Thursday, September 29, 2022

శ్రీరాముడు మాంసాహారం తిన్నాడా?

 శ్రీరాముడు మాంసాహారం తిన్నాడా? 




సాహితీమిత్రులారా!

శ్రీరాముడు మాంసాహారం తిన్నాడా? - అనే

ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా తిరుగుతోంది. మన దేశంలో రాముణ్ణి పూజించేవాళ్ళకు, ద్వేషించేవాళ్ళకు లోటులేదుగా. అలా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అందుకే ఆయనెప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాడు. రాముణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి బాగుపడిన వాళ్ళూ ఉన్నారు. రాముణ్ణి తిడుతూ, ప్రచారంలోకి వచ్చి సంపాదించుకున్నవాళ్ళూ ఉన్నారు. అంటే వాళ్ళవీళ్ళకూ అందరికీ రాముడి వల్ల మంచే జరిగిందన్న మాట. అదే రామనామం గొప్పతనం. ఇక ఈ ప్రశ్నకు సమాధానంలోకి వెళదాం..


Rajan PTSK గారికి ధన్యవాదాలు

Tuesday, September 27, 2022

శ్రీరాముని వంశవృక్షం - రాముని పూర్వీకులు - రాముని వంశీకులు

 శ్రీరాముని వంశవృక్షం - రాముని పూర్వీకులు - రాముని వంశీకులు




సాహితీమిత్రులారా!

సూర్యవంశ రాజుల పరంపర మొదటి నుండి చివరి వరకూ!- 

శ్రీరాముడు సూర్యవంశపు రాజనీ, పాండవులు చంద్రవంశ క్షత్రియులనీ, శ్రీకృష్ణుడు యందువంశ తిలకుడనీ ఇలా మనం పుస్తకాలలో చదువుతూ ఉంటాం. ప్రవచనాలలో వింటూనే ఉంటాం. అయితే ఈ వంశాలేమిటి? ఈ వంశాలలో ప్రసిద్ధులైన రాజులెవరు? ఎవరి తరువాత ఎవరు రాజ్యానికి వచ్చారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మనకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మన భరతభూమిని పరిపాలించిన రాజుల పరంపర మీద అవగాననూ పెంపొందిస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనం సూర్యవంశ రాజుల పరంపర కోసం చెప్పుకుందాం.

ఇందులో రామాయణంలో చెప్పబడిన సూర్యవంశ వర్ణన, భాగవతంలో చెప్పబడిన సూర్యవంశ వర్ణన కూడా వివరిస్తున్నాను.


రాజన్ పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలు


Sunday, September 25, 2022

రాబందుల సమావేశం - ఏ వీరుడు కొట్టిన వాళ్ళను ఎవరు తినాలి?

 రాబందుల సమావేశం - 

ఏ వీరుడు కొట్టిన వాళ్ళను ఎవరు తినాలి?




సాహితీమిత్రులారా!

రామాయణంలో పిట్ట కథ-

మన అమ్మమ్మలూ నాయనమ్మలు భారతరామాయణాల నుండి, పురాణాలనుండీ ఎన్నో పిట్టకథలు చెప్పేవారు. సరదాగానూ చమత్కారంగానూ ఉండే ఆ చిన్నచిన్న కథలు నిజానికి మూలంలో ఉండేవి చాలా తక్కువ. అంటే వ్యాసుడు, వాల్మీకీ చెప్పినవి కావన్న మాట. కానీ అవన్నీ ఆయా పౌరాణిక పాత్రల గొప్పతనాన్ని చెప్పేవిగానో, భక్తిభావం కలిగించేవిగానో, సమాజానికి ఎదో ఒక మంచి సందేశాన్ని అందించేవిగానో ఉండటం వల్ల ఆ చిట్టిపొట్టి కథలు ఒక తరం నుండి మరొక తరానికి అందుతూనే ఉన్నాయి. మనలను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి కథలలో ఒక దానిని ఈరోజు చెప్పుకుందాం.


Rajan PTSKగారికి ధన్యవాదాలు


Thursday, September 22, 2022

సప్త చిరంజీవులు ఎవరు? ఎక్కడ ఉంటారు

 సప్త చిరంజీవులు ఎవరు? ఎక్కడ ఉంటారు 




సాహితీమిత్రులారా!

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః

కృపః పరుశరామశ్చ సప్తైతే చిరంజీవినః

అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు ఈ ఏడుగురినీ సప్త చిరంజీవులంటారు. ఈ సప్త చిరంజీవులతో పాటూ మార్కండేయుని కూడా కలిపి నిత్యం స్మరించుకునేవారు సర్వవ్యాధులనుండీ రక్షణ కలిగి, అపమృత్యు భయంలేకుండా, నిండు నూరేళ్ళూ జీవిస్తారన్నది పెద్దలు చెప్పిన మాట.  చిరంజీవి అంటే చిరకాలం పాటూ జీవించేవాడు అని అర్థం. మనం ఈరోజు ఆ చిరంజీవులందరి కోసం సంగ్రహంగా చెప్పుకుందాం. 

Rajan PTSKగారికి ధన్యవాదాలు


Tuesday, September 20, 2022

అది తెలియకపోతే భారతం ఏమీ తెలియదు

 అది తెలియకపోతే భారతం ఏమీ తెలియదు




సాహితీమిత్రులారా!

అంశం- అది తెలియకపోతే భారతం ఏమీ తెలియదు

వ్యాఖ్య- మల్లాది చంద్రశేఖరశాస్త్రి

ఆస్వాదించండి-





Sunday, September 18, 2022

గ్రామదేవతల చరిత్ర

 గ్రామదేవతల చరిత్ర




సాహితీమిత్రులారా!

గ్రామదేవతలకు ఆపేర్లెందుకు వచ్చాయో

తెలిపే ఈ వీడియోను ఆస్వాదించండి-



తెలుగు హోమ్ చానల్ వారికి ధన్యవాదాలు

Thursday, September 15, 2022

తమిళ వేదంగా పిలిచే "తిరుక్కురళ్‌"లో ఏముంది?

 తమిళ వేదంగా పిలిచే "తిరుక్కురళ్‌"లో ఏముంది?




సాహితీమిత్రులారా!

తిరుక్కుఱళ్. తిరు అంటే గౌరవవాచకం. మనం సంస్కృతంలోనూ, తెలుగులోనూ “శ్రీ”ని ఎలా అయితే గౌరవసూచకంగా వాడతామో, అలానే తమిళంలో “తిరు” అన్న మాటను వాడతారు. ఉదాహరణకు తిరుమల అన్న మాట తీసుకుంటే.. తిరు అంటే పవిత్రమైన లేదా పూజనీయమైన అని అర్థం. మల అంటే పర్వతం.  అలానే తిరుకొలను అంటే పుష్కరిణి అని అర్థం. తిరుప్పావై అంటే పవిత్రమైన లేదా శుభం కలిగించే వ్రతం అని అర్థం. ఇక “కుఱళ్” అంటే రెండు పాదాలున్న పద్యం. కాబట్టి తిరుక్కుఱళ్ అంటే పవిత్రమైన పద్యం అన్న మాట. 

 Rajan PTSKగారికి ధన్యవాదాలు


Tuesday, September 13, 2022

బాలనాగమ్మ కథ

 బాలనాగమ్మ కథ





సాహితీమిత్రులారా!

మాయలు ఫకీరు కథ - మాయలు మంత్రాల అద్భుత జానపద కథ.

తెలుగు జానపద కథల్లోకెల్లా గొప్పదిగా భావించబడే కథ బాలనాగమ్మ కథ. మాయలూ మంత్రాలతో, మాయలఫకీర్ కుతంత్రాలతో, బాలవర్థిరాజు సాహసాలతో మొదటినుండీ చివరి వరకూ కూడా పాఠకులనూ శ్రోతలనూ ఉర్రూతలూగించే ఇటువంటి కథ మరలా తెలుగు జానపద కథాసాహిత్యంలో రాలేదన్నది మన అమ్మమ్మలు, నాన్నమ్మలూ చెప్పే మాట. నేను కూడా ఈ కథను నా చిన్నప్పుడు మా నాన్నమ్మ నోటి ద్వారా కనీసం యాభైసార్లైనా విని ఉంటాను. ఎన్నిసార్లు విన్నా అదే కొత్తదనం, అదే ఆశ్చర్యం, అదే ఆనందం. అటువంటి అద్భుతమైన ఆ బాలనాగమ్మ కథను మన అజగవ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక కథలోకి ప్రవేశిద్దాం.

 Rajan PTSK గారికి ధన్యవాదాలు

Sunday, September 11, 2022

కన్యాశుల్కం నాటకం 2వ భాగము

 కన్యాశుల్కం నాటకం 2వ భాగము




సాహితీమిత్రులారా!

కడుపుబ్బా నవ్వించే, సాంఘిక దురాచారాలను నిరసించే గొప్ప నాటకం

క్రితం భాగంలో మనం మధురవాణి, గిరీశం, రామప్ప పంతులు, పూటకూళ్ళమ్మ, వెంకటేశం మొదలైన పాత్రలతో నడిచిన కన్యాశుల్కం ప్రథమాంకాన్ని చెప్పుకున్నాం. వెంకటేశానికి చదువు చెప్పే మిషతో గిరీశం వెంకటేశంతో పాటూ వాళ్ళ అగ్రహారానికి బయలుదేరివెళ్ళడంతో ప్రథమాంకం ముగుస్తుంది. ఈ ప్రథమాంకంలో వచ్చిన పాత్రలలో ముఖ్యమైనవి మాత్రం మధురవాణి, రామప్పపంతులు, గిరీశం. ఇందులో మధురవాణి ఒక వేశ్య, రామప్ప పంతులు రామచంద్రపురం అగ్రహారం కరణం, ఇక గిరీశం గురించి చెప్పేదేముంది. తన తెలివితేటలతో వాక్చాతుర్యంతో అవతలివారిని బురిడీకొట్టిస్తూ బ్రతికే జిత్తులమారి పాత్ర అతనిది. ఇక ఈ ద్వితీయాంకంలో మనకు వెంకటేశం తండ్రి, కృష్ణరాయపురం అగ్రహారీకుడూ అయిన అగ్నిహోత్రావధాన్లు, ఆ అగ్నిహోత్రావధాన్లు భార్య వెంకమ్మ, కూతురు బుచ్చమ్మ, బావమరిది కరటక శాస్తుల్లు, ఆ కరటకశాస్తుల్ల శిష్యుడు ప్రధానంగా కనబడతారు. ఈ కరటక శాస్త్రులు విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు. ఇక ద్వితీయాంకంలోకి  ప్రవేశిద్దాం.

Rajan PTSK గారికి ధన్యవాదాలు

Thursday, September 8, 2022

కన్యాశుల్కం నాటకం

 కన్యాశుల్కం నాటకం




సాహితీమిత్రులారా!

కడుపుబ్బా నవ్వించే, సాంఘిక దురాచారాలను నిరసించే గొప్ప నాటకం.

దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ప్రబోధించిన మహాకవి మన గురజాడ అప్పారావు గారు. అప్పటికాలంలో వేళ్ళూనుకు పోయిన బాల్యవివాహాలవంటి సాంఘిక దురాచారాలను చూసిన ఆ కవిహృదయం ద్రవించిపోయింది. అయిదారేళ్ళ ఆడపిల్లల్ని డబ్బు కక్కూర్తితో యాభై అరవై ఏళ్ళ ముసలాడికిచ్చి పెళ్ళి చేసే, దుర్మార్గమైన ఒక ఆచారాన్ని   రూపుమాపడానికీ  ఆయన కంకణం కట్టుకున్నారు. అంతేగాక పుస్తకభాషను గ్రాంథికం నుండి వాడుకభాషకు మార్చడానికి గిడుగు రామ్మూర్తి పంతులుగారితో కలసి ఆయన చేసిన కృషి అంతా ఇంతాకాదు. సమాజం విజ్ఞానవంతంగా మారడానికి వాడుకభాషే పుస్తకభాషగా ఉండాలని  ఆయన బలంగా నమ్మారు. అటువంటి వాడుకభాషనే ఆయుధంగా చేసుకుని బాల్యవివాహాలనే ఒక సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడానికి ఆయన చేసిన ప్రయత్నమే కన్యాశుల్కం నాటకం. హాస్యరస ప్రధానంగా కనిపించే ఈ నాటకం అంతర్లీనంగా ముక్కుపచ్చలారని ఆడపిల్లలు బాల్యవివాహాల పేరుతో ఎలా బలైపోతున్నారో మనకు చూపిస్తుంది. కేవలం ఈ ఒక్క దురాచారమేగాక,  ఆనాటి సమాజనికి పట్టిన మరెన్నో రుగ్మతలను కూడా మన కళ్ళకు కట్టిస్తుంది, సుమారు 130 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ప్రదర్శింపబడిన ఈ కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ తెలుగువారిని అలరిస్తూనే ఉంది. ఈ నాటకం పుస్తక రూపంగా వచ్చి కూడా సుమారు 125 సంవత్సరాలు కావస్తోంది. ఇటువంటి ఓ గొప్ప రచనను మన అజగవ ఛానల్‌ ద్వారా మీకు వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను. నిడివి పెద్దదైన ఈ నాటకానికి, ఎటువంటి మార్పులూ చేర్పులూ చేయకుండా, కొన్ని భాగాలుగా చేసి మీకు అందించబోతున్నాను. మీ అభిమానాన్నీ, ఆశీర్వచనాన్నీ ఆకాంక్షిస్తున్నాను. ఇక నాటకంలో ప్రవేశిద్దాం.


Rajan PTSK గారికి ధన్యవాదాలు

Tuesday, September 6, 2022

మేఘసందేశంలోని కథేమిటి?

 మేఘసందేశంలోని కథేమిటి?




సాహితీమిత్రులారా!

వ్యాసవాల్మీకుల తరువాత ఆ స్థాయిలో మనం గౌరవించుకునే కవి.. మహాకవి కాళిదాసు. మన దేశంలో పుట్టిన మహాకవులందరిదీ ఒక ఎత్తైతే.. కాళిదాసు ఒక్కడిదీ ఒక ఎత్తు ఎత్తు. మరలా కాళిదాసు రచనల్లో రఘువంశం, కుమారసంభంవం, అభిజ్ఞానశాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం ఇవన్నీ ఒక ఎత్తైతే “మేఘ సందేశం” ఒక్కటే ఒకెత్తు. ఈ మేఘ సందేశం కావ్యం అసలు పేరు మేఘదూతం. ఇది కేవలం 120 శ్లోకాలున్న ఒక చిన్న కావ్యం. ఈ కావ్యంలో ఉన్న గమ్మత్తేమిటంటే.. కథ అంత ప్రత్యేకంగా ఉన్నట్టేమీ అనిపించదు. కానీ కథనం, ఆ వర్ణనలు అసాధారణంగా అనిపిస్తాయి. అందుకే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ శ్లోక తాత్పర్యాలతో ఈ ఉన్న పుస్తకం కొనుక్కుని చదవండి. లేదా archive.orgలో వేదం వేంకటరాయశాస్త్రిగారి వ్యాఖ్యానంతో కూడా PDF లభిస్తుంది. ఆ పుస్తకం copyright పరిధిలోకి రాదు కనుక, హాయిగా డౌన్లోడ్ చేసి చదువుకోండి. నిజానికి ఈ ఒక్క పుస్తకాన్నే కాదు.. కాళిదాసు రచనలన్నీ కూడా మనం చదవాలి. అప్పుడు కలిగే ఆనందం వేరు. జర్మన్ మహాకవి గోథే మీద కూడ కాళిదాసు ప్రభావం చాలా ఎక్కువ. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం చదివిన ఆ గోథే అందులోని రచనా విన్యాసానికి ముగ్ధుడైపోయి వీధిలోకి వచ్చి ఆనందంతో నృత్యం చేశాడట. మన కాళిదాసుకు అలాంటి అభిమానులు ఎందరో ఉన్నారు. మనలో కొందరికి ఉన్న బుద్ధిమాంద్యం చేత, బానిస బుద్ధిచేత సుమారు 2000 సంవత్సరాల క్రితం వాడైన మన మహాకవి కాళిదాసుని అటూఇటుగా 500 సంవత్సరాల క్రితం వాడైన షేక్స్‌స్పియర్‌తో పోల్చి సంబరపడుతుంటాం. మన కాళిదాసుని ఎవ్వరితోనూ పోల్చలేం. ఒకవేళ పోల్చాల్సి వస్తే.. ఏ వ్యాసునితోనో, వాల్మీకితోనో పోల్చాలి. సరే.. ఇక మేఘసందేశం కథలోకి వెళదాం. 


Rajan PTSK గారికి ధన్యవాదాలు


Sunday, September 4, 2022

మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ! -2

 మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ! -2




సాహితీమిత్రులారా!

మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ! రెండవ భాగం!

క్రితం భాగంలో మనం కణ్ణగీ కోవలుల వివాహం గురించీ, మాధవీ కోవలుల ప్రేమ గురించీ, ఒక చిన్న అపార్థం వల్ల వారిద్దరూ విడిపోవడం గురించీ, పరివర్తన చెందిన కోవలుడు తన భార్యతో కలసి మదురై నగరానికి బయలుదేరడం గురించి, మధ్యలో వారికి కౌంతిని అనే యోగిని కలవడం గురించీ చెప్పుకుని, వారు ముగ్గురూ కలసి మదురై నగర పొలిపమేరలలో ఉన్న ఓ గ్రామాన్ని చేరుకోవడం దగ్గర కథను ఆపాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం.

ఎంతో దూరం నుండే వినవస్తున్న బ్రాహ్మణుల వేదఘోష, సైనికుల కవాతు చప్పుళ్ళు, ఏనుగుల ఘీంకారములు, గుర్రాల సకిలింపులు, మీనాక్షీసుందరేశ్వర ఆలయాలలో మ్రోగుతున్న ఘంటారావములతో ఒక సరికొత్త వాతావరణంలోకి ప్రవేశించిన అనుభూతి కలిగింది వారికి. ఆ ఆశ్చర్యానుభూతితోనే వైగై నదిని సమీపించిన వారు ఆ నది సౌందర్యానికి మరింత అబ్బురపడ్డారు. అలా వాళ్ళు ఆనాటికి ఆ గ్రామంలోనే విడిది చేశారు. ఆ మరునాడు కోవలుడు కణ్ణగికి అనేక జాగ్రత్తలు చెప్పి,  కౌంతిని యోగినికి నమస్కరించి మదురై నగరానికి వెళ్ళాడు. అక్కడ వర్తకం వీధిలో ఉన్న అనేకమంది వర్తకులతో సంభాషించి, సాయంత్రం అయ్యేలోగా తిరిగి తాము విడిది చేసిన గ్రామానికి వచ్చేశాడు. ఆరాత్రి కోవలుడు కణ్ణగికి మదురైనగర విశేషాలను చెబుతూ, తాము త్వరలో అక్కడ ఎంత గొప్ప జీవితాన్ని గడపబోతున్నామో వివరిస్తూ మురిపించాడు. కణ్ణగి కూడా సంతోషసాగరంలో మునిగిపోయింది.

మిగిలిన కథ వీడియోలో వినండి



Rajan PTSK గారికి ధన్యవాదాలు

Friday, September 2, 2022

మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ

 మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ





సాహితీమిత్రులారా!

మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ! మొదటి భాగం!

సిలప్పదికారమ్ అనే రచన తమిళ పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. దీనిని ఇళంగో అడిగళ్ అనే రాచకవి రచించాడు. ఇతడు జైనుడు. సిలంబు అంటే మంజీరం. అంటే కాలికి పెట్టుకునే అందె అన్నమాట. అదికారమ్ అంటే ప్రభావం. కనుక సిలప్పదికారమ్ అంటే మంజీర మహిమ అని అర్థం చెప్పుకోవచ్చు. 

పూర్వం దక్షిణ భారతదేశంలో తమిళప్రాంతాన మూడు మహా సామ్రాజ్యాలుండేవి. అవి చోళ, పాండ్య, చేర సామ్రాజ్యములు. అందులో ధనధాన్యాలతో తులతూగే చోళ సామ్రాజ్యాన్ని కావేరీ పట్టణం రాజధానిగా చేసుకొని కరికాలచోళుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. కావేరీ పట్టణానికి పుహార్ అనే మరో పేరు కూడా ఉంది. ఆ నగరం వాణిజ్యానికి కూడా ఎంతో ప్రసిద్ధి చెందిది. ఆ పట్టణంలో మహానాయకుడనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను మహాధనికుడు, ధర్మాత్ముడు కూడా. అతనికి ఒక్కతే కూతురు, పేరు కణ్ణగి. మహాసౌందర్యవతి. అంతకుమించి సౌశీల్యవతి కూడా. కణ్ణగికి పదమూడవ సంవత్సరం రాగానే, ఆమెకు తగిన వరునికోసం వెదకటం మొదలుపెట్టాడు మహానాయకుడు. 

ఆ నగరంలోనే మహాసత్త్వుడనే మరో వైశ్యప్రముఖుడు ఉండేవాడు. అతడు గొప్ప ఐశ్యర్యవంతుడుగా, మహాదాతగా కీర్తి గడించాడు. అతగాడు చోళరాజైన కరికాలచోళునకు అత్యంత ఆప్తుడు కూడా. ఆ మహాసత్త్వునకు కోవలుడనే ఒక కొడుకున్నాడు. ఆ కోవలుడు విద్యాధికుడు, సంస్కారి. సంగీతసాహిత్యాలలో దిట్ట. అతను పదహారేళ్ళ ప్రాయంవాడు కాగానే అతని తండ్రి అతనికి మంచి సంబంధాల కోసం వెతకసాగాడు. ఆ విషయం తెలుసుకున్న మహానాయకుడు మహాసత్త్వుని కలసి, కోవలుడిని తన అల్లుడిగా చేసుకోవాలన్న కోరికను వెల్లడించాడు. అందుకు మహాసత్త్వుడు కూడా ఎంతో ఆనందంగా అంగీకరించాడు. అటుపై ఒక శుభముహూర్తంలో కణ్ణగీ, కోవలుల వివాహం మహావైభవంగా జరిగింది. 

ఆ తరువాత కొంతకాలానికి కణ్ణగి అత్తవారింటికి కాపురానికి వచ్చింది. మహాసత్త్వుడు తన కొడుకు కోడలు ఏకాంతంగా గడపడానికని ఒక దివ్యమైన భవనాన్ని కట్టించి, దాసదాసీజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నూతన దంపతులు క్షణకాలం పాటూ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా, ఎంతో అన్యోన్యంగా కాలం గడపసాగారు. కణ్ణగి తన భర్తను అన్ని విధాలా సంతోషపెడుతూనే, దానధర్మాది కార్యక్రమాలు కూడా నిరాఘాటంగా చేస్తుండేది. వ్యాపారదక్షత కలిగిన కోవలుడు తమ వ్యాపారాన్ని సమర్థతతో నిర్వహిస్తూ సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచసాగాడు. ఇలా చూడముచ్చటైన ఆ జంటను చూసి బంధుమిత్రులంతా ఎంతో మురిసిపోతుండేవారు. 

అలా కొంతకాలం గడిచింది. ఇదిలా ఉండగా ఒకనాడు కరికాలచోళుని ఆస్థానంలో మాధవి అనే నర్తకి నాట్యప్రదర్శన ఇచ్చింది. ఆమె నాట్యానికి అబ్బురపడిన ఆ చోళ చక్రవర్తి ఆమెకు పచ్చలహారాన్ని బహుమతిగా ఇచ్చాడు. సాధారణంగా రాజసభలో జరిగే నాట్యప్రదర్శనలకు నగరంలోని ప్రముఖులు వెళ్ళడం సర్వసాధారణం. అలా ఆనాటి ప్రదర్శనకు కోవలుడు కూడా వెళ్ళాడు. మాధవిని చూడగానే అతని హృదయం నిండా ఆమె ప్రతిబింబమే నిండిపోయింది. మాధవికి కూడా మొదటి చూపులోనే కోవలునిపై ప్రేమ కలిగింది.

 మిగిలిన కథ వీడియోలో వినండి...........


 Rajan PTSK గారికి ధన్యవాదాలు