Tuesday, April 30, 2019

కోహినూర్‌


కోహినూర్‌
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి......................

బ్రిటిష్‌ రాజ మాత (రాణీ మాత అనాలా?) పరమపదించిన సందర్భంలో టీవీ వార్తలు బ్రిటిష్‌ సామ్రాజ్య వైభవాన్ని మరొక్కసారి కొనియాడుతున్నాయి. తెర మీద ధగ ధగా ప్రకాశిస్తున్న వజ్ర వైడూర్యాలు కనిపిస్తున్నాయి. అన్నిటిలోకీ ప్రశస్తమైన కోహినూర్‌ వజ్రపు అందాన్నీ, అపురూపాన్నీ వర్ణిస్తున్నాడు వార్తాహరుడు.

“అబ్బ! ఎంత బాగుందో కదా?” అన్నది మీనాక్షి తెర వంకే కళ్ళార్పకుండా చూస్తూ.

“నిజమేనండీ,” అంటూ ఏకీభవించింది పద్మ. “మేము లండన్‌ వెళ్ళినప్పుడు దాన్ని చూశాం అబ్బ! ప్రత్యక్షంగా చూస్తే అది ఇంకా ఎంత మిరుమిట్లు గొలుపుతూంటుందో!”

“ఏమిటీ, మీరు దాన్ని చూశారా?”

“ఆఁ, అవునండీ. టవర్‌ అఫ్‌ లండన్‌ లో దాన్ని ప్రదర్శనలో పెడతారుగదా? అక్కడ చూశాం.”

“ఇంకా ఏమేం చూశారు?” అడిగింది మీనాక్షి కుతూహలంగా.

“ఓ, చాలా చూశామండి. ఇదిగో మన నెమలి సింహాసనం పీకాక్‌ త్రోన్‌ అంటారే అది చూశాం.”

“అదెక్కడా?”

“బ్రిటిష్‌ మ్యూజియంలో ఉంది. ఆ బ్రిటిష్‌ మ్యూజియంలో ఇంకా ఎన్నెన్నున్నాయో! అబ్బో! మన దేశం నుంచి తెచ్చినవే రకరకాల వస్తువులున్నాయ్‌”

“ఆఁ! అన్నీ మన దేశం నుంచి కొల్లగొట్టి తెచ్చినవే కదా!” అన్నాడు మీనాక్షి భర్త ప్రకాశం ఇంక ఊరుకోలేక.

మిగతా వాళ్ళు ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. చివరికి మీనాక్షి నచ్చచెప్పే ధోరణిలో నెమ్మదిగా అంది, “కొల్లగొట్టడమంటే మరప్పుడు వాళ్ళదే కదా అధికారం? అందుకని తెచ్చారు. మన దేశం ఒక్క చోటనుంచే కాదు కదా?”

పద్మ వెంటనే అందుకుంది, “అవును, అనేకమైన దేశాల నుంచి ఎన్నెన్నో వస్తువులు తెచ్చిపెట్టారక్కడ.”

“అవును. అంటే అన్ని దేశాలనుంచీ దొంగిలించి తెచ్చారన్నమాట,” అన్నాడు ప్రకాశం.

నరేంద్ర పద్మ భర్త కొంచెం ఇబ్బందిగా కదిలాడు. “పోనీలెండి. ఇప్పుడేం చేస్తాం? చరిత్ర మార్చలేం కదా? గత జల సేతు బంధనం ఎందుకు?”

“గతాన్ని గురించి కాదు నేను మాట్లాడేది,” ప్రకాశం కొంచెం ముందుకి వంగి గట్టిగా అన్నాడు. “ప్రస్తుతం మాటే. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళైనా మన సొత్తు మనకి తిరిగి ఇవ్వమని మనం ఎందుకు అడగటంలేదు? నిజానికి అవ్వన్నీ మన దేశంలో ఉండాల్సినవి.”

నరేంద్ర నవ్వాడు. “చూడండి. ఆ బ్రిటిష్‌ మ్యుజియంలో ఎల్జిన్‌ మార్బుల్స్‌ అని ఉన్నాయి. అవి ఎక్కడనుంచి తెచ్చినవో తెలుసా? ఏథెన్‌స్‌ నగరంలో పార్థెనాన్‌ భవనం గురించి మీరు వినే ఉంటారు గదా?”

“అవునవును. పాలరాతితో కట్టిన పెద్ద ఆలయం లాంటిది కదా?” అనడిగింది మీనాక్షి ఉత్సాహంగా.

“అవును. ఆ భవనంలోని విగ్రహాలనీ, చెక్కడాలనీ లార్డ్‌ ఎల్జిన్‌ అనే అతను రెండు వందల ఏళ్ళ కిందటే తీసుకువచ్చాడు. ఎందుకో తెలుసా? వాటిని గ్రీసు దేశంలోనే ఉంచితే అక్కడి వాళ్ళు వాటిని సరిగ్గా కాపాడకపోవడమేగాక వాటిని పాడుచేస్తారని చెప్పి వాటిని బ్రిటన్‌కి తీసుకు వచ్చేశాడు. వాటిని తిరిగి ఇవ్వమని గ్రీకు ప్రభుత్వం చాలా సంవత్సరాలనుంచీ అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటూనే ఉంది. కానీ ఏం లాభం? ఇంకా అవి బ్రిటిష్‌ మ్యూజియంలోనే ఉన్నాయి. ఏది? కాబట్టి మన వస్తువులు తిరిగి వచ్చేందుకు యాభై ఏళ్ళు చాలవు, ఇంకా చాలా రోజులు పడుతుందని నా ఉద్దేశం,” అని నవ్వేశాడు నరేంద్ర.

“అంతవరకూ మనం చేతులు ముడుచుకు కూర్చోవాలనా మీ ఉద్దేశం?” తీవ్రంగా అడిగాడు ప్రకాశం.

“లేకపొతే? ఇప్పుడు వాటికోసం యుధ్ధం చేయమంటారా?” నరేంద్ర కాస్సేపు ఆగి అన్నాడు, “అదృష్టవశాత్తూ, ఎంత కొల్లగొట్టినా మన దేశంలో ఇంకా వెలలేని కళా సంపద మిగిలుంది.”

పద్మ మళ్ళీ అందుకుంది ఉత్సాహంగా. “నిజమేనండీ. ఇక్కడి మ్యూజియంలోనే మనం దేవుడి విగ్రహాలవీ చూశాం కదా? ఎప్పటివో? బీసీ నాటివా? ఆ తర్వాతవా?”

“అవును. అవక్కడకెలా వచ్చాయో తెలుసా?” వెటకారంగా అడిగాడు ప్రకాశం.

“కనీసం అవి మాత్రం దొంగిలించి తేలేదు కదా?” అన్నది పద్మ నవ్వుతూ.

“ఏం? ఎందుకలా అనుకుంటున్నారు?”

ప్రకాశం రెట్టింపుతో కొంచెం తబ్బిబ్బయ్యింది పద్మ. “అంటే మ్యూజియం వాళ్ళు కదా. వాళ్ళు అమెరికన్‌లు ఎప్పుడూ మన మీద అధికారం చెలాయించలేదు కదా అని.”

కొంచెం హేళనా, చాలా విచారమూ మిళితమైన నవ్వు నవ్వాడు ప్రకాశం. “అక్కడే మీరు పొరపడుతున్నది.”

“ఏమిటండీ మీరు మరీను. ఈ మ్యూజియం వాళ్ళందరూ వెళ్ళి మన పురాతన వస్తువులన్నీ దొంగిలిస్తున్నారంటారా?” నరేంద్ర కొంచెం విసుగ్గా అడిగాడు.

“వాళ్ళు స్వయంగా దొంగిలించక్కరలేదు. ఆ పని చేసేందుకు మన దేశం వాళ్ళే చాలామంది సిధ్ధంగా ఉన్నారు కదా. అయినా దొంగిలించిన వస్తువులని తెలిసీ కొనడం మాత్రం దొంగతనంతో సమానం కాదంటారా? ఇక్కడి మ్యూజియంలో ఆ బాపతు శిల్పాలు చాలానే ఉన్నాయి.”

అందరూ ఏం మాట్లాడాలో తెలియక కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. “ఒక విధంగా అదీ మన గొప్పే కదా,” అన్నది చివరికి పద్మ .

“మన గొప్పా? ఎలాగ?” ప్రకాశం ఇదివరకటి వెటకార ధ్వనితోనే అడిగాడు.

“అంటే మన శిల్ప కళ అంత గొప్పది కాబట్టే వేరే దేశాల వాళ్ళుకూడా వచ్చి అంత శ్రమ పడి మన శిల్పాలను తీసుకువెళ్తున్నారు కదా. అది మన గొప్పే కదా?” అన్నది పద్మ.

“నిజమేనండోయ్‌” అందుకున్నాడు నరేంద్ర. “అలాగే చూడండి, మన గొప్ప గొప్ప సంస్కృత గ్రంధాలెన్నో జర్మనీలో ఉన్నాయట వాళ్ళు పరిశోధనలు చేసేందుకు.”

“అలాగే ఈ మధ్య ఇటలీలో ఒక ఆయుర్వేదం యూనివర్సిటీ కూడా ప్రారంభించారని విన్నాను నేను,” అన్నది పద్మ. కానీ ప్రకాశం ఏమీ ఉత్సాహం కనపర్చలేదు.

“ఏమిటండీ, మీకు సంతోషంగా లేదా?” నరేంద్ర అడిగాడు.

“నాకు సంతోషంగా ఎలా ఉంటుందండీ? మన దేశంలో ఉండాల్సిన ప్రాచీన గ్రంధాలు జర్మనీలో ఉన్నాయనీ, మన దేశంలో ఉండాల్సిన రత్న మాణిక్యాలు ఇంగ్లండులో ఉన్నాయనీ, మన దేశంలో ఉండాల్సిన కళా సంపద అమెరికాలోకి రవాణా అయిపోయిందనీ ఇదంతా చూసి నేను సంతోషించాలా? మన గొప్ప బయటవాళ్ళు గుర్తిస్తే తప్ప మనకు తెలియనంత కాలం మన సంపదలన్నీ ఇలా కొట్టుకుపోవల్సిందే,” నిట్టూర్చాడు ప్రకాశం.

మిగతా వాళ్ళు మౌనం వహించారు. వాతావరణం కాస్త ఉల్లాసపరిచే ఉద్దేశంతో మీనాక్షి అన్నది, “అందుకేనండీ, మా పిల్లలకు మాత్రం మన సంస్కృతి గురించి అంతా నేర్పించాలనుకునేది. లేకపోతే, ఇలా బయట దేశంలో ఉండిపోతే వాళ్ళకు మన చరిత్రను గురించీ, మన గొప్పదనాన్ని గురించీ ఏం తెలుస్తుంది? అందుకే ఈ వేసవి శలవుల్లో మేం వెళ్ళినప్పుడు కాస్త నాలుగు చోట్లా తిరగాలని ఉంది.”

“నాలుగు చోట్లంటే ఆంధ్ర ప్రదేశ్‌ లోనా?” కుతూహలంగా అడిగింది పద్మ.

“ఊఁహుఁ. మొత్తం దేశమంతా ఎన్ని చోట్లు వీలైతే అన్ని.”

“వేసవి కాలంలో ప్రయాణాలా? అబ్బ! మీ ఓపికని మెచ్చుకోవాల్సిందే!” ఆ మాటలు వినేందుకే నీరసంవచ్చినట్టు కుర్చీలో వెనక్కి వాలాడు నరేంద్ర.

నిండుగా నవ్వాడు ప్రకాశం. “శ్రమ లేకుండా ప్రతిఫలం ఎలా వస్తుందండీ? ఎన్ని పుస్తకాలు చదివినా, సినిమాలు చూసినా, స్వయంగా చూసిన అనుభూతి వేరు. అక్కడ పెరిగామనే తప్ప మనం మాత్రం దేశంలో ఏం చూశాం? ఆ అద్భుతాలన్నీ ప్రత్యక్షంగా అనుభవిస్తే మనమేమిటో, మన విలువేమిటో తెలుస్తుంది,” మెరిసే కళ్ళతో మరో లోకంలోకి చూస్తున్నట్టున్నాడు ప్రకాశం.

“అబ్బ! వింటుంటేనే నాకు అసూయగా ఉంది. మీరు తిరిగిరాగానే అన్ని విశేషాలూ మాకు చెప్పాలి తెలిసిందా?” ఆత్రంగా అడిగింది పద్మ.

“తప్పకుండా,” అంటూ నమ్మ బలికారు మీనాక్షీ, ప్రకాశం ఇద్దరూ.
***

తమ దేశాటనమును తాజ్‌ మహల్‌ తో ప్రారంభించాలనే ఉద్దేశంతో ముందుగా ఢిల్లీలో దిగారు ప్రకాశం, కుటుంబం. ఎంత ప్రయాణ బడలికతో ఉన్నా, వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలని చూడాలనే ఉత్సాహంతో, ఢిల్లీలో ఉన్న కాస్త వ్యవధిలోనే జంతర్‌ మంతర్‌ కి బయల్దేరారు. తీరా అక్కడకి చేరాక ఏం చేయాలో బోధపడలేదు. తాము తప్ప అక్కడ వేరే యాత్రీకులెవరూ ఉన్నట్టు లేరు. యాత్రీకులు సరే, వేరే మనుషులు కూడా కనిపించలేదు. ఓ పక్కగా రకరకాల గుడిసెలూ, పాకలూ, చెట్లకి కట్టిన తాళ్ళూ, వాటి మీద ఆరేసిన బట్టలూ, అక్కడే గడ్డి మేస్తున్న పశువులూ, ఆ పరిసరాలన్నిటినీ పర్యవేక్షిస్తున్నట్టు ఠీవిగా నుంచున్న ఒక ఎద్దూ ఇవి తప్ప మనుషులెవ్వరూ కనిపించలేదు. ఇక్కడ టూరిస్టు గైడ్‌ లాంటి వారెవరైనా దొరుకుతారా అని ప్రకాశం వెతుకుతున్న సమయంలో ఒకతను ఆపద్భాందవుడులా వచ్చి తాను గైడునని చెప్పుకున్నాడు.

అతను హిందీలో చెప్తున్న వివరాలను తనకే సరిగ్గా బోధపడకపోయినా, పిల్లలకోసమని వీలైనంతవరకూ ఇంగ్లీషులోకి తర్జుమా చేసేందుకు ప్రయత్నించాడు ప్రకాశం. పిల్ల్లల కళ్ళు మాత్రం ఆ ఎద్దు మీదే ఉన్నాయి. అది ఎటువైపు చూస్తోందో, ఎటువైపు తిరుగుతోందో, తమ వద్దకు వస్తోందో లేదో అనే మీమాంసలో పడి వాళ్ళు తండ్రి చెప్తున్న విషయాలను అంతగా పట్టించుకున్నట్టు అనిపించలేదు. మీనాక్షి వాళ్ళకు ఎద్దు నుంచి ప్రమాదమేమీ లేదనీ, భయపడక్కరలేదనీ నచ్చచెప్పబోయింది కానీ, పిల్లలకు మాత్రం ధైర్యం చిక్కలేదు. ఇంతలో ఆ ఎద్దు ఈ సంబరంలో తానూ పాల్గొని అందరినీ పరామర్శించాలన్నట్టు వారివైపే విలాసంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. వాళ్ళ భయాలన్నీ నిజంకావడం చూసిన పిల్లలు వాళ్ళున్న మెట్ల మీదనుంచి కిందకి దౌడు తీశారు. మీనాక్షికీ ప్రకాశానికీ వాళ్ళ వెంటే వెళ్ళక తప్పలేదు. అడుగులోనే హంసపాదన్నట్టు మొదటి ప్రయత్నమే ఇలా విఫలమవడంతో ప్రకాశం కొంచెం బాధ పడ్డాడు. “ఇదే యు. ఎస్‌ లో అయితే ప్రతి అల్లాటప్పా చోటా హిస్టారికల్‌ పాయింట్‌ అంటూ ఒక బోర్డు పెట్టి దాని ప్రత్యేకతలూ, ప్రాముఖ్యతలూ, దానికి సంబంధించిన వివరాలన్నీ రాసి పెడతారు గదా, ఇక్కడ అలాంటివేవీ ఎందుకు లేవు?” అని విసుక్కున్నాడు. దానికి సరైన సమాధానమేదీ తోచక మీనాక్షి “ఏమో?” అని ఊరుకున్నది. మర్నాడే తాము తాజ్‌ మహల్ని చూడబోతున్నామని గుర్తుకు వచ్చి ప్రస్తుతం కలిగిన ఆశాభంగానికి ఉపశమనం పొందాడు ప్రకాశం.

మర్నాడు ఆగ్రాలో హోటలునుంచి టాక్సీలో తాజ్‌ మహల్‌ చూడ్డానికి బయల్దేరారు. ఇంకా తాజ్‌ మహల్‌ చేరుకోక ముందరే అన్ని వాహనాలనీ నిలిపివేసి అందర్నీ దిగమని హెచ్చరించారు. “అదేమిటి? ఎందుకిలా?” అంటూ అయోమయంగానే టాక్సీ దిగారందరూ. అక్కడ వాతావరణ కాలుష్యం మూలాన తాజ్‌ మహల్‌ పాడవకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశారని గైడ్‌ వివరించడంతో మెచ్చుకోలుగా చూసింది మీనాక్షి, “చూశారా, మన వాళ్ళు కూడా మన సంపదను ఎలా భద్రపరుస్తున్నారో?” అన్నట్టు ప్రకాశం వైపు చూస్తూ.

“హుఁ. తాజ్‌ మహల్ని పాడు చేసేది మథురలో ఉన్న రిఫైనరీ తాలూకు పొగ అనుకున్నాను?” అన్నాడు ప్రకాశం. “అన్నీ పాడు చేస్తాయి,” అని సర్దేసింది మీనాక్షి. టాక్సీనుంచి నాలుగు అడుగులు వేయగానే, వాళ్ళ గైడొక వాన్‌ ముందు వాళ్ళని ఆపి అందులో కూర్చోమన్నాడు.

ప్రకాశానికి మతి పోయినట్టయింది. “ఇదేమిటీ?” అన్నాడు. “ఈ వాన్‌ లో ఎక్కి మనం తాజ్‌ మహల్‌ కి వెళ్తున్నాం,” అని చెప్పాడు గైడ్‌ “మరి వాతావరణ కాలుష్యమనీ, కార్ల లోంచి వచ్చే పొగ మూలాన తాజ్‌ మహల్‌ పాడవుతుందనీ కార్లాపేస్తే మళ్ళీ ఈ వానెందుకు?” అనడిగాడు ప్రకాశం.

అలవాటైన ప్రశ్న కాదనేమో గైడు ఏమీ జవాబుచెప్పకుండా, “త్వరగా ఎక్కండి,” అని తొందర పెట్టాడు. ఎక్కువైన అయోమయంతో వాన్‌ లోకి ఎక్కారు అందరూ. వాన్‌ లో వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. వాన్‌ లో కొన్ని గజాలు ప్రయాణం చేశాక, తాజ్‌ మహల్‌ ద్వారానికి ఒక వంద అడుగుల దూరంలో అది ఆగింది. మళ్ళీ అందరూ దిగి కాలినడకన మిగిలిన మేర దాటేందుకు బయల్దేరారు, దోవలోనున్న పెంటల్నీ, రొచ్చుల్నీ సాధ్యమైనంతవరకూ తప్పించుకుంటూ. దేశంలో మిగతా ప్రాంతాలలో ఎక్కువవుతున్న శుభ్రతని చూసి సంతోషించిన ప్రకాశానికి అక్కడి భీభత్సాన్ని చూస్తే హఠాత్తుగా ఒక ముఫ్ఫై ఏళ్ళు వెనక్కు వెళ్ళినట్టు తోచింది. “అందర్నీ ఎలాగూ నడిపిస్తున్నప్పుడు ఆ దోవ కాస్త శుభ్రంగా ఉంచ కూడదూ? అందులో ఇలాంటి ముఖ్యమైన యాత్రా స్థలానికి,” అని తనలో తానే గొణుక్కున్నాడు ప్రకాశం.

తీరా తాజ్‌ మహల్‌ చేరుకున్నాక ప్రకాశం అనుకున్నట్టు ముఖ ద్వారం లోనుంచి కాకుండా ఓ సందు లాంటి దాని గుండా పక్క ద్వారంలోనుంచి లోపలకి పంపించారు. లోపల అడుగడుగునా ఉన్న పోలీసు సిబ్బందిని చూసి కాస్త విస్తు పోయినా, ఆ ఏర్పాట్లు టెర్రరిస్టులనుంచి రక్షణ కోసమని గైడ్‌ చెప్పడంతో ప్రకాశం సమాధానం పడ్డాడు. ఆ రోజు ఆదివారం కావడంతో జనం చాలా మందే ఉన్నారు. హనుమంతుడి తోకలా పెరిగి పోతున్న క్యూని చూసి లోపలకి వెళ్ళేందుకు ఎంత సేపు పడుతుందోనని లెక్కలు కట్టడం మొదలు పెట్టాడు ప్రకాశం. నత్త నడకలా ముందుకు కదుల్తున్న ఆ క్యూలో పదేసి అడుగులకొక బందోబస్తు సిబ్బంది మనిషి వచ్చి “లైన్‌ లో నుంచోండి,” అని అదిలిస్తున్నాడు. ఇంకొక మనిషి వచ్చి ప్రకాశం చేతిలోని కామెరా లాక్కోబోయాడు. “దీంతో ఫోటోలు తీయకూడదు,” అన్నాడు.

“మరి వాళ్ళందరూ తీస్తున్నారు కదా,” అన్నాడు ప్రకాశం.

“అవి విడియో కామెరాలు,” అన్నాడు సిబ్బంది మనిషి.

“విడియో కామెరాలు అనుమతిస్తే స్టిల్‌ కామెరాకు ఏమిటి అభ్యంతరం?” అనడిగాడు ప్రకాశం.

“అట్టే వాగకు. రూల్సు రూల్సే. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ కామెరా మేం లాక్కోవాల్సి వస్తుంది,” అని బెదరించాడతను. “పోనీలెండి, ఎందుకొచ్చిన గొడవ,” అని మీనాక్షి వెనక నుంచి గొణగడంతో ప్రకాశం తగ్గాల్సొచ్చింది.

తాజ్‌ మహల్‌ దాకా వచ్చి ఫొటోలు తీయకపోవడం ప్రకాశం మనసునెంతో బాధించింది. చిట్టచివరికి అదిలింపులతో, బెదరింపులతో మొత్తానికి అసలు భవనాన్ని చేరారు ప్రకాశం కుటుంబం. గైడు తన ఉపన్యాసం మొదలు పెట్టాడు. ఆ భవనం కట్టడానికి ఎన్ని టన్నుల పాలరాయి వాడారో, ఎంత మంది శిల్పులూ, ఎంత మంది పనివాళ్ళూ శ్రమించారో, ఎన్ని రకాల మణి మాణిక్యాలు తెప్పించారో వగైరాలన్నీ చెప్తూ లోపలికి నడిపించాడు. గోడలో పొదిగిన రత్నాల అందాన్ని పొగుడుతూ, బాగా చూడండి అని తన చేతిలో ఉన్న టార్చి లైటుని గోడమీద రత్నానికి అదిమి పెట్టి స్విచ్చి వేశాడు. అదిరిపడ్డాడు ప్రకాశం. “అదేమిటి? ఫ్లాష్‌ ఫొటోలు తీయకూడదని చెప్పి మరిప్పుడు దాని మీద లైటు పెడితే అవి పాడైపోవూ? ఫర్వాలేదు, మాకు బాగానే కనిపిస్తున్నాయి. ఆ టార్చ్‌ లైటు తీసేయి,” అన్నాడు. గైడు పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ వేరే వేరే రత్నాల మీద అలా టార్చ్‌ లైటు నొక్కిపెట్టి తన ధోరణి కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రకాశానికి కోపం తన్నుకొచ్చింది. “అరే! నీక్కాదూ చెప్పేదీ? ఆ లైటు తీసేసెయ్‌ అవి పాడౌతున్నాయి,” అన్నాడు.

“ఏం ఫర్వాలేదండీ,” అని అతను మళ్ళీ నొక్కిపెట్టాడు.

“వెంటనే నువ్వు ఆపుతావా లేదా?” ఇంచుమించు అరిచినంత పని చేశాడు ప్రకాశం.

ముఖం గంటు పెట్టుకుని గైడు టార్చ్‌ లైటు ఆర్పేశాడు. అక్కడున్న మిగతా కాలమంతా ఉదాసీనంగా పొడిపొడిగా రెండు మాటలు చెప్పి ఊరుకున్నాడు. మొత్తానికి తాజ్‌ మహల్‌ ఘట్టం కూడా అసంతృప్తికరంగానే ముగిసింది. తరువాత కార్యక్రమం హైదరాబాద్‌ వెళ్ళి కొన్నాళ్ళు బంధువులతో గడపడం. కనీసం అక్కడ ఆశాభంగానికి ఆస్కారం లేదని ఊరట చెందాడు ప్రకాశం. ఏర్‌ పోర్టులో అన్నగారి కుటుంబాన్ని చూసిన సంతోషం, వాళ్ళు కనపరుస్తున్న ఉత్సాహం, ఆప్యాయత, మైమరపింపజేశాయి. కుదుటపడ్డ మనసుతో ఉల్లాసంగా ఇంటికి బయల్దేరాడు.

కారు గేటులోపలికి రాగానే ఏదో తేడా గమనించాడు ప్రకాశం. “ఏమిటీ ఏదో కొత్త భాగం కట్టినట్టున్నారే?” అనడిగాడు పరీక్షగా చూస్తూ.

“ఆఁ. అదంతా ఉందిలే. తర్వాత చెప్తాను,” అంటూ ఇంటి పక్కకి దారి తీశాడు ప్రకాశం అన్నయ్య.

“అటెక్కడకీ?” విస్తుపోయాడు ప్రకాశం, తన ముందున్న తలుపుల వేపు అయోమయంగా చూస్తూ.

“ఇప్పుడు గుమ్మాన్ని ఇటు పక్కకి మార్పించాంలే, వాస్తు దోషం పోవడానికి,” అన్నాడు వాళ్ళన్నయ్య.

పక్క తలుపులోంచి వెళ్తూంటే మళ్ళీ తాజ్‌ మహల్‌ లో ఉన్నట్టు భ్రమ కలిగింది ప్రకాశానికి. కానీ ఆ భావాన్ని వెంటనే అణిచేసుకుని అన్నని అనుసరించాడు.

