Showing posts with label శ్రీకృష్ణదేవరాయలు. Show all posts
Showing posts with label శ్రీకృష్ణదేవరాయలు. Show all posts

Tuesday, August 1, 2017

శిరఃప్రధానమను వాక్యం బెమ్మెయిన్ దప్పునే


శిరఃప్రధానమను వాక్యం బెమ్మెయిన్ దప్పునే




సాహితీమిత్రులారా!



శ్రీకృష్ణదేవరాయలవారి ఆముక్తమాల్యదలోని
ఈ పద్యం చూడండి ఇది పంచమాశ్వాసంలో
నాయిక వర్ణనలోనిది-

హేమాభాంగ విభాధరారుణి వక్త్రేందు ప్రభాశీలద
ద్భామారత్నము వొందదయ్యె మును దత్తద్వర్ణ యుక్తాఖ్య లన్
శ్యామాత్వంబళి గర్వధూర్యాహ కచచ్ఛాయాచ్ఛటంగాంచె నౌ
గామున్నుర్వి శిరఃప్రధాన మనువాక్యం బెమ్మెయిందప్పునే


ఆకన్యక(గోదాదేవి) శరీరం బంగారు వన్నెకలిగి ఉన్నదానివల్ల గాని,
అధరోష్ఠం ఎఱ్ఱగా ఉన్నదానివల్లగాని, ముఖము చంద్రుని వన్నెకలిగి
ఉన్నదానివల్లగాని, తత్వర్ణాను సరణంగా- హేమాంగి, బిబోష్ఠి,
చంద్రముఖి అనే నామాలు వహింపక తేటులతో దీటగు నల్లని
తలవెంట్రుకల కాంతికి అనుగుణంగా శ్యామ అనే నామం వహించింది.
శ్యామ అనగా యౌవన మధ్యస్థురాలనీ, సర్వశరీరంలో శిరమే ప్రధానం
కావడం వల్ల ఆ శిరఃకాంతే ప్రధానంగా ఆపేరు వచ్చిందని భావం.

Thursday, December 1, 2016

వేసవిలో పగలేందుకు దీర్ఘమో


వేసవిలో పగలేందుకు దీర్ఘమో




సాహితీమిత్రులారా!


ఎండాకాలాన్ని ఆముక్తమాల్యదలో
ద్వితీయాశ్వాసంలో 44వ పద్యం నుండి 70వ పద్యం
వరకు వర్ణించాడు. అందులోని ఒక పద్యం ఇది-

పడమర వెట్టు నయ్యుడుకుప్రాశన మొల్లక కూటికిపేదలై
బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవియాజ్ఞ మాటికిన్
ముడియిడఁ బిచ్చుగుంటు రథము న్నలుప న్బయనంబు సాగమిన్
జడను వహించె నాఁగ దివసంబులు దీర్ఘము లయ్యె నత్తఱిన్
                                                                  (ఆముక్తమాల్యద -2-49)


సూర్యరథానికి సారథి అనూరుడు(తొడలు లేనివాడు)
ఆ రథానికి పగ్గాలు పాములు. ఎండాకాలంలో
పడమర నుండి వీచే గాలులు వేడిగా ఉండటం
వలన గాలిని మేసే పాములు గాలిని తినలేక
నీరసించి పోయినాయి. రథసారధి అనూరుడు
పగ్గాలను లాగడంవల్ల అవి తెగిపోతున్నాయి.
సూర్యుని ఆనతిమేర తెగిన ప్రతిసారి రథాన్ని
నిలిపి పాము పగ్గాలను ముడి వేసి బిగించి రథాన్ని
నడిపవలసి వచ్చిది. అందువల్ల సూర్యరథయానం
ఆలస్యమైపోతుందట. దానివల్ల ఎండాకాలంలో
పగలు దీర్ఘములౌతున్నాయట - అని భావం.

ఎంతటి అపూర్వమైన ఊహయో కదా !

