Monday, September 30, 2019

మరణ మృదంగం


మరణ మృదంగం





సాహితీమిత్రులారా!

1.
కోర్టు గదుల్లోపల ఓ కేసు మీద వేడివేడిగా చర్చలు జరుగుతున్నై. ఓ లాయర్ ఓ పక్షానిది తప్పు అంటూంటే రెండో ఆయన వేరే వాళ్ళది తప్పు అని వాదిస్తున్నాడు. ఈ వాదనలు అంత త్వరగా ఎలానూ తెమలవు కనక ఈ ఇద్దరు లాయర్లలో ఎవర్నీ సమర్థించకుండా పీటర్, పక్కనే టేబుల్ మీద ఉన్న పేపర్ తీసి పైపైన వార్తలు చదవడం మొదలుపెడుతూ ఒక్కసారిగా అరిచేడు, “ఇది విన్నారా? ఇవాన్ ఇల్యిచ్ పోయాట్ట!”

“నిజమా?” అన్నాడు మరో లాయర్ యథాలాపంగా, అదేదో పెద్ద విషయం కాదన్నట్టూ. అయితే ఆ మాటల్లో పీటర్‌కి కాస్త ఆశ్చర్యం, ‘హమ్మయ్య, దరిద్రం వదిలింది ఇన్నాళ్ళకి’ అనే విషయాలు స్పష్టంగా వినిపించాయి.

చేతిలో పేపర్ చూపిస్తూ పీటర్ చెప్పేడు, “కావాలిస్తే చూసుకోండి ఇందులో రాసినది. ఇది వాళ్ళావిడ ప్రస్కోవ్యా ఇచ్చిన ప్రకటనలో సమాచారమే. ఇవాన్ ఇల్యిచ్ ఫిబ్రవరి 4, 1882న పోయారు. మధ్యాహ్నం శవానికి అంత్యక్రియలు జరుగుతున్నై. స్నేహితులూ, బంధువులూ అందరూ రావాల్సింది.”

ఇవాన్ ఇల్యిచ్ చాలాకాలం కోర్టులో పనిచేశాడు కనక ఆయన జబ్బుగా ఉన్నంతకాలం ఆ ఉద్యోగం ఎవరికీ ఇవ్వకుండా అట్టేపెట్టేరు. ఇప్పుడు ఇవాన్ పోవడంతో ఆ ఉద్యోగం ఎవరికొస్తుందో అనే విషయం గదిలో ఉన్న లాయర్లూ, కొత్తగా చేరిన న్యాయవాదులూ ఎవరి మనసుల్లో వాళ్ళు అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఆలోచనల్లో భాగంగానే పీటర్ కూడా తన బావమరిదికి ఏదో ఒక చోటకు బదిలీకి ప్రయత్నించాలనీ మరొకటనీ ఆలోచించడం మొదలైంది. అయితే పైకి అప్పుడే ఇవన్నీ మాట్లాట్టం బాగోదు కనక “అసలు ఏమైందో ఇవాన్‌కి?” అన్నాడు, ప్రత్యేకించి ఎవర్నీ ఉద్దేశించకుండా.

“ఏమో, ఆయన జబ్బేమిటో డాక్టర్లకి అంతుబట్టలేదు. నలుగురైదుగురి దగ్గిరకి వెళ్ళాట్ట. ఎవరికైనా ఏదైనా తెలిస్తే దానికి సంబంధించి మందులిచ్చారని అన్నారు. అవన్నీ ఏనాడూ పనిచేసినట్టు లేదు.” ఎవరో సమాధానం చెప్పేరు.

“ఆయన ఉన్నవాడేనా? పెళ్ళాం పిల్లలకి ఏమీ లోటుండదు కదా?” మరో పెద్దమనిషి అన్నాడు గుంపులోంచి.

“ఏమో, వాళ్ళావిడకి ఏదో ఉంది. కానీ అది అంత పనికొచ్చేది కాకపోవచ్చు.”

ఈ మాటల వల్ల మొత్తానికి ఈ గుంపులో తేలిందేమిటంటే–జబ్బు వచ్చినదీ, వచ్చాక పోయినదీ ఇవాన్ ఇల్యిచ్, తాము కాదు. ఇదో అంటీ అంటనట్టు ఉండే భావం మనసులో. అయితే దీనివల్ల తమకి తగులుకున్న తలనెప్పి మాత్రం ఇవాన్ పోయినందుకు ఓసారి వెళ్ళి చూడవలసి రావడం. పీటర్ ఇదే విషయం అడిగి ఎవరొస్తారా అని చూడబోతే, ఎవరికీ తీరికా కోరికా ఓపికా ఉన్నట్టు లేదు.

ఎంతాశ్చర్యం! మొన్న మొన్నటిదాకా తామేనా ఇవాన్ కూడా పేకాటకీ దానికీ తిరిగింది? సరే, పీటర్ ఇవాన్‌తో చిన్నప్పటినుండీ చదువుకున్నాడు కనక తానొక్కడే వెళ్ళడానికి తయారయ్యేడు. మిగతావాళ్ళకి ఆ రోజు సాయంత్రం ఆడబోయే పేకాటకన్నా మరో విషయం అంత ముఖ్యం కాదు కాబోలు, మరో ఇంటికి పేకాటకు బయల్దేరారు. పీటర్ ఇవాన్‌ని చూడ్డానికి బయల్దేరుతూ చెప్పేడు, “ఓ కుర్చీ నాకోసం ఖాళీగా ఉంచండి; ఓ చూపు చూసి వచ్చేస్తా!”

“అలాగే, తప్పకుండా ఉంచుతాం.” నవ్వింది పేకాట బృందం.

ఇవాన్ ఇంటికెళ్ళేసరికి పీటర్‌కి కనిపించినది ఇవాన్ వాళ్ళావిడ ప్రస్కోవ్యా, కూతురూ, ఆఖరి పిల్లాడూను. మరికాస్త లోపలికి వెళ్తే మేనల్లుళ్ళూ, మిగతా బంధుగణం. వచ్చేపోయే వాళ్లతో ఇల్లంతా హడావుడిగా ఉంది. ఇవాన్ బతికున్న రోజుల్లో అతన్ని చూడ్డానికీ, సేవ చేయడానికీ పెట్టుకున్న మనిషి జెరాసిమ్‌, పరామర్శకి వచ్చే అందర్నీ ఆహ్వానించడానికీ, వెళ్ళిపోతున్నవారికి వీడ్కోలు పలకటానికీ బయట గదిలోనే ఉన్నాడు. శవాన్ని చూడ్డానికెళ్తే మొదట్లో ఏం చేయాలి? పేటిక దగ్గిరకెళ్ళి క్రాస్ వేసుకోవాలా, లేకపోతే ఏదైనా ప్రార్థన అన్నట్టూ పెదిమలు కదపాలా? ఏదీ తోచని స్థితిలో శవపేటిక దగ్గిరకెళ్ళి, అందరూ ఏం చేస్తున్నారో చూసి అదే చేసి బయటకి రాబోతూంటే ఇవాన్ వాళ్ళావిడ ప్రస్కోవ్యా పీటర్ చేయి పట్టుకుని, “మీతో మాట్లాడే పని ఉంది కాస్త ఇలా వస్తారా?” అంటూ మరో గదిలోకి దారి తీసింది.

పీటర్‌కి కొంచెం ఇబ్బంది అనిపించినా మరోదారి లేక ఆవిడ వెంటే నడిచేడు. లోపలకి తీసుకెళ్ళాక రాబోయే కన్నీళ్లకి కాబోలు, చేతిలో రుమాలు పట్టుకోవడం పీటర్ గమనించాడు. మనసులోనే అనుకున్న మాట మాత్రం, ‘ఇదేం దరిద్రం! ఇప్పుడీవిడ సోది అంతా నేను వింటూ కూర్చుంటే, పేకాటకి సమయానికి చేరడం ఎలా?’

ఏమీ ఉపోద్ఘాతం లేకుండా ఆవిడే మొదలుపెట్టింది, “మీకు సిగరెట్ కాల్చుకోవాలని ఉంటే సరే నాకేమీ అభ్యంతరం లేదు. ఈ అంత్యక్రియలు విషయం, ఇవాన్ చివరి రోజుల గురించి ఎంత మర్చిపోదామన్నా కుదరదు కదా! వాటి గురించి అలా ఉంచి, మరో విషయం మాట్లాడదామని పిల్చాను. చివరి రోజుల్లో ఇవాన్ ఎంత కష్టం అనుభవించాడో చెప్దామని…”

“అవునా! అయ్యో, చివరిదాకా తెలివి ఉందా?” ఏదో అడగాలి కనక పీటర్ అన్నాడు.

“ఆఁ, ఉంది. చివరి మూడు రోజులూ నరకం అనుభవించాడు. ఏడుపు, కేకలు, అసలు మనిషిని పట్టుకోలేకపోయాం అనుకోండి. ఏం చెప్పమంటారు…”

పీటర్‌కి ఏమనాలో తెలియలేదు. ఇవాన్ తనకి చిన్నప్పటి నుండీ తెలుసు. అయినా ఆ నెప్పీ, బాధా తనకి కాదు కదా? తానేం చేయగలడు? ఇదే ఆలోచనల్లో ఉండగానే ప్రస్కోవ్యా అసలు తానడగబోయే విషయానికొచ్చి అడిగింది, “మీరందరూ బాగా ఒకరికొకరు తెలుసున్న లాయర్లూ, గవర్నమెంట్లో పనిచేసిన ఉద్యోగస్తులూనూ. నాకైతే ఈయన పోయినందుకు ఏదో పింఛను వస్తుందేమో, ఇవాన్ పోయినందుకు ఈ అంత్యక్రియలకీ వాటికీ ఏదైనా వస్తుందేమో మీకు తెలుస్తుందనీ, మిమ్మల్ని అడుగుదామనీ…” ముక్కు చీదింది ఆవిడ.

ఒక్కసారిగా పీటర్‌కి జ్ఞానబోధ అయింది. ఇదన్నమాట ఈవిడ తనని అడగబోయినది! చూడబోతే ఈవిడ తనకి రాబోయే పింఛను విషయాలూ అవీ బాగానే తెలుసుకున్నట్టుంది. తానేదో ఉత్తరమో దక్షిణమో ఇచ్చి మరికొంత రాబడతాడని ఈవిడ ఆశ కాబోలు. ఆవిడ చెప్పినదంతా విన్నాక పీటర్ నోరు విప్పేడు, “మీకు తెలిసినదే నాకూ తెలుసు. అంతకన్నా మనమేం చేసినా గవర్నమెంట్ ఇవ్వదు. ఇంతకన్నా రాబట్టడం అసంభవం.”

ఒక పెద్ద నిట్టూర్పు అయ్యేక ఆవిడ మిగతా మాటల్లో పీటర్‌కి ధ్వనించిందేమిటంటే, ఇంక తానేమీ డబ్బులు లాగలేడు కనక, తనవల్ల ప్రస్కోవ్యాకి ఏ అవసరమూ లేదని తెలిసింది కనక, తానింక దయచేయవచ్చు. మెల్లిగా లేచి మరోసారి ఇవాన్ పార్థివదేహం ఉన్న చోటికి వచ్చేడు పీటర్. ఈ సరికి మిగతా బంధువులంతా వచ్చారు కాబోలు గది అంతా నిండి ఉంది. దారి చూసుకుంటూ బయటకొచ్చాడు. జెరాసిమ్‌ కనిపించగానే అన్నాడు కాస్త దీనంగా మొహం పెట్టి, “జీవితంలో ఇదో దరిద్రపు క్షణం కదా?”

“అవును, మనందరం ఏదో ఓ రోజు ఇలా వెళ్ళవల్సినవాళ్లమే గదా?” జెరాసిమ్‌ చెప్పేడు, అక్కడే పడి ఉన్న కుప్పలోంచి పీటర్ కోటు వెతికి తీసి ఆయన చేతికిస్తూ.

తన బాధ్యత తీరిపోయింది, బయటకి వచ్చిన పీటర్ అన్నీ మర్చిపోయి గుర్రం బగ్గీ ఎక్కుతూ హుషారుగా అన్నాడు, తోలేవాడితో, “సరే పోనీయ్, ఇప్పటికే మనం పేకాటకి ఆలశ్యం అయ్యేం. ఇప్పుడు వెళ్తే కనీసం మరో రెండు మూడాటలు వేయొచ్చు.”

“హేయ్” అంటూ గుర్రాలని ముందుకు దూకించాడు, బండి తోలేవాడు.

2.
ఇవాన్ ఇల్యిచ్ జీవితం అతి సాధారణమైనదీ, ఏ చికాకులూ లేనిదీను; మనందరి జీవితాల్లాగానే అందుకే అది అతి భయంకరమైనది. కోర్టులో పనిచేసిన ఇవాన్‌కి నలభై అయిదేళ్ళకే ఆయుష్షు తీరిపోయింది. ఓ సారి ఇవాన్ కుటుంబం గురించి వెనక్కి చూస్తే ఇవాన్ తండ్రికి ముగ్గురు కొడుకులు. ఓ సారి తండ్రికీ ఇవాన్‌కి జరిగిన మాటల్లోనే కొడుక్కి సరైన దెబ్బ–తగలవల్సిన చోట కొట్టేడు తండ్రి.

బాగా పొద్దుపోయాక ఇంటికి ఆలస్యంగా వస్తూ ఎవరికీ కనపడకుండా లోపలకి దూరిపోదామనుకున్న ఇవాన్‌ని ముందు గదిలోనే కూర్చున్న తండ్రి పిలిచేడు “ఒరే అబ్బాయ్, ఇటు రా!”

ఇవాన్ గుండె చిక్కబట్టుకుని తండ్రి ముందుకొచ్చేడు. తన కోసమే చూస్తున్నాడా ఇంతవరకూ? ఈయనకి కోపం వస్తే వళ్ళు చీరేస్తాడనేది ఊరంతా తెలిసినదే. అసలే సర్కారు ఉద్యోగంలో దశాబ్దాలు పనిచేసి ప్రజలందర్నీ ఎలా ఏడిపించుకు తినాలో క్షుణ్ణంగా తెలిసిన మనిషి. ఏమంటాడో ఇప్పుడు? తన చదువు గురించా, లేకపోతే తాను అప్పుడప్పుడూ ఎగ్గొట్టే క్లాసుల గురించా, ఇప్పుడు తనతో మాట్లాడబోయేది?

“ఒరే అబ్బాయ్, పెద్దాడు ఏదో ఒకటి చేసి నాలాగ సర్కారు ఉద్యోగం సంపాదించాడు. నీ తర్వాత వాడు ఎలాంటివాడో ఊరంతా తెలుస్తూనే ఉంది. వాణ్ణి దార్లో పెట్టడానికి చావొచ్చింది. కిందా మీదా పడి రైల్వేలో ఉద్యోగం వేయించాను. నీ సంగతి ఇంక తేలాలి. నువ్వేం చేద్దామనుకుంటున్నావ్? నువ్వు క్లాసులు ఎగ్గొడుతున్నావనీ, నీ పనులు బాగోలేవనీ నా దగ్గిరకి కర్ణాకర్ణీగా వార్తలొస్తున్నాయ్…” తండ్రి అడిగేడు.

“నేను ప్లీడరీ చదువుదామనుకుంటున్నానండి.” ఇవాన్ చెప్పాడు ధైర్యం కూడగట్టుకుని.

“ప్లీడరీ మంచిదే, ఏదో ఉద్యోగం వస్తుంది లేకపోతే ఆఫీసు పెట్టుకోవచ్చు. కానీ ఆ చదువులు చదవగలననే ధైర్యం ఉందా? చూడబోతే నీ తిరుగుళ్ళు అంత బాగోలేవు మరి. నీకు ధైర్యం లేకపోతే అలా పై చదువులకి డబ్బులు తగలేయడం దేనికీ?” మొదట్లో అడిగిన సౌమ్యత తండ్రి గొంతులో లేకపోవడం గమనించాడు ఇవాన్.

“ఇంక తిరుగుళ్ళు కట్టిపెట్టేసి బాగా చదువుతాను.” కంగారుగా చెప్పేడు ఇవాన్.

“సరే వెళ్ళు అయితే, నేను అన్నీ గమనిస్తున్నానని మర్చిపోకు సుమా! తేడాలొస్తే నా చేతిలోంచి ఒక్క కొపెక్ కూడా రాలదు. ఆ తర్వాత ఏమౌతుందో నీకూ తెలుసు.”

బతుకుజీవుడా అనుకుంటూ ఇవాన్ వడివడిగా లోపలకి నడిచాడు. ఉత్తరోత్తరా ఇవాన్, తండ్రి చెప్పిన ప్రతీమాటా తు.చ. తప్పకుండా వినే తన అన్నలాగా బుద్ధిమంతుడూ కాకుండా, తమ్ముడిలా మరీ తిరుగుబోతూ కాకుండా మధ్యస్థంగా పైకొచ్చేడు. బంధువుల్లో ఇవాన్ అంటే ఏమీ ప్రత్యేకత లేకపోయినా, మంచివాడనిపించుకోకపోయినా, చెడ్డవాడని మాత్రం ఎవరూ అనలేదు. చిన్న వయసులో నేర్చుకున్న వినయం విధేయత, కుర్రాడిగా ఉన్నప్పుడూ ఆ తర్వాత పెద్దయ్యాకా మర్యాదగా ఎలా మసలాలో నేర్చుకున్నదీ, ఇవాన్ ఎప్పుడూ మర్చిపోలేదు. పెద్దయ్యేకొద్దీ ప్రతీ కుర్రాడిలాగానే కొంచెం అమ్మాయిల పట్ల వ్యామోహం, కాస్త గర్వం వంటబట్టినా వాటివల్ల తనకి గానీ, అవతలవాళ్లకి గానీ, తన కుటుంబానిక్కానీ ఏమీ అపకారం, చెడ్దపేరు రాకుండా ఇవాన్ జాగ్రత్తగానే ఉన్నాడనడం వాస్తవం. దీనికి కారణం, చదువు కోసం ఇవాన్ తండ్రి ఇచ్చిన ఆఖరి వార్నింగ్‌ను మనసులో ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవడమే.

ఇవాన్‌ పూర్తిగా చదువు మీద దృష్టి సారించేక ఎంతో కష్టం అనిపించిన ప్లీడరీ చదువు మెల్లిగా వంటబట్టడం మొదలైంది. స్కూల్లో ఉన్నప్పుడు చేసిన వెధవ పనులు ఎప్పుడైనా గుర్తొస్తే మనసులో ముల్లులా దిగేది ఇవాన్‌కి మొదట్లో అవి తలుచుకుని. అయితే ఓ సారి కాలేజీలో చేరాక అవే పనులు మిగతావాళ్ళూ చేస్తూంటే సరే తాను చేసినది అందరూ చేస్తున్నదే అంటూ మనసులో సమాధానం ఇచ్చుకున్నాక జీవితం గాడిలో పడడం మొదలైంది. అయితే తాను చేసిన వెధవ పనులు తండ్రికి చూచాయగా తెలియడం వల్ల, అవి చేసినందుకు కలిగిన పశ్చాత్తాపం, అవమానాల వల్ల, చేసినవి తప్పా ఒప్పా అనేవి మాత్రం ఇవాన్‌కి ఎప్పటికీ తెలియలేదు. తెలిసినది మాత్రం తాను అందరిలాగే చేశాడు. ఏదేమైనా ఇవన్నీ ఒక్కోటిగా మర్చిపోయి చదువులో పడ్డాడు ఇవాన్; చదువు సాగినంత కాలం తండ్రి, తనతో చెప్పినట్టూ, తనమీద ఓ కన్నేసి ఉంచుతాడనేది ఎప్పటికప్పుడు గుర్తుంచుకుంటూ.

మూడేళ్ళకి ప్లీడరీ చదువు గట్టెక్కేసరికి సర్కారు వారి పుణ్యమా అని సివిల్ సర్వీసులో చిన్న ఉద్యోగం కుదిరింది. తనకి చెప్పినట్టూ కుదురుగా చదువుకుని ఉద్యోగం సంపాదించినందుకు తండ్రి సంతోషించాడా లేదా అనేది ఎలా ఉన్నా, ఇవాన్ కొత్త ఉద్యోగంలో చేరడానికి కావాల్సిన బూట్లూ, బట్టలూ కొనుక్కోవడానికి మాత్రం ఆయన డబ్బిచ్చాడు. చదువుకున్న కాలేజీలో తనకి పాఠాలు చెప్పిన టీచర్లకీ, తన స్నేహితులకీ వీడ్కోలు చెప్పేసి, మారు మూల పల్లెటూర్లో వచ్చిన సర్కార్ ఉద్యోగంలో జేరడానికి తనకున్న సరంజామాతో బయల్దేరాడు ఇవాన్.

స్వంత సంపాదన చేతిలో పడుతూంటే, ఇవాన్ ఉద్యోగంలో నేర్చుకున్నదేమంటే, ఆఫీసు గంట అయిపోయాక తనిష్టం వచ్చినట్టూ చేయొచ్చు. బయట ఎలా నవ్వినా ఏం చేసినా ఉద్యోగంలో మాత్రం ఇవాన్ నిక్కచ్చి మనిషి. అయితే ఈ కుర్ర లాయర్ని తన వలలోకి లాగినప్పుడూ, ఆ తర్వాత ఆవిడ ఇవాన్‌ని వ్యభిచారం చేసే చోట్లకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడూ, తన పై ఆఫీసర్ చెప్పింది బుద్ధిగా విని ఆవిణ్ణి వదిలించుకున్నాడు ఇవాన్. ఏదైతేనేం, తన ఉద్యోగానికీ, సమాజంలో తాను సంపాదించుకున్న గౌరవానికీ ఎసరు రాకుండా ఇవాన్ జాగ్రత్త పడ్డాడనేది మాత్రం వాస్తవం. మొదట్లో తండ్రి వల్ల ఉద్యోగం సంపాదించుకున్నాడనీ, ఏదో అత్తెసరి సరుకు మనిషనీ అనుకున్న జనం ఇవాన్ నిజాయితీ ఆఫీసులో ఎప్పుడైతే తెలిసిందో అప్పట్నుండి కొంచెం గౌరవం ఇవ్వడం మొదలు పెట్టారు. దానికి తగ్గట్టుగానే మరింత నిజాయితీగా ఉంటూ ఇవాన్ నేర్చుకున్న విలువైన పాఠం: ఆఫీసు విషయాలు, అవి అయిపోయాక తాను బయట వెలగబెట్టే రాచకార్యాలు ఎప్పుడూ కలవరాదు.

అలా అయిదేళ్ళు ఆ ఉద్యోగం చేశాక, కొత్త కోర్టులూ, కొత్త లా పుస్తకాలూ అమల్లోకి వచ్చేయి. ఇవన్నీ జనాల్లోకి రావాలంటే ఎవరో ముసలి లాయర్లూ, న్యాయమూర్తుల వల్లా ఏమౌతుంది? కొత్తవాళ్ళ అవసరం అనివార్యం కనక వీళ్ళలో ఇవాన్ ప్రముఖుడిగా తేలాడు, కుర్ర లాయర్ అవడం వల్లా, పాత వ్యవస్థలో అయిదేళ్ళు పనిచేసినందు వల్లాను. దీనివల్ల ఇవాన్‌కి మెజిస్ట్రేట్ ఉద్యోగానికి పదోన్నతి వచ్చి వేరే చోటకి బదిలీ అయింది. తలతాకట్టు పెట్టాక చేసేదేముంది? ఇప్పటిదాకా పోగేసుకున్న స్నేహితుల్నీ, పరిసరాలనీ విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి. అలా రెండోసారి ఇవాన్ కొత్త ఉద్యోగానికి బయల్దేరేడు.

పాత ఉద్యోగంలో టై, సూటూ, బూటు వేసుకుని ఉద్యోగానికి వెళ్తే పోలీస్ ఆఫీసర్ నుంచి కింద వాళ్లదాకా గౌరవం ఇచ్చేవారు. అయితే ఆ గౌరవం తన పై ఆఫీసర్ అయిన మెజిస్ట్రేట్ రానంతవరకే. ఆయన రాగానే తాను చేతులు కట్టుకుని ఆయన ముందు అందరితోపాటు నిలబడాల్సిందే. అయితే ఇప్పుడు తానే ఒక మెజిస్ట్రేట్. ఎవర్నైనా తన దగ్గిరకి తీసుకొస్తే తాను చెప్పేదాకా అలా నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. తాను ఏదైనా కాయితం మీద రాసి ఆర్డర్ ఇస్తే అది ముక్కస్య ముక్కార్థంగా అనుసరించవల్సిందే. తాను అంత గొప్పవాడు.

ఇంత పెద్ద ఉద్యోగం వచ్చినా ఇవాన్ తన ఉద్యోగాన్నీ తనచేతిలో అధికారాన్నీ ఏనాడూ పాడుచేసిన దాఖలాల్లేవు. నిజాయితీగా తన ఉద్యోగం తాను చేసేవాడు. ఆఫీసు బయటకొచ్చాక కూడా తాను చేసే ఏ పని వల్ల తనకి కానీ తనకి ఉద్యోగం ఇచ్చిన సర్కార్ వారిక్కానీ ఎప్పుడూ ఎసరుపెట్టే పనులు చేయలేదు. కొత్త పుస్తకాలు వంటబట్టించుకుని, ఏదైనా క్లిష్టమైన కేసు వస్తే తన స్వంత అభిప్రాయం పక్కనపెట్టి, దాన్ని కూలంకషంగా ఏ కీలుకాకీలు విడదీసి సులభంగా తీర్పు చెప్పడం అలవాటు చేసుకున్నాడు ఇవాన్. అలా కొత్తగా వచ్చిన మెజిస్ట్రేట్ ఏ పనైనా సులభంగా చేస్తాడని పేరు రావడానికి అంత కష్టం కాలేదు. ఈ వార్తలన్నీ ఇవాన్ తండ్రికి ఎప్పటికప్పుడు చేరుతూనే ఉన్నాయ్.

ఈ కొత్త ఉద్యోగంలో ఇవాన్ సమాజంలో డబ్బున్న పైతరగతి వాడు. పాత ఊళ్ళో ప్లీడరీ ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన స్నేహాలూ, అక్కడి స్నేహితులూ వేరు. ఇక్కడ ఇవాన్ మెజిస్ట్రేటు కనక కొత్త స్నేహితులందరూ డబ్బున్న సమాజంలో బాగా పై తరగతి జనం. అందులో చాలామంది బాగా డబ్బున్న ప్లీడర్లూ, మిగతా పెద్దలూను. వాళ్లతో పేకాట, అప్పుడో వోడ్కా ఇప్పుడో చిన్న సర్దా తీర్చుకుంటూ ఇవాన్ జీవితం గాడిలో పడుతోంది. పేకాటలో పట్లు తెలుస్తున్నై ఇవాన్‌కి. కొంచెం హుందాగా కనిపించడానికా అన్నట్టూ గెడ్డం పెంచడం మొదలుపెట్టాడు కూడా.

రెండేళ్ళు ఇలా సరదాగా గడిచేక ప్రస్కోవ్యా ఇవాన్ జీవితంలోకి ప్రవేశించింది. ఆఫీసు పని అయ్యేక ఎప్పుడైనా పేకాట దగ్గిరో మరో చోటో తారసిల్లిన ఈ ప్రస్కోవ్యా ఇవాన్‌తో అప్పుడప్పుడూ కలిసి డాన్స్ చేయడం, రాత్రిదాకా గడపడం జరిగాక ప్రస్కోవ్యాని పెళ్ళి చేసుకోవడానికి ఇవాన్‌కి ఏమీ అభ్యంతరం కనిపించలేదు. ప్రస్కోవ్యా మంచి కుటుంబంలోంచి వచ్చినదే, ఏవో కొన్ని ఆస్తిపాస్తులున్నాయి కూడా. అయితే ఇవాన్ మాత్రం ఆవిణ్ణి పెళ్ళి చేసుకునే ముందు తనకున్న ఉద్యోగం, ఆవిడకి కూడా తనంత జీతం వస్తుందనుకోవడం, తన జీతం కుటుంబానికి సరిపోతుందా, లేదా అనేది మాత్రం జాగ్రత్తగా లెక్కలు కట్టుకుని బేరీజు వేసుకుని చూసుకున్నాడనేది అతని స్నేహితుల్లో కొంతమందికి మాత్రమే తెల్సిన నిజం. అలా మొత్తానికి ఇవాన్‌కి పెళ్ళైపోయింది.

పెళ్ళైన కొత్తలో యువజంటకి వేడివేడిగా వాడివాడిగా హాయిగా గడిచింది. కొత్త ఇల్లూ, ఆ ఇంటిక్కావాల్సిన సరంజామా అమర్చుకున్నాక జీవితం ఇంక అంతా హాయే కదా. అయితే త్వరలోనే తెలిసొచ్చిన నిజం ప్రస్కోవ్యా ఏడు నెలల నిండు చూలాలు. భార్య కడుపుతో ఉంటే మాత్రం తాను ముందు గడిపినట్టే జీవితం హాయిగా గడపడానికి ఏమీ అడ్డురావాల్సిన అవసరం లేదని ఇవాన్ అనుకున్నాడు కానీ మొదటి నెలల్లోనే అసలు జీర్ణించుకోలేని, ఇప్పటివరకూ ఎప్పుడూ ఎదురవని చేదు నిజాలు బయటకి రావడం మొదలుపెట్టాయ్! మొదటి కాన్పు అవడం వల్లో మరోటో గానీ అయినదానికీ కాని దానికీ, ఇవాన్ చేసే ప్రతీ పనికీ ఆవిడ ఇవాన్‌ని తప్పుపడుతూ నసపెట్టడం నేర్చుకుంది. ఉత్తి పుణ్యానికి ఇవాన్ అంటే అసూయ పడడం, ఎక్కువసేపు ఆఫీసులో ఉంటాడనీ అసలు ఇల్లు అంటే లెక్కలేదనీ దెప్పడం మొదలైంది. ప్రస్కోవ్యా నస మొదలైన రోజుల్లో ఆవిణ్ణి పట్టించుకోకుండా ఎప్పట్లాగానే ఉండొచ్చని ఇవాన్ అనుకుంటూ తాను వెళ్ళడమో లేకపోతే స్నేహితుల్నీ బంధువుల్నీ ఒక్కోసారి తనింటికే పేకాటకి పిలుస్తూండడం గమనించాక ప్రస్కోవ్యా మరింత విజృంభించింది. బయటకి వెళ్లనీయకుండా ఇవాన్‌కి ఏదో పనిచెప్పడం, ఆ పని అయ్యేక అది సరిగ్గా చేయలేదనడం, లేకపోతే మరో వంక ఇవాన్‌ని ఇంటిపట్టునే ఉంచడానికి. ఈ నస తప్పించుకోవడానికి ఏ మార్గమూ తట్టలేదు ఇవాన్‌కి. తాను ఊరుకునేకొద్దీ ప్రస్కోవ్యా మరింత నసగడం ఇవాన్ గమనించేడు. ఏ పెళ్ళి వల్లయితే తనకి ఆనందం దొరుకుతుందనుకున్నాడో అదే పెళ్ళి వల్ల తన జీవితంలో మునపటి సంతోషం కూడా మాయమౌతూండడం, పెళ్ళికి ముందు ఏ పని చేయడానికైనా తనకున్న స్వాతంత్రం కూడా ఇప్పుడు లేకపోవడం, ఆటు ఆఫీసు పనితోనూ ఇటు ఇంట్లో జరిగే నసతోనూ తన బతుకు అస్తవ్యస్తంగా తయారవడం ఇవాన్‌కి తెలుస్తూనే ఉంది. అయినా ఏమీ చేయలేని అశక్తత.

ప్రసవం అయ్యేక ప్రస్కోవ్యా మారుతుందనుకున్నాడు కానీ ఇప్పుడు ఇవాన్‌కి కొత్త కష్టాలు తయారయ్యేయి. పుట్టిన పిల్లకి ఎలా, ఎన్ని పాలు పట్టాలో తెలియకపోవడం, దానిక్కూడా ఇవాన్ ఓ కారణం అంటూ పేట్రేగి బుర్ర తిరిగిపోయేలా ప్రస్కోవ్యా సణుగుడు. తల్లికీ పిల్లకీ ఏవేవో రుగ్మతలు. అవి అసలు నిజంగా డాక్టర్ దగ్గిరకి వెళ్ళాల్సినంత రుగ్మతలా కాదా అనేది ఇవాన్‌కి ఆవిడ ఎప్పుడూ చెప్పని, అసలు ఎప్పటికీ తెలియని రహస్యం.

మునపటికంటే తగ్గుతుందనుకున్న ప్రస్కోవ్యా పెట్టే నస ఇప్పుడు పుట్టిన పిల్లతో రెట్టింపు అయింది. ఆలోచించగా ఇవాన్‌కి చివరకి తేలిందేమిటంటే, పెళ్ళి అనేది ఏదో కొంత సంతోషాన్నిచ్చినా అదో పెద్ద తలకి మించిన భారం. ఏ నిముషం ఎలా ఉంటుందో ఎవరికి తన సహాయం కావాలో, ఎవరు తనని విసుక్కుని పురుగులా విదిల్చి పారేస్తారో అనేది చెప్పడం అసంభవం. ఈ పెళ్ళి అనే సుడిగుండం లోంచి ఈదుకుని బయటపడి ‘నేను సంతోషంగా ఉన్నానహో’ అని చెప్పగలిగే ప్రబుద్ధుడెవడూ లేడు. తనకేదైనా ఆటవిడుపంటూ ఉంటే అది ఆఫీసు పనిలోనే. అలా ఓ ఏడాదిలో ఇవాన్ ఇంట్లో నోరుమూసుకుంటూ, ఆఫీసులోనో లేకపోతే బయటో తన సంతోషం వెతుక్కోవడానికి అలవాటుపడ్డాడు.

మూడేళ్ళు ఇలా గడిచాక ఇవాన్‌కి మరోసారి పదోన్నతి. ఇప్పుడు ఇవాన్ ఎవరినైనా సరే తన ఇష్టం వచ్చినట్టూ విచారణ జరిపించి జైల్లో పెట్టించగలడు. పెద్దలెవరైనా పిలిస్తే వెళ్ళి సభాముఖంగా ఓ గంట మాట్లాడగలడు కూడా. ఈ ఆఫీసు పని ఇలా ఉంటే ఇంట్లో ఈ లోపుల మరి కొంతమంది పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్లతో పాటే ప్రస్కోవ్యా నస కూడా ఎక్కువైంది, అంతే సాధారణంగా. అయితే ఇవాన్ జీవితంలో నేర్చుకున్న విషయాలతో ఓ సారి ప్రస్కోవ్యా నోరు విప్పడం మొదలుపెట్టగానే తాను వేరే లోకంలోకి పోయినట్టూ ఈవిడ సాధించడాన్ని వినిపించుకోకపోవడం అలవాటు చేసుకున్నాడు. కనీసం అలా అనుకుంటున్నాడు. మరో ఏడేళ్ళు గడిచేక ఇవాన్‌కి మరోసారి ముక్కూ మొహం తెలియని వేరే చోటుకి బదిలీ అయింది. అక్కడకి వెళ్ళేలోపునే పుట్టిన మొదటి ఇద్దరూ పిల్లలూ ఏదో వ్యాధితో పోయారు.

కొత్త ఉద్యోగంలో వచ్చే జీతం ఎక్కువైనా ప్రస్కోవ్యాకి ఈ ఊరు నచ్చలేదు, ఇక్కడ ఏది కొనాలన్నా ఖర్చెక్కువ. ఇంత దూరం తనకి ఇష్టం లేకపోయినా ఈడ్చుకొచ్చినందుకు ఆవిడ నస మరింత ఎక్కువై ఇవాన్ జీవితం మరింత దుర్భరం అయింది. ఓసారి అయినదానికీ కానిదానికీ ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం అయితే మరోసారి పిల్లల గురించో వాళ్ల చదువుల గురించో, ఒకరితో ఒకరు అరుచుకుంటూ–మాట్లాడుకోవడం అనడం కన్నా కొట్టుకోవడం అనడం సబబేమో-–కసురుకోవడం. ఇవి ఎక్కువయ్యే కొద్దీ ఎక్కడో మొదలైన కథ వెనక్కి పాత విషయాల మీదకీ, ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన వాటిమీదకీ అలా అలా పెరుగుతూ మరింత అరుచుకోవడం; ఇలా ఒకరికొకరు తమకి తెలిసీ తెలియకుండా మనసులో దూరంగా జరగడం ఇద్దరికీ తెలుస్తూనే ఉంది. ఎప్పుడైనా, అరుదుగా ఓ చిన్నపాటి తేలిక నవ్వులు ఇద్దరి మధ్యా. అదయ్యాక మళ్ళీ గొడవలూ, అరుపులూ.

ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతూంటే జీవితం ఇలాగే ఉంటుందనీ, ఇదంతా సర్వసామాన్యం అనీ ఇవాన్‌కి తెలిసివస్తోంది క్రమక్రమంగా. ఈ చెప్పులో రాయిని, చెవిలో జోరీగను తప్పించుకోవడానికి ఇవాన్ ఎక్కువసేపు ఆఫీసులో, తన ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవడంలో కాలం వెచ్చించేవాడు. లేకుంటే సాయంత్రాలు స్నేహితులతో పేకాటలో. అలా ఆఫీసులో ఇవాన్ మంచి పేరు తెచ్చుకున్నట్టు జనం అనుకోవడం, పని అయిపోయాక ఆఫీసువాళ్లతో కబుర్లు, పేకాట, వీటితో ఇవాన్‌కి కూడా తృప్తిగానే ఉంది. ఇలా ఇవాన్ పేకాటలో, ఆఫీసు పనిలో తన స్వంత సుఖం వెతుక్కోవడం మొదలుపెట్టాక ప్రస్కోవ్యా అసలు ఇవాన్ ఇంటి గురించి పట్టించుకోవట్లేదని మరో కొత్త గొడవ మొదలెట్టింది. ఏదైతేనేం రోజులు అలా పరుగెడుతూనే ఉన్నై. అందరి జీవితాల లాగానే తన జీవితం కూడా బాగానే ఉందనుకుంటూనే ఉన్నాడు ఇవాన్. కాలం ఎవరి కోసమూ ఆగదు కదా?

పెద్దమ్మాయి లిసాకి పదహారేళ్ళొచ్చాయి. అలా ఈ అమ్మాయీ, పోగా పోయినవాళ్లలో చివర్న స్కూల్లో చదివే కుర్రాడు మిగిలేరు ఇవాన్‌కి. కుర్రాణ్ణి తనలాగానే లాయర్ చదువులో పెడదామన్నాడు ఇవాన్. కానీ ప్రస్కొవ్యా అడ్డం వచ్చి కుర్రాణ్ణి హైస్కూల్లో జేర్పించింది. తనంటేనే ప్రస్కోవ్యాకి అసహ్యం అనుకున్నాడు ఇవాన్, కానీ ఇలా కుర్రాణ్ణి లాయర్ చదువుకి వద్దనడంతో ఈవిడకి తానే కాదు తాను చదివిన చదువంటే కూడా అసహ్యం అని ఇవాన్‌కి పరోక్షంగా చెప్పినట్టయింది. అమ్మాయికి ఇంటిదగ్గిరే చదువు. ఎక్కడ ఏం చదువుతున్నా పిల్లలిద్దరూ గాడిలో పడుతున్నట్టే అని ఇవాన్ అనుకున్నాడు. కొన్నాళ్ళు గడిచేక వేరే చోటికీ మరో ఉద్యోగానికీ మారుతావా అని అడిగారు ఆఫీసులో పెద్దలు ఇవాన్‌ని. కానీ అన్నింటినీ వద్దనుకుని అదే ఊర్లో ఉండిపోయేడు, మారితే ప్రస్కోవ్యా నస మరింత ఎక్కువ అవుతుందనుకోవడం ఒకటీ, మారిన ప్రతీసారీ ఆ కొత్త ఊళ్ళో సర్దుకోవడం మరోటీ అన్నీ గుర్తొచ్చి.

3.
అలా పదిహేడేళ్ళు గడిపాక అప్పుడొచ్చింది అనుకోని అవాంతరం ఇవాన్ జీవితంలోకి. ఉన్న ఊర్లోనే ప్రమోషను తనకి రాకుండా మరొకరికి ఇవ్వడం దీనిక్కారణం. దీనితో చిర్రెత్తుకొచ్చిన ఇవాన్ ఆఫీసులో పై వాళ్లతోనూ తెలిసినవాళ్లతోనూ తనకా ఉద్యోగం రానందుకు గొడవ పెట్టుకున్నాడు. ఈ జగడాలతో వాళ్లకీ ఇవాన్ అంటే కోపం మొదలైంది. చిలికి చిలికి గాలివాన అయి మిగతా పై ఉద్యోగాలక్కూడా ఇవాన్‌ని పట్టించుకోవడం మానేశారు. ఇటు ఎదుగుతున్న పిల్లల వల్ల ఇంట్లో ఖర్చులు పెరుగుతున్నాయి. తనకేమో పదోన్నతి రాకుండా ఈ ఆఫీసు పెద్దలు అడ్డుకుంటున్నారు. ప్రస్కోవ్యా నస ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ప్రస్కోవ్యాకి ఉన్న చిన్ని ప్రపంచంలో ఎవరెన్ని తప్పులు చేసినా మొత్తం ఆవిడ చుట్టూ ఉన్న ప్రపంచం ఇంత దరిద్రంగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఇవాన్! ఇవాన్‌కి ఉన్న తలనెప్పి మరొకటి; తనకొచ్చే జీతానికీ తన ఖర్బులకీ ఎక్కడా పోలిక లేదు. అప్పు చేయకుండా బండి నడవని పరిస్థితిలో ఆఖరికి అన్నీ తెలిసిన ఇవాన్ తండ్రి కూడా నిమ్మకి నీరెత్తినట్టూ ఉండడం, ఏమీ సహాయం చేయకపోవడం చూసాక ఇవాన్‌కి అనిపించిన విషయం- తానో పనికిరాని, ఎవరికీ అఖ్ఖర్లేని ఏకాకి దద్దమ్మ అని. అయితే ఇవాన్ ఉద్యోగం, అతనికొచ్చే జీతం మూడువేల అయిదువందల రూబుళ్ళూ చూసి బైటవాళ్ళు అనుకునేది వేరు. వాళ్ల దృష్టిలో ఇవాన్ ఒక అదృష్టవంతుడు. పదోన్నతి రాకుండా అడ్డుకున్నందుకు ఇవాన్‌కి జీవితంలో విరక్తి పుట్టి చావాలనిపించినప్పుడు, ఇవాన్ తండ్రితో సహా అందరికీ అదేమీ అసలు పట్టించుకోవాల్సిన విషయంలాగా కూడా అనిపించలేదు.

ఎవరూ సహాయం చేయని ఈ స్థితిలో ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకటే మార్గం తోచింది ఇవాన్‌కి. కొంతకాలం ఉన్న ఉద్యోగానికి శెలవు పెట్టి ప్రస్కోవ్యానీ పిల్లల్నీ పుట్టింట్లో ఆవిడ అన్న దగ్గిర దిగపెట్టి అక్కడే ఉండడం. ప్రస్కోవ్యా అన్న, తన బావ ఉండేది పల్లెటూళ్ళో కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. ఉండేది పుట్టింట్లో కనక ప్రస్కోవ్యా నస, తనని సాధించడం తగ్గడానికీ ఆస్కారం ఉంది కదా?

అయితే బావ ఇంట్లో దిగేక అసలు విషయం తెలిసొచ్చింది ఇవాన్‌కి. ఇప్పుడు తనో జీతం లేని మనిషి. శెలవైతే ఇస్తారు కాని పని చేయకుండా జీతం ఎవరు ఎంత కాలం ఇస్తారు? మొదటి పదిరోజులు సరదాగా గడిచేక నిద్రపట్టని రాత్రుళ్లతో ఇవాన్‌కి జీవితం మరింత కష్టమైంది. కొన్నాళ్ళు ఈ నరకం అనుభవించాక ఓ రోజు పొద్దున్నే ఏదో నిశ్చయానికి వచ్చినవాడిలా, బావ, ప్రస్కోవ్యా ఎంత చెప్పినా వినిపించుకోకుండా పీటర్స్‌బర్గ్ బయల్దేరాడు. వెళ్లడానికి ఒకటే కారణం–ఎలాగైనా ఎవరి కాళ్ళో చేతులో పట్టుకుని ఎక్కడో ఒకచోట పెద్ద జీతానికి ఉద్యోగం సంపాదించాలి. విధి ఒక్కొక్కప్పుడు మనకి అనుకూలంగా మారడం నిజమనేదానికి సాక్ష్యం కాబోలన్నట్టూ, వెళ్ళాక తెలిసింది అసలు విషయం- మంత్రివర్గంలో మార్పుల వల్ల ఇవాన్‌కి మంచి రోజులు రాబోతున్నై! తర్వాత కాగితాలు వేగంగా కదిలేయి. మొదట్లో పనిచేసిన చోటే ఇవాన్‌కి పెద్ద పదోన్నతి; అదీ మామూలుగా కాదు, రావాల్సిన పదోన్నతి కన్నా రెండు మెట్ల మీదకి ఒక్కసారిగా, తంతే బూర్లె బుట్టలో పడ్డట్టూ పడ్డాడు ఇవాన్. వీటితోబాటు, శెలవులో ఉన్నందుకు డబ్బూ, జీతం బాగా పెంచుతూ మరో కాయితం ఇవ్వబడ్డాయి. ఒక్కసారి ఇన్ని సంతోషపు వార్తలు రావడంతో ఇవాన్ ఇంట్లో, ఆఫీసులో అంతకు ముందు జరిగిన పాత కక్షలూ అన్నీ మర్చిపోయి బావ దగ్గిరకి బయల్దేరేడు ఇవన్నీ చెప్పడానికి. కొన్నాళ్ళ ఎడబాటు వల్లో, కొత్త ఉద్యోగం, అందులో రాబోయే ఎక్కువైన జీతం వల్లో, లేకపోతే మరో కారణమో, ఏదైతేనేం, ఇవాన్, ప్రస్కోవ్యాల మధ్య దెబ్బలాటలూ, వాదులాటలూ ఏమీ రాలేదు. మరీ పెళ్ళయిన కొత్తలో ఉన్నంత ప్రేమ ఒకరిమీద ఒకరు ఒలకపోసుకోకపోయినా దగ్గిరగా ఉన్నట్టు అనుకోవల్సిందే.

వెనక్కి వచ్చి చెప్పిన ఈ వార్తలకి ప్రస్కోవ్యా, ఆవిడ అన్న, వదిన సంతోష పడ్డారని ఇవాన్‌కి అనిపించింది. చెల్లి మొగుడికి ఉద్యోగం లేనప్పుడు తమ ఇంట్లో తిష్టవేసి, తమ మోచేతి నీళ్ళు తాగుతున్నందుకు అన్న ఎలా ఉన్నా వదిన విసుక్కోవడం తెలిసిన ప్రస్కోవ్యా, ఇప్పుడీ ఇద్దరూ బలవంతం చేసిమరీ కొన్నాళ్ళు ఉండమంటే వాళ్లని కాదనలేక మరో కొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. అదీగాక కొత్త ఊళ్ళో ఇల్లు చూసుకుని ఇవాన్ అన్నీ అమర్చుకోవద్దూ, పెళ్ళాం పిల్లల్ని తీసుకెళ్ళేముందు? అలా ఇవాన్ ఒక్కడే బయల్దేరేడు ఉద్యోగంలో చేరడానికి, ప్రస్కోవ్యా తనకి వచ్చిన ఉద్యోగం చూసి సంతోషించిందనుకునీ, తన గొడవలూ సణుగుడూ తగ్గినందుకూను.

కొత్త ఊర్లో ఇవాన్‌కి అంత కష్టపడక్కర్లేకుండానే, మంచి ఇల్లు దొరికింది. తామిద్దరూ ఎడంగా ఉండడం వల్లో, డబ్బు మహిమో మరొకటో మరి, ఇవాన్ సౌమ్యంగా కాకపోయినా మునపటంత దురుసుగా మాత్రం మాట్లాడటం లేదు ఎవరితోనూ. ఇంటికి కావాల్సిన మరమ్మత్తులు జరుగుతూంటే, ఖాళీ ఉన్నప్పుడల్లా అటు వెళ్ళి తానూ ఒక చేయి వేయడం, ఏది ఎక్కడ ఎలా ఉండాలో చెప్పడం- ఇవీ ఆఫీసు గంటలు అయ్యేక ఇవాన్ చేసే పనులు. రాత్రి పడుకున్నప్పుడు ఇంట్లో ఏ పని ఎలా చేస్తే ఇల్లు బాగుంటుందా అంటూ ఆలోచించడం, పొద్దున్న లేచాక ఆ ఆలోచన ప్రకారం పనులు సరి చేయించడం; ఒక్కోసారి వీటి గురించి ఆలోచిస్తూ ఆఫీసు పనిలో కూడా పరాకుగా ఉండడం; నవ్వుకుంటూ తర్వాత ఒళ్ళు దగ్గిర పెట్టుకుని పనిచేయడం; ఇవీ ఇప్పుడు ఇవాన్ జీవితంలో ముఖ్యమైన పనులు. ఇంటి పనంతా అవడానికి సెప్టెంబర్ దాకా పట్టవచ్చేమో అనుకున్నాడు కానీ అన్నీ అక్టోబర్ దాకా సాగాయి. ఈ లోపుల ఇవాన్ ఇంటి గురించీ ఆ మరమ్మత్తుల గురించీ బావకీ ప్రస్కోవ్యాకీ పెద్దగా తెలియనివ్వలేదు. కారణం ఏమిటంటే ప్రస్కోవ్యా రాగానే తాను కొన్న పెద్ద ఇల్లూ, ఆ ఇంటిని ఎలా తీర్చిదిద్దాడో–అదీ ప్రస్కోవ్యాకి అనుకూలంగా–చూపించి ఒక్కసారి ఆశ్చర్యపరుద్దామని. ఇంట్లోకి కావాల్సిన సోఫాలకీ కుర్చీలకీ ఆఖరికి కిటికీలకి పెట్టే తెరలకీ కూడా ఇవాన్ ఎముకలేకుండా చేయి ఝూడించాడు, లేకపోతే తర్వాత అమ్మగారికి కోపం రాదూ?

ఓ రోజు ఇల్లంతా కలయ తిరుగుతున్నప్పుడు ఏవో కిటికీ తెరలు సరిగ్గా పెట్టలేదనీ, అవి ఎలా పెట్టాలో చూపించడానికి ఇవాన్ స్వయంగా అక్కడే ఉన్న నిచ్చెన పైకి ఎక్కుతూ సరిగ్గా చూసుకోక, కాలు పట్టు తప్పి కింద పడ్డాడు. బిగించడానికి అక్కడే నేలమీద ఉంచిన తలుపు పిడి పక్కటెముకల్లో గుచ్చుకుని కలుక్కుమంది ఒక్కసారి. ఇవాన్ వెంఠనే లేచి నుంచుని దెబ్బ తగిలిన చోట చేత్తో రుద్దుకున్నాడు. మర్నాడూ, ఆ పై రోజూ ఏదో ముట్టుకుంటే కొంచెం నెప్పి అనిపించినా మొత్తానికి దాని గురించి పెద్దగా ఆలోచించవల్సిన అవసరం రాలేదు. మూడు రోజులు పోయాక అన్ని పనులూ సరిగ్గా జరుగుతున్నందుకూ, కొత్త ఉద్యోగానికీ అందులో వచ్చే జీతానికి అన్నింటినీ కలుపుకుని చూసుకుని ఇవాన్ సంతోషంగా తన డైరీలో రాసుకున్న విషయం ‘నేను జీవితంలో పదిహేనేళ్ళు చిన్నవాడినైపోయినట్టుగా ఉంది.’

