Thursday, September 30, 2021

ఆంధ్రప్రస్థానం నాటిక

 ఆంధ్రప్రస్థానం నాటిక




సాహితీమిత్రులారా!

ఆంధ్రప్రస్థానం నాటిక

కథ, దర్శకత్వం - సి.యన్.మూర్తి

వీక్షించండి-



Tuesday, September 28, 2021

ఎవరు ఎవరిని రక్షింపగలరు?

ఎవరు ఎవరిని రక్షింపగలరు?




సాహితీమిత్రులారా!



మహాభారతంలో ఒకచోట చెప్పబడిన శ్లోకం గమనించండి-


రామస్య వ్రజనం బలే ర్నియమనం పాండో సుతానాం వనం

వృష్ణీనాం విధనం నలస్యనృపతే రాజ్యాత్పరిభ్రంశనమ్

నాట్యాచార్యక మర్జునస్య పతనం సంచిత్యలంకేశ్వరే

సర్వం కాలవశాజ్జనో2త్ర సహతే కః కం పరిత్రాయతే?


రాముడంతవానికి ప్రవాసము సంభవించెను.

బలిచక్రవర్తి పాతాళమం దణచబడెను.

యాదవులకో సంఘమరణం సంభవించెను.

నలమహారాజు రాజ్యభ్రష్టుడాయెను.

అర్జునుని వంటి వీరుడు నాట్యాచార్య వృత్తిని అవలంబించెను.

రావణుని వంటివాడు పడిపోయెను.

అందరు కాలమునకు వశులు కావలసిందే.

ఎవరు ఎవరిని రక్షించగలరు?

 

Sunday, September 26, 2021

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు

 నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు




సాహితీమిత్రులారా!



దేవులపల్లి కష్ణశాస్త్రిగారి కృష్ణపక్షంలోని

స్వేచ్ఛాగానం - 2 ను ఆస్వాదించండి-


నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు

నా యిచ్చయే గాక నాకేటి వెరపు

కలవిహంగమ పక్షముల దేలియాడి

తారకామణులలో తారనై మెరసి

మాయమయ్యెదను నా మధురగానమున

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


మొయిలు దేనెలలోన పయనంబొనర్చి

మిన్నెల్ల విహరించి మెరుపునై మెరసి

పాడుచూ చిన్కునై పడిపోది నిలకు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ

జతగూడి దోబూచి సరసాల నాడి

దిగిరాను దిగిరాను భువినుండి దివికి

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


శీకరంబులతోడ చిరుమీలతోడ

నవమౌక్తికములతో నాట్యమ్ములాడి

జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


పరుగెత్తి పరుగెత్తి పవనునితోడ

తరుశాఖ దూరి పత్రములను జేరి

ప్రణయరహస్యాలు పలుకుచు నుందు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


అలరుపడంతి జక్కిగింత వెట్టి

విరిచేడి పులకింప సరసను బాడి

మరియొక్క ననతోడ మంతనంబాడి

వేరొక్క సుమకాంత వ్రీడ బోగొట్టి

క్రొందేనె సోనలగ్రోలి సోలుటకు

పూవు పూవునకు బోవుచునుందు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?


పక్షి నయ్యెద చిన్న ఋక్ష మయ్యెదను

మధప మయ్యెద చందమామ నయ్యెదను

మేఘ మయ్యెద వింత మెరుపు నయ్యెదను

అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను

పాట నయ్యెద కొండవాగు నయ్యెదను

పవన మయ్యెద వార్ధిభంగ మయ్యెదను


ఏలొకో  యెప్పుడో యెటులనో గాని

మాయ మయ్యెదను  నేను మారిపోయెదను

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

నా యిచ్చయే గాక నాకేటి వెరపు?

Friday, September 24, 2021

వాన వెలిసింది(నాటకం)

వాన వెలిసింది(నాటకం)




సాహితీమిత్రులారా!

