Friday, January 31, 2020

కొత్తవరవడి


కొత్తవరవడి
సాహితీమిత్రులారా!

ఆరుద్రగారి కవిత ఆస్వాదించండి-

కవిత కోసమె నేను పుట్టాను
క్రాంతికోసము కలము పట్టాను
ఎండమావులు చెరిపి పండువెన్నెల నిలిపి
గుండెవాకిలి తలుపు తట్టాను

మందికోసము గుడిని కట్టాను
మమతలన్నీ ముడుపు కట్టాను
అగుపడని దైవం ఆరగించదు సుమ్ము
అందుకే అవి పంచిపెట్టాను

పంచవన్నెల చిలుక పట్టాను
పంజరంలో అదిమి పెట్టాను
పక్షిలా నాగుండె పరితపించుచు మండె
పంజరాలను పగులగొట్టాను

ముళ్ళలో ఒక పువ్వు చూశాను
మోజుపడి అది తుంచివేశాను
గుచ్చుకొన్నదా ముల్లు విచ్చుకొనదా పువ్వు
పూలుకోయుట విడిచి పెట్టాను

నీటిలో ఒక నీడ చూశాను
నీడకై గాలమ్ము వేశాను
చిక్కలేదొక మీను చిక్కుకున్నది నేను
చింపి వలలను పారవేశాను

మందికోసం నడుం కట్టాను
మంచి కోరుచు కేక పెట్టాను
మందుడొక్కడు లేచె మంచితనమును తూచె
మలుపుదారిని తేతు పట్టాను

అద్దమందున నిజము చూశాను
అద్దాని కై  దారికై వేశాను
అనుసరించిన జనత అలసిపోవుటచేత
మనసులో నిట్టార్చి వగచాను

నిన్ను నాలో కలుపుకొన్నాను 
నన్ను నేనే తెలుసుకున్నాను
కోర్కెనై వెలుగునై కొమరాల జిలుగునై 
కొత్తవరవడి మొదలు పెట్టాను.
(ఆరుద్ర రచనలు / కవితలు) 
(విపుల సంకలనం - 1985)

Wednesday, January 29, 2020

సౌందర్యాధిదేవత


సౌందర్యాధిదేవత
సాహితీమిత్రులారా!

ఫారశీ భాషలో ఫిరదౌసీ వ్రాసిన షాఃనామా-లోని
కవిత ఇది. దీన్ని దాశరథిగారు తెనిగించారు.

యవనికాభ్యంతరమ్మున యువతి మోము
భాను బింబంబుకన్నను భాసురమ్ము
కొమ్మ, సొగసైతయేన్గుదంతమ్ము బొమ్మ!
తరణి తనువల్లి మహితమందారవల్లి


నెలత బుగ్గలు లేతదానిమ్మ పూలు
ఆమె పెదవులు జ్వలియించు అగ్నిశిఖలు
పడతి చనుదోయి రజత కుంభమ్ములౌర!
కనులు కాటుకపిట్ట రెక్కలను బోలు

ఆమె మైతావి కస్తూరినతిశయించు
గొలుసు గొలుసులు గొలుసులు వెలది కురులు
కాంత పదివ్రేళ్లు పదివెండి కలములౌర!
ఎవరి ఫాలాన నేమి లిఖించగలవొ!

చందమామపై కస్తూరి చల్లినపుడు
ఎవ్వరైనను చూచిరో! యే నెఱుంగ,
నా చెలియ మోముపై వ్రాలి నాట్యమాడు
నీలి కురులను చూడ రారేమి మీరు?
                                                                              (ఆలోచనాలోచనాలు నుండి)

Monday, January 27, 2020

తాటాకు బొమ్మలాట


తాటాకు బొమ్మలాట
సాహితీమిత్రులారా!

ఇది శ్రీశ్రీ వ్రాసిన కవిత
పోయెట్రీ వర్క్ షాప్ నుండి
తీసుకోవడం జరిగింది.

తాటాకు బొమ్మలాట
తాటాకు బొమ్మరింట 
దాగున్న సూరీడా!-

       ఆరని కంటి నీరే 
       ఏరయి పారే వేళా
       ఊగని ఉయ్యాలగా - నా
       ఒడిలో నిదురపోరా!

తాటాకు బొమ్మరింట 
దాగున్న సూరీడా!
నా చిట్టి సూరీడా!

      జోలపాడే కన్నీరే ఈ
      లోకాలె చీకటాయె ఆ
      ఎండమావి అలగా జనం

      గాయపడ్డ మా మనసే
      ఆరని కొరివాయె
      తూలిపడ్డ ప్రజలకే
      కూడు నీడ కరువాయె
      బీడు పడ్డ నేలమీద
      వానచినుకు పడదాయె

అమ్మచేతి మందారం నా
అందమైన బంగారం

       చెందామర చేరువైన
       ముచ్చటైన మూలధనం

నీరులేని మేఘం వచ్చి 
నెత్తురే చిందెనురా!
అన్నం లేని బాననిండా
కన్నీరే పొంగెనురా!


Saturday, January 25, 2020

కప్పిచెప్పువాడు కవి


కప్పిచెప్పువాడు కవి 
సాహితీమిత్రులారా!

ముకుందవిలాసంలోని ఈ పద్యం గమనించండి-
ఇది భద్రాదేవి కన్నులను గురించి చెప్పే పద్యం.

ఒకయేటఁ జిక్కె మీనము
నొకనెలకేఁ చిక్కెఁ పద్మమొక పగటింటన్
వికలతఁ జిక్కెంగుముదము
టకి నయనసమంబులగునె జడగతులెపుడున్
              (ముకుందవిలాసము - 1-219)
భద్రాదేవి నేత్రసామ్యాన్ని పొందటానికి
చేప, తామర, కలువ ప్రయత్నించాయట.
దానిలో చేప ఒక ఏట (సంవత్సర కాలంలో)
కృశించిపోయిందట.
తామర ఒక నెలలోనే చిక్కిపోయిందట.
కలువ ఒకరోజులోనే చిక్కిపోయిందట.
కావున అవి భద్రాదేవి నయన సామ్యం
పొందలేక పోయాయని తెలుస్తున్నది.

కానీ దీనిలోని అసలు అర్థం అదికాదట -
మరి ఎలా అంటే -

చేప ఏటిలో(నదిలో) చిక్కిపోయిందట
తామర ఒక నెలకే చిక్కె (వెన్నెలలో) చిక్కిందట
(అంటే వెన్నెలలో తామర ముడుచుకు పోతుంది)
కలువ ఒక పగటింట(పగలులో) చిక్కెనట
(అంటే పగలు సూర్యుని వెలుతురులో
కలువ ముడుచుకుపోతుంది) ఈ విధంగా అవి
భద్రాదేవి నయనాల సామ్యం కాలేక పోయినవట.
చిన్న పదాల విరుపుకూడాకాదు పునరుక్తిచే
చమత్కరించారు ఈ కవి కాణాదం పెద్దనామాత్యుడు.

Thursday, January 23, 2020

భృంగ పంచకం


భృంగ పంచకం


సాహితీమిత్రులారా!

తెలుగులో భృంగ పంచకం పేరుతో ఐదు పద్యాలున్నాయి. ఇవి ఎవరు రాశారో తెలీదుగానీ, శ్రీనాథుడని కొందరి అభిప్రాయం. ఈ ఐదు పద్యాల చుట్టూ మాంచి కత కూడా అల్లిపెట్టారు మన పూర్వులు. కథలో కెళితే.....

పూర్వం ఒక మహారాజుకు సౌందర్యవతి అయిన భార్య ఉండేది. రాజులకు అనేక మంది భార్యలు ఉండటం సహజం వారిలో ఈవిడ చిన్నదిగా అనుకోవచ్చు. మహారాజు వల్ల పూర్తి చెందక మదనజ్వరంతో వేగిపోతోంది. ఆ రాజ్యంలో మంత్రి ముసలివాడు కావడంతో, అతని కుమారుని ఆపదవిలోకి నియమించాడు రాజు. కొత్తమంత్రి మంత్రాంగనిపుణుడేకాదు అసాధారణ సౌందర్యవంతుడు. రాణిగారి కన్ను ఇతనిపైబడింది. చాతుర్యధుర్యయైన చేటికచేత రాయబారాలు నడిపింది.  అతడేమి తక్కువవాడా! వచ్చిన అవకాశాన్ని వదులుకొనే అరసికుడా! వచ్చిన చిక్కల్లా ఆమెతో సంగమం ప్రమాదకరం కావున జాగ్రత్తగా వ్యవహరించాలి. "కామాతుకాణాం నభయం నలజ్జ" అనికదా! కామాతురత భయాన్ని దాటి పురికొల్పింది. చీకటి పడిన తరువాత రాణిదూతిక ఏర్పరచిన సంకేతాన్ని అనుసరించి, ఆమె భవనానికి చేరుకున్నాడు. మదనక్రీడా పారవశ్యంలో వారికి సమయం తెలియలేదు.
ఇంతలో మహారాజు నెమ్మదిగా తన భవనం నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నాడు. ఆరోజు సప్తమో? అష్టమో ?చంద్రుడుకూడా ఆలస్యంగా ఉదయించాడు. ఈ పరిస్థితి చూచిన చెలికత్తె

తుమ్మెదపై పెట్టి అన్యాపదేశంగా మంత్రిని హెచ్చరించింది.
మాయురె భృంగమా! వికచమల్లికలన్ విడనాడి తమ్మిలో
నీయెడ పూవుదేనియల నింపు జనింపగ గ్రోలి సొక్కియున్
బోయెదనన్న భ్రాంతి నిను బొందదు రాజుదయించె నిప్పుడే
తోయజపత్రముల్ వరుసతో ముకుళించె జలింపకుండుమా!

(ఈ పద్యం పైకి కనిపించే భావం - ఓ తుమ్మెదా మంచి మల్లెలను విడచి తామరపువ్వులోని మకరందం మీదమోజుతో ఇక్కడ చేరావు. ఎంసేపటికీ విడిచిపెట్టి వెళ్ళిపోదామని అనుకోవడంలేదు. చంద్రుడు ఉదయించినాడు. తామరరేకులు ముడుచుకుంటున్నవి. ఇప్పుడు బయటికి పోలేవు. కదవిక లేకుండా జాగ్రత్తగా ఉండు.
దీనిలోని ధ్వని(ఆంతర్యం)- ఓ మంత్రిశేఖరా నీ భార్యను విడిచి, రాణితో క్రీడిస్తూ ఆలస్యం చేశావు. ప్రభువు వస్తున్నాడు. (రాజు - ప్రభువు, చంద్రుడు). అయినా భయపడక దాక్కో.)

లోపల ఉన్న ఇద్దరూ ఈ హెచ్చరికతో జాగ్రత్తపడ్డారు. ఈ పద్యం విన్న మహారాజుగారు చెలికత్తెను ప్రశ్నించగా. ఆమె తామరలను చూచి చెప్పానని చమత్కరించింది.
మంత్రి దాగినచోటు ఇరుకు, గాలి లేదు. బాధతో అటూ ఇటూ కదులుతున్నాడు. మహారాజు ఆ సంగతి కనిపెడితే ప్రమాదమని చెలికత్తె చతురిక మళ్ళీ ఇలా హెచ్చరించింది.

అలికులవర్య! పద్మముకులాంతమందు వసింప నేరమిన్
జలనము సెందె దేమి నవసారసమిత్రుడు రాకయుండునా
తొలగక యందె యుండు మిక తోయజవైరి తిరంబె రాత్రి యీ
కలవర మేల తుమ్మిదను గానక యూరట యురకుండుమా!

(తుమ్మెదా! ముకుళితమైన తామరలో ఉండలేక కదులుతున్నావెందుకు! ఈ చంద్రుడు స్థిరమా? సూర్యుడు రాకుండా ఉంటాడా? కలవరపడక ఊరటతో ఊరుకో.
మంత్రి పరంగా- ఓ మంత్రివరా! నీవు దాక్కొన్న ఇరుకు ప్రదేశంలో ఇబ్బందిగా ఉండవచ్చు స్థిరంగా ఉండు ఆయన వెళ్ళిన తరువాత ఒంటరి సమయం వస్తుంది. అప్పటిదాకా సద్దుచేయక జాగ్రత్తగా ఉండాలి.)

ఆ మాటలు విని మంత్రి ధైర్యంతో, ఓర్పుతోవేచి ఉన్నాడు. అతని ఇంటి దగ్గర ధర్మపత్ని ఇతని గురించి ఆందోళన చెంది, రహస్యంగా వాకబు చేసింది. భర్త వ్యవహారాలు ఆమెకు కొంత తెలుసు. రాణిగారి ఇంటికి వెళ్ళాడని తెలిసి, అక్కడ ఏమి ప్రమాదం వచ్చిందో అని ఆదుర్దాగా బయలుదేరి వచ్చింది. ఆమె వచ్చి బయటపడి విచారణ చేస్తే గుట్టు రట్టవుతుందని చతురిక ఆమెకు ఇలా చెప్పింది.

అలినీ తత్తరమేల నేడు నిదె నీ యాత్మేశుడౌ భృంగమున్
జలజాసక్త మకరంద పానవశతన్ సానందుడై యున్న వా
డులు కింతేనియు లేక నీ వరుగుమీ యొప్పారు నిప్పాట నీ
చెలువుండుం బరతెంచు వేకువను రాజీవంబు పుష్పించినన్

(ఆడు తుమ్మెదా నీ భర్త పద్మినీ మకరందపాన వివశుడై ఉన్నాడు.
ఆనందంలో మునిగి ఉన్నాడు. నీవు భయపడవద్దు. తెల్లవారి రాజీవం విచ్చుకోగానే,
నీ నాథుడు వస్తాడు. ప్రస్తుతానికి నెమ్మదిగా వెళ్ళిపో.)

మంత్రి భార్యకు జరిగింది అర్థమై వెళ్ళిపోయింది.
రాజు రాణితో మదనకేళిలో తేలి, అలసి నిద్రించాడు. రాణికూడా ఆ స్థితికే వెళ్ళింది. తెల్లవార వచ్చింది.
ఇక దాక్కున్న మంత్రి వెళ్ళిపోవటానికి అవకాశం వచ్చిందని చతురిక మంత్రికి అర్థమయ్యేలా
ఈ విధంగా అన్నది.

పతి నిద్రించిన వేళ రా దగునయో పద్మారి! యీ కేళికా
యతనంబందు రతిశ్రమ న్విభుడు నిద్రాసక్తుడై యుండె నీ
శత పత్రేక్షణ మోము వాంచినది నీసామర్ధ్యముం జూపదో
కతి వేగంబుగ నేగుమా తొలగి మాయాత్మల్ సుఖం బందగన్

ఈ పద్యభావాన్ని గ్రహించిన, మంత్రి జాగ్రత్తగా ఇవతలకు వచ్చి వేగంగా వెళ్ళిపోయాడు.
మరునాటి ఉదయం అవసరమైన రాచకార్యాలు ఉండటంవల్ల విశ్రాంతి తీసుకోకుండానే
హడావిడిగా మంత్రి కొలువుకూటానికి వెళ్ళాడు. మహారాజు పేరోలగంలో ఉన్నాడు. పైనున్న
తెరల చాటున నుంచి రాణి చూస్తూంది. కొలువుకు వచ్చే తొందరలో మంత్రి ముందురోజు రాత్రి
ప్రేమావేశంలో రాణి తన మెడలో వేసిన పచ్చల హారాన్ని తీసి దాచకుండా అలాగే వచ్చాడు.
దాన్ని రాజు చూస్తే గుర్తుపడతాడు. ప్రమాదం. రాణి కలతచెంది ఈ అపాయాన్ని ఎలాగైనా
తొలగించమని చెలికత్తెను కోరింది. చతుర అయిన చతురిక మారువేషంతో ఒక భట్టువలె వచ్చి,
ఆస్థానమంతా కలయజూచి ఈ పద్యం చదివింది.

అతుల సంభాంతరస్థిత బుధవళి కెల్ల జొహారు, వీరరా
హతులకు మేల్జొహారు, సతతోజ్జ్వల విక్రమ సార్వభౌమ సం
తతికి జొహారు, వైభవవితాన పురందరుడైన యట్టి భూ
పతికి జొహారు, మానపరిపాల జొహారు ప్రధాని శేఖరా!

అందరినీ స్తోత్రం చేసినట్లు కనిపించినా తనను ప్రత్యేకంగా మానపరిపాల అనటం మంత్రికి
పట్టిచ్చినట్లుగా ఉంది. భట్టును చూసి చతురిక అని గ్రహించి, తనను చూసుకొని,
తడుముకొని, పచ్చల హారాన్ని గురించి తెలుసుకొని, మెడలో నుంచి
ఇతర హారాలతో దాన్నీ కలిపి బయటకు కనబడకుండా తీసి, కవిత్వానికి సంతోషించి
ఇస్తున్నట్లుగా కుహనాభట్టుకు బహూకరించాడు. మిగతావారు,
రాజు ఏవో బహుమతులిచ్చి పంపారు.
ఈ ఐదు పద్యాలలో ఇమిడిన అందమైన కథ ఇది. 

Tuesday, January 21, 2020

విశ్వగుణాదర్శం - వేంకటాధ్వరి


విశ్వగుణాదర్శం - వేంకటాధ్వరి
సాహితీమిత్రులారా!

18వ శతాబ్దిలో నివసించిన వేంకటాధ్వరి రచించినది విశ్వగుణాదర్శం.
ఇది ఒక చంపూకావ్యం. ఇందులో హిమాలయాల్లోని బదరికాశ్రమం నుండి
మొదలై సేతువువరకు గల విష్ణుక్షేత్రాలను గురించిన, తీర్థాలను గురించిన వివరాలను వర్ణణాత్మకంగా వివరింపబడింది. దీనిలో కృశాను, విశ్వావసులనే ఇద్దరు గంధర్వులు, విమానారూఢులై దేశపర్యటన చేస్తున్నప్పుడు  జరిగిన సంభాషణల రూపంలో ఈ విశేషణాలన్నీ ఉంటాయి. అందులోనూ, శేషశైలం(తిరుపతి కొండ) మొదలుకొని, సేతువు పర్యంతం విస్తరిల్లిన ప్రదేశాలన్ని విపులంగా, వివరంగా వేంకటాధ్వరి వీక్షించాడు.

దక్షిణభారదేశంలోని ప్రజల ఆచారవ్యవహారాలు, సాంఘికరీతులు, రాజకీయ ధోరణులు, మతవ్యవహారాలు, దేశవ్యవస్థను గురించి కూడ రచయిత చెప్పాడు. చెన్ననగరాన్ని వర్ణించే సందర్భంలో, తిరువళ్లిక్కేణిలో వెలసిన పార్థసారథిని గురించి ప్రస్తావించాడు. ఆ సందర్భంలోనే, ఆనాటి ఆంగ్లేయ పాలకుల, పరివాలనా విధానాన్ని
గురించి చెప్పాడు. హూణులు శౌచాది క్రియాహీనులని విమర్శించాడు.
ఈస్టిండియా కంపెనీవారి పాలన చెన్నపట్టణంలో జరుగుతున్న సమయంలో
ఈ గ్రంథం వెలువడినట్లు తెలుస్తుంది.

ఈ గ్రంథాన్ని 1914లో కామేశ్వరరావు, 1915లో ఏ. దేవరాజు పెరుమాళ్ళు,
1877లో తాతాచార్యులు, 1917లో వేంకటరామకృష్ణకవులు
ఆంధ్రానువాదం చేసివున్నారు.

దీనిలోని ప్రారంభ శ్లోకం ఇక్కడ చూద్దాం-

స్రగ్ధర -
శ్రీరాజీవాక్ష వక్షఃస్థలనిలయ రమాహస్తవాస్తవ్య లోల
ల్లీలాబ్జానిష్పతన్తీ మధురమధుఝరీ నాభిపద్మే మురారేః
అస్తోకంలోకమాత్రాద్వియుగముఖశిశోరాననేష్వర్ప్యమాణం
శఙ్ఖప్రాన్తేనదివ్యంపయఇతివిబుధైశ్శఙ్క్యమానాపునాతు

శ్రీమహావిష్ణువు వక్షస్థలనివాసి అయిన శ్రీమహాలక్ష్మి తన చేతిని విలాసార్థముగా ధరించిన తామరపువ్వులోని నుండి జారుచున్న తేనెధారను ఆ లక్షీదేవి తన పతిఅయిన విష్ణువునాభికమలమున తన బిడ్డయైవుండు బ్రహ్మనోట సంకు(శంఖు)తో పోసే పాలు అని
దేవతలు తలుచుకొనేట్లు ఆ మకరందధారయే ఈ కావ్యమును దీన్ని
చదివే చదువరులను పవిత్రం చేయుగాక అని మంగళాశీర్వాదం ఇస్తున్నాడు కవి..

ఎంతటి ఊహోకదా!

Sunday, January 19, 2020

వందేమాతర గీతం కథేంటి?


వందేమాతర గీతం కథేంటి?


Bankimchandra Chattapadhay.jpg

సాహితీమిత్రులారా!

వందేమాతర గీతం అంటే
తెలియనివారుండరంటే
పెద్దవింతేమీకాదనుకుంటా
 దీనివెనుక కథ తెలినివారు
చాలమందే వుండవచ్చు. అసలు అదేవరు ఎందుకు వ్రాశారు
ఇది మన జాతీయగీతం/పాట. దీన్ని బంకించంద్ర చటర్జీగారు వ్రాశారు.
అదెలా జాతీయగీతంగా మారింది అంటే దానివెనుకు కథ వుంది.
1838 జూన్ 27న ఈయన జన్మించారు. ఈయన సాహితీ వ్యాసంగమంతా ఒక ఎత్తయితే ఒక వందేమాతరగీతం ఒక ఎత్తు. ఆయనకు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. దీన్ని విడిగా ఒక పాటగా వ్రాయలేదు. దేశభక్తిని ప్రబోధించే ఒక నవల ఆనందమఠం(1882) అనేది. 1773లో బెంగాల్లో చెలరేగిన కరువు, ఒక సంతాలీల ముఠా ఆంగ్లేయుల నెదిరించి ఖజానాలు దోచుకోవడం ఈ నవల్లోని ఇతివృత్తం. దీనిలో సాధువులు దేశమాతను కొలిచే సందర్భంలో వందేమాతం గీతంగా వ్రాయబడింది.

ఆకాలంలో ఈ నవలను  చదివిన 
ఎందరో స్వాతంత్య్రం పట్ల ఆకర్షింతులై
ఉద్యమాల్లో పాల్గొన్నారు. దీనివల్ల ఇది చాల ప్రముఖమైన
దేశభక్తి గేయంగా మారింది. దీనితో వందేమాతర ఉద్యమంకూడా వచ్చింది.
తరువాతి కాలంతో మన స్వాతంత్య్రం రావడం మన రాజ్యాంగ నిర్మాతలు
దీన్ని జాతీయ గేయంగా గుర్తించడం జరిగింది.

Friday, January 17, 2020

శృంగార పంచకం


శృంగార పంచకం
సాహితామిత్రులారా!

సరిగ్గా 98 సంవత్సరాల క్రిందట
ఈ శృంగార పంచకం ముద్రించబడింది.
అంటే 1922వ సంవత్సరంలో.
అసలు శృంగార పంచకం అంటే ఏమిటి దానిలో
ఏదో శృంగారం అనే పదంతో కొంత అర్థమౌతోంది
కాని పూర్తి అర్థం కాలేదంటారా ఏమీలేదు శృంగారంతో
కూడిన 5(పంచకం) పుస్చకాలు. అందులో ఏమున్నాయి
అంటే.........
జాబులు ----- దీని కర్త - సెట్టి లక్ష్మీనరసింహ్వం
సరసోక్తి యుక్త కృష్ణశతకం  దీన్నీ లక్ష్మీనరసింహ్వం గారే
రసికాభిలాషం ---కర్త  కవిసార్వభౌమ శ్రీనాథుడు
సరసచాటువులు --- కర్త - సెట్టి లక్ష్మీనరసింహ్వం
పూర్వకవులు-చాటువులు

ఇవి ఇందులోని పుస్తకాలు.
ఇవి బూతుపుస్తాలుగా ముద్రవేసి
వీటిని జనాలకు దొరనంతగా దూరం చేశారు.
కానీ వీటిని చాటుమాటుగా మనవారు మద్యపాన నిషేధంలో
మద్యం తెచ్చుకున్నట్లుగా తెచ్చుకొని చదివేవారట. అవి ఎంతటి
రసికమైనవో ఎంతటి రసికుడవో తెలిసెరా అని పాటవుందికదా
అలా వాటిని చదివేవారని పెద్దలు చెబుతుంటారు. దొరికితే
సాహితీప్రియులు తప్పక చదవండి. కొన్ని పద్యాలు
దొరుకుతున్నాయని కొందరు పూర్తిపుస్తకాలే నెట్ లో
దొరుకుతున్నాయని కొందరు అంటున్నారు.
ఇదీ సమాచారం.

Tuesday, January 14, 2020

లీలాశుకును చిన్నికృష్ణుడు


లీలాశుకును చిన్నికృష్ణుడు
సాహితీమిత్రులారా!

లీలాశుకుడు చిన్నికృష్ణుని తన శ్రీకృష్ణలీలామృతంలో
ఈ విధంగా వర్ణించాడు. ఇది ప్రార్థనా శ్లోకంగాకూడా
పాటిస్తున్నారు.

కస్తూరీతిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కఙ్కణమ్
సర్వాఙ్గే హరిచందనం చ కలయమ్ కణ్ఠే చ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణిః

నుదుట కస్తూరి బొట్టు, ఱొమ్మున కౌస్తుభం, ముక్కున ముత్తెము,
చేతిలో పిల్లనగ్రోవి, మణికట్టున మురుగు, ఒడలంతా గంధం
మెడలో ముత్యాలదండ ధరించిన కృష్ణుడు
గోపీజన పరివేష్టితుడై వెలయుచున్నాడు అని భావం.

దీనిలో లీలాశుకుడు
మన కళ్లకు కట్టినట్లు
మన ఎదురుగా ఉన్నట్లు
శ్రీకృష్ణుని వర్ణించాడు.

Monday, January 13, 2020

మెరుపులు(గురజాడ వారి పద్యాలు)


మెరుపులు(గురజాడ వారి పద్యాలు)
సాహితీమిత్రులారా!
Image result for gurajada venkata apparao

గేయాలు కవితలు నాటికలు మాత్రమే 
మన నవయుగవైతాళికుడు గురజాడ వేంకట అప్పారావు
వ్రాశారని చాలమంది అనుకోవడం జరుగుతున్నది. 
ఆయన పద్యాలు కూడా వ్రాశాడని 
ఈ పద్యఖండిక ద్వారా తెలుస్తుంది. గమనించండి-

ఈవియు దియ్యనిమాటయు
భావంబున జేయతగిన పని తెలియుటయున్
ఠీవియగు ధైర్యభావము 
రావుసుమీ యొకనివలన రావలె తనతోన్

మానిసులు గాని యింతుల
తా నేర్చని నేర్పు చెలగుతరి జెప్పంగా
జ్ఞానవతుల కగునెె పికము
దాని శిశువుల బెంచు నెగురుదాక నొరుచేన్

గడ్డితిను కారు మెకముల
బొడ్డున కస్తూరి నునిచి పొలియగజేసెన్
జడ్జివిధి దుష్టజిహ్వల 
నొడ్డిన సమకూరు శుభము లుర్విజనులకున్

అడచుకొన కింద్రియంబుల 
నిడుమల కది త్రోవ యండ్రు యివి యడచుటయే
కడుసంపదలకు బాటగు 
నడుమే తేర వి ష్టమొదవు నామార్గమునన్

కాశి జచ్చెనేని కలుగదు జన్మంబు
కలిగెనేని కలుగు నుదుట కన్ను
సిరసు నందు చిన్ని సిరి తోబుట్టువు
కంఠసీమ వెలయు గరళ చిహ్న

నాల్గు రీతుల గనకంబు నాడెమగును
వేటు గీటుల తునియించి వెచ్చజేసి
నరుడు నట్టుల నాల్గింట నాడెమగును
కులము శీలంబు కర్మంబు గుణముచేత

(ఇవి సంస్కృత శ్లోకాలకు అనువాదాలుగా 
అవసరాల సూర్యారావు గారు గుర్తించారు.)
అనువాదమైనా కాకపోయినా పద్యాలు పద్యాలు చక్కగా కూర్చారుకదా!

Saturday, January 11, 2020

ఱెక్కలతోడి సురాద్రియోయనన్


ఱెక్కలతోడి సురాద్రియోయనన్
సాహితీమిత్రులారా!

అలభ్యకావ్యాల్లో ఎఱ్ఱన రామాయణం. దీనిలోని
కొన్ని పద్యాలు మాత్రం లభ్యమౌతున్నాయి.
హనుమంతుడు సముద్రం లంఘధించే సమయంలో
అనేకులు అనేకరకాలుగా వర్ణించారు. మరి ఎఱ్ఱన వర్ణన
ఆసందర్భంలో ఈ విధంగా ఉంది గమనించండి-

చువ్వన మేను వంచి రవిసోఁకఁగఁ దోఁక విదల్చి పాదముల్
వివ్వఁగఁ బట్టి బాహువులు వీచి మొగంబు బిగించి కొండ జౌ
జవ్వన నూఁగి ముందఱికిఁ జాఁగి పిఱిందికిఁ దూఁగి వార్ధిపై
ఱివ్వన దాఁటె వాయుజుఁడు ఱెక్కలతోడిసురాద్రియో యనన్


Wednesday, January 8, 2020

15 టీ లు త్రాపిన కవి


15 టీ లు త్రాపిన  కవి
సాహితీమిత్రులారా!
Image result for tea cup with tea images
ఎఱ్ఱాప్రెగ్గడ మన కవిత్రయంలో చివరివాడు.
ఈయన రచించిన నీలకంఠేశ్వర శతకం ఇప్పుడు అలభ్యము.
కానీ దానిలోని కొన్ని పద్యాలు మాత్రం లభిస్తున్నాయి.
వాటిలో ఒక పద్యం-

నిను సేవించినఁ గల్గు మానవులకున్ వీటివధూటీటీ
ఘనకోటీశకటీటీటిటీగందేభవాటీటీ
రనటీహారిపటీసువర్ణమకుటీప్రచ్ఛోటికాపేటికల్
కనదామ్నాయమహాతురంగ శివలింగా! నీలకంఠేశ్వరా!

ఈ పద్యం చదివిన వారికి ఎఱ్ఱాప్రెగ్గడగారు
15 టీలను త్రాపుతున్నారు గమనించండి.

నిను సేవించినఁ గల్గు మానవులకున్ వీటివధూటీటీ
ఘనకోటీశకటీటీటిటీగందేభవాటీటీ
రనటీహారిపటీసువర్ణమకుటీప్రచ్ఛోటికాపేటికల్
కనదామ్నాయమహాతురంగ శివలింగా! నీలకంఠేశ్వరా!

Monday, January 6, 2020

పంజాబీకవితా


పంజాబీకవితా
సాహితీమిత్రులారా!
Image result for c narayana reddy
ఈ గజల్ పంజాబీలో జగ్తర్ వ్రాయగా దానికి
డా. సి. నారాయణరెడ్డిగారు అనువాదం చేశారు.
దీన్ని స్రవంతి మాసపత్రిక(మార్చి-ఏప్రిల్ 1983)నుండి
సేకరించడం జరిగింది.

నిప్పుల రెక్కలతో ఎగిసి కొసనింగిని కుమ్ముతుంటాను
గగనతమస్సును చీల్చి చీల్చి నా గమ్యాన్ని చేరుకుంటాను

పడగెత్తిన సుడిగాలి దెబ్బలకు పడిపోయినట్లు తోస్తున్నా
ముంగిట్లో ఏ చరణముద్రలో ముందే గమనిస్తుంటాను

ఈ గోడలపై దిగిన మేకులూ ఏ స్ముతిరేఖలో తెలుపనా?
ఎవరో ఎప్పుడో చిత్రపటాలను ఇక్కడ నిలిపారంటాను

వెలిగించీ నాగుండె దివ్వెగా; నిలిపాను కన్ను గడపపై
ఇంతకుమించిన నిరీక్షణం ఇంకెవ్వరు చేస్తారంటాను

ఒకే ఒక్క పత్రాని కిద్దరం ఉన్నాము రెండుపుటలమై
వింతజీవితం; కలిసేవున్నా విడిగా ఉన్నామంటాను

తరువులాంటి నాహృదయమేమొ అద్దంలా పగిలెననీ
గజలును ఆమెకు వినిపించగ నా కన్నీళ్లు చూడమంటాను

మిణుగురు వెలుగుల రంగుల తరగల కొనలు అందుకోలేకున్నా
విరహంలో నాఅదృష్టరేఖలు పరీక్ష చేస్తుంటాను.

నేనుంటున్నది నాయింట్లోనే; అయినా ఇది ఒక ప్రవాసమే
కాదంటారా, అయితే ''జగ్తర్'' కవిని చూసి పొమ్మంటాను 

Saturday, January 4, 2020

టెంకాయచిప్ప శతకము


టెంకాయచిప్ప శతకము
సాహితీమిత్రులారా!