Monday, November 28, 2016

తారుణ్యాతిగ చూతనూత్న ఫలము


తారుణ్యాతిగ చూతనూత్న ఫలము




సాహితీమిత్రులారా!



ఆముక్తమాల్యదలో వేసవికాలంలో విష్ణుచిత్తుడు
అతిథులకు ఎలాంటి భోజనం వడ్డిచాడో చూచాం.
అదే తరుణంలో మాంసాహారుల వేసవి భోజనం
ఎలా ఉండేదో కూడ శ్రీకృష్ణదేవరాయలవారు
వర్ణించారు ఆ పద్యం చూడండి-

తారుణ్యాతిగ చూతనూత్న ఫలము క్తైలాభిఘార స్వన
ద్ధారా ధూపిత శుష్కదంబుహృత మాత్స్యచ్ఛేద పాకోద్గతో
ద్గారపుంగన రార్చు భోగులకు  సంధ్యావేళలం గేళికాం
తారాభ్యంతర వాలుకా స్థి హిమాంత ర్నారికే ళాంబువుల్
                                                                        (ఆముక్తమాల్యద - 2- 68)


ఆ వేసవి యందు సంపన్నమైనవారు (భోగులు) మధ్యాహ్నమున
దోరమామిడి ముక్కలతో చుయ్యని శబ్దం వస్తూండగా నూనెపోత
తాలింపు వేసి నీటితడి ఇగురగానే తీసిన చేప బద్దలయిగురుతో
తింటారు. ఆ చేపల కూర తిన్నాక సాయంకాలమున తిన్న
భోజనము జీర్ణమయేప్పుడు ఆ చేపల కసరుతో త్రేన్పులు
వస్తూండేవి. వాటిని  తగ్గించటానికి ఇసుకలో పూడ్చి పెట్టిన
కొబ్బరికాయలను అప్పుడే తీసి వాటిని పగులగొట్టి వాటినీరు
త్రాగితే అవి(ఆ త్రేనుపులు) శాంతించేవి - అని భావం.

Sunday, November 27, 2016

వేసవి చందన చర్చ మున్నుగన్


వేసవి చందన చర్చ మున్నుగన్



సాహితీమిత్రులారా!


ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలవారు
విష్ణుచిత్తుడు విల్లిపుత్తూరునందు
అతిథులకు వేసవిలో వండించి
పెట్టిన భోజన వివరం
ఈ పద్యంలో చూడండి-

తెలి నులివెచ్చ యోగిరము తియ్యని చారులు తిమ్మనంబులున్
బలుచని యంబళు ల్చెఱుకు పాలెడనీళ్ళు రసావళు ల్ఫలం
బులును సుగంధి శీతజలము ల్వడపిందెలు నీరు చల్లయు
న్వెలయగ పెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్
                                                                       (ఆముక్తమాల్యద -1-81)

వేసవికాలం కాబట్టి అతిథులకు
ముందుగా తాపం చల్లార్చే
గంధపు పూతపెట్టి తరువాత
ఆహారపదార్థాలను వడ్డించేవారు
అవన్నీ వేడిని పోగొట్టే పదార్థాలే. అవి-

కొంచెం వేడిగా ఉండే తెల్లని అన్నము,
బెల్లము వేసిన చారు,
తిమ్మనంబులు అనే తీపి పదార్థాలు,
 పల్చని అంబళులు(పులుసులు)
చెఱకురసం, కొబ్బరినీళ్ళు,
తీపి భక్ష్యములు(రసావళులు, అతిరసలు)
పండ్లు, సువాసనగల చల్లని నీరు,
వేసవి తాపాన్ని పోగొట్టటానికి ఊరవేసిన
మామిడి పిందెలు, నీరు ఎక్కువగా కలిగిన
మజ్జిగ, తృప్తిగా భోజనము పెట్టేవాడు.
- అని భావం.

