Showing posts with label పోతన. Show all posts
Showing posts with label పోతన. Show all posts

Thursday, May 24, 2018

రుక్మిణీ వర్తమానం


రుక్మిణీ వర్తమానం





సాహితీమిత్రులారా!


మన తెలుగువారిలో రుక్మిణి కల్యాణం తెలియనివారుండరు
ఇప్పుడుకాదండి గతంలో ఇప్పుడు ఆమె ఏ సినిమా నాయికయో
చెప్పమనే స్థాయికి వచ్చేశాం. శ్కీకృష్ణునికి రుక్మిణి పంపిన సందేశంలోని
పద్యవివరణను చీమలమర్రి బృందావనరావుగారి మాటల్లో చూద్దాం.
ఈ వివరణ అంతర్జాల మాసపత్రిక నవంబర్ 2011లో ప్రచురితమైంది
ఇక చదవండి..........


ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో

పైది చాలా ప్రసిద్ధమైన పద్యం. భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం లోనిది. కవి పోతన.

ఒక యువకుని ప్రేమించి, తన ప్రేమ సాఫల్యం పొందగల అవకాశాలు కానీ, తన వారినుంచి తగిన సానుకూలత గానీ లేకపోవడంతో స్వయంగా తన ప్రయత్నాలు ప్రారంభించి, ఆ యత్నాలు ఫలిస్తాయో లేదో అనే సందేహమూ, ఆతురతా, ఏమవుతుందో అనే భయమూ – వీటితో డోలాయమానమౌతున్న కన్నె మనసు ఈ పద్యంలో ఎంతో సహజంగా కనిపిస్తుంది.

విదర్భ రాజపుత్రి రుక్మిణి. వివాహయోగ్యమైన వయసు వచ్చింది ఆమెకు. చిన్నతనం నుంచీ శ్రీకృష్ణుని పరాక్రమమూ, లీలలూ విని వుందేమో – ఆయననే పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. కానీ ఆమె అన్న రుక్మికి అది ఇష్టం లేదు. తన స్నేహితుడైన చేది రాజు శిశుపాలునికి చెల్లెలినివ్వాలనేది అతని ఉద్దేశం. తండ్రి భీష్మకుడు పేరుకే రాజు. పెత్తనమంతా రుక్మిదే. కూతురి మనసు తెలిసినా కొడుకు మాటను కాదనే సమర్థత తండ్రికి లేదు. రుక్మి మొండివాడు. చెల్లెలి ఇష్టాయిష్టాలతో అతనికి నిమిత్తం లేదు. శిశుపాలునికి ఇవ్వాలనేదే అతని నిశ్చయం. అతనికి కృష్ణుడంటే చిన్నచూపు. అతని స్నేహితుడైన శిశుపాలునికైతే కృష్ణునితో జన్మవైరం. ఇక రుక్మిణికేమో శిశుపాలుడంటే అసహ్యం. అతడు మత్తుడనీ, సింహము పాలి సొమ్ము లాక్కోవాలనుకునే గోమాయువు (నక్క) లాంటివాడనీ ఆమె అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో తను కోరుకున్న వానిని పొందగలిగే అవకాశం రుక్మిణికి లేనే లేదు.

కానీ ఆమె మోహం చాలా తీవ్రమైనది. ఎలాగైనా సరే కృష్ణునే చేసుకోవాలనేది ఆమె పంతం. అది వీలు కాకపోతే “వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ నిను జింతించుచు బ్రాణముల్విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా,” అనేది ఆమె నిశ్చయం. ఏదో ఒక విధంగా కృష్ణునికి తన ప్రేమ తెలియజేస్తే చాలు, అతనే వచ్చి తనను సాధించుకుంటాడని ఆమె నమ్మింది. అందుకోసం తన ప్రేమ వార్తను ఎలాగైనా కృష్ణునికి చేరవేయాలని భావించింది.

రుక్మిణి ప్రేమ తీవ్రతతో ఉందే కాని, ఉచితానుచితాలు తెలియని యువతి కాదు. ఆమె ఒక మహారాజు పుత్రిక. మరో రాజుతో పెండ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె ఏమి చేసినా తొందరపాటు గానో, దొంగ వ్యవహారం గానో వెకిలిపాటు గానో ఉండరాదు. అది ఆమె శీలానికి యోగ్యమైన పద్ధతి కాదు. అందుకని ఆమె ఏ కుంటెనకత్తె తోనో రహస్యంగా వర్తమానం పంపలేదు. పరమ యోగ్యుడైన ఒక భూసురుని ఆ పనికి ఎన్నుకున్నది. తన పరిస్థితిని వివరించి చెప్పి కృష్ణునికి తన మనోగతాన్ని తెలుపమని పంపింది. ఆ బ్రాహ్మణుడు కూడా అది తగని పనిగా భావింపలేదు. విషయం రుక్మికో, రాజుకో తెలిస్తే తల తెగిపోయే పరిస్థితి. అయినా భయపడలేదు. ఒక సర్వ లక్షణ లక్షిత అయిన రాకుమారికి పరమయోగ్యుడైన శ్రీకృష్ణుడే భర్త కావాలని ఆయన కూడా భావించి అది సత్కార్యం గానూ, దైవ నిర్ణయం గానూ, తనకు ధర్మంగానూ నమ్మి అంగీకరించాడు. శ్రీకృష్ణునితో మాట్లాడేటప్పుడు గూడా ఆమెకు తగిన వాడవు నీవే, ఆమె కూడా నీకు మాత్రమే తగినది అని వివరిస్తాడు.

శ్రీకృష్ణుడు భగవంతుడు, రుక్మిణి సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆయన భక్తురాలు – ఈ మామూలు వాదనలను పక్కకు తోసెయ్యండి. ఒక యువతి తాను ప్రేమించిన వాడిని పొందడం కోసం, వ్యతిరేక పరిస్థితులను అధిగమించి ప్రయత్నాలు సాగించి సఫలీకృతురాలు కావడమూ, ఆ ప్రేమను పొందిన యువకుడు ఏదోలే అని కొట్టిపార వేయకుండా, నిర్దిష్టమైన ప్రణాళికతో నలుగురూ చూస్తుండగానే ఆమెను తన రథమ్మీద ఎక్కించుకొని తీసుకొని పోవడం – ఈ ఇరవయ్యోకటో శతాబ్దపు సినిమా కథ ద్వాపరయుగంలో జరగడమనేది ఎంత హృద్యమైన సన్నివేశం!

ఆ బ్రాహ్మణుడిని – అతని పేరు అగ్నిద్యోతనుడు – ద్వారకకు పంపిన దగ్గర్నుంచీ రుక్మిణి మనసులో ఒకటే గుబులు, ఒకటే ఆరాటం, ఏమౌతుందో, ఏమౌతుందో అని ఒకటే దిగులు. ఆ ఆరాటమంతా ఈ పద్యంలో ఎంత సహజంగానో వ్యక్తమయింది. అసలీయన ద్వారక చేరాడా, దారిలో అలసి ఎక్కడైనా చిక్కు పడ్డాడా! కృష్ణుడికి తన సంగతి తెలిపితే ఆయన ఏమనుకున్నాడో! ఇదేమిటి, ఈ అమ్మాయి ఇలా తప్పుగా ప్రవర్తించింది, అని అనుకోలేదు గదా. ఇంతకీ కృష్ణుడు వస్తాడా, ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడా లేదా! అయినా నా అదృష్టం ఎలా ఉందో గదా! ఇలా రకరకాలుగా ఊహలు పోతున్నాయి ఆమె మనస్సులో. తనంతట తనే వలచి వస్తే చులకన కావడం మామూలే. కృష్ణుడి దృష్టిలో తాను పలుచనై పోలేదు గదా! ‘తప్పుగా తలచెనో’ అనుకోవడంలో ఉద్దేశం అదే. తన ప్రేమ చాలా స్వచ్ఛమైనది. తానేమీ ఏమో రాజ్యసుఖాదికాలు ఆశించి కృష్ణున్ని కావాలనుకోలేదు. తాను రాజపుత్రిక. తనకు లేని రాజ్యసుఖాలు లేవు. కృష్ణుడే రాజ్యమేమీ లేనివాడు. అనాది నుంచి రాజ్యభోగాలు ఆశ చూపించి స్త్రీని లోబరుచుకోవడం పురుషుల ప్రకృతి. దుష్యంతుడు కూడా శకుంతలను లోబరచుకోటానికి “ఈ మునిపల్లె నుండుటిది యేల? నాకు భార్యవయి భాసుర లీల నశేష రాజ్యలక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందుము అనిందితేందు కాంతామలతుంగ హర్మ్యముల,” అన్నాడు. ఆమె కూడా తనకు పుట్టిన వాడినే రాజుగా చెయ్యమని అడిగి ఒప్పించుకొని ఒడబడింది. ఇక్కడ అలాంటిదేమీ లేదు.

ఏ రకంగా చూసినా కృష్ణుని కన్నా రుక్మిణే గొప్పది. ఆమె చాలా ఉచితం గానూ, ధైర్యం గానూ, మనస్సాక్షి పూర్వకం గానూ ప్రవర్తించింది. ఎంతైనా, తన రాయబార ఫలితం తెలిసిందాకా మనసులో ఆరాటమే గదా. ఆ ఆరాటమంతా పై పద్యంలో కనిపిస్తుంది. ఈ బ్రాహ్మణుడు పోయినాడో, లేదో ఆయన ఏమనుకున్నాడో, ఇంతకూ వస్తాడో, రాడో అని అనుకున్న తర్వాత “ఈశ్వరుండనుకూలింప దలంచునో, తలచడో,” అనుకోవడం ఎంతో స్వాభావికంగా ఉంది. ఇక్కడొక విచిత్రం ఉంది. ఈశ్వరుడేం చేస్తాడో గదా అని ఈశ్వరుణ్ణి ఒక్కణ్ణే కాదు. అమ్మవారిని – ఆర్యామహాదేవిని – కూడా రుక్మిణి తలచుకున్నది. ఈశ్వరుడు అనుకూలింప దలంచునో, లేదో అని సందేహపడింది గానీ, పార్వతీ దేవి విషయంలో ఆమెకు అటువంటి సందేహం ఏమాత్రమూ లేదు. ఆమె తప్పక తనను పాలిస్తుంది. అది నిశ్చయమే. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే “నను పాలించ నెరుంగునో, ఎరుగదో” అనేది. అమ్మవారు నిశ్శంకగా కాపాడుతుంది. కానీ, ఆ ఉపాయం ఆమెకు తెలుసునో, తెలియదో అని అనుకుంటున్నది రుక్మిణి. ఎంత నమ్మకమో చూడండి రుక్మిణికి గౌరీదేవి మీద. ఎంతైనా సాటి ఆడది గదా, ఆ మాత్రం సానుకూలత ఆమె మనసులో లేకుండా ఎలా వుంటుందా, అనేది రుక్మిణి విశ్వాసం! ఎంత కమ్మని పద్యం రాశాడు పోతన!

వివాహం జరగబోయే ముందు గౌరీదేవి ఆలయానికి వచ్చి గౌరీపూజ చేసి బయటకి వచ్చాక అప్పటికే రథంతో తయారుగా ఉన్న కృష్ణుడు అందరూ చూస్తుండగానే, రుక్మిణి చేయందించగా దాన్ని గ్రహించి ఆమెను రథమ్మీదకి ఎక్కించుకుంటాడు. ఇది రుక్మిణీ కళ్యాణానికి పతాక సన్నివేశం.

ఇప్పటికీ వివాహ సందర్భంలో వధువు గౌరీపూజ కావించడమనేది తప్పకుండా వస్తున్న ఆచారం. ఆడపెండ్లివాండ్ల విడిది గదిలో అలంకరించున్న ఆడంగులందరూ ఉండగా, బ్రాహ్మణుడు పెండ్లి కూతురి చేత గౌరీపూజ చేయిస్తాడు. ఆ పూజ అయింతర్వాత వరుని తరఫు పురోహితుడూ, వరుని తల్లిదండ్రులూ, ఇతర పెద్దలూ ఆ గదిలోకి వస్తారు. పురోహితులిద్దరూ – గోత్రమూ, ఋషుల ప్రవరతో సహా – ఫలానా వారి ముని మనమరాలు, ఫలానా వారి మనమరాలు, ఫలానా వారి పుత్రిక అయిన వధువును, ఫలానా గోత్రము, ఋషుల ప్రవర గల్గిన ఫలానా వారి ముని మనమడు, ఫలానా వారి మనమడు, ఫలానా వారి కొడుకు అయిన వరునితో వివాహానికి అనుజ్ఞ ఇచ్చిన తర్వాత, పెండ్లి కూతురిని గంపలో కూర్చోబెట్టి మేనమామలు పెండ్లి పీటల మీదకి తీసుకుని రావడం – అదో ముచ్చట! చెప్పవచ్చేదేమంటే, గౌరీపూజ అనేది పెండ్లిండ్లలో నేటికీ జరుగుతున్న ఆచారం. ద్వాపర యుగంలో ఇంట్లో కాకుండా ఆలయానికే వెళ్ళి గౌరీపూజ చేసేవారు కాబోలు. ఆ పద్ధతి రుక్మిణీ కృష్ణులకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఆర్యామహాదేవికి ఉపాయాలే తెలియకుండా ఉంటాయా!

ఇప్పటికీ ఏ పని మీదనైనా ఎవర్ని ఎక్కడికైనా పంపితే, అతను తిరిగి వచ్చేలోగా ‘ఘనుడా భూసురుడేగెనా’ అని మనం అనుకోవడం ఈ పద్యం సార్థకతను చెప్పకనే చెపుతుంది. మహానుభావుడు పోతన. ఔచిత్యమూ, అభిరుచీ ఎరుగని మన తెలుగు సినిమా నిర్మాతలూ, దర్శకులూ తగని నటులను ఎన్నుకొని రుక్మిణి పాత్రను ఘోరంగా, ఏడుపుగొట్టుగా చూపించారు గానీ నిజానికి రుక్మిణి మన పురాణాల్లోని ఒక గొప్ప నాయిక.

Saturday, April 28, 2018

భాగవతం శుకయోగి ఎందుకు చదివాడు?


భాగవతం శుకయోగి ఎందుకు చదివాడు?



సాహితీమిత్రులారా!



భాగతవతం గొప్పదనాన్ని వివరించే పద్యాలు
శ్రీమదాంధ్రమహాభాగవతం ప్రథమస్కంధంలో
చెప్పబడినవి చూడండి-

అవనీచక్రములోన నేపురుషుఁడేయామ్నాయమున్ విన్న మా
ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ
క్తివిశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా
గవతామ్నాయముబాదరాయణుఁడు దాఁగల్పించెనేర్పొప్పఁగన్

భూమండలంలో ఏ మానవుడు ఏ గ్రంథంలోని విషయాన్ని
విన్నంత మాత్రం చేతనే శ్రీమహావిష్ణువుపై అచంచలమైన
భక్తి కలిగి జన్మబంధాలు తొలగిపోతాయో అలాంటి లోక
కల్యాణప్రదమైన భాగవతం అనే మహాగ్రంథాన్ని వ్యాసమహర్షి
నేర్పుతో రచించాడు.

ఇట్లు భాగవతంబు నిర్మించి, మోక్షార్థియయిన శుకునిచేఁజదివించె,
నని చెప్పిన విని శౌనకుడు నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండు
నయిన శుకయోగి యేటికి భాగవతం బభ్యసించె ననపుఁడు సూతుండిట్లనియె.

వ్యాసుడు ఆ విధంగా భాగవతం వ్రాసి ముముక్షువైన శుకునిచే
చదివించాడు. అనగానే శౌనకుడు శుకుడు కేవలం స్వస్వరూప
జ్ఞానంకలవాడు కదా విశ్వంలోని సమస్తవిషయాలపైన ఉపేక్షభావం
కలవాడు కదా అలాంటివాడు భాగవతం మాత్రం ఎలా చదివాడు
ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు దానికి సూతుడు ఇలా చెప్పాడు.

