Tuesday, July 31, 2018

రచనలలో వైజ్ఞానిక దృష్టి అవసరం


రచనలలో వైజ్ఞానిక దృష్టి అవసరం






సాహితీమిత్రులారా!


“చంద్రుడు గుండ్రంగా ఎందుకు కనిపిస్తాడు” అని పిల్లలు అడిగితే తల్లిదండ్రులు ఏం చెపుతారు.

“అమ్మా నేనెట్లా పుట్టాను?” అని అడిగితే తల్లి ఏం చెబుతుంది?

పిల్లలు అనేక సందర్భాలలో అమాయకంగా తల్లిదండ్రులను అడుగుతూ పోతారు. వాటికి సమాధానం చెప్పలేనప్పుడు, నోరుమూసుకో అని గానీ, దేవుడిచ్చాడు అని గానీ, బుకాయిస్తే అది సమాధానం చెప్పినట్లు కాదు. తెలియనప్పుడు తెలుసుకుని చెపుతాను అంటే పోయేదేమీ లేదు. అది సరైన ధోరణి కూడా. అబద్ధాలు, అసత్యాలు కలిపి చెప్పి పిల్లలకు వక్రీకరించే ధోరణి చేయకూడదు. కానీ, చాలామంది తల్లిదండ్రులు ఈ తప్పులే చేస్తుంటారు. వారు చెప్పే విషయాలు పిల్లలకు గాఢంగా నాటుకుపోతాయి. అలాగే తల్లిదండ్రుల మాటలు, సమాజంలో ఇతరుల మాటలు, మూఢనమ్మకాలు, హత్తుకుపోతే పెద్దయిన తర్వాత సైన్సు చదువుకున్నా అవి పోవు. ఈ విషయమై సుప్రసిద్ధ రచయిత చలం తన బిడ్డల శిక్షణలో చాలా స్పష్టంగా వివరించారు. నేటి సైంటిస్టులు, కార్ల్ సేగన్, మైకల్ షర్మర్ వివరిస్తూ పిల్లలపై తెలియని దశలో చెప్పే విషయాల ప్రభావం ఎలా నాటుకపోతుందో  తేటతెల్లం చేశారు. సైన్సులో ఒక విభాగంలో నిపుణుడైనంత మాత్రాన ఆ సైంటిస్టుకు మిగిలిన విషయాలలో స్పష్టత వున్నదని అనుకోరాదు. అందుకే ఒక విభాగంలో సైన్సు చదువుకున్న వ్యక్తి మూఢ నమ్మకాలను పాటిస్తే మనం ఆశ్చర్యపడక్కరలేదు.

తెలుగులో వైజ్ఞానిక విషయాలు చక్కగా వివరిస్తూ లోగడ అనేక రచనలు వచ్చాయి. సుప్రసిద్ధులు అందుకు  పూనుకున్నారు. డా. గాలి బాలసుందర రావు, మహీధర జగన్మోహన రావు, డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, వసంతరావు వెంకటరావు నేడు దేవరాజ్ మహరాజు, నాగసూరి వేణుగోపాల్, వసునందన్ తదితరులు సైన్సును విడమరిచి సులభంగా అందిస్తున్నారు. రచయితలు అవి దృష్టిలో పెట్టుకుంటూ చెడగొట్టకుండా ఉండే ధోరణిలో రచనలు చేయవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక, మాథ్యమిక పాఠశాల స్థాయిలో వైజ్ఞానిక ధోరణి అలవరచి పెంపొందించడానికి పాఠ్య ప్రణాళిక తగనుగుణంగానే రూపొందించారు.

 పిల్లల్ని చెడగొట్టాలని తల్లిదండ్రులెవరూ భావించరు. తాము చెప్పేదంతా వారి మంచికేనని కథలూ గాథలూ నూరిపోస్తారు. అవన్నీ నిజమేనని పిల్లలు నమ్ముతారు. ఎంత సైన్సు చదువుకున్నా చిన్నప్పటి నమ్మకాలు, ఈర్ష్యా ద్వేషాలు, కులాలు, మతాలు, ప్రాంతీయ తత్త్వాలు, రంగు భేదాలు తొలగిపోవడంలేదు. కనుక పాఠాలలో చిన్నప్పటి నుండీ వైజ్ఞానిక విషయాలు ఆకర్షణీయంగా చెప్పటం వలన ఈ దోషం చాలా వరకు తొలగిపోతుంది. నిపుణుడైన శాస్త్రజ్ఞుడు ఇతర విభాగాలలో జరిగేవాటితో సమన్వయీకరణ చేస్తే రాగద్వేషాతీతంగా పాఠాలు పిల్లలకు అందించవచ్చు. కార్ల్ సేగన్, ఐజక్ అసిమోవ్, రిచర్డ్ డాకిన్స్, ఎ.బి.షా., నైల్ డి గ్రాస్, బ్రైన్ గ్రీన్, రచనల నుండి ఈ విషయాలు గ్రహించవచ్చు. పాఠ్యగ్రంథాలు తయారు చేసేటప్పుడు వీటిని సిలబస్ లో ప్రవేశపెడితే అనూహ్య సత్ఫలితాలు లభిస్తాయి.

బి.వి. నరసింహారావు బాలబంధుగా ఈ విషయాలని ఆడిపాడీ చూపెట్టారు. ఆయన రచనలు నేడు లభిస్తున్నవి. వాటిని అమెరికాలోనూ ఆంధ్ర ప్రదేశ్ లోనూ తెలంగాణా లోనూ ఉపాధ్యాయులు స్వీకరించి అనుసరిస్తే చక్కని పరిణామాలు వస్తాయి. ఆధునిక పునర్వికాసానికి ఈ ధోరణులు అవసరం. స్త్రీ రచయితలలో నవలలు, కథలు, నాటికలు, కవితలు నేడు విపరీతంగా వెలువరిస్తున్నారు. వారు కూడా వైజ్ఞానిక ధోరణులను స్వీకరిస్తే సమాజంపై ఇంకా గాఢమైన ప్రభావాన్ని చూపెట్టగలరు. ప్రాచీన కథలు, గాథలు తిరిగి రాసేటప్పుడు పాఠాలలో చేర్చేటప్పుడు అవి కథలని, యథాతథంగా జరిగినట్లు నమ్మరాదని స్పష్టం చెయ్యాలి.

వైజ్ఞానిక ధోరణిలో గొప్ప సుగుణం ఏమంటే ప్రపంచంలో ఎక్కడ ఎవరు కనుగొన్నా అది అందరికీ అందించటం, ఆ విషయంలో ఎలాంటి అరమరికలు లేకపోవడం చెప్పుకోదగిన అంశం. అందువలన వైజ్ఞానిక ధోరణి అనేది పిల్లల స్థాయి నుండి అలవరచాలి. అమెరికా సైన్సు, అమలాపురం సైన్సు, అదిలాబాదు సైన్సు అని వుండదు. ఎక్కడ ఎవరు కనుగొన్నా అందరికీ అందించటం, అంటరానితనాన్ని పాటించకపోవడం, కుల మత దేశ సంకుచిత తత్వాలను దూరంగా పెట్టి అందరికీ విజ్ఞానాన్ని విప్పార చేయటం సైన్సు సుగుణం. అదే ధోరణి రచయితలు, రచయిత్రులు బాగా వ్యాపింప చేయాలి.
----------------------------------------------------------
రచన - ఇన్నయ్య నరిశెట్టి, 
మధురవాణి త్రైమాసిక పత్రిక సౌజన్యంతో

Monday, July 30, 2018

షికారి(కథ)


షికారి(కథ)




సాహితీమిత్రులారా!



ఈ కథ చదవండి-

గప్పుడు పొద్దుగూకి నాలుగొట్టిండ్రు కావచ్చు. నేను గప్పుడే బడి కాడ్నించి అచ్చిన. బాపు కుక్కి మంచంల కూకోని ఏందొ ఆలోచన జేత్తండు. అమ్మ అంటింట్ల యేదొ సగవెడ్తంది. శాయ్ వెడ్తున్నదో ఏందొ, గిన్నెల సప్పుడు గలగల ఇనవడ్తంది. ఇంట్ల ఎవ్వలు లేరు, మే దప్ప. అన్నలు పట్నంల సదువుకుంటున్నరు. అక్కలు పెండ్లిల్లు చేసుకోని అత్తగారింటి కాడ ఉంటున్నరు. పండ్గకో పబ్బానికో అత్తరు. గప్పుడు ఇల్లంత కలకల లాడ్తది.

నేను అంటింట్లకు అరుగు మీదికీ కోడ్రిగానోలె అటూ ఇటూ తిర్గుతన్న. నా మన్సంత ఇంటి ముందటి బజార్లనె ఉన్నది. ఎప్పుడు నా దోస్తులు రామడు , రవిగాడు, రాయేశడు అత్తరా – ఎప్పుడు ఆల్లతోని శిర్రగోనె, పెండల బుర్రి , గోటీలు, బొంగురాలు ఆడ్దామా అని గడె గడెకు పెద్దర్వాజ కాడికి బొయ్, బజార్లకు తొంగి సూత్తన్న.

గింతట్ల అమ్మ రొండు జేతుల, రొండు కోపులల్ల శాయ్ దీస్కోని అచ్చి, బాపుకోటి నాకోటిచ్చింది. నాకిచ్చిందాంట్ల శాయ్ సగమే వుంది. ‘నాకు నిండ గావాలె! నాకు నిండ గావాలె!’ అని నేను మంకు పట్టు పట్టిన.

అమ్మ ” ఏందిర పోరడ! ఎంతగనం దాగుతవ్ శాయ్ !” అని తిట్టుకుంటనె లోపల్కి బొయ్, కేతిరి దెచ్చి, నా కోపు నిండ శాయ్ నింపింది.

ఇగ మేం శాయ్ దాగుడు షురు జేసినం. మా బాపు శాయ్ సాసర్ల వోస్కొని, ఒకటే జుర్రుతాండు. గా సప్పుడు బజార్ల కినిపిత్తంది.
గింతట్ల బాపు శాయ్ దాగి, అమ్మను పిల్శి, “రాత్రికి కూరేం వండుతున్నవే” అని అడ్గిండు.

” కూర పాడుగాను! ఏం కూర గాలవడ్డది! కూరగాయలు గిన్నెన్ని సూత లేవు.” అని అన్నది.

బాపు మంచంల కెల్లి లేశి, దండెం మీదున్న శెల్ల నందుకోని తల్కాయకు రుమాల్ చుట్టుకుండు. సక్కగ అర్గు మీది అర్రలకు బోయిండు. మూలకు ఆనిచ్చున్న తుపాకి నందుకున్నడు. గిదంత నేన్ జూత్తనే ఉన్న.

” ఇగొ! నేన్ షికారికి బోతన్న. పిట్టలొ శాపలొ కొట్టుకోని అత్త. నేనచ్చెటాల్లకు నువ్ అల్లమెల్లిపాయ రోట్లె దంచి పెట్టుకొ! ” అని అంకుంట తోలు శెప్పులు దొడుక్కున్నడు.

” బాపు! బాపు! నేన్ గూడత్త ” అని నేనంగనె, అమ్మ ” నువ్వెంద్కురా పోరడా! గాడ్కి! పురుగూ బూశీ ఉంటయ్! ” అన్నది.
నేను ” లే ! నేం గూడ బోత ” అని జిద్దు జేశిన.

గప్పుడు బాపు నా దిక్కు ఓపారి జూశి, ” గట్లనే పా! ” అన్నడు. నా శేతికి వో చిన్న సంచిచ్చిండు. అండ్లేముంటయో నాక్ దెల్సు. శెర్రాలు, తుపాకి మందు, గంద్కం పూలు ఉంటయ్. ఇగ నేను ఊశిపోతున్న నెక్కర్ను నడుం మీద్కి అనుకుంట, పెరట్ల వడి బాపెంక ఉర్కుడు వెట్న. గీ తుపాకి మాకెట్లచ్చిందో జరంత జెప్త ఇనుండ్రి . దానెంక ఓ కతుంది.

బాపు వైద్గుడు. అలొపతి ఆర్వేదం అన్ని గల్పి కొడ్తడు. ఎంతొ మందికి వైద్గం జేశిండు. ఇంక జేత్తండు. నేను పుట్టక ముందు అనుకుంట – రజాకార్ల లొల్లుల్ల, బాపు తను మందు జేశిన తాసిల్దారు నడిగి వో తుపాకి సంపాయించిండట ఎందుకైనా మంచిదని! గదే గిది. దీనికి లైసెన్సు సూత ఉంది.
రజాకార్ల లొల్లి అయిపోయినంక మా బాపు షికార్కి బొయ్, పిట్టలను, కుందేల్లను, యేదులను కొట్క తెచ్చుడు మొదలు వెట్టిండు. ఇంతకు ముందు నేను బాపుతోటి మూన్నాల్గు సార్లు షికారికి బోయిన.

బాపు తుపాకి బుజం మీద వెట్కొని, పెద్ద పెద్ద అడ్గులేస్కుంట పోతుండు. నేను యెంక సంచి వట్కోని ఉర్కుతున్న. తొవ్వల ఎవలెవలొ బాపుని మందలిత్తండ్రు. కొండ పోశడు గనవడి, ” ఏం పంతులు ! షికారికి వోతుండ్రా ? ” అని అడిగిండు.
“అవ్ర పోశిగ ! అవ్ను గని శెర్ల శాపలేమన్న వున్నాయిర ?” అని బాపు వాడ్ని అడ్గిండు.

” ఆ! శెర్లున్నయ్ ! గా లక్కోల్ల బాయిల సూత గింత గింత మొట్టలు వున్నయ్. పొయ్ రండ్రి ” అనుకుంట కొండ పోశడు ఎల్లిపోయిండు.

మే మడ్లల్ల వడి, యీదులల్ల వడి పోతున్నం.

గింతట్ల బాపు, నడ్శేటోడల్ల ఒక్క మల్క ఆగి, ” అరేయ్ ! నువ్వెప్పుడన్న రొండు తల్కాయల పామును జూశినవారా ? ” అని అడ్గిండు.
” లే! సూల్లేదు ” అన్న
” అయ్తె సూడు . గదె రొండు తల్కాయల పాము ” అన్నడు బాపు.

శాంతాడు పెట్టు దూరంల నల్లగ, దొడ్డుగ పండ్కోని వుంది పాము గెట్టు మీన. దాని తల్కాయెదొ! తోకేదొ! తెల్తలేదు. రొండేపుల ఒక్క తీర్గనే ఉన్నది. దాంకి ఇసముండది. కర్సినా మనిసి సావడు. దగ్గర్కి వొయ్ సూశిన. ” ఇగ వా! ” అనంగనె మల్ల నడ్సుడు వెట్టిన.

నేన్ తల్కాయ లేపి ఒక్కపారి మొగుల్దిక్కుకు జూశిన. గువ్వలు, గోరెంకలు, కొంగలు, పాయిరాలు గూల్లల్లకు తిర్గి అత్తన్నయ్. శెట్ల నిండ ఆల్తన్నయ్. ” కీ! కీ! ” అని ఒక్కటె సప్పుడు.

బాపు నడ్శేటోడల్ల మల్ల ఒక్క మల్క ఆగిండు. నేం సూత టక్కున ఆగిన. బాపు సప్పుడు జెయ్యకుంట, యీదులను సాటు జేసుకుంట, సాటు జేసుకుంట ఒక యీత మట్ట మీన తుపాకిని ఆనిచ్చి, కొమ్మల్ల గూసున్న గువ్వలకు సూటి వెట్టిండు. నేను దమ్మాప్కోని, బాపుని, తుపాకిని, గువ్వల్ను రెప్ప కొట్టకుండ సూత్తన్న.

గింతట్ల బాపు ‘ ధన్ ‘ మన్నడు. గువ్వల్రొండు తపతప గొట్టుకుంట న్యాల మీన వడ్డై. నేనటు దిక్కు ఉర్కిన. నాకన్న మొదలె బాపు గువ్వల్ని దొర్కవట్టి , సంచిల ఏశిండు. వో ఈతాకు దెంపి సంచి మూతికి గట్టిక కట్టు గట్టిండు. సంచి నాకిచ్చిండు “పట్టుకోర” అని . నేన్ గట్లనె జేశిన.

బాపు తుపాకిని మల్ల లోడు జేశిండు. ఇగ మేం మెల్లెమెల్లెగ లక్కోల్ల బాయి కాడ్కి బోయినం. అది పెద్ద మోట బాయి. అండ్ల సగం వడ లీల్లున్నయ్. ఇగ బాయి గడ్డ మీన కూసోని బాపు, లీల్ల దిక్కు సూసుడు వెట్టిండు. గింతట్ల వో బొమ్మె శాప లీల్ల మీన కచ్చి, గాలి దీస్కోని మల్ల లీల్లల్ల మునిగింది. ఒక్కొక్క శాప కిలో బరువు ఉంటది గావచ్చు.

” సూత్తున్నావుర! ” అని అన్నడు బాపు.

” సూత్తన్న బాపు! సూత్తన్న ! ” అని నేనన్న.

బాపు దోతి, అంగి ఇడ్శి పారేశి, చిన్నపంచను గట్టుకున్నడు. తుపాకి లీల్లల్లకు సూటి వెట్టి కూసున్నడు.

గింతట్ల ఇంకో బొమ్మె శాప మెల్లెగ లీల్ల మీన కచ్చింది. బాపు ‘ధన్ ‘ మన్నడు. శాప ఉడ్కు లీల్లు మింగి , క్యాల్ దప్పి తెల్ల బొత్తేస్కోని లీల్ల మీన ఎల్లెల్కల వడ్డది. బాపు తుపాకి ఆడ వారేశి, బాయిల దునికిండు. యీత కొట్టుకుంట బొయ్ శాపను దొర్కిచ్చుకున్నడు. మెల్లగ గడ్డపొంట, గడ్డపొంట దరి వట్టుకోని ఎక్కుకుంట మల్ల గడ్డ మీన కచ్చి శాపను సంచి లేశి బట్టలు దొడుక్కున్నడు.

ఇగ మేం ఆడ్నుండి శింతామని శెర్వు కాడ్కి బోయినం. శెర్ల జిల్మలు మస్తుగున్నయ్. లీల్లల సగం మునిగిన తుమ్మ శెట్ల మీన కీ!కీ! అనుకుంట ఎక్కడ్నుంచో అచ్చి ఆల్తన్నయ్. శెట్టు కొమ్మలల్ల ఆటి గూల్లు గనవడ్తున్నయ్. గూల్లల్ల ఆటి పిల్లలు కీసు కీసు మని ఒకటే ఒర్రుతున్నయ్. బాపు మల్ల ఓ జిల్మకు సూటి వెట్టి ‘ ధన్ ‘ మన్నడు. అది కీ!కీ! అని రెక్కలు కొట్టుకుంట లీల్లల్ల వడ్డది. మిగిల్న జిల్మలన్ని ‘కెకెకె!’ అనుకుంట గాల్లెకు లేశినయ్.

“దాన్ని తెత్తావుర !” అని బాపు నాతోని అనంగనె, నేను గట్లనె! అని అంగిడ్శి ఆడ వారేశి, నెక్కరు తోటె లీల్లల్ల దునికిన. యీత గొట్టుకుంట జిల్మ కాడ్కి వోతున్న. గింతట్ల ఒక్కపాలి నా కాల్లకేదొ సుట్టుకున్నట్టు అయింది. పానం గజ్జు మన్నది. ” నీరు గట్టెలా!? ఇంకేమన్న పాములా!?” లీల్లల్ల కాల్లు గట్టిగ కొట్టినాకొద్ది ఇంక కాల్లకు సుట్టుకుంటంది. కాల్లు గొట్టకుంటెనేమొ మునిగిపోతనాయె! ముంగల వోదమన్న యెంకకు అద్దామన్న నా వల్లైతలేదు. ఇగెట్ల! “అరె! గిది నాసు గావచ్చు ” అని గప్పుడు నాకనిపిచ్చింది. బాపు శెర్వు ఒడ్డు కాడ నిలవడి నన్నే సూత్తండు ,గని లీల్లల్ల నా కాల్లకేమైతందో గాయినకు సమజైతలేదు. ఇగ నేను ” ఓ బాపు! నా కాల్లకు నాసు సుట్టుకున్నదే ! ” అని లగాయించి ఒర్రిన. బాపు పరేశాన్ అయిపోయిండు. కొంచెం సోంచాయించి, ” అరెయ్! నీ ముంగల గడ్డున్నది సూడు! ఎట్లన్న ఆడ్కి బొయ్ గడ్డ మీన ఎక్కి కూకో!” అన్నడు.

నాకు కడ్పులకెల్లి సలి వెట్టుడు మొదలైంది. పండ్లు టక టక కొట్టుకుంటున్నయ్. ఇగ ఎట్లనో ఉగ్గబట్టుకోని మెల్లమెల్లగ కాల్జేతులాడిచ్చుకుంట శెత్తోని నాసును తీశేసుకుంట, గడ్డకాడికి బోయి, గడ్డ మీనకు ఎక్కి కూకున్న. బాపు మల్ల ” గట్ల గట్ల గడ్డెంబడి లీల్లు తక్కువున్న జాగలకెల్లి యీడ్కి రా!రా! ” అని కీక వెట్టిండు.
నేను బయపడుకుంట బయపడుకుంట గట్లనే మెల్లగ ఒడ్డు మీద్కి అచ్చి పడ్డ. బాపిచ్చిన శిన్నపంచెతోటి పెయ్ దుడ్సుకోని అంగి దొడ్కున్న. ఇగ మేం జిల్మను మర్శిపోయి ఇంటి మొకం బట్టినం. తొవ్వల బాపు ఒక్క మాట మాట్లాడలె! ఇంటి కచ్చినం. గప్పట్కే మా యమ్మ పెరట్ల నిలవడి పొయ్యినోల్లు ఇంకత్తలేరేంది” అని ఎదురు సూత్తంది.

నేను లోపల్కి బొయ్, సంచి కింద దులిపిన. రొండు గువ్వలు,శాప తపుక్కున న్యాల మీన వడ్డయ్. ఇంక వాటి పానం పూర బోలె – గుడ్డి దీపం ఎల్గుల అటీటు మెసుల్తున్నయ్.
అమ్మ ” ఆ! షికారి బాగనె చేస్కచ్చిండ్రు!” అనుకుంట నాదగ్గరి కచ్చి ” ఏందిర పోరడ ! నీ నెత్తి లాగు తడ్శినయ్ ! ” అన్నది.నేను జర్గిన కతంత జెప్పిన.

ఇగ మా యమ్మ అందుకున్నది ” నీ షికారి పాడుగాను! ఎన్ని మల్కల జెప్పిన! పిట్టల్ని కొట్టద్దయ్యా! వాటి పిల్లలు అగాదం అయిపోతయ్ – గా పాపం మనకు సుట్టుకుంటది! అని. నువ్వింటవా! నీ శెటం నువ్వేనాయె! అట్టిగ పోరడు సచ్చిపోతుండె గద! ” అని బాపును తిట్టుకుంట , నన్ను మండుతున్న పొయ్ కాడ్కి దీస్కపొయ్ దాని ముంగల ఎచ్చగ కూకోవెట్టింది. తువ్వాలు దీస్కచ్చి నెత్తి దుడ్శింది. ” పొలగాడు బయపడ్డట్టున్నడు !” అని అనుకుంట జీడి గింజ తోటి జిష్టి దీసి దాన్ని పొయ్యి లేశింది.
మా బాపు సప్పుడు జేత్తలేడు. ఊ! అంటలేడు, ఆ! అంటలేడు. మంచంల కూకోని ఎటో సూత్తండు.

***

గీ కతయ్యి నాల్గు నెల్లయింది. బాపు మల్ల ఇగ షికారికి బోలె. ఏమనుకున్నడొ ఏమొ! వోనాడు తుపాకిని దీస్కోని కర్నారం బోయి, దాన్ని సర్కారుకు దఖల్ జేశి అచ్చిండు. నేను బడి కాడ్నుంచి గప్పుడే అచ్చిన. బజార్ల పోరగాండ్లు ఆడుకుంటున్న సప్పుడు ఇనవడ్తంది. గిర్న ఉర్కిపొయ్ ఇగ ఆల్లతోటి గల్సిన.
----------------------------------------------------------
రచన - నాగరాజు రవీందర్, 
వాకిలి సాహిత్య పత్రిక

Sunday, July 29, 2018

నత్కీరుడు… నిబద్ధతా


నత్కీరుడు… నిబద్ధతా



సాహితీమిత్రులారా!


శ్రీ కాళహస్తి మాహాత్మ్యంలో ధూర్జటి, నత్కీరోపాఖ్యానం ఆలంబనగా చేసుకొని … ఈ నాటికీ వర్తించే ఒక విషయంమీద అతని అభిప్రాయాన్ని వెలిబుచ్చేడని నేను భావిస్తున్నాను.

స్థూలంగా కథ ఇది:

పూర్వం దక్షిణదేశాన్ని పాండ్య రాజు పరిపాలించేవాడు. ఆ రాజుదగ్గర వంశపారంపర్యంగా వచ్చిన సరస్వతీదత్తమైన ఒక “శంఖపీఠం” ఉంది. దాని ప్రత్యేకత… దాని మీద కవులైనవారు ఎవరైనా కూర్చుంటే మరొక్కరు కూచుందికి అవకాశం కల్పిస్తుంది. అలా కల్పించలేదంటే, కూచున్న వ్యక్తి కవి కాదన్నట్టే లెఖ్ఖ. అటువంటి శంఖపీఠంపై కూర్చున్న అతని ఆస్థాన కవులలో అగ్రగణ్యుడు నత్కీరుడు.