" వాన వెలిసింది" - నాటకం

రచన - ఎన్.ఆర్.నంది

నిర్వహణ - వై.సరోజా నిర్మల

నాటకంలో పాల్గొన్నవారు

చాట్ల శ్రీరాములు, పి.వి.రావు

కె.వి.ప్రదీప్ కుమార్, ఎస్.ఆర్.కృష్ణ

ప్రసారం - ఆకాశవాణి హైదరాబాదు

ఆస్వాదించండి-




Wednesday, September 22, 2021

బావగారొచ్చారు (హాస్య రేడియో నాటకం)

 బావగారొచ్చారు (హాస్య రేడియో నాటకం)




సాహితీమిత్రులారా!

బావగారొచ్చారు (హాస్య రేడియో నాటకం)

రచన : శ్రీ నండూరి సుబ్బారావు

ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

ఆస్వాదించండి-




Monday, September 20, 2021

షట్చక్రవర్తి చరిత్రలోని నవవధువు

 షట్చక్రవర్తి చరిత్రలోని నవవధువు




సాహితీమిత్రులారా!




కామినేని మల్లారెడ్డిగారి షట్చక్రవర్తి చరిత్రములో

నవవధువును ఈ క్రిందిపద్యంలో వర్ణించారు 

ఎంత అద్భుతంగా ఉందో గమనించగలరు-


మగని వీక్షించి దేహళీమధ్యసీమఁ

ద్రపయు నెనుకకుఁ బ్రేమ ముందఱికిఁ దిగువ

భామ గనుపట్టె నాలీఢపాదయగుచు

మరునితోఁబోర నిలుచున్న మహిమ మెఱయ

                                                                 (షట్చక్రవర్తి చరిత్రము - 5 - 114)


ఈ పద్యంలో మొదటిగా పడకింటికి వెళుతున్న ఒక నవవధువును వర్ణించాడు కవి కామినేని మల్లారెడ్డిగారు.

పడకింటి గడపవరకూ వెళ్ళి లోపల భర్తను చూచి దేహాళీ మధ్యసీమ(గడపమధ్య)లో

ఆగిపోయింది. త్రప(సిగ్గు) వెనుకకు లాగుతోంది. భర్తమీద ప్రేమ ముందరికి లాగుతోంది.

 ఆలీఢపాదయై(ఒకపాదం గడపకు లోపల ఒకపాదం గడపకు వెలుపల ఉంచి) నిలబడింది. 

ఆ స్థితిలో మరుని(మన్మథుని)తో పోరన్(యుద్ధంచెయ్యడానికి)

నిలబడ్డ తీరుగా ఆ యువతి కనబడింది- అని కవి వర్ణించాడు

Saturday, September 18, 2021

BBC RADIO DRAMA Mrs. M

 BBC RADIO DRAMA Mrs. M





సాహితీమిత్రులారా!
బిబిసి రేడియో డ్రామా 
Mrs. M  ఇది డేవిడ్ క్రామ్ టన్ గారి రచన
వీక్షించగలరు.
ఇది ఆంగ్లంలో ఉంటుంది ఆస్వాదించండి-



Thursday, September 16, 2021

పానుగంటివారి కంఠాభరణం

 పానుగంటివారి కంఠాభరణం




సాహితీమిత్రులారా!


పానుగంటివారి హాస్య నాటిక

కంఠాభరణం రేడియోలో

ప్రసారం చేయబడింది.

అది ఇక్కడ ఆస్వాదించండి-




Tuesday, September 14, 2021

రేడియోహాస్యకథ

 రేడియోహాస్యకథ




సాహితీమిత్రులారా!


రచన - పొత్తూరి విజయలక్ష్మి

ప్రసారం ఆలిండియా రేడియో

ఆస్వాదించండి-




Sunday, September 12, 2021

సూరనగారి జైత్రయాత్ర

 సూరనగారి జైత్రయాత్ర




సాహితీమిత్రులారా!



పింగళి సూరనగారి రాఘవపాండవీయంలోని ఈ పద్యం

అజమహారాజు(మరో అర్థంలో పాండురాజు) జైత్రయాత్రకు 

వెళుతున్న సందర్భంలో కూర్చిన పద్యం 

గమనించండి ఎంతటిదో-


తలపం జొప్పడి యొప్పెనప్పుడు తదుద్యజ్జైత్ర యాత్రా సము

త్కలికారింఖ దసంఖ్యసంఖ్య జయవత్కుంభాణరింఖా విశృం

ఖల సంఘాత ధరాపరాగ పటలాక్రాంతంబు మిన్నేఱన

ర్గళ భేరీరవ నిర్దళద్గగన రేఖాలేప శంకాకృతిన్

                                                                                                      (రాఘవపాండవీయం - 1-09)

మహారాజు జైత్రయాత్రకు వెళ్లగా 

అతని వెంట గుఱ్ఱపు దండు భేరీదళం ఉన్నది. 

అతని గుఱ్ఱపు దండు విశృంఖలంగా పరుగెత్తుతూ ఉంటే

వాని గిట్టలతో లేచిన దుమ్ముతెరంతా ఆకాశగంగలో పడి 

అదంతా పలుచని బురదగా మారిపోతోంది. 

రాజుగారి వెంట ఉండే భేరీల మ్రోతలకు దద్ధరిల్లి 

ఆకాశం బీటలు వారుతుండగా 

ఆ ఆకాశ గంగ యొక్క పంకం(బురద) అంతా నెఱ్ఱెలు వారిన 

ఆకాశాన్ని పూయటానికి కలిపిన అలుకువలె ఉన్నది - అని భావం

ఎంతటి ఊహోకదా!

Friday, September 10, 2021

ఎఱ్ఱనగారి మధుపానం

 ఎఱ్ఱనగారి మధుపానం




సాహితీమిత్రులారా!



ఎఱ్ఱనగారు తన నృసింహపురాణంలో తృతీయాశ్వాసంలో హిరణ్యకశిపుడు

వనవిహారం వెళ్ళినపుడు అక్కడ చీకటిపడగా అక్కడే గుడారాలు వేసుకొని

ఉన్నాడు అప్పుడు చంద్రోదయం తర్వాత మధుపానం చేయడం మొదలు పెట్టారు 

ఆ సందర్భంలో మధుపాత్రలో చంద్రుడు ఎలా కనిపించాడో కొన్ని పద్యాల్లో వర్ణించారు

ఎఱ్ఱనగారు. వాటిలోని ఒక పద్యం ఇక్కడ- 


సురుచిర పానపాత్రమున సుందరి యొక్కతె కేల నిండుచం

దురుఁడు ప్రకంపితాంగకముతోఁదికించెఁ దదాననాంబుజ

స్ఫురిత వికాస వైభవము సొంపు లడంకువ మ్రుచ్చలింపఁ జె

చ్చెరఁ జనుదెంచి పట్టువడి చేడ్పడి భీతి వడంకు చాడ్పునన్

                                                                                                 (నృసింహపురాణము - 3- 97)

ఒక సుందరి(అందాలరాశి) చేతిలో 

అందమైన పానపాత్ర 

అందులో నిండు చందురుడు ప్రకంపిత (కదలాడే) 

అంగకముతో(రూపంతో) ఎలా కనిపించాడంటే 

ఆమె ముఖపద్మం తాలూకు విస్ఫురిత వికాస వైభవాల సొంపుల్ని 

అణకువతో దొంగిలిండానికి వేగంగా వచ్చి పానపాత్రలో పట్టుబడి 

నిశ్చేష్టుడై భయంతో వణికిపోతిన్నట్టు కనిపించాడు

(ఆమె కంటికి అలా అనిపించాడు 

లేదా ఆమె అలా తిలకించింది.) - అని భావం.

Wednesday, September 8, 2021

కంకంటివారి జలక్రీడ

కంకంటివారి జలక్రీడ




సాహితీమిత్రులారా!



కంకంటి పాపరాజు గారు తన 

ఉత్తర రామాయణంలో ఆరవ ఆశ్వాసంలో

సీతారాముల జలక్రీడావర్ణన లోని 

ఒక పద్యం గమనించండి-


మొగములు గానరా నిగిడి కామిను లీఁదఁ

                 గొల నెల్లఁ జంద్రమండలము లయ్యెఁ

గుచములు గానరాఁ గొమ్మ లీఁద సరోవ

                 రం బెల్లఁ గమలకోరకము లయ్యె

గ్రొమ్ముడుల్ గానరాఁ గొమిరె లీఁదఁగఁదటా

                  కంబెల్ల గాఢాంధకార మయ్యెఁ

బిఱుఁదులు గానరా బిసరుహానన లీఁద

                  దీర్ఘికాంతర మెల్ల దీవు లయ్యె

బాహువుల్గానరాఁ బద్మపాణు లీఁద

నరసి యెల్ల మృణాళైకసదన మయ్యె

నంగములు గానరాఁ గాంచనాంగు లీఁద

సారసాకర మెల్ల బంగార మయ్యె

                                            (ఉత్తరరామాయణము - 6-82)

ఈ పద్యంలో యువతులు సరస్సులో దిగి ఒక్కోసారి ఒక్కొక్క అవయవం కనబడే విధంగా ఒక్కొక్క విధమైన ఈత ఈదుతుంటే ఆ సరస్సు ఎలావుందో  కంకంటివారు వర్ణిస్తున్నాడు

మొగములు గానరా నిగిడి కామిను లీఁదఁ

                 గొల నెల్లఁ జంద్రమండలము లయ్యెఁ

కామినులు(స్త్రీలు) ముఖాలు కనపడే విధంగా వెల్లకిలా నిలువుగా నిగిడి(సాగి) ఈదుతుంటే కొలనంతా చంద్రబింబాలతో నిండినట్లయింది ప్రతిముఖం చంద్రునిలా ఉండడంచేత

గుచములు గానరాఁ గొమ్మ లీఁద సరోవ

                 రం బెల్లఁ గమలకోరకము లయ్యె

కుచాలు కనబడేవిధంగా ఆ కొమ్మలు(యువతులు) ఈదుతుంటే సరస్సంతా కమలకోరకమ్ముల(తామర మొగ్గల)తో నిండినట్లుంది. వారి కుచాలు తామరమొగ్గల్లా ఉండటంతో

గ్రొమ్ముడుల్ గానరాఁ గొమిరె లీఁదఁగఁదటా

                  కంబెల్ల గాఢాంధకార మయ్యెఁ

కొమెరలు(యువతులు) బోర్లా పడుకొని కేశపాశాలు నీటిమీద పరుచుకొని కనబడే విధంగా ఈదుతుంటే సరస్సంతా దట్టమైన చీకటితో నిండినట్టయినది. అంతమంది స్త్రీల ముడుల నల్లదనమంతా సరస్సంతా వ్యాపించడంతో

బిఱుఁదులు గానరా బిసరుహానన లీఁద

                  దీర్ఘికాంతర మెల్ల దీవు లయ్యె

బిసరుహాననలు(తామరపూలవంటి ముఖాలున్న స్త్రీలు) పిఱుదులు కనబడేవిధంగా ఈదుతుంటే సరస్సుమధ్యంతా దీవులతో నిండినట్లయింది. పిఱుదులు దీవుల్లా వుండంతో

బాహువుల్గానరాఁ బద్మపాణు లీఁద

నరసి యెల్ల మృణాళైకసదన మయ్యె

తామరపూలవంటి చేతులున్న యువతులు చేతులు కన్పడేవిధంగా ఈదుతుంటే సరస్సంతా తామరతూడులతో నిండినట్లయింది. వారిచేతులు తామర తూడుల్లా ఉండటంచేత

నంగములు గానరాఁ గాంచనాంగు లీఁద

సారసాకర మెల్ల బంగార మయ్యె

కాంచనాంగులు(బంగారువంటి శరీరంగల యువతులు) శరీరాలు కన్పడేవిధంగా సరస్సంతా బంగారమైంది. 

Monday, September 6, 2021

కన్నుల వర్ణన

 కన్నుల వర్ణన




సాహితీమిత్రులారా!



ముకుందవిలాసంలోని ఈ పద్యం గమనించండి-
ఇది భద్రాదేవి కన్నులను గురించి చెప్పే పద్యం.

ఒకయేటఁ జిక్కె మీనము
నొకనెలకేఁ చిక్కెఁ పద్మమొక పగటింటన్
వికలతఁ జిక్కెంగుముదము
టకి నయనసమంబులగునె జడగతులెపుడున్
              (ముకుందవిలాసము - 1-219)
భద్రాదేవి నేత్రసామ్యాన్ని పొందటానికి
చేప, తామర, కలువ ప్రయత్నించాయట.
దానిలో చేప ఒక ఏట (సంవత్సర కాలంలో)
కృశించిపోయిందట.
తామర ఒక నెలలోనే చిక్కిపోయిందట.
కలువ ఒకరోజులోనే చిక్కిపోయిందట.
కావున అవి భద్రాదేవి నయన సామ్యం
పొందలేక పోయాయని తెలుస్తున్నది.

కానీ దీనిలోని అసలు అర్థం అదికాదట -
మరి ఎలా అంటే -

చేప ఏటిలో(నదిలో) చిక్కిపోయిందట
తామర ఒక నెలకే చిక్కె (వెన్నెలలో) చిక్కిందట
(అంటే వెన్నెలలో తామర ముడుచుకు పోతుంది)
కలువ ఒక పగటింట(పగలులో) చిక్కెనట
(అంటే పగలు సూర్యుని వెలుతురులో
కలువ ముడుచుకుపోతుంది) ఈ విధంగా అవి
భద్రాదేవి నయనాల సామ్యం కాలేక పోయినవట.
చిన్న పదాల విరుపుకూడాకాదు పునరుక్తిచే
చమత్కరించారు ఈ కవి కాణాదం పెద్దనామాత్యుడు

Saturday, September 4, 2021

కుమారసంభవంలోని సరోవర వర్ణన

కుమారసంభవంలోని సరోవర వర్ణన




సాహితీమిత్రులారా! 


ఒక సరస్సును నన్నెచోడు కుమారసంభవములో
స్త్రీవలె వర్ణించిన తీరు
ఈపద్యంలో ఎంత రమ్యంగా వర్ణించాడో
పరికించండి.

లోలాంబుజాలముల్ నీలాలకములుగా
           బాలమృణాలముల్ కేలు గాఁగ
దళితాంబుజాతంబు దెలిమోముగా నుత్ప
           లములు విశాలనేత్రములు గాఁగ
జక్కవకవ నిండుచనుఁగవగాఁ బులి
          నస్థల మురుజఘనంబు గాఁగ
మొలచు లేఁదరఁగలు ముత్తరంగలు గాఁగ
           శోభిల్లుసుడి నిమ్ననాభి గాఁగ
నబ్జవనలక్ష్మి శంభువీర్యమునఁ గొడుకుఁ
బడసి దివిజుల కీఁబూని పావకునకు
నొలసి తనరూపుచూపున ట్లొప్పు దోఁచె
శ్రీకరంబగు నా కమలాకరంబు

                                                    (10-29)


ఈ పద్యం శివుని వీర్యాన్ని శరవణమను సరస్సులో,
బ్రహ్మ ఆదేశానుసారం అగ్నిదేవుడు వదలడానికి
వెళ్ళే సమయంలో సరస్సును వర్ణించినది.

భావం-
శోభాకరమైన ఆ పద్మాకరము
చంచలములగు నీరుల సమూహములు నల్లని కురులుగను,
లేత తామరతూడులు చేతులుగను,
వికసించిన పద్మము నిర్మలమైన ముఖముగను,
కలువలు విశాలమైన నయనాలుగాను,
చక్రవాకద్వయము నిండు స్తనద్వయముగను,
ఇసుకతిన్నె గొప్ప కటిస్థలముగను,
అప్పుడే పుడుతున్న లేత అలలు పొట్టమీది ముడుతలు(త్రివళులు)గా,
 ప్రకాశించే సుడి లోతైన నాబిగా
తామరతోపు అనెడి లక్ష్మి
శివుని వీర్యంచే కొడుకును పొంది
దేవతలకు ఇచ్చేందుకు పూని
అగ్నికి సమీపించి తనరూపును
చూపుచున్నదా!
అన్నట్లు ఒప్పినది.

Thursday, September 2, 2021

ఏది సత్యం (నాటిక)

 ఏది సత్యం (నాటిక)




సాహితీమిత్రులారా!

ఏది సత్యం రేడియో నాటిక

రచన - శ్రీమతి పావని నిర్మల ప్రభావతి

దర్శకులు - శ్రీ ఐనాల రామ మోహన రావు

ప్రసారం - ఆకాశవాణి విజయవాడ కేంద్రం

ఆస్వాదించండి-