Tuesday, August 3, 2021

ఇలాంటి కుటుంబం ఉంటుందా!

 ఇలాంటి కుటుంబం ఉంటుందా!
సాహితీమిత్రులారా!ఎంత చిత్రం!

మురారి కొయ్యబారాడా? కాదా!

పూరీ జగన్నాథుడు కొయ్యవిగ్రహమేగా!

ఎందుకట -

ఈ శ్లోకం చూడండి


ఏకా భార్యా ప్రకృతి రచలా చంచలా సా ద్వితీయా

ఏక పుత్రో సకల సృడభూత్ మన్మథో దుర్నివార:

శేషశ్శయ్యా శయన ముదధి: వాహనం పన్నగాశీ

స్మారం స్మారం స్వగృహ చరితం దారుభూతో మురారి:


ఒక భార్య భూమి(ప్రకృతి) ఆమెకు చలనం లేదు.

రెండవ భార్య లక్ష్మి బహుచంచల.

ఒక కొడుకు బ్రహ్మ అడ్డమైన సృష్టి చేస్తాడు.

రెండవకొడుకు మన్మథుడు వానికి పట్టపగ్గాలుండవు.

పడుకునే శయ్య పాము. పడక సముద్రంమీద -

పాము పీకుతుందో?  సముద్రం ముంచుతుందో?

వాహనం గరుత్మంతుడు పాములను తినేవాడు

ఇలాంటి చరిత్రగల తన ఇంటిని

తలచుకొంటూ తలచుకొంటూ

మురారి కొయ్యబారి పోయాడు.

ఎంత చిత్రం!


Sunday, August 1, 2021

"తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త" - నాటిక

 "తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త" - నాటిక 
సాహితీమిత్రులారా!

ఆకాశవాణిలో ప్రసారమైన

"తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త" - నాటిక 

 రచన: _జంధ్యాల 

నిర్వహణ : _సత్యం శంకరమంచి

 ఇక్కడ ఆస్వాదించండి-Friday, July 30, 2021

జేబుదొంగలు(నాటిక)

 జేబుదొంగలు(నాటిక)

సాహితీమిత్రులారా!

"జేబుదొంగలు" – నాటకం

నవలామూలం - విశ్వనాథ సత్యనారాయణ

 రేడియో నాటికీకరణ - విశ్వనాథ పావని శాస్త్రి

 నిర్వహణ - వై సరోజా నిర్మల

ఆస్వాదించండి-


Wednesday, July 28, 2021

ఇంతమాత్రానికే ఇంత గర్వం అవసరమా!

ఇంతమాత్రానికే ఇంత గర్వం అవసరమా! 
సాహితీమిత్రులారా!రాజమందిరంలో నిరాటాకంగా తిరిగే రాజసేవకులు 

అదే తమపాలిటికి గొప్పగా భావించి గర్వించి 

రాజదర్శనానికొచ్చే పండితులను చూచి చూడనట్టుగా

వ్యవహరిస్తూ కసరుకొంటూ విర్రవీగితిరిగే వారిపై

ఒక కవిగారు పిల్లిపై పెట్టి ఈ విధంగా ఒక శ్లోకం చెప్పారు 

గమనింపగలరు-

మా గర్వ ముద్వహ బిడాల! మహీపతీనా

మంతఃపురం మణిమయం సదనం మమేతి

పట్టాభిషేకసమయే పృథివీపతీనాం

బాహ్య ట్థితస్య కలభస్య హి మండనశ్రీః!


ఓసీ పిల్లీ! నీవు మణిమయమైన రాజాంతఃపురంలో తిరుగుతున్నావని

ఇదే నా స్వంతిల్లని గర్వపడకురాజులకు పట్టాభిషేక మహోత్సవం జరిగే 

సమయంలో వెలుపలున్నగున్నయేనుగుకే అలంకార వైభవం కాబట్టి 

అలాంటి శుభసమయాల్లో నీమొగం చూచేవాళ్ళేవుండరు. పైగా 

నిన్ను చూస్తే అపశకునంగా భావిస్తారు. ఇంతమాత్రానికే 

ఇంత గర్వం అవసరమా - అని భావం

Monday, July 26, 2021

నీకాలెంత కందిందో!

 నీకాలెంత కందిందో!


సాహితీమిత్రులారా!తిమ్మన పారిజాతాపహరణంలో
సత్యభామ కృష్ణుని తన్ని సన్నివేశం
మనకు తెలిసిందే మరి అలాంటిదే
ఈ శ్లోకం చూడండి.

ప్రియురాలికి ఇష్టంలేని పనేదో చేటడంచే
కోపశీలఅయిన ఆమె ప్రణ కోపంతో పతిని తన్నింది.
అతడు ఆమెపై గల రాగాతిశయంతో
అనునయిస్తూ పలికినది ఈ శ్లోకం.

దాసే కృతాగసి భవే దుచిత: ప్రభూణాం
పాదప్రహార ఇతి సుందరి! నాస్మిదూయే
ఉద్యత్క ఠోరపులకాంకుర కంటకాగ్రై
ర్యత్ఖిద్యతే మృదు పదం వమ సా వ్యథా మే


సేవకుడు తప్పరుచేసినపుడు యజమాని కోపంతో
తన్నడం సరైనదే. నేను నీకు దాసుడును
నీ విషయంలో అపరాధం చేసినందుకు నన్ను
నీవు పాదప్రహారం చేసినందుకు బాధపడను.
కాని నీ పాదస్పర్శచేత నా శరీరం పుకించి నిక్కబొడిచిన
ముల్లులలాంటి రోమాల వల్ల కోమలమైన
నీ పాదానికి నొప్పికలిగిందేమోనని
నేను బాధపడుతున్నాను- అని శ్లోక భావం.

Saturday, July 24, 2021

మమ్మల్నంటే మేమనమా

 మమ్మల్నంటే మేమనమా
సాహితీమిత్రులారా!ఈ శ్లోకం చూడండి-
ఎంత చిత్రంగా ఉందో

రామకృష్ణపరమహంస, రమణమహర్షి లాంటివాళ్ళు
మొదట ప్రపంచానికి అర్థంకాక పిచ్చివాళ్లనుకుంది.
కానీ వారు ప్రపంచాన్నీ అలాగే అనుకున్నారు.
అలాంటి విషయం వివరించే శ్లోకమే ఇది చూడండి-

జ్ఞాత తత్త్వస్య లోకోయం జడోన్మత పిశాచివత్
జ్ఞాత తత్త్వోపి లోకస్య జడోన్మత్త పిశాచివత్

మిథ్యా ప్రపంచాన్ని అర్థం చేసుకొన్న జ్ఞానికి
లోకం వెఱ్ఱివాళ్ళమయమని అనిపిస్తే
మరి మొదటినుండి తత్త్వజ్ఞానులున్ని
అందరినీ వెఱ్ఱివాళ్ళకిందే జమకట్టింది
ఈ మాయాలోకం- అని భావం

అంతే కదా మరి
మమ్మల్ని వెర్రివాళ్లంటే
మేమనమా


Thursday, July 22, 2021

దుర్గ అంటే ఏమిటో ?

 దుర్గ అంటే ఏమిటో ?
సాహితీమిత్రులారా!దుర్గ అంటే మనకు అమ్మవారని మాత్రం తెలుసు.
అసలు ఆపేరులోని రహస్యం ఏమిటి అంటే
ఈ శ్లోకం చూడాల్సిందే

దైత్య నాశార్థ వచనో కార పరికీర్తిత:
కారో విఘ్న నాశశ్చ వాచకో వేదసమ్మత:
రేఫో రోగఘ్న వచనో శ్చ పాపఘ్న వాచక:
భయ శత్రుఘ్న వచనాశ్చాకార: పరికీర్తిత:
                                                          (ముండమాలా తంత్రం)

దుర్గ అనే పదంలో ఐదు అక్షరాలు ఉన్నాయి.
అవి రెండు అచ్చులు, మూడు హల్లులు.
అవి ద్ - ఉ, ర్ - గ్ - అ - అనేవి
ఇందులో ద్, ర్, గ్ అనే మూడు హల్లులు, ఉ, అ అనే రెండు  అచ్చులు. వీటివల్ల
దకారం అంటే ద - అనే అక్షరం వల్ల  దైత్యనాశనం జరుగుతుందట.
ఉకారం అంటే  - అనే అక్షరం వల్ల విఘ్ననాశనం జరుగుతుందట.
రేఫో అంటే ర - అనే అక్షరం వల్ల రోగనాశనం జరుగుతుందట.
 అనే అక్షరం వల్ల పాపనాశనం జరుగుతుందట.
 - అనే అక్షరం వల్ల శత్రునాశనం జరుగుతుందట.


ఆ ఐదు అక్షరాలకలయికతో దుర్గ
అనే పదం ఏర్పడుతుంది కావున
ఆ పదాని అంత మహత్తుంది.
ఇది మనం చెప్పిన మాటలు కాదు
మన పెద్దలు చెప్పినవి.
అటువంటి దుర్గామాతకు నమస్కారం.

Tuesday, July 20, 2021

శివుడు కొండలపై ఎందుకుంటాడు?

 శివుడు కొండలపై ఎందుకుంటాడు?
సాహితీమిత్రులారా!పూర్వం ఏ ఇంటిలో పట్టినా

నల్లులు విపరీతంగా ఉండేవి.

ఇక దోమల సంగతి చెప్పక్కరలేదు.

సీతారామయ్య అనే ఐయన ఇంటికి

వెళ్ళిన కవిగారు వాటితో పడిన బాధను

పద్యంలో ఇలా చెప్పారు చూడండి-


నల్లులు లేవని వస్తిమి,

కొల్లలుగా చేరఁడేసి గోడలవెంటన్

నల్లులకు తోడు దోమలు

చిల్లులుబడఁ గుట్టెనయ్య సీతారామా!


ఎంత కసిగా కుట్టాయో పాపం

దాంతో ఏకంగా పద్యం తన్నుకొచ్చింది.

శివుడద్రిపై శయనించుట

రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం

డవిరతమును శేషునిపై

పవళించుట నల్లి బాధ పడలేక సుమా!


శివుడు కైలాసపర్వతంపై పడుకోవడం

సూర్యచంద్రులు ఆకాశంలో ఉండటం

విష్ణువు పాముపైనుండి దిగకుండా

పడుకోనుండడం ఎందుకంటే

నల్లి బాధ పడలేకట

కవి నల్లి బాధను ఎంతగా భరించారో

అది ఇంత చమత్కారంగా చెప్పాడు.

ఇప్పుడు దాదాపు నల్లు అంతరించాయని

అనుకుంటాను అందుకే కొందరికి నల్లి అంటే

ఏమిటో తెలియడంలేదు. మంచిదే

కవిగారు చెప్పినట్లు కాకుండా శివుడు సూర్యచంద్రులు

విష్ణువు పడుకోవడానికి వేరేమైన ప్రత్యామ్నాయం

దొరకవచ్చు.

Sunday, July 18, 2021

మనమిద్దరం లోకనాథులమే

 మనమిద్దరం లోకనాథులమే
సాహితీమిత్రులారా!ఈ చమత్కార శ్లోకం చూడండి-
సమాస చమత్కారం చెప్పే శ్లోకం ఇది-

అహం చత్వంచరాజేంద్ర! 
లోకనాథా వుభావపి
బహువ్రీహి రహం రాజన్! 
షష్ఠీతత్పురుషో భవాన్ఓ రాజా! నీవు, నేను ఇద్దరం
కూడ లోకనాథులమే సుమా!
కాని ఒక్కటే చిన్న భేదం
బహువ్రీహి ప్రకారం నేను లోకనాథణ్ణి,
నీవేమో షష్ఠీతత్పురుష ప్రకారం లోకనాథుడవు
- అని భావం

బహువ్రీహి సమాసం అన్యపద ప్రధానం కావున
లోకః నాథః యస్యసః - లోకనాథః అని
అంటే లోకమే నాథుడు(రక్షకుడు)గా కలవాణ్ణి నేను.

లోకానికి నాథుడవు(ప్రభువు)నీవు -
దీనిలో షష్ఠీత్పురుష సమాసం ఉంది.

లోకంపై ఆధారపడి బ్రతికేవాణ్ణి నేను.
లోకాన్ని పాలించేవాడవు నీవు
- అని భావం.
సమాసంలో రెండర్థాలకూ
లోకనాథః - అనే రూపమే ఉంటుంది
కావున కవి ఈ విధంగా చమత్కరించాడు.

Friday, July 16, 2021

చిల్లర దేవుళ్లు (నాటిక)

 చిల్లర దేవుళ్లు (నాటిక)


సాహితీమిత్రులారా!

రేడియోలో ప్రసారమైన

చిల్లర దేవుళ్లు - నాటకం , 

రచన - దాశరథి రంగాచార్య

సమర్పణ - శారదా శ్రీనివాసన్

ఆస్వాదించండి-
Wednesday, July 14, 2021

''మామగారు పెళ్లి కొడుకాయనే" - నాటకం

 ''మామగారు పెళ్లి కొడుకాయనే" - నాటకం  
సాహితీమిత్రులారా!

''మామగారు పెళ్లి కొడుకాయనే" - నాటకం , 

రచన - జంధ్యాల , నిర్వహణ - రామం

గతంలో రేడియోలో ప్రసారమైన నాటకం

ఆస్వాదించండి-Monday, July 12, 2021

గణపతి - రేడియో నాటకం

 గణపతి - రేడియో నాటకం 
సాహితీమిత్రులారా!

శ్రీ చిలకమర్తి లక్ష్మి నరసింహం విరచిత హాస్య రసాయనం

గణపతి నాటకం రేడియో నాటిక ఆస్వాదించండి-Saturday, July 10, 2021

వినాయకుడు పిల్లికి దండంపెట్టాడా!

వినాయకుడు పిల్లికి దండంపెట్టాడా!
సాహితీమిత్రులారా!ఒక కవి ఎంతవారైనా సమయానుకూలంగా

ప్రవర్తించాలని అన్యాపదేశంగా ఈ శ్లోకం కూర్చారు

గమనించండి-


గణేశ స్త్సౌతి మార్జాలం స్వవాహ సాభిరక్షణే

మహా నపి ప్రసంగేన నీచాన్ సేవితు మిచ్ఛతి


గణపతి పిల్లి స్తుతిస్తున్నాడట-

ఎందుకనగా తనవాహనమై ఎలుకను రక్షించుకోవటానికి

దానిని స్తుతించకపోతే అది తన వాహనాన్ని 

ఎక్కడ మ్రింగేస్తుందోనని దాన్ని స్తుతిస్తున్నాడట

అంతటి దేవుడు కూడ ఆవిధంగా చేయవలసి వచ్చిందంటే 

గొప్పవాడు కూడ సందర్భాన్ని బట్టి నీచులను సేవించవలసి 

వస్తుందని శ్లోకంలో సమర్థించబడింది. కాబట్టి కవికి తటస్థించిన

సందర్భం కూడ అలాంటిదేనని అన్యాపదేశంగా కవి చెబుతున్నాడు.

Thursday, July 8, 2021

కాళ్లకూరి నారాయణరావు - వరవిక్రయం

 కాళ్లకూరి నారాయణరావు - వరవిక్రయం
సాహితీమిత్రులారా!

కాళ్లకూరి నారాయణరావుగారి  

వరవిక్రయం రేడియో నాటిక 

ఆస్వాదించండి-

Tuesday, July 6, 2021

అన్నిటికి మూలం కోరికే కదా!

 అన్నిటికి మూలం కోరికే కదా!
సాహితీమిత్రులారా!ఈ చమత్కార శ్లోకం చూడండి-

రత్నాకరే పరిహృతా వసతిః కిమన్యత్
అంగీకృతః కఠిన వేదన దుఃఖ భారః
వక్షోజ కుంభ పరిరంభణ లోలుపేన
కిం కిం నతేన విహితం బతమౌక్తికేన


ముత్యానికి వక్షోజాలను కౌగిలించుకోవాలనే
ప్రగాఢమైన కోరిక కలిగింది. వెంటనే
సముద్ర(రత్నాకర)నివాసాన్ని వదలుకొంది.
రంధ్రం చేయటంలోగల బాధ(దుఃఖము)ను ఓర్చుకొంది.
వక్షోజాలను నిరంతరం కౌలించుకోవాలనే కోరికే ఇన్ని
బాధలను సంహిపచేసింది - అని భావం.

అదే కదా కోరికలేకపోతే ఏంచేస్తాం
అన్నిటికి మూలం కోరికే కదా

Sunday, July 4, 2021

ఈకాలంలో ఇలాంటి స్త్రీలున్నారా

ఈకాలంలో ఇలాంటి స్త్రీలున్నారా
సాహితీమిత్రులారా !నెల్లూరును పరిపాలించిన మమసిద్ధికి,
కాటమరాజుకు పుల్లరి(పశువులను మేపగా
ఇచ్చే సుంకము) విషయంలో పోరు ఏర్పడింది.
మనుమసిద్ధి పక్షాన ఖడ్గతిక్కన యుద్ధం చేస్తూ
సైన్యం చిందర వందర కాగా రణరంగం వదలి
ఇంటికి వచ్చాడు. అప్పుడు అతని భార్య తిక్కనకు
స్నానానికి నీళ్ళుతోడి నులకమంచం అడ్డం పెట్టి,
పసుముద్దకూడ పెట్టిందట. అది చూచిన తిక్కన
ఇదేమిటని అడగ్గా ఈ పద్యం చెప్పిందట-

పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్
ముగురాడువారమైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్

అన్నదట.
శత్రువులకు వెన్నిచ్చి పారిపోతే
మగతనం ఉన్న వారు నవ్వరా
వగపెందుకు  ఇప్పటి వరకు
ఇద్దరమే ఆడవాళ్ళం ఉన్నాము.
(ఆమె వాళ్ళఅత్త)- ఇకముందు మనం ముగ్గురము
ఆడవాళ్ళవుతాము - అని హేళన భావంతో పలికింది.

ఆ వీరపత్ని పేరు మాంచాల

ఇపుడు ఇలాంటి స్త్రీలు లెవరైనా ఉన్నా
భర్తకు పౌరుషం తెప్పించి యుద్ధానికి పంపగలిగే
వీరపత్నులు. ఆలోచించాలి
ఆనాటి స్త్రీలకు నేటి స్త్రీలకు ప్రతి విషయంలోను.

Friday, July 2, 2021

కవిచమత్కారం

కవిచమత్కారం
సాహితీమిత్రులారా!1925 ప్రాంతంలో బెజవాడలో పిసుపాటి చిదంబరశాస్త్రిగారు
శతావధానం చేస్తుండగా ఒక పృచ్ఛకుడు
ఎవరికీ దిక్కుతోచని సమస్యను ఇచ్చాడు.
దీనితో సదస్యులు దిగ్భ్రాంతి చెందారు.
సమస్య ఇది-
కాఖాగాఘాకిఙ కాటన్నాయాటాఙ

చిదంబరశాస్త్రిగారు చిరునవ్వుతో
వ్రాసుకోండి అన్నారు.
అర్థరహితమైన ఈ సమస్యను ఎలా పూరిస్తారా? అని అందరూ
ఆశ్చర్యంతో చూస్తున్నారు.
శాస్త్రిగారు ఇలా పూరించారు.

చాఛాజాఝాచి ఙ చంచన్నాయా ఛీఙ
తాథాదాధాతిఙ తాతన్నాయా థూఙ
పాఫాబాభాపిఙ పాపన్నాయా పీఙ


ఇది వినేసరికి  పృచ్ఛకుడు బిత్తరపోయాడు.
కాస్తలో తేరుకొని "పూరణకేమైనా అర్థముందా?" అని ప్రశ్నించాడు.
"మీ సమస్యకు అర్థం ఉంటే మా పూరణకు అర్థం ఉంటుంది"- అన్నారు శాస్త్రిగారు.

అప్పుడు సమస్యార్థాన్ని పృచ్ఛకుడు ఇలా వివరించాడు.
              కాటన్నాయడనే ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి చదువు అబ్బలేదు.
కానీ తాను గొప్పవాడినని పొగిడించుకోవాలని తపన. అలా పొగిడించుకొని
వారికి తృణమో పణమో ఇచ్చేవాడు. మిగతా వారికి పైసా కూడా విదిల్చేవాడు కాదు.
ఈ రహస్యం తెలుసుకొన్న ఒక చతుర పండితుడు అతని దగ్గరికి వెళ్ళి తాళం వేస్తూ
ఈ సమస్యను గానం చేసి గొప్ప సత్కారం పొందాడు.

అప్పుడు శాస్త్రిగారు "ఈ విశాల విశ్వంలో మీ కాటన్నాయని వంటివారు
చంచన్నాయుడు, తాతన్నాయుడు, పాపన్నాయుడు అనే లుబ్దాగ్రేసర
చక్రవర్తులు ఉన్నారు. మీ పండితుని కన్నా మా పండితులు అధిక
విద్యాప్రౌఢులు కనుకనే అన్యాపదేశంగా ఛీ, థూ - అని వారి మూర్ఖతను
నిందిస్తూనే పొగిడినట్టుల భాసింప చేసి గౌరవం పొందారు." అని వివరించేసరికి
సభ్యులంతా కరతాళ ధ్వనులతో పిసుపాటివారిని అభినందిచారు.

పృచ్ఛకుడు కూడా  తనదారంటే వచ్చిన శాస్త్రిగారి చాతుర్యానికి కాదనలేక
హృదయపూర్వకంగా సంతృప్తిని, సంతోషాన్నీ వ్యక్తపరిచాడట.


Wednesday, June 30, 2021

ఇస్తే దానకర్ణుడు మరి ఇవ్వకపోతే...........

ఇస్తే దానకర్ణుడు మరి ఇవ్వకపోతే...........
సాహితీమిత్రులారా !ప్రతిరోజూ  బిక్షం పెట్టించుకొంటూ
ఒకరోజు పెట్టకపోతే నానాబూతులు తిడతారుకదా!
అలానే కవులూ దానమివ్వని వారిని ఎలా పద్యాలలో
ఈ సడించుకున్నారో కొన్ని పద్యాలను చూద్దాం-

ఎంత వేడినా, ఏమన్నా ఇవ్వని వారిని
చూసి ఒక కవి ఇలా అంటున్నాడు-

ఇల లోభి నెంత వేడిన
వలవని వెతలంతె కాని వా డిచ్చెడినే
జలమును వెస గిల కొట్టిన
కలుగునె నవనీతమాశగాక ----పెద్దగా లేక పోయినా ఇచ్చేవాళ్ళున్నారు
ఉండీ ఇవ్వని వాళ్ళున్నారు
అటువంటి వారిని గురించి చెప్పిన పద్యం -

కలుగక యిచ్చెడు మనుజులు
తలవెండ్రుకలంతమంది తర్కింపంగా
కలిగియు నీయని యధములు
మొలవెండ్రుకలంతమంది మోహనరంగా!చాలా మంది ఇస్తున్నపుడు
ఒక లోభి ఇవ్వకపోతేనేమి
గోష్ఠంలో పెక్కావులు పాలిస్తుండగా
ఒక బక్కావు ఇవ్వకపోతే ఏమిలే అంటున్నాడో కవి-

పెక్కావు లిచ్చుచో నొక
బక్కా వీకుండెనేని పాడికి కరవా
పెక్కు దొర లిచ్చుచో నొక
కుక్కల కొడు కీయకున్న కూటికి కొరవా!


దీనిలో ఇవ్వని వాని శునకపుత్రునితో పోల్చాడు
మరి అతని బాధ అలాంటిది.

ఒక కవి అంటాడు - దానమనేది పుట్టుకతోచేతిలో పుట్టే గుణం.
దాన్ని బలవంతాన చేతికి - అటూ - ఇటూ నులిమి
ఎక్కించటానికేమన్నా గాజువంటిదా?

పుట్టుక తో డుత కరమున
పుట్టవలెన్ - దానగుణము - పుట్టకపోతే
యిట్టట్టు నులిమి బలిమిని
బట్టింపను గాజ తాళ్ళపలి కొండ్రాజా!ఇక్కడ మరో కవి అంటున్నాడు పదిమందికిచ్చి
పదకొండవవానికివ్వకపోతే వాడూరుకోడు
తిట్టి పోస్తాడు అంటున్నాడు చూడండి-

పదివేలమంది కిచ్చియు
తుది నొక్కని కీయకున్న దొరకువు కీర్తుల్
పదివేల నోము నోచిన
వదలదె యొక రంకు వంక వన్నియసుంకా!


పదివేల నోములు నోస్తే వచ్చిన పేరు,
ఒక రంకుతనపు అపకీర్తి వస్తే నిలువదు.
అలాగే దాత అన్నవాడు పేరుండాలంటే ఇస్తూనే ఉండాలి.

Monday, June 28, 2021

ఆరు ముఖాల షణ్ముఖుడు

 ఆరు ముఖాల షణ్ముఖుడు 
సాహితీమిత్రులారా!షట్ అంటే ఆరు, ఆరుముఖాలుకలవాడు
షణ్ముఖుడు, షడాననుడు - సుబ్రహ్మణ్యస్వామి.
ఆయన ఆరు ముఖాల ప్రత్యేకత-
ఆరు ముఖాలలో మొదటిది వెలుగునిస్తుంది.
రెండవముఖం వరాలను ఇస్తుంది.
మూడవ ముఖం యజ్ఞాలను రక్షిస్తుంది.
నాలుగవ ముఖం వేదాల అర్థాన్ని బోధిస్తుంది.
ఐదవ ముఖం దుష్టశక్తులను నాశనం చేస్తుంది.
ఆరవముఖం వల్లీదేవిమీద ప్రేమ కటాక్షాన్ని ప్రసారం చేసి,
ధర్మాన్ని ఆచరించాలని అందరికి ప్రబోధిస్తుంది.
అలాగే ఆరుముఖాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు
అనే అరిషడ్వర్గములను నాశనం చెస్తాయి.
కుమారస్వామిని ఆరాధించటాన్ని కౌమారం అంటారు.
ఇప్పుడు ఈ మతం హిందూ సనాతన ధర్మంలో కలిసిపోయింది.


Saturday, June 26, 2021

కాశీమజిలీ కథలు - కొన్ని విషయాలు - 2

 కాశీమజిలీ కథలు - కొన్ని విషయాలు - 2

సాహితీమిత్రులారా!కాశీమజిలీ కథల్లో మణిసిద్ధుడు, గోపడు ఇద్దరూ ఊరూరూ

మజిలీలు చెస్తూ వెళుతున్నారు కాశీకి. మధ్యలో కనపడ్డ

వింతలు విశేషాలూ వివరిస్తున్నాడు గోపనికి మణిసిద్ధుడు.

ఇలా వెళుతూండగా ఒకఊరిలో గోడమీద క్రింది పద్యం

చూశాడు శిష్యుడు(గోపడు) ఈ పద్యం పై ఒక బొమ్మకూడ

ఉంది. ఆ పద్యం-


భూపతిఁజంపితిన్, మగఁడు భూరిభుజంగము చేతఁజచ్చె, నే

నాపదఁజెంది చెంది యుదయార్కుని పట్టణముఁజేరి వేశ్యనై

పాపము గట్టుకొంటి, తన పట్టి విటుండయి కౌఁగిలింప, సం

తాపముఁబొంది, యగ్గిఁబడి, దగ్ధనుగా, కిటు గొల్లభామనై

యీ పని కొప్పుకొంటి, నృపతీ వగపేటికిఁజల్ల చిందినన్


దీన్ని చూచిన తరువాత గోపనికి కొండెత్తు కుతూహలం పెరింది

ఈ బొమ్మేమిటి, ఈ పద్యమేమిటి, ఇందులో ఎన్నో సన్నివేశాల

ప్రసక్తి ఉంది. దాని పూర్వాపరాలేమిటి

ఈ గొల్లభామ ఏ భూపతిని చంపింది

ఆమె మగడు ఎందువల్ల పాముకాటుతో మరణించాడు

వారికి పుట్టిన కుమారుడెక్కడ పెరిగాడు

ఆమె వేశ్యగా ఎందుకు మారింది

ఆమె దగ్గరకే ఆమె కొడుకు విటునిగా ఎందుకొచ్చాడు

ఇవన్నీ తెలిసి తెలిసి అగ్నిప్రవేశం చేయకుండా

ఎందుకు చల్లనెత్తుకొంది

అందులోంచి చల్లచిందితే ఏ నృపతి ప్రశ్నించాడు

శిష్యుడు వేసిన ప్రశ్నలన్నిటికి గురువుగారు మణిసిద్ధుడు

పూసగ్రుచ్చినట్లు సమాధానం చెప్పాడు ఇదంతా వింటుంటే

చదువుతుంటే ఎంత ఆసక్తికా కథాకథనం వుందో మదిర

సుబ్బన్నదీక్షితుల గొవ్వభామ కథలో


   ఈ పద్యంలోని సంఘటనలుగాని, ఇందులోని కల్పనలుగాని

సుబ్బన్నదీక్షితులు సృష్టించిన కల్పనలుకాదు. ఇందులోని

కథాకథనమే వారిది. ఈ పద్యం మూలశ్లోకం రసిక జీవనం అనే

సంస్కృత ప్రబంధంలో ఉంది.


ఆ శ్లోకం-

హత్వా నృపంపతి మవేక్ష్య భుజంగదష్టం

దేశాంతరే విధివశాద్ గణికాస్మితాజాతా

పుత్రం భుజంగ మధిగమ్యచితాం ప్రవిష్టా

శోచామి గోపగృబిణీ కథ మద్యతక్రమ్


రసిక జీవనం కంటే ప్రాచీనమైన ఇంకొక సంస్కృత సంకలన గ్రంథం

ఒకటుంది. దానిపేరు ప్రబంధ చింతామణి దాన్లో రెండవ ప్రకరణంలోని

12వ శ్లోకంలో ఉన్న గోపగృహిణీ ప్రబంధం ఈ కథకుమూలమని

చాటుపద్య రత్నాకంలో దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు పొందుపరిచారు.

ఈయుణ్ణి వెంకట వీరరాఘవాచార్యులుగారు మూలశ్లోకాన్ని

వివరాలుతెలిపారట. కాశీమజిలీ కథలు కపోల కల్పితాలు కావని

దీని బట్టి తెలుస్తున్నది.

Thursday, June 24, 2021

కాశీమజిలీకథలు - కొన్ని విషయాలు

 కాశీమజిలీకథలు - కొన్ని విషయాలు
సాహితీమిత్రులారా!
ఒకనాడు ఆబాలగోపాలాన్ని అలరించిన కథలు
కాశీమజిలీకథలు వీటిని మధిర సుబ్బన్నదీక్షితులు
కూర్చారు. ప్రజాబాహుళ్యంలో ప్రచారంలోని కథలకు
మంచి కథనంతో కూర్చాడు మధిర సుబ్బన్నదీక్షితులు.
ఇవి మొదట్లో వ్యానహారిక భాషలోనే వ్రాయబడ్డాయి.
తరువాతి కాలంలో ఇవి గ్రాంథికంలోని మార్చారు.

ఇవి ఎంత ప్రచారంలోకి వచ్చాయో ఈ పద్యం చెబుతుంది.

పండితులైన మెచ్చవలె, పామరకోటికినైన నింపుగా
నుండవలెన్, ప్రబంధమునయోక్తుల నిర్వురకున్ హితంబుగా
కుండిన తత్ప్రబంధమది యొక్క ప్రబంధమె సాధుపాఠకా
ఖండ సుఖ ప్రదం బగుటగా ఫలమా కవితా ప్రసక్తిన్

దీన్ని బట్టి పామరులకుకూడ ఇంపుగా వుండాలంటే
వ్యావహారిక భాషలోనే సాధ్యం. మనకు ఇప్పుడు దొరికే
పుస్తకాలు గ్రాంథికంగా ఉన్నాయి. మరొక విషయమేమంటే
ఇటీవల వీటిని చదువగలిగే సామర్థ్యం ప్రజల్లో తగ్గిందనే
చెప్పవచ్చు అందుకే వీటిని సాధారణ కథల్లాగా అనువదించి
బజారులో ఉంచారు. అంటే ఎంత ప్రసిద్ధమైనవైతేనో
అనువాదాని పూనరుకదా.  పూర్తి విషయంలోకి వస్తే
ఇవి పండ్రెండు భాగాలు 359 మజిలీలు 12 ప్రధాన
కథలతోపాటు 496 ఉపకథలున్నాయి.
వీటినుండే మనకు కొన్ని సినిమాలు కూడ వచ్చాయి
అందులో భామావిజయం, కీలుగుర్రం, చిక్కడు దొరకడు
(కొంత భాగం) మొదలైనవి..ఇలా చెబితే చాలా వున్నాయి.

         మధిర సుబ్బన్నదీక్షితులు (1868-1928) తూర్పగోదావరి జిల్లా
తాళ్లపూడి గ్రామంలో జన్మించారు. ఈయన ఇవిగాక అనేక పుస్తకాలు
వ్రాశారు. అష్టావధానాలు చేశారు. ఈ పుస్తకాల ఆదరణ
చూసి ఆ కాలంలో అనేక కథా పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి కానీ
వీటివలె ప్రసిద్ధం కాలేదు.

1. కాశీమజిలీకథలు - మధిర సుబ్బన్నదీక్షితుల(1898)
2. నిజమైన కాశీమజిలీలు - నంది చలపతిరాజు(1903)
3. శ్రీరంగమజిలీలు - బత్తల లక్ష్మయ్య(1911)
4. కాశీరామేశ్వర మజిలీలు -గుడిపాటి శేషగిరిరావు(1915)
5. రామేశ్వరపు మజిలీలు - కె. వెంకటరంగనాయకమ్మ(1919)
6. కాశీమజిలీలు - నందిరాజు చలపతిరావు(-)
Tuesday, June 22, 2021

లక్షీదేవి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో

 లక్షీదేవి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో

సాహితీమిత్రులారా!లక్షీదేవి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో

తెలిపే శ్లోకం ఇది గమనించండి-

క్షీరసాగరా త్పారిజాత పల్ల లేభ్యో, రాగమిందు

శకలా దేశాంతవక్రతా, ముచ్ఛైశ్రవైశ్చంచలతాం

కాల కూటన్మోహనశక్తిం, మదిరయా మదం,

కౌస్తుభమణి రతి నైష్ఠుర్యం, ఇత్యే తాని సహవాస

పరిచయవశా ద్విరహ వినోద చిహ్నాని గృహీత్యేవోద్గతా


పూర్వం అమృతమధనం కోసం దేవతలూ - దానవులూ

కలిసి పాలసముద్రం చిలికినపుడు, దాన్నుండి

కల్పవృక్షం - కామధేనువు - పాంచజన్యం - పారిజాతం-

ఉచ్ఛైశ్రవం - ఐరావతం - కౌస్తుభమణి - కాలకూటం -

చంద్రుడు - లక్ష్మీదేవి - ఇవన్నీ కూడ ఉద్భవించాయి.


ఈ ప్రకారంగా ఇవ్నీ లక్ష్మీదేవికి సోదరసోదరీమణులు కదా

వీటి పోలికలు కొన్నయినా ఉంటాయికదా

ముఖ్యంగా లక్ష్మీదేవికి వారి పోలికలు కొన్ని వచ్చాయి-

అవి చంద్రుని నుంచి వక్రత్వం

ఉచ్ఛైశ్రవం నుంచి చాంచల్యం

విషం నుంచి మైకం,

అమృతం నుండి మదం,

కౌస్తుభం నుండి కాఠిన్యం

వచ్చాయి అందువల్ల లక్ష్మీదేవి

స్వభావం ఎప్పుడు ఎలా ప్రదర్శించబడుతుందో

మానవులకు అంతు చిక్కకుండా పోయింది.