ఒకసారి ఆ రాజ్యంలో “ధాత కరువు” వంటి చెప్పలేని క్షామం వస్తుంది. వర్షాలు లేక, తిండిలేక ఆ రాజ్యంలోని ప్రజలు అల్లల్లాడుతుంటారు. ఆ రాజ్యంలో ఒక గ్రామంలోని ప్రజలందరూ వలస పోతుంటే, అక్కడ ఒక శివాలయంలోని పూజారి కూడా దేవునికి నమస్కరించి “స్వామీ! నీ సంగతి నువ్వు చూసుకో. కరువు తీరేక మళ్ళీ వచ్చి నీ సేవ చేసుకుంటాను” అంటాడు. దానికి శివుడు, “నేను నీ కొక పద్యం రాసిస్తాను. నువ్వు మహారాజు దగ్గరకి పోయి ఆ పద్యం చూపించు. నీకు వెయ్యి మాడలు బహుమానంగా ఇస్తాడు. ఈ కరువు తీరేదాకా పనికొస్తుంది. ఈ లోపున మంచి వర్షాలు పడి పరిస్థితి మామూలు స్థితికి వస్తుంది,” అని చెప్పి పంపిస్తాడు.

రాజసభలో పద్యం వినిపించగానే నత్కీరుడు ఫక్కున నవ్వుతూ ఆ పద్యంలో “సింధు రాజకన్య కేశములు సహజ గంధము కలిగి ఉన్నాయన్న” మాటకు ఆక్షేపణ చెబుతూ, “ఇది తప్పు. ఇలా చెప్పకూడదు. ఆది కవిత్వ సంప్రదాయాలకి అనుగుణంగా లేదు. ఇలా రాయవచ్చునా” అని అనగానే, ఆ పూజారి చిన్నబుచ్చుకుని, మహానుభావులారా. ఈ పద్యం నేను రాసింది కాదు. ఈ మహారాజు మీద పరమేశ్వరుడు రాసి ఇచ్చేడు. ఇందులోని తప్పొప్పులు నిర్ణయించగలశక్తి నాకు లేదు నన్ను క్షమించండి” అని వెనుతిరుగుతాడు.

వెనక్కి తిరిగి వచ్చిన పూజారిని ఈశ్వరుడు “ఏమయింది? ఉట్టి చేతులతో వచ్చేవు?” అని అడిగితే, ఈశ్వరుడి రాసిన పద్యాన్ని తిరిగి అప్పగిస్తూ, “స్వామీ, నిన్ను నమ్ముకుని రాజసభకి వెళితే, నిండు సభలో నా పరువు పోయింది. ఇంక ఏమిటి చెప్పమంటావు? అయినా, ప్రపంచంలో, ఎవరికైనా తమ జ్ఞానాన్ని ప్రదర్శించడం వల్ల రాజగౌరవం దక్కుతుంది గాని పక్కవాళ్ళ జ్ఞానం వల్ల సమ్మానం రాదు గదా. నత్కీరుడివల్ల నేను పడ్డ దుఃఖము కరువుతో పడ్డ బాధకంటే అతీతమైనది. అయినా, నా అదృష్టం ఇలా ఉంటుండగా చివరకి నిన్నూ, నత్కీరుణ్ణీ నిందించి ఏమి లాభం? బిక్షమెత్తుకునైనా ఎలాగో ఒకలాగ ప్రాణం నిలబెట్టుకుని కరువు తీరేక మీ సేవ చేసుకుందికి వస్తాను. నాకు శలవు ఇప్పించండి,” అని వేడుకుంటాడు.

దానికి శివుడు మనసు కరిగి, ” ఏమిటీ! నత్కీరుడు పద్యం తప్పుపట్టేడా? ఏదీ పద చూద్దాం ఆ తప్పేమిటో” అని పూజారిని తీసుకుని రాజ సభకు వెళ్ళి,

“ఈ మహారాజు మీద నేను సాహిత్యసురభిళంగా పద్యం చెప్పి పంపిస్తే, ఎవడో నత్కీరుడట అసూయతో ఏదో తప్పుపట్టాలిగదా అని తప్పు పట్టేడట. ఏమిటి ఆ తప్పు? లక్షణమా? అలంకారమా? పదబంధమా? రసమా? ఎక్కడ తప్పుందో చెప్పమనండి?” అని నిలదీస్తాడు.

దానికి నత్కీరుడు మునపటిలాగే తప్పు ఎత్తి చూపిస్తూ, “లోకంలో ఎక్కడైనా జుత్తుకి సహజమైన సువాసన ఉంటుందా? అలా ఉంటుందని అంటే ఎవ్వరైనా నవ్వరా?” అని సమాధానం చెబుతాడు.

దానికి ఈశ్వరుడు ఈ మాత్రం తెలీదా అన్నట్టు, “నీకు తెలీదేమో!జుత్తుకి సహజమైన సువాసన లేకపోవడమేమిటి? పార్వతీ దేవి జుత్తుకి సహజమైన సువాసన ఉంది. తెలుసా?” అని ఉదాహరణ చూపించి సమర్థించుకోబోతాడు.

అప్పుడు నత్కీరుడు,”పార్వతీ దేవికి ఉంటే ఉండొచ్చు. అంతమాత్రం చేత భూమి మీద స్త్రీలందరి జుత్తూ సహజ సువాసన ఉంటుందని చెప్పకూడదు. కోపం తగ్గు. దేవలోకంలో ఉన్న వస్తువులు భూమి మీద ప్రత్యక్ష ప్రమాణాలు కావుగదా.” అంటాడు.

దానికి శివుడు అలిగి, పెంకిగా,”నే నెవ్వరో తెలుసునా” అన్నట్టు తన నుదిటిమీద కన్ను చూపిస్తూ ఒక హస్తవిక్షేపం చేస్తాడు.

దానికి అంతకంటే పెంకిగా నత్కీరుడు “ఒక్క కన్నే కాదయ్యా.. నీ తలచుట్టూ కళ్ళున్నప్పటికీ, పద్యం తప్పుకాదని ఎవడూ అనడు. ఇక్కడ నీ మాయాప్రతాపాలు చెల్లవు,” అని అంటాడు.

దానికి శివుడు రుద్రుడై “నువ్వు కుష్టురోగంతో బాధపడు, ఫో!” అని శపిస్తాడు.

దానికి ఒక్కసారి తన హద్దులు తెలుసుకున్నవాడై, శివుడి పాదాలమీద పడి,”స్వామీ! పొరపాటయిపోయింది. పరమదయాళువివి నువ్వు. నాకు శాపవిమోచన మార్గాన్ని వివరించు,” అని వేడుకుంటాడు.

అప్పుడు ఈశ్వరుడు శాంతించి, “కైలాస శిఖరాన్ని చూసినప్పుడు నీకు శాపవిముక్తి అవుతుంది,” అని అంతర్థానం అవుతాడు.

జరిగినదానికి నత్కీరుడు విచారిస్తూ,”కవిత్వప్రమాణాలు కాపాడవలసిన భారాన్ని నేనెందుకు భుజాలకి ఎత్తుకున్నాను. ఈ శంఖపీఠంపై కూర్చున్న మిగతాకవులలాగే నేనూ నోరుమూసుకుని ఊరుకుంటే పోయేది గద. అనవసరంగా దేవునితో ఎందుకు వాదనకు దిగేను? ఈ కుష్టురోగాన్ని ఎలా భరించడం? ఎన్ని నదులు దాటాలి? ఎన్ని అడవులు తిరగాలి? ఎన్ని కొండలు ఎక్కాలి? ఎన్ని నిర్జనప్రదేశాల్లోంచి పోవాలి? ఇవన్ని దాటి నేను ఎప్పుడు కైలాస శిఖరం చూడగలుగుతాను? ఆ పేరు వినడం తప్ప ఎన్నడూ చూసి ఎరగనే” అని విచారిస్తూ ఉత్తరదిశగా బయలుదేరి వెళ్తాడు.

***

శివుడు నత్కీరుణ్ణి నిలదీసిన ప్రశ్నల ద్వారా, మనకి కవిత్వానికి ఒక లక్షణం, అందులో కొన్ని అలంకారాలూ, పదబంధాలూ, ఉండడమే గాక, అది రసనిష్యందంగా ఉండాలని తెలుస్తుంది. నిజానికి కవిత్వం స్వీయానుభూతినో, శ్రుతపూర్వమైన అన్యుల అనుభూతినో, ప్రతిబింబిస్తూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నత్కీరుడి అధిక్షేపణ ద్వారా, మరొక సూక్ష్మవిషయం తెలుస్తోంది. కవులు తమ స్వీయానుభవాలని సాధారణీకరించేటపుడు, ఆ అనుభూతికి ఆలంబనమైన వస్తువు మరొకరి అనుభూతి పరిధిలో లేకపోవచ్చునన్న సత్యాన్ని గుర్తెరిగి ఉండాలి. వెనకటికి ఒక శ్రీమంతుడు “దానికేముంది, కోడుగుడ్డంత బంగారం ఎవరిదగ్గరైనా ఉంటుంది” అన్నాడట. అలాగ తన అనుభూతి అందరి అనుభూతిగా, ప్రతీదీ సామాన్యీకరించకూడదు. ఆ అనుభూతి ప్రకటన తీరు “Suspension of Disbelief” కి ఆస్కారం ఇవ్వకపోతే, కొత్తవస్తువుగురించి చెప్పినపుడు రసభంగమవుతుంది.

ఈ నిబద్ధత ఒక్క సాహిత్యంలోనే కాదు, ప్రతివారికీ కొన్నికొన్ని విషయాలపట్ల తమకి తాము ఎన్నుకున్న నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధతకి పరీక్షాసమయం వచ్చినపుడు నిరూపించుకోకపోతే అది కేవలం ఆదర్శంగా మిగిలిపోతుంది. ఆ సందర్భం మన యజమానితోనో, మన పై అధికారితోనో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానో రావచ్చు. శివుడి పద్యంలోని తప్పుని ఎత్తిచూపకుండా శంఖపీఠిమీది ఇతరకవుల్లా “నాకెందుకు?” అని తప్పించుకోవడం సాహిత్యంపట్ల వాళ్ళ నిబద్ధత లేకపోవడాన్ని సూచించినట్టు, పరీక్షాసమయంలో మన ఆదర్శానికి దన్నుగా నిలబడకపోవడం మన నిబద్ధతా రాహిత్యాన్ని సూచిస్తుంది. అయితే తప్పుని ఎత్తి చూపించేటప్పుడు, వ్యక్తి తన పరిధుల్నీ, పరిమితుల్నీ మరిచిపోకూడదు. ఒక్కొక్కసారి, వాదనలో మనం గెలిచామన్న సంతోషం (లేదా అహంకారం) మనచేత కొన్ని దురుసు మాటలు మాటాడిస్తుంది. దానివల్ల కొన్ని అనర్థాలు ఎదురౌతాయి. అటువంటి బలహీనతలకు మనం లోనుకాకూడదు. వాదనలో గెలుపు వ్యక్తిమీద గెలుపు కాదు. ఆ సందర్భంలో గెలుపు అన్నివేళలా మన గెలిచినట్టు కాదు. వాదనలో విభేదం ఒక విషయంలో అభిప్రాయభేదం తప్ప వ్యక్తులతో విభేదం కాదు. ఈ సున్నితమైన విషయాలు చాలా స్పష్టంగా మనకి అవగాహన అయి ఉండాలి.

మరొక్క విషయం, వాదనలో మనం ఓడిపోయినపుడు, చాలా ఉదాత్తంగా మన అపజయాన్ని అంగీకరించాలి తప్ప, శివుడిలా ఆ సందర్భానికి చెందని మన ప్రత్యేకతలూ, ప్రతాపాలూ చూపించకూడదు. అదే పని మన వాదో, ప్రతివాదో చేసినపుడు, అతను తన అపజయాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తించి, హుందాగా అక్కడితో ఆ వాదనని సమాప్తం చెయ్యాలి. లేకపోతే, సందర్భం గాడి తప్పుతుంది. We should allow the defendant to realize and digest his defeat; and, we should also know, that it takes time. We shall also behave the same way given our roles are reversed.

కవిత్వం ద్వారా వ్యక్తిత్వాలని ఉదాత్తం చేసుకోలేకపోతే, కవులకీ సామాన్యులకీ తేడా ఏమిటి?

***

(పద్యాలు చదవాలనుకుంటున్న వాళ్ళకి మచ్చుకి కొన్ని:

దానికి నవ్వుచు నృపసభ
లో నత్కీరుండు పలికె “లోకము నగదే
పూనుకొని సహజ గంధము
వేనలికిం గలదటన్న వేయి దెరగులన్!”

“తప్పిది, చెప్పరాదు, కవితా సమయంబున కొప్పుగాదు, నీ
విప్పగిదిన్ రచింప దగునే?” యన, విప్రుడు చిన్న వోయి, “నా
కప్పరమేశ్వరుండు వసుధాధిపుపై రచియించి యిచ్చినా,
డొప్పును దప్పు నేనెరుగ, నుత్తములార!” యటంచు గ్రమ్మరన్.

వచ్చి పార్వతీసు వంక కనుంగొని
అతని పద్య మతని కప్పగించి
నిన్ను నమ్మిపోయి నిండిన సభ సిగ్గు
చెడితి ఉన్నకథలు వేర చెప్పనేల?

“తానెరిగిన విద్య నృపా
స్థానములో నెరపంగ కీర్తి సమకూరుంగా
కే నరునకు బరవిద్యా
ధీనత భూపాల సభల దేజము గలదే?”

“నీ మాట నమ్మి పోయిన
నా మోసము జెప్పనేల? నత్కీరునిచే
నే మాట పడ్డ దుఃఖము
క్షామ వ్యధ కొలది గాదు, సద్భక్త నిధీ!”

అని మరియు నిట్లనియె..
నా భాగ్యం బిటులుండగా దుది నిను నత్కీరునిం దూరగా
నే భావ్యం? బిక జాలు, నిక్కరవుచే నిట్లైతి నెందైన గా
నీ భైక్షంబున గుక్షి బ్రోచుకొని, దీనిం దీర్చి నేవత్తు, దే
వా! భద్రంబగు నీకు, నన్ననుపవే?” యన్నం గృపా మూర్తియై.

కట కట! యన్నత్కీరుం,
డట! కవితయు దప్పు వట్టె నట! యటు పదమీ
యెటువలెనో తెలిసెద?” నని,
నిటలాక్షుడు వచ్చి కుంభినీపతి సభలోన్.

ఈ రాజన్యునిమీద నే కవిత సాహిత్యస్ఫురన్మాధురీ
చారుప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు పాటించి న
త్కీరుండూరక తప్పువట్టెనట యేదీ లక్షణంబో,అలం
కారంబో,పదబంధమో రసమొ చక్కంజెప్పుడాతప్పనన్.

అనవుడు, నా నత్కీరుడు
మునుపటి వలె దప్పటన్న ముక్కంటియు వా
ని కనియెన్, “గిరితనయా
ఘన కచభారంబు సహజగంధం” బనుచున్.

“అగజకు నైనం దగు, నిల
మగువలకుం దగదు, మాను మత్సరమింకన్,
గగన ప్రసూన వాదము
జగతిం బ్రత్యక్షమునకు సరి యన దగునే?”

“లూలామాలపు మాటలు
చాలు” ననిన నలిగి, తన నిజంబగు రూపం
బాలోన జూపవలె నని,
నీలగ్రీవుండు నిటల నేత్రము జూపన్.

“తల చుట్టువార గన్నులు
గలిగిన బద్యంబు దప్పు గాదన వశమే
వల దిచ్చట నీ మాయా
విలసనములు పనికి రావు విడువు” మటన్నన్.

శపియించెం బ్రతి భాషల
గుపితుండై రుద్రుడతని “గుష్ఠ వ్యాధిం
దపియింపు” మనుచు దానికి
నపరిమిత భయమ్మునంది యతడిట్లనియెన్.

“స్వామీ ద్రోహము జేసితిం, దెలుపవే శాపాంత ముద్యత్కృపా
ధామా! నా” కనుచున్ బదాబ్జముల మీదం బడ్డం, ఆ భక్త ర
క్షామందారుడు శాంతి బొంది యనియెం “గైలాస శైలంబు గం
టే మానుం బద” మన్న, నందులకు దా డెందంబునం గుందుచున్.

“ఈ కవితాభి మానము వహించితినేటికి? శంఖపీఠిపై
నీ కవులున్నయట్లు వసియింపక దేవునితోడ నేల చా
ర్వాక మొనర్చితిం? గడు భరంబగు కుష్ఠరుజా విషాద మే
నే కరణిన్ ధరింతు? నిక నెన్నడు చూచెద వెండి గుబ్బలిన్?”

ఎన్ని మహానదుల్, వనములెన్ని, గిరీంద్రము లెన్ని బోయవీ
ళ్ళెన్ని, మృగంబులెన్ని, జనహీనములైన పథంబులెన్ని నే
నిన్నియు దాటి ఏ కరణి ఈశ్వరు శైలము చూడబోయెదన్
కన్నదిగాది విన్నయది గాని సదాశివ ఏమి చేయుదున్.
----------------------------------------------------------
రచన- నౌడూరి మూర్తి, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Saturday, July 28, 2018

కృష్ణశాస్త్రి – సినీ సాహిత్యం


కృష్ణశాస్త్రి – సినీ సాహిత్యం





సాహితీమిత్రులారా!


తెలుగు సినీ సాహిత్యానికి కావ్య గౌరవం తెచ్చిన రచయితలలో కృష్ణశాస్త్రిగారు ప్రసిద్ధులు. మల్లీశ్వరి సినిమాకి మాటలు-పాటలు రాయటంతో ఆయన తెలుగు సాహిత్యంలో చలనచిత్ర గీతాలకి ప్రత్యేకతని సంతరించారు. ఆయన వెలువరించిన సినీసాహిత్యంలో పరిశీలించవలసిన అంశాలు రెండు. ఒకటి మల్లీశ్వరి రచన. రెండు సినీగీతాలు.

దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు 1950 లో సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగుచలనచిత్ర చరిత్రలో ఆణిముత్యమైన మల్లీశ్వరి చిత్రానికి ఆయన రాసిన సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చినాయి. ప్రసిద్ధ దర్శకులు బి.ఎన్.రెడ్డిగారు కృష్ణదేవరాయల కాలంనాటి కథని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం వంటి లలితకళలకి సమ ప్రాధాన్యాన్నిచ్చి, రాయలవారి కళాభిరుచిని దృశ్యకావ్యంగా తీయాలని రెడ్డిగారి సంకల్పం. ‘దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి రచనలమీద నాకెంతో గౌరవం. ఆయనచేత చిత్రాలలో పాటలు రాయించాలనుకునేవాడిని. ‘మల్లీశ్వరి’ ఆలోచన రాగానే, ఆ కథకు ఆయనే తగినవారని, ఆయనతో చెప్పి రాయమని అడిగాను. కృష్ణశాస్త్రిగారు చాలా నిదానం, నెమ్మది. ఎంత ఆలస్యం అయినా సరే, ఒక కళాఖండంగా నిర్మించాలని వారిచేతనే మాటలు, పాటలు రాయించాను.’ అని బి.ఎన్.రెడ్డిగారు అన్నారు.

కృష్ణశాస్త్రిగారు రొమాంటిసిస్ట్ కావడంతో మల్లీశ్వరి చిత్రం ఆయన అభిరుచులకి తగ్గట్టుగా రూపుదిద్దుకుంది. ఏ సన్నివేశానికి, ఏ రసానికి, ఏ పాత్రకి మాటలు ఎంతవరకు అవసరమో గుర్తించి మరీ సంభాషణలు రాశారు. పాత్రల స్వభావాలని దృష్టిలో ఉంచుకొని ఔచిత్యాన్ని పాటిస్తూ రచన చేశారు.

పల్లె వాతావారణం, తిరునాళ్ళ సంబరాలు, నాట్య సన్నివేశాలూ, శిల్పుల జీవితాలూ, నేతపనివాండ్ర జీవితాలూ, రాజమందిర వాతావరణం, అమాయక ప్రకృతి – అన్నింటినీ పరిశీలించి సందర్భానికి తగ్గట్టు రచన చేశారు. సంభాషణలు పాత్రల స్వభావాలనుంచి పుట్టే సంఘర్షణలకి అద్దం పడతాయి. తద్వారా కథ నడుస్తుంది. కథని సాగదీసినట్టుగా కాకుండా, సహజధోరణిలో నడిపించడం కృష్ణశాస్త్రిగారి ప్రతిభకి గీటురాయి.

కృష్ణశాస్త్రిగారు కవి. సంభాషణలు రాసేటప్పుడు ఆయనలొ కవి కనిపించడు. పాత్రల మనసులోంచి, వాళ్లున్న పరిస్థితిలోంచి ఎలాంటి మాటలు వస్తాయో ఆలోచించి, ఆ మాటలనే రాయటం ఆయన ప్రత్యేకత. అసలు అభిప్రాయాన్ని ప్రకటించడానికి మాటలూ, అనుభూతిని వ్యక్తం చేయడానికి కవిత్వమూ అన్న స్పృహ సంభాషణల రచయితకు ఉండాలి. ఆ స్పృహ కృష్ణశాస్త్రిగారికి ఉంది.

‘మల్లీశ్వరి’ చిత్రంలో చిన్నపిల్లల అల్లరీ, అమాయక సంభాషణమూ, ఆటపాటలూ చిత్రించి మల్లీ,నాగరాజుల బాల్యాన్ని రసమయం చేసారు. నాటక రచనా, సినిమా రచనా కొంచెం దగ్గరగ ఉంటాయి. కథలోని పాత్రల స్వభావాల సంఘర్షణలోంచి పలికే సంభాషణలే కథని కొసదాకా నడిపిస్తాయి.

‘మల్లీశ్వరి’ చిత్రంలో నాగమ్మ అత్యాశ, నాగప్ప సంతృప్తికర జీవితం, మల్లీ, నాగరాజుల అమాయకత్వం, కళాభిరుచులూ, రాయలవారికి కళలపట్ల ఉన్న ఆదరణ కథకి కీలకమైన అంశాలు. నాగమ్మ ‘తన కూతురు మహారాణివారి ఇష్టసఖి కావాలని’ ఆశపడటం, నాగరాజు ‘మల్లిని మహారాణీవారి ఇష్టసఖిని చేయమని’ అమాయకంగా కోరటం, రాయలవారు సరదాపడి వారి ముచ్చట తీర్చటం – ఈ మూడు అంశాలూ కథని నడిపించాయి. నాగరాజు శిల్ప సృష్టి, మల్లీశ్వరి నాట్యకౌశలం కథకి వన్నెలు దిద్దినాయి. మల్లీశ్వరి నవరసభరితంగా రూపుదిద్దుకొంది.

‘రాతిబొమ్మ మోజులో పడి, అసలు బొమ్మని మరిచిపోతావేమో’ అని మల్లి అంటే ‘అసలు బొమ్మకంటే రాతిబొమ్మే నయం కదూ’ అని నాగరాజు అంటాడు. ఈ సంభాషణం తనని పట్టించుకోకుండా, బొమ్మలు చెక్కడంలో, నిమగ్నమైన బావ మనసుని మళ్లించడానికి మల్లి సరదాగా అన్నదీ, నాగరాజు చమత్కారంగా అన్న మాటలూ కథకి జీవం పోసినాయి.

మహారాజావారి మెడలోని హారం మల్లి చేతిలోకీ, పల్లె వాతావరణంలో పండిన జాంపండు రాణీవారి చేతిలోకి మారడం కథని మలుపు తిప్పింది. రాజుగారి కళాభిరుచి,పల్లెప్రజల అమాయక సంస్కృతీ ప్రస్ఫుటించేలా చిత్రించిన ఈ సన్నివేశం కళలకీ రాజుల కొలువుకీ వంతెనలా భాసిల్లింది.

ధనం, అహంకారం నాగమ్మ వ్యక్తిత్వాన్నీ, మంచితనం, అమాయకత్వం నాగప్ప వ్యక్తిత్వాన్నీ తీర్చిదిద్దినాయి. పౌరుషాన్ని ప్రదర్శించిన నాగరాజు శిల్పవిద్యలో రాణకెక్కుతాడు. మల్లీశ్వరి రాణీవారి ఇష్టసఖి అవుతుంది.

మల్లి,నాగరాజుల వియోగాన్ని కృష్ణశాస్త్రిగారు హృదయాలని కదిలించేలా చిత్రించారు. చివరికి ప్రేయసీ ప్రియులు సాహసించి దగ్గరవటంతో, రాయాలవారు ముచ్చటపడి, వారిని విడుదల చేయటంతో కథ సుఖాంతమౌతుంది.

రాణివాసాలకంటే అమాయక పల్లెటూరి నివాసమే సుఖమని గ్రహిస్తారు, మల్లీనాగరాజులు. వారి కోరికని రాజుగారు రాణీవారికి తెలియజేసినపుడు రాణీవారు ‘పాపం! ఆ చిన్నవారి మనసులో రాణీవాసపు భోగభాగ్యాలంటే వింత వింత ఊహలున్నాయి కాబోలు’ అని అంటారు. రాణివాసాల భ్రమ తొలగి, జీవితంలో అసలు వాస్తవాన్ని ఆవిష్కరించటం చిత్రంలో ప్రధాన ఉద్దేశ్యం. ప్రేమ ఎంత ఉదాత్తమైనదో, జీవనసౌందర్యాన్ని ప్రేమ ఎలా ప్రోది చేస్తుందో కళాత్మకంగా చెప్పిన చిత్రం ‘మల్లీశ్వరి’. కళలకి, ప్రేమకీ ఎంత దగ్గర సంబంధముందో చెప్పిన చిత్రం ఇది. కళాకారుల సృజనాత్మక అనుభవాన్నీ, ఆ అనుభవంలో వారు పడే వేదననీ, లక్ష్యసాధనలో వారి దృఢ దీక్షనీ మల్లీ నాగరాజు పాత్రలలో కృష్ణశాస్త్రి తేటతెల్లం చేశారు.

