Tuesday, January 31, 2017

తెల్లవారుతోంది అలకలు మానండి


తెల్లవారుతోంది అలకలు మానండి
సాహితీమిత్రులారా!కోడికూతను వర్ణన అంటే పాల్కురికి సోమన
గుర్తుకు వస్తాడు. అలాగే తులసి బసవయ్య
సావిత్రి కథను ప్రబంధంగా వ్రాశారట
అందులోని కోడికూతను పెదపాటి జగ్గ్గన
ప్రబంధరత్నాకరంలో ఉదహరించాడు -
ఆ వర్ణనన ఇక్కడ-

మాయపు దుంటవిల్తు వెడమాయల మానినులారా ప్రాణముల్
వోయెడు నాడు నాటికిక బోవిడుడీయలుకల్ విజేపలం
బాయకుడీ యటంచు బరిబాషల జాటెడుభంగి కొక్కొరో
కోయని కూత వేసె దొలికోడి పురాంతర గేహదేహళిన్

తమ భర్తలపై అలిగి పడతులు
వారికి దూరంగా ఉన్నారు.
మన్మథుడు మాయల మారివాడు.
వాడు పెట్టే బాధలవల్ల ప్రాణాలు
పోతాయి - మన్మథ బాణాలవల్ల
విరహంలో ఉన్న వారి ప్రాణాలకు
అపాయం కలుగుతుంది. అందువల్ల
మీరు అలుకను వదలండి, మీ భర్తలకు
దూరం కాకండి అని వారిన హెచ్చరిస్తున్నదా
అన్నట్లు కోడి కొక్కొరొకో - అని ఇండ్ల
లోపలిభాగాల్లో కూసిందట. కవి భావనా శక్తి
ఎంత అద్భుతంగా ఉన్నదో చూడగలం దీనిలో

వీరితో వ్యవహారం దుఃఖానికి కారణం


వీరితో వ్యవహారం దుఃఖానికి కారణం
సాహితీమిత్రులారా!ఈ శ్లోకం చూడండి-
ఎటువంటివారితో వ్యవహారం
చేయకూడదో చెబుతున్నది.

మూర్ఖశిష్యోపదేశేన 
దుష్టస్త్రీ భరణేన చ 
దుఃఖితైః సంప్రయోగేణ
పండితోऽప్యవ సీదతి
(చాణక్య నీతి దర్పణము - 1-4)

బుద్ధీహీనుడైన శిష్యునికి ధర్మోపదేశం చేసినా,
వ్యభిచారిణి కఠినభాషిణి అయిన స్త్రీని పోషించినా,
నానారోగములచే పీడితులును,
ప్రియజనుల వియోగ పీడితులును,
ధననాశాది కారణములచే దుఃఖితులును ఐనవారితో వ్యవహారం
చేయుటచే బుద్ధిమంతుడైన మనుష్యుడుకూడ
దుఃఖములపాలు కావలసివచ్చును - అని భావం.

Monday, January 30, 2017

మూఢమూర్ఖజన గార్ధభముల్ముగురేకరాశియే


మూఢమూర్ఖజన గార్ధభముల్ముగురేకరాశియేసాహితీమిత్రులారా!
ప్రతి ఒక్కరికి ఒకరు మెచ్చుకోవాలని
ఎందుకంటే అలా ప్రశంసలందుకొనే కళను
మరింతగా తన కృషిని పెంచుకుంటాడు
అదే విషయాన్ని చెప్పే ఈ పద్యం చూడండి-

చదివిన పద్యమందుఁగల సారమెరుంగఁగలేని యజ్ఞుడున్
హృదయము హాయి గన్నను గవీంద్రుని మెచ్చకపోవు కొంటెయున్
బదవి విశేషముండి, కృతి పద్యములూరక కోరు లోభియున్
గద భువి మూఢమూర్ఖజన గార్ధభముల్ముగురేకరాశియే

ఒక మంచి పద్యం చదివి దానిలోని తాత్పర్యం తెలుసుకోలేని అరసికుడు
భావం గ్రహించి మనస్సుకు రసానందం కలిగినప్పటికి ఆ కవిని మెచ్చుకోని
అవివేకి, ఏదో ఒక గొప్ప పదవిలో ఉండికూడ కావ్నాన్ని ఊరకే
తనకు అంకితం ఇవ్వాలని కవిని కోరే లోభి - ఈ ముగ్గురు
కూడ లోకంలో ఒకే జాతికి చెందినవారు. మూఢుఢు, మూర్ఖుడు,
గాడిద సమానమైనట్లుగా పై తెలిపినవారు కూడ గార్ధభసమానులే
- అని భావం
కవిత చదివి దాని సారాన్ని గ్రహించే చాతుర్యం,
చక్కని కవితను వ్రాసిన కవిని ప్రశంసించటం,
కవులకు సత్కారాలు చేసి కావ్యాలను అంకితం పొందడం
సహృదయులైనవారి కర్తవ్యాలని ఈ  పద్యం ఉద్దేశం.

మితంగా ఉంటేనే అభిమానం


మితంగా ఉంటేనే అభిమానంసాహితీమిత్రులారా!

సాన్నిహిత్యం పెరిగితే చనువుపెరుగుతుంది
చనువు పెరిగితే ఎలావుంటుందో వివరిస్తుందీ
శ్లోకం చూడండి-

అతి పరిచయా దవజ్ఞా
సంతత గమనా దనాదరో భవతి
మలయే భిల్ల పురంధ్రీ
చందన తరుకాష్ఠ మిన్థనం కురుతే

ఎవరితో పరిచరిచయాన్నయినా అతిగా పెంచుకోకూడదు.
అది చనువుగా మారితే వెటకారాలకూ అవకాశం కలిగిస్తుంది.
అలాగే - అదేపనిగా  ఎవరిదగ్గరకైనా వెళ్తూంటే నిరాదరణకు
దారితీయవచ్చు అదే మితంగా ఉంటే అభిమానం పెరుగుతుంది.
ఎలాగంటే మలయపర్వతం మీద గంధపు చెట్లు విస్తారంగా ఉన్నాయి.
అక్కడి గిరిజనులు వాటిని మామూలు చెట్లగానే చూస్తారు.
అవసరాన్ని బట్టి వంటచెరకుగా కూడ వాడతారు కారణం అవి విరివిగా
వారికి దగ్గరగా ఉండటమే కదా అదే మనకు అవి అరుదుగా ఉంటాయి
కాబట్టి అవంటే మహాప్రీతికదా

Sunday, January 29, 2017

అచటన్ నా యిల్లు కట్టించెదన్


అచటన్  నా యిల్లు కట్టించెదన్
సాహితీమిత్రులారా!


జాషువాగారు ఈ మోసపు ప్రపంచాన్ని నిరసిస్తూ
ప్రపంచంలో ఎక్కడ నివసించాలో తెలియటంలేదని
చెబుతున్న పద్యం చూడండి-

పయిపై నవ్వులు పల్కరింపులు మృషా బాంధవ్యముల్ జూపి, ఆ
పయి శత్రుత్వము సేయు నాగరికతా భ్రష్ట స్వభావా ధముల్
సయితానుల్ చరియింపనట్టి ధర గోష్పదంబు కన్పట్టినన్
దయతో నా కెఱింగింపుమమ్మ అచటన్ నా యిల్లు కట్టిం చెదన్

తెచ్చి పెట్టుకున్న నవ్వులతో పలకరింపులు,
అబద్ధపు బాంధవ్యాలు చూపి ఆ తరువాత
శత్రుత్వాన్ని ప్రదర్శించే నాగరికతా భ్రష్టత్వం
పట్టిన అధములు సైతానులు(దయ్యాలు) తిరుగని
పవిత్రప్రదేశం  భూమిపై ఎక్కడైనా కనబడితే దయతో
ఆయనకు చెబితే అక్కడ తను ఇల్లు కట్టుకుంటానని
చెబుతున్నాడు జాషువాగారు.

ఎంత స్పష్టంగా మనకళ్లకు కట్టినట్లు
సమాజంలోని కుళ్లును చూపించాడు
ఈ పద్యంలో.

వీటికి ఆలస్యం చేయరాదు


వీటికి ఆలస్యం చేయరాదు
సాహితీమిత్రులారా!కొన్నిట ఆలస్యం పనికిరాదు
కొన్నిట తొందర పనికిరాదు
ఈ శ్లోకం చూడండి-

సిద్ధమన్నం ఫలం పక్వం 
నారీ ప్రథమ యౌవనమ్
కాలక్షేపం నకర్తవ్యం 
ఆలస్యా దమృతం విషమ్

వేడివేడి  అన్నము
ఆరముగ్గిన పండు
స్త్రీ ప్రథమ యౌవనం-
వీటిని అనుభవించటానికి
వాయిదా వేయరాదు
ఆలస్యం చేస్తే అమృతంకూడ
విషంగా మారే ప్రవాదం ఉన్నదికదా
- అని భావం

Saturday, January 28, 2017

ఎవరు పయోముఖ విషకుంభము?


