Thursday, May 13, 2021

ముక్కోటి దేవతలు ఎవరు?

 ముక్కోటి దేవతలు  ఎవరు?
సాహితీమిత్రులారా!విష్ణువు స్వరూపములైన ముప్పది ముగ్గురు
దేవతలనే ముక్కోటి దేవతలు అంటారు.

ఆ దేవతలు -
1. అష్టవసువులు - 8
   1. వరుణ, 2. వృషభ, 3. నహుష, 4. జయ
   5. అనిల, 6. విష్ణు 7. ప్రభాను, 8. ప్రత్యూష

2. రుద్రులు - 11
  1. ఉగ్ర, 2. సోమ, 3. శర్వ, 4. మృగవ్యాధ
  5. బిక్షక, 6. అహిర్ - బుధ్న్య, 7. పినాకీ,
  8. ఈశ్వర, 9. కాపాలిక, 10. భీమ, 11. భిషక్

3. ఆదిత్యులు - 12
   1. ఆర్యమ, 2. మిత్ర, 3. వరుణ, 4. అర్క, 5. భగ,
   6. ఇంద్ర,  7. వివస్వన్, 8. పూషా, 9. పర్జన్య, 10. త్వష్టా,
   11. విష్ణు, 12. అజ

4. ఇంద్రుడు,
5. బ్రహ్మ

మొత్తం = 8 + 11+ 12+ 1 + 1= 33

ఈ ముప్పది మువ్వురు విష్ణు స్వరూపులు.
వీరినే ముప్పదిమూడు కోట్ల దేవతలుగా చెబుతారు.

(శ్రీమాన్ దిట్టకవి నరసింహాచార్య కృత
 విజ్ఞాన కాంతి పుంజాలు నుండి.)


Tuesday, May 11, 2021

పంచభక్ష్య పరమాన్నాలంటే ఏవి?

 పంచభక్ష్య పరమాన్నాలంటే ఏవి?
సాహితీమిత్రులారా!మనం మాట్లాడే సమయంలో
పంచభక్ష్య పరమాన్నాలనే మాటను వింటుంటాం
పంచ అంటే అయిదు భక్ష్య - తినదగినవి
పరమాన్నాలు - అని అర్థం
అదే ఆ తినదగిన 5 భక్ష్యాలు ఏవి


పదార్థాలు(భక్ష్యాలు) -
1. నమలదగినవి - భక్ష్యాలు
2. తినదగినవి   - భోజ్యాలు
3. లేహ్యాలు     - నాక్కునేవి
4. జుఱ్ఱుకోగదినవి - చోష్యం
5. త్రాగదగినవి   - పానీయం


వీటన్నినిటిని కలిపి పంచభక్ష్యములు అంటారు
ఏవి తినగలవి ఏవినమలదగినవి
ఏవి జుర్రుకోదగినవి
ఏవి నాక్కోదగినవి విడిగా చెప్పక్కరలేదనుకుంటాను.

Sunday, May 9, 2021

అరచేతిలో తీర్థాలున్నాయా?

 అరచేతిలో తీర్థాలున్నాయా?
సాహితీమిత్రులారా!అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది.
ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.

కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి,
ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం
అని అంటున్నాము. అలా నీటిని
"ఓమ్ కేశవాయస్వాహా, "
"ఓమ్ నారాయణాయస్వాహా, "
"ఓమ్ మాధవాయస్వాహా ",
అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. 
ఈ సందర్భంలోని

ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.

చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే
బ్రహ్మతీర్థం అని అంటారు. 

చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ,
 ప్రజాపతి తీర్థం అని అంటారు.

అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని 
దాన్ని అగ్ని తీర్థం అని అంటారు. 

చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ
కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు ని అంటారు.

ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.

ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద 
ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము 
కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.

సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం 
కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది. 
పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం 
పితృతీర్థం అనబడుతున్నది.


Friday, May 7, 2021

దోషిని ఎలా కనుక్కొంటారు?