సాహిత్యం రసజగత్తు. చలనచిత్ర రచన ప్రజలకి సన్నిహితమైన శైలిలో ఉండాలి. మనుషులూ వారి ప్రవృత్తులూ, కదలికలూ, మాటతీరూ, స్వరభేదాలూ, సంస్కారం, కుటుంబ నేపధ్యం, పరిసరాల ప్రభావం, అనుబంధాలూ – అనురాగాలూ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని, లోకంపట్ల ఎరుకతో సంభాషణలు రాయడం వల్ల ‘మల్లీశ్వరి’ కళాఖండమయ్యింది. సాహిత్యానికి సంబంధించి తనవంతు పాత్ర సమర్థంగా నిర్వహించారు కృష్ణశాస్త్రిగారు.

చలనచిత్ర రచనతో కృష్ణశాస్త్రిగారిలోని కవి ప్రజలకి మరింత సన్నిహిత మయ్యాడు. తెలుగు మాటల కూర్పు పాటకి ఎలా ప్రాణం పోస్తుందో కృష్ణశాస్త్రిగారికి బాగా పట్టుబడింది. సినిమాలో సందర్భం, పాత్రల స్థితిగతులూ, అప్పటి మనస్స్థితి, వారి భాష అన్నీ తెలుసుకొని పాట రాసినప్పుడే సినిమాపాట రక్తి కడుతుంది. కృష్ణశాస్త్రిగారి పాటలలో ప్రత్యేకత ఏమిటంటే, సినిమా చూస్తున్నప్పుడు ఎటువంటి అనుభూతికి లోనవుతామో, పాట విడిగా వింటున్నప్పుడు కూడా అటువంటి అనుభూతికి లోనవుతాము.

మానవ జీవితంలో ఎన్నో సన్నివేశాలు, ఎందరో మనుషులు, ఎన్నెన్నో మానసిక స్థితులు. అన్నింటికీ అన్ని రకాలుగా భాషలో మాటలుంటాయని కృష్ణశాస్త్రిగారి విశ్వాసం. ఆ ‘మాట’ తప్ప మరో ‘మాట’ ఆ మానసిక స్థితిని వ్యక్తం చేయలేదని ఆయన నమ్మకం. ఆ ‘మాట’ వచ్చేదాకా ఓపిక పడితే, పాట జీవం పొసుకుంటుంది. మాటకి పర్యాయ పదాలుండవనీ ఆ స్థితిని వ్యక్తం చేయడానికి అది తప్పనిసరి పదమని ఆయన అభిప్రాయం. అందుకే కృష్ణశాస్త్రిగారి పాటల రచనలో ఆలస్యం జరిగినప్పటికీ, పాటలు అమృతబిందువులైనాయి. సంగీతం నాదం ద్వారా సాధించేది. కవిత్వం శబ్దం ద్వారా సాధించాలి. తెలుగు జీవితాన్ని ప్రతిబింబించే కృష్ణశాస్త్రిగారి పాటలు రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. 1975లో కృష్ణశాస్త్రి సన్మాన సంఘం, మద్రాసు వారు ‘మేఘమాల’ పేరుతో ఒకటీ, 1996లో ఓరియంట్ లాజ్మన్ వారు ‘గోరింట’ పేరుతో ఒకటీ సినిమాపాటల సంకలనాలు వెలువరించారు.

జానపద గీతాల స్వరూప స్వభావాలూ, నన్నయవంటి మహాకవుల పద్యాల ఛందో రీతులూ, త్యాగయ్య అన్నమయ్యల కీర్తనల అంతఃసౌందర్యమూ, జీర్ణించుకొని, తెలుగుపదాల కూర్పులో పాటని పలికించే సౌందర్య రహస్యాన్ని కృష్ణశాస్త్రి గ్రహించగలిగారు. ప్రజల జీవితంలోని కష్టసుఖాలూ, మాటతీరూ నిశితంగా పరిశీలించే దృష్టి కృష్ణశాస్త్రికి పుష్కలంగా ఉంది.

కృష్ణశాస్త్రిగారి శైలి లలితమైనది. ఆయన ముద్రని మనం పాటలో పట్టుకోగలం. ఆ ఆత్మీయతని ఆయన పాట కూర్పులో సాధించగలిగారు. దానికి కారణం ఒక మాట పక్కన ఏ మాట పొదిగితే భావం, రసం, రాగం సమర్థంగా పలుకుతాయో కృష్ణశాస్త్రిగారికి తెలిసిన విద్య. అందరం మాట్లాడుకొనే మాటలతోనే పాట పాడించగల కళావేత్త. ఆయన. ‘పాట పదములకై నిత్య పథికుడు’ కృష్ణశాస్త్రి.

భావ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కృష్ణశాస్త్రిగారి సినీగీతాలని ఐదు రకాలుగా విభజించవచ్చు. 1. జోలపాటలు 2. సంస్కృతి 3. సంస్కరణదృష్టి 4. మానవత 5. ప్రణయం.

పసితనంలో అమ్మ పాడే జోలపాటతో మనిషికీ పాటకీ అనుబంధం ఏర్పడుతుంది. చందమామ రావె! జాబిల్లి రావే! అంటూ మానవ జీవన స్రవంతిలో ఆనందాన్ని కలిగించే పాటలు ఎన్నో ఉన్నాయి. కృష్ణశాస్త్రిగారు ఈ పాటల తత్త్వాన్ని గ్రహించి, ఆయన పద్ధతిలో కొన్ని సినిమాలకి సందర్భానికి తగినట్టుగా జోలపాటలు రాసారు. ఆ పాత్రల స్థితిగతులని బట్టి పాటలో చరణాలు ఉంటాయి. ఆ పాటలు వింటుంటే పాత్రల స్వభావాలు మనకు అవగతమవుతాయి.

‘బంగారుపాప’ సినిమాకి రాసిన పాటలో ‘ లుళలుళలుళా! అనే సాకీతో ప్రారంభమై, ‘తాధిమి తకధిమి తోల్బొమ్మా! దీని తమాష కీల్బొమ్మా!’ అంటూ తాత్త్విక ధోరణిలో సాగే జోలపాట రాశారు. ‘ఎవరికెవ్వరో ఏమౌతారో, యివరము తెలుసా? కీల్బొమ్మా, ఈ యివరము తెలుసా మాయబొమ్మా’ అనే చరణంలో మనిషి జీవితరహస్య మార్గాలని అన్వేషించే ధోరణి ఉంది. ‘కోపము తాపము క్రూరకర్మలూ, కూడని పనులే తోల్బొమ్మా, పాపపు రొంపిని పడబోకే, పరమాత్ముని నమ్మవె కీల్బొమ్మా’ అంటూ మానవులు జీవన ధోరణిని తెలియజేస్తారు. ఈ సందర్భంలో పాప సాహచర్యంతో దుర్మార్గుడు మంచివాడుగా మారతాడు. ఆటన్నా పాటన్నా పరమాత్ముని బొమ్మలాటని చెప్పే జీవన సత్యం ఈ పాటకి సాహిత్య గౌరవాన్నిచ్చింది.

‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో ‘రామాలాలీ! మేఘశ్యామాలాలీ! తామరస నయనా! దశరధ తనయాలాలీ! ‘ అనే పాటలో దృశ్య చిత్రీకరణంలో పాత్రల స్వభావాలు ఆవిష్కరించేలా, మాటలు పొదిగారు కృష్ణశాస్త్రిగారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామునికి తల్లులు. ‘ఎవ్వరు ఊపాలి? ఎవ్వరు జోల పాడాలి?’ అని కౌసల్య ‘నేనా’ అంటుంది. కన్నతల్లికే సందేహం వస్తే, సుమిత్ర ‘నేనో’ అని తటపటాయిస్తుంది. కైకెయి ‘నేనే’ అని ఖచ్చితంగా చెబుతుంది. కాకువు భేదంతో కైకేయికి రామునిపై ఎంత ప్రేమ ఉందో చెప్పి కృష్ణశాస్త్రిగారు ఈ జోలపాటలో కైకేయి స్వాభావిక సౌందర్యాన్ని ఆవిష్కరించారు.

‘కాలం మారింది’ చిత్రంలో అనాధ బాలికపై జోలపాట కరుణరసం ఉట్టిపడేలా రాశారు. ‘పల్లె నిదురించేను – తల్లి నిదురించేను! ప్రతిపాప తల్లి పొత్తిళ్ళు నిదురించేను’ అని ప్రారంభించి, ‘ఎవరికి నీవు కావాలి? ఎవరికి నీ మీద జాలి’ అని అనాధబాలికని ప్రశ్నిస్తారు. ‘ఏ తల్లి పాడేను జోల? ఏ తల్లి ఊపేను డోల, ఎవరికి నీవు కావాలి, ఎవరికి నీ మీద జాలి’ అని ప్రపంచం కర్కశత్వాన్ని ప్రకటిస్తారు. ‘కలువ పాపాయికి కొలను ఒడి ఉన్నది! చిలుక పాపాయికీ చిగురు ఒడి ఉన్నదీ! ప్రాణమే లేని ఒక శిలకు గుడి ఉన్నది! నీకే.. అమ్మ ఒడి లేనిదీ … గుడి లేనిదీ … ‘ ప్రకృతిలో అన్నీ ఆనందంగానే ఉన్నాయి. మానవ సమాజంలోనే కరుణలేదనీ,మనుషుల కంటే మతానికి ప్రాధాన్యానిస్తున్నారనే జీవనసత్యాన్ని కృష్ణశాస్త్రి భావకవిత్వంలో ఒక అంశమైన దృశ్యచిత్రణం కళాత్మకంగా చేశారు.

తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టేవి పండగలు. మానవులందరూ కలసి మెలసి సాగించే జీవన విధానంలో పండగలకి ప్రాధాన్యం ఉంది. సుఖదుఃఖాలూ, కలిమిలేములూ అన్నీ మరచిపోయి, ఆనందాన్ని పొందేది పండగలప్పుడే. పల్లెలు సంస్కృతికి ఆటపట్టు. నారు పోసింది మొదలు,పంటలు ఇళ్ళకి చేరేదాకా మనిషికి పాట తోడు ఉంటూనే ఉంటుంది. తెలుగు సినిమాలలో కృష్ణశాస్త్రిగారు మన పండగలని చిత్రిస్తూ కొన్ని పాటలను రాశారు. అవి ఆయనకి మన సంస్కృతి పట్ల ఉన్న అవగాహనని తెలియజేస్తాయి.

మన పండగలు వినాయక చవితితో ప్రారంభమౌతాయి. ‘వినాయక విజయం’ చిత్రానికి రాసిన పాటలో ‘వేల్పులందరిలోన తొలివేల్పువో ఏమో! పూజలలో మొదటి పూజ నీదేనేమో! అని అంటారు. పిల్లలూ పెద్దలూ భక్తి శ్రద్ధలతో చేసే వినాయక పూజని ప్రస్తావించారీ పాటలో. అట్ల తదియకీ, ఉండ్రాళ్ల తదియకీ ‘గోరింటాకు’ పెట్టుకొని సంబరపడే కన్నెపిల్లల కలలని చిత్రిస్తూ ‘గోరింట పూసింది కొమ్మా లేకుండా, మురిపాల అరచేత మొగ్గా తొడిగింది, ఎంచక్క పండిన ఎర్రని చుక్క , చిట్టీ పేరంటాలికి శ్రీరామ రక్ష’ అంటారు. ‘మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తె కలవాడొస్తాడు. సిందూరంలా పూస్తే చిట్టీ చేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు.’ కృష్ణశాస్త్రిగారు కలలకి మాటల రంగులద్ది, భావాన్ని అందంగా పలికించి తెలుగు సంస్కృతిలోని సౌందర్యాన్ని ఆవిష్కరించారు.

‘అమెరికా అమ్మాయి’ తెలుగుపాట పాడే సన్నివేశాన్ని చిత్రించి, ‘ఒళ్లంత వయ్యారి కోక, కళ్లకు కాటుక రేఖతో’ తెలుగు పడతిని పరిచయం చేస్తారు. సాంస్కృతిక సౌందర్యమంతా మూసపోసిన పాట ఇది.

‘కార్తీక దీపం’ చిత్రంలో కృష్ణశాస్త్రిగారు కార్తీకమాసంలో స్త్రీలు అరటిదొప్పలపై దీపాలు వెలిగించి, చెరువులలో వదిలే దృశ్యాన్ని చిత్రిస్తూ పాట రాశారు.

‘ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం ‘

అనే పల్లవితో ప్రారంభమై, ‘ఆకాశానా ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేటా, ఈ చిరుదివ్వెల చూచి చుక్కలనుకొంటారో’ అని అంటారు. భావకవికి భావన ముఖ్యం. భూమ్యాకాశాల మధ్య దూరాన్ని చెరిపివేసేలా చిత్రీకరించిన పాట కృష్ణశాస్త్రిగారిది. మన సంస్కృతిలోని సౌందర్యాన్ని భావించి రాసిన పాట ఇది.

‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా’ అంటూ రాసిన పాట ‘ఉండమ్మా బొట్టు పెడతా’ చిత్రంలో సంక్రాంతి వాతావరణాన్ని సాక్షాత్కరింపజేస్తారు. ‘కడివెడు నీళ్లు కళ్ళాపి చల్లి గొబ్బిళ్లో గొబ్బిళ్లు, కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్లో గొబ్బిళ్లో’ అంటారు

‘గాదుల్లో ధాన్యం ! కావిల్లా భాగ్యం
కష్టించే కాపులకూ! కలకాలం సౌఖ్యం’

అని శ్రమైక జీవన సౌందర్యాన్ని పలికిస్తారు. సాంస్కృతిక నేపథ్యంలోంచి కృష్ణశాస్త్రి రాసిన పాటలు తెలుగు సాహిత్యంలో శాశ్వతమైన స్థానాన్ని పొందాయి.

రాజారామమోహనరాయలు మానవోద్యమం ప్రభావంతో ఆంధ్రదేశంలో సంస్కరణ ఉద్యమాలకి శ్రీకారం చుట్టినవారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు, రఘుపతి వేంకటరత్నం నాయుడుగారు. ఇద్దరూ బ్రహ్మ సమాజానికి ఉద్యమరూపాన్ని ఇచ్చినవారే. సంస్కరణ ఉద్యమంలో వితంతు వివాహం, వేశ్యానిర్మూలనం, దళితుల ఉద్ధరణం ప్రధానమైన అంశాలు. ఈ భావాలు నేపథ్యంలోంచి భావకవితా వైతాళికుడు కృష్ణశాస్త్రి కొన్ని సినిమాపాటలు రాశారు.

‘కల్యాణ మంటపం’ సినిమాలో ఒక వేశ్య కూతురు తనకి తమ కులవృత్తి నచ్చక సాంసారిక జీవితం గడపాలని కోరుకుంటుంది. ‘సరిగమపదనిస… పలికేవారుంటే, హృదయము తెరిచేవారుంటే.. వలచే మనసుకు బదులుగ, పిలిచే కనులకు ఎదురై, ఎదురై పలికేవారుంటే” అని ఆమె సంస్కరణ భావాలు గల హృదయంకోసం ఎదురుచూస్తోంది. ‘ఒక కోవెలలో ఒకడే దేవుడు, ఒక హృదయంలో ఒకడే ప్రియుడు! జీవన నేత, ప్రేమ విధాత ‘ అని కృష్ణశాస్త్రిగారు వేశ్యా వృత్తిలోంచి బయటపడాలనుకొనే స్త్రీ ఆకాంక్షని చిత్రించారు.

సామాన్యులు ఊర్వశిని వేశ్యగా భావిస్తే, కృష్ణశాస్త్రి విశ్వప్రేయసిగా గౌరవించారు. స్త్రీని ఉన్నత దృష్టితో చూడటం భావకవిత్వంతోనే ప్రారంభమైంది. స్త్రీ హృదయాన్ని, ఆవేదననీ అర్థం చేసికొని కృష్ణశాస్త్రి సంస్కరణ దృష్టితో రాసిన పాట ఇది.

హరిజనోద్యమం, కళావంతుల వివాహం మొదలైన సంస్కరణ ఉద్యమాలతో సన్నిహిత సంబంధం గల కృష్ణశాస్త్రిగారు సినీ సాహిత్యంలో సంస్కరణ ధోరణి ప్రదర్శిస్తూ ‘మంచిరోజులు వచ్చాయి’ చిత్రంలో

‘నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
పగటితో రేయి అన్నదీ నను తాకరాదనీ
నీరు నన్ను తాకరాదనీ గడ్డిపరక అన్నది
నేను భర్తనే తాకరాదనీ ఒక భార్య అన్నదీ’

అనె పాటలో కులాంతర వివాహం చేసుకున్న భార్య భర్తని తృణీకరించిన సందర్భంలో ఆమె హృదయాన్ని సంస్కరించే ధోరణిలో కృష్ణశాస్త్రి ఇలా అంటారు.

‘రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా’

అని ప్రకృతిలోని నైర్మల్యాన్ని మనుషుల్ని అలవరచుకోమంటున్నారు. ‘అంటరానితనము – ఒంటరితనము, అనాదిగా మీ జాతికి అదే మూలధనము’ అని అంటారు. మనుషుల మూర్ఖత్వాన్ని తొలగించే ప్రయత్నం. ఈ భావసంస్కరణం. అదే కృష్ణశాస్త్రి పాటలకి ఆభరణము.

కృష్ణశాస్త్రిగారి సాహిత్యంలో అంతర్లీనంగా స్ఫురించేది మానవత. మనిషిని మనిషిగా, మానవునిగా చేసేది మానవత. ప్రపంచ పరిస్థితుల పట్ల , విశ్వమానవుల పట్ల కరుణతో అర్థం చేసుకొనే స్పృహ కలిగించేది మానవత. కొన్ని సినిమా పాటలలో మానవతా సుమగంధాలు వెదజల్లేరు కృష్ణశాస్త్రి.

సుఖదుఃఖాలు చిత్రానికి రాసిన పాట. ‘ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది’ అనే పల్లవితో ప్రారంభమౌతుంది. ‘మరిగిపోయేది మానవహృదయం కరుణకలిగేది చల్లని దైవం;’ అని అంటారు. ‘ద్వారానికి తారామణి హారం, హారతి వెన్నెల కర్పూరం’ అని పాట ముగిస్తారు. సంకుచిత మనస్తత్త్వాన్ని చెరిపి విశాల దృక్పథాన్ని ధ్వనింపచేస్తున్నారీ పాటలో. వ్యక్తులు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకి గుమ్మాలకి మామిడితోరణాలు కట్టుకుంటారు. ఒక చిన్నపళ్లెంలో హారతి పడతారు. కానీ కవి విశ్వకుటుంబి . ప్రపంచ శుభం కోరే కవి ఇంటి గుమ్మానికి నక్షత్రాల మణిహారమే తోరణం. ఆకాశం హారతిపళ్లెం. చందమామ కర్పూరం బిళ్ల. వెన్నెల హారతి. ఆరుమాటలలో ఆరు ఖండాలని కలిపి, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ధ్వనింపజేసిన ఈ గీతం మానవతకి అద్దం పడుతుంది.

‘ఉండమ్మా! బొట్టు పెడతా’ చిత్రంలో ‘అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది’ అనే పాటలో ‘ఆ గుడిలో దీపం ఉంది . అదియే దైవం’ అని అంటారు కృష్ణశాస్త్రి. మానవ హృదయంలో వెలిగే ప్రేమ ఆ దైవం. ‘ప్రతిమనిషి నడిచే దైవం. ప్రతి పులుగూ ఎగిరే దైవం’ అని అంటారు. మతవైషమ్యాలతో మనిషిని మరిచిపోతున్న ఈనాడు మనిషిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని గుర్తు చేస్తున్నారు కవి. మతం కంటే మానవత ఎంత గొప్పదో చెబుతున్నారు. మనిషి మనసు ఈశ్వరుని కొలువు అనిపించాలనే తపనతో రాసిన గీతమిది. కులమతాల కతీతమైన మానవత ఈ గీతంలో అక్షరకాంతులు వెదజల్లింది.

తెలుగు సినీ గీతాలలో ప్రణయానికి ప్రాధాన్యాన్నిచ్చిన వారిలో కృష్ణశాస్త్రిగారిని ప్రత్యేకంగా చెప్పాలి. వియోగాన్నీ, సంయోగాన్నీ సున్నితంగా చెప్పడంలో ఆయన సిద్ధహస్తులు. ‘మల్లీశ్వరి’ చిత్రానికి రాసిన పాటలు ప్రణయ మాధుర్యానికి ప్రతినిధులు.

‘మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే’ అంటూ మల్లీశ్వరి చిత్రంలోని విరహగీతం కథానాయిక మనోభావాలని క్రమక్రమంగా వ్యక్తం చేస్తూ, ఆమె తన వ్యక్తిత్త్వాన్ని విశ్లేషించుకొనేలా చిత్రించిన ధోరణిలో రచించారు కృష్ణశాస్త్రి. భావకవిత్వంలో లిరిక్ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్న గీతమిది. ‘ఎన్నినాళ్లకీ బ్రతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో’ అని ముగిసిన ఈ పాట సినిమాలో సందర్భానికి సరిగ్గా అతకడమే కాక, విడిగా విన్నప్పుడు ఆ దృశ్యం మన మనస్సులో కనిపించేలా రాశారు కృష్ణశాస్త్రి.

‘ఎందుకే నీకింత తొందర, ఇన్నాళ్ల చెరసాల ఈ రేయి తీరునే’ అని తొందరపడే మనసుని చిలకగా భావించి, రాణివాసమనే పంజరంలోంచి కథానాయిక విముక్తమవటాన్ని సూచించి, పాటరచనలలో సృజనాత్మక భావనకి ప్రాధాన్యాన్నిచ్చారు కృష్ణశాస్త్రి.

ఆకాశవీధిలో హాయిగా ఎగిరే మేఘమాలని పిలిచి, మల్లి అమాయకంగా తన హృదయ వేదన తెలుపుతూ మల్లీశ్వరి చిత్రంలో,

‘జాలిగుండెల మేఘమాలా! నా, బావలేనిది బ్రతుకజాల!
కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని
వానజల్లుగా కురిసి పోవా! కన్నీరు, ఆనవాలుగా బావమ్రోల’

వియోగ శృంగారం పలికించారీ గీతంలో.

‘సుందర సురనందనవని మల్లీ, జాబిల్లీ!
అందేనా! ఈ చేతుల కందేనా?
చందమామ ఈ కనులకు విందేనా? ‘

అనే పాట ‘పూజాఫలం’ చిత్రానికి రాశారు. ప్రేమించిన ప్రియుడు ఎదురుగా ఉన్నా తనకి దక్కక పోవడాన్ని కన్నులకి విందులు చేస్తూ, చేతులకందని చందమామలా చెప్పేరీ పాటలో కృష్ణశాస్త్రి. ‘కలువ పేద బ్రతుకులో వలపు తేనె నింపేనా? ” అంటూ పేద ప్రియురాలి మనోవేదన వియోగ శృంగారంలో పలికించి ప్రకృతిలో మానవ మనఃస్థితిని దర్శించారు.

‘రానిక నీకోసం సఖీ! రాదిక వసంత మాసం’ అంటూ ‘మాయని మమత’ చిత్రంలో విఫలప్రేమని పలికించారు. వియోగంతో భార్యకి భర్త రాసిన లేఖ రూపంలో ‘కుశలమా! నీకు కుశలమేనా?’ అని అంటూ ‘బలిపీఠం’ చిత్రంలో రాసిన పాటలో విరహాగ్ని కొత్త తరహాలో పలికించారు.

ప్రియుని తన ఒడిలో పరుండబెట్టికొని ‘ రాజమకుటం’ చిత్రంలో కథానాయిక పాడే పాట ‘సడిసేయకేగాలి సడిసేయబోకే ‘ అంటూ కృష్ణశాస్త్రి అమూర్తమైన వాటికి ఆకారాన్ని కల్పిస్తారు. ‘పండువెన్నెల నడిగి పాంపు తేరాదే! నీలిమబ్బుల దాగి నిదుర తేరాదే! విరుల వీవన పూని విసిరిపోరాదే! ‘ గాలిని బ్రతిమాలే ధోరణి ప్రణయంలో ప్రకృతిని చిత్రిస్తారు కృష్ణశాస్త్రి.

‘ఏకవీర’ చిత్రంలో ‘ప్రతిరాత్రి వసంత రాత్రి, ప్రతిగాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి’ అంటూ సంయోగ శృంగారంలోని సౌందర్యాన్ని పలికించారు కృష్ణశాస్త్రి. ‘మావిచిగురు తినగానే కోయిల పలికేనా/ కోయిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా?’ అని ‘సీతామాలక్ష్మి’ చిత్రంలో రాసిన పాటలో ప్రణయంలో అమాయక ప్రకృతిని చిత్రించారు. ‘ఒకరి పెదవి పగడాలు వేరొకరి కనుల దివిటీలు, ఒకరి గుండె ఉయ్యాల వేరొకరి గుండె జంపాల’ అనడంలో ప్రణయం హృదయంలో మాధుర్యాన్ని చిందించాలనే భావనకి ప్రాధాన్యాన్నిచ్చారు.

