విపరీతపు వావివరుస
సాహితీమిత్రులారా!
ఒకరోజు భోజమహారాజు ధారానగరంలో విహరిస్తూ
దుర్గాదేవి ఆలయానికి పోగా అక్కడ ఒక యోగిని
ఒక కుర్రవానికి అనేకవిధాల లాలిస్తూ ముద్దుముచ్చట
లాడుతోంది. సర్వసంగ పరిత్యాగిగా ఉండవలసిన ఈమెకు
ఈ సంసారపు జంజాటము ఏమిటి అని అనుకొని. అయినా
ఆవిషయం తెలుసుకొందామని ఆమెతో -
"అమ్మా! ఈ బాలుడు నీకేమి కావాలి? - అని ప్రశ్నించాడు.
దానికి ఆమె రాజును చూచి "మహాప్రభూ! ఈ కుర్రవాడు నాకు సోదరుడు,
మేనల్లుడు, మనుమడు, మామ, కొడుకు,పినతండ్రి, మరిది" - అని చెప్పింది.
ఈ విపరీతపు వావివరుస విని రాజు ఆశ్చర్యపోయాడు. మరునాడు
ఆ యోగిని చెప్పిన వావివరుసను ఒక సమస్యగా
కూర్చి పండితులందరికి ఇచ్చాడు -
సమస్య-
భ్రాత, ర్భ్రాతృవ్య, పౌత్ర, శ్వశుర, సుత, పితృ, వ్యేతి తం దేవరేతి
దీన్నివిన్న పండితులు ఏమీ చెప్పలేక ఉండగా
కాళిదాసు కాళికాప్రసాదంతో ఆ రహస్యాన్ని కనిపెట్టి ఇలా పూరించాడు.
జారోత్పన్నౌ తనయదుహితరౌ, దంపతీ దైవయోగా
ద్యోగిన్యా గర్హితా సా తదనుగమవశాద్యోగినీత్వం ప్రపేదే,
పశ్చాద్భార్యాకృతాంబాజనిత మధ శిశుం లాలయత్యబ్రవీత్సా
భ్రాతర్భ్రాతృవ్య పౌత్ర శ్వశుర సుత పితృవ్యేతి తం దేవరేతి
ఒక ఊరిలో ఒక జారిణి ఉండేది. ఆమె చిన్నవయసులో ఒకనితో
కలిసి ఒక కొడుకును కని అతన్ని పిల్లవాణ్ణి వదిలేసి ఇంకో ఊరిలో
ఇంకొకనితో ఉండెను. అతనివలన ఒక కుమార్తెను కని, వారిని వదలి
మరొక ఊరిలో వేశ్యావృత్తిలో ఉండినది. కొన్నాళ్ళకు ఆమెకు కలిగిన
కొడుకుకు, కూతురుకు దైవయోగంతో వివాహమయింది.
వారి జన్మరహస్యం గురించి ఒక యోగిని తెలియపరచడంతో
ఆ కన్య సంసారాన్ని వదలి యోగిని అయినది.(ఆమె భోజునికి కనిపించినది.)
ఆమె యోగిని అయిన తరువాత ఆమెను వెదకుచూ ఊరూరా తిరుగుతూ
కన్నతల్లి వేశ్యగా ఉన్న ఊరికి పోయి కామావేశంతో వేశ్యగా ఉన్న తల్లితో
కలియగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఆ వేశ్య పిల్లవాన్ని విడిచిపెట్టింది.
ఆ శిశువు ఎట్లో ఈ యోగినికి దొరికాడు. ఆ యోగిని ఆత్మశక్తితో శిశువు
జన్మరహస్యం కనిపెట్టింది కావున ఇన్ని వావివరుసలు చెప్పింది.
వావివరుసలు-
1. సోదరుడు - తన తల్లి అయిన వేశ్యకు కుమారుడు కావున.
2. మేనల్లుడు - తను పెండ్లాడిన తన అన్నకు కొడుకు కావున.
3. మనుమడు - తనతల్లి అయిన వేశ్య తనభర్తకు భార్య అయింది. దీనివల్ల
తనతల్లి తనకు సవతి అయింది. ఆ సవితికి మొదట తనభర్త కొడుకు
కావున
తనభర్త తనకు కొడుకు అతని కొడుకు కావున మనుమడు
4. మామ - తనభర్తకు తల్లి అయిన వేశ్య తనకు అత్త, అత్త మొగుడు(తనభర్త)
తనకుమామ, ఈ వరుసన తనభర్త, ఈ పిల్లవాడు ఒకే గర్భవాసులు
అయినందున మామ.
5. కొడుకు - తనభర్తకు కొడుకు కావున తనకు కొడుకే
6. పినతండ్రి - తనతల్లికి మగడు తనభర్త. తనభర్తకు తనతల్లికి పుట్టినవాడు ఈ శిశువు.
తనతల్లికి భర్త అయిన వరుసలో తనకు తండ్రి, ఆ తండ్రికి ఈ శిశువు తమ్ముడు
కావున పినతండ్రి.
7. మరిది - తనభర్తకు తల్లి అయిన వేశ్య తనకు అత్త ఆ అత్తకు రెండవ కొడుకు.
కావున భర్త తమ్ముడు మరిది
ఇన్ని సంబంధాలను మూడు పాదాలలో ఇమిడ్చి
సమస్యను పూర్తి చేశాడు కాళిదాసు.
అతని ఊహాపోహలకు ప్రతిభా విశేషానికి
భోజరాజు ఆశ్చర్యపడి
గొప్ప సన్మానము చేశాడు.
కాళిదాస కవి *విక్రమాదిత్యుని* ఆస్థాన కవి కదండి !! మరి భోజరాజా ఆస్థానంలో ఎలా ఉండగలడు. అయితే ఈ సమస్య భోజరాజు లేవనెత్తినా .... పూరణ చేసినది ఆ రాజ ఆస్థాన కవి *బుద్ధిసాగరుడు*. ఇది ఆ కవి యొక్క కల్పనాచాతుర్యం. వివరాలకి http://saraswatam.blogspot.com/2018/01/blog-post_18.html మరియు https://www.youtube.com/watch?v=ZhxMy84SJg0 చూడగలరు
ReplyDelete