Showing posts with label అన్యాపదేశం. Show all posts
Showing posts with label అన్యాపదేశం. Show all posts

Wednesday, July 28, 2021

ఇంతమాత్రానికే ఇంత గర్వం అవసరమా!

ఇంతమాత్రానికే ఇంత గర్వం అవసరమా! 




సాహితీమిత్రులారా!



రాజమందిరంలో నిరాటాకంగా తిరిగే రాజసేవకులు 

అదే తమపాలిటికి గొప్పగా భావించి గర్వించి 

రాజదర్శనానికొచ్చే పండితులను చూచి చూడనట్టుగా

వ్యవహరిస్తూ కసరుకొంటూ విర్రవీగితిరిగే వారిపై

ఒక కవిగారు పిల్లిపై పెట్టి ఈ విధంగా ఒక శ్లోకం చెప్పారు 

గమనింపగలరు-

మా గర్వ ముద్వహ బిడాల! మహీపతీనా

మంతఃపురం మణిమయం సదనం మమేతి

పట్టాభిషేకసమయే పృథివీపతీనాం

బాహ్య ట్థితస్య కలభస్య హి మండనశ్రీః!


ఓసీ పిల్లీ! నీవు మణిమయమైన రాజాంతఃపురంలో తిరుగుతున్నావని

ఇదే నా స్వంతిల్లని గర్వపడకురాజులకు పట్టాభిషేక మహోత్సవం జరిగే 

సమయంలో వెలుపలున్నగున్నయేనుగుకే అలంకార వైభవం కాబట్టి 

అలాంటి శుభసమయాల్లో నీమొగం చూచేవాళ్ళేవుండరు. పైగా 

నిన్ను చూస్తే అపశకునంగా భావిస్తారు. ఇంతమాత్రానికే 

ఇంత గర్వం అవసరమా - అని భావం

Saturday, July 10, 2021

వినాయకుడు పిల్లికి దండంపెట్టాడా!

వినాయకుడు పిల్లికి దండంపెట్టాడా!




సాహితీమిత్రులారా!



ఒక కవి ఎంతవారైనా సమయానుకూలంగా

ప్రవర్తించాలని అన్యాపదేశంగా ఈ శ్లోకం కూర్చారు

గమనించండి-


గణేశ స్త్సౌతి మార్జాలం స్వవాహ సాభిరక్షణే

మహా నపి ప్రసంగేన నీచాన్ సేవితు మిచ్ఛతి


గణపతి పిల్లి స్తుతిస్తున్నాడట-

ఎందుకనగా తనవాహనమై ఎలుకను రక్షించుకోవటానికి

దానిని స్తుతించకపోతే అది తన వాహనాన్ని 

ఎక్కడ మ్రింగేస్తుందోనని దాన్ని స్తుతిస్తున్నాడట

అంతటి దేవుడు కూడ ఆవిధంగా చేయవలసి వచ్చిందంటే 

గొప్పవాడు కూడ సందర్భాన్ని బట్టి నీచులను సేవించవలసి 

వస్తుందని శ్లోకంలో సమర్థించబడింది. కాబట్టి కవికి తటస్థించిన

సందర్భం కూడ అలాంటిదేనని అన్యాపదేశంగా కవి చెబుతున్నాడు.

Thursday, March 26, 2020

అందరూ ఒకలాటివారుకాదు కదా!


అందరూ ఒకలాటివారుకాదు కదా!



సాహితీమిత్రులారా!

ఒక కవి అన్యాపదేశంగా చెప్పిన పద్యం ఇది
చూడండి-

రేరే చాతక! సావధాన మనసా మిత్ర! క్షణం శ్రూయతామ్
అంభోదా బహవో వసన్తి గగనే సర్వేపి నైతాదృశా:
కేచిత్ వృష్టిభి రార్ద్రయన్తి వసుధాం గర్జన్తి కేచిద్వృథా
యం-యం-పశ్యసి తస్య-తస్య పురతో మాబ్రూహి దీనం వచ:

మిత్రా!
చాతకమా!
 ఒక్కమాట సావధానంగా విను.
ఆకాశంలో మేఘాలు అనేకములు.
అన్నీ ఒక లాటివేకాదు.
కొన్ని భూమిని ఫలింపచేస్తాయి.
మరి కొన్ని కేవలం ఉఱిమిపోతాయి.
కనిపించిన ప్రతి మేఘం దగ్గర
దీనంగా యాచించవద్దు.
అంటున్నాడు కవి.
నిజమేకదా!

