంగానే వ్యవహరిస్తారు.
మరికొందరు కోమల స్వభావులుగా ఉంటారు.
వారికి కఠినంగా ప్రవర్తించడం చేతకాదు.
కాని అసాధారణ మహాపురుషుల
విషయంలో దీనికి భిన్నంగా ఉంటుంది.
ఆయా సందర్భాన్ని బట్టి ఒకసారి కఠినంగాను,
మరోసారి పుష్పంకంటే కోమలంగాను
లోకోత్తర పురుషుల మనసులుంటాయి.
వారి మనసుల తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు
- అని భావం

శ్రీమద్రామాయాణం గంగా............


శ్రీమద్రామాయాణం గంగా............


సాహితీమిత్రులారా!


ఈ చమత్కార శ్లోకం చూడండి-
క్రీ.శ.1182-97 ల మధ్యకాలంలో, జయంతిపురాన్ని
పాలించిన కంబవంశరాజు కామదేవుని ఆస్థానంలో
కవిరాజు ఉండేవాడు. ఈ కవి రాఘవపాండవీయం అనే
ద్వ్యర్థికావ్యాన్ని రామాయణ మహాభారతకథలను జోడించి
13 సర్గలలో 668 శ్లోకాలతో రాశాడు.
 ఈ కవిని గురించి చెప్పిన శ్లోకం ఇది చూడండి-

శ్రీమద్రామాయణం గంగా భారతం సాగరోపమాన్
తత్సంయోజన కార్యజ్ఞ: కవిరాజో భగీరథ:

శ్రీమద్రామాయణం గంగానది వంటిది.
మహాభారతం విశాలమైన సముద్రం వంటిది.
ఈ రెంటిని కలిపిన కవిరాజు భగీరథునివంటివాడు
 - అని శ్లోక భావం.

Thursday, October 20, 2016

మహిళ ఆసక్తురాలైతే



మహిళ ఆసక్తురాలైతే


సాహితీమిత్రులారా!

ప్రాకృతంలోని భవభావన అనే గ్రంథంలో 12 భావనలున్నాయి.
దీనిని క్రీ.శ. 1112 న మలధారి హేమచంద్రసూరి రచించాడు.
అందులోని సూక్తులలో ఇప్పుడు ఒకటి చూద్దాం-

మహిలా హు రత్తమేత్తా ఉచ్చుఖండం వ సక్కరా చేవ
హరఇ విరత్తా సా జీవియంపి కసిణాహిగరలవ్వ

మహిళ ఆసక్తురాలైతే
దానిలో చెరకు ముక్కలలోవలె,
పంచదారలో వలె తీపి ఉంటుంది.
ఆమె విరక్త అయితే కృష్ణసర్పం వలె
దాని విషం ప్రాణాంతకమౌతుంది- అని భావం.

ఇది వెయ్యి సంవత్సరాల క్రిందటి మాటకదా!
ఇప్పుడేమైనా మార్పుందేమో లేక
ఇదే నిజమో అనుభవజ్ఞులు తెలియగలరు.

రాజ దర్శనం చేయించిన పద్యం


రాజ దర్శనం చేయించిన పద్యం



సాహితీమిత్రులారా!


గౌడ డిండిమభట్టును ఓడించటానికి వెళ్ళిన శ్రీనాథునికి
ప్రౌఢదేవరాయలవారి దర్శనమే దొరకటం కష్టమైంది.
ఎన్నో ప్రయత్నాలు చేసిచేసి విసిగివేసారి ఏమిచెయ్యాలో
దిక్కుతోచక ఆలోచించగా ఆలోచించగా చివరకు
ఒక వెలుగురేఖ తోచింది.
ఎవరో ఒకరిద్వారా ఈ క్రింది సవాలు పద్యం రాజుగారికి చేర్చగలిగాడు.
అదే రాజదర్శనానికి మార్గమయింది కలిగించింది.
ఆ పద్యం-

