Wednesday, October 5, 2016

నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి


నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి


సాహితీమిత్రులారా!




అలంకారం కోటంరాజుగారు
సమాజంలోని మనుషులు
ఎదుటివాని ప్రేమించలేక పోవడానికి
అన్నికారణాలకు మూలమైనది స్వార్థమేనని
"నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి" - అనే
మకుటంతో వ్రాసిన ఖండిక ఇది.

ఎల ప్రేమింతలేను యెదుటివాని
నేల శ్రమియించలేను స్నేహితుల కొఱకు
ఏల నెనరూనలేను దీనాళిపైన
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

చెట్ట పనులకు నేను నాచేయి కలిపి
గుట్టు పనులకు నేను నాగుండె నిడుదు
వెట్టి చేయించు కొనుటన్న వేడ్క నాకు
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

చేతు దానమ్ము కీర్తి కండూతి వలన
కోతు గొంతులు పదవిని గోరి నేను
నీతుల వచింతు, నాయవి నీతిమాయ
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

మమత లెడబాపినాను యీ మానవులకు
తమము పర్వంగ జేసితి ధాత్రిలోన
శమము వీడితి, వలచి హింసాప్రవృత్తి
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

మాటలెన్నైన జెప్పుదు లోటులేదు
పాటి యిదియంచు జెప్పుదు దీటులేక
రాటు దేలితి ప్రజలను రట్టుజేయ
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

కోరికట్నంబు పెండ్లాడి  గోరినాను
చేరి పైమెట్టు పెద్దల దూరినాను 
పేరు గొన ఛద్మ వేషంబు వేసినాను
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

సేవలందుట యన్న నిశ్చింతనాకు 
సేవలందింప వలెనన్న చింతనాకు
సేవ చేయంగ వలెనంచు చెప్పుచుందు
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

నేను నీవను భేదంబు లేదు నేడు
నేను నీవను భేదంబు నేను జూతు
కాన భేదాలు యెన్నైన కలుగజేతు
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

వల్లె వేయుదు నీతుల కొల్లగాను
చల్లగా చిల్కి విషమును సాగిపోదు
మెల్లగా గోతులను దీయు మేటినౌదు
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

పనులు నావైన చాలును పరుగుదీతు
పనులు మీవైన చాలును పండుకొందు
పనులు పైసాలు జూపింప పరవశింతు
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

పీడితులటన్న చూపింతు ప్రేమ నెంతొ
తాడితులటన్న దయజూతు తలపునిలిపి
నాడి గమనించి బేరంబు లాడుచుందు
నాదు స్వార్థమ్మె మూలమ్మనాదినుండి

No comments:

Post a Comment