Friday, August 31, 2018

ఆ ఒక్క నిమిషం


ఆ ఒక్క నిమిషం

సాహితీమిత్రులారా!


ఈ అనువాద కథను ఆస్వాదించండి-

హాల్ లో ఉన్న గోడగడియారం పదిగంటలైన సూచన ఇచ్చింది. అప్పుడే టెలిఫోన్ కూడా గొంతు చించుకోవడం మొదలెట్టింది. ఏవేవో ఆలోచనలలో ఉన్న నేను ఉలిక్కి పడ్డాను.  చేయి చాపి రిసీవర్ తీసుకున్నాను.

“హెలో….”

” మిసెస్ ఫ్లెచర్ ? ” రెండవ వైపు నుంచి ఓ అపరిచితుడి స్వరం.

” యస్ మాట్లాడుతున్నాను.”

” నేను వైటన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను .ప్లీజ్ ఓ నిమిషం హాల్డ్ చేయండి. నేనిప్పుడే ….”  రెండవ వైపు లైన్ లో నిర్జీవమైన నిశ్శబ్ధం చోటు చేసుకుంది.

నా మనసులో అవ్యక్తమైన భయం పుట్టింది . గుండె లో గుబులు మొదలైంది. ఈ సమయంలో ఓ పోలీస్ స్టేషనుంచి ఫోనొచ్చిందంటే  కారణమేమై ఉంటుంది. ఒకే కారణం స్ఫురిస్తూంది . యాక్సిడెంట్! ఓమైగాడ్!! మేలర్ కు యాక్సిడెంట్ అయిందా? ఆ దుర్ఘటనలో మరణించాడా? ఓ ….. నో….నో… ఇది నిజం కాదు. తప్పుడు సమాచారం.  ఇలా కాకూడదు. నా బుర్ర పని చెయ్యట్లేడు. శరీరం చెమటలతోతడిసిపోయింది. వెన్నెముక లో భయం విద్యుత్తులా ప్రవహించింది. నిర్జీవమైన చేతుల్లో రిసీవర్ పట్టుకోని రాబోయే విపత్తు గురించి ఆలోచిస్తూ వణకసాగాను.

ఈ రోజుదయం మేలర్ మహ కోపంతో ఇంట్లోంచి వెళ్ళాడు. కళ్లలో నుంచి నిప్పురవ్వలు రాలుస్తూ, పెద్దగా చప్పుడు చేస్తూ గట్టిగా తలుపు మూసి వెళ్ళాడు.   తర్వాత  పోర్టికోలో నుంచి అతడు ఏ విధంగాకోపంతో కారును రివర్స్ గేర్ లో తీశాడో…  ఆ శబ్దాన్ని వింటే అతని మనుసు ఎంత కకవికాలమైందో అర్ధమవుతుంది.  టైర్ల కీచు శబ్ధం తారురోడ్డును చీల్చుతూ, ఓ మలుపు తీసుకోని వేగంగా పారుతున్న ట్రాఫిక్ లోజొరబడి, ప్రవాహంలోపడి అగమ్యం వైపు కు  కొట్టుకుపొతున్నాడా అనిపించింది నాకు. ఇదంతా నా కళ్ళారా కి టికీ లోనుంచి చూడసాగాను. ఆ సమయంలో మా ఇద్దరి కళ్ళు ఒకసారి కూడా కలుసుకోలేదు.

అతడి ఓవర్ స్పీడే అతని ప్రాణాలు తీసి ఉంటుంది.  అందుకే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్… నా మతిమండి పోను… అతడి స్నేహితుల కోసం భోజనం తయారు చెయ్యమన్నప్పుడు నేను బిజీగా ఉన్నాననేవంకతో నిరాకరించకపోతే అతడికి కోపం వచ్చేది కాదు, ఈ దుర్ఘటన జరిగేది కాదు.

ఇది మా మొదటి జగడం కాదు.  చిన్న చిన్న విషయాల పై వాదులాటలు జరుగుతూనే ఉంటాయి.  ఇలా మా  పాప పుట్టినప్పట్నుంచి మొదలైంది.  జెని పుట్టక ముందు మన ప్రేమలో ఏలాంటి లోపమురాదని నమ్మించే దాన్ని. కాని జెని పుట్టాక నా వాగ్దానాలు బూడిదలో పూసిన పన్నీరులా అయ్యాయి.  నా సమయమంతా ఆమెకే కేటాయించాను.  నా శ్రద్దంతా జెని వైపుకే వెళ్ళేది.  ఆమె బాగోగులు చూడటం లోనేరేయింబగళ్ళు గడిచిపోయేవి. చూడటానికి చాలా ముద్దుగా బోసి నవ్వులతో చూడముచ్చటగా, ఉన్న మాస్వీట్ బేబిగర్ల్ నాగుండెలయలా ఉంది.  ఓ క్షణం కూడా ఆమెను వదలి ఉండలేను.  అంచేత మేలర్, నేనూరాత్రిభోజనం మాత్రమే కలసి చేసేవాళ్ళం. మేలర్ తో సరిగా మాట్లాడే తీరిక కూడా ఉండేది కాదు.  జెని పై నా ఆసక్తి అతన్ని నాకు దూరం చేయసాగింది.  అతడికి తగిన సమయం ఇవ్వలేకపోయాను.  పాప మీద ప్రేమనన్ను పిచ్చి దాన్ని చేసింది.  ఆమె ఏడుపుకు నేను అదిరిపోయేదానిని.  నా గుండెలకు హత్తుకొని  సముదాయించే దానిని. ఇలాంటి గారాబం చేయడం వల్లనే మేలరుకు దూరమవుతు ఉన్నాను. రిసీవర్ పై పట్టువల్లనా చేతి వ్రేళ్ళు  తెల్ల బడ్డాయి.  ఈ వ్యక్తి నన్ను లైన్ లో పెట్టి ఎటు మాయమై పోయాడో దేవుడెరుగు ! ఈ కొన్ని క్షణాలు కొన్ని యుగాల్లా ఉన్నాయి నాకు !

నా ధ్యాస మేలర్ అమ్మ వైపు,  మా అత్తగారి వైపు కెళ్ళింది.  తన కొడుకు మరణ వార్త వినగలిగే ధైర్యం ఆమెకుందా! ఆది కూడా ఏకైక పుత్రరత్నం మరణ వార్త!  ఆమె ఈ వార్తను భరించలేకపోతుంది. నేనంటేనే ఆమెకసలు ఇష్టం లేదు.  పైగా తన కొడుకు మరణానికి కారణం నేనే అనుకుంటుంది. జెని పుట్టాక ఆమె దగ్గర నా అర్హత, ప్రేమ, వాత్సల్యం, గౌరవం కోల్పోయాను.  నేనెప్పుడూ ఆమె ఇంటికి జెనిని నాతోతీసుకవెళ్ళలేదు.  పాపని ఇంటిలోనే వదిలేసి మేలర్ తో వెళ్ళేదానిని. వృద్దురాలి రోగం జెనికి తగుల్తుందేమోననే భయం.  నా అత్తగారు రోగాల పుట్ట.  ఆమెకు లేని రోగం అంటూ లేదు.

“మనం ఈ సారి జెనిని వెంట తీసుకెళదాం అమ్మ దగ్గరికి. మనమరాలిని చూడలేదని ఆమె చాలా బాధపడుతుంది. అమ్మ ద్వారా జెనికి ఏలాంటి రోగం తగలదు. ఇదంతా  నీ భ్రమ. రోగాలు  వృద్దాప్యానికీసూచన మాత్రమే, అవి అంటు  రోగాలు కావు !” అని క్రితం వారం మేలర్ నాకు నచ్చజెప్పాడు.

కానీ నేను ఒప్పుకోలేదు.  దీని వల్ల కూడా మేలర్ నాపై కోపంగా ఉన్నాడు.  కాని నాకు గత్యంతరంలేదు. జెనిని అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళడానికి నాకు మనసొప్పలేదు.

పెంళ్ళయిన మా మొదటి సంవత్సరం హాయిగా,  ఆనందంగా గడిచింది.  మాపాప మా ఇద్దర్ని మరీ దగ్గరిగా చేస్తుందనుకున్నాను.  కాని జెని మా ఇద్దరి మధ్య ఓ పెద్ద అగాధంలా మారింది.  మా భార్య భర్తలమ ధ్య  అడ్డు గోడగా  తయారైంది.  నాకు పిల్లలంటే చాలా ఇష్టంగా ఉండేది. కాని ఇప్పుడది మూర్ఖత్వంలా అనిపిస్తుంది. మొదట్లో నేనే మేలర్ ను వాళ్ళ అమ్మ నుంచి విడదీసి వేరుగా కాపురం పెట్టాను.  నా ప్రేమలోపడి ఒప్పుకొన్నాడు.

కాని జెని రాకతో నా ప్రమాణాలు నీటి మూటలే అయ్యాయి. నా ఆసక్తి  అంతా ఆమె వైపే. మేలర్ మీద నేను చూపిన ఆశ్రద్ద ఏలాంటిదో నాకిప్పుడు అర్ధం అవుతుంది. కాని ఇప్పుడు లాభం ఏమిటి? చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్లయింది.

లోపలి గదిలో నుంచి వినిపిస్తున్న జెని ఏడుపు నన్ను కుదిపింది.  ప్రస్తుతం నా ఆలోచనలు, హాస్పిటల్ శవదహన క్రియల వైపు సుడిగుండం లా తిరిగసాగాయి.  జెని ఏడుపు స్థాయి పెరిగింది.  కాని దాన్నినేను పట్టించుకోకుండా మరోసారి  ఆలోచనల సముద్రంలో మునిగి తేలుతున్నాను. ఇప్పుడు నేను అతని తల్లి ముందు అపరాధిగా నిలబడి ఉన్నాను.  అతడు లేకుంటే నేనెవరిపై ఆధారపడి బ్రతకాలి ! ఇంటినిఅమ్మేసి  లేదా ఉద్యోగం చేసి మిగతా జీవి తాన్ని గడపాల్సుంటుంది. ఇలాంటి స్థితిలో జెని గురించి ఎవరు పట్టించు కొంటారు ?  జెని… నా ప్రాణం.  నేను అపాదమస్తకం కంపించి పోయాను.

ఓ గాడ్ ! నేనెక్కడ చిక్కుకున్నాను ! ఈ వ్యక్తి ఎక్కడ చచ్చి పోయాడు… లైన్ లో ఉండమన్నాడు… నేను కోపంతో ఊగుతూ రిసీవర్ నా రెండవ చేతికి కొట్టుకొంటు… నే..ను ఎప్పుడు కూడా మేలర్ తో గొడవపడను అతని పట్ల అశ్రద్ద చేయను. దేవుడు అతడిని సురక్షితంగా ఉంచుగాక.  భగవంతుడా నాకు సహాయపడు అని మనసులో బడబడలాడసాగాను.

రెండవ వైపు రిసీవర్ లో కటకట శబ్ధం వినబడగానే నాగుండె వేగం పెరిగిపోయింది. భయంకరమైన విషాద వార్తను అందుకోడానికి నన్ను నేను సంబాళించుకోన్నాను.  రెండవ వైపు రిపీవర్ లో నుంచి ఆ వ్యక్తిగొంతు వినిపించింది.

“వెరీ సారి మిసెస్ ఫ్లేచర్… మీకు కష్టం కలిగించినందుకు కాని…. “మరో సారి గాఢమైన నిశ్సబ్దం అలుముకుంది!? ఆ వ్యక్తి  మొహన్ని నా చేతి గోళ్లతో పిచ్చిపిచ్చిగా గీకాలనిపించింది.  నాకెందుకిలాఎదురుచూసేలా చేస్తున్నాడు ? ఎదురు చూస్తున్న క్షణాలు నా ఆదీనం లో  నుం చి తప్పి పోతున్నాయి.

హమ్మయ్య ! చిట్ట చివరికి అవతలి వైపు నుంచి సమాచారం అందింది, ” చూడండి మిసెస్ ఫ్లేచర్ ! బహుశ మీకు గుర్తే ఉంటుంది… మూడు నెలల క్రితం మీకో బంగారపు ఉంగరం దొరికింది,  దానిని మాకందజేశారు. దీని గురించి హక్కు దారులెవరు కూడా ఏలాంటి రిపోర్టు ఇవ్వలేదు.  ఇది తమదేనని ఎవరు చెప్పలేదు కాబట్టి న్యాయపరంగా మీరే ఈ ఉంగరానికి హక్కుదారులు.  మీరు దీన్ని మా పోలీసు స్టేషన్ కొచ్చి తీసుకోగలరు.ఓ. కె గుడ్ బై !“ అంటు రిసీవర్ పెట్టేశాడు.

గట్టిగా ఓ శ్వాస పీల్చాను.  రిసీవర్ చేతిలో నుంచి క్రింద పడి పెండ్యులమ్ లా ప్రేలాడసాగింది.  కాళ్ళు చేతుల్లో  సత్తువ లేక ప్రక్కనే ఉన్న సోఫాసెట్ లో కూలబడ్డాను.  కొన్ని వందల మైళ్ళ దూరం నుంచిపరుగెత్తుకొంటూ వచ్చినట్టనిపించింది.  చూపు నా చేతిగడియారం వైపు పడింది.  నా నోరు ఆశ్చర్యంతో తెరుచుకుంది.  గడియారం పది గంటల ఒక్క నిమిషం చూపుతుంది. అంటే ఈ ఫోన్ కాల్ ఒక్క నిమిషందా ?  ఈఆటంతా ఓ నిమిషంలో ముగిసింది.  కాని ఈ నిమిషం నాకు ఓ యుగం కంటె పెద్దగా అనిపించింది.

మరోసారి తృప్తిగా ఊపిరి తీసుకొన్నాను.  జెని అరుపులు,  ఏడుపులు నా చెవుల్లో మోగసాగాయి.  సోఫాలో నుంచి తటాలున లేచి జెని ఏడుస్తున్న గది వైపు బయల్దేరాను.  కాని కొన్ని అడుగులు ముందుకువేశానో లేదో ఏదో అవ్యక్తమైన శక్తి నన్ను ముందుకు కదలనీయలేదు.

గట్టిగా ఓ నిట్టూర్పు విడిచి, “…. నో డియర్… నేనింకా చాలా అత్యవసరమైన పనులు చేయాల్సున్నాయి….నువ్వింకాస్తా ఏడ్వడమే  మంచిది !” అని నాలో నేనే చెప్పుకున్నాను.

నేను మారిపోయాను !

నా హృదయం ఆనందం తో నాట్యం  చేస్తుంది.  ఇల్లంతా తిరిగి,  పరుగెత్తుతు చిన్న పిల్లలా సంతోషంతో గట్టిగా కేరింతలు పెట్టాలని మనసు తహతహలాడసాగింది.

నేను సంతృప్తిగా తలాడించి, గొంతెత్తి అన్నాను, ” మీ నాన్నగారికి ఫోన్ చేయబోతున్నాను.  అతడు వాళ్లమ్మ దగ్గరే ఉండి ఉంటాడు.  అతనితో  చాలా ముఖ్యమైన విషయాల గురించి  మాట్లాడాలి.  ఇంకో నిముషం కూడా ఆగలేను.”

సంతోషంగా టెలిఫోన్ సెట్ వైపు వెళ్ళసాగాను మేలర్ కు ఈ విషయం చెప్పి తేలిక పడటానికి.
----------------------------------------------------------
మూలం: English: ONE MINUTE OF ETERNITY (Anonymous)
అనువాదం: అమ్జద్, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Thursday, August 30, 2018

‘ఒద్దిరాజు అపూర్వ సోదరులు’


‘ఒద్దిరాజు అపూర్వ సోదరులు’ సాహితీమిత్రులారా!

‘ఒద్దిరాజు అపూర్వ సోదరులు’ గా ప్రసిద్ధులైన సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గార్లు సంస్కృతాంధ్ర పండితులు మరియు ప్రచురణ కర్తలు. ఒద్దిరాజు సీతారామచంద్రరావుగారు ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారు ఒద్దిరాజు సోదరులలో చిన్నవాడు. వీరికి సుమారు పది భాషలలో పాండిత్యం ఉంది. వీరి తల్లిదండ్రులు వెంకట రామారావు మరియు రంగనాయకమ్మలు. వీరు వరంగల్లు మండలం మానుకోట తాలూకా, ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు. ఈ గ్రామం నుండే వీరు తెనుగు అనే పత్రికను నడిపారు. ఈ పత్రిక 1922 ఆగస్టులో 500 ప్రతులతో ఆరంభమై ఐదు సంవత్సరాలు తెలంగాణ ప్రజా చైతన్యానికి దోహదం చేసింది.

వీరు 1918లో విజ్ఞానప్రచారిణీ గ్రంథమాలను స్థాపించి విజ్ఞానదాయకమైన పుస్తకాలను ప్రచురించి తెలంగాణాలో విజ్ఞానవ్యాప్తికి తోడ్పడ్డారు. వీరు నిజాం కాలంలో తెలంగాణా ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవానికి దోహదం చేశారు. వీరు ఇంగ్లీషు, ఉర్ధూ, పారసీక, సంస్కృత భాషలు నేర్చారు. సంగీత సాహిత్యాలలో నైపుణ్యం సాధించారు. చరిత, విజ్ఞానశాస్త్రం, వైద్యం మొదలైన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన ఎన్నో వ్యాసాలను వ్రాశారు. తెనుగు పత్రిక మొత్తము 12 పేజీలను వీరు తమ రచనలతోనే నింపేవారు. నిజానికి వారు పరిశోధకులు, సంఘసంస్కర్తలు, రచయితలు, కవులు, విమర్శకులు, చిత్రకారులు, ప్రచురణకర్తలు, ముద్రాపకులు, సంపాదకులు, చర్మకారులు, కుట్టుపనివారు, సూట్‌ కేసులను తయారీ చేసినవారు, గృహనిర్మాతలు , వాస్తునిపుణులు, జ్యోతిష్కులు, ఆయుర్వేదం, హోమియోపతీ, అల్లోపతీలలో వైద్యులు, నూతన ఔషదాలను తయారు చేసినవారు, ఫార్మసీలను స్థాపించినవారు, శస్త్రచికిత్స జరిపినవారు. బియ్యం మిల్లు, నూనె మిల్లు, పిండిమరలు స్థాపించి నడిపినవారు. సబ్బులు, ఇంకులు, రకరకాల నూనెలు, రొట్టెలు తయారు చేసినవారు, పుస్తకాల బైండింగులు చేసినవారు, తాపీపని, వడ్రంగిపని చేసినవారు, పశువైద్యం తెలిసినవారు.

ఇన్నిరంగాలలో కృషి చేసినవారు ఇప్పటికీ లేరంటే అతిశయోక్తి కాదు. విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను ప్రారంభించి వందకుపైగా పుస్తకాలను ప్రచురించారు. ఒద్దిరాజు జంటకవులు రచించిన ప్రసిద్ధ కావ్యాలు కొన్ని–రుద్రమదేవి, తపోభంగం, శశ విషాణం, సౌదామినీ పరిణయం, సంధ్యారాగం, భక్తిసార చరితం, మిఠాయిచెట్టు, గ్రీకు పురాణ కథలు మొదలైనవే కాకుండా పౌఢ ప్రబంధం, నవలలు, భ్రమర, బ్రాహ్మణ సాహసము, స్త్రీ సాహసము, ప్రేమ ప్రవాహము, అవిగాక రవీంద్రుని ‘రెక్‌’ నవల అనువాదము, నౌకాభంగము, నిస్వార్ధ దరిద్రులు, నిరసనోపాఖ్యానం వంటి లఘు కావ్యాలు, నాటికలు ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఆశువుగా సంస్కృతంలో కవిత్వం చెప్పగల దిట్టలు వారు . వారు సంస్కృత, ద్రావిడ, ఆంధ్ర, హిందీ భాషలలో 1200 పైగా గ్రంథాలు రచించారట. ఫోటోగ్రఫీ, విద్యుత్తు చేతిపనులకు సంబంధించిన రచనలు సోదరకవుల బహుముఖ ప్రజ్ఞను చాటుతాయి. త్యాగరాజ ఉత్సవాలను జరిపేవారు. స్వయంగా వీణ, వయొలిన్‌, వేణువు నేర్చుకున్నారు. ఆయా వాయిద్యాల్ని వారే తయారు చేసుకునేవారట!ఒద్దిరాజు సోదరులు కలిసి ‘ఉపదేశ రత్నమాల, తిరుప్పల్లాండు, భక్తిసార చరిత్ర, సంస్కృత వ్యాకరణము రచించారు. వారు ‘తెనుగు’ పత్రిక నడిపే సమయంలో పత్రిక పైభాగాన ఇలా ప్రచురించేవారు.

తే. గీ. వార్తయందు జగము వర్థిల్లు తున్నది
యదియు లేనినాడ యఖిలజనులు
నంధకార మగ్నులగుదురు గావున
వార్త నిర్వహింప వలయు బతికి’

అది వారి ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తోంది. బహుముఖ ప్రతిభావంతులు, తెనుగు పత్రికా సంపాదకులు ఒద్దిరాజు సోదరులు తమ పత్రికలో చాలా చక్కని వ్యాసాలు రచించారు. ఆ రోజుల్లో వారు తెనుగు పత్రిక కోసం రచించిన సంపాదకీయాలలో తేట తెనుగు తీయదనం తొణికిసలాడేది. ఎక్కడా కఠిన పదాలు లేకుండా సామాన్యమైన పత్రికా పాఠకుడికి సైతం అర్థమయ్యే వచన రచన ఈ సోదరుల ప్రత్యేకత. ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారు 2. 4. 1887న జన్మించి తమ 75వ సంవత్సరం 28. 1. 1956న పరమపదించారు. వారి అనుజులు ఒద్దిరాజు రాఘవ రంగారావు గారు 4. 4. 1894న జన్మించి 17. 5. 1973న తమ ఎనభైవ యేట దివంగతులైనారు.
ఈ బహుముఖ ప్రజ్ఞావంతులకు నా స్మృత్యంజలులు!
-----------------------------------------------------
రచన: శారదాప్రసాద్, 
మాలిక పత్రిక సౌజన్యంతో

Wednesday, August 29, 2018

తెలుగు భాషాదినోత్సవ ఉపన్యాసం


తెలుగు భాషాదినోత్సవ ఉపన్యాసంసాహితీమిత్రులారా!

ఈ ఉపన్యాసం వినండి "గిడుగు వేంకట రామమూర్తి" గారి జయంతి
సందర్భముగా అంటే ఆయన జన్మదినమే మన "మాతృభాషాదినోత్సవం"
ఇవ్వబడిన ఉపన్యాసం వీక్షించి వారి గొప్పదనమేమో గమనించండి-


Tuesday, August 28, 2018

పది నిముషాలు


పది నిముషాలుసాహితీమిత్రులారా!


ఒక అమ్మాయి తన మనసులోని భావాలను తనకు నచ్చిన వానితో
ఎలా చెప్పిందో ఇక్కడ చూడండి-

ఈ గదిలో చేరిన రెండేళ్ళకి మొదటిసారి పైకొచ్చింది. ఒక పెళ్ళీడుకొచ్చిన అమ్మాయి, వయసుకు సంబంధించిన ఆవేశమేమీ లేకుండా చాలా సూటిగా తొణక్కుండా మాట్లాడింది. చాలా స్పష్టతతో గూడా. అపుడపుడూ పలకరింతనవ్వులూ పరిచయవాక్యాలూ తప్ప మేమెప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు. తన పని తాను చేసుకుపోయే మంచి పిల్ల.

“మీకు బదిలీ అయిందని, రేపు గది ఖాళీ చేస్తారనీ తెలిసింది. మా నాన్న వడ్డీలు, స్టాకు మార్కెట్ల గోలలోపడి మమ్మల్నెటూ పట్టించుకోడు. మా అమ్మకేమో నన్ను వాళ్ళ తమ్ముడికిచ్చి కట్టపెట్టడమే ధ్యేయం. నేనూ ఓ మనిషిననీ నాకూ ఇష్టాయిష్టాలుంటాయనీ ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్ళిచేస్తే సంతోషిస్తాననీ అనుకోదు. ఆడదంటే తనలాగా వండిపెట్టి మగాడ్ని ఆనందింపచేసే పనులు చేయాలని అనుకుంటుంది. ముప్పయ్యేళ్ళకే మా మామయ్యకు లేని అవలక్షణాలు లేవు. మిమ్మల్ని రెండేళ్ళుగా గమనిస్తున్నా. మీలాటి మంచివాడితో జీవితం బాగుంటుందని నా వూహ. కాదు, నమ్మకం. మీ అంతట మీరు వచ్చి ఒక ఆడపిల్లను నేరుగా అడిగి తీసికెళ్లిపోయి పెళ్లి చేసుకోలేరు. అలాగని నాకు ఇష్టంలేని పెళ్ళి చేసుకొని చావలేను. ఓ మగాడు మంచి భార్యను ఎలా కోరుకుంటాడో ఓ ఆడదీ అలాగే మంచి భర్తను కోరుకోవడం తప్పేమీకాదు. ఇలా అస్తారపదంగా పెంచిన మనసునీ శరీరాన్నీ ఆ పోరంబోకుకు అప్పగించి పశ్చాత్తాపపడలేను. పెళ్ళయాక ఆలోచించేకన్నా పెళ్ళికి ముందే ధైర్యంచేయడం మంచిదని నేననుకుంటా. నేను సాయంత్రం ఐదు నుంచీ ఐదున్నర వరకూ గుడి పక్కన జిరాక్స్ షాపులో వుంటాను నా సర్టిఫికేట్లతో. నాకూ ఉద్యోగం వచ్చింది. డబ్బుకూ ఇబ్బంది పడక్కరలేదు. నా పట్ల మీ అభిప్రాయమేమిటో తెలుసుకోకుండానే మాట్లాడుతున్నాననుకోకండి. నేనంటే మీకూ యిష్టమనే మీ చూపులద్వారా గ్రహించాను. ఇక మీ యిష్టం.”

ఏం చేయాలిపుడు?

సమయం 5:15 అవుతోంది. లేచి త్వరగా వెళితే పది నిమిషాలే పడుతుంది.
---------------------------------------------------------
రచన: విజయ్ కోగంటి, 
ఈమాట సౌజన్యంతో

Monday, August 27, 2018

సుధా వృష్టి


సుధా వృష్టి
సాహితీమిత్రులారా!
క్రీస్తుశకం 1828 ప్రాంతాలు. సర్వధారి నామ సంవత్సరం.

శ్రావణం అయిపోయింది. భాద్రపదమూ సగపడింది. ఎక్కడా తడిగాలి పొడ కూడా లేదు. అప్పుడే సూర్యుడు బాగా నెత్తి మీదికి వచ్చేశాడు, అంతటి ఆకాశం లో ఆయనొక్కడే. మొగమాటానికి కూడా ఒక్క మబ్బు పింజ లేదు.

ఆ పూటకి అక్కడి గంజికేంద్రాన్ని మూశాక, ఒక్కొక్క మెట్టే ఎక్కి వెళుతున్నాడు ఎట్టయాపురం ప్రభువు. ఆపూట ఎక్కడా నిలుచోబుద్ధి కావటం లేదు. సరాసరి మూడంతస్తులూ ఎక్కి చంద్రశాల అనబడే మేడ మీది ఆరుబయటికి వెళ్ళి ఆగాడు. తలెత్తి ఒక్కడే ఆ ఎర్రటి ఎండలోకి చూస్తూ కొద్ది ఘడియల సేపు.

వెళ్ళి నిలదీయాలని ఉంది – అంతకన్నా దేవతలకు దగ్గరగా ఎట్లా వెళ్ళటం?

“ఏమిటి చేయాలి ???”

ఆయన శ్రీ జగవీర రామ వెంకటేశ్వర ఎట్టప్ప నాయకర్. గద్దె ఎక్కి దాదాపు పదేళ్ళవుతోంది. మొదట మొదట గమనించుకోలేదుగాని ఆ ఏటికాయేడు రాజ్యం లో దుర్భిక్షం పెరుగుతూనే ఉంది. తాను చేసిన తప్పేమా అని మనసు కెలకబారుతూ ఉంది. చుట్టుపక్కలి రాజ్యాలన్నీ బాగానే ఉన్నట్లున్నాయి – ఒక్క మనియాచ్చి సంస్థానం తప్ప. కాకపోతే అక్కడ మరీ ఇంత గండకత్తెర లేదు.

వరుణయాగాలను ప్రతియేటా జరిపిస్తూనే ఉన్నాడు. ఫలితం అంతంతే. నాలుగు చినుకులు రాలిపోయేవి.
ఆ ఏడు మరిక ఏమి చేసేందుకూ ధనం లేదు.

తండ్రి పోగు చేసినదంతా ఆవాళ్టివరకూ ఖర్చు పెట్టి గడుపుకొచ్చాడు. తన ప్రజలు – అంటే తన సంతతి , జనమంతా . ఒక్కడి డొక్క మాడినా ఆ పూటకి ముద్ద ఎత్తలేని మెత్తని వాడు ప్రభువు. ఎంత పెద్ద బొక్కసమైతే మటుకు ఎన్నేళ్ళు పోషిస్తుంది ఇంతమందినీ ? ధాన్యం అమ్మేవారు ఇక్కడి అవసరం కనిపెట్టి చెట్టెక్కి కూచుంటున్నారు. ఇక అంతఃపురపు జవహరీ మిగిలింది – అప్రతిష్ట రాకుండా దాన్ని ఊరు దాటి అమ్మిస్తే ఈ ఏడు గడుస్తుందేమో.

రాణివాసపు నగకట్టు అంతా పెద్దరాణీ గారి అధీనం లో ఉంటుంది – అంత చెయ్యెత్తు మనిషీ వంగిపోయి వెళ్ళాడు తల్లి దగ్గరికి. ఆవిడ ఎనభయి ఏళ్ళు దాటుతున్న వృద్ధ . తెల్లని జరీ చీరె లో , తిలకం లేని నుదుట తీర్చిన విభూతి తో మెడలో రుద్రాక్ష తావళాలతో సాధారణ వితంతువు వలె ఉన్నది కాని రాజ చిహ్నాలేమీ ఒంటి మీద లేవు.

ఒక్కచూపుతోనే గ్రహించి అక్కడ ఉన్నవారినందరినీ పంపించివేసింది.

” నాయన గారూ ! మా దగ్గరి వస్తువులూ నిండుకున్నాయండీ. ఆరు మాసాలైంది ”

ప్రభువు మరీ కుంచించుకుపోయాడు. తెలియనివ్వకుండానే ఆదుకుందన్నమాట అమ్మ.

” చిన్న రాణి గారి వస్తువులు ” – అడగలేక అడిగాడు.

ఆ ఇంట మెట్టిన మహాలక్ష్మి సొత్తు అది, తాకేందుకు తమకు అధికారం లేనిది. కాని -

లోపల అందెల సవ్వడి వినబడింది. పల్చటి తెర వెనకన గాజుల చేతులు నిలువునా దూసి ఇచ్చాయి.

కాశ్మీరపు శాలువ లో మూటగట్టి తెచ్చి ముందు పెట్టింది పెద్ద రాణి కమలాంబికా దేవి.

ప్రభువు అందుకోలేకపోయినాడు. పుక్కిలింతలు గా దుఃఖం.

కొడుకు శిరస్సు మీద చేయి వేసి నిలిచింది తల్లి. రాజ కుటుంబాలలో ఎన్నడో గాని జరగని చర్య అది. ఆ క్షణాన బరువులన్నీ మరచి ఆయనా పిల్లవాడయినాడు- అడిగాడు .

” మీరు ఎరగరా నాయనా ? ”

ఊహూ. ఎరగడు కద.

” అంతా గుస గుసగా అనుకుంటూనే ఉంటున్నారు కాదా అప్పటినుండీ ? ”

” ఎప్పటి నుండి అమ్మా ? ” – గౌరవ వాచకాన్ని మరచాడు.

” మీ తండ్రి గారు ‘ ద్రోహి ‘ అయినప్పటినుంచీ ” – ఒక్క ఊపున చెప్పివేసి కూలబడిపోయింది.

***

ద్రోహం.

అవును. విన్నాడు.

ఆ అలజళ్ళలో – ముప్ఫై ఏళ్ళు వస్తూ ఉండిన తనను , పసివాడివలే మేనమామల ఇంటికి , తిరువారూరు పంపివేశాడు తండ్రి. ఆయన బ్రతికి ఉన్నంతవరకూ ఎదురు చెప్పే ప్రశ్నే లేదు.

కట్టబ్రహ్మన్న తన కన్న ఏడాదే పెద్దవాడు, కాని ఎంతో పెద్ద గుండెవాడు.

చూస్తే ధైర్యం పుట్టేటట్లుండేవాడు .

బంధుత్వం లేదు గాని బ్రహ్మన్న తండ్రి ని చిన్నాయనా అని పిలవటం అలవాటు. ఆయనా అంతే. పెద్ద నవ్వు తో ఎత్తుకొని బుజాన ఎక్కించుకొనేవాడు. ఏ మాత్రమూ రాచరికపు బిగింపులు లేకుండేవి.

” ఎక్కడ తెలుస్తాయి మర్యాదలు ” అని చాటున ఈసడించేవాడు తన తండ్రి. ఎప్పుడో ఎన్నో తరాల నాడు కట్ట బ్రహ్మన్న పూర్వుడు రాజ సేవకుడట. బిడ్డలు లేని రాజు అతన్ని దత్తత చేసుకొని పట్టం కట్టాడట. తాము, ఎట్టయాపురం పాలకులు కాక మునుపు విజయనగర రాజబంధువులట . చంద్రగిరి నుండి వచ్చి సరాసరి ప్రభువులైనారట.
అందుకని తండ్రికి ఆ లోకువ. కానీ , కట్టబ్రహ్మన్న సంస్థానం పాంచాలంకురిచి లోనే జనం ఎక్కువ సుఖం గా ఉండేవారు – తనకు తెలుసు.

సొంత దర్జా ఉండిన తెలుగు పాలెగాళ్ళు తామంతా. ఆర్కాటు నవాబు కు
పేరుకు సామంతులు . అప్పుడప్పుడు ఉడుగర లు పంపుతుండేవారు. నవాబు ది అసలే ఖర్చు చెయ్యి. తెల్లవాడు మరిన్ని సరదాలు మప్పాడు. ఎంత డబ్బూ ఆ విలాసాలకు చాలక తెల్లవాడి దగ్గర అప్పు చేశాడు .తీర్చలేక పాలెగాళ్ళ దగ్గర శిస్తు వసూలు చేసుకొమ్మన్నాడు. తెల్లవాడికి కావలసింది సరిగ్గా అదే.

బ్రహ్మన్న ఆవాళ ఎట్టయాపురం వచ్చాడు. విశాలమైన కన్నుల నిండుగా ఎర్రని జీరలు. అంత కోపంగా అతన్ని ఎన్నడూ చూడలేదు.

” పెదనాయనా , ఇది ఎక్కడి తీరువా ? వాడెవడు ? ఎక్కడివాడు ? ఈ నేల వాడిది కాదు, నీరు వాడు ఇవ్వలేదు, నారు పోయలేదు, కోత కోయ లేదు, కుప్ప నూర్చలేదు – శిస్తు దేనికి కట్టాలి ? ”

తన తండ్రి చెవిన పెట్టనేలేదు. కడితే ఏం పోతుందనేశాడు.

బ్రహ్మన్న ఆ శిస్తును చాలా అన్యాయపు లెక్కన్నాడు. అది అంతతో ఆగదన్నాడు. తల్లిని తాకట్టు పెట్టరాదన్నాడు
.తెల్లవాడికి పాపం పుణ్యం ఉండవన్నాడు.

తండ్రి సరేలెమ్మన్నాడు- కాని మాట తప్పాడు.

ఆ తరువాత చాలా జరిగిపోయినాయి. తాను నోరెత్తి అడిగాడని ఊరు దాటించి పంపారు. భార్య నీలోత్పలాంబ మేనమామ కూతురే. తిరువారూరు శివుడు త్యాగరాజ స్వామి అర్థాంగి పేరు ఆమె కి పెట్టారు.
అక్కడే , ఒక్కతే విడిగా కొలువున్న అమ్మవారు కమలాంబికా దేవిది తన తల్లి పేరు.

ఇక్కడ తన తండ్రి కలెక్టర్ జాక్ సన్ కు మహా దగ్గరి చుట్టమైనాడు. ఆ పైన వచ్చిన అధికారు లందరికీ విశ్వాసపాత్రుడైనాడు. సైన్యాన్ని అరువిచ్చాడు. బ్రహ్మన్న గుట్టుమట్టులన్నీ తెలిసినవాడుగా వాటిని బయటపెట్టి – చేయగలిగినదంతా చేశాడు.

ఆఖరికి, యుద్ధం లో ఓడిన బ్రహ్మన్న తిరుకాలంపురం అడవులలో ఆశ్రయం పొంది ఉంటే – పుదుక్కోట రాజా అతని ఆచూకీ ఇచ్చాడు. ఆ పాపం మటుకు తన తండ్రిది కాదు.

కాని – బ్రహ్మన్నను ఉరితీసినాక పాంచాలం కురిచి కోట ను నేలమట్టం చేసి అక్కడ ఆముదాలు విత్తించినవారు తన తండ్రి బంటు లేనట . ఆ రాజ్యాన్ని విడగొట్టి తమకూ మనియాచ్చి వారికీ చెరి సగం పంచాడు తెల్లవాడు. ఎట్టయాపురం ప్రభువు ను రాజు నుంచి దిగజార్చి జమిందారు ను చేసిపెట్టాడు.

తండ్రి మరణించినాక గాని ఎట్టయాపురానికి వచ్చే అవకాశం రాలేదు. వయసు దాటుతుండగా , వచ్చి సరాసరి ప్రభువయినాడు. ఇవాళ్టికి అశక్తుడు కూడా అయినాడు.

ఆ ఘాతుకానికే ఫలితమా ?

పరిహారం ??

***

నాలుగు మెతుకులు తిన్నాననిపించుకొని, నడుము వాల్చినా విశ్రాంతి లేక అటూ ఇటూ మెసలి మెసలి , చీకటి పడుతూండగా – ప్రదోష అర్చన కు అమ్మవారి గుడికి బయల్దేరాడు. నూలు ధోవతి కట్టుకొని నూలుదే ఉత్తరీయాన్ని పైన కప్పుకొని , ఒక్కడే- కాలినడకన . ఆభరణాలు ధరించటం మానివేసి చాలాకాలమయింది.

దర్శనమయినాక వెంటనే దేవిడీ కి వెళ్ళాలనిపించక రంగమంటపం మెట్ల మీద కూర్చుండిపోయాడు. ఎన్ని ఆమడల అవతల ఎక్కడ వాన కురుస్తోందోగాని – కొంచెం కొంచెం గా చల్లగాలి తిరిగింది . తెమ్మెరలు ఏవో వింత నాదాలనూ మోసుకు తెచ్చాయి. ధ్వని ని అనుసరిస్తూ వెళితే – ప్రాకారానికి చేరబడి కూర్చుని ఒక పద్దెనిమిదేళ్ళ కుర్రవాడు. ఆ మ్రోగించే వాద్యమేదో – ఎప్పుడూ చూడనిది.

తొలినాటి నుంచి వంశస్థులందరూ సంగీత సారస్వతాల లో ఏ మాత్రమో అభిరుచి ఉన్నవారే , తానూ ఎరుగును – కొంత. కేదార గౌళ నా అది ?

గాలితోబాటు గా ఎవరిదో దయ వచ్చి తాకినట్లయింది. క్షమిస్తున్నారా ?

కుర్రవాడు గొంతు విప్పి పాడుతున్నాడు. ” నీలోత్పలాంబికాయై నమస్తే ”

ఏమి ప్రతిభ , ఎంత నిండు !

అతనికీ తనకూ ఒళ్ళు తెలిసేప్పటికి ఎంత కాలమయిందో !

ప్రభువు తానే వెళ్ళి పలకరించాడు. కుర్రవాడి లో అమాయకత్వమూ జ్ఞానమూ సమం గా ఉన్నట్లున్నాయి. పేరు వడివేలు పిళ్ళై అట. ఆ వాద్యాన్ని వయొలిన్ అంటారట. తెల్లవాళ్ళు తెచ్చినదట. తన గురువు గారు దాన్ని మన్నిస్తారట. గురువుగారి తమ్ముడు అందులో నిధి అట. గురువు గారి మాట చెబుతూంటే అతనికి ఒళ్ళూ పై తెలియలేదు. తనకూ తన అన్నలు ముగ్గురికీ ఆయన గురువేనట. ఆయన పాట తప్ప మరొకటి తాను పాడడట. ఆయన అపర కార్తికేయుడట. అమ్మవారు పిలిస్తే పలుకుతుందట.మహావైణికుడూ వాగ్గేయకారుడూ మాత్రమే కాదు – వేదం చదువుకున్నాడట. కౌముది ఆయన మునివేళ్ళ పైన ఆడుతుందట. మంత్ర తంత్ర జ్యోతిష్య శాస్త్రాలలో పారం ముట్టిన వాడట.

” ఏ ఊరు నాయనా వారిది ? ”

” ఆయనకొక ఊరెక్కడుందయ్యా ? పైరు పచ్చలకు కాపు గదా సుబ్రహ్మణ్యుడు – ఈయనా అంతే. ఒక చోట నిలవడు , తిరుగాడుతూనే ఉంటాడు. వాళ్ళ అమ్మ చెబుతుంటుంది గా , ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ”

ప్రభువు కు కొంత నిరాశ.

కుర్రవాడిని దగ్గర ఉంచుకొని దినమ్మూ అతని పాటలు వినాలనిపించింది. వాటిలోని కారుణ్యాన్ని దోసిళ్ళతో ఎత్తి తాగుతుండాలనిపించింది.కాని ఆ ఊరటను పొందే హక్కు తనకు లేదని కూడా అనిపించింది.
ఏమీ అనకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు.

వెన్నెలకు మాత్రం కరువు లేదు కదా రాజ్యం లో. ఆ రాత్రి చంద్రశాలలో కూర్చున్నప్పుడు అప్రయత్నం గా ఆ కీర్తనే నోట్లో ఆడింది ప్రభువుకు. మనసుకు హాయనిపించింది. ‘ నీలోత్పలాంబికాయై ‘ అని , నమస్తే అని అనలేక దీర్ఘం తీసుకుంటున్నాడు పైకే. అప్పుడే అక్కడికి అడుగు పెడుతూన్న రాణి నీలోత్పలాంబ , ఆ నడివయస్సులో బిడియ పడింది.

***

శాంతంగా తెల్లవారింది. రాజ పురోహితుడు ఎవరినో వెంటబెట్టుకొని దర్శనానికి వచ్చాడని వర్తమానం.
కొలువుకూటం లోకి ప్రమథులు దిగి వచ్చారని తోచింది ప్రభువు కు .
ఆయన బాలస్వామి దీక్షితులు , వెంట కొందరు శిష్యులు. వాళ్ళ అన్నగారు ముత్తు కుమారస్వామి దీక్షితులు , ఇంకొక తమ్ముడితో కలిసి సంచారం చేస్తున్నారట. ఎట్టయాపురం లో కొన్నాళ్ళు ఆగాలని సంకల్పించారట. సాయంత్రానికి చేరుకుంటారట.
ఆ వెనకాల నిలుచుని బెదురు చూపులు చూస్తూ నిన్నటి కుర్రవాడు కనిపించాడు .
ఓహో . వీరేనన్నమాట.

***

పదహారేళ్ళ వయసు లో మదరాసు కోట లో తెల్లవాళ్ళ సంగీతం విన్నాడు ముత్తుస్వామి. ఐరిష్ బాండ్ ల సెల్టిక్ సంగీతం అది. ఒక తెల్ల దొరగారు అడిగాడు , వాటికి సాహిత్యం కూర్చగలవా అని. కూర్చాడు- తెలుగు లోనూ సంస్కృతం లోనూ. ఆ వరసలను మృదువు చేసి శుద్ధి చేశాడు. జగదంబ తనలో నింపిన శబ్ద శక్తి ని వాటిలో నిక్షేపించటమయిందని తర్వాత గురువుగారు చిదంబరనాథ యోగి చెప్పారు. ఆయన వెంట వెళ్ళి ఏడేళ్ళు వారణాసి లో ఉన్నాడు. తురుష్కుల ధ్వనులు కలగలిసిన ఔత్తరాహ సంగీతాన్ని వెంటతెచ్చి పుటం పెట్టి కర్ణాటకం తో అతికాడు. నూట యాభై కి పైన దేవాలయాలు తిరిగి పేరు పేరునా కీర్తనలు కట్టి పాడి దేవతలకు పులికాపు పెట్టి స్నపన చేయించి సాంబ్రాణి ధూపం వేశాడు. వాగర్థాల తో స్వరాన్ని సమన్వయించిన ఆ మంత్రమాలికలు వెలికి వచ్చేందుకు తన నొక ఉపాధి గా అమ్మ పంపిందనే స్ఫురణ అన్ని వేళలా ఉంటుండేది. నాలుగు నాళ్ళు ఒక చోట ఆగకుండా యాభై మూడేళ్ళ జీవనం. ఇక్కడికి రావాలి, బహుశా ఇక్కడే ఆగాలి – కొంతకాలం.
అమ్మ పిలుచుకునే దాకా.

***

ఎట్టయాపురపు రాజ్యం పొలిమేరల్లోకి వస్తూనే ఆవరించి ఉన్న ధూమమేదో అగుపించింది దీక్షితులకు. నేల ఎండి బీటలు విచ్చింది. ఎక్కడా పచ్చని చిగురన్నది లేదు. పశువుల డొక్కలు ఎండిపోయినాయి. జనాల మొహాలలో కళ లేదు.

పాతకాలు ఎన్నో చోట్ల, ఎంతమంది వల్లనో జరుగుతుంటాయి. ఏ కారణం చేతనో అది ఈ చోట ముద్ద కట్టుకుపోయి ఉంది. ఏమో, ఇక్కడిది వ్రణమై ఛిన్నం కావలసి ఉందేమో – ఆరోగ్యం రావలసి ఉందేమో.

ప్రభువు మొహం చూస్తూనే దీక్షితులు ద్రవించిపోయాడు. నాయకర్ ప్రవృత్తి కళ్ళకు కట్టింది. ఈ జీవుడు ఉత్తముడు. ఉన్నతుడు. అందుకు ఇదంతా.

దీక్షితులను చూ స్తే ప్రభువుకు ప్రాణాలు లేచివచ్చాయి. అమాంతం సాగిలపడ్డాడు.

మాటలు లేని సంభాషణ కొనసాగింది.

మర్నాడు ఉదయమే, శ్రీ చక్రార్చన అవుతూనే పాంచాలంకురిచి కి బయల్దేరారు. దేవిడీ నేలకూలినచోటి ఆముదాలబీడులో – దీక్షితులు ఏవో ప్రక్రియలు చేశాడు.

” ఇక్కడ అమ్మవారికి గుడి కట్టండి నాయకా ”

ఆలయం నిర్మించటం మాటలా- అన్నమే లేక పస్తులుంటుంటే ?

దీక్షితులు నవ్వాడు, గ్రహించినట్లుగా. ఏమీ అనలేదు.

పాపపు సొత్తు క్షయమయింది. ఇది కొత్త మొదలు.

***

ఆ సాయంత్రం ఎట్టయాపురం కోవెలలో.
సాయంకాలపు పూజావిధి అయింది.

ఆ మూలన, కదంబ వృక్షం కింద కూర్చొని-
దీక్షితులు గళం సవరించుకున్నాడు.

స గ మ ప ని స
స ని ప మ గ స.

ఆలాపన.

చంద్రకాంత శిలలు కరిగినట్లు
చల్ల చల్లని ఏరుగా సాగినట్లు
గండు కోయిలలు పదివేలు కూసినట్లు
నారికేళాలలో సలిలం ఊరినట్లు -

మబ్బులు పట్టినట్లు. మెరుపులు మెరిసినట్లు. ఆకాశం ప్రేమగా ఉరిమినట్లు.
మట్టి పరిమళం ముక్కుకు సోకినట్లు.

” ఆనందామృతాకర్షిణీ….
సలిలం వర్షయ వర్షయ వర్షయ …”

అమృతం .

వాన. ఎంతెంత కాలానికో వాన. ఊళ్ళన్నీ తడిపిన వాన. గూళ్ళలోకి చిమ్మిన వాన.
ఆగలేదు. కురుస్తూనే ఉంది.
ఆ రోజుకి చాలించాక మర్నాడు, ఆ మర్నాడు.
తర్వాత వారానికి రెండుసార్లు.
సమంగా , సాధువై, స్వాదువై వాన కురిసింది.
నెలకు మూడు తడవులుగా ఆ చోట కురుస్తూనే ఉంది.

***

[కర్ణాటక సంగీత త్రయం లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఆ తర్వాత ఎట్టయాపురం లోనే ఉండిపోయాడు. 1835 లో దేహాన్ని వీడాడు. ఆయన సమాధి అక్కడ ఉంది.

జగవీర రామ వెంకటేశ్వర ఎట్టప్ప నాయకర్ ఆ తర్వాత మరొక నాలుగేళ్ళు బ్రతికాడు.

రాజ్యం సుభిక్షమైంది.

ఒక్క మరక - ఎట్టప్పన్ అన్న మాట తమిళం లో ద్రోహి కి పర్యాయ పదమై ఉండిపోయింది.

కాని ఆ వంశం లో మరి తొమ్మిది తరాల వారు ప్రభువులైనారు. సంగీతానికి సేవ చేశారు.

అప్పుడు కురిసిన పుణ్యం ఆ నేలకి ఇంకా మిగిలింది.

భరతమాతకు ఘనపుత్రుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి 1882 లో ఎట్టయాపురంలో జన్మించాడు. ]
---------------------------------------------------------
 రచన - మైథిలి అబ్బరాజు, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Sunday, August 26, 2018

అంతర్వేదం


అంతర్వేదం

సాహితీమిత్రులారా!

‘అంతర్వేది’ అనే పేరు తలచుకోగానే అంతర్ వేదం, అంతరంగంలోని వేదం అన్న మాటలతో పాటు – అంతరువు ఏది? (ప్రపంచానికీ నాకూ మధ్య) అన్న భావం కలుగుతుంది. అందుకనే అంతర్వేది అనే పేరులో ఏదో ఆధ్యాత్మిక భావన వినిపిస్తుంది.

చిన్నప్పటి నించీ ఒక నది సముద్రంలో కలవడం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి, ఆకాంక్ష. ఇంత పెద్ద జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోట కొన్ని మైళ్ళ దూరం పాటు సముద్రంలో కూడా మంచి నీళ్ళే ఉంటాయిట అన్న ఆసక్తికరమైన సంగతి చిన్నప్పట్నించీ వింటూ ఉండటం కూడా ఈ ప్రదేశాన్ని చూడాలన్న కుతూహలాన్ని పెంచింది (ఇది తప్పని – కనీసం వరద లేని వేసవి కాలంలో – అక్కడికి వెళ్ళాక తెలిసింది).

గోదావరి గురించి నాకున్న పరిమితానుభవం గురించి…
చిన్నప్పుడు ఒంగోలు నుంచి విశాఖపట్టణం వైపు రైల్లో వెళ్ళేప్పుడు గోదావరి బ్రిడ్జిని దాటిన అనుభవం ఉంది. గోదావరి రైలు బ్రిడ్జి కి ఇటుప్రక్క పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, బ్రిడ్జి దాటితే అటుప్రక్క తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి – ఇదీ నాకు తెలిసినది.

కానీ ఇప్పుడు తిరపతి నించి రాజమండ్రికి బస్సులో వచ్చేటప్పుడు, గోదావరిని రెండుసార్లు చూసే అవకాశం కలిగింది. ఎందుకంటే హైవే (స్వర్ణ చతుర్భుజి) లో వేసిన రోడ్డు రాజమండ్రికి కొన్ని కిలోమీటర్లు దక్షిణంగా గోదావరి నదిని దాటుతుంది. అంటే రైలు మార్గం తాడేపల్లి గూడెం, నిడదవోలు, కొవ్వూరుల రూట్ లో వచ్చి గోదావరిని దాటితే – స్వర్ణ చతుర్భుజి రోడ్డు మార్గం మాత్రం తాడేపల్లి గూడెం ప్రాంతాల్లో దక్షిణం వైపుగా మళ్ళి తణుకు మీదుగా వచ్చి గోదావరిని దాటుతుంది. కానీ అప్పటికే గోదావరి రెండు పాయలుగా చీలి ఉంటుంది.
తూర్పు వైపు ఉన్న పాయని ‘గౌతమీ గోదావరి’ అని పశ్చిమం వైపు ఉన్న పాయని ‘వశిష్ట గోదావరి’ అని పిలుస్తారు. గోదావరి జిల్లాలని వేరు చేస్తున్నవి – గోదావరి నదీ(ధవళేశ్వరం దాకా), ఆ తరవాత వశిష్ట పాయలే. అంటే పశ్చిమ గోదావరి జిల్లా నించి తూర్పు గోదావరి జిల్లాలోకి హైవే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ముందుగా వశిష్ట గోదావరిని దాటాలి. అప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తాం. ఆ తర్వాత గౌతమీ గోదావరి పాయని దాటి కొంచెం ఉత్తరం వైపుగా ప్రయాణిస్తే రాజమండ్రి చేరతాం.

ఈ వశిష్ట, గౌతమి పాయల మధ్య ఉన్న రావులపాలెం మీదుగా హైవే వెళుతుంది. ఈ ఊరుని ‘కోనసీమ ముఖద్వారం’ అని పిలుస్తారు. కాబట్టి రైల్లో అయితే గోదావరిని దాటే అవకాశం ఒకసారే కాని ఈ హైవే మీద రాజమండ్రికి వెళితే వశిష్టని, గౌతమిని కూడా చూడొచ్చు!

సరే రాజమండ్రి లో దిగాక – ఇంకేముంది బస్ స్టాండ్ నించి తిన్నగా అంతర్వేది బస్ ఎక్కడమేగా – అని అమాయకంగా, నిర్లక్ష్యంగా వెళ్ళాను పొద్దున్నే ఆరు గంటలకి. ‘అంతర్వేదికి బస్సు ఏ ప్లాట్ ఫారమ్ మీదికి వస్తుంది?’ అని ధాటీగా అడుగుతున్న నన్ను చూసి నీళ్ళు నమిలాడు అక్కడ ఎంక్వయిరీలో కూర్చుని ఉన్న యువకుడు. ఆ ఆవరణలోనే ఒక ప్రక్కగా వేరేగా ఉన్న ఇంకో చిన్న బస్టాండ్ వైపు చూపిస్తూ ‘కాకినాడ బస్సు’ అంటూ ఏదో గొణిగాడు.

సరే అనుకుంటూ ఒక మూలగా ఉన్న ఆ బుల్లి బస్టాండ్ దగ్గరకి వెళ్ళి అడిగితే ఒకాయన ‘మీరు రాజోలు వెళ్ళి అక్కడ నుండి వేరే బస్సులో వెళ్ళాలి’ అన్నాడు. మళ్ళీ వెనక్కొచ్చి ఎంక్వయిరీ కౌంటర్ యువకుడికి విషయం తెలియచేయాలని అతని దగ్గరకి వెళ్ళగానే అతడు హంబుల్ గా “సార్ నాకు తెలియక చెప్పాను, లోపల మా వాళ్ళని కనుక్కున్నాను. మీరు రాజోలు బస్ ఎక్కాలి ఫలానా ప్లాట్ ఫారం మీద” అన్నాడు. ‘మీకు విషయం తెలియచేద్దామనే’ వచ్చాను అని నవ్వి రాజోలు బస్సు ఎక్కాను. బస్ కండక్టర్ “రాజోలు వెళ్ళి అక్కడ నించి సఖినేటిపల్లి వెళ్ళే బస్ పట్టుకుని మధ్యలో మలికిపురంలో దిగి అక్కడ నించి ఆటోలో వెళ్ళాల్సిందే” అని వివరించాడు.

సరే, ఇక రాజమండ్రిలో బయల్దేరిన రాజోలు బస్ బుర్రిలంక, కడియపు లంక, చెముడు లంకలను దాటి దక్షిణంవైపు గా ప్రయాణిస్తూ గౌతమీ గోదావరి పాయని దాటింది. అంటే రావులపాలెం అన్నమాట. రావులపాలెం దాటి పశ్చిమంగా ప్రయాణించి వశిష్ట గోదావరి పాయని చేరడానికి కొంచెం ముందే మళ్ళీ దక్షిణం వైపుకు తిరిగింది బస్సు. ఈ లెఫ్ట్ టర్న్ తీసుకున్న ప్రదేశం పేరు ఈతకోట. ఇహ అక్కడ్నించీ దాదాపు గోదావరికి సమాంతరంగా దక్షిణం వైపుకే ప్రయాణిస్తూ గంటి, గంటిపెదపూడి (జి పెదపూడి), తాటిపాక మీదుగా రాజోలు చేరింది. అన్నీ చిన్న ఊర్లే అని చెప్పొచ్చు. తాటిపాక మాత్రం చిన్న టౌన్. రాజోలు అంతకన్నా కొంచెం పెద్ద టౌన్.

రాజోలు నించి అంతర్వేదికి బస్‌ సౌకర్యం లేదు. బహుశా రోజుకొకటి లేదా రెండు బస్సులు ఉన్నాయేమో! ఎవర్నడిగినా సఖినేటిపల్లి వెళ్ళే బస్సు ఎక్కి మధ్యలో మలికిపురం అనే ఊళ్ళో దిగి అక్కణ్ణించి ఆటోలో వెళ్ళమన్నారు. సరే, అలాగే వెళ్ళి మలికిపురం చేరాను. అక్కడ షేర్ ఆటో ఎక్కాను. (మామూలుగా ఆంధ్రాలో అన్ని ఊళ్ళల్లో కుక్కినట్లే ఇక్కడ కూడా – 20 కి.మీ ప్రయాణం కాబట్టి ఛార్జి 20 రూపాయలు. జనం నిండిందాకా ఆటో కదలదు కాబట్టి వేళ కాని వేళలో మలికిపురం చేరామంటే ఇరుక్కుపోతాం)

అదృష్టవశాత్తూ నేను అరగంట కన్నా ఎక్కువ వేచి ఉండనక్కరలేకుండానే పదకొండు గంటలకంతా అంతర్వేదికి చేరిపోయాను – అరటి, కొబ్బరి ఇంకా ఎన్నో పచ్చపచ్చని ఫల పుష్ప వృక్ష జాతులు దారికిరుప్రక్కలా కన్నుల పండువ చేస్తుండగా చాలా చిన్నచిన్నగోదారిపల్లెల గుండా ప్రయాణం. దారి పొడుగూతా గోదారి కాల్వ – కాటన్ మహాశయుణ్ణి గుర్తు చేస్తూ.

***

అంతర్వేది. చిన్న పల్లెటూరు. గాలిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే తోచింది – బహుశా నా మనసులో ఉన్న భావనే అయిఉండవచ్చు ! బస్టాండ్ ఉండేంత పెద్ద ఊరు కాదు. లక్ష్మీనరసింహస్వామి గుడి బయట పందిళ్ళు వేసి ఉన్న స్థలంలో ఆటో ఆగింది. ప్రాకారం దాటి గుడి లోపలకి వెళ్ళీ వెళ్ళగానే చుట్టూ తిరిగాను. నలువైపులా నాలుగు ద్వారాలు. దక్షిణం, పశ్చిమం ద్వారాల నుంచి బయటికి చూస్తే విశాలమైన ప్రదేశం – దూరంగా నదీ పరివాహిక ప్రాంతం. రక్తకుల్య అనే నది కూడా ఇక్కడ ఉంది. ఈ నదికి స్థల పురాణంలో ఒక ప్రత్యేక పాత్ర ఉందిట. లక్ష్మీనరసింహస్వామి గుడికి ఐదారు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కృష్ణమ్మ అనే జమిందారు దీనిని పునరుద్ధరించాడు.

ఈ గుడి కన్నా పురాతనమైన నీలకంఠేశ్వరస్వామి గుడి (చాలా చిన్నది) దీనికి కొంచెం దూరంలోనే ఉంది. క్షేత్ర పాలకుడైన ఈ నీలకంఠేశ్వరస్వామి గర్భగుడి ముఖద్వారం పశ్చిమం వైపుకు ఉండటం ఒక ప్రత్యేకతట.

అన్ని గుళ్ళ మాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో కూడా స్పెషల్ దర్శనం టిక్కెట్టంటూ వేరేగా ఉంది. (ఇది కొన్న వాళ్ళకే లక్ష్మీ నరసింహస్వామిని దగ్గరగా చూసే అవకాశం – మిగతా వారిని కొన్ని అడుగుల ముందుగా ఆపేస్తారు) కానీ జనం చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది – వాతావరణంలో కమర్షియల్ గోల లేదు. గుడి లోపల నలువైపులా చక్కని దారి, చెట్లు. ఈశాన్య మూలలో ఒక చిన్న బావి. దానిలో ఒక పెద్ద తాబేలు, కొన్ని చిన్న తాబేళ్ళు.

మధ్యాహ్నపు ఎండ బయట కారం దంచుతున్నట్లుంది – అగ్నివర్షంట – ఆరోజు (మే 23, 2015) ఉష్ణోగ్రత నలభై ఎనిమిది దాటిందేమో తూ.గో లో బహుశా. కానీ లోపల గుడిలో భరించలేనంత వేడిగా ఏం లేదు. గుడి వెనక ఉన్న ఒక హాలులో నిత్యాన్నదాన పథకం క్రింద భోజనం పెడుతున్నారు. ఇది రోజూ జరిగే కార్యక్రమమేనట. తిన్న వాళ్ళందరూ కంట్రిబ్యూట్ చేసే నిధుల నించే ఈ కార్యక్రమం నడుస్తుందట. ఎవరైనా ఒక్కోరోజు పూర్తిగా స్పాన్సర్ చేసేవాళ్ళు కూడా ఉంటారట. ఆ రోజు ఎవరో స్పాన్సర్ చేసినట్లున్నారు – బ్రహ్మాండమైన గోదావరి జిల్లా భోజనాన్ని కొసరి కొసరి మరీ వడ్డిస్తున్నారు.

తీవ్రమైన వేసవి కాబట్టి జనం ఎవరూ కనపడుతున్నట్లు లేరు. ఆలయోద్యోగులు తప్ప. భోజనమయ్యాక బావిలో తాబేళ్ళని కాసేపు చూసి గుడి ఆవరణలో కూర్చున్నాను. అప్పుడప్పుడూ చల్లని గాలి వీచి బయటి ఎండని మరిపిస్తోంది. ఆలయంలో దాదాపుగా జనం లేనట్లే.

ఇంతలో ఒక హరికథా కళాకారిణి – మంధా నాగమణి గారట యానాం నించి వచ్చారు – ఆ మిట్ట మధ్యాహ్నం పూట “కృష్ణ రాయబారం” కథ చెప్పడం ఆరంభించారు.

లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆస్థాన కళాకారుడు మృదంగంతోనూ, బయట నుంచి వచ్చిన వేరొకరు హార్మోనియంతోనూ నాగమణి గారికి సహకారం అందించారు. మైక్ సెటప్ చేయడానికి ముందు ఆవిడ కొన్ని కీర్తనలు చక్కగా ఆలపిస్తుంటే (పన్నెండున్నరనించి ఒంటి గంట దాకా) ‘ఎవరో గాయని అయిన భక్తురాలు పాటలు పాడుతున్నారేమో’ అనుకున్నాను. తర్వాత సంప్రదాయానుసారం చిరతలు, పూలమాల ధరించి ఒంటి గంట నించీ దాదాపు రెండున్నరదాకా ఖంగుమనే కంఠంతో హరికథ చెప్పారు – ఎక్కడా ‘గొంతు’ దాచుకున్నట్లు అనిపించకుండా.
‘ఇదేమిటి ఇంత మండు వేసవి మధ్యాహ్నంలో హరికథా?’ అని అక్కడున్న ఆలయ ఉద్యోగిని అడిగితే ఆయన నవ్వి ‘అవునండీ ఇక్కడ ప్రతి శనివారం మధ్యాహ్నం ఉంటుంది – వేసవికేం ఎక్సెప్షన్ లేదు’ అన్నారు. బహుశా సాయంత్రం ఏర్పాటు చేస్తే జనం తిరిగి వెళ్ళడానికి ఇబ్బంది పడతారని మధ్యాహ్నం ఏర్పాటు చేశారేమో ! (అంతర్వేది చాలా మారుమూల పల్లెటూరు, రాకపోకలకి రోడ్లు ఇరుకుగా ఉంటాయి) మొత్తానికి మధ్యలో ‘గోవిందోహారి’ చెప్పేవాళ్ళు, చివర్లో చప్పట్లు కొట్టేవాళ్ళు లేకపోయినా నాగమణి గారు నిరుత్సాహపడినట్లు కనిపించకుండా మధ్యమధ్యలో చక్కని జోక్స్ చెప్తూ హరికథాకాలక్షేపం చేశారు.

రాయబారం వెళ్ళేముందు కృష్ణుడితో ద్రౌపది చెప్పిన తిక్కన గారి పద్యం “ఇవి దుస్ససేను వ్రేళ్ళందవిలి” – ఆ రోజుల్లోనే క్లోజప్ షాట్ ని ఈ పద్యం ద్వారా తిక్కన స్ఫురింపచేశాడు అని శ్రీశ్రీ పొగిడినది – పాడతారేమోనని ఆశగా ఎదురు చూశాను. కాని పాడలేదు. రాయబార ఘట్టంలో ప్రసిద్ధమైన పాండవోద్యోగ నాటక పద్యాలు (జండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో) అన్నీ పాడారు.

సాగర సంగమంకి ఎలా వెళ్ళాలి అని గుళ్ళో ఇద్దరు ముగ్గుర్నడిగితే దారి కన్నా జాగ్రత్తలు ఎక్కువగా చెప్పారు. చాలా లోతు ఉంటుంది, ప్రమాదాలు జరిగాయి వగైరా..
నాలుగున్నరకి బయల్దేరి ఊళ్లోకి వచ్చి ‘సాగరసంగమం ఎక్కడండీ?’ అని ఒకాయన్ని అడిగితే ‘అలా శివాలయం ప్రక్కనుండి తిన్నగా వెళ్ళిపోండి’ అంటూ ‘కాళ్ళు కూడా కడుక్కోవద్దండీ దయచేసి – ఎక్కడ ఎంత లోతుంటుందో ఎవరికీ తెలియదు’ అని భయపెట్టారు. ఆయన చెప్పిన శివాలయం అక్కడకి చాలా దగ్గరే – ఇదే క్షేత్రపాలకుడైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం. అక్కడకి వెళ్ళాక ‘సాగరమునకు దారి’ అన్న బోర్డు చూసి మలుపులేమీ తిరక్కుండా బోర్డులో సూచించిన దారి వైపు వెళ్ళాను. ఒక కిలోమీటరుకి పైగానే నడక. తాటి చెట్లూ, మధ్యలో చిన్న చిన్న చెరువుల లాంటి గుంటలూ, ఓయన్జీసి వాళ్ల పెట్రోల్ బావుల వాసనలు, దూరంగా వినిపిస్తూ క్రమంగా దగ్గరవుతున్న సముద్రపు హోరు. సముద్రం చాలా ఉద్ధృతంగానే ఉన్నట్లనిపించింది. కొద్దిమంది స్నానాలు చేస్తున్నారు. ‘మరీ కాళ్ళు కూడా తడపనంత ప్రమాదం ఏముందబ్బా ఇక్కడ’ అని అనుకున్నాను.

‘ఇంతకీ గోదావరి ఎటున్నట్లు? ఎక్కడ కలుస్తోంది సముద్రంలో?’ అని ఆలోచించుకుంటూ ‘పోనీ అలా తీరం వెంబడే నడుచుకుంటూ పోదామా’ అనుకున్నాను. ఉత్తరం వైపు (ఇది ఈశాన్యం – సముద్రం దగ్గిర దిక్కులు తెలీక చాలా గందరగోళం గా ఉంటుంది) చూస్తే అనంతమైన సముద్రం. మరో వైపు మాత్రం తీరం వంపు తిరిగి ఉంది. కాబట్టి బహుశా గోదారి అటువైపు ఉండవచ్చు అనిపించింది. కొంచెం సేపటికి ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టి అక్కడే చాలాసేపు గడిపాను. చిరుచీకట్లు పడేటప్పుడు మళ్ళీ నడుస్తూ బయలుదేరి గుడికి వెళ్ళకుండా మలికిపురం వెళ్ళే రోడ్డు లోకి తిరిగేసి అలా రెండు కిలోమీటర్లు నడుస్తూ పోయాను ఆటో దొరికిందాకా.

ఆటోలో ఒక రైతు సోదరుడితో పరిచయం. ఆయన పేరు ప్రభోజీ! ‘ఇలాంటి పేరు ఎక్కడా వినలేదండీ’ అంటే ‘విశాఖపట్టణం జిల్లాలో కసింకోట అనే ఊళ్ళో ఉన్న ఒక ముస్లిం గురూజీని కొలిచే వారు ఇలాంటి పేర్లు పెట్టుకుంటారని చెప్పాడు. గోదావరి జిల్లాల్లో చాలా మంది హిందువులు (ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ఆలయ పూజారులతో సహా) ఈయనని ఆరాధిస్తారట – హిందూ మతాన్ని పాటిస్తూనే.

మలికిపురంలో ఆటో దిగి మళ్ళీ ఇంకో షేర్ ఆటోలో రాజోలు వచ్చేసి రాత్రికి రాజమండ్రి చేరాను. తర్వాత రోజంతా అంతర్వేదిలో నిర్జనంగా ఉన్న ఆలయ ప్రాంగణం, తాబేళ్ళ బావి, హరికథ, సముద్రం – వీటన్నిటినీ రెలిష్ చేసినా అసలు గోదావరి సముద్రంలో కలిసే చోటు చూడలేకపోయానే అని మనసంతా పీకుతూనే ఉంది. దీన్ని గురించి ఇంకొంచెం తెలుసుకుందామని గూగులించితే నరసాపురం నించి అంతర్వేది లోని సాగరసంగమానికి లాంచి సర్వీసు ఉందని ఏదో వెబ్సైట్ లో కనపడింది.

***

మర్నాడు బండలు పగిలే ఎండలో, వడగాడ్పులో పదిన్నరకి రాజమండ్రిలో నరసాపురం బస్ ఎక్కాను.

మునుపు తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది వెంబడే దక్షిణం వైపు గా ప్రయాణిస్తూ అంతర్వేది చేరుకుంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించి గోదావరి నదికి దాదాపు సమాంతరంగా అంతర్వేదికి వెళ్తున్నాననమాట. ఎందుకంటే వశిష్ట గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి రాజోలు తూర్పు వైపున ఉంటే నరసాపురం పశ్చిమం వైపు ఉంది.
ఈ రకంగా పశ్చిమ గోదావరి వైపున్న ఊళ్ళు కూడా చూడవచ్చు అనుకుంటూ రాజమండ్రిలో బస్ ఎక్కాను. ఆంధ్రదేశంలో అగ్నిమండలం విస్ఫోటనం చెందిందా అన్నట్లుంది వాతావరణం.
బస్సు రాజమండ్రి నుంచి దక్షిణంగా గౌతమీ గోదావరికి సమాంతరంగా ప్రయాణించి గౌతమీ పాయనీ, రావులపాలెం నూ దాటి, వశిష్ట గోదావరిని కూడా దాటింది. అంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించిందన్నమాట. దొంగరావిపాడు అనే ప్రాంతం దగ్గర బస్సు ఎడమ వైపు తిరిగి వశిష్ట గోదావరికి సమాంతరంగా దక్షిణం వైపుకి ప్రయాణించింది. సిద్ధాంతం, వడలి (ఈ ఊరు చూడగానే సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులైన వడలి మందేశ్వరరావు గారు గుర్తొచ్చారు), చెరుకువాడ, పెనుగొండ, మార్టేరు, కవిటం, వేడంగి (రేలంగి లాగా కనపడుతూ ఎన్నో పాత సినిమాల్లో వేళంగి అనే పేరుతో హాస్య పాత్రలు వేసిన యక్కల కోటేశ్వరరావు అనే నటుడిదీ ఊరేనా), పాలకొల్లుల మీదుగా నరసాపురం చేరుకుంది.

మిట్టమధ్యాహ్నపు రోడ్డుపై మండుటెండ నోటికొచ్చినట్లు పేలుతూనే ఉంది. నరసాపురం బస్టాండ్ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి ఒకాయన్ని లాంచి సర్వీసు గురించి అడిగాను. ఆయన ‘సాగరసంగమానికి లాంచి సర్వీసు తీసేసి చాలా రోజులయిందనీ, కొద్ది దూరంలోనే వశిష్ట గోదావరి పాయ ఉందనీ, దాన్ని పంటు మీద ఐదు నిమిషాల్లో దాటుకుని అటువైపు గట్టునించి ఆటో తీసుకుని మలికిపురంలో దిగి వెళ్ళమని అన్నాడు.

అయ్యో, మొన్నటి రూటే పట్టుకోవలసి వచ్చిందే! అనుకున్నాను. కాని పంటు ఎక్కడం కొత్త అనుభవమే కదా అనుకుంటూ ఆయన్ని దారి అడిగాను. తన బండి మీదే ఎక్కించుకుని పంటు బయల్దేరే చోట నన్ను దింపాడు. పది రూపాయలకి టిక్కెట్టు కొనుక్కుని పంటులో కూర్చున్నాను. ఎక్కినప్పుడు ఖాళీగానే ఉంది కాని పది నిమిషాల్లోనే ఎన్నో సైకిళ్ళు, కొన్ని మోటారు సైకిళ్ళు, ఒక కారు వచ్చి పంటు ఎక్కాయి. బయట ఎండ భయంకరంగా ఉన్నా గోదావరి నీళ్ళని చూస్తే మనస్సులో చల్లగా ఉన్నట్లనిపించింది.

ఈ గట్టు నించి అవతలి గట్టుకి చేరడానికి ఐదు నిమిషాలు కూడా పట్టలేదేమో! అవతలి గట్టున (తూ.గో. జిల్లాలో) ఉన్న ఊరు సఖినేటిపల్లి లంక. అక్కడ సిద్ధంగా ఉన్న ఆటో ఎక్కాను. మధ్యాహ్నపు అగ్నిహోత్రుడి మీద మంత్రాల్లా పైనుంచి రాలుతున్న నిప్పుల్లోంచి గోలగోలగా పరిగెత్తుతూ ఆటో మలికిపురం చేరేప్పటికి రెండు గంటలయింది.

ముందురోజు రాజోలు నుంచి సఖినేటిపల్లి వెళ్ళే బస్సు ఎక్కి మధ్యలో మలికిపురం దిగాను. ఈరోజేమో సఖినేటిపల్లి లంక నుంచి రాజోలు వెళ్ళే రూటులో ప్రయాణించి మధ్యలో ఉన్న మలికిపురంలో దిగాను.

ఆ సమయంలో ఆటోలు ఏమీ లేవు. మూడు మజ్జిగలూ, ఒక నిమ్మకాయ షోడా తాగేసి మూడున్నరకి బయల్దేరిన ఒక ఆటోలో ఎక్కి అంతర్వేదికి చేరేటప్పటికి నాలుగయింది. వదలకుండా ఎండ ఇంకా తీవ్రంగా ఉపన్యసిస్తూనే ఉంది. కొంచెం సేపు లక్ష్మీనరసింహస్వామి గుడిలోనే కూర్చుని అక్కడి వాళ్ళని సాగరసంగమం గురించి ఈసారి కొంచెం వివరంగా అడిగాను. అందరూ సముద్రం దగ్గరకి వెళ్ళే దారి గురించే చెప్తున్నారు (జాగ్రత్త లతో సహా) కానీ నదీ సాగర సంగమం గురించి అడుగుతూంటే సరిగా బదులివ్వడం లేదు. ఈ మధ్యనే ఏవో సంఘటనలు జరిగిఉంటాయి అనుకున్నాను వాళ్ల ధోరణి చూసి.

గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే ఒకాయన “ఆ ప్రదేశం చాలా దూరం అండి. మీరు అంతదూరం నడవలేరు. ఒకవేళ ఇప్పుడు బయలుదేరినా అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి పడొచ్చు” అంటున్నాడు. (అప్పుటికి సాయంకాలం అయిదు అవుతూ ఉంది). ‘ఫర్వాలేదండి. చూసి ఒచ్చేస్తాను” అని కొంచెం మాటలు కలిపినాక ‘నీలకంఠేశ్వర స్వామి గుడి దాటాక కుడి ప్రక్కకి వెళ్ళే సందులోకి తిరిగి తిన్నగా వెళ్ళిపోండి” అని అన్నాడు.

‘ఈ మలుపు తిరగకకుండా తిన్నగా వెళ్ళడం వల్లే నదీ సాగరసంగమానికి బదులు బీచ్ కి వెళ్ళిపోయాను నిన్న’ అనుకుంటూ ఆ మలుపు తిరిగి త్వరత్వరగా నడవడం ప్రారంభించాను. కనీసం చూసి వచ్చేద్దాం అనుకుంటూ.

ఓ అయిదు నిముషాలు నడవగానే ఎవరో ఒక యువకుడు బండి మీద వెళుతూ “ఎక్కడికి వెళుతున్నారండీ?” అని నన్ను పలకరించి “నాతో రండి” అంటూ తన బండి మీద ఎక్కించుకున్నాడు. కొంత దూరం తిన్నగా ప్రయాణించి తర్వాత రోడ్డు దిగి ఒక పేటలోకి ప్రవేశించి చాలా మలుపులు తిరిగి ఒకచోట ఆపి “ఇక్కడ నుంచి తిన్నగా వెళితే లైట్ హౌస్ వస్తుంది. దాని పక్క నుంచి వెళితే సాగరసంగమం వస్తుంది” అని నన్నుదించి వెళ్ళిపోయాడు.

ఓ పది నిమిషాలు నడిచి సాగరసంగమం చేరుకున్నాను. కుడివైపు చూస్తే అఖండ గోదావరి. ఎడమవైపు కొద్ది దూరంలోనే మహోధృతంగా వినిపిస్తున్న సముద్రఘోష. మేట మీదుగా నడుచుకుంటూ నది దగ్గరకి వెళ్ళాను. నలుగురైదుగురు తప్పితే అక్కడ ఎవరూ లేరు. ఒకరిద్దరు జాలర్లు మాత్రం తీరం వెంబడే కర్రలు పాతుతూ వాటికి వలలు చుట్టుకుంటున్నారు. నదిలో దిగి స్నానం చేయాలని ఇచ్ఛ. అక్కడే దిగితే అక్కడున్న నలుగురైదుగురూ వద్దని వారిస్తారేమోనని భయం వేసి మేట మీద ఏటవాలుగా కుడివైపు తీరం వెంబడే ఒక అరకిలోమీటరు నడుస్తూ కొన్ని చెట్లు, పొదలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడ నది కొద్దిగా వంపు తిరిగి ఉండటం వల్ల ఆ ప్రదేశం ఎవరికీ కనిపించదు. అక్కడ నదిలోకి దిగడానికి తయారవుతుండగా ఒక జాలరి ఉన్నట్లుండి ప్రత్యక్షమై ‘జాగ్రత్తండోయ్’ అంటూ కొద్ది దూరంలోనే తన వలను అల్లుకుంటూ కూర్చున్నాడు.

గోదావరిలోకి దిగాను. పైన విశాలమైన ఆకాశంలో అస్తమించడానికి ఉద్యుక్తుడవుతున్న సూర్యుడూ, చుట్టూ అఖండ గోదావరి, దూరంగా సముద్రపుఘోష. మనసంతా మౌనం.
ఏదైనా నది – వంపు తిరిగి వెనక్కి రావడం (కాశీ దగ్గర గంగ, ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు దగ్గర గోదావరి), సాగరంలో లీనమై తన ఐడెంటిటీ కోల్పోవడం – నీ మూలస్థానంలో కలిసిపోవడం, నిన్ను నువ్వు కోల్పోవడం, అంతర్ముఖుడవడం – ఇలాంటి వాటికీ నదీ సాగర సంగమానికీ ఏదైనా సంబంధం ఉందేమో!

ఒక గంట సేపు నీళ్ళల్లో గడిపి బయటకి వచ్చాక ముందురోజు చూసిన బీచ్ మీదుగా వెళ్ళవచ్చుకదా అని అనిపించింది. గోదావరి గలగలలు వింటూ సముద్రం వైపుకి నడిచాను. సాగరసంగమాన్ని దర్శించి ఎడమ ప్రక్కకు తిరిగి మరో అరకిలోమీటర్ నడిచి బీచ్ పాయింట్ కి చేరుకున్నాను.

కొంతసేపు అక్కడ గడిపి నదీ సాగరసంగమాన్ని చూడగలిగానన్న తృప్తితో వెనక్కి మళ్ళాను.
-----------------------------------------------------------
రచన - రాజశేఖర్ పిడూరి, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Saturday, August 25, 2018

కొలను – మొదటి భాగం(అనువాదకథ)


కొలను – మొదటి భాగం(అనువాదకథ)


సాహితీమిత్రులారా!


ఆంగ్లం నుండి అనువదించిన కథను ఆస్వాదించండి-
ఏపియా పట్టణంలోని మెట్రోపోల్ హోటలుకు యజమాని అయిన చాప్లిన్ నన్ను లాసన్ కు పరిచయం చేసినప్పుడు, లాసన్ పట్ల ప్రత్యేకమైన ధ్యాసను పెట్టలేదు నేను. అప్పుడు మేము హోటల్ లాంజ్ లో కూచుని కాక్టెయిల్ తాగుతున్నాము. ఆ ద్వీపానికి సంబంధించిన విషయాలమీద లోకాభిరామాయణం కొనసాగుతుంటే, వినోదం నిండిన ఉల్లాసంతో దాన్ని వినసాగాను.

చాప్లిన్ తన సంభాషణ ద్వారా నాకు ఉత్సాహాన్నీ ఆనందాన్నీ కలిగించాడు. అతడొక మైనింగ్ ఇంజినీరు. తను సాధించిన వృత్తిపరమైన విజయాలకు అంతగా విలువ లేని ప్రాంతంలో స్థిరపడటాన్ని అతని ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చునేమో. ఆయన చాలా తెలివిగల మైనింగ్ ఇంజినీర్ అని చెప్పుకుంటారు అక్కడి వాళ్లందరూ. అతడు చిన్నగా వుంటాడు. శరీరం లావుగా కాకుండా సన్నగా కాకుండా మధ్యరకంగా వుంటుంది. వెంట్రుకలు నల్లగానే వుంటాయి. కాని, తలమీద మాత్రం అక్కడక్కడ జుట్టు నెరిసిపోయి కొంత పలుచగా వుంటుంది. మీసాలు చిన్నగా, కొంచెం కొక్కిరిబిక్కిరిగా ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎండ తగలడం చేతా, మద్యం తాగడం చేతా అతని ముఖం బాగా ఎరుపు రంగును కలిగి వుంటుంది. ఆ హోటలు పేరులో అట్టహాసం ఉన్నా దాని భవనం కేవలం రెండంతస్తులదే. దాన్ని అతని నలభై ఐదేళ్ల భార్య చక్కని అజమాయిషీతో పర్యవేక్షిస్తుంటుంది. సన్నగా పొడవుగా ఉండే ఆమె, ఆస్ట్రేలియా దేశస్థురాలు. చాప్లిన్ తరచుగా ఉద్రేకంతో, నిషాలో, భార్యపట్ల భయంతో ఉంటాడు. ఆ ద్వీపానికి కొత్తగా వచ్చినవారు కొద్ది రోజులు కాగానే చాప్లిన్ కూ అతని భార్యకూ మధ్య జరిగే కుటుంబ కలహాల గురించి వింటారు. భర్తను ఎప్పుడూ తన స్వాధీనంలో ఉంచుకోవటం కోసం ఆమె తన పిడికిలినీ పాదాన్నీ ఉపయోగిస్తుంది. అప్పుడప్పుడు భర్త బాగా తాగి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తే, ఆమె అతణ్ని ఇరవై నాలుగు గంటలపాటు గదిలో బంధించడం, మరునాడు అతడు వరండాలో దీనాతిదీనంగా భార్యతో వేడుకుంటున్నట్టుగా మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్లకు అది వినపడటం మామూలే.

చాప్లిన్ ఒక వింతైన, ఆసక్తికరమైన మనిషి. తన జీవితంలో చాలా ఎత్తుపల్లాలతో కూడిన వైవిధ్యం ఉందని చెప్తుంటాడతడు. అది నిజమో అబద్ధమో తెలియదు కాని, అతడు చెప్పేది వినాలనిపిస్తుంది. ఒకసారి అట్లా చెప్తున్నప్పుడు మధ్యలో లాసన్ రావటం నాకు అంతరాయం అనిపించి లోలోపలే విసుక్కున్నాను. చాప్లిన్ అప్పటికే బాగా తాగి వున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. నాకు ఇష్టం లేకున్నా అతని బలవంతం మీద మరో పెగ్గును తాగటానికి ఒప్పుకున్నాను నేను. చాప్లిన్ మెదడులో అప్పటికే మందకొడితనం ఆవహించిందని గ్రహించాను. మర్యాద ప్రకారం, ఆనవాయితీ ప్రకారం తరువాతి రౌండులో మద్యానికి నేనే ఆర్డరివ్వాలి, నాకిష్టం ఉన్నా లేకపోయినా. అప్పుడు చాప్లిన్ లో వదరుబోతుతనం ప్రవేశిస్తుంది. తర్వాత అతని భార్య చూపులు కోపంతో నిండిపోవటం ఖాయం.

చాప్లిన్ ఆకారంలో లాగే లాసన్ ఆకారంలో కూడా ఎటువంటి ఆకర్షణా లేదు. అతడు కూడా సన్నగా చిన్నగా వుంటాడు. ముఖం కోలగా, చుబుకం చిన్నగా, ముక్కు పెద్దగా, కనుబొమల వెంట్రుకలు నల్లగా దట్టంగా వుంటాయి. ఈ ఆకార విశేషాలన్నీ అతని రూపానికి ఒక రకమైన వింత తరహాను ఆపాదించాయి. అతని కళ్లు చాలా నల్లగా పెద్దగా ఉంటాయి. ఆయన ఉల్లాసంగా కనిపిస్తాడు కాని, అది నిజమైన ఉల్లాసం కాదనిపిస్తుంది నాకు. అది ప్రపంచాన్ని మోసగించటం కోసం పైపైన అతడు ధరించే ముసుగు. అది అతనిలోని అల్పత్వాన్ని దాస్తున్నదనిపించింది. అతడు ఆహ్లాదంగా కనిపించినప్పటికీ, ఎందుకో కాని ఆ మనిషిలో కపటత్వం ఉందనుకునేవాణ్ని. తన బొంగురు కంఠంతో చాలా మాట్లాడేవాడు. చాప్లిన్, లాసన్ ఇద్దరూ తమ మందుపార్టీల గురించి చెప్పుకోవడంలో ఒకరినొకరు మించిపోతారు. ఇంగ్లిష్ క్లబ్ లో బాగా తాగిన రాత్రుల గురించీ, విపరీతంగా విస్కీ తాగుతూ వేటాడటం గురించీ, సిడ్నీకి వెళ్లినప్పుడు ఆ నగరంలో కాలు మోపిన దగ్గర్నుంచి తిరిగివచ్చే దాకా పూర్తిగా నిషాలో ఉండటం గురించీ వాళ్లు చెప్పుకునే ముచ్చట్లు అందరి నోళ్లలో గాథలుగా మారిపోయి ఇద్దర్నీ తాగుబోతులుగా మిగిల్చాయి. నాలుగు పెగ్గులు తాగింతర్వాత ఇద్దరికీ నిషా ఎక్కింది. కాని, ఇద్దరి తీరుల మధ్య చాలా భేదం వుంది. చాప్లిన్లో మొరటుతనం, నీచత్వం కనిపించగా, లాసన్ లో నిషా ఉన్నా సభ్యత కనిపించింది.

ఆఖరుకు లాసన్ కొంచెం తూలుతూ కుర్చీలోంచి లేచి, “నేను ఇంటికి వెళ్తున్నాను. సాయంత్రం మళ్లీ కలుస్తాను” అన్నాడు.
“మీ ఇంటావిడ బాగుందా?” అని అడిగాడు చాప్లిన్.

“ఆఁ”, అని వెళ్లిపోయాడు లాసన్. ఆ ఏకాక్షర సమాధానం కొంచెం వింతగా అనిపించడంతో నేను తలెత్తి చూశాను.

“మంచివాడు. నిజానికి చాలా మంచివాళ్లలో ఒకడు. కాని, పాపం బాగా తాగుతాడు. అతని మీద జాలి కలుగుతుంది” అన్నాడు చాప్లిన్, ఎటువంటి ఉద్వేగాన్నీ కనబరచకుండా.

చాప్లిన్ చేసిన ఈ వ్యాఖ్యలో కొంత హాస్యం లేకపోలేదు. తర్వాత మళ్లీ, “తాగిన మత్తులో వున్నప్పుడు లాసన్ ఎదుటివాడితో పోట్లాడాలనుకుంటాడు” అన్నాడు చాప్లిన్.

“అతడు తరచుగా నిషాలో వుంటాడా?” అని అడిగాను.

“విపరీతంగా. వారంలో మూడునాలుగు రోజులు చిత్తుగా తాగుతాడు. అతడట్లా మారటానికి ఈ ద్వీపమే కాక ఎతెల్ కూడా కారణం”

“ఎతెల్ ఎవరు?”

“ఆమె అతని భార్య. రెండు జాతుల మిశ్రమంగా పుట్టింది. ముసలి బ్రెవాల్డ్ కూతురు. భర్త ఆమెను తీసుకు పోయాడు కాని, అక్కడి పరిస్థితిని ఆమె తట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ భార్యాభర్తలిద్దరూ కలిసి వుంటున్నారు. ఏదో వొకరోజు తాగుడు మూలంగా కాకపోయినా మరే ఇతర కారణం చేత ఐనా ఉరేసుకుని చస్తాడు లాసన్. అతడు మంచివాడే కాని, తాగినప్పుడు మాత్రం భరించలేనంత అరాచకత్వం నిండుతుంది అతన్లో” అని చప్పుడు వచ్చేలా త్రేన్పు తీశాడు చాప్లిన్.

తర్వాత, “నేను పైకి వెళ్లి షవర్ కింద స్నానం చేస్తాను. ఆ చివరి పెగ్గును నేను తాగకుండా వుండాల్సింది. ఎప్పుడూ ఆ ఆఖరి పెగ్గే మనను బోల్తా కొట్టిస్తుంది” అన్నాడు. పైన వున్న స్నానాల గదిలోకి పోవాలని నిశ్చయించుకున్న అతడు కొంచెం సంశయిస్తూ మెట్లవైపు చూశాడు. తర్వాత అసహజమైన గాంభీర్యంతో లేచి నిలబడ్డాడు. మళ్లీ, “లాసన్ తో స్నేహం చేస్తే లాభమే. అతడు చాలా పుస్తకాల్ని చదివాడు. నిషాలో లేనప్పుడు ఎంత నెమ్మదిగా వుంటాడో! తల్చుకుంటే అది ఆశ్చర్యంగా వుంటుంది. చాలా తెలివైనవాడు కూడా. అట్లాంటి వాళ్లతో మాట్లాడితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది” అన్నాడు.

ఈ విధంగా లాసన్ గురించిన దాదాపు మొత్తం కథను కొన్ని వాక్యాల్లో నాకు చెప్పాడు చాప్లిన్.

సాయంత్రం నేను సముద్రతీరం వెంట వాహ్యాళికి పోయి హోటలుకు తిరిగివచ్చి చూస్తే, అక్కడ లాసన్ కనిపించాడు. ఏ ఉద్వేగమూ లేని కళ్లతో లాంజ్ లోని పేముకుర్చీలో బాగా లోపలికి కూరుకుపోయినట్టుగా కూర్చుని వున్నాడు. మధ్యాహ్నం నుండి మద్యం తాగుతూనే వున్నట్టు అనిపించింది అతని వాలకం చూస్తే. అతనిలో మందకొడితనం కనిపించింది. చూపుల్లో వ్యాకులతా, ప్రతీకారభావంతో కూడిన కోపమూ ఉన్నాయని గ్రహించాను. ఒక్క క్షణం నా మీద దృష్టిని నిలిపాడతడు. కాని, నన్నతను గుర్తు పట్టినట్టు లేదు. అక్కడ పక్కనే డోమినో అనే పాచికల ఆట ఆడుతున్న ఇద్దరుముగ్గురు పురుషులు అతణ్ని చూడనట్టుగా తమ పనిలో మునిగిపోయారు. అతని వాలకంలోని ఆ సాదాసీదాతనమే అందుకు కారణం. నేను కూడా వాళ్లతో కలిసి ఆ ఆట ఆడటం మొదలు పెట్టాను.

“మీరు చాలా కలుపుగోలు మనిషి” అన్నాడు నా పక్కన వచ్చి కూచున్న లాసన్ అకస్మాత్తుగా.

అతడు కుర్చీలోంచి లేచి, వంగిన మోకాళ్లతో కొంచెం కుంటుతున్నట్టుగా తలుపువైపు నడిచాడు. మా ఆటా, ఆ వాతావరణం అతనికి హాస్యాస్పదంగా కనించాయా అనిపించింది. లాసన్ అక్కణ్నుంచి కదలగానే, ఆటాడుతున్నవారిలో ఒకడు కిసుక్కున నవ్వి “ఇవ్వాళ్ల బాగా తాగి వున్నాడు ఆయన” అన్నాడు.

మరొకడు, “తాగి కూడా అతనిలాగా నింపాదిగా ఉండలేకపోతే అసలు తాగకపోవడమే మంచిదనిపిస్తుంది” అన్నాడు.

ఆ నిర్భాగ్యుడు నిజానికి ఒకరకంగా ప్రేమ నిండిన వాడిలాగానే ఉన్నాడనీ, కాని విషాదాన్ని తలపింపజేయడానికి అవసరమైన దీనత్వమూ భయమూ అతని జీవితంలో ఉన్నాయనీ ఎవరూహిస్తారు?

తర్వాత రెండుమూడు రోజుల వరకు లాసన్ కనపడలేదు.

ఒకరోజు సాయంత్రం వేళ నేను హోటల్ మొదటి అంతస్తులోని వరండాలో కూచుని వున్నాను. అక్కణ్నుంచి హోటల్ ముందరి వీధి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు లాసన్ వచ్చి నా పక్కన వున్న కుర్చీలో కూర్చున్నాడు. అతనిలో నిషా వంటిది ఎంతమాత్రం లేదు, చాలా నెమ్మదితనం వుంది. యధాలాపంగా నాతో యేదో అన్నాడతడు. నేను కొంచెం ఉపేక్షతో జవాబిచ్చేసరికి సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టుగా నవ్వుతూ “మొన్న నేను విపరీతంగా తాగి నిషాలో వున్నాను” అన్నాడు.

నేను జవాబివ్వలేదు. నిజానికి అనటానికి ఏమీ లేదు కూడా. చుట్ట తాగుతున్న నేను దోమల్ని తరమటం కోసం పొగను నోటితో చుట్టూ ఊదాను. అక్కడి స్థానిక కూలీలు పని ముగించుకుని హోటలు ముందరి రోడ్డు మీదుగా తమ యిళ్లకు తిరిగి వెళ్తుండటం చూశాను. వాళ్లు పెద్దపెద్ద అంగలతో మెల్లగా, జాగ్రత్తగా, హుందాగా నడుస్తున్నారు. చెప్పులు లేని పాదాలతో వాళ్లు నడుస్తుంటే వింతైన శబ్దం వస్తోంది. వాళ్ల వెంట్రుకలు సాధారణంగా మెలితిరిగి కాని, వంపు లేకుండా కాని నల్లగా ఉంటాయి. అప్పుడు మాత్రం వాళ్ల వెంట్రుకలు తెల్లని పొడితో నిండి ఒక అసాధారణమైన ప్రత్యేకతను కనబరుస్తున్నాయి. వాళ్లు దృఢమైన శరీరాలతో పొడవుగా ఉన్నారు. వాళ్ల తర్వాత సాల్మన్ ద్వీపానికి చెందిన కాంట్రాక్టు కూలీల గుంపొకటి పాటలు పాడుకుంటూ వెళ్లింది. వాళ్లు బొగ్గులాంటి కారు నలుపుతో, ఎర్రరంగు వేసుకున్న వెంట్రుకల్తో, పెద్దపెద్ద తలలు కలిగిన సమోవా ద్వీపవాసులకన్న పొట్టిగా, చిన్నగా ఉన్నారు. మధ్యమధ్య తెల్ల జాతీయులు తమ గుర్రపు బగ్గీల్లో రోడ్డు మీదుగా పోవటమో లేక హోటలు ప్రాంగణంలోకి రావటమో చేస్తున్నారు. ఎదురుగా వున్న ప్రశాంతమైన సముద్రపు నీళ్లలో నిలిచి వున్న రెండుమూడు ఓడలు తమ సొగసును కనబరుస్తున్నాయి.

“ఇట్లాంటి ప్రదేశంలో ఫుల్లుగా తాగటం తప్ప చేయటానికి పనేమి ఉంటుందో తెలియదు నాకు” అన్నాడు ఆఖరుకు లాసన్.
ఏదో అనాలి కదా అనుకుని “సమోవా ద్వీపం మీకు నచ్చలేదా?” అన్నాను.

“ఈ ద్వీపం అందంగానే వుంటుంది” అన్నాడతడు.

ఆ వాక్యం సమోవా ద్వీపపు అద్భుతమైన అందాన్ని వర్ణించడానికి ఎంతమాత్రం సరిపోలేదనిపించింది. నేను నవ్వి అతనివైపు తిరిగాను. అతని కళ్లలో భరించలేనంత ఆవేదన కనిపించింది. వాటిలో అనంతమైన విషాదపు లోతులున్నాయి. అటువంటి భావోద్వేగాన్ని అతడు చూపగలడని నేను అసలే ఊహించలేదు. కాని, అతని ముఖంలోని ఆ భావం వెంటనే మాయమై అతడు నవ్వాడు. ఆ నవ్వు సాదాసీదాగా, కొంచెం అమాయకంగా వుంది. దాన్తో అతని ముఖకవళిక మారింది. దాని మూలంగా నాలో అతని పట్ల మొదటిసారిగా కొంత విముఖత ఏర్పడింది.

“నేనిక్కడికి వచ్చిన కొత్తలో ఊరంతా తిరిగేవాణ్ని” అని ఒక్క క్షణం సేపు మౌనంగా ఉండిపోయాడు లాసన్. తర్వాత మళ్లీ, “మూడు సంవత్సరాల పాటు ఈ ద్వీపాన్ని వదిలి దూరంగా ఉన్నాను. కాని, తర్వాత తిరిగివచ్చాను” అన్నాడు. ఆ పైన కొంచెం తటపటాయించి “మళ్లీ ఇక్కడికే రావాలని నా భార్య పట్టుబట్టింది. ఆమె ఇక్కడే పుట్టిందని మీకు తెలుసు కదా” అన్నాడు.

“ఔను, తెలుసు” అన్నాను.

అతడు మళ్లీ మౌనం వహించాడు. తర్వాత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ గురించి ఏదో వ్యాఖ్య చేశాడు. “మీరు వైలిమాకు వెళ్లారా?” అని అడిగాడు. ఏదోవిధంగా నాతో కలుపుగోలుగా వుండాలని ప్రత్నం చేస్తున్నాడతడు. స్టీవెన్సన్ పుస్తకాల గురించి మాట్లాడాడు. తర్వాత సంభాషణ లండన్ నగరం మీదికి మళ్లింది.

“అక్కడి కావెంట్ గార్డెన్స్ ఇంకా అట్లానే ఉత్తేజకరంగా ఉన్నాయనుకుంటాను. ఆ సంగీత నాటకాలను నేనిక్కడ యెంతగానో మిస్సవుతున్నాను. ట్రిస్టాన్ అండ్ ఐలోడ్ అనే నాటకాన్ని చూశారా మీరు?” అని అడిగాడు.

ఆ ప్రశ్నకు జవాబు తనకెంతో ముఖ్యమైనది అన్నట్టుగా అడిగాడు. “చూశాను” అని నేను ముక్తసరిగా చెప్పగానే సంతోషాన్ని కనబరిచాడు. వాగ్నర్ సంగీతం గురించి మాట్లాడాడు. ఒక సంగీతపరుడిలా కాక, మామూలు మనిషిలా మాట్లాడాడు. వాగ్నర్ సంగీతం ద్వారా ఒక రకమైన మానసిక తృప్తిని పొందాననీ, కాని దాన్ని వివరించలేననీ అన్నాడు.

“నాకు అంతగా డబ్బూ అదృష్టమూ లేవు కాని, బేర్సూత్ నిజంగా చూడాల్సిన ప్రదేశం. కాని, అది కావెంట్ గార్డెన్సంత బాగా ఉండదనుకోండి. ఆ సంగీత నాటకశాలలో అద్భుతమైన తళతళల వెలుతురూ, మెడకింది దాకా దుస్తుల్ని ధరించిన స్త్రీలూ, ఇంకా ఆ శ్రావ్యమైన సంగీతమూ ఎంతో బాగుంటాయి. వాక్యూర్స్ నాటకంలోని మొదటి అంకం చాలా బాగుంటుంది కదా. ఇక ట్రిస్టాన్ నాటకంలోని చివరి ఘట్టమైతే అద్భుతం. ఆహా, ఎంత దివ్యంగా ఉంటుందో!” అన్నాడు.

ఈ మాటలు చెప్తుంటే అతని కళ్లలో మెరుపు కనిపించింది. ముఖం దీప్తితో వెలిగిపోయి, అతడు అంతకుముందు కనిపించిన మనిషి కాదనిపించింది. తెల్లని చెక్కిళ్లు ఎరుపు రంగును పులుముకున్నాయి. అంతకు ముందు అతని గొంతు బొంగురుగా, కొంచెం వికృతంగా ఉండిన సంగతి మరచిపోయాను. కొంత ఆకర్షణీయంగా కూడా కనపడ్డాడతడు.

“దేవుని తోడు, ఈ రాత్రి లండన్లో ఉండాలనిపిస్తోంది నాకు. అక్కడి పాల్ మాల్ రెస్టారెంట్ మీకు తెలుసు కదా. అందులోకి నేను చాలా సార్లు పోయేవాణ్ని. ఇక పికాడిలీ సర్కస్ దగ్గర దుకాణాలన్నీ వెలుగుతో నిండిపోయి, అక్కడ జనంతాలూకు రద్దీతో యెంతో కోలాహలంగా వుంటుంది. అక్కడ నిల్చుని ఒక్క క్షణం కూడా తెరిపి లేకుండా వచ్చే పోయే బస్సులనూ టాక్సీలనూ చూస్తుంటే ఆనందంతో దిమ్మ తిరిగిపోతుంది. భగవంతుని గురించీ, చేరింగ్ క్రాస్ గురించీ రాయబడిన ఆ పంక్తులు గుర్తున్నాయా మీకు?” అని అడిగాడు లాసన్. నాకు చెప్పరానంత ఆశ్చర్యం కలిగింది.

“థామ్సన్ రాసిన పంక్తులా?” అని అడిగాను. తర్వాత ఆ పంక్తుల్ని చదివాను ఇలా -

‘అంతులేని విషాదం నిన్ను ఆవరించినప్పుడు
అప్పుడు -
స్వర్గానికీ చేరింగ్ క్రాస్ కూ మధ్య వున్న జనాల జేకబ్ నిచ్చెన
ఆ ప్రజాసమూహం వెల్తురుతో తళతళా మెరుస్తుంది’

లాసన్ చిన్నగా నిట్టూర్చాడు.

“దహౌండ్ ఆఫ్ హెవెన్ చదివాను నేను. అది బాగుంది” అన్నాడు.

“సాధారణంగా అందరూ అట్లానే అంటారు” అని గొణిగాను.

“ఇక్కడ పుస్తకాలు చదివేవాళ్లెవరూ కనపడరు. చదవటం అనేది అట్టహాసం అనుకుంటారు వీళ్లు”

అతని ముఖంలో బెంగ నిండిన చూపు కనపడింది. నా దగ్గరికి రావాలని అతడెందుకనుకున్నాడో ఊహించాను. తాను కోల్పోయిన ప్రపంచాన్ని, మళ్లీ అనుభవించలేని జీవితాన్ని నాకూ తనకూ మధ్య వున్న లంకెగా భావించాడు. ఎందుకంటే అప్పటికి కొంత కాలం క్రితమే నేను లండన్లో ఉండి వచ్చాను. అందుకు గాను నాపట్ల సంభ్రమం నిండిన ఆశ్చర్యం, అసూయా కలిగాయి అతనికి. ఐదు నిమిషాల వరకు అతడు ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఉద్రేకం నిండిన తీవ్రతతో “నేనిక్కడ విసిగిపోయాను, బాగా విసిగిపోయాను” అన్నాడు. ఆ మాటలకు నేను చలించిపోయాను.

“అయితే మరి నువ్వెందుకు ఇక్కణ్నుంచి వెళ్లిపోవు?” అని అడిగాను.

“నా ఊపిరితిత్తులకు చిన్న వ్యాధి వచ్చింది. ఇంగ్లండులోని చలికాలాన్ని నేనిప్పుడు తట్టుకోలేను”

ఆ సమయంలో మరొక వ్యక్తి ఆ వరండాలోకి రావడంతో లాసన్ మళ్లీ మౌనంలోకి కూరుకుపోయాడు.

“ఇది మందు తాగాల్సిన సమయం. ఎవరు నాతో కలిసి కొంచెం విస్కీ తాగుతారు? నువ్వేమంటావు లాసన్?” అన్నాడు అప్పుడే వచ్చిన వ్యక్తి.

లాసన్ వేరే లోకంలోంచి బయటికి వచ్చినట్టనిపించాడు. అతడు కుర్చీలోంచి లేచి, “కింద వున్న బార్లోకి పోదాం పద” అన్నాడు. వాళ్లిద్దరూ వెళ్లిపోయారు.

లాసన్ పట్ల నాకు సానుభూతి భావం కలిగింది. అతడంటే ఆసక్తి, కలవరం ఏర్పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత నేనతని భార్యను కలిశాను. వాళ్ల పెళ్లి జరిగి ఐదారేళ్లు కావస్తుందని తెలిసింది. కాని, ఆమె యింకా చాలా చిన్న వయసున్న స్త్రీలాగా కనిపించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. లాసన్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె వయసు పదహారేళ్లకన్న యెక్కువ లేదు.
అప్పుడామె అద్భుతమైన అందంతో వెలిగిపోయేది. చామనచాయతో, చిన్నచిన్న చేతులతో, పాదాలతో, తీగలాంటి అతి సన్నని శరీరంతో చాలా ముద్దొచ్చేది. మిశ్రమ జాతికి చెందిన స్త్రీలు సాధారణంగా లావుగా, మోటుగా వుంటారు. కాని, లాసన్ భార్యలోని కోమలత్వం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ సౌకుమార్యాన్ని చూస్తుంటే ఊపిరి తీసుకోవడం మానేసి నోరు తెరుస్తాము. చాలా నాగరికంగా కనిపించే ఆమె అటువంటి ప్రాంతంలో ఉండటం ఆశ్చర్యకరమే. మూడవ నెపోలియన్ దర్బారులోని అందాల రాశులు గుర్తుకొస్తారు ఆమెను చూస్తే. ఫ్రాకు, హ్యాటు ధరించే ఆమెలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తుంది. లాసన్ ఆమెను మొదటిసారిగా చూసినప్పుడు ఆమెలో కళ్లు మిరుమిట్లు గొలిపే అందం, మనోహరత్వం ఉండివుంటాయి.

లాసన్ ఈ మధ్యనే సమోవా ద్వీపంలోని ఒక బ్యాంకులో మేనేజరుగా పని చేయడానికి ఇంగ్లండు నుండి వచ్చాడు. అది వేసవి కాలపు ప్రారంభం. అతడు హోటల్లో ఒక గదిలో ఉంటున్నాడు. వచ్చిన కొత్తలో వెంటనే అక్కడి మనుషులందరితో పరిచయం చేసుకున్నాడు. ఆ ద్వీపపు వాతావరణం హాయిగా వుంటుంది. అక్కడి జీవితంలో నెమ్మదితనం ఉండటం ఒక విశేషం. ఆ హోటల్లోని లాంజ్ లో తీరికగా, బద్ధకంగా సాగే పిచ్చాపాటీ అన్నా, సాయంత్రాల్లో కొందరు వ్యక్తులు ఇంగ్లిష్ క్లబ్ లో ఆడే బిలియర్డ్స్ ఆటను చూడటమన్నా అతనికి యెంతో ఇష్టం. సముద్రతీరం వెంబడి పొడవుగా వ్యాపించి వున్న ఏపియా పట్టణాన్నీ, అక్కడి బంగళాలనూ, పక్కనే వున్న గ్రామ వాతావరణాన్నీ అతడు ఇష్టపడతాడు. వారాంతపు రోజుల్లో ఊరిబయట కొండల మీద రైతుల ఫామ్ హౌజులకు పోయి, ఒకటిరెండు రాత్రులు అక్కడ గడిపి వస్తాడు లాసన్. ఇంగ్లండులో వున్నప్పుడు తీరిక, స్వేచ్ఛ అన్నవి తెలియవు అతనికి. సమోవా ద్వీపంలో పుష్కలంగా సోకే సూర్యరశ్మి అతణ్ని ముగ్ధుణ్ని చేసింది. ఊరిబయటి పొదల మధ్యలోంచి పోతున్నప్పుడు చుట్టుపక్కల వున్న ప్రకృతి అందాన్ని చూసి అతని తల ఆనంద పారవశ్యంతో ఊగుతుంది. ఆ ద్వీపంలోని భూమి వర్ణించలేనంత సారవంతమైనది. ఒకదానితో మరొకటి పెనవేసుకున్న రకరకాల వింతవింత చెట్లతో, నేల నిండా దట్టంగా పరచుకున్న చిన్నచిన్న మొక్కలతో తీగలతో అడవి స్వచ్ఛంగా, మనోహరంగా ఉంటుంది. అవన్నీ అగోచరత్వంతో కూడి, హృదయాన్ని కదిలించి ఇబ్బంది పెట్టే దృశ్యాలు.

ఇంకా ఉంది…
-----------------------------------------------------------
ఆంగ్ల మూలం: The Pool - సోమర్సెట్ మామ్
అనువాదం: ఎలనాగ
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Friday, August 24, 2018

వెన్నెల రేయి(అనువాదకథ)


వెన్నెల రేయి(అనువాదకథ)
సాహితీమిత్రులారా!

ఈ ఫ్రెంచి అనువాదకథను ఆస్వాదించండి-

పాస్టర్ మారిగ్నాన్ అన్న పేరులో మొదటి భాగం మాత్రమే సరిగ్గా సరిపోతుందతనికి. పొడుగ్గా వుంటాడు. మూఢ భక్తి, చిరచిర లాడే గుణం వున్నా నీతి బద్ధంగా వుండే మనిషి. దేవుడి మీద అతని నమ్మకం స్థిరమైనది. దేవుడి ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ తనకి అర్థంమౌతాయని అతని విశ్వాసం

తన ఇంటి దగ్గర తోటలో, అప్పుడప్పుడు వడివడిగా అడుగులేసుకుంటూ నడుస్తూ తనలో తను చర్చించుకుంటాడు – “దేవుడు ఇదంతా ఎందుకు చేసినట్లు?” అని.

అదే విషయం గురించి తీవ్రంగా ఆలోచించి, దేవుడి స్థానంలో తననే వుంచుకోని చివరికెలాగో సమాధానం తెలుసుకుంటాడు. ఏనాడు అతను భక్తితో, వినయంతో “దేవా నీ అద్భుతాలు అర్థం కావు కదా” అనడం జరగలేదు.

“దేవుడి సేవకుణ్ణి నేను. దేవుడు చేసే పనులు నాకు తెలియకుండా ఎలా వుంటాయి. తెలియకపోయినా ఊహించగలను కదా” అని తనకి తాను చెప్పుకుంటాడు.

సృష్టిలో వున్న ప్రతిదీ ఒక నిర్దిష్టమైన అవసరం కోసం ఆలోచించి చేయబడ్డదే అని నమ్ముతాడు. “ఎందుకు” అన్న ప్రశ్నకు “ఎందుకంటే” అన్న సమాధానం వుంటుందని నమ్ముతాడు. సూర్యోదయం ప్రశాంతంగా ఎందుకుంటుంది? మనం మేల్కొనగానే ఆనందించేందుకు. అలాగే పగలు ఎండ కాయల్ని పండ్లుగా పండించడానికీ, వాన వాటిలో తేమ నింపడానికి, సాయంత్రాలు నిద్రకు సిద్ధమవడానికి, చీకటి రాత్రులు నిద్రపోవడానికి సృష్టించబడ్డాయని అంటాడు.

నాలుగు కాలాలు సరిగ్గా వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వుంటాయి అని నమ్ముతాడు. అసలు ప్రకృతి ఒక ఉద్దేశ్యాన్ని అనుసరించి ఎలా పని చేస్తుంది? ప్రపంచంలో ఏదైనా ప్రకృతికి నియమాలకు లోబడి వుండాలి కదా? కానీ అలాంటి అలోచన అతనికి ఎప్పుడూ రాలేదు.

ఆడవాళ్ళంటే పడదతనికి. అసహ్యించుకునే వాడు. వాళ్ళని దూరంగానే వుంచేవాడు. క్రీస్తు చెప్పిన మాటలు – “అమ్మా, నాతో మీకేమి పని?” అంటుంటాడు. పైగా – “బహుశా దేవుడికి అతని సృష్టిలో నచ్చనిది ఆడదేనేమో” అంటాడు. మొగవాణ్ణి తప్పుదోవ పట్టించే మోసగత్తెలు మగువలేననీ, అలా దారి మళ్ళించాక ఎప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తూ వుంటారని అతని నమ్మకం. చూడటానికి సుకుమారంగా కనిపించే అత్యంత ప్రమాదకారులనీ అనుకుంటాడు. పాపానికి దోహదంచేసే వాళ్ళ శరీరాలకన్నా ప్రేమకు కారణమయ్యే వాళ్ళ హృదయాలని ఎక్కువగా ద్వేషించేవాడు.

స్త్రీల మృదుస్వభావం చాలాసార్లు ఆయన అనుభవంలోకి వచ్చేది. అతనెప్పుడూ వాటికి లొంగిపోలేదు. పైగా అలాంటి అనుభవాలు, ప్రకంపనకు గురి చేసే ప్రేమలాంటి అనుభూతులు అతనిలో కోపాన్ని పెంచేవి.

మొగవాణ్ణి మభ్యపెట్టి, పరీక్షలకు లోను చేసేందుకే దేవుడు ఆడదాన్ని సృష్టించాడని అతని నమ్మకం. మగవాడు తనని తాను సంరక్షించుకోడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోకుండా, ఆడవారిని బంధించే ఉచ్చు లాంటిదేదీ లేకుండా వాళ్ళ దగ్గరకు వెళ్ళనేకూడదంటాడు. అసలు ఆడదంటేనే ఒక ఉచ్చు. చేతులు చాపి, పెదవులను ఎరగా వేసి బంధించే ఉచ్చు. ఇదీ అతని అభిప్రాయం.

ఆయనతో పాటు వుండే సన్యాసినులైన నన్స్ తో తప్ప వేరే ఏ స్త్రీలతోనూ ఆయనకు చనువు లేదు. వాళ్ళంతా చేసిన ప్రతిజ్ఞల కారణంగా నిరపాయకరంగా వుండే వాళ్ళు. అయినా కూడా వాళ్ళతో చాలా తీవ్రంగా ప్రవర్తించేవాడు. ఎందుకంటే నిర్బంధంగా బ్రతికే వాళ్ళ జాలి గుండెల్లో కూడా ఏదో ఒక మాయ చేసే మృదుత్వం వుంటుందని. అది ఫాదర్ గా వున్న తన మీద కూడా ప్రదర్శిస్తారేమో అన్న అనుమానం ఆయనకి వుంది.

అలాంటి మాయ చేసే మృదుత్వాన్ని ఆయన తరచుగా గుర్తించేవాడు. వాళ్ళ విధేయతలోనూ, ఆయనతో మాట్లాడేటప్పుడు మంద్రంగా పలికే వాళ్ళ గొంతులోనూ, కిందకు దించిన కళ్ళలోనూ, ఆయన చీవాట్లు పెట్టినప్పుడు వాళ్ళు పెట్టే కన్నీళ్లలోనూ ఆ మాయ చేసే మృదుత్వాన్ని చూడగలడాయన. అలాంటి సందర్భంలో ఆయన తన నల్లటి గౌనుని విదిలించుకుంటూ, పెద్ద పెద్ద అంగలువేసుకుంటూ ఆ మఠం బయటికి ఏదో ప్రమాదం నుంచి పారిపోతున్నట్లు పరిగెత్తేవాడు.

ఆయనకి ఒక మేనకోడలు వుంది. ఆమె వాళ్ళమ్మతో కలిసి దగ్గర్లోనే వుంటుంది. ఆమెను ఎలాగైనా సిస్టర్స్ ఆఫ్ ఛారిటీలో సన్యాసినిగా చెయ్యాలని ఆయన ప్రయత్నం.

ఆ అమ్మాయి చక్కగానే వుంటుంది కానీ ఆమెకు కాస్త తిక్క వుంది. పాస్టర్ ప్రసంగాలలో ఆమె నవ్వుతుంటుంది. ఆయన కోప్పడితే గట్టిగా హత్తుకుంటుంది. అలాంటప్పుడు వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అతనిలో ఎక్కడో దాగి వున్న వాత్సల్యం ఆ అమ్మాయి పట్ల పొంగుకొచ్చేది.

ఎప్పుడైనా ఆ ఊరి వీధుల్లో ఆమెతో కలిసి నడిచేటప్పుడు ఆమెతో దేవుడి గురించి మాట్లాడేవాడు. తన దేవుడి గురించి. ఆమె ఎప్పుడూ అతను చెప్పేది వినేది కాదు. ఆకాశం వైపు చూసేది, గడ్డి వంక, పూల వంక చూసేది. గమనిస్తే ఆమె కళ్ళ మెరుపులో జీవితపు ఆనందం అంతా కనిపించించేది. ఒకోసారి గాల్లో ఎగురుతున్న ఏ కీటకాన్నో అందుకోవాలని ముందుకి ఉరికేది. దాన్ని పట్టుకోని తిరిగి వచ్చేటప్పుడు – “చూడు మామయ్యా ఎంత ముద్దుగా వుందో ఇది. చూస్తే గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తోంది” అనేది.

ఇలా పురుగుల్ని ముద్దు పెట్టుకోవడం, విరబూసిన పూలని హత్తుకోవడం అతనికి చికాకుని, కోపాన్ని తెప్పించేవి. అలాంటి చర్యలలో కూడా ఒక ఆడపిల్ల మనసులో వుండే ఆ మృదుత్వాన్ని గుర్తించేవాడు.

ఒకరోజు చర్చిలో శవాల పనిచేసే అతని భార్య వచ్చి ఫాదర్ తో, భయపడుతూనే ఒక విషయం చెప్పింది. ఆయన మేనకోడలు ఎవర్నో ప్రేమిస్తోందని.

ఆ వార్త అతనిలో రగిల్చిన ఒత్తిడి, భయం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అతనప్పుడు షేవింగ్ చేసుకునేందుకు ముఖానికి సోప్ రాసుకున్నాడు. అది అలా వదిలేసి శిలలా నిలబడిపోయాడు.

కాస్సేపటికి తేరుకున్నాక ఆలోచన, మాట రెండూ వచ్చాయి. “పచ్చి అబద్ధం చెప్తున్నావు నువ్వు మెలైన్” అంటూ అరిచాడు.

కానీ ఆమె మాత్రం తన చేతిని గుండె మీద వేసుకోని చెప్పింది – “అయ్యగారూ, నేను గానీ అబద్దం చెప్తే ఆ ప్రభువే నన్ను దండిస్తాడు. చెప్తున్నా వినండి. రోజూ రాత్రిపూట మీ చెల్లెలు పడుకోగానే ఈమె గారు వెళ్తున్నారు. నది ఒడ్డున కలుస్తారు ఇద్దరూ. మధ్యరాత్రి పదిపన్నెండు గంటలకు వెళ్ళి చూడండి కావాలంటే”.

గడ్డం చేసుకోవడం సంగతి మర్చిపోయాడతను. మెట్లపైకీ కిందకీ వడివడిగా తిరిగాడు. బాగా ఆలోచించేటప్పుడు అలాగే చేస్తాడతను. తిరిగివచ్చి గడ్డం చేసుకుంటూ ముక్కు నుంచి చెవి దాకా మొత్తం మూడుసార్లు గాట్లు పెట్టుకున్నాడు.

రోజంతా మౌనంగా వుండిపోయాడు. కోపం. అపనమ్మకం. ఆయనకు మొదటి నుంచి ప్రేమలంటే వున్న కోపం కారణంగా తన పెంపకం విఫలమైందన్న భావన మరింత తీవ్రమైంది. తండ్రి లాంటి వాడిగా, పెంచిన వాడిగా, ఒక చర్చి ఫాదర్ గా ఆ పిల్ల చేత మోసగించబడ్డాడన్న భావన కలిగింది. ఎవరైన తల్లిదండ్రులకు తమ కూతురు తమ ప్రమేయం లేకుండానే భర్తని ఎంచుకుంటే కలిగే భావనే అతనికి కూడా కలిగింది.

రాత్రి భోజనం అయిపోయిన తరువాత ఏదైనా చదువుదామని అనుకున్నాడు కానీ కోపం అంతకంతకూ పెరుగుతుండటంతో ఏమీ చదవలేకపోయాడు. రాత్రి పది గంటలు అవుతూనే తనకి బాగా అలవాటైన చేతికర్రని అందుకున్నాడు. రోగగ్రస్థులు వుండే ఇంట్లో ప్రార్థనలు చెయ్యడానికి రాత్రిళ్లు వెళ్ళాల్సివస్తే ఆ టేకు కర్ర తీసుకెళ్ళడం ఆయనకు అలవాటు. దృఢంగా వున్న ఆ కర్ర వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, తన పిడికిలితో బలంగా పట్టుకున్నాడు. ఉన్నట్టుండి దాన్ని పైకెత్తి పళ్లు కొరుకుతూ కుర్చీని కొట్టాడు. ఆ దెబ్బకి ఆ పాత కుర్చీ వెనుక భాగం విరిగి నేల మీద పడింది.

వాకిలి తలుపులు తెరిచి బయటికి అడుగుపెట్టాడు. గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అద్భుతమైన వెన్నెల. అతనికి ఎప్పుడో అరుదుగా తప్ప ఆ సౌందర్యాన్ని చూసే అవకాశం రాదు కదా!

కవులకు వున్నట్లే ఆయనకి కూడా అలాంటివి చూసి స్పందించే గుణం వుంది. అందుకే ఆ చర్చి ఫాదర్ మనసు అద్భుతమైన, ప్రశాంతమైన ఆ దృశ్యం వైపు కాస్సేపు మళ్ళింది.

ఆయన తోట మొత్తం సన్నని వెన్నెల వెలుగులో స్నానం చేస్తున్నట్లు వుంది. పండ్లచెట్లు తమ పొడుగాటి నీడలని నేల పైన పరుస్తున్నాయి. వాటికి వున్న కొమ్మలు, ఆ కొమ్మలకు పల్చగా వున్న ఆకులు కలిసి వెలుగు నీడల బొమ్మలు గీస్తున్నాయి. గోడమీదకి పాకిన పూల తీగ తీయటి వాసనలని వెదజల్లుతూ ఆ వెన్నెల వెలుగుకి అత్తరు సొబగులు అద్దుతోంది.

ఆయన గట్టిగా గాలి పీల్చడం మొదలుపెట్టాడు. ఒక తాగుబోతు వైన్ తాగినట్లు ఆ గాలిని ఆయన తాగడం మొదలుపెట్టాడు. నడక సాగించాడు. నెమ్మదిగా, ఆశ్చర్యపోతూ, ఆహ్లాదాన్ని అనుభవిస్తూ – దాదాపుగా తన మేనకోడలిని మర్చిపోయినట్లుగా నడవసాగాడు.

తోట బయటకు వచ్చి చూస్తే నిర్మలమైన రాత్రిలో వెన్నెలతో అభిషిక్తమౌతున్న నేల కనిపించింది. కనుచూపుమేరలో వున్న భూమంతా వెలుగుతో సరసాలాడుతూ, రమణీయమైన ఆ కాంతిలో లీనమైనట్లు కనిపించింది. కీచురాళ్ళ శబ్దం ఒక నిర్దుష్టమైన నాదంతో పలికినట్లు ఆగి ఆగి వినిపిస్తోంది. దూరంగా ఎక్కడో చకోర పక్షి తన సంగీత జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటోంది. అదంతా కలిసి ఒక మధురమైన కచేరిలా వుంది. కలల్లోకి జార్చగలిగిన సంగీతం. చంద్రుడి వెన్నెలనే మరులుగొల్పగలిగిన సుమధుర గానం.

పాస్టర్ ముందుకే నడిచాడు. అతని హృదయంలో అలజడి ఎందుకు కలుగుతోందో అతనికే తెలియలేదు. ఉన్నట్టుండి నీరసించిపోయాడు. శరీరంలో శక్తి మొత్తం ఆవిరైపోయినట్లు అనిపించింది. ఎక్కడైనా కూర్చోని, కాస్త సేదతీరి భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచం గురించి ఆలోచించాలని అనిపించింది.

అక్కడికి కాస్త దూరంలో నది వెంబడే నిలబడి వున్నాయి బూరుగు చెట్లు. సన్నటి మంచు తెల్లటి పరదా కప్పుతుంటే అందులో నుంచి ప్రసరిస్తున్న చంద్ర కాంతి ఆ మంచుని వెండి రెంగులోకి వెలిగిస్తోంది. దూరంగా వున్న పర్వతాలను, వాటి పైనెక్కడో మొదలైన నది కిందకి జారే కఠినమైన మార్గాన్ని, పల్చటి పత్తి కప్పినట్లుగా, తెల్లటి కాంతి కమ్మేసింది.

పాస్టరు మళ్ళీ ఆగిపోయాడు. అతని అంతరాంతరాలలో క్రమంగా ఒకలాంటి మృదుత్వం అనివార్యంగా విస్తరిస్తోంది.

ఒక అనుమానం, అర్థం కాని కలవరం అతనిని ఆక్రమించింది. అతను తరచుగా ప్రశ్నించుకునే విషయం మళ్ళీ జ్ఞప్తికి వచ్చింది.

“దేవుడు ఇదంతా ఎందుకు సృష్టించాడు? రాత్రి వున్నది నిద్రకోసమే కదా? స్పృహ లేకుండా, ప్రపంచాన్ని విస్మరించి విశ్రమించడానికే కదా? మరి రాత్రిని పగటికన్నా మనోహరంగా ఎందుకు చేశాడు? సంధ్యాసమయాల కన్నా ఆహ్లాదకరంగా ఎందుకు కూర్చాడు? సొగసుగా వుంటూనే నిగూఢమైన ఈ ప్రపంచాన్ని వెలుగులతో నింపడానికే కదా సూర్యుడు వున్నాడు? ఎంత టక్కరిదీ భూమి? వెలుగుని కాదని పారదర్శకంగా వున్న ఈ నిశీథిసుందరిని ఎందుకు ప్రేమించింది?

రెక్కలున్న అద్భుత గాయకుడు అందరిలా ఎందుకు నిద్రపోవటంలేదు? ఎందుకు తన కుహుకుహు రవాల గళాన్ని నిగూఢ నిశీధిలోకి వొంపుతున్నాడు?

“ప్రపంచం పైన ఈ మేలి ముసుగు ఎందుకు? హృదయం ఇలా కంపించడం ఎందుకు? ఆత్మకు భావుకత ఎక్కడిది? శరీరానికి ఎందుకు ఈ దౌర్భల్యం కలుగుతోంది? అందరూ నిద్రలో జోగుతూ కనీసం వీటి వైపు చూడనైనా చూడలేని సమయంలో ఇంత ఇంద్రజాలం ఎందుకు జరుగుతోంది? ఈ మనోహరమైన అద్భుతం, ఈ అద్వితీయమైన కవితాఝరి ఎవరికోసం దివి నుంచి ఇలకు జాలువారుతోంది?”

ఆయన అర్థం చేసుకోలేకపోయాడు.

అదిగో, అక్కడ చూడు. ఆ పచ్చిక నేల చివర, చెట్లు చిత్రంగా కల్పించిన పైకప్పు కింద, మెరుస్తున్న మంచులో తడుస్తూ ఎవరో ఇద్దరు పక్కపక్కనే నడుస్తున్నారు.

అతను ఆమె కన్నా పొడగరి. తన ప్రియురాలి మెడ చుట్టూ చేతిని వేసి పదే పదే ఆమె కనుబొమ్మల మధ్య ముద్దు పెడుతున్నాడు. ఐహికమైన జీవితంలో నుంచి వారిద్దరినీ మాయం చేసి కళాకృతిలా కనిపిస్తున్న ఆ దృశ్యంలోకి ఏ దైవ హస్తమో చేర్చినట్లుగా అనిపిస్తోంది. వారిద్దరూ ఇద్దరిలా కాక ఒకే ఆత్మలా కనిపిస్తున్నారు. ఆ ఆత్మ కోసమే ఈ ప్రశాంతమైన, నిశబ్దమైన రాత్రి సృష్టించబడిందా అన్న భావన కలుగుతోంది. ఇద్దరూ పాస్టరు వైపుగా వస్తుంటే, ఆయన ప్రశ్నలకు భగవంతుడు పంపిన సమాధానంలా వున్నారు.

ఆయన స్థాణువులా వుండిపోయాడు. గుండె వేగం హెచ్చింది. కంగారుగా అనిపించింది. కళ్ళ ముందు బైబిల్ నుంచి బోయజు రూతులు వచ్చి నిలబడ్డట్లు అనిపించింది. పవిత్ర గ్రంథాలలో భగవంతుడి ఇచ్ఛ ప్రకారం జరిగే అద్భుతకథలన్నీ గుర్తుకువచ్చాయి. సాల్మన్ గీతం అతని చెవులలో ప్రతిధ్వనించింది. ఆ గీతంలో వున్న సౌకుమార్యమంతా అతని గుండెల్లో మృదువుగా వ్యాపించింది.

“బహుశా ఇలాంటి ప్రేమికుల ప్రేమను అజరామరం చేసేందుకే దేవుడు ఇలాంటి రాత్రులను సృష్టించాడేమో” అనుకున్నాడాయన.

ఆ జంట జత కలిసిన చేతులతో ముందుకు వస్తుంటే తనకు తానుగా వైదొలిగాడు. ఆమె అతని మేనకోడలే. కానీ భగవంతుడి ఆజ్ఞను తిరస్కరించాలా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. దేవుడి అంగీకారమే లేకపోతే ఈ ప్రేమ చుట్టూ ఇంతటి అద్భుతాన్ని ఎందుకు వ్యాపింపచేస్తాడు?

తనకు అనుమతిలేని ఒక మందిరంలోకి చొరబడినందుకు అపరాధ భావన కలుగుతుండగా వెనక్కి మళ్ళాడాయన.
-----------------------------------------------------------
మూలం: ‘Moonlight, or In the Moonlight’, 
by ‘Guy de Maupassant’, French, 
అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Thursday, August 23, 2018

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 2


భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 2
సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి..........

ఆచారాలను పాటించక తాగుడు వంటి దురలవాట్లకు బానిస అయినవాణ్ని కొందరు భ్రష్ఠుడు అనడం కద్దు. కాని ఆ పదం తప్పు. భ్రష్టుడు అన్నదే సరైన పదం. కాని కుటుంబంలోని పెద్ద కొడుకును జ్యేష్ఠుడు, మేలిమి పొందినవాణ్ని శ్రేష్ఠుడు అనటమే రైటు. జ్యేష్టుడు, శ్రేష్టుడు అనేవి తప్పు పదాలు. “కొడవటిగంటి కుటుంబరావు గారి వాక్య నిర్మాణంలో నిర్దిష్ఠత ఉంటుంది” అని ఒక సాహిత్యసభలో ఎవరైనా చదివారనుకోండి. ఆ వాక్యంలో భాషాదోషం ఉన్న విషయాన్ని గుర్తు పట్టాలి మనం. నిర్దిష్టతకు బదులు నిర్దిష్ఠత అని రాయటం మరి భాషాదోషమే కదా. కొందరు నిర్దుష్టత అని రాస్తారు. అది కూడా తప్పే అని గ్రహించాలి.

‘ఠ’ వత్తుకు బదులు ‘ట’ వత్తును ప్రయోగించడం మరొక రకమైన భాషాదోషం. “మనం మన తెలుగు భాష ప్రతిష్టను కాపాడుదాం” అని రాస్తే మన తెలుగు భాషా ప్రతిష్ఠ ఏమై పోను! ప్రతిష్ట తప్పు, ప్రతిష్ఠ ఒప్పు.“తెలుగు భాషను పటిష్టం చెయ్యాలి” అన్నప్పుడు అలా వాక్రుచ్చినవారి తెలుగు భాష పటిష్ఠంగా లేదని తాత్పర్యం! పటిష్టం తప్పు. గోష్ఠి అంటే చిన్న సభ వంటిది. పండితుల గోష్ఠి ఉంటుంది. (మందు కొట్టేవాళ్లది కూడా ఉంటుంది బహుశా!). అయితే ఈ పదాన్ని గోష్టి అని తప్పుగా రాయటం అరుదేం కాదు. పరమేష్టి , పరాకాష్ట అన్నవి కూడా అటువంటి భాషాదోషాలే. పరమేష్ఠి , పరాకాష్ఠ అన్నవి సరైన పదాలు. “అలా నిష్టూరాలాడుతావేం వదినా” అని ఒక ఇల్లాలు మరొక ఇల్లాలు దగ్గర బాధ పడిపోవటం మనం గమనిస్తుంటాం. ఇక్కడ నిష్టూరము అనే పదం తప్పు. నిష్ఠురము అనేదే రైటు. కొన్ని నిఘంటువుల్లో నిష్టురము అనే పదం కూడా ఇవ్వబడిన మాట వాస్తవమే. నిష్ఠురము అంటే కఠినము లేక పరుషము అని అర్థం. “సమాసభూయిష్టమైన కవిత్వాన్ని ఈ కాలంలో ఇష్టపడరు” అనే వాక్యం దోషభూయిష్ఠమైనది. అంటే భూయిష్టము తప్పన్న మాట. భూయిష్ఠము సరైన పదం. అధిష్టానము, కనిష్ట , గరిష్ట , సౌష్టవం ఈ పదాలు కూడా తప్పే. అధిష్ఠానము, కనిష్ఠ , గరిష్ఠ , సౌష్ఠవం ఇవి సరైన పదాలు. ఇక శవాన్ని పడుకోబెట్టే కట్టెల కుప్పకు కాష్టము అనే పదాన్ని వాడుతారు చాలా మంది. కాని నిజానికి కాష్ఠము అనేది రైటు. అయితే కొన్ని నిఘంటువుల్లో కాష్టము అన్న పదం కూడా ఇవ్వబడింది.

‘థ’ కు బదులు ‘ధ’ అని తప్పుగా రాస్తారు కొంత మంది. ఉదాహరణకు కధ, అనాధ అనేవి. కథకు బదులు కత అని రాస్తే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అది కథకు వికృతి. కాని కధను ఒప్పుగా ఒప్పుకోరు మరి. ‘ధ’ కు బదులు ‘థ’ రాయటం కూడా అరుదైన విషయమేం కాదు. వీథి, వ్యథ, శీథువు అనేవి కొన్ని ఉదాహరణలు. ఇక్కడ వీధి, వ్యధ, శీధువు అన్నవి కరెక్టు పదాలు. నాధుడుకు బదులు నాథుడు రాయటం కూడా ఇటువంటిదే. దీటైన అనే మాటకు బదులు ధీటైన అన్న పదాన్ని ఉపయోగిస్తారు కొందరు. కాని ‘ధీటైన’ తప్పు. దీటైన, దీటుగా అనేవే సరైన మాటలు.

“లబ్దిదారులకు ప్రభుత్వం పట్టాలను ప్రదానం చేసింది” అని వార్తాపత్రికల్లో చదువుతుంటాం మనం. ఇక్కడ లబ్ధిదారులు అనేదే సరైన పదం. కాబట్టి లబ్దప్రతిష్టులులో రెండు తప్పులున్నాయి. లబ్ధప్రతిష్ఠులు అని సరిగ్గా రాయటం మనం దాదాపు ఎక్కడా చూడం.

ఉజ్వలము, తత్వము, సత్వము అనే పదాలు ఇప్పుడు సరైనవిగా చలామణి అవుతున్నాయి కాని, అవి పూర్తి కచ్చితత్వం ఉన్న పదాలు కావు. నిజానికి గ్రాంథికభాష ప్రకారం చూస్తే ఉజ్జ్వలము, తత్త్వము, సత్త్వము అనేవి సరైనవి. అయినా ఉజ్వలము, తత్వము, సత్వము అని రాస్తే అత్యంత శుద్ధతావాదులైన పండితులు తప్ప ఇతరులు ఆక్షేపణ తెలుపరు.

ఆఫీసుకు వెళ్తున్నాను అనే అర్థంలో కచేరీకి వెళ్తున్నాను అనడం పూర్వకాలంలో అత్యంత సాధారణంగా జరిగేది. కచేరీ అనే పదానికి నిఘంటువులో కొలువుకూటము, ఉద్యోగశాల, దర్బారు, దివాణము అని అర్థాలున్నవి. అయితే కచేరీ అంటే సంగీత సభ కూడా. కచ్చేరీ అన్నా కూడా అదే అర్థం.

దవము అన్నా , దావము అన్నా అడవి కనుక, కార్చిచ్చును దవానలం లేక దావానలం అనవచ్చు. సతతము, సతము అనేవి కొంచెం దందరగోళాన్ని కలుగజేసే పదాలు. సతతము = ఎల్లప్పుడు. సతము = శాశ్వతము. ఈ భేదాన్ని గమనించాలి (బేధము తప్పు భేదము అన్నదే రైటు).

ఉగాది రాగానే కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పటానికి “నవాబ్ధి అరుదెంచింది” అంటూ కవిత్వం రాసి ఆర్భాటం చేయవచ్చు ఎవరైనా. కాని అలా చేస్తే సునామీ ఫలితంగా సముద్రాన్నే మీదకు తెచ్చుకున్నవాళ్లం అవుతాము! ఎందుకంటే అబ్ధి నే పదానికి సముద్రం అని అర్థం. నవాబ్ది అని రాసినా తప్పే. తెలుగు భాషలో అబ్ది అనే పదమే లేదు. అయినా మనం దశాబ్ది, శతాబ్ది అని రాస్తుంటాం. మరి సంవత్సరం అనే అర్థాన్నిచ్చే కచ్చితమైన పదమేది? ఈ ప్రశ్నకు జవాబు అబ్దము. కాబట్టి ఉగాది రోజున నవాబ్దము వస్తుందన్న మాట. అలాగే దశాబ్దము, శతాబ్దము అన్నవి సరైన పదాలు.

సూర్యుడు ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య (ధృవాల మధ్యకాదు) ప్రయాణించే మార్గాన్ని అయనము అంటాము. దక్షిణాయనము అంటే ఈ మార్గంలో సగమైన దక్షిణభాగం. కాని ఉత్తరదిశలో ఉండే సగభాగాన్ని ఉత్తరాయణము అనాలి, ఉత్తరాయనము అనకూడదు. కారణం తెలియదు. అయణము అనే పదం ఉందో లేదో, ఒకవేళ ఉంటే దాని అర్థమేమిటో తెలియదు. అసలు ఆ పదమే నిఘంటువుల్లో లేదు. అయినా ఉత్తరాయణము అనే రాయాలి. శక్తివంతుడు అనే పదం మనకు అచ్చులో తరచుగా కనబడుతుంది. ఉదా: ‘హనుమంతుడు మహా శక్తివంతుడు’, ‘మా సిమెటు చాలా శక్తివంతమైనది’ ఇలాంటి వాక్యాలను చూస్తాము. కాని శక్తివంతుడు అనేది సరైన పదం కాదు. శక్తిమంతుడు అనేదే సరైన పదం. బలశాలి అయినవాణ్ని బలవంతుడు అనే అనాలి. కాని ఐశ్వర్యం ఉన్నవాళ్లు శ్రీమంతులు అవుతారు తప్ప శ్రీవంతులు కారు.

‘ల’ కు బదులు ‘ళ’ రాస్తారు/పలుకుతారు కొంత మంది. ఉదా: కళ్యాణము. కళ్యాణ మండపము అనే మాటను పుస్తకాల్లో, బోర్డులమీదా, ఆఖరుకు సినిమా టైటిల్స్ లో కూడా చూస్తాము. కళ్యాణ్ అని పేరు కూడా పెట్టుకుంటారు కొందరు. అలానే రాసుకుంటారు కూడా. కాని ప్రమాణిక నిఘంటువుల ప్రకారం తెలుగు భాషలో కళ్యాణము అనే పదం అసలు లేనే లేదు. కల్యాణము అనేదే ఉంది. కాబట్టి కల్యాణ్ అనే పేరే సవ్యమైనది. అలాగే మౌలికమైన అనటానికి బదులు మౌళికమైన అని రాస్తారు/పలుకుతారు. మూలము అంటే వేరు (Root). మూలము నుండి వచ్చిందే మౌలికము.

ఊరట (ఊఱట), ఉపశమనము అనే అర్థాన్నిచ్చే పదం సాంత్వనము. దీన్ని చాలా మంది స్వాంతనము అని తప్పుగా రాస్తారు/పలుకుతారు. రాధికా సాంత్వనము ముద్దు పళని రాసిన గ్రంథం పేరు అని సాహితీపరులకు తెలుసు. “రాజుగారి భండాగారము నిండుకున్నది” అంటూ ఆవేదన చెందేవారు తమ భాషలోని దోషాన్ని ఎప్పుడు గ్రహించి ఆవేదన చెందుతారు? భండారము అనేదే సరైన మాట అని తెలుసుకున్నప్పుడే కదా! భండారంలోని ద్రవ్యం రహస్యం కనుక “నీ బండారం బయట పెడతాను” అనే వాక్య ప్రయోగం వచ్చి ఉంటుంది. అయితే భాండాగారము అన్నది కూడా సరైన పదమే.

బ్రహ్మ గురించిన అపోహలు మనకు రెండు ఉన్నట్టు గ్రహించాలి. అందులో మొదటిది బ్రహ్మాండము అంటే జగత్తు అని భావించటం. ‘పెద్ద’ అని అర్థం వచ్చేలా ఆ పదాన్ని వాడుతున్నాం. కాని బాగా పరిశీలించి చూస్తే దానికి బ్రహ్మగుడ్డు అనే అర్థం వస్తుంది! ప్రమాణిక నిఘంటువుల్లో బ్రహ్మాండము అనే పదమే లేదు. ఒకటి రెండు ఇతర నిఘంటువుల్లో ఉన్న మాట నిజమే. ఇక రెండవది బాగా పొగడటానికి బ్రహ్మరథము అనే పదాన్ని వాడుతాము. ఈ పదానికి ‘మృతి పొందిన సన్యాసులను తీసికొని పోయెడి వాహనము’ అనే అర్థం ఉంది నిఘంటువులో. ఒకవేళ ఇది జాతీయం అందామనుకున్నా ఏ విధంగా చూసినా పొగడటం అనే అర్థసమన్వయం కుదరదు. బ్రాహ్మణ్యము అనే పదం కూడా తప్పే. బ్రహ్మణ్యము అనేదే రైటు.

మేధోవంతులు, మేధోమథనం, మేధోసంపత్తి, మేధోశక్తి అని చదువుతుంటాం చాలా సార్లు అచ్చులో. ముఖ్యంగా వార్తాపత్రికల్లో ఈ మాటలు ఎక్కువగా కనపడతాయి. తెలుగు భాషలో మేధస్సు అనే పదమే లేదు. మేధ అన్నది మాత్రమే ఉంది కాబట్టి, విసర్గ సంధి కుదిరే ప్రశ్నే లేదు. తపస్సు ఉంది కనుక తపః+వనము = తపోవనము, శిరస్సు ఉంది కనుక శిరః + రత్నము = శిరోరత్నము ఇలా విసర్గ సంధులు కుదురుతాయి. మేధోమథనం పదం ఏర్పడటానికి వీల్లేదు. మేధామథనం, మేధాశక్తి , మేధాసంపత్తి ఇలాంటి సమాసాలు మాత్రమే ఏర్పడుతాయి. కనుక ఆ పదాలే కరెక్టు.

ప్రేత భూముల దగ్గర ఫలానా స్మశాన వాటిక అని పెద్దపెద్ద అక్షరాలతో బోర్డుల మీద రాసి ఉండటం మనం గమనించవచ్చు. కాని స్మశానము తప్పు. సరైన పదం ‘శ్మశానము’ అని గ్రహించాలి. శాలీనత అంటే ఒక నిఘంటువులో దిట్టతనము అనీ, మరొక నిఘంటువులో బిడియము అనీ అర్థాలు ఉన్నాయి. రూపంలో దీనికి దగ్గరగా ఉండే శాలిత అనే మరో పదంతో తారుమారు చేయకూడదు దీన్ని. శాలిత అంటే శాలిత్వము. ఊహాశక్తి ఎక్కువగా ఉండటాన్ని ఊహాశాలిత అనవచ్చు. ప్రొమోషన్లను (ప్రమోషన్లను అనకూడదు) పదోన్నతులు అని పత్రికల్లో రాయటం మనం సాధారణంగా గమనించే విషయం. దీని సంధి విచ్ఛేదం పదవి + ఉన్నతి కాదు. పదవి + ఉన్నతి = పదవ్యున్నతి (యణాదేశ సంధి) అవుతుంది. పదము + ఉన్నతి = పదోన్నతి (గుణ సంధి) అవుతుంది నిజమే. కాని, ప్రొమోషన్ అంటే పదములో పెంపుదలా? పదము అంటే స్థానము అని వేరొక అర్థం ఉంది కాబట్టి, స్థానంలో పెరుగుదల అనుకోవాలి. ‘ఫలానా ఉద్యోగానికి అర్హత కోసం వయోపరిమితి….’ అంటూ ప్రకటనల్లో చాలా తరచుగా చూస్తుంటాం మనం. కాని అది భాషాదోషమే. పయః + పరిమితి = వయఃపరిమితి అవుతుంది. అదేవిధంగా తపః + ఫలము = తపఃఫలము (తపోఫలము కాదు). మనః + కమలము = మనఃకమలము (మనోకమలము కాదు).
----------------------------------------------------------
రచన - ఎలనాగ, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Wednesday, August 22, 2018

సెకండ్ హ్యండ్(అనువాదకథ)


సెకండ్ హ్యండ్(అనువాదకథ)


సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి.
ఇది ఉర్దూ నుండి అనువాదం చేయబడిన కథ.
కానీయండి మరి......

“వద్దురా, అల్లా! నాకు సిగ్గుగా ఉంది?”

“అయ్యో గిందులో సిగ్గేంటే, నేను ఇప్పుకో లేదా నా బట్టల్ని?”

“ఉయ్!” సిగ్గు పడింది చమ్కి.

“ఇప్పుతావా లేదా? అనాబికి చెప్పనా?” శహజాది పాషా గట్టిగా అరిచి౦ది. . ఆమెకు నరనరానా ఆజ్ఞాపించే అలవాటుంది.

చమ్కి కొద్దిగా తడబడుతూ, మరికొద్దిగా సిగ్గు పడుతూ, తన చిన్నారి చేతులతో మొదట కుర్తా విప్పింది. తర్వత పైజామా . ఆ తర్వాత శహజాది ఆజ్ఞ ప్రకారం సబ్బు నురుగలతో నిండిన నీటి టబ్బులో ఆమెతో పాటు దిగి౦ది.

ఇద్దరు స్నానించాక , చిన్నగా నవ్వుతూ “ఇంగ చెప్పు. నువ్వు ఏం బట్టలు తొడుక్కు౦టావు ? “శహజాది పాషా గొంతులో పొగరు, అధికారం.
“బట్టలా?” చమ్కి అమాయకంగా అంది, “గివే! నా నీలం రంగు పైజామా , కుర్త గిట్ల!”

శహజాది పాషా విస్తూబోతూ, ముక్కెగరేస్తు, “ఛీ! ఇంత పాడు వాసన కొడ్తున్నవేనా! మరి స్నానం చేసి లాభమేమిటి?” అని అడిగింది
చమ్కి జవాబుకు బదులు ఓ ప్రశ్న వేసింది, “మరి మీరే౦ వేసుకు౦టున్నారు పాషా?”

“నేనా!” శహజాది పాషా, గర్వంగా అంది, “నేనైతే నా బిస్మిల్లా రోజున మా తాతమ్మ కుట్టించిన చమ్కీ చమ్కీల బట్టలు …అవే తొడుక్కొంటాను. అయినా నా బట్టల విషయం నేకె౦దుకు?”

చమ్కి ఓ క్షణం ఆలోచనలో పడింది. మళ్లీ అంది నవ్వుతూ , “ఆలోచిస్తున్నాను…!”

“ఏమిటో?” శహజాది పాషా కుతూహలంగా అడిగింది.

ఇంతలో, బయట అనాబి గొంతు చించుకోవడం వినిపించింది.

“అయ్యో పాషా! నన్ను హమామ్ నుంచి బయటి కెళ్ల గొట్టి గీ పోరితో ఏం గప్పాలు కొట్టుకు౦ట కూర్చున్నావు? తొందరగా తెమలండి. లేకుంటే బీ పాషాకు గిప్పుడే పోయి జెప్తా.”

చమ్కి తన మనసు లో మాట చెప్పింది నెమ్మదిగా, “పాషా… మీరు నేను పైట మార్చుకోవడం వల్ల అక్క చెల్లెళ్ళయినాంగా. మరి మీ బట్టల్ని నేనేసుకోవచ్చుగా?”

“నా బట్టలా” అంటే ఆ బట్టలన్నీ…పెట్టెలో నిండి ఉన్నాయి…గవన్నియా?”

జంకుతూ ‘అవు’నన్నట్లు తలూపింది. శహజాది పాషా కడుపుబ్బ నవ్వింది.

“అయ్యో ఎంత పిచ్చి పొల్లవి. నువ్వైతే పనిదానివి. నువ్వు నేను తొడిగి విడిచిన బట్టలేసుకు౦టావు. నువ్వు బ్రతికున్నంత వరకు నా విడిచిన బట్టలే తొడుగుతుంటావ్.”

అహంకారం, పొగరు మేళవింపు ఎక్కువ గాను, ప్రేమ వాత్సల్యం తక్కువగాను ప్రదర్శిస్తూ, ఇంతకు క్రితమే స్నానానికి ముందు విప్పేసిన బట్టల్ని ఆమె మొహం వైపుకు గిరాటు వేసి, “ఇగ్గో విప్పిన నా బట్టలు వేసుకో. నా దగ్గరైతే చాలా బట్టలున్నాయి.” అంది శహజాది పాషా.
చమ్కి కి కోపం వచ్చింది.

“నేనెందుకు తొడుక్కొవాలి అవి ! మీరే తొడుక్కొండి!!” అని అంది చమ్కి, శహజాది పాషా వదలిన బట్టల వైపు చూపుతూ. ఆమె మండి పడింది. కోపంగా, “అనాబి..అనాబి” అని కేకేసింది.

అనాబి గట్టిగా తలుపులు బాదింది. తలుపులు అరగా మూసి ఉన్నాయి. వెంటనే పూర్తిగా తెరచుకున్నాయి.

“అయ్యో…ఇంకా మీరిద్దరు బరిబతలుగానే నిలబడి ఉన్నారా!?” అంటూ చోద్యంగా వారిద్దరి వైపు చూస్తూ, ముక్కు పై వేలేసుకుని అంది.
శహజాది పాషా వెంటనే స్టాండ్ పై ఉన్న మెత్తని గులాబి రంగు టవల్ లాగి తన శరీరానికి చుట్టుకు౦ది. చమ్కి అలాగే నగ్నంగా నిలబడి ఉంది. అనాబి తన కూతురు వైపు కోపంగా చూసి అంది, ” గీ పాషా వాండ్ల హమాముల తానం చేయడాని కెందుకొచ్చినావ్?”

“గీ శహజాది పాషే జెప్పింది నాతో తానం చెయ్ మని!”

అనాబి బెదురుతూ నలు వైపులా చూసింది ఎవరైనా వినడం లేదు కదా అని.

బాత్ రూం లోనుంచి చమ్కిని బయటికి లాగి, “జల్దీ పో నౌకర్ ఖాన (పరిచారికుల గది) లో నా బట్టలేసుకో. లేకుంటే నీకు సర్ధిగిర్ధి గిట్ల పట్టుకొంటే పాణం పోతది. ” అని అంది. కొద్దిగా సిగ్గు పడుతు అనాబి. తిరిగి తనే మళ్లీ అంది, ” మాసి మట్టి మట్టి గున్నవి తొడగబాకు. మొన్న శహజాది పాషా ఇచ్చిన ఎర్ర పట్టి కుర్తా పైజామా లేసుకో!”

అక్కడే నగ్నంగా నిలబడిన ఆ ఏడేండ్ల అమాయక ప్రాణి గాఢాలోచనలో కెళ్లి… నెమ్మది నెమ్మదిగా అంది, “అమ్మా! నేను మరి గీ శహజాది పాషా బరాబర్ (సమవయస్కులు) గదా …మరి నేనొదిలేసిన బట్టలెందుకేసుకోదు అది ?’

“ఉండు! నేను అమ్మతో చెప్తాను, చమ్కి ఇలా చెప్పిందని.” శహజాది పాషా
అనాబి భయపడి ఆమెను తన ఒడిలో తీసుకొని, గుండెలకు హత్తుకు౦ది.

“పాషామ్మ గీ పోరి పిచ్చి ముండ! దీని మాటల్నెందుకు అమ్మగారికి చెప్పుతవ్. దీంతో ఆడబాకండి. మాటలాడబాకండి. దీని పేరుమీద చెప్పుతో గొట్టండి” అని అంది అనాబి ఆమెను బుజ్జగిస్తూ.

శహజాది పాషాకు బట్టలు తొడిగించి, దువ్వెనతో తల దువ్వి తన చేతులతో అన్నం తినిపించి, పనులన్నీ చేసి తన గదిలోకిళ్లింది అనాబి. చమ్కిఇంకా అలాగే నగ్న౦గా చెట్టులా నిలబడి ఉన్నది గదిలో. మారు మాట్లాడకుండా చమ్కిని చూడగానే రెండు చేతులతో దబదబా బాదసాగింది, “తిన్న పళ్లెం లోనే బొక్కలు కొడ్తవే బజారు ముండ. పెద్దొర ఇంట్లోంచి యెల్లగొడ్తె ఎక్కడికి పోతావే? నీకెన్ని నఖరాలు!” అంటూ.
అనాబి శహజా పాషాకు తన పాలిచ్చి౦ది . అందుకోసమే ఆమె నియమించబడింది. ఫలితంగా తిండి బట్టలకు ఎలాంటి కొదువలేదు అనాబికు. తన కూతురు చమ్కి కి కూడా ఖరీదైన శహజాది పాషా తొడిగి వదిలేసిన బట్టలన్నీ ఇస్తారు. అంతేగాకుండా వెండి నగలు,ఆటవస్తువులు కూడా వాడినవి ఇచ్చారు.

కాలం గడుస్తున్న కొద్ది చమ్కి పసితనం వెనక్కి, అలోచనలు ముందుకు వెళ్లసాగాయి. ఫలితంగా శహజాది పాషా విడిచినవి తనెందుకు తొడగాలనే పట్టు ఆమెలో తలెత్తసాగింది. అప్పుడప్పుడు తను అద్దంలో మొహం చూస్తుకొంటూ, “అమ్మా ! నేనైతే పాషా కన్నా అందంగా ఉన్నాను కదా! మరి ఆమె నేను విప్పినవి తొడగాలిగా!” అని అనుకొంటుండేది.

అనాబి తన కూతురుకు నచ్చజెప్పేది—‘గొప్పోళ్ళు గొప్పోళ్ళే! మనం వారికి సాటి కాదు. ఎవ్వరైనా వింటే ముక్కు-చెవులు కోసి, గుండు గీయించి బయటికి గెంటేస్తారు’ అని!

అనాబి పాషా కు పాలివ్వడం మానేసి కొన్నేళ్లు గడచిపోయాయి. ఓ సారి దేవడీలో, కోఠీలో పనికి కుదిరిన వాళ్లను చచ్చాకనే వదులుతారు-అంటూ చమ్కి చెవులు మెలితిప్పి నచ్చజెప్పేది అప్పుడప్పుడు.

“ఇంకేమి చెప్పక నోర్మూసుకుని పడి ఉండు. చచ్చే వరకు నువ్వు శహజాది పాషా విడిచిన బట్టలే తొడుగుతూ ఉ౦డాలి! సమజై౦దా లేదా గాడిద పిల్లా!”

గాడిద పిల్ల ఆ సమయంలో నోరైతే మెదుపలేదు కాని ఆమె మనసులో లావా మాత్రం ఉబికొచ్చింది.

***

పదమూడేళ్లొచ్చాక మొదటిసారి శహజాది పాషా నమాజ్ తప్పింది. ఎనిమిదవ రోజు పూలమాలలతో ఆమెను ఆలంకరించారు. కనులు మిరుమిట్లు గొలిపే దుస్తులు ఆమెకు తొడిగించారు. ఆమె కుర్తాలో అక్కడక్కడ చిన్న చిన్న బంగారపు గజ్జెలు పొదుగబడి ఉన్నాయి. నడుస్తూంటే ఛన్ ఛన్ మనే చప్పుడు వినిపించేది. కోఠీ మర్యాదల ప్రకారం ఖరీదైన ఆ బట్టల జత కూడా దిగదుడుపు లో ఇవ్వబడింది. అనాబి సంతోషాలకు పట్టపగ్గాల్లేవు. వాటిని తీసుకొని తన గదిలోకి రాగా వయసుకన్న ఎక్కువ తెలివి, స్వాభిమానం గల చమ్కి దుఃఖ పడుతూ అంది, “అమ్మా …గత్యంతరం లేక తీసుకోవడం వేరే సంగతి. కాని నువ్వు గీలాంటివి తీసుకొని పెద్దగా ఖుషీ పడకు!”

“ఓయ్ బిడ్డా! ఈ జత బట్టల్ని అమ్మినా రెండొందల రూపాయలు ఎక్కడికీ పోవు! మనం అదృష్టవంతులం బిడ్డా! గీ లాంటి కోఠిలో పడ్డాం.” అనాబి నచ్చజెప్పే ధోరణిలో అంది.

“అమ్మా! ఎప్పుడైనా నా వదిలిన బట్టలను శహజాది పాషా కు తొడగడానికివ్వలని నాకు కోరికగా ఉంది!” అంది.

అనాబి తన రెండు చేతులతో తల పట్టుకు౦ది.

“నువ్వు కూడా పెద్ద మనిషై పోయినావ్! కొంచమన్న తెలివిగా మాట్లాడు. ఇలాంటి దివానే…దివానే మాటలు ఎవరి చెవుల పడ్డా మన గతే౦ గాను? జర ఆలోచించు బిడ్డా?” అని అంది అనాబి. ఆమె మెహం పాలి పోయింది. చిన్నగా అనాబి ఏడుపు అందుకోగా చమ్కి నోరు మూసుకుంది.

***

మౌల్వి సాహెబ్ ఇద్దరమ్మాయిలకు ఒకేసారి ఖురాన్ మరియు ఉర్దూ ఓనమాలు నేర్పించడం ప్రారంభించారు. వీరిద్దరు ఖురాన్ పఠనం పూర్తి చేశాక భారీ బట్టలు శహజాది పాషాకు, మామూలు బట్టలు చమ్కికు కూడా కుట్టించారు, బేగం సాహెబ్ గారు. ఆ తర్వాత పాషా భారీ బట్టలు కూడా చమ్కీ కి దిగదుడుపు బట్టల క్రింద అందాయి. కాని ఆమెకు ఆ కొత్త బట్టలే చాలా నచ్చాయి. వాటిని తన ప్రాణంలా చూసుకునేది చమ్కి.

లేత నారింజ రంగు డ్రెస్ అది. ఎంతో ఖరీదైన భారీ బట్టల కన్న మిన్నగా అనిపించింది చమ్కీకి.

శహజాది పాషా బాగా చదువుకుంది. యుక్త వయసులో కొచ్చింది. పెండ్లి ఆర్భాటం మొదలైంది.

పెండ్లిలో తను ఈ నారింజ రంగుబట్టలే తొడగాలని నిశ్చయించుకొంది. ఇవి ఎవరి దిగదుడుపు బట్టలు కావు. ఉత్రన్ కాదు!

శహజాది పాషా అమ్మగారు బేగం సాహెబా గారు ఎంతో దయాహృదయురాలు. ఆమె ఎల్లప్పుడు పరిచారకులను తన సంతానంలాగే చూసుకునేది. అందుకే తన కూతురు శహజాది పాషాతో పాటు చమ్కి పెండ్లి కోసం కూడా సంబంధాలు చూడసాగింది. చివరికి నవాబు సాహెబు తో చర్చించి చమ్కీ పెండ్లి కూడా ఓ తగిన అబ్బాయితో నిశ్చయం చేసింది. శహజాది పెండ్లికాగానే ఈ పెండ్లి సంబరాలలోనే చమ్కీ ‘అగ్త్ ‘ (పెండ్లి) కూడా చదివించాలని నిర్ణయించింది.

శహజాది పాషా అగ్త్ కు ఓ రోజు ముందు నుంచే కోఠి (మహల్) బంధు మిత్రుల రాక పోకలతో నిండిపోయింది. అమ్మాయిల మిడతల దండు మహల్ ను అల్లకల్లోలం చేసి౦ది.. తన స్నేహితురాళ్ళ గుంపులో కూర్చొని కాళ్లు-చేతులకు గోరింటాకు పెట్టించుకుంటూ శహజాది పాషా, “నువ్వు అత్తవారింటికెళ్లితే నీ కాళ్లకు గోరింటాకు నేనే పెడ్తాను.” అంది చమ్కితో.

“అయ్యో!ఎంత మాట.” ప్రేమ పూర్వకంగా అంది అనాబి.

“దాని కాళ్లకు మీ శత్రువులు తాకుగాక! మీరింత చెప్పిందే పది వేలు! మీ వరుడి లాగే దీని మొగుడు కూడా ఉండాలని మీరు ప్రార్ధన చేయండి.” అని అంది అనాబి.

“కాని ఈమె ‘నిఖా ’ ఎప్పుడు?” అంటూ ఓ పోకిరి అమ్మాయి అడిగింది.

శహజాది పాషా అదే చిన్ననాటి అహంకారపు నవ్వుతో అంది, ” నేను వదిలేసే దిగదుడుపు తో దీని కట్న కానుకలు తయారై
పోయాయి!

దిగదుడుపు ..మురికి…మాలిన్యం…అశుచి…వాడిన…విడిచిన…ఉత్రన్’ లాంటి పదాలు వినీ వినీ చమ్కీ చెవులు వాచిపోయాయి. ఈ పదాలు వందల వేల సంఖ్యలో సూదుల్లా గుండెలను చిల్లులు పొడిచాయి. ఛిద్రపరిచాయి. చమ్కీ మనసు చివుక్కుమంది. కళ్ళలో ఉబికొచ్చిన కన్నీళ్ళను దిగమ్రింగుకు౦టూ, తన గదిలో కొచ్చి పడింది చమ్కీ.

నెమ్మదిగా చీకటి పడుతు౦డగానే అమ్మాయిలు బాజభజంత్రీల తో పాటు పాటల కచేరీ మొదలైంది. అమ్మాయిలు గొంతెత్తి మధుర స్వరంతో పాడే శృంగార గీతాల తొ కోఠీ మారుమ్రోగింది. లయబద్దంగా డోలు కూడా మ్రోగ సాగింది.

క్రితం రాత్రి జాగరణ అయింది. ఈ రోజు కూడా కానున్నది. కోఠీ పెరటి వైపు వంటకాల కోసం ఎన్నో పొయ్యిలు అమర్చబడినాయి. వంట వాళ్ళు తీరిక లేకుండా వంటల తయారీ లో నిమగ్నులై ఉన్నారు. కోఠీ లో రేయి పగలు లా ఉంది!

చమ్కీ అందం నారింజ రంగు బట్టల లో ద్విగుణీకృతమైంది. ఈ బట్టలు ఎవరూ వాడి వదిలేసినవి కాదు. కొత్త బట్టతో కుట్టి౦చినవి. తను తొడుక్కోవడానికి అదృష్టం కొద్ది అందినవి.. ఇంతవరకు శహజాది పాషా వాడిన బట్టల్నే వేసుకునేది. నా పెండ్లికిచ్చే కట్నం కానుకలు వగైర వగైరాలు కూడా సెకండ్ హ్యండ్ వే! ఇలా నా జీవితం వాడిన వస్తువులతోనే గడుస్తో౦ది. కాని పాషా…ఓ ఉన్నత కుటుంబీకురాలు. ఎంత కాలం ? నువ్వూ తెలుసుకో! నువ్వు ఎన్నోపాత వస్తువులు నా కోసం ఇచ్చావ్ కదూ… ఇప్పుడు చూడు అను కు౦టూ మలిద (పరాటాలను, తేనే , పంచదార, నెయ్యిలతో చేసిన ఓ తీపి తినుభండారం) ట్రేను ఎత్తుకొని పెండ్లి కొడుకున్న మహల్ కెళ్ళింది చమ్కీ.

నలువైపులా దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలు. ఇక్కడా అదే గందరగోళం! తెల్లార్తే అగ్త్. విశాలమైన ఈ మహల్ లో నలువైపులా సందడి, హంగామాలలో ఎవరూ చమ్కీని పట్టించుకోలేదు.వారిని, వీరిని అడుగుతూ నేరుగా పెండ్లి కొడుకు గదిలో కెళ్ళింది చమ్కి.

గోరింటాకు, పసుపు చందనం రీతి-రివాజులతో అలసి సొలసి పోయిన పెండ్లి కొడుకు మంచంమీద బడలిక తీర్చుకొంటున్నాడు. గది కర్టెన్ కదలడం తో అటువైపుకు పడింది అతని చూపు. అలాగే కళ్ళప్పగించి చూడసాగాడు.

మోకాళ్ళ వరకు పొడవైన అప్రానీ కుర్తా. బిగుతుగా ఉన్న పిక్కల పై బిగుతుగా ఉన్న చూడీదార్. చేతి పనితో అల్లిన చె౦గావి రంగు పైట. పొట్టి చేతుల కుర్తా లో నుంచి తొంగి చూస్తూన్న అందమైన బాహువులు., వెడల్పైన బెదురు కళ్ళు. జడలో మల్లెల దండలు. రసగుళికల్లాంటి పెదవుల పై హత్య చేసే చిరు నవ్వు.

శోభనం రాత్రికి ము౦దు రాత్రి పెండ్లి కొడుకుకు ప్రమాదకారి . ఎంత మంచి వాడైనా, ఆ రాత్రి ఇలాంటి స్థితిలో పాపపు విందును కవ్విస్తుంది. ఒంటరితనం నేరానికి నాంది పలుకుతుంది. చమ్కీ తన కంటి కొసల్లోంచి చూసిన చూపుకు అతడి శరీరం విస్పోటం చెంది శకలాలుగా మారింది. చమ్కీ కావాలనే తన మొహం పక్కకు త్రిప్పి నిలబడింది. అతడు వ్యాకుల౦గా లేచి వచ్చి అమె కెదురుగా నిలబడ్డాడు. కనుకొసల నుంచి చూసిన ఆమె చూపు పెళ్లి కొడుకు లో తుఫాన్ రేపింది.

“నీ పేరేమిటి?” గాలి పిల్చే బదులు నీళ్ళు నములుతూ అడిగాడు.

“చమ్కీ ”

ఆమె కిల కిల నవ్వు అతన్ని కవ్వించసాగింది. ఆమె అందమైన మొహం చంద్రునిలా ఉంది.

“నిజంగా…నీలో ఉన్న ఆకర్షణ, కాంతికి …నీ పేరు సరిగ్గా సరిపోయి౦ది!” అంటూ బెదురుతూనే అమె భుజం పై తన చేయి వేసాడు . తర్వాత అమె చేతులను పట్టుకు౦టూ అడిగాడు, “ఈ ట్రే లో ఏముంది?” అని.

చమ్కి అతడికి ధైర్యాన్నిఇస్తూ , “మీ కోసం మలీద తీసుకొచ్చాను. రాత్రి జాగరణ అయింది కదా…మీ నోరు తీపి చెయ్యడానికి!” అంది మందస్మితమై, కత్తి-కటారుల్లేకుండానే అతడిని గాయపరిచింది.

“మేము మలీద గిలీద తో నోరును తీపి చేయం! “మేమైతే…” అంటూ తేనే లాంటి చమ్కి పెదవులపై తన నోరు తీపి చెయ్యడానికి పెదవులను ప్రేరేపించాడు. చమ్కీ అతని బాహువుల్లో ఒరిగిపోయింది. అతడి పవిత్రతను దోచుకోవడానికి…తను దోచుకోబడడానికి.
దేవడీ సంప్రదాయం ప్రకారం శోభనం రాత్రి గడిచాక, రెండవ రోజు ఉదయం శహజాది పాషా తను వాడిన పెండ్లి బట్టల జత, పెండ్లి నగలు చమ్కి కి అందించడానికి వెళ్ళింది.

చమ్కీ నవ్వుతూ “పాషా ఇప్పటివరకు నేను మీ వాడిన వస్తువులను వాడుతూ వచ్చాను. కానిప్పుడు మీరు కూడా…!?” అంటూ పిచ్చిదానిలా గట్టిగా నవ్వసాగింది. తిరిగి “నేను వాడిన వస్తువును మీరు కూడా ఇప్పుడు జీవితాంతం …” అని అంది నవ్వుల మధ్య. ఆమె నవ్వు ఆగనే లేదు.

చుట్టు ప్రక్కల ఉన్న అమ్మలక్కలు, ” పాపం! బాల్య స్నేహితురాళ్ళు ఆడుతూ-పాడుతూ కాలం గడిపారు. ఇప్పుడీ జంట విడి పోతున్నందుకు చమ్కీ దుఃఖం భరించ లేక పిచ్చిదానిలా ప్రవర్తిస్తో౦ది! “అని అన్నారు.
-----------------------------------------------------------
మూలం: వాజిద తబస్సుం (ఉర్దూకథ),
తెలుగు అనువాదం: అమ్జద్,
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Tuesday, August 21, 2018

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 1


భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 1

సాహితీమిత్రులారా!

తెలుగు భాషాప్రయోగంలో అత్యంత ప్రవీణులం, నిష్ణాతులం అయితే తప్ప మనం రాసే, మాట్లాడే భాష పూర్తి దోషరహితంగా ఉండే అవకాశం లేదు. అయితే భాష బాగా తెలిసినవాళ్లు రాసేదాంట్లో, మాట్లాడే దాంట్లో స్ఖాలిత్యాలు (తప్పులు) చాలా తక్కువగా ఉండి, భాష సరిగ్గా రానివాళ్లు రాసేదాంట్లో ఎక్కువ తప్పులుండటం మనం సాధారణంగా గమనించ గలిగే విషయం. పాఠకులు తమ తెలుగు భాషను మెరుగు పరచుకోవటానికి ఉపయుక్తంగా ఉండేలా నెలనెలా కొన్ని ఉదాహరణల సహాయంతో విశదపరచటమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశం. మనం ఉపయోగించే భాష సాధారణ సందర్భాల్లో శిష్టముగా ఉండటం అవసరం. దీన్నే శిష్ట వ్యావహారికం/శిష్ట వ్యవహారికం అంటున్నాము. అది గ్రాంథికమై ఉండాలన్న నియమం లేదు. అయితే ఏవి భాషాపరమైన దోషాలో తెలిసి ఉండటం మంచిది.

హాస్యాన్ని చేర్చి వినోదాన్ని కలిగించాలనే ఉద్దేశంతో అక్కడక్కడ కొన్ని చమత్కార భరితమైన వాక్యాలను రాసాను. అవి కేవలం సరదా కోసమే తప్ప ఎవరినీ చిన్నబుచ్చటం కోసం కాదు. దయచేసి పాఠకులు సహృదయతతో అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను. మరొక్క విషయం. ఒక ప్రయోగం భాషాసవ్యత దృష్ట్యా తప్పు అని చెప్పినంత మాత్రాన దాన్ని నేటి ఆధునిక యుగంలోని రచనా సందర్భంలో అసలే వాడకూడదని కాదు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అటువంటి ఎన్నో పదాలను ఉపయోగించటం పరిపాటిగా వస్తున్న విషయమే. అయితే స్ట్రిక్టుగా (కచ్చితంగా) చూస్తే అది తప్పు అనే విషయం తెలిసి ఉండాలి.

ప్రాథమిక స్థాయి దోషాలను మొదట పరీక్షించి, అరుదుగా తటస్థించే తప్పులను తర్వాత పరిశీలిద్దాం.

అవసరం లేకపోయినా ఒక అక్షరాన్ని ఒత్తి పలకటం (అక్షరం అడుగు భాగాన ఒక చిన్న నిలువు గీత ఉన్నట్టు వ్యవహరించటం – దీన్ని జట అంటారు) లేక ఆ విధంగా రాయడం మనం సాధారణంగా గమనించే స్ఖాలిత్యం.

“వివిధ మతాల, జాతుల, వర్గాల మధ్య సమైఖ్యతను సాధించటం ఈనాడు మన దేశానికెంతో అవసరం” అనే వాక్యంలో సమైఖ్యత అన్న పదం తప్పు. సమైక్యత అనేది సరైన పదం. సమ + ఐక్యత = సమైక్యత (వృద్ధి సంధి). అదే విధంగా ‘మల్లిఖార్జున స్వామి దేవాలయం’ అని రాసివున్న బోర్డులు కనపడతాయి మనకు అక్కడక్కడ. మల్లికార్జునుడు అనేదే సరైన పదం. మల్లిక + అర్జునుడు = మల్లికార్జునుడు (సవర్ణ దీర్ఘ సంధి). “నేను ప్రయోగించే భాష చాలా ఖచ్చితంగా ఉంటుంది సుమండీ” అన్నాడట ఓ పండితుడు. నిజానికి కచ్చితం అనే మాటకు బదులు ఖచ్చితం అని రాయటం వలన తన భాషలో కచ్చితత్వం లోపించిందన్న విషయాన్ని ఎరుగడాయన! ఏదైనా ఒక రంగంలో గొప్పవాడైన వ్యక్తిని సూచించటానికి ఉద్దండుడు అనే పదం ఉంది. కాని ఉద్ధండుడు అని రాస్తారు లేక పలుకుతారు కొంత మంది. గొప్పవాణ్ని సూచిస్తున్నాం కనుక ఒత్తు లేకుండా రాస్తే చప్పగా (సాదాగా) ఉండి అపచారం జరిగిపోతుందని భయం కాబోలు! ఉద్దండము అంటే పొడవైనది లేక ఎక్కువైనది అని అర్థం.

విష్ణువుకు ఉన్న అనేక నామాలలో (పేర్లలో) జనార్దనుడు అనేది ఒకటి. కాని జనార్ధనుడు అని తప్పుగా రాసేవాళ్లు లేకపోలేదు. అదే విధంగా మధుసూదనుడుకు బదులు మధుసూధనుడు అని కొందరు రాయటం, పలకటం అరుదైన విషయమేం కాదు. సూదనము అంటే చంపుట. మధు అనే రాక్షసుణ్ని చంపినవాడు కనుక మధుసూదనుడు అయినాడు శ్రీహరి.

“గులాబీ పువ్వులు గుభాళించినట్టు” అని వచన కవితలో ఒక కవి రాసుకోవచ్చు గాక, అంత మాత్రాన గుభాళించు అనే పద ప్రయోగం తప్పు కాకుండా పోతుందా? గుబాళించుట అంటే వాసన కొట్టుట.

“నావి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కావండీ. ఇవి ఆనంద భాష్పాలు” అన్నదట ఒక యిల్లాలు తన భర్తతో. ఆ భర్త ఒకవేళ తెలుగు భాషను అమితంగా ప్రేమించే వాడైతే ఆ పద ప్రయోగాన్ని విని ఎంతగా విచారపడి దుఃఖ బాష్పాలను రాలుస్తాడో కదా! బాష్పాలు అనేదే సరైన పదం. అట్లా దుఃఖం ముంచుకొచ్చినప్పుడు మనను మనం ‘సంభాళించుకోవాలి’ అనకండి. ఎందుకంటే సంబాళించుకొనుట అన్నదే సరైన పదం.

“ఫలానా శ్రీమంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి వజ్ర వైఢూర్యాలను కానుకలుగా సమర్పించుకున్నాడు” అని అచ్చులో చదివి అది దోషరహితమైన వాక్యం అనుకోకండి పాఠకులారా! ఎందుకంటే వైఢూర్యము అనటం తప్పు. వైడూర్యము అనేదే సరైన పదం. పురాణంలో శంబూకుడు అనే ఒకాయన తటస్థిస్తాడు మనకు. శంబూకము అంటే ముత్యపు చిప్ప లేక ఆల్చిప్ప. అయితే శంభూకుడు అని ఎవరైనా వాడితే ఆ పదం తప్పు అని గ్రహించాలి.

“నీ కోసం నా ప్రాణాలను ఫణంగా పెడతాను” అని ఎవరైనా అన్నారనుకోండి. చస్తే నమ్మొద్దు. ఎందుకంటే ఆ ఫణం వల్లనే చచ్చిపోతాము మనం! ఫణము అంటే పాము పడగ. పణము = పందెము కనుక ఇదే రైటు. ‘మాంసాహార & శాఖాహార హోటల్’ అనే బోర్డులు మనకు కనిపించటం సర్వసాధారణమైన విషయం. శాఖ అంటే చెట్టు కొమ్మ కనుక, కొమ్మలతో వండిన కూరను తెచ్చిపెడతారేమోనని భయం కలుగవచ్చు తెలుగు భాషా పండితులకు! శాఖాహారము అనేది తప్పు. శాకాహారము అనాలి. శాకము = కూర (ఆంగ్లంలో కరీ).

‘రాయబారము’కు బదులు ‘రాయభారము’ అని తప్పుగా ప్రయోగం చేస్తారు కొందరు. అట్టివారికి సవ్యముగా ‘రాయ’ భారమా?! కొన్ని కుటుంబాల వాళ్లు ‘భ’ గుణింతం ఎక్కువగా వాడుతారు రోజువారీ భాషలో. “భావగారూ, భావి దగ్గర స్నానం చేసి ధోవతి కట్టుకోండి” అంటారు. ఈ వాక్యంలో మూడు భాషాదోషాలు దొర్లినయ్. బావ, బావి, దోవతి అనేవే సరైన పదాలు. భావి అంటే భవిష్యత్తు అనే మరో అర్థం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. భ్రాహ్మ(ణు)లు అనే పదాన్ని వాడటం కూడా తప్పే. బ్రాహ్మణులు అనేదే రైటు. అదే విధంగా భీభత్సము, భీబత్సము, బీబత్సము – ఈ మూడు పదాలూ తప్పుతో కూడుకున్నవే. బీభత్సము అన్న పదమే సరైనది. “ఆర్థిక స్థోమత లేని బీదవాడు పాపం” అనే వాక్యంలో భాషాదోషం ఉంది. ఎందుకంటే స్థోమత అనే పదం తప్పు. స్తోమత అన్నది సరైన పదం. “ఎందుకలా అదేపనిగా కదుల్తావ్? స్థిమితంగా కూర్చోలేవూ?” అంటూ చిన్న పిల్లవాణ్ని పెద్దాయనెవరైనా మందలిస్తే, స్తిమితం అనే పదాన్ని స్థిమితంగా మార్చి ‘దోషం’ ఆ పెద్దాయనదే అనిపిస్తుంది కదా!

స్తంభము అనే పదాన్ని స్థంభము అని రాస్తారు కొంత మంది. స్తంభము అనేదే రైటు. స్థంభము తప్పు. ‘స్తంభించుట’ స్తంభము నుండి వచ్చిందే. ఇంకొక భాషాదోషాన్ని ప్రస్తావిస్తాను. అదేమిటంటే ప్రస్థావన అనే తప్పు పదాన్ని వాడటం. ప్రస్తావించుట అంటే చెప్పుట. ప్రస్తావము అన్నా కూడా ప్రస్తావన అనే అర్థం. ప్రస్థావన తప్పు. “ఆస్థీ, అంతస్థూ చూసుకోకుండా ఏ సంబంధాన్నీ చేసుకోవద్దు” అన్నామనుకోండి. అప్పుడు మనం సరిగ్గా చూసుకోకుండా రెండు భాషాదోషాలను దొర్లించిన వాళ్లమవుతాము. ఆస్తి, అంతస్తు అనేవే సరైన పదాలు. అదేవిధంగా అస్థిత్వము అన్న పదాన్ని వాడినామనుకోండి. అప్పుడు మనం పప్పులో కాలు వేసినట్టటే. ఎందుకంటే అస్తిత్వము అన్నదే సరైన పదం. అస్థిత్వము తప్పు.

మీరు రాంచి వెళ్లారట కదా. అక్కడి స్థూపాల్ని చూసారా? అని అడిగామనుకోండి. అప్పుడు కూడా రెండు తప్పులు చేసినవాళ్లం అవుతాము. ఒకటి భాషాపరమైనది, మరొకటి సామాన్య విజ్ఞానం (General Knowledge) కు సంబంధించినది. స్తూపము అనేదే సరైన పదం కావటం భాషకు సంబంధించినదైతే, రాంచిలో కాక సాంచిలో స్తూపం ఉండటం G.K. కు సంబంధించినది! కొందరు స్తనాలు అనటానికి బదులు స్థనాలు అంటారు. అది కూడా తప్పే. దీనికి విరుద్ధంగా ‘థ’ వత్తుకు బదులు ‘త’ వత్తు రాస్తారు కొంత మంది. ఉదా: అస్తిక, నేరస్తులు, గ్రామస్తులు. అలా రాయటం తప్పు. అస్థిక, నేరస్థులు, గ్రామస్థులు అని రాయాలి. అయితే రోగగ్రస్థులు అని రాయకూడదు. రోగగ్రస్తులు అనే రాయాలి. ఎందుకంటే గ్రస్తము అనే పదానికి తినబడినది లేక మింగబడినది అని అర్థం.

‘ట’ వత్తుకు బదులు ‘ఠ’ వత్తును రాయటం మరొక రకమైన భాషా స్ఖాలిత్యం. తెలుగు భాష ఎంతో విశిష్ఠమైనది అంటూ పొగిడామా తుస్సుమన్నట్టే! ఎందుకంటే విశిష్ఠము అనేది తప్పు పదం. విశిష్టము అని రాయాలి. అదే విధంగా ఉత్కృష్ఠము తప్పు. ఉత్కృష్టము సరైన పదం. ముష్ఠి , పుష్ఠి అని రాస్తారు చాలా మంది. కాని అవి తప్పులు. ముష్టి , పుష్టి అనేవి సరైన పదాలు. “చిత్రగుప్తుని చిఠ్ఠాలో మన పాపాలన్నీ రాయబడి ఉంటాయి” అని చదువుతాం మనం. అలాగే “ఏంటా వెకిలి చేష్ఠలూ” అంటూ చివాట్లు పెట్టడం కూడా వింటుంటాం. ఇక్కడ చిఠ్ఠాకు బదులు చిట్టా, చేష్ఠకు బదులు చేష్ట సరైన పదాలు అని తెలుసుకోవాలి. కోపం ఎక్కువగా ఉన్నవాణ్ని కోపధారి అనటం వింటుంటాం. కాని అది తప్పు. కోపిష్ఠి అనాలి (కోపిష్టి కాదు). అదేవిధంగా పాపిష్టి , పాపిష్ఠిలలో రెండవది రైటు. నిజానికి పాపిష్ఠి అని కాక పాపిష్ఠుడు అనాలట. కిరీటధారి, మకుటధారి, గిరిధారి, వస్త్రధారి అనవచ్చు కాని కోపధారి అనకూడదు.

తనకు అరవై సంవత్సరాల వయస్సు విండిన సందర్భంగా ఒకాయన అట్టహాసంగా ఉత్సవం జరుపుకోవాలనుకున్నాడు. ఆహ్వాన పత్రికల్లో షష్ఠిపూర్తి ఉత్సవం అని అచ్చయింది. అయితే మరి అతనికి ఆరేళ్ల వయసే ఉన్నట్టు భావించాలా? ఎందుకంటే ఆరవ తిథి (పంచమి తర్వాత వచ్చేది) షష్ఠి . అరవై సంవత్సరాల ఉత్సవాన్ని షష్టిపూర్తి లేక షష్ట్యబ్ద పూర్తి అనాలి. ఇలా కేవలం ఒక వత్తు వచ్చి చేరినందుకే అర్థం పూర్తిగా మారే ప్రమాదాలు తెలుగు భాషలో మరి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ప్రదానం, ప్రధానం. ప్రదాన సభ అంటే ఇచ్చివేసే సభ కాగా (బహుమతి ప్రదానం), ప్రధాన సభ అంటే ముఖ్యమైన సభ అవుతుంది. అదేవిధంగా అర్థము = భావము, అర్ధము = సగము. అర్థ సౌందర్యం అంటే Beauty of meaning. అర్ధ సౌందర్యం అంటే Half beauty. ఇక ధార అంటే వరుస, దార అంటే భార్య. ‘బాలరసాల సాల……’ అనే పద్యంలో పోతన ‘నిజదార సుతోద్ధర పోషణార్థమై’ అన్నాడు. పంచదార అంటే ద్రౌపది (ఐదుగురికి భార్య అయినది) కూడా అవుతుంది.
----------------------------------------------------------
రచన - ఎలనాగ, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో