Monday, June 29, 2020

ప్రత్యేక ముద్రికలు(ఉంగరాలు)


ప్రత్యేక ముద్రికలు(ఉంగరాలు)

సాహితీమిత్రులారా!
Legendary Telugu wordsmith Kapilavai Lingamurthy passes away- The ...
కపిలవాయి లింగమూర్తిగారి మాంగల్యశాస్త్రం
నుండి ప్రత్యేక ఉంగరాలను గురించి తెలుసుకుందాం -

ఈ పుస్తకంలో 5 ప్రత్యేక ఉంగరాలను గురించి వివరించారు.
వాటిలో మొదటిది సూర్యగ్రహణముద్రిక.

సూర్యోపరాగ సంప్రాప్తే లోహానాంత్రయ మిశ్రితం
తామరతామ్ర సువర్ణానాం - అర్క షోడశ రంధ్రభిః
అఖండంచ, ఇమాంకృత్యా - ముద్రికాం ధారణ శుభం

తా. సూర్యగ్రహణ సమయంలో వెండి 12, రాగి 18, బంగారం 10 పాళ్లు కలిపి ఒకచోట కరిగించి దానితో అతుకు లేకుండా ఉంగరం చేయించుకుని ధరిస్తే సమస్త గ్రహబాధలు తొలగిపోతాయి.

ఈ ఉంగరం తయారు చేసేవిధానం -
గ్రహణం ప్రారంభం కాగానే విశ్వకర్మ స్నానం చేసి అర్ధ్ర వస్త్రం కట్టుకొని కుంపటి, దాగలి మొదలైన పరికరాలు గ్రహణం కనిపించే ఆరుబయట పెట్టుకొని పైన చెప్పిన ప్రకారం లోహాలు మూసలో వేసి కరిగించవలె. అవి కరిగిన తరువాత మూసలో నుండి బొగ్గులు తొలగించవలె. అపుడు గ్రహణచ్ఛాయ దానిలో పడుతుంది.

          ఆ ఛాయ కరిగిన లోహంలో ప్రతిఫలించింది లేనిది చూచి పిమ్మట ఆలోహాన్ని అలాగే ముద్దగా గాని లేదా చిన్న బిళ్లగా గాని గాడిలో పోసి పిమ్మట ఆ బిళ్లను చదును చేసి దానికి నడుమ ఒక రంధ్రం సేయవలె. పిమ్మట దాన్ని ఒక కడ్డీపై ఎక్కించి ఉంగరంగా చరుచుతూ పోవలె. ఆ విధంగా ఉంగరానికి ఒక ఆకారం రాగానే ఇక గ్రహణం విడవకముందే దాని రంధ్రం నుండి గ్రహణాన్ని చూడవలె. గ్రహణాన్ని చూచిన పిమ్మట దానిని మళ్లీ ఒక కుంపటిలో వేయకూడదు.

         ఈ ఉంగరం చేసేప్పుడు శిల్పి అది ఏ గ్రహణంమైతే ఆ మంత్రం అనగా చంద్రగ్రహణానికి చంద్రుని మంత్రం, సూర్యగ్రహణానికి సూర్యుని మంత్రం జపించవలె. అలాగే ఉంగరం నుండి సూర్య చంద్రుల బింబాన్ని చూచేప్పుడు ఆ గ్రహణం రాహుగ్రస్తమైతే రాహుమంత్రం, కేతుగ్రస్తమైతే కేతుమంత్రం జపించవలె.

ఇది ఈ ఉంగరం తయారీవిధానం ఎంతగా వివరించారో కవిగారు.