తెలుగు సాహిత్యరంగంలో ప్రత్యేకించి, సినిమారంగంలో విలువలు పడిపోతున్న ఈనాడు కూడా కృష్ణశాస్త్రి సినిమా పాటలకి వన్నె తగ్గలేదు. దానికి కారణం, తెలుగు మాటలకి, జిలుగు వెలుగూ కలిగించి, పాటలు రాసి, పాటలో భావసౌందర్యాన్ని ఆవిష్కరించటం, మానవ మనస్తత్త్వంలోని వైవిధ్యాన్ని గ్రహించి, విభిన్న అనుభూతులని పాటలుగా పలికించిన కృష్ణశాస్త్రి తెలుగు సాహిత్యంలో అజరామరుడు.

కృష్ణశాస్త్రిగారి సాహిత్యాన్ని పరిశీలిస్తే ఆయన సౌందర్య ప్రస్థానంలో శాశ్వతమైన స్వేచ్చకోసం, నిర్మలమైన ప్రేమకోసం, శాశ్వతమైన సౌందర్యం కోసం ఆయన పడిన తపన తెలుస్తుంది.

‘కృష్ణపక్షం’లో కవికుమారుడు భౌతికమైన స్వేచ్చాన్వేషణంలో ప్రేమకి దూరమై, సౌందర్యాన్ని కోల్పోయాడు. ‘ప్రవాసం’ లో దుఃఖంతో తనని తాను సంస్కరించుకొనే ప్రయత్నం చేశాడు. ప్రేమభావనతో హృదయాన్ని సౌందర్యమయం చెసుకున్నాడు. ‘ఊర్వశి’లో శాశ్వతసౌందర్యాన్ని దర్శించాడు. శోధన, సాధన, ఆరాధన ప్రధానమైన అంశాలుగా సాగిన కృష్ణశాస్త్రి సౌందర్య ప్రస్థానంలో ప్రేమ ఎంత ఉదాత్తమైనదో తెలుస్తుంది.

ప్రకృతిప్రేమ, మానవత, భక్తి, ప్రణయం, పల్లీయ జీవనమాధుర్యం, దేశభక్తి మొదలైన అంశాలు ఆయన కవిత్వంలో చోటు చేసుకొని, మానవవిలువలని ఆవిష్కరించాయి.

భౌతిక సౌందర్యం కంటే ఆత్మసౌందర్యం శాశ్వతమైనదనే సత్యం ఆయన సాహిత్యంలో మనకి కనిపిస్తుంది. బ్రహ్మసమాజం, మానవోద్యమం ఆయనకి మానవులపట్ల కలిగించిన అవగాహనతో, ఆయన సృష్టించిన సాహిత్యం మనిషిపట్ల ఆయనకి గల ప్రేమని తెలియజేస్తుంది

ఆంగ్లవిద్యా సంస్కారం ఆయనకి సాహిత్య సృజనలో రూపానికి సంబంధించిన నూతన సంవిధానమూ, భావాలకి సంబంధించిన సంస్కరణ దృష్టిని అలవరించాయి. భావకవిత్వాన్ని ఉద్యమరూపం ధరించేలా చేసినాయి.

కృష్ణశాస్త్రి సౌందర్య దృష్టి, మానవ ప్రేమ, కరుణ, పదలాలిత్యం తెలుగు సాహిత్యంలో నవ్య ధోరణులకి మార్గదర్శకాలైనాయి.
---------------------------------------------------------
రచన- డా. సీతారామయ్య (రామసూరి), 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Friday, July 27, 2018

భారతీయ సాంప్రదాయంలో గురువు పాత్ర


భారతీయ సాంప్రదాయంలో గురువు పాత్ర





సాహితీమిత్రులారా


భారతీయ సాంప్రదాయం ఆచార్యులకు అగ్ర తాంబూలం ఇచ్చింది. గురువును లేక  ఆచార్యుని  త్రిమూర్త్యాత్మకంగా  చిత్రించడం మన సంప్రదాయంలోనున్న మహోన్నత దృష్టాంతము. 'గు' అనగా అంధకార బంధురము. 'రు' అనగా ప్రకాశ వంతమైన తేజస్సు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞాన ప్రకాశాన్నందించడమే నిజమైన గురువు యొక్క కర్తవ్యము. ఆధ్యాత్మికంగానూ , సామాజికంగానూ గురువు ప్రాధాన్యత ఎనలేనిది.

విద్యార్థి , గురువు మఱియు గురుకులము భారతీయ సంప్రదాయంలో పెనవేసుకొన్న బంధాలు. ఇవే విద్యాభివృద్ధికి, సంస్కృత వికాసానికి ఆలంబనాలు. గురు శిష్యుల పరస్పర అన్యోన్యత, సౌజన్యత విద్యాభివృద్ధికి దిశానిర్దేశమయ్యాయి. ‘‘ అన్నదానం మహాదానం విద్యాదానమతః పరమ్ l  అన్నేన క్షణికా తృప్తిః  యావజ్జీవం తు విద్యయా ll “  అంటూ విద్యాదాన ఔన్నత్యాన్ని చాటిచెప్పిన దేశం మనది. అందుకే పంచమహాయజ్ఞాల్లో   'అధ్యాపనం బ్రహ్మవిద్యా' అంటూ పేర్కొన్నారు. విద్య వల్ల తాను మాత్రమే  విరాజిల్లితే అతడు ఆచార్య స్థానానికి అనర్హుడు. విద్యార్థి స్థాయికి దిగివచ్చి ఆతనిని తీర్చిదిద్ది తనతో సమానంగా అంటే ఒక దీపం మరో దీపాన్ని ప్రజ్వలించినట్లు చేయడం ఆచార్యుని ప్రథమ కర్తవ్యం. ఆచార్యుడు, దేవుడు ఒకే సారి వస్తే అచార్యునికే అగ్రపీఠం అంటాడు కబీర్ దాసు (गुरु गोविन्द दोऊ खड़े काको लागूं पायं। बलिहारी गुरु आपने जिन गोविन्द दियो बताय). అందుకే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ 'శ్రీ గురు చరిత్ర' ప్రవచనం లో ఓ గమ్మత్తైన మాట అంటారు. దుష్ట సంహారం కోసం పొందిన భగవంతుని అవతారం చాలా తేలిక. గురువుగా అవతరించి కొన్ని తరాలను ఉద్ధరించడం అవతార ప్రక్రియ లో ఒక క్లిష్టమైన విషయమంటారు వారు. అందుకే గురుపరంపర ఆగకూడదంటారు.

'సదాశివ సమారంభాం శంకరాచార్య  మధ్యమామ్ l
అస్మదాచార్య  పర్యంతాం వందే గురు  పరంపరామ్ ll  '

ఈశ్వరుని మొదలుకొని , శంకరాచార్యులను మధ్యనిడి , మా గురువు వరకు ఎవరెవరు ఆచార్యులున్నారో వారందరికీ  నమస్కారము  అని ఈ శ్లోకార్థము.ఈ పరంపర సంప్రదాయమే లేకుంటే మన సంస్కృతి ఏమయ్యేది? మన విజ్ఞానం ఎలా పరిఢవిల్లేది?
నిజమైన ఆచార్యుడు, సమాజ క్షేమాన్ని కోరే ఆచార్యుడు తాను కష్ట పడి సంపాదించిన జ్ఞానాన్ని అర్హత గల వారికి అందజేయడం కోసం హోమాలు సైతం చేస్తాడని తైత్తిరీయ ఉపనిషత్తు దృష్టాంతం చెపుతుంది.

'ఆ మా యంతు బ్రహ్మచారిణః స్వాహా
వి మా యంతు బ్రహ్మచారిణః స్వాహా
ప్ర మా యంతు బ్రహ్మచారిణః స్వాహా
ద మా యంతు బ్రహ్మచారిణః స్వాహా'

అంటే మేధా శక్తి గల వారు, ఇంద్రియ నిగ్రహులు, కోపహీనులు (శాంత స్వభావులు ) అయిన అర్హులు విద్యార్థులుగా రావాలి. శిష్యులను వుద్ధరించాలనే ఈ తపన గురువులను అగ్రస్థానం లో కూర్చోపెడుతుంది.
గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. అందుకే “गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः“ అంటుంది గురుగీత. విద్యకూ జ్ఞానానికీ బీజం నాటడం ద్వారా బ్రహ్మ, మనస్సు వికల్పం గాకుండా బ్రహ్మజ్ఞాన పరిష్వంగన అయి వుండడం కోసం మరియు సదా ప్రబోధన చేయడం ద్వారా విష్ణుత్వం గురువుకు ఆపాదించబడింది. బ్రహ్మజ్ఞానంలో భౌతికజ్ఞానం లయం చేయడమనే స్థితికి శిష్యుణ్ణి తీసుకొని రావడం శివతత్త్వానికి ప్రతీక.
గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నది అతిశయోక్తి గాదు. కేవలం విషయ సేకరణ జ్ఞానాన్ని అందించటం లేదు. విద్యను ఒక సముద్రంతో పోలిస్తే గురువు మేఘం వంటి వాడు. సముద్రంలోని క్షారగుణాన్ని నిబద్ధించి స్వచ్చమైన జ్ఞానధారను శిష్యులకు ఉపాధిగా ఇస్తుంటాడు గురువు. బుద్ధి జ్ఞానాల ఆంతర్యాన్ని టి.ఎస్.ఇలియట్ అన్న ఆంగ్లకవి ఇలా చిత్రీకరిస్తాడు:

Where is the Life we have lost in living?
Where is the wisdom we have lost in knowledge?
Where is the knowledge we have lost in information?

Information నుండి knowledge లోతుల్లోకి వెళ్లి wisdom ను అందించడమే గురువు సమాజానికి చేసే మహోపకారము.
ఇన్ని సత్ క్రియలు చేసే గురువు ఎలాంటి వాడై ఉండాలో కూడా మన సంప్రదాయం చెబుతుంది. శ్రోత్రియం మరియు బ్రహ్మ నిష్ఠ గురువుల కుండ వలసిన సద్గుణాలు. ప్రస్థానత్రయాల ప్రజ్ఞ శ్రోత్రియుల లక్షణం. విద్యార్థికి ఆత్మజ్ఞానప్రబోధం చేయడానికి కావలసిన వస్తుసామగ్రి శబ్ద రూపంలో గ్రహించి తేట తెల్లంగా చెప్పడానికి శ్రోత్రియం ఉపకరిస్తుంది. మరి బ్రహ్మనిష్ఠా? ఇది అత్యంత అవసరమైన గుణం. తాను స్వయంగా ఆత్మజ్ఞానానుభూతిని పొంది ప్రబోధించడం బ్రహ్మనిష్ఠకు పరాకాష్ట. నరేంద్రుడు 'దేవుణ్ణి చూచారా' అని ఎందర్ని అడిగినా ఒక్క రామకృష్ణ పరమహంస మాత్రం దేవుణ్ణి చూశానని, చూపించ గలనని భరోసా ఇవ్వగలిగాడు. ఈ రెండు గుణాలే కాక గురువు శాంతుడు, వినయశీలి, ఆచారశీలి, బుద్ధిమంతుడు అయి వుండాలన్నారు మన పూర్వీకులు.

‘శాంతో  దాన్తః కులీనశ్చ వినీతః శుద్ధ  వేషవాన్l
శుద్ధాచారస్సుప్రతిష్ఠః  శుచిర్దక్షః సుబుద్ధిమాన్ ll
అధ్యాత్మజ్ఞాననిష్ఠశ్చ తంత్ర మంత్ర విశారదః l
నిగ్రహస్సు గ్రహీశక్తో గురురిత్యభిదీయతే ll  ’

'బుద్ధి చెప్పు వాడు గ్రుద్దితేనేమయా ' అంటాడు వేమన. శిష్యుణ్ణి సన్మార్గంలో ఉంచడానికి ఒక దెబ్బ కొడితే అది మంచికే గాని చెడుకు గాదన్న సంగతి పెద్దలు గ్రహించాలి.

సామృతైః పాణిభిర్ఘ్నన్తి గురవో న విషోక్షితై: l
లాలనాశ్రయణో  దోషాః తాడనా శ్రయణో గుణాః ll

గురువు శిష్యులను తన అమృతహస్తాలతో కొడతాడే కానీ చెడు అక్షంతలతో కాదు. ఈ శ్లోకార్థమే “లాలనే బహవో దోషాః తాడనే బహవో గుణాః l తస్మాత్ పుత్రం చ శిష్యం చ తాడయేత్ న తు లాలయేత్ ll“ – లాలించడం వలన చాల దోషాలు ఉన్నాయి. కొట్టడం వలన చాల గుణాలు ఉన్నాయి. అందువలన పుత్రుని శిష్యుని కూడ కొట్టి మంచి మార్గంలో పెట్టాలి అని సుభాషితకారులన్నారు. అంతే కాక “లాలయేత్ పంచవర్షాణి దశ వర్షాణి తాడయేత్ l ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ ll“ – పుత్రునికి అయిదు సంllలు వచ్చే వరకు లాలించాలి. తర్వాత పది సంllలు కొట్టి మంచి మార్గంలో పెట్టాలి. పుత్రునికి పదహారు సంllలు వచ్చిన తర్వాత మిత్రునివలె చూసుకోవాలి అని సుభాషితకారులన్నారు. ఇట్లా మన భారతీయ సంప్రదాయంలో పుత్రునికి , శిష్యునికి అభేదాన్ని చెప్పారు.  పుత్ర, శిష్యులు ఇరువురూ గురువుకు పుత్రులే అని భారతీయ సంస్కృతి తెలియజేస్తున్నది.

ఇంతగా గురువును గూర్చి చెప్పిన మన సంప్రదాయం ఇప్పటి విద్యా పద్ధతులకు అనుగుణంగా నిలబడుతుందా? అదేమో గురుకుల సంప్రదాయము. ఇప్పటిదేమో తద్భిన్నమైన సంప్రదాయము. అప్పట్లో గురువు నీడలో శిషులు విద్యాభ్యాసం చేసేవారు. గురుకులంలోనే వుండేవారు. నేడు అలా కాదు. గురు శిష్యుల మధ్య అంతరాలు పెరిగాయి. దూర శ్రవణ విద్య, అంతర్జాలం ద్వారా గురువుతో సంబంధాలు, వీడియో మరియు ఆడియో లాంటి సరికొత్త పోకడలు నేటి అంతర్జాతీయ విద్యా రంగలో క్రొత్త మలుపులు. విద్యా వస్తువు సైతం సమూలంగా మారింది. ఆత్మజ్ఞానమంటే ఏమో అవసరం లేదు. డబ్బెలా సంపాదించాలి? అవసరాల్ని సృష్టించి, పెంచి, అప్పులిచ్చి, వస్తువుల్ని ఎలా విక్రయించాలి? ఇలాంటి భావనలు (consumerism tendencies) ప్రబలంగా విద్యారంగం లో చోటు చేసుకొన్నాయి.

ఇలాంటి జీవన యానంలో గురువు స్థానం ఎక్కడ? ఇది విశ్లేషించుకోవలసిన విషయము. మన సాంప్రదాయాన్ని నేటి పద్ధతులకు అన్వయంచుకొని ఎలా సంరక్షించుకోవాలి? నేటి గురువు ఈ కాలపు అవసరాల రీత్యా నిత్యం తన జ్ఞానాన్ని పెంచుకోవలసిన అవసరం ఎంతో వుంది. అలాగే శిక్షణా శైలి కనుగుణంగా శిక్షణా నైపుణ్యాన్ని(teaching skills)  పెంపొందించుకోవాలి. నైతిక ప్రవృత్తి విద్యార్థులలో పెంపొందించడం కోసం తాను ధార్మికగ్రంథాధ్యయనం చేయాలి. విద్యాభ్యాసనా సమయంలో లోపించిన నైతిక ప్రమాణాలే నేటి సామాజిక రుగ్మతలకు కారణమన్న సత్యాన్ని గురువు దృఢంగా విశ్వసించాల్సిన సమయమిది. ‘Analytical knowledge, emotional knowledge and spiritual knowledge are the integral part of the overall education’ అన్న సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా శిష్యుణ్ణి తీర్చిదిద్ద గలిగే వాడే నేటి గురు స్థానానికి అర్హుడు. 'గూగుల్' కావలి హద్దుల్లోకి వెళ్లి విషయాలను విశ్లేషించి సారాన్ని సారవంతంగా శిష్యునికందించాల్సిన అగత్యం గురువుపైనుంది అనడంలో సందేహం లేదు. అతి కష్టమైన విషయాన్ని సూక్ష్మంగా అన్వయించి అఖండంలో అణువునూ, అణువులో అఖండాన్ని సాక్షీభూతం చేస్తూ సాగరాన్ని సైతం ఘటంలో ఇమిడ్చి ఇవ్వగల నేర్పరి నేటి నిజమైన గురువు. అతనే ఆచార్య స్థానానికి అర్హుడు. సదా సత్కారార్హుడు.
--------------------------------------------------------
రచన- డా. కరణం నాగరాజ రావు, 
మధురవాణి సౌజన్యంతో

Thursday, July 26, 2018

చేగోడీ కంప్యూటర్‌కంపెనీ(కథ)


చేగోడీ కంప్యూటర్‌కంపెనీ(కథ)





సాహితీమిత్రులారా!




శివరాం కి సాధారణంగా కోపం రాదు. కానీ హైదరాబాదులో విమానం ఎక్కిన్యూయార్క్‌లో దిగేదాకా ఒళ్ళు మండుతూనే వుంది. ఎప్పుడు ఇండియా వెళ్ళినా, వచ్చినా, Air India లో ముసలి గుజరాతీ తల్లిదండ్రులు, పిల్లలకి గుళ్ళూ,గోపురాలూ చూపించి భారత లేదా తెలుగూ కల్చర్‌నాలుగు వారాల్లో crash course యిచ్చేద్దామనుకునే మధ్యవయసు భారతీయులే తప్ప ఇటువంటి ప్యాసెంజెర్లని చూడలేదు. విమానం నిండా వాళ్ళే… తనొక్కడు తప్ప.

“ఏమిటి చేశారు .. విజ్వుల్‌బేసిక్కా? ఫరవాలేదు. నేనా! ఆరేకల్‌ ఆర్నెల్లు training తీసుకున్నాను… ఆరేకల్‌డి బి ఏ యా లెక financials నా? ఎందుకైనా మంచిదని రెండూనూ… ఈ మధ్య AS/400, PeopleSoft కి విపరీతంగా demandఉందండీ.. అవి చేసే బదులు ఏకంగా SAP చేస్తేనే మంచిది. ఏనుగు కుంభస్థలంకొట్టొచ్చు…”

ఈ పై విధంగా ఆ Air India plane లో మాట్లాడుకునే వాళ్ళ భాషలో శివరాంకిఒక్క మాట కూడా అర్థం అవలేదు. అసలు ఆ టాపిక్‌ఏమిటో కూడా తెలియటం లేదు. పొరపాటున ఈ ఖగోళం నుంచి మరో సివిలిజేషన్‌కి వెళ్ళిపోయామేమో అనుకుంటూ పక్కనే కూచున్న చౌదరి గారికేసి చూశాడు. మన హైదరాబాదు మనిషి లాగే వున్నాడు. చౌదరి మెడలో ఒక లాకెట్‌వేలాడుతోంది. అందులో ఒక గెడ్డపాయన ఫోటో వుంది. చౌదరి గంటకొకసారిఆ గడ్దపాయన ఫోటో కళ్ళ కద్దుకుని దణ్ణం పెట్టుకుంటున్నాడు.

ఎవరండీ ఆయన? కొత్తగా వెలిసిన స్వామీజీ గారా! అనడిగాడు శివరాం ఉండబట్టలేక. ఈయన స్వామీజీ కాదు సార్‌! చెంద్రబాబు నాయుడు. ఆయనే మా అందరికీ నాయకుడు. ఎవరూ! chief minister ఫోటోయా? అవును సార్‌! నాయుడు గారు ఆంధ్రాని అమెరికా కంటే పెద్ద కంప్యూటర్‌ దేశం చేసి పారేద్దామని వ్రతం పట్టాడు. Bill Gates అంతటివాడు నాయుడుగారిని చూసి డంగై పోతున్నాడు. మా అందరికీ అసలు స్వామీజీ నాయుడు గారే!

“మా అందరూ” అంటే?

అదేనండీ .. ఈ విమానంలో ఉన్న వాళ్ళం అందరం కంప్యూటర్‌ software గాళ్ళం.మేమే నేటి బాలలం .. రేపటి పౌరులం. దేశానికి డబ్బు, పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే వీరులం. ఆవేశపడి పోతున్నాడు చౌదరి.

అప్పటికి అర్థం అయింది శివరాం కి ఇందాకా వాళ్ళు మాట్లాడుకుంటున్న భాషకంప్యూటర్‌భాష అని. మెల్లిగా వివరాలు తెలిశాయి. చౌదరితో బాటు మరొక నలుగురు ఆ విమానంలోనే కత్తిపూడి, కాపవరం,కైకలూరు వగైరా ఊళ్ళలో computer training తీసుకుని H1 వీసాల మీద అమెరికా వస్తున్నారు.

ఆముదాలవలస నుంచి అనకాపల్లి దాకా ఆంధ్రాలో అన్ని ఊళ్ళలోనూ, ప్రతి జంక్షన్‌దగ్గరా ఒకకిళ్ళీ కొట్టూ, పక్కనే కంప్యూటర్‌సెంటర్‌ఉండటం చూసి శివరాం నవ్వుకున్నాడు మొన్నమొన్ననే.చౌదరి sponsoror … అంటే H1 వీసాలు సంపాయించి అమెరికా తీసుకు వెళ్తున్న ఆసామీ పేరు క్రిస్‌మర్టీ ట. కంపెనీ అమెరికాలోచాలా పేరున్న పెద్ద కంపెనీ .. పేరు చేగోడీ కంప్యూటర్స్‌.

చేగోడీ … ఆ మాట విని, చేగోడీలు తిని అనేక యుగాలు అయిందే అని కొంచెంగింజుకుంటున్న శివరాంని చూసి, క్రిస్‌గారికి చేగోడీ లంటే చాలా ఇష్టం అనీ, అమెరికా వాళ్ళు ఆనియన్‌రింగ్స్‌ని ఆంధ్రాచేగోడీ నుంచి కాపీ కొట్టారని క్రిస్‌గారి అభిప్రాయం అనీ, మా ఈ కంప్యూటర్‌బ్యాచ్‌వాళ్ళందరినీ డల్లాసులో ఒక బ్రహ్మాండమైన guest house లో వుంచి projects లో పనిచేయిస్తూ నెలనెలా జీతం ఇస్తూ అఖండ గౌరవం చేస్తారనీ చౌదరి ఎంతోకుతూహలంగా వివరించాడు. విమానంలో వున్నరావు, మూర్తి, రెడ్డి, రాజు వగైరా కంప్యూటర్‌కళాకారులందరూ పైకి ఆర్భాటంగాసూటూ బూటూ వేసుకుని ఎప్పుడుఅమెరికాలో దిగుదామా అని భయం భయంగా ధైర్యం నటిస్తున్నారు.

Air India విమానం న్యూయార్క్‌లో దిగగానే కస్టమ్స్‌వాళ్ళు ప్యాసింజెర్లందరినీలైనులో నుంచోబెట్టారు. విజువల్‌బేసిక్‌ వాళ్ళంతా తెల్ల లైను, C, C++, java గాళ్ళందరూ నల్ల లైను, PeopleSoft, AS/400, గాళ్ళు ఎర్ర లైను, SAPవాళ్ళు మటుకు, ఇదుగో ఈ gold carpet మీద లైన్లలో నుంచోండి అని హెచ్చరికలు చేశారు. శివరాం కి మళ్ళీ ఒళ్ళు మండింది. తను అమెరికా వచ్చి పాతికేళ్ళయింది. తన గురించి ఒక్క కస్టమ్స్‌ఆఫీసరూ పట్టించుకోలేదు.తన ఒళ్ళు మంట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూండగానే ఒక నల్ల దొర వచ్చి… దూకుడుగా .. ఏం ఇక్కడే నుంచున్నావు అని కోప్పడ్డాడు. ఎక్కడ నుంచోవాలో తెలీక అన్నాడు శివరాం.

నువ్వేమిటి? విజువల్‌బేసిక్కా, యూనిక్సా, విండోసా … అని అడుగుతున్న ఆ జాన్సన్నిచూసి అయామ్‌ ఎ మెకానికల్‌ ఇంజనియర్‌ అన్నాడు శివరాం.

ఇంజనియర్‌వా … ఐతే ఇక్కడ నిలబడు అన్నాడు జాన్సన్‌జాలిగా . ఆ లైనులోతనొక్కడే ఉన్నాడు. ఆఖరివాడిగా, మిగిలిన కంప్యూటర్‌లైన్లన్నిటికీ వెనకాల.

మొత్తానికి ఆ కంప్యూటర్‌వాళ్ళందరూ న్యూయార్క్‌నుంచి Dallas, Chicago, Raleigh, Atlanta, ఎవరి దారిన వాళ్ళు పోగా తను హ్యూస్టన్‌ flightతీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రాణం పోయినా మళ్ళీ హైదరాబాదు నుంచి బయలుదేరే Air Indiaలో ప్రయాణం చెయ్యనని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసుకున్నాడు.

DFW – Dallas – Fort Worth విమానాశ్రయం లో విమానం ఆగింది. చౌదరి,రావు, రెడ్డి, రాజు, శాస్త్రి ఐదుగురూ అర్జంటుగా వేసుకున్న సూట్లు సద్దుకుని, పౌడరు, సెంటు పూసుకుని ఎర్రగా బుర్రగా పొడుగ్గా హాయ్‌హౌ ఆర్‌యు అని అమెరికన్‌ఇంగ్లీషులో మాట్లాడే క్రిస్‌మర్టీ గారికి ఎలా షేక్‌హండ్‌ఇవ్వాలా, ఎవరు ముందు మాట్లాడాలా అని ఆ పంచ పాండవులు తర్జన భర్జన పడుతుండగా … ప్యాసెంజెర్స్‌ని రిసీవ్‌చేసుకోవటానికివచ్చిన నల్ల, తెల్ల, పసుపు .. అంటే చైనా దొరలందరూ వెళ్ళిపోయారు.

క్రిస్‌గారు ఎలా ఉంటారో తెలియక ఇప్పుడెలాగరా భగవంతుడా అని చౌదరికంగారు పడుతుండగా,క్రిస్‌మర్టీ వచ్చి హలో అయామ్‌క్రిస్‌మర్టీ అనిపరిచయం చేసుకున్నాడు. అతని మొహం చూసి చౌదరి రావు మొహం, రావు రెడ్డి మొహం, రెడ్డి రాజు మొహం, రాజు శాస్త్రిమొహం చూసుకున్నారు. ఇలా మొహాల వీక్షణ కార్యక్రమం పూర్తయ్యాక పంచపాండవులు కలిసి క్రిస్‌ మొహం కేసితీవ్రం గా చూశారు. గోధుమ రంగులో, పొట్టిగా, గుజరాతీ వాళ్ళలా గిల్టు బంగారు రంగు కళ్లద్దాలతో ఉన్న క్రిస్‌ వాళ్ళకి క్రిస్‌లా కనబడలేదు. మర్టీలా కనబడలేదు. క్రిస్‌మర్టీలా అసలు కనబడలేదు.

ఆర్యూ క్రిస్‌మర్టీ సార్‌? అని అడిగాడు చౌదరి ధైర్యం చేసి. అవునండీ welcome to America అన్నాడు తెలుగుఇంగ్లీషులో క్రిస్‌మర్టీ. క్రిస్‌మర్టీ అంటే … నసిగాడు రావు. ఓ అదా! నా అసలు పేరు కృష్ణమూర్తి లెండి. అమెరికా కదా … అంచేత వాళ్ళకిఅర్థమయ్యే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది..

సరే, క్రిస్‌గారు పంచపాండవుల్ని తన లెక్సస్‌, అనగా చిన్న ఖరీదైనకారులో ట్రంకులో సామాను అంతా పట్టకపోతే తాడు వేసి కట్టి guest house కి తీసుకెళ్ళాడు. Guest house అంటే ఆంధ్రా గవర్నర్‌గారి ఇల్లు లాగానో రామోజీ రావు గారి ప్రపంచ ప్రఖ్యాత స్టూడియో guest house లా డజనుమంది వంటవాళ్ళు, కార్లు, డ్రైవర్లతో ఉంటుందనో, కనీసం కాలవ మీదకి ఖాకీ టోపీ పెట్టుకుని నిక్కర్‌వేసుకుని ఉప్పాడ కాలవ inspection కి వచ్చే సివిల్‌ఇంజనీరు గారి రాదారి బంగళాలా ఉంటుందనోఅనుకున్న చౌదరి ఊహాశక్తి చాలా దెబ్బ తినేసింది. డల్లాస్‌లో అతిబీద నల్ల వాళ్ళూ, మరియుమెక్సికన్‌వాళ్ళూ ఉండే సందులు గల్లీల్లో ఒక బిల్డింగ్‌లో ఎనిమిదో అంతస్తులో ఉండే రెండు గదులఫ్లాట్‌ అనగా అపార్టుమెంట్‌నే కంప్యూటర్‌ వాళ్ళందరూ guest house అంటారని తెలిసి పంచపాండవులులక్క ఇంటిలో ధర్మరాజు, అర్జునుడూ, భీముడు, మరియు అన్ని సినిమాలలోనూ ఒక్క డైలాగు కూడా లేకుండాకేవలం తలకాయలు పైకీ కిందికీ ఊపుతూ అభినయించే నకుల సహదేవులు లాగా ఫీలయిపోయారు.

పాపం పండి అమెరికా వచ్చి పడ్డామని పాండవులకి తెలియడానికి పాతికరోజులు పట్టలేదు. ఒక్కొక్కడి దగ్గరా లక్ష రూపాయలు trainingకనీ, వీసా ఖర్చులనీ డబ్బు పుచ్చుకున్నచిన్నారావు క్రిస్‌మర్టీ గారి స్వయానా రెండో బావమరిది అని తెలిసిపోయింది. వైజాగ్‌కరపాంమార్కెట్‌లోనూ, కాకినాడబోగందాని చెరువు పక్కనూ, అనకాపల్లి బెల్లం దుకాణాల మధ్యలోనూ ఉన్నకంప్యూటర్‌ training centers కీ, చేగోడీ కంప్యూటర్‌ కంపెనీకి ఉన్నది డబ్బు పంచుకోడం తప్ప అసలువ్యాపార సంబంధం ఏమీ కాదని తెలిసి పోయింది. Project మాట దేవుడెరుగు, నెలనెలా జీతం మాటదేవుడెరుగు, ఆరుగురు ఉన్న guest house లో telephone కూడా లేదనీ అందరికీ కలిపి మనోవర్తి, అంటే ప్రాణం పోకుండా తిండి ఖర్చులు మటుకు చేగోడీ కంప్యూటర్‌వారు కేవలం రెండు నెలలు భరిస్తారనీ, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటికి మీరు పోవచ్చు అని అంటారని తెలిసిపోయింది. డబ్బు పుచ్చుకుని,అమాయకులైన కంప్యూటర్‌ ప్రోగ్రామర్లని అమెరికా తీసుకు వచ్చి, నడిరోడ్డులో వాళ్ళని వదిలెయ్యడం మాత్రమే ఇటువంటి చేగోడీ కంపెనీల వ్యాపారమని తేలిపోయింది.

మామూలు కంటే గట్టిగా టెలిఫోన్‌మోగింది.
“హల్లో” అన్నాడు శివరాం
ఓ! what a surprise, ఎలా ఉన్నారు?
ఎలా ఉందండీ మా దేశం?
అదేమిటి! నా మొహంలా వుందీ, అంటే!
ఓ … really!
… నిజంగానా! అంత మోసం చేస్తారా ఈ కంప్యూటర్‌ కంపెనీ వాళ్ళూ … too bad.
… I am sorry!
…ఓ పని చెయ్యండి, మా హ్యూస్టన్‌ వచ్చెయ్యండి. కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండొచ్చు
… అబ్బే పరవాలేదు. మా ఆవిడ చాలా understanding మనిషి.
… ఫరవాలేదు. Greyhound లో డల్లాస్‌లో ఎక్కితే హ్యూస్టన్‌ ఐదారు గంటల్లోవచ్చేస్తారు. నేను వచ్చి pick-up చేసుకుంటాను. Don’t worry. We will work it out చౌదరి గారూఅనిఫోన్‌ పెట్టేశాడు శివరాం.

శివరాం కి ఒళ్ళు మండిపోతోంది. ఈ శనివారం చౌదరి డెల్లాస్‌నుంచి వస్తాడు.పాపం, పంచపాండవులకి ఎంత మోసం జరిగిందీ … ఆంధ్రా వాళ్ళ కంప్యూటర్‌ వ్యాపారం ఇంత అధ్వాన్నంగాఉంటుందని అందరికీ తెలియదు కదా అని అనుకుంటూ Monica Lewinsky latest news విందామని TV remote కోసం సోఫా వెనకాల వెదుకుతూ ఉండగా శివరాం భార్య అర్జంటుగా గెంతులేసుకుంటూ వీధి తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. వస్తూనే “ఏమండోయ్‌.. I finally did it ” అంది.

ఏమిటి ఏంచేశావు?

ఇదుగో చూడండి, అని కాయితాలు శివరాం మొహం మీద పడేసింది.

అదేనండీ, మీరు ఇండియా వెళ్ళి వచ్చిన దగ్గర్నుంచీ ప్రాణం తీశారుగా ఏదోకంప్యూటర్‌కోర్స్‌లో చేరమనీ, I finally did it.

శివరాం కి మళ్ళీ ఒళ్ళు మండింది ఆ కాయితాలు చూడగానే.

ఏమిటీ, SAP లో జేరమన్నారుగా! చూడండి This is an excellent deal.మొత్తం ఖరీదు $10,000. రెండు వారాలు training. ఎక్కడనుకుంటున్నారు … హైదరాబాదులో! వాళ్ళే ticket పెట్టి అక్కడికి తీసుకెళ్ళి training ఇస్తారట. అటు ఇండియా వెళ్ళినట్టూ ఉంటుంది. రెండువారాలు training కి మూడు నెలలు training అయినట్టు సర్టిఫికెట్‌ ఇస్తారుట. చూశారా, అన్నీలాభాలే. వెనక్కి వచ్చాక గంటకి 150 డాలర్లు ముందు అంటే ఏడాదికి $300,000 – ఆ తర్వాత 200 డాలర్లు… ఇక మీరు ఉద్యోగం మానెయ్య వచ్చు, నేను సెటిల్‌అయాక మీరు కూడా SAP లో …

శివరాంకి సాధారణంగా కోపం రాదు. ఇవాళ మటుకు ఒళ్ళు మండి పోతోంది.

ఏమిటండీ అంత కోపం ఎందుకూ ?

ఎందుకా! ఇదుగో ఇందుకూ, అన్నాడు ఆ కాగితాలలో ఆఖర్న ఉన్న సంతకం చూపించి. అవునండీ, He is a nice fellow .. క్రిస్‌మర్టీ from చేగోడీ కంప్యూటర్స్‌. Head quarters డల్లస్‌లో నట. వాళ్ళకి ఇండియాలో కూడాఅన్ని ఊళ్ళలోనూ training centers ఉన్నాయిట.

అందుకు కాదు, అందుకే .. ఇందుకే .. అసలు అందుకే అన్నాను. శివరాంకి మాటలు తడబడు తున్నాయి.

శివరాంకి ఎందుకు ఒళ్ళు మండుతోందో ఆవిడకి ఏమాత్రం అర్థం కాలేదు.
-----------------------------------------------------------
రచన: వంగూరి చిట్టెన్‌ రాజు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, July 25, 2018

పోతనామాత్యుని జీవన దృక్పథం


పోతనామాత్యుని జీవన దృక్పథం






సాహితీమిత్రులారా!


సీ. కమనీయ భూమి భాగములు లేకున్నవే
        పడియుండుటకు దూది పరుపులేల?
   సహజంబులగు కరాంజలులు లేకున్నవే
        భోజన భాజన పుంజమేల?
   వల్కలాజిన కుశావళులు లేకున్నవే
        కట్టదుకూల సంఘంబులేల?
   గొనకొని వసియింప గుహలు లేకున్నవే
        ప్రాసాద సౌధాది పటల మేల?

తే.  ఫలరసాదులు కురియవే పాదపములు
     స్వాదుజలముల నుండవే సకల నదులు
     పొసగ భిక్షము బెట్టరే పుణ్య సతులు
     ధన మదాంధుల కొలువేల తాపసులకు

ఈ పద్యం బమ్మెర పోతనామాత్యునిది. ఆయన ఆంధ్రీకరించిన మహాభాగవతం ద్వితీయ స్కంధం లోనిది. తెలుగు భాగవతం నుంచి నచ్చిన పద్యం ఏరడం కంటే కఠినమైన పని పద్యాలంటే ఇష్టమున్న వాండ్లకు మరొకటి ఉండదు. భాగవతం లోని కొన్ని వేల పద్యాలు పాత తరం తెలుగువారి నోళ్ళల్లో నానుతున్నాయి.

పోతన అనగానే ఒక వినమ్రుడైన, నిరాడంబరుడై భక్తి తన్మయత్వంతో సొక్కిపోతున్న ఒక వ్యక్తి రూపం మనసులో సాక్షాత్కరిస్తుంది. తనను నరాంకితం చేస్తాడేమో ననే అనుమానంతో కన్నీరు పెట్టే సరస్వతీ దేవిని ఓదార్చే ఒక పవిత్రమూర్తి గోచరిస్తుంది. అత్యంత సాధారణంగా జీవిస్తూ, భగవద్ధ్యానం తప్ప మరొకటి ఎరుగని ఒక సాధు పుంగవుని ఆకృతి స్ఫురిస్తుంది. కవిత్వాన్నీ జీవితాన్నీ వేర్వేరుగా భావించక జీవితమెంత భక్తి భరితమో కవిత్వమూ అంతే భక్తిమయం చేసుకుని ఆ భావాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి అలానే బ్రతికిన ఓ ఉత్తమ వ్యక్తి రూపరేఖ భావ గోచరమౌతుంది.

పోతన గురించి అలాంటి అభిప్రాయమే జనానికి కలగడానికి కారణం – లోకంలో ప్రాచుర్యంలో ఉన్న కథలే అనడం సగం నిజం మాత్రమే. అసలు ఆ అభిప్రాయానికీ, ఆ కథల ప్రాచుర్యానికీ కూడా కారణం ఆయన కవిత్వమే అని చెబితేనే పూర్తి నిజం చెప్పినట్లవుతుంది. భాగవతం లోని వివిధ ఘట్టాల్లో భగవంతుని గురించీ ఆయన లీలల గురించీ రాసేటప్పుడు ‘అనుభవించి పలువరించిన’ ఆ ఆప్తతలు, పోతన కవిత్వం ఎడలనే కాక కవి అంటే కూడా ఒక ఆత్మీయతతో కూడిన మెచ్చుదలను కలిగిస్తాయి. జీవితం విషయంలో ఆయన దృక్పథమే వేరు అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. అలాంటి భావాలు వెలారుస్తూ రాసిన పద్యాల్లో మకుటాయమాన మైంది పై పద్యం.

ఈ పద్యం ఏ సందర్భం లోనిది అనేది అంత ముఖ్యం కాదు. ఏ సందర్భంలో చెప్పినా, ఎవరు ఎవరితో ఎందుకు చెప్పినా, ఆ పద్యం లోని భావం ఆ మహాకవి వైయక్తిక జీవితానికి ఒక టీక అని మాత్రం అనిపిస్తుంది. జీవితం పట్ల ఆయన దృక్పథాన్ని నిక్కచ్చిగా, నిజాయితీగా చెప్పిన పద్యం అది. ఆయన బ్రతికిన పద్ధతికి అద్దం, ఆ పద్యం. అయినా, పద్య సందర్భం చెబుతాను. శుకయోగి పరీక్షిన్మహారాజుకు, విశ్వమయుడైన విరాట్పురుషుని గురించీ, జ్ఞానీ అజ్ఞానుల ప్రవర్తన గురించీ తెలుపుతూ ‘అజ్ఞాని మాయలో భ్రమిస్తాడు, జ్ఞాని జాగరూకుడై మెలగుతాడు. సంసారం సుఖమనుకోడు. శరీర ధారణకు అవసరమైనంత మేరకే భోగాలను అంగీకరిస్తాడు’ అని చెపుతూ ‘బుద్ధిమంతుడు ఈ రకంగా భావిస్తాడు’ అనిచెప్పే సందర్భం లోది పై పద్యం.

పడుకోడానికి ఇంత నేల ఉండగా తల్పాలూ శయ్యలూ కావాలా? తినడానికి దేవుడిచ్చిన చేతులుండగా బంగారూ, వెండీ పళ్ళాలు కావాలా? నార చీరలూ, పట్టలూ ఉండగా పీతాంబరాలు అవసరమా? ఉండటానికి గుహలుండగా ఆశ్రమాలూ ప్రాసాదాలూ అవసరమా? తినేందుకు చెట్లు పండ్లిస్తుండె, తాగేందుకు నదులు నీరిస్తుండె. ఇంటింటా ఉండే పుణ్య గృహిణులు భిక్ష పెడతారాయె. తపసు చేసుకునే వారికి ఇంకేం కావాలి? ధనమదంతో కళ్ళు కనిపించని వారిని ఎందుకు ఆశ్రయించాలి? ఇదీ పద్య భావం.

ధనమదాంధుల కొలువేల తాపసులకు? అన్నాడు పోతన. తాపసులకేనా? సాధారణ జనులకు మాత్రం ఎందుకు? ఆత్మగౌరవం కలవాడు ఇతరులను ఎందుకు ఆశ్రయించాలి? సహజంగా స్వేచ్చగా బ్రతకడానికి ఈ ప్రపంచంలో లేనిది ఏమున్నది? పరిమళవంతంగా బ్రతుకును పండించుకోడానికి ఎంత అనువు లేదు?స్నానానికీ పానానికీ భుక్తికీ నిద్రకూ అన్నిటికీ అవకాశాలున్నపుడు ధనాధిపుల కాళ్ళ వద్ద ఉండాల్సిన అవసరమేముంది? ఈ అభిప్రాయాన్ని ఎంతో చక్కగా చెబుతుందీ పద్యం.

ఈ పద్యం చదవగానే ముందు స్ఫురించేది ఓహో ఎంత అందంగా చెప్పాడో అనే భావన. ఒక ఆత్మగౌరవం కలిగిన మనిషి, వ్యర్థాడంబరాలకు వ్యామోహం చెందని మనిషి, శరీర పోషణ మాత్రాన్ని ఎంత సులభంగా నిర్వహించుకోవచ్చునో ఎంత బాగా చెప్పాడో అనే మెప్పు కలుగుతుంది. ఆ చక్కటి భావం వల్ల ప్రసన్నతా పూర్వకమైన పరిసరాలు ఆ పద్యం చుట్టూ ఆవరించుకున్నాయి. అయితే, తాత్పర్యపు వెలుగులో పద్య నిర్మాణం లోని సొగసును నిర్లక్ష్యం చేయనక్కర లేదు. పద్యం చెప్పడంలోని అలవోక తనము, సహజత్వము అంతే అందంగా ఉన్నాయి. పోతన సహజపాండిత్యం కలిగిన వాడుగా పేరున్నవాడు. గణాలు కిట్టించుకుంటూ రాయడం గానీ, ఒక భావం ఒక పాదంలో పట్టక పైపాదంలో ఇరికించడం గానీ, యతిప్రాసల కోసం ఏవో పదాలను కృతకంగా తెచ్చిపెట్టుకోవడం గానీ ఆయన చాలా పద్యాల్లో కనపడదు. అంత్య ప్రాసలు ఆయన బలహీనతా – బలమూ కూడా. సాధారణంగా పోతన అన్ని పద్యాల్లో ఉండే ప్రసన్నత పై పద్యం లోనూ ఉన్నది. ధారాశుద్ధీ, శ్రవణ సుభగతా, భావం ఏ పాదానికి ఆ పాదం విరగడమూ, ఒక్క వ్యర్థ పదమూ లేకపోవడమూ – నిర్మాణ దృష్ట్యా ఈ పద్యానికి అందం సంతరించి పెట్టాయి. పద్య సౌందర్యమూ, భావ సౌందర్యమూ కలగలిసిన అందం ఈ పద్యం.

“నా గీతం జాతిజనుల గుండెలలో ఘూర్ణిల్లా”లని ఆకాంక్షించాడు ఆధునిక కవి. ఆ కొలబద్దకు సరిగ్గా అతికిపోయే కవి పోతన. ఆయన పద్యాలు జాతిజనుల గుండెల్లోనే కాదు రసనల మీద కూడా నివసిస్తున్నాయి. విశ్వనాథ వారన్నట్లు “పోతన్న తెలుగుల పుణ్యపేటి.”
----------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

Monday, July 23, 2018

మెయి బూదిపూత మాగాణి


మెయి బూదిపూత మాగాణి





సాహితీమిత్రులారా!



పునుకల్ జూచిన కాజగడ్డలు, ఫణుల్ పొల్పారు కాజాకు లే
మననౌ జాబిలి కాజపూ, వెరువు పెల్లై సారమౌ దుబ్బుల
ల్లిన యుండల్, మెయి బూదిపూత తెలిఢిల్లీభోగముల్, చేను నీ
వనెదన్ మా పితృపాదులమ్మని పొలంబౌదీవు – విశ్వేశ్వరా!

శోభనాద్రిగారని పూర్వం నందమూరు గ్రామంలో ఒక బ్రాహ్మణ గృహస్థు ఉండేవాడు. ఆయన గొప్ప దాత. ఆయన దాతృత్వానికి ఆస్తి అంతా కరిగిపోయింది. పొలాలన్నిట్నీ దాదాపు అమ్మి మరీ దానం చేశాడట. నకనకలాడే కడుపులతో వచ్చి త్రేన్చుకుంటూనూ, చినిగిన గుడ్డలతో వచ్చి క్రొత్త బట్టలు కట్టుకొనీనూ పోయేవారట ఆర్తులు– చీకట్లను వదిలి వెల్తురును మోసుకుపోతున్నట్లు. ఆయన కాశీనుంచి ఒక లింగం తెచ్చి ఒక ఆలయాన్ని నందమూరులో కట్టి ఆ శివుణ్ణి ఆ గుళ్ళో ప్రతిష్ఠించాడు. తన చేతిలో పెల్లురేగిన దాతృత్వ శౌర్యాగ్నికి ఆయన కొడుకులకు దారిద్ర్యం మిగిలితే-– ఆ గుడిలోని శివుణ్ణి, బంగరుకొండ చేదాల్చినవానిని (శివుని విల్లు మేరుపర్వతము) చూపించి, ఈయనను సేవించండి అని చెప్పి గతించాడట.

ఆయన కుమారుడైన విశ్వనాథ సత్యనారాయణ వారి వూరిలోని ఆ విశ్వేశ్వరుని మీద ‘మా స్వామి’ అనే పేర వ్రాసిన విశ్వేశ్వర శతకము లోనిది పై పద్యం.

ఈ విశ్వేశ్వర శతకము చాలా విలక్షణమైనది. ఈ శతకంలోని తొలి రెండు పద్యాలూ శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యంలో తొలి రెండు పద్యాలుగా అమర్చుకున్నాడు ఆయన. ఈ శతకం 1916లో ప్రారంభం చేసినా 1926లోగాని ముగించలేదట. ఇది విలక్షణమైనదని ఎందుకన్నానంటే పరమేశ్వరునితో ఎన్ని రకాలుగా ముచ్చట్లు చెప్పాడో, ఎన్ని చోట్ల ఆశ్చర్యం పొందాడో, ఎంత బ్రతిమలాడాడో, ఎంత అలిగాడో, ఎంత కోపపడ్డాడో, ఎంత భక్తిభావాన్ని వెలార్చాడో, శివుణ్ణి ఎంత పరిహాసం చేశాడో, ఎన్ని వైవిధ్య భావాలను రాశిపోశాడో, ఎంత ప్రతిపద్య చమత్కారం చూపాడో, ఎన్ని అద్భుతమైన సమాసాలు గుప్పించాడో, ఎన్ని విధాలుగా స్వామిని సంబోధించాడో, ఎంత ఛందస్సుందరంగా పద్యాలను పొదిగాడో– అది కేవలం అనుభవైకవేద్యమే తప్ప– వివరించాలంటే ప్రతి పద్యమూ ఒక గ్రంథమౌతుంది. నిజానికి ఈ ఒక్క పద్యం ఒక దృష్టాంతముగా ఉటంకించబడుతున్నది గాని వంద పద్యాల్లో కనీసం తొంభై పద్యాలు ఎత్తి చూపవలసినవి ఉన్నాయి.

‘నీవో యౌవనమూర్తివౌదువు అన్నపూర్ణాంబికాదేవిన్ జూచిన వృద్ధవోలె మదికిం దీపించు’ అని ఆశ్చర్యపోతాడొక పద్యంలో. ‘ముమ్మొన కర్రతో తడుముకొంచున్ లచ్చిగేహంబు ముందర నిల్చున్ భవదీయ భిక్షుకత కంతం బెప్డు విశ్వేశ్వరా’ అని వింతపడతాడొక చోట. ‘నీతో సయ్యాటములాడెదను, ఎట్లో సైరింతువు మత్కృత పరీహాసంబు’ అని సమాధానపడతాడు. ‘ఏమి కాపురమయ్యా మీది, ఆ కొండకోయతకు నీ యొయ్యారమే, బూదిపూతే నచ్చింది. నీకామె సొగసు నచ్చింది. ఒక ఏనుగు మొగమాయన్నూ, ఒక ఆరుమొగాలాయన్నూ కన్నారురయ్యా సంతానము’ అంటూ పరిహాసం చేస్తాడు. నీకు అభిషేకం చేద్దామంటే నమకంగూడా రాదు. ‘హూణ వాక్కావ్యామోదము ముక్తిత్రోవెదురు చుక్కైపోయె’ అని బాధపడతాడు. ‘నా మొర నీకు విన్పించదా? అసలు నాలో దోసమేముందో నిరూపించవయ్యా ముందు’ అని నిలదీస్తాడు. ‘నా బ్రతుకు ఎండి బీడువడి నెఱ్ఱెలై ఉంది. నీ కరుణ వర్షాగాఢజీమూతాల కుంభవృష్టి కురిపించవయ్యా’ అని వేడుకుంటాడు.

పద్యాలు క్రమంగా చదువుకుంటూ వస్తే– చివరలో ఒక దశలో ఆయనకు శివసాక్షాత్కారం అయిందా అనే నమ్మకమైన భావం చాటే పద్యాలు కనిపిస్తాయి. ‘నీపై విశ్వాసమునుంచితిన్ వదలకప్పా’ అన్న తర్వాత, ‘ఆకర్ణించెద నేమియో ప్రమథ శంఖారావమో, నన్నిదే కైకో నీవరుదెంతు వీ ధ్వని యదే గాబోలు విశ్వేశ్వరా’ అని శివుని రాకను గమనిస్తాడు. ఆ తర్వాత దర్శనమై ‘శౌక్లద్యుత్యూర్జిత దీపితావయవ సమ్లానంబు నీ మూర్తి ఏమనుదు మద్భాగ్యంబు’ అంటాడు. ‘నీదు రాక గురుతింపన్ లేనె’ అని తనకు తాను నమ్మకం చెప్పుకుంటాడు. ‘రమ్ము తీర్చెద పథాయాసంబు’ అని తన పాదాలు అందించమంటాడు. ‘నా కన్నులన్ బడివచ్చు బాష్పములు, కంఠవ్యగ్ర గాద్గద్యముల్, మై కేడించిన లేత చెమ్మటలు, రోమాంచాలు’ అని పరవశపడిపోతాడు. నీ కారుణ్యము కోసం అంగలార్చిన దినాల్లో నా ‘జిహ్వాగ్రవాణీ కింకింకిణి నూపుర స్వనములెంతే దట్టమైపోయె’ – నేడీ కారుణ్యము చూసి నాకసలు నోరేరాదు – అంటాడు. ఈశ్వరుణ్ణి దృష్టం కావించుకున్న మహా భక్తుడిగా కనిపిస్తాడు విశ్వనాథ ఈ శతకంలో.

అసలు పద్యం వ్రాయడాన్ని ఆయన పరీక్షగా తీసుకుంటాడనిపిస్తుంది, ఏ పద్యమైనా కూడా. విసర్గపూర్వక అక్షరాలు ప్రాసగా తీసుకుంటాడు. ద్విత్వాక్షరలు సరేసరి. సంయుక్తాక్షరాలు క్త్య, గ్వ్య లాంటి వాటిని ప్రాసలో పెట్టుకొని అశ్వధాటిగా పద్యాన్ని పరిగెత్తిస్తాడు. ‘నైశాటప్రాణ మరున్మహాభుజగవంశస్వామి’, ‘దైవత జగద్ద్రుశ్రీప్రసూన ప్రభాస్రగ్వ్యుత్పత్తులు’, ‘సంసరణాంభోధి మహాపదద్రిధుత తృష్ణావీచి కల్లోలగహ్వరము’లాంటి మైళ్ళు మైళ్ళు పొడుగుండే సమాసాలు బిగిస్తాడు. ఇదుగో ఈ పద్యం గమనించండి:

మీ దాతృత్వమొ, తండ్రి దాతృత్వయొ మీ మీ మధ్యనున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబులేదిట్లురా,
ఏదో లెక్కలు తేల్చుకో! మొరటుతో నేలా! యొడల్ మండెనా
ఏదో వచ్చినకాడికమ్మెదను సుమ్మీ! నిన్ను విశ్వేశ్వరా!

వ్యావహారిక భాషను ఎంత సహజంగా, అలవోకగా పద్యంలో నిబంధించాడో చూడండి.

ఈ శతకంలోని తొలి పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షం కావ్యములో తొలి పద్యంగా పెట్టుకున్నాడనుకున్నాము గదా. ఆ పద్యంలో ‘చిద్గగన ప్రాలేయాంశువు’ అనే పదముంది. ‘ప్రా’ అనే ద్విత్వాక్షరం ముందున్న ‘న’ అనే అక్షరం లఘువుగా వాడాడు. ఒకే సమాసం మధ్యలో వున్నప్పుడు ద్విత్వాక్షరం ముందున్న లఘువు గురువౌతుంది గదా, నీ కావ్యం తొలి పద్యంలోనే ఛందోదోషముంది అనీ, మరికొన్ని విషయాలనూ ఉటంకిస్తూ, కొత్త సత్యనారాయణ చౌదరి అనే పండితుడు తీవ్ర విమర్శ లేవనెత్తాడు. దరిమిలా పాత సత్యనారాయణగారి అనుయాయులూ వ్యతిరేకులూ — కొత్త సత్యనారాయణగారి సమర్థకులూ వ్యతిరేకులూ, వీరందరూ పుంఖానుపుంఖాలుగా విమర్శలూ ప్రతివిమర్శలూ చేసుకున్నారు 1960లలో, ఆంధ్రపత్రికలో. చాలా తుములంగా సాహిత్య సమరం జరిగి చాలా కాలం కొనసాగింది. మనవాళ్ళకు సహజబుద్ధులెక్కడికి పోతాయి. ఆ విమర్శల్లో అంతర్లీనంగా బ్రాహ్మణ అబ్రాహ్మణ కులవాదాలూ సాహిత్యేతర వ్యాఖ్యలూ చోటుచేసుకున్నాయి. సాహిత్యప్రియులు ఎంతో ఆత్రంతో వచ్చేవారం ఎవరు ఎవర్ని సమర్థిస్తారో, ఎవరు ఎవర్ని ఖండిస్తారో అని ఎంతో కుతూహలంగా ఎదురుచూసేవారు. ఆ ఖండనమండనలన్నీ క్రోడీకరించి ఎవరైనా పుస్తకంగా వేశారో లేదోగానీ మళ్ళీ వాటిని చదవడానికి దొరకలేదు. ఇదంతా విషయాంతరం లెండి.

ఇక పైన చెప్పిన పద్యానికి వద్దాం. తండ్రి చేసిన దానాల ఫలితంగా ఉన్న పొలమంతా ఊడ్చుకుపోగా ఒకట్రెండు ఎకరాలు మిగిలినట్లున్నాయి. అదీ మాగాణీ పొలం. ఆ పొలం ఆయనకు శివునిలాగా కనిపించిందో, శివుడే ఆ పొలంలాగా కనిపించాడోగాని– నువ్వు మా తండ్రి అమ్మని పొలానివనిపిస్తున్నదయ్యా అంటున్నాడు. శివుని వంటిమీది బొమికలు పొలంలో మొలిచిన కాజగడ్డలుగానూ, ఆయన మెడలోని పాములు కాజాకులుగానూ, జాబిల్లి కాజపూవుగానూ, శివుడి వెంట్రుకల ముడులు చేలో ఎరువు చల్లినప్పుడు అక్కడక్కడా ఎక్కువ పడినచోట దట్టంగా మొలిచిన దుబ్బులుగానూ, తెల్లని బూదితో అలముకున్న శివుని శరీరం తెల్లని ఢిల్లీ భోగాల వరిగింజల కంకుల్తో పరచుకున్న పొలంగానూ కనిపించి, ‘మా పితృపాదులమ్మని పొలంబౌదీవు విశ్వేశ్వరా’ అని వర్ణిస్తున్నాడు. పోతూ పోతూ వారి తండ్రి మిగిల్చింది ఆ కొద్దిపాటి పొలం. చూపించి పోయింది శివుడిని. ఆ రెండూ ఆయన దారిద్ర్య నిర్వాపణాలే. ప్రయోజనంలో మాత్రమే గాక ఆకారంలో కూడా ఇద్దరికీ పోలికలు కనిపెట్టి, అదీ ఇదీ ఒకటే అని రూపించుకున్న అందమైన భావన ఇది. పద్యాల్లో ప్రౌఢిమ, భావాల్లో శబలత, ఊహల్లో విశృంఖలత– భావకవిగా ప్రారంభమైనా దరిమిలా ఏ ఉద్యమంలోనూ ఇమడనంతగా ఎదిగిన హిమాలయ శిఖర సదృశుడైన కవి విశ్వనాథ.
(‘ఢిల్లీ భోగాలు’ వరి ధాన్యంలోని మేలు రకాల్లో ఒకటి)
----------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, July 22, 2018

మామగారూ మామిడి చెట్టూ(కథ)


మామగారూ మామిడి చెట్టూ(కథ)




సాహితీమిత్రులారా!



శివరాం మామగారికి మామిడి చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు ఇలాటి పురాణకాలం నాటి చెట్లంటే చాలా ఇష్టం. మెడ్రాసులో నాలుగు వందల సంవత్సరాల మర్రిచెట్టు చరిత్ర, గయలో బుద్ధుడు కూచున్న రావిచెట్టు,కాకినాడలో 1923లో తన ఇంట్లో నాటిన బంగినపల్లి మామిడిచెట్టు ఇలా ఎన్ని కథలైనా ఆయన చెప్పగలడు.

అమెరికా తెలుగు వారి ఆచారం ప్రకారం అల్లుడి తల్లిదండ్రులని sponsor చెయ్యకుండా అమ్మాయిని అడ్డుపెట్టి మనవణ్ణీ మనవరాల్నీదగ్గిరుండి చూసుకునే నిమిత్తం ఆ చెట్లన్నీ వదులుకుని శివరాం మామగారు, అత్తగారు అమెరికా వలస వచ్చారు. మధురవాణి సంపాదన నాలుగు రాళ్ళే అయినా, శివరాం సంపాదన కేవలం రెండు రాళ్ళే కనక మామగారికి మరీ ఎక్కువ అథార్టీ వచ్చేసింది.

“పోనీ, నన్నూ రమ్మంటావేమిటయ్యా అల్లుడూ” అన్నారు మామగారు.
“ఎక్కడికీ?” అన్నాడు శివరాం ఎక్కడికో, ఏమిటో తెలిసినా కూడా.
“అదేనయ్యా! అప్పుని కాలేజీలో చేర్పించటానికి”
తన భార్య పేరు లక్షణంగా నాగసుబ్బలక్ష్మి అని ఉండగా .. అది మానేసి మనవరాలికి మన ఇంటా వంటా లేని “అపూర్వ”అనే అస్తవ్యస్తమైన బెంగాలీ పేరో గుజరాతీ పేరో పెట్టారని కూతురి మీద కొంచెం, అల్లుడి మీద చాలా కోపం ఆయనికి. అందులోనూ అమెరికాలో అల్లుడు అప్పులు చేసి బతకడం చూసి ఆ వంకా ఈ వంకా పెట్టి మనవరాలిని అప్పూ అని పిలిచి క్షణం క్షణం ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు శివరాం మామగారు.
“బాగానే ఉంటుందనుకోండి, కానీ అత్తగారు ఒక్కరూ ఇంట్లో ఉండగలరా మనమంతా వెడితే?” అన్నాడు శివరాం. “పైగా ఇప్పటికే చాలా ఖర్చయింది కూడాను..”
“చాల్లే, ఊరుకో శివరాం. అక్కడికి నీ సొంతడబ్బేదో ఖర్చు పెడుతున్నట్టుగా చెప్తున్నావు… అపూర్వకి వాళ్ళే మంచి scholarship ఇచ్చారుగా, మిగిలిందానికి stafford loan తీసుకున్నావుగా .. ఇక నీ చేతినుంచి ఏమవుతోంది ఖర్చు?”

శివరాం భార్యకి ఇండియాలో పెట్టిన పేరు మధురవాణి. అమెరికా రాగానే మధురం తగ్గించేసి ఉట్టి వాణిగా చెలామణి అయింది. తను నాలుగు రాళ్ళు సంపాదించడం మొదలుపెట్టిన దగ్గరినుంచీ మొగుణ్ణి ఏమండీ, మీరూ అనడం మానేసింది వాణి. కాస్త గీరగా కూడా మాట్టాడ్డం మొదలుపెట్టి గీర్వాణిగా మార్చుకుంది పేరు. శివరాం అత్తగారు కూడా ఇదేదో బాగానే ఉందనుకుని ఆయన రిటైరైపోయి గవర్నమెంటు కారూ, డ్రైవరూ, ఇల్లూ పోయి అద్దె కొంపలో పడగానే తను కూడా భర్తని ఏకవచన ప్రయోగం చెయ్యడం మొదలు పెట్టబోతే, “నడ్డి మీద చంపేస్తాను” అని బెదిరించీ, పాతివ్రత్యం కథలు చెప్పీ, బతిమాలీ, శివరాం మామగారు మర్యాదగానే పిలిచే ఒప్పందం చేసుకుని గౌరవం దక్కించుకున్నారు.

ఎలా అయితేనేం, మొత్తానికి శివరాం, గీర్వాణి, మామగారూ, అపూర్వ హ్యూస్టన్‌ నించి బయల్దేరి ఎక్కడో వర్జీనియాలో విలియమ్‌ అండ్‌ మేరీ కాలేజీకి బయల్దేరారు.
“అంత చంటిపిల్ల, గట్టిగా పదిహేడు ఏళ్ళు లేవు.. దానికి ఈ అమెరికా గవర్నమెంటు అప్పు ఇచ్చి .. దాని life అప్పుతో మొదలుపెట్టించడం ఏమిటి నా తలకాయ” వ్యాఖ్యానించాడు శివరాం మామగారు student loan గురించి వినగానే.

Rental car drive చేసుకుంటూ శివరాం Richmond airport నుంచి అపూర్వ కంప్యూటరూ, అరడజను పెట్టెలూ అన్నీ వేసుకుని యూనివర్సిటీకి బయలుదేరాడు. కాలేజీ ఆవరణలోకి ప్రవేశించగానే అక్కడ అంతా చెట్లూ, మంచి వాతావరణం చూసి, “చూశారా, మన Houstonలాగా కాకుండా ఈ వర్జీనియా ఎంత scenicగా ఉందో” అన్నాడు శివరాం.

చుట్టూ తీవ్రంగా కళ్ళతో అన్నీ వెదుకుతున్న మామగారు, “scenic ఏమిటి నా తలకాయ, ఎక్కడా ఒక్క యూనివర్సిటీ బిల్డింగ్‌ కనపడటం లేదు. అంతా అడివిలా ఉంది .. ఆ వెనకాల ఎక్కడో బిల్డింగ్‌ కడితే ఎలా కనపడి చస్తుంది, రోడ్డు మీద ఉండాలి గానీ” అని విరుచుకుపడ్డారు.

మొత్తానికి యూనివర్సిటీ సెంటర్‌లో orientationకి వెళ్ళారు నలుగురూ. Reception area లో ఏ forms fill చేయాలో చెప్తున్న జాన్సన్‌ని చూసి “ఈయన ఇంగ్లీషు మేష్టారా?” అనడిగాడు శివరాం మామగారు.
“ఇంగ్లీషు మేష్టారేమిటి?”అనడిగింది మధురవాణి.
“అదేనే.. వీడి చెవులకి రింగులూ అవీ ఉంటేనూ .. ఇక్కడ ఎలాగా తెలుగు మేష్టర్లు ఉండరు గదా.. చెవిపోగులూ, పిలకా పెట్టుకుని ఉంటే ఇతను ఇంగ్లీషు మేష్టరనుకున్నాను” అన్నాడు మామగారు.
“కాదండి.. ఇతను ఇక్కడ second year student. అపూర్వ admission formsకి సాయం చేస్తున్నాడు”
“second year student చెయ్యటం ఏమిటి? ఏ రిజిస్ట్రారో ప్రిన్సిపాలో చెయ్యాలి గాని”
“ఇక్కడ అంతేనండి. Orientation, registration, అన్నీ సీనియర్‌ కుర్రాళ్ళే చేస్తారు”
“నా మొహంలా ఉంది. ఆఖరికి పాఠాలు కూడా వీళ్ళే చెప్తారా?” కొంచెం అనుమానంగా అడిగాడు.
“అబ్బబ్బ, ఊరుకోనాన్నా! వాటికి మంచి professors ఉన్నారులే. అన్నీ ముందే కనుక్కున్నాం” అంది వాణి శివరాం ఇచ్చిన కాగితాల మీద సంతకం పెడుతూ.
“నువ్వెందుకే అంత కులాసాగా సంతకం పెడుతున్నావు అన్నింటి మీదానూ? అల్లుడు ఒక్కడు చాలడూ అప్పు పుచ్చుకోడానికీ?” వార్నింగు ఇచ్చారు మామగారు.
“Thank you, congratulations. Your registration is complete. Here is your ID.. అదిగో ఆ హాల్లో కూచోండి.. మా యూనివర్సిటీ ప్రెసిడెంటూ, Dean of student affairs, Admissions Dean అందరూ కాసేపట్లో మీకు orientation ప్రారంభిస్తారు”
“అదేమిటయ్యా! డబ్బు కట్టి, చలానా తీసుకోకుండానే admission అయిపోయిందంటాడేమిటి ఈ వెధవ, చెవులికి పోగులూ, ఒంటినిండా పచ్చబొట్లూ వీడూనూ”
“లేదండీ, కట్టవలసిన డబ్బంతా రెండు వారాల క్రితం loans ఇచ్చిన bank వాళ్ళు schoolకి directగా కట్టేశారు. ఇవాళేం అక్కర్లేదు” శివరాం విశదీకరించాడు.

సరే, orientation meeting లో వాళ్ళ కాలేజ్‌ ఎంత గొప్పదో, studentsని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అన్నీవివరంగా చెప్పి, ఇక మీరు మీ పిల్లల తాలూకు సామాన్లన్నీ వాళ్ళ వాళ్ళ dormsలో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళని కలవడానికి వీల్లేదు. ఎందుకంటే మీ పిల్లలు ఈ క్షణం నించీ మా బాధ్యత. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళి .. నెల నెలా డబ్బు మటుకు పంపిస్తూ ఉండండి.. అని ఆ యూనివర్సిటీ ప్రెసిడెంటూ వగైరాలు గంటన్నర సేపు lecture ఇచ్చారు. అవన్నీ విన్న శివరాం మామగారికి నోట మాట రాలేదు.
“అంత దూరం నించీ ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని మనం ఇక్కడికి తగలడితే ఇక చాలు ఇంటికి పో అంటారేవిటయ్యా!అసలు ఇది నిజమైన యూనివర్సిటీయేనా? ఆ మాటకొస్తే ఇప్పటికి అందరూ కుర్రవాళ్ళే గాని అప్పు గాడికి పాఠం చెప్పే ఒక professor కూడ వచ్చి అది ఏం చదువుతుందీ .. క్లాసులు ఎన్నింటికీ, ఎక్కడా.. ఇలాటివేమీ చెప్పలేదేమిటి?..” ఇలా గిజగిజలాడిపోతున్నాడు మామగారు. శివరాంకీ మధురవాణికీ కూడా కొంచెం బాధగానే ఉంది .. అంత అర్జెంటుగా అపూర్వని అక్కడ వదిలెయ్యడానికి. చేసేదేమీలేక, ఎవడో కుర్రాడి ధర్మమా అని అపూర్వ ఉండే dorms దగ్గరికి వెళ్ళి సామానంతా మూడో అంతస్తులో తన రూంలో పెట్టారు.

“ఏమే, అప్పూ, మీ నాన్నకి ఎలాగా తెలియదేమో గానీ.. మీ hostel warden ఎవరూ, ఆయన ఆఫీసు ఎక్కడా కనుక్కున్నావా?” అని అడుగుతుండగా ఒక తెల్లబ్బాయి, మరొక నల్లమ్మాయిని తీసుకొచ్చింది అపూర్వ రూంలోకి.
“Hi, I am Janice, your daughter’s room mate” అని పరిచయం చేసుకుంది నల్లమ్మాయి.. “ఇదుగో this is Robert, our resident advisor. He is in a room downstairs” అంటూ. ఇంతలోకి శివరాం ఆఖరి బాక్స్‌ తీసుకుని వచ్చి, మూర్ఛ పోయిన మామగారి మొహం మీద నీళ్ళు జల్లి .. తర్వాత అన్ని విషయాలూ తెలుసుకుని .. ఆయనకి అర్థం అయేలా చెప్పాడు.అమెరికాలో జైళ్ళకే గాని హాస్టళ్ళకి వార్డెన్లు ఉండరనీ, ఆ dorms లో పై రెండు అంతస్తుల్లో ఆడపిల్లలూ కింది రెండు అంతస్తుల్లో మగపిల్లలూ ఉంటారనీ, ఆ తెల్ల కుర్రాడు వీళ్ళందరికీ వార్డెన్‌ లాటి వాడనీ ఏం ఫరవా లేదనీ ఓదార్చాడు.

మొత్తానికి అమ్మాయిని కాలేజీలో చేర్పించి మళ్ళీ హ్యూస్టన్‌ వచ్చి పడ్డారు శివరాం, మధురవాణి, మామగారూ.

రాగానే అత్తగారితో అన్నాడు శివరాం, “ఏమండీ.. గత నాలుగు రోజులుగా మామగారు పాపం అదోలా ఉన్నారు.ప్రయాణం, ఆ యూనివర్సిటీ వ్యవహారాల వల్ల అనుకుంటాను. పాపం, ఏమిటో పోగొట్టుకున్న వాడిలా ఎక్కడికి వెళ్ళినా అలా చుట్టూ చూస్తూ, ఏదో వెతుక్కుంటున్నట్టు కనబడ్డారు. కాస్త కనుక్కోండి” అని.

గుంభనంగా నవ్వింది శివరాం అత్తగారు, “అది చిదంబర రహస్యం అల్లుడు గారూ” అంటూ.
“అంటే?”
“అదే… అమెరికా వచ్చిన దగ్గర్నించీ ఆయనకి ఎక్కడా మామిడిచెట్టూ మర్రిచెట్టూ లాటివి కనబడలేదు. ఎక్కడ చూసినా చిన్న చిన్న చెట్లూ, పొదలూ, scenic, scenic అని మీరనుకునే అడివే గాని. అందుకే పాపం ఆయన అలా మామిడిచెట్టు కోసం, మర్రిచెట్టు కోసం, రావిచెట్టు కోసం వెతుక్కుంటూ ఉండి ఉంటారు. అసలు అందుకే ఆయన మీతో కూడా వచ్చింది. టెక్సస్‌లో ఎలాగూ లేవు, కనీసం వర్జీనియాలో నన్నా ఉండకపోతాయా అని!”
టక్కున ముక్కున వేలేసుకున్నాడు శివరాం!
-----------------------------------------------------------
రచన: వంగూరి చిట్టెన్‌ రాజు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, July 21, 2018

త్రిల్‌(కథ)


త్రిల్‌(కథ)



సాహితీమిత్రులారా!

ఉదయం పదకొండున్నర.

సూర్యుడు మదన తాపంతో వేడెక్కి పోతున్నాడు. అతని నిట్టూర్పుల వడగాలులు భూమిని ఉడికిస్తున్నాయి. డాక్టర్‌ శేఖర్‌ పరిస్థితీ అలాగే ఉంది. ఐతే ఎనభై మైళ్ళ వేగంలో మెత్తగా కదుల్తున్న తన కొత్త మెర్సెడీస్‌ కారు అతనికి శరీర తాపం తగ్గించటానికి శాయశక్తులా పనిచేస్తున్నది. నిజానికి దాని పటిష్టమైన ఏ.సి. వల్ల అతనికి కొంచెం చలి వేస్తున్నది కూడా. “అర్మానీ” శ్రేణిలో కల్లా శ్రేష్టమైన చలవ కళ్ళద్దాలు కారు అద్దాలకు వున్న అత్యున్నతమైన “టింట్‌” తో కలిసి అంతటి సూర్యుడి ప్రభావాన్ని వెలాతెలా పోయేట్లు చేస్తున్నాయి.

అలాగని శేఖర్‌ మనసు ప్రశాంతంగా లేదు. ఒక వంక ఉద్వేగంతోనూ మరోవంక ఏదో అనిర్వచనీయమైన ఉల్లాసంతోనూ ఉద్రేకంతోనూ ఎగిరిపడుతోంది. ఇల్లు దగ్గర పడే కొద్దీ ఎంతో ఉత్కంఠ. తన వీధిలోకి మలుపు తిరగటం తోనే డ్రైవ్‌ వే లో ఏదైనా కారుందా అని అతని మనసు ఆత్రంగా వెదికింది. ఉంటుందని అనుకోక పోయినా ఉంటే బాగుండునన్న ఆశ. ఉంటే ఎంత బాగుంటుందో అన్న ఉల్లాసపు ఊహ! ఆ వెంటనే మళ్ళీ “కొంప దీసి ఆదిలోనే హంసపాదు కాదు కదా” అన్న చిన్న భయం కూడా కలిగింది. గెరాజ్‌ డోర్‌ ఓపెనర్‌ ని నొక్కాడు. వెంటనే తెరుచుకోలేదు. ఒక్క క్షణం పాటు పనిచెయ్యటం లేదేమో నని చాలా కంగారు పడ్డాడు. తన దగ్గర మెయిన్‌ డోర్‌ కీస్‌ కూడా లేవు. ఎంతో కష్టపడి సాధించినది అంతా ఓపెనర్‌ లో బేటరీలు ఐపోవటం వల్ల మట్టిగొట్టుకు పోతుంది. ఆతృతగా అలా నొక్కుతూనే యింకొంచెం దగ్గరయ్యే సరికి తలుపు తెరుచు కోవటం మొదలయ్యింది.దూరాన్నుంచే గమనించాడు గెరాజ్‌ ఖాళీగా వుండటం. “హమ్మయ్య కనీసం ఒక వైపు నుంచి లైన్‌ క్లియర్‌ గా వుంది” అనుకున్నాడు.గబగబా కారు గెరాజ్‌ లో పార్క్‌ చేసి గెరాజ్‌ డోర్‌ తెరిచే వుంచి లోపలికి పరిగెత్తాడు.