డంబు సూపి ధరాతలంబుపై దిరుగాడు కవిమీద గాని నా కవచమేయ
దుష్ప్రయోగంబులు దొరకొని చెప్పెడు కవి శిరస్సున గాని కాలు చాప
సంగీత సాహిత్య సరస విద్యలు నేర్పు కవుల రొమ్ములు గాని కాల్చి విడువ
చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు కవి నోరు గాని వ్రక్కలు గదన్న
దంట కవులకు బలులైన యింటి మగడ
కవుల వాదంబు వినవేడ్క గల్గెనేని
నన్ను బిలిపింపు మాస్థాన సన్నిధికిని
లక్షణోపేంద్ర!  ప్రౌఢరాయక్షితీంద్ర!

చివరి అస్త్రంగా ప్రయోగించాడు విజయం పొందాడు
డిండిమభట్టు కంచు ఢక్కను పగులగొట్టించాడు
కవిసార్వభౌమ - బిరుదాన్ని కైవశం చేసుకున్నాడు.

Wednesday, October 19, 2016

బాలగోపాల! కరుణాలవాల!


బాలగోపాల! కరుణాలవాల!



సాహితీమిత్రులారా!

పుసులూరి సోమరాజ కవి బాలగోపాలుని పేర
రచించిన శతకంలోని పూర్వకవుల స్తుతి చూడండి.

ప్రాచేతసార్పిత రామాయాణము భంగి
                     వ్యాస కల్పిత భాగవతము మాడ్కి
ద్రావిడ వాఙ్మయోదార వేదమురీతి
                     నారద మధురగానంబు సరణి
లీలాశుక స్తుతి లాలన ప్రక్రియ
                    జయదేవకవి సరస్వతి విధమున
బమ్మెర పోతన్న భారతీక్రమమున 
                    దాసగీత ప్రబంధముల పోల్కి
బాల కృష్ణాంఘ్రి దాసోక్త పద్యశతకము
దయను కనుగొను మాచంద్రతారకముగ
బాలగోపాల! కరుణాలవాల! నీల
శైల పాలావనీపాల చారులీల

ఈ కవి సంస్కృతాంధ్ర తమిళ కర్నాట కవులను
స్మరించడం గమనించదగ్గ విషయం
అందులోనూ భక్తకవులను మాత్రమే స్తుతించాడు.

ఈ కవి నందనందన శతకం లోని ఈ పద్యం చూడండి.
గోపికా కృష్ణుల దివ్యవిహార లీలలను
రమణీయంగా వర్ణించిన తీరు గమనించండి.

పుక్కిట తమ్ములం బడుగు బోటికి నోటికి నియ్య జూచు వే
రొక్కతె కోపగింప కనకోత్పల మాలిక లిచ్చినట్టి మే
లిక్కడ చూప వచ్చితి బళీ యను రాధిక నూరడించు నీ
చక్కదనంబు జూడ మనసైనది చూపుము నందనందనా!

కృష్ణుడు తాంబూలం వేసుకున్నాడు.
ఒక గోపిక తన కిమ్మని అడిగితే ఆమె నోటికి అందించాడు.
దీన్ని చూసి ఇంకో గోపికకు కోపం వచ్చింది.
ఆమె అలుక తీర్చటానికి తాను ధరించిన
చంపకోత్పలమాలలు ఇచ్చాడు.
ఇటువంటి చేతలు, చాతుర్యాలు
నా దగ్గరా - అనే రాధను ఊరడించే
నీ సౌందర్యం చూడాలని మనసైంది.
నాకు చూపించవలసింది - అని
తానూ ఒక గోపిక అయి కవి అర్థిస్తున్నాడు.



రవికాననిచో కవిగాంచునే గదా!


రవికాననిచో కవిగాంచునే గదా!



సాహితీమిత్రులారా!




రాయలవారి భువనవిజయంలో ఇచ్చిన సమస్య
రవికాననిచో కవిగాంచునే గదా!