ధీరులు నిరపేక్షులు నా
త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁడట్టివాఁడు నవ్యచరిత్రా

నుతింపదగిన చరిత్రగలవాడా భగవంతుని యందే తప్ప మరే విషయంపై
 ఆసక్తి లేనివారు, ప్రాపంచిక విషయాలందు అనురక్తి లేనివారు, ఆత్మయందే
రమించువారు అయిన యోగీంద్రులు నిర్వ్యాజమైన భక్తితో హరి సంకీర్తనం
చేస్తుంటారు. శ్రీమన్నారాయణుడు అట్టి యోగ్యతకలవాడు.

హరిగుణవర్ణనరతుఁడై
హరితత్పరుఁడైన బాదరాయణి శుభత
త్పరతం బఠించెఁ ద్రిజగ
ద్వరమంగళ మైన భాగవత నిగమంబున్

శుకయోగి శ్రీహరి దివ్యనామాలను, గుణాలను గానం చేయుటయందు
ఆసక్తి కలవాడు. ఆయన యందే ఏకాగ్ర చిత్తం కలవాడు. ఆయన
భాగవతసంహితను మూడులోకాలకు శుభదాయకమైనదిగా భావించాడు.
శుభంకలగాలనే అధ్యయనం చేశాడు.

నిగమములు వేయుఁజదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భారత మను
నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా

శౌనకముని పండితా వేలవకొలదిగా ఉన్న వేదశాఖలన్నింటిని
అధ్యయనం చేసినా ముక్తిసంపద సులభంగా లభించేది కాదు.
కాని భాగవతసంహితను అభ్యసిస్తే కైవల్యం సులభంగా లభిస్తుంది.

Monday, January 22, 2018

మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్


మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్




సాహితీమిత్రులారా!



బమ్మెర పోతన దైవభక్తి -
అమ్మలమీది భక్తి
ఇక్కడ చూద్దాం-

భాగవత ప్రారంభంలో ఆయన స్తుతించిన
పద్యాలను చదవని తెలుగువారు ఉండరంటే
అతిశయోక్తికాదు. వాటిని ఇక్కడ మరోసారి
కేవలం అమ్మగారి పద్యాలనే చేసుకుందాం-

క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్
        (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 6)
నేలకు నుదురు తాకునట్లు సాగిలబడి మ్రొక్కి సైకతశ్రోణి,
చదువులవాణీ, అలినీలవేణీ అయిన వాణిని సన్నుతిస్తాను.
ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షమాలనూ, మరోచేతిలో
రామచిలకనూ, ఇంకోచేతిలో తామరపువ్వునూ, వేరొకచేతిలో
పుస్తకాన్నీ ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన
సుందర సుకుమార సూక్తులతో ఆ అరవిందభవు(బ్రహ్మ)ని
అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో
దేవతల సమూహాన్ని కనికరిస్తుంది.


పుట్టం బుట్టి శిరంబునన్ మొలవ, నంభోపాత్రంబునన్
నెట్టం గల్గును, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతు దత్సరణి నా కీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ నాకగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ దయాంభో నిధీ
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 7)

అమ్మా! సరస్వతీదేవీ! నేను తలపై పుట్ట పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు.
పడవలో పుట్టిన వ్యాసుడను కాను. కాళికను కొలిచిన కాళిదాసునికాను.
అయినా భాగవత పురాణాన్ని తెనిగంచటానికి పూనుకొన్నాను. ఏం చెయ్యాలో, ఏమీ తోచటంలేదు. ఇటువంటి సమయంలో ఎటువంటిమార్గము అవసరమో
అది నీవే నాకు అనుగ్రహించి నాచేయి పట్టుకొని నడిపించు, ముమ్మాటికి
నిన్నే నమ్ముకున్నాను తల్లీ! నీవే ఆధారం. నాకు తెలుసు తల్లీ నీ కరుణ
అపార పారావారం- అని భావం

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నఁడు గల్గు భారతీ
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 8)

సరస్వతీదేవీ శరత్కాలమేఘంవలె, చంద్రునివలె, కర్పూరంవలె,
హంసవలె, మల్లెపూవువలె, ముత్యాలహారంవలె, మంచువలె, నురుగువలె,
వెండి కొండవలె, రెల్లువలె, ఆదిశేషునివలె,  మొల్లవలె, జిల్లేడుపూవువలె,
పాలసంద్రమువలె, తెల్లతామరవలె, ఆకాశగంగవలె స్వచ్ఛమైన తెల్లనికాంతితో
ప్రకాశించే నిన్ను  మనసున దర్శించే అవకాశం ఎప్పుడు కలుగుతుందో


అంబ నవాంబుజోజ్వలకరాంబుజ, శారదచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శృతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుత విహారిణి, నన్ గృపజూడు భారతీ
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 9)

కొత్తగా వికసించిన పద్మాన్ని ధరించి మిక్కిలిప్రకాశించే
పద్మమువంటి హస్తం కలదానా శరత్కాలపు వెన్నెకాంతుల
ఆడంబరంతో కూడిన అందమైన ఆకారం కలదానా
ధరించిన రత్నాభరణాల కాంతులు దిగంతాలను తాకేట్లు
శోభించేదానా వేదసూక్తుల్లో వ్యక్తమయ్యే స్వీయప్రభావం
కలదానా సత్కవుల మహాభక్తుల భావాకాశవీధుల్లో
ప్రశస్తంగా విహరించేదానా సరస్వతీ నను దయచూడు.

అమ్మలు గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపాఱడి బుచ్చిన యమ్మ, తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృతాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 10)

ఆమె అమ్మలందరికీ అమ్మ, మూడులోకాలకు మూలమైన
ముగురమ్మలకు మూలమైన అమ్మ, పెద్దకాలం నాటి
అందరికన్న అధికురాలైన అమ్మ, రాక్షసులతల్లికి
గర్భశోకాన్ని కలిగించిన అమ్మ, తనను నమ్ముకొన్న
దేవకాంతల మనస్సులలో నివసించే అమ్మ, అందరికీ
అమ్మ ఆ దుర్గమ్మ దయాసముద్రురాలు, ఆమె లక్ష్మయై
సంపద, సరస్వతియై కవిత్వాన్ని, పార్వతియై శక్తిని
సమకూర్చాలని పోతనమహాకవి కోరుకుంటున్నాడు.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంపుఁబెన్నక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తోనాడు పూఁబోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లా లు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణ ముల్
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 11)

శ్రీదేవి ఆదిదేవుడైన విష్ణువుకు పట్టపురాణి, ఆమె పుణ్యములరాశి,
సిరిసంపదలకు నిలయమైనది, క్షీరసాగరమథనంలో చంద్రునితో
కలిసి పుట్టినది. సరస్వతీ పార్వతులతో క్రీడించు పూబోడి,
పద్మాల్లో నివసించే యౌవనవతి, సమస్తలోకాలవారు ఆమెనే
పూజిస్తారు, ఒక్క చూపుతోనే దారిద్యాన్ని పటాపంచలు చేసే
తల్లి ఆ ఆదిలక్ష్మి తనకు నిరంతరం సౌభాగ్యాన్ని అందజేయాలని
పోతనమహాకవిగారు కోరుకుంటున్నారు.

ఈ విధంగా పోతనగారు సరస్వతి పార్వతి దుర్గాదేవిని లక్ష్మీదేవిని
కావ్యారంభంలో స్తుతించారు.

వసంతపంచమి పర్వదినాన వారిని ఈ పద్యాలరూపంలోనైనా
స్మరించుకుందాము.

Wednesday, September 27, 2017

కలయో!వైష్ణవమాయయో!


కలయో!వైష్ణవమాయయో!




సాహితీమిత్రులారా!

కొన్ని కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించేవిగా
నమ్మశక్యం కానివిగా ఉన్నపుడు ఇలా అనుకోవడం
సహజమేకదా అదేమిటంటే కలయో వైష్ణవమాయయో
ఇంతకు ఇది ఎవరన్నారు అంటే
చిన్నికృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు చెప్పగా
యశోదాదేవి కృష్ణుని నోరు తెరువమన్నపుడు కృష్ణుడు
తననోరు చూపించాడు ఆ సమయంలో ఆమెకు
కృష్ణుని నోటిలో ఈ సకల బ్రహ్మండము కనిపించింది
కనిపించగానే ఆమెకు కలిగిన ఆశ్చర్యాన్ని పోతనమహాకవి
ఈ పద్యంరూపంలో వెలయించాడు ఆ పద్యం-

కలయో!వైష్ణవమాయయో! యితర సంకల్పార్థమో! సత్య మో
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁగానో పర
స్థలమో! బాలకుఁడెంత! యీతని ముఖస్థంబై యజాండం బు ప్ర
జ్వలమై యుండుటకేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపగన్!
                                                                                                 (పోతన భాగవతము - 10-342)

యశోదాదేవి ఇలా అనుకొంటున్నది-
నేను కలగనలేదుకదా లేకపోతే ఇది విష్ణువు మాయకాదుకదా!
దీనిలో ఇంకేదైనా అర్థం ఉందా? ఇలాకనిపించడానికి
లేక ఇది సత్యమేనా? నా బుద్ధి పనిచేయడం లేదు
అసలు నేను యశోదాదేవినేనా?ఇది మాయిల్లేనా
లేకపోతే ఈ కుర్రవాడు ఎంత  వీని నోటిలో ఈ
బ్రహ్మండమంతా వెలుగులు చిమ్ముతూ కనిపించడమేమిటి?
ఎంత వింత ఆలోచించి చూచేకొద్దీ ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా ఉంది!

ఎవరైనా ఇంకోలా అనుకొనే వీలుందా!

Thursday, May 4, 2017

పోతన సరస్వతీదేవి ప్రార్థన


పోతన సరస్వతీదేవి ప్రార్థన




సాహితీమిత్రులారా!


పోతన భాగవతంలో
మొదట సరస్వతీదేవిని
ప్రార్థిన ఈ పద్యం చూడండి-

పుట్టం బుట్టి శిరంబునన్ మొలవ, నంభోపాత్రంబునన్
నెట్టం గల్గును, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతు దత్సరణి నా కీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ నాకగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ దయాంభో నిధీ

అమ్మా! సరస్వతీదేవీ! నేను తలపై పుట్ట
పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు.
పడవలో పుట్టిన వ్యాసుడను కాను.
కాళికను కొలిచిన కాళిదాసునికాను.
అయినా భాగవత పురాణాన్ని తెనిగంచటానికి
పూనుకొన్నాను. ఏం చెయ్యాలో, ఏమీ తోచటంలేదు.
ఇటువంటి సమయంలో ఎటువంటిమార్గము అవసరమో
అది నీవే నాకు అనుగ్రహించి నాచేయి పట్టుకొని
నడిపించు, ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లీ!
నీవే ఆధారం. నాకు తెలుసు తల్లీ నీ కరుణ అపార పారావారం-
అని భావం

దీనిలో పోతన తన నిజమైన భావనను వ్యక్తం చేస్తున్నాడు
నేను వాల్మీనికాను, వ్యాసుని కాను, కాళిదాసుని కాను
ఏదో ఈ పని చేయాలని పూనుకొన్నాను నీకృపతో
నాకుదారిచూపమని దైవంమీ భారం వేశాడు తనపని తాను చేశాడు.
అదీ పోతన

Tuesday, February 7, 2017

భాగవతంలోని శిక్షలు


భాగవతంలోని శిక్షలు




సాహితీమిత్రులారా!

భాగవతంలో అనేక శిక్షలు కనిపిస్తాయి.
ఇక్కడ కొన్ని విషయాలు గమనిద్దాం-

ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదునికి
తండ్రి అయిన హిరణ్యకశిపుడు
విధించిన శిక్షలు ఈ పద్యంలో
గమనించవచ్చు-

తనకుమారునికి ఎన్ని శిక్షలి విధించినా
నారాయణ స్మరణ మానడంలేదని తలపోసిన
సందర్భములోనిది ఈ పద్యం -

ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులందు  ద్రొ
బ్బించితి శస్త్రాజి పొడిపించితి మీఁదనిభేంద్ర పక్తిఁద్రొ
క్కించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందుఁ ద్రో
యించితి పెక్కు పాట్లనలయించితి జావఁడిదేమి చిత్రమో
                 (ఆంధ్రమహాభాగవతము - 7 -201)
అని భయంతో ఆక్రోశంతో ఆక్రోశించాడు
సముద్రాలలో త్రోయించాడు,
గదలతో కొట్టించాడు,
కొండల మీదినుంచి త్రోయించాడు,
ఆయుధాలతో పొడిపించాడు,
ఏనుగులతో త్రొక్కించాడు,
నిప్పుల్లో త్రోయించాడు, కొట్టినాడు,
తిట్టినాడు, అవమానించాడు,
పలువిధాలుగా బాధించాడు-
అయినా చావలేదే ఇదేమి చిత్రమో - అని భావం
ఇందులో పలురకాల శిక్షలు మనకు కనిపిస్తున్నాయి..

Monday, October 24, 2016

భక్తి అంటే ఎలాగుండాలి?


భక్తి అంటే ఎలాగుండాలి?


సాహితీమిత్రులారా!


శ్రీమద్భాగవతాన్ని పరీక్షిన్మాహారాజుకు
శుకమహర్షి వారంరోజుల్లో చెప్పాడు.
అందులో ప్రహ్లాదచరిత్రలో ప్రహ్లాదుని
భక్తిని వివరిస్తూ చెప్పిన పద్యం
భక్తి అంటే ఎలావుండాలో చెబుతుంది.
ఆ పద్యం చూడండి-

పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ చింతనామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁడేతద్విశ్వమున్ భూవరా!

ఓ రాజా! మహానుభావుడైన ప్రహ్లాదునికి మంచినీరు త్రాగేప్పుడు,
మాటలాడేప్పుడు ఆ మాధవుని చింతనే. ఆహారం తీసుకునేటప్పుడు,
 ఆటలాడేప్పుడు కూడా ఆ అచ్యుతుని స్మరణే. నడుస్తున్నపుడు,
నవ్వుతున్నపుడు కూడ నారాయణుని ధ్యానమే. చివరకు నిద్రలో
కూడా ఆ నీరజాక్షుని కలవరింతలే.

ఇది ఆశ్చర్యం కాదు
భక్తికి ఇది సరైన పద్ధతి.
కాని ఏపని చేసినా అంతే ఏకాగ్రతతో చేస్తాంకదా
అది ముఖ్యమైనదంటే ఇలాగే మనం చేస్తుంటాం.
కాని భక్తిలో కాదు.
మరి సినిమాల్లో ప్రేమికులను చూస్తున్నాముకదా!
అదే ధ్యాసగా అండటం ఇదంతా వేరేమీకాదు.
మనం భగవంతుని భక్తికి తప్ప
మిగిలినవాటికి ఇలానే ఉంటాంకదా!
ఏం చేస్తాం మరి.

Saturday, October 8, 2016

నవపల్లవ కోమల కావ్యకన్యకన్


నవపల్లవ కోమల కావ్యకన్యకన్


సాహితీమిత్రులారా!


లోకంలో కొన్ని విషయాలు ప్రసిద్ధమై ప్రజల
నాడుల్లో జీర్ణించుకు పోయుంటాయి.
అలాంటివాటిలో పోతన శ్రీనాథుడు
బావమరుదులను విషయం.
పోతనను రాజాశ్రయం కోరమని శ్రీనాథుడు చెప్పినపుడు.
పోతన తనభావాన్ని ఈ పద్యంలో
ఎలా వివరించాడో చూడండి-

బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్
గూళుల కిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదర పోణార్థమై


మామిడిచెట్టు లేత చిగురులవలె కోమలమైన
నా కావ్యకన్యను అధములైన రాజుకిచ్చి
వారిచ్చిన డబ్బుతో పొట్టనింపుకోవడం కంటె
కవులు నాగలిపట్టి పొలం దున్నితేనేమి?
అడవులలో కందమూలలాలను త్రవ్వుకొని
తింటూ జీవిస్తేనేమి?  భార్యాపుత్రులను పోషించు
కోవటానికి కూతురులాంటి కావ్యాన్నమ్ముకోవటం
కంటె స్వతంత్రంగా జీవించటమే మంచిది- అని భావం.

రాజాశ్రయాన్ని నిరాకరించిన అతి తక్కువ
మందికవులలో పోతన ముఖ్యమైనవాడు.


Saturday, October 1, 2016

శివుని పగిది నొప్పె.........


శివుని పగిది నొప్పె.........


సాహితీమిత్రులారా!

పోతన భాగవతంలో దశమస్కందము 297వ పద్యంలో
శ్రీకృష్ణుని శివునిగా వర్ణించిన పద్యం చూడండి-
హరి హరులు వేరుకాదు అనడానికా అన్నట్లు
పోతనకు బాలకృష్ణుడు శివునిగా కనిపించిన
ఈ చమత్కారపద్యం చూడండి.

తనువున నంటిన ధరణీపరాగంబు 
                       పూసిన నెఱిభూతి పూఁత గాఁగ
ముందర వెలుఁగొందు ముక్తాలలామంబు 
                       తొగలసంగడికాని తునుక గాఁగ
ఫాలభాగంబుపైఁ బరఁగు కావిరిబొట్టు 
                       కాముని గెల్చినకన్నుగాఁగఁ
గంఠమాలికలోని ఘననీల రత్నంబు 
                       కమనీయ మగు మెడకప్పుగాఁగ
హారవల్లు లురగహారవల్లులుగాఁగ
బాలలీలఁబ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును,
వేఱులేమిఁదెల్ప వెలయునట్లు
                        (ఆంధ్రమహాభాగవతము - 10-297)

ఆటపాటల సమయంలో బాలకృష్ణుడు
పరమశివునిలా కనిపించేవాడు.
వాని దేహానికి అంటిన దుమ్ము విభూతి పూతవలె కనిపించేది.
ఉంగరాలజుట్టును పైకి ముడిచి ముత్యాలపేరుతో ముడివేసింది యశోద.
అది శివునితలపై ఉండే చంద్రవంకలాగా కనబడుతున్నది.
నుదుట నిలువుగా పెట్టిన ఎర్రని తిలకం మన్మథుని గెలిచిన
శివుని ఫాలనేత్రంలాగా కనబడుతోంది.
మెడలోవేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా
ఉన్న పెద్దనీలమణి, శివుని కంఠంలోని హాలాహలపు
నల్లని మచ్చలాగా కనబడుతోంది.
మెడలోని ముత్యాలహారాలు శివుని మెడలోని
సర్పహారాలుగా కనబడుతున్నాయి.
ఎదకకుండానే పెద్దవాడైన విష్ణువు బాలకృష్ణుని అవతారంలో
ఈ విధంగాలీలలు చూపాడు.
శివుడూ తానూ ఒకటేసుమా అని హెచ్చరిస్తున్నాడా! అన్నట్లు
చిన్నికృష్ణుడు శివునివలె కనిపించాడు - అని భావం

Saturday, September 17, 2016

అబద్ధం ఏప్పుడెప్పుడు చెప్పవచ్చు?


అబద్ధం ఏప్పుడెప్పుడు చెప్పవచ్చు?



సాహితీమిత్రులారా!

వామనావతారంలో శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిన మూడడుగులనే
అడుగుతాడు. అప్పుడు రాక్షసగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని
పక్కకు పిలిచి వచ్చినవాడు విష్ణువు నీవు ఆయనకు మూడడుగులు
ఇవ్వద్దు ఇస్తే ఇబ్బందుపాలవుతావు అని చెబుతూ ఇప్పుడు మాటతప్పినా
పెద్ద ఇబ్బందిలేదు అని చెబుతూ ఈ పద్యం చెప్పాడు.

వారిజాక్షులందు, వైవాహికములందు
ప్రాణవిత్తమాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొందదధిప

ఓ అసురేంద్రా! ఆడవారి విషయంలోనూ, వివాహవిషయాలందు,
ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేప్పుడు,
భయపడిన గోవులను, బ్రాహ్మణులను ఆదుకొనేప్పుడు
అపద్ధం ఆడవచ్చు పాపంరాదు - అని భావం.

దీనిలోని విషయాలను గమనిస్తే ఎప్పుడైనై
అబద్ధం చెప్పవచ్చని తేలిపోతుంది
ఇందులోని విషయాలు అన్నిటిని కాకుండా
విడిగా ఏవిషయం ఉండదని గ్రహించవచ్చు
కావున ఇది సరైనదికాదని చెప్పక్కరలేదనుకుంటాను.

Thursday, September 15, 2016

ఇలాంటి వాళ్ళు ఉన్నారా?


ఇలాంటి వాళ్ళు ఉన్నారా?


సాహితీమిత్రులారా!

భాగవతం నవమస్కందంలో రంతిదేవుని చరిత్ర ఉంది.
అందులో రంతిదేవుడు దానధర్మాలు చేసి చివరకు
అడవిలో సకుటుంబంగా తిరుగుతూ 48 రోజులు నిరాహారుడై
48వ రోజు పాయసము, మంచినీళ్లు బొరుకుతాయి అవి
తన కుటుంబ సభ్యులకు పంచి తినేలోపు ఒక బ్రహ్మణుడు
ఆకలిగొనిరాగా  తన భాగంలోనిది పెట్టి పంపుతాడు అతడు వెళ్ళగానే
మరొక శూద్రుడు వస్తే అతనికి మిగిలినది పెట్టేస్తాడు. చివరికి నీళ్ళు త్రాగే సమయంలో
ఒక చండాలుడు దప్పికతో ఉన్నాను మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకోమంటాడు అప్పుడు
అతకు ఎంత దప్పిక ఉన్నా అతనికి నీరు పోస్తాడు. ఆ పోసే సందర్భములోనిది ఈ పద్యం -

అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి; ద్రావుమన్న; రా
వన్న, శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపద
ల్గ్రన్నన మాన్పి వారి సుఖంబులు సేయుటకంటె నొండు మే
లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముఁ డొక్కడు సుమ్ము పుల్కసా!                     
 (ఆంధ్రమహాభాగవతము 9-648)

ఓ అన్నా! అన్నం లేదు కాని తియ్యటి మంచినీళ్ళు ఉన్నాయి.
 దగ్గరకురా! దప్పిక తీరేట్లు త్రాగు. తనతోటి దేహధారులకు ఆపద
 కలిగితే వెంటనే వారి కష్టాలను పోగొట్టి వారిని ఆదుకోవడం కంటే
 మానవులకు వేరే పరమార్థం ఉందా? ఆ పురుషోత్తముడు ఒక్కడే నాకు దిక్కు!
- అని భావం

Saturday, September 10, 2016

ఏపని చెప్పినా ఏదో ఒకటి అడ్డు చెప్పే కొడుకులు కొడుకులా?



ఏపని చెప్పినా ఏదో ఒకటి అడ్డు చెప్పే కొడుకులు కొడుకులా?


సాహితీమిత్రులారా!

పోతన భావతంలో అనేక నీతులు ఉన్నాయి
వాటిలో ఒకటి ఇక్కడ చూద్దాం.

యయాతి,  తనకుమారుడైన పూరుని తనకు యవ్వనం ఇచ్చి
తన ముసలితనం పూరుని తీసుకొమ్మని అడిగే సమయంలో
తండ్రికి పూరుడు చెప్పినవి-

సద్గతిని కోరే వారు మునివృత్తిని
అవలంబించి శ్రమపడటం
దేనికి  జన్మనిచ్చిన తండ్రి
చెప్పిన పని చేస్తే వానికి
సద్గతి కొంగుబంగారమే కదా!
అని అంటూ మరోమాట చెబుతాడు
ఆ పద్యం చూడండి-

పనుపక చేయుడు రధికులు
పనిచిన మధ్యములు పొందుపఱతురు తండ్రుల్
పనిచెప్పిన కోరి పనిచిన 
ననిశము మాఱాడు పుత్రు లధములు తండ్రీ!
                                                     (9-559)

ఓ తండ్రీ! ఇంగితం తెలుసుకొని
చెప్పకుండానే చేసేవారు ఉత్తములు.
చెప్పిన తరువాత పనులు
చేసేవారు మధ్యములు.
తండ్రి ఆజ్ఞాపించినా
చేయకుండా ఏదో ఒకటి అడ్డు చెప్పే
కొడుకులు అధములు - అని భావం.

Sunday, September 4, 2016

నాకుచున్ సుముఖులై యొసఁగెన్ నిజవత్సకోటికిన్


నాకుచున్ సుముఖులై యొసఁగెన్ నిజవత్సకోటికిన్


సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణుని పరీక్షించాలని బ్రహ్మదేవుడు గోవులను, దూడలను,
గోపాలకుల్ని అంతర్ధానం చేశాడు. ఆసమయంలో బాలకృష్ణుడు గోవుల,
 గోవత్సాల, గోపాలకుల రూపాలు ధరించి తన విశ్వమయతను
బ్రహ్మకు తెలియజేస్తాడు.
ఆ సందర్భములోని పోతన పద్యం చూడండి.

పాయని వేడ్కతో నునికిపట్టులకుం జని గోవులెల్ల నం
బేయని చీరి హుమ్మనుచుఁ బేరిచి మూర్కొని పంచతిల్లి పె
ల్లై యతిరేకమై పొదుగులం దెడ లేక స్రవించుచున్న పా
లా యెడ నాకుచున్ సుముఖలై యొసఁగెన్ నిజవత్సకోటికిన్
                                                 (ఆంధ్రమహాభాగవతము - 10-518)


ఆవులు వీడిపోని సంతోషంతో తాము ఉండవలసిన
స్థానాలకు వెళ్ళి 'అంబే' అని తమ దూడల్ని పిలుస్తున్నాయి.
హుంకారంతో ఆ వత్సములను సమీపించాయి. వాటి వాసన చూస్తూ
ఆ ఆనందంవల్ల మూత్రవిసర్జన చేస్తున్నాయ్. తమ సంతానంపై ప్రేమ
ఎక్కువైపోగా, వాటి పొదుగుల్లో పాలు ఎక్కువై మరీ ధారాళంగా స్రవించసాగాయి.
అవి తమ బిడ్డల్ని నాకుతూ అనురాగవతులై వత్సములకు పాలిచ్చాయి - అని భావం.