Showing posts with label దేవుడు మన కళ్ళకుఎందుకు కనబడడు?. Show all posts
Showing posts with label దేవుడు మన కళ్ళకుఎందుకు కనబడడు?. Show all posts

Monday, January 9, 2023

దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు? ఏం చేస్తే కనపడతాడు?

 దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు? 

ఏం చేస్తే కనపడతాడు?





సాహితీమిత్రులారా!


దేవుడు మన కళ్ళకు…ఎందుకు కనబడడు….? ఏం చేస్తే కనపడతాడు?

మన బతుకు అంతా ఐదు అంశాల మీదే ఆధారపడి వుంది.వాటిని వదిలేస్తే దేవుడిని చూడవచ్చు.....ఇంకా లోతుగా చెప్పాలంటే ఇలా వుంది ఆ వ్యవస్థ 

పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం.

అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…, వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. 

ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….

ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.!

వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ!

అగ్ని కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.

జలమునకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.

భూమి కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటిని మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే. 

ముఖపుస్తకం నుండి.....