ఇల్లు పూర్తిగా సిద్ధం అయ్యాక అందర్నీ రమ్మని ఉత్తరం రాసి ప్రస్కోవ్యా, పిల్లల్నీ తీసుకురావడానికి ఇవాన్ రైల్వేస్టేషన్‌కి వెళ్ళాడు. వచ్చిన వాళ్ళందరికీ పనివాళ్ళు ఎలా చేసిందీ, వాళ్లని తాను ఎలా సరి దిద్దిందీ, అన్నీ చూపించాడు ఇవాన్ ఇల్లంతా కలియతిప్పుతూ. ఆఖరికి తాను నిచ్చెన మీద నుంచి కిందపడి ఎలా దెబ్బ తగిలించుకున్నాడో కూడా చెప్పేడు. చెప్పినది విని పెళ్ళాం పిల్లలూ కళ్ళూ విప్పార్చుకుని ‘ఆహా, ఓహో’ అంటే ఇవాన్ పొంగిపోయి సంతోషపడ్డాడు. సాయిత్రం టీ తాగుతూంటే ప్రస్కోవ్యా అడిగింది ఇవాన్ కింద పడడం, దాని వల్ల తగిలిన పక్కటెముకల్లో దెబ్బ సంగతీ, అసలు ఎలా కింద పడ్డాడూ అనేవి. “ఓ అదా! ముట్టుకుంటే, ఇదిగో ఇక్కడ కాస్త నెప్పి అనిపిస్తోంది, ఇప్పటికే తగ్గిపోయిందనుకో. అయినా ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు నన్నేం చేయగలవు, నేను ఓ రకంగా మంచి ఆటగాణ్ణి గదా స్కూల్లోనూ, కాలేజీలోను కూడా? నా బదులు మరొకరికి ఈ దెబ్బ తగిలి ఉంటే ప్రాణం మీదకి వచ్చి ఉండేది కాదూ?” ఇవాన్ చెప్పేడు తనకి తగిలినది పెద్ద పట్టించుకునేంత దెబ్బ కాదన్నట్టూ.

ప్రస్కోవ్యా వచ్చాక ఇంటికి మరికొన్ని మార్పులు; ఫలానా వస్తువు ఇక్కడ మాత్రమే ఉండాలి. మరొకటి ఇక్కడ ఉండకూడదు, ఇంకొకటి మరీ పాతదైపోయింది కొత్తది కొనాలి, ఈ పాత వస్తువు మరోచోట ఉండి తీరాల్సిందే. అలా ఏదైతేనేం, ఈ విషయాల్లో దెబ్బలాటలూ, అరుపులూ, కేకలూ లేకుండా ఇవాన్ బండి లాక్కొచ్చాడు. అంతా సర్దుకున్నాక చేయడానికి ఇంకేముంది? పొద్దుటే లేచి కాఫీ తాగి ఆఫీసుకెళ్ళడం, అక్కడ తీరిక లేకుండా పని. సాయంత్రం కొత్త స్నేహితులూ పేకాటతో అప్పుడప్పుడూ జీవితం బాగానే ఉంటోంది కూడా. దేనికీ కొరతనేదే లేదు. ఇన్నేళ్ళలో ఇవాన్ నేర్చుకున్న పాఠం ఆఫీసు విషయాలూ, ఇంటి విషయాలూ ఎప్పుడూ ఒకదానికొకటి కలవకుండా చూసుకోవడం. పాత జీవితంలో దెబ్బలాటలు మనసులో ఎప్పటికీ ముల్లులా మెదుల్తూనే ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇవాన్ ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాట్టం, అవసరం లేనిచోట మాట్లాడకపోవడం అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడైనా రాత్రి భోజనం అయ్యేక ఎవరైనా స్నేహితులొస్తే వాళ్లతో కబుర్లు, లేకపోతే ఏదో పుస్తకం చదవడం, మర్నాటిక్కావాల్సిన కోర్టు కాగితాలు చూసుకోవడం. రోజులు చీకూ చింతా లేకుండా గడిచిపోతున్నాయ్. అమ్మాయి పెద్దదవుతోంది కనక కొంతమంది అబ్బాయిలు దానికూడా తిరగడం ఇవాన్, ప్రస్కోవ్యా గమనిస్తూనే ఉన్నారు. ఆఖరి కుర్రాడు స్కూల్లో ఉన్న తన లెక్కలతోనో, వాడికి కుదిర్చిన మేష్టారితోనో పాఠాలు కుస్తీ పడుతున్నాడు అందరి పిల్లల్లాగానే.

ఓ సారి ఇవాన్ తెలుసున్న అందర్నీ పిలిచి డేన్స్ పార్టీ ఇచ్చేడు ఇంట్లో. అన్నీ అద్భుతంగా జరుగుతున్నై అనుకునేంతలో ప్రస్కోవ్యా ఇవాన్‌తో దెబ్బలాట వేసుకుంది- వచ్చిన అతిథుల కోసం కొన్న కేకుల గురించీ మిగతా తిండి గురించీను. ‘ఆవిడ బయట నుంచి తెప్పించినవి బాగోలేవని ఇవాన్ మరో నలభై అయిదు రూబుళ్ళు ఖర్చుపెట్టి మరికొన్ని కేకులు కొన్నాడుట, అవి పార్టీలో ఎవరూ తినలేదనీ, మిగిలిపోయాయనీ వాటి కోసం అంత డబ్బు తగలేయడం ఎందుకని’ ఆవిడ వాదన. చిలికి చిలికి గాలివాన అయినట్టూ ఇక్కడ మొదలైన గొడవ వెనక్కి వెనక్కి పెళ్ళి అయిన రోజుదాకా వెళ్ళి ఒకరి గొంతు ఒకరు పట్టుకునేదాకా వచ్చింది. ‘నువ్వో పనికిరాని వెధవ్వి’ అని ఆవిడ తేల్చి చెప్పేసరికి ఇవాన్ తలపట్టుకుని ఇంక విడాకులే శరణ్యం అనుకున్నాడు ఆ రోజు. పార్టీలో తాను సంతోషంగా ఉన్నాడనుకున్న పది నిమిషాలూ ఆవిరై పోవడానికి ఒక్క క్షణం కూడా పట్టలేదంటే అదంతా ఆ రోజు ఇవాన్ మీద వీరవిహారం చేసిన ప్రస్కోవ్యా నోటి ప్రతిష్టే. ఈ గొడవ ఎలా ఉన్నా, ఏమైనా డాన్స్ పార్టీ మాత్రం బాగా జరిగినట్టూ చెప్పుకోవాల్సిందే. ఇవాన్ సమాజంలో బాగా పేరున్న ఒకావిడతో డాన్స్ చేశాడు సంతోషంగానే.

ఆ తర్వాతి రోజుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మరో వారం గడిచింది. ఇవాన్‌ది ఏ తప్పు ఉన్నా లేకపోయినా ఆవిడ పూర్వంలా కోపంతో మాట్లాడకుండా చేతిలో వస్తువు విసిరి విరగ్గొట్టడం, అది ఇవాన్ పట్టించుకోకపోతే ఆవిడ కోపం చూపించడానికి మరోలా ప్రయత్నం చేయడం; ఈ తతంగం చూశాక ఆవిడ ఎప్పుడైతే తానున్న గదిలోకి రాబోయిందో వెంఠనే ఇవాన్ లేచి మరో గదిలోకి వెళ్లిపోవడం మొదలుపెట్టాడు. ఇది గమనించింది కాబోలు, ఆవిడ కూడా ఇదే పద్ధతిలో ఇవాన్ గదిలోకి వస్తే తాను బయటకి వెళ్ళిపోవడం సాగించింది. రోజులకొద్దీ ఒకరి మీద ఒకరికి పెరిగే విపరీతమైన అసహ్యం; ఈయనంతే మారడు అని ఆవిడనుకుంటే, ఆవిడకు ఎందుకు కోపమో ఇవాన్‌కి అంతుబట్టక పోవడం.

మామూలు రోజుల్లో ఆఫీసులో ఏం జరిగినా సాయంత్రం అయ్యేసరికి నలుగురితో పేకాట ఆడ్డానికి మాత్రం మంచి ఉత్సాహం ఇవాన్‌కి. తక్కువమందితో ఆడితే ముక్కలు సరిగ్గా రావడం అటుంచి ఆట సరిగ్గా పసందుగా ఉండటం లేదు. ఏ రోజైనా పేకాట ఆడినందుకు కొంచెం సంతోషమే, అయితే అందులో నెగ్గి డబ్బులొస్తే ఆ రోజు రాత్రి మంచం ఎక్కేముందు మరి కాస్త సంతోషం. ఎప్పుడైనా ఏ విషయంలో దెబ్బలాటలొచ్చినా స్నేహితులని మాత్రం కలిసి ఎంచుకోవడం ఇవాన్‌కీ ప్రస్కోవ్యాకీ బాగానే అలవాటైంది. సమాజంలో పై తరగతి జనాలతో స్నేహాలు పెంచుకుంటూ తమకి పనికిరాని వాళ్ళని క్రమంగా తగ్గించుకున్నారు ఇద్దరూను.

జీవితం గడిచిపోతోంది. ఆ గడిచేది సంతోషంగానేనా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే, ప్రస్కోవ్యా నోటి దురుసు లేనినాడు కాస్త ప్రశాంతత. ఏ రోజైనా ఆవిడ నోరు విప్పితే ఆ రోజు నుంచి మరో పదీ పదిహేను రోజులు నరకం. ఈ రకంగా జరిగే రోజుల్లో, పెద్దగా మిగతా మార్పులేవీ లేవు ఇవాన్ జీవితంలో.
4.
ప్రస్కోవ్యాకి కూడా ఆరోగ్యం బాగానే ఉంది. ఎప్పుడైనా ఇవాన్‌కి దెబ్బ తగిలిన చోట నెప్పిపెట్టినా ఇవాన్ ఆరోగ్యానిక్కూడా వంక పెట్టడానికి లేదు. అప్పుడో జ్వరం, ఇప్పుడో రొంపా రాకుండా ఆ మాత్రం ఎవరికీ జీవితం ఉండదు కదా? దెబ్బ తగిలిన చోట నెప్పి ఎప్పుడైనా ఎక్కువైతే ఆయా రోజుల్లో ఎవరి మీదైనా పెద్దగా అరవడం, అదీ తనకి తెలియకుండానే అసంకల్పితంగా జరుగుతోందని ఇవాన్‌కి తెలియదు. మొగుడూ పెళ్ళాల మధ్య మళ్ళీ అంతర్యుద్ధాలు మొదలయ్యేయి. అయినదానికీ కానిదానికీ అరుచుకోవడం, అక్కడ్నుంచి మరోసారి జరిగిపోయిన విషయాల్లో నీది తప్పు అంటే నీది తప్పు అని అరుపులూ కేకలూ. ఇవాన్ ఇంట్లో ప్రశాంతత అంటే ఏమిటనే ప్రశ్న తలెత్తడం సహజంగానే మొదలైంది. కొన్ని రోజుల్లో నెప్పి ఉన్ననాడు ఇవాన్ కోపం ముక్కుమీద కొచ్చేది. ఈ మధ్యలో ప్రస్కోవ్యా చెప్పిన విషయం ఏమిటంటే- ఇవాన్‌కి ఉన్న కోపం భరించలేనిది. తాను మంచిది కనక ఈ ఇరవై ఏళ్ళూ నెట్టుకురాగలిగింది కానీ మరొకరైతే ఈ పాటికి నుయ్యో గొయ్యో చూసుకునేవారే. ఇదీ కొంచెం నిజమే అన్నట్టూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాన్ గొణగడం, దానితో గొడవ మొదలు పెట్టడం ఆయన దగ్గిర్నుంచే ప్రారంభం అవడం అందరికీ తెలుస్తోంది. వీటిక్కారణాలు కూడా అతి చిన్నవి. కొడుకు తినేటప్పుడు టేబిల్ మీద చేయి సరిగా పెట్టేడనో, పెట్టలేదనో, తిన్న తర్వాత ఆ కంచం సరిగ్గా తీయలేదనో, లేకపోతే హాల్‌లో ఉన్న పేపర్ సరిగ్గా ఉంచలేదనో, ఇదనీ అదనీ అయినదానికీ కానిదానికీ అరవడం చూసేక మొదట్లో నోరు పారేసుకునే ప్రస్కోవ్యా తన నోరు అదుపులో పెట్టుకోవడం అలవాటు చేసుకుంది. ఇన్నేళ్లలో ఈవిడ ఇవాన్‌ని సాధించి, రాచి రంపాన పెట్టి ఇప్పటికి నేర్చుకున్నదేమిటంటే, ఇవాన్ అరుస్తున్నప్పుడు తాను నోరు మూసుకుంటే ఆయనే అరిచి అరిచి ఊరుకుంటాడు. లేకపోతే ఇల్లో నరకంలా తయారౌతోంది. పెద్దవాళ్లవుతున్న పిల్లల ముందు అరుచుకోవడం ఎంత సిగ్గుచేటు!

అలా ఇవాన్ అరవడం మొదలుపెట్టగానే ఆవిడ కూడా ఏదో పని ఉన్నట్టు వేరే గదిలోకి వెళ్ళిపోవడం, ఏదో పని గుర్తొచ్చినట్టూ నటించడం అలవాటు చేసుకుంది. ఎప్పుడైతే ప్రస్కోవ్యా నోరు అదుపులో పెట్టుకుంటూ ఇవాన్ అరుపులు విననట్టూ నటించడం నేర్చుకుందో అప్పట్నుంచీ ఇవాన్ అరవడం మరింత ఎక్కువైంది. ఈ గొడవలు చూశాక ప్రస్కోవ్యాకి తన జీవితం అంటే విరక్తీ, తన మీద తనకే జాలీ పుట్టేయి. ఇవాన్ అంటే విసుగుపుట్టడం మొదలై ఆఖరికి ఈ గొడవలు భరించలేక లోపల ‘ఇంక వీడు ఛస్తే మేలు’ అనుకోవడం దాకా వచ్చింది. అయితే నిజానికి ఆవిడకి–అందరి భార్యల్లాగానే, మొగుడు చావడం ఇష్టం లేదు. ఆయన పోతే ఆయనకొచ్చే జీతం, ఈ ఇల్లూ, ఇంట్లో, బయటా పనులన్నీ ఎవరు చేస్తారు? అలా ఇవాన్ పోతే మంచిదే గొడవ వదుల్తుంది, కానీ ఇవాన్ పోకూడదు. అలా అటూ ఇటూ తేల్చుకోలేక ఈ ఘర్షణలో ప్రస్కోవ్యాకి మరింత విరక్తీ, జీవితం అంటే భరించలేని నరకంలాగా తయారౌతోంది.

ఓ రోజు ఇవాన్ ఎప్పట్లాగే అరిచి అరిచి విసిగి వేసారిపోయి కూలబడ్డాక, ప్రస్కోవ్యా అసలు ఇవాన్ ఎందుకిలా తయారయ్యోడో కనుక్కోడానికి నెమ్మదిగా మాటల్లోకి దించింది. అప్పుడు తెలిసినది ఇవాన్ ఒప్పుకున్న విషయమే–ఇవాన్‌కి పక్కటెముకల్లో దెబ్బ తగిలిన చోట నెప్పి రోజురోజుకీ ఎక్కువౌతోంది. నెప్పి ఎక్కువైననాడు ముక్కుమీద కోపం, అరవడం అన్నీ హెచ్చుతున్నాయ్. మరికాస్త విచారించాక ఇవాన్‌ని డాక్టర్ దగ్గిరకి తీసుకెళ్ళడానికి నిశ్చయం అయింది. మొత్తానికి ఇవాన్ మొదటిసారి ఓ డాక్టర్‌గారి ఆఫీసులో తేలాడు.

డాక్టర్ దగ్గిర అంతా మామూలే, పిలిచేదాకా ఎందుకొచ్చాంరా భగవంతుడా అంటూ కూర్చోవడం, పిలిచాక లోపలకి వెళ్ళి ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం, తాను కోర్టులోకి వచ్చే నేరస్తులతో చెప్పినట్టే, డాక్టర్ తనతో చెప్పడం–ఇవన్నీ నాకొదిలేయండి, నేను చెప్పినట్టు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ మందులు వేసుకోండి–అలా తానేదో సాక్షాత్తూ భగవంతుడిలా ప్రాణం పోస్తానన్నట్టూ మాట్లాడేడు డాక్టర్.

కోర్టులో ఇవాన్ కూడా ఇలాగే మాట్లాడతాడు కదా వచ్చిన నేరస్తులతో? నేను చెప్పినట్టూ జైల్లో ఉండండి, మీజీవితం నా చేతుల్లో పెట్టండి, నేను బాగు చేస్తా, నేను చెప్పింది వింటే… అలా కోర్టులో తాను భగవంతుడైతే ఇక్కడ డాక్టర్ తనకి భగవంతుడు.

డాక్టర్ చెప్పడం ప్రకారం ఇవాన్‌కి ఏదో అయింది. దెబ్బతగిలిన చోట ఏదో ఉంది. అయితే డాక్టర్ స్కోపు పెట్టి తరచి తరచి చూసినా ఏమీ తెలియలేదు. ఫలానాది అవ్వొచ్చు అనుకుందాం ప్రస్తుతానికి, అయితే ఆ ఫలానా అవునా కాదా అనేది ఇంకా తెలియదు… వగైరా వగైరా. ఈ సోది అంతా డాక్టర్ మాట్లాడుతుంటే ఇవాన్‌కి ఉన్న ప్రశ్న ఒక్కటే, ‘ఈ సోది అంతా పక్కన పెట్టి, ఇప్పుడు తనకున్నది ఏ రోగమో అలా ఉంచి అసలు అది సీరియస్సా లేకపోతే చిన్నపాటి మందులతో తగ్గుతుందా?’

అయితే ఇవాన్ అడిగిన ఈ ప్రశ్న డాక్టర్‌కి పట్టినట్టు లేదు, అసలు ప్రశ్న ఆయన ఉద్దేశ్యంలో ఈ రోగం కిడ్నీ దెబ్బతినడం వల్ల వచ్చిందా లేకపోతే ఇది అపెండిసైటిస్సా? అది తేలితే మిగతాది తర్వాత చూసుకోవచ్చు. డాక్టర్ చెప్పడం ప్రకారం ఇది అపెండిసైటిస్ అనుకుని ముందు మందులు వేసుకుంటూ మూత్రం పరీక్షకి పంపుతారు. అలా అపెండిసైటిస్సా, కిడ్నీకి సంబంధించినదా అనే రెండింట్లో ఒకటి సులభంగా తేల్తుంది. అయితే డాక్టర్ ఇలా ఇది ఫలానా జబ్బు అని చెప్పకపోవడం ఇవాన్‌కి నిరాశ కలిగించింది. వచ్చేసే ముందు ఆయనకివ్వాల్సిన ఫీజు టేబిల్ మీద పెట్టి మళ్ళీ ఓ ప్రశ్న అడిగేడు, “మా లాంటి వాళ్ళకి మీరు చెప్పేది సరిగ్గా అర్ధంకాదు కనక అడుగుతున్నాను, డాక్టర్ ఇప్పుడు నాకున్నది ఏదైనా ప్రాణాపాయమా?”

“నాకు తెలుసున్నంతలో ఏం చేయాలో చెప్పాను కదా? మూత్రపరీక్షలో మరికొంత సమాచారం తేల్తుంది. అప్పుడు చూద్దాం ఏం చేయాలో?” డాక్టర్ చెప్పేడు కళ్లజోడు సవరించుకుంటూ ఇవాన్ కేసి చూసి. ఆయన మాటల్లో వాడిన–సామాన్యంగా జనాల్లో ఎవరికీ సాధారణంగా అర్ధం కాని–పదాలు ఇవాన్‌కి కూడా అర్ధంకాలేదు.

ఎందుకో మెజిస్ట్రేట్ అయిన ఇవాన్‌కి తాను కోర్టులో నేరస్తులతో ఇలాగే ‘చూడు నాయనా నువ్వు ప్రశ్నలడగడం మాని నోరు మూసుకోకపోతే నిన్ను కోర్టు లోంచి బయటకి పొమ్మని, నిన్నేమీ అడక్కుండానే శిక్ష విధించాల్సి ఉంటుంది,’ అనడం చటుక్కున గుర్తొచ్చింది. వెంఠనే నోరుమూసుకుని డాక్టర్‌కు ఒక నమస్కారం పారేసి బయటకొచ్చి బగ్గీలో ఇంటికి బయల్దేరేడు. దారంతా ఒకటే ఆలోచన. ఇప్పుడు తనకున్నది ఏ రోగం? పెద్ద రోగం అయితే ప్రాణం పోయేంతటిదా లేకపోతే చిన్నపాటిదా? అసలీ డాక్టర్లు ఏమీ చెప్పకుండా, లేకపోతే ఏవో ఎవరికీ అర్ధంకాని పదాలన్నీ వాడుతూ ఇదీ కాదు అదీ కాదంటూ ఏవిటీ మాట్లాట్టం? ఇంతా చేసి డాక్టర్ తనకి ప్రాణం మీదకొచ్చే జబ్బు అన్నాడా లేకపోతే నయం అవుతుందన్నాడా? నిజంగానే తనకి జబ్బు ముదిరిపోయిందని డాక్టర్ చెప్పినట్టూ ఇవాన్ బుర్రలో పురుగు తొలవడం మొదలుపెట్టింది. మనసంతా కల్లోలం అవుతూంటే ఇంటికొచ్చే దారిలో ఇన్నాళ్ళూ అప్పటిదాకా అందంగా కనిపించిన అందమైన ఇళ్ళూ చెట్లూ చేమలూ చీదర చీదరగా ఛండాలంగా కనిపించడం మొదలై మొత్తానికి ఎలాగోలా ఇల్లు చేరాడు. ఇంటి దగ్గిర బయల్దేరినప్పుడు పక్కటెముకల్లో ఉన్న నెప్పి మాత్రం డాక్టర్ దగ్గిరకి వెళ్ళినప్పుడూ, వచ్చేటప్పుడూ కూడా ఏమీ తగ్గినట్టులేదు సరికదా, ఈ డాక్టర్‌తో మాట్లాడాక మరింత ఎక్కువైనట్టనిపించింది ఇవాన్‌కి.

బగ్గీ దిగి ఇంట్లోకెళ్ళాక డాక్టర్ ఏమన్నాడో ప్రస్కోవ్యాతో ఇలా చెప్పడం మొదలు పెట్టాడో లేదో పెద్దమ్మాయి లిసా గదిలోకి వచ్చింది టోపీ పెట్టుకుని. తల్లీ, కూతురూ ఎక్కడికో వెళ్లడానికి ముందే సిద్ధమైనట్టున్నారు తాను రాకముందే. ఆ పిల్ల గదిలోకి వచ్చాక ఉన్న రెండు క్షణాలూ ముళ్ళమీద కూర్చున్నట్టు కూచోవడం, తాను మాట్లాడేది వినడానికి ఇద్దర్లోనూ ఎవరికీ ఏ మాత్రం ఇష్టం లేకపోవడం వాళ్ల మొహాల్లో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటే, ఇవాన్ నోరు మూసుకున్నాడు. ఏదైతేనేం, ప్రస్కోవ్యా ఇవాన్ చెప్పినది అసలు పూర్తిగా విందో లేదో కాని, కూతురితో బయటకి వెళ్ళేటప్పుడు మాత్రం యథాలాపంగా అంది, “మొత్తానికి డాక్టర్ దగ్గిరకెళ్ళావు, సంతోషం. ఏదీ డాక్టర్ చీటీ ఇలా ఇయ్యి, మన పనికుర్రాడు జెరాసిమ్‌ని పంపించి మందు తెప్పిస్తా. మర్చిపోకుండా వాడు.”

ఆవిడ గదిలో ఉన్నంతసేపూ ఏదో కష్టం నెత్తిమీద ఉన్నవాడిలా ఉన్న ఇవాన్ ఆవిడలా వెళ్లగానే దీర్ఘంగా నిట్టూర్చాడు: ‘నిజానికి నా పరిస్థితి నేననుకున్నంత ఛండాలంగా లేదు కాబోలు.’

ఆ రోజునుంచీ ఇవాన్ డాక్టర్ చెప్పినట్టు మందు వేసుకోవడం మొదలుపెట్టేడు కానీ మూత్రం పరీక్ష అయ్యేక ఈ మందు మార్చబడింది. అయితే మూత్రపరీక్షలో వచ్చినదీ, డాక్టర్ అనుకున్నదీ, ఇవాన్‌కి ఉన్న నెప్పీ ఇవన్నీ వేరువేరని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. డాక్టర్ తనకి తెలుసున్నంతలో ఇవాన్‌కి మంచి మందులే ఇస్తున్నాడు. అయినా ఇవాన్ నెప్పి తగ్గకపోవడానికి డాక్టర్‌ని ఎలా తప్పు పట్టడం? డాక్టర్ ఇచ్చిన మందు వల్ల నెప్పి తగ్గనందుకు ఇవాన్‌కి ఎంత కోపం వచ్చినా ఇచ్చిన మందు మాత్రం వాడుతూనే ఉన్నాడు. రోగం ముదురుతూనే ఉంది. రోజూ మందు వాడాక తన నోటిలోంచి ఏదైనా వాసన వస్తోందా, అజీర్ణం ఏదైనా ఉందా, మందు సమయానికి వేసుకుంటున్నాడా అనేది ఏ రోజులోనైనా ఇప్పుడు ఇవాన్‌కి ఉన్న ముఖ్యమైన పని. తెలుసున్న ఎవరైనా తమ ఆరోగ్యం గురించో తమకున్న రోగం గురించో మాట్లాడితే ఇవాన్ ఇప్పుడు శ్రద్ధగా విని వాళ్లకున్న రోగం తనకొచ్చినలాంటిదేనా కాదా, వాళ్లకీ తనకీ ఒకే రకం రోగ లక్షణాలా అనేది అడిగి మరీ తెలుసుకుంటున్నాడు. ఇలా ఎప్పటికప్పుడు మర్చిపోదామనుకున్నా ఇవాన్ మనసులో రోజులో దాదాపు నూరు శాతం మెదిలేది–తనకున్న రోగం. తెలియనిది మాత్రం, ఎన్నిసార్లు డాక్టర్ దగ్గిరకి వెళ్ళినా ఇవాన్‌కి వచ్చిన రోగం ఏమిటనేది మాత్రమే.

మందులవల్ల ఏదైనా గుణం కనిపించిందా అనేది అటుంచినా, ఇవాన్ తాను వాడే మందులవల్ల రోగం తగ్గుతోందని తనకి తాను చెప్పుకోవడం మొదలుపెట్టినా, ఇవాన్‌కి తెలీని, తెలిసినా పట్టించుకోని మరో విషయం ఉంది. ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా తన మాట వినకపోయినా, గొడవపడ్డా, ఆఫీసులో కాయితాలు కదలకపోయినా, ఆఖరికి పేకాటలో ముక్కలు సరిగ్గా రాకపోయినా నెప్పి ఎక్కువవుతున్నట్టూ, రోగం ముదిరినట్టూ అనిపించి మరింత కోపంగా అరుస్తున్నాడు ఇవాన్. రోజులో ఎవరితోనూ ఏ గొడవా రానప్పుడు మందు పనిచేస్తోందనుకోవడం, ఏ గొడవైనా వస్తే, తనకి జబ్బు ముదరడం కోసమే ఫలానా గొడవ కావాలని ఎవరో కల్పించారనుకోవడం ఇవాన్‌కి తెలియకుండానే అలవాటు అవుతోంది. మందు వేసుకున్నా నెప్పి తగ్గకపోవడం వల్ల అందరి మీదా అరుస్తున్నాడని మిగతావాళ్ళు అనుకుంటే, అందరూ కావాలని తనకి కోపం తెప్పించి మందు పనిచేయకుండా చేస్తున్నారని ఇవాన్ ఆలోచన. మందు పనిచేస్తోందా లేదా అనేది అటుంచితే తన కూడా ఉన్నవాళ్ళు పనికట్టుకుని కావాలని అలా ప్రవర్తించి, తనకి కోపం తెప్పించాలనుకుంటున్నారని అనుకుంటూ మరింత అరవడం; దాంతో మందు వికటించడం జరుగుతోంది. ఎందుకిలా జనం అంతా తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు? తాను కోలుకోవడం వీళ్లకిష్టం లేదా? తనకి జనాలమీద ఉత్తి పుణ్యానికిలా కోపం రావడానిక్కారణం తానే అని తెలుసుకోవడానికి బదులు తన చుట్టూ ఉన్న జనం అనుకోవడంతో ఇవాన్‌కి అందరిమీదా అసహ్యం కలుగుతోంది. డాక్టర్లకి అంతుబట్టని తన రోగం ఏమిటనేది తెలుసుకోవడానికి ఇప్పుడు ఇవాన్ దొరికిన పుస్తకాలూ, కాయితాలూ చదవడం మొదలుపెట్టాడు. చదివేకొద్దీ ఆయా పుస్తకాల్లో ఉన్న రోగాలన్నీ తనకున్నట్టు భ్రమించుకోవడం, మరింత కోపం; ఈ చక్రభ్రమణం అలా సాగుతూనే ఉంది. ఆ రోజు ఇలా ఉంటే ఈ రోజుకి నేను బాగుపడ్డాను, ఆ తర్వాత, ఈరోజు ఇంకా బాగుంది ఆరోగ్యం అంటూ ఇవాన్ బేరీజు వేసుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఈ బేరీజులన్నీ డాక్టర్‌ని చూసే రోజు వరకే. ఓ సారి డాక్టర్ దగ్గిరకెళ్లగానే వాళ్ళు చెప్పింది విన్నాక తనకి రోగం మరింత ముదిరినట్టు అనిపించేది; ఒకోసారి ఆ ముదరడం బాగా ముదిరినట్టు అనిపిస్తే మరోసారి కొంచెంగానే ముదిరినట్టు.

ఆ పై నెలలో ఇవాన్ మరో పెద్ద డాక్టర్ దగ్గిరకెళ్ళేడు. మందిచ్చేటప్పుడు సవాలక్ష ప్రశ్నలు. ఈ డాక్టర్‌కి ఏం వచ్చో, రాదో అటుంచి అసలీ ప్రశ్నలన్నీ చూస్తే ఈయన డాక్టరేనా అనిపించడం సహజం. ఈయన కూడా మొదటి డాక్టర్ లాగానే చెప్పాడు, తనదేదో రోగం అయినా సరే ఇవాన్ ఈయన ఇచ్చిన మందు ఓ వారం వాడి చూసేడు. ఫలితం శూన్యం కానీ మరో డాక్టర్ దగ్గిరకెళ్ళమనీ, ఆ మూడో డాక్టర్ హస్తవాసి గొప్పదనీ మరెవరో ఊదేరు ఇవాన్ చెవిలో. అలా ఇవాన్ మూడో డాక్టర్ దగ్గిర తేలాడు. ఈ డాక్టర్ దగ్గిరకి వెళ్తూంటే మనసులో ఏదో శంక; ‘అసలు ఇలా అందరి చుట్టూ తిరక్కుండా మొదటి డాక్టర్ చెప్పినట్టూ చేస్తే బాగుండేదేమో?’ అంతట్లోనే తటాల్న మరో ఆలోచన; ‘ఛీ, ఛీ ఇదేం పనికిరాని ఆలోచన? ఇలా నీరసం కలిగించే ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు, అసలే తనకేదో జబ్బు ఉందంటున్నారు కదా?’ మూడో డాక్టర్ దగ్గిర మందు వాడుతున్నప్పుడు మరో తెలుసున్నావిడ చెప్పడం విని ఇవాన్ ఒక హోమియోపతీ డాక్టర్‌ని చూడబోయేడు. ఆయనిచ్చిన మందు ప్రస్కోవ్యాకి తెలియకుండా రహస్యంగా వాడి చూసేడు ఇవాన్. అలా మూడో డాక్టర్ మందులూ, హోమియోపతీ మందూ వాడ్డం మొదలెట్టాక ఇవాన్ నోట్లోంచి ఇప్పుడో దుర్వాసన మొదలయింది. నెప్పి ఏమాత్రం తగ్గినట్టో అనిపించింది తగ్గలేదు సరికదా మరింత ఎక్కువైంది. ఆకలి మందగించి నీరసం వస్తోంది ప్రతీరోజూ. ఇంక ఈ విషయంలో తనని తాను మోసగించుకోవడం అనవసరం. తన శరీరంలో జరిగే మార్పులు తనకొక్కడికే కదా తెలిసేది? ఇంత జరుగుతున్నా డబ్బులు గుంజుతున్న ముగ్గురు డాక్టర్లలో ఏ ఒక్కడికీ తన జబ్బేమిటో తెలియలేదా?

అన్నింటికన్నా వింత, తనకిలా అవుతూంటే, ప్రపంచం అతి మామూలుగా తన పని తాను చేసుకుపోతూంది. ఎవరికీ తన గురించి కానీ తనకున్న అతి వింతైన, ఏ డాక్టరూ ఏమిటో చెప్పలేని జబ్బు గురించి కానీ ఆవగింజంత పట్టినట్టు లేదు. ఎవరూ తన గురించి పట్టించుకోకపోవడం అనేది ఇవాన్‌ని మరింత కుంగదీసే విషయం. బయట ప్రపంచం ఇలా ఉంటే ఇంట్లో మరింత దరిద్రంగా ఉంది పరిస్థితి. ప్రస్కోవ్యా, తన కూతురూ వాళ్ళ వాళ్ల తిరుగుళ్ళలో ఇవాన్‌కి ఏమయిందో ఎందుకలా అందరిమీదా కసురుకుంటున్నాడో అర్థం కాదు. ఇవాన్‌కి లోలోపల ఒక విషయం మాత్రం అర్థమౌతోంది. వీళ్ళకెవరికీ తాను అఖ్ఖర్లేదు సరికదా వీళ్ల జీవితాలకి తానో పెద్ద అడ్డంకి. తాను ఎంత త్వరగా పోతే అంత బావుంటుందని వీళ్ళందరూ లోలోపల అనుకుంటున్నారు. ఈ సంగతెలా ఉన్నా ఇవాన్‌కి మాత్రం ఒకటి నిజంగానే తెలుసు. అది ప్రస్కోవ్యా ఇప్పుడు తనతోటి వ్యవహరించే పద్ధతి వేరు. ఆవిడ సంతోషానికి తానూ, తన అనారోగ్యం అడ్డం రాకుండా చూసుకుంటూంది. తనని పట్టించుకోనట్టు ఉండడం ఓ రకం మనస్తాపం అయితే ఇవాన్‌కి మెదడు బద్దలయ్యే విషయాలు ప్రస్కోవ్యా ఆవిడ స్నేహితుల్తో రోజూ మాట్లాడే కబుర్లు: “మా ఆయన రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మనుషులందరిదీ ఓ దారి అనుకుంటే మా ఆయనది ఇంకో దారి. మందు ఎలా వేసుకోమంటారో అలా సమయానికి వేసుకోడు. చేపలు తినవద్దని చెప్పారు కానీ అవే తినడం; నేను చెప్పేది వినడు. దీనికి తోడు, అర్ధరాత్రి దాకా నిద్ర మానుకుని స్నేహితుల్తో పేకాట. జబ్బేమిటో ఎవరికీ చెప్పడు. ఎలా తగ్గుతుంది?”

ఆఖరికి ఇవాన్ ప్రస్కోవ్యాని నిలదీశాడు కూడా ఈ విషయంలో. ఆవిడ ఊరుకుంటుందా! ప్రతీ చిన్నవిషయం గుర్తుంచుకుని నిన్న ఇలా చేస్తే మొన్న అలా చేశావు, అటు మొన్న మరోలా అంటూ ఏకరువు పెట్టి తాను స్నేహితుల్తో చెప్పినది నిజమని ఋజువు చేయడం మొదలయ్యేక ఇవాన్ అన్నాడు, “మరి నెప్పి వల్ల అలా జరిగి ఉండొచ్చులే.”

“నెప్పి సంగతి ఎలా ఉన్నా, నువ్వు మారకపోతే అసలు జబ్బు తగ్గడం మాట అటుంచి మా జీవితాలని నాశనం చేస్తున్నావు కదా?” ప్రస్కోవ్యా ఆఖరి బాణం ఇవాన్ మనసులో సూటిగా దిగింది.

మొత్తానికి ప్రస్కోవ్యా ఇవాన్‌తో సహా అందరితోనూ చెప్పి, తాను నమ్మిన విషయం ఏమిటంటే, ఈ జబ్బు రావడానికి, ముదరడానికీ తగ్గకపోవడానికీ అన్నింటీకీ ఇవాన్ ఒక్కడే కారణం. ఆవిడ అలా తన మనసులో మాట చెప్పేసి తన తప్పేమీ లేదని చేతులు దులిపేసుకుంది కానీ ఆవిడన్న మాట ఇవాన్ మీద దారుణమైన ప్రభావం చూపించిందనేది ఆవిడకి తెలియలేదు. అసలే తాటిపండు మీదపడ్డ నక్కలాగా మూలుగుతున్న ఇవాన్‌కి దీనివల్ల మరింత నిస్తేజం ఆవరించింది. జీవితం అంటే ఇప్పుడు ఇవాన్‌కి అతి విరక్తీ, అసహనమూ. దానికి తోడు ప్రస్కోవ్యాని రోజూ చూడడానికే భయం, అసహ్యమూను–నోటికొచ్చినట్టూ ఏమాట పుసుక్కున అనేస్తుందో అని.

ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే, ఆఫీసులో తన దగ్గిర పని ఉన్నా లేకపోయినా ఎవరికీ వేరే పనేమీ లేనట్టూ అంతా తనకేసే చూస్తున్నారని ఇవాన్ సందేహం. వాళ్ల ఆలోచనలు చూడబోతే, ‘వీడికి పోయేకాలం వచ్చేసింది. వీడెప్పుడు పోతాడా, కొత్తాయన ఎప్పుడు వస్తాడా’ అని చూస్తున్నారా? తనలో ఏదో రోగం తనని తినేస్తోందనీ తన మీద జాలి చూపించడం. ఎవరైనా తనతోనూ, చుట్టూ ఉన్న జనంతోనూ సరదాగా మాట్లాడితే ఇవాన్‌కి తాను ఏ రోగం లేని రోజుల్లో ఇలాగే సరదాగా ఉండేవాడు కదా అని గుర్తొచ్చి, ఇప్పుడు ఆరోగ్యం పాడైనందుకు తనమీద తనకీ, ఆ సరదాగా మాట్లాడిన వాళ్లమీదా విపరీతమైన కోపం.

మళ్ళీ సాయంత్రం పేకాటకొచ్చే స్నేహితులతోటీ ఇదే గొడవ. ఎప్పుడైనా కూర్చున్న చోటనుంచి కాస్త నెప్పి వల్ల కొద్దిగా అటూ ఇటూ కదిలినా, ‘పోనీ ఇంటికెళ్ళి పడుకుంటావా? ఈ రోజుకి ఆట ఆపేద్దామా?’ అని మాట్లాట్టంతో ఇవాన్ ఆలోచనలు పరిపరివిధాలుగా పోయేవి. ఏమైంది వీళ్ళందరికీ, ఎందుకు తనని వదుల్చుకుందామని చూస్తున్నారు? తాను చేతులూ కాళ్ళూ కూడా కదపలేడని వీళ్ళనుకుంటున్నారా? మరో కనువిప్పు కలిగించిన విషయం- మరొకరితో జతగా పేకాట ఆడుతున్నప్పుడు ఆటలో ఓడిపోతే అవతలివాళ్ళు అంతా ఇవాన్‌దే తప్పు అన్నట్టూ దెప్పడం. అప్పుడు మరోసారి ప్రస్కోవ్యా అన్న విషయాలన్నీ గుర్తు రావడం; ఇలా తానే తన జీవితం విషపూరితం చేసుకోవడమే కాదు పనిగట్టుకుని అవతల వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాడు. ఈ ఆలోచనలు మనసులోకి రాగానే ఇవాన్‌కి ఇంక మిగతా రాత్రి కాళరాత్రే. వీళ్ళందరి వల్లా ఇంత బాధ అనుభవించాక ఇంక రాత్రి నిద్ర ఎలా పడుతుంది? నిద్రలేమి అలా ఉంచితే మర్నాడు పొద్దున్నే లేచి ఆఫీసుకెళ్లవద్దూ? పోనీ ఈ ఒక రోజు ఆఫీసుకి వెళ్ళకుండా శెలవు పెట్టి ఇంట్లోనే కూర్చుందామా అంటే ఇంట్లో ప్రస్కోవ్యా మాట్లాడేదీ, వాడే మందులూ, వాటి వాసనా, ఏ వ్యాపకం లేకుండా కూర్చుంటే అనుక్షణం గుర్తొచ్చే నెప్పీ, ఇదంతా మరో దారుణమైన నరకం. ఏదైనా ఇంట్లో కుటుంబం, ఆఫీసులో తనకూడా పనిచేసేవాళ్ళూ వీళ్ళందరూ తననో అగాధంలోకి తోసేసి చంపేసేలా ఉన్నారు, అసలు నిజంగా తనకి చావొచ్చేలోపుల. కట్టుకున్న పెళ్ళాంతో సహా ఒక్కరికీ తానేమిటో, తన బాధేమిటో తెలుసుకుని అర్ధం చేసుకోవడానికీ అసలు తనతో మాట్లాడి అనునయించడానికీ ఇసుమంత తీరికలేదు. తానెలా పోయినా వీళ్ళకి అక్కర్లేదు.

5.
ఇలా త్రిశంకు స్వర్గంలో ఓ నెల, ఆ పైన మరో నెలా గడిచాక ఇవాన్ బావ ఓ సారి చెల్లెలు సంసారం చూసిపోవడానికి వచ్చేడు. ఆయనొచ్చినప్పుడు ప్రస్కోవ్యా ఇంట్లో లేదు, ఏదో పనిమీద బయటకెళ్ళినట్టుంది. తలుపుతీసిన ఇవాన్‌ని చూడగానే బావమరిది ఏదో భూతాన్ని చూసినట్టు బెదిరాడని ఆయన మొహం చెప్పకనే చెప్తోంది. నోరు తెరిచాడు ఆశ్చర్యపోతూ. ఏదో అందామని అనుకున్నాయన, అలాగే గుడ్లు మిటకరించి, ప్రయత్నంతో నోరు మూసుకున్నాడు. ఆయన మొహంలో ఆశ్చర్యం ఇవాన్‌కి కనబడనే కనబడింది.

“అయితే నీకు కూడా నాలో ఏదో మార్పు కనిపిస్తోందన్నమాట!” ఇవాన్ అన్నాడు.

“అవునవును, నీలో చాలా మార్పు వచ్చిందే, అంతా కులాసాయేనా?” బావ ఇంట్లోకి వస్తూ అడిగేడు, చూపు తిప్పుకుని, ఇవాన్ కళ్ళలోకి చూడకుండా. చావు కళేనా అతనికి కనిపించింది? తర్వాత మరోసారీ మరోసారీ ఇవాన్ బావమరిదితో ఆయనకి తనలో ఏం కనిపించిందో అడగడానికి మాటలు మొదలుపెట్టాడు. కానీ బావమరిది మరో విషయం మరో విషయం మీదకి మాట మార్చి దొరకకుండా తప్పించుకున్నాడు. బయటకి వెళ్ళిన ప్రస్కోవ్యా వెనక్కి వచ్చాక, అన్నాచెల్లెళ్ళని లోపలకి వెళ్ళనిచ్చి తలుపులన్నీ మూసేసి అద్దంలో అసలు తను ముందు ఎలా ఉండేవాడూ, ఇప్పుడెలా ఉన్నాడూ అనేది పాత ఫోటోలలో ఉన్న తనని మార్చి మార్చి చూసుకోవడం మొదలుపెట్టాడు ఇవాన్–ముందు మొహం, తర్వాత ఛాతీ, చొక్కా పైకి ఎత్తి చేతులూ, జబ్బలూ అవీను. ఇవాన్‌కే తెలుస్తోంది ఇప్పుడు. తనలో మార్పు మామూలు మార్పు కాదు. శారీరకంగా కూడా తాను దారుణంగా మారాడు. ఆ రోజు ఇవాన్ మనసులో చీకటి అమావాస్య నాటి చీకటికన్నా ఎక్కువైంది. ఇంట్లో ఒంటరి అయిన ఇవాన్ ఆలోచనల ప్రకారం ఇంక తాను మామూలు మనిషి అవడం కుదరకపోవచ్చేమో. మళ్ళీ అంతలోనే ఏదో ఆశ. కాదు, కాదు ఇలా నిరాశ పనికిరాదు. ఇది అసలు అపెండిసైటిస్సా, లేకపోతే తెగిపోయిన కిడ్నీ అవ్వొచ్చా అనేది అటుంచితే, మొదట తనకి నిరాశ పనికిరాదు. ఈ ఆలోచనల్లోంచి బయటకొచ్చే మార్గం ఆఫీసు పనిలో తల దూర్చడం.

ఆఫీసు గదిలో ఏవో కేసుకి సంబంధించిన కాగితాలు బయటకి తీసి చదవడం మొదలుపెట్టాడు.

ఫలానా నిందితుడు ఎక్కడో దొంగతనం చేశాడు. చేశానని ఒప్పుకోడు, సాక్ష్యం సరిగ్గా చూడాలి… అసలు తనకి ఉన్న రోగం అపెండిసైటిస్సా? నోరు మూసుకో, నిరాశ పనికిరాదు… నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందని చెప్పినా ఒప్పుకోకపోతే లాయర్ మాత్రం ఏం చేయగలడు? ఇది అసలు తెగిపోయిన కిడ్నీ అయితే డాక్టర్ చేసిన మూత్ర పరీక్షలో తెలియదూ? డాక్టర్ తనకి ఏమీ తెలియకుండా ఎందుకు దాస్తున్నాడు? ప్రస్కోవ్యా కానీ అలా దాచమని డాక్టర్‌తో చెప్పిందా? నేను పోతే నా నస తగ్గుతుందని అలా చెప్పడానికి ఆస్కారం ఉంది కదా?… నువ్వు చేసినది నేరం అంటే అసలు నిందితుడు తనకేసి అలా చూస్తూ కాదంటాడేమిటి, తప్పుచేసి ఎందుకు ఒప్పుకోడు?… అయినా ఆడాళ్ళందరూ అంతే, వాళ్లక్కావాల్సింది డబ్బు కానీ మొగుడు మనిషా, రోజూ ఎలా, ఏం చేసి ఛస్తున్నాడో పట్టించుకుంటారా?… ఇదెక్కడి దరిద్రం, నా ఆలోచనలు ఇలా తగలబడుతున్నాయే…

కాసేపటికి తెలిసినదేమిటంటే ఆ కేసు విషయాలు బుర్రలోకి ఎక్కడం లేదు. మనసంతా ఏదో తెలీని విషాదం; ఆఖరికి బావమరిదిక్కూడా తాను చావబోతున్నాడనేది తెలిసిపోయింది. లాభం లేదు. చేతుల్లో కాగితాలు అక్కడే పారేసి బయట గదిలోకి వచ్చేడు. అటుపక్క ఉన్న ప్రస్కోవ్యా గదిలోంచి మాటలు వినబడుతున్నై. చడీ చప్పుడూ లేకుండా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది తలుపు దగ్గిరే నుంచుని వినిపించే అన్నాచెల్లెళ్ల మాటలు వినడం మొదలుపెట్టాడు.

“ఏమైందే ఇవాన్‌కి?” బావ అడుగుతున్నాడు.

“ఏమోరా, ఎవరికీ ఏమీ చెప్పడు. ఇప్పటికే నలుగురైదుగురు డాక్టర్లని చూశాడు. రకరకాల పరీక్షలూ, మందులూ మాకులూను. ఏ మందూ సరిగ్గా పనిచేయదు అంటాడు. ఏదీ సరిగ్గా వేసుకున్నట్టూ కనిపించదు. నేనూ, అమ్మాయీ ఏదైనా అంటే మామీద అరుస్తాడు. రాత్రి పొద్దుపోయే దాకా అదే ప్రపంచం అన్నట్టూ నిద్ర మానుకుని పేకాట. ఏం చేయమంటావ్? నీకేమైనా తేడా కనిపిస్తోందా? మందులు వాడితే మామూలుగా అవుతుందని డాక్టర్ అంటున్నాడే?”

“తేడా అంటున్నావా? ఇవాన్ కళ్ళలోకి చూశావుటే? చావు కళ వచ్చేసింది. మహా బతికితే…”

“మరి రెండో డాక్టర్ మరోలా చెప్పేడే మాతో? మరీ అంత అధ్వాన్నంగా ఉందంటావా పరిస్థితి?”

ఇవాన్ ఇంక వినలేక లేచిపోయేడు. డాక్టర్ తన కిడ్నీ విడిపోయిందన్నాడా? అయితే చేత్తో అటూ ఇటూ కదిపి మళ్ళీ దాన్ని సర్దినట్టు చెప్పాడుగా ఆయనే? ఇంకేమీ చేసేది లేదనీ మిగతా అంతా త్వరలోనే సర్దుకుంటుందనీ కాదూ చెప్పాడు తనకి? బుర్ర విదిల్చి బయటకొచ్చి నౌకర్‌తో బండి సిద్ధం చేయమని చెప్పాక తన ఆఫీసు గదిలో కోటు తీసుకుని బయల్దేరబోయేడు. అడుగుల చప్పుడు విని ప్రస్కోవ్యా అన్నతో బాటు బయటకొచ్చి కంగారుగా అడిగింది, “ఇప్పుడెక్కడి బయల్దేరడం?”

ఇవాన్‌కి పీకలదాకా కోపం ముంచుకొచ్చింది. ఇన్నాళ్ళూ తాను ఆఫీసు గదిలో ఉన్నాడా ఊడేడా అనేది పట్టించుకోని మనిషి, ఇప్పటివరకూ పక్క గదిలో అన్నతో తన చావు గురించి మాట్లాడిన మనిషి, ఇప్పుడు తనని బాగా చూసుకుంటున్నట్టు వాడికి తెలియాలని ఇలా ఆరాటంగా అడుగుతోంది. ఏం మనిషి, ఈవిడా తనకి ఏదో చేసేది! కోపం అణిచిపెట్టి, “పీటర్‌ని చూసే పని ఉంది. కాసేపట్లో వచ్చేస్తా,” చేతిమీద పురుగుని విదిలిస్తున్నట్టూ కటువుగా చెప్పి బయటకి నడిచేడు ఎవరి మొహంకేసి చూడకుండా.

పీటర్ ఇంటికెళ్ళిన ఇవాన్ అతనితో కలిసి మరో డాక్టర్ స్నేహితుడింటికి దారి తీశాడు. అదృష్టవశాత్తూ డాక్టర్ ఇంట్లోనే ఉన్నాడు. మరోసారి డాక్టర్ పరీక్ష. మరో అభిప్రాయం. ఈయన చెప్పినవీ తనకి అర్థమైనవీ అన్నీ కలిపి చూసుకుంటే తేలినది ఇది: అవును నిజంగా తన శరీరంలో ఏదో విడిపోయింది. ముప్పాతికి మూడొంతులు అది అపెండిక్స్‌కి సంబంధించినదే. విడిపోయింది ఎలాగా విడిపోయింది కనక ఇంక దానికదే సర్దుకుని తనకి ఏమీ కాకపోవచ్చు. అలా పామూ చావకుండా కర్రా విరక్కుండా డాక్టర్ సమాధానాలు విన్నాక ఇవాన్ ఇంటికొచ్చేడు. మనసులో ఏదో ఉల్లాసం, ఇప్పుడు తనకి డాక్టర్ చెప్పినది మరీ అంత చెడ్డ విషయం కానందుకు. మరోసారి ఆఫీసు గదిలో కూర్చుని కాగితాలు చూడ్డం మొదలుపెట్టేడు ఈ ఆరోగ్యం సంగతి బలవంతంగా పక్కన పెట్టి. ఆ కాయితాలు చూడ్డం అవగానే మళ్ళీ తన మనసు నొక్కిపెట్టిన ఆరోగ్యం విషయం మీదకి బలవంతంగా మరలడం ఇవాన్‌కి తెలుస్తోంది. అవును తన అపెండిక్స్ మీదకే.

కాగితాలు అన్నీ పక్కన పారేసి బయటకొచ్చేడు హాలులోకి. కూతురూ, ప్రస్కోవ్యా, కొత్తగా ఉద్యోగంలో చేరిన–తనకు అల్లుడిగా బాగా సరిపోతాడనుకునే–కుర్రాడితో కులాసాగా కబుర్లు చెప్తున్నారు, పక్కనెవరో వయొలిన్ వాయిస్తూంటే. వాళ్లతో కాసేపు కబుర్లు చెప్పాక మళ్ళీ ఈ జబ్బు అంటుకున్న దగ్గిర్నుంచీ తాను ఆఫీసు గది పక్కనే పడుకుంటున్న వేరే చిన్న గదిలోకి వచ్చేడు. ఆలోచనలు ముసురుతున్నై. ఏదో పుస్తకం చేతిలో తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. కళ్ళు పుస్తకం మీదా, మనసు అపెండిక్స్ మీదాను. మందు వేసుకోవడం మాట గుర్తొచ్చి లేచి మందు వేసుకుని మళ్ళీ మంచం ఎక్కాక ఆలోచనలు. విడిపోయినది దానికదే సర్దుకుంటుందని చెప్పాడు కదా డాక్టర్? ఇంక దానిగురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం అనవసరం. నెప్పి పెట్టినచోట చేయి వేసి చూసుకుంటే ఇప్పుడు ఏమీ నెప్పి లేదు, అంటే ఇప్పటికే అది సర్దుకుంటోంది. ఇంకెందుకు బెంగ, తాను చేయాల్సిందల్లా వేళకి మందు వేసుకుని శరీరం దాని పనిని దాన్ని చేయనివ్వడమే. చూశావా, మందు ఎంత త్వరగా పని చేస్తోందో? ఆలోచనలు కట్టిపెట్టి పడుకోవడానికి లైటు ఆర్పి పక్కకి తిరిగాడు మంచం మీద ఇవాన్. మొహంలో చిరునవ్వు; ఆ నవ్వు తగ్గేలోపుల ఒక్కసారిగా ఉధృతంగా పక్కటెముకల్లో నెప్పి. నోట్లో ఒక్కసారిగా భరించలేని దుర్గంధపు వాసన. ఇవాన్ ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. ‘భగవంతుడా, తగ్గిపోయిందనుకున్న జబ్బు మళ్ళీ వచ్చిందా? ఇప్పుడే కదా మందు పనిచేస్తోందనుకున్నాడు! ఇదీ కిడ్నీకి సంబంధించినదా? లేకపోతే డాక్టర్ చెప్పిన అపెండిసైటిస్సే అయితే మందు పనిచేయాలి కదా? అయినా ఇప్పుడు ఇది అపెండిసైటిస్సా కిడ్నీకి సంబంధించినదా అనేది అనవసరం. ఇప్పుడున్న ప్రశ్న, చావా బతుకా? అవును బావమరిది అన్నట్టూ తన ప్రాణం పోతోంది. తానేం చేయగల్డు? ఇప్పటిదాకా ప్రాణం ఉంది, ఇప్పుడది పోతోంది. తన ప్రాణం పో…తోం…ది. ఆ పోవడం తాను ఆపలేడు. తాను చచ్చిపోతున్నాడనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయం. అందరూ రోజూ తనకేసి జాలిగా చూట్టం అవీ కనబడుతున్నా తన ఆరోగ్యం బాగుపడుతుందని ఇంకా తనని మోసం చేసుకోవడం దేనికీ? ప్రాణం పోవడం కూడా ఎప్పుడో నెలల్లోనే వారాల్లోనో కాదు, ఇప్పుడే పోవచ్చు. జీవితంలో వెలుగు ఉంది ఇప్పుడు; దాన్ని చిక్కటి చీకటి బలవంతంగా ఆక్రమిస్తోంది. ఇదేనా చావు అంటే? ఇప్పటిదాకా ఇక్కడున్నాడు తాను. పోయాక ఎక్కడికి వెళ్ళేది? శ్వాస ఆగిపోతున్నట్టయింది ఇవాన్‌కి. కాదు తనకి చావాలని లేదు. ఒక్క ఉదుట్న లేచి కూర్చుని చీకట్లో దీపం వెలిగించబోయేడు. చీకట్లో కొవ్వొత్తి కింద పడింది. ఇవాన్ మళ్ళీ మంచం మీదకి చేరబడ్డాడు.

చీకటి గదిలో మంచం మీద కళ్ళు విప్పార్చుకుని గదిలో చూరు కేసి చూస్తూ నిట్టూర్చేడు ఇవాన్. ‘ఇంక తాను ఏమనుకున్నా ఉపయోగం లేదు. అవును చావే. తనకి ఇంత జరుగుతున్నా ఇంట్లో ఒక్కరికి కూడా ఏమీ పట్టినట్టు లేదు. ఎలా పడుతుంది, చావబోయేది తాను కానీ వాళ్ళు కాదు కదా?’ ఆ నిశ్శబ్దంలో తన గుండె చప్పుడు స్పష్టంగా వినపడ్డం తనకే తెలుస్తోంది. పక్క గదిలోంచి వచ్చే వయొలిన్ శబ్దం కూడా. అవతలి వాళ్లమీద ఒక్కసారి అసూయ తన్నుకొచ్చింది, ‘దరిద్రులు, తను చచ్చిపోతున్నాడని తెలిసినా హాయిగా కులుకుతున్నట్టున్నారు. తనమీద జాలీ లేదు కనికరమూ లేదు. వీళ్ళు మాత్రం ఎల్లకాలం బతికి ఉంటారా? తాను పోయాక వీళ్ళు మాత్రం చావరా? జంతువుల్లా కులాసాగా ఉన్నారు, ఏం దరిద్రం ఈ జీవితం? మనిషన్నాక ఇదేనా బతుకు? ఇలాగేనా చావొచ్చేది ప్రతీ ఒక్కరికీ…’ ఈ సారి ఇవాన్‌కి మనసులో ఉథృతంగా కోపం వచ్చింది, అన్నింటి మీదాను.

ఆలోచనలు వదిలించుకోవడానికి తల విదిల్చేడు ఇవాన్. అసలు మొదటినుండీ తనకి ఏమైందో గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. తనకేదో జబ్బున్న మాట నిజమే అయితే ఇలా మనసు, ఆలోచనలూ పాడు చేసుకోవడం దేనికీ? ఓ సారి నిచ్చెన మీదనుంచి కింద పడ్డాడు, పక్కటెముకల్లో ఏదో దెబ్బ తగిలింది. ముందు కాస్త తాత్సారం చేసినా డాక్టర్ దగ్గిరకెళ్ళాడు. ఆయనిచ్చిన మందులు వాడాడు, తగ్గలేదు. మరో డాక్టర్, మరో డాక్టర్ అంటూ ఎవరు చెప్తే వాళ్ల దగ్గిరకి తిరిగాడు. తర్వాత ఏమైందో ఏమిటో? అపెండిక్స్ అయితే అదే సర్దుకుంటుందని డాక్టర్ చెప్తే అవుననుకుని భ్రమపడ్డాడు. కానీ ఇది పెద్ద జబ్బే అని తెలిసి వస్తోంది, తాను ని…జం…గా…నే… చచ్చిపోతున్నాడు. గుండె ఆగిపోతోంది, ఊపిరి అందడం లేదు. అంధకారం. భయం, కోపం, నీరసంతో అలా వెనక్కి వాలిపోయేడు, ఇంక ఇదే ఆఖరి క్షణం అనుకుంటూ. ఆ వాలడంలో ఏదో కిందపడి చప్పుడైంది పెద్ద శబ్దంతో.

ఇంట్లో అప్పటివరకూ ఉన్న స్నేహితులు వెళ్ళిపోతున్నట్టున్నారు. వాళ్లని సాగనంపడానికి తలుపు దగ్గరకి వచ్చిన ప్రస్కోవ్యా ఇవాన్ గదిలోంచి వచ్చిన చప్పుడు విని లోపలకి వచ్చి అడిగింది, “ఇవాన్ నీకు ఏమైంది? ఆ చప్పుడేమిటి?” స్నేహితుల ముందు ఇలా ఏదో చప్పుడైనందుకు ఆవిడ కంఠంలో విపరీతమైన విసుగూ, కోపం ఏమాత్రం దాచకుండా బయటపడుతూనే ఉంది.

“ఏదో కింద పడినట్టుంది.” ఇవాన్ చెప్పేడు పైకి.

ఇదెక్కడి దరిద్రంరా అనుకుంటున్నట్టూ ధనధనమని కాళ్ళతో చప్పుడు చేస్తూ విస విసా బయటకెళ్ళి కొవ్వొత్తి తెచ్చింది ప్రస్కోవ్యా. ఆ వెల్తుర్లో, ఇవాన్ అప్పుడే పది మైళ్ళు పరుగెట్టుకొచ్చినవాడిలా వళ్ళంతా చెమట్లు కక్కుతూ కనిపించేడు. భూతాన్ని చూసినట్టూ బెదిరి పరుగెడుతున్నట్టూ గదిలోంచి బయటకెళ్ళిపోయింది ప్రస్కోవ్యా.

వచ్చినవాళ్ళందర్నీ సాగనంపాక మరోసారి ఇవాన్ దగ్గిరకొచ్చేసరికి ఇవాన్ ఇంకా అలాగే పడుకుని ఉన్నాడు. ఏదో అడగాలి కనక అడిగినట్టూ ఆవిడ అంది, “ఇవాళ మరీ ఎక్కువగా ఉందా నెప్పి?” ఆ అడగడంలో తన మీద జాలిగానీ, ప్రేమకానీ, కనికరం కానీ లేకపోవడం ఇవాన్‌కి ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉంది.

ఇవాన్ మనసులో ప్రస్కోవ్యా మీద ఉన్న కట్టలుకట్టలుగా పేరుకుపోయిన అసహ్యం ఒక్కసారిగా బయటకొచ్చింది, విసుగ్గా గొణిగేడు వినీవినపడనట్టూ, “ఆ ఏదో అలాగే ఉందిలే.” ఆవిడకి చెప్పని మాట మాత్రం, “ఎందుకు ప్రతీదీ ఈవిడకి చెప్పడం? ఆవిడేమైనా చేసిందా, ఎప్పుడైనా పట్టించుకుందా?”

మరోసారి ప్రస్కోవ్యా రెట్టించి అడుగుతోంది, “నెప్పి ఎక్కువగా ఉందా?”

“అవును, ఏం?”

“నీకు జబ్బూ నెప్పి మరీ ఎక్కువౌతున్నాయని నీకూ తెలుసు. ఇంక ఇప్పట్నుండి డాక్టర్‌ని ఇంటికొచ్చి నిన్ను చూడమని చెప్దామనుకుంటున్నా. నువ్వు ఇలా ప్రతీదీ కింద పారేస్తూ ఇంట్లో అందర్నీ అదరగొడుతున్నావు.”

ఒక్కసారి ఇవాన్‌కి ఎవరో మరోసారి తనకు రాబోయే చావు తప్పదనే విషయం ‘నీకు చావు దగ్గిరలో ఉంది, మర్చిపోకు సుమా’ అని గుర్తు చేసినట్టనిపించి, అప్రయత్నంగా అనేశాడు, “వద్దు. ఆ డాక్టర్ వస్తే ఎక్కువ ఖర్చు అనవసరంగా!”

ప్రస్కోవ్యా “సరిగా పడుకో, నిద్ర పడుతుందా?” అంటూ దగ్గిరకొచ్చింది. అప్పటికే ప్రస్కోవ్యా మీద అసహ్యం మనసులో ఉబికి వస్తూంటే, ఆవిడ తన దగ్గిరకి రావడం, నుదురు మీద ముద్దుపెట్టుకోవడం చూసి జీవితంలో ఆవిడని అంతకు ముందెన్నడూ లేనంత అసహ్యించుకున్నాడు ఇవాన్. ఎంతో కష్టం మీద తన దగ్గిరగా వచ్చే ప్రస్కోవ్యాని దూరంగా తోసేయకుండా నిగ్రహించుకోవాల్సి వచ్చింది.

ఇలా మొహమాటం పలకరింపు అవగానే తన పని అయిపోయినట్టూ వెంఠనే ప్రస్కోవ్యా మరోసారి ఇవాన్‌ని పడుకోమని చెప్పి బయటకి వెళ్ళిపోయింది.
6.
ఇవాన్‌కి తెలిసినది తను మృత్యుముఖంలో ఉన్నాడన్న చేదు నిజం. అయితే చావు అనేది తనకి అప్పుడే వచ్చేస్తోందనుకోవడం జీర్ణించుకోలేని సత్యం. ఇది అంతకుముందు ఎప్పుడూ తనకి అనుభవంలోకి రానిది. చదువుకునే రోజుల్లో తాను చదివిన తర్కం ప్రకారం ‘ఫలానా వాడు మనిషి, మనుషులందరికీ చావు తధ్యం, అందువల్ల ఈ ఫలానా మనిషి కూడా చస్తాడు’ అనేది ఎవరో ఫలానా అనే మనిషికి వర్తిస్తుంది. ఆ ఫలానా మనిషికి జీవితంలో బాల్యం, యవ్వనం, కుటుంబం అంటూ ఉన్నారో లేరో ఎవరికి తెలుసు? అతనికి ఎవరున్నారో ప్రేమించడానికీ పట్టించుకోవడానికీ? కానీ తాను ఫలానా అనే మనిషి కాదు కదా? తాను ఇవాన్ అనే మెజిస్ట్రేట్, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు; తనకి ప్రేమించే కుటుంబం, ఆస్తులూ, పాస్తులూ ఉన్నై. ఎవరో ఫలానా అనే మనిషికి తనకీ ఎంత తేడా? అతనికి చావు రాసిపెట్టి ఉంటే మాత్రం తనకి కూడా చావు రావాలని ఎక్కడుంది? అయినా తాను ఆ ఫలానా మనిషిలా చావాలని రాసిపెట్టి ఉంటే వాడికి మనసులో తెలిసినట్టూ తనకీ తెలిసి ఉండేది కదా? తనకేమీ తెలియటం లేదే? అందువల్ల ఇప్పుడు చావు రావడం అనేది అసంభవం. ఇదీ ఇవాన్ ఆలోచనా క్రమం. ఇవాన్ ఇలా ఎన్నిసార్లు తనని మోసగించుకునే ఆలోచనలు కల్పించుకున్నా చివరకి రాబోయే చావు తధ్యం అంటూ మనసులో ఏదో మూల చావు తన గొంతు వినిపిస్తూనే ఉంది.

ఆరోగ్యంగా ఉన్నప్పుడు వచ్చే మంచి ఆలోచనల మీదకి మనసు మళ్ళించడానికి ప్రయత్నం చేశాడు ఇవాన్. అయితే తనకే వింతగా అనిపించినట్టూ ఎంత బలవంతంగా మళ్ళించినా ఆ ఆలోచనల మీద నుంచి మళ్ళీ తన చావు మీదకే మనసు మళ్ళడం ఇవాన్‌కి తెలుస్తోంది. వీటిని తప్పించుకోవడానికి ఇవాన్ ‘నేను మునపటిలాగే పనిలో పడితే ఈ చావు ఆలోచనలు వాటికవే పోతాయి’ అనుకుంటూ కోర్ట్ పనుల్లో తలములకలవడానికి ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే పొద్దున్నే ఏదో పని ఉన్నట్టూ ఆఫీసులో పని చేసేవాళ్ల దగ్గిరకి వెళ్ళి ఏదో మాట్లాడ్డం, తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు వాళ్లకి చెప్పడానికన్నట్టూ చాలాసేపు అక్కడే కూర్చుని వాళ్లతో ఇవీ అవీ కబుర్లూ చెప్పాక కోర్టులో జనాలకేసి ఏదో ఆలోచిస్తున్నట్టూ చూడడం, ముందుకి వంగి ఏవో కాయితాలు చూస్తున్నట్టూ నాటకం ఆడ్డం. ఇంత చేసి నెప్పి గురించి మర్చిపోదామని ప్రయత్నం చేశాక, కూర్చున్న చోటు నుంచి లేవగానే నేనెక్కడకీ పోలేదంటూ ఉధృతమైన నెప్పి. దాన్ని పట్టించుకోకుండా ఏదో పని మీద దృష్టి పెడదామంటే కళ్ల ముందు యముడిలా నవ్వుతున్నట్టూ వికట్టహాసంతో పక్కలు నొక్కుతూ మరో ఏ ఆలోచనా కుదరనివ్వని నెప్పి! ఆ నెప్పితో మళ్ళీ చావు తధ్యం అంటూ వెనకటి ఆలోచనలు. దాంతో తాను చేయబోయే పనిలో తప్పులు; ఇంతటి తెలివైన జడ్జ్ కూడా చేసే తప్పులు చూసి నోరు వెళ్ళబెడుతూ ఆశ్చర్యపోయే మిగతావాళ్ళు. ఇవి చూశాక ఎలాగో ఒకలాగ బలవంతంగా ఓపిక తెచ్చుకుని ఆ రోజు పని పూర్తి చేసి ఇంటికి చేరడం. అలా ఇంటికి చేరాక తెలిసొచ్చే అసలు విషయం–ఈ చావు అనేది ఇంక తాను తప్పించుకోలేడు. ఎంత ఆ ఆలోచనల గురించి తప్పించుకుందామన్నా అవి నెప్పి వల్లో మరోవిధంగానో తన ముందుకొచ్చి నుంచుంటున్నాయి మా సంగతేం చేశావు అని అడుగుతున్నట్టూ. అన్నింటికన్నా భయంకరమైనదేమిటంటే, ఆ నెప్పి, ఆలోచనలూ తన ఎదురుగా వచ్చినప్పుడు తాను వాటి కేసి ధైర్యంతో చూసి ఎదుర్కోలేకపోవడం; ఆ నెప్పీ, మనసులో రాబోయే మృత్యు భయం అన్నింటినీ నోరెత్తకుండా అనుభవించడం.

వీటిని తప్పించుకోవడానికి ఇవాన్ కనిపెట్టిన మరో సాధనం; కిటికీ తెరలన్నీ మార్చడం. కొన్ని రోజులు మార్చిన తెరలవల్ల జీవితం బాగానే ఉన్నా తొందర్లోనే మళ్ళీ మనసులోకి చావు భయం అడ్డూ అదుపూ లేకుండా తోసుకొచ్చింది.

వెన్ను వణికించే ఆలోచనలతో ఇవాన్ ఇలా సతమౌతూ బుర్ర పాడవకుండా ఉండడానికి ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఆ గదిలో ఈ మూలనున్న సామాను ఆ మూలకి మార్చడానికి గడుపుతూ కూతుర్నో ప్రస్కోవ్యానో పిలిచినప్పుడు, వాళ్లకి ఇవాన్ చేసే పనులన్నీ పిచ్చిపిచ్చిగా అనిపించడం, ఈ పనులన్నింటికీ వద్దు అనడం, ఇవాన్ సరే అనుకుంటూ తన గదిలోకి పోవడం–ఇదీ రోజు వారీ కార్యక్రమం.

ఆ సర్దడంలో ఎంత వద్దనుకున్నా మళ్ళీ చావు ఆలోచన; ఈ హాల్ లోనే ఏదో తెర సరిగ్గా లేదనుకుని తాను పైకి ఎక్కబోతే కిందపడి ఈ జబ్బు తెచ్చుకున్నాడు కాదూ? పోనీయ్, మరి ఈ ఫోటోలు పెట్టిన ఆల్బమ్ ఎవరు ఇలా తలకిందులుగా పెట్టారు? ఈ ఇంట్లో ఎవరికీ ఏ పనీ చేతకాదు ఛీ, ఛీ. పోనీ ఈ గది అందంగా ఉంచడానికి ఇల్లు కొన్నప్పుడూ, కొన్ని మొక్కలూ అవీ పెట్టడానికి ఎంత కష్టపడ్డాడు తాను? ఈ ఇత్తడి కుండీ మసకబారిపోతోంది; ఇంట్లో ఒక్కరిక్కూడా దానిని తుడుద్దామన్న ధ్యాసే లేదు. ఏం మనుషులు? ఇవాన్ దాన్ని తీసి తుడిచేంతలో ప్రస్కోవ్యా, ఇవాన్ కూతురూ వచ్చి అసలు ఇవాన్ కుండీ మీద చిన్న మరక గురించి ఎందుకంత శ్రద్ధ తీసుకుంటున్నాడో, అసలే జబ్బుగా ఉన్నప్పుడు, అంటూ సణుగుడు. దాంతో ఇంట్లో అందరికీ వాగ్యుద్ధం. కోపతాపాలు చల్లబడ్డాక ఇవాన్‌కి అనిపించిన విషయం; వాళ్ళు చెప్పిందే నిజమేమో, ఆ మరక అసలు ఎవరికీ కనిపించట్లేదు. పోయే మనిషిని తనకెందుకంత తాపత్రయం, వాళ్ళకి లేనిది? శారీరక రోగం అంటే ఏదో మందు ఇచ్చి కుదర్చవచ్చేమో మరి మనోవ్యాధి తగ్గడానికి సరైన మందు ఉందా?

ఇవాన్ చేసే ఈ పనులన్నీ చూసి చూసి ఇవాన్ ఏది వినకూడదనుకుంటున్నాడో ఆ మాట అననే అనేసింది ప్రస్కోవ్యా ఓ రోజు: “ఈ పనులన్నీ నీకెందుకు, అసలే జబ్బు మనిషివి కదా? అసలు ఇలా సామాను అటూ ఇటూ మార్చడానికి మొదలుపెట్టినప్పుడు కిందపడి ఇలా పీకలమీదకి తెచ్చుకున్నావు. మళ్ళీ ఇంకా ఎందుకు?”

సరిగ్గా ఆవిడలా అన్నప్పుడే శరీరం పక్కనుంచి మరోసారి నెప్పి. అప్పటివరకూ మొక్కల్లో ఉన్న ఆకుల చాటునుంచి తొంగిచూస్తున్నట్టూ కనపడీ కనపడకుండా ఉన్న నెప్పి ఇప్పుడు ఎదురుగా వికట్టహాసంతో ఎదురుగా ఉన్నట్టు తెలిసిరావడం. ఏదో చిన్న తెర సరిగ్గా లేదని దాన్ని సవరించడానికి పైకెక్కబోతూ చావు కొనితెచ్చుకున్నాడు తాను. ఎంత తెలివితక్కువతనం. అసలు ఇలా జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగినది అదే, ఇలా బుర్ర పాడవగానే తనగదిలోకి వెళ్ళి నడుం వాల్చాడు నెప్పి తగ్గుతుందేమో అనుకుంటూ.

ఏ విషయాలైతే మర్చిపోయి తన ఆరోగ్యం బాగుపడుతోందనుకున్న రోజునో, లేకపోతే తన మనసు బాగుండనప్పుడో ఈవిడొచ్చి ఇలా పుల్లతో గెలకడం ఇవాన్‌కు తెలుస్తూనే ఉంది. అసలే తాను పోతున్నాడు. నా చావుకు ఈవిడో సమిధ వేస్తోంది. ఎవరి కర్మ… ఈ లోపునే నెప్పి మరోసారి వికృతంగా నవ్వుతూ తన ఎదురుగా కనిపించడం, ఇవన్నీ చూసి భయంతో వణకడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడిప్పుడు ఇవాన్. ఇలా అనుకునేలోపుల మరోసారి పక్కటెముకల్లోంచి ఉధృతంగా భరించలేని ఈ నెప్పి; పంటిబిగువున భరిస్తూ ఇలా అనుభవించవల్సిందేనా, పోయే దాకా?

7.
ఒకప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఇవాన్ ఇలా ఎందుకు తయారయ్యాడో అనేది స్పష్టంగా చెప్పడం కష్టం కానీ ఇదంతా ఒక్కసారి మాత్రం మీద కొచ్చి పడినది కాదని, మెల్లిగా మొదలైన రోగం చాప కింద నీరులాగా ఒంట్లో పాకిందని తెలుస్తూనే ఉంది. రోజు మీద రోజూ, నెల మీద నెల గడుస్తూంటే ఇవాన్ స్నేహితులకీ కుటుంబానికీ తెలిసి వచ్చినది ఏమిటంటే, ఇవాన్ గది, ఆయన బట్టలూ వాడుకునే వస్తువులూ అన్నీ ఖాళీ అవ్వబోతున్నై! డాక్టర్లకీ ఇంట్లో నౌకర్లకీ ఆఖరికి ఇవాన్‌కి కూడా పూర్తిగా తెలిసిన విషయం ఇది. ఇన్నేళ్ళూ ఎంతో కష్టపడి ఒళ్ళు దాచుకోకుండా–ఇటు ఇంట్లో అటు సర్కారులోనూ– న్యాయమూర్తిగా పని చేసిన ఇవాన్ శాశ్వతంగా శెలవు తీసుకోబోతున్నాడు. శరీరంలో నెప్పి ఎలా ఉన్నా నిరంతరం మనసులో గుచ్చుకుంటూ ఈ ముల్లు కెలికే నెప్పి భరించడానికి ఇవాన్‌కి ఓపిక లేకపోయింది. అరుపులూ కేకలూ ఎక్కువౌతూంటే ప్రతీరాత్రీ ఇంట్లో ఎవరికీ నిద్రలేని కాళరాత్రే అవుతున్నప్పుడు ఇవాన్‌కి నిద్ర పట్టడానికి మత్తుమందు ఇవ్వడం మొదలుపెట్టేడు డాక్టర్. మత్తుమందు వల్ల కొన్నాళ్ళు నిద్రపట్టినా జబ్బు తగ్గటం మాట అటుంచి ఇవాన్ పరిస్థితి మరింత విషమించింది. నోట్లో దుర్వాసనా, శరీరంలో విడిపోయిన భాగం–కిడ్నీయో, అపెండిక్సో మరోటో–ఆగకుండా నేను ఇక్కడే ఉన్నాను సుమా అంటూ నెప్పితో రోజువారీ గుర్తు చేస్తూనే ఉన్నై.

ఈ స్థితిలో ఏ మాత్రం చిన్న కష్టం వచ్చినా, శరీరం ఇంక ఇది తట్టుకోలేనంటూ మొరాయించడం ఇవాన్‌కి తెలుస్తోంది. మామూలుగా తినే తిండి అరగకపోవడంతో రోగికి వేరేగా వండడం మొదలుపెట్టారు. ఈ తిండిలో రుచీ పచీలేదు. అదీకాక ఇవాన్ ఇప్పుడు నడవలేకపోతున్నాడు. తిండి తిన్నాక ఆ కంచం తీయడానికీ, బట్టలు మార్చడానికీ జెరాసిమ్‌ సహాయం కావాల్సి వస్తోంది. అన్నింటికన్నా దరిద్రం ఇప్పుడు ఇవాన్ మలమూత్రాలు తీయడానికి బెడ్ పేన్ పెట్టారు. రోజంతా ఒకే గదిలో ఉంటూ ఆ కంపులో ఇవన్నీ అనుభవిస్తూ బతికే ఇవాన్‌కి జీవితం అంటే విరక్తి పుట్టడంలో ఆశ్చర్యం ఏవుంది?

గుడ్డికన్నా మెల్ల మేలన్నట్టూ ఈ పరిస్థితిలో కూడా ఇవాన్‌కి జెరాసిమ్‌ ఒక ఆశాకిరణం. ప్రస్కోవ్యా, కూతురూ తన గదిలోకి రాకపోయినా, వచ్చినప్పుడు ముళ్ళమీద కూర్చున్నట్టూ కూర్చుని రెండు మాటలు కూడా మాట్లాడకపోయినా జెరాసిమ్‌ మాత్రం విధిగా వచ్చి ఏవో కబుర్లు చెప్తూ ఉండడమే అందుక్కారణం. జెరాసిం కుర్రాడు, రోజూ శుభ్రంగా మంచి బట్టలేసుకుని పనిలోచి రావడం, చేసేపని ఉల్లాసంగా చేయడం చూస్తే ఇవాన్‌కి వాడంటే ఇష్టం, వాడితో మాట్లాడ్డం ఓ ముచ్చట, వాడి మాటల్లో ఇవాన్‌కి కాస్త ఊరట.

ఓరోజు ఇవాన్ బట్టలు మార్చుకోబోతూంటే పేంట్ కిందకి జారిపోయింది. అప్పటిదాకా ఎప్పుడూ నగ్నంగా కనబడని ఇవాన్‌ని చూశాడు జెరాసిమ్‌. కానీ ఇవాన్ ఏమనుకుంటాడో అని, ఆయన సన్నబడిపోయిన కాళ్ళూ, దాదాపు నిర్వీర్యం అయిపోతున్న శరీరాన్నీ చూసి కూడా పైకి ఏమీ కనిపించకుండా ఇవాన్ దగ్గిరకొచ్చి పేంట్ తొడుక్కోవడానికీ, బట్టలు సరి చేయడానికి సహాయం చేశాడు. ఇవాన్‌కి ఒక్కసారి తనమీదా, కనీసం బట్టలు కూడా కట్టుకోలేని తన చేతకాని తనం మీదా, విపరీతమైన అసహ్యం, ఆ పక్క జెరాసిమ్‌ చేత ఇలాంటి పని చేయించుకోవాల్సి వచ్చినందుకూ, ఆ పని జెరాసిమ్‌ చేసినందుకూ అతనిమీద జాలీ… కాసేపటికి నోరు పెగుల్చుకుని అన్నాడు ఇవాన్.

“జెరాసిమ్‌…” పిలిచేడు ఇవాన్ బట్టలు తొడగడం అయ్యేక.

తానేదైనా తప్పు చేశాడేమో, ఇవాన్‌కి ఎక్కడో నెప్పి పెట్టిందేమో తాను బట్టలు తొడుక్కోవడంలో సహాయం చేసినందుకు అనుకుంటూ, జెరాసిమ్‌ కొంచెం బెదిరి అడిగేడు “చెప్పండి, ఏమిటి?”

“ఈ పనంతా నీకు అసహ్యం కలిగిస్తోందేమో, నేనేం చేయలేకపోతున్నానని ఏమీ అనుకోవు కదా?”

“అబ్బే, అలా ఎందుకనుకుంటున్నారు? నాకేం ఫర్వాలేదు, మీకు ఏదో ఆరోగ్యం బాగోలేక ఇలా ఉందని నాకు తెలియదా, అటువంటిదేమీ లేదు, నేను ఏదో అనుకుంటున్నానని ఏమీ మనసులో పెట్టుకోకండి.” బయటకెళ్లబోయేడు జెరాసిమ్‌.

“జెరాసిమ్‌, కాస్త నన్ను ఈ కుర్చీలోంచి సోఫామీద కూర్చోబెట్టగలవా?”

జెరాసిమ్‌ వచ్చి, ఇవాన్ చేయి ఒకటి తన భుజం మీద ఉంచుకుని రెండో చేత్తో ఇవాన్ నడుం మీద చేయి వేసి లేపి మెల్లిగా నడిపించుకుంటూ సోఫా మీదకి తీసుకెళ్ళేడు. కుర్రాడు బలమైన చేతుల్తో అలా ఇవాన్‌ని సునాయాసంగా తీసుకెళ్ళేసరికి ఇవాన్ అన్నాడు, “అరే ఎంత సులువుగా చేశావు, నేను ఇక్కడనుంచి అక్కడకి నడవడానికే ఎంత కష్టపడుతున్నానో.”

జెరాసిమ్‌ ఓ చిరునవ్వు నవ్వి బయటకెళ్ళబోయేడు మళ్ళీ. కుర్రాడు గదిలో ఉంటే ఇవాన్‌కి కాస్త ఉపశమనం ఎవరో తోడు ఉన్నందుకు, “ఇంట్లో మరో పని ఉందా నీకు?” అడిగేడు.

“చిన్న పని ఉందనుకోండి, పొయ్యిలోకి పేళ్ళు కొట్టమన్నారు కానీ…”

“అయితే ఇలా వచ్చి ఆ కాళ్ళకింద చిన్న బల్ల పైకెత్తుతావా? కాళ్ళు ఎత్తుగా పెట్టుకుంటే కాస్త బాగున్నట్టూ ఉంది పడుకున్నప్పుడు.”

“తప్పకుండా,” జెరాసిమ్‌ వచ్చి ఆ పని అయ్యేక చెప్పేడు, “ఇంకేమైనా చేయమంటారా ఈ గదిలో?”

“… కాస్త… ఆ కాళ్ళు పైకెత్తి నొక్కగలవా? అలా అడుగుతున్నందుకేమీ అనుకోకేం?”

“ఫర్వాలేదు. మీకేం కావాల్సినా నిరభ్యంతరంగా అడగండి.”

“మరి ఆ పేళ్ల సంగతో?”

“అదంత ముఖ్యం కాదు. కాసేప్పోయాకో, ఇంటికెళ్ళేలోపులో చేసినా ఫర్వాలేదు.”

ఇవాన్న్‌కు నచ్చిన విషయం, ఎవరూ తనతో మాట్లాడకపోయినా జెరాసిమ్‌ మాట్లాడుతుండడం. అతన్తో మాట్లాడ్డం ఓ సంతోషం. అయితే ఇందులో తన ఆరోగ్యం విషయం ఎంత వద్దనుకున్నా వస్తూనే ఉంది. ఒకటి మాత్రం అచ్చమైన అబద్ధం. అందరికీ తెలిసినా, తెలిసి మరీ ఆడే అబద్ధం; తనకి నిజంగా బాగవుతుందనేది. నిజంగా బాగవదనేది అనేది ఇవాన్‌కి తెలిసిన సత్యం. తాను చావబోతున్నాడు; అది మాత్రం ఎవరు ఎంత అబద్ధం ఆడినా తప్పుకాని పరమ సత్యం. మరి వీళ్ళందరూ ఎందుకలా అంటున్నారు తనతో? పోనీ వీళ్ళందరూ అలా అబద్ధం ఆడుతున్నా ‘ఒరే నోరు మూసుకోండ్రా, నేను చచ్చిపోతున్నానని తెలిసినా ఎందుకలా అబద్ధాలాడుతున్నారు?’ అని తాను చెప్పలేకపోవడం. మరో విషయం ఇవాన్‌కి తెలిసివచ్చినది, తనకి ఏదో ఊరడింపు కావాలి. కానీ ఎవరికీ తనని ఊరడించడానిక్కానీ, తనతో తీరిగ్గా మాట్లాడ్డానిక్కానీ తీరికా, కోరికా లేవు. తన దగ్గిరకి రాగానే తన నుంచి వచ్చే దుర్గంధానికీ, తన శరీరం చూసి భయడకుండా ఓర్చుకోవడానికీ, అసలు తన పరిస్థితి ఏమిటో, తన మనసులో ఏది ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరికి ఓపిక? జెరాసిమ్‌ నౌకరు కనక భయపడ్డా అతనికి తప్పదు. ‘మీకు ఇలా జబ్బు చేసినందువల్ల ఇలా ఉన్నారు కానీ లేకపోతే బాగానే ఉండి ఉండేది కదా, మీ కాళ్ళు పైకెత్తి కాస్త ఒత్తడంలో మీకు హాయిగా ఉంటే అలాగే చేద్దాం’ అనే జెరాసింమ్‌ఒక్కడే తనకి జబ్బు ఉన్నట్టూ, తనని ఊరడిస్తూ అబధ్ధాలు చెప్పకుండా మాట్లాడేది. ఓ రోజు ఇవాన్ కాళ్ళు ఒత్తి వెళ్ళిపోతూంటే జెరాసిమ్‌ అన్నాడు కూడా ‘మనలో అందరూ ఏదో ఒకరోజు పోవాల్సిన వాళ్లమే, దానికి సిద్ధం అవడానికి ఎలాగోలో సర్దుకోవాలి కదా. ఇవాళ మీకు ఇలా అయింది. మరో రోజు నాకూ ఇలాగే అవ్వొచ్చు,’ ఈ మాట కుండ బద్దలు కొట్టినట్టూ జెరాసిమ్‌ ఇవాన్‌కి రాబోయే చావు గురించి అన్నా, ఆ మాటలో అబద్ధం ఏమీ లేనందుకు ఇవాన్ సంతోషించాడు.

ఇవాన్‌కి మనసారా ఏడవాలనీ అలా ఏడుస్తూంటే ఎవరో తనని ఊరడించాలనీ ఉంది. గెడ్డం నెరిసిపోయే ఈ వయసులో కూడా చిన్న కుర్రాడికి జ్వరం వచ్చినప్పుడు అనునయించినట్టూ ఎవరో ఒకరు వచ్చి తనని అనునయించాలనీ, తనతో మనసారా మాట్లాడాలనీ మనసులో కోరిక. అయితే అది తీరదని కూడా ఇవాన్‌కి పూర్తిగా తెలిసిన విషయం. ఇంత తెలిసినా ఆ కోరిక చావకపోవడం మరో వింత. అయితే ఇంట్లో ఎవరికీ ఆ కోరిక లేదు కనక ఎవరైనా స్నేహితులొస్తే అలా చేయొచ్చు. కానీ స్నేహితులెవరైనా చూడ్డానికొచ్చినప్పుడు ఇవాన్‌కి వచ్చిన మరో ఆలోచన, ‘తాను ఇలా ఏడవడం ఏం సమంజసం? తాను ఇలా ఏడిచినట్టూ ఈ స్నేహితుడు మరోచోటా మరోచోటా చెప్పడూ?’ ఈ ఆలోచన రాగానే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఇవాన్ తనకి అంతా బాగానే ఉన్నట్టూ, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందన్నట్టూ గంభీరంగా, కోర్టులో జడ్జ్ లాగా మాట్లాడుతున్నాడు. తనలో నిరంతరం జరిగే ఈ అబధ్ధపు ఆలోచనలూ, అసందర్భపు కోరికలూ, తనకింత మానసిక, శారీరిక క్షోభ జరుగుతున్నా ఎవరికీ పట్టనట్టూ లోకం ఉండడం, అదే లోకం తన దగ్గిరకి పలకరించడానికి వచ్చినప్పుడు, ‘తగ్గుతుందిలే, నీకు నయమైపోతుంది’ అనే ముఖస్తుతితో వాళ్లకీ తనకీ తెలిసినవైనా అబద్ధాలు మాట్లాట్టం, అవి నిజనమని తాను అనుకోవడం, ఈ అబద్ధాల వల్ల మరింత క్షోభ కలగడం వాళ్ళు వెళ్ళగానే. చావబోయే చివరి రోజుల్లో కూడా ఇన్ని లొసుగులా జీవితంలో?

8.
ఆలోచనలతో సతమతమైపోయి నిద్రలోకి జారుకున్న ఇవాన్‌కి తెల్లవారినట్టు తెలిసినది మర్నాడు మరో పని కుర్రాడు పీటర్, ఇవాన్ గదిలోకి వచ్చి తెరలన్నీ పక్కకి తీసి వెల్తురు వచ్చేలాగ చేశాకే. అయినా ఇప్పుడు పగలా, చీకటా, సోమవారమా, శుక్రవారమా అనేది ఏ పాటిది? కొన్ని రోజుల్లో చావబోయేవాడికి గంటలూ, రోజులూ, పౌర్ణమీ, అమావాస్యా ఎందుకు పనికొస్తాయ్? లోపలకి వచ్చిన కుర్రాడు అడిగేడు.

“కొంచెం టీ తాగుతారా పొద్దున్నే?”

పొద్దున్నే లేవగానే అందరూ టీ తాగుతారు కనక అందర్నీ అడిగినట్టే తననీ అడుగుతున్నాడు కాబోలు; ఇవాన్ చెప్పేడు, “వద్దులే.”

“మంచం మీదనుంచి లేచి ఇలా సోఫా మీద కూర్చుంటారా?”

ఈ గదంతా అసహ్యంగా ఉండి, నా శరీరం నుంచి వచ్చే దుర్గంధంతో కంపు కొడుతోంది కాబోలు, శుభ్రం చేయడానికా అడుగుతున్నాడు? “వద్దు నా మూలాన నన్ను ఉండనియ్!”

ఇవాన్ చేయి చాచాడు ఏదో తీయడానికి పక్కనే ఉన్న టేబిల్ మీదనుంచి. అది చూసి ఏదో కావాలేమో అనుకుంటూ వెళ్లబోయిన వాడల్లా వెనక్కి వచ్చి పీటర్ అడిగేడు, “ఏదైనా కావాలండి?”

“నా వాచి ఇక్కడ ఉండాలే?”

“ఇదిగో, ఇక్కడే ఉంది,” పీటర్ వాచి తీసి ఇవాన్‌కి ఇచ్చేడు.

టైమ్ ఎంతైందో చూసి ఇవాన్ అన్నాడు, “ఎనిమిదిన్నరైంది, అందరూ లేచినట్టేనా?”

“మీ అబ్బాయి లేచి స్కూలుకెళ్ళాడు. ఇంటావిడ, అమ్మాయీ ఇంకా లేవలేదు. మీకేదైనా కావలిస్తే లేపమని చెప్పారు. పిలవమన్నారా?”

“వద్దు వద్దు,” రోగంతో ఉన్న తనని చూడగానే ఆవిడ మొహంలో కనబడే అసహ్యం, విసుగూ, ఆవిడ పెట్టే నస గుర్తొచ్చి ఇవాన్ కంగారుగా చెప్పేడు, “కాస్త టీ తీసుకురా, తాగుతా.”

పీటర్ బయటకెళ్లబోయేడు. తనకూడా ఎవరో ఒకరు కూడా ఉంటే బాగుంటుందనుకున్న ఇవాన్ వాడు బయటకెళ్లడం చూసి అన్నాడు, “అరే వెళ్లిపోతున్నావా, కాస్త నా మందు అందిస్తావా? ఏమో ఈ పరిస్థితిలో కూడా మందు పని చేయొచ్చు, ఎవరు చూడొచ్చారు?”

పీటర్ అందిచ్చిన మందు వేసుకున్నాక మరో సారి ఉధృతంగా నెప్పి. ‘నోట్లో మందు పనిచేయట్లేదని తెలిసీ ఎందుకు వేసుకుంటున్నాడు దీన్ని? తాను పోతున్నాడు సరే కానీ ఇదేం నెప్పి? ఏం చేసినా వదలని దరిద్రం; కాస్త ఉపశమనం కూడా లేదా తనకి?’ మూలిగాడు ఇవాన్. పీటర్ జాలిగా చూడబోయేసరికి చెప్పాడు, “సరే పోయి టీ తీసుకురా.”

టీ తీసుకొచ్చిన పీటర్‌ని ఎవరో ముక్కూ మొహం తెలియనివాడు తన గదిలోకి వచ్చినట్టూ చూసేడు ఇవాన్. అది చూసిన పీటర్ మొహంలో కొత్త ఆశ్చర్యం. అది గమనించి ఒక్కసారి తెలివి వచ్చినట్టైంది ఇవాన్‌కి. అవును తను టీ తెమ్మన్నాడు కదా? “ఆఁ, ఆ టీ అలా పెట్టి కాస్త మొహం కడుక్కుని, ఈ చొక్కా మార్చకోవడానికి సహాయం చేయి. ఇప్పుడు శరీరం ఏం చేయాలన్నా సహకరించడం లేదు.”

బట్టలు మార్చుకునేప్పుడు ఇవాన్ తన శరీరం కేసి చూసుకోవడం మానుకున్నాడు. ఇప్పుడు తనదో దరిద్రపు కుళ్ళుతున్న శిధిలమైపోతున్న శరీరం. చూసుకోవడానికేవుంది? మొహం కడుక్కుని బట్టలు మార్చుకున్నాక కాస్త తెరిపి. బతుకుతానేమో అనే ఆశాకిరణం, అంతలోనే చావు తధ్యం అనే మహాసముద్రంలాంటి నిరాశ. టీ తాగుతుంటే మరోసారి, ‘నేనెక్కడకీ పోలేదంటూ’ గుర్తు చేసే పక్కటెముకల్లో నెప్పి! మళ్ళీ నోట్లో దుర్వాసన. దానితోపాటు వచ్చే విరక్తీ, నిర్వేదం వగైరా, వగైరా. మరో సారి ఇవన్నీ మర్చిపోయి నిద్రలోకి జారుకోవడానికి మత్తుమందు. ఎన్నాళ్ళిలా? ఈ సారి డాక్టర్ వచ్చినప్పుడు చెప్పాల్సిందే, ‘ఇలా కుదరదు. మరో దారి చూడమని ఆయన్ని అడగాలి.’

తలుపు దగ్గరేదో చప్పుడైనట్టుంది. డాక్టర్ వస్తున్నట్టున్నాడు. తెల్ల కోటు వేసుకుని హాయిగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా లోపలకి వస్తూ, తానేదో మృత్యువుని ఆపగలిగే గొప్ప భగవంతుడైనట్టూ రోగికి తన మొహంలో నేనున్నాను ఏమీ కంగారు లేదు! అనే ధైర్యం చూపించాలని ఆరాటం కాబోలు; వచ్చినవాడు చేతులు రుద్దుకుంటూ చెప్పేడు, “ఏం చలి బయట? పొద్దుటే బయల్దేరేముందు కాస్త చలిగా ఉంది కానీ దిగితే కానీ తెలియదన్నట్టూ, వణికించేస్తోంది సుమా. అయితే ఎలా ఉంది రాత్రి సరిగా నిద్ర పట్టిందా? మొహం చూడబోతే దేని గురించో విచారంగా ఉన్నట్టుందే?”

దరిద్రుడు, ఏమిటా అడగటం? రోగం తనని చంపేస్తోందని తెలిసీ, తనకి తగ్గుతుంది అనే అబద్ధాలు ఆడుతూ, దేని గురించి విచారం అని అడుగుతున్నాడా? తాను చస్తూంటే నిర్విచారంగా ఉండగలడా? వీడా డాక్టరు? ఇలాంటి పిచ్చిప్రశ్నలు ఎలా అడగ్గలుగుతున్నాడు, ఎంత మామూలుగా ఉందామనుకుంటే మాత్రం? ఇవన్నీ నోట్లోనే నొక్కేసి ఇవాన్ చెప్పేడు, “ఎలా ఉంటుంది? ఎప్పట్లాగే రాత్రంతా భయంకరంగా నెప్పి, మత్తు మందు వేసుకోవడం, కాసేపు నిద్ర, అది పనిచేయడం మానేశాక మళ్ళీ నెప్పి. ఏ రోజైనా ఇదే నా కధ!”

“అవును ఈ జబ్బులో అలాగే ఉంటుంది కదా?” అసలు మొదటనుంచీ ఇదే రోగమో చెప్పని, చెప్పలేని డాక్టర్ దగ్గిరకొచ్చి నాడి చూట్టం, చేతులూ కళ్ళూ ఎలా ఉన్నాయో, నాలిక చాపమనడం, పైనా కిందా చూడ్డం సాగించేడు. ఇవాన్‌కి ఇదో తప్పించుకోలేని వ్యవహారం. తాను న్యాయమూర్తిగా కోర్టులో కూర్చున్నప్పుడు ఇలాగే లాయర్లు వాగే వాగుడంతా–పూర్తిగా అబధ్ధాలు అని తెలిసి కూడా, అది పనికొస్తుందా లేదా అనేది అటుంచితే–వినాల్సి వచ్చేది కదా? ఇదీ అంతే.

ప్రస్కోవ్యా తలుపు దగ్గిర పీటర్‌ని గదమాయిస్తూంది, “డాక్టర్ వచ్చినప్పుడు నన్ను లేపమని చెప్పాను కదా?”

లోపలకి వచ్చి–తాను ఇవాన్‌ని ఎంతో ప్రేమిస్తోందని డాక్టర్‌కి చూపించడానికీ అన్నట్టు–తనని తలమీద ముద్దు పెట్టుకున్న ప్రస్కోవ్యాని ఇవాన్ పరికించి చూశాడు. కళకళల్లాడే మొహం, మంచి సిల్క్ బట్టలు, అబ్బో, అప్పటికే లేచి షోకు చేసుకున్నట్టుంది తళ తళా మెరుస్తున్నయ్ మెడా చేతులూ, కనిపించినంత మేర మిగతా శరీరమూను. ఇవాన్‌కి ఒక్కసారి మనసు లోపలి పొరల్లోంచి ఆవిడంటే ఉన్న అసహ్యం, జుగుప్సా ఒక్కసారి పొంగుతూ బయటకొచ్చేయి. ఆవిడ తనని ముట్టుకున్నందుకూ, ఇలా డాక్టర్ ముందు అతిగా ప్రవర్తించడం చూసి భరించలేని రోత పుట్టింది.

ఆవిడ ఇదేదో పది నిముషాల ప్రహసనం అన్నట్టూ డాక్టర్ని పలకరించింది. తనతో మాటామంతీ లేదు ఎప్పట్లాగానే. డాక్టరైనా, జెరాసిమ్‌ అయినా ఆఖరికి పీటర్ అయినా తనతో మాట్లాడుతున్నారు ఏదో ఒక బంధువు లాగానో లేకపోతే ఏదో ఒకలాగా కానీ స్వంత భార్య అయిన ఈవిడ మాత్రం తనకి దూరంగా జరుగుతోంది ఉన్న బంధుత్వం నుంచి. కానీ డాక్టర్‌తో మాట్లాడేటప్పుడు మాత్రం ఈవిడ చూపించేది మరో కోణం.

ప్రస్కోవ్యా అంటోంది డాక్టర్‌తో. “చూడండి ఈయన నేను చెప్పేది వినిపించుకోడు, టైమ్‌కి మందు వేసుకోడు. అన్నింటికన్నా ముఖ్యం మంచం మీద ఒకే లాగ పడుకోవడం. నడుమ్మీద, పక్కనా అలా పడుకుంటే దద్దుర్లు లేచి, పుండు పడి మరో రోగం వస్తుందంటే వినడు. ఏం చేయమంటారు?” జెరాసిమ్‌ చేత కాళ్ళు ఎలా పైకి ఎత్తించుకున్నాడో, ఇంట్లో సామాన్లు ఇక్కడ్నుంచి అక్కడకీ అక్కడ్నుంచి ఇక్కడకీ ఎలా మార్చమంటాడో అన్నీ పూస గుచ్చినట్టూ చెప్పింది ప్రస్కోవ్యా; అక్కడికి డాక్టరేదో మందో మాకో వేసి ఇవన్నీ మార్పించగలడన్నట్టూ.

డాక్టర్ వంకర నవ్వొకటి నవ్వేడు, “అవునా? ఏం చేస్తాం? కొంతమంది జబ్బున్న వాళ్ళు కొన్ని రకాలుగా ఇలా చేస్తూ ఉంటారు. మనం ఏమీ చేయలేం. వాటిని అలా వదిలేయడమే మంచిది.”

“నీకు నేనింత చాకిరీ చేస్తున్నా, నువ్వేమీ చెప్పక్కర్లేదు డాక్టర్‌తో నేనేం చేస్తున్నానో చేయట్లోదో, ఆయనకీ తెలుసు.” ప్రస్కోవ్యా అంది ఇవాన్‌తో చివరకి. ఈ అబద్ధాలు రోజూ జరిగేవే కనక ఇవాన్ నోరు మూసుకున్నాడు. ఈవిడ తనకేం చేస్తోందో తనకీ ఆవిడకీ తెలియకపోతే కదా?

ఆయన బయటకెళ్ళాక ప్రస్కోవ్యా అంది ఇవాన్‌తో. “మరోగంటలో ఇంకో డాక్టర్ వస్తున్నాడు, ఆయనని నేను నాకోసం, నీకు ఇష్టం ఉండదని తెలిసీ పిలిపించాను. వద్దనకు, సరేనా?” ఇవాన్ ఈ అబద్ధాలు వినలేక, నోట్లో ఏమాటా రాకుండా జాగ్రత్తపడుతూ భృకుటి ముడిచేడు.

దాదాపు పదకొండున్నరకి మరో డాక్టర్ ఇంటికొచ్చేడు. మరో అరగంట గడిచేక ప్రస్కోవ్యా డాక్టర్‌తో బయటకి నడిచింది. ఇవాన్ అడగాలి కనక అడిగినట్టూ డాక్టర్‌తో అన్నాడు, “ఈ జబ్బు అసలు తగ్గడానికి వీలుందా?”

“అంత గ్యారంటీగా చెప్పలేం కానీ పదిశాతం ఉండవచ్చేమో,” అన్నాడు డాక్టర్. మాటతో ఎంత ధైర్యం ఇద్దామనుకున్నా ‘ఇంక చావు తప్ప మరో మార్గం లేదు నీకు’ అని ఆ డాక్టర్ మొహం చెప్పకనే చెప్పింది ఇవాన్‌కి. ఇవాన్ మొహంలో ఆ మాట విన్నాక కనబడిన చావుకళ చూసి, బయటకి వెళ్ళేటప్పుడు ప్రస్కోవ్యా కళ్ళు తుడుచుకోవడం ఇవాన్ కంట పడనే పడింది. మరోసారి మనసులో గునపం దింపినట్టు ఇవాన్ కళవళ పడ్డాడు. ఇంకెన్ని రోజులు?

డాక్టర్ అటువెళ్ళగానే అప్పటిదాకా కళకళ్ళాడిన గది మూగబోయింది. అవే గోడలు వాటి మీద అవే చిత్రాలు, అవే టేబుళ్ళూ, వాటి మీద అవే మందులూ. వీటినన్నింటినీ కాదంటూ, ముందు నేనున్నానంటూ మరోసారి భయంకరమైన నెప్పి. ఇవాన్ మూలుగు వినబడ్డాక మరోసారి మత్తుమందు ఇవ్వబడింది. సూది శరీరంలో దిగగానే కాస్త నెప్పి, మరో మూలుగు. కళ్ళు మూతలు పడుతుంటే ఇవాన్ నిద్రలోకి జారిపోయేడు.

సాయింత్రం ఏడు గంటలక్కాబోలు మెలుకువొచ్చింది ఇవాన్‌కి. ఏడున్నరకి యధావిధిగా భోజనం పంపబడింది ఇవాన్ గదిలోకి. కష్టపడి నాలుగు మెతుకులు ఎంగిలి పడ్డాక, ఎక్కడకో బయల్దేరినట్టూ ప్రస్కోవ్యా వేసుకున్న వంపు సొంపులన్నీ కనిపించే బట్టలతో గదిలోకి వచ్చింది. ఒక్కసారి ఇవాన్‌కి ఈవిడని మొదటిసారి కలుసుకున్న రోజులు గుర్తొచ్చాయి. ఇలాగే అలంకరించుకుని వచ్చింది ఆ రోజు కూడా. ఆవిడ వస్తూనే చెప్పిన మాట: అందరూ కలిసి ఆపేరాకి వెళ్తున్నారు. ఈ ఆపేరాకి ప్రత్యేకంగా టికట్లు ఇవాన్ తెప్పించినవే. తనకి వెళ్ళాలని లేదు, ఇవాన్‌ని ఇలా వదిలేసి కానీ అందరూ కలిసి వెళ్ళాలనుకున్నారు, తాను లేకుండా పిల్లలు వెళ్లడం పడదు కనక ఇప్పుడు రానంటే బాగోదు కదా? అలా కాసేపు కబుర్లు.

తర్వాత తానెలా ఉన్నాడో, మందు పనిచేస్తోందా అసలు, డాక్టర్ ఏమంటున్నాడో అనేవి. అసలు ఏదో ఒకటి మొహమాటానికి మాట్లాడాలని తప్ప ఏమీ పస లేని కబుర్లన్నీ అయ్యేక, కూతురూ, ఆ అమ్మాయి స్నేహితుడూ లోపలకి వచ్చి చూడాలనుకుంటున్నారు, రావచ్చా అని ప్రశ్న.

“సరే రమ్మను.” ఇవాన్ ఒప్పుకున్నాక ఆ ఇద్దరూ లోపలకొచ్చారు ఇవాన్ గదిలోకి.

మందుల వాసన, తన రోగం వల్ల వచ్చే దుర్గంధం అన్నీ వాళ్ళకి అసహ్యం కలిగిస్తున్నాయనేది వాళ్ళ మొహాల మీద తెలిసిపోతోంది. అంతలో అందరికన్నా ఆఖర్న పుట్టిన, ఇంకా స్కూలుకెళ్ళే ఇవాన్ కుర్రాడు వచ్చేడు లోపలకి. మొహంలో తండ్రి మీద జాలి, కళ్ళచుట్టూ నల్లని జీరలు, తండ్రి ఇంక పోతాడనే జీర్ణించుకోలేని సత్యం వల్ల కుర్రాడికి రోజూ కలిగే బాధ చెప్పకనే చెప్తున్నాయ్! ఇవాన్‌కి కూడా జాలి వేసింది కుర్రాడి మీద. ఈ కుర్రాడూ, తనకి రోజూ గది తుడిచిపెట్టి ఏది కావాలన్నా విసుక్కోకుండా అమర్చి పెట్టే నౌకరు జెరాసిమ్‌, వీళ్ళిద్దరే కాబోలు అసలు తనని అర్ధం చేసుకున్నది. తల తిప్పి కూతురు లిసా కేసీ ఆ అమ్మాయి స్నేహితుడికేసీ చూశాడు. యవ్వనంలో ఉన్న పిల్ల వంపు సొంపులు చూపించే ప్రయత్నం తెలుస్తూనే ఉంది. ఏ మానవ శరీరం వల్ల తాను రోజుల తరబడి చిత్రవధ అనుభవిస్తున్నాడో అటువంటి శరీరాన్నే చూపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు వీళ్ళు. తేడా ఒక్కటే, కుళ్ళిపోతున్నది తన శరీరం, యవ్వనంలో పొంగుతూ కళకళలాడుతున్నది వాళ్ల శరీరం.

కాసేపు మౌనం రాజ్యమేలాక ఆపేరాలో ఏమి చూడబోతున్నారో, అది చూడ్డానికి ఇచ్చిన కళ్ళజోళ్ళు ఎక్కడ ఉన్నాయో, నీకిచ్చాను కదా అంటే, అబ్బే నాకేం తెలీదని ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, దాని మీద ఒకరికి నచ్చని మరొకరి విసుర్లూ అయ్యేక అమ్మాయి స్నేహితుడు అడిగేడు ఇవాన్‌ని ఆరోగ్యం గురించి.

“ఎప్పట్లాగానే ఉంది.” ఇవాన్ సమాధానం విని కుర్రాడు ఇవాన్ కేసి, తల నించి కింద దాకా ఓ జాలి చూపు చూశాడు. ఈ లోపునే అమ్మాయి కూడా ఏదో మాట్లాడబోయేసరికి కుర్రాడు తలవంచుకున్నాడు నిశ్శబ్దంగా. వాళ్ళ చూపుల్లో, మొహాల్లో కనబడిన భావాల్లో ఇవాన్ త్వరలో చావబోతున్నాడనేది తెలుస్తూనే ఉంది. ఎవరికీ ఇంకేం మాట్లాడాలో తెలియకుండా మరో కొద్ది క్షణాలు గడిచాక అమ్మాయే లేచి అంది, “ఇంక వెళ్తాం ఆలస్యం అవుతోంది ఆపేరాకి.”

అందరూ బయల్దేరారు, ఇవాన్‌ని వదిలేసి. వాళ్ళటు వెళ్ళగానే ఇవాన్‌కి కాస్త తెరిపి అనిపించింది. ‘నీకు బాగవుతుంది, మందు వేసుకో, సరిగ్గా నిద్రపో’ అనే రోజూ వినే అబద్ధపు లోకం లోంచి బయటకొచ్చి పడినందుకు. అసలు నిజం అప్పుడు మరోసారి బయటకొచ్చి నేనిక్కడే ఉన్నాను సుమా అంటూ ఉధృతమైన నెప్పి రూపంలో గుర్తు చేసేసరికి.

క్షణాలు, గంటలుగా గడుస్తున్నాయ్, ఇవాన్‌కి మాత్రం నెప్పి ఏ కోశానా తగ్గేలా లేదు. చావు తథ్యం, రాబోతోంది తొందర్లో అనే ఆలోచనలు ఇవాన్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, కాసేపటికి నౌకరు పీటర్ లోపలకి వచ్చాక, అతనితో చెప్పేడు ఇవాన్, “పోయి జెరాసిమ్‌ని లోపలకి పంపిస్తావా?”
9.
ఝాము రాత్రి, బాగా చీకటి పడ్డాక ఎప్పుడో ప్రస్కోవ్యా అలాగే వంపుసొంపులన్నీ ప్రదర్శిస్తూ వెనక్కి వచ్చి ఇవాన్‌ని పలకరించింది. ఇవాన్ ఆవిడ రావడం చూసి కళ్ళు తెరిచి చూసి వెంఠనే మూసుకోబోయేడు. ఇంకా అక్కడే ఉన్న జెరాసిమ్‌ని ఇంటికి పంపించేసి తాను ఉంటానంది ప్రస్కోవ్యా. కానీ ఇవాన్ వెంఠనే చెప్పేడు, “వద్దు, వద్దు, నువ్వు పోయి పడుకో, ఇక్కడ జెరాసిమ్‌ ఉన్నాడు కదా?” తానెందుకు ఆవిణ్ణి బయటకి వెళ్ళమన్నాడో ఆవిడకీ తెలుసు, తనకీ తెలుసు కనక ఆవిడ వెళ్తూ అడిగింది, “నెప్పి బాగా ఎక్కువగా ఉందా?”

“ఎప్పట్లాగానే ఉందిలే, దాని సంగతికేం?”

“నిద్ర పట్టడానికి మత్తుమందు వేసుకుంటావా?”

“సరే,” ఇవాన్ మందు నోట్లో పెట్టుకోగానే ఆవిడ బయటకెళ్ళింది.

తెల్లవారుఝామున మూడింటిదాకా అది నిద్రో, కలో, మాయో ఏదో తెలియని త్రిశంకు స్వర్గం ఇవాన్‌కి. తననీ, తనకూడా ఉన్న నెప్పినీ కట్టకట్టి ఏదో నల్లటి గోనెసంచీలో కుక్కుతున్నారు. వద్దనేకొద్దీ లోపలకి తోస్తూంటే తాను ఏమీ చేయలేక పోతున్నాడు. ఆ సంచీలోంచి బయటపడితే బాగుణ్ణని ఉంది, కానీ రావడానికి శరీరం సహకరించడం లేదు. ఈ నల్లటి ఇరుకు సంచిలో కూడా నేనెక్కడికీ పోలేదంటూ తనకున్న దారుణమైన నెప్పి గుర్తు చేస్తూనే ఉంది. కాసేపటికి ఊపిరి ఆడని స్థితిలో ఒక్కసారి ఊరట, సంచీలోంచి ఎలాగో బయటపడ్డాడు. ఒక్క ఉదుట్న మెలుకువొచ్చింది. కళ్ళెత్తి పైకి సారించేడు. మొదటగా కనిపించినది తన కుళ్ళుతున్న శరీరం, ఆ పైన పుల్లల్లాగా తయారైన తన కాళ్ళు, తన కాళ్ల దగ్గిరే కూర్చుని కాళ్ళు పడుతున్న జెరాసిమ్‌; రాత్రంతా కూర్చున్నట్టున్నాడు పాపం, కునికిపాట్లు పడుతున్నాడు.

“జెరాసిమ్‌, నన్ను వదిలేసి పోయి పడుకో, పో.”

“అబ్బే ఫర్వాలేదు, కాసేపు ఉండగలను.”

“వద్దు, పోయి పడుకో, నాకు ఫర్వాలేదులే.” పళ్లబిగువున అన్నాడు ఇవాన్.

జెరాసిమ్‌ వెళ్ళగానే పక్కకి తిరిగి పడుకున్నాడన్నమాటే గానీ, అప్పటిదాకా లోలోపల దాగిన దుఃఖం ఒక్కసారి గట్టు తెంచుకుంటూ బయటకొచ్చింది. తన చేతకాని తనానికీ, తనకొచ్చిన ఈ జబ్బుకీ, తనకి దీనివల్ల కలిగిన ఒంటరితనానికీ, అక్కడ్నుంచి అసలు మనిషిలో ఉన్న పశుప్రవృత్తికీ, దేవుడనే వాడసలు ఉండే ఉంటే, ఆయనకున్న కఠిన హృదయానికీ, అసలు దేవుడే లేకపోతే, దేవుడు లేనేలేడు అనే ఆలోచనకీ అన్నింటినీ కట్టగట్టుకుంటూ అంతులేని ఏడుపు. చిన్నపిల్లవాడు ఆకలితో పాలకోసమో, బొమ్మ విరిగిపోతే దానికోసమో ఏడిచినట్టు, మొదలూ చివరా లేని అంతులేని ఏడుపు, కన్నీళ్ళు కారుతూంటే అలా ఏడుస్తూనే ఉన్నాడు ఇవాన్ చాలాసేపు. ఆ ఏడుపులోనే మళ్ళీ ప్రశ్నలు; దేవుడా నన్నెందుకిలా సృష్టించావు? నన్నెందుకిలా ఏడిపిస్తున్నావు, నేనేం తప్పుచేశాను?” ఇదయ్యాక అందులోంచి మళ్ళీ కోపం. “నన్ను చంపాలనుకుంటే, ఒక్క దెబ్బతో పోనీయ్, ఇలా ఎంతకాలం ఏడిపిస్తావు?”

ఏడుపుతో మెల్లిగా తెరిపిన పడ్డాక ఏదో శబ్దం, తన అంతర్గతం లోంచి వచ్చే మాటలే అవి; అజ్ఞాత వ్యక్తి కంఠం కూడా కాదు; తనలోంచి వచ్చే మాట వేరే ఎవరో తననే అడుగుతున్నట్టుంది, “ఏం కావాలి నీకు ఇవాన్?”

ఇవాన్ ఓ సారి తనకేసి చూసుకున్నాడు, ఏం కావాలి తనకి? తనకా, “బాగా అందరిలా ఆరోగ్యంగా బతకాలి, అదే తనక్కావాల్సినది. అదే అదే.”

“అంటే మునపటిలా ఎలా ఉన్నావో అలాగా? అంటే చిన్నతనం, యవ్వనం, పెళ్ళీ, పిల్లలూ; అవి సంతోషం కలిగించాయా నీకు?” అజ్ఞాత కంఠం అడుగుతోంది, “అవన్నీ మళ్ళీ కావాలా లేకపోతే అందులో కొన్ని మాత్రమేనా?”

దీనికి సమాధానం కోసం ఇవాన్ వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఓ సారి చూసుకుంటే, జీవితంలో ఏవి తనకి బాగున్న రోజులు? చిన్నప్పటి రోజులు బాగుండేవి. హాయిగా ఆడుకోవడం, పడుకోవడం. తర్వాత యవ్వనం? చదువుకునే రోజులు, కాలేజీ, ఉద్యోగం? బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తన స్వాతంత్ర్యం? వాటిలో తనకి కాస్త సంతోషం కలిగించేవి కొన్ని ఉన్నా, వద్దు. అవన్నీ పైకి బాగానే ఉన్నా విషపూరితమైనవని అని తెలిసొచ్చింది కదా? మరి పెళ్ళి? పెళ్ళి పేరుతో కామం, భోగం, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టూ రోజుల తరబడీ ఆడుకునే కపట నాటకం, ఇవాన్‌కి వణుకు పుట్టుకొచ్చింది వద్దు గాక వద్దు. ఇవన్నీ ఒకెత్తు ఐతే ఈవిడ పెట్టే సన భరించడం కన్నా ఒంటరిగా ఉండడమే మేలు. పిల్లలో? అసలే వద్దు. పుట్టిన వాళ్లెంతకాలం బతుకుతారో? వాళ్ళెలా తయారౌతారో అనే చింత. మరి నెప్పీ, రోగమో? హతోస్మి. ఇవన్నీ చూసుకుంటే ఏది సంతోషం కలిగించేది? ఒక్క చిన్నప్పటి రోజులు మాత్రమే. పెరిగే కొద్దీ తనకి ఏది సంతోషం కలిగిస్తుందనుకున్నాడో అది ఆవిరైపోతూ జీవితంలో సుఖం అనేది ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. జీవితంలో తాను ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎక్కువ సంతోషం పొందుతున్నానని అనుకుంటూ ఉంటే నిజానికి తన జీవితం ఒక్కో మెట్టూ కిందకి అధఃపాతాళంలోకి దిగుతోంది. అంటే తన ఆరోగ్యం బాగైనా సరే తనకి జీవితంలో సంతోషం కలిగించేదేమీ లేదా? నిజంగానే లేదా? ఇప్పటికైనా తెలిసిన పరమ సత్యం తన ఎదురుగా వికట్టహాసంతో నవ్వుతున్న మృత్యువు! అయిదేళ్ళ ప్రాయంలో తానెంత సంతోషంగా ఉన్నాడో తల్చుకుంటే ఇప్పటి పరిస్థితి కానీ, అసలు ఆరోగ్యంగా బతికి ఉన్నప్పుడు కానీ ఉన్న సంతోషం అసలు సంతోషం కింద లెక్కపెట్టొచ్చా? అయితే మునపటిలాగా సంతోషంగా బతకాలంటే, వెనక్కి పోయి తాను చిన్నపిల్లవాడైపోవాలి. అలా జరగడం అసంభవం.

తనకి జరుగుతున్న ఇదంతా ఏమిటి? ఇలా నెప్పి ఎందుకు అనుభవించాలి? దీనికంతటికీ ఏదో కారణం ఉండాలి కదా? తానేదో తప్పు చేశాడు జీవితంలో. ఏవిటది? ఇలా అనుకోగానే ఇవాన్‌కి జీవితం కళ్ళముందు గిర్రున తిరిగింది. ఎక్కడా పెద్ద తప్పులు చేసినట్టు లేదు. అన్నీ బాగానే ఉన్నా ఎందుకిలా అయింది తన జీవితం? అసలు మొదటినుండీ తాను చేశాననుకున్న మంచి పనులన్నీ తప్పులేనేమో? తన తోటివాళ్ళూ, తన కూడా స్నేహితులూ చేసిన పనులే తానూ చేశాడు కదా, అవన్నీ తాను నిజంగా మంచి పనులనుకునే, అందరూ మెచ్చేవి అనుకునే చేశాడు కదా, అవన్నీ కూడా తాను జీవితంలో చేసిన తప్పులై ఉండొచ్చు. మిగతావాళ్ళు ఒప్పుకుంటే మాత్రం అవన్నీ మంచివని ఎక్కడుంది? అలాగైతే తాను పోయేముందు జడ్జ్ ముందు నిలబెట్టి ఈ తప్పుల్లో నువ్వు సమర్ధించుకునేది ఏమిటి అని అడిగితే సమర్ధించికోవడానికేమీ మిగల్లేదు, అలా ఏడుపు మొహం పెట్టి చూడ్డం తప్ప.

అజ్ఞాత కంఠం మరోసారి అడుగుతోంది, “అయితే ఇవాన్, ఇప్పుడేమంటావ్? జీవితం ఎలా ఉండాలి? ఇలాగే ఉంటే బాగుందనేనా? అలా కాకపోతే మరెలా ఉండాలో?”

ఇవాన్‌కి ఓ సారి తన ఆఫీసు గుర్తుకొచ్చింది. తాను కోర్టు లోపలకి అడుగుపెడుతుంటే జవాన్ అరుస్తాడు, “జడ్జీ గారొస్తున్నారు, జడ్జీ గారొస్తున్నారు.” ఇవాన్‌కి ఒక్కసారి వళ్ళు తెలిసినట్టయి అరిచేడు, “నేనేం తప్పూ చేయలేదు. జడ్జ్ మాత్రం ఏం చేస్తాడు తప్పు చేయకపోతే?” అప్పటికి బాగా మెలుకువ వచ్చింది ఇవాన్‌కి. అప్పటిదాకా కడుపులో దాచుకున్న దుఃఖం బయటకి రాగానే మరో పక్కకి తిరిగి పడుకున్నాడు.

ఇంత వ్యథ కలిగినా ఇవాన్‌కి వదలని ప్రశ్న ఒక్కటే: ఎందువల్ల తనకీ యమయాతన? తనకి తెలియకుండా ఎక్కడ జరిగింది తప్పో ఒప్పో తన జీవితంలో? అయితే తన జీవితంలో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని మనసులో ఓ మూల, తాను ఏ తప్పూ చేయలేదని మరో మూలా బుర్ర తొలిచేస్తూనే ఉన్నై. ఎంత ఆలోచించినా ఈ అంతులేని ప్రశ్నలకి మాత్రం ఇవాన్‌కి సమాధానం ఎప్పటికీ దొరకలేదు.

10.
మరో రెండు వారాలు గడిచాయి. ఇవాన్ ఆరోగ్యం విషమిస్తూనే ఉంది. అంతకు ముందు మంచం మీదనుంచి సోఫా మీదకీ అటూ ఇటూ వెసులుబాటుగా తిరగ్గలిగే ఇవాన్ ఇప్పుడు సోఫాకే పరిమితం అయ్యేడు. సోఫాలో పడుకున్న ఇవాన్ కళ్ళు తెరిస్తే ఎదురుగా కనిపించేది గోడ ఒక్కటే. అంతు దొరకని ప్రశ్నలకి బుర్ర పాడవడం తప్ప అవి అలా వస్తూనే ఉన్నై. ‘ఇదంతా ఏవిటసలు? చావంటే ఇదేనా?’ ఒక్కోసారి మనసులోంచి తన్నుకొచ్చేది సమాధానం, ‘అవును ఇదే చావంటే, అవును ఇదే, ఇదే.’

“మరి ఈ నెప్పీ, బాధా ఎందుకు?” ఇవాన్ తనకి తాను వేసుకునే ప్రశ్న.

“కారణమేమీ లేదు, చావంటే అలాగే ఉంటుంది.” లోపల్నుంచి వచ్చే సమాధానం.

ఇవాన్‌కి ప్రతీదీ రెండు వ్యతిరేకాల్లా కనబడడం మొదలైనది తనకి జబ్బు వచ్చినప్పటినుండీ. మొదట్లో కిడ్నీయో అపెండిక్సో; తర్వాత సరిగ్గా పని చేయకపోవడమో అది శరీరం లోంచి విడిపోవడమో; ఆ అవయవం తిరిగి పనిచేస్తుంది అనే ఆశ, చేయదనే నిరాశ. జబ్బు ముదిరేకొద్దీ ఎదురుగా వికట్టహాసం చేస్తూ క్రూరంగా నవ్వుతున్న తన మృత్యువు! సమాధానం లేని ప్రశ్న మాత్రం, ఆ మృత్యువు తన ఎదురుగా నవ్వడం ఆపేసి తనని కబళించడానికి మీదకి ఎప్పుడొస్తుందనేది మాత్రమే.

మూడునెలలనుంచీ తెలుస్తోంది. తన ఆరోగ్యం క్షీణించడం, తనని అందరూ శరీర దుర్గంధం వల్లో మరో కారణం వల్లో ఒంటరిగా చేయడం. ఇంతమంది జనం, చాలా మంది స్నేహితులూ ఉన్నా తాను ఇప్పుడో ఎవరికీ పట్టని ఒంటరి. ఎంత తనకి తాను ధైర్యం చెప్పుకుందామన్నా తన జబ్బు ముదురుతోంది. ఏదో ఒక ఆలోచన మనసులో మెదలడం, దాన్ని పట్టుకుని వెనక్కి ఆలోచిస్తూ పోతే తన చిన్నతనంలో ఎలా ఉండేదో అనే దాని దగ్గిర తేలడం. ఓ రోజు ఏ పండో తిన్న జ్ఞాపకం వస్తే, తన నోట్లో ఏదో రకమైన కంపు వల్ల ఏవో పాడైపోయిన పళ్ళు తీసుకొచ్చి తనకి తినడానికి పెట్టారని తాను అందరి మీదా అరిచాడు; చిన్నప్పుడు తిన్న ఆ పళ్ళ మంచి రుచీ వాసనా గుర్తొచ్చి. ఆ ఆలోచన అక్కడ ఆగితేనా? అక్కడనుంచి తన అన్నదమ్ముల మీదకీ, ఆడుకున్న ఆట వస్తువుల మీదకీ పాకే ఎడతెగని ఆలోచన్లు.

మరోసారి తనకీ జబ్బు ఎలా వచ్చిందీ, ఇంతవరకూ ఎలా పెరిగి తననీ మృత్యుముఖం లోకి ఈడ్చిందీ అనే ఆలోచనలు. నెప్పి పెరిగే కొద్దీ, జీవితం నాశనం అవడం తెలుస్తూనే ఉంది ఇన్నాళ్ళూ; అయినా ఏమీ చేయలేకపోయేడు. సరిగ్గా ఆలోచిస్తే, మహా అయితే తాను పుట్టినప్పుడో, సరిగ్గా బాల్యంలోనో కొన్ని సంతోషమైన రోజులుండేవి కాబోలు. అప్పటినుండీ జీవితం-–జబ్బు ఉన్నా లేకపోయినా–ఛండాలంగా తయారవుతూ వస్తోంది; అయినా తాను మాత్రం జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఏదో సంతోషంగా ఉన్నానని అనుకుంటూ వస్తున్నాడు. నిజానికి జరిగినదేమిటంటే ఒక్కో అడుగు వేసుకుంటూ తాను వచ్చినది మృత్యుముఖానికి. ఎంత దౌర్భాగ్యం! ఎంతో ఎత్తులోంచి రాయి కిందపడితే పడే కొద్దీ వేగం పుంజుకుంటున్నట్టూ తన జీవితం మృత్యువు వడిలోకి అతి వేగంగా లాగబడుతోంది. ఆ రాయి కిందపడగానే అనేక ముక్కలైనట్టూ తాను కూడా మృత్యువుని జేరగానే పటాపంచలౌతాడు. ఒక్కసారి మృత్యువు మీదకొస్తున్నట్టూ ఊహించుకుంటూ అలాగే నిశ్చేతనంగా కూర్చుండిపోయేడు ఇవాన్.

ఈ మృత్యువును అడ్డుకోవడం అసంభవం! జీవితం ఇలా జరగడం, ఇదంతా కాస్త అర్ధమైనా బాగుణ్ణు. కానీ అలా అర్ధమవడం కూడా అసంభవంగానే తోస్తోంది. తాను కానీ ఎలా న్యాయంగా బతకాలో అలా బతకలేదా అని ప్రశ్నించుకుంటే–లేదే, తాను తనకి తెలిసినంతలో న్యాయంగా ఎవరికీ ఏ హానీ చేయకుండా బతికేడు కదా? ఇంతలోనే విరక్తిగా మొహంలో నవ్వు. ఏదైతే వద్దనుకున్నాడో అదే మళ్ళీ మళ్ళీ బుర్రలోకి రావడం; అదే మళ్ళీ వద్దనుకోవడం. ఏ సమాధానం దొరకని ప్రశ్న మాత్రం తనకి సమాధానం లేని ప్రశ్నలూ, తనముందు కనబడే మృత్యువూ, ‘ఇదంతా దేనికోసం?’ అనేదీను.

11.
మరో రెండు వారాలు గడిచాక కూతురు కాస్త మంచి సమాచారం తీసుకొచ్చింది. లిసా స్నేహితుడు, అంతకు ముందోసారి ఆపెరాకి వెళ్తూ ఇవాన్‌ని చూడ్డానికొచ్చినతను లిసాని పెళ్ళిచేసుకుంటాననే ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఈ మాట ఇవాన్‌కి చెప్పడానికి ప్రస్కోవ్యా గదిలోకి వచ్చేసరికి ఇవాన్ సోఫా మీద పడుకుని పైనున్న కప్పు కేసి నిర్విచారంగా చూస్తూ నెప్పితో మూలుగుతున్నాడు. శరీరంలో జరిగే మార్పులూ నెప్పీ, మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నై.

మందు వేసుకున్నాడో లేదో కనుక్కుందామనుకుంటూ నోరు విప్పబోయిన ప్రస్కోవ్యాకి అన్ని సమాధానాలూ ఇవాన్ మొహంలోనే; తన జీవితం దాదాపు నాశనం చేసిందన్నట్టూ అంతులేని అసహ్యం, పగ, ద్వేషం, విరోధం అన్నింటితో కలగలిపి కనిపించేయి. ప్రస్కోవ్యా ఇంక నోరు మెదపలేదు.

“నన్నింక వదిలేయ్, ఇలాగే ప్రశాంతంగా ఇలాగే పోనియ్యి.” ఇవాన్ ఆవిడ మొహంలో మారే రంగులు చూసి చెప్పేడు బతిమాలుతున్నట్టూ.

ప్రస్కోవ్యా ఏదో అనబోయి బయటకెళ్లబోయేదే కానీ ఈ లోపుల ఇవాన్ కూతురు లిసా గదిలోకి వచ్చింది తండ్రిని పలకరించి ఆ రోజు ఆయనకి ఆరోగ్యం ఎలా ఉందో అడగడానికి.

ఏ భావం లేకుండా కూతురితో అన్నాడు ఇవాన్, “త్వరలోనే మీకందరికీ నానుంచి విముక్తి దొరుకుతుంది.”

కాసేపు అక్కడే కూర్చున్న తర్వాత ఇద్దరూ బయటకి వెళ్ళడానికి కదిలేరు వాళ్ల పనులమీద.

కూతురు లిసా ఓ సారి కళ్ళు తుడుచుకునే అమ్మతో అంది బయటకి వచ్చాక “ఇదంతా నీ తప్పా? నాన్నకి అలా అవడం మనందరికీ బాధగానే ఉంది. అయితే మాత్రం ఇంత వ్యధ మనం ఎందుకు అనుభవించాలి?”

ఎప్పట్లాగానే రోజూ వచ్చే డాక్టర్ చూడ్డానికొచ్చేడు ఆ తర్వాత. ఇవాన్ ఆయనడిగిన ప్రశ్నలకి అవునూ, కాదూ అంటూ ఏవో నోటికొచ్చిన సమాధానాలు చెప్పేక వెళ్ళేముందు మనసులో విషం వెళ్లగక్కేడు కోపంగా, “డబ్బులకోసం తప్ప మీరిక్కడకి వచ్చే పనేమీలేదు. మీరూ, మీరిచ్చే మందులూ పనికిరావని తెలుస్తూనే ఉంది. నన్నింక ఇలా ప్రశాంతంగా పోనీయండి. ఇంక మీర్రావాల్సిన అవసరంలేదు.”

“మీ నెప్పి తగ్గించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా కదా?”

“ఆ, మీరు చేసే ప్రయత్నం ఏ మాత్రం పని చేస్తూందో తెలుస్తూనే ఉంది కదా? నా మానాన నన్ను ఉండనీయండి, అదే చాలు.” ఇవాన్ అరిచేడు ఆయన మీద.

డాక్టర్ బయటకెళ్ళి ప్రస్కోవ్యాతో చెప్పేడు, “ఈయన చివరి దశలోకి వచ్చాడు. ఈ పరిస్థితిలో ఇంక నేను చేయగలగేది ఒక్కటే. అస్తమానం నెప్పి తెలియకుండా మత్తుమందు ఎక్కువ మోతాదులో ఇవ్వడమే. చూడబోతే ఈయనకి శారీరకంగా నిజంగా నెప్పి దారుణంగా ఉన్నట్టుంది.”

అసలు ఇవాన్‌కి ఇంత కోపం రావడానిక్కారణం వేరే ఉంది. క్రితం రాత్రి జెరాసిమ్‌ ఇవాన్ కాళ్ళు పడుతున్నప్పుడు వాడి యవ్వనంలో ఉన్న శరీరాన్ని తన దుర్గంధపు శరీరంతో పోల్చి చూసుకుని తన జీవితంలో ఏదో సరిగ్గా జరగలేదని అనుకోవడం; శారీరకంగా ఇవాన్‌కి నెప్పి ఉన్నా, మానసికంగా ఉన్న నెప్పి లక్షరెట్లు ఎక్కువవడమే దీనిక్కారణం. తన జీవితం బాగానే ఉందనీ, తానేం తప్పు చేయలేదనీ, తన ఉద్యోగంలో కూడా తాను మంచి పేరు తెచ్చుకున్నాననీ మరోటనీ ఇవాన్ లోలోపల తనకి తాను ధైర్యం చెప్పుకోబోయేడు కానీ ఇవన్నీ ఎందుకూ పనికిరావనీ తన జీవితమే ఓ పెద్ద పనికిరాని జీవితమనీ లోపలి మరో గొంతు వీటన్నంటినీ నొక్కేసింది.

‘ఇలా నాకు మనసులో తోస్తున్నవన్నీ నిజం అయితే నాకు పుట్టినప్పుడు ఇవ్వబడిన అన్నింటినీ పోగొట్టుకుని చావడానికి సిద్ధం అవుతున్నానన్నమాట,’ అనుకున్నాడు ఇవాన్. దీనితో ఊరుకోక మరో విధంగా ఆలోచించడం మొదలుపెట్టేడు. పొద్దున్న ప్రస్కోవ్యా, కూతురూ రావడం, డాక్టర్ వచ్చి తనకి చావు దగ్గిరపడిందని చెప్పడం వగైరా వగైరా. దానితో ఇవాన్‌కి క్రితం రోజు రాత్రి వచ్చిన కల ఒక్కసారి గుర్తొచ్చింది. అందులో ఇవాన్ తన శరీరంలోంచి వేరుపడి తన పెళ్ళాం పిల్లలు చూస్తున్నట్టూ తన జీవితాన్ని విశ్లేషిస్తే, ఇవాన్‌కి జరిగినదంతా ఒకపెద్ద దగా. చావూ, బతుకూ కలగలిపిన దారుణమైన మోసం. ఈ ఆలోచనతో ఇవాన్ నెప్పి పదింతలు ఎక్కువైనట్టైంది. మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ, దుప్పటి మీదకి లాక్కున్నాడు మొహం కూడా కనిపించకుండా కప్పుకోవడానికి. అలా కప్పుకోవడంలో ఊపిరి ఆడనట్టు అయ్యేసరికి దీనికంతటికీ ప్రస్కోవ్యా, పిల్లలూ ఈ సంసారం అంతా కారణం అని తోచి వాళ్ళమీద రోత మరింత ఎక్కువై మనసులో దావానలం బద్దలయింది. ఎప్పటిలాగానే ఉధృతంగా నెప్పి పక్కటెముకల్లోంచి. పెద్ద మూలుగు, మరో సారి మరో పెద్ద మోతాదులో మత్తు మందు.

మధ్యాహ్నానికి మత్తు దిగేక మళ్ళీ మరణ మృదంగపు వాయింపు మొదలైంది, ఆగకుండా. గదిలోకి వచ్చినందరి మీదా ఇవాన్ అరిచి వాళ్ళని బయటకి తరిమేశాక కాస్త ఊరట పొందే సమయంలో మరోసారి ప్రస్కోవ్యా లోపలకి వచ్చింది.

“పాస్టర్ వచ్చి కొన్ని మాటలు చెప్దామనుకుంటున్నారు. అది నీకు నచ్చుతుందేమో అని…” మాటల్లో నాన్చడం, తాను ఎలాగా పోతున్నాడు కనక ఈవిడ చేసే సహాయం, అది చెప్పడానికి ఈవిడ వాడే భాష తెలుస్తూనే ఉన్నై.

“ఏవిటీ? ఇప్పుడా, ఎందుకూ, కానీ….” ఇవాన్‌లో ఏదో తెలియని ఆక్రోశం. ప్రస్కోవ్యా కళ్ళలోంచి కారే నీళ్ళూ, ఆవిడ ఏడుపు ఆపుకోలేకపోవడం ఇవాన్‌కి తెలుస్తూనే ఉంది.

“అవును, ఈ పాస్టర్ మంచివాడు, ఏమంటాడో విను…” ఏడుస్తున్న ప్రస్కోవ్యా బయటకెళ్ళింది.

“సరే, సరే.” ఇవాన్ అన్నాడు ఏదో మాట్లాడాలి కనక.

పాస్టర్ లోపలకి వచ్చాక ఇవాన్ తాను జీవితంలో చేసిన తప్పొప్పులు ఆయన ముందు చెప్పాల్సినదంతా చెప్పేడు. చేసిన తప్పులూ ఒప్పులూ ఆయన ముందు చెప్పుకున్నాక ఏదో తృప్తి. ఆ తర్వాత అసలీ జబ్బు ఎందుకొచ్చిందో ఎలా వచ్చిందో, ఈ నెప్పీ, ఆపరేషన్ చేసి బాగుచేయడం కుదురుతుందా అసలు, దాని వల్ల బతుకుతాడనే మిణుకు మిణుకుమనే ఆశా అదంతా ఎందుకో అన్నీ గొంతు పూడుకుపోయేలా చెప్పాక అరిచాడు, “నేను బతకాలి. నేను ఆరోగ్యంగా బతకాలి.”

పాస్టర్ విన్నంతసేపూ ఆయన కళ్లలో నీళ్ళు చూస్తూనే ఉన్నాడు ఇవాన్. తర్వాత ఆయన చెప్పాల్సిన మాటలు చెప్పి బయటకి నడిచేడు. ఆయనలా వెళ్లగానే ప్రస్కోవ్యా లోపలకి వచ్చి అడిగింది, “ఇప్పుడు కాస్త బాగున్నట్టుందా?”

ఇవాన్ ఆవిడకేసి కూడా చూడకుండా చెప్పేడు, “ఆఁ, బానే ఉందిలే.”

ఆవిడ వేసుకున్న బట్టలూ, ఒకప్పుడు తాను ఆబగా అనుభవించిన ఆవిడ శరీరం, ఆవిడ గొంతూ ఒకటే చెప్తున్నాయ్ ఇవాన్‌కి: ‘ఇదంతా అబద్ధం, ఇలా కాదు ఉండాల్సినది. ఇలా అసంబద్ధంగా అబద్ధాలతో, ఒకరితో ఒకరి మనసులో లోపల జరిగేవి దాచిపెట్టుకుంటూ బతకకూడదు.’ ఓ సారి ఇలా ఆలోచనలు మొదలవ్వగానే ఇవాన్‌కి ఆవిడ మీద ఉన్న అసహ్యం, కోపం అన్నీ మరోసారి ఉబికి పైకి వచ్చేయి. ఆ వెనకనే శరీరంలో నెప్పీ, మనసులో నెప్పీ కెలుకుతూనే ఉన్నై. నల్లటి సంచీలో కుక్కుతున్నప్పుడు ఊపిరి ఆడనట్టూ మరో బాధ. మరింత చేరువలో ఉన్నట్టూ మృత్యువు వికట్టహాసం.

ఇవాన్ మొహంలో జుగుప్స చూపిస్తూ ఆవిడమీద నుంచి ఒక్కసారి కళ్ళు తిప్పుకుని అందర్నీ “పొండి, ఇక్కడ్నుంచి పొండి, నా మానాన నన్ను వదిలేయండి” అంటూ అరుస్తూ కేకలు పెట్టేడు.

12.
ఇలా మొదలైన ఇవాన్ అరుపులు మరో మూడు రోజులు కొనసాగాయి, క్రమంగా పెరుగుతూ. ఈ మూడు రోజుల్లో ఇవాన్ ఎంతటి చిత్రవధ అనుభవించాడో ఆ అరుపుల్తో ఇంట్లో ప్రతీ ఒక్కరినీ అంతే చిత్రహింస పెట్టాడు. ఒక్కోసారి తాను నిజంగా చచిపోతున్నాడనుకుంటూ ‘ఆ, ఆ ఇదే’ అని అరవడం, ‘లేదు, లేదు. లే… ఇదికాదు’ అనుకుంటూ సాగదీసుకుంటూ అరవడం అందరికీ వినిపిస్తూనే ఉంది ఇంట్లో. ఈ మూడురోజుల్లోనూ ఇవాన్ ఆ నల్లటి గోనెసంచీలో కుక్కబడుతూ, లోపలకి తోయబడుతూ, తనకి తెలియకుండా ఎలాగో ఒకలాగ బయటకొస్తూనే ఉన్నాడు. ఉరికంబం మీద తలకి తాడు తగించాక కాళ్ల కింద బల్ల తీసేస్తే కలిగే ఊపిరాడని పరిస్థితి ఈ మూడు రోజుల్లో మూడు కోట్ల సార్లు అనుభవించాడు ఇవాన్. ఓ పక్క ఈ గోనెసంచీ లోకి వెళ్లడానికి తాను జీవితంలో చేసిన తప్పేం లేదని తన అంతరాత్మ వగుస్తూనే ఉంది. రెండో విషయం ఆ గోనెసంచీ లోకి వెళ్లకుండా తప్పకపోవడం. ఇలా మనసులో జరిగే విచిత్రమైన ఆలోచనల పోరాటంతో గోనెసంచీ లోకి నెట్టబడుతూ బయటకొస్తూ యమయాతన అనుభవించేడు ఇవాన్. జీవితం ఇప్పుడు చావు, బతుకుల మధ్య సన్నటి దారంతో వేళ్ళాడుతోంది. ఆ దారం ఎప్పుడు తెగుతుందా అనేది మాత్రం తెలియని ఒక అతి మహా విచిత్రం.

ఒక్కసారి గుండె మీద వేయి శతఘ్నుల పోటు. ఊపిరి అందడం లేదు ఇవాన్‌కి. పెద్ద గోతిలో పడిపోతూండగా చివర్లో కనిపించిన ఓ వెలుగు. ఓ పక్కకి వేగంగా వెళ్తూంటే నిజంగా అటుగాక మరో వ్యతిరేక దిశలో వెళ్తూన్న భావన. ‘హమ్మయ్య, ఇదేదీ నిజం కాదన్నమాట. సరే మరేది నిజం?’ ఇవాన్ మనసులో కొత్త ఆలోచన రూపు దిద్దుకోవడం తెలుస్తోంది, అన్నింటినీ ముంచేసిన కొత్త నిశ్శబ్దం లోంచి.

ఇది జరిగింది ఇవాన్ అరుపులు మొదలైన మూడోరోజు సాయంత్రం, మరో రెండు గంటల తర్వాత ప్రాణం పోతుందనగా. ఇవాన్ సోఫా మీద పడుకుని గోనెసంచీ లోంచి బయటకి రావడానికన్నట్టూ గాలిలో చేతులూపుతూండగా ఇవాన్ చిన్న కుర్రాడు లోపలకి వచ్చేడు. చేయి అప్రయత్నంగా కుర్రాడి తలమీద పడితే ఆ తండ్రి చేయిని తన పెదాల మీదకి తీసుకొచ్చి కుర్రాడు ముద్దు పెట్టుకోవడం, కుర్రాడి కన్నీళ్ళు తన చేయి తడపడం ఇవాన్‌కి తెలుస్తూనే ఉంది. అప్పుడే గోనెసంచీ లోకి నెట్టబడుతూ చీకట్లో వెలుగు కనిపించిన ఇవాన్ కళ్ళు తెరిచి చూశాడు కుర్రాడికేసి.

ఒక్కసారి ఏదో అర్ధమైనట్టూ అనిపించింది ఇవాన్‌కి. తనకిచ్చిన జీవితాన్ని తాను సరిగ్గా జీవించలేదు. అయితే మునిగిపోయిందేమీ లేదు; ఏదో మరో విధంగా దీన్ని మరమ్మత్తు చేసి బాగు చేయవచ్చు. అయితే ఎలా దీన్ని బాగుచేయడం, ఏది సరైన పద్ధతి?

ప్రస్కోవ్యా గదిలోకి వచ్చి చావబోయే తనని చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టడం కూడా ఇవాన్ చూశాడు. ఇవాన్‌కి ఒక్కసారి అందరిమీదా జాలి పుట్టుకొచ్చింది. “నా మూలాన వీళ్ళెంత నరకం అనుభవించారు? నేను పోతున్నందుకు ఎంత బాధ అనుభవిస్తారు తర్వాత? పోనీయ్, ఈ నరకం అంతా తాను పోగానే వదిలి సంతోషంగా ఉంటారు తర్వాత.” ఇలా అనుకుంటూ ఇవాన్ ఏదో అనబోయేడు కానీ లోపలనుంచో ఆలోచన చటుక్కున ఆ మాట నొక్కేసింది, “ఎందుకు మాట్లాడ్డం? అర్ధం కావాల్సినవాళ్లకి అదే అర్ధం అవుతుంది” అనుకుంటూ. ప్రస్కోవ్యాతో ‘కుర్రాణ్ణి బయటకి తీసుకెళ్ళండి,’ అన్నట్టూ చేతితో చూపించాడు. మాగన్నుగా మత్తు కమ్మేస్తూ ఉంటే, ముక్కలు ముక్కలుగా వస్తూ ‘మీకం… దరికీ… క్షమాప…’ ఇవాన్ మాట మూగబోయింది.

కళ్ళు మూతబడ్డాక ఇన్నాళ్ళూ తనని పిప్పి పిప్పి చేసిన భూతం తనని వదిలేస్తూన్న అనుభూతి. పక్కటెముకల్లోంచీ, రెండు పక్కలనుంచే కాదు, పైనుంచీ, కిందనుంచీ దశదిశలనుంచీ భూతం పట్లు వదిలేస్తోంది. రోగంతో ఇంతకాలం ఏడిపించినందుకు ఇవాన్ అనే పేరున్న తాను తన కుటుంబాన్నీ వాళ్ళందరినీ క్షమించమని అడిగాడు కదా? ఎంత చిన్నదీ విషయం, నెప్పి వదిలిపోతోంది. తనకున్న అన్ని బంధాలూ వదులవుతున్నాయి. ఇదిగో ఇక్కడే ఉన్నా అంటూ ఇన్ని నెలలూ తనని పట్టు వదలని మహా భూతంలా భయపెట్టిన నెప్పి ఎక్కడ? ఏదీ, ఎక్కడా ఆ నెప్పి?

ఈ పక్కనే కదా సర్వకాల సర్వావస్థల్లోనూ నేనిక్కడే ఉన్నానంటూ గుర్తు చేసిన నెప్పి? ఇంకా ఉందా? అది కిడ్నీయేనా? అపెండిక్సా? ఈ పక్కనా ఆపక్కనా? సరే ఎక్కడైతేనేం, దాన్ని అలాగే ఉండనీయ్. మరి చావో? ఎక్కడుంది తన చావు? తానిన్నాళ్ళూ అనుక్షణం దాని పేరు చెప్తే ఉలిక్కిపడిన చావు, అది వస్తే ఎలా అనుకుంటూ తాను భయపడిన చావు ఏదీ? ఎక్కడ? కనబడదే?

చావు బదులు నల్లటి సంచిలో లోలోపలకి దిగబడి పోతూంటే ఆ మూల కనిపించిన వెలుగు. చావు బదులు వెలుగు! చావు అనేది లేనే లేదు. చావు అనేది ఎప్పుడో అంతరించిపోయింది.

‘ఇదన్నమాట!’ భయం బదులు ఒక్కసారి ఇవాన్ మనసులో సంతోషం. దరిద్రం వదిలింది. హమ్మయ్యా, వదిలి పోయింది, హాయి, చావు అనేదే పోయింది. వ… ది… లి… పోయింది! ఇదీ ఇవాన్ మనసులో చివరిసారిగా కలిగిన ఆలోచన. ఒక్కసారి చివరి ఊపిరి ఆగినట్టూ, ఓ మూలుగు, కాళ్ళూ చేతులూ అచేతనం అవుతూండగానే ఇవాన్ ప్రాణాలు మెల్లిగా అనంతవాయువుల్లో కలిసిపోయేయి.

తన చేయి కుర్రాడి కన్నీళ్ళతో తడవడం దగ్గిర్నుంచి ప్రాణం పోవడం వరకూ ఇవాన్‌కి సరిగ్గా మూడే మూడు క్షణాలని అనిపించింది. కానీ అక్కడే కూర్చుని ఇవాన్‌ను చూస్తూన్న వాళ్లందరికీ ఈ స్థితిలో ఇవాన్ అతి దారుణంగా మృత్యుభయం, యమయాతన మరో రెండు గంటలు అనుభవించాడని చెప్తున్నట్టూ మరణ మృదంగం అలా మోగుతూనే ఉంది.
------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి
మూలం: లియో టాల్‌స్టాయ్
(మూలం: డెత్ ఆఫ్ ఇవాన్ ఇల్యిచ్)
ఈమాట సౌజన్యంతో

Saturday, September 28, 2019

This play without me! నేను లేని ఈ నాటకం!


This play without me! నేను లేని ఈ నాటకం!




సాహితీమిత్రులారా!

I stepped down from the dais
to watch the play- I am acting in.
It goes on without this I
I am sure, it can go on for ever.
I am important, the dais said,
that I am The life, that I am needed
that it would be clueless without me.

దిగిపోయి చూస్తున్నాను.
నేను ఉన్నా లేకున్నా కథ మారదని తెలిసీ
ఏదో ఒకలా కొనసాగుతుందని తెలిసీ
ఆశ్చర్యంగా ఎవరో అన్నారు
వేదికమీదనుండే
నేను చాల ప్రధానమైన పాత్రననీ
కథకి నేను కావాలనీ
నేను లేకపోతే తన పాత్రకీ మాటల్లేకుండా పోతాయనీ

Living
all those hours of words,
in the dark of starry skies
and misty mornings!

నక్షత్రానికి నక్షత్రానికి మధ్య ఉన్న చీకట్లో
చీకటివెలుగుల తొలిసంజల మంచులో
ఎన్నెన్నో గంటలు మాట్లాడుకుంటూ…
జీ వి తం!

The wind blew strong
autumnal leaves airborne
I sat on a sturdy rock
watching them swirl.
What it means to be a leaf,
would a tree ever understand?
Perhaps not
as long as they are together!

నిశ్చలంగా రాయినై నేను చూశాను
పసిమికాంతిలో మెరిసిపోతూ గాలిలో
ఇష్టమొచ్చినట్టు గిరికీలు కొట్టడం…
ఆకుగా ఉండటమంటే ఏంటో
చెట్టుకెప్పుడన్నా అర్థమవుతుందా?
బహుశా కాదేమో
అవి రెండు కలిసి ఉన్నంత కాలం.

Why does it take so long to feel
this Weightlessness?
Or
is it Nothingness?
Or…
Being Nobody.

ఎందుకో మరి
ఇంత సమయం పట్టింది నాకు
ఏమీలేనితనం కూడా ఉంటుందని గుర్తించడానికి
ఎందుకో మరి…
నేనేమీ కానని.
-------------------------------------------------------
రచన: మంజీర, నంద కిశోర్, 
ఈమాట సౌజన్యంతో