Saturday, June 30, 2018

కత్తి పడవలు(కథ)


కత్తి పడవలు(కథ)సాహితీమిత్రులారా!


వానెప్పుడొస్తుందా, పడవల పందేలెప్పుడెప్పుడు పెట్టుకుందామాని బళ్ళోకొచ్చినప్పట్నుంచీ కిటికీలోంచీ మబ్బుల్ని చూస్తా, మద్దె మద్దెన పక్కనున్న బాచి గాడితో, ఎనక బెంచీ రాంబాబు గాడితో గుసగుసలాడతా వుంటే “నిన్న సైకిలు మీంచి పడ్డప్పుడు మీ మామ నిన్నిడుసుకున్నాడంటగా” అంటూ రామాంజనీలు గాడు ఎనక బెంచీ లోంచి, ఎకసెక్కంగా గిల్లి మరీ అడిగాడు.

“అరేయ్‌ పొట్టోడా…నన్నెవడిడుసుకుంటాడు. నాకేవన్నా దెబ్బల్తగిలాయా పాడా. సైకిలేండిలొంకర్లు పోయిందని, మడ్డుగార్రేక్కు సొట్ట పడిందని మా మావేడుస్తా వుంటే, డొక్కు సైకిల్తెచ్చి నాకిచ్చినందుకు మమ్మా నాన్న మా మావనే తెగిడుసుకున్నారు”

నేనట్లా చెబుతుండగానే, మా సైన్సయ్యవారు “పొట్ట పొడిస్తే అక్షరమ్ముక్కలేదు…గాడిద…పాఠం చెబుతుంటే ఒకటే మాటలు…పక్కచూపులు. పైగా వినేవాళ్ళను చెడగొట్టడం. పీరీడు అయ్యే వరకు బెంచీ ఎక్కి నిల్చో”అనొక్క ఉరుమురిమారు.

బెంచీ ఎక్కడం మనకేమీ కొత్త కాదు గానీ, మబ్బులు కనిపించవనే బెంగ.
పొలాలకవతల నుంచి దుమ్ము రేపుకొస్తూ గాలి వాన.
స్కూలొదిలిపెట్టాక ఇళ్ళకు పరిగెత్తే మూడో క్లాసు పిల్లల్లాగున్నాయి మబ్బులు.
గాలికి కిటికీ తలుపులు అప్పుడే నిద్రలేచిన కోడి పుంజు రెక్కల్లా టపటపా కొట్టుకుంటున్నాయి.

“బెంచీ ఎక్కించినా నీకు సిగ్గులేదురా…”అని, రామాంజనీలును కిటికీ తలుపులు మూసేయమని చెప్పారు మేష్టరుగారు.

తలుపులందక వాడెగురుతా వుంటే కిటికీ రెక్కలు దొరికినట్టే దొరికి తప్పించుకుని టపటప కొట్టుకుంటుంటే, పొట్టోడు జారిపోతున్న చడ్డీని ఒక చేత్తో పైకెగలాక్కుంటూ అదాటున ఎగురుతా వుంటే భలే నవ్వొచ్చింది. నేనుగానీ వాడి పక్కనుంటే, గబుక్కున వాడి చడ్డీని కిందకు లాగేసుందును.

మేష్టరు గారు పాఠం చెబుతూ, మిగతా పిల్లలు పాఠం వింటూ రామాంజనీలు ఎవ్వారం ఎవ్వరూ చూడ్డంలేదని, “కిటికీ నేనెయ్యనా మేస్టారు” అంటే పక్కన ఉరుము లేని పిడుగు పడ్డట్టు ఒక్కసారిగా అందరూ నావైపు చూసి, క్రిష్నాష్టమప్పుడు వుట్టి కొట్టడానికెగిరినట్టు ఎగురుతున్న పొట్టోడిని చూసి ముందు మేష్టరు గారు, తర్వాత నేను, మిగిలిన మా క్లాసు పిల్లలు ఒహటే నవ్వులు. ఆఖర్న రామాంజనీలు-అందరూ తన్ను చూసి నవ్వుతున్నారని తెలిసి, సిగ్గుతో వంకర్లు పోతూ నవ్వేశాడు.

గాలి ఇంకాస్త పెరిగి, చినుకులు పరిగెత్తుకుంటూ మా క్లాసు లోకి రాబోయి, మేష్టరు గారిని చూసి అడక్కుండా లోపలికొస్తే బాగోదని తటపటాయించి, తొంగి తొంగి చూస్తుండేసరికి కిటికీ దగ్గరగా బెంచీల చివర్లలో కూచున్న వాళ్ళంతా…కొంచెం కొంచెంగా జరుక్కుంటూ బల్ల రెండో కొసన కూచున్న వాళ్ళను నెట్టడం, వాళ్ళు కాళ్ళను నేలకు తన్ని పెట్టి, కిటికీ వైపు వాళ్ళను కిటికీ వైపుకే తిరిగి నెట్టడం… క్లాసురూమంతా వాన నీళ్ళలో కాయితప్పడవలా వూగుతోంది.

వానలో చప్పగా తడుస్తున్న గంటను, క్లాసు రూము పైకప్పును, ఎదురుగా వున్న మమ్మల్ని, చేతికున్న వాచీని మార్చి మార్చి చూసుకుని “గోల చేయకుండా కూర్చోండి. లెక్కల మాష్టరొచ్చే వరకు బయటకెవరన్నా కదిలారా వానలో గోడకుర్చీ వేయిస్తానని”చెప్పి సైన్సయ్యవారెళ్ళిపోయారు.

పైకప్పు కన్నాల్లోంచి బొట్లు బొట్లుగా పడుతున్న వాన నీళ్ళను దోసిళ్ళలో పట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళం చల్లుకుంటా ఉంటే, పొట్టోడు బల్లెక్కి కిటికీ తలుపులు బార్లా తెరిచేశాడు. కొంతమందిమి కిటికీ దగ్గరకెళ్ళిపోయి, నీళ్ళనాపాటున పట్టుకుని చల్లుకోవడం మొదలెట్టాం. ముందు బెంచీల్లో కూచున్న వాళ్ళు నోటు బుక్కుల్లోంచీ మద్య పేజీలు చింపుకుని పడవలు చేసుకుంటున్నారు. ఎనక బెంచీల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటా అరుస్తున్నారు.

ప్యూను సీనివాసులు నెత్తి మీద మూడు మడతల గోనెపట్టా కప్పుకుని పరుగెత్తుకెళ్ళిపోయి ఇంటి బెల్లు కొట్టేశాడు.

‘జైహిందో’ అనుకుంటూ అందరం ఇళ్ళకు ఒహటే పరుగు.

తొందర తొందరగా ఎల్లిపోయి మా ఇంటి ముందు సైడుకాలవలో పడవలొదిలి, మిగిలిన పడవల్ని తుక్కురేగ్గొట్టాలని నేనందరికంటే ముందు ఉరుకుతా ఉంటే – బాచి గాడు, రాంబాబు నా వెనకాతలే పరిగెత్తారు.

వానలో జుట్టు తడిస్తే జలుబొస్తుందని, జలుబుతో జొరమొస్తుందనీ అమ్మా నాన్న కంగారు పడతారని నా భయం. మొన్నొకరోజు మా మామ సైకిలు తొక్కుతూ, నడిరోడ్డు మీద ాామ్మని పడితే సైకిలేండిలు వొంగి పోయిందని, మడ్డుగారుకు సొట్టపడిందని మామ నన్ను తిడతా వుంటే – నేను రోడ్డు మీద పడ్డప్పుడు, నా పక్క నుంచీ ట్రాక్టరెళ్ళిందని తెలిసి ‘సైకిలేండిలు ఇరిగిపోతే పొయ్యింది లెద్దు. పిల్లోడికేమీ కాలేదు. లేచినేల మంచిదైందని’ ఇంటెల్లపాదీ నన్ను చూసి అనందించారు. మరిప్పుడు జుట్టు తడుపుకుని, వొల్లంతా నాన్చుకుని జలుబు తెచ్చేసుకొంటే అంతా దుఃఖమైపోరూ – సంకలో పుస్తకాలు తప్పించి చుట్టూ తల మీద  కప్పుకోడానికేదీ కనిపించలేదు. తడిసిన చొక్కాలోంచి నీళ్ళు చిన్నగా పుస్తకాలకు కూడా అంటుతున్నై.

రాంబాబు మైనం కాగితం పుస్తకాల సంచీని, బాచి గాడేమో రేకు పుస్తకాల పెట్టెను నెత్తి మీదెట్టుకుని అలుపు తీర్చుకుంటా నడుస్తుంటే, తల మీద పుస్తకాలెట్టుకుని నేనూ వాళ్ళ పక్కనే నడుస్తున్నా.

రోడ్డులన్నీ నీళ్ళలో దాక్కున్నాయి.
సైడు కాల్వల్లోని వాన్నీళ్ళు పొంగి, మా పడవల కోసం తొంగి తొంగి చూస్తున్నాయి.
ఎక్కడెక్కడి మబ్బులో పడవల పందేలు చూడ్డానికి గుంపులు గుంపులుగా కూడి మా వూరి మీదకొస్తున్నాయి.

ఉరుమొచ్చినప్పుడల్లా ‘అర్జున… అర్జునా’ అనుకుంటూ, గాలి గట్టిగా కొట్టినప్పుడు వొంటికంటుకు పోయిన టెర్లిన్‌చొక్కా చలి పెడుతుంటే గజగజ వొణుక్కుంటూ ఇంకాస్త తడిసి ముద్దై ఇంటికి చేరేసరికి, మా ఇంటి ముందటి చుట్టిళ్ళు తలంటు పోసుకుని సాంబ్రాణి పొగేసుకుంటున్నట్టనిపించింది. వసారా చూరులోంచి పడుతున్న వాన నీటి కింద బొక్కెనలు, బిందెలూ పెట్టి, పంచలో మంచాలేసుక్కూర్చుని, వీధిలోకి దిగులుగా చూస్తున్నారు అమ్మా నాన్న. వానొస్తె పన్లోకెల్లే పన్లేదని హాయిగా బొజ్జోక ఎందుకట్లా దిగులుగా కూర్చుంటారో!

“నన్ను చూడండోచ్‌… ఇంతోన పడ్డా జుట్టు తడవకుండా వొచ్చేసానోచ్‌” అని స్టయిల్‌ కొడ్తూ, తడిసిన పుస్తకాల్ని తెరిచి, పడవల్చేసుకోడానికి కాయితాల కోసమెతుకుతా వుంటే “ఓర్నీ బొక్కులన్నీ తడుపుకొచ్చేసావా… ఇయ్యన్నీ మల్లీ ఎట్టా కొంటాంరా” అని నాన్న, “గుడ్డలన్నీ తడుపుకుంటా రాకపోతే వాన తగ్గిందాక బల్లోనే కూచుని రావొచ్చుకదరా… ఇప్పుడేమి కడతావు … అయిగో నీ గుడ్డలన్నీ బయట తీగ మీద” అని అమ్మ … కొట్టినంత పన్చేసారు.

“నేను తడవలేదు… నా జుట్టు చూడండి”అంటూ ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా, తడిసిన పుస్తకాల్ని జాగరత్తగా చుట్టింటి పొయ్యి దగ్గర పొంతకానించి ఆరబెట్టి “జుట్టు తడిస్తే మొక్క మొలవ్వురా…జలుబొస్తే మాత్రేసుకోవొచ్చు. బొక్కులు తడిసి సిరిగి పోతే మల్లా ఏడ కొంటాంరా కొడకా…ఇట్టాగైతే నీకు చదువెట్లా వొస్తదిరా కొడకా”అంటూ నాన్న ఒకటే తిట్లు.

పడవ చేసుకోడానికి పొడి కాయితం దొరక్క నేనేడుస్తావుంటే, “జలుబని మూలిగినప్పుడు చెబ్తా నీ పని” అంటూ నా చొక్కా లాగు ఇప్పేసి చీరకొంగుతో అమ్మ తల తుడుస్తా వుంటే – కరెంటు స్థంభం పక్క పొగాకు బేర్నీ గోడ చాటునుంచీ రాంబాబు, బాచిగాడు, రామాంజనీలు జిల్లాయిలే అని ఎక్కిరిస్తా ‘కత్తి పడవల్చేసుకొచ్చాం…పందేనికి సై సై’ అంటూ ఒహటే సైగలు.
-----------------------------------------------------------
రచన: కె. వి. గిరిధరరావు, 
ఈమాట సౌజన్యంతో

Friday, June 29, 2018

” ప్రభావతీ ప్రద్యుమ్నం” - 2


” ప్రభావతీ ప్రద్యుమ్నం”  - 2
సాహితీమిత్రులారా!


ప్రభావతీ ప్రద్యమ్నం రెండవ భాగం ఆస్వాదించండి-

తలగడగా రుక్మిణి తొడలు. కాళ్ళొత్తుతూ సత్యభామ. సురటి (గుండ్రటి విసనకర్ర)తో భద్ర. వింజామర వీస్తూ మిత్రవింద. కాళంజి (తాంబూలం వూసే పాత్ర) ధరించి కాళింది. తమలపాకులిస్తూ జాంబవతి. గొడుగు, పాంకోళ్ళు పట్టుకుని నాగ్నజితి. నీళ్ళ గిన్నెతో లక్షణ మెరుపుతీగల పక్క నల్లమబ్బులాగా అష్టభార్యల్తో కృష్ణుడుంటే నిండు నెలవంకలా అక్కడికొచ్చింది శుచిముఖి!
ఆడవాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు అలా నదురు బెదురూ లేకుండా వస్తున్న రాజహంసిని చూసి.
కృష్ణుడి దగ్గరగా వెళ్ళి “ఇంద్రుడు పంపగా వచ్చేను ఓ మాట చెప్పి వెళ్దామని ఏకాంతంగా!” అంది శుచిముఖి తన కొడుకుని రాక్షసుడి మీదికి పంపటం రుక్మిణికి నచ్చకపోవచ్చని అనుమానిస్తూ.
దాని ఆలోచనకి ముచ్చట పడి లేచి కూర్చున్నాడు కృష్ణుడు.
అతని భార్యలంతా దూరంగా వెళ్ళేరు.
ఇంద్రుడు తనని పిలిపించిందగ్గర్నుంచి జరిగిందంతా వినిపించింది శుచిముఖి.
చిరునవ్వుతో కృష్ణుడు, “ఔను. ఇది మంచి ఆలోచన. ప్రభావతికి భర్తయ్యే వాడు నిశ్చయంగా ప్రద్యుమ్నుడే! అందగాడు,వీరుడు, రాక్షసుల కన్న ఎక్కువగా మాయలు నేర్చిన వాడు! తప్పకుండా ఆ వజ్రనాభుణ్ణి చంపుతాడు! .. ఇక ఆ వజ్రపురానికి వెళ్ళటానికి దారి కూడ సిద్ధం చేసేన్నేను. భద్రుడనే నటుడు నా తండ్రి యాగానికి వచ్చి తన ఆటల్తో మునుల్ని మెప్పించి ఎన్నో వరాలు పొందేడు. వాటి వల్ల ఇప్పుడు ప్రపంచమంతా తిరుగుతూ ప్రదర్శన లిస్తున్నాడు. నువ్వు వజ్రనాభుడికి అతని గురించి చెప్పి అతన్ని వజ్రపురానికి ఆహ్వానించేట్టు చెయ్యి. ప్రద్యుమ్నుడు భద్రుడిగా అక్కడికొస్తాడు… ఇక నువ్వు వెళ్ళి ఆ పని జరిగేట్టు చూడు” అని ఆదేశించేడు.

వజ్రపురం వైపుకు బయల్దేరేయి హంసలన్నీ.

ద్వారకానగరం బయట
ఆటలాడుతున్నాడు ప్రద్యుమ్నుడు
తనెక్కిన గుర్రం తన మనసు తెలుసుకుని పరిగిడుతుంటే బంతిని కింద పడకుండా బంగారు కోలతో కొడుతూ!
బంతిని నేలకి కొట్టి అది పైకి లేస్తే దాన్ని కొట్టటం ఎవరైనా చేస్తారు. అతనలా కాకుండా బంతిని వేగంగా పైకెగరేసి అది కింద పడకుండా కొడుతూ ఆకాశంలోనే ఉంచి అడుతున్నాడు వాయువేగంతో గుర్రం మీద అటూ ఇటూ తిరుగుతూ! చూసేవాళ్ళు అతని వేగానికి, చాతుర్యానికి ముగ్ధులౌతున్నారు.
కాసేపలా ఆడి తృప్తిగా ఆపి గుర్రం దిగేడు.

పైనుంచి ఇదంతా చూసింది శుచిముఖి.
“మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా. ఇతంతో రెండు మాటలు మాట్టాడి వెళ్దాం” అంది పెద్దగా, అతనికి వినపడేటట్టుగా.
అంటూండగనే హంసలన్నీ కిందికి దిగేయి, అతనికి దగ్గర్లో!
కుతూహలంగా వాళ్ళని చూస్తూ, “ఇక్కడెవర్తోనో మాట్టాడాలన్నారు కదా! ఎవరతను? ఏ పని మీద వెళ్తున్నారు మీరు?” అనడిగాడతను.
మనోహరమైన స్వరంతో శుచిముఖి చెప్పింది “ఇంకెవర్తోనో కాదు, నీతోనే మా పని! ఇంద్రుడు పంపితే నీ తండ్రి దగ్గరికొచ్చి వాళ్ళిద్దరి ఆజ్ఞలు తీసుకుని ఓ చోటికి వెళ్ళబోతున్నాం. కృష్ణుడికి కుడిభుజం లాంటి వాడివి నువ్వు. కనక ఓ సారి నిన్నూ పలకరించి వెళ్దామని దిగేం. వస్తాం మరి”
“మీ పని గురించి అడగను గాని, ఇందాక “మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా” అన్నారు కదా! నా విషయం ఎందుకొచ్చిందో ఎక్కడొచ్చిందో ఐనా నాకు చెప్పకూడదా?”
“అది రహస్యం. పైగా ఒక్క క్షణం కూడ ఆలస్యం చెయ్‌ కూడదు మేం. కాని నీకూ కృష్ణుడికీ తేడా లేదు గనక యిదివరకు నీ విషయం ఎక్కడొచ్చిందో చెప్తా” అంటూ అనుమానంగా చుట్టూ చూసింది శుచిముఖి. దాని చూపు వెంటనే తిరిగిందతని చూపు కూడ. ఆ చూపు తోటే దూరంగా తప్పుకున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా.
“వజ్రనాభుడనే రాక్షసుణ్ణి చంపటానికి ఇంద్రుడూ, నీ తండ్రీ కలిసి చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ఐతే వీళ్ళ కన్నా ముందు వాడే ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమో కనిపెట్టమని పంపితే మేం యిప్పుడా వజ్రనాభుడి పురానికి పోతున్నాం” అంది శుచిముఖి గుట్టుగా.
“ఇంత చిన్న పనికి వాళ్ళిద్దరూ ఇన్నాళ్ళు ఆలోచించాలా? నన్నొకణ్ణి పంపితే ఎప్పుడో పూర్తిచేసేవాణ్ణే!” అన్నాడు ప్రద్యుమ్నుడు బాధ పడుతూ.
“నిజంగా వీరుడివంటే నువ్వు. ఇంద్రుడూ, కృష్ణుడూ కూడ చాలా రోజులుగా ఆలోచిస్తున్నారంటే ఆ రాక్షసుడెలాటి వాడో అన్న ఆలోచనైనా లేకుండా ఒక్కడివే వెళ్ళి వాణ్ణి చంపుతానంటున్నావ్‌!.. సరే, యిదివరకు నీ విషయం ఎందుకొచ్చిందో చెప్తా. ఆ మధ్య ఓ సారి వజ్రపురానికి వెళ్ళినప్పుడు ఆ వజ్రనాభుడి కూతుర్ని చూసేన్నేను. ఆమె అందం గురించి చెప్పాలంటే లోకాలన్నీ చూసిన నాకే మాటలు దొరకటం లేదు! ఏవైనా ఉపమానాలు వాడి వర్ణిద్దామంటే సిగ్గేస్తోంది! ఎంత చెప్పినా ఆ అందం దానికి కోటి రెట్లుంటుంది! .. నాకు భాషలో పాండిత్యం లేక్కాదు చెప్పలేంది సరస్వతీ దేవి స్వయంగా తనంత దానిగా చేసింది నన్ను… అసలు, గొప్ప శబ్దసంస్కారం ఉంది గనకే నాకు “శుచిముఖి” అని పేరు పెట్టిందా దేవి. ఓ రోజు తన పెంపుడు చిలక్కీ నాకూ కవిత్వంలో పోటీపెట్టి నన్ను మెచ్చుకుని “ఉపమాతిశయోక్తి కామధేను” అనే బిరుదు కూడ స్వయంగా తన చేత్తో రాసి నా కాలికి తొడిగింది. కావాలంటే ఇదుగో చూడు” అంటూ తన బిరుదు నూపురం అతనికి చూపించింది శుచిముఖి. “అలాటి నాకే ఆ కన్య రూపం వర్ణించటం అలివి కాని పని. పోనీ బొమ్మ గీద్దామా అంటే బ్రహ్మకే అలాటి దాన్ని మరొకర్ని సృష్టించటం చేతకాలేదంటే ఇక గియ్యటం నా వల్లనౌతుందా? .. అసలు బ్రహ్మే ఓ సారి అంటుంటే విన్నా, ఆమెని తను సృష్టించ లేదని, పార్వతీదేవే సృష్టించిందని! అన్నట్టు నీకు చెప్పలేదు గదూ, ఆమె పేరు ప్రభావతి. ఆ ప్రభావతి తన కల్లో ఆ పరమేశ్వరి రాసిచ్చిందని తన చెలికత్తెకి ఓ చిత్రపటం చూపిస్తుంటే చూసేన్నేను. ఆ బొమ్మలో ఉన్నతను అచ్చం నీ పోలికల్తోనే ఉన్నాడు. దాని గురించే “మనం అనుకుంటున్నతను ఇతనేననుకుంటా” అన్నదిందాక… సరే,ఇప్పటికే చాలా ఆలస్యం ఐంది. ఇంక వస్తాం” అంటూ ఆకాశాని కెగిరింది శుచిముఖి మిగిలిన హంసల్తో.

వజ్రపురానికి చేరి కన్యాంతఃపురంలో కొలన్లలో తిరగసాగేయవి!

ఇక్కడ ప్రద్యుమ్నుడు ప్రభావతి గురించి శుచిముఖి చెప్పిందంతా మళ్ళీ మళ్ళీ తల్చుకుంటూ ఉంటే, ఆమెని చూడకపోయినా ఆశ్చర్యంగా ఆమె రూపం అతని మనసులో హత్తుకుంది! చుట్టూ ఉన్నవాళ్ళని, పరిసరాల్ని మర్చిపోయి ప్రభావతినే తల్చుకుంటూ బాధపడసాగేడతను “అయ్యో, ఆ శుచిముఖి నాలాటి వాణ్ణే చిత్రంలో చూశానంటే ఆ విషయం ఏదో ఖచ్చితంగా కనుక్కుని ఉండొచ్చు కదా! ఆ హంస ఏమనుకుందో గాని ఆ తర్వాత ఒక్క క్షణం నిలబడకుండా ఎగిరిపోయింది! ఆలోచించి చూస్తే అది ప్రభావతి అందాన్ని నా దగ్గర అంతగా వర్ణించటానికి కారణం నా స్పందన ఎలా వుంటుందో చూడ్డానికిలా ఉంది. అది తనంత తనే ఇక్కడ దిగి నా తండ్రీ, ఇంద్రుడూ కలిసి వజ్రనాభుణ్ణి చంపే ఆలోచనలో ఉన్నట్టు చెప్పటం, నేను నా తండ్రికి కుడిభుజం లాంటి వాణ్ణని అనటం వీటిని బట్టి ఆ వజ్రపురానికి వాళ్ళు నన్ను పంపాలని అనుకుంటున్నట్టు కూడా అనిపిస్తోంది. ఆ విషయం తెలిసిన హంస నాకా కన్య చక్కదనాన్ని గురించి అంతగా చెప్పిందంటే ఆ చిత్రం నాదేనని నమ్మకం కలుగుతోంది! ఐనా, ఆ హంస ప్రభావతి తన సృష్టి కాదని బ్రహ్మ అంటుంటే విన్నానంది కదా! అప్పుడతను ఆమెక్కాబోయే భర్త ఎవరో కూడా చెప్పాడేమో ఆ హంసని అడిగుండొచ్చు కదా, నా బుద్ధి ఏమైపోయింది? ఇక ఇప్పుడా హంస మళ్ళీ ప్రభావతి దగ్గరికి వెళ్తుందో లేదో!”

ఉద్యానవనంలో తిరుగుతున్నాడతను. పూలలో, లతల్లో, కొమ్మల్లో, ప్రకృతి అంతట్లో ప్రభావతే కన్పిస్తోంది! ఇలా లాభం లేదని తన విషయం అంతా ఆ హంసకి ఓ లేఖ రాసి పంపుదామనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం రాసేశేడు.ఐతే దాన్ని శుచిముఖికి తీసుకెళ్ళి ఇచ్చేదెవరు?

విరహంతో అతని వివేకం నశించిపోతోంది. లేఖని తీసుకెళ్ళగలరా లేదా అన్న ఆలోచన లేకుండా ఉత్తర దిక్కుగా వెళ్ళే వాళ్ళందర్నీ పిల్చి వజ్రపురానికి వెళ్తున్నారా అంటూ అడగసాగేడతను చిలకల్ని, తుమ్మెదల్ని,కోయిలల్ని, గాలుల్ని, మేఘాల్ని, హంసల్ని!

హఠాత్తుగా ఓ చిలక ఆకాశాన ఎగుర్తూ అతని పరిస్థితి చూసి ఆగింది. “నేను వజ్రపురానికే వెళ్తున్నా. నీ పనేవిటో రెండు మూడు ముక్కల్లో టక్కున చెప్పెయ్‌.” అన్నదది హడావుడిగా. “ఈ లేఖని అక్కడున్న శుచిముఖి అనే హంసకివ్వాలి, అంతే” అన్నాడతను ఆనందంగా. “సరే ఐతే. ఎవరికీ కనపడకుండా నా రెక్కల మధ్య ఉండేట్టు దాన్నిచకచక కట్టెయ్‌” అంటూ అతని దగ్గర వాలిందది. అతను అలా చెయ్యటం, అది ఎగిరి పోవటం క్షణంలో జరిగేయి.

ఈలోగా శుచిముఖి ప్రభావతితో పరిచయం కలిగించుకోటానికి సరైన అవకాశం కోసం చూస్తోంది. ప్రభావతి మళ్ళీ అదివరకు వచ్చిన సరస్సు దగ్గరికే వచ్చిందో రోజు.

ఆమె కూడ ప్రద్యుమ్నుడి గురించిన కలవరింతల్లోనే ఉంది!
మళ్ళీ ఓ సారి అతని చిత్రాన్ని చూస్తేనన్నా తాపం కొంత తగ్గుతుందని దాన్ని తెప్పించి చూసుకుంది, ఇంకా విరహంలో మునిగిపోయింది!
ఇదే సరైన సమయం అని వాళ్ళ దగ్గరగా వెళ్ళింది శుచిముఖి!
రకరకాలుగా అనేక చోట్ల నుంచి ఆ చిత్రం వంక చూస్తూ ఏదో ఆలోచనలో వున్నట్టు నటిస్తూ అటూ ఇటూ నడవసాగింది.
అది గమనించింది ప్రభావతి!
“ఈ పక్షికి ఏం తెలుసో, పదేపదే ఈ చిత్రాన్నిలా చూస్తోంది!” అంది తన చెలికత్తెతో.
వెంటనే అందుకుంది శుచిముఖి!
“ఆ చిత్రాన్ని నేనింతగా చూట్టానికి కారణం ఉంది! ఇదివరకు నేనొక అందగాణ్ణి చూశా. అంత అందం ఉన్న మనిషి నాకు మళ్ళీ కనిపించనే లేదు! ఇప్పుడీ చిత్రం అతందిలా అనిపిస్తే, అతని బొమ్మేనా, లేక యింకెవరైనా అలాటి వాళ్ళున్నారా అని ఆలోచిస్తున్నా, అంతే” అని చెప్పీచెప్పనట్టుగా చెప్పింది.
ప్రభావతికి ఎక్కడలేని కుతూహలం కలిగిందా మాటల్తో.
“ఏమిటేమిటీ, మళ్ళీ చెప్పు! ఇలా వచ్చి జాగ్రత్తగా దగ్గరగా గమనించి చూడు అతనో కాదో! మా దగ్గరికి రావొచ్చు,నీకేం భయం అక్కర్లేదు” అంది కంగారుగా.
“మనుషుల్ని చూట్టంతోనే వాళ్ళకి భయపడాలో లేదో చెప్పగలన్నేను. కాకపోతే మీరిద్దరూ ఏకాంతంగా మాట్టాడుకుంటుంటే మీరు పిలవకుండా మీ మధ్య కొచ్చేంత అమర్యాదస్తురాల్ని కాను గనక యిప్పటి దాకా ఆగా” అంది శుచిముఖి ఖచ్చితంగా.
ఆ మాటలకి ఆశ్చర్యపడిపోయారు వాళ్ళిద్దరూ!
“నువ్వు నిజంగా బుద్ధిమంతురాలివి. ఇలాటి వ్యక్తి ఉన్నాడా లేడా అని మేం పందెం వేసుకున్నాం. ఒక్కసారి చూసి చెప్పు” అని బతిమాలింది చెలికత్తె రాగవల్లరి.
“పందెం కోసమో మరోదాని కోసమో నాకెందుకు? బొమ్మని చూడమని కోరేరు, చూస్తా” అంటూ దగ్గరగా చూసి,
“సందేహం లేదు, అతనే ఇతను” అని తీర్పిచ్చింది శుచిముఖి.
పొంగిపోయింది రాగవల్లరి. జాగ్రత్తగా ఆ హంసనెత్తుకుని ప్రభావతి దగ్గరి కెళ్ళింది, “నిజంగా నువ్వు నాపాలిటి దేవతవి, నా పందెం గెలిపించావ్‌” అని దాన్ని ముద్దు చేస్తూ.
“ఉండుండు, ఈ చిత్రంలో అతని గుర్తులేవైనా కనిపిస్తున్నాయేమోకనుక్కుందాం” అంది ప్రభావతి అసహనంగా.
“ఇంకా అనుమానం ఎందుకు? అవిగో అతని వక్షాన ఉన్నవి శంకరుడితో యుద్ధం నాటి దెబ్బల గుర్తులు! మెడమీద రతీదేవి కంకణాల ముద్రలు కూడ కన్పిస్తున్నాయి! ఈ బొమ్మ వేసిందెవరో అతన్ని బాగా ఎరిగిన వాళ్ళే!” అంటూ,”ఏదేమైనా మీ పందెం తేలటానికి యిప్పటికి నేనిచ్చిన సమాచారం చాలు. మిగిలిన విషయాలు మీకక్కర్లేదులే” అని పైకెగరబోయింది శుచిముఖి. సున్నితంగా పట్టి ఆపింది ప్రభావతి. “దయచేసి మమ్మల్నొదిలి వెళ్ళకు. మాతో స్నేహం చెయ్యవా?” అనడిగిందా హంసని జాలిగా. “మీరిద్దరూ రహస్యాలు మాట్టాడుకుంటుంటే మధ్యలో నేనెందుకు? ఇంక వెళ్ళొస్తా” అని బయల్దేరబోయింది శుచిముఖి మళ్ళీ. “మాట్టాడితే పోతాపోతానంటావ్‌! నువ్వుండటం మా ఏకాంతానికి అడ్డం కాదు. నిజానికి మంచిది కూడా. ఈ చిత్రంలో ఉన్నతని మీద మా ప్రభావతి ఆశలన్నీ పెట్టుకుని ఉంది. అతని విషయాలన్నీ మాకు చెప్పాలి నువ్వు. అప్పుడు గాని ఆమె ప్రాణాలు నిలబడవు. ఆ తర్వాత మా రహస్యం అంతా నీకు చెప్తాం” అని ప్రాధేయపడింది రాగవల్లరి.

ఇక తన వంకరమాటలు ఆపొచ్చని గ్రహించింది శుచిముఖి.
“సరే చెప్తా వినండి. ద్వారకానగరం అనే అద్భుత పట్టణానికి రాజు కృష్ణుడి రూపంలో ఉన్న విష్ణువు. అతనికి ఎనిమిది మంది భార్యలు. వాళ్ళలో పెద్ద భార్య రుక్మిణీ దేవి. ఆమె కొడుకే ఈ చిత్రంలో ఉన్న ప్రద్యుమ్నుడు. సౌందర్యానికి సరిపడే మంచి గుణాలున్నవాడు” అంటూండగా ప్రభావతి పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది.
“ఇంకేం, పార్వతీదేవి చెప్పిన పేరు కూడా సరిపోయింది! ఈ హంస వాలకం చూస్తుంటే ఇక మిగిలిన పని కూడా సాధించే చాతుర్యం వున్న దాన్లానే ఉంది” అంది రాగవల్లరి కూడా సంతోషంగా. ఇంతలో శుచిముఖి కాలికున్న పెండెరం కనిపించిందామెకి. గబగబ దాన్ని చదివి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ “ప్రభావతీ! మన పని చేసిపెట్టటానికి ఇంతకు మించిన వాళ్ళు దొరకరు” అని చెప్తూ శుచిముఖికి ప్రభావతి కల విషయం, ఆ తర్వాత జరిగిన విషయాలూ అన్నీ చెప్పేసింది.శుచిముఖి కూడా తను ఆమె విషయం అంతకు ముందే ప్రద్యుమ్నుడికి చెప్పినట్టు, ఐతే అతను దానికి ఏమీ స్పందించనట్టూ చెప్పేసరికి
ప్రభావతి తెల్లబోయింది.
శుచిముఖి వెంటనే, “రాకుమారీ, నీకేం భయం అక్కర్లేదు. అతను కాకపోతేయేం? ఏ లోకంలో ఉన్నవాణ్ణైనా ఎవర్నైనా మరొకర్ని కోరుకో. అతన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. పార్వతీదేవి అందుకు ఒప్పుకోదేమో అని సందేహం వద్దు నీకు. నీ ఇష్టమే ఆమె ఇష్టం … నీ అందాన్ని అంతగా వర్ణించినా కిక్కురుమనకుండా ప్రద్యుమ్నుడున్నాడంటే అదతని సౌందర్య గర్వం. నీ సంగతి నీకు తెలీకపోవచ్చు గాని నిన్ను గురించి నేను వర్ణిస్తే విని నీ కాళ్ళ మీద వచ్చి వాలని వాడు ఏలోకంలోనూ ఇంకెవడూ ఉండడు. నువ్వు కావాలంటే నా ప్రయాణాల్లో చూసిన చక్కటి యువకుల చిత్రాలు రాయించి తెస్తా. నువ్వు ఊఁ అను చాలు” అని హుషారుచేసింది.
ప్రభావతికి నచ్చలేదా మాటలు.
“అంతా విని మళ్ళీ యిలా అడ్డంగా మాట్టాడతావేం? ఐనా నువ్వు తెచ్చేదేమిటి నా తండ్రే యింతకు ముందు అన్ని లోకాల్లోనూ ఉన్న యువకుల చిత్రాలు రాయించి చూపించేడు నాకు. వాళ్ళెవర్నీ ఒక్క చూపు మించి చూడలేదు నేను.తనకి శత్రువని ఈ ప్రద్యుమ్నుడి చిత్రం మాత్రం చూపించలేదతను. ఏదేమైనా నా ప్రతిజ్ఞ విను ఎన్ని జన్మలకైనా ఆ ప్రద్యుమ్నుడే నా భర్త!” అని నిశ్చయంగా తెగేసి చెప్పింది ప్రభావతి.

కొంచెం సేపు ఆలోచించి, “శుచిముఖీ! నాకొక్క ఉపకారం చేసి పెట్టు. ఇంకో సారి నువ్వు ద్వారకకి వెళ్ళి ప్రద్యుమ్నుడితో నా విషయం చెప్పి చూడు. ఆ తర్వాత ఎలా జరగాలో అలా జరుగుతుంది” అంది ఆఖరిప్రయత్నంగా.
ఆమెకి ప్రద్యుమ్నుడి మీద ఎంత ప్రేమ కలిగిందో స్పష్టంగా అర్థమైంది శుచిముఖికి.
“ప్రభావతీ! నీ ప్రేమ ఎంత లోతైందో చూట్టానికి నీకిష్టం లేని కొన్ని మాటలన్నా, క్షమించు. ప్రద్యుమ్నుడిని నీ దగ్గరికి తెచ్చే బాధ్యత నాకొదిలిపెట్టు. అప్పుడేదో పరాకున ఉండి అతను మాట్టాడలేదు గాని అతను నీ భర్త కాక తప్పదు. ఎందుకంటే, ఒకసారి బ్రహ్మకీ సరస్వతికీ ప్రణయకలహం వచ్చి ఆమె అలిగితే అమెకి సర్దిచెప్పటానికి అతను నన్ను పిలిచేడు. ఆ మాటల సందర్భంలో మన్మథుణ్ణి తిడుతూ, “ఒరేయ్‌ మన్మథా! నన్నింత బాధిస్తున్నావిప్పుడు. నీక్కూడా తొందర్లో ప్రభావతి విరహంతో వేగే రోజులొస్తున్నాయిలే చూసుకో!” అన్నాడు. ఆ మన్మథుడే ఈ జన్మలో ప్రద్యుమ్నుడు. కనక, అతనిప్పుడు నీ విరహంతో బాధ పడుతుంటాడని తెలుస్తోంది కదా! ఇక నే త్వరగా వెళ్ళి ఆ విషయం చూస్తా” అంది శుచిముఖి ఆమెని ఓదారుస్తూ.

ఐతే ప్రభావతికి నమ్మకం కలగలేదు. “ఈ హంస అక్కడికి వెళ్ళేదెప్పటికి? వెళ్ళి అతన్ని చూడాలి. అతనికి నామీద కోరిక కలగాలి. ఇక్కడికి రావటానికి అతని తండ్రి ఒప్పుకోవాలి. ఇక్కడ నా తండ్రి అతను రావటానికి ఒప్పుకోవాలి. ఇవన్నీ జరిగేదెప్పుడు? నాకోరిక తీరేదెప్పుడు?” అంటూ దిగాలుపడిపోయింది.
అంతలో
ఓ చిలక రెక్కలు టపటప కొట్టుకుంటూ కేకలు పెట్టింది ఎదురుగా ఉన్న ఓ చెట్టు మీద వల్లో తగులుకుని!
అంత దిగుల్లోనూ దాని అవస్థకి మనసు కరిగి దాన్ని విడిపిద్దామని పరిగెత్తింది ప్రభావతి. దాన్ని వల్లోంచి తప్పించింది.
ఐతే హడావుడిగా ఆమె చేతులు విడిపించుకుని వేగంగా ఎగిరిపోయిందా చిలక, ఆమెకి తన ముఖం చూపించకూడదన్నట్టుగా!
ఆ గడబిడలో జారిపడిందో లేఖ, దాని రెక్కల్లోంచి!
“శుచిముఖీ, ఇదేదో విచిత్రంగా ఉందే! నువ్వెళ్ళి ఆ చిలకని పట్టుకురాగలవా?” అనడిగింది ప్రభావతి. “అదెంత పని? ఇప్పుడే తెస్తా” అని చిలక వెంట పడిందా రాజహంసి.
“ఇంతకీ యీ చెట్టు మీద వలెవరు పెట్టారో, దుష్టులు!” అని ప్రభావతి కోపగించుకుంటే,
“కోయిల్లొచ్చి కూసి నీ విరహాన్ని పెంచుతున్నాయని వాటిని పట్టటానికి నేనే పెట్టా .. సరేగాని, యీ లేఖలో ఏవుందో చూద్దామా?” అని దాన్ని లాక్కుంది రాగవల్లరి.
ఇలా ఉంది దాన్లో
“సరస్వతీదేవి చేత ఉపమాతిశయోక్తి కామధేను బిరుదు పొందిన శుచిముఖికి ప్రద్యుమ్నుడు స్నేహపురస్సరంగా పంపిన రహస్యలేఖ. ప్రప్రభాభావతి గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ ..” అని చదువుతూనే ఆనందంగా గెంతుతూ,
“నిన్ను గురించి నీ ప్రియుడు పంపిందే యీ ఉత్తరం. నీ అదృష్టం పండింది” అనరిచింది రాగవల్లరి.
“నువ్వు చదివింది నిజంగా దాన్లో ఉందేనా?”
“దేవుడి మీద ఒట్టు, నిజం”
“ఐతే ఆ ప్రప్రభాభావతి ఎవరో! ఇంకా ఏముందో చూడు” అని ప్రభావతి అంటే, “నీ వెర్రి గాని అది నీపేరే. కంగారులో అలా రాశాడంతే. చదువుతా విను. ప్రప్రభాభావతి గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ తలుచుకునే కొద్దీ నా మనసంతా ఆమే నిండిపోయి విరహంతో కాగిపోతున్నా. ఆమె అధరామృతం కావాలని చెప్పు ..” అంతవరకు రాగవల్లరి చదివేసరికి ఆమె చేతిలోంచి లేఖని లాగేసుకుంది ప్రభావతి. “ఔన్లెమ్మా. తరవాత్తరవాత యింకెంత పచ్చిగా రాశాడో! నువ్వే చదువుకో!” అంది రాగవల్లరి గడుసుగా. దానికి సిగ్గు పడుతూ కోపం నటిస్తూ ప్రభావతి ఆ ఉత్తరం చించబోతే, “భలే దానివే. అది శుచిముఖికి రాసిన ఉత్తరం. నువ్వు చించేస్తే ఎలా? పైగా ప్రియుడు నీ గురించి రాసిన తొలి ఉత్తరం చించటం అమంగళం కూడా” అంటూ లాలించి, బుజ్జగించి, బెదిరించి ఆపింది రాగవల్లరి.

ఈలోగా శుచిముఖి చిలకని చిక్కించుకుంది!
“ఓసి దొంగచిలకా! నీ రెక్కల్లో ఉత్తరం తీసుకుని ఎక్కడికెళ్తున్నావ్‌? రాక్షసరాజు కూతురు నిన్ను పట్టుకురమ్మంది పద!” అని గద్దించింది దాన్ని తన కాళ్ళ సందున ఇరికించుకుని.
“చంపితే చంపు గాని నన్నక్కడికి మాత్రం తీసుకుపోవద్దు. ఇక్కడ చస్తే నేనొక్కదాన్నే. అక్కడికి తీసుకుపోతే ఇంకెంతమందో!” అని గింజుకుంది చిలక.
“ఎంత గింజుకున్నా ఏవీ ఉపయోగం లేదు. ఎలాగూ ఆ ఉత్తరం మాకు దొరికింది. నువ్వు గనక బుద్ధిగా నాతో వస్తే ప్రభావత్తో చెప్పి నిన్ను విడిపిస్తా” అని ఆశ చూపించింది శుచిముఖి.
“అలా కాదు. దయచేసి నా మాట విను. ఎక్కడన్నా ఆగుదాం. నా పరిస్థితి నీకు చెప్తా. విన్నాక నీకే తెలుస్తుంది నేనెందుకింత పట్టు పడుతున్నానో” అంది చిలక.
సరేనని ఆ చిలకని తీసుకుని ఓ కొండ శిఖరం మీద దిగి దాన్ని తన రెక్కల్తో పట్టుకుని “ఇక నీ విషయం మొత్తం చెప్పు నాకు” అంది శుచిముఖి.
“నేనో పని మీద ద్వారకకి వెళ్ళి తిరిగొస్తుంటే ఆ వూరి బయట ఒకతను ఉత్తరానికి వెళ్తున్న పక్షుల్నీ, మేఘాల్నీ,గాలుల్నీ కూడ మీరు వజ్రపురానికి వెళ్తున్నారా అని అడుగుతుంటే నేను జాలిపడి ఆగా. అతను నాకో ఉత్తరం ఇచ్చి దాన్ని శుచిముఖి అనే హంస కిమ్మంటే నేనిక్కడ కన్యాంతఃపురంలో హంసల్ని చూసి వాళ్ళలో శుచిముఖి ఉందేమో కనుక్కుందామని చెట్టు మీద దిగి వల్లో చిక్కా. దాంతో ఈ పాట్లన్నీ వచ్చి పడినయ్‌” అన్నదా చిలక.
“దీనికి తెలిసింది ఇంతేలా ఉంది. కనక ఇంకెక్కడా యిది ఈ విషయం చెప్పకుండా చూడాలి” అనుకుంది శుచిముఖి.
“పక్షికి పత్రిక పంపేవాడు వెర్రివాడై వుంటాడు. అలాటి ఉత్తరంలో ఏముంటుంది ప్రేలాపన తప్ప! కనక దాని సంగతి మర్చిపో నువ్వు… అది సరే గాని .. అసలు నువ్వు ద్వారకకి ఎందుకు వెళ్ళాల్సొచ్చిందో చెప్పు ముందు” అంది శుచిముఖి తీవ్రంగా.
-----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

Thursday, June 28, 2018

విద్వాన్ విశ్వం ఆధునికస్వరం


విద్వాన్ విశ్వం ఆధునికస్వరం
సాహితీమిత్రులారా!

కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు – ఒక సరికొత్త పాటను వినిపించిన కవి విద్వాన్ విశ్వం. పద్యానికి ఆధునికస్వరాన్ని యివ్వడంతో పాటుగా, పాటని కావ్యంగా మలిచిన చాలా కొద్దిమంది కవులలో ఆయనొకరు. పాటనీ పద్యాన్నీ జమిలిగా నేత నేసి, అటు పల్లెపాటలోని అమాయకత్వమూ యిటు మార్గకవిత్వంలోని ప్రౌఢత్వమూ సరిపాళ్ళలో జత చేసి, రాయలసీమ కన్నీటిపాటను పెన్నేటిపాటగా ఆయన మలిచిన తీరు అపూర్వం. మనిషి ఆశపోతుతనానికి నాశనమవుతున్న ప్రకృతిదృశ్యాన్నీ, అస్తవ్యస్తమవుతున్న సాంఘికజీవనాన్నీ, నిర్మలమైన ప్రేమతో పెనవేసుకొన్న ఒక నిరుపేదజంట జీవితనేపథ్యంగా చిత్రించిన కావ్యం పెన్నేటిపాట. ఈ కవే పేర్కొన్నట్టు, యీ పాట మొదలుండునే కాని తుదిలేని బాట.

విశ్వంగారి కవితలో నన్ను బాగా ఆకట్టుకొన్న అంశం అందులోని ధ్వని. సంస్కృత ప్రాకృత సాహిత్యాలలో ఆయనకున్న విశేష పరిజ్ఞానం దీనికి కారణం కావచ్చు. ఎంతటి వాస్తవికవర్ణన చేసినా అందులో ఒకానొక ధ్వని చటుక్కున పాఠకుడి మనసును మెలిపెట్టి ఆ వర్ణించే విషయాన్ని బలంగా హత్తుకునేట్టు చేస్తుంది. పేదల దయనీయస్థితి అయినా, ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరయినా, ఉన్నవాళ్ళ దాష్టీకమయినా, స్వచ్ఛమైన దాంపత్యంలోని అనురాగమైనా – ఆ చిత్రణ ధ్వనిమార్గంలో సాగుతుంది. ఊరిలోనున్న ఒకే ఒక సంపన్న భవనాన్ని వర్ణిస్తూ అది ఊరెల్ల మ్రింగి ఉబ్బినట్లున్నది అంటారు. అది కొందరి దృష్టిలో ఎడారిలోని ఒయాసిస్సు కావచ్చు కానీ పేదలకు వట్టి ఎండమావి. పెన్నేటిపాటలో విశ్వంగారి కవితావిశ్వరూపాన్ని చూడాలంటే ఆ కావ్యాన్నంతటినీ పరిశీలించాలి. ప్రస్తుతానికి, రెండు పూర్తిగా భిన్నమైన అంశాలని ఆయన చిత్రించిన తీరుని మాత్రం పరిచయం చేస్తాను.

ఉ. ఎద్దులబండినెక్కి పయనించుచు నుండగ ధూళి రేగి, ఆ
     పొద్దును మూసివేయగనె పో! సురవైరులు లేచివచ్చి, రా
     యెద్దుల తోకలం గలుగు నింతటి మారుతమంత వీచినన్
     దద్దయు ప్రొద్దుదోచె పిశితాశనులంతట పారిపోవరే!

పూర్వకావ్యాలలో కనిపించే వర్ణనలకి అనుకరణగా అనిపించే యీ పద్యం నిజానికి ఒక పేరడీ! ఈ కావ్యంలోని నిరుపేద జంట రంగన్న – గంగమ్మ. రంగన్న తండ్రి నారపరెడ్డి ఒకప్పుడు ఊరిలో పెద్ద మోతుబరి, పట్టాదారు. అయితే అతని చేతికి ఎముక లేదు! సన్నకారు రైతులకీ, పేదసాదలకీ, ఊరి దేవాలయానికే కాకుండా, తన చుట్టూ చేరే భజనపరులకి కూడా అడిగినది లేదనక దానాలు చేస్తూ, ఉన్న ఆస్తినంతా హారతికర్పూరం చేసేస్తాడు. అలాంటి అపరదానకర్ణుడైన నారపరెడ్డిని కీర్తించే వాళ్ళకి కొదవేముంటుంది! పూర్వం రాజులనూ జమీందారులనూ ధనవంతులనూ కీర్తిస్తూ కవులు చెప్పే పద్యాలను, వాటి సంఖ్యను బట్టి, పంచరత్నాలనో నవరత్నాలనో అనేవారు. బట్ట లచ్చుమయ్య, బండారు బసవయ్య అనే యిద్దరు, నారపరెడ్డిని కీర్తిస్తూ పంచరత్నాలను బట్టీ పట్టి (అంటే అవి వాళ్ళ స్వంతం కావన్నమాట!) అతని ముందు చదువుతారు. అలా చదివిన పంచతర్నాలలో ఇది ఒక పద్యం. పూర్వకాల వర్ణనల్లో ఎక్కువగా కనిపించే ఉత్ప్రేక్ష, అతిశయోక్తి అలంకారాలతో నిండిన చమత్కారభరితమైన పద్యం.

నారపరెడ్డి ఎడ్లబండిని ఎంత వేగంగా తోలగలడో ఈ పద్యంలో కవి ధ్వనింపజేశాడు. నారపరెడ్డి ఎడ్లబండిని తోలుతూ ఉంటే ఉవ్వెత్తుగా దుమ్ము రేగుతోంది. ఆ ధూళి ఎంతగా రేగుతోంది అంటే, అది ఏకంగా సూర్యుడినే (పొద్దు అంటే సూర్యుడు) మూసేసిందట! అలా ఎప్పుడయితే సూర్యుణ్ణి దుమ్ము కమ్మేసిందో, లోకమంతా చీకట్లు కమ్ముకున్నాయి. రాత్రయిపోయిందనుకొని సురవైరులు (అంటే రాక్షసులు – రాక్షసులు నిశాచరులు కదా!) లేచి వచ్చారు. అయితే అంతలోనే ఆ ఎద్దుల తోకలు ఊగే వేగానికి, చిన్నగా వీచే గాలి సైతం ఝంఝామారుతంగా మారి ధూళిమేఘాలను చెల్లాచెదరు చేస్తోంది. సూర్యుడు మళ్ళీ ప్రకాశించగానే ఆ పిశితాశనులు (పిశిత + అశనులు – మాంసభక్షకులు) పారిపోతున్నారు!

చాలా తమాషా అయిన ఊహ కదా! యుద్ధసైన్యాన్ని వర్ణించే సందర్భంలో దాని ఆర్భాటాన్ని చిత్రించేందుకూ, ముఖ్యంగా దౌడు తీసే గుఱ్ఱాల వేగాన్ని స్ఫురింపజేసేందుకూ, అక్కడ రేగే పెంధూళిని చిత్రచిత్రాలుగా వర్ణించడం పూర్వకవి సంప్రదాయం. గోగణాన్ని అపహరించుకుపోయే కౌరవసైన్యాన్ని వర్ణిస్తూ, ఆ సమయంలో రేగిన ధూళిని అభినవ జలధర శ్యామంబు లగునెడ లాకు జొంపంబుల ననుకరింప అంటూ అద్భుతమైన సీసంలో వర్ణిస్తారు తిక్కనగారు. రకరకాలుగా రేగిన ధూళి ఒక పెద్ద ఉద్యానవనం భువినుండి దివికి ఎగురుతున్నట్లుందని ఆ పద్యం వర్ణిస్తుంది. అలాగే పోతన, యుద్ధరంగంలో భీష్ముని పైకి ఉరికి వచ్చే శ్రీకృష్ణుని ముఖం హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై ఉన్నదని వర్ణిస్తారు. అంటే గుఱ్ఱపుడెక్కలకి రేగిన ధూళి కృష్ణుని ముంగురులపై అట్టకట్టిందని! ప్రబంధ కాలానికి వచ్చేసరికి కృతిభర్తల శౌర్యపరాక్రమాలను వర్ణించే క్రమంలో యిలాంటి వర్ణన చేయడం ఆనవాయితీ అయ్యింది. పెద్దనగారు రాయల పరాక్రమాన్ని వర్ణిస్తూ, రాయల సైన్యాల ధాటికి రేగిన ఎఱ్ఱని దుమారాలవల్ల చీకట్లు కమ్మితే, వాటిని చూసి శత్రురాజుల స్త్రీజనం ఎఱ్ఱని చీకట్లేమిటని ఆశ్చర్యపోయారని వర్ణిస్తారు. అలాగే ముక్కు తిమ్మన షష్ఠ్యంతాలలో రాయలను త్వరితాధరితానిలవాజి నటత్ఖురజోరురజోభర గూఢ రవిస్ఫురణా! అని సంబోధిస్తాడు. అంటే – వాయువేగాన్ని మించి పరుగులుపెట్టే గుఱ్ఱపు డెక్కలనుండి రేగి కమ్ముకొనే ధూళిచేత కప్పివేయబడిన సూర్యుడు కలవాడా! అని!

సరిగ్గా ఇలాంటి సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, వాటిల్లో ఉండే అతిశయాన్ని ఒక్కింత వెక్కిరిస్తూ రచించిన మంచి పేరడీ పద్యం ఇది. ప్రబంధాలలో గుఱ్ఱాలిక్కడ ఎడ్లుగా మారాయి. రాజు రెడ్డయ్యాడు. ఈ పద్యంలో ఉన్న వెటకారమంతా ‘ఇంతటి మారుతమంత వీచినన్’ అనడంలో ఉంది. ‘మూసివేయగనె పో!’ అనడంలో ఉంది. పేరడీకి యిలాంటి వ్యంగ్యమే ఆయువుపట్టు. ఇది భాషలోని కాకువు తెలిసిన కవి మాత్రమే చేయగల రచన. చాలా ఉద్వేగభరితంగా సాగే కావ్యంలో తళుక్కున మెరిసే యిలాంటి సున్నితమైన పరిహాసం కావ్యాన్ని మనోహరం చేస్తుంది.

విశ్వంగారి కవిత్వంలో ఇదొక చిన్న పార్శ్వం మాత్రమే! అలతి అలతి పదాలలో గాఢమైన అనుభూతిని ధ్వనింపజేయడం అతని కవిత్వంలో మరొక గొప్ప అంశం. రంగన్న- గంగమ్మల మధ్యనున్న అనురాగాన్ని వర్ణించే యీ పద్యాలు దీనికి చక్కని మచ్చుతునకలు:

ఇన్ని యిడుములు నీకోసమే భరించు
చుంటినని ఆతడనడు; నీ సుఖము కొఱకె
బ్రదుకుచుంటి నటం చామె పలుక దెపుడు;
మాటలేటికి మనసులో మరులు పొరల?

అతని యడుగుల చప్పుడే ఆమె మొగము
నింత విప్పార్చు, మాట రవంత విన్న
జాలు కన్నులలో వసంతాలు విరియు,
చూచెనా యిక నిలువెల్ల చొక్కిపోవు

ఈ పద్యాలకు వ్యాఖ్యానం అవరసం లేదు. పద్యాన్ని యింత సునాయాసంగా పలికించిన కొద్దిమంది ఆధునిక కవులలో విశ్వంగారు ఒకరు. విద్వాన్ విశ్వంగారి సాహిత్యకృషి చాలా విస్తృతమైనది. పత్రికాసంపాదకత్వము, వాటిలో శీర్షికల నిర్వహణ, కావ్య కథా నాటక రచన, సంస్కృత ప్రాకృత కావ్యాల అనువాదము, వైదికసారస్వత అనువాదము – ఇలా బహుముఖీనమైన సాహిత్యసేవ చేశారు. సంస్కృత, ప్రాకృత, ద్రవిడ సాహిత్యాలలోంచి ఆణిముత్యాలని ఎంచి, తెనిగించి, సంకలించిన భారతీయ కవితాకల్పకం తెలుగువాళ్ళకి ఆయన అందించిన అపూర్వ అపురూపకానుక!

పెన్నేటిపాటలో రంగన్న పాటని వర్ణిస్తూ చెప్పిన యీ పద్యం, విశ్వంగారి కవిత్వానికి కూడా చక్కగా అన్వయిస్తుంది!

వాని తియ్యని గొంతుక లోనలోన
తీవ సాగుచునున్న దుద్వేగ రవము
వాని చిక్కని గుండియ లోనలోన
పూవు పూయుచునున్న దుద్బుద్ధ రసము!
---------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, June 26, 2018

ఎక్కడ నుంచి…?(కథ)


ఎక్కడ నుంచి…?(కథ)సాహితీమిత్రులారా!”ఎక్కడి నుంచి?”

నమస్కారం. బాగున్నారా అన్న తరువాత, ఓ అపరిచిత వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన రెండో ప్రశ్న ఇది.

వరుసగా బారులు దీరి ఉన్న కార్ల మధ్యన స్థలం కనపితే, కారు పార్క్‌ చేసి తాళం చెవితోపాటు ఉన్న రిమోట్‌ని నొక్కి, ఆ కారును లాక్‌ చేసి, ఇటు తిరిగానో లేదో, ఈ ఆగంతకుడు ప్రశ్నలతో ప్రత్యక్షం. వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయి. ముఖంలో ముడుతలు ఉన్న, జీవితంలో తిన్న డక్కామొక్కీలతో సంపాదించిన ఓ అనిర్వచనీయమైన ప్రశాంతత. ఓ చిరునవ్వు, కొద్దిగా వంగిన శరీరం, వేసుకున్నది పసిఫిక్‌ ట్రైల్‌ కోటు. డాకర్స్‌ పాంటు, నైకీ బూట్లు అయినా, ఎందుకో ఓ తెల్ల జుబ్బా, పంచ, చెప్పులు వేసుకున్నట్లనిపించింది. పడమట అస్తమిస్తున్న సూర్యుడు, అరుణ వర్ణాలను కలిపిన తెరను అతని వెనుక దించడానికి ప్రయత్నిస్తున్నాడు. కొద్ది దూరంలో లాండ్స్కేప్‌ కని నిర్మించిన సరస్సులో బాతులు చేస్తున్న చప్పుడు విని, ఆకాశంలో ఎగురుతున్న మరో గుంపు బాతులు, పలుకరించి పోదామనో ఏమో, పొలోమని గుంపుగా నీళ్ళలోకి దిగాయి.
”సీర్‌ రాప్స్‌ి నుంచి వస్తున్నానండి” అన్నాను బదులుగ.

”అబ్బే అది కాదండి. ఆంధ్రలో ఎక్కడి నుంచి” అని మళ్ళీ ప్రశ్నించాడు ఆ ముసలతను చిరునవ్వుతోనే.

”తిరుపతి దగ్గర ఓ పల్లెనండి” అన్నాను.

సరస్సు దగ్గర నిలబడి ప్రశ్నలేసే యక్షుడిలాగ అతను మరో ప్రశ్న వేయబోయే ముందే, అతని కుటుంబ జనమనుకుంటా అప్పటికే ఓ వంద అడుగులు ముందుకు నడిచిన వారు, వెనక్కు వచ్చి ముఖాలు ఇబ్బందిగా పెట్టి, ”హలో, హాయ్‌ు” అంటూ నన్ను పలకరించి, ఇంకా నాతో మాట్లా లని ప్రయత్నిస్తున్న ఆ ముసలతనికి నచ్చచెప్పి, తీసుకెళ్ళడనికి ప్రయత్నం చేయసాగారు. మార్చి కాబట్టి, ఇంకా చిరు చలి వేస్తున్న, అప్పుడే నిక్కరు, షర్టు వేసుకున్న ఓ మధ్య వయస్కురాలు, ”ఈ ముసలాయనతో ఇదో పోరైపోయింది. కనబడిన ప్రతి మనిషితో కబుర్లేసుకోవాలనుకుంటాడు” అని తన భారీ శరీరాన్ని ఓ వందుగులు నడిపించం వల్ల కలిగిన గసల మధ్య విసుక్కోవడం వినిపించింది. అలా ఆ ముసలతనిని తీసుకొని ఆ కుటుంబం ముందు పోతుంటే కొద్దిగా వెనుక వారిని అనుసరించం మొదలెట్టాను. ఎదురుగా తెల్లటి గుడి గోపురం, అస్తమిస్తున్న సూర్యుని కాంతులకు కొత్త వర్ణాలను సంతరించుకొని కొత్తగా కనిపిస్తున్నది. జనాల రాకపోకలతో హడవిడిగానే ఉంది.

చికాగో ఆరోరాలో కట్టించిన బాలాజి గుడిని అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. అక్కడికి వెళ్ళితే మనస్సులో ఓ ప్రశాంతత. డువాన్‌ వీధిలో షాపింగుకని, ఓహేర్‌ ఏర్‌పోర్టులో రిసీవ్‌ లేక సెండ్‌ ఆఫ్‌ కనో చికాగోకు వచ్చి దారిలో గుడి సందర్శనానికని వచ్చిన జనాలతో గుడి సందిగా ఉంది. నేను గుడికి రావడనికి కారణం విస్సు. వాడిని చూసి ఓ ఆరేళ్ళపైనే అయ్యింది అనుకుంటాను. ఫోన్‌లో తరచు మాట్లా ుకున్నా, వాడిని ఇన్ని రోజుల తరువాత కలుస్తున్నామని ఆనందంగానే ఉంది. వాడు ఈ మధ్యనే చికాగోకి తూర్పున ఓ వంద మైళ్ళ దూరంలో ఉన్న వూరికి రిలొకేట్‌ అయ్యాడు. నేను చికాగోకి పమట ఓ రెండొందల మైళ్ళ దూరంలో ఉన్నాను. నేను చికాగోకు పనిమీద వస్తున్నానని విని, వాడు నన్ను కలుద్దామని చికాగో వస్తానన్నాడు. గుడిలో కలుద్దామని ప్లాన్‌ వేసుకున్నాము. పార్కింగ్‌ లాట్‌ నుంచి గుడికి వెళ్తా విస్సు జాడ కనిపిస్తుందేమోనని చుట్టూ
చూసాను. వచ్చినట్లు లేదు.

గుడిలో అడుగుపెట్టి, అర్చనకని డబ్బులు కట్టి, ఓ బ్రవును బేగ్‌లో అరటిపళ్ళు తీసుకొని, మెట్లెక్కి ఎడమ వైపున్న వినాయకునికి, వళ్ళి, నాయకి సమేతంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామికి, కుడివైపున్న మల్లికార్జున
స్వామి, భ్రమరాంభలకు మ్రొక్కి, నవగ్రహాలను శాంతింపజేయడనికి ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర గుడి ఆవరణలో ప్రవేశించాను. బంగారు నగలు, పట్టుబట్టలు, కార్నేషన్‌, చేమంతి, రోజా పూల అలంకరణలు ఓ ఎన్నారై టచ్‌ ఇవ్వగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు దేవుడు. అప్రయత్నంగా కళ్ళు మూసుకుని చేతులెత్తి నమస్కరించాను. అలా దేవుని చూస్తుంటే ఎదో ఓ ప్రశాంతత. దేవుడు
కనపేటట్లు హాల్లోనే ఒకచోట పద్మాసనం వేసుకొని కూర్చుని విస్సు కోసం వేచి ఉన్నాను. ఆ ఆవరణలోనే ఓ మూల ప్రొద్దున సత్యనారాయణ వ్రతం చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. గర్భగుడికిరువైపుల శ్రీదేవి,
భూదేవిలకి దర్శనాలు, ప్రదిక్షిణలు జనం అవిరామంగా చేస్తూనే ఉన్నారు. అక్కడక్కడ మన సంస్క ృతిని పిల్లలకి పరిచయం చేయాలనే తపనలో ఉన్న తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. యాంకీ యాసతో పద్యాలు, శ్లోకాలు మురిపంతో చూస్తున్న వారి ముందు వల్లె వేస్తున్నారు చిన్నారులు. మరోవైపు పెళ్ళి చేసుకొని కొత్తగా ఈ దేశంలో అడుగు పెట్టిన యువతీ యువకులు స్వెట్‌ షర్ట్‌, షార్ట్‌లతో కనిపిస్తున్నారు. ఇండియా నుంచి రాగానే ఇక్కడి జనాలతో కలిసి పోయేలా మాటా, యాస, నడక, దుస్తులు మార్చే యువతరం, పిల్లలు పుట్టే సరికి పంచా, జుబ్బాలు, పట్టుచీరలు కట్టుకొని గుడికి రావాలనుకోవడం, పిల్లలను మన సంప్రదాయంలో పెంచాలనుకోవడం ఎన్ని సార్లు చూసిన అచ్చెరువు గొల్పుతూనే ఉంటుంది.

విస్సు నేను తరచుగా ఫోన్‌లో మాట్లాుకుంటూనే ఉంటాము. మా అబ్బాయి, అమ్మాయి చదువులు ముగించి ఉద్యోగరీత్యా టెక్సాస్‌ ఒకరు, వర్జీనియా ఒకరు మూవ్‌ అయ్యిపోయి, మా ఇంటిని కూడ ఓ ఖాళి గూడును చేసారు. విస్సుకు ఆలస్యంగా ఓ అబ్బాయి పుట్టాు. మొన్నీమధ్యనే కాలేజీలో చేరాడనుకుంటా. వాడిని చూసి ఓ ఆరేళ్లపైనే అయ్యి ఉంటుంది. తరచుగా కొడుకుని పెంచంలో తన బాధలు చెప్పుకొని నా సలహాలు విస్సు అడుగుతుండే వాడు. కొడుకు దేవుని మీద ఏ మాత్రం భక్తి లేకుండ ఓ నాస్తికునిలాగా తయారయ్యాడని విస్సు బాధ.
####
గుడిలో ఓ మూల ఫోల్డింగ్‌ కుర్చీలో ఓ ముసలమ్మ కూర్చుని ఉంది. ఆవిడ దరిదాపుల కూర్చున్న వారిని ఉద్దేశించి బోసుబాబుతో పాటు తను ఈ దేశం ఎలా వలస వచ్చి ఎలా గ్రీన్‌ కార్డ్‌ సంపాదించింది, బోసుబాబు తన కుటుంబంలోని వారినందరిని ఇక్కడికి తెచ్చే ప్రయత్నాలని గురించి ఓ మెగా సీరియల్‌ లాగా బ్రాడ్కస్ట్‌ చేయసాగింది. భరించలేక లేచే జనాలతో, తెలియక ట్రాప్‌ అవుతున్న కొత్త జనాలతో ఆ మూల ఓ వింత సందిని జోడించుకుంది. విస్సు కోసం ఎదురుచూస్తు, జనాలను, అక్కడ జరిగే దృశ్యాలను చూస్తు కాలం గపసాగాను. అలా జనసందోహం చూడటంలో అదో ఆనందం. విస్సు ఇంకా రాలేదమబ్బా అనుకుంటుండగానే భుజం మీద ఆప్యాయంగా చేయి పటం, తిరిగి చూస్తే నవ్వుతూ విస్సు ప్రత్యక్షం.

”ఏరా విస్సు ఎలా ఉన్నావు – చాలకాలం అయ్యింది నిన్ను చూసి.

ఎందుకింత ఆలశ్యం అయ్యింది?” అన్నాను నేను.

”180 మీద ఒకటే ట్రాఫిక్‌ జాం బ్రదర్‌. నీకెలా అయ్యింది ప్రయాణం” అని తిరిగి విచారించాడు.

విస్సు నన్ను బ్రదర్‌ అనే పిలుస్తాు. బంధువర్గాలకి సుదూరంగా వుండటం వల్ల స్నేహితులలోనే బంధువులను వెదుక్కుంటామేమో! అలా పల్కరింపుల తరువాత గర్భగుడిలోకి వెళ్ళి అర్చనలు చేయించి, పూజారి
ఇచ్చిన తీర్థం, శగోపురం, ప్రసాదాలని స్వీకరించి, ప్రసాదంగా ఇచ్చిన ఆల్మండ్‌ పలుకులని నముల్తూ క్రిందనున్న కెఫెటేరియాకి దారి తీసాం. వీకెండ్‌ కాబట్టి బాగా రష్‌గా వుంది. టోకెన్‌లు కొనడనికి ఓ
క్యూ, కొన్న టోకెన్‌లు మార్చి తిండి తెచ్చుకోవడనికి మరో క్యూ. రెండింటిలోను ఓ పాతిక దాకా మనుష్యులున్నారు. సీరియల్‌, మఫ్పిùన్‌లు, కేక్లు, పిజ్జాలు రెడుగా వంట చేయకుండ తినడనికి అలవాటు
పి, ఇడ్లు, దోశె అంటే చికాగో గుడిలోనో, దీవాన్‌ వీధిలోనో దొరికే ఎక్సోటిక్‌ డిష్‌లుగా మారింతరువాత, ఇలాంటి రద్ది సహజమే. దైవదర్శనంతో పాటు ఈ ‘వింతైన’ వంట కాలు భుజించ ం కూడ
చికాగో రావడనికి ఓ ముఖ్య కారణమేమో. ఇడ్లు, వడ, మసాలా చాయ్‌ు నేను తీసుకున్నాను. విస్సు దోశ, మసాల చాయి తీసుకున్నాడు. ఓ మూల టేబుల్‌ ఖాళీగా కనపడితే కొన్న టిఫిన్‌లు అక్కడ పెట్టి, స్ష్టెరో
ఫోం గ్లాసులలో నీరు తెచ్చుకొని కూర్చున్నాము.

విస్సు మనస్సులో ఏదో మధనప ుతున్నట్లు తెలుస్తూనే వుంది. మళ్ళీ వాళ్ళబ్బాయి చంటి గురించే అని ఊహించాను. టీనేజర్లని పెంచ ం తల్లిదండ్రులకి ఓ ఛాలెంజే. నేను, మా ఆవిడ, మా పిల్లలిద్దరిని ఆ స్టేజిలో భరించం కష్టమే అయ్యింది. తెలిసీ తెలియని తనం, తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న వితండ వాదం, అవివేకం వల్ల ఉండే ఓవర్‌ కాన్‌ఫి ెంసులు సురేకారం, గంధకం, బొగ్గులలాగ మిళితమైపోయి, తల్లిదండ్రులను చూస్తునే అగ్గిలా అంటుకొని భగ్గున రోజుకో గొడవ లేందే టేనేజి వారి రోజులు గ వవనుకుంటాను.

”ఏరా విస్సు, అదోలా ఉన్నావు” అన్నాను, ఇడ్లు ముక్క తుంచుతూ.

”పాత పాటే బ్రదర్‌. చంటి గురించే, వాడు టేనేజిలో అడుగు పెట్టినప్పటినుంచి శాంతి లేకుండ పోయింది. చెప్పిన మాట ఒకటీ వినడు.”

”మళ్ళీ ఏమైంది?” అన్నాను నేను.

”వాడు నేను ఇచ్చే సలహాలు ఒకటీ పాటించు. వాడి మంకుతనం వాడిదే. పొద్దున లేచి పేపర్‌ చదువురా అంటాను. ఊప˙, వాడు వింటే కదా. ఆ పేపర్‌ ముట్టు. మనమంతా ‘హిందూ’ పేపర్‌ చదివే
ఈ స్థితికి ఎదిగామా. దేశంలోను, ప్రపంచంలోను జరుగుతున్న విషయాలను గురించి సరి అయిన అవగాహన లేకపోతే ఎలా” అని విస్సు వాపోయాడు.

”పోనీ, వాడికి పేపర్‌ చదవడం వల్ల కలిగే లాభాలని గురించి వివరించావా?” అన్నాను నేను.

”చెప్పి చెప్పి నోరు పిపోయిందనుకో. వాడు వింటే కదా, అలానే పొద్దునే పూజ చేసి దేవుణ్ణి కూడ మ్రొక్కి మరీ సర్కార్‌కు పోరా అంటాను. వాడు ఆ పూజ గది వైపే పోడు. పూజకని ఎంత శ్రమపి, ఇంట్లోనే
విడిగా ఓ రూమును మందిరంగా ప్లాన్‌ చేసి కట్టించాను. ఇండియాలో నుంచి, పెద్ద మండపము, దేవుని విగ్రహాలు, పూజ సామానులు తెప్పించి పెట్టి, ఇంట్లోనే ఓ గుడి కట్టగలిగాను. ఆ పూజ గదిలో
కూర్చుంటూనే నా మనస్సు శాంతిగా ఉంటుంది. వాడికివేం పట్టవేంటి? ఆ గదిలోకి మేం బలవంతం చేస్తే కాని అడుగు పెట్టు”, విస్సు అలా చంటి గురించి చెప్పుతూనే ఉన్నాడు.

”పోనీలేరా. టీనేజి తరువాత వాడు మారుతాడేమో. మా పిల్లల లోను టేనేజి దాటిం తరువాత మంచి మార్పు వచ్చింది. వారిది తెలిసీ తెలియనితనం. మనం మన తరంలోనూ మన తల్లిదండ్రులు వద్దన్నా జుట్లు పెంచేసి, ‘దం మారో దం’ అంటూ హేపీగా దినాలు గ ిపేయలేదు. అప్పుడు మనల్ని చూసి మనవారూ జులాయిలా తిరుగుతున్నారని బాధపి వుండచ్చు కదా”

”మంచి అలవాట్లు ఒకటీ రాకపోతే ఎలారా బ్రదర్‌”

”పిల్లలన్న తరువాత, ఈ బాధలు పక తప్పదు. నీ శాయశక్తులా చంటిని మంచివాడిగా ్వ్చదిద్ద నికి ప్రయత్నించు.”

”ఇక చంటి గురించి చాల్లే కాని, మీ పేరెంట్స్‌ గురించి చెప్పు. ఎలా వున్నారు వారు. వారి ఆరోగ్యం బాగుందా?” – మాట మార్చాను నేను.

”నాన్న గురించి గుర్తుచేసావా? అదో తీరని సమస్యే!” అన్నాడు విస్సు.

విస్సు వాళ్ళమ్మా, నాన్నలకి ఒక ే కొడుకు. ఇద్దరికి బాగా వయస్సయ్యింది. వయస్సులో ఉన్నప్పుడు సంతోషంగానే విస్సును విదేశాలకి పంపించినా, వయస్సు మళ్ళడంతో చూసుకోవడనికి, కొడుకు కోడలు ఉండలనుకోవడం సహజమే. అందుకే వారు విస్సును రమ్మని పోరుతూ ఉన్నారని విన్నాను. ”మామూలే. ఇవ్వాళ పొద్దునే మాట్లా ను. ఆరోగ్యమా ఇద్దరికి తగ్గిపోతున్నదని, ఇండియాకి వచ్చేయమని ఒకటే గొడవ. పోయిన ఏడదో ఓ పదివేలు ఖర్చుపెట్టుకుని ఇంటిల్లిపాది వెళ్ళి ఓ నెల ఉండి వచ్చాము. ఉద్యోగాలు, ఇల్లు అన్ని ఇక్కడ సంపాదించి, పిల్లవాడికి ఓ మంచి చదువు చెప్పిస్తూ స్థిరప ిన తరువాత, అక్కడికి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి కెరీర్‌ అదీ మొదలెట్టాలంటే ఎలా” అని వాపోయాడు.

”కాని వారి పరిస్థితి కూడ కష్టంగానే ఉంది కదా. ఏమి చేయాలనుకుంటున్నావు” అన్నాను నేను.

