Thursday, May 31, 2018

రావణుని మానసిక అవస్థ


రావణుని మానసిక అవస్థసాహితీమిత్రులారా!"ప్రవరసేనుని సేతుబంధము" పదకొండవ ఆశ్వాసములో సీతకు రావణుడు రామచంద్రుని మాయాశిరమును చూపుటను, దానిని చూసి సీత ఉద్వేగముతో మూర్ఛపోయి, అటుపై అనేకవిధములుగా విలపించటము, త్రిజట యనే రక్కసి సీతను ఊరడించి, ధైర్యము చెప్పుట చిత్రింపబడినాయి. ఈ ఆశ్వాసమున మొదటి ముప్పై అయిదు శ్లోకములలో రావణుని తీవ్ర ఉన్మత్తావస్థను కవి మహానైపుణ్యముతో చిత్రించినాడు. రాముడు కపిసేనతో కూడి యుద్ధమునకై లంకకు ఏతెంచిన వార్త విని రాక్షసరాజుకు నిద్రపట్టుట లేదు. సీతమీది మోహము వేధించుచున్నది.

తం పులఇఅమ్మి పేచ్ఛఇ ఉల్లవన్తో అ తీఅ గేహ్ణఇ గోత్తమ్|
ఠాఇ అ తస్స సమఅణే అణ్ణమ్మి వి చిన్తిఅమ్మి స చ్చిఅ హిఅఎ||

ఛాయ:

తాం ప్రలోకితే పశ్యత్యుల్లపంశ్చ తస్యా గృహ్ణాతి గోత్రమ్|
తిష్టతి చ తస్య సమదనేऽన్యస్మిన్నపి చిన్తితే సైవ హృదయే||

చూచిన ప్రతి చోటా సీతముఖమే కనిపిస్తోంది. మాటాడిన ప్రతి మాటలోనూ ఆమె నామము దొరలుతూంది. ఆమెను మర్చిపోవటానికి ప్రయత్నము చేసే కొద్దీ, ఆమెయే హృదయంలో నిలుస్తోంది.

ఈ ఘట్టములో దశకంఠుని అవస్థ మయసభలో పరాభవం చెందిన కురురాజు దుర్యోధనుని మనఃస్థితిని కొంత ప్రతిబింబిస్తుంది. ఆ యవస్థను నివారించటానికి దశవదనుని పత్నులు విఫలప్రయత్నము చేస్తారు. ఈ దురవస్థను అతను సైపలేక చివరకు ఈ విధముగా చింతించినాడు: జనులు తమ ఆశలు శిథిలమయినప్పుడు, తమకు రక్షణ కరవైనపుడు, మిత్రులు దొరకనపుడు భయము చేత లజ్జను విడనాడి తమ నియమముల నతిక్రమింతురు.

ఈ విధముగా క్రూరముగా ఆలోచించి, రాక్షసరాజు భటులకు రాముని ఖండిత మాయాశిరమును తయారు చేయమని ఆజ్ఞనిచ్చినాడు. ఆ శిరమును జూపి భీతావహురాలైన సీతను స్వాధీనము గావించుకొనవలెనన్న కర్కశమైన కాంక్ష యతనిది. దశవదనములతో దనుజరాజు భటులకు యాజ్ఞనిచ్చునప్పుడు రావణుని (అవస్థ) వర్ణన ఇది. ఉన్మత్తతకు పరాకాష్ట.

అణ్ణేణ సమారద్ధం వఅణం అణ్ణేణ హరిసగహి అప్ఫిడిఅమ్|
అణ్ణేణ అద్ధభణిఅం ముహేణ అణ్ణేణ సే కఇ వి ణిమ్మవిఅమ్||

ఛాయ:

అన్యేన సమారబ్ధం వచనం అన్యేన హర్షగృహీతస్ఫేటితమ్|
అన్యేనార్ధభణితం ముఖేన అన్యేనాస్య కథమపి నిర్మాపితమ్||

మొదటి ముఖముతో వచనమునారంభించినాడు. ఇంకొక ముఖము రాక్షసానందముతో ఆ మాటలనందుకొనినాడు. ఆపై మాటలు రాక మరొక ముఖముతో మాటలాడినాడు. చివరన యెటులో మరొక ముఖముతో ఆజ్ఞను ముగించినాడు.

రావణాసురుని మనమునందున్న తీవ్రమైన అరిషడ్వర్గవిన్యాసము ముప్పది ఐదు శ్లోకములలో చిత్రింపబడి, పై శ్లోకమందు శిఖరాగ్రము నందుకొనినది.

సేతుబంధకారుని సీతాదేవి అసహాయ. అయినప్పటికీ ధీర. పరమ ముగ్ధ కాదు. ఆమె మాటలలో రాచకన్య యొక్క ధీరత్వము, ప్రతీకారేచ్ఛ కానవస్తుంది. సీతయందు ప్రవరసేనుడు నిలిపిన ధీరత్త్వము ’కుందమాల’ అను దృశ్య కావ్యమున తిరిగి కానవచ్చును. జానకిని ఊరడించుట త్రిజట వంతయ్యింది. సేతుబంధకవి రాముడు సాక్షాత్తు నారాయణుడు. ఈ విషయమును త్రిజట ముఖమున కవి చెప్పించినాడు. చివరకు వానరుల యుద్ధసంరంభమును, భేరీ నినాదములను విని సీత ఊరడిల్లును.

ఈ ఆశ్వాసము నందు సేతుబంధకారుడు సీతయొక్క పాత్రచిత్రణమునూ, రావణుని ఉన్మత్త మానసిక అవస్థను అపూర్వముగా చిత్రించినాడు. పూర్వఘట్టములందు సుగ్రీవుని పాత్రచిత్రణమును, నాయకత్త్వప్రతిభను గురించిన ప్రస్తావన ఇదివరకు ఉటంకింపబడినది.

యుద్ధము మొదలైనది. వానరయోధుని బలమును, పరాక్రమమును కవి చిత్రించుచున్నాడు.

కఇవచ్ఛత్థలపరిణఅణిఅఅముహత్థమిఅదన్తిదన్తప్ఫలిహమ్|
ణిహఅ భడ మహిఅ ణివడిఅ సురవహుచల వలఅ ముహలపవ అవఇవగమ్||

ఛాయ:

కపివక్షఃస్థలపరిణత నిజముఖాస్తమిత దన్తిదన్తపరిఘమ్|
నిహత భట మహిత నిపతిత సురవధూచల వలయ ముఖరప్లవగ గతిపథమ్||

అసురసైన్యమందలి యుద్ధగజమొక్కటి ఒకానొక వానరయోధుని పాషాణసదృశమైన వక్షఃస్థలమును తన కొమ్ములతో కుమ్మింది. ఆ అదటుకు వానరశ్రేష్టునికి యేమీ నొప్పి కలుగలేదు కానీ, గజము యొక్క దంతము మాత్రము వెనుకకు వంగి దానిముఖములోనికే చొచ్చినది. ఇక్కడ వానరయూధుల దేహదారుఢ్యము వ్యంజితము. నిహతులైన వానరయోధుల కొనిపోవుటకు వచ్చిన స్వర్గలోకవాసులైన అప్సరల నూపురనాదములతో యుద్ధపథమతిశయించినది.
-----------------------------------------------------------
ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము - అనే వ్యాసం నుండి
దీని రచయిత రవి. ఈ మాట- జనవరి 2016

Wednesday, May 30, 2018

ఆగమాలు అంటే ఏమిటి?


ఆగమాలు అంటే ఏమిటి?సాహితీమిత్రులారా!మన హిందూమతంలో ఆగమాలని తరచు వింటుంటాం
అవేమిటో ఇక్కడ తెలుసుకుందాం-

దేవాలయాలను, దేవతావిగ్రహాలను నిర్మించి ప్రతిష్టించే
విధానాలను, దేవతాసాన్నిధ్య సాక్షాత్కారాలు లభించడానికి
చేయవలసిన పూజా పునశ్చరణాదులను వివరించే శాస్త్రం
ఆగమశాస్త్రం. దీనికి సర్వవిద్యలూ, కళలూ, అనుబంధాలనీ,
సర్వ తత్త్వ పురుషార్థాలను ఇది ప్రతిపాదిస్తుందనీ చెబుతారు.
ఇందులోని మంత్ర తంత్రాది విధానాలన్నీ నాలుగు వేదాల
నుండి గ్రహించినవే.

క్షీర సముద్రాదులలో నెలకొని ఉన్న వ్యూహ, స్వరూపాదుల
నుంచి దేవతా శక్తిని ఆకర్షించి, దానిని పూర్ణకుంభ, యంత్ర,
విగ్రహాదులలో ప్రసరింపచేసి, పూజా విధానాలచేత వృద్ధి
పొందింపచేసే మనోరథాలను తీర్చుకొనే ప్రక్రియలు
ఆగమాలలో చెప్పబడినాయి. దేవతల ఆగమాన్ని గూర్చి
తెలుపుతాయిగనుక ఇవి ఆగమాలు అని పిలుస్తారు.
నిఖిలార్థాలను సంగ్రహంగా బోధిస్తాయి గనక ఇవి
ఆగమాలైనాయని మరొక వివరణ -
(ఆ సమన్తాత్ గమ్యన్తే నిఖిలా అర్థాఇతి ఆగమః)
ఆగత, గత, మత, అనే మూడు శబ్దాల మొదటి అక్షరాలను
కలుపగా ఆగమ శబ్ద వచ్చినట్లు ఆగమాలలో చెప్పబడింది. శైవ,
వైష్ణవ, శాక్తాయ, భేదం చేత ఆగమాలు 3 విధాలు. వీటిలో శాక్తేయ
ఆగమాలకు తంత్రాలని పేరు. ఇవిగాక గాణాపత్య భైరవాది
తంత్రాలు కూడా ఉన్నాయి.దక్షిణ భారతదేశంలో శైవ వైష్ణవ ఆగమాలకు,
ఉత్తర భారతదేశంలో తంత్రాలకూ ప్రచారం ఎక్కువ. ఆగమాలలోగాని,
తంత్రాలలోగాని ప్రధానంగా మంత్ర, యంత్ర ఉపాసనాక్రమాలు
వర్ణించబడి ఉంటాయి. శైవ వైష్ణవ ఆగమాలలో విశేషించి దేవాలయ
విగ్రహ నిర్మాణ ప్రతిష్ఠా విధానాలు, వాస్తు, గాన, పాకాది విశేషాలు,
పంచకాల పూజాదులు కూడా నిరూపింపబడి ఉంటాయి.

Tuesday, May 29, 2018

కందుకూరి రుద్రకవి - బలవదరీ శతకం


కందుకూరి రుద్రకవి - బలవదరీ శతకం
సాహితీమిత్రులారా!కందుకూరి రుద్రకవి రెండు శతకాలు వ్రాసినట్లు తెలుస్తున్నది.
వాటిలో ఒకటి బలవదరీ శతకం, రెండవది ధరశరధీరధీశనుత
శతకంఇవి రెండునూ అలభ్యాలే. కాని మొదటి శతకం లోని కొన్ని
పద్యాలు వేటూరి ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్యమణిమంజరిలో
ఉదహరించి వున్నారు. వాటిలో రెండు ఇక్కడ చూద్దాం-

కలశపయోధి మీఁద తరగల్ మఱి హోయని మ్రోయ వేయుభం
గుల తలపాన్పు పాము బుసకొట్టగ నేగతి నిద్రజెందెదో
యలసత తండ్రి చీమ చిటుకన్నను నిద్దురరాదు మాకు నో
బలవదరీ దరీకగహరభస్వదరీ యదరీదరీ హరీ

ఒకవైపు సముద్రం ఘోష పెడుతుంటే, చెవిలో ఆదిశేషుడు
బుసపెడుతుంటే నీకెలా నిద్రపడుతూంది ఓహరీ మాకైతే
చీమ చిటుక్కన్నా నిద్రరాదే - అని వ్యంగ్యంగా శ్రీహరిని
అడుగుతున్నాడు కవిగారు.

అల పగవాని తమ్ముడు భయాతురుడై చనుదెంచినంతటన్
బళిబళి వచ్చితీవనుచు బట్టముఁ గట్టవె లంక కప్పుడే 
కొలిచిన నిన్నె కొల్వవలె కోరిక లిచ్చిన నీవ యీవలెన్
బలవదరీ దరీకగహరభస్వదరీ యదరీదరీ హరీ

ఓ హరీ పగవాడైన విభీషణుడు వచ్చి పాహి అనంగానే
అభయమిచ్చి కాపాడి అప్పుడే లంకకు పట్టం కట్టించావు
కొలిస్తే నిన్నే కొలవాలి కోరికలు తీర్చాలంటే నీవే తీర్చాలి
 అంటున్నాడు కవి.


Monday, May 28, 2018

గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2


గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2


సాహితీమిత్రులారా!

గణపతి: అంతు చిక్కని వింత దేవుడు రెండవభాగం  ఆస్వాదించండి-

(డిన్నరును ముగించిన పిమ్మట ప్రమదామణియైన సతీదేవి ‘వేద వాఙ్మయంలో ఏ మాత్రమున కనిపించని గణేశుడు పురాణకాలం నాటికి దేవ గణంబుల నాయకుడిగా ప్రఖ్యాతి పొందిన తెఱంగు తేటపడ వినం గుతూహలంబై యున్నది, వినిపింపు’మని యడిగిన సుఖాసీనుడైన సురేశ్వరుండు, గజముఖుడైన వినాయకుండు విఘ్ననాయకుండై దేవగణంబున జేరి గణాధిపతియైన కథాక్రమంబును ఈ ప్రకారంబుగా చెప్పదొడంగెను!)

వేదసాహిత్యంలో గణపతి
వేదసాహిత్యం అంటే నాలుగు వేదాలే కాదు, ఈ నాలుగు వేదాలలోని శ్లోకాల అర్థాన్ని వివరించడానికి తరువాతి కాలంలో వివిధ వేదపాఠశాలల్లో చెప్పుకున్న వ్యాఖ్యానాలను కూడా వేదవాఙ్మయంలో భాగంగానే పరిగణిస్తారు. బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు ఇవి వేదాలకు అనుబంధాలుగా వచ్చిచేరాయి.

వేదపాఠానికి తొలినాళ్ళలో రాసిన వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారు. ప్రతి వేదశాఖకు (పాఠశాలకు) సొంత బ్రాహ్మణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఋగ్వేద సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా చెబుతారు కాని, మనకు ఆరు బ్రాహ్మణాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఇందులో ఐతరేయ బ్రాహ్మణం అతి ప్రసిద్ధమైనది. అలాగే యజుర్వేద సంహితకు సంబంధించిన 12 బ్రాహ్మణాలు ఉన్నాయని చెబుతారు. ఇందులో కృష్ణ యజుర్వేదశాఖకు చెందిన తైత్తిరీయ బ్రాహ్మణం దక్షిణ భారతంలో అతి ప్రసిద్ధి చెందింది.

వివిధ కర్మ, యజ్ఞ కార్యాల అంతరార్థాలను ఇంకా విపులంగా వివరించేవి ఆరణ్యకాలు. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు మాత్రమే కాక పరబ్రహ్మ స్వరూపాన్ని లోతుగా చర్చించే ఉపనిషత్తులు తరువాతి కాలానికి చెందినవైనా వాటిని కూడా వేదసాహిత్యంలో భాగంగానే పరిగణిస్తారు. ఉపనిషత్తులు జ్ఞాన ప్రధానం. ఉపనిషత్తులు వేదానికి చివరివి కాబట్టి వాటిని వేదాంతం అని కూడా అంటారు.

వేదాలలో మరికొన్ని గణపతి స్తుతులు
క్రితం చెప్పినట్టు వేదాలలో అతి ప్రాచీనమైన ఋగ్వేదంలోని రెండవ మండలంలో కనిపించే ‘గణానాం త్వా గణపతిగ్ం’ (2.23.1) అన్న శ్లోకం బ్రహ్మణస్పతి సూక్తంలోనిది. ఈ శ్లోకంపై వ్యాఖ్యానం చేసిన బ్రాహ్మణాలన్నింటిలోనూ ఇది బ్రహ్మణస్పతి అయిన బృహస్పతి గురించిన శ్లోకం అనే వివరించారు. ఋగ్వేదంలోని ఇదే శ్లోకం యథాతథంగా కృష్ణయజుర్వేదానికి చెందిన తైత్తిరీయ సంహితలోనూ (2.3.14.3) కాఠక సంహితలోనూ (10.12.44) కనిపిస్తుంది. అయితే, శుక్లయజుర్వేద శాఖకు సంబంధించిన వాజసనేయి సంహితలో, కృష్ణయజుర్వేదానికి చెందిన మైత్రాయణీ సంహితలో (3.12.20) కొంత భేదంతో ఈ శ్లోకం కనిపిస్తుంది:

గణానాం త్వా గణపతిం హవామహే
ప్రియానాం త్వా ప్రియపతిం హవామహే
నిధినాం త్వా నిధిపతిం హవామహే వసో మమ
అహమజానీ గర్భధమా త్వమజాసి గర్భధం॥

గణములలో గణపతివి, ప్రియులలో ప్రియపతివి; నిధులకు నిధిపతివి; నాకు యజమానివి; హిరణ్య గర్భానివి; నాకు ఈ సృష్టి గర్భాన్ని అందజేయుము.

ఈ శ్లోకం అశ్వమేధయాగ సమయంలో ఉపయోగించే శ్లోకంగా మైత్రాయణీ సంహిత పేర్కొన్నది. స్పష్టంగా ఇది హిరణ్యగర్భుడిని (ప్రజాపతిని) ప్రార్థించే శ్లోకం, గజముఖుడైన గణపతి గురించి కాదు.

కృష్ణ యజుర్వేద సంహితాల్లో హస్తిముఖుని ప్రస్తావన
ఇదివరకు చెప్పినట్టుగా, ప్రధాన వేద మంత్రపాఠాలలో ఎక్కడా గజముఖుడైన గణపతి ప్రస్తావన కనిపించదు. అయితే, దీనికి ఒకే ఒక్క మినహాయింపుగా కృష్ణయజుర్వేద శాఖకు చెందిన మైత్రాయణీయ సంహితలో ఈ గాయత్రి శ్లోకం కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం:

తత్ కరాటాయ విద్మహే
హస్తిముఖాయ ధీమహి।
తన్నో దంతీ ప్రచోదయాత్॥ (మైత్రాయణీయ-సంహిత)

ఇది కచ్చితంగా గజముఖుడైన గణేశుని వర్ణించే శ్లోకమే అని చెప్పక తప్పదు. కరటి అంటే ఏనుగు లేదా ఏనుగు చెక్కిళ్లు అన్న అర్థాలున్నాయి కదా. హస్తిముఖం అంటే మళ్ళీ ఏనుగు ముఖమనే అర్థం. దంతీ అంటే దంతము కలది అన్నది ఏనుగుకున్న పర్యాయపదాల్లో ఒకటి. హస్తి, దంతీ సంస్కృత పదాలైతే, కరాటి/కరటి అన్న పదం దేశ భాషలనుండి సంస్కృత భాషలోకి వచ్చి చేరిన పదమని కొంతమంది భాషావేత్తల అభిప్రాయం.

నిజానికి ఋగ్వేద సంహితలోని సూక్తాలు, మంత్రాలు ప్రాచీన దేవతలైన అగ్ని, ఇంద్ర, మిత్ర, వరుణ, సవితృ, ప్రజాపతి, బృహస్పతి, విష్ణు, ఆర్యమన్, వివస్వంత మొదలైన వారిని స్తుతించేవి. ఋగ్వేదంలో కనిపించే ఒకే ఒక్క గాయత్రి మంత్రం సవితృ దేవతను స్తుతించేది.

ఓం భూర్భువస్వః
తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి।
ధియోయోనః ప్రచోదయాత్॥

ఈ ప్రసిద్ధ గాయత్రి మంత్రాన్ని ఆధారం చేసుకొని తరువాత వచ్చిన వేదాలలో వివిధ దేవతలను స్తుతించే గాయత్రి మంత్రాలు సృష్టించబడ్డాయి. అనేక దేవతలను స్తుతిస్తూ ఈ గాయత్రి మంత్రాలలో విద్మహే, ధీమహి, ప్రచోదయాత్ అనే పదాలు ప్రతి మంత్రంలో వాడబడ్డాయి. ఉదాహరణకు విష్ణుగాయత్రి మంత్రం ఇలా సాగుతుంది:

ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణుః ప్రచోదయాత్

యజుర్వేద గాయత్రి మంత్రాల్లో బ్రహ్మ, విష్ణు, రుద్రులతో పాటు ఋగ్వేదంలో లేని దేవతలైన కాత్యాయని (దుర్గ), స్కంద, గౌరి, నారాయణ, భాస్కర మొదలైన కొత్త దేవతలను స్తుతించే గాయత్రి మంత్రాలు కూడా మనకు కనిపిస్తాయి.