ఎవరు పయోముఖ విషకుంభము?సాహితీమిత్రులారా!పయోముఖవిషకుంభము అంటే-
కడవ నిండుగా విషముండి మూతి
దగ్గర మాత్రం కొంచెము పాలు కలది.
అలాంటి వానిగురించి
ఈ శ్లోకం చెబుతున్నది చూడండి-

పరోక్షే కార్యహన్తారం
ప్రత్యక్షే ప్రియవాదినమ్
వర్జయేత్తాదృశం మిత్రం
విషకుంభం పయోముఖమ్
                                          (చాణక్యనీతి దర్పణము)


చాటున పనులను చెడగొడుతూ
ఎదురుగా తియ్యని మాటలను
మాట్లాడే మిత్రుని పయోముఖ
విషకుంభమని వదలివేయవలెను -
అని భావం

ఇలాంటి వాళ్ళు లోకంలో చాలమంది ఉన్నారు
వారిని వదలివేయమని శ్లోకం యొక్క భావం

చెట్లనీడలను చెట్లే త్రాగుతున్నాయి


చెట్లనీడలను చెట్లే త్రాగుతున్నాయి
సాహితీమిత్రులారా!నన్నెచోడుని కుమారసంభవంలో పార్వతీదేవి తపస్సు
ఎలాంటి ఎండలో చేస్తున్నదో తెలిపే పద్యం ఇది.
ఈ పద్యం కవి రచనా చమత్కృతిని తెలుపుతుంది.
చూడండి-

ఆతపభీతి నీడలు రయంబున మ్రాఁకులక్రిందుఁ దూరెనో
యాతరులుం దృషాభిహతులై తమనీడలు  తార త్రాగెనో
భాతి ననంగ నీడ లురుపాదపమూలములం దడంగె గ్రీ
ష్మాతపమధ్యవాసరములందుఁ జలింపకయుండు నెండలన్                   (6-141)


వేసవి తాపములలో మధ్యాహ్నములందు
చలనములేని ఎండలలో నీడలు ఎండవలని
భయంతో శీఘ్రంగా చెట్లక్రిందిభాగాన ప్రవేశించెనో
ఆ చెట్లును దప్పికచే కొట్టబడినవయి తమ నీడలను
తామే త్రాగివైచెనో అన్నట్లు నీడలు పెద్దచెట్లమొదళ్ల
యందు అడగి యుండెను.

ఎంతటి ఊహో కదా

Friday, January 27, 2017

పలనాటికి మాటికి బోవనేటికిన్


పలనాటికి మాటికి బోవనేటికిన్
సాహితీమిత్రులారా!


శ్రీనాథుని చాటువుల్లో ఇది ఒకటి.
ఇది పలనాటిని సందర్శించిన తరువాత
ఆయన అభిప్రాయంగా చెప్పవచ్చు

అంగడి యూరలేదు వరియన్నము లేదు శుచిత్వమేలే
దంగన లింపులేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగఁ బాల్పడు కృపాపరులెవ్వరు లేరు దాతలె
న్నంగ సున్న గాన పలనాటికి మాటికి బోవనేటికిన్

ఈ పద్యంలో పల్నాడులోని నాటి పరిస్థితులను
మన కళ్ళకు తన కళ్ళతో చూపుతున్నాడు శ్రీనాథుడు-

పలనాడులో గ్రామల్లోదుకాణాలు లేవు.
తినటానికి వరి అన్నం దొరకదు.
అక్కడి వారికి పరిశుభ్రత అసలే తెలియదు.
స్త్రీలు చూడటానికి అందంగా లేరు.
అందమైన తోటలు కనబడవు. మంచినీళ్ళకు
ఎంతో లోతైన బావులు త్రవ్వి బాధపడుతు
న్నందుకు దయచూపేవారుండరు.
దానగుణం కలవారు కూడ లేరు.
అటువంటప్పుడు ఏ సౌకర్యంలేని
పలనాటికి మాటిమాటికి ఎందుకు వెళ్ళాలి?
అని కవి భావన.
అంటే పండితులను, కవులను ఆదరించి
బహుమతులిచ్చే కళాకారులు లేరు.
సుందరమైన దృశ్యాలు లేవు అలాంటప్పుడు
పలనాటికి మాటిమాటికి వెళ్లడం వృధా అని
శ్రీనాథుడు నిరసన భావాన్ని ఈ పద్యంలో తెలిపాడు.

ఆర్భాటం ఎక్కువ పని తక్కువ


ఆర్భాటం ఎక్కువ పని తక్కువ
సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి -
మొదట్లో భీకరంగా ఉండి
తరువాత ఏ భీకరము లేనివి
ఈ శ్లోకంలో ఏకరువు పెడుతున్నాడు కవి-

అజాయుద్ధే, ఋషిశ్రాద్ధే
ప్రభాతే మేఘాడంబరే
దంపత్యోః కలహేచైవ
బహ్వారంభో లఘుక్రియా

మేకపోతులు అకారణంగా పోట్లాడుకుంటాయి.
అంతలోనే విరమించుకుంటాయి.
ఇవి చూసేవారికి వినోదంగా ఉంటుంది
తప్ప అదంతా పసలేని యుద్ధమే
వీటివలెనే ఆర్భాటం ఎక్కువ పని
తక్కువగా ఉండేవి
కొన్ని ఉన్నాయి అవి -
ఉదయకాలంలోని మేఘాడంబరం,
మొగుడు - పెళ్లాల పోట్లాట,
ఋషుల శ్రాద్ధక్రియ
ఉదయకాలంలో మేఘాలు విపరీతంగా
కమ్ముకొని విపరీతంగా వర్షం వస్తుందేమో
అని పిస్తాయి చివరికి నాలుగు చునుకులతో
సర్దకుంటుంది ఇది అందరూ గమనించిందే
మొగుడు పెళ్లాల సంగతి సరేసరి-
ఋషుల శ్రాద్ధక్రియ కూడా ఇలాంటిదేనట
అంటే చివరికి పసలేనివి.

Thursday, January 26, 2017

ఎవరికి ఇహమే స్వర్గము?


ఎవరికి ఇహమే స్వర్గము?
సాహితీమిత్రులారా!


కడుపే కైలాసం
ఇల్లే ఇంద్రభోగం
అంటూంటారు.
అదేమోగాని
ఈ శ్లోకం చూడండి-

యస్య పుత్రో వశీభూతో భార్యా ఛందానుగామినీ
విభవే యశ్చ సంతుష్ట స్తస్య స్వర్గ ఇహైవహి

ఎవనికి పుత్రుడు వశమునందుండునో
(అంటే చెప్పిన మాటవింటూ ఉండటం)
ఎవని భార్య తనకు ఇష్టమైన రీతిలో ఉండునో,
ఎవడు తన సంపదతో సంతుష్టడవుతాడో
అటువంటి వానికి ఇహలోకమే స్వర్గము -
అని భావం.

అన్నిదానములలోకి గొప్పదేది?


అన్నిదానములలోకి గొప్పదేది?
సాహితీమిత్రులారా!


చిలకమర్తివారి ఈ పద్యం చూడండి-
దానాలలో ఏది ఎలాంటిదో చెబుతున్నది-

అన్నదానము గొప్పదనవచ్చునే గాని        
                      అన్నంబు జాములో నరిగి పోవు         
వస్త్రదానము గూడ భవ్యదానమె గాని        
                      వస్త్రమేడాదిలో పాతదగును        
గృహదానమొకటి యుత్కృష్ట దానమె గాని      
                       కొంప కొన్నేండ్లలో కూలిపోవు         
భూమిదానము మహా పుణ్యదానమె గాని                              
                        భూమి యన్యుల జేరి పోవవచ్చు           
అరిగిపోక , ఇంచుకయేని చిరిగిపోక           
కూలిపోవక యన్యుల పాలుగాక             
నిత్యమయి, వినిర్మలమయి,నిశ్చలమయి          
యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి            


పంపినవారు : 
అలంకారం విజయకుమార్.

భారతగణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు


భారతగణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు
సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు, దేశప్రజలకు

గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు


Wednesday, January 25, 2017

ఇవి లభించాలంటే గొప్ప తపస్సంపన్నుడై ఉండాలి


ఇవి లభించాలంటే గొప్ప తపస్సంపన్నుడై ఉండాలి
సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం గమనించండి-
ఎంత గొప్పవిషయమో తెలుస్తుంది-

భోజ్యం భోజనశక్తిశ్చ రతిశక్తిర్వరాంగనా
విభవో దానశక్తిశ్చ నాల్పస్య తపసః ఫలమ్

మంచి భోజన పదార్థం లభించుట,
ఆ భోజన పదార్థమును తిని హరించుకొను శక్తి,
అందమైన భార్య లభించుట, ఆమెతో హాయిగా
భోగముననుభవించు కామశక్తి కలిగియుండుట,
సంపదను కలిగియుండుట, ఆ సంపదను
దానముచేయు శక్తి కలిగి యుండుట - అనేవి
అల్పవిషయాలు కాదు గొప్ప తపఃఫలితముగానే
అవి లభించునుగాని ఇతరము కాదు- అని భావం.

కుమారసంభవంలోని గ్రీష్మము -2


కుమారసంభవంలోని గ్రీష్మము -2
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........అవియనిగండశైల మన నంఘ్రులతోడన యెండకున్న భూ
భవ మన నింకి బీటగిలఁ బాఱని యేఱన మస్తకం బొగిన్
బవులనిమార్గి సంఘ మనఁబట్టదు లోకములోన నిట్టివే
సవి గలదయ్య నా నఖిలసాధ్వస మయ్యె నిదాఘ ముగ్రమై
                                                                                                                                    (138)
బ్రద్దలుకాని పెద్దకొండఱాయా అన్నట్లు,
వేరులతోనే ఎండని చెట్టా అన్నట్లు,
ఇంకి బీటలువాఱునట్లు ప్రవహింపని నది
అనునట్లు, తలపగుతుందా అని బాటసారులు
అనునట్లు, ఆక్రమిస్తూ, లోకములో ఇలాంటిదుంటుందా
అన్నట్లు వేసవి తీవ్రమయి అందరకూ భయావహమైంది.


హరి శరధిఁ గ్రుంకె నభవుఁడు
సురనదిఁ దాల్చె నబ్జజుఁడు గ్రమ్మఱ నం
బురుహంబు సొచ్చె నతిదు
స్తర దుస్సహతీవ్రతరనిదాఘభయమునన్ (139)


మిక్కిలి దుస్తరము,  దుస్సహము, తీవ్రతరము అయిన వేసవి
వలని భయంతో విష్ణువు సముద్రంలో మునిగాడు,
శివుడు గంగను నెత్తిన పెట్టుకున్నాడు,
బ్రహ్మ మళ్ళీ పద్మంలోకి ప్రవేశించాడు.


ఇట్లతిదారుణం బైనఘర్మదివసంబునం బార్వతి పంచాగ్నిమధ్యాగ్ని ముఖాధోముఖోర్ధ్వముఖాది
ఘోరతపంబు సేయుచు. (140)

ఈవిధంగా అతి ఘోరమైన వేసవిలో పగటిపూట పంచాగ్ని
మధ్యము, అగ్నిముఖము, అధోముఖము, ఊర్ధ్వముఖము,
మొదలైన భయంకర తపస్సులు చేయుచూ.........
(తరువాతి పద్యంతో అన్వయం)
(పంచాగ్ని మధ్యము - నాలుగువైపులా నాలుగు
అగ్నులను ఏర్పరచుకొని పైకి సూర్యునివైపు
చూస్తూ చేసే తపస్సు.
అగ్ని ముఖము - అగ్ని వైపు చూస్తూ చేసే తపస్సు.
అధోముఖము - ముఖము క్రిందికి పెట్టి చేసే తపస్సు.
ఊర్ధ్వముఖము - ముఖము పైకి ఉంచుకొని చేసే తపస్సు.)


ఆతపభీతి నీడలు రయంబున మ్రాఁకులక్రిందుఁ దూరెనో
యాతరులుం దృషాభిహతులై తమనీడలు  తార త్రాగెనో
భాతి ననంగ నీడ లురుపాదపమూలములం దడంగె గ్రీ
ష్మాతపమధ్యవాసరములందుఁ జలింపకయుండు నెండలన్ (141)

వేసవి తాపములలో మధ్యాహ్నములందు
చలనములేని ఎండలలో నీడలు ఎండవలని
భయంతో శీఘ్రంగా చెట్లక్రిందిభాగాన ప్రవేశించెనో
ఆ చెట్లును దప్పికచే కొట్టబడినవయి తమ నీడలను
తామే త్రాగివైచెనో అన్నట్లు నీడలు పెద్దచెట్లమొదళ్ల
యందు అడగి యుండెను.


పరితాపోగ్రనిదాఘవేళ శిల పైఁ బంచాగ్ని మధ్యంబునన్
బరమధ్యానసమేత యై నిలిచి విభ్రాజిల్లె నుద్యత్తప
శ్చరణాలంకృతశైలనందన గనత్సంధ్యారుణాంభోధరో
త్కరమధ్యస్థిరకాంతకాంతియుతశీతద్యోతిలేఖాకృతిన్ (142)

పూనుకొన్న తపస్సుచే అలంకరింపడినదైన పార్వతి
మిక్కిలి తాపముచే భయంకరమైన వేసవి సమయమున
ఱాతిమీద, అయిదగ్నుల నడుమ, గొప్పధ్యానముతో కూడి
ఉండి ప్రకాశించు సంజవేళ ఎర్రనైన మేఘసముదాయము
నడుమ నిలకడగల మనోహరమైన కాంతితో కూడుకొన్న
చంద్రరేఖవలె మిక్కిలి ప్రకాశించెను.


Tuesday, January 24, 2017

ఈ మూడు మహాత్కార్యాలు


ఈ మూడు మహాత్కార్యాలు
సాహితీమిత్రులారా!


ఈ పనులు చేయడం వలన
చాల పుణ్యం  వస్తుందట-
ఈ శ్లోకం చూడండి -


దరిద్రాయ కృతం దానం
శూన్య లింగస్య పూజనమ్
అనాథ ప్రేత సంస్కారమ్
అశ్వమేధ సమం విదుః


దారిద్య్రంతో బాధపడే వారికి దానం చేయడం,
పూజాపునస్కారాలిలేని శివలింగానికి పూనుకొని
పూజచేయడం, అనాథగా పడి ఉన్న శవానికి
దహన సంస్కారాలు జరిపించడం - అనే
ఈ మూడూ మహాత్కార్యాలు. ఇవి చేయడం
అశ్వమేధయాగంతో సమానం.
వీటిలో ఏది చేసినా అపారమైన పుణ్యం వస్తుంది
- అని శ్లోక భావం

కుమారసంభవంలోని గ్రీష్మము -1


కుమారసంభవంలోని గ్రీష్మము -1
సాహితీమిత్రులారా!

నన్నెచోడుని కుమారసంభవంలో
6వ ఆశ్వాసం 134వ పద్యంతో
ప్రారంభమవుతుంది గ్రీష్మము-
ఇటువంటి దానిలో పార్వతీదేవి
తపస్సును వర్ణించాడు నన్నెచోడుడు-

స్పురదురుదావపావకము, శోషితసింధుచయోదకంబు, సం
హరితపతంగసంఘ, మసమర్థితమార్గిగణంబు, దప్తభూ
మిరుహకులంబు, వర్ధితసమీరవిదాహ, మశేషదగ్ధ భూ
ధరనికరంబునాఁ బటునిదాఘము పర్వె భయంకరాకృతిన్
                                                                                        (134)

బాగా పెరుగుతున్న గొప్ప దావాగ్ని కలిగినది,
ఎండింపబడిన నదీసమూహజలముగలది,
చంపబడిన పక్షులగుంపు గలది,
అశక్తులుగా చేయబడిన పాంథు(బాటసారు)ల గుంపుకలది,
తపింపచేయబడిన చెట్లసమూహముగలది,
వృద్ధిపొందిపబడిన గాలుల వేడిగలది,
దహింపబడిన యెల్ల పర్వతముల సమూహముగలది,
అనునట్లు తీక్షణమైన వేసవి భయంకరాకారముతో వ్యాపించినది.


తలఁచిన డెందము గందును
బలికిన నోరెల్లఁ బొక్కుఁ బ్రభ సూచిన రె
ప్పలు గమరు ననఁగఁ బటుతర
నిలయానలభాతి నెండ వేసవిఁ గాఁచెన్ (135)

అనుకుంటే హృదయం తపిస్తుంది,
మాట్లాడితే నోరంతా బొబ్బలెక్కతాయి,
వెలుతురు చూస్తే కనురెప్పలు కాల్తాయి-
అన్నంత తీవ్రతరమైన ప్రళయాగ్నివలె
ఎండ వేసవిలో తపిపచేసింది.

స్పురదారణ్యమహీధరోపరిసముద్భూతోగ్రదావానలో
త్కరవిస్పారశిఖాలిఁగూడి రవికాంతవ్రాతసంజాతదు
స్తరతీవ్రాగ్నిఁ బెనంగి వీచె వడ యాసంక్రుద్ధకాలాగ్ని రు
ద్రరయో చ్ఛ్వాససమేతమో యని జనవ్రాతంబు గంపింపఁగాన్(136)

ప్రకాశిస్తున్న అడవిలోని కొండలపై పుట్టిన కార్చిచ్చుల ప్రకాశముల
జ్వాలల వరుసతో కలిసి, సూర్యకాంతశిలలనుండి పుట్టిన దటడానికి
వీలుకాని తీక్ష్ణమైన అగ్నితో కూడి, మిక్కిలి కోపించిన ప్రళయాగ్ని
అనెడు రుద్రుని వేగవంతమైన ఉశ్చ్వాసముతో కూడినదా! అని
లోకులు కంపించే విధంగా వడగాల్పులు వీచాయి.

ఉరునిదాఘాతపాహతిఁ గరులతలలు
వ్రస్సి లోపల ముత్యముల్ వరుస విరిసి
మంగలములోని ప్రేలలభంగిఁదూలి
ప్రేలివడఁగాసెఁ గట్టెండ పిడువరించి (137)

ఇటువంటి ఎండ దెబ్బకు ఏనుగుల తలలు బద్గలై
వాటి తలల్లోని ముత్యాలు చెదిరి పెన్నంలో పడి
పేలాల వలె కదలుతూ పేలినట్లు తీక్ష్ణమైన ఎండ
పిడుగువలె అతిశయించి కాసింది.


Monday, January 23, 2017

నేను నీడను మీకు


నేను నీడను మీకుసాహితీమిత్రులారా !


డా. రామచంద్రగారి ఈ గేయ కవిత వినండి-
తాను తరువై పలికిన పలుకులు
తరు రక్కసుని ఎద ములుకులు-


ఎవడు బీజము వేసెనో, తొట్టతొలి
నెవడు నీరము పోసెనో, ఈ రీతి
మొలకనై - చివురునై, వర్ణాలపర్ణమై
కొమ్మనై, తన్నంటి రెమ్మనై, చేవనై
                  - తల్లిగర్భములో నిలచితీ

పక్షులకు, పాంథులకు నీడనై, ఆకటికి
పండునై, వేకటికి దైవమై, జగతికంతకు
కల్పతరువుగా, చిక్రోడక్రీడలకు నిశ్రేణినై
సుస్థిరత గగన మంటగ నెదిగి పైపైకి
                                       - ఎగిసిపోయితినేను

నన్ను నరికేవాడు ఘనుడా? వాడు ఏపాటి
మొనగాడు?  గణనకెక్కిన దుర్మదుడు,
నికరంపు దానవుడు, తప్పొప్పులే యెరుగనోడు
బొగ్గులకు కల్పతరువును నఱుకువాడు
                                          - కృతఘ్నుడుకాడోవాడు

నన్ను గసటనుబెట్టి ఏమి తిని బతికేడు?
రోగాల రోదనల కడ తేరు తుదకతడు
జీవాళి కంట నెత్తుటి చారికల నెరుగడు
విష వాయువులు గ్రోలి నేలనే కూలబడు
                           - వేసరిలి తిరిగి లేవగలేడు

పామొకటి బుసకొడుచు తొర్రలోపల ముడిగి
పైపైకి ఎగబాకి, పక్షి గూళ్ళను తాకి
గుడ్లన్నీ తెగనాకి, సంతతిని కడతేర్చె
ఈడ్చి కొట్టేందుకు చేతులాడగలేదు నాకు
               - దానికి ఆహారమది, కట్టడికినాకేటి హక్కు?
                                                           వీడు అట్టీడు కాడో!

పిట్టా!  ఏడ్వకే, నేనుంటి నీ వెంట, కాదు కాలము గడ్డుది
పశువా!  నీకేల అలజడి!  గడ్డి పరకల మేతకు?  కాదిది చోటిది
అమృతమొసగెడి కల్ప భూజమ్మునకు చోటిది
వింజామరల మీకుమరల వీవనా మనసార/ సేదదీరుడు నాయొడి
                                                                      - తల్లివలె కాయనా మిమ్ము?

నా ప్రాణములు ఊడ్చి, పొయి కట్టెలుగ మాడ్చి
మింట మేఘముడుల్చి, పంట నిప్పుల కాల్చి
పాపమిట్టిది మోయు శాపంబుకద నీకు తెరువరీ!
నుగ్గు నూచముకాగ / ఫలమేమి ప్రాణులకు?
                                 - ఊతకొమ్మను నరుకుతావా?


ప్రజల మున్నుడి ఒకటి వినవా!  మూర్ఖడా!  - నాలోని
ఆకాకునొక్క దివిజుడట యెరుగవా?  కబోదివా!
"ఛందాంసి యస్యపర్ణాని" అంది గీతామాత - తెలియదా!
లేకున్న పూ రజము - తేనెపట్టగుటెట్లు?
                                                         - అది అమృతంబు కాదా!

అటు బోయడొకడు నానీడ వెలయించె రామకృతి
ఇటు నొక్క గౌతముడు పొందెనట జ్ఞాన ధృతి
అటు వీరబ్రహ్మయ్య - ఇటు యోగివేమయ్య
నానీడ మానవత నెకొల్ప లేదా బోధనల!
                                                         - అవి నీకు తలకెక్కలేదా!

పికకూజితంబులు - నెమలి క్రేంకారాలు
తూగుటూయెలలూగు - కోతి పిల్లలగుంపు
శాఖోపశాఖలిడు చలువల్ల రిమఝిమలు
పలువా!  ఎరుగవా!  ప్రకృతి చూపెడి హొయలు!
                                                              - తెరువరీ కబోదివా!

నానివాసము చలువ పందిళ్ళు, సమయింప ప్రళయమే!
నీదేమీ నాగాస్త్రమా!  - కాక గరుడాస్త్రమా!  పరుశువా!
నీకుఠారము తుప్పలుగ తూలు నాకడ - తెలియవో!
చిగురాకునైనను - పెకలించగాలేవు
                                                         - గరువంపు తెరువరీ!

వర్గమే స్వర్గమని - వర్ణమే స్వర్ణమని
కులమంటె బలమని - ధనమంటె ఘనమని
అపవర్గ స్వప్న సౌధంబునీయది - 
అపరిపక్వ మనస్వివీవుజడుడా
ప్రకృతిపై వికృత ప్రవర్తనము విడనాడు - ఇదేమి నర్తనమా?
                                     - లేకున్నా చండ్రనిప్పులె నిను కాల్చు

ఇంటి వెనుకకొకటి కంటి తుడుపుగా నేదో మావియో
మానో మాకో మీరు మెచ్చినది - కాకచిన్న మొలకో
ప్రకృతి యొడి బిడ్డలం - మము పెంచు ముబ్బిడిగ
మేమంటే యెరుగవా!  తెరువరీ!  ప్రాణవాయువు దాతలం 
                                                            - నీ శ్రేయోభిలాషులం

ఒక విషాద స్మృతిమమ్ము కెరలించు నపుడపుడు
ఋతుచక్రమున బడి - నలిగి పోయెడినాడు
ఎంత సంతసమో, గిలిగింతలో వసంతం నాడు
హేమంత శిశిరాలు మముమాడ్చు గిలకొట్టి నేడు
                                - కావడికుండే కద బతుకంటే

వీణనై వేణువై, వాయులోలీనమై - నావ నాగలి పట్టెమంచమై
బిడ్డ డూగే ఊయలై, మరి రాజు లెక్కే గద్దెనై
శవములను మోసేటి పాడెనై - ఆపై రాణులెక్కే పల్లకీ పడకనై
ఇన్ని అవతారాలు నావి - నీకులాగా కలవు తండ్రీ!
                                                                             - నీదేటి గొప్ప?

గోపాలుడా!  వాడు భూపాలుడా!  కాక ధనపాలుడా!
ఎవడైనా నేమి?  వితర్దికతోడ వాడికొక చోటు నానీడ
యాతాయాతా జనులకగు చలివేంద్ర నానీడ
నిదాఘ తప్తులకు - నిరీహులకు - విరహులకు
                                   - అమ్మకౌగిలి కదా నానీడ- డా. యన్. రామచంద్ర
 అధ్యక్షులు, సాహితీమిత్రమండలి
ప్రొద్దుటూరు, కడపజిల్లా, ఆం.ప్ర.
వేమన సాహితీ కళాపీఠం వారు(22-01-2017) 
నిర్వహించిన  శతాధిక కవి సమ్మేళనంలో 
చదివిన కవిత

ఇవి పూర్వజన్మ ఫలితాలే


ఇవి పూర్వజన్మ ఫలితాలే
సాహితీమిత్రులారా!ఈ శ్లోకం చూడండి-
ప్రపంచంలో ఏదీ సరైనవిధంగా చేయడు
బ్రహ్మదేవుడు అలా చేశాడండే
అది పూర్వజన్మ ఫలమేనట-

యః సుందరన్తద్ వనితా కురూపా యా సుందరీ సా పతిరూపహీన
యత్రోభయం తత్ర దరిద్రతా చ విధే ర్విచిత్రాణి విచేష్టితాని

పురుషుడు అందగాడైన స్త్రీ అందవిహీనంగా,
భార్య అందగత్తె అయిన భర్త రూపహీనుడుగా,
ఇద్దరు ఒకటిగా ఉన్న వారు దరిద్రులుగా ఉండుట
విధాత యొక్క విచిత్రపులీలలు- అలాగే
ధనమున్నవాడు లోభిగాను,
దాత ధనహీనుగాను ఉందురు.
అలా కాకుండా పై విషయాలన్నీ సమంగా ఉన్న
అలాంటి వారి పూర్వజన్మ ఫలితముకాక మరొకటిగాదు
- అని భావంజన్మదిన శుభాకాంక్షలునేతాజీ సుభాష్ చంద్రబోస్  

జన్మదిన శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు

నేతాజీ సుభాష్ చంద్రబోస్  

జన్మదిన శుభాకాంక్షలుSunday, January 22, 2017

ఎవరిని ఎలా గుర్తిచవచ్చు?


ఎవరిని ఎలా గుర్తిచవచ్చు?
సాహితీమిత్రులారా!


సేవకులు, మిత్రులు, బంధువులు మొదలైన
వీరిని ఒక్కొక్కరిని ఒక్కోవిధంగా గుర్తించవచ్చు-
అంటే నిజమైన వారెవరనే దాన్ని ఏలా
గుర్తించాలో ఈ శ్లోకం చెబుతున్నది చూడండి-

జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే
మిత్రంచాపత్తి కాలేషు భార్యాంచ విభవక్షయే

పనుల నిర్వహణనుబట్టి నౌకరుల శక్తి తెలుసుకొనవలెను,
దుఃఖములు సంప్రప్తించినపుడు బంధు బాంధవులు
ఎంత ఉపయోగపడునో గుర్తించ వచ్చును.
కష్టకాలంలో సాయపడే దాన్ని బట్టి మిత్రుని తెలుసుకోవచ్చును.
అలాగే ఐశ్వర్యం క్షీణించినపుడు భార్య స్వభావాన్ని తెలుసుకో వచ్చును
- అని భావం

చాణుక్యుడు ఎవరు?