భట్టుమూర్తి పూరణ చూడండి-
ఆ రవి వీరభద్రు చరణాహతిడుల్లిన బోసి నోటికిన్
నేరడు రామలింగ కవి నేరిచెబో మన ముక్కుతిమ్మన
క్రూరపదాహతిన్ దెగిన కొక్కెర పంటికి దుప్పి కొమ్ము ప
ల్గారచియించె నౌర! రవి కాననిచో కవి కాంచునే గదా!

దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది.
అదేమంటే ఒకరోజు తెనాలి రామలింగ(కృష్ణ)కవి
ముక్కుతిమ్మన ఇంటికి వెళ్ళిన సమయంలో
ముక్కుతిమ్మన ఉయ్యెలలో కూర్చొని ఊగుతున్నాడట.
రామలింగకవి "తాతా ఊతునా?" అని అడిగాడట.
దానికి తిమ్మనగారు సరేనన్నారు. కాని రామలింగడు
తాంబూలము వేసికొన్నవాడు వెంటనే తిమ్మన పై ఉమిచాడట.
 దానితో తిమ్మనకు కోపం వచ్చి ఊగుతున్న ఊయలనుండి
అలాగే కాలితో ఒక్కతన్ను తన్నాడట దానితో రామలింనికి పన్ను
ఊడిందట అది ఎవరికీ తెలియకుండా వెంటనే దుప్పికొమ్ముతో
పన్ను చేయించుకొని పెట్టుకొని రాజసభకు వచ్చాడట.
ఈ కథంతా దూరంనుండి గమనించిన భట్టుమూర్తి
సమస్యపూరణలో గుట్టురట్టు చేశాడు.

దక్షయజ్ఞంలో పూష- అనే సూర్యుని వీరభద్రుడు 
దంతాలుడేట్లు కొట్టాడు. అదే విధంగా రామలింగకవికి 
తిమ్మనగారు దంతమూడేవిధంగా క్రూరమైన తనపాదంతో తన్నాడు 
దానితో తెనాలి రామలింగకవికి దుప్పికొమ్ము పన్నైనదని, 
రవి చూడకపోయినా కవి చూడగలడని పూరణలోని భావం.

Tuesday, October 18, 2016

చుట్టినవారు కావలె యశోవిభవంబులు పొందగా వలెన్


చుట్టినవారు కావలె యశోవిభవంబులు పొందగా వలెన్



సాహితీమిత్రులారా!


విజయవాడలో ఒక ప్రముఖుడు
విదేశాలకు వెళ్ళే సందర్భంలో
ఆచార్య ఉత్పల సత్యనారాయణాచార్యులుగారు
చెప్పిన పద్యం చూడండి
ఎంత శృంగార మధురిమ,
 చాతుర్యం చోటుచేసుకున్నాయో

పుట్టిన చోట నిల్చి పొలుపొందుట కేవల మాడుదాని చ
న్కట్టుకు మాత్రమే తగును గాని మనీషులు, దూర దేశముల్
మెట్టినవారు ద్వీప పటలీవృత్త భూవలయంబు నెల్లనుం
జుట్టినవారు కావలె యశోవిభవంబులు పొందగా వలెన్

పుట్టిన చోటే ఉండి శోభించదగినవి
కేవలం ఆడవారి కుచాలేగాని
మనీషులు(విద్వాంసులు, బుద్ధిమంతులు)
అయినవారు, దూరదేశాల్లో మెట్టినవారు
ప్రపంచమంతా తిరిగి కీర్తిప్రతిష్ఠలను
సంపాదించాలంటారు కవిగారు.


తోయజశాత్రవ మిత్ర బింబముల్


తోయజశాత్రవ మిత్ర బింబముల్



సాహితీమిత్రులారా!