 దోషిని ఎలా కనుక్కొంటారు?
సాహితీమిత్రులారా!యాజ్ఞ్యవల్క్య స్మృతిలో మహాపరాధము చేసినవారికి 5 రకాల
దైవపరీక్షలను వివరించారు. అవి సామాన్యమైన
వాటికి ప్రయోగించరాదు. దోషము చేసినవారిని, చేయనివారిని
కనుక్కోవటానికి ఈ పరీక్షలను చెప్పడం జరిగింది.

1. తులపరీక్ష-
దీనిలో దోషిగా నిర్ణయించబడినవారు ఒక త్రాసులో
కూర్చోవాలి తూచబడతాడు. మరలా లేచి  ఆ త్రాసునుద్దేశించి
నేను దోషినికానిచో నన్ను పైకి తీసుకుపొమ్మని మంత్రపూర్వకంగా
ప్రార్థించాలి. తరువాత అంతకుముందు కూర్చున్న దానిలోనే కూర్చోవాలి.
 అపుడు ఆ శిబిక పైకిలేచిన అతడు నిర్దోషి. లేదా
క్రిందికి వచ్చినా, యథాస్థానంలో ఉన్నా అతడు దోషిగా నిర్థారించబడతాడు.

2. అగ్ని పరీక్ష -
దీనిలో పరీక్షించ వలసినవాని చేతిలో 7 రావి ఆకులను ఉంచి
అగ్నిని ప్రార్థించి వానిపై బాగా కాల్చబడిన ఇనుపగుండ్లను చేతిలో
పెడతారు. వారు అగ్నిగుండము చుట్టు 7 వలయాలుగా ఉంచిన
అగ్నివలయాలను నిదానంగా దాటిన తరువాత ఇనుపగుండ్లను
వదలివేయాలి. అలా వదలిన తరువాత చేతులు పరీక్షిస్తారు
అవి కాలినచో అతడు దోషి. కాలనిచో నిర్దోషి.

3. ఉదక పరీక్ష - 
దీనిలో వరుణుని ప్రార్థించి నిందితుడు జలాశయంలో
నాభివరకు నీరు వచ్చువరకు వెళ్ళి నిలబడతాడు.
 మరొకడు తొడలు పట్టుకొని  ఉంటాడు. అప్పుడే బాణాన్ని విలుకాడు
 వదలిపెడతాడు విడిచిన బాణంతో బాగా వేగంగా పరుగెత్తేవాడు
ఒకడు నిలబడి ఉంటాడు. బాణంపడినచోట మరొకడు ఉంటాడు.
అపుడు ప్రాడ్వివాకులు మూడుమార్లు చప్పట్లు కొడతారు
మూడవమారు కొట్టగానే నిందితుడు
నీటిలో మునుగుతాడు. వెంటనే బాణం విడిచిన స్థానమందున్నవాడు
బాణం పడినచోటుకు చేరుకుంటాడు. చేరగనే బాణంపడిన
చోటున్నవాడు బాణంతో బాణం వదలినచోటుకు పరుగుతీస్తాడు.
అతడు ఆచోటుకు చేరేప్పటికి నిందితుడు నీళ్ళలోనే ముని ఉండాలి
అలా ఉంటే నిర్దోషి లేదంటే దోషి.

4. విషపరీక్ష - 
దీనిలో నిందితుడు విషాన్ని ప్రార్థించి. ఏడు యవల
(గోధుమగింజలలోని ఒక రకం) అంత పరిమాణంలో విషాన్ని
అంతకు 30 రెట్ల పరిణామం ఉన్న వెన్నతో కలిపి పూర్వాహ్నంలో
చల్లని చోట తినాలి. ఆ రోజంతా అతనికి మూర్ఛ, వమనము
మొదలైన విషలక్షణాలు కనబడకుంటే
అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తారు.

5. కోశ పరీక్ష -
ఇందులో రుద్ర, దుర్గ, ఆదిత్య మొదలైన ఉగ్రదేవతలను పూజించి
వారి స్నానోదకమును సేవిస్తాడు. 14 రోజులలో రాజ దైవిక సంకటాలు
(ధన నష్టము, బంధువుల మరణము, రోగము మొదలైనవి) రానిచో
అతడు నిర్ధోషిగా ప్రకటిస్తారు.

Wednesday, May 5, 2021

తాంబూలం వేయడం ఎందుకు?

 తాంబూలం వేయడం ఎందుకు?
సాహితీమిత్రులారా!తాంబూలం గురించిన
ఈ శ్లోకం చూడండి-

ప్రాతః కాలే ఫలాధిక్యం
చూర్ణాధిక్యంతు మధ్యమం
వర్ణాధిక్యం భవే ద్రా త్రౌ
తాంబూలమితి లక్షణం


తాంబూలంలో మూడు వస్తువులున్నాయి.
1. ఆకులు, 2. వక్కలు, 3. సున్నం
ఇవి ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పేదీ
శ్లోకం.
ప్రాతఃకాలంలో వక్కలు ఎక్కువగాను
మధ్యాహ్నం సున్నం ఎక్కువగాను
రాత్రి తమలపాకులను ఎక్కువగాను
ఉన్న తాంబూలం సేవించాలని అర్థం.

ఉదయం పైత్యాన్ని హరిస్తుంది వక్క,
మధ్యాహ్నం ఉష్ణాధిక్యాన్ని తగ్గిస్తుంది సున్నం,
రాత్రి తమలపాకు జీర్ణశక్తిని కలుగజేస్తుంది

సున్నం శరీరానికి కావలసిన కాల్షియం అందిస్తుంది.
పుట్టబోయే బిడ్డకు ఎముకలుకు బలాన్నిం ఇచ్చేందుకు
గర్భిణీ స్త్రీలు తాంబూలం వేసుకోవాలి.
ఇది ఆహారానికి రుచిని కలిగిస్తుంది.
వివాహితులే తాంబూలం వేసుకోవడం మంచిది.
అలాగే భోజనానంతరమే వేసుకోవాలి
ఎప్పుడూ నమలుతూ ఉండటం మంచిది కాదు.

Monday, May 3, 2021

''స్నానం'' అంటే ఏమిటి?

''స్నానం'' అంటే  ఏమిటి?
సాహితీమిత్రులారా!

స్నానం అంటే మనం ప్రతినిత్యం చేసేదేకదా

అవును కానీ దీనిలో రకాలున్నాయట-
తలస్నానం, కంఠస్నానం అవేకదా
అవి మనకు తెలిసినవి కాని మనకు తెలియనివి
ఉన్నాయి వాటిని గురించి ఇక్కడ తెలుసుకుందాం

శాస్త్రాలల్లో స్నానాలు పంచ, దశ, సప్తవిధాలని 
తెలిపియున్నారు మన పెద్దలు.

స్నానాని పంచ పుణ్యాని కీర్తితాని మహర్షిభిః.......
అని అంటే స్నానం 5 రకాలని అవి-

1. ఆగ్నేయస్నానం
   విభూతిని శరీరమంతా పూసుకోవడం

2. వారుణ స్నానం
   బొడ్డులోతు నీటిలో మూడుసార్లు మునగడం వారుణ స్నానం 

3. బ్రాహ్మ్య స్నానం
   ఆపోహిష్టామ యోభువఃతాన ఊర్జే దధాతన....
       అనే మంత్రం చదువుతూ స్నానం చేయడం

4. వాయవ్య స్నానం
   గోధూళి శరీరం మీద వేసుకోవడం

5. దివ్య స్నానం
   ఎండ కాస్తున్నప్పుడు వర్షం కురిస్తే ఆ నీటిలో తడవడం

ఇవి ఆంధ్రవేద పరిభాష అనే గ్రంథంలో చెప్పబడినవి.
అలాగే ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేదసార రత్నావళిలో
దశవిధ, సప్తవిధ స్నానాలగురించి వివరించారు.

పై చెప్పిన 5 విధాలకు మరికొన్ని చేర్చారు ఇక్కడ
వారుణం, ఆగ్నేయం, వాయవ్యం, బ్రహ్మం, కాపిలం, మానసం,
దివ్యం అని ఏడు విధాలు

పైన చెప్పనివి కాపిలం, మానసం అనేవి రెండురకాలు

కాపిలం స్నానం -
నాభిస్థానానికి దిగువ నీటితో ప్రక్షాళన చేసికొని
శరీరం పైభాగాన్ని తడిబట్టతో తుడుచుకోవటం

మానస స్నానం
మనసులో విష్ణుస్మరణ చేసుకోవటం మానస స్నానం

పది స్నానాలు-

భస్మ గోమయ, ఘృ, ద్వారి, పంచగవ్యైస్తతః పరం
గోమూత్రం, క్షీరం, సర్పిః, మశోదకం .....
అనే శ్లోకం పదివిధాలైన స్నానాలను చెబుతున్నది.
దీనిలోని ప్రతి స్నానానికి మంత్రాలున్నాయి. అవి
మనం ఇక్కడ వివరించుకోవడం లేదు.

స్నానం చేసే విధానంలో 5 అంగాలున్నాయట
అవిసంకల్పం, మార్జనం, వరుణసూక్త పఠనం,
అఘమర్షణం, స్నానాంగ తర్పణం అనేవి
స్నానాంగ పంచకాలు.

Saturday, May 1, 2021

''పంచకావ్యాలు'' అంటే ఏవి?

''పంచకావ్యాలు'' అంటే ఏవి?
సాహితీమిత్రులారా !


ఏ భాషా సాహిత్యంలోనైనా, వేలకొద్దీ పుస్తకాలు
వెలువడుతుంటాయి కానీ మరీ గొప్ప గ్రంథాలను
వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు. నిన్నమొన్నటిదాకా
సంస్కృతంలో మొట్టమొదట చదవాల్సింది
ఐదు కావ్యలను చెప్పేవారు వాటినే
పంచకావ్యాలు అంటుండేవారు.
చిత్రమేమంటే ఆ ఐదింటిలో
కాళిదాసు వ్రాసినవి మూడున్నాయి.
మరొకటి భారవి వ్రాసింది. ఇంకొకటి
మాఘుడు వ్రాసింది. ఈ ఐదు కావ్యాలు
చదువగానే ఇంకే కావ్యాన్నైనా చదివి
అర్థం చేసుకోవడం అంతసులువని
వారి నమ్మకం. కాదు నిజమే.
ద్రాక్షాపాకంలోని రఘువంశం మొదలు
కొరుకుడు పడని మాఘకావ్యం వరకు.
చూద్దామా వాటి పేర్లు వరుసగా
1. రఘువంశం  - కాళిదాసు
2. కుమార సంభవం - కాళిదాసు
3. మేఘసందేశం - కాళిదాసు
4. కిరాతార్జునీయం - భారవి
5. శిశుపాలవధ - మాఘకవి

ఇవన్నీ సంస్కృతంకదా తెలుగులో
ఏవైనా వున్నాయా ఇలా అంటే
ఉన్నాయి. వాటిని రెండు మూడు
విధాలుగా చెబుతున్నారు చూద్దాం-
మన పరిశోధకులు ఆరుద్రగారి
ప్రకారం -
తెలుగులో పంచకావ్యాలు-
1. మనుచరిత్ర - అల్లసాని పెద్దన
2. వసుచరిత్ర - రామరాజభూషణడు
3. రాఘవపాండవీయం - పింగళి సూరన
4. శృంగారనైషధం - శ్రీనాథకవి
5. ఆముక్తమాల్యద - శ్రీకృష్ణదేవరాయలు

అంతర్జాలంలో కొందరు పెట్టిన
పంచకావ్యాలు-
1. మనుచరిత్ర - అల్లసాని పెద్దన
2. పాండురంగమాహత్మ్యం - తెనాలి రామకృష్ణుడు
3. ఆముక్తమాల్యద - శ్రీకృష్ణదేవరాయలు
4. వసుచరిత్ర - రామరాజభూషణుడు
5. విజయవిలాసము - చేమకూర వేంకటకవి

ఇక్కడ ఏవి పంచకావ్యాలైనా వాటిని చదవడం వలన
భాషా పరిజ్ఞానం పెంపొందుతుందని మనవారి
ఆలోచన.
పాటించగలవారు దాదాపు లేరనే చెప్పాలి
పాటించగల వారుంటే
వారి ధన్యవాదాలు.