లోపలికి వెళ్ళగానే ఇంకా కొన్ని అవకతవకలు కనిపించాయి. ఇదివరకు మేడ మీదకు వెళ్ళే మెట్లు ఇప్పుడు దేనికీ సంబంధించక గాలిలో వేళ్ళాడుతున్నట్టున్నాయి. ఇదివరకటి వీధి గుమ్మానికి అడ్డంగా కొత్త మెట్లు సాక్షాత్కరించాయి. మొట్ట మొదట ఇల్లు కట్టినప్పుడు అక్కడ మెట్లు పెట్టాలనుకోకపోవడాన, ఓ వారగా, పొందిగ్గా అమరినట్టు కాక, కొట్టొచ్చినట్టూ, దోవకడ్డంగా ఉన్నట్టూ అగుపించాయి. విశాలమైన దొడ్లోంచి వచ్చే వెలుతురుతో కళకళలాడే భోజనాల గది ఇప్పుడు దొడ్లో అర్థాంతరంగా లేచిన ఎ్తౖతెన గోడ మూలాన మసక చీకట్లో బితుకు బితుకు మంటోంది. విశాలంగా, ధారాళ మైన గాలీ, వెలుతుర్లతో ప్రకాశిస్తూ, సర్వాంగ సుందరంగా అలంకరించుకున్నట్టుండే ఇల్లు ఇప్పుడు బోసిగా, వెలవెలబోతూ, చీకటి గుయ్యారంలా కనిపించింది.

మాటలు రాక నోరు వెళ్ళబెట్టుకుని చుట్టూరా చూశాడు ప్రకాశం. చివరికి ఎలాగో నాలిక స్వాధీనం చేసుకుని, “ఏమిటిదంతా?” అనడిగాడు.

“చెప్పాను కదా. వాస్తు సరిగ్గా లేకపోతే ఎన్ని అనర్ధాలు జరగొచ్చో తెలుసా?”

“ఇప్పుడు ఏమి అనర్ధాలు జరిగాయి నీకు?”

“ఏవో చిన్న చిన్న అవాంతరాలు. ఇంకా పెద్దదేదో జరిగేంతవరకూ ఎందుకుకాచుక్కూర్చోవడం?”

“అయినా నీకసలు ఇలాంటి నమ్మకాలెప్పుడూ లేవు కదా? ఇప్పుడెందుకు మొదలయ్యింది?”

“తెలియక చాలా తప్పులు చేస్తాం. అయినా మన పూర్వీకులు ఎంతో జ్ఞానం సంపాదించి ఇలాంటి నియమాలన్నీ పెట్టారు. మనకా జ్ఞానం లేకపోగా అంతా మాకే తెలుసుననే గర్వం. అందుకే ఇలా అఘోరిస్తున్నాం. అయితే నెమ్మదిగా మన పొరపాట్లు తెలుసుకుని మన అలవాట్లు మార్చుకుంటున్నాం. ఇప్పుడెవరూ వాస్తు చూసుకోకుండా ఇల్లు కట్టడం లేదు తెలుసా? అదృష్టవశాత్తూ ఇదివరకే కట్టిన ఇళ్ళను పడగొట్టి మళ్ళీ కట్టించి దోషాలని దిద్దవచ్చని చెప్పాడాయన.”

“ఆయనెవెరూ?”

“అదే, వాస్తు పండితుడు. రేపు పెళ్ళిలో చూస్తావుగా.”

మర్నాడు పొద్దున్నే మేల్కొన్న మీనాక్షికి చక్కని మంగళవాద్యం వినిపించింది. ఆహ్లాదకరమైన ఆ సంగీతాన్ని తానొక్కత్తే విని ఆనందించడం ఇష్టం లేక ప్రకాశాన్ని లేపింది. కానీ అతను లేచివచ్చేలోగా సంగీతం కాస్తా ఆగిపోయింది. “అయ్యో!” అని ఉసూరుమంటున్న మీనాక్షిని, “ఇంతకీ ఏమిటా పాట?” అని కుతూహలంగా అడిగాడు ప్రకాశం.

“అదేనండీ. భజన పాట. మనం చాలా సార్లు విన్నాం.” అప్రయత్నంగా కూనిరాగాలు తీయడం మొదలు పెట్టింది మీనాక్షి. “ఓం, జయ జగదీశ హరే, స్వామి లా ల ల లాల ల లా. భక్త జనానాం ఊఁ, ఊఁ, తానన నానా, ఊఁ, ఊఁ, జయ జగదీశ హరే.”

“మంచి మేలుకొలుపే. ఎవరు వాయించారో గానీ.” కిటికీ దగ్గరికి వెళ్ళి నలు దిక్కులా గాలించాడు. కను చూపు మేరలో ఎవరూ కనిపించలేదు. “ఇంతలో మేళం వాళ్ళు ఎక్కడకి మాయ మయ్యారంటావు?”

“ఏమో. అసలది మామూలు మేళంలా లేదు కూడా.”

“పోనీలే. ఇవ్వాళ పెళ్ళిలో బోలెడు బాండు మేళాలు వినచ్చు,” అని ఉత్సాహ పరిచాడు ప్రకాశం.

అయితే కళ్యాణ మండపానికి బయల్దేరే ముందరే మళ్ళీ ఆ వాద్యం వినిపించింది. ఆత్రంగా గేటు దగ్గరికి పరిగెత్తిన వాళ్ళిద్దరికీ వీధిలోకి వస్తున్న ఎదురింటివారి కారు తప్ప ఇంకేమీ కనిపించలేదు. పాట మాత్రం ఇంక వినిపిస్తూనే ఉంది. ఇంతలో ప్రకాశం అన్నయ్య వచ్చాడు, “ఏమిటి చూస్తున్నారు?” అంటూ. “ఈ పాట ఎక్కడినుంచి వస్తోందోనని చూస్తున్నాం,” అన్నది మీనాక్షి.

“ఓ అదా? అది వాళ్ళ కారు రివర్స్‌ లో పెట్టినప్పుడు మిగతా వాళ్ళను తప్పుకోమని చెప్పేందుకు వస్తుంది,” అని వివరించాడతను.

“రివర్సుకి ఈ పాట పెడతారా?” ఆశ్చర్యంగా అడిగాడు ప్రకాశం.

“ఊఁ, ఎవరికేం కావాలో అది పెట్టుకోవచ్చు.”

“అంటే ఆయనెవరో చాలా భక్తుడన్నమాట,” మెరిసే కళ్ళతో అన్నది మీనాక్షి.

ఎంత భక్తుడైతే మాత్రం భజనపాటని అలాంటి ప్రయోజనంకోసం వాడుకోవడం ప్రకాశానికి నచ్చలేదు. కాని బయటకేమీ అనకుండా పెళ్ళికి బయల్దేరాడు. దోవలో మరెన్నో కార్లూ, లారీలూ వెనక్కు వెళ్తున్నప్పుడల్లా అదే పాటను వాయించడం గమనించి తెల్లబోయింది మీనాక్షి. ప్రకాశం మౌనంగానే ఉండిపోయాడు.

కానీ పెళ్ళి మంటపంలో వేస్తున్న పాట విని మాత్రం ఊరుకోలేకపోయాడు. “అదేమిటీ, గాయత్రీ మంత్రం వేస్తున్నారు?” అని ఆశ్చర్య పోయింది మీనాక్షి కూడా.

“ఏం?” అర్ధం కానట్టు చూస్తున్న అన్నగారికి విసుగ్గా బోధించాడు ప్రకాశం, “అది చాలా గోప్యంగా ఉంచాల్సిన మంత్రం కదా?” కొట్టిపారేశాడు వాళ్ళన్నయ్య. “ఆఁ, ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? కనీసం ఇలాంటి రికార్డులు మూలానైనా కుర్రకారుకి మన ఆచారాలూ, సాంప్రదాయాలూ తెలుస్తాయి.”

“అది మేమనాల్సిన డైలాగ్‌ కదా?” నవ్వడానికి ప్రయత్నించాడు ప్రకాశం. “ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు మాట్లాడతావేమిటీ?” “అమెరికాలోనైనా, ఇండియాలోనైనా యువతరం అంతా ఒకటే.”

ఇంకేం మాట్లాడాలో తెలియలేదు ప్రకాశానికి. గంట కిందట పుచ్చుకున్న బ్రహ్మచర్యాన్ని అప్పుడే వదులుకోడానికి సిద్ధపడుతున్న పెళ్ళికొడుకును చూస్తే అన్నయ్య చెప్పిన మాట అంత అసందర్భంగా తోచలేదు. మిగతా పెళ్ళంతా ఆ ఆలోచనలతోనే గడిపేశాడు.

రెండు రోజుల తర్వాత పెద్ద తరం వాళ్ళ ఆసక్తి ఏపాటిదో తెలిసొచ్చింది ప్రకాశానికి. ఊళ్ళో జానపద కళా ప్రదర్శన జరుగుతూంటే పిల్లలతో బయల్దేరుతూ అన్ననీ, వదిననీ కూడా రమ్మన్నాడు ప్రకాశం.

“ఆఁ, ఏవో లంబాడీ బట్టలూ, పిచ్చిపూసలూ తప్ప అక్కడేముండవు,” అని చప్పరించేశారు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళ పిల్లలు మాత్రం “స్టార్‌ హోటెల్స్‌ లో మంచి బూటీక్‌ పెడతారు. దానికైతే వస్తాం,” అన్నారు. ఇంక వాళ్ళను బలవంత పెట్టకుండా ప్రకాశం కుటుంబం వెళ్ళొచ్చారు. పిల్లలు బాగా ఆనందించారు. ఇంకో రోజు సాలార్‌ జంగ్‌ మ్యూజియం కి వెళ్దామంటే, “ఆ పాత చెత్తంతా చూడాలంటే తలనొప్పి బాబూ,” అని నిరాకరించారు. తర్వాత అజంతా , ఎల్లోరా వెళ్తూ కూడా రమ్మని ఆహ్వానించినా, ఎండల్లో ప్రయాణం కష్టమని నీరసపడ్డారు. పైగా ప్రకాశం వాళ్ళని కూడా హాయిగా ఇంట్లో కూర్చోక ఈ అనవసరపు తిరుగుళ్ళెందుకని ఒక ఉచిత సలహా కూడా పడేశారు. కానీ ప్రకాశం దాన్ని పట్టించుకోలేదు.

చివరికి తిరిగి యు.ఎస్‌కి వెళ్ళే రోజు వచ్చింది. వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చిన నలుగురు స్నేహితులు అన్నగారితో పిచ్చాపాటీ మాట్లాడుతూంటే వింటూ కూర్చున్నాడు ప్రకాశం. ఒకసారి ఈ ప్రయాణపు అనుభవాలు నెమరు వేసుకుంటే తను సాధించినదేమిటో అర్ధం కావటం లేదు. చూడాలనుకున్నవన్నీ చూశారు. కానీ ఏమిటో అనుకున్న అనుభూతి కరవైంది. ఎన్ని అందాలని చూసినా, ఎన్ని అద్భుతాలని దర్శించినా, ఏమిటో వెలితి గానే ఉన్నది. అదేమిటో, అదెలా తీర్చాలో మాత్రం తెలియటం లేదు.

వచ్చిన వాళ్ళలో ఒకాయన తన గుండె జబ్బు గురించి చెప్తూ, “డాక్టరు ఏదో లోపల బెలూన్‌ పెట్టాలంటున్నాడు. కానీ నాకు సందేహంగానే ఉంది. మాకు తెలిసినతను విశాఖలో ఎవరో యోగాతో గుండె జబ్బులని నయం చేస్తాడని చెప్పాడు. అక్కడకి వెళ్దామనుకుంటున్నాను,” అన్నాడు.

“ముందర్నించీ క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తూంటే అది గుండె జబ్బు నివారించడానికి పనికొస్తుందేమో కానీ, ఒకసారి వచ్చాక దాన్ని కుదుర్చేందుకు ఎలా వీలవుతుంది?” అనడిగాడు ప్రకాశం.

“మీకు యోగాలో నమ్మకం లేనట్టుంది. అది చాలా గొప్ప విద్యండీ.”

“నేను కాదనటంలేదు. కానీ దాని ప్రయోజనం దీర్ఘాభ్యాసంతో కనిపిస్తుంది కానీ, మందులా నాలుగు డోసులు వేసుకుంటే ఏం లాభం లేదంటున్నాను.”

“మీకు తెలియదండీ, మన వాళ్ళు ఎన్నెన్ని మహిమలు సంపాదించారో,” అని అవతలి అతను తీర్మానించడంతో ప్రకాశం నోరు మూసుకున్నాడు. మన పూర్వీకులు ఎంతో జ్ఞానం సంపాదించిన మాట నిజమే. అయితే అదేమిటో మాజిక్‌ లా అనుకుంటున్నారేకానీ, అది శాస్త్రబంధమైన నియమాలతో రూపొందించబడినదని ఎందుకు ఆలోచించరో అతనికి అర్ధం కాలేదు.

ఊరికే గతాన్ని గొప్ప చేసి మాట్లాడితే ఏం లాభం, ఆ గతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతే?

ఇంతలో సంభాషణ పిల్లల చదువుల మీదకు మళ్ళింది. ఇంజనీరింగూ, కంపూటర్లూ తప్ప ఇంకేమీ చదువులున్నట్టు కనిపించలేదు. ప్రకాశం ఉబుసుపోకకి అడిగాడు, “ఇప్పుడెవరైనా అసలు చరిత్రా, సాహిత్యం లాంటి సబ్త్ల్జెకు చదువుతున్నారా? అని.

“ఎందుకూ? అవేమైనా తిండి పెడతాయా? అయినా వాటిని ఎలాగూ తీసేశారు కదా?”

“అందరికీ బిల్‌ గేట్స్‌ లాగా అయిపోవాలని కోరిక,” అన్నాడు ప్రకాశం అన్నయ్య నవ్వుతూ.

“ఏం? కొంతమందికైనా విశ్వనాథ సత్యనారాయణలానో, మల్లం పల్లి సోమశేఖర శర్మ లానో అవ్వాలని ఉండదా?” రెట్టించాడు ప్రకాశం.

“పిల్లలకున్నా వాళ్ళ తల్లి తండ్రులొప్పుకోవద్దూ ఆ చదువులకి?”

“మీరే చెప్పండి. మీ పిల్లలు తెలుగు సాహిత్యం చదువుతామంటే మీరొప్పుకుంటారా, మెడిసిన్‌ చదవమంటారు గానీ.” ఆ సవాలుతో ప్రకాశం ఆత్మపరీక్ష చేసుకోవాల్సొచ్చింది. అతనికే ఆశ్చర్యం కలిగేటట్టు జవాబు వచ్చింది. “తప్పకుండాను. వాళ్ళకు దేంట్లో ఆసక్తి ఉంటే అదే చదవమంటాను.”

“మరి జీవనోపాధో?”

“దానికేం సమస్య లేదు. మన సాహిత్యం గురించి పరిశోధనలు చేసే వాళ్ళు అక్కడి యూనివర్సిటీలలో చాలా మందే ఉన్నారు.”

“కావచ్చు. మీదంతా కడుపు నిండిన బేరమండీ. కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రం అది కుదరదు..”

ఆ మాటల్లో తన ప్రయాణాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడానికి ఆధారం దొరికినట్టనిపించింది ప్రకాశానికి.

***

తిరిగి ఇల్లు జేరిన ప్రకాశానికీ, మీనాక్షికీ ఘనంగా స్వాగతమిచ్చారు పద్మా నరేంద్రలు వాళ్ళింట్లో పెద్ద పార్టీతో. “మీకొక శుభ వార్త. ఏమిటో చెప్పుకోండి చూద్దాం.”

“ఏమిటో మాకెలా తెలుస్తుంది? మీరే చెప్పాలి,” అన్నది మీనాక్షి నవ్వుతూ.

నరేంద్ర గొంతు సవరించుకున్నాడు. “ఏం లేదండీ. వెళ్ళేముందు ప్రకాశంగారన్న మాటలు మమ్మల్ని చాలా ప్రభావితం చేశాయి. ఇక్కడి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాక మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం. మీరు చెప్పినట్టు మన సంస్కృతి గురించీ, మన చరిత్ర గురించీ, మన విలువను మనకు తెలిపేటట్టుగా ఒక చిన్న స్కూల్‌ లాంటిది నడపాలని నిశ్చయించుకున్నాం. పేరుకి పిల్లలకోసమనైనా, పెద్దలు కూడా అక్కడ నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. మీరు ఊళ్ళో లేనప్పుడు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం. ఒక్క పేరు మాత్రం మీ చేత పెట్టిద్దామని ఆగాం. చెప్పండి, ఏం పేరు పెట్టమంటారు?” అందరూ ప్రకాశం వేపు ఆత్రంగా చూశారు. అందర్నీ కలయజూశాడు ప్రకాశం. తాము వెళ్ళే ముందర జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. తమ ప్రయాణపు అనుభవాలన్నీ గుర్తొచ్చాయి. చివర్లో అన్నగారింటిలో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. “కోహినూర్‌ అని పెట్టండి,” అన్నాడు గంభీరంగా.

“అదేమిటి?” అంటూ ఆశ్చర్యపోయాడు నరేంద్ర.

“అవును. మన దేశంలోని వాళ్ళకు శ్రధ్ధ లేకా, తీరిక లేకా, పోషణ లేకా మరుగున పడిపోతున్నవన్నీ మనం ఇక్కడ భద్రపరిచి ముందుతరాల వారికి పొందుపరుద్దాం. తర్వాత ఎప్పుడైనా అక్కడి వాళ్ళకు వాటి మీద కోరిక కలిగితే, ఇక్కడకి వచ్చి వాటి గురించి నేర్చుకోవచ్చు,” అన్న ప్రకాశం వేపు ఆశ్చర్యంగా చూశాడు నరేంద్ర. చిరునవ్వు నవ్వాడు ప్రకాశం.
--------------------------------------------------------
రచన: మాచిరాజు సావిత్రి, 
ఈమాట సౌజన్యంతో

Monday, April 29, 2019

వసంతునితో వెన్నెలఱేడు పోటీ!


వసంతునితో వెన్నెలఱేడు పోటీ!

సాహితీమిత్రులారా!


చం. క్షితిపయి వట్టి మ్రాకులు జిగిర్ప వసంతుడు దా రసోపగుం
      భిత పద వాసనల్ నెఱప, మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస
      న్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె;

ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా మధుమాసం వచ్చింది. వసంత ఋతువుని వసంతునిగా సంభావించడం కవిసమయం. అతను మన్మథుని చెలికాడు కదా. వసంతుడు వస్తూనే చక్కగా భూమిపై మోడువారిన చెట్లనన్నింటినీ చిగురింపజేశాడు. మామూలుగా చిగురించాయా అవి! రస ఉపగుంభిత పద వాసనల్ నెఱప – చిగురించాయి. రసవంతమైన (ఫలపుష్పాల వంటి) సామగ్రితో, వాటినుండి వచ్చే సుగంధాలు నలువైపులా వ్యాపించేట్టుగా చిగురించాయి. అలా చిగురింపజేశాడు వసంతుడు. వసంతుడు అంతటి ఘనకార్యాన్ని చేసినా పైనుండి చూస్తున్న చంద్రుడు మెచ్చుకోలేదు. సరికదా, అతనితో స్పర్థ బూనాడు. అతని కంటే ఘనుడనని నిరూపించుకోడానికి ప్రసన్నమైన, సుకుమారమైన తన వెన్నెలజల్లు కురిపించి రాళ్ళను సైతం కరగింపజేశాడు! శరత్తులాగే వసంతంలో కూడా వెన్నెల విరగకాస్తుంది, ఆకాశం నిర్మలంగా ఉంటుంది కాబట్టి. పైగా వేడెక్కే పొద్దులనుండి చల్లని ఉపశమనాన్ని కూడా యిస్తుంది. అంచేత మధుమాసం కూడా వెన్నెల మాసమే. ఈ రెండంశాలనూ కలపోస్తూ, వసంతునికీ చంద్రునికీ మధ్య స్పర్థనొక దాన్ని కల్పించాడు కవి. కవి చమత్కారానికి హద్దేముంది! పైగా ‘ప్రతి పద్యమునందు జమత్కృతి గలుగన్ జెప్పనేర్తు’నని ప్రతినబూనిన కవి కూడాను.

ఈపాటికే ప్రాజ్ఞులయిన పాఠకులకి ఈ కవి ఎవరో ఎరుకలోకి వచ్చే ఉంటుంది. ఇది చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసములోని పద్యం. నేను పైన యివ్వడం మానేసిన చివరి పాదం కూడా ఈపాటికే చాలామంది గుర్తించి ఉంటారు.

      ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!

పద్యం తెలియని చాలామందికి కూడా తెలిసే వాక్యం ఇది. తెలుగు సాహిత్యంలో అంతగా ప్రసిద్ధికెక్కింది. వసంత వర్ణనలో విశేషమైన కల్పన చేయడమే కాకుండా దానిని ఉదాహరణగా తీసుకొని, సామాన్యంగా మనుషులలో ప్రత్యేకించి కవులు కళాకారులలో, కనిపించే ఒకానొక లక్షణాన్ని ఎత్తిచూపిస్తున్నాడు చేమకూర కవి. ఈ కవి ప్రతి పద్యం లోనే కాదు ప్రతి పదంలో కూడా చమత్కారం గుప్పించగల దిట్ట. చివరి పాదం చదివిన తర్వాత మళ్ళీ పద్యమంతా తిరిగి చదివితే, చివరి పాదం హఠాత్తుగా ఊడిపడింది కాదని, పద్యం మొదటినుంచీ కవి ఆ విషయాన్ని తాను ప్రయోగించిన పదాల ద్వారా స్ఫురింపజేశాడనీ అర్థమవుతుంది. ‘రసోపగుంభిత పదవాసనలు’ అంటే నవరసాలతో శోభిల్లే పదభావాలు. అలాంటి శబ్దార్థాలు కూడిన కవిత్వాన్ని రచించి, ఒక కవి మోడువారిన హృదయాలను చిగురింపజేశాడు. మరొక కవి దానిని మెచ్చకుండా పంతంతో తను కూడా కావ్యరచన చేశాడు. ప్రసాదము, సౌకుమార్యము అనే గుణాలతో ప్రకాశిస్తూ, రాతి గుండెలను సైతం కరిగించే కావ్యం అది. ప్రసాదము, సౌకుమార్యము అనేవి కావ్యగుణాలు. ఆలంకారికులు మొత్తం పది కావ్యగుణాలను చెప్పారు – శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సౌకుమార్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజస్సు, సమాధి. ప్రసాదము అంటే అందరికీ అర్థమయ్యే పదాలతో సులువుగా సాగిపోయే గుణం. సౌకుమార్యం అంటే అక్షరరమ్యతతో చెవికి ఇంపుగా ఉండే లక్షణం. ఇలా ఒకవైపు వసంతాన్ని వర్ణిస్తూనే మరొకవైపు ఒకానొక లోకస్వభావాన్ని స్ఫురింపజేయడం కవి ప్రతిభ. రసోపగుంభిత పదవాసనలు, ప్రసన్నత, సౌకుమార్యము మొదలైన పదాలలో శ్లేష ద్వారా దీన్ని సాధించాడు వేంకటకవి. అయితే పద్యం మొత్తం మీద ఉన్న అలంకారం శ్లేష కాదు. ఎందుకంటే ఈ పద్యంలో ఉన్నది వసంతుడూ చంద్రుడే కాని కవులు కాదు. కవుల మధ్యనున్న స్పర్థ కేవలం పాఠకులకు స్ఫురించే అంశమే తప్ప నేరుగా కవి చెప్పింది కాదు. ఇటువంటి అలంకారాన్ని సమాసోక్తి అంటారు. శ్లేష ఎక్కువగా శబ్దప్రధానమైనది. సమాసోక్తి అర్థప్రధానమైనది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, భావప్రధానమైనది. అది మనసుని మరింతగా హత్తుకుంటుంది.

ఏదయితేనేమి, ఆ యిరువురి స్పర్థ, వారి రచనలను అనుభవించేవారికి గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది! అది కవుల విషయమైనా సరే, చంద్రవసంతుల విషయమైనా సరే. స్పర్థయా వర్ధతే విద్య అని అన్నారు కదా. అయినా ఒక కవిగా, ఎంత గొప్ప కవిత్వాన్ని రచించినా సమకాలము వారలు మెచ్చకపోవడాన్ని గూర్చి వాపోయాడు వేంకటకవి. మెచ్చకపోవడమే కాదు, ఏ రకంగా తక్కువ చేసి చిన్నబుచ్చుతారో కూడా మనకీ పద్యంలో చూచాయగా తెలియజెప్పాడు. పద్యాన్ని మరొకసారి జాగ్రత్తగా చదివితే, చంద్రుడు వసంతుడిని తక్కువ చేయడం మనకి కనిపిస్తుంది. ‘వట్టి మ్రాకులు చిగిర్ప’ అన్న పదబంధంలో ‘వట్టి’ అనే పదం మోడువారిన అనే అర్థంతో పాటు, విడిగా చదివితే ‘కేవలం’ అనే హేళన భావం కూడా ధ్వనిస్తుంది. కేవలం చెట్లని మాత్రం చిగురింపజేయడమే వసంతుడు చేసే పని అని, తాను మాత్రం రాళ్ళను సైతం కరిగించగలడనీ- చంద్రుని పరంగా అన్వయించుకోవచ్చును. అలాగే వసంతుడు తన కార్యాన్ని సాధించడానికి ‘క్షితిపయి’కి వెళ్ళవలసి వచ్చింది. మరి తానో, ఆకాశంలో ఉండే తన కార్యాన్ని సాధిస్తాడు. ఇలా ప్రతి పదాన్ని సార్థకంగా ప్రయోగించడం చేమకూర ప్రత్యేకత. తాపీ ధర్మారావుగారు విజయవిలాసానికి చేసిన హృదయోల్లాస వ్యాఖ్యలో ఈ ప్రత్యేకతను అద్భుతంగా పట్టి మనకందించారు. వేంకటకవి పద్యాలలో అధికాధికం శబ్దచమత్కార బంధురమైనవి. అర్థచమత్కారంతో సున్నిత భావాన్ని స్ఫురింపజేయడం ఈ పద్యంలో నన్ను ఆకట్టుకొన్న అంశం. సాధారణంగా కవుల కావ్యాలలో ఋతువర్ణనలు విస్తారంగా సాగుతాయి. అయితే వేంకటకవి విడిగా ఋతువర్ణన చేయలేదు. సాయంకాల వర్ణనతో కలిపి వసంతాన్ని వర్ణించడం ఇక్కడున్న విశేషం. పై పద్యంలో చంద్రుని ప్రసన్నతకూ సౌకుమార్యానికీ కారణం వసంతకాలం ఒక్కటే కాదు. అది పున్నమిరేయి కూడానూ. దీని ముందరి పద్యాలను చదివితే ఆ విషయం బోధపడుతుంది. అది కూడా కవి నేరుగా చెప్పడు, సాయంకాల దృశ్యాన్ని చిత్రించడం ద్వారా మనకి ప్రత్యక్షం చేస్తాడు. ఆ పద్యాన్ని కూడా ఆస్వాదించి వసంతుని ఆగమనాన్ని స్వాగతిద్దాం.