Saturday, June 27, 2020

ఎంత స్వాభావికమైనదీ శ్లోకంఎంత స్వాభావికమైనదీ శ్లోకం


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం ఎంత స్వాభావికంగా భర్తృహరి కూర్చారో గమనించండి-

మధు తిష్ఠత వాచి యోషితాం
హృది హాలాహలమేవ కేవలమ్
అత ఏవ నిపీయ తే2ధరో
హృదయం ముష్టిభి రేవ తాడ్యతే
                               (భర్తృహరి సుభాషితములు -2-60)
తేనె ధారలు కారేలా మాట్లాడటం స్త్రీల స్వభావం.
కావున ఆ తీపి పెదాలను పీల్చడానికీ పురుషులు
ఉబలాటపడతారు. అవి పైపై మధురపు పలుకులని తెలిశాక,
హృదయంలో హాలాహలం ఉందని బైటపడ్డాక కసి కొద్దీ
వారి స్తనాలను మర్దిస్తారు.
అధర చుంబనం - స్తనపీడనం రతిలో స్వాభావిక అంశాలు.

ఈ శ్లోకంలో ఒకదాన్నొకటి సమర్ధిస్తున్నట్లుగా చెప్పడం కవి చాతుర్యం.
తీయగా మాట్లాడే స్త్రీలను మొదట తెలీక నమ్మినప్పటికి వారిలో విషముందని
గ్రహించాక నిక్కిన చన్నులను చేత్తో అణచటం - పిడికిళ్ళతో గ్రుద్దడం కాముకులు
వెనువెంటనే ఆచరించే కృత్యాలు.
ఇది ఆ స్త్రీల పట్ల ఆచరించతగినదే
ఇక్కడ వేశ్యలని ప్రత్యేకంగా
వర్ణించినప్పటికి
ఈ స్వభావం అధికం అనేది సర్వసమ్మతం.

Thursday, June 25, 2020

తార చంద్రునితో ఏమనిందంటే?


తార చంద్రునితో ఏమనిందంటే?

సాహితీమిత్రులారా!

తెలుగు కావ్యజగత్తులో సుప్రసిద్ధములై శతాబ్దాలుగా
సాహితీ రసికుల ఆస్వాదములై వస్తూన్న వాటిలో
"శశాంకవిజయం, 
రాధికా సాంత్వనం, 
బిల్హణీయం
వైజయంతీవిలాసం,
అహల్యా సంక్రదనం" మొదలైనవి.
వీటిని ఎవరంటే వారు చదవకూడదని
వీటిపై బ్రిటిషువారి కాలంలో నిషేధం విధించబడునది. దాన్ని
తొలగించడానికి అనేకులు అనేకరకాలుగా శ్రమించారు.
అది గతం ఇప్పుడో వీటిని సదివే ఆసక్తిఉన్నా అర్థం చేసుకోగల సామర్థ్యం తగ్గి
వీటిని చూడటం తగ్గిందనవచ్చు.
ఏమైతేనేమి సాహితీనందనంలో అడపాదడపా వీటినేకాక అనేకానేక
విషయాలను ముచ్చటించుకుందాం.
అసలు విషయానికొస్తే శశాంకవిజయంలో తార చంద్రునికి తనపై మోహం
కలిగేలా తన గురువు గారైన బృహస్పతి తదితరుల రహస్యకార్యకలాపాపాల చిట్టా
ఈ విధంగా విప్పింది. చూడండి.

కన్నకూఁతు రటంచు నెన్నక భారతీ
        తరణిఁ గూడఁడె నీ పితామహుండు?
మేనత్త యను మేర మీఱి రాధికతోడ
         నెనయఁడే నిన్న నీయనుఁగు బావ?
వదినె యంచు నొకింత వావి లేకయె జ్యేష్ఠు
         నెలతతోఁ బొందఁడె నీ గురుండు?
ముని పత్ని యన కహల్యను బట్టఁడే నీదు
         సహపాఠి యౌ పాకశాసనుండు?
ఇట్టి మీవారి నడతలు కట్టిపెట్టి
యమ్మ నేఁజెల్ల! న్యాయంబు లాడె దౌర!
కడకు నీ రంకు నీ వెఱుంగని వితాన
దూరెదవు నన్నుఁ, జలహారి దోసకారి! (3-81)

Tuesday, June 23, 2020

ఏడువారాల నగలు అంటే? - 2


ఏడువారాల నగలు అంటే? - 2

సాహితీమిత్రులారా!

