Thursday, October 31, 2019

న్యూ తెలుగు మదర్‌


న్యూ తెలుగు మదర్‌

సాహితీమిత్రులారా!

ఆ రోజు దిన పత్రికల్లో  వచ్చిన ఒక వార్త రాష్ట్రమంతటా చెప్పలేని సంచలనం సృష్టించింది .  నక్సలైట్ల మందు పాతరలా పేలింది. ప్రజలు ఆ వార్త గురించి గుంపులు గుంపులుగా ఏర్పడి చర్చించుకోవడం ప్రారంభించారు . కొందరు యిది మన ప్రాచీన సంస్కృతిపై దాడి …. అలాజరగడానికి వీల్లేదన్నారు . ఉడుకురక్తం ఉప్పొంగే కుర్రవాళ్ళు కొందరు ప్రపంచం మారుతున్నది ఇంకా యింకా ముందుకు దూసుకు పోతున్నది , మార్పు సహజం . పాతచింతకాయ పచ్చడి లాంటి ఆలోచనల్ని తుంగలో త్రొక్కి ముందుకురుకుతున్న కాలాని కనుగుణంగా మారాల్సిందే , మార్చాల్సిందే . ప్రాచీన సంస్కృతి గాడిద గుడ్డు అంటూ వేలాడాల్సిన పని లేదు . ఇవ్వాళ మనం మంచి అనుకున్నది ప్రారంభిస్తే కొన్నాళ్ళకు అదే క్రొత్త సంస్కృతిగా పరిణమించవచ్చు , కాబట్టి ఈ ఆలోచన వెరైటీగానే కాకుండా నావెల్టీగా కూడా ఉన్నది . తప్పకుండా ప్రయత్నించాల్సిందే అంటూ సపోర్టు చేశారు . పెద్దవాళ్ళు “పిదపకాలం పిచ్చిబుద్ధులు ….. పనికిమాలిన ఆలోచనలు …. ప్రజలు రకరకాల యిబ్బందుల్తో చస్తుంటే ….. ఇప్పుడీపని యింత అవసరమా …. అఘోరించండి .” అని గొణుక్కున్నారు , పెద్దగా అంటే కుర్రాళ్ళకి కోపాలొస్తాయేమోనని భయపడుతూ.

మొత్తానికి ఆశించిన కలకలం , కలవరం కలిగించడంలో కృతకృత్యమయ్యిందా వార్త.

“గుడ్‌ అయిడియా … గో ఎ హెడ్‌ ” అంటూ ప్రోత్సహిస్తూ వచ్చిన లెటర్లను , ఈ మెయిల్లను చూసి వుక్కిరి బిక్కిరి అవుతున్నారు ముఖ్యమంత్రి గారు . ఈ సంచలనానికి కేంద్ర బిందువయిన  ‘  తెలుగు తల్లి ‘  విగ్రహం మాత్రం , మాటా పలుకూ లేకుండా , ఒక చేత్తో కలశంతో , మరోచేత్తో బిడ్డల్ని దీవిస్తూ టాంక్బండ్‌ పైన నిశ్చలంగా , నిర్వికారంగా , నిశ్చేష్టగా నిలుచుంది , హుస్సేన్‌ సాగర్‌ లోని బుద్ధుణ్ణి చూస్తూ .

సంగతేమిటో మీకు యింకా అర్ధం కాలేదుగదూ ! ట్రాన్స్‌ పరెన్సీని నిత్యం జపించే యీ రోజుల్లో విషయాన్ని మీ నుండి దాయడం భావ్యంకాదు గనుక …. సస్పెన్సుకు తెరదింపేస్తాను . ప్రజల్లోకి చొచ్చుకుపోయి యింత సంచలనం కలిగించిన యీ వార్తను అన్ని పత్రికలూ వాటికి తోచిన అలంకారాల్తో అభివర్ణించాయి . వాటన్నిటి సారాంశమేమిటంటే ….

“రాబోయే ఆంధ్రరాష్ట్రావతరణోత్సవాల్ని , వినూత్నంగా , ప్రపంచమంతా ఆశ్చర్య పోయేలా నిర్వహించాలని ముఖ్యమంత్రిగారి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు . ఈ సందర్భంగా వారిక్కలిగిన మరొక అద్భుతమైన యోచన ఏమంటే కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ , మన తెలుగు తల్లి విగ్రహం మాత్రం మార్పు లేకుండా వుంది , ఎవరో ఏ నాడో డిజైన్‌ చేసి తయారు చేసిన ఆ విగ్రహాన్ని ప్రస్తుత హైటెక్‌ భావనలకు సరిపడేలా సరిక్రొత్త రూపంలో సంతరించాలని . దీనికి ప్రజలనుండి సూచనలు , సలహాలు ఆహ్వానిస్తున్నారు . అలాగే కొత్త తెలుగు తల్లి ఎలా ఉండాలో డిజైన్‌ చేసి పంపితే , పరిశీలించి , బాగున్న డిజైన్‌ ను యెన్నుకుని , ఆరూపంలో విగ్రహం తయారు చేయిస్తామనీ, ఆ డిజైనర్‌ ను సముచిత రీతిలో సత్కరిస్తామనీ తెలియజేస్తున్నారు.

********************************

నాలుగొందలేండ్ల పైచిలుకు ఘన చరిత్ర కలిగిన భాగ్యనగరంలోని మంత్రాలయం అది . మంత్రాలయం అంటే అదేదో పుణ్యస్థలమనుకునేరు , కాదు , మంత్రులుండే చోటు అని నా వుద్దేశ్యం . అది దుష్టసంధి , దుస్సమాసం అంటారా ? ఏమైనా అనుకోండి మీయిష్టం . మీకామాత్రం స్వతంత్రం వుంది . ఇంగ్లీషుతెలుగు , హిందీతెలుగు , తెలుగుసంస్కృతం పదాలతో రకరకాల క్రొత్త పదాలు పుట్టగా లేంది , నేను కేవలం సంస్కృతపదాలతోనే ఒక కొత్త పదం సృస్టిస్తే తప్పొచ్చిందా ? అలాంటి మంత్రాలయం లో , సి యం  గారి నేతృత్వంలో సమావేశం జరుగుతున్నది . యమ్మెల్యేలు , మంత్రులు , అధికారులు , కొందరు అనధికార ప్రముఖులు ఆహ్వానించబడ్డారు .

మొదటగా ఈ మధ్యనే ఐదు దేశాల యాత్రకు వెళ్ళి యెన్నో క్రొత్త విషయాలను తెలుసుకుని వచ్చిన శాసన సభ్యులను అభినందిస్తూ , వారి అనుభవం రాష్ట్రాభి వృద్ధికి నూతన ద్వారాలను తెరవాలని ఆకాంక్షించారు సి యం గారు . తరువాత అసలు విషయానికొచ్చారు . ” మంత్రులారా ! మన ఆంధ్రదేశం అనేక విధాలుగా అభివృద్ధిని సాధిస్తూ యితర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న విషయం మీ అందరికీ తెలుసు . ఐ టి రంగంలో విప్లవాత్మకమైన మార్పు సాధించి , ఉన్నత స్థాయిలో నిలిచిన సంగతి మీకు చెప్పాల్సిన పనిలేదు . నాకు వచ్చిన ఒక వినూత్న ఆలోచనను ప్రజలలో చర్చకు పెట్టిన విషయం , ప్రజలందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన విషయమూ మీకు తెలుసు . ప్రజామోదంతో మీ అందరి సహకారంతో తెలుగు తల్లి విగ్రహాన్ని , నేటి మార్పుల కనుగుణంగా డిజైన్‌ చేయించదలిచాను . అనేక మంది డిజైనర్లు ఉత్సాహంగా , తమ మేధకు పదనుపెట్టి , డిజైన్లు పంపించారు . వీటిని ఒక్కొక్కటిగా మనముందున్న తెరపై ప్రదర్శిస్తారు , బాగా ఉన్నదనుకున్న వాటిని మీరు నిర్ణయిస్తే , ఉత్తమమైన దానిని అనుసరించి క్రొత్త తెలుగు తల్లి విగ్రహాన్ని తయారు చేయిస్తాము . ఈ విగ్రహాన్ని ప్రతి నియోజక వర్గ కేంద్రంలోను నెలకొల్పాలని  , ఆప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచి పెద్ద పార్కులుగూడా నెలకొల్పాలని ప్రభుత్వపరంగా నిర్ణయించాము . మీ అభిప్రాయాలనుగూడా చెప్పాలని కోరుతున్నాను . ”

ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి కాగానే ప్రతిపక్ష సభ్యులొకరు లేచి ” యిది మన ప్రాచీన సంస్కృతీ సంపదపై ప్రభుత్వ పరంగా జరగబోతున్న దాడి , దీనిని మేము సాగనివ్వం ” అన్నారు .

ఇంతలో సి యం గారు అందుకుని, ” మిత్రులకు మరొక విషయం చెప్పడం మరిచాను , ఈ ప్రాజెక్టు బాధ్యతను , డబ్బు ఖర్చు చేసే అధికారాన్ని శాసన సభ్యులకు అప్పగిస్తాం , ఎవరి నియోజక వర్గంలో వారు శ్రమించి ఈ కలల ప్రాజెక్టు కు ఆకారం కల్పించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ” అని చెప్పారు ; ఇంక ఎవరికీ అభ్యంతరంచెప్పే అవసరమే కనిపించలేదు.

మిత్రపక్ష సభ్యులొకరు ” మీ ఆలోచన బాగానే వుందిగాని ఈ ప్రాజెక్టు కు యెంతో ఖర్చవుతుంది కదా, అంత డబ్బెలా వస్తుందో ఆలోచించారా ? ఇప్పటికే రాష్ట్రం అప్పుల వూబిలో కూరుకుపోయివుంది ” అన్నారు.

సి యం గారు ఆర్ధికమంత్రి గారి కోసం చూశారు . ఆయనలేరు.  హోం మంత్రి గారి సీటుకూడా ఖాళీగా వున్నది . సెక్రటరీని పిలిచి అడిగారు ” ఇద్దరు మినిస్టర్లు రాలేదేమిటి ?  ఫోను చేశారా ? ” అని “ఫోను చేశారు సార్‌ ! సార్‌ అడిగితే ఈ ప్రాజెక్టు కు అవసరమైన నిధులను యెక్కడినుండి మళ్ళించాలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారుల సమావేశంలో చర్చించి , ప్రతిపాదనలతో వస్తామని చెప్పమన్నారు ఫైనాన్స్‌ మినిష్టర్‌ గారు . అలాగే ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే , ప్రజాందోళనను ఏ విధంగా ఎదుర్కోవాలో అధికారులతో చర్చించి , నిర్దిష్టమైన ప్రపోజల్స్‌ తో వస్తామని హోం మినిస్టర్‌ గారు చెప్పారు . వారిద్దరూ కొద్ది సేపట్లో రావచ్చు సార్‌ ” అని చెప్పాడు సెక్రటరీ .

“వారి సమావేశాల్ని ఆపివేసి వెంటనే రమ్మని ఫోన్‌ చేయండి ” అని చెప్పి ‘ డియర్‌ ఫ్రెండ్స్‌ ‘  మాయీ సరికొత్త ఆలోచనను ప్రపంచ బ్యాంకు వారికి తెలియజేసి , ఈ ప్రాజెక్టుకు ఋణ సహాయాన్ని అర్ధించాం , నిన్న రాత్రి వరల్డ్‌  బ్యాంక్‌ ప్రెసిడెంటు గారితో మాట్లాడాను , మన ప్రతిపాదన అద్భుతంగా వుందని అభినందించి , 400 కోట్ల రూపాయలు యివ్వడానికి ఒప్పుకున్నారు . అలాగే భారతమాతకు కూడా క్రొత్త రూపు సంతరించవలసినదిగా పి యం గారికి సలహా కూడ యిస్తామన్నారు . దీనిని బట్టి తెలుస్తున్నదేమిటంటే , మన ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించనుందని . ఈ ఆర్ధిక సహాయం కన్ఫరం అయిన సంగతి ఈ సమావేశంలోనే వెల్లడించాలని , ఆర్ధిక మంత్రి గారికిగూడ చెప్పలేదు” అంటూ సి యం గారు ” మాటల్లోనే వచ్చారు ఫైనాన్సు మినిస్టరు గారు , హోంమంత్రి గారు .  మంత్రిగారూ ! డబ్బు గురించి మీరు కసరత్తులు చేయాల్సిన పనిలేదు . మన అన్ని ప్రాజెక్టులకు అప్పిచ్చిన వాళ్ళే , ఈ ప్రాజెక్టుకు గూడా అప్పిస్తున్నారు . నారుపోసినవాడే నీరుకూడా పోయాలిగదా ! పోస్తాడు . కాబట్టి మీకేం బెంగవద్దు . హోం మంత్రి గారూ ! చాందసులు కొందరు అరచి గోల చేసినంత మాత్రాన మన ప్రాజెక్టు ఆగదు . ప్రజామోదంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరు . అవసరమైతే పారామిలటరీదళాల్ని వినియోగిస్తాం . అంతపెద్ద విద్యుత్‌ ఉద్యమాన్ని నిరోధించ గలిగిన మనం, వీటిని ఆపలేమా ? అప్పటి పరిస్థితుల కనుగుణంగా వ్యవహరిద్దాం . ఇప్పట్నుంచే మనకెందుకు ఆందోళన ? జరగవలసిన దానిగురించి ప్రస్తుతం ఆలోచిద్దాం ” అన్నారు .

మరొక సభ్యుడు ” నిధుల్నెలా ఖర్చు చేయాలో ఆలోచించారా” అని అడిగాడు . ” ఇప్పుడేగా ఆర్ధిక మంత్రిగారొచ్చారు , వారితో ఆలోచించి నిర్ణయిస్తాం . నా వుద్య్దేశ్యమేమిటంటే ప్రతి నియోజక వర్గానికి కోటిరూపాయలు కేటాయించి మిగిలింది రిజర్వు ఫండుగా ఉంచుతాం . ప్రాజెక్టు బాగాచేసిన వారికి యింకా యెక్కువ గూడ వుంచుతాం . కన్సల్టెంట్లకు పదిశాతం తప్పదుగదా  ! ” అన్నారు సి యం గారు .

“ఈ ప్రాజెక్టుకు కూడా విదేశీ కన్సల్టెంట్లు అవసరమా ? మన తెలుగు తల్లి విగ్రహం యెలా వుండాలో వారి సలహా దేనికి ” అన్నారొకరు .

” మీరన్నది నిజమే , కాని వరల్డు బ్యాంకు వారి కండిషన్లు మీకుతెలుసుగదా ! పని చేయించుకున్నా , లేకున్నా , మనకుపయోగపడినా , పడకున్నా విదేశీ కన్సల్టెంట్లకు ముట్టజెప్పాల్సిందే ” వివరించారు ఆర్ధిక మంత్రిగారు .

మాట్లాడాలని ఉన్నా , ఎదురుగా కన్పిస్తున్న కోటి రూపాయల కలలో తేలిపోతూ , మిగిలిన వారెవరూ నోరు మెదపలేదు .

” ఫ్రెండ్స్‌ ! ఫండ్స్‌ గురించి క్లారిఫై అయ్యింది గనుక , ఇక డిజైన్లు చూసి , మీకు నచ్చినవి సూచించండి ” చెప్పారు సి యం గారు.

దాదాపు మూడువందల డిజైన్లను పరిశీలించారందరూ , కొన్ని నవ్వు తెప్పించేవి , కొన్ని కోపం తెప్పించేవి , విసుగుకల్గించేవి కొన్ని , చిరాకు కల్గించేవి కొన్ని …… యిలా అన్నింటినీ చూసి , పది బొమ్మలు బాగున్నాయని నిర్ధారించి వాటిలోంచి గెలిచిన డిజైన్‌ను నిర్ణయించే బాధ్యతను ముఖ్యమంత్రి , ఆర్ధిక , హోంమంత్రులు , కొందరు అధికార , ప్రతిపక్ష శాసన సభ్యులు , అనధికార ప్రముఖులతో కూడిన కమిటీకి అప్పగించారు . సమావేశం అల్పాహార విందుతో ముగిసింది .