”బ్రదర్‌, మా కాలనీ పోయినసారి వెళ్ళినప్పుడు చూసాను. ప్రతీ ఇంట్లోను ఓ వయస్సు మళ్ళిన జంటనే. పిల్లలందరిలో సగం మంది పైగా విదేశాలకు, మరో సగం మంది ఇండియాలోనే మరో సిటీలకు
బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు. అమ్మాయి, అబ్బాయిలను కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, అమెరికా పంప నికి చదవమని ప్రోత్సహించిన వాళ్ళు, ఇప్పుడు వంటరితనం అంటే ఎలా? అంతెందుకు. మా నాన్నల కాలంలో వారూ పల్లెలు వదిలేసి హైదరాబాదు రాలా? ఇదీ అంతే. ఇలా వారు వంటరిగా ఉన్నారు అని గుర్తుకు వస్తే కొంచెం చివుక్కుమంటుంది. వారితో మాట్లాిన రోజు మనస్సు శాంతికి దూరం అవుతుంది”

నేనా విషయం ఎత్తింది విస్సుకు నచ్చినట్లు లేదు. ఆస్ట్రిచ్‌ పక్షిలాగా ఇసుకలో తల పెట్టుకుంటే సరిపోతుందన్నదే ఈ సమస్యకి పరిష్కారం అని ఇక్కడున్న చాలామంది అభిప్రాయం అనుకుంటా. డబ్బులు పంపించి, సహాయంగా పనిమనిషినో ఎవరినో పెట్టుకొని కాలం గ పమని ఈ సమస్యను కార్పెట్‌ క్రింద త్రోసేసినా, అసలు తల్లిదండ్రులు ఎదురు చూసేది పిల్లల సాంగత్యం అన్న విషయం చెప్పకనే మనస్సులో తొలిచేస్తూ ఉంటుంది. విస్సు కూడ అందరిలా ఈ బాధను భరిస్తూనే వుండచ్చు. ఈ దేశంలో ముసలితనం కంటే భయంకరమైనది ఏదీ లేదు. ముసలివారికి అవసరమైన పని సహాయం, డక్టర్లు, మందులూ ఏవీ అందుబాటులో ఉండవు. జీవితమంటే ఇల్లు, యూనివర్శిటీ డర్మ్‌, అపార్ట్‌మెంట్‌, ఇల్లు, కాండో, ఓల్డ్‌ ఏజ్‌ హోం – ఇదో లైఫ్‌ సైకిల్‌ ఇక్కడ. బహుశ విస్సు గ్లోబలైజేషన్‌తో అక్కడ మనుష్యుల జీవితానికి నిర్వచనం కూడ అంతేనని నిర్ణయించుకొని మనస్సును కుదుటపెట్టేసుకున్నాడేమో.

నా ఆలోచనలు ఊహించినట్లుగా విస్సు, ”బ్రదర్‌, ముందు చూడటమే మన కర్తవ్యం. పిల్లల్ని బాగా పెంచి మంచి భవిష్యత్తు ఇవ్వడమే మనకు ముఖ్యమైన జీవితాశయం. దానికోసం బాగా సంపాదించాలి. అలాగని మనం సుదూర తీరాలకు వెళ్ళవలసి వస్తే వెళ్ళాల్సిందే. ఇక పేరంట్స్‌ అంటావా, నాకు కూడ గిల్టీగానే ఉంటుంది. మరీ గిల్టీ అనిపించినప్పుడు, మా తాతలను వదిలి మా అమ్మా, నాన్నలు రాలేదా అని సరి పెట్టుకుంటాను” – ఖచ్చితమైన తన అభిప్రాయాలు చెప్పాడు.

సంభాషణ ఇక ఆ విషయంపైన పొడిగించం కష్టమనిపించి మాట మార్చాను. అలా మరో అరగంట అవీ, ఇవీ కబుర్లు చెప్పుకొని విస్సు దగ్గర వీడ్కోలు తీసుకున్నాను. పార్క్‌ చేస్తున్న కార్‌ వైపు వెళ్ళి డోర్‌ తెరుస్తుండగా కార్‌ హార్న్‌ వినపింది. ఏదో తప్పో, యాక్సిడెంట్‌ అయ్యితే కాని హార్న్‌ కొట్టరు కాబట్టి, ఏమైందో చూద్దామని, అప్రయత్నంగా తల తిప్పాను. ఎవరో గుడి ఆవరణలో ఉన్న దారిలో ఓ స్టాప్‌ సైను
చూడకుండ కారును ఆపకుండ అలానే ముందుకు నడిపించినట్లున్నాడు. ఆక్సిడెంట్‌ అయ్యి ఉండేదేమో, హస్తవాసిలో తప్పింది. హార్న్‌ శబ్దానికి పొలోమంటూ సరస్సులో ఈదుతున్న బాతులు కొన్ని
లేచి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇందాక అక్కడే పలకరించిన ముసలతను కనిపించినట్ల్షెనది. అంతా నా భ్రమనే. అక్కడెవరూ లేరు, సూర్యుడు కూడ. చీకట్లు మెల్లగా, పూర్తిగా చుట్టుకుంటున్నాయి.

2

”ఎక్కడి నుంచి?”

సిండి నా కొలీగ్‌ లిండ ఫ్రెండ్‌. లిండకు ్వకవేళలలో సమాజసేవ చేయడం ఇష్టం. ఈ మధ్యన హాస్పిస్‌కు ఎక్కువగా పనిచేస్తున్నట్లు చెప్పింది. దాని గురించి పెద్దగా తెలియపోవడంతో లిండను ప్రశ్నలేస్తూ
ఉండేవాడిని.

”వీకెండ్స్‌ నీవేం చేస్తూ వుంటావు. ఆ లాన్‌ కేర్‌ అని గ ి్డ పీకుకోవడం కొంచెం తగ్గిస్తే మా హాస్పిస్‌కు కూడ కొంత సహాయంగా ఉంటుంది కదా” అని నాతో నవ్వుతూ టీజ్‌ చేసేది. నేను హాస్పిస్‌ గురించి వేస్తున్న ప్రశ్నలకు, నా సందేహాలను తీర్చడనికి సిండుతో పరిచయం చేసింది. సిండు హాస్సిస్‌ వలంటీర్‌ రిక్రూట్మెంట్‌ కోఆర్డినేటర్‌. నా ప్రశ్నలు చూసి, నన్నూ ఓ వలంటీర్‌గా మార్చవచ్చు అనుకున్నారేమో. తను హాఫ్‌ ఐరిష్‌. క్వాటర్‌ ఆంగ్లో సాక్సన్‌, క్వాటర్‌ పోలిష్‌గా పరిచయం చేసుకొని సిండి నన్నడిగిన ప్రశ్న అది.

”ఇండియా నుంచి” అని చెప్పి ‘నా రక్తాలు ఇంకా అలా అంతర్జాతీయ వన్నెలు సంతరించుకోలేదు తల్లీ’ అని మనసులో అనుకొని, ఆంధ్రలోనే ఓ పల్లెల గుంపులో మా కుటుంబాన్ని ఓ పది తరాల వరకు వెనక్కుపోవచ్చు అనుకున్నాను. ఇంకో మూడు తరాల తరువాత ఎవరు చూసొచ్చారు. నా మునిమనవడో మనుమరాలో ”ఐ ఆం హాఫ్‌ ఇండియన్‌” అనినా అనవచ్చును.

”ఇండియా అంటే నీకు పెద్దగా వివరించాల్సిన పని లేదు. ఇది మధర్‌ తెరెసా అంతిమ దినాలు సమీపించిన ముసలివారికి చేసిన సేవ వంటిదే. ఇక్కడ కూడ, పేషంట్‌ కేన్సరో, మరో వ్యాధి వల్లనో టెర్మినాల్లి ఇల్‌ అని నిర్ధారించిన తరువాత, పేషంట్‌కు హాస్పిస్‌ ఓ మార్గంగా చూపెడతారు. హాస్పిస్‌ ఎంచుకుంటే, అతని రోగ నివారణకు చేయవలసిన ప్రయత్నాలన్నీ మానేస్తారు. ఉదాహరణకు కేన్సర్‌కు పెద్ద ఆపరేషనో, లేక, కీమొ తెరాపీ జరుగవలసి వుంటే హాస్పిస్‌ ఎన్నుకున్న తరువాత ఆ ప్రయత్నాలని మానుకుంటారు. దాని బదులుగా ఆ పేషంట్‌ చివరి క్షణాలు సుఖంగా గిచిపోయేటట్లు, అతనికి ఇంట్లోనే నర్సింగ్‌ సర్వీస్‌, పేయిన్‌ మేనేజిమెంట్‌, వాలంటీర్ల ద్వారా కంపానియన్‌షిప్‌ సదుపాయాలు అందచేస్తారు. నీవు వలంటీర్‌గా ఏ పనైన చేయవచ్చును. పేషెంట్‌తో సమయం గపవచ్చు. నా లాగా హాస్పిస్‌ గురించి మిగిలిన వారికి వివరించవచ్చును. డొనేషన్‌లకని ప్రజంటేషన్లు చేయవచ్చును. అది నీ చాయిస్‌” అని చెప్పింది.

”కొద్ది రోజులలోనే చనిపోతారని తెలిసి, వారితో సమయం గిపి అనుబంధం పెంచుకోవడం కష్టమనిపిస్తుంది” అన్నాను.

”నిన్ను వలంటీర్‌గా తీసుకొనే ముందే సైకలాజికల్‌గా ఈవల్యుయేట్‌ చేస్తారు, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడనికి ఓ ట్రైనింగ్‌ కూడ ఉంటుంది. మా దగ్గర వలంటీర్లుగా పెద్ద చిన్న అందరూ ఉన్నారు. ఈమధ్యనే ఓ కాలేజీ కుర్రాడు కూడ మా దగ్గర చేరాడు. హీ ఈజ్‌ డూయింగ్‌ ఏ గ్రేట్‌ జాబ్‌. యు షుడ్‌ మీట్‌ హిం” అంది సిండి.

”కుర్రవాడికి ఇంత వైరాగ్యం ఎలా అబ్బింది, ఆ అబ్బాయి కధేంటి?”అన్నాను.

”ఆ అబ్బాయి, మొదట్లో ప్రజెంటేషన్‌లకని, చందాలు ప్రోగు చేయడనికి చేరాడు. కాని హాస్పిస్‌ గురించి మాట్లా ేటప్పుడు ఆ అనుభవం ఉంటే కాని అది కన్విన్సింగ్‌ గా ఉండదనీ, తనే ఓ పేషెంట్‌ దగ్గర పనిచేయడనికి ఒప్పుకున్నాడు. నేనూ మొదట్లో ఈ అబ్బాయి ఆ పని సరిగ్గా చేస్తా ో లేదో అని అనుమానపడిన విషయం నిజమే. ఆశ్చర్యంగా, ఆ అబ్బాయి ఆ పనిని చాలా బాగ చేస్తున్నాడు. పేషంట్‌, పేషంట్‌
బంధువుల దగ్గరి నుంచి ఫ్బీేక్‌ అద్భుతంగా ఉంది” అంది.

”ఏమి చేసాడేంటి?” అన్నాను.

”పేషంట్‌ ఈ అబ్బాయి రాకకు వారం మొత్తం ఎదురు చూస్తుంటాడట. ఈ అబ్బాయి వచ్చే ఆదివారం ఆ పేషంట్‌కు ఓ హైలైట్‌ అయిపోతుంది. ఈ అబ్బాయి లైబ్రరీ నుంచి ఆ పేషంటుకు నచ్చిన విషయం పైనున్న పుస్తకాలు తీసుకెళ్ళి చదువుతాడు. దానిపై వారు చర్చించుకుంటారు. ఆ పేషంట్‌కు చేపలు పట్టం ఇష్టమని తెలిసి, ఆ అబ్బాయి మాకు వ్రాసి ప్రత్యేకంగా పర్మిషన్‌ తీసుకుని, తన కారులోనే ఓ ఆదివారం మొత్తం ఫిషింగ్‌కని వెళ్ళి ఎంజాయ్‌ు చేసి వచ్చారు. అలా వీల్‌ చెయిర్లో ఉన్న పేషెంట్‌ను బయటకు తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. కాని ఈ అబ్బాయి పేషంట్‌కు ఇష్టమని ఆ పని చేసాడు. ఈ అబ్బాయి చాలా డిఫ్పùరెంట్‌. వి ఆర్‌ లక్కీ టు గెట్‌ హిం.నీవు అతనిని కలవాల్సిందే” అంది.

సిండి మాటల వల్ల నాకు ఆ అబ్బాయిని, ఆ పేషంటును కలుసుకోవాలనిపించింది. ఇంకా ముసలితనం, మృత్యువు గురించి ఆలోచించే స్టేజికి రాకపోయినా, ఆ పరిస్థితి తొందరలోనే వస్తుందని తెలుసు. బహుశ ఈ పని చేయడం వల్ల ఆ స్థితిని ఎదుర్కొనడనికి సహాయపవచ్చు అన్న స్వార్థం కూడ ఒక కారణం కావచ్చును.

”ఓ.కె. సిండి. ఆ అబ్బాయిని, పేషంట్లని పరిచయం చేయి, ఎప్పుడు కలుద్దాం.”

”హ∫ అబ∫ట్‌ నెక్ట్‌ ్స సండే” అంది సిండి.

”సరే ఎప్పుడు ఎక్కడ?” అన్నాను నేను.

”సరే నేను నీకు కాల్‌ చేస్తాను” అని సిండి నా ఫోన్‌ నంబర్‌ తీసుకుంది.

3

”ఎక్కడ నుంచి…..వచ్చాం మనం? ఏమిటి మనం? ఎక్కడికి ….. పోబోతున్నాం మనం?” పాల్‌ గ్యూగిన్‌ వేసిన చిత్రం నఖలు. బాస్టన్‌ మ్యూజియం ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్‌ ్సలో అనుకుంటా దాని ఒరిజినల్‌ చిత్రం చూసాను. జీవితార్ధం వెదుక్కుంటూ, దేశ విదేశాలు తిరిగి చివరికి తహితి దీవులు చేరి అక్కడ గ ిపిన చివరి దినాలలో గీసిన చిత్రం ఇది. 19దో శతాబ్దం చివర్లో గీసిన గొప్ప చిత్రాలలో, వాన్‌గో, మోనే చిత్రాలతో పాటు ఈ చిత్రం చిరకాలం నిలిచిపోతుంది. జీవిత చక్రంలో జరిగే పలుదశలు, జీవితార్ధాలకి సింబాలిక్‌గా గీసిన ఈ చిత్రం నాకు ‘మొనాలిస’ చిత్రం కన్నా ఓ గొప్ప మిస్టరీగానే ఉండిపోయింది. ఎందుకో, హాస్పిస్‌ పేషంట్‌ ఇంట్లో ఈ చిత్రం చూడం ఒకవిధంగా తగిన చోటే అనిపించింది. ఆ చిత్రం క్రింద ఓ లెథంర్‌ సోఫా. దాని కటువైపు ఓ లవ్‌ సీటు మరోవైపు రిక్ల్షెనర్‌. వాటి మధ్య మ్యాచింగ్‌ కార్నర్‌ టాబిల్స్‌, ల్యాంప్సు, సెంటర్‌ టేబిల్‌, ఓ ఒరియెంటల్‌ కార్పెట్‌, సెంటర్‌ టేబిల్‌ మీద ఓ క్రిస్టల్‌ వేస్‌లో అందంగా అమర్చిన తాజా పూలు. నీటుగా అందంగా అమర్చిన ఆ గది, ఆ ఇంటతని టేస్ట్‌ గురించి చెప్పకనే చెప్పుతున్నాయి. అబ్బాయి పేషంట్‌తో లోపల రూంలో ఉన్నాడు.

నేను, సిండి సోఫాలో కూర్చుని ఆ అబ్బాయి కోసం వెయిట్‌ చేస్తున్నాము. కొంతసేపటికి ఓ ఇరవై ఏళ్ళ యువకుడు బయటికి వచ్చాడు. బాగా టాన్‌ అయిన స్కిన్‌తో, కోటేరు ముక్కుతో దాదాపు ఆరుగులు ఎత్తు, సన్నగా ఉన్నా, కండలతో బలంగా ఓ మాడల్‌ లాగా ఉన్నాడు. కళ్ళు పెద్దగా ఉండటంతో ఏ దేశం నుంచి వచ్చాడో కనిపెట్ట ంకష్టంగానే ఉంది. అన్ని దేశాల్లో నుంచి వలస వచ్చిన వారితో ఈదేశం నిండిపోయింది. ఎవరు ఎక్కడ నుంచి వచ్చారో చెప్పడం కష్టమే.

సిండి ఆ అబ్బయిని ”హాయ్‌ు ఆడి” అని పలకరించి నాకు పరిచయం చేసింది. నేను హాస్పిస్‌ గురించి ఇంటరెస్ట్‌ చూపెడుతానని విని, ఆడి, ”గ్రేట్‌, ఓల్డ్‌ మాన్‌ను చూద్దాం” అని లోపలికి తీసుకెళ్లా ు. లోపల బ్‌ెరూంలో ఓ బ్‌ె దాని మీద ఎత్తుగా వేసుకున్న దిండు కానుకొని పేషంట్‌ కూర్చుని ఉన్నాడు. మంచం ఆనుకొన్న గోడ మీద మొనే ‘వాటర్‌ లిలీస్‌’ పేయింటింగ్‌ ప్రింట్‌ ఉంది. పేషంట్‌ చేతిలో ఓ ఆల్బం ఉంది. దానిలో ఫొటోలు చూస్తున్నాడు. సిండి నేను కూడ హాస్పిస్‌ గురించి తెలుసుకోవడనికి వచ్చినట్లు చెప్పింది.

ఆయన నన్ను నవ్వుతూ పలుకరించి, ”గత వారం ఆడి ఫిషింగ్‌కి తీసుకెళ్ళాడు కదా. ఇవిగో ఫోటోలు చూడండి” అంటూ ఆనందంగా ఆల్బం లోని ఫోటోలు చూపెడుతూ తాము ఏ విధంగా ఎంజాయ్‌ు చేసిందీ వర్ణించసాగాడు.

”ఎన్ని చేపలు పట్టారు” అంది సిండి.

”అబ్బే అన్ని చిన్న చిన్నవే. పట్టి వదిలేసాము. ఓ పెద్ద దాన్ని చివర్లో పట్టాం. కోసి బార్బెక్యు చేసి తిందాం అన్నాను నేను. ఆడినే దానిపై తెగ జాలిప ి వదిలేసాడు” అని నవ్వాడు ఆ ముసలతను.

అలానే ఆ అల్బంలో ఉన్న పాత ఫోటోలు చూపెడుతూ, తన భార్యని కొడుకులను పరిచయం చేసాడు. కొడుకు మిలిటరీ డ్రెస్‌లో కనిపించాడు. ఓ మిలిటరీ డక్టర్‌గా వియెత్నాంలో పనిచేసాడని ఓ
ఫోటోలో చూపెట్టాు.

”ఆడి నేను వీళ్ళని తొందరలోనే కలుస్తానని జోక్‌ చేస్తుంటాడు” అని మరోసారి ఆడితో పాటు నవ్వాడు.

ఆయన ముఖంలో చనిపోతున్నానన్న విచారం ఇసుమాత్రం కూడ కనపలేదు. అప్పుడే మాటలలో ఆయన భార్య పిల్లవాడు అప్పటికే చనిపోయారని తెలిసింది. ఆయన కొడుకు చేతికొచ్చి, వియత్నాం యుద్ధంలో పిన్న వయస్సులోనే చనిపోయాడని తెలిసి నాకే తెగ బాధ వేసింది. ఆయన పక్కనున్న టేబుల్‌ పైన ఆంటిక్‌ కార్ల ఫోటోలతో ఓ లైబరరీ పుస్తకం ఉంది. దానిలో కార్లు చూస్తూ ఆ రోజు ఆడితో సమయం చాలా బాగా గిచిందని చెప్పాడు. అలా కొంతసేపు ఆడి గురించి మంచి మాటలు ఆ ముసలతని దగ్గర మరీ మరీ విని వీడ్కోలు తీసుకొని బయటి లివింగ్‌ రూంకు వచ్చాము. సిండి పని వుందంటూ, మళ్ళీ ఫోన్‌లో మాట్లాుతానని వెళ్ళిపోయింది. నేను, ఆడి సోఫాలో కూర్చున్నాము. ఆడి చేస్తున్న పనికి నిజంగానే ఇంప్రెస్స్‌ అయ్యి గొప్ప పని చేస్తున్నావని పొగిడను.

”అబ్బే ఆయన మంచితనంతో ఆ మాటలన్నాడు. నాకే అతను మంచి కంపెనీ ఇచ్చాడు. నాకు చిన్నప్పటి నుంచి కార్లంటే తెగ ఇష్టం. మా ఇంట్లో మా నాన్నకి టైం లేదు. మా అమ్మకి ఇంటరెస్ట్‌ లేదు.
ఈయన దగ్గర అవి రెండూ పుష్కలంగా ఉన్నాయి. ఆయనతో ఆ కార్ల గురించి మాట్లాుతుంటే గంటలు క్షణాలుగా గిచిపోతాయి. నాకున్న ఆ లోటు కాస్తా ్వపోయింది. ఈయన చిన్నప్పుడు టెక్సాస్‌లో పెరిగాడు.
నాకు లాస్సొ త్రాడుతో తిప్పడం తెలీదని, అది ఎలా చేయాలో ఓపిగ్గా ఓ రెండు వారాలు నేర్పాడు. హాస్పిస్‌ జీవితంలో ఎదగనికి నాకు ఎంతో ఉపయోగంగా ఉంది” అన్నాడు.

లోపల ఉన్నప్పుడు, ఆ అబ్బాయి, ఆ ముసలతను కరెంట్‌ అఫైర్స్‌ కూడ చక్కగా విశ్లేషించి మాట్లాం చూసాను.

”నీవేం న్యూస్‌ పేపర్లు చదువుతావు. ప్రపంచంలో జరుగుతున్న విషయాలపైన మంచి అవగాహన ఉంది” అన్నాను.

ఆడి నవ్వుతూ ”అబ్బే పేపర్లు ఏమి చదవనండి. నాది విజువల్‌. ఇంటర్‌ ఆక్టివ్‌ అప్రోచ్‌. టి.వి.లో న్యూస్‌ ఫాలో అవ్వుతాను. వెబ్‌సైట్లలో విమర్శలు చదువుతాను. తెలిసిన వారితో చర్చలు చేస్తాను. వీటి
వల్ల నాకంటూ ఓ అభిప్రాయం అన్ని విషయాల మీద ఏర్పరచు కోవడనికి వీలవుతుంది” అన్నాడు.

నిజమేనేమో. కాలం మారుతూ ఉంటే మనుష్యుల జీవన విధానంలోను మార్పులు వస్తాయేమో. వార్తలు తెలుసుకోవడనికి ఈ కాలంలో టముకు కొట్టే వారి అవసరం లేదు కదా. రేపొద్దున ఈ ప్రింట్‌ె పేపర్లకి కూడ అవసరం లేదేమో అనుకున్నాను. మన లాగే మన తరువాతి తరం గ పాలనుకోవడం ప్రగతికి తిరోగమనమైన ఆలోచన ఏమో? ఈ తరతరాంతరాల విభేదాలను అంగీకరించక పోవడమే జెనెరేషన్‌ గేప్‌ అనుకుంటా.

ఆడి అలాగే మాట్లా ుతూ, ”మరో విషయం. రెండో ప్రపంచ యుద్ధం గురించి చరిత్ర పుస్తకాలు, సినిమాల ద్వారానే తెలుసుకున్నాను. కాని ఈయన ఆ యుద్ధంలో జెర్మనీలో పాల్గొని అక్కడే వారికి దొరికిపోయి ఆంఇగా ఓ ఏడది పైనే ఉన్నాడు. ఆయన అనుభవాలు ఏ పుస్తకంలోను దొరకవు. అలాగే ఆయన పిల్లనాడిని వియత్నాం యుద్ధంకు పంపించింది. ఆ కాలం కబుర్లు వింటుంటే టైం మెషీన్‌లో మరో తరంలో జీవించినట్లనిపిస్తుంది. ఇదో అపురూపమైన అవకాశమే కదా” అంటూ హాస్పిస్‌ ఉపయోగాలను గురించి చెప్పసాగాడు. అలా తను చేస్తున్న పని మంచిదని, ఎంతో ఇంటరెస్టింగ్‌గా ఉందని అతను చెపుతుంటే, విషాదపూరితమైన ఓ సీరియస్‌ వాతావరణాన్ని ఎదురు చూస్తున్న నాకు ఒక షాక్‌ లాగే ఉంది. నాకూ హాస్పిస్‌ చేరాలనే కుతూహలం కలిగింది. ఇక మిగిలినది ఒకే ప్రశ్న. దానికి యువకుడి దగ్గర జవాబు దొరుకుందా? ప్రయత్నిస్తే పోయింది కదా అని, ”మరి ఈయన కొన్ని రోజులలోనే పోతున్నాడని తెలిసి ఎలా అడ్జస్ట్‌ అవ్వగలుగుతున్నావు. మరీ యిలా అనుబంధం పెంచుకోవడం మంచిది కాదేమో కదా” అని అడిగాను.

దానికా అబ్బాయి చిరునవ్వు నవ్వి ఆలోచించసాగాడు. ఎలా జవాబు చెప్పాలని ఆలోచిస్తున్నాడేమో. ఓ క్షణం నిలబడి, తిరిగి, పాల్‌ గ్యూగిన్‌ పేయింటింగ్‌ చూస్తూ అనర్గళంగా ఫ్రెంచ్‌లో, వఈ’ళి తి ఙలిదీళిదీరీ దీళితిరీ? గతిలిరీ రీళిళీళీలిరీ దీళితిరీ? ఈ’ళితి బిజిజిళిదీరీ దీళితిరీ? అంటూ ఆ పేయింటింగ్‌ పేరు చదివి ”ఇలాంటి ప్రశ్నలు మనిషి పుట్టినప్పటి నుంచి, బుద్ధుని దినాలు నుండి, గ్యూగిన్‌ కాలం వారి నుండి, ఇప్పటి వరకు ఉన్నవే, ఇక ముందు కూడ జవాబు లేక ఉండిపోవాల్సిందే. వీటి గురించి ఆలోచించనికి నాకు అనుభవం బహుశ తెలివి లేవు. నాకు ఆలోచించాలన్నా ఓపికా లేదు. నా కర్థం అయ్యిందల్లా అవతలి మనిషి బాధలో ఉన్నప్పుడు దానికి నాకు చేతనైనంతా సహాయం చేయాలి అన్న మంచి ఆలోచననే. ఈ హాస్పిస్‌ నాకు అలాంటి అవకాశం ఇస్తుంది. ఆ ఆలోచనే నా స్పూùర్తికి, సంతోషానికి కారణం. అలా అనుకొని ఆ భావనలు నింపుకుని, బాధాకరమైన ఇలాంటి ఆలోచనలకి చోటు ఇవ్వలేదు. ఏమో మనకేమీ తెలుసు – ఆయన చనిపోయిన తరువాత చనిపోయిన భార్య పిల్లవాడిని కలిసి సుఖంగా ఉంటాడేమో” అని
నవ్వాడు.

అనుభవం లేకున్నా ఆ అబ్బాయి రీజనింగ్‌ విని ముచ్చట ప్డను. హాస్పిస్‌లో చేర నికే నిశ్చయించుకున్నాను. చివరగా వీడ్కోలు తీసుకోబోతుండగా, ఆడి మళ్ళీ నవ్వుతూ –

”మీరు నన్ను గుర్తు పట్టినట్లు లేదు?” అన్నాడు.

”నేను ముందే తెలుసా?” ఆశ్చర్యంగా అడిగాను నేను.

”ఓ ఆరేళ్ళ క్రితం కలిసాం మనం. ఇప్పుడు ఇక్కడే ఓ యూనివర్సిటీలో చదువుతున్నాను”

”ఇంతకి నువ్వు…” ఇంకా గుర్తు తెచ్చుకోవడనికి ప్రయత్నిస్తూ సందిగ్ధంగా అడిగాను నేను.

”విను వాళ్ళబ్బాయి ఆదిత్య నండి. అదే…. చంటి అంటే వెంటనే గుర్తువస్తుందో ఏమో నండి” అన్నాడు చేతులు జోడిస్తూ…..
------------------------------------------------------
రచన: నిర్మలాదిత్య, 
ఈమాట సౌజన్యంతో

Monday, June 25, 2018

మహారాజుగారి రయిలుబండి(అనువాదకథ)


మహారాజుగారి రయిలుబండి(అనువాదకథ)సాహితీమిత్రులారా!అనుకోకుండా జరిగిందది.

సెల్వనాయగం సర్ ఇంట్లో ఉండాల్సిన నేను కొన్ని ఇబ్బందుల వల్ల జార్జ్ సర్ ఇంట్లో ఉండవలసి వచ్చింది. నాకు ఆయనతో పరిచయం లేదు. ఆ రెండు రాత్రులు, ఒక పగలూ నా జీవితంలో ముఖ్యమైనవిగా మారబోతున్నాయి. అప్పటికి నా పద్నాలుగేళ్ళ జీవితంలో నేను కనీవినీ ఎరగని కొన్ని విషయాలు నాకు తెలియబోతున్నాయి. ఇంకొన్ని ఆశ్చర్యాలకూ నేను సిద్ధం కావలసి ఉండింది.

జార్జ్ సర్ మలయాళీలు. ఆయన మూడు పెద్ద గుండీలున్న పొడవు చేతుల జుబ్బా ఒకటి వేసుకునున్నారు. ముఖం బడిపంతులుకు ఉండాల్సినట్టు లేదు. నోరు పైకి వంగి ఎప్పుడూ నవ్వుతున్నట్టే కనిపిస్తారు.

మిసెస్ జార్జ్‌ని చూడగానే కాస్త పొంకంగా అనిపించారు. బొట్టులేని తెల్లని నుదురు. ఆమె నడత చూస్తే వయసులో ఉండే అహం ఇంకా తగ్గినట్టులేదు. నల్లంచున్న తెల్లచీర కట్టుకునున్నారు. చీర కుచ్చిళ్ళు బహు చక్కగా కాగితపు మడతల్లా చెదరకుండా ఉన్నాయి. నేను అక్కడికెళ్ళినప్పుడు ఇద్దరూ కూతురి రాకకోసం చూస్తూ గుమ్మంలో నిల్చోనున్నారు. నేనూ వారితో గుమ్మం దగ్గరే నిలబడ్డాను.

దూరంగా ముగ్గురమ్మాయిలు వస్తూ కనిపించారు. అందరూ ఒకేలాంటి బట్టలు వేసుకునున్నప్పటికీ ఒకమ్మాయి పొడవుగా ఉండటం వల్ల దూరం నుండే తెలిసిపోతోంది. నడిచే వైనంలో మధ్యమధ్యన తన నడుము కనబడుతోంది. దగ్గరికి వచ్చినాక మెరుస్తున్న ఆ అమ్మాయి కళ్ళు చూశాను. ఒలిచిన ఇప్పగింజల్లా రెండు వైపులా వాడిగల కన్నులు. మెడలో చైన్ గాని, చెవులకు కమ్మలు గాని, ఒంటిమీద ఇంకేమీ ఆభరణాల్లాంటివి లేవు. అయితే పైపెదవి మీద ఒక పుట్టుమచ్చ ఉంది. అది తన పెదవులు కదిలినప్పుడల్లా కదిలి నా చూపుని అటే తిప్పుకుంటోంది. చూడకుండా ఉందామన్నా ఉండలేకపోయాను. ఇదొక పన్నాగమేమో అబ్బాయిలను ఆకట్టుకోటానికి అనుకున్నాను.

జార్జ్ సర్ తనను రోసలిన్ అని నాకు పరిచయం చేశారు. తను నన్ను కళ్ళెత్తి ఓమాదిరిగా చూసింది. ఆ ముఖం చూస్తే పదమూడేళ్ళుండచ్చు అనిపించింది. కాని ఆ అమ్మాయి శరీరం ఇంకా ఎక్కువ వయసునే చెప్తున్నట్టుండింది.

ఎన్నో ఆశ్చర్యాలు కలగబోతున్నాయని చెప్పాను కదూ. మొదటి ఆశ్చర్యం వారి ఇల్లు. నేను అంతవరకు ఎక్కడా చూడనన్ని సౌకర్యాలున్నాయి ఆ ఇంట్లో. నాకంటే పొడవైన నిలువెత్తు గడియారం గంటగంటకీ మోగుతుంటుంది, నేనిక్కడున్నాను అని గుర్తు చేస్తూ. హాల్‌లో రిఫ్రిజిరేటర్ ఉంది. అది ఉండుండి గుయ్యని శబ్దం చేస్తుంటుంది. ఎప్పుడూ తాకలేదు నేను అప్పటిదాకా, ఎలా ఉంటుందో ఆ ఫ్రిజ్ తలుపు ఒక్కసారి తీసి చూద్దామనిపించింది. వేలాడే గొలుసుని లాగితే పెద్దగా చప్పుడు చేస్తూ ఫ్లష్ చేసే కమోడ్. ఎన్నో మొక్కలను కుండీల్లో పెట్టి పెంచుతున్నారు. అవేవీ జీవితంలో ఒక్క పూవు కూడా పూసేవిలాగా లేవు.

నాకు కేటాయించిన గది అప్పటికప్పుడు సర్దించినట్టున్నారు. అలమర, టేబులు ఒక పక్క అంతా ఆక్రమించుకున్నాయి. తాళం వేసి వున్న ఆ గాజు తలుపుల అలమరాలో చాలా పుస్తకాలున్నాయి. పక్కన ఒకదానిపై ఒకటి సర్దిపెట్టిన ఖాళీ పెట్టెలు. అలమరలో చోటు లేకో, అవసరం లేకో బైటే పడేసి వున్న ఇంకాసిని పుస్తకాలు, ఇంకేవో వస్తువులూ. పరుపుపై అప్పుడే ఉతికిన వాసనతో తెల్లటి బెడ్‌షీట్. తేలికైన రెండు మెత్తటి దిండ్లు. అటాచ్డ్ బాత్రూమ్. అయితే దీనికి మూడు తలుపులున్నాయి, మూడు గదులనుండీ వాడుకోడానికి వీలుగా. లోపలికి వెళ్ళగానే మూడిటికీ లోగడియలు పెట్టుకోవాలి, తర్వాత మరిచిపోకుండా లోపలి గడియలన్నీ తీసి రావాలి. బాత్‌టబ్ తెల్లటి రంగునుండి గోధుమరంగులోకి మారుతోందా లేక గోధుమరంగునుండి తెల్లగా అవుతుందా అని చెప్పలేనట్టుంది. దాని గోడకంటుకుని పాములా ఒంపులు తిరిగిపోయున్న ఒక పొడవైన వెంట్రుక. ఇంకా ఆడవాళ్ళున్నారని చెప్పే కొన్ని వస్తువులు. లోదుస్తులు దాపరికం లేకుండా దండెం పైన వేలాడుతున్నాయి.

రెండో ఆశ్చర్యం, ముద్దులు పెట్టడం! ఆ అమ్మాయి పద్దాక ముద్దులు పెడుతోంది. ఊరకనే అటు వెళ్ళే తల్లిని వాటేసుకుని బుగ్గమీద ముద్దిచ్చింది. ఒక్కోసారి వెనకనుండి వచ్చి ఆమెను హత్తుకుని ఆశ్చర్యం కలిగించింది. ఒక్కోసారి బుగ్గమీద, ఒక్కోసారి నుదుట. తల్లికూడా అలానే చేసింది. కొన్నిసార్లు అలా ముద్దుపెట్టేప్పుడు వాలుకళ్ళతో నన్ను చూస్తోంది. అలాంటప్పుడు నేను ఏం చెయ్యాలన్నది నాకు తెలియలేదు. జీవితంలో మొట్టమొదటిసారి పరాయివాళ్ళింట్లో ఉంటున్నాను. అందునా వాళ్ళు కేథలిక్స్. వాళ్ళ అలవాట్లు అలా ఉంటాయేమో అనుకున్నాను. అయినా ఏదో మొహమాటంగానే ఉంది. ఇది వీళ్ళకి సహజమైన చర్య అని మనసులో అనుకున్నాను.

భోజనాల బల్ల దగ్గర వడ్డించగానే నేను తొందరపడి కంచంలో చేయి పెట్టబోయాను. ప్రార్థన మొదలవ్వగానే చేయి వెనక్కి లాక్కున్నాను. చివర్లో ఆమెన్‌ చెప్పినప్పుడు నేను శ్రుతి కలపాలని నాకు తెలియలేదు. అలా చెయ్యనందుకే అనుకుంటా ఆ అమ్మాయి నన్నదోలా చూసింది.

ఆ రాత్రి జరిగినదీ ఒక వింత సంఘటనే! అలవాటు లేని గది, అలవాటు లేని మంచం, మునుపెన్నడూ వినని శబ్దాలు. అసలు నిద్ర పట్టలేదు.

చిన్నగా నా గది తలుపు తెరిచిన అలికిడి. కొవ్వొత్తిని పట్టుకుని రోసలిన్ మెల్లగా నడిచి వచ్చింది. నావైపైనా చూడకుండా నేరుగా పెట్టెలు పేర్చిన వైపుకెళ్ళి నిల్చుని అమెరికాలో ఉండే లిబర్టీ స్టాచ్యూలా కొవ్వొత్తిని పైకెత్తింది. నేను అదాటున లేచి కూర్చున్నాను.

“భయపడ్డావా?” ఇదే తను నాతో మాట్లాడిన మొదటి మాట. నేను లేచెళ్ళి తన పక్కన నిలబడి ఏంటా అని చూశాను. ఆ కర్రపెట్టెలో ఐదు పిల్లి పిల్లలు ఒకదానినొకటి ఒరుసుకుని మెత్తగా కళ్ళు మూసుకుని ఉన్నాయి. పూలగుత్తిని తీసుకున్నట్టు ఒక్కొక్కదాన్నీ చేతిలోకి తీసుకుని చూసింది. తన చేతి వెచ్చదనం ఆరిపోయేలోపు నేనూ ఆ పిల్లిపిల్లలను తాకి చూశాను. కొత్త అనుభవంలా ఉంది.

“మూడు రోజులే అయింది ఈని. రెండు చోట్లకి మార్చింది. తల్లి పిల్లి ఈ కిటికీ గుండానే వస్తుంది, పోతుంది. చూసుకో,” అంది.

నేనేం మాట్లాడలేదు. కారణం, నేనింకా అప్పటికి ఆ అమ్మాయి మొదటి ప్రశ్నకే జవాబు వెతుక్కుంటున్నాను అక్షరాలు కూడబలుక్కుంటూ. కాసేపు నాకేసి చూసింది. నాకు బాగా పరిచయమున్న వ్యక్తిలాగా రహస్యం చెప్పే గొంతుతో, “ఈ తల్లి పిల్లిపిల్లగా ఉన్నప్పుడు మగపిల్లిగా ఉండేది. ఉన్నట్టుండి ఒకరోజు ఆడపిల్లయ్యి పిల్లలు పెట్టేసింది‌!” అంది. గొంతు ఇంకా సన్నగా చేసుకుని, “ఈ నల్లపిల్లికి మాత్రం నేను పేరు పెట్టేశాను. అరిస్టాటిల్‌!” అంది.

ఇప్పుడు మాత్రం “అరిస్టాటిల్ ఎందుకు?” అని అడగాలనుకున్నాను.

నా మనసు చదివినదానిలా, “చూడటానికి అచ్చం అరిస్టాటిల్‌లా ఉంది కదా?” అంది.

ఇంతసేపూ నా పక్కన తను నన్ను ఆనుకునే ఉంది. తన నైట్‌డ్రెస్ ఆ చిన్న వెలుతురులో మరింత పలచగా ఉన్నట్టు కనిపించింది. విరబోసుకున్న తన జుట్టు నుండి వెచ్చదనం, వొంటి నుండి వస్తున్న వాసన నాకు కొత్తగా ఉండింది. నా వేళ్ళు తనలోని ఏదో ఒక భాగాన్ని తాకగలిగేంత దగ్గరగా నిల్చునుండింది. తననే చూస్తున్న నన్ను చూసి చూపుడు వేలు పెదవులపై శిలువలా పెట్టి సైగ చేస్తూ మెల్లగా నడిచి తలుపు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిన దిక్కుకి మెడ తిప్పి పడుకుని కాసేపు చూస్తూ ఉండిపోయాను. అది ఒక కొత్త అనుభవం.

ఉదయం అల్పాహారం తొందరగానే ఐపోయింది. వాళ్ళందరూ మంచి ఖరీదయిన బట్టలు కట్టుకునున్నారు. మిసెస్ జార్జ్ దగ్గరనుండి లీలగా హాయిగా పర్ఫ్యూమ్ వాసన వస్తోంది. రాత్రి అసలేమీ జరగనట్టే పిల్లిపిల్లలా కూర్చుని ఉంది రోసలిన్. నెమలి పింఛంలాంటి డ్రెస్సు, నల్లటి షూస్, పొడవైన తెల్లటి సాక్స్ వేసుకునుంది. తను కావాలనే మెల్లగా తింటున్నట్టనిపించింది. భోజనాల బల్ల దగ్గర మేమిద్దరమే మిగిలాం. ఎవరూలేని ఆ సమయం కోసమే చూస్తున్నట్టు నా వైపుకి తిరిగి, గొంతు సవరించుకొని రహస్యం చెప్తున్నట్టుగా “మా నాన్నదగ్గరొక రయిలు బండి ఉంది‌.” అంది లోగొంతుకతో.

“రయిలా?” అన్నాను.

“అవును రయిలే. పద్నాలుగు పెట్టెలు!”

“పద్నాలుగు పెట్టెలా!”

“ఆ బండే తిరువనంతపురానికీ కన్యాకుమారికీ మధ్య తిరిగే రయిలు బండి. పొద్దున ఆరుగంటలకు బయల్దేరి మళ్ళీ రాత్రికి వచ్చేస్తుంది‌.”

“రయిలు బండిని మీ నాన్నెందుకు కొన్నారు?”

“కొనలేదు, స్టుపిడ్. తిరువనంతపురం మహారాజా ఈ లైనుని మా తాతయ్యకు అతని సేవకు మెచ్చుకుని కానుకగా ఇచ్చారట. ఆయన తర్వాత అది మా నాన్నకు వచ్చింది. ఆయన తర్వాత అది నాకే!”

తన తర్వాత అది ఎవరికి సొంతమవుతుందని తేలేలోపు మిసెస్ జార్జ్ వచ్చేశారు. గబగబమని వాళ్ళందరూ మేరీమాత గుడికి బయల్దేరడంతో ఆ సంభాషణ అర్ధాంతరంగా ఆగిపోయింది.

పద్నాలుగేళ్ళ పిల్లాడిని ఎంతసేపని నాకిచ్చిన గదిలో ముడుక్కుని, చదవడానికేమీ లేకుండా ఎవడో బ్రిటీష్‌వాడు, జో డేవిస్ అట, రాసిన Heat అన్న పుస్తకాన్ని ఎంతసేపని తిరగేయను? కానీ ఏంచేయను. వాళ్ళు తిరిగొచ్చిన అలికిడి వినిపించి చాలాసేపైంది. ఇక తప్పక నా గది తలుపు కొంచం తీసి బయటకి తొంగి చూశాను. ఎవరూ కనిపించలేదు.

వరండాలోకి వచ్చాను. అడుగున నూనె మరకలున్న పొడవైన పేపర్ బేగులో చేయిపెట్టి ఏదో తీసి నోట్లో వేసుకొని నములుతూ ఉండింది తను. ఆ చేయి బేగులోకి పోయిరావడం పుట్టలోకి పాము వెళ్ళడం, రావడంలా కనిపించింది నాకు. పేరు తెలీని ఉండలాంటిదాన్ని అందులోనుండి తీసి నోట్లో వేసుకుంటోండింది. ఆ కవర్ నాకేసి చాపింది. తన మణికట్టు గెణుపు నా ముఖానికి దగ్గరగా నున్నగా కనిపించింది. పేరు తెలియని పదార్థాలు నేను తినను. వద్దని తలూపాను.

“ఐస్ ముక్కలు కావాలా?” అని అడిగింది.

నా జవాబు కోసం చూడకుండనే వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి నీలం రంగు ప్లాస్టిక్ ట్రే పట్టుకొచ్చింది. రెండంచులూ పట్టుకొని దాన్ని విల్లులా వంచి ఐసు ముక్కలు పైకెగురుతుంటే పట్టుకుని నోట్లో వేసుకుంది. మరొక ముక్కని పట్టి నీటిబొట్లు కారుతుండగా నాకందించింది. తను ఒకటి తీసుకుని పటుక్కుమని కొరికి తింది.

అటూ ఇటూ తిరిగి చూసి, ఫ్రిడ్జ్‌కి వినపడనంత దూరంలో ఉన్నట్టు నిశ్చయించుకుని, రహస్యంగా చెప్పింది, “ఈ నీళ్ళు కేరళనుండి తెచ్చినవి. అర్ధగంటలో గడ్డకట్టి ఐస్ ఐపోతుంది. ఇక్కడి నీళ్ళు చాలా స్లో! రెండు రోజులు పడుతుంది గడ్డకట్టడానికి‌!” అంది.

నేనూ ఆమెలా పటుక్కుమని కొరికాను. పళ్ళు జివ్వుమన్నాయి. తలలో ఏదో జరిగినట్టనిపించింది. కొరికిన వేగానికి ఐసుముక్క నీళ్ళయి నా నోటి చివరలనుంచి కారాయి. రోసలిన్ నన్ను చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. “నీకు ఐసు ముక్కలు తినడం చేతకాదు‌” అంది.

తనను పరీక్షగా చూశాను. హాఫ్ స్కర్ట్, కాలర్‌బోన్‌నీ భుజాలనీ దాచని షర్టు వేసుకునుంది.

అప్పుడే రయ్యిమని ఒక జోరీగ తన చుట్టు ఎగరడం మొదలుపెట్టింది. అది తన భుజంమీద వాలబోతుంటే విదిలించింది. నేను కంగారుగా తోలబోతే నా చేయి ఆ అమ్మాయి భుజానికి తగిలి, త్రాసు ఒక వైపు కిందకు వాలినట్టు పక్కకు వంగింది.

ఇప్పుడు రోసలిన్ కాళ్ళ దగ్గర ఎగురుతోంది ఆ జోరీగ. మళ్ళీ నేను తోలే ప్రయత్నంగా చేయి విసిరాను. తను నవ్వడం మొదలుపెట్టింది. ఈ ఆట ఆగకుండా సాగింది కాసేపు. ఆ ఆట ఆపేస్తాడేమో అనే భయంతో నేను మనసులో దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. కాని, అదే అయింది. పనిమనిషి వచ్చి రోసలిన్‌తో అమ్మ పిలుస్తున్నారని చెప్పింది.

ఆ ఆదివారం సాయంత్రపు టీ కార్యక్రమం కూడా మరిచిపోలేనిదే. ఇంటి బయట తోటలో మొదలైందది. పసుప్పచ్చగా పండి మెరుస్తున్న పెద్దపెద్ద పళ్ళున్న బొప్పాయి చెట్టు కింద ఇది జరిగింది. దూరంగా రెండు తాడిచెట్లకు కట్టిన పొడవైన వెదురు కర్రలననుండి కిందకి దిగిన వైరొకటి జార్జ్ సర్ మ్యూజిక్ రూమ్‌లో ఉన్న రేడియో ఆంటెనాకి వెళ్తోంది. ఆ రేడియోనుంచి ఒక ఆలాపన వినిపిస్తూ ఉండింది.

మిసెస్ జార్జ్ అందరికీ కప్పులో టీ పోసి ఇచ్చారు. పింగాణీ ప్లేట్‌లో బిస్కట్స్ పెట్టి ఇచ్చారు. నలుపలకలుగా ఉండి పైన సన్నని చక్కర పలుకులు చల్లి ఉన్నాయవి. ప్రతీ బిస్కట్‌కీ తొమ్మిది బెజ్జాలున్నాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయాయవి. అంత రుచికరమైన తొమ్మిది బెజ్జాల బిస్కట్లు తినడం అదే మొదటిసారి!

ఉన్నట్టుండి జార్జ్ సర్ తన కూతురిని గిటార్ వాయించమని ఆజ్ఞాపించారు. ‘ఓ డాడీ…’ అని అయిష్టంగా, వెళ్ళి గిటార్ పట్టుకొచ్చింది. కాలిమీద కాలేసుకుని, ఒత్తుకునే పేము కుర్చీలో ఇబ్బందిపడుతూ కూర్చుని వాయించుతూ పాడటం మొదలుపెట్టింది. ఆమె స్కర్ట్ పైకి జరిగి ఎండపొడ తగలని తెల్లని తొడలు కనిపించాయి. Don’t let the stars get in your eyes అని మొదలైంది ఆ పొడవైన పాట. Love blooms at night, in daylight it dies అన్న లైను నాకోసమే రాయబడినట్టు అనిపించింది. శ్రుతి లేకుండా, స్వరం కలవకుండా పావురపు గొంతేసుకుని పాడినప్పటికీ ఆ పాట నాకు చాలా బాగా నచ్చేసింది.

ఇలాంటొక అన్యోన్యమైన కుటుంబాన్ని నేనెప్పుడూ అప్పటిదాకా చూసెరగను. మిసెస్ జార్జ్ భుజంపైకి వేసుకున్న పైటలో మడతలు విచ్చుకున్న విసనకర్రలా క్రమంగా ఉన్నాయి. వాటిని జాకెట్‌లోకి వెండి పిన్నుతో బిగించారు. రోసలిన్ కళ్ళు మునుపటి కంటే ఇంకా పొడవుగా చెవులను తాకుతున్నాయా అన్నట్టు అనిపించాయి. ముఖంలో మెరుగు. జార్జ్ సర్ చేతులు రుద్దుకుంటూ భోజనాల బల్ల దగ్గర కూర్చుని ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. వాళ్ళతోబాటు నేనూ కూర్చున్నాను. ‘జపం చేద్దాం!’ అని ఆయన ప్రారంభించారు.

‘మా దేవుడవయిన యేసు ప్రభువా! ఎల్లలులేని నీ కృపచేత నిన్నటిలాగే ఈ రోజూ మాకు లభించిన ఈ రొట్టె కోసం ఇక్కడ కూడివున్న మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ రొట్టె కూడా దొరకనివారికి దారి చూపించుము. భారం మోసేవారికి ఉపశమనం కలిగించే రక్షకుడా! మా భారములను తేలిక పరుచుము. మాతో కొత్తగా చేరిన ఈ స్నేహితుడిని రక్షించుము. ఆతని ఆశయాలన్నిటినీ నెరవేర్చుము. నీ మహిమను చాటిచెప్పేందుకు మమ్ములను ఆశీర్వదించు ప్రభువా! ఆమెన్‌.’

ఈ సారి సరైన చోట సరైన సమయానికి ఆమెన్ చెప్పేశాను. నన్నుకూడా వారి ప్రార్థనలో కలుపుకున్నందుకు సంతోషం కలిగింది. నేను ఆమెన్ అన్నప్పుడు నావైపు కొంటెగా చూసి, తన కళ్ళను పక్కకు తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉండిపోయింది.

అయితే ఇంత ఆహ్లాదకరంగా మొదలైన రాత్రి చివరికొచ్చేసరికి చెత్తగా ముగిసింది.

భోజనాల బల్ల దగ్గర వున్నంతసేపు సంభాషణ చాలా ముఖ్యం. అది శుభ్రంగా ఇంగ్లీషులోనే సాగింది. ఒక తమిళ మాటో, మలయాళమో మచ్చుక్కూడా లేదు. ఆ అమ్మాయి నదికంటే వేగంగా మాట్లాడగలుగుతోంది. నా ఇంగ్లీషు చీకట్లో నడిచినట్టు ఉంటుంది. కాబట్టి మాటల పొదుపు పాటింపు చాలా అవసరం అనిపించింది. ఆ పొదుపు మాటలక్కూడా సగం సమయం గాలే వదిలాను.

తినే పింగాణీ ప్లేట్‌ని చూస్తూ తినడం నిషేధించినట్టు, బల్లపై పరచివున్న పదార్థాలను ‘దయచేసి ఇది అటివ్వండి…’. ‘ఆ రొట్టెలను ఇటు జరపండి‌…’ అని ఒకరిని ఒకరు అడుగుతూ అందించుకుంటూ తింటారు. ఇది కూడా నాకు కొత్తే.

అవియల్‌ అనే కొత్త వంటకం రుచిలో నేను ముణిగిపోయి వున్నాను. అప్పుడు జార్జ్ సర్ ఇంగ్లీషులో ఏదో అడిగారు. ఏమడిగారో నాకు తెలియదు గనుక వినిపించుకోలేదు. రోసలిన్ సన్నని స్వరంతో జావాబిచ్చింది. హఠాత్తుగా పైకప్పు అదిరిపోయేలా జార్జ్ సర్ అరిచారు. నేను వణికిపోయాను. గ్లాసులో నీళ్ళమీద వలయాలు కనిపించాయి. ఆ అమ్మాయి అంతవరకూ చూస్తున్న కొంటె చూపును నా మీదినుండి లాక్కుని ప్లేటుని చూస్తూ తినసాగింది. తన కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

మిసెస్ జార్జ్ వాతావరణాన్ని తేలికపరచాలని కళ్ళతో సైగలు చేశారు. అప్పటికీ జార్జ్ సర్ ముఖంలో కోపం తగ్గలేదు. ఆయన శాంతించడానికి చాలా సమయం పట్టింది.

ఆ రాత్రి చాలాసేపు నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతున్నాను. గాలి సవ్వడి చేసినప్పుడెల్లా తలుపు తెరచుకుంటుందా అని దీక్షగా చూస్తూ ఉన్నాను. అసలు తెరుచుకోనేలేదు.

ఎలానో ఒకలా నిద్రపోయాను. నడిజాము దాటాకేమో ఏదో చప్పుడుకి మెలుకువ వచ్చింది. చీకటి తప్ప మరేం కనిపించలేదు గానీ ఏవో మాటల్లాంటివి వినిపించాయి. గుసుగుసగా ఆడ గొంతు, ‘కాస్త ట్రై చెయ్యండి, ప్లీజ్!’ అని. మగ గొంతులో ఏవో మూలుగులు. మళ్ళీ నిశ్శబ్దం. కాసేపటికీ మళ్ళీ అదే ఆడగొంతు, ‘సరే, పోన్లెండి‌.’ అని చిరాగ్గా. తర్వాత చాలా సేపు మేలుకునే ఉన్నాగానీ ఏమీ వినిపించలేదు.

చెప్పినట్టే సెల్వనాయగం సర్ తెల్లవారుజామునే వచ్చేశారు. రిజిస్ట్రేషన్ పనులన్నీ పూర్తిచేసి నాకు సెబరపట్నం హాస్టల్‌లో సీటు ఇప్పించేశారు. అందరూ అది చాలా మంచి హాస్టల్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. నాకిచ్చిన గదికి మరో ఇద్దరు స్టూడెంట్లొస్తారనగానే శత్రుదేశపు సైన్యం వస్తుందన్నంత ఆత్రంగా నా సరిహద్దులను ఆక్రమించుకున్నాను.

నేను నా పెట్టె, సామాన్లు తీసుకోడానికి వచ్చినప్పుడు ఇల్లు తెరచే ఉంది. పనిమనిషి ఒక చేపని బండమీద కడుగుతూ ఉంది. ఆ చేప కళ్ళు పెద్దగా ఒక వైపుకు తెరచుకుని నన్నే చూస్తోంది. అయితే ఆమె మాత్రం నా వైపుకి తిరిగి చూడలేదు.

గది తలుపు జారుగా తెరిచివుంది. అయినా అక్కడి అలవాటుని ఆచరిస్తూ తలుపుని రెండు సార్లు కొట్టాకే లోపలికెళ్ళాను. నా పెట్టె, సంచీ పెట్టినచోటే ఉన్నాయి. అవి అందుకున్నాక గదంతా ఓసారి చూశాను. నా జీవితంలో మరోసారి ఇక్కడ ఉండే అవకాశం రాదని తెలిసిపోయింది.

ఏదో గుర్తొచ్చిన వాడిలా కర్రపెట్టె దగ్గరకెళ్ళి తొంగి చూశాను. నాలుగు పిల్లలే ఉన్నాయి. తల్లి పిల్లి మళ్ళీ పిల్లల్ని చోటు మారుస్తున్నట్టుంది. నల్ల పిల్లిపిల్ల లేదు. మిగిలిన నాలుగు పిల్లలూ తమ వంతు కోసం చూస్తున్నట్టున్నాయి. అవి మెత్తగా, వెచ్చగా ఉన్నాయి. రో-స-లి-న్ అని చెప్పుకుంటూ ఒక్కో అక్షరానికీ ఒక్కో పిల్లని తాకాను.

తిరిగొచ్చే దారిలో తను మాట్లాడిన మొదటి మాట గుర్తొచ్చింది. ‘భయపడ్డావా?’ ఎంత ఆలోచించినా చివరి మాట ఏంటో గుర్తుకు రాలేదు.

బ్రహ్మాండమైన పిల్లర్లతో కట్టబడిన ఆ బడి, కేంపస్‌లో ఉన్న చెట్లూ నన్ను ఆకట్టుకున్నాయి. ఇంత పెద్ద స్కూల్లోనూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ దానికవతలున్న నగరాల్లోనూ జీవించే ఏ ఒక్కరికీ తెలీని ఒక విషయం నాకు మాత్రమే తెలుసు. ఆ నల్ల పిల్లిపిల్ల పేరు అరిస్టాటిల్. ఆ ఆలోచనే ఎంతో సంతోషాన్నిచ్చింది.

తన గురించి తెలుసుకోవాలని ఉన్నా, ఎలా తెలుసుకోవాలో అర్థంకాక ఏ ప్రయత్నమూ చెయ్యలేదు. ఎవరిని అడగాలో కూడా తెలియదు. నేను ఎంతో శ్రమపడి సీటు సంపాయించుకున్న ఈ అమెరికన్ మిషన్ స్కూల్లో ఆ అమ్మాయి చదవటం లేదని కొన్నాళ్ళకే తెలిసిపోయింది. రోసలిన్ అన్న ఆమె అందమైన పేరుని Rosalin అని రాయాలా లేక Rosalyn అని రాయాలా అన్న ఈ చిన్న విషయంకూడా కనుక్కోలేదే అని చాలా బాధపడ్డాను.

చాలా కాలం తర్వాత తను కేరళనుండి వేసవి సెలవులకి వచ్చుంటుందనీ మళ్ళీ చదువులు కొనసాగించడానికి వెళ్ళిపోయుంటుందనీ ఊహించుకున్నాను. ఎప్పట్లాగే ఆ ఊహకి కూడా చాలా ఆలస్యంగానే వచ్చాను.

ఈ కొత్త బళ్ళో కెమిస్ట్రీ సర్ విలియమ్స్ ఒకటే కర్రపెత్తనం చలాయించేవాడు. మెండలీవ్ అన్న రష్యా శాస్త్రవేత్త చేసిన కుట్ర కారణంగా మేము పీరియాడిక్ టేబిల్స్‌ని కంఠస్థం చెయ్యాలని అజ్ఞాపించాడు. అప్పుడు 112 ఎలిమెంట్స్ లేవు; తొంబైరెండే ఉన్నాయి. ఎంత చదివినా వాటిని కంఠతా పట్టలేకపోయాను. బరువు తక్కువైనది హైడ్రోజన్ అనో, బరువైనది యురేనియం అనో ఆ వివరాలు నా జ్ఞాపకాల బండల మీదనుంచి జారిపోతూనే ఉన్నాయి. ముందు పేరు పెట్టాక తర్వాత కనుక్కున్న ఎలిమెంట్ జెర్మేనియం అన్నది నాకెప్పుడూ గుర్తుండేది కాదు అప్పట్లో. కాబట్టి ఆ రెండేళ్ళు విలియమ్స్ సర్ నా పట్ల అసంతృప్తితోనే ఉన్నాడు కానీ జాలిపడో పెద్దరికంతోనో పొరపాటునకూడా నాకు E కంటే ఒక గ్రేడు ఎక్కువివ్వాలని ప్రయత్నించలేదు. ఇతని హింసకు గురై నేను నిద్రపోయే ముందు రోసలిన్‌ని తలచుకోలేకపోవడం అన్న దారుణం కూడా రెండుమూడు సార్లు జరిగింది!

ఇది జరిగి ఇప్పటికి చాలా ఏళ్ళు దాటింది. ఎన్నో దేశాలు తిరిగాను. ఎన్నో దేశాల వీధులూ రహదార్లూ గుర్తుండిపోయాయి. ఎందరి ముఖాలనో ఆకర్షించాను. ఎన్నో గాలుల్ని పీల్చాను… ఎన్నో తలుపులనూ తెరిచాను. ఎన్నో మంచాలలో నిద్రపోయాను. ఇంకెన్నో రకరకాల ఆహారాలు తిన్నాను.

అయితే కొరకగానే కరిగిపోయే సన్నని చక్కెర పలుకులు చల్లిన తొమ్మిది బెజ్జాల బిస్కట్లు తిన్న ప్రతిసారీ రోసలిన్ వాసన, ఒక గిటార్ నోటూ నా మనసులోకి రావడం మాత్రం ఇప్పటికీ ఆగలేదు!
----------------------------------------------------------
(మూలం: మహారాజావిన్ రయిల్ వండి (2001) 
(మహారాజుగారి రయిలుబండి) కథల సంపుటినుండి.)
రచన: అవినేని భాస్కర్  (మూలం: ఎ. ముత్తులింగం)
ఈమాట సౌజన్యంతో

Sunday, June 24, 2018

కవిరాజశిఖామణి కవిత్వశక్తి


కవిరాజశిఖామణి కవిత్వశక్తి
సాహితీమిత్రులారా!


ఉ. ఆ రుచిరాననాబ్జదరహాసవిలాసవికాసభాసినీ
    హారకరాతిభాతి నమలాంగశరీరతుషారదీప్తికాం
    తోరునగంబు సమ్మదరసోత్కటఘర్మజలంబు పర్వి పొ
    ల్పారె హిమాచలంబు నమరాధిపవాహిని గప్పినట్టిదై

శ్రీనాథుడు హర్షనైషధాన్ని తెనిగిస్తూ, ప్రౌఢకవిత్వాన్ని ఆస్వాదించే ఓపిక లేనివారిని ఏమాత్రం మొహమాటం లేకుండా ‘సోమరిపోతులు’ అంటాడు. పైగా ‘లేజవరాలు చెక్కు గీటిన వసవల్చు బాలకుఁడు డెందమునం గలఁగంగ నేర్చునే’ అని సన్నాయినొక్కులు కూడా నొక్కుతాడు! సంస్కృతకావ్యాల ప్రభావంతో అలాంటి ప్రౌఢకవిత్వం మనకి తెలుగులో కూడా అవతరించింది. మరీ ప్రౌఢం కాకపోయినా, ప్రబంధాలలో వర్ణనలను అర్థం చేసుకొనేందుకు కొంత పాండిత్యం, పరిశ్రమ అవసరమవుతాయి. అలాంటి వర్ణనలకి నిలువెత్తు ఉదాహరణ పై పద్యం – ఆ విషయం పద్యం చదవగానే బోధపడిపోయి ఉంటుంది! ప్రబంధ వర్ణనల్లో సాధారణంగా కనిపించే మరొక అంశాన్ని కూడా ఈ పద్యం పరిపూర్ణంగా ప్రతిఫలిస్తోంది. అది అలంకారసాంద్రత. అంటే ఒకే పద్యంలో ఒకే విషయాన్ని అనేక అలంకారాలతో వర్ణించడం. నిజానికి ఈ రెండు అంశాలూ పరస్పరం సంబంధమున్నవే. ఒక విషయాన్ని వర్ణిస్తూ అలంకారాల సహాయంతో ఆకట్టుకొనేలా ఒక పద్యం అల్లాలంటే, అందులోని వాక్యనిర్మాణంలోనూ భాషలోనూ చాలా కుదింపు అవసరం అవుతుంది. ఆ కుదింపు పద్యాన్ని అర్థం చేసుకోడంలోని క్లిష్టతను పెంచుతుంది. ఈ పద్యంలో జరిగింది కూడా అదే. అయితే ఈ క్లిష్టత భాషలోనే తప్ప చెప్పే అంశంలో కాదు. కాస్తంత సాధన ఉంటే చాలు, తోవ సులువుగానే దొరుకుతుంది. ఆ తోవలో, అందులోని కవి కల్పనలని మన మనసులో చిత్రించుకుంటూ వెళితే ఒక అందమైన దృశ్యం సాక్షాత్కరిస్తుంది.

ఇది నన్నెచోడుడు రచించిన కుమారసంభవ కావ్యంలోని పద్యం. శివునికి తపోభంగమయ్యే ఘట్టం. పార్వతీదేవి కడకంటి చూపులతో కలిసి మరుని తూపులు శివుని మనసులో నాటుకున్నాయి. స్థాణువులో ఒక్కసారి కదలిక వచ్చింది. సర్వసంగపరిత్యాగిలో శృంగారం అంకురించింది. ఆ సమయంలో శివునిలో కలిగిన ఒక సాత్వికభావ విశేషాన్ని వర్ణిస్తున్న పద్యమిది.

ఈ పద్యాన్ని అర్థం చేసుకోడానికి ఒక కిటుకుంది. భారతీయభాషలకి క్రియాపదం ఒక రకంగా ప్రాణమని చెప్పవచ్చు. ఆ గుట్టు పట్టుకుంటే తక్కిన పద్యాన్ని అర్థం చేసుకొనే మార్గం సుగమం అవుతుంది. ఈ పద్యంలో కనిపించే క్రియాపదాలు – పర్వి, పొల్పారె, కప్పినట్టిదై. ఇందులో కప్పినట్టిది ఐ, పర్వి అనే రెండు క్రియలూ అసమాపకక్రియలు. పొల్పారె అనేది వాక్యాన్ని పూర్తిచేసే సమాపకక్రియ. పొల్పారడం అంటే ఒప్పారడం, అందగించడం. ఒప్పారినది ఏది లేదా ఎవరు? అది తెలియాలంటే, దీనికి సంబంధించిన నామవాచకం కోసం వెతకాలి. తెలుగులో నామవాచకాలు ఎక్కువగా – డు, ము, వు, లు అనే ప్రత్యయాలతో అంతమవుతాయి. పూర్వభాషలో ము అనేది ంబు అనే రూపంలో కూడా ఉండేది (అసలు రూపం అదే). అంచేత అలాంటి పదాల కోసం చూస్తే కనిపించే పదాలు ఘర్మజలంబు, నగంబు. ఇందులో ఘర్మజలంబు పర్వి అని ఉంది కాబట్టి, పరచుకొన్నది ఘర్మజలము.

ఆ తరువాత, అందగించినది నగము. నగము అంటే పర్వతం. ఏమిటా పర్వతం? దాని ముందు ఒక పొడుగాటి సమాసం ఉంది. తెలుగు పద్యాలని అర్థం చేసుకోడానికి తెలియాల్సిన మరొక ముఖ్యమైన అంశం ద్రుతం. పూర్వభాషలో చాలా పదాలు ద్రుతాంతాలు, అంటే పదాల చివర నకార పొల్లు ఉంటుంది. వచ్చెన్, తెచ్చెన్, ప్రీతిన్, క్షితిన్ – ఇలా. ఆ ద్రుతం పక్క పదంలో మొదటి అక్షరంతో చేరుతుంది. ఒక వేళ పక్క పదం అచ్చుతో మొదలైతే, ఆ అచ్చుతో కలిసి నకారం వస్తుంది. అంచేత నకారంతో మొదలయ్యే పదాలని జాగ్రత్తగా పరిశీలించాలి, అది పదంలో సహజంగా ఉన్న నకారమా లేదా ద్రుతం కలిసి వచ్చిన నకారమా అని. ఈ సమాసం మొదట్లో నమలాంగశరీర అని ఉన్నది. నమల అన్నది సాధారణ వాడుకలో ఉన్న పదం కాదు. అంచేత అది అమల అయ్యుండాలి. ఇప్పుడు సమాసంలో ఒకో పదాన్ని విడగొట్టుకొని ప్రతిపదార్థం తెలుసుకోడమే! అమలాంగ, శరీర, తుషారదీప్తికాంత, ఉరు, నగంబు. తుషారదీప్తి అంటే చల్లని కాంతి కలవాడు, చంద్రుడు. తుషారదీప్తికాంత అంటే చంద్రకాంతశిల. అంటే చలువ(పాల)రాయి. ఉరు నగము అంటే పెద్ద పర్వతం. తుషారదీప్తికాంతోరునగంబు అంటే చలువరాతికొండ అన్నమాట. ఏమిటా చలువరాతికొండ? అమలాంగ శరీరం. అమలాంగుడు అంటే స్వచ్ఛమైన (తెల్లనైన) శరీరం కలవాడు అని, శివుడు. శివస్వరూపం తెల్లని కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. అమలాంగ శరీరం – శివుని శరీరం. అంచేత, ఒప్పారినది ఏమిటయ్యా అంటే, శివుని శరీరమనే చలువరాతికొండ. ఎందుకు? ఎలా? అనే ప్రశ్నలకి సమాధానాలు తక్కిన రెండు క్రియలు చెపుతున్నాయి. సమ్మదరసోత్కట ఘర్మజలంబు శివుని మేనిపై పరచుకొన్నది. సమ్మద, రస, ఉత్కట, ఘర్మజలం. ఘర్మజలం అనే పదం శ్రీశ్రీ పుణ్యమా అని చాలామందికి తెలిసే ఉంటుంది! చెమటనీరు. అధికమైన సంతోషరసమనే చెమటనీరు శివుని శరీరమంతటా వ్యాపించినదన్న మాట. ఒక స్థిరమైన భావం (స్థాయీభావం) రసంగా నిష్పన్నమయ్యే క్రమంలో, ఆ రసానికి ఆలంబన అయిన వారిలో కలిగే అసంకల్పిత స్పందనలను సాత్వికభావాలంటారు. అవి ఎనిమిది. అందులో స్వేదం ఒకటి. ప్రియురాలిపై రాగాతిశయం కలిగినప్పుడు శరీరం పులకించడంతో పాటుగా చెమరుస్తుంది కూడా! అయ్యవారి మేను అమ్మవారిపై కలిగిన ప్రేమాతిశయం కారణంగా చెమర్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే శివుని శరీరాన్ని చంద్రకాంతశిలాపర్వతంతో పోల్చడం దేనికి? కేవలం తెల్లదనం ఒక్కటే పోలికా? దీనికి సమాధానం పద్యం మొదటి పాదంలో దొరుకుతుంది.

ఆ రుచిరాననాబ్జదరహాసవిలాసవికాసభాసినీహారకరాతిభాతిన్

ఆ, రుచిర, ఆనన, అబ్జ, దరహాస, విలాస, వికాస, భాసి, నీహారకర, అతి, భాతిన్ అని పదవిభాగం. ఆ = ఆ పార్వతీదేవి యొక్క, రుచిర = కాంతివంతమైన, ఆనన = ముఖమనే, అబ్జ = చంద్రుని (అప్ అంటే నీరు, సముద్రం అని అర్థాలు. సముద్రం నుండి పుట్టాడు కాబట్టి చంద్రుడు అబ్జుడు), దరహాస = చిరునవ్వుల, విలాస = చక్కదనపు, వికాస = విప్పారిన, భాసి = వెలుగులనే, నిహారకర = చంద్రుని (చల్లని కిరణాలు కలిగినవాడు), అతి = గొప్ప, భాతిన్ = కాంతుల వలన. అంటే, అమ్మవారి ముఖచంద్రుడు కురిసే చిరునవ్వు వెన్నెలలు అక్కడంతటా వ్యాపించాయి. చంద్రకాంతికి చంద్రకాంతశిల కరుగుతుందని కవిసమయం. అంచేత పార్వతీదేవి ముఖచంద్రుడు కురిసే చిరునవ్వు వెన్నెలల వలన శివుని శరీరమనే చంద్రకాంతశిలాపర్వతం కరగడం మొదలుపెట్టిందన్న మాట. అదే అతని మేనిపై పరచుకొన్న చెమట! ఎన్ని అలంకారాలో చూడండి. పార్వతీదేవి మోము జాబిలి. ఆమె చిరునవ్వులు వెన్నెలలు. శివుని శరీరం చంద్రకాంతశిలాపర్వతం (శిల అంటే సరిపోదు, ఆయన దేహపరిమాణం కొండంత ఉంది!). దానిపై పరచుకొన్న చెమట సంతోషరసం. ఇంత చెప్పి కూడా కవికి సంతృప్తి కలగలేదు! పరమేశ్వరుని దేహాన్ని పాలరాతికొండతో చేసిన పోలిక కవికి పూర్తి తృప్తినిచ్చినట్టు లేదు. అతని ఊహలో ఆ దేహం మరింత ఘనంగా, గొప్పగా కనిపిస్తోంది. అంతటి ఉన్నతి ధ్వనించాలంటే ఇంకా ఉన్నతమైన ఉపమానం కావాలి. హిమగిరిపైనున్న ఆ మహేశ్వరుడు సాక్షాత్తూ ఆ హిమవత్పర్వతంలానే దర్శనమిచ్చాడు కవికి. హిమాచలం కూడా తెల్లని కాంతులతో మెరిసేదే కదా. మరి అతని మేన ప్రవహిస్తున్న ఘర్మజలమో? అది అమరవాహిని కాక ఇంకేమిటి కాగలదు! మహాదేవుని దేహం ‘హిమాచలంబున్ అమరాధిపవాహిని కప్పినట్టుగా’ ఉందన్న యింపైన ముక్తాయింపునిచ్చాడు.

ఇదే సందర్భంలో కాళిదాసు తన కుమారసంభవ కావ్యంలో శివునిలో కలిగిన చలనాన్ని ఒకే ఒక్క శ్లోకంలో ఒకే ఒక్క ఉపమానంతో వర్ణిస్తాడు.

హరస్తు కించిత్ పరిలుప్త ధైర్యః చంద్రోదయారంభ ఇవాంబురాశిః
ఉమాముఖే బింబఫలాధరోష్ఠే వ్యాపారయామాస విలోచనాని

పార్వతిని చూసిన శివుని స్థితి చంద్రోదయవేళలో సముద్రంలా అయ్యింది. కాస్తంత తగ్గిన ధైర్యంతో తన చూపులని బింబాధర అయిన ఉమ మోముపై ప్రసరింపజేశాడు. ఉపమానాలని ఆచితూచి ప్రయోగించడంలో కాళిదాసుని మించిన కవి ఎవరు! ఆయనకి వాల్మీకి మార్గదర్శి. అంచేత ఒకే ఒక్క ఉపమానంతో శివుని స్థితిని మనోజ్ఞంగా ధ్వనింపజేశాడు కాళిదాసు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యవిషయం ఒకటుంది. కాళిదాసు కుమారసంభవంలో శివుడు ఉదాత్తుడైన కావ్యనాయకుడు. అసలు మన్మథబాణం తనని తాకకుండానే మారుని భస్మం చేస్తాడు. శివునికి కలిగిన తపోభంగం చాలా స్వల్పమైనది – కించిత్ పరిలుప్త ధైర్యః. అది కూడా పార్వతీదేవిని చూడడం వల్ల తప్పిస్తే మన్మథబాణం వలన కాదు. ఆ తర్వాత కథలో కూడా విరహబాధను పొందినది పార్వతీదేవి కాని శివుడు కాదు. నన్నెచోడుని కుమారసంభవంలో శివుడు శృంగారరసానికి ఆలంబన అయిన ప్రబంధనాయకుడు. మన్మథబాణం ఇతన్ని తాకుతుంది. ఆ తర్వాత కథలో శివుడు కూడా పార్వతిలా విరహతాపాన్ని పొందుతాడు. అందువల్ల శివునిలో కలిగిన సాత్వికభావోదయాన్ని విశేషించి వర్ణించాడు నన్నెచోడుడు.

ఇంత చెప్పి కూడా నాకూ సంతృప్తి లేదు! ఒక కవిని కొద్దిగానైనా పరిచయం చేసుకోవాలంటే ఒక్క పద్యం సరిపోదు కదా. నన్నెచోడుని కవిత్వశక్తిలో ఆయనకున్న భాషాలంకార పాండిత్యాన్ని పైపద్యం ప్రదర్శిస్తోంది. అదొక్కటే కావ్యానికి గొప్పతనం చేకూర్చదు. హృదయాన్ని తాకే కవిత్వం కావాలి. అలాంటి ఒక పద్యాన్ని కూడా రుచి చూద్దాం:

అలమటసెడియొండె నిలువదు చిత్తంబు
        మూర్ఛిల్లి వెడబాసి పోవదొండె
నూఱట గొనియొండె నాఱదు శోకాగ్ని
        పొరిమాల గొని కాలిపోవదొండె
ఘర్మాశ్రుజలము లొక్కట కట్టుకొనవొండె
        బొడవంతయు గరంగిపోవ దొండె
బర్వు నిట్టూర్పులు పట్టున బడవొండె
        బొందిమ్ముగా బాసిపోవదొండె

నిట్టి కడలేని దుఃఖాబ్ధి బెట్టి ముంప
దలచియోకాక పోనీక బలిమి నాదు
ప్రాణ మొడలిలో నాకాశవాణి దెచ్చి
మగుడ జెఱబెట్టె నని రతి మఱుగుచుండె

ఒక చిత్రమైన సున్నితమైన మనఃస్థితిని ఎంతో సహజంగా నేర్పుగా గుండెని తాకేలా అక్షరీకరించిన గొప్ప పద్యం ఇది. శివుని కంటిమంటకు కాలిబూడిదయిన తన పతిని గూర్చి పరితపిస్తూ ప్రాణార్పణకి సిద్ధమవుతుంది రతి. ఆ సమయంలో పైనుంచి ఆకాశవాణి పలుకులు వినిస్తాయి, మన్మథుడు తిరిగి తనకి లభిస్తాడని అభయమిచ్చే మాటలు. ఆ మాటలతో రతి తన మరణప్రయత్నాన్ని విరమిస్తుంది. అప్పుడు రతి స్థితి ఎలా ఉంటుంది? ఊబిలో కూరుకుపోయే వ్యక్తికి తీగ దొరికినట్టుగా, ఒక సన్నని ఆశ. అయితే, తిరిగి పతిసాన్నిధ్యం పొందే వరకూ అది ఊగిసలాటే. నిరంతర సంఘర్షణ, సందిగ్ధత – ఆశనిరాశల మధ్య, జీవన్మరణాల మధ్య. ఆ అవస్థని ఎంతో సున్నితంగా, హృదయవిదారకంగా ఈ పద్యంలో చిత్రించాడు కవి.

ఈ పద్యమంతా రతి వేదనతో పలికే మాటలు. ఒండె అంటే ఆలా కాకపోతే ఇలా ఆయినా అని. రతి సందిగ్ధావస్థని ఈ చిన్న అచ్చతెనుగు మాటతో పద్యమంతా స్ఫురింపజేశాడు నన్నెచోడుడు. బాధను వీడి చిత్తం స్థిరంగా నిలవదు. పోనీ, తీవ్రమైన బాధతో మూర్ఛిల్లి పూర్తిగా విడిచిపెట్టయినా పోదు. దహిస్తున్న శోకాగ్ని ఆరనైనా ఆరదు. పోనీ పూర్తిగా నన్ను కాల్చేయనైనా కాల్చేయదు. దుఃఖంతో శ్రమతో పొంగుకు వచ్చే కన్నీరు, చెమట, ఆగనైనా ఆగవు. పోనీ నా శరీరం వాటిలో మునిగి కరగనైనా కరిగిపోదు. ఆయాసంతో పరుచుకొనే నిట్టూర్పులు ఒక పట్టున పట్టుబడవు. పోనీ చక్కగా శరీరాన్ని విడిచిపెట్టయినా పోవు. అదీ ఆమె దయనీయ పరిస్థితి! రతి పొందే నలుగుబాటులోని తీవ్రత ఎత్తుగీతిలో తారస్థాయి నందుకొంది. ఆమె అంటోంది కదా, ‘ఇలాంటి అంతులేని దుఃఖసముద్రంలో నన్ను ముంచడానికే ఆకాశవాణి ఎగిరిపోయే నా ప్రాణాలని బలవంతంగా తెచ్చిపెట్టి మళ్ళీ శరీరమనే ఖైదులో బంధించింది!’ అని. పాంచభౌతికమైన శరీరమూ మనసూ ప్రాణమూ విలవిలలాడిపోయే తీరు పద్యమంతా పరచుకొని రతి వేదనలోని తీవ్రత సహృదయ హృదయాలని గాఢంగా తాకక మానదు!

ఈ కావ్యపీఠికలో నన్నెచోడుడు కవిత్వాన్ని గురించి చెపుతూ, ‘హృదయాన్ని సూటిగా తాకి భేదించలేని బాణం ఒక బాణమేనా, కవిత్వం అసలు కవిత్వమేనా’ అంటాడు. ఈ కవిరాజశిఖామణి నేర్పుగల విలుకాడే!
-----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, June 23, 2018

శ్రీనాథుని భీమేశ్వర పురాణము: స్థానీయత, కొన్ని అపూర్వాంశాలు


శ్రీనాథుని భీమేశ్వర పురాణము: 
స్థానీయత, కొన్ని అపూర్వాంశాలు
సాహితీమిత్రులారా!పాయ కొక చోటఁ జదికిలఁబడగ నుండ
నైన ఫలమేమి? యటు వినోదార్థ మరిగి
సంచరింతముగాక యీ జలజ హితుని
ధర్మ మౌర్జిత్యమును బొంద దక్షపురిని – భీ.పు. 5-16.

కవిగా గొప్ప దిమ్మరి కావడం వల్ల శ్రీనాథుని కాలంనాటి ఆంధ్రభూమికి చెందిన చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక ఆనవాళ్ళు ఆయన కావ్యాల్లో, చాటువుల్లో శిలాక్షరాలయ్యాయి. పై పద్యం కైలాసనాథుని ద్వారా శ్రీనాథుడు సందర్భానుసారం చెప్పించినప్పటికీ (శివుడూ దిమ్మరే కదా!) భావం మాత్రం శ్రీనాథుని జీవితానుభవంలోనిది.

ఊసుపోకకో (భీ.పు. 5-15), రాజ సందర్శనార్థమో, రాయబారిగానో, పొట్టగడవడానికో, తీర్థయాత్రాది కృత్యంగానో ఆ కాలం నాటి ఆంధ్ర ప్రాంతమంతా ఆయన కలయదిరిగాడు. అంతేగాక ప్రౌఢదేవరాయల ఆస్థానపు కన్నడ ప్రాంతమూ (విద్యానగరం), పెదకోమాటి వేమారెడ్డితో కాశీ, సంచరించాడు. శైవారాధన తత్పరుడు (శైవమే పరమమనే సంకుచితుడు కాడు. ఇదే కావ్యంలో అవతారికలో రాధాగోపాలుని కొలిచాడు, భీ.పు. 1-3) గాబట్టి శ్రీనాథుడు పేర్కొనని దక్షిణభారత శైవక్షేత్రాల్ని ఆయన పేర్కొనకపోవటానికి కారణం ఆయన ఆ ప్రాంతాలను సంచరించక పోవడమే కావచ్చు. తాను కాలుపెట్టిన ప్రాంతపు విభావాన్నీ, దైన్యాన్నీ ఉన్నదున్నట్టు చెప్పడం శ్రీనాథుని నైజం.

భీమేశ్వర పురాణం చెప్పడానికి ముందు పల్నాడు తిరిగి ఆ ప్రాంతపు అన్నపానాల లోటుకు (అంగడి యూరలేదు, రసికుడు పోవడు – చాటువులు) ఎంతగానో నోరు చేసుకొన్నాడు. అక్కడి శుచీ శుభ్రతా లేని పురోహితుని యింటి స్థితి మొత్తాన్నీ (దోసెడు కొంపలో – చాటువులు) ఈసడించాడు. తాగడానికి నీళ్ళుగాని, తినడానికి వరియన్నముగాని లేని పలనాటి నుండి భీమవాటికి పయనమై ఈ భీమమండల విభవానికి మైమరచాడు.

ఎక్కడఁజూచినన్సరసి, యెక్కడఁజూచిన దేవమందిరం,
బెక్కడఁజూచినందటిని, యెక్కడఁజూచినఁబుష్పవాటికం,
బెక్కడఁజూచినన్నది, మహీవలయంబున భీమమండలం
బెక్కడ? యన్యమండలములెక్కడ? భావనచేసి చూచినన్‌! – భీ.పు. 3-23.

రాజమహేంద్రవరపు రాజుల ప్రాపకం పొందడానికి ముందు శ్రీనాథుడు వారి మంత్రి బెండపూడి అన్నయ కోరిన మీదట భీమవాటి మహిమను, భీమమండల ప్రాభవాన్నీ ప్రబంధ రీతిలో కావ్యం కట్టాడు.

ఈ భీమేశ్వర పురాణం ఒక అచ్చమైన తెలుగు ప్రబంధం. తెలుగు కావ్యాలకు సంస్కృతమూలాలు చెప్పుకోవడం సాధారాణం. తెలుగున నన్నయాదిగా ఈ రీతి చెప్పుకుంటున్నా అలా చెప్పుకున్న వారి కావ్యాల్లోనే సంస్కృత మూలం కొంచమై స్వకపోల కల్పితాలు కొల్లలు. ఐతిహాసిక కావ్యాలు కూడా. మిగిలిన తెలుగు కావ్యాలన్నీ దాదాపు ఈ దాపున అందుకు ఎక్కువభాగం ఉదహరించవచ్చు. ఆత్మన్యూనతో, గీర్వాణ గారవమో తెలుగు కవిత్వాన్నీ చిన్నచూపు చూసింది.

భీమేశ్వర పురాణం సంస్కృత భీమఖండానికి (స్కాందపురాణంలో గోదావరీ ఖండం లోనిది) అనుసృజన కాదనడం యిప్పటికి సాధారణమే. ఈ క్రింది మిగుల హేతువులు కూడగడితే ఈమాట మరింత తెల్లమౌతుంది. భీమేశ్వరపురాణానికి భీమఖండమనే పేరు అర్వాచీన కాలంలో ప్రసిద్ధమైంది. (స్వారోచిష మనుసంభవం మనుచరిత్రమైనట్టు.)

అవతారికలో కవులు తాము రాయదలుచుకొన్న కావ్యాంశాలను కృతిభర్తలు తమను అడిగి రాయించుకొన్నారని చెప్పడం పరిపాటి. శ్రీనాథుడు భీమమండల దర్శనపులకితుడు. మండల మధ్యస్థిత దేవరూపం తన కారాధ్యము. దీనితో బాంధవుడైన అన్నయ పేర కృతి చెప్పడానికీ, తద్వారా రాజమండ్రి కొలువున పాదం మోపడానికీ తోవ తొక్కిన కాలిబాటౌతుంది. అన్నయ భక్తిపూర్వకంగా భీమనాథుని ప్రాంగణానికర్పించిన మండపాలు (భీ.పు. 1-27), దాన శిలాక్షరాలు చూచినవాడు కదా కవి. అందుకే అన్నయే తన నడిగినట్లూ (భీ.పు. 1-28) ‘సబహుమానంగా తనకు కర్పూర తాంబూల జాంబూనదాంబరాభరణంబు లొసంగెనని’ (భీ.పు. 1-29) కూడా చెప్పుకుంటాడు. ఇది నిజమైనా కాకున్నా ఈ విధమైన రివాజు నన్నయాదిగా వస్తున్నదే.
ఇలా అన్నయ, ‘స్కాందపురాణంలో గోదావరీ ఖండాన్ని పరిపాటి రచింపమని’ అడిగాడట. తప్ప భీమఖండం కాదు.

కర్పూర తాంబూలం అందుకొన్న కవి వెంటనే తన మూలాలోచనమైన రాజమండ్రి వీరభద్ర, వేమపృధ్యీశ్వరుల విక్రమాన్ని పొగిడి వారి మంత్రికి కృతి నిస్తున్నానన్నాడు. ఇక్కడొక వివరణ కూడా ఇస్తున్నాడు కవి.
పంచలక్షణాలతో శోభిల్లే సంస్కృత పురాణమైన స్కాందంలో గోదావరీ ఖండం దక్షారామ భీమేశ్వర మహాత్మ్య సంయుత మవటం వల్ల భీమేశ్వరపురాణం అంటాననీ, పురాణమని ఆఖ్యానించినా ఆంధ్ర ప్రబంధంగా చెప్తాననీ తన కోరిక నెరవేరేందుకు రాజమహేంద్రవర రెడ్ల వంశవర్ణన చేస్తాడు. ఈ రెండు చోట్లా ఎక్కడా భీమఖండం అని అనకుండా కృత్యంతభాగంలో, ‘స్కాందపురాణాంబునందు, గోదావరీ ఖండంబునందు జెప్పంబడిన భీమఖండం, భీమేశ్వర మహాత్మ్యంబును, భీమేశ్వర పురాణంబుననంబరగు’ నని కావ్యఫలశృతి చెప్తాడు.

అసలు విషయం సంస్కృత స్కాంద పురాణంలో భీమఖండం లేదనీ (పేజి 706, ఆరుద్ర స.సా.), లండన్ లైబ్రరీలో మెకంజీ సేకరించిన దక్షారామ ప్రతులను శోధించిన వెల్చేరు నారాయణరావు, డేవిడ్‌ షూల్మన్‌లు (పుట 187. శ్రీనాథ, 2012) కూడా చెపుతున్నారు.

దానికి తోడు తెలుగు లిపిలో మాత్రమే వున్న సంస్కృత భీమఖండం గోదావరీ మండలానికే పరిమితమై వుండడం గమనార్హం. దీనిద్వారా భీమేశ్వరపురాణం తర్వాతే శ్రీనాథుడు గానీ మరెవరైనా భీమఖండాన్ని సంస్కృతంలో కర్త పేరు చెప్పకుండా (చెప్పకపోవడం అవసరం కూడా) 32 అధ్యాయాలు తెలుగులిపిలో రాయగా 1879లో మొదట అచ్చయింది. తర్వాత జయన్తి సూర్యనారాయణ శాస్త్రి గారి తెలుగు తాత్పర్యంతో 1943లో కాకినాడలో ముద్రణకు నోచుకుంది. ఈ పుస్తకం చివర 8 తెలుగు అష్టకాలూ, 4 లాలిపాటలూ, 1 జోలపాట, సంవాదం పేరుతో 51 చరణాల పాట, 10 చరణాల ఏకాంతసేవ పాట, మంగళహారతి వున్నాయి. ఇవి ఎవరి రచనలో పేర్కొనలేదు. ఆ తర్వాత జయన్తివారి మాణిక్యాంబ, భీమేశ్వరాష్టకాలూ, భాగవతి వాసుదేవ దీక్షుతుల భీమేశ్వరాష్టకం వున్నాయి.

ప్రథమాశ్వాసం చివర శౌనకాది మునులు ‘స్కాందపురాణంలో పూర్వఖండంలో పారాశర్యుండు నిజాపరాధంబు కారణంబుగా విశ్వనాథుచే నధిక్షేపింపబడి వారణాశి వెల్వడియె’ (భీ.పు.1-120) అని విన్న వారగుటచే సూతుని తదనంతర కథ వినవేడుకౌతుందని చెప్పమనగా సూతుడు కథ ప్రారంభించడంతో రెండవ ఆశ్వాసం మొదలౌతుంది.

పై అంశాలలో ఏకసూత్రత లేదని, భీమఖండం అనేవి స్కాందంలో లేదని, అది శ్రీనాథుని కల్పితమని స్పష్టమవుతున్నాయి. ఇంకొక మౌలికాధార అంశం తర్వాతి వివరణల్లో ఉంది.

భీమేశ్వర పురాణం స్థలమాహాత్మ్యం తెలియజేసే ప్రబంధం. దక్షారామ భీమనాయకుని మహిమ పేరున ఈ ప్రాంతపు తత్కాల భౌగోళిక, సాంస్కృతిక వాస్తవాలకు ఈ కావ్యం ఆలవాలమైంది. ఇది కొత్త ఒరవడి. స్థలపురాణాలలో ఎర్రన నృసింహపురాణం దీనికి ముందుదైనా కర్నూలు జిల్లా అహోబిలపు ప్రాంత వాసనలేవీ లేని నారసింహ భక్తియుతమైన కావ్యమే ఐంది.

ఆశ్వాస విభజన
కావ్యేతివృత్తం కొంచెమైనా ప్రాంతవిశేషాదులను వర్ణణాత్మకంగా తీర్చి తర్వాతి ప్రబంధ కవులకు శ్రీనాథుడు అనుసరణీయమయ్యాడు. కథావస్తువును స్థూలంగా చూస్తే:

ప్రథమాశ్వాసం – అవతారికతోపాటు దక్షారామ పురవర్ణన 20 పద్యాలలో కొలువై వుంది.
ద్వితీయాశ్వాసం – ప్రబంధ వర్ణనలూ, శాపగ్రస్తుడైన వ్యాసుడు యాత్రకు వెడలుట, కాశి నుండి ప్రధాన క్షేత్రాల ద్వారా ఆంధ్రభూమిలో అడుగిడుట, అగస్త్యుని కలయిక, శాపకారణం తెలియరావడం.
తృతీయశ్వాసం – అగస్త్యుడు వ్యాసునికి దక్షారామ మహిమ చెప్పుట, భీమమండల విభవం గాంచుట, వ్యాసాదుల దక్షారామ ప్రవేశం, ఇంద్రుడు దేవతలకు శివలింగ మహాత్త్యం చెప్పడం, వ్యాసుని భీమనుతితో మూలమైన వ్యాసకథ దాదాపు ఇక్కడితో అయిపోతుంది.
చతుర్థాశ్వాసం – అగస్త్యుడు తీర్థమహాత్త్యం చెప్పడం, శివలీలలు, భీమనాథుడు స్వయంభువుగా వెలయుట.
పంచమాశ్వాసం – సూర్యుడు కైలాసానికి వెళ్లి శివుని దక్షారామంలో కొలువుండమని కోరడం, శివుని రాక, భూదాన మహిమ.
చివరి ఆశ్వాసంలో దక్షవాటి, భీమమండలాల ప్రాశస్త్యం, ఫలశృతి.
స్థానీయత
స్థానీయత వాస్తవికమైనది, అద్దం లాంటిది. సాహిత్యంలో గానీ ఇతరశాస్త్రాలలో గానీ విశ్వజనీన ప్రమాణాలు డొల్లలుగానే మిగులుతాయి. స్థలకాల నిబద్ధమైన ఐతిహాసిక కథనాలు వ్యాపితమయ్యే కొద్దీ స్థానీయ అంశాలు అనే వాస్తవ ప్రేరేపితాలు కలిసి కథ ఎక్కడికక్కడి ప్రాంతీయతను సంతరించుకుంటుంది. రామాయణంలోని కొల్లలైౖన అవాల్మికాంశాలు ఇందు కుదాహరణ. మలి చారిత్రక యుగంలో పుట్టుకొచ్చిన పురాణ సాహిత్యం స్థానీయతలకు పట్టుగొమ్మలై నిలిచింది. కావ్యసాంప్రదాయంలో అవసరమైన చోటల్లా స్థానీయ పునాదులపై వస్తుగతంగా కథాక్రమమూ, ఆత్మగతంగా వర్ణనలూ, మానవాళి సమస్త సాంప్రదాయ వనరుల ఉటంకింపులూ, కదలాడుతూంటాయి. కాబట్టి స్థానీయత శిష్టకావ్యాలలో కూడా ఒక పాత అంశమే. జానపదం నిండుగా స్థానియాంశాల సమాహారం. వలసవాదుల చూపులనుండి స్థానీయ అంశాల వెదుకులాట, మూలవాసుల, జానపదుల, వివిధ జాతుల, ప్రాంతీయ అంశాల గవేషణ, ఉద్దరణ జరిగిందనుకోవడానికి పై వివరణ ఒక విరుగుడు కావొచ్చు.

మానవ సమాజం తాను నడిచిన, గడపిన స్థల కాలాదులను పదిలపరుచుకొని భావానువాదం నిరంతరం చేస్తునేవుంటుంది. భీమేశ్వర పురాణం స్థలపురాణం కావడం మాత్రమే కాకుండా కవి నడచిన దారిలో తన నత్యంత మైమరిపించిన ప్రాంతపు జాడలు పదిలపరచిన కావ్యంగా కూడా అగుపిస్తోంది.

అవతారికలో రాజమండ్రి పుర విశేషాలు (1-41,42) లింగమంత్రి అన్నదానం పేరుతో బ్రాహ్మణ భోజన వర్ణన (1-61), అన్నయమంత్రి దాతృత్యాన్ని చెప్పే బోడసకుర్తి (1-65), చోడవరం, (1-65), పలివెల (1-78) దక్షారామపురవర్ణన (1-88 నుండి 20 పద్యాలు), వ్యాసుడు కాశి, పూరీ, శ్రీకూర్మం, సింహాచలం మీదుగా (2-51) పిఠాపురం రావడం, ఏలానది పారుతున్న ప్రాంత శోభ, అక్కడ పండే పంటలు (రకరకాల ఫలశాకములు, దుంపలు 2-51 నుండి 60) కుమారారామ శోభ (2-61 నుండి 64), సర్పవర వర్ణన (2-65 నుండి 68), తుల్యభాగ నదీతీర సాంపరాయ గ్రామసీమ వర్ణన (2-72 నుండి 80), అగస్త్యుడు దక్షారామ మహిమను వ్యాసునకు చెప్పడం (3-12 నుండి 40), ఈక్రమంలో ఆ చుట్టుతా వున్న ఊర్ల పేర్లు సంపర, పులగుర్త, ఓదూరు, శీల, కోటిపల్లి, పిఠాపురం, సంగమేశ్వరం, పలివెల, రాజమండ్రి మొదలైనవాటి ఉటంకింపు, పలు తోటలూ (3-57 వచనం) వ్యాస అగస్త్యులు దక్షపురిని కీర్తించు యక్షగాన ప్రదర్శన (3-61), భూదాన మహిమలో అనువులు, మినుములు, గోధుమలు, శనగలు పండే భూమిని చెప్పడం (5-68), భీమమండలానికి హద్దులు చెప్పుట (5 -77,78,84), వసంత ఋతువర్ణనలో జాజర పాటలు పాడు అచ్చరలు ( 5-103) మొదలగు ఘట్టములు పూర్వ శోధకులు స్పృశించి పులకరించి తెలియజెప్పినవి.

నాకై పూర్వశోధకులు మిగిల్చిన కొన్ని కొత్త అంశాలతో భీమేశ్వరపురాణంలోని స్థానీయతను చారిత్రకాది కోణాలలో పరిశీలిస్తున్నాను.
1. యాత్రా కావ్యం
శాపగ్రస్తుడైన వ్యాసుని దక్షిణకాశి అనబడిన (కాశి అన్నపూర్ణచే) దక్షారామ యాత్రతో పాటు, అగస్త్యుడు వ్యాసునికి చూపించిన భీమమండల, దక్షారామ పరిసర ప్రాంతాల పరిచయం, గోదావరీ నదీ పాయల గమన యాత్రా విశేషాలతో ఉన్న యాత్రా కావ్యంగా కూడా భీమేశ్వరపురాణాన్ని చూడవచ్చు. ఈ ప్రయాణంలో వ్యాసుని కాశి నుండి పూరీ జగన్నాథం, శ్రీకూర్మం, సింహాచలం దాటించడం ఒకే సీస పద్యంలో (2-42) చేసి అనంతర భీమమండల యాత్రని అడుగడునా నాలుక తీరా (పద్యపద్యానా) శ్రీనాథుడు వర్ణించాడు.

మొదట పిఠాపురంలో ఏలానదీ తీరపు పలుపంటలు, తోటలు, పిఠాపుర క్షేత్ర దేవతలు, పలుపూలు, దుంపలు, పొలాలు (2-51 నుండి 60) కవి వ్యాసుని ద్వారా చూపించాడు. కుమారారామ (సామర్లకోట) సర్పవర క్షేత్రాలు (2-61 నుండి 68) తిప్పించి సాంపరాయ గ్రామ తుల్యభాగ నదీ తీర బిల్వవనాల (ఇప్పుడు కానరానివి) నీడలో (2-71 నుండి 86) సేద తీర్చాడు. అక్కడ తారసపడ్డ అగస్త్యునితో ముచ్చటలాడి వ్యాసుడు తన యాత్రకు హేతువు చెప్పి కాశిని విడిచినందుకు కళ్ళనీళ్ళు (3-4) పెట్టుకున్నాడు. ఎంత భీకర తపస్సులాచరించినా మునులు మానవ మాత్రులే కదా! శ్రీనాథుని దృష్టి ఇది. వెంటనే బాధ దిగమింగుకుని వ్యాసుడు కమండలంలో నీళ్ళతో కళ్ళు కడుక్కొన్నాడట. ఇది స్వాభావిక వర్ణన. అగస్త్యుని అర్థించగా వ్యాసునికి దక్షామ తోవతోపాటు ఆ స్థల మహిమ చెప్పి ఆ ప్రాంతమంతా వ్యాసుని అగస్త్యుడు కలయత్రిప్పాడు (3-12 నుండి 40.) (భారతేతిహాస, సకల పురాణకర్త అయిన వ్యాసుడు (అ) సర్వజ్ఞుడని సాంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి. అయితే వెల్చేరు నారాయణరావు, డేవిడ్‌ షూల్మన్‌లు వ్యాసుడు ఈ పురాణంలో సకల జన సామన్య లక్షణాలు కలవాడని తమ శ్రీనాథ పుస్తకంలో చెప్తున్నారు. ఈ పురాణ వ్యాసుని వ్యాస (ఆ) అని విభజించడం సమంజసం.)

వ్యాసుని భీమమండలం తిప్పడంలో శ్రీనాథుడు అగస్త్యునిచే ఒక విచిత్రం చేయించాడు. ఓంకారపురి (నేటి ఓదూరు) చెంత వుండి ఈ వూరు ఈ మండలానికి మధ్య ప్రాంతమని చెప్పాడు. అక్కడి నుండి ఆకాశమార్గాన ఈ మండల వైభవం చూద్దామని లోపాముద్ర వ్యాసాదులతో అగస్త్యుడు ఆకాశమెక్కి భీమమండలం మొత్తాన్ని (5-77) పక్షిచూపుతో చూపించాడు.

పూర్వ కావ్యాలలో విమానాలపైనుండి క్రింది ప్రాంతాలు చూడటం ఎక్కడైనా ఉన్నా, శ్రీనాథుడే గ్రద్ద చూపులాంటి చూపుతో ఆకాశం నుండి ఈ మండల క్షేత్రాలను (కోటిపల్లి, సంవేద్యం, దక్షారామం, సప్తగోదావరం, రాజమండ్రి, గౌతమి సాగరసంగమం – నేటి యానం కావచ్చు, పలివెల, పట్టిసం, కూమారారామం, కుక్కుటేశ్వరం, మొదలైనవి) అగస్త్యుని చూపుడు వేలికొసతో గుర్తించి చూపాడు. ఇది ఒక అబ్బురం. ముందుగానే చెప్పకున్నట్టు భీమమండలంపై అనుకంపతో ఒళ్ళు మరచేలా వర్ణించగల క్షేత్ర భౌగోళిక రేఖల ఆనవాళ్ళు బాగా ఎరిగినవాడైన శ్రీనాథుడు రచనలో ఈ క్రొందీరును తొక్కాడు. చదివే పాఠకుడైనా వినే శ్రోతైనా ఈ సన్నివేశం వద్ద ఒక వింత అనుభూతిని పొందేలా శ్రీనాథుని కలం ఈ ప్రాంతపు భౌగోళిక రేఖలను గీసింది. మొత్తానికి భీమపురాణ ప్రధాన కథ (వ్యాస యాత్ర) భీమమండల యాత్రా విశేషాలతో ఉన్న కావ్యం.

2. కపట భిల్లుండైన చలిగొండఱేని యల్లుని కథ
వ్యాసుడు దక్షారామం చేరడానికి ముందు తుల్యభాగ తీరంలోని సాంపరాయగ్రామ సమీప ముక్తీశ్వరుని దర్శించి బిల్వదళాలూ, రేలపూలూ, పద్మాలతో పూజ చేశాడు. అయితే ముక్తీశ్వర స్వామి రూపం చెప్పడంలో శ్రీనాథుడు ఆనాటికున్న అరుదైన శివలింగాన్ని మన ముందుంచుతున్నాడు. చూడండి.

‘తుల్యభాగా తీరంబున సాంపరాయణగ్రామంబు చేరువ బిల్వాటవీ వాటిఁగపట భిల్లుండైన చలిగొండఱేని యల్లుని ముక్తీశ్వరు దర్శించి’ – (భీ. పు. 3-72.)

వేద విభాగముల బరిఢవించిన పుణ్యుండు వేడ్కఁబూన్చెబి
ల్వీదళ పూజనంబు గడులెస్సగఁ గూరిమిశిష్యపంక్తితో
నాదిమ భిల్లు నిత్యకరుణామృత పూరము జల్లు పుండరీ
కోదర భల్లు నృత్తకరియూధపు మల్లుని గొండయల్లునిన్‌  - భీ. పు. – 3-73.

పై వచనము, పద్యాలలో శివలింగం పై కపటభిల్లుని రూపం స్పష్టమౌతుంది. (చిలుకూరి పాపయ్య శాస్త్రిగారు శ్రీనాథ కృతిసమీక్షలో (పుట-9) ‘నా డీశ్వర లింగమునఁ కిరాతవేషపు గుర్తులేమైన నుండెడివేమో!’ అనే సందేహించారు. కవి అంత స్పష్టంగా చెపుతున్నా కూడా!) కపటభిల్లుడైన శివలింగ రూపాలు తొలి చారిత్రక యుగాల్లో వుండడం గమనించవచ్చు.


గుడిమల్లం నిగడ వేల్పు (శివలింగం)
భారతదేశంలోనే అటువంటి మొదటి శివలింగం చిత్తూరు జిల్లా గుడిమల్లం గ్రామంలో పరశురామాలయంలోని శివలింగం. క్రీ. పూ. 2, 3 శతాబ్దాల నాటిది. వెనుక మాయా కిరాత వేషధారితో పానపట్టం లేని శివలింగం. రాజు తన అధికారానికి ప్రతీకగా పురుషాంగాన్ని ప్రతిష్టించిన కాలం. (దక్షారామ, కుమారారామాలు అలాగే చాళుక్యభీముని పేరున వెలసినవే. అయితే మలి చారిత్రక యుగానికి మార్పుచెందిన శివలింగాలవి.) క్రీ. పూ. 2వ శతాబ్దం నుండి ఈ క్రమం అనువాదమౌతూ వస్తోంది

మలిపౌరాణిక యుగానికి వచ్చేసరికి వ్యవసాయ సమాజాలు, బ్రాహ్మణీయ మార్పులకు గురౌతున్న క్రమంలో అప్పటి వరకూ విడిగా వున్న లజ్జగౌరి, ఇతర గ్రామదేవతల రూపం పానవట్టంగా మారి నేటి శివలింగరూపం ఏర్పడింది.


పానపట్టం లేని శివలింగం (కీసరగుట్ట)
నేటి తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో (క్రీ. శ. 4, 5 శతాబ్దాలు) కొండమీది నాలుగు వరసల్లో 70 లింగాలు (చెక్కేపని నేర్పేక్షేత్రం), లజ్జగౌరి ఆనవాళ్ళను ఐ.కె.శర్శ 1982లో కనుగొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో కూడా ఇటువంటి మాయాకిరాతుని ప్రతిమవున్న శివలింగం (క్రీ. శ. 5,6 శతాబ్దాలనాటి ఈ లింగం కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్‌ రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలో భధ్రపరచినది) దొరికింది.

ఇదే విషయమై చరిత్రలో ఇంకొంచెం ముందుకు వెళితే బౌద్ద గోళాకార స్థూప కట్టడాలు, జైన దిగంబర విగ్రహాల ప్రభావాలతో పానపట్టంతో కూడిన శివలింగ రూపంలో వజ్రయానం నాటికి కుదురుకున్నాయన్న వాదాలు వున్నాయి.

పై క్రమం పరిశీలిస్తే సాంపరాయగ్రామ ముక్తీశ్వర శివలింగంపై కపట వేటగాని రూపంలో ప్రతిమ శ్రీనాథుని కాలం వరకూ నిలిచి వుండడానికి కారణాలు ఏమై వుంటాయో? ఈ ప్రాంతం వేంగివిషయలో వున్నా మారుమూలాన వుండటంవల్ల ఆ పాత విగ్రహాన్ని తదనంతర పాలకులు పట్టించుకొని వుండకపోవచ్చు. వలసవాదుల కాలం వరకు శ్రీనాధుడు చెప్పిన శివలింగం ఇక్కడ వుండేదని, తర్వాత దాని స్థానే నేటిరూపంలో వున్న శివలింగం వచ్చిందని చిలుకూరి పాపయ్య శాస్త్రి శ్రీనాధకృతి సమీక్షలో చెప్తున్నారు. కాని, ఆయన ఈ రెండు శివలింగ రూపాలపై దృష్టి సారించలేదు.

ఏదేమైనా కపట కిరాతుని ప్రతిమ వున్న శివలింగం వల్ల శ్రీనాథుని భీమేశ్వరపురాణానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటి? అంటే ఇంత స్పష్టంగా సాంపరాయగ్రామ ముక్తీశ్వర లింగ ప్రతిమను కవి పేర్కొంటే సంస్కృత భీమఖండంలో (తెలుగులిపిలో గోదావరీ ఖండంలోనే లభిస్తున్న) వ్యాసుని సాంపరాయగ్రామ ముక్తీశ్వర దర్శన సందర్భంలో శ్రీనాథుడు చెప్పిన ఆనవాళ్ళులేని నేటి శివలింగ రూపాన్ని చూపిస్తోంది. ఆ శ్లోకాలివిగో:

తుల్యభాగాతటే రమ్యే బిల్వకాననారాజితే
సాంపరాయ మహగ్రామ సమీపే స్థితమవ్యయమ్‌
ముక్తీశ్వర మమాకాంతం దృష్ట్వాభక్తీవశం గతః
శిష్యసంఘేన సహిత స్సమ్యగ్బిల్వదళార్చనం
శీతాచలేంద్ర మాతుతురకరోత్తస్య సంయమీ
– చతుర్థాధ్యాయమ్‌ – 15,16,17 – భీ.ఖం.

శుద్ధస్వర్ణ ప్రతీకాశై రారగ్వధసుమైర్నవైః
సాంపరాయ మహగ్రామ సమీపస్థాయినం ప్రభుం
శంకరం పూజ్యమాన వ్యాసోనారాయణ స్స్వయం. – చతుర్థాధ్యాయమ్‌ – 18 – భీ. ఖం.

సంస్కృత భీమఖండంలో లేని కపట కిరాతుడై వున్న శివలింగాన్ని శ్రీనాథుడు ఉటకించాడు కదా! కాలం వెనకకు మరలదు కదా! ప్రాచీనమైన యీశ్వరలింగము మాత్రం నేడు లేదు. నేటి రూపంలో వుండే శివలింగం, పార్వతి విగ్రహం అక్కడ వున్నాయి. శ్రీనాథుడు పార్వతి విగ్రహ ప్రస్తావన అసలు చేయనే లేదు. పైన చెప్పిన మలిపురాణ కాలం (5, 6 శతాబ్దాలు) ముందరి శివలింగాలు విడిగా, పురుషాంగం రాజుకు ప్రతీకగా వేటగాని ప్రతిమలో చెక్కించడం, లజ్జగౌరి ప్రతిమలు వేరుగా వుండడం చారిత్రకాలు. బహుశా ఈ ముక్తీశ్వర క్షేత్రం ఈ విషయంతో పరిశీలిస్తే మరింత ప్రాచీనమైనదై వుండవచ్చు.

ఈ విషయాల ద్వారా సంస్కృత భీమఖండం అర్వాచీన కాలంలో (18 లేదా 19 శతాబ్దాలలో) తెలుగులిపి లోనే కర్త పేరు (వ్యాస) వ్యక్తం చేయకుండా (అలా చేయడం అవసరంకూడా కదా!) ఎవరో రచించినట్లు ప్రబలమైన సాక్ష్యంగా ఊహించవచ్చు.

3. తుల్య భాగ – చారిత్రక వాస్తవాలు
గోదావరీ లోయలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ పాయల మినహా పంట అవసరాలకు కాలవల తవ్వకమనే అంశం ఈ ప్రాంతపు ఆర్థిక, సాంస్కృతిక, ప్రగతిని వేగవంతం చేయడం చరిత్రలో నమోదైనదే. మధ్య యుగాల నుండి నీటివనరులతో సాగులోకొచ్చిన భూమి చుట్టూ వ్యవస్థ రూపు దిద్దుకోవడం. తద్వారా భూస్వామ్యం పెరగడం వల్ల ఈ విషయం భీమేశ్వరపురాణంలోని భూదాన మహిమ ద్వారా (5-60 నుండి 80) విపులంగా విశదమౌతుంది. కోటిపల్లి గౌతమీశాఖ నుండి దక్షిణాన వశిష్ట అంతర్వేదిపాలెం వరకువున్న కోనవిషయ (సీమ) వరదలకూ, ఉరవడికీ అనువైన ఆవ. అందుకే అక్కడ కొబ్బరిపంట విశిష్టసాగు అయ్యింది.

కోటిపల్లి గౌతమికి తూర్పుగోదావరి జిల్లా ప్రోలునాడు (పిఠాపురం, గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలాలు సుమారుగా) కొంతభాగము, చాగల్నాడు, మెట్ట మినహా మధ్య సాగు (డెల్టా) భూమిగా వున్న ప్రాంతంలో నీటివనరుని అనువుగా మార్చుకోవడం వ్యవసాయ సమాజం ఏర్పడిన మలిదశలో (ఇక్కడి సందర్భంలో తొలిమధ్య యుగాలలో చోళ, చాళుక్యుల కాలంలో) మొదలైంది. అలా చోళ చాళుక్యుల పాలనలో కాలవ వ్యవస్థ పటిష్టమయ్యే క్రమంలో ధవళేశ్వరం దాటిన తర్వాత ఏర్పరిచిన కాలవే తుల్యభాగ. ఈ పేరు కూడా అదే విషయాన్ని సూచిస్తుంది. ఈ తుల్యభాగ మరిన్ని పిల్లకాలువలై మధ్య సాగు ప్రాంతాలకు నీరు పారుస్తుంది. గౌతమి నుండి తుల్యభాగ విడివడిన ప్రాంతం నుండి కొద్ది పైభాగం నుండి ఏలేరు పాయ విడివడి ప్రోలునాడుకి ప్రధాన నీటి వనరు అయ్యింది. ఈ ఏలేటి పంట భూముల వైభవాన్ని వ్యాసుడు పిఠాపురం చేరిన సందర్భంలో శ్రీనాథుడు వివరంగా చెప్పాడు. ఈ నది (తుల్యభాగ) ఉత్పత్తి క్రమంలో జరిగిన వంతు పంపకాల గొడవను సద్దుమణిచే కథ తుల్యభాగుని పౌరాణీకరణ. (స్థానిక అంశాలను పౌరాణీకరించే శిష్ట వర్గ భావజాలంతో ఈ కథలన్నీ నిండిపోయినట్లే) ఈ కథలో కూడా వాతాపి, ఇల్వలుల పేర అంతకు ముందున్న పేర్లు ఇప్పనపాడు (ఇల్వలపురం), (వా)తాపేశ్వరంగా (పూర్వపు పేరు తెలియదు) రూపు దిద్దుకొని వుండవచ్చు.

సప్తర్షులు గౌతమిని భీమనాథుని చెంతకు తేవడానికి వెళ్ళిన క్రమంలో జరిగిన కథలో రాక్షస ఋషులు, సప్తర్షులు శాప ప్రతిశాపాలు ఇచ్చుకున్నారు. సప్తగోదావరి స్వాభావికతను (లేని దానిని) మార్మికంగా పౌరాణికం చేయడం (లుప్తమైన నదిని అంతర్వాహినిగా) కన్పిస్తుంది. అలాగే ఆ కాలానికి తుల్యభాగ పిల్లకాలవలు శుష్కించిన విషయాన్ని కూడా.

4. గ్రామదేవతలపై ప్రత్యేక చూపు
శిష్ట కవులలో శ్రీనాథుడు విభిన్నుడు. ఎంత శైవమతానుకంప తనలోవున్నా ఇతర దైవాలను అవసరమైన చోట కీర్తించాడన్నది ముందే చెప్పుకున్నాం. ఇంకొంచెం విస్తృత హృదయమున్న కవి కాబట్టే శ్రీనాథుడు పూర్వులెవరూ చేయని విధంగా, గ్రామదేవతల వర్ణనను భీమేశ్వర పురాణంలో చేశాడు. మొదటి ఆశ్వాశంలో దక్షారామ పురవర్ణనలో:

– ‘దక్షవాటిక’ పశ్చిమ ద్వారభూమి ప్రతివసించు — గోగులమ్మా’ (పద్యం – 99)
– ‘దక్షపురమున నుత్తరద్వారమందు — మండతల్లి’ (పద్యం – 100)
– ‘సారమతి దక్షవాటిక తూరుపుగవనిం — నూకాంబ’ (పద్యం – 101)
– ‘మట్టయినట్టి దకక్షుని పట్టణమున దక్షిణంబు ఘట్టాంబిక’ (పద్యం – 102)


మండాలమ్మతల్లి
అనే నలుగురమ్మలూ ఈ వాటిని కాచేవారని చెప్పాడు. అయితే పశ్చిమ, దక్షిణ దిక్కులున్న గోగులమ్మ, ఘట్టాంబికలు ఇప్పుడు దక్షారామానికి అవే దిక్కుల్లో వున్నాయి. నూకాలమ్మ వాయవ్యాన, ఆలయపు చెంత రావిచెట్టు క్రింద మండతల్లి మారుప్రాంతాలలో ఇపుడు కొలువైయున్నారు. అవసరమైన చోటల్లా శ్రీనాథుడు పై గ్రామదేవతల ప్రస్తావన తెచ్చాడు. ఆయనకు జానపదుల శక్త్యారాధనపై చిన్నచూపు లేదు.


నూకాలమ్మ గుడి
నూకాలమ్మ, గోగులమ్మ, మండాలమ్మల పేర్లు ప్రాకృతికమైనవి. ఘట్టాంబిక అనే పేరు సంస్కృతీకరించినది. ఇది శ్రీనాథుని కాలం నాటికే జరిగివుండవచ్చు. ఇపుడాపేరును (ఘంటాంబిక) ఘంటాలమ్మగా పిలుస్తున్నారు. ఘట్ట అనే శబ్దం శ్రీనాథుడు పేర్కొనడంలో దక్షవాటిలో జరిగిన ఘట్టాలను సూచించేదిగా వున్నా ఈ అంశంతో గ్రామదేవత లుద్భవించడం స్వాభావికం కాదు. అందునా దక్షారామ భీమేశ్వరాలయానికంటే ముందే ఈ దేవతారాధనలు చారిత్రకం. ఘటం అనే తెలుగు కుండకు సంస్కృతి రూపు దిద్దుకునే దశలో చాలా ప్రధానమైన స్థానముంది. గ్రామదేవతల జాగరణ కార్యక్రమంలో (గరగ రూపం కూడా అదే) ఊరేగింపులలో ప్రత్యేకించి వేసవి గాడ్పుల కాలంలో కొలిచే దేవతగా కుండాలమ్మ రూపు దిద్దుకొని వుంటే సంస్కరింపబడి ఘటాంబిక –> ఘట్టాంబికగా అయివుండొచ్చు.

5. ఒక ప్రేరణ – అపూర్వ ఉటంకింపు
శ్రీనాథునికి అన్నమయ్య (సుమారుగా 1408-1500) ఒక తరం (30 సం.లు) తర్వాతివాడు. అసమానుడు.

శ్రీనాథుడు కవితారీతులతోనూ, పద్యపు నడకలలోనూ, పలు అంశాలలో తర్వాతి కవులకు ఎలా అనుసరణీయమైయ్యాడో ఇప్పటికి పూర్వ పరిశోధనల వల్ల విశదమే. అయితే అన్నమయ్య తన పదాలను గ్రంథచౌర్యం చేసిన వారిని సంబోధిస్తూ

వెఱ్ఱులాల మీకు వేడుక కలిగితేను
అఱ్ఱు వంచి తడుకల్లంగ రాదా!

అనే కీర్తన ఆగ్రహంతో 10 చరణాలు చెప్పాడు. అన్నమయ్య కీర్తనలేవీ ఇన్ని చరణాలు కలవికావు. అందుకాయనలో కలిగిన ధర్మాగ్రహమే కారణం కావచ్చు.

పై కీర్తనకు, శబ్దార్థరీతులలో కూడా దారి చూపినదిగా శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో నాల్గవ ఆశ్వాసంలో క్షీరసాగర మథన కథా ప్రారంభంలో దేవదానవులను మందలిస్తూ శ్రీమన్నారాయణుడు పలికినట్లుగా ఉన్న పద్యాలు ఇవి.

ఓ వెఱ్ఱులార! యేటికి – నీ వెడగు విచారములు సహింపగరాదా?
యే వారికైన మేలా – చా4వుల తార్కితములుగ్రసంగ్రామములన్‌? – 52

కుడిచి కూర్చుండి మీరేల కొంతయైన – కుమ్ములాడెద? రోయన్నదమ్ములార!
గొఱ్ఱె క్రొవ్వియు సెలగట్టె గొరికినట్లు – కటకటా! మీ వివేకంబు గాటుపడగ! – 53

6. భీమవాటి – పౌరాణీకరణ
ప్రబంధరీతిలో చెప్తున్న కావ్యంలో స్థలపురాణం, క్షేత్రమహాత్త్యం వంటి అంశాలను పొందుపరచే క్రమంలో కవి ఆయా అంశాలను అతిశయించి చెప్పడం అరుదేమి కాదు. భీమేశ్వరపురాణం అడుగడుగునా ప్రతి పద్యంలోనూ ఈ మండల నదులనూ, వివిధ క్షేత్రాలనూ చూపిస్తూనే మండల మూలనాయకుడైన భీమనాథుని కూడా మహిమలతో స్థానీయం చేయడం జరిగింది.

శాపగ్రస్త వ్యాస కథకు ఆలంబనగా కాశీ దక్షారామ సాదృశ్యం (4-40), భీమనాథుని కొలవడం వల్ల ఫలమేమి? (4-32), దక్షారామ, భీమమండల దైవత్వ నిరూపణతో వున్న ఆరవ ఆశ్వాసం వీని కుదాహరణలు. మొదటి చాళుక్యభీముని పేర వెలసిన ఈ ఆలయ నాయకుని మహిమ చెప్పే హాలహల భక్షణ సందర్భంలో,

భీమమగు గరళకూటము – భూమిని గగనము దిశల బొడసూపినచో
భీమగతి మ్రింగెగావున- భీమేశ్వరుడయ్యె నితడు బిరుదాంకమునన్‌ – భీ. పు. 4-46.

అన్న పద్యంతో పౌరణిక ప్రాశస్త్యం సంతరించాడు శ్రీనాథుడు. అందుకే వెల్చేరు నారాయాణరావు, డేవిడ్‌ షూల్మన్‌లు వెలయించిన పుస్తకం Srinatha, the poet who made gods and kings అన్న మాట అక్షరసత్యమని నేను నిరూపించనవసరం లేదు.

7. కొసరుముచ్చట్లు
వర్ణనల్లో ఏకవికాకవి గొప్పవాడే. అయినా నేలబారు జనజీవితం తెలిసినవాడు, తన భాషా ప్రాంతపు ఎల్లల మధ్య ప్రజలభాష, నేలల, నెరిగినవాడు శ్రీనాథుడు. ఆయన అనుభవంలో నుండి పుట్టిన వర్ణనల సొబగును మూడే మూడు పదాల ద్వారా ఉదహరిస్తాను.

మొదటి ఆశ్వాశంలో దక్షారామపుర వర్ణనలో శివుని మహిమ చెబుతూ, ‘హాలాహలంబను నల్లొనేరేడుపండు మిసిమింతుడును గాక మ్రింగినాడు’ (111) — హాలోహలాన్ని అల్లొనేరేడుపండుతో పోలిక చెప్పడం,
రెండవ ఆశ్వాసంలో సూర్యాస్తమయ వర్ణనలో, ‘సంజె కెంపును దిమిరపుంజంపునలుపు – గమిచి బ్రహ్మండ భాండంబు గరిమమెరసె, పరమపరిపాకథ వృంతబాంధ మెడలి – పతనమగు తాటిపండుతో ప్రతిఘటించి’ – (30) — ఆకాశంపై సాయంసంజె ఎరుపూ, అలముకునే చీకటీ కలిసి బ్రహ్మాండం మిగలముగ్గి ముచ్చు తెగి పడడానికున్న తాటిపండులా ఉందట. మిగలముగ్గిన నల్లటి తాటిపండు ముచ్చుక దగ్గర, క్రింది భాగము, మధ్య పొట్ట మెల్లగా చీలుతుండగా ఎర్రటి చారికలతో కనుబడుతుంది. దానిని సూర్యాస్తమయ బ్రహ్మాండంగా భావించడం,
నాల్గవ ఆశ్వాసంలో దేవాసురులు అమృతానికై దెబ్బలాడుకునే సందర్భంలో, ‘ఱంతులు మీఱ మిక్కిలిగ ఱాగతనంబున దొమ్మిచేసి……. ‘ (96) అనుచోట దొమ్మి అనే నేటికీ ఉన్న పదప్రయోగం చేయడం,
పై మూడు పదాలూ శ్రీనాథునికున్న జన జీవిత సాగత్యాన్ని, పద ప్రయోగ నైపుణిని తెలుపుతున్నాయి.

ముగింపు
‘శ్రీనాథునిపై ఎందరెన్ని పరిశోధనలు చేసిన ఇంకా చేయవలసిందెంతో ఉంది. ఇతని జీవిత చరిత్ర మీదా, కవితా తత్వం మీదా ఎన్నో గ్రంథాలను వ్రాసినా ఈ విషయం పుష్పక విమానం లాంటిది’ అన్న ఆరుద్ర మాట (పుట 754 స.సా.) ఉచితమైనది. కావ్యరీతి తెలుగు పురాణాలలో (పేరులో మాత్రమే) రెండవదైనా (బసవపురాణం పలు దక్షిణభారత ప్రాంతాలను చెప్పినా శివలీలలను మాత్రమే ఉటంకిస్తుంది), స్థానీయ నిబద్ధమైన పురాణంగా (ప్రబంధ రీతిలో) అద్వితీయ ముద్రను శ్రీనాథుని భీమేశ్వర పురాణం బలంగా వొత్తింది.

పూర్వ పరిశోధకులు శ్రీనాథుని భీమేశ్వర పురాణంలోని కొన్ని చెప్పలేదనుకున్న అంశాలను స్థానీయతను దృష్టిలో ఉంచుకుని నా దృష్టి, శక్తుల మేర పరిశీలించిన ప్రయత్నం ఈ వ్యాసం.
----------------------------------------------------------
రచన: కర్రి రామచంద్రారెడ్డి, 
ఈమాట సౌజన్యంతో