విజయవిలాసములోని సాయంకాల వర్ణన పద్యం చూడండి-

అంగజరాజు పాంథ నిచయంబుపై విజయం బొనర్ప నేఁ
గంగఁ దలంచునంత మునుఁగల్గఁగ దాసులు పట్టు జాళువా
బంగరు టాలవట్టముల భంగిఁగనంబడెఁ బూర్వ పశ్చిమో
త్తుంగ మహీధ రాగ్రములఁ దోయజశాత్రవ మిత్ర బింబముల్
                                                           (విజయవిలాసము -1-208)

అంగజరాజు - మన్మథుడు అనే రాజు,
పాంథ నిచయంబుపైన్ - విరహులనే మార్గస్థులమీద,
విజయంబు ఒనర్పన్ - విజయము సాధించటానికి,
ఏఁగంగన్ తలంచునంతన్ - దాడిచేయాలని ఊహించేంతలో,
మునుఁగల్గగన్ - అందరికంటే ముందుగా,
దాసులు - సేవకురులు, పట్టు(కొనే),
జాళువా బంగరు- జాళువాదేశపు మేలైన బంగారుతో చేయబడిన,
ఆలవట్టముల భంగిన్ - సుర్యపాను చంద్రపానులనే రాజ చిహ్నముల విధంగా,
పూర్వ పశ్చిమ ఉత్తుంగ మహీధర అగ్రములన్ -
తూర్పునా పడమటా ఉన్న మిక్కిలి ఎత్తైన కొండల శిఖరములమీద,
తోయజశాత్రవ మిత్ర బింబముల్ - చంద్రుని యొక్కయు
సూర్యుని యొక్కయు బింబములు, కనంబడెన్ - కనబడెను.


మన్మథుడనే రాజు మార్గస్థులను జయించి కొల్లగొట్టటానికి
దాడి చేయడానికి బయలుదేరాలనుకున్నంతలోనే సేవకులు
మున్ముందుగానే సూర్యపాను చంద్రపాను
లనే ఆలవట్టాలలాగ, తూర్పు పడమర కొండలమీద
చంద్ర, సూర్యబింబాలు కనిపిస్తున్నాయని - తాత్పర్యం.

Monday, October 17, 2016

లలితగుణధుర్య! యేనుగు లక్ష్మణార్య!


లలితగుణధుర్య! యేనుగు లక్ష్మణార్య!


సాహితీమిత్రులారా!





భర్తృహరిసుభాషితాలను తెనిగించినవారు
పుష్పగిరి తిమ్మన ఒకరు,
 ఏనుగు లక్ష్మణకవి ఒకరు,
ఎలకూచి బాలసరస్వతిగారొకరు
వీరిలో పుష్పగిరితిమ్మన, ఏనుగు లక్ష్మణకవి
ఇద్దరు మంచి మిత్రులు.
వీరు ఒకరి కవిత్వాన్ని ఒకరు ప్రశంసించుకున్నారు.
వారిమాటల్లోనే చూద్దాం.

తిమ్మకవి లక్ష్మణకవిని ప్రశంసించినది-

భారతీ వదనాంబుజ భ్రాజమాన
కలిత కర్పూర తాంబూల కబళ గంధ
బంధురంబులు నీ మంజుభాషణములు
లలితగుణధుర్య! యేనుఁగులక్ష్మణార్య!

అని ప్రశంసించగా
లక్ష్మణకవి తిమ్మకవిని ఈవిధంగా ప్రశంసించాడు-

హాటకగర్భ వధూ లీ
లాటన చలి తాంఘ్రి నూపురారావశ్రీ
పాటచ్చరములు, తేనియ
తేటలు మా కూచిమంచి తిమ్మయ మాటల్

సమకాలీనులు ఒకరికవిత్వాన్ని
 ఒకరు మెచ్చుకోవడం చాల అరుదు
ఇది అరుదైన విషయమే

నీరజముల్ కుముదంబు లౌను రేల్


నీరజముల్ కుముదంబు లౌను రేల్



సాహితీమిత్రులారా!

విజయవిలాసములోని
ఈ చమత్కారపద్యం చూడండి-

నెల యుదయించునప్పు డల నీరజముల్ కుముదంబు లౌను రేల్
కలువలదాయ రాకకుఁ బగల్ కుముదంబులు నీరజంబులౌఁ
దలఁపఁగ నింత వింత గలదా యని కందువమాట లాడుచున్
బళిర కిరీటి మీఱెఁ దన ప్రౌఢి విశారదుఁ డెన్నుచుండఁగన్
                                                            (విజయవిలాసము -1-207)








అర్జునుడు తన చెలికాడైన 
విశారదునితో అన్న పద్యం ఇది -

రేల్ - రాత్రులందు, నెల - చంద్రుడు, 
ఉదయించునప్పుడు, అల నీరజముల్ - 
ఆ పద్మములు, కుముదంబులు అగున్ - కలువలగును, 
(చెడిన సంతోషము కలవగును అనగా ముడుచుకొనును), 
పగల్ - పగటి యందు, కలువదాయ రాకకున్ - కలువకు 
శత్రువైన సూర్యుడు వచ్చినపుడు, కుముదంబులు - కలువలు, 
నీరజంబులౌన్ - తామరలగును,(రజము(పుప్పొడి)లేనివగును 
అనగా ముడుచుకొనును), తలఁపన్  - ఆలోచింపగా, ఇంతవింత 
గలదా - ఇంత చిత్రం ఉంటుందా - అని విశారదుడు తన, 
ప్రౌఢిన్ - నేర్పును, ఎన్నుచుండగన్ - పొగడుతుండగా, 
కందువ మాటలు - చమత్కారమగు మాటలను, 
ఆడుచు - పలుకుతూ, కిరీటి - అర్జునుడు, 
మీఱెన్ - అతిశయించెను, బళిర - సెబాష్!

విశారదా చూచావా చంద్రుడు వచ్చినపుడు 
తామరలు కలువలవుతాయి. 
సూర్యుడు వచ్చినపుడు కలువలు 
తామరలవుతాయి. ఇంతవింత ఎక్కడైనా ఉందా! 
అని అర్జునుడు చమత్కారంగా అంటూండగా 
విశారదుడు అతని కవిత్వాన్ని మెచ్చుకుంటాడని - భావం

Sunday, October 16, 2016

పరోపకారుల స్వభావము ఎలాంటిది?


పరోపకారుల స్వభావము ఎలాంటిది?



సాహితీమిత్రులారా!




పరోపకారం మిదం శరీరమ్ అన్నది ఆర్యోక్తి.
మరి పరోపకారులకు సంబంధిచి
వారి సహజగుణం  లేక స్వభావం
ఎలాంటిదో తెలియాలంటే  కాళిదాసు చెప్పిన
ఈ శ్లోకం చూడాల్సిందే.

భవన్తి నమ్రా స్తరవ: ఫలోద్గమై
ర్నవాంబుధి ర్దూరవిులంబినో ఘనా:
అనుద్ధతా స్సత్పురుషా స్సమృద్ధిభి:
స్వభావ ఏవైష పరోపకారిణామ్
                            (అభిజ్ఞాన శాకుంతలం -5-13)
ఫలాలు ఎక్కువైనకొలది  వంగుతాయి చెట్లు.
నీటిని ఎక్కువగా ఉన్న మేఘాలు
విశేషంగా  క్రిందికి వంగి ఉంటాయి.
సత్పురుషులకు ఐశ్వర్యం కలిగే కొలది
వినయం కలిగి ఉంటారు.
పరోపకారులకిది స్వభావము కదా - అని భావం

పరోపకారం చేసేవారు వినయంతో
వంగి ఉంటారని గ్రహించాలి.
అదే వారి సహజగుణం లేదా స్వభావం.