బుధవారం ధరించే నగలు-
బుధవారాని బుధుడు అధిపతి. ఆరోజు ఉదయం బుధహోర ఉంటుంది. పచ్చలు బుధునికి ప్రియమైన రత్నం. పచ్చలలో, ఆకుపచ్చ, చిలుకపచ్చ అని భేదాలున్నాయి. వీటిలో ఏరంగైనా బుధవారం ధరించవచ్చు. పూర్వం పచ్చల దండలు ప్రసిద్ధి. పచ్చలు చెవులపోగులలోను, ముంజేతి కడియాలలోను పొదుగుతారు. కావున అవి ఉంటే వాటిని బుధవారం ధరించవచ్చు. వీటితోపాటు కంచు కడియాలు, ఉంగరాలు కంచుపూసల దండలు ధరించవచ్చు.

గురువారం ధరించే నగలు -
గురువారానికి బృహస్పతి అధిపతి. గురువారం ఉదయం గురుహోర ఉంటుంది.పుష్యరాగం గురునికి ప్రియమైన రత్నం. వీనిని కంకణాలలో, చెవికమ్మలలో కూడ పొదుగుతారు. కాబట్టి గురువారంనాడు యిత్తడి నగలు, ఉంగరాలు, వన్నె తక్కువలోని బంగారు నగలు ధరించవచ్చు.

శుక్రవారం ధరించే నగలు -
శుక్రవారానికి శుక్రుడు అధిపతి. ఆరోజు ఉదయం శుక్రహోర ఉంటుంది.శుక్రునికి వజ్రం ప్రియమైన రత్నం. వజ్రాలు తాటంకాలలోను, ముక్కుపుడకలలోను పొదుగుతారు. వజ్రం ఇతర ఆభరణాలలో దేనియందు పొదిగినా పొదకకున్నా చేతి ఉంగరాలలో మాత్రం తప్పక పొదుగుతారు. శుక్రవారంనాడు వాటిని ధరించవచ్చు. వాటితోపాటు తగరపు పూసలు, గజ్జెలు, తగరముపూసిన నగలు ధరించవచ్చు.

శనివారం ధరించే నగలు -
శనివారం శనైశ్చరుు అధిపతి. ఆరోజు ఉదయాన్నే శనిహోర ఉంటుంది. శనైశ్చరునికి నీలం ప్రియమైన రత్నం. నీలాలలో రంగును బట్టి నీలం, ఇంద్రనీలం అని రెండురకాలు. ఇంద్రనీలం అంటే బ్లూ, నీలమంటే బ్లాక్. శనివారం రోజున వీటిలో ఏదైనా ధరించవచ్చు.
నీలాలను పోగులు, ముంగరములు మొదలైత వానిలో పొదుగుతారు
ఇవికాక ఆరోజు స్టీలు ఉంగరాలు, గొలుసులు ధరించవచ్చు.
                                                                                                     (మరిన్ని విశేషాలు తరువాత)

Sunday, June 21, 2020

ఏడువారాల నగలు అంటే?


ఏడువారాల నగలు అంటే?

సాహితీమిత్రులారా!

స్త్రీలు ధరించే భూషణాలలో ఒక్కొక్కటి 7 రకాలుగా ఉన్నాయి.
వాటిని ఏడువారాల నగలంటారు. వాటిని వారాన్ని బట్టి ధరిస్తారు.
వీటిని గురించి మాంగల్యశాస్త్రం(స్వర్ణ శిల్పం)లో
కపిలవాయి లింగమూర్తిగారు చాల వివరంగా ఇచ్చారు.

ఆదివారం ధరించే నగలు -
ఆదివారానికి సూర్యుడు అధిపతి. ఆరోజు ఉదయం సూర్యహోర ఉంటుంది. సూర్యునికి ప్రియమైన వర్ణం సింధూరం. మాణిక్యం సూర్యునికి ప్రియమైన రత్నం కాని అది దొరకటం కష్టం. కావున ఎర్రని కత్నాలను పొదిగిన నగలను ధరించవచ్చు. సాధారణంగా తాటంకాలలో, పతకాలలో, ఉంగరాలలో ఎర్రని రాళ్లు పొదిగిన వాటిని ధరించవచ్చు  అలాగే రవ్వలుతాపని శుద్ధమైన బంగారం ఆభరణాలను కూడ ధరించవచ్చు.

సోమవారం ధరించే నగలు -
సోమవారానికి చంద్రుడు అధిపతి. ఆరోజు ఉదయాన్నే చంద్రహోర ఉంటుంది. ముత్యాలు చంద్రునికి ప్రియమైనవి. కావున ముత్యాల దండలు, వెండితీగలతో అల్లిన తావళాలు, శంఖం మరియు ముత్యపు చిప్పలతో చేసిన ఆభరణాలు, వెండి దండికడియాలు, ముంజేతి కడియాలు, ఉంగరాలు ధరించవచ్చు.

మంగళవారం ధరించే నగలు -
మంగళవారానికి కుజుడు(అంగారకుడు) అధిపతి. ఆరోజు ఉదయం కుజహోర ఉంటుంది. అంగారకునికి ముదురు ఎరుపురంగు ప్రియమైనది. పగడాలు అంగారకునికి ప్రియమైనవి. కావున మంగళవారంరోజున పగడాల దండలు ధరించాలి. పగడాలను చేకట్లలో పొదుగుతారు. కావున వాటిని ధరించవచ్చు. రాగితీగలతో అల్లిన తాళాలు, రాగికడియాలు, ఉంగరాలు ధరించవచ్చు.
                                                                                                (మిగిలినవి రేపు తెలుసుకుందాం)

Friday, June 19, 2020

అవివేకి తోడబుట్టువు


అవివేకి తోడబుట్టువు

సాహితీమిత్రులారా!

కన్యనే కాదు కవితాకన్యను కూడా తగిన వానికే దానం చేయాలి
అని నాచనసోమనాథుని చమత్కార పద్యం.
ఇది పొత్తపి వేంకటకమణ కవి తన లక్షణశిరోమణి(2-163)లో
ఉదహరించబడినది.

కవితా కన్యక కెందును
గవి జనకుఁడు, బట్టుదాది గణుతింపంగా
నవరస రసికుడె పెనిమిటి 
యవివేకియె, తోడఁబుట్టువనవేమ నృపా!

ఓ అనవేమనృపాలా!  కవితా బాలకు కవి తండ్రి,
ఎత్తుకొని పదిచోట్ల తిప్పి ప్రకాశితం చేసే భట్టు దాది వంటివాడు.
అనుభవించే సహృదయడు, శృంగారాది నవరసానుభవ యోగ్యుడు భర్త.
అవివేకి తోడబుట్టువు వంటివాడు.
కావున కవితాకన్యను నవరసరసికునికే
ఇవ్వాలని కవి భావన.

Wednesday, June 17, 2020

చమత్కారదీవెన
చమత్కారదీవెన
సాహితీమిత్రులారా!

పద్యాల్లో దీవెనలు చాలా చమత్కారంగా ఉంటాయి.
వాటిలో ఒకటి క్రింది శ్లోకంలో చూడగలం. 
గమనించండి.

విష్ణో రాగమనం నిశమ్య, సహసా కృత్వా ఫణీంద్రం గుణం
కౌపీనం పరిధాయ చర్మకరిణ: శంభు: పురోధావతి:
దృష్ట్వా విష్ణురథం సకంప హృదయ: సర్పో పతత్ భూతలే
కృత్తి ర్వి స్ఖవితా హ్రియా నతముఖో నగ్నో హర: పాతువ:

శివుడు దిగంబరంగా ఉన్నాడు. విష్ణువు వస్తున్నాడని తెలిసింది. పామును మొలతాడుగా, గజచర్మాన్ని కౌపీనంగా పెట్టుకొని వెళ్ళాడు. గరుత్మంతుని చూడగానే పాముకు గుండెలవిసి కిందపడింది. గోచీ వూడిపోయింది. నగ్నుడై తలవంచుకొని వున్న పరమేశ్వరుడు మిమ్ము రక్షించుగాక - అని భావం