శతకాలు అనేకం వాటిలో టెంకాయచిప్ప శతకం ఆంధ్రవాల్మీకిగా పేరు గన్న, వాసుదాసుగా ప్రసిద్ధుడైన వావికొలను సుబ్బారావుగారు 06-04-1925తేదీ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఎదుట చదువి శ్రీరామచంద్రులవారికి అర్పింపబడినది. ఇందులో 155 పద్యాలున్నాయి. ఇది ఎక్కువ భాగం తేటగీతులు మిగిలినవి కందపద్యాలు, ఒక్క ఉత్పలమాలతో కూర్చబడినది
అందులోని కొన్ని పద్యాలను ఇక్కడ గమనిద్దాం-

ఆంధ్రవాల్మీకి హస్తంబునందు నిలిచి
రూప్యములు వేనవేలుగఁ బ్రోగుచేసి
దమ్మడైనను వానిలో దాఁచుకొనక
ధరణిజాపతి కర్పించి ధన్యవైతి
కలదె నీకంటె గొప్ప టెంకాయచిప్ప  - 1

కలుగవే కోట్లకొలఁది టెంకాయ లవని
వానిలో నొక్కటైన నీవాసి గనెనె
నిచ్చ రామాబ్జ సన్నిధిని నిల్చి
మచ్చికను మచ్చరితమును ముచ్చటింపు   - 2


చేతిదోడుగ నిన్నాళ్ళు చిప్పమిన్న
గ్రాలితివి నాకు, నింక నీ గాసిదీఱ
నిలుము రామపదాబ్జ సన్నిధిని సతము
నేను వచ్చెద వైళంబ నీకుఁ దోడు    - 3

కాలినడకల నామడల్  లీలగాఁగ
నడచువేళల, నేలపై నడవులందు
మేను వ్రాల్చిన వేళఁ, గౌపీనమాత్ర
ధారినై తిర్గువేళ, నోనారికేళ
ఫలను, వినుఁబాయకుండుట నిలుపు మదిని  - 4

వేలకొలదిని రూప్యముల్ విడిచి, శుష్క
తృణముగా నెంచి నామేడయిల్లువదలి
మేలి జలతారు వలువలు కాలఁదన్ని
నిన్ను గ్రహియించితిని గాదె నిమ్మిఁజిప్ప   - 5

విడిచితి సర్వ ధనంబులు
విడిచితి భోగంబులెల్ల విషయసుఖంబుల్
విడిచితి నిల్లును భూమియ 
విడువను గద నిన్ను నెట్టివేళలఁ జిప్పా  - 6

ఈ విధంగా సరళమైన భాషతో మాట్లాడిన విధంగా
వ్రాయబడింది ఈ శతకం.

Thursday, January 2, 2020

''నానీ'' కవితా ప్రక్రియ


''నానీ'' కవితా ప్రక్రియ
సాహితీమిత్రులారా!
Image result for acharya n gopi images
ఆచార్య ఎన్.గోపీ
తెలుగులో నాని కవితా ప్రక్రియ 1990 దశకం ఉత్తార్థంలో
ఊపందుకుంది. నానీ అనే పేరేంటి మనం చిన్నపిల్లల్ని
పిలిచినట్లు అంటే అలానే అనుకోవాలి.
ఉర్దూలో నన్హే అనే పదంనుంచి పుట్టిందంటారు
నన్హే అంటే చిన్నది అని. ముస్లిం ఇండ్లలో చిన్నపిల్లలను
న(న్హే)న్నే బచ్చే అని అంటుంటారు. మనం ఈకాలంలో
చిన్నపిల్లల్ని నానీ పిలువడం గమనిస్తూనే ఉన్నాం.
ఎన్. గోపీ నిజ ఆవేదన దుఃఖం నుంచే నానీ అనే
మినీ కవితలు గోరుముద్దల్లాగా బయలుదేరాయి.
నానీ పదంలో నా, నీ అనే అక్షరాలు నా ఆవేదన
నీ ఆవేదన అనే అర్థంకూడ వస్తుంది.
ఆచార్య ఎన్.గోపీ గారు సృష్టించిన ఈ కవితా రూపాన్ని
ఎందరో కవులు అనుసరిస్తూ కవితలు రాస్తున్నారు.
కొండను అద్దంలో చూపినట్టుగా గొప్ప అర్థాన్ని
20-24 అక్షరాల్లో ఇమిడ్చి చెప్పడమే నానీ.
ఇందులో నాలుగు మినీ పాదాలుంటాయి.
రెండేసి పాదాలకు  భావాంశం ఉంటుంది.
మొదటి పాదానికి రెండో పాదం సమర్థకంగా ఉంటుంది.
ఉదాహరణ -

కుండ ముక్కలైందా
కుమిలిపోకు
మట్టి మరో రూపంకోసం
సిద్ధమౌతుంది
                                    (గోపీగారి నానీ)

ఈ కవితా ప్రక్రియతో ఆనేకులు ప్రభావితులై పుస్తకాలు కూడా ప్రచురించారు.
ఇప్పుడు నానీ ప్రక్రియలో కవిత్వం వ్రాయడం
తెలియనికవులు లేరనటంలో అతిశయోక్తి కాదేమో!

Wednesday, January 1, 2020

నూతన సంవత్సర శుభాకాంక్షలు


 నూతన సంవత్సర శుభాకాంక్షలుRelated image

సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
ప్రపంచ ప్రజలకు
2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు