తెల్పగరాదె! నిజంబు నీశ్వరా?
సాహితీమిత్రులారా!
వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడీ - అని
స్వాతంత్ర్యసమరంలో గంధం పట్టుక తిరిగిన
మన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి
సూతపురాణంలోని పద్యం చూడండి.
ఒకరుడు "వేదమే భగవదుక్త" మటంచు నుపన్యసించు, నిం
కొకరుడు "బైబిలే భగవదుక్త" మటంచును వక్కణించు, వే
రొక్కురుడుమా "ఖొరాన్ భగవదుక్త" మటంచును వాదులాడు, నీ
తికమక లేల బెట్టెదవు? తెల్పగరాదె! నిజంబు నీశ్వరా!
(సూతపురాణము -3-1)
ఈశ్వరా! ఒక ఛాందసుడు వేదాలనే భగవంతుడు అన్ని ధర్మాలను
భవ్యంగా వివరించాడు కావున వాటినే సదా సేవించాలంటాడు.
మరొకడు బైబిలు గ్రంథమే భవ్యమైనది అదే భగవత్ కైంకర్యంగా
కర్తవ్యమని కంకణం కట్టుకొని బోధిస్తాడు.
వేరొకడు అవేవీకావు మా ఖురాన్ గ్రంథమే ఖుద్దున(స్వయంగా)
ఖుల్లను(వివరంగా), ఖుషీగా ఖుల్లమము(రాచబాట)ను చూపిస్తుందంటాడు,
ఇలా ఇంతమంది ఇన్ని విధాల మా చెవులు గింగిరులెత్తించి, గిజగిజలాడించి,
గింజుకొనేట్లు చేస్తుంటే, హే భగవాన్! దేవా! అల్లాహో అక్బర్! ఎంగుకిలా ?
మమ్ములను తికమక పెట్టి చంపుకుతింటావు.
ఓ కరుణామయా! కనికరించి, అసలు నిజమేదో నిగ్గుతేల్చి చెప్పి,
మా సందేహాలను పటాపంచలు చేయరాదా? -
అని కరుణాక్రందన చేస్తున్నాడు కవిగారు.