చాణుక్యుడు ఎవరు?
సాహితీమిత్రులారా!చాణుక్యుడు తెలియనివారు లేరు కదా!
చాణుక్యుడు ఎవరు అని ప్రశ్నించారేమిటి?
అని సందేహించ పనిలేదు ఆయన గురించి
వాస్తవ విషయాలలోకెళితే
మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి -
వాటిని ఇక్కడ చూద్దాం-

చాణుక్యుడు ఒక అద్భుతరాజనీతిజ్ఞుడు.
మగధదేశాన నందవంశ నిర్మూలన
మౌర్యసామ్రాజ్య స్థాపన చేసి రాజనీతి
విషయకమైన ఒక గొప్ప గ్రంధాన్ని
అర్థశాస్త్రం పేరున మనకు అందించినవాడు.
తన అర్థశాస్త్రం చివర తనను గురించి
ఈ విధంగా వ్రాసుకున్నాడు చూడండి-

యేన శాస్త్రం చ శస్త్రం చ నందరాజ చ భూః
అమర్షే ణోద్ధృతాన్యాశు తేన శాస్త్రం మిది కృతమ్
                                                           (కౌటిల్యుని అర్థశాస్త్రం - 15- 1 - 180)

(దుష్టులైన నందరాజుల చేతిలో చిక్కిన పృథివిని,
శస్త్రములను, శాస్త్రములను విడిచిన ఆచార్య
చాణుక్యుని ద్వారా ఈ గ్రంథం రచింపబడెను.)

హేమచంద్రుని అభిదాన చింతామణిలో ఈయనను
గురించి ఈయనకు ఈ క్రింది నామాంతరములు
ఉన్నట్లు పేర్కొన్నాడు-

1. వాత్సాయనుడు, 2. మల్లనాగుడు, 3. కుటిలుడు, 
4. చణకాత్మజుడు, 5. ద్రామిలుడు, 6. పక్షిస్వామి,
7. విష్ణుగుప్తుడు, 8. అంగులుడు
(అభిదాన చింతామణి 853, 854)

ఈయనకు ఇన్ని పేర్లున్నా తండ్రి పెట్టిన పేరు
విష్ణుగుప్తుడు. చణకుని కుమారుడు కావున లేదా
మిక్కిలి కుశాగ్రబుద్ధి కలవాడగుటచే అత్యంత
చతురుడనే అర్థం వచ్చే చాణుక్యుడు అనే పేరు
చెప్పబడుతున్నది. కౌటిలీయ అర్థశాస్త్రంలో
కౌటిలుడనే పేరు చాలా చోట్ల వాడబడింది
ఇది బహుశా గోత్రనామం కుటిల పేరుతో
కౌటిల్యుడు అనేపేరు వచ్చిందికాని కుటిల
స్వభావంతో కౌటిల్యుడు కాదు అని
మహామహోపాధ్యాయ గణపతి శాస్త్రిగారు పేర్కొన్నారు.

చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో
విద్యాభ్యాసం జరిగింది. ఆయన జన్మస్థలం
ఖచ్చితమైనది తెలియదు తక్షశిల పాకిస్తాన్
లోని పంజాబుకు సమీపంలోని ఝేలం గ్రామంలో
ఉన్నందున ఈయన కూడ ఆ ప్రాంతంలోనే జన్మించి
ఉంటాడని భావిస్తున్నారు.

ఈయన ఇంటిని విశాఖదత్తుడు ముద్రారాక్షసం(3-15)లో
ఈ విధంగా వర్ణించాడు -

ఉపలశకల మేతద్ భేదకం గోమయానాం
వటుభి రుపహృతానాం బర్హిషాం స్తోమ ఏషః
శరణమపి  నమిద్భిహిః శుష్యమాణాభిర్
వినమిత పటలాన్తం దృశ్యతే జీర్ణకుడ్యమ్ 

చాణుక్యుని పాకలో ఒకవైపు పిడకలను పగులగొట్టు ఱాయి,
మరొకచో శిష్యులు తెచ్చిన దర్భలు, కప్పుపైన ఎండుటకు
ఆరబెట్టిన సమిధలు ఉన్నాయి. ఆ సమిధల బరువుకు
ఇంటి కప్పు వంగి ఉంది. అలాంటి ఇంట్లో చాణుక్యుడు
ఉండేవాడు. ఒకమారు ఒక విదేశరాయబారి ఈ ఇంటిని చూచి
ఇంత పెద్ద రాజ్యానికి ప్రధానమంత్రి ఇటువంటి పాకలో ఉండటమా-
అని అనగా చాణుక్యుడది విని ఈ విధంగా అన్నాడట-

ఏ దేశంలో ప్రధానమంత్రి పాకలో ఉంటాడో
ఆ దేశవాసులు సుందర భవనాల్లో ఉంటారు.
ఏ దేశప్రధానమంత్రి ఆకాశాన్నంటే సౌధాల్లో
ఉంటాడో ఆ దేశ ప్రజలు గుడిసెల్లో మగ్గుతుంటారు.
అన్నాడట.

ఆంగ్లేయుల లెక్కప్రకారం క్రీ.పూ. 322 లేక 325
సంవత్సరాలకు పూర్వం మౌర్య చంద్రగుప్తుడు
ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ కాలంలోనే ఈయన
ఉన్నట్లు చెబుతారు.

ఈయన బ్రాహ్మణుడే కాని ప్రతిదినము లోభుల
ఇండ్లకు వెళ్ళి యాచించు బ్రాహ్మణుడు కాదు.
రాజ్యనాశము, రాజ్యనిర్మాణముచేయు బ్రాహ్మణడు
స్వాభిమానియైన తపస్వి, నల్లగా ఉండి కురూపిగా
ఉండటం వల్ల  ఒకమారు శ్రాద్ధక్రియకు పిలువబడి
తిరస్కృతుడై  పంక్తి నుండి బహిష్కృతుడై ఆ అవమానంతో
క్రుద్ధుడై నందుని రాజ్యభ్రష్టుని చేసి నందవంశాన్నే
సమూలంగా నాశనం మౌర్యసాంమ్రాజ్య స్థాపనము చేసినవాడు.

ఈయన కేవలము కౌటిలీయ అర్థశాస్త్రమేకాదు
మరి కొన్ని రచనలు చేశారు ఆ రచనలు-

1. వృద్ధచాణక్య -
   ఇందులో 8 అధ్యాయాలు, 108 శ్లోకాలున్నాయి.

2. చాణక్యనీతిశాస్త్రము-
   ఇందులో 108 శ్లోకాలున్నాయి

3. చాణక్యసారసంగ్రహము-
   దీనిలో 300 శ్లోకాలున్నాయి.

4. లఘుచాణక్య -
   ఇందులో 8 అధ్యాయాలు, 91 శ్లోకాలున్నాయి

5. చాణక్య రాజనీతిశాస్త్రము-
   ఇదే అర్థశాస్త్రమని పేరున్నది.
   దీనిలో 8 అధ్యాయాలు 512 శ్లోకాలున్నాయి

(ఇది చాణక్య నీతి దర్పణము
 జగదీశ్వరానంద్ తెలుగు అనువాదం
 నుండి సేకరించబడింది)

Saturday, January 21, 2017

శివుడు తోలు ఎందుకు కట్టుకున్నాడు?


శివుడు తోలు ఎందుకు కట్టుకున్నాడు?
సాహితీమిత్రులారా!మనం రకరకాల వింతలు
విశేషాలు వింటుంటాం
అందులో కొందరు బట్టలు
ఒకసారి కట్టుకొని విప్పివేస్తారట
ఎందుకంటే వాళ్ళకు ఉతుక్కోవడానికి
తగినంత నీరు దొరకదని అన్నారు
పట్టు చీరలు నీటితో ఉతకరట-
మరి దేంతో ఉతుకుతారంటే
ఉతికేదేలేదని కొందరంటే
కాదు పెట్రోల్ వాష్ చేస్తారని
మరికొందరు అంటున్నారు.
ఇదంతా ఎందు కంటే
ఒక చాటుకవి చెప్పిన చాటువు
చూస్తే మీకే తెలుస్తుంది చూడండి-

చాకివానితోడ జగడాలు పడలేక
సిరిగలాడు పట్టుచీర గట్టె
శివుడు తోలు గప్పె సీ యని మది రోసి
భైరవుండు చీర పారవేసె

ఇది చాటువు

బట్టలుతికేవారితో తగదా పడలేక
డబ్బున్న మారాజు కాబట్టి విష్ణువు
పట్టు బట్టలు కట్టాడు.
మరి శ్మశానాల్లో ఉండేవాడు డబ్బులేనోడూ
అయిన శివయ్య తోలు కట్టాడు
ఇంక భైరవుడైతే ఏకంగా బట్టలే తీసేసె
ఇంకెట్టామరి. ఇప్పుడైతే తక్కవేమి
పట్టణాలల్లో నగరాల్లో అందుకేగాద
వాషింగ్ మెషీన్లు వచ్చింది వాడుకలోకి
అందుకయ్యా శివుడు తోలు కట్టిండేది.

(చీర  అంటే వస్త్రం)

శీలమంటే ఏమిటి?


శీలమంటే ఏమిటి? 
సాహితీమిత్రులారా!


శీలం అంటే మనం వివిధ
రకాల వివరణలు వింటుంటాం
కాని మహాభారతంలో వ్యాసులవారి
సమాధానం వినండి -

అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా
అనుగ్రహం చ దానం చ శీలమే తత్ప్రప్రశన్యతే
                                                                               (మహాభారతం అను. 124-66)

ప్రాణులన్నిటి యందు మనోవాక్కాయ కర్మలచే
వైరము లేకుండుటయు, దయకలిగి ఉండుటయు,
దానముచేయుటయు శీలముగా ప్రశంసింపబడుచున్నది.

దీన్ని బట్టి శీలమంటే ఏమిటో అర్థమైందికదా
ఇది చెప్పడం ఎంత సులువో ఆచరించటం
అంత కష్టం.

Friday, January 20, 2017

ఎలాంటి వారికైనా పిలిస్తే మనసు ఉరకలేయదా?


ఎలాంటి వారికైనా పిలిస్తే మనసు ఉరకలేయదా?
సాహితీమిత్రులారా!


ఎటువంటి వారికైనా విషయవాంఛలు ఉంటాయి
అనటానికి భర్తృహరి వైరాగ్యశతకంలోని
ఈ శ్లోకం చూస్తే తెలుస్తుంది-

భిక్షాశనం, త దపి నీరస మేకవారం,
శయ్యా చ భూః, పరిజనో నిజదేహమాత్రమ్,
వస్త్రం సుజీర్ణ వతఖణ్డమయీ చ కన్థా,
హాహా! తథాపి విషయా న్న జహాతి చేతః!


భిక్షావృత్తి చేత జీవిస్తుండే వారిని పరికిద్దాం -
వారికి భిక్ష ద్వారా లభించిందే ఆహారం.
అదికూడా సారహీనమైనదే లభిస్తుంది గాని
పంచభక్్యపరమాన్నాలు గావు. ఆ నిస్సారమైన
భిక్ష అయినా ఒక్కపూట మాత్రమే.
ఇక పరుండటానికి లభించే పరుపు - కటికనేల.
కేవలం తన దేహం తప్ప. ఏ పరివారం చుట్టుపక్కల ఉండదు.
చినిగిపోయిన పాత గుడ్జ పేలికలే ధరించే వస్త్రాలు.
ఇలా జీవించే నిర్విణ్ణులకు సైతం చేరరమ్మని స్త్రీ పిలిస్తే
మనస్సు సంభోగేచ్ఛతో ఉరకలు వేయదా? - అని భావం.


ఎవరు తీర్థయాత్రలు చేయలేరు?


ఎవరు తీర్థయాత్రలు చేయలేరు?
సాహితీమిత్రులారా!ధర్మరాజుతో నారదుడు
ఈ విధంగా అన్నాడు-

వ్రతములు లేనివారు, నుపవాసపరాఙ్ముఖులైనవారు దు
ర్మతులు విహీనశౌచులుఁగ్రమంబునఁదీర్థములాడనోప రా
తత గుణశాలి వీవఖిలధర్మవిదుండవు గావునన్ శుభ
స్థితిఁ జని తీర్థసేవనము సేయుము నీకు నభీష్టసిద్ధిగన్ 
                                                              (శ్రీమదాంధ్రమహాభారతము అరణ్య - 2- 284)


వ్రతాలు చేయనివారు, ఉపవాసాలకు విముఖులైనవారు,
చెడ్డవారు, శుచిత్వములేనివారు, తీర్థయాత్రలు చేయలేరు.
నీవు లెక్కకు మిక్కిలిగా మంచిగుణములు గలవాడివి,
సర్వధర్మములు ఎరిగినవాడివి, కాబట్టి తీర్థాలను
సేవించటానికై శుభప్రదంగా వెళ్ళిరమ్ము
నీ కోరికలు నెరవేరుగాక - అని భావం

కాబట్టి తీర్థయాత్రము అందరూ చేయలేరని
దీని బట్టి తెలుస్తున్నది కదా
ఇది ఆకాలపు మాట
ఇప్పుడు అందరూ తీర్థయాత్రలకు
వెళుతున్నారుకదా  -
అని సందేహం వ్యక్తమౌతుంది. నిజమే
అందుకే యాత్రలకు వెళ్ళినవారు
ఎన్నిరకాలుగా ప్రమాదాలకు లోనవుతున్న
సంఘటనలు చూస్తున్నాముకదా
కారణం ఇదే అయి ఉండవచ్చు
అటువంటి గుణాలు కలవారు
తీర్థయాత్రలు చేయడం
సర్వదా లాభదాయకం
మిగిలినవారు వినోదయాత్రలనాలిగాని
తీర్థయాత్రలనకూడదు.

Thursday, January 19, 2017

కాచం మణిం కాంచన మేకసూత్రే


కాచం మణిం కాంచన మేకసూత్రే
సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకం చూడండి-

కాచం మణిం కాంచన మేకసూత్రే
గ్రథ్నాసి బాలే కిము చిత్రమేతత్
అశేషవి త్పాణిని రేకసూత్రే
శ్వానం యువానాం మఘవాన మాహ

ఒక బాలిక గాజుముక్కను, మణిని,
బంగారు నగను ఒకదారంతో గ్రుచ్చి
ఆడుకుంటున్నది. దాన్ని చూచి
ఒకాయన-
ఓ బాలా నీవు విలువగల బంగారాన్ని,
మణిని, సాధారణమైన గాజుముక్కతో కలిపి
ఒక చోట కట్టుతున్నావు ఏమాశ్చర్యం
- అని ప్రశ్నించాడు.
దానికి ఆ అమ్మాయి -
అయ్యా సర్వజ్ఞుడైన పాణిని కుక్కను, ఇంద్రుని
యువకుణ్ని ఒక్కసూత్రంలో బంధిచలేదా
అంతటివాడు ఆ పనిచేయగా లేనిది నేను
ఒక సూత్రం(దారం)లో వీటిని చేర్చటం తప్పా -
అని బదులిచ్చిది


అసలు విషయం ఏంటంటే
పాణిని అష్టాధ్యాయిలో
శ్వయువమఘోనామతద్దితే - అని
ఒక సూత్రమున్నది.
శ్వస్, యువస్, మఘవన్ శబ్దాలకు
టి - లోపం విధించారు పాణిని.
అంటే శ్వస్ - అంటే కుక్క,
యువన్ - అంటే పడుచువాడు,
మఘవన్ - అంటే ఇంద్రుడు -
అని అర్థాలు.
నిజానికి ఇక్కడ అర్థంతో సంబంధంలేకుండా
ఆ శబ్దాలకే వ్యాకరణ నియమం వర్తిస్తుంది. కాని
ఆ బాలిక చమత్కారంగా సమాధానం చెప్పడం
ఇక్కడ విశేషం.
పూర్వం స్త్రీలు, పిల్లలు కూడా
వ్యాకరణ పరిచయం కలిగి ఉండేవారని
దీనివలన మనం గ్రహించవచ్చు.


అంతకంటే ఎక్కువ దొరకదు


అంతకంటే ఎక్కువ దొరకదు
సాహితీమిత్రులారా!


ప్రాప్తములేక వస్తువుల్
పట్టుబడంగనేరవు -
అని పెద్దలంటూంటారు
అది ఎలాగో
ఈ శ్లోకం చెబుతుంది చూడండి

ఆసాద్యాపి మహోదధిం న వితృషో జాతో జలైర్బాడబో
మేఘం ప్రాప్య న చాతకో పి చరణౌ భానుం న లేభే రుణః
చన్ద్ర శంకరశేఖరే పి  నివసన్ పక్షక్షయే క్షీయతే
ప్రాయః సజ్జన సంగతౌ హి లభతే దైవానురూపం ఫలమ్

బడబాగ్ని మహాసముద్రంలో ఉన్నా
ఆ ఉదకంతో దాని దప్పి తీరలేదు
మేఘాన్ని పొందినా చాతకపక్షి దప్పిక తీరలేదు
అరుణుడు సూర్యుణ్ని ఆశ్రయించినా
అతనికి పాదాలు రాలేదు
శివుని శిరోభూషణంగా ఉన్నా
చంద్రుడు కృష్ణపక్షాంతంలో
క్షీణిస్తూనే ఉన్నాడు
సజ్జనుల సంగతి లభించినా
దైవం ఇచ్చిన ఫలం మాత్రమే లభిస్తుంది
అంతకంటే ఎక్కువ దొరకదు - అని భావం.

Wednesday, January 18, 2017

భక్తి అంటే ఏమిటి? - ముక్తి అంటే ఏమిటి?


భక్తి అంటే ఏమిటి? - ముక్తి అంటే ఏమిటి?
సాహితీమిత్రులారా!భక్తి అంటుంటాము కదా !
భక్తి అంటే ఏమిటి?
మనసా వాచా కర్మణా భగవంతుని 
సేవించటాన్ని భక్తి అంటున్నారు పెద్దలు
నారదపాంచరాత్రమున ఈ శ్లోకం చెప్పబడింది-

అనన్య మమతా విష్ణౌ మమతా ప్రేమ సంగతా
భక్తిరిత్యుచ్యతే భీష్మ ప్రహ్లాదదోద్దవనారదైః

- అంటే నిరతిశయ ప్రేమభావముతో కూడిన ఉత్తమమతమే
భక్తి అని భీష్మ, ప్రహ్లాద, ఉద్దవ, నారదుల మతము(అభిప్రాయము)

ఆదిశంకరులు వివేకచూడామణిలో-
స్వస్వరూపనుసంధానం భక్తిరిత్యభిధీయతే - అన్నాడు
(తన ఆత్మస్వస్వరూపముతో ఐక్యం చెందడమే భక్తి)

మధ్వచార్యులు -
పునర్విశ్లేషభీరుత్వం పరమాభక్తిరుచ్యతే
(విడిచిపోవుటకు భయపడుట - 
అంటే సర్వాధిక ప్రేమభావమే భక్తి)

భగవద్రామానుజాచార్యులు-
పరానురక్తీశ్వరే, సాత్వస్మిన్ పరమప్రేమరూపా
(ఎట్టి ప్రతిబంధకములైననూ 
లొంగని నిరంతర ప్రేమ ప్రవాహమే భక్తి)

మరి ముక్తి అంటే ఏమిటి -

అవిద్యానిర్మగ్నుడైన మానవుడు సంసారచక్రములో 
జరామరణశీలుడై నిరంతరం దుఃఖం అనుభవిస్తున్నాడు. 
దాని నుండి శాశ్వత ఆనంద సంధాయక స్థితిని 
పొందటాన్నే ముక్తి లేక మోక్షం అంటారు

ముక్తి అంటే ఆళ్వారుల మాటల్లో -
ప్రకృతి బంధవిముక్తుడై ఆనంద ప్రాప్తిని 
అందటాన్నే మోక్షం. అలాంటి ఆనంద 
ప్రాప్తిని పొందగల్గిన సాధకుడు మిక్కిలి ధన్యుడు

భగవద్రామానుజులు - 
భక్తిరూపజ్ఞానమే మోక్షం - అంటున్నాడు.