ఇందులో శంకరుని దిగంబరత్వం, పామునకు గరుత్మంతునకు గల
సహజవైరం మొదలైనవానితో కవి చమత్కారపూర్వకంగా ఆశీర్వదించాడు

Tuesday, June 16, 2020

లేదు అనగానే అభిమానం శూన్యం అవుతుంది


లేదు అనగానే అభిమానం శూన్యం అవుతుంది


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి.
యాచించటంలోని దైన్యము
ఎంత చక్కగా వర్ణించబడినదో తెలుస్తుంది.

మానిసి కేడు జానల ప్రమాణము దేహము, యాచనార్థమై
పూనిన ఆఱు జానలగు, పోయి ధనాఢ్యుని యిల్లు చేరగా 
జానలు నాలుగౌ, నతని చల్లగ "దేహి" యటన్న రెండగున్,
పైన నతండు "నాస్తి" యనినన్ వినినంతన శూన్యమయ్యె
డిన్!


మనుష్యుని దేహము 7 జానల పొడవుంటుంది.
యాచించుటకు(అడుక్కోవడానికి) సిద్ధపడగానే 6 జానలవుతుంది.
ధనవంతుని యిల్లు చేరగానే 4 జానలవుతుంది.
అతనిని "దేహి" అని అర్థించగానే 2 జానలవుతుంది.
ధనాఢ్యుడు "నాస్తి"  అనంటే అర్థించిన వ్యక్తి(అభిమానవంతుడు) శూన్యమై పోవును.

చూడండి కవి ఎంత సత్యాన్ని పద్యంలో కళ్ళ ఎదుట చిత్రించాడో!

Saturday, June 13, 2020

లోకరీతి


లోకరీతి

సాహితీమిత్రులారా!

ఒక గురువుగారు శిష్యుని పిలుపు మేరకు వారి ఇంటికి వెళ్ళాడు.
అక్కడ శిష్యుని భార్యకు కోపం వచ్చి కుండతో శిష్యుని కొట్టింది.
కుండ పగిలిపోయింది. కుండ మూల్యం ఇవ్వమని గద్దించింది.
అది చూచిన గురువుగారు అనుభవవేత్త
ఈ శ్లోకంలో తన అనుభవం వివరించాడు చూడండి.

అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకే!
అహో!  భాగ్యవతీ నారీ!  భాండమూల్యం నయాచతే!

నాతలపై నా భార్య ఎన్నో వందల కుండలు పగులగొట్టింది
(కోపం వచ్చినపుడు కుండనెత్తి తలపై కొట్టేది).
కాని ఎన్నడూ కుండ వెలను అడుగలేదు
నా భార్యే మహోత్తమురాలు-
అని భావం.

Thursday, June 11, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం

సాహితీమిత్రులారా!

శ్రీనాథకవిసార్వభౌమునికి ఇచ్చిన సమస్య ఇది చూడండి. 
కేవలం సర్వనామాలనే ఇచ్చి పూరించమనడం చాల క్లిష్టమైనది.
ఒకానొక సమయంలో ఒక సభలో శ్రీనాథమహాకవిని పరీక్షించడానికి 
కుత్సితంగ "అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱె" -
అనే సమస్యను ఇచ్చారు.
దానికి శ్రీనాథుని పూరణ-

కొందఱు భైరవాశ్వములు కొందఱు పార్థని తేరి టెక్కెముల్
కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింత లున్
కొందఱు కృష్ణ జన్మమునఁ గూసిన వారలు నీ సదస్సులో
నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱం
దరే

భైరవాశ్వములు - కుక్కలు, పార్థుని తేరి టెక్కెముల్ - కోతులు,
ప్రాక్కిటీశ్వరులు - వరాహాలు, కాలుని యెక్కిరింతలు - దున్నపోతులు,
కృష్ణ జన్మమునఁగూసిన వారలు - గాడిదలు, అంటే సభలోని వారు
కుక్కలు, కోతులు, పందులు, దున్నలు, గాడిదలు అని నిందాహేళనం.

Tuesday, June 9, 2020

మాట అంటే మాటలా?


మాట అంటే మాటలా?

సాహితీమిత్రులారా!

మాట అంటే పదము, వాక్యం, వార్త, సూక్తి, లోకోక్తి, ప్రతిజ్ఞ, కథ, ప్రార్థన ఇలా అనేక అర్థాలున్నాయి.
ఈ పద్యం చూడండి మాటను ఎంత గొప్పగా చూపించాడో.

మాటలచేత దేవతలు మన్ననచేసి వరంబులిచ్చెదర్
మాటలచేత భూపతులు మన్ననచేసి ధనంబు లిచ్చెదర్
మాటలచేత కామినులు మగ్నతచెంది సుఖంబు లిచ్చెదర్
మాటలు నేర్వకున్న అవమానము, న్యూనము, మానభంగ మున్

కాబట్టి మంచి మాటలు నేర్చి, అర్థం చేసికొని, చక్కగా వివరించడం కూడా అభ్యాసం చేయాలి. లేకుంటే అగౌరవం, హీనత్వం, గర్వభంగం మొదలైనవి ఎన్నో గలుగుతాయి. కావున ప్రతి మనిషి సమయానికి తగిన విధంగా మాట్లాడవలెనని కవి హెచ్చరికగా దీన్ని భావించవచ్చు. మాటమీద ఎంత చక్కని పద్యంమో కదా

Sunday, June 7, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం

సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకమారు వేశ్య(కవయిత్రి) వచ్చి
అష్టదిగ్గజకవులకు సవాలుగా ఒక సమస్యను ఇచ్చింది.
"మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్" - అనేది సమస్య.
ఆ సమస్యను మరుసటి రోజుకు చెప్పేవిధంగా సమయమిచ్చింది.
దీనికి సమాధానం ఎలాగా అని ఆలోచించి తెనాలి రామకృష్ణుని ఆశ్రయించినారు.
దానికి అతడు పెద్దనతో 
"రేపు బోగంది వచ్చి సమస్య అడిగినంతలో మా శిష్యుడు 
అని మీరు చెప్పగా నేను మీ శిష్యుడనై చెబుతాను" -  అని అన్నాడు.
కచేరి ప్రారంభమైంది పెద్దన తన శిష్యుడు చెబుతాడని చెప్పాడు.
తెనాలిరామకృష్ణుడు లేచి పద్యాన్ని ఈ విధంగా పూరించాడు.

"కోరిక లుప్పతిల్ల మదిఁగోరిన యట్టి కళా విశేషముల్
 చారు తరంబులన్ రతుల సల్పఁగ నేర్చిన యట్టి జాణ యీ
 వార వధూ శిరోమణి వంతుల వేసుక దెబ్బ తీయుఁడీ
 మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలంద
ఱున్"

దీనితో అష్టదిగ్గజ కవులు ఆనందించగా సభ అంతా
 కరతాళధ్వనులతో వెల్లివిరిసింది. 

Friday, June 5, 2020

ఎవరి భావన వారిది

ఎవరి భావన వారిది

సాహితీమిత్రులారా!

కొడుకుల్ పుట్టరటంతు నేడ్తురవివేకుల్ -
అని ధూర్డటి - కాళహస్తీశ్వర శతకంలో అంటాడు.
కాని పుత్రులు శత్రువులంటున్నాడు
కనుపర్తి అబ్బయామాత్యుడు చూడండి-

కొడుకులు పుట్టరంచునొక కొన్ని దినమ్ములు చింత నంద నుల్
పొడమిన ఆయువున్, బలము, బుద్ధియు, విద్యయు చాల కల్గగా
ఉడుగని చింత- కల్గి తమనోలి భజింపక చింత - తండ్రి కె
ప్పుడు కడు చింత వేయుదురు -పుత్రులు శత్రులు గాక మిత్రులే

మోదం కలిగించే వారు మిత్రులు
ఖేదం కలిగించేవారు శత్రువులు
మరి కొడుకులు పుట్టటం ఆలస్యమైతే ఒకటే వేదన,
మందులూ, మాకులూ, దానాలూ, ధర్మాలూ,
పూజలూ, యజ్ఞాలూ, యాగాలూ ఒకటేమిటి అన్నీ
కొడుకు పుట్టేదాకా. లేకలేక ఒక పుట్టగానే
వాడి ఆయుర్దాయంగూర్చి, ఆరోగ్యాన్ని గూర్చి,
చదువుగూర్చి ఒకటే ఆరాటం చివరికి
ప్రయోజకుడైనాడు అనుకొంటే వృద్ధాప్యంలో
మా మొగం చూడంటంలేదని
తల్లిదండ్రుల వ్యధ పడుతుంటారు
మరి ఇంత వేదనకలిగించే పుత్రుడు
మిత్రుడెలా అవుతాడు శత్రువేకదా -
 అంటున్నాడు కవిగారు.

Wednesday, June 3, 2020

బంగారమంటి కోమటిబంగారమంటి కోమటి


సాహితీమిత్రులారా!

ఏదైనా ఎక్కువైతే అది పిచ్చికిందికే లెక్క.
మరి సంగీతం ధ్యాసతో ఒక వ్యాపారి ఏమిచేశాడో?
ఈ పద్యం పుట్టింది. చూడండి........


లింగాల గురివిసెట్టికి
గంగాధరుడేమి? గతులు కల్పించెనయా
బంగారమంటి కోమటి
సంగీతముచేత బేరసారములుడిగెన్!


గురివిసెట్టి వ్యాపారం చక్కగా చేసుకుంటూ ధనం సంపాదించేవాడు.
గంగాధరుడనే సంగీత విద్వాంసుడు అతనికి సంగీతం నేర్పడం మొదలు పెట్టాడు.
గురివిసెట్టి సంగీతం పాడుకుంటూ తరననాం..... తరననాం.... అంటూ
ఒక మానిక వేయవలసినవానికి రెండు, రెండు వేయవలసినవానికి మూడు
ఇలా వేయడం వల్ల వ్యాపారం పూర్తిగా ఎత్తిపెట్టే దాకా పోయిందట.
అవసరం కాని విషయాలలో తలదూర్చితే ఇంతేకదా!

Monday, June 1, 2020

ముక్తి ఎన్ని రకాలు?


ముక్తి ఎన్ని రకాలు?

సాహితీమిత్రులారా!

మనం భగవంతుని జన్మరాహిత్యంకోసమే పూజించాలని
పెద్దలు చెబుతారు. కాని దాన్ని మనం ముక్తి అనే పదంతో వాడుతుంటాం.

ముక్తి అనేది నాలుగు రకాలని చెబుతారు.
1. సాలోక్య, 2. సామీప్య, 3. సారూప్య, 4. సాయుజ్య ముక్తి.

ఇంతకు ఇవేమిటివి అంటే తెలుసుకుందాం.-

సాలోక్యముక్తి - అంటే భగవంతుడుండే లోకంలో భక్తుడుండడం

సామీప్య ముక్తి-
                            భగవంతుని ఆంతరంగికులలో చేరి భగవంతుని సమీపంలో ఉండడం

సారూప్య ముక్తి - ఇది ఒకవిధంగా భగవంతుని ఆకారంలో ఉండడం

సాయుజ్య ముక్తి - భగవంతుని రూపంతో బాటు భగవందానందం పొందుతూ 
                                                భగవంతునిలో లీనమవడం.
ముక్తిలో కూడా ఇన్ని విధాలున్నాయి.
మనకే విధమైన ముక్తి కావాలో మనం ఆవిధమైన పద్ధతిని
అవలంబించి  ఆయనలో చేరాలిమరి.