Wednesday, May 31, 2017

వ్రాలు - అందం


వ్రాలు - అందం
సాహితీమిత్రులారా!


అక్షరాలు గుండ్రంగా వ్రాయండం
అందరికి సాధ్యమయే విషయంకాదు
వ్రాతను బట్టి వారి మనస్తత్వమును
చెప్పే శాస్త్రమొకటి ఉంది దానిపేరు
గ్రాఫాలజీ అంటారు వారు వ్రాసే విధానాన్ని
బట్టి వారి మనస్తత్వము చెబుతారు.
పూర్వం ప్రతిదాన్ని వ్రాయడానికి వారికి ప్రత్యేక
వ్రాయసగాడు ఉండేవాడు. తిక్కనకు
కుమ్మరి గురునాథుడు అనే వ్రాయసకాడు ఉన్నట్లు
చెబుతుంటారు. ఇక మన కవిసామ్రాట్ విశ్వనాథ వారు
స్వయంగా తన చేత్తో వ్రాసినది వేయి పడగలు అనేదేనట
అంటే వారు చెబుతుంటే వ్రాసేవారు వ్రాస్తుండేవారు
అలాంటి వ్రాయసగండ్రలో ఒకాయన చెప్పిన ఈ పద్యం చూడండి-

వ్రాలివిగో కనుగొనుము వన్నియమీఱగ వ్రాలకేమి నా
వ్రాయు సుధారసాలు, కవిరాజుల కెల్లమనోహరాలు, వ
జ్రాలు, సరస్వతీ విమల చారుకుచాగ్రసరాలు, చూడచి
త్రాలు, మిటారి మోహనకరాలు, నుతింప తరంబె ఏరికిన్

ఒక వ్రాయసకాడు తన చేతి వ్రాత
సౌందర్యానికి మురిసిపోతూ
చెప్పుకొన్న పద్యం ఇది.
నా వ్రాలు ఎలావుందో చూడు-
అమృతధారలు, కవిశ్రేష్ఠులకు మనోహరమైనవి,
వజ్రాలు, సరస్వతీదేవి వక్షస్థలాన్ని అలంకరించే
ముత్యాల దండలు, చిత్రవిచిత్రాలు, అందమైన
అమ్మాయి హస్తాలు. ఇలా చెబుతున్నాడు.

మూడు లాడములు ఒక గుఱ్ఱం


మూడు లాడములు ఒక గుఱ్ఱం
సాహితీమిత్రులారా!


అన్యాపదేశాలు మన కవిత్వంలో
తక్కువేమీ కాదు. తిరుపతి వేంకట కవులు
కామేశ్వరీస్తవము చేశారు అందులోని
ఈ అన్యాపదేశ పద్యం చూడండి-
ఇందులో రామకృష్ణకవులను గురించి
చెబుతున్నారు. పద్యం చూడండి-

దారింజిక్కిన లాడమొండు గని, మోదంబంది, యీ మీద నే
స్వారింజేయగ మూడు లాడములు అశ్వమ్మొక్కడుం దక్కు వం
చూరంజొచ్చినభంగి బాలకవులేదోకొంచెమార్జించి, ఆ
ధారాధారమున్ భవత్పదవికై యత్నించుచున్నారహో

అని కామేశ్వరీమాతకు విజ్ఞప్తి చేశారు.

ఒకనికి దారిలో ఒక లాడము(లాలము)
(గుఱ్ఱం కాళ్ళకు గుండ్రంగా ఉండే ఇనుప కట్టులు)
దొరిందట. దాన్ని తీసుకొని ఇంక గుర్రపుస్వారీ
చేయటానికి నాకు ఇంక మూడు లాడములు ఒక గుర్రము
తక్కువున్నాయని అను కున్నాడట ఆ వెఱ్ఱివాడు.
అట్లాగే రామకృష్ణకవులకు కవిత్వధార ఉన్నంత మాత్రంతో
అవధానం చేయడానికి సరిపడరని అన్యాపదేశంగా చెప్పడం
ఇందులోని భావం.

Tuesday, May 30, 2017

మాటకు దరిద్రం అడ్డురాదుకదా!


మాటకు దరిద్రం అడ్డురాదుకదా!
సాహితీమిత్రులారా!ప్రియమైన మాటలు అందరిని దగ్గర చేస్తాయి
కటువైన మాటు దూరం చేస్తాయి
దీన్ని గురించిన ఒక శ్లోకం చూడండి-

ప్రియవాక్య ప్రదానేన సర్వేతుష్యన్తి జంతవః
తస్మాత్ ప్రియంహి వ్యక్తవ్యం వచనే కా దరిద్రతా

ఎదుటివారికి ప్రియంగా మాట్లాడటం వలన
అందరూ సంతోషిస్తారు. మెచ్చుకొంటారు.
అందుచేత ఓ సంఘజీవీ నీవు ప్రియంగా
మాట్లాడుతూం ఉండు. మాటలకు దరిద్రం(లోటు)
ఉండదుకదా  మాట్లిడితే పోయేదేముందీ - అని భావం

ఉత్తములు నీచమైన చేష్టలు చేయరు


ఉత్తములు నీచమైన చేష్టలు చేయరు
సాహితీమిత్రులారా!
ఉత్తముడు ఉత్తముడే నీచుడు నీచుడే
ఈ విషయాన్ని తెలిపే భర్తృహరి సుభాషితం
చూడండి-

ఇందులో పోల్చడానికి కవి కుక్కను - ఏనుగును
తీసుకున్నాడు-

లాఙ్గూల చాలనమధశ్చరణావఘాతం
భూమౌ నిపత్య వదనోదరదర్శనం చః
శ్వా పిణ్డదస్య కురుతే గజపుఙ్గవస్తు
ధీరం విలోకయతి చాటుశతైశ్చ భుఙ్త్కే

తనకు గుప్పెడు మెతుకులు వేస్తే
వాడిముందర తోకాడిస్తూ నిలబడటమో
నేలమీద పొర్లుతూ కాలితో తన పొట్టకేసి
చూపించడమో చేస్తుంది కుక్క.
కాని ఏనుగు అలా కాదు....
ఠీవిగా నిలబడి మావటి వాడు
ఆప్యాయంగా అందించే మేతను లాలింపు ద్వారా
గ్రహిస్తూ ధైర్యదృక్కులతో చూస్తూంటుంది.
కవినిశిత పరిశీలనకు ఇది మచ్చు తునకగా చెప్పవచ్చు.
ఉత్తములు నీచ చేష్టలు చేయరని దీని భావం.

దీన్నే లక్ష్మణకవి ఈ విధంగా అనువదించాడు-

వాలమఁద్రిప్పు నేలఁబడి వక్త్రముఁ గుక్షియుఁజూపు గ్రింద టం
గాలిడుఁద్రవ్వుఁబిండదునికట్టెదుటన్ శునకంబు భద్రశుం
డాలము శాలితండులగుడంబులు చాటువచశ్శతంబుచే
నోలి భుజించి ధైర్యగుణయుక్తిగఁ జూచు మహోన్నతస్థి తిన్

Monday, May 29, 2017

ఈ పోలిక సరికాదు


ఈ పోలిక సరికాదు
సాహితీమిత్రులారా!
ఈ శ్లోకం చూడండి
ఎంత చమత్కారంగా ఉందో-

సజ్జనస్య హృదయం నవనీతం
వర్ణయన్తి విబుధాః తదళీకమ్
అన్యదేహ విలసత్ పరితాపాత్
సజ్జనో ద్రవతి నో నవనీతమ్

సజ్జన హృదయం నవనీతంతో పోలుస్తారు కవులు.
అది సరైనదికాదు. అసత్యం. ఇతరుల దేహానికి
బాధకలిగితే సజ్జనులు ద్రవించి పోతారు. కానీ
నవనీతం కరుగుతుందా కరగదే దానికింది వేడి
చేస్తేగాని కరగదు ఈ పోలిక ఎలా సరిపోతుంది
అని కవి చమత్కరిస్తున్నాడు.

పోస్టు పోనింగ్ మెంటాలిటీ ఇప్పటిదికాదు


పోస్టు పోనింగ్ మెంటాలిటీ ఇప్పటిదికాదుసాహితీమిత్రులారా!


ప్రతిపనిని వాయిదా వేయడం
దాన్ని చేయవలసిన సమయంలో
చేయకపోవడి అనే ది నేటి సమస్యకాదు.
దీన్ని గుర్తించిన వ్యాసులవారు
భారతంలో ఈ సూక్తిని ఉటంకించారు
చూడండి-

శ్వః కార్య మద్య కుర్వీత పూర్వాహ్ణేచాపరాహ్ణికమ్
నహి ప్రతీక్షతే మృత్యుః కృతంచాస్య నచాకృతమ్
                                                            (మహాభారతం- శాంతిపర్వం- 321-73)

రేపు చేయవలసిన పనిని ఇప్పుడే చేయవలయును.
మధ్యాహ్నము చేయవలసిన పనిని ఉదయమే
చేయవలయును. మనము పనులను ముగించామా
లేదా అని మృత్యువాగదుకదా - అని భావం.

కాబట్టి వాయిదాల పద్ధతి విడిచి పెట్టి ఎప్పటి
పనులు అప్పుడే చేయడం అలవాటు చేసుకోవాలి.

Friday, May 26, 2017

తక్కిడి - నా కొడుకు తప్పే వెదకున్


తక్కిడి - నా కొడుకు తప్పే వెదకున్
సాహితీమిత్రులారా!
మన కవులు కోపం వస్తే బూతులొస్తాయి
ఆ బూతులతోటే పద్యాలను చెప్పారు
కొందరు అలాంటిదే ఇక్కడ ఒక పద్యం.
తప్పులు వెదకేవానిగురించి
ఒక కవిగారు చెప్పిన చాటువు చూడండి-

నక్కలు బొక్కలు వెదకును
అక్కఱతో ఊరపంది అగడిత వెదకున్
కుక్కలు చెప్పులు వెదకును 
తక్కిడి నా లంజకొడుకు తప్పే వెదకున్

నక్కలు ఎండ్రకాయల బొరియల్లో తోక పెట్టి
అవి పట్టుకోగానే బయటికి తీసి తింటాయి.
అట్లాగే ఊరపంది పొర్లడానికి బురదకావాలికదా
కావున అగడిత(కోట పక్కని కందకము) వెదుకుతుంది
కుక్క చెప్పులు వెదుకుతుంది పనికిమాలిన వెధవ
తప్పులే వెదకుతాడు అని భావం

తస్మాత్ జాగ్రత జాగ్రత - 2


తస్మాత్ జాగ్రత జాగ్రత - 2
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........6. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయో
   యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత

విత్తము, చిత్తము, జీవితము క్షణభంగురములు అంటే
అశాశ్వతములు. యమునికి కరుణలేదు.
కావున మేల్కొనండి మేల్కొనండి.

ఇక్కడ నుండి తస్మాత్ జాగ్రత జాగ్రత అని కాక
కా తత్ర పరివేదనా - అని చెప్పడం మొదలు పెట్టాడు.

7. యావత్కాలం భవేత్కర్మతావత్తిష్ఠంతి జంతవః
   తస్మిన్ క్షీణే వినశ్యంతి కా తత్ర పరివేదనా

ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో
అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే
మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి
బాధపడటం ఎందుకు.

8. ఋణానుబంధ రూపేణ పశుపత్నీసుతాలయః
   ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరివేదనా

ఋణానుబంధము ఉన్నంతవరకే భార్యసంతానం
ఇల్లు పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే
ఇవన్నీ నశించిపోతాయి
అందుకు వ్యథ చెందడమెందుకు.

9. పక్వాని తరు పర్ణాని పతన్తి క్రమశో యథా
   తథైవ జంతవం కాలే కా తత్ర పరివేదనా

పండిన ఆకులు చెట్టునుండి రాలిపోతాయి.
అలాగే మరణం ఆసన్నమైనపుడు ప్రాణులు
మరణింస్తాయి. దానికి చింతించటం ఎందుకు


10. ఏక వృక్ష సమారూఢా నానాజాతి విహంగమాః
    ప్రభాతే విదితో యాంతి కా తత్ర పరివేదనా

చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం
ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు
అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు
వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన
మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని
ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ
నవసరములేదు.

11. ఇదం కాష్టం ఇదం కాష్ఠం నద్యం వహంతి సంగతః
    సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదనా

ప్రవహించే నదిలో రెండు కట్టెపుల్లలు దగ్గరకు చేరతాయి.
కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి.
అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచప్రవాహంలో కొంతకాలం
సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును
అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.,


Thursday, May 25, 2017

బలహీనుడు వణికి పోవు సన్నివేశాలు


బలహీనుడు వణికి పోవు సన్నివేశాలు
సాహితీమిత్రులారా!


కవిచౌడప్ప చెప్పిన
ఈ పద్యం చూడండి
బలహీనుడు ఎప్పుడు
వణికిపోతాడో తెలుస్తుంది-

పరపతి గవయగ జనుచో
అరుణోదయవేళ తానమాడం జనుచో
పొరిపొరి వణకు నశక్తుడు
కరుణారస కుందవరపు కవిచౌడప్పా!

రెండు సన్నివేశాలలో బలహీనుడు
వణికిపోతాడట-
1. పరస్త్రీని కలవటానికి వెళ్లేప్పుడు
2. సూర్యోదయంవేళ స్నానానికి వెళ్లేపుడు
ఎందుకో మరి పాఠకులకు చెప్పక్కరలేదు.

తస్మాత్ జాగ్రత జాగ్రత - 1


తస్మాత్ జాగ్రత జాగ్రత  - 1
సాహితీమిత్రులారా!ధారానగరంలో పరమేశ్వరి, సోముడు - అనే
చర్మకార దంపతులకు సునందుడు అను
బాలుడు పుట్టాడు. ఈ బాలుడుపూర్వజన్మలో
ఒక గొప్ప యతి. అందుకే 13 సంవత్సరాలకే
గొప్ప జ్ఞాని అనినాడు ఈ బాలుడు. ఒకరోజు
రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా
తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది.
అప్పుడు బ్రాహ్మీముహూర్తంలో సునందుడు
నగరప్రజలను మోల్కొల్పుతూ కొన్ని శ్లోకాలు చెప్పాడు
వాటిలోని నీతిశ్లోకాలు-

1. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తిబంధు సహోదరాః
   అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత

తల్లిదండ్రులు, బంధు సోదరులు, గృహధనములు
జన్మతో వచ్చును. మరణముతో తెగిపోవునవి. ఇవేవీ
లేవని గ్రహించి జాగ్రత్త వహింపుడు.

2. జన్మదుఃఖం జరాదుఃఖం జాయాదుఃఖం పునఃపునః
   సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత

జన్మించుటయే దుఖించుటకు
వార్థక్యం దుఃఖకరము
భార్యవలన మరిన్ని దుఃఖములు
పుట్టుట చచ్చుట అను సంసారసాగరం
దుఃఖం - ఈ విషంలో మేల్కొనుడు మేల్కొనుడు

3. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠన్తి తస్కరాః
   జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత

కామము-క్రోధము-లోభము అనే ముగ్గురు దొంగలు
మనదేహంలో మకాం వేసి ఉన్నారు. వారు జ్ఞానమనెడి
రత్నమును దొంగిలించుటకే ఉన్నారు
మేల్కొనుడు మేల్కొనుడు

4. ఆశయా బద్ధతే లోకః కర్మణా బహుచింతయా
   ఆయుక్షీణం న జానన్తి తస్మాత్ జాగ్రత జాగ్రత

లోకులు ఆశకును కర్మకును కట్టుబడి
ఏవేవో విచారములతో జీవితములు
గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న
విషయాన్ని గమనించరు ఈ విషయంలో
మేల్కొనండి మేల్కొనండి

5. సంపద  స్సప్న సంకాశాః యౌవనం కుసుమోపహమ్
   విద్యుచ్చంచల మాయుష్యం తస్మాత్ జాగ్రత జాగ్రత

సంపదలు స్వప్నంు వంటివి అంటే అశాశ్వతాలు.
యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో
తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.
కావున మేల్కొనుడు  మేల్కొనుడు.

Wednesday, May 24, 2017

సున్న చుట్టక వ్రేలు సూపినావు


సున్న చుట్టక వ్రేలు సూపినావు
సాహితీమిత్రులారా!ఒక చాటుపద్యం చూడండి-
వినుకొండ పాలకుడైన
రాయన మంత్రి భాస్కరుని గురించి
చెప్పినది-

అక్షరాభ్యాసంబు శిక్ష చేసెడునాడె
          ఓ వ్రాసి నా వ్రాయకుండినావు
గుణిత వేళలయందు కోరి లా కేత్వంబు
          దాకు కొమ్మియ్యక తర్లినావు
ఒకటి పంక్తిని వ్రాయ నూహ నేర్చిననాడె
          సున్న చుట్టక వ్రేలు సూపినావు
గణిత వేళలనాడె ఘనయుక్తిగా నేర్పు
          గురుకీర్తికిని ప్రాలు గూర్చినావు
నిజకులాచార ధర్మంబు నిర్వహించి
హెచ్చుగలయట్టి దాతవై హెచ్చినావు
సరసహృదయుండ వినుకొండ శాసనుండ
భవ్యభరతుండ రాయన భాస్కరుండ

ఇందులో కవి ఎంత చాకచక్యంగా
రాయని మంత్రి దాతగుణాన్ని వివరించాడోచూడండి-

అక్షరాలు దిద్దే సమయంలోనే న- అని వ్రాయలేదట
(ఇక్కడ న - అంటే లేదు అని)
గుణింతాలు నేర్చే సమయంలో ల-కు ఏత్వమును,
ద-కు కొమ్మును ఇవ్వలేదట
అంటే లేదు అనే మాట వ్రాను రాదట.
ఒకటి రెండ్లు నేర్చే వయసులో
సున్న వ్రాయడం మానివేశాడట.
సున్న అంటే ఇక్క శూన్యం అని
ఏమీలేదని అర్థం.
గణిత వేళలనాడు గొప్పకీర్తిని కూర్చినాడట.
చాల గొప్పదాతగా పేరు పొందాట.

దీవిలో గుణింతాలతోనే
కవి ఎంత చక్కగా వివరించాడోకదా
గుణించడం, ఏత్వమివ్వడం, కొమ్మివ్వడం,
సున్నచుట్టటం ఇలాంటివి గమనించగలం. 

ఆపదలకు చింతిందేది సామాన్యులే


ఆపదలకు చింతిందేది సామాన్యులే
సాహితీమిత్రులారా!ఎటువంటి ఆపదలు పైన బడినా ధైర్యం వీడక
ఉండేవారు సామాన్యులుకాదు మహాత్ములు అని
తెలిపే శ్లోకం చూడండి-
ఇది భర్తృహరి నీతిశతకంలోనిది-

విరమ విరమాయాసా దస్మా ద్దురధ్యవసాయతో
విపది మహతాం ధైర్యధ్వంసం య దీక్షితు మీహసే
అయి జడవిధే, కల్పాపాయే2ప్యపేతనిజక్రమాః
కులశిఖరిణః క్షుద్రా వైతే న వా జలరాశయః

కుల పర్వతాలు - 7
మహేంద్ర, మలయ, సహ్య, వింధ్య, సానుమంత,
ఋక్ష, పారియాత్రము - అనేవి కులపర్వతాలు
సముద్రాలు - 7
దధి, ఇక్షు, సుర, క్షీర, ఘృత, లవణ,జల
అనేవి సప్తసముద్రాలు
కులపర్వతాలు, సప్తసముద్రాలు ధ్వంసమైనా,
ప్రళయం వచ్చి కల్పమే అంతరించినా
మహాత్మలకు ఎటువంటి ఆపదలు వచ్చినా
వారి ధైర్యాన్ని విడనాడరు- అని భావం.

దీనికే ఏనుగు లక్ష్మణకవి గారి అనువాదం-

దొసఁగులు వచ్చు వేళ గుణధుర్యుల ధైర్యగుణంబు సర్వ ముం
బస చెడు నంచుఁ జూచెదవు పాపపుదైవమ, యీదురాగ్రహ
వ్యసనము మాను మాను, ప్రళయంబున వితనిజక్రమంబు లై
ససి నెడ వించుకంతయును సాగరముల్ గులపర్వతంబు లున్

Monday, May 22, 2017

యవనీ నవనీత కోమలాంగీ


యవనీ నవనీత కోమలాంగీ
సాహితీమిత్రులారా!మొగల్ చక్రవర్తి షాజహాన్ ఆస్థానంలో
కొంతకాలం పండిత జగన్నాథరాయలు
ఉన్నాడట. ఆ సమయంలోని ఒక సంఘటన-

చక్రవర్తి ఆస్థానంలో ఒక యువతిని చూచి
ఈ శ్లోకం చెప్పాడట.

యవనీ నవనీత కోమలాంగీ
శయనీయే యది మామకే శయనా
అవనీతలమేవ సాధు మన్యే
న వనీ మాఘవనీ వినోదహేతుః

వెన్నెలవలె కోమలమైన శరీరంగల
ఈ యవన(మహమ్మదీయ)స్త్రీ
నా శయ్యపై శయనించినట్లయితే
ఇంద్రుని నందనోద్యాన విహారము
కంటే మామూలు నేలయే శ్రేష్ఠమని
భావిస్తాను. - అని శ్లోక భావం.
అంటే ఆ యువతి సమాగమం కలిగితే
కటికనేలకూడ నందనవనం కంటే గొప్పదిగా
భావిస్తాను అని ఆమెపైగల గాఢానురాగాన్ని
వెల్లడించాడు.

రొట్టెకున్ రేవును సున్నకున్ మొదలు


రొట్టెకున్ రేవును సున్నకున్ మొదలు
సాహితీమిత్రులారా!


ఒక ప్రేయసి ఏదో కారణంతో ప్రియునిమీద అలిగి
ముఖం అటువైపు తిప్పి కూర్చున్నదట అప్పుడామె
ప్రియుడు ప్రణకోపాన్ని చల్లార్చడానికి చాతుర్యంతో
చెప్పిన పద్యం ఇది-
ఈ పద్యం తెనాలిరామకృష్ణునిదని ప్రతీతి

కులుకుంగుబ్బలు సోగకన్నుగవ తళ్కుంజెక్కులున్ మోవి సొం
పులుఁజూపింపక వేగ మవ్వలికిమోమున్ ద్రిప్పనేమాయె ని
వ్వల లేవే నెఱిగుంపులుం బిఱుఁదులున్ వామాక్షి చాల్ మాకు రొ
ట్టెలకున్ రేవును సున్నకున్ మొదలుగంటే వింటివేయెచ్చ టన్

ఓ వామాక్షి(అందమైన కన్నులు గలదానా)
అందమైనకుచాలు, సోగకన్నులు, తళుకు చెక్కులు,
మోవిసొంపు చూపక వేగంగా ఆవలికి తిరిగితే ఏమౌతుంది
ఇటువైపును ఉన్నవి ఉన్నవికదా రొట్టెకు ఇటువైపు అటువైపు
అనేదిఉందా ఎక్కడైనా మొదలుపెట్టి తినవచ్చుకదా
అలాగే సున్నకు మొదలుంటుందా ఉండదుకదా - అని భావం.

ఇదే అర్థంతో ఇలాంటిదే మరో పద్యం-

వరబిబాధరమున్ బయోధరములున్ వక్రాలకంబుల్ మనో
హరలోలాక్షులు జూప కవ్వలి మొగంబైనంత నేమాయె నీ
గురుభస్వజ్జఘనంబు గ్రొమ్ముడియు మాకుం జాలవే గంగక
ద్దరిమే లిద్దరికీడునుం గలదె యుద్యద్రాజబింబాననా


Sunday, May 21, 2017

కష్టతరములైనవి ఏవి?


కష్టతరములైనవి ఏవి?
సాహితీమిత్రులారా!కష్టములైనవి ఏమిటో
ఈ శ్లోకంలో వివరిస్తున్నారు చూడండి-

కష్టం చ ఖలు మూర్ఖత్వం
కష్టం చ ఖలు యౌవనమ్
కష్టాత్కష్టతరం చైవ
పరగేహ నివాసనమ్

మూర్ఖత్వము నిశ్చయముగా కష్టమును కలిగించును.
మరియు యౌవ్వనము కూడ  కష్టమును కలిగించునదే.
అదేవిధంగా ఇతరుల ఇండ్లలో నివసించడం మిక్కిలి
కష్టదాయకము - అని శ్లోక భావం.

వైదికులు


వైదికులు
సాహితీమిత్రులారా!


వైదికులను గురించి అజ్ఞాతకవి వ్రాసిన
పద్యాలను చూడండి-

వారిచర్యలను కళ్ళకు కట్టినట్లు వ్రాశాడు-

నీళ్లకు నిఱ్ఱితోళ్లకును నేతికరుళ్లకు దొడ్డయుత్తరేన్
వ్రేళ్లకు దర్భముళ్లకును వేదపునోళ్లకు సన్నకుట్టువి
స్తళ్లకు రావిపేళ్ల కనిశంబును మళ్లకు పప్పుగూరప
చ్చళ్లకు రాగిబిళ్లకును సంసతస మందుదు రాంధ్రవైది కుల్

లేవరు లెండు లెండనిన లేచినవారయినం దటాలునన్
బోవరు పోవుచున్ నిలిచి పోదుము పోదుము త్రోయకుండ టం
చీవరుసంగృహస్థునలయింతురు బెండిలిలో సదస్యసం
భావననాఁడు చూడవలె బాపనసాముల సాములన్నియున్

Saturday, May 20, 2017

ఇవి చేయువారే నిజమైనవారు


ఇవి చేయువారే నిజమైనవారు
సాహితీమిత్రులారా!


ఎలాంటి పుత్రుడు, తండ్రి,భార్య,
మిత్రులు నిజమైనవారో
చెప్పెడిది ఈ శ్లోేకం చూడండి-

తే పుత్రా యే పితుర్భక్తాః
స పితా యస్తు పోషకః
తన్మిత్రం యస్య విశ్వాసః
సా భార్యా యత్రనిర్వృత్తిః

తండ్రి యందు భక్తి కలవారే పుత్రులు.
బిడ్డల పాలన పోషణ చేయువాడే తండ్రి.
విశ్వాసపాత్రుడైనవాడే మిత్రుడు.
ఏ స్త్రీ వలన భర్తకు సుఖము ప్రాప్తించునో
అట్టి స్త్రీయే భార్య - అని శ్లోక భావం.

తపోభంగ యత్నం - 1


తపోభంగ యత్నం - 1
సాహితీమిత్రులారా!


భారవి కిరాతార్జునీయంలో
అర్జునుడు ఇంద్రకీలాద్రిపై
తపస్సు చేస్తుండగా దాన్ని
భగ్నం చేయడానికి అప్సరసలు
చేసిన యత్నం ఇక్కడ గమనిద్దాం-

శ్రుతిసుఖముపవీణితం సహాయై
రవిరలలాంఛనహారిణశ్చ కాలాః
అవిహితహరిసూనువిక్రియాణి
త్రిదశవధూషు మనోభవం వితేనుః (10-38)

అప్సరసలకు సహాయంగా వచ్చిన
గంధర్వుల వీణాగానం, ఋతువుల
ఫలపుష్పాదుల విజృంభణ అర్జునుణ్ణి
ఏ మాత్రం చలింపచేయలేదు. కాగా
ఆ అప్సరసల మనస్సుల్లో మన్మథుని
ప్రవేశపెట్టి కలచినవి అనగా తన
ఆయుధం శత్రువుపై గాక తనకే చేటు
చేసినట్లుందని భావం.

న దలతి నిచయే తథోత్పలానాం
న విషమచ్ఛదగుచ్ఛయూథికాసు
అభిరతిముపలేభిరే యథాసాం
హరిత నయావయవేషు లోచనాని (10-39)

అప్సరసల నేత్రాలు అర్జునుని అంగప్రత్యంగాల్లోనే
నిమగ్నమయ్యాయి. వికసించిన మల్లె మొదలైన
పూగుత్తులు వారిని ఆకర్షించలేక పోయాయి. దీని
ద్వారా వారి చక్షుః ప్రీతి అనే మన్మథ వికారం
చెప్పాడు కవి.

మునిమభిముఖతాం నినీషవో యాః
సముపయయుః కమనీయతాగుణేన
మదనముపదధే స ఏవ తాసాం
దురధిగమా హి గతిః ప్రయోజనానామ్   (10-40)

అప్సరసలు తమ అందంతో అర్జునుణ్ణి
వశం చేసుకోతలచారు. కాని అర్జునుడే
వారిలో మన్మథ భావాల్ని కలుగజేశాడు
నిజంగా మన ప్రయోజనాల పరిణామం
ఎట్లా ఉంటుందో తెలుసుకోవటం కష్టమే.
అర్జునుని వశం చేసుకోవటానికి బదులు
తామే అతని వశమైనారని భావం.

Friday, May 19, 2017

శీలమంటే ఏమిటి?


శీలమంటే ఏమిటి?సాహితీమిత్రులారా!
శీలమంటే ఏమిటో భారతంలో
అనుశాసనిక పర్వంలో
వ్యాసుడు వివరించారు
తెలుసుకుందాం

అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా
అనుగ్రహం చ దానం చ శీలమేతత్ప్రశన్యతే

ప్రాణులన్నిటి యందు మనసు వాక్కు కర్మలచే
వైరము లేకుండుటయు, దయకలిగి ఉండుటయు,
దానము చేయుటయు శీలముగా ప్రశంసించబడుచున్నది-
అని భావం.
కానీ కాలక్రమంలో దీని భావం మారింది.

సాష్టాంగ దండప్రణామము అంటే?


సాష్టాంగ దండప్రణామము అంటే?
సాహితీమిత్రులారా!నమస్కారాలలో సాష్టాంగ దండప్రణామము ఒకటి.
రెండుచేతులు జోడించి నమస్కరిండం అందరికి తెలిసిందే
సాష్టాంగ దండప్రణామము అంటే నేలపై సాగిం పడి మ్రొక్కడం
అంతేకదా
నిజమే
దానికి అర్థం ఏంటని?
స అంటే కూడుకొన్న,
అష్ట - ఎనిమిది,
దండప్రణామము-
నమస్కారము - అంటే ఎనిమిదింటితో కూడిన నమస్కారం.
ఈ పద్యం చూడండి-

కరయుగములు, చరణంబులు
నురములలాటస్థలంబు నున్నత భుజముల్
సరిధరణిమోపి మ్రొక్కిన
పరగున సాష్టాంగమండ్రు పరమ మునీంద్రుల్

రెండు చేతులు, రెండు కాళ్ళు, రొమ్ము, నుదురు,
రెండు భుజాలు మొత్తం ఎనిమిదింటిని నేలకు
ఆన్చి మ్రొక్కిన అది సాష్టాంగదండప్రణామమనబడును-
అని భావం

Wednesday, May 17, 2017

ఇప్పుడిది నేరమయింది


ఇప్పుడిది నేరమయింది
సాహితీమిత్రులారా!
పిల్లలను దండించడం నేరయింది
నేటికాలంలో. కానీ దీనికి సంబంధించిన
శ్లోకం ఒకటి మన పూర్వులు చెప్పినది
చూడండి-

లలనాద్ బహవోదోషా స్తాడనాద్ బహవో గుణాః
తస్మాత్పుత్రం చ శిష్యం చ తాడయేన్న తులాలయేత్

లాలన(బుజ్జగించడం)వలన పిల్లలో చాలాదోషాలు
ఉత్పన్నములు అగును. దండించడం వలన చాల
గుణములు కలుగును. కావున సంతానాన్ని, శిష్యులను
దండించవలెనేగాని లాలించకూడదు - అని భావం.

భారవి వసంతర్తువు


భారవి వసంతర్తువు
సాహితీమిత్రులారా!


భారవి కిరాతార్జునీయమ్ లో
అర్జునుడు పాశుపతం కోసం ఇంద్రకీలాద్రిపై
తపస్సు చేసుకొనే సమయంలో
వసంతర్తు వర్ణన చూడండి-
దశమసర్గలో 31వ శ్లోకం నుండి
35వ శ్లోకం వరకు.


కుసుమనగవనాన్యుపైతు కామా
కిసలయినీమవలంబ్య చూతయష్టిమ్
క్వణఁదలికులనూపురా నిరాసే
నలినవనేషు పదం వసంతలక్ష్మీ - 31

పుష్పవనాలను చేరాలనే కోరికతో
వసంతలక్ష్మి చిగిర్చిన మామిడి
కొమ్మను పట్టుకొని తుమ్మెద రొద
అందెల ధ్వనికాగా పద్మవనాలను
వదలిపెట్టింది.

వికసితకుసుమాధరం హసంతీం
కురవక రాజీవధూం విలోకయంతమ్
దదృశురివ సురాంగనా నిషణ్ణం
సశరమనంగమశాకపల్లవేషు   -32

వికసించిన పువ్వులనే పెదవి
కదిలిస్తున్న గోరింట చెట్లనే
వధువును చూస్తూ కొత్తగా చిగిర్చిన
అశోక చెట్లపై బాణం ధరించిన మన్మథుణ్ణి
చూచినట్లు అప్సరాంగనలు చూచినట్టు భావించారు.

ముహురనుపతతా విధూయమానం
విరచితసంహతి దక్షిణానిలేన
అలికులమలకాకృతిం ప్రపేదే
నలినముఖాంతవిసర్పిపంకజిన్యాః  -33

మెల్లగా వీస్తున్న మలయానిలంతో
కదల్చబడిన తామరల ముఖాలనే
పద్మాలపై తుమ్మెదలు చేరి ముంగురుల
అందాన్ని కలిగించాయి.

శ్వసనచలితపల్లవాధరోష్ఠే
నవనిహితేర్ష్యమివావధూనయంతీ
మధుసురభిణి షట్పదేన పుష్పే
ముఖ ఇవ శాలలతావధూశ్చుంబే   -34

సాలవృక్షంకొమ్మ అనే వధువు పుష్పమనే ముఖాన్ని
చిగురు అనే పెదవిని, మకరందం అనే మధువును
కలదై గాలితో కదలుతుండగా కోపించినట్టుంది.
తుమ్మేద అనే ప్రియుడు మాటిమాటికి దాన్ని
సమీపించి కోపం తగ్గించేందుకు పుష్పాన్ని
మకరందం కోసం చేరటం ముద్దుపెట్టుకొన్నట్టు
భాసించింది.

ప్రభవతి న తదా పరో విజేతుం
భవతి జితేంద్రియతా యదాత్మరక్షా
అవజితభువనస్తథా హి లేభే
సితతురగే విజయం న పుష్పమాసః  - 35

జితేంద్రియత్వం ఎంతవరకు తనను రక్షిస్తుందో
అంతవరకు శత్రువు అతణ్ణి జయించలేడు.
ముల్లోకాలను జయించిన వసంతర్తువు
జితేంద్రియుడైన అర్జునుణ్ణి జయించలేకపోయింది.
వసంతర్తువు అర్జునుణ్ణి ఏ మాత్రం చలింపచేయలేదు.


ఈ విధంగా భారవి వసంతర్తువును వర్ణించాడు.

Tuesday, May 16, 2017

గోపికలనోట సినారె మాట


గోపికలనోట సినారె మాట
సాహితీమిత్రులారా!


మన జ్ఞానపీఠఅవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డిగారు
వాసుదేవ తత్వాన్ని గోపిలచే పలికించిన ఈ పద్యం
చూడండి-
గోపాలమౌళిపాదముద్రలు కనుగొన్న
గోపికల భావ పరంపరగా కూర్చిన
పద్యం ఇది చూడండి-


కిటి యై కౌఁగిటఁ జేర్చెను,
వటుఁడై వర్థిల్లి కొలిచె వడిఁ, గృష్ణుండై
యిటఁ బదచిహ్నము లిడెఁగ్రిం
దటి బామున నేమి నోఁచితమ్మ ధరిత్రీ

విష్ణువు వరాహమూర్తియై ధరిత్రిని
కౌగిట చేర్చుకున్నడు. వామనమూర్తియై
బ్రహ్మాండాన్ని కొలిచినాడు. శ్రీకృష్ణమూర్తియై
తనఅడుగు జాడలతో పుడమిని పునీతం చేసినాడు
ఓ భూమాతా గతజన్మలో నీవు నోచిన పుణ్యం ఇది-
అని భావం

నూరువురు వైద్యులు కూడివచ్చినా.....


నూరువురు వైద్యులు కూడివచ్చినా.....
సాహితీమిత్రులారా!


నూరువురు వైద్యులు కూడివచ్చినా
దైవనిర్ణయం మారదు ఏది జరగాలో
అదే జరుగుతుంది -
ఈ విషయాన్ని తెలిపే భర్తృహరి 
సుభాషిత పద్యం చూడండి-

శతభిషగాఢ్యుఁడ్యున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ
తతులకు నాథు డయ్యును, సుధారససేవధి యయ్యుఁ, దారకా
పతి దనరాజయక్ష్మభవబాధలఁ బాపగ నోపఁ డక్కటా
హతవిధికృత్య మెవ్వనికినైన జగంబున దాటవచ్చునేశతభిష అంటే నూరుగురువైద్యులు, నక్షత్రముపేరు.
చంద్రుని వెంట శతభిష నక్షత్రం ఉంటుందని దాన్నే
నూరుమంది వైద్యులు ఆయనతో ఉంటారని అర్థం.
అలాగే చంద్రుడు శివుని తలపై అలంకృతుడై ఉంటాడు.
ఓషధులకు రాజు, అమృతానికి నిధి, అయినప్పటికి
తనకు వచ్చిన క్షయరోగము తప్పినదా తప్పలేదుకదా
దైవ విధిని దైవనిర్ణయాన్ని దాటడానికి ఎంతటివారికి కూడ
సాధ్యంకాదు - అని దీనిభావం.

Sunday, May 14, 2017

ఆదిత్యహృదయము


ఆదిత్యహృదయముసాహితీమిత్రులారా!ఇది శ్రీమద్రామయణ యుద్ధకాండలో
అగస్త్యుమహర్షి శ్రీరామచంద్రునికి
ఉపదేశించినది-

దీన్ని పారాయణం చేసినవారికి
శత్రునాశము, ఆరోగ్యము,
ఐశ్వర్యప్రదము ఇలా
అనేకానేక ఉపయోగముకలవని
చెప్పుదురు. ఫలశ్రుతిలో గమనించగలరు.
సూర్యోదయ, మధ్యాహ్న,
సాయంకాలములందు
పారాయణము చేస్తారు

కావున
సాహితీమిత్రులు ఉపయోగించు
కొనగలరని
ఇక్కడ ఇస్తున్నాను.

తతో యుద్ధపరిశ్రాన్తం సమరే చిన్తయా స్థితమ్‌|
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్‌|| ౧||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్‌|
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః|| ౨||

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్‌|
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి|| ౩||

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్‌|
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్‌|| ౪||

సర్వమఙ్గలమాఙ్గల్యం సర్వపాపప్రణాశనమ్‌|
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్‌|| ౫||

రశ్మిమంతం సముద్యన్తం దేవాసురనమస్కృతమ్‌|
పూజయస్వ వివస్వన్తం భాస్కరం భువనేశ్వరమ్‌|| ౬||

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః|
ఏష దేవాసురగణాఁల్లోకాన్‌ పాతి గభస్తిభిః|| ౭||

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కన్దః ప్రజాపతిః|
మహేన్ద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః|| ౮||

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః|
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః|| ౯||

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్‌|
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః|| ౧౦|| 

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్‌|
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాణ్డ అంశుమాన్‌|| ౧౧|| 

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః|
అగ్నిగర్భోऽదితేః పుత్రః శఙ్ఖః శిశిరనాశనః|| ౧౨||

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః|
ఘనవృష్టిరపాం మిత్రో విన్ధ్యవీథీ ప్లవఙ్గమః|| ౧౩||

ఆతపీ మణ్డలీ మృత్యుః పిఙ్గలః సర్వతాపనః|
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్‌భవః|| ౧౪||

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః|
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోऽస్తు తే|| ౧౫||

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః|
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః|| ౧౬||

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః|
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః|| ౧౭||

నమః ఉగ్రాయ వీరాయ సారఙ్గాయ నమో నమః|
నమః పద్మప్రబోధాయ మార్తాణ్డాయ నమో నమః|| ౧౮|| or మార్తణ్డాయ

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే|
భాస్వతే సర్వభక్శాయ రౌద్రాయ వపుషే నమః|| ౧౯||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే|
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః|| ౨౦||

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే| or హరయే విశ్వకర్మణే
నమస్తమోऽభినిఘ్నాయ రుచయే లోకసాక్శిణే|| ౨౧||

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః|
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః|| ౨౨||

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః|
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్‌|| ౨౩||

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ|
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః|| ౨౪||

|| ఫల శ్రుతిః||
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాన్తారేషు భయేషు చ|
కీర్తయన్‌ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ|| ౨౫||

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్‌పతిమ్‌|
ఏతత్‌ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి|| ౨౬||

అస్మిన్క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి|
ఏవముక్త్వా తదాऽగస్త్యో జగామ చ యథాగతమ్‌|| ౨౭||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోऽభవత్తదా|
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్‌|| ౨౮||

ఆదిత్యం ప్రేక్శ్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్‌|
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్‌|| ౨౯||

రావణం ప్రేక్శ్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్‌|
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోऽభవత్‌|| ౩౦||

అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః|
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి|| ౩౧||
|| ఇతి ఆదిత్యహృదయమ్ || 

Saturday, May 13, 2017

శాన్తి మంత్రములు -1


శాన్తి మంత్రములు -1
సాహితీమిత్రులారా!


శాన్తిమంత్రాలనే పేరు వింటూంటాము
అవి ఏమిటి వాటి అర్థం ఇక్కడ తెలుసుకుందాం-

ఓమ్ 
శంనోమిత్రః శంవరుణః 
శంనోభవత్వర్యమా
శం న ఇన్ద్రో బృహస్పతిః 
శంనో విష్ణు రురుక్రమః
నమో బ్రహ్మణే నమస్తే వాయో 
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మవదిష్యామి
ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి
తన్మామవతు తద్వక్తారమవతు
అవతు మాం అవతు వక్తారమ్
ఓం శాంతి శ్శాంతి శాంతిః

అర్థం -
సూర్యుడు మాకు సుఖమును కలుగజేయుగాక!
వరుణుడు మాకు సౌఖ్యమును ఒసగుగాక!
అట్లే ఆర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి,
విశాలరూపుడగు విష్ణువు మాకు సుఖమును
కలుగజేయుదురుగాక!
బ్రహ్మస్వరూపమైన వాయువునకు నమస్కారము
ఓ వాయువా! నీవే ప్రత్యక్షమైన బ్రహ్మస్వరూపము
కాన నిన్నే ప్రత్యక్షమైన బ్రహ్మస్వరూపంగా చెప్పగలను
నిన్ను ఋతుస్వరూపముగను చెప్పగలము.(శాస్త్రమును,
కర్తవ్యమును అతిక్రమించకుండా బుద్ధియందు లెస్సగ నిశ్చితమగు
అర్థమును ఋతము అనబడును). సత్యస్వరూపముగను వచింపగలము
ఆ బ్రహ్మము నిన్ను రక్షించునుగాక! ఆచార్యుని రక్షించుగాక!
ప్రణవస్వరూపమగు ఓ పరబ్రహ్మమా ఆధ్యాత్మిక, ఆధిభౌతిక,
ఆధిదైవిక తాపములు శమనమగుగాక!


కవిసమయములు - 2


కవిసమయములు - 2
సాహితీమిత్రులారా!
కవిత్వము వ్రాయువారికి అంటే కవులకు 
ఇవి తప్పక తెలిసి ఉండవలెను

ఈ క్రింది వస్తువులందు లేని ధర్మమును 
నిబంధించ వచ్చును -

1. నదులలో పంకజనీలోత్పలములు లేకున్నను వర్ణించ వచ్చు
2. ప్రతి తటాకములో హంసలు లేకున్నను వర్ణించ వచ్చు
3. ప్రతి పర్వతము నందు బంగారము, రత్నములు, గజములు,
   లేకున్నను వర్ణించ వచ్చు
4. చీకటిని పిడికిటితో పట్టవచ్చని. సూదులతో భేదింపవచ్చని
   వర్ణించవచ్చు
5. ఆకాశగంగలో దిగ్గజములు స్నానమాడుచున్నట్లు వర్ణించవచ్చు
6. ప్రతాపమున రక్తత్వము, ఉష్ణత్వమును వర్ణించవచ్చు.
7. వెన్నెల దోసిళ్లతో దీసి ఎత్తవచ్చని, కడవలతో ముచుకొని పోవచ్చని
   వర్ణించ వచ్చు.
7. పురాతనుడైనను శివుని శిరశ్చంద్రుని బాలునిగా వర్ణించ వచ్చు
9. కీర్తిని, పుణ్యమును, హాసమును తెల్లగా వర్ణించ వచ్చును.
10. అపకీర్తిని, పాపమును నల్లగా వర్ణించ వచ్చు.
11. కోపమును, అనురాగమును ఎఱ్ఱగా వర్ణించ వచ్చు.
12. స్త్రీకి రోమావళి, త్రివళులు లేకున్నా వర్ణించ వచ్చు.
13. చక్రవాక దంపతులకు రాత్రి వియోగము గలుగునట్లు
    వర్ణించ వచ్చు.
14. చంపక భ్రమరములకు విరోధమున్నట్లు వర్ణించ వచ్చును.

Thursday, May 11, 2017

గతి నింపలరెన్ బళి దృగ్విలాసమై


గతి నింపలరెన్ బళి దృగ్విలాసమై
సాహితీమిత్రులారా!రోసనూరు వేంకటపతి కృత
విష్ణుమాయా విలాసములోని
ఈ పద్యం చూడండి-

విష్ణులోకంలో ఒక తిన్నెమీద మోహినిగా బంతి ఆడుతూ
శివుడికి పునర్దర్శనమిస్తాడు శ్రీహరి. పైకి ఎగిరిన బంతిని
చేత్తో పట్టుకోవడానికి ఆ వగలాడి మోహిని ఎగిరింది. అలా
ఎగిరిన ఆమె మేను బైరిడేగలాగా చూడడానికి చూపరులకు
కనువిందు చేసింది.
ఆ సందర్భములోని పద్యం ఇది చూడండి-

ఎగసిన బంతిఁజేనొడియ నీ వగలాఁడి చెలంగఁ బొంగు మే
నొగి యల బైరిడేగవలె నుండెడి గుత్తపు గుబ్బ లప్పుడా
మొగమున కొక్కమై నెగయు ముచ్చట చన్గవ జక్కవల్వడి
న్నెగిరి చనంగఁబోవుగతి నింపలరెన్ బళి దృగ్విలాసమై
                                                                                   (విష్ణుమాయా విలాసము - 3- 32)

ఆమె ఎగిరినపుడు గుత్తపు గుబ్బలుకూడ ఒక్కసారిగా
ముఖంవైపు ఎగిరి పడ్డాయి. ఆ ముచ్చట ఎలా ఉందంటే
వక్షోజాలు చక్రవాక పక్షులుకాబట్టి సహజంగానే అవి ఎగిరి
వెళ్ళిపోతున్నాయా అన్నట్లు ఇంపు గొలిపాయి. బళిబళీ
మొత్తంమీద ఆ యువతి చూపరులకు
ఒక దృగ్విలాసంమయ్యింది - అని భావం

ఇందులో కవి వర్ణన కంటికి కట్టినట్లు
ఎంతచక్కగా ఉందో కదా

రామభద్రుని సంధ్యారాగం


రామభద్రుని సంధ్యారాగం
సాహితీమిత్రులారా!

అయ్యలరాజు రామభద్రుని
రామాభ్యుదయంలోని
సంధ్యారాగం చూడండి-

కవికల్పనకు అంతుండదేమో
ఒక్కొక్కరికి ప్రకృతి ఒక్కొక్కలా
కనిపిస్తుంది దాన్ని వారు వర్ణించే
విధానం మహాద్భుతం
ఇక్కడ అచ్చతెలుగుపలుకులతో
ఒలికిన కవిత చూడండి-

తొట్టుకొని సంజ కెం ప
ప్పట్టున రవి బాసి సితగభస్తి నెదురుకో
నట్టె సిరి వచ్చుటకునై
పట్టిన కెంబట్టు దిడ్డి పాలకిఁ బోలెన్
                                                 (రామాభ్యుదయము - 2- 92)

ఎర్రదనం పడమటి దిక్కున అఏంతటా వ్యాపించి ఉంది.
అది ఎలావుందంటే ఎర్రటి పట్టుతెరలు కట్టిన పల్లకిలా
ఉందని అయ్యలరాజు రామభద్రుని ఊహ.

ఈ ఎర్రటి పల్లకీ ఎవరికోసం పుట్టిందంటే - చెబుతున్నాడు
సూర్యుని పని అయిపోయింది. అస్తమించాడు లేదా
అధికారం కోల్పోయాడు. ఇప్పటిదాకా అతన్ని వెన్నంటి ఉన్నశోభ
తక్షణం అతణ్ని విడిచి పెట్టేసింది. ఇలా రవిని విడిచి లేదా
వీడ్కోలు పలికి ఆ శోభ ఇప్పుడింకా పుట్టని అధికారంలోనిరాని
ఉదయించబోతున్న తెల్లనికిరణాల చంద్రుణ్ని ఆహ్వానించడానికి
ఎదురుకోలు పలకడానికి త్వరగా అట్టే తూర్పు దిక్కురావాలి.
సిరి అలా తరలిరావడం కోసం సిద్ధపరచిన ఎర్రతెరల పల్లకీలా
ఉంది ఈ సంజెకెంపు- అని భావం.

ఏమి ఊహ.............. ఏమి ఊహ.......

Wednesday, May 10, 2017

ఎంతవారుగాని వేదాంతులైనగాని


ఎంతవారుగాని వేదాంతులైనగాని
సాహితీమిత్రులారా!ఎంతవారుగాని వేదాంతులైనగాని
వాలుచూపు సోకగానె సోలిపోదురో -
అని ఒక సినీమాలో పాట

శివపల్లి సర్వోత్తమ కవి గారి
లక్షినారాయణ పరిణయములో
క్షీరసాగర మథనం తరువాత
అమృతాన్ని పంచే సమయంలో
అసురులను మోహిని ఏవిధంగా
మోహింప చేసిందో ఈ పద్యంలో
వర్ణించారు చూడండి -

వలుద గుబ్బలు సూపి వలపించుఁగొందఱిఁ
             జేసన్నఁ గొందఱి నాసకొల్పుఁ
జెక్కుల తళుకులఁ జొక్కించుఁ గొందఱి
             కనుగిల్పి కొందఱిఁ గాకు సేయు
వాతెఱ జిగిఁ జూపి వాకట్టుఁగొందఱి
             మాటలఁగొందఱి మరులు కొల్పు
జింక చూపులచేతఁ జిక్కించుఁగొందఱిఁ
             జేష్టలఁ గొందఱి జిక్కు వఱచుఁ
గలికి నగవునఁ గొందఱి వలలఁబెట్టు
కక్షకాంతులఁ గొందఱిఁ గరగఁజేయు
సురల కమృతంబు వడ్డించుచోఁ గడంగి
యసురపంక్తుల వంచించు నవసరమున

గుండ్రటి గుబ్బల్ని ప్రదర్శించి అసురులకొంరని
వలపించింది. చేతి సంజ్ఞలతో కొందరికి ఆశలు
పుట్టించింది. చెక్కిళ్ళకాంతులతో కొందరిని మై
మరిపించింది. కన్నుగీటి కొందరిని చికాకు పెట్టింది.
క్రిందిపెదవి మెరుపును చూపించి కొందరిని నోటమాట
రాకుండా చేసింది. మాటలతో కొందరిని మరులుకొనేట్టు
చేసింది. అమాయకమైన లేడిచూపులతో కొందరిని
చిక్కించుకొంది. ఇంకా ఏవేవో చేష్టలతో కొందరిని చిక్కుల్లో
పడగొట్టింది. గడసరి నవ్వులతో కొందరిని తన వలలో
చిక్కుకునేలా చేసింది. బాహుమూలరుచులతో కొందరిని
కరిగిపోయేలా చేసింది. మొత్తంమీద అసురులందరినీ
అవాక్కులను చేసింది.
అంతటి జగన్మోహనరూపమే వలపిస్తే
మరులుకొననివాడవడు.