అంగజరాజు పాంథ నిచయంబులపై విజయం బొనర్ప నే
గంగ దలంచునంత మునుగల్గగ దాసులు పట్టు జాళువా
బంగరు టాలవట్టముల భంగి గనంబడె బూర్వ పశ్చిమో
త్తుంగ మహీధరాగ్రముల దోయజశాత్రవమిత్ర బింబముల్

వసంతుడు మన్మథుని చెలికాడే కాదు, సేనాపతి కూడా. అందువల్ల వసంతమాసం అంటే మన్మథుడు జైత్రయాత్ర చేసే సమయం అన్నమాట. మన్మథరాజు జైత్రయాత్రకి సన్నద్ధమైన సమయాన్ని వర్ణిస్తున్న పద్యమిది.

ఇక్కడొక చిన్న పిట్టకథ చెప్పుకోవాలి. ఒకసారి భవభూతి, దండి, కాళిదాసులతో కలిసి భోజరాజు సముద్రపుటొడ్డుకు విహారానికి వెళ్ళాడట. అక్కడ అస్తమిస్తున్న సూర్యుడిని చూసి ‘పరిపతతి పయోనిధౌ పతంగః’ అన్నాడట. అంటే సూర్యుడు సముద్రంలో పడిపోతున్నాడు అని. మిగిలినవారు ఒకొక్క పాదంతో ఆ పద్యాన్ని పూరించాలి. వెంటనే దండి ‘సరసిరుహా ముదరేషు మత్తభృంగః’ అన్నాడట. అంటే పద్మాల కడుపుల్లో మత్తిల్లిన తేనెటీగలున్నాయి అని. తేనె తాగేందుకు వాలిన భ్రమరాలు పద్మ మరందాన్ని త్రాగి మత్తెక్కి ఉన్నాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. పద్మాలు ముడుచుకుపోయాయి. అలా ముడుచుకుపోయిన పద్మాల కడుపుల్లో మత్తిల్లిన భృంగాలు ఉండిపోయాయి! ఆ తర్వాత భవభూతి ‘ఉపవనతరుకోటరే విహంగః’ అన్నాడు. ప్రక్కనే ఉద్యానవనాలున్నాయి. ఆ తోటల్లో చెట్లున్నాయి. ఆ చెట్ల తొర్రలలోకి పక్షులు చేరుకున్నాయి అని అర్థం. ఇక చివరగా కాళిదాసు వంతు. అతను ‘యువతి జనేషు శనై శ్శనై రనంగః’ అని పూరించాడు. అంటే యౌవనవతులైన స్త్రీలలోకి మెల్లమెల్లగా మన్మథుడు ప్రవేశిస్తున్నాడు అని.

అంచేత మన్మథుని దండయాత్రకు అనువైన సమయం సాయంత్రమే. ఇక్కడ జైత్రయాత్ర ఎవరిపైన అంటే, పాంథనిచయంబులపైన. అంటే ప్రయాణంలో ఉన్నవాళ్ళపైన. తమ ప్రియతములకు దూరమై విరహంతో వేగుతూ ఉండే వాళ్ళపైనన్న మాట! రాజు ఎక్కడికైనా బయలుదేరాడనగానే పెద్ద సన్నాహమే కదా. అతని ఠీవికి తగ్గట్టుగా ముందు కొంతమంది రాజోచిత లాంఛనాలను పట్టుకొని నడుస్తారు. అలాంటి రాజచిహ్నాలలో సూర్యచంద్రుల బొమ్మలున్న పలకలు అమర్చిన పొడుగాటి కర్రలను సూర్యపాను చంద్రపాను అంటారు. వాటినే ఆలావర్తములని (ఆలవట్టములు) కూడా అంటారు. ఇక్కడ యాత్రకి సన్నద్ధమయినది మామూలు రాజు కాదు కదా! జగజ్జేత అయిన మన్మథుడు. అతనికి బొమ్మలతో పని లేదు. అచ్చంగా చంద్రసూర్య బింబాలే మేలిమి (జాళువా) బంగారు ఆలవట్టములయ్యాయి అన్నట్టుగా అటూ యిటూ, తూర్పుపడమటి కొండలపై (పూర్వ పశ్చిమ ఉత్తుంగ మహీధరాగ్రముల) ప్రకాశించాయి. తోయజశాత్రవుడు అంటే పద్మాలకు శత్రువు – చంద్రుడు. తోయజమిత్రుడు సూర్యుడు. చంద్రబింబం తూర్పుకొండపైన, సూర్యబింబం పడమటికొండపైన వెలుగుతోంది. అందుకే అది సాయంసమయం. సూర్యాస్తమయమూ చంద్రోదయమూ ఒకేసారి అవుతున్నాయంటే అది పున్నమి అన్నమాట. అది మధుమాసమనీ పున్నమినాటి సాయంసంధ్యా సమయమనీ ఎక్కడా నేరుగా చెప్పకుండా కేవలం దృశ్యచిత్రీకరణ ద్వారా తెలియజేయడం కవి రచనలోని చమత్కారం! అంగజరాజు అనే పదానికి కూడా గొప్ప సార్థకత ఉందని వివరించారు తాపీవారు. దీనికి అంగదేశంలో పుట్టిన రాజు అనే అర్థం కూడా వస్తుంది. అంగదేశం భరతఖండంలో ఉత్తరాన ఉంది. అందువల్ల అంగజరాజు ఉత్తరదిక్కు నుండి బయలుదేరుతున్నాడని ఊహించవచ్చు. అప్పుడు సరిగ్గా అతని కుడిపక్క (అంటే పడమట) సూర్యపాను, ఎడమపక్క (అంటే తూర్పున) చంద్రపానూ ఉన్న దృశ్యం మనకి చక్కగా సాక్షాత్కరిస్తుంది.
----------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, April 28, 2019

ఏకాంతం కోసం


ఏకాంతం కోసం
సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి.................

ఆ పెద్దావిడ ప్రతీ మంగళవారం ఆ పుస్తకాలాయన ఇల్లు శుభ్రం చేయడానికని వొస్తుంది. కాలింగ్ బెల్ విని తలుపు తీస్తూ మీ మనవడెలా ఉన్నాడని అడిగాడు ఆయన. లోపలికొచ్చి కాళ్ళు తుడుచుకునే పట్టా మీదే ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్టు నిలబడిపోయింది మా పార్కర్.

“నిన్ననే వాణ్ణి పూడ్చిపెట్టాం సర్!” నిర్లిప్తంగా చెప్పింది.

“అయ్యయ్యో! ఔనా?!” పుస్తకాలాయన ఇంకేమనాలో తోచక మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయానికాయన ఉదయపు ఫలహారం చేస్తున్నాడు. ఎప్పట్లానే బాగా నలిగిపోయిన నైట్ గౌనులో ఆరోజు పేపరు చేత్తో పట్టుకునున్నాడు. ఇప్పుడు ఏమీ జరగనట్టు తిరిగిపోయి ఫలహారం ముగించడమా, ఇంకేవైనా ఓదార్పు మాటలు అనాలా అర్థంకాలేదాయనకి. ఏమీ మాట్లాడకుండా పేపరు పట్టుకొని పక్క గదిలోకెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ, అది మొరటుతనంగా అనిపించిందతనికే.

“చర్చిలో అంతా సవ్యంగా జరిగిపోయిందా, మిసెస్ పార్కర్?” మొహమాటపడుతూ అడిగాడు.

“ఏమన్నారు సర్?” అర్థంగానట్టు అడిగిందావిడ.

“అదే, పిల్లవాడి ఆ… కార్యక్రమం ఏ ఇబ్బందీ లేకుండా…”

ఆవిడేమీ బదులివ్వలేదు. తలవంచుకుని మెల్లిగా ఆడుగులేస్తూ వంటింట్లోకెళ్ళిపోయింది. ఆయన నిట్టూర్చి తన ఫలహారం పనిలో పడ్డాడు.

ముసలావిడ వంటింట్లోకెళ్ళి చేతిసంచీ లోంచి తన పనిముట్లు తీసుకొని సంచీ చిలక్కొయ్యకి తగిలించింది. మెల్లిగా కుర్చీలో కూర్చొని వొంగి బూట్లు విప్పుకుంది. బూట్లు వేసుకోవడం, తిరిగి విప్పడం ఎంత నొప్పో ఆమెకు. అయితే ఆమెకా నొప్పి ఎంతగా అలవాటైపోయిందంటే, లేసులు విప్పదీయడం మొదలుపెట్టబోతుండగానే ఆమె పళ్ళు బిగుసుకుంటాయి, రాబోయే నొప్పిని ఊహిస్తున్నట్టుగా.

అతి ప్రయాస మీద బూట్లు విప్పి పక్కనపెట్టి కొంచెంసేపు కుర్చీలో అలాగే జారగిలబడి కూర్చుందామె, మోకాళ్ళు రుద్దుకుంటూ.

“గ్రానీ! గ్రానీ!” బయట వీధి లోంచి ఆమె మనవడు బూట్లతో సహా ఆమె ఒళ్ళోకెగబడ్డాడు.

“అబ్బబ్బా! అలా మీదపడొద్దని ఎన్నిసార్లు చెప్పాల్రా? చూడు, నా బట్టలెంత మురికి చేశావో!” విసుక్కుందామె. ఆమె మాటలేం పట్టించుకోకుండా వాడలాగే ఆమె ఒళ్ళో లేచి నుంచున్నాడు.

“గ్రానీ! ఒక్క పెన్నీ ఇవ్వవా!”

“ఫో అవతలకి! గ్రానీ దగ్గర పెన్నీల్లేవ్.”

“ఉన్నై, ఉన్నై, నాకు తెలుసుగా! గ్రానీ, ఒక్క పెన్నీ అంటే ఒక్కటి. ఇవ్వు గ్రానీ.” ఆమె మెడ చుట్టూ చేతులేసి తన చెంప ఆమె చెంపకి తగిలించి ముద్దుగా ఆడిగాడు.

“చాల్లే, నీ వేషాలూ నువ్వూ! నా దగ్గర పెన్నీలేమీ లేవంటున్నా కదా?” ఆమె చేతులు అప్పటికే తన హ్యాండ్‌బ్యాగులో చిల్లర డబ్బులకోసం తడుముతున్నాయి.

“సరే. నీకో పెన్నీ ఇస్తా. మరి నాకేమిస్తావూ, చెప్పు ముందు!”

వాడు ముద్దుగా నవ్వి అమ్మమ్మ మెడ చుట్టూ చేతులు ఇంకా గట్టిగా బిగించాడు.

“నా దగ్గిరేం లేదుగా గ్రానీ?” వాడి కంటి రెప్పలు ఆమె చెంప మీద చక్కిలిగిలి పెడుతూ…

పెద్దావిడ ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి నిలబడింది. సింకు నుంచి టీ గిన్నెలో నీళ్ళు నింపి స్టవ్ మీద పెట్టింది. ఆపైన, ఇంకో గిన్నెలోనూ బకెట్‌లోనూ నీళ్ళు పట్టింది. పంపు నుంచి ధారగా నీళ్ళు గుడగుడ శబ్దం చేస్తూ గిన్నెలో నిండుతుంటే ఆమెకు నొప్పి ఏదో తగ్గినట్టనిపించింది కాసేపు.

ఆ వంటింటి స్థితి గురించి ఏకంగా పుస్తకమే రాయొచ్చు. పుస్తకాలాయన వారమంతా తన ‘పని’ తానే చేసుకుంటాడు. ఆవిడ వారానికొక్కరోజు మాత్రమే వొచ్చి శుభ్రంచేస్తుంది. ఆ వారంలోగా ఆయన నానా కంగాళీ చేసిపెడతాడు ఇల్లంతా. టీ కాచుకుని ఆ చెత్తంతా ఒక పెద్ద జాడీలో పడేస్తాడు. చెంచాలు, కత్తులు, ఫోర్కులూ వాడి సింకులో పడేస్తాడు. ఎప్పుడైనా కడగక తప్పదనిపిస్తే, ఒక తువ్వాలుతో తుడిచి మళ్ళీ వాడేస్తాడు. ఆయన దృష్టిలో ఇల్లు శుభ్రం చేసుకోవడమంత దండగ పని ఇంకొకటి లేదు.

“ఇంట్లో హాయిగా ఇష్టమొచ్చినట్టు వుండండి. వారానికొకసారి పనిమనిషిని మాట్లాడుకుంటే వచ్చి శుభ్రం చేసిపోతుంది. ఆమాత్రం దానికి ఇల్లు ప్రతీరోజూ ఎందుకూ క్లీన్ చేసుకోవడం. వేస్ట్ ఆఫ్ టైమ్!” అంటాడాయన దగ్గరి స్నేహితులతో. అదీ ఆయన ‘పద్ధతి.’

ఆ పద్ధతి అందమంతా ఆ వంటిల్లు చూస్తేనే తెలిసిపోతుంది.

వంటిల్లంతా పెద్ద చెత్త కుండీలా తయారయింది. నేల మీద రొట్టె ముక్కలు, ఉత్తరాలు, ఖాళీ పేకెట్లు, సిగరెట్టు పీకలు, చెప్పనలవికాకుండా వుంది. అయినా ఎప్పుడూ ఆవిడ విసుక్కోలేదు. పైగా ఒంటరివాడనీ అతన్ని అంటిపెట్టుకుని వుండేవారెవరూ లేరనీ సానుభూతి కూడా. కిటికీ తలుపు తెరిచి ఆకాశం వంక చూసింది. అక్కణ్ణించి ఆకాశం ఎందుకో ఎప్పుడూ దిగులుగా అనిపిస్తుంది. ఉన్న ఒకటీరెండు మబ్బులు కూడా ఆకాశంలో టీ మరకల్లాగా అంచులు చిరిగిపోయి, అక్కడక్కడా చిల్లులు పడ్డ దుప్పట్లలా వుంటాయి.

ఆవిడ నేల చిమ్మడం మొదలుపెట్టింది. ‘ఏమిటో, నా పాడు జన్మకీ కష్టాలు తీరేలా లేవు. ఎంతకని భరించను, ఎన్నని సహించను!’ అనుకుని నిట్టూర్చింది.

ఆ మాట ఆమె గురించి ఆమే కాదు అందరూ అనుకునేదే. సాయంత్రం పనంతా ముగించి ఇంటికి నిదానంగా నడుచుకుంటూ పోయే ఆమెను చూసి అందరూ పాపం అనుకుంటారు. మా పార్కర్ బతుకంతా కష్టాలే కష్టాలు, అని చెప్పుకుంటారు. ఆవిడకదేమీ గొప్పగా అనిపించదు. ఆమాటకొస్తే అసలేమీ అనిపించదు. ఆవిడ ఫలానా నంబరు ఇంట్లో ఉంటుంది అన్నప్పుడు ఎలా వుంటుందో, ఆమెది ఎంత కష్టమైన బతుకో అనుకున్నప్పుడూ అలానే వుంటుంది. నిజంగా కష్టమైన బతుకే…

పదహారేళ్ళప్పుడు స్ట్రాట్‌ఫర్డ్ వదిలి లండన్‌కొచ్చిపడింది పనిమనిషిగా. ఓహ్! స్ట్రాట్‌ఫర్డ్! అంటే షేక్స్‌పియర్ పుట్టిన వూరే కదా? అందరూ ఆమెని అడిగేవాళ్ళే! ఏమో సర్, తెలీదు. ఆమెకు షేక్స్‌పియర్ ఎవరో లండన్ వచ్చాక కానీ తెలియలేదు.

ఇప్పుడా వూరి జ్ఞాపకాలు ఏమీ లేవు. ఏ చీకటి రాత్రో చిమ్నీగొట్టాం నుంచి నక్షత్రాలను చూడడం, లీలగా అమ్మ, ఇంటిముందు మొక్క ఏదో గుర్తులేదు కానీ మంచి వాసన వస్తుండేది. ఎప్పుడో జబ్బుచేసి మంచం పైన పడుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు గుర్తొచ్చాయి, అంతే.

ఆమె మొదట పనిచేసిన ఇంట్లో భయంకరంగా వుండేది. రోజంతా వంటింట్లోనే మగ్గాల్సొచ్చేది. పైగా ఆ వంటమనిషి ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేని రాక్షసి. ఇంటి నుంచి వొచ్చే వుత్తరాలు కూడా చదవనిచ్చేదికాదు. చేతిలోంచి లాక్కొని చిమ్నీలో పారేసేది అవి చదువుకుంటూ ఊహల్లో తేలిపోతుందని. …పేడపురుగులు! అవును కదా! ఆ వంటమనిషి వాటినెప్పుడూ చూడలేదట. పేడపురుగులు చూడని వాళ్ళూ ఉంటారా? తన కాళ్ళు తాను చూసుకోని వాళ్ళెవరుంటారు. మా పార్కర్ ముఖంలో చిన్న నవ్వు కనిపిస్తుంది ఆ పేడపురుగులు గుర్తొచ్చినప్పుడల్లా.

ఆ ఇంటి నుంచి ఒక డాక్టరుగారి ఇంట్లో పని కుదిరింది. అక్కడా పగలూ రాత్రీ పని. రెండేళ్ళు అలుపెరగకుండా అలా పనిచేసి, ఒక బేకర్‌ని పెళ్ళాడింది.

“బేకర్‌ని పెళ్ళాడారా?” అన్నాడు పుస్తకాలాయన, ఆవిడ ఆ సంగతి చెప్పినప్పుడు. ఎప్పుడో ఇంట్లో ఇంకో ప్రాణి ఉంది అని గుర్తొచ్చినప్పుడు ఆ పుస్తకాల మధ్యలోంచి తలెత్తి ఆమె చెప్పేది వింటుంటాడాయన.

“అయినా బేకర్లే నయం లెండి. తిండికి లోటుండదు. పైగా శుభ్రమైన పని!” ఆవిడ నిజంగానా అన్నట్టు ఆయనవంక చూసింది.

“బేకరీలో బ్రెడ్ అమ్మడం, వచ్చీపోయే కస్టమర్లతో సరదాగా ఉండుండాలి కదా?”

“దుకాణంలో ఉండేంత తీరికెక్కడిది సర్? మొత్తం పదముగ్గురిని కన్నాను. ఏడుగురిని కప్పెట్టాను. తెలిసింది రెండే అనుకోండి నాకు, పురిటి మంచం లేకుంటే ఆస్పత్రి మంచం.”

“అనుకోవచ్చు, అనుకోవచ్చు,” వెన్నులోంచి చలి వచ్చినట్లు ఒక్కసారి వొణికి పెన్ను చేతిలోకి తీసుకుని తన పనిలో పడిపోయేడు.

ఏడుగురు పోయినా మిగిలిన ఆరుగురినీ పెంచి పోషించడమంటే మాటలా? ఇంతలో ఇంటాయనకి ఊపిరి తిత్తుల వ్యాధి సంక్రమించింది. లోపలంతా పిండి నిండిపోయిందన్నాడు వైద్యుడు.

“అమ్మా! ఇక్కడ కనక ఈయనని కోస్తే ఊపిరితిత్తులనిండా గోధుమ పిండే కనిపిస్తుంది మనకి. అయ్యా, మీరు కొంచెం గట్టిగా ఊపిరి పీల్చండి.” షర్టు పైకెత్తి పడుకున్న అతని వెన్ను పైన పెన్నుతో రాస్తూ అన్నాడు వైద్యుడు, ఆయన ఎంతో ప్రయాసతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆమెకెందుకో అతని నోటి నుండి గోధుమ పిండి పొగలా వచ్చినట్లు అనిపించింది.

ఆయన పోయిన తరవాత ఆరుగురు పిల్లలనీ పెంచేసరికి ప్రాణాలు కడబట్టిపోయాయి. సరిగ్గా ఆఖరి పిల్ల బళ్ళోకెళ్ళేసరికి తన చెల్లెలు భర్తతో సహా దిగింది, నీకు సహాయం చేస్తా అంటూ! సహాయం మాట దేవుడెరుగు, వచ్చిన రెండునెలలకి చెల్లెలు మెట్ల మీద జారి మంచాన పడడంతో చంటి బిడ్డలా అయిదేళ్ళపాటు పెంచాల్సిన పరిస్థితి వచ్చిపడింది. నిజంగా తన చెల్లెలు వయసొచ్చిన చంటి బిడ్డే!

ఆ తరవాత ఇద్దరాడపిల్లలూ జబ్బుచేసి పోయారు. జిమ్ సైన్యంలో చేరి ఇండియా పోయాడు. ఇద్దరు మగపిల్లలు జీవనోపాధి వెతుక్కుంటూ దేశాలు పట్టి వెళ్ళిపోయారు. ఆఖరిది ఎమిలీ తనతో మిగిలిపోయిందనుకుంటే అది ఎందుకూ పనికిరాని ఒక వెయిటర్ వెధవని పెళ్ళాడింది. వాడూ కడుపులో అల్సర్లు పుట్టి చచ్చిపోయాడు లెన్నీ పుట్టిన ఏడాది. ఇక మిగిలిందల్లా తన మనవడు లెన్నీ…

ఆలోచనల్లోనే గిన్నెలన్నీ కడిగి తుడిచి సర్దేసిందామె. నల్లగా మురికిపట్టిన కత్తులన్నీ కోసిన బంగాళాదుంపతో రుద్ది కడిగింది. భోజనం చేసే బల్ల, ప్లేట్లు కప్పులున్న అల్మారా, మిగతా వంటిల్లంతా కూడా శుభ్రంచేసి చేతులు తుడుచుకుంది.

…బుజ్జివెధవ పాపం ఎందుకో ఎప్పుడూ అనారోగ్యంగానే వుండేవాడు. వాడి వుంగరాల జుట్టు, నాజూకు రంగు చూసి అందరూ ఆడపిల్లనుకునేవారు. తనూ ఎమిలీ ఎన్నెన్నో చిట్కా వైద్యాలు చేశారు. ఆ వైద్యాలకోసం ఎమిలీ ఆదివారం పత్రిక పొద్దున్నే చదివేది. ఆ పత్రికకి సలహాల కోసం తల్లీ కూతురూ ఎన్నో ఉత్తరాలు కూడా రాసేవారు. అయినా లెన్నీ అసలు తిండి సరిగ్గా తిననేలేదు. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా వాడు ఒళ్ళుచేయనేలేదు.

అమ్మకంటే వాడికి అమ్మమ్మంటే ప్రాణం. వాడు అమ్మమ్మ బిడ్డ.

“నువ్వు ఎవరి బేబీవీ?” అడిగింది మా పార్కర్, స్టవ్ తుడిచి జిడ్డు పట్టిన కిటికీ మీద సబ్బు రుద్దుతూ.

“నేను గ్రానీ బేబీని!”

ఒక పిల్లవాడి గొంతు తన గుండె కిందుగా నవ్వుతూ చెప్పింది. ఆ గొంతు ఎంతో ఆప్యాయంగా, ఎంతో దగ్గరగా తన గుండెలోంచి వస్తున్నట్టుగా వినిపించి మా పార్కర్ నిలువెల్లా కదిలిపోయింది ఒక్క క్షణం.

గది గుమ్మం దగ్గర అలికిడయింది. ఆమె తలెత్తి చూసింది. పుస్తకాలాయన తయారయి ఎక్కడికో బయల్దేరినట్టున్నాడు.

“మిసెస్ పార్కర్! నేను బయటికెళ్తున్నాను!”

“అలాగేనండి!”

“మీకివ్వాల్సిన డబ్బు బల్లమీద వుంది.”

“అలాగేనండి.”

ఆయన వెళ్ళబోతూ ఆగిపోయాడు.

“అన్నట్టు, కిందటి వారం మీరొచ్చినప్పుడు డబ్బాలోంచి కోకో పొడి బయటకానీ పడేశారా?”

“అబ్బే, లేదండి.”

“వింతగా వుందే. నాకు బాగా గుర్తు, డబ్బాలో ఒక చెంచాడు పొడి మిగిలేవుండాలి. ఇప్పుడు చూస్తే ఖాళీగా వుంది. కనపడకపోతే బయట పడేశారేమోననుకున్నా. నాకు చెప్పకుండా ఏదీ పడేయరు కదా!?” ఆయన గంభీరంగా ముగించి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, తన లౌక్యానికీ తెలివి తేటలకీ ఎంతగానో మురిసిపోతూ. తనేమీ అంత అమాయకుడూ తెలివితక్కువవాడూ కాదనీ, ఇంటి విషయాల్లో అప్రమత్తంగానే వుంటాడనీ తెలియజెయ్యడమే ఆయన ఉద్దేశ్యం.

ఆయన వెళ్ళిపోయిన గుర్తుగా తలుపు ధడాలున మూసుకుంది. మా పార్కర్ తన బ్రష్షులు, గుడ్డలూ తీసుకొని బెడ్రూములోకి నడిచింది చిన్నగా. పక్కలు దులిపింది, దుప్పట్లు తీసి కొత్త దుప్పట్లు పరిచి ముడతలు సరిచేసి వాటిని పరుపు కిందికి నెట్టింది. దిళ్ళు సర్దింది. ఆ ఒంటరితనంలో, నిశ్శబ్దంలో తన మనవడి ఆలోచన ఆమెను కుదిపివేస్తూనే ఉంది.

ఎలాగూ పోక తప్పనప్పుడు వాడంత నరకయాతన ఎందుకు అనుభవించాలన్న ప్రశ్న ఆమెని నిలవనీయడంలేదు. అంత పసి కూన ఒక్కొక్క ఊపిరి కోసం బ్రతుకునంతగా వేడుకోవాలా? ఆ చిన్నారిని అంత చిత్రహింసలు పెట్టి ఆనందించేదెవరు? ఎవరి తృప్తికోసం వాడి పోరాటం? ఆమెకు అర్థంకానిదదే.

వాడి పలుచటి గుండెలో ఏదో మరుగుతున్నట్టు వచ్చే గుర గుర శబ్దం. అది బైటికి రాదు వాడిని ఊపిరి తీసుకోనీయదు. దగ్గినప్పుడల్లా చేతులు కాళ్ళు కదిలిపోయేవి. కళ్ళు ఉబ్బుకొచ్చేవి. ఆ తరవాత అలసిపోయి దిండుకి చేరబడి వాడు గ్రానీ వంక కోపంగా చూసేవాడు.

తను కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

“నేనేం చేయనురా నా తండ్రీ!” చెమటకి తడిసిపోయిన వాడి జుట్టుని మొహం మీంచి పక్కకి జరిపింది. వాడు కోపంగా ఆమె చేయి పక్కకి తోసేసి కళ్ళు మూసుకున్నాడు. గుండెని మెలిపెడుతున్నట్టున్న బాధని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది.

ఇక తనవల్ల కాలేదు. చేతిలో వున్న తుడుపు గుడ్డ అలానే వదిలేసింది. ఆమె తన బతుకేదో తాను బతికింది. ఏదొచ్చినా నిబ్బరంగా నిలబడింది. ఆమె ఇంతవరకూ కన్నీళ్ళు పెట్టుకోలేదు బైటివారి ముందైనా తన పిల్లల ముందైనా. కానీ ఇప్పుడు లెన్నీ లేడు. తనకెవరూ లేరు. ఇప్పుడెవరికోసం బ్రతకాలి? తనకు మిగిలిందల్లా ఆ పసికూన ఒక్కడే. ఇప్పుడు వాడూ లేడు. ఈ కష్టాలన్నీతనకే ఎందుకు రావాలి? తనకే ఎందుకవుతుంది ఇలా?

“నాకే ఎందుకవుతుంది ఇలా?”

తెలియకుండానే ఆ ప్రశ్న మా పార్కర్ నోటినుంచి బయటకు వచ్చింది. గుండెను నులిపెడుతున్న బాధతో మా పార్కర్ తనేం చేస్తున్నదో తెలియని స్థితిలో వంటగదిలోకి నడిచింది, కోటు వేసుకుంది, తలకు టోపీ పెట్టుకుంది. ఇంట్లోంచి బైటకు వచ్చింది. ఎక్కడికి పోవాలి? ఎటువైపు నడవాలి? ఏం చేస్తే తన ఆలోచనలనుంచి తను తప్పించుకోగలదు?

బయట చలిగా వుంది. చల్లటి ఈదురుగాలి కత్తులతో కోస్తున్నట్లుగా ఉంది. అందరూ చకచకా నడిచిపోతున్నారు తమ శరీరాలన్నీ కప్పుకుని. పక్క మనిషిని పలకరించడానిక్కూడా ఓపిక, తీరిక లేని మనుషులు, ఎవరికీ ఆమె బాధ పట్టలేదు. ఎక్కడైనా కూర్చుని తీరుబడిగా ఏడవాలని వుందామెకు. కానీ ఇన్నేళ్ళ తరువాత ఏడుద్దామన్నా అవుతుందా? ఇన్నేళ్ళూ గుండెల్లో ఉగ్గబట్టుకువున్న ఏడుపు ఇప్పుడు మాత్రం బయటకు వస్తుందా?

ఆ ఆలోచన రాగానే లెన్నీ గుండెల మీదకెగబాకినట్టుగా అనిపించింది. అవున్నాన్నా, గ్రానీ కిప్పుడు ఏడవాలనుంది. ఏడుపంటూ మొదలుపెడితే అన్నిటికీ ఏడవాలి. రాక్షసిలాంటి వంటమనిషి, భర్త అనారోగ్యం, పుట్టిపోయిన తన పిల్లలు, ఇన్నేళ్ళ ఈ దుర్భరమైన జీవితం చివరికి లెన్నీ దగ్గరికి వచ్చి ఆగేదాకా జరిగిన ప్రతీదానికి ఏడవాలి. తీరిగ్గా పూర్తిగా గుండె బరువు తగ్గిపోయేలా ఏడవాలి. ఇన్నిటికి ఏడవాలంటే చాలా సమయం కావాలి. అయినా సరే. సమయం వచ్చింది. ఇక ఆగదు. తను ఏడవక తప్పదు. ఇక ఏడవాలి. కానీ ఎక్కడ?

“మా పార్కర్ బతుకంతా కష్టాలే కష్టాలు!” అవును. కష్టాలే. బిగబట్టుకున్న పెదవులు వణికాయి.

ఇంటికెళ్ళి ఏడవలేదు, అసలే బిడ్డ పోయిన బాధలో వున్న ఎమిలీ తట్టుకోలేదు, బెదిరిపోతుంది. బయటెక్కడైనా పార్కులో బెంచీ మీద కూర్చోని యేడుద్దామంటే, అందరూ చుట్టుముట్టి ప్రశ్నలడుగుతారు. పుస్తకాలాయనది పరాయి ఇల్లు. అక్కడ ఎలా ఏడవగలదు? ఏ దుకాణం మెట్ల మీదో కూర్చుని ఏడిస్తే పోలీసువాళ్ళు వచ్చి పొమ్మంటారు.

తనకు ఇష్టమైనంతసేపు ఎవరికీ తను కనిపించని చోటు, ఎవరూ తనని ప్రశ్నలడగని చోటు ఒకటి లేదా? ఇన్నాళ్ళకి ఈ ప్రపంచంలో తను పొగిలి పొగిలి ఏడవడానికి ఒక చోటంటూ కనీసం లేదా?

ఇంతలో వాన మొదలయింది. చల్లటి ఈదురుగాలి ఆమెను సూదులతో పొడిచింది. మా పార్కర్ అటూ ఇటూ చూసింది. లేదు, చోటెక్కడా లేదు.
----------------------------------------------------------
రచన: శారద ,
మూలం: కేథరిన్ మాన్స్‌ఫీల్డ్,
(మూలం: Katherine Mansfield –
 “The life of Ma Parker.”)
ఈమాట సౌజన్యంతో

Saturday, April 27, 2019

మా ఆవిడ – మంగళసూత్రం


మా ఆవిడ – మంగళసూత్రం
సాహితీమిత్రులారా!


ఈ కథను ఆస్వాదించండి...................

బద్ధకంగా నిద్రలేచి మొహం కడుక్కొని కుర్చీలో కూచుని టైము చూశాను. పావు తక్కువ ఆరు అవవస్తోంది. వాకింగుకి వెళ్ళే టైము అయింది.

“ఏమండీ” అంది మా ఆవిడ మృదువుగా, ఉదయమే మొదటి కాఫీ కప్పు ఇస్తూ.

మృదువుగా మాట్లాడం అంటే నాకు అర్ధం కాదు. మెల్లగా, నెమ్మదిగా, తక్కువ శ్రుతిలో మాట్లాడడాన్ని మృదువుగా మాట్లాడడం అని అర్ధం చెప్పుకుంటాను. ప్రస్తుతం ప్రభావతి అలాగే మాట్లాడింది. ఇలా మాట్లాడడం ఆవిడ నైజం కాదు. ఆవిడ అలా మాట్లాడినప్పుడల్లా నేను ఇబ్బంది పడ్డ సందార్భాలే గుర్తుకు వస్తాయి. అందుకనే నేను గంభీరంగా అన్నాను.

“ఏమిటండీ” అని.

“నిన్న రాత్రి మంగళసూత్రం మళ్ళీ పెరిగింది. పొద్దున్నే పసుపుతాడు వేసుకున్నాను.”

నా గుండెల్లో రాయి పడింది.

“ఇదివరలో మూడు మాట్లు సూత్రం పెరిగింది. ఇది నాలుగోమాటు. ఈ మాటైనా, మాటు పెట్టకుండా కొత్తది చేయించండి!” మా ఆవిడ కొనసాగించింది మృదువుగానే.

పెరిగినప్పుడల్లా మా ఇంట్లో చిన్న సైజు యుద్ధం జరిగేది. కొత్తది చేయించమని ఆవిడ, అతికిస్తే సరిపోతుందని నేను వాదించుకునే వాళ్ళం. ఇప్పటిదాకా నేనే గెలిచాను.

“నా దగ్గర డబ్బు లేనప్పుడే అది ఎందుకు పెరుగుతుంది? నా మీద అది కక్ష సాధిస్తోందా?” అన్నాను నవ్వుతూనే.

“మీ దగ్గర డబ్బు ఎప్పుడుంది కనుక?” మాటల్లో శ్రుతి పెరిగింది.

నిజమే, నలభైనాలుగు ఏళ్లకు పైగా ఉద్యోగం చేసినా స్వంత ఇల్లు లేదు. బేంక్ బేలన్స్, డిపాజిట్స్ కలిపి కూడా రెండు, మూడు మాట్లు హాస్పిటలుకి వెళ్ళి రాగలిగినంత మాత్రమే ఉంది. సంపాదించినది ఖర్చు పెట్టడమే మా ఇద్దరికీ అలవాటు. ఆదా చేయాలనే సద్బుద్ధి మా ఇద్దరికీ ఎప్పుడూ కలగలేదు. నేను మాట్లాడలేదు.

“ఈ మంగళ సూత్రం ఎప్పుడు చేయించామో గుర్తుందా?” మాటల్లో శ్రుతి మధ్యమ స్థాయికి చేరుకుంది.

“మన పెళ్ళికి చేయించాము కదా!” అని అన్నాను మృదువుగా.

“మన పెళ్లయి ఎన్ని ఏళ్లు అయింది?” శ్రుతి మారలేదు.

“నలభై నాలుగు ఏళ్లు అయింది కదా!” మృదువుగానే అన్నాను.

“ఎన్ని తులాలతో చేయించారో గుర్తు ఉందా?” శ్రుతి మధ్యమ స్థాయి దాటేసింది.

“నాలుగు తులాలని అనుకుంటున్నాను.” నా గొంతులో కూడా శ్రుతి పెరిగింది. (ఈ పక్కింట్లో టివిలో ప్రవచనాలు ఆగిపోయాయి. ఆ పక్కింట్లో గ్రైండర్ ఆగిపోయింది.)

“మీ మొహం, తులాలు కాదు కాసులు. మూడు కాసుల కన్నా రెండు మూడు చిన్నాలు తక్కువే.”

“చిన్నం అంటే ఎంత?”

“నాకూ తెలియదు. అప్పుడు మావాళ్ళు అలాగే అన్నారు.”

“మీ వాళ్ళు అన్నదే సత్యమా?” శ్రుతి ఇంకా పెరిగింది.

“ఊళ్ళో వాళ్ళు కూడా అలాగే అన్నారు మరి. అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్లకేముంది? మార్చి ఇంకోటి చేయించుకుందామని అంటే మీరు ఒప్పుకోలేదు ఇప్పటి దాకా!”

“పిచ్చిదానా, మంగళ సూత్రము మార్చరాదు. సూత్రం పెరిగింది అంటారు కానీ తెగింది అనకూడదు. పసుపు తాడు మాత్రమే ఉత్తమం. అవి ధరించే అనసూయ, సావిత్రి లాంటి వాళ్ళు పరమ పతివ్రత లయ్యారు.” శ్రుతి మార్చి మృదువుగానే అనునయించాను అనుకున్నాను.

“నేను పతివ్రతను అయినా, వాళ్ళ కోవలోకి వెళ్ళను కానీ ఈ సూత్రం ఎప్పుడు మార్పిస్తారో చెప్పండి?” ఖరాఖండిగా వినిపించింది స్వరం.

“మార్చను. పెళ్ళినాడు వేసుకున్న మంగళ సూత్రం తన కడదాకా కానీ భర్త గతించిన తరువాత కానీ మాత్రమే తీయవలెను అని వేదాల్లో వ్రాశారు. అది పతివ్రతా లక్షణం!” కఠినంగానే అన్నాను శ్రుతి పెంచి. (పక్కింటి వాళ్ళు మా ఇళ్ళ మధ్య గోడ దగ్గరకి వచ్చిన చప్పుళ్ళు వినిపించాయి.)

“మీరు వేదాల్లో చదివారా?” నిలదీసింది మా ఆవిడ.

“విజ్ఞులు సెలవిస్తే నేను విన్నాను!” నేనూ తగ్గలేదు.

“తమరి ముఖారవిందం. ఈ మంగళ సూత్రంలో ఇప్పుడు ఎంత బంగారం ఉంటుందో చెప్పగలరా?” (గోడ దగ్గర నవ్వులు వినిపించాయి.)

“మూడు కాసులు ఉంటుంది గదా రెండు చిన్నాలు తక్కువగా.” జవాబిచ్చాను.

“ఇదివరలో మూడు మాట్లు పెరిగింది. పెరిగినప్పుడల్లా ఒక సెంటిమీటరు తగ్గింది. మూడు మాట్లు మెరుగు పెట్టించాం. మెరుగు పెట్టించినప్పుడు పావు తులం తగ్గుతుందిట. వెరసి ఇప్పుడు ఒక తులం మీద రెండు,
మూడు గ్రాములు ఉంటుందేమో.”

“అదేమిటి? కాసులనుంచి తులాలకి వచ్చావు.”

“ఈ కాలంలో తులాలలోనే లెఖ్ఖిస్తున్నారు.”

అన్నట్టు బంగారం లెఖ్ఖలు అనగానే గుర్తుకు వచ్చింది. మా ఆవిడకు నగలు ఒక చేతివేళ్ళతో లెఖ్ఖించదగ్గవి మాత్రమే ఉన్నాయిట. రెండు వేళ్ళు మిగిలిపోతున్నాయి అని కూడా బహువిధాల పలుమార్లు విచారించింది. కనీసం ఒక చేతి వేళ్ళనైనా సంతృప్తి పరచమని అనేక మార్లు అభ్యర్ధించింది. ధనాభావ పరిస్థితుల వల్ల బంగారంతో మా ఆవిడ బంధం పెంపొందించ లేకపోయాను. నగలు లెఖ్ఖించడంలో కూడా మా మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. మా పెళ్ళిలో వాళ్ళ వాళ్ళు నాకు పెట్టిన ఉంగరం, నా చిటికిన వేలికే సరిపోవడం వల్ల నేను ఉపయోగించలేకపోయాను. కొంతకాలం తరువాత ఆ ఉంగరానికి, నా చెవి పోగులు జేర్చి తన మధ్యవేలికి అమర్చుకుంది. ఇది లెఖ్ఖలోకి రాదుట. అది నా అకౌంట్ లోకే వెళ్ళుతుందట. ముత్యాలహారంలో బంగారం లెఖ్ఖించ స్థాయిలో ఉండదు కాబట్టి అది బంగారు నగల లెఖ్ఖలోకి రాదుట. ఈ కారణం వల్లే చెవి దుద్దులు, ముక్కు పుడక లెఖ్ఖించ రాదుట. గాజులు ఆడవాళ్ళ హక్కు అలాగే మంగళ సూత్రం, నల్లపూసలు పెళ్ళైన ఆడవాళ్ళ హక్కు కాబట్టి అవి లెఖ్ఖించ కూడదుట. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏదైనా నగ చేయించుకుంటే మా ఇంట్లో విబేధాలు విజృంభిస్తాయి. రెండు మూడు రోజులు ఎడతెగని చర్చలు ఉచ్ఛస్థాయిలో సాగుతాయి. ఆ రెండు రోజులు మా ఇంటి పక్కవాళ్ళు టివి కట్టేస్తారు కూడాను. నా ఆలోచనలలో నేనుండగా మా ఆవిడ తన మనసులో మాట బయట పెట్టింది.

“ఇంకో మూడు తులాలు కలిపితే గట్టి సూత్రం మంచిగా చేయించుకోవచ్చు!” ఉత్సాహంగా అంది.

“నీ గొలుసు ఉంది కదా మూడున్నర కాసులుది. అది, ఇది కలిపితే బంగారం కొనఖ్ఖర్లేదు. మార్చి చేసినందుకు మజూరి ఒక పదిహేను, ఇరవై వేలల్లో వచ్చేస్తుందంటే చేయించుకో.” సౌమ్యంగానే అన్నాను.

“ఆ గొలుసు మా అమ్మది. అది మన అమ్మాయికే చెందుతుంది నా తదనంతరం. అది మార్చడానికి ఒప్పుకోను. ఏం? మూడు తులాల బంగారం కొనలేరా?” కోపంగానే అంది.

నాకూ కోపం వచ్చింది.

“ఇంకా ఎంత కాలం నీ మెడలో ఉంటుందో తెలియని ఆ మంగళసూత్రానికి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టే ఉద్దేశం నాకు లేదు. నువ్వెంత అడిగినా లాభం లేదు.” నా గొంతు నాకే కర్కశంగా వినిపించింది.

ఈ మాట అంటూనే నేనూ తలుపు తీసుకొని వీధిలోకి వచ్చాను. పక్కింటి వాళ్ళు హడావడిగా తమ ఇళ్ళలోకి వెళ్లడం గమనించాను. సాధారణంగా ఇద్దరూ కలిసి వాకింగుకి వెళతాము. ఈ వేళ కోపంగా నేను ఒక్కడినే వెళ్లాను.

చల్లటి గాలి మొహానికి తగులుతోంది. అయినా కోపం ఇంకా చల్లారలేదు. ప్రసన్నాంజనేయ స్వామి గుడి వీధి దాటి నాలుగు అడుగులు వేశాను. దాటుతూ స్వామి వారికి ఓ నమస్కారబాణం కూడా వేశాను, ఎందుకైనా మంచిదని. కొంచెం దూరంలో ఒక శునకరాజు రోడ్డు మధ్య అడ్డంగా పడుక్కొని విశ్రమిస్తున్నాడు. చిన్నప్పటినుంచి కూడా నాకు కుక్కలంటే భయం. భయంతో కూడిన భక్తి కూడా. కుక్క భౌ భౌ అంటే నేను దేవుడికి దండం పెట్టుకుంటాను, నన్ను కరవకుండా చేయమని. వారికి నిద్రాభంగం కలిగించరాదనే సదుద్దేశంతో రోడ్డు పక్కగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. అయిదారు అడుగుల దూరంలో ఉండగానే గ్రామసింహం గారు లేచారు. భౌ భౌ అంటూ నన్ను పలకరించారు. నాకు వారి భాష తెలియకపోవడం వల్ల కంగారు పడ్డాను. అది శ్రుతి పెంచింది. నేను ఆగిపోయాను. నన్ను చూసి అది సరదాగానో, కోపంగానో తన భాషలో భౌ భౌ అంటూ వాదం మొదలు పెట్టింది అని అర్ధం అయింది. దానికి నన్ను చూసి కోపం వచ్చిందో లేక అసహ్యం వేసిందో అర్ధం కాలేదు, కానీ నేను అంటే దానికి ఇష్టం లేదు అని అర్ధం అయింది. దానితో నేను సంభాషణ మొదలు పెట్టాను.

“స్నూపీ” అని పిలిచాను. “కూల్ కూల్” అని కూడా అన్నాను.

అది పట్టించుకోలేదు, మళ్ళీ భౌ భౌ అంది ఇంకొంచెం ఘట్టిగా. నేను వివరణ ఇచ్చుకున్నాను.

“నేను మీ వీధికి రెండు వీధుల అవతల ఉంటాను. రోజూ ఈ దోవనే వెళుతుంటాను కదా. ప్లీజ్ దోవ వదులు.”

ఆ వేళ ఆ సారమేయమునకు తన రోజు వచ్చిందని గ్రహించలేకపోయాను. అది ఇంకొంచెం ఘట్టిగా భౌ భౌ అంటూ ఉత్సాహంగా రెండు అడుగులు ముందుకు వేసింది. అప్రయత్నంగా నేను రెండు అడుగులు వెనక్కి వేశాను.

“నో నో, నేను ఫ్రెండునే!” అని సంజాయిషీ ఇచ్చుకున్నాను. అది వినలేదు. వడి వడిగా ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేసింది, భౌ భౌ రాగాలాపన చేస్తూనే. ఇంతలో దాని మిత్రులు ఒకటి రెండు వచ్చి అవి కూడా వాటి భాషలో, దొరకునా ఇటువంటి కండ! అని రాగాలాపనలో జతకలుపుతూ నా కాలు వాసన చూశాయి.

కింకర్తవ్యం అని కంగారు పడ్డాను. అంతా మిధ్య, పలాయనమే సత్యం అని జ్ఞానోదయం అయింది. వెనక్కి తిరిగి నా కండ వాటికి అందకుండా పిక్కబలం చూపించాను.

దీన్నే భౌ భౌ వాదం అంటారట, మా శర్మ చెప్పాడు. మనం చెప్పేది ఎదుటివాడికి అర్ధం కాదు, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడు. వాడు చెప్పేది మనకి డిటో. మా ఇంట్లో కూడా ఇదే జరిగింది కదా అనుకున్నాను. ఒక గంట సేపు వాకింగు చేసి ఇంటికి తిరిగి వచ్చాను.

తిరిగి వచ్చేటప్పటికి మా ఆవిడ టెలిఫోనులో ఎవరితోనో మాట్లాడుతోంది. నేను బట్టలు మార్చుకొని వచ్చేటప్పటికి ప్రభావతి ఫోన్ పెట్టేసింది. ఒక పదిహేను నిముషాలు నిశ్శబ్దంగానే గడిచింది. ఒక్కొక్కప్పుడు నిశ్శబ్దం భరించడం కూడా కష్టమే. తొందర పడ్డానేమోనని అనిపించింది. ఒక లక్ష పెట్టి చేయిస్తే ప్రభావతి కోరిక తీరుతుందేమో ననిపించింది కూడాను. ఈ భావం ఒక నిముషం కన్నా నిలువలేదు. ఉన్న నాలుగూ లాకర్లోనే ఉన్నాయి. రెండు జతల గాజులు కూడా. మంగళసూత్రం, నల్లపూసలు, రెండు జతల గాజులు మాత్రమే ఒంటి మీద ఉంటాయి. లాకర్లోని గొలుసు మార్చి చేయించుకుంటే నష్టం ఏమిటి? ఆలోచన తెగటం లేదు. వాతావరణం తేలిక పరచాలని,

“ఈ వేళ టిఫిన్ ఏం చేస్తున్నావు?” అని అడిగాను.

“అల్పాహారమా? ఉగ్రాణిని సేయ సంకల్పించితిని!” అని కోపంగానే అంది.

నాకు నవ్వు వచ్చినా ఆపుకున్నాను. ఈ ఉగ్రాణి ప్రయోగం పెళ్ళైన కొత్తలో మొదలు పెట్టింది.

జన్మతః తెలుగుకి నాకు పరమ వైరం. తెలుగు భాషకి వ్యాకరణానికి ఉన్న అవినాభావ సంబంధం నాకు ఎల్లప్పుడూ మా మాష్టారు నా వీపు మీదే బోధ పరిచేవారు. మా మాష్టారు ఎన్ని మృదంగ కచేరీలు చేసినా నాకు బోధపడలేదు. అది వ్యాకరణానికి నా వీపుకి ఉన్న అవినాభావ సంబంధం అని సరిపెట్టుకున్నాను. దురదృష్టవశాత్తు నేను తెలుగు విద్వాన్, ఉ.భా.ప్ర పరీక్షలకు చదువుచున్న ప్రభావతిని పెళ్లి చేసుకోవలసివచ్చింది. పెళ్లి చేసుకొని జోర్హాట్ తీసుకొచ్చిన తరువాత ప్రభావతికి తెలుగు ట్యూషన్ చెప్పించి ఆ పరీక్షలు పాస్ చేయించలేని దౌర్భాగ్యుడిని కూడా. అలా అని ఆవిడ వివిధ సందర్భాలలో తేట తెల్లం చేసింది. అదియునుం గాక, పెళ్ళైన కొత్తలో ఆమె తన భాషా ప్రావీణ్యతను ప్రదర్శించేది. ఆ ప్రదర్సన నాకు మట్టుకే పరిమితం. ఇతరులతో మాములుగానే మాట్లాడేది.

పెళ్ళైన కతిపయ దినములకు, ఒకానొక దినమున (అదేమిటో మా ఆవిడ భాషాప్రయోగం అప్పుడప్పుడు నాకూ అలవాటు అయింది)

“శ్రీదేవీ, నా ప్రియ భార్యామణీ, ఈ వేళ ఉదయం అల్పాహారము నేమి చేయుచున్నదానవు?” అని అడిగితిని.

“ఉగ్రాణిని సేయ సంకల్పించితిని” అని యామె ప్రత్యుత్తరమిచ్చెను. “చేయుచున్న కాదు సేయుచున్న యని యనవలెను” అని కూడా ప్రబోధించింది.

“ఉగ్రాణి అనగా నేమి?” అని అడగబోయి, నవ్వుతుందని అడగడం మానేశాను. ఉగ్రాణి అంటే ఏమై ఉంటుందా అని ఆరు బయట కుర్చీ వేసుకొని ఆలోచించాను. ఉగ్రవాద సంబంధితమేమోనని భయపడ్డాను. కాదు అని సమాధానపడ్డాను. అనుమానం తీరక మా శర్మ దగ్గరికి వెళ్ళి అడిగాను. శర్మ తెలుగువాడే. సాహిత్య పిపాసి నని చెప్పుకుంటాడు. అంటే నాకు తెలియదు. బహుశా సాహిత్యం చదివి పీపాల కొద్దీ కక్కే వాడు అనుకుంటాను. కనిపించినప్పుడల్లా “ఆ పుస్తకం చదివావా? ఈ పుస్తకం చూశావా?” అని అడిగి, వాటి గురించి ఒక అరగంట బుర్ర తినేసేవాడు. వాడు కూడా కొద్దిసేపు ఆలోచించాడు. బహుశా ఏ ఇటాలియన్ లేక ఫ్రెంచ్ వంటకమో అయుంటుంది. ఫెమినాలో చదివి ఉంటుంది అని అభిప్రాయ పడ్డాడు.

“అబ్బే మా ఆవిడ ఫెమినా చదవదు!” అని నొక్కి వక్కాణించాను.

“అయితే తప్పకుండా బెంగాలీయో, మరాఠి వంటకమో అయ్యుంటుంది!” అని బల్ల గుద్ది ఉద్ఘాటించాడు.

“లేడీస్ క్లబ్ రాజకీయాలలో మీ ఆవిడ బెంగాలీ-మరాఠి వాళ్ళ వైపు ఉంటుందని అభిజ్ఞవర్గాల భోగట్టా. వాళ్ళెవరి దగ్గరో నేర్చుకొని ఉంటుంది,” అని కూడా విశదీకరించాడు. నాకు నమ్మకం కలగలేదు. ఇంటికి వెళితే అదే తెలుస్తుంది కదా అని వచ్చి ఉత్కంఠగా ఎదురు చూశాను.

ఒక అరగంట తరువాత ప్లేటులో ఇంత అటుకుల ఉప్మా తెచ్చి నా చేతిలో పెట్టింది.

“ఉగ్రాణి అంటే అటుకుల ఉప్మానా?” అని ఆశ్చర్యపడ్డాను.

“అవును తాలింపు వేసిన అటుకుల ఉప్మాను ఉగ్రాణి అందురు” అని వివరించింది ప్రభావతి. ఇటువంటి చమత్కార ప్రయోగాలు చాలానే చేసేది.

“మీ ముఖారవిందమున కిష్కింధా వాసులు ఉత్సాహముతో ఉరకలు వేయుచున్నారు.”

“మీ వదనచంద్రమున రామ భక్తులు పరవశంతో నృత్యమాచరించు చున్నారు.”

“మీ ముఖపద్మమున తుమ్మల వనమున సూర్యాస్తమయ శోభ విరాజిల్లుతోంది.”

ఈ మాటలు ఆవిడ అన్నప్పుడు నన్ను పొగడుతోందనే అనుకున్నాను. కానీ మా శర్మ టీకా తాత్పర్యం చెప్పినప్పుడే అసలు విషయం, మొదటి రెంటికీ నాది కోతి ముఖమని, చివరిదానికి నా ముఖం తుమ్మల్లో పొద్దు గూకినట్టు ఉంటుందని అని అర్ధమయింది. నిందాస్తుతి అంటే ఏమిటో విడమర్చి చెప్పాడు శర్మ. ఇటువంటివి కూడా ఆ కోవలోకే వస్తాయి అని బొజ్జ నిమురుకొని మరీ చెప్పాడు.

పిల్లలు పుట్టి, పెరుగుతున్నప్పుడు భాషాప్రయోగాలు తగ్గిపోయాయి. కోపం వచ్చినప్పుడు ఏకాంతంలో మాత్రమే నిందా స్తుతి చేసేది. నేను పట్టించుకోవడం మానేశాను. చాలాకాలంగా అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ మొదలు పెట్టింది. సంయమనంతో సంధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేశాను.

“ఈ మాటు కూడా సూత్రం అతికించి, అవసరమైతే రెండు మూడు గ్రాములు బంగారం తగిలించి పొడుగు తగ్గకుండా చేయించుకు వస్తాను. ఒకటి రెండు నెలల్లో శంకరం దగ్గరనుంచి రావాల్సిన లక్ష తిరిగి వస్తుంది. దానితో కొత్తది చేయిస్తాను,” అని చెప్పి సమాధాన పరచటానికి ప్రయత్నించాను.

ఒక అరగంట వాద, ప్రతివాదాల తరువాత మా ఆవిడ తెల్ల జండా ఎగరవేసింది. ఉగ్రాణిని ఆరగించి, కొత్తపేటలోని బంగారం దుకాణానికి వెళ్ళి, సాయంకాలానికి మంగళసూత్రం తీసుకు వచ్చాను.

రెండు నెలలయినా శంకరం లక్ష ఇవ్వలేదు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారట. నా విషయంలో అదే నిజమయింది.

మా ఆవిడ చేతి వేళ్ళ లెఖ్ఖ తగ్గకూడదనే సదుద్దేశంతో, ఈ మధ్యన బజారుకి వెళ్ళినప్పుడు కానీ, మా కాలనీలో వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు కానీ మా ఆవిడకు ఓ సలహా ఇవ్వడం మొదలు పెట్టాను.

“పమిట మెడ చుట్టూ, భుజాలు కప్పుకొని నడువు!” అని.

ఈ మాటలు నేను పురుషాహంకారం చేత అనలేదు. గత కొద్దికాలంగా హైదరాబాదులో గొలుసు దొంగలు చెలరేగిపోతున్నారు. ఇలా వచ్చి అలా స్త్రీల మెడలోని గొలుసులు తెంపుకు పోతున్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నామన్నారు. గస్తీ ముమ్మరం చేశామన్నారు. పది టీములు గొలుసు దొంగల పని పట్టేందుకు పనిచేస్తున్నాయని చెప్పారు. అయినా గొలుసు దొంగతనాలు తగ్గలేదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని వారు సలహా ఇచ్చారు.

మాములుగానే మా ఆవిడ నా మనోగత భావాన్ని గ్రహించకుండా అపార్ధం చేసుకుంది.

“మీ మొహం, అరవై ఆరేళ్ళ ఈ వయసులో నన్ను ఎవరు చూస్తారండి?” అని తీసి పారేసింది.

నా మనోగత భావాన్ని ఆవిడకి విపులంగా విశదీకరించాను. మా ఆవిడ పెళ్ళున నవ్వింది. భళ్ళున నవ్వింది. పడిపడి నవ్వింది. నవ్వి నవ్వి అంది.

“ఏ దొంగాడో తెంపుకు పోతే తప్ప నాకు కొత్త మంగళ సూత్రం వచ్చే మార్గం లేదా భగవాన్?” అని కనిపించని దేవుడిని అడిగింది.

ఒక్కొక్కప్పుడు దురదృష్టం ఎడా పెడా తన్నుతుంది. నా దురదృష్టం మా ఆవిడకు వరమయింది. సరిగ్గా మా ఆవిడ పై వాక్యం అన్నప్పుడు ఆకాశమార్గాన తధాస్తు దేవతలు విహరిస్తున్నారేమో. మా ఆవిడ కొలిచిన భగవాన్ గారి ప్రోద్బలంతో తధాస్తు దేవతలు తధాస్తు అని ఉంటారు. ఈ విషయం పది రోజుల తరువాత అనుభవంలోకి వచ్చింది.

ఆ దురదృష్ట ఉదయం సమయాన, వాకింగ్ అనే కార్యక్రమంలో నేను మా ఆవిడ పక్కనే నడుస్తున్నాను. మోటారు సైకిల్ మీద వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు మా ఆవిడ మెడలో మంగళ సూత్రం, నల్లపూసల గొలుసు పెరిగించుకు పోయారు.

“అయ్యో, అయ్యో!” అని మేమిద్దరం ముక్త కంఠంతో ఒకే శ్రుతిలో అరిచాము.

చుట్టుపక్కల ఉన్న ఇద్దరు పురజనులు “అయ్యయ్యో, అయ్యయ్యో” అని వంత పాడారు.

మోటారు సైకిల్ నంబరు చూడనందుకు చివాట్లు పెట్టారు.

ఇంతలో కింద పడ్డ నల్లపూసల గొలుసులో ఒకముక్క కనిపించింది. గుడ్డిలో మెల్ల అని వాళ్ళు సంతోషపడి మమ్మల్ని కూడా ఆనందించమన్నారు. పోయిన మంగళ సూత్రానికి, నల్లపూసల గొలుసు కోసం పోలీసు రిపోర్ట్ ఇవ్వమని సలహా పాడేసి వెళ్ళిపోయారు.

పోలీస్ రిపోర్ట్ ఇద్దామని నేను అనుకున్నాను కానీ మా ఆవిడ నా అభిప్రాయాన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది.

“తులం మంగళసూత్రం, అరతులం నల్లపూసల గొలుసు పోయిందని చెప్పుకోవడానికి సిగ్గు ఉండఖ్ఖర్లేదా, తెలిసి నలుగురూ నవ్వరా?” అని అడిగింది.

నేను సమాధానం చెప్పలేకపోయాను. ఇంటికి వచ్చేశాము. మూడు రోజులు గడిచిపోయాయి. నాలుగోరోజు ఉదయం కాఫీ సేవిస్తుంటే మా ఆవిడ అంది: “పెళ్ళాం పసుపు తాడుతో తిరుగుతూంటే సిగ్గు లేదు ఈ మనిషికి!”

నేను మాట్లాడలేదు. పేపరు తీసి, మోడిగారి అమెరికా పర్యటనలో ఒబామాగారితో కుదిరిన ఒప్పందాల గురించి మరింత శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను.

“బెల్లం కొట్టిన రాయిలా ఎలా కూర్చున్నారో మాట్లాడకుండా?”

“భారత్, అమెరికాలు కలసి నడవాలని ఒబామాగారు ఉద్భోదించారు.”

“మొన్న అమ్మాయి టెలిఫోన్ చేసింది. కొత్త మోడల్సట, ఐదు తులాల్లో సూత్రం, రెండున్నర తులాల్లో నల్లపూసలు వచ్చేస్తాయట, వాట్సప్పులో ఫోటోలు పంపింది, మీక్కూడా, చూడలేదా?”

“సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో సహాయం అందించటానికి అమెరికా సిద్ధంగా ఉందని ఒబామాగారు పునరుద్ఘాటించారు”

“కావాలంటే ఒక ఏభై వేలు ట్రాన్సఫర్ చేస్తానన్నాడు అబ్బాయి.”

“మోడిగారు హర్షం వ్యక్తం చేశారు.”

పేపరు తీసి పాడేసింది ప్రభావతి.

“మీకు చీమ కుట్టినట్లైనా లేదా?”

“ఎందుకు అంత ఆవేశపడతావు? ఐదు +రెండున్నర = ఏడున్నర తులాలు, వాటికి తరుగు, మజూరి ఇత్యాదులు కలిపి కనీసం రెండున్నర లకారాలు అవుతాయి. ఇంకో రెండు నెలలు ఆగు. ఎఫ్.డీ.లు మెచ్యూర్ అవుతాయి. కొంటాను.”

“కుదరదు. ఇప్పుడు వెళ్ళి ఆ ఎఫ్.డీ.లు తీసెయ్యండి. సాయంకాలం వెళ్ళి తెచ్చుకుందాం రెడీమేడ్ దొరుకుతాయి.”

“వడ్డీ తక్కువ వస్తుందే…”

“ఈ లోపు బంగారం ధర పెరుగుతుంది.”

“అయినా ఐదు తులాలిది ఎందుకే? మూడు తులాలిది నీకు అచ్చి వచ్చింది కదా. నలభై ఏళ్ల పైగా నీ మెడలో నిలకడగా ఉంది గదా,” ఆఖరి అస్త్రం ప్రయోగించాను.

“మీ మొహం, నాలుగు మాట్లు పెరిగింది. అన్నట్టు ఐదేళ్ల క్రితం పెరిగినప్పుడు మీకు గుండె నొప్పి వచ్చింది. పది రోజుల తరువాత మూడు స్టెంట్లతో తిరిగి వచ్చారు హాస్పిటలు నుంచి. నా మెడలో గట్టి ఐదు తులాల మంగళ సూత్రం ఉంటే మన ఇంటి ముందు యముని మహిషపు లోహ గంటలు వినిపించవు.”

“నీ మొహం, నాకోసం యముడు ఎందుకు వస్తాడు? వస్తే గిస్తే యమ కింకరులలో చివరి రేంకు వాడు వస్తాడు.”

“మళ్ళీ మీ మొహమే, నా మంగళ సూత్ర మహిమ వల్ల, నా పాతివ్రత్య ప్రభావం వల్ల, యముడే రావాలి. పతివ్రతా మణుల మంగళ సూత్రం తెంపడానికి అత్యున్నత అధికారి వస్తాడు. అది యమలోకపు ప్రోటోకాల్. గట్టి మంగళసూత్రం వల్ల నా పాతివ్రత్య మహిమ ఇంకా ప్రకాశిస్తుంది ”

నాకు నోట మాట రాలేదు. మా ఆవిడ వాక్చాతుర్యంతో నా మెదడు మొద్దుబారింది. నాకు జలుబు చేసినా మా ఇంటి పరిసరాలలో గంటలు వినిపిస్తాయేమో నన్న అనుమానం పొడచూపింది. “పతి ప్రాణంబులు తప్ప…” అని పాడుకుంటూ యమధర్మరాజు మా ఇంట్లోకి వచ్చేస్తాడేమో నని భయం వేసింది. ఈ మాటు వాద ప్రతివాదాలలో మా ఆవిడే గెలిచింది. మనసును సమాధాన పరుచుకొని, నేను బేంకుకి వెళ్ళి ఎఫ్.డీ బంధాన్ని తెంచుకుని, మా ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని మరోమారు వేశాను.

మా ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని దొంగలకు కనిపించకుండా చేసే వ్రతాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నాను.
----------------------------------------------
రచన: బులుసు సుబ్రహ్మణ్యం, 
ఈమాట సౌజన్యంతో

Friday, April 26, 2019

శబ్దాన్ని జయించి రా!


శబ్దాన్ని జయించి రా!
సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి...................

యుగయుగాల నిశ్శబ్దం ప్రోది చేసుకున్న తపోవనం
దిగంతాలకు వ్యాపించిన పచ్చదనం
అడవిగొడుగు చీల్చుకుని అవనిని తాకాలని
రవికిరణాలు పరితపిస్తాయి
శీలవతి హృదయాన్ని తాకలేని కాముకునిలా

ఊరంతా తిరిగివచ్చి అలసి సొలసిన గాలి
అచటి కొమ్మలెక్కి ఆకులపై నిద్రిస్తుంది
వర్షపు చినుకులో, మంచు ముత్యాలో
వెదురాకుల కొసలు రాలుస్తూనే ఉంటాయక్కడ

భ్రూమధ్యంలో ప్రాణం నిలిపి
తపోమగ్నులై అక్కడొక మహర్షి.

“మునిపుంగవా!
ఈ దాసుని తమ శిష్యునిగా స్వీకరిస్తారా?
మీ పాదుకల చెంత నాకింత చోటుందా?”

జంట సూర్యులవలె ప్రకాశిస్తూ తెరచుకున్నాయి ముని నేత్రాలు.

“ఎవరు నీవు?”

“సన్యసించ వచ్చిన రాజును నేను
తెరలుతెరలుగా ముసిరిన
కనకముపై అనుకాంక్షను
కాంతపైని కాముకతను
అవనిపైని ఆపేక్షను
జ్ఞానఖడ్గంతో ఛేదించి
అబద్ధాన్ని తన ప్రపంచానికే అప్పగించి
పరమార్థాన్ని వెదుక్కుంటూ బయలుదేరి వచ్చాను
మునివర్యా కనికరించండి”

కళ్ళతో మనసు లోతుల్ని శోధించిన మునివర్యులు
ప్రశాంతంగా ప్రశ్నించారు:

“నాయనా!
వచ్చిన దారిలో నువ్వు
ఏయే శబ్దాలను విన్నావు?”

“పక్షుల కలరవాలను విన్నాను
రాలినపడిన పండుటాకులపై మృగాల
సయ్యాటలు విన్నాను
మూగవైన గట్లతో నది ఆపక సలిపే
మధుర సంభాషణలు విన్నాను
పూల తపస్సును భంగపరుస్తున్న
తుమ్మెదల ఝంకారాన్ని విన్నాను
గజరాజును వెదుకుతున్న
కరిణి ఘీంకారాన్ని విన్నాను”

మూసుకున్న కనురెప్పల వెనుక
జంట సూర్యులవంటి ముని నేత్రద్వయం మరుగయింది.

“పరిపక్వత రాలేదు కుమారా
తేలిపోయే బెండు నేలనంటదు
వెళ్ళు, ఇంకొన్నేళ్ళు గడచిరా!”

కొన్ని వేల సూర్యుల
అస్తమయాలను చూసింది గగనం

కొన్ని కోట్ల పూలను
విదిల్చి రాల్చింది వనం

ఎన్నో రేపవళ్ళు పుట్టి పెరిగి
కాలగర్భంలో కలసి కరిగిపోయాయి.

ఒకనాడు…

కురిసిన మంచు తెల్లదనం, కరిగే రాత్రి నల్లదనం
ఇంకా విడివడని ఒక ప్రభాత సమయాన
మళ్ళీ
అదే స్వరం అదే మాట –

“మునిపుంగవా!
ఈ దాసుని తమ శిష్యునిగా స్వీకరిస్తారా?”

తెరచిన ముని కళ్ళలో మళ్ళీ
జంట సూర్యుల ప్రకాశం

“ఇప్పుడు చెప్పు!
ఏయే శబ్దాలను
వచ్చిన దారివెంట విన్నావు?”

“నెలవంక పొదలుకొనే అలికిడి విన్నాను
వినువీథిని తారల గుసగుసలు విన్నాను
వికసించే పూమొగ్గల సుతిమెత్తని సవ్వడిని
ఉషస్సును చూసి తప్పుకునే
చీకటి సడిని విన్నాను
నా యెద లోతుల్లో ఉబికే
కన్నీటి జడిని విన్నాను”

ముని పెదవుల పైనుండి
జ్ఞానం తొణికిసలాడే మృదుహాసం
జాలువారింది.

“కూర్చో,
పాదుకల ప్రక్కన కాదు
పులి చర్మంపై నా సరసన”

తూర్పున
నక్షత్రాలను వీడ్కొలిపిన ఆకాశం
సూర్యునికి స్వాగతం పలుకుతోంది.
---------------------------------------------------------
రచన: చంద్ర మోహన్ 
మూలం: తమిళ కవి వైరముత్తు, కొంజమ్ తేనీర్
 – నిఱైయ వానం, 2005 (కొంచెం తేనీరు – బోలెడంత ఆకాశం) 
కవితా సంపుటి నుంచి ‘సబ్దంగళ్ కడందు వా’ అన్న కవిత. 
ఈమాట సౌజన్యంతో

Thursday, April 25, 2019

జన్మజన్మల స్పృహ


జన్మజన్మల స్పృహ
సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి..................

తప్పకుండా
గత జన్మలో నేనొక పుస్తకాన్నే అయ్యుంటాను.

పుస్తకాలు మదిలోకొచ్చిన ప్రతిసారి
ఎక్కడెక్కడికో వలసపోయి మరీ
వాటిలో, వాటి విషయ పరంపరలో భాగమైపోతుంటాను.

గ్రంధాలయాల్లో, పుస్తకాల షాపుల్లో,
అలమరల అరలలో,
చక్కగా ఒక పుస్తకాన్నై ఇమిడిపోతుంటాను.
అక్కడ మొలిచే రెక్కలతో
ఎక్కడెక్కడికో స్వేచ్చగా ఎగిరిపోతుంటాను.

వ్రాస్తూ చెరిపేస్తూ వ్రాసుకుంటూపోతున్న
బాల్యపు నల్ల పలకే కదా జీవితం!
దానిని పుస్తకంగా పదిల పరచి
పరవశించి పోతుంటాను.
కాగితాల రెపరెపల్లో
సువాసనని
ఇష్టంగా ఆస్వాదిస్తూ వుంటాను.

అందుకేనేమో, ఎంతకీ తీరని దాహమొకటి,
ఎప్పుడూ నొక్కి వక్కాణించి మరీ చెబుతుంటుంది.
“ఐతే మరిన్ని పుస్తకజన్మలు తప్పకుండా ఎత్తుతావని,
లేకుంటే, ఈ జన్మలోనే అనేక జన్మలకు సరిపడా బతుకుతావని”.
--------------------------------------------------------
రచన: గరిమెళ్ళ నారాయణ, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, April 24, 2019

సీతా-రామా


సీతా-రామా
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..............

సీత
నరాలు నరాలుగా, సన్నగా, బలహీనంగా, అక్కడక్కడా వాపుల్తో భయంకరంగా, భయం-భయంగా, చిన్నప్పుడు మా ఇంట్లో వున్న ఎప్పటిదో తెలియని, మా తాతని, నాన్ననీ, నన్నూ చూసిన ఆ చెట్టు, మెలితిరిగి, ఎండిపోయి, నెర్రెలిచ్చి, బతికుందో, చచ్చిపోయిందో తెలియకుండా మోడుబారిన ఆ చెట్టులా, యెప్పటినుంచో, అనాదినుంచి గుర్తు తెలియని చితిలో కాలుతున్న, గుర్తులేని కలలో కలిగిన భయంలా, బతుకులోనే చావుని చూసి, చావునే వూపిరిగా బతుకుతున్న శవంలా, నిజంలా, నిస్తేజంగా ఈ కుర్చీలో నేను. గుండే, మనసు ఎండిపోయి, మండిపోయి, నేడంటే, రేపంటే భయంతో, నిన్న, మొన్నని దాటి, గతకాలపు లోతుల్లో, లోలోతుల్లో ఎండిన కన్నీటిచుక్కలా నేను, ఆరిన వెలుగుల రవ్వగా నేను.
రామ…రామా.

రామ
రామ….రామా, మళ్ళీ పిలుస్తున్నట్టున్నాడు. వినిపించీ వినిపించనట్టూ, తప్పుచేసినవాడిలా, దొంగలా, భయం, భయంగా. మంచినీళ్ళేవైనా కావాలేవో, లేకపోతే మళ్ళా ఏ muscle cramp ఏవైనా వొచ్చిందో. మంచినీళ్ళాయితే కాసేపు ఆగగలడులే, muscle cramp ఐతే మల్లా పిలుస్తాడులే, నేనీ చాప్టర్ చదివేసిపోతా. పిలవిటవైతే పిలుస్తాడుగానీ ఎప్పుడో తప్ప ఏవీ అడగడు. రెప్పలు మాత్రం తెరుస్తాడు. అది చూపులా వుండదు, మనిషిని తడివినట్లనిపిస్తుంది. ఎప్పుడో, ఎక్కడో పోయిన వస్తువేదో చేతులకందకుండా కళ్ళకి మాత్రవే కనిపించినట్టు. చిన్నప్పుడెప్పుడో తెగిపోయి, ఎగిరిపోయిన గాలిపటం తన కళ్ళకి మళ్ళీ కనపడినట్టు.

కొంచెం ఆ కుర్చీలోంచి లేచి అటూ ఇటూ నడవొచ్చుకదా. కాసేపలా బయటకి ఏ ఫ్రెండ్స్ దగ్గరకో పోవొచ్చుకదా. బుక్స్ అంటే వొకప్పుడు ఎంతిస్టం, కనీసం ఏ లిబ్రరీకో అలాపోయిరావొచ్చుకదా. ఊహూ, ఆ కుర్చీలో వొక భాగమైపొయ్యాడా అనిపిస్తుంది. అప్పుడప్పుడూ రామా, రామా అని పిలవటం తప్ప. మూసుకున్న కనురెప్పలు తెరుచుకోవు, అప్పుడప్పుడూ విచ్చీ, విచ్చని పెదాలమద్య మెరిసీ మెరియని చిరునవ్వు తప్ప. తపస్సులో వున్నట్టు, ఏ లోతుల్లో, ఏ ఏ ఙ్ఞాపకాలను వెతుక్కుంటున్నాడో, ఏ ఙ్ఞాపకాల్లొ ఇమిడిపోయిన ఏ అనుభవాల్లోంచి మెరిసే మెరుపో ఆ విరిసీ విరియని చిరునవ్వు. నేనేనా? నాకోసవేనా?

ఎప్పటి సంగతి. దశాబ్ధాల క్రితం. “రామ, రామ,” ఆ గొంతులోనుంచొచ్చే ఆ పిలుపు నాలో ఎంత సంతోషాన్ని నింపేది. చేస్తున్న పని అంతటితో చెల్లు. వొకచిన్న చిరునవ్వు, క్షణకాలపు స్పర్శ, తన కళ్ళలో ఎంత ప్రేమ, నా గుండెల్లో ఎంతానందం, క్షణవే, మళ్ళా తన పనిలోతను,నా పనిలో నేను. గుండెనీ, మనసునీ ముంచేసే ఆనందపు క్షణాలు. ఎంత చల్లని చిరునవ్వు, హాయిగా, ప్రేమగా, ఎంత ఆప్యాయతను పంచే నవ్వు. నా హృదయం ప్రేమ సముద్రమయ్యేది. తన గొంతులో, స్పర్శలో, నవ్వులో నేనే, నేనే, నేనే. తన పెదాలు పలికే ఆ శబ్దం ఎంత ప్రేమని మోసుకొచ్చేది.

సీత
ఇప్పుడు పెద్ద నొప్పేంలేదు. మొదట్లో కొంచంవుండేది కాని. మొదట్లోకూడా అంత నొప్పేంలేదు, కాకపోతే భయం, కోపం, అసహ్యం, నా సొంత శరీరం నన్ను మోసం చేస్తున్నందుకు. అబ్బా ఈ muscle cramp ఇంకా పొలా, తనొచ్చి కొంచం మసాజ్ చేస్తే బావుండు. చాలాసార్లు నాకేదో అవసరం వుండి తనని పిలవను. తనెక్కడో ఆ మూల కూర్చుంటుంది. ఇక్కడనుంచి కనపడదు. పిలవంగానే కాకపోయినా, వొకటి రెండు నిమిషాల్లో వస్తుంది. తనని చెయ్యి పట్టూకోని వొళ్ళోకి లాక్కొనే స్వాతంత్రం నాకిప్పుడు లేదు. నా వొళ్ళో కూర్చొనే ఇష్టం తనకుందని నేననుకోను. మాత్లాడడానికి గొంతురాదు. గుండె గొంతులో కొట్టుకుంటుంది, స్పర్శ, వినికిడి, మొదలైన senses అన్నీ వొక్క చూపులోనె కలసిపోయి, నా కళ్ళ నిండా, మనసు నిండా, గుండె నిండా తన రూపం నిండిపోతుంది. కళ్ళే మాటలవుతాయ్, తనవొంటిని తడువుకునే చేతులవుతాయ్, తన మనసుని నింపుకునే నిశ్శబ్ధపు గుండెలవుతాయ్.

రెండు మూడు అవసరంలేని నా పిలుపుల తర్వాత, తను వచ్చి నా ఎదురుగా వుండే కుర్చీలో కూర్చుంటుంది. తనకి తెలుసా తనిక్కడ కూర్చుంటే నా కిష్టవని, తనని చూస్తూవుండటం నాకిష్టవని. హా.. నొప్పితగ్గిపోయింది, తను కుర్చీలోంచి లేచిన అలికిడయింది.

రామ
మళ్ళా ఏ అవసరం లేని పిలుపు. తనకి నేనీ మూల కూర్చుంటే ఎందుకో ఇష్టం వుండదు, అప్పుడప్పుడూ పిలుస్తానే వుంటాడు. ఇప్పుడిక్కడ తన ఎదురుగానే కూర్చున్నా కదా, ఇంక పిలవడనుకుంటా. ఎందుకో, తనకేంవస్తుంది నేనిక్కడ కూర్చుంటే? ఇద్దరి మద్య మౌనం తప్ప మరేవుండదు. ఎప్పుడన్నా అలసిపోయిన కళ్ళకి విశ్రాంతినీయడానికి నే పుస్తకం మూస్తే, మళ్ళా అదే చూపు, అప్పుడే పుట్టిన బిడ్డని తల్లి చూసుకునే చూపు, వొళ్ళంతా తడివే చూపు, కళ్ళనిండా మనసుని నింపుకున్న చూపు. ఏవొస్తుంది నేనిక్కడ కూర్చుంటే తనకి. ఏవుంది నాలో చూడ్డానికి? ఏవుందినాలో, వయసు తెచ్చిన విస్ఫోటనం తప్ప, ఏవుందినాలో మమత చచ్చిన స్తబ్ధతతప్ప, ఏవుంది నాలో గతం మిగిల్చిన కన్నీరు తప్ప, ఏవుందినాలో నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం తప్ప, ఏవుందినాలో? కొద్దో గొప్పో ఇంకా నిన్నటి రామ లక్ష్మి గుర్తొచ్చే నా మొహానికి నే చదివే పుస్తకం అడ్డు. మరింకేం చూస్తాడు నాలో. కళా కాంతి లెక ఎండిపోయి ముడుతలు పడిన చర్మం చుట్టిన ముడుసులు తేలి వంకరపోయిన కొమ్మల్లాంటి నా చేతుల్నా? ంఅడతలు మడతలుగా, ఎన్ని మడతలో నేనే లెక్క పెట్టడం మానేసిన నా పొట్టనా? కప్ప కాళ్ళ లాగానో, మరే పక్షి కాళ్ళలాగానో నరాలు, ఎముకలు తప్ప కండలేని నా పాదాలనా? ప్రాణాన్నంతా కళ్ళలో పెట్టుకోని ఏంచూస్తాడు నాలో, పెదాలపై విరిసీ విరియని ఆ చిరునవ్వులో ఏం దాస్తాడు తనలో?

అందానికి నాకూ చాలా దూరం. వొక మాదిరిగా వుంటావనేది మా అమ్మ. కొచం షోకు చేసుకుంటే పరవాలే ఏవరేజ్ గా వుంటావనేది అక్క. ఎంత ఎత్తుకు తీసుకపోయాడో నన్ను, ఎంత అందాన్ని నాలో నింపేడో. పరవాలేదనే రామలక్ష్మిని, ఏవరేజ్ రామలక్ష్మిని, తన ప్రేమతో ఎంత అందంగా మలిచాడో. నా కురులు, నా కళ్ళు, నా పెదవులు, నా చేతులు, నా గుండెలు, నా పొట్టా, నా కాళ్ళు, నా పాదాలు, నా ప్రతి అవయవం అందంతో పులకరించేలా, ఎంత ప్రేమని, ఎంత ఆనందాన్నీ నింపాడో నాలో.

నా గొంతు, కళ్ళు, శరీరం, నా స్పర్శ ఏ లోతుల్లో ఏ అనుభూతుల్ని సృజించేదో, నా వొడిలో మూర్చనలు పోయే తన అనుభవం ఎంత ఆనందాన్ని నింపేదో నా గుండెల్లో, ఎంత పరవశాన్ని పంచేదో నా శరీరంలో. ఎక్కడనుంచి, ఏ కనపడని కోణాల్నించి, ఏ పరవశాల్నించి వుద్భవించేదో అంత ప్రేమ, అనంతవైన తన ప్రేమ, తనువూ, మనసు, ఊహా, కల, మునిగి, కరిగి, లయించిపోయే వుప్పెనలా ఉవ్వెత్తునెగిసిపడే ప్రేమ, నిశ్శభ్దంగా పారే నిండునదిలాటి ప్రేమ, అమ్మలాటి, కడుపున పుట్టిన బిడ్డలాటి, పచ్చని చెట్టులాటి ప్రేమ.

ఎన్ని రాత్రులు గడిపేవో, వొకరి శరీరాన్ని వొకరు పఠిస్తూ, మరలా, మరలా ఆ శిఖరానందాన్ని చేరుతూ. శృంగారానికి పరాకాష్ట ఐన ఆ అమరానందాన్ని చేరుతూ. మనిషికీ, మనసుకీ ఆవలితీరవైన ఆ అనుభూతిని, నిర్వాణంలా, ఒకే సమయంలో నిశ్చలవూ, అనిశ్చలవూ ఐనటువంటి ఆ స్థితిని చేరుతూ, ఎన్ని రాత్రులు గడిపేవో. ఎన్ని గంటలు దొర్లిపోయాయో ఇద్దరిమధ్యా నిండిపోయిన నిశ్శభ్దంలోకి, కళ్ళూ, పెదవులూ, తడువుకునే చేతులూ, మెత్తని గుండెల్లో వొదిగిపోయే ముఖాలు, చల్లని వొడిలో దాగిపోయే సుఖాలు. ఏవి మాట్లాడేవో మా కళ్ళు మౌనంగా, పెనవేసుకున్న చేతి వ్రేళ్ళనుంచి ఏ ఏ భాషలు ప్రవహించేవో, కలసిన అధరాలు ఏ కవితల్ని సృజించేవో, పలుకన్నది రాని మా గొంతుల్లో ఎన్నెన్ని సంతోషాలు నిండేవో. ఇద్దరి మనుషుల్లో మనసొక్కటే వుండేది, మమతొక్కటే నిండేది.

ఎందుకీరోజు మనసు గతంలోకి పరుగెత్తుతుంది. ఎంతకాలం క్రితం సంగతులివి. దశాబ్ధాల క్రితం గుర్తులివి. ఈ క్షణం జరిగినట్టూగా ఎందుకిలా? నా పెదవులపైన తన పెదవుల వెచ్చదనం నాకింకా తెలుస్తూనేవుంది, నా జడలో తను చూసిన మల్లెల వాసన నా మనసులోకి వీస్తూనే వుంది, ఇంకా నా గుండెల్లో తన ప్రేమ ఉప్పెన పొంగుతూనేవుంది. కానీ ఇది వొక జ్ఞాపకవే, అనగా అనగా చందమామ కథల్లోలా ఎప్పటీదీ జ్ఞాపకం?

తనెదుటినించి లేచిపోతే కొంత ఉధ్రుతం తగ్గుతుందేవొ, కానీ నాకు తెలుసు వొకసారి మొదలైన ఈ ఉత్పాథం చల్లబడడాని చాలా కాలవే పడ్తుంది. Let me go to my corner chair…, that is where I may read a little…, that is where I may stop reliving these memories again and again.

సీత
నా ఎదురుగావున్న ఈ కుర్చీనొకసారి చెక్ చెయ్యాలి తను ఏ గుడికో వెళ్ళీనప్పుడు. మెత్తలు పాతపడిపోయి కూర్చోడానికి సరిగాలేవేవో. తను మళ్ళా నాక్కనిపించని ఆ మూలకెళ్ళిపోయింది. ఈ కుర్చీ సంగతి మాత్రం తప్పకుండా చూడాలి. కానీ తన సమస్య కుర్చీనా, నేనా? ఈ నాలుగడుగుల సాన్నిహిత్యం, నా చూపు, నా రూపు తనకి నచ్చవేవో, లేకపోతే నే పిలిచే ఆ నాలుగక్షరాల పిలుపు మళ్ళా మళ్ళా వినాలనేవో.

“రామా,” ఆ పిలుపు నా పెదవుల పైనుంచి కాదు వచ్చేది. ఆ పిలుపు నా మనసులోంచి గుండెల్లోకి పాకి, నాలో ప్రతి కణాన్నీ సృశించి, పులకరింపచేసే అనుభూతిలా, నాకు తెలియని నా అంతరాంతరాల్లోంచి వచ్చేది. తనంటే నాకెంతిష్టం. తననోదిలి ప్రొద్దునపూట ఆఫీస్ కి పోవటం యెంత కష్టంగా వుండేదో, తననుంచి నన్నునేను చీల్చుకుని పోయినట్టుండేది. సాయంత్రం సమస్య మరింత జఠిలంగా వుండేది, ఆ న్యూయార్క్ ట్రాఫిక్‌లో చిక్కుకపోయిన ప్రతి నిముషం దోసిట్లో అమౄతం బొట్టూ, బొట్టూగా చేజారిపోయినట్టుండేది.

మెత్తటి, చల్లని కాటన్ చీర, ఎర్రెర్రని కుంకుమబొట్టు, సాయంత్రపు న్యూయార్క్ రొచ్చులోంచి, మెత్తటి తన కౌగిలిలోకి, చల్లటి తన ప్రేమలోకి. అబ్బా మళ్ళా ఈ చేయెందుకో నొప్పిగావుంది, ఇది క్రేంప్ కాదు, కానీ సన్నని ఏదో అనీజీనెస్. ఆ న్యూయార్క్ సాయంత్రాలు, మేవిద్దరం ఆ గుమ్మం దగ్గర, ఆ క్షణంలో ఇద్దరంలా వుండేవాళ్ళం కాదు, వొకటై కలసిపోయేవాళ్ళం. సన్నని షాంపూవాసనతో కలిసిన మైసూర్‌శాండల్ సబ్బు వాసనలో కలగలిసిన వెచ్చని సన్నని చవట వాసన, మెత్తని కాటన్ శారీ, వీటన్నిటి మధ్యా మెరిసే కళ్ళు, ఎగసే గుండెలు. నా చేతుల్లో వొదిగిపోయిన నా చిన్నిపాపలా. మనసెగిరి పడుతుంది, నా చేతుల్లో నేనే నమ్మలేని వొక మహా అద్భుతం ఉదయిస్తుంది. నా కడుపున పుట్టిననా కూతుర్ని నే నెత్తుకున్నట్టు, బేబీ powder, అప్పుడే పట్టిన విటమిన్ డ్రాప్స్, తలకంటుకుని మిగిలిపోయిన సాంబ్రాణి పొగ వాసన, బుజ్జికడుపులో నిండిన పాలలో వెనక్కొచ్చిన వొకటి రెండు చుక్కలు, చిన్ని, చిన్ని చిరునవ్వు, తళతళ మెరిసే కళ్ళూ, పువ్వుల్లాంటి పాదాలు, కొచం చెదిరిన కుంకుమతో అమ్మలా కరుణ కురిసే ఆ కళ్ళూ, కొంగుతో నా మొహం తుడిచినపుడు మెత్తని అమ్మ చీర కొంగులా ఆ కాటన్ చీర ఇవన్నీ కలిసి సృష్టించే వొక మహాద్భుత అనుభవం, ఆ సాయంత్రం తనవొడిలో ఆ నిముషం. నా రక్తం పంచుకుని పుట్టిన నా బిడ్డా, నాకు రక్తం పంచిచ్చిన మా అమ్మ, నా బతుకులో భాగవైన నా రామలక్ష్మి, ఆ సాయంత్రం, ఆ క్షణంలో వీళ్ళందరి ప్రేమ నాకు తన వొడిలో దొరికేది. I think when you traverse to the higher layers in love…, the differences that exist down below may disappear. Love for your wife…, kids…, parents…, family…, friends…, relatives…, and humanity becomes one and the same. The consciousness of love melts and disappears into that sublime divinity of love.

రామ
ఏవైంది, ఆ ప్రేమంతా ఏ లోకాలకేళ్ళిపోయింది? ఏ కనిపించని గాలిలో కలిసిపోయింది? ఏ బతుకు పరుగుల్లో, ఏ డాలర్ నోట్ల జిలుగుల్లో జారిపోయింది? ఈ హైదరాబాద్ మహానగరం మా ప్రేమని మింగేసిందా? లేకపోతే న్యూయార్క్ నగరవే ముచ్చటపడి వుంచేసుకుందా? నాకు తెలియదు, నిజంగా తెలీదా, కారణాల్ని తర్కించటం ఇష్టం లేదా? వొక్కొక్కసారి అనిపిస్తుంది సీత ని నలభైలు మార్చేసేయని, he suddenly transformed into an egotistic chaser of materiel and fame. లేకపోతే హైదరాబాద్ నగరం నన్నే మార్చేసిందో. ఎంతకాలం తర్వాత మళ్ళీ ఈ నగరంలో, మా ఇద్దరికీ ఇష్టవైన, అత్యంతిష్టవైన, కలలుగన్న ఈ తెలుగు నగర జీవితం. వొక్కసారిగా వాస్తవాన్నించి కలలోకి దూకినట్టు. మా మితిమీరిన ఉత్సాహంలో, ఏదైతే న్యూయార్క్ లో మా ప్రేమకి, మా సంతోషాలకి మూలవై నిలిచిందో, దాన్నే, ఆ సాన్నిహిత్యాన్నే హైఎదరాబాద్‌లో కోల్పోయాం. న్యూయార్క్ లో we were a team. It was us against that big apple. We struggled…, we fought our fights together…, we were but two people pitted against all powerful city like NY. Friends were formal…, parties were nothing but to show the materiel wealth to each other…, festivals were so routine. So we both were oasis to each other to relax and recuperate. హైదరాబద్ లో గాడి తప్పిన సమీకరణం. ఇక్కడ స్నేహితులు, స్నేహితులే, మొహవాటాలు కాదు. ఇక్కడ మా పోరాటాలు మాకే పరిమితం కాదు, మతోపాటూ నిలిచే హితులూ, సన్నిహితులూ. ఇక్కడ తను సాయంత్రాలు నాకోసం పరుగెత్తాల్సిన అవసరం లేదు, నేను తనకోసం ఎదురుచూసే తీరిక లేదు. తన దగ్గరో ఇంటి తాళాం ఉండేది.

చల్లని సాయంత్రాలు, వెచ్చని కౌగిళ్ళు, తనివితీరని ముద్దులు, పసిపాపలాంటి నవ్వులు, మనసులు, మమతలూ, స్పర్శలో అగ్ని జ్వలించే తపనలూ, కళ్ళాలో మనసు ప్రథిఫలించే మమతలు, అనంతంగా చుట్టుముట్టే కోరికలూ, ఆనందంతో ఎగిసిపడే గుండెలూ, నెమ్మది, నెమ్మదిగా మా చేతుల్లోంచి జారిపోయాయ్. ఎప్పుడొ వొకసారి కౌగిల్లోకి చేరినా, అది శారిరకవసరవే. మనసులో పరచుకుంటున్న శూన్యం, జారిపోయే ప్రేమ స్థానం లో నిండుకుంటున్న శూన్యం. ఏవైంది నాకీరోజు. ఎంతకాలవైంది, నా బుగ్గలపైన ఈ వెచ్చని కన్నీరు కారి, ఎవైంది నాకీరోజు. నాకు, నాకు ఏడవాలని లేదు, దేవుడా నాకేడవాలని లేదు.

సీత
న్యూయార్క్ లో మాకేప్పుడూ సమయం ఉండేది, తను జాబ్ చేయ్యటం మొదలైనతర్వాత కూడా. ఎప్పుడైనా వర్క్ లోడ్ పెరిగినప్పుడు తగ్గిన సమయాన్ని compensate చేస్తూ, గడిపే ఆ కొద్ది సమయాన్ని హిమలయాల ఎత్తుకు తీసుకపోయేది మా ప్రేమ, ప్రతి నిముషం వొక స్వర్గ ఖండవై, శరీరాన్నీ, మనసునీ అలౌకికానందంలో తరింపచేసేది మా ప్రేమ.

వొచ్చే జన్మంటూ వుంటే నేను తన హృదయాన్నై పుట్టాలని కోరుకునే వాడిని. తన మనసులో, శరీరంలో భాగవైపోడానికి. నిజవే గుండె రక్తాన్ని పంప్ చెయ్యడం తప్ప మరేదైనా చేస్తుందనుకోవడం నిజంగ పిచ్చితనవే. మెదడు ఇంకా మనసుకి కొచం దగ్గరేవో. కానీ మెదడు కూడా, వొక జీవకణ సమూహవే. వొక భౌతికవైన అస్థిత్వం కలదే, మనసులా చేతికి దొరకంది కాదు, కళ్ళకి కనపడనిది కాదు, ఊహలో మాత్రవే వుండేది కాదు. Brain may be the engine behind it…, but mind is conscious of itself.

Mind is the home of love. The natural…, biological mechanisms…, like procreation impulses they come from those hard wired memory that we call double helix…, the DNA. Love is not just an impulse of procreation. Love is not just two naked bodies rolling together and producing babies. It is that, and also much more. Of course…, there is happiness in that basic instinct of procreation too. There should be…, because that is what drives biological life. So nature bribes us for that act of procreation with that intense happiness that we call orgasm. But mind with all its infinite powers of creation…, it took that biological instinct of procreation and turned it into an emotional volcano of love. Love for the person that you procreate with and what is the result…, an immense…, infinite amalgamation of those biological orgasms. If a biological orgasm is a blast furnace in a steel mill…, then the emotional orgasm that you experience with a person that you love is the Vesuvius volcano in continuous explosion.

నాకు పిచ్చి పట్టడం లేదు కదా. ఇప్పుడెందుకీ ఆలోచనలు. ఆ అగ్ని పర్వతం చల్లారి సంవత్సరాలు గడిచినాయ్. కలగా మాత్రవే మిగిలిన గతంలో దేనికోసవీ దేవులాట, కాడు రమ్మని పిలిచే ఈ వయసులో ప్రేమకోసం ఈ పరుగులాట.

బాగా వెతుక్కో సీతా, జ్ఞాపకాలు అంతవయ్యే సరిహద్దులో, వెయ్యి కళ్ళతో వెతుక్కో. వెల్లికిల్లపడి వెయ్యి కాళ్ళతో కొట్టుకునే పురుగు కనిపిస్తుందేవొ. ప్రేమని ఆశ, స్వార్థం, మూర్ఖత్వం జయించిన నిముషం లో మనిషికీ పురుగు కీ మధ్య అంతరం కరిగిపోయిన నిముషంలో నువ్వింకా సీతగానే వున్నావో కాఫ్కా పురుగ్గా మారిపోయావో.

రామ
ఈ నవల చదివిన ప్రతిసారీ, నా మనసు “అన్నా” ని ప్రాధేయపడుతుంది, చనిపోవొద్దని, ప్రేమని చంపేయొద్దని. అన్నా కూడా వొక ఊహే కదా, ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం టాలస్టాయ్ మనసులో ప్రాణం పోసుకున్న కలే కద.కానీ ఈ రోజు నాకనుపిస్తుంది, అన్నానా నేను ప్రాదేయపడుతున్నాను, లేక నన్ను నెనే ప్రాధేయపడుతున్నానా? So much of love between Anna…, and Vronsky…, how could she punish him with her death. How could she do that knowing that it will ruin him physically and emotionally. మన మనసుల్లో అంత శక్తి వుందా? మనం ప్రేమించే మనిషిని, హింసించి, శిక్షించగలిగే శక్తి. ఇంత ప్రేమని దాచుకోగలగే మన మనసులో, ఇంత కౄరత్వం కూడా దాగుందా? నా సీతని శిక్షించేంత కోపం, కసి, కౄరత్వం, నాలో వున్నాయా? నే వేసిన శిక్ష వేరెవరికి తెలీకపోవచ్చు, నాకు తేలీదా. తన మనసుకి తేలీదా? నా కోపం, నా కసి, నా అరుపులు, నా నిర్లిప్తత. నా నిర్లిప్తత, తన పట్ల, తన ప్రేమ పట్ల, నిర్లిప్తత, నిర్లక్షం తననెంత బాధపెట్టేయో, నన్నెంత బాధ పెట్టేయో. అర్థం పర్థం లేని తగవులు మామద్య ఎంతదూరాన్ని పెంచాయో. ఇద్దరం సంఘంలో పైకెదిగేం, కానీ వొకరి మనసులో వొకరం పాతాళానికి జారిపొయ్యాం. ఈ మెటీరియల్ rat చేజ్ లో ఐతే విజయం సాధించాంగానీ, ఆ విజయంలో జారిపోయిన జీవితాన్ని గమనించలేకపోయాం.

ఈ ఏడుపీరోజు ఆగదా? ఎంత బలవైన కోట కట్టేన్నేను నా మనసు చుట్టూ. ఎవరిచ్చారీ జ్ఞాపకాలకి ఈ శక్తి? ఏ శక్తినావహించాయోగానీ ఈ రోజిలా నా గుండె గోడల్ని బద్దలు చేసివుప్పొగుతున్నాయెందుకు, నా కళ్ళలో ఇలా చిప్పిల్లుతున్నాయెందుకు? బతుకు ఆఖరి పాదంలో నిల్చున్న నేనీ గతం ఉప్పెనని తట్టూకోగలనా. అయ్యో, దేవుడా, చావుకుముందు యెందుకిచ్చావయ్యా నా మనసు నాకు, ఎప్పుడో పారేసుకున్న నా ప్రేమ నాకు, దేవుడా, సీతా! నా ఇంటికి వొక్కో కొత్త అంతస్తు లేస్తున్నపుడు, నా వౄత్తిలో వొక్కో మెట్టూ ఎక్కడనికి, నా బంగారు సాయంత్రాలని వదిలెసుకున్నపుడు, సంఘంలో నా పరిధిని పెంచుకునే ఆత్రుతలో పడగ్గదిని స్మశానంగా మార్చినపుడు, శౄంగారాన్ని రెండు నిమిషాలకి కుదించినపుడు, బయట విజయాల్లో అలుపు ఇంట్లో కోపంగా, విసుగ్గా, వాదనగా మారినపుడు, నా జీవితం, నా కిష్టవైన నా జీవితం, బంగారు కలలాటి నా జీవితం నన్నొదిలిపోతున్నపుడూ ఇచ్చుండకూడదా. నా మనసును, నా ఇష్టాన్ని, నా ప్రేమని, నా బతుకుని అప్పుడిచ్చుండకూడదా. దేవుడా, సీతా అప్పుడిచ్చుండకూడదా, నాకీ కన్నీళ్ళు అప్పుడొచ్చుండకూడదా, ఈ జ్ఞాపకాల వంతెన్ని అప్పుడు కట్టుండకూడదా.

దేవుడా, ఎందుకు న్యూయార్క్ నుంచి వచ్చేశాం? అంతపెద్ద నగరంలో, ఆ చిన్న గూటిలో మేవు నిర్మించుకున్న ఆ స్వర్గాన్ని మా చేతుల్తో మేవే ఎందుకు నాశనం చేసేశాం?

సీత
మొదట్లో దీనికంతా కారణం హైదరాబాద్ అనుకున్నాను. న్యూయార్క్ నుంచి రావడంలో ఎంతో పొరపాటు చేసేననుకున్నాను. కానీ ఇప్పుడననిపిస్తుంది ఇది న్యూయార్క్ నుంచి హైదరాబాద్ రావడం కాదు. న్యూయార్క్ నుంచి డల్లాస్ పోయున్నా, హైదరాబాద్ నుంచి నెల్లూర్ మూవయున్నా, నెల్లూర్ నుంచి రాజమండ్రీ మారున్నా, లేక న్యూయర్క్ లోనే ఉండున్నా బహుశా ఇలాగే జరిగుండేదేవో. ఇదొక మానసిక స్థితి. నన్ను నేను ఋజువు చేసుకోవలనే వొక అర్థం లేని బలవైన ఆసక్తి. చుట్టూ ఉన్న సంఘంలో నేను అంటూ నా ప్రత్యేకతను చాటించుకునే బలవైన అనురక్తి. దానికోసం సేకరించవలసిన వస్తు సముదాయం, దానికోసం నిర్మించవలసిన సోషియల్ స్టేటస్, నా వౄత్తిలో నేనెక్కగోరే ఆ ఎత్తైన మెట్లు. ఎస్, సీత ఈజ్ గ్రేట్, కేపబుల్ గై అని నలుగురూ అనుకోవలనే బయటకు చెప్పుకోని ఆరాటం, వీటన్నిటి కోసం సాగే పరుగులో, ఈ అర్థంలేని విలువల కోసం జరిగే పోరాటంలో, ఏవైతే బతుకును డిఫైన్ చేస్తాయో ఆ basic but simple emotions ని ఆరడుగులలోతు గొయ్యిలో కప్పేసా న్నేను. రామ లక్ష్మి వుంది మనసులో వొక మూల, ఆ ప్రక్కనే ఇరుక్కుని రామలక్ష్మి మీద ప్రేమ కూడా.కానీ నా మనసులో, ఆత్మలో వెలిగిన రామలక్ష్మి తరిగిన తర్వాత, నేను కూడా కాఫ్కా పురుగులా transmutate అయ్యానేవో. ఎక్కడనుంచొచ్చిందో ఈ విషప్పురుగు, I do not know where did it come from…, but suddenly it grabbed me by my mind and pulled me…, all of me into it. The bug that is called professional advancement. The bug that is called proving oneself to the world. The bug that wants to listen to the words “he did it.” I completely transformed into that bug. Once the metamorphosis was complete I crawled into the cocoon that I built with so called self improvement…, properties…, stocks…, career advancement and all that wonderfully shallow values.

నా extended పని గంటలు రామలక్షిని బాధపెట్టేయనుకోను. కానీ నేనిప్పుడు సీత ని కాను, పురుగుని, వెల్లికిల్ల పడి తిరిగి లేవలేని అసహ్యవైన పురుగుని. మొదట్లో ఆఫీస్ పని ఇంటికి రావడం మొదలయ్యింది, తర్వత ఆఫీస్ కి ఇంటికి మధ్య గీత చెదిరిపోయింది. ఇంట్లో ఉన్న ఆ నాలుగ్గంటలూ, రేపు, వొచ్చే వారం, వొచ్చే నెల నే చెయ్యల్సి పని గురించో, నా ఇన్వెస్టిమెంట్స్ ని ఎక్కడనుంచి ఎక్కడకి మర్చటవో, ఏ స్తలాలను అమ్మి ఏ స్తలాలు కొనటవో ఇదే ద్యాస. నా బంగారు తల్లి, నా పాప, నా ప్రాణం నా రామలక్షి ఎప్పుడు నా మనసు నించి జారిపోయిందో, నా చుట్టూ నే కట్టూకున్న ఈ సాలెగూటిలో నన్ను నేనే ఖైదీ చేసుకున్నాన్నేను. ఎప్పుడన్నా మెరుపులాగా వొక చక్కని సాయంత్రం గుర్తుకొచ్చేది, మెరిసే రెండు కళ్ళు గుర్తుకొచ్చేవి, స్వర్గంలాంటి తన పెదాల వెచ్చదనం, అన్ని బాధల్నీ మరచిపోగలిగే తన వొడి మెత్తదనం మనసుకొచ్చేవి. మెరుపులాగే క్షణకాలవే, సాలెగూట్లో చిక్కుకున్న పురుగుని నేను. నేను సీతని కాదు, Manager సీతని…, stock speculator సీతని…, Realtor సీతని…, బతుకుపోయిన వొంటరి సీతని.

కొందరు పుట్టటవే పురుగులా పుట్టకపోయినా, పెరగటం పురుగులానే పెరుగుతారు. తమ చుట్టూ దట్టవైన గూటినే కాదు, మనసుని కూడా గూటితోనే అల్లుతారు పొరపాటునకూడా మరే ఆలోచన, మరే కలా, మరే ఊహా మనసులో మొలెకెత్తకుండా. డబ్బు తప్ప మరేవి పూయని చెట్లనే నాటుతారు, డబ్బు తప్ప మరేవీ ఊరని ఊబిలోనే వుంటారు. సుబ్బారావ్ గాడు, వీడు పుట్టటవే పురుగ్గా పుట్టేడని నా అనుమానం. వాడి పేరు సుబ్బారావ్ అయినా, అందరికీ వాడు పొడక్షరాలతో ఎస్సార్ (S.R. = yes sir) అనే చెప్పుకుంటాడు. వొకసారి న్యూయార్క్ లో వాడింటికి పిలుచుకపొయ్యాడు. నేరుగా బెడ్రూంలో కి లాక్కుపొయ్యాడు. వాడిల్లులాగే, బెడ్రూం కూడా గాడీగా కాకుండా అందంగా వుంది. ప్రపంచంలో వున్న గాడీనెస్ నంతా వాడు తన మనసుకే ప్రత్యేకంగా రిజర్వ్ చేసుకున్నాడులావుంది. వొక bag నా చేతుల్లో పెట్టి దాంట్లో యేవుందో చూడమన్నాడు. వొపెన్ చేసి చూస్తే, దాన్నిండా కొత్తవే ఐనా నలిగిన డాలర్ నోట్లు. He asked me to hold that money…, to feel the power…, and love of the money. Then he told me that last night he had the most powerful…, most high like Himalayas experience. He said he and his wife spread the money on the bed…, and had sex. He said he never felt so high…, so powerful…, so happy…. Two hot soft bodies covered with sweat and craving rolling over that money. Paper money stuck to their naked sweaty bodies…, the sound of crumpling notes under them between them…, he said…, he has seen the haven and entered it.

సుబ్బారావ్ సుఖంగానే వున్నాడు న్యూయార్క్ లో, వాడి నిర్వచనంలో. వొకే వొక సమస్య, వాడి పెళ్ళాన్ని చూసినప్పుడల్లా నాకు డాలర్ నోట్లంటుకున్న ఆవిడ దిశమొలే మనసుకొస్తుంది, కొచెం కడుపులో కెలుకుతుంది. కానీ ఏవయ్యన్నేనిపుడు, ఏస్సార్లా డబ్బు ముందు మాస్టర్బేట్ చేసుకునేంత పరవశం కలగకపోయినా, చక్కని పులకరింత కలిగే పురుగ్గా, చిన్న ఏస్సార్ లా మారిపోయాను. నే నసహ్యించుకునే ఆలోచనల్ని నాకుగానేనే ఆవాహనచేసేను. నా బతుకులోకి పెద్దమ్మను నేనే చెయ్యిపట్టి తీసుకొచ్చాను. నా ఉరికి నేనే తాడు పేనుకున్నాను.

రామ
నేను చదువుకున్నదాన్నే, కొద్దో గొప్పో తెలివైనదాన్నే. ఎందుకర్థం కాలేదు నాకు, ఇంత చిన్న విషయం, ఇంత సరళవైన నిజం. ప్రేమని కూడా మిగిలిన విలువైన వస్తువుల్లాగానే కాపాడుకోవాలని. కాపాడుకోవటం అంటే కర్రల్తో, కత్తుల్తో కాపలా కాయడం కాదు. Love has to be expressed to protect it. Love can only blossom and flourish when it is expressed. మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో, ఊహల్లో, వుత్తరాల్లో, కలల్లో, కళ్ళలో, కౌగిలింతల్లో, పడక గదుల్లో వ్యక్త పరచని ప్రేమ చచ్చిపోతుంది. It may not die…, but it definitely loses it’s intensity and love between wife and husband that loses it’s intensity creates a void…, a vacuum that will be filled by other emotions like anger. ఎక్కడనుంచొచ్చేదో నాకు కోపం, హద్దులులేని, అవధులుదాటిన కోపం, కొన్ని సార్లు నాకే సిగ్గేసేంత కోపం, నాకే అర్థం కాని కోపం! నాకే ఆశ్చర్యవేసేది, ఎక్కడ దాగుండేదీ కోపం న్యూయార్క్ లో అని. ఇప్పుడర్దమవుతుంది.

సీత
బయట నుండి మాదెప్పుడూ ముచ్చటైన సంసారవే. మా ఇద్దరి కష్టం మా మనసుల్లోకి, బతుకుల్లోకి కన్నీళ్ళని తెచ్చిందేవో గానీ, మా ఇంట్లోకి మాత్రం లక్ష్మినే తెచ్చింది, బయట మాకు మంచి పేరునే తెచ్చింది. రామలక్ష్మి కి సీతరావుడికి మధ్య ఎన్ని కాంతి సంవత్సరాలదూరం పెరిగిందో ఎవరికితెలుసు? మా మసులకి తప్ప. ఈరొజు ఈ సాధించినవాటికి మేం పణంగా పెట్టిన మా ఇద్దరి బతుకులకి తప్ప. బతుకులో మూడో వంతు భాగాన్ని, రెండు దశాబ్ధాల్ని ఏ సుఖం కోసం ధారపోశాం? మాకిష్టవైన, మమ్మల్నిద్దరినీ వొకటిగా చేసి, మా మనసంతా మాటల్లో చెప్పలేని ఆనందంతో నింపిన మా ప్రేమని, ఆ బతుకంటే మా ఇష్టాన్ని, అత్యంత సహజంగా మాలో నిండిన మా ఆనందాన్ని, ఏ జిలుగుల కోసం, ఏ వెలుగుల కోసం, ఏ ఇటుకల కోసం, ఏ గుప్పెడు నేల కోసం, ఏ మోటరు కార్ల కోసం, ఏ పదవుల కోసం, ఏ చప్పట్ల కోసం, ఎవరి కోసం ధారపోశాం? ఎవరి కోసం విసరివేశాం? మా కోసవే ఐతే ఎందుకు మా బతుకుల్లో, మనసుల్లో ఇంత బాధ. ఎందుకీ వయసులో, ఈ ఆఖరి రోజుల్లో ఎందుకు ఎందుకీ బాధా?

వొక్కసారి, వొకే వొక్క సారి, మళ్ళా నేనొక రెండు దశాబ్ధాలు వెనక్కి పోగలిగితే, మిగిలిన ఈ కొద్ది రోజుల్లో అప్పటి సీతని మళ్ళా నా మనసులో నింపుకోగలిగితే, వొక్కసారి నా పాపని మళ్ళా నే పొందగలిగితే! అంతదృష్టవుందా నాకు? తనని పలకరించి, తన తిరస్కరాన్ని భరించగలిగే శక్తి నా కిప్పుడులేదు. వొక్కసారి, మళ్ళా తన ప్రేమను పొందగలిగితే. మనసులో ఇలా కుళ్ళి, కుళ్ళి చచ్చే బదులు, తనతో నా మనసు విప్పగలిగితే. నిజవే మేం కలిసే వున్నాం, కానీ మానసికంగా ఎంత దూరవుంది మా మధ్య, ఎన్ని దశాబ్దాల దూరం. ఈ వయసులో మళ్ళా నేను ప్రేమకోసం పాకులాడటం ఏవిటి. తను కాదంటుందేవో అని భయపడటం ఏవిటి. సీతా, సీతా వయసుతో పనేవిటి ప్రేమకి. ఐతే ఇంత వయసులో ఎందుకు ఇంకా గతంలోనే బ్రతుకుతున్నావ్. అప్పటి జ్ఞాపకాల్లోనే ముడుచుకు పోతున్నావ్. జరిగిన తప్పుల్ని మనసులో వొప్పుకోవడం కాదోయ్, మనిషిముందు కూడా వొప్పుకుంటే రామ లక్ష్మి మళ్ళా నీకు దక్కుతుందేవో, కనీసం నీ మనసు కొంచం కుదుట పడుతుందేవో.

రామ
జీవితపు ఆఖరిపాదంలో, ఇప్పుడిక్కడ కూర్చోని వెనక్కి తిరిగి చూస్తుంటే, ఎందుకు నే సాధించిన వీజయాలేవీ నాకు సుఖాన్నివ్వడం లేదు? నే నెక్కిన నిచ్చెన మెట్లేవీ నాకు గర్వంగా లేవు? నా పిల్లలకి నాన తప్ప నాకు మరింకేవీకాడనుకున్న సీతనే కనిపిస్తున్నాడు? ఏప్పుడో, ఏ కాలంలోనో, ఏ లోకంలోనో కలలా కరిగిపోయిన ఆ కొద్దిరోజుల, వొక్క బెడ్రూం కొద్ది బ్రతుకుల పాత జ్ఞాపకాలే మనసుకొస్తున్నాయ్? ఎందుకని, ఎందుకని ఇంత జీవితంలో, నేను కష్ట పడినవి, నేను గర్వ పడినవీ, గొప్పవనుకున్నవి అన్నీ జారీపోయి, మరుగున పడిపోయి, ఎప్పుడో పాతళం లోకి త్రొక్కేసిన ఆ నాలుగు నిముషాలే, ఆ నాలుగు నవ్వులే, ఆ నాలుగు సుఖాలే మళ్ళా, మళ్ళా నా మనసులో చర్వితచరణం అవుతున్నాయ్? ఆ క్షణాలకోసం, ఆ మనిషి కోసం, ఆ ప్రేమకోసం ఎందుకు నా కళ్ళూ ఇంతలా కన్నీళ్ళు కార్చుతున్నాయ్? దేవుడా, దేవుడా ఇక నా మనసిలా కాగిపోవలసిందేనా? నా కన్నీళ్ళలో నేను మునిగిపోవల్సిందేనా?

ఎందుకు నేనీ కన్నీళ్ళలో మునిగిపోవాలి. ఎందుకు నా మనసులో నేనే బందీ కావాలి. వొక్క సారి నేను మళ్ళా ఆ అందవైన రామలక్ష్మిని కాలేనా, వొక్కసారి మళ్ళా నేనా ఆనందాన్ని, నా ఆనందాన్ని, నా సీతని నా చేతుల్లో పొదువుకోలేనా. వొక్క సారి నేను నా ఈ వొక్క కోరికని, నా మనసులోకి , గుండెల్లోకి, కళ్ళలోకి, నా ఆత్మలోకి ఆవాహనం చేసుకోలేనా. నా సీతని నేను పొందలేనా?

What do you know…. a busted dream may have lots of power
A fallen leaf can still live in her dreams
What do you know… a total rat may have a heart of a butterfly
Even a frog can evolve into a southern belle
What do you know… a rainbow in its heart is white
Even a crushed hope can blossom into a beautiful kite
What do you know… of human heart that evolved into a mind
Even a dead memory can blossom into a life…, what do you know ?
-----------------------------------------------------
రచన: రవికిరణ్ తిమ్మిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, April 23, 2019

బంగార్రాజు ముద్దు


బంగార్రాజు ముద్దు
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.................

బంగార్రాజెక్కిన విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్టుని సమీపిస్తున్న కొద్దీ అతన్లోని ఉద్విగ్నత ఎక్కువవడం మొదలు పెట్టింది. ‘అమెరికాలో అడుగు పెట్టిన ఏడాది తరువాత గానీ మళ్లీ భారతదేశపు ముఖాన్ని చూడడానికి వీలవదని జ్యోతిష్కుడెవడయినా అమ్మకి చెప్పి వుంటే నేనసలు అమెరికా గూర్చి కలలోనయినా ఊహించడానికి వీలయ్యేదా?’ అని మొదట్లో అనుకున్నాడు. రెండేళ్ల తరువాత అని మరుసటేడాది అనుకున్నాడు. అది కాస్తా మూడేళ్ల తరువాత, నాలుగేళ్ల తరువాత… అలా అభివృద్ధి చెంది, గ్రీన్ కార్డ్ చేతికొచ్చి అతనీ విమానమెక్కేసరికి పదేళ్లు గడిచాయి.

నిజానికి బంగార్రాజు తల్లి, ‘మా అబ్బాయికి గ్రీన్ కార్డ్ ఎప్పుడొస్తుంది?’ అని ఆస్థాన జ్యోతిష్కుణ్ణి సాధించడం బంగార్రాజు అమెరికా విమానం ఎక్కిన మరునాటి నించే మొదలుపెట్టింది. మొదట్లో ఇవాళో, రేపో అన్నతను కాస్తా రెండేళ్లు గడిచేసరికి శనిజపం చేయించాలనీ, కుజుడికి కోపం తగ్గించడం కోసం పూజలు చెయ్యాలనీ, గురుడికి హోమం చేయించాలనీ చెప్పడమే గాక వాటిని చేయించి ఇంకో రెండేళ్లు సాగదీసేసరికి, ఇంకతను వాళ్ల గుమ్మం తొక్కకుండా చీపురుకట్టతో అతనికి శాంతి చేయించింది.

బంగార్రాజు అమెరికా వెళ్లిన మహర్దశ వై2కె. అది ఏ జాతకాల్లోనూ, ఏ గ్రహానికీ సంబంధించినది కాదు; ఏ గ్రహమూ ఇంకోడింట్లో దూరడం వల్లనో ఇంకొకణ్ణి ఓరగానో, లేక కోరగానో చూడడం వల్లనో సంభవించినది కాదు. అది అమెరికావాడి తెలివితక్కువతనం. కాకపోతే సోమరితనం. లేకపోతే, నాలుగంకెలుండే క్రీస్తుశకం కాలమానాన్ని కాస్త కుదించి, చివరి రెండంకెలతో సరిపుచ్చుకొమ్మనమని ఎవరు మాత్రం ఎలా చెబుతారు? ఎవరి తప్పయితేనేం గానీ అది బంగార్రాజుకి ఒప్పే చేసింది.

అతను చేసింది బీయేనే అయినా, తిరిగింది భీమవరం లోనే అయినా అతని నైకి షూసునీ, లీవైస్ జీన్సునీ, టామీ హిల్ఫైగర్ టీషర్టునీ, రేబాన్ గాగుల్సునీ చూసిన వాళ్లందరూ అతనికి అమెరికా ముద్రని టీనేజర్‌గా వున్నప్పుడే వేసేశారు. ఆ ముద్రకి కొద్దిగానైనా స్థానబలిమిని కలిగించాలని ఏ గ్రహానికో దురద పుట్టడం వల్ల కాబోలు కోబాల్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. అదే ముద్రని ఐ.ఎస్.ఐ. ముద్రగా భావించిన ధనలక్ష్మి అతణ్ణి అర్జెంటుగా కొనేసుకుంది. పెళ్లి కాకముందరే ఆమె పేరుని ఐశ్వర్యగా మారుస్తాననే అతని ఇంగితం వెనుకనున్న మహత్తరమయిన ప్రేమని ఆమె ఘాటుగా ప్రేమించేసి, “ఐ లవ్యూ సో మచ్‌రా బంగారూ!” అన్నది అతని కౌగిట్లో కరిగిపోతూ.

ఆ కౌగిటిని అట్లాగే పట్టుకుని ఆ వై2కె మహర్దశలో బంగార్రాజు తనతో అమెరికా తీసుకుపోవడానికి ఆమె పొట్టలోని బాబిగాణ్ణి ధనలక్ష్మి తల్లిదండ్రులు అడ్డం పెట్టారు. ‘వాడు పుట్టగానే తప్పకుండా వస్తాను,’ అని విమానమెక్కిన బంగార్రాజుని బాబిగాడి బారసాలకి రానీయకుండా ముందుచూపుతో సింగిల్ ఎంట్రీ వీసాని మాత్రం అతనికి రాయించిన అమెరికా వాడడ్డొచ్చాడు. ధనలక్ష్మిని కూడా, అమెరికా కాన్సులేట్ చుట్టూ పొర్లు ప్రదక్షిణాలు చేస్తానని ఆమె బెదిరించేదాకా లాగి, రెండేళ్ల తరువాత అయితేనేం, ఆమెనీ బాబిగాణ్ణీ శాన్ ఫ్రాన్సిస్కోలో వున్న బంగార్రాజుని చేరనిచ్చాడు. మనవరాలు కత్రీనా పుట్టినప్పుడు వెళ్లి తీరాలన్న బంగార్రాజు తల్లికి మాత్రం సైంధవుడిలా అడ్డుపడ్డాడు. మనవరాలు కత్రీనా పుట్టినప్పుడు వెళ్లి తీరాలంటూ అదే బెదిరింపుని బంగార్రాజు తల్లి చేస్తే, ‘ఇక్కడ కాదు, వీసా వెంకటేశ్వరస్వామి దగ్గర చేసి రామ్మా. తరువాత వెయ్యి డాలర్లు కట్టు. అయితే వీసా వస్తుందని గ్యారంటీ ఏమీ లేదు,’ అని ఆ కాన్సులేట్ వాడన్నవాడని, ఆ అన్నవాడు చేతన్ పటేల్ అన్న భారతీయుడిలా ఉన్నవాడని ఆవిడకి మండిపోయి ఆవిడకొచ్చిన అచ్చతెలుగులో వాడి మీద శాపనార్థాలని కుమ్మరించింది.

అందరికీ రెండుమూడేళ్లల్లో గ్రీన్ కార్డ్ రావడమేమిటీ, వీడికిన్నేళ్లు పట్టడమేమిటీ? అని ఆమె అందరితోను వాపోతుండేది. సరయిన లాయర్ని చూస్కొని వుండడు, అని ఎవరయినా కిసుక్కున అంటే, మీకు ఇబిత్రీ కేటగిరీ గూర్చి తెలుసా? అని వెంటనే ప్రశ్నించేది. ఇండియాలో ఇ, బిర్యానీలో బి, త్రిషాలో త్రి. ఈ మూడింటినీ కలిపితే మావాడి గ్రీన్ కార్డ్ కేటగిరీ. అర్థమైందా? అని ఘాటుగా బోధించేది. ఆవిడకి అంత అర్థమయ్యేలా చెప్పింది బంగార్రాజే. అప్పటికే అమెరికాలో ఎవరికయినా ఫోన్ చేసి తన పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు, బి యాజ్ ఇన్ బిర్యానీ, ఎ యాజ్ ఇన్ అమెరికా, ఎన్ యాజ్ ఇన్ ఎన్టీ రామారావ్ అంటూ చెప్పడం అలవాటు జేసుకున్నాడు.

“నేను ఇంజనీరింగ్ చేస్తానంటే నువ్వు అడ్డం కొట్టావ్. ఆ డిగ్రీ వుంటే అప్లై చేసిన రెండేళ్లల్లో గ్రీన్ కార్డ్ వచ్చుండేది,” అన్నాడు బంగార్రాజు.

ఉద్యోగం సక్రమంగానే చేస్తున్నా, ఇంజనీరింగ్ డిగ్రీలున్న వాళ్లతో ఏమాత్రం తొణకకుండా పోటీ పడుతున్నా, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఉన్నా, గ్రీన్ కార్డ్ అప్లికేషన్ల విషయంలో మాత్రం ఆ ఇంజనీరింగ్ డిగ్రీ వున్నవాళ్లేమో తిరుపతిలో స్పెషల్ దర్శనం లైన్లోనూ తనేమో ధర్మదర్శనం క్యూలోనూ ఉన్నట్లనిపించి, అతనికి మంటెత్తినా చెయ్యగలిగిందేమీ లేదు గనుక సహిస్తున్నాడు.

“అప్పుడు నాకేం తెలుసురా? నువ్వు ఇంజనీరింగ్ చెయ్యడానికి కష్టపడడమెందుకని, పైగా ఏదో నా కళ్ల ముందుంచుకుందామనీ వద్దన్నాను గానీ డబ్బుకు లేకనా? ఈ మధ్య ఇక్కడ పేటకో ఇంజనీరింగ్ కాలేజీ తెరుస్తున్నారు. వాళ్లకి ఫీజులు కడితే చాలట. ఎవరూ క్లాసులకి కూడా వెళ్లరట. వాటిల్లో చదువుతున్న పిల్లలంతా ఎప్పుడూ ఇంటి చుట్టుపక్కలే కనిపిస్తుంటారు. ‘క్లాసులకి వెళ్లరేమిట్రా?’ అనడిగితే, ‘అక్కడ చెప్పేవాళ్లెక్కడున్నారు ఆంటీ?’ అంటారు. ఆ కాలేజీ వాళ్లనడిగి ఓ డిగ్రీ సర్టిఫికెట్ పంపేదా?” ఆశగా అడిగిందావిడ.

“అదేదో గ్రీన్ కార్డుకి అప్లై చేసేటప్పుడే చేసుండాల్సింది. ఇప్పుడు లాభం లేదు,” అన్నాడు బంగార్రాజు.

వాడి బియ్యే డిగ్రీని అడ్డం పెట్టుకుని నా మనవరాల్ని చూడనీకుండా ఆపుతోంది ఈ వెధవ వీసా, అని ఆవిడ అమెరికాని ఆడిపోసుకోని క్షణం లేదు. ప్రస్తుతం ఆ మనవరాలు కత్రీనా, ఆవిడ వొళ్లోనే కూర్చుని, ధనలక్ష్మి టీషర్టుని పట్టుకుని లాగుతూ, అన్నయ్య బాబిగాడితోనూ, అమ్మమ్మ, తాతలతోనూ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అతనికై ఎదురు చూస్తోంది. ఆ పిల్ల చికాకునీ, ఏడుపునీ చూసిన వాళ్లెవరయినా బంగార్రాజు అక్కడకి రావడం ఆ పిల్లకి ఇష్టం లేదనుకునే అవకాశముంది గానీ, అర్ధరాత్రి ఒంటిగంటకి రెండేళ్ల పిల్లని నిద్రలేపి పట్టుకొచ్చారని చెబితే మాత్రం ఆ పిల్లని అపార్ధం చేసుకున్నందుకు చాటుగానయినా సరే, చెంపలేసుకుంటారు. ధనలక్ష్మీ బాబిగాడూ అప్పటికి నెలరోజుల క్రితమే -– గ్రీన్ కార్డ్ వచ్చి వారం ఇంకా పూర్తి కాకుండానే — పుడుతూనే అమెరికన్ సిటిజెన్‌షిప్పుని చేత పట్టుకొచ్చిన కత్రీనాతో సహా హైదరాబాద్ చేరుకున్నారు. ఇండియా వెళ్లడం మొదటిసారి కావడం వల్ల ధనలక్ష్మి తాను అక్కడ కనీసం రెణ్ణెల్లుండాలంది. బంగార్రాజుకి అన్నాళ్లు సెలవు దొరికే అవకాశమే లేదు గనుక ఆమే పిల్లలూ ముందు వెళ్లేలా, నెల తరువాత అతను వాళ్లని చేరేలా, వచ్చేటప్పుడు మాత్రం అందరూ కలిసి తిరిగి వచ్చేలా టిక్కెట్లు కొనుక్కున్నారు. అందుకే అతను ఇప్పుడు ఒంటరిగా వస్తున్నాడు.

బంగార్రాజు ఉద్వేగానికి లోను కావడానికి ఎంతో చిన్న కారణం చాలంటుంది అతన్ని పన్నెండేళ్లుగా అబ్సర్వేషన్‌లో వుంచిన ధనలక్ష్మి. ‘ఐ లవ్యూ బంగారూ,’ అని మొదటిసారి ఆమె నోట్లోంచి రాగానే అతని కళ్లల్లో నీళ్లని చూసి ఉబ్బితబ్బిబ్బైపోయింది గానీ, తరువాతనించీ ఎవరయినా నీ చొక్కా బావుంది, యు లుక్ నైస్ టుడే లాంటి సాధారణ వ్యాఖ్యలు చెయ్యగానే అతని కళ్లల్లో తడిని చూడడం అలవాటయిన తరువాత, ‘డీహైడ్రేషన్ వస్తుంది. ఈ నీళ్లు తాగండి,’ అని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకునే నీళ్ల బాటిల్ని అతని చేతికివ్వడం మొదలు పెట్టింది. సీతారామయ్యగారి మనవరాలు సినిమాని ఇంట్లో చూస్తున్నప్పుడయితే అతను కళ్లు తుడుచుకుంటూ పక్కన కూర్చున్న ఆమె చీర కొంగుని పూర్తిగా తడిపేశాడు. అప్పట్నించీ అతని పక్కన కూర్చుని సినిమా చూసేటప్పుడు ఆమె ముందుగానే నీళ్ల బాటిల్తో బాటు ఒక హాండ్ టవల్ని కూడా ఒళ్లో రెడీగా పెట్టుకునేది.

అలాంటి బంగార్రాజు ఉద్విగ్నతని హిమోన్నతశిఖరాల నెక్కించింది అతను ఫ్లైట్‌లో చూసిన హిందీ సినిమా.

ఆ సినిమాలో, కాషాయ వస్త్రాలని కట్టుకుని, నెరుస్తున్న బవిరిగడ్డంతో వున్న ఒకాయన ఇండియాలో అడుగు పెట్టగానే మోకాళ్లని నేలకానించి, వంగి నేలని ముద్దు పెట్టుకొని, మేరా భారత్ మహాన్ అంటాడు. ఆ వెనకే దిగిన ఒక సూట్‌వాలా గొంతుని బట్టి ఆ గడ్డపాయన్ని తన తండ్రిగా గుర్తిస్తాడు. ఆ సూట్‌వాలా అమెరికా వెళ్లి మొదట్లో చాలా కష్టాలు పడి, ఆ కష్టాలని తన తల్లిదండ్రులకి తెలియజెయ్యడం ఇష్టం లేక తన ఫోన్ నంబరూ అడ్రస్సు వాళ్లకి తెలియనివ్వడు. పదేళ్ల తరువాత బిజినెస్‌లో విజయవంతుడై ఇండియా కొస్తాడు. ఆ గడ్డపాయన, అక్కున చేర్చుకోవడానికి ఆ సూట్‌వాలా తల్లి ఈ లోకంలో లేదన్న వార్తని కొడుక్కి చేరవేస్తాడు. అందువల్లనే తను అయిదేళ్ల క్రితం సన్యాసం పుచ్చుకున్నాడనీ, తెలిసిన వాళ్లెవరయినా కొడుకు ఆచూకీ చెబుతారేమోనని అమెరికాలో వున్న శిష్యబృందం పిలిస్తే వెళ్లి, చికాగోలో సిన్హా గారింట్లో, హూస్టన్‌లో హెగ్డే గారింట్లో, మేరీలాండ్‌లో మెహతా గారింట్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో శాస్త్రి గారింట్లో, ఇలా దేశం నలుమూలలా కొడుకు గూర్చి ఆచూకీ అడిగి తిరిగొస్తున్నాననీ చెబుతాడు. మరి, ఒకే ప్లేన్‌లో వున్నా మనం ఇప్పటిదాకా కలవలేదెందుకని? అని ప్రశ్నిస్తాడు సూట్‌వాలా. నేను బిజినెస్ క్లాసులో వచ్చాను. మరి నువ్వు? అంటాడు తండ్రి. ఎకానమీలో, అంటాడు కొడుకు. మరి అందుకు, అని జవాబిస్తాడు తండ్రి. ఈలోగా బ్యాక్‌గ్రౌండ్లో ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ,’ అని పాట వస్తూండడంతో సూట్‌వాలాకి తన కర్తవ్యం గుర్తొచ్చి, అమ్మ లేకపోతేనేం, జన్మనిచ్చిన ఈ నేలతల్లి వుండగా అని, యే మిఠ్ఠీ, యే ధరిత్రి, యే జన్మభూమి అంటూ ఆ నేల మీద ముద్దుల వర్షాన్ని కురిపిస్తాడు.

ఈ సంభాషణ జరుగుతున్నంతసేపూ బంగార్రాజు కళ్లల్లో ఫౌంటెన్లు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. విండో సీట్లో కూర్చున్న అతను చేతికందిన గుడ్డతో కళ్లు తుడుచుకుంటుంటే, ‘చూడండి, ఇతను నాకొంగు లాగుతున్నాడు,’ అని పక్కసీట్లో కూర్చున్నావిడ అరవడం వినిపించింది. అదిరిపోయిన బంగార్రాజు, ‘క్షమించండి, మా ఆవిడనుకున్నాను,’ అని కళ్లల్లోంచి గంగాగోదావరులని ప్రవహింపజేస్తుంటే, ఆవిడ, ‘ఈ పట్టుచీరెకంటిన నీళ్ల మరకలు డ్రైక్లీనింగ్ చేసినా పోవు,’ అని విసుక్కుంటూ తన రుమాలుని అతనికిచ్చింది – ‘మళ్లీ ఇవ్వఖ్ఖర్లే’దని నొక్కి చెబుతూ. తరువాత, ‘మధ్య సీటు నాకొద్దంటే, పక్కనవున్నది నీ తమ్ముడి వయసువాడంటూ అయిల్ సీట్లో కూర్చున్నారు. ఇప్పటికయినా ఇట్రండి,’ అని మొగుడి మీద చికాకుపడి, లేచి, ఆయన చేత సీటు మార్పించింది. ఇంకా నయం! నేను నిద్రపోతూ ఆవిడ భుజమ్మీద తలవాల్చినప్పుడు చూసింది కాదు, అనుకుని తేలిక పడ్డాడు బంగార్రాజు.

బంగార్రాజు చూసిన ఆ సినిమా అతని మనోక్షేత్రమ్మీద పదునైన నాగలితో పర్రులని చేసింది. ఎయిర్‌పోర్టులో తల్లి వేచివుంటుందని అతనికెలాగో తెలుసు. ఆమె మీద ముద్దులవర్షాన్నెలాగూ కురిపిస్తాడు. ఇక మిగిలింది జన్మభూమికి – అదే, ధరిత్రికి – ముద్దు పెట్టడం. ధరిత్రి అన్న పదాన్ని అతను మొదటిసారి విన్నది ఆ ఫ్లైట్‌లోనే అయినా, కాంటెక్స్టుని బట్టి జన్మభూమికి దాన్ని పర్యాయపదంగా అర్థం చేసుకున్నాడు. ఏదయినా కొత్త పదాన్ని గుర్తుంచుకోవాలంటే ఆ పదాన్ని అదే పనిగా వాడుతూండాలి, అన్న హైస్కూల్ మాష్టారి ఉపదేశం ఆ సినిమా చూస్తున్నప్పుడే గుర్తొచ్చి దాన్ని పాటించాలని మనసులో నోట్ చేసుకున్నాడు. ధరిత్రిని పదే పదే తలుచుకున్నాడు. విమానం దిగగానే తను చెయ్యబోయే మొదటి పని అదేనన్న నిర్ణయానికి అతనొచ్చాడు.

విమానం లాండ్ అయిన తరువాత అది మెల్లిగా గేట్ల దగ్గరికి చేరుతుండగానే ప్రయాణీకులందరూ గబగబా లేచి నిలబడ్డారు. నడుస్తున్న విమానం లోంచి దూకేయరు కదా అని బంగార్రాజు భయపడ్డాడు. రైలు గానీ బస్సు గానీ కదుల్తున్నప్పుడు ఎక్కడం దిగడం ఎంత అలవాటున్నా, ఆ ఎత్తులోంచి దూకితే మక్కెలు విరగడం ఖాయమన్నది అతనికి తెలుసు. అయితే, ఫ్లైట్ అటెండెంట్‌కి తప్ప ఇంకెవరికీ విమానం తలుపులని ఎలా తియ్యాలో తెలిసినట్లు లేదు. ప్రయాణీకులంతా ఆమె తలుపు తీసేదాకా అలాగే నిల్చుండి పోయారు.

అందరూ అలా నిల్చునుండగానే, ఎక్స్‌క్యూజ్ మీ అంటూ ఒక నడివయస్కుడు విమానం వెనుక మొదలు పెట్టి, తోసుకుంటూ వచ్చి, సరిగ్గా బంగార్రాజు సీటుపైన వున్న ఓవర్‌హెడ్ లగేజ్ క్యాబిన్ తెరిచి అందులోని కారీ-ఆన్ బయటకు లాగాడు. అందులో వున్న బంగారు ఇటుకల బరువుని అతను ఆపలేక కాబోలు బంగార్రాజు నెత్తిమీద దాన్ని దభీమని పడేసి, సారీ అని జనాంతికంగా అనేసి, ఎక్స్‌క్యూజ్ మీ అంటూ ముందుకు దూసుకుపోయాడు. ఆ సూట్‌కేస్ కాలిమీద నించి పోవడం వల్ల తట్టుకోలేని బాధతో ఒకాయన కోపంగానే, మీకన్నా ముందునించే ఇక్కడున్నాం అన్నాడు. అందుకేగా ఎక్స్‌క్యూజ్ మీ అన్నాను, అని తొక్కడానికి మిగిలిన పాదాలని వెదుక్కుంటూ నడివయస్కుడు ముందుకి సాగిపోయాడు.

మొత్తానికి బంగార్రాజు విమానం లోంచి కుడికాలుని జెట్ బ్రిడ్జ్ మీద ఆనించగానే, భారతదేశపు బంగారు నేలని అక్కడే ముద్దు పెట్టుకోవాలనిపించి, ముందుకి వంగాడు. వెనక వస్తున్న వాళ్లకి అతనేం చెయ్యబోతున్నాడో ముందుగా అతను మాటవరుసకయినా చెప్పక పోవడంతో, వాళ్లు తిరుపతి క్యూలో నిల్చున్నప్పటి లాగా అతన్ని ముందుకు తోశారు. బాలన్స్ లేక అతను ముందుకు పడినా గానీ అతని ముందుపళ్లు అతని తోనే ఎయిర్‌పోర్ట్ బయట వేచి వున్న ధనలక్ష్మి దాకా చేరడానికి కారణం అతని నుదురు ముందుగా ఆ జెట్ బ్రిడ్జ్ ఫ్లోర్‌ని తాకడం. అతని ఎడమకాలు విమానాన్ని వదిలి ముందుకు రానని మొరాయించడంతో బంగార్రాజు ఒక పక్కకి పడ్డాడు. అతని కుడిచేతి పట్టుని దాదాపు విదిలించుకున్న అతని కారీ-ఆన్ ఏ కళనుందో గానీ ఎగిరి అతని మీద పడి కావలించుకొంది.

“నేలని ముద్దు పెట్టుకోవడం ఇక్కడ కాదండీ, ముందర. చలానా కట్టి, టోకెన్ తీసుకున్న తరువాత!” వీల్‌ఛెయిర్ని విమానం దాకా పట్టుకొచ్చిన ఒక ఎయిర్‌పోర్ట్ ఎంప్లాయీ ఉచితసలహా నిచ్చాడు గానీ అతనున్న చోటు నించి అంగుళం కూడా కదల్లేదు. బంగార్రాజు వెనక వచ్చినవాళ్లు ఓ పాతిక మంది, ‘ఆ పడేదేదో కొద్దిగా పక్కకు పడొచ్చుగా, మరీ మధ్యలో పడ్డాడు,’ అని విసుక్కుంటూ అతని కాళ్ల మధ్య అడుగులేస్తూ అతన్ని దాటుకుంటూ, సూట్‌కేసులని అతని మీదుగా లాక్కుంటూ వెళ్లారు. ఆ తొక్కిసలాటలో తన ప్రాణాలు పోతాయేమోనని అతను కాళ్లు దగ్గరకు తీసుకుంటూ భయపడ్డాడు గానీ, జాలిపడ్డ ఒక తోటి ప్రయాణీకుడు చేతిని అందించగానే, బతికాన్రా దేవుడా! అనుకుంటూ లేచి నిలబడి, కారీ-ఆన్ లాక్కుంటూ, ‘జెట్ బ్రిడ్జ్ నేల కాదు గదా! పైగా, నేలకి కనీసం ఇరవై అడుగుల ఎత్తులో వుంటుంది! అసలు దాన్ని ముద్దు పెట్టుకోవాలనే బుద్ధి తక్కువ ఆలోచన నాకెలా వచ్చిందసలు?’ అని తనని తను తిట్టుకుంటూ ముందుకు నడిచాడు.

ఎయిర్‌పోర్ట్ టర్మినల్‌లో అడుగు పెట్టగానే, అక్కడ పెద్ద బంగారు అక్షరాలతో, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో — ‘మీ జన్మభూమిని తనివి తీరా ముద్దు పెట్టుకోండి. పక్కన చలానా కట్టండి.’ అని రాసివున్న బోర్డు కనిపించింది. అతనితో పాటుగా వచ్చిన కొందరు 500 రూపాయలకి చలానా కట్టి, ‘ఇక్కడ ముద్దు పెట్టండి,’ అని బాణం వేసి చూపించిన చోట నేల మీదికి వంగి, ముద్దు పెట్టి వెళ్ళిపోవడాన్ని అతను చూశాడు. అంతమంది అలా ధరిత్రికి ముద్దులివ్వడం చూసి అతని కళ్లు కుండపోత వర్షాన్ని మామూలు పరిస్థితుల్లో అయితే కురిపించేవే గానీ ఈ చలానా విశేషమే ఆ మేఘాలని తరిమి కొట్టింది.

నిలబడి, ఈ తంతుని ఆశ్చర్యంగా చూస్తున్న బంగార్రాజుని చూసి, “ఏం సార్? మీకు జన్మభూమంటే గౌరవం లేదా?” అంటూ మనో వైజ్ఞానిక్ దబావ్‌ని ప్రదర్శించాడో యూనిఫాం వేసుకున్న వ్యక్తి.

“అందరూ ముద్దు పెట్టిన చోట నన్నెలా ముద్దు పెట్టమంటావయ్యా? వాళ్ల జెర్మ్స్ నాకు అంటి, లేనిపోని రోగాల్ని తెచ్చిపెడితే ఇక్కడున్న నాలుగురోజులూ మంచమ్మీదే గడపాల్సొస్తుంది,” అన్నాడు బంగార్రాజు.

“డెట్టాల్తో క్లీన్ చేస్తాం సార్. ఇంకొక అయిదొందలు అంతే!”

“ముద్దు పెట్టుకోవాల్సింది మట్టినయ్యా, మార్బుల్ ఫ్లోర్‌ని కాదు.”

(అతను చూసిన హిందీ సినిమాలో సూట్‌వాలా మొహానికి మట్టి అంటడం అతనికి ఇంకా గుర్తుంది. పైగా, ఆ బవిరిగడ్డంవాడు పిడికిలి లోంచి మట్టిని నేల మీదికి జారుస్తాడు కూడా ఏదో డైలాగ్ చెబుతూ.)

“మట్టి చల్లుతాం సార్. ఇంకో అయిదొందలు. అంతే. రెడీగ వుంది,” అని పక్కనే వున్న ఎర్ర బకెట్టుని చూపించాడు. అందులో మట్టో, ఇసకో వున్నమాట నిజమే గానీ, బంగార్రాజుకి మాత్రం దాన్ని చూడగానే రైల్వే స్టేషన్లలోనూ, బస్టాండుల్లోనూ, సినిమాహాళ్లల్లోనూ, ‘ఇక్కడ ఉమ్మివేయుము,’ అని రాసివున్న ఎర్ర బక్కెట్లు కళ్ల ముందు ప్రత్యక్షమై, అతన్ని నిలువెల్లా జలదరింపజేశాయి. ‘బాబోయ్!’ అని అరిచి అక్కణ్ణుంచి పరుగెత్తుకెళ్లి ఇమ్మిగ్రేషన్ లైన్లో పడ్డాడు.

అతనికి మళ్లీ ధరిత్రి గుర్తొచ్చింది ఇమ్మిగ్రేషన్ అయిన తరువాత లగేజ్ కోసం కన్వేయర్ బెల్ట్ దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు. లగేజ్‌ కోసం అతను ఎస్కలేటర్ మీద ఒక ఫ్లోర్ దిగి రావలసి వచ్చింది. చుట్టూ చూసి, ఇదీ నేలంటే! ఇదే ధరిత్రి అంటే! గ్రౌండ్ ఫ్లోర్! పై అంతస్తులో ‘నేలని ముద్దుపెట్టుకోండి’ అని చెప్పి మోసం చేస్తున్నారు అనుకున్నాడు. వంగి, ముద్దు పెట్టుకోవడానికి అనువయిన ధరిత్రి ఎక్కడయినా ఉన్నదేమోనని చుట్టూ కలియజూశాడు. ఇంతలో చిన్న గొడవ ఒకటి అతని దృష్టి నాకర్షించింది.

“ఎక్కడ పడితే అక్కడ నేలని ముద్దు పెట్టుకోకూడదు. ఈ ఎయిర్‌పోర్టుకి రూల్సున్నాయ్. ఫీజు ఎగ్గొడదామనే ఈ దొంగబుద్ధెందుకో. మళ్లీ డాలర్లల్లో సంపాదిస్తారు. పద. వెయ్యి రూపాయలు ఫైన్ కడుదువు గాని,” అని ఒక యూనిఫాం వ్యక్తి ఒకతన్ని చెయ్యి పట్టుకుని కౌంటర్ దగ్గరికి తీసుకెడుతున్నాడు. ఆ లాక్కెళ్లబడుతున్న వ్యక్తిని తన తల మీద కారీ-ఆన్ పడేసిన వ్యక్తిగా బంగార్రాజు గుర్తించాడు. తిక్క కుదిరింది వెధవకి, అనుకున్నాడు తల మీద బొప్పిని తడుముకుంటూ. ఆ ట్రీట్‌మెంటుని చూసినందుకో లేక మరెందువల్లనో గానీ ఇంకెవరూ అక్కడి నేలని ముద్దాడాలని తపిస్తున్నట్లు అతనికి కనిపించలేదు. ‘ఎట్లాగో ఈ ధరిత్రి మీద అడుగు పెట్టగానే ముద్దు పెట్టలేదు. వీలయినప్పుడు పెడతాను. ఇంక చేసేదేముంది?’ అని బంగార్రాజు సరిపుచ్చుకున్నాడు.

కస్టమ్స్ నించి బయట పడగానే బంగార్రాజుకి ధనలక్ష్మీ, బాబిగాడు, కత్రీనా, తల్లీ, అత్తమామలూ కనపడ్డారు. కత్రీనా కట్రీనాని తలపించేలా చికాగ్గా ఏడుస్తూ, తల్లి చంక దిగిపోతానంటోంది. వాళ్లిద్దరినీ కలిపి ఒకేసారి కావలించుకోగానే ధనలక్ష్మి అతనికి టూ లీటర్ వాటర్ బాటిల్ని అందించింది. తరువాత, పదేళ్ల బాబిగాడి తలని చేత్తో నిమురుతూ అలాగే పట్టుకుని తల్లిని కావలించుకుని, ఆమె రెండు బుగ్గలనీ ముద్దుల వర్షంలో ముంచేశాడు. ధనలక్ష్మిని చూడగానే నీళ్లని నింపుకున్న అతని కళ్లు, జననీ జన్మభూమిశ్చ పాట గుర్తొచ్చి తల్లి మీద కుంభవృష్టిని కురిపించాయి.

“ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటి ముద్దుల వర్షాన్ని నామీద కురిపించాడు. మళ్లీ ఇప్పుడు! నువ్విలాగే పదేళ్లకోసారి వస్తూండరా,” అన్నదతని తల్లి కళ్లని చీరెకొంగుతో ఒత్తుకుంటూ.

మిఠ్ఠీ – ధరిత్రి – జన్మభూమి అనుకుంటూ అతను నేల వైపు చూసేటంతలో, ధనలక్ష్మి, “అయ్యయ్యో! ఇది ఎట్లా కిందపడి పొర్లుతోందో చూడు. ఇదుగో, యాదమ్మా, దీన్ని ఎత్తుకుని రావే. ఆ వంటి నిండా మట్టితో దాన్ని నేను ముట్టుకోను. ఇంటికెళ్లి స్నానం చేయించిన తరువాత దాన్ని పడుకోబెట్టు,” అని ఆజ్ఞని జారీ చెయ్యడం వినిపించింది.

నేలకి బదులుగా కత్రీనా వంటిని అంటుకుని వున్న మిఠ్ఠీని ముద్దు పెట్టుకుంటే ఆ ధరిత్రిని ముద్దు పెట్టుకున్నట్లే గదా అన్న బ్రిలియంట్ ఐడియాతో అతను కత్రీనాని ముట్టుకోబోతుంటే, ధనలక్ష్మి అతన్ని ఇవతలకి లాగింది.

“ఒక రోజంతా ప్రయాణం చేసొచ్చావ్. నీ క్రిములని దానికంటించబోకు.”

“మరి, నువ్వు నన్ను ముట్టుకున్నావ్ గదా!”

“ఇది వేరు,” అంటూ అతని పెదాలతో తన పెదాలను కలపబోయింది. “అబ్బ! కంపు! అమెరికన్ ఎయిర్‌పోర్టుల్లో కనిపించే జంటల్లాగా ఎంచక్కా పెదాలు కలిపే ముద్దు కోసం ఎదురు చూస్తుంటే, లాండ్ అయ్యే ముందర పళ్లు తోముకుంటే ఏం పోయిందట?” అని చికాకుపడి సుతారంగా పెదాలని అతని పెదాలకి తాకించి దూరంగా జరిగింది.

బంగార్రాజు ఆమె కోపాన్ని పట్టించుకోక పోవడానికి కారణమయిన ధరిత్రికి అతను ఇవ్వాలనుకున్న ముద్దుని తలుచుకుని, నెల రోజులుంటాగా, ఈ ధరిత్రి ఎక్కడికీ పోదులే! అనుకుని ఎయిర్‌పోర్ట్ నించి అందరితో కలిసి బయటపడ్డాడు.

నెల రోజుల పాటు ఇండియాలో తిరిగాడన్న మాటే గానీ, ఎక్కడా అతనికి తన పెదాలతో నేలని తాకడానికి మనస్కరించలేదు. పొరబాటున దేన్నన్నా తాకగానే, హాండ్ శానిటైజర్‌ని చేతులకి రాసుకొమ్మనమని ధనలక్ష్మి అతనికి వెంటనే అందించేది. ధనలక్ష్మి పక్కన లేకపోయినా ఆమె కళ్లతో చూడడం అలవాటయినందువల్లనో ఏమో, ఎక్కడ చూసినా అతని కళ్లని ఎక్కువగా ఆకట్టుకొంది నేలమీది చెత్తా, చెదారం, కారాకిళ్లీ మరకలూను. ఆఖరికి, నిజంగా పుట్టిన చోటంటూ వెళ్లిన అతని అమ్మమ్మగారి ఊళ్లో కూడా అతని కోరికని నెరవేర్చుకోలేక పోయాడు. అక్కడ వాళ్ల సావిట్లో జంతువులు చేసిన రొచ్చుని చూస్తే అతనికి అక్కణ్ణుంచి ఎంత తొందరగా పారిపోదామా అని అనిపించింది. పోనీ తిరుపతి వెళ్లినప్పుడో? ఎంతయినా పుణ్యతీర్థం కూడాను అనుకున్నాడు గానీ అక్కడ రోజూ లక్షలమంది తిరుగుతారని తెలుకున్నాక ఆ ఆలోచననే దగ్గరికి రానివ్వలేదు. పైగా, వాళ్లు అక్కడ ఉన్నప్పుడు వర్షం కురిసి మడుగులు కట్టాయి కూడా. షూస్ వేసుకున్న కాళ్లతోనే వాటిని దాటుకుంటూ నడవడం కష్టమయితే ఇంక ముద్దెక్కడ పెట్టుకుంటాడు? హైదరాబాద్‌లో సరేసరి! చిన్న వర్షాలకే రోడ్లు కాస్తా చెరువులుగా మారతాయి. వర్షం కురవనప్పుడు? అని మీరడగొచ్చు. కాంపౌండ్ వాల్ దగ్గర్నుంచీ మొదలు పెట్టి అంతా గచ్చుమయం చేసిన (అతనున్న) ఇళ్లల్లో మట్టికి తావేదీ? బస్సులూ కార్లూ వెడుతూ ఇంట్లోకి విసిరేసిన దుమ్మునీ, ధూళినీ అతనెలా ముద్దు పెట్టుకుంటాడు, ధనలక్ష్మి ఎలా కుదరనిస్తుందీ?

నెల రోజులిట్టే గడిచిపోయి, బంగార్రాజు కుటుంబసమేతంగా అమెరికా వెళ్లే ఘడియ రానే వచ్చింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మిగ్రేషన్ అయిపోయి, విమానం ఎక్కడానికి వెయిట్ చేస్తున్నప్పుడు ఏదో కలకలం వినిపించి అటువైపు చూశాడు. ఎవరో ఒక ప్రయాణీకుణ్ణి ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వాళ్లు పట్టుకుని గదమాయిస్తున్నారు, ఇక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదంటూ. బంగార్రాజు అతణ్ణి వెంటనే గుర్తు పట్టాడు. వీడు నా ఫ్లయిట్ లోనే వచ్చాడు, అని ధనలక్ష్మికి చెప్పి, కుతూహలంతో వాళ్ల దగ్గరికి వెళ్లబోయాడు. ఇంతలో సెక్యూరిటీ మనుషుల చేతుల్లో ఉన్నతను కాస్తా వాడిపోయిన తోటకూర కాడలాగా వాళ్ల చేతుల్లోంచి కిందకు జారి నేలమీద వెల్లకిలా పడిపోయి గిలగిల కొట్టుకోవడం మొదలు పెట్టాడు. సెక్యూరిటీ వాళ్లు, అర్జెంటుగా డాక్టర్‌ని పిలవండి అని వాకీ-టాకీలో చెబుతూ అతణ్ణి వదిలిపెట్టారు. క్రింద పడ్డతను కాస్తా చటుక్కున బోర్లాపడి నేలని ముద్దు పెట్టుకుని గర్వంగా లేచి, కాలర్ ఎగరేసుకుంటూ అక్కణ్ణించి బయల్దేరి బంగార్రాజు కెదురొచ్చాడు.

“మీకు ధరిత్రిని ముద్దు పెట్టుకోవడానికి బయట నెలరోజుల అవకాశముండగా ఇక్కడ, ఇంత నాటకమాడడం…” అని మధ్యలోనే ఆగిపోయాడు బంగార్రాజు.

“నేను ఎయిర్‌పోర్టులో ముద్దు పెట్టుకోవాలని ప్రతిజ్ఞ చేశాను. లేకపోతే, ఫ్లయిట్ దిగినప్పుడు నాచేత వెయ్యిరూపాయల జరిమానా కట్టిస్తారా?” అని రుసరుసలాడుతూ అతను వెళ్లిపోయాడు.

అప్పటి దాకా ధరిత్రిని ముద్దు పెట్టుకోలేదన్న బంగార్రాజు పుండు మీద వాడెవడో అంత సునాయాసంగా ముద్దు పెట్టడం కారం జల్లినట్లనిపించింది. అలాగని ఆ కారాన్ని అంతమంది మధ్య తుడుచుకోనూ లేడు, ఆ పుండుని కడుక్కోనూ లేడు. వాళ్లెక్కబోయే విమానానికి నెక్స్ట్ స్టాప్ ఇండియా బయటేనని బంగార్రాజుకి తెలుసు. ఆ ఆలోచన రాగానే బంగార్రాజు కళ్లలోంచి చిరుజల్లు మొదలయింది. అతని వాలకాన్ని కనిబెట్టిన ధనలక్ష్మి అతను ఏమాలోచిస్తున్నాడో తెలుసుననుకుని, “గ్రీన్ కార్డ్ వచ్చిందిగా, ఈసారి పదేళ్లు ఆగక్కర్లేదు లెండి మళ్లీ రావడానికి,” అని చేతిలో రెడీగా పెట్టుకున్న హాండ్ టవల్ని అందిచ్చింది.

“ఐషూ, ఈ పాలిథీన్ కవర్లో ఏమిటిది?” అమెరికాలో ఇంటికి చేరిన వారం తరువాత ఒక సూట్‌కేసుని తెరిచినప్పుడు కనిపించిన కవర్ని చూపించి అడిగాడు బంగార్రాజు.

“అదా! హుసేన్ సాగర్లో నిమజ్జనం చెయ్యబోయేముందు వినాయకుడి వీపుని గోకి తెచ్చిన మట్టట. వచ్చేటప్పుడు మా అమ్మ ఇచ్చింది,” అన్నది ధనలక్ష్మి.

బంగార్రాజు ముందు ఆ పాలిథీన్ కవర్ని ముద్దు పెట్టుకోవడం ఏమిటో, తరువాత తనమీద ముద్దుల వర్షాన్ని ఎందుకు కురిపిస్తున్నాడో అర్థం కాకపోయినా, “ఐ లవ్యూ సో మచ్‌రా బంగారూ!” అన్నది ధనలక్ష్మి అతని కౌగిలిలో తడిసిపోతూ.
-------------------------------------------------------
రచన: తాడికొండ కె. శివకుమార శర్మ, 
ఈమాట సౌజన్యంతో