Friday, November 25, 2016

పునుగుందావి నౌదనంబు మిరియంపు బొళ్లతో


పునుగుందావి నౌదనంబు మిరియంపు బొళ్లతో




సాహితీమిత్రులారా!


శీతాకాలంలో విష్ణుచిత్తుడు అతిథులకు
ఎలాంటి భోజనం వడ్డిచేవాడో
శ్రీకృష్ణదేవరాయలు
ఆముక్తమాల్యదలో ఇలావివరించాడు-

పునుగుదావి నౌదనంబు మిరియంపు బొళ్లతో జట్టి చు
య్యను నాదాఱని కూరగుంపు, ముకుమందై యేర్చునావం జిగు
ర్కొను పచ్చళ్లును, బాయసాన్నములు, నూరుంగాయలున్, జేసుఱు
క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారంబిడు న్సీతునన్
                                                                             (ఆముక్తమాల్యద-1-82)

పుగనుగుతావుల వరి అన్నం,
మిరియపు పొడితోపాటు
చుయ్యిమనే తిరుగమోత చప్పుడు
చల్లారని శాకాలు, ముక్కుజబ్బును
మాన్పగలిగే ఆవపిండితో కూరిన
పచ్చళ్ళు, ఊరగాయలు, చేయి
చురుక్కుమనే నేయి, సగమిగురకాచిన
పాలు చలికాలంలోని ఆహారపదార్థాలుగా
వడ్డించేవాడు విష్ణుచిత్తుడు - అని భావం.

Monday, November 21, 2016

గగనము నీరుబుగ్గ కెనగా


గగనము నీరుబుగ్గ కెనగా




సాహితీమిత్రులారా!




మానవజీవితానికి ఋతుచక్రానికి ఉన్న
 అవినాభావ సంబంధం శ్రీకృష్ణదేవరాయలు
దర్శించినంతగా మరేకవీ వీక్షించలేదు.
వర్షాకాలంలో విష్ణుచిత్తుడు తన భార్య భోజనము వండగా
తీర్థయాత్రికులకు వడ్డించిన తీరు
ఈ పద్యంలో రాయలవారు
వర్ణించారు చూడండి-

గగనము నీటిబుగ్గ కెనగా జడిపట్టిననాళ్ళు భార్య కన్
పొగ సొరకుండ వారికెడపుంబొఱియ ల్దవిలించి వండ న
య్యగపల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చినప్రప్పు నాలు గే
న్లొగసినకూరలు న్వడియము ల్వరుగు ల్పెరుఁగు న్ఘృతప్లుతిన్
                                                                 (ఆముక్తమాల్యద - 1- 80)


ఇది వర్షాకాల భోజనవిషయం-

వానాకాలంలో వంట చేసేప్పుడు
తనభార్య కళ్ళలో పొగ చొరకుండా
ఉండటానికి విష్ణుచిత్తుడు నీరు తీసివేసి
ఎండించిన టెంకాయ బోండాలను పొయ్యిలో
పెట్టించి వంట చేయించి ఇంటికి వచ్చిన
అతిథులకు ఆ టెంకాయ చిప్పలనే వరి అన్నము,
పప్పు, కూరలు, వడియాలు, వరుగులు, పెరుగు, నెయ్యితో
కూడిన భోజనం వడ్డించేవాడు- అని భావం.


Thursday, November 17, 2016

తల బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు


తల బక్షచ్ఛట గ్రుచ్చి బాతువులు




సాహితీమిత్రులారా!


ఆముక్తమాల్యదలో విష్ణుభక్తే కాక రాయల
వర్ణనా వైదగ్ధ్యానికి, లోకోత్తరమైన ఊహాశక్తి,
లోకజ్ఞతకూ నిలువెత్తు నిదర్శనంగా
నిలుస్తున్నదీ పద్యం తిలకింపుడు-


తల బక్షచ్ఛట గ్రుచ్చి బాతులు కేదారంపు గుల్యాంతర
స్థలి నిద్రింపగ జూచి యారెకు లుషస్నాత ప్రయాత ద్విజా
వలి పండీకృత శాటు లన్సవి తదావాసంబు జేర్పంగ రే
వుల డిగ్గి న్వస బారువాని గని నవ్వు న్శాలిగోప్యోఘముల్
                 
                                                                                     (ఆముక్తమాల్యద - 1- 65)

విల్లిపుత్తూరు చుట్టూ మాగాణి పొలాలున్నాయి.
ఆ పొలాల్లో వరి ఏపుగా పెరింది.
ఆ వరిమళ్ళకు కాలువలు తీయబడ్డాయి.
ఆ పంటకాలువల ఒడ్డుపై రెక్కల్లో తలముడుచుకొని
ఉన్న బాతులను చూచి అవి ప్రొద్దున్నే స్నానం చేసి
మరిచి వెళ్ళిన బ్రాహ్మల ధోవతులనుకొంటూ
ఆ ఊరి కాపలావాళ్ళు వాటిని ఆ యజమానులకు
అప్పగిద్దామని కాలువలోకి దిగగా ఆ బాతులు
లేచి పారిపోతున్నాయి. ఈ దృశ్యాన్ని చూచి
పొలాల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు నవ్వుకొంటున్నారట
- అని పద్యభావం. 

Tuesday, November 15, 2016

ఎండ నన దిఙ్ముఖములు రాఁజె


ఎండ నన దిఙ్ముఖములు రాఁజె




సాహితీమిత్రులారా!



శ్రీకృష్ణదేవరాయలవారు తన ఆముక్తమాల్యదలో 
ద్వితీయాశ్వాసంలో 48 పద్యం నుండి 70వ పద్యం 
వరకు మొత్తం 22 పద్యాలు వేసవి కాలవర్ణ తో సాగింగాయి. 
అందులోని ఒక పద్యం చూడండి-


నీర్ఝర ప్రబలవేణిక లింక జట్రాలఁ
         బేరినప్రాచి పెన్పేటు లెగసె
నెఱుకులు పడియనీ రివుర  గువ్వలఁ బట్టఁ
         బోయునీ రాడడఁ బొలము నెఱసె
సురగాలి దవదగ్ధ తరుపర్ణతతి రేఁపఁ
         బావురా లని డేగపదుపు దూఱె
నిద్రితద్రుచ్ఛాయ నిలువక జరగ వెం
         బడిన యధ్వగ పంక్తి పొరలువెట్టె
క్షేత్రపాలున కుదికినచీర లాఱు
చాకిరేవులగములయ్యె సకలదిషలుఁ
దెలుపులుగఁ దోఁచె నెండమావుల బయళ్ళు
గందె నివి యెండ నన దిఙ్ముఖములు రాఁజె
                                                                                                      (2-46)


నీర్ఝర ప్రబలవేణిక లింక జట్రాలఁ
         బేరినప్రాచి పెన్పేటు లెగసె

కొండలపైనుండి దూకే సెయేళ్ళపాయలు ఎండిపోగా
వాటి మధ్యలో ఉన్న చట్టుబండలపై నీరు ఉన్నపుడు
పేరుకొని పోయిన పాకుడు(ప్రాచి) బిళ్ళలు బిళ్ళలుగా
పగిలిపోయింది.

నెఱుకులు పడియనీ రివుర  గువ్వలఁ బట్టఁ
         బోయునీ రాడడఁ బొలము నెఱసె
అడవిలో పల్వల సమూహాల్లోని నీరు (చిన్న గుంటలలోని నీరు)
ఆవిరై పోయాయి.(ఎరుకల వాళ్ళు గువ్వల కోసం అక్కడక్కడా
గుంటలు త్రవ్వి నీరు పోసి ఉంచుతారు గువ్వలు అక్కడ
వాలినపుడు పట్టుకోవడానికి అనుకూలంగా) ఆగుంటల్లోని
నీరు పొలాలలో అక్కడక్కడా కనిపిస్తున్నాయి కాని చెరువుల్లోను
గుంటల్లోను నీరు ఎక్కడా ఒక్కబొట్టుకూడ లేదు.