్‌******************************************************

ఒక వారం రోజుల తరువాత  ‘ న్యూ తెలుగు మదర్‌ ‘    విగ్రహ నిర్ధారణ కమిటీ సమావేశం సి యం గారి అధ్యక్షతన జరిగింది . విస్తృతసమావేశంలో నిర్ణయించిన పది డిజైన్లను నిశితంగా , నిర్దుష్టంగా  పరిశీలించారు . వాడి , వేడి చర్చలు జరిగాయి .

చర్చల సందర్భంగా ఒకరికో చిన్న అనుమానం వచ్చింది . ” మనం ఈ డిజైన్లన్నీ చూస్తున్నాంగదా ! ఈ సందర్భంగా శంకరంబాడి సుందరాచార్య గారి మంచి పాపులర్‌ పాట  ‘ మాతెలుగు తల్లికి మల్లె పూ దండ ‘   ను మనం మరచి పోకూడదు . ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళి , ఉత్తేజం కలిగించిన , ఇంకా కలిగిస్తున్న పాట అది . కనుక మనం నిర్ణయించే డిజైనులో మల్లెపూదండ వేసుకున్న తెలుగు తల్లిని చూపిస్తే బాగుంటుందేమో ” అన్నాడు .

మరొక శాసన సభ్యునికి చాలా కోపం వచ్చింది . “ప్రపంచం ముందుకు దూసుకు పోతుంటే , మీరింకా స్వాతంత్రానికి పూర్వం వ్రాసిన పాటలోని పదాల్ని పట్టుకు వేలాడతారేమండీ , ప్రాస కోసం మల్లెపూదండ అనివాడారు అప్పుడు .  ‘ న్యూ తెలుగుతల్లికి నుదుట రత్నాలు ‘   అని యిప్పుడెవరైనా వ్రాశారనుకోండి రత్నాలు పెట్టేస్తామా ? ఆవేశంలో ఏనాడో వ్రాసిన ఆ పాటను గురించి మర్చిపోండి . మనం ఈ నూతన విగ్రహాల్ని ప్రతిష్టించి , ఆవిష్కరిస్తే చాలా మంది వీటి గురించి కూడా పాటలు వ్రాస్తారు . అలంకారం కోసం వీళ్ళేదో వ్రాస్తే , అలా మార్చ గలమా విగ్రహాన్ని ? ” అని గద్దించాడు .

తర్జన భర్జనలు , తీవ్ర వాదోపవాదాలు జరిగాయి, సభ్యులు గ్రూపులుగా చేరి చర్చించుకున్నారు . రెండేసి మూడేసి గ్రూపులవారు తలకు తల ఆనించుకుని , ఆలోచనలు గాలికి పోకుండా బంధించి తీవ్రంగా ఆలోచించారు . టీ లు త్రాగి ఆలోచించారు , కాఫీ అలవాటున్నవారు కాఫీ త్రాగారు , వేసవిలో టీ లు కాఫీలేంటండీ, అసలే బుర్ర వేడెక్కి చస్తుంటే కూల్డ్రింక్‌ తెప్పించండని , కొందరు తెప్పించుకుని త్రాగారు . మరోరకం కూల్‌ డ్రింకులు అలవాటున్న వారు అవిగూడా తెప్పిస్తే బాగుండేదని మెల్లగా గొణుక్కున్నారు , పెద్దగా అంటే సి యం గారు తిడతారేమోనని . సిగరెట్‌ అలవాటున్న వారు బయటికెళ్ళి పొగతాగారు   ‘ ఇచ్చట పొగత్రాగుట నిషేధించబడినది , పొగత్రాగినవారు శిక్షార్హులు ‘   అన్న బోర్డుకడ్డంగా నిలబడి . ఇలా యెవరికి అనుకూలమైన విధంగా వారు రిలాక్స్‌ అయి , నిర్ణయం తీసుకునే బాధ్యతను సి యం గారి కప్పగించారు , ఏకగ్రీవంగా .

సీ యం గారు అర్థనిమీలిత నేత్రులై ఆలోచించారు (పూర్తిగా నిమీలితులైతే నిద్రపోతున్నారనుకుంటారని). ఉల్ఫెన్‌ సన్‌ గారి సలహా తీసుకుందామా అనుకుని , ఛ !  ఛ !   డబ్బుతో సంబంధం లేని యీవిషయంలో గూడ ఆయన్నెందుకు సంప్రదించడం …. నేనే నిర్ణయిస్తా అని డిసైడ్‌  చేసుకుని , ఒక్క నిముషం యోగా లోకి దూకారు . ఫ్లాష్‌ వెలిగింది . మెల్లగా కళ్లు పూర్తిగా విప్పి , చిరునవ్వుతో అందర్నీ గమనించారు , గొంతు సవరించుకున్నారు , ” ఈ చిన్న విషయం గురించి యింతలా టైం వేస్టు చెయ్యడం అనవసరం . ఆ పాట ఎప్పుడో వ్రాసింది ప్రస్తుతం వున్న తెలుగు తల్లిని గురించి కదా ! సెంటిమెంటు ఉన్నవాళ్లు కొందరైనా వుంటారు . వాళ్ళుగూడా బాధపడకుండా , క్రొత్త తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో , ముందుగా పాత తెలుగు తల్లి విగ్రహానికి మల్లెపూల దండలు వేసి , దండతో పాటు విగ్రహాన్నీ తొలగిస్తాం . అప్పుడు క్రొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం . సరేనా ! “.

ఈ యిష్యూ యింత యీజీగా సాల్వ్‌ కావడంతో అందరూ కరతాళ ధ్వనులతో సి యం గారి ప్రతిపాదనను ఆమోదించారు . ఇక డిజైన్‌ సెలక్షన్‌ విషయం వైపు దృష్టిసారించారు . కొన్ని నిబంధనలు నిర్ణయించుకున్నారు ముందుగా , విగ్రహ రూపురేఖలు ప్రస్తుత ట్రెండుకనుగుణంగా వుండాలి . ఐ టి రంగాన్ని హైలైట్‌  చేస్తూ వుండాలి , గ్లోబల్‌ విలేజిగా మారిన ప్రపంచాన్ని ప్రతిబింబించాలి . దేశ , విదేశాల్లో పెరుగుతున్న మన రాష్ట్ర యిమేజిని గూడ దృష్టిలో వుంచుకోవాలి .

ఈ నిబంధనలకనుగుణంగా వున్న రెండు డిజైన్లను అంతిమ నిర్ణయం కోసం ఎంపిక చేసుకున్నారు . కాని విగ్రహానికి చూపిన డ్రెస్‌ విషయంలో మార్పు వుండాల్సిందేనని అందరూ అన్నారు . కారణం రెండు డిజైన్లలోనూ పంజాబీ డ్రస్‌  వాడడమే . విగ్రహానికి చీర వుండాలన్నారు కొందరు , తెలుగుదనం వుట్టిపడేలా పావడా , పరికిణీ వాడదామన్నారు కొందరు. చర్చించారు , తెలుగు “తల్లి” అంటున్నాం కనుక , తల్లులైన స్త్రీలు చీరలుకట్టడం సంప్రదాయం కనుక చీరకట్టినట్లు చూపడమే భావ్యం అని నిర్ణయానికొచ్చారు . మన క్రొత్త తెలుగు తల్లి సంప్రదాయం , ఆధునికత కలబోసి వుంటుందని ప్రచారం చేసుకోవచ్చని జబ్బలు చరుచుకున్నారు . ఒకరి భుజం ఒకరు తట్టుకుని , తమ ఆలోచనకు అభినందించుకున్నారు . చీరరంగు గురించి కొంత వాదన జరిగింది . తెల్ల రంగన్నారు కొందరు , కాదు పసుపురంగన్నారు , తెలుపు శాంతికి చిహ్నమని ఒకరంటే , పసుపు సౌభాగ్యానికీ , ఐశ్వర్యానికి చిహ్నమని మరొకరన్నారు . మెజారిటీ నిర్ణయం ప్రకారం పసుపు రంగు చీర వుంచాలని నిర్ణయించబడింది .

మొత్తం మీద ఈ ఐడియాలన్నిటిని కలగలిపి తెలుగుతల్లి క్రొత్త రూపు ఈ విధంగా ఉండాలని డిసైడ్‌  చేసారు స్త్రీత్వం ఉట్టిపడేలా ప్రసన్న వదనం , పెదవులపై చిరుమందహాసం , తలపై వుండే కిరీటాన , ముందు భాగంలో స్పష్టంగా కన్పించేలా హైటెక్‌ సిటీ చిత్రం , కిరీటాగ్రం పై వ్యవసాయాభివృద్ధికి గుర్తుగా వరికంకులు పింఛంలా మలచాలని , భుజ కీర్తులుగా డాము , విద్యుత్‌ టవర్‌ రెండువైపులా వుంచాలనీ , గళాభరణంగా సీ డీ ల దండ చెక్కాలని , దండ కడియాలు గా విద్యకు గుర్తుగా స్కూలు బిల్డింగు , మహిళాభివృద్ధికి  గుర్తుగా డ్వాక్రా అనే పదాలు రెండువైపులా వుండాలని , సింహ మధ్య కటిభాగాన  వడ్డాణము పై  ‘  రోడ్ల విస్తరణ పధకం  ‘    అని వ్రాయాలని , ఎదగడానికీ , ఎగరడానికీ ఉద్యుక్తమవుతున్న భంగిమలో ఒక చేత కంప్యూటర్‌ ను , మరో చేత విమానాన్ని పట్టుకుని వున్నట్లు చెక్కించాలని మెజారిటీ ఒపీనియన్‌ ప్రకారం నిర్ణయించారు కన్సెన్సెస్‌ కి అడ్డుపడుతూ పతిపక్షాలవారు ఈ విగ్రహాన్ని మీ ప్రభుత్వ పధకాల ప్రచారం కోసం వాడుకుంటున్నారు అని ఆరోపించడంతో . వాళ్ళు చెయ్యలేరు, మమ్మల్ని చెయ్యనివ్వరు. ఉక్రోషం పట్టలేక , అలవాటు ప్రకారం ఆరోపణలు చేస్తున్నారు , ఇలాటివాటిని మేం లెక్క చేయం అని అధికార పక్షం వారు తోసిపుచ్చారు .

ఈ విధంగా రూపురేఖలు నిర్ణయించబడ్డ తెలుగు తల్లి క్రొత్త విగ్రహాన్ని ప్రముఖ డిజైనర్‌ చేత డిజైన్‌ చేయించి , విగ్రహ తయారీకి గ్లోబల్‌ టెండర్లు పిలిచారు . ఒకో విగ్రహానికి  50  లక్షల రూపాయలు కోట్‌ చేసిన ఒక అమెరికన్‌ కంపెనీవారికి ఆర్డరు దొరికింది . ఆకంపెనీ వారు ఆంధ్రా లోని శిల్పులకు విగ్రహానికి  50  వేల రూపాయలు యిచ్చి  300  విగ్రహాలు తయారు చేయించారు .

రాష్ట్రావతరణ దినోత్సవం దగ్గరవుతున్నది … అన్ని నియోజక వర్గాలలో , మరి కొన్ని ముఖ్యప్రదేశాల్లో విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమవుతున్నది .

టాంక్‌ బండ్‌ మీద తెలుగు తెల్లి , స్తూపం మీద నుండి మెల్లగా దిగి తల దించుకుని , రోడ్డు దాటి హుస్సేన్‌ సాగర్‌ వైపు వెళుతున్నది .
------------------------------------------------------
రచన: కె. యస్‌. పరబ్రహ్మం, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, October 29, 2019

నిద్ర పట్టనివ్వని అలారం


నిద్ర పట్టనివ్వని అలారం
సాహితీమిత్రులారా!

రెవరెన్డ్‌మాసిలామణి ఉపన్యాసం అనర్గళంగా సాగుతోంది. కెన్నెడీ చరిత్ర ముగిసింది నెహ్రూ చివరి రోజులు.” … మతం పాత్ర పరిపాలన వ్యవహారాల్లో పరిమితంగానే ఉంటుంది. క్యాథలిక్కు అమెరికా ప్రెసిడెంటు అవడం సాధ్యమయింది కదా! భగవంతుణ్ణి పక్కకు నెట్టిన నెహ్రూ మన ప్రియతమ ప్రధాని. ముందు ముందు స్త్రీలు, నల్లవాళ్ళు, అంటరాని వాళ్ళు ఎవరైనా దేశాలని యేలే సమయం వస్తుంది. వస్తూంది. అయితే మననందరినీ యేలే ఆ ప్రభువు ఒక్కడే. ఆయన్నే నమ్మండి …” అంటున్నారు రెవరెండ్‌ ఆజానుబాహుడు, చామన ఛాయ, తమిళ ఛాయలు గల తెలుగులో ధారాళంగా మాట్లాడుతున్నారు. తెలుగులో ఆయనే రాసిన పాట పాడారు.
“శిలువే నా శరణాయెనూరా”
ఇది తెలుగులో ప్రసిద్ధమైన భక్తి కీర్తన “శివ దీక్షాపరురాలనురా” వరసలో రాసానని చెప్పారు. ఎవరో గొణిగారు “బాబోయి, ఆ పాట జావళి, భక్తి గేయం కాదు”అని. నాలో ఓ ప్రశ్న జావళి భక్తి గీతం ఎందుక్కాదని?


అవకాశం వచ్చింది, బతుకులో పై మెట్లెక్కుతున్నాను. కానీ, ప్రతి అంతస్తూ పరాయి ఊరులా అనిపిస్తూ ఉంటుంది. ఈస్టు పాయింటులోనో డాల్ఫిన్సులోనో కమ్మటి రుచులు, రకరకాల వంటకాలూ నాగరీకులైన ఆడ, మగ స్నేహితులు పరిచయస్తులు, పోలికలు, వెటకారాలు. తెలియని అనేక భాషల వాళ్ళు. ఇంగ్లీషులోనే సంభాషణలు నుడికారం తెలియక అవస్థలు. మొత్తానికి బయల్దేరిన చోటునుంచి చాలా దూరమే వచ్చాను.


స్టేషన్‌పక్కనించి రోడ్డు మీద నడుస్తుంటే ‘వస్తావా?’ అనే నవ్వూ యేడుపూ కలిసిన గొంతుకలతో పిలుపులూ, చిరిగిన నిక్కర్ల కుర్రాళ్ళూ, బక్క చిక్కిన రిక్షావాడి ఈల, “కారొచ్చిందప్పయ్యమ్మ కారు, అది కారు కాదు నా కాలి గోరు” అని సందు చివరి నుంచి గోలగా వినపడే పాట మనసుని కెలుకుతూ ఉంటాయి.


నా ఊరేదీ? నా వాళ్ళు వీళ్ళా వాళ్ళా?

వీధిని తట్టుకోలేకపోతే చర్చిలోకి వెళతాను. నమ్మకం యెప్పుడో పోయింది. కానీ అక్కడ మామూలు మనుష్యుల్ని గురించి ఈసడింపులేకుండా మాటలు వినపడతాయి. చాలా మంది ప్రభువు మీద అపరిమితమైన విశ్వాసమున్నవాళ్ళు. నన్ను మళ్ళీ “మంచి” దారిలోకి తీసుకెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళూను. దుఃఖం, బాధా, లేమి లోంచొచ్చే లేకితనం గమనిస్తూ కూడ తట్టుకుని పరిశుభ్రతవైపూ పరిశుద్ధతవైపూ వారు నమ్మిన దారిని చూపి జనం మనసుల్లో ఆశ కల్పించి, ఆదరణ గుణాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నించే ఫాదిరీలూనూ.


రివరెండ్‌మాసిలామణి గారి ఉపన్యాసం చర్చిలో కాదు సభలో వేదిక మీంచి సాగుతోంది. “… తెలుగులో మొట్టమొదట ముద్రించిన పుస్తకం బైబులు. దాదాపు నూటయాభై సంవత్సరాలక్రితం మతవ్యాప్తికోసం దొరలు ప్రవేశపెట్టిన తెలుగులో ముద్రణావకాశం త్వరలోనే వావిళ్ళ రామస్వామి శాస్త్రుల కంపెనీ లాంటి వాళ్ళు అందుకుని, అంతవరకూ అక్కడక్కడా కొద్దిమందికే పరిమితమైన గ్రంథాలని పరిