Sunday, April 30, 2017

తెలుగులో భజగోవిందం -1


తెలుగులో భజగోవిందం -1
సాహితీమిత్రులారా!శ్రీ అలంకారం కోటంరాజుగారు
ఆంధ్రీకరించిన భజగోవిందం
చూడండి-
భజగోవిందం శ్లోకాలకు
మోహమగద్గరం
అనే పేరు కూడ ఉంది.


చావు దరిగొన్న సమయాన చాకునే, డు
కృఙ్కరణ సూత్రమింత ధరిత్రిలోన
మూఢ! గోవిందు భజింపు మోయి నిన్ను
వాడె రక్షించు జగతి నవార్యగతిని - 1

మనసునం గోరికలు మాను మాన్యబుద్ధి
ధనమునందాస వీడుము ధాత్రిలోన
నీదు నిజకర్మలభ్యమ్మదేది యగునొ!
దానదనరుము మూఢ! విధాన మదియ  - 2

మనసునందున చింతించి దినముదినము
పడతి చనుదోయియును నాభిపద్మమరసి
మోహపడబోకు, వానికై దేహమందు
కల్గు మాంసంపు ముద్దలుగావె తెలియ!  - 3

ఔర! నలినీదళంబుపై నీరమట్లు
బ్రదుకుచంచలమై కడు పరిఢవిల్లు
లోకమంతయు నెంతయో రోగశోక
మోహములతోడ నిండారు మూఢ! వినుమ  - 4

విత్త సముపార్జనా సక్త చిత్త వృత్తి
కలుగు తఱి నిన్ను నీవారు పలుకరింత్రు
జర్జరితమౌచు దేహమ్ముసాగు నపుడు
ఎవరు గేహాన నిను పల్కరింతు రెరుగ?  - 5


దేహమందున ప్రాణమ్ము తేజరిల్ల
యెన్న క్షేమమ్ము నరసెద రింటిలోన
దేహ మందున ప్రాణమ్ము తీరువెన్క
భార్యయే భీతి పడు కళేబరము జూచి    - 6

బంధురమ్ము క్రీడాసక్తి బాల్యమందు
వనితలన్న యాసక్తి యౌవ్వనమునందు
వృద్ధుడైన చింతాసక్తి వృద్ధియగును
బ్రహ్మమన్న నిరాసక్తి బరపు గాదె!            - 7


ఎవరు నీ భార్య?  నీపుత్రుడెవరు జెపుమ?
చిత్రమైనది సంసార జీవనంబు
ఎవ్వడవు నీవు? నీరాక యెచటనుండి
తమ్ముడా! యిపుడు సల్పు యదార్థ చింత!   - 8

సజ్జన స్నేహకలన నిస్సంగమమరు
పుడమి నిస్సంగమునను నిర్మోహమమరు
రహిని నిర్మోహమున నిశ్చలత్వమమరు
నిశ్చలతయె జీవన్ముక్తి నిచ్చు నెపుడు   - 9

కరుగ వయసును కామవికారమేది?
నీరు యెండిన తఱిని కాసారమేది?
ధనము నశియింప యెవరు బాంధవులు జూడ
జ్ఞానియౌ వాని కేది సంసారమరయ!        - 10


ధనము జనమును జూచి యౌవ్వనము జూచి
గర్వపడకు, యొకనిమేష కాలమందు
అన్ని నశియించు, మాయా మయంబటంచు
నెఱిగి సద్భ్రహ్మ పదవి వరింపుమీవు       - 11


జగద్గురు శంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు


జగద్గురు శంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు

సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు

జగద్గురు శంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు

Saturday, April 29, 2017

మన సాంప్రదాయం


మన సాంప్రదాయం 
సాహితీమిత్రులారా!మన సాంప్రదాయంలో
ఉన్న కొన్ని విషయాలను గమనిద్దాం
వీలైతే ఆచరిద్దాం-

నిద్రలేవగానే ప్రతి ఒకరు తమకు ఇష్టమైన వారినో
దేవుని చిత్రాన్నో బాబా చిత్రాన్నో చూస్తుంటారు.
కానీ వీటికంటే ఇలా చేస్తే బాగుంటుందేమో
ఇది మనపూర్వులు ఆచరించేదే
నిద్రలేవగానే ఎవరి కుడిచేయిని వారు
చూచుకోవడం చూస్తూ
ఈ శ్లోకం లేదా శ్లోక భావాన్ని
మనసులో అనుకోవడం-


కరాగ్రే వసతే లక్ష్మీః
కరమధ్యే సరస్వతీ
కరమూలే తు గోవిందః
ప్రభాతే కరదర్శనమ్

అరచేతి మొదటిలో లక్ష్మీదేవి
అరచేతి మధ్యలో సరస్వతీదేవి
అరచేతి మొదటిలో గోవిందుడు
ఉన్నాడని ప్రభాతవేళలో
చేతిని దర్శిస్తున్నాను - అనేది
దీని భావం

లోకోభిన్నరుచిః


లోకోభిన్నరుచిః
సాహితీమిత్రులారా !


ఎడవల్లి వెంకటకవి గారు
తను చెప్పదలుచుకున్న
విషయాన్ని ఈ పద్యంలో
ఎలరా చెప్పారో చూడండి-

అత్యంత గూఢమైన అర్థంబుగాని సం
         దర్భంబు కవిత కొందరకు బ్రియము
సరవినశ్రుత పూర్వ శబ్ద ప్రయోగముల్
         చెరగిన కవిత కొందరకు బ్రియము
పోడిమి రెట్టింప వాడిక మాటలు
         తరచైన కవిత కొందరకు బ్రియము
సెలయేళ్ళు దుమికిన సరణి జంఝాళి
         తంబైన కవిత కొందరకు బ్రియము
భూమిని నందర మనసురా గవితసెప్పి
మెప్పుగైకొనగనవశక్యమప్పనమున
దాచనేటికి బుద్ధికి తోచినటుల
రచన చేసెద వినరయ్య రసికులార!

ఎన్ని విధాల చెప్పినా నచ్చనివాడు వచ్చడు
నచ్చేవాడు ఎలాగైనా నచ్చుతాడు అందువల్ల
కవి తన ఇచ్చవచ్చిన రీతి వ్రాస్తానంటున్నాడు
అంతే కదా లోకోభిన్న రుచిః  అంటారు పెద్దలు.

Friday, April 28, 2017

మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరికిన్


మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరికిన్
సాహితీమిత్రులారా!మూర్ఖులైనవారిని మార్చడం ఎంతటి కష్టమో
భర్తృహరి సుభాషితం చెబుతున్నది చూడండి-
ఇది ఏనుగు లక్ష్మణ కవి అనువాదము-

మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా
యక చలదూర్మికానికరమైన మహోదధి దాఁటవచ్చు, మ
స్తకమునఁ బూవుదండవోలె సర్పమునైన భరింప వచ్చు, మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరి కిన్


మొసలి నోట్లో - దాని కోరల మధ్య ఇరుక్కొన్న రత్నాన్ని
ఎంతో ప్రయత్నంచేత(దాన్ని చంపకుండా) బైటకు తీయవచ్చు
పెను కెరటాలు క్షణం ఆగుండా ఒడ్డుకువిసిరే సముద్రాన్నయినా
దాటవచ్చు మహాభీకరంగా బుసలు కొట్టే పామును సయితము
మచ్చికతో పూలదండవలె తలమీద ధరించవచ్చు
 కానీ పట్టరాని క్రోధంతో మూర్ఖుడై వున్నవాడిని సమాధాన
పరచడం మాత్రం నిజంగా అసాధ్యం - అని భావం.

ఏదీ నాటి తృప్తి?


ఏదీ నాటి తృప్తి?
సాహితీమిత్రులారా!తిరుపతి వేంకట కవులలోని
చెళ్లపిళ్ళ వేంకట శాస్తిగారు
కామేశ్వరీయము అనేశతం వ్రాశారు
అందులోని ఈ పద్యం చూడండి-

చదువుల్ విస్తరికుట్లు, జందెపు బనుల్ చాపల్, మఱిన్ దొడ్డి లో
పొదలున్ కూరలు గాగ వర్తిలిరి మున్ భూమీసురుల్ - నేటి సం
పద మోటారులు, మేడలోడలునుగా మాఱెంగదా వీరి కు
న్నదె అవ్వారల తృప్తి వారి సుఖ మానందంబు కామేశ్వరీ!


పూర్వం విద్యావంతులైన పండితులైన వారు విద్యార్థులకు
విద్యాదానం చేస్తూ వేదశాస్త్రాలు పాఠాలు చెబుతూ
విస్తర్లుకుట్టుకుంటూనో, జందేలువడుక్కుంటూనో,
దర్భలతో చాపలు అల్లుతూనో గడిపేవారు.
దొడ్డిలో పూలచెట్లు, కూరగాయల పనులు
చూసుకుంటూ అదే వారి సంపదగా భావించేవారు.
నేటివారికి సంపదకు కొలమానాలు వారి మోటారుకారులు,
మేడలు, ఓడలు అయినాయి. ప్రాచీనుల తృప్తి,
ఆనందం ఇప్పటివారికి ఉన్నాయా-
అని కామేశ్వరీదేవిని అడుగుతున్నారు.

ఆలోచించండి వారు దేవిని అడిగినది నిజమేనా?
కాదా?

Thursday, April 27, 2017

సత్యము లేనిచోట


సత్యము లేనిచోట
సాహితీమిత్రులారా!


పెమ్మయసింగధీమణీ మకుటంతో వ్రాయబడిన
పద్యాలలోని ఒక పద్యం

సత్యము లేని చోటఁ దనుసమ్మతిఁ జెందనిచోట, సాధు సాం
గత్యము లేనిచోట ధనకాంక్షమునింగినచోట శత్రు రా
హిత్యము లేనిచోట ఋణమీయనిచోట గాపురంబుఁ దా
నిత్యముఁజేయరాదు సుమి నిక్కము పెమ్మయ సింగధీమ ణీ!

ఈ పద్యకారుడు
సత్యం పలుకనిచోట,
తన మనసుకు సమ్మతిలేనిచోట,
మంచివారితో స్నేహం లేనిచోట,
శత్రువులు ఉన్నచోట, అప్పు పుట్టనిచోట,
ఉండరాదంటున్నాడు.

నిజమేనా
ఈయన చెప్పిన అంశాలు
కాదనగలరేమో చూడండి

Wednesday, April 26, 2017

తా తిట్టక వాదు రాదు


తా తిట్టక వాదు రాదు
సాహితీమిత్రులారా!


ఈ పద్యం చూడండి
ఎంత సత్యాన్ని చెబుతున్నదో

పెట్టక కీర్తిరాదు వలపింపక యింతికి నింపురాదు తాఁ
దిట్టక వాదురాదిఁక నెదిర్చిన వైరుల సంగరంబునన్
కొట్టక పేరురాదు కొడుకొక్కఁడు లేక ఫలంబు లేదయా
బట్టపు రాజుకైన నిది పద్ధతి పెమ్మయ సింగధీమణీ!


ఎవరికీ ఏమీ పెట్టక పోేతే కీర్తి ఎలా వస్తుంది రాదుకదా
స్త్రీని వలపించక ఇష్టమెలా పుడుతుంది పుట్టదుకదా
ఎదిర్చిన శత్రువును యుద్ధంలో కొట్టక పోతే పేరు
ఎలా వస్తుంది రాదనేకదా
ఇవన్నీ  సరే దేనికైనా కొడుకొకడుంటే ప్రయోజనం
ఉంటుంది లేకపోతే ప్రయోజనమేమి
పట్టపురాజుకైనా ఇదే పద్ధతి అంటున్నాడు కవి
ఇవన్నీ నిజమే కదా ఆలోచించండి.

గర్భవతి వర్ణన


గర్భవతి వర్ణన
సాహితీమిత్రులారా!చక్రపురి రాఘవాచారిగారి
నలచరిత్ర (ద్విపద)నుండి
గర్భవతీవర్ణన గమనించండి
ఎంత చక్కగా చేశారో చూడండి-

పరిపూర్ణ సోముని బడలించు మోము
దొరకొని వేగుచంద్రునిరీతి నుండె

ననవిల్తు పూచెండ్లనందగు చనగల
మొనల నల్లని వర్ణములు గానిపించె

మృదుబింబముల వన్నె మెచ్చని మోవి
కదిసిన మలినంబు గప్పినట్లుండె

బడలికల్ మేనునఁ బర్వె నందంద
నడు మమందం బాయె నాభి గన్పడియె

సవరని నల్లపూసలపేరుఁ బోలె
నవిరళంబగు నూగారుఁ జూపట్టెఁ

గలికిచూపుల చంద్రికల్ పర్వె ననఁగఁ
బలుకఁబాఱెను గండపాళికాయుగళ

మలివేణి ముఖచంద్రుఁ డమృతంపు రసము
చిలుకు చందంబునఁజిట్టుము లెసఁగె

గగనభాగంబు సాకారమై యొప్పు
పగిదిఁ గౌదీఁగె చూపట్టె నానాఁట
                                            (నలచరిత్ర - 3- 95నుండి 98)

కవి గర్భవతి లక్షణాలను వర్ణిస్తున్నాడు-
నాయిక ముఖం చూసి నిండు చంద్రుడు
కూడ అసూయపడతాడు అంత అందంగా
ఉంటుంది నాయికముఖం. అలాంటి ముఖం
ఇప్పుడు కాస్త పాలిపోయి తెల్లవారుజామున
చంద్రునిలా ఉంది.

నాయిక వక్షోజాలు మన్మథుని ఆయుధాలైన
పూలగుత్తుల వలె ఉన్నాయి. వాటి మొనలు
నలుపెక్కాయి.

ఆమె పెదవి దొండపండు కంటె ఎక్కువ ఎఱ్ఱగా
ఉంటుంది. కాని ఇపుడు నల్లదనం కప్పినట్లున్నది.
శరీరంలో అలసటలు క్రమ్ముకున్నాయి.
సన్ని నడుము ఇప్పుడు చెద్దదయింది.
ఇంతకుముందు కనిపించని బొడ్డు
ఇప్పుడు నడుము పెద్దదయి స్పష్టంగా
కనబడుతున్నది.

నాయిక నూగారు గ్రుచ్చని నల్లపూసలదండలా
దట్టంగా కనిపిస్తోంది. ఆమె చూపులు వెన్నెల
చెక్కిళ్ళమీదకు వ్యాపించడంవల్ల తెల్లబడ్డాయా
అన్నట్లుగా ఆమె చెక్కిళ్ళు తెల్లబడ్డాయి.

గర్భవతులకు నోటిలో నురుగుతో కూడిన ఉమ్మి
ఎక్కువగా ఊరుతుంది. అవే చిట్టుములు.
తుమ్మెదల వంటి జుట్టు కల ఆ నాయిక యొక్క
ముఖమనే చంద్రుడు అమృతరసం చిలుకుతున్నట్లుగా
ఆమె చిట్టుములు ఎక్కువయ్యాయి. ఆకాశానికి
రూపం వచ్చినట్లుగా ఆమె తీగ వంటి నడుము
క్రమక్రమంగా పెద్దదవడం వలన కనబడుతోంది.
నిజానికి ఆకాశానికి ఆకారం లేదు. అందువలన
ఆకాశం కనబడేది కాదు. కాని ఇపుడు ఆమె గర్భవతి.
నడుము చెద్దదయింది. ఆకాశానికి ఆకారం వచ్చినట్లుగా
కనబడుతున్నది.

Monday, April 24, 2017

తమను తాము మోసం చేసుకుంటూ-------


తమను తాము మోసం చేసుకుంటూ-------
సాహితీమిత్రులారా!
ఈ సుభాషితం చూడండి-
దుర్విరక్తులు తాము తమనే
మోసం చేసుకుంటూ ఇతరుల్నీ
వంచించేవారిని గురించి చెబుతున్నాడు-

స్వపరప్రతారకోసౌ, నిన్దతి యోళీకపణ్డితో ఉపతీః,
యస్మాత్తపసోపి ఫలం స్వర్గః స్వర్గే2పి చాప్సరసః

స్త్రీలు చెడ్డవారు, వారిని కూడరాదు-
అంటూ సుద్దులు చెబుతుంటారు కొందరు.
తపస్సే ముఖ్యం - అని కూడ వీరి భాషణ.
తపస్సు వల్ల ఫలితం స్వర్గప్రాప్తి.
అక్కడ ఉండేది అప్సరస స్త్రీలు.
స్వర్గం నిజంగా పొందడం అంటూ జరిగితే
అక్కడ ఉండేదీ స్త్రీలే అయినపుడు, వీరు
స్త్రీలను నిందించడం దేనికీ
దీనివల్ల వీరి వైరాగ్యం అంతా నటనయే అనీ
బయటకు అలా అంటారే తప్ప
లోపల స్త్రీలాభాపేక్ష ఉందనీ గ్రహించవచ్చు మనం

కంటికి నిద్ర వచ్చునే?


కంటికి నిద్ర వచ్చునే?
సాహితీమిత్రులారా!శ్రీనాథుడు తన మనసులోని బాధను
కాశీఖండంలో వింధ్యపర్వతంతో పలికించాడు
చూడండి-

కంటికి నిద్ర వచ్చునె? సుఖంబగునే రతికేళి? జిహ్వకున్
వంటక మించునే? యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె మానుషంబుగల యట్టి మనుష్యున కెట్టివానికిన్
కంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు కల్గినన్

నిద్ర, రతి సౌఖ్యం, తిండి, అనేవి
మనసుకు సంబంధించినవి
మనసు సరిగాలేనపుడు అవి సక్రమంగా ఉండవు
అదే విషయాన్ని ఇందులో గమనించవచ్చు
తనంతటి శత్రువొకడు ఉంటే మనిషైనవానికి
నిద్రపడుతుందా?,
రతికేళి సుఖాన్ని ఇస్తుందా?
తిండి రుచిస్తుందా?
ఇవేవీ సరిగా ఉండవు- అని భావం

Sunday, April 23, 2017

అకారణ విరోధం - లోకరీతి


అకారణ విరోధం - లోకరీతి
సాహితీమిత్రులారా!
కొండెగాడు సజ్జనులకు అకారణ విరోధి
అని పెప్పే భర్తృహరి సుభాషితం చూడండి-

మృగమీన సజ్జనానాం తృణ
జలసన్తేష విహితవృత్తీనామ్
లుబ్దకధీవరపిశునా నిష్కా
రణమేవ వైరిణో జగతి

ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టక
ఏదో దొరికిన నాలుగు గడ్డిపరకలు
మేస్తూ జీవించే జింకలకు అకారణ
విరోధులు బోయవాళ్ళు.

నీటిలో దొరికిన మేతతో బతికే
చేపలకు అకారణ వైరం పూని
వలవేసి పట్టేవారు జాలరులు

ఇతరుల జోలికి పోక
తనమానాన బ్రతికే సజ్జనుల్ని
నిష్కారణంగా పీడించేవారు
కొండెగాళ్ళు- ఇదీ లోకరీతి.
-అని భావం

పెద్దనగారి ఆవేదన


పెద్దనగారి ఆవేదన
సాహితీమిత్రులారా!


శ్రీకృష్ణదేవరాలవారి మరణానంతరం
పెద్దన ఆయనను తలచుకొంటూ
ఆవేదనతో చెప్పిన పద్యం -

ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి
        కేలూతయొసంగి యెక్కించు కొనియె
మనుచరిత్రం బందు కొనువేళ పురమేగ
         పల్లకి తనకేల పట్టియెత్తి
కోకట గ్రామాద్యనేకాగ్రహారంబు
         లడిగిన సీమలయందునిచ్చె
బిరుదైన కవి గండపెండీరమున కీవ
         తగుదని తానె పాదమున దొడిగె
ఆంధ్రపితామహ అల్లసాని
పెద్దన కవీంద్ర యని తన్ను బిల్చునట్టి
కృష్ణరాయలతో దివికేగలేక
బ్రతికి యున్నాడ జీవచ్ఛవంబనగుచు.

కృష్ణదేవరాయలు ఎప్పుడైనా ఏనుగు మీద
వెళుతున్నపుడు పెద్దన ఎదురైతే ఆయన క్రిందికి
దిగి తనను ఏనుగుపైకి ఎక్కించుకొనేవాడు

మనుచరిత్ర కావ్యాన్ని అంకితం తీసుకొనే
సమయంలో పల్లకీ ఊరేగింపులో, తన చేతితో
రాయలు పల్లకీ ఎత్తినాడు.
అడిగిన చోట తనకు కోకటాది గ్రామాలను
అగ్రహారాలుగా ఇచ్చినాడు

గండపెండరం ధరించటానికి నీవే తగినవాడివని
స్వయంగా తానే పాదానికి తొడిగినాడు.

ఆంధ్రపితామహా అని గౌరవంతో పిలిచి సత్కరించిన
రాయలతోటి నేనూ స్వర్గానికి పోక జీవచ్ఛవంగా మిగిలి ఉన్నాను
అని ఆవేదన చెందినాడు పెద్దనగారు.

Saturday, April 22, 2017

దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ


దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
సాహితీమిత్రులారా!సాహితీజగత్తులో కవిసార్వభౌముడు
అనగానే శ్రీనాథుడని తెలియనివారుండరు
ఆయన జీవితం ఒక ఉదాహరణ ప్రతి మనిషికి
జీవితంలో ఎన్ని ఉత్తాన పతనాలున్నా చివరికి
ఆనందంగా జీవిత యాత్ర ముగిస్తే ఎంతో సంతోషదాయకం
ఆయన జీవితం అలాజరగలేదు మొదట
ఎంత విలాసవంతంగా భోగభాగ్యాలతో
ఉన్నాడో చివరికి అంత దారిద్య్రంతో విలవిలాడాడు
ఈ పద్యం అవసానదశలో ఆయనను సన్మానించినవారిని
జీవనాధారం కల్పించిన వారిని అనుకుంటూ నిర్వేదంతో
చెప్పినదినది కానీ ఇందులోనూ ఒక చమత్కారం ఉంది
అదేమిటంటే దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
అంటే దేవతల కవివరుడు బృహస్పతికి గుండె గుభేలుఅనేవిధంగా
తను అమరపురికి వెళుతున్నానంటూ ఆత్మాభిమానాన్ని చాటుకున్నాడు.

కాశికా విశ్వేశు గలిసె వీరభద్రారెడ్డి
       రత్నాంబరంబు లేరాయడిచ్చు
రంభగూడె దెనుంగు రాయరాహుత్తుండు
       కస్తూరికేరాజు ప్రస్తుతింతు
స్వర్గస్తుడయ్యె విస్సనమంత్రి, మరిహేమ
       పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండె మైలారు విభుడేగి
       దినవెచ్చమేరాజు తీర్చగలడు
భాస్కరుడు మున్నె దేవుని పాలి కరిగె
కలియుగంబున నికనుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి


వీరారెడ్డి అనే ప్రభువు రత్నాంబరాలు ఇచ్చేవాడు
అతడు ఇప్పుడు కాశికావిశ్వేశ్వరునిలో కలిసిపోయినాడు
అనగా దివంగతుడైనాడు. ఇక ఏరాజు ఇస్తాడవి.

తెనుగురాయడు స్వర్గం చేరి రంభతో కూడి ఉన్నాడు
ఇప్పుడు కస్తూరిఇమ్మని ఏరాజును ప్రార్థించాలి.

విస్సన్నమంత్రితో పంక్తిలో బంగారు పాత్రలో భోజనం చేసేవాణ్ణి
అతడుకూడ పరలోకం వెళ్ళాడు. ఇప్పుడు ఎవరితో భుజించాలి.

మైలారు విభుడు నాకు దినవెచ్చంగా ఆహారధాన్యాలు పంపేవాడు
ఆయనా కైలాసానిపోయి శయనించాడు ఇక ఇప్పుడెవరిస్తారు.

భాస్కరమంత్రి కూడ ముందే భగవంతుణ్ణి చేరుకున్నాడు
ఇక ఇటువంటి పరిస్థితులలో కలియుగంలో జీవించడం కష్టమనితలచి
స్వర్గలోకంలోని దేవతల కవి గుండెలు అదరగా శ్రీనాథుడు దేవలోకానికి
వెళుతున్నాడు- అని చెప్పుకున్నాడు శ్రీనాథుడు.


ఏ గుణాలున్నవారిని ఆశ్రయించాలి?


ఏ గుణాలున్నవారిని ఆశ్రయించాలి?
సాహితీమిత్రులారా!


గుణవంతుడైన రాజును ఆశ్రయించాలి
గుణహీనునైనవానికాదని భర్తృహరి చెప్పిన
ఈ శ్లోకం చూడండి-

ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం
దానం భోగో మిత్రసంరక్షణం చ
యేషామేతే షడ్గుణా ప్రవృత్తాః
కోర్థస్తేషాం పార్థివోపాశ్రయేణ?

గుణవంతుడైన రాజుకు 6 గుణాలుంటాయి
1. దుష్టశిక్షణ నైపుణ్యం
2.. గొప్పకీర్తి
3. బ్రాహ్మణాదరణ
4. భోగాలను అనుభవించే గుణం
6. గొప్ప విరాళాలను దానంగా ఇవ్వగలగడం
6. శరణన్నవారిని రక్షించడం
వీటిలో ఏది లోపించినా
అలాంటి రాజును
కొలవడం వృథా అంతేకాదు
దగ్గరికి వెళ్ళినా లాభం ఉండదు. - అని భావం

Friday, April 21, 2017

దైవబలం చాలకపోతే..........


దైవబలం చాలకపోతే..........
సాహితీమిత్రులారా!
భర్తృహరి చెప్పిన ఈ శ్లోకం చూడండి
ఒక కథలా వివరించాడు
దైవబలం లోకపోతే ఏమౌతుందో

ఖర్వాటో దివనేశ్వరస్య కిరణైః సంతాపితే మస్తకే
వాఞ్ఛన్దేశ మనాతపం విధివశా త్తాలస్య మూలం గతః
తత్రాప్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః
ప్రాయో గచ్ఛతి యత్ర దైవహతకస్త త్రైవ యా న్త్యాపదః

ఒకానొక బట్టతలవాడు, మిట్టమధ్యాహ్నం
సూర్య తాపం భరించలేక అందులోనూ
మరీ ముఖ్యంగా మాడుతున్న శిరస్సును
కాపాడుకోవటానికి దగ్గర్లో ఓ చెట్టూ కనబడక
తాటిచెట్టును చూశాడు. అదీ కొద్దిపాటి నీడలో
తలదాచుకోవాలనుకొని దాని క్రిందికిచేరాడు

అది వేసవికాలం కావడంతో చాల ముగ్గిన
తాటిపండు ఒకటి దైవికంగా సరిగ్గా అప్పుడే
వానితలపై పడింది వెంటనే వాడితల బ్రద్దలైపోయింది.
దైవబలం చాలకపోతే
ఇలాగే జరుగుతుందిమరి.

ఇదే పద్యంలో ఏనుగు లక్ష్మణకవి ఈ విధంగా వ్రాశాడు-

ధర ఖర్వాటుఁ డొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై
త్వరతోడన్ బరువెత్తి చేరినిలిచెన్ దాళద్రుమచ్ఛాయఁ ద
చ్ఛిరముం దత్ఫలపాత వేగంబున విచ్చెన్ శబ్దయోగం బు గాఁ
బోరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్


దేవతలు, రాక్షసులు ఎవరిసంతానం?


దేవతలు, రాక్షసులు ఎవరిసంతానం?
సాహితీమిత్రులారా!
మనం పురాణాలలో ఇతిహాసాలలో
సప్తరుషులలో కశ్యపుని పేరు వినే ఉంటాము.

ఆయనకు అదితి, దితి, దనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను,
అనల, అరిష్ట, ఖశ, సురభి, ఇర, సురస, 
మొదలైన భార్యలు ఉన్నారు.
వీరిలో
అదితికి-
ద్వాదశాదిత్యులు
అష్టవసువులు
ఏకాదశరుద్రులు - పుట్టారు

దితికి -
శూరపద్మాసుడు, సిహవక్రుడు, వజ్రాంగుడు,
గోముఖుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, అజాముఖి
మొదలైన రాక్షసులు పుట్టారు.

దనువు నందు - మయుడు

కాళిక యందు నరకుడు

తామ్రయందు-
క్రౌంచి(గుడ్లగూబలు)
భాసి(భాసులు)
ధృతరాష్ట్రి (హంసలు)
శుకు(నత, వినత)
పుట్టారు.

క్రోధవశ యందు

మృగి - (మృగికి జంతువులు)

మృగమంద (మృగమందకు రుక్ష,, సృమర, చమరాలు)

హరి - (హరికి - సింహాలు, కోతులు)

భద్రమత (భద్రమతకు - ఐరావతి)

మాతంగి(మాతంగికి -ఏనుదులు)

శ్వేత(శ్వేతకు - అష్టదిగ్గజాలు)

సురభి(సురభికిరోహిణి, గంధర్వి, వీరికి వరుసగా పశువులు, గుర్రాలు)

సురస(సురసకు - నాగులు)

కద్రువ(కద్రువకు - ప్రాకే జాలమంతా)

పుట్టిది.

(ఇందులో కొన్నికొన్ని మార్పుగా కనిపించ వచ్చు
ఇవి పురాణాలను బట్టి తేడా ఉంటాయి.)

Tuesday, April 18, 2017

ఎవడు మిత్రుడు?


ఎవడు మిత్రుడు?
సాహితీమిత్రులారా!


భర్తృహరి ఎవరిని మిత్రుడంటారో
ఈ శ్లోకంలో చెప్పాడు చూడండి-

పాపాన్నివారయతి, యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి, గుణాన్ ప్రటీకరోతి
ఆపద్గతం చ న జహాతి, దదాతి కాలేః
సన్మిత్ర లక్షణ మిదం ప్రదన్తి సన్తః


ఇతరులను చెడుపనులనుండి నివారించేవాడు,
మంచిపనులను చేయడానికి ప్రోత్సహించేవాడు,
ఇతరులరహస్యాలను కాపాడటం,
పరులయొక్క సద్గుణాలను మెచ్చుకొనడం,
తమను ఆశ్రయించిన వారిని మాత్రమేకాక
ఆపదలో ఉన్నకాలంకో ఎవరినైనా విడువకుండా
ఉండటం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా
ఆ పనులకు అవసరమైనవి అందించడం - ఈ గుణాలున్న
వాడు మంచి మిత్రుడని భావం.

దీన్నే ఏనుగ లక్ష్మణకవి -
అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ
జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము,
విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు
మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు.
- అని అనువదించాడు.

సప్తద్వీప సప్తసాగర సమేత భూమి


సప్తద్వీప సప్తసాగర సమేత భూమి
సాహితీమిత్రులారా!


మనం పౌరాణిక సినీమాలు చూచినప్పుడు
సప్తద్వీపవసుంధరావేలావలయితం - అంటూ
భారీభారీ డైలాగులు వింటుంటాం
అసలేమిటవి అని మీకెప్పుడైనా అనిపించిందా
సప్తద్వీప అన్నా నవఖండభూమండల- అనీ అంటూంటారు
అవేమిటి - ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిద్దాం.

పురాణాలలో ద్వీపం అంటే నాలుగుప్రక్కలా నీరున్న భూభాగం
అనికాదు. రెండుప్రక్కల నీరున్న ప్రదేశం.
మనం ఖండాలు 7 అని చదువుతూంటాము.
అవే ద్వీపాలు ఇక్కడ. నాడున్నద్వీపాలు నేడున్న ఖండాలు
సముద్రాలు ఇక్కగ వాటి పేర్లు కుందూరి ఈశ్వర దత్తుగారు
ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళం అనేపేరున ఒక పుస్తకాన్ని
1962లో ప్రకటించారు దాన్నుండి -

జంబూద్వీపం - ఆసియాఖండము
క్షారోదము     - హిందూమహాసముద్రము

ప్లక్షద్వీపం   -    ఆసియామైనర్
ఇక్షుసముద్రము - ఎర్రనల్లసముద్రాలు

శాల్మలద్వీపము - ఆఫ్రికా ఖండము
సురసముద్రము - మధ్యధరా సముద్రము

కుశద్వీపము - ఐరోపా ఖండము
ఘృతసముద్రము - ఆర్కిటిక్ సముద్రము

క్రౌంచద్వీపము  - ఉత్తర అమెరికా
దధిసముద్రము - అట్లాంటిక్ సముద్రము

శాకద్వీపము - దక్షిణ అమెరికా
క్షీరసముద్రము - శాంతమహాసముద్రము(పసిఫిక్)

పుష్కరద్వీపము - ఆస్ట్రేలియా మొదలైన దీవులు
శుద్ధజల సముద్రము - అంటార్కిటికా సముద్రము


Monday, April 17, 2017

కావ్యకంఠుని ప్రార్థన


కావ్యకంఠుని ప్రార్థన
సాహితీమిత్రులారా!


కావ్యకంఠ గణపతి ముని ఉమా స్తోత్రంలో చేసిన
ఈ ప్రార్థన చూడండి ఎంెత చమత్కారంగా ఉందో

గణపతయేస్తన ఘటయోః
పదకమలే సప్తలోక భక్తేభ్యః
అధరపుటే త్రిపురజితే
తథాసి పీయూషమంబత్వమ్

తల్లీ!
 గణపతికై స్తనఘటములందును
భక్తులకై పాదపద్మములందును,
మహేశ్వరునికై అధరపుటములందును
అమృతమై ఉన్నావు.

Sunday, April 16, 2017

నాయికా భేదాలు - 2


నాయికా భేదాలు - 2
సాహితీమిత్రులారా!నాయికలను సరస్వతీకంఠాభరణములో 
భోజుడు 32 రకాలుగా చెబితే
విశ్వనాధుడు సాహిత్యదర్పణంలో
384 విధాలుగా వివరించాడు.

ఇక్కడ నాయికలను అలంకార శాస్త్రజ్ఞుల
ఉదాహరణలని బట్టి నాయికా భేదాలు-

గుణం వల్ల నాయికలు -
ఉత్తమ, మధ్యమ, అధమ

వయసు, కౌశలం లను బట్టి నాయికలు -
ముగ్ధ, మధ్యమ, ప్రగల్భ

ధైర్యాన్ని బట్టి నాయికలు -
ధీర, అధీర

పరిగ్రహణం వల్ల నాయికలు -స్వీయ

అపరిగ్రహణం వల్ల - అన్య

అవస్థల వల్ల నాయికలు - 
కలహాంతరిత, వాసవసజ్జిక, విప్రలబ్ద, ఖండిత, 
విరహోత్కంఠిత, ప్రోషితభర్తృక, స్వాధీనపతిక, 
అభిసారిక

వీరుగాక
ఊఢానూఢలు, 
ఉదాత్త, శాంతలలితలు,
సామాన్య,  స్వైరిణి, 
రూపాజీవ, గణిక, విలాసిని
అనేక రకాలు.
నాయిక, ప్రతినాయిక, ఉపనాయిక 
ఇలా అనేక భేధాలున్నాయి.
    

పుత్రులు శత్రువులుగాక మిత్రులే


పుత్రులు శత్రువులుగాక మిత్రులే
సాహితీమిత్రులారా!


కొడుకుల్ పుట్టరటంతు నేడ్తురవివేకుల్ -
అని ధూర్డటి - కాళహస్తీశ్వర శతకంలో అంటాడు.
కాని పుత్రులు శత్రువులంటున్నాడు
కనుపర్తి అబ్బయామాత్యుడు చూడండి-

కొడుకులు పుట్టరంచునొక కొన్ని దినమ్ములు చింత నంద నుల్
పొడమిన ఆయువున్, బలము, బుద్ధియు, విద్యయు చాల కల్గగా
ఉడుగని చింత- కల్గి తమనోలి భజింపక చింత - తండ్రి కె
ప్పుడు కడు చింత వేయుదురు -పుత్రులు శత్రులు గాక మిత్రులే

మొదం కలిగించే వారు మిత్రులు
ఖేదం కలిగించేవారు శత్రువులు
మరి కొడుకులు పుట్టటం ఆలస్యమైతే ఒకటే వేదన,
మందులూ, మాకులూ, దానాలూ, ధర్మాలూ,
పూజలూ, యజ్ఞాలూ, యాగాలూ ఒకటేమిటి అన్నీ
కొడుకు పుట్టేదాకా. లేకలేక ఒక పుట్టగానే
వాడి ఆయుర్దాయంగూర్చి, ఆరోగ్యాన్ని గూర్చి,
చదువుగూర్చి ఒకటే ఆరాటం చివరికి
ప్రయోజకుడైనాడు అనుకొంటే వృద్ధాప్యంలో
మా మొగం చూడంటంలేదని
తల్లిదండ్రుల వ్యధ పడుతుంటారు
మరి ఇంత వేదనకలిగించే పుత్రుడు
మిత్రుడెలా అవుతాడు శత్రువేకదా -
 అంటున్నాడు కవిగారు.

Saturday, April 15, 2017

గాలిదేవుని అగచాట్లు


గాలిదేవుని అగచాట్లు
సాహితీమిత్రులారా!
ఈ చమత్కార పద్యం చూడండి-
ఓ అజ్ఞాతకవి వ్రాసిన పద్యం ఇది-

ఆకల్టాడదేమి? నేడు పవనుండాకాశ వాపీతటా
శోకానేక వనాళి గ్రుమ్మరుచు నచ్చోడాగెనో? లేక గం
గా కల్లోల వతీ తరంగముల నూగంబోయెనో? లేక కాం
తా కర్పూర కపోల పాలికల నిద్రాసక్తుడై యుండెనో?

మండు వేసవిలో చెట్ల ఆకులు కదటంలేదు
గాలిదేవుడు ఎటుపోయాడో పాపం ఎండ తీవ్రత తట్టుకోలేక
చల్లని ప్రదేశాలకు వెళ్లాడేమో. ఆకాశము, దిగుడు బావిులు,
అశోకవనాలు ఎక్కడెక్కడో తిరుగుతున్నడో లేకపోతే
గంగ మొదలైన నదులలోని అలలమీద ఊయలలూగుతున్నాడో
యువతులు తమ చెక్కిళ్ల మీద పూసుకొన్న కమ్మని
పచ్చకర్పూరలేపనాలమీద హాయిగా ఒళ్లుమరచి నిద్రపోతున్నాడేమో
అని - పద్యభావం

ఈ పద్యాన్ని బట్టి వేసవిలో
ఆ కాలంలో ఏమేమి చేసేవారో తెలుస్తున్నది.


పేపర్ లెస్ ట్రాన్సాక్షన్స్


పేపర్ లెస్ ట్రాన్సాక్షన్స్
సాహితీమిత్రులారా!నేడు ప్రభుత్వం పేపరును
ఎక్కువగా వాడవద్దంటూంది
కాని పేపరు వాడటంలేదా
అన్నిరకాల ప్రచారాలతోటి
పేపరుకూడ విరివిగానే వాడుతున్నారు
ఇలాంటి దానిపై మాచిరాజు దేవీప్రసాద్ గారి
ఈ పద్యం చూడండి-

కాగితం ఖర్చు చేయకండి - మీరు
కాగితము ఖర్చు చేయబోకండి యనుచు
విశ్వరూపాల వంటి వేయి కోట్లు
వాలు పోస్టర్లు అంటించె వాడ వాడ

కాగితం వాడవద్దంటూ చెప్పేందుకు
పెద్దపెద్ద అక్షరాలతో అతిపెద్ద  వాల్పోస్టర్లు
వేయించి వాడవాడలా అంటిచారట ఆ ఆఫీసరు
ఎంత చిత్రమోకదా ఈ నాడు జరుగుతున్నది
ఇలాంటిదేకదా ప్రజల శ్రేయస్సుకన్నా ప్రచార
హోరే ఎక్కువగా జరుగుతున్నది.

Friday, April 14, 2017

వారాని ఆ పేర్లే ఎందుకో?


వారాని ఆ పేర్లే ఎందుకో?
సాహితీమిత్రులారా!మనం వాడే వారాలు - 7, 
వారాలు ఏ భాషలోనైనా 7 ఉన్నాయి. 
మనం వాడే వారాలు --
ఆదివారం, సోమవారం, మంగళవారం,
బుధవారం, గురువారం, శుక్రవారం,
శనివారం

మనం ఈ వారాలకు ఈ పేర్లే ఎందుకు వాడుతున్నామో
అంటే ఆదివారం - రవివార్ - సండే - 
సూర్యునికి సంబంధించినది
సోమవారం - సోమ - చంద్రునికి సంబంధించిన వారం.
మంగళవారం - మంగళుడు - కుజుడు - కుజునికి సంబంధించినది.
బుధవారం - బుధుడు - బుధునికి సంబంధించినది.
గురువారం - బృహస్పతివారం - దేవగురువు బృహస్పతికి సంబంధించినది.
శుక్రవారం - శుక్రుడు - రాక్షసగురువు శుక్రునికి్ సంబంధించినది.
శనివారం - మందవారం - మందేశ్వరుడు - శనికి సంబంధించినది.
ఇవన్నీ గ్రహాలు గ్రహాలకు సంబంధించిన పేర్లివి.
బాగానే ఉంది ఆదివారం - బదులు సోమవారం అనచ్చుకదా
మనం ఏరోజుకు ఏపేరు పెట్టాలని ఎలా తెలుస్తున్నది
ఈ రోజుకు ఈ పేరే ఎందుకు పెట్టాలని కొందరు అడుగుతుంటారు
అవి ఎందుకో మనవారి విజ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది.
మనం ఇప్పుడు గంటలు అంటున్నాము కొంతకాల పరిమితికి
అలాగే పూర్వం హోర అనేవారు.
హోర అనే పదం అహోరాత్రులు - అనే దానిలోనుండి తీసుకోబడింది.
ఇవి గ్రహాలపేర్లతోటే ఉన్నాయి.
సూర్యహోర, చంద్రహోర, కుజహోర,
ఇలా ... వీటిలో ఉదయాన్నే ఏ హోర సూర్యోదయానికి వస్తుందో
ఆ రోజును ఆ హోర పేరుతో పిలుస్తారు. సూర్యహోర ఉన్నరోజును
ఆదివారం లేక భానువారం లేక రవివార్ ఇలా అంటున్నాము.
చంద్రహోర ఉన్న రోజును సోమవారం అంటున్నాము. 
ఇదేవిధంగా అన్ని వారాలకు వాటి పేర్లు వచ్చాయి. 
ఇప్పుడు  తెలిసింది కదా మనవారి గొప్పదనం.

Monday, April 10, 2017

ఆహారము - ప్రముఖుల అభిప్రాయాలుఆహారము - ప్రముఖుల అభిప్రాయాలు
సాహితీమిత్రులారా!
ఆహారం గురించిన అనేక అభిప్రాయాలను
ఒకచోటికి కూర్చి చూపుతున్నారు
న్నీరు బాలాజీగారి
చూడండి-
 
1. ' శ్రీరామ రాజ్యం' ఎలా వుండేదో ఉత్తరకాండలో ఈ వర్ణన చూడండి
     " వ్యవసాయదారులు ఎవరూ పండిన వెంటనే 
      పంట కోసుకోవాలని తొందర పడటంలేదు !
      రాశులుగా పోసిన ధాన్యానికి ఎవరూ కాపలా వుండట్లేదు !
      గాదెలు కట్టుకోటానికి ఎవరూ ఆత్రుత పడటంలేదు . 
      ధాన్యం బస్తాలు ఇంటిబైటే పడేసి అంతా నిశ్చింతగా నిద్రపోతున్నారు .
      రామరాజ్యంలో ఎవరికీ తిండికరువూ ,
      దొంగతనం అవసరం వుండదని వారికి తెలుసు ! 
                                                                              ---- మహర్షి వాల్మీకి 

2. ఆకలిగొన్నవాడికి ' దేవుడు ' 
    కనపడేది అన్నం రూపంలోనే ! 
                                    -- మహాత్మా గాంధీ 


3. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా , 
      వంట చేస్తున్న మా అమ్మగారు.
      " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ
       - నేను అన్నం కోసం వచ్చాననుకుని !
        ఎంతయినా అమ్మ అంటే అన్నం. 
        అన్నం అంటే అమ్మ ! అంతే !
                                               -- జంధ్యాలగారు 

4. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - 
    సంతాపసభకి వెళ్ళినదానితో సమానం ! 
                             -- విశ్వనాధ సత్యనారాయణ గారు 

5. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు 
    తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! 
    వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న 
    ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! 
                                                   -- రేలంగి వెంకట్రామయ్య గారు 

6. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా, 
    మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! 
    ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !
                                    -- ముళ్ళపూడి వెంకటరమణ గారు 

7. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు
    " అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు.
      అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ
      అర్ధం కాలేదు !  
                                                                     -ఆత్రేయగారు

8. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !
     అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! 

                                                       -- చాగంటి కోటే శ్వర రావుగారు 

9. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !!
                                                           -- గౌతమ బుద్దుడు 

10. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ !
       చారుకూడా అమృతంలా రుచిస్తుంది !
                                                  -- మాతా అమృతానందమయి

11 . మీ భర్త ఎంత ధనవంతుడయినా, మీకోసం మీరు స్వంతంగా ఒక కప్పు కాఫీ               
      సంపాదించుకునే శక్తి లేనప్పుడు మిడిసిపడటం అనవసరం !
                                                                  -- యద్దనపూడి సులోచనారాణిగారు 

12. మీ పిల్లలు ఎంతదూరంలో, ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం                          
      తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు
      మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించు !Sunday, April 9, 2017

గొప్ప విషయాలమీదే మనసు నిలపాలి


గొప్ప విషయాలమీదే మనసు నిలపాలి
సాహితీమిత్రులారా!


లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు
లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం.
అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా
దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము.
ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో
సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి
మానవజీవితానికి కూడ వర్తిస్తుంది.

సరే ఇక్కడ దీనికి సంబంధించిన ఒక శ్లోకం
భర్తృహరి కృతం చూడండి-

ఉత్తుంగ మత్తమాతంగ
మస్తకన్యస్తలోచనః
ఆసన్నే నపి సారంగే
కరోత్యాశాం మృగాధివః

మృగాలకు రాజు అయిన సింహం
మదించిన ఏనుగు కుంభ స్థలాలను
చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది.
అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా
వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు
ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని,
అల్పవిషయాలపై మనసుపోనివ్వరు.

విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి.
ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి.
అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు
వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే
దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే
అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది.

వేనిలో ఏవున్నాయి?


వేనిలో ఏవున్నాయి?
సాహితీమిత్రులారా!మనకు తెలియని విషయం
తెలుసుకోవటమే జీవితం
ప్రతిరోజూ ఎన్నో క్రొత్త విషయాలను
తెలుసుకుంటూంటాం
అవి గతంలో ఉన్నవి కావచ్చు
లేదా క్రొత్తగా కనిపెట్టినవికావచ్చు
ఇక్కడ గతంలో ఉండి
మనకు తెలియనివిషయాలను చూద్దాం

సంస్కృతంలో మొదటి వ్యాకర్త - ఇంద్రుడు
అంటున్నాయిమన గ్రంథాలు
లిపిని గురించి వ్యాకరణాన్ని గురించి 
తైత్తిరీయ సంహితలో వివరంగా ఉంది.

దీనిలోనే పెద్దసంఖ్యలను గురించికూడ ఉన్నది
ఏక - 1, దశ - 10, శత - 100, సహస్ర - 1000,
ఆయుత - 10000, నియుత - లక్ష,
ప్రయుత - పదిలక్షలు, అర్భద - - కోటి,
న్యర్భద - పదికోట్లు, సముద్ర - వందకోట్లు,
మధ్య - వేయికోట్లు, అంత - పదివేలకోట్లు,
పరార్థ - లక్షకోట్లు ....
ఈ విధంగా సంఖ్యలగురించి చెప్పబడింది.


పంచవిశ బ్రాహ్మణంలో - 
బంగారు తూకాలనుగురించి చెప్పబడింది


తపథబ్రాహ్మణంలో 
సమయం గురించిన చర్చ ఉంది.

Saturday, April 8, 2017

నాసిక గంధఫలి వలె వెలయు


నాసిక గంధఫలి వలె వెలయు

సాహితీమిత్రులారా!


ఇటీవలె దివికేగి అవధాని పితామహ
సి.వి.సుబ్బన్నగారు చీరాల(1986)లో
ముక్కుమీద చెప్పిన పద్యం చూడండి-

నాసిక దీర్ఘమై భాసిల్లుచుండిన
       మగువ తాఁగోరిన మగనిఁబొందు
నాసిక వట్రుపై భాసిల్లుచుండిన
       సతి అధికారికప్రతిభఁగొఱలు
నాసిక శుకరీతి భాసిల్లుచుండిన
        భామిని సుఖలీల పరిఢవిల్లు
నాసిక చప్పిడై భాసిల్లుచుండిన
        వికటస్వభావయై సకియ పొగులు
ప్రాగుపార్థితపుణ్యసౌభాగ్యయైన
లేమ నాసిక గంధఫలి వలె వెలయు
అసిచికిత్సఁదీర్చికొనిన నసకు కొంత
చక్కదన మబ్బునేమొ, ప్రశస్తి రాదు

దీనిలో అంగసాముద్రికం ప్రకారం
ముక్కు ఎలాఉంటే -
దీర్ఘంగా, గుండ్రంగా, చప్పిడి ముక్కుల
ఫలితాలను వివరించారు
అలాగే ముక్కు ప్లాస్టిక్ సర్జరీద్వా మార్చుకొంటే
అందంగా ఉంటుందేమో గాని
అంగసాముద్రికంలో చెప్పిన ఫలితం
రాదంటున్నాడు శతావధానిగారు

వసుదేవుడెవరు? కుంతీదేవి ఎవరు?


వసుదేవుడెవరు?    కుంతీదేవి ఎవరు?
సాహితీమిత్రులారా!బ్రహ్మపురాణం ప్రకారం-

దేవమీఢుడు అనే రాజుకు
అసక్ని అనే కుమారుడు
ఆయన కుమారుడు శూరుడు
శూరునికి 10 మంది కుమారులు, 5 మంది కుమార్తెలు
కుమారులలో మొదటివాడు వసుదేవుడు
2. దేవభాగుడు, 3. దేవశ్రవుడు, 4. అనాదృష్టి
5. కనవకుడు, 6. వత్సవంతుడు, 7. శ్యాముడు
8. శ్యమీకుడు, 9. గృంజముడు, 10. గండూషుడు

కుమార్తెలు-
పృథ(కుంతీదేవి) - భర్త - పాండురాజు - 
                                    కుమారులు - పాండవులు 
    
పృథుకీర్తి -        భర్త - శ్రుతదేవ - 
                         కుమారుడు - దంతవక్రుడు

శ్రుతికీర్తి  -      భర్త - ధృతకేతు
                        కుమారులు - ప్రతర్థనాదులు
                        కుమార్తె - భద్ర

శ్రుతశ్రవ    -   భర్త - దమఘోషుడు
                         కుమారులు -శిశుపాలుడు, సాల్వుడు

రాజాధిదేవి   -  భర్త- జయత్సేనుడు
                           కుమారులు -  విందానువిందులు
                           కుమార్తె - మిత్రవింద
దీని ప్రకారం -
వసుదేవుడు శ్రీకృష్ణుని తండ్రి
కుంతీదేవి వసుదేవుని చెల్లెలు
పాండవుల తల్లి, శ్రీకృష్ణుని మేనత్త.

Friday, April 7, 2017

బలరామ కృష్ణులు - వారి సతీసుతులు


బలరామ కృష్ణులు - వారి సతీసుతులు
సాహితీమిత్రులారా!


బలరాముని భార్య - రేవతి
ఈమెకు నిశాతుడు, ఉల్మకుడు అని ఇద్దరుకుమారులు

కృష్ణునికి 8 మంది భార్యలు

1. రుక్మిణి - ఈమెకు 10 మంది కుమారులు ఒక కుమార్తె
                    కుమారులు 1. ప్రద్యుమ్నుడు, 2. చారుదేష్ణుడు
                    3. చారుభద్రుడు, 4. సుదేష్ణుడు, 5. సుచారుడు,
                    6. చారుదేహుడు, 7. చారుగుప్తుడు, 8. చారుచంద్రుడు,
                    9. విచారువు, 10. చారువు
                    కుమార్తె - చారుమతి
2. జాంబవతి - కుమారుడు - సాంబుడు
3. సత్యభామ - కుమారులు - దామ్రుడు, చక్రుడు
4. కాళింది   -  ----------------
5. మిత్రవింద  - కుమారుడు - మిత్రపవంతుడు
6. భద్ర -          ----------------
7. నాగ్నజితి -   కుమారులు- 
                                     సునీధుడుి, మిత్రబాగుడు
8. లక్షణ    -  --------------------------

ఉపమాలంకార విశేషాలు - 8


ఉపమాలంకార విశేషాలు - 8
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి...
4. ధర్మవాచకలుప్త -
శత్రురాజుల మనోరాజ్యశతము చేతగూడ
దురాక్రముడైన యూ రాజ కుంజరు
యుద్ధప్రవృత్తుడయ్యెను

ఇందులో రాజ కుంజర శబ్దం ఉపమితసమానము.
ఇందు వాచక, ధర్మము(లుప్త) లోపించినది.

5. ధర్మోపమానలుప్త-
మధువనమునంతయు గాలించితిని.
చెట్వన్నిటిని చూచితిని.
కాని ఓ సహకారమా నీవంటి చెట్టుమాత్రము
కనిపించలేదు

ఇందు ఉపమానము కనిపించలేదు.
సమానధర్మము చెప్పబడలేదు.

6. వాచకోపమేయలుప్త -
కాయజవల్లభాయిత-
ఇందులో కాయజవల్లభ - ఉపమానము
ఉపమానవాచకము, ఉపమేయము లుప్తములు.
కాయజవల్లభాయిత అంటే
తనను కాంతిచే రతీదేవిగా ప్రకటించుకొన్నరమణి -
అని అర్థము.

7. ధర్మోపమానవాచకలుప్త-
ఆమె భీతహరినేక్షణ

ఆమె భయముచెందిన లేడికన్నులవంటి
కన్నులు గలది - అని అర్థం.
ఇందులో కన్నుల చంచలత్వము -
 సమానధర్మము లోపించినది.
విభీతహరిణేక్షణ ఉపమేయపరము.
ఉపమానము లేదు. ఉపమావాచకము లోపించినది.

Thursday, April 6, 2017

గాక యుండిన నపకీర్తి కలుగుటరుదె?


గాక యుండిన నపకీర్తి కలుగుటరుదె?
సాహితీమిత్రులారా!


ఈ సుభాషితమును చూడండి-

ఊడి లేచినమొల్క లొగినాటు, బుష్పించు
          లతల మెల్లఁగఁ బూవులనుగ్రగించు,
వ్రాలినకొమ్మలఁ బైకెత్తి బంధించుఁ
          బలుముండ్లు గలుగు రుప్పలఁ దొలంచు,
సొలసిన చెట్లకు జలసేక మొనరించుఁ
          గలుపుగాదంబులఁ గత్తిరించుఁ
దోఁటమాలి సతంబు, నాతోయమునన
ధారుణీపతి స్వప్రజా తతిని మివుల
నిపుణతను బాలనమొనర్చి నెగడవలయుఁ
గాక యుండిన నపకీర్తి కలుగుటరుదె?
                                                       (సుభాషితరత్నమాల - 104)


ఊడిలేచిన మొక్కలను క్రమంగా నాటడం,
పుష్పించే లతలనుండి పూవులను మెల్లగా
తీసుకోవడం, వాలిన కొమ్మలను పైకెత్తి కట్టడం,
చక్కగానిలిచిన చెట్లగుంపులను  పెంచడం,
పక్కకు విడిపోయిన చెట్లను చేర్చడం,
బాగా ముండ్లున్న పొదలను తీసివేయడం,
వాడిన చెట్లకు నీరు ఎక్కువగా అందించడం,
కలుపు మొక్కలను తీసివేయడం ఈ విధంగా
తోటమాలి చేసేవిధంగానే రాజు నిపుణతతో
పాలనను చేస్తూ రాజ్యాన్ని పెంపొందించాలి
అలా కాకపోతే అపకీర్తి కలగడమన్నది
అరుదైన విషయమేమికాదు - అని భావం.

సుమతి వేమన శతకాలు సంస్కృతంలో - 2


సుమతి వేమన శతకాలు సంస్కృతంలో - 2
సాహితీమిత్రులారా!వేమన శతకం తెలుగునుండి సంస్కృతంలో

అనువుగానిచోట అధికులమనరాదు
కొంచముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచెమై ఉండదా
విశ్వదాభిరామ! వినురవేమ!

నాస్థానే2ధికతా వాచ్యా
నైచ్యోక్తేః స్వస్య న క్షతిః
కింనా దర్శనేభో2ల్పంస్యాత్
శ్రూయతాం వేమ విశ్వద!

అల్పబుద్ధవానికధిరారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగఁ గొట్టు
చెప్పుతినెడు కుక్క చెఱకు తీపెఱుఁగునా
విశ్వదాభిరామ! వినురవేమ!

అల్పధీరధకారస్థః
సతోనిష్కాసయేత్ ధ్రువమ్
చర్మ భఙ్త్కే న చేక్షుం క్వా
శ్రూయతాం వేమ విశ్వద!

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ! వినురవేమ!

అల్పో వదతి సాటోపం
ప్రశాంతం సజ్జనః పునః
కాస్యవత్కిం స్వనేత్స్వర్ణం
శ్రూయతాం వేమ విశ్వద!

Wednesday, April 5, 2017

వీరికి చెప్పడం ఎలా?


వీరికి చెప్పడం ఎలా?
సాహితీమిత్రులారా!


ఈ సుభాషిత పద్యం చూడండి-

తామరతూఁటి దారమున దర్పిత సర్పముఁ గట్టవచ్చుఁ దాఁ
గోమలమౌ శిరీషమునఁ గోయఁగ వచ్చును వజ్రమున్, గడుం
దీమసమొప్ప క్షారజలధిన్ మధుధారను దీపుసేయనౌ,
నీమహిఁజ్ఞానహీనులకు నెట్లును దెల్పఁగఁ జాల రెవ్వరున్
                                                                        (సుభాషితరత్నమాల - 71)తామరతూటి దారంతో మదించిన పామునైనా కట్టవచ్చు
అతికోమలమైన పుష్పమైన శిరీష(దిరిసెన)పువ్వుతో
అతికఠినమైన వజ్రాన్ని కోయవచ్చు, కడు ధైర్యంతో
ఉప్పు సముద్రాన్ని తీయటిధారతో తియ్యగా చేయవచ్చు.
కానీ ఈ ప్రపంచంలో జ్ఞానహీనునికి చెప్పలేరు ఎవ్వరునూ-
అని భావం.