Saturday, December 31, 2016

ఈ గుణాల వల్ల లాభమేమి?


ఈ గుణాల వల్ల లాభమేమి?
సాహితీమిత్రులారా!


మంచి గుణాలుండాలని
అందరు కోరుకుంటారు.
అలాంటి గుణాలున్నవారిని
మెచ్చుకుంటారు గౌరవిస్తారు.
ఆలోచించి చూస్తే
ఈ గుణాధిక్యత వల్ల
ఒనగూడే మేలు ఏముందీ?
అని ఈ శ్లోకంలో కవి
అడుగుతున్నాడు చూడండి-

నైర్గుణ్య మేవ సాధియో
ధిగస్తు గుణ గౌరవమ్
శ్లాఘినోన్యే విరాజన్నతే
ఖండ్య న్తే చన్దన ద్రుమాః

అడవిలో చెట్లుంటే మాత్రం
ఎవరు పట్టించుకుంటారు
అదే గంధపు చెట్టు దొరికిందా -
నరికి పట్టుకుపోతారు.
దాని సుగంధమే దాని
ఉనికికి చేటు తెచ్చినట్లు
ఇంకెందుకూ మంచి గుణాలు -
అవి ఉండి ఏం లాభం-
అని శ్లోక భావం.

కవిత వ్రాయటం గహనమైన విషయం


కవిత వ్రాయటం గహనమైన విషయం
సాహితీమిత్రులారా!

కవిత్వం రాయడం గొప్పవిషయమేమి కాదని
కొందరి అభిప్రాయం అది ఎంత కష్టమో?
శ్రీకంఠచరితంలో మంఖకుని
ఈ శ్లోకం చెబుతుంది-

అర్థోస్తి చే న్న పదశుద్ధి రథాప్తి సాపి
నో రీతి రస్తు, యది సా ఘటనా కుతస్త్యా
సాప్యస్తి చే దపి స వక్రగతి స్తదేతత్
వ్యర్థం, వినా రస మహోగహనం కవిత్వమ్

కవిత్వం చాల గహనమైంది
ఎందుకంటే
దానిలో అర్థం బాగా ఉంటే
పదాల శుద్ధి ఉండదు.
ఒక వేళ పదశుద్ధి ఉన్నా
రీతి సరిగా ఉండదు.
అది కుదిరితే పదసంఘటన
సరిగా ఉండదు.
అది కుదిరినా వక్రగతితో ఉంటుంది.
ఇవి అన్ని అమరినా దానిలో రసస్ఫూర్తి
సరిగా లేకపోతే అది వ్యర్థం.
అందువల్ల పదశుద్ధి, రీతి్, పదసంఘటన(శయ్య)
కలిగి రసప్రతిపాదితమైనది ఉత్తమ కవిత్వం.
అటువంటి కవిత వ్రాయటం చాల గహనమైన విషయం-
అని ఈ శ్లోకభావం.

Friday, December 30, 2016

ఎడతెగని పనుల్లో మునిగితేలే నరులు


ఎడతెగని పనుల్లో మునిగితేలే నరులు
సాహితీమిత్రులారా!

భర్తృహరి తన సుభాషితత్రిశతిలో
వైరాగ్యశతకంలో కాలమహిను వర్ణించే
ఈ శ్లోకం చూడండి -

ఆదిత్యస్య గతాగతై రహరహ స్సంక్షీయతే జీవితం
వ్యాపారై ర్బహుకార్యభారగురుభిః కాలో న విజ్ఞాయతే,
దృష్ట్వా జన్మజరావిపత్తిమరణం త్రాస శ్చ నోత్పద్యతే,
పీత్వా మోహమయీం ప్రమదమదిరా మున్మత్తభూతం జగత్

సూర్యోదయ - సూర్యాస్తమాలచేత రోజురోజుకూ
ఆయువు తరిగిపోతుండడాన్ని, ఎడతెగని పనుల్లో
మునిగితేలే నరులు గుర్తించలేక పోతున్నారు.
తమ కళ్లముందే ఎందరి జనన మరణాలు -
వృద్ధ, దీనజనుల బాధలు సంభవిస్తూన్నా
వాటిని పరాకు చేస్తున్నారు. ఒక మద్యపానపు
మత్తు ఆవహించినట్లు జగమెల్లా మతి తప్పి
ఉన్నది - అని భావం.

అబద్ధమాడటానికూడ ప్రమాణాలుంటాయా?


అబద్ధమాడటానికూడ ప్రమాణాలుంటాయా?
సాహితీమిత్రులారా!


ఒక ప్రమాణాన్ని అతిక్రమించటానికి
దారులు వెదకడం మానవ నైజం.
ఇలాంటి దారులు మన ఇతిహాసాల్లో----

ఆపద్ధర్మంగా అబద్ధమాడటానికి ఇవి లైసన్స్ లు

ఇది ఆంధ్రమహాభారతం ఆదిపర్వం
మూడవ ఆశ్వాసంలోని ఘట్టం-

యయాతి మహారాజు శుక్రాచార్యుల
కుమార్తె దేవయానిని వివాహమాడాడు.
అలాగే విధివశంగా దేవయాని దాసీగా
ఉన్న వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ
దాసీగా అయింది. దేవయాని దాసీ
కావున శర్మిష్ఠ కూడ యయాతి సొత్తే అయింది.
వివాహసమయంలో శుక్రాచార్యుల వద్ద  చేసిన
ప్రమాణం ఉల్లంఘించం ఎలా? అని,
అబద్ధం ఆడటం ఎలా? అని  బాధపడే సమయంలో
శర్మష్ఠ యయాతితో అన్న పలుకులు ఈ పద్యం చూడండి-


ఈ ఏడింటియందు నసత్యదోషము
లేదని ముని ప్రమాణంబు గలదు

చను బొంకగ బ్రాణాత్యయ
మున సర్వధనాపహరణమున వధగావ
చ్చిన విప్రార్థమున వధూ
జనసంగమమున వివాహసమయములందున్
                                                                           (ఆదిపర్వం - 3-178)
.

ప్రాణాపాయ సమయాన,
సమస్త ధనం అపహరించ
బడే సమయాన, వధించబడేందుకు
సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుని రక్షించేందుకూ,
స్త్రీ సంగమ విషయానా, పెళ్ళివేళలందు
అసత్యమాడవచ్చు - అని భావం

ఇదే విషయాన్ని పోతన శ్రీమదాంధ్రమహాభాగవతం
వామన చరిత్రలో బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు
ఇలాంటి బోధనే చేస్తాడు -

వారిజాక్షులందు వైవాహిములందు
బ్రాణవిత్త మాన భంగమందు
చకితగోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము వొందడధిప

ఈ పద్యం ఆబాలగోపాలం విన్నదే-

Thursday, December 29, 2016

తప్పు లెంచక నుండుట తగిన లెస్స


తప్పు లెంచక నుండుట తగిన లెస్స 

 

సాహితీమిత్రులారా!

సర్వజ్ఞ త్రిశతి (కన్నడము)-
ప్రజాకవిగా పేరు పొందిన
సర్వజ్ఞ కృతము
త్రిపదిలో వ్రాయబడినది.
దీనిని తెనుగున
శివకవి యన్. శివగౌడు వ్రాశారు.
సర్వజ్ఞ కవి 15శతాబ్ది ఉత్తరార్థములోను,
16 శతాబ్ది పూర్వార్థములోను ఉన్నట్లు చెబుతున్నారు
ఆ త్రిశతిలోని కొన్ని నీతులు చూడండి -


జాజియ హోలేసు, తేజి వాహన లేసు
రాజమందిరదొళిరలేసు తప్పుగళు 
మాజుమాజువదె లేసు సర్వజ్ఞ (కన్నడము)

జాజి పూలెస్స పయనించ వాజి లెస్స
రాజమందిర వాసంబు రాణ లెస్స
తప్పులెంచకనుండుట తగిన లెస్స
త్రిపది కవిచంద్ర సర్వజ్ఞ దేశికేంద్ర


బెచ్చనెయ మనెయాగి వెచ్చక్కె హొన్నాగి 
ఇచ్చెయను అరివ సతియాగి స్వర్గక్కె
కిచ్చు హచ్చెంద సర్వజ్ఞ  (కన్నడ)

వెచ్చదనమిచ్చు భవనంబు, వెచ్చమునకు
వచ్చు సిరి, వశవర్తిని భార్యగలుగ
స్వర్గమేటికి కాల్పనా జనుల కరయ
త్రిపది కవిచంద్ర సర్వజ్ఞ దేశికేంద్ర


ఉరగన హలునంజు సురిగెయ మొనెనంజు
కరుణ విల్లదన నుడినంజు దుర్జనర
ఇరవెల్లనంజు సర్వజ్ఞ (కన్నడము)

త్రాచుకోర విషము, ఖడ్గధార విషము
ఎన్న నిర్దయు నుడికార మెల్ల  విషము
ధూర్తుడగువాని ఇరవెల్ల దోగు విషము
త్రిపది కవిచంద్ర సర్వజ్ఞ దేశికేంద్ర

దీనికి మన సుమతి శతకంలోని పద్యం -

తలనుండు విషము ఫణికిని 
వెలయంగా తోకనుండు వృచ్ఛికమునకున్
తలతోక యనక నుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

ఎళ్ళు గాణిగ బల్ల, సుళ్ళు సింపెగ బల్ల
కళ్ళరను బల్ల తలవార, బణజిగను
ఎల్లవను బల్ల సర్వజ్ఞ (కన్నడము)

తిలల నెరుగును గానుగ ద్రిప్పువాడు 
తలవరెరుగును చోరుల, దర్జివాడు
ననృతమెరుగును వర్తకుండఖిల మెరుగు
త్రిపది కవిచంద్ర సర్వజ్ఞ దేశికేంద్ర

ఇట్టి దివ్యాన్నములుమెచ్చునే శివుండు


ఇట్టి దివ్యాన్నములుమెచ్చునే శివుండు
సాహితీమిత్రులారా!


శ్రీనాథుని హరవిలాసంలో హిమవంతుడు
శివుని ఆకారాన్ని వెక్కిరిస్తూ పార్వతికి
చెప్పిన చమత్కార పద్యం -

తలమీద చదలేటి దరిమీల దినజేరు 
        కొంగలు చెలగి కొంకొంగురనగ
మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
        బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ
గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
        బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱుమనగ
గడియంపు బాములు కకపాలలో నున్న
        భూతి మై జిలికిన బుస్సురనగ
దమ్మిపూజూలి పునుక కంచమ్ము సాచి
దిట్ట తనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని
యిట్టి దివ్యాన్నములుమెచ్చునే శివుండు

శివుడు బిక్షకు వెళ్ళే సమయంలో ఎంత గోలగోలగా
ఉంటుందో వర్ణించిన పద్యం ఇది-


తలమీద చదలేటి దరిమీల దినజేరు 
        కొంగలు చెలగి కొంకొంగురనగ

తలమీది ఆకాశగంగలో ఉన్న దరిమీనులనే
చేపలను తినడానికి  కొంగుకొంగుమనే శబ్దం చేస్తూ
కొంగలు మూగి ఉన్నాయి.

మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
        బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ

మెడలోని పుఱ్ఱెలమాల, శివుడు కదులుతూంటే
ఒకదానికొకటి తగులుకొని
బొణుగూ బొణుగూ అనే శబ్దం చేస్తున్నాయి.

గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
        బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱుమనగ
కట్టుకున్న పులితోలుకొంగు చివర, శివుడు ఎక్కిన
నందిని తాకుతూ ఉంటే అది చిఱ్ఱుబుఱ్ఱు లాడుతూంది.

గడియంపు బాములు కకపాలలో నున్న
        భూతి మై జిలికిన బుస్సురనగ
చేతికి కడియాల్లా కట్టుకున్నపాములు
చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలోని విభూది
తుళ్ళి పడినపుడల్లా బుస్సుబుస్సు మంటున్నాయి.

దమ్మిపూజూలి పునుక కంచమ్ము సాచి
దిట్ట తనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని

బ్రహ్మకపాలం చేత పట్టుకొని
వీధివీధి తిరిగి  బిచ్చమెత్తుకుంటాడు

యిట్టి దివ్యాన్నములుమెచ్చునే శివుండు
అటువంటి శివుడికి ముష్టెత్తుకున్నకూడు తప్ప
మనం పెట్టే దివ్యాన్నాలు రుచిస్తాయా - అని భావం.


ఈ పద్యం లో ఎక్కువపాలు
తెలుగు పదాలే వాడాడు శ్రీనాథుడు
అదేకాక ధ్వన్యనుకరణ
నాలుగుపాదాల్లో కనిపిస్తుంది
ఎంత చమత్కారంగా
ఎంత వ్యంగ్యంగా వర్ణించాడో కదా!

Wednesday, December 28, 2016

అచట లేవనికదా!


అచట లేవనికదా!
సాహితీమిత్రులారా!


కాసుల పురుషోత్తమకవి కృత
ఆంధ్రనాయక శతకంలోని
ఈ పద్యం చూడండి-

అచట లేవని కదా! యరచేత జఱచె గ్రు
          ద్ధత సభస్తంభంబు దానవేంద్రు
డచట లేవనికదా! యస్త్రరాజం బేసె
          గురుసుతుం డుత్తోదరము నందు
నచటలేవనికదా! యతికోపి ననిచె పాం
          డవులున్న వనికి గౌరవకులేంద్రు
డచటలేవనికదా! యాత్మీయసభను ద్రౌ
          పదివల్వ లూడ్చె సర్పధ్వజుండు
లేక యచ్చోటులను గల్గలేదె ముందు
కలవు కేవల మిచ్చోట గల్గు టరుదె
చిత్రచిత్ర ప్రభావ!  దాక్షిణ్యభావ!
హతవిమతజీవ!  శ్రీకాకుళాంధ్రదేవ!
           (ఆంధ్రనాయక శతకము -9)


బహు విచిత్రమైన మహిమకలవాడా!
దయాభావం కలవాడా!
శత్రుసంహరకుడా!
శ్రీకాకుళం అనే క్షేత్రంలో వెలసిన
ఆంధ్రనాయకుడను పేరుగల విష్ణుమూర్తీ !

స్తంభంలో ఉండవని హిరణ్యకశిపుడు
స్తంభాన్ని అరచేతితో కొట్టాడు.

ఉత్తర గర్భంలో ఉండవని బ్రహ్మాస్త్రాన్ని
అశ్వత్థామ ఉత్తర కడుపులోని శిశువుపై
ప్రయోగించాడు.

అడవిలో ఉండవని కోపిష్ఠియైన దూర్వాసుని
పాండవుల వద్దకు పంపాడు దుర్యోధనుడు.

సభలో ఉండవని ద్రౌపది వస్త్రాలను
లాగించాడు సుయోధనుడు.

మొదట అక్కడ  లేకపోయినా స్తంభాదుల్లో
నివు సాక్షాత్కరించావు.
మరి ఈ శ్రీకాకుళం గుడిలో
మొదటినుండి వెలసి ఉన్నావు
ఇక్కడ కనిపించడంలో ఆశ్చర్యం
కానేకాదు -  అని భావం.

తనకోపమె తనశత్రువు (భావానుకరణ)


తనకోపమె తనశత్రువు (భావానుకరణ)
సాహితీమిత్రులారా!మనకు సుమతీ శతకంలోని ఈ పద్యం
సుపరిచితమే దీనికంటే ముందే నన్నయ
భారతంలో ఇదే భావంతో పద్యం ఉండటం విశేషం.
ఆ పద్యం -
పరీక్షిన్మహారాజు వేటకు వెళ్ళినపుడు
వేటలో బాణపుదెబ్బతగిలిన లేడిని వెదుకుతూ
శమీక ముని ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న
మునిని ఆ లేడిని గురించి అడిగాడు
తపస్సమాధిలో ఉన్న ముని ఎంతకూ పలుకకపోగా
కోపించి అక్కడే దూరంగా చచ్చిపడిఉన్న పాముని తెచ్చి
ముని మెడలో వేసి వెళ్ళాడు. అతడు వెళ్ళిన తరువాత
ఆమునికిమారుడైన శృంగి వచ్చి తన తండ్రి మెడలో
పాముని చూచి కుపితుడై శపించాడు.
తండ్రి సమాధినుండి లేచిన తరువాత
శాపమిచ్చిన సంగతి తెలిపాడు.
అప్పుడా ముని కుమారునితో
తొందరపడ్డావునాయనా అని బాధపడి,
కొడుకుతో పలికిన మాటల్లోని ఈ పద్యం చూడండి-

క్రోధమ తపముం జెరచును
క్రోధమ యణిమాదులైన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు
బాధ యగుం, గ్రోధిగా దపస్వికి జన్నే

కోపము తపస్సును చెడగొడుతుంది.
కోపమే అణి, గరిమ, లఘిమాది అష్టసిద్ధులను
పోగొడుతుంది. కోపమే ధర్మంతో కూడిన కార్యాలకు
బాధ కలిగిస్తుంది. కావిన తపస్సుచేసే మునికి
కోపము తగునా - అని భావం.

క్షమలేని తపసి తనమును
బ్రమత్తు సంపదయు ధర్మబాహ్య ప్రభురా
జ్యము భిన్నకుంభమున తో
యములట్టుల యధ్రువంబు లగు విని యెల్లన్
(శ్రీమదాంధ్రమహాభారతము -1-2-172,173)

ఓర్పులేని ముని తపస్సూ,
ప్రమాదపడేవాని ధనమూ,
ధర్మంనుండి తొలగిన రాజు రాజ్యమునూ,
ఇవన్నీ బద్దలయిన కుండలోని వలె
అస్థిరములవుతాయి - అని భావం


వినిలోని భావాన్ని తరువాతి కాలంలో
సుమతీశతకకారుడైన బద్దెనకు క్రింది పద్యానికి
ఒరవడి దిద్దనదని పండితుల అభిప్రాయం-తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

Tuesday, December 27, 2016

వీరిని ఇతరులు త్వరగా నమ్ముతారు


వీరిని ఇతరులు త్వరగా నమ్ముతారుసాహితీమిత్రులారా!


ఈ మంచిమాట వినండి-

కాంతారే ష్యపి విశ్రమో
జనస్యా ధ్వని కస్యవై,
యస్య దారాన్స విశ్రాంత
స్తస్మాద్దారాః పరాగతిః

అసహాయుడైన వాడికి, ఒంటరిగా
అడవిలో ఉన్నవాడికి కూడ పక్కన
భార్య ఉంటే కొంత శాంతీ - విశ్రాంతి
లభిస్తాయంటారు.
తోడుగా భార్య ఉన్నవాడిని ఇతరులు
త్వరగా నమ్ముతూండడం అనేది
లోక సహజం కనుక
పురుషునికి భార్య ఆవశ్యకత అధికం.

కాదంటారా!

వాణి నా రాణి


వాణి నా రాణి
సాహితీమిత్రులారా!


సరస్వతీపుత్రులమని చెప్పుకొనేవారే అందరూ.
వాణి నా రాణి - అని చెప్పగల సాహసం ఎవరికుంటుంది?
అలాంటి వాడు మన తెలుగులో ఒకడున్నాడట.
ఆయనే పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు.
ఈయన జైమిని భారతాన్ని పద్యకావ్యంగా రచించినవాడు.
శృంగార శాకుంతలం పేరున కాళిదాసు నాటం అభిజ్ఞాన శాకుంతలాన్ని
పద్యకావ్యంగా మలిచాడు.
ఈయన మీద ఒక చాటువుంది.
ఎవరు చెప్పరో గాని ఇది ప్రసిద్ధమైనది.
ఆ పద్యం -

పిల్లలమఱి పినవీరన
కిల్లాలట వాణి యట్టులే కాకున్నన్
తెల్లముగ నొక్కరాతిరి
తెల్లగ తెలవారు వరకు తేగలడె కృతిన్

ఒక్క రాత్రిలో పినవీరభద్రునికి బదులుగా
వాణియే జైమినీ భారతాన్ని రచించిదని
చిరకాలంగా పండితలోకంలో ప్రచారంలో ఉంది.
సరస్వతి ఆయనకు విధేయురాలుగా ఉండేదని
అలా కాకపోతే  పినవీరభద్రునికి అది సాధ్యమయేదా?
-అని పై పద్యంలో చెప్పబడింది.

విచిత్రమేమంటే ఈ విషయం
ఆయన తన కావ్యాలలో ఎక్కడా వ్రాయలేదు -
తరువాతి కవులు ఈ కవిమీది గౌరవంతో ఆవిధంగా
కల్పించారని కొందరివాదన.

Monday, December 26, 2016

మీమాంసాది శాస్త్రాలు కేవలం నాలుగైదు రోజుల్లో.........


మీమాంసాది శాస్త్రాలు కేవలం నాలుగైదు రోజుల్లో.........
సాహితీమిత్రులారా!

హాస్యరసానికి సాహిత్య దర్పణంలో
ఉదాహరణగా చూపిన శ్లోకం ఇది-

గురో ర్గిరః పంచదినా వ్యధీత్య
వేదాంతశాస్త్రాణి దినత్రయం చ
అమీ సమాఘ్రాయ చ తర్కవాదాన్
సమాగతాః కుక్కుటమిశ్ర పాదాః

కుక్కుట మిశ్రాదులు ప్రభాకర భట్టు
చెప్పిన మీమాంసా శాస్త్ర వాక్కులను
అయిదు రోజుల పాటు చదువుకొని,
తరువాత వేదాంత శాస్త్ర విషయాలము
మూడు రోజులలో పూర్తి చేసుకొని,
తర్కశాస్త్ర వాదాలను వాసన చూచి
ప్రస్తుతం ఇక్కడికి విచ్చేశారు - అని
శ్లోక భావం.

ఇందులో ఏముందని మనం అను కోవచ్చు
కాని బాగా గమనిస్తే ఎవరూ చెప్పక్కర్లేదు
ఇది హాస్యానికి చెప్పినవని ఎందుకంటే
మీమాంసాది శాస్త్రాసు కేవలం నాలుగైదు
రోజుల్లో అధ్యయనం చేయటం సాధ్యంయ్యే
పనేనా కాదని తెలిసిపోతుందికదా
కుక్కుటమిశ్రుడు అనే వ్యక్తి ఆ విధంగా
చేసి, తాను గొప్పపండితుణ్ణని భావంతో
వస్తున్నాడని హేళన కాక మరేమి.

ఈ శ్లోకం చెప్పేదేందంటే.........


ఈ శ్లోకం చెప్పేదేందంటే.........
సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయల పరాక్రమాన్ని
వర్ణించే శ్లోకం ఇది. చూడండి-

వీరాగ్రేసర కృష్ణరాయ భవతా కృత్తా రణప్రాంగణే
ప్రౌఢాః కేచన పారసీకపతయః ప్రాప్తాః పురీ మామరీమ్
పీరుత్తేతి గురౌ, బలద్విషి సురత్తాణేతి, శచ్యాం పున
ర్బిబ్బీతి, ప్రణతౌ సలామితి సురాన్ స్మేరా ననా మ్కర్వతే

వీరులలో గొప్పవాడైన ఓ కృష్ణదేవరాయ
నీతో యుద్ధం చేసి చంపబడిన పారశీకరాజులు
వీరమరణం పొందారుకావున దేవలోకానికి వెళ్ళారు.
అక్కడ దేవగురువు బృహస్పతిని చూచి పీరుత్త - అని,
ఇంద్రుని విషయంలో సులతాన్ అని, శచీదేవిని
గురించి బీబీ, నమస్కారించేప్పుడు సలాం అని
తమ భాషలో పలుకుతూ దేవతలను చిరునవ్వు
కలవారినిగా చేసినారు. దేవతలకు వీరి భాషా
పదాలు తెలియక వారు నవ్వుకున్నారు -
శ్లోక భావం.

ఇంతకూ ఈ శ్లోకం వల్ల తెలిసేదేమిటంటే
కృష్ణదేవరాయలు యుద్ధంలో
పారశీక రాజులను జయించాడని.

Sunday, December 25, 2016

సగరుముమ్మనుమండు తపము గైకొనినచోటు


సగరుముమ్మనుమండు తపము గైకొనినచోటు
సాహితీమిత్రులారా!


పెద్గనగారి ప్రవరుడు హిమవత్పర్వత
ప్రాంతంలో  తిరుగుతూ చూస్తూ వెళుతూ
ఈ విధంగా ఊహించుకున్నాడట -


నిడుదపెన్నెఱిగుంపు జడగట్ట సగరుము
         మ్మనుమండు తపము గైకొనినచోటు
జరఠకచ్ఛపకులేశ్వరువెన్ను గాన రా
         జగతికి మిన్నేఱు దిగిన చోటు
పుచ్చడీకతనంబు పోఁబెట్టి గిరికన్య
         పతిఁగొల్వ నాయాసపడినచోటు
వలరాచరాచవారలికాక్షుకనువెచ్చఁ
         గరఁగిన యలకనికరపుఁజోటు
తపసియిల్లాండ్రచెలువంబుఁ దలఁచి తలఁచి
మున్ను ముచ్చిచ్చును విరాళి గొన్నచోటు
కనుపపులు  వేల్పుఁబడవాలుఁ గన్నచోటు
హర్షమునఁ జూచి ప్రవరాఖ్యుఁడాత్మలోన
                                                                                 (మనుచరిత్ర - 2 - 9)


నిడుదపెన్నెఱిగుంపు జడగట్ట సగరుము
         మ్మనుమండు తపము గైకొనినచోటు
సగర చక్రవర్తి ముని మనుమడు భగీరథుడు తన  పొడవైన
వెండ్రుకలు అట్టలు కట్టగా తపము ఆచరించిన చోటు.


జరఠకచ్ఛపకులేశ్వరువెన్ను గాన రా
         జగతికి మిన్నేఱు దిగిన చోటు
పాతాళములోని ఆదికూర్మము వీపు కనబడేవిధంగా
(అంత లోతుగా) ఆకాశగంగ భూమిని దిగిన చోటు.

పుచ్చడీకతనంబు పోఁబెట్టి గిరికన్య
         పతిఁగొల్వ నాయాసపడినచోటు

పార్వతీదేవి పతిగా పరమేశ్వరుని పొందటానికి
తెగించి  తపమాచరించిన చోటు

వలరాచరాచవారలికాక్షుకనువెచ్చఁ
         గరఁగిన యలకనికరపుఁజోటు

మన్మథుడు శివుని కంటి మంటచే
బూదియైన దయనీయమైన చోటు


తపసియిల్లాండ్రచెలువంబుఁ దలఁచి తలఁచి
మున్ను ముచ్చిచ్చును విరాళి గొన్నచోటు
సప్తర్షు భార్యల అందాన్ని తలచి తలచి అగ్నిదేవుడు
మోహము పొందిన చోటు

కనుపపులు  వేల్పుఁబడవాలుఁ గన్నచోటు
దేవతల సేనాని కుమారస్వామిని గన్న ఱెల్లు గడ్డి ఉన్నచోటు

హర్షమునఁ జూచి ప్రవరాఖ్యుఁడాత్మలోన
వీటినన్నిటిని మనసులో అనుకొంటూ ఉన్నాడు ప్రవరుడు.పీనస రోగమున్నవాడు వాసనను గ్రహించలేడు


పీనస రోగమున్నవాడు వాసనను గ్రహించలేడుసాహితీమిత్రులారా!


ఒక కవి వ్యంగగా కస్తూరిని సంబోధిస్తూ
చెప్పిన అన్నాపదేశ పద్యం ఇది
చూడండి-

పీనస రోగి నిన్ను తిలపిష్ట సమానము చేసినంతనే
వాని వివేక హీనతను వందురనేల కురంగనాభమా
మానవతీకపోలకుచమండలమండిత చిత్రపత్రికా
నూన వితాన వాసనల నుండుట లోకము నిన్నెరుంగదే
                                                                                (ప్రబంధరత్నాకరము)

కస్తూరి మంచి పరిమళం గల సుగంధద్రవ్యం.
పీనసరోగమున్నవాడు వాసనను గ్రహించలేడు
కాబట్టి అతని దృష్టిలో తెలకపిండి, కస్తూరి
రెండూ ఒక రకంగానే అనిపిస్తాయి అది వాని
అజ్ఞాన ఫలితం.

ఓ కస్తూరీ!  నీవు ఆ విషయంలో బాధపడవద్దు.
యువతుల చెక్కిళ్ళమీద, స్తనాల మీద
కస్తూరితో చిత్రించిన రకరకాల చిత్రాలను
వాటినుండి వ్యాపించే సువాసనను
ప్రపంచం గుర్తిసుంది కదా!

ఇది వ్యంగ్యంగా మరో అర్థాన్ని తెలుపుతుంది-
కవి పండితుల వైదుష్యాన్ని, ప్రతిభను
ఒక వివేకి గుర్తించనంత మాత్రాన
వారి గొప్పతనానికి ఏ విధమైన కొరత కలగదు.
ప్రపంచం వారి గొప్పదనాన్ని తప్పక గుర్తిస్తుంది
- అని భావం.

Saturday, December 24, 2016

మన్మథుణ్ని కూడా తిడుతున్నాను


మన్మథుణ్ని కూడా తిడుతున్నాను
సాహితీమిత్రులారా!


ద్రాక్షారామనివాసి అయిన
గాంగేయుల భీమశాస్త్రిగారి
ఈ శ్లోకం చూడండి-

యాం చిన్త యామిమనసా మయి సా విరక్తా
సా ప్యవ్యమిచ్ఛతి జనం సజనో ప్యసక్తః
అస్మత్కృతే చ పరిశుష్యతి కాచి దన్యా
ధిక్తాం చ తం చ కుసుమాస్త్రమిమాం చ మాం చ

ఒక నాయకుడు నిరాశతో విరక్తుడై
ఇలా అంటున్నాడు-
నేను మనస్సులో ఎవరిని తలుస్తున్ననో,
ఆమెకు నాపై ప్రేమలేదు.
ఆమె మరొక పురుషుణ్ని ఇష్టపడుతున్నది.
కాని అతనికి ఆమె పై కోరిలేదు-
నా విషయంలో కూడ మరొక
స్త్రీ విరహంతో కృశించి పోతోంది.
వారందరిని గూర్చి నేను ధిక్కరిస్తున్నాను.
ఒకవైపే ప్రేమను కలిగించినందుకు
మన్మథుణ్ని కూడా తిడుతున్నాను.

ఇలాంటి ప్రేమను రసాభాసంగా
చెబుతారు అలంకార శాస్త్రంలో.

తనను ఒక దేవతగా భావించుకుంటారు

తనను ఒక దేవతగా భావించుకుంటారు

సాహితీమిత్రులారా!


నడమంత్రపు సిరిని గురించిన 
ఈ శ్లోకం చూడండి- 

ఇది కలివిడమ్బనమ్ లోనిది.

ప్రామాణ్యబుద్ధిః స్తోత్రేషు
దేవతాబుద్ధి రాత్మని
కీట బుద్ధి ర్మనుష్యేషు
నూతనాయాః శ్రియఃఫలమ్

ఈ శ్లోకంలో నడమంత్రపు సిరి వలన 
కలిగే వికారాలను చెబుతున్నాడు కవి.

తనను ఎదుటివారు తమ అవసరాల కొరకు
ముఖ స్తుతి చేస్తుంటే, ఆలోచించకుండా
అవన్నీ నిజమని నమ్మేస్తారు.
తనను ఒక దేవతగా భావించుకుంటారు.
ఇతర మనుష్యులందరినీ తన దృష్టిలో
పురుగులవలె హీనంగా చూస్తారు.
ఇవ్నీ మొదటినుండి ధనవంతులుగా
ఉన్న వారికంటె, మధ్యలో సంపద కలిగినవారిలో 
ప్రత్యేకంగా కనబడే లక్షణాలని కవి వర్ణించాడు.

Friday, December 23, 2016

నీ పాదానికి ఎంత నొప్పి కలిగిందో?


నీ పాదానికి ఎంత నొప్పి కలిగిందో?
సాహితీమిత్రులారా!ఈ శ్లోకం చూడండి -

దాసే కృతాగసి భవే దుచితః ప్రభూణాం
పాదప్రహార ఇతి సుందరి నాస్మిదూయే
ఉద్యత్క ఠోరపులకాంకుర కంటకాగ్రై
ర్యత్ఖిద్యతే మృదు పదం నను సా వ్యథా మే

సేవకుడు తప్పుచేసినప్పుడు యజమానులు
కోపించి పాదంతో తన్నటం సరైనదే.
నీకు దాసుడనైన నేను నీవిషయంలో
అపరాధం చేసినందుకు నన్ను నీవు
పాదప్రహారం చేసినందుకు బాధపడను.
కానీ నీ పాదస్పర్శతో నా శరీరం పుకించి
నిక్కబొడిచిన కంటకాల్లాంటి రోమాల వల్ల
కోమవమైన నీ పాదానికి నొప్పి కలిగిందేమో
అని బాధపడుతున్నాను - అని భావం.

తన ప్రియురాలికి తాను అ ప్రియమైన పని దేన్నో
చేసినందువల్ల కోపశీలి యైన ఆమె ప్రణయ కోపంతో
కాలితో పతిన్ తన్నింది. అతడు ఆమె పైగల
రాగాతిశయంతో అనునయిస్తూ పలికిన శ్లోకం ఇది.

పరహస్తేచ యద్ధనం


పరహస్తేచ యద్ధనంసాహితీమిత్రులారా!నేటి ప్రజల్లోని భావన
ఈ పద్యంలో కనిపిస్తున్నది చూడండి

పుస్తకేషుచ యావిద్య
పరహస్తే చ యద్ధనం
సమయేతు పరిప్రాప్తే
నసావిద్యా న తద్ధనం

ఇది నీతిశాస్త్రంలోని శ్లోకం
పుస్తకాల్లో ఎంత  చదువు ఉన్నా
ప్రయోజనం ఏమిటీ ?
ఏమీ లాభంలేదుకదా!
అది తన చేతిలో ఉండాలికదా!
ధనం కూడా అంతే
ఇతరుల చేతిలో ఉండి లాభమేమిటీ?
తనదై ఉంటే ప్రయోజనం సిద్ధిస్తుంది - అని భావం

ఇది దృష్టిలో పెట్టుకొని గాబోలు
ప్రజలు బాంకుల్లో వేసిన డబ్బును
తిరిగి తెచ్చుకోవడానికి అవసరం ఉన్నా
లేకున్నా అది తెచ్చుకోవడానికి నానాయాతన
పడుతున్నారు.

Thursday, December 22, 2016

మానవుడు స్వస్వభావాన్ని చిక్కబట్టుకుంటాడు


మానవుడు స్వస్వభావాన్ని చిక్కబట్టుకుంటాడు
సాహితీమిత్రులారా!కాళిదాసు ఈ సూక్తి చూడండి-
నేటి ఆధునిక కవితలా అనిపిస్తుందో లేదో?


జ్వలతి చలితేందనోగ్నిః
విప్రకృతః పన్నగః ఫణాం కురుతే 
ప్రాయః స్వం మహిమానం 
క్షోభాత్ ప్రతిపద్యతే  హి జనః

కొరువులు కదిలిస్తే అగ్గి భగ్గుమంటుంది.
పొడిస్తే పాముపడగ విప్పుతుంది.
కలవరం పుట్టిస్తే మానవుడు
స్వస్వభావాన్ని చిక్కబట్టుకుంటాడు.

దీని భావం గమనిస్తే
ఆధునిక కవితలా లేదా?

బంతికూళ్లకును జాకోరంబు లేపారగన్


బంతికూళ్లకును జాకోరంబు లేపారగన్సాహితీమిత్రులారా!

శృంగారనైషధములోని ఈ చంద్ర వర్ణన
ఎంత చమత్కారంగా ఉందో చూడండి-
నలుడు దమయంతితో చెబుతున్న
సందర్భంలోనిది ఈ పద్యం-

ఉడువీథీ హరినీల రత్నమయ పాత్రోత్సంగ భాగంబునం
గడు గారా మొనరన్ ఝషాంకునకు నంక చ్ఛాయయన్ కమ్మనూఁ
బిడితోఁ గూడ సుధాంశుబింబ మను సర్పిః పాయసాహారముం
గుడువం బెట్టెనొ బంతికూళ్లకును జాకోరంబు లేపారగన్
                                                                (శృంగారనైషధము -8-198)


ప్రేయసీ!  చూచావా!  రాత్రి అనే ఇల్లు,
ఆకాశమనే నీలాల కంచంలో
మన్మథునికి నేయి నూటిడితో
పాటు వడ్డించిన పాయసంలాగ
చంద్రుడు కనిపిస్తున్నాడు.
చకోరాలు బంతికూటికి రావాలని
ఉవ్విళూరుతున్నాయి - అని భావం

ఎంత మనోహరమైన ఊహో
ఎంత గొప్ప వర్ణనో కదా!
Wednesday, December 21, 2016

హసంతీం చ హసంతీ చ


హసంతీం చ హసంతీ చ
సాహితీమిత్రులారా!


ఈ చమత్కార శ్లోకం చూడండి-


హసంతీంహసంతీం
హసంతీం వామలోచనామ్
హేమంతే యే న సేవన్తే
తే నరా దైవవంచితాః

దీనిలో హసంతీ శబ్దం
మూడుమార్లు ప్రయోగించబడింది.
ఒకదానికి కుంపటి,
మరొకటి కంబళి,
మూడవదానికి నవ్వుతున్న
అనే విశేషణార్థం.

కుంపటినిగాని, కంబళినిగాని
నవ్వుతూన్న అందమైన కన్నులున్న
యువతినిగాని చలికాలంలో ఎవరు ఆశ్రయించరో,
వారు దురద్రుష్టవంతులు - అని చెబుతున్నాడు కవి.

చలిబాధ తప్పుకోవటానికి కొందరు
కుంపటి ముందు కూర్చుంటారు
మరి కొందరు కంబళి కప్పుకుని
వెచ్చదనాన్ని పొందుతారు,
నవ్వుతున్న ప్రియురాలి గాఢాలింగనంతో
చలినుండి తప్పించుకుంటారు.
ఈ మూడింటిలో ఏదీ లభించనివారు
నిజంగా విధివంచితులని
కవి చమత్కారంగా చెప్పాడు.

తిరుప్పావై పాశురాలు

తిరుప్పావై పాశురాలు సాహితీమిత్రులారా!

గోదాదేవి ధనుర్మాసంలో రోజుకొకటి 
చొప్పున ముప్పదిరోజులు 30 పాశురాలను
స్వామివారికి నివేదించారు. ధనుర్మాసంలో 
ప్రతి ఒక్కరు చదువదగిన వినదగిన పాశురాలు
ఇక్కడ ఉంచాము విని తరించండి.


Tuesday, December 20, 2016

వీరిమాట జవదాటరాదు


వీరిమాట జవదాటరాదు
సాహితీమిత్రులారా!


ఈ సూక్తి చూడండి-

ఆచార్యో బ్రహ్మణో మూర్తిః
పితా మూర్తిః ప్రజాపతేః
మాతా పృథివ్యా మూర్తిస్తు
భ్రాతా స్యో మూర్తి రాత్మసః

గురువు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు.
తండ్రి బ్రహ్మ స్వరూపుడు.
తల్లి భూదేవి సమానురాలు.
సోదరుడు ఆత్మ సమానుడు.
ఈ విధంగా వీరంతా దేవతామూర్తులు -
పూజ్యులు - కావున వీరిమాట జవదాటరాదు-
అని శ్లోక భావం.

గోదాదేవి మేఘసందేశం


గోదాదేవి మేఘసందేశం
సాహితీమిత్రులారా!సందేశాలు ఒక్కొక్కరు ఒక్కొకదానితో పంపించారు.
నలుడు హంసతో పంపాడు. బుద్ధజాతక కథల్లో
కామవిలాప జాతకకథలో భర్త భార్యకు వాయసం
ద్వారా సందేశం పంపిస్తాడు. అలాగే
దక్షింణభారతదేశ వైష్ణవుల దివ్యప్రబంధాల్లో ,
ప్రియుడైన వేంకటేశ్వరునకు గోదాదేవి మేఘం
ద్వారా పంపిన సందేశం ఇది చూడండి-

మిన్నా గత్తె  ళ గిన్ఱ వేగజ్గాళ్ వేఙ్గిడత్తు
త్తన్నా గ తిరుమంగె తఙ్గియ శీర్ మార్వఱ్కు
ఎన్నాగత్తిళజ్కోవిరిమ్బిత్తామ్  నాళ్ తోఱుమ్
పొన్నాగమ్ పుల్ గుదుర్క ఎన్ పురిపుడైమై శెప్పమినే
                               (ఆళ్వారుల మంగళాశాసన పాశురాలు - పుట 143)

విద్యుల్లతలతో కూడి యుండు ఓ మేఘములారా!
నూతనముగా అభివృద్ధి యగుచుండు నా కుచముల
యందాసపడి నన్ను గాఢాలింగనము చేసుకొనుగాక యని
ఎల్లపుడు ఆశపడుచున్నాను. ఈ విషయమును
వేంకటాచలమున వేంచేసి ఉన్న స్వామియగు
శ్రియఃపతికి విన్నవింపుడని గోదాదేవి మేఘములను
ప్రార్థించెను - అని భావం.

Monday, December 19, 2016

ఘటకర్పరుడు ఎవరు?


ఘటకర్పరుడు ఎవరు?సాహితీమిత్రులారా!

ఘటకర్పరీయమనే లఘుకావ్య ఒకటి ఉంది.
అది కాళిదాసు వ్రాశాడని, భాసుడు వ్రాశాడని,
ఘటకర్పరుడు వ్రాశాడని రకరకాల వాదాలున్నాయి.

వాటిలో భాసుడే ఘటకర్పరుడనే దాన్ని బలపరిచే
శ్లోకం ఇది చూడండి-

జీయేత యేవ కవినా యమకైః పరేణ
తస్మై వహేయ ముదకం ఘటకర్పరేణ
శృత్వేతి భాసకవి నోక్త మమృష్యమాణాః
ప్రాహు స్త మన్య కవయో ఘటకర్పరాఖ్యమ్

యమకాలంకారయుక్త కవిత్వం చెప్పటంలో
ఇతరులెవరైనా నన్ను జయిస్తే, వారికి నేను
కుండలతో మంచినీరు మోసి తెచ్చిస్తాను
అని భాసకవి ప్రతిజ్ఞచేయటం సహించలేని
ఇతరకవులు భాసుణ్ణి అప్పటినుండి
ఘటకర్పరుడని పిలుస్తూ వచ్చారు - అని భావం

దీన్నిబట్టి భాసుడే ఘటకర్పరుడని తెలుస్తున్నది.

ఈశ్వరుని విల్లు పేరు పినాకము


ఈశ్వరుని విల్లు పేరు పినాకము
సాహితీమిత్రులారా!


మనం విల్లు పట్టిన వారిని చాలమందిని చూస్తున్నాము.
వారిలో మనకు శ్రీరామచంద్రుడు బాగా తెలుసు. తరువాత
అర్జునుడు వీరిని గురించి చదువుతున్నాము.
కాని విల్లు పట్టునవారిలో ప్రసిద్ధులైన వారి విల్లులకు
గల విశేషనామాలను ఇక్కడ గమనిద్దాము.


పేరు                                విల్లుపేరు
శివుడు                          పినాకము
విష్ణువు                         శార్ఙ్గము
రాముడు                     వజ్రకము
అర్జునుడు                 గాండీవము
ద్రోణాచార్యుడు        ద్రుణము
కర్ణుడు                        కాలపృష్ఠము

ఇందులో అర్జునునికి ధనస్సుపేరుతో
ఏకంగా గాండీవి అనే పేరుంది.

ధనుర్విద్యలో కృతయుగంలో శివుడు గొప్పవాడు
ఆయన కుమాస్వామికి, పరశురామునికి మొదట
నేర్పించారు.
పరశురాముడు ద్రోణునికి
ద్రోణుడు అర్జునునికి
విలువిద్య నేర్పించారు.

Sunday, December 18, 2016

ఆపదల్లో బుద్ధి మందగిస్తుందట


ఆపదల్లో బుద్ధి మందగిస్తుందటసాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి
ఎంతటి వారికైనా  విపత్తులో
బుద్ధి పనిచేదని చెబుతున్నది.
ఇది హితోపదేశః అనే దానిలోది.

అసంభవం హేమమృగస్య జన్మ
తథాపి రామో లులుభే మృగాయ
ప్రాపి స్సమాపన్నవిపత్తి కాలే
థియోపి పుంసాం మలినా భవన్తి

బంగారులేడి పుట్టటం అసంభవమైన విషయం
అయినా అవతార పురుషుడైన శ్రీరాముడు
సీత ప్రోద్బలంతో మృగాన్ని పట్టుకోవటానికి వెళ్ళాడు.
సాధారణంగా ఆ పత్కాలం సమీపిస్తే మనుషుల
బుద్ధులు మాలిన్యమై పోతాయి - అని భావం.


నే వలచుటకేమి శంకరునివంటి మహాత్ముడు..........


నే వలచుటకేమి శంకరునివంటి మహాత్ముడు..........
సాహితీమిత్రులారా!


శ్రీనాథుని పద్యాలలో రసికత తోటి
హాస్యప్రియత్వం ద్యోకతమవుతుంది.
అలాంటిదానికి ఉదాహరణగా ఈ పద్యం చూద్దాం-

తొలకరి మించుతీవగతి తోప దుకాణము మీదనున్న య
య్యలికులవేణితోఁ దముల పాకుల బేరము లాడబోయి నే
వలచుట కేమి శంకరుని వంటి మహాత్ముడు లింగరూపియై
కులికెడు దాని గబ్బి చనుగుబ్బల సందున నాట్యమాడగన్

శ్రీనాథుడు తమలపాకుల బేరానికి అంగడికి పోగా అక్కడ
అందమైన పడుచు కనిపించింది. ఆమెను చూడగానే
మన కవిగారికి వలపు కలిగిందట. దాన్ని సమర్థిస్తూ
ఇలా అంటున్నాడు -

ఆ మెరుపుతీగవలె ఉన్న ఆ తరుణి
దుకాణంపై కూర్చుంటే ఆమెను చూచి
నేను వలచుటలో వింతేముంది అంతటి
మహాత్ముడు, మన్మథుని జయించినవాడు
అయిన శంకరుడే ఆమెను మోహించి,
ఆమె స్తన ద్వయం మధ్యలో లింగరూపంలో
చేరి నాట్యమాడుతుంటే ఇక నావంటివాడు
వలపులో పడటం వింతకాదు కదా!
- అని అంటున్నాడు.

ఇంతకూ ఆమె లింగధారి కాబట్టి
ఆమె మెడలో ధరించిన లింగం
ఎదపై వ్రేలాడుతూంది.
దీన్ని పరిహాసానికి
కూర్చాడు ఈ పద్యం.

Saturday, December 17, 2016

కాలము దుస్తరమెట్టివారికిన్


కాలము దుస్తరమెట్టివారికిన్
సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి -
శకుంతలను మరచిపోయిన దుష్యంతుడు
ఆమె తన భార్యకాదని, అసత్యము చెబుతున్నదని
పలికే సందర్భములో కాళిదాసు కూర్చినది.

స్త్రీణా మశిక్షిత పటుత్వమమానుషీషు
సందృశ్యతే కిముత యాః ప్రతి బోధవత్యః
ప్రాగంతరిక్షగమనా త్స్వమపత్యజాత
మన్యై ర్ద్విజైః పర భృతాః ఖలు పోషయన్తి
                                                                        (అభిజ్ఞాన శాకుంతలమ్)

స్త్రీ జాతికి ఎటువంటి శిక్షణ లేకుండానే చాల
చాతుర్యంతో పనులు జరుపుకోవటం పశుపక్ష్యాదుల్లోనే
కనిపిస్తున్నప్పుడు తెలివితేటలు కలిగిన మనుష్యుల
విషయంలో పెప్పవలసిన దేముంది కోకిలలు తమ
గ్రుడ్లను తాముపొదకుండా కాకుచే పొదిగించి,
పిల్లలు పుట్టిన తరువాత రెక్కలు వచ్చేవరకు
కాకులతోనే పోషింపచేస్తాయి. తమకు శ్రమలేకుండా
ఇతరులతో ఆ భారం మోయించటం ఎంత తెలివి
కలపని?

అదే విదంగా ఈ శకుంతల కూడ మహారాజు
భార్యగా అంతఃపురంలో ప్రవేశించి రాజ భోగాలు
అనుభవించాలని ఇలా అబద్ధం చెబుతున్నది
అని దుష్యంతుడు ఆరోపించాడు - అని భావం

ఎంత సత్యమైనా కాలం దాన్ని
ఎందుకూ కొరగాకుండా చేసిందికదా!
అందుకే కాలము దుస్తరమెట్టివారికిన్ -
అన్నారు పెద్దలు.

నిర్గుణో శోభతే నైవ


నిర్గుణో శోభతే నైవసాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-
ఎటువంటి విషయం చెబుతోందో-

నిర్గుణో శోభతే నైవ
విపులాడంబరో పివా
ఆపాత రమ్య పుష్ప శ్త్రీ
శోభిిత శ్వల్మలి ర్యథా

పూవులతో విరబూసి శోభిస్తూ
బూరుగు చెట్టు ఎంతో అందంగా
కనిపిస్తుంది ఏం ప్రయోజనం
దానికి ఎవరి మెప్పూ లభించదు.
ఆర్భాటంగా ఉందని లోలోపల
అనుకొని ఊరుకుంటారు.
అలాగే గుణహీనుణ్ని చూసి
ఏమాడంబరంగా
ఉన్నాడీతడు అనుకుంటారు
ఎలాంటి హంగూ లేకున్నా గుణవంతుడు
గౌరవం పొందుతాడు - అని భావం.

Friday, December 16, 2016

నేనూ నీవూ ఇద్దరం లోక నాథులమే


నేనూ నీవూ ఇద్దరం లోక నాథులమే
సాహితీమిత్రులారా!ఈ చమత్కార శ్లోకం చూడండి-
సమాస చమత్కారం చెప్పే శ్లోకం ఇది-

అహం చత్వంచరాజేంద్ర! 
లోకనాథా వుభావపి
బహువ్రీహి రహం రాజన్! 
షష్ఠీతత్పురుషో భవాన్


ఓ రాజా! నీవు, నేను ఇద్దరం
కూడ లోకనాథులమే సుమా!
కాని ఒక్కటే చిన్న భేదం
బహువ్రీహి ప్రకారం నేను లోకనాథణ్ణి,
నీవేమో షష్ఠీతత్పురుష ప్రకారం లోకనాథుడవు
- అని భావం

బహువ్రీహి సమాసం అన్యపద ప్రధానం కావున
లోకః నాథః యస్యసః - లోకనాథః అని
అంటే లోకమే నాథుడు(రక్షకుడు)గా కలవాణ్ణి నేను.

లోకానికి నాథుడవు(ప్రభువు)నీవు -
దీనిలో షష్ఠీత్పురుష సమాసం ఉంది.

లోకంపై ఆధారపడి బ్రతికేవాణ్ణి నేను.
లోకాన్ని పాలించేవాడవు నీవు
- అని భావం.
సమాసంలో రెండర్థాలకూ
లోకనాథః - అనే రూపమే ఉంటుంది
కావున కవి ఈ విధంగా చమత్కరించాడు.

అభిరుచులు స్వాభావ సిద్ధమేనా?


అభిరుచులు స్వాభావ సిద్ధమేనా?
సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-

సతాంధనం సాధుభిరేవ భుజ్యతే
దురాత్మాభి ర్దుశ్చరితాత్మావాం ధనమ్
పికాదయా శ్చూతఫలాని భుంజతే
భవన్తినింబాః కలు కాక భోజనాః

పక్షులు గ్రహించే ఆహారంలో
తేడాలకు వాటి స్వభావాలే కారణం
కాబోలు లేకుంటే మరేమిటి?
చిలుకలు - కోయిలలు మామిడి పళ్లను
ఆశిస్తే, కాకులు చేదుగా ఉండే
వేప పళ్లను తినడమేమిటి?

మంచి వారికి మంచి అభిరుచులు,
చెడ్డవారికి చెడ్డ అభిరుచులు స్వభావసిద్ధము
అనడానికి ఇది తార్కాణం కదా!


Thursday, December 15, 2016

నీ బాణాలు రాలిపోనూ


నీ బాణాలు రాలిపోనూ
సాహితీమిత్రులారా!


కుమారధూర్జటి కృత
ఇందుమతీ పరిణయము లోని
ఈ పద్యాన్ని చూడండి

ఒక చెలికత్తె తమ రాజకుమార్తె
విరహవేదన చూడలేక కోపంతో
మన్మథుని శపిస్తున్న పద్యం ఇది-

నీ బాణంబులు రాల, నీ ధనువు ఖండీభూతమై పోవ, నీ
జాబిల్లిన్ ఫణియంట, నీ బలము లాశావీధి పాలైచనన్
నీ బంట్రోతు తనంబు స్త్రీల యెడనే, నిన్నెవ్వరున్ నవ్వరే
మా బాలామణి వేచబోకు మకటా మర్యాద గా దాత్మజా

నీ బాణాలు రాలిపోనూ,
నీ విల్లు ముక్కలైపోనూ,
నీ చంద్రుణ్ని పాముకాటేయ,
నీ బలగాలు దిక్కువపాలుగానూ,
నీ పౌరుషం ఆడవాళ్ల విషయంలోనేనా?
ఎవ్వరూ నిన్ను చూచి నవ్వరా!
మా బాలామణిని బాధించబోకు
ఓ మన్మథా! ఇది నీకు మర్యాద కాదు సుమా!
- అని భావం

ఇందులో కవి ఎంత చమత్కారంగా
మన్మథుని తిట్టిచాడో చూడండి-
మన్మథుని బాణాలు పూవులు
అవి రాలిపోతాయికదా
ఆమె అదే తిట్టింది.
మన్మథుని విల్లు చెఱకు కదా
అది ముక్కలుగా నరుకుతారు కదా
ఆమె అదే తిట్టింది.
చంద్రుణ్ణ్ని పాము మ్రింగుతుందికదా
ఆమె అదే తిట్టింది
అతని బలగాలు కోకిలా తుమ్మెదలేగా
అవి దిక్కుల పారిపోతాయికదా
ఆమె అదే తిట్టింది.

ఇందులో లోకంలో సహజంగా ఉండే వాటినే
తిట్లుగా పలికించాడు ఈ కుమారధూర్జటి.
ఎంత చమత్కారం

ఎవరి విషయం వారు సమర్థించుకోరా?


ఎవరి విషయం వారు సమర్థించుకోరా?
సాహితీమిత్రులారా!శేషము వేంకటపతి కృత
శశాంకవిజయంలోని
ఈ పద్యాలు చూడండి-

తార శశాంకు(చంద్రు)ని తన మార్గంలోకి
తెచ్చుకోవడానికి ఇతరుల తప్పును పైకి
తెచ్చి ఈ విధంగా చెప్పింది -

బాళి మనంబునం దణఁచి, ప్రాయము వ్యర్థము చేసి, యూరకే
తూలిన నేమి పుణ్య? మని తోఁచెను, ము న్నల దారుకా వన
స్త్రీలు గిరీశునిన్ గలయరే? వ్రజ భామలు శౌరిఁ గూడరే?
యాలలనా శిరోమణుల కందున నిందున నేమి చెప్పుమా ?

మనసులో కోరికలను అణచి ప్రాయాన్ని వ్యర్థం చేసి
ఊరకే మరణిస్తే పుణ్యమవుతుందా
పూర్వం శివుడు దారుకావనంలోని స్త్రీలతో కూడలేదా
వ్రజ భామలను విష్ణువు కూడలేదా
ఆ స్త్రీలకు అందున ఇక్కడ నాకు ఏమిటో  చెప్పు

కన్నకూఁతురటంచు నెన్నక భారతీ
         తరుణిఁ గూడఁడె నీ పితామహుండు?
మేనత్త యను మేర మీఱి రాధికతోడ
         నెనయఁడే నిన్న నీ యనుఁగు భావ?
వదినె యంచు నొకింత వావి లేకయె జ్యేష్ఠు
         నెలతతోఁ బొందఁడె నీ గురుండు?
ముని పత్ని యన కహల్యను బట్టఁడే నీదు
         సహపాఠి యౌ పాకశాసనుండు?
ఇట్టి మీవారి నడతలు కట్టిపెట్టి
మమ్మ నేఁజెల్ల న్యాయంబు లాడె దౌర!
కడకు నీ రంకు నీ వెఱుంగని వితాన 
దూరెదవు నన్నుఁ, జలపోరి దోసకారి!
                                                            (శశాంకవిజయము - 3-80,81)

ఓ చంద్రా!
నీ పితామహుడు బ్రహ్మ కన్నకూతురని
కూడా  చూడకుండా సరస్వతిని కలిశాడు.
మరి మీ బావో (కృష్ణుడు) మేనత్త అనే పరిధి
దాటి కూడలేదా?
మీ గురువుగారు (ఉతధ్యుని భార్య మమతను)వదినె అని
చూడకుండా బలవంతంగా పొందాడుకదా!
మీ సహపాఠి ఇంద్రుడు మునిపత్ని అని చూడకుండా
అహల్యను బట్టాడు కదా!
ఇలా మీవాళ్ళందరి నడతలను కట్టిపెట్టి
మమ్మనడం భావ్యమా ?
న్యాయం మాట్లాడుతున్నావా చివరకు
నీరంకు నీకు తెలియదా నన్నంటున్నావు.

ఈ విధంగా తార తన కోరికను
సమర్థించుకుంటూన్నది.

Wednesday, December 14, 2016

మృదువై దేశీయమై భవ్యమై విననింపై.....


మృదువై దేశీయమై భవ్యమై వినింపై.....
సాహితీమిత్రులారా!

వాసవాంబ చరిత్రకు మూలం
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ.
వైశ్యపురాణం(వాసవీ మాహత్మ్యం)లో
వాసవి జననం నుండి ఆత్మార్పణవరకు
కథ వర్ణించడమైనది. దీని రచన కొరకు
వైశ్యులు వారి గురువైన భాస్కరాచార్యుల
వారిని వైశ్యప్రముఖులంతా వైశ్యపురాణాన్ని
రచించవలసినదిగా ఈ విధంగా కోరారట
ఆ పద్యం చెప్పారట -

తెనుగుంగా వ్యము జెప్పవయ్య మృదువై దేశీయమై భవ్యమై
వినింపై సరసత్వమై విరళమై విఖ్యాతమై కీర్తిమై
జనతా మోదక హృద్యపద్య యుతమై సద్ధర్మమై చోద్యమై
తనరం బల్కవె చింతయేల యనుచున్ ధర్మజ్ఞ భాషింపవే

మృదువుగా, దేశ్య పదభూయిష్టంగా, మేలు రకంగా ఉండి,
చెవులకింపుగా రసపరిపూర్ణంగా, అరుదైన రచన కలిగి,
ప్రశస్తమై కీర్తిని కలిగించేదిగా, చదివే పాఠకులకు
ఆనందాన్ని కలిగించే మనోహరములైన పద్యాలతో కూడి,
మంచి ధర్మ ప్రబోధకమై, ఆశ్చర్యముగా ప్రకాశించే తెనుగు కావ్యాన్ని
రచింపుము. నీవు ధర్మాలు తెలిసినవాడు కనుక నీకు ఈ విషయంలో
విచారమెందుకు అని వారి ప్రార్థన సారాంశం.ఇలాంటి వాళ్ళూ ఉంటారు


ఇలాంటి వాళ్ళూ ఉంటారుసాహితీమిత్రులారా!ఇది లోకంకదా అన్నిరకాలవాళ్లు ఉంటారు.
ఇలాంటివాళ్లుకూడా -

చితాం ప్రజ్వలితాం దృష్ట్వా 
వైద్యో విస్మయ మాగతః
నాహం గతో న మే భ్రాతా, 
కస్యేదం హస్తలీఘవమ్

ఒక వైద్యుడు పొరుగూరి నుండి  వెళుతుండగా
ఎవరో వ్యక్తి మరణించగా శ్మశానంలో ఒక చితి
పేర్చి నిప్పంటించివెళ్లారు. అప్పుడా దారిన వచ్చిన
ఈ వైద్యునికంట పడింది ఆ దృశ్యం. వెంటనే
ఇతనికి వైద్యానికి నేనుకాని నా తమ్ముడుగాని వెళ్లలేదు కదా!
ఇది ఎవరి హస్తలాఘవమై ఉంటుంది
అనగా ఎవరి చేతి చలవ వల్ల ఇతడు చనిపోయాడు -
అని ఆశ్చర్యపడ్డాడట - అని భావం

దీని అర్థం ఏమిటి వారి చేతి మాత్రతో
వైకుంఠయాత్ర ఖాయమనే స్పష్టమే కదా!

Tuesday, December 13, 2016

ఈ సమయాల్లో తాంబూలం సేవిస్తే సుఖమట


ఈ సమయాల్లో తాంబూలం సేవిస్తే సుఖమటసాహితీమిత్రులారా!


కవి చౌడప్ప అంటూనే బూతులే
చెప్పే కవి అని కొందరి అభిప్రాయం-
అది కొంతవరకు నిజమే కాని
ఈ పద్యం చూడండి-

పరగడుపున సభలలోపల
తరుణులయెడ భుక్తమైన తరి యొక విడెమున్
దొరకని వరునకు సౌఖ్యము 
కరవప్పా కుందవరపు కవి చౌడప్పా!

ఇది తాంబూల సేవనం ఎప్పుడు
చేయాలనేవిషయం సూచించే పద్యం

ఆహారం తీసుకోకముందు ఒకసారి,
ఎక్కడికైనా సభలకు వెళ్ళినపుడు,
స్త్రీలతో సల్లాపాలలో ఉన్నపుడు,
భోజనం చేసిన తరువాత -
ఈ సమయాల్లో ఒక్కవిడియము
దొరకక పోతే ఆ పురుషునికి
లోకంలో సుఖమనేది  కరువే అవుతుందట.

దీన్ని బట్టి ఆసమయాల్లో
తాంబూలం వేసుకోవాలని కవి భావం.

స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలట


స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలటసాహితీమిత్రులారా!


సంస్కృతంలోని కామందకనీతిశాస్త్రాన్ని
తెలుగులో జక్కరాజు వెంకటరాజు
ఆంధ్రకామందకమనే పేరున తెనిగించాడు.

అందులోని ఈ పద్యం చూడండి-

వలపుల సొంపు కెంపు జిగి వన్నియ వాల్జడ కన్నులం గనం
గలకల మంచు మించు మృదు గద్గద భాషలు నేకతంపు చ
ర్యలు వెలలేని మెచ్చుల యొయారి తుటారి మిటారి యొప్పులుం
గల కలవాణి టేనగునిగాకల బెట్టుదు గుట్టు ముట్టగన్

కమ్మని కంఠధ్వనిఉన్న పడతి ప్రేమానురాగాల విలాసాలు,
ఎరుపెక్కిన కడగంటి చూపులు, కలకల ధ్వనితో కూడిన
సుకుమారమైన సల్లాపాలు, ఏకాంతంలో చూపే మన్మథ
వికారచేష్టలు, వెలకట్టరాని పొగడ్తలతో కూడిన ఒయారాల
అందాలు అనే ఆయుధలతో, ధైర్యంతో, మాయలతో
ఏ పురుషుణ్ణి విరహతాపానికి గురిచేయదు? - అని భావం

అందమైన యువతి పురుషుణ్ణి ఆకర్షించి, తన వయ్యారాలతో,
సరససల్లాపాలతో తనకు అధీనుణ్ణిగా చేసుకుంటుంది. తనకు
లోబడేంత వరకు అతణ్ణి తాపానికి గురి చేస్తుంది. అందువలన
స్త్రీల విషయంలో చాల జాగ్రత్తగా ఉండాలని గ్రంథకర్త సూచన
ఇది.

Monday, December 12, 2016

వయసు మళ్ళినవాని ఆవేదన


వయసు మళ్ళినవాని ఆవేదనసాహితీమిత్రులారా!వయసు మళ్ళినవాని ఆవేదన తెలిపే
ఈ శ్లోకం చూడండి-

ఆ పాండురా శ్శిరసిజాస్త్రివళీ కపోలే
దంతావళీ విగతా వచ మే విషాదః
ఏణీదృశో యువతయః పధి మాం విలోక్య
తాతేతి భాషణపరాః ఖలు వజ్రపాతః

తల వెంట్రుకలు తెల్లబడ్డాయి.
చెంపల మీద ముడుతలు ఏర్పడ్డాయి.
నోట్లో దంతాలు ఊడిపోయాయి. అయినా
అందుకోసం నాకు విచారంగాలేదు.
కాని నేను వచ్చే దారిలో లేడి కన్నుల
యువతులు నన్ను చూచి తాత
అని తమలో తాము మాట్లాడుకోవడం
నాకు పిడుపాటువలె తగిలినది - అని భావం.

ఇందులో తాత - అంటే సంస్కృతభాషలో
తండ్రి అని, మన తెలుగులో తాత అంటే
ఇంకెంత బాధపడేవాడో కదా!

వీరి విషయంలో అమర్యాద తగదు


వీరి విషయంలో అమర్యాద తగదు
సాహితీమిత్రులారా!అవమానించడం తగదు ఎవరినైనా
కానీ వీరిని అవమానించడం
అసలు చేయకూడదట -
ఈ శ్లోకం చూడండి -

క్షత్రియం చైవ సర్పంచ
బ్రాహ్మణంచ బహుశ్రుతమ్
నావమన్యేత వై భూష్ణుః
కృశా నపి క దాచన

పరాక్రమం గల రాజు(క్షాత్రంగలవాడు)నీ,
పామునూ, బాగా పాండిత్యం
గల బ్రాహ్మణునీ, బాగా బ్రతికి -
చెడినందువల్ల అవస్థలుపడేవాడినీ,
ఎన్నడూ అవమానించరాదు.
ఎందుకంటే - వీరు తాత్కాలితంగా
ఏమీ చేయకలేకున్నా, తమ శక్తి సామర్థ్యాలకు
పదునుపెట్టి అవతలివారి అంతు చూడగలరు.
కావున వీరి విషయంలో  అమర్యాద కూడదు.

Sunday, December 11, 2016

అప్పుడు అన్నీ నిష్ప్రయోజనాలే


అప్పుడు అన్నీ నిష్ప్రయోజనాలే
సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి -
ఇది నీతిశాస్త్రంలోనిది.

అధర్మేణై తతేతావ
త్తతో భద్రాణి పశ్యతి,
అతత్స పత్యాన్ జయతి
నమూలస్తు వినస్యతి

అన్నాయం - అక్రమాల ద్వారా ఎంతగా
సంపాదించి భాగ్యవంతుడైనా
బాగా సుఖాలు అనుభవించినా,
విరోధులపై విజయం సాధించినా,
ఏదో నాటికి పాపం పండడం ఖాయం.
అప్పుడు సంపాదన, సుఖం, ధనం,
శత్రుజయం అన్నీ నిష్ప్రయోజనాలే.

కాబట్టి న్యాయాన్యాయాలను పరిగణించి
ఉండటం అన్నివిధాలా శ్రేయమని భావం.

నాస్వామి ఈ రాత్రి వచ్చి పరవశింపచేయగలడు


నాస్వామి ఈ రాత్రి వచ్చి పరవశింపచేయగలడు
సాహితీమిత్రులారా!చైనా జాతిలో మొలకెత్తి
జపానుసాహితీలతను లతాంతాలను
విరియించిన ఒక కథ-

ఆకాశరాజుకు తంబతా సుమే అనే చక్కని చుక్క
ఒకే ఒక కూతురు. ఆ పిల్లకు బట్టలునేయడం
అంటే ఇంత అంత అనరాని సరదా.
నాన్నకు కావలసిన బట్టల్ని నేసి యిచ్చేది.
ఒకరోజు మగ్గం ముందు కూర్చొని పోగులు
సారించుతూ దోవెంట పోయే మాంచి ఏపైన
కోడెను తోలుకు వెళుతున్న ఓ కోడెకానిమీద
కన్నేసింది తండ్రికి ఆమె మనసు తెలిసి
అతని పొత్తుకు ఇష్టపడి అతన్ని అల్లునిగా
చేసుకున్నాడు. పెళ్ళైంది వారిద్దరు ఒకర్నొకరు
ఎడబాయక చేయవలసిన పనులు చేయక
పనంతా ఆకాశరాజుపై బడింది. చివరికి
ఆకాశరాజు వారిని విడదీశాడు. ఒకరు
ఏటికి అవతల ఒకరు ఇవతల ఉండేలా చేశాడు.
ఏడాదికి ఒకసారిమాత్రమే కలుసుకునే దానికి
ఒప్పుకున్నాడు.
అది ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడు మాత్రమే
అనుమతించబడింది.
దీనిమీద జపానులో పౌరాణిక గాథ అల్లబడింది.
అనేకానేకులు వారి కథను మహాకవులనేకులు వారి
స్వగత ఛందాల్లో పురివిప్పి ఆడాయి.
ఇక్కడ కొన్నిటిని చూద్దాం-

ఆమొనో గో వా 
అయి ముకీ తాషితే
  వాగా కోయీ షీ-
కిమి కిమాసు నారీ
హిమో తోకీ మాకేనా....

(ఆకాశగంగకు ఈ దరిని ....
కొంతకాలం నుంచీ కన్నులుకాయలుకాచి
కనిపెట్టుకొని----
వెంపర్లాడుతున్నానో ----
నా నాథుడు ఈ రేయి దక్కకపోడు.
నానీవి సడలే తరుణం ఆసన్నమైంది .)

హిసా కతా నో 
ఆమొ నోకా వాశె నీ
     ఫూనే ఊకెతె
కోయోయ్  కా-కీమీగా
ఆగరి కిమాసఁ ..

(నురగలై పరవళ్ళుపోయే
అమరాకాశవాహినిని తరించి...
తేలియాడుతూ నాస్వామి ఈ రాత్రి
వచ్చి పరవశింపచేయగలడు)

కాజే కూమో వా
ఫూతా - త్సూ నో కిషీ నీ
    కాయోయ్ దోమో 
వాగా తూహో త్సూమా నో
కోతో జో కాయో వానూ....

సుబూతే నీ మో
నాగే కోషీసు బేకీ
   ఆమోనొ గోవా 
హేదా తేరేబా  కామో
ఆమత సుబే నాకీ...

(వాయుదేవుడూ పర్జన్యుడూ
ఈవల ఆవల రాకపోకలు సలుపుతున్నా
మాయిరువురికీ ఒకపలుకైనా నడవదుగదా
అద్దరి కూతవేటు దూరంలో ఉన్నా...
హతవిధి ... ఆశ్వయుజం వచ్చేదాకా,
ఒకరికొకరం కాకుండా చేసింది.)

ఆమొనొ గోవా
ఈతోకావా నామీ వా
   తాతేనో దోమో
సమోరై గాతాషీ
చికాకీ కోనో సే వో...

(ఆకాశగంగ పొంగకపోయినా
అంతగా గడవరాని అడ్డంకులు లేకపోయినా
ఆ రవంత ప్రవాహాన్నీ అతిక్రమించి
అతని సరసన చేరనీయని ... దురుల్లంఘ్య -
అనుశాసనం ... అప్రతిహత ప్రతిబంధకమౌతూ ఉంది)

(జపాను పద్యవళీ,  అనువాదమూ
The Romance of the Milky way and the other  Studies
అనే లే హరెన్ సంగ్రహాన్ననుసరించి)

Saturday, December 10, 2016

కృష్ణుని సేవింప వచ్చిన శివుడా!


కృష్ణుని సేవింప వచ్చిన శివుడా!
సాహితీమిత్రులారా!


పింగళి సూరన కృత
ప్రభావతీ ప్రద్యుమ్నము నందలి
ఈ ఉత్ప్రేక్ష చూడండి-

ఇంద్రునికి ఆయన రథసారథి మాతలి ద్వారకా
పట్టణంలోని ఉద్యానవనం చూచి
తనఱేనికి ఈ విధంగా చెప్పుచున్నాడు-

కలధౌతకేళినగంబుగాఁ బోలును
         దనరుచున్నది శంభుతనువులీల
ఘనపుష్పచాంపేయ వనరాజి గాబోలు
         నేలుచున్నది పులితోలు సిరుల
హరినీల సోపానసరణి గాఁబోలును 
         బగటుచున్నది నల్లపాఁపపేరుఁ
బవడంపుటలవ సౌభాగ్యంబుగాఁబోలుఁ
         జాటుచున్నది జటాజూటరుచిని
సరసిగాఁబోలుఁ గ్రాలెడు సురనదిగతి
నోడగాఁబోలుఁ బోలెడునుడుపతికళ
ననిమిషాధిప చూచితే యల్లపసిడి
కోటనడిమి శృంగారపుఁదోఁటలోన
                                       (ప్రభావతీప్రద్యుమ్నము - 1- 63)

ఓ దేవతలరాజా! ఇంద్రా!
వెండి క్రీడా పర్వతము శివుని శరీరంగాను,
పచ్చని సంపెగ చెట్లచాలు పులితోలుగను,
నీలంపు మెట్లవరుస నల్లత్రాచుల హారంగాను,
పగడాల కంచె జటాజూటంగాను,
నడుమనున్న కొలను ఆకాశగంగగను,
ఆ కొలనిలోని నావ చంద్రకళగాను,
చెప్పి, ఉద్యానవనరూపమున శ్రీకృష్ణుని
సేవింపవచ్చియున్న శివుడు కాబోలు - అని
ఉత్ప్రేక్షించినాడు కవి.

ఇవి గుర్తుంచుకోవాలి


ఇవి గుర్తుంచుకోవాలి
సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-

నవిగన్హ్య కథాంకుర్యా
ద్బహిక్మాల్యం నధారయేత్,
గవాంచయానంపృష్ఠేన
సర్వన్త వవిగర్హి తమే

నిందించే విధంగా ఎప్పుడూ ప్రసంగించకూడదు.
మనం ధరించినా గాని, ఇతరులు ధరించినాగాని
ఒకసారి బైట పారవేశాక ఆ పూల మాలలు ధరించకూడదు.
ఎద్దు మూపున ఎక్కి ప్రయాణించకూడదు.
అది శివుని వాహనం అని మరచిపోకూడదు.

Friday, December 9, 2016

వారు స్త్రీలు కారా?


వారు స్త్రీలు కారా?
సాహితీమిత్రులారా!


తంజావూరును పాలించిన విజయరాఘవుని
ఆస్థానంలో మన్నారుదాసవిలాసం(యక్షగానము) అనే
శృంగార కావ్యరచయిత్రి రంగాజీ (రంగాజమ్మ)
ఆస్థాన కవయిత్రిగా ఉండేది. చక్కని కవిత్వం చెప్పగలదిట్ట.
విజయరాఘవునిచేత కనకాభిషేక గౌరవాన్ని పొందినది.
ఆమె అంటే ఎక్కువ ప్రేమతో రాజుగారు ఎక్కువగా
ఆమెతోటి కాలం గడిపేవాడు. ఒకరోజు విజరాఘవుని భార్య
రంగాజమ్మ దగ్గరికి ఒక దూతికతో నిందా పూర్వకంగా
తన భర్త సాంగత్యము వదలుకొమ్మని సందేశం పంపినది.
దానికి రంగాజమ్మ ఈ పద్యంతో సమాధానం చెప్పింది.
చూడండి ఆ పద్యం -

ఏ వనితల్మముం దలపనేమి పనో! తమరాడువారు గా
రో వలపించు నేర్పెరుగరో! తమ కౌగిటిలోన నుండగా
రావది యేమిరా! విజయరామ! యటం చిలుదూరి బల్మిచే
దీవరకత్తెనైపెనగి తీసుకువచ్చితినా? తలోదరీ!

ఎవరైనా స్త్రీలు మావిషయం
స్మరించవలసిన అవసరంమేమి?
వారు స్త్రీలు కారా తమ భర్తను అనురాగంతో
వశపరచుకునే తెలివి వారికి లేదా?
నేను విజయరాఘవుడు ఆమె కౌగిలిలో ఉండగా
తీసుకొని వచ్చినానా? నన్ను నిందించటం ఎందుకు - అని భావం.

రాయలు తనంత తానే నా దగ్గరికి వస్తున్నాడు
రాణి తన ప్రేమతో ఆయనను బంధించలేనప్పుడు
నా దోషం ఏమున్నది అది ఆమె లోపమే
అని యుక్తిగా సమాధానమిచ్చింది.

తగినవానికి ఇవ్వలేక పోతే ఎలా?


తగినవానికి ఇవ్వలేక పోతే ఎలా?
సాహితీమిత్రులారా!


జాలి, దయ, కరుణ ఇవి అందరికీ ఉంటాయి.
అయితే అవి కొందరిలో ఎక్కువగాను మరికొందరిలో
తక్కువగాను ఉంటాయి. ఆ ఉన్న కరుణ ఎవరికైతే
అవసరమో వారికి చెందితే మంచిది. అలా కాని
పక్షంలో అది వృధా అవుతుంది దానికి సంబంధించిన
ఈ శ్లోకం చూడండి-
ఇది నీతిశాస్త్రంలోనిది-

దీనానా మిమ పరియహా శుష్కసస్యా
న్యేదార్యం ప్రకటయతో మహీదరేషు
ఔన్నత్యం పరమవాప్య దుర్మదస్య
జ్ఞాతో యం జధర తావకో వివేకం

మేఘుడు లేదా వరుణుడు కరుణమాలి మితిమీరిన
గర్వం చేత కొండలలో, కోనల్లో అపారంగా వర్షం
కురిపించేస్తుంటాడు. దీనంగా ఆకాశం వంక చూస్తూ,
తమ పంటచేల పైన ఇంత వానను కురిపించమని
రైతులు మోరలు సాచి ప్రార్థిస్తున్నా అతనికి జాలి
కలగదు - అని భావం.

పంటచేలు ఎండిపోతున్నా, ఆర్భాటంగా పనికి రాని చోట్ల
కురిసే మేఘుడిలాంటి వాళ్లే లోకంలో కొందరుంటారు.
వీళ్లది ఉదారబుద్ధే కాని, అవసరమైన వారికి వీరి సహాయం
అందదు, వ్యర్ధులకు అందుతుంది.