Thursday, August 29, 2019

నిండైన జీవితం


నిండైన జీవితం

సాహితీమిత్రులారా!

వయసుతో పాటు హుందాతనం, సంస్కారం, ఆత్మ సమ్మానం, తాత్వికత సంతరించుకుని అందరినీ గౌరవంగా దగ్గరకు తీసుకునే ప్రేమమూర్తి ఛాయాదేవి. తాననుకున్నట్లుగా సమర్థవంతంగా జీవించి, మరణానంతరం కూడా తాననుకున్నట్లే వెళ్ళిపోయిన విశిష్ట వ్యక్తి…

చివరగా ఆమెను 2016లో సి. ఆర్. హోమ్‌లో చూసినప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా వున్నారు. జీవనోత్సాహాన్ని ఒడిసి పట్టుకున్నారు. ఛాయాదేవి అంటే క్రమశిక్షణ. ఛాయాదేవి అంటే సమయ పాలన. ఛాయాదేవి అంటే ప్రతిపనీ కళాత్మకంగా చెయ్యడం. ఛాయాదేవి అంటే హాస్య చతురత. ఎంత కష్టాన్నైనా అది సహజమేనన్నట్లు స్వీకరించడానికి సిద్ధంగా వుండడం. మృత్యువు అనివార్యం అని అందరికీ తెలుసు. అయితే దాన్ని స్వాగతించడానికి సంసిద్ధంగా అందరూ ఉండలేరు. ముందు ఏర్పాట్లు చెయ్యలేరు. కానీ ఛాయాదేవి మాత్రం ఎవరికీ ఎలాంటి తడబాటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుని సగౌరవంగా వెళ్ళిపోయారు.

చాలామందికి ఛాయాదేవి అంటే ‘ప్రయాణం,’ ‘సుఖాంతం’ మాత్రమే తెలుసు. తరువాత ఆమె ఎన్నదగిన కథలెన్నో వ్రాశారు.

పంథొమ్మిది వందల అరవై డెభ్భై దశకాలలో వచ్చిన ప్రయాణం, సుఖాంతం అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి. ‘ప్రయాణం’ కథ ఒక గంభీరమైన సమస్యను తీసుకుని ఎలాంటి మెలోడ్రామా లేకుండా అండర్‌టోన్‌లో వ్రాసిన కథ. అలాగే సుఖాంతం కూడా. ఈ కథ నెమ్మదిగా నడుస్తూనే చివరికి పాఠకులకి ఒక షాక్ ఇస్తుంది. వస్తువు ఎంత గంభీరమైనదైనా పాఠకులను చుట్టూ కూర్చోబెట్టుకుని, కథ చెప్పినట్లే వుంటుంది కానీ చదువుకోడానికి వ్రాసినట్టు వుండకపోవడం కూడా ఆ కథలు జ్ఞాపకం వుండిపోవడానికొక కారణం కావచ్చు. అదే అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేకత. ఆమె వ్రాసిన ‘ఆఖరికి అయిదు నక్షత్రాలు’ కూడా వ్యాఖ్యానరహితంగా చెబుతారు. చివరికి ఆమె చేసిన ఒక తాత్వికమైన వ్యాఖ్య మినహాయించి, ఈ కథ ఒక మంచికథగా నిలిచిపోవడానికి వస్తు గాంభీర్యంతో పాటు ఆమె శైలిలోని నిరాడంబరత, చాలా సున్నితమైన వ్యంగ్యమూ కూడా కారణాలే. ఛాయాదేవిగారి కథలు ఎక్కువగా ఉత్తమ పురుషలో వుండడం వలన అవి పాఠకులకి మరింత సన్నిహితంగా రాగలిగాయేమో కూడా!

1933లో జన్మించిన ఛాయాదేవి 1954లో రాసిన తొలి కథ ‘విమర్శకులు’ తరువాత ఆమె కథలన్నీ స్త్రీల జీవితాల చుట్టూ నడిచినవే. అంతకుముందు ఆమె నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లో వ్రాసిన నాటిక ‘పెంపకం’, 1952లో నిజాం కాలేజి పత్రికలో వ్రాసిన ‘అనుబంధం’ అనే కథ కూడా ఆడపిల్లల్ని స్వేచ్ఛ ఇవ్వకుండా పెంచడాన్ని గురించే వ్రాసారు. బాల్యమంతా కూడా ఒక సంప్రదాయపు కట్టడిలో గడపడం కూడా స్వేచ్ఛ విలువ తెలియడానికి, దానికోసం పరితపించడానికి కారణమౌతుంది. అందుకే ఆమె మొదటినించీ ఒక ఆడపిల్లగా గృహిణిగా ఉద్యోగినిగా తల్లిగా స్త్రీల జీవితాలచుట్టూ వుండే పరిధులనూ పరిమితులనూ తన కథల్లో చిత్రించారు. స్త్రీవాదం అనే పదం సాహిత్యంలో వినపడకముందే స్త్రీల పరాధీనత గురించే ఎక్కువ వ్రాశారు. రొమాంటిక్ నవల విజృంభణ కాలంలో కూడా నవల వైపు చాపల్యం చూపక తను గమనించిన విషయాలను, వాటిపట్ల తన అవగాహననూ తనదైన తాత్విక దృక్పథంతో కథలుగా వ్రాసి కథా రచయిత్రిగా వుండిపోయారు. తాను మానవతావాదిగా కన్న స్త్రీవాదినని చెప్పుకోడానికే ఇష్టపడతానన్న ఛాయాదేవి కథలన్నీ దాదాపు స్త్రీల జీవితాలను తడిమినవే. ఆమె చెప్పినట్లు అవి ‘తీవ్రంగానో, నిష్టురపూర్వకంగానో కాక, ఆర్ద్రత కలిగించేటట్లూ హాస్యస్ఫోరకంగానూ వ్యంగ్యపూర్వకంగానూ’ వుంటాయి. అనేక కట్టడుల మధ్య పెరిగిన ఆడపిల్ల, భర్త కనుసన్నలలో నడవవలసిన భార్య, భర్తే కాక పిల్లల అధీనతలో కూడా వుండవలసిన తల్లీ వరకూ వివిధ దశలలో స్త్రీల జీవితాలను గురించి వ్రాశారు.

ఛాయాదేవి కథారచన ప్రారంభం నాటికి, లేదా ఆమె చదవుకుంటున్న కాలం నాటికి, ఆడపిల్లల్లో చదువు పట్ల, వైవాహిక జీవితం పట్ల, జీవన సహచరుని ఎంపిక పట్ల కొన్ని స్వతంత్రమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. తమ తల్లుల అధీనత, అస్వతంత్రత, ఇంట్లో అన్నిటికీ తండ్రుల పెత్తనం, తల్లులకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం గమనిస్తూ పెరిగిన ఆనాటి అమ్మాయిలు, ఇందుకు భిన్నంగా జీవించాలని ఆశపడడం సహజం. అయితే అప్పటి సంప్రదాయ కుటుంబాలలో ఆ ఆశల సాకారానికి అవకాశాలు తక్కువ కనుక, వాళ్ళు పెద్దలు కుదిర్చిన వివాహాలకే తలవంచి అందులోనే రాజీపడి బ్రతకవలసి వచ్చేది. ఇలాంటి అమ్మాయిల కథే ‘విమర్శకులు’. ఆడపిల్లలను కుండీల్లో మర్రిచెట్టుల వలె మరుగుజ్జుచేసి పెంచడాన్ని ప్రతీకాత్మకంగా చెప్పిన ‘బోన్సాయి బ్రతుకు’ అనే కథ 74లో వ్రాశారు. స్వేచ్ఛగా పెరిగిన పెద్ద చెట్టు జడివానలోనూ పెనుగాలిలోనూ పదిమందికి నీడనిస్తుంది. అదే కుండీలో కుదించి పెంచిన మొక్కని జడివాననుంచి మనమే కాపాడి లోపల పెట్టాలి. ఈ కథ అనేక భాషా సంకలనాలలో చోటు చేసుకుంది. తండ్రులంటే విపరీతమైన భయంతో పెరిగిన ఆడపిల్లలు ఆ తండ్రి స్పర్శ ఎరుగరు. పొరపాటున ముట్టుకోవలసి వచ్చినా జంకుతారు. తండ్రికి వృద్ధాప్యం వచ్చినప్పడు మాత్రమే ఆ స్పర్శను అనుభవించగలగడాన్నీ, ఆ స్పర్శకోసం తపించడాన్నీ హృద్యంగా చెప్పిన కథ ‘స్పర్శ’. పిల్లలకి శారీరక స్పర్శే కాదు ఆత్మిక స్పర్శకూడా ఎంతో అవసరం. తండ్రీకూతుళ్ళ మధ్య ఈ ఆత్మిక స్పర్శని తాత్వికత రంగరించి, అంతే హృద్యంగా చెప్పిన పెద్దకథ (నవలా?) ‘మృత్యుంజయ’ ఛాయాదేవికీ ఆమె తండ్రికీ మధ్య నడిచిన ఉత్తరాలకు కథారూపం. ఈ పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రి పురస్కారం లభించింది.

జీవనసహచరుని ఎన్నిక గురించి హాస్య ప్రధానంగా వ్రాసిన కథ ‘ఎవర్ని చేసుకోను?’. ‘నిర్ణయం’, ‘స్థాన మహిమ’ అనే కథల్లోకూడా ఈ విషయాన్నే ప్రస్తావించారు. సహచరుణ్ణి ఎంచుకోడం అనే విషయంలో కొంత ప్రాక్టికల్‌గానూ, కొంత సాహసంతోనూ, కొంత భావ సారూప్యతతోనూ వుండాలి. అయినప్పటికీ ఎంత జాగ్రత్తగా ఎంచుకున్నా “ఎవర్ని చేసుకున్నా భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల మనస్థైర్యాన్ని అలవర్చుకోవాలి. అంతేగాని మన ఊహల ప్రకారమే జీవితం సాగాలంటే ఎల్లప్పుడూ సాగదు. దేనికైనా మానసికంగా సిద్ధపడి వుండాలి.” అంటారు ఛాయాదేవి. ‘స్థాన మహిమ’ కథలో మాధవి ప్యారిస్‌లో వున్నన్నాళ్ళూ మురళితో సన్నిహితంగా మెసలి, ఇండియా రాగానే అతన్ని పెళ్ళిచేసుకోడానికి తిరస్కరిస్తుంది. దానికి కారణం అతని కుటుంబ సభ్యుల అలవాట్లూ, అతని కుటుంబమూ తనకి నచ్చలేదంటుంది. తను రిసెర్చి చేసుకోవాలంటుంది. ఆమె తీసుకున్న ప్రాక్టికల్ నిర్ణయాన్ని రచయిత్రి సమర్థిస్తుంది. ఈనాటి చదువుకున్న స్త్రీల ఆలోచనలకూ ప్రాజ్ఞతకూ మాధవి ఒక ఉదాహరణ. ప్రేమ అనేది సాహచర్యంలోనూ సహజీవనంలోనూ వికసించి పెంపొందాలంటారు ఛాయాదేవి.

ఎంత చదువుకున్నా, ఎన్ని అభిరుచులున్నా, కోరికలున్నా అవి భర్త అభిరుచులతోనూ ఆయన కోరికలతోనూ కలిసినప్పుడే నెరవేరతాయి. లేకపోతే ఆమె జీవితం అతని చుట్టూ తిరిగే ఉపగ్రహం లాంటిదేనని చెప్పే కథ ‘ఉపగ్రహం 1’.

ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల పైన కూడా సటిల్ డిక్టేటర్‌షిప్ వుంటుందని, దాన్ని సమ్మతించకపోయినా సర్దుకుపోవడం తప్పదనీ అర్థంచేయింస్తుంది ‘శ్రీమతి ఉద్యోగిని’ అనే కథ. తను చేసే ఉద్యోగానికి తనెంత అంకితభావంతో పనిచెయ్యాలన్నా పురుషుల వలె స్త్రీలు అదనపు సమయాన్ని ఆఫీసుల్లో గడపలేరు. ఆఫీస్ పని ఇంటికి తెచ్చుకుని చేసుకోలేరు. అలాగే బంధుమిత్రుల రాకపోకలు, మర్యాదలు కూడా వాళ్ల ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తాయి. ప్రశ్నోత్తరాల రూపంలో నడచిన ఈ కథలో హాస్య స్ఫూర్తి వున్నా, అంతర్లీనంగా ఈ విషయాలన్నీ స్పృశించారు ఛాయాదేవి. ఉద్యోగినులైన శ్రీమతుల గురించి పరిశోధనకు వచ్చిన అమ్మాయి వేసిన ప్రశ్నలకు ఇంట్లో తన భర్త పెత్తనాన్నీ ప్రాబల్యాన్నీ కొంత హాస్యమూ కొంత లౌక్యమూ కలబోసి సమాధానాలిస్తుంది. ‘వచ్చే జన్మలో కూడా ఈయన్నే మీ భర్తగా ఎంచుకుంటారా?’ అనే ప్రశ్నకు అవునంటూ లౌక్యంగా చెప్పినా, తన లోపల ‘అట్లా అనడం భారత నారీ ధర్మం కదా’ అనుకుంటుంది ఆ శ్రీమతి ఉద్యోగిని.

భార్యాభర్తలిద్దరూ సమానమైన మేధోవంతులైనా ఒక్కొక్కసారి భార్య అతని నీడనే అనామకంగా వుండిపోతుంది. ఆమె అతనికిచ్చిన ప్రోత్సాహమూ సహకారమూ కూడా గుర్తింపులేకుండా పోతాయనేదానికి ఉదాహరణ ‘సతి’, ‘ఆయన కీర్తి వెనక’ కథలు. సాహితీ సతి అయిపోయిన ఒక రచయిత్రి కథ ‘సతి’. భర్తతో పాటు తనూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనక, సంసారాన్నీ పిల్లలనీ చూసుకుంటూ అతని కీర్తికి పరోక్షంగా కొంగుపట్టిన ఆమె కనీసం అతనితో పాటు ఫోటో దిగడానికి కూడా పనికిరాకపోయింది. తనూ ఉద్యమంలో పాల్గొని వుంటే ఎలా వుండేది అనుకుంటుంది ‘ఆయన కీర్తి వెనక’ కథలో. ‘మొగ్గు’ కథలో ‘నేను’ భర్తకీ కొడుక్కీ మధ్య నలిగిపోతూ ఆమె మనసు కొడుకు పక్షమే వున్నా “వాడో నేనో తేల్చుకో!” అని భర్త మూర్ఖంగా అన్నప్పుడు ఆమే ఒక్క క్షణం ఆలోచిస్తుంది: భర్తయినా కొడుకైనా ఇద్దరూ పురుషులే. ఏ ఒకరి దగ్గరున్నా తనకి అధీనతే. తనూ ఉద్యోగస్తురాలే. ఎవరిదగ్గరా ఉండక్కర్లేదు. కొడుక్కి తన అవసరం లేదు, చూసుకోడానికి అతనెంచుకున్న సహచరి వస్తోంది. ఇక తను లేకుండా గడవనిది భర్తకే–అని అతనిమీద సానుభూతితో “పోరా పిచ్చి వెధవా!” అని కొడుకుని ముద్దుగా విసుక్కున్నట్టే ఒక తల్లిలా అతని వైపే మొగ్గుతుంది. వయసులో భార్యలమీద పెత్తనం చేసిన భర్తలకి ముదిమిలో భార్యలనే చేతికర్రలు చాలా అవసరం. అయినా బింకం.

పనిప్రదేశాలలో స్త్రీలపై చాపకింద నీరులా ప్రదర్శించే లైంగిక హింస, వివక్ష, అణచివేతలను ‘కర్త కర్మ క్రియ’ కథలోనూ, పై అధికారుల మనస్తత్వాన్ని ‘మార్పు’ కథలోనూ సున్నితంగా చెప్పారు ఛాయాదేవి.

ఛాయాదేవి ప్రసిద్ధ కథ ‘ప్రయాణం’లో రమ యూనివర్సిటీ విద్యార్థిని. అక్కడ లెక్చరర్‌గా వున్న మూర్తిని ప్రేమించింది. కానీ సంప్రదాయాలకు విలువ ఇచ్చే ఆమె కుటుంబం అతనితో శాఖాంతరానికి సమ్మతించదని ఆమెకు తెలుసు. ఈ లోగా ఆమెకు తల్లితండ్రులొక సంబంధం కుదిర్చారు. అతను అన్ని విధాలా అర్హుడని తేల్చారు. కానీ రమ తన అసమ్మతి తెలిపి హైదరాబాద్ నించి విశాఖపట్నంలో తనింకా చదువుకుంటున్న యూనివర్సిటీకి బయలుదేరింది. తన జీవితానికి సంబంధించిన ముఖ్యాంశం పట్ల రాజీపడే ప్రసక్తి లేదనీ, తనని తను గౌరవించుకోవడం అంటే పెద్దల్ని ధిక్కరించినట్లు కాదనీ నమ్మిన వ్యక్తి ఆమె. హైదరాబాద్ నించి విశాఖపట్నం దారిలో అనుకోకుండా రాజమండ్రిలో కలిసిన ఆమె స్నేహితురాలు సుధ ఆమెను తనతో ఒక రోజు ఉండిపొమ్మని బలవంతపెడితే అక్కడ దిగిపోయింది. కానీ అదేరోజు రాత్రి సుధ భర్త కక్కుర్తికి బలైంది. అతనలాటివాడని తెలిసీ సుధ ఆమెను కాపాడలేకపోవడానికి కారణం, తన ప్రియస్నేహితురాలి మీద అటువంటి అఘాయిత్యం చేయబోడనే వెర్రి నమ్మకం. అప్పుడు కూడా తన భర్తకి ఇటువంటి అలవాట్లు వున్నప్పటికీ తనంటే ప్రేమ అని చెబుతుంది సుధ. ఇటువంటి చాలా కథల్లోకి మల్లే జరిగిన విషయానికి రోతపడుతూ కూర్చుని ఏడ్చి మొత్తుకుని స్నేహితురాలిని నిందించి ఆత్మహత్యా ప్రయత్నం చేసి తనను తను కించపరుచుకోదు రమ. ఆ రోతనంతా తన మనసులోనే భరిస్తూ విశాఖపట్నం వచ్చింది. అయితే జరిగినదాంట్లో తన తప్పులేదని తెలిసినా తను అపరిశుద్ధం అయిపోయానని భావిస్తుంది. కనుక ఈ విషయం దాచి మూర్తిని పెళ్ళి చేసుకోలేనని నిజాయితీగా అతనికి ఈ విషయం చెప్పేస్తుంది. అది విన్న అతను ‘నీళ్ల కుండీలో పడ్డ ఎలుకపిల్ల గట్టుమీదకు రాలేక లోపల నీళ్లలోకి పోలేక గిలగిల్లాడినట్లు’ బాధపడ్డాడు. అతని మానసిక బలహీనత చూశాక ఆమెకి మరింత విరక్తి కలిగి సన్యాసం పుచ్చుకుని కలకత్తాలో రామకృష్ణ మిషన్లో చేరిపోవాలనుకున్నప్పుడు, ఆమెకు సంభవించినది కేవలమొక ప్రమాదం మాత్రమేననీ, దానికీ పరిశుద్ధతకీ సంబంధమే లేదనీ, దాన్ని అక్కడికి మర్చిపోయి తన విలువైన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ తనకు సహచరిగా వుండమనీ, తనెవర్నైతే తిరస్కరించి వచ్చిందో ఆ శేఖరమే అర్థం చేయిస్తాడు. కొన్ని శతాబ్దాలుగా మనసులో ఇంకిపోయిన పరిశుద్ధత, కన్యాత్వం వంటి భావజాలంనించి బయటపడలేనిది ఒక యువకుడు. వీటికి అతీతంగా ఆలోచించగలిగిన మరొక యువకుడినీ, అతనిలో తనను గౌరవించగల సహచరుణ్ణి గుర్తించిన రమనూ రాబోయే కాలానికి కావలసిన వ్యక్తులుగా పాఠకులు గుర్తించారు. అందుకే ఈ కథకు మంచి పాఠకాదరణ లభించింది.

ఛాయాదేవి మరొక ప్రసిద్ధ కథ ‘సుఖాంతం’. పిల్లలకు చదువులూ పరీక్షలూ కంటినిండా నిద్ర పోనివ్వవు. పెరిగి పెద్దైనాక స్త్రీలకు సంసారమూ పిల్లల పెంపకం వాళ్ల చదువులూ వగైరాలతో నిద్ర వుండదు. పోనీ అన్ని బాధ్యతలూ నెరవేరాకైనా అనుకున్నపుడు నిద్ర పోడానికుంటుందా? ఎన్నో సమస్యలు… ఇంటివి, దేశానివి. పైగా పోస్ట్‌మ్యాన్‌కీ, ప్రతి పిలిచేగంటకీ, టెలిఫోన్‌కీ, వచ్చే పోయే వారికీ సమాధానాలు చెప్పాలి. ఒక వయస్సొచ్చేసరికి నిద్ర అసలు రాదు, మాత్రలకి తప్ప. అప్పుడవి ఒకటీ రెండూ చాలవు. మంచి నిద్ర కావాలంటే గుప్పెడే సరి అనుకుందావిడ. ఎందుకైనా మంచిదని ఒక చీటీ కూడా వ్రాసిపెట్టింది – ఇది ఆత్మహత్యా ప్రయత్నం కాదు, కేవలం నిద్ర కోసమే – అని. ఈ కథ చదివి “ఆమె ఎవరైతెనేం కాసేపు సుఖంగా నిద్రపోనివ్వండి, కదిలించకండి.” అనలేకపోతే మనం గుండె లేని మనుషులం అన్నమాట. కేవలం నిద్రేకాదు స్త్రీలకు దేనికీ వారి స్వంత సమయం అంటూ వుండదు.

ఇటీవలకాలంలో ఆమె వ్రాసిన ‘ఆఖరికి అయిదు నక్షత్రాలు’ కార్పొరేట్ వైద్య వ్యాపారాన్ని కళ్ళారా చూసి ఆవేదనతో ఆర్తితో వ్రాసిన కథ. ఇందులో ఆమె వాడిన మాటలు- షేర్ హోల్డర్స్, రక్త సంబంధం(తడవకీ రక్తం తెమ్మనడం), బిల్లు సంబంధం(ఎప్పటికప్పుడు వేలకొద్దీ బిల్లులు కట్టమనడం); చివరికి ఆమె చేసిన వ్యాఖ్య: “మరణాన్ని కొనుక్కోడానికి అంత దూరం అంత ప్రయాసపడి ఎవరూ వెళ్లక్కర్లేదు. మనం పిలిచినా పిలవకపోయినా రావలసిన సమయంలో అదే వస్తుందని అర్థమైంది”. అన్ని సదుపాయాలూ వున్న అయిదు నక్షత్రాల హాస్పిటల్లో కనీసం శవాన్ని పెట్టడానికి కూడా సరైన సదుపాయం లేక ఐస్‌గడ్డ చుట్టూ ఉప్పు చల్లి ఆ శరీరాన్ని అప్పగించడానికి బిల్లు అడిగిన తెంపరితనం… “ఏమీలేదు, యాంజియో గ్రాఫే!” అని నవ్వుకుంటూ వెళ్ళిన వ్యక్తి మరణించాడన్న వార్త చెప్పడానిక్కూడా ఆలస్యం చేసిన విష వ్యాపార సంస్కృతి ఇప్పుడు పాకుతోంది డేశమంతా. ప్రయివేటైజేషన్ విషసంస్కృతికి పుట్టిన వికృత శిశువుల్లా తయారయ్యాయి కొన్ని వైద్య వ్యాపార కేంద్రాలు.

వృద్ధాప్యంలో స్త్రీలను గురించి వ్రాసిన కథలు ‘ఉడ్ రోజ్’, ‘తన మార్గం’, ‘పరిధి దాటిన వేళ’. బోన్సాయి బ్రతుకు వలె ‘ఉడ్ రోజ్’ కూడా ప్రతీకాత్మకమైన కథ. ఇకబెనా పుష్పాలంకరణలో ఉడ్ రోజ్‌ను వృద్ధాప్యానికి చిహ్నంగా ఉపయోగిస్తారట. తన ఇంట్లో గుబురుగా అల్లుకుపోయి పచ్చని పువ్వులతో నిండుగా వుండి, వాటిలోనించి ఉడ్ రోజ్‌లు రాబోయే కాలానికి తీగెని మొదలంటా పీకిపెడతాడు ఆమె కొడుకు, ఇంట్లో వెలుగుకు అవరోధంగా వుందని. వృద్ధాప్యంలో విశ్రాంతితో విసిగిపోయిన తల్లి “మనిషికీ మనిషికీ మధ్య మమత ఆ తీగంత దట్టంగా పెరగకూడదేమో! అలా పెరిగితే పిల్లలైతే పీకి పారెయ్యగలరు, తల్లికి అల్లుకుపోవడమే తెలుసు.” అనుకుంటుంది కొంత తాత్వికంగా. అయితే ‘తనమార్గం’ కథలో వర్ధనమ్మ వృద్ధాప్యంలో ఎవరి పంచనా ఉండకుండా తన జీవనమార్గాన్ని తానే ఎంచుకొని ధైర్యంగా నిలబడింది. కొడుకుల విమర్శలకు తట్టుకుని నిలబడగలిగింది. అలా నిలబడే అవకాశం ఆమెకు భర్త వ్రాసి ఇచ్చిన ఇల్లు అనే ఆర్థిక వనరు వల్ల సాధ్యమైంది.

‘పరిధి దాటిన వేళ’ కథలో కథకురాలు ఎన్నడూ లేనిది స్వయంగా మందులు కొనుక్కోడానికి బజారుకు వెళ్ళి దారితప్పిపోతుంది. చివరికెలాగో చాలాసేపటికి ఇల్లు చేరుతుంది. ఈలోగా ఇంట్లోవాళ్ల కంగారు, నిష్టూరాలు, ఎందుకెళ్ళావని గుచ్చి గుచ్చి అడగడాలు. కూతురూ కొడుకూ కోడలూ ఎవరికి తోచింది వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. “ఇంట్లో అలా ఒక్కణ్ణీ నన్నొదిలేసి అలా వెళ్ళిపోయావేమిటీ?” అంటాడు భర్త. ఒంటరితనం అంటే తనకున్న భయాన్నీ, ఇంట్లో పనులన్నింటికీ నామీద ఆధారపడుతున్నారన్న నిజాన్నీ తన ‘అధికారం’ ముసుగు కింద దాచి, “ఇంకెప్పుడూ అలాంటి పిచ్చిపనులు చెయ్యకు” అంటూ నిశ్చింతగా పడుకున్నాడాయన. ‘అనుకోకుండా వీళ్లందరినీ కాసేపు ఓ ఆట ఆడించగలిగానని చాలాసేపు నిద్రపట్టలేదు నాకు’ అని కథకు ఓ చక్కని మెరుపు ముగింపిచ్చారు ఛాయాదేవి.

‘మూడునాళ్ల ముచ్చట’, ‘ఎవరి ఏడుపు వాళ్లది’, ‘నలుగురికోసం’, ‘బ్రహ్మాస్త్రం’ అనే కథల్లో చాయాదేవి నిశిత పరిశీలన, వాస్తవికతా దృష్టి, హాస్యమూ కలగలిసి వుంటాయి.

ఛాయాదేవి జీవన తాత్వికత జిడ్డు కృష్ణమూర్తిగారి తాత్వికతే.

అబ్బూరి ఛాయాదేవి కథలు, తనమార్గం, ఎవర్ని చేసుకోను? అనే కథా సంపుటాలే కాక, ఆమె ‘చైనాలో ఛాయాచిత్రాలు’ అనే యాత్రా కథనం, అపరిచిత లేఖ ఇతర కథలు, మృత్యుంజయ (ఒక తండ్రి కథ), వరద స్మృతి (సంకలనం), వ్యాసచిత్రాలు, బొమ్మలు చెయ్యడం, స్త్రీల జీవితాలు-జిడ్డు కృష్ణమూర్తి, మన సమస్యలు-కృష్ణాజీ సమాధానాలు, మన జీవితాలు-జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు, మొదలైన పుస్తకాలు ప్రచురించారు. 1954లోనే ‘కవిత’ పత్రికకు సంపాదకత్వం వహించారు. తరువాత ఆంధ్ర యువతీమండలికి ‘వనిత’ అనే పత్రికకు సంపాదకురాలిగా వున్నారు. 1989-90లలో ఉదయం పత్రికలో మహిళాశీర్షిక నిర్వహించారు. ఇటీవలి వరకూ స్త్రీవాద పత్రిక భూమికలో కాలమ్ వ్రాశారు. ఆమె జీవన సహచరుడు వరదరాజేశ్వరరావుగారి హాస్యోక్తులను వరదోక్తులు పేరున కార్టూన్లతో సహా సంకలనం చేసి ప్రచురించారు. తన జీవిత, సాహితీ జీవిత ఛాయాచిత్రమాలికను రూపొందించారు. ఆమె కథల ఇంగ్లిష్ అనువాదాల సంకలనాన్ని ఆథర్స్ ప్రెస్ ప్రచురించింది.

పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన ఛాయాదేవి 1953లో రచయిత, కవి అబ్బూరి వరదరాజేశ్వరరావుగారిని వివాహం చేసుకున్నారు. తరువాత లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. న్యూఢిల్లీలో కొంతకాలం (59-61) యునైటెడ్ సర్విస్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లైబ్రేరియన్‌గానూ, తరువాత జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్‌నేషనల్ స్టడీస్‌లో డిప్యూటీ లైబ్రేరియన్‌గానూ (72-82) పనిచేశారు. అప్పడే ఉద్యోగరీత్యా డాక్యుమెంటేషన్ కోసం ఒక సంవత్సరంపాటు (1976-77) ఫ్రాన్స్‌లో వున్నారు. తరువాత స్వచ్ఛంద పదవీవిరమణ చేసి (1982) హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అనేక పురస్కారాలతో పాటు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు కూడా అందుకున్నారు. కొంతమంది రచన వేరు, వారి వ్యక్తిత్వం వేరుగా వుంటారు. ఛాయాదేవి రచనే ఆమె వ్యక్తిత్వం. వరదరాజేశ్వరరావుగారి నిష్క్రమణ అనంతరం ‘వరద స్మృతి’ అనే ప్రేమ కానుక ప్రచురించారు. ఆమె కథలతో పాటు తండ్రికీ ఆమెకూ మధ్య నడిచిన లేఖాస్రవంతి మృత్యుంజయ ఎన్నదగిన రచన.

చదువరుల మిత్రుల హృదయాలలో ఆమె సదా నిలిచి వుంటారు. కభి అల్విద న కహనా…
-------------------------------------------------
రచన: పి. సత్యవతి, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, August 27, 2019

In the Pupil


In the Pupil

సాహితీమిత్రులారా!

(Witches Sabbath – Stanley Hayter)

బిడియపడుతూ అరమోడ్పు కనుల వెనక దాక్కొనే దోబూచలాట మనుషుల ప్రేమ–అది సంజెలోకి మాయమవుతుంటుంది. చీకటినీడల వెనుక తారట్లాడుతుంటుంది, గుసగుసగా మాట్లాడుతుంటుంది, పరదాల మాటున పొంచి ఉండి, దీపాలు ఆర్పేయడానికే ఉత్సాహపడుతూ ఉంటుంది.

సూర్యుడంటే నాకేం అసూయ లేదు. అతను కిటికీ సందుల్లోంచి తొంగి చూస్తానంటే కూడా నాకేం అభ్యంతరంలేదు–నేను కూడా అక్కడున్నంతవరకూ!

ప్రేమ వ్యవహారాలకి అర్ధరాత్రులకంటే మిట్టమధ్యాహ్నాలు సరిపోతాయని నా అభిప్రాయం. కవులూ ప్రేమికులూ చందమామనే ప్రేమికుల చక్రవర్తిగా పట్టం కట్టడానికి ప్రయాసపడ్డారు కానీ, చీకటితెరల మాటున మసకబారిన ఆ రాత్రి సూర్యుడంటే నాకు రోత. ‘సరే’ అని అంగీకరించిన ఒక ప్రేమ, దాని పర్యవసానాలు–గురించిన ఈ కథ మొదలైంది పట్టపగలు, వెలుగు కోసం బార్లా తెరిచిన ఒక కిటికీ ముందు. ఈ కథ ముగింపు రాత్రికి, పగటికి మధ్య ఉన్నంత తేడాతో ఆమెను ఆశ్చర్యపరచివుంటే ఆ తప్పు నాది కాదు. ఆమెది. ఎవరి ‘సరే’కోసమయితే నేను తపించిపోతూ ఎదురుచూశానో ఆమెదే.

ఆమె నా ప్రేమని అంగీకరించడానికి ముందు జరిగిన సంఘటనలు కొన్ని ఇక్కడ చెప్పాలి. ఒక్క సంగతి బల్లగుద్ది చెప్పవచ్చు. ప్రేమలో, కళ్లు…ఎలా చెప్పాలి, కళ్ళు మిగతావాటికంటే ముందుంటాయి. ఎందుకంటే, అవి చురుకైనవి, పనిమెళకువ తెలిసినవి. చూడగలవు, చదవగలవూ కూడా. ప్రేమికుల శరీరాలు వాటితో పోలిస్తే మోటుగా నేర్పు లేకుండా ఉంటాయి. తమను రెండవది చూడకుండా బట్టల వెనక దాచుకుంటాయి. చివరికి పెదాల మీంచి వచ్చే మాటలు కూడా తచ్చాడుతూ ఉంటూండగానే, కళ్ళు మాత్రం అప్పటికే ప్రేమకి దాసోహమవుతుంటాయి.

నాకు ఇంకా ఆ రోజు కళ్లకి కట్టినట్టే ఉంది. మెరిసిపోతున్న ఎండలో నీలిరంగు ఆకాశంలోకి తెరుచుకున్న కిటికీ దగ్గర నిల్చునున్న మేము, ఏదో ఒప్పందానికొచ్చినట్టు ఒకేసారి ఒకర్నొకరం చూసుకున్నాం. చూపులు కలిసాయి. అదిగో అప్పుడు చూశానతన్ని. ఆమె కనుపాపల్లోంచి నాకేసి చూస్తున్న నా చిన్ని ప్రతిరూపాన్ని. నేనింకా ఆమె గౌన్ అంచు కూడా తాకనే లేదు, కాని వాడప్పుడే అక్కడ… ఆ కళ్ళల్లోకి చొరబడ్డాడు. అతన్ని చూసి చిరునవ్వు నవ్వాను. అతను కూడా మర్యాదగా తలూపాడు, ఈలోగా ఆమె కళ్లు తిప్పుకుంది. మళ్లీ వాడు నేను, ఆమె ఆ ‘సరే’ చెప్పేదాకా ఒకరికొకరు కనపడలేదు.

గుసగుసగా, చప్పుడు లేకుండా ఆమె ఒప్పుకుంటూ చెప్పిన ‘సరే’ విన్నప్పుడు నేనింక తటపటాయించలేదు. ఆమె చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని, దగ్గరకి లాక్కున్నాను. అప్పుడు మళ్ళీ చూశానతన్ని, ఆమె గుండ్రటి కనుపాపల్లోంచి తొంగి చూస్తూ, నా వైపుకి, నాకు దగ్గరగా తన మొహాన్ని తేవడానికి ఉరకలేస్తున్నాడు. ఒక్క రెప్పపాటు అతన్ని దాచేసింది, కానీ మళ్లీ కనిపించి వెంటనే మాయమైపోయాడు. వాడి మొహంలో ఆనందం, తృప్తి నేను గమనించగలిగాను. అదిగో, అప్పడినుండీ, ఆమె పెదవులను నా పెదవులతో కలపబోతున్న ప్రతీసారి ఆ రెప్పల వెనక వాడికోసం చూసేవాడిని. ప్రతిసారీ వాడు అక్కడే, ఆ కంటిపాప కచేరీలో కుదురుగా కూర్చునుండేవాడు. వాడి మొహం ఎంత చిన్నగా ఉన్నా కూడా అందులోని హావభావాలు నాకు తెలిసిపోయేవి. ఒక్కోసారి కేరింతలు కొడుతూ, ఒక్కోసారి అలిసిపోయినట్టుగా, ఒక్కోసారి ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయి…

ఒకరోజు ఆమె కన్నుల్లో దొంగలా దాక్కున్న ఆ కనుపాపడి గురించి చెప్పాను. నా ఊహలూ చెప్పాను. ఆశ్చర్యంగా, ఆమెకి నచ్చలేదు.

“ఇదేం పిచ్చి!” కనుపాపలు దూరంగా జరిగాయి. తన మొహాన్ని నా చేతుల్లోకి తీసుకుని, బలవంతంగా ఆ మరుగుజ్జువాడికోసం ఆ కళ్లలో గాలించాను. తను పకపకా నవ్వేసి, కనురెప్పలు దించేసింది.

“ఊహూ, ఊహూ.” ఆమె నవ్వులో నవ్వుకానిదేదో గోచరమైంది.

ఒక్కోసారి అసంగతమైన ఒక చిన్న విషయానికి అలవాటుపడిపోతాం. దాని గురించే ఆలోచిస్తూ, విశ్లేషిస్తూ దానికో అర్థాన్ని అస్తిత్వాన్ని కల్పిస్తాం. మనకు తెలిసేలోపే ముఖ్యమైనవాటిని, నిజాలని తిరస్కరిస్తూ, తోసిరాజంటూ అది చెయ్యెత్తి, ధైర్యంగా తన హక్కులని అడగడం మొదలెడుతుంది. నేను కనుపాపడికి అలవాటుపడిపోయాను. పిచ్చాపాటీ మాట్లాడుతున్నప్పుడు ఆమెతో పాటుగా, వాడుకూడా శ్రద్ధగా వినడం నాకు సంతోషంగా ఉండేది. మా ఇద్దరిమధ్యా ఆ అలవాటు ఒక ఆటగా మారింది. తను అతన్ని దాచెయ్యడానికి ప్రయత్నించడం, నేను వాడిని వెతుకుతూ ఉండటం (ప్రేమికులు ఏమేం చెయ్యగలరో ఎవరికెరుక!), ఇదీ ఆ ఆట, నవ్వుల్లోను, ముద్దుల మధ్య సాగుతూ ఉండేది. ఒకరోజు–ఇప్పటికీ ఆరోజుని తల్చుకుంటే గుండె మెలిపెట్టినట్టుగా ఉంటుంది–నా పెదాలతో ఆమె పెదాలని అందుకోవాలని ముందుకు వంగాను, అలవాటుగా ఆమె కళ్లలో వాడికోసం చూశాను. ఆ కనురెప్పల కిందగా కనిపించి చేయి ఊపాడు. వాడి కళ్ళల్లో ప్రయత్నపూర్వకంగా దాచుకుంటున్న విషాదం. చప్పున వెనుతిరిగి ఆమె కంటిపాప లోలోపలికి పరుగెత్తిపోయాడు.

“వచ్చి నన్ను ముద్దు పెట్టుకో.” ఆమె కనురెప్పలు వాడిని దాచేశాయి.

“ఆగు!” నన్ను నేను మరిచిపోయి, ఆమె భుజాలు నొక్కుతూ అరిచాను. భయంతో విచ్చుకున్న ఆమె కనుపాపల లోతుల్లో వెన్ను చూపి వెళిపోతున్న నా కంటిపాపడిని ఆఖరిసారి చూశాను. ఏమైంది ఏమైందని ఆమె ఆత్రుతగా అడుగుతున్న ప్రశ్నలకి నేను ముక్తసరిగా ఏదో సమాధానం కల్పించి చెప్పాను. ఆపైన చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. నాకు తెలుసు; ఆట అయిపోయింది.

2.
కొన్నిరోజులు ఆమెకి గానీ, ఇంకెవరికీగానీ, నా మొహం చూపించలేదు. ఇంతలో, క్రీమ్ కలర్ కవర్లో ఒక ఉత్తరం బోలెడన్ని ప్రశ్నలతో నన్ను వెదుక్కుంటూ వచ్చింది. ‘అనుకోకుండా, ఎటైనా వెళ్లాల్సి వచ్చిందా? ఆరోగ్యం బానే ఉందా’? ‘బాలేనిది నా ఆరోగ్యమేనేమో’ అనిపించింది నాక్కూడా. ఏటవాలుగా, కొక్కిరిబిక్కిరి దస్తూరిని మరొకసారి చూడగానే ఇక ఆగలేక ఉన్నపళంగా ఆమెని చూడడానికి బయలుదేరాను. ఆమె ఇంటిదాకా వచ్చికూడా ఆ వీధిలోనే ఒక బెంచీ మీద కూర్చుండిపోయాను, సాయంత్రంకోసం ఎదురుచూస్తూ. ఖచ్చితంగా ఇది నా పిరికితనం, సందేహం లేదు. నాకు చూడనిది, మరి ఇంక ఎప్పటికీ కనిపించదేమోనని నా భయం. ఆమె కన్నుల్లో నా కళ్ళతో మరొకసారి వెతకవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. నాకూ అలానే అనిపించింది. అసలు ఇదంతా నా భ్రమే కావొచ్చు. కనుపాప కట్టిన భ్రమ కావచ్చు. కాని, ఇది భ్రమ కాదు అని ఋజువు చేసుకోవాలనే ఆలోచన కూడా వాడి అస్తిత్వాన్ని, నా మతితప్పిన స్థితిని రెండు ప్రత్యేకమైన అస్తిత్వాలుగా నిర్ధారిస్తుంది. నమ్మినదాన్ని ఋజువు చేసుకోడానికి ఆ రెంటికీ వేర్వేరు అస్తిత్వాలు ప్రకటిస్తుంది. వాడు నిజమే అయి, నాది భ్రమే అయితే, దాన్ని తార్కికంగానే తేల్చేయాలి కాని ప్రయోగం ద్వారా కాదు. కల్పనను ఋజువు చేయడానికి చేసే ప్రయోగం ఆ కల్పనను నిజం చేస్తుంది. నా భయాన్ని నానుంచి నేను సులభంగానే దాచిపెట్టుకున్నాను. నేను బెంచీ మీద ఎందుకు కూర్చున్నాను: ‘సాయంత్రం బయట ఆహ్లాదంగా బావుంది; చాలా దూరం నడిచి అలసిపోయాను; ఆ చిట్టి కంటిపాపడు ఒక కథకి మంచి వస్తువనిపించింది కాబట్టి; ఇక్కడ హాయిగా కూర్చొని కనీసం ప్లాట్ అయినా రాసుకోవచ్చు.’ ఇలా.

ఆవరించుకుంటున్న చీకటి నన్ను చివరికి ఆమె ఇంట్లోకి నెట్టింది. ‘ఎవరూ?’ ఇంటి లోపలనుంచి వినిపించిన ఆమె గొంతు, కొద్దిగా ఆమెది కానట్టుగా, కొద్దిగా ఇంకెవరికోసమో అన్నట్టుగా.

“నువ్వా, మొత్తం మీద ఇన్నాళ్లకి!”

ఆమె గదిలోకి వెళ్లాం. సంజెవెలుగులో ఆమె తెల్లటి చెయ్యి లైట్ స్విచ్ అందుకోబోయింది.

“వద్దు. లైట్ వెయ్యకు.” అంటూ ఆమెని దగ్గరకి లాక్కున్నాను. మా శరీరాలు కలిసివున్నంతసేపు కళ్ళు మూసుకునే ఉన్నాయి. చీకటి కప్పిన ప్రేమ. ఆ సాయంత్రం మేము లైట్ వెయ్యలేదు. మళ్లీ ఎప్పుడు కలుద్దామో నిర్ణయించుకొన్నాక, కోర్ట్ స్టే ఇచ్చినవాడిలా నేను తిరిగి వచ్చేశాను.

ఇక్కడ నుంచీ జరిగిన తతంగం వివరాలు చెప్పడం అనవసరం – ముందుకు పోతున్నకొద్దీ, నిరాసక్తంగా తయారవుతుంది. పెళ్ళి అయిన మగవాడెవడైనా ఈ అధ్యాయాన్ని సునాయాసంగా చెప్పగలడు: మధ్నాహ్నం నుంచి అర్ధరాత్రికి మారిన మా కలయికలు నిస్సారంగా, కొత్తదనం లేకుండా, విరసంగా అయిపోయాయి. మా ప్రేమ కూడా జీవం కోల్పోయి ఒక అలవాటుగా తయారైంది. మంచం డబుల్ బెడ్ అయింది, పక్కన మేజోళ్ళు, మూలన బాత్రూమ్‌తో సహా. తిరిగి ఈ ప్రేమలో వేడిని ఊదడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. పొరపాటున ఆమె కనుపాపల్లోకి చూస్తానేమో, వాటిని ఖాళీగా నేను లేకుండా చూడాల్సివస్తుందేమోనన్న భయం, నన్ను తెల్లవారకముందే లేపి తయారుచేయించేది. మొదట్లో తెల్లారకుండానే నేను వెళ్ళిపోవడం ఆమెకు కొత్తగా అనిపించింది. కొంతకాలానికి అది కూడా అలవాటైపోయింది.

ఓ పెళ్ళి అయిన మగవాడుగారూ, మీకు కృతజ్ఞతలు. తతిమ్మా కథ నేనే చెప్తాను!

తెల్లవారుజాము చలిలో ఇంటివైపు నడుస్తూ, అప్రయత్నంగానే కంటిపాపడి గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. క్రమక్రమంగా, వాడి ఆలోచన నన్ను భయపెట్టడం మానేసింది. ఒకప్పుడు వాడి అస్తిత్వం నన్ను భయపెట్టేది, వాడి తాలూకు ఊహే నాలో అనుమానాన్ని, తొట్రుపాటుని కలగచేసేది. కాని ఇప్పుడు వాడు కేవలం ఒక కల్పన, ఒక భ్రమ అనేది నన్ను విచారంలోకి నెడుతుంటుంది.

‘అసలు ఎంతమంది ఉండుంటారు ఇటువంటి కంటిపాపళ్లు? ఎంతమందిని మనం ఇతరుల కళ్లలోకి జల్లి పోస్తుంటాం?’ అని అప్పుడప్పుడూ, నిర్మానుష్యమైన వీధుల్లో నడుస్తూ, ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎందరి కళ్లల్లోనో బతుకుతున్న నా ప్రతిబింబాలందర్నీ ఒకచోట పోగుచేస్తే ఈ మరుగుజ్జు ‘నేను’లతో ఒక చిన్న దేశం నిండిపోతుందేమో… నిజమే, నేను చూసినప్పుడే వాళ్ల ఉనికి, కానీ నా ఉనికి కూడా ఒక అమ్మాయి నన్ను చూసినప్పుడే కదా? కానీ, ఆ చూసిన అమ్మాయి కళ్లు మూసేసుకుంటే, అప్పుడో… ఓహ్, చెత్త ఆలోచన! అవును, చెత్తే అనుకో. కానీ, నేను ఇంకొకరి కంటిపాపడు కాకుండా నాకంటూ ఒక ఉనికి ఉన్నట్టయితే, నా ప్రియురాలి కంటిలో ఉన్న ఆ చిన్ని ప్రతిబింబానికీ ఒక ప్రత్యేకమయిన ఉనికి ఉన్నట్టే కదా.

నిద్రమత్తులో ఇలాంటి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చేవికావు. చుట్టలు చుట్టలుగా చిక్కుపడిపోయిన వాటిని మళ్లీ సావకాశంగా విప్పుతూ ఉండేవాడిని. ‘అసలు వాడు ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? ఎక్కడికి వెళ్లుంటాడు? సరే, ఆమె కనుపాపల్లో వాడిప్పుడు లేడు. అయితే ఏం? నాకు ఆమె కళ్లలో తళుక్కుమని మెరిసి మాయమైపోయే ఈ మరుగుజ్జు అవసరం ఏముంది? వాడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నా వ్యవహారాల్లో దూరి, నా జీవితాన్ని, ప్రేమని ఒక అభాసగా మార్చేసి, మా ఇద్దరిని విడగొట్టడానికి ఆ పాపిష్టి పాపడికెంత ధైర్యం!’

ఈ ఆలోచన గట్టిగా పట్టుకున్నాక, ఒక్కోసారి మళ్లీ ఆమె దగ్గరకి వెళ్ళాలనిపించేది, ఆమె కన్నుల వెనుక దాగిన రహస్యాన్ని విప్పాలనిపించేది: ఆ కనుపాపలో అసలు వాడు ఉన్నాడా, లేడా?

కానీ, ఎప్పుడూ సాయంత్రం పడకముందు నేను వెళ్లలేదు. ఒకవేళ ఆమె గదిలో ఇంకా లైట్ వెలుగుతుంటే, ఆమె కౌగిలింతలకు తల తిప్పుకునేవాడిని. చీకటి మా కళ్ళకు గంతలు కట్టేదాకా, ఎలానోలా అంతగా కదలిక లేకుండా ఉండేవాడిని. ఆపైన ధైర్యంగా ఆమె ముఖంలో ముఖం పెట్టి ఆ చీకటిలో తరచి తరచి అడిగేవాడిని. ‘యూ లవ్ మి? డూ యు లవ్ మి?’ మెల్లిగా ఆ రాత్రి మా అలవాటుగా మారిపోయేది.

3.
ఒకరోజు రాత్రి నిద్రమత్తులో ఉండగా, ఏదో నా కనురెప్పని కొద్దిగా పట్టిలాగినట్టు అనిపించింది. ఉలిక్కిపడి లేచాను, చిన్న కీటకం లాంటిదేదో నా ఎడమకంటిని రాచుకుంటూ, బుగ్గమీదనుంచి నా చెవుల్లోకి పాకి కీచుగొంతుతో అరిచింది: “వాట్ ది హెక్! ఇదేదో ఖాళీ అపార్ట్‌మెంట్ లాగా ఉంది. ఇక్కడెవరూ లేరు.”

“ఏంటీ?” ఇంకా అది కలో నిజమో తెలీని మత్తులో గొణిగాను.

“ఏంటి అని కాదు, ఎవరని అడుగు. అది మొదటి విషయం. రెండోది నీ చెవిని కాస్త తలగడకి దగ్గరగా వంచు, నేను దిగాలి. ఇంకొంచెం దగ్గరగా, ఇంకా… గుడ్.”

తలగడ అంచు మీద, ఇంకా తెల్లారని బూడిదరంగు వెలుగులో మసకగా కనిపిస్తూ, కూర్చొనున్నాడు, వాడే నా కంటిపాపడు. కష్టమైన ప్రయాణం చేసి చేసి అలసిపోయిన బాటసారిలా, చేతులు తలగడ అంచుకి ఆనించి, వగరుస్తున్నాడు. వాడి మొహంలో తీవ్రమైన విచారం కనిపిస్తోంది, వాడి చేతుల్లో బూడిద రంగు టాకాలు వేసిన నల్లటి పుస్తకం.

వాడికేసి ఆశ్చర్యంతో చూస్తూ, “అయితే నువ్వు భ్రమవి కాదన్నమాట!” తెలీకుండానే పెద్దగా అరిచాను.

“అదేం పిచ్చి ప్రశ్న! అరవకు. ఆమె లేస్తుంది. నీ చెవిని ఇలా దగ్గరకి పెట్టు. నీకు చెప్పాల్సింది ఒకటి ఉంది.”

అలిసిపోయిన తన కాళ్లు జాపుకుని, విశ్రాంతిగా కూచుని, గుసగుసగా నా చెవిలో చెప్పడం మొదలెట్టాడు:

ఆమె కంటిపాపలోకి నేను ఎలా చేరిందీ నీకు తెలుసు, దాని గురించి నేను చెప్పక్కర్లేదు. ఆ కథంతా మనిద్దరికీ బాగా తెలుసు. నా కొత్త ఇల్లు నాకు నచ్చింది. అద్దాల ప్రతిబింబాలతో, ఒక చిన్న ఏడురంగుల ఫ్రేము ఉన్న కిటికీ వెచ్చగా ఒద్దిగ్గా ఉండేది. ఉబ్బిన అద్దాలు ఎప్పటికప్పుడు కంటినీరుతో శుభ్రంగా తుడవబడుతూ ఉండేవి. రాత్రి అయ్యేసరికి, వాటంతట అవే కర్టెన్లు మూసేసి చీకటిపడేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, అన్ని సౌకర్యాలూ వున్న అపార్ట్‌మెంట్. కానీ ఇంటి వెనకవైపు, పొడుగాటి వసారా ఉంది, చీకటిగా ఉండేది. అదెక్కడికి పోతుందో ఎవడికి తెలుసు. ఎప్పుడూ ఆ కిటికీ దగ్గరే కూచుని నీకోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. నా వెనక ఏం ఉందో నేనూ ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒకరోజు, ఎదురుచూసినట్టుగా మన మీటింగ్ జరగలేదు. మరీ లోపలికి పోకుండా ఆ వసారా మొగదల లోనే పచార్లు చేశాను. మరీ లోపలికి పోతే నిన్ను కలవలేనేమో అని భయం. ఈలోగా, కంటిపాప బైట వెలుతురు పల్చబడింది. ఇక నువ్వు రావు అనుకున్నాను. ఏమీ తోచలేదు. సరే కాలక్షేపం అవుతుంది కదా అని ఆ వసారాలోకి నడిచాను. కంటిపాప బయట వెలుతురు తగ్గిపోతోందని చెప్పాను కదా, ఇంతలో నన్ను కటికచీకటి కమ్మేసింది. చేతులతో గాలిని తడుముకుంటూ నడుస్తూ లోపలికి పోయాను. వెనక్కి తిరిగి వచ్చేద్దామనుకుంటుండగా, సన్నటి గొంతు ఒకటి దుప్పట్లోంచి మాట్లాడుతున్నట్టుగా ఆ వసారా లోలోపలినుంచి వినిపించింది. అదేమిటో అని చెవులు రిక్కించి విన్నాను. చాలామంది కలిసి, శ్రుతి తప్పుతూ, ఒక రాగాన్ని ఆలాపిస్తున్నారు. నా చెవులకి అందులో రెండు పదాలు కూడా స్పష్టంగా వినిపించాయనుకుంటా: ‘ఉరిశిక్ష’, ‘మరణం’. మిగిలిన పాట వినిపించలేదు. ఇది నాలో కుతూహలం రేపింది. కానీ, కనుపాప పూర్తిగా మూసుకొనిపోతే తిరిగివచ్చే దారి కనపడదన్న భయంతో తిరిగి వచ్చేశాను.

కానీ ఈ వ్యవహారం అక్కడతో అయిపోలేదు. మరుసటిరోజు, కిటికీ దగ్గర నేను కూర్చున్నచోటునుంచే మళ్లీ రణగొణగా ఆ పాట వినిపించింది. పాట స్పష్టంగా వినిపించలేదు కాని బృందంలో అన్నీ మగగొంతుకలే అని అర్థమయింది. ఈ విషాద పరిస్థితి నన్ను ఆగనీయలేదు. వసారా ఆ చివరిదాకా వెళ్ళి అదేదో చూడాల్సిందే! అనుకున్నాను. కానీ, అటువైపు వెళ్తే ఎవరున్నారో, ఎలాంటివారో, మళ్లీ తిరిగి ఈ కిటికీ దగ్గరకు రాగలనో లేదో అని తటపటాయించాను. రెండు మూడు రోజులపాటు మళ్లీ ఆ పాట వినపడలేదు. నేనే లేనిపోనిదేదో ఊహించుకున్నానేమో అనుకున్నాను. ఒక రోజు మధ్నాహ్నం, తనూ నేనూ మాకు అలవాటైన కిటికీల దగ్గర కూర్చుని నీకోసం ఎదురుచూస్తున్నాం. అప్పుడు మళ్లీ ఆ పాట వినిపించింది మరింత బలంగా, మరింత పెద్దగొంతుకలతో. అపశ్రుతిలో వినిపిస్తున్న ఆ పాటలోని పదాలు మూలుగుతున్నట్టుగా సాగుతూ గింగిరాలు తిరుగుతూ నా చెవుల్లో మ్రోగడం మొదలెట్టాయి. వాటి అర్థం ఎలాటిదంటే, ఇక నాకు ఆ పాటగాళ్లని కలవక తప్పలేదు. నీకు చెప్పకుండా వెళ్లడం మాత్రం నాకు ఇష్టంలేదు. నీకు గుర్తుందిగా, నీకు వీడ్కోలు చెప్పే వెళ్లాను ఆ రోజు. నువ్వు ఆశ్చర్యపోయినట్టుగా కనిపించావు, నేను ఆ కంటిపాప లోలోపలికి వెళ్ళిపోయాను. అక్కడంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. ఆమె కళ్లలోంచి వస్తున్న వెలుతురు క్రమక్రమంగా తగ్గిపోతూ, పోను పోనూ దారంతా చిమ్మచీకటిగా ఉంది. నా అడుగులు ఆ చీకట్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ వసారా చీకటి గోడలు తడుముకుంటూ నేను ముందుకి పోయాను. ఆఖరికి చావుపచ్చ వెలుగు కనిపించింది. నిరాశతో వినాశంతో ఈనెలు విరబోసుకున్న ఈతచెట్టులా ఉంది ఆ వెలుతురు. హఠాత్తుగా, నాకు ఎక్కడలేని అలసట, నిరుత్సాహమూ ఆవరించుకున్నాయి. ‘ఏం వెతుక్కుంటూ వచ్చానిక్కడికి, ఈ చీకటి సమాధుల్లో ఏముంది?’ అనుకుంటూ, ‘ఈ చావుపచ్చని వెలుగుకోసం సూర్యకాంతిని వదులుకోవడం ఎందుకు?’ అని వెనక్కు తిరిగేవాడినే కాని, అంతలో, ఆ పాట మళ్లీ మొదలైంది. ఇప్పుడు ఆ మాయదారి స్తోత్రంలో, నాకు ప్రతిఒక్కరి గొంతూ స్పష్టంగా వినపడుతోంది:

మగ-మగ-మగాడా, చిట్టోడా, పొట్టోడా, మరుగుజ్జు మరుగుజ్జు మగాడా
బతుకు మీద తీపుంటే, అడగాలోయ్ పాపల్నీ,
నువు దూకకముందే పాపల్నీ కంటిపాపల్నీ
బేసి బేసి. ఒకటీ-మూడూ-ఐదూ-ఏడూ…

కంటిపాపల్లో
కంబాలు, కంబాలు,
ఉరికంబాలున్నాయోయ్.
నీకు నువ్వే తగిలించుకో
ఉరితాడు బిగించుకు పో, చచ్చిపో.
నిట్టూర్చి నిప్పై రగిలిపో, రగిలిపో
బూడిదవై రాలిపో, ఆరిపో
సరి సరి రెండు-నాలు-గారె-నిమిది.

మరుగుజ్జు మగాడా. మరుగుజ్జు మగాడా
కంగకు, కంగకు, కంగారెందుకు
జాగ్రత్త, జాగ్రత్త – జారేవు జాగ్రత్త
తెగిపోయిన బంధం
హృదయానికి రంధ్రం
కత్తివాదరపైనే
నీ కాలం ఇకపై అరగాలి
బేసి బేసి ఒకటీ-మూడూ-ఐదూ-ఏడూ…

మరుగుజ్జు మగాడా, మరుగుజ్జు, మరుగుజ్జూ ఉజ్జుజ్జుజ్జ్ …

ఇలా వచ్చేవు అలా వెళ్లేవు
తడిలో నీడవై
ఇసకలో జాడవై
విను విను రెండు-నాలు-గారె-నిమిది

అసంబద్ధమైన ఆ పాట చేపను పట్టుకున్న గాలంలా నన్ను తనలోకి లాక్కుంటూ తీసుకెళ్ళింది. ఇంతలో ఒక గుండ్రటి బిలద్వారం లాంటిది కనిపించింది. అందులోంచే వస్తోంది ఆ చావుపచ్చటి వెలుతురు. చేతులతో అంచులు పట్టుకుని, లోపలికి తలపెట్టి చూశాను. కింద శూన్యంలోంచి పది పన్నెండు గొంతులు ఊళలు వేస్తున్నాయి. మిరుమిట్లు కొలిపే పచ్చటి వెలుతురులో నా కళ్లు బైర్లు కమ్మాయి. కళ్లు చిట్లించుకుని, కొద్దిగా ముందుకు వంగాను, పాకుడుపట్టిన ఆ బిలద్వారం కుంగిపోయి నేను కాళ్ళు చేతులు కొట్టుకుంటూ బిలంలోకి పడిపోయాను. మరీ లోతుగా ఏం లేదు. లేచి కూర్చొని చుట్టుపక్కల చూశాను. ఆ వెలుతురికి కొద్దికొద్దిగా కళ్లు అలవాటు పడుతున్నాయి. నేను ఒక సీసా లాంటి దాంట్లో ఉన్నాను; సీసా కిందభాగం ఉబ్బెత్తుగా ఉంది. దాని మీద ఉన్నాను నేను; సీసా గోడలు రక్తనాళాల లాగా ఉబుకుతూ తగ్గుతూ ఉన్నాయి. నా కిందనుంచి ఒక ముద్దలాంటి దానిలోంచి ఆ పచ్చటి కాంతి వస్తోంది. నా చుట్టూరా ఒక పదిమంది మనుషులు, నీడలో సగం కనిపించకుండా అరికాళ్ళు ఆ వెలుగు మీద నిలబడి మొహాలు గోడలవైపు పెట్టి పాడుతున్నారు. వాళ్లు పాడుతున్న పాట చివరి చరణంలోకి వచ్చినట్టున్నారు.

మరుగుజ్జు మగాడా, మరుగుజ్జు, మరుగుజ్జూ ఉజ్జుజ్జుజ్జూ
ఇలా వచ్చేవు అలా వెళ్లేవు
అడుసులో అడుగువై
తడిలో నీడవై
ఇసకలో జాడవై
ఏదీ మరొకసారి
పట్టుకో పాతపల్లవినీ
విను విను రెండు-నాలు-గారె-నిమిది

‘నేనెక్కడున్నానూ?’ నా ప్రశ్న ఆ ఊళలాంటి పాటలో ముణిగిపోయింది. బయటకి దారి వెతుక్కుందామని, నిలుచోబోతూ పట్టు తప్పి ఆ సీసా అంచుల్లోంచి ఇంకా కిందకి పడిపోయాను, అక్కడి వాళ్లందరి నవ్వుల మధ్య జారుతూ, సరిగ్గా ఇద్దరి మధ్యలో కూలబడ్డాను.

‘ఎక్కువమందైపోతున్నారు’ అని నా ఎడమవైపు మనిషి విసుగ్గా గొణిగాడు. నాకు కుడివైపునున్న మనిషి మాత్రం స్నేహంగా చూశాడు. పిడచకట్టుకుని ముందుకు పొడుచుకొచ్చిన నుదురు, సాలోచనగా కళ్ళు, వంకీ గడ్డం, బట్టతలను కప్పుతూ వెనకకు సాపుగా దువ్విన జుట్టు–ప్రొఫెసర్‌లకు ఉండాల్సిన మొఖం అది.

“మీరెవరు? నేనెక్కడ ఉన్నాను?”

“మేమా? మేము నీ పూర్వీకులం. అర్థం కాలేదా ఇంకా? ఆడవారి కంటిపాపలన్నీ అద్దెయిళ్ళ లాంటివే. ముందు రానిస్తారు, ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా బయటకి నెట్టేస్తారు. ఆ అందరూ ఇదిగో ఇక్కడ తేల్తారు. ఉదాహరణకి నేను ఆరోవాడిని, నీకు ఎడం పక్కన ఉన్నవాడు రెండో నెంబరు. నువ్వు నెంబర్ పన్నెండు. ఇది వరుస బట్టి కాదు అనుబంధం బట్టి. అర్థం అవుతోందా, లేదా వివరంగా చెప్పమంటావా? ఇంతకీ తలకు దెబ్బలేం తగల్లేదు కదా?”

“గోడలు గుద్దుకునా?”

“కాదు, అర్థం కాకపోవడాన్ని గుద్దుకుని.”

ఒక్క నిముషం మౌనంగా ఉన్నాం ఇద్దరమూ.

“సర్లే కానీ, నువ్వు ఇలా వదిలించుకోబడడాన్ని నమోదు చేసుకోడం మాత్రం మరిచిపోకు. ఓహ్, ఈ అమ్మాయిల కంటిపాపలు…” గడ్డం దువ్వుకుంటూ కొనసాగించాడు “అందమైన రెప్పల నీడలనుండి ఆహ్వానిస్తూ ఉంటాయి. ఎంత అందమైన ద్వారమో, హరివిల్లు రంగుల కిటికీతో! కానీ లోపల మాత్రం అంతా భయంకరమైన చీకటి. ఒకప్పుడు నేను కూడా…”

మధ్యలో అడ్డుకున్నాను. “మిమ్మల్నెవరు నమోదు చేశారు?”

“క్వాగ్గా.”

“అలాంటి పేరెప్పుడూ వినలేదే.”

“నీకు టెలీగొని గురించి తెలుసా?”

“ఊహూ..”

“అయితే నీకు లార్డ్ మోర్టన్ ఆడగుర్రం గురించి అస్సలేం తెలియదన్నమాట.”

“దానికి, దీనికి ఏమిటి సంబంధం?”

“ఏమిటి సంబంధమా? చెప్తాను విను. 16వ శతాబ్దపు జార్జ్ డగ్లస్, ఎర్ల్ ఆఫ్ మోర్టన్‌ అనే రాజుకు ఒక ఆడగుర్రం ఉండేది. క్వాగ్గా అంటే జీబ్రాలా ఉండే గుర్రం. కానీ చారలు ఒళ్ళంతా ఉండవు. ఆ ఆడగుర్రానికి క్వాగ్గా వల్ల అలా మొహం మీద చారలున్న ఒక గుర్రం పుట్టింది. ఎవడితో మొదటిపిల్లను కన్నదో వాడి లక్షణాలే మిగతా ఎవరితో కన్న పిల్లలకైనా వస్తూ ఉంటే టెలీగొనీ అంటారు. ఆ తర్వాతి నుంచీ ఎన్ని మగగుర్రాలు వచ్చినా, అవి ఎలాంటివయినా, ఆ ఆడగుర్రానికి చారలున్న పిల్లలే పుట్టేవి, ఆ గుర్రం క్వాగ్గానింకా మరిచిపోనట్టుగా. అది చూసి మోర్టన్ ప్రతిపాదించాడు: ఆడది తన మొదటి ప్రేమని ఎప్పటికీ మరిచిపోలేదు, మొదటి ప్రియుడితో ఉన్న అనుబంధం, పిదప వచ్చిన ప్రియులందరిలోనూ బతికివుంటూ, ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఆమెలో కొనసాగుతూనే ఉంటుంది. ఇదిగో మనం కూర్చున్నామే ఈ కంటిపాప అడుగున, దీని మొదటి ప్రియుడు క్వాగ్గా. స్కాట్లండ్ జంతుశాస్త్రజ్ఞుడు ఎవార్ట్ ఈ టెలిగొనీ అసత్యమని నిరూపించాడు.

“ఈ కంటింటి మొదటి పాపడు క్వాగ్గా. మిస్టర్ ఎవార్ట్, లార్డ్ మోర్టన్ సిద్ధాంతాన్ని తప్పని ఎప్పుడో ఋజువు చేశాడని అతనికి నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ క్వాగ్గా నిరంకుశుడు. ఎవరిమాటా వినడు. అతని ప్రకారం, అతను మట్టి, మనమందరం నీటిగొట్టాలం, మనందరం చేసేదల్లా తిరిగిరానిదాన్ని, మళ్లీ పుట్టించాలనే…”

“ఈ టెలీగొనీ అనేది నిజంగానే తప్పని ఋజువు కాబడిందా?”

“ఆహ్హా, నాకు తెలుసు నువ్వా ప్రశ్న అడుగుతావని”, ప్రొఫెసర్ నవ్వాడు. “ఇంతకు ముందు కూడా ఇది గమనించాను. ప్రియులు ఎక్కువవుతున్నకొద్దీ, కుతూహలం ఎక్కువవుతుంటుంది. అందరికీ ఒకే ప్రశ్న? నాపట్ల ప్రేమలో చారలున్నాయా? లేదా? దాని గురించి తర్వాత మాట్లాడదాంలే. విను, మొదటివాడు నిన్ను పిలుస్తున్నాడు.”

“వదిలించుకోబడ్డ నెంబరు పన్నెండూ, ఇటురా.”

నేను లేచి నిల్చున్నాను, గోడకి చేతులు ఆనించి మెల్లగా ఆ గొంతు వినిపించిన వైపు వెళ్లాను. దారిలో ఎవరెవరి కాళ్ళో అడ్డంపడుతున్నాయి. నేను లోపలికి పోతున్నకొద్దీ, అక్కడున్న పాపళ్ళను గమనించాను. కొందరికి ఆకారం పూర్తిగా లేదు, వాళ్లు అక్కడి పచ్చటి కాంతిలో కలిసిపోయి, వెలిసిపోయినట్టుగా ఉన్నారు. వాళ్లు కంటికి సరిగా ఆనకపోవడంతో, నేను వాళ్లని తన్నుకుంటూనే లోపలికి పోవాల్సివచ్చింది. ఉన్నట్టుండి, రెండు బలమైన అదృశ్యహస్తాలు నా మోకాళ్లు పట్టుకున్నాయి.

“ఈ ప్రశ్నలకి జవాబులు రాయి.”

నన్ను పట్టుకున్న చేతులెవరివో చూద్దామని వంగాను, కాని అవి కనిపించలేదు. ఒకటో నెంబరు ఎంతగా వెలిసిపోయాడంటే, అక్కడి గాలిలో కలిసిపోయాడు. అతని అదృశ్య హస్తం నన్ను వదిలి, ఒక పుస్తకాన్ని తెరిచింది. ఇదిగో ఆ పుస్తకమే ఇది. దగ్గర దగ్గరగా, ఇరుగ్గా పేజీలన్నీ నిండిపోయిన్నాయి. ఎవరో తిప్పుతున్నట్టుగా పేజీలొక్కొక్కటే లేచి పడుతున్నాయి. చివరికి ఒక ఖాళీపేజీ కనిపించింది. దాని మీద నా నెంబరు ఉంది.

ప్రశ్నలు డజన్లకొద్దీ ఉన్నాయి ఆ పేజి మీద: ఎప్పుడు ఈ కంటిపాపలోకి మొదటిసారి దూరావు? ఎందుకు? ఇలా.

ఎన్నాళ్లు ఉంటావు? ఈ ప్రశ్నకి కింద కొన్ని సమాధానాలు సూచనగా ఉన్నాయి: అ) ఎప్పటికీ ఆ) మరణించేవరకూ ఇ) ఇంతకన్నా మంచి ఇల్లు దొరికేవరకూ. ఒకే సమాధానం ఎన్నుకోమని సూచన చివరిలో ఉంది. దరఖాస్తు చివరికొచ్చేసరికీ, ఆమె నాకు పెట్టిన ముద్దుపేర్లు ఏమిటి, అసూయ గురించి నీ స్పందన ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. తొందరగానే నేను నా సమాధానాలు రాసేశాను. ఆ అదృశ్య హస్తం పుస్తకం మూసేసింది. ఇంకా ఉన్న ఖాళీపేజీలు కళ్ళముందు మెరిశాయి.

“సరే. ఇక కానీయి” అన్నాడు క్వాగ్గా పుస్తకం మూసేస్తూ, “మరో కీ.శే. భగ్నప్రేమికుడు. ఈ పుస్తకం మెల్లగా నిండిపోతోంది. ఇంక నువ్వెళ్లొచ్చు.”

నేను, ఆరూ రెండుల మధ్య నా చోటికి తిరిగి వచ్చాను. ఆరోనెంబరు తెల్లటి గెడ్డం నన్ను పలకరించడానికి రెపరెపలాడింది కానీ, నా ముభావాన్ని చూసి మాట్లాడలేదు. ఆ పుస్తకంలో ఇంకా ఉన్న ఖాళీపేజీల గురించి చాలా సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను అక్కడే. ఇంతలో, ఖంగుమని మోగిన క్వాగ్గా కంఠం నన్ను స్పృహలోకి తెచ్చింది.

“పదకొండూ, ఇక్కడకు రా!”

“పదకొండూ రావాలి! పదకొండూ రావాలి!” అందరి గొంతులూ కలిశాయి.

“ఏమవుతోంది?” అనడిగాను నేను రెండును.

“పాత కథే. వరస నెంబరు ప్రకారం మొదలవుతుంది. వచ్చేసారి, నీతోనే మొదలవుతుందిలే.”

ఇంక అడగవలసిన అవసరం లేకపోయింది. అప్పటికే పదకొండో నెంబరు, మధ్యలోకి వస్తున్నాడు. అతని భారీ ఆకారం నాకు బాగా తెలిసినదే. నాముందువాడు అలా మధ్యలోకి వచ్చి, ఆ పసుపు వెలుగునిస్తున్న ముద్ద మీదకు ఎక్కి మంటపం మీదకి ఎక్కి అందరివైపు ప్రశాంతంగా చూశాడు. అతను ముక్కుకు తగిలించుకున్న కళ్ళజోడు నుంచి వేలాడుతున్న తాడును పెదాలతో కొరకసాగాడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా. అతని చెక్కిళ్ళు వణికాయి.

“అవునవును, ఒకానొకప్పుడు, ఇప్పుడు చెప్పుకోవాలంటే నవ్వొస్తుంది కాని, మీ అందరిలాగనే, నాకూ ఒకే ధ్యేయం ఉండేది. ఏదో విధంగా, ఈమె కంటిపాపలోకి దూకడం. అందరం ఇక్కడ అలానే చేరాం కదా? ఇంకా ఏముంది చెప్పడానికి?”

కళ్ళజోడు తాడును తన వేలికి చుట్టుకుంటూ, అద్దాలని తీసి చేత్తో పట్టుకొని, అందర్నీ చూస్తూ, అసహ్యంతో కదిలిపోతూ మొదలెట్టాడు:

ఉచ్చు అది. మగాళ్లని బంధించే ఉచ్చు. కానీ, అది కాదు విషయం. మా మొదటి కలయికే అన్నీ స్థిరపర్చింది. ఆరోజు, నాకు గుర్తుంది, తను నల్లటి గౌను వేసుకుంది, మెడవరకూ గుండీలన్నీ పెట్టుకొనుంది. తన ముఖం కూడానూ గుండీలు పెట్టినట్టు ముడుచుకునే ఉంది, బిగిసిన పెదాలు, అరమూసిన కళ్లు. ఆవిడ వ్యాకులతకు కారణం? ఈ పెద్దమనిషి పది. ఈయన కథ ఈమధ్యే కదా విన్నది. ఎవరూ ఇంకా మర్చిపోలేదు. అప్పటికింకా ఈయన పరిచయ భాగ్యం నాకు కలగలేదు. కానీ, ఆ అరమోడ్పు రెప్పల చాటున దాగివున్న కనుపాపల పరిస్థితి గొప్పగా లేదని నాకు అర్థం అయ్యింది. నేను ఎలాగో దొంగతనంగా ఆ కళ్లలోకి తొంగి చూశాను. ఎంతో ఒంటరితనం కనిపించింది. నాకు సరిపోయిన కంటిపాప కోసం వెతుకుతున్న నేను వెంటనే ఆ ఖాళీ కంటిపాపను ఆక్రమించుకుందామని నిర్ణయించుకున్నాను.

కానీ, ఎలా? ఆడాళ్ల హృదయంలో స్థానం సంపాదించండంలో ఎవడి దారి వాడిదే. చిన్న చిన్న పనులు, వీలయినంతవరకూ పెద్ద ఖర్చులేనివి చేసిపెట్టడం నాకు తెలిసిన పద్ధతి: ‘నువ్వు ఫలానా రచయిత రాసిన ఫలానా పుస్తకం చదివావా?’ లేదు, కానీ చదవాలని ఉంది…’ మర్నాడు ఉదయానికి ఆ పుస్తకం సరికొత్త కాపీ పంపించడం. ఏ కళ్లలోకైతే మనం చొరబడదామనుకుంటున్నామో, ఆ కళ్ళు మొదటి పేజీ తిప్పగానే నీ పేరు పైన ఒక అందమైన కొటేషన్ చూస్తాయి. పారేసుకున్న పక్క పిన్ను, లేదా లాంతరు శుభ్రం చేసే దబ్బనం–ఇలాంటివి ఎన్ననీ? అన్నిటినీ జాగ్రత్తగా గమనించి గుర్తుంచుకోవాలి. మళ్లీ కలిసినప్పుడు, అలాంటిదే పక్క పిన్ను, ఆ దబ్బనం, ఆపెరాకు టికెట్, ఆస్పిరిన్ కాప్సూల్స్, ఇంకా ఇలాంటివి ఎన్నెన్ననీ. ఇదంతా ఎందుకంటే, ఇంకో మనిషిలోకి మనం అంచెలంచెలుగానే చొరబడగలం. మన చిట్టి చిట్టి అవతారాలు, అతి సూక్ష్మంగా, కంటికి ఆననంత సూక్ష్మంగా చొరబడాలి. ఇలా తగినంతమంది జొరబడినాకగాని ఆమె ఆలోచనలను మనం లోబరుచుకోలేం. ఈ సైన్యంలో ఎప్పుడూ ఒకడుంటాడు, అందరిలానే అణుపరిమాణంలోనే ఉంటాడు కాని, వాడి వల్లనే, వాడి వెంటనే మన ప్రేమకి అర్థం కూడా ఆమె కళ్ళలోకి చొరబడుతుంది. వాడు పోయాడా, అంతే. అణువులన్నీ పొడిగా రాలిపోతాయి, శాశ్వతంగా. అయినా, ఇదంతా మీకూ తెలుసు.

ఈ విధంగా, నేను నా పద్ధతిని అమలులో పెట్టాను. మన ప్రేయసి ఎటువైపు చూసినా, ఆమె కళ్లు వాటిని తప్పించుకోడానికి వీల్లేకుండా, మూల మూలనా–పుస్తకాల్లో, ఫొటోప్రేముల్లో, పూలకుండీల్లో–ఎక్కడ చూసినా, నా చిట్టి సైన్యమే కనిపించేది. ఏ మూల నుంచైనా ఏ వంక నుంచైనా అవి నా పేరునే గుసగుసగా జపిస్తుండేవి. ఏదో ఒకరోజు, అందులో ఒకడు ఆమె కనుపాపలోకి చొరబడతాడని ఆశగా ఎదురుచూసేవాడిని. అయినా, ఇదేమీ అంత తొందరగా అయిపోయే వ్యవహారం కాదు. ఆమె బరువైన కనురెప్పలు ఒకపట్టాన లొంగలేదు.

ఒకసారి, ఇలాంటి లెక్కలేనన్ని సేవల తర్వాత, నవ్వుతూ అన్నది: “నువ్వు నన్ను ఆశిస్తున్నట్టున్నావు, అది జరగని పని. నీ సమయం వృథా చేసుకుంటున్నావు తెలుస్తోందా?”

“నాకదంతా అనవసరం.” బలహీనంగా అన్నాను నేను. ఒకసారి నా ట్రైను క్రిమియాకు వెళుతూ సగం దూరంలో ఆగిపోయింది, కిటికిలోంచి చూస్తే పచ్చటి పొలాల మధ్యలో ఒక చిన్న స్టేషన్ కనిపించింది. దాని పేరు ఒక చెక్క పలక మీద రాసివుంది. ఆ స్టేషన్ పేరు ‘సహనం.'”

ఆమె కళ్లు కొద్దిగా విప్పారాయి. “అయితే ఇప్పుడు సగం దూరంలో ఉన్నానంటావ్? బాగుంది!”

దానికి సమాధానం ఏం చెప్పానో గుర్తులేదు. కానీ, ‘సహనం’ స్టేషను దగ్గర ట్రైను ఆగవలసినదానికంటే చాలా ఎక్కువ సేపే ఆగిపోయిందని మాత్రం గుర్తుంది. అప్పుడు, నేను నా పూర్వీకులయిన మీ సాయం అర్థించదలచుకున్నాను. మీరెవరో అప్పటికింకా నాకు తెలీదు, కానీ ఆమె కనుపాపల్లో ఇంతకుముందు ఇంకెవరో ఎందరో ఉండి ఇక్కడ మగ్గిపోతున్నారని మాత్రం నా మనస్సుకి కచ్చితంగా తెలుసు. ఆ కళ్ళలో ఎందరో కళ్ళు పెట్టి వారి ప్రతిబింబాలు చూసుకున్నారు… టూకీగా, గిన్నెలోని పులుసును అడుగునుంచి పైకి కలయబెట్టినట్టు, ఆమె గతాన్ని అడుగునుంచి రేకడం మొదలెట్టాను. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి, ఇంతకుముందు ఇంకెవర్నో ప్రేమించి దానినుంచి బైటపడి, ఇంకా నిన్ను ప్రేమించడం మొదలెట్టకపోతే ఆ ‘ఇంకెవర్నో’ని రెచ్చగొట్టి, రెచ్చగొట్టి ఆమె తనను ప్రేమించడానికి అన్ని తోవలూ, మార్గాలు నీకు చూపించేలా.

ఆమె గతాన్ని ఎలా రేకెత్తాను అంటే–‘ఆడవాళ్లు నాలాంటి వాడిని ప్రేమించరు. ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు ఇంతకు ముందు ప్రేమించిన వాడో, వాళ్లో నాలా మాత్రం ఖచ్చితంగా ఉండరు. కదా? అవునా కాదా? చెప్పవా, సర్లే…’ మొద్దు శ్రద్దతో యాంత్రికంగా ఒక పని చేసుకుపోయే పనివాడిలా, నేను ఇలా తవ్వుకుంటూ పోయాను. ఒకే ప్రశ్నని రకరకాలుగా తిప్పుతూ అడిగేవాడిని. మొదట్లో, వాటికి సమాధానం ఏం వచ్చేది కాదు, ఆపైన ఒకటి రెండు పదాలు మాత్రం. కానీ, ఆమె మనస్సు అడుగుపొరల్లోంచి ఏదో మరుగుతూ ఉడుకుతూ పైకి వచ్చి బుడగలల్లే బద్దలవుతూ ఉండేదని మాత్రం నాకు తెలుసు. మరింత ఉత్సాహంతో ఆమె గతాన్ని కెలికాను. ప్రేమ తాలూకు జ్ఞాపకాలని రేకెత్తించకుండా ప్రేమను రేకెత్తించలేమని నాకు తెలుసు. ఒకప్పటి ప్రేమ తాలుకూ జ్ఞాపకాలు, అంతరంగం లోపలి పొరల్లోంచి బయటకు వచ్చి, మళ్లీ అవి చీకట్లోకి నెట్టెయ్యబడతాయి, కానీ వాటి తాలుకు అనుభూతి మాత్రం మనస్సులోనే నిలిచిపోతుంది. ఆమె కళ్లు వాటంతట అవే తరుచుగా విప్పార్చుకుని నాకేసి ఆత్రంగా చూసేవి, నా ప్రశ్నలకి ఆర్ద్రంగా కదిలేవి. నేను ఎన్నోసార్లు పిస్టల్ మోత కోసం ఎదురుచూస్తున్న పరుగుపందెపు ఆటగాడిలా కళ్లలోకి గెంతడానికి సిద్ధంగా ఉండేవాణ్ణి. కానీ నేను ఎవరికి ప్రతిబింబమో, ఆ అసలు మనిషి–అతని కళ్లలోనేగా నేనప్పటికింకా ఉన్నది– తన జడ్డితనంతో ఎన్నో అవకాశాలు పోగొట్టాడు. ఎలాగైతేనేం, ఆ రోజు రానే వచ్చింది. అతను (మేము) వెళ్ళేసరికి ఆమె తన కిటికీదగ్గర కూర్చుని ఉంది; భుజాలమీద కప్పుకున్న శాలువా లోంచి ఆమె భుజాలు వణకడం తెలుస్తోంది.

“ఏమైంది? ఒంట్లో బాలేదా?”

“ఏం లేదులే, కాస్త జ్వరంగా ఉన్నట్టుంది, పట్టించుకోకు.”

కానీ, చిన్న చిన్న సేవలు చేసే మనిషికి పట్టించుకోకుండా ఉండే అవకాశం లేదు. నేను వెళ్ళిపోయాను. ఒక పావుగంట తర్వాత రమ్మని కబురు వచ్చింది.

పావుగంట తర్వాత, నేను దీక్షగా చేతి వాచిలో నిమిషాల ముల్లుకేసి చూస్తూండగా, సిల్క్ చేతి రెపరెపలు, థర్మామీటర్ తొడుగు తీసి మూసిన చప్పుడు వినిపించాయి.

“ఎంతుంది?”

“98.6”

ఇక్కడ, రాతిమొద్దు కూడా అవకతవకగా తప్పుచెయ్యలేదు. మేమిద్దరం ఆమెకి దగ్గరగా జరిగాం.

“నీకు తెలీదు, నన్ను చూడనీ.”

“అబ్బా, వదిలెద్దూ.”

“అలాకాదు. ముందు థర్మామీటర్ బాగా విదిలించాలి, అదీ అలా, ఆ తర్వాత…”

“ఏయ్!”

ఇప్పుడు వాళ్లిద్దరి కళ్ళూ కలుసుకున్నాయి దగ్గరగా. ఆమె కనుపాపలు మంచుపొరలాంటి తడితో మెరుస్తున్నాయి (ఇది కచ్చితమైన ఋజువు). తయారుగానే ఉన్న నేను కొత్తింట్లోకి ఒక్క ఉదుటున గెంతాను. కాని, కళ్ళ మధ్య దూరం సరిగ్గా అంచనా వెయ్యకపోవడంతో అంచున వేలాడి, కాస్సేపు తుఫానులో చెట్టుకొమ్మలా, ఆమె కనురెప్పల వెంట్రుకను పట్టుకుని ఊగిసలాడి, నిలదొక్కుకున్నాను. ఏం చెయ్యాలో తెలుసు కాబట్టి, కొన్ని క్షణాల తర్వాత ఆమె కంటిపాపలోకి జారుకున్నాను తత్తరపాటుతో, ఊపిరి తీసుకుంటూ. నా వెనకాలే, మొదటి ముద్దు మెత్తని చప్పుడు వినిపించింది. దానివెనుకే థర్మామీటర్ నేలమీద పడి టింగుమంది. ఆమె కనురెప్పలు మూసుకున్నాయి. కాని, నా పని అయిపోయింది. నేను నా చోటుకి చేరుకున్నాను. కంటిపాపడి ఉద్యోగం ఎంత ప్రమాదకరమో ఆలోచించుకుంటూ కూర్చున్నాను. అది నిజమే అని తర్వాత తెలిసింది. నా అంచనాలను మించిన చీకటి, వ్యాకులత నన్ను కబళించబోతున్నాయి.

పదకొండు తన కథ చెప్పి, మౌనంగా, దిగులుగా కూర్చున్నాడు. పూర్వీకులందరూ తిరిగి వాళ్ల ఊళపాట ఎత్తుకున్నారు. ముందు మెల్లగా మొదలైన పాట, కాస్సేపటికి బిగ్గరగా మారింది:

మగ-మగ-మగాడా, చిట్టోడా, పొట్టోడా, మా మంచి మరుగుజ్జు మగాడా
బతుకుతీపుంటే, దూకేముందు పాపల్నీ, కంటిపాపల్నీ అడగాలోయ్”
ఒకటీ-మూడూ-ఐదూ-ఏడూ…

“మరీ జంతువు!” అన్నాను ఆరుతో.

“బేసి కదా. వాళ్ళలానే ఉంటారు.”

నాకు అర్థం కాలేదు.”

“నువ్వు గమనించలేదా? ఇటుపక్క నేను ఆరు, నువ్వు పన్నెండు, నీకు అటుపక్క రెండు, నాలుగు. మనందరివీ సరిసంఖ్యలు. ఆ బేసి సంఖ్యగాళ్లందరూ, కావాలని ఎంచుకున్నట్టుగా మొరటుగా బండగా ఉంటారు. మనలా నాగరీకంగా, నాజూకుగా ఉండరు.

“అదెలా?”

“ఎలా అంటావా? బహుశా మనిషి మనస్సుకి ఏదో ఆటుపోటుల్లాంటి లయ ఉంటుంది, లేదా కోరికలు మారిపోతుంటాయి. ఇదొకరకం డయలెక్టిక్ ఆఫ్ లవ్, అంటే గతితార్కిక ప్రేమతత్వం. సిద్ధాంత-ప్రతిసిద్ధాంతాలు మొరటు-నాజూకు మగవాళ్ళు. వాళ్ళ మధ్య పెండ్యులమ్‌లా ఊగిసలాడుతూ ఆమె మనసు. అందుకే ఆ మొరటు బేసివాళ్ళు. మనలాంటి నాజూకు సరిమనుషులు.” కన్నుగీటి, నవ్వుతూ అన్నాడతను.

నాకు నవ్వబుద్ధి కాలేదు. ఆరు కూడా నవ్వడం ఆపేశాడు. “అసలు సంగతి ఏంటంటే…” నాకు దగ్గరగా జరిగి, అతను చెప్పడం మొదలెట్టాడు, “మనం అంత తొందరపాటుగా నిర్ణయానికి రాకూడదు. ఉపన్యాసకుడి ధోరణికి శ్రోతలే కర్తలు. త్వరలోనే ఈ సంగతి నువ్వూ ఒప్పుకుంటావు. అదలా ఉంచు, పదకొండు నేర్పరి. అతని నిశితమైన పరికింపును నువ్వు కాదనలేవు. బలమైన అనుభూతులని మనం మామూలు మాటల్లో చెప్తాం. మనకు దగ్గరవారిని ముద్దుపేర్లతో, పొట్టిపేర్లతో పిలుస్తాం. మనకి చాలా ముఖ్యులైన వాళ్లని మనం అలానే దగ్గరకి తీసుకుంటాం. స్లావిక్ భాషలో మిల్ అంటే డియర్ అని, మల్ అంటే చిన్న అని. దానితో గందరగోళం ఉండేది. ఏం, ప్రియుడిని చిట్టీ అని పిలిస్తే దాని అర్థం ఏమయ్యుండాలి? అంతే కాదు. పదకొండు మాదిరిగానే నేను కూడా స్త్రీలు నిజంగా ప్రేమించేది, వాళ్ళ కంటిపాపళ్లమైన మనల్నే గానీ, ఎవరివల్ల మనం ఇలా కంటిపాపల్లోంచి పాపల్లోకి దూకుతున్నామో ఆ ఎనుబోతులను కాదు అనే నమ్ముతాను. పదకొండు అన్న ‘చిన్నచిన్న పనులు చేసిపెట్టడం’ అన్నది వెకిలిగా తీసుకోకపోతే, ఇక్కడ కూడా పదకొండు చెప్పింది నిజమే. ఎవరైనా నిన్ను ప్రేమించాలంటే వారికి ‘సంబంధించిన వస్తువు’లపై నీ ముద్ర, నీ అధికారం ఉండాలి. ఒకరకంగా ప్రేమ అనేది ఇంకేమో కాదు, ఒకే వస్తువుతో ఇద్దరి అనుబంధం అని…

“ఇదా మీరు చెప్…”

“విసుక్కోకుండా చెప్పేది విను.” నా చిరాకు చూసి, మళ్లీ అన్నాడు, “ఆగు, కాస్త ఓపిక పట్టు. రెండు నిమిషాలు ఓర్చుకున్నావంటే, ఆ తర్వాత నీకే ఆసక్తి పుడుతుంది. ఒకే వస్తువును (వ్యక్తి, ఇమేజ్) పదే పదే చూస్తుంటే కలిగే అదే అదే స్పందన (ఎమోషన్) వల్ల ఆ వస్తువు ‘తనం’ ఒక ఊహగానో, ఆకృతిగానో నీ మనసులో ముద్ర వేస్తుంది. దాన్ని పరిభాషలో రెసెప్ట్ అంటారు. ప్రేమ అంటే ఏమిటి? ప్రియుడు అనే ఊహ, ఆకృతి (ఐడియా అండ్ ఇమేజ్) కలగలిసినది కాదు; ప్రియుడు అనే భావనతో జతపడిన ఆకృతి (కాన్సెప్ట్ అండ్ ఇమేజ్) కాదు; ప్రియుడు అనే ఒక వస్తువు (వ్యక్తి, ఇమేజ్) వల్ల కలిగే ఒక స్పందన. అయితే, వస్తువుతోనే జతపడి స్పందన కాదు, స్పందనతో జతపడి వస్తువు కూడా ఉంటుందని, ఈ అనుబంధం ఒకవైపునుంచి కాక రెండువైపుల నుంచీ ఉంటుందని సైకాలజిస్టులు గమనించలేకపోయారు, కాని, ఈ విషయం ప్రేమించేవారు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పటిదాకా? ప్రేమ రెండువైపులనుండీ రాజుకునేదాకా. ఎప్పటిదాకా? అంటే… ఏం, అర్థం కాటల్లేదా? కాస్త ఆలోచించు. ఉదాహరణలైతే బోలెడు చెప్పగలను కాని నీ ఆలోచన నేను చెయ్యలేను కదా.

మొదటి కేసు: పుష్కిన్ రాసినట్టు ‘ఎవరో ఒకరి కోసం ఎదురుచూసే మనసు’ ఎ సోల్ వెయిటింగ్ ఫర్ సమ్‌వన్. మనసులో ప్రేమ తాలూకు ఉద్రేకం అయితే ఉంది కాని ప్రేమికుడి రూపం లేదు. అంటే స్పందనతో జతపడ్డ వస్తువు (వ్యక్తి) లేదు. దేనికీ గురిచూడకుండా గాల్లోకి పేల్చే తుపాకి ఇది. ఎప్పుడో ఒకరోజు ఆ ‘ఒకరు’ పోయి, ‘ఎవరో’ మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఆ ‘ఒకరి’ జాగాను ఆక్రమించుకోవడం చాలా తేలిక.

రెండో కేసు: ‘ఎవరో’ ఉన్నారు కానీ వారిపట్ల ప్రేమ తాలూకు ఉద్రేకం లేదు. అంటే వస్తువు (వ్యక్తి) ఉంది కాని దానితో జతపడి స్పందన లేదు. అది పుట్టించడానికి అవసరమయ్యే ధాతువులు, పరిస్థితులు అన్నీ కావాలి. అది అంత సులభం కాదు. చాలా సమయం పడుతుంది, ఒక్కోసారి ఎప్పటికీ పుట్టకపోవచ్చు కూడా. చిన్న వయస్సులో ప్రేమలు మొదటి కేసు తరహావీ, వయస్సు వచ్చాక మొదలయ్యే ప్రేమలు రెండో తరహావీనూ.

కానీ, ఈ వస్తువు+స్పందన=ఉద్రేకం అన్న సూత్రం ప్రేమికులకి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఈ ఉద్రేకం అనుక్షణమూ ఉంటే, ప్రేమించబడినవారు కనిపించిన ప్రతిసారీ–ఈ సూత్రం ప్రకారం– రెండవవారిలో ప్రేమను రగిలించాలి. అదే విధంగా కామోద్దీపన కలిగిన ప్రతిసారి ఒకే వస్తువు (ఒకే ప్రియుడి/ప్రియురాలి రూపం) మదిలో మెదలాలి. కాని ఇది వాస్తవంలో ఇలా జరగదు. వాస్తవంలో ప్రేమ, సాధారణంగా ఒకవేపు నుంచే ఉంటుంది. తీగలోని ఎలక్ట్రిక్ కరెంట్‌లా అది ఒకే వైపు ప్రయాణిస్తుంది. ఇలాంటి వన్-వే ట్రాఫిక్ ఒకవైపు ప్రేమలే మొదటి తరహా ప్రేమలో. కరెంట్ వస్తువు నుండి స్పందనకు ప్రయాణిస్తుంది తప్ప ఇటునుండి అటు కాదు. ఇందులో స్పందన కలిగించే ఉద్రేకం ముఖ్యం కాబట్టి ఇమేజ్, అంటే వస్తువు రూపం మారిపోతూండవచ్చు. ఇలాంటి ప్రియురాలిలో ఉద్రేకం ఎప్పుడూ చాలా ఉంటుంది విధేయత ఉండదు. ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది కాని ప్రియులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ఈ వన్-వే రెసెప్ట్‌: ఒకే విధమయిన స్పందన-ఎన్నో వస్తువులు.

ఎందుకా? ఓ మై గాడ్! బుర్రలోకి ఏదీ పోతున్నట్టు లేదు. సరే, కరెంట్ కాకపోతే గుండెనుండి జరిగే రక్తప్రసరణ తీసుకో. గుండె లోంచి కవాటం గుండా రక్తం బైటకు ప్రవహిస్తుంది కానీ తిరిగి లోపలికి రాలేదు, రక్తం తిరిగి లోపలికి రాకుండా గుండె కవాటం ఒకే వైపుకు తెరుచుకుంటుంది కాబట్టి. మొదటి తరహా ప్రేమ కూడా అంతే. రక్తానికి కవాటం తెరచుకొని బైటకు ప్రవహించడానికి ఉద్దీపన కావాలి. అది వస్తువును చూడడం వల్ల వస్తుంది కాని వస్తువు ‘తనం’వల్ల రాదు. అందువల్ల వస్తువు రూపం ఎదురుగా ఉన్నంత సేపే ఉద్రేకం పొంగిపొరలుతుంది. అందువల్ల ఈ తరహా ప్రేమ, ప్రియతముల సమక్షంలో ఉన్నంతవరకే ఉంటుంది. వారు లేనప్పుడు ఆ స్పందనకు వస్తువు ఏదో, దాన్ని ఎలా చేరుకోవాలో తెలియదు.

ఆ ఆవలింత విసుగా? అలసటా? సరే. ఏదేమైనా, రెండో తరహా ప్రేమలో, అవిధేయత ఉండదు కానీ, ప్రేమోద్రేకమూ పెద్దగా ఉండదు. స్పందన కలుగుతున్న సమయంలో వస్తువు (వ్యక్తి, ఇమేజ్) సమక్షంలోకి వచ్చినప్పుడు ఉద్రేకం పుడుతుంది. కానీ అలాకాక వస్తువే మొదట సమక్షంలోకి వస్తే అది స్పందన కలిగించదు. అది ప్రేమానుభూతిని తనతో పాటు తీసుకురాదు. ఆ వస్తువుతో జతపడిన వేరే ఏ భావావేశమయినా తనతో తీసుకురావచ్చు. ఇలాంటి వన్-వే ప్రేమ రోజువారీ జీవితాలకి బాగా నప్పుతుంది. ఇది సంసారపక్షం ప్రేమ, ఇందులో ఉద్రేకం తక్కువ. ఈ వన్-వే రెసెప్ట్‌: ఒకే వస్తువు-ఎన్నో విధాలయిన స్పందనలు.

ఈ రెండూ కాక మూడో తరహా- రెండువైపులనుండి పారే ప్రేమ; వస్తుస్పందనల విడదీయరాని బంధం; ఎ ట్రూ టూ-వే రెసెప్ట్; ఒకే వస్తువు-ఒకే స్పందన. వెల్, నా ఉద్దేశంలో అదే నిజమైన ప్రేమ. నువ్వేమైనా అను పదకొండుకి ప్రేమ గురించిన ఈ సత్యం తెలుసు, కానీ దాన్ని ఎలా పొందాలో తెలియదు. అదే, నా విషయంలో…”

“ఇప్పుడెందుకు అదంతా తోడుకోవడం?” అన్నాను చిరాగ్గా.

ఆరు కొద్దినిమిషాల పాటు తెగిపోయిన ఆలోచనలన్నిటినీ మళ్లీ వెతుక్కుంటూ ముడివేసుకుంటున్నవాడికి మల్లే మౌనంగా ఉండిపోయాడు.

“ఎందుకంటే, పదకొండు ఎక్కడివరకూ వచ్చి ఆగిపోయాడో, అదే మౌలికమైన, ప్రధానమైన ప్రశ్న, ముఖ్యంగా మనలాంటివాళ్లకి–ఇదిగో ఇలా ఈ కనుపాపల చీకటి గొయ్యిలో బందీలైపోయినవాళ్లకి… ఎందుకింకా మనల్ని మనం మోసం చేసుకోవడం? మనందరం వర్ణించలేని నిర్వర్ణులమైతున్నాం. కాలం మనను పెన్సిల్ గీతలా చెరిపివేస్తోంది; చెరువులోని అలలలా మనం మాయమైపోతున్నాం. నేను క్రమక్రమంగా క్షీణించిపోయి ఈ చీకటిలో కలిసిపోతున్నాను. నా ఆలోచనలలోని స్తరాలని నేను విడదీసుకోలేకపోతున్నాను. త్వరలోనే రూపు, రేఖ లేకుండా అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి శూన్యమైపోతాను. కానీ, అసలు బాధేమిటంటే నాతో పాటు ఎన్నో సైంటిఫిక్ సిద్ధాంతాలు, ప్రయోగాలు, పరిశీలనలు ఇవన్నీ కూడా ఈ చీకటిలో కలిసిపోతాయి. ఇక్కడనుండి బయటపడగలిగితే ఆ ఫ్రాయిడ్లకు, ఆడ్లర్లకు, మాయర్లకు విస్మృతి అంటే, ఇలా పూర్తిగా మరిచిపోబడిన స్థితి, అంటే ఏంటో నేర్పించేవాణ్ణి. మాట పొరపాట్లు, రాత పొరపాట్ల వంటి వాటినుంచి ఏవేవో సిద్ధాంతాలల్లే ఆ గర్విష్ఠులకు విస్మృతి అనే ఈ చీకటి గుహ, అస్తిత్వం అనేది లేని ఈ స్థితి లోంచి వచ్చిన మనిషి ముందు నోరు పెగులుతుందా? పెగిలితే వినాలనే కుతూహలం ఉంది కానీ అవకాశం లేదు. శవపేటికలో మనిషి లేచి రాగలడేమో గానీ, ఇక్కడనుండి బయటపడే మార్గం లేదు.

నీకు తెలుసా, నాకు యుక్తవయసు వచ్చినప్పటినుండి అస్తిత్వనాశనం, అజ్ఞాత, విస్మృత స్థితుల గురించిన అన్వేషణలోనే పూర్తిగా ముణిగిపోయాను. మొదటిసారి, ఏదో కవిత్వం చదువుతుంటే హఠాత్తుగా ఎదురయింది:

పక్షులగుంపూ ఎగిరిపోయింది
పెంధూళి మేఘమూ ఒరిగిపోయింది
పొద్దుకూడా కుంకింది
నన్ను విస్మృతుడిని చేయాలంటే
ఇప్పుడే, ఈ క్షణమే నీకు సరైన సమయం

ఈ నాలుగు వాక్యాల గురించి ఆలోచిస్తూ, ఈ ఆలోచనలో దిగబడిపోయిన నేను ఇక ఎప్పుడూ బైటకి రాలేనని గుర్తించలేదు. రెసెప్ట్‌స్ అనేవి వ్యక్తావ్యక్త చేతనల మధ్య నిరంతరం పయనిస్తుంటాయని నా ప్రతిపాదన. అయితే కొన్నిసార్లు అవ్యక్తచేతన (అన్‌కాన్షస్) లోలోపలికి వెళ్ళిన రెసెప్ట్‌స్ కొన్ని తిరిగి వ్యక్తం కాలేవు. కాన్షస్‌నెస్ లోకి రాలేవు. ఒక రిసెప్ట్ ఎలా నశిస్తుంది? అనే ప్రశ్న నన్ను వెంటాడటం మొదలెట్టింది. నిప్పు కణికలా నివురుగప్పుతూ క్రమక్రమంగానా, గాలిలో దీపం ఆరిపోయినట్టు ఉఫ్ఫుమని ఒక్కసారా? ఉన్నట్టుండా, తీసుకొని తీసుకొనా? మొదట్లో నేనూ కవితో ఏకీభవించాను: మరచిపోబడడం ఎప్పుడో మొదలవుతుంది, కానీ చివరికి తృటిలో అంతా అయిపోతుంది. జర్మన్ మానసిక శాస్త్రజ్ఞుడు ఎబ్బింగ్‌హౌస్ కనిపెట్టిన నెమోనిక్ సీరీస్ ఆధారంగా ఒక్కో రిసెప్ట్ ఎప్పుడు అంతమవుతుందో లెక్కలు కూడా కట్టాను. కానీ, నా చూపు మరిచిపోయిన అనుభూతుల వైపు మళ్ళింది. ఇది ఆసక్తికరమైన ప్రశ్న. ఒక మగవాడు ఆడది n సార్లు కలుస్తారు. కలిసిన ప్రతిసారీ వారిలో ఆ ప్రేమోద్రేకం, ఒక నెర్వస్ ఎక్సైట్‌మెంట్, ఉంటుంది. కానీ n+1సారి కలిసినప్పుడు ఆ ప్రేమోద్రేకం కనపడదు. అతడు శాయశక్తులా నటిస్తాడు. ఆమె వెళ్లిపోయిన తర్వాత తన మనస్సునంతా చిందరవందర చేసి గాలిస్తాడు. నిష్ప్రయోజనం. పోయిన వస్తువును (వ్యక్తి, ఇమేజ్) తిరిగి వెతుక్కోవచ్చు, కానీ పోయిన స్పందనని (ఎమోషన్) తిరిగి సృష్టించలేం, అది అసంభవం. ఊసరవెల్లి తోకని నీ చేతిలో వదిలేసి పారిపోయింది. వస్తువుకూ స్పందనకూ ఉన్న బంధం తెగిపోయింది.

ఈ చల్లారిపోయిన ఉద్రేకం, ప్రేమను అభావంగా చేస్తుంది. కొన్ని పోలికలు చూడు. వేడి చేసిన గంధకాన్ని చల్లబరిస్తే ఏమవుతుంది? దాని రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. భాస్వరం స్ఫటికాలను వేడిచేసి, క్రమంగా దశలవారిగా చల్లార్చినప్పుడు, ఊదారంగు నుంచి ఎరుపుకు ఎరుపు నుంచి నలుపుకు మారుతుంది. కేవలం రంగు మాత్రమే కాదు, ఒక స్థితిలో అది దాని స్ఫటికాకృతిని కూడా పోగొట్టుకుంటుంది, తన నిర్దిష్టమైన రూపాన్ని పూర్తిగా పోగొట్టుకొని నిరాకారమైన పొడిగా మిగిలిపోతుంది. ఈ చల్లారే దశలలో ఏ దశలో స్ఫటికం తన ఆకృతిని పోగొట్టుకుంటున్నదో తెలుసుకోగలితే, ధగధగలాడే వజ్రం ఏ క్షణంలో, నల్లటి బొగ్గుముక్కగా మారి మనచేతికి మసిగా అంటుతుందో తెలుసుకోగలిగిన మనం, ఏ క్షణంలో ఒకరిపట్ల ‘నా ప్రేమ’ అన్నది మారిపోతుందో తెలుసుకోలేకపోతున్నాం?

ఇది అంత సులభం కాదు. రసాయన శాస్త్రపు పరిధుల్లోంచే మన చర్చ కొనసాగిద్దాం. స్ఫటికం రూపాంతరం చెంది పొడిగా మారటానికి ముందు అధిస్థిరత్వపు స్థితిలో, మెటాస్టేబుల్ స్టేట్ అంటాం, ఉంటుంది. అంటే, రూపుకి-విరూపానికి మధ్య సాగే డోలాయమానమైన స్థితి. ఈ ప్రతీక సరిపోతుంది మనకి. మనుషుల మధ్య ప్రేమలు చాలావరకూ ఈ అధిస్థిరత్వపు స్థితిలో ఉంటాయి. మంచుగడ్డకు-మరిగేనీటికి మధ్యలో ఎక్కడో. తమాషా ఏమిటంటే ఈ రెండు చివరల కన్నా మధ్యలో ఉండే ఈ డోలాయమాన స్థితి బలమైనది. ఒకపట్టాన వీగిపోనిది. వేడిగా ఉన్న పదార్థం ఏదైనా, దానంతట దాన్ని మనం ఒదిలిపెడితే, సహజంగా, నిరంతరాయంగా చల్లబడుతూ వస్తుంది. స్పందన కూడా అలాంటిదే. దాన్ని భగభగమండే మంటగానే ఉంచాలంటే దానిలోకి ఎప్పుడూ కొత్త ఇంధనం వేస్తూ ఉండాలి.

ఇక్కడిదాకా వచ్చేసరికి ఈ పోలికలు నా ఆలోచనకు అడ్డంపడ్డాయి. ఏ పరిస్థితుల్లో సహజంగా చల్లబడడం అనే ప్రక్రియ, స్ఫటికాన్ని పొడిగా, వజ్రాన్ని బొగ్గుగా, రూపాన్ని నిరూపంగా, ప్రేమను అభావంగా చేస్తున్నదో సైన్స్ నాకు చెప్తోంది. అయితే చల్లబడడం అనేది వేగవంతంగా జరిగినప్పుడు, స్ఫటికాల రూపం మారిపోతుంది కాని, అవి తిరిగి వేరే రకమైన స్ఫటికాలుగా రూపాంతరం చెందేంత సమయం ఉండదు. నిరూపమైన పొడి అణువులు స్ఫటికాలుగా మళ్ళీ మారుతూ, చల్లదనం వల్ల ఆగిపోతాయి; అటు స్ఫటికమూ, ఇటు పొడీ కాని సాదృశ ఆకృతులుగా మిగిలిపోతాయి. ఫలితం: స్పష్టమైన ఆకృతి అంటూ ఏమీ లేని ఒక గడ్డకట్టిన రూపం. స్ఫటికం రెండు వస్తువుల మధ్య ఉన్న బలమైన ఆకర్షణ, నిరూపం రెండు మనసులు ఒకరినొకరు ద్వేషించుకొనే భావన. డోలాయమానమైన స్థితి.

ఈ పరిస్థితులలో, ఎంతోకాలం ప్రేమ నిలిచి ఉండాలంటే ఒకటే మార్గం: ఒకరినొకరు నిరవధికంగా వంచించుకుంటుండాలి, తప్పదు. ఏమిటా చూపు? అది అదే మరి! ఒక వ్యక్తి వస్తువును (తన ప్రేయసి) తన గుండెల్లో తాపడం చేసుకొని ఎప్పటికీ విధేయంగా ఉన్నా ఆ వస్తువు అనుబంధ స్పందన ఎంతోకాలం ఉండదు. వస్తువు (వ్యక్తి, ఇమేజ్) మారిపోతూ ఉంటుంది. ఈరోజు నీ ఇమేజ్‌ను ప్రేమించాలి అంటే నిన్నటి నీ ఇమేజ్‌ను మోసంచేయాలి. తప్పదు. నేనే గనక రచయిత అయ్యింటే, ఇది కథగా రాసేవాణ్ణి: నా హీరో ఒక అమ్మాయిని కలుస్తాడు. అమ్మాయి భలే చురుకైనది, పదహారేళ్ళ ప్రాయపుది. సరే, ప్రేమలో పడతారు. పెళ్లవుతుంది, పిల్లలు పుడతారు. కాలచక్రం గిర్రున తిరుగుతుంది. వాళ్ల అనుబంధం సడలిపోకుండా ఉంది ఇప్పటికీ. ఇప్పుడు అతనికి ఉబ్బసం; ఆమెకు కీళ్ళవాతం, ముడుతలు పడిపోయిన చర్మం. కానీ ఒకరితో ఒకరు ప్రేమగానే ఉంటారు. ఒకరోజు, వీధి తలుపు తెరుచుకుని ఆమె వస్తుంది. ఆమే కాని ఆమె కాదు. నిన్నటిదో, పోయినేటిదో కాదు. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని నా హీరో మాటిచ్చిన ఆ పదహారేళ్ల అమ్మాయి. నా హీరో బహుశా, ఆశ్చర్యపోతాడు, నిశ్చేష్టుడవుతాడు. ఆ వచ్చిన అమ్మాయి, ఈ మధ్యవయస్సు జీవితం వైపు భయంతో చూస్తుంది. అప్పటికి తనకి పుట్టని పిల్లలని చూస్తుంది. నా హీరో, ఆ రెండో తలుపు వైపు చూస్తాడు, ఇప్పుడు ఆమె ఈ గదిలోకి వస్తే ఏం అవుతుందోనని. ‘నిన్న నాకు నువ్వు మాటిచ్చావ్’ అంటుంది ఆ అమ్మాయి. ‘నిన్న? అది ఇరవై యేళ్ళనాటి మాట కదా’ అనుకుంటాడు ఉబ్బస రోగి తలగీక్కుంటూ. ఇంతలో అడుగుల చప్పుడు. ఇప్పటి ఆమె, ఎదురుగా ఉన్న అప్పటి ఈమె.

‘నువ్వెళ్ళిపో, తనకు నువ్వు ఇక్కడ కనిపిస్తే…’

‘ఎవరికి?’

‘నీకే, తొందరగా వెళ్లిపో…’

కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ రెండవగది తలుపు తెరుచుకుంది, మన హీరో, వెల్… నిద్రలోంచి లేస్తాడు.”

“అయ్యా ఆరూ, ఇదేమైనా న్యాయంగా ఉందా? సైకాలజీ నుండి కెమిస్ట్రీకీ, కెమిస్ట్రీ నుండి ఫిక్షనుకీ దూకించావు. ఇక ఇక్కడ నుండి మళ్లీ నీ స్ఫటికాలకు, భాస్వరానికి, గంధకానికి తీసికెళతావా!”

“వెళతాగా. ముందు ఇది విను. నువ్వు ‘అ’ను ప్రేమించావు, కానీ మర్నాటికి ఆ ‘అ’, ‘అ1’ ఆ మర్నాటికి ‘అ2’గా ఇలా ప్రతీక్షణం ఒక కొత్త స్ఫటికంగా మారుతున్న వ్యక్తిని ప్రేమిస్తూ ఉండాలంటే, నువ్వు కూడా ఆ వ్యక్తి తాలూకూ రూపాన్ని మార్చుకుంటూ ఉండాలి, నీ స్పందనను (ఎమోషన్) ఈ సరికొత్త ఇమేజ్ వైపుకి మళ్లించుకుంటూ ఉండాలి. ‘అ2’ కోసం ‘అ1’ని, ‘అ1’ కోసం ‘అ’ని వంచిస్తూ ఉండాలి. ఇమేజ్ మారుతున్నంత వేగంగా ఈ వంచనలు జరుగుతున్నంతసేపు ప్రేమ శాశ్వతంగా, నిత్యనూతనంగా ఉంటుంది. వంద అడుగులు నడిచిన మనిషికి, ప్రతి అడుగుకీ తన శరీరం పడిపోబోయిందని, అలా పడకుండా సరైన సమయానికి అతని కండరాలు ఆపి నిలబెట్టాయని తెలియకుండానే నడిచినట్టు – వారాలు, ఏళ్ళతరబడి ప్రేమలో ఉన్నవారు వారి కలయికల సంఖ్య వారి వంచనల సంఖ్యకు సమానం అని తెలుసుకోలేరు.”

పేరుమోసిన వక్త తన ఉపన్యాసం తర్వాత గర్వంగా చప్పట్లకోసం ఎదురుచూస్తున్న సంతృప్తి ఆరు మొహంలో. కానీ, ఇంత బరువైన ఉపన్యాసంతో నా బుర్ర నిద్రపోయింది. అతను ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి, మళ్లీ తన ధోరణి మొదలెట్టాడు: కలయికల వేగం ఎక్కువైతే, వంచనల వేగం ఎక్కువైతే… ఇక నా వల్లకాలేదు, కళ్లు బరువెక్కిపోయి, మంచి నిద్రలోకి జారుకున్నాను. నిద్రలో కూడా కెమికల్ సూత్రాలు, ఆల్జీబ్రా ఈక్వేషన్లు కందిరీగల్లా రొదపెట్టాయి. ఎంతసేపు పడుకున్నానో తెలియదు. నన్ను ఎవరెవరో తట్టిలేపుతున్నట్టు అనిపించింది.

“పన్నెండూ, ఇక్కడకు రా!”

“కొత్త అబ్బాయి కథ విందాం”

“పన్నెండూ రావాలి! రావాలి!”

ఇక తప్పలేదు. నాకు ఇరుపక్కలనుండీ వాళ్లంతా నెడుతూ ఉంటే, మధ్యలో పచ్చగా వెలుగుతున్న ముద్ద మీదకి ఎక్కాను. పది జతల కళ్లు, చీకట్లోంచి నావైపే సారించి ఉన్నాయి- ఇద్దరి మధ్య రహస్యాన్ని వినడానికి ఆత్రుతగా, సిద్ధంగా. నా కథ నేను చెప్పాను, నీకు తెలిసినదేగా. నేను పూర్తిచేశాక, వాళ్లందరూ ఆ ఊళపాట ఎత్తుకున్నారు మళ్లీ. ఈ సారి నాకు కణతలు కంపించాయి. తలనాదుగా అనిపించింది. నేను కూడా, ఇటూ అటూ ఊగూతూ వాళ్లతో పాటు పాడటం మెదలెట్టాను:

కంటిపాపల్లో
కంబాలు, కంబాలు,
ఉరికంబాలున్నాయోయ్.
నీకు నువ్వే తగిలించుకో
ఉరితాడు బిగించుకు పో, చచ్చిపో.
నిట్టూర్చి నిప్పై రగిలిపో, రగిలిపో
బూడిదవై రాలిపో, ఆరిపో
సరి సరి రెండు-నాలు-గారె-నిమిది.

పాట అయ్యాక, నన్ను వదిలేశారు. చీకటి నీడల్లోకి వచ్చి కూలబడ్డాను. నేను కంపరంతో వణికిపోతున్నాను, పళ్ళు టకటకమని కొట్టుకుంటున్నాయి. నాపైన నాకు ఎప్పుడూ లేనంత అసహ్యం వేసింది. నావైపు సానుభూతిగా చూస్తూ ఆరు, “మర్చిపో, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నీ కథ నువ్వు చెప్పావు. అంతటితో సరి. నువ్వు మాత్రం ముక్కలైపోయినట్టున్నావు. ” అన్నాడు నా భుజం నొక్కి.

“ఆరూ, ఒక్క సంగతి నాకు చెప్పు. నేను, మిగిలిన వాళ్లు ఇక్కడకి రావడంలో అర్థం ఉంది. కానీ, నీకు ప్రేమ అవసరం ఏముంది? ఈ కంటిపాప నూతిలోకి నువ్వెలా వచ్చిపడ్డావు? నీకున్నది ఒక పుస్తకప్రియుడి హృదయం. నీకు కావాల్సిందల్లా పుస్తకాలు, బుక్-మార్కులు. వాటితోనే బతక్కుండా హాయిగా, ఇక్కడ, నీ అవసరం లేని చోట…”

యూనివర్సిటీ ప్రొఫెసర్ మొహంలో ఒక్కసారిగా చెప్పలేనంత దిగులు.

“ఎవరికైనా అవ్వచ్చు కదా? జామెట్రీనీ, ఆస్ట్రానమీని కనిపెట్టిన థేల్స్ అంతటివాడే పైకి చూస్తూ నడుస్తూ బావిలో పడిపోయాడట. నేనూ అలానే. నేను కావాలని ఏం చెయ్యలేదు. కానీ, ఎవరైనా వాళ్ల కనుపాపలలోకి నిన్ను కావాలని పడేస్తే ఏం చెయ్యగలం? అప్పట్లో నేను వుమెన్స్ కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పని చేసేవాడిని. సెమినార్లు, ట్యుటోరియల్స్, పేపర్స్, ఇదే నా జీవితం. సహజంగానే నా స్టూడెంట్లు నా దగ్గరకి–ఒక్కోసారి ఇంటికి కూడా–రిఫరెన్స్‌ల కోసం, అనుమానాలు తీర్చుకోవడం కోసం వచ్చేవారు. తను కూడా ఒకటి రెండు సార్లు వచ్చింది. ఈమె అంత చురుకైన విద్యార్థేం కాదు. అప్పుడు నేను స్టూడెంట్లకు అతి కష్టమైన స్టిమ్యులస్ లాగరిథమ్స్‌లో వెబర్-ఫెక్నర్ సూత్రం బోధిస్తున్నాను. ఒక అనుభూతి తీవ్రత, దాని ప్రేరేపకపు తీవ్రతకు అనులోమనిష్పత్తిలో… తను వినటం లేదని గమనించాను. ‘నేనేం చెప్పానో ఒకసారి చెప్పు’ అన్నాను. తను తల దించుకొని దేనినో చూస్తూ నవ్వుతోంది. కోపం ఆపుకోలేక, పుస్తకం టేబుల్ మీద విసిరేసి గట్టిగా అరిచాను: ‘అసలెందుకు నువ్వొచ్చింది?’

తను తలెత్తి చూసింది. కన్నీళ్ళు. అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారో, చేయాలో నాకు తెలియదు. ఆమె దగ్గరకి వెళ్లి మంచుపొర లాంటి తడి నిండిన ఆ కళ్ళల్లోకి చూడడమనే తప్పు చేశాను…”

భారంగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు ఆరు.

మళ్లీ పచ్చటి బురదలాంటి గోడలు చుట్టూ మూసుకుపోయాయి. ఉబ్బెత్తుగా ఉన్న ఆ పచ్చటి గోడలు చూస్తూ, ఇక నా బతుకింతేనా, ఈ ఊబిలాంటి గుహలో మగ్గిపోవాల్సిందేనా, వర్తమానం ఇక నాకెప్పుడూ ఒక కలేనా అని తెగని ఆలోచనలతో సతమవుతున్నాను.

కథ చెప్పడానికి ఇప్పుడు ఒకటి వంతు వచ్చినట్టుంది. పచ్చటి ముద్ద మీద నల్లగా ఒకటి. అతని పక్కనే ఇదిగో ఈ నల్లపుస్తకం. (క్వాగ్గా ఎప్పుడూ ఆ పుస్తకంతోటే ఉంటాడు).

“ఒకే ఒక్క విశిష్ట లక్షణం ఆధారంగా” అంటూ మొదలెట్టాడు ఒకటి. “మనం స్త్రీలను నాలుగురకాలుగా విభజించవచ్చు. మొదటి రకం స్త్రీలు, ప్రియులకి తమ దుస్తులు విప్పి, తిరిగి తొడగడానికి అనుమతిస్తారు; ప్రేమికులని బానిసలగా చేసి, ఒక పట్టాన రాని గుండీలు, నాడాల ముళ్ళు తీయడం లాంటి ఊడిగం చేయించుకోవడంలో ఆరితేరిన కళావతులు, సాటిలేని జాణలు వీళ్లు. మూసిన కంటితోనే, ప్రేమికులకు వెళ్ళమని ద్వారం చూపిస్తారు. రెండో రకం స్త్రీలు, వివస్త్రను చేయడం వరకే ప్రేమికుడికి అప్పజెప్పి, వాళ్ల దుస్తులు తిరిగి వాళ్ళే తొడుక్కుంటారు. ఆ పెద్దమనిషి కిటికీలోంచి చూడటమో, సిగరెట్టు కాల్చుకోవడమో చేస్తాడు. మూడోరకం స్త్రీలు, అందరికంటే ప్రమాదకరమైన వాళ్లు. ప్రేమికుడిని వాళ్ళ గుండీలు, నాడాల వైపుకు నడిపిస్తారు, ఆపైన వారి ప్రతీ సింగారింపులోనూ భాగం చేస్తారు. రెండర్థాల మాటలతో, కవ్వింపు చేష్టలతో రెచ్చగొట్టే ప్రమాదవతులు వీళ్ళు. ఒక్కమాటలో చెప్పాలంటే శృంగారానికి ఆహ్వానపత్రికలు. ఇక ఆఖరుగా నాలుగో రకం, వాళ్ళ దుస్తులు విడవడం, తిరిగి తొడుక్కోడం వాళ్లే చేస్తారు. వేశ్యలు, కొత్తమోజు తీరిపోయిన భార్యలు, ఇంకా ఎవరెవరో ఎవరికి తెలుసు? ప్రియమైన వారసులారా, ఇప్పుడు చెప్పండి, మన కంటి యజమాని ఇందులో ఏ వర్గానికి చెందినది?”

వెంటనే అన్ని గొంతులూ ఒక్కసారిగా అరవడం: “మొదటి రకం.”, “కాదు, కాదు, రెండు.” “తప్పు, మూడు.”

అన్ని గొంతులనీ అణుస్తూ, బిగ్గరగా అరిచారెవారో “అన్నిటికన్నా ఆఖరిది.”

నల్లటి ఒకటి సడిలేకుండా నవ్వింది.

“తెలుసు, నాకు తెలుసు. ఈ విషయంలో అభిప్రాయబేధాలు సహజం. ఈ పుస్తకానికి చాలా మందిని గురించి చాలానే తెలుసు. ఇంకా చాలా ఖాళీ పేజీలు ఉన్నాయనుకోండి, ఇంకా మనవారు అందరూ ఇక్కడ లేరు కూడానూ. కానీ, ఇవ్వాళో రేపో ఆ ఖాళీ పేజీలన్నీ నిండిపోతాయి, ఏదో ఒకనాటికి మన యజమాని కళ్ళు పొడిబారతాయి, మాయ చేసి ముగ్గులోకి లాగే నైపుణ్యాన్ని కోల్పోతాయి. అదిగో అప్పుడు, ఆఖరి పేజీ కూడా నిండిపోయాక, ‘కంప్లీట్ అండ్ సిస్టమాటిక్ హిస్టరీ ఆఫ్ వన్ ఎన్‌చాన్ట్రెస్’ అనే గ్రంథాన్ని, ఇండెక్స్‌తో సహా నేను పూర్తి చేస్తాను. నేను చెప్పిన వర్గాలు ఒక నమూనా మాత్రమే, ఆరు భాషలో చెప్పాలంటే, జస్ట్ ఫర్ మెథడలాజికల్ పర్పసెస్. ఒక రకం నుంచి ఇంకో రకానికి మధ్య వెడల్పాటి ద్వారాలున్నాయి. మన ప్రేయసి అన్ని రకాలలోనుండీ నడవడం పెద్ద ఆశ్చర్యమేం కాదు.

“మీకందరికీ తెలుసు కదా, నేను మెదటివాడిని. ఎప్పుడంటే… ఎప్పుడైతేనేంలే, గడిచిపోయిందనేదే ముఖ్యం. ఒక సాహిత్య సమావేశంలో పరిచయం అయ్యింది. ‘ఆమె దూరం నుంచి వచ్చింది, ఈ వాతావరణం కొత్త. కాస్త కనికరంతో మెలగండి.’ నాగరికంగా లేని ఆమె దుస్తులు తన సుకుమారాన్ని దాచాయి. ఆమెతో కళ్ళు కలపబోయాను. కాని, ప్రతిసారీ ఆమె రెప్పలు రెపరెపలాడి, పక్కకు తిరిగిపోయాయి.

“తర్వాత టీ తాగడానికి ఒకచోట చేరాం. ఒక వక్త ఏదో ప్రసంగం ఇచ్చాడు, రాసుకున్న పేజీలన్నీ కలగాపులగం చేసుకోవడంతో, అదొక తలనొప్పిగా మారింది. ఆ సమావేశపు పెద్ద, ఈ పల్లెనుంచి వచ్చిన అమ్మాయిని ఇంటిదాకా దింపమని అడిగాడు. ‘తను ఒంటరిగా వచ్చింది, ఇప్పటికే చాలా లేటైపోయింది, దారి తప్పితే కష్టం’ అంటూ. ఆమె కాలర్, గుండీ ఊడిపోయి వదులుగా ఉందని నాకిప్పటికీ గుర్తు.

“బయటకి వచ్చాం. హోరున కుండపోతగా వాన. గుర్రపు బగ్గీకోసం కేకేశాను. రాళ్లలా కొడుతున్న వర్షంలోంచి నడుచుకుంటూ, బగ్గీలో ఎక్కాం. ఆమె ఏదో గొణిగింది కానీ, ఇటుకరాళ్ళ దారిమీది బండి చక్రాల శబ్దంలో వినిపించలేదు. మలుపు మలుపులోనూ కుదుపులు, అదను చూసుకుని ఆమె మోచేతి దగ్గర పట్టుకున్నాను. ఆమె చేయి గుంజుకోబోయింది కాని కుదరలేదు. బగ్గీ కుదుపులకి, ఇద్దరం ఒకళ్ళొనొకళ్లం తగులుకుంటున్నాం. ఇక్కడే ఎక్కడో చీకట్లో ఆమె పెదాలున్నాయి. ఎక్కడో వెతికిచూద్దామనిపించింది. నేను ఆమె వైపు ఒంగాను. ఊహించని విధంగా ఆమె ఒక్క ఉదుటులో, బగ్గీ పరదా తీసి తెరిచి బయటకి గెంతేసింది. నవలల్లో ఇలాంటి సాహసం చదివినట్టు గుర్తు. కానీ, వాటిల్లో ఇది మగవాళ్ళు చేసే సాహసం. అందులో కుండపోత వర్షం సంగతి ఉన్నట్టు లేదు. నాకు కాసేపు ఏం చేయాలో తోచలేదు. ఆమె ఖాళీచేసిన ఒంటరి జాగాలో కొన్ని క్షణాలు; బగ్గీ నడిపే అతన్ని ఆపమని చెప్పడానికి మరికొన్ని క్షణాలు; బగ్గీలోంచి నేను ఉరకడం చూసి అతను నేను డబ్బు ఎగ్గొడతానేమో అని అరవడం, అతనికి డబ్బు ఇచ్చేసరికి, మరికొన్ని క్షణాలు; వృథా అయ్యాయి. తడిగా ఉన్న వీధి గుండా వెనక్కి వడివడిగా ఆమె కోసం వెతుకుతూ నడుస్తున్నాను, వీధిదీపాలు లేని ఆ చీకటిలో ఆమె ఆకారాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తూ. ఒక కూడలి దగ్గర ఆమే అనుకున్నాను. కాదు, ఎవరో వేశ్య, నోట్లో సిగరెట్‌తో: ‘వస్తావా?’ సైగచేసింది. వినిపించుకోకుండా వెళ్ళాను, మరోవీధి, మరో గందరగోళం. చివరికి ఒక వీధిలో కనిపించింది. వణుకుతూ, వానలో తడిసిపోయి. ఎటుపోవాలో తెలియక అక్కడ నిల్చుని ఉంది. మా సంభాషణ మీరు ఎన్నోసార్లు ఇప్పటికే విన్నారు. నా అపరాధ బావనలో నిజాయితీ లేకపోలేదు. ఆమె తడి వేళ్లు ముద్దు పెట్టుకుని, క్షమించమని వేడుకున్నాను. క్షమించనంటే ఆ వర్షపు బురదలో మోకాళ్ల మీద పడి మరీ అర్థించాల్సి ఉంటుదని భయపెట్టాను. ఏమైతేనేం, ఇంకో బగ్గీ కట్టించుకుని ఇద్దరం అందులో ఎక్కాం. రాతి రోడ్డు ఎంత కుదిపినా ఆమె పక్కకి నేను జరగలేదు, నా భుజాలు ఆమెని అంటకుండా, బిగించుకుని ఓ మూల కూచున్నాను. చలితో మా శరీరాలు గడ్డకట్టుకుపోయాయి, పళ్లు కటకటలాడుతున్నాయి. ఆమెకి వీడ్కోలు చెప్తూ మళ్లీ గడ్డకట్టుకుపొయిన ఆమె చేతులు ముద్దుపెట్టుకున్నాను. హఠాత్తుగా ఆమె కిలాకిలా నవ్వింది.

రెండ్రోజుల తర్వాత ఆమెను కలిశాను బోలెడు మందులతో, భరోసాలతో. అప్పటికే పాపం తను దగ్గు జలుబుతో వణికిపోతున్నది కాబట్టి మందులు చక్కగా అవసరానికొచ్చాయి. అప్పటికింకా నీ పంథా నేను అనుసరించలేదు, పదకొండూ… దానికింకా సమయం రాలేదు. ఏ కొంచెం మర్యాద తప్పినా, అతి చేసినా బెడిసికొట్టే దశ అది. అప్పటికింకా, నేనిలా వెలిసిపోయిన బూడిదరంగు బుడిపెని కాదు. ఆమె ఇంట్లో కిర్రుమంటున్న సోఫాలో కూర్చొని, తెల్లవారేదాకా కబుర్లు చెప్పుకొనేవాళ్ళం. ఆమెకి ఈ సిటీ గురించి తెలీదు, ప్రపంచం గురించి తెలీదు, నా గురించీ తెలీదు. మా కబుర్లు, ఎటుపడితే అటుపోతుండేవి. మొదట ఓపిగ్గా కిరోసిన్ పొయ్యి ఎలా వాడాలో చెప్పాను. ఆ తర్వాత, ఒకసారి ఏదో మాటల్లో వచ్చి, కాంట్ క్రిటీక్ గురించి పొడూగ్గా చెప్పాను. సోఫాలో ఓ మూల ముడుచుకొని కూర్చొని ఆ నల్లటి కళ్లని నావైపు నుంచి తిప్పకుండా ఏం చెప్పినా శ్రద్ధగా విన్నది.

ఆమెకి చివరకు ఆమె గురించి కూడా తెలియదు. ఒకరోజు తెల్లవారేదాకా నడిచిన మా కబుర్లలో ఆమె గురించి ఆమెకి చెప్పాను, ఇదిగో ఈ నల్లటి పుస్తకానికి వేసిన టాకాలు విప్పే ప్రయత్నం అది. ఆ సాయంత్రం ఆమె భవిష్యత్తులో ఎదుర్కోబోయే అనుభవాలు సంఘటనలు, ఉద్వేగాలు, నిరాశలు, కలయికలు, విడిపోవడాలు, ఇంకా చాలా వాటి గురించి. ఇదంతా ఆమె భవిష్యత్తు తలుపు తట్టే ప్రయత్నం. ఒక్కోసారి పొడిగా నవ్వింది, ఇంకోసారి నన్ను సరిదిద్దింది, మరోచోట మౌనంగా వింటూ ఉండిపోయింది. నా సిగరెట్టు ఆరిపోయినట్టుండడంతో, వెలిగించుకోడానికి అగ్గిపుల్ల గీశాను. ఆ పచ్చటి వెలుగులో, ఆమె మొఖం వేరుగా కనిపించింది, మరింత ముగ్ధంగా, ప్రౌఢిమతో భావిరూపంలా వెలిగింది. నేను చప్పున అగ్గిపుల్ల ఆర్పివేసి, చెప్పుకుంటూ పోయాను: మొదటి ప్రేమ, మొదటి వైఫల్యం, బాధాకరమైన వీడ్కోళ్లూ, అటుతర్వాత వచ్చే ప్రేమలూ – ఇవన్నీ. అక్కడితో ఆగలేదు, ఇంకా కొనసాగించాను. అనుభూతి అంతా అలిసిపోయి, కరిగిపోయి, వెలిసిపోయే సుదూర భవిష్యత్తు గురించీ, మనిషిగా ఖర్చయిపోయి, వెలిసిపోవడం ఎంత భయంకరమో, ఉద్వేగం కంటే కుతూహలమే మిగలడం ఎంత దౌర్భాగ్యమో, అక్కడ… మళ్లీ అగ్గిపుల్ల వెలిగించి, ఆమె మొహంలోకి చూసి, అలానే ఉండిపోయాను నా వేళ్లు కాలేదాకా. అవును, వారసులారా! అప్పుడే గనక నా ప్రయోగాన్ని నేను విజయవంతంగా ముగించగలిగి ఉంటే, ఒక డజను అగ్గిపుల్లలు వెలిగించి ఉండేవాణ్ణి. మీరు మోసిన ఆ పన్నెండుగురి మొఖాలనూ చూడగలిగేవాణ్ణి ఆమె మొఖంలో. కానీ, ఆమె అగ్గిపుల్ల లాక్కుని, ఆర్పేసింది. మా వేళ్లు పెనవేసుకున్నాయి, ఆ వానరాత్రిలో లాగా వణికిపోతూ. ఇంక చెప్పేందుకేముంది?”

నల్లటి ఒకటి, మండపం మీదనుంచి మెల్లగా దిగింది.

“విన్నావుగా, క్వాగ్గా గురించి నీ అభిప్రాయం?” అనడిగాడు ఆరు.

మర్యాదకోసం కూడా నేను ఏమీ అనలేదు.

“ఓహ్, అసూయగా ఉన్నట్టుంది? ఒకప్పుడు క్వాగ్గా డాంబికాలంటే నాక్కూడా చిరాగ్గానే ఉండేది. కానీ, గతాన్ని మనం గెలవలేం. చక్రవర్తికన్నా దర్పం ఎక్కువ దానిది, మొక్కి దాంతో సంధి చేసుకోవాల్సిందే. అదీగాక, అసూయ అంటే ఏంటో తెలుసా?”

అతని లెక్చరు నేను పట్టించుకోకుండా వెనుదిరిగి పడుకున్నాను. మర్యాదలేని మనుషుల గురించి ఆరు ఏదో గొణిగాడు.

ముందు నిద్ర నటించినా, కాస్సేపటికి నిజంగానే మంచి నిద్ర పట్టింది. ఎంతసేపో తెలీదు కానీ, అంతలో ఒక అద్భుతమైన వెలుగు నా కళ్లలోకి చొచ్చుకొని పాకింది. కళ్లు తెరుచుకుని చూద్దును కదా, చూట్టూ పరచుకున్న నీలపు కాంతి. మోచెయ్యి ఆనించి, పైకి లేచి అది ఎక్కడ నుండి వస్తోందో అని చుట్టూ చూశాను, ఆశ్చర్యంగా ఆ వెలుతురు నాలోంచే వస్తోంది. దాని వెలుగు నాలోంచి వస్తూ, కొన్ని అడుగుల దూరం వరకూ పరుచుకుంది. నా శరీరం తేలిగ్గా, దూదిపింజలా అయిపోయింది ఏదో కలలోలా. మిగిలినవాళ్లంతా గాఢ నిద్రలో ఉన్నారు. నేను, పచ్చటి వెలుతురు ముద్ద మీదకి పాకాను. నా లోంచి వస్తున్న కాంతి పుంజాలు, ఆ మంటపం వెలుతురూ ఒకదాన్నొకటి పెనవేసుకొని చిత్రమైన ఇంధ్రదనస్సు పరుచుకుంది. మరోసారి పైకి లేవగానే, ఆ గుహ గోడలు పట్టుకుని నేను పైకి తేలుకుంటూ వచ్చాను. గుహ పైభాగంలో కప్పు దగ్గర చీలిక తెరుచుకుంది. తేలిగ్గా, మెత్తగా ఉన్న నా శరీరాన్ని కుదించి అందులోంచి నేను పైకి రాగలిగాను. నా ముందు, అదే వసారా. నన్ను ఈ చీకటి గుహలోకి తెచ్చిన వసారా. నాలోంచి వస్తున్న వెలుగు వల్ల కొంచెం చూడగలిగాను. కంటిపాప ద్వారాన్ని సమీపిస్తూ… నాలో ఏదో ఆశ కుదుళ్లలోంచి కదిలింది. గోడల దగ్గర ఏవో ఆకారాలు తచ్చాడుతున్నాయి, కానీ అవేవీ నాకు పట్టలేదు.

గుండె గొంతులో కొట్టుకుంటుంటే కంటిపాపలో కిటీకీ దగ్గరకి వచ్చాను. హమ్మయ్య, ఎలాగైతేనేం, తిరిగి నేను స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాను. నేను గుడ్డిగా అటువైపు తుపాకీ గుండులా పరిగెత్తాను. కానీ, కనురెప్ప మూసేసి ఉంది. పిడికిలితో గుద్దాను, కాని దానిలో కదలిక లేదు. ఆమె మంచి నిద్రలో ఉన్నట్టుంది. కోపంతో, ఆ రెప్పలని కాళ్లతో, చేతులతో గుద్దాను, తన్నాను. అవి కాస్త కదిలాయి, కాని తెరుచుకోలేదు. నాలోంచి వస్తున్న వెలుగు తగ్గిపోవడం ప్రారంభించింది, నా శరీరం కూడా బరువెక్కిపోసాగింది. భయంతో, మళ్లీ ఏ చీకటిలో చిక్కడిపోతానో అని సొరంగంలోకి మళ్లాను. నానుంచీ వస్తున్న కిరణాలు నాలోకి కుంచించుకు పోతున్నాయి. వగరుస్తూ, మళ్లీ గుహ ముఖద్వారం దగ్గరకి వచ్చాను. చీలిక తెరుచుకుంది, దాంట్లోంచి మళ్లీ గుహ లోపలకి పడ్డాను, పడ్డానో విసిరెయ్యబడ్డానో.

ఎడారిలో తుఫానుకు ఎగురుతున్న ఇసకలా నా ఆలోచనలు. నేను ఎందుకు వెనక్కి వచ్చాను? ఏ శక్తి నన్ను ఇలా మళ్లీ ఈ గుహలోకి విసిరేసింది? స్వేచ్ఛనుండి బానిసత్వంలోకి. లేదా ఇదంతా ఒక పీడకలేమో? కానీ ఎందుకు, ఎలా?

ఆరుని భుజంపట్టి ఊపుతూ లేపాను. కళ్ళు నులుముకుంటూ ఉలిక్కిపడి లేచి, పాపం నా ప్రశ్నల పరంపరనంతా విన్నాడు.

“ఒక్క క్షణం. నీదంతా కల అని నువ్వంటావ్?” నా నుంచీ ఇంకా వస్తున్న నీలిరంగు వెలుతుర్ని చూస్తూ అన్నాడు – “హ్మ్, ఒక కల నడుస్తూ ఉండొచ్చు, కానీ ఆ కల, ఆశ్చర్యపోకు, నువ్వే. అవును. మిగిలిన అందరికీ కూడా ఈ అనుభవం అయ్యింది. ఆమె కలలు ఒక్కోసారి మనల్ని మేల్కొలిపి, మనల్ని తిరిగేలా బలవంతం చేస్తాయి. నిద్రలో నడిచేవాళ్లలా మనం పోతుంటాం ఎందుకో, ఎక్కడికో తెలియకుండా. ఇప్పుడు నీ గురించే కలగంటోంది. అందుకే నీలో ఇంకా ఆ కాంతి. ఇప్పుడు పోయింది. అంటే కల అయిపోయిందన్నమాట.”

“ఆరూ”, గుసగుసగా అన్నాను, “ఎన్నాళ్లిలా, నా వల్ల కాదు. ఇక్కడ నుండి తప్పించుకుని పారిపోదాం.”

అతను అడ్డంగా తలూపాడు. “అసంభవం.”

“కానీ, ఎందుకు? ఇప్పుడే కదా నేను ద్వారం దాకా పోగలిగాను. ఆ రెప్పలే అడ్డుపడకపోయింటే?”

“అసంభవం.” మళ్లీ అన్నాడు, “ఒకవేళ నువ్వు బయటపడినా, అక్కడ పక్కమీద నీ మనిషే ఉంటాడని నమ్మకం ఏమిటి? వాళ్లు ఇప్పటికే విడిపోయి ఉంటే, అప్పుడేం చేస్తావు? ప్రపంచంలో స్థలం చాలా పెద్దది. దారి తప్పిపోయి, ఎవరి కాళ్లకిందో పడి చచ్చిపోతావు. రెండోది, నీముందు కూడా సాహసవంతులు ఈ ప్రయత్నం చేశారు, కానీ…”

“మరి?”

“వెనక్కి వచ్చేశారు.”

“అవునా?”

“ఊ, ఆ చీలిక ఆమె కలలు కంటున్న వారి కోసం, లేదా కొత్తవాళ్ల కోసం మాత్రమే తెరుచుకుంటుంది. ఆ కలలు మనల్ని కట్టి ఉంచుతాయి. మూసుకున్న రెప్పలతో మనల్ని వాస్తవం నుంచి తెగ్గొడతాయి. మన అవసరం తీరిపోగానే మళ్ళీ ఈ కూపంలో పడేస్తాయి. దీనికి ఒక్కటే మార్గం: కొత్తవాడు వచ్చే దాకా వేచి ఉండి, ఆ చీలిక తెరుచుకోగానే ఇందులోంచి బయటపడటం. కానీ, ఒక రహస్యం దానికి అడ్డుపడుతుంది…”

“ఏంటది?”

“నువ్వు బయటకి పోతున్నప్పుడు, నీ కొత్త వారసుడు, నీ స్థానంలోకి రాబోతున్నవాడు నీకు ఎదురవుతాడు. ఆ రాబోయేవాడిని చూడాలనే కోరిక, అది క్షణమాత్రమైనా సరే, చాలా బలమయింది. కానీ ఆ ఒక్క క్షణం చాలా ముఖ్యమైంది. దాన్ని పోగొట్టుకుంటే, అంతా పోయినట్టే. నువ్వూ ఆ రాబోతున్నవాడు ఇద్దరూ కలిసి కింద పడతారు. ఇంతవరకూ జరిగిన ప్రయత్నాలలో జరిగిందదే. చూశావా? ఇదో తప్పించుకోలేని మానసిక రుగ్మత.”

అతను అసంభవం అని మాటిమాటికీ రెట్టిస్తున్నకొద్దీ, నాలో ఎలాగైనా తప్పించుకు తీరాలన్న పట్టుదల పెరిగింది. ఎన్నో గంటలపాటు ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను. ఇంతలో, మండపం ఎక్కడానికి రెండు వంతు వచ్చింది. మొదటిసారి, అతని వెలిసిపోయి, కుంచించుకుపోయిన రూపాన్ని పరికించి చూశాను. ఇబ్బందిగా దగ్గుతూ, మొదలెట్టాడు, మాటలకోసం తొట్రుపడుతూ.

“ఎలా జరిగిందంటే… ఒకరోజు నాకో ఉత్తరం వచ్చింది, పొడుగాటి కవర్లో, బొక్కిసపూల వాసనతో. కవరు చించి ఉత్తరం తీశాను, కొక్కిరిబిక్కిరి దస్తూరితో ఉంది. చదవటం మొదలెట్టాను.”

“ఓహ్… ఎంటది?”

“నిశ్శబ్దం!” అని అందర్నీ అజ్ఞాపించాడు క్వాగ్గా, “నీ కథ ఇప్పటికి ఆపు. పైనుంచి… వినిపిస్తోందా?”

అందరి గొంతులూ మూతబడ్డాయి. నిశ్శబ్దం. మొదట్లో నాకేం వినిపించలేదు. క్రమక్రమంగా, పైనుంచి, గుహకి చాలా దూరంలో, ఎవరివో అడుగుల చప్పుడు. జాగ్రత్తగా, ఆచి తూచి అడుగేస్తున్నట్టు వినిపిస్తున్నాయి. అవి ఆగాయి, మళ్లీ కదిలాయి, ఆగాయి…

“విన్నావా?” అన్నాడు ఆరు. “అతను వచ్చాడు. అప్పుడే తిరుగుతున్నాడు.”

“ఎవరు?”

“పదమూడు.”

మళ్లీ మేమంతా పాడటం మెదలెట్టాం, ఆ ఊళపాట. మరవబడ్డవాళ్ల స్తుతి. మొదట మెత్తగా, అతను భయపడకుండా, ఆ తర్వాత మెల్లమెల్లగా గొంతు పెంచుతూ బిగ్గరగా, గుహ మాంసపు కండరాల గోడలు అదిరేలా పాడుతున్నాం. క్వాగ్గా సంజ్ఞలతో కాసేపు ఆగడం, ఆగి, మళ్లీ మొదలెట్టడం.

దగ్గరగా వచ్చిన అడుగుల చప్పుడు, గిరుక్కున వెనక్కి తిరిగి వెళిపోయినట్టున్నాయి.

“బిగ్గరగా, ఇంకా బిగ్గరగా!”, క్వాగ్గా అరిచాడు, “అతన్ని లాగాలి, ఇందులోకి లాగాలి. మనవాడు తప్పించుకోకూడదు, తప్పించుకోలేడు.”

మా కీచు గొంతుకలు మరోసారి తారస్థాయిని అందుకున్నాయి గుహ బురద గోడలు అదిరేలా. కానీ, పదమూడో వాడు, గుహ పైన గిరికీలు కొడుతూ, ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు, గుహ ద్వారం దాకా వచ్చి వెనక్కి పోతున్నాడు. అందరం ఓపికున్నంతవరకూ పాడి అలిసిపోయాం. క్వాగ్గా విశ్రాంతికి అనుమతించాడు. అందరూ మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. నేను మాత్రం ఊరుకోలేదు. నా చెవులు గోడలకానించి ఆ చీకటిలో శబ్దం కోసం చెవులురిక్కించి వింటున్నాను. కాస్సేపటి వరకూ చడీ చప్పుడూ లేదు. కానీ, అంతలో మళ్లీ, గుహ పైనుంచి అడుగుల చప్పుడు వినిపించింది. అతి మెల్లగా గుహ పైనున్న చీలిక తెరుచుకోసాగింది. గోడలను పట్టుకుని నేను పైకి ప్రాకడానికి ప్రయత్నించాను కానీ, అవి పట్టు దొరకక, కిందకి జారిపోయాను. కింద ఏదో గట్టి వస్తువుమీద పడ్డాను. అది క్వాగ్గా నల్ల పుస్తకం. దాని, టాకాలు విప్పి, వాటిని కొక్కేలుగా చేసుకుని, గోడమీదకి ఎగబ్రాకాను. నా చెయ్యికి ఎడం అవుతున్న బిలద్వారం దొరికింది.

ఎవరిదో తల అక్కడ ఊగిసలాడుతోంది. కళ్లు గట్టిగా మూసుకుని, ఒక్క ఊపుతో చీలికలోంచి బయటపడి, గుడ్డిగా పరిగెత్తాను. రెండుసార్లు నడిచిన మార్గమే కాబట్టి, సొరంగం నాకు అలవాటే, చీకటిలో కూడా అది నాకు తెలుసు. తేలిగ్గానే నాకు కంటిలోంచి వస్తున్న వెలుగు కనిపించింది. సగం మూసుకున్న ఆ కళ్లలోంచి కిందకి దిగి, తలగడ మీదకి గెంతి, వస్తున్న ఆయాసాన్ని తట్టుకుంటు ఇలా వచ్చి పడ్డాను. ‘అతను ఇంకెవరో అయితే నా గతేం కాను’, అని కంగారుపడుతూ, ఆశకి-భయానికి మధ్య ఊగిసలాడుతూ, ఎలాగైతేనేం, వేకువజాము వెలుగులో నిన్ను చూశాను–నేను ఎవరి ప్రతిబింబమో ఆ వ్యక్తి పర్వతాకారాన్ని చుశాను. నిన్ను చూశాక, ప్రభువా, ఇంక నిన్ను ఎప్పుడూ వదిలి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను, ఇంకెప్పుడూ ఇంకెవరి కళ్లలోకి దూకే సాహసం చెయ్యను. అయినా, అది చేసేది నేను కాదు, నువ్వు….”

ఆమె కనుపాపలోని నా కంటిపాపడు అంతకుమించి ఇంకేం చెప్పలేదు. ఆ నల్లటి పుస్తకాన్ని చంకలో పెట్టుకుని, లేచి నిల్చున్నాడు. గులాబీరంగు వేకువ చారలు కిటికీ అద్దాలపై తచ్చాడుతున్నాయి. ఎక్కడో బండి చక్రాలు తిరుగుతున్న చప్పుడు. ఆమె కనురెప్పలు కదిలాయి. కంటిపాపడు ఆ కళ్లవైపు జాగ్రత్తగా చూసి, నా వైపుకి తిరిగాడు, నా అనుమతికోసం అన్నట్టుగా. ‘సరే నీ ఇష్టం ప్రకారమే కానీ’ నవ్వుతూ, నా మొహాన్ని అతనికి వీలయినంత దగ్గరగా చేర్చాను. అతను, నా కంటిలోకి ఎక్కి, లోపలికి పోయాడు, కానీ, బహుశా అతని చంకలో పుస్తకం అంచు నా కంటి గుడ్డుని బలంగా గీరిందేమో, భరించలేని నొప్పి నా బుర్రంతా పాకింది. అంతా చీకటి, కన్ను పొడుచుకున్నా కనిపించని చిమ్మచీకటి. ఎంతోసేపు ఉండదేమో అనుకున్నాను. ఊహూ! గులాబీరంగు వేకువ నల్లగానే ఉంది. కాలం తన గిట్టల మీద వంగి వెనక్కితిరిగినట్టు, చీకటి రాత్రి నామీదకి ఉరికింది. మంచం మీదనుంచి జారుకుని, గబగబా బట్టలేసుకుని, చప్పుడు చెయ్యకుండా బయటపడ్డాను. సావిడి దగ్గర ఒక మలుపు, తర్వాత తలుపు, మరో మలుపు, మరో తలుపు, గోడల్ని తడుముకుంటూ ఒక్కో మెట్టూ దిగాను. వీధిలోకి వచ్చాను. సూటిగా నడుస్తూ, ఎటుపోతున్నానో తెలియకుండా, ఎందుకో, ఏమిటో పట్టించుకోకుండా నడిచాను. క్రమక్రమంగా, గాలి పలచబడి, భవంతులు లీలగా కన్పిస్తున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే ఎర్రటి రెండో వేకువ నన్ను అందుకుంటోంది.

ఉన్నట్టుండి, పైనుంచి కంచు గంటలు గణగణమన్నాయి. తలెత్తి చూశాను. ఒక పాతకాలపు చర్చి గోడల పైన ఒక త్రిభుజంలో చిత్రించిన పెద్ద కన్ను మంచుతెరలు చీల్చుకుని నా వైపే సూటిగా చూస్తోంది. నా వెన్నులోంచి వణుకు భుజాల్లోకి పాకింది. ‘ఇటుకల మీద వేసిన బొమ్మ, అంతే’, మంచుతెరలనుంచి నన్ను నేను విడగొట్టుకుంటూ, పదే పదే అదే అనుకున్నాను, ‘ఇటుకల మీద వేసిన బొమ్మ, అంతే’.

వెలుతురు చీలుస్తున్న మంచులోంచి నావైపు వస్తూ కనిపించింది ఒక బెంచి. ఇక్కడే, నేను చాలా సేపు కూర్చున్నాను, ఈ మధ్యనే. చీకటి నన్ను ఆవరించడానికి ఎదురుచూస్తూ. ఇప్పుడా బెంచి పలకల మీద మంచుబిందువులు పరుచుకుని ఉన్నాయి.

బెంచి చివర తడిని తుడిచి కూర్చున్నాను, జ్ఞాపకాలు నెమరేసుకుంటూ. ఇక్కడే కదా నేను అప్పటికింకా స్పష్టతలేని ఒక నవలిక గురించి ఆలోచించింది? ఇప్పుడు నా దగ్గర ఆ కథాంశానికి సరిపడా సరుకు ఉంది. ఒక కొత్తరోజు ప్రవేశిస్తున్న ఆ సమయంలో, నేను చెప్పదలచింది ఎలా చెప్పాలా అని ఆలోచించాను. ఏదీ చెప్పినట్టు ఉండకుండా అంతా చెప్పాలి. ముందుగా నిజాన్ని కత్తిరించేయాలి, అది ఎవరికి కావాలీ? ఆ తర్వాత బాధని నా కథ కాన్వాస్ అంచుల దాకా పులమాలి. ఆ పైన, కాస్త రోజువారీ సంఘటనలు కాస్త కాస్త, అక్కడక్కడా అద్దాలి, కాస్త మొరటుదనంతో. అదిలేకుండా ఎలా? చివరగా, కొన్ని తాత్విక వాక్యాలు…

ప్రియమైన పాఠకుడా! ఈ వాక్యాలు నీ కంటిపాపకి అంటకుండా నువ్వు వెనుదిరిగి వెళిపోతున్నావు. వద్దు, వద్దు. నన్ను అప్పుడే ఈ బెంచి మీద వంటరిగా వదిలెయ్యకు. నా చెయ్యి పట్టుకో. చాలాకాలం ఒంటరితనాన్ని అనుభవించినవాణ్ణి. ఇంకాస్త గట్టిగా పట్టుకో, మరికాస్త బలంగా… ఇప్పడివరకూ ఎవరికీ చెప్పని రహస్యం నీతో చెప్తాను: పసిపిల్లలకి చీకటి చూపించి ఎందుకు భయపెట్టడం? ప్రత్యేకించి అదే చీకటితో వాళ్ళను బుజ్జగించి నిద్రపుచ్చి కలల్లోకి నడిపించగలిగినప్పుడు!

(1927)
-------------------------------------------------
రచన: నాగరాజు పప్పు 
మూలం: Sigizmund Krzhizhanovsky,
ఈమాట సౌజన్యంతో

Thursday, August 22, 2019

కవితాపానశాల మద్యం


కవితాపానశాల మద్యం

సాహితీమిత్రులారా!


ఉ.
కాలమహర్నిశంబనెడు కత్తెరతో భవదాయుదంబర
శ్రీల హరించు, మోముపయిజిల్కును దుమ్ముదుమార మేలకో
జాలిపడంగ? నీ క్షణము సంతసమందుము; నీవువోదు; వీ
రేలుబవళ్లు మున్నటు చరించు నిరంతర మండలాకృతిన్
చం.
గతము గతంబె యెన్నటికి కన్నులగట్టదు; సంశయాంధసం
వృతము భవిష్యదర్థము; వివేకవతీ! యొక వర్తమానమే
సతత మవస్య భాగ్యమగు సంపద; రమ్ము విషాదపాత్రకీ
మతమునఁదావులేదు క్షణమాత్రవహింపుము పానపాత్రికన్
ఈ పద్యాలు ఏవో మారుమూల గ్రంథాల్లోంచి తెచ్చి ఉదాహరిస్తున్న పద్యాలు కావు. దాదాపు 70, 75 ఏళ్ల నించీ కవిత్వ ప్రియుల రసనాగ్రాన సంచారం చేస్తున్న పద్యాలే. రసజ్ఞులు పదింపదిగా మననం చేసుకునే పద్యాలే.

ఈ పద్యాల గురించి ప్రత్యేకంగా వివరించుకోవలసినది ఏమైనా ఉంటుందనుకోను. ఎందుకంటే పద్యాలు చదువుకుంటూ పోతుంటేనే అర్థం అవగతమైపోతుంది. భావం కోసమో ఏవైనా పదాల తెలివిడి కోసమో ఒక్క క్షణం కూడా నిలవాల్సిన అవసరంలేదు. దీర్ఘ సమాసాలేమీ లేవు. చిన్నచిన్న వాక్యాలతో ఒక మిత్రుడు పక్కన నిల్చుని విశేషాలు వివరిస్తున్నట్లు నిమ్మళమూ, అప్రతిబంధితమూ ఐన ధార. పదాలన్నీ చాలా సహజంగా వచ్చి ఛందస్సులో ఒదిగిపోయిన సౌలభ్యం. ఉదాత్తమైన ఊహలను అలతి పదాల్లో అలవోకగా వింగడిస్తున్న చతురిమ. ఈ ధోరణులన్నీ కలసి పద్యాలను పరమ సుందరంగా తీర్చిదిద్దినవని చెప్పుకుంటే చాలు.

‘నిన్న రాబోదు, ఎల్లి రాలేదు, ఉన్ననాడే నీది భాయీ’ అనే భావాన్ని బలంగా వినిపిస్తూ బ్రతికుండగానే హాయిగా బ్రతుకు, నిన్న ఇట్లయిందే, రేపు ఎల్లా ఉంటుందో అనే తలపులు మనసులోకి రానీయకు– అనే బోధనలు వినగానే, ఈ భావాలు ఉమర్‌ఖయ్యామ్‌వి కాక మరెవరివి అని ప్రతివారూ గుర్తిస్తారు. ఉమర్‌ఖయ్యామ్ అనగానే తెలుగు సాహిత్యానికి ఆయన్ను పరిచయం చేసిన దువ్వూరి రామిరెడ్డిగారు తటాలున మదిలో మెదులుతారు. అవును, పైన పేర్కొన్న కమ్మని పద్యాలు రచించి గానం చేసిన ‘కవి కోకిల’ దువ్వూరి రామిరెడ్డిగారే! వారి ఖయ్యామ్ రుబాయతుల ఖండకావ్యం పానశాల లోనివి అవి. చాలా మంది కవులకు చాలా సార్థకమైన బిరుదులున్నాయిగాని ‘కవికోకిల’ అనే బిరుదు రామిరెడ్డిగారికి అన్వర్థమైనంతగా మరే బిరుదూ మరే కవికీ శతశాతం సరిపోతుందనేది సందేహమే. ఎంత అద్భుతంగా పద్యాలు రాస్తారు ఆయన! లాలిత్యమూ ప్రౌఢిమా సౌందర్యమూ సరళతా గాంభీర్యమూ స్పష్టతా అలవోకతనమూ అన్నీ ఒకచోట – ఆధునికుల్లో – చూడదలచుకుంటే రామిరెడ్డిగారి పద్యాలే ప్రథమ గణ్యాలు.

ముందు కొద్దిగా ఖయ్యామ్ గురించి. పదకొండో శతాబ్దపు ద్వితీయార్ధభాగంలో జన్మించి, పన్నెండో శతాబ్దపు ప్రథమార్ధభాగంలో మరణించిన ఖయ్యామ్ పూర్ణాయుర్దాయ జీవి. ఈయన పారశీకములో తన కవితలను రుబాయత్ ఛందస్సులో వ్రాశాడు. 1859వ సంవత్సరంలో ఎడ్వర్డ్ ఫిడ్జరాల్డ్ అనే ఆంగ్ల కవి కొన్ని ఖయ్యాం రుబాయీలను ఇంగ్లీషులోకి అనువదించి ప్రకటించాడు గాని, వాటిని తొలుత జనం పట్టించుకోలేదు. ఆ మరుసటేడాది మరికొన్ని రుబాయీలను అనువదించి, అన్నిటినీ మరో సంపుటిగా తెచ్చిన తర్వాత ఆంగ్ల పాఠకులు ఎగబడి ఖయ్యామ్‌ను సొంతం చేసుకున్నారు. దరిమిలా చాలామంది ఆంగ్లీకరణం కావించారు గాని, ఫిట్జరాల్డును చదివిన పాఠకులు మరెవరినీ మన్నించలేదు.

ఖయ్యామ్ రుబాయతుల అందాన్ని పారశీకంలోనూ, ఫిట్జరాల్డు భాషాంతరీకరించిన ఆంగ్లంలోనూ చూచి ముగ్ధులైన తెలుగు కవులు అనేకులు ఆయా భాషల మాధ్యమం ద్వారా తెలుగులోకి తేవడానికి ప్రయత్నించారు. పద్య కావ్యాలుగా తీసుకొచ్చారు. వారిలో కొందరు లబ్ధప్రతిష్ఠులూ, కొందరు ఔత్సాహికులూ. అవీ బాగానే వున్నాయి కాని దువ్వూరివారి పద్యాలను ఆప్యాయంగా అక్కునజేర్చుకున్న తెలుగు పాఠకజనం ఇతరుల పద్యాలను అంతగా ఆదరించలేదు. అబ్బూరి వరదరాజేశ్వరరావుగారైతే (వారేనని గుర్తు) రామిరెడ్డిగారి పానశాల వచ్చింతర్వాత ఇతరులు ఖయ్యామ్ జోలికి ఎందుకుపోతారో అని ఆశ్చర్యపోయారు. అలాంటి అభిప్రాయం ఎవరు వెలిబుచ్చినా అది పానశాల ఎడ ఉండే గౌరవభావం వల్లనే కాని, కవిత్వం వచ్చినవారు అందమైన పరభాషా కావ్యాన్ని తెలుగులోనికి తెద్దామనుకోవడం చాలా సహజమూ, ఆహ్వాన యోగ్యమూ అనేది అందరూ ఒప్పుకుంటారు. పైగా ఫలానివారు వ్రాశారు గదా, మీరెందుకు మళ్లీ వ్రాయడం అని ఆంక్ష పెట్టడం సమంజసం కాదు గూడా. కొన్ని కొన్ని రచనలకు అలాంటి పేరు వస్తుంది. ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరిని అనువదించిన తర్వాత ఆ ప్రయత్నానికి పూనుకొన్న ఇతరుల కృషికి ఆదిలోనే పెదవి విరిచినవారు ఎందరో! ఇటీవల ఖయ్యామ్ మీద చేయి చేసుకున్నవారిలో జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ఒకరు. వారు అమర్ ఖయ్యామ్ పేర అనువదించిన కావ్యమూ బాగా ప్రజాదరణ పొందింది. ఆ పద్యాలన్నీ పాపయ్యశాస్త్రిగారి సహజ లాలిత్యంతో బాగుంటాయి.

ఖయ్యామ్‌ను మన వేమనతో కొంతవరకూ పోల్చుకోవచ్చు. వేమన కొంతకాలం రక్తిలో ఉండి విరక్తిలోకి వస్తే ఖయ్యామ్ మాత్రం పూర్తిగా రక్తికే అంకితమైనాడు. ఆయన జీవితపు నశ్వరత్వాన్ని గురించి చెప్పినా, విరక్తుడు మాత్రం కాదు. వేమన దేవుడినీ ఆయన పేరుతో జరిగే ఆచారాలనూ కూడా నిరసించాడు. ‘తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా’ అనీ ‘పాల సంద్రము మీద పవ్వళించినవాడు గొల్ల యిండ్ల పాలు కోరనేల – ఎదుటివారి సొమ్ములెల్లవారికి తీపి’ అంటూ దేవుణ్ణి అపహసించాడు గాని ఖయ్యామ్ నాస్తికుడు కాడు. ‘సృష్టికాద్యంతములు నీవె స్రష్ట నీవె, పాల ముంచ నీటను ముంచ ప్రభువు వీవె’ అని అంటాడుగాని దేవునితో నాకేమి నిమిత్తం అనే భావాలూ చాలా చోట్ల వెలిబుచ్చాడు. ‘రెండు దినములకొకతూరి ఎండురొట్టె బోసిముంతెడు చలినీళ్లు పుట్టెనేని ఏల నిను బోలువానికి కేలుమోడ్చ’ అంటాడు. దేవుని అస్తిత్వాన్ని అంగీకరించినా ఆయన పేరుతో జరిగే నమాజులూ పూజాదికాలను నిరసించాడు. ‘దేవ! నీవు లేని గుడిని ప్రార్థించుకంటె పానశాలను సత్యమ్ము పలుక మేలు’ అంటాడు. ప్రార్థన అంటే అసత్యమైనట్లు ఆయన మసీదుకు పోయేది నమాజు కోసం కాదు. ఈ పద్యం చూడండి.

మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ; బ్రాతవై
చినిఁగెను; నేఁడునున్ మరల జెప్పులకోసము వచ్చినాఁడ. నె
మ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపఁగ రాను; నీవు చ
చ్చినయెడ వీడిపోయెదవు చెప్పులువోలె నమాజుసైతమున్.

నమాజుతో నెమ్మనము చెడుతుందట! చిత్రం.

ఇంకో తమాషా భావం, ఇదుగో చూడండి. ‘ఎవ్వరున్ పాపము సేయకున్న తన మన్నన ఎందుకు?’ అని దేవుని ప్రశ్నిస్తాడు. అంతేకాదు, ‘నీ బిరుదున్నిల్పుటకే నొనర్చితిని నిర్భీతిన్ సమస్తాఘముల్ – నరకంబంటక యున్న వీలగునె పశ్చాత్తాపముం బొందగన్’– ఇదీ ఖయ్యామ్ ధోరణి.

రామిరెడ్డిగారి పానశాల అనువాదమే అయినా భావానువాదమే కాని ముక్కస్యముక్కానువాదం కాదు. ఆయన స్వతంత్ర కావ్యాలు గూడా వ్రాశాడు. అవీ చాలా గొప్పగా ఉంటాయి. కృషీవలుడు, నలజారమ్మ, ఆయన స్వతంత్ర కావ్యాలు. ఏమైనా రామిరెడ్డి అనగానే తటాలున పానశాల గుర్తొచ్చేది నిజమే కాని, ఒక్క నిమిషం ఆగిన పిమ్మట ఆయన ఇతర కృతులనూ గుర్తుచేసుకుంటాడు తెలుగువాడు.

రామిరెడ్డిగారు ఖయ్యామ్ రుబాయీలను పారశీకం నుంచే అనువదించారు. దానికోసం పారశీ భాషను స్వయంకృషితో నేర్చుకుని నిష్ణాతుడై అనువాదానికి పూనుకున్నాడు. అదీ ఆయన అంతస్సత్వం. ఖయ్యామ్ రుబాయీల మౌలిక సౌందర్యాన్ని తెలుగులోకి దించేశాడు. ‘బహరాము, బాగ్దాదు, బల్ఖ, వజీరు, మునాది, గోరి, కౌసరు’ లాంటి పదాలు అనువాద సందర్భం కోసం వాడాడుగాని, ఆ పదాలే లేకుంటే పానశాలను ఎవరూ అనువాద కావ్యం అనుకోరు. పారశీక వాతావరణాన్ని తెలుగుదేశంలో ప్రతిష్ఠించడానికి తెలుగు తీపినీ, తెలుగు పద్యానికి పార్శీ శృంగార సౌందర్యాన్నీ అద్దారు.

కేవలం ద్రాక్షాసవపు గిండి మాత్రమే అయితే అది అసంపూర్ణమే. ఆ చషకాన్ని సాకీ ఒయ్యారంగా అందిస్తుంటేనే సందర్భానికి సార్థకత- ‘రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురపు విడెమ్ము’లాగా. అయితే అక్కడ రమణికీ స్వీకర్తకూ మధ్య ప్రియ దూతిక వుంది గాని, సాకీ స్వయంగానే రమణిలాంటిది. దూతిక కాదు. ఖయ్యామ్ ‘మదిరాతపస్వి’ మరి.

శృంగారానికి సంబంధించినంతవరకూ పారశీక కవి చూపులూ, సౌందర్యాన్వేషణా వనిత ముఖం దాటి ఈవలకు రాలేదు. ముద్దు ముంగురులు, బిత్తరి కన్బొమలు, తేమ రాగిల్లిన రాగవతీ కపోలములు, చెలియ నిగారపుం దళుకు చెక్కులనేలిన పుట్టుమచ్చ, సరసాస్యబింబము- ఇంతవరకే. మన తెలుగు సంస్కృత కవులైతే- వారి ఊహలు సుందరి మెడమీది నుంచి పయోధరాల మీదికి దూకి, నూగారు మీది నుంచి జారి పొక్కిలి దాకా ప్రయాణిస్తాయి అనేది మనం ఎరిగిందే. రామిరెడ్డిగారు సీరియస్‌గానే అన్నారో చమత్కరించారోగాని పార్శీ యువతులు గాగ్రాలూ, కుర్తీలూ ధరించడం అందుకు కారణం కాబోలు అన్నారు!

పానశాలలోని చాలా పద్యాలు సాహితీ మిత్రుల సంభాషణల్లో ఉటంకింపబడుతూవుంటాయి. చాలా పద్యాలు రసికుల నాలుకల మీద నర్తిస్తుంటాయి. సహృదయ పాఠకుల పిపఠిషను ఎగదొసేందుకు కొన్ని ఉదహరిస్తాను, చిత్తగించండి.

అయయో! ఎందఱి మానవోత్తముల కంఠాకూరముల్ ద్రెంచె నిర్దయమౌ కాలము!
నీవూనేనను తారతమ్యమిహమందేగాని, భూగర్భ రత్నావాసంబున లేదు
పారదమట్లు జీవితము పట్టిన నిల్వదు శీఘ్రగామి
వాదులుమాని నా సరసవారుణినానుము, దానితో మహమ్మూదు సమస్త రాజ్యరమ బోలదు
అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల, విశ్రాంతి గృహంబు, అందునిరుసంజలు రంగుల వాకిళుల్
మానవులైన వారెపుడొ మ్రందుట నిశ్చితమౌట బాగదాదైనను, బల్ఖయైన సమమౌను
జీవిత సార్థవాహము విచిత్రగతింబయనించు నందులో నీవొక ఱెప్పపాటయిన నెయ్యరతో సుఖముందువేని మోదావహమంతకన్నగలదా
పరమొ, గిరమ్మొ, దాని తలపైనొక దోసెడు మన్ను చల్లి సుందరి మెరుగుం గపోలముల దాచిన ముద్దులు దొంగిలించి
ఇల చదరంగ, మందు జనులెల్లరు పావుల, హస్సులున్నిశల్ తెలుపును నల్పుగళ్ళు కదిలించును రాజును బంటు దక్కు పావుల విధియాటకాడు
పైన ఉదాహరించిన పద్యపాదాల తొలిపాదాలంత హార్దికంగా మలిపాదాలూ ఉంటాయి. అన్ని పద్యాలనూ పూర్తిగా ఇవ్వటం ఒక కేటలాగును చేర్చడమే అవుతుంది గనకా ‘గ్రంథ విస్తర భీతి’తోనూ కుదించాను. సహృదయ పాఠకులు అర్థంచేసుకోగలరు.

ఖయ్యామ్ తొంబది ఏళ్ళు పైనే జీవించినట్లున్నాడు. ఆయన జీవితపు ద్వితీయార్ధం అంత సుఖంగా సాగినట్లు లేదు. అయినా తన ముదిమిని ఆసవపానంతో ‘లేతగించు’కున్నాడు. అందుకే ఆయన కవితలు లేబ్రాయపు మార్దవంతో ఉంటాయి. రెడ్డిగారి భాషాంతరీకరణం ఇంకా నునులేత.

రామిరెడ్డిగారు తన యాభైయవ ఏటనే మరణించారు. అదేమంత పెద్ద వయస్సు కాదు. కావ్యాలేగాక కొన్ని పద్య ఖండికలూ ఆయన వ్రాశాడు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మరణించాడు. ఆయన వ్రాసిన స్వాతంత్ర్య రథము అనే ఖండిక, మరికొన్ని పద్యాలూ, కొన్ని ముత్యాలసరాలూ సామినేని ముద్దుకృష్ణ సంకలించిన వైతాళికులులో చోటుచేసుకున్నాయి.

రెడ్డిగారు ఖయ్యామ్‌ను సంబోధిస్తూ క్రింది పద్యం చెప్పారు.

పారసికన్న శ్రావ్యమయి, పల్లవ కోమలమై సుధారసం
బూరెడు మా తెనుంగు నుడి నొప్పిద మౌనటు, నీదు భావముల్
ఏరిచి చేర్చికూరిచితి నింపగు కావ్యము నో ఖయామ! నీ
పేరిక యావదాంధ్ర పృథివీస్థలి శాశ్వతమై తనర్చుతన్.

కవిగారి ఆశంస పూర్తిగా నెరవేరినట్లే. ఐనా నిజాన్ని సగమే చెప్పాడు వినయం మూలకంగా. ఖయ్యామ్‌తోపాటు దువ్వూరి రామిరెడ్డిగారి యశస్సు కూడా యావదాంధ్ర పృథివీస్థలిలో చిరస్థాయి అయిందనే రెండో సగం నిజాన్ని కూడా ఆహ్లాదంగా చెప్పుకుని, పానశాల పద్యాలను మళ్ళీమళ్ళీ మననం చేసుకుందాం.
------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, August 20, 2019

దేవుడి కొడుకు


దేవుడి కొడుకు

సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి...........

పన్నెండేళ్ళ రాయ్‌చరణ్‌కి యజమాని ఇంట్లో పని దొరకడానిక్కారణం రాయ్‌చరణ్‌ వయస్సు ఒకటైతే రెండోది యజమానిదీ రాయ్‌చరణ్‌దీ ఒకటే కులం కావడం. మొదట్లో ఇంట్లో ఏదో ఒక పని చేయడానికి పనికొస్తాడేమో అని పెట్టుకున్న రాయ్‌చరణ్‌ యజమాని కొడుకుని చూడ్డానికి ఉపయోగపడ్డాడు. అమ్మగారు ఇంట్లో ఏదో పనిలో ఉన్నప్పుడు కుర్రాణ్ణి ఆడించడం, వాడు ఏడుస్తూంటే సముదాయించడం వగైరాలతో పాటు ఇంటా బయటా చిన్న చిన్న పనులు. అలా యజమాని కొడుకు అనుకూల్, రాయ్‌చరణ్‌ చేతిలోనే పెరిగాడు దాదాపుగా.

కుర్రాడు పెద్దవుతున్నా, రాయ్‌చరణ్‌ తోటే నేస్తం. అనుకూల్‌కి చదువూ, పెళ్ళీ అయ్యి కోర్టులో ఉద్యోగం వచ్చేదాకా రాయ్‌చరణ్‌కి అతనొక్కడే యజమాని. అనుకూల్ పెళ్ళి అయ్యేక రాయ్‌చరణ్‌కి ఇప్పుడిద్దరు యజమానులు; అనుకూల్, కొత్తగా ఇంట్లోకొచ్చిన అనుకూల్ వాళ్ళావిడాను. అనుకూల్‌కి ఓ ఏడాదిలో పిల్లాడు పుట్టేసరికి మళ్ళీ రాయ్‌చరణ్‌కి పురనపి జననం అన్నట్టూ ఒకప్పుడు అనుకూల్‌ని చూసినట్టే అనుకూల్ కొడుకుని సాకడం మొదలయింది. అనుకూల్‌కి పద్మానది ప్రాంతానికి బదిలీ అయ్యింది. తనని చిన్నప్పట్నుండీ పెంచిన రాయ్‌చరణ్‌ అంటే ఉన్న అభిమానం వల్ల అనుకూల్‌, కుటుంబంతో అక్కడికి వెళ్తూ రాయ్‌చరణ్‌ని కూడా వెంట తీసుకెళ్ళాడు.

ఏడాది నిండుతోంటే అనుకూల్ కొడుకు పాకడం, మెల్లిగా అడుగులు వేయడం మొదలుపెడుతున్నాడు. మాటలు వస్తున్నై. అమ్మా, నాన్నా అని పిలుస్తూ రాయ్‌చరణ్‌ని ‘తాతా’ అంటున్నాడు. ఆ మాట అంటున్నందుకే వాడంటే రాయ్‌చరణ్‌కి విపరీతమైన అభిమానం. వాడికి గుమ్మం దాటి ఇంట్లోంచి బయటకెళ్ళాలని సరదా. వాడు బయటకెళ్లకుండా, కిందపడి దెబ్బలు తగిలించుకోకుండా చూడ్డం రాయ్‌చరణ్‌ పని. కుర్రాడికెలా తెల్సిందో కానీ వాడు సరదాకి ఇంట్లోంచి బయటకెళ్ళాలని ప్రయత్నించడం, వెళ్ళిపోతూంటే రాయ్‌చరణ్‌ గమనించి వాణ్ణి పట్టుకోవడం ఒక ఆటలా తయారైంది. రాయ్‌చరణ్‌ అనుకూల్‌తో అన్నాడు ఓ సారి ఈ కుర్రాడి గురించి, “వీడు మంచి తెలివైన వాడండి, నన్ను ఏడిపించి, నా కళ్ళు కప్పేసి బయటకి పారిపోదామని ప్రయత్నం చేస్తున్నాడు. నేను చూడనప్పుడు దాక్కోవడం, పట్టుకున్నప్పుడు అదో రకమైన నవ్వూ, అబ్బో, వీడు తప్పకుండా కోర్టులో జడ్జ్ అయి తీరుతాడు చూడండి.”

కుర్రాడు పెరిగే కొద్దీ వాడి అవసరాల కోసం కొన్ని ఆట బొమ్మలూ, ఆ బొమ్మలు పెట్టుకుని అటూ ఇటూ లాగడానికో చిన్న బండీ ఒక్కోటీ అమరుతున్నై. కొత్త కొత్త ఆటల కోసం రాయ్‌చరణ్‌ మోకాళ్ళమీద అటూ ఇటూ కదులుతూ గుర్రం లాగా కుర్రాణ్ణి వీపు మీద మోయడం, ఒక్కోసారి వాడితో కుస్తీ పట్టడం, ఆ కుస్తీలో మళ్ళీ కుర్రాడి ముందు కింద పడిపోయి ఓడిపోయినట్టు ఒప్పుకుని గుంజీలు తీయడం, ఇవన్నీ చూస్తూ అనుకూల్, వాళ్ళావిడా నవ్వుకోవడం జరుగుతూనే ఉన్నై. ఉద్యోగంలో అనుకూల్‌కొచ్చే మంచి జీతం వల్ల కుర్రాడి అవసరాలకి దేనికీ ముందూ వెనకా చూసుకోనవసరం లేదు. అమ్మగారు వాడికి ఎప్పుడూ కొత్త బట్టలూ, కొత్త బంగారం నగలూ వేసి చూసుకుని మురిసిపోతూ వాణ్ణి ఆడించడానికి రాయ్‌చరణ్‌ చేతిలో పెడుతున్నారు. ఇన్నేళ్లబట్టీ పనిచేస్తున్న రాయ్‌చరణ్‌ మీద నమ్మకమే తప్ప ఎవరికీ అనుమానం లేదు; కుర్రాడి నగల గురించి కానీ, వాడిని నగలకోసమో, మరోదానికో రాయ్‌చరణ్‌ కానీ వాడు చూస్తూండగా ఇంకెవరో కానీ ఎత్తుకుపోతారని.

చూస్తూండగానే వర్షాకాలం వచ్చింది. ఉరుములు మెరుపుల్తో ధాటీగా కురిసే వర్షానికి పద్మానది ఉరకలేస్తూ, పడగెత్తిన పాములా బుసలు కొడుతూ ప్రవహించడం మొదలైంది. ఈ ప్రవాహంలో ములిగిపోయిన పంటలూ, చేలూ అలా ఉంచితే నదీతీరం అంతా బురద. అది చాలనట్టూ ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చే చెట్టూ చేమా వల్ల ఏం జరుగుతుంతో చెప్పడం కష్టం కనక ఎవరూ నది దగ్గిరకి వెళ్ళడానికి లేదు. నదీతీరానికి వెళ్ళి చూడాలంటే వర్షాకాలం అయ్యేదాకా ఆగాల్సిందే. ఈ వర్షాలలో ఓ రోజు తెరిపి ఇచ్చినప్పుడు అనుకూల్ కొడుకుని, వాడికున్న చిన్న బండిలో కూర్చోపెట్టి,రాయ్‌చరణ్‌ నదీ తీరానికి తీసుకొచ్చేడు. అలా తీసుకురావడానిక్కారణం కూడా కుర్రాడు వెళ్దాం వెళ్దాం అని ఏడుస్తూ పట్టుబట్టడమే. చలీ వేడీ కానీ ఆ రోజున వర్షం లేదు కానీ ఆకాశం మబ్బుగానే ఉంది. నది ఒడ్డున మోకాలి లోతు బురద అయినా నీళ్ళవరకూ వెళ్లకుండా కొంచెం దూరం నుంచే ఇద్దరూ నీళ్ల ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు కుర్రాడి చూపు అటు పక్కనే ఉన్న కదంబ వృక్షం మీద పడింది. అసలే వర్షాకాలం నీళ్ళు బాగా వంటబట్టి ఉన్నాయి కాబోలు, ఆకులు కూడా కనబడకుండా చెట్టంతా పువ్వులు. అదేదో అద్భుతాన్నిచూస్తున్నట్టూ కుర్రాడు అటువేపే చూస్తుంటే రాయ్‌చరణ్‌కి తెలిసిన విషయం ఏమిటంటే, కుర్రాడికి ఆ పువ్వులు కావాలి. కానీ ఆ చెట్టు దగ్గిరకెళ్ళాలంటే తాను బురదలో దిగి వెళ్ళిరావడానికి ఇరవై నిముషాలకి పైన పట్టవచ్చు. తాను అలా వెళ్తే ఇక్కడ కుర్రాణ్ణి ఎవరు చూస్తారు?

కుర్రాణ్ణి మభ్యపెట్టి వాడి చూపు ఆ పువ్వుల మీదనుంచి తప్పించాలని రాయ్‌చరణ్ ‘ఇదిగో ఆ పిట్ట చూడు, ఆ నీళ్ళు చూడు,’ అంటూ చెప్పాడు కానీ, జడ్జ్ కాబోతున్న కుర్రాడా అలా తప్పించుకునేది? ఈ పువ్వులనే చూపిస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. వాడి ఏడుపు చూసి రాయ్‌చరణ్‌కి కాలూ చేయీ ఆడలేదు.

‘సరే, నువ్విక్కడే కదలకుండా ఉంటానంటే నేను వెళ్ళి తీసుకొస్తా ఆ పువ్వులు’ అడిగేడు.

కుర్రాడి మొహం చూసి ‘సరే, అలాగే ఉంటా,’ అన్నాడనుకుని మరోసారి వాణ్ణి హెచ్చరించి మోకాలిదాకా తడవకుండా బట్ట మీదకి లాక్కుని రాయ్‌చరణ్ బురదలోకి దిగేడు, కదంబ వృక్షం కేసి వెళ్తూ.

రాయ్‌చరణ్ అలా వెళ్ళడం ఆలస్యం, కుర్రాడు ఇటు నదికేసి తన బండి లాక్కుంటూ వెళ్ళిపోయేడు. విపరీతమైన వేగంతో పోయే నీళ్ళ ప్రవాహం చూసేసరికి వాడికి మరింత సరదా పుట్టింది. పక్కనే దొరికిన చిన్న కర్ర పట్టుకుని నీళ్లలోకి దాన్ని వంచుతూ చేపలు పడుతున్నట్టూ వంగడం, నీళ్ళని ఆ కర్రతో కొట్టడం సాగించేసరికి చిన్న నీటి తుంపర వాడి మీద పడింది. దాంతో నీళ్ళంటే మరింత ఉత్సాహంతో మరింత ముందుకి వెళ్ళాడు బండిని లాక్కుంటూ…

చేతికి అందిన నాలుగు పువ్వులు కోసి, అవి చూశాక కుర్రాడి మొహంలో కనబడే సంతోషం గుర్తు తెచ్చుకుంటూ వెనక్కి వస్తూ బండి కేసి చూశాడు రాయ్‌చరణ్. బండి అయితే ఉంది కానీ కుర్రాడు చుట్టుపక్కల ఎక్కడా లేడు. రాయ్‌చరణ్ రక్తం గడ్డకట్టుకు పోయినట్టయింది. చేతిలో పువ్వులెక్కడివక్కడ పారేసి బండి దగ్గిరకి వచ్చి ‘అబ్బాయ్, నాన్నా ఎక్కడున్నావురా, రా, రా’ అంటూ పిలిచేడు. ఎప్పుడు పిలిచినా నవ్వుతూ ‘తాతా ఇక్కడున్నా’ అంటూ సమాధానం ఇచ్చే కుర్రాడి గొంతుక వినిపించలేదిప్పుడు. ఇప్పుడున్నదంతా పద్మానది ప్రవాహం, దాని తాలూకు గలగలల చప్పుడూను. పిచ్చివాడిలా కనిపించినంత మేర వెతికాడు రాయ్‌చరణ్. మానవమాత్రుడన్నవాడెవడూ లేడు చుట్టుపక్కల. కాలూ చేయి ఆడని పరిస్థితి.

రాయ్‌చరణ్ కళ్ళప్పగించి ఎటువైపు చూసి ఎన్ని అరుపులు అరిచి కుర్రాణ్ణి పేరుతో పిలిచినా, ఎంత ఏడిచి మొత్తుకున్నా అనుకూల్ కొడుకు ఈ నీటిలో కొట్టుకుపోవడం అనేదో పెద్ద విషయం కానట్టూ, ఆ కుర్రాడి చావు విషయం తనకేం పట్టనట్టూ పద్మానది ఉరుకులు పరుగుల్తో అలా ప్రవహిస్తూనే ఉంది.

సాయంకాలం దాకా రాయ్‌చరణ్ తీసుకెళ్ళిన కొడుకు రాకపోయేసరికి అప్పటి దాకా చూసిన అనుకూల్ భార్య మొగుడితో చెప్పి మరో నలుగురు మనుషుల్ని పంపించింది వెతకడానికి. చీకట్లో లాంతర్లు పట్టుకుని వెతుకుతున్న జనాలకి అక్కడే నది ఒడ్డున కేకలు పెడుతూ పిచ్చివాడిలా తిరుగుతున్న రాయ్‌చరణ్ కనిపించేడు కానీ కుర్రాడి జాడలేదు. రాయ్‌చరణ్‌ని వెనక్కి తీసుకొచ్చేసరికి అనుకూల్ కాళ్ళమీద పడి భోరుమన్నాడు. అతన్ని ఎన్ని అడిగినా, ఎంత కదిపినా ఏమీ సమాధానంలేదు, నాకేం తెలియదనే మాట తప్ప. మొత్తానికి పద్మానదిలో కుర్రాడు కొట్టుకుపోయాడనే తీర్మానించినా, ఊరిబయట కొంతమంది దేశదిమ్మర్లు దిగారనీ వాళ్ళే ఎత్తుకుపోయి ఉండొచ్చనీ కొంతమంది అనుకున్నా ఏమీ తేలలేదు.

అనుకూల్ భార్య రాయ్‌చరణ్‌ని తిడుతూ, “నా కుర్రాణ్ణి ఎక్కడకి తీసుకెళ్ళావు, ఎక్కడ దాచావు చెప్పు?” అంటూ ఏడుస్తూ నిందించింది కానీ ఏమీ సమాధానం రాబట్టలేకపోయింది. రాయ్‌చరణ్ ఎవరేం అడిగినా తన తలమీద కొట్టుకోవడం, ఏడవడం తప్ప మరేమాటా చెప్పలేకపోయేడు. అనుకూల్ భార్య ఇదంతా చూశాక రాయ్‌చరణ్‌ని ఇంక వెళ్ళిపొమన్నట్టూ తలుపు వేసేసుకుంది.

అనుకూల్, భార్యతో రాయ్‌చరణ్ గురించి చెప్పడానికి ఏదో ప్రయత్నంతో అన్నాడు, “నన్ను చిన్నప్పటినుంచి పెంచిన రాయ్‌చరణ్ అలాంటివాడు కాదు, వాడు మన కొడుకుని దాచడం కానీ, చంపడం కానీ ఎందుకు చేస్తాడు?”

“ఎందుకా, కుర్రాడి వంటి మీద నగలకోసం. ఇప్పుడర్థం అయిందా?” అనుకూల్ నోరు మూయించింది ఆ మాటతో ఆవిడ.

ఆవిడామాట అన్నాక ఇంక నోరెత్తలేకపోయేడు అనుకూల్.

అనుకూల్ ఇంట్లోంచి గెంటబడిన రాయ్‌చరణ్ తన ఊరికి బయల్దేరాడు. రాయ్‌చరణ్‌కి ఎప్పుడో పెళ్లయిందనే మాటే తప్ప ఇప్పటివరకూ అతనికి తన కుటుంబం అంటే అనుకూల్, అతని పిల్లాడే. ఇప్పుడు స్వంత ఊరికొచ్చేసరికి తనకో కుటుంబం, భార్యా ఉందని తెలిసివచ్చింది. రాయ్‌చరణ్ ఊరికి తిరిగొచ్చిన ఏడాది చివర్లో అతనికో కొడుకుని అందించి రాయ్‌చరణ్ భార్య ఆఖరి శ్వాస తీసుకుంది.

పుట్టిన కుర్రాణ్ణి చూడగానే రాయ్‌చరణ్‌కి అదోరకమైన అసహ్యం, నీరసం, అనేకానేక ఆలోచనలు. ఇప్పుడు అనుకూల్ కొడుకు తన చేతుల్లోంచి దాటిపోయాక వీణ్ణి సాకాలంటే అదోరకమైన అపరాధభావం. అదీగాక ఇప్పుడు తనకి ‘ఇదెక్కడి దరిద్రం దాపురించిందిరా?’ అనే ఆలోచన. ఈ ఆలోచనల్తో కుర్రాణ్ణి ఎప్పుడూ దగ్గరకు తీయడానికి ప్రయత్నించనేలేదు. రాయ్‌చరణ్ ఇంట్లో అతని విధవ అప్పగారు కానీ లేకపోతే ఆ పుట్టిన కుర్రాడు ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు. అలా రాయ్‌చరణ్‌తో సంబంధం లేకుండా కుర్రాడు పెరుగుతున్నాడు. వాడికి ఫైల్నా అని ఆవిడే పేరు పెట్టింది కూడా.

కుర్రాడు పెరుగుతుంటే రాయ్‌చరణ్ ఆలోచనా క్రమంలో ఏదో మార్పు వస్తూ ఉందిప్పుడు. వాడు పాకుతుంటే అనుకూల్ కొడుకు పాకుతున్నట్టే ఉంది. వీడు కూడా అనుకూల్ కొడుకులాగే తనని గడపదాకా వెళ్ళి ఏడిపించడం అదీ చేస్తున్నాడు. ఏదో జరుగుతోంది తనకి తెలీయకుండా. తనని తాతా అంటూ పిల్చిన కుర్రాడు అలా నీళ్లలో కొట్టుకుపోయి తనమీద మమకారంతో తనింట్లోనే పుట్టాడు కాబోలు. దీనికి కారణాలు వెతికితే కంటి ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. మొదటిది–తన కొడుకు అనుకూల్ కొడుకు పోయిన సరిగ్గా ఏడాదికి పుట్టాడు. రెండోది–ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టని తనకి ఈ మధ్య వయసులో ఇంక పుట్టరు, అసాధ్యం అనుకున్నప్పుడు ఆ అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ వీడు పుట్టాడు. మూడోది–అనుకూల్ కుర్రాడిలాగే వీడూ జడ్జ్ అయ్యే లక్షణాలు కనిపించడంలే? అదీగాక అనుకూల్ వాళ్ళావిడ అంది కదా, ‘నా కుర్రాణ్ణీ ఎత్తుకుపోయింది నువ్వే!’ అని. తల్లి మనస్సు తనకి తెలియలేదు ఆవిడలా అన్నప్పుడు. ఇప్పుడు–-వీడు తనకి పుట్టాక–అది తెలిసివస్తోంది. పాపం ఆవిడ ఎంత క్షోభ అనుభవిస్తోందో? ఈ ఆలోచనలు రాగానే రాయ్‌చరణ్ తన కొడుకుని వాడు అనుకూల్ కొడుకే అన్నట్టూ పెంచడం మొదలుపెట్టాడు.

కుర్రాణ్ణి ‘ఏమండీ, యజమానిగారు!’ అనడం, మంచి జమీందారులాగా బట్టలు తొడిగి మహారాజులా చూసుకోవడం మొదలుపెట్టాడు. ‘ఎంత లేకలేక కొడుకు పుట్టినా ఇంత గారాబమా!’ అనుకునే లోకుల్ని ఎప్పుడూ లెక్క చేయలేదు రాయ్‌చరణ్. జమీందారుగారి పిల్లలు అలగా జనంతో ఆడుకోరు కాబట్టి రాయ్‌చరణ్ ఎప్పుడూ తన కొడుకుని ఎవరితోనూ ఆడుకోనిచ్చేవాడు కాదు. తన దగ్గిరున్నవీ, భార్యవీ నగలన్నీ కరిగించేసి కుర్రాడికి నగలు చేయించాడు. అనుకూల్ కొడుకు ఒకప్పుడు ఆడుకున్న బండి లాంటిదే ఓ బండి కూడా అమర్చబడింది. కుర్రాణ్ణి చూస్తే ఎవరికీ కూడా రాయ్‌చరణ్ కొడుకనే అనుమానం రాదు, ఎవరో జమీందార్ల బిడ్డ అనే తప్ప.

ఐదేళ్ళు గడిచి ఫైల్నా స్కూల్‌కి వెళ్ళే రోజు వచ్చేసరికి రాయ్‌చరణ్ తనకున్న పొలం అవీ అమ్మేసి మళ్ళీ కలకత్తా చేరి కుర్రాణ్ణి మంచి స్కూల్లో, అక్కడే ఉన్న హాస్టల్లో జేర్పించాడు. కుర్రాడికేమీ తక్కువ రాకుండా చూస్తూ రాయ్‌చరణ్ మాత్రం రోజుకిన్ని మెతుకులు మాత్రం తింటూ చిక్కి శల్యం అవుతున్నాడు. రాత్రి వంటరిగా ఉన్నప్పుడు తనలో తనే కలవరింపులు–‘అబ్బాయ్, నేనంటే నీకెంత ఇష్టం! నువ్వు పోయాక నా మీద ఇష్టంతో మళ్ళీ నా ఇంటికి వచ్చావు. నీకెప్పటికి ఏమీ తక్కువచేయను!’ అంటూ.

పన్నెండేళ్ళు గడిచాయ్ ఇలాగే. పెద్దవుతున్న కుర్రాడికి చదువు బాగానే వంటబడుతూంది. అందరితోబాటు హాస్టల్లో ఉండడం అలవాటైంది. కుర్రాడికి చిన్నప్పటినుండీ రాయ్‌చరణ్ ఎలా అలవాటు చేశాడో అలాగే దర్జాగా బతకడం తెలుసు. తానే కుర్రాడి తండ్రినని రాయ్‌చరణ్ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఎవరైనా రెట్టించి అడిగితే తాను కుర్రాడికి సేవ చేసే పనివాడినని మాత్రం చెప్పాడు. రాయ్‌చరణ్ కుర్రాడి దగ్గిర పనివాడిలా చూపించే అణకువ చూసి మిగతా పిల్లలు నవ్వినా రాయ్‌చరణ్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. మిగతా పిల్లలమాట అలా ఉంచితే ఫైల్నా కూడా రాయ్‌చరణ్ దగ్గిర లేనప్పుడు తన పనివాడు ఎలా అణుకువగా ఉంటాడో వాళ్లతో చెప్తూ నవ్వుకునేవాడే. కుర్రాడికి రాయ్‌చరణ్ అంటే ఇష్టమే కానీ అదో రకమైన దిగజారుడు ఇష్టం–పనివాడి పట్ల ఉండే ఇష్టం లాంటిది తప్ప ఎప్పుడూ తన తండ్రి అన్న భావమే లేదు. ఆ దిగజారుడు ఇష్టం కూడా రాయ్‌చరణ్ వాణ్ణలా పెంచడం వల్ల వచ్చిందే తప్ప అది వాడి తప్పూ కాదు, పుట్టుకతో వచ్చినదీ కాదు.

రోజులు గడిచేకొద్దీ కుర్రాడు పెద్దవడం అటుంచితే రాయ్‌చరణ్ ముసలివాడౌతున్నాడు. రాయ్‌చరణ్ సరిగ్గా పనిచేయటం లేదని అతను పనిచేసే చోట యజమాని అరుస్తున్నాడు. పని ఇచ్చిన పెద్దమనిషికి పూర్తి సమయం కేటాయించలేకపోవడం ఒకెత్తు అయితే పనిలో ఉన్నప్పుడు కూడా సరిగ్గా పనిచేయకపోవడం మరొకటి. ముసలితనం వల్ల రాయ్‌చరణ్ శరీరం సహకరించడం లేదు. ఈ వైపు ఎదుగుతున్న కుర్రాడు తనకి రోజురోజుకీ ఎక్కువ డబ్బులు కావాలని పీకుతున్నాడు. చూడబోతే రాయ్‌చరణ్ దగ్గిర డబ్బులు దాదాపుగా అయిపోవస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాయ్‌చరణ్ ఏదో నిశ్చయానికొచ్చాడు. తానింక ఎలాగా ఉద్యోగం చేయలేడు కనక అక్కడ యజమానితో చెప్పి పని మానుకున్నాడు. ఓ రోజు ఫైల్నా దగ్గిరకొచ్చి చెప్పాడు, “నాకు ఊర్లో కొంచెం పని ఉంది, నా దగ్గిర మిగిలిన ఈ డబ్బులు నీదగ్గరుంచు. నేను మరికొన్ని రోజుల్లో మళ్ళీ వెనక్కి వస్తా.”

అనుకూల్ ఇప్పుడెక్కడ పనిచేస్తున్నాడో కనుక్కుని రాయ్‌చరణ్ అతన్ని చూడ్డానికి బయల్దేరాడు. రాయ్‌చరణ్ వచ్చేసరికి అనుకూల్ బయట వరండాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. వాళ్ళావిడ లోపల ఏదో పనిలో ఉంది. కొడుకు నీళ్లలో పడి కొట్టుకుపోయాక వాళ్ళకి మరింక పిల్లల్లేరు. ఆవిడ పాపం ఇంకా పుత్రశోకం అనుభవిస్తున్నట్టే ఉంది. రాయ్‌చరణ్ రావడం చూసి అనుకూల్ మొహంలో ఏం భావం లేకుండా అడిగాడు, “ఏమిటిలా వచ్చావు?”

రాయ్‌చరణ్ నోటమ్మట మాట లేకుండా అలాగే నించున్నాడు చేతులు కట్టుకుని.

చిన్నపుడు తనని పెంచినందుకో మరెందుకో కానీ కాసేపటికి అనుకూల్ అన్నాడు సున్నితంగానే, “కొన్నేళ్ల క్రితం ఏదో జరిగిందిలే, దాని సంగతి ఇప్పుడెందుగ్గానీ, పనికోసం చూస్తున్నావా? నీకు మళ్ళీ పనిలోకి రావాలనుంటే చెప్పు, నాక్కూడా ఇంట్లో ఒకరు అవసరం.”

“అందుక్కాదండి వచ్చినది. ఓ సారి అమ్మగార్ని చూసి ఓ మాట చెప్పిపోదామని వచ్చాను,” కాసేపటికి నోరు పెగుల్చుకుని చెప్పాడు రాయ్‌చరణ్.

“సరే, రా అయితే లోపలకి,” అనుకూల్ ముందు నడుస్తుంటే రాయ్ చరణ్ అనుసరించాడు.

అమ్మగారు రాయ్‌చరణ్‌ని చూడగానే మొహం చిట్లించింది, మళ్ళీ ఎక్కడ దాపురించిందిరా ఈ దరిద్రం అనుకుంటూ.

రాయ్‌చరణ్ ఇదేం పట్టించుకోనట్టు చూసి, ఆవిడకి చేతులు జోడించి చెప్పాడు ఏమీ ఉపోద్ఘాతం లేకుండా, “మీ కుర్రాణ్ణి పద్మానది మింగేసిందని అందరూ అనుకున్నారు కానీ, అది నిజం కాదు. వాణ్ణి కావాలని ఎత్తుకుపోయినది నేనే.”

అనుకూల్, వాళ్ళావిడా నోర్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యం, సంభ్రమం, అనుమానం అన్నీ కలగలుపుతూ ఒక్కసారిగా అరిచినట్టే అన్నారు, “ఏమిటీ, నువ్వా! ఎందుకు, ఎలా… ఇంతకీ వాడెక్కడున్నడిప్పుడు?”

“నా దగ్గిరే ఉన్నాడు. నేనే పెంచాను ఇన్నాళ్ళూనూ. వాడికి ఏ లోటూ రాకుండా చూస్తూ స్కూల్లో ఉంచాను. ఎల్లుండి ఆదివారం తీసుకుని వస్తున్నాను. ఇంట్లోనే ఉంటారా?”

ఆదివారం కోర్టుకి శలవు కనక అనుకూల్ ఇంట్లోనే ఉన్నప్పుడు రాయ్‌చరణ్ ఫైల్నాని తీసుకుని వచ్చాడు. కుర్రాణ్ణి చూసి అనుకూల్ భార్య దాదాపు మూర్ఛపోయింది. వాణ్ణి ముట్టుకుని, చేత్తో తడుముతూ, ముద్దులు పెట్టుకుంటూ అదో లోకంలో తేలుతోంది ఆవిడ. అనుకూల్‌కి కూడా ఏదో ఆపేక్ష పుట్టుకొచ్చింది కుర్రాణ్ణి చూడగానే. వీళ్ళిద్దర్నీ చూస్తున్న రాయ్‌చరణ్ కంట్లో నీళ్ళు కనబడకుండా ఉండడానికి కష్టపడుతుంటే అనుకూల్‌లో ఉన్న మెజిస్ట్రేట్ బయటకొచ్చి అడిగేడు, “వీడు మా కొడుకే అనడానికి ఏమిటి ఋజువు? ఎవరైనా సాక్షులు ఉన్నారా దీనికి?”

“ఇటువంటిదానికి సాక్ష్యం ఎక్కడుంటుందండి? నేను వాణ్ణి ఎత్తుకుపోయానని చెప్పాను కదా. వాడు మీకు పుట్టినప్పట్నుంచీ వాడంటే నాకు, నేనంటే వాడికీ ఎంత ఇష్టమో మీకు తెలుసు. సాక్ష్యం కావాలంటే భగవంతుడే సాక్షి.” రాయ్‌చరణ్ చెప్పేడు.

అనుకూల్ ఇటువైపు చూసేసరికి వాళ్ళావిడ కుర్రాణ్ణి ముద్దాడడం, ఎన్నాళ్లకో కనబడిన కుర్రాణ్ణి చూడడానికి రెండు కళ్ళూ చాలవన్నట్టూ వాడికేసి చూస్తూ ఉండడం కనిపించింది. ఇంక అనుకూల్ సాక్ష్యం గురించి ఏమీ బలవంతం చేయలేకపోయేడు. అయినా తన నమ్మిన బంటు రాయ్‌చరణ్ కుర్రాణ్ణి ఎత్తుకుపోయినట్టూ ఒప్పుకుంటున్నాడుగా! వీడు తమ కొడుకు కాక రాయ్‌చరణ్ కొడుకు అనుకోవడం ఎలా? రాయ్‌చరణ్ అంత ముసలివాడికి ఇంత చిన్న కుర్రాడు పుట్టి ఉండడం అసంభవం కాదూ? ఈ ఆలోచనలు రాగానే అనుకూల్ ఇంక రెట్టించలేకపోయేడు.

కాసేపటికి అనుకూల్ జడ్జ్ లాగా ఏదో తీర్పు ఇస్తున్నట్టు చెప్పేడు రాయ్‌చరణ్‌తో, “నిన్ను నమ్ముతున్నాను కానీ ఇంక నువ్వు ఈ చుట్టుపక్కల ఉండడానికి ఒప్పుకోను. నువ్వు మా కళ్ల ఎదుట ఉండడం కుదరదు.”

పిడుగు మీద పడ్డట్టు రాయ్‌చరణ్ కంఠం వణుకుతుండగా అడిగేడు, “అలా అంటారేమిటండీ, ఈ ముసలితనంలో నేనెక్కడకి వెళ్తాను? ఎవరున్నారు నాకు?”

అనుకూల్ భార్య కూడా అంది, “పోనీ అతన్ని ఉండనీయరాదుటండి, ఏదో పనిచేసిపెడతాడు ఇంట్లో. ఇన్నాళ్ళూ కుర్రాణ్ణి సాకాడు కనక కుర్రాడికి కూడా ఊసుపోతుంది.”

అనుకూల్ అరిచేడు, “లేదు. వాడిక్కడ ఉండడానికి వీలులేదు. మనం ఎంతో నమ్మి కుర్రాణ్ణి చేతిలో పెడితే ఇలా ఎత్తుకుపోయి ఇన్నేళ్ళూ మనకి పుత్రశోకం కలిగించాడు. ఎప్పుడైతే కుర్రాణ్ణి ఎత్తుకెళ్లడానికి నిశ్చయం చేసుకున్నాడో ఆ రోజే ఇక్కడ ఉండే వీల్లేకుండా తెగతెంపులు చేసుకున్నాడు. వాడెక్కడికెళ్తాడో మనకి అనవసరం.”

రాయ్‌చరణ్ అనుకూల్ కాళ్ళావేళ్ళా పడ్డాడు. కానీ ఫలితం లేకపోయింది, “నేను కాదండి అలా ఎత్తుకెళ్ళినది, ఏదో అలా జరిగిపోయింది…” అంటూ నీళ్ళు నాన్చుతున్న రాయ్‌చరణ్‌ని అనుకూల్ గద్దించాడు, “నువ్వేకదా కుర్రాణ్ణి ఎత్తుకెళ్ళానని చెప్పేవు? మరి నువ్వు కాకపోతే ఎవరు?”

“నేను కాదు, నేను కాదు, ఏదో దేవుడి హస్తం వల్ల అలా అయింది… నేను కాదు, నా ప్రారబ్దం,” రాయ్‌చరణ్ ఏడవడం సాగించాడు చెప్పిన మాటే చెప్తూ.

అనుకూల్ వంటి జడ్జ్ ముందా ఈ ప్రేలాపన? అంతా విన్నాక అనుకూల్ మరింత పట్టుదలగా చెప్పేడు, “నీ దారిన నువ్వు వెళ్ళు. మళ్ళీ ఎప్పుడూ నీ మొహం మాకు చూపించకు.”

ఇదంతా చూసాక ఫైల్నాకి కూడా మండుకొచ్చినట్టయింది. తానొక మెజిస్ట్రేట్ కొడుకు. అయినా ఈ దరిద్రుడు రాయ్‌చరణ్ తనని ఎత్తుకుపోవడం వల్ల, తల్లీ తండ్రీ లేనట్టు పెరిగాడు. ఎంత మోసం! అయినా ఎందుకు చేశాడో ఇదంతా? రాయ్‌చరణ్‌కేసి చూసిన ఫైల్నాకి అతని ముసలితనం, తానేమి అడిగినా వెంటనే కాదనకుండా అమర్చడం అన్నీ గుర్తొచ్చి కాస్త జాలివేసి అనుకూల్‌తో అన్నాడు, “పోనీయండి నాన్నా! ఇన్నాళ్లకైనా నన్ను తీసుకొచ్చి అప్పగించాడు కదా, అతను ఇక్కడ ఉండడం మీకిష్టం లేకపోతే వాళ్ళ ఊరికి పోనీయండి. అక్కడికే మీరు నెలకింత అంటూ ఏదో డబ్బు పంపించవచ్చు. ఏమంటారు?”

ఈ మాట విన్న రాయ్‌చరణ్ తలెత్తి తన కొడుకుకేసి చూశాడు. అదే రాయ్‌చరణ్ కొడుకుని ఆఖరిసారి చూడడం. అనుకూల్‌కీ వాళ్ళావిడకీ ఓ నమస్కారం పెట్టి ఇంటి గేటు తీసుకుని వెనకకి కూడా చూడకుండా నడుచుకుంటూ రోడ్డు మీద రద్దీలో జనంలో కల్సిపోయేడు.

నెలాఖరుకి అనుకూల్, రాయ్‌చరణ్ ఉండే ఊరికి ఓ మనీ ఆర్డర్ పంపించాడు. అయితే ఆ డబ్బులు వెనక్కి వచ్చేశాయి. డబ్బులు బట్వాడా చేయడానికి రాయ్‌చరణ్ అనే పేరున్నవారెవరూ ఆ ఊర్లో లేరుట!
--------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి 
మూలం: రవీంద్రనాథ్ ఠాకూర్
మూలం: మై లార్డ్, ది బేబీ
ఈమాట సౌజన్యంతో