Tuesday, May 31, 2016

దండం దశగుణం భవేత్


దండం దశగుణం భవేత్


సాహితీమిత్రులారా!

దండిస్తేకాని పనిజరగదు అనే సందర్భంలో "దండం దశగుణ భవేత్" అంటూంటారు.
దేవుడికైనా దెబ్బేగురువు అంటే కొడితేగాని పనిజరగదు అని భావం.
కానీ ఈ శ్లోకం పూర్తిగా చూద్దాం.

విశ్వామిత్రా హి  పశుషు
కర్దమేషు జలేషు చ
అంధే తమసి వార్ధక్యే
దండం దశగుణం భవేత్

ఇది శ్లోకం మరి దీనిలోని అర్థం -

1. వి - పక్షులు,
2. శ్వా - కుక్కలు,
3. అమిత్ర - మిత్రులుకానివారు(శత్రువులు),
4. అహి - పాములు,
5. పశు - పశువులు,
6. కర్దమేషు - బురదలో,
7. జలేషు - నీటిలో,
8. అంధే - గుడ్డితనంలో,
9.తమసి - చీకటిలో,
10. వార్ధక్యే - ముసలితనంలో

దండం - కర్ర,
దశగుణం - 10 గుణాలను, భవేత్ - కలిగిస్తుంది.


అంటే
కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి,
బురదలోను, నీటిలోను, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆపుగా(ఆసరాగా)ఉంటుంది.
కావున కర్ర ఈ పది రకాలుగా ఉపయోగపడుతుంది - అని భావం

వసుధలో లేడు మా బావవంటివాడు


వసుధలో లేడు మా బావవంటివాడు


సాహితీమిత్రులారా!

లోకంలో బావ బావమరదుల పకపకలు, వికవికలు, వేళాకోళాలు,
సరసాలు అందరికీ తెలిసినవే. ఇక్కడ ఈ పద్యంలో
తనబావను ఒకరు
వ్యాజస్తుతి చేస్తున్నారు
చూడండి.

అందమున జూడ రాముబంటైన వాడు,
నాగరకతకు డము వాహనమున కీడు,
శుచికి హేమాక్షుజంపిన శూరుజోడు
వసుధలోలేడు మాబావవంటివాడు

అందంలో మాబావ హనుమంతుడు అంటే కోతి,
నాగరకతకు యముని వాహనానికి సమానం అంటే దున్నపోతు,
పరిశుద్ధిలో హిరణ్యాక్షుని చంపిన శూరునికి జోడి అంటే
వరాహము(పంది)తో సమానం అన్నమాట.
మాబావ వంటివాడు ఈ భూమిమీద లేనేలేడు అంటున్నాడు
బావమరది. చూడండి
ఎంత చక్కగా వేళాకోళం చేశాడో.

చూశారుకదా! వినడానికి ఎంతబాగా పొగిడినట్లున్నది.
వ్యాజస్తుతి అంటే ఇదే పైకి పొగడినట్లును
 అంతర్గతంగా నిందించినట్లుంటుంది.

హనుమజ్జయంతి శుభాకాంక్షలు

హనుమజ్జయంతి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు 
హనుమజ్జయంతి శుభాకాంక్షలు

లాంగూల్యం అంటే తోక , 

అది హనుమంతులవారికి గొప్ప అస్త్రం 

అందుకే దాన్ని స్తోత్రం చేశారు. 

అది ఇక్కడ చదవండి. 

శుభమగుగాక


శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం



హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧ ||
మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨ ||
అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౩ ||
రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౪ ||
శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౫ ||
వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౬ ||
సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౭ ||
రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౮ ||
గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౯ ||
పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౦ ||
జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౧ ||
స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౨ ||
రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౩ ||
జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౪ ||
భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౫ ||
వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౬ ||
వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౭ ||
అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౮ ||
లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౯ ||
రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౦ ||
ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౧ ||
సీతాఽశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౨ ||
ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత్ || ౨౩ ||
ఈ స్తోత్రం 
http://stotras.krishnasrikanth.in/sri-hanuman-langoolastra-stotram-in-telugu/

ఈ బ్లాగునుండి తీసుకోబడింది వారికి నా కృతజ్ఞతలు.


Monday, May 30, 2016

నీలనృపతిన్ వీక్షించు నేత్రత్రయిన్


నీలనృపతిన్ వీక్షించు నేత్రత్రయిన్


సాహితీమిత్రులారా!
ప్రపంచంలో కవులతో కృతులు రాయించుకొని చివర
చెప్పినది కాక వేరొకటి చేసెడివారు కొందరైతే,
మరికొందరు రిక్తహస్తములు చూపెడివారు.
గజనీ మహమ్మదు ఫిరదౌసికి బంగారునాణేలు ఇస్తానని
చివరికి వెండినాణేలు పంపాడు.
అవి తిరస్కరించినందుకు మరణదండన కూడ
విధించడానికి వెనుకాడలేదు సుల్తాను.
కూచిమంచి జగ్గకవికి చింతలపాటి నీలాద్రిరాజు
తన ఉంపుడుకత్తెను నాయికగను, తనను నాయకునిగాను
కృతి రాయమని చివరికి శూన్యహస్తాలు చూపాడు
దీనితో మండిన జగ్గకవి చంద్రరేఖావిలాసం పేరును
చంద్రరేఖావిలాపంగా మార్చాడు.
ప్రార్థనా పద్యంలో రాజును
ఈ విధంగా శపించాడు చూడండి.

శ్రీకంఠుండు, భుజంగ భూషణుడు, భస్మీభూత పంచాస్త్రు డ
స్తోకాటోప బలప్రతాప పురరక్షోదక్ష సంశిక్షణుం
డాకాశూజ్జ్వల కేశపాశుడు త్రిశూలాంకుండు రుద్రుండు తా
నీకన్ చింతలపాటి నీలనృపతిన్ వీక్షించు నేత్రత్రయిన్

(గరళము కంఠమునందుకలవాడు,
సర్పములను భూషణములుగా ధరించువాడు,
మన్మథుని భస్మము చేసినవాడు,
త్రిపురాలను నాశము చేసినవాడు అయిన
త్రశూలాంకుడు రౌద్రంగా రాజును
మూడునేత్రములతో చూచుగాక -
అని శాపము ఇచ్చాడు.)

బ్రహ్మ ఆలిత్రాడు బండిరేవునద్రెంప


బ్రహ్మ ఆలిత్రాడు బండిరేవునద్రెంప


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి.
బ్రహ్మ ఆలిత్రాడు బండిరేవులో
ఎందుకు త్రెంపాలంటున్నాడో కవి.

విత్త మొకని కిచ్చి వితరణశీలమౌ
చిత్త మొకని కిచ్చి చెరచినాడు
బ్రహ్మ ఆలిత్రాడు బండిరేవునద్రెంప
రెండు నొకనికీక బందుచేసె

సృష్టికర్త బ్రహ్మదేవుడే తప్పులు చేస్తున్నాడు చూడండి
ఆ బ్రహ్మ దాతృబుద్ధిలేని లోభికి అపార ధన(విత్తం) ఇస్తున్నాడు.
దాన (వితరణ) శీలం మరొకనికి ఇస్తున్నాడు
కాని వానికి ధనంలేకుండా మహాదరిద్రుని చేసి
మహాపరాధం చేస్తున్నాడు.
విత్తాన్ని వితరణశీలాన్ని ఒకరికే ఇస్తే ఎంత బాగుంటుంది-
అని దరిద్రంలో మగ్గే కవి ఎంత అక్కసుతో అంటున్నాడో చూడండి.
సరస్వతీదేవి మంగళసూత్రాన్ని తెంచేయాలట అంటే బ్రహ్మదేవుని చంపేస్తున్నాడు.
లేమిలో ఎన్ని బాధలో ఇంతపని చేయిస్తున్నది.

Sunday, May 29, 2016

వారములకు, నెలలకు తెలుగు పేర్లు


వారములకు, నెలలకు తెలుగు పేర్లు


సాహితీమిత్రులారా!

ఈరోజు మనం అన్నిటిని మార్చివేశాము.
ప్రతిదాన్ని ఆంగ్లంతో అనుసంధానించి చెప్పుకుంటున్నాము.
మనం వాడే ప్రతిపదం కొన్నాళ్ళకు పరభాషాపదాలవుతాయేమో!
ఏమో! ఆశ్చర్యం అక్కరలేదు.
మనదేశంలో ఉన్నవారు ప్రతిదాన్ని మనలో కలిపేసుకునే దానికి అలవాటు పడ్డారు.
కానీ కొందరు ఎంత ప్రత్యేకంగా ఆలోచించారో చూస్తే అది ఇంకా ఆశ్చర్యం కలగకమానదు.
 అలాంటి వారిలో  అజ్జాడ ఆదిభట్లనారాయణదాసుగారు,
కొక్కొండ వేంకటరత్నంగారు మరొకరు.

 హరికథాపితామహునిగా పేరుగాంచిన ఆదిభట్ల నారాయణదాసుగారు
అచ్చతెలుగు పుస్తకాలను రాశారు.
ఆకాలంలో బళ్ళలో తెలుగుపంతుళ్ళకు సంస్కృతం రాదు.
సంస్కృత పండితులకు తెలుగు రాదు.
ఇలాంటి స్థితి తరువాత అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే తెలుగు పుస్తకాలు లేవు.
మళ్ళీ ఇప్పుడు అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే కావాలంటున్నాము.
ఇదంతా ఏమిటో మరి
అసలు విషయానికొస్తే నారాయణదాసుగారు సంస్కృత వారాలకు
తెలుగులో వారాల పేర్లు మార్చారు. (ఇవి అంతకు ముందుకాలంలో ఉన్నవే)
అలాగే తెలుగు నెలలుగా చెప్పేవాటికి అచ్చతెలుగు పేర్లు పెట్టాడు
అవి ఇక్కడ చూద్దాం.
వారాల పేర్లు (వంతుల పేర్లు)
సంస్కృతం పేరు           అచ్చతెలుగు పేరు
రవివారం                    ప్రొద్దువంతు
సోమవారం                 నెలవంతు
మంగళవారం              పారిపట్టివంతు
బుధవారం                  పెద్దవంతు
గురువారం                 బేస్తవంతు
శుక్రవారం                  చుక్కవంతు
శనివారం                   సనివంతు

మాసముల పేర్లు

చైత్రమాసము                  ముత్తెపురిక్కనెల
వైశాఖమాసము              చేటరిక్కనెల
జ్యేష్ఠమాసము                 తాటిరిక్కనెల
ఆషాఢమాసము              నీటిరిక్కనెల
శ్రావణమాసము               తూఁపురిక్కనెల
భాద్రపదమాసము            ముక్కంటిరిక్కనెల
ఆశ్వయుజమాసము        తొలకరిరిక్కనెల
కార్తీకమాసము                కత్తెరనెల
మార్గశిరమాసము            పొంగటినెల
పుష్యమాసము                పొట్లరూపురిక్కనెల
మాఘమాసము               జన్నపురిక్కనెల
ఫాల్గునమాసము              ప్రొద్దురిక్కనెల

ఇవి ఇప్పుడు ఎందుకు అంటారేమో?
ఇవి ఉన్నాయని కేవలం తెలుకొనేందుకు.
వీటిని వాడితే వారికి
మరొక వ్యాఖ్యాత అవసరమే.

పద్యాలమాల - హృద్యశుభాలహేల


పద్యాలమాల - హృద్యశుభాలహేల


సాహితీమిత్రులారా!
కడపజిల్లా, కమలాపురం మండలం, రామాపురం గ్రామంలో
నిత్యకళ్యాణదేవతామూర్తులు శ్రీమహాలక్ష్మీసమేత మోక్షనారాయణస్వామి,
శ్రీవల్లీదేవసేన సమేతద్వికందర షణ్ముఖసుబ్రహ్మణ్యస్వామి
బ్రహ్మోత్సవములు
19-05-2016 నుండి 23-05-2016 వరకు జరిగినవి.
ఈ సందర్భముగా 22-05-2016 సాయంకాలం 5గం.లకు
 "రాయలసీమ స్థాయి కవిసమ్మేళనం" జరిగింది.
అందులో పాల్గొన్న శ్రీయుతులు విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి
"పద్యాలమాల - హృద్యశుభాలహేల" ఇది.

అతిపురాతనమునై అద్భుతవిగ్రహాల్ 
         హ్లాదమై, జనుల మోదపఱచు
మోక్షనారాయణ మోహిత షణ్ముఖ
          స్వాములు ప్రజల ప్రస్నపఱచు
వైశాఖమాసాన వైభవోపేతమై
         శుద్ధత్రయోదశీ శుభము గూర్చు
దేవేర్ల, దేవుళ్ళ దివ్యకళ్యాణాలు
         భక్తాళి హృదయాల రక్తిపేర్చు
ఏమి యోగమో! భోగమో! ఎఱుగ నౌనె
మోక్షగాములై జనులు సమీక్ష చేసి
సతత సంతోష వారాశి సాగుచుంద్రు
పుణ్యక్షేత్ర మన- నిదె ఇభ్భువిని జూడ

మహి మహోజ్జ్వల క్షేత్రమై మహిమగలిగి
నిత్యకళ్యాణమూర్తుల నిలయమగుచు
మానవాళికి మోక్షసామ్రాజ్యమగుచు
అలరు "రామాపురక్షేత్ర" మతులకీర్తి

భక్తజనంబులు రక్తిమై కొలువంగ
       వరముల రక్షించి వరలు నెద్ది
ఎట్టిపాపములైన ఇట్టె పోగొట్టెడు
        పావన క్షేత్రమై ప్రబలునెద్ది
విస్తృత విఖ్యాతి విశ్వాన వెలుగంగ
        విమల విశిష్ఠత వెలయునెద్ది
ఉభయబ్రహ్మోత్సవాలుర్విలో చెలగంగ
        దైవద్వయ కృపేక్ష తనరునెద్ది
అదియె "రామాపురక్షేత్ర" మవనిలోన
భక్తకోటికి పసిడియై వరలు చుండు
దివ్యక్షేత్రము - భువనైక భవ్యస్థలము
మోక్ష సిద్ధికి మూలమై భువివెలుంగు

ఎల్లవేళల స్వాముల ఉల్లమలర
చూసి, సేవించి, తరియించి - శుభములలర
మెలగవలె నోయి జనులార మృదులభక్తి
జీవితానంద మదియె - ఈ జీవితాన

సతము "పుణ్యభూమి ఛారిటబుల్ ట్రస్టు"
క్షేత్రవైభవము విశిష్ఠ పఱుప
దివ్యభక్తి సాంస్కృతిక కార్యములనెల్ల
జరిపి - ధన్యమయ్యె - వరసుకీర్తి

Saturday, May 28, 2016

స్వర్ణపుష్పాలతో పాదపూజ


స్వర్ణపుష్పాలతో పాదపూజ


సాహితీమిత్రులారా!

1948 జనవరి 18వ తేదీన విజయవాడలో ఆంధ్ర నాటక కళా పరిషత్ వార్షిక సమావేశంలో
విశ్వనాథ సత్యనారాయణ వారు తమ "శశిదూత" మనే ఖండకావ్యమును
"బందా కనకలింగేశ్వరరావు" గారికి అంకితం చేశారు.
ఈయన ప్రముఖ రంగస్థల నటుడు.
కనకలింగేశ్వరరావుగారు విశ్వనాథవారికి 5 స్వర్ణ పుష్పాలను బహూకరించారు.
ఆ సభలో ఆసీనులై ఉన్న తమ గురువు చెళ్ళపిళ్ళ వారికి
ఆ స్వర్ణపుష్పాలతో విశ్వనాథవారు పాదపూజ చేస్తూ,
చంపకోత్పల ఛందస్సులో అయిదుసార్లు నమస్సులు సమర్పించారు.
వాటిని చూడండి.

ప్రవిమలమైన చెళ్ళపిళ్ళ వంగసమన్ నునుపాలవెల్లి కా
లుపకను చందమామ కవిలోక మహాగురవే నమోనమ:

(పరిశుద్ధమైన చెళ్ళపిళ్ళ వంశమనే పాలసముద్రంలో
పుట్టిన చందమామా కవిలోక మహాగురూ నమస్కారం.)

తొలి తుదిరేక మెత్తనలు దూసిన సోగ తెనుంగులో పదా
లు వెలలు తేనెవాక కవిలోక మహాగురవే నమోనమ:

(ఆద్యంత మృదుమధురరాలైన తెనుగు పదాలు తొణికసలాడే
మధుర ప్రవాహమా కవిలోకపు గొప్ప గురువా నమస్కారం.)

తొలి కవులెల్ల కష్టపడి తూచిన యెల్ల పదార్థముల్ కడున్
సులభము గాగ చూరగొను శుద్ధ మహామతయే నమోనమ:

(ఆదికవులు కష్టపడి తూచిన మహా పదార్థాలను ఏమాత్రమూ
కష్టం లేకుండా ఎంతో సులభంగా దోచుకొన్న నిర్మల
మహాబుద్ధికి నమస్కారం.)

తలచిన యెల్ల శబ్దమును తానును మెత్తని రూపమూని మం
జులమయి సేవ చేసెడు విశుద్ధ మహావచసే నమోనమ:

(తలచిన ప్రతి శబ్దమూ మృదులాకృతి దాల్చి
సేవచేసే నిర్మల మహావాక్కుగల వానికి నమస్కారం.)

కోనలలోన మిన్నొలయు కొండలలోన హిమాంబుదాళిలో
కానలలో వినిర్భరముగా ప్రవహించెడు నాంధ్ర శారదా
నూనసురాపగన్ మృదుల నూతన సాధు సమప్రసార ధా
రానతరేఖ దీర్చిన ధురా ప్రతిభానిధయే నమోనమ:

(కొండల్లో, కోనల్లో, కానల్లో పారుతున్న ఆంధ్ర శారదాగంగను
నూతన సాధు సమతలంలో ప్రవహింపజేసిన మహా ప్రతిభానిధికి నమస్కారం.
క్షీణప్రబంధ యుగంలో క్షుద్ర కావ్య నిర్మాణాల గందరగోళాల మధ్య
 కొట్టుమిట్టాడుతున్న తెలుగు కవిత్వాన్ని కొత్తమలుపు తిప్పి
నూతన యుగస్రష్టయైన మహాకవికి నమస్కారం.)

నమస్కారానికి ఒక స్వర్ణపుష్పం
చొప్పున గురువుగారి పాదాలముందు ఉంచాడు.

జయజయ ప్రియభారత జనయుత్రి

జయజయ ప్రియభారత జనయుత్రి


సాహితీమిత్రులారా

దేవులపల్లి వారి
 "జయజయ ప్రియభారత జనయిత్రి" 
- అనే దేశభక్తి గేయాన్ని ఆలకించండి.


Friday, May 27, 2016

తప్పెవరిది?


తప్పెవరిది?


సాహితీమిత్రులారా!

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు
ఒకసారి చమత్కారంగా ఈ పద్యం చెప్పారు.
చూడండి.

తొలి నాళుల శబ్దార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి యీ నా
ళుల వ్రాసిన కవి దోషము
కలి ముదిరిన కొలది వింతగతులను వెలయున్

(వెనుకటి రోజుల్లో ఏదన్నా ఒక పద్యానికో,
పదానికో అర్థం తెలియకపోతే పాఠకుడు
అపండితుని కింద లెక్క తెలుసుకోవటానికి ప్రయత్నం జరిగేది.
ఈ రోజుల్లో అలా కాదు.
తమ కర్థం కాకుండా రాయటం కవి దోషమని
అధునాతనులు అంటున్నారు.
కలి ముదిరిన కొద్దీ వింతలు పుడుతున్నాయి సుమా!)

ఇది ఎన్ని ఏళ్ళనాటి పద్యమో కాని
ఇది నేటికీ అక్షరసత్యం కదా!

మాతెలుగు తల్లికి మల్లెపూడండ

మాతెలుగు తల్లికి మల్లెపూడండ


సాహితీమిత్రులారా

శంకరంబాడి సుందరాచారి "మాతెలుగు తల్లికి మల్లెపూదండ" గేయాన్ని 
మొదట ఆలపించినది "టంగుటూరి సూర్యకుమారి
దీనికి సంగీతం అందించినది "ఆర్. సుదర్శనం
ఆ గేయాన్ని ఇక్కడ ఆలకించండి.


Thursday, May 26, 2016

నీకున్ మాంసము వాంఛయేని కఱవా?


నీకున్ మాంసము వాంఛయేని కఱవా?


సాహితీమిత్రులారా!

శ్రీకాళహస్తీశ్వరుని ధూర్జటి ఎలా నిలదీస్తున్నడో చూడండి.


నీకున్ మాంసము వాంఛయేని కఱవా? నీ చేత లేడుండగా,
జోకైనట్టి కుఠారముండ, అనలజ్యోతుండ, నీరుండగా,
పాకంబొప్ప ఘటించి, చేతిపునకన్ భక్షింప కాబోయచే
చేకొంటెంగిలిమాంస, మిట్లు తగునా? శ్రీకాళహస్తీశ్వరా!

కరుణాంతరంగుడైన శ్రీకాళహస్తీశ్వరుడు భక్తదయాళువు
తిన్నని చేతి ఎంగిలి మాంసం తిన్నాడు కదా!
దాన్ని ధూర్జటిగారు ఈ విధంగా నిలదీస్తున్నారు.
నీకు మాంసంకవాలంటే కరువా?
 నీచేతిలోనే లేడి ఉందికదా! ఇంకో చేతిలో చక్కని గొడ్డలి ఉందిగా,
నెత్తిమీద నీరుందికదా! నీ మూడవ కంట్లో అగ్ని ఉందికదా!
మంచి పాకంగా వండుకొని తినే వీలుందికదా!
మరి ఆ తిన్నని ఎంగిలి మాంసం ఎందుకు తిన్నావయ్యా? ఓ కాళహస్తీశ్వరా!
 - అని నిలదీస్తన్నాడు.
ఎంత చమత్కారంగా
ఎంత రమణీయంగా
అడిగాడో చూడండి.

యాచించుటలోని దైన్యము


యాచించుటలోని దైన్యము


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి.
యాచించటంలోని దైన్యము
ఎంత చక్కగా వర్ణించబడినదో తెలుస్తుంది.

మానిసి కేడు జానల ప్రమాణము దేహము, యాచనార్థమై
పూనిన ఆఱు జానలగు, పోయి ధనాఢ్యుని యిల్లు చేరగా 
జానలు నాలుగౌ, నతని చల్లగ "దేహి" యటన్న రెండగున్,
పైన నతండు "నాస్తి" యనినన్ వినినంతన శూన్యమయ్యెడిన్!


మనుష్యుని దేహము 7 జానల పొడవుంటుంది.
యాచించుటకు(అడుక్కోవడానికి) సిద్ధపడగానే 6 జానలవుతుంది.
ధనవంతుని యిల్లు చేరగానే 4 జానలవుతుంది.
అతనిని "దేహి" అని అర్థించగానే 2 జానలవుతుంది.
ధనాఢ్యుడు "నాస్తి"  అనంటే అర్థించిన వ్యక్తి(అభిమానవంతుడు) శూన్యమై పోవును.

చూడండి కవి ఎంత సత్యాన్ని పద్యంలో కళ్ళ ఎదుట చిత్రించాడో!

Wednesday, May 25, 2016

"రా" - కొట్టుట


"రా" - కొట్టుట 


సాహితీమిత్రులారా!

అడిదము సూరకవి ఒకసారి విజయనగర ప్రభువు విజయరామరాజు
మీద ఏకవచన ప్రయోగంతో ఒక "రా" వచ్చేట్టు పద్యం చెప్పాడు.
రాజుగారు ఏమీ అనలేదుగానీ రాజ బంధువు సీతారామరాజుకు
కోపం వచ్చి ఆక్షేపించాడు. అప్పుడు సూరకవి ఆవిధంగా
చెప్పటంలోని ఔచిత్యాన్ని, అందాన్ని
ఇలా సమర్థించుకున్నారట.

చిన్నప్పుడు రతికేళిక
నున్నప్పుడు కవితలోన  యుద్ఝములోనన్
వన్నె సుమీ "రా"-కొట్టుట 
చెన్నుగనో పూసపాటి సీతారామా!

(చిన్నప్పుడు "రా" -  అనడం సహజమే.
రతిక్రీడలో స్త్రీపురుషులు పరస్పరం "రా" అనుకోవటం
భోగాతిశయాన్ని సూచిస్తుంది.
కవిత్వంలోనూ, యుద్ధంలోనూ అనవచ్చు.
అనవచ్చుమాత్రమేకాదు అంటే వన్నె సుమా!)

అందుకే అతని చాతుర్యాన్ని చూసి ఇలా అన్నారు.

అంతా సుకవులు గారా?
అంతింతో పద్య చయము నల్లగలేరా!
దంతివి నీతో సమమా?
కాంతా సుమబాణ! సూరకవి నెరజాణా!


"రా" -  కొట్టటాన్ని గురించి మరోకవి పద్యం ఇది.

కవులు పొగడువేళ కాంతలు రతివేళ
సుతులు మద్దువేళ  శూరవరులు
రణము సేయువేళ రా కొట్టి పిలుతురు
పాడి యదియు మిగుల భజనకెక్కు

ఏకవచనం ప్రయోగించటాన్ని గురించి సంస్కృతంలో
ఒక శ్లోకం ఉంది
తెలుగులోని పద్యాలన్నీ దాని అనుసరణలే.
ఆ శ్లోకం.......

బాల్యే సుతానాం సురతేంగనానాం
స్తుతే కవీనాం సమరే భటానాం
త్వంకార యుక్తాహి గిర: ప్రశస్తా:
కస్తే ప్రభో! మోహతరస్మరతం.

నానాసూన వితానవాసనల నానందిచు సారంగమే

నానాసూన వితానవాసనల నానందిచు సారంగమే


సాహితీమిత్రులారా!

ముక్కుతిమ్మన ముక్కమీద ఒక పద్యం చెప్పి ఒకరికి ఇవ్వగా
ఆపద్యం నచ్చి రామరాజభూషణుడు(భట్టుమూర్తి) అది కొని
తన వసుచరిత్రలో రాసుకున్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది.
కానీ ఇది నిజంకాదని అది వేరొక పద్యమై ఉంటుందని పండితులు,
పరిశోధకులు భావిస్తున్నారు.
ఆ ముక్కుమీద చెప్పిన పద్యం
ఇదని ప్రచారం చూడండి.