సురగాలి దవదగ్ధ తరుపర్ణతతి రేఁపఁ
         బావురా లని డేగపదుపు దూఱె
కార్చిచ్చులో పడి చెట్లు కాలిపోగా కాలిన అస్థిపంజరాల్లా
ఆకులు సుడిగాలిలో అల్లాడుతున్నాయి. వాటిని చూచి గద్దలు
పావురాలనుకొని ఆ మాడిన ఆకుల గుంపుల్లోకి ప్రవేసిస్తున్నాయి.

నిద్రితద్రుచ్ఛాయ నిలువక జరగ వెం
         బడిన యధ్వగ పంక్తి పొరలువెట్టె
చెట్లనీడల్లో మధ్యాహ్నవేళ ప్రయాణం చేస్తూ అలసిపోయిన
బాటసారులు ప్రక్కనే ఉన్న బావులలో ఇంతనీరు త్రాగి
సేదతీరి నిద్రపోయారు. ఆ నీడలు సూర్యగమనంతో
చలిస్తూంటే నిద్రలో ఉన్న బాటసారులు తెలియకుండానే
నీడతోపాటు దొర్లుతున్నారు.


క్షేత్రపాలున కుదికినచీర లాఱు
చాకిరేవులగములయ్యె సకలదిషలుఁ
దెలుపులుగఁ దోఁచె నెండమావుల బయళ్ళు

అన్ని దిక్కులు తెల్లగా మెరిసిపోతున్నందున
అవి క్షేత్రపాలకుడు(కాలభైరవుడు) ఉతికి ఆరవేసిన
వస్త్రాల్లా ఉన్నాయి


గందె నివి యెండ నన దిఙ్ముఖములు రాఁజె

సుకుమారువ ముఖాలు ఎండలో కంది పోవడం
సహజం కనుక దిక్కులనబడే స్త్రీలముఖాలు
కందిపోయినవో అన్నట్లుగా రాజుకున్నాయి
దిగంతాలలో కార్చిచ్చు క్రమ్ముకొన్నది.

రాయలసీమలో ఎండలు ఎంతగా ఉంటాయో
దీనిలో వర్ణించిన సహజరీతి తెలుపుతున్నది

Saturday, November 12, 2016

తదాస్య మారుత సుగంధాకృష్టమై


తదాస్య మారుత సుగంధాకృష్టమై



సాహితీమిత్రులారా!



శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోని
పాంచజన్య స్తుతి చూడండి-

హరి పూరింపఁ దదాస్య మారుత సుగంధాకృష్టమై నాభిపం
కరుహక్రోడమిళిందబృంద మెదు రెక్కం దుష్క్రియాపంక సం
కర దైత్యాను పరంపరం గముచు రేఖం బొల్చు రాకా నిశా
కరగౌరద్యుతి పాంచజన్య మొసఁగుం గళ్యాణ సాకల్యమున్


విష్ణువు తన శంఖాన్ని పూరిస్తుంటే 
ఆ స్వామి ముఖవాయువులందున్న
పరిమళాలవల్ల ఆయన నాభిపద్మంలో 
ఉన్న తుమ్మెదలబారు ఎదురెక్కుతున్నది. 
అది ఎలా ఉందంటే శంఖధ్వని పాపపంకిలమైన 
రాక్షసుల ప్రాణసమూహాన్ని త్రాగుతున్నట్లుగా ఉన్నది. 
పున్నమినాటి చంద్రునివలె తెల్లగా ఉన్న ఆ పాంచజన్యం 
సకల కల్యాణములను ప్రసాదించు గాక! - అని భావం.