Wednesday, February 28, 2018

బ్రాహ్మణాలు అంటే ఏమిటి?


బ్రాహ్మణాలు అంటే ఏమిటి?




సాహితీమిత్రులారా!




వైదికమంత్రాల అర్థాన్ని వివరించి వాటి వినియోగాన్ని
నిర్తేశించేవి బ్రాహ్మణాలు. వేదమంత్రద్రష్టలను ఋషులు అనీ,
బ్రాహ్మణ ద్రష్టలను ఆచార్యులు అనీ అంటారు. ఆదిలో 
బ్రహ్మణాలు అనేకం ఉండేవి. అవి ప్రస్తుతం లభించిన
కొద్ది బ్రాహ్మణాలు తప్ప మిగిలినవన్నీ కాలగర్భంలో కలిసి 
పోయాయని విద్వాంసులు భావిస్తున్నారు. యజ్ఞకర్మల 
విధానంలోని భేదాలనుబట్టి,  మతభేదాలను బట్టి ఏయజ్ఞంలో
ఏ మంత్రాలను ఉపయోగించాలో, మంత్రాలకూ యజ్ఞాలకూ గల 
సంబంధం ఎటువంటిదో, బ్రాహ్మణాలు సూక్ష్మంగా వివరిస్తాయి.
అట్టి వివరణలలో మధ్యమధ్య కొన్ని కథలను కూడ చెప్పడం 
జరిగింది. పురూరవ ఊర్వశుల కథ (శతపథబ్రాహ్మణం - 11-5-1),
జతౌషు వృత్తాంతం (శతపథబ్రాహ్మణం - 1-8-1), హరిశ్చంద్రోపాఖ్యానం 
అలాంటి కథలే. కథా కథనశిల్పం బ్రాహ్మణ గ్రంథాలలో పరిణత
రూపంలో కనిపిస్తాయి. బ్రాహ్మణాలు గద్యాత్మకరచనలు.
బ్రాహ్మణాలలో నాలుగు భాగాలున్నాయి.
1. విధివిభాగం, 2. అర్థవిభాగం, 3.ఉపనిషద్విభాగం,
4. ఆఖ్యానవిభాగం.

ఋగ్వేదబ్రాహ్మణాలు - 2
1. ఐతరేయ బ్రాహ్మణం, 2. శాంఖాయన బ్రాహ్మణం

యజుర్వేద బ్రాహ్మణాలు - 
శుక్లయజుర్వేదానికి - శతపథబ్రాహ్మణం
కృష్ణయజుర్వేదానికి - తైత్తిరీయ బ్రాహ్మణం

సామవేద బ్రాహ్మణాలు -
దీనిలో 9 బ్రాహ్మణాలున్నాయి.
కాండ్య, షడ్వింశ, సామవిధాన, ఆర్షేయ, దేవతాధ్యాయ,
ఉపనిషద్, సంహితోపనిషద్, వింశ, జైమినీయ బ్రాహ్మణాలు

అధ్వరవేద బ్రాహ్మణాలు-
దీనిలోనూ 9 బ్రాహ్మణాలు ఉన్నాయని చెబుతున్నా
ఒక్కటి మాత్రమే లభించింది.
అదీ గోపథ బ్రాహ్మణం.

Tuesday, February 27, 2018

ఉండవలసింది ప్రేమ ఒక్కటే


ఉండవలసింది ప్రేమ ఒక్కటే




సాహితీమిత్రులారా!


ఇక్కడ మనం శ్రీకృష్ణభక్తురాలైన
మీరాబాయి ఒక కీర్తనను
తెలుగు అనువాదంలో చూద్దాం-

ప్రతి నిత్యం స్నానంచేస్తేనే దేవుడు సాక్షాత్కరించేటట్టయితే
వెంటనే నేను తిమింగలాన్నవుతాను, అఖాతంలో;

దుంపలూ పళ్ళూ తిన్నంతమాత్రాన తెలిసేటట్టయితే ఆయన,
నేను మేకజన్మ ఎత్తితేనే బాగుండు ననుకుంటాను;

జపమాల తిప్పితేనే ఆయన బయటపడతాడంటే
పెద్దపూసల మాలతోనే జపాలు చేస్తాను;

రాతిబొమ్లకు మొక్కడం వల్లనే ఆయన తెరమరుగు విడుస్తాడంటే
పాషాణమయమైన పర్వతాన్నే పూజిస్తాను, సవినయంగా;

పాలు తాగితేనే ఆయన్ని ఒంటబట్టించుకోవచ్చంటే
ఎన్నో పాడిదూడలకూ పసిపిల్లలకూ ఆయనీపాటికి
తెలిసిపోయే ఉండాలి;

పతిని విడిచిన మాత్రాన దేవుడికి పిలుపందుతుందంటే
వేలకొద్దీ జనం నపుంసకులయిపోరా మరి?

మీరాబాయికి తెలుసు, దేవుణ్ణి కనుక్కోడానికి
తప్పకుండా ఉండవలసింది, ప్రేమ ఒక్కటేనని.

ఎంత చక్కగా చెప్పిందోకదా విషయాన్ని
అలాగే ఈ కీర్తనలో కబీరు దోహాలలోని
భావం కూడా కనిపిస్తుంది.

Monday, February 26, 2018

శృంగార చేష్టలు అంటే---------2


శృంగార చేష్టలు అంటే---------2




సాహితీమిత్రులారా!
తరువాయి భాగం.........



8. లలితం - 
చేతులు కాళ్ళు మొదలైన అవయవాల్ని సుకుమారంగా 
కదిలించడం లలితం

9. విచ్ఛిత్తి -
ఆభరణాలు కొద్దిగా ధరించినా కాంతిని పోషిస్తే అది విచ్ఛిత్తి

10. బిబ్బోకం -
అతి గర్వంచే ఇష్టమైన వస్తువుపై కూడ అనాదరం 
చూపడం బిబ్బోకం

11. విహృతం -
సిగ్గుతో పలకవలసిన కాలాన పలకకుండటం విహృతం

12. చకితం -
ప్రియుని ఎదుట ఏదోకారణంతో భయపడి తొట్రుపాటు 
నొందటం చకితం

13. హసితం - 
యౌవనోదయంచే అకారణంగా నవ్వడం హసితం

14. కుట్టమితం -
ప్రియుడు తన కేశాలు, స్తనాలు,  అధరాలు గ్రహిస్తే
లోలోపల సంతోషిస్తూ కూడ తత్తర పడుతూ తలను
చేతుల్ని విదిలించడం కుట్టమితం

15. కుతూహలం - 
అందమైన వస్తువుని చూడాలనే చాపల్యం కుతూహలం

16. శోభ -
రూప యౌవన సుకుమార భోగాలవల్ల 
అంగాలకు కలిగే అందం శోభ

17. కాంతి -
మన్మథునిచే వర్థిల్ల చేయబడ్డ శోభయే కాంతి

18. దీప్తి -
అత్యంతమైన కాంతియే దీప్తి

19. ప్రగల్భత -
ప్రియుడు ప్రియురాలు పరస్పరం రమించేప్పుడు
అప్రతిబంధకంగా వర్తిల్లడం ప్రగల్భత

20. ఔదార్యం - 
ఔదార్యం అంటే వినయం అంటే ప్రియుని 
తప్పు తెలిసినా కోపగించక పోవటం ఔదార్యం 

21. మదం -
సౌభాగ్యం యవ్వనాదుల గర్వం వల్ల కలిగే వికారం మదం

22. తపనం -
ప్రియ విరహ సమయంలో మోహాతిరేకంతో 
కలిగే చేష్ట తపనం

23. మౌగ్ద్యం -
తెలిసిన వస్తువును గూర్చి తెలియనివిధంగా 
ప్రియుని సన్నిధిలో ప్రశ్నించటం మౌగ్ద్యం

24. విక్షేపం -
ప్రియుని ఎదుట భూషణాలు సగం దాల్చడం,
ఊరకే అటు ఇటు చూడడం, రహస్యంగా మాట్లాడటం
మొదలైన చేష్ట విక్షేపం.

25. కేళి -
ప్రియునితో విహరించేప్పుడు చేసే 
చుంబన ఆలింగనాది క్రీడ కేళి

Sunday, February 25, 2018

సిగ్గులేకుండా నేను పండితున్నంటాడు


సిగ్గులేకుండా నేను పండితున్నంటాడు




సాహితీమిత్రులారా!




ప్రాకృత భాషలోని ముక్త పదాలు(చర్యాపదాలు)వ్రాసినవారిలో
పదవ శతాబ్దంలో పేరెన్ని గన్నవారు కృష్ణపాదుడు(కణ్హ) ఒకరు
శరహస్తపాదుడు(సరహపా) మరొకరు.
వీరిరువురిలో శరహస్తపాదుని వాక్కు
తీవ్రంగా ఉంటుంది. ఆయన రచించిన
ఒక చర్యాపదం ఇక్కడ చూద్దాం -

పండిఅ సఅల సత్థ బక్ఖాణ ఇ
దేహ హి బుద్ధ బసంత ణ జాణ ఇ
గమణా గమణ ణ తేణ బిఖండిఅ
తోచి ణిలజ్జ భణఇ హ ఉరి, పండి అ

పండితుడు సకల శాస్త్రాలను వ్యాఖ్యానిస్తాడు.
కాని తన శరీరంలో ఉండే ఆత్మను ఎరుగలేడు.
జనన మరణ పరిభ్రమణం నుంచి తప్పుకోలేడు.
అయినప్పటికీ సిగ్గు లేకుండా నేను పండితుణ్ణని
ఘోషిస్తాడు - అని భావం.

Saturday, February 24, 2018

మతుకుపల్లి వారి సరస్వతీ స్తుతి


మతుకుపల్లి వారి సరస్వతీ స్తుతి




సాహితీమిత్రులారా!
Image may contain: 1 person
ముఖపుస్తకంలో Dr. ఏల్చూరి మురళీధరరావుగారు పోస్ట్ చేసిన
సరస్వతీదేవి ప్రార్థన  వారిమాటల్లో చూద్దాం-
ఈనాటి సుప్రభాత వేళ శ్రీ మతుకుమల్లి నృసింహశాస్త్రి గారి అజ చరిత్రమును చదువుతున్నప్పుడు అవతారికలో ఈ స్తుతి కనబడింది. దైవదత్తమైన ఆ మహాపాండితికి, అపూర్వమైన ఆ కల్పనాశిల్పశోభకు, అపారమైన ఆ భక్తిపారమ్యానికి ఆశ్చర్యాతిశయం కలిగింది. ఇంతటి గాఢబంధంతోనూ, గంభీరమైన భావసంపుటితోనూ రచితమైన సరస్వతీ సంప్రార్థన ఇంకొకటి ఇంతవరకు నాకు కానరాలేదు. సర్వవిధాల ఆయన కవితాధోరణి నిరుపమానం అనిపించింది. అర్థతాత్పర్యాలతో ప్రకటించినట్లయితే కావ్యం విద్యార్థిలోకంలో సుప్రతిష్ఠితమై ఉండేదని అనిపించింది.

అద్భుతావహమైన ఆ పద్యరాజం ఇది:

ఘన ఘనశ్రీ సముత్కటజటా వర పదక్రమయుక్త్రయీమయ రమ్యవేణి 
నానాస్వరవ్యంజనప్రతానానూనశబ్ద మహాశబ్దశాస్త్రవీణ
భూరిగుణవిశేషపుంజైకనిత్యసంబంధవత్తర్కవిభ్రాజిరశన
సరససాలంక్రియోజ్జ్వలసువర్ణపదోరుసంగీతసాహితీస్తనభరాఢ్య

క్షిప్రసద్గతిముఖరభాట్టప్రభాక
రీయమంజీరయుగరమణీయచరణ
జలజ నిత్యప్రగల్భవాచాల వాణి
నిలచుఁ గాఁత మదీయాస్య జలరుహమున.

♦️ ఘన ఘనశ్రీ ... రమ్యవేణి – ఘన = దట్టముగా క్రమ్ముకొన్న, ఘన = మేఘము యొక్క, శ్రీ = శోభవంటి శోభచే, సముత్కట = విరివియైన, జటా = కేశముల అల్లికచే, వర = శ్రేష్ఠమైన, పద = స్వరూపముతోడి, క్రమయుక్ = విధానమును కలిగిన, త్రయీమయ = మూడు పాయలతో సంలగ్నమైన, రమ్యవేణి = అందమైన వేనలిని కలిగినదియును –

(ఘన = సంపుటీకరింపబడిన, ఘన = ఘనము అను పేరు గలిగిన గానఫణితి తోడను, శ్రీసముత్కటజటా - శ్రీ = బ్రహ్మవిద్యాసిద్ధికై, సముత్కట = నేర్చికొనుటకు విషమమైన, జటా = జట అను పేరుగల ఫణితి తోడను, వరపదక్రమయుక్ – వర = కోరదగిన, పద = పదము అను పేరు గల పాఠవిశేషము తోడను, క్రమ = క్రమము అను పేరితోడి పాఠక్రమము తోడను, యుక్ = కూడినట్టి, త్రయీమయ = ఋగ్యజుస్సామములను మూడు వేదములు మూడు పాయలుగా ప్రవహించుచున్న, రమ్యవేణి – అందమైన వాక్స్రవంతిని గలదియును - అని ఇంకొక అర్థం);

♦️ నానా ... వీణ – నానా = సాహిత్యమునందు అనేక ప్రకారములైన, స్వర = అచ్చుల యొక్క (ఉదాత్త అనుదాత్త స్వరిత ప్లుతములను ఉచ్చారణవిశేషముల యొక్క), వ్యంజన = హల్లుల యొక్క, ప్రతాన = విరివిచే ఏర్పడునట్టి, అనూన = సార్థకములైన, శబ్ద = పదసంపదతోడి, మహాశబ్దశాస్త్ర = విస్తారమైన వ్యాకరణశాస్త్రమునకు ప్రాణశక్తిని కూర్చు, వీణ = వీణాదండమును కలిగినదియును –

(నానా = సంగీతమునందు బహుత్వసిద్ధి గల, స్వర = స్వతోరంజకములైన సప్తస్వరముల యొక్క, వ్యంజన = సువ్యక్తమగు, అనూన = శ్రుతిస్ఫుటవైఖరిని పరిపూర్ణముగా కలిగిన, శబ్ద = ధ్వన్యాత్మకమైన, మహాశబ్దశాస్త్ర = సంగీతశాస్త్రమునకు మూలకందమైన, వీణ = వీణాదండమును కలిగినదియును – అని ఇంకొక అర్థం);

♦️ భూరి ... రశన - భూరి = అధికతరమైన, గుణవిశేషపుంజ = సత్యదయాది గుణవిశేష పరంపరతో, ఏక = ఐక్యమును భజించి, నిత్యసంబంధవత్ = ఎల్లప్పుడు కూడియుండవలెనడి, తర్క = ఆకాంక్షచే, విభ్రాజి = ప్రకాశమానమైన, రశన = నాలుకను కలిగినదియును –

(భూరి = విస్తారమైన భూమికతోడి, గుణవిశేషపుంజ = చతుర్వింశతి తత్త్వములను నిరూపించు గుణముల సముదాయముతో, ఏక = కైవల్యరూపమైన, నిత్యసంబంధవత్ = నిత్యత్వసిద్ధిని (సంసర్గమును) కలిగిన, తర్క = తర్కశాస్త్రము యొక్క వికసనముచే, విభ్రాజి = మెరయుచున్న, రశన = మొలత్రాడు కలిగినదియును – అని ఇంకొక అర్థం);

♦️ సరస ... భరాఢ్య - సరస = రసవంతమైన, స+అలంక్రియా = సరిగమపదని అను సప్తస్వరముల అందమైన కూర్పుచే సిద్ధించు అలంకారముల ప్రయోగము చేత, ఉజ్జ్వల = ఔజ్జ్వల్యము అను శాస్త్రధర్మమును గల, సు+వర్ణ = షడ్జాది స్వరముల యొక్క గతివిశేషములను ప్రకటించు రచనముల చేతను, పద = పదములు అను రచనావిశేషముల చేతను, ఉరు = విస్తారమైన, సంగీత = సంగీతశాస్త్రము యొక్క మాధుర్యముతో నిండినట్టిదియును –

సరస ... భరాఢ్య - సరస = నవరసముల కూడిక చేత, స+అలంక్రియా = కావ్యశోభాకరములైన అలంకారముల ప్రయుక్తి చేత, ఉజ్జ్వల = విశదమైన, సువర్ణ = అక్షరరమ్యత గల, పద = అర్థవంతములైన సుశబ్దములచే నిండి, ఉరు = విశాలమైన, సాహితీ = సాహిత్యశాస్త్ర మధురిమను ప్రసాదించునట్టిదియును అగు,

స్తనభరాఢ్య – స్తనభర+ఆఢ్య = (ఒకటి ఆపాతమధురమగు సంగీత రసము చేతను, వేరొకటి ఆలోచనామృతమగు సాహిత్య రసము చేతను నిండిన) వక్షోజముల యొక్క బరువుచే, ఆఢ్య = కూడినట్టిదియును;

♦️ క్షిప్ర = శీఘ్రగతిని గల, సద్గతిముఖర – సద్+గతి = అందమైన నడకచే, ముఖర = గలగల చప్పుడుచేయుచున్న, భాట్ట ప్రభాకరీయ = మీమాంసా శాస్త్రములో కుమారిల భట్ట మతము, ప్రభాకర మతము అను రెండు మార్గములచే నిర్మింపబడిన, మంజీరయుగ = కాలి అందెల జంటచే, రమణీయ = అనుక్షణము సరిక్రొత్తదిగా భాసించు, చరణ జలజ = పాదపద్మములు గల,

♦️ నిత్యప్రగల్భవాచాల – నిత్య = ఎల్లప్పుడు, ప్రగల్భ = ప్రత్యుత్పన్నమైన ప్రతిభను ప్రకాశింపజేయు, వాచాల = వాక్యరీతిని కలిగిన,

♦️ వాణి = సరస్వతీదేవి,

♦️ మదీయ = నా యొక్క; ఆస్యజలరుహమున – ఆస్య = ముఖమనెడి, జలరుహమున = పద్మమునందు; నిలచున్+ కాఁత = నిలచియుండును గాక. అని!

అద్భుతరామాయణం - రఘునాథమహంత


అద్భుతరామాయణం - రఘునాథమహంత




సాహితీమిత్రులారా!




మన దేశంలోని ప్రతి భాషలోనూ
రామాయణం వ్రాయబడింది.
అందులోని కొన్ని రామాయణాలను
గురించి తెలుసుకునే మార్గంలో
మైథిలీ భాషలో వైద్యనాధ్ మాలిక్ కృత
సీతాయనం గురించి తెలుసుకున్నాము.
ఇప్పుడు అస్సామీకి చెందిన అద్భుత
రామాయణాన్ని గురించి తెలుసుకుందాం-

అద్భుతరామాయణాన్ని 18వ శతాబ్దిలోని 
రఘునాథమహంత రామాయణాన్ని మొదట
వచనకావ్యంగా వ్రాశాడు తరువాత అద్భుత
రామాయణాన్ని మార్కండేయ పురాణం
నుండి వస్తువును తీసుకొని వ్రాశానని
చెప్పుకున్నాడు. ఇందులోని కథ-

శ్రీరాముడు తనపట్ల చేసిన ఆరోపణకు క్రుంగిపోయిన సీతాదేవి
తల్లియైన భూదేవి ఒడిలో చేరి పాతాళలోకం చేరుకుంటుంది.
కుమారులైన లవకుశుల వియోగాన్ని సహించలేక ఏ ఉపాయంతో
నైనా వారిని తన వద్దకు తీసుకురమ్మని వాసుకుని కోరుతుంది.
హనుమదాదుల రక్షణవలయాన్ని ఛేదించి తీసుకురాలేక వాసుకి 
బ్రాహ్మణ రూపంలో శ్రీరాముని వద్దకు వెళ్ళి విద్యనేర్పే మిషతో
లవకుశులను పాతాళానికి తీసుకువస్తాడు.  కాని సీతాదేవి భర్తతో
కలిసి ఉండే యోగం తనకు లేదని, శ్రీరామునికి, లవకుశులకు,
హనుమంతునికి మాత్రమే కనబడే విధంగా అదృశ్యరూపంలో వచ్చి
ప్రతిదినం ఒకసారి దర్శనమివ్వగలనని చెప్పి అదృశ్యమౌతుంది.
ఇది అద్భుత రామాయణ కథ.

దీనితో పాటు రఘునాథమహంత శత్రుంజయ 
కావ్యాన్ని కూడ వ్రాశారు. విచిత్ర కథలతో
వాలి, హనుమంతుల శౌర్య సాహసాల గాథలను 
వివరించే కావ్యంగా శత్రుంజయ కావ్యం కూర్చారు.
జైన సాంప్రదాయంలోని రామాయణకథలను,
పామరజనుల నోటికథలను తెలిసి ఉండి, 
అవి అంతరించి పోకుండా ఈ గ్రంథాల్లో 
పదిలం చేశాడని ఒకభావన.

Friday, February 23, 2018

శృంగార నాయకులు


శృంగార నాయకులు




సాహితీమిత్రులారా!



నాయకులు తెలుసు కాని శృంగారనాయకులెవరు
అందరూ శృంగారంలో ఆసక్తిఉన్నవారేకదా
్ందరూ నాయకులేకదా అంటే పొరపాటే
శృంగారనాయకులకు మనవారు చెప్పిన
పేర్లు వివరణ ఇక్కడ చూద్దాం-

శృంగానాయకులు నాలుగురకాలు
1. అనుకూలుడు, 2. దక్షిణుడు
3. ధృష్టుడు, 4. శఠుడు

1. అనుకూలుడు -
ఎల్లపుడు పరస్త్రీ విముఖుడై తన నాయికపై 
ప్రేమగలవాడు అనుకూలుడు.

2. దక్షిణుడు -
నాయికలందరిపై సమానమైన స్వాభావికమైన 
ప్రేమకలవాడు దక్షిణుడు

3. ధృష్టుడు -
మాటిమాటికి తప్పులు చేస్తూన్నవాడైనా ధిక్కృతుడై నప్పటికి
మళ్ళి మళ్ళీ వినయం అవలంబించేవాడు ధృష్టుడు.

4. శఠుడు -
కామిని విషయంలో ఆమెకు తెలియనీకుండా 
కపటం చేసే నేర్పరి శఠుడు.

వీరికి కామతంత్రాలను నేర్పేవారు కొందరుంటారు
వారిని  విట, చేట, విదూషకులంటారు.

Wednesday, February 21, 2018

శృంగార చేష్టలు అంటే--------------1


శృంగార చేష్టలు అంటే--------------1




సాహితీమిత్రులారా!

యౌవనం వల్ల కలిగిన హావభావాలు మొదలైన వాటివల్ల
నాయికా నాయకులకు కలిగే చేష్టలనే శృగార చేష్టలంటారు.
వాటిని గురించిన కొన్ని విషయాలను ఇక్కడ చూద్దాం-
ఇవి మనసువల్ల పుట్టేవి, అప్రయత్నంగా పుట్టేవి,
స్వభావాలవల్ల పుట్టేవి అని మూడురకాలు.   

మనసు వల్ల పుట్టేవి - 3
1. భావం, 2. హావం, 3. హేల
భావం -
ఏ వికారములేని మనసులో మొట్టమొదటిసారి 
కలిగిన వికారంను భావం అంటారు.

హావం- 
భ్రూనేత్రాది వికారాలచే సంభోగేచ్ఛను తెలిపే భావమే
అల్పంగా పైకి కనపడే వికారాన్ని హావం అంటాము/ 
భావాన్ని కొద్దిగా వ్యక్తం చేయటాన్ని హావం అంటారు.

హేల- 
హావంలో వ్యక్తమైన వికారమే సువ్యక్తమైతే 
అది హేల అని పిలువ బడుతుంది.

అప్రయత్నంగా పుట్టే శృంగార చేష్టలు - 7
1. శోభ, 2. కాంతి, 3. దీప్తి, 4. మాధుర్యం,
5. ప్రగల్భత, 6. ఔదార్యం, 7. ధైర్యం.
పై చెప్పిన రెండు విధాల శృంగార(10)చేష్టలు
స్త్రీ, పురుషులకు ఇద్దరికి కలుగుతాయి.

స్వభావం వల్ల కలిగే శృంగార చేష్టలు - 18
ఇవి కేవలం స్త్రీలకు సంబంధించిన శృంగార చేష్టలు.
1. లీల-
చేష్టలతో, వేషాలతో, భూషణాలతో, ప్రేమ మాటలతో,
ప్రియుణ్ణి అనుకరించడానికే లీల అని పేరు.
2. విలాసం -
ఇష్టమైన వారిని చూడటంతో నడకలో, ఉనికిలో, కూర్చోవడంలో
మాట్లాడడంలో, చూడటంలో మొదలైన పనుల్లో కనబడే విశేషమే విలాసం.
3. మాధుర్యం -
ఏ అవస్థలో ఉన్నా, ఎలావున్నా రమణీయంగా 
కనబడటమే మాధుర్యం.

4. ధైర్యం -
ఆత్మశ్లాఘలేని అచంచలమైన మనోవృత్తినే ధైర్యం అంటారు.

5. విభ్రమం - 
ప్రియుడు రావడంతో కలిగిన హర్షరాగాదువల్ల తొందరతో
భూషణాదులు తారుమారుగా ధరించటం విభ్రమం

6. కిలికించితం -
ప్రియసంగమ హర్షం వల్ల  కలిగిన స్మిత శుష్కరుదిత,
హసిత త్రాస క్రోధ శ్రమ మొదలైన వాటి సాంకర్యమే
కిలికించితం.

7. మోట్టాయితం -
ప్రియునితో రతిక్రీడల్లో తేలాలి అనే మనసు కలిగినపుడు
అతని కథలు విని చేసే కర్ణకండూయనాదికమైన చేష్టనే
మోట్టాయితం అంటారు.

Tuesday, February 20, 2018

గుణాఢ్యుడు - బృహత్కథ


గుణాఢ్యుడు - బృహత్కథ




సాహితీమిత్రులారా!


సంస్కృతంలో వెలసిన కథాకావ్యాలలో
గుణాఢ్యుని బృహత్కథ చెప్పదగింది.
ఇది వెలసిన తరువాత అనేక కవులకు
కావ్యనాటకాలకు ఇతివృత్తాలను సమకూర్చింది.
సంస్కృత సాహిత్యంలో వ్యాస, వాల్మీకుల సరసన
పేర్కొనదగినవాడు గుణాఢ్యాడు. బృహత్కథ సంస్కృతంలో
కూర్చబడలేదు. దానికి గల కారణం తెలిపే ఒక ఒకకథ
ప్రచారంలో ఉంది. ఆ కథ........
             శాతవాహనరాజు ఒకసారి రాణితో జల విహారం చేస్తూండగా
ఆమె "మోదకైస్తాడయ(నీళ్లతో నన్ను కొట్టకు)"
అనగా రాజు పొరపాటుగా అర్థం చేసుకొని మోదకాలను
(లడ్డూలను) తెప్పించి రాణి మీదికి విసరసాగాడు.
రాజుకు సంస్కృతం రానందున రాణి పరిహాసమాడింది.
రాజు ఆస్థానంలో ఉన్న గుణాఢ్యుడు ఆరుసంవత్సరాల్లో
ఆయనకు సంస్కృతం నేర్పుతానన్నాడు. ఆ ఆస్థానంలోనే
ఉన్న శర్వవర్మ తానైతే ఆరు నెలల్లోనే నేర్పుతానన్నాడు.
దానికి గుణాఢ్యుడు అలా నేర్పగలిగే పక్షంలో నేను సంస్కృత
ప్రాకృత దేశభాషలను త్యజిస్తాను అని శబథం చేశాడు.
శర్వవర్మ ప్రత్యేకంగా కాతంత్రవ్యాకరణాన్ని రచించి తాను చెప్పిన
 ప్రకారం 6 నెలల్లో రాజుకు సంస్కృతం నేర్పాడు. తాను చేసిన
శపథం ప్రకారం గుణాఢ్యుడు సంస్కృత ప్రాకృతాలను వదలివేశాడు.
అందుకే పైశాచిక భాషలో బృహత్కథ వ్రాశాడు.

                                         దీనిలోని కథలో చివరిభాగం మాత్రమే
మనకు లభ్యమౌతూంది. దీనికి ఒక కథ చెప్పబడుతూంది.
శపథ ప్రకారం గుణాఢ్యుడు ఆ భాషలను వదలివేసి రాజాస్థానం
నుండికూడ వెళ్ళాడు. తర్వాత బృహత్కథను వ్రాసికొని రాజుకు
ఇవ్వాలని వెళ్ళగా  తీసుకొని కొందరు పండితులకిచ్చి చదివి
వారి అభిప్రాయం చెప్పమన్నాడు. వారు అది అంత గొప్ప
పుస్తకం కాదని ఈర్ష్యతో చెప్పగా రాజు దాన్ని గుణాఢ్యునికి వెనక్కు
ఇవ్వమని పంపేశాడు. దానికి బాధపడి గుణాఢ్యుడు అది తీసుకొని వెళ్ళాడు.
రాజుగారి భోజనంలో ఏరుచీలేని మాంసం వంటవాడు వడ్జిస్తున్నాడు.
దానికి రాజు నిలదీసి అడగ్గా దానికి వంటవాడు. రాజా అడవిలో
జంతువులన్నీ ఒక దగ్గరే కూర్చోని ఆహారంలేకుండా ఉన్నాయి.
అక్కడ ఒకాయన మంటచేసి అందులో ఏదో చదువుతూ
చదివిన తాళపత్రాన్ని అందులో వేసేస్తున్నాడు. ఆయన చుట్టూ
జంతువులన్నీ వున్నాయి అని చెప్పగా రాజు ఆశ్చర్యంతో అక్కడికి
వెళ్ళి చూడగా అక్కడ గుణాఢ్యుడే అది చదివి అందులో
వేస్తున్నాడని గమనించి తానెంత పొరపడ్డానో అర్థమై ఆయన్ను
ప్రాథేయపడి అక్కడినుండి పిలుచుకు వెళ్ళాడట. ఆ మిగిలిన కథే
ఇప్పుడు మనకున్న బృహత్కథ.
దీన్ని బుద్ధస్వామి బృహత్కథాశ్లోక సంగ్రహ అని,
క్షేమేంద్రుడు బృహత్కథామంజరి అని,
సోమదేవుడు కథాసరిత్సాగరం అని
సంస్కృతంలోనికి అనువదించారు.

Monday, February 19, 2018

విద్యున్మాలికలు


విద్యున్మాలికలు




సాహితీమిత్రులారా!


శ్రీ.శ్రీ. గారి ప్రభవ నుండి
విద్యున్మాలికలు అనే ఈ కవిత చూడండి-

బారులు బారులుగా తీరిన
మబ్బు గుబ్బలుల దారుల
దారి తప్పి చరించె
ఆ రేయి తరళ సరళేరమ్మదములు
అవి కవిడెంబమంబు గగురుపొడిచి
ఓరగా,
కోకిలపాట జీరగా
పైరుల పైపయి సోకి చను
తూరుపు గాలి
తీరుగా కవిడెందమున 
తాకి తాకనటుల తరలిపోయిన 
ఏ పిన్న భావాలొ
భావంపు సిగ్గు తడియారక
నుడిలో విడుదల వడ జాలక
విహ్వలించు
ఏ పిన్న భావాల పరిమళ తరంగాలొ
ఆనాటి చకచకిత చంచలావితతి

స్వర్గ వీథీవిహార తారకలు మారి
శాపవశాన,
మానవునితోట మడికట్లలోన
ప్రవాసపు బ్రతుకుతోన
నవయుచుండియు నవ్వు వెల్లువల జల్లు
రకరకాల రంగుల వికచ లతాంత సంతతులుగ
వినువీథి మీద


తమ కోరికల తోడ  పరిపూతములైన
కనుల కాంతి  వినయ విసృమతరలేమొ
ఆ నాటి రేయి నవఘళించిన
శంపాసహస్ర 
నిశావిశాల కుహర విహారములు

అవి యేమొ
యామినీవినీల గేహదేహళీ
విష్ణు క్రాంత నితాంత తోరణములొ
ఆటలాడు వేలుపు బాలికల
పావడా అంచుల బంగారు తీవియలొ
కావవి
వేటకాని కోలలకు కూలి 
వేదనల తూలు హరిణాల కండ్లు 
జాలికి పురుటిండ్లు -
దిక్కు దిక్కుల కంపిన దీనంపు చూడ్కులే
ఆనాటి
ప్రళయ తాండవ భయంకర సౌదామినులు

- ముద్రణ - భారతి (మార్చి- 1933)

Sunday, February 18, 2018

అయ్యలరాజుగారి సీతాలావణ్యం


అయ్యలరాజుగారి సీతాలావణ్యం



సాహితీమిత్రులారా!



"అయ్యలరాజు రామభద్రు"ని "రామాభ్యుదయం"లో
ఆయన "సీత"ను వర్ణించిన తీరు ఇక్కడ చూద్దాం-

కళ వెచ్చఁబోని నిర్మలచంద్రబింబంబు
         పరభృతం ూంటని సరసకిసల
మినకరవ్యాప్తి వాడని కమ్మపూఁదీవ
         మరుఁడేర్చి దాఁచిన మార్గణంబు
లఁటిచూడని మించుటద్దంపుఁ బలకలు
         కొదమ రాయంచ మార్కొనని తూండ్లు
వలరాచయాఁకఁ బాటిలు మ్రానిక్రొంబండ్లు
         కానంగరాని శృంగారసరసి
యనఁ బుడమి ముద్దరాలి నెయ్యంపుఁజూలి
ముద్దు నెమ్మోము మించు కెమ్మోవి మేను
కలికిచూపులు తళుకుఁ జెక్కులు భుజంబు
లుదుటుఁ జనుగవయును నాభియును దనర్చు

ఆ సీత ముఖం కళలు తరని చంద్రబింబం.
కెమ్మోవి కోకిలముట్టని మావిడిచిగురు.
శరీరం సూర్యకిరణాలచే వాడని పూతీగ.
చూపులు మన్మథుడు మంచివిగా ఏర్పరచి
దాచిపెట్టిన బాణాలు. చెక్కిళ్ళు మించుటద్దములు.
భుజాలు తామరతూండ్లు, నాభికనిపించని శృంగార సరసి.

ఎలఁదీవఁబోడి జానకి
కలభాషిణి యలరురూపు కలిమిం గడు రం
జిలు శరథి వెడలి వెలిఁగెడు
నల చక్కెవింటివాని యమ్మో యనఁగాన్

లేతతీగవలె మనోహరమైన శరీరంకలది.
అవ్యక్తమధురమైన పల్కులు కలది.
పుష్పమువలె కోమలమైన రూపంతో
ఒప్పే సీత సముద్రం నుండి బయటికి
వచ్చిన లక్ష్మిదేవియా లేక మన్మథబాణమా
అన్నట్లు ఒప్పుచున్నది - అని భావం.

తుమ్మెదకంటు పూమొగడతోఁ దులఁదూగు లతాంగి ముక్కునె
త్తమ్మికి జాతిదాయ వనితాజనతామణిమోము కంతు క్రొ
త్తమ్ములతమ్ము లిందుకళికాలిక వాలిక పూపుఁ గోపు ల
క్కొమ్మకు సావిమావిసెలగొమ్మకు సాటియె బోటు లెయ్యె డన్

ఆ సీత ముక్కు సంపెంగపూవును పోలివున్నది.
ముఖం కమలాలన్నిటిని శత్రువులాంటిది.
చూపులు మన్మథ బాణాలు. ఆ తరుణికి
సాటిరాగల స్త్రీల లోకంలో ఎక్కడా లేదు
- అని భావం

కమలంబు మోము కన్నులు
కమలంబులు కేలుఁగవయుఁ గమలము లడుగుల్
కమలంబులు నిలువెల్లను
గమలాకృతి మించె బుడమి కన్నియ బళిరే

ఆ కన్నె మొగం కమలాలవలె ఉన్నాయి.
కనులు కమలాలను పోలి ఉన్నాయి.
చేతులు కమలాలవలనే ఉన్నాయి.
పాదాలు కమలాలట్లే ఉన్నాయి.
ఇన్నిమాటలెందుకు ఆపాదమస్తకం
ఆ ఇంతి ఆకారం కమలాకారమే అంటే
లక్ష్మీరూపం అని భావం.

ఆకరియానవేలి యనంతవిలాసము మాధవోదయం
బాకమలాయతాక్షిమధురాధరసీమ హరిప్రకార మా
కోకిలవాణి మధ్యమునఁ గూడిన దింతయు కాదు తాను రా
మాకృతి దాల్చె నీచెలువమంతయు నాయమయందుఁ జొప్పడున్

రామచంద్రా ఆమె ఏనుగు వంటి నడక కలది.
సీత జడ అనంతుని(సర్పరాజైన ఆదిశేషుని) వలె ఉన్నది.
ఆమె పెదవి మాధవుని(వసంత)కాలంలోని చిగురువలె ఎఱ్ఱగా
ఉన్నది. ఆమె నడుము హరి(సింహం)వలె ఉన్నది.
ఈ ఉపమానాలన్నీ (అనంతుడు, మాధవుడు, హరి) విష్ణువుకు
పర్యాయపదాలే. ఆ విష్ణువు నీవే. కావున నీ లక్షణాలన్నీ
ఆమెలో చేరి ఉన్నాయి. అంతేకాదు ఆమె రామ(స్త్రీ) రూపము
దాల్చి నీ సౌందర్యమునంతా కలిగి ఉన్నది - అని భావం.

జొక్కపుఁ బసిండి నక్కులఁ జెక్కుఁ జెక్కు
లక్కలికికొప్పు నాలాంబుముక్కు ముక్కు
కనకగంధఫలీసారకంబు కంబు
కలిత రేఖావిలాసమంగళము గళము

ఆ కలికి చెక్కిళ్ళు బంగారాన్ని మించిన మెఱుస్తున్నాయి
కొప్పు మేఘాన్ని పోలి ఉంది ముక్కు బంగారపు సంపెగపూవు
వలె ఉంది. మెడ శంఖం మాదిరి ఉంది - అని భావం.

Saturday, February 17, 2018

సీతాయన - వైద్యనాథ్ మాలిక్


సీతాయన - వైద్యనాథ్ మాలిక్




సాహితీమిత్రులారా!


రామాయణం విన్నాం గాని సీతాయన ఏమిటి అంటే
దాని రచయిత వివరాలు చూద్దాం-

వైద్యనాథ్ మాలిక్, విధు ప్రముఖమైథిలి పండితుడు.
ఈయన బీహార్ లోని మధుబని జిల్లా విరౌల్ గ్రామంలో
1912వ సంవత్సరంలో జన్మించాడు. ఇతని రచనలు
1934లో వచ్చిన భూకంపంలో పోయాయి. 
పద్యాలు పత్రికల్లో వచ్చాయి. హిందీ, మైథిలి భాషల్లో 
చాల పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. 
చాలా వృత్తులు చేపట్టినా చివరకు పూర్వపు దర్భంగా 
రాజ్యంలోని రాజ్ నగర్ లో మేనేజరుగా పదవీవిరమణ చేశారు.

1976లో సాహిత్యఅకాడమీ అవార్డు పొందిన సీతాయన
ఈయన ముద్రిత రచనలలో మొదటిది. ఇది 7 సర్గల
ఇతిహాస కావ్యం. ఇది రచించటానికి ఈయనకు 
11 సంవత్సరాల సమయం పట్టింది. ప్రతిసర్గలోను
మళ్ళీ 7 ఉపసర్గలున్నాయి. కవి దీన్ని సప్తసర్గి సుమన్ అన్నాడు.
ఉదాత్త పాత్రలు, ధారాశుద్ధిగల శైలి, ఇతివృత్త నిర్వహణ
నైపుణ్యం గల సీతాయన మైథిలి సాహిత్యంలో విశిష్టరచన.

మొదటి సర్గలో - 
మిథిలా వర్ణన, సాంఘిక ఆచారాలు, పద్ధతులు,
సీతను ఆది శక్తిగా చెప్పటం, ఆమె భూప్రవేశం,
జనకుడు శ్రయజ్ఞ నిర్వహణకు నిశ్చయించుకోవటం,
సీతావతార జననం, మొదలైనవి ఉన్నాయి.

రెండవ సర్గలో -
సీతా బాలికాలీలలు

మూడవ సర్గలో-
సీతావివాహం

నాలుగవ సర్గలో -
సీత వనవాసాగమనం

ఐదవ సర్గలో -
సీతాపహరణం

ఆరో సర్గలో -
అగ్ని పరీక్ష

ఏడవ సర్గలో-
ధరణిప్రవేశం

ఈ విధంగా కూర్చారు వైద్యనాథ్ మాలిక్ గారు

రామాయణం వంటిదే సీతాయణ
సీతను మహామాయగా, ఆదిశక్తిగా 
కవి చిత్రించాడు. సంస్కృత సాహిత్య 
విమర్శకులు ఇతిహాసానికి నిర్ణయించిన
అన్ని లక్షణాలు దీనికున్నాయి.
పటిష్టమైన పదబంధాలు, స్పష్టమైన అభివ్యక్తి, 
విస్తార వర్ణన, ధారాశుద్ధి గల శైలితో ఈ కావ్యం
సహృదయ రంజకంగా ఉంటుంది.

( ఆధారం- విజ్ఞాన సర్వస్వం - 6, భారతభారతి పుట. 947)


Friday, February 16, 2018

వచనం వికాస ప్రారంభం


వచనం వికాస ప్రారంభం




సాహితీమిత్రులారా!




వచనం దానివికాసం గురించి అది ప్రారంభంలో
ఎలా ఉన్నది తెలిపే ప్రయత్నం-
తెలుగులో మొదట అచ్చైన పుస్తకం 1746లో
అదీ నూరు జ్ఞానవచనాలు దీన్ని రెవరెండ్ బెంజిమన్
షుల్జ్ ముద్రించాడు. దీనితో తెలుగు ముద్రణా యుగం 
ప్రారంభమైంది. ఇది వచన పుస్తకం. అంటే తెలుగులో 
మొదట ముద్రించబడిన పుస్తకం వచనంలోనే. 
పాశ్చాత్యులు తమ మతప్రచారంకోసం మొదలు పెట్టిన
ముద్రణ మన సాహిత్యానికి ఎంతో మేలు చేసిందనవచ్చు.
అదీనూ వచనానికి. దీనితో మరీ అభివృద్ధి చెందింది.
తెలుగురాని తెలుగేతరులకోసం వ్యాకరణ పుస్తకాలను 
1814లో డా. క్యారీ దొరగారు ముద్రించారు. అలాగే
1816లో ఏ.డి.కాంబెల్, 1817లో సి.పి.బ్రౌన్ తెలుగు 
వ్యాకరణాలను ముద్రించారు. ఇవన్నా వచనంలోనివే.
          1912లో ఫోర్ట్ సెంటు జార్జి కళాశాలను స్థాపించి
తెలుగు వచనబోధనకు పుస్తకాలు లేనందున ఆ కళాశాలలో 
ప్రధానాధ్యాపకులుగా ఉన్న రావిపాటి గురుమూర్తి శాస్త్రి
1819లో ద్వాత్రింశత్సాలభంజికల కథలు (విక్రమాదిత్యుని కథలు)
1834లో పంచతంత్రకథలు, 1836లో వ్యాకరణ పుస్తకాలను
చక్కని వ్యావహారిక భాషలో వ్రాయబడి అనేకమార్లు 
ముద్రింపబడినాయి.
తరువాత 
పాటూరి రామస్వామి - శుకసప్తతికథలు(1840)
పాటూరి నరసింహశాస్త్రి - హరిశ్చంద్రునికథ(1840)
పాటూరి రంగశాస్త్రులు - చేమకూరవారి విజయవిలాసము(1841)
టి.రాఘవాచార్యులు - నలచరిత్ర(1841)
ధూర్జటి లక్ష్మీపతి - హంసవింశతి(1842)
దిలారామకథలు, భూగోళదీపికలు(1843)
భేతాళ పంచవింశతి (1848)
ఈ విధంగా వచనంలో అదీను వ్యాహారిక భాషలో
1855 వరకు అచ్చులో రావడం మొదలుపెట్టాయి.

Thursday, February 15, 2018

దృగ్భీత్యా నరసక్షమాపతిసభ


దృగ్భీత్యా నరసక్షమాపతిసభ




సాహితీమిత్రులారా!




శ్రీకృష్ణదేవరాలవిఖ్యాతిని గురించిన
సంస్కృతంలో చెప్పబడిన చాటువు-

దృగ్భీత్యా నరసక్షమాపతిసభ స్త్రీణాం మృగేణాశ్రితో 
రాజా తన్ముఖతర్జిత స్స్వయ మపి త్యక్త్వాత్మనో మండ లమ్
దుర్గేశస్య జటాటవీ ముపగతః పాణౌ త మేణం దదౌ
సన్మార్గప్రవణో నిజాశ్రితతమం క్షీణోపి నోపేక్షతే
(చాటుపద్యమణిమంజరి - పుట - 165 - ప.419)

నరసరాజుకుమారుడైన శ్రీకృష్ణదేవరాయల స్త్రీలచూపుల
భయంచేత లేడి చంద్రుణ్ణి ఆశ్రయించింది. అయితే
ఆ చంద్రుడు కూడ వారిముఖాలచే భయపెట్టబడి,
తన (చంద్ర)మండలం  వదలి శివుని జటాజూటాటవిని
చేరినాడు. చేరి ఆ లేడిని శివుని చేతికిచ్చాడు.
సన్మార్గము(మంచిమార్గం/ ఆకాశమార్గం)నందు
ఆసక్తికలవాడు ఎంతటి క్షీణదశలో ఉన్నా తనను
ఆశ్రయించినవారిని ఉపేక్షించడు కదా - అని భావం.

Wednesday, February 14, 2018

ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో పాండవుల చిత్తవృత్తి


ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో పాండవుల చిత్తవృత్తి




సాహితీమిత్రులారా!


ఒకానొక అవధానంలో వేలూరి శివరామశాస్త్రిగారిని
ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో పాండవుల చిత్తవృత్తి
ఎలా వున్నదో వర్ణించమన్నారట- దాని ఆయన
వర్ణించిన సీసపద్యం చూడండి-

తొడలుదాటించుచూదూకు దుశ్శాసనుఁ
         జంపగల్గియును సంశయమునొంది
తగునిదియను సుయోధనుఁ బట్టి చంపగఁ
         జేవగల్గియుఁ దర్మచింతజేసి
కర్ణకఠోరత కలిగించు కర్ణుని 
         మ్రదిపఁగలిగియు మానవలసి
సకలదుశ్శకుని శకునిఁని జంపఁగఁ
         జాలియుఁ గాలదొష్ట్యమునఁదేసి
ఊరకున్నారు భూపాలహీరమణులు
పాండవేయులు ద్రోవదిఁ బట్టినాఁడు
వలువలొలువంగఁబూనిన తులువపలువ
సేఁతలుంజూచి ధర్మవిశేషమెఱిఁగి

ఆసమయంలో పాండవుల మనోభావాలను
కళ్ళకు కట్టినట్లు వర్ణించాడుకదా

Tuesday, February 13, 2018

సంగీత సాహిత్యములు లేనివాడు


సంగీత సాహిత్యములు లేనివాడు 



సాహితీమిత్రులారా!



వేలూరి శివరామశాస్త్రిగారు
సంగీత సాహిత్యములు లేనివాడు పశువని
చెప్పెన కందపద్యం-

సంగీతముసాహిత్య మె
ఱుంగక యున్నట్టి యానరుడెందును దా
శృంగములు తోఁకలేక చె
లంగు బలీవర్దమన నిలాతలమందున్

(బలీవర్దము - వృషభము, ఎద్దు) 

శాకాహార శతకం


శాకాహార శతకం


సాహితీమిత్రులారా!


పురుషులందు పుణ్యపురుషులు వేరయా
అన్నట్లు ప్రక్రియలందు శతకప్రక్రియవేరయా
ఎన్ని రకాల శతకాలున్నా విషయ వైవిధ్యమైనవి
ఛందోవైవిధ్యమైనవి ఇలా అనేకరకాల వైవిధ్యాలతో
శతకం శాఖోపశాఖలుగా విస్తరించిన వటవృక్షం మాదిరి
విస్తరిస్తూనే వుంది. ఇక్కడ శాకాహార శతకం మరోవింతైన వైవిధ్య శతకం
దుబ్బాకుల కృష్ణస్వామి కృతమిది.
ఇందులోని కొన్ని పద్యాలను చూద్దాం-
దీని పేరులోనే శకము అంటే కూరగాయ
వీటిని మాత్రమే తినే దాన్ని గురించిన విషయం
ఇందులో ఉంటుందని కదా-
దీనిలోని మకుటం -
"తెలిసి నడుచుకొనుము తెలుగు బాల"
ఇవి ఆటవెలదులు అని చెప్పక్కరలేదుకదా
ఎందుకంటే మకుటంలో ఐదు సూర్యగణాలున్నాయికదా
సరే పద్యాలు కొన్ని చూద్దామా-

క్రూర జంతు నోట కోరలు మొనదేలు
కాలిగోళ్ళు చీల్చ గలుగనుండు
జంతువులలొ నుండు జీర్ణరసము వేరు
తెలిసి నడుచుకొనుమ తెలుగుబాల (58)

మనిషియైనవాడు మాంసము తినవద్దు
మందగించు బుద్ధిమాంసమునను
రక్త కలుషితమయి రాలిపోవుఁదనువు
తెలిసి నడుచుకొనుమ తెలుగుబాల (59)

మాంసము తినకండి మాయరోగము వచ్చు
కాటికీడ్చు నదియె క్యాన్సరయ్యి
పాపమబ్బు మరియు పాడౌను దేహంబు
తెలిసి నడుచుకొనుమ తెలుగుబాల (60)
ఇదోరకమైన నీతి శతకంగా చెప్పవచ్చును కదా

Monday, February 12, 2018

మేఘసందేశం


మేఘసందేశం



సాహితీమిత్రులారా!


డా.సి.నారాయణరెడ్డిగారు కాళిదాసు "మేఘసందేశం"
గొప్పదనాన్ని దృష్టిలో ఉంచుకొని వ్రాసిన కవిత
ఇది చూడండి-

గుత్తులుగా వ్రేలాడు 
గోస్తనుల చందాన
ఆషాఢమున వలా
హక పంక్తి కాలూన;

కాళిదాసు హఠాత్తు
గా నాకు కన్పించె
తిన్నగా "మేఘసం
దేశమ్ము" విన్పించె

అలకాపురమ్మేడ
యక్షదంపతులేడ
వర్షాంబుధరముచే
వార్తావహనమేడ?

చిత్రకూటమ్మేడ
శివుని పర్వతమేడ
గగన కల్లోలిని
కనక సికతములేడ?

సురత కేళి జనిత
పరిఖేదమును బాపు
ఐందవ శిలా పరి
ష్యంది బిందువు లెచట?


హ్రీమూఢ లెచట
కామార్తు లెచట
స్తనభర స్తోక న
మ్ర నవోఢ లెచట?

దనద శాపములేదు
దైవఘటనము కాదు
ఏడాది కాదొక్క
నాడు విరహము లేదు?

యక్షయువకుడు పుష్క
లావర్త మేఘమును 
నిల్పి సందేశమ్ము
తెల్ప బూనగలేదు

గాలి తాకిడిచేత
కదిలిసాగెడు మేఘ
శకల మాతని నివే
దికను వినగాలేదు

కాళిదాసుని హృదయ
కందరమ్ముల లోన
అణగారు విరహమే
అక్షరత్వము దాల్చె


కాళిదాసుని భావ
కల్పనావేశ ఫల
మేకదా యీ నాటి
"మేఘ సందేశమ్ము"

నింగిలో మేఘాలు 
నిల్చియుండే వరకు
కనిపించు కాళిదా
సుని యశశ్చంచలలు

కాళిదాసుని "మేఘ
కావ్య" సందేశమ్ము
స్ఫురించు నన్నాళ్ళు
కురియు నమృతపు జల్లు

Saturday, February 10, 2018

పుంటికై వెదుకఁగోరి వరింతువు


పుంటికై వెదుకఁగోరి వరింతువు




సాహితీమిత్రులారా!


"చమత్కార రత్నావళి" అనే లఘుకృతిలోని
పద్యం చూడండి. దీన్ని "సత్యవోలు సుందరకవి"
రచించారు. ఇది కేవలం 34 పుటల కృతి.
ఇందులో రసవంతాలైన వివిధ వస్తువుల వర్ణనలు ఉన్నాయి.
అయితే ఇందులో కవి చాతుర్యం ఏమిటంటే
ఉపమానాన్ని మాత్రమే వర్ణించి
ఉపమేయాన్ని, భంగ్యంతరంగా
సూచించడం.
ఇక్కడ మక్షికము -  తప్పులు వెదికేవాడు
తప్పులు వెదికేవాన్ని గురించి చెబుతూ
మక్షికాన్ని ఉపమానంగా వాడాడు కానీ
ఉపమేయాన్ని చెప్పలేదు - గమనించండి.

తలను సుగంధతైలమును దావుల నీనెడు బూల మాలికల్
గళమున బాహు మధ్యమున గమ్మని మంచి గంధమున్
గలయల సింహసంహనుని గాత్రము నందును పూతిగంధ సం
కులమగు పుంటికై వెదుకఁగోరి వరింతువు మక్షికాథమా!

(సింహసంహనుడు = సర్వాంగ సుందరుడు
పూతిగంధ = దుర్గంధము)

Friday, February 9, 2018

ఇదే నా అంతిమ నమస్కారం


ఇదే నా అంతిమ నమస్కారం




సాహితీమిత్రులారా!


అశ్వధాటీ వృత్తాలలో దేవిని స్తుతించినవారు
కాళిదాసని తెలుసు దానికే దేవీఅశ్వధాటి స్తోత్రం
అని కూడ అంటారు. అలాగే పండిత జగన్నాథుడు
కూడ అశ్వధాటి కావ్యాన్ని కూర్చారు. అందులో
జగన్నాథుడు తంజావూరు నుండి ఉత్తర భారతదేశం
వెళ్ళినట్లు తెలిసే శ్లోకం ఒకటుంది. తన విద్యాభ్యాసం
పూర్తవగానే దక్షిణాపథంలోని తంజావూరు రాజాస్థానంలో
ప్రవేశించాడు. అక్కడ వారి సత్కారాలు నచ్చక అక్కడ
నుండి ఉత్తరాపథం వెళ్ళినట్లు తెలుస్తుంది.
ఈ శ్లోకం చూడండి-

ఖంజాయితోధిమతి గంజావరోపి బత సంజాయ తేత్ర ధన దః
సంజాఘటీతి గుణపుంజాయితస్య నతు గుంజామితంచ కనకం
కింజాగ్రతీ జయసి కిం జానతీ స్వపిషి శింజాననూపురపదే 
తేజోపురేశి నవకంజాక్షి సాధు తదిదంజాతు వాకిము శివే


ఇక్కడున్న ధనవంతుడు గర్వాంధుడు. మధుపాయి.
ఇక్కడున్న గుణవంతునికి గురిగింజయెత్తు సరిగల
బంగారం కూడ లేదు. ధ్వనించే అందెలచే అంకితమైన
తల్లీ కమలదళాలంత విశాలమైన కళ్లున్నదానా
మేలుకొని ఉన్నావా నిద్రపోతున్నావా కామేశ్వరీ మేలు
మేలు నీకిదే నాకడసారి(అంతిమ)నమస్కారం.
స్వీకరించి ప్రయాణానికి అనుమతించు - అని భావం


Thursday, February 8, 2018

నరక కుండాలు


నరక కుండాలు




సాహితీమిత్రులారా!


భారతీయుల నమ్మకం ప్రకారం
చేసిన పాపాలను బట్టి ప్రాణి మరణానంతరం
నరకానికి వెళతారు. వారు ఎవరుచేసిన దానినిబట్టి
వారికి ఆ నరకం ప్రాప్తిస్తుంది. వీటిని బ్రహ్మవైవర్త
పురాణంలో కృష్ణపరమాత్మ నందునికి చెప్పిన
కర్మవిపాక వర్ణననుండి మరి కొన్ని గ్రంథాలనుండి
గమనిస్తే నరక కుండాలు 86. వీటిలో ప్రాణి
అనుభవించాల్సిన శిక్షలను విధిస్తారు.
86 కుండాల పేర్లు-
1. వహ్ని 2. తప్త 3. క్షర 4.విట(ఉప్పు) 5. మూత్ర
6. శ్లేష్మ 7. గర(విషం) 8. దూషికా 9. వసా 10. శుక్ర
11. అసృక్(నెత్తురు) 12. అశ్రు 13. గాత్ర మల, 14. కర్ణ మల
15. మద్య 16. మాంస 17. నఖ 18. రోమ 19. కేశ 20. అస్థి
21. తామ్ర 22. లోహ, 23. తీక్షణ కంటక 24. విష 25. ఘర్మ
26. తప్ర సురా 27. ప్రతప్త తైల  28. కుంత 29. కృమి 30. పూయ
31. సర్ప 32. మశక 33. దంశ 34. గరళ 35. వజ్ర దంష్ట్ర
36. వృశ్చిక 37.శర 38. శూల 39. ఖడ్గ 40. గోళ 41. నక్ర 
42. కాక 43. సంచాల 44. వాళ 45. వజ్ర 46. తప్తపాషాణ
47. తీక్షణ పాషాణ 48 లాలా 49. మసీ 50. చూర్ణణ 51. చక్ర
52. వక్ర 53. కూర్మ 54. జ్వాలా 55. భస్మ 56. దండ 
57. తప్తనూర్మీ 58. అసివత్ర 59. క్షురధారా 60. సూచీముఖ
61. గోధాముఖ 62. నక్రముఖ 63. గజదంశ గోముఖ 65. కుంభీపాక
66. కాలసూత్ర 67. అవలోభ 68. అరుంతుద 69. పాంశుభోజ
70. పాశవేష్ట 71. శూలప్రోత 72. శునీముఖ 73. ప్రకంపన
74. ఉల్కాముఖ 75. అకూప 76. వేదన 77. దండతాడన 
78. జాలబద్ధ 79. దేహచూర్ణ 80. దళన 81. శోషణ 82. కష
83. శూర్ప 84. జ్వాలాజిహ్వ 85. ధూమాంధ 86. నాగవేష్టన
కుండములు.

వీటిలో కొన్నయినా విన్నామా ?
విన్నాంకదా అపరిచితుడు సినిమాలో
ఇక్కడ చాలవిన్నాం గమనించండి
ఇవి వున్నాయో లేదో అన్నది అనవసరం
కానీ ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ
ఒకరిని ఇబ్బంది పెట్టకుండా వుంటే
వీటితో పనిలేదని కొందరి నమ్మకం
కాదంటామా? లేదుకదా!

Wednesday, February 7, 2018

తాను తెలుగువాడినని చెప్పిన జగన్నాథుడు


తాను తెలుగువాడినని చెప్పిన జగన్నాథుడు




సాహితీమిత్రులారా!


పండిత జగన్నాథుని పేరు సుపరిచితమేకదా
ఆయన తన "ప్రాణాభరణ" కావ్యంలో
తాను తెలుగువాడినని సగర్వంగా
చాటాడు. ఆ శ్లోకం చూడండి-

త్రైలింగాన్వయ మంగళాలయ మహాలక్ష్మీదయాలాలితః
శ్రీమత్పేరమభట్టసూను రనిశం విద్వల్లలాటంతపః
సంతుష్టః కమతాధిపస్య కవితామాకర్ణ్య తద్వర్ణనం
శ్రీమత్పండితరాజ పండితజగన్నాథోవ్యధాసీ దిదం

నేను తెలుగువాడిని. లక్ష్మీకృపాలాలితుడను
శ్రీమంతుడగు పేరు భట్టారకుని కుమారుడను
విద్వల్లలాటంతపుడను, పండితరాయ బిరుదాంకితుడను.
కామరూపాధీశ్వరుని కవిత్వం విని సంతుష్టుడనై
అతని గుణాలను వర్ణిస్తూ నేనీ కావ్యాన్ని రచించాను-
అని భావం.
మన రాయప్రోలు సుబ్బారావు చెప్పినట్లు -
ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఏపీఠమెక్కినా, ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమిభారతిని, నిలుపరా నీజాతినిండుగౌరవము
అవమానమేలరా, అనుమానమెల, భరతపుత్రుండనంచు భక్తి తొబలుక.
- అని దేశభక్తి కలవానిగా ఈ కవిగూడ తనదేశం తన భాషనుగురించి
చాటుకోవడం ఈ తరంవారు మరువకూడదనే విషయాన్ని
ఈ శ్లోకం చెబుతున్నదికదా!

Tuesday, February 6, 2018

వృత్తములు వాటి పేర్లు


వృత్తములు వాటి పేర్లు




సాహితీమిత్రులారా!


మనం పద్యాలలో వృత్తాలను చూస్తున్నాముకదా
వాటి పేర్లు వివరాలను చూద్దామా-

వృత్తముల పేర్లు ఎక్కువభాగం స్త్రీ పరములయినవిగా ఉన్నవి.
ఇవికాక మరికొన్ని పద్య నైసర్గిక ప్రవృత్తి, గతి లయలను
సూచిస్తున్నాయి.

మంద్రాకాంత - మందమైన ఆక్రమణము లేక గతి కలది
ద్రుతవిలంబిత - త్వర, అలస గమనము కలది
వేగవతి, త్వరితగతి - వేగ గమనము గలది
మయూరసారి - నెమలివంటి సుకుమార గతి కలది
రథోద్ధత   - రథమువలె ఉద్ధత గతి కలది.
జలోద్ధత గతి - ప్రవాహమువలె ఉద్ధత గతి కలది
హంసయాన - హంసవంటి మనోజ్ఞ గతి కలది
అశ్వగతి - అశ్వపు నడక గలది
హరిణప్లుత - లేడి దూకుడువంటి గతి గలది
అలసగతి - నెమ్మదైన గతి గలది

ప్రకృతిలోని మార్పులను, పూవులను
గూర్చినవి కొన్ని వున్నాయి -
వసంతతిలక, కుసుమితలతావేల్లిత, మాలా, స్రజ, 
చంచరీక, కుసుమ విచిత్ర, వనమాలిని, జలద, 
అంబురుహ, పాలాశదళ మొదలైనవి.

మొత్తం మీద స్త్రీ నామములు కలవి అధికమైనవి-
మానిని, ప్రియకాంతా, సావిత్రి, మధుమతి, కాంతా, 
సుముఖి, ప్రియంవద, స్రగ్ధర, స్రగ్విణి, మంజుభాషిణి, 
మత్తహాసిని, రుచిర, తన్వీ, సుమంగలి, సువదన, 
చంచలాక్షికా, గౌరీ, అపరాజితా, తనుమధ్యా, చిత్రరేఖ, 
కామదత్తా, పద్మిని, చంద్రలేఖా, చంద్రికా
మొదలైనవి.

Monday, February 5, 2018

భ్రమరగీత


భ్రమరగీత




సాహితీమిత్రులారా!


శాంతిలోంచి అశాంతి
అశాంతిలోనే శాంతిని
అనుభవించగలడు శ్రీశ్రీ

ఈ భ్రమరగీతిని చూడండి-
ఇది "ఖడ్గసృష్టి"నుండి-

గిరగిరగిరాం
భ్రమరం
గిరాం
భ్రమణం
భ్రమం
'భ్రమరణం'
భ్రమణ భ్రమరం
భ్రమర భ్రమణం
గిరగిర గిరాగిరా గిరాం భ్రమణం
రణం మరణం
రణమరణం దారుణహననం
ధిషణానిధనం
వృథామధనం
అది నా చెవిలో కథనం
లోకధనం 
కదనం
కదన కథాకథనం
అది నాయెదలో రణనం
ఝణ ఝణ ఝంఝణ ఝణాఝణా నిక్వణనం
అది నా పయనంలో ప్రథ మారుణ కిరణం
రణ నిస్సహణం
వధా విధా నాచరణం
నాలో లోలోపల భ్రమా భ్రమర సంచరణం
రణద్రణ నిస్సహన ప్రణవం
అది నా హృదయంలో రుథిరజ్వలనం గీతాజననం

(ధిషణానిధనం = మనీష(బుద్ధి)నాశనము
దారుణహననం = దారుణ హత్య
నిస్సహణం = A large double drum.)

Sunday, February 4, 2018

నిత్యానంద ఘోషు


నిత్యానంద ఘోషు




సాహితీమిత్రులారా!

మన తెలుగులో భారతాన్ని
నన్నయ తిక్కన ఎఱ్ఱన(కవిత్రయం)
సంస్కృతం నుండి అనువదించారు
అలాగే నిత్యానందఘోషు బాంగ్లలో
వ్యాసభారతాన్ని 18 పర్వాలుగా
రచించాడు. అయితే దీన్ని
విజయ పాండవ కథ అని పిలుస్తారు.

"విజయ పాండవ కథా అమృతలహరీ
సునిలె అధర్మఖండె పరలోకె తరి
సున సున అరె భాయి హయె ఏకమన
నిత్యానంద ఘోష బలె భారత కథన"
(విజయ పాండవ కథామృతలహరి వింటే అధర్మం
ఖండనదిమవుతుంది. పరలోకం లభిస్తుంది. వినండి
వినండి సోదరులారా ఏకాగ్రచిత్తంతో వినండి.
నిత్యానంద ఘోషు చెబుతున్నాడు.)

నిత్యానందఘోషు అశ్వమేధపర్వం మాత్రం
వ్యాసుని రచననే కాకుండా జైమిని రచనను
కూడ తీసుకొని అనువదించాడు. అతని రచన
సరళమైంది. ఆబాల వృద్ఝుల వరకు అవగతమౌతుంది.
కురుక్షేత్రం రణరంగంలో దుర్యోధనుడి
మృతదేహాన్ని చూచిన గాంధారి అన్న మాటలు చూడండి-

"దేఖ కృష్ణ! మరి ఆఛె రాజా దుర్యోధన,.
సంగేతె నాదెఖి కెన కర్ణదుశ్శాసన?
శకుని సంగెతె కెన నా దేఖి రాజన?
కథాభీష్మ మహాశయ, గాంధార నందన?
ఏకాదశ అక్షౌహినీ యార సంగె జాయ్,
హేన దుర్యోధన రాజా ధులాయ్ లుటాయ్,
సువర్ణేర ఖాటై జారీ సతత శయన,
ధూలాయ్ ధూపర తను హయ్యాఛె ఏఖన."
(చూడు కృష్ణ దుర్యోధనరాజు చచ్చి పడున్నాడు.
దగ్గర కర్ణ దుశ్శాసనులు కనబడరేమీ రాజరాజుతో శకుని లేడేమి
భీష్మమహాశయుడేడీ పదకొండు అక్షోహిణుల సేన వెంట
నడిచే మహారాజు ధూళిలో ఎలా పొర్లాడుతున్నాడో
బంగారు మంచంమీద ఎల్లప్పుడూ శయనించే రాజు ఇప్పుడు
ధూళిధూసర దేహంతో పడున్నాడు)

Saturday, February 3, 2018

శతకవాఙ్మయంలో పాము - 1


శతకవాఙ్మయంలో పాము - 1




సాహితీమిత్రులారా!



మన శతకవాఙ్మయంలో పామునుగురించిన చిత్రణలు
అనేకం వున్నాయి. వాటికి సంబంధించిన గాధలూ అనేకం
వున్నాయి. ఇక్కడ మనం సుమతి శతకకారుడు బద్దెన
కూర్చిన సర్పసంబంధమైన పద్యాలను చూద్దాం-

ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము బదినూరేండ్లున్
మడువున కొక్కెర యుండదె
కడునిల పురుషార్థపరుడు కావలె సుమతీ!

ఉడుము నూరేండ్లుంటుంది. పాము వేయేండ్లుంటుది.
మడుగున కొంగ కలకాలం వుంటుంది. వాటివాటి
వయసులను బట్టి ఉదహరిస్తున్నాడు కాని వాటివలన
ప్రయోజనం ఏమిటి - మానవజన్మ ఎత్తినందుకు ఫలంగా
పురుషుడు ధర్మార్థకామమోక్షాలను సాధించాలిగాని-
అంటున్నాడు కవి.

ఎప్పుడూ తప్పులే వెదికే వానిదగ్గర చేసే నౌకరీ ఎలాంటిదంటే
పాము పడగ నీడన నివసించే కప్పవంటిదని పోల్చాడు కవి
ఇక్కడ పామును దొరగానూ, కప్పను నౌకరుగానూ పోల్చాడు.
ఆ పద్యంలో-

ఎప్పుడు తప్పులు వెదకెడు 
నప్పురుషుని కొల్వకూడదది యెట్లన్నన్
సప్పంబు పడగనీడన
కప్పవసించిన విధంబు గదరా సుమతీ!

జీవితంలో తప్పించుకోవటానికి వీలులేని
దుఃఖకరమైన అంశాలను కొన్నింటిని వివరిస్తూ
చెప్పిన పద్యం-

కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైన, సతి తులువైనన్
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!

కప్పకు కాలు విరిగినా, పాముకు రోగమైనా,
భార్యగయ్యాళయినా, ముసలితనంలో దరిద్రం
వచ్చినా - దుఃఖము తప్పదట -
నిజమేకదా!

ఇదొక యదార్థపద్యం -

కరణము సాదైయున్నను
కరి మదముడిగినను బాము కరవకయున్నన్
ధర తేలు మీటకున్నను
గరమరుదుగ లెక్కగొనరు గదరా సుమతీ!

బాధకలిగింరలేని కరణాన్ని, మదములేని ఏనుగును,
కరవకుండా ఉన్న పామును, కుట్టని తేలును
లోకంలో ఎవర లక్ష్యపెడతారు - అంటే
లెక్కచేయరనిభావం.



Friday, February 2, 2018

సుశీలమ దెవ్వనియందు శోభిలున్


సుశీలమ దెవ్వనియందు శోభిలున్




సాహితీమిత్రులారా!


ఈ పద్యం చూడండి-
జనసమ్మతమైన సుశీలము ఎవరియందు ఉంటుందో
వానికి ఏవి సాధ్యమౌతాయో కవి వివరిస్తున్నాడు.
ఇది ఏనుగు లక్ష్మణకవి కృత భర్తృహరి నీతిశతకంలోనిది.

అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం 
చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో
పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్
క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వనియందు శోభిలున్

ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో
వానికి సముద్రం ఒక చిన్న కాలువలాగా,
నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా,
మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం
పూలదండలాగా, భయంకరమైన విషం అమృతంలాగా
ఔతాయి - అని భావం.

Thursday, February 1, 2018

200 సంవత్సరాలు పట్టిన శరత్కాల వర్ణన


200 సంవత్సరాలు పట్టిన శరత్కాల వర్ణన




సాహితీమిత్రులారా!


నన్నయ భారతం అరణ్యపర్వంలో
శరదృతు వర్ణన ప్రారంభించాడు.
కాని అదిపూర్తి కాకుండగానే
భారతం అరణ్యపర్వం నిలిచిపోయింది.
అక్కడికి చేరిన పద్యం లేదా నన్నయగారి
చివరి పద్యాలు ఈ వర్ణనే చూద్దాం-

భూసతికిం దివంబునకుఁ బొల్వెసఁగంగ శరత్సమాగమం
బాసకల ప్రమోదకర మై విలసిల్లె మహర్షిమండలో
పాసిత రాజహంస గతి భాతి ప్రసన్న సరస్వతీక మ
బ్జాసనశోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై
(శ్రీమదాంధ్రమహాభారతము - అరణ్య - 4-140)

సర్వజనులకు సంతోషాన్ని కలిగిస్తూ శకత్తు భూదేవికీ స్వర్గానికీ
అందం చిందిస్తూ విలసిల్లింది. శరత్తు,  మహర్షుల సమూహంచేత
ఆరాధించబడిన రాజహంసల గమనాన్ని స్ఫురింపచేసింది.
స్వచ్ఛమైన సరస్వతితో కూడిన బ్రహ్మదేవుడితో, బ్రహ్మవాహనమైన
రాజహంసతో సమానమై ఒప్పారింది.

శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధబంధురో
దారసమీర సౌరభము తాల్చి సుధాంశువికీర్యమాణ క
కర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబు లై

అవి శరత్కాలంలోని రాత్రులు. మిక్కిలి ప్రకాశమానాలైన నక్షత్ర
మాలికలతో కూడి వికసించిన క్రొంగొత్త తెల్లకలువల దట్టమైన
సుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి,
అంతటా వెదజల్లబడిన కప్పురపు పుప్పొడివలె ఆకసాన్ని ఆవరించిన
చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి ఆకాశాన్ని నిండుకొని మిక్కిలి
సొగసుగా ఉన్నాయి.

ఈ పద్యంతో నన్నయ ఆగిపోయాడు తరువాత
200 సంవత్సరాలకుగాని ఎఱ్ఱాప్రెగ్గడ ఈ మిగిలిన
దాన్ని పూర్తి చేయడానికి పూనుకొనలేదు కావున
ఈ వర్ణననకు 200 సంవత్సరాలు పట్టిందనవచ్చు.

స్ఫురదరుణాంశురాగరుచిఁబొంపిరివోయి నిరస్తనీరదా
వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనముల్ సెలంగఁగాఁ
గరము లెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడఁగన్

శరత్కాలంలో సూర్యోదయ సమయాలు కనులపండువుగా శోభిల్లాయి.
అప్పుడు మబ్బలు క్రమ్మటాలు తొలగిపోయాయి, బాలభానుడి
అరుణకిరణాలు విస్తరించాయి. పద్మాలు వికసించి, శోభాయమానంగా
వెలుగొందాయి. హంసలు బెగ్గురుపిట్టలు, తుమ్మెదలు చేసే కలరవాలు
వెల్లివిరిశాయి.

దానాంభఃపటలంబునం బృథుపయోధారావళిం దాల్చి గ
ర్జానిర్ఘోషము బృంహితచ్ఛలనఁ బ్రచ్ఛాదించి ప్రావృట్పయో
దానీకంబు శరద్భయంబున నిగూఢాకారతన్ డిగ్గె నాఁ
గా నొప్పారె మదోత్కటద్విరదసంఘంబుల్ వనాంతంబునన్

అడవిలో మదించిన ఏనుగుల గుంపులు వులసిల్లాయి.
శరత్కాలానికి భయపడి, వానాకాలంలోని మబ్బుల
గుంపులు మారువేషాలలో భూమికి దిగివచ్చాయా
అన్నట్లు అవి కనిపించాయి. మదించిన ఏనుగులు కాబట్టి
వాటికి మదజలం స్రవించటం కద్దు. అవి మబ్బులకుండే
నీటిజల్లులో అన్నట్లున్నాయి. అట్లే ఏనుగులు చేసే
బృంహిత ధ్వనులు మేఘాలగర్జనలో అన్నట్లున్నాయి.

కలనీలకంఠకోలా
హలలీలలు సెలఁగె, రాజహంసకులంబుల్
విలసించె, సప్తపర్ణా
వలి విగళిత కుసుమ కుటజ వాటిక లడరన్

నెమళ్ళ కలరావాలతో కూడిన ఆటలు విలసిల్లాయి.
అంటే నెమళులు అవ్యక్తమధురాలైన ధ్వనులు చేస్తూ
నృత్యం చేశాయి. రాజహంసలగుంపులు శోభిల్లాయి.
ఏడాకుల అరటి చెట్లు గుంపులు మరియు పూలురాలిన
కొండమల్లెల పొదలు విలసిల్లాయి.

అతి గాంభీర్యవిభూతి నేకచుళుకాహంకారనిశ్శేషశో
షితపాథోధిపయస్కుఁడైన ముని దోఁచెం బుణ్యతేజోమయా
కృతి నయ్యామ్యదిగంతవీథిఁ బ్రకటక్రీడాకళాగర్వ గ
ర్జితమండూకకళంకితాంబుశుచితాసిద్ధిప్రదాచార్యుఁడై

శరత్కాలంలో ఆకసాన దక్షిణదిశలో అస్త్యనక్షత్రం కనిపించింది.
ఆ అగస్త్యుడు మిక్కుటమైన నిండు వ్యక్తిత్వంగల మహర్షి. ఆయన
సమస్త సముద్రజలాన్ని తన దోసిలిపట్టి ఒక్కచుక్కకూడా
మిగలకుండా త్రాగేశాడు. అంతవరకు బెకబెకమనే సవ్వడి చేస్తూ
ఆడుకునే కప్పలవలన బురదగా చేయబడిన నీళ్ళకు నిర్మలత్వాన్ని
ప్రసాదించే గురువు ఆ అగస్త్యుడు.

విశదశారదాంబుద పరివేష్టనమునఁ
బొలుచు గగనంబు ప్రతిబింబములొయనంగ
వికచకాశవనీ పరివేష్టనమున
నతిశయిల్లె నిర్మలకమలాకరములు

తెల్లని శరత్కాల మేఘాలు చుట్టుముట్టి ఉన్న ఆకసానికి ప్రిరూపాలో
అన్నట్లుతెల్లని పూలు పూచిన రెల్లుమొక్కలచేత చుట్టుకొనబడిన
నిర్మలసరస్సులు శోభిల్లాయి.

ఈ విధంగా సాగింది ఎఱ్ఱాప్రెగ్గడగారి వర్ణన.