నానాసూన వితానవాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యో
షా నాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసి యై
పూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్

ఈ పద్యాన్ని నాలుగువేల వరహాలిచ్చి
రామరాజభూషణుడు కొన్నాడని ప్రతీతి.
ఇది ఎంతమాత్రం సరైనదికాదు.
ఇది కవులను గూర్చి మనవారు కల్పించే కల్పనాకథ మాత్రమే.
అయినా నంది తిమ్మన కాలంలో రామరాజభూషణుడు లేడు.
ఒకవేళ ఉన్నా వసుచరిత్ర అంతటి కావ్యం రాయగల వానికి ముక్కుపై
ఇంత కల్పన చేయలేకపోయాడనడం పరిహాసాస్పదం అన్నాడు - వీరేశలింగంగారు.
ఈ ఐతిహ్యము అంత విశ్వాసపాత్రంగాలేదని - డా. దివాకర్ల వేంకటావధాని అన్నారు.
ఆఁడుదాని అంగప్రత్యంగములు వర్ణనము చేయుట వసుచరిత్రకారుని లక్షణము.
ఈ లక్షణము తిమ్మన పారిజాతాపహరణములో మచ్చుకైనా కనబడదు.
అట్టి వర్ణనలు చేయుట తిమ్మనగారి స్వభావములో లేదు.
కావున నిస్సందేహంగా ఇది రామరాజభూషణునిదే కాని తిమ్మన కృతికాదు.


ఓరుగల్లును పాలించిన  ప్రతాపరుద్రుని
ఆస్థానంలో ఉండిన విద్యానాథుని(అగస్త్యుని)
"నలకీర్తికౌముది" అనే సంస్కృతకావ్యంలో
ఈ క్రింది శ్లోకం ఉన్నది.

భృంగానవాస్తి ప్రతిపన్నఖేదా
కృత్వాననే గంధఫలీ తప:ఫలమ్
తన్నాసికా భూ దనుభూతగంధా
స్వపార్శ్వనేత్రీకృతభృంగసేవ్యా

ఈ శ్లోకం భావం గ్రహించి రామరాజభూషణుడు
"నానాసూన వితానవాసనల" -   అనే పద్యం రచించి
ఉండవచ్చని టేకుమళ్ల అచ్యుతరావుగారి అభిప్రాయం.
(ఆంధ్రవాఙ్మయచరిత్రము పుట. 206 - టేకుమళ్ల అచ్యుతరావు)

Tuesday, May 24, 2016

ఊరక రారు మహాత్ములు


ఊరక రారు మహాత్ములు


సాహితీమిత్రులారా!

"ఊరక రారు మహాత్ములు" అన్నది ఇప్పుడు విరివిగా వింటుంటాం.
ఇంతకు ఇది ఎక్కడిది? -  అని ఆరా తీస్తే
ఈ విషయం తెలుస్తుంది.
ఇది మొదట అన్నది ఎవరు అంటే నందుడు.
అసలు సంగతేంటి అంటే వసుదేవుని కోరికమేరకు
యాదవుల పురోహితుడు వ్రేపల్లెకు వచ్చాడు
ఆ సమయంలో నందుడు ఆయనకు
ఉచితోపచారములు చేసి
ఈ పద్యం చెప్పాడు.

ఊరక రారు మహాత్ములు
వా రధముల యిండ్లకడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా!
                                        (శ్రీమదాంధ్రమహాభాగవతము -10-284)
అని అన్నాడు.
(మహాత్ములైనవారు ఏ పని లేకుండా ఊరకే రారు.
తక్కువ స్థాయిలో ఉన్న మావంటి వారి ఇంటికి వచ్చారంటే
దానికి కారణం మాకు శుభములు చేకూర్చడానికే అవుతుంది.
మహానుభావా! మీరాక చాలా శుభం కలిగిస్తుంది.
నాకు బాగా తెలుసు.)

దీన్ని ఇప్పుడు వ్యంగంగా కూడా ఉపయోగిస్తున్నారు.
ఇది వ్యావహారికంలోకి ఎంతలా చొచ్చుకు పోయిందో!
మనందరికీ తెలుసు.

బాటసారి


బాటసారి


సాహితీమిత్రులారా !

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి
బదరికలోని కవిత ఇది
చూడండి


ఏటికి నే బిడ్డను ,
తోటకు తోబుట్టువును;
పాట నాకు కూడు,
పక్షి నాకు సైదోడు-
నా పేరు బికారి, మ
రో పేరు బాటసారి
మన సున్న చోట మజిలీ
మరి కాదంటే బదలీ!

Monday, May 23, 2016

రుచి రాంగ రుచుల నయ్యంగనకున్


రుచి రాంగ రుచుల నయ్యంగనకున్


సాహితీమిత్రులారా!

విజయవిలాసంలోని ఈ పద్యం చూడండి.
సుభద్రను కవిగారు ఎలా వర్ణించారో

అయ్యారే! చెలువెక్కడ!
న య్యారే గెలువఁ జాలు నంగజు నారిన్
వెయ్యాఱులలో సరిలే
రయ్యా, రుచి రాంగ రుచుల నయ్యంగనకున్ ((1-103)

అయ్యారే = ఓహోహో ,
చెలువు ఎక్కడ = ఆ సుభద్ర అందము,
ఎక్కడ = తక్కిన కాంతల అందమెక్కడ,
ఆ ఆరే = ఆ సుభద్ర నూగారే,
అంగజు = మన్మథునియొక్క,
నారిన్ = వింటి అల్లెత్రాడు(తుమ్మెదల పంక్తిని),
గెలువన్ చాలున్ = గెల్వగలదు - ఓడించగలదు
(లేదా)
అంగజు నారిన్ = మన్మథుని భార్య రతీదేవి,
గెలువఁజాలును(నూగా రొక్కటే రతీదేవిని గెలుస్తుందని ఈలాగా కవి నిరూపించాడు),
రుచిర అంగ రుచులన్ = మనోహరమైన (యావత్)శరీరమునందుగల అందములలో,
ఆ అంగనకున్ = ఆ సుభద్రకు,
సరి = సమానమైన అందగత్తెలు,
వెయ్యాఱులలోన్ = వేలకొలది కాంతలలో,
(ఎవ్వరూ) లేరు అయ్యా = లేదు సుమా!

(ఇది తాపీధర్మారావుగారి హృదయోల్లాస వ్యాఖ్యలోనిది)

దేశమును ప్రేమించుమన్నా



దేశమును ప్రేమించుమన్నా


సాహితీమిత్రులారా!
గురజాడగారి
దేశమును ప్రేమించుమన్నా అనే 
దేశభక్తి గీతాన్ని వినండి



గురజాడ అప్పారావుగారి చేతిరాత

గురజాడ అప్పారావుగారి చేతిరాత


సాహితీమిత్రులారా!

  దేశమును ప్రేమించువన్నా 
మంచియన్నది పెంచుమన్న 
అనే దేశభక్తి గేయం
యుగవైతాళికుడైన గురజాడవారి చేతిరాతలో ఇక్కడ చూడండి.


Sunday, May 22, 2016

పిలుపు



పిలుపు


సాహితీమిత్రులారా!

దేవరకొండ బాలగంగాధర తిలక్
"అమృతం కురిసినరాత్రి" లోని
మరో కవిత చూడండి.


ధాత్రీ జనని గుండె మీద
యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు
మీ రెవరైనా చూశారా
కన్నీరైనా విడిచారా

కోటి కోటి సైనికుల ఊడిపడిన
కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను
మీ రెపుడైనా చూశారా
కన్నీరైనా విడిచారా

దరిద్రుని నోరులేని కడుపు
తెరుచుకొన్న నాలుక బూడిదలో వ్రాసుకొన్న మాటలు
మీ రెపుడైనా చూశారా
కన్నీరైనా విడిచారా

కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే
మొండిచేతుల మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం
మీరెవరైనా చూశారా
కన్నీరైనా విడిచారా

ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగి పోకపోతే
అణచుకొన్న నల్లని మంటలు అకాశానికి రేగకముందే
మీరిపుడైనా మేల్కొంటారా 
చీకటి తెరలను చీలుస్తారా
ప్రభాత విపంచిక పలికిస్తారా?
                                         (1942)

సరస సంభాషణ


సరస సంభాషణ


సాహితీమిత్రులారా!
పెళ్ళిఅయిన తరువాత మొదటిరాత్రి గడచింది.
వధువును ఉదయాన్నే ఆప్తులుచూచిన వెంటనే
ఒక్కొక్క ఆమె
                   ఒక్కొక ప్రశ్నను
                                           ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు.


కస్తూరీ వరపత్రభంగ నికరో భ్రష్టో న గండస్థలే
నో లిప్తం సఖి చందన స్తనతబే, ధౌతం న నేత్రాంజనమ్
రాగో నస్ఖలిత స్తవాధరపుటే తాంబూల సంవర్ధిత:
కిం రుష్టాసి? గజేంద్రమత్తగమనే! కింవా శిశుస్తే పతి:


కలికిరొ చెక్కుల మకరికలు చెడలేదు?
  చందనం చన్నుల చెదరలేదు?
కన్నుల కాటుక జారలేదు?
  పెదవి తాంబూలంచే ఏర్పడిన ఎరుపు చెడలేదు?
ఓ గజగామినీ! నీవు కోప్పడ్డావా?
లేక
నీ భర్త పసివాడా?

కొత్తపెండ్లికూతురి
సమాధానం

నాహం నో మమ వల్లభశ్చ కుపిత: సుప్తో న వా సుందర:
నో వృద్ధో న చ బాలక: కృశతను: నో వ్యాధితో నో శఠ:
మాం దృష్ట్వా నవయౌవనాం శశిముఖీం కందర్పబాణాహతో
ముక్తో దైత్యగురు: ప్రియేణ పురత: పశ్చాద్గతో విహ్వల:!


నేను -
            నాపతిని కోపించుకోలేదు.
                               అతడు నిద్రపోలేదు.
                                        కురూపి కాడు.
                                                 వృద్ధుడు కాడు.
                                                         బాలుడు కాడు.
                                                                   బలహీనుడు కాడు.
                                                                              వ్యాధిగ్రస్తుడు కాడు.
                                                                                           మూర్ఖుడు కాడు.
                                                          కాని
                   నవయౌవనంలో ఉన్న చంద్రముఖినైన నన్ను
                    చూడగానే మన్మథావేశంతో
                      రాక్షసగురుని(శుక్రమును) విడచినాడు
                        - నేను తెల్లబోయాను.
                              - అని సమాధానం చెప్పింది.
(ఇది కాళిదాసు "శృంగారతిలకము"లోనిది.)

Saturday, May 21, 2016

జయంతి అంటే జన్మదినం కాదా!


జయంతి అంటే జన్మదినం కాదా!


సాహితీమిత్రులారా!

సాధారణంగా భౌతికంగాలేని మహనీయుల
పుట్టినరోజులను జయంతి అని వాడుకలో వాడుతున్నారు.
దీన్ని గురించి "వాడుకతెలుగులో అప్రయోగాలు" అనే పరిశోధకగ్రంథంలో
వివరించడం జరిగింది.
దాన్ని ఒకసారి గమనిద్దాం.

మేదినీకోశంలో (నానార్థ నిఘంటువు) -
జయంతీ అంటే వృక్షవిశేషం(తక్కిలి చెట్టు), పార్వతి, ఇంద్రసుత, పతాక అనే అర్థాలున్నాయి.
అమరకోశంలోనూ జయంతీ పదానికి వృక్షవిశేషమనియే ఉన్నది.
వాచస్పత్య నిఘంటువులో - జయంతీ అనే పదానికి దుర్గాశక్తి,
ఇంద్రసుత, పతాక,తక్కిలి చెట్టు, యాత్రాయోగవిశేషములతోపాటు
రోహిణీ నక్షత్రముతో కూడిన శ్రావణ కృష్ణాష్టమి అనే అర్థాన్ని కూడా చూపింది.
ఏ నిఘంటువులోను జయంతీ అనే శబ్దానికి జన్నదినం అనే అర్థం చూపలేదు.
కానీ ఈ లోకంలో శంకర జయంతి,
నృసింహ జయంతి, గాంధీ జయంతి
మొదలైన పదాలలో జన్మదినం అనే అర్థంలో వాడుకలో ఉన్నది.
 ఐతే ఈ శబ్దానికి కేవలం జన్మదినం అనికాక అవతారపురుషుల
జన్మదినం, మరణించిన మహాపురుషుల జన్మదినం అనే
విశేషార్థంల్లో వాడుకలో ఉంది.

వాచస్పత్య నిఘంటువులోని ప్రమాణం విష్ణుధర్మంలోనిది -

రోహిణీ చ యదా కృష్ణ పక్షే2ష్టమ్యాం ద్విజోత్తమ
జయంతీ నామ సా ప్రోక్తా సర్వపాపహరా తిథి:

అలాగే సనత్కుమారసంహితలోని ప్రమాణం-

శ్రావణస్య చ మాసస్య కృష్ణాష్టమ్యాం నరాధిప
రోహిణీ యది లభ్యేత జయంతీనామ సా తిథి:


శ్రావణే వా నభస్యే వా రోహిణీసహితాష్టమీ
యదా కృష్ణా నరైర్లబ్దా సా జయంతీతి కీర్తితా  (వసిష్టసంహిత)

వీటి ఆధారంగా జయంతీ శబ్దానికి రోహిణీ నక్షత్రంతో
కూడిన కృష్ణాష్టమి అనే అర్థమే తేలుతుంది.
కానీ జన్మదినం అనే అర్థం రాదు.
కాని కృష్ణాష్టమి కృష్ణుని జన్మదినం కావడం వల్ల
రోహిణీ నక్షత్రంతో కూడిన కృష్ణాష్టమిని తెలియజేసే
జయంతీ శబ్దం మహాత్ముల జన్మదినంగా
వ్యాకోచాన్ని పొంది ఉండవచ్చు.

బుద్ధజయంతి (బుద్ధపౌర్ణిమ) శుభాకాంక్షలు


బుద్ధజయంతి (బుద్ధపౌర్ణిమ) శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు 
బుద్ధ(జయంతి)పౌర్ణిమ శుభాకాంక్షలు.


గిరియుష్మద్ధనురస్త్రతాప్రభృతిమోఘీకృద్వధూశీలవి
స్ఫురణావర్మభిదాఢ్యదార్ఢ్యసఫలీభూతప్రభూతత్రిపూ
ర్వరదైతేయజిఘాంసనపరోగ్రప్రాప్యసారూప్యని
ర్భరరమ్యాంగతథాగతాంగకపర బ్రహ్మన్! స్తుమస్త్వామనున్


ఈశ్వరుడు మేరుపర్వతమును ధనుస్సుగను, 
నారాయణుని బాణముగను పూనియు, 
త్రిపురాసులను, వారిభార్యల పాతివ్రత్నమహిమచేత గెలువలేకపోయెననియు, 
పిమ్మట బుద్దుని స్మరించి, ఆయన అనుగ్రహమున దిగంబరత్వము పొంగి, 
అసురకాంతల పాతివ్రత్యమును భంగపరచి, ఆ అసురులను  గెలిచె అనియు - తాత్పర్యము.
(ఈశ్వరుడు బుద్ధభగవానుని ధాయనించి సారూప్యమును పొందెనని భావము.)


బుద్దుని జన్మస్థలం లుంబినిని ఈ వీడియోలో చూడండి.

Friday, May 20, 2016

నరసింహ జయంతి శుభాకాంక్షలు


 నరసింహ జయంతి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు 
నరసింహ జయంతి శుభాకాంక్షలు


డింభద్రోహివధోత్కటోత్ర్కమణఘృష్టిక్లిష్టతా రోమకూ
పాంభోజప్రభవాండభాండదళనోద్యద్ద్వానధీకృత్సభా
స్తంభాంతస్స్ఫుటనస్ఫురత్ఫళఫళధ్వన్యార్తినిశ్చేష్టని
ర్దంభోద్వేగదిశావశాప నృహరిబ్రహ్మన్! స్తుమస్త్వా మనున్

బాలుడగు ప్రహ్లాదుని బాధించుచున్న హిరణ్యకశిపుని 
సంహరించుటకై నరసింహమూర్తి స్తంభమును చీల్చుకొని 
వెలువడుటలో ఫెళఫెళయను మహాధ్వని యయ్యెననియు, 
ఆ ధ్వని, భగవంతుడట్లు వెడలివచ్చుటలో కలిగిన సంఘర్షణవలన, 
ఆయన రోమకూపములందున్న బ్రహ్మాండభాండములు బ్రద్దలగుటవలన 
పుట్టినది కాబోలు అన్నట్లు ఉండెననియు, 
ఆ ప్రచండశబ్దమునకు దిగ్గజములు చెవుడుపడి 
నిశ్చేష్టములయ్యె ననియు తాత్పర్యము.

నడుమే పసలేదుగాని నారీమణికిన్!


నడుమే పసలేదుగాని నారీమణికిన్!


సాహితీమిత్రులారా!

ఇంటిపేరు "నస" - కవిత్వం బహు"పస" అని అంటూ ఉంటారు.
ఆయనే చేమకూర వెంకటకవి.
ఈయన విజయవిలాస, సారంగధర మొదలైన కావ్యాలను రచించినవారు.
విజయవిలాసం అనేది అర్జునుని తీర్థయాత్ర.
దీనిలో ముగ్గురు నాయికలతో అర్జునుని విలాసం.
అందులోని 1-104వ పద్యం ఇది చూడండి.

కడుహెచ్చు కొప్పు దానిన్ 
గడవన్ జనుదోయి హెచ్చు, కటి యన్నిటికిన్
కడుహెచ్చు, హెచ్చు లన్నియు
నడుమే పసలేదుగాని నారీమణికిన్!

ఇది చిన్నపద్యం.
దీనిలో కవి సుభద్ర
కొప్పూ, స్తనాలూ, కటిప్రదేశమూ, నడుమూ వర్ణిస్తున్నాడు.

సుభద్ర కొప్పు పెద్దది.
దాన్ని మించి చనుకట్టు పెద్దది.
అన్నిటికంటె కటిప్రదేశము పెద్దది.
అన్నీ పెద్దవేకాని
నడుమే సారంలేనిది స్వల్పవిషయమని భావం.

కవి ఏదో లోపం చెబుతున్నట్లు చెబుతున్నాడు
కాని ఇదిలోపంకాదు.
నడుం ఎంత సన్నగా ఉంటే అంత అందమంటారు.
అందగత్తెలు సింహమధ్య, అణుమధ్య అని అనడం
సర్వసాధారణంకదా!

ఎంత చమత్కారంగా వర్ణించాడో కదా! ఈ పద్యాన్ని.

ఒకటి సుతునకు, చెలికాని కొప్పు రెండు


ఒకటి సుతునకు, చెలికాని కొప్పు రెండు


సాహితీమిత్రులారా!

ఉత్తరాలు రాయడం ఇప్పుడు లేదనే చెప్పాలి.
కాకపోతే అక్కడక్కడ అప్పుడప్పుడు అర్జీలలాంటివి
ఇంకా కొనసాగుతగన్నవనే చెప్పాలి.
వీటిలో శ్రీ-లు రాస్తుంటాము.
శ్రీశ్రీశ్రీ - ఇలా రాసిన తర్వాత మిగతా విషయం ఉంటుంది.
అయితే ఎవరికి ఎన్ని శ్రీ-లు వాడాలి అనేది ఒక లెక్క ఉండేది.
దానికి సంబంధించిన వివరాలు
ఈ పద్యంలో ఉన్నాయి
చూడండి.

ఒకటి సుతునకు, చెలికాని కొప్పు రెండు
మూఁడు సమునకు, వైరికి మూఁడు నొకటి
యైదు గురునకు, నేలిక కాఱు శ్రీలు
ఏడు భూపాలునకు దగు నేర్పడంగ


1 కొడుక్కు,
2 స్నేహితునికి,
3 సమునకు (తనతో సమానమైనవానికి),
4 శత్రువునకు,
5 గురువునకు,
6 పాలకునికి,
7 భూపాలునకు(రాజుకు) శ్రీలను వాడాలి.
ఇప్పుడు ఈ పద్యంతో తెలిసింది కదా!

Thursday, May 19, 2016

ప్రకటన (పరారీ అయిన వ్యక్తికోసం)


ప్రకటన (పరారీ అయిన వ్యక్తికోసం)


సాహితీమిత్రులారా!

ఇది దేవరకొండ బాలగంగాధర్ గారి
"అమృతంకురిసిన రాత్రి" లోనిది
ఎలావుందో చూడండి
ఈ కవిత.

స్టేషన్లో టికెట్లును జారీ చెయ్యకండి
ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివెయ్యండి
దేశదేశాలకు కేబుల్ గ్రమ్స్ పంపించండి
దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి

ఆకాశవాణిలో ఈ విషయం ప్రకటించండి
కాఫీహోటళ్ళలో క్లబ్బులలో కర్మాగారాల్లో
కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి
సముద్ర తీరాలలో నదీజలాలలో వెదకండి

సాయుధ దళాల్ని దిక్కులలో నిబెట్టండి
రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి
అడుగుజాడల్ని కూపీ తియ్యండి
వేలిముద్రల్ని పరీక్షించండి

ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారులో భయంతో గుసగుసలాడుతున్నారు
విజ్ఞానవేత్తలు నాగరికత పైతోలు వొలుస్తున్నారు
మనుష్యభక్షకులు నేడు చంకలు కొట్టుకుంటున్నారు

కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు
రాజకీయవేత్తల ఉపన్యాసాలు ఎవరూ వినడం లేదు
సైంటిస్టులు  ఒక్కొక్కరే ఆత్మహత్య చేసుకుంటున్నారు
స్వార్ధజీవనులు గభాలున రొమ్ములు బాదుకొంటున్నారు


సిద్ధాంతాలు చర్చలూ ఎవరూ చేయడం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు
అతృప్త అశాంత ప్రజా పారావార తరంగం
అంచుల్ని దాటి భీకరంగా విరుచుకు పడుతోంది

ఇంక చరిత్రలు రాయనక్కర లేదు
ఇంక రాజ్యాలు పాలించ నక్కరలేదు
అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది
ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది

కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ - మన జాతిని మనం
కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం
వెతికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని
వేరు దారిలేదు కదలండి కదలండి జై అని.

అపార కృపా తరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరీమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజా హితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్నీ తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి

     1950లో రాయబడింది.




శ్రీరస్తు! భవదంఘ్రి చికురంబులకు


శ్రీరస్తు! భవదంఘ్రి చికురంబులకు


సాహితీమిత్రులారా!

శ్రీనాథమహాకవి ఆశీర్వాదపదాలను చమత్కారంగా చతురంగా
ప్రయోగించి రసజ్ఞుల హృదయాలను ఆకర్షించిన
సౌందర్యవర్ణన పద్యం
పరికించండి.

శ్రీరస్తు! భవదంఘ్రి చికురంబులకు మహా భూర్యబ్దములు సితాంభోజ నయన!
వరకాంతిరస్తు! తావకముఖ నఖముల కాచంద్రతారకంబబ్జ వదన!
మహిమాస్తు! నీ కటి మధ్యంబులకు మన్ను మిన్నుగ లన్నాళ్ళు మించుబోడి!
విజయోస్తు! నీ గాన వీక్షల కానీల కంఠ హరిస్థాయిగా లతాంగి!
కుశలమస్తు! భవచ్ఛాత కుంభ కుంభ
జంభ భిత్కుంభి కుంభా భిజృంభమాణ
భూరి భవదీయ వక్షోజములకు మేరు
మందరము లుండు పర్యంత మిందువదన!


ఈ పద్యంలో పాదాది కేశ పర్యంతం వివిధ అవయవాలను జంటలుగా
తీసుకొని శుభవచనాలు పలికాడు కవిసార్వభౌముడు.

ముందు పాదాల నుంచి ముంగురులదాకా ఒక్కసారి పరకాయించి చూశాడు.
వాటికి దీర్ఘాయువగు గాక - అని ఆశీర్వదించాడు.
ఎదురుగా వస్తున్నది కాంత,
ముఖం కనిపించింది. నఖాలు కనిపించాయి.
చంద్రుడు నక్షత్రాలు ఉన్నంతవరకు వాటికాంతి ఉండుగాక - అని ఆశీర్వదించాడు.
వదనాన్ని చంద్రబింబంతోను, గోళ్ళను నక్షత్రాలతోను పోల్చటం సంప్రదాయం.
తరువాత పిరుదులు, నడుము - వరుసగా మన్ను మిన్ను ఉన్నంతకాలం
వాటి మహిమ ఉండును గాక!
- అని(ఇక్కడ క్రమంగా తగిన ఉపమానాలే, వైశాల్యానికి మన్ను - భూమి,
శూన్యత్వానికి సన్నగనానికి నడుము మిన్ను(ఆకాశం)),
గాన(మాట), వీక్షలు(చూపు) నొమలిగొంతులా, లేడి కన్నులలా విజయం పొందునుగాక!
ఇక వేరువేరు అవయవాలను వదలి సార్థకమైన
జంట వక్షోజాలను గ్రహించి బంగారు కుండలవలె, ఐరావత కుంభాల వలె
అలరేటి మేరు మందర పర్వతాలు
ఉన్నంతకాలం కుశలం కలుగుగాక! -
అని తృప్తితీర ఆశీర్వదించాడు.

Wednesday, May 18, 2016

ముత్తెరంగులు మహింగల యట్టి విమర్శకుల్


ముత్తెరంగులు మహింగల యట్టి విమర్శకుల్


సాహితీమిత్రులారా!

శ్రీ అనంత పంతుల రాలింగస్వామిగారు నేటి విమర్శకులు ముచ్చటగా
మూడు విధాలని హాస్యప్రాయంగా క్రింది పద్యంలో చెప్పారు.........
చూడండి.

ఉన్నది ఉన్నదంచనుచు నుఁడెడి వాడధముండు, తెల్వి మై
ఉన్నది లేదటంచనుచు నుండెడి నాతడు మధ్యముండు, లే
కున్నది యున్నదంచనుచు నుండు నతండిలనుత్తముండ యా,
నెన్నగ ముత్తెరంగులు మహింగల యట్టి విమర్శకుల్ వెసన్


1.ఆయా గ్రంథాలలో ఉన్న మంచిని విమర్శించువాడు
    అధమ విమర్శకుడు,
2. ఆధిక తెలివిని ప్రదర్శిస్తూ, ఆ గ్రంథాలలో ఉన్న మంచిని
     లేదంటూ పేర్కొనువాడు మధ్యముడు,
3. ఇక, ఆ పుస్తకాలలో చెప్పబడని, లేని, మంచిని, విషయాన్ని,
    ఉన్నదని ఉగ్గడించేవాడు ఉత్తమవిమర్శకుడు.......
    గా    ప్రపంచంలో చెలామణి అగుచున్నారు.

ప్రతి వ్యక్తిని యాచించ వద్దు


ప్రతి వ్యక్తిని యాచించ వద్దు


సాహితీమిత్రులారా!

ప్రతి వ్యక్తిని యాచించవద్దని
అన్యాపదేశంగా కవి
ఈ శ్లోకంలో చెబుతున్నాడు
చూడండి.

రేరే చాతక! సావధాన మనసా మిత్ర! క్షణం శ్రూయతామ్
అంభోదా బహవో వసన్తి గగనే సర్వేపి నైతాదృశా:
కేచిత్ వృష్టిభి రార్ద్రయన్తి వసుధాం గర్జన్తి కేచిద్వృథా
యం-యం-పశ్యసి తస్య-తస్య పురతో మాబ్రూహి దీనం వచ:

మిత్రా!
చాతకమా!
 ఒక్కమాట సావధానంగా విను.
ఆకాశంలో మేఘాలు అనేకములు.
అన్నీ ఒక లాటివేకాదు.
కొన్ని భూమిని ఫలింపచేస్తాయి.
మరి కొన్ని కేవలం ఉఱిమిపోతాయి.
కనిపించిన ప్రతి మేఘం దగ్గర
దీనంగా యాచించవద్దు.
అంటున్నాడు కవి.
నిజమేకదా!

Tuesday, May 17, 2016

అధమ పాఠకుని లక్షణాలు


అధమ పాఠకుని లక్షణాలు


సాహితీమిత్రులారా!

మనమంతా చదువుతున్నాము. చదివేవాళ్ళను చూస్తున్నాము.
కాని ఏ లక్షణాలు ఉత్తమమైనవి? ఏవి అధమమైనవి?
 ఈ శ్లోకం చూస్తే అర్థమౌతుంది.


శీఘ్రీ గీతీ శిర: కంపీ యథా లిఖిత పాఠక:
అనర్థజ్ఞో2ల్పకంఠశ్చ షడేతే పాఠకాధమా:


తొందరా చదవటం
మూలుగుతూ చదవటం
తల ఆడిస్తూ చదవటం
వ్రాస్తున్నట్లుగా చగవటం
అర్థ జ్ఞానం లేకుండా చదవటం
నీరసంగా చదవటం - అనే
ఈ 6 అధమ పాఠకుని లక్షణాలు.
గమనించండి మనవారిలో ఎవరైనా ఉన్నారేమో?
ఇప్పటినుండైనా ఈ లక్షణాలను మానేట్లు చేద్దాం.

రమణమ్ - మరణమ్ - చరణమ్


రమణమ్ - మరణమ్ - చరణమ్


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకంలోని చమత్కారం చూడండి.

రామచంద్రే "రణ" ప్రాప్తే మధ్య "మం" నాక యోషిత
ఆది "మం" లేభిరే వీరా భీరమశ్చ ఆది "చం" రణమ్

రామచంద్రుడు "రణమ్" (యుద్ధము) నకు వెళ్ళినాడు.
నాకయోషిత (దేవతా స్త్రీలు)
(రణ మధ్య "మ" ను పొందిరి) "రమణ" రమణులను పొందిరి.
వీరులు ఆది "మ" ను పొందిరి - "మరణ" - మును పొందిరి.
భీరువులు (పిరికివారు) ఆది "చ" ను పొందిరి
అనగా
చరణములను పొందిరి.

Monday, May 16, 2016

సారమైనది అత్తవారిల్లే


సారమైనది అత్తవారిల్లే


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి ఎంత చమత్కారంగా చెప్పాడో.

అసారే ఖలు సంసారే సారం శ్వశుర మందిరమ్
క్షీరాంభౌ చ హరిశ్శేతే శివశ్శేతే హిమాలయే

(సారములేని ఈ సంసారంలో
పురుషులకు సార(ఆనంద)మైనది
అత్తవారి ఇల్లు
అందుచేతనే
విష్ణవు క్షీరసాగరముపై
పవ్వళించుచున్నాడు!
శివుడు హిమాలయముపై
వసించుచున్నాడు!)

సరససంభాషణలు



సరససంభాషణలు


సాహితీమిత్రులారా!
సామాన్యమానవులు పరిహాసాలాడడం, ఛలోక్తులు విసరడం
మనం గమనించేవే కాని దేవతలు సైతం పరిహాసాలాడడం
మనం ఇక్కడ గమనించ వచ్చు.
గంటి కృష్ణవేణమ్మగారు "గిరిజా కల్యాణము" -  అనే కావ్యంలో
 "బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు" వివాహభోజన సమయంలోని
సరససంభాషణలు ఇలా చిత్రించారు చూడండి.

విష్ణువు శివునితో-

విసము తిన్ననోట కసవయ్యె కాబోలు
భక్షణంబులెల్ల పార్వతీశ!
అట్టి దివ్యమైన ఆహారంబులు లే
వటంచు బల్కె విష్ణు డభవుతోడ-

అప్పుడు శివుడు-

నిక్కము నీవు పల్కినది నీరజనాభ! ఇటెందు మ్రుచ్చిలన్
చిక్కదు వెన్న తెత్తుమన చిక్కవు ఎంగిలి కాయలెందు నీ
కెక్కడఁ దెత్తుమయ్య అవి యిప్పుడటంచు శివుండు నవ్వినన్
అక్కడ పంక్తిభోజనమునందు పకాలున నవ్విరందఱున్


విష్ణువు బ్రహ్మతో-

వండి వడ్డింప దొకనాడు వనిత నీకు
అంటు తలవాకిటనెగాన - ఓ విధాత!
భుక్తి సలుపుమ యిపుడైన బొజ్జనిండ
అనుచు పరిహాసమాడె నా హరియు నపుడు

Sunday, May 15, 2016

కుకవి నింద


కుకవి నింద


సాహితీమిత్రులారా!

ప్రతి కావ్యంలో ప్రతికవి కుకవి గురీంచిన పద్యం రాయడం పరిపాటి.
ఇక్కడ క్రీ.శ. 1932లో అనంతపంతుల రామలింగస్వామి అనుకవి
రచించిన శుక్లపక్షము అనే హాస్య కావ్యం రాసి ముద్రింపిచారు.
అందులో కుకవి నింద
ఎంత
తమాషాగా
రాశారో
చూడండి.

రసము నే నెఱుంగనా? ప్రారబ్దమిదియేమి?
        ద్రవిడదేశాన్నసత్రముల నిడరె?
సముచితాలంకారసమితి నే నెఱుగనా?
       మగువలు ధరియించు నగలు కావె?
యతిని నే నెఱుగనా? క్షితిలోన
       కాషాయవస్త్రధారుండైనవాడు కాడె?
గురువు నే నెఱుగనా? సరిసరి! అక్షరా
       భ్యసనంబు సల్పిన యతడు కాడె?
శబ్దమన నే నెఱుంగనా? చప్పుడు గదె?
అనుచు వచియించు అజ్ఞాన జనములోన
అగ్రగణ్యుండవగు నీ వహా! కవిత్వ
మును రచించుట భాషకు ముప్పు గాదె?

మరోప్రపంచం, మరోప్రపంచం

మరోప్రపంచం, మరోప్రపంచం


సాహితీమిత్రులారా!

మహాప్రస్థానంలో మొదటి గేయం 
మరోప్రపంచం మరోప్రపంచం శ్రీశ్రీ గొంతుకతో వినండి.


Saturday, May 14, 2016

ఆపాతాళ నిమగ్న పీవర తనుర్జానాతి మంద్రాచల:

ఆపాతాళ నిమగ్న పీవర తనుర్జానాతి మంద్రాచల:


సాహితీమిత్రులారా!

ఈ చమత్కార పద్యం చూడండి.

దేవీం వాచ ముపాసతే హి బహవ: సారంతు సారస్వతమ్
జానీతే నితరామసౌ గురుకుల క్లిష్టో మురారి: కవి:
అబ్దిర్లంఘిత ఏవ వానర భటై: కింత్వస్య గంభీరతాం
ఆపాతాళ నిమగ్న పీవర తనుర్జానాతి మంద్రాచల:

సరస్వతిని ఆరాధించువారు అనేకులు.
కాని సారస్వతసారము గురుకులములో
శ్రమపడి విద్యను అభ్యసించిన ఒక "మురారి" కే తెలియును.
సముద్రమును ఎన్నియో కపులు దాటినవి.
కాని సముద్రపులోతు - పాతాళం వరకు మునిగిన
మందరపర్వతానికే తెలియును!

కరుణశ్రీ పద్యాలు - ఘంటసాల గాత్రం


కరుణశ్రీ పద్యాలు - ఘంటసాల గాత్రం

సాహితీమిత్రులారా!

కరుణశ్రీ కవిత్వం ఘంటసాల గాత్రంతో 
అనేకం వెలుగులోకి వచ్చాయి గతంలో 
వాటిని మళ్ళీ ఒకసారి విందాం.


Friday, May 13, 2016

సభ్రమర పద్మాఘ్రాణ


సభ్రమర పద్మాఘ్రాణ


సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకం చూడండి.

కస్యవా నభవతి రోషా దృష్ట్వా ప్రియాయా: సవ్రణ మధరమ్
సభ్రమర పద్మాఘ్రాణ శీలే సహస్వేదానీమ్!

నాయిక పరపురుషుని దంతక్షతము పొందినది
అంతలోనే భర్త వచ్చినాడు.
అతనికి అనుమానం రాకుండా
చెలికత్తె నాయికతో
"ప్రియురాలి పెదవి గాటు చూచిన ఏ ప్రియునికి రోషం రాదు?
నేను చెప్పినా వినక తుమ్మెద ఉన్న పద్మమును అఘ్రాణించితివి!
కర్మను అనుభవింపుము!"
అని భర్త వినేట్లుగా అంటున్నది.

కుంతీవిలాపం



కుంతీవిలాపం


సాహితీమిత్రులారా!

కరుణశ్రీ కవిత్వం ఘంటసాల గాత్రంతో 
అనేకం వెలుగులోకి వచ్చాయి 
గతంలో వాటిని మళ్ళీ ఒకసారి విందాం.

Thursday, May 12, 2016

భ్రాతృహంతా, పితృహంతా


భ్రాతృహంతా, పితృహంతా


సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకం చూడండి.

భ్రాతృహంతా పితృహంతా మాతృహంతా చయ:పుమాన్
త్రయేతేచ మహాభక్తా: ఏతేషాంచ నమామ్యహమ్

అన్నను చంపినవాడు,
తండ్రిని చంపినవాడు,
తల్లిని చంపినవాడు
ఈ ముగ్గురు మహాభక్తులు.
వీరికి నమస్కారం.
ఎట్లా
అన్నను చంపినవాడు, తండ్రిని చంపినవాడు, తల్లిని చంపినవాడు
మహాభక్తులా?
ఎవరువారు?

అన్నను చంపినవాడు(విభీషణుడు),
తండ్రిని చంపినవాడు (ప్రహ్లాదుడు),
తల్లిని చంపినవాడు(పరశురాముడు)
ఈ ముగ్గురు మహాభక్తులు.
వీరికి నమస్కారం.

పుష్పవిలాపం


పుష్పవిలాపం


సాహితీమిత్రులారా!

కరుణశ్రీ జంధాయల పాపయ్యశాస్త్రిగారి కలంనుండి జాలువారిన పుష్పవిలాపం 
ఘంటసాల వేంకటేశ్వరరావుగారి అమృతగాత్రంలో విని తరించిరి మన పూర్వులు 
నేడు మనం విందాం.










Wednesday, May 11, 2016

కవితా! ఓ కవితా!


కవితా! ఓ కవితా!


సాహితీమిత్రులారా!
శ్రీశ్రీ కలంనుండి జాలువారిన "కవితా! ఓ కవితా!" 
శ్రీశ్రీ కంఠనాదంనుండి వినండి



వాని తలదీయ సదాశివ సద్గురుప్రభూ!



వాని తలదీయ సదాశివ సద్గురుప్రభూ!


సాహితీమిత్రులారా!
కవిత్వాన్ని ఎవరికి వినిపించాలో ఎవరికి వినిపించగూడదో
ఈ క్రింది పద్యంలో కవి వివరించాడు.
చూడండి.

గొప్ప కవీంద్రుడైన వినగోరు కవిత్వము, తోచినంతలో
చెప్పును తప్పునొప్పు, నిరసింపక దిద్దును, శుంఠయయ్యెనా
తప్పులు పట్టు, యుక్తి పెడదారికిదీయు, "గరాసు", దాని దా
ద్రిప్పుట బెట్టుట, వాని తలదీయ, సదాశివ! సద్గురుప్రభూ!

సదాశివ సద్గురువర్యా దేశంలో గొప్పగొప్ప కవీశ్వరు లెందరో,
ఇతరుల కవిత్వాన్ని, దానిలోని ఇంపుసొంపులను వినాలనుకుంటారు.
విన్న తర్వాత వానిలోని మంచి చెడ్డలను,
అర్థనర్థాలను తనకుతోచినట్లు స్పష్టంగా, తెల్పుతారు.
తిరస్కరింపక, చొరవ తీసుకొని, ఇక్కడ ఇది ఇలా ఉంటే బాగుంటుందని,
దిద్దిచెబుతారు.
ఇక సరిగా,
చదువురాని మూర్ఖుడు(గరాసు), దుష్టుడైనచో,
వెదకి వెదకి ఆ కవిత్వంలోని ఒప్పులను విడచి
తప్పులను మాత్రమే పట్టుకొంటాడు.
విడిచి పెట్టక వానిమాటలకు, విపరీతార్థాలు,
పెడార్థాలు తీసి, క్రూరత్వం, గర్వం కూడా ప్రదర్శిస్తాడు,
వాని తస్సదియ్య అలాంటివాని
తలకాయ తీసివేసినా తప్పులేదు సుమా!

Tuesday, May 10, 2016

"కుంభి కుంభములపై వాసించు తద్వాసనల్"


"కుంభి కుంభములపై వాసించు తద్వాసనల్"


సాహితీమిత్రులారా!
శ్రీనాథుడు రామగిరిదుర్గపాలకుడైన తెలుగురాయడిని దర్శించినపుడు
తెలుగురాయని ఆశీర్వదించగా తెలుగురాయడు
శ్రీనాథుని కోరిక తెలుపుమనగా
ఈ పద్యంలో
తనకోరిక
వెలిబుచ్చాడు
శ్రీనాథుడు.

అక్షయ్యంబగు పాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా
బిక్షాదానము సేయరా సుకవిరాట్ బృందారక ప్వామికిన్
దక్షారామ చళుక్య భీమ వర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించు తద్వాసనల్

(ఓ తెలుంగాధీశ కస్తూరి దానంగా ఇస్తే
దక్షారామంలోని
అప్సరసల
ఉన్నత స్తనాలమీదపూసి
అనుభవిస్తాను.)

అడిగేది దానం
అదీ కస్తూరి
వేశ్యా స్తనాలపైరాసి
అనుభవించటానికట.
ఎంత చిత్రమైన దానం
అడిగాడో
              చూడండి.

జగద్గరు శంకరాచార్యులవారి జయంతి


జగద్గరు శంకరాచార్యులవారి జయంతి

సాహితీమిత్రులారా!

జగద్గరు శంకరాచార్యులవారి జయంతి సందర్భంగా వారిని స్తుతిద్దాం. 
ఇది వింటూ మనసులో అనుకోండి.

















Monday, May 9, 2016

వాణీ విలాపం



వాణీ విలాపం

సాహితీమిత్రులారా!
ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం 

వారి కావ్యఖండిక వాణీవిలాపంను 
మధురగాయకమౌళి శ్రీ అమలాపురం కన్నారావు గారు ఆలపించారు 
మీరును వినండి


అష్టశక్తులు


అష్టశక్తులు

సాహితీమిత్రులారా!
శ్రీమహావిష్ణువు సన్నిధిలో చామరాలను
పట్టుకొని వీస్తూ సేవించేవారు
8 మంది వారికి అష్టశక్తులని పేరు.
వారి పేర్లను ఈ పద్యంలో చూడండి.

సరసిజాలయ సావిత్రి సర్వభద్ర
విమల పద్మ మహాదేవి విలసదీశి
జాహ్నవి యనంగ నెనమండ్రు శక్తులెపుడుఁ
జామరంబుల వీతురు చక్రిమ్రోల
           (మహాలక్ష్మీపరిణయము 1-25)

1. సరసిజాలయ 2. సావిత్రి        3. సర్వభద్ర   4. విమల
5. పద్మ             6. మహాదేవి   7. ఈశి         8. జాహ్నవి

Sunday, May 8, 2016

ఏమి సంబంధ మిది?



ఏమి సంబంధ మిది?


సాహితీమిత్రులారా!

కవితావినోదము (మొదటి సంపుటి)లో
విద్వాన్ కావ్యతీర్థ మద్దుపల్లి వేంకటసుబ్రమణ్యశాస్త్రిగారు
ఈ విధంగా రాసి ఉన్నారు.
1925నుండి 1934 వరకు నంద్యాల మునిసిపల్ హైస్కూల్ నందు ఉండేవారు.
తరువాత కర్నూల్, సెంటుజోసఫ్స్ గరల్స్ హైస్కూలులో
చేరినపుడు వారికి ఈ విధమైన ఆలోచన వచ్చిందట.
ఇప్పుడు ఈ పాఠశాలలో ఉద్యోగం దొరకుటకు కారణమేమి?
అని ఆలోచించగా
ఈ విధమైన శ్లోకం వచ్చిందట.
27-02-1960లో రాయబడింది.

రూపేణ వేణ్యా నను రోమరాజ్యా
నాగాంగంనా ఏవ హి బాలికా స్స్యు:
విద్యాలయే తాభి రభూ దత స్సు
బ్రహ్మణ్యనామ్నో మమ సాన్నిహిత్యమ్!

(ఇక్కడ చదువుకునే బాలికలందరు
రూపముచేతను, జడలచేతను, నూఁగారుచేతను
నాగాంగనలే అవుతారు. రూపంలో నాగకన్యలను పోలినవారు.
జడలు, నూగారు(నాగ = ) సర్పములవలె ఉన్నవి.
నేను సుబ్రమణ్యుడను. సుబ్రమణ్యస్వామి సర్పస్వరూపుడు కదా! )

కనుకనే మాకు మాకింత సన్నిహిత సంబంధం ఏర్పడినది.