Friday, September 30, 2016

తిరిపెమున కిద్దరాండ్రా!


తిరిపెమున కిద్దరాండ్రా!


సాహితీమిత్రులారా!



శ్రీనాథుని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం.
ఎన్ని మార్లు చెప్పుకున్నా అవి తరగనివి ఆయన చమత్కారాలు
ఆయన ఒకమారు ప్రయాణ మధ్యంలో బాగా దాహమై తాగడానికి
నీరేదొరకని సందర్భంలో చెప్పిన పద్యం ఇది-

సిరిగలవానికి చెల్లును
తరణుల పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమున కిద్ద రాండ్రా
పరమేశా గంగవిడుము పార్వతి చాలున్

బాగా ధనముండే శ్రీకృష్ణుడు పదహారువేలమంది
గోపికలున్నా పరవాలేదు ఎందుకంటే
ఆయనకు ధనముంది చాకగలడు.
 ఓ పరమేశ్వరా! మరినీవో తిరిపెగానివి(బిక్షగానివి)
నీకెందుకయ్యా? ఇద్దరు భార్యలు. (నేను దప్పికలో ఉన్నాను)
గంగను వదలవయ్యా నీకు పార్వతి చాల్లే - అని భావం.

ఎంత బాధలోనైనా
ఇంత చమత్కారంగా చెప్పడం ఆయనకే చెల్లు.

కవి ఈశ్వరుడా?



కవి ఈశ్వరుడా?


సాహితీమిత్రులారా!


కవీశ్వరుడు అంటూంటాము
అది ఎలాగో వానమామలై వరదాచార్యులవారు
ఈ పద్యంలో వివరించారు చూడండి.
స్తవరాజ పంచశతిలోని ఈ పద్యంలో
శారదా స్తవరాజములోనిది గమనింపుడు-

మూఁడవ కన్ను గల్గటయు మూర్దమునన్ రసగంగ లుండుటల్ 
వేడుకతో కళానిధుల వీడక నౌదలఁ దాల్చుచుండుటల్ 
కూడును గూడు లేక  సతిఁగూడి దరిద్రత నాశ్రయించుటల్
గాఢ సమాధి నుండుటలుగా కవి నీశ్వరుఁడయ్యె  భారతీ!


ఓ భారతీమాతా! మూడవకన్ను(ప్రతిభా నేత్రం) కలిగిఉండటం,
తలపై రసగంగను కలిగి ఉండుట, సంతోషంగా కళానిధులను(చంద్రుని)
తలదాల్చుట, అన్నమునకు గతిలేక బిక్షమెత్తుట, నిలువనీడలేక
పర్వతముపై ఉండుట,  భార్యతో బాటు దరిద్రము ఆశ్రయించి ఉండుట
ఈ సామ్యాలన్నిటితో కవి తాను ఈశ్వరునిగా పిలువబడెనో - అని భావం.


Thursday, September 29, 2016

సాహితీనందనానికి ఎఱ్ఱాప్రెగ్గడ సాహితీ పురస్కారం


సాహితీనందనానికి ఎఱ్ఱాప్రెగ్గడ సాహితీ పురస్కారం 


సాహితీమిత్రులారా!

గురజాడవారి 154వ జయంతి మరియు
గుఱ్ఱం జాషువాగారి 121వ జయంతి సందర్భముగా
మహతి సాహితిసాంస్కృతిక, ధార్మికసేవా సంస్థ,
కందుకూరు (ప్రకాశం జిల్లా) వారు
ఎఱ్ఱాప్రెగ్గడ సాహితీ పురస్కారము ప్రటించారు
ఈ పురస్కారం
1. ప్రముఖకవి వేదగిరి వేంకట నరసింహరాయ శర్మ గారికి,
2. ప్రకాశంజిల్లా రచయితల సమాఖ్య అధ్యక్షులు
     డా. నూనె అంకమరావుగారికి,
3. ప్రముఖ సాహితీ సేవకులు 
    అలంకారం వేంకట రమణరాజు(నాకు)
     ఈ పురస్కారం ప్రకటించారు
ఈ పురస్కారం
26-09-2016 సోమవారం సా. 5 గం.  
"సాహితీనందనం", "చిత్రకవితా ప్రపంచం" బ్లాగులను
నిర్వహిస్తున్నందుకు
సాహితీసేవకులుగా గుర్తించి
ఎఱ్ఱాప్రెగ్గడ సాహితీ పురస్కారాన్ని
ఏ.వి.రమణరాజు(నా)కు అందించారు.
ఈ పురస్కారమందించిన
మహతి సేవకులు తన్నీరు బాలాజీగారికి
హృదయపూర్వక ధన్యవాదాలు.

కొన్ని ఛాయాచిత్రాలు చూడండి



గుఱ్ఱం జాషువాగారి 121వ జయంతి శుభాకాంక్షలు


గుఱ్ఱం జాషువాగారి 121వ జయంతి శుభాకాంక్షలు


సాహితీమిత్రులారా!

మహాకవులను గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఘంటసాల వారి గాత్రంలో జాషువాగారి శిశువు పద్యాలు వినండి.

Tuesday, September 27, 2016

నీకుమారులు మోక్షవిరోధులా!


నీకుమారులు మోక్షవిరోధులా!


సాహితీమిత్రులారా!


డా. వానమామలై వరదాచార్యులుగారి
శ్రీ స్తవరాజ పంచశతిలో 5వది
శ్రీనృకేసరీ, శ్రీహరీ
మకుటాలతో కూర్చారు.
దానిలోని 39, 40 వ పద్యచమత్కారం వ్యాజస్తుతిలో
ఎంతచక్కగా ఉన్నదో చూడండి.

నీరజనాభ ప్రాణులకు నీవన మోక్షమిడం దలంతు వా
లారసగర్భుడన్ మరుఁడు స్వామి భవత్ సుతులయ్యు ముక్తి సం
స్కారవిరోధులై సకల సత్వములం దగ సృష్టకార్య సం
చారులుగా నొనరుర్తు రిది చాల విచిత్రము శ్రీనృకేసరీ! (39)

ఓ కమలనాభా! నీవేమో ప్రాణులకు మోక్షమివ్వాలనుకుంటావు.
నీకుమారులైన బ్రహ్మ, మన్మథులు ముక్తికి విరోధులా అన్నట్లు
సకల ప్రాణులకు సృష్టికార్యోన్ముఖలుగా చేస్తున్నారు ఇదేమి విచిత్రముగా
ఉన్నది స్వామీ! నృకేసరీ!


ధనధాన్యముల నాసఁ జూపుదురు శ్రీధాత్రీ సతుల్  నిత్యమున్
వనితాలోకము వంక కీడ్చు మము దేవా  నీసుతుండంగజుం
డును నీవో మరి వారి నేమి యన వెప్డున్ మమ్ము శిక్షింతు మా
ఘన పంకమ్ముల  నూడ్చు నీ దుహిత శ్రీగంగమ్మయే శ్రీహరీ! (40)

శ్రీదేవి భూదేవీ నీకు భార్యలై కూడ ధనమునొకరు
ధాన్యమునొకరు ఆశ చూపుతున్నారు
ఓ దేవా!  నీకుమారుడైన మన్మథుడున్నాడే -
అతడు మమ్ములను స్త్రీ వ్యామోహము వంక కీడుస్తున్నాడు
నీవు వీరందరినీ ఏమనవు మమ్మలినే శిక్షిస్తావు
నీకుమార్తె గంగమ్మే మాపాపాలను పోగొడుతున్నది స్వామీ! నరహరీ!


మురారి ఎందుకు కొయ్యబారాడు?


మురారి ఎందుకు కొయ్యబారాడు?


సాహితీమిత్రులారా!

ఎంత చిత్రం!
మురారి కొయ్యబారాడా? కాదా!
పూరీ జగన్నాథుడు కొయ్యవిగ్రహమేగా!
ఎందుకట -
ఈ శ్లోకం చూడండి

ఏకా భార్యా ప్రకృతి రచలా చంచలా సా ద్వితీయా
ఏక పుత్రో సకల సృడభూత్ మన్మథో దుర్నివార:
శేషశ్శయ్యా శయన ముదధి: వాహనం పన్నగాశీ
స్మారం స్మారం స్వగృహ చరితం దారుభూతో మురారి:

ఒక భార్య భూమి(ప్రకృతి) ఆమెకు చలనం లేదు.
రెండవ భార్య లక్ష్మి బహుచంచల.
ఒక కొడుకు బ్రహ్మ అడ్డమైన సృష్టి చేస్తాడు.
రెండవకొడుకు మన్మథుడు వానికి పట్టపగ్గాలుండవు.
పడుకునే శయ్య పాము. పడక సముద్రంమీద -
పాము పీకుతుందో?  సముద్రం ముంచుతుందో?
వాహనం గరుత్మంతుడు పాములను తినేవాడు
ఇలాంటి చరిత్రగల తన ఇంటిని
తలచుకొంటూ తలచుకొంటూ
మురారి కొయ్యబారి పోయాడు.
ఎంత చిత్రం!

Monday, September 26, 2016

శివుడు ఆత్మహత్యకోసం విషం తాగాడా?


శివుడు ఆత్మహత్యకోసం విషం తాగాడా?


సాహితీమిత్రులారా!

ఇంట్లో కలహాలుంటే ఎవరికైనా ఎంత కష్టమో దాన్నే
మనప్రజాకవి వేమన
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా 
విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.

ఈ చమత్కారశ్లోకం చూడండి.

అత్తుం వాంఛతి వాహనం గణపతే ర్భూషా భుజంగం క్రుధా
తం వాహోపి షడాననస్య - గిరిజా వాహోపి నాగాననమ్
గౌరీ జహ్నుసుతా మసూయతి - కళానాథం లలాటానల:
నిర్విణ్ణ స్సహసా కుటుంబ కలహా దీశో పిబద్దుర్విషమ్!

శివుని మెడలోని పాము గణపతి
వాహనమైన ఎలుకను మ్రింగేయలని చూస్తోంది.
ఆ పామును ఆర్ముగము(కుమారస్వామి)
వాహనం నెమలి తినాలని చూస్తోంది.
పార్వతి వాహనమైన సింహం
వినాయకుని(నాగాననుని - ఏనుగు ముఖమువాని)
చంపాలని చూస్తోంది.
పార్వతి - తలపైఉన్న గంగను ఈర్ష్యగా చూస్తోంది.
తలపైని చంద్రుని నుదుటఉన్న అన్ని మసిచేయాలని చూస్తోంది -
ఇన్ని కుటుంబ అంత: కలహాలతో ఎవరినీ సర్దుబాటు చేయలేని శివుడు
ఆత్మహత్యకై విషం మ్రింగాడు - అని భావం.

అంటే దేవతల కోసమో
జగద్రక్షణకోసమో
విషం త్రాగలేదట
కుటుంబ అంత:కలహాలే కారణమట
ఎంత చమత్కారం.

మధుర స్వప్నము


మధుర స్వప్నము


సాహితీమిత్రులారా!


స్వప్నం అందరం కంటూనే ఉంటాం
కాని ఆ సుందర సుమధుర స్వప్నానికి
అక్షరాకృతి ఇచ్చామా?  అందరూ ఇవ్వలేరు
అలా ఇచ్చారు చాలామంది కవులు
అలాంటి కవులలో
మన వేదగిరి వేంకట నరసింహరాయ శర్మగారొకరు.
ఈయన స్వప్నంలో శ్రీకృష్ణదేవరాయలను దర్శించారట
దానితో ఆకృతి దాల్చిన ఖండిక ఇది
చూడండి.

నింగిలో నుండి రేరాజు తొంగి చూడఁ
గలువ జవరాలి మోమునఁ గాంతి హెచ్చ
మెల్ల మెల్లగ వీచెను పిల్లగాడ్పు
రామణీయంబుఁ గద శరద్రాత్రి భువికి

భువనమును మోహకెరటాల ముంచివైచు
పండువెన్నెల రేయి పరుండి యుండి
గాఢ నిద్రార్థినై సుంత కన్నుమూయ
మధురతర స్వప్నముంగంటి మఱువఁజాల

ఆ కలయందుఁ గాంచితిని అంబర చుంబిత సౌధపంక్తితో
శ్రీ కవిరాజితంబులయి చెన్నెలరారు నదీతటంబునన్
వాకొనరాని శిల్పములు వర్ణనఁ జేయగలేని కోటలున్
నా కనులారఁ గాంచితినంత మనోజ్ఞ విశాల పట్నమున్

చెంగు చెంగున ప్రవహించు తుంగభద్ర
యూర్మికల నూగు రాయంచ యొప్పులరసి
తమ్మి పూవులఁ గన హృదయమ్ము నుండిఁ
బొంగె కవనంబు గంగాతరంగ మట్లు

వెడలు చుంటిని పట్టణ వీధులందు
కవులకాణాచి యనఁదగు భువనవిజయ
సభను దరిశింపగాఁ గడు సంబరమున
న్మ్యమై యొప్పు భర్మ హర్మ్యంబుఁ గంటి

రాజరాజుల నోడించు నాజులందు
విశ్వవిఖ్యాతుఁడై విఱ్ఱవీగె నెవఁడు?
అట్టి నరసింహ కృష్ణరాయాధిపుండు
పాలనంబునుఁ గావించు పట్టణమది

వేదమంత్రాశీర్ని నాదముల్వెల యించు
      భూసుర ప్రవరులు భాసిలంగ
భార్గవ రాముని పరిహసింగఁజాలు
    సకల సామంతులు సన్నుతింప
కమనీయ మృదుపద కైతలందించెడి
    అష్టదిగ్గజ కవులభినుతింప
గంధర్వనిభులగు గాయకాగ్రణు లెల్ల
     మధుర గీతంబుల మనవి సేయ
అంగనలుఁజేరి బంగారు హారతులిడ
ఆంధ్రహాటక పీఠంబు నధివసించి
దేవతాధిపు కైవడి తేజమెసఁగ
రమణ కొలువుండె, "శ్రీకృష్ణరాయ నృపుడు"

శ్రీరమ్యంబగు శేషశైలమున వాసింగాంచి భక్తావళీ
ప్రారబ్ధంబులఁ బాపునట్టి హరి తా పద్మావతీదేవితో
సారాచార వివేకవర్తనములన్ సత్కీర్తులంగన్న, మా
ధీరాగ్రేసరు కృష్ణరాయ నృపతిన్ దీవించి రక్షించుతన్

శ్రీకరుఁడగు పరమేశుఁడు
పాకారినుతుండు హైమ భామిని తోడన్
శ్రీకృష్ణరాయ భూవిభుఁ
బ్రాకటమౌ సిరులొసంగి, భవ్యునిఁ జేయున్

సతతము హర్షమ్మున, భా
రతితో పద్మాసనమున రాజిల్ల మునుల్
స్తుతిసేయ మొదటి వేలుపు
మతిమంతుని కృష్ణరాయ మాన్యునిఁ గాచున్

అని ముదంబున నేనిటు లాశుధార
పద్యములఁ జెప్పగా విని ప్రభువరుండు
ఆసనంబునఁ గూర్చుండ ననుమతించి
భాషముఁ జేసె కవిజన భూషణముగ

కవివర నీ వృత్తాంతము
వివరింపగ వేడుచుంటి వీనులెలర్పన్
గవి చంద్రుని రాక సభా
భవనంబు పవిత్రమయ్యె భవ్యుఁడనైతిన్

నరసింహ రాట్కవీంద్రుఁడ
నరనాధ వినంగనెంతు నాదగు పూర్వుల్
సరస కవిసార్వభౌములు
సరసాంతకరణ విమల సౌజన్యనిధీ

పాల సంద్రాన నల కౌస్తుభంబు భాతిఁ
బ్రాభవంబంది నాఁడనో ప్రభువతంస
సరస సంగీత సాహిత్య స్నుతమగు
వాసిఁ గాంచిన వేదగిర్వంగడము

జనని "సుబ్బమాంబ", జనకుండు "వేంకట
రమణ బుధవరుండు" రమ్యగుణుఁడు
కందుకూరి సీమ కవిత కాకరమగు
జానకమ్మ పేట జన్మభూమి

వ్రాసితి మారుతిస్తవము వ్రాసితినేను కరావలంబమున్
వ్రాసితి బిల్వమాల పదవైభవమొప్ప బుధుల్ నుతింపగా
వ్రాసితి ఖండకావ్యమును వ్రాసితి కొన్ని సుధామయోక్తులన్
ఆసల దీర్చి నన్ను తరితార్థునిఁ జేయుము, "కృష్ణరాణ్ణృపా"!

కవిలు నుతింప విబుధులు కరముమెచ్చ
కరము హర్షించి కవిజన కల్పశాఖి
మందహాసము చెవ్నొంద సుందర తర
పచ్చడంబును పౌఁగప్పి పలికెనిట్లు

లలిత కమనీయ మృదుపద లాలితమయి
తెలుఁగుఁదనమున నీకైత తేజరిల్లె
వెలయఁగల వీవు సాహితీ వీధులందు
రాజితానంద నరసింహ రాట్కవీంద్ర!

అష్టదిగ్గజ కవికోటి కంజలింప
పలికి రీరీతి మృదు ధార లొలుకు నుడుల
ముద్దులొలికెడు పదముల మూటఁ గట్టు
కావ్యములవ్రాసి మించుమో కవికుమార

జయము కన్నడత్రైలింగ్య జగతిపతికి
జయము శ్రీకృష్ణవిభునకు జయమటంచు
వందిమాగధ ఘోష మిన్నందెనంత
సార్వభౌముండు నాటికి సభ ముగంచె

సంతసాంబుధిఁ దేలెడు సమయమందు
కుక్కుటంబులు గొంతెత్తి కూయఁ దొడగె
తండ్రి పఠియించు సుప్రభాతమువినంగ
పడక విడనాడి లేచితిఁ బరవశమున
                                      (కావ్యశ్రీ నుండి)
ఎంత చక్కగా
శ్రీకృష్ణదేవరాయలతో తన గురించి
తన కృతులగురించి
చక్కని వర్ణనలతో అక్షరాకృతి
కల్పించాడు కవిగారు.

Sunday, September 25, 2016

రామరాజభూషణుని ఆంజనేయస్తుతి


రామరాజభూషణుని ఆంజనేయస్తుతి


సాహితీమిత్రులారా!



వసుచరిత్రలో రామరాజభూషణుని
ఆంజనేయస్తుతి చూడండి

తరుణార్క కబళనోద్ధతిణ జూపెనెవ్వాఁడు 
          రుచులచే ఫలమోహరుచులచేత
నకలంకరామముద్రికఁ బూనె నెవ్వాఁడు 
         శయముచే హృత్కుశేశయముచేత
మున్నీరుఁ బల్వలంబుగ దాఁటె నెవ్వాఁడు 
          జవముచే గుణగణార్జవముచేత
నక్షశిక్షాప్రౌఢి నలరారె నెవ్వాఁడు 
           రణముచే నియమధారణముచేత
ధరణి నెవ్వాఁడు దానవద్విరదదళన
విహృతిఁ దనకేసరికిశోరవృత్తిఁ దెలిపె
నతని మత్కావ్య భవ్యవాగమృతఘటన
మంజులస్వాంతు హనుమంతు మదిఁదలంతు
                                                 (వసుచరిత్ర 1-8)
(బాల్యమున సూర్యుని మ్రింబోయి అమానుష శక్తినిసాటి, 
సీతాన్వేషణమునకు శ్రీరామమగద్రికను గైకొని స్వామికార్యనిర్వహణ శక్తిని ప్రకటించి, 
సముద్రమును పడియవలెదాటి జవాతిశయమును సువ్యక్తమొనరించి, 
అక్షకుమారాది రాక్షసుల దునిమి 
సంగ్రమనైపుణ్యమును ప్రకటించిన రాక్షసదంతావళులకు 
కేసరికికిశోరమగు 
ఆంజనేయునకు కవి 
మధురకవితార్థియై
నమస్కరించుచున్నాడు.) 

నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న గలదా నూరేండ్లు చింతించిన్


నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న గలదా నూరేండ్లు చింతించిన్


సాహితీమిత్రులారా!


మనది భారతదేశం
మనకు కర్మసిద్ధాంతంతో చాలా
ఎక్కువ సంబంధం ఉంది.
ఏదానికైనా రాత ఉండాలంటూంటాం.
కావున దాన్నే ఒకకవి ఈ చమత్కారపద్యంగా
చెప్పాడు. మన పూర్వులకు చాలమందికి
ఈ పద్యపాదం సామెతాగా వాడటం కద్దు.


రసవాదంబులు పెక్కు నేర్చిన మహారాజేంద్రులన్ గెల్చినన్
వెసతో మంత్రములుచ్ఛరించిన మహావిద్యల్ ప్రసంగించినన్
అసహాయంబగు శూరతం గనిన దానంబోధి లంఘించినన్
నొసటన్ వ్రాసిన వ్రాలు కన్న గలదా నూరేండ్లు చింతించినన్


ఈ పద్యం విధి వ్రాత గొప్పతనాన్ని తెలుపూంది.
బ్రహ్మ పుట్టిన ప్రతిప్రాణికి నొసటిపై వారివారి సుఖదు:ఖాలను
ముందుగానే వ్రాస్తాడనేది మన వారి నమ్మకం.
అందువల్ల మనిషి రసవాద విద్యను
(బంగారం తయారుచేసేది) నేర్చుకున్నా,
రాజులతో పోరాడి గెలిచినా,
మంత్రాలను బాగా జపించినా,
గొప్పవిద్యలు నేర్చుకొని
శాస్త్రవాదాలు చేసినా,
ఎవరూ తోడులేకుండా శూరత్వం చూపినా,
సముద్రం దాటినా కూడా
నొసటిమీద బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతప్రకారమే జరుగుతుంది
గాని అంతకుమించి స్వశక్తితో మనిషి ఏదీ సాధించలేడని - తాత్పర్యం. 

Saturday, September 24, 2016

తెలుగుభాష - మంజుఘోష


తెలుగుభాష - మంజుఘోష


సాహితీమిత్రులారా!

తెలుగుభాష గొప్పదనాన్ని ఎంతమంది
ఎన్నివిధాలుగా చెప్పినా అది సరిపోదు
కాని మనం మనభాషను మనభాషాగొప్పదనాన్ని
చెప్పకుండా ఉండలేం ఎలాగంటే
మన తల్లిని ఎప్పుడూ తలవకుండా ఉండగలమా?
అందుకే ఎప్పుడూ ఎవరో ఒకరు
మనభాష గురించి చెబుతూనే ఉంటారు
ఇప్పుడు మన సాహితీసోదరుడు
కామనూరు రామమోహన్ గారు
తెలుగుభాష - మంజుఘోష అంటున్నాడు
ఆయన మాటల్లో విందాం.

పసిపాప ముద్దుగా పలుకరించినయట్లు
               చిలుకలు కమ్మగా పలికినట్లు
విరజాజి లతలెల్ల విరబూసిన నవ్వగా
               పులకింత హృదయాన కలిగినట్లు
శారదరాత్రుల చంద్రికా తరగల
              తూగుటుయ్యలలోన వూగినట్లు
ఇక్షురసంబు నాపేక్ష మీరగ గ్రోలి
              తీయని త్రేన్పులు త్రేన్చినట్లు
కోయిలమ్మ కూకూయని కూసినట్లు
పంచమంబున వీణియ పలికినట్లు
నెమలి పురివిప్పి యెదురుగా నిలిచినట్లు
హాయి గొల్పెడి భాష నా యాంధ్రభాష!

పసిడి పలుకుల మనసార పలుకరించు
పద్య మన్నచో తనువెల్ల పరవశించు
పలుకు పలుకుకూ, మేనెల్ల పులకరించు
తెలుగు భాషకై హృదయము కలవరించు

విమల జీవన శైలుల విశదపరచు
తేట నీతులనేకము తెలియపరచు
మానవతను సంరక్షించు మతినియిచ్చు
అర్థమిచ్చు మరియు పరమార్థమిచ్చు

వెతికి చూడుము సాహితీ లోతులందు
పదము పదమున తీపిని పొందవచ్చు
పద్యమెవరైన మనసార పాడవచ్చు
తీపి తెలియనోడె తెలుగు తేల బలుకు!

మన గురజాడ


మన గురజాడ


సాహితీమిత్రులారా!

మన కరుణశ్రీగారి మాటల్లో
మన గురజాడ చూడండి.


ఎవ్వ రీ నవ్య సాహిత్య వైతాళికులు!
ఎవ్వ రీ భవ్య సాహిత్య సంచాలకులు!
ఎవ్వ రీ దివ్య సాహిత్య నవ నందనము
ముద్దుముద్దుగ తీర్చిదిద్దు వనపాలకులు!!

వ్యావహారిక భాష కావాహనము పల్కి
యావదాంధ్రుల నాల్కలందు తేనెలు చిల్కి
అందాల ఆణిముత్యాల సరముల కల్పి
ఛందాలు కూర్చు స్వచ్ఛంద కవితా శిల్పి!!

హృదయమున సరిక్రొత్త ఊహ రేకెత్తించి
ఉదయమును మేల్కొల్పు ఉత్తమ కళావేత్త
చకచకా గతము చీల్చుకు భవిష్యత్తులో
కాలుబెట్టిన నిత్యకల్యాణ యుగకర్త!!

హాస్య రసమును ప్రజల ఆస్యాలపై నిలిపి
లాస్యాలు నేర్పు కన్యాశుల్క నిర్మాత
జగ మెఱుంగుల నవ్యసాహిత్య మందించు
జగ మెఱింగిన ప్రజా సారస్వత విధాత!!

తళుకు చెక్కిళ్ళ పుత్తడిబొమ్మ
చిన్ని గుండెలలోని కన్నీటి కెరటాలు
పలుకు పలుకున పొంగి పై పైకి ప్రవహింప
తిలకించి ప్రకృతియే పులకించిపోయింది!!

తలపోసి కొత్తపాతల మేలు కలయికను
కొలబోసి సరిపాళ్ళు కలబోసిన యశస్వి
ప్రజలలో నిజదేశభక్తి రేకెత్తించి
ధ్వజమెత్తి చెడుగుపై దండెత్తిన మనస్వి!!

ఎవరొహో యీ నవ్య కవితా భగీరథులు!
ఎవ రీ నవీన మానవతా మహారథులు!
జవసత్వముల పాంచజన్యంబు పూరించు
నవ కురుక్షేత్ర విప్లవ విజయసారథులు!!
                                  (ఉదయశ్రీ నాల్గవభాగం నుండి)

Friday, September 23, 2016

కొత్త పాతలలో ఏది మంచిది?


కొత్త పాతలలో ఏది మంచిది?


సాహితీమిత్రులారా!


మనవాళ్ళు అంటూవుంటారు
"గతకాలము మేలు వచ్చు కాలముకంటేన్" - అని,
మరికొందరేమో
"మంచిగతమున కొంచెమేనోయ్" - అంటుంటారు.
మొత్తానికి ఏది సరైనది
ఇది తెలియాలంటే
ఈ శ్లోకం చూడాల్సిందే.
ఇది కాళిదాసు "మాళవికాగ్నిమిత్రమ్"
నాటకంలో ప్రస్తావనలో ఉంది.

పురాణ మిత్యేవ న సాధు సర్వం
న చాపి కావ్యం నవ మిత్యవద్యమ్
నన్త పరీక్ష్యాన్యతర ద్భజంతే
మూఢ: పరప్రత్యయనేయబుద్ధి:


ఏది కూడ కేవలం పాతది
అనే కారణంతో మంచిదికాదు.
కొత్తదైనంత మాత్రాన
దోషయుక్తమైనదీ కాదు.
ఉత్తములైన వారు వాటిని పరీక్షించి
గుణాన్ని బట్టి మంచిదాన్నే తీసుకుంటారు.
అవివేకి ఇతరులమాటలపై
నమ్మకంతో నిర్ణయించుకుంటాడు.
మంచి చెడులను వస్తుధర్మమే
కారణంగాని కాలం కారణం కాదు. - అని భావం.

పాతది మంచిది కొత్తది చెడ్డది అనే అపోహ
కాళిదాసు కాలం నుంచీ ఉందని దీన్నిబట్టి తెలుస్తుంది.
ఈ అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాడు కాళిదాసు.
మంచి చెడ్డలు గతంలోను వర్తమానంలోను
భవిష్యత్తులోను ఉంటాయి అనేది అందరూ
ఆమోదించదగినది.

ఎప్పుడూ పీడించేదెవరు?


ఎప్పుడూ పీడించేదెవరు?


సాహితీమిత్రులారా!

ఈ చమత్కారశ్లోకం చూడండి.

మత్కుణా మశకా రాత్రౌ, మక్షికా యాచకా దివా
పిపీలికా చ భార్యా చ దివారాత్రౌ చ బాధతే


ఇది ఒక భార్యాబాధితుడు చెప్పడట.
దీని భావం -
నల్లులూ, దోమలూ రాత్రిపూట బాధిస్తాయి.
బిచ్చగాళ్ళు ఈగలు పగలు ఇబ్బంది పెడతాయి.
చీమలు, భార్య మాత్రం రాత్రింబవళ్ళు బాధిస్తాయి.

దీనిలో నల్లులూ, దోమలు పగటిపూట మనజోలికేరావు.
బిచ్చగాడు, ఈగలు రాత్రిపూట అసలు ఇబ్బంది కలిగించవు.
చీమలు రాత్రి పగలు కూడ కుట్టి ఇబ్బంది పెడతాయి.
భార్య అయితే అవికావాలి ఇవికావాలని చెవిలో జోరీగై
అహోరాత్రులు పీడిస్తూనే ఉంటుంది.
మొత్తానికి ఎంత చమత్కారంగా చెప్పడండీ!
ఇది అందరికీ వర్తించదని మనం గమనించాలి.

Thursday, September 22, 2016

స్వజాతి చైతన్యము విస్మరింతురో!


స్వజాతి చైతన్యము విస్మరింతురో!


సాహితీమిత్రులారా!

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు
తన విజయశ్రీ(కురుక్షేత్ర వీరకావ్యం)లో
పాండవులు మంత్రాలోచనం జరుపునపుడు
అందరు కృష్ణునితో చెప్పవలసినది చెప్పిన
తరువాత పాంచాలి మాటలు ఏవిధంగా కూర్చో చూడండి.

భుజాగ్రముల్ పొంగ పురోగమింతురో!
ధ్వజాగ్రముల్ వంగ తిరోగమింతురో!
శరమ్ములన్ దాల్చి పరాక్రమింతురో!
కరమ్ములన్ మోడ్చి పరిక్రమింతురో!

త్యజింతురో క్షాత్రకుల ప్రతిష్ఠలన్!
భజింతురో శాత్రవ పాదపద్మముల్!
భుజింతురో కానల కందమూలముల్!
సృజింతురో తాత్త్విక ధర్మశాస్త్రముల్!

స్మరింపుడీ భూత సభా ప్రమాణముల్!
ధరింపుఁడీ చేత ధనుష్ కృపాణముల్!
హరింపుఁడీ కౌరవ గర్వసంహతుల్!
భరింపుఁడీ పౌరవ గౌరవద్యుతుల్!

అధిష్ఠితోద్దండ రథిప్రకాండుఁడౌ
యుధిష్ఠిరుండెంతటి సార్థకాఖ్యుఁడో!
అజాతశత్రుత్వ యశోభిలాషలో
స్వజాతి చైతన్యము విస్మరింతురో!

ఇది ఎంత చిత్రం!


ఇది ఎంత చిత్రం!


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి.

యథా వ్యాళగళస్థోపి భేకో దంశా నపేక్షతే
తథా కాలాదినాగ్రస్తో లోకో భోగా నపేక్షతే

పాము గొంతులో సగము చిక్కిన కప్ప బయటఉన్న
కీటకాలకై నాలుక చాచుచున్నది.
అట్లే కాలంచే కబళింపబోవు లోకము
భోగములను కావాలనుకొంటున్నది.
ఇది ఎంత చిత్రం!

Wednesday, September 21, 2016

గురజాడ - అడుగుజాడ


గురజాడ - అడుగుజాడ


సాహితీమిత్రులారా!


మహాకవి గురజాడ అప్పారావును
ఆధునిక కవితలో చెప్పిన
తన్నీరు బాలాజిగారి సీసాన్ని చూద్దాం.

ముదు ముద్దు మాటల "ముత్యాలసరము"గా
                      గ్రుచ్చి మురిపెముగాఁ గూర్చినావు
కామాంధుకౌగిట కరిగిపోనివ్వక 
                      "కన్యక"ను చిచ్చుననం గాల్చినావు
"కన్యశుల్కము"నాడి కామిత ముదుసళ్ల
                      కన్నులు తెరిపింప కదలినావు
కాసుల తండ్రికి కనువిప్పు గల్పింప
                       "పూర్ణమ్మ"కు పురుడు పోసినావు

తెలుగు నింగిలోన వెలుగుల జాబిలి
తెలునాట నీదు "దిద్దుబాటు"
మంచి మానవతల బెంచి నడతుమయ్యా
అందరి గురజాడ - అడుగుజాడ

అప్పారావుగారి తెనిగింపు



అప్పారావుగారి తెనిగింపు


సాహితీమిత్రులారా!


మహాకవి గురజాడ అప్పారావుగారి రచనలు కన్యాశుల్కం,
పూర్ణమ్మ, దేశభక్తి గేయం లాంటివి అందరం చూచే ఉంటాం.
కాని ఆయన సంస్కృతశ్లోకాలకు తెనుగుఅనువాదం ఎలా చేశారో
చూడటం అరుదుకదా ఇప్పుడు అవి కొన్ని చూద్దాం.

దాతృత్వం ప్రియ వక్తృత్వం 
ధీరత్వ ముచితజ్ఞతా
అభ్యాసేన నలభ్యంతే
చత్వార స్సహజా గుణా:

దీనికి అనువాదం-

ఈవియు దియ్యనిమాటయు
భావంబున జేయదగిన పని తెలియుటయున్ 
ఠీవియగు ధైర్య భావము 
రావు సుమీ యొకని వలన  రావలె తనతోన్


స్త్రీణా మశిక్షిత పటుత్వ మయాను షేషు
సందృశ్యతే కిముత యా: ప్రతిబోధ వత్య:
ప్రాగ న్తరిక్ష గమనాత్స్వమ పత్యజాత
మనై ర్ద్విజై: పరభృతా: ఖలు పోషయన్తి:
         (శాకుంతలం -5-220)
దీనికి అనువాదం-
మానిసులుగాని యింతుల
తా నేర్చని నేర్పు చెలగు తరి జెప్పంగా
జ్ఞానవతుల కగునె పికము
ద్దాని శిశువుల బెంచు నెగురుదాక నొరుచేన్

ఎంత సరళంగా ఉన్నాయో కదా!