ఎందుకైనా మంచిదని “హల్లో యింట్లో ఎవరైనా వున్నారా” అని బిగ్గరగా అంటూ అన్ని గదులూ ఒక్క సారి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. “గుడ్డలు మార్చుకుంటే బాగుంటుందేమో” అనుకుంటూ వాక్‌ ఇన్‌ క్లాజెట్‌ లోకి వెళ్ళాడు. జాకెట్‌ హేంగర్‌ కి వేలాడదీసి టై తీస్తుంటే, స్నానం చేస్తే బాగుంటుందేమో అనిపించింది. “పోనీ యిద్దరం కలిసి చేస్తే” అన్న చిలిపి ఊహ ఒక్కక్షణం మెరిసి ఆ దృశ్యాన్ని ఊహించుకుని ఆనందలోకాల్లో విహరించాడు. మళ్ళీ వెంటనే, “అది మరీ అత్యాశ” అని సర్ది చెప్పుకున్నాడు. నిజంగా అలాటి అవకాశమే కలిగితే మళ్ళీ చెయ్యొచ్చు స్నానమేగా అని ఊరడించుకున్నాడు. గబగబా పిల్లల బాత్‌ రూం లోకి వెళ్ళి సరిగ్గా ఆరు నిమిషాల్లో గోరు వెచ్చటి నీటితో స్నానం చేశాడు. ఈ మధ్యనే యూరోపియన్‌ వెకేషన్‌ కి వెళ్ళినప్పుడు తెచ్చిన అద్భుతమైన పెర్‌ ఫ్యూములవంక ఒకసారి చూసి, కొంచెం పూసుకుంటే? అనుకున్నాడు. అది రిస్కీ వ్యవహారం, జాగ్రత్తగా వుండటం అవసరమని హెచ్చరించుకుని ఫామిలీ రూమ్‌ లోకి పరిగెత్తాడు. ఇంట్లో వేడిగా వున్నట్టనిపించి థెర్మోస్టాట్‌ లో ఉష్ణోగ్రత చూశాడు. 81 డిగ్రీలు. 78 కి తగ్గించాడు. అంతలోనే తను కొని తెచ్చిన వస్తువులు కార్లో మరిచిపోయినట్లు గుర్తొచ్చి గెరాజ్‌ లోకి దౌడు తీశాడు.ఒక బాక్స్‌ చాకొలెట్‌ స్ట్రాబెరీలు, మరొక బాక్స్‌ మిక్స్డ్‌ ఫ్రూట్స్‌ ఒక పెద్ద ద్రాక్ష గుత్తి లోపలికి తీసుకు వచ్చి ఫ్రిజ్‌ లో పెట్టాడు.

టైం పదకొండూ యాభై ఐదు.ఒక వంక కలగబోయే అద్భుతమైన అనుభూతిని ఊహించుకుంటూ భావోద్వేగం. మరో వంక ఏదైనా అడ్డంకి వచ్చిందేమో నన్న ఆందోళన. కిటికీ దగ్గరికి వెళ్ళి కర్టెన్లు కొద్దిగా తెరిచి రోడ్డు వైపుకు చూశాడు. నిర్మానుష్యంగా వుంది. మళ్ళీ వాచ్‌ వంక చూసుకున్నాడు. హఠాత్తుగా ఏదో బెల్‌ మోగిన శబ్దం. టెలిఫోన్‌ కోసం వెళ్ళబోయి మళ్ళీ శబ్దం వినిపించక పోవటంతో కాలింగ్‌ బెల్‌ ఏమో నన్న ఆశతో గభాల్న వెళ్ళి తలుపు తెరిచాడు.

చిరునవ్వుతో సుభద్ర, కూలింగ్‌ గ్లాసెస్‌ తీస్తూ. ఆమెనలా దగ్గరగా చూస్తూ నిశ్చేష్టుడై నిలబడి పోయాడు శేఖర్‌. సుభద్ర తనే వెంటనే లోపలికి వచ్చేసి తలుపు తాళం వేసింది.

పక్కపక్కనే యిద్దరూ! అడుగు కన్నా కూడా తక్కువ దూరంలో. శేఖర్‌ యింకా తేరుకో లేదు. సుభద్రే చొరవగా సున్నితంగా అతన్ని కౌగిలించుకుని పెదాల మీద ముద్దు పెట్టుకుంది. శేఖర్‌ కి శరీరం అంతా దూదిపింజలా తేలికై పోయి ఎక్కడికో ఆకాశంలోకి ఎగిరి పోతున్న అనుభూతి. జీవితంలో ఇంతకన్నా మధురమైన క్షణం యిప్పటి వరకూ రాలేదన్న భావన.ఆమె వెంటనే అతన్ని విడిపించుకుని గెరాజ్‌ వైపు వెళ్ళి గెరాజ్‌ డోర్‌ మూసి వచ్చింది. ఇంతలో శేఖర్‌ కూడా తేరుకున్నాడు.ఎదురుగా వెళ్ళి ఆమెని బలంగా కౌగిలించుకున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ చిలిపిగా చూస్తూ అతన్ని మళ్ళీ ముద్దు పెట్టుకుంది. కళ్ళే మాట్లాడుకుంటున్నాయి. ఆపలేని చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి. ప్రపంచంలో ఇంకెవరూ ఇంకేమీ లేని మనఃస్థితి. మనసుల్లోని కోరికల్ని స్పష్టంగా చదివేసిన కాళ్ళు చెప్పకుండానే బెడ్‌ రూంలోకి అక్కడి కింగ్‌ సైజ్‌ బెడ్‌ మీదికీ దారితీశాయి.

శేఖర్‌ కి కాలం స్తంభించిపోయింది. మనస్సంతా తన ఉనికి తనకే తెలియని అమేయ స్థితిలో పడింది. భావాల్లో ఇమడని ఆనందానుభూతి. ఇద్దరూ ఒకటై ఆ ఒకటీ గాలిలా శూన్యంలా అంతటా ఆవరించే పరిణామ గతి. కొంత సేపటికి తెప్పరిల్లాక యిద్దరయ్యాక ఒకరినొకరు వదలలేక వదిలాక కదలలేక కదిలాక కాలం కళ్ళు తెరిచాక పరిసరాలు మసకమసగ్గా ఆకృతులు ధరించాక సుభద్ర అడిగింది, “మళ్ళీ యిప్పుడు వర్క్‌ కి వెళ్ళాలా?” అని. “ఇంక యీ రోజుకు వెళ్ళే పని లేదు” అన్నాడు శేఖర్‌ ఆశగా చూస్తూ. “నేనింక వెళ్ళాలి” అన్నది సుభద్ర కదలకుండానే. “యింకొంచెం సేపు వుండకూడదా” అన్నాడతను. “నీకు కుదిరినట్టు నాకు కుదరదుగా; ఐనా మరీ ఎక్కువ సేపు వుండటం ప్రమాదం” “ఏం పర్లేదు అన్నీ నేను చూసుకుంటాగా సెలవు పెట్ట రాదూ యీ పూటకి? ఇదుగో సెల్‌ ఫోన్‌ మీ ఆఫీసుకి ఫోన్‌ చెయ్యి” అన్నాడతను ధీమాగా. “ఇంకెక్కడి సెలవులు ఇండియా ట్రిప్‌ లోనే అన్నీ ఐపోయాయి” “ఇన్నాళ్ళు ఎదురు చూశాక ఇప్పుడే వచ్చావు ఇంతలోనే వెళ్తానంటే ఎలా?…” గోముగా అడిగాడు. “ఇది మొదటి సారే కదా; మళ్ళీ మరో రోజు” అంటూ అతన్ని విడిపించుకుని మెల్లగా లేచి బాత్రూంకి వెళ్ళింది.

శేఖర్‌ గబగబా లేచి వెళ్ళి ఫ్రిజ్‌ లో పెట్టినవి తీసుకుని వచ్చి బెడ్‌ మీద పెట్టి కూర్చున్నాడు. సుభద్ర రావడంతోనే “ఆకలిగా లేదూ?” అనడిగాడు వాటి కేసి చూపిస్తూ. “ఉంది గాని యిలాటివి తింటే ఆకలి తీరుతుందా?” అంది చిలిపిగా. శేఖర్‌ కి ఆ మాటలోని అంతరార్థం తెలిసి ఒక్క ఉదుటున లేచి పట్టుకో బోయేంతలో బయటికి పరిగెత్తి షూస్‌ వేసుకుంటూ “ఇంటి దగ్గర్నించి తెచ్చుకున్న లంచ్‌ నా కార్లో వుంది. ఆఫీసు కెళ్ళి తింటాలే” అన్నది. “మరైతే రేపు యిదే టైంకి మళ్ళీ రావాలి” అన్నాడు శేఖర్‌ ఆమెని కౌగిలించుకుంటూ. “రేపు కుదరదు. పదకొండుకి ఒక మీటింగ్‌ వుంది. ఎల్లుండి శుక్ర వారం మా గ్రూప్‌ వాళ్ళందరం లంచ్‌ కి వెళతాం. ఈ సారి మా వైస్‌ ప్రెసిడెంట్‌ కూడా వస్తున్నాడు గనక వెళ్ళి తీరాలి. సోమవారం ఖాళీనే. ఆ రోజు కలుద్దాం ఐతే” అంది సుభద్ర. “సోమవారం నాకు కుదరదనుకుంటాను. ఏదో కాన్ఫరెన్స్‌ వున్న గుర్తు. అది కేన్సిల్‌ చెయ్యటానికి ఏ మాత్రం వీలున్నా చేస్తాను. లేక పోతే మంగళ వారం యిదే టైంకి రావటం మర్చిపోకు” అన్నాడు శేఖర్‌ ఆమెని వదల్లేక వదుల్తూ. “నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తావుగా. అన్నట్టు మనం యిలా ప్లాన్లు వేస్తున్నాం సరే, ఎవరికీ ఏవీ అనుమానాలు రావుగదా” అంది సుభద్ర. “అదంతా నేను చూసుకుంటాగా. పైగా యిలా అనుమానాలు ఎవరికీ రాకుండా కలుసుకోవటం లో ఎంత త్రిల్‌ వుందో నీకు తెలీదూ?” “త్రిల్‌ బాగానే వుంది గానీ మనం కాస్త జాగ్రత్తగా వుంటే తప్పు లేదుగా. పైగా దొరక్కుండా తప్పించుకోవాలి గాని అందరికీ తెలిసేట్టు చేశావనుకో, దాన్లో అంత మజా వుండదు”. “అది నిజమే”. “ఇంక నేను వెళ్ళాలి మరి” అంటూ చటుక్కున ఒక ముద్దిచ్చి గభాల్న తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళి పోయింది సుభద్ర.

తలుపు తాళం వేసి శేఖర్‌ లోపలికి వెళ్ళి ఒక క్షణం ఆలోచించాడు. ఇంట్లో వుండి చేసే పనేం లేదు. టీవీ చూస్తే ఏం వస్తుంది? పోనీ వర్క్‌ కి వెళదామంటే అక్కడా చేసేది పెద్దగా లేదు. ఈ మధ్య వైద్య రంగపు ఆర్థిక వాతావరణంలో వచ్చిన మార్పుల మూలాన చాలా మంది స్పెషలిస్టులకి పని బాగా తగ్గిపోయింది. శేఖర్‌ కూడా వారంలో నాలుగు రోజులు, అదీ 8 నుంచి ఒంటి గంట వరకు మాత్రమే పనిచేస్తున్నాడు. బయటికెళ్ళి ఏదన్నా సినిమా చూడాలని నిర్ణయించుకున్నాడు. గబగబా డ్రెస్‌ చేసుకున్నాడు. బెడ్‌ రూం అంతా ఒక సారి కలయ చూశాడు.వస్తువు లన్నీ ఎక్కడ వుండాల్సినవి అక్కడే వున్నాయి. బెడ్‌ తను వచ్చినప్పుడు ఎలా వుందో అలాగే సరిచేశాడు. బెడ్‌ మీద పెట్టిన పండ్లన్నీ తీసుకెళ్ళి కారులో పెట్టాడు. దార్లో ట్రాష్‌ కేన్‌ చూసి అవన్నీ పడేసెయ్యాలి. కారెక్కి ఆనందలోకాల్లో తేలిపోతూ దగ్గర్లోనే వున్న సినిమా థియేటర్‌ కి వెళ్ళాడు.

సుభద్ర భర్త సుబ్బారావు, శేఖర్‌ హైస్కూల్‌ రోజుల్నించి స్నేహితులు. గుంటూరు మెడికల్‌ కాలేజికి శేఖర్‌ వెళ్ళినప్పుడు సుబ్బారావు ముందు హిందూ కాలేజిలోనూ ఆ తర్వాత అక్కడి పి.జి. సెంటర్‌ లోనూ ఫిజిక్స్‌ చదివాడు. ఆ విధంగా అక్కడున్నన్నాళ్ళు వాళ్ళ స్నేహం అంతరాయం లేకుండా సాగింది. తర్వాత శేఖర్‌ అమెరికాకి వచ్చిన రెండేళ్ళకి సుబ్బారావు కూడా పోస్ట్‌ డాక్టొరల్‌ ఫెలోగా వచ్చాడు. ఆ తర్వాత ఐదేళ్ళకి సుబ్బారావు కూడా యిండస్ట్రీలో వుద్యోగం సంపాదించి అనుకోకుండా శేఖర్‌ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న మెంఫిస్‌ కే చేరాడు. అలా వాళ్ళ స్నేహం మళ్ళీ రాజుకుంది. అప్పటికి ఇద్దరికీ పెళ్ళిళ్ళయాయి. సుబ్బారావు తెలివిగా అమెరికాలో సాంకేతిక రంగాల్లో వున్న అవకాశాల్ని గమనించి యింజనీరింగ్‌ చేసిన సుభద్రని సెలెక్ట్‌ చేసుకున్నాడు. శేఖర్‌ కి అమెరికాకి వచ్చేటప్పుడే వాళ్ళ వాళ్ళు పట్టుపట్టి రాధతో పెళ్ళి చేసి పంపించారు. రాధ ఎం.ఏ. చదివినా అవసరం లేక ఉద్యోగం గురించి చాలా కాలం ఆలోచించలేదు. ఇప్పుడు నలభయ్యో పడిలో పడుతున్నాక పిల్లలకి తన అవసరం చాలావరకు తగ్గిపోయాక యింట్లో ఏమీ తోచక కాలక్షేపానికి వారానికి మూడు రోజులు ఒక హాస్పిటల్లో వాలంటరీ వర్క్‌ చేస్తున్నది. సుభద్ర వచ్చిన దగ్గర్నించి కంప్యూటర్‌ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నది. రెండు కుటుంబాల్లోనూ దాదాపు ఒకేవయసు పిల్లలు యిద్దరిద్దరు. అందరూ మగపిల్లలే. ఆ విధంగా కూడా వాళ్ళ మధ్య సంబంధాలు బాగా దగ్గరయ్యాయి. సంపాదన విషయంలో తేడాలు ఎక్కువే వున్నా ఎంతో కాలం నుంచి కలిసి పంచుకున్న జ్ఞాపకాలూ సుబ్బారావు చతుర సంభాషణా చాతుర్యం కలిసి ఆ స్నేహాన్ని చాలా వరకు నిలబెట్టాయి.

క్రితం సంవత్సరం వరకు.

ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. సుబ్బారావుకి ఉద్యోగం పోవటం, ఎంత ప్రయత్నించినా మళ్ళీ దొరక్కపోవటం, శేఖర్‌ తో మాట్లాడేప్పుడు అతననే ప్రతి మాటకీ ఏదన్నా అంతరార్థం వున్నదేమో అని అనుమానిస్తూ వుండటం మొదలయ్యింది. దాంతో అతను శేఖర్‌ ఎదుట పడటం చాలా వరకు తగ్గించేశాడు. సుభద్రే పిల్లల్ని తీసుకుని అప్పుడప్పుడు వెళ్తుండేది. ఒక్కోసారి రాధ యింట్లో లేనప్పుడు కూడా.

…………………………..

ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రకారం సుభద్ర ఆపై వారం నాడు మళ్ళీ శేఖర్‌ దగ్గరికి వచ్చింది. మొదటి సారి వున్నంత ఆవేశమూ ఆతృతా ఉద్రేకమూ ఉధృతీ లేకపోయినా ఆ కలయిక కూడా ఉత్సాహంగానూ ఆనందంగానూ గడిచింది. ఈ సారి వాళ్ళు మొట్టమొదటి సారిగా ఒకరినొకరు ఎప్పుడు చూశారో ఆ సందర్భాల్లోని సన్నివేశాల గురించి కాసేపు మాట్టాడుకున్నారు. ఐతే యిద్దరూ జాగ్రత్తగా తమ తమ జీవిత భాగస్వాములగురించి వీలైనంత తక్కువ మాటలు వచ్చేట్లు చూసుకున్నారు. మరో పదిరోజుల తర్వాత మళ్ళీ కుదిరింది. ఇంకో వారానికి మళ్ళీ. ఇన్నాళ్ళకి ఇద్దరూ కలిసి జకూజీ టబ్‌ లో స్నానం చెయ్యటానికి వీలు దొరికింది.

ఆ రోజు రాధ మామూలుకన్నా కొంత ముందుగా యింటికి వచ్చేసరికి బాత్రూంలో ఏదో మార్పు జరిగి నట్టు అనుమానం కలిగింది. ఏమిటా అని కొంచెం నిదానంగా ఆలోచిస్తే ఎప్పుడో ఏడాది కొకసారి వాడే టబ్‌ ని అంతకు ముందే ఎవరో వాడినట్టు అనిపించింది.రాధకు అర్థం కాలేదు. తను ఎప్పుడూ దాన్లో స్నానం చెయ్యదు. పిల్లలు ఉదయాన్నే స్కూలుకు వెళ్ళారు. శేఖర్‌ కూడా వర్క్‌ కి వెళ్ళిన తర్వాతే తను బయటికి వెళ్ళటం జరిగింది. పిల్లలు తిరిగి వచ్చే అవకాశం లేదు.

దొంగలెవరైనా యింట్లో వున్నారేమో నని ఒక్క క్షణం భయం వేసింది. కాని వెంటనే ఆ పరిస్థితి చాలా త్రిల్లింగ్‌ గా అనిపించింది. నీరసంగా రోజులు గడుస్తున్న జీవితంలో ఉత్సాహం కలిగించటానికి అప్పుడప్పుడు ఇలాటి సంఘటనలు కావాలి మరి. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ గెరాజ్‌ లోకి వెళ్ళి పిల్లల బేస్‌ బాల్‌ బేట్‌ తీసుకుంది.లోపలికి వచ్చి పిల్లిలా నడుస్తూ ఒక్కొక్క రూమే చూసింది. క్లాజెట్స్‌ మొత్తం వెదికింది. ఇంట్లో వున్న వస్తువులు గాని నగలు గాని ఏవైనా పోయాయేమో చూసుకుంది. అన్నీ ఎక్కడివి అక్కడే వున్నాయి. తలుపులు గాని కిటికీలు గాని తెరిచిన దాఖలాలు లేవు. పోనీ ఎలాగోలా గెరాజ్‌ డోర్‌ నే తెరుచుకుని వచ్చారనుకున్నా ఏమీ తీసుకోకుండా స్నానం మాత్రం చేసి వెళ్ళరు కదా!

మాసిన గుడ్డలు వేసే బుట్టలో రెండు కొత్త టవళ్ళు వాడి పడేసి నట్టు తెలుస్తోంది. ఇలా కనిపిస్తున్న ఆధారాలని అన్నిటిని అన్వయించి చూస్తే ఒకటే అవకాశం తేలుతుంది. అదేంటంటే, శేఖర్‌ తప్పకుండా ఇంతకు ముందే ఇంటికి వచ్చి వెళ్ళుండాలి.అంటే వర్క్‌ దగ్గర ఏదన్నా కారణం వల్ల స్నానం చెయ్యాల్సి వచ్చి వుండాలి. అంతవరకు బాగానే ఉన్నది గాని అలా జరిగినా సామాన్యంగా ఎప్పుడూ ఇంటికి రాడు. తన ఆఫీసులోనే స్నానం చేసి బట్టలు మార్చుకోవటానికి అన్ని సదుపాయాలు వున్నాయి. సరే, ఎందువల్లయినా యింటికే వచ్చి స్నానం చెయ్యాల్సినా, ఎదురుగా కనిపిస్తూ వున్న ఐదారు టవళ్ళు కాదని ఎక్కడో వున్న కొత్త టవళ్ళు వెదికి తీసి వాడాల్సిన అవసరం ఏమిటి? అది కూడా ఒకటి కాదు, రెండు?

మెల్లగా రాధ మనసులో అనుమానం ఆవులించి కూర్చుంది. ఈ మిస్టరీని ఎలాగైనా సాల్వ్‌ చెయ్యాలన్న కోరిక బలంగా కలిగింది.ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ కాలేజ్‌ రోజుల్లోని చలాకితనం, స్వతంత్రంగా సాహసంగా పనుల్ని సాధించే చొరవ పునరుజ్జీవనం పొందాయి. గాలిలో నడుస్తున్నట్టు అడుగులు పడుతూండగా చకచక బెడ్‌ రూంలోకి నడిచింది. జాగ్రత్తగా తడి గుర్తుల కోసం

చూస్తూ కార్పెట్‌ మీద వెదికింది. ఎక్కువ వెదకక్కర లేకుండానే తేలిపోయింది కాళ్ళు పూర్తిగా ఆరకుండానే బాత్రూంలోంచి బెడ్‌ రూంలోకి వెళ్ళినట్టు. అదీ నేరుగా బెడ్‌ మీదికే. బెడ్‌ కూడా అక్కడక్కడ తడిగా వుంది. అదికూడా బెడ్‌ మధ్యలో కొంత విశాలమైన స్థలంలో. కాబట్టి ఇద్దరు మనుషులై వుండటానికి బాగా అవకాశం కనిపిస్తున్నది. ఇప్పుడు బెడ్‌ ని బాగా పరిశీలనగా
చూసింది. తను బయటికి వెళ్ళేటప్పుడు సర్దిన దానికి ఇప్పుడు వున్నదాన్ని మనసులో పోల్చిచూసింది. చిన్న చిన్న ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిండ్లు కొంచెం కదిలాయి. మేట్రెస్‌ స్థానం లోను కొంత మార్పున్నది.

ఇవన్నీ చూశాక రాధకి పరిస్థితి చాలావరకు అవగాహన అయింది. శేఖర్‌ ఇంకెవరితోనో కలిసి టబ్‌ లో స్నానం చేసి అక్కడి నుంచి బెడ్‌ మీదికి వచ్చాడన్నది దాదాపుగా నిశ్చయం. కలిసి స్నానం అంటే ప్రాస్టిట్యూట్‌ అయే అవకాశం లేదు. పైగా అంత చనువు కలగాలంటే యిది మొదటిసారి అయి వుండదు. కాకుంటే ఎంత ప్రయత్నించినా గత కొద్ది నెలలలో యిలాటి అనుమానాస్పద దృశ్యాలు ఏవీ గమనించినట్టు లీలగా ఐనా గుర్తుకు రావటం లేదు. కనక ఇది ఈ మధ్యనే మొదలైన వ్యవహారం. మిగిలినవి ఎలా వున్నా శేఖర్‌ కొంత కాలంగా ఎవరినో తను లేనప్పుడు ఇంటికి తీసుకు రావటం మొదలుపెట్టాడు. అందుకు ఏ మాత్రం సందేహం లేదు.

ఇంక ఇప్పుడు వెంటనే నిర్ణయించుకో వలసింది దీన్ని గురించి ఏం చెయ్యటం అనేది. “నువ్వెవరితోనో సంబంధం పెట్టుకున్నావని నాకు తెలుసు” అని నేరుగా యుద్ధం ప్రకటించొచ్చు. ఐతే శేఖర్‌ ఒక వేళ ముందుగానే అలాటి సందర్భం వస్తే ఏంచెయ్యాలో ఆలోచించుకునివున్నట్టయితే అలాటిదేం లేదని ధైర్యంగా బుకాయించవొచ్చు. లేకుంటే, ఔను, నిజమే, ఏం చేసుకుంటావో చేసుకో అని ధిక్కరించనూ వచ్చు. అది చాలా రిస్కీ పద్ధతి. రెండో పద్ధతి మళ్ళీ యిలాటి సంఘటన జరిగే వరకు జాగ్రత్తగా ఆగి అప్పుడు రెడ్‌ హేండెడ్‌ గా పట్టుకోవటం.దాని వల్ల యింకో ఉపయోగం ఏమిటంటే అవతలి వ్యక్తి ఎవరో కూడా వెంటనే తెలిసి పోతుంది. కాకపోతే ఆ పద్ధతి పని చెయ్యటానికి చాలా ప్లానింగ్‌ అవసరం. ఆహా దొరికారని ఉత్సాహంగా ఇద్దర్నీ బెడ్‌ మీద పట్టుకుంటే అప్పుడు వాళ్ళ ప్రతిస్పందన ఎలా వుంటుందో చెప్పటం కష్టం. లేనిపోనిది యిద్దరూ కలిసి తనని చంపేస్తే? డిటెక్షన్‌ మాట దేవుడెరుగు, ప్రాణాలు పోవచ్చు. కామంలో నిండా మునిగిన వాళ్ళు ఏంచేస్తారో ఎవరు చెప్పగల్రు? పోనీ అంత దాకా రాక పోయినా, పట్టుకుని ఆ తర్వాత ఏం చేసేటట్టు? నీకు విడాకులిచ్చేస్తా అని బెదిరించొచ్చు. కాని దాంతో ప్రమాదం ఏమంటే, సరే అలాగే అంటే అప్పుడేంచెయ్యాలి? తనకి విడాకులిచ్చి వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుని కులుకుతూ వుంటే తనొక్కతే పిల్లల్ని పెంచుతూ బతకాల్సొస్తుంది. డబ్బు బాగానే లాగొచ్చు గాని ఈ వయసులో తనకి మళ్ళీ పెళ్ళంటే అందుకు అవకాశాలు బాగా తక్కువ. అదీ ఇద్దరు మగపిల్లలుండి డివోర్స్‌ తీసుకున్న తనకి. అన్నింట్లోకి మంచి పద్ధతి ఎలాగైనా దీన్ని ఉపయోగించుకుని అతన్ని తన కాలి కింద వుండేట్టు చేసుకుని బ్లాక్‌ మెయిల్‌ చెయ్యటం. అందుకు మొదటి మెట్టు అవతలి వాళ్ళు ఎవరో తెలుసుకోవటం. అప్పుడైతే ఇద్దర్నీ ఒకరికి తెలియకుండా మరొకరిని బ్లాక్‌ మెయిల్‌ చేసే ఛాన్స్‌ వుంటుంది!

