Wednesday, October 19, 2016

బాలగోపాల! కరుణాలవాల!


బాలగోపాల! కరుణాలవాల!



సాహితీమిత్రులారా!

పుసులూరి సోమరాజ కవి బాలగోపాలుని పేర
రచించిన శతకంలోని పూర్వకవుల స్తుతి చూడండి.

ప్రాచేతసార్పిత రామాయాణము భంగి
                     వ్యాస కల్పిత భాగవతము మాడ్కి
ద్రావిడ వాఙ్మయోదార వేదమురీతి
                     నారద మధురగానంబు సరణి
లీలాశుక స్తుతి లాలన ప్రక్రియ
                    జయదేవకవి సరస్వతి విధమున
బమ్మెర పోతన్న భారతీక్రమమున 
                    దాసగీత ప్రబంధముల పోల్కి
బాల కృష్ణాంఘ్రి దాసోక్త పద్యశతకము
దయను కనుగొను మాచంద్రతారకముగ
బాలగోపాల! కరుణాలవాల! నీల
శైల పాలావనీపాల చారులీల

ఈ కవి సంస్కృతాంధ్ర తమిళ కర్నాట కవులను
స్మరించడం గమనించదగ్గ విషయం
అందులోనూ భక్తకవులను మాత్రమే స్తుతించాడు.

ఈ కవి నందనందన శతకం లోని ఈ పద్యం చూడండి.
గోపికా కృష్ణుల దివ్యవిహార లీలలను
రమణీయంగా వర్ణించిన తీరు గమనించండి.

పుక్కిట తమ్ములం బడుగు బోటికి నోటికి నియ్య జూచు వే
రొక్కతె కోపగింప కనకోత్పల మాలిక లిచ్చినట్టి మే
లిక్కడ చూప వచ్చితి బళీ యను రాధిక నూరడించు నీ
చక్కదనంబు జూడ మనసైనది చూపుము నందనందనా!

కృష్ణుడు తాంబూలం వేసుకున్నాడు.
ఒక గోపిక తన కిమ్మని అడిగితే ఆమె నోటికి అందించాడు.
దీన్ని చూసి ఇంకో గోపికకు కోపం వచ్చింది.
ఆమె అలుక తీర్చటానికి తాను ధరించిన
చంపకోత్పలమాలలు ఇచ్చాడు.
ఇటువంటి చేతలు, చాతుర్యాలు
నా దగ్గరా - అనే రాధను ఊరడించే
నీ సౌందర్యం చూడాలని మనసైంది.
నాకు చూపించవలసింది - అని
తానూ ఒక గోపిక అయి కవి అర్థిస్తున్నాడు.



No comments:

Post a Comment