మైత్రాయణీయ సంహిత మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరి వేదపాఠశాలకు సంబంధించిన కృష్ణ యజుర్వేదశాఖ. దీని సంహిత తొలిరూపం దాదాపు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటిదని ఒక అంచనా. ప్రస్తుతం లభ్యమౌతున్న కృష్ణయజుర్వేద సంహితాలలో దీన్ని ప్రాచీనమైనదిగా పరిగణిస్తారు.

అయితే, కృష్ణయజుర్వేద శాఖకే చెందిన ఇతర యజుర్వేద సంహితాల్లోను, శుక్ల యజుర్వేద సంహితాల్లోనూ ఈ హస్తిముఖ గాయత్రి శ్లోకం కనిపించదు. కాబట్టి చాలామంది పండితులు ఈ శ్లోకాన్ని ప్రక్షిప్తంగానే పరిగణిస్తారు. ఉదాహరణకు ఆంధ్రదేశంలో దొరికిన తైత్తిరీయ సంహితలో ఈ శ్లోకం లేదు. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆంధ్రదేశపు తైత్తిరీయ సంహితలోని గ్రాయత్రీ శ్లోకాల్లో మైత్రాయణీయ సంహితలో కనిపించని నరసింహ స్తుతి కనిపిస్తుంది. నరసింహుడిని స్తుతించే గాయత్రి మంత్రం ఇలా సాగుతుంది:

వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి।
తన్నో నృసింహః ప్రచోదయాత్॥ (తైత్తిరీయ సంహిత-ఆంధ్ర)

అంటే ఈ యజుర్వేద శాఖలు తమ స్తోత్రపాఠాలలో స్థానికంగా ఉన్న గ్రామదేవతలకు చోటు కల్పించే ప్రయత్నం ఆ రోజుల్లో జరిగిందని మనం ఊహించవచ్చు. గజముఖుడైన దేవునికి మహారాష్ట్రంలో ప్రాతినిధ్యం ఉంటే, ఆంధ్రదేశంలో సింహముఖుడైన నరసింహుడిని కొలిచేవారేమోనని ఊహించడం సత్యదూరం కాదేమో. స్కాంద పురాణంలో కనిపించే గుర్రం తలతో ఉన్న హయగ్రీవుడు, జంతువుల తలతో ఉన్న దైవరూపాలకు మరో ఉదాహరణ.

అయితే తైత్తిరీయ సంహిత మరో ప్రతి పూణె లోని ఆనందాశ్రమంలో దొరికింది. ఇందులో హస్తిముఖ గాయత్రి శ్లోకం లేదు కానీ, ఆంధ్ర తైత్తిరీయ సంహితలో నందీ గాయత్రి స్థానంలో వక్రతుండుడిని స్తుతించే శ్లోకం ఉంది:

తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి।
తన్నో దంతీ ప్రచోదయాత్॥ (తైత్తిరీయ సంహిత-ఆనందాశ్రమ)

అయితే వ్యాఖ్యానంతో సహా 19200 పద్య, గద్యాలున్న ఈ కృష్ణయజుర్వేద సంహితంలో ఒకే ఒక్క గాయత్రి శ్లోకం మాత్రమే గజముఖుడైన గణపతి గురించి ప్రస్తావిస్తుంది. అంతేకాక, యజుర్వేదంలోని శాంతి మంత్రాల్లో బ్రహ్మ, విష్ణు, రుద్రులతో పాటు మిగిలిన దేవతలకు సంబంధించిన శాంతి మంత్రాలు కనిపిస్తాయి కాని, గణేశుడిని శాంతింపజేసే శాంతి మంత్రం ఏ సంహిత పాఠాల్లోనూ కనిపించదు. ఈ కారణాలవల్ల మైత్రాయణీయ సంహితంలోనూ, తైత్తిరీయ సంహిత (ఆనందాశ్రమ)లోనూ కనిపించే ‘గణేశ’ స్తోత్రాలు ప్రక్షిప్తమని చెప్పకోవచ్చు.

యజుర్వేదం తరువాతి కాలం నాటిదయిన అథర్వవేదంలో కూడా ఎక్కడా గజముఖుడైన గణేశుని ప్రస్తావన కనిపిచకపోవడం వల్ల కూడా గణేశుడు వేదకాలంలో వైదిక దేవతల్లో ఒకడుగా పరిగణింపలేదని చెప్పడానికి వీలు కల్పిస్తుంది.

వేర్వేరు యజుర్వేద గాయత్రి మంత్ర పాఠాల్లో భేదాలుండడం, ఒక్క గాయత్రి మంత్రభాగంలో తప్ప మిగిలిన యజుర్వేద సంహితలో మరెక్కడా గణేశుడు కనిపించకపోవడం, శాంతిమంత్రాల్లో గణేశున్ని శాంతింపజేసే మంత్రం లేకపోవడం; అథర్వవేదంలో గణేశుని ప్రస్తావన లేకపోవడం వంటి ఆధారాలను బట్టి గణేశుడు యజుర్వేదకాలం నాటికి కూడా వేద సాహిత్యంలో భాగం కాదని, ‘హస్తిముఖ’, ‘వక్రతుండ’ గాయత్రి మంత్రం తరువాతి కాలంలో ప్రక్షిప్తంగా జతచేయబడిందని పండితుల వాదన.

ఇతిహాసాల్లో గణపతి
రామాయణంలో లేని గణేశుడు
ఆది కావ్యంగా కీర్తించబడ్డ వాల్మీకి రామాయణంలో ఎక్కడా గజముఖుడైన గణేశుని ప్రస్తావన కనిపించదు. అయితే, ప్రస్తుతం మనం వినాయకుని సోదరునిగా పరిగణించే కుమారస్వామి ప్రస్తావన మాత్రం బాలకాండలో కనిపిస్తుంది. అయితే, ఇక్కడ స్కందుడైన కుమారస్వామిని అగ్నికి కుమారునిగా వర్ణించడం విశేషం:

అనుయాతౌ శ్రియా దీప్తౌ శోభయేతామ్ అనిన్దితౌ।
స్థాణుమ్ దేవమ్ ఇవ అచిన్త్యమ్ కుమారౌ ఇవ పావకీ॥ (బాల 1-22-8)

విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు నడచి వెళ్తూవుంటే వారిద్దరూ అగ్ని కుమారులైన స్కందుడు, విశాఖుడు స్థాణువు (శివుడు) వెంట నడిచి వెళ్తున్నట్టు అనిపిస్తున్నది.

అంటే రామాయణ కాలం నాటికి స్కందుడు వినాయకుని సోదరుడన్న ఊహ లేదు. అంతేకాక స్కందుడు శివుని కుమారుడిగా కాక అగ్నిపుత్రునిగా ఇక్కడ వర్ణింపబడటం గమనార్హం. ఇతిహాస పురాణ కథల ఆధారంగా చూస్తే స్కందుడు గణేశుని కంటే ప్రాచీనమైన దేవుడు. స్కందుని పుట్టుపూర్వోత్తరాల గురించి రాయాలంటే మరో పెద్ద వ్యాసమే అవుతుంది కానీ, వాల్మీకి రామాయణంలో మాత్రం గజముఖుడైన వినాయకుని ప్రస్తావన లేదని కచ్చితంగా చెప్పవచ్చు.

మహాభారతంలో గణపతి
మహాభారత రచన అనగానే చాలామందికి వ్యాసుడు మౌఖికంగా చెబుతూ ఉంటే గణపతి లేఖకుడిగా రాసే దృశ్యం తలపుకు వస్తుంది. మనకు తెలిసిన కథ ప్రకారం, వ్యాసుడు భారతం రాయాలనుకున్నాడు. లేఖకుడిగా ఉండమంటూ వినాయకుడి సాయం కోరతాడు. ఓ మానవ ఋషి చెప్పేది రాయడమేంటి అని మొదట ఆలోచిస్తాడు వినాయకుడు. చివరకు ‘నా ఘంటం ఆగిపోని వేగంతో చెబితేనే రాస్తాను’ అంటూ చిన్న షరతు పెడతాడు. వ్యాసుడు కూడా ‘నేను చెప్పేది సంపూర్ణంగా అర్థం చేసుకుని మాత్రమే రాయాలి’ అంటాడు. అలా వ్యాసుడు భారతం చెప్పడం మొదలుపెడితే వినాయకుడు తన దంతాన్ని పెకిలించి ఘంటంగా మార్చుకుని రాయడం మొదలుపెడతాడు. ఫలితంగా ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాల మేళవింపుతో మహాభారతం రూపుదిద్దుకుంది.

అయితే, గణపతి లేఖకుడిగా ఉండే కథ అన్ని మహాభారత ప్రతుల్లో కనిపించదు. నిజానికి మన భారతదేశంలో సంస్కృత మహాభారతానికి వేలకొలది ప్రతులు దేశమంతటా దొరుకుతాయి. అయితే, ఉత్తరభారతంలో నాగరి లిపిలో దొరికే మహాభారత ప్రతికీ దక్షిణభారతంలో దొరికే భారతప్రతికీ శ్లోకాల సంఖ్యలోనూ అమరికలోనూ విభేదాలు కనిపిస్తాయి. అలాగే శారదా, నేపాలీ, మైథిలి, బెంగాలీ అంటూ దేశమంతటా దొరికే ప్రతులను ఒకదానితో ఒకటి పోలిస్తే ఎన్నో విభేదాలు, ప్రక్షిప్తాలు కనిపిస్తాయి. విష్ణు సీతారామ్ సుక్తాన్కర్ అనే సంస్కృత పండితుని నాయకత్వంలో భండార్కర్ ప్రాచ్య పరిశోధనా సంస్థ (The Bhandarkar Oriental Research Institute) ఆధ్వర్యంలో భారతదేశంలో పలుచోట్ల లభించే మహాభారత ప్రతులను సేకరించి, ఒక్కో శ్లోకాన్ని అనేక ప్రతులలో తులనాత్మకంగా విశ్లేషించి, వాటి ద్వారా శుద్ధి చేయబడిన ఒక మహాభారత ‘మార్జిత’ ప్రతిని (critical edition) తయారుచేశారు. అయిదు దశాబ్దాల దాకా సాగిన ఈ మహాయజ్ఞంలో ఎంతోమంది సంస్కృత పండితులు పాల్గొని దాదాపు 1300 దాకా ప్రతులను విశ్లేషించారు.

అలా ఆ భండార్కర్ సంస్థ వారు ప్రచురించిన ‘మార్జిత’ ప్రతిలోని ఆదిపర్వంలో వ్యాసుడు గణపతిని లేఖకుడిగా ఉండమని అర్థించే కథ లేదు. ఎందుకంటే నాగరి లిపిలో ఉండే ఒక భారత ప్రతిలో కావ్యస్య లేఖనార్థాయ గణేశః స్మర్యతాం మునే (1-1-109) అంటూ మొదలుపెట్టి ఎనిమిది శ్లోకాలుగా సాగే కథ ఇతర ప్రతుల్లో కనిపించదు. ఉదాహరణకు ఆంధ్రదేశంలో తెలుగు లిపిలో దొరికిన మహాభారత ప్రతులలో ఈ కథ లేదు. (నన్నయ్య రాసిన తెలుగు భారతంలో కూడా ఆదిపర్వంలో లేఖకుడైన గణపతి కథ కనిపించదు.) అంతేకాక, ఉత్తరభారతంలోనే దొరికిన సంస్కృత మహాభారత ప్రతులలో ముఖ్యమైన శారదా, నేపాలీ, మైథిలి, బెంగాలీ ప్రతులలో ఎక్కడా ఈ వ్యాస గణేశుల కథ కనిపించదు. అయితే, తమిళనాడులోని కుంభకోణంలో దొరికిన మహాభారత ప్రతుల్లో ఈ కథ ఉంది. ఎక్కువ ప్రతుల్లో ఈ కథ లేకపోవడం వల్ల ఈ కథ తరువాతి కాలంలో జతచేసిన ప్రక్షిప్తమేనని ఈ పండితులు నిర్ణయించారు.

ఈ కథను వదిలేస్తే, మహాభారతంలో గణపతిగా, గణేశునిగా చాలా చోట్ల శివుడిని వర్ణించే శ్లోకాలు కనిపిస్తాయి. అంతేకాక మహాభారతంలో దక్షప్రోక్తశివ-సహస్రనామ స్తవంలో శివునికి ఉన్న సహస్రనామాలలో గణాధిప, గణేశ్వర, గణాధ్యక్ష, గణకార, గణకర్తృ, గణపతి మొదలైన పేర్లన్ని కనిపిస్తాయి. ఒకే ఒక్క చోట మాత్రం విష్ణువును గణేశ్వర అని స్తుతించడం కనిపిస్తుంది (13.135.79).

కొన్ని ప్రతుల్లో వినాయక అన్న పదం బహువచనంలో (వినాయకులు) అన్న అర్థంలో వాడడం కనిపిస్తుంది. మచ్చుకు శాంతిపర్వంలోని ఈ శ్లోకం చూద్దాం:

అనేనైవ తు దేహేన గణానాం సమతామ్ వ్రజేత్
తేజసా యశసా చైవ యుక్తో భవతి నిర్మలః
నా రాక్షసాః పిశాచాః వా న భూతాః న వినాయకాః
విఘ్నం కుర్యుగృహే తస్య యాత్రాయమ్ పఠ్యతే స్తవః

ఇక్కడ వినాయకులను రాక్షసులు, పిశాచాలు, భూతాలతో పాటు పేర్కొంటూ ఈ భూత, పిశాచ, వినాయక, రాక్షస గణాలు సృష్టించే విఘ్నాలను ఈ స్తవం పఠించడం ద్వారా నివారించవచ్చు అని ఈ శ్లోకం చెబుతుంది.

వినాయకులు అని బహువచన రూపంలో కనిపించే ఇంకో శ్లోకం అనుశాసనపర్వంలోనిది:

నందీశ్వరో మహాకాయో గ్రామిణీ వృషభధ్వజః
ఈశ్వరాః సర్వలోకానాం గణేశ్వర వినాయకాః

సర్వలోకాలకు ఈశ్వరుడు అయిన శివుడు నంది, మహాకాయ, గ్రామిణీ, వృషభధ్వజుడు, వినాయకులు మొదలైన గణాలకు అధిపతి.

అంటే ఇక్కడ గణేశ్వరుడు శివుడు. వినాయకులు అనేవారు ఆయన అనుచరులైన పెక్కుమంది గణాలలో కొంతమంది. (భవస్య అనుచరః అని తరువాతి శ్లోకంలో ఉంది.) అయితే, ఈ రెండు శ్లోకాలను కూడా ప్రక్షిప్తాలుగానే పరిగణించి మహాభారత శుద్ధప్రతిలో చేర్చలేదు.

మహాభారత శుద్ధప్రతిలో గజముఖుడైన గణేశుడు కానీ వినాయకుడు కానీ కనిపించరు. ప్రక్షిప్త శ్లోకాలలో కూడా వినాయకులు అనే వారు శివుడిని అనుసరించి ఉండే పెక్కు గణాలలో కొందరు అని మాత్రమే మనకు తెలుస్తుంది. మరోచోట వినాయకులను రాక్షస, పిశాచ, భూత గణాలతో పాటు పేర్కోవడం గమనార్హం. ఏది ఏమైనా మహాభారత రచనాకాలం నాటికి గజముఖుడైన వినాయకుడు దేవుడిగా, శివుని పెద్దకొడుకుగా స్థానం సంపాదించుకోలేదనే చెప్పాలి.

వినాయకుడు: విఘ్నకర్తా? విఘ్నహర్తా?
పైన చెప్పిన భారతంలోని ప్రక్షిప్తాల కాలం మనకు తెలియదు కానీ, వినాయకుల గురించిన వర్ణనలు మనకు మానవగృహ్య సూత్రాల్లోనూ (క్రీ.పూ. 5శ.) ఆ తరువాత యాజ్ఞవల్క్య స్మృతి (క్రీ.శ. 3శ.) లోనూ కనిపిస్తాయి. అయితే, ఈ వర్ణనల్లో వినాయకులు(బహువచనం) విఘ్నాలను తొలగించే నాయకులుగా కాక ప్రతినాయకులుగా, విధ్వంసకులుగా, విఘ్నకారకులుగా వర్ణింపబడటం విశేషం.

మానవగృహ్య సూత్రాల్లో వినాయక ఖండం
గృహ్య సూత్రాలలో ఇంట్లో జరిగే పెళ్లిళ్లకు, ఉపనయనాలకు, ఇతర గృహ సంబంధమైన షోడశ కర్మలకు అవసరమైన మంత్రాలు, సూచనలు ఉంటాయి. అయితే, మానవగృహ్య సూత్రంలో మనకు నలుగురు వినాయకుల గురించి వివరించడానికి ఒక పూర్తి ఖండమే కనిపిస్తుంది (2.14). ద్వితీయ అధ్యాయంలోని చతుర్దశ ఖండంలో ఉన్న 38వచనాలు ఈ వాక్యాలతో ప్రారంభమౌతాయి:

అథాతో వినాయకాన్ వ్యాఖ్యాస్యామః
శాలకటంకటశ్చ కూష్మాండరాజపుత్రశ్చోస్మితశ్చ దేవయజనశ్చేతి
ఏతైరధిగతానామిమాని రూపాణి భవంతి

ఈ ఖండం ప్రకారం నలుగురు వినాయకుల పేర్లు: శాలకటంకటడు, కూష్మాండరాజపుత్రుడు, ఉస్మితుడు, దేవయజనుడు. ఈ ఖండం వారి భయంకరమైన ఆకారాల గురించి, వారు పెట్టే బాధలను వర్ణించి, ఆ బాధలను నివారించడానికి ఏ విధంగా ఈ వినాయకులను శమింపజేయాలో వివరిస్తుంది. అయితే ఇందులో ఈ వినాయకులకు గణేశునితో సంబంధం కనిపించదు. శివపార్వతుల ప్రసక్తి కూడా ఏమాత్రం ఉండదు.

యాజ్ఞవల్క్య స్మృతిలో వినాయకుని ప్రస్తావన
సంస్కృత వాఙ్మయచరిత్రలో శ్రుతిసాహిత్యంగా పరిగణించబడే వేదసాహిత్యం తరువాత వెలువడిన సాహిత్యాన్ని స్మృతి సాహిత్యం అని పిలుస్తారు. శ్రవణం అంటే వినడం, కావున శ్రుతి అంటే వినబడినది అని అర్థం. స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవడం, కాబట్టి స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోబడినది అని అర్థం. శ్రుతుల్లో చెప్పిన విషయాల స్ఫూర్తితోనే సమాజానికి మార్గనిర్దేశం చేయడం, ఆచారవ్యవహారాల గురించి, ధర్మాధర్మాల గురించి చెప్పిన పుస్తకాలు స్మృతులు. యాజ్ఞవల్క్య స్మృతి, నారదస్మృతి, మనుస్మృతి మొదలైనవి స్మృతిసాహిత్యానికి కొన్ని ఉదాహరణలు.

యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పిన వినాయకులు ఆరుగురు. మానవగృహ్య సూత్రాల్లో చెప్పబడిన నలుగురు పేర్లలో శాలకటంకటడు పేరును శాలుడు, కంటకుడు అని రెండు పేర్లుగా, కూష్మాండరాజపుత్రుడు అన్న పేరును కూష్మాండుడు, రాజపుత్రుడు అని మరో రెండు పేర్లుగా విడదీసి మొత్తం ఆరుగురి పేర్లు యాజ్ఞవల్క్య స్మృతిలో కనిపిస్తాయి.

అయితే, ఈ ఆరు పేర్లు ఆర్వాచీనంగా అనిపిస్తాయి. ఇతర భాష్యాల్లోను, పురాణాల్లోనూ మానవగృహ్య సూత్రాల్లో చెప్పబడిన నాలుగు వినాయకుల పేర్లే కనిపిస్తాయి. విష్ణుధర్మోత్తర పురాణంలో కూడా ఈ నలుగురు వినాయకుల పేర్లు ఉండడమే కాకుండా, ఈ నలుగురి తల్లి అంబిక అన్న వివరణ కూడా కనిపిస్తుంది. అయితే, వాజసనేయ సంహితలో అంబిక రుద్రునికి చెల్లెలు. పురాణ కాలం వచ్చేసరికి అంబిక పార్వతికి మరో పేరుగా, శివునికి భార్యగా మారిపోతుంది. అయితే, స్కాంద పురాణంలో విఘ్ననాశకులైన వినాయకులు ఆరుగురని పేర్కొవడం మరో ఆసక్తికరమైన విషయం.

యాజ్ఞవల్క్య స్మృతిలో ఈ వినాయకుల దుశ్చర్యలను ఇంకా విపులంగా వివరిస్తారు. ఈ వినాయకులు యజ్ఞకర్మలు చేయకుండా అడ్డుకుంటారని, శిష్యులను అధ్యయనం చేయకుండా అల్లరి చేస్తారని ఈ శ్లోకాలు వివరిస్తాయి. వారికి కోపం వస్తే మనుష్యులపై పూని వారిని హింసిస్తారని ఈ రెండు స్మృతులు స్పష్టంచేస్తాయి.

ఈ రెండు రచనల్లోనూ వినాయకులను శాంతింపజేయడానికి బలి తప్పనిసరి అని సూచిస్తారు. జంతుమాంసంతో పాటు సుర (కల్లు) కూడా అందజేయాలని, ఆపై తమ తప్పులకు ప్రాయశ్చిత్త పడుతున్నట్టుగా చూపిస్తే వినాయకులు శాంతించి కరుణిస్తారని ఈ స్మృతులలో వివరణ ఉంటుంది.

కొన్ని మనుస్మృతి ప్రతులలో “శూద్రానాంచ గణనాయకః” అంటూ శూద్రులకు దేవుడు గణనాయకుడని చెప్పే ఒక శ్లోకం కనిపిస్తుంది. అయితే, పండితులు దీన్ని ప్రక్షిప్తంగానే పరిగణిస్తారు కాబట్టి, మనుస్మృతి శుద్ధప్రతి (critical edition)లో ఈ శ్లోకం భాగం కాదు.

పురాణాల్లో గణేశుడు
పురాణము అంటే పురాతనమైనది. పురా- అంటే పాత, అంతకుముందు- అన్న అర్థాలున్నాయి. పురాణదంపతులు అంటే ఆదిదంపతులు. పురాణపురుషుడు అంటే ప్రాచీన పురుషుడు. ప్రాచీనమైన పాత కథలను తిరిగి గుర్తుతెచ్చుకొనే కథలు కాబట్టి పురాణాలు కూడా స్మృతి సాహిత్యం కిందికే వస్తాయి.

మహాపురాణాలుగా పేరుపొందిన అష్టాదశ పురాణాల రచన గుప్త యుగంలో (క్రీ.శ.300-550) ఆరంభం అయినట్టుగా పండితుల ఊహ. మనం ఇప్పుడు హిందూమతంలో భాగంగా భావిస్తున్న దేవతలు, వారి మధ్య సంబంధాలు, వారి లీలలను వర్ణించే ఎన్నో ఆసక్తికరమైన కథలు చాలావరకూ మనకు ఈ 18 పురాణాల ద్వారానే స్థిరత్వాన్ని పొందాయి. అయితే, విజ్ఞానసర్వస్వాలుగా మారిన ఈ పురాణాలు దాదాపు క్రీ.శ. 1400 సంవత్సరాల దాకా ఎన్నో మార్పులు, చేర్పులతో, ప్రక్షిప్తాలతో వృద్ధిచెందుతూనే వచ్చాయి. కొన్ని పురాణాలకు, ఉపపురాణాలకు 17వ శతాబ్ది దాకా కూడా మార్పులు, చేర్పులు జరుగుతున్నట్టు మనం నిరూపించగలము.

పురాణయుగం కన్నా ముందు మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు అన్న భావన కనిపించదు. అలాగే, పురాణాల కన్నా ముందు మనకు విష్ణువు దశాతారాల వర్ణన కనిపించదు. ఉదాహరణకు భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడా తాను విష్ణువు అవతారమని చెప్పుకోలేదు. భగవద్గీతలో విష్ణువు ప్రస్తావన ఒకే ఒక్క సారి వస్తుంది: ఆదిత్యానామ్ అహం విష్ణుః (10.21). మృగములలో సింహమును నేను; దేవతలలో ఇంద్రుడను నేనే; రుద్రులలో శంకరుడును నేనే; అని చెప్పిన శ్లోకాలలోనే ఆదిత్యులలో విష్ణువును నేనే అని అంటాడు తప్ప, తాను విష్ణువు అవతారమని గీతలో ప్రత్యేకంగా ఎక్కడా చెప్పలేదు.

రుద్రుడు, శివుడు, శంకరుడు ఒకే దేవుడుగా కలిసిపోవడం; స్కందుడు, విశాఖుడు, కుమారస్వామి, సుబ్రహ్మణస్వామి ఒకే దేవుని రూపాలుగా మారిపోవడం; రాముడు, కృష్ణుడు, పరశురాముడు మొదలైన వ్యక్తులు విష్ణువు అవతారాలుగా గుర్తింపు పొందడం- ఇవన్నీ మనకు ఈ పురాణ కథల ద్వారానే సిద్ధించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా గుర్తింపు పొందడం; ఈ త్రిమూర్తుల సరసన సరస్వతి, లక్ష్మి, పార్వతి భార్యలుగా మారటం అంతా పురాణ యుగంలోనే జరిగింది. వైదిక సాహిత్యంలో ప్రముఖ దేవతలైన వరుణ, మిత్ర, ఆర్యమస్, సవితృ, ప్రజాపతి, ఆర్యమన్, అంశ, వివస్వంత, సోమ మొదలైన వారంతా ఈ పురాణాల్లో దాదాపు కనుమరుగైపోయారు. ఋగ్వేదంలో దేవతలకు అధిపతిగా, దేవతలందరిలోనూ అతిముఖ్యుడిగా కనిపించే ఇంద్రుడు పురాణకాలానికి తన ప్రాముఖ్యాన్ని పూర్తిగా కోల్పోవడం విశేషం.

అలాగే అంతకు ముందు సాహిత్యంలో విఘ్నకారకులుగా, దుష్టులైన భూతగణాలతోపాటు వర్ణించబడ్డ వినాయకులు చివరకు ఒకే వినాయకుడి రూపు దాల్చడం, ఆ వినాయకుడు గజముఖుడైన గణేశునితో విలీనం చెందడం, గణేశుడు పార్వతి పుత్రుడిగా, స్కందుని సోదరుడిగా శివపార్వతుల కుటుంబంలో చేరిపోవడం– ఈ కథనాలన్నీ పురాణాల్లోనే కనిపిస్తాయి.

గణేశుడైన గణపతి ప్రస్తావన శైవ పురాణాలైన లింగ, స్కాంద, అగ్ని పురాణాల్లో కనిపిస్తే, వైష్ణవ పురాణాలైన విష్ణుపురాణంలోనూ భాగవతంలోనూ గణేశుని ప్రసక్తి ససేమిరా కనిపించదు. అయితే, పద్మ పురాణంలో గాణపత్య తెగల గురించిన చర్చ కనిపిస్తుంది. బ్రహ్మ, భవిష్య, బ్రహ్మాండ, వామన పురాణాల్లో కూడా గణేశుని ప్రస్తావన పృథక్కుగా కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణంలో 42 అధ్యాయాలతో సాగే గణపతిఖండం పూర్తిగా గణేశుని గురించిన వివిధ కథలను విపులంగా వివరిస్తుంది.

ఇవి కాక అనేక ఉపపురాణాల్లో గణేశుని ప్రస్తావన కనిపిస్తుంది. ఇందులో రెండు ఉపపురాణాలు పూర్తిగా గణేశుని నిమిత్తం రాసినవి. గణేశుడే సర్వజగత్తుకు మూలాధారమని కీర్తించే గణేశ పురాణం రెండు ప్రధాన ఖండాలుగా విభజింపబడి ఉంది: 92 అధ్యాయాలతో ఉపాసనఖండం మొదటి ఖండం, 155 అధ్యాయాలతో క్రీడాఖండం రెండవ ఖండం. భగవద్గీత లాగా, 11 అధ్యాయాల గణేశ గీత గణేశ పురాణంలోని రెండవ ఖండంలో 138వ అధ్యాయం నుండి 148వ అధ్యాయం దాకా ఉంటుంది. వినాయకుడే పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించే ముద్గల పురాణంలో గణేశునికి 8 అవతారాలుగా పేర్కొంటూ, ఒక్కో అవతారానికి సంబంధించిన కథలను విపులంగా వివరించడంతో ఇది తొమ్మిది ఖండాలతో 428 అధ్యాయాలతో గణేశ పురాణం కంటే చాలా పెద్దదిగా తయారయ్యింది.

అయితే, ఈ పురాణాల్లోని గణేశుని కథల్లో బోలెడంత వైవిధ్యం, వైరుధ్యం కనిపిస్తుంది. ఈ పురాణాల్లో గణేశునికి సంబంధించిన కొన్ని ప్రధానమైన ఘట్టాలకు సంబంధించిన కథల్లో కనిపించే వైరుధ్యాలను వివరంగా విశ్లేషిద్దాం!

గణేశుని జననం
పురాణ సాహిత్యంలో మనకు గణేశుని జననం గురించి ఎన్నో రకాల కథలు కనిపిస్తాయి. కొన్ని కథల్లో గణేశుడిని శివుడు సృష్టిస్తాడు. మరి కొన్ని కథల్లో పార్వతీదేవి వినాయకుణ్ణి తయారుచేస్తుంది. కొన్ని కథల్లో మాత్రమే గణేశుడు శివపార్వతులకు పుట్టిన పుత్రుడు. మరి కొన్ని పురాణాల్లో గణేశుడు స్వయంభువు.

లింగపురాణంలో దేవతల కోర్కె మేరకు దైత్యులకు విఘ్నాలు కలిగించడానికి (విఘ్నార్థన్ విఘ్నాయ) ఇభాననుడైన (గజముఖుడైన) గణేశ్వరుడిని శివుడు సృష్టిస్తాడు. వరాహపురాణంలో (23.4) కూడా పార్వతి ప్రమేయం లేకుండా రుద్రుడు తన నవ్వు (హసితం) ద్వారా గణేశ్వరున్ని సృష్టిస్తాడు. వరాహపురాణంలో రుద్రుడు సృష్టించిన వినాయకుడు ప్రచండ రూపం కలవాడని, క్రూరదృక్కులు కల ఆ బాలకుడు విఘ్నకారకుడని, ఆ వినాయకుడు కలిగించే విఘ్నాలు తొలగాలంటే ‘ఆవిఘ్నవ్రత’ మాచరించి వినాయకుడిని శాంతింపజేయాలని ఉంటుంది (23.28-29, 59.1-4).

వామన పురాణంలో శివుడు, పార్వతి మహామోహంతో గడుపుతున్నప్పుడు వారికి పుత్రుడు జన్మిస్తే అతడు మహాశక్తిమంతుడు అవుతాడని దేవతలు భయపడతారు. ఇంద్రుడు తన ఇంద్రపదవికి ముప్పు వాటిల్లుతుందని శివుని రేతస్సును అగ్ని హరించేటట్టుగా చేస్తారు. పుత్రుడు కలగలేదని బాధపడుతున్న పార్వతి (నిషిదస్తు పుత్రోత్పత్తిమ్ తవ ఉదరాత్) తన శరీరంపైనుండి తీసిన నలుగుపిండితో గజముఖుడైన ‘మలపురుషు’డిని తయారు చేస్తుంది. ఆ బాలకుడు నాయకుని (భర్త) ప్రమేయం లేకుండా పుట్టాడు కాబట్టి, “నాయకేన వినా దేవీ త్వభూతోపి పుత్రకః (28.71)” అతని పేరు వినాయకుడని శివుడు తన కొడుకుగా స్వీకరిస్తాడు.

శివ పురాణంలో కూడా పురుషుని ప్రమేయం (పురుషం నిర్మమౌ) లేకుండా పార్వతి తన శరీరపు మైల నుండి (మల సంభవం) గణపతిని సృష్టించింది అని కనిపిస్తుంది. బ్రహ్మాండ పురాణంలోని లలితా మాహాత్మ్యంలో దుర్గారూపిణి అయిన లలిత రాక్షసులతో యుద్ధం చేయడానికి తన నోటిద్వారా గజాననుని సృష్టిస్తుంది.

పద్మ పురాణంలోని సృష్టిఖండంలో హాస్యానికి (హాస్యాత్) ఒంటిమీద మైలతో బొమ్మను తయారుచేసి, తాను గంగానదిలో స్నానం చేస్తుండగా పవిత్రమైన గంగాజలం తాకి ఆ బొమ్మకు ప్రాణం వస్తుంది. అతడిని పార్వతి పుత్రుడిగా స్వీకరించింది. గంగ తాకడం వల్ల ప్రాణం పోసుకొన్నాడు కాబట్టి దేవతలు అతన్ని గాంగేయుడని స్తుతిస్తారు.

బ్రహ్మవైవర్త పురాణంలో గణేశుడిని కృష్ణుని అవతారంగా వర్ణించడం కనిపిస్తుంది. కృష్ణుని రూపం చూసి ఇష్టపడ్డ పార్వతి తనకూ అలాంటి పుత్రుడు కావాలని కోరుకొంటుంది. ఆ కోర్కెతో ఆమె పుణ్యకవ్రత మాచరించినప్పుడు కృష్ణుడు శివుని రేతస్సు రూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి గణేశుడిగా ఉద్భవిస్తాడు.

స్కాంద పురాణంలో దాదాపు ఇప్పుడు మనకు ప్రాచుర్యంలో ఉన్న కథ కనిపిస్తుంది. వినోదార్థం తన శరీరపు లేపనాలతో బొమ్మను తయారుచేసి పార్వతి తన శక్తితో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. గణేశ పురాణంలో మాత్రం శివపార్వతుల సంయోగం వల్ల శివుడు కరుణిస్తే పార్వతి గర్భం దాల్చి గణేశునికి జన్మనిస్తుంది.

ఇక ముద్గల పురాణంలో గణపతికి శివపార్వతులతో ఏ సంబంధం లేదు. ఈ పురాణంలో వినాయకుడు స్వయంభువు, పరబ్రహ్మ స్వరూపం. ఇంతకుముందు చెప్పినట్టు ఈ పురాణంలో గణేశుని ఎనిమిది అవతారాలను వర్ణించడం ప్రధానమైన విషయం.

గణేశుని జననంపై వివిధ పురాణాల్లో వైరుధ్యం ఉన్నా, పార్వతి తయారుచేసిన బొమ్మే గణేశుడిగా ఉద్భవించాడన్నది పలు పురాణాల్లో కనిపించే సామాన్య అంశం. పురాణాల కంటే ముందు యాజ్ఞవల్క్య స్మృతిలో గణేశుని జనని అంబిక అని తల్లిపేరు మాత్రమే ప్రస్తావించడం విశేషం.

వినాయకుడు గజముఖుడు ఎలా అయ్యాడు?
వినాయకునికి ఏనుగు తల ఎలా వచ్చింది అన్న అంశంపై కూడా వివిధ పురాణాల్లో పరస్పర విరుద్ధమైన కథనాలు కనిపిస్తాయి. వామన పురాణంలో గణేశుడు పుట్టడమే ఏనుగు తలతో పుట్టాడు– మలాచ్చక్రే గజాననమ్ (28.58). బ్రహ్మవైవర్త పురాణంలో శని క్రూరదృక్కుల వలన అప్పుడే పుట్టిన బాలుని తల తెగిపడిపోయింది. విష్ణువు వెంటనే గరుడ వాహనమెక్కి ఉత్తరదిశకు వెళ్ళి అప్పుడే శృంగార కేళిలో పాల్గొని అలసిపోయిన గజరాజు తల ఖండించి దాన్ని గణేశునకు అతికిస్తాడు.

స్కాంద పురాణంలో గణేశుడు పరాశక్తికి ఉద్భవించినవాడు. గజారూఢుడై శివునితో యుద్ధం చేసి ఓడిపోతాడు. శివుడు అతని తలను, అతని వాహనమైన సిందూర అనే ఏనుగు తలను ఖండిస్తాడు. అప్పుడు పరాశక్తి శివుణ్ణి వేనోళ్ల స్తుతించి, తన పుత్రుడ్ని తిరిగి బ్రతికించమని వేడుకోగా, ఆయన ఆ ఏనుగు తలను అతికించి గణేశుని పునర్జీవుని గావిస్తాడు.

వరాహ పురాణంలో శివుడు తన దరహాసం నుండి గణపతిని సృష్టించాడని చెప్పుకున్నాం కదా. ఈ కథలో ఆ పుట్టిన బాలుని సౌందర్యం చూసి శివుడే అసూయ పడతాడు. దేవతాస్త్రీలంతా ఇతడిని మోహిస్తారని తలచి అతని తలను ఏనుగుతలగా, పొట్టను పెద్దదిగా చేసి లంబోదరుడిగా, పామును యజ్ఞోపవీతంగా చేసి అతన్ని అనాకర్షణీయంగా చేస్తాడు.

శివ పురాణంలో మనకు ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ కనిపిస్తుంది. పార్వతి నలుగుపిండితో చేసిన బొమ్మకు జీవం పోసి, అతన్ని ద్వారపాలకుడిగా నియమించి స్నానానికి వెళ్తుంది. శివుడు కొద్ది నిమిషాల తర్వాత పార్వతిని కలుసుకోవడానికి వస్తాడు. బాలగణేశుడు శివుణ్ణి లోనికి ప్రవేశించడానికి నిరాకరిస్తాడు. శివుడు అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ కారణంగానే, ఈ బాల గణేశుడు తన శక్తికి మించి శివుడితో పోరాడినా శివశక్తిని మించలేకపోతాడు. అప్పుడు ఆ యుద్ధంలో శివుడు గణేశుని తల ఖండించివేస్తాడు. బయటకు వచ్చి జరిగిన ఘోరం చూసిన పార్వతి దుఃఖిస్తుంది. ఆమెను శాంతింపజేయడానికి శివుడు తన దూతలను ఉత్తరం దిశగా వెళ్ళి కనిపించిన మొట్టమొదటి ప్రాణి తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. శివదూతలకు ఏకదంతుడైన గజరాజు కనిపిస్తే అతని తలను ఖండించి తీసుకువస్తారు. ఆ తలను బాలుని శరీరంపై అతికించి పార్వతీదేవిని సంతోషపరుస్తాడు శివుడు.

ఏకదంతుడిగా గణేశుడు
గణేశుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు అన్న విషయంలో కూడా ఈ పురాణాల్లో ఏకాభిప్రాయం లేదు. బ్రహ్మవైవర్త పురాణంలో పరుశరాముడు కార్తవీర్యుని సంహరించిన తరువాత కైలాసంలో శివుని దర్శనం కోసం వెళ్తే శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు కాబట్టి, లోనికి వెళ్లకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. అప్పుడు కోపంతో పరుశరాముడు తన ఆయుధమైన పరుశువును విసరగా వినాయకుడు తన ఎడమ దంతం కోల్పోతాడు.

ఇక గణపతి లేఖకుడిగా కనిపించే ఉత్తరదేశంలోని మహాభారత కథనాల్లో గణపతి మహాభారత రచన కోసమే తన ఎడమ దంతాన్ని విరిచేసి ఆగకుండా ఆ శ్లోకాలను రచించాడని మనం ఇదివరకే చర్చించుకొన్నాం కదా!

పద్మ పురాణంలో గణేశుడు, బలరాముడైన సంకర్షణుడు పరస్పర యుద్ధంలో బలరాముడు రోకలి విసరగా గణేశుడు దంతాన్ని కోల్పోతాడు.

గణేశ పురాణంలో గణేశుడు దేవాంతకుడు అనే రాక్షసునితో యుద్ధం చేస్తున్నప్పుడు తన దంతం కోల్పోయాడని చెబుతుంది. ముద్గల పురాణంలో నరాంతకుడనే రాక్షసుడు తన దంతాన్ని విరిచేస్తే, గణేశుడు ఆ దంతంతోనే అతన్ని సంహరించడం జరుగుతుంది.

అలా గణేశుని జననం, అతని గజముఖం, ఏకదంతం మొదలైన అంశాలపై పురాణాల్లో ఎన్ని వైరుధ్యాలున్నా, మధ్యయుగం నాటికి వినాయకుడు శివుని కుటుంబసభ్యునిగా, అతని పరివారంలో ఒకడుగా స్థిరపడిపోయాడు.

అయితే, ఇన్ని పురాణాల్లో గణేశుని ప్రస్తావన వచ్చినా ఏ మహాపురాణాల్లోనూ గణపతి ప్రధాన దేవుడు కాదు. అంటే గణేశుని ప్రస్తావన ఉన్న శ్లోకాలు తొలగించినా ఆయా పురాణాలలోని ప్రధాన కథకు అంతరాయం కలగదు. అష్టాదశపురాణాల్లో శివుడు, బ్రహ్మ, విష్ణువు, శక్తి, దేవి, స్కందుడు మొదలైనవారు ముఖ్య దేవతలు. స్కాంద పురాణంలోని ఈ శ్లోకం గణపతిని తక్కువస్థాయి దేవునిగా చూపిస్తుంది:

అధమా మర్త్యలోకేత్ర రమంతే విషయాత్మకాః
విషకీటకావత్తత్ర రతిం కృత్వా గరీయసీం
స్వర్గ మోక్షౌ పరిత్యజ్య తత్కస్మాన్ మర్త్య ఈష్యతే
యేనాసౌ ప్రాథ్యేతే మర్త్యైర్ మర్త్యదో గణనాయకః (6.142.6-7)

మర్త్యలోకంలో అధములు స్వర్గ, మోక్షాలను పరిత్యజించి, జీవితంలో రతిసుఖాల కోసం, విషకీటకాదుల నుండి రక్షించడం కోసం ప్రార్థనలు చేస్తారు. అట్టివారి దేవుడు గణనాయకుడు.

ఇంతకు ముందు మనుస్మృతిలో ప్రక్షిప్త శ్లోకంగా చెప్పుకొన్న శ్లోకం కూడా గణపతి తక్కువజాతి ప్రజల దేవుడు అని సూచించడానికి చారిత్రక కారణాలు ఉండవచ్చు.

(“ఇంత విన్నా వినాయకుడు నాకు అంతు చిక్కని దేవుడిగానే మిగిలిపోయాడు. ఒకప్పుడు పిశాచ, భూతగణాలతో పాటుగా దుష్టుడుగా, విఘ్నకారకుడుగా వర్ణించబడ్డ వినాయకుడు, పురాణసాహిత్యంలోకి వచ్చేసరికి సాత్విక దేవునిగా శివుని కుటుంబంలో ఒకడుగా మారిపోయాడు కదా! ఈ రకమైన పరిణామానికి కారణాలు ఏమిటి? ఈ మార్పును వివరించడానికి ఇతర ఆధారాలేమైనా ఉన్నాయా?” అంటూ ఆవులిస్తూ అడిగింది మా ఆవిడ.

“పౌరాణిక సాహిత్యం మాత్రమే పరికిస్తే ఆ మార్పులకు కారణాలు వివరించడం కష్టం. అయితే, గజముఖుడైన గణపతి భారతదేశంలోనే అభివృద్ధి చెందిన బుద్ధ, జైన మతాల్లో కూడా దేవుడే. అంతేకాక ఆగ్నేయాసియాలోని పలు దేశాల్లోనూ, చైనా, జపాన్ దేశాల్లోనూ గణేశుని పోలిన దేవతలు కనిపిస్తారు. అలాగే, భారతీయ భాషల్లోని కావ్యసాహిత్యం, ఇతర లౌకిక సాహిత్యం ద్వారా కూడా మరికొన్ని ఆధారాలు రాబట్టవచ్చు. అలాగే, దేవాలయాల్లోని శిల్పసంపద, చిత్రకళల ద్వారా కూడా గణపతి దేవుని పరిణామాన్ని గమనించవచ్చు. అంతేకాక ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను విశ్లేషించాలి. ఈ ఆధారాల గురించి మళ్ళీ తీరుబడిగా ఇంకోరోజు చర్చించుకొందాం, సరేనా?” అంటూ నేను కూడా తన ఆవులింతల రాగానికి శ్రుతి కలిపాను.)
(సశేషం)
----------------------------------------------------------
రచన: సురేశ్ కొలిచాల, ఈమాట అంతర్జాలమాసపత్రిక సౌజన్యంతో  

Sunday, May 27, 2018

నివేదిక: సంస్కృత సంగోష్ఠి


నివేదిక: సంస్కృత సంగోష్ఠిసాహితీమిత్రులారా!
ఈ నివేదికను ప్రతి భారతీయుడు చదవాలనే దానితో
మన పాఠకులకు అందుబాటులో ఉంచడం జరిగింది
తప్పక చదవగలరని ఆశ............

భవన్స్ వివేకానంద కళాశాల భాషావిభాగ ప్రాంగణంలో జనవరి 2018, 24-25 తేదీలలో సంస్కృత సంగోష్ఠి నిర్వహించబడింది. సంగోష్ఠి విషయాంశం: ఆధునిక కాలంలో సంస్కృత సాహిత్యం యొక్క ఆవశ్యకత, ఆచరణీయత.


విస్తారమైన సంస్కృత సాహిత్యంలో లభిస్తున్న అనేక శాస్త్ర, సామాజిక గ్రంథాలలోని వివిధ అంశాల మీద దృష్టి సారిస్తూ, వాటి ద్వారా ప్రస్తుత కాలంలోని మేధోస్థాయిని పెంచుకోడం మానవాళికి ఎలా ఉపయోగకరమనే విషయం మీద అనేక శోధపత్రాలు, విశేషజ్ఞుల అభిప్రాయాల మేళవింపుతో ఈ సంగోష్ఠి ఆసక్తికరంగా సాగింది. బెంగళూరు, చెన్నై, కాకినాడ, విశాఖపట్టణము, తిరుపతి, కొవ్వూరు, రాజమహేంద్రవరము మొదలైన విభిన్న ప్రాంతాల నుంచి మరియు జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి అధ్యాపకులు, పరిశోధకులు విభిన్న అంశాలకు సంబంధించిన 47 పరిశోధనా పత్రాలను సమర్పించారు.

మొదటిరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృతవిభాగాధ్యక్షులు ప్రొ. ఎ. రాములు అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ విశ్రాంత డిజిపి డా. కె. అరవిందరావు విశిష్ట అతిథిగా వ్యవహరించారు. జీయర్ ఇంటెగ్రేటెడ్ వైదిక అకాడమీకి చెందిన వైదిక సంశోధన ప్రచురణ విభాగాధ్యక్షులు ఎస్. వి. రంగరామానుజాచార్యులు కీలకోపన్యాసం చేశారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎయిర్ కమోడోర్ జె. ఎల్. ఎన్. శాస్త్రి, ప్రధానోపాధ్యాయులు ప్రొ. వై. అశోక్ పాల్గొన్నారు.


రెండవరోజు అంతిమ సమావేశానికి శ్రీరాజరాజేశ్వర సంస్కృత కళాశాల విశ్రాంత న్యాయోపన్యాసకులు మహామహోపాధ్యాయ నల్లగొండ పురుషోత్తమ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్కృతభారతి నుంచి శ్రీ ఎ. ఆర్. ఎస్. ఎస్. బాలాజీ ఆతిథ్య ఉపన్యాసం ఇచ్చారు. ఉస్మానియా బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు చెందిన సంస్కృతభాషావిభాగాధ్యక్షులు డా. విద్యానంద్ ఆర్య నిర్ణేతగా వ్యవహరించారు. ఈ ద్విదిన సంగోష్ఠిని కళాశాల భాషావిభాగ్యాధ్యక్షులు శ్రీమతి సి. కామేశ్వరి, సంస్కృతోపన్యాసకులు శ్రీమతి మీనారాణి, వారి విద్యార్థి బృందం ప్రశంసార్హమైన నిబద్ధతతో అంకితభావంతో సమయపాలనతో నిర్వహించారు. ఈ రెండు రోజుల సంగోష్ఠి లోని కీలకోపన్యాసములు, పత్రసమర్పణలు, సమర్పించిన పత్రములపై వక్తల అభిప్రాయములు సంస్కృతభాషలోనే జరగడం అత్యంత ఆనందదాయకమైన విషయం.

సమర్పించిన పత్రాల వివరాలు
వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పరిశోధకులు మొత్తం 47 పత్రాలను సమర్పించారు. రెండు వేదికల మీద ప్రసంగాలు, చర్చలు ఆసక్తికరంగా సాగినాయి.

1. సంస్కృత విజ్ఞానము
చిన్మయవిద్యాలయ నుంచి వచ్చిన దత్తసాయి భౌగోళిక విషయాల్లో భాగంగా భాస్కరాచార్య విరచిత సిద్ధాంతశిరోమణి గ్రంథంలోని గురుత్వాకర్షణ శక్తి గురించిన విషయాలను వివరించారు.

ఆకృష్టి శక్తిస్తు మహీ యత్ స్వస్థమ్ గురు స్వాభిముఖమ్ స్వ శక్త్యా।
ఆకృష్యతే తత్ పతతీవ భాతి సమే సమంతాత్క్వ పతత్వియం ఖే॥ (సి.శి.-1114 AD)

భూమి యందు ఆకర్షణశక్తి గలదు. తన ఆకర్షణశక్తితో భూమి పదార్థాలను తనవైపు లాగుతుంది. ఆ పదార్థాలు ఆ ఆకర్షణశక్తివల్లనే భూమి మీద పడతాయి. ఆకాశంలోని వివిధ గ్రహాల ఆకర్షణ శక్తుల వల్ల సమతుల్యత నిలిచియుంటుంది.

ఆర్యభట్టు యొక్క సూర్యకేంద్రిత సిద్ధాంత విషయంలో గ్రహాలు స్వంత కక్ష్యలో వర్తులాకారంలో పరిక్రమించడాన్ని గురించి ప్రస్తావించారు.

కక్ష్యా ప్రతిమండలగా భ్రమంతి సర్వే గ్రహాః స్వచారేణ।
మందోచ్చాదనులోమం ప్రతిలోమశ్చైవ శీఘ్రోచ్ఛాత్॥
                                       (ఆర్యభటీయం –కలాక్రియాపాదః -3.17) 499AD.

ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుందో బృహద్ సంహితా అనే గ్రంథంలో ఉన్నదని చూపించారు.

సూర్యస్య వివిధవర్ణాః పవనేన విఘట్టితాః కరాః సాభ్రే।
వియతి ధనుః సంస్థానాః యే దృశ్యంతే తదింద్రధనుః॥ 
                                             (బృహద్ సంహితా – 35 అధ్యాయః)

భ్రుగు సంహితలో రవాణా ముఖ్యంగా మూడు విధాలని, నౌకాయానం, భూయానం, ఆకాశయానమని వివరిస్తూ, 16 భిన్న రకాలైన విమానాల నిర్మాణం, ఉపయోగాల గురించి వివరించారు. వాటి పేర్లు – ఉష్మంభార ఉష్మపా ఉష్మహనో రాజామ్లతృంగవీరహా పంచాఘ్నో అగ్నితృంగభారహనశీతాహ్నో విషంభర విశల్యకృత్ విజమిత్రో వాతామిత్రశ్చేతి।

రక్తప్రసరణం గురించి –

హృదో రసో నిస్సరతి తస్మాదేతి చ సర్వశః ।
సిరాభిహ్రుదయం వైతి తస్మాత్తత్ప్రభావాః సిరాః ॥
                                                               (భేలా సంహితా-20-3)

కృత్రిమ గర్భధారణ గురించి (టెస్ట్ ట్యూబ్ బేబీ) –

సత్రే హ జాదావిషితా నమోభిః కుంభే రేతః సిషిచతుః సమానమ్।
తతో హ మాన ఉదీయా మధ్యాత్ తతో జాతమృషీ మాహుర్వశిష్ఠమ్॥
                                                                          (ఋగ్వేదః – 7.33.13) (4)

గణితానికి సంబంధించిన పింగళసూత్రం-
గాయత్రే షడ్సంఖ్యాంమర్ధే పనీతే ద్వయంకే అవశిష్ఠస్త్రయస్తేషు 
రూపమపానీయ ద్వయాంకాధః శూన్యం స్థాప్యమ్”
 (పింగళాచార్యాః , చంద్రశాస్త్ర – 200 బిసి.)-
తదితర విషయాలను వివరించారు.

2. ఆరోగ్యవృద్ధికి తోడ్పడే భారతీయభోజనవిధి
సంస్కృత అకాడమీ నుంచి డా. సంతోష్ కుమార్ జోషి గారు ఆహారస్వీకరణ గురించి సంస్కృతగ్రంథాల్లోని ప్రముఖ చర్చలను ప్రస్తావించారు. వాగ్భటుని అష్టాంగహృదయంలోని ఎనిమిదవ అధ్యాయంలో జఠరాగ్ని గురించిన చర్చను, తొమ్మిదవ అధ్యాయంలోని ఆహారసమయంలో నీరు త్రాగే పద్ధతులను వివరించారు.

భోజనాదౌ పిబేత్తోయమగ్నిసాదం కృశాంగతామ్।
మధ్యేచాగ్నిం వివర్ధేత అంతే శ్రేష్ఠం రసాయనమ్॥

(భోజనం ముందు, మధ్యలో కాకుండా చివరలో ద్రవ్యాలు తీసుకోవాలి.)

అత్యంబుపానాన్నవిపచ్యతేన్నమ్। (నీరు ఎక్కువ త్రాగడం జీర్ణానికి ఉపయోగపడదు.)
అనంబుపానాచ్చ స ఏవ దోషః। (నీరు తక్కువ త్రాగడం కూడ సరికాదు.)

నాదేయం కౌపం చ జలం మేళయిత్వా న పిబేత్ ఏకమేవ నద్యా వా కూపస్య.
(నదీ, బావుల జలాన్ని కలిపి త్రాగడానికి వాడకూడదు.
ఏదో ఒకదాన్నే వాడడం మంచి పద్ధతి.)

అశ్వచాలనాది వ్యాయామోత్తరకాలం న పిబేత్ జలమ్। 
(గుఱ్ఱపుస్వారీ వంటి వ్యాయామాలనంతరం వెంటనే నీరు త్రాగరాదు.)

అతి తృషితోఽపి న బహు పిబేత్ । ముహుర్ముహుః వారి పిబేత్। 
(అతిగా దాహం వేస్తున్నప్పుడు ఒక్కసారే అధిక జలం తీసుకోరాదు. కొద్దికొద్దిగా త్రాగవలెను.)

విరుద్ధ ఆహార పదార్థాల కూడని మేళవింపులను గురించి వివరిస్తూ-

రంభాఫలం త్యజేత్ తక్రదధిబిల్వఫలాన్వితమ్.
(పెరుగు, మజ్జిగలతో అరటిపండును కలిపి తినరాదు.)

కృతాన్నం చ కషాయం చ పునరుష్ణీకృతం త్యజేత్
( వండిన పదార్థాలను, కషాయాలను తిరిగి వేడిచేయరాదు.)

ఏకత్ర బహుమాంసాని విరుధ్యంతే పరస్పరమ్ (ఒకేసారి విభిన్న మాంసాలను తినరాదు)
మత్స్యానూపమాంసం చ దగ్ధయుక్తం వివర్జయేత్. (చేపలను పాలతో కలిపి తినరాదు.)

చారుచర్య అను గ్రంథంలోని భోజన వేళలను, విధులను, భోజన పాత్రలను గురించిన శ్లోకాలను, స్వర్ణమయపత్రాణి(పైత్యక్షోభనివారకం) రౌప్యపాత్రాణి (పైత్యప్రకోపం, శ్లేష్మహారకం) కాంస్యపత్రాణి(రక్తపైత్య హారకం) రమ్భాపత్రమ్ (కఫవాతహరః) పలాశపత్రమ్ (పైత్య శ్లేషవికారహరం ) – ఈ ఆకులలో తినడం వలన కలిగే లాభాలను వివరించారు. బ్రహ్మపురాణం లోని పంక్తి భోజన నియమాలను(టేబుల్ మానర్స్ వంటిది) వివరించారు.

గ్రసనావసరే తస్మాత్ కణో నావకిరేత్। (మెతుకులు వెదజల్లబడకుండా ఆహారం తీసుకోవాలి)
విశేషాన్ముఖవ్యాదానపపి న స్యాత్। కరాగ్రం ముఖే చాధికం న ప్రవిశేత్। (ఆవలింతలు కూడదు, వేళ్ళు మరీ నోటిలోనికి జొనిపి తినరాదు.)
ఇతస్తతో న పశ్యేత్ శనైః శనైః భుంజీత। (అటూ ఇటూ చూడకుండా నెమ్మదిగా భుజించాలి.)

ఆరోగ్యసంరక్షణార్థం కూడా జీవితంలో పాటించవలసిన నియమాలననేకం చెప్పారు.

అత్యాహారాద్భవేద్వ్యాధిరనాహారాద్బలక్షయః। (ఆహారం అధికం ఐతే వ్యాధి, అల్పం ఐతే బలక్షయము కలుగుతుంది.)
సమాహారాద్బలం సమ్యగాయుర్వర్ధనముత్తమమ్।। (సమతుల్య ఆహారం వలన ఉత్తమ బలము, ఆయుష్షు పెరుగుతుంది.)

ఏకశాయీ ద్విభోజీ చ షణ్మూత్రీ ద్విపురీషకః।
స్వల్పసంగమకారీ చ శతవర్షాణి జీవతి॥

3. ఉపనిషత్తుల్లోని విద్యావిధానాలు
ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కృష్ణచైతన్య పది ఉపనిషత్తుల్లోని విషయాలను క్లుప్తంగా వివరిస్తూ, వేదాంత విషయాలు మాత్రమే కాక వీటిలో సత్యాన్వేషణ, మానవసౌభ్రాతృత్వం గురించిన అంశాలను విస్తారంగా చర్చించబడినాయని తెలిపినారు.

ఈశావాస్యోపనిషత్ లో శ్లోకం గమనిస్తే
యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి|
సర్వభూతేషు చాత్మానాం తతో న విజుగుప్సతే॥ (ఈ. 6)

మానవజాతి జరుపుతున్న మారణహోమాలన్నిటికీ కారణమైనవి ఇతరులది తనకు కావాలన్న లోభము, ఇతరులపై ద్వేషము. అన్ని భూతాలలో (కేవలం మానవులలోనేకాదు) ఉన్నది ఒక్క ఆత్మనే , తనకు కలిగే నొప్పిని ఇంకొకరికి ఇవ్వకుండా ఉండగలగాలనే సూత్రం విస్తరించి బాల్యంనుంచీ వివరించగలిగితే శాంతి కోసం ప్రత్యేక ప్రయత్నాలవసరం రాదు. మనిషి మానవత్వం ఎదగడమే విద్య యొక్క పరమార్థం అనే అంశంలో ఏ విభేదాలకూ ఆస్కారం లేదు కదా.

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః।
ఏవం త్వయి నాన్యతోఽస్తి న కర్మ లిప్యతే నరే॥ (ఈ.2)

ఏ కర్మ(పని) అయినా చేసేటపుడు అనుకూల, ప్రతికూల ఫలితాలకు సిద్ధంగా ఉండాలి అని బోధించే ఈ సూత్రం చక్కగా తెలుసుకోగలిగిన ఏ విద్యార్థీ చిరువయసులో ఆత్మహత్యల గురించి ఆలోచించడు.

కుతో వా ఇమాః ప్రజాః ప్రజాయంత ఇతి (ప్ర.1-3)

ఈ మొత్తం విశ్వం ఎలా ఆవిర్భావించింది వంటి శాస్త్రీయమైన ప్రశ్న, చర్చలను లోకానికి పరిచయం చేయవలసిన అవసరం ఉంది.

తమసోమా జ్యోతిర్గమయ (బృ.1.3.28)

చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించవలసి ఉందనే ఇటువంటి సత్యం సర్వకాలాలకూ అత్యావశ్యకమైన బృహద్విద్య.

అన్ని రకాల పాఠ్యపుస్తకాలలో వివరించి చెప్పవలసిన జీవనసూత్రాలివి.

4. బీజోత్పత్తి–భూమి నిరూపణం
చెన్నె రాణీ మేరీ కళాశాల సంస్కృతవిభాగ్యాధక్షురాలు డా. ఉమా మహేశ్వరి శార్ఙ్గధరుడు సేకరించిన శార్ఙ్గధరపద్ధతి అనే గ్రంథంలో రాజనీతి, ధనుర్వేదము, రసాయన, అర్థశాస్త్రము, ఔషధవిద్యలతో పాటు ప్రముఖంగా వృక్షాయుర్వేదమనే విభాగంలోని ఉపవన వినోదం అనే అధ్యాయంలో చెప్పబడిన బీజోత్పత్తి, భూమినిరూపణం, మొక్కల్లోని వైవిధ్యత, నాటు పద్ధతులు, బావులు త్రవ్వడం, బావులకై భూపరీక్ష, తరుచికిత్సలు మొదలైన అనేకవిషయాలను గురించి వివరించారు.