ఇలా నిర్ణయించుకోవటంతో రాధకి ఎంతో ఉల్లాసం వచ్చింది. వయసు ఒక్క సారిగా సగానికి తగ్గిపోయిన అనుభూతి. ఇక అప్పటి నుంచి శేఖర్‌ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టింది. ఏవైనా లవ్‌ లెటర్స్‌ దొరుకుతాయేమో నని రోజూ అతని జేబులు వెదుకుతోంది.అతను ఎవరికన్నా ఫోన్‌ చేస్తే అది తనకి తెలియనట్టు మరో ఫోన్‌ నుంచి ఒక క్షణం విని పెట్టేస్తోంది. తను ప్రతిరోజూ వాలంటరీ వర్క్‌ కి వెళ్ళాలని నిర్ణయించు కున్నట్టు నమ్మించి వర్క్‌ లేని రోజుల్లో కూడా వెళ్తున్నట్టు నటిస్తోంది. అనుమానకరమైన సూచనలకోసం అప్రమత్తంగా గమనిస్తోంది.

ఇలా ఒక నెల రోజులు గడిచాయి. మధ్యలో రెండు సార్లు కొంచెం అనుమానం వచ్చింది గాని పూర్తిగా తేలలేదు. ఒక వేళ శేఖర్‌ కి తనకి అనుమానం వచ్చిన సంగతి తెలిసి జాగ్రత్తగా ఉంటున్నాడేమో అనిపించింది. రెండో వ్యక్తి ఎవరో తెలిసే అవకాశమే కలగలేదు. ఆ రోజు సోమవారం. సాయంత్రం ఏడున్నర అయింది. పిల్లలు హోమ్‌ వర్క్‌ చేస్తున్నారు. రాధ భోజనం ముగించింది. శేఖర్‌ యింకా యింటికి రాలేదు. ఇంతలో కాలింగ్‌ బెల్‌ మోగింది. పెద్ద కొడుకు మనోజ్‌ వెళ్ళి తలుపు తీసి “మామీ నువ్వో సారి అర్జెంట్‌ గా యిటురా” అని కేక పెట్టాడు. ఏమిటా అని రాధ వెళ్ళి చూస్తే ఎదురుగా పోలీసులు!

“ఏమిటి ఏం కావాలి?” అంటూ తడబడుతూ అడిగింది రాధ. “మీరు మమ్మల్ని చూసి భయపడాల్సిన పనేం లేదు. ఇది డాక్టర్‌ సెఖార్‌ గారి ఇల్లేనా?” అంటూ అతని గురించిన వివరాలు, ఎక్కడ పనిచేసేది, ఎలాటి కారు నడిపేది,ఆ రోజు ఎప్పుడు ఇల్లు విడిచి వెళ్ళింది, ఆ తర్వాత ఏమైనా ఫోన్‌ కాల్స్‌ చేశాడా … ఇలాటివి అడిగారు. రాధకి అర్థం కాలేదు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నది. అదే విషయం వాళ్లని అడిగింది. అప్పుడు ఒక లేడీ పోలీస్‌ ఆమెతో లోపలికి వచ్చి ఆమె పక్కన సోఫాలో కూర్చుని మెల్లగా విషయం బయటపెట్టింది “డాక్టర్‌ సెఖార్‌ ఓ గంట క్రితం తీవ్రమైన కారు యాక్సిడెంట్‌ లో బాగా గాయాలు తగిలి మరణించారు. శవాన్ని చూసి గుర్తు పట్టేందుకు మిమ్మల్ని హాస్పిటల్‌ కి తీసుకెళ్ళటానికి మేం సిద్ధంగా వున్నాం.” అంటూ.

రాధకి మొదటిగా కలిగిన భావం ఇన్నాళ్ళ తన ఇన్వెస్టిగేటివ్‌ వర్క్‌ పూర్తి కాకుండానే ఇలా అర్థాంతరంగా ఆగిపోతున్నదే, అంత ఉల్లాసం కలిగిస్తున్న ఆ పని ఇంక లేకుండా పోతుందే అనే బాధ. కాని దాని గురించి ఇప్పుడు తను చెయ్యగలిగింది ఏమీ లేదు. హస్పిటల్‌ కి వెళ్ళి వెంటనే జరగాల్సిన కార్యక్రమాలు చూడటం ఒక్కటే తక్షణ కర్తవ్యం.

ఒంటి నిండా గాయాల్తో దాదాపుగా గుర్తు పట్టటానికి వీల్లేకుండా వున్నాడు శేఖర్‌. ప్రాణం పోయి చాలా సేపయినట్టుంది. కొంచెం సేపు ఆ బెడ్‌ పక్కన ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది రాధ. ఏం చెయ్యాలో తోచలేదు. ఏడుపు ఏమాత్రం రాలేదు. అసలు బాధ కూడా కలగలేదు. ఇద్దరూ కలిసి పంచుకున్న పదిహేనేళ్ళ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు మరిచిపోలేని సన్నివేశాలు ఏమున్నాయా అంటే ఏమీ గుర్తుకు రావటం లేదు.చూసే వాళ్ళకు బాగుండదని దుఃఖం కలిగినట్టు కొద్ది సేపు నటించింది. ఇంతలో మరో లేడీ పోలీస్‌ వచ్చి, “మీకు అభ్యంతరం లేక పోతే ఒక్క నిమిషం ఇలా రావలసింది” అని దగ్గర్లో వున్న ఇంకో బెడ్‌ దగ్గరికి తీసుకు వెళ్ళింది.

ఎవరో శ్వేత జాతి స్త్రీ. బహుశః ముప్పై ఏళ్ళ వయసు వుండొచ్చు. ఆకర్షణీయంగానే వుంది. స్పృహలో లేదు. ఒంటి నిండా రకరకాల వైద్య పరికరాలు అమర్చి వున్నాయి. “ఈమెను మీరు ఎప్పుడైనా చూశారా? ఈమె ఎవరో మీకు తెలుసా?” అని అడిగారు రాధని. లేదన్నది రాధ. అసలు ఆమెని తనకి చూపాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు. వాళ్ళే చెప్పారు, ” డాక్టర్‌ సెఖార్‌ కారుకి యాక్సిడెంట్‌ జరిగినప్పుడు ఈమె కూడా ఆ కారులోనే వున్నది. అతనితో పాటు పని చేసే వ్యక్తి అయుండ వచ్చని అనుకుంటున్నాం. వివరాలు తెలియగానే తెలియజేస్తాం” అన్నారు.

ఆ వివరాలు బయటికి రావటానికి ఒక వారం రోజులు పట్టింది. వచ్చిన వాటి సారాంశం ఇది : ఆ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో శేఖర్‌ హాస్పిటల్‌ నుంచి బయలుదేరి వస్తూ దారిలో ఒక సింగిల్స్‌ బార్‌ లో ఆగాడు. లోపలికి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళిన వాడు ఆ అమ్మాయితో కలిసి హడావుడిగా బయటికి వచ్చాడు. ఆ అమ్మాయి అంతకు ముందే తన భర్తతో తగువు పడి కోపంగా బార్‌ కి వచ్చి వుంది. ఐతే ఆమెకి తెలియ కుండా బయటఆమె భర్త కూడా అక్కడికి వచ్చి బయట ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఆమె శేఖర్‌ తో కలిసి రావటం, వాళ్ళిద్దరూ శేఖర్‌ మెర్సెడీస్‌ కారులో ఎక్కటం అతని కంట పడింది. తనతో పోట్లాట పెట్టుకోవటమే కాకుండా ఎవడో బ్రౌన్‌ వెధవతో తన భార్య వెళ్లటం చూసిన అతను పట్టరాని కోపంతో తన ట్రక్‌ లో వాళ్ళని వెంబడించాడు. శేఖర్‌ కారుని అతను కలుసుకునే సరికి వాళ్ళొక ఫ్రీవే మీద వున్నారు. అతను ఆ కారు పక్కగా ఆమె వున్న వైపునుంచి వచ్చి గన్‌ చూపిస్తూ ఆమెని ఏదో బెదిరించటం,ఆ వెంటనే శేఖర్‌ తన కారుని చాలా స్పీడ్‌ పెంచి నడపటం జరిగింది. ట్రక్‌ కూడ ఆ కారుని అందుకోవటానికి ప్రయత్నం చేసింది.అలా దాదాపు వంద మైళ్ళ వేగంతో వెళ్తున్న శేఖర్‌ హఠాత్తుగా ఒక పెద్ద ట్రక్‌ ని పాస్‌ చెయ్యాల్సి రావటంతో కారు కంట్రోల్‌ తప్పి మీడియన్‌ లో వున్న గోడని బలంగా కొట్టటం, అంతటితో ఆగకుండా ఎగిరి రెండో వైపుకు కారు పడటం, ఆ వైపు నుంచి వస్తున్న ఇంకో ట్రక్‌ దాన్ని యాభై గజాల దూరం గాల్లో విసిరెయ్యటం క్షణంలో జరిగిపొయ్యాయి.

డాక్టర్ల ఉద్దేశం శేఖర్‌ బహుశః ఆ ట్రక్కు గుద్దుకోకముందే మరణించి వుంటాడని. అతనితో వున్నామె మాత్రం అత్యాశ్చర్యంగా వెంటనే చనిపోలేదు; మరుసటి రోజు హాస్పిటల్‌ లో చనిపోయింది అప్పటివరకు కోమాలో వుండి.

శేఖర్‌ అప్పుడప్పుడు సూచాయగా చమత్కారంగా అన్నట్టుగా అంటుండే మాటలు రాధకు గుర్తుకు వచ్చాయి: “ఎలాగైనా తెల్ల ఆడవాళ్ళు శృంగారంలో బాగా ఆరితేరిన వాళ్ళు; వాళ్ళ అనుభవం ముందు మిగిలిన వాళ్ళంతా దిగదుడుపే. మనకు శృంగారశాస్త్రంలో రహస్యాలు తెలియాలంటే వాళ్ళతో కొంత అనుభవం సంపాదించటం ఒక్కటే మార్గం…” యిలాగా. దీన్ని బట్టి చూస్తే ఆ కోరిక తీర్చుకోవటానికే అతను బార్‌ కి వెళ్ళినట్టు, అక్కడ అనుకూలంగా అదే సమయానికి వచ్చి కసితోనూ కోపంతోనూ ఏదో విపరీతమైన పని చేసెయ్యాలని ఉద్రేకంలో వున్న ఆమెని తీసుకుని ఏ హోటల్‌ కో వెళ్ళటానికి ప్రయత్నించి నట్టు కనపడుతుంది. ఒక వేళ యీ మధ్య కాలంలో యింటికి తీసుకు వస్తున్నది కూడ యిలాటి వాళ్ళను కాదు కదా? అని ఆలోచనలో పడింది రాధ.

ఈ సమస్యని పరిష్కరించటానికా అన్నట్టు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పోలీసులు వచ్చి “డాక్టర్‌ సెఖార్‌ కారులో దొరికిన వస్తువులు” అంటూ యిచ్చిన వాటిలో ఒక డైరీ కూడా కనిపించింది. వాళ్ళు వెళ్ళటం తోనే రాధ ఆతృతగా దాన్ని తెరిచి చదివింది. ఆమె సందేహాలు చాలా వాటికి అందులో సమాధానాలు దొరికాయి కూడా.

రెండు నెలల క్రితం వున్న ఒక ఎంట్రీలో యిలా వుందిి: “జీవితం మరీ డల్‌ గా వుంటున్నది. చచ్చేటంత సంపాయించాను. నచ్చిన కార్లూ,హోమ్‌ థియేటరూ, ఇంటి నిండా రకరకాల గాడ్జెట్లు. ఛాన్స్‌ దొరికి నప్పుడల్లా క్రూజ్‌ ట్రిప్పులు ఇంటర్నేషనల్‌ వెకేషన్లూ. ఐతే వీటిలో వేటిలోనూ కలగాల్సిన ఉత్సాహం కలగటం లేదు. ఇంకేదైనా కొత్త దారి కావాలి. ఎంతసేపూ ఇంట్లో కూర్చుని టీవీ చూడటం,బయటికెళ్ళి సినిమాలు చూడటం, ఎప్పుడన్నా పార్టీల్లో కలిసి చూసిన మొహాలే చూడటం మాట్టాడిన విషయాలే మాట్టాడటం ఇంతేగా ఈ వెధవ జీవితం? ఇంక ఊరుకోకూడదు. ఏవన్నా సాహసాలు చెయ్యాలి. “యస్‌” వ్యవహారం చూస్తుంటే కొంచెం ప్రయత్నం చేస్తే దొరకొచ్చు అనిపిస్తుంది. చేసి చూద్దాం పోయిందేం వుంది గనక?” తరవాత కొన్నాళ్ళకి “ఈ రోజు మొదటి సారిగా యస్‌ ఇంటికి వచ్చింది. మరపు రాని మధురానుభూతుల్ని రుచి చూపించింది. ఈ ఐడియా ఇంత లేటుగానా రావటం? అయ్యయ్యో ఎంత కాలం వేస్టయి పోయింది!” దీని తర్వాత నెల రోజులకి మరోటి: “ఇప్పటికి యస్‌ తో ఐదు సార్లు అయింది. దీన్లో కూడా పెద్ద ఉత్సాహం కనపడటం లేదు. దానికి తోడు యీ మధ్య మంచి సమయం చూసుకుని రాధకి డివోర్స్‌ ఇచ్చి తనని పెళ్ళి చేసుకోమని చెప్పీ చెప్పనట్టు చెబుతుంది. రాధని వొదిలించుకుని ఇంకెవరినన్నా చేసుకునేట్టయితే

ఇంతకన్నా ఇంకెవరూ దొరకరా ఏమిటి మనకి? ఒక రొచ్చు గుంటలో నుంచి ఇంకో దాన్లోకి దూకే వెధవలా కనబడు తున్నానన్న మాట. ఇంతటితో యీ కధ ఆపి ఇంకెవరన్నా దొరుకుతారేమో చూడాలి. అసలు వీళ్ళెవరూ కాదు. ఈ సారి తెల్ల పిల్లల కోసం గట్టిగా ప్రయత్నం చెయ్యాలి. మన ముఖం చూసి ఎవరూ రారు గాని కారు చూసి రావొచ్చు. డబ్బు వెదజల్లితే దొరకొచ్చు. ఆఫీసులో పనిచేసే వాళ్ళని ఎవరినన్నా పట్టటం తేలిక. ఐతే ఒక సారి తగులు కుంటే అంత తేలిగ్గా వదలరేమో. పైగా యీ మధ్య సెక్సువల్‌ హెరాస్‌ మెంట్‌ అని ఇదో గోల హడావుడిగా కూడా ఉంది. కాబట్టి వర్క్‌ కి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళయితేనే హాయి.” ఆఖరుగా చావుకు ముందు రోజు యిలా రాసుకున్నాడు: “ఒక మంచి ఐడియా వచ్చింది నిన్న రాత్రి టీవీ చూస్తుంటే. ఇన్నాళ్ళు ఎందుకు రాలేదో ఆశ్చర్యం! హాయిగా సింగిల్స్‌ బార్లకి వెళ్ళి బీటేస్తే ఎవరో ఒకరు దొరకరా? వరసన ఓ నెల రోజులు ప్రయత్నిస్తే ఒక సారన్నా సక్సెస్‌ కావటం కష్టం అనుకోను. అక్కడికి వొచ్చే వాళ్ళందరూ వొచ్చేది అందుకోసమే కదా!”

ఇదన్న మాట విషయం. వెరైటీ కోసం, కొత్తదనం కోసం, సాహసం కోసం, త్రిల్‌ కోసం పడ్డ పాట్లు యివి. గమ్మత్తేమిటంటే యీ ప్రయత్నంలో చావు కూడా చాలా త్రిల్లింగ్‌ గానే జరిగింది. కాకపోతే తెల్లపిల్లతో సంబంధం కావాలన్న కోరిక తీరని కోరిక గానే మిగుల్చుకుని సరిగ్గా అది తీరబోయేముందే పోయినట్టున్నాడు.

ఈ విధంగా డైరీలో రాతల్ని బట్టి తన యింటికి వచ్చి శేఖర్‌ తో వుంటున్నది ఎవరో తనకి తెలిసిన వాళ్ళే నని రాధకి అర్థమయింది. కాకుంటే ఎవరో స్పష్టంగా తెలుసుకోవటం మాత్రం సాధ్య పడలేదు. ఔను మరి. ఎవరి పేరు చూసినా ఎస్‌ తో మొదలౌతూ వుంటే ఎలా! సరళ, శారద, సంధ్య, సుజాత, శోభన, సుభద్ర, సుమ, సౌమ్య, స్నేహ, సుచరిత,.. డామిట్‌ వీళ్ళలో ఎవరనేది

ఎలా తేలటం? అందరూ అందరే. ఛాన్స్‌ దొరికితే ఎవడితో లేచి పోదామా అని ఎదురు చూస్తున్నట్టు కనపడతారు. ఒక పక్క అందరూ ఉద్యోగాలు చేస్తూ సంపాయిస్తున్న వాళ్ళే గాని వీళ్ళ జీవితాల్లో ఏం వుంది చెప్పుకోటానికి? ఇంటా బయటా చచ్చేట్టు పనిచెయ్యటం, వీక్‌ ఎండ్‌ లో పార్టీలు వుంటే ఎప్పుడూ కలిసే వాళ్ళనే కలిసి అరిగిపోయిన రికార్డుల్లాగా అవే మాటలు మాట్టాడుకుని, మంచి తిండికి వాచిపోయి వున్నట్టు ఎంత చెత్తనైనా “డెలిషియస్‌, సో టేస్టీ” అంటూ లొట్టలేసుకుని తింటూ గుడ్డలూ నగలూ చూపించుకుని గర్వపడటం, యిదేగా రూటీన్‌? అయ్యుండచ్చు యీ చచ్చువెధవ మొగుడికి దొరికిన దండుముండ. ఎవరైనా ఏది ఏమైనా తను తొందర పడి డివోర్స్‌ తీసుకోవటం గాని అతనే అవతలి వాళ్ళ మీద మరీ మోజులో పడి తనని వదిలించుకోవటం గాని జరక్కముందే ఈ వ్యవహారం యిలా చాలా సంతృప్తికరంగా ముగిసినందుకు రాధ ఆనందంగా కృతజ్ఞతగా పిట్స్‌ బర్గ్‌ గుడికి వెళ్ళి పూజలు చేయించి వచ్చింది. ఇప్పుడు ఆస్తి అంతా తన చేతికి రావటమే కాకుండా శేఖర్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కింద ఒక మిలియన్‌ వచ్చింది. కార్‌ ఇన్సూరెన్స్‌ కూడా కొంత రాబోతుంది. శేఖర్‌ తో పాటు చనిపోయిన ఆమెకి అదృష్టవశాత్తూ భర్త తప్ప ఇంకెవరూ లేరు. ఆ భర్తని జైల్లో పడేశారు. కనక వాళ్ళకి ఏమీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం మీద శేఖర్‌ పోవటంతో రాధ నాలుగు మిలియన్లకి అధికారిణి అయింది. ఇంత కన్నా కావలసింది ఏముంది! ఈ డబ్బుతో యిక తను ఆడింది ఆట పాడింది పాట! ఇన్నాళ్ళుగా తీరని కోరికలన్నీ హాయిగా తీర్చుకోవచ్చు. ఆంక్షలు విధించటానికి గాని హద్దులు నిర్ణయించటానికి గాని ఎవరూ వుండరు. స్వేచ్ఛావిహంగంగా వినోద విహారాలు చెయ్యొచ్చు!

వెంటనే తన ఆలోచనల్ని అమలులో పెట్టింది రాధ. ఇండియా నుంచి తల్లిదండ్రుల్ని పిలిపించింది. వాళ్ళతో పాటు యింకా పెళ్ళికాని చిన్న చెల్లెలు కూడా వచ్చింది. వాళ్ళందరు తనతో పాటు వుంటూ పిల్లల విషయం చూసుకుంటున్నారు. తన ప్రైవసీ కోసం ఒక కాండొమీనియం కొనుక్కుని తోచినప్పుడు అక్కడికి వెళ్ళి వుంటున్నది. ఒక రోజు ఖరీదైన ఒక రెస్టారెంట్‌ కి లంచ్‌ కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి కండలు వస్తాదులా వున్న వైటర్‌ తో మెల్లగా మాటల్లోకి దిగి షిఫ్ట్‌ అయాక తనకి ఫోన్‌ చెయ్యమని తన నంబర్‌ యిచ్చింది. ఆమె ఖరీదైన గుడ్డలూ మెర్సెడీస్‌ కారూ చూశాక అతను అప్పటికప్పుడే ఆ ఉద్యోగం వొదిలేసి ఆమెతో కాండో కి వెళ్ళాడు. అతనికి పెళ్ళయి వుంది, రాధ కన్నా బహుశః ఓ పదేళ్ళన్నా చిన్న వాడయుంటాడు. కాని,ఇద్దరూ యిష్టపడ్డాక అలాటి చిన్న చిన్న విషయాలు ఎవరికీ అభ్యంతరం కావు కదా! అందులోను అతను అమెరికన్‌, తెల్లవాడు కావటంతో మిగిలిన తెలుగు వాళ్ళు చెవులు కొరుక్కోవటానికి కూడా అంతగా అవకాశం దొరకలేదు. కొన్నాళ్ళకి అతను వాళ్ళావిడకి డివోర్స్‌ చేసి రాధ కాండో లోకే తన మకాం మార్చేశాడు. ఆ తర్వాత రాధ ఎవరెవరో కొత్త కొత్త కుర్రవాళ్ళతో కనపడుతుందని అప్పుడప్పుడు వదంతులు వినిపించాయి గాని అలా అన్నది ఆమె శ్రేయోభిలాషులు కాదనే విషయం అందరికీ తెలుసు. ఐనా రాధ అతన్ని పెళ్ళి చేసుకోవటం జరిగేపని కాదని ముందుగానే స్పష్టంగా చెప్పిందనీ అలాగే తన మీద ఏమాత్రం పెత్తనం చెలాయించినా వూరుకోనని కూడా తెలియజెప్పిందనీ పుకార్లు. ఏది ఏమైనా రాధ మాత్రం తన కొత్త జీవితాన్ని పుష్కలంగా అనుభవిస్తున్నదన్న విషయం ఎవరూ కాదనలేక పోయారు.రాధ తల్లిదండ్రులు యీ వ్యవహారాలు చూసి మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డారు గాని తర్వాత మెల్లగా అలవాటు పడిపోయారు.మారుతున్న కాలంతో మారటానికి డబ్బుని మించిన ఇంధనం లేదు కదా!

పాపం, సుభద్ర పరిస్థితి మాత్రం దయనీయంగా మిగిలిపోయింది. తను శేఖర్‌ తో ఇంకొన్నాళ్ళ ముందే సంబంధం పెట్టుకుని పెళ్ళి కూడా చేసుకునివుంటే మిలియన్ల ఆస్తి ఆ వంట యింటి రాకాసి రాధకి కాకుండా తనకే వచ్చి వుండేది. అప్పుడు ఉద్యోగం లేని మొగుడి గొడవా డబ్బులు చాలీ చాలక ఎప్పటికప్పుడు వెదుక్కునే దుర్భర పరిస్థితీ లేకుండా ఆనందంగా తన మనసుకి నచ్చిన పనులు చేస్తూ జీవితాన్ని అనుభవిస్తూ వుండేది. పోనీ కనీసం యింకొన్నాళ్ళు అతను బతికివున్నా అతని చేత అధమం కొన్ని మంచి నగలన్నా కొనిపెట్టించు కునివుండేది. తను ఎంతో చక్కటి ప్లాన్‌ వేసి ఆడవాళ్ళంటేనే ఆ చాయల లేకుండా పరిగెత్తే ప్రవరాఖ్యుడి లాటి శేఖర్‌ ని దార్లోకి తీసుకు వచ్చి తనకోసం చొంగకార్చుకుంటూ రోజూ ఎదురుచూసేట్టు చేసి కొంగు చుట్టూ తిప్పుకోబోతూ వుండగా అతని తెల్లతోలు పిచ్చి చావుకి తెచ్చి కొంపదీసింది. ఇప్పుడు తనకి మిగిలిందేవిటి బూడిద తప్ప! పైగా దుఃఖోపశమనానికైనా ఇలా జరిగిందని ఎవరికీ చెప్పుకోవటానికి కూడా లేదు. ఎంత మంచి స్నేహితులైనా ఇలాటి విషయం చెవిలో పడితే ఊరు ఊరంతా బ్రాడ్‌ కాస్ట్‌ చెయ్యకుండా ఊరుకుంటారా? అదీ కాకుండా తను కూడా మళ్ళీ ఇంకెవడినన్నా బంగారు పిచికని పట్టాలి కదా! దానికి ఎంతకాలం పడుతుందో!

ఇలాటి దౌర్భాగ్యం పగవాళ్ళకి కూడా వద్దురా బాబూ!
-----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో