Thursday, November 30, 2017

ఒకనాటి గృహలక్ష్మి పత్రికలోని చిత్రం


ఒకనాటి గృహలక్ష్మి పత్రికలోని చిత్రం




సాహితీమిత్రులారా!

డా. యన్. కేసరి గారు స్థాపించిన
గృహలక్ష్మి పత్రికలోని ఈ చిత్రం
అరణ్యవాసం వెళ్ళిన రాముని వెంట
సీత కూడా వెళ్ళిందికదా
ఆ అరణ్యంలో అత్రి మహాముని
ఆశ్రమం వెళ్ళినపుడు అనసూయను
కలిసిన సందర్భములో ఆమె సీతను
ఆశీర్వందించినది అది  ఈ గృహలక్ష్మి
పత్రికలో చిత్రించారు. చూడండి-


Wednesday, November 29, 2017

భారతదేశంలో విమానాలు


భారతదేశంలో విమానాలు




సాహితీమిత్రులారా!
మనదేశంలో విమానాల తయారీకి ప్రయత్నించిన
శివకర్ బాపుజి టాల్పడే మన శిల్పాలలో విమాన
విషయాలు వీటిని గురించిన విషయాల వీడియో
డాక్యుమెంటరీ చూడండి-

Tuesday, November 28, 2017

సొగసు చూడతరమా!


సొగసు చూడతరమా!




సాహితీమిత్రులారా!

మన కావ్యాలలో నైషధం విద్వదౌషధం
అని పేరుగాంచిన శ్రీనాథుని శృంగారనైషధములో
నలదమయంతుల వివాహ వృత్తాంతం ఇతి వృత్తంగా

సాగింది. అందులో  నలుడు ఇంద్రాదులదూతగా
దమయంతి అంతఃపురంలోకి
తిరస్కరణీ విద్యతో వెళ్ళినపుడు
మొదటిసారిగా నలుడు దమయంతిని
చూస్తాడు అప్పుడు దమయంతిని చూచిన
నలుని స్థితి శ్రీనాథుడు వర్ణించిన పద్యాలు
కొన్ని-

సుదతి ముఖేందు మండలము సొంపున రాగ ర సాంబురాశి య
భ్యుదయముఁ బొంది యెంతయును నుబ్బున వేల నతి క్రమించుడున్,
మదిఁ గడు భీతిఁ బొందిన క్రమంబున భూవరు దృష్టి సేరె న
మ్మద గజరాజ యాన కుచ మండల తుంగ మహీంద్రశృంగ మున్

మగువ ముఖేందువం దమృత మధ్యమునన్ మునుఁగంగఁ బాఱియో,
మగువ కుచద్వయంబు నడుమం బడి రాయిడి దందసిల్లి యో,
మగువ గభీర నాభి బిల మార్గముఁ దూఱి పరిభ్రమించి యో,
సొగపున రాజనందనుని చూపులు నిల్చుఁ దదంతరంబు లన్
                                                                    (శృంగారనైషధము - 3- 148, 149)

ఆ దమయంతిని కోరికమీర ఆపాదమస్తకం చూస్తూ
నలమహారాజు బ్రహ్మసాక్షాత్కారానందమును
అతిక్రమించేదైన మన్మథావేశాన్ని అనుభవిస్తూ
ఇంకేమీ తెలియని స్థితిలో ఉండెను.
ఆ సమయంలో శ్రీనాథమహాకవి
దమయంతి సౌందర్యాని ఈ విధంగా వర్ణించాడు-

నలుడు దమయంతి ముఖము అనే చంద్రుని సౌభాగ్యాన్ని
దర్శించటంచే అనురాగ సముద్రం ఉప్పొంగి చెలియలి కట్టను
దాటుకొని వెల్లి వొడువగా, అతని చూపు తాను ఆ వెల్లి(ప్రవాహం)లో
మునిగి పోతాననే భయంచేతకాబోలు ఆ మదించిన ఏనుగు నడకలదాని
కుచమండలమనెడి ఉన్నత గిరిశిఖరాల పైకెక్కాడు. రాజు దమయంతి
ముఖం చూచి అనురక్తి మితిమీరగా ఆమె స్తనసౌభాగ్యాన్ని పరికించడం
మొదలు పెట్టాడు ఇదంతా ఎలావుందంటే చంద్రోదయం సమయాన
సముద్రం పొంగి వెల్లువయితే దరినున్నవాడు మునకభయంతో కొండ
ఎక్కినట్లుంది.నలుని చూపులు దమయంతి ముఖచంద్రుని యందు
అమృతమునడుమ మునిగిపోయినందుననో, ఆమె చనులరెంటి
నడుమ సందులో పడి ఒరయిక చేతఇఱికి కొన్నందువల్లనో,
ఆమె లోతైన పొక్కిటి(నాభి)రంధ్రపు దారిలో దూఱి సుడితిరిగి
నందునో పారవశ్యముచేత పారవశ్యము పొంది దానిదానిలోపల
నిలిచిపోయాడట.

Sunday, November 26, 2017

వావిరిఁగన్నుదోయి


వావిరిఁగన్నుదోయి




సాహితీమిత్రులారా!


భర్తృహరి శృంగారశతకంలోని
ఈ శ్లోకం చూడండి-

కేశః సంయమినః, శ్రుతేరపి పరం పారం గతే లోచనే,
అన్తర్వక్త్రమపి స్వభావశుచిభిః కీర్ణం ద్విజానాం గణైః,
ముక్తానాం సతతాధివాసరుచిరౌ వక్షోజకుమ్భా విమా,
విత్థం తన్వి వపుః ప్రశాన్త మపి తే, రాగం కరోత్యేవ నః


ఓ కాంతా! నీకురులు ఎంతో నియమబద్ధంగాను -
నీ కన్నులు ఉపనిషద్వాక్య విచారం చేసేవిగాను ఉన్నాయి.
ఇక నీ చిన్న నోరు చక్కని వర్తన గల ద్విజగణమా అన్నట్లుగా ఉంది.

జీవన్ముక్తులకు స్థావరమన్నట్లుగా ఉన్న
నీ పరిపూర్ణ కుచకుంభములు వర్ణించ ఎవరికి తరము

సన్నని పూదీగ వలె ఉన్న నీ శరీరానికి ఆ నడుము ఉన్నట్టూ
మరి లేనట్టా అనే అనుమానాన్ని కలిగిస్తేంది.

శాంతంగా - వైరాగ్య సాధకంగా ఉన్న నీ దేహం
చిత్రంగా సంభోగాభిలాషను కలిగిస్తోంది.

శాంతమూర్తుల చెంత చేరినపుడు వైరాగ్యం
కలగవలసి ఉంటే, అందుకు భిన్నంగా మరింత
అల్లుకు పోవాలనిపించటం వింతే మరి

దీనిలో శృతి అంటే శాస్త్రము, చెవి
             సంయమము - నియమం, ముడి
            ద్విజ - బ్రాహ్మణులు, దంతాలు
            ముక్తాళి - ముక్తుల సమూహం, ముత్తెముల వరుస
             రాగము - క్షోభము(కలత), అనురాగము

ఏనుగు లక్ష్మణకవి అనువాదం-

వావిరిఁగన్నుదోయి శ్రుతి పారగ మెంతయు సంయముల్ కురుల్,
భావశుచి ద్విజప్రకరభాజన మెన్న ముఖాంతరంబు, ము
క్తావళిరమ్యముల్ కుచములక్కట యిట్లు ప్రశాంతమయ్యు రా
జీవదళాక్షి మేను విరచించుచు నున్నది మాకు రాగమున్

Saturday, November 25, 2017

వక్ర భాష్యాలు


వక్ర భాష్యాలు




సాహితీమిత్రులారా!

దాశరథి కృష్ణమాచార్య 
ధ్వజమెత్తిన ప్రజ నుండి
వక్ర భాష్యాలు


తిరిగే భూగోళాన్ని ఆపేయండి;
దిగి పోతా న్నేను;
మానవత వసించవలసిన చోట
దానవత సహించలేను

నరకం లేదు లేదన్న వాళ్ళే
నరలోకాన్ని నరకం చేశారు;
స్వర్గం వట్టిది వట్టిదన్న వాళ్ళే
స్వప్రయోజనాల స్వర్గం సృష్టించారు

దేవుడు లేడన్న వారే తమ సిద్ధాంతాల
దేవాలయాలు నిర్మించారు;
వాటిలోకి మానవ కోటిని  పడద్రోసి
బందీలుగా చేసి పారేశారు

విగ్రహాలు పనికిరావని తోసేశారు
విగ్రహంలేని మనుషుల బొమ్మల్ని పూజించారు;
ఏది వద్దంటున్నారో అదే చేస్తున్నారు
ఏదీ తెలియని సామాన్యుల్ని మోసగిస్తున్నారు

మేధావి లనబడేవారి వక్ర భాష్యాలు
బాధలన్నిటినీ సృష్టించే విషబీజాలు;
సవ్యంగా ఆలోచించేవాడు లేని నాడు
సవ్యసాచు ల వల్ల ఈ లోకానికి కీడు

నగ్నంగా ప్రవహించే నది కావాలి
అగ్ని శకలాలు విసిరే రవి రావాలి
రుగ్నమైన మేధాశక్తులు పోవాలి
భగ్న హృదయాలలో ఆశ లేవాలి

తిరిగే భూగోళాన్ని ఆపేయండి
దిగి పోతా న్నేను
మానవత వసించవలసిన చోట
దానవత సహించలేను

Friday, November 24, 2017

ఒకే పద్యంలో కర్ణుని జీవితం


ఒకే పద్యంలో కర్ణుని జీవితం




సాహితీమిత్రులారా!

ఆంధ్రమహాభారతం శాంతిపర్వంలో
నారదుడు కర్ణుని గురించి ధర్మరాజు
కోరిక మేరకు చెబుతూ చెప్పిన పద్యం ఇది-
ఇందులో కర్ణుని జీవితం మొత్తం వివరింపబడింది-

వినుము నరేంద్ర! విప్రుఁడలివెన్, జమదగ్నిసుతుండు శాపమి
చ్చె, నమరభర్త వంచనముసేసె, వరంబని కోరి కుంతి మా
న్పె నలుక, భీష్ముఁడర్థరథుఁజేసె యడంచెఁ, గలంచె మద్రరా
జనుచితమాడి, శౌరి విధియయ్యె, నరండనిఁజంపెఁగర్ణునిన్
                                           (శ్రీమదాంధ్రమహాభారతం - శాంతిపర్వం - 1-35)

ధర్మరాజా! నేను చెప్పేది విని గ్రహించు, బ్రాహ్మణుడు కోపగించి
కర్ణుని శపించాడు తరువాత పరశురాముడు శపించాడు,
ఇంద్రుడు మోసంతో కవచకుండలాలు తీసుకున్నాడు,
కుంతి వరం అనే కారణంతో కోపాన్ని మాన్పింది,
భీష్ముడు అర్థరథునిగా చేసి అగౌరవపరిచాడు,
శల్యుడు అనుచితమైన మాటలతో హృదయాన్ని కలతపరిచాడు,
కృష్ణుడు అతడు దాటరాని విధియైనాడు, ఇన్ని జరిగితే
యుద్ధంలో అర్జునుడు కర్ణుని రణరంగంలో వధించాడు.

Thursday, November 23, 2017

చార్ ధామ్ లో పూరి జగన్నాథుడు


చార్ ధామ్ లో పూరి జగన్నాథుడు




సాహితీమిత్రులారా
పూరీజగన్నాథుని విశేషాలను
డాక్యుమెంటరీ
ద్వారా తెలుసుకొందాం-




Wednesday, November 22, 2017

తాజా గజల్


తాజా గజల్




సాహితీమిత్రులారా!


దాశరథి కృష్ణమాచార్య వారు
తెలుగులో గజల్ కూర్చిన మొదటివారు.
వీరి నేత్రపర్వం నుండి ఈ తాజా గజల్


ఎడారులనే కోరుకున్న వేళ
ఇసుక తుఫానుకు భయపడనేల?

కంటక శయ్యను పరుచుకున్నవాడు
వంటిపై గాయాలకు భయపడనేల?

చీకటి అరణ్యంలో చిక్కుకున్నవాడు
ఏకాకినైతినని దుఃఖపడనేల?

దానవుని దీన బాంధవు డనుకున్ననాడు
దగాపడితినని నేడు తపనపడనేల?

ధన పిశాచమ్మును తలపైన పెట్టుకుని
మునిగిపోయితిమని కుమిలిపడనేల?

ప్రేయసి కఠినురాలు - ప్రేమించినావు
కరుణించలేదని కలతపడనేల?

కానరాని దైవము కనులలో వుండగా
కనిపించలేదని మదనపడనేల?


Tuesday, November 21, 2017

ఇలాంటి ఆడవాళ్ళు ఇప్పుడున్నారా?


ఇలాంటి ఆడవాళ్ళు ఇప్పుడున్నారా?




సాహితీమిత్రులారా!

నెల్లూరిని పాలించిన మనుమసిద్ధికి సేనాధిపతులలో
ఒకసేనాపతి ఖడ్గతిక్కన. ఒకమారు మనుమసిద్ధికి
కాటమరాజుకు మధ్య పుల్లకి విషయంలో యుద్ధం
సంభవించింది. దానికి ఖడ్గతిక్కన సైన్యసమేతం
వెళ్ళి ఎదుర్కొన్నాడు. కాటమరాజు సేనాపతులలో
ఒకడైన పిన్నమనాయునితో జరిగిన పోరులో ఖడ్గతిక్కన
తన  సైన్యాన్ని కోల్పోయాడు చివరికి చేసేదిలేక
మరికొంత సైన్యాన్ని తీసుకొని పొవటానికి ఇంటికి
తిరిగివచ్చాడు దానితో తండ్రి అయిన సిద్ధనామాత్యులు
కొడుపై కోపించి నానామాటలని యుద్ధంలో చావనైనా
చావక నాకడుపున చెడబుట్టావని నిందించాడు.
దానికి ఆ యోధాగ్రేసరుడు చాల చింతించాడు.
భార్య చానమ్మ స్నానానికి నీళ్లుపెట్టి అక్కడ ఒక పసుపు
ముద్దను ఉంచి నులకమంచాన్ని అడ్డు పెట్టి ఈ విధంగా
అన్నది-

పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకు లెల్లన్
ముగురాడు వారమైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన వేళన్
(శత్రువులకు వీపుచూపి వస్తే మగతనం వున్న నాయకులు
నవ్వరా ఇంట్లో ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళమైనాము
బాధఎందుకు స్నానం చేసేవేళ)

అదేసమయంలో అన్నం పెట్టే సందర్భంలో
తల్లి విరిగిన పాలు పోసి ఈ విధంగా అన్నది-

అసదృశముగ నరివీరుల
పసమీరగ గెలువలేక పందక్రియన్ నీ
వసి వైచి విరిగి వచ్చిన
పసులున్ విరిగినవి తిక్క పాలున్ విరిగెన్
(అసమానమైన శత్రువులు బలం పెరగ్గా గెలువలేక
పిరికిపందవలె నీవు కత్తిని పక్కన పెట్టి తిరిగివచ్చావు
పశువులు విరిగి పాలువిరిపోయాయి తిక్కనా)

ఈ మాటలతో సైన్యాన్ని తీసుకొని  మనుమసిద్ధి వద్దన్నా
వినకుండా ఒప్పరించుకొని యుద్ధానికి వెళ్ళి భయంకరంగా
పోరాడి వీరమరణం పొందాడు.

ఒకసారి ఆలోచిస్తే ఇలా ఒక తండ్రి అవమానించడం
సహజమే కాని తల్లి, భార్య అవమానించి యుద్ధసన్నద్ధుని
చేసి పంపడంలో ఇలాంటి స్త్రీలున్నారా అంటే దాదాపు
లేరనే చెప్పాలి కాదంటారా?

Monday, November 20, 2017

కర్కట వ్రణములు ( Cancers )


కర్కట వ్రణములు ( Cancers )




సాహితీమిత్రులారా!
క్యాన్సర్స్ గురించి డా.గన్నవరపు నరసింహమూర్తిగారు కూర్చిన వ్యాసం
ఇక్కడ ఇవ్వబడింది చదవండి-శరీరానికి కలిగే రుగ్మతలలో కొత్త పెరుగుదలలకు ( Growths ) ప్రాముఖ్యత ఉన్నది. ఈ పెరుగుదలలు నెమ్మదిగా పెరిగే నిరపాయకరమైనవి( Benign tumors ) కావచ్చును. త్వరితముగా పెరిగి పరిసర కణజాలములోనికి మూలములతో ఎండ్రకాయల వలె చొచ్చుకుపోయే ప్రమాదకరమైన కర్కటవ్రణములు ( Malignant tumors ) కావచ్చును. ఇవి కాన్సరులుగా అందుకే ప్రాచుర్యములో ఉన్నాయి. ఈ పెరుగుదలలు పుట్టల వలె పెరుగుట వలన వీటిని పుట్టకురుపులని కూడా అంటారు.
కణముల జన్యువులలో మార్పు జరుగుటవలన (Genetic Mutations ) ఆ కణములు అతిత్వరగా పెరుగుతూ, అతిత్వరగా విభజన చెందుట వలన ఈ పెరుగుదలలు పొడచూపుతాయి. కర్కటవ్రణములలో కణములు పూర్తిగా ఆయా అవయవ కణజాలములలోని కణముల వలె పరిపక్వత నొందవు. అందుచే అవి ఆ అవయవాల కణములను పోలి ఉండవు. ఈ కణాలలో న్యూక్లియస్ పరిమాణము హెచ్చుగా ఉండి, సైటోప్లాజము పరిమాణము తక్కువగా ఉంటుంది. ఈ కణాల మధ్య సంధానము కూడా తక్కువగా ఉంటుంది. పరిపక్వత పొందకపోవుటచే ఈ కణాలు ఆ యా అవయవ ధర్మాలను నిర్వర్తించవు.
ఈ కణ బీజములు లింఫు నాళముల ద్వారా లింఫు గ్రంధులకు , రక్తనాళముల ద్వారా యితర అవయవములకు వ్యాప్తి చెందగలవు. ఈ కర్కటవ్రణాలు త్వరగా పెరుగుతూ పోషక పదార్థాలను విరివిగా సంగ్రహించుట వలన , ఈ వ్రణములనుంచి విడుదల అయ్యే రసాయినక పదార్థముల వలన ఆకలి క్షీణించుట చేత బరువు తగ్గి దేహక్షీణత కలుగుతుంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది ఆ అవయవ ధర్మాలకు ప్రతిబంధకము కూడా కలుగ జేస్తాయి. ఈ పుట్టకురుపులు చివరి దశలలో ఉన్నప్పుడు శరీరపు వ్యాధి నిరోధక శక్తి తగ్గి సూక్ష్మాంగజీవుల వలన వివిధ రోగములు కూడా కలుగ వచ్చును
కర్కట వ్రణములు కలుగడానికి కారణము కణముల జన్యువులలో మార్పు రావటమే కదా! ఈ జన్యువ్యత్యాసము తొంబయి శాతము , కణముల పరిసరముల ప్రభావము వలన జరిగితే ఒక పదిశాతము వరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువుల వలన కలుగుతాయి. వృద్ధాప్యములో శరీరపు వ్యాధినిరోధక శక్తి తగ్గి అసాధారణ కణములు తొలగింపబడకపోవుట వలన ఆ కణాలు పెరుగుట వలన ఆ పెరుగుదలలు పొడచూపుతాయి. పొగత్రాగుట, యితర విధాల పొగాకు వినియోగము, ఊబకాయము, వ్యాయామ లోపము, సూక్ష్మజీవులు కలిగించే వ్యాధులు, ఆహారపుటలవాట్లు, వాతవరణకాలుష్యము ,రేడియోధార్మిక కిరణాల వంటి భౌతిక కారణాలు అవయవాల కణములను ప్రభావితము చేస్తాయి.
పొగత్రాగడము, పొగాకు వినియోగములు 25 శాతపు పుట్టకురుపులకు కారణము. తొంబై శాతపు శ్వాసకోశ కర్కటవ్రణములు పొగత్రాగే వారిలోనే సంభవిస్తాయి. మూత్రాశయపు కాన్సరులు ( Urinary bladder cancers ), మూత్రపిండముల కర్కటవ్రణములు ( Kidney cancers), స్వరపేటికలో వచ్చే కర్కటవ్రణములు ( Laryngeal cancers ) అధికశాతములో పొగత్రాగే వారిలోనే కలుగుతాయి. జీర్ణాశయము ( Stomach ), క్లోమము ( Pancreas ), కంఠము, అన్ననాళములలో పుట్టే పుట్టకురుపులు పొగత్రాగే వారిలోనే ఎక్కువ. పొగాకులలో నైట్రోసమైన్లు ( Nitrosamines ), పోలీసైక్లిక్ హైడ్రోకార్బనులు ( Polycyclic Hydrocarbons) అనే కర్కటవ్రణజనకములు ( Carcinogens) ఉంటాయి. పొగాకు నమిలే వారిలోను, పోకచెక్కలు విరివిగా నమిలే వారిలోను నోటిలో కాన్సరులు ఎక్కువగా వస్తాయి. కాలుతున్న అంచు నోటిలో పెట్టి చుట్టలు కాల్చే వారిలో ( విశాఖ, శ్రీకాకోళపు ప్రాంతాలలో యీ అడ్డపొగ అలవాటు ఉన్నది. ) అంగుట్లో కర్కటవ్రణములు రావచ్చును. జపాను దేశములో జీర్ణాశయపు పుట్టకురుపులు ఎక్కువయితే అమెరికాలో పెద్దప్రేవుల పుట్టకురుపులు ఎక్కువ. నా ఆత్మీయులలోను, నెయ్యులలోను పెద్దప్రేవుల కర్కటవ్రణములు చూసాక భారతీయులలో అంతా అనుకునే కంటె ఎక్కువ మందికే బృహదంత్ర కర్కటవ్రణములు Colon Cancers ) కలుగ వచ్చునేమో ననే సందిగ్ధము నాకు కలుగుతున్నది.
అతినీలలోహిత కిరణాల ( Ultraviolet rays ) వలన చర్మపు పుట్టకురుపులు, మెలనోమాలు ( Melanomas)కలుగుతాయి. రేడియో ధార్మిక కిరణాలకు ( Radio active rays ) లోనైతే పుట్టకురుపులు రావచ్చు.
ఱాతినార ( Asbestos )వాడే పరిశ్రమల్లో పనిచేసే వారికి శ్వాసకోశపుపొరలో ( Pleura ) మీసోథీలియోమా ( Mesothelioma) అనే కాన్సరు కలిగే అవకాశ మెక్కువ.
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ( Human Papilloma Virus ) వలన గర్భాశయ ముఖములలో పుట్టకురుపులు ( Uterine Cervical Cancers ) కలుగుతాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వలన కాలేయపు పుట్టకురుపులు కలుగవచ్చును. హెలికోబాక్టర్ పైలొరై ( Heliocobacter pylori )అనే సూక్ష్మజీవుల వలన జీర్ణాశయపు ( Gastric) కాన్సరులు కలుగుతాయి.
వంశపారంపర్యము వలన మూడు నుంచి పది శాతపు కర్కటవ్రణములు సంభవిస్తాయి. జన్యువైపరీత్యములతో బి ఆర్ సి ఎ 1 , 2 ( BRCA 1 BRCA 2 ) జన్యువులు వంశానుగతముగా వస్తే రొమ్ము కాన్సరులు వచ్చే అవకాశములు ఎక్కువ.
కర్కటవ్రణములు ప్రమాదకరమైన వ్యాధులు. వాటిని కనుగొన్న సమయానికి అవి సుదూరవ్యాప్తి పొందకపోతే అవి చికిత్సకు లొంగే అవకాశాలు ఉంటాయి. వివిధావయవాలకు వ్యాప్తి చెందిన పుట్టకురుపులను పూర్తిగా నయము చేయుట కుదరక పోవచ్చును. ఆ స్థితులలో వైద్యులు ఉపశమన చికిత్సలే చేయగలుగుతారు. శస్త్రచికిత్స, రేడియోధార్మిక కిరణ ప్రసరణ చికిత్సలు ( Radiation therapy ) రసాయినకౌషధ చికిత్సలు ( Chemotherapy ) , ప్రతిరక్షణ చికిత్స ( Immunotherapy)లను వ్యాధి నివారణకు, ఉపశమన చికిత్సలకు వాడుతారు.
కాన్సరు వ్యాధిని సంపూర్ణముగా నయము చెయ్యాలంటే తొలిదశలలోనే వ్యాధిని పసిగట్టాలి. అంతే కాక కర్కటవ్రణములు రాకుండా జాగ్రత్తపడాలి.
కాన్సరు వ్యాధి నివారణ :
పొగ త్రాగడము, పొగాకు నములుట, హెచ్చుగా పోక చెక్కలు నమలుట జర్దాకిళ్ళీ వంటి వాడుకలు లేకుండా చూసుకోవాలి. సారాయి వినియోగమును చాలా అదుపులో ఉంచుకోవాలి. హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరస్ వ్యాధులు రాకుండా పిన్నవయస్సులోనే H.P.V టీకాలు (Vaccine) వేయించాలి. మితాహారము, శరీరపు బరువును అదుపులో ఉంచడము, శారీరకవ్యాయామము, కాయగూరలు, పళ్ళు , పూర్ణధాన్యముల వినియోగము పుట్టకురుపులను నివారించుటకు తోడ్పడుతాయి. హెపటైటిస్ బి సోకకుండా టీకాలు వేయించుకొనుట, హెపటైటిస్ సి రాకుండా తగిన జాగ్రత్తలలో ఉండుట రేడియోధార్మిక కిరణాలకు గురి కాకుండా వీలయినంత చూసుకొనుట కర్కటవ్రణములను నివారించుటకు తోడ్పడుతాయి.
పుట్టకురుపులు త్వరితముగా కనుగొని వాటికి సత్వర చికిత్స చేయడము వలన వాటిని నయము చేసే అవకాశ మున్నది. ఎవరికి వారు వారి శరీరమును శోధన చేసుకునుట వలన కొన్ని కాన్సరులను త్వరగా గుర్తించ వచ్చును. దేహమును , చర్మమును పరీక్షించుకొంటే చర్మముపై కలిగే వ్రణములు కనిపిస్తాయి. అసాధారణపు పుట్టుమచ్చలు కలిగినా , ఉన్న పుట్టుమచ్చలు పెరిగినా, లేక వాటి వర్ణములో మార్పులు జరిగినా , లేక వాటి వలన దురద, నొప్పి వంటి లక్షణములు పొడచూపినా, లేక వాటి చుట్టూ వలయములు ఏర్పడినా, మరే మార్పులు కలిగినా వైద్యులను సంప్రదించి, వాటిని శస్త్రచికిత్సచే తొలగించుకొని వాటికి కణపరీక్ష ( Biopsy ) చేయించుకోవాలి. స్త్రీలు కనీసము నెలకొకసారైనా వారి రొమ్ములను పరీక్షించుకోవాలి. అనుమానాస్పదమైన పెరుగుదలలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. స్తనచిత్రీకరణలు ( Mammograms) రొమ్ము కాన్సరులను సత్వరముగ కనుగొనుటకు తోడ్పడుతాయి. నలభై నుంచి డెబ్భై సంవత్సరములలో ఉన్న స్త్రీలకీ పరీక్షలు ప్రతి రెండు లేక మూడు సంవత్సరములకొక పర్యాయము వైద్యులు సూచిస్తారు.
గర్భాశయముఖ కర్కటవ్రణములు కొన్ని హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరసుల ( Human papilloma viruses) వలన కలుగుతాయి. హెచ్.పి.వి ( HPV Vaccine ) టీకాలను పిల్లలకు వేసి ఈ పుట్టకురుపులను నివారించ గలము. ఇరవై సంవత్సరాల నుంచి అరవైఐదు సంవత్సరముల లోని స్త్రీలలో గర్భాశయ ముఖము నుంచి పాప్ స్మియర్ వలన గ్రహించిన కణపరీక్షలను ( Pap Smears ) వైద్యులు సిఫారసు చేస్తారు. ఈ పరీక్షలు కర్కటవ్రణములను తొలిదశలలో కనుగొందుకు ఉపయోగపడుతాయి.
ఉత్తర అమెరికా ఖండములో వైద్యులు ఏభై సంవత్సరములు నిండిన వారికి బృహదంత్ర అంతర్దర్శన పరీక్షలను ( Colonoscopies) ప్రతి ఐదు పది సంవత్సరములకు ఒకసారి సూచిస్తారు. ఈ పరీక్షలు చేసినప్పుడు పాలిప్స్ ( Polyps) అనే అంగుష్టాకారపు కంతులు కనిపిస్తే వాటిని సమూలముగా విద్యుద్దహనప్రక్రియచే ( Electro cauterization ) తొలగించి కణపరీక్షకు పంపిస్తారు. ఈ కంతులు తొలిదశలలో నిరపాయకరమైనా తరువాత అపాయకరమైన కాన్సరులుగా పరిణామము చెందవచ్చు. ఈ నిరపాయకరమైన ఆంత్రపు పెరుగుదలలను తొలగించుటచే వైద్యులు అపాయకరమైన కర్కటవ్రణములను నివారించ గలుగుతారు. తొలిదశలలో కనుక్కో బడిన బృహదాంత్ర కర్కటవ్రణములు ( Colon cancers ) చికిత్సలకు సాధారణముగా లొంగుతాయి. భారతదేశములో యీ కొలొనోస్కోపులు శోధన పరీక్షలుగా ప్రాచుర్యము పొందినట్లు లేదు. దీర్ఘకాలిక పరిశోధనలు చేస్తే వీటి ఉపయుక్తత తెలిసే అవకాశము ఉంది.
పొగత్రాగే వారిలో తరచు శ్వాసకోశపు చిత్రాలు తీస్తే శ్వాసకోశపు కర్కటవ్రణములను తొలిదశలలో కనుక్కొనే అవకాశము కొంత ఉండవచ్చును. సంవత్సరానికో సారి కాట్ స్కాన్ ( Low dose Computerized Axial Tomography Scan ) చేస్తే యీ కాన్సరులను త్వరగా కనుక్కొనే అవకాశము పెరుగుతుంది. కాని చాలా మందిలో శ్వాసకోశపు కర్కటవ్రణాలు ( Lung Cancers) బయటపడేటప్పటికే అవి వ్యాప్తి చెంది ఉంటాయి. ఒక పదిహైను శాతము మందిలో శస్త్రచికిత్సకు అవకాశము ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తొలిదశలలో కనుక్కోబడక పోవుటచే నయమయే శ్వాసకోశపు కాన్సరులు చాలా తక్కువ ఉంటాయి.
రక్తములో ఉన్న ప్రాష్టేట్ స్పెసిఫిక్ ఏంటిజెన్ ( Prostate Specific Antigen ) పరీక్ష ప్రతి రెండు సంవత్సరములకు 55 - 69 సంవత్సరముల వయస్సులో ఉన్న పురుషులలో చేస్తే ప్రాష్టేట్ కర్కటవ్రణములను ( Prostatic Cancers) సకాలములో గుర్తించ వచ్చును.చాలా మందిలో ప్రాష్ట్రేట్ కాన్సరులు నెమ్మదిగా పెరుగుటచే పెక్కుశాతము మంది చికిత్స లేకపోయినా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశమున్నది. P.S.A పరీక్షలతో సత్వరముగా కనుక్కొని చికిత్స చేస్తే మరింత ప్రయోజనము చేకూర వచ్చును.
కర్కట వ్రణములు ఆరంభదశలో ఉన్నపుడు యే బాధా కలిగించక పోవచ్చును. అవి పెరుగుతున్న గొలది వివిధ లక్షణాలు పొడచూపుతాయి. సాధారణముగా అవి ఏ అవయవాలలో ఉంటాయో ఆ అవయవాలకు సంబంధించిన లక్షణాలు కలుగుతాయి. ఆకలి తగ్గుట , బరువు తగ్గుట , కర్కటవ్రణ లక్షణాలు. ఏ అవయవ సంబంధమైన వ్యాధి లక్షణాలు కనిపించినా తగిన శోధన పరీక్షలు చేయుట వలన అవి ప్రస్ఫుట మవ వచ్చును. రక్త పరీక్షలు, ఎక్స్ రేలు, కాట్ స్కానులు, అల్ట్రాసోనోగ్రాములు, ఎం.ఆర్.ఐ స్కానులు, పెట్స్కానులు, కొలొనోస్కోపి , గాస్ట్రోస్కోపి, బ్రాంఖోస్కొపీలు , కర్కటవ్రణములను కనుగొనుటకు ఉపయోగ పడుతాయి.
వ్రణములు, కనుక్కొన్నాక వాటినుంచి కణపరీక్షలు ( Biopsies) చేసి వ్యాధిని నిర్ణయిస్తారు. వివిధ పరీక్షలతో ఈ కర్కట వ్రణములు యితర అవయవములకు వ్యాపించాయో లేదో నిర్ణయించి తగిన చికిత్సలు చేస్తారు.
మిగిలిన వైజ్ఞానిక శాస్త్రాల ఆలంబనముగా వైద్యశాస్త్రము అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ మంతటా వైజ్ఞానిక పరిశోధకులు విజ్ఞానశాస్త్రపు టభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఆరంభదశలో కనుగొనబడిన కాన్సరులు చికిత్సకు లొంగే అవకాశమున్నది. అంత్యదశలలో కనుగొన్న కర్కటవ్రణములకు సంపూర్ణచికిత్సలు సాధ్యము కావు. అటువంటి పరిస్థితులలో ఉపశమన చికిత్సలకే అవకాశ ముంటుంది.

( తెలుగుతల్లి కెనడా లో ప్రచురించబడిన వ్యాసము )

Sunday, November 19, 2017

కోణార్కలోని సూర్యదేవాలయం


కోణార్కలోని సూర్యదేవాలయం




సాహితీమిత్రులారా!

మన దేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో
కోణార్క అనే చోట ఉన్న సూర్యదేవాలయాన్ని
గురించి ,రథ చక్రం ద్వారా సమయం
ఎలా కనుక్కోవచ్చో చూడండి
ఈ వీడియోలో -


Saturday, November 18, 2017

మిస్టరి ఆఫ్ దీస్ టెంపుల్స్


మిస్టరి ఆఫ్ దీస్ టెంపుల్స్



సాహితీమిత్రులారా!

ఈ వీడియో చూడండి-
ఈ దేవాలయాలన్నీ ఒకే నిలువురేఖలో ఉన్నాయి
ఎంత చిత్రంగా నిర్మించారో మనవారు

గజల్


గజల్



సాహితీమిత్రులారా!


దాశరథి కృష్ణమాచార్యులుగారు
గజల్ ను గురించి వ్రాసిన గజల్
చూడండి-

రమ్మంటే చాలు గానీ రాజ్యాలు విడిచిరానా
నీచిన్ని నవ్వుకోసం స్వరా్గలు గడిచి రానా

ఏడేడు సాగరాలు ఎన్నెన్నొ పర్వతాలు
ఎంతెంత దూరమైనా బ్రతుకంత నడిచి రానా

కనులందు మంచులాగా కలలన్ని కరిగిపోగా
కావేరి వోలె పొంగే కన్నీరు తుడిచి రానా

నీవున్న మేడ గదిలో నను చేరనీయరేమో
జలతారు చీర కట్టి సిగపూలు ముడిచి రానా

పగబూని కరకువారు బంధించి ఉంచినారు
ఏనాటికైనగానీ ఈ గోడ పొడిచి రానా

                                                         (సాఖీనామా లోనిది ఈ గజల్)

Friday, November 17, 2017

ఎన్నో రాత్రులు శ్మశానాల్లో గడిపాను


ఎన్నో రాత్రులు శ్మశానాల్లో గడిపాను




సాహితీమిత్రులారా!

భర్తృహరి వైరాగ్యశతకంలోని
ఈ శ్లోకాన్ని చూడండి-

ఉత్ఖాతం నిధిశఙ్కయా క్షితితలం, ధ్మాతా గిరేర్ధాతవో,
విస్తీర్ణస్సరితాంపతి, ర్నృపతయో యత్నేన సంతోషితాః,
మన్త్రారాధనతత్పరేణ మనసా నీతాః శ్మశానే నిశాః,
ప్రాప్తః కాణవ రాటకో పి న మయా తృష్ణే! సకామా భవ

నిధి నిక్షేపాలు పూర్వులెవరో దాచి ఉంచుతారని విని ఆశగా
నేల చెడత్రవ్వాను. బంగారం మీది వ్యామోహంతో కొండలమీద
లభ్యమయ్యో మణిశిలవంటి ధాతువుల్ని కరిగించాను. ఎక్కడో
దూరదేశాల్లో సంపదలున్నాయని ఆత్రంగా సముద్రాలమీదికి
ప్రయాసతో ప్రయాణించి, రాజులకొలువు చేసి వార్నికనిపెట్టి సదా
ఇష్టుడిగా మెలిగాను. మంత్రాలతో ఎక్కడెక్కడి ఐశ్వర్యాలూ
వశమౌతాయని ఆశించి రాత్రులెన్నో శ్మశానాల్లో గడిపాను.
ఏదీ గుడ్డిగవ్వయినా లభించిందా ఈ తపన ఇక చాల్లే - అని భావం

Wednesday, November 15, 2017

అధిక్షేపము - కవితా నిక్షేపము


అధిక్షేపము - కవితా నిక్షేపము




సాహితీమిత్రులారా!
ఇది మన దాశరథి కృష్ణమాచార్య
ఆలోచనా లోచనాలు - నుండి

ఫారసీక కవులలో మరపురానివాడు ఫిరదౌసీ.
ఇతడు క్రీ.శ. పదవ శతాబ్దివాడు. ఇతని పూర్తి పేరు
అబుల్ ఖాసిం హసన్ ఫిరదౌసీ. అరవైవేల పద్యాలుగల
షానామా అనేది ఇతని మహాకావ్యం. పర్షియన్ రాజు ఇతిహాసం.
అమరమైన ఈ కావ్యం విలువ తెలుసుకోలేని ఆనాటి రాజు
సుల్తాన్ మహమూద్ - ఫిరదౌసీని అవమానించాడు.
ఆ అవమానం కవిని కవ్వించింది. అధిక్షేప కావ్య రచనకు
ఉపక్రమింపచేసింది. అందులోని ఒక భాగమే
ఈ కవిత -

కాలగర్భాన చనిన భూపాలకులను
కలముతో బ్రతికించిన కవినినేను,
ఏసువలె నేను వారి పేరెత్తి పిలువ
తమ సమాధుల వెడలిరి ధరణిపతులు

వాత హతికిని కాలప్రవాహమునకు,
అగ్ని, వర్షపాతమునకు భగ్నములగు
సౌధములను నిర్మించు రాజన్యుతోడ
కావ్య నిర్మాత ని పోల్చగా తరంబె

నా మహాకావ్య సౌధ శృంగములపైన
గాలికి వానకును అధికారమేది
కాలమును కట్టి పడవేయ గలుగు శక్తి
నా కలాన కొసంగి యున్నాడు ప్రభువు.

రాజులో నుదాత్తత లేనిరోజు వచ్చె
స్వామిలోన నౌదార్యమ్ము చచ్చిపోయె
మౌక్తికమ్ము నొసగలేని శుక్కిలోన
శూన్యమేగాని, కనిపించు నన్యమెట్లు

ముండ్ల తీవెకు ద్రాక్షలు మొలుచునొక్కొ
జముడు పొదలోన పండునే జామపండ్లు
నాక వన వాటికలలోన నాటగానె
పాప భూరుహములు పుణ్యఫలము లిడునె

పరిమళ ద్రవ్యముల నమ్మువాని చేర
పరిమళమ్మంటి తీరు వస్త్రములకు,
బొగ్గలమ్మెడి వానితో పొందుసేయ
వలనముల నిండ నిండును మసియొకంటె

చిరుతపులి మచ్చ లెవ్వరు చెఱుప గలరు
ఏన్గు నెవ్వరు తెలుపు గావింపగలరు
క్షుద్రుడగు వాని గుండెల ముద్రవడిన
హీనతను మాపజాలు టెవ్వాని తరము

పులిని నను నీవు మేకగా తలచినావు
ఏనుగులతోడ తొక్కింపనెంచినావు
జ్ఞానకాంతుల వెదజల్లజాలు నేను
మానవున కెవ్వనికి లొంగబోను లెమ్ము

అరువదివేల పద్దేముల నల్లిన కావ్యము, మౌక్తికస్రజ,
మ్మరయ ధరిత్రి శాశ్వతత నందవలెన్ కవితా మహత్తుతో
పరపతి కంకితంబగుట న్యాయముకాదు, ప్రవక్త పాద పం
కరుహములందు నిల్చితి కానుకగా, భవభంజకమ్ముగా

Tuesday, November 14, 2017

ధృతరాష్ట్రునికి భార్యలెందరు?


ధృతరాష్ట్రునికి భార్యలెందరు?




సాహితీమిత్రులారా!


మనకు తెలిసిన వరకు ధృతరాష్ట్రునకు
గాంధారి ఒకతే భార్య. కానీ
ఆంధ్రమహాభారతంలోని(1-5-12,13)
ఈ విషయాలు గమనిస్తే ఎంతమందో
తెలుస్తుంది.
సుబంధుడు అనే గాంధారరాజుకు
11మంది ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు
గాంధారి, సత్యవ్రత, సత్యసేన, సుధేష్ణ,
సంహిత, తేజశ్శ్రవ, సుశ్రవ, నికృతి,
శుభ, సంభవ, దశార్ణ -అనే 11 మంది స్త్రీలు.
శకుని అనే పురుషుడు.
ఈ పదకొండు అమ్మాయిలను ఏకముహూర్తంలో
ధృతరాష్ట్రునికి భీష్ముడు వివాహం చేయించాడు.

కులమును రూపము శీలముఁ
గలకన్యలఁ దెచ్చి తెచ్చి గాంగేయుండీ
నలఘుఁడు ధృతరాష్ట్రుఁడు కుల
తిలకుండు వివాహమయ్యె దేవీశతమున్
                                                           (ఆంధ్రమహాభారతం - 1-5-13)

ఒక మారుకాకుండా తెచ్చి తెచ్చి నూరుమంది
రాజకుమార్తెలను భీష్ముడు చేశాడని పైపద్యవలన
తెలుస్తున్నది. కావున
ఈ లెక్కప్రకారం అక్షరాల 111 మంది
భార్యలు ధృతరాష్ట్రునికి అని తేలుతున్నది.

Monday, November 13, 2017

అఘోరాలు ఏమిటి? వారి సందేశం ఏమిటి?


అఘోరాలు ఏమిటి? వారి సందేశం ఏమిటి?




సాహితీమిత్రులారా!

భక్తి తత్త్వంలో అనేక విధాల రూపాలున్నాయి
అలాంటివాటిలో అఘోరాలు ఒక విధం
ఘోరము కానిది అఘోరం అని కొందరు
ఆతత్త్వాన్ని గురించి చేబుతారు.
వారు శ్మశానాల్లో ఉంటారని,
శవాలను తింటారని
ఇలా అనేక సందేహాలను నివృత్తి చేస్తున్న
అరవింద్ అఘోరా తో వై.టి.వి. ఇంటర్వూ
ఈ వీడియోను వారి తత్త్వాన్ని గమనించండి-



Saturday, November 11, 2017

మెరౌలీలోని ఇనుపస్తంభం


మెరౌలీలోని ఇనుపస్తంభం




సాహితీమిత్రులారా!

గుప్తులకాలంనాటి ఇనుపస్తంభం
ఢిల్లీలో మెహరౌలీ ప్రాంతంలో ఉంది
దాని ప్రత్యేకతలు తెలిపే ఈ వీడియోను
చూడండి


Friday, November 10, 2017

ఎల్లోరా గుహల్లోని కైలాసనాధ దేవాలయం


ఎల్లోరా గుహల్లోని కైలాసనాధ దేవాలయం




సాహితీమిత్రులారా!

ఎల్లోరా గుహల్లోని కైలాసనాథ దేవాలయం
కట్టడాల్లో సాంకేతివిషయాలను గమనించండి
ఈ వీడియోను చూడండి-


Thursday, November 9, 2017

ఎవరికి ఎలాంటి అభిరుచులుంటాయి?


ఎవరికి ఎలాంటి అభిరుచులుంటాయి?




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
ఏమి చెబుతున్నదో -

సతాంధనం సాధుభిరేవ భుజ్యతే
దురాత్మాభి ర్దుశ్చరితాత్యావాం ధనమ్
పికాదయా శ్చూతఫలాని భజంతే
భవన్తినింబాః కలు కాక భోజనాః

పక్షులు గ్రహించే ఆహారంలో తేడాలకు
వాటి స్వభావాలే కారణం కాబోలు లేకుంటే
మరేమిటి చిలుకలు - కోయిలలు మామిడి పళ్లను
ఆశిస్తే, కాకులు చేదుగా ఉండే వేప పళ్లను తినడమేమిటి
అంటే మంచి వారికి మంచి అభిరుచులు,
చెడ్డవారికి చెడ్డ అభిరుచులు స్వభావసిద్ధము అనడానికి
ఇది తార్కాణంగా చెప్పవచ్చు.

Wednesday, November 8, 2017

అతి సర్వత్రా వర్జయేత్


అతి సర్వత్రా వర్జయేత్





సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
ఏమి చెబుతుందో -

అతి పరిచయా దవజ్ఞా
సంతత గమనా దనాదరో భవతి
మలయే భిల్ల పురంధ్రీ
చందన తరుకాష్ఠ మిన్థనం కురుతే

ఎవరితో పరిచయాన్నయినా అతిగా పెంచుకోకూడదు.
అది చనువుగా మారితే వెటకారాలకూ - వ్యంగ్యాలకూ
ఆస్కారం కలిగిస్తుంది. అలాగే అదేపనిగా ఎవరిదగ్గరకైనా
వెళుతుంటే నిరాదరణకు దారితీయవచ్చు మితంగా ఉంటేనే
అభిమానం పెరుగుతుంది. ఎలాగంటే విస్తారంగా మలయపర్వతం
మంచి గంధపు చెట్లతో సమానం. వాటిని సైతం వంటచెరకుగా
వాడుకో గల అతి పరిచయం ఆ చెట్లతో వారికుంది. కానీ,
మనకు మాత్రం అవి మహాప్రియం.

Tuesday, November 7, 2017

భార్యాభర్తలను విడదీసే వారు ఎలాంటి శిక్షలు పొందుతారు


భార్యాభర్తలను విడదీసే వారు ఎలాంటి శిక్షలు పొందుతారు





సాహితీమిత్రులారా!

భార్యా భర్తను విడదీసేవారికి మనవారు
ఏ నరకాలకు పోతారని సెలవిచ్చారో చూడండి-

మహా ప్రభేతి నరకం
దీప్త శూల మహోచ్ఛ్రయం,
తత్ర శూలేన ఛిద్యం తే
పతి భార్యోప భేదినః

భార్యా భర్తలు చల్లగా ఉంటే చూడలేని ప్రబుద్ధులు అనేకురు
వారిమధ్య చిచ్చి పెడితేగాని నిద్రించని ఘటాలూ ఎక్కవే
వారు ఈ లోకంలో సుఖంగా వినోదంగా కాలం గడపవచ్చేనేమో
గాని వారికి నరకమే ప్రేప్తిస్తుందంటారు. దిలో భాగమే ఈ శ్లోకం
శూలాలతో అనుక్షణం చిత్రవధ చేయబడటమే. ఈ నరకం పేరు
మహాప్రభ అని చెప్పబడుతున్నది. దంపతులను విడదీయడమంత
పాపపుపనికంటే మరొకటిలేదుకదా

Monday, November 6, 2017

అరుణాచలేశ్వరుడు


అరుణాచలేశ్వరుడు



సాహితీమిత్రులారా!

అగ్నిలింగమైన అరుణాచలేశ్వరుని అరుణాచలాన్ని
గురించిన విషయాలను వీడియో రూపంగా చూడండి-



Sunday, November 5, 2017

ఎవరు పండితుడు? - ఏది విషతుల్యం?


ఎవరు పండితుడు? - ఏది విషతుల్యం?




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-
ఏమి చెబుతున్నదో!

కః వథ్యతరో? ధర్మః, కశ్శుచి?
రిహయస్య మానసం శుద్ధమ్,
కః పండితో? వివేకీ, కిం విష?
మవధీరణా కురుషు


హితాన్ని కలిగించేదే ధర్మం
ఎవరి మనసులు పరిశుద్ధంగా ఉంటాయో
వారే శుచిగా ఉన్నవారు
ఆత్మకూ - అనాత్మకూ(జీవికీ- పరమాత్మకూ)
భేదం తెలిసినవాడే పండితుడు
హితుడు గానీ - గురువుగానీ చెప్పిన మాటను
తిరస్కరించడం(పెడచెవిన పెట్టడం)-
విషతుల్యం
అని శ్లోక భావం

Saturday, November 4, 2017

ప్రాచీన దేవాలయ కట్టడాల్లో యంత్రపనితనం


ప్రాచీన దేవాలయ కట్టడాల్లో యంత్రపనితనం




సాహితీమిత్రులారా!

మన ప్రాచీన దేవాలయాల్లో మన శిల్పులు ఉపయోగించిన
పనిముట్లు నేటి యంత్రాలకన్నా మిన్న అని తెలిపే
ఈ వీడియో చూడండి హోయసలేశ్వరుని దేవాలయంలోని
శిల్పాలు వాటి పనితనం ఇక్కడ గమనించండి-

అడవిని సృష్టించిన మానవుడు


అడవిని సృష్టించిన మానవుడు




సాహితీమిత్రులారా!

అడవిని సృష్టించడం ఏమిటి
అంటే ఈ వీడియో చూడాల్సిందే
జాదవ్ పెయాంగ్ అనే వ్యక్తికి
సంబంధించిన కథనం
ఈ వీడియో చూడండి


Friday, November 3, 2017

వారణాశి(కాశి)- సిటి ఆఫ్ ది టెంపుల్స్


వారణాశి(కాశి)- సిటి ఆఫ్ ది టెంపుల్స్ 




సాహితీమిత్రులారా!

వారణాసి అంటే కాశి. కాశీలో లెక్కకు మిక్కిలి
దేవాలయాలున్నాయి అందుకే సిటి ఆఫ్ ది టెంపుల్స్ 
అని పిలుస్తారు. దాని గురించిన వీడియో వీక్షించండి-


Thursday, November 2, 2017

రాజుకు ఉండకూడని దోషాలు


రాజుకు ఉండకూడని దోషాలు




సాహితీమిత్రులారా!


రాజుకు ఉండకూడని దోషాలు 14 అని శాస్త్రాలు చెబుతున్నాయి.
వీటినే చతుర్దశ రాజదోషాలు అంటారు. అవి-
1. నాస్తిక్యం, 
2. క్రోధం, 
3. ప్రమాదం(ఏమరిపాటు), 
4. జ్ఞానవంతులను దర్శించకపోవటం, 
5. ఆలస్యం(సోమరితనం)
6. పంచేంద్రియాలకు లొంగడం, 
7. రాచకార్యాలలో ఇతరులను సంప్రతించకుండా 
     ఒక్కడే నిర్ణయాలు తీసుకోవడం, 
8. విషయపరిజ్ఞానం లేనివారి సలహా పొందడం, 
9. నిర్ణయాలను అమలు జరపడంలో ఉత్సాహం చూపకపోవడం, 
10 రహస్యంగా ఉంచవలసిన విషయాలను రహస్యంగా ఉంచకపోవడం, 
11. నిర్ణయాలను తీసుకోవాల్సినపుడు నిర్ణయంతీసుకోకుండా వాయిదా వేయడం,
12. ఉపరి రక్షణం(కాపాడవలసిన వారిని కాపాడకపోవడం)
13. శుభకార్యాలను చేయకపోవడం,
14. శత్రువులను అందరినీ ఏకకాలంలో ఎదిరించాలనుకోవడం

ఇవి ఒక రాజుగా చేయకూడని పనులు.

Wednesday, November 1, 2017

వామాచారం అంటే ఏమిటి?


వామాచారం అంటే ఏమిటి?




సాహితీమిత్రులారా!



మనం అన్నీ తెలుసుకోవాలి వాటిలో శ్రేష్ఠమైనదాన్నే పాటించాలి.
కొన్ని విషయాలడిగినపుడు అవి పాటించకపోయినా వాటిని గురించి
తెలుసుకోవడం తప్పుకాదుకదా ఎలాగంటే మనం త్రాగకపోయినా
మద్యంలోని రకాలు వింటున్నాం అవేమిటంటే మద్యమని 
తెలుసుకోగలుగుతున్నాము. అంతమాత్రంతో మనం త్రాగాలని
లేదుకదా. 

శ్రీవిద్యా ఉపాసకులు అనేకరకాల పద్ధతులతో పూజలు చేస్తుంటారు
వాటిలో సమయాచారం, దక్షిణాచారం, కౌళాచారం, వామాచారం
ఇలా చెప్పుకోవచ్చు. 

ఇక్కడ వామాచారం గురించిన విషయాలను 
క్లుప్తంగా తెలుసుకుందాం-

వామాచారం వేద విహితమైన మార్గాల ద్వారా కాక, అడ్డదారులలో
సిద్ధులను సంపాదించుకొనే విధానంగా పేరు తెచ్చుందని 
కొందరి అభిప్రాయం. సత్వరం ఫలితాలను కలుగుతాయని కొందరూ,
పంచమకారా(మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం)ల
ఆకర్షణ వల్ల మరికొందరూ, వామాచారమార్గం పట్టారని ఒక భావన.
వామాచారం ఐదు విధాలని మేరుతంత్ర మనే గ్రంథం చెబుతున్నది.
దీనిలో మొదటిది కౌలం(కౌళం), రెండవది వామం, మూడవది 
చీనం(చీనక్రమం)(దీనిలో చీన, మహాచీన, దివ్యచీన అనే రకాలున్నాయి), 
నాలుగవది సిద్ధాంతం, ఐదవది శాంబరం(ఇది ఆటవికులలో ఎక్కువ 
ఆదరణ పొందింది).

కుల సంబంధమైనది కాబట్టి దీన్ని కౌలమంటారని నిర్వచనం.
తరతరాలుగా వచ్చే కొన్ని ఆచారాల వల్ల కూడ కౌలం అనే పేరు 
వచ్చిందని చెప్పవచ్చు. మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం 
అనే పంచమకారాలను పాటిస్తారు. మనస్సు దేనివల్లతృప్తి పొందుతుందో, 
సుఖం కలుగుతుందో అదే దేవికి తృప్తిని కలిగిస్తుందని వామాచారపరుల భావన. 
బలులివ్వటం, తాగిన మైకంలో వివస్త్రలను అనుభవించటం లాంటివి ఈ పూజలో 
భాగమని అంటారు. మేరుతంత్రం ఈ మార్గాలను ఖండిస్తుంది. 
వామాచారంలో పశుభావం, వీరభావం, దివ్యభావం అనే దశలున్నాయి. 
సాధకుడు పశుభావంలో దైహిక సుఖ భోగాల స్ధయిని క్రమంగా దాటి సోహం భావదశకు చేరుకొంటాడని అంతర్యం.స సోహం భావన అంటే తానే బ్రబ్మననే జ్ఞానం కలగడం. పశుభావంలో శరీర శుద్ధి, మనశ్శుద్ధి, కలిగినపుడు గానీ వీరభావ దశ రాదు. అప్పుడు గురువు అవసరం కలుగుతుంది. తరువాత దశలో తానే బ్రబ్మమనే జ్ఞానం కలుగుతుంది. కాని, సాధనలో దైహిక సుఖాల సుఖాల దశ దాటడం కష్టం, అరుదు. అందువల్లనే ప్రామాణిక వేదాంత గ్రంథాలు వామాచారాన్ని ఖండిస్తాయి.