గురజాడ అప్పావుగారి పుట్టినరోజు శుభాకాంక్షలు


గురజాడ అప్పావుగారి 
పుట్టినరోజు శుభాకాంక్షలు


Tuesday, September 20, 2016

ఈ ఊరికి ఆ ఊరెంతదూరమో


ఈ ఊరికి ఆ ఊరెంతదూరమో


సాహితీమిత్రులారా!



ఈ సామెత వినే ఉంటారు ఈ ఊరికి ఆ ఊరంతదూరమో,
ఆ ఊరికి ఈ ఊరంతదూరమే. ఎలామారుతుంది.
అలాగే మనం ఇతరులకు ఎలా కనబడతామో
ఇతరులకు మనం అలాగే కనబడతాంకదా
ఈ శ్లోకం చూడండి.

జ్ఞాత తత్త్వస్యలోకోయం జడోన్మత్త పిశాచివత్
జ్ఞాత తత్త్వోపి లోకస్య జడోన్మత్త పిశాచివత్

ఈ జగత్తును అర్థం చేసుకొన్న
వారికి ప్రపంచం మూర్ఖమై,
పిచ్చెత్తిన పిశాచంలా కనిపిస్తుంది.
అలాంటి మహాజ్ఞాని కూడ
ఈ లోకానికి మూర్ఖమై పిచ్చెత్తిన
పిశాచంలా కనబడతాడు.

Monday, September 19, 2016

వర్షఋతువు - బాటసారులు


వర్షఋతువు - బాటసారులు


సాహితీమిత్రులారా!


భర్తృహరి శృంగారశతకంలో బాటసారులతీరు
వర్షఋతువులో ఎలావుంటుందో
ఈ శ్లోకంలో చెప్పాడు చూడండి.

ఉపరి ఘనం ఘనపటలం, తిర్యగ్గిరయో2పి నర్తితమయూరా:
క్షితి రపి కన్దళధవళా, దృష్టిం పథిక: క్వ పాతయతి!


తమ ప్రియురాండ్రను విడిచి వచ్చిన బాటసారుల తీరు ఇది-

వర్షఋతువులో మేఘపటలం ఆర్భాటం,
నెమళ్ళనాట్యం, పుట్టగొడుగుల ఉనికి
బాటసారులకు అడుగు పడనివ్వడంలేదు.

పైన చూద్దామంటే ఎప్పుడు కురుస్తుందో తెలియని మేఘం;
అటుఇటు చూస్తే నెమళ్ళు; క్రింద చూద్దామంటే నేలంతా
పరుచుకున్న పుట్టగొడుగులు
ప్రియురాళ్ళను వీడి వెళ్ళవద్దని -
సంభోగసుఖాన్నాస్వాదిస్తూ ఇంటి పట్టునే
ఉండమని హెచ్చరికలు చేస్తున్నాయి - అని భావం.

తల్లిదండ్రులు ఎవరు?


తల్లిదండ్రులు ఎవరు?


సాహితీమిత్రులారా!

తంల్లిదండ్రులు ఎవరా ఏమిటీ ప్రశ్న అనుకోవచ్చు
కాని వారి గురించి మనకు తెలిసింది తక్కువే అందుకే ఆ ప్రశ్న.
నీతిశాస్త్రంలోని ఈ శ్లోకం చూడండి.

సర్వతీర్థమయీ మాతా
సర్వదేవమయ: పితా
మాతరం పితరం తస్మాత్
సర్వ యత్నేన పూజయేత్

పుణ్యతీర్థాలు ఎక్కడో కాశీ మదుర అయోధ్యలలో మాత్రమేలేవు.
గంగా మొదలైన సకల తీర్థాలు తల్లియే ఇక దేవతలు ఏఏ క్షేత్రాలలో
కొలువై ఉన్నారో అని వెతకక్కరలేదు. తండ్రియే సకల దేవతా స్వరూపుడు.
వీరిద్దరిని సేవించడం సకలతీర్థ క్షేత్రాలను సేవించినంత పుణ్యం.
కావున వారిని పూజించడం అటుంచి వారిని వృద్ధాశ్రమాలపాలుచేయకుండా
ఇంటిపట్టున ప్రేమ అభిమానాలు పంచుతూ మీకు కలిగిన దానితో వారికి
తృప్తికలిగించండి - అనవలసి వస్తోంది.

Sunday, September 18, 2016

చిత్తగించుమయ్య శ్రీగణేశ! -2


చిత్తగించుమయ్య  శ్రీగణేశ! -2



సాహితీమిత్రులారా!

గణేశ్ పాత్రో గారి
శ్రీగణేశ శతకం నుండి కొన్ని పద్యాలు చూచాం
ఇప్పుడు మరికొన్ని-

The way to man's is Through his stomach 
                                -- Mrs. Sarah payson

మగని మెప్పు పొందు మార్గమ్ములన్నిట
కమ్మనైన భోజనమ్ము మిన్న
కడుపు నుండి గుండె గడప దగ్గరకదా
చిత్తగించుమయ్య శ్రీగణేశ!


I praised the dead which are already dead 
more than the living which are yet alive
                                       --Ecclesiastes

పోయినోళ్ళ గొప్ప పొగడితి వేనోళ్ళ
పోయిన తరువాత పొగిడియేల
ఉన్నవాళ్ళలోన ఉండరాగొప్పోళ్ళు
చిత్తగించుమయ్య శ్రీగణేశ!

There is no cosmetic for beauty like happiness
                                       -- Lady blessing ton


పసుపు గంద మేల  పసరులేపనమేల
మొగము సొగసు కొరకు ముసుగులేల
అందమున్నదికద ఆనందమందునే
చిత్తగించుమయ్య శ్రీగణేశ!

In bed we laugh in bed we cry
And born in bed, in bed we die
The near approach abed may show
Of human bliss to human woe
                  --Issac Ded Benserede


పాన్పుపైన నవ్వు పానుపు పై నేడ్పు
పాపకాన్పు పాన్పుపాడెపాన్పు
సుఖము దుఖములకు సోపానమాపాన్పు
చిత్తగించుమయ్య శ్రీగణేశ!

Begger That I am, 
I am even poor in thanks
                -- shakespear

పుచ్చుకొనుటెగాని యిచ్చుటతెలియని
బిచ్చగాడువీడు బీదవాడు
ఋణముతీర్చుకొందునని చెప్పజాలను
చిత్తగంచుమయ్య శ్రీగణేశ!

ప్రకృతిని మించిన పరమాత్మ లేడు


ప్రకృతిని మించిన పరమాత్మ లేడు

సాహితీమిత్రులారా!

మనం ప్రకృతిలో ఉన్నామా
దీనికి హానికలిగితే మనకూ హానేకదా
అది తెలియక
అభివృద్ధి పేరుతో ఎవరు కూర్చున్న కొమ్మను వారే
నరుక్కున్నట్లు చేసుకుంటూ పోతున్నాం.
మన పిడుగు పాపిరెడ్డిగారు
ప్రకృతికి మించిన పరమాత్మలేడంటున్నాడు
ఆయన "నే చెప్తూనే ఉన్నా" - అనే కవితాసంకలనంలోని
ఈ కవితలో చూడండి-

రసమయ జగత్తు - రమ్యమైన విత్తు
రసికహృదయాలలో - రాశిగా మొలకెత్తు

కృషీవలుని హలంతో - జీవజలం మొలకించు
కవిరాజ కలంతో - రసధార కురిపించు

రాళ్లనే కరిగించి - రత్నాలుగా మార్చు
నాట్యరీతులతోన - నటరాజుగా నిలుచు

శ్రామికుల ఒడిలోన - ప్రేమికునిగా చేరు
కార్మికుల హస్తాల - కర్మిష్టిగా మారు

వసంతాల కేళితో - సీమంతాలు చేయు
భావనా వీచికలలో - జోలలుపాడు

ప్రకృతిని మించిన పరమాత్మలేడు
మానవతను మించిన మతంలేదు

గుణాన్ని మించిన కులంలేదు
ప్రేమను మించిన భావనలేదు

భావాన్ని మించిన భాషలేదు
సేవను మించిన ధాన్యంలేదు

పరార్థాన్ని మించిన పూజలేదు
త్యాగాన్ని మించిన భోగంలేదు

సౌభ్రాతృత్వాన్ని మించిన భాగ్యంలేదు
జగత్తే మనదనుకుంటే విపత్తేలేదు

Saturday, September 17, 2016

అబద్ధం ఏప్పుడెప్పుడు చెప్పవచ్చు?


అబద్ధం ఏప్పుడెప్పుడు చెప్పవచ్చు?



సాహితీమిత్రులారా!

వామనావతారంలో శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిన మూడడుగులనే
అడుగుతాడు. అప్పుడు రాక్షసగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని
పక్కకు పిలిచి వచ్చినవాడు విష్ణువు నీవు ఆయనకు మూడడుగులు
ఇవ్వద్దు ఇస్తే ఇబ్బందుపాలవుతావు అని చెబుతూ ఇప్పుడు మాటతప్పినా
పెద్ద ఇబ్బందిలేదు అని చెబుతూ ఈ పద్యం చెప్పాడు.

