Tuesday, August 29, 2017

మన భారతి కిండిక పద్యహారతుల్


మన భారతి కిండిక పద్యహారతుల్సాహితీమిత్రులారా!

మన భాషఎంత గొప్పదో తెలిసి కూడ
ఆంగ్లభాషవైపు వెళ్ళడం చూచి
అలంకారం కోటంరాజుగారు
అలా వెళ్ళకండని తెలుగు భారతికి
హారతులివ్వండని చెబుతున్నాడు చూడండి-

తెనుగు పద్యంబు హృద్యంబు, తెన్గుపల్కు
తేనియల యూట, యమృతంపు తేటగాదె
ఎల్లవారల హృదయాల కొల్లగొనెడి
పరసువేదియ కద తెన్గుభాషయనగ

తెనుగు, తెలుంగు, యాంధ్రమని, తేరగ పల్కుట గాదు, నిత్యమున్
మనము స్వభాషకై హృదయమందున నెవ్విధి చింతజేసి నా
మనియెడు చర్చబూనిన, క్రంబున తోచు హుళక్కియంచు, జీ
వనమున తెన్గుసేవయె జవంబును, సత్త్వము, తేజ మీయదే

మన జాతియు, మన భాషయు
ఘనమైన చరిత్రగలవి గతకాలమునన్,
తెనుగును బ్రతికింపగ చిం
తన జేయుడు, మీరు తెనుగుదనమును నిల్పన్

ఇంతనరాని భాషయిది, యెంతగ జెప్పిన తీరబోదు, ఇం
తింత త్రివిక్రమత్వమున, ఏపు వహించి, మహోన్నతంబునై
ప్రాంతము లాక్రమించినది, ప్రాపు నొసంగిన నింతకింకయై
వింతలొనర్చు, సుంతయు వివేకము జూపుడు, భాషపెంపగున్

తెనుగు చదువుడు, చదివింప జనుల నడుమ
నడుముగట్టుడు, ఇంకముందు నడుపుడంచు
వేయబోకుడు పొలికేక, శ్రేయమొసగు
పద్ధతిని యాచరింపంగ భాష పెరుగు

అట్టితెనుంగువీడి, జనులందరు నాంగ్లపు మాయజిక్కగా
నెట్టుమనస్సు పుట్టినది, యియ్యది మాన్యతమంబు గాదు, ఎ
ప్పట్టుననైన, మీరలు అపార ముదంబున తెన్గుభాషకున్
పట్టముగట్టరండు, మన భారతి కిండిక పద్యహారతుల్

(పద్యప్రకాశం నుండి-)

తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు


తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు
సాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు
తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు

Monday, August 28, 2017

విశ్వనాథవారి చమత్కారం


విశ్వనాథవారి చమత్కారం
సాహితీమిత్రులారా!

విశ్వనాథ సత్యనారాయణగారు
తన విశ్వనాథ పంచశతిలో
కూర్చిన పద్యం చూడండి -
ఇందులోని చమత్కారమేమో
గమనించండి-

ఊరిభార్య లెల్ల రూహించి యామె మం
చంబుతో నిడిరి శ్మశానమందు
నట పిశాచకాంత లాలోచనము చేసి
పడతి మరల నూరి నడుమ నిడిరి
                                                      (విశ్వనాథ పంచశతి)

ఇందులో ఒక మహాతల్లి ఎంత గయ్యాళో
కవి చెప్పదలుచుకొన్నాడు కానీ ఆమె గయ్యాళి
అని ఒక్కమాటైనా అనకుండానే ఎలా చెప్పాడో
చూడండి-
ఊళ్ళో ఉన్న భార్యలంతా సమావేశం జరిపి
ఈ గయ్యాళిని విదిలించేందుకు ఇదే సరైన మార్గమని
రాత్రివేళ ఆమెను మంచంతో కూడ మోసుకొని పోయి
శ్మశానంలో ఉంచి వచ్చారు. ఆ శ్మశానంలోని పిశాచకాంతలు
తెల్లవారే సరికి ఆమెను పీక్కుతింటాని ఊరివారంతా సంతోషించారు.
పాపం వాళ్ళకోరిక నెరవేరలేదు. శ్మశానంలోని పిశాచకాంతలంతా
ఆలోచించి తెల్లవారేలోగా ఆమెను మంచంతో సహా మోసుకొని వచ్చి
ఊళ్ళో దించి వెళ్ళారట.

దీన్ని బట్టి ఆమె ఎంత గయ్యాళో
చెప్పక్కరలేదుకదా!
ఎంత చమత్కరించారో కదా!

Sunday, August 27, 2017

పాప ఫలితాలు ఎప్పుడు వస్తాయి?


పాప ఫలితాలు ఎప్పుడు వస్తాయి?
సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
పాపపుణ్య ఫలితాలు ఎప్పుడు వస్తాయో?
చెబుతుంది-

నా ధర్మశ్చరితే లోకే
సద్యః ఫలతి గౌరవ,
శనై రావ ర్తమానస్తు
కర్తు ర్మూలాని కృంతాయా

మనం చేసే పుణ్యపాపాలకు ఫలితం
అనుభవించడానికి కొంత సమయం పట్టవచ్చు
వెంటనే ఫలితానికి రాకపోవచ్చు ఆవు గడ్డిమేయగానే
పాలివ్యలేదు కదా పాప పుణ్యాల ఫలితమూ
అంతే అయితే - పాపం వల్ల కలిగే ఫలితం
వినాశకరంగానే ఉంటుంది - అని భావం.

Saturday, August 26, 2017

రూపరాణి(నూతన ఛందస్సు)-2


రూపరాణి(నూతన ఛందస్సు)-2
సాహితీమిత్రులారా!కొలకలూరి స్వరూపరాణి కూర్చిన
రూపరాణి ఛందంలోని మరొక ఖండిక-

మగడు

నెల విచ్చి నెలబుచ్చు నెల బిచ్చ
గాడి
జీవన వనమెల్ల సిరిపచ్చ

కొరకొరమని ఆలి కొడుతుంది
కనుక
అన్యుల యాజమాన్యపు రంధి

ఉద్వాహమున కట్నమొకసారి
అద్దె
ఊపి గుంజును నెలకొకసారి

మనుజుండు కావచ్చు మగవాడు
మగడు
క్షతి నింటి నద్దె కిచ్చినవాడు

దీనిలోని లక్షణం-
మొదటిపాదం మూడు ఇంద్రగణాల దీర్ఘపాదం
మూడవపాదం మూడు ఇంద్రగణాల దీర్ఘపాదం
రెండవపాదం ఒక సూర్యణంగల లఘుపాదం.
1,3 పాదాలకు అంత్యప్రాస ఉన్నది.
ఈ మూడు పాదలు ఒక శబ్దార్థ శకలం (యూనిట్)
ఇలాంటి శకలాలు నాలుగుింటిని కలుపుకొని
ఒక శీర్షిక రూపొందుతుంది.
అంటే మూడేసి పాదాలు నాలుగైతే ఒక ఖండిక.

Friday, August 25, 2017

కుక్కపోతు నిపుడె కూల్చి చంపె


కుక్కపోతు నిపుడె కూల్చి చంపె
సాహితీమిత్రులారా!చమత్కారాలలో భావ చమత్కారమొకటి
చెప్పదలచుకొన్న భావాన్ని సూటిగా
చెప్పకుండా చిత్రమైన మలుపు త్రిప్పి
చమత్కారంగా చెప్పటాన్ని
భావచమత్కారం
అంటారు.

ఇద్దరు ప్రేమికులు గోదావరీతీరంలో
ప్రతిదినం ఒక పూలతోటలో ప్రొద్దున్నే
కలుసుకొంటున్నారు. అదే సమయానికి
ఒక బైరాగి పూలకోసం అక్కడికి వచ్చేవాడు.
ఆ సన్యాసివేషం చూచి కుక్క ఒకటి
మొరుగుతూ అతని మీదికి వచ్చేది.
కుక్క మీదికి రావటం అతనికి ఇబ్బంది.
అతడు అక్కడికి రావడం ఈ ప్రేమికులకు
ఇబ్బంది. ప్రేమికులైన యువతీయువకు
లిద్దరు ఆ సన్యాసిని అక్కడకు రాకుండా
చెయ్యాలనుకున్నారు. అట్లని,
బైరాగీ నీవు రావద్దని
అతనితో ఎలా చెప్పగలరు
యువతి ఆలోచించించింది-
అతణ్ణి రాకుండా చెయ్యటానికి --

ఇచ్చకొలఁదిఁ దిరుగు మింక బైరాగి గో
దావరీతటమున దట్డమైన
పొదలఁ జేరి యొక్క పొగరైన సింగ మా
కుక్కపోతు నిపుడె కూల్చి చంపె
                                                 (గాథా సప్తశతి)
అని చెప్పింది.

ఆ బైరాగి ఇక స్వేచ్ఛగా రావచ్చట
అతణ్ణి ఇబ్బంది పెడుతున్న కుక్కను
అక్కడే దట్టమైన పొదల్లో ఉన్న పొగరైన
సింహం ఇప్పుడే కూల్చి చంపిందట
కుక్కతోనే ఇబ్బంది పడుతున్న సన్యాసి
ఇక వస్తాడా రానే రాడు. కాని, ఆమె
ఆ సన్యాసిని రావద్దని చెప్పిందా
చెప్పలేదే. అట్లని రావద్దని చెప్పలేదా
చెప్పింది. చెప్పకుండా చెప్పింది.
ఆ సన్యాసి మనస్సు నొచ్చుకోకుండా
చెప్పింది. దీన్నే భావ చమత్కారం అంటారు.

వినాయక చవితి శుభాకాంక్షలు


వినాయక చవితి శుభాకాంక్షలు
సాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు
వినాయక చవితి శుభాకాంక్షలుWednesday, August 23, 2017

కవి - కవిత


కవి - కవిత
సాహితీమిత్రులారా!


పుల్లాపంతుల రాధాకృష్ణమూర్తిగారి
కవి - కవిత పద్యంఖండిక
పద్యం ప్రకాశం లో నుండి-

వాల్మీకియను కవీశ్వరుడు లేకుండిన
         రామభూమీశుడనామకుండె
వ్యాసుడన్ కవితావిలాసుండు లేకున్న,
         శ్రీకృష్ణ లీల లెంచెడి దెవండు
నన్నయ యను కవినాథుండు లేకాంధ్ర
         భారత లబ్దికెవ్వండు నోచె
పెద్దన్నయన్న కవిలేకపోయిన
         బ్రవరాఖ్యు నియతి నెవ్వండు సూచె
కనుక సుయశోవిశాలురౌ ఘనుల చరిత్ర
లవని బ్రాచుర్యమంద గావ్యములు వ్రాసి
అక్షర విలక్షాఖ్యేయ భిక్షపెట్టు
కవులు జగతికి జ్ఞాన చక్షువులు గారె

ఒక కవి దివ్యమహోన్నత భక్తిచే
            విజ్ఞాన దీపికల్ వెలుగ జేయ
ఒక కవి శృంగార మొలికించి తలపుల
            నవనవోదయ వసంతంబు నింపు
ఒక కవి శౌర్యతరోగ్రోక్తిబరపుచు
            జాతీయ వీరవిస్తరణ నిలుపు
ఒక కవి సంస్కారనికరంబు సూచించి
            సంఘచైతన్యప్రశస్తి గొలుపు
కాలదేశావసరముల గని యెఱింగి
అలఘు కవితల లోక కల్యాణ కర్త
లగుట, నిత్యయశఃకాయులయిన ఘనులు
కవులు జగతికి జ్ఞాన చక్షువులు గారె

కవి చాతుర్యము జూప ముగ్ధలకు వేగౌ, నట్లు - భక్తాళి కే
శవసాయుజ్యము బొందు, బౌరుషమునన్ సైన్యాళి దోస్సార శా
త్రవ గర్వాపహవృత్తి నిల్చు, గరుణన్ దైవారు దైవంబు, దా
త వరాలన్ గురియించు దత్తదుచితస్థానోక్తి కాలంబులన్

ఏసారస్వతుడో, మఱే సుగుణియో, యేవాగ్మియో, యెప్పుడో
యే సందర్భమునందొ, యెచ్చటనొ "మేలింపైన దౌ" నంచు వి
ద్యాసద్యోగుల కొక్క పద్దియమొ, వాక్యార్థమ్మొ, శబ్దమ్మొ, హృ
ద్యాసక్తిన్ నుడువన్ యశోధనులుగారా! కర్తయున్, భర్తయున్

కలకలలాడు వెన్నెలలు గాసినయట్లు మృదంగరావముల్
వలికినయట్లు, మింట నవవారిదముల్ గని నీలకంఠముల్
కులుకునయట్లు, లేత చివుళుల్ దిని మత్తిలి కోకిలావళుల్
పిలిచినయట్లు, పూర్ణిమ గృపీటజు జూచిన కల్వకోరికల్
మొలచినయట్లు, భాస్కరుని ముంగిట జూచిన పద్యభావముల్
మొలచినయట్లు, విచ్చిన నవీనసుమాసవమాని భృంగముల్
గలగినయట్లు, వేణు మృదుగానముచే తలలూపి నాగముల్
నిలచినయట్లు, చీకటి వినీల నభఃస్థల నవ్యతారకల్
బొలిచినయట్లు, భావముల బోలిచి శిల్పి వినూత్నరూపముల్
మలచినయట్లు, మౌని పరమంబును జేరెడు వేళ బ్రహ్మమున్
దలచినయట్లు, పాంథునకు దప్పికబోమధుశీతలోదకం
బొలికినయట్లు, నవ్య వధువోరగ జూడ వరుండు దానలో
జెలగినయట్లు, మార్ధవము జిందెడి కోరిక లెన్ని యెన్నియో
చిలికినయట్లు, నాకడకు జేరి మదీయ మనంబు దీయపుం
దలపుల నింపు, సాగును సుధారసధార కథానిధానమై
కళయయి, శిల్పమై, మధురగానమునై బ్రతిసృష్టయై దిగం
చలముల దోచు నూత్నహరిచాపమునై కలలో విలాసమై
వెలుగగ జేయు జీవితము వేయి మనోహరకాంతులీనుచున్
నిలువగజేయు భావముల నిత్యశుభావహ దీప్తకీర్తులన్
జెలిమి యొకింత గూర్చ బుధశేఖరపాళికి "కైత" దూతియై

కావున బ్రజ్ఞావంతుడు
దీవలయములోన గీర్తి దీప్తింజెందం
గావలె నన్నన్ సత్కృతి
గావింపవలయు, లేదగైకొనవలయున్

Sunday, August 20, 2017

రూపరాణి(నూత్న ఛందస్సు)


రూపరాణి(నూత్న ఛందస్సు)
సాహితీమిత్రులారా!


తూమాటి దోణప్పగారి సంపాదకత్వంలో
పద్యప్రకాశం అనే పద్య సంకలనం
2004లో వెలువడింది.
అందులో ప్రకాశం జిల్లా కవుల పద్యాలను
సంకలన పరిచారు.
ఇందులోనిదే రూపరాణి
ఇది కొలకలూరి స్వరూపరాణిగారి
నూత్నఛందస్సులోని ఒకదాన్ని
ఇక్కడ మనం చూస్తున్నాము-

తెలుగు దివ్వె-(పద్యకవిత)

లోటు బడనిది తెలుగు దివ్వె
నిలుప
లోగిలి యెల్ల వెలుగు పువ్వె

లొసుగు యింగ్లీష్ తో తెలుగు దివ్వె
లోయ
శిఖరాల క్రమములో సిరిమువ్వె

లోతౌపదాల తెలుగు దివ్వె
పల్లె
లాలించునాటి చల్లాబువ్వె

"గ్లోబలైజేషన్"కొరివిని
మలుప
తీడు వత్తిని తెల్గుదివ్వెని

దీనిలోని లక్షణం-
మొదటిపాదం మూడు ఇంద్రగణాల దీర్ఘపాదం
మూడవపాదం మూడు ఇంద్రగణాల దీర్ఘపాదం
రెండవపాదం ఒక సూర్యణంగల లఘుపాదం.
1,3 పాదాలకు అంత్యప్రాస ఉన్నది.
ఈ మూడు పాదలు ఒక శబ్దార్థ శకలం (యూనిట్)
ఇలాంటి శకలాలు నాలుగుింటిని కలుపుకొని
ఒక శీర్షిక రూపొందుతుంది.
అంటే మూడేసి పాదాలు నాలుగైతే ఒక ఖండిక.

Friday, August 18, 2017

గురువని ఎవరిని సంబోధంచాలి?


గురువని ఎవరిని సంబోధంచాలి?
సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
గురువెవరో ఎవరిని పిలవాలో-
మనవాళ్లు కనబడిన ప్రతివారిని
"గురు" పదంతో పిలుస్తుంటారు.
అది సరైందికాదట-

ఉపాధ్యాయాన్ దశాచార్యః
ఆచార్యాణాం శతం పితా
సహస్రంతు పిత్రూన్ మాతా
గౌరవే ణాతిరిచ్యతే

గురువని అందరినీ సంబోధించటం సరైనదికాదు.
దీనిలో రకాలున్నాయి. పదిమంది ఉపాధ్యాయుల
కంటే ఒక ఆచార్యుడు మిన్న. నూరుగురు ఆచార్యుల
కంటే తండ్రి మిన్న. అటువంటి వెయ్యిమంది తండ్రుల
కంటే ఒక తల్లి మిన్న. కనుకనే తల్లిని ప్రథమగురువంటారు.
అందరికంటే మిన్నగా గౌరవించదగినది తల్లియే - అని భావం.

Wednesday, August 16, 2017

సీసం మీద సీసపద్యం


సీసం మీద సీసపద్యంసాహితీమిత్రులారా!


పండ్రంగి రామారావు అనే శతావధానిని
ఒక పృచ్ఛకుడు-
సీసం మీద సీసం చెప్పమన్నాడట-
ఆ పద్యం ఇది చూడండి-

ఆబాలగోపాల మఖిల హస్తములందు
          చెన్నొందు పెన్సిళ్లు చెఱువు గనియె
అచ్చొత్తగా చేయు నక్షరసంచయం 
          బద్దాని చేతనే అందమొందె
వ్యాఘ్రమ్మునైనను శీఘ్రమ్ముగా జంప
          జాలిన గుండ్లను సలుప దగియె
వింతగా తనపేరు వృత్తంబు గాంచియు
          సంకీర్తనంబున సాగుచుండె
అధిక మూల్యంపు లోహంబు లమరియున్న
వెండి బంగారములబోలు చుండె ననియు
సీసమున కెప్డు సాటిగా చెల్లవండ్రువీని
యుపయోగ భారముల్ తెలియ మెండు

సీసం - ఒక ఛందస్సు, ఒక లోహం, లోహంతో పెన్సిళ్లు,
తుపాకి గుండ్లు, అచ్చక్షరాలు తయారు చేస్తారు
అనే భావాన్ని ఇందులో కూర్చి శబ్దార్థ సుందరంగా
చెప్పాడు కవిగారు.

Tuesday, August 15, 2017

ఎన్ని అనుభవిస్తేనేమి?


ఎన్ని అనుభవిస్తేనేమి?
సాహితీమిత్రులారా!


బహిర్లాపిక ప్రహేళికను పోలిన
భర్తృహరి వైరాగ్యశతకంలోని
ఈ శ్లోకం చూడండి

ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం?
న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం?
సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం?
కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్?

ఇందులో నాలుగు ప్రశ్నలున్నాయి

1. ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం?
     కోరికలన్నీ తీర్చే సంపదలు పురుషునికెన్ని కలిగితేనేమి?
2. న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం?
      శత్రువులపై విజయం సాధించి భూభాగాన్ని ఎంత విస్తరిస్తేనేమి?
3. సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం?
    బాగా మిత్రులకు ధనకనక వస్తువాహనాలిచ్చి గౌరవిస్తేనేమి?
4. కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్?
     కల్పాంతందాకా చావులేకుండా బ్రతికితేనేమి?

అనేవి ప్రశ్నలు దీనికి సమాధానాలేమిటి?
అంటే ఇందులో లేవు. బయటినుండి తీసుకోవాలి
ఆలోచించగా ఇవన్నీ ప్రయోజనం లేనివని అర్థం.
మరేమి కావాలి ఎప్పుడు ఇవి ఫలవంతమైనవి.
అంటే మోక్షదాయకమైనపుడు అనేది సమాధానం
లేదా మోక్షమివ్వవుకనుక ఇవి నిష్ప్రయోజనాలే
అని అర్థం స్ఫురుస్తుంది.

స్వాతంత్యదినోత్సవ శుభాకాంక్షలు


 స్వాతంత్యదినోత్సవ శుభాకాంక్షలుసాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు
71వ స్వాతంత్యదినోత్సవ శుభాకాంక్షలుMonday, August 14, 2017

జయ జనార్ధనా కృష్ణా రాధికాపతే


జయ జనార్ధనా కృష్ణా రాధికాపతే
సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణునికి సంబంధించిన
ఈ పాటను వినండి-ముద్దుగారె యశోదా ముంగిటి ముత్తెము వీడు


ముద్దుగారె యశోదా ముంగిటి ముత్తెము వీడు
సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణునికి సంబంధించిన
అన్నమయ్య కీర్తన వినండి-
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు


శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలుSunday, August 13, 2017

ఎక్కడుంది వైరాగ్యం?


ఎక్కడుంది వైరాగ్యం?
సాహితీమిత్రులారా!


యశోవర్మ కృత ప్రాకృతకావ్యం
గఉడవహో(గౌడవధః) లోని
ఈ శ్లోకం చూడండి

సోచ్చేయ కిం ణ రాఓ  మోత్తూణ బహుచ్ఛలాఇం గేహాఇం
పురిసా రమంతి బద్ధుజరేసు జం కాణణంతేసు

అనేక మాయలు కపటాలతో నిండిన గృహనివాసం విడిచిపెట్టి
మనుష్యులు జలపాతాలతో అందంగా ఉన్న అరణ్యాలలో
 నివసిస్తున్నారంటే అదిమాత్రం రాగం కాదా? అనగా
ఇల్లు వదలండం చేత వైరాగ్యవంతులైమనుకునేవారు
సుందరవనాలలమీద రాగం చూపుతున్నారు.
వైరాగ్యం ఎక్కడుందని భావం.

Saturday, August 12, 2017

బడబానల భట్టు


బడబానల భట్టు
సాహితీమిత్రులారా!


కోపం వస్తే తిట్టడం పరిపాటి
అదే కవి అయితే కవిత్వంలో
అంటే పద్యాల్లో తిడతారు.
అలాంటి కవులను తిట్టుకవులని
అంటుంటారు. అలాంటి వారిలో
వేమువాడ భీమకవి ఒకరు.
ఇలాంటివారిలో బడబానల భట్టు
గురించి చూద్దాం-

ఈయన ఒకమారు ఒక చెరువులోకి వెళ్ళి
సంధ్యవారుస్తున్న సమయంలో
ఆయన చేతి ఉంగరం జారి చెరువులో పడిందట.
అప్పుడు ఆ చెరువు ఎండిపోవాలని తిట్టాడట.
అందులోని నీళ్ళన్నీ నాలుగు గడియల్లో ఎండిపోయాయట.

ఆ పద్యం-
బడబానల భట్టారకు,
కుడిచేయుంగరము రవికి గొబ్బున నర్ఘ్యం
బిడువేళ నూడి నీలోఁ
బడియెఁ దటాకంబ నీటిఁ బాయుము వేగన్

ఈ పద్యంలో ఏడవ చోట కారం నిల్పి చెప్పడం వల్ల
ఇది జరిగిందని చెబుతారు.

బడబానల భట్టారకు,
కుడిచేయుంగరము రవికి గొబ్బున నర్ఘ్యం
బిడువేళ నూడి నీలోఁ
బడియెఁ దటాకంబ నీటిఁ బాయుము వేగన్

త్రిపురాంతకం నుండి శ్రీశైలం

వెళ్ళేదారిలో ఉంది ఈ చెరువు..

Friday, August 11, 2017

వేటిని ఎవరు విడిచి పెడతారు?


వేటిని ఎవరు విడిచి పెడతారు?
సాహితీమిత్రులారా!


ఈ నీతిశ్లోకం చూడండి-
ఇందులో ఎవరు దేన్ని
విడిచి పెడతారో వివరించారు.

నిర్ధనం పురుషం వేశ్యా
ప్రజా భగ్నం నృపం త్యజేత్
ఖగావీతఫలం వృక్షం
భుక్త్వాచాభ్యాగతాగృహమ్

వేశ్య ధనహీనుని, ప్రజలు ఓడిపోయిన రాజును
విడిచి పెడతారు. పక్షులు పండ్లులేని చెట్లను,
అతిథులు భోజనం చేసిన ఇంటిని విడిచిపెడతారు-
అని భావం.

Thursday, August 10, 2017

మహాత్ములకు సహజాలంకారాలు


మహాత్ములకు సహజాలంకారాలు
సాహితీమిత్రులారా!
మహాత్ములకు ఐశ్వర్యంలేప్పుడు కూడ
సహజాలంకారాలైనవి ఏమిటో
ఈ పద్యంలో వివరించారు చూడండి-
ఏనుగులక్ష్మణకవి అనువదించిన
భర్తృహరి సుభాషితాలలోనిది ఈ పద్యం-

కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం
గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్
వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్
సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పు డున్

చేతులకు ఎల్లపుడూ దానంచేసేగుణం,
నోటికి సత్యవాక్కును పలికే లక్షణం,
శిరస్సుకు గురువులకు నమస్కరించే గుణం,
బాహువులకు ఎదురులేని పరాక్రమం
కలిగి ఉండే గుణం, మనస్సునకు
అకలంకమైన ప్రవర్తన అనే లక్షణం,
చెవులకు శాస్త్రశవణం అనే గుణం-
ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు
కూడా సహజాలంకారాలుగా భావింపబడతాయి.

Wednesday, August 9, 2017

ముక్కోటి దేవతలు అంటే ఎవరు?


ముక్కోటి దేవతలు అంటే ఎవరు?
సాహితీమిత్రులారా!


విష్ణువు స్వరూపములైన ముప్పది ముగ్గురు
దేవతలనే ముక్కోటి దేవతలు అంటారు.

ఆ దేవతలు -
1. అష్టవసువులు - 8
   1. వరుణ, 2. వృషభ, 3. నహుష, 4. జయ
   5. అనిల, 6. విష్ణు 7. ప్రభాను, 8. ప్రత్యూష

2. రుద్రులు - 11
  1. ఉగ్ర, 2. సోమ, 3. శర్వ, 4. మృగవ్యాధ
  5. బిక్షక, 6. అహిర్ - బుధ్న్య, 7. పినాకీ,
  8. ఈశ్వర, 9. కాపాలిక, 10. భీమ, 11. భిషక్

3. ఆదిత్యులు - 12
   1. ఆర్యమ, 2. మిత్ర, 3. వరుణ, 4. అర్క, 5. భగ,
   6. ఇంద్ర,  7. వివస్వన్, 8. పూషా, 9. పర్జన్య, 10. త్వష్టా,
   11. విష్ణు, 12. అజ

4. ఇంద్రుడు,
5. బ్రహ్మ

మొత్తం = 8 + 11+ 12+ 1 + 1= 33

ఈ ముప్పది మువ్వురు విష్ణు స్వరూపులు.
వీరినే ముప్పదిమూడు కోట్ల దేవతలుగా చెబుతారు.

(శ్రీమాన్ దిట్టకవి నరసింహాచార్య కృత
 విజ్ఞాన కాంతి పుంజాలు నుండి.)

Tuesday, August 8, 2017

తిథి శబ్దం - వివరాలు


తిథి శబ్దం - వివరాలు
సాహితీమిత్రులారా!

తిథి అంటే శబ్దరత్నాకరంలో
1. పాడ్యమి లోనగునది
2. శ్రాద్ధదినము
అనే అర్థాలు ఇచ్చారు.

తన్యంతే కిలతా యస్మాత్తస్మాత్తాస్తిథ తిథయ స్స్మృతా
                                                                        -సిద్ధాంతశిరోమణౌ(కాలమాధవీయే)
తినోతి అనేపదం నుండి పుట్టింది ఈ తిథి అనే పదం.
తినోతి అనగా విస్తరించునది అని అర్థం
(చంద్రకళలను దినదినము పెంచుట)

తిథులు మూడు విధాలు-
1. ఖర్వ
2. దర్వ
3. హింస్ర

ఖర్వ - అనేది సమతిథి
            అంటే సూర్యోదయంనుండి మరునాడు సూర్యోదయము వరకు
            తిథి ఉండే తిథికి సమతిథి - ఖర్వ అని పేరు.

దర్వ - అంటే వృద్ధియైన తిథి అని అర్థం
       60 గడియలకన్నా ఎక్కువ ఉన్నతిథి.

హింస్ర - క్షీణత కలిగిన తిథి అని అర్థం.
                       60 గడియలకన్న తక్కువైన తిథి.


Monday, August 7, 2017

ఇలలో సాటిలేని భారతదేశం


ఇలలో సాటిలేని భారతదేశం
సాహితీమిత్రులారా!


1954నాటి సంఘం - అనే సినిమాలోని
దేశభక్తి గీతం వినండి-
వైజయంతిమాలగారి నటనతో
చిత్రీకరించినది-

Saturday, August 5, 2017

కేశవం ప్రతి గచ్ఛతి


కేశవం ప్రతి గచ్ఛతి
సాహితీమిత్రులారా!

మనదేశంలో బహుదేవతా ఆరాధన ఉందికదా
ఇంత మందిని పూజిస్తే ఆపూజలు ఎవరికి చేరుతుందో
ఈ శ్లోకం చెబుతుంది చూడండి-

ఆకాశాత్పతితం తోయం
యథా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః
కేశవం ప్రతి గచ్ఛతి


ఆకాశం(మేఘం)నుండి జారిపడిన నీటి బిందువులు
సన్నటి నీటి జాళ్లుగా, వాగులుగా, ఏఱులుగా మారి
సముద్రంలో ఏవిధంగా కలుస్తున్నాయో అదేవిధంగా
దేవతలందరికి చేసిన పూజలు, నమస్కారాలు అన్నీ
విష్ణువుకుచేరి ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి - అని
అర్థం.

Wednesday, August 2, 2017

తాంబూలం


తాంబూలం
సాహితీమిత్రులారా!


తాంబూలం గురించిన
ఈ శ్లోకం చూడండి-

ప్రాతః కాలే ఫలాధిక్యం
చూర్ణాధిక్యంతు మధ్యమం
వర్ణాధిక్యం భవే ద్రా త్రౌ
తాంబూలమితి లక్షణం

తాంబూలంలో మూడు వస్తువులున్నాయి.
1. ఆకులు, 2. వక్కలు, 3. సున్నం
ఇవి ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పేదీ
శ్లోకం.
ప్రాతఃకాలంలో వక్కలు ఎక్కువగాను
మధ్యాహ్నం సున్నం ఎక్కువగాను
రాత్రి తమలపాకులను ఎక్కువగాను
ఉన్న తాంబూలం సేవించాలని అర్థం.

ఉదయం పైత్యాన్ని హరిస్తుంది వక్క,
మధ్యాహ్నం ఉష్ణాధిక్యాన్ని తగ్గిస్తుంది సున్నం,
రాత్రి తమలపాకు జీర్ణశక్తిని కలుగజేస్తుంది

సున్నం శరీరానికి కావలసిన కాల్షియం అందిస్తుంది.
పుట్టబోయే బిడ్డకు ఎముకలుకు బలాన్నిం ఇచ్చేందుకు
గర్భిణీ స్త్రీలు తాంబూలం వేసుకోవాలి.
ఇది ఆహారానికి రుచిని కలిగిస్తుంది.
వివాహితులే తాంబూలం వేసుకోవడం మంచిది.
అలాగే భోజనానంతరమే వేసుకోవాలి
ఎప్పుడూ నమలుతూ ఉండటం మంచిది కాదు.

Tuesday, August 1, 2017

శిరఃప్రధానమను వాక్యం బెమ్మెయిన్ దప్పునే


శిరఃప్రధానమను వాక్యం బెమ్మెయిన్ దప్పునే
సాహితీమిత్రులారా!శ్రీకృష్ణదేవరాయలవారి ఆముక్తమాల్యదలోని
ఈ పద్యం చూడండి ఇది పంచమాశ్వాసంలో
నాయిక వర్ణనలోనిది-

హేమాభాంగ విభాధరారుణి వక్త్రేందు ప్రభాశీలద
ద్భామారత్నము వొందదయ్యె మును దత్తద్వర్ణ యుక్తాఖ్య లన్
శ్యామాత్వంబళి గర్వధూర్యాహ కచచ్ఛాయాచ్ఛటంగాంచె నౌ
గామున్నుర్వి శిరఃప్రధాన మనువాక్యం బెమ్మెయిందప్పునే


ఆకన్యక(గోదాదేవి) శరీరం బంగారు వన్నెకలిగి ఉన్నదానివల్ల గాని,
అధరోష్ఠం ఎఱ్ఱగా ఉన్నదానివల్లగాని, ముఖము చంద్రుని వన్నెకలిగి
ఉన్నదానివల్లగాని, తత్వర్ణాను సరణంగా- హేమాంగి, బిబోష్ఠి,
చంద్రముఖి అనే నామాలు వహింపక తేటులతో దీటగు నల్లని
తలవెంట్రుకల కాంతికి అనుగుణంగా శ్యామ అనే నామం వహించింది.
శ్యామ అనగా యౌవన మధ్యస్థురాలనీ, సర్వశరీరంలో శిరమే ప్రధానం
కావడం వల్ల ఆ శిరఃకాంతే ప్రధానంగా ఆపేరు వచ్చిందని భావం.