సురుచిర తారకాకుసుమ శోభి


సురుచిర తారకాకుసుమ శోభి
సాహితీమిత్రులారా!


వర్ణనలలో ప్రబంధ పరమేశ్వరుని
సంధ్యారాగ వర్ణన చూద్దాం-
ప్రబంధాలకు మూలమైన
వర్ణననలు చేసిన ఎఱ్ఱాప్రెగ్గడవారి
నృసింహపురాణంలోని ఈ పద్యం చూద్దాం-
సంధ్యాసమయంలో
పశ్చిమదిక్కున వ్యాపించే ఎర్రదనాన్ని
సంధ్యారాగం అంటారు.
ఇక్కడ కవిగారి ఊహను చూడండి
ఎంత అద్భుతంగా ఉందో-

సురుచిరతారకాకుసుమ శోభి నభోంగణ భూమిఁ గాలమ
న్గరువపు సూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్
సరసముఁగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్తతోఁపుఁ బెం
దెరయన నొప్పు సాంధ్య నవ దీధితి పశ్చిమ దిక్తతటంబు నన్
                                                                                  (నృసింహపురాణము -3-78)

ఆకాశం అనే వేదిక కాంతిమంతాలైన నక్షత్రాలనే పువ్వులతో
అలంకరింపబడి ఒప్పెసలారుతోంది. ఈ వేదిక మీద రాత్రి
అనే స్త్రీ సరసంగా - సకల దిక్కుల అధిపతుల ముందర
నటించబోతోంది రంగస్థలం లోపల ఆరాత్రి అనబడే స్త్రీ
(నిశాసతి). వెలుపల సభలో దిక్పతులు. ఈ కార్యక్రమం
మొత్తానికి ఒక సూత్రధారి(దర్శకుడు) ఉంటాడు.
అతడు కాలము అనే గొప్ప సూత్రధారి. ఇతడు
ప్రయత్నపూర్వకంగా నట్టువరాలు ప్రేక్షకులకు
అప్పుడే కనబడకుండా సదరు నిశాసతికి అడ్డుగా
ఒక తెర ఎత్తిపట్టుకున్నాడు. ఆ తెరకొత్తదీ ఎర్రదీ
పెద్దదీ. అదే - సంధ్యాసమయంలో కనపించే
ఎర్రదనపు వెలుగుసుమా
ఈ విధంగా సంధ్యారాగం ఒప్పుతోందని.


బుద్దపౌర్ణిమ శుభాకాంక్షలు


బుద్దపౌర్ణిమ శుభాకాంక్షలు
సాహితీమిత్రులకుశ్రేయోభిలాషులకు
బుద్ధగవానుని జన్మదిన శుభాకాంక్షలు

Monday, May 8, 2017

మానవుఁడేమి సుఖింపఁగల్గెడిన్


మానవుఁడేమి సుఖింపఁగల్గెడిన్
సాహితీమిత్రులారా!

ఈ చమత్కార పద్యం చూడండి-
ఇష్టములేనివానికి కవిత్వం చెప్పడం
ఎలాంటిదో ఒకకవి ఈ పద్యంలో వివరించాడు.

సరసులుగానివారియెడఁ జాలఁగవిత్వరసప్రసంగముల్
కఱచుట కంఠశోషణమెకాక రసజ్ఞతకల్గ నేర్చునే
స్మరశరజాలవేదనకుఁ జాలక భ్రాంతిని ఱాతి బొమ్మతో
మరఁగిరమింపఁగాఁదివిరి మానవుఁడేమిసుఖింపఁగల్గెడిన్

సరసులుకానివారికి కవిత్వం చెప్పటం
రసప్రసంగాలు చేయడం కంఠశోష తప్ప
మరేమీకాదట అవివినంగానే రసజ్ఞత
పుడుతుందాయేమి పుట్టదుకదా
మన్మథబాణాలదెబ్బకు భ్రాంతితో
కోరి రాతి బొమ్మతో కలిసినట్లుంది
ఆ మానవుడు ఏమిసుఖం పొందగలడు

కాబట్టి సరసుడైన వానికే కవిత్వం వినిపించడం
రసభాషణం చేటడం మంచిది అని భావం.

Sunday, May 7, 2017

సారపుధర్మమున్ విమల సత్యము


సారపుధర్మమున్ విమల సత్యము
సాహితీమిత్రులారా!తెలుగువారు క్లిష్టసమయాల్లో భగవంతుడు
వాటిని చక్కదిద్దటాని వస్తాడు
అని చెప్పటానివాడే పద్యం ఇది-

శ్రీకృష్ణుడు పాండవదూతగా కౌరవసభకు
వెళ్లినపుడు ధృతరాష్ట్రునితో పలికిన
పలుకులలోని ఒక పద్యం ఇది-

సారపుధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచేఁ
బారముబొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు
లెవ్వారలుపేక్ష సేసిరది వారల చేటగుగాని ధర్మ ని
స్తారక మయ్యు సత్యశుభదాయమయ్యును దైవముండె డున్
                                                                      (శ్రీమదాంధ్రమహాభారతము - 5 - 273)ఈ పద్యం పాండవదూతగా
కురుసభలో కృష్ణుడు చెబుతున్నది.
ఉత్తమమైన ధర్మం
నిర్మలమైన సత్యం
పాపముచేతను, అబద్ధంచేతను,
దరిచేరలేక చెడటానికి సిద్ధంగా
ఉన్నసమయంలో వాటిని రక్షించే శక్తి
ఉన్నా ఎవరు అడ్డుపడక ఉపేక్షిస్తారో
అది వారికే చేటవుతుంది
ఆ స్థితిలో భర్మరక్షణకు
సత్యానికి శుభంకలిగించటానికి
భగవంతుడు వస్తాడు-
అని భావం.

మోదమటే మదహంసగామినీ


మోదమటే మదహంసగామినీ
సాహితీమిత్రులారా!అజ్ఞాతకవి చెప్పిన
ఈ నీతి పద్యం చూడండి-

అంగనలేనియిల్లు చతురంగబలంబులులేనిరాజు ని
స్సంగుఁడుగాని మౌని జనసమ్మతిలేని ప్రధాని కామినీ
సంగములేని యౌవనము శాంతములేనితపంబు స్త్రీలకున్
ముంగరలేనిభూషణ మోదమటే మదహంసగామినీ

ఓ మదహంసగామినీ!
ఇంటికి దీపం యిల్లాలని కదా ఆ యిల్లాలు లేని ఇల్లు,
చతురంగబలాలుంటేనే రాజు ఆ బలములులేని రాజు,
నిస్సంగుడైతేనే మౌని మరి నిస్సంగత్వం లేని మౌని,
కామినీజన సంగమానికే కదా యౌవనము అదిలేని యౌవనము,
తాపసికి శాంతముండాలికదా ఆ శాంతములేని తాపసి,
స్త్రీ ముఖానికి ముక్కెరే భూషణము అదిలేని భూషణాలు
సమ్మతమేనా - అని భావం.
అవి పనికిరాని తాత్పర్యం.

Saturday, May 6, 2017

ఇవి ఉన్నవాని యందు దేవుడుంటాడు


ఇవి ఉన్నవాని యందు దేవుడుంటాడు
సాహితీమిత్రులారా!


ఏగుణాలుంటే దేవుడుంటాడో
ఈ పద్యం వివరిస్తున్నది
చూడండి-

వినుముత్సాహము, సాహస
మును, ధైర్యము, విక్రమంబు, బుద్ధియు శక్తుల్
దనరు నరునందు దేవుం
డనయముఁ గలఁడనుచు వినిచిరార్యులు వత్సా!

ఓ బిడ్డా,! ఉత్సహము, సాహసము, ధైర్యము,
పరాక్రమము, బుద్ధి, శక్తి అనే ఈ ఆరు గుణాలు
కలవానియందు దేవుడు కలడని పెద్దలు చెప్పిరి-
అని భావం

సముద్రవసనే దేవీ


సముద్రవసనే దేవీ
సాహితీమిత్రులారా!మనం మన సాంప్రదాయంలో
నిద్రలేవగనే
మంచపైనుండి
కాలు క్రింది పెట్టేముందు
భూమిని తాకి ఈ విధంగా అనుకొని
కళ్లకద్దుకోవాలి-

సముద్రవసనే దేవీ పర్వత స్తనమండితే
విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

సముద్రం వస్త్రముగా ధరించిన ఓ భూదేవీ
మాకోసం పర్వతాలనే స్తనాలుకలిగిన
విష్ణుపత్ని నీకు నమస్కరిస్తున్నాను
నీకు నాపాదాలు తాకిస్తున్నందుకు
నన్ను క్షమించు - అని భావం.

Friday, May 5, 2017

ఇవి గొప్ప తపస్సుచేగాని లభించవు


ఇవి గొప్ప తపస్సుచేగాని లభించవుసాహితీమిత్రులారా!ఈ శ్లోకాన్ని చూడండి-
భగవంతుని కృప
ఎంతయో తెలుపుతుంది-

భోజ్యం భోజన శక్తిచ్చ 
రతిశక్తిర్వరాంగనా
విభవో దానశక్తి చ్చ
నాల్పస్య తపసః ఫలమ్

మంచి భోజన పదార్థము లభించుటయు
లభించిన దాన్ని జీర్ణించుకొనే శక్తీ,
అందమైన భార్య దొరకటం
దొరికిన ఆమెతో హాయిగా భోగమును
అనుభవించు కామశక్తి కలిగి ఉండటం,
సంపదను కలిగి ఉండటం
కలిగిన సంపదను దానం చేయగల
బుద్ధిని కలిగి ఉండటం
అనేవి అల్పమైన విషయాలుకావు
అల్పతపస్సుతో దొరికేవికావు
గొప్పతపస్సంపన్నుడై ఉండవలె.
-అని భావం.


సంస్కృతంలో దండక భేదాలు


సంస్కృతంలో దండక భేదాలు
సాహితీమిత్రులారా!

మనం  సంస్కృతదండకము ఎక్కువగా విన్నది
కాళిదాసు శ్యామలాదండకమని చెప్పవచ్చు.
దండకాలు సంస్కృతంలో చాలారకాలున్నాయి
అవి ఇక్కడ గమనిద్దాం-

ఛందఃశాస్త్రకారులు -
పింగళుడు, కేదారభట్టు, గంగాదాసు, హేమచంద్రుడు, జయకీర్తి
మొదలైన వారు చెప్పిన దండకఛందో భేదాలు వాటిపేర్లు ఇక్కడ
తెలుసుకుందాము.

1. చండవృష్టి ప్రయాతము -  2 నగణాలు 7 రగణాలు
2. అర్ణ -                                       2 నగణాలు 8 రగణాలు
3. అర్ణవ                -                    2నగణాలు 9రగణాలు
4. వ్యాళ                                    2నగణాలు 10రగణాలు
5. జీమూత                                2నగణాలు 11రగణాలు
6. లీలాకర                                 2నగణాలు 12రగణాలు
7. ఉద్దామ                                 2నగణాలు 13రగణాలు
8. శంఖ                                     2నగణాలు 14రగణాలు
9. ఆరామ                                  2నగణాలు 15రగణాలు
10 సంగ్రామ                               2నగణాలు 16రగణాలు
11. సురామ                                2నగణాలు 17రగణాలు 
12. వైకుంఠ                             2నగణాలు 18రగణాలు
13. సార                                    2నగణాలు 19రగణాలుి
14. కాసార                               2నగణాలు 20రగణాలు
15. విసార                              2నగణాలు 21రగణాలు
16. సంహార                             2నగణాలు 22రగణాలు
17. నీహార                              2నగణాలు 23రగణాలు
18. మందార                       2నగణాలు 24రగణాలు
19. కేదార                           2నగణాలు 25రగణాలు
20. ఆసార                          2నగణాలు 26రగణాలు
21. సత్కీర                         2నగణాలు 27రగణాలు
22. సంస్కార                         2నగణాలు 28రగణాలు
23. మాకంద                      2నగణాలు 29రగణాలు
24. గోవింద                       2నగణాలు 30రగణాలు
25. సానంద                     2నగణాలు 31రగణాలు
26. సందోహ                    2నగణాలు 32రగణాలు
27. ఆనంద                      2నగణాలు 33రగణాలు

కేదార భట్టు చెప్పిన దండక భేదము-

2 నగణాలు  త - గణములు(వీటికి పరిమితిలేదు)


గంగాదాసు చెప్పిన దండక భేదాలు-

1. ప్రచికత సుమభిధ     -                 2 నగణాలు 7 యగణాలు

2. కుసుమ స్తబకము                          అన్నీ సగణాలే(9కిపైన)

3. మత్తమాతంగ లీలాకరము -       అన్నీ ర గణాలే(9కి పైన)

4. అనంగశేఖరము       -                  1లఘువు 1 గురువు చొప్పున 27
                                                            అక్షరాలకు తక్కువగాకుండా ఉండాలి.
5. అశోకపుష్పమంజరి/
   జగత్యశోకమంజరి                      1రగణము, 1జగణము చొప్పున
                                                             9 గణములకు తక్కువకాకూడదు.

6. సింహ విక్రాంతము                     అన్నీ య గణాలే (9కిపైన)

హేమచంద్రుని దండకభేధము
1. కామబాణము              అన్నీ త గణాలే చివర 
                                          గగ లతో               
                                           అంతము (9కి పైన)

జయకీర్తి దండక భేదము-
గద్యదండకము               పాదాక్షర నియమరహితమైన 
                                            గణములతో చెప్పబడే దండకాలన్నీ
                                             గద్యదండకాలే.

Thursday, May 4, 2017

పోతన సరస్వతీదేవి ప్రార్థన


పోతన సరస్వతీదేవి ప్రార్థన
సాహితీమిత్రులారా!


పోతన భాగవతంలో
మొదట సరస్వతీదేవిని
ప్రార్థిన ఈ పద్యం చూడండి-

పుట్టం బుట్టి శిరంబునన్ మొలవ, నంభోపాత్రంబునన్
నెట్టం గల్గును, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతు దత్సరణి నా కీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ నాకగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ దయాంభో నిధీ

అమ్మా! సరస్వతీదేవీ! నేను తలపై పుట్ట
పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు.
పడవలో పుట్టిన వ్యాసుడను కాను.
కాళికను కొలిచిన కాళిదాసునికాను.
అయినా భాగవత పురాణాన్ని తెనిగంచటానికి
పూనుకొన్నాను. ఏం చెయ్యాలో, ఏమీ తోచటంలేదు.
ఇటువంటి సమయంలో ఎటువంటిమార్గము అవసరమో
అది నీవే నాకు అనుగ్రహించి నాచేయి పట్టుకొని
నడిపించు, ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లీ!
నీవే ఆధారం. నాకు తెలుసు తల్లీ నీ కరుణ అపార పారావారం-
అని భావం

దీనిలో పోతన తన నిజమైన భావనను వ్యక్తం చేస్తున్నాడు
నేను వాల్మీనికాను, వ్యాసుని కాను, కాళిదాసుని కాను
ఏదో ఈ పని చేయాలని పూనుకొన్నాను నీకృపతో
నాకుదారిచూపమని దైవంమీ భారం వేశాడు తనపని తాను చేశాడు.
అదీ పోతన

దండకము - 1


దండకము - 1
సాహితీమిత్రులారా!


దండకము అనే సాహిత్యంలో ఒక ప్రక్రియ.
మొదట్లో దేవతా స్తోత్రాలుగా ఉండేవి.
మన తెలుగులో మొదటి దండకం
పాశుపతాస్త్రం కోసం అర్జునుడు చేసిన శివస్తోత్రం.
ఇది నన్నయగారు అరణ్యపర్వం(1-324)లో రచించారు.

ఆ దండకం చూడండి-
ఇది త-గణ దండకం

శ్రీకంఠ, లోకేశ, లోకోద్భవస్థాన సంహారకారీ, పురారీ,  మురారి ప్రియా, చంద్రధారీ, మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి, పుణ్యస్వరూపా, వురూపాక్ష, దక్షాధ్వరధ్వంసకా, దేవ, నీదైన తత్వంబు
భేదించి బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన, సర్వేశ్వరా, శర్వ, సర్వజ్ఞ, సర్వాత్మకా, నిర్వికల్ప ప్రభావా, భవానీపతీ, నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై తాదిదేవా, మహాదేవ, నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిర్మలజ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధరాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహధ్యాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్చులై నిత్యులై రవ్యయా, భవ్య, సేవ్యా, భవా, భర్గ, భట్టారకా, భార్గ వాగస్త్య కుత్సాది నానామునిస్తోత్ర దత్తావధానా, లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ, భస్మానులిప్తాంగ, గంగాధరా,
నీ ప్రసాదంబునన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధసాధ్యోరగేంద్రా సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా, విశ్వకర్తా, సురాభ్యర్చితా, నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ
త్రిలోకైక నాథా నమస్తే నమస్తే నమః

ఇది మన తెలుగులోని మొదటి దండకము