Monday, January 9, 2017

నీవు కవికాదుగదా! అనుమానంగా ఉంది


నీవు కవికాదుగదా! అనుమానంగా ఉంది




సాహితీమిత్రులారా!

కొంచెం ఛందోజ్ఞానం ఉన్నవాళ్ళంతా
కవులమని చెప్పుకొని తిరిగే
నాటిరోజుల్లో శ్రీనాథుడు అన్యాపదేశంగా
గాడిదను సంబోధిస్తూ చెప్పిన పద్యం ఇది
చూడండి-

బూడిదబుంగవై యొడలు పోడిమి దప్పి మొగంబువెల్లనై
వాడల వాడలం దిరిగి వచ్చెడి వారలు చొచ్చొచోయనన్
గోడల గొందులందొదిగి కూయుచునుండెడి కొండవీటిలో
గాడిద! నీవుసుం గవివి గావుగదా! యనుమానమయ్యెడిన్

ఒంటినిండా బూడిదపూసుకొని, కళతప్పి,
ముఖం తెల్లగా పాలిపోయి వీధులన్నీ తిరుగుతూ,
ఎదురు వచ్చేవారు చొచ్చో అని అదిలిస్తుండగా
గోడలకు ఒదిగి ఓండ్రపెడుతున్నావు.
కొండవీటి పట్టణంలోని ఓ గార్దభమా!
నీవు కూడ కవివి కావు గదా!  నాకెందుకో
అనుమానంగా ఉందిసుమా అని
శ్రీనాథుడు కవిమ్మన్యులను ఎత్తి పొడిచాడు.
కేవలం గణయతి ప్రాసలు తెలిసి పద్యాలు
రాసినంతమాత్రాన ఎవరూ కవులుగాదని
ఆ కవులకు తెలియజెప్పడానికి గాడిద
నుద్దేశించి ఈ పద్యం చెప్పాడు. 

Sunday, December 25, 2016

పీనస రోగమున్నవాడు వాసనను గ్రహించలేడు


పీనస రోగమున్నవాడు వాసనను గ్రహించలేడు



సాహితీమిత్రులారా!


ఒక కవి వ్యంగగా కస్తూరిని సంబోధిస్తూ
చెప్పిన అన్నాపదేశ పద్యం ఇది
చూడండి-

పీనస రోగి నిన్ను తిలపిష్ట సమానము చేసినంతనే
వాని వివేక హీనతను వందురనేల కురంగనాభమా
మానవతీకపోలకుచమండలమండిత చిత్రపత్రికా
నూన వితాన వాసనల నుండుట లోకము నిన్నెరుంగదే
                                                                                (ప్రబంధరత్నాకరము)

కస్తూరి మంచి పరిమళం గల సుగంధద్రవ్యం.
పీనసరోగమున్నవాడు వాసనను గ్రహించలేడు
కాబట్టి అతని దృష్టిలో తెలకపిండి, కస్తూరి
రెండూ ఒక రకంగానే అనిపిస్తాయి అది వాని
అజ్ఞాన ఫలితం.

ఓ కస్తూరీ!  నీవు ఆ విషయంలో బాధపడవద్దు.
యువతుల చెక్కిళ్ళమీద, స్తనాల మీద
కస్తూరితో చిత్రించిన రకరకాల చిత్రాలను
వాటినుండి వ్యాపించే సువాసనను
ప్రపంచం గుర్తిసుంది కదా!

ఇది వ్యంగ్యంగా మరో అర్థాన్ని తెలుపుతుంది-
కవి పండితుల వైదుష్యాన్ని, ప్రతిభను
ఒక వివేకి గుర్తించనంత మాత్రాన
వారి గొప్పతనానికి ఏ విధమైన కొరత కలగదు.
ప్రపంచం వారి గొప్పదనాన్ని తప్పక గుర్తిస్తుంది
- అని భావం.