అడవులు, అనూపాలు, సామాన్యాలు అని భూమి మూడు వర్గాలుగా విభజింపబడినది. అందులో సారాన్ని, రంగును బట్టి తిరిగి ఆరురకాలుగా చెప్పబడింది. నాటు కాలము, నీరు పెట్టు పద్ధతులు, వృక్షరక్షణ మొదలైన విషయాలు వివరింపబడినవి.

దశపుత్రసమో ద్రుమః (ఉ.వి.5) – పునరుత్పత్తి అత్యంత ముఖ్యమైన అంశమైన ప్రాణికోటిలో ఈ విధంగా ఒక చెట్టును పెంచడం పదిమంది పుత్రులతో సమానం అన్న భావన బహుగొప్పది. ఏ చెట్లు నాటడం వల్ల నరకబాధలుండవో చెప్తూ కూడా పర్యావరణ పరిరక్షణ కు దోహదం చేస్తున్న ఈ క్రింది శ్లోకాలు గమనించదగ్గవి.

అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశచించిణీకాః।
కపిత్థబిల్వామలకత్రయం చ పంచామ్రవాపీ నరకం న పశ్యేత్॥

ఒకరావిచెట్టును, ఒక వేపచెట్టును, ఒక మర్రిచెట్టును, ఒక చించిణీక(?) వ్రుక్షాన్ని, ఒక వెలగచెట్టును, ఒక మారేడు చెట్టును, మూడు ఉసిరిక చెట్లను, ఐదు మామిడిచెట్లను నాటి బావి ఏర్పాటుచేసి రక్షించేవాడికి నరకబాధ ఉండదు.

యస్తు సంరోపయేద్బిల్వం శంకరం ప్రీతి కారకమ్।
తత్కులేపి సదా లక్ష్మీః సంతిష్ఠేత్పుత్రపౌత్రికీ॥ (ఉ.వి.9)

శంకరునికి ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షాన్ని నాటి సంరక్షించడం వలన ఆ వంశంలో ధనము, పుత్రపౌత్రాదులు ఎప్పటికీ ఉండడం జరుగుతుంది.

సమ్యక్కృష్టే సమే క్షేత్రే మాషానుప్త్వా తిలాంస్తథా।
సునిష్పన్నానపనయేత్తత్ర బీజోప్తిరిష్యతే॥ (ఉ.వి.50)

పాలను, తిలాభస్మాన్ని గోమయాన్ని బీజరక్షణకు ఉపయోగించే విధానం చెప్పబడింది.

హేమంతే శిశిరే దేయం జలం చైకాంతరే దినే।
వసంతే ప్రత్యహం గ్రీష్మే సాయం ప్రాతర్నిషేచనమ్॥ (ఉ.వి.72)

వర్షాసు చ శరత్కాలే యదా వృష్టిర్న దృశ్యతే।
తదా దేయం జలం తజ్ఝైరాలబాలే మహీరుహమ్॥ (ఉ.వి.73)

హేమంత శిశిరాలలో రోజు విడిచి రోజు, వసంతం లో రోజూ, గ్రీష్మంలో రోజుకు రెండు సార్లు పొద్దున, సాయంత్రం, వర్ష, శరత్ ఋతువులలో వర్షం లేదనుకున్నపుడు మాత్రం నీళ్ళు పట్టాలి.

ఇంకా పిడుగులు పడినపుడు చెట్లరక్షణ, చెట్లు పెద్దగా పెరగడానికి వలసిన పద్ధతులన్నీ చర్చించబడినాయి.

5. పాండులిపిలో (మాన్యుస్క్రిప్ట్) లభ్యమౌతున్న ప్రాచీన రచనలు.
తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి చెందిన పరిశోధకులు రాహుల్ దేబ్ హల్దార్ పాండులిపిలో ఉన్న రచనల సంరక్షణ, శాస్త్రపరిశోధనలో వాటి ప్రాముఖ్యతలు, వినియోగాల ఆవశ్యకతను గురించి వివరించారు.

హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్
తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే ॥ (ఈ.15)

ఆవరించిన భ్రమలను తొలగించి సత్యావిష్కరణ చేయడానికి శోధన అవసరం.

ఇదివరకు లేని నూతనతథ్యాల ఆవిష్కరణలకు, ఇప్పటికే ఉన్నసిద్ధాంతాల పునర్మూల్యాంకనకు పరిశోధన అనేది నిరంతరం జరుగవలసి ఉంటుంది. పునర్మూల్యాంకనకు లభ్యమౌతున్న ప్రాచీన గ్రంథాల మూల ప్రతులను వాటి పాండులిపి (మాన్యుస్క్రిప్ట్-చేతివ్రాత)లను సాకల్యంగా, లోతుగా పరిశీలించడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన అంశం.

పాండులిపిలో రచనలు రాతిపలకలు, మట్టిపలకలు,చర్మపత్రాలు, తాటియాకులు, భూర్జపత్రాలు, చెక్కపలకలు మొదలైన వాటిలో లభ్యమౌతున్నవి. ఆకారాన్ని బట్టి గండీ, కచ్ఛపీ, ముష్టీ, సమ్ముటఫలకమ్, ఛేదపాటీ అనే రకాలు, లేఖనశైలిని బట్టి త్రిపాఠః, పంచపాఠః, శుండాకారః, సచిత్రపుస్తకం, స్వర్ణాక్షరలిపి, రజతాక్షరలిపి, సూక్ష్మాక్షరలిపి, స్థూలాక్షరలిపి అనే వర్గాలున్నాయి.

పాండులిపిలో ఉన్న వాఙ్మయపరిశోధన క్రింది విషయాలలో జరుగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

వైదిక లౌకిక దర్శనవాఙ్మయము
గ్రంథాల సమీక్షాత్మకాధ్యయనము
మాతృకాసంపాదనము
సంస్కృతవిద్వాంసుల వ్యక్తిత్వము
పరిశోధనకు అవకాశమున్న నూతన క్షేత్ర ఆవిష్కరణ.
బ్రాహ్మీలిపిలో ఉన్న ఉత్తర, దక్షిణ బ్రాహ్మీలిపి, వాటిలోని ఉపవర్గాల గురించి కూడా వివరంగా చర్చించబడింది.

సత్యనిర్ధారణకు మూలగ్రంథాల పరిశోధన, అందుకు మూలగ్రంథాల పరిరక్షణ చాలా అవసరమని నిర్ధారించిన పత్రమిది.

6. కాకతీయకాలంనాటి నృత్తరత్నావళి
వరంగల్ ఎస్. వి. ఎస్. ఎ. పీజీ కళాశాలనుంచి ప్రకాష్ పేరిణి నృత్యం గురించి జాయపసేనాని విరచిత నృత్తరత్నావళి అను సంస్కృతగ్రంథం నుంచి ప్రస్తావిస్తూ, యుద్ధకాలాలలో సైన్యం యొక్క ఉత్సాహ వర్ధనానికై శాస్త్రీయంగా రూపొందించిన పద్ధతులను గురించి వివరించారు.

కాకతీయుల కాలంలో సంస్కృత సాహిత్యం కూడా ఇతోధికంగా ప్రజాదరణ పొందింది. విద్యానాథుని ప్రతాపరుద్రయశోభూషణం, రెండవ ప్రతాపరుద్రుని యయాతి చరితం, ఉషారాగోదయం, వీరభల్లట దేశికుని నాట్యశేఖరమ్, గంగాధర కవి యొక్క రాఘవాభ్యుదయః, చంద్రవిలాసః, మహాభారతనాటకమ్, నరసింహ కవి యొక్క కాదంబరీ నాటకమ్, వేదాంతదేశికుని యాదవాభ్యుదయః, అగస్త్యుని బాల భారతమ్, గంగాదేవి యొక్క మధురావిజయమ్ మొదలైనవి రచింపబడినాయి. ప్రతాపరుద్రీయంలో చెప్పబడినట్లు విద్యానాథుని కాలంలో 200 మంది సంస్కృతకవులుండేవారని, లలితకళల ప్రయోజనం గురించి వివరిస్తూ భరతముని ప్రణీత నాట్యశాస్త్రంలో ఉన్న నాట్యం యొక్క ఉద్దేశ్యాన్ని చెప్పే శ్లోకాన్ని ఉటంకించారు.

దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినామ్
విశ్రాంతిజనం కాలే నాట్యమేతద్భవిష్యతి॥

దుఃఖితులకు, శ్రామికులకు, శోకార్తులకు, తపస్విజనులకు, నాట్యం విశ్రాంతి నిస్తుంది.

ప్రస్తుతాంశం జాయసేనాపతి విరచిత నృత్తరత్నావళి మొత్తం ఎనిమిది అధ్యాయాలు కలది. మొదటి నాలుగధ్యాయాలు మార్గ వృత్తి, చివరి నాలుగధ్యాయాలు దేశివృత్తి నాట్యలక్షణాలను వర్ణిస్తాయి.

రంగభూమి (వేదిక) పై ప్రవేశం గురించి-

సమపాదేన వా తిష్టన్ భుజంగత్రాసితేన వా।
కృతే యవనికాక్షేపే సతి రంగభువం విశేత్॥

రాసకనృత్తమ్ లో నాయికల నృత్యం గురించి-

బంధం పిండ్యాదిమాశ్రిత్య యస్మిన్ షోడశనాయికాః।
నృత్యంతి ద్వాదశాష్టౌ వా రాసకం తత్ ప్రకీర్తితమ్॥ (12)

రాసకనృత్త వస్త్రధారణ-

చేలమధోరుక్తం యద్వా కూర్పాసం కంచుకం తథా।
ధార్మిల్లం వేణికాం వాపి తత్తద్దేశానుసారతః॥ (13)

కందుకనృత్తమ్ గురించి-

దత్వాఽన్యాసాం నిజాన్ గృహ్ణత్యః పరతః పరాన్।
మిథో వినిమయేనైతాన్ స్వీకుర్యత్యః కదాచన॥
నృత్యంతి వనితా యత్ర తత్ స్యాత్ కందుక నర్తనమ్ । (17)

పత్రసమర్పణల అనంతరం ప్రసంగించిన వక్తలు ఇప్పటికే సంస్కృతంలో ప్రామాణ్యంగా భావించి వివిధ భాషల్లోకి అనువదింపబడి, దేశవిదేశాలకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధనకు ఆధారంగా తీసుకోబడిన/బడుతున్న విషయాంశాలు మాత్రమే కాకుండా, భారతీయసమాజానికే విశిష్టత అయినటువంటి ఆత్మానాత్మ వివేకానికి సంబంధించిన అంశాలను పరిశోధకులు స్వీకరించి, నేటి కాలపు వైచారికతలో వాటిని ప్రతిక్షేపించవలసి ఉంటుందని సూచించారు. ఇంకా సంస్కృతగ్రంథాల్లోని ధర్మచర్చ, నైతికబోధ, భాషరమ్యత, స్వచ్ఛభారత కల్పన, ఆధునిక పరికరాలతో చేరువవుతున్న సంస్కృతం, నాటి కాలపు స్త్రీ సాధికారత, గురుపరంపర, గరుడ-భాగవత-మార్కండేయ పురాణాల్లో వర్ణింపబడిన గర్భస్థపిండాభివృద్ధి శిష్యలక్షణాలు వంటి అనేక విషయాంశాలతో పత్ర సమర్పణలు సరళసంస్కృతంలో సాగినవి. అంశాన్ని పరిచయం చేయడంలోనే కొందరు పత్రసమర్పకులకు ఇచ్చిన సమయం ముగిసిపోవడం విచారకరం. పత్రసమర్పకులు ఇచ్చిన సమయంలో ప్రముఖ అంశాలను తమ ప్రసంగంలో తెలిపేందుకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదనిపించింది.


భౌతిక విషయ పరిశోధనలోని ప్రాథమిక ఆధారజ్ఞానం ఇతర సమాజాలలోని అదే జ్ఞానానికి ప్రత్యామ్నాయంగా సంస్కృత గ్రంథాలలో బలంగా నిలబడుతూ వైజ్ఞానిక రంగం యొక్క ఆమోదాన్ని పొందింది. అయితే ఇతర భాషా గ్రంథాలలో చర్చింపబడని ఉపవాస విధి, ప్రదక్షిణ వంటి కొన్ని విశేషాంశాలు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి, విశ్వమానవశ్రేయస్సుకు సంబంధించినవి సాధికారకంగా నిరూపించడం సంస్కృత పండితుల, పరిశోధకుల తక్షణ కర్తవ్యమని దిశానిర్దేశం చేశారు. సమర్పించిన అన్ని పత్రాలతో సచిత్రకంగా శోధపత్రసంకలనం విడుదల జరిగింది.

సమర్పించిన పత్రాల విషయాంశాల వైవిధ్యత, భాషాశుద్ధి మరి ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకొని తొమ్మిదింటిని ఎన్నికచేసి, ఆయా పత్రసమర్పకులను తమ పరిశోధనలోని కీలకాంశాలను తిరిగి క్లుప్తంగా సమర్పించమని కోరినారు. ఆ కార్యక్రమమంతా వీడియోరికార్డ్ చేసి వాటిలో అధ్యాపక రంగ పత్రసమర్పకులకు ఒకరికి, పరిశోధక రంగ పత్రసమర్పకులకు ఒకరికి ఉత్తమపత్ర బహుమతి ప్రదానం చేసినారు.

భవిష్యత్తులో మరింత పరిశోధన, జరుగవలసిన అధ్యయనం గురించి సంస్కృతపండితుల దృష్టిని ఆకర్షించి ఈ సంగోష్ఠి విజయవంతమైనదని చెప్పవచ్చు.
-------------------------------------------------------
రచన: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి, ఈమాట సౌజన్యంతో...

Saturday, May 26, 2018

అశ్వంగా మారిన అప్సరస


అశ్వంగా మారిన అప్సరససాహితీమిత్రులారా!


ఒక అప్సరస అశ్వంగా మారితే అది ఒక సత్ప్రబంధం అవుతుంది!
అదెలాగో తెలియాలంటే ఈ వ్యాసం సాంతం చదవాల్సిందే.

సీ. ప్రియుని కెమ్మోవి చుంబింప నోపని లేమ
            కఠిన ఖలీన మేగతి వహించు
    హారంబు బరువని యలయు లతాతన్వి
            వాగెల నెట్టి కైవడి ధరించు
    జడసోకు లోర్వగా జాలని తరళాక్షి
            కడువంక పల్ల మే కరణి బూను
    నొడ్డాణమును దాల్ప నోపని సతి పొట్ట
            బట్టెడ బిగి నెటువలె సహించు

తే. మిగుల మెత్తని నడుపుల మెలగు నింతి
      మనసు కంటెను జవమున మసలు నెట్టు
      లనుచు దేవత లద్భుత మంది చూడ
      రాజకులనాథ సాంబ్రాణి తేజి యయ్యె

ఒక చిత్రమైన సన్నివేశాన్ని వర్ణిస్తున్న పద్యం ఇది. ‘సాంబ్రాణి తేజి’ అంటే ఉత్తమజాతి అశ్వం. అతిలోక సుందరి, సుకుమారి, సొగసుల నెరజాణ అయిన ఒక అప్సర స్త్రీ గుఱ్ఱంగా మారుతూ ఉంటే చూస్తున్న దేవతలు, ఆమె పడే అవస్థని ఊహించుకొంటూ, అయ్యో పాపం అనుకొంటున్న సందర్భం. ఇలాంటి విచిత్రమైన సన్నివేశాలని సృష్టించి వినేవాళ్ళ, చదివేవాళ్ళ ఊహశక్తికున్న అవధిని విస్తృతపరచడంలో మన పూర్వకవులు సిద్ధహస్తులు. ఈ పద్యం కన్నా, దీని తర్వాత జరిగిన కథ మరీ చిత్రమైనది!

పూర్వం మన కథలన్నీ చివరకు కంచికే వెళ్ళేవి. అందుకే వాటి ముగింపుతో మనకి పెద్దగా నిమిత్తం లేదు. ఆ మాటకొస్తే కథతో కూడా లేదు! కథనంలో వచ్చే కల్పనలు, సంభాషణలు, వర్ణనలు, అవి రేకెత్తించే ఆలోచనలు, అనుభూతులు- అవీ మనకు ముఖ్యం. అందుకే మన కావ్యాలలో పురాణాలలో, అవే పాత్రలు రకరకాల కథలలో కనిపిస్తాయి. అవే కథలు రకరకాలుగా వినిపిస్తాయి. కథ మొదట్లోనే దాని ముగింపు తెలిసిపోతుంది! ఈ కావ్యం కూడా సరిగ్గా అలాగే మొదలవుతుంది. సూతుడు శౌనకాది మునులకు కథ చెప్పడం మొదలుపెడుతూనే ఇలా అంటాడు: “వినండి మహాత్ములారా. విచిత్రంగా, ఒక రాజు వల్ల కృష్ణునికీ అర్జునునికీ యుద్ధం జరిగింది. ఒక్క ధర్మరాజుని తప్ప, అర్జునునితో సహా అతని సైన్యం మొత్తాన్ని కృష్ణుడు తన చక్రధారతో చంపేశాడు. ఆ తర్వాత, కృపతో ఉభయ సైన్యాల వీరులందరినీ తిరిగి బతికించాడు.”

అదీ కథ! ఇలా కథని ముగింపుతో సహా ముందే చెప్పేస్తే ఇక దాని మీద ఆసక్తి ఎలా ఉంటుంది- అని సందేహించ నక్కర లేదు. అసలు అలా మొదలు పెడితేనే వినేవాళ్ళకి కథ గూర్చి మరింత ఆసక్తి పెరుగుతుంది. కృష్ణార్జునుల మధ్య యుద్ధం ఎలా సంభవించింది చెప్మా. కాస్త వివరంగా చెప్పండి మహానుభావా అంటూ మహర్షులు సూతుని తొందర చేస్తారు. ఇలా కథను టూకీగా ముందుగానే చెప్పేయడం మనకి రామాయణాది పురాణ కావ్యాలలో కూడా కనిపిస్తుంది. మన పురాణాలలో సామాన్యంగా కనిపించే మరొక కథన విధానం- ఒకరు మరొకరికి చెపుతున్నట్టుగా సాగడం. అది కూడా రెండు మూడు పొరలలో సాగుతుంది. మహాభారతం కూడా సూతుడు శౌనకాది మునులకు చెప్పేదే. అందులో మళ్ళీ జనమేజయునికి వైశంపాయనుడు ఆ కథ చెప్పినట్టుగా సూతుడు చెపుతాడు. జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు, అంటే పాండవుల మనవడు. మనవడు తాతల గురించిన కథ వింటాడన్నమాట. ఈ కథలో కూడా అదే సంవిధానం కనిపిస్తుంది. సూతుడు చెప్పే కథలో అసలు కథని శుకమహర్షి ఇలావంతుడికి చెపుతాడు. ఇలావంతుడు అర్జున కుమారుడు. ఇక్కడ తండ్రి కథని తనయుడు వింటున్నాడు. ఇలా ఒకే కథకి ఇద్దరు కథకులు ఉండడం, ఈ కథలు ఒకరు చెప్పగా మరొకరు వినే మౌఖిక సంప్రదాయానికి చెందినవన్న విషయాన్ని గుర్తుచేస్తాయి. అంతే కాదు, వినేవాళ్లు రెండు మూడు దృక్కోణాలనుండి కథను వినే అవకాశం ఉంటుంది. పై పద్యంలో ‘రాజకులనాథ’ అనేది ఇలావంతునితో శుకుడు చేసిన సంబోధన. ప్రస్తుతం కథ ఇలావంతుని దృష్టినుంచి వింటున్నామన్నమాట. ఇలా రెండు పొరలు చాలవన్నట్టు, దీనికి మరొక పొర మన తెలుగు కవులు చేరుస్తారు. అది, తాము స్వయంగా తమ కృతిభర్తలకి కథ చెప్పడం. ఈ కథ చెపుతున్న కృతికర్త చరిగొండ ధర్మన. కృతిభర్త ఎనుమలపల్లి పెద్దన మంత్రి. చరిగొండ ధర్మన్న పదహారవ శతాబ్దానికి చెందిన కవి. అతను నిర్మించిన ఈ కావ్యం పేరు చిత్రభారతం.

పేరుకు తగ్గట్టే ఇది చిత్రమైన కావ్యం. భారతంలో వచ్చే పాత్రలే ఇందులోనూ వస్తాయి. అయితే సంఘటనలూ సన్నివేశాలూ మాత్రం పూర్తిగా భిన్నం. కృష్ణార్జునుల మధ్య యుద్ధం తటస్థపడుతుంది. కౌరవ పాండవులు ఏకమై యుద్ధానికి సన్నద్ధులవుతారు. మొత్తం వారి బలం పద్ధెనిమిది అక్షౌహిణీలు. కర్ణుడు అర్జునుని పరాక్రమాన్ని పొగుడుతాడు. సహదేవుడు సంధికై కృష్ణుని వద్దకు దూతగా వెళతాడు. కర్ణ దుర్యోధనాదుల పరాక్రమాన్ని కృష్ణునికి వర్ణించి చెప్తాడు సహదేవుడు. సంధి పొసగదు. కురుక్షేత్రంలోనే యుద్ధం జరుగుతుంది. శల్యుడు అర్జునుని రథసారథి. భీముడూ దుర్యోధనుడూ కలిసి బలరామునితో యుద్ధం చేస్తారు. అర్జునబాణానికి బలరామ కృష్ణులు మూర్ఛపోతారు. కృష్ణుని కుమారులు యుద్ధంలో మరణిస్తారు. చివరకి కృష్ణుడు ధర్మరాజుని తప్ప యుద్ధంలో అందరినీ చంపేస్తాడు. మరి యింత చిత్రమైన కథ ‘భారతం’ ఎలా అయింది? ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. సంఘటనలూ సన్నివేశాలూ చిత్రమైనవి కావచ్చు. కానీ అందులోని పాత్రలు ముమ్మూర్తులా భారతంలో పాత్రలే. అంటే ఆ పాత్రల స్వభావాలు, వాటి మధ్యనున్న సంబంధాలు, భారతంలో కనిపించినట్టుగానే ఉంటాయి. ఇందులోనూ అర్జునుడు విక్రముడే, ధర్మరాజు నీతివేత్తే. సుయోధనుడు మదమాత్సర్య మత్తుడే. కౌరవపాండవులు కలిసి యుద్ధం చేసినా, వారి మధ్య వైరిభావం ఎక్కడికీ పోదు. కృష్ణార్జునులు యుద్ధం చేసినా, వారి మధ్యనున్న పరమస్నేహం అలానే ఉంటుంది. అందుకే అది భారతమే అయ్యింది. పాత్రల స్వభావాలను అలానే ఉంచుతూ, కేవలం సన్నివేశ కల్పన ద్వారా ఇలాంటి నూతనమైన, అతి విచిత్రమైన కథలు నిర్మించడం మన భారతదేశ సాహిత్యంలో కనిపించే విశిష్టమైన అంశం. ఇలాంటివే రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం, అర్జున-బభ్రువాహన యుద్ధం (అర్జునుని మరొక కుమారుడు బభ్రువాహనుడు) మొదలైనవి.

ఈ చిత్రభారతం కథ వినగానే శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమా గుర్తుకు వస్తుంది. అందులోనూ ఇదే కథ కదా. అయితే అందులో కౌరవ పాండవులు కలిసి యుద్ధానికి రావడం ఉండదు. అలాగే యుద్ధంలో కృష్ణుడు అందరినీ సంహరించడమూ ఉండదు. అందులో శివుడు ప్రత్యక్షమై ఇద్దరి యుద్ధాన్నీ ఆపుతాడు. కాబట్టి ఇది వేరే కథ. కృష్ణార్జునయుద్ధం గయోపాఖ్యాన నాటకం ఆధారంగా తీయబడిన చిత్రం. అందులో గయుడనే గంధర్వుని వలన కృష్ణార్జునులకు యుద్ధం సంభవిస్తుంది. ఈ చిత్రభారతంలో చతుర్ధనుడు అనే రాజు వలన వస్తుంది. రెంటిలోనూ శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ ఒకటే. ఇంద్రుడు, బ్రహ్మ, శివుల వద్దకు రక్షణకై వెళ్లి, అక్కడ కుదరక చివరకు అర్జునుని శరణు కోరడమూ సామాన్య అంశమే. అయితే చిత్రభారతంలో, పాండవ కౌరవుల మధ్య కురుక్షేతంలో జరిగిన సమరమంతటి ఘోర యుద్ధమే, పాండవ యాదవుల మధ్య జరుగుతుంది. ధర్మరాజుని తప్ప పాండవ కౌరవ సేనావాహిని అంతటిని, చతుర్ధనుడితో సహా, శ్రీకృష్ణుడు సంహరించడం చిత్రం అయితే, తిరిగి అందరూ బతకడం అద్భుతం. తన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ధర్మరాజు ఒక్కడే రోదిస్తూ ఉంటాడా యుద్ధభూమిలో. అప్పుడు కృష్ణుడు ఓదార్చడానికి వస్తే, తనను కూడా చక్రంతో చంపేయమని కోరుకొంటాడు. శ్రీకృష్ణుడు అతని పరిస్థితికి జాలిపడి, చనిపోయిన అందరిలోనూ ఒకే ఒక్కరిని బతికిస్తానని, అది ఎవరో కోరుకోమని ధర్మరాజుకు వరమిస్తాడు. అప్పుడు ధర్మరాజు, తాము యిచ్చిన మాట నిలుపుకోనేటట్టుగా చతుర్ధనుని బతికించమని కోరుకొంటాడు. ధర్మరాజు ధర్మ నిరతికి సంతోషించిన కృష్ణుడు, యుద్ధంలో మరణించిన వారందరినీ తిరిగి బతికిస్తాడు. ఇందులో అర్జునుని పరాక్రమంతో పాటు యుధిష్ఠిరుని ధర్మవీరం కూడా ప్రదర్శింపబడిందన్న మాట!

గయుని కథ దక్షిణాది భాషలలో యక్షగానంగాను, నాటకంగానూ ప్రసిద్ధి పొందింది. అయితే సంస్కృత పురాణాలలో ఎక్కడా ఆ కథ ఉన్నట్టు లేదు. ఈ చిత్రభారతం బ్రహ్మాండ పురాణం లోనిదని చరిగొండ ధర్మన్న ఈ కావ్య అవతారికలో పేర్కొన్నాడు. నేను బ్రహ్మాండ పురాణం మొత్తం చదవలేదు కాని, చూసినంత వరకూ అందులో ఈ కథ మాత్రం నాకు కనిపించలేదు. దీనికి మరే సంస్కృత గ్రంథమైనా మూలమేమో తెలియదు. బహుశా దేశభాషలలో ఉన్న గయోపాఖ్యానాన్ని ఆధారం చేసుకొని అలాంటి కథనే ఒక కావ్యంగా ధర్మన్న మలచి ఉండవచ్చును. తన కావ్యానికి గౌరవాన్ని తీసుకురావడం కోసం అది బ్రహ్మాండ పురాణంలోని కథగా పేర్కొని ఉండవచ్చు! సంస్కృత సాహిత్యంతో కొంత లోతైన పరిచయం ఉన్నవాళ్ళు నిగ్గు తేల్చాల్సిన విషయమిది.

మహాభారతంలో అనేక ఉపకథలు వచ్చినట్టుగానే చిత్రభారతంలో కూడా వస్తాయి. ఇంద్రుని దగ్గరకు రక్షణ కోరి వెళ్ళిన చతుర్ధనుడికి పారిజాతాపహరణ కథను వినిపిస్తాడు ఇంద్రుడు. అయితే అది నంది తిమ్మన చెప్పిన కథ కన్నా కొంత భిన్నమైనది. నరకాసురుని సంహరించిన తర్వాత అదితి కుండలాలను తీసుకొని స్వర్గానికి వెళతాడు కృష్ణుడు. అక్కడ శచీదేవి పారిజాత పుష్పాన్ని అలంకరించుకొని, దాన్ని ధరించే అర్హత దేవతాస్త్రీలకు మాత్రమే ఉందని సత్యభామతో అంటుంది. దానితో సత్య అలగడం, ఆమె అలక తీర్చడానికి ఇంద్రునితో యుద్ధం చేసి పారిజాత వృక్షాన్ని కృష్ణుడు భూమికి తీసుకుపోవడం జరుగుతుంది. తన పారిజాతాన్నే కాపాడుకోలేని తాను, కృష్ణునినుండి చతుర్ధనుని ఎలా కాపాడగలనని చెప్పి పంపిస్తాడు ఇంద్రుడు. అలాగే చతుర్ధనుడు శివుని దగ్గరకు వెళ్ళినపుడు అతనికి బాణాసుర వృత్తాంతాన్ని చెపుతాడు శివుడు. బ్రహ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు భాగవతంలో వచ్చే బ్రహ్మ గర్వభంగ కథను అతను చెపుతాడు. ఇలా అచ్చమైన పురాణ బాణీని అనుసరిస్తూ విచిత్రమైన కల్పనలతో సాగుతుంది ఈ కావ్యం.

ఇంతకీ చతుర్ధనుని చంపుతానని కృష్ణుడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? అది తెలుసుకోవాలంటే మన పద్యం దగ్గరకి తిరిగి రావాలి. పద్యానికి అర్థాన్ని వివరించుకొని ఆ తర్వాత మళ్ళీ కథలోకి వెళదాం. ఒక అప్సరస గుఱ్ఱంగా మారుతోంది. అది ఉత్తమజాతి అశ్వమే. సర్వాలంకారభూషితం కూడానూ. అయినా అవి స్త్రీలు ధరించే అలంకారాలు కావు కదా, గుఱ్ఱానివాయెను! అంచేత పాపం ఆ అప్సర వాటిని ఎలా భరిస్తోందో కదా అని దేవతలందరూ ఆశ్చర్యపడుతున్నారు. ప్రియుని పెదవుల తాకిడినే సహించలేనంత లేత పెదవులు ఆ అప్సరవి. ఇప్పుడా పెదాలకు గుఱ్ఱపు కళ్లెం తగిలించబడింది! అసలే ఆమెది తీగలాంటి మేను. మెడలో హారాన్ని కూడా మోయలేనంతటి సుకుమారమైన ఆ శరీరం వాగెలను, అంటే పగ్గాన్ని ఎలా ధరిస్తుంది! వెనక ఊగే జడ తాకిడులు కూడా ఓర్వలేని ఆ తరళాక్షి వంపైన పల్లము (అంటే కూర్చునేందుకు గుఱ్ఱంపై వేసే జీను) ఎలా మోస్తుంది! ఒడ్డాణాన్ని సైతం భరించలేని ఆమె పొట్ట పట్టెడ బిగింపుని ఎలా సహిస్తుంది! అతి మెల్లగా సుకుమారంగా నడిచే ఆమె ఇప్పుడు మనోవేగంతో ఎలా పరిగెత్తగలదు! ఇలా అనుకొంటూ దేవతలు అద్భుతంతో చూస్తూ ఉండగా, ఆమె సాంబ్రాణి తేజిగా మారిపోయింది. ఒక అందమైన ఆడది గుఱ్ఱంగా మారిపోయే సన్నివేశం కాని, దాన్ని ఇలా వర్ణించే పద్యం కాని బహుశా ప్రపంచ సాహిత్యంలో మరెక్కడా లేదేమో!

అలా గుఱ్ఱంగా మారిన అప్సరస మరెవరో కాదు, నలకూబరుని వలచి వలపించిన దేవకాంతామణి రంభ. తుల్యుడనే మహర్షి తపస్సుని భగ్నం చేయడానికి ఇంద్రుని పంపున వచ్చి, ఆ ముని కోపానికి గురి అయి అతనిచ్చిన శాపం వలన గుఱ్ఱంగా మారుతుంది. చతుర్ధనుడు కుండిన రాజ్యాన్ని ఏలే రాజు. గొప్ప గుణవంతుడు, పుణ్యమూర్తి. అతను చేసిన పుణ్యం కారణంగా అతనికి సశరీరంగా అన్ని లోకాలనూ చూసే యోగం ఉంది. అతన్ని తనపై ఎక్కించుకొని సర్వలోకాలు తిప్పి తీసుకువస్తే అప్పుడు రంభకు శాపవిమోచనం జరుగుతుంది. కుండిన రాజ్యం దగ్గరలో ఉన్న అరణ్యాన్ని చేరి అశ్వరూపాన్ని పొందుతుంది రంభ. వేటనుండి వస్తూ అడవిలో ఆ ఉత్తమాశ్వాన్ని చూసి చతుర్ధనుడు రాజ్యానికి పట్టుకువస్తాడు. ఒక శుభముహూర్తం చూసి దానిని అధిరోహిస్తాడు. అది ఆకాశానికి ఎగిరి, స్వర్గ వైకుంఠ కైలాసాది సకల లోకాలనూ చూపించి తిరిగి అతని రాజ్యానికి తీసుకువస్తుంది. అలా వచ్చే తోవలో ఒక చోట శ్రీకృష్ణుడు అర్ఘ్యం ఇస్తూ ఉంటే, ఈ గుఱ్ఱపు మొహాన ఉన్న చెమట కాస్తా జారి, గాలివాటుకి వచ్చి కృష్ణుని చేతిలో పడుతుంది. ఆ తర్వాత కథ పైన మనం చెప్పుకున్నదే. ఎక్కడి తుల్య మహర్షి తపస్సు, ఎక్కడి పాండవ యాదవ యుద్ధం! ఇప్పుడు మనం చెప్పుకొనే ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ అంటే ఇదే కదూ!

తాను రచించినది పురాణ కథ అని ధర్మన్న చెప్పుకొన్నా, యిది ప్రబంధ బంధురమైన రచన. కొత్త కొత్త వర్ణనలు, అద్భుత రసపోషణ, ధారాధుర్యమయిన పద్య రచన ఈ కావ్యంలో మనకి కనిపిస్తాయి. రంభ గుఱ్ఱంగా మారిన తర్వాత ఆ అశ్వాన్ని ప్రబంధంతో పోలుస్తూ చెప్పే పద్యంలో తన కావ్య గుణాలను అన్యాపదేశంగా ఇతను పేర్కొన్నాడని భావించవచ్చు.

పదముల చొప్పును వడి యొ
ప్పిదము నలంకారలక్ష్మి పేర్మియు ధారా
స్పద భావము గల్గి శుభ
ప్రదమై హయ మమరె సత్ప్రబంధము రీతిన్

పదముల అందము (గుఱ్ఱానికి కాళ్ళు, ప్రబంధానికి మాటలు), చక్కగా ఒప్పారే వడి (వడి అంటే వేగము, తెలుగు పద్యంలో యతి అని రెండు అర్థాలు), అలంకార శోభ, గొప్ప ధారతో కూడిన స్వభావము (అశ్వగతికి ప్రత్యేకించి ధార అని పేరు) కలిగిన శుభ్రప్రదమైన ఉత్తమాశ్వం సత్ప్రబంధంలా అనిపించడంలో ఆశ్చర్యమేముంది!
-----------------------------------------------------------------------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు  - ఈమాట (మే 2017)సౌజన్యంతో

Friday, May 25, 2018

ఈ పద్యం ఒకసారి చదవండి - 2


ఈ పద్యం ఒకసారి చదవండి - 2
సాహితీమిత్రులారా!చరిగొండ ధర్మన కృత చిత్రభారతంలోని ఈ పద్యం ఒకసారి
చదవండి- ఇది సహదేవుడు భీష్ముని ప్రతాపం గూర్చి కృష్ణుని
సభలో వర్ణిస్తున్న సందర్భంలోనిది ఈ పద్యం

చతురంబోధిపరీత భూవలయ రక్షాదక్ష బాహా బలో
ద్ధత రాజన్య సమూహ శుష్క గహనోద్యద్దావవహ్నిచ్ఛటా
యిత శాతోగ్ర కుఠార భార్గవ మదాహిస్తంభనోదగ్ర మం
త్రిత మౌర్వీ రవ భీష్ము భీష్ము నని వారింపంగ మీ శక్యమే


చదివారా చదివితే ఎలా వుందో
మధ్యలో ఆపడానికి వీలుకావడం లేదా
ఇంకేమైనా వుందా గమనించండి


Thursday, May 24, 2018

రుక్మిణీ వర్తమానం


రుక్మిణీ వర్తమానం

సాహితీమిత్రులారా!


మన తెలుగువారిలో రుక్మిణి కల్యాణం తెలియనివారుండరు
ఇప్పుడుకాదండి గతంలో ఇప్పుడు ఆమె ఏ సినిమా నాయికయో
చెప్పమనే స్థాయికి వచ్చేశాం. శ్కీకృష్ణునికి రుక్మిణి పంపిన సందేశంలోని
పద్యవివరణను చీమలమర్రి బృందావనరావుగారి మాటల్లో చూద్దాం.
ఈ వివరణ అంతర్జాల మాసపత్రిక నవంబర్ 2011లో ప్రచురితమైంది
ఇక చదవండి..........


ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో

పైది చాలా ప్రసిద్ధమైన పద్యం. భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం లోనిది. కవి పోతన.

ఒక యువకుని ప్రేమించి, తన ప్రేమ సాఫల్యం పొందగల అవకాశాలు కానీ, తన వారినుంచి తగిన సానుకూలత గానీ లేకపోవడంతో స్వయంగా తన ప్రయత్నాలు ప్రారంభించి, ఆ యత్నాలు ఫలిస్తాయో లేదో అనే సందేహమూ, ఆతురతా, ఏమవుతుందో అనే భయమూ – వీటితో డోలాయమానమౌతున్న కన్నె మనసు ఈ పద్యంలో ఎంతో సహజంగా కనిపిస్తుంది.

విదర్భ రాజపుత్రి రుక్మిణి. వివాహయోగ్యమైన వయసు వచ్చింది ఆమెకు. చిన్నతనం నుంచీ శ్రీకృష్ణుని పరాక్రమమూ, లీలలూ విని వుందేమో – ఆయననే పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. కానీ ఆమె అన్న రుక్మికి అది ఇష్టం లేదు. తన స్నేహితుడైన చేది రాజు శిశుపాలునికి చెల్లెలినివ్వాలనేది అతని ఉద్దేశం. తండ్రి భీష్మకుడు పేరుకే రాజు. పెత్తనమంతా రుక్మిదే. కూతురి మనసు తెలిసినా కొడుకు మాటను కాదనే సమర్థత తండ్రికి లేదు. రుక్మి మొండివాడు. చెల్లెలి ఇష్టాయిష్టాలతో అతనికి నిమిత్తం లేదు. శిశుపాలునికి ఇవ్వాలనేదే అతని నిశ్చయం. అతనికి కృష్ణుడంటే చిన్నచూపు. అతని స్నేహితుడైన శిశుపాలునికైతే కృష్ణునితో జన్మవైరం. ఇక రుక్మిణికేమో శిశుపాలుడంటే అసహ్యం. అతడు మత్తుడనీ, సింహము పాలి సొమ్ము లాక్కోవాలనుకునే గోమాయువు (నక్క) లాంటివాడనీ ఆమె అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో తను కోరుకున్న వానిని పొందగలిగే అవకాశం రుక్మిణికి లేనే లేదు.

కానీ ఆమె మోహం చాలా తీవ్రమైనది. ఎలాగైనా సరే కృష్ణునే చేసుకోవాలనేది ఆమె పంతం. అది వీలు కాకపోతే “వ్రతచర్యన్ నూరు జన్మంబులన్ నిను జింతించుచు బ్రాణముల్విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా,” అనేది ఆమె నిశ్చయం. ఏదో ఒక విధంగా కృష్ణునికి తన ప్రేమ తెలియజేస్తే చాలు, అతనే వచ్చి తనను సాధించుకుంటాడని ఆమె నమ్మింది. అందుకోసం తన ప్రేమ వార్తను ఎలాగైనా కృష్ణునికి చేరవేయాలని భావించింది.

రుక్మిణి ప్రేమ తీవ్రతతో ఉందే కాని, ఉచితానుచితాలు తెలియని యువతి కాదు. ఆమె ఒక మహారాజు పుత్రిక. మరో రాజుతో పెండ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె ఏమి చేసినా తొందరపాటు గానో, దొంగ వ్యవహారం గానో వెకిలిపాటు గానో ఉండరాదు. అది ఆమె శీలానికి యోగ్యమైన పద్ధతి కాదు. అందుకని ఆమె ఏ కుంటెనకత్తె తోనో రహస్యంగా వర్తమానం పంపలేదు. పరమ యోగ్యుడైన ఒక భూసురుని ఆ పనికి ఎన్నుకున్నది. తన పరిస్థితిని వివరించి చెప్పి కృష్ణునికి తన మనోగతాన్ని తెలుపమని పంపింది. ఆ బ్రాహ్మణుడు కూడా అది తగని పనిగా భావింపలేదు. విషయం రుక్మికో, రాజుకో తెలిస్తే తల తెగిపోయే పరిస్థితి. అయినా భయపడలేదు. ఒక సర్వ లక్షణ లక్షిత అయిన రాకుమారికి పరమయోగ్యుడైన శ్రీకృష్ణుడే భర్త కావాలని ఆయన కూడా భావించి అది సత్కార్యం గానూ, దైవ నిర్ణయం గానూ, తనకు ధర్మంగానూ నమ్మి అంగీకరించాడు. శ్రీకృష్ణునితో మాట్లాడేటప్పుడు గూడా ఆమెకు తగిన వాడవు నీవే, ఆమె కూడా నీకు మాత్రమే తగినది అని వివరిస్తాడు.

శ్రీకృష్ణుడు భగవంతుడు, రుక్మిణి సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆయన భక్తురాలు – ఈ మామూలు వాదనలను పక్కకు తోసెయ్యండి. ఒక యువతి తాను ప్రేమించిన వాడిని పొందడం కోసం, వ్యతిరేక పరిస్థితులను అధిగమించి ప్రయత్నాలు సాగించి సఫలీకృతురాలు కావడమూ, ఆ ప్రేమను పొందిన యువకుడు ఏదోలే అని కొట్టిపార వేయకుండా, నిర్దిష్టమైన ప్రణాళికతో నలుగురూ చూస్తుండగానే ఆమెను తన రథమ్మీద ఎక్కించుకొని తీసుకొని పోవడం – ఈ ఇరవయ్యోకటో శతాబ్దపు సినిమా కథ ద్వాపరయుగంలో జరగడమనేది ఎంత హృద్యమైన సన్నివేశం!

ఆ బ్రాహ్మణుడిని – అతని పేరు అగ్నిద్యోతనుడు – ద్వారకకు పంపిన దగ్గర్నుంచీ రుక్మిణి మనసులో ఒకటే గుబులు, ఒకటే ఆరాటం, ఏమౌతుందో, ఏమౌతుందో అని ఒకటే దిగులు. ఆ ఆరాటమంతా ఈ పద్యంలో ఎంత సహజంగానో వ్యక్తమయింది. అసలీయన ద్వారక చేరాడా, దారిలో అలసి ఎక్కడైనా చిక్కు పడ్డాడా! కృష్ణుడికి తన సంగతి తెలిపితే ఆయన ఏమనుకున్నాడో! ఇదేమిటి, ఈ అమ్మాయి ఇలా తప్పుగా ప్రవర్తించింది, అని అనుకోలేదు గదా. ఇంతకీ కృష్ణుడు వస్తాడా, ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడా లేదా! అయినా నా అదృష్టం ఎలా ఉందో గదా! ఇలా రకరకాలుగా ఊహలు పోతున్నాయి ఆమె మనస్సులో. తనంతట తనే వలచి వస్తే చులకన కావడం మామూలే. కృష్ణుడి దృష్టిలో తాను పలుచనై పోలేదు గదా! ‘తప్పుగా తలచెనో’ అనుకోవడంలో ఉద్దేశం అదే. తన ప్రేమ చాలా స్వచ్ఛమైనది. తానేమీ ఏమో రాజ్యసుఖాదికాలు ఆశించి కృష్ణున్ని కావాలనుకోలేదు. తాను రాజపుత్రిక. తనకు లేని రాజ్యసుఖాలు లేవు. కృష్ణుడే రాజ్యమేమీ లేనివాడు. అనాది నుంచి రాజ్యభోగాలు ఆశ చూపించి స్త్రీని లోబరుచుకోవడం పురుషుల ప్రకృతి. దుష్యంతుడు కూడా శకుంతలను లోబరచుకోటానికి “ఈ మునిపల్లె నుండుటిది యేల? నాకు భార్యవయి భాసుర లీల నశేష రాజ్యలక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందుము అనిందితేందు కాంతామలతుంగ హర్మ్యముల,” అన్నాడు. ఆమె కూడా తనకు పుట్టిన వాడినే రాజుగా చెయ్యమని అడిగి ఒప్పించుకొని ఒడబడింది. ఇక్కడ అలాంటిదేమీ లేదు.

ఏ రకంగా చూసినా కృష్ణుని కన్నా రుక్మిణే గొప్పది. ఆమె చాలా ఉచితం గానూ, ధైర్యం గానూ, మనస్సాక్షి పూర్వకం గానూ ప్రవర్తించింది. ఎంతైనా, తన రాయబార ఫలితం తెలిసిందాకా మనసులో ఆరాటమే గదా. ఆ ఆరాటమంతా పై పద్యంలో కనిపిస్తుంది. ఈ బ్రాహ్మణుడు పోయినాడో, లేదో ఆయన ఏమనుకున్నాడో, ఇంతకూ వస్తాడో, రాడో అని అనుకున్న తర్వాత “ఈశ్వరుండనుకూలింప దలంచునో, తలచడో,” అనుకోవడం ఎంతో స్వాభావికంగా ఉంది. ఇక్కడొక విచిత్రం ఉంది. ఈశ్వరుడేం చేస్తాడో గదా అని ఈశ్వరుణ్ణి ఒక్కణ్ణే కాదు. అమ్మవారిని – ఆర్యామహాదేవిని – కూడా రుక్మిణి తలచుకున్నది. ఈశ్వరుడు అనుకూలింప దలంచునో, లేదో అని సందేహపడింది గానీ, పార్వతీ దేవి విషయంలో ఆమెకు అటువంటి సందేహం ఏమాత్రమూ లేదు. ఆమె తప్పక తనను పాలిస్తుంది. అది నిశ్చయమే. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే “నను పాలించ నెరుంగునో, ఎరుగదో” అనేది. అమ్మవారు నిశ్శంకగా కాపాడుతుంది. కానీ, ఆ ఉపాయం ఆమెకు తెలుసునో, తెలియదో అని అనుకుంటున్నది రుక్మిణి. ఎంత నమ్మకమో చూడండి రుక్మిణికి గౌరీదేవి మీద. ఎంతైనా సాటి ఆడది గదా, ఆ మాత్రం సానుకూలత ఆమె మనసులో లేకుండా ఎలా వుంటుందా, అనేది రుక్మిణి విశ్వాసం! ఎంత కమ్మని పద్యం రాశాడు పోతన!

వివాహం జరగబోయే ముందు గౌరీదేవి ఆలయానికి వచ్చి గౌరీపూజ చేసి బయటకి వచ్చాక అప్పటికే రథంతో తయారుగా ఉన్న కృష్ణుడు అందరూ చూస్తుండగానే, రుక్మిణి చేయందించగా దాన్ని గ్రహించి ఆమెను రథమ్మీదకి ఎక్కించుకుంటాడు. ఇది రుక్మిణీ కళ్యాణానికి పతాక సన్నివేశం.

ఇప్పటికీ వివాహ సందర్భంలో వధువు గౌరీపూజ కావించడమనేది తప్పకుండా వస్తున్న ఆచారం. ఆడపెండ్లివాండ్ల విడిది గదిలో అలంకరించున్న ఆడంగులందరూ ఉండగా, బ్రాహ్మణుడు పెండ్లి కూతురి చేత గౌరీపూజ చేయిస్తాడు. ఆ పూజ అయింతర్వాత వరుని తరఫు పురోహితుడూ, వరుని తల్లిదండ్రులూ, ఇతర పెద్దలూ ఆ గదిలోకి వస్తారు. పురోహితులిద్దరూ – గోత్రమూ, ఋషుల ప్రవరతో సహా – ఫలానా వారి ముని మనమరాలు, ఫలానా వారి మనమరాలు, ఫలానా వారి పుత్రిక అయిన వధువును, ఫలానా గోత్రము, ఋషుల ప్రవర గల్గిన ఫలానా వారి ముని మనమడు, ఫలానా వారి మనమడు, ఫలానా వారి కొడుకు అయిన వరునితో వివాహానికి అనుజ్ఞ ఇచ్చిన తర్వాత, పెండ్లి కూతురిని గంపలో కూర్చోబెట్టి మేనమామలు పెండ్లి పీటల మీదకి తీసుకుని రావడం – అదో ముచ్చట! చెప్పవచ్చేదేమంటే, గౌరీపూజ అనేది పెండ్లిండ్లలో నేటికీ జరుగుతున్న ఆచారం. ద్వాపర యుగంలో ఇంట్లో కాకుండా ఆలయానికే వెళ్ళి గౌరీపూజ చేసేవారు కాబోలు. ఆ పద్ధతి రుక్మిణీ కృష్ణులకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఆర్యామహాదేవికి ఉపాయాలే తెలియకుండా ఉంటాయా!

ఇప్పటికీ ఏ పని మీదనైనా ఎవర్ని ఎక్కడికైనా పంపితే, అతను తిరిగి వచ్చేలోగా ‘ఘనుడా భూసురుడేగెనా’ అని మనం అనుకోవడం ఈ పద్యం సార్థకతను చెప్పకనే చెపుతుంది. మహానుభావుడు పోతన. ఔచిత్యమూ, అభిరుచీ ఎరుగని మన తెలుగు సినిమా నిర్మాతలూ, దర్శకులూ తగని నటులను ఎన్నుకొని రుక్మిణి పాత్రను ఘోరంగా, ఏడుపుగొట్టుగా చూపించారు గానీ నిజానికి రుక్మిణి మన పురాణాల్లోని ఒక గొప్ప నాయిక.

Wednesday, May 23, 2018

కవిత్వం, ఆధునికత, సాహిత్యం - 2


కవిత్వం, ఆధునికత, సాహిత్యం - 2

సాహితీమిత్రులారా!


మనం - "కవిత్వం, ఆధునికత, సాహిత్యం"అనే వ్యాసాన్ని
చూచాం. దానికొనసాగింపు రెండవ భాగం ఈ రోజు గమనించండి
దీన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు వ్రాశారు
అంతర్జాలమాసపత్రిక ఈమాటలో నవంబర్ 2002న
ఈ వ్యాసం ప్రచురితమైంది. ఇక చదవండి......

ప్రసిద్ధమైన లేదా ప్రతిభావంతమైన ఏ రచనకీ ఇది ప్రాచీనం, ఇది ఆధునికం అన్న విలువ లేదు! కవిత్వం అన్నది గోదావరి నది లాంటిది. ఎక్కడో బ్రహ్మగిరి, త్రియంబకేశ్వరంలో పుట్టి చిన్న వాగులాగ ప్రారంభమై, ఒక కాలువలాగ పారి, ఒక పెద్ద నదిగా మారి, అది మహారాష్ట్రలోకి వెళ్ళకుండా, మరో మలుపు తీసుకొని, నేరుగా ఆంధ్రదేశంలోకి వచ్చి, అఖండ గోదావరి అయిపోవడం అనేది ఒక పెద్ద ప్రక్రియ జరిగింది. ఇందులో ఈ నది అనేకమైన వాతావరణాల్లోంచి, అనేకమైన బాహ్య దృశ్యాల్లోంచి ప్రయాణించుకుంటూ వచ్చింది. అదేవిధంగా, సాహిత్యం అన్నది కూడా, గోదావరి నదిలాగా, అనుస్యూతమైనది. అంటే, ఎడతెగని ఒక పరిపూర్ణ ధారగా ప్రవహిస్తూ ముందుకు వచ్చింది. అలాగే, ఇది ప్రాచీనం, ఇది ఆధునికం అన్న తేడాలు లేకుండా ఉంది సాహిత్యం. సాహిత్యం అన్నది సాహిత్యం, కానిది కాదు. ప్రముఖ కధకుడు రాచకొండ విశ్వనాధా శాస్త్రి గారు ఒక మాటనే వారు. కవిత్వం అనగా నేమి? దానికుండే లక్షణాలు ఏమి? అని మాట్లాడుతుంటే, చాలా సింపుల్‌గా “What is poetry  is poetry and what is not poetry is not poetry”  అనేవారు. నిర్వచనాల్లో కవిత్వం ఉండదు. కవిత్వంలో కవిత్వం ఉంటుంది. మనం మూడు వంతులు నిర్వచనాల్లో ఇరుక్కుపోయి అసలైన విషయాలకి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కనక ప్రాచీనత ఆధునికత లేదా సమకాలీనత ఆధునికత వంటి విషయాలు పెట్టుకోటం అనేది కుదరనటువంటి విషయం. “ఇది ప్రాచీన సాహిత్యం కాబట్టి దీన్ని నేను ఆదరిస్తాను, ఇది ఆధునిక సాహిత్యం కాబట్టి దీన్ని నేను తిరస్కరిస్తాను, లేదా ఆధునిక సాహిత్యాన్ని మాత్రమే ఆదరిస్తాను, ప్రాచీనమైన సాహిత్యాన్ని నేను అంగీకరించను..” అని ముందుగా కొన్ని నిర్ణయాలు చేసుకోటం సరైన పద్ధతి కాదు. ఇది మొదటిగా జరిగే ప్రాధమికమైన అపోహ!

రెండవ అపోహ ఏమిటంటే పద్య కవిత్వం, వచన కవిత్వం లేదా గేయ కవిత్వం ప్రక్రియా భేదాల్ని బట్టి ఇది ఉత్తమమైనది, ఇది అధమమైనది అన్న అభిప్రాయాల్ని మనం తరచు చూస్తూ ఉంటాం! ఇటువంటి అభిప్రాయాల్ని ఎవరు, ఎందుకు ప్రచారం చేస్తారంటే ఒక ప్రక్రియని గాఢంగా అభిమానించినవారు, అంతకు మించినది మరొకటి లేదు అని గాఢంగా విశ్వసించిన వాళ్ళు దీని మీద ఉండే తీవ్రమైన అభిమానం మిగిలిన వాటిపై తీవ్రమైన అసంతృప్తిగా పరిణమించే అవకాశం ఉండటం వల్ల తరచు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అభిప్రాయాలు, ఈనాడుఆనాడు అని కాకుండా, ఏనాడూ ఉన్నాయి.

కాళిదాసు ఒక అద్భుతమైన శ్లోకం రాసాడు. అది ఆయన రచించిన నాటక రచనల్లో మొట్టమొదటిది “మాళవికాగ్ని మిత్రం” అన్న నాటకంలోది. అగ్నిమిత్రుడనే రాజుగారు, వాళ్ళ అంతఃపురంలోకి అనుకోకుండా వచ్చి చేరిన ఒక అమ్మాయి, వాళ్లకి సంబంధించిన ప్రణయ నాటకం ఇది. ఆ నాటకం మొట్టమొదట్లో  “పురాణమిత్యేవ నసాధు సర్వం, నచాపి కావ్యం నవమిత్య వధ్యమ్‌, సంతః పరీక్ష్యాంతరత్‌ భజంతే, మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః ” అని. ఈ శ్లోకానికి అర్ధం “ప్రాచీనమైనది అంతా స్వీకరించతగినది కాదు. ఇది కొత్తది కదా అని దానిని తిరస్కరించటం లేదా ఉదాశీనంగా చూట్టం కూడా సరైన పద్ధతి కాదు.వివేకవంతులైన వ్యక్తులు, పరీక్షగా దాన్ని గురించి ఆలోచన చేసి, ఏది ఉత్తమమైనదో దాని పట్ల అభిమానాన్ని ప్రకటిస్తారు. ఈరకమైన విచక్షణతోటి ఆలోచించని వ్యక్తులు , ఇతరులు ఏది చెపితే దాన్ని నమ్ముతూ ఉంటారు”. తరవాత ఈమాటలే అలంకారికులు, సమర్ధులైన కవులు చెప్పారు. ఈ ఇతివృత్తం రచనకి పనికి వస్తుంది, ఇది పనికి రాదు అనేటువంటి విభేదాల్ని మన మొత్తం ప్రాచీన సాహిత్యంలో (అటు తెలుగులోకాని, ఇటు సంస్కృతంలో కాని) చూసుకుంటూ వస్తే, ఆధునిక సాహిత్యంలో కూడా అనేక ఉద్యమాలవల్ల ప్రభావితులైన వాళ్ళు కూడా ఏనాడూ ఈవిషయాన్ని మాట్లాడ లేదు. ఎందుకంటే, “లక్షణాన్ని చెబుతున్నాను, దీన్ని నేను నిర్వచిస్తున్నాను. ఇది నేను ఇలాగే ఉండాలని నిర్దేశిస్తున్నాను” అనేవారికి, ఒక రకమైన తర్కం ఉంటుంది. ఇలాంటి చోట మనోధర్మం కంటే, బుద్ధిధర్మం ఎక్కువగా పనిచేస్తుంది. కాని, సాహిత్యాన్నికాని, ఇతర కళలనుగాని, ఒక ఆర్ద్రమైన దృష్టితో చూసేటువంటి వాళ్ళు, దాన్ని స్వీకరించేటువంటి వాళ్ళు మనోధర్మం ఉపయోగిస్తారు. మనోధర్మంతో ఏకళనైనా చూడటం అనేది అత్యవసరమైన విషయం. అలా చూసిన రోజున, కాలసంబంధమైనటువంటివి గాని, ప్రక్రియా సంబంధమైనటువంటివి గాని, హద్దులుగా కాని, అడ్లుగాగాని మనకి కనపడవు.

ఇంకొక విచిత్రమైన పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. సాధారణంగా మనం “ఆధునికత సమకాలీనత” అన్న రెండు మాటల్లో చాలా పొరపాటు పడుతూ ఉంటాం! “అధున” అన్న సంస్కృత పదానికి “నేడు” అని అర్ధం. “సమకాలీనత”కి కూడా అర్ధం అలాగే కనపడుతుంది. కాని, కళాదృష్టితో ఈ రెండు మాటల్ని చూసినపుడు, దానికి ఒక చిన్న అర్ధచ్ఛాయ భేదం కనపడుతుంది. ఉదాహరణకి, కవిత్వం గురించి ఆలోచిద్దాం! ఈనాటి కాలంలో, పద్యరచన అనేది ఒక చిన్న ప్రక్రియ. కుటుంబ సంక్షేమం గురించి, చెట్ల పెంపకం గురించి, వాతావరణ కాలుష్య నివారణం గురించి పద్యాలు రాసి, “నేను ఆధునిక కవిని” అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆధునికం అంటే సమకాలీన సమస్యల్ని, ఉటంకిస్తూ, వచనంలో ఉండే విషయాన్ని, పద్యీకరించటం లేదా ఛందఃకరణం చెయ్యటం అని కొందరి అభిప్రాయం. కాని ఆధునికత అంటే ఇది కాదు!

“ఆధునికత” అనేది మన కాలంలో, మనం జీవిస్తున్నప్పుడు చెప్పబడేటువంటి విషయమే కాదు. ప్రతి కాలంలోనూ కొందరు ఆధునికులు ఉంటారు! నన్నయ్య కంటే తిక్కన్న, తిక్కన్న కంటే శ్రీనాధుడు, శ్రీనాధుడు కంటే పెద్దన్న, అతనికంటే దక్షిణాంధ్రాలో వచ్చిన ఒక చేమకూర వేంకట కవో, లేకపోతే ఆ పెద్దన్న గారి పక్కనే ఉండే రామరాజభూషణుడనే భట్టుమూర్తో ఆధునికులు అవుతారు. ఎందుకంటే ఎవళ్ళూ కూడా ఇంకోళ్ళా రాయలేదు. నిన్నటివాడి కంటే, భిన్నమైన దృష్టితోటి, ఒక కొత్త రచనా సంవిధానంతో, ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదించడంతో, వాళ్ళు ముందుకు వచ్చారు. ఆధునికులు దీన్ని “సొంతగొంతు వెతుక్కోటం” అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకసారి ప్రముఖ మ్యూజిక్‌ కంపోజర్‌ రమేష్‌ నాయుడు గారితో పాట కంపోజింగ్‌లో, ఏదో కబుర్లు చెప్పుతూ మాట్లాడుతుంటే, ఒకతను వచ్చాడు. “నేను పాడతానండీ, సినిమాల్లో అవకాశం కావాలి” అన్నాడు. “నాయనా, నువ్వు ఏం పాడతావు?” అని నాయుడుగారు అడిగితే, “నేను ఘంటసాల లాగా పాడతానండీ” అన్నాడు. అందుకు సమాధానంగా రమేష్‌ నాయుడుగారు “బాబూ, ఘంటసాలగారే బతికున్నారు, ఘంటసాలగారిలాగా పాడక్కరలేదు, నీలాగ నువ్వు పాడే వసతి ఏమైనా ఉంటే చెప్పు, మనం ఆలోచిద్దాం” అన్నారు. అలాగే ఏ కాలంలో అయినా, నీలాగ నువ్వు ఏమైనా చెయ్యగలవా?

ఏ సందర్భంలో అయినా ప్రతి కళ వెనుక ఒక శాస్త్రం ఉంటుంది. చాలా నాటుగా చెప్పాలంటే,  సైకిల్‌ తొక్కటం నేర్చుకుంటే ఎలా వస్తుందో, పద్యం రాయటం కూడా నేర్చుకొంటే అలా వస్తుంది. అయితే, మామూలుగా ఉండే ఆవరణం, దానికుండే సాంకేతిక విషయాలు, ఎవరికైనా నేర్పగలం. కాని, దానికి మించిన మనో ధర్మం ఒకటి ఉంటుంది. ఆ మనోధర్మాన్ని వీటికి కలిపినపుడు మాత్రమే ఆ కళ నీసొంతంగా, నీకు సంబంధించిన ఒక ఆవిష్కృతి లేదా దాన్ని వ్యక్తం చెయ్యటంలో ఒక విశిష్టత కనిపిస్తుంది. చాలా మంది సంగీత విద్వాంసుల దగ్గర సంగీతం నేర్చుకుంటారు. మరి ఆంధ్రదేశంలో సంగీత విద్వాంసులు అనేసరికి ఒక వోలేటి వెంకటేశ్వర్లు గారో, ఒక నేదునూరి కృష్ణమూర్తి గారో, ఒక బాలమురళీకృష్ణ గారో లేదా దక్షిణదేశానికి వెళ్ళినప్పుడు మధురై శేషగోపాలం లాంటివాడో, ఎమ్‌. ఎస్‌. సుబ్బులక్ష్మి గారో, డి. కె. పట్టమ్మాళ్‌ గారో వాళ్ళ పేర్లే ఎందుకు గుర్తుకు వస్తాయి? కొన్ని వందలమంది సంగీత కళాశాలల్లోగాని, గురువుల వద్ద కానీ సంగీతం నేర్చుకొన్నారే? అని అంటే, ఆ నేర్చుకొన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, పాడే విధానంలో, ఆ రసాన్ని ఆవిష్కరించే విధానంలో, ఒక మనోధర్మాన్ని మనం వ్యక్తం చేసినప్పుడు ఆ కళ నీ”సొంతం” అవుతుందన్నమాట! ఆ సొంతం అవడం ఎప్పుడైతే ఉందో అది రెండు వందలేళ్లక్రితం అయినా కావచ్చు, ఈవాళ కావచ్చు, ఇంకో వంద సంవత్సరాలు పోయిన తరవాత కావచ్చు ఈ కళ అనేది అనుస్యూతమైన, ఎప్పటికప్పుడు కొనసాగే స్రవంతి అని అనుకుంటే, ఇందులో ఫలానా భాగం రైటు, ఫలానా భాగం రైటు కాదు, ఇది అంగీకార్యం, ఇది అంగీకారం కాదు అని అక్కడా లేదు! ఏ కళను మనం చూసినా, ప్రాచీన ఆధునిక భేదాలు కాని, లేదా ఈనాడు జరుగుతున్న విషయాన్ని నేను స్వీకరిస్తున్నాను కనుక ఇది ఆధునికం అని చెప్పడం సరి కాదు. “ఆధునికం” అంటే ఏమిటంటే, నీమనోధర్మాన్ని నిన్నటివాడికంటే, వేరేవిధంగా చెప్పడం అన్నమాట! ఆధునికం అన్నది కాలసంబంధం కాదు! ఆధునికత అన్నది మనోధర్మానికి సంబంధిించినది. ప్రబంధాల గురించి మనం అనేకం వింటూ ఉంటాం! ప్రబంధాలలో 18 వర్ణనలు ఉంటాయి. నాయికా, నాయకులు ఉంటారు. శృంగార రసం వర్ణింపబడుతుంది. ఇలా రొడ్డు కొట్టుడుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇది గతానుగతికంగా మనం చెప్పుకొనేది. కాని ప్రబంధయుగం మొత్తం పెద్దన్న గారిని మొదలుకొని దక్షిణాంధ్ర యుగంలో వచ్చిన చేమకూర వేంకట కవి, రంగాజమ్మ, ముద్దు పళని వరకు ఇలాగ 200 లేదా 300 ఏళ్ళు మనం వెళ్ళినట్టయితే, ఎవడిలాగ మరొకడు ఎప్పుడూ రాయలేదు. తరవాత భావకవులు వచ్చేసరికల్లా, వాళ్ళెవరూ ప్రబంధకవుల్లాగా ఇతి వృత్తాలు రాయలేదు. కనుక, కాలం మారుతున్నప్పుడు, కాలంలో అభిరుచులు మారుతున్నప్పుడు, కాలపరంగా ఇతర విషయాలు ప్రభావితం చేస్తున్నప్పుడు వాటిల్లో కళా సంబంధమైన అభిరుచుల వల్ల, కొత్త, కొత్త విషయాలు, కొత్త, కొత్త మార్పుల వల్ల, కొత్త మనోధర్మంతోటి సాహిత్యం చెప్పడం అనేది సంభవిస్తుంది.అప్పుడు అది నిన్నటి వాడికంటే భిన్నంగా కనిపిస్తుంది.ఆ కనిపించడంలో ఉన్న వైవిధ్యాన్ని మనం చూడాలిగానీ, నిన్నటిది చాలా గొప్పది, ఈవాళ వచ్చేటువంటిది కాదు అనే కాల సంబంధమైన నిర్ణయాల్తోటి మనం ఆలోచన చెయ్యకూడాదు.

క్రియేటివ్‌ ఆర్ట్‌ విషయంలో నువ్వేమిటి, నువ్వు సాంకేతికంగా నేర్చుకొన్నది ఎలా చెబుతున్నావు? అన్నది ముఖ్యం. మనకి చమత్కారంగా పద్యం రాయటం విషయంలో ఉన్న కవిత్వపు భ్రమల గురించి ఒక్కటి చెపుతూ ఉండేవారు. చాలా మందికి భ్రమేమిటంటే, ఫలానా ఆయన పద్యాలు రాస్తాడంటే ఆయన కవి అని! పద్యం రాయటం అంటే వచనంలో ఉన్న కొన్ని పదాల్ని ఛందస్సులోకి పెట్టటం అన్నమాట. ఏలూరులో నా మిత్రుడు ఒకడు, ఒక ప్రెస్‌ బోర్డు మీద ఒక రెండు లైన్లు రాయించాడు. “కలరు ప్రింటర్సు, బైండర్సు, కార్డుబోర్డు బాక్సుమేకర్సు, ఏలూరు, పవరుపేట” అని. ఈ రెండులైన్లు తేటగీతి పద్యపాదాలు. “ఆంధ్ర పత్రిక ఇచ్చట అమ్మబడును” శుభ్రమైన తేటగీతి పాదం ఇది. “కప్పులందున చేతులు కడుగరాదు” అది కూడా పద్యపాదమే! ఈ ఛందఃకరణం చెయ్యడం మాత్రమే కవిత్వం అయితే, అనేక విషయాలు కవిత్వం అవుతాయి. ఆయుర్వేద గ్రంధాలు పద్యాల్లో రాసిన వాళ్ళున్నారు. నీతి విషయాల్లో ఉత్తినే ఉండే స్టేట్మెంట్స్‌ పద్యల్లో చెప్పిన వాళ్ళున్నారు. ఇదే కనుక కవిత్వం అయితే, ఆంధ్ర పత్రిక ఎడిటోరియల్‌ కూడా కవిత్వమే అవుతుంది!
(ఇంకా ఉంది)

Tuesday, May 22, 2018

గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1


గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1సాహితీమిత్రులారా!గణపతి: అంతు చిక్కని వింత దేవుడు - అనే పేరున
కొన్ని కథలు వ్రాశారు సురేశ్ కొలిచాలగారు వీటిని
అంతర్జాల మాసపత్రిక ఈ మాటలో ప్రచురించారు
అవి మన పాఠకులకు అందించాలనే తపనతో
ఇక్కడ-
‘అమెరికాలో ఉంటూ మన పిల్లలకు మన పద్ధతులు, సంప్రదాయం ఏం తెలియకుండా పెంచుతున్నాం!’ అని అందరూ ప్రవాస భారతీయుల్లాగే మా ఆవిడ కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది. అందుకేనేమో, మొన్న వినాయక చవితి రోజు తను ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు వెళ్ళే తొందరలో ఉన్నా, ప్రొద్దునే లేచి, తలస్నానం చేసి, ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన రంగు బొమ్మలు వాడక పోవడం పర్యావరణ రీత్యా మంచిదని తనూ నమ్ముతుంది కాబట్టి ఇండియన్ స్టోరులో దొరికే రంగు రంగుల గణపతి బొమ్మలు కొనడం ఏనాడో మానివేశాం. అంతలో స్నానం చేసి కిందికి వచ్చిన పిల్లలకు తను తయారు చేసిన గణపతిని చూపించి ఈ రోజు వినాయక చవితి అని, దేవునికి మొక్కుకున్న తరువాతే సిరియల్ తినాలని ఆదేశించింది. వాళ్ళతో పాటు తను కూడా మొక్కుతూ, వాళ్ళ చేత శుక్లాంబరధరం శ్లోకం కరక్టుగా చెప్పించడానికి ఆపసోపాలు పడుతూ ఉంటే, నేను పక్కన నవ్వుతూ నిలబడ్డాను.

“ఉత్సవవిగ్రహంలా నిలబడి ఊరికే నవ్వడమేనా? సాయం చేసేదేమైనా ఉందా?”

నేను నవ్వడం మానేశాను.

“అయినా, అంత నవ్వెందుకొస్తోంది?”

“నువ్వు స్వర్ణకమలం సినిమా చూశావు కదా? అందులో శ్రీలక్ష్మి వినాయకుని పటానికి హారతి పడుతూ- శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం చదువుతుంది గుర్తుందా? అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నాను.”

“అదేమిటి, నేను చదివింది ఆంజనేయ దండకం కాదుగా? శుక్లాంబరధరం వినాయకుడి స్తోత్రమే కదా!”

శుక్లాంబరధరం అన్నది వినాయకుడి స్తోత్రమేనని చాలామంది అపోహపడతారు. ఈ స్తోత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, ఎక్కడా వినాయకుడిని వర్ణిస్తున్న ఆనవాలు లేదు- అంటూ ఆ శ్లోకం పూర్తిగా చదువుతూ ఒక్కో పదాన్నే వివరించాను:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!

టీకా: శుక్ల = తెల్లని; అంబర = వస్త్రమును; ధరం = ధరించిన వాడిని; విష్ణుం = విష్ణువును; శశి = చంద్రుని; వర్ణం = రంగు గల; చతుర్ = నాలుగు; భుజం = భుజముల వాడిని; ప్రసన్న = సంతుష్టమైన; వదనం = ముఖము కలవాడిని; ధ్యాయేత్ = ధ్యానింతును; సర్వ = అన్ని; విఘ్న = అడ్డంకులు; ఉపశాంతయే = ఉపశమించుటకు / తొలగి పోవుటకు.

తాత్పర్యం: తెల్లని వస్త్రములు ధరించినవాడిని, విష్ణువును, చంద్రుని వంటి కాంతి గలవాడిని, నాలుగు భుజములు గలవాడిని, సంతుష్టమైన ముఖము గలవాడిని, అన్ని అడ్డంకులు తొలగింప జేయుటకై ప్రార్థిస్తున్నాను.

“చూశావా! ఈ స్తోత్రంలో శుక్లాంబరధరం విష్ణుం అంటే, తెల్లని బట్టలు ధరించిన విష్ణువును ధ్యానిస్తున్నాను– అంటూ స్పష్టంగా విష్ణువు గురించి చెప్పే శ్లోకమే అని తెలిసిపోతుంది.” అన్నాను.

“నిజానికి నా దృష్టిలో గణపతి ప్రాచీన గ్రామదేవతల్లో ఒకడు. వేదాల్లో కానీ, అతి ప్రాచీన సంస్కృత సాహిత్యంలో కానీ గణపతి ప్రస్తావన ఎక్కడా కనిపించదు.”

ఆఫీసులకు, స్కూళ్ళకి వెళ్లాల్సిన వేళ కావడంతో ఆ చర్చ అక్కడితో (తాత్కాలికంగానే) ఆగిపోయింది. పిల్లలచే ఆ శ్లోకం పూర్తిగా చెప్పించి వాళ్ళను స్కూళ్ళలో దింపి మేము మా ఆఫీసులకు వెళ్లిపోయాం.

సాయంత్రం ఇంటికి రాగానే, “నేను మా నాన్నకు ఫోన్ చేసి వినాయకుడి గురించి అడిగాను. ఆయన ఋగ్వేదంలోనే గణపతిని స్తోత్రం చేసే శ్లోకాలున్నాయని అన్నాడు. గణానాం త్వా గణపతిం హవామహే… అన్న శ్లోకం ఋగ్వేదం లోనే ఉందట.” అంటూ గౌరీ-శంకర సంవాదంలా, ప్రొద్దుటి వాదాన్ని మళ్ళీ తిరగతోడింది మా ఆవిడ.

“మీ నాన్నను తప్పు పట్టడం కాదు కాని, ఋగ్వేదంలో ఆ శ్లోకం బృహస్పతి గురించి చేసే స్తోత్రం, వినాయకుడి గురించి కాదు.” ఎప్పుడో పదేళ్ళక్రితం ఇంటర్నెట్లో చేసిన చర్చ గుర్తు తెచ్చుకుంటూ అన్నాను. ఎందుకైనా మంచిదని, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన సమూల ఋగ్వేద సంహిత పుస్తకం తీసుకువచ్చి ద్వితీయ మండలం లోని 23వ సూక్తములో ఈ శ్లోకం చూపించాను.

గణానామ్ త్వా గణపతిగ్‌ం హవామహే
కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్।
జ్యేష్ఠరాజమ్ బ్రహ్మణామ్ బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభి స్సీద సాదనమ్॥

టీకా: గణానామ్= గణముయందు; త్వా= నిన్ను; గణపతిగ్‍ం= గణపతిని; హవామహే= ఆహ్వానించుచున్నాము; కవిమ్= కవిని; కవీనామ్= కవులలో; ఉపమ= పోలికలో; అశ్రవస్-తవమ్= మిక్కిలి అధికుడయిన వానిని; జ్యేష్ఠ రాజమ్= పెద్ద రాజు అయిన వాడిని (రాజాధిరాజును); బ్రహ్మణామ్= బ్రహ్మణ్యులలో; బ్రహ్మణస్పతే= బ్రహ్మణస్పతివి; ఆ= అయిన; శృణ్వన్= ఆలకించి; ఊతిభిః= కోర్కెలు తీర్చువాడవై ; సీద= అలంకరించుము; సాదనమ్= ఆసనము/స్థానము.

తాత్పర్యం: గణములకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసుడవు, పోల్చదగిన కీర్తి శ్రేష్టులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణస్పతివి, పెద్దరాజువు/రాజాధిరాజువు అయిన నీవు మా కోర్కెలు తీర్చుటకు, మా ప్రార్థన ఆలకించి ఈ పూజా సమయము నందు ఈ స్థానమును లేక ఆసనమును అలంకరించుము.

నిజానికి ఈ సూక్తానికి అధిదేవత బృహస్పతి/బ్రహ్మణస్పతి. ఈ సూక్తంలో మిగిలిన శ్లోకాలన్నీ బృహస్పతి/బ్రహ్మణస్పతిని ఉద్దేశించి రాసినవే. గణపతి అంటే ఇక్కడ జనసమూహానికి అధిపతి. అంతే. నిజానికి ఇంద్రుణ్ణి కూడా ‘గణపతి’ అంటూ ప్రస్తుతించే శ్లోకం ఋగ్వేదంలోని పదవ మండలంలోని 112వ సూక్తంలో కనిపిస్తుంది:

ని షు సీద గణపతే గణేషు
త్వం ఆహుర్ విప్రతమం కవీనామ్।
న ఋతే త్వత్ క్రియతే కిం చనారే
మహామ్ అర్కమ్ మఘవఞ్ చిత్రమ్ అర్చ॥

తాత్పర్యం: ఆసీనుడవు కమ్ము, గణములయందు గణపతివి; కవులయందు ఉత్తమ విప్రుడవు; నీ ప్రమేయం లేకుండా ఏమి జరగదు: ఓ మహాత్ముడా; అద్భుతమైన వాడా; మఘవంతుడా (శ్రీమంతుడా); ఈ స్తోత్రముతో నిన్ను అర్చించెదను.

ఈ దశమ మండలపు 112వ సూక్తంలో అన్ని శ్లోకాలు ఇంద్రుణ్ణి స్తుతిస్తున్నవే. కాబట్టి ఈ స్తోత్రం కూడా మనం ఏనుగు ముఖంతో ఉన్న గణపతిని ప్రార్థించే శ్లోకం కాదు అని సులభంగానే గ్రహించవచ్చు.

“మరైతే, దేవతలందరూ వినాయకుణ్ణి ప్రథమ దేవుడిగా పూజిస్తారు, అని మనకు చిన్నప్పటి నుండి చెప్పారు కదా! మన సినిమాల్లో, కావ్యాల్లో కూడా గణపతినే మొట్టమొదటగా స్తుతిస్తారు. ఇవన్నీ తరువాత వచ్చినవేనా?” కుతూహలంగా అడిగింది మా ఆవిడ. (అడిగిన వెంటనే నాలుక కరుచుకుంది ఎప్పట్లానే.) దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాను.

“సంస్కృత మహాభారతంలో గజముఖుడైన గణపతి ప్రస్తావన లేదు. మహాభారతంలో శివుడిని ఒకసారి గణేశునిగా ప్రస్తుతించిన శ్లోకం ఉంది. అంతేకాక, విష్ణువును గణేశ్వరునిగా కీర్తించడం కూడా కనిపిస్తుంది. వీరశైవులైన లింగాయతులు కూడా ఎక్కడా గణపతిని శివుని సుతునిగా ప్రస్తావించరు.శివుడు వారికి పరమేశ్వరుడైనా, వినాయకుడు దేవుడు కాదు వారికి. అలాగే, మన తెలుగు కావ్యాల్లో నన్నయ్య రాసిన మొట్టమొదటి పద్యంలో, శ్రీవాణిగిరిజాశ్చిరాయ… అంటూ త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులను శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూన్న ఈ పద్యంలో లక్ష్మీ, పార్వతి, సరస్వతుల ప్రస్తావనే తప్ప గణపతి/విఘ్నేశ్వరుని ప్రస్తావన ఎక్కడా కనిపించదు. అలాగే, తిక్కన మొదటి పద్యమైన శ్రీయన గౌరి నా బరగుచెల్వకు జిత్తము… అంటూ శ్రీ గౌరి ప్రస్తావనతో ప్రారంభించి, హరిహర స్తుతితో తన భారతాంధ్రీకరణను ప్రారంభించాడు. ఈ ప్రారంభ పద్యాల్లో ఎక్కడా గణపతి ప్రస్తుతి కనిపించదు. అయితే, ప్రబంధయుగంలో మాత్రం వినాయకుని ప్రస్తుతి, అవతారిక పద్యాల్లోనే మనకు కనిపిస్తుంది. పెద్దన రాసిన అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ… చాలా ప్రసిద్ధమైన పద్యం. పోతన, కేతన అవతారిక పద్యాల్లో కూడా వినాయకుని స్తుతి కనిపిస్తుంది. నన్నెచోడుడు కూడా వినాయకుని స్తుతించాడు కానీ, అతడు నన్నయ్య సమకాలికుడంటే నేనొప్పుకొను.

అయితే, మరి ఈ గణపతి అనే దేవుడు ఎక్కడినుండి వచ్చాడు? వేదాలలో ఏ మాత్రం కనిపించని వినాయకుడు హిందూమతంలో ఇంతగా ప్రముఖ స్థానం ఎలా సంపాదించాడు?

గణపతి ఇప్పటికీ అంతు చిక్కని వింతదేవుడు. అయితే, గణపతి పుట్టుపూర్వోత్తరాల గురించి; ఇతిహాస, పురాణ కాలంలో గణపతిని వర్ణించిన వివరాల గురించి; బుద్ధ వాఙ్మయంలో గణపతి ప్రస్తావన గురించి; ఇతర కావ్యాల్లో, శాసనాల్లో గాణాపత్య తెగల గురించి ఇప్పటిదాకా మనకు తెలిసిన వివరాలు — వాటిగురించి పలుపండితులు వెలిబుచ్చిన అభిప్రాయాలు అన్నీ నీకు వివరంగా వివరిస్తాను. ముందు డిన్నర్ కానిద్దామా?”

(సశేషం)