సర్వనామాలతో సమస్యలు - పూరణలు


సర్వనామాలతో సమస్యలు - పూరణలు


సాహితీమిత్రులారా!
సర్వనామాలసమస్యలను పూరించడం కొంత క్లష్టమైన పనే
అలాంటివి గతంలో ఇవ్వబడిన
సమస్యలను వాటి పూరణను ఇక్కడ చూద్దాం

ఒకానొక సమయంలో ఒక సభలో శ్రీనాథమహాకవిని 
పరీక్షించడానికి కుత్సితంగ
"అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱె" - అనే
సమస్యను ఇచ్చారు.
దానికి శ్రీనాథుని పూరణ-

కొందఱు భైరవాశ్వములు కొందఱు పార్థని తేరి టెక్కెముల్
కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింతలున్
కొందఱు కృష్ణ జన్మమునఁ గూసిన వారలు నీ సదస్సులో

నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందరే


భైరవాశ్వములు - కుక్కలు, పార్థుని తేరి టెక్కెముల్ - కోతులు,
ప్రాక్కిటీశ్వరులు - వరాహాలు, కాలుని యెక్కిరింతలు - దున్నపోతులు,
కృష్ణ జన్మమునఁగూసిన వారలు - గాడిదలు, అంటే సభలోని వారు కుక్కలు,
కోతులు, పందులు, దున్నలు, గాడిదలు అని నిందాహేళనం.
=======================================================================

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకమారు వేశ్య(కవయిత్రి) వచ్చి
అష్టదిగ్గజకవులకు సవాలుగా ఒక సమస్యను ఇచ్చింది.
"మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్" - అనేది సమస్య.
ఆ సమస్యను మరుసటి రోజుకు చెప్పేవిధంగా సమయమిచ్చింది.
దీనికి సమాధానం ఎలాగా అని ఆలోచించి తెనాలి రామకృష్ణుని ఆశ్రయించినారు.
దానికి అతడు పెద్దనతో  "రేపు బోగంది వచ్చి సమస్య అడిగినంతలో
మా శిష్యుడు అని మీరు చెప్పగా నేను మీ శిష్యుడనై చెబుతాను" -  అని అన్నాడు.
కచేరి ప్రారంభమైంది పెద్దన తన శిష్యుడు చెబుతాడని చెప్పాడు.
 తెనాలిరామకృష్ణుడు లేచి పద్యాన్ని ఈ విధంగా పూరించాడు.

"కోరిక లుప్పతిల్ల మదిఁగోరిన యట్టి కళా విశేషముల్
 చారు తరంబులన్ రతుల సల్పఁగ నేర్చిన యట్టి జాణ యీ
 వార వధూ శిరోమణి వంతుల వేసుక దెబ్బ తీయుఁడీ
 
మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్"

దీనితో అష్టదిగ్గజ కవులు ఆనందించగా సభ అంతా కరతాళధ్వనులతో వెల్లివిరిసింది. 

===================================================================

పూర్వం నెల్లూరు మండలంలో ఉన్న తెట్టు గ్రామ నివాసి మోచర్ల వెంకన.
వెంకటగిరి సంస్థానంలో యాచభూపతి ఇచ్చిన అనేక సమస్యలకు
పూరణ చేసిన గొప్ప ఆశుకవితా ధురీణుడు. ఆ రాజుగారు ఇచ్చిన
సమస్యలలో ఈ సమస్య ఒకటి- 
"నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్"
దీన్ని రామాయణ, భాగవత, భారతార్థాలలో పూరించమన్నాడు రాజుగారు.
వెంకన్నగారు ఈ విధంగా పూరించారు.

రామాయణార్థం వచ్చేలా పూరణ  -

అనిలజ! జాంబవంత! కమలాప్త తనూభవ! వాయుపుత్ర! యో
పనస సుషేణ! నీల! నల! భానుకులుండగు రాఘవేంద్రుఁడ
ద్దనుజపురంబు వేగెలువ దైత్యులఁజంపగ వేగ రమ్మనెన్

నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

కిష్కింధలో  ఉన్న వానర ప్రముఖులను పేరు పేరున రామచంద్రుడు
రాక్షసులతో వెంటనే యుద్ధం చేసి వారిని సంహరిచడానికి
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
రమ్మన్నాడని భావం వచ్చే విధంగా పూరించాడు.

భాగవతార్థం వచ్చేలా పూరణ -

అనఘ సురేశ! వాయుసఖ! అర్యమనందన! రాక్షసేంద్ర! యో
వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! తాను ర
మ్మను మని చెప్పె మాధవుఁడుమారుని పెండ్లికి మిమ్ము నందరన్

నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

ప్రద్యుమ్నుని పెండ్లికి ఇంద్రుని, అగ్నిని మొదలైన దేవతల నందరిని పేరుపేరున
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
రమ్మన్నాడు కృష్ణుడు అనే భావం వచ్చేలా పూరించాడు.

భారతార్థం వచ్చేలా పూరణ -

అనఘ సురాపగాతనయ! యర్కతనూజ! విచిత్రవీర్యనం
దన! గురుపుత్ర! ద్రోణ! కృప! నాగపురీశ్వర! దుస్ససేన! ర
మ్మనె రాజసూయము యమాత్మజుఁడిప్పుడుచేయఁబూని తా

నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

ధర్మరాజు రాజసూయానికి భీష్ముని, కర్ణుని, ధృతరాష్ట్రుని, అశ్వత్థామ, ద్రోణ,
కృపాచార్య మొదలైన వారినందరిని ధర్మరాజు రాజసూయానికి పేరుపేరున
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ అని
అందరిని పిలువమని చెప్పినట్లు భావం వచ్చేలా పూరించాడు.

దీన్ని బట్టి మోచర్ల వెంకనకవికి ఎంతటి సమయస్పూర్తో! ఎంతటి ఆశుధారయో!

Saturday, October 15, 2016

పదికోటులు బొంకును ప్రత్యహంబిలన్


పదికోటులు బొంకును ప్రత్యహంబిలన్


సాహితీమిత్రులారా!





పెరంబూదూరు రాఘవాచార్యుల వారి చాటుపద్యం చూడండి-
నల్లగొండ జిల్లా చందుపట్ల గ్రామపు దేశముఖ్ నరసింహారెడ్జి,
గ్రామంలోని సీతారామచంద్రస్వామివారి దేవాలయపు భూములను
కబ్జా చేసి అర్చకులైన రాఘవాచార్యుల కుటుంబాన్ని నానాబాధలు పెట్టాడట
ఆ సందర్భములో చెప్పిన పద్యం ఇది.

ఉరగధవుండు ప్రజ్ఞగల యుత్తముడంచు వచింప రెండువే
ల్గరు సగు నాల్కలుండిన నొకప్పుడు గొప్పని బొంకలేడహో
నరుడగు చందుపట్ల నరనాథుడు నర్సని ప్రజ్ఞ యెట్టిదో
గురుతగు నొక్క నాల్క పది కోటులు బొంకును ప్రత్యహంబిలన్


సర్పరాజైన శేషుడు ప్రజ్ఞావంతుడని ఉత్తముడని ప్రసిద్ధి పొందాడు.
అతనికి వేయి తలలు, రెండువేల నాలుకలు ఉన్నాయి. అయినా
అతడు ఒక్క అబద్ధం కూడ పలుకలేడు. కాని మనిషయిన మా గ్రామపు
దొర మాత్రం ప్రతిరోజు ఒక్కనాలుకతోనే పదికోట్లు బొంకులాడుతాడు.
ఆ నరసని ప్రజ్ఞ ఎంత గొప్పదోకదా! - అని భావం

నీ వడికి కంపము నొందుచు నిల్చిపోయె


నీ వడికి కంపము నొందుచు నిల్చిపోయె


సాహితీమిత్రులారా!



అలంకారం కోటంరాజుగారి ఖండికలలో
సెకండ్ల ముల్లు ఒకటి
చూడండి దీనిలోని విశేషమేమో!


పరుగులు బెట్టి యెక్కడికి పోయెదవమ్మ సెకండ్లముల్ల మా
బరువులు దీర్చనా బ్రతుకు భారము మీదెయటంచు నెంచి సం
బరమున నేగుటా తెలియ పల్కుము ముల్కివి గాదె నీవు శ్రీ
కరమగునా త్వదీయ ప్రతిభా గమనోద్ధతి యీ జగాళికిన్


గంటల ముల్లు నీ వడికి గంపమునొందుచు నిల్చిపోయె, చే 
నంటగ నీవ చిక్కెదవె యద్భుతమైన ధురాత్వరోద్ధతిన్
బంటుగనేలవే జగతి బంధుర సింధురమై త్వదీయ శ్రీ
కంటక మాయెగా పరుల కంటికి యాపెఱముండ్ల రెంటికిన్

నిమిషపు ముల్లు పొల్లగుచు నీదెసజూచుచు నిల్చిపోయె, యే
నిమిషములోన నైన నిను నిల్పగ పొల్పగు నట్టి దారికై 
సమయము యెప్పుడంచు మనసాదృఢదీక్షను బూనె కాని దా
ని మనుగడే  జగాన యిటునిల్చుట నీవయటం చెఱుంగునే

పొరుగువాడు పదవి పొందంగ జూచిన 
పరుగు లెత్తువాడు ధరణిలోన 
పదవి పోవు వెనుక పదపడి సంతోష
పడును వానిగుండె బరువుదీరి

మన్మథుడే స్వయంగా రాసిన అక్షరపంక్తి


మన్మథుడే స్వయంగా రాసిన అక్షరపంక్తి


సాహితీమిత్రులారా!




భర్తృహరిసుభాషిత త్రిశతిలోని
శృంగారశతకంలోని ఈ శ్లోకం చూడండి-

ఉద్వత్త: స్తనభార ఏవ, తరళ నేత్రే, చలే భ్రూలతే,
రాగాధిష్ఠిత మోష్ఠపల్లవ మిదం, కుర్వస్తు నామ వ్యథామ్
సౌభాగ్యాక్షరపఙ్త్కి కేవ లిఖితా పుష్పాయుధేన స్వయం
మధ్యస్థాపి కరోతి తాప మధకం రోమావళి: కేన సా

గుండ్రని పెద్దవైన స్తనముల బరువు,
చకచకా కదిలే చూపులు నాకు ఎంత వ్యధను
కలిగిస్తున్నాయో చెప్పలేను మిత్రమా!
అనుక్షణం ఆ స్తనాలు కన్నలే నా మనసులో
మెదులుతూ నాకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
మన్మథుడే స్వయంగా రాసినట్లున్న అక్షరపంక్తిని పోలిన నూగారుతో
కూడిన నడుము మరింత తాపాన్ని కలిగిస్తోంది. ఎర్రని పెదాలు ఊరిస్తున్నాయి.
ఓసి మదన వదనా! నీకిది తగునా!

లోకంలో ఎక్కడైనా పెద్దవైన వస్తువులు
భారాన్ని బాధను కలిగించడం సహజమే
కాని ఉండీ లేనట్లున్న నీనడుముమీది
నూగు రోమాలు కోరిక పుట్టిస్తూ నాకు
మన్మథతాపం కలిగిస్తున్నాయి.
నీ చూపుల చాంచల్యం, నాకు చిత్తచాంచల్యాన్ని
కలిగించడంలో ఆశ్చర్యంలేదు గాని, నీ ఎర్రని పెదవులే
నన్ను ఊరిస్తూ మరింత విరహతాపాన్ని రగిలించడం చిత్రంగా ఉంది.