కర్మ, జ్ఞాన, భక్తియోగములలో భక్తి ఉత్తమమని
అదే సులభమోక్షసాధకమని దానినే
మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవగరీయసీ - అని వివేకచూడామణిలో శంకరభగవత్పాదులు బోధించారు.

వీటన్నిటిని బట్టి ముక్తికి మొదటి మెట్టు భక్తి
భక్తి మోక్షసాధకము
మరి భక్తి ఎట్లా సాధించటం అంటే
భక్తి తొమ్మిది రకాలు -
శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనమ్
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మనివేదనమ్
                     (శ్రీమద్భాగవతమ్ 7-5-23)

1. శ్రవణం - భగవంతుని గూర్చి వింటూండం.

2. కీర్తనం - భగవంతుని కీర్తిస్తూండడం(పొగడుతూండడం)

3. స్మరణం - భగవంతుని స్మరిస్తూండడం

4. పాదసేవనం - మనసులో భగవంతిని పాదాలను 
                               నిలుపుకొని సదా పాద ధ్యానంలో ఉండడం

5. అర్చనం - అర్చనానికి పర్యాయపదం పూజ. అంటే 
                        పూజచేస్తూండడం

6. వందనం - దీనికే అభివాదనమని, స్తుతి అని పేరు. 
                         భగవంతునికి నమస్కరించటం

7. దాస్యము - త్రికరణశుద్ధికల సేవే దాస్యము

8. సఖ్యము - స్నేహభావాన్నే సఖ్యం అంటారు 
                          అర్జునుని భక్తి దీనికి ఉదాహరణ

9. ఆత్మనివేదనం - సంపూర్ణవిశ్వాసంతో భగవంతునికి 
                                    శరణాగతి చేయడమే ఆత్మనివేదన


వీటిలో దేనినైనా లేక కొన్నింటిని ఆచరించిన 
ముక్తిని పొందవచ్చునంటారు పెద్దలు.


ఏవి గోప్యంగా ఉంచాలి?


ఏవి గోప్యంగా ఉంచాలి?
సాహితీమిత్రులారా!


మనం ఏవి రహస్యంగా ఉంచాలి
ఏవి ఎవరితో పంచుకోవచ్చు
అనే విషయాలు
ఈ నీతిశాస్త్రశ్లోకం చెబుతున్నది చూడండి-

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మన్త్రమౌషధమ్
తపో దానావ మానే చ నవగోప్యాని కారయేత్

వయసు, ధనము, ఇంట్లోని లోపాలు,
రహస్యవిషయం, మంత్రం, ఔషధం,
తపస్సు, దానం, అవమానము - అనే తొమ్మది
విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి - అని భావం.

వీటిలో కొన్ని కాలానుగుణంగా చెప్పవలసిన
అవసరం ఏర్పడుతున్నది.

Tuesday, January 17, 2017

గతిమధ్యస్తన కుంతల స్తబక............


గతిమధ్యస్తన కుంతల స్తబక............
సాహితీమిత్రులారా!

తెనాలిరామకృష్ణుని పాండురంగమహాత్మ్యంలోని
నిగమశర్మోపాఖ్యానములోని ఈ పద్యం చూడండి-

ఒక కాపుకోడలి వర్ణన-

గతిమధ్యస్తన కుంతలస్తబకవీక్షాగర్వదుర్వార యీ
సతిచే మానమె యూనమయ్యె నిఁక నిస్సారంపుఁ బ్రాణంబు దా
ల్చు తగుల్ గాదని రోసి యావృషలివాలుందూపుఁగ్రొమ్మంట కా
హుతియౌ బర్హిమృగేంద్రకుంభిచమరీయూధంబు నేణంబులున్
                      (పాండురంగమాహాత్మ్యము -3- 86)
నడక, నడుము, కుచములు, జుట్టు, చూపులు - అనువానిచే
కలిగిన గర్వము వారింపరానిదగు ఈ స్త్రీ వలన మన మర్యాదయే
తగ్గిపోయినది సారములేని  జీవితము ధరించాలనుకోవడం తగదు
అని ఏవగించుకొని నెమలి, సింహము, ఏనుగు, చమరీమృగముల
గుంపు జింకలును ఆ శూద్రస్త్రీ యొక్క వాడియైన బాణముల వలని
అగ్నిజ్వాలలకు కాలి చనిపోవును - అని భావం.

ఆమె నడక నెమలి నడకలు, నడుము సింహమునడుము,
స్తనములు కరికుంభములు, జుట్టు చమరీమృగవాలము,
చూపులు ఏణము(జింక)ల చూపులు అని కవి వర్ణిస్తున్నాడు.
ఆమె వాటినన్నిటిని వేటాడుచున్నదని భావము.


అతిదుఃఖితులు అని ఎవరికి పేరు?


అతిదుఃఖితులు అని ఎవరికి పేరు?
సాహితీమిత్రులారా!


ప్రపంచంలో రకరకాల వాళ్ళున్నారు.
ప్రతిదానికి కోపించేవారు కొందరైతే
ప్రతిదానికి నవ్వేవారు కొందరు.
మరికొందరు ప్రతిదానికి బాధపడుతుంటారు
ఇక్కడ ఈ శ్లోకంలో అతిగా దుఃఖించేవారిని
గురించి చెప్పారు చూడండి-

ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః క్రోధనో నిత్యశఙ్కితః
పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః
                                                             (సంస్కృత సూక్తి రత్నకోశః)


అసూయగలవాడు, అతిగా జాలిపడేవాడు,
సంతృప్తిలేనివాడు, కోపస్వభావం గలవాడు,
ఎల్లపుడూ శంకించేవాడు, ఇతరులమీద
ఆధారపడి జీవించేవాడు - ఈ ఆరుగురిని
అతిదుఃఖితులుగా చెప్పబడుతున్నది - ఈ శ్లోకం

Monday, January 16, 2017

ఎల్లలోక మెఱింగిన గొల్లవాడ


ఎల్లలోక మెఱింగిన గొల్లవాడ
సాహితీమిత్రులారా!

కాసుల పురుషోత్తమకవి
ఆంధ్రనాయక శతకంలోని
ఈ పద్యం చూడండి

తలను బించెపుదండ ధరియించవలెగాని
            మణికిరీటము బెట్ట మనుజపతివె?
గళమున వనమాలికలు పూనవలెగాని
            హారముల్వేయ దేశాధిపతివె?
కరమున మురళి చక్కగ బూనవలెగాని
            శాతాసి బూనంగ క్షత్రియుడవె?
తనువు గోక్షీరవాసన గుప్పవలెగాని
            చందనం బలద రాజవెతలంప?
నెల్లలోక మెఱింగిన గొల్లవాడ
వేది కులమింత రాజసమేమినీకు
చిత్రచిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హతవిమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!
                                                  (19)

శ్రీకాకుళాంధ్రదేవా!
నీవు తలపై నెమలిపింఛం ధరించడంమాని
మణికిరీటమును ధరించావు నీవు ప్రభుడవాయేమి?
మెడలో వనమాలను ధరించంమాని
ముత్యాలసరములు ధరించావు
దేశాధిపతివా ఏమి?
చేతిలో పిల్లనగ్రోవి పూనవలెగాని
ఖడ్గం ధరించావేమి?
క్షత్రియుడవాయేమి?

నీ శరీరం ఆవుపాలవాసన కొట్టాలికదా
ఒంటికి మంచిగంధం పూసుకొన్నావు
నీవు రాజువా ఏమి కాదుకదా
నీవు గొల్లవని అందరకూ తెలుసు
నీకుమెక్కడ
నీ యీ  దుర్గర్వమెక్కడా - అని భావం

కాసుల పురుషోత్తమకవి
వ్యాజస్తుతితో ఎంత చక్కగా శతకం వ్రాశారో
ఇలాంటి పద్యాలవల్ల అవగతమౌతుంది

పురుషుడు దేన్ని వదిలెయ్యాలి?


పురుషుడు దేన్ని వదిలెయ్యాలి?
సాహితీమిత్రులారా!

పురుషుడు వేటిని వదిలెయ్యాలనే విషయాన్ని
ఈ శ్లోకం తెలియజేస్తున్నది చూడండి-

ఆలస్యం త్యక్తప్యం లౌల్యం లోభః పరాపవాదశ్చ
అస్థానేషు చ కోప స్తథాతిమానశ్చ పురుషేణ 
                                                                                         (ఆర్యాద్వాషష్టిక)

పురుషుడు సోమరితనాన్ని,
చాపల్యాన్ని, దురాశను,
ఇతరులను నిందించడాన్ని,
అనవసరంగా పోపించడాన్ని,
అహంకారాన్ని - విడిచివేయాలి-
అని శ్లోకభావం

Sunday, January 15, 2017

నుతియింప నుండుమిక నీ భూమీస్థలిన్ పత్రికా!


నుతియింప నుండుమిక నీ భూమీస్థలిన్ పత్రికా!
సాహితీమిత్రులారా!

రాజా బహదూర్ పంగళి వెంకట రామారెడ్డి గారి
సహకారంతో గోలకొండ పత్రిక అభివృద్ధి చెందాలని
ఆశీర్వదిస్తూ అహళ సింగరాచార్యులుగారు పెప్పిన పద్యం-

రాజా వెంకట రామిరెడ్డి సుతవై రాజద్యశశ్శాలివై
తేజోరూపవిభాసమానమతివై దివ్యప్రభారాశివై
భ్రాజ త్పండిత పద్యగద్యనికరోద్భావైక సంభావ్యవై
భూజానుల్నుతియింప నుండుమిక నీభూమీస్థలిన్ పత్రికా!


తెలంగాణాలో విద్య, చైతన్యం చాలా తక్కువగా ఉన్నరోజుల్లో
గోలకొండ పత్రిక తెలంగాణా ప్రాంతానికి జాగృతి కల్గించింది.

రాజా బహదూర్ పింగళివెంకట రామారెడ్డి సహకారంతో
ఆవిర్భవించి, కీర్తిని గొప్పగాపొంది, తేజస్సుతో పాఠకుల
బుద్ధిని ప్రకాశింప జేస్తూ, గొప్ప ప్రభలతో వెలుగుతూ,
విద్వాంసుల పద్యాలు గద్యాల సమూహంతో ఒప్పుతూ,
ప్రభువులు, సంపన్నులు నిన్ను
పొగడుతుండగా భూమిమీద వర్ధిల్లు -
అని గోలకొండ పత్రికను ఆశీర్వదించారు - అని భావం.

దేశం కోసం దేన్ని త్యజించాలి?


దేశం కోసం దేన్ని త్యజించాలి?సాహితీమిత్రులారా!


సంస్కృత సూక్తి రత్నకోశః లోని
ఈ శ్లోకాలు చూడండి-

ఆపదర్థే ధనం రక్షేద్దారాన్రక్షేద్ధనైరపి
ఆత్మానాం సతతం రక్షేద్దారైపి ధనైరపి


ఆపత్సమయంలో అక్కరరావడం కోసం
ధనం రక్షించుకోవాలి.
భార్యను ధనం త్యజించైనా రక్షించుకోవాలి.
భార్యను, ధనాన్నైనా పరిత్యజించి తనను రక్షించుకోవాలి
- అని ఈ శ్లోక భావం

ఆపదర్థే ధనం రక్షేద్దారాన్రక్షేద్ధనైరపి
పునర్దారాః పునర్విత్తం న శరీరం పునః పునః
ఆపత్సమయంలో అక్కరరావడం కోసం
ధనం రక్షించుకోవాలి.
భార్యను ధనం త్యజించైనా రక్షించుకోవాలి.
భార్య మళ్లీ దొరుకవచ్చు, ధనం మళ్ళీ దొరక వచ్చు
శరీరం మళ్ళీ మళ్ళీ దొరకదుకదా - అని ఈ శ్లోక భావం.

అయితే ఈ శ్లోకం చూడండి-

ఆపదర్థే ధనం రక్షేద్దారాన్రక్షేద్ధనైరపి
ఆత్మానాపి కులం రక్షేద్దేశం రక్షేత్కులైరపి

ఆపత్సమయంలో అక్కరరావడం కోసం
ధనం రక్షించుకోవాలి.
భార్యను ధనం త్యజించైనా రక్షించుకోవాలి.
తనప్రాణలైనా అర్పించి కులాన్ని రక్షించుకోవాలి.
అయితే ఆకులాన్ని కూడా త్యజించి దేశాన్ని
రక్షించుకోవాలి - అని భావం(అంటున్నది ఈ శ్లోకం)


Saturday, January 14, 2017

ఈ కాలం మహిమ ఎంతో!


ఈ కాలం మహిమ ఎంతో!
సాహితీమిత్రులారా!

కలికాలంలోని గొప్పదనాన్ని
కూచిమంచి తిమ్మకవి తన
కుక్కటేశ శతకంలో వివరించారు
ఆ పద్యం చూడండి-

వేదశాస్త్రపురాణ విద్యలక్కరగావు
           పరిహాసవిద్యలు పనికివచ్చు
గద్యపద్యవిచిత్ర కవితలు గొఱగావు
           గొల్లసుద్దుల్ తల్ పెల్లుమీరు
దేవతాభాషల తీరులేమియు గావు
           పారసీకోక్తులు ప్రణుతి కెక్కు
శైవ వైష్ణవ మతాచారంబు లొప్పవు
           పాషండమతములు బాళినలరు
నౌర ఇక్కాల మహత్మ్యమెంతొ
వింతయై తోచుగద ధరాభ్యంతరమున
భూనుతవిలాస! పీఠికాపురనివాస!
కుముదహితకోటి సంకాశ! కుక్కుటేశ!

రెండుపాదాల మకుటాలుగల శతకాలలో
కుక్కుటేశ శతకం ఒకటి.
ఆంధ్రనాయక శతకంలోను
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ -
అని రెండు పాదాల మకుటం ఉంది.

వైదికవిద్యల మీద అనాదరము,
గద్యపద్య కవితమీద చిన్నచూపు,
సంస్కృతభాషపై అగౌరవము,
శైవాది మతాలపై అశ్రద్ధ,
జానపదవిద్యలపైన మక్కువ,
అన్నయభాషా వ్యామోహం,
హాస్యపు కవితల మోజు,
నాస్తిక మతాల మీద ఆసక్తి -
అనే విషయాలు కలిప్రభావం
వలన వ్యాపించాయని -
ఇది వింతగా ఉందని
కుక్కటేశ్వరస్వామికి
కవి ఆవేదనతో నివేదించుకున్న
పద్యం ఇది.

ఈ కవి క్రీ.శ. 18వ శతాబ్దిలో ఉండినవాడు
కుక్కటేశ్వర శతకంతోపాటు
రసికజన మనోరంజనము,
అచ్చతెలుగు రామాయణము,
భర్గా శతకము మొదలైనవనేకము
కృతిచేసిన కవి ఈయన
కాలానుగుణంగా వచ్చే మార్పులను
మన కళ్లకు కట్టినట్లు పై పద్యంలో
వివరించారు తిమ్మకవిగారు.

నన్నెక్కడ యాచిస్తాడో అని...


నన్నెక్కడ యాచిస్తాడో అని...
సాహితీమిత్రులారా!

భోజరాజీయంలో అనంతామాత్యుడు
అన్నిటికంటె చులకనైనవాడు,
తేలికైనవాడు తల్లిలేనివాడని
ధేనువుతో చెప్పిస్తాడు. కాని ఇక్కడ
మరో విషయం గమనించగలం చూడండి-

తృణాల్లఘుతర స్తూలః
తూలా దపి చ యాచకః
వాయు నాపి కిం న నీతో పౌ
మా మయం యాచయే దితి

సమాజంలో యాచకుల స్థతిని వర్ణించేదీ శ్లోకం
లోకంలో తేలికగా ఉండే వస్తువు గడ్డిపరక.
గడ్డిపరక కంటే తేలికైనది దూది.
దూదికంటే తేలికైనది యాచకుడు(బిచ్చగాడు)
అంత తేలికైతే గడ్డిపరక, దూది గాలిలో
ఎగిరిపోయినట్లు గాలిలో ఎందుకు ఎగిరిపోడు
అంటే ఇతణ్ణి తీసుకెళితే నన్నెక్కడ యాచిస్తాడో
అని వాయుదేవుడు తీసుకుపోడని కవి చమత్కరిస్తున్నాడు.

Friday, January 13, 2017

క్రాంతి తోడ మమ్ము గావఁగ సంక్రాంతిక్రాంతి తోడ మమ్ము గావఁగ సంక్రాంతి 
సాహితీమిత్రులారా!


సంక్రాంతి ప్రతినెల వస్తుంది కాని
మకరసంక్రాంతికి ప్రత్యేకత ఎందుకంటే
పంటలుపండి ప్రజలంతా ఆనందోత్సాహతో
ఉంటారు. కాని ప్రతిసంక్రాంతి అలాజరగదు
మారిన కాలంలో సంక్రాంతిని
తన్నీరు బాలాజీగారు స్వాగతించిన
ఈ పద్యాలు చూడండి


హరిహరిలోరంగ హరియని శ్రీకాంతు
                ధ్యానించు మన హరిదాసులేరి !
హరహర మహాదేవ యనుచు శ్రీకంఠుని
                అవతారులగు జంగమయ్యలేరి !
డుడు బసవన్నల డోలుసన్నాయిల
                పలుగంగిరెద్దుల వారలేరి !
భుక్తి కొరకు దెచ్చుఁ భుజమున సంచిలో
                దానము వేయు వదాన్యులేరి !
సిరులులేనినాడు శ్రీహరిహరులకు
కూడులేదు మరియు గూడు లేదు
పంటలున్న వచ్చు - పసిడి సంక్రాంతికి
పూర్వ వైభవమ్ము పుడమిలోన

పాడి పంటతోడ పసిడి రాసులతోడ
భోగి మంట వోలె భుక్తి గలుగ
క్రాంతి తోడ మమ్ము గావఁగ సంక్రాంతి
లేమి కలిమి తేడ లేక రమ్ము!