Sunday, December 31, 2017

గరుత్మంతునికి తల్లి దీవెన


గరుత్మంతునికి తల్లి దీవెన 
సాహితీమిత్రులారా!గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని
గురించిన మాటలను విని
వెళ్ళి నాగులతో ఈ విధంగా అన్నాడు-

మా యీ దాస్యము వాయును
పాయము సేయుండు నన్ను బనుపుం డిష్టం
బేయది దానిన తెత్తున
జేయుఁడనై యమరవరులఁజేకొని యైనన్

(నాతల్లి యొక్క, నాయొక్క దాసితనం పోవటానికి
ఆలోచన చేయండి. నన్ను ఆజ్ఞాపించండి.
దేవశ్రేష్ఠులను లోబరచుకొనియైన మీకిష్టమయినదాన్ని
విజయంపొంది తెచ్చిస్తాను)

అపుడు ఆ నాగులు కరుణించి
గరుత్మంతునితో ఇలా అన్నారు-

అమితపరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు నీదయిన దాస్యముఁ వాపికొనంగ నీకుఁ జి
త్తముగలదేని భూరిభుదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియిమ్మనిన నవ్విహగేంద్రుడు సంతసం బునన్

(నీవు అంతులేని విక్రమమును, వేగాన్ని బలాన్ని కలిగిన
పక్షిశ్రేష్ఠునివి. నీకు గలిగిన దాస్యాన్ని పోగొట్టుకోవాలనే
అభిప్రాయం ఉంటే గొప్ప భుజాల గర్వమును శక్తిని కలిగేట్టు
మాకు అమృతం తెచ్చివ్వు అని పాములనగా,
ఆ పక్షీంద్రుడైన గరుత్మంతుడు సంతోషంతో.........)

అలాగే చేస్తాను అని చెప్పి జరిగిన వృత్తాంతాన్నంతా
తన తల్లి అయిన వినతకు వివరించి చెప్పి అమృతం
తేవడానికై వెళుతున్నాను న్ను దీవించమని తల్లిపాదాలకు
నమస్కరించిన వినత సంతోషించి కొడుకును కౌగిలించుకొని
తరువాత ఇలా దీవించింది-

అనిలుడు పక్ష్మయుగ్మ మమృతాంశుఁడు వీపనలుండు, మస్తకం
బినుఁడు సమస్త దేహమును నెప్పుడుఁగాచుచు నీకభీష్ట ముల్
ఘనముగఁ జేయుచుండెడు జగన్నుత యున్నతియున్ జయంబుఁజే
కొనుమని యిచ్చె దీవెనలు గోరి ఖగేంద్రునకుం బ్రియం బునన్

(వాయువు రెక్కల జంటని, చంద్రుడు వీపును, అగ్ని తలను,
సూర్యుడు శరీరాన్నంతటిని సర్వదా రక్షించుచు, నీకు కోరికలు
గొప్పగా(నెరవేరునట్లు) చేయుదురుగాక, లోకములచే నుతింప
బడువాడా గొప్పతనమును విజయమును గ్రహింపుము -
అని వినత మనస్సున కోరి పక్షులకు రాజైన గరుడునికి
ప్రీతితో ఆశీస్సు లిచ్చిపంపెను)

అలా వెళ్ళిన వాడు దేవతలను జయించి అమృతం
తెచ్చి పాములకు ఇచ్చి దాసీత్వాన్ని పోగొట్టుకున్నాడు.
తల్లిదీవెన ఎంతో గొప్పదోకదా!

(ఆంధ్రమహాభారతం ఆదిపర్వం ద్వితీయోశ్వాసం నుండి )

Saturday, December 30, 2017

బ్రహ్మశిరము పగలబడి నవ్వుచున్నది


బ్రహ్మశిరము పగలబడి నవ్వుచున్నది
సాహితీమిత్రులారా!


తమిళవాఙ్మయంలో భక్తిసాహిత్యంలో
"తిరునావుక్కరసర్" అనే మహాకవికి
ప్రముఖ స్థానం వుంది.
ఈ కవిగారు పల్లవరాజైన
మొదటి మహేంద్ర వర్మ కాలంవాడంటారు.
ఈ మహాకవి 49వేల గీతములను పాడినట్లు
చెబుతుంటారు. ఈ కవి మహాదేవుని నుతించిన
ఈ గీతం చూడండి-
ఇందులో ఆ దేవాధిదేవుడు శివుడు గంగను,
ఆదిశేషుని, చంద్రరేఖను, బ్రహ్మకపాలాన్ని
ధరించినాడు. ఈ వస్తువులను చూచి
ఎంత చమత్కారంగా వర్ణించాడో తెలుస్తుంది.

కిడన్దపామ్ పరుగు కణ్డరివై పేదుర
క్కిడన్ద పామ్బవళై యోర్ మయిలెన్డైయుర
కిడన్ద నీర్జడైమిశైప్పిరైయు మేఙ్గువే
కిడన్దు తాన్ నగుదులై క్కెడిల వాణరే

శివుని జటాజూటమునగల గంగ ఒక అబల,
వక్షముపై యధేచ్ఛగా పడగెత్తే సర్పాన్ని చూచి
తాను అబల అవడంచే భీతచిత్తయైంది.
కాని ఆ సర్పము కేశపాశావృతమైన గంగను చూచి
తనను చీల్చటానికి పురివిప్పిన నెమలిగా భావించి
వగలబొగులుచున్నది. ఆ బాధతో ఉన్న పామును
చూచి చంద్రుడు తనను కబళించటాని వచ్చే రాహువేమో
అని కలతపడుచున్నాడు. ఈ దృశ్యాలన్నీ చూస్తున్న
బ్రహ్మశిరస్సు పగలబడి నవ్విందట స్వభావంచే విరుద్ధములైన
వానిని కూడ ఒకచో సమీకరించిన మహాత్ముడా మహాదేవుడు
అనుట కవి అభిప్రాయం.


Friday, December 29, 2017

ద్రౌపదాదిత్యుడు


ద్రౌపదాదిత్యుడుసాహితీమిత్రులారా!
ఆదిత్యుడు అంటే సూర్యుడు
కాశీనగరంలో 12 రకాల పేర్లతో
12 సూర్యులున్నారు. వారిలో
ద్రౌపదాదిత్యుడు ఒక సూర్యుడు.
ఇంతకు ఈ ఆదిత్యుని ప్రత్యేకతేమి
అంటే - ఈ విషయం గమనించాల్సిందే

దుష్టశిక్షణకోసం, శిష్టరక్షణకోసం శివుడు
ఈ భూలోకంలో పంచపాండవులుగా
అవతరించాడు. భవాని ద్రుపదరాజపుత్రిగా
ఆవిర్భవించి వారిని పరిగ్రహించింది.
సుఖంగా ఉండగా పాండవుల పెద్దతండ్రి
కుమారుడైన దుర్యోధనుడివల్ల కష్టదశ వచ్చి
అడవుల్లో కాలం గడపాల్సి వచ్చింది
అజేయులైన పతులకష్టాలు చూడలేక లోలోపల
పరితపిస్తూ ద్రౌపది ఎట్లో కాలం గడుపుతూ ఉంది.
ఒకరోజు పతుల అనుమతితో వాణాసికి వెళ్ళి
అక్కడున్న ఆదిత్యుని కొలువసాగింది.
ఆమె ఆరాధనకు మెచ్చిన సూర్యుడు
ప్రత్యక్షమై ఒక అక్షయమైన అన్నపాత్రను
ఒక గరిటను ఇచ్చి, పాంచాలీ ఎంతమంది 
అన్నార్థులు వచ్చినా రుచికరములైన భోజన 
పదార్థాలనిస్తుంది ఈ పాత్ర. అయితే ఒక్క
నియమం. అతిథులు అందరూ తిన్నతరువాత
నీవు భుజించాలి ఒక్కఅతిథి అయినా మిగిలి ఉండగా
నీవు తిన్నావో! అంతే ఈ పాత్ర రిక్తపాత్ర అయిపోతుంది
ఇంకోవరం ఇస్తున్నాను విను. శ్రీవిశ్వేశ్వరునికి 
దక్షిణభాగంలో నువ్వు సేవించిన నన్ను ఆరాధిస్తే,
వారికి ఆకలి దప్పులుండవు. ఆరోగ్యం లోపించదు.
మరోవరం ఇస్తున్నాను అదేమంటే ఇక్కడ నన్ను
సేవించడానికి ముందు నిన్ను ధ్యానించి సేవించి,
నన్ను అర్చించేవారు నీ పాతివ్రత్యమహిమవల్ల
సర్వరోగవిముక్తులౌతారు - అని వరాలిచ్చాడట.
అందుకే ఈ సూర్యుని ద్రౌపదాదిత్యుడంటున్నారు.

(ఇది కాశీఖండాన్ని అనుసరించి చెప్పిన విషయం)

Thursday, December 28, 2017

భూపతిఁజంపితిన్ మగఁడు భూరి......


