Showing posts with label పురాణాలు. Show all posts
Showing posts with label పురాణాలు. Show all posts

Wednesday, April 18, 2018

విష్ణుపురాణం


విష్ణుపురాణం



సాహితీమిత్రులారా!



విష్ణుపురాణం అష్టాదశ పురాణాలలో మూడవది.
మైత్రేయుని అభ్యర్థనపై పరాశరుడు చెబుతున్నట్లుంది.
విష్ణుపారమ్యాన్ని ప్రతిపాదించే పురాణమని పేరే చెబుతున్నది.
ధ్రువుడు, వేనుడు, పృథుమహారాజు, యవనాశ్వుడు, మాంధాత 
మొదలైన వారి చరిత్రలు, శంబరాసుర వృత్తాంతము, నరకుని 
వృత్తాంతము మొదలైనవి దీనిలో వర్ణించబడినాయి. కృతయుగం 
మొదలు కలియుగం వరకు మానవుల ప్రవృత్తులు, జీవన విధానాలలో 
కలిగే మార్పులను యుగధర్మాలనే పేరుతో ఈ పురాణం సూచించింది. 
ప్రాసంగికంగా వచ్చిన వృత్తాంతాలలో క్షీరసాగర మథనం, ప్రహ్లాద చరిత్ర, 
వ్యాసుడు వేదవిభాగాలను చేయడం, అష్టాదశ పురాణాల అనుక్రమణిక, 
చతుర్దశ విద్యల విభజన, వైష్ణవ లక్షణాలు, వర్ణాశ్రమ ధర్మాలు, సగర,
శ్రీరామాది సూర్య వంశ రాజుల కథలు, తారాశశాంక పురూరవవాది 
చంద్రవంశ రాజుల కథలు, శ్యమంతకోపాఖ్యానం, శ్రీకృష్ణావతార కథ, 
ఖాండిక్య కేశిధ్వజ జనకసంవాదం మొదలైనవి చెప్పబడ్డాయి. 

విష్ణుపురాణానికి మొదటి తెలుగు అనువాదం 
పశుపతి నాగనాథునిది (14వ.శ.) ఇది అలభ్యం. 
తరువాత వెన్నె కంటి సూరన(16వ.శ.), కలిదిండి 
భావనారాయణ(16వ శ.), కళ్లేపల్లి నరసింహమూర్తి, 
తాడేపల్లి సీతారామస్వామి(19వ శ.) పద్యానువాదాలు చేశారు. 
తుపాకుల అనంతభూపాలుడు(18వ శ.), నోరి గురులింగశాస్త్రి(19వ శ.) 
వచన రచనానువాదం చేశారు.

Tuesday, April 3, 2018

పద్మపురాణం


పద్మపురాణం



సాహితీమిత్రులారా!



అష్టాదశపురాణాలలో రచనకు సంబంధించినంతవరకు
పద్మపురాణం మొదటి, సంఖ్యలో రెండవది. పద్మపురాణంలో
55వేల శ్లోకాలున్నాయి. ఇది సాత్వికపురాణం. ఇది విష్ణువుకు 
మిక్కిలి ప్రీతిపాత్రము, హృదయ స్థానం అని సాంప్రదాయం.
ఇందులో ఆరు ఖండాలున్నాయి. అవి ఆది, భూమి, బ్రహ్మ, 
పాతాళ, సృష్టి, ఉత్తర ఖండాలు. పద్మకల్పంలో ప్రవృత్తం 
కావడం చేత పద్మపురాణం అని, ఆ కల్పంలో విష్ణునాభినుంచి
క్షోణీలక్షణాలతో ఉద్భూతమైన పద్మమే భూమికావడం చేత దీనికి
పద్మపురాణం అని పేరు. శ్రీహరి తత్త్వాన్ని ప్రతిపాదించేది 
ఈ పురాణం.

                ఆది ఖండంలో సృష్టిక్రమం, భూమిపైని ప్రధాన  నదీతీర్థ పర్వతాలు 
మొదలైన వాటి వర్ణన, కింపురుషాది వర్షవర్ణన ఉన్నాయి. ఇందులో శైవతీర్థాలే 
ఎక్కువగా వర్ణించబడ్డాయి. భూమి ఖండంలో ఎక్కువగా విష్ణపారమ్య 
ప్రతిపాదికాలైన కథలున్నాయి. పద్మావతి(కంసుని తల్లి) చరిత్రం, 
భార్యా తీర్థాధిక్యాన్ని తెలిపే సుకలాచరిత్రం, గురుతీర్థ, పితృతీర్థ 
మహిమలు,  అశోకసుందరీ నహుషుల కథలు ఇందులో చేరి ఉన్నాయి. 
అనేక వ్రతకథలు, వాసుదేవస్తోత్ర, రామనామ, విష్ణుసహస్రనామ 
మహిమలు కూడా ఇందులో వివరించబడ్డాయి. ఇందులోని ముఖ్యాంశం 
అష్టాదశ పురాణాత్మక విష్ణు స్వరూప వర్ణన. పాతాళఖండంలో పూర్వకల్ప
రామాయణం ఒక విశేషం. 

            పద్మపురాణం ఉపాఖ్యానాలకు ప్రసిద్ధి చెందినది.
తెలుగులో దీనిని పద్యరూకంగా అనువదించిన వారిలో మడికి
సింగన(15వ శతాబ్దం) మొదటివాడు. ఇతడు ఉత్తర ఖండం
మాత్రమే అనువదించాడు. తరువాత కామినేని మల్లారెడ్డి
(1550-1610), త్రిపురాన తమ్మయదొర(1849-90), పిశుపాటి
చిదంబర శాస్త్రి(1892--1951), వేటూరి శివరామశాస్త్రి(1892-1967)
కూడా అనువదించారు.

Sunday, March 18, 2018

బ్రహ్మపురాణం


బ్రహ్మపురాణం




సాహితీమిత్రులారా!




అష్టాదశ పురాణాల్లో మొదటిది బ్రహ్మపురాణం. 
విష్ణుపారమ్యం కలది విశేషించి కృష్ణగాథలు ఉన్నది.
బ్రహ్మకల్పంలో ప్రవర్తితమైన రాజస పురాణం ఇది.
ఋషులకు బ్రహ్మ చెప్పినట్లుంది. ఇందులో 5 సర్గలు,
పదివేల శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణ ప్రశస్తి 
ఇతరపురాణాల్లో ఎక్కువగా కనబడుతుంది.

        ఇందులో మొదట బ్రహ్మ సృష్టిక్రమం, వర్ణన,
రాక్షస, దేవతా వంశాల, సూర్యచంద్ర వంశాల విస్తృత
వర్ణన ఉన్నాయి. ప్రతిసర్గంలో దక్షప్రజాపతితో సృష్టి
ప్రారంభం కావడం, దక్షుడు అదేపనిగా సృష్టి చేస్తూండగా,
ఆ సృష్టికి కావలసినంత స్థలం వున్నదో లేదో తెలుసుకొమ్మని
నారదుడు ఉపదేశించడం, దక్షుని కుమార్తెలు భూవిస్తృతిని
తెలుసుకొని రావడానికి పోయి తిరిగి రాకపోవడం చెప్పబడింది.
సూర్యవంశ వర్ణన సందర్భంలో సగరకుమారులు యాగాశ్వాన్ని
వెదకుతూ ముని ఆగ్రహానికి గురుయై భస్మంకావడం అనే కథలో
ఆ ఆరువది వేల మందిలో నలుగురైదుగురు ముని అనుగ్రహం 
పొంది చావు తప్పించుకొని వారే యాగాశ్వాన్ని తిరిగి చెచ్చారని
ఈ పురాణం చెబుతుంది. భగీరథుడు తపస్సు చేసి గంగను 
భూమిపైకి తేవడం కూడా వర్ణితమైంది ఇందులో.

         చంద్రవంశ గాథా ప్రారంభంలో చంద్రుడు అత్రిమహర్షి
కుమారుడై పుట్టి చంద్రవంశాన్ని విస్తంరింపచేసినట్లుంది. ఆ తరువాత
రుద్రమహాత్మ్యవర్ణన ప్రసక్తం కాగా పార్వతీ పరమేశ్వరుల వివాహం 
వర్ణింపబడింది. గౌరి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను
ప్రేమించినట్లు చెప్పాడని, గౌరి శివుని తన తండ్రితో కలిసి 
మాట్లాడమని కోరిందని, శివుడు హిమవంతుని వద్దకుపోగా ఆయన
తన కుమార్తెకు స్వయంవరం చాటిస్తాడని కథనం. తిరిగి గౌరి వద్దకు 
పోయి మావంటి పేదలు స్వయంవర సభలోకి ఎట్లా రాగలరని అడగగా 
గౌరి శివుని మెడలో అప్పటి కప్పుడే పూలమాలవేసిందట. స్వయంవరంలో 
శివుడు శిశురూపంలో గౌరి అంకతలంపై క్రీడించగా, గౌరి ఆ శిశువు మెడలో 
స్వయంవరమాల ఉంచింది. దేవతలు అందుకు కోపించి యుద్ధం 
చేయబోయి ఓడిపోయారు. చివరకు నిజం తెలుసుకొని వారు శివుని స్తుతించారు.

                    తరువాతి కథ జగన్నాథక్షేత్రం()పూరి)లో వెలసిన
జగన్నాథ, బలరామ, సుభద్రామూర్తుల ఆవిర్భావంతో సంబంధించిన
ఇంద్రద్యుమ్న చరిత్రం. శ్రీకృష్ణచరిత్రం కూడా విపులంగా వర్ణించబడింది.  
భాగవత కథాంశాలకంటె ఇందులోని కథాంశాలు భిన్నంగా ఉన్నాయి.

                    ఇందులోని ఒక విశేషాంశం దశావతారకథనం. అగ్నీధ్ర రాజవృత్తాంతం 
మాయ అంటే ఏమిటో నిరూపించి,  దానిని నిరాసం(తిరస్కరం) చేయటానికి 
యోగాభ్యాస ఆవశ్యకతను నిరూపించి  ఆ సందర్భంలో సాంఖ్యయోగాన్ని వివరించటం జరిగింది. ప్రసక్తానుప్రసక్తంగా అక్షరాక్షర స్వరూపనిరూపణం, విద్యావిద్యా మహిమ స్వరూపనిరూపణం చేయబడ్డాయి. ఆ తరువాత సర్వపురాణాలకు సామాన్యమైన 
తీర్థవర్ణనలు, ద్వీప, వర్ష వర్ణనలు ఉన్నాయి. పురూరవ చక్రవర్తి పూర్వజన్మ 
వృత్తాంతం ఒక ప్రత్యేక గాథగా ఉంది. ఈ పురాణాన్ని జనమంచి శేషాద్రి శర్మ(1892-1950)
గారు పద్యానువాదం చేశారు. వెంకట పార్వతీశ్వరకవులు కూడా నడకుదుటి వీరరాజుతో 
కలిసి మరో అనువాదం చేశారు.

Saturday, March 10, 2018

పురాణాలంటే ఏమిటి దాన్లో ఏముంటాయి


పురాణాలంటే ఏమిటి దాన్లో ఏముంటాయి




సాహితీమిత్రులారా!



పురాణం అంటే ప్రాచీన కథాగుచ్ఛం అనే అర్థం స్ఫురిస్తుంది.
వేదవాఙ్మయంలోో ఇతిహాసం, ఆఖ్యానం మొదలైన శబ్దాలతోపాటు
పురాణశబ్దం కూడ కనిపిస్తుంది.  ప్రపంచోత్పత్తి, వీరుల, ఋషుల 
జీవితాలు మొదలైన వృత్తాంతాలు వేదయుగంలోనే రచించి ఉండవచ్చు. 
వాటికే పురాణాలని పేరు. సాధారణంగా వాటిని రచించినవారి పేర్లు తెలియవు. 
హరివంశంలో పురాణాల సంఖ్య  గురించిన ప్రస్తావన ఉంది. గౌతమ, ఆపస్తంబుల 
ధర్మశాస్త్రాలు (క్రీ.పూ.500) కూడా పురాణాలను పేరొంటున్నాయి. పురాణాల 
కాలం ఇది అని తేల్చడానికి వీలు లేదు. వీటిలో అతిప్రాచీనమై
నవి, ప్రాచీనము కాని కూడ ఉన్నాయి. రాజవంశాలను వివరించే
పురాణాలలో హర్షుడు మొదలైన వారి వంశవివరణం లేనందువల్ల
పురాణాలు క్రీ.పూ. 500 సంవత్సరాలకు పూర్వమే వ్రాయబడినట్లు
విమర్శకుల అభిప్రాయం.
          పురాణాలలో సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశావతారవర్ణన 
అనే అయిదు లక్షణాలు అన్నిటిలో కనిపించటం
వల్ల వీటికి పంచలక్షణాలు అనే పేరు వచ్చింది. వేదాల్లో చెప్పబడిన
నీతి ధర్మతత్త్వాది విషయాలను పురాణాలు కథలు, ఉపాఖ్యానాల 
ద్వారా వివరిస్తున్నాయి. లాక్షిణికులు వీటిని మిత్ర సమ్మతములుగా 
పరిగణించారు. చారిత్రకంగా కూడా పురాణాలకు ప్రాముఖ్యత ఉంది.
వీటిలో శుంగ, నంద, మౌర్య, గుప్త, ఆంధ్ర మొదలైన రాజవంశా చరిత్రలు 
సమగ్రంగా ఉన్నాయి. విమర్శ దృష్టితో వీటిని కొంచెం సవరించి చూస్తే 
ఇవి చారిత్రక వృత్తాంతాలతో  కూడ సరిపోతున్నాయి. 18 మహాపురాణాలను, 
18 ఉపపురాణాలను వ్యాసుడే రచించాడని ప్రతీతి. కానీ వ్యాసుడు 
ఒక్క బ్రహ్మపురాణం మాత్రమే వ్రాశాడని, మగిలినవి అతని శిష్యులు 
రచించారనీ మరొక అభిప్రాయం. వ్యాసునికి ముందే పురాణాలున్నాయని 
వాటి సారాంశం వివరించి వాటికి ప్రచారం కలిగించాడని మరొక అభిప్రాయం.