Friday, October 28, 2016

పాతాళమున నున్న బంధురధ్వాంతముల్


పాతాళమున నున్న బంధురధ్వాంతముల్



సాహితీమిత్రులారా!

ఎఱ్ఱాప్రెగ్గడ రచించిన హరివంశంలోని
ఈ పద్యం చూడండి-
ఏటాజరిగే ఇంద్రోత్సవం గోపాలకులు
శ్రీకృష్ణుని మాటలతో మానుకొని
గోవర్ధన పర్వతాన్ని పూజించడంతో
కోపోద్దీపుడైన ఇంద్రుడు వ్రేపల్లె మీద
భయంకరమైన వర్షం కురిపించాడు
ఆ వర్షాన్ని ఈ కవి వర్ణించిన విధం
ఇక్కడ చూడండి.

దిక్కరిణీ బృంద మొక్కట యీనిన
                          పిల్లలు దివిఁబ్రసరిల్లె ననఁగ
గోత్రాచలంబులు చిత్రవాతాహతి
                         వెసఁబెల్లగిలి మీఁదవెలసె ననఁగఁ
బాతాళమున నున్న బంధురధ్వాంతముల్
                         వెడలి భానుని మ్రింగ నడరె ననఁగ
నిల నాల్గుచెఱఁగుల జలధులు నలిరేఁగి
                         కడళుల నభ మెక్కఁ గడగె ననఁగ
నొప్పి యుద్ధురస్థూల పయోధరములు,
దెసల కడపటఁ బొడమి యాకసము మూసి
మెఱుఁగు జోతులు చూడ్కికి మిక్కుటముగఁ
నొదవెఁ బిడుగులు రాలును నుప్పతిల్లె

దట్టమయిన పెద్దమేఘాలు దిక్కుల చివర పుట్టి ఆకాశాన్ని కప్పివేశాయి.
ఇది దిక్కులనే ఆడఏనుగుల గుంపు
ఒక్కసారిగా కనిన పిల్లలు ఆకాశమంతా వ్యాపించినట్లున్నది.
మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం,
వింధ్యం, పారియాత్రం  అనే ఏడు కులపర్వతాలు తీవ్రమైన గాలివల్ల
మొదలంటా లేచి ఆకాశంలో వెలసినట్లుగా ఉంది.
పాతాళంలో ఉన్న దట్టమైన చీకట్లు సూర్యుని మింగడానికి వచ్చినట్లుంది.
భూమి నాలుగు దిక్కులా ఉన్న సముద్రాలు అలలతో ఆకాశం మీదికి
ఎక్కుతున్నట్లుగా ఉంది.
ఆకాశంనిండా మెరుపులు పుట్టాయి. పిడుగులూ రాళ్ళూ పుట్టాయి.


దీన్ని కవి  ఉత్ప్రేక్షాలంకారంలో
ఎంత కమనీయంగా వర్ణించాడో కదా!

No comments:

Post a Comment