భూపతిఁజంపితిన్ మగఁడు భూరి......
సాహితీమిత్రులారా!కాశీమజిలీ కథల్లో మణిసిద్ధుడు, గోపడు ఇద్దరూ ఊరూరూ
మజిలీలు చెస్తూ వెళుతున్నారు కాశీకి. మధ్యలో కనపడ్డ
వింతలు విశేషాలూ వివరిస్తున్నాడు గోపనికి మణిసిద్ధుడు.
ఇలా వెళుతూండగా ఒకఊరిలో గోడమీద క్రింది పద్యం
చూశాడు శిష్యుడు(గోపడు) ఈ పద్యం పై ఒక బొమ్మకూడ
ఉంది. ఆ పద్యం-

భూపతిఁజంపితిన్, మగఁడు భూరిభుజంగము చేతఁజచ్చె, నే
నాపదఁజెంది చెంది యుదయార్కుని పట్టణముఁజేరి వేశ్యనై
పాపము గట్టుకొంటి, తన పట్టి విటుండయి కౌఁగిలింప, సం
తాపముఁబొంది, యగ్గిఁబడి, దగ్ధనుగా, కిటు గొల్లభామనై
యీ పని కొప్పుకొంటి, నృపతీ వగపేటికిఁజల్ల చిందినన్

దీన్ని చూచిన తరువాత గోపనికి కొండెత్తు కుతూహలం పెరింది
ఈ బొమ్మేమిటి, ఈ పద్యమేమిటి, ఇందులో ఎన్నో సన్నివేశాల
ప్రసక్తి ఉంది. దాని పూర్వాపరాలేమిటి
ఈ గొల్లభామ ఏ భూపతిని చంపింది
ఆమె మగడు ఎందువల్ల పాముకాటుతో మరణించాడు
వారికి పుట్టిన కుమారుడెక్కడ పెరిగాడు
ఆమె వేశ్యగా ఎందుకు మారింది
ఆమె దగ్గరకే ఆమె కొడుకు విటునిగా ఎందుకొచ్చాడు
ఇవన్నీ తెలిసి తెలిసి అగ్నిప్రవేశం చేయకుండా
ఎందుకు చల్లనెత్తుకొంది
అందులోంచి చల్లచిందితే ఏ నృపతి ప్రశ్నించాడు
శిష్యుడు వేసిన ప్రశ్నలన్నిటికి గురువుగారు మణిసిద్ధుడు
పూసగ్రుచ్చినట్లు సమాధానం చెప్పాడు ఇదంతా వింటుంటే
చదువుతుంటే ఎంత ఆసక్తికా కథాకథనం వుందో మదిర
సుబ్బన్నదీక్షితుల గొవ్వభామ కథలో

   ఈ పద్యంలోని సంఘటనలుగాని, ఇందులోని కల్పనలుగాని
సుబ్బన్నదీక్షితులు సృష్టించిన కల్పనలుకాదు. ఇందులోని
కథాకథనమే వారిది. ఈ పద్యం మూలశ్లోకం రసిక జీవనం అనే
సంస్కృత ప్రబంధంలో ఉంది.

ఆ శ్లోకం-

హత్వా నృపంపతి మవేక్ష్య భుజంగదష్టం
దేశాంతరే విధివశాద్ గణికాస్మితాజాతా
పుత్రం భుజంగ మధిగమ్యచితాం ప్రవిష్టా
శోచామి గోపగృబిణీ కథ మద్యతక్రమ్

రసిక జీవనం కంటే ప్రాచీనమైన ఇంకొక సంస్కృత సంకలన గ్రంథం
ఒకటుంది. దానిపేరు ప్రబంధ చింతామణి దాన్లో రెండవ ప్రకరణంలోని
12వ శ్లోకంలో ఉన్న గోపగృహిణీ ప్రబంధం ఈ కథకుమూలమని
చాటుపద్య రత్నాకంలో దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు పొందుపరిచారు.
ఈయుణ్ణి వెంకట వీరరాఘవాచార్యులుగారు మూలశ్లోకాన్ని
వివరాలుతెలిపారట. కాశీమజిలీ కథలు కపోల కల్పితాలు కావని
దీని బట్టి తెలుస్తున్నది.

Wednesday, December 27, 2017

భిక్ష మెత్తితి వేల - సిగ్గుపడక


భిక్ష మెత్తితి వేల - సిగ్గుపడకసాహితీమిత్రులారా!


శేషప్పకవిగారి నరసింహ శతకంలోని
ఈ పద్యం చూడండి-
కవి భగవంతుని ఏవిధంగా నిలదీస్తున్నాడో

వాంఛతో బలిచక్రవర్తి దగ్గరఁజేరి
        భిక్ష మెత్తితివేల - బిడియపడక!
అడవిలో శబరి తీయని ఫలాలందియ్య
        జేతు లొగ్గితి వేల సిగ్గు పడక!
వేడ్కతో వేవేగ విదురునింటికి నేగి
        విందు గొంటివదేమి వెలితిపడక
నటుకు లల్పము కుచేలుఁడు గడించుకు డేగ
        బొక్క సాగితివేల లెక్కగొనక
భక్తులకు నీవు పెట్టుట భావ్యమౌను
వారి కాశించితివా తిండివాఁడ వనుచు!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఓ లక్ష్మీనారాయణా! నీకేంకొదువ సిగ్గుపడకుండా
బలిచక్రవర్తిని బిక్షమడిగినావు?. అభిమానం అనేకూడ
తలచుకోకుండా అడవిలో శబరి ఎంగిలి ఎందుకు తిన్నావు?
వేగంగా విదురునింటికి పోయి కక్కుర్తిగా విందారగించావెందుకు?
కటిక దరిద్రుడైన కుచేలుడిచ్చిన పట్టెడు అటుకులకే
అమితమైన ధన, కనక, వస్తు వాహనాలనెందు కిచ్చావు?
భక్తులకు నీవివ్వడం భావ్యమేకాని భక్తులనుండి నీవు
తీసుకోవడం నీకు భావ్యమా! ఓ స్వామీ! తిండిపోతంటారు
- అని భావం

Tuesday, December 26, 2017

యతో భావః తతో రసః


యతో భావః తతో రసః
సాహితీమిత్రులారా!రసం ఎలా పుడుతుందంటే
ఈ శ్లోకం చూడాల్సిందే
ఇది అభినయ దర్పణంలోనిది-

యతో హస్త స్తతో దృష్టిః
యతో దృష్ట స్తతో మనః
యతో మనః తతో భావో
యతో భావః తతో రసః

హస్తమున్నచోట దృష్టి ఉండాలి,
దృష్టి ఉన్నచోట మనసు లగ్నంకావాలి,
మనసు లగ్నమైనచోట భావం,
భావం ఉన్నచోట రసం తప్పక ఉంటాయి
-అని భావం
ప్రదర్శన కళలో ఇవి వర్తిస్తాయి.
అలాగే పాఠ్య (కేవలం చదివే) కావ్యానికి
కూడ వర్తిస్తాయి. ఇక్కడ హస్తమనేది కొన్ని
సంకేతాల సంపుటిని వ్యక్తం చేసే చిహ్నం.
చదువుకొనే కవితలో ఈ సంకేతాలను
పదచిత్రాలు తెలియ చేస్తాయి ఒక రకంగా
ఇవి కవిసమయాలు. పాత కవిసమయాల
స్థానంలో కొత్తవాటిని ఆధునికిలు సృష్టిస్తే
ఏ సంజ్ఞని దృష్టిలోకి తెచ్చుకోవాలన్నది
ముఖ్యం. అప్పుడు మనస్సు దానిమీదే
లగ్నమౌతుంది. భావరసాలు రెండూ
ఒకదాని తర్వాత ఒకటి నిష్పన్నమై
ఆనందం కలుగుతుంది. నిజమైన కవిత్వాన్ని
చదువుకొన్నా, విన్నా ఇది సిద్ధిస్తుంది.
భావహీనమైన రసం ఉండదు అలాగే
రసహీనమైన భావమూ ఉండదు.
అని నాట్యశాస్త్రం చెబుతున్నది.

ఈ ఉదాహరణ సూస్తే పై విషయం బోధపడుతుంది.
ఇది దేవులపల్లి వారి అన్వేషణ అనే ఖండకావ్యంలోనిది-
ఇది వచనంలా చదువుకొన్నా చిత్రాలు కనబడతాయి
చూడండి-

సన్నని యెల్గెత్తి జాలిగా నెవరినో
        అరయుమా! పిలుచుచున్నదియె యమున!
ప్రక్క నిర్జీవ ధావళ్యమ్ముతో నున్న 
        సికతా తలమ్ము గాంచితివె, దాని?
తుది మొదల్ లేదిదే త్రోవరుల్ త్రొక్కని
        యీదారినే పరువెత్తినాను
ఈ మొండి చేతులనెత్తి యీవనతరుల్
        శూన్య దృక్కుల దిశల్ చూచునయ్యొ
ఇచటనె యిచటనే యతడిచట నేను-
ఇచట నీ జావూ బొదరింట నేను -
ఈ కడిమి చెట్టు క్రింద ముమ్మీ యతండు -
సరిగ కన్నుల గట్టిన సరణి దోచు

ఈ పద్యంలోని కవితానర్తకి మొదటి సన్నని గొంతుకతో
జాలిగా పిలుస్తున్న యమునను కంఠంతో అనుకరిస్తున్నట్ట
నిపిస్తుంది. ఇసుక తిన్నెలను కళ్ళతో చూపెడుతుంది.
చెట్లు మొండి చేతులెత్తాయన్నప్పుడు తన చేతులు ఎత్తినట్టే
కనబడుతుంది. అవి శూన్య దృక్కులతో దిశలో చూస్తున్నావని
ఖాళీ చూపులతో ఇటూ, అటూ, అటూ ఇటూ చూస్తున్నట్టు
కనబడుతుంది. ఇదుగో తానక్కడ, నేనిక్కడ అని చోట్లు
మార్చి మార్చి చూపెట్టడం అలా చూపిస్తూ పాతదృశ్యాలు
తన కన్నులకు కట్టినట్టుందని చెబుతుంది.
నాయిక కన్నులకే కాదు పఠిత కన్నులకు కూడ కట్టినట్లు
చెప్పగలగడమే అభినేయార్థ ఖండకావ్యం.
ప్రదర్శనకళను పుణికి పుచ్చుకొంటే
రసభావాలు నిష్పన్నమౌతాయి.


