Thursday, May 30, 2019

అందమేఆనందం


అందమేఆనందం
సాహితీమిత్రులారా!

"సాయంత్రం మా ఆఫీస్ పార్టీకి వస్తున్నావుగా?సరిగ్గా ఆరింటికి వచ్చి తీసుకెళ్తాను" అటు వైపు ఫోన్ లో రాఘవ అడుగుతున్నాడు. అంత కన్నా దబాయిస్తున్నాడు అంటే సరిపోతుంది. స్మితకి తెలుసు, తనను అన్ని చోట్లకు ఎందుకు రమ్మంటాడో.నా గాళ్ ఫ్రెండ్ ఎంతో అందగత్తె అని అందరి ముందూ చెప్పుకోవటం అతనికో సరదా, చాలా గర్వకారణం. నిజానికి చెప్పుకోతగ్గ అందగత్తే స్మిత. మంచి ఎత్తుకి తగ్గ శరీర సౌష్టవం,ముట్టుకుంటే మాసిపోయే పచ్చని శరీర ఛాయ. నిజంగానే కలువల వంటి కళ్ళు. ముక్కు మాత్రం కాస్త పెద్దగా ఉంటుంది కానీ, అన్నిట్లో కలిపి చూస్తే, చక్కగానే ఉంటుంది. "సరే వస్తాను కానీ కొంచం త్వరగా వెళ్లిపోవాలి, రేపుఎగ్జామ్ ఉంది."చెప్పింది స్మిత."అయితే, లేత నీలంరంగు చీర, మొన్నదీపావళికి కొనిచ్చానే,అది కట్టుకో.అన్నీ మ్యాచింగ్ వేసుకుని,చక్కగా రా" అధికారపూర్వకంగా చెప్పాడు రాఘవ.

రాఘవలో తనకు నచ్చనిది అదొక్కటే. ఏది చెప్పినా, నువ్వు చేసి తీరాలి అన్న విధంగా చెప్తాడు. మిగతా ఎందులోనూ అతనంత ధారాళంగా తన అమ్మ,నాన్న కూడా ఉండరనిపిస్తుంది స్మితకు. కావాలంటే గంటలు గంటలు తనతో షాపింగ్ చేస్తాడు. తానే మంచి మంచి చీరలు,డ్రెస్సులు కొనిస్తాడు. తనకి డ్రైవింగ్ వచ్చేవరకూ ప్రతి వారం అతనే బ్యూటీ పార్లర్ కూడా తీసుకెళ్లేవాడు. థాంక్స్ చెప్తే నవ్వేస్తాడు "నువ్వు అందంగా ఉంటే, నాకేగా లాభం" అని జోక్ చేస్తాడు. త్వరలో పెళ్లి మాటలు మాట్లాడటానికి వాళ్ల వాళ్ళు వస్తారు అని కూడా చెప్పాడు. అతనూ చాలా అందగాడని చెప్పలేకపోయినా, మనిషి బాగా మేన్‌టేన్ చేస్తాడు. మంచి బ్ర్యాండెడ్ దుస్తులనే వాడతాడు.

మగవాళ్ల పార్లర్ కి వెళ్ళి మొహానికి ట్రీట్మెంట్లు చేయించుకుంటాడు. క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్ళి వ్యాయామం చేస్తాడు. బాంక్ లో పని చేస్తున్నా, మార్కెటింగ్ రంగంలో ఉండటం వల్ల, మనిషి రూపం మీద ఎదుటివాడి మర్యాద ఆధార పడి ఉంటుందని గట్టిగా నమ్మినవాడు. ఎమ్బీఏ చదువుతున్న స్మితకి రాఘవ బాంక్ లో పరిచయం అయ్యాడు. సంవత్సరకాలంలోనే చాలా దగ్గరయ్యారు ఇద్దరూ. స్మిత ఫైనల్ పరీక్షలు అయిపోగానే పెళ్లి చేసుకుందాము అని అడుగుతున్నాడతను.

సాయంత్రం చాలా శ్రద్ధపెట్టి ముస్తాబయ్యింది స్మిత. ముందే పార్లర్ కి వెళ్ళి వత్తైన తన జుట్టుని చక్కటి ముడి వేయించి, ముత్యాలతో అలంకరించింది. బయలు దేరే ముందు అమ్మ ఓసారి దిష్టి తీసేసింది, అంత అందంగా ఉంది స్మిత.

సాయంత్రం బయట కార్ పెట్టి, లోపలికి వచ్చిన రాఘవ కళ్ళలోనే ప్రశంస కనబడిపోతోంది. త్వరగా వచ్చేస్తామని అమ్మ,నాన్నకి చెప్పి ఇద్దరూ బయలుదేరారు. కారు ఎక్కాక ఉత్సాహంగా అన్నాడు రాఘవ "నీకో మంచి వార్త. అమ్మ, వదిన నీ నగల షాపింగ్ గురించి ప్లాన్ చెయ్యటం మొదలుపెట్టారు. వచ్చే అమావాస్య దాటాక, మంచిరోజు ఉందట, మీ ఇంటికి మావాళ్ళందరూ వస్తున్నారు" అని. "నా పరీక్షలకు ఇంకా మూడు నెలలు టైమ్ ఉంది కదా, అప్పుడే పెళ్ళైతే ఎలా?"గాభరాగా అడిగింది స్మిత. "డోంట్ వరీ. ముహూర్తాలు నీ పరీక్షల తర్వాతే. అంతలో నీ షాపింగ్ అన్నీ చేసుకో. కానీ, నీకు కొనాలనుకున్న వాటిల్లో, నాకు ఒక్క కోరిక మాత్రం తీరదు" అన్నాడు. "ఏమిటో?" ఆశ్చర్య పోయింది స్మిత. "ఏంలేదు, నీ ముక్కు కాస్త లావు కదా, వజ్రాలముక్కెర కొనాలన్నా నీకు అంత బావుండదు" అల్లరిగా అన్నాడు.

"ఫరవాలేదు, వడ్డాణానికి తగ్గ నడుముందిలే" తిప్పి కొట్టింది స్మిత. సాయంత్రం పార్టీలో చాలా ఎంజాయ్ చేశారు. ఈరోజు స్మితను "నా కాబోయే భార్య" అని కొత్త పరిచయం చేసేసాడు అందరికీ. అందరి కళ్ళూ స్మిత మీదే, గర్వంతో అతని ఛాతీ ఉప్పొంగి పోయింది. రాత్రి స్మితను ఇంటి వద్ద దిగబెట్టి "త్వరగా పడుకో, లేకపోతే కళ్ళ కింద నల్ల చారలు వచ్చేస్తాయి " అని హెచ్చరించి మరీ వెళ్లాడు రాఘవ. నవ్వుకుంటూ వెళ్ళి పడుకుంది అతను చెప్పినట్టే.

రాఘవ అన్నట్టే వాళ్ల వాళ్ళు ఫోన్ చేసి ఫలానా రోజు వస్తామని అడిగారు. స్మిత తల్లి తండ్రి వాళ్ళను సంతోషంగా ఆహ్వానించారు. అనుకున్నరోజు రానే వచ్చింది. ఆ సాయంత్రం రాఘవ తల్లి తండ్రి, అన్నా,వదిన, రాఘవతో కలిసి వచ్చారు. రాఘవ అందరినీ అందరికీ పరిచయం చేశాడు. మీ ఇద్దరూ మాట్లాడుకోండి అని పెద్ద వాళ్ళు రాఘవను, స్మితను పైన డాబా మీదకు పంపేశారు. ఇన్నాళ్లుగా పరిచయం ఉండి ఎంతో దగ్గరైన వాళ్లిద్దరికీ ఈ సందర్భం కొంత కొత్తగా, కొంత వింతగా ఉంది. కొద్ది సేపు మౌనం తరువాత స్మిత అడిగింది "మీ అన్నయ్య, వదిన నీకంటే బాగా పెద్దవాళ్ళా?" కొంచం మొహం చిట్లించుకున్నాడు రాఘవ "మరీ పెద్ద వాళ్ళేం కాదు, అలా కనబడతారు అంతే. వాళ్ల పెళ్లై ఆరేళ్లైంది, ఇద్దరు పిల్లలు కాగానే అడుగో అలా తయారైంది మా వదిన. కాస్త తగ్గమని అన్నైనా చెప్పడు, మా అమ్మా చెప్పదు.” కాస్త చిరాగ్గా అన్నాడు. "సరేలే, అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ. నేను పెళ్లికి ముందే ఒక విషయం నిన్ను అడగాలని అనుకున్నాను, నువ్వు కాదనవని నమ్మకం ఉంది." చెప్తూ ఆగాడు. ఇన్నాళ్లలో అడగనిది ఇప్పుదేముందో స్మితకు అర్థం కాలేదు. అమ్మ, నాన్న ఎంతో కొంత కట్న కానుకలు ఇస్తారు ఎలాగూ. బెంజికారు వంటి గొంతెమ్మ కోరికలేమైనా ఉన్నాయా ఇతని మనసులో అని చిన్న సందేహం రాకపోలేదు స్మితకు. “నాతోనా? అమ్మ నాన్న తోనా?" స్మిత అడిగింది. "ఇది నిర్ణయించు కోవలసింది నువ్వే. నన్ను ఎంతో అర్థం చేసుకున్నావని నా నమ్మకం. నువ్వు డబ్బు గురించి ఏ మాత్రం హెసిటేట్ చెయ్యద్దు, అవన్నీ నేను చూసుకుంటాను." చెప్పుకు పోతున్న రాఘవను ఆపింది స్మిత "అసలు ఇంతకూ విషయం ఏంటి రఘూ?" సూటిగా అడిగింది.

"నాకు నీ ముక్కుకు వజ్రాల ముక్కు పుడక చూడాలని ఉంది" చెప్పాడు. "ఓస్ అంతేనా, నీ కోసం ముక్కు కుట్టించు కుంటానులే" నవ్వింది స్మిత. "అది కాదు రా. కుట్టించే ముందు, నీ ముక్కు కొంచం సరి చేయించుకుంటే బావుంటుంది. చంద్రుడిలో మచ్చలా, నీలో ఉన్న ఒకే ఒక్క లోపమది. ఎంత మంది మోడెల్స్, సినీ తారలూ చేయించుకుంటున్నారు ఈ రోజుల్లో. నాకు తెలిసిన టాప్ సర్జెన్ ఉన్నారు ఈ ఫీల్డ్ లో. ఆయన దగ్గరే ప్రఖ్యాత మళయాళం సినీ తార డయానా కూడా ముక్కు సరిచేయించుకుంది. నేను చెప్పాను కదా, డబ్బు ఆలోచించకు " చెప్తున్నాడు రాఘవ. అతను చెప్తున్నది విని షాక్ తిన్నది స్మిత. ఇంజెక్షన్ అంటేనే భయపడిపోయే తాను, ఇలాంటిది ఊహించుకోను కూడా లేదు. "లేదు లేదు రఘూ, ఇది నా వల్ల కాదు. ప్లీస్, ఇంకేదైనా చెప్పు కానీ, ఇది టూ మచ్. దాని వల్ల అంత నా అందం తరిగిపోయిందనిపిస్తోందా నీకు? నో వే." తెగేసి చెప్పింది. చాలా బతిమాలాడు రాఘవ ఆమెను. కొంచెం కరిగింది, మా అమ్మ, నాన్నను అడుగుతా అన్నది. ఒప్పుకోలేదు రాఘవ. “ఇది మన ఇద్దరి మధ్య విషయం రా. నువ్వు తెలివైన దానివి, చదువుకున్నావు. ఎవరి సలహాలు, పర్మిషన్లు నీకు అవసరం లేదు. నీ మనసు ఒప్పుకోవాలి అంతే." స్పష్టంగా చెప్పాడు. "ఇప్పుడే నేనేమీ చెప్పలేను రఘు. నాకు కొంచం సమయం కావాలి" స్థిరంగా పలికింది స్మిత. ఇద్దరూ కిందకు దిగి వచ్చారు. అక్కడ అప్పుడే అందరూ వియ్యంకుల వరుసలు కలిపేసుకుని సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. రాఘవ అమ్మ స్మితను దగ్గర పిలిచి ఆప్యాయంగా కూర్చోపెట్టుకుంది. ఇంతకు ముందు ఆవిడను స్మిత ఒకటి రెండు సార్లు కలిసింది కూడా. వాళ్ళందరి ఆనందం చూసి స్మితకు కొంచం గిల్టీ గా అనిపించింది. రఘు చెప్పిన విషయం ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. వాళ్ళు వెళ్ళిపోయాక రాత్రంతా ఒంటరిగా ఆలోచించింది. రెండ్రోజుల తర్వాత రాఘవకు ఫోన్ చేసి, ఒకసారి ఆ సర్జన్ ను కలవాలని, ఆ తర్వాత తన నిర్ణయం చెప్తానన్నది. అలాగే కానీ, ఆ తరువాతే ముహూర్తాలు పెట్టుకుందామన్నాడు రాఘవ. ఒప్పుకోక పోతే, అతన్ని వదులు కోవాలని చెప్పకనే చెప్పాడని అర్థమైంది స్మితకు.

ఇద్దరూ వెళ్ళి సర్జన్ ను కలిసారు. ఆయన చాలా ఓపికగా రైనోప్లాస్టీ(ముక్కు సరిచేయటం), అందులో సాధక బాధకాలు అన్నీ వివరించి చెప్పారు. ఆపరేషన్ తర్వాత ముక్కు లోపల బ్యాండేజ్ లు వేస్తారని, ముక్కు పైన స్ప్లింట్ వేస్తారని, కొన్ని రోజులు నోటితో ఊపిరి పీల్చాలని విడమర్చి చెప్పారు. వాపు దాదాపు సంవత్సరం పాటు వస్తూ పోతూ ఉంటుందిట. కొన్ని కేసుల్లో చిక్కులు రావచ్చట కూడా. నాసికా రంధ్రం మూసుకు పోవటం, ముక్కు చివర నరాలు దెబ్బతినటం ఇంకా కొన్ని ఆయన వివరిస్తుంటే, స్మిత హడలిపోయిన మాట నిజం. కానీ రాఘవ మీది ప్రేమ స్మిత భయాలన్నిటినీ అధిగమించింది. కొంత అయిష్టంగానే ఒప్పుకుంది. రాఘవ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. "ఐ లవ్ యూ సో మచ్" అని ఒక వంద సార్లు చెప్పి ఉంటాడు. తమాషా ఏమంటే, ఇరు వైపులా తల్లి తండ్రులకూ ఇది నచ్చలేదు. అవసరమా అని చెప్పి చూశారు. ఎప్పుడూ ఇవ్వటమే కానీ, ఏమీ అడగని ప్రాణ సమానమైన రాఘవ కోసం చేస్తానన్నది స్మిత. పరీక్షలు అయ్యాక, ఆపరేషన్ పెట్టుకున్నారు. ముందు రోజు రాత్రి ఆ హాస్పిటల్ లో చేరింది స్మిత. ఎనిమిది వరకూ ఉండి, పొద్దున్నే అయిదుకే వస్తానని వెళ్లాడు రాఘవ. స్మిత అమ్మ అక్కడే ఉండిపోయింది. ఏమీ తినద్దని పాలు మాత్రం ఇచ్చారు. నిద్ర పట్టక తన స్పెషల్ రూమ్ నుండి బయటకు వచ్చి అటూ ఇటూ తిరగ సాగింది స్మిత.

అటు పక్కన కామన్ రూములు ఉన్నాయి. చిన్న హాస్పిటల్ కావటం వల్ల ఎక్కువ పేషెంట్స్ లేరు. లోపల ఎవరో ఉన్నారు, బయట కుర్చీలో ఒకావిడ కూర్చుని ఉంది. చూడటానికి చాలా సంపన్నురాలిగా కనిపిస్తోంది. కట్టిన చీర, ఎత్తు మడమల చెప్పులు, అందంగా కత్తిరించిన జుట్టు భుజాల వరకు పడుతుంటే, చెవుల్లో వజ్రాల హ్యాంగింగ్స్ మెరుస్తున్నాయి. ముఫ్హై లోపలే ఉంటుంది. తానే నవ్వి పలకరించింది. పేరు స్వప్నిక అట. కానీ తనకోసం కాదు, ఎవరో పేదపిల్లకు మొహం కాలి పోతే, వాళ్ళ చ్యారిటీ తరఫున డబ్బు పోగుచేసి, ఆ అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ కోసం తీసుకొచ్చిందట. వాళ్ల చ్యారిటీ స్త్రీల కోసమేనట. వచ్చేవారం ఒక బుగ్గ సరిగ్గా లేకుండా పుట్టిన పసి పాపకు ఆపరేషన్ చేయిస్తున్నారట. డబ్బు చాలనప్పుడు తానే స్వయంగా ఇస్తుందట. నెలకు ఒకటైనా ఇలాంటివి చేస్తుందిట తాను. అభినందించకుండా ఉండలేక పోయింది స్మిత. స్మిత తాను ఎందుకొచ్చిందో చెప్పింది. "ఇంత అందంగా ఉన్నారు, మోడెలింగ్ కోసమా ముక్కు సరిచేయించుకోవటం?" అనేసింది స్వప్నిక. "కాదు, నా ప్రాణమైన నా వుడ్ బీ కోసం" మెరిసే కళ్ళతో చెప్పిన స్మితను అదో లా చూసింది స్వప్నిక.

"పెళ్లైయ్యక పిల్లలు వద్దనుకున్నారా?" అడిగింది స్వప్నిక. "ఛ ఛ, అదేం మాట. అలాంటిదేమీ లేదే. అసలు దీనీకేం సంబంధం? ముక్కు ఆపరేషన్ వల్ల పిల్లలు పుట్టరని ఎక్కడా లేదే?" కొంచం కోపంగా అడిగింది స్మిత. "మరి, పిల్లలు పుట్టాక, పొట్ట ఎత్తుగా అయిపోతే, అక్కడ లైపో సక్షన్ చేయించుకుంటారా? తొమ్మిది నెలలు మోసి, పిల్లల్ని కన్నాక సాగిపోయిన చర్మం కోసం ఏం చేస్తారో ఇప్పుడే ఈ హాస్పిటల్లోనే కనుక్కోండి. పిల్లలకు పాలిచ్చి పెంచాక, బ్రెస్ట్ ఎన్‌హ్యాన్స్మెంట్ చేయించుకుంటారా? లేక వాళ్ళకు పాలే ఇవ్వరా? మరి, ఎన్నో కేసుల్లో పిల్లల్ని కన్న స్త్రీలు వారి గర్భాశయం వదులైపోయి, దగ్గినా, తుమ్మినా కొద్దిగా మూత్రం పడుతూ అవస్థ పడతారు. అలా కనుక మీకు అయితే, మీ ఆయన అసలు సంసారం చేస్తారా మీతో? ఎన్ని ఆపరేషన్స్ చేయించుకుంటారు?" సూటిగా అడిగింది స్వప్నిక.

దిమ్మేరపోయింది స్మిత. ఆమె మాటలు బాణాలై గుచ్చుకుంటుంటే ఏడుపొచ్చేసింది స్మితకు. ఏడుస్తూ తన రూమ్ లోకి వెళ్లిపోయింది. అమ్మ హడలిపోయింది ఏం జరిగిందో అని. అలాగే ఓ పది నిముషాలు ఏడుస్తూ ఉండిపోయింది. "ఏమ్మా, భయంగా ఉందా?"లాలనగా అడిగింది అమ్మ. ఇరవైరెండేళ్ళు తనను అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ చేతుల్లో ఒదిగిపోయింది. ఆ చేతుల ముడతలు ఏనాడైనా కనిపించాయా తన కళ్ళకు? అమ్మ నవ్వితే కళ్ల కింద పడే గీతలు, మెడ మీది సాగిన చర్మం, ఏనాడైనా నాన్నకు కనిపించాయా? ఏ కొత్త చీర కట్టుకున్నా, మహాలక్ష్మిలా ఉన్నావు అని మనస్పూర్తి గా మెచ్చుకుంటారే నాన్న. మరి తనకు? సృష్టి లో కెల్లా అందమైనది తన అమ్మే కదా. మరి ఇదేంటి? తాను చేస్తున్నదేoటి?

అంతలో స్వప్నిక లోపలికి వచ్చింది. "సారీ స్మితా. బాధ పెట్టినట్టు ఉన్నాను కదూ. ఎంతో మంది ఆడపిల్లలు ప్రకృతి కోపించి, జన్యు పరమైన వికృతులతో పుడుతుంటే చూస్తున్నాను. వారి భర్తల చేతిలోనే దెబ్బతిని, అందవికారులవటం చూశాను. కానీ ఇంత అందమైన నువ్వు ఇలాంటి పొరబాటు చేస్తుంటే ఆగలేక పోయాను. నీలాంటి అమ్మాయి లభించటమే అదృష్టం అనుకునే మగాడు నీకు దొరకాలి అనిపించింది. ఇలా బాహ్య రూపానికి ప్రముఖ్యాన్నిచ్చే మనిషి కాదు. ఈ ఆపరేషన్లో ఏదైనా తేడా వచ్చి,మొహం పాడైతే నీ వుడ్ బీ నీ వైపు చూస్తాడా?తప్పుగా మాట్లాడి ఉంటే, క్షమించు" అని చెప్పి వెళ్లిపోయింది. ఒక పావుగంట అలా పడుకుండిపోయింది స్మిత. లేచి, వెళ్ళి మొహం కడుక్కొచ్చి, అమ్మకు చెప్పింది "ఇంటికి వెళ్దాం పదమ్మా. ఈ పెళ్లి జరగక పోయినా నువ్వు బాధపడనని మాట ఇవ్వు". అమ్మ మొహంలో ఎంతో ఆనందం.
--------------------------------------------------
రచన - బృంద తంగిరాల, 
సుజనరంజని సౌజన్యంతో

Sunday, May 26, 2019

అగ్రగామి సాహిత్యాచార్యుడు - పింగళి లక్ష్మీకాంతం


అగ్రగామి సాహిత్యాచార్యుడు - పింగళి లక్ష్మీకాంతం
సాహితీమిత్రులారా!

పింగళి లక్ష్మీకాంతం గారు తెలుగు సారస్వత ప్రపంచానికి పరిచయం చేయవలసిన పనిలేదు. కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, వక్తగా, సాహిత్యాచార్యుడిగా వాసికెక్కిన వారు పింగళి లక్ష్మీకాంతం గారు. తెలుగు జాతికి - ఆంధ్ర సాహిత్య చరిత్రను అందించారు. పదహారు వందల ఏళ్ళ పాటు విలువడిన గ్రంధాలన్నీ చదివి, ఆకళించికుని సమగ్ర చరిత్ర వ్రాసి తెలుగు ప్రజలకు కానుకగా ఇచ్చారు పింగళి లక్ష్మీకాంతం గారు. తెలుగులో ఉద్దండ మహా పండితులుగా వెలిగారు. వారి జీవితానికి సార్ధకత ఏర్పరచుకున్నారు. చెళ్ళపిళ్ళ వారి శిష్యుడిగా తెలుగు నాట - అవధాన ప్రక్రియలు నిర్వహిస్తూ, తెనుగు భాషా ప్రవీణుడిగా నిలిచారు. సాహిత్యాచర్య వృత్తిలో ఉండి తన తెలుగు ఉనికితో అనేకానేక తెలుగు అధ్యాపకులను తీర్చి దిద్ది తెలుగు సాహిత్య, భాషా వికాసానికి తోడ్పడ్డారు.

తన సాహిత్య శిల్ప సమీక్ష గ్రంధంలో పాశ్చ్యాత్య కావ్య విమర్శ సిద్ధాంతాలకీ, భారతీయ అలంకారారిక సిద్ధాంతాలకీ వస్తుతహ వుండే భేద, సాధౄశ్యాలను వివరించారు లక్ష్మీకాంతం గారు. అంతే కాదు సాహిత్య కళ, కళలు, విద్యలు, కావ్యనిర్వచనము, కవిత్వము, చందస్సు, రసాన్వరూపము, సృంగార భేదములు, రసభాసము, భావకవిత్వము, వస్తుకవిత్వము, నాకటలక్షణములపై శీర్షికలు వ్రాసి అందించారు. వీరు రచించిన " సాహిత్య శిల్ప సమీక్ష " సాహిత్య విమర్శన గురించి తెలుసుకోవాలన్న వారు తప్పక చదవవలసిన గ్రంధం.

జననం, చదువు, కొలువు:

లక్ష్మీకాంతం గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆర్తమూరు లో జనవరి 10, 1894 న, ఓ సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి వెంకట రత్నం గారు, తల్లి కుటుంబమ్మ. లక్ష్మీకాంతం గారి పూర్వికులు పింగళి సూరన్న గారట. ప్రాధమిక విద్య, గూడూరు, రేపల్లె లో అభ్యసించి, బందరు నుండి బి ఏ పట్టా సాదించారు. కొంత కాలం " కాపియిస్ట్ " గా పనిచేశారు. తరువాత బందరు నోబెల్ స్కూల్ లో, నోబెల్ కాలేజి లో అధ్యాపకుడిగా పనిచేశారు. కొన్ని రోజులు మద్రాసు ఓరియంటల్ గ్రంధాలయంలో పరిశొధకుడిగా పనిచేశారు. 1931 నుండి 1949 వరకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అధ్యక్షుకులుగా వ్యవహరించారు. తెలుగు, సంస్కృత భాషా బోదనకు ప్రణాలికలను రూపొందించారు. బి ఏ, ఎం ఏ విద్యార్ధులకు ఇతిహాసం, తెలుగు సాహిత్య విమర్సల గురించి బోదించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా విభాగానికి అధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. వీరి శిష్యులు తెలుగు నాట అనేక కళాశాలలో అధ్యాపకులుగా ఉన్నారు. లక్ష్మీకాంతం గారు, తిరుపతి వేంకటవ కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి శిష్యులు.

కొంత కాలం ఆల్ ఇండియా రేడియో కి సాహిత్య సలహాదారుగా ఉన్నారు. ఈ తరుణంలో అనేక సంస్కృత రూపకాలను రూపొందించారు. 1954 లో లక్ష్మీకాంతం గారు కేంద్ర సాహిత్య అకాడమి కార్య నిర్వాహక సభ్యుడిగా వ్యవహరించారు. 1961 లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ఆచార్యుడిగా చేరారు. 1968 నుండి తెలుగు అకాడమి కార్య నిర్వాహక సబ్యుడిగా, అకాడమిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. లక్ష్మీకాంతం గారు " అవధాన " ప్రక్రియలో కూడా చురుక్గా పాల్గొనేవారు.

కాటూరి వెంకటేశ్వరరావు గారితో కలసి కవిత్వం వ్రాస్తూ - పింగళి - కాటూరి జంట కవులు గా ప్రసిద్ధులైయ్యారు. "తొలకరి ", " సౌదర్యానందం " ఈ జంట కవుల రచనలు. " ఆంధ్ర సాహిత్య చరిత్ర " సంకలనం చేశి తెలుగు జాతికి అందించారు. ఆంధ్ర సాహిత్య చరిత్ర రచించి ఒక కొత్త ఒరవడి సృష్టించారు.

ఆంధ్ర సాహిత్య చరిత్ర:

ఆంధ్ర సాహిత్య చరిత్రను పది ప్రకరణలలో వివరించారు. అవి:

- ప్రజ్ఞాన్నయ్య యుగంలో కవిత్వార్భవము (1000 క్రీ. శ. వరకు)
- నన్నయ్య యుగము (1000-1100 క్రీ. శ. వరకు)
- శివకవి యుగము (1100-1225 క్రీ. శ. వరకు)
- తిక్కన్న యుగము (1225-1320 క్రీ. శ. వరకు)
- ఎర్రాన్న యుగము (1320-1400 క్రీ. శ. వరకు)
- శ్రీనాధ యుగము (1400-1500 క్రీ. శ. వరకు)
- శ్రీ కృష్ణ దేవరాయల యుగము (1500-1600 క్రీ. శ. వరకు)
- దఖినాంధ్ర (నాయక రాజ) యుగము (1600-1775 క్రీ. శ. వరకు)
- క్షీణ యుగము (1775-1875 క్రీ. శ. వరకు)
- ఆధునిక యుగమౌ (1875 క్రీ. శ. మొదలు)

సుప్రసిద్ధ సాహిత్యకారుడు - ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి కార్యదర్శి శ్రీ దేవులపల్లి రామానుజరావు ఈ పుస్తకానికి తొలి పలుకు వ్రాశారు. పింగళి లక్ష్మీకాంతం గారు ఎం ఏ విద్యార్ధులకు అనేక సంవత్సరాలు బోదిస్తూ తన అనుభవాలను క్రోడీకరిస్తూ ఈ గ్రంధాన్ని రూపొందించారు. తన కృతి సమర్పణలో లక్ష్మీకాంతం గారు ఇలా రాసారు:

ఇది జనించిన నలుబది యేండ్లనుండి
సరస సాహిత్య విజ్ఞాన సత్రమనుచు
ఆశ్రయింపని తెలుగు విద్యార్ధి లేడు
చొచ్చి చూడని తెల్గు వ్యాసుండు లేడు.

ఈ సంకలనంలో తెలుగు జాతి చరిత్రను ప్రస్తుతీకరించారు. ప్రజల భాష, ఆస్థాన భాష, ప్రాచీన భాషల గురించి వివరించారు. తెలుగు భాషా చరిత్ర లో తెనుగు ఎంత ప్రాచీన భాషో తెలుపుతూ 633 క్రీ. శ. లో జయసిమ్హ వల్లభుని కాలం నాటి " విప్పర్తి " శాసనము, మంగి దొరరాజు కాలం నాటి " లక్ష్మీపుర " శాసనం, 727 ఖ్రీ. శ. " అహదనకర " శాసనము - ఇలా అనేక శాసనాధారతో చరిత్రని పొందుపరిచారు.

నన్నయ్యకు పూర్వమే ఆంధ్రంలో మాత్రాగణ బద్ధములను, అక్షరగణ బద్ధములను ఆయన పద్యములు వ్రాయబడినవని ప్రత్యక్ష ప్రమాణాలతో, శాసనాల ఆధారముగా విస్లేషించి ఉదాహరించారు.

అరవం (తమిళం) లో " యాప్పిరంగన్ " అన్న చందశ్శస్త్రం (ఇది నన్నయ్యకు పూర్వము) లో వాంచయ్య అన్న తెలుగు లక్షణ వేత్త రచించిన గ్రంధం గురుంచి ప్రస్తావించారు. తెలుగు భాషకు చాళుక్య రాజుల సేవలను నిసితముగా విస్లేషించి వ్రాసారు. లక్ష్మీకాంతం గారికి చరిత్ర పట్ల ఎంతటి అపార అవగాహన ఉన్నదో అని చెప్పడనికి ఇది ఒక తార్కాణం.

కవితావిర్భవము నుండి సమకాలీన సాహిత్యం వరకు తెలిసిన మహాపండితుడు. మార్గ కవిత, దేశి కవిత (చాళుక్యుల నాటి పాలనలో), భారతాంధ్రీకరణ పద్ధతి, పల్కూరి సోమనాధుడు - వారి గ్రంధాల సమీక్ష, మత పరిస్థితి, భాషా పరిస్థితి, గోన బుద్ధారెడ్డి, చక్రపాణి రంగనాధుడు, నిర్వచనోత్తర రామాయణము, వర్ణలలు-చిత్రణము, భాషా సృష్టి, కేతన, కాచవిభుడు - విట్టలుడు, మంచన, మారన - మార్ఖండేయ పురాణము, ఎర్రాప్రగడ - రామాయణము, హరివంశము, లక్ష్మీ నరసిమ్హ పురాణము, భాస్కర రామాయణము, నాచన సోముడు - ఎర్రన్న సోమనలు, మహాకవి శ్రీనాధుని - నైషధీయ చరిత విమర్శ, అనువాధ పద్ధతి, హర విలాసము, భీమేశ్వర పురాణము, క్రీడాంభిరామము, కాశీ ఖండము, శివరాత్రి మహత్యము, పలనాటి వీర చరిత్ర, శ్రీనాధుని శైలి, (గురించి రాసారు), పఒతన - అనువాధ సరణి, భోగినీ దండకము, వీరభద్ర విజయము, జక్కన, అనంతామాత్యుడు, గౌరన మంత్రి, దగ్గుపల్లి దుగ్గన, పిల్లలమర్రి పిన వీరన్న, జైమినీ భారతము, దూబగుంట నారాయణ కవి, భైచరాజు వెంకటనాధుడు, పిడపర్తి సోమన, నంది మల్లయ్య - ఘంట సింగన, కొరవి గోపరాజు, వెన్నెలకంటి అన్నయ్య, ఇలా అనేక మంది గురుంచి, వారి రచనల గూర్చి విసిదీకరించారు తన గ్రంధంలో.

బసవపురాణం, శివతత్వసారము, సంగీత రత్నాకరం, పద్మావతీ దండకము, చంద్రననా దండకము, పద్మిణీ దండకం, విద్యావతీ దండకం, వీరభద్ర విజయము, విక్రమార్క చరిత్ర (జక్కన) - ఇలా తెలియని గ్రంధాలను కూడా వెలుగులోకి తెచ్చారు. అలానే కవులను కూడా పరిచయం చేశారు. వారిలో:

- చంద్ర కవి - మైసూరు రాజు కృష్ణ ప్రభువు ఆస్థాన కవి
- నుదురుపాటి సాంబన్న - పుదుపుకోట (పుదుప్కొట్టై) లోని తొండమాన్ ఆస్థాన కవి
- లక్ష్మీ దాస కవి
- గణపవరపు వెంకట కవి (విద్యావతీ దండకం) ఉన్నారు.

ఇలా, ప్రమాణంలో లేని వారినీ - వారి గ్రంధ విషయాలను వెలుగులోకి తెచ్చిన ఘనులు శ్రీ లక్ష్మీకాంతం గారు.

ఈ రచనలో మరో విషేషం ఉంది. అది ఏమిటీ అంటే - వ్రాత ప్రతులలో లేని పద్యాలను కూడ ఇందులో ప్రస్తుతీక్రించారు. అంటే ఈయన ఎన్నో గ్రంధాలను చదివి, వాటిలోని సూక్ష్మాలతో సహా రూపాంతరం చేశారు. ఉదాహరణకి విక్రమార్క చరిత్ర (జక్కన, వ్రాసినది) - ఈ గ్రంధాన్ని వెన్నెలకంటి సిద్ధన మంత్రికి అంకితమివ్వబడినది; ఇది 1423 - 1447 ఏ. డి. వరకూ విజయనగర రాజ్యమును పాలించిన ప్రౌడ దేవరాయల కాలనాటిదని తన పరిశొధనలో కనిపెట్టి, ఆ విషయాలను ఈ సంపుటంలో పొందుపరిచారు. అలానే శ్రీనాధునికి ముత్యాలశాలలో కనకాభిషేకము చేసిన విజయనగర ప్రభువు ప్రౌడ దేవరాయలే అన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.

శ్రీ లక్ష్మీకాంతం గారి ఇతర రచనా కృతులు:

- సాహిత్య శిల్ప సమీక్ష
- మధురాపండితరాజము
- గంగాలహరి
- తేజోలహరి
- అత్మాలహరి
- ఆంధ్ర వాంజ్మయ చరిత్ర
- గౌతమ వ్యసాలు
- నా రేడియో ప్రసంగాలు
- ఆల్ మెన్ ఆర్ బ్రదర్స్
- తొలకరి
- సౌందర్యానందం

తెలుగు జాతికి ఆంధ్ర సాహిత్య చరిత్రను అందించారు. పదహారు వందల ఏళ్ళ పాటు విలువడిన గ్రంధాలన్నీ చదివి, ఆకళించికుని సమగ్ర చరిత్ర వ్రాసి తెలుగు ప్రజలకు కానుకగా ఇచ్చారు పింగళి లక్ష్మీకాంతం గారు. తెలుగులో ఉద్దండ మహా పండితులుగా వెలిగారు. వారి జీవితానికి సార్ధకత ఏర్పరచుకున్నారు. చెళ్ళపిళ్ళ వారి శిష్యుడిగా తెలుగు నాట - అవధానిగా, తెనుగు భాషా ప్రవీణుడిగా నిలిచారు. ఆచర్య వృత్తిలో ఉండి తన తెలుగు ఉనికితో అనేకానేక తెలుగు అధ్యాపకులను తీర్చి దిద్ది తెలుగు సాహిత్య, భాషా వికాసానికి తోడ్పడ్డారు. 1972 లో, తన డెబ్బై ఏనిమిదవ ఏట స్వర్గస్తులైయ్యారు, కానీ వీరి గ్రంధం " ఆంధ్ర సాహిత్య చరిత్ర " తర తరాలకు తెలుగు భాషా ప్రాభవాన్ని చాటుతూనే ఉంటుంది.
--------------------------------------------------------
తెలుగు తేజోమూర్తులు 
నిర్వహణ : ఈరంకి వెంకట కామేశ్వర్    
సుజనరంజని సౌజన్యంతో

Thursday, May 23, 2019

గోడలు


గోడలు


 

సాహితీమిత్రులారా !

కళ్ళుతెరిచేసరికి సన్నగా అర్ధం కాని నొప్పి .
ఎక్కడనేది కూడా స్పష్టంగా లేదు. కణతలు రుద్దుకుంది అనాలోచితంగా.
రాత్రి ఎప్పుడు నిద్ర పట్టిందో ఎప్పుడు మెళుకువగావుందో తెలీని స్తితిలో ఎప్పుడు తెల్లవారిందో గమనించనే లేదు.
ఒక్క క్షణం ఎక్కడవున్నదీ అంతు పట్టలేదు.
కళ్ళుతిప్పి గదినంతా ఓసారి పరికించింది.గట్టిగా కాళ్ళు చాపుకుందుకు కూడా లేని నాలుగు మూరల వెడల్పు మరో నాలుగు మూరలెక్కువున్న పొడవులోవున్న చీకటి కొట్టది.
చీకటి కొట్టు ......
అవును ఎన్నిసార్లు అమ్మను విసుక్కోలేదు...ఈ చీకటి కొట్టునించి బయటకు వెళ్తామా? అని...
కాని ఇప్పుడా చీకటికొట్టే సుఖంగా తోస్తోంది.
తొలిసంపాదన చేతికందగానే ఎవరైనా చీరో సారో నగో కొంటారు కాని తను మాత్రం ఎంతో ఇష్టపడి కొనుక్కున్నది... మంచి అద్దం.
దాని ఖరీదువిని తల్లి బుగ్గలునొక్కుకున్నా లెఖ్ఖచెయ్యలేదు.
అమ్మకు ఎలా చెప్పాలి మసక బారి, ఓ పక్క పగిలిపొయి మిగిలిన అద్దం పెంకులో ఎప్పుడు చూసుకున్నా కనిపించేది అయితే ఓ కన్ను లేదూ ఓ వైపు సగం చెక్కిలి ,కాస్త చెవి భాగం ...కాదంటే బొట్టు పెట్టుకుందుకే పనికి వచ్చేది.
ఎప్పుడన్నా సరదా పడి కాస్త దూరంగా పెట్టిమొహం చూసుకుందామన్నా కనిపించేది ఓ జీభూతం మాత్రమే.
అందరూ అంటారు తనెంతో అందంగావుంటుందని.
ఒక్కసారి తనివితీరా చూసుకుందామన్నా అద్దమైతే కొనగలిగింది కాని , అరచెయ్యంత కిటికీ లోంచి వెలుగు వెల్లువనెలా రప్పించగలదు....అద్దాన్ని ఇటుతిప్పి అటు తిప్పి ఉహు ..ఏం లాభం లేకపోయేది.
అందుకే ఆశ ఆశగానే మిగిలిపోయింది.
అప్పుడో ఇప్పుడో తల్లిమీద విరుచుకు పడేది...
"ఈ పశువుల కొట్టం నించి విముక్తి లేదా? వేరే ఇంటికి వెళ్ళిపోదామని"
" నోరుమూసుకో ... ఇక్కడ నీబాబు సంపాయించి కుప్పలు కుప్పలు పెట్టిపోయాడా .. ఎంత అద్దె పొయ్యాలి వేరే ఇల్లంటే ..
మాటలా?"
అయినా తను గొణుగుతూనేవుండేది.
ఇంటివాళ్ళింట్ళొ అమ్మ వంటచేస్తుంది ..అందుకే అద్దెలేకుండా ..ఈ చిన్న గది ఇచ్చినది.
పూర్వం ఇక్కడ వాళ్ళు గేదెనో కుక్కనో కట్టేసివుంటారనడానికి ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.
ఎన్నిసార్లు అమ్మ తననూ తోడు తీసుకెళ్ళాలని ప్రయత్నించలేదు?
ఉహు ..పడనిచ్చివుంటే ఈపాటికి వంటలక్కగా...
ఓ రకంగా అదే బాగుండేదేమో..
ఆ ఇంట్లో రాత్రి గడపడమే నరకంగావుంటే పగలల్లాకూడా...
తల్లీ కూతుళ్ళూ ఇరుక్కుని రాత్రంతా ఆగదిలో పడుకోవడం.. నరకమే వేలుకదిపే వెసులుబాటుకూడ వుండదు.. ఏవైపు పడుకుంటే ఆవైపు తిమ్మిరెక్కిపోవలసిందే..
తిక్కలేచినప్పుడల్లా గొణుక్కోవడం మామూలే.
" ఇంకెన్నాళ్ళు? ఏదో ఒకరోజున ఈ దరిద్రం వదిలేసి పారి పోవలసిందే ?" గట్టిగానే అంది విసుగ్గా..
" ఎక్కడి కి వెళతావు, నిన్నెవరిక్కడ వెళ్ళనిస్తారని... " తల్లీకూతుళ్ళ వాగ్యుద్ధానికి నాంది అది.
మిగతా ఇద్దరూ బెదిరిపోయి కళ్ళు గట్టిగా మూసుకునేవారు..
" ఎవడి వలలోనో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటావా?" " మరే నువ్వేగా మాకు ఆదర్శం... అలాంటి వలలో పడే ఇలాగున్నావుగా.. "
ఆ మాటల యుద్ధానికో అంతుదొరికేదికాదు.
" నాకు తెలుసు ... నేను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే నాజీతం డబ్బులు నీకందవనేగా..."
" నా ఖర్మ అంతా నా ఖర్మ ..." తల్లిచేత్తో తలబాదుకోవడం ...
తెల్లారితే అమ్మ ఆవిషయం మరచిపోయేది. మాటాడటం మామూలయేది ...
అయితే అమ్మ అనుకోలేదు ...
ఆరోజు ఉదయమే మామూలుగానే పనికి వెళ్తున్నాననే అనుకుంది...
కాళ్ళకు వెండి మెట్టెలు, మెడలో పసుపు తాడు.. కొత్త చీర చేతులనిండుగా పచ్చ గాజులు..
మెడలో నల్లపూసలు
ఎర్రనీళ్ళు దిష్టి తీసి లోనికి రానిచ్చింది అమ్మ. కాని ఆ కళ్ళనిండుగా కోపమే..
ఆ పెళ్ళి ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తూనేవుంది.
అయినా తీపి తినిపించి ఇద్దరికీ ఉన్నంతలో భోజనం అమర్చింది.
తిరిగి వెళ్ళేప్పుడు మాత్రం అమ్మ బయటకే రాలేదు. కొత్త చీరకు మట్టంటకుండా, కుచ్చెళ్ళు ఓ చేత్తో ఎత్తిపట్టుక్కుని కొత్త హైహీల్స్ టకటకలాడిస్తూ పక్కన వాసుతో ఎంత గర్వంగా బయటకు కదిలింది..
గుమ్మంలో నించున్న చెల్లెళ్ళిద్దరినీ వెనక్కు తిరిగి చూస్తే మనసు ద్రవించింది.
" వీళ్ళకేదైనా చెయ్యాలి..."
వాసు మంచి వాడు తన మాట కాదనక పోవచ్చు.. ఇద్దర్నీ ఆ ఊబిలోంచి ఎలాగైనా బయటకు లాగాలి..'
కాని అది కలేనా మళ్ళీ తనే ఇక్కడికే వచ్చి పడేట్టుందా?
కిర్ మంటూ తలుపు చప్పుడు.. ఎనిమిది దాటినట్టుంది..
చెల్లాయిలిద్దరూ రెడీ అవుతున్నారు..లేచి వాళ్ళకు మొహం చూపించడానికి మనసొప్పలేదు.
అందుకే కళ్ళుమూసుకుని నిద్ర నటించింది.
ఇద్దరూ స్కూల్ కి వెళ్ళిపోయాక, లేద్దామనుకుంది.. ఈ లోగా అమ్మ వంటముగించుకుని వచ్చినట్టుంది.
కొంగుచాటునుండి మూతపెట్టివున్న గిన్నె గట్టుమీదుంచి దగ్గరకువచ్చి చెయ్యినుదుటి మీదుంచి చూసింది . ఆస్పర్శలో ఎంత పరామర్శ. ఎంత ఓదార్పు! అమ్మ ప్రేమ చాటడానికి ఇంతకంటే మాటలెందుకు ఒక్కసారి చిన్నప్పటిలా అమ్మవళ్ళో దూరి పడుకోవాలనిపించింది.కాని అలా చెయ్యలేదు, ఎందుకు చెయ్యలేకపోయిందో తెలియదు.
"లేచి మొహం కడుక్కో " ఏమీ జరగనట్టుగా ఎప్పటిలాగే ఎలా అనగలిగింది అమ్మ.
బిడియంగా లేచి బ్రష్ చేసుకుంది.
అమ్మ తెచ్చినట్టుంది ప్లేట్లో వేడీవేడి ఇడ్లీలు రెండు పెట్టి ఇచ్చింది.
అమ్మ మొహం చూడాలంటేనే గిల్టీగావుంది.గొప్పగా బాధించేవిషయం ఏం జరిగిందని అమ్మ అడగకపోవడం.
ఏం జరిగిందని నిజంగా అడిగితే ఏం చెప్పాలి?
ఎలా చెప్పాలి?
కాని అమ్మ ఆమాటే ఎత్తలేదు.
నాలుగురోజులు ..వారంగామారింది. పెళ్ళి అనేది ఓకలగా అనిపిస్తోంది.
నిజంగా ఆపీడకల నిజం కాకపోయుంటే ఎంతబాగుండేది?
మానసికంగా శారీరికంగా చిక్కబట్టుకున్నాననుకునే లోగా జరిగిందది...
ఈ పది రోజుల్లో అమ్మ ఎలా సవరించుకు వస్తోందో కాని ఒక్కరోజూ ఉద్యోగం గురించి కాని డబ్బుగురించి కాని ఒక్క మాటా ఎత్తలేదు.తనకూ ఉద్యోగానికి వెళ్ళాలనిపించలేదు. గాయపడిన శరీరం కోలుకున్నా మనసు కుదుటపడటం నత్తనడకలాగే సాగుతోంది.
చెల్లాయిలు స్కూల్ కి వెళ్ళారు
అమ్మ ఇంకారాలేదు.. కిర్ర్ మంటూ తలుపు చప్పుడు తలెత్తింది గుమ్మం నిండుగా వాసు..
ఏదీ ఆకళ్ళల్లో పెళ్ళికిముందు గంతులు వేసిన ప్రేమ? ఎక్కడినించి వచ్చిందీ ప్రస్తుత కాఠిన్యం?
ఎం జరుగుతోందో తెలిసేలోగానే జుట్టుపట్టుకులాగి బయటకీడ్చాడు
"చెప్పాపెట్టకుండా పారిపోయొస్తే వదిలేసి గాజులు తొడుక్కు కూచుంటా ననుకున్నావా? ఇదిగో అదిగో అని చూస్తే నీలుగుతున్నావా? ఉద్యోగం మానితే నీఅబ్బ ఇల్లెవడునడుపుతాడే ..పద... "
ప్రతిఘటించే వ్యవధికూడా ఇవ్వకుండా ఎక్కడ అందితే అక్కడ కొడుతూ తన్నుతూ ఈడుస్తున్నాడు.. డొక్కలో తగిలిన బలమైన కాలి దెబ్బకు అప్రయత్నంగానే పలికింది నా గొంతు ' అమ్మా....'
ఏం జరిగిందో తెలిసే లోగానే ఓమూల పడిఉన్నాను గోడక్కొట్టుకున్న వేలు విరిగినంత నొప్పి ..
పెదవిచిట్లి రక్తం ధారలు కట్టింది ..కళ్ళు బైర్లు కమ్మాయి అయినా ఎలా వాసు చేతిలోంచి బయట పడ్డనా అనే అనుకుంటున్నాను..
పక్కింటి వాళ్ళు అడ్డుపడ్డారా..తలవిదిలించి చూసాను
కలో మాయో అర్ధం కాలేదు. ఎదురుగా అమ్మ అపరకాళిలా కాలెత్తి ఫెఢీ మని తన్నింది పైపైకి వస్తున్న వాసు గుండెల మీద
" నాకూతురి మీద ఈగ వాలినా ఇక్కడినించి కదిలేది నీ శవమే అది నీకు ఇప్పటికే అర్ధమయిఉండాలి
" వాసు మొహం పాలిపోయింది.
మొగుడూ పెళ్ళాలమధ్య గొడవ పెద్దది చెయ్యకు ఎవరో అమ్మకు సలహా ఇచ్చారు.
గొడవా... ఏం జరిగిందో నీకు తెలుసా రా ఇటురా బరబరా ఆమెను ఈడ్చుకు వచ్చి నన్ను సర్రున వెనక్కు తిప్పి నా వీపుమీద సిగరెట్ వాతల్ను చూపి
ఇవి చూసాక కూడా వోపిక పట్టానంటే నా కూతురే సమర్ధించుకోగలదని కాని
ఇలా దాన్ని బేలను చేసాక నేను చూస్తూ ఊరుకోను
అది నోరువిప్పి చెప్పక్కరలెదు ఇన్నాళ్ళుగా అది వాడి మాటేత్తలేదంటేనే అర్ధమయింది -అది పడ్డనరకమేమిటో
నాపిల్లనాకు భారం కాదు
కాస్సేపు నిశ్శబ్దం
ఆలోచించుకో మిగతా ఇద్దరూ ఆడపిల్లలే వాళ్ళపెళ్ళిల్లెలా చేస్తావు
ఈ అమ్మమ్మ కబుర్లు మానవమ్మా ..
వాళ్ళను నచ్చిమెచ్చిన వాళ్ళే చెసుకుంటారు
వాళ్ళకోసం దీని జీవితాన్ని వాడికి బలివ్వను..
అమ్మ నాదాకా వచ్చి నాచెయ్యిపట్టి లోపలకు తీసుకెళ్ళింది.
భేషజాలు వదిలి అమ్మ అక్కున చేరాను
అమ్మ నిశ్శబ్దం కూడా మాటాల్లాగే వినిపించింది నాకు
ఇరుకైన గోడలు ఎంతోవిశాలంగా తోచాయి
అమ్మనిశ్శబ్దాన్ని అనువదించుకుంటే
' శైలూ.. పుట్టింది మొదలు గోడలమధ్య ఉక్కిరి బిక్కిరై మరెక్కడికో పారిపోదామనుకుంటాము కాని మనం పోయేది గోడల మధ్యనుండి గోడల్లోకే అవి లోపలైనా వుంటాయి వెలుపలా వుంటాయి
మనం జీవించేదే గోడలమధ్య గోడల్లో గోడల్లా...
-----------------------------------------------------
రచన - స్వాతి శ్రీపాద, 
సుజనరంజని సౌజన్యంతో

Wednesday, May 22, 2019

యుగధర్మం


యుగధర్మం


                                                                         
 
సాహితీమిత్రులారా!

గుమ్మంలో ఆటో ఆగిన చప్పుడు విని పేపర్ చదువుతున్న గురునాధం గారు తలెత్తి చూసి, కుర్చీ లోంచి లేచి భార్యని ఉద్దేశించి కేక పెట్టారు, " సుగుణా ! చూడు ఎవరు వచ్చారో "అంటూ.
                     "బ్రేక్‌ఫాస్టు" తయారు చెయ్యడం కోసం రవ్వదోశ పిండి కలుపుతున్న సుగుణమ్మ చెయ్యైనా కడుక్కోకుండా అలాగే బయటికి వచ్చింది. అంతలో ఆటో దిగిన పిల్లలు "తాతయ్యా", "బామ్మా" అంటూ పరుగున వచ్చి వాళ్లని కౌగిలించుకున్నారు. పిల్లల్ని ప్రేమగా చేరదీసుకున్నారు వాళ్లు.
 "వీళ్లిద్దరూ కలిసి వచ్చారేమిటో! వీళ్ల మధ్య ఇంత సయోధ్య ఎప్పటినుండో" అన్నారు గురునాధం గారు అన్యాపదేశంగా.
                    సామాను తీసుకుని లోపలకు వచ్చిన కొడుకుల్నీ, కోడళ్లనీ చూసి పలకరించింది సుగుణమ్మ, "అంతా బాగున్నారా ? ఇదేమిటి ఇలా ఉత్తరమైనా రాయకుండా వచ్చారు, ఇబ్బందులేం లేవుకదా" అంటూ ఆత్రంగా అడిగింది
                          "ఉత్తరం రాయకపోడమేమిటండీ అత్తయ్య గారూ! మీ అబ్బాయి నాల్గు రోజుల క్రితమే కార్డు రాసి పోస్టు చేశారు. పోస్టులో మిస్సయ్యింది కాబోలు. అది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది కదా. అందులో కొత్తేముంది కనక" అని జవాబు చెప్పింది పెద్ద కోడలు రజితాంబ.
                             " ఊరకనే రారు మహాత్ములు! వీళ్ల రాకకు కారణం ఏమిటో" అనుకున్నారు గురునాధం గారు మనసులో.
                             "రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు కదా, తరవాత మాట్లాడుకుందాం. ముందు స్నానాలు చేసి వచ్చి కాఫీ, టిఫిన్లు కానివ్వండి. మీరు స్నానాలకి వెళ్లండి, ఈలోగా నేను కాఫీలూ అవీ తయారుచేస్తా " అన్నారు సుగుణమ్మ గారు వంట గదిలోకి దారి తీస్తూ.
                           " ఆగండి అత్తయ్యా! మీకా శ్రమ వద్దు. క్షణంలో నేను వచ్చి ఆ పని చూస్తా " అంటూ బట్టలు తీసుకుని బాత్‌రూం కి పరుగెట్టింది చిన్న కోడలు సువర్ణ మాల.
                        ఎప్పుడూ చుట్టం చూపుగా వచ్చి, అత్తగారిచేత వండించుకు తిని వెళ్లే వాళ్లకి ఈమాటు ఇంత సద్బుద్ధి ఎలా వచ్చింది చెప్మా - అని విస్తుపోయారు మామగారు. వాళ్లలో వచ్చిన మార్పు ఆయనకు వింతగా కనిపించింది. తెల్లబోయినట్లు చూశారు ఆయన కొడుకుల వైపు.
                          "ఈ నెలలోనే రిటైరైపోతున్నట్లు నువ్వు రాసిన ఉత్తరం చూసాక మాకు మనసు నిలవ లేదు. తమ్ముడూ నేనూ కూడబలుక్కుని, చెరో పదిహేను రోజులూ సెలవు పెట్టి వచ్చేశాం, నీకు దిగులుగా ఉండకుండా కంపెనీ ఇవ్వాలని. పిల్లలకిప్పుడు సెలవులేలే. ఇకపోతే మీ పెద్ద కోడలికే సెలవు దొరకడం కష్టమయ్యింది. చివరకు ఎలాగో సాధించాలే " అన్నాడు పెద్ద కొడుకు ఎంతో ఇదిగా.
                      " అవును నాన్నా! ఈమధ్య మీ చిన్న కోడలూ, పిల్లలూ కూడా తెగ ఇదైపోతున్నారు, మిమ్మల్ని చూసి చాలా కాలం అయ్యిందంటూ. ఇదే తగిన సమయం కదాని మేమూ బయలుదేరి వచ్చేశాము" అన్నాడు చిన్న కొడుకు కూడా.
                       గురునాధం గారి కళ్లు ఆనందంతో మెరిశాయి. "ఈ ఆత్మీయత కోసమే కదా పెద్దవాళ్లు దేవిరించేది" అనుకున్నారు మనసులో ఆయన. కొడుకులు చూపిస్తున్న అభిమానం ఆయనకు చాలా సంతోషాన్ని కల్గించింది. మెరిసే కళ్లతో వాళ్ల వైపు ఆప్యాయంగా చూశారు ఆయన.
                          *                    *                    *                    *
                          ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక ప్రైవేటు కాలేజీల్లో అది కూడా ఒకటి. గురునాధం గారు ముప్ఫై ఏళ్లుగా అందులో మాథమాటిక్సులో లెక్చరర్‌గా పనిచేస్తూ, ఆ ఊరి వాళ్ల మెప్పునూ, ఆత్మీయతనూ పొందగలిగారు. సుగుణమ్మ గారు కూడా ఆయనకు తగిన భార్యగా, ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది.. నిరాడంబరమైన వాళ్ల జీవన శైలి ఆ ఊరిలోని జనాలకి బాగా నచ్చడంతో, వాళ్లను ఒక ప్రత్యేకమైన గౌరవంతో చూసేవారు. ఆ ఊరు వచ్చిన కొద్ది రోజులకే గురునాధం గారు, అది ఎఫిలియేటెడ్  కాలేజీయే కదా, ఎలాగా ట్రాన్సుఫర్లు ఉండవని, పల్లెటూరిలో ఉన్న చిల్లర మల్లర ఆస్తులన్నీ మొత్తం అమ్మేసీ, కొంత బ్యాంకు లోను తీసుకునీ, ఐదువందల చతురపు గజాల స్థలంలో రెండు గదుల చిన్న ఇల్లు కట్టుకునారు. అంతకు మించిన ఆస్తిలేవీ లేవు వాళ్లకు.
                      గురునాధం గారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వాళ్లు పెద్దవాళ్లై, ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. వాళ్లకు పెళ్లిళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద కోడలు ఉద్యోగస్తురాలు,  చిన్న కోడలు గృహిణి మాత్రమే. గురునాధం గారు రిటైర్ ఔతున్న వార్త తెలిసి వచ్చారు వాళ్లు, కొద్ది రోజులు ఉండివెళ్లే ఉద్దేశంతో.చూస్తూoడగా గురునాధం గారికి "రిటైర్" కావలసిన సమయం వచ్చేసింది.
                         ఇన్నాళ్లూ విద్యార్ధుల అభివృధ్ధే తన ధ్యేయంగా, విద్యా దానమే తన కర్తవ్యంగా జీవించిన గురునాధం గారికి సగౌరవంగా వీడ్కోలు చెప్పాలని, కాలేజీ ఆడిటోరియంలో సభని ఏర్పాటు చేశారు ఆ కాలేజీ మేనేజిమెంటువారు. ఆ సభకు విద్యార్ధులూ, వారి తల్లితండ్రులూ, ఊరి పెద్దలే కాకుండా, చాలా రోజుల క్రితం ఆయన దగ్గర చదువుకుని ఇప్పుడు పెద్ద పెద్ద  ఉద్యోగాలలో ఉన్న పూర్వ విద్యార్ధులు కూడా రావడం విశేషం !
                             సభ గొప్పగా జరిగింది. రకరకాల బహుమతులతో ఆయనను ఘనంగా సత్కరించి, అధ్యాపకుడిగా విద్యా రంగానికి ఆయన చేసిన సేవల్ని మనసా కొనియాడారు చాలా మంది. మిత్రులు, సహోద్యోగులు ఆయన పదవీ విరమణ చేస్తున్నందుకు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉపన్యాసాలిచ్చారు. ఆ కళాశాల యాజమాన్యం ఆయనకి పూలదండవేసి, పండిత సాలువా కప్పి, పదివేలు రొఖ్ఖంతో ఉన్న పర్సు బహూకరించి గౌరవించారు.
                            గురునాధం గారి కళ్లు చెమర్చాయి. "రేపటి నుండి నేనుకూడా ఈ కాలేజీకి గేటు బయటి జనంలో ఒకణ్ణి కదా" - అన్న భావం  ఆయన మనసుని కలతపెట్టింది.. అలా అనుకునేసరికి ఆయనకు నీరసం వచ్చినట్లయ్యింది. ఎలాగో నిగ్రహించుకుని అందరికీ వీడ్కోలు చెప్పి, దుఃఖంతో బరువెక్కిన హృదయంతో బయటికి వచ్చేశారు ఆయన. కొడుకులు వెంట ఉండి అయన్ని ఇంటికి తీసుకెళ్లారు.
                    మనుమల రాక ఒక విధంగా గురునాధం గారి మనసుకి స్వాంతన నిచ్చిందని చెప్పవచ్చు. వాళ్ల బుడి బుడి పలుకులు వింటూ, వాళ్లతో ఆడుతూ ఆయన తన దిగులును చాలా వరకు మర్చిపోగలిగారు. సుగుణమ్మకు ఇంటి బాధ్యత పెరగడంతో అయనతో నిదానంగా రెండు మాటలు మాట్లాడడానికి కూడా ఆమెకు తీరిక దొరకటం లేదు. రాత్రి కూడా ఆమె అలసటతో వచ్చి, మంచం మీద వాలగానే సొమ్మసిలినట్లు వెంటనే నిద్రపోతోంది. అక్కడితో ఇక గురునాధం గారికి మనుమల తోడిదే లోకమయ్యింది.
                    ఆ సాయంకాలం కొడుకులూ, కోడళ్లూ కూడబలుక్కుని, పిల్లల్ని పెద్దవాళ్ల మీద వదలి, తొలి ఆట సినిమాకి వెళ్లారు. సుగుణమ్మ వంట ముగించి, పిల్లలకు అన్నాలు పెట్టింది. ఆపై తనూ భర్తా కూడా తిన్నాక, వండినవనీ డైనింగ్‌టేబులు మీద సద్ది వచ్చి,  పిల్లల్ని నిద్రపుచ్చి, తానూ అలాగే పడుకుని నిద్రపోయింది. గురునాధం గారికి మాత్రం నిద్ర పట్ట లేదు. భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ ఆయన కళ్లు మూసుకుని పడుకుని ఉండిపోయారు. సినిమాకి వెళ్లిన వాళ్లు తిరిగివచ్చినా ఆయన లేచీ ప్రయత్నం చెయ్యలేదు. తమ వెంట తీసుకు వెళ్లిన డూప్లికేటు తాళంచెవితో తలుపు తెరుచుకు వాళ్లు లోపలకు వచ్చారు.
                     వాళ్లు నలుగురూ బట్టలు మార్చుకుని వచ్చి భోజనాలకు కూర్చుని గుసగుసగా ఆమాటా ఈమాట చెప్పుకుంటూ  భోజనాలు చెయ్యసాగారు. క్రమంగా వాళ్ల సంభాషణ తండ్రికి రాబోయే "ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యూయిటీ" వగైరాల మీదికి మళ్లింది.
                    "అన్నయ్యా, నాన్నకున్న సర్వీసుకి డబ్బు బాగానే వస్తుంది కదూ! ఈ మధ్య లెక్చరర్లకు కూడా పెన్షనూ వగైరా బెనిఫిట్సు బాగానే ఉన్నాయని విన్నా" అన్నాడు చిన్న కొడుకు మాటల సందర్భంలో. వెంటనే సంభాషణ అటు మళ్లింది.
                    "వస్తుంది. కాని ఎంతన్నది నాకు సరిగా తెలియదు. ఎంతైనా కానియ్యి, ఇక మనం అమ్మా నాన్నల్ని ఇక్కడ ఉండనీయొద్దు. మనదగ్గరకి తీసుకు వెడదాం. ఇక ఈ ఇంటితో పనేమిటి ! దీన్ని అమ్మేసి, ఆ డబ్బు మనం చెరిసగం తీసుకుని, ఆపైన హౌసింగ్ లోనుకి పెట్టుకుని, మనిద్దరం చెరో ఫ్లాటు తీసుకుందాం. అక్కడితో మనకు ఇక అద్దెకొంపల పీడ విరగడై పోతుంది" అన్నాడు పెద్ద కొడుకు.
                  "ఔనండీ, ఈ ఐడియా చాలా బాగుంది. ఆ తరువాత, అత్తయ్య గారిని ఒకళ్లం, మామయ్య గారిని ఒకళ్లం దగ్గర అట్టేపెట్టుకోవచ్చు. అది ఎంతో సదుపాయంగా ఉంటుంది" అంటూ బావగారిని మెచ్చుకుంది చిన్నకోడలు.
                  "చాలాబాగుంది! అలాగే చేద్దాం. అత్తయ్యగారిని నేను అట్టేపెట్టుకుంటా. ఈ '"బేబీ సిట్టర్సు"తో నాకు చాలా ప్రోబ్లంగా ఉంది. ఆమె నాకు ఆసరాగా ఉంటారు" అంది పెద్ద కోడలు ఆనందంగా.
                   వెంటనే తోక తొక్కితే త్రాచు పాము లేచినట్ట్లు ఖస్సున లేచింది చిన్న కోడలు. " ఔ నమ్మా ! బెనిఫిట్లన్నీ నీకే కావాలి. నేనేమో నా పిల్లలతోపాటుగా, మామగారికి కూడా చాకిరీ చేస్తూ నాల్గు గోడల మధ్య పడి మగ్గి మన్నైపోవాలి...అంతే కదూ" అంటూ బుసలు కొట్టింది ఆమె
                          అన్నదమ్ము లిద్దరూ సందిగ్ధంగా ఒకళ్ల వైపు ఒకళ్లు చూసుకున్నారు. వాళ్ల ముఖాల్లో రంగులు మారాయి.
                        "స్వర్ణా,నువ్వేం బాధపడకు. నాన్నకు ఇంతో అంతో పెన్షన్ వస్తుంది కదా, నువ్వొక పని మనిషిని, ఎప్పుడూ ఇంటిలోనే ఉండి నీకు సాయం చేసేందుకు పెట్టుకుందువుగానిలే" అన్నాడు చిన్న కొడుకు భార్యకు ఓదార్పు కోసం.
                      " బాగుంది వరస" అంది పెద్ద కోడలు రజిత నిరసనగా, " పెన్షన్ మొత్తం మీరే తీసుకోవాలంటే కుదరదు. అది "ఫామిలీ పెన్షన్" కదా, అందులో అత్తయ్యకు సగం ఉంది. ఆమెకూ ఇవ్వాలి" అంది.
                      "మరే పాపం! మంచి తెలివినే చూపిస్తున్నావు. అత్తయ్య నీ దగ్గర వుండి నీకు అడుగడుగునా సాయపడేది చాలదా? దానికి ఏ విలువా లేదంటావా?" చిన్నకోడలు స్వర్ణ పెద్దకోడల్ని నిలదీసి అడిగింది.
                       అభిప్రాయ భేదాలు మొదలవ్వగానే అప్రయత్నంగా వాళ్ల గొంతుకలు రెచ్చిపోయాయి. గుస గుసలుగా మొదలైన సంభాషణలు క్రమంగా పెరిగి కేకల్లోకి వచ్చాయి. పక్క గదిలోనే ఉన్న గురునాధం గారు అసహనంతో పక్క మీద అటూ, ఇటూ  దొల్లసాగారు. పక్కనే ఉన్న మరో మంచంమీద పడుకుని ఉన్న సుగుణమ్మ మాత్రం గాఢనిద్రలో ఉండి, ఆదమరచి , చిన్నగా గుర్రుపెడుతూ, హాయిగా నిద్రపోతోంది. డైనింగ్ టేబుల్ దగ్గరి సంభాషణలేవీ ఆమె చెవికి చేరలేదు..
                         వెంటనే భార్యకు వత్తాసుగా మాట్లాడాడు పెద్ద కొడుకు. ' నిజమేరా తమ్ముడూ! మీకు తెలిసిన విలువలు మాకు తెలియవు మరి! అమ్మ మాతో ఉంటే ఆమె పోషణ భారం మాదే కదా ! పైగా అమ్మ జబ్బుమనిషి కూడా. ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తుందో ఎవరికి తెలుసు ? మందులూ, డాక్టర్ ఫీజులు అంతాఎంత ఖర్చు ఉంటుందో ఏమో..... ఎవరికి తెలుసు ? పెన్షన్‌లో ఆమె వాటా ఆమెకు ఇస్తే ఏ అవసరానికైనా తడుముకోకుండా డిపోజిట్ చేసి ఉంచవచ్చునని మీ వదిన అభిప్రాయపడింది. అందులో తప్పేమిటిట" అంటూ టొకాయించి అడిగాడు తమ్ముణ్ణి.
                    ఇంక వాళ్ల మాటలు వినాలనిపించ లేదు గురునాధం గారికి. అప్పుడే మెలకువ వచ్చినట్లుగా, ఆవలించి ఒళ్లువిరుచుకుని, లేచి కూర్చుని చిన్నగా దగ్గి, గుక్కెడు మంచినీళ్లు గొతుకలో పోసుకుని, ఏమీ ఎరుగనట్లు మళ్లీ పడుకున్నారు ఆయన. అక్కడితో మాటలు ఆపేసి  పడుకోడానికి వెళ్లిపోయారు వాళ్లు.
                        పడుకుని కళ్లు మూసుకున్నారన్న మాటేగాని, గురునాధం గారికి ఆ రాత్రి ఒకపట్టాన నిద్ర పట్ట లేదు. కొడుకుల సంభాషణ ఆయన మనసును బాగా కలత పెట్టింది. ఏవేవో ఆలోచనలు మనసును దొలుస్తూండడంతో ఆయన నిద్రపోలేకపోయారు. నెమ్మదిగా తలెత్తి పక్క మంచం వైపు చూసిన ఆయనకు, నిర్మలంగా, పసిబిడ్డలా అమాయికంగా నిద్ర పోతున్న సుగుణమ్మ కనిపించింది. బెడ్‌లైటు వెలుగులో బేలగా కనిపిస్తున్న భార్య ముఖం వైపు చూస్తూ, " నన్నే నమ్ముకుని బ్రతుకుతున్న ఈ అమాయకురాలికి ఎట్టి పరిస్థితిలోనూ నేను అన్యాయం చెయ్యను" అనుకున్నారు. ఒక అభిప్రాయానికి వచ్చాక ఆయనకు నెమ్మదిగా నిద్ర పట్టింది.
                           *                   *                    *                      *
                         మరునాడు బ్రేక్‌ఫాస్టు టైంకి అందరూ టేబుల్ దగ్గరకు చేరారు. కోడళ్లు తెలివిగా ముందే పిల్లల్ని తెమిల్చి దొడ్లో ఆడుకోమని పంపించేశారు. కొడుకులూ, కోడళ్లూ మంచి టెన్షన్‌లో ఉండడం గమనించారు గురునాధం గారు. కానీ ఏమీ మాట్లాడకుండా, గంభీరంగా ఒక కుర్చీలో కూర్చుని, శ్రద్ధగా ఆ రోజు పేపర్ చదువుకుంటున్నారు..
                          సుగుణమ్మ ఉప్మాతో ఉన్న కేసరోల్ తెచ్చి బల్లమీద ఉంచుతూ, "ఒంట్లో నలతగా ఉండి పూరీ - కూరా చేద్దామనుకునీ చెయ్యలేకపోయా. ఉప్మా చేశా" అంది, సంజాయిషీ చెపుతున్నదానిల.
                           పెద్దకోడలు వెంటనే అందుకుని, "అదేమిటి అత్తయ్య గారూ ! ఒంట్లో బాగుండనప్పుడు ఈ ఉప్మా మాత్రం ఎందుకు చేశారు? మాతో ఒక్కమాట చెపితే మేం చేసీవాళ్లం కదా. మీరింక రెస్టు తీసుకోండి వంట  నేను చేస్తా" అంటూ ముందుకు వచ్చి టేబులు మీద ఉన్న ప్లేట్ల దొంతర లోంచి ఒక్కొక్క ప్లేటే తీసి, అందులో ఉప్మా పెట్టి, స్పూన్ వేసి ఒక్కొక్కళ్లకీ అందించసాగింది.
                          అది చూసి చిన్న కోడలు, తనూ ఖాళీ గ్లాసులు నీళ్లతో నింపి, ఆ ప్లేట్ల  పక్కన ఉంచి, అక్కడే ఉన్న నేతి గిన్నె అందుకుని వడ్డించడానికి సిద్ధంగా నిలబడింది. చిన్న కొడుకు భార్య వైపు మెప్పుగా చూశాడు.
                           పెద్దకోడలు అత్తగారివైపు తిరిగి, "మీరూ రండమ్మా, మీ అబ్బాయిల్తో కూర్చుని మీరు కూడా చల్లారక ముందే ఉప్మా తిందురుగాని" అంటూ ఆమెను మామగారి పక్కనున్న కుర్చీలో కూర్చోమని బలవంతం చేసి కూర్చోపెట్టింది.
                      ఎన్నడూ ఎరుగని ఈ ఆత్మీయతలు చూడగానే "ఇది కలా, నిజమా" అనే సందేహం వచ్చింది సుగుణమ్మగారికి. కాని, డైనింగ్ టేబులు చుట్టూ మూడు జంటలూ అలా నిండుగా కూర్చుని టిఫిన్ తినడం ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది. కోడలు వడ్డించిన వేడి వేడి ఉప్మా చెంచాతో టీసుకుని తింటూ మురిసిపోయింది ఆమె, కొంతసేపు అందరూ తినడం మీదే దృష్టిని కేంద్రీకరించారు.
                        ఉప్మా తినడం పూర్తిచేసి నెమ్మదిగా అసలు విషయంలోకి వచ్చాడు పెద్దబ్బాయి. " ఇంకా మీరు ఇక్కడే ఎందుకు ఉండాలి నాన్నా ! రేపు మాతో మీరూ హైదరాబాదు వచ్చెయ్యండి.ఇక్కడి సంస్థానమంతా కట్టిపేట్టేద్దాం.. ఏకంగా అందరం అక్కడే ఉంటే సరిపోతుంది, ఏమంటావు ?"
                          వెంటనే అన్నగారికి వత్తాసుగా, "ఔను నాన్నా ! మీరు రిటైరు అయ్యాక కూడా ఎందుకు ఇంకా ఈ ఊరినే పట్టుకు వేళ్లాడాలి మనం!  మీకు గ్రాట్యూయిటీ అనీ, ప్రోవిడెంట్‌ఫండనీ ఏవేవో సొమ్ములు వస్తాయి కదా? దానికి తోడుగా ఈ ఇల్లు కూడా అమ్మేసి, ఇంకా డబ్బు తక్కువైతే బ్యాంకు లోనుకి పెట్టుకుంటే, నేనూ అన్నయ్యా చక్కగా, మా మా ఆఫీసులకు దగ్గరగా ఉండేలా చూసుకుని చెరో ఫ్లాటూ తీసుకుంటాం. మీరు కూడా మాతోపాటే, నాదగ్గర ఒకళ్లు, అన్నయ్య దగ్గర ఒకళ్లు ఉండవచ్చు. స్వంత ఇళ్లే కనుక వసతిగా ఉంటుందికూడా! ఏమంటారు" అన్నాడు చిన్నబ్బాయి గుక్క తిప్పుకోకుండా.
                             "నిజమే నత్తయ్యా! మరిది మంచి మాట చెప్పాడు. ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండడంకన్న మాతో ఉండడమే బాగుంటుంది కూడా" అంది పెద్ద కోడలు బెల్లింపుగా
                             తెల్లబోయింది సుగుణమ్మ. భర్త వైపు బేలగా చూసింది. పెళ్లైనది మొదలు తానూ భర్తా ఎప్పుడూ పది రోజులకంటే ఎక్కువ చెరోచోటా ఉన్నది లేదు. పొద్దు సంజకు మళ్లాక ఇప్పుడు ఆ ఏర్పాటు ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. అంతేకాదు, ఇల్లు అమ్మడం అన్నది కూడా ఆమెకు సమ్మతం కాదు. ఈ  ఇల్లు తాము దగ్గరుండి  మనసు పెట్టి కట్టించుకున్నది. ఈ ఇంటిలో ప్రతి ఇటుక చాటునా ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి తమకు. తన పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు. ఇక్కడే తను ఆడపడుచుకి పెళ్లి చేసింది.....ఇలా ఎన్నెన్నో బాధ్యతలకు, బంధాలకు జ్ఞాపిక ఈ ఇల్లు. ఇది తన ఆశల హరివిల్లు, ఆనందపుటలరులు పూసిన పొదరిల్లు ! దీనిని అమ్మెయ్యడం అన్న మాట ఆమె భరించలేదు.
                          గురునాధం గారు ఒక్కసారి భార్య వైపు చూసి, నిదానంగా ఆఖరి చెంచా ఉప్మా కూడా తినడం పూర్తి చేసి, మంచినీళ్లు త్రాగి, కుర్చీ కమ్మీ మీదే ఉంచబడిన చిరు తువ్వాలుతో మూతి తుడుచుకుని కుర్చీలో సద్దుకు కూర్చున్నారు, ఈ పరిస్థితి వస్తుందని ముందే తెలుసు కనుక, ఆయన ఏమీ చెలించలేదు. కాని ఆయన ఏం చెపుతారో వినాలని ఆత్ర పడుతున్నారు తక్కిన వాళ్లు.
                       గొంతు సవరించుకుని ధృఢమైన కంఠస్వరంతో చెప్పసాగారు గురునాధం గారు., "అమ్మాయిలూ, అబ్బాయిలూ ! ఇన్నాళ్లూ మీకెవరికీ తెలియని కుటుంబ విషయాలు కొన్ని, నేను మీకీవేళ చెప్పాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి.........
                      అబ్బాయిలూ! మీకు మీ నాన్నమ్మ గుర్తుందికదూ ! కాని ఆమె నన్ను కన్న తల్లి కాదన్నది మీకు తెలియదు. ఆమె మా నాన్నకి రెండవ భార్య, నాకు సవతి తల్లి. వ్యాపారం దెబ్బతినడంతో మనసు చెడి, అకస్మాత్తుగా వచ్చిన గుండె పోటుతో మరణించారు మా నాన్న. అప్పటికి నేనింకా బి. ఎస్సి. ఫైనల్ ఇయర్‌లో ఉన్నా. కబురు తెలిసి వెంటనే ఇంటికి పరుగెత్తా. నేను వెళ్లేసరికి మీ నాన్నమ్మ అంటే నా మారుటితల్లి, తన ఆరేళ్ల కూతుర్ని గుండెలకు హత్తుకుని, మా నాన్న శవం దగ్గర కూర్చుని గుండెలవిసిపోయేలా ఏడుస్తోంది. ఆ ఏడుపులో నాకు, భర్త మరణించాడన్న దుఃఖంతోపాటుగా, ఇక మా భవిష్యత్తు ఏమిటి - అన్న ఆర్తనాదం కూడా వినిపించింది. వెంట్నే నేనొక నిర్ణయానికి వచ్చా.
                      అంత వరకు నేను ఆమెను "పిన్నీ" అని పిలిచే వాడిని.అప్పుడుమాత్రం "అమ్మా" అని పిలవాలనిపించింది. "అమ్మా ! ఏడవకమ్మా. నాన్నను నేను నీకు తెచ్చి ఇవ్వలేనుగాని ఇకనుండి నీకూ, చెల్లికీ నేను అండగా ఉంటానమ్మా" అని చెప్పి ఆమెను ఓదార్చా. వాళ్లని అలాగే చూసుకున్నా కూడా.
                       ఆ తరవాత కొన్నాళ్లకి మీ అమ్మ నాకు సహధర్మచారిణి అయ్యింది. మీ తాతయ్య నేను అడక్కపోయినా నాకు పదివేలు రొఖ్కం వరదక్షిణగా ఇచ్చారు. వెంటనే నే నా డబ్బుని, నా చెల్లెలి పెళ్లి కోసం బ్యాంకులో దాచా. ఇంతవరకు మీ అమ్మ ఆ డబ్బును గురించి నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నేనేంచేసినా ఎప్పుడూ మీ అమ్మ నన్ను "ఎందుకు" "ఏమిటి" అని అడిగిన పాపాన పోలేదు ఎప్పుడూ. ఆమె నన్నంతగా నమ్మింది."
                      ఊపిరి పీల్చుకోడానికి ఒక్క క్షణం ఆగారు గురునాధం గారు. అంతలో చిన్న కొడుకు ఏదో మాట్లాడ బోతే, ఆయన చేతి సైగతో వారించి, ఒక గుక్క మంచినీళ్లు త్రాగి మళ్లీ చెప్పడం మొదలు పెట్టారు.....
                  "నే నిదంతా మీకు చెపుతున్నది మీ మెప్పూ, మెహర్భానీలకోసం కాదు. ఒక్క తరం మారే సరికి మానవత్వపు విలువలు ఎంతగా దిగజారిపోయాయో మీకు తెలియాలని మాత్రమే. మధ్యలో అడ్డురాకుండా చెప్పేది పూర్తిగా వినండి......
                        నిరుడు మీ అమ్మకి చాలా పెద్ద జబ్బు చేసిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది. మీరప్పుడు నాకు సానుభూతి ఉత్తరాలు కూడా రాశారు కదా ! .అది మీరు మళ్లీ చెప్పనక్కర లేదు, నా కదంతా బాగా జ్ఞాపకం ఉంది. సరిగా అప్పుడే మీలో ఒకరికి ఇనస్పెక్షన్ జరుగుతోండడంవల్లా, ఇంకొకళ్లు అదే సమయంలో స్పెషల్ ట్రైనింగు మధ్యలో ఉండడం వల్లా, మృత్యు ముఖంలో ఉన్న తల్లిని చూడడానికి రాలేక పోయారు మీరు. కనీసం డబ్బేమైనా కావాలా -అని కూడా మీలో ఎవ్వరూ నన్ను అడగలేదు.
                           డాక్టర్ కిడ్నీ మార్చా లన్నాడు. నా కిడ్నీ సరిపడ లేదు. హెచ్చు ఖరీదు ఇచ్చి కొనాల్సి వచ్చింది. దొరకడం కూడా చాలా కష్టమయ్యింది. ఆశ చావక, అంతవరకు తరచు "డయలసిస్" చేయిస్తూ మీ అమ్మని బ్రతికించుకుంటూ వచ్చా. ఇల్లు బేరం పెట్టా. చివరిదాకా మృత్యువుని ఎదిరించాలనే అనుకున్నా. మీ అమ్మ లేకుండా నేను లేను.... అనిపించింది. చివరకు నాతో పడలేక మృత్యువు మీ అమ్మను నాకు వదలి వెళ్లిపోయింది." అకస్మాత్తుగా కంఠం గద్గదమై ఆయన మాట్లాడలేకపోయారు.
                          కోడళ్లు మొహమొహాలు చూసుకున్నారు. సుగుణమ్మ గారు, భర్త తనకోసం పడిన పాట్లు గుర్తు రాగా, చెమ్మగిల్లిన కళ్లను పైట చెంగుతో ఒత్తుకున్నారు. వాతావరణం గంభీరంగా మారింది. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు.
                       గురునాధం గారే ముందుగా సద్దుకని మళ్లీ చెప్ప సాగారు. 'నా భార్య మంచం మీద ఉన్నన్నినాళ్లూ నాకు మాట సాయం, మనిషి సాయమే కాదు, మనీ సాయం  కూడా చేసిన వాళ్లు నా స్టూడెంట్లు, వాళ్ల  తల్లితండ్రులు,  ఆపై ఇరుగు పొరుగుల వారూను. వాళ్లు నన్ను ఇల్లు అమ్మనివ్వ లేదు. అవసరం ఉన్నంతా తలో కొంచెం చేబదులుగా సద్దారు. మొత్తానికి వాళ్ల పుణ్యమా అని, నాకు ఇల్లు, ఇల్లాలూ కూడా దక్కేలా చేశారు. మీరేమో ఓ కార్డుముక్క రాసి సరిపెట్టేశారు. చాలు, ఈ జన్మకి ఈ అనుభవం చాలు" అన్నారు ఆయన విరక్తిగా.
                        ఆ మాటలు విన్న సుగుణమ్మ గారు, "ఇదంతా మనసులో ఉంచుకునా ఈయన, "కొన్నాళ్లు మనం వెళ్లి పిల్లల దగ్గర ఉండి వద్దాము" అన్నప్పుడు, "సర్లే, ,చూద్దాం. ముందు వాళ్లు మనల్ని రమ్మననియ్యి" అన్నారు" అనుకుంది మనసులో.
                     గురునాధం గారే ముందుగా తేరుకున్నారు. "ఇప్పుడిక మీరు ఎంతసేపటినుండో వినాలని ఎదురు చూస్తున్న విషయంలోకి వద్దాం" అన్నారు. ఆపై జేబులోంచి రుమాలు బయటికి తీసి, నెమ్మదిగా కళ్ల జోడు తుడిచి మళ్లీ పెట్టుకుని, చెప్పడం మొదలు పెట్టారు.....
                        " మొదటి మాట... మిత్రుల ధర్మాన నిలబడ్డ ఈ ఇంటిని ఇక అమ్మే ఉద్దేశం నాకు లేదు. ఇది మీ అమ్మ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు. ఇది ఆమె ఉన్నన్నినాళ్లూ ఆమెతోనే ఉంటుంది.
                        రెండోది.... డబ్బు ! మీ అమ్మ జబ్బు పడ్డప్పుడు చేసిన అప్పుల్లో కొన్ని ఇంకా తీర్చవలసినవి ఉన్నాయి. అప్పులన్నీ తీర్చాక ఇంకా ఏమైనా మిగిలితే ఆమెను తీసుకుని తీర్థయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నా. మా అనంతరం మాట ఏమోగాని, ప్రస్తుతానికి ఈ ఇంటిమీద ఏ ఆశలూ పెట్టుకోకండి.
                       ఇక ఆఖరుమాట కూడా వినండి...... మీ అమ్మ వేరు, నేను వేరు అని నే నెప్పుడూ అనుకో లేదు. మమ్మల్ని విడదీసి పంచుకోడం మీ వల్ల నయ్యే పని కాదు. మృత్యువు కూడా ఆ పని చెయ్యకూడదు అన్నది నా ఆకాంక్ష. పుత్రుడు అంటే, "పున్నామ నరకం నుండి తప్పించే వాడు" అని అర్ధం చెపుతారు. నరకందాకా ఎందుకు, తల్లితండ్రుల్ని వృద్ధాప్యపు వడిదుడుకులనుండి రక్షించేపాటి ఔదార్యం కూడా ఉండటం లేదు ఈ నాటి కొడుకులకి !
                           ఎవరో, ఎప్పుడో, ఏదో మనకు ఒరగదోస్తారని, ఎవరూ ఎవరి మీదా ఏ ఆశలూ పెంచుకో కూడదు. ఈ కలియుగంలో స్వార్ధమే పరమార్ధం.
మా రోజులు బాగుండాలంటే మేమూ స్వార్ధపరులం కాక తప్పదు. కాని మీరు మా పిల్లలే నన్నది మేము ఎప్పుడూ మర్చిపోము. ఇదివరకు లాగే మీరు ఇక ముందు కూడా, మీకు ఎప్పుడు రావా లనిపించినా వచ్చి వెడుతూండండి."
                            చాలా సేపు ఏకబిగిని మాట్లాడడంతో ఆయనకు దాహం వేసింది కాబోలు, పక్కనున్న గ్లాసు ఎత్తి నీళ్లు నోట్లో పోసుకోబోయారు. కాని అందులో చుక్క నీళ్లు కూడా లేవు.
                     *                    *                   *                    *                    *
                            " పెట్టిన శలవు అయిపోయింది"  అంటూ గురునాధంగారి అబ్బాయిలు ఆ మరునాడే హైదరాబాదుకి ప్రయాణమయ్యారు. గేటు దాకా వెళ్లారు గురునాధం దంపతులు వాళ్లతో. వాళ్లని సాగనంపి వెనుదిరిగిన గురునాధం గారికి భార్య కళ్లల్లో కన్నీరు కనిపించింది.
                            ఆప్యాయంగా, భార్య బుజం చుట్టూ చెయ్యి వేసి ఇంట్లోకి నడిపిస్తూ అడిగారు గురునాధం గారు, "సుగుణా ! నేను తప్పుచేశా నంటావా" అని.
                         " లేదండీ, మీరెప్పుడూ తప్పు చెయ్యరు. నా కడుపు తీపి నా కళ్లను తడిపింది" అంది ఆమె అనునయంగా.
                        "గుండె నిబ్బరం చేసుకో సుగుణా. ఈ రోజుల్లో మనిషికి కావలసింది, ఏ పరిస్థితినైనా ఎదుర్కో గల మనోధైర్యం ! అది లోపిస్తే, స్వార్ధమే పరమార్ధ మైన ఈ కలియుగంలో మనిషి బ్రతకడం చాలా కష్టం. తల్లి తండ్రులకి, వాళ్లు బ్రతికి ఉండగానే, "మదర్సు డే", "ఫాదర్సు డే" - అంటూ దినాలు జరిపించేసి, ఆ రోజునే చేతులు దులిపేసుకోడం ఫేషన్‌గా మారిన ఈ రోజుల్లో మనం పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోడంలో అర్ధం లేదు. తల్లి తండ్రులు కూడా, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం త్యాగాలూ చేసెయ్యకుండా, కనుగలిగి, ముందు చూపుతో వృద్ధాప్యంలో పబ్బం గడుపుకోడం కోసం నాల్గు రాళ్లు వెనకేసుకోవాలి, తప్పదు. కన్న వాళ్లకీ, బిడ్డలకీ మధ్య తప్పని సరిగా ఉండవలసిన పరస్పర సహకారం లోపించడంతో వచ్చే వెలితి ఎప్పటికైనా జనం అర్ధం చేసుకుంటారో లేదో. ఇది ఒక విష వలయం ! ఒకరి సంగతి ఒకరికి పట్టని పరిస్థితిలో క్రమంగా జాతి నిర్వీర్యమై పోతుంది. స్వార్ధమే ఈ యుగ ధర్మం ! మనమేంచెయ్య లేము" అంటూ నిట్టూర్చారు ఆయన. ఇద్దరూ మెట్లెక్కి ఇంట్లోకి వచ్చారు. ఆమెకు ఇల్లంతా బోసిగా కనిపించింది.
పిల్లలు వెళ్లిపోయాక సుగుణమ్మ గారిలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది గురునాఢం గారికి. ఆ రాత్రి భోజనాలు ముగించి వచ్చి విశ్రాంతిగా కూర్చున్నాక ఆ విషయం ఎత్తారు ఆయన. అలవాటుగా తాంబూలం అందిస్తున్న భార్య చెయ్యి పట్టుకుని, "సుగుణా! నువ్వు మామూలుగా లేవు, దేనికో బాధ పడుతున్నా వనిపిస్తోంది. నా నిర్ణయం నీకు నచ్చలేదా? ఐతే చెప్పు, రేపే మనం బయలుదేరి పిల్లలదగ్గరకి వెళ్లిపోదాం. నువ్వు బాధ పడడం నేను చూడలేను" అన్నారు ఆయన.
                 " రెక్కలొచ్చిన పిట్టలు ఎగిరిపోక మనతో ఉంటాయా! అదికాదు..... మనిషికీ జంతువుకీమధ్య నున్న తేడాని గురించి ఆలోచిస్తున్నా. ఒక విధంగా చూస్తే అవే నయమనిపిస్తోంది. అవి ఒకసారి ఇల్లు వదలి వెళ్లిపోతే మళ్లీ వెనక్కి తిరిగిచూడవు.
                  నాకు జబ్బు చేసినప్పుడు మీరు ఓపిగ్గా వున్నారు కనుక ఒక్కరూ ఆ తిప్పలన్నీ పడగలిగారు. రేపు మనమిద్దరమూ వయసు మీరి కాలూ చెయ్యీ ఆడక అవస్థ పడుతూంటే .... అప్పుడు మనల్ని ఆదుకునేది ఎవరు.... అన్నది తల్చుకుంటేనే భయమేస్తోంది. చిన్నప్పటి నుండీ పెంచి పెద్ద చేసిన కన్నవాళ్ల మీద కనికరమన్నది లేకుండా, ఇంకా మననుండి ఏవేవో రాబట్టాలని వంతులేసుకుని మరీ పోటీ పడుతున్నారే?....అదే నాకు దుఃఖం తెప్పిస్తోంది" అంది సుగుణమ్మ దిగులుగా.
                ఏమీ మాట్లాడలేక కొంతసేపు మౌనంగా ఉండిపోయారు గురునాధం గారు. చివరికి సద్దుకుని, "నిజమే సుగుణా! మనకు చివరి రోజుల్లో పిల్లలు దక్షత అవుతారనే ఆశ పెట్టుకోడంలో అర్ధం లేదు. మానవత్వపు విలువలు నానాటికీ తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ఆ ఆశే దుఃఖం. ఎవరి మీదా ఆధార పడకుండా ముందు చూపుతో మన బ్రతుకు తెరువు గురించి మనమే ఆలోచించుకోవాలి. నువ్వు బాగా గుర్తుచేశావు! దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోడం మంచిపని" అంటూ, ఆలోచనలో పడ్డారు ఆయన.
                 సుగుణమ్మ, ఒక్కొక్క తములపాకుకీ సున్నం రాసి, ఈనెలు తీసి, వక్కపొడి చేర్చి భర్తకు అందిస్తూ, మధ్యమధ్య ఒక్కొక్క సారి తనూ తింటూ ఆయన ఏం చెపుతారో వినాలని మనసంతా ఆత్రం నింపుకుని ఎదురు చూస్తోంది.
                  ఇక తాంబూలం చాలు అన్నట్లు చేతితో సైగ చేసి, చెప్పసాగారు గురునాధంగారు. " నాకొక ఆలోచన తోస్తోంది, చెపుతా విను....... నాకు ఎన్నాళ్లనుండో ఉన్న కోరిక, నీతో కలిసి యాత్రలకు వెళ్లాలని. తిరిగి వచ్చాక మనం ఒక పని చేద్దాం! ఈ ఇంటిని ఒక వృద్ధాశ్రమంగా మారుద్దాం. మనం కాక మరో నలుగుర్ని చేర్చుకుందాం. కష్టాలూ, ఖర్చులూ సమంగా అందరం పంచుకుందాం. ఒకళ్ల కొకళ్లం ఆసరాగా ఉందాం. పిల్లలను మనం కాదనం. వాళ్లు చూడాలనుకుంటే, ఎప్పటిలాగే వచ్చి చూసి వెళ్లొచ్చు. ఇలా చేయడం వల్ల కనీసం మనకు స్వేఛ్చా స్వతంత్రాలైనా మిగిలి ఉంటాయి! ఎలా ఉంది నా ఆలోచన?"
                 "చాలా బాగుందండీ. అలాగే చేద్దాం" అంది సుగుణమ్మ.
                    కళ్ల మీదకు నిద్ర ముంచుకు వచ్చేవరకు వాళ్లు చాలాసేపు ఆ విషయాలే మాట్లాడుకున్నారు.                                                 
                      "సరిలే, సుగుణా, ఇక మనం సామాను సద్దుకుందామా" అన్నారు ఆయన.                                                                 
                      ఆశ్చర్యంతో "ఎందుకు" అన్నట్లుగా ఆయన వైపు చూసింది ఆమె.
                     "నాల్గు రోజుల్లో మనం బయలుదేరి తీర్థయాత్రలకు వెడదాం. ఇన్నాళ్లూ ఉద్యోగంతో నేనూ, సంసార బాధ్యతతో నువ్వూ ఏ సరదా లేకుండా బ్రతికేశాం. ఇప్పుడైనా తీర్థ యాత్రల పేరుతో స్వేఛ్చగా తిరిగి, నాల్గు ఊళ్లూ చూసివద్దాం" అన్నారు గురునాధం గారు.
                      సుగుణమ్మ చిన్నగా నవ్వుతూ, "తీర్థ యాత్ర ఏమిటి, "ప్రేమ యాత్ర" అనండి, బాగుంటుంది" అంది.
                      భార్య తన మనసుని అర్ధం చేసుకిన్నందుకు గురునాధం గారి గుండె ఆనందంతో ఉప్పొంగింది. కళ్లల్లో తడి, పెదవులపై చిరునవ్వు మెరుస్తూండగా ఆమె ఆయనకు వింత అందంతో కనిపించింది. ఆయన కళ్ల నిండా ప్రేమ నింపుకుని ఆమెనే చూస్తూ, కోటి రాగాల తీయదనం ఉట్టిపడే ఎలుగుతో "సుగుణా" అంటూ ఆర్ద్రంగా పలికారు ఆమె పేరుని.
                       "నీకు నేనూ, నాకు నువ్వూ...... ఏటి ఒడ్డున కోట కడదాం పదవే" అని పాడుతూ, రోడ్డువెంట పుచ్చపువ్వులా విరిసి ఉన్న వెన్నెలలో సైకిల్ తొక్కుకుంటూ పోతున్నారు ఎవరో !
------------------------------------------------------ 
రచన - వెంపటి హేమ, 
సుజనరంజని సౌజన్యంతో

Tuesday, May 21, 2019

పెరుమాళ్లకెరుక


పెరుమాళ్లకెరుక
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.............
                                                           
మేము కాపురముంటున్న కాలనీలోకి కొత్త కుటుంబమొకటి అద్దెకు దిగింది. కాలనీ మొత్తం కలిసికట్టుగా ఒక కుటుంబంలా మసలేవాళ్లం. మా కాలనీలో ఇంచుమించు అందరివీ సొంత ఇండ్లే.ఇండ్లు కట్టి ఉద్యోగరీత్యా వేరే వూర్లలో కాపురమున్న కుటుంబాలు ఓ ఏడెనిమిదుంటాయి. వాళ్ల ఇండ్లలో పర్మనెంటుగా అద్దెకున్న కుటుంబాలు ఓ నాలుగున్నాయి. మిగిలినవి వచ్చేవాళ్లు పొయ్యేవాళ్లుగా ఉంటాయి.
కొత్తగా ఎవరొచ్చినా వున్నన్నినాళ్లు వళ్లనుమాలో ఒకరిగా కలుపుకోవడం మా కాలనీ ఆచారం. ఆ తంతులో భాగంగానే కొత్తగా వచ్చిన ఇంటికి మా కాలనీ ఆడవాళ్లమంతా కలిసి ఓ సుముహూర్తంలో అడుగుపెట్టాం.
ఇక్కడ మా కాలనీ వాళ్ల గురించి కొంత చెప్పాలి. మా కాలనీలో సుమారు ఏభై ఇండ్లుంటాయి. ఆ ఇండ్లలో ఆడమగ ఇద్దరూ ఉద్యోగాలు చేసే ఇండ్లుకొన్ని. వాళ్లు పెళ్లీ పేరంటాల్లాంటి వాటికి తప్ప కలవరు. మిగిలిన వాటిల్లో వున్న స్త్రీలు కొంతమంది కడుపేకైలాసం, ఇల్లే వైకుంఠమన్నట్లుగా వాళ్లెప్పుడూ గడపదాటరు, కొంతమంది ఆడికో అమాసకో అడపాదడపా కలుస్తుంటారు. మేమొక పదిహేను మందిమి మాత్రం ప్రతిరోజూ ఎవరింట్లోనో ఒకరింట్లో తప్పక కలుస్తుంటాము. మగవాళ్ల టిఫిన్లు చేసి ఆఫీసులకు వెళ్లిపోయిన తర్వాత గబగబా వంటపని పూర్తి చేసుకుంటాము. ముందురోజే ఎక్కడ కలవాలన్నది నిర్ణయమవుతుంది. స్టోరుకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలన్నా, మార్క్ట్టెట్టుకు వెళ్లి కూరగాయలు తెచ్చుకోవాలన్నా అందరం కలిసే వెళ్తాం. మా గ్రూప్ లో ఎవరైనా చీరలు కొనాలన్నా, నగలు కొనుక్కోవాలన్నా ఇదే తంతు. వీలైనంతమంది ఆ కొనుగోలులో పాలు పంచుకుంటాం.
పది పన్నెండు మందిమి ఒక్కసారిగా వెళ్లేసరికి వీధిలోనే మా మాటలు విన్నట్ట్తుంది. ఆ ఇంటి ఇల్లాలు ’రండి రండి’ అంటూ సాదరంగా ఆహ్వానించింది. మాకందరికి పెద్దదిక్కుగా వున్న సత్యవతక్క మమ్మల్ని ఒక్కొక్కరినే ఆమెకు పరిచయం చేసింది.
వాళ్లు వరంగల్లు నుంచి వచ్చారు. ఆయింటి యజమానిపేరు సోమశేఖరం. బ్యాంకులో వుద్యోగం. ఆమె పేరు స్నేహలత. వాళ్లకిద్దరు పిల్లలు. పెద్దమ్మాయి హైదరాబాద్ లో రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. పేరు లహరి. చిన్నవాడు లోహిత్ ఎనిమిదవ తరగతి.
ఇవన్నీ మేం ఒక్కొక్కరం ఒక్కో ప్రశ్న వేయగా స్నేహలత నోటిద్వారా తెలుసుకున్న వివరాలు. ముఖ్యమైన ఈ విషయాల్ని అందించి ఇప్పుడే వస్తానంటూ స్నేహలత లోపలికెళ్లింది. మాకు కాఫీనో టీనో ఆఫర్ చెయ్యడానికి వెళ్లుంటుందని తెలుసు.
ఈ లోపల మా కండ్లన్నీ డ్రాయింగ్ రూంలోని అణువణువునూ దర్శించుకున్నాయి.కొత్తగా సర్దుకోడం వల్ల కాబోలు ఎక్కడా ధూళిదుమ్ము లేకుండా నీట్ గా వుంది. సోఫాలు, టీపాయ్, టీ. వీ., దివాను- మామూలే. అయినా ఆ సెలక్షన్లో ఎంతో నేర్పున్నట్లు వాటిని చూస్తూనే తెలుస్తోంది.
కార్నర్స్ లో చోటు చేసుకున్న ప్లవర్ వేజ్ లు సహజమైన రంగులతో, అంతకంటే సహజమైన రూపాలతో అప్పుడే చెట్లకు పూసిన పువ్వుల్లాగా కంటికింపుగా ఉన్నాయి. పెద్ద సోఫాకు ఎడమ పక్కగా పెట్టిన రోజా పూలగుత్తి సహజమైన వాసనలను వెదజల్లుతుంటే దానికి దగ్గరగా కూచున్న సౌమ్య వాటిని ముట్టిచూసి "ఏయ్! ఇవి చూడండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ గులాబీ వాసనతో ఎలా గుబాలిస్తున్నాయో’ అంది.
టీ.వి. పక్కగా వున్న కార్నర్ వుడెన్ స్టాండ్ లో పెట్టిన పిల్లల ఫోటోలను తదేకంగా చూస్తూ నిలబడిన ఆశ వెంటనే టి.వి. పైన పెట్టిన లిల్లీలకు ముక్కుచేర్చి ఇవికూడా అచ్చు లిల్లీల వాసనేస్త్రున్నాయంటూ అందరివైపు చూసింది.
ఈ లోపల స్నేహలత ఆ గదిలో ప్రవేశించడాన్ని చూసి ఎక్కడి వాళ్లక్కడ సర్దుక్కూచున్నారు. ’మీ అమ్మాయి అబ్బాయి ఫోటోనాండి’ అంది ఆశ. ’అవునండీ’ అని స్నేహలత సమాధానం. మళ్లీ ప్రశ్నల పరంపర మొదలైంది. ’ఈ ఫ్లవర్ వేజ్ లన్నీ ఎక్కడ కొన్నారండీ చాలా బాగున్నాయి?’ అంటూ సత్యవతక్క ప్రశ్నతో పాటే ఒక సర్టిఫికెట్ కూడా సమర్పించింది. ’హైదరాబాద్ లోనే నండి’ అంది స్నేహలత. ’నేచురల్ ఫ్లవర్స్ లాగా వాసనెలా వచ్చిందండీ’ అడిగింది సౌమ్య. అప్పుడప్పుడూ సెంటు స్ప్రే చేస్తానండీ’ అంది స్నేహలత.
ఆమె అలంకరణ, పిల్లల ఫోటోల్లోని డ్రస్ లు, వాళ్ల హెయిర్ స్టైల్స్, ఇంటిలోపలి డెకరేషన్ ఆమెకున్న కళానైపుణ్యాన్ని చెప్పక చెప్తున్నాయి.
మంచి ఈస్తటిక్ సెన్స్ వున్న మనిషి అనిపించింది. ఆమెముందు మా గ్రూప్ వాళ్లెవరిని నిలబెట్టినా దిగదుడుపుగానే ఉన్నామనిపించింది.
ఇంతలో ఓ యాభైయైదేండ్ల వయసున్న ఒక స్త్రీ trayలో juice glass లతో ప్రత్యక్షమైంది. ఆమెను పరిచయం చేయకపోవడాన్ని బట్టి ఆమె కట్టుకున్న చీరను బట్టి వంటమనిషనుకున్నాం. చెవులకు కమ్మలు తప్ప మరే నగా లేదు. కానీ మొహం కళగా వుంది. విడో, మొహాన బొట్టు లేకపోయినా అందంగా వుంది.
తర్వాత ఓ ఐదు నిముషాలు కూర్చోని మా ఇండ్లకు రమ్మని ఆహ్వానించి వచ్చేశాం.
దారిలో మంచి ’కళాపోసనున్న మనిషి’ అంది సత్యవతక్క రావుగోపాలరావును అనుకరిస్తూ.
"నిజమే అని అందరం అంగీకరించాం. ’కళా పోసనతో పాటు సదువు సంస్కారం కూడా వున్న మనిషే" అంది శాంత.
’ఆమె అదృష్టం. మంచి వంటమనిషి కూడా దొరికింది. బాగా నమ్మకస్తురాలిలా వుంది.’అని అన్నాను నేను.
మళ్లీ మల్లికా వాళ్ల పాప పుట్టిన రోజుకు స్నేహలతను కూడా ఆహ్వానించినట్లు చెప్పింది మల్లిక. కరెక్ట్ టైముకు ఒక నిముషం కూడా ఇటూ అటూ కాకుండా మల్లిక వాళ్ల గడపలో అడుగుపెట్టింది స్నేహలత. పంక్చువాలిటీ కూడా మెయిన్ టెన్ చేస్తుందనుకున్నాం. వెంట వచ్చిన వాళ్ల వంటమనిషి ఒక పెద్దపాకెట్ ను ఆమె పక్కన పెట్టింది. ’నువ్వికవెళ్లు’ అనగానే ఆ పెద్దావిడ వెళ్లిపోయింది.
అందరి చూపులు ఒక్కసారిగా స్నేహలత శరీరాన్ని తాకాయి. లైట్ క్రీం కలర్ కు బ్లాక్ బార్డరున్న సీకోగద్వాల్ చీర రోలింగ్ కారణంగా ఆమె శరీరం మీద పొందిగ్గా అమరింది. చెవులకు, మెడకు ముత్యాలు, నల్లరాళ్ల కమ్మల లాకెట్. చేతిలో అవే కాంబెనేషన్ తో గాజులు, మెడమీద చిన్నకొప్పు. చాలా సింపుల్ గా డీసెంట్ గా వుంది. అలంకరణ.
చక్కని అందం, దానికి తగిన అలంకరణ, సంస్కారం, కూర్చున్న వాలకం, మాట్లాడేతీరు మమ్మల్ని ఆమెకు కాస్త దూరంగానే వుంచాయి. ’ఏమే గీమే’ అని ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకొనే మేము ఆమె దగ్గర మాత్రం మొహమాటంగానే వున్నాము. ’ఏమండీ’ అంటూ ఆచితూచి మాట్లాడ్తున్నాము.
మల్లిక తన ఇంటికి ఇందిరాగాంధి దిగబడిందన్నట్లుగా చిరునవ్వుతో ఆమెను పలకరించింది. తన ఆడబిడ్డల్ని తీసుకొచ్చి పరిచయం చేసింది. అది చాలదన్నట్లు తను పనిమీద వెళ్తూ ’మీరు కంపెనీ ఇవ్వండ’ ని మమ్మల్ని పురమాయించి వెళ్లింది.
మల్లిక వాళ్లపాపను తీసుకొచ్చి చూపెట్టినప్పుడు ఏదో మాట్లాడాలన్నట్లు ’నీపేరేంటమ్మా’ అని బుగ్గగిల్లి పలకరించిందామె. ’హసిత’ అని పాప అనగానే ’చాలా ముద్దుపేరు’ అని అభినందించింది.
ఆ శాల్తీ చుట్టూ కూచున్న మాకు ముళ్లమీదున్నట్లుంది. ఎన్నో ఏండ్లుగా కాలనీలో వుంటున్నాము. ఎప్పుడూ ఏ ఫంక్షన్ లోనూ ఇంత బెరుకు ఫీల్ కాలేదు. అలా అని ఆమేం దేవలోకం నుంచి దిగి రాలేదు. అంత రిజర్వుడుగా ప్రవర్తించమనీ చెప్పలేదు. అయినా ఎవరూ కూడా మనసు విప్పి ఫ్రీగా మాట్లాడలేక పోయాము.
కొత్త కావడంవల్ల అలా వున్నామనుకోవడం కూడా అబద్ధమే. ఎందుకంటే ఎంతోమంది కొత్తవాళ్లు ఆ కాలనీకి వచ్చినప్పుడు మేమెప్పుడు ఇలా ఫీల్ కాలేదు. గలగలా మాట్లాడి మొదటిరోజే వాళ్ల బీరువాలోని చీరల్ని, నగల్నీ దర్శించి వచ్చిన దాఖలాలెన్నో వున్నాయి.
జీవన విధానంలో వున్న చిన్నచిన్న పద్ధతులు ఒక మనిషికి ఇంతటి వున్నతస్థానాన్ని ఆపాదిస్తాయా అని అనుకున్నాను మనసులో.
ఒక్కరోజు పరిచయంతో కొత్త వళ్లను మాలో కలుపుకుని స్టోరుకు, మార్కెట్ కు, బజారుకు మా వెంట తిప్పుకొనే మేము ఈమె విషయంలో మాత్రం అంత తొందరగా అడుగు ముందుకు వెయ్యలేక పోయాము.
ఒకరోజు సత్యవతక్క వాళ్లింట్లో సాయిభజన ఏర్పాటు చేశారు. భజనకు ముందు కార్యక్రమంలో భాగంగా సౌమ్య, లలితక్క, మంజుల, వేణి వాళ్లు వంటింట్లో ప్రసాదాలు తయారు చేస్తున్నారు.
నేనూ, ఝాన్సీ సాయి పటాలను తుడిచి పసుపు కుంకాలతో బొట్లు పెడ్తున్నాము. సత్యవతక్క, ఇంద్రాణి, మీనా, మాలతక్క, ఆశ పూల మాలలు కడ్తున్నారు.
ఆశ వున్నట్లుండి ’నీవు చెప్పమన్నావని స్నేహలత గారిని కూడా భజనకు పిలిచాను’ అంది. అంతకు ముందు సత్యవతి ఆమెను కూడా పిలవాలనే అనుకుంది. అంటీముట్టనట్లున్న వాళ్ల బంధం వల్ల ఆమె ఆస్తికురాలా, నాస్తికురాలా తెలియకుండా పిలవడం బాగుండదని సౌమ్య, లలితక్కలు కూడా తన అభిప్రాయంతో ఏకీభవించడంతో పిలవకుండా మానేసింది.
కానీ ఇప్పుడు ఆశ ఆ మాట అనడంతో అందరు కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యారు. ఎవరికి వాళ్లే అంతకు ముందు భజనకు కట్టుకోవాలనుకున్న చీరల స్థానంలో వేరే చీరల్ని కట్టుకునే ఆలోచనలో పడ్డారు.
పిల్లల్ని స్కూలు నుంచి ఏకంగా భజన దగ్గరికి రమ్మన్నాను. స్కూలు నుంచి ట్యూషన్ కెళ్లి అట్నుంచి రావడానికి ఏడవుతుంది. అప్పటికి భజన పూర్తయి హారతిచ్చే సమయం. అందుకని నేరుగా రమ్మాన్నాను.
ఇప్పుడామె భజనకు వస్తుందని తెలిసి పిల్లల్ని ఎందుకు రమ్మన్నానా? అని ఫీలయ్యాను. మాసిన యూనిఫారాలతో, జిడ్డుగారే మొహాలతో వచ్చే పిల్లల్ని చూసి ఆమె ఎక్కడ ఏడ్డిమడ్డిగా వున్నారనుకుంటుందోనని నాజంకు.
సాయి పటాలకు బొట్లు పెట్టి టీపాయ్ పైన క్లాత్ పరచి పటాలను పొడిగ్గా దానిపైన పెట్టి గోడకు ఆనించి అమర్చిన తర్వాత నా పని అయిపోయిందన్నట్లు ’ఇంటికెళ్లి మొహం కడుక్కోనొస్తాన’ ని బయలు దేరాను.
ఇంటికొచ్చి అందాకా తీసిపెట్టిన పాతపట్టుచీరను బీరువాలో పెట్టి ఈ మధ్యే మ్యారేజ్ డేకి కొనుక్కున్న టస్సర్ సిల్కు చీరను తీసుకున్నాను. దాంతో కూర్చొని భజన చేయడం కొంత కష్టమే. ఎటు తిరిగినా కదిలినా నలిగిపోతుంది. అయినా వేరే చీరలేవీ నచ్చలేదు. ఈ ఒక్కరోజు కదలకుండా కాస్త కష్టపడి కూర్చుందాములే అనుకున్నాను. స్నేహలత కోసం ఆ చీర కట్టుకోవడం.
పనిమనిషికి వీధిలోనే పిల్లల్ని భజన దగ్గరికి రావద్దని చెప్పమన్నాను. వాళ్లకోసారి చెప్పినా వినరు, అందుకని మంచిబట్టలు ఒక్కోజత తీసి మంచం మీద పెట్టాను. వచ్చేటట్లయితే మొహాలు కడుక్కుని వాటినేసుకుని రమ్మన్నాను.
6 గంటలకు భజన మొదలవుతుంది. కరెక్టుగా 5:50 కి భజనహాలులో అడుగుపెట్టిందామె. సాదరంగా ఆహ్వానించింది సత్యవతక్క ’నాకు రావడానికి వీలుగాక ఆశతో చెప్పి పంపాను’ అని అబద్దం కూడా ఆడింది అక్క.
స్నేహలత వెనక పూజబుట్ట పట్టుకుని నిలబడి వుంది వాళ్ల వంటమనిషి ’బుట్ట అక్కడ పెట్టి నువ్వెళ్లు’ అంది ఆమె.
భజన ముగిసిం తర్వాత ప్రసాదం తీసుకుని ’వస్తానండీ’ అని బయలుదేరిందామె. వాళ్లింటి వరకు వెళ్లి దిగబెట్టడానికి ఆశ తయారైంది.
భజన ముగిసింతర్వాత అందరూ వెళ్లిపోయినా మాగ్రూప్ వాళ్లం అంత తొందరగా కదలం. ఎక్కువైన ప్రసాదాల్ని పంచుకుని తింటూ ఆ రోజు ఏ పాట ఎవరు బాగా పాడారో చర్చించుకుంటూ మళ్లీ ఓ గంటసేపైనా గడపుతాం. అందుకే ఆమెను వదిలిపెట్టి మళ్లీ ఆశ వచ్చింది.
తనను ఆదరంగా స్నేహలత లోపలికి ఆహ్వానించినట్లు చెప్పింది. ఇంకోరోజు వస్తానని తాను వచ్చేసినట్లు చెప్పింది.
వస్తూవస్తూ స్టోర్లో చెక్కరిస్తూన్నారన్న విషయం గుర్తొచ్చి ఆమెకీ విషయం చెప్దామని వెనక్కెళ్లిందట.
స్నేహలత భజన అయిపోయే సమయానికి భజన దగ్గరికి రాలేదని వంటమనిషిని చివాట్లేయడాన్ని చెవులారా విని అది సమయం కాదనుకొని వచ్చేసిందట.
ఆమె తిడ్తుంటే ఆ నడివయసు మనిషి తప్పుచేసినందుకు తలవంచుకుని నోరెత్తకుండా నిలబడినట్లు కూడా చెప్పింది.
పనోల్లను అదుపులో పెట్టాలంటే అంతమాత్రం తిట్లు అప్పుడప్పుడూ పడడంలో తప్పులేదనుకొన్నాం.
ఒకరోజు ఆంజనేయస్వామి గుడినుండి వస్తున్నాం. వాళ్లవంటామె వెదురుబుట్ట చంకలో పెట్టుకుని ఎండిన పేడను ఏరుకుంటూ కన్పించింది.
’ఏమ్మా, ఈడుండావు’ అని ముందే పలకరించింది సత్యవతక్క ’కనకాంబరం చెట్లకు పేడ ఎరువేస్తే బాగుంటుందంటేను’ అంది. ఆ మాటనేటప్పుడు ఆమె నిలబడలేదు. ఆ మొహం పక్కకూడా చూడలేదు. ఆమె నిలబడి చూసినట్లయితే మావాళ్లు ఆమె ద్వారా చాలా సంగతులే రాబట్టే వాళ్లు. ఆ అవకాశాన్ని ఆమె మాకివ్వకుండా తనింకో దారిలో వెళ్లిపోయింది.
’దీని టెక్కు మండిపోను’ అంది సౌమ్య. ’నోరూ వాయీ లేని మనిషిలా వుంది’ అనుకున్నాను నేను.
వినాయకచవితి పండగొచ్చింది. ఆ సాయంకాలం మా అందరిండ్లలో వినాయకులను చూసి, మొక్కి, ప్రతి ఇంట్లోనూ ఐదేసి గుంజిళ్లుతీసి వొస్తున్నాము.ఎన్ని వినాయకులను చూశామో లెక్కకట్టుకుని సరిసంఖ్యలో రావడంతో ఇంకో వినాయకుణ్ణి చూడాలనుకున్నాం.
వెంటనే ఆశ స్నేహలత గారి పేరు చెప్పింది. అప్పటికి ఆమెవచ్చి రెండుమూడు నెలలైనా ’గారు, అండీ’ లతోనే మా స్నేహం ఇంకా కొనసాగుతూవుంది.
అందరం సరే అంటే సరే అనుకున్నాం. వాళ్లింటి వైపు నడిచాం. సందెవేళ కావడంతో తలుపు తీసే వుంది. అయినా పిలవకుండా పోవడం సభ్యతకాదని నిలబడ్దాం. ఉదయం నుంచి పండగపని, పిండి వంటలతో భుక్తాయాసం, మళ్లీ ఇప్పుడు ఇంతదూరం తిరగడం కాళ్లు పీకుతున్నాయని ఒక్కొక్కరమే బయటవున్న అరుగుల మీద కొలువుతీరాం. ఆటైంలో కరెంటు పోయింది కాబోలు.
కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ బయటికి రాలేదు.
కొంచెం గొప్పగా కన్పించే వాళ్లతో స్నేహంకోసం తహతహలాడే మనిషి ఆశ. అలాంటి వాళ్లతో రాసుకొని పూసుకొని తిరుగుతూ అదో గొపాగా ఫీలవుతుంది తను.
ఇప్పుడు గూడా తలుపు కొట్టమంటుంటే ఏం అవసరం లేదని తనకాయింట్లో బాగా చొరవ వున్నదానిలా లోపలికి దూరేసింది ఆశ.
వెళ్లింది నిముషంలోనే వెనక్కి తిరిగొచ్చి గుసగుసగా ’ఉయ్యాల్లో పండుకొని ఎంచక్కా వంటామెతో కాళ్లు పట్టించుకుంటావుందో. చూద్దురుగాని రండి’ అని మమ్మల్ని పిలిచింది.
అలా చెప్పాపెట్టకుండా లోపలికి వెళ్లడం సభ్యతకాదని చెప్పినా దొంగగా కిటికీలోనుంచి తొంగి తొంగి చూశాం.
ఆమె వెనక వరండాలో వేసిన ఉయ్యాల బల్ల మీద గోవిందరాజుల స్వామి ఫోజులో పండుకుని వుంటే ఆ నడివయసు ఆడామె నిల్చొనే వంగి కాళ్లు పడుతూ వుంది.
ఒకచోట గట్టిగా నొక్కిందో, మరేమైందో కాలిని విసిరింది. దాంతో నిల్చున్నావిడ పట్టుదప్పి పడిపోయింది. ఆమె ’అబ్బా’ అన్న అరుపుకు స్నేహలత కళ్లు తెరవడం, మమ్మల్నెక్కడ చూస్తుందోనని మేము పక్కకు తప్పుకోవడం ఒకేసారి జరిగింది.
’ఛీ,ఇక్కడొద్దురండీ’ అని సత్యవతక్క దారి తీయడంతో మేమూ ఆమెను అనుసరించాం.
ఒకరోజు మల్లిక జ్వరంగా వున్న కూతుర్ని తీసుకుని హెల్త్ సెంటరుకి వెళ్లి ఒక సంచలనాత్మకమైన వార్తను మోసుకొచ్చింది.
స్నేహలత వాళ్లవంటామె ఒళ్లుకాలి ఆస్పత్రికి వచ్చిందని ఎక్కువకాలడం వల్ల క్రీం పూసి, ఇంజక్షనిచ్చి గవర్నమెంటు ఆస్పత్రిలో అడ్మిట్ కమ్మని డాక్టరు సలహా ఇచ్చాడని చెప్పింది.
అంతకాలినా ఆమెతోపాటు ఇంట్లో వాళ్లెవరూ రాలేదని, మా కాలనీలో బండిమీద ఇస్త్రీచేసే సంజీవి పెళ్లాం ఓబులమ్మ వెంట బెట్టుకొచ్చిందని చెప్పింది.
ఆమె ఆస్పత్రిలో ఫలానా వార్డులో అడ్మిట్ అయింది అనే విషయం ఓబులమ్మ ద్వారా తెలుసుకున్న లలిత మాకా విషయం చేరవేసింది.
ఆరోజు శుక్రవారం మార్కెట్టుకు మేవంతా తప్పని సరిగా వెళ్లేరోజు. మార్కెట్టు పని కాగానే 12:30కి మాకాలనీకి వెళ్లే బస్సుఎక్కాలి. అప్పటికి 12:20అయింది. అది తప్పితే `1:30 కే బస్సు. ఏమైతే అయిందని ఆస్పత్రికి వెళ్లి ఆమెను చూసి వెళ్దామనుకున్నాం. మాలతక్క, ఝాన్సీ మాత్రం పిల్లలు, భర్త వస్తారని, లేటైతే ఇబ్బంది పడతారని మీరు చూసి రండని వెళ్లిపోయారు.
మేము రెండు ఆటోలలో ఆస్పత్రిలో అడుగుపెట్టాం. ఒళ్లుకాలిన మనిషి అని అడిగి ఏ వార్డులో వుందో తెలుసుకున్నాం.
మేము వెళ్లగానే కనపడిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాం. మంచం మీద ఆ నడివయసు మనిషి పడుకోనుంది. ఒకపక్క బుగ్గలు, కనురెప్పలు, మెడ, భుజం అంతా కాలిన బొబ్బలు, మంట లేకుండా వుండడానికి పూసిన క్రీముతో వికృతంగా వుంది.
మంచంమీద స్నేహలత భర్త కూర్చుని రసమన్నాన్ని స్పూన్ తో తినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె నోరు తెరవలేక నానా అవస్థలు పడుతూ చేత్తోనే వద్దని వారిస్తావుంది.
’ఈ ఒక్కసారి మెల్లగా నోరు తెరువమ్మా’ అని బతిమాలుతున్నాడాయన. ’పనిమనిషి పైన ఎంత దయాగుణం ఈయనకి’ అనుకున్నాం.
మేం ఆమెను చూడ్డానికి వచ్చామని తెలిసి ఆయన క్యారియరు అక్కడ ఉన్న ఐరన్ రాడ్ మీద పెట్టి బయటికి వెళ్లిపోయాడు.
పొరబాటున కాగిన నూనె మింద పడిపోయిందని చెప్పిందామె. ఎక్కువ మాట్లాడించి ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక, వూరికే నిలబడడం కూడా కష్టమనిపించి ఐదునిముషాలుండి వచ్చేశాం.
మేము బయటికి రావడం చూసి బయటవేపచెట్టు కింద నిలబడిన ఆయన లోపలికి వెళ్లిపోయారు.
ఒక పదడుగుల దూరంలో ఓబులమ్మ క్యారీరు కడుగుతూ మమ్మల్ని చూసి పరుగెత్తుకొచ్చింది. సారు భోజనం తెస్తే పెద్దోళ్ల ముందరెందుకని బయట తిన్నానంది.
’ఇంతకూ కాగిన నూనె ఎట్లా అంతగా మింద బోసుకునిందట. అదీ మొహంపైన’అడిగింది సత్యవతక్క.
’మీకా మహాతల్లి అట్లని జెప్పిందా? ఆమె జెప్పినా ఇనేవాళ్లకన్నా వుండొద్దమ్మా’ అనింది. అది మా తెలివి తక్కువ తనాన్ని ఎద్దేవా చేస్తున్నట్లపించింది.
’ఎవరో అయ్యగారి స్నేహితులొస్తారని వడలు సెయమనిందంట. ఈయమ్మ గారెలన్నీ సేశాక స్నేహలతమ్మ ఎలావుందో సూస్తామని తెచ్చి పెట్టమందట. ఈమె తీసుకెళ్లి ఇచ్చి ఇంకో వాయి గారెలు నూనెలో ఉడుకుతున్నాయని వంటింట్లోకి పరిగెత్తొంచిందట. ఆయమ్మ గారెనోట్లో పెట్టుకుని బొత్తిగా వుప్పులేదని, పిండిలో వుప్పు కలపమని చెప్పడానికి వంటింట్లోకొచ్చింది.
అప్పటికే పిండిమొత్తం అయిపోయింది. ఉప్పెయకుండా గారెలు చేస్తే ఎవరు తింటారని ఆయమ్మకు కోపమొచ్చి ’ముందే రుచి చూడమని ఇవ్వొద్దా’ అని గదమాయించిందట.
’ఇప్పుడడిగిందానివి ముందే నువ్వెందు కడగలేదు’ అనిందట ఈయమ్మ. అంతే ఆయమ్మకు కోపమొచ్చి ’ నూనె బాణలెత్తి ఈయమ్మ మిందికి ఇసిరిందట. ఈయమ్మ తప్పుకోబట్టి సరిపోయింది. లేకుంటే మొత్తం నూనె మొగం మింద బడేది. గుడ్డిలో మెల్లమాదిరిగా కొంచెం కాలింది’ చెప్పుకుంటూ వొస్తోంది ఓబులమ్మ.
’ఆయమ్మకెవరూ దిక్కులేదా?’ అడిగింది మల్లిక. ఇంతకాలినా వాళ్లవాళ్లెవరూ రాలేదని అడిగిన ప్రశ్న.
’ఎందుకు లేరూ. అయ్య ఆయమ్మ కొడుకే కదా! కూతుర్లు లేరు. పెద్ద కొడుకు, కోడలు బాగానే సూసుకుంటారట. వాళ్లు గుంటూరు దగ్గర పల్లెలో వుంటారు. కానీ ఈయమ్మకు సేసిపెట్టేవోళ్లు లేరని ఆయమ్మని పంపించదు.’- ఓబులమ్మ మాట ఎవరి చెవికీ ఎక్కడం లేదు.
స్నేహలతకు ఆవిడ అత్తా. వంటమనిషి కాదా! ఈ నిజాన్ని ఎవరం జీర్ణం చేసుకోలేక పోతున్నాం.
’ఆయమ్మ సూసే పోకడను బట్టి అందరూ ఆ తల్లిని పనిమనిషనే అనుకొంటారు. కానీ నోట్లో నాలుక లేని ఆ మహాతల్లి నాతో మాత్రం గుడ్డలిస్త్రీకీయడానికొచ్చినపుడు కష్టాలూ నష్టాలూ సెప్పుకోని కన్నీళ్లు బెట్టుకుంటుంది. ఏం జేస్తాం కలికాలమమ్మయ్యా.’ అని నిట్టూర్చింది ఓబులమ్మ.
మంచం మీద కూర్చొని తల్లిని తినమని వేడుకొంటున్న ఆ బ్యాంకాఫీసరు భార్య చేతిలో కీలుబొమ్మా లేక వాళ్లమ్మ మాదిరే నోరూవాయీ లేక సర్దుకు పోతున్న మనిషా. మా కందరికీ ఆయన మెతకతనమే ఇన్ని అనర్ధాలకు కారణమనిపించింది.
’దాని సంసారం కూలిపోను ఈ ఎత్తుబారం ఆశ దానితోక బట్టుకోని. తిరగాలని ఎంత పరుగులు దీసిందో’ అంది సౌమ్య.
’నాకేం తెలుసు. మీరందరూ కూడా ఆమె గొప్పతనాన్ని మెచ్చుకున్నోళ్లే కదా!’ అంది అమాయకంగా ఆశ.
’మంచి కళాపోసనున్న మనిషికదా!’ అంది ఎగతాళిగా సత్యవతక్కవైపు చూస్తూ ఇంద్రాణి. మా అందరి దృష్టిలో ఒకప్పుడు ఎంతో సంస్కారమున్న మనిషి అన్పించిన స్నేహలతాదేవి ఒక పిచ్చికుక్కలాగా మారిపోయింది.
అత్త ఆరళ్లను చూశాం. కానీ కోడలి కొలుపుల్ని చూడ్దం ఇదే మొదటిసారి.
అత్తనొక పనిమనిషిలాగా వాడుకోవడమే గాక, కేవలం ఒక మనిషిగా కూడా చూడని స్నేహలతాదేవిని తలోమాటా ఈనాటికీ నీచంగా అంటూనే వుంటాం.
సంస్కారం అన్నది ఇంటిని పొందిగ్గా, కళాత్మకంగా అమర్చుకోవడంలోనే వుండదని, మనసును మలుచుకోవడంలో వుంటుందని తెలిసినప్పటి నుంచి మేం కట్టే చీరల విషయంలోను, జిడ్డుకారే మొహాలతో కనబడే పిల్లల విషయంలోనూ కించపరచడం మానేసి చాలా కాలమైంది.
----------------------------------------------------------
రచన - మహాసముద్రం దేవకి, 
సుజనరంజని సౌజన్యంతో

Monday, May 20, 2019

చాంద్ర సౌర మాసములు మరియు తారతమ్య నివారణ - 2


చాంద్ర సౌర మాసములు మరియు తారతమ్య నివారణ - 2
సాహితీమిత్రులారా!


నిన్నటి తరువాయి.............

అధిమాసము

సౌరమాసము కన్నా చాంద్రమాసము చిన్నది. అందువలన సూర్యుని సంక్రాంతికి మరియు అమావాస్యకు మధ్య ఎడము ప్రతీనెల పెరుగుతూ ఉంటుంది. ఈ ఎడము 32 నెలల 16 రోజులకు ఒకసారి ఒక చాంద్రమాసమునకు సమానమవుతుంది. అనగ ఇన్ని రోజులకు సంక్రాంతి మరియు అమావాస్య మధ్య అంతరము ఒక నెలకు సమానముగా ఉంటుందన్నమాట. ఈ అంతరమును పరిగణనలోకి తీసుకొనకపోతే చాంద్రమాసము ప్రతి 32 నెలలకు ఒక్కొక్క సౌరమాసమును అధికమిస్తూ వెళుతుంది. అలా సౌరమానము ప్రకారము వచ్చె చైత్రాది మాసములు మరియు చాంద్రమానము ప్రకారము వచ్చే చైత్రాదిమాసములు వేరు వేరు సమయములలో వస్తాయి.

దాని వలన వచ్చే ఇబ్బంది ఏమిటి?

ఇబ్బంది ఉంది. ఈ చైత్రాదిమాసముల ఏర్పాటు కపోలకల్పితము కాదు. అది ఒక లోకాచారముగా (convention) గా ఏర్పడినది కూడా కాదు. మన ఊహలకందని సృష్టి రహస్యముతో దానికి అవినాభావ సంబంధమున్నది. ఊహాతీత సృష్టిలో ఏ ఘటననూ నియంత్రించే శక్తి మనకు లేదు. కాబట్టి దానిని అనుసరిస్తూ అనుకోని ఘటనల ప్రతికూల ప్రభావమును తప్పించుకొనుటకు మరియు అనుకూల ప్రభావమును పూర్తిగా వినియోగించుకొనుటకు ఈ ఏర్పాటు చేయబడినది.

అది ఎలా?

సూర్యుడు మీనములో నున్నప్పుడు వచ్చే పూర్ణిమకు చందృడు చిత్ర లేక స్వాతీ  నక్షత్రమునందుండును[1]. అలా ఉన్నప్పుడు మాత్రమే అది చైత్రమాసమవుతుంది. ఇదే సమయములో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ప్రకృతిలో కొత్తదనము ప్రారంభమవుతుంది. మోడువారిన చెట్లు మరియు మొక్కలు చిగురించడము మొదలవుతుంది. అంతవరకు జాడ కనబడని కోకిల కుహుకుహులు, శిశిరములో నిస్త్రాణగా మారిన మన శరీరములలో తెలియని కొత్త ఉత్సాహము, జీవితములో కొత్త ఆశలు చిగురించడము ఈ వసంతముతో ప్రారంభమవుతుంది. నైరాశ్యము అలముకున్న జీవితములలో నూతనోత్సాహమును నింపగలిగిన శక్తి ఈ కాలపు వేకువ ఝాముకుంటుంది[2].

ఉదాహరణకు -

సూర్యుని మీనప్రవేశము మరియు పూర్ణిమనాడు చందృడున్న నక్షత్రమును పరిగణనలోకి తీసుకోకుండా చందృని ప్రతి మాసమునకు పేరు పెడుతూ ఎదరికి వెళుతున్నాము అని ఊహించుకుందాము. ఫాల్గునమాసము పూర్తి అయ్యే సరికి ముందు చెప్పిన 32 మాసముల కాలము వచ్చింది అని అనుకుందాము. అపుడు వచ్చిన నెలకు చైత్రము అని పేరు పెట్టాము. ఈ నెల పూర్తి అయ్యింది కానీ సూర్యుడు మీనరాశిలో ప్రవంశించలేదు. అంతే కాదు ఈ నెలలో వచ్చిన పూర్ణిమకు చిత్రాస్వాతులయందు చందృడు లేడు. కానీ మనము దీనిని చైత్రము అని పేరు పెట్టాము.

దాని తరువాత వచ్చిన నెల వైశాఖమయ్యింది. కానీ పూర్ణిమనాడు చిత్రాస్వాతులలో ఒకదానిలో చందృడున్నాడు. దాని తరువాత జ్యేష్ఠమాసము వచ్చింది. దీనితోపాటు గ్రీష్మ ఋతువు ప్రారంభమవ్వాలి. జ్యేష్ఠం కాష్ఠంలా కాలుతుంది. అంటే కాలుతున్న కఱ్ఱ దగ్గర కూర్చున్నట్లు ఎండ ఉంటుంది. కానీ సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించలేదు. అందువలన గ్రీష్మము ప్రారంభము కాలేదు. తరువాతి నెల ఆషాఢము. మనము చెప్పుకున్నట్లు ఏ పూర్ణిమకూ  ఆ నెలకు సంబంధించిన నక్షత్రము రావట్లేదు. శ్రావణ-భాద్రపదములు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. కానీ మనము కొత్తాగా మొదలుపెట్టిన లెక్క ప్రకారము ఈ రెండు మాసములు ముందే వచ్చాయి.

[1] .      కార్తిక్యాదిషు సంయోగే కృత్తికాది ద్వయం ద్వయమ్।   అన్య్యోపాన్త్యౌ పంచమశ్చ త్రిధా మాసత్రయం స్మృతమ్।। సూర్యసిద్ధాంతము

[2] .      ఉత్ఫుల్లనవమల్లికాపరిమలభ్రాన్తభ్రమద్భామరే రే పన్థాః కథమవ్యథాని భవతాం చేతాంసి చైత్రోత్సవే।

            మన్దాన్దోలితచూతనూతనఘనస్ఫారత్స్ఫురత్పల్లవైరుద్వేలన్నవవల్లరీష్వితి లపన్త్యుచ్చైః కలం కోకిలాః।। సిద్ధాంతశిరోమణి

ఇలా వసంతము, గ్రీష్మము, వర్ష, శరత్, హేమంతము, శిశిరము వాని వాని మాసములలో కాక ఒక నెల ఆలస్యముగా ప్రారంభమయ్యాయి. సమయము గడిచింది. మరల 32 మాసములు పూర్తయ్యాయి. ఈ సారి ఈ ఋతువులు ఇంకో నెల వెనక్కు వచ్చాయి. అంటే మనము లెక్క పెట్టే ఋతువులు మరియు ప్రకృతిలో వాని స్వభావసిద్ధమయిన కాలమునకు రెండు నెలల తేడా వచ్చింది. కొంతకాలమునకు మనము చెప్పుకునే వసంత ఋతువులో వానలు పడడము మొదలయితే ఒకానొక సమయము వచ్చేసరికి చలి పుట్టించవలసిన హేమంతములో రోల్లు బద్దలయ్యే ఎండలు వచ్చాయి.

అంటే..?

అంటే మనము ప్రకృతి నుండి విడిపోయాము. ప్రకృతి దాని దారిలో పోతోంది మనము మన దారిలో పోతున్నాము.

దాని వలన మనకు నష్టమేమిటి?

వసంత ఋతువు ప్రారంభము అయ్యింది. నవరసాలు కలిపిన ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తాము. దాని లోని ఔషధ గుణములు ఎవరికీ వివరించి చెప్పక్కరలేదు. ఇది ఒక సంప్రదాయముగా భావిద్దాము. ఆ సంప్రదాయమును పాటించాలంటే మనము మామిడి, వేప మరియు చింత చెట్లు, చెఱుకు తోటలు, అఱటి వనములు పెంచ వలసినదే. లేదా వాని పెంపకమును ప్రోత్సహించవలసినదే. శ్రీరామనవమికి బెల్లపు పానకము అందులో మిరియాలు.  అలాగే అక్ష తదియ, శ్రావణపున్నమి, వినాయకచవితి, రథసప్తమి, మహాళయము, శరన్నవరాత్రులు, దీపావళి, కార్తీక పున్నమి, భోగి, మకర సంక్రాంతి, మహా శివరాత్రి, వసంతోత్సవము, హోళీ పండుగలు. ఈ పండుగలన్నీ ప్రకృతితో ప్రత్యక్ష సంబంధమున్నవి. వీనిలో దేనినీ మనము ఊహించి చెయ్యలేము.

మనకు వచ్చే నష్టము

మనము ఊహించిన కొత్త పద్ధతితో మనము వాడుకునే ఋతువులు మరియు మనము ఎదురుగా చూస్తున్న ప్రకృతి వేరు వేరుగా కనిపించడము మొదలయ్యింది. మనము అనుకున్న కాలములో ఆయా వస్తువులు దొరకనందున క్రమముగా సంప్రదాయము కనుమరుగయ్యింది. సంప్రదాయము ముసుగులో మనము కాపాడుకుంటూ వచ్చిన మన ఆరోగ్యము మరియు ప్రకృతి యొక్క ఆరోగ్యము కూడా క్షీణించడము మొదలయ్యింది.

మన ఊహలకు అతీతమయిన ప్రకృతి ఇపుడు అంచనా వేయలేని స్థాయికి వెళ్లి పోయింది. ప్రకృతిలో మార్పుతో మనలో వచ్చే మార్పులను ముందే ఊహించగలిగే అవకాశము చేజారినది. ప్రకృతితో ఉన్న అవినాభావ సంబంధమును మనకు గుర్తు చేసి ప్రకృతికి అనుకూలముగా మనను నడిపే సంస్కారములు కనుమరుగయ్యాయి.

ఫలితంగా...

1.      పంచదార మరియు బెల్లము బదులు తీపి లేని తీపి వాడుతున్నాము.(Sugar free sugar).  చక్కెర కర్మాగారములు మూత పడ్డాయి. పంచదార మరియు బెల్లము ఎలా ఉంటాయో మనకు తెలియదు. చెఱుకుగడ అనే పదము మెల్లగా వాడుకలో నుండి మాయమవుతుంది. తీపి తినకపోయినా తీపిరోగము పిల్లా పెద్దా అందరినీ వరిస్తుంది.

2.      అశోక వృక్షమునకు పూలు వసంత ఋతువులో పూస్తాయి. అవి ఎఱుపు పసుపు రంగుల మిశ్రమములో ఉంటాయి. ఇవి వసంత ఋతువులో మాత్రమే కనబడతాయి. మనము చూడని ఆ వృక్షమును మనము గమనించేదెలా? ఇప్పటికే కనుమరుగయిన ఈ వృక్షము ఇంక అంతరిస్తుంది.

3.      పారిజాతము, అర్కపత్రము, కపిత్థము(వెలగ), జంబూకము(నెఱేడు), అశ్వత్థము, బిల్వము, పలాశ (మోదుగ) ఇలా వందలాది ఔషధగుణములున్న వేలాది వృక్ష సంపదతో ముడి పడి ఉన్న మన సంస్కృతి కనుమరుగవుతుంది.

4.      అతి ఔషధయుక్తమైనది నూపురమున్న మన దేశపు ఆవు. మన చుట్టు పక్కల అది సంచరిస్తే చాలు మనము ఆరోగ్యముతో ఉంటాము. మన సంప్రదాయములతో మనకు దూరము పెరిగే కొద్దీ దాని విలువ మన దృష్టిలో తగ్గడము ప్రారంభిస్తుంది.

5.      ఆరోగ్యకరములైన వృక్షసంపద పశుసంపద నశిస్తుంది. వాతానుకూల గృహములలో నివశించే కొత్త సంస్కృతి మనను నిస్తేజులను చేస్తుంది. పూజలు నిరర్థకములుగా కనిపిస్తాయి. వేకువ ఝామునే నిద్ర లేవాలన్న వాదన తర్క హీనము (illogical) గా కనిపిస్తుంది.

6.      అతి సున్నితముగా తయారయిన మన శరీరమును మరియు వాతావరణమును వరించడానికి ఎయిడ్స్, ఫ్లూ, మస్తిష్క జ్వరము, చికిత్సలేని MND వంటి భయానక రోగములు సిద్ధమవుతాయి.

7.      మట్టి వాసన మనకు పడదు. పూలు పూయని ప్లాస్టిక్ మొక్కలు ఇంటి చుట్టు నయనానందమును కలిగిస్తే నయనానందముతో బాటు సర్వతోభివృద్ధికి తోడ్పడే వృక్షసంపద ఉద్యానవనములలో సహితము కనుమరుగవుతుంది.

ఇలా వర్ణించడము ప్రారంభిస్తే దీనికి అంతమే ఉండదు.

మరి మన దగ్గర ఈ సమస్యలకు సమాధానము?

మన వ్యవహారములో వసంతాది ఋతువులు, మన ప్రకృతిలో ఆ ఋతువుల లక్షణములు ఒకేసారి కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలి. అపుడు ప్రకృతికి అనుకూలముగా చెప్పబడిన పండుగలు

ఆయా సమయములోనే వస్తాయి. ఏకాదశి ఉపవాసములు, పండుగల పిండివంటలు, సంక్రాంతులలో నదీస్నానము, నదులు మరియు పశువులకు పూజలు కాలానుగుణంగా ఆచరించాలి.

సూర్యుని సంక్రాంతి మరియు చందృని తిథులతో ఉమ్మడిగా వచ్చే ఈ మాసములు మరియు ఋతువులు, వాని విశేషతను బట్టి మనము అనుసరించే సంప్రదాయములు మన సర్వతోబ్వృద్ధికి ఏర్పాటు చేయబడినవి. ఇందులోని ఏ అంశమూ కల్పితము కాకపోవడము మరియు విజ్ఞానయుతము కావడము ఆశ్చర్యంగా ఉంది కదా?

అందువలనే అధిమాసము..

అందువలనే ప్రకృతితో సమానముగా మన కాలమును పరిరక్షించుకోవడానికి మధ్య మధ్యలో అధికముగా వచ్చే మాసమును అధికమాసమని పేరు పెట్టారు. దీనినే మలమాసము మరియు శూన్యమాసమని అని కూడా అంటారు. మాస గణనలో దానికి స్థానము లేకపోవడము మరియు ఫలితములో అది శూన్యము అవడమువలన దానికి ఆ పేరు వచ్చినది.

దానిని గుర్తించడమెలా?

చాలా సులభము. ఒక అమావాస్యనుండి మరియొక అమావాస్య వరకు గల సమయమును చాంద్రమాసము అంటాము. ఈ కాలపరిధిలో సూర్యుడు రాశి మారతాడు. అలా రాశి మారడాన్ని మనము సంక్రాంతి అంటాము. ఈ కాలపరిధిలో సూర్యుడు కనుక రాశి మారకపోతే అది అధిమాసమని లెక్క. అనగా ఏ చాంద్రమాసములో అయితే సూర్యుని సంక్రాంతి ఉండదో దానికి అధిమాసమని పేరు.

క్షయమాసము

క్షయమాసము కూడ ఇదే విధముగా ఏర్పడుతుంది. ఒకే చాంద్రమాసములో రెండు సూర్యసంక్రాంతులు వస్తే దానిని క్షయమాసము అంటాము. ఇది చాలా అరుదుగా వస్తుంది. ఇది 141 సంవత్సరములకు వస్తుంది. ఒకొక్కసారి ఇది వచ్చిల తరువాత 19 సంవత్సరములకే వచ్చు అవకాశమున్నది. కానీ ఇలా రావడము చాలా అరుదుగా ఉంటుంది.

ప్రస్తుత ఉగాది

బ్రహ్మగారి మొత్తము వయస్సు 100 సంవత్సరములు.

    ప్రస్తుతము ఆయన వయస్సు సగము అయిపోయింది.

మిగిలిన సగములో ఇప్పుడు మొట్టమొదటి కల్పము నడుస్తున్నది.

  ఈ కల్పములో ఆరుగురు మనువుల కాలము ముగిసినది. ప్రస్తుతము ఏడవవాడయిన వైవస్వతమనువు సమయము నడుస్తున్నది.

 వైవస్వతమనువులో 27 మహాయుగములు గడచిపోయినవి. ప్రస్తుతము 28వ మహాయుగములో కృత, త్రేతా ద్వాపర యుగములు ముగిసినవి. కలియుగము నడుస్తున్నది.

     కలియుగములో మనము ఈ మార్చినెలలో చేసుకునే ఉగాదినాటికి 5111 సౌరవర్షములు పూర్తవుతాయి. అనగ 5112వ సంవత్సరము ప్రారంభమవుతుంది. ప్రభవ నుండి లెక్కపెట్టే మనకు ఇది వికృతనామ సంవత్సరమయితే ఉత్తరభారతదేశమునందలి బార్హస్పత్యమానమును అనుసరించే వారికి ఇది శోభనకృత్ అను వర్షము.
-------------------------------------------------------
రచన - డా. పిడపర్తి వె.భా.సుబ్రహ్మణ్యం, 
పిడపర్తి పూర్ణసుందరరావు,
సుజనరంజని సౌజన్యంతో

Sunday, May 19, 2019

చాంద్ర సౌర మాసములు మరియు తారతమ్య నివారణ - 1


చాంద్ర సౌర మాసములు మరియు తారతమ్య నివారణ - 1


సాహితీమిత్రులారా!చాంద్రమాసము
సూర్యుడు ప్రతిరోజూ ఒక అంశ (డిగ్రీ), చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు. (సూర్యుడు నడుస్తాడా? ఈ ప్రశ్నకు మనము సమాధానము తదుపరి భాగములో చర్చిద్దాము. అదే విధముగ వాని స్పష్టగతి కూడా రాబోవు సంచికలలో చర్చిద్దాము) అనగ వారిద్దరి మధ్య అంతరము 12 అంశలన్నమాట. ఈ అంతరము ప్రతిరోజూ 12 యొక్క గుణకములలో పెరుగుతుంది. ఈ పన్నెండు అంశల అంతరమునకు తిథి అని పేరు. మొదటి రోజు 12 అంశలున్న ఈ అంతరము రెండవరోజు 24, మూడవరోజు 36 ఇలా పెరుగుతుంది. 0 నుండి 12 అంశలవరకూ పాడ్యమి, 13 నుండి 24 వరకు విదియ ఈ విధముగ జరుగుతూ వారిద్దరి మధ్య అంతరము 180 అంశలు రాగానే పూర్ణిమ తిథి ముగుస్తుంది.  మరల అక్కడనుండి ప్రతి 12 అంశలకూ కృష్ణపక్షముయొక్క పాడ్యమి విదియ మొదలగు తిథులు నడుస్తూ 360 అంశలు పూర్తి కాగానే అమావాస్య అవుతుంది. సూర్యచంద్రులు ఒక చోట కలిసి ఉంటే అది అమావాస్య అన్నమాట.(దర్శః సూర్యేందు సంగమః, సూర్యచందృల సంగమమును దర్శము అంటారు. దర్శః అనగ అమావాస్య అని అర్థము. ఇలా 30 తిథులు పూర్తి కాగానే ఒక చాంద్రమాసము పూర్తి అవుతుంది.

సౌరమాసము

సూర్యుడు ప్రతిరోజూ ఒక అంశ నడుస్తాడు అని తెలుసుకున్నాము కదా. ఆ విధముగా ప్రయాణిస్తూ సూర్యుడు 360 అంశలు కలిగిన రాశిచక్రమును 360 రోజులలో పూర్తి చేస్తాడు. ఈ కాలమే ఒక సౌరవర్షము. రాశి చక్రములో 12 రాశులు ఉంటాయి. రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని సంక్రమణము అంటాము. ఒక సంక్రాంతి నుండి దాని తరువాతి సంక్రాంతి వరకూ గల కాలము ఒక సౌరమాసముగా పరిగణించబడుతుంది. ప్రతీ సంక్రాంతికీ ఒక విశేషత ఉంది. ప్రతీ సంక్రాంతీ పండుగే. అలా దానిని జీవితముతో ముడిపెట్టుటకు గల కారణము కాలగణనలో దాని గణన నిరంతరము కొనసాగునట్లు చేయుటయే. ఇది ఒకటీ కారణము అని చెప్పలేము. ఇది కూడా కారణము. దానికి వేరేమైనా వైజ్ఞానిక కారణములున్న మనము వానిని రాబోవు కాలములో చర్చించుకుందాము.

తారతమ్యము  దాని నివారణ

          13 అంశల వేగముతో పోవు చందృడు రాశి చక్రమును 28 నుండి 29 రోజుల అవధిలో పూర్తిచేస్తుంటే సూర్యుడు ఒక రాశిని 29 నుండి 30 రోజులలో పూర్తి చేస్తున్నాడు. చంద్రుడు రాశి చక్రమును పూర్తి చేయడానికి మరియు సూర్యుడు ఒక రాశిని పూర్తి చేయడానికి గల కాలములో కొంచము అంతరము ఉన్నది. ఈ పూర్తిచేయు కాలములే చాంద్ర సౌరమాసములు. కానీ రెండింటిలో ప్రతి నెల వచ్చు ఆ చిన్న అంతరమే కాలక్రమములో ఒక చందృని నెలకు సమానమైపోతుంది. దానిని అదే విధముగా వదిలేస్తే వారిద్దరి మధ్య ఈ అంతరము పెద్దదై ఈ గణనకు ఒక పొంతన లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి వల్ల కాలగణన అర్థములేనిదై పోతుంది.( అదెలా?)

          ఈ రెండింటిలో తారతమ్యము లేకుండా పొంతన కలిగిస్తే కాలవ్యవస్థ చెక్కుచెదరకుండా ఉండగలుగుతుంది. ఆ కారణముగా దీనికి ఒక పద్ధతిని అవలంబించారు. ప్రతీ చాంద్రమాసములో ఒక సంక్రాంతి ఉండాలి అప్పుడే అది ఒక నెలగా పరిగణించబడుతుంది అని. అది మేషరాశితో ప్రారంభమవుతుంది. అనగ ఏ చందృని మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడో ఆ మాసమునకు చైత్రమాసమని పేరు. ఇలా మొత్తము 12 రాశుల ప్రవేశముతో 12 చాంద్రమాసములు ఏర్పడతాయి. అంతే కాకుండా ఈ చాంద్రమాసములను గుర్తించడానికి రెండవ మార్గమును కూడా కనుగున్నారు. మాసములకు చైత్రము, వైశాఖము మొదలగు పేర్లను నక్షత్రములను బట్టి పెట్టారు. అనగ చైత్రమాసము యొక్క పూర్ణిమ నాడు చంద్రుడు చిత్రా నక్షత్రమునందు కానీ దానికి ముందు వెనుక గల నక్షత్రములో గానీ ఉంటాడు. ఇదే విధముగా వైశాఖపూర్ణిమనాడు విశాఖ నక్షత్రమునందు, జ్యేష్ఠమాసము నందు జ్యేష్ఠా నక్షత్రమునందు ఉంటాడు, ఇదే విధముగా మిగిలిన మాసములకు తెలియవలెను.

          అనగా మనము ఒక మాసమును రెండు మూడు ఖగోళీయ దృశ్యములను ఆధారముగ చేసుకొని గుర్తించగలము మరియు నిర్థారించగలము కూడ. సూర్యచంద్రుల మాసప్రమాణములలో చిన్న అంతరము పెరిగి పెరిగి కొన్నాళ్లకు పెద్దదవుతుంది. అలా పెద్దదైన దాని ప్రమాణము ఒక చాంద్రమాసముతో సమానముగా ఎదుగుతుంది. అలా ఏదిగిన ఆ మాసములో సూర్యుని సంక్రమణము ఉండదు. ఆనగా ఆ చాంద్రమాసములో సూర్యుడు ఒకరాశినుండి వేరు రాశికి మారడని అర్థము. కానీ మనము సూర్యుని సంక్రాంతి లేనిదే దానిని మాసముగా ఒప్పుకొనుట కుదరదని ఇంతకు ముందే తెలుసుకున్నాము. మరి ఆ మాస గణనలోకి రాని ఈ మాసము ఏమవుతుంది? అదే సూర్యుడు ఒకే చాంద్రమాసములో రెండు రాశులు మారితే ఏమవుతుంది?
-------------------------------------------------------
రచన - డా. పిడపర్తి వె.భా.సుబ్రహ్మణ్యం, 
పిడపర్తి పూర్ణసుందరరావు,
సుజనరంజని సౌజన్యంతో

Saturday, May 18, 2019

వాచోపన్యాసం


వాచోపన్యాసం 
సాహితీమిత్రులారా !


"యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ" - ఉపనిషత్తుల్లోని ఉవాచ

వాచీ.
గడియారం.
ఘటీయంత్రం.
తోయయంత్రం.

వాచీతో ఉన్నదొక పేచీ. వాచీ ఒక సవ్యసాచి. పెద్దముల్లు పెద్దన్న ధర్మన్న. నింపాదిగా నిదాననంగా కాలధర్మం తప్పకుండా పనిచేయిస్తాడు పెద్దన్న. చిన్నముల్లు అర్జునుడితో సమానమే. కాలం అనే భయంకరమైన అక్షయవీరుడికి, ఇంకో అక్షయవీరుడేగా కావలసింది? సరిజోదు లేకపోతే కాలం భూతం మింగెయ్యదూ? చిన్నముల్లు ఆపటానికి ప్రయత్నిస్తుంది. చాలాసార్లు విఫలమైనా ప్రయత్నిస్తూనే ఉంటుంది.

దేశానికో వాచీ. భూమ్మీద నిలబడి తూర్పు వెళ్ళే రైలెక్కితే మారే ప్రతిదేశానికి ఒకో విధమైన కాలం, దానికొక వాచీ. భూమ్మీద నిలబడి పడమర వెళ్ళే రైలెక్కితే మారే ప్రతిదేశానికి ఒకో విధమైన కాలం, దానికొక వాచీ. దిశకో వాచీ. దేశం లాగే దిశకో వాచీ. దిసమొలకో వాచీ. దీని గురించి చెప్పనే అక్ఖరలా.

చిన్నప్పుడు వాచీ. పెద్దవుతూ వాచీ. పెద్దయ్యాక వాచీ. చిన్నప్పటి వాచీ - అపురూపం. చూసుకున్నదే చూసుకుని అబ్బో అని మురిసిపొయ్యే కాలం. అక్కడా కాలమే విచిత్రంగా! పెద్దవుతూ వాచీ - ఒక రూపం. ఓ సారి చూసుకున్నాక, స్నేహితులకు చూపించాక వదిలేసే కాలం. అబ్బో అబ్బో ధాటి కాస్త తగ్గి పడుండే కాలం. అక్కడా కాలమే విచిత్రంగా! యవ్వనంలో వాచీ - ఒక పం పం. షోకిల్లా కాలం. పిల్లకు చూపించుకొని జబర్దస్తుగా ఫీలైపోయే కాలం. మగ స్నేహితులకు చూపించుకోటం నామోషీ అయిపోయే కాలం. అక్కడా కాలమే విచిత్రంగా! యవ్వనమైపోయాక వాచీ. కాంఫిడెన్సు కాలం. బోష్టింగు కాలం. పొగరుబోతు కాలం. బడాయి కాలం. ఎంత డబ్బు ఉంటే అంత పెద్దవాచి కాలం.

వాచీ లేకపోతే మనం లేము. అంతే, మరో మాట లేదు. ఎందుకా? పెళ్ళాం దగ్గరికెప్పుడెళ్ళిపోదామా అని చూస్కోటానికి కావల్సింది వాచీనే! లేకపోతే ముద్దులు మురిపాలు దక్కనిదీ మనకే! ఆఫీసు నుంచి బయటపడేదెప్పుడూ అని చూస్కోటానికి కావల్సింది వాచీనే! లేకపోతే బాసుగారి తొత్తులమైపోయేదీ మనమే! పరీక్షలు రాయాలంటే కావల్సింది వాచీనే! లేకపోతే ఫెయిలైపోయేది మనమే! పోటీల్లో చూసుకోవాల్సింది వాచీనే! లేకపోతే అందరికన్నా ఆఖరుగా నిలబడేది మనమే! పాటల్లో చూసుకోవాల్సింది వాచీనే! లేకపోతే రెండోసారి మన పాట మనమే వినుకోవాలి. వంటల్లో చూసుకోవాల్సింది వాచీనే! లేకపోతే మాడి మసైపోయిన పదార్థాలు తినాల్సింది మనమే!

ఇహ ఎక్కడ పెట్టుకోవాలన్నా అక్కడ ఇమిడిపొయ్యేది వాచీనే. జేబులో వాచీ! జుబ్బా జేబులో పెట్టుకుని ఊరకే బయటకు తీసి చూసుకునే కాలం. పైన ఒక బొడిపె ఉండి నొక్కుతే తెరుచుకుని ముల్లుల్ని చూపించేది. పెండ్యులం వాచీ! అటు నుంచి ఇటు ఉయ్యాల ఊగుతూ కళ్ళు బైర్లు కమ్మించేది. వర్తమాన వశీకరణం దీన్నుంచే పుట్టిందని ప్రతీతి. నిలువుస్తంభం వాచీ! ఊళ్ళో పనికిమాలిన పోకిరీలంతా ఆ స్తంభం చుట్టూ చేరి రచ్చబండ చేసే కాలం. ఆ వాచీ ఎన్నో ఊసుపోక కబుర్లకీ, గాలి కబుర్లకు నిలువు సాక్ష్యం. గోడ వాచీ! ఎటు తిరిగినా నిన్నే చూస్తూ ఉండే వాచీ. నీ ప్రతి అడుగును శాసించ గలిగింది ఈ వాచీనే!

ఇలా రకరకాలు. ఇంకా ఎన్నో ఉన్నయ్. చిత్రచిత్రాలు. చిత్రవిచిత్రాలు. ఎడమ చేతి వాచీ! కుడి చేతీ వాచీ! ఎడమ చెయ్యి వాచీ కోమలమైన వాచీ. అందుకే ఆడవాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు. కుడి చెయ్యి వాచీ కర్కశమైన వాచీ. అందుకే మగవాళ్ళు తక్కువగా పెట్టుకుంటారు. వాళ్ళు కూడా పాపం నాజూగ్గా కనపడదామని ప్రయత్నం. పెద్ద బెల్టు వాచీ. చిన్న బెల్టు వాచీ. నాజూకు బెల్టు వాచీ. పెద్దవజను వాచీ. చిన్నవజను వాచీ. వజనే లేని వాచీ.

బంగారపు వాచీ. వెండి వాచీ. రత్నాల వాచీ. పగడాల వాచీ. నవరత్నాల వాచీ. ఐరను వాచీ. అల్యూమినియం వాచీ. ప్లాస్టిక్కు వాచీ. కొబ్బరికాయ వాచీ! చీపురుపుల్లల వాచీ! అనకాపల్లి వాచీ. సత్యనారాయణస్వామి వాచీ! గుళ్ళో మండపంలో ఉండే వాచీ! అరసవిల్లి వాచీ! శ్రీముఖలింగం వాచీ! గర్భగుళ్ళో సూర్యకిరణాల వాచీ! నాలుగు రూపాయల వాచీ. నలభై రూపాయల వాచీ. నాలుగొందల వాచీ. నాలుగువేల వాచీ! నాలుక్కోట్ల వాచీ! అక్కడా కాలమే, ఇక్కడా కాలమే! తేడా ఏవిటో ఆ వాచీకి, ఆ కాలానికీ తెలియాలె.

కోటలో గంట. అదో కాలం. అదో వాచీ! రూపు లేకపోయినా ఒక ఖచ్చితమైన వాచీ. అర్థరాత్రప్పుడు పన్నెండు గంటలు. పన్నెండు మోతలు. ఠంగు ఠంగు మోతలు. ఎట్లా తెలుసు కొట్టేవాడికి? అదో విచిత్రమైన కాలం. అయినా ఖచ్చితమే! అదీ మన పూర్వీకుల కాలం. అదే ఆ కలపు వాచీ. బోలెడు జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చే వాచీ!. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చే వాచీ! గంట అనే కాలపు సమయం, ఈ గంట కొట్టటం నుంచే వచ్చింది. గంటంటే గుళ్ళో గంట అనుకునేవు, కాదులే కానీ, అది కోటలో గంట.

ఈ వాచీకి ప్రకృతికి బ్రహ్మాండమైన సంబంధం ఉన్నది. గడియారవృక్షం అని ఒక చెట్టు ఉంది. ఆ వృక్షవిశేషమేమంటే గడియకొక పండు కింద పడేస్తుంది. ఆ పడ్డ చప్పుడు బట్టి, ఒక గడియ అయ్యిందని జనాలకు తెలిసేది. పొద్దున పొద్దున్నే కిందపడ్డపళ్ళన్నీ గంపల్లోకెత్తేసి కాలం లెక్కలు మళ్ళీ మొదలెట్టేవారు..
మరి పిందెల కాలంలో, ఆకురాలు కాలంలో, తుఫాను కాలంలో ఏం చేసేవాళ్ళో తెలియదు కానీ!

సరే అదలా పక్కనబెడితే వాచీకి ఇంకో పిట్ట కథ ఉన్నది. ఒకటేవిట్లే, ఒహ రెండు చెపుతా కాచుకో! కొంతమందికి ఇవ్వగానే వా అని ఏడ్చి ఛీ అని విసరి కొట్టేవారనిన్నీ, అందువల్లే దానికి వాచీ అని పేరొచ్చిందనీ నా పిట్టకథ. కొంతమందికి ఇవ్వగానే వహ్ అని పొంగి సీ అని ముద్దెట్టుకునేవారనిన్నీ, అందువల్ల వాహ్ సీ ప్రకృతి రూపమైతే వాచీ వికృతి రూపమనీ - ఇలా ఇంకోటి కట్టా పిట్టకథని. ఇలా ఎన్నైనా చెప్పుకుపోవచ్చు. ఆగని వాచీ ముల్లులాగా!

ఈ వాచీకి మహాభారత యుద్ధానికి బ్రహ్మాండమైన సంబంధం ఉన్నది. ఈ వాచీల్లోని భాగాలు ప్రతిదీ ఒకదానికొకటి ప్రాణం పోసేవే. సాయం చెయ్యకపోతే ఒక దాని ప్రాణం ఒకటి తీసేసే గుణం ఉన్నవే! మహాభరత యుద్ధమే వాటి మధ్య. సఖ్యత కుదిరిందా ఐదు ఊళ్ళలా ఐదు ముల్లులు. కుదరలేదా ఐదు దెబ్బలేసి యుద్ధమే. అలా ఒహ రోజు ఒహటి జరిగిందిట. ఎక్కడ? కురుక్షేత్రంలో. సాత్యకి ద్రోణాచార్యుడిని ఓడించాడు ఒక రోజు యుద్ధంలో. ఆచార్యుణ్ణి ఒడించాడా ? ఎలా? అసలే యుద్ధం. అందునా భారత యుద్ధం. మహాభారత యుద్ధం.

ఓ రోజు, ద్రోణాచార్యుడు సాత్యకిని ఒరే నువ్వెంత నీ ఆటలెంత అని పరాభవించేస్తూ ఉండగా సాత్యకికి ఒక ఛాన్సు దొరికి, దొరికించుకొని లాగి ఆచార్యుడి ధనుర్భంగం కావించాట్ట. వార్నీ అని ఆచార్యుడు ఆశ్చర్యపోతూ, ఆగు సత్తి, నాదగ్గర వాచీ లేదు కానీ నువ్వొక ఘడియ ఆగు, ఇంకో ధనస్సు పుచ్చుకోనీ నీసంగతిజేస్తానని ఇంకో ధనువు అందుకోబోతుంటే దొరికింది సందని వాచీకి పెద్దముల్లులాంటి సారథిని సత్తిబాబైన సాత్యకి ఏసేసాట్ట. పెద్దముల్లు లేకపోటంతో చిన్నముల్లు గిరగిరా తిరుగుతూనే ఉన్నట్టు గుర్రాలు గిర్రున తిరిగి పరుగందుకున్నాయిట. ముల్లు లేకపోతే సమయమెంతో తెలీకపోయినా అవి, ఆ గుర్రాలు, అలా వాచీకుండే కీ లా గిరగిరా తిరగటం ఆచార్యుణ్ణి రక్షించింది. ఆయన ఆ గడియల వాచీకి దణ్ణం పెట్టుకున్నాట్ట, గుర్రాల్ని, గడ్డాన్నీ నిమురుకుంటూ. అందువల్ల దేని ప్రాముఖ్యం దానిదే. కీ లేపోతే ముల్లు లేదు. ముల్లు లేపోతే కీ ఉపయోగమూ లేదు. అలా వాచీకి భారతానికి లంకె ఉన్నది.

సద్దామునేసేప్పుడు తలారివాడు వాచొంక చుస్తూ ఆ సమయానికి దబ్బున ఏసేసాడు. బిన్ లాడెనునేసేసేప్పుడు ఆ సీలు తన వాచొంక చూస్కున్నాట్ట. బెర్లిను గోడ పడిపోయినప్పుడు కొన్ని వాచీలాగిపోయినాయట. పటేలు నిజామును శంకరగిరి మాన్యాలు పట్టిద్దామని వాచీ చూసుకుని టైమిచ్చాట్ట. ఎన్నో చెప్పుకోవచ్చు - ఇలా ప్రపంచ చరిత్ర అంతా వాచీలతో నిండిపోయింది. అదీ వాచీ గొప్పతనం. అదీ వాచీ ప్రాముఖ్యం. అదీ వాచీ ప్రామాణికత.

హిట్లరు వాచీ. జిన్నా వాచీ. రామానుజం వాచీ. ఐన్స్తైను వాచీ! ఇలా అదో రకం విభాగం.

అయ్యా, ఇలా వాచీ మీద ఒక ఆవు వ్యాసం రాసెయ్యొచ్చు.

ఓం తత్ సత్!
----------------------------------------------------------
రచన - - మాగంటి వంశీమోహన్, 
సుజనరంజని సౌజన్యంతో