వారిజాక్షులందు, వైవాహికములందు
ప్రాణవిత్తమాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొందదధిప

ఓ అసురేంద్రా! ఆడవారి విషయంలోనూ, వివాహవిషయాలందు,
ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేప్పుడు,
భయపడిన గోవులను, బ్రాహ్మణులను ఆదుకొనేప్పుడు
అపద్ధం ఆడవచ్చు పాపంరాదు - అని భావం.

దీనిలోని విషయాలను గమనిస్తే ఎప్పుడైనై
అబద్ధం చెప్పవచ్చని తేలిపోతుంది
ఇందులోని విషయాలు అన్నిటిని కాకుండా
విడిగా ఏవిషయం ఉండదని గ్రహించవచ్చు
కావున ఇది సరైనదికాదని చెప్పక్కరలేదనుకుంటాను.

దక్షవాటిక శివుని యంత:పురంబు


దక్షవాటిక శివుని యంత:పురంబు



సాహితీమిత్రులారా!

శ్రీనాథని  సీసపద్యాలు
ఎంత ప్రఖ్యాతమైనవో వేరు చెప్పనక్కరలేదు.

భీమఖండములోని ఈ పద్యం
దక్షవాటికను గురించి చెబుతుంది.
ఇందులో ఎంత చమత్కారం ఉందో చూడండి.


దక్షవాటీ మహాస్థానంబులో లేని
      యమరులే స్థానంబు నందులేరు
దక్షవాటీ మహాస్థానంబులో లేని
      యర్థమే స్థానంబు నందులేదు
దక్షవాటీ మహాస్థానంబులో లేని
      యమృతమేనంబు నందులేదు
దక్షవాటీ మహాస్థానంబులో లేని
      యజ్ఞమే స్థానంబు నందులేదు
దక్షవాటిక సకల తీర్థముల కిరవు
దక్షవాటిక సకల విద్యలకు గరిడి
దక్షవాటిక విభవంబు తానకంబు
దక్షవాటిక శివుని యంత:పురంబు

          (భీమఖండము -6-106)

ఈ పద్యంలో ఒకటి రెండు పదాలు తప్ప
అన్నీ పాదమంతా పునరావ్రుతమైనాయి

Friday, September 16, 2016

మీరూ నా వలె కావద్దు!


మీరూ నా వలె కావద్దు!


సాహితీమిత్రులారా!




ఈ శ్లోకం చూడండి
ఒక యాచకుడు
ఎంత చమత్కారంగా యాచిస్తున్నడో!

ద్వార ద్వార మట న్భిక్షు: శిక్షత్యేవం నయాచతే
అదత్వా మాదృశో మాభూ: దత్వాత్వం త్వాదృశో భవ

ఒక యాచకుడు ఇంటింటికి వెళ్ళి ఈ విధంగా బోధిస్తున్నడు.
నీవు దానం చేయక, నావంటి యాచకుడవు కావద్దు దానం చేసి
నీవు నీవలెనే ఉండుము - అని శ్లోక భావం

ఈ యాకుడెవరో మంచి చమత్కారిలా ఉన్నాడు కదా!
నీతిశాస్త్రంలో ఒక శ్లోకం ఉంది దాని భావమేమంటే -
దానం చెయ్యనికారణంగా దరిద్రుడవుతాడు.
దారిద్ర్యకారణంగా దానం చేయలేడు
దానం మళ్ళీ చేయలేదు కాబట్టి మళ్ళీ దరిద్రుడవుతాడు - అని ఈ సూక్తి
ఈ యాచకునికి యాచించుకోవడానికి పూర్తిగా వంటబట్టినట్లుంది.

చిత్రం విధి విలాసం


చిత్రం విధి విలాసం


సాహితీమిత్రులారా!

విధివిలాసం ఎంత చిత్రమో
ఈ శ్లోకం చెబుతుంది చూడండి

యస్సుందర: తదన్వితా కురూపా
యాసందరీ తత్పతి రూపహీన:
యత్రోభయం తత్ర దరిద్రతాచ
విధేర్విచిత్రాణి విచేస్టితాని!

సుందరుడైన భర్తకు కురూపి భార్యఅవుతుంది.
సుందర స్త్రీకి కురూపుడైన భర్త యేర్పడతాడు.
భార్యాభర్తలు అందంగా ఉంటే వారికి దారిద్ర్యం వస్తుంది.
విధివిలాసం ఎంత చిత్రమైనది - అని భావం.

Thursday, September 15, 2016

ఇలాంటి వాళ్ళు ఉన్నారా?


ఇలాంటి వాళ్ళు ఉన్నారా?


సాహితీమిత్రులారా!

భాగవతం నవమస్కందంలో రంతిదేవుని చరిత్ర ఉంది.
అందులో రంతిదేవుడు దానధర్మాలు చేసి చివరకు
అడవిలో సకుటుంబంగా తిరుగుతూ 48 రోజులు నిరాహారుడై
48వ రోజు పాయసము, మంచినీళ్లు బొరుకుతాయి అవి
తన కుటుంబ సభ్యులకు పంచి తినేలోపు ఒక బ్రహ్మణుడు
ఆకలిగొనిరాగా  తన భాగంలోనిది పెట్టి పంపుతాడు అతడు వెళ్ళగానే
మరొక శూద్రుడు వస్తే అతనికి మిగిలినది పెట్టేస్తాడు. చివరికి నీళ్ళు త్రాగే సమయంలో
ఒక చండాలుడు దప్పికతో ఉన్నాను మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకోమంటాడు అప్పుడు
అతకు ఎంత దప్పిక ఉన్నా అతనికి నీరు పోస్తాడు. ఆ పోసే సందర్భములోనిది ఈ పద్యం -

అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి; ద్రావుమన్న; రా
వన్న, శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపద
ల్గ్రన్నన మాన్పి వారి సుఖంబులు సేయుటకంటె నొండు మే
లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముఁ డొక్కడు సుమ్ము పుల్కసా!                     
 (ఆంధ్రమహాభాగవతము 9-648)

ఓ అన్నా! అన్నం లేదు కాని తియ్యటి మంచినీళ్ళు ఉన్నాయి.
 దగ్గరకురా! దప్పిక తీరేట్లు త్రాగు. తనతోటి దేహధారులకు ఆపద
 కలిగితే వెంటనే వారి కష్టాలను పోగొట్టి వారిని ఆదుకోవడం కంటే
 మానవులకు వేరే పరమార్థం ఉందా? ఆ పురుషోత్తముడు ఒక్కడే నాకు దిక్కు!
- అని భావం

వరదరాజన్ కస్యదోషోయమ్


వరదరాజన్ కస్యదోషోయమ్


సాహితీమిత్రులారా!


మల్లినాథ సూరి వంశపు పూర్వ పురుషుడైన
కపర్ధి స్వామి చెప్పిన శ్లోకంగా ప్రసిద్ధమైంది.

దరిద్రుడైన ఒక యాచకుడు
రాజుగారితో ఇలా అన్నాడు

అంబా తుష్యతి న మయా
న స్నుషయా సాపి నాంబయా నమయా
అహమపి నతయా న తయా
వరదరాజన్ కస్యదోషోయమ్

ఓ రాజా! మా తల్లికి నా వలన సంతోషంలేదు.
కోడలి ద్వారా కూడ ఆమె సంతోషంగాలేదు.
నా భార్య కూడ మా అమ్మతో కాని, నాతో కాని
సంతోషంగా ఉండటంలేదు - నేను కూడ అమ్మతో కాని,
నా భార్యతో కాని సంతోషంగా లేను.
ఇది ఎవరిదోషమో నీవే చెప్పు- అని శ్లోకానికి భావం.

పై మాటలకు నా దరిద్రమే వీటన్నిటికి కారణం అని భావం
దరిద్రుని భార్యకాని తల్లికాని ప్రన్నంగా చూడరనే విషయం ప్రసిద్ధమైనదే కదా!


Wednesday, September 14, 2016

క్రోధము


క్రోధము



సాహితీమిత్రులారా!



మానవులకు శత్రువులు ఆరుగురు
వాటిని అరిష్ట్వర్గములు అంటాము.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేవి ఆరు.
వీటిలో కోపం అదే క్రోధం గురించి
వేదగిరి వేంకటనరసింహరాయశర్మగారి ఖండిక చూడండి.
మొదట కోపానికి నమస్కారం చేసి మిగిలినవి
చెబుతున్నారు వేదగిరివారు.

క్రోధమ! కామాదులు నీ
సోదరును మాట నిజము శోధింపకుమీ
బాధింపకు వేధింపకు
సాధింపబోకు మమ్ము సాష్టాంగ నతుల్

అలుక, కస్సుబుస్సు ఆగ్రహంబును, కుస
రుస, చురచుర, కినుక రూఢికెక్కె
చిఱ్ఱు బుఱ్ఱు మఱియు చీకాకు, కొరకొర
కోప మనెడు పేర్లుఁగూర్చి రిలను

కోపమ పెద్దలు నిన్నిల
కాపురుషుని లక్షణంబుగాఁబలికి రహో!
శాపమునకు మూలమవై
కోపమ! పరమార్థతతినిఁగూల్చెదవుఁగదా!

పన్నులు పటపట కొరుకుట
కన్నులు యెరుపెక్కుటయును గంతు లిడుటయున్
మిన్నందు నట్లు వాగుట
తన్నుట, తన్నులనుఁదినుట తథ్యము నీకున్

పరుషములనుఁబలికించుచు
దురితములను ప్రోత్సహించి దుందుడుకొప్పన్
మురియుచు నుందువు నిరతము
సరియెవ్వరు?  కామ మోహ సహజన్ములెగా!

అతి చేరువ మౌఢ్యమునకు
వ్యతిరేకము సజ్జనులకు యతివర్యులకున్
పతనంబునకును మార్గము
మతిమంతులఁజేర చెలిమి మాయమొనర్చున్

అహమునుఁబెంచును నిరతము
సహనంబును చంపు శీల సంపద నణచున్
ఇహపర సుఖములఁద్రుంచును
మహనీయులనయిన మందమతులనుఁజేయున్

సుడిగాలి వలెనుఁదిరుగుచు
కడు భీకరమూర్తి వగుచు కనుపించెడి, ఓ
మిడిమేలపు దొర క్రోధమ
చిడిముడిపాటేల? బుధులు ఛీ! ఛీ!  యనరే!

పురహరుఁడును మును లంకా
పురహరుఁడును కాల్చరయిరి పూనికతో నిన్
ఖరహరుఁడు కూల్చడయ్యెను
మురహరుఁడగు చక్రి మౌనముద్ర వహించెన్

తుదముట్టింపగఁజాలవు
గదలు కృపాణములు శూల కార్ముకములు నిన్
పదునుఁగల కుఠారమ్ములు
బెదరని మొనగాడనివీవు వీసంబయినన్

జినుఁడును గౌతమబుద్ధుఁడు
ఘనుఁడగు నయ్యేసు క్రీస్తు 'గాంధి'యు నెహ్రుల్
నిను గెలిచి విజయకేతన
మును నాటిరి, వారు పుణ్యపురుషులు జగతిన్

నీమూలమునఁగదా! నిజముగా "కాశిని"
         శపియించె మును పరాశరసుతుండు
నీమూలముఁగదా! నిజముగా భీముఁడు
         ఊరువుల్విరిచె సుయోధనునకు
నీమూలమునఁగదా! నిదురించు పాపలు
         హతులైరి ద్రోణుని సుతునిచేత
నీమూలమునఁగదా! నిజముగా గాధేయ
         దుర్వాస మౌనులు దోషులయిరి
నీ మహిమ నెన్నగాఁజాల కామ లోభ
మోహమద మత్సరములతో పొందొనర్చి
ఆటలాడుచు నుంటివి అహహ! ఏమి
క్రోధమా! నీవుయెంతటి కుటిలమతివి

గొప్పవాళ్ళెట్లా అవుతారు?


గొప్పవాళ్ళెట్లా అవుతారు?



సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
గొప్పవాళ్ళవటం గురించి చెబుతున్నది.

గుణై: ఉత్తుంగతాం యాతి నోచ్చై: ఆసన సంస్థితై:
ప్రాసాద శిఖరస్థోపి కాక: కిం గరుడాయతే

గుణంచేత గొప్పవాళ్ళవుతారు కాని
ఉన్నత పదవుల యందు ఉన్నంత మాత్రాన గొప్పవారు కాదు.
మేడపై ఉన్నంతమాత్రాన కాకి గరుత్మంతుడవుతుందా?
కాదు కదా!

ఇది లోకంలో బాగా గమనించ దగ్గ విషయం
పదవులుంటే ఏదో చేస్తారనుకోవడం
పదవులు లేనివారు ఏమీ చేయరనుకోవడం సరైనదికాదు
వీటన్నిటికి సరైనది మంచి గుణమే అది లేకుంటే ఎక్కడున్నవాడైనై ఒకటే.

Tuesday, September 13, 2016

'మని' లేదా మాకు పంపు మగవాడైనన్


'మని' లేదా మాకు పంపు మగవాడైనన్


సాహితీమిత్రులారా!




మనవారు ఎంత చతురులో
హాస్యానికైనా ఒక హద్దుండాల్నాలేదా
ఒక కవి కన్యాశుల్కం(ఓలి) ఇచ్చే
రోజుల్లో కట్నలను నిరసిస్తూ
ఎంత వికృతాకారునికైనా,
 బ్రతుకుదెరువు లేనివానికైనా మగవాడైతే
పిల్లనిచ్చి ఎదురు డబ్బిస్తారు మావారు ఓ శివా!
నీవు గణపతి పెళ్ళికి డబ్బులేక చేయలేకున్నవేమో?
మాకుపంపు ఆయన్ను అని వేళాకోళంగా ఈ పద్యం రాశాడు చూడండి.

గణపతికి పెండ్లి చేయవు
"మని" లేదా మాకు పంపు మగవాడైనన్
కనుముక్కు తీరు లేకు
న్నను భువిని కట్నంబు లెదురు నడచును శంభో

ఇలాంటి వాటిని  అధిక్షేప పద్యాలంటారు.

నేను - నీవు


 నీవు - నేను 


సాహితీమిత్రులారా!

ఈ రోజు అంటే 13-09-2016 మన సుకవి  అదే మనసు కవి
ఆత్రేయగారి వర్థంతిరోజు అందుకే
ఆయన గురించి కొంత ఆయన కవిత ఇంకొంత
చూద్దాం.

అసలు పేరు - కిళాంబి వేంకటనరసింహాచార్యులు
కలం పేరు - ఆచార్య ఆత్రేయ (ఆత్రేయ - గోత్రం)
పుట్టింది - 07-05-1921
        నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట తాలూకా, మంగళంపాడు గ్రామం
తల్లిదండ్రులు - శ్రీమతి సీతమ్మ, శ్రీ కృష్ణమాచార్యులు

చదువు - ఇంటర్మీడియట్, టీచర్ ట్రైనింగు

ఉద్యోగాలు - అనేకం

వివాహం - 1940లో శ్రీమతి పద్మావతితో

బిరుదలు - మరచిపోయినవి పోగా జనం నోళ్ళలోనిది మనసు కవి
         మే,1989లో సార్వత్రిక విశ్వవిద్యాలయంవారి డాక్టరేట్
మరణం - 13-09-1989 బుధవారం రాత్రి 10గం. మద్రాసులో
     

============================*****************============================

అందలమెక్కి కవ్వించు అందమీవు
అందు కొన చెయి చాచెడి ఆశ నేను

నందనమ్మున విరియు ఆనందమీవు
లోకలోకాల ముంచెడి శోకమేను

గగనవీధిని వెల్గు నక్షత్రమీవు
భువిని మిడికెడి మిణుగురు పురుగు నేను

అంతుతెలియని అపురూప కాంతివీవు
మూలలన్ నక్కు చీకటి ముద్ద నేను 

కలుషముల నెల్ల హరియించు గంగవీవు
పూర్వజన్మల పాపాలపుట్ట నేను

మధురభావమ్ము చిమ్ము సుమమ్ము నీవు
మండిపడు రాగ హోమాగ్ని గుండ మేను

ముట్టుకున్నంత కందెడి మొగ్గ వీవు
మొదలు తుదలేని భయదకాముకుడ నేను

శివుని నెవైన కైలాస శిఖరి నీవు
సిరిని దాచిన శ్రీహరి యురము నేను

సఖుని మదిలోన నమిడిన చలివి నీవు
చలికి మొద్దుబారిన హిమాచలము నేను

ఆటవిడుపు కోరు అల్లరాటవు నీవు
అలుపు సొలుపులేని వలపు నేను

మాటలే రాని పక్షి యారాటమునకు
కరిగి చిలికిన తొలకరి కవిత నీవు

ఆదికవి రాతి ఎదనూచినట్టి క్రౌంచ
మిథునముల ఎల్గులో మూల్గు వ్యధను నేను

తప్పటడుగులు వేయుచు దారితప్పి
జారిపడి ఏడ్చు పాప కన్నీరు నేను

చేయి నందించి గుండెకు చేర్చి సేద
తీర్చ తల్లి కడుపులోని తీపి నీవు

ఇది గేయంకాదు పద్యం తేటగీతి, ఒక్కచోట ఆటవెలది
ఆయన డైరీలో కవితలు పద్యాలు వ్రాసేవారట.
వారి డైరీ లోనిదే ఈ కవిత.


బిరుదుల్గాల్పందగున్ శంకరా!


బిరుదుల్గాల్పందగున్ శంకరా!



సాహితీమిత్రులారా!



శ్రీనాథుడు "ఫుల్లసరోజనేత్ర అల పూతన చన్నుల చేదుద్రావి" -
అనే పద్యం శ్రీకృష్ణునిమీద చెబితే
పెరంబూదూరు రాఘవాచార్యులుగారు
శంకరునిమీద ఈ పద్యం చెప్పాడు చూడండి.

గరళంబుం దిగ మింగినానని మహాగర్వంబుచే నుంటి వీ
వరయంగా మునగాల సీమ ఫలితం బై పేరు జెన్నొందు బం
దరు పొట్టీల ప్రసాదముం దినినమీ దన్ శ్రీధరాఖ్యుండవీ
కరణిన్మెక్కకపోతివేని బిరుదుల్గాల్పందగున్ శంకరా!

ఈ పద్యం నేటి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా
చందుపట్ల గ్రామనివాసి అయివ
పెరంబూదూరు రాఘవాచార్యులు గారు
వారానికొకసారి కోరాడ ప్రాంతపు మునగాల
పరగణాలోని గంగిశెట్టి గూడెం(బరాఖత్ గూడెం) అనే
గ్రామంలోని దేవాలయ ఉత్సవయాజ్ఞీకానికి వెళ్ళినపుడు
అక్కడివారు వడ్డించిన అన్నం తినలేక వ్యంగ్యంగా చెప్పినది.

ఓ శంకరా! నీవు పూర్వం హాలాహలం మ్రింగినానని చాల గర్వంతో ఉన్నావు. 
కాని ఈ మునగాల సీమలో పండే బందరు పొట్టీల(ఒకరకం బియ్యం) అన్నం తిని 
హరించుకుంటే అప్పుడు నిన్ను శ్రీధరుడు (విషాన్ని ధరించినవాడు) అని పిలువచ్చు. 
ఆ అన్నం తినలేకపోతే నీకున్న ఆ బిరుదులు కాల్చదగినవి గాని సార్ధకమైనవికావు -
అని వ్యంగ్యంగా హాస్యపూరితంగా చెప్పాడట.

Monday, September 12, 2016

ఫ్యాషన్ వెఱ్ఱి


ఫ్యాషన్ వెఱ్ఱి



సాహితీమిత్రులారా!

పాతసినీమాలో ఒక పాటుంది. అదేమంటే
పిచ్చి రకరకాల పిచ్చి అని దీన్ని శ్రీమతి భానుమతిగారు  పాడారు.
ప్రతి ఒక్కరికీ ఒకరకమైన పిచ్చి అదే వెఱ్ఱి ఉంటుంది కాదంటారా.
మనదికూడా ఒకరకం పిచ్చే అదేమిటంటారా సాహిత్యం పిచ్చి.
ఈ పిచ్చివలన ఎవరికీ ఏమీ నష్టంలేదు.
కానీ సమాజంలోని విపరీతపు పోకడలను పిచ్చో వెఱ్ఱో అని
సర్దుకుపోవడం అలవాటైందిమనకు. ఇది చూడలేని
మన తన్నీరుగారికి ప్యాషన్ వెఱ్ఱి మీద
సాహిత్యపు పిచ్చిలో ఏదో జనానికి చెబుతున్నారు
చూద్దామామరి-

గణనాథుని జనులకు జాగృతి
నిమ్మని కొలుస్తూ ప్రారంభించాడు.

శ్రీగణనాథుని గొలిచెద
రాగలయిడుముల తరుమగ రయమున రాగన్
జాగున్ సేయక జనులకు
జాగృతి సలుపగ పలుశుభ జయముల నొసగన్


రాగిరంగులుఁబూసి రమ్యమందురుగాని
                        నల్లని కురులున్న నాతి యేది
చారెడు కన్నుల సౌరులు గన్పింప
                           కాటుకఁ బెట్టెడి కన్నులేవి
బంగరుమేనిని పరికించిఁ జూడగ
                            పసుపు మేనికిఁ బూయు పడతియేది
అందాల బొట్టుతో యలరించు స్త్రీమోము
                           నుదుట తిలకమున్న సుదతియేది
ఫ్యాషననుచు పసుపు పారాణి కుంకుమల్ 
ఒదలి, నాగరికత ఇదియె ననుచు 
భారతీయ యలఘు పావనరీతుల
మరువకమ్మ మగువ మనమునందు


తెల్గు జాణతనము దెల్పు జానుతెనుఁగు
                       ఉగ్గడింతురు నేడు  ఒత్తి ఒత్తి
తెలుగుసుదతి చీరదెచ్చు సొంపువదలి
                        ధరియించు జీన్స్ లు తరచి తరచి
ముంజేత గాజులు ముక్కుపుడకలేక
                        ముంగురులనుఁ జూచి మురిసి మురిసి
నల్లని వాల్జడ నడుమునకందమౌ
                        కురులద్రుంచి వదలు కొసరి కొసరి
ఫ్యాషననుచు ఆంధ్రప్రాభవంబు విడక
తేనెలొలుకు తేట తెలుగుభాష 
తెలుగు కట్టు బొట్టు తెలుగుజాతి పరువు
మరువకమ్మ మగువ మనమునందు

భక్తి సంభజింతురీ పద్మబంధు


భక్తి సంభజింతురీ పద్మబంధు


సాహితీమిత్రులారా!

మయూరుని సూర్యశతకంలోని
ఈశ్లోకాన్ని చూడండి

సిద్దై: సిద్ధాన్త మిశ్రం, శ్రితవిధి విబుధై: చారణై శ్చాటు గర్భం
గీత్యా గంధర్వముఖ్యై:, ముహు రహిపతిభి ర్యాతుధానైర్యతాత్మ
సార్ఘ్యం సాధ్యై: మునీంద్రై ర్ముదిత తమమనో మోక్షిభి: పక్షపాతాత్ - ప్రాత:
ప్రారభ్యమాణ: స్తుతి రవతు రవిర్విశ్వవంద్యోదయో వ: 
                             (సూర్యశతకం - 81శ్లో.)

ఈ శ్లోకభావం  శ్రీనాథుడుని కాశీఖండంలో
3వ ఆశ్వాసంలోని 174 పద్యంగా
మనోహర రూపం దాల్చింది
ఆ పద్యం -

సిద్ధాంత సంశుద్ధి సిద్ధ సంఘాతంబు
                         విధ్యుక్త పరిపాటి విబుధకోటి
చాటు ధారాప్రౌఢిఁజారణవ్యూహంబు
                         కిన్నరవ్రాతంబు గీరసరణి
ఖచర సంఘము విశృంఖలవచోవైచిత్రి
                         యాతుధానశ్రేణి యధికభక్తి
గరుడలోకము నమస్కారవాక్యంబున
                         నేకాగ్రమతి దండశూకసమితి
ప్రతిదినంబునుఁ బ్రాతరారంభవేళ
నిర్ణిబంధన నిరుపాధి నిరవగాధ
నిర్ణిరోధ నిరాఘాట నిరుపమాన
భక్తి సంభజియింతురీ పద్మబంధు

ఈ పద్యం శివశర్మ అనే భక్తుని విష్ణుదూతలు దివ్యరథంలో
విష్ణులోకానికి తీసుకుపోతూ దారిలో కనిపించిన సూర్యలోకాన్ని
చూపుతూ దేవతలంతా సూర్యుణ్ణి ఎలా పూజిస్తారో వివరించే పద్యంగా
ఆ శ్లోకభావాన్ని మార్చారు శ్రీనాథుడు.

శ్లోకభావం -

అదిగో సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడు.
యోగీశ్వరబృందం హృదయపూర్వకంగా
సూర్యుని ఆహ్వానం పలుకుతోంది
సిద్ధపురుషులు సిద్ధాంతభాగంతీసి
విధిహితంగా వినయాంజలి ఘటిస్తున్నారు.
దేవతాసమూహం వేదోక్తంగా ప్రమాణాలు చేస్తోంది.
చారగణాలు స్వామి గుణవర్ణన కావిస్తున్నవి.
గంధర్వవర్గం మనోహరమంజుల మధురగానం ప్రారంభించినది.
పన్నగరాజులు పడగలు విప్పి ప్రణమిల్లుతున్నారు.
యాతుధానులు ఆత్మనిగ్రహంతో నమస్కారాలు చేస్తున్నారు.
(యాతుధానులు - రాక్షసులు)
సాధ్యులు సాంజలులై అర్ఘ్యప్రదానం చేస్తున్నారు.
మహామునీంద్రులు ప్రసన్నహృదయాలతో సంస్తుతిస్తున్నారు.
యోగీంద్రులు స్వాత్మభావనతో ప్రశంసిస్తున్నారు.
అటువంటి శుభసమయంలో విశ్వవంద్యుడైన
రవిరాజు మెల్లమెల్లగా  వేంచేస్తున్నాడు.
ఆదిత్యుడు అందరికీ ఆశీస్సులు అందిస్తున్నాడు - ఇది భావం.