Monday, December 25, 2017

కాశీమజిలీకథలు - మధిర సుబ్బన్న దీక్షితులు


కాశీమజిలీకథలు - మధిర సుబ్బన్న దీక్షితులు
సాహితీమిత్రులారా!ఒకనాడు ఆబాలగోపాలాన్ని అలరించిన కథలు
కాశీమజిలీకథలు వీటిని మధిర సుబ్బన్నదీక్షితులు
కూర్చారు. ప్రజాబాహుళ్యంలో ప్రచారంలోని కథలకు
మంచి కథనంతో కూర్చాడు మధిర సుబ్బన్నదీక్షితులు.
ఇవి మొదట్లో వ్యానహారిక భాషలోనే వ్రాయబడ్డాయి.
తరువాతి కాలంలో ఇవి గ్రాంథికంలోని మార్చారు.

ఇవి ఎంత ప్రచారంలోకి వచ్చాయో ఈ పద్యం చెబుతుంది.

పండితులైన మెచ్చవలె, పామరకోటికినైన నింపుగా
నుండవలెన్, ప్రబంధమునయోక్తుల నిర్వురకున్ హితంబుగా
కుండిన తత్ప్రబంధమది యొక్క ప్రబంధమె సాధుపాఠకా
ఖండ సుఖ ప్రదం బగుటగా ఫలమా కవితా ప్రసక్తిన్

దీన్ని బట్టి పామరులకుకూడ ఇంపుగా వుండాలంటే
వ్యావహారిక భాషలోనే సాధ్యం. మనకు ఇప్పుడు దొరికే
పుస్తకాలు గ్రాంథికంగా ఉన్నాయి. మరొక విషయమేమంటే
ఇటీవల వీటిని చదువగలిగే సామర్థ్యం ప్రజల్లో తగ్గిందనే
చెప్పవచ్చు అందుకే వీటిని సాధారణ కథల్లాగా అనువదించి
బజారులో ఉంటారు. అంటే ఎంత ప్రసిద్ధమైనవైతేనో
అనువాదాని పూనరుకదా.  పూర్తి విషయంలోకి వస్తే
ఇవి పండ్రెండు భాగాలు 359 మజిలీలు 12 ప్రధాన
కథలతోపాటు 496 ఉపకథలున్నాయి.
వీటినుండే మనకు కొన్ని సినిమాలు కూడ వచ్చాయి
అందులో భామావిజయం, కీలుగుర్రం, చిక్కడు దొరకడు
(కొంత భాగం) మొదలైనవి..ఇలా చెబితే చాలా వున్నాయి.

         మధిర సుబ్బన్నదీక్షితులు (1868-1928) తూర్పగోదావరి జిల్లా
తాళ్లపూడి గ్రామంలో జన్మించారు. ఈయన ఇవిగాక అనేక పుస్తకాలు
వ్రాశారు. అష్టావధానాలు చేశారు. ఈ పుస్తకాల ఆదరణ
చూసి ఆ కాలంలో అనేక కథా పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి కానీ
వీటివలె ప్రసిద్ధం కాలేదు.

1. కాశీమజిలీకథలు - మధిర సుబ్బన్నదీక్షితుల(1898)
2. నిజమైన కాశీమజిలీలు - నంది చలపతిరాజు(1903)
3. శ్రీరంగమజిలీలు - బత్తల లక్ష్మయ్య(1911)
4. కాశీరామేశ్వర మజిలీలు -గుడిపాటి శేషగిరిరావు(1915)
5. రామేశ్వరపు మజిలీలు - కె. వెంకటరంగనాయకమ్మ(1919)
6. కాశీమజిలీలు - నందిరాజు చలపతిరావు(-)

(వీటి గురించిన మరింత సమాచారం మరోమారు)

Sunday, December 24, 2017

ఆరుద్రగారి మధ్యాక్కరలు


ఆరుద్రగారి మధ్యాక్కరలు
సాహితీమిత్రులారా!విశ్వనాథవారి మధ్యాక్కరలు చూసి ఉంటారు
అలాగే అబ్బూరి రామకృష్ణారావుగారు వ్రాశారు
వీరి శిల్పాన్ని మెచ్చుకొని ఆరుద్రగారు కూడ
మధ్యాక్కరలను వ్రాశారు. అవి
శుద్ధమధ్యాక్కరలు అనే పేర 60 దాకా
ఆంధ్రప్రభ వారపత్రికలో అచ్చైనాయి.
వాటిలోని ఒక మూడు మధ్యాక్కరలు ఇక్కడ-

ఆదిలో నన్నయ్యగారు
         అక్కరల్ విరచించినారు
పాదాంత విశ్రాంతు లిడక
         పాడేటి లయబోధ పడక
ఈ దేశి ఛందస్సులోని
         ఇంపైన గతి కొచ్చెహాని
ప్రాదుర్భవించింది నవత
         పాడుకో ఆరుద్ర కవిత


ఆరంభ పుణ్యకాలమున
         ఆధునిక ఖండ కావ్యమున
పేరుమాత్రం చెప్పకుండ
        " పృధ్వీప్రశంస"లో నిండ
తీరుగా రెండు పాదాలు
         తియ్య తేనియలున్న పూలు
ఆరూఢిగా గ్రుచ్చినారు
         అక్కరల్ అబ్బూరి వారు

కామ్యమౌ నూతనత్వమ్ము
         కండగల అంత్యప్రాసమ్ము
రమ్యమ్ముగా తెచ్చినారు 
         రామకృష్ణరావుగారు
సౌమ్యమౌ అక్కరల్ నేడు
         "సామ్రాట్టు" చేపట్టినాడు
గమ్యమ్ము గమనమ్ము సౌరు 
         కటకటా కనిపించనీదు

Saturday, December 23, 2017

శ్రీశ్రీ ముత్యాలసరాలు


శ్రీశ్రీ ముత్యాలసరాలుసాహితీమిత్రులారా!ముత్యాలసరాలనగానే మనకు
గుర్తుకు వచ్చే మహాకవి గురజాడ
కాని ఇక్కడ శ్రీశ్రీ వ్రాసిన ముత్యాసరాలు
ఇవి "ప్రభవ" అనే పద్యకావ్యాన్ని తన సవతితల్లికి
అంకితమిస్తూ వ్రాసిన ముత్యాలసరాలు
1928 ఫిబ్రవరి - మార్చి నెల్లో వ్రాసినవి
చూడండి-

నవ వసంత ప్రాత రంచిత
భువన మోహన కుసుమవల్లరి
గ్రీష్మకాలాతప భరమ్మున
గీటడంగినది.

గాఢనిద్రాముద్రమేల్కని
కనులఁదెఱచి క్షణమునందున
స్నానమని వినినంత నిలువున
జలదరించితిని

ఆ యకాల ప్రళయ ఝంఝా
వాయువులలో తెన్ను తెలియని
యత్యప్రాయ స్థితిగతుల యం
దవశతలు గలిగె

నా శిశుత్వాజ్ఞాన వేళా
నష్ట మాతృ చరిత్ర నెఱుఁగను
తావకాని ర్వాచ్య సద్వా
త్సల్యమునఁ దల్లీ

ఇప్పుడు నీవు గతించినంతట
నెచటఁదెలియనిలోపమొదవెడు
ఇవి నితాంతాజ్ఞాత నిష్ఠుర
దివస నిచయములు

త్రిదిన ధామప్రధిత గాయక
మధుర రుతముల నడుమ నించుక
మామకీనాలస రవమ్ముల
మనసు నిల్పఁగదే
Friday, December 22, 2017

కూరల తృప్తి చేకూరె మాకు


కూరల తృప్తి చేకూరె మాకు
సాహితీమిత్రులారా!


ధర్మనందన విలాసంలో కాళ్ళకూరి గౌరీకాంతంగారు
భోజనశాలలో భోజనాల వడ్డిపును అచ్చటివారి మాటలను
ఈ పద్యంలో చూడండి-

కూరల తృప్తి చేకూరె మాకును నింకఁ
       బచ్చళ్ళు దెమ్మని బలుకువారు
పచ్చళ్ళ రుచిగానబడిఁయెడు మాకింకఁ
       బులుసు చారెడటంచుఁబలుకువారు
పులుసు చారులం దృష్టి పొందితిమింక మీద
       భక్ష్యముల్ దెమ్మని బలుకువారు
భక్ష్యముల్్గొంటి మీపాటి పాయసము తి
       మ్మనములు దెమ్మని యనెడివారు
పాయసము తిమ్మనములుండె ఫలరసములు
పెరుగు పాలల్ల దెమ్మని పిలుచువారు
నగుచు బ్రహ్మణ ముఖ్యులాద్యంతయుక్త
భుక్తిఁగెవ్వున నార్చి రప్పుడు నృపుండు
                                                                (ధర్నందన విలాసం - 3-53)

ఈ పద్యం చూడగా ఆదృశ్యాలు
మనముందు కనిపించేలా ఉన్నాయికదా

Thursday, December 21, 2017

ఎన్నున్నా ఆవగింజంత అదృష్టముండాలంట


ఎన్నున్నా ఆవగింజంత అదృష్టముండాలంట
సాహితీమిత్రులారా!


ఈ కవి కథ వింటే మనం పెట్టుకున్న 
శీర్షిక పేరు నిజమనిపిస్తుంది చూడండి-

ఇంతకీ ఏకవి అంటారా! 
ఆ కవిపేరు కంచి వీరశరభ కవి

ఒక కావ్యానికి పేరు రావాలంటే చాలా కలిసిరావాలట.
గ్రంథంలో రసముంటే. సహృదయులు ప్రచారం చేస్తే
జనంలో ఆకావ్యం అల్లుకుపోతుంది. మన సాహిత్యంలో
హరిశ్చంద్రో పాఖ్యానాలకు కొరతలేదు. అయినా శంకర
కవి కావ్యానికి వచ్చినంత ప్రచారం మరిదేనికీ రాలేదు.
అయితే వీర శరభయ్య రచించిన హరిశ్చంద్రోపాఖ్యానం
ఒకటుందని బ్రౌన్ దొరగారు గుర్తించి, దానికి కంచి కావ్యం
అని మరోపేరు పెట్టి టీకా తాత్పర్యాలు రాయించారు.
అయినా లోకుల దృష్టిలో పడలేదు కారణమేమంటారు
కంటి వీరశరభయ్య మంచికవే. అతులిత మధుర 
వచస్థితిచే కృతి చేయగలిగినవాడే తల్లివైపు నుండి శ్రీపతి 
పండితుని కుటుంబంలోని వాళ్ళు చుట్టాలు. 
(మాతామహులు వీరన్న బహుశా ధర్మగుప్తాభ్యుదయం
వ్రాసిన వారు కావచ్చు) అయినా ఇతని కావ్యం 
సమగ్రానైనా వెలుగు చూడలేక పోయింది.
ఇంతకు ఆవగింజైనా అదృష్టం లేదనేకదా.

Wednesday, December 20, 2017

బ్రహ్మ దేహం నుండి పుట్టినవారు


బ్రహ్మ దేహం నుండి పుట్టినవారు
సాహితీమిత్రులారా!


బ్రహ్మ నుండి ఒక్కొక్క భాగంనుండి
కొందరు ఉద్భవించారు గమనించండి-

దేహభాగం నుండి - స్వాయంభువ మనువు
                                - శతరూప

నీడనుండి             - కర్ధమప్రజాపతి

అపానం నుండి    - నిరృతి

ముఖం నుండి     - సరస్వతి, అంగిరసుడు

చెవుల నుండి      - పులస్త్యుడు

కన్నుల నుండి     - అత్రి

మనస్సు నుండి    - మరీచి

ప్రాణం నుండి     - వశిష్ఠుడు

చేతి నుండి        - క్రతువు

చర్మము నుండి     - భృగువు

నాభి నుండి        - పులహుడు

తొడ నుండి        - నారదుడు

బొటనవ్రేలి నుండి   - దక్షుడు

భృకుటి నుండి      - నీలలోహితుడు అనే రుద్రుడు

దివ్యదృష్టితో         - సనత్సుజాతుడు, సనత్కుమారుడు
                                    సనందుడు, సనకుడు

(మహాభాగవతం నుండి---)

Tuesday, December 19, 2017

సుభాషిత త్రిశతి అనువాదకులు


సుభాషిత త్రిశతి అనువాదకులు
సాహితీమిత్రులారా!


సంస్కృతంలో భర్తృహరి రచించిన
సుభాషిత త్రిశతిని తెనుగులో
అనువదించిన వారి సంఖ్య
20వ శతాబ్ది వరకు ఆరుగురు
ఈ మధ్యకాలంలో అనుదించిన
వారున్నారేమో తెలియరాలేదు

మొదటివారు ఎలకూచి బాలసరస్వతి (1620)
రెండవవారు ఏనుగు లక్ష్మణకవి              (1725)
మూడవవారు పుష్పగిరి తిమ్మన             (1750)
నాలుగవవారు పోచిరాజు వీరన్న            (1790)
ఐదవవారు గురురాజ కవి                          (1810)
ఆరవవారు వెల్లాల నరసింగకవి               (1830)

వీరిలో పోచిరాజు వీరన్నస, గురురాజకవి ఆంధ్రీకరణలు
లభించలేదు. వెల్లాల నరసింగకవి ఆంధ్రీకరణ మాత్రం
ఒక్కసారిమాత్రం అచ్చైంది. ఆంధ్రపరిషత్ కార్యాలయంవారి
శతక సముచ్ఛయం మొదటి భాగంలో లభిస్తుంది.
ఎలకూచి బాలసరస్వతిగారి కంటె,
పుష్పగిరి తిమ్మనగారి కంటె
ఏనుగు లక్ష్మణకవిగారి ఆంధ్రీకరణం
బహుళ ప్రజాదరణ పొందింది.

Monday, December 18, 2017

తెలుగు సిరి


తెలుగు సిరి
సాహితీమిత్రులారా!డాక్టర్. బెజ్జంకి జగన్నాథాచార్యులు. మాచర్లవాసి
తన ఆవేదనను ఈ కవితలో వ్యక్తం చేశారు
ఈ ఆవేదన సబబేనా అవసరంలేదా
మీరు ఈ కవితను చదివి నిర్ణయించండి-

             
తేగీ.తెలుగు మాట్లాడ వెరతురు ! తెలుగు వారు
       తెలుగు వారము మన మని!తలప రేల
       తేనెలూరెడి మనభాష ! తెలుగు భాష
        పలుకు పలుకున తేనెలు! చిలుకు ననుచు


         పలుకుటేగాని నోరార ! పలుక రైరి
         ఆంగ్ల భాషన్న వ్యామోహ ! మయ్యె నేడు
         ఆంగ్ల మైనను వచ్చునా !యనిన సున్న
          చక్కగ పలుకుటేరాదు ! నిక్కముగను

          అతుకు లతికిన మాటలు ! వెతుకు కొనుచు
          గతుకు గతుకుల బాటపై ! వెతలు పడుచు
          వాహనములు నడిపి నట్లు ! పలుకు టేల
          పలుక కున్నను దక్కును ! పరువు గను
          మిన్నకుండిన గౌరవ ! మన్న మిగులు

         అన్ని భాషలు నేర్వగ ! నడ్డు లేదు
         కాదనెడి హక్కెవరికైన ! లేనె లేదు
         ఆంగ్లమెరిగిన వారితో ! నాంగ్ల మందు
         మాటలాడుటెవరికైన! మంచిదయ్య

         ఆంగ్లమేరాని మనతెలు ! గయ్యలెదుట
         మాటలాడుట తగదయ్య ! మాను టొప్పు
         అమెరికావెళ్ళి పెండ్లాడి ! యచటనున్న
         కన్న తల్లిని మరతురా ! కఠినులైన

         మాతృభాషయు నట్టిదే ! మాన్యులార
         మాతృభాషను కలనైన ! మరువకండి
         మరువకండి మరువ కండి ! మాతృభాష
          ఉగ్గు పాలతో నేర్చిన ! ఉచిత భాష

          అమ్మ ప్రేమతో నేర్పిన ! అమృత భాష
          సుధలు కురిపించు మదిలోన ! మధురభాష
          పండితులు పామరులు గూడ ! పలుకు భాష
          జుంటి తేనియ కన్నను !.జున్ను కన్న

          పాల మీగడ కన్నను ! పాలకన్న
          పటికబెల్లము కన్నను ! పంచ దార
          కన్న తెలుగు మాధర్యమే ! మిన్నయౌర
          పద్య రచనలో వెలిగెడి ! ప్రధమ భాష

          చెలగి యవధాన విద్యలో ! వెలుగు లీను
          తెలుగు భాషొక్కటే దీని ! తీరు వేరు
          ద్వంద్వ నానార్ధ నర్మగ ! ర్భముల నొప్పు
          ముచ్చటైన తెలుగు భాష ! ముద్దు లొలుకు

          మదిని పులకింప జేసెడి ! మధుర భాష
          కృష్ణరాయలు పోషించి ! కీర్తి గాంచె
          బ్రౌనుదొర బ్రహ్మ రధమును ! పట్టుటన్న
          తెలుగు జాతికి గొప్పని !.తెలుసు కొనుడు

          తెలుగు భాషామ తల్లికి !వెలుగు నింప
           తెలుగు ఖ్యాతిని పెంచాలి ! తెలుగు వారు
           పెంచువారలు మీరేల ! త్రుంచు వారు
           కారు కారాదు కలనైన ! పౌరులార!

           తెలుగు మృతభాష కారాదు! వెలుగు లుడిగి
           తెలుగు తల్లికి జైజైలు! పలుక వలెను
           దిక్కులన్నిపిక్కటిలగ! నొక్క మారు
           కోరు చున్నాడు బెజ్జంకి! కోర్కె మీర

                           - డాక్టర్. బెజ్జంకి. మాచర్ల.
                                            9848562726.

బీదపూజ


బీదపూజ
సాహితీమిత్రులారా!కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి
కవితాఖండిక ఇది. ఇది ఉదయశ్రీ - లోనిది.
కడుపేదవాడొకడు దైవపూజకు పూలకై వెళ్ళి
అవి లభింపక తిరిగివచ్చి దేవునికి
తన దీన స్థితిని వివరించుకున్నదే
ఈ కవితాఖండిక చూడండి-

"వాడిన గ్రుడ్డిపూలు గొనివచ్చెను వీ" డని జాలిమాలి నో
నాడకు మో దయామయ యథార్థము నీకడ విప్పిచెప్ప నో
రాడుటలేదు - పూలకొరకై పువుదోటకు నేనుగూడ జ
న్నాడను - పుష్పమొక్కటయినన్ లభింపకపోయె నా కటన్

వారలు పెద్దపెద్ద ధనవంతుల బిడ్డలు - మంచి మంచి బల
గారపు పూలబుట్టలను గైకొని పోయిరి ముందుగానె - మా
బూరుగుచెట్టుక్రింద పడిపోయిన గోడల పూరిపాకలో
దూరిన లేత వెల్గులకు దుప్పటినెత్తితి - అమ్మలేపినన్

లేచి - చిఱుచాప నొకమూల దాచిపెట్టి
ప్రాత తాటాకుబుట్టను చేతబట్టి
పొంత లోపలి జల మింత పుక్కిలించి
తల్లి కాళ్ళకు వంగి వందన మొనర్చి!

తెలతెలవాఱుచుండ జనితిన్ విరితోటకు - తోటమాలి త
ల్పులు బిగియించె నా చినిగిపోయిన గుడ్డలు నన్నుజూచి; కా
ళుల బడి, గడ్డమంటి, యెటులో బతిమాలి, యవస్థనంది లో
పల బడినాను - చెంత గనుపట్టిరి మిత్రులు పూలుగోయుచున్

చకచక పూలు గోసికొని సాగిరి వారలు - శూన్యకుంజ మా
లిక లెటు చూచినన్; మిగులలే దొక పుష్పముకూడ నాకు నే
నొకదెస విన్నబోయి నిలుచుంటి; ననున్ గని వారలందఱున్
పకపక నవ్వినారు - తలవంచితి నేనొక కొమ్మచాటునన్

పట్టిపూమొక్క లన్ని నా వంక చూచి
ప్రసవబంధాలు సడల బాష్పములు రాల్చె;
చేతిలోనున్న బుట్టను చింపివైచి
తిరిగివచ్చితి గుండెలు దిగబడంగ

ఇంటికి వచ్చుచుండ గనిపించిరి దేవర దేవళమ్ములో
మంటపమందు పుష్పములు మాలలు గ్రుచ్చుచు వారు - పోయి కూ
ర్చుంటిని నేను కూడ నొకచో నొక స్తంభమువెన్క - ఇంతలో
గంటలు మ్రోగి - అర్చనలకై గుడులోనికి పోయి రందఱున్

పూజలై మిత్రు లిండ్లకు పోయినారు
రిక్తహస్తాల నిన్ను దర్శింపలేక
మంటపము ప్రక్క ధూళిలో నిండియున్న
గ్రిడ్డిపువ్వులనే యేరుకొంటి నేను

పరిమళము లేక - ఎవరికి పనికిరాక -
పాఱవేయ బాటల ప్రక్కపడి - కరాళ
కాల పురుషుని కాఱు చక్రాల క్రింద
బ్రతుకలేక దరిద్ర పుష్పమ్ము లివ్వి

ఈ యనాథ సుమాలనే - ఈ విశీర్ణ
జీర్ణకుసుమాలనే - ఈ కృశించు మ్లాన
హీన దీన ప్రసూనాలనే - త్వదంఘ్రి
సేవకై దోయిలించి తెచ్చితిని నేను

పూల దోసిలి కన్నీట పొరలిపోయె
విరుల మాలిన్య మంతయు వెడలిపోయె
ఆగియుంటి ప్రభూ స్వామియాజ్ఞకొఱకు
ఆదరింతువొ లేదొ నా "బీదపూజ"


Sunday, December 17, 2017

దేవుని గురించిన పద్యం


దేవుని గురించిన పద్యం
సాహితీమిత్రులారా!గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు
చెప్పిన పద్యం ఇది
ఇందులో ఆయనకు
దేవుని పైగల అభిప్రాయం
వ్యక్తమౌతుంది గమనించండి-

పువ్వులగొనితెచ్చి పూజింపనేలకో
         విరులగుంపున నిన్ను నరయువాడు
పుణ్యవాహినులలో బోయి క్రుంకగనేల
         హృదయగీతముల నిన్ను వెదకువాడు
వర్ణాశ్రమములంచు పరితపింపగనేల
         బుధులందు నినుజూచి పొంగువాడు
కల్ల విగ్రహముల కరుణ వేడుటయేల
         ఘనకార్యముల నిన్ను గనెడువాడు
సృష్టి యెల్లను నీవయై చెలగుచుంట
గాంచి యుప్పొంగి కార్యంబు కడక దీర్చి 
తనదు మనమున నినుగొల్చి కొనెడుగాని 
మాయలో బడి సత్యంబు మరచునొక్కొ

పువ్వులను కొని తెచ్చి పూజించడ మెందుకు
పూలమధ్యలోనె నిన్ను చూచేవాడు
పుణ్యనదుల్లో మునుగడమెందుకు
తనహృదంలో గీతాల్లో నిన్ను వెదకువాడు
బ్రహ్మచర్యం, గృస్థాశ్రమం, వానప్రస్థం,
సన్యాశాస్త్రమం అని ఆశ్రమాలగురించి
పరితపించందేనికి బుధులలో నిన్ను చూచేవాడు
అబద్ధపు విగ్రహాలలో నిన్ను వెదకడమెందుకు
గొప్పకార్యాల్లో  నిన్ను చూస్తున్నవాడు
సమస్త విశ్వంలో నీవేయై చెలగుటను చూచి
ఉప్పొంగి నిన్ను మనసులో నిలుపుకొంటాడేగాని
మాయలోపడి సత్యాన్ని మరచిపోతాడా అని భావం.

అంటే పూజల్లోనూ, నదీస్నానాల్లోనూ, వర్ణాశ్రమాల్లోనూ
విగ్రహాల్లోనూ దేవుడిని చూడకుండా పూవుల్లోనూ
హృదయంలోనూ, మంచివాళ్ళలోనూ, గొప్పపనుల్లోనూ
చివరకు సృష్టి అంతటా కనిపించే దేవుడిని అసత్యమైన
వాటిలో కాకుండా సత్యమైన తనహృదంలో నిలుపుకొంటాడట.

Saturday, December 16, 2017

గంగానదీ జలం - అద్భుతాలు


గంగానదీ జలం - అద్భుతాలు
సాహితీమిత్రులారా!

గంగానది హిందువుల పవిత్రనది
దీన్ని అంతర్జాతీయంగా నిరూపించిన
పరిశోధనలను గురించిన ఈ వీడియో
చూడండి-

Friday, December 15, 2017

“విశ్వంభర” కావ్యం – నారాయణరెడ్డి గారి స్వీయపఠనం


“విశ్వంభర” కావ్యం – నారాయణరెడ్డి గారి స్వీయపఠనంసాహితీమిత్రులారా!

శ్రీ సి. నారాయణరెడ్డి గారికి జ్నానపీఠ అవార్డును సముపార్జించిపెట్టిన కావ్యం “విశ్వంభర”. మరి ఈ కావ్యపఠనం వారి స్వరంలోనే విందాము. ఇది మొదటి భాగము యొక్క రికార్డు. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. సాహిత్యంకూడా సమకూర్చటం జరిగింది. వినేముందు ఈ కావ్యరచన పూర్వాపరాల “ప్రస్తావన” లోకి తొంగిచూద్దాము. 

శ్లోకానువాదం ఎలా వుండాలి?


శ్లోకానువాదం ఎలా వుండాలి?
సాహితీమిత్రులారా!

సంస్కృత శ్లోకాలను అనువదించేప్పుడు
శ్రీనాథుడు పెట్టుకొన్న నియమాలను
అనుసరిస్తేనే మూలం చదువుతున్నంత
తృప్తి దొరుకుతుందట-
ఆ నియమాలు
1. శబ్దాన్ననురించి ఉండటం  
2. అభిప్రాయాన్ననుసరించి ఉండటం
3. భావాన్ని ఉపలక్షించటం
4. రసాన్ని పోషించటం
5. అలంకారాలను భూషించటం
6. ఔచిత్యాన్ని ఆచరించటం
7. అనౌచిత్యాన్ని తీసివేయటం
చేసినప్పుడే "మాతృకను అనుసరిచి చెప్పబడిన 
కావ్యంమే హృదయంగమం"గా ఉంటుందట.
ఇక్కడ ఒక శ్లోకాన్ని విద్వాన్ విశ్వంగారు
రెండు కందాల్లో అనువదించిన తీరు గమనిద్దాం-

మందాక్రాంత వృత్తం -
ధూమజ్యోతి స్సలిల మరుతాం సన్నిపాతః క్వమేఘః
సందేశార్ధాః క్వపటు కరణైః ప్రాణిభిః ప్రాపణీయాః
ఇత్యౌత్సుక్యాదపరి గణయన్ గుహ్యకస్తం యయాచే
కామార్తాహి ప్రకృతి కృపణా శ్చేతనా చేతనుషం

దీనికి విశ్వంగారి తెనిగింపు(ఆంధ్రీకరణం)-

ధూమజ్యోతి స్సలిల మ
హా మారుత సన్నిపాతమగు మబ్బేడా?
ధీమంతులు గొంపోయెడు
క్షేమ సమాచారమేడ? చిత్రము కదా?

అయినన్ తన తమి పెనగొని
వయికొన్నన్, యక్షుడబ్దపతి యాచించెన్
దయితాదూరుల మతి, కెం
తయినా చేతనవిచేతనము లొకటిగదా?

Thursday, December 14, 2017

ప్రపంచంలోని పది వింతలు


ప్రపంచంలోని పది వింతలు
సాహితీమిత్రులారా!

ప్రపంచంలోని వింతలు అనేక అందులోని
పదింటిని తెలిపే వీడియో ఇక్కృ చూడండి-
Wednesday, December 13, 2017

పెండ్లి


పెండ్లిసాహితీమిత్రులారా!కరుణశ్రీగారి కలం నుండి జాలువారిన
పెండ్లి పద్యం చూడండి ఎలావుందో-

బృందారకానంద మందార మకరంద
        బిందునిష్యందాల విందు పెండ్లి;
రంగారు ముంగారు బంగారు సరసాంత
        రంగాల సత్యనర్తనము పెండ్లి;
సోగకన్నులరాణి రాగరంజితపాణి
        రాణించు మాణిక్యవీణ పెండ్లి;
చిన్నారి పొన్నారి చిగురు చెక్కిళ్ళలో
        నవ్వులొల్కు గులాబిపువ్వు పెండ్లి;
ప్రేమతో దేవతలు పెట్టు బిక్ష పెండ్లి;
అక్షయంబైన శ్రీరామరక్ష పెండ్లి;
వధువు వరుడు "ద్వంద్వ"మై మధువు గ్రోలు
ప్రేమ బృందావనారామసీమ పెండ్లి!!

ఈ పద్యం పెండ్లికి నిర్వచనంలా ఉందికదా!

Tuesday, December 12, 2017

బుద్ధిమంతుడు ఇతరులకు చెప్పుకోనివి?


బుద్ధిమంతుడు ఇతరులకు చెప్పుకోనివి?
సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
ఇది బుద్ధిమంతుడు
ఇతరులకు ఏవి చెప్పుకోడో
వాటిని గురించి చెబుతున్నది
గమనించండి-

अर्थनाशं मनस्तापम्, 
गृहे दुश्चरितानि च।
वञ्चनं चापमानं च, 
मतिमान्न प्रकाशयेत्॥

అర్థనాశం మనస్తాపమ్
గృహే దుశ్చరితాని చ 
వఙ్చనం చాపనామం చ
మతిమాన్న ప్రకాశయేత్

A wise man should not divulge the loss of money, 
distress of mind, quarrels at home and that he has been 
cheated or insulted.

बुद्धिमान धन के नाश, मन के दुःख और घर की कलह, 
धोखे और अपमान को गुप्त रखता है, किसी को नहीं बतायेगा।

బుద్ధిమంతుడు  ధన నాశము; 
మనసు యొక్క బాధ; గృహ కలహములు; 
వంచింప బడుట;అవమానింపబడుట; 
ఈ ఐదును  గుప్తముగా నుంచుకొనును 
ఇతరులకు చెప్పుకొనడు

Monday, December 11, 2017

ఈ శ్లోకం చూడండి


ఈ శ్లోకం చూడండి
సాహితీమిత్రులారా!లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతంలోని
ఈ శ్లోకం చూడండి
కేవలం పేర్లనే శ్లోకం మలచి చివర్లో
మాత్రమే తన విన్నపాన్ని తెలిపాడు

హేగోపాలక! హేకృపాజలనిధే! హేసిన్ధుకన్యాపతే!
హేకంసాంతక! హేగజేన్ద్రకరుణాపారీణ! హేమాధవ!
హేరామానుజ! హేజగత్త్రయగురో! హేపుండరీకాక్ష! మాం
హేగోపీజననాథ! పాలయ పరం జానామి న త్వాం వినా

హేగోపాలక! 
హేకృపాజలనిధే! 
హేసిన్ధుకన్యాపతే!
హేకంసాంతక! 
హేగజేన్ద్రకరుణాపారీణ! 
హేమాధవ!
హేరామానుజ! 
హేజగత్త్రయగురో! 
హేపుండరీకాక్ష! 
హేగోపీజననాథ!
ఇవన్నీ పేర్లేకదా ఇందులో
మాం - నన్ను,
పాలయ - కాపాడుము,
త్వాంవినా - నిన్నువిడిచి
పరం - వేరోకరిని
నజానామి - ఎరుగను
అనేవే ఆయన ప్రార్థన

ఓ గోపాలా, ఓదయామయా, ఓలక్ష్మీనాథా, ఓకంసధ్వంసీ,
ఓగజరాజవరదా, ఓమాధవా, ఓకృష్ణా, ఓముల్లోకములతండ్రీ,
ఓతామరకన్నులవాడా, ఓగోపాంగనావల్లభా, ననుగావుము,
నీకంటే అన్యులను ఎరుగను- అని భావం.

ఇందులో భగవంతుని పేర్లుతప్ప
వేరులేదు అంటే
భగవన్నామస్మరణే
ఈ శ్లోకం చదివిన వారికి 
భగవత్కృపలభిస్తుందనే
భావించాలి.

Sunday, December 10, 2017

సమస్య ఎక్కడో పరిష్కారం అక్కడే


సమస్య ఎక్కడో పరిష్కారం అక్కడే
సాహితీమిత్రులారా!

రాఘవపాండవీయం అనే ద్వ్యర్థికావ్యం
అంటే రామునికథ, కృష్ణునికథ
రెండు ఒకే పుస్తకంలో ఉండటం
అంటే ఒక పద్యాన్ని ఒక అర్థంతో చదివితే
రామునికథ అవుతుంది. అదే పద్యాన్ని
మరో అర్థం తీసుకుంటే కృష్ణుని కథ
అయ్యే విధంగా వ్రాయబడిన పుస్తకం.
అందులోని ఒక పద్యాన్ని ఇక్కడ 
ఉటంకించుకుందాం
దశరథుడు / పాండురాజు  జైత్రయాత్ర
సందర్భంలో ని పద్యం

తఁలపం జొప్పడి యొప్పె నప్పుడు తదుద్యజ్జైత్ర యాత్రాసము
త్కలికారింఖదసంఖ్య సంఖ్యజయవత్కంఖా ణరింఖావిశృం
ఖల సంఘాత ధరాపరాగ పటలాక్రాంతంబు మిన్నే రన
ర్గళ భేరీరవ నిర్దళద్గగనరేఖా లేపపంకాతిన్

ఇది ఈ వీడియో చివర్లో గరికపాటివారి
వివరణతో  పలకడం కూడ వినవచ్చు వినండి


Saturday, December 9, 2017

ఎవరికిని శక్యముగాదు


ఎవరికిని శక్యముగాదు
సాహితీమిత్రులారా!

హరస్తుతి అనే గ్రంథం నుండి
కొన్ని శ్లోకాలు-

గజాన్తాం విభూతిం మహారాజ్యపట్టమ్
సురేంద్రాధిపత్యం చ నో కామయే హమ్
పరం కేవలా త్వత్పదామ్భోజసేవా
ప్రభో రోచతే మే సదా పాహిమాం భోః

ఈశ్వరా! నేను గజాంతమగు ఐశ్వర్యాన్నికాని,
గొప్ప రాజ్యపట్టాభిషేకం కాని కోరుకోలేదు.
నీ పాదపద్మముల సేవమాత్రమే నా కిష్టం
ప్రభూ నన్నెపుడూ కాపాడు

త్వమేవ త్వమేవ త్వమేవ త్వమేవ
త్వమేవా స్యభీష్టం  పరం దైవతం మే
త్వదన్యం న జానే న వీక్షే న కాఙ్క్షే
న సేవే న వన్దే   భిగమ్య స్త్వమేవ

ఈశ్వరా! ముమ్మాటికీ నీవే నాకు మిక్కిలి ఇష్టమైన దేవుడవు
నీ కంటే వేరు దైవము నెఱుగను చూడను కోరను సేవించను
నమస్కరింపను కూడ నీవే నా గమ్యస్థానం.

దరిద్రం తనోషీశ్వరం సర్వభూమే
స్తథా సార్వభౌమం ముహూర్తా ద్దరిద్రమ్
ధర నూర్ధ్వమేకం మహాదుఃఖమగ్నమ్
తథా థః క్షిప స్యన్య ముద్యత్సుఖేభ్యః

ఈశ్వరా! నీవు దరిద్రుని ప్రభువుగాను ప్రభువును దరిద్రునిగాను
క్షణంలో చేయగల సమర్థుడవు. దుఃఖంలో మునిగిపోయిన ఒకని
ఉద్ధరిస్తావు. సుఖభోగాలతో ఉన్న ఒకని తలక్రిందు చేస్తావు.
ఇదంతా నీ ఇచ్ఛ.


క్షణాత్పూర్వ మమ్భోవిహీనం సరో యత్
క్షణాదూర్ధ్వ మంబుప్రవాహైః పృణాసి
క్షణాత్పూర్వ మభ్రై స్సధారై ర్నదద్భి
ర్వృతం ద్రాగ్విహాయః కరోమి ప్రశాన్తమ్

ఈశ్వరా! క్షణం క్రిందట నీరులేని సరస్సును
చూస్తుండగానే నీటి ప్రవాహంతో నింపుతావు.
ఉఱుముతూ వర్షిస్తున్న మేఘాలతో నిండిన
ఆకాశం ఒక్క తృటిలో (మేఘాలే లేకుండా)
స్వచ్ఛం చేస్తావు.

సృజ స్యబ్జయోనిః ప్రభూ సర్వలోకాన్
హరి ర్దారయ స్యాదర త్ప్రాణిజాతమ్
హర స్యుగ్రరూపః ప్రమేయం సమస్తమ్
క ఈష్టే వగన్తుం తవేదృఙ్మహత్వమ్ 

ఈశ్వరా! నీవు బ్రహ్మవై సర్వలోకాలను సృష్టిస్తావు.
విష్ణువై సర్వప్రాణులను కాపాడతావు. రుద్రుడవై
సర్వసృష్టిని నశింపచేస్తావు. ఇట్టి నీయొక్క గొప్ప
దనమును తెలియనెవరికిని శక్యముకాదు.


Thursday, December 7, 2017

దశ దిశా విశ్రాంతయశుడు


దశ దిశా విశ్రాంతయశుడు
సాహితీమిత్రులారా!

దశకుమార చరిత్రలో
కేతన తిక్కనసోమయాజిని గూర్చి
ఈ విధంగా వ్రాశారు చూడండి-

దీన్నే కవిబ్రహ్మ అనే నాటకంలో
డా. ప్రసాదరాయకులపతిగారు
మనుమసిద్ధి మహీశ్వరుని రాజ్యమును
కాకతీయ గణపతిదేవ చక్రవర్తి సహాయంతో
తిక్కన సాధించిన తరువాత కేతన
చెప్పినట్లు వ్రాశాడు. ఆ పద్యం చూడండి-

సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వడనిన వీ
             డనునాలుకకు తొడవైనవాడు
చిత్త నిత్యస్థిత శివుడెవ్వడనిన వీ
             డను శబ్దమున కర్థమైనవాడు
దశ దిశా విశ్రాంతయశుడెవ్వడనిన వీ
             వీడని చెప్పుటకు పాత్రమైనవాడు
సకల విద్యాకళాచణుడెవ్వడనిన వీ
             డని చూపుటకు గురియైన వాడు
మనుమసిద్ధి మహీశ సమస్తరాజ్య
భాగ్య ధౌరేయు డభిరూపభావభవుడు
కొట్టరుపు కొమ్మనామాత్యుకూర్మిసుతుడు
దీనజనతానిధానంబు తిక్క శౌరి!

చూచారుకదా ఎంత చక్కగా తిక్కనసోమయాజిని
కేతన స్మరించాడో
         

Wednesday, December 6, 2017

ఆనాటి తెలుగుతల్లి చిత్రం


ఆనాటి తెలుగుతల్లి చిత్రం సాహితీమిత్రులారా!


మొదటి ప్రపంచ తెలుగు మహాసభల
నాటి తెలుగుతల్లి చిత్రం
దీన్ని చిత్రించిన చిత్రకారుడు
కొండపల్లి శేషగిరిరావుగారు


(శోభనాచలం బ్లాగు సౌజన్యంతో)

విప్రతిషేధే పరం కార్యమ్


విప్రతిషేధే పరం కార్యమ్
సాహితీమిత్రులారా!


విప్రతిషేధే పరం కార్యమ్ - అనేది పాణినీయం
వ్యాకరణ సూత్రం. విప్రతిషేధే పరం కార్యమ్ - అంటే
మొదట చెప్పిన విధీ(కార్యము), తరువాత చెప్పిన విధీ
(కార్యము) రెండూ ఒకే శబ్దం విషయంలో తారసిల్లినపుడు
(వచ్చినపుడు) మొదటి విధిని విడిచి రెండవ విధిని
గ్రహించాలి అనేది సూత్రార్థం.
దీన్ని గ్రహించిన ఒక కవి
ఎంత చమత్కారంగా వాడాడో చూడండి-

"నిజపలి రాద్యః ప్రణయీ,
హరిర్ద్విలీయః, కరోమి కిమ్ గోపి!"
"శృణుసఖీ పాణి సూత్రం
విప్రతిషేధే పరం కార్యమ్"

రాధ ఆమె చెలికత్తెల సంభాషణగా కూర్చబడినది

రాధ - నిజపలి రాద్యః ప్రణయీ,
           హరిర్ద్విలీయః, కరోమి కిమ్ గోపి!
(నా భర్త నామీద మొదటి నుంచి ప్రణం ఒలికించాడు
 ఇప్పుడేమో కృష్ణుడొకడు  నా జీవితంలో ప్రవేశించాడు
 ఏమిచెయ్యనే)

గోపిక - శృణుసఖీ పాణి సూత్రం
              విప్రతిషేధే పరం కార్యమ్
(ఏముందీ అటువంటి వాటన్నిటికి  శాస్త్రకారులు మనకు దారి
చూపించే పోయారు పాణిని సూత్రం వినలేదా
విప్రతిషేధే పరం కార్యమ్- అని)

అంటే మొదటివాడైన భర్తను వదిలేసి రెండవవాడైన కృష్ణుని
ఆశ్రయించమని సలహా ఇచ్చింది - పాణిని సూత్రం ఎంతబాగా
ఉపయోగించిందిTuesday, December 5, 2017

శతకాలలో సీస పద్యరచన


శతకాలలో సీస పద్యరచన
సాహితీమిత్రులారా!

మన సీసపద్యంలో సీసమనేది సంస్కృతంలో శీర్షిక అనే పదం నుండి
పుట్టింది. ఈ ఛందస్సుతో రచించిన రచన శీర్షమును, అంటే
శిరస్సును అలంకరించినట్లగును. సీసము సాధారణంగా ఏదైనా విషయంకాని, కథా సందర్భములను గాని వివరించే చోట్లనే కవులు ఉపయోగించారు. ప్రబంధవర్ణనలలో సీసపద్యము కనబడతాయి.
సీసముతో మొదట శతకం వ్రాసినవాడు 
పాల్కురికి సోమనాథుడనే చెప్పవచ్చు. ఈయన వ్రాసిన 
చతుర్వేదసారము అనే దానికి
బసవలింగ శతకమని మరోపేరుంది. దీనికి గలకారణం "బసవలింగ "
అనే సంబోధనతో లేదా మకుటంతో ఉండటమే. దీనిలో సంఖ్యాపరంగా
చూస్తే దీనిలో నాలుగువందల సీసపద్యాలున్నాయి. అంటే నాలుగు 
శతకాలు. ఈ సీసపద్య శతకాల్లో రెండు విభాగాలున్నాయి 
1. సీసముతోటి ఆటవెలది అనుసంధానింపబడినవి
2. సీసముతోటి తేటగీతి అనుసంధానించబడినవి

అయితే ఇక్కడ సోమన వ్రాసిన పద్యాలన్నీ ఆటవెలది 
అనుసంధాన పద్యములే. పూర్వం సీసాలన్నీ ఆటవెలది అనుసంధానితాలే అందువల్లసోమనాథుడు ఈ విధంగా వ్రాశాడు.
ఉదాహరణ పద్యం -
బసవన్న శ్రీపాద పద్మ పుష్పంధయ
         స్థేముండు పాల్కుర్కి సోముడనగ
బసవపుర ప్రాప్యపర్వతోత్తర ముఖ
         సీముండు పాల్కుర్కి సోముడనగ
బసవపురాణ ప్రబంధ సంఘటనాభి
         రాముండు పాల్కుర్కి సోముడనగ
బసవ శతక గద్య పద్యాది సంస్కృతి
         ధాముండు పాల్కుర్కి సోముడనగ
పరగ ప్రస్తుతించి భావించి భజియించి
బసవ విభుని కరుణ యెసగ బడసి
నిర్వికల్పరతి చతుర్వేదసారమన్
పద్యముల్ రచింతు బసవలింగ

ఈ సోమశేఖరకవి విరచిత శతకాలు మరి రెండున్నట్లు 
తెలుస్తున్నది 
సోమశేఖర శతకంలోని పద్యం-
తలకమ్మి కొండయు, విలుకమ్మి కొండయు
         గడయును నడుముగా గలుగుతేరు
సరసిజ ముకుళంబు సద్వాక్యకలనంబు
         మాతలినాలగు మాతలియును
మిన్నుల జనువాడు కన్నుల వినువాడు
         నంక పర్యంకంబులైన శరము
చల్లని పవనంబు నెల్లైన భువనంబు
          మేపును మోపుగా మెలగు నారి
కాకకోర్తు విల్లు గఱిగల గుఱ్ఱాలు
పగలు రేలు దిరుగు బండికండ్లు
గలగ బురజయంబు గైకొన్న నిను గొల్తు
చిరశుభాంక సోమశేఖరాంక


Monday, December 4, 2017

మరువలేను ఓ పోలీసు వెంకటసామి


మరువలేను ఓ పోలీసు వెంకటసామి 
సాహితీమిత్రులారా!

జననం - 04-12-1922       మరణం-11-02-1974
ఘంటసాల 96వ జన్మదినోత్సవం
ఈరోజు సంగీతసామ్రాజ్యంలో
ఆయనది తిరుగులేని మధురగళం
ఆయన జీవిత విశేషాలు
ఆయన మొదట సినిమాలో
ఎలా అడుగు పెట్టారన్నది
ఈ ఆడియోద్వారా తెలుసుకోగలరు
కిరణ్ ప్రభ టాక్ షో లోని ఈ ఆడియో
అందరు వినండి-

Sunday, December 3, 2017

స్వర్గంలో విప్లవము


స్వర్గంలో విప్లవము
సాహితీమిత్రులారా!

గతంలో భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి
ఆ సందర్భంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం లో వికసించిన
కవిత ఇది. తెలుగు సాహిత్యం, తెలుగు సంగీతం, తెలుగు సంస్కృతి, 
తెలుగు శిల్పం, తెలుగు నాట్యం, తెలుగు చలనచిత్రరంగం, తెలుగువారి 
అభిరుచులు స్వర్గానికి ఎలా వ్యాపించిందీ, స్వర్గవాసులలో
ఎటువంటి మార్పుతెచ్చిందీ, సంభావించిన ఊహాచిత్రం ఇది.
ఇది కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ఉదయశ్రీ - 5 లోనిది.

"ఇందిరా! ఇదేమి? ఇంటిలో కూర్చుండి
వంటచేయుచుంటి వొంటరిగాను?"
"అక్క!  భాగ్యనగరమట!  తెల్గుసభలంట!
కోడలమ్మపోయి కులుకుచుండె!!"

స్వర్ణదీతటాన సౌపర్వకన్యలు
"ఎంకిపాట" లభినయింతురంట!
ప్రతిదినమ్ము అదితి "బంగారుబొమ్మ పూ
ర్ణమ్మ" మోము ముద్దులాడునంట!

"త్యారాజు" గారి తంబురా శ్రుతి విని
వాణి వీణ మౌన మూనెనంట!
"ఘంటసాల" వారి గానామృతము గ్రోలి
అమృత మొల్లరంట అమరులెల్ల!

అమరకాంతలెల్ల "అమరావతీకేశ
బంధము"లకె మోజుపడుదురంట!
చెక్కిరంట దేవశిల్పులు "ఓరుగల్
ద్వారబంధము"ను సుధర్మముందు!

సిద్ధహస్తుడై "క్షేత్రయ్య" గారికి
రంభ ప్రణయలేఖ వ్రాసెనంట
"కూచిపూడిబాణి" క్రొత్తగా నేర్చిన
అచ్చరలకు విలువ హెచ్చెనంట!

ఒకటి రెండు సార్లు "ఊర్వశి" రాదాయె
ఇంద్రసభకు; ఎచటి కేగె నామె?
తెలుగు చలనచిత్రకళ ప్రేమతో పిల్వ
దివిని విడిచి భువికి దిగెను మగువ!

భాగ్యనగరి ద్రాక్షపండ్లు తెచ్చివగాని
తెరవదంట తలుపు దివిజగృహిణి!
అమృతమానువేళ "ఆవగాయ"ను సురల్
నంచుకొందురంట నడుమ నడుమ!

భాగవతములోని పద్యాలతో శచీ
దేవి పెదవి మరియు తీపియెక్కె!
రుచులు పల్లవించు శచిమోవి క్షణమైన
వీడలేడు నేడు వేల్పుఱేడు!

కవి సమూహమందు కాళిదాసుడు లెస్స!
మహలులందు తాజమహలు లెస్స!
నగరులందు భాగ్యనగియే హైలెస్స!
దేశభాషలందు తెలుగు లెస్స!!

(ఈ నెల 15వ తేదీ నుండి  భాగ్యనగరిలో ప్రారంభమౌ 
ప్రపంచ తెలుగు  మహాసభలకు
గుర్తుగా మరోమారు ఈ కవితను ఇక్కడుంచాను.)

గోపురం నీడ త్రిప్పి పడే దేవాలయం


గోపురం నీడ త్రిప్పి పడే దేవాలయం
సాహితీమిత్రులారా!

హంపి విరూపాక్ష దేవాలయంలోని
ప్రత్యేకత ఏమంటే రాజగోపురం
నీడ దేవాలయంలో త్రిప్పి పడుతుంది
అలాగే దేవాలయం గోపురం నీడకూడ
ఆలయంలో పడుతుంది-
ఈ వీడియోలో విశేషాలు గమనించండి-


Saturday, December 2, 2017

వసంతం


వసంతం


సాహితీమిత్రులారా!

వసంతం అనే కవిత
"ఫూలోం కీ బహార్" అనే హిందీ
కవితకు స్వేచ్ఛానువాదం)

దూరమెరుగని దూరం నుండి
విరామ మెరుగక పయనాన్ని
సాగిస్తున్న పాంధకిశోరాన్ని
వెదకుతున్నాను వసంతాన్ని
            అదుగో వసంతం వెల్లివిరిసి
            వనిరూపుదాల్చింది
ఆవనిలో వూగే విరులూ
తరులు తరుశాఖలూ
నన్నే పిలుస్తున్నాయి పదేపదే

            తోటమాలీ తలుపు తెరవవోయీ
            తోటమాలీ తలుపు తెరవవోయీ
            నీతోటలోని ప్రతి కొమ్మారెమ్మా
            నన్నేపిలుస్తున్నాయి కమ్మగా
స్తబకాల వన్నెలవెలిగే వనిలో
ననకారుశోభనాట్యమాడే వనిలో
ఆటలాడేపూల
పాటపాడే తుమ్మెదల
చూడమంటున్నాయి కొమ్మలు
            తోటమాలీ తలుపు తెరవవోయి!
            నీతోటలోని కొమ్మలు నన్నేపిలుస్తున్నాయి!
అవి వనినేత్రాలా
దివిలోని తారకలా
ఆనందం చిమ్మేగొట్టాలా
నీతోటలోని అందాల విరులు
              తోటమాలీ తలుపుతెరవవోయి!
              నీతోట ప్రతిపూవునన్నేపిలుస్తున్నాయి!
విరితావుల మత్తెక్కి
ఆనందపు పిచ్చెత్తి
నన్నువోపాటపాడమని
స్వాగతం పలుకుతున్నాయి
              తలుపు తెరువు తోటమాలీ!
              నాపాలిటి వనమాలీ!
శాద్వల శ్యామల భూతలస్వర్గం
కాదిది అపరిదివితలస్వర్గం
తోటప్రక్కలవెళ్ళే వారికేం తెలుసు
కన్నెత్తియైనా ఇటు చూడరు
ఏపూలు విరిశాయో వారికేం తెలుసు
                తోటమాలీ తలుపు తెరవవోయీ!
                తోటమాలీ తలుపు తెరవవోయీ!
హాసవిలాస సుఖాల జీవించి
తుదకా సుఖాల్లోనే నశించే
ఆనంద రూపాలీ విరులు
వీని చావుకేమీ బ్రతుకేమీ
             నేనూ వీటి నవ్వుల నేర్వడానికే వచ్చా
             నింత దూరం ఆ పువ్వుల నవ్వుల నన్ను
             నేర్వనీ తోటమాలీ తలుపు తెరవవోయీ!
తోటమాలీ తలుపు తెరవవోయీ!
వనమాలీ తలుపు తెరవవోయీ!
ఆ పూలు నన్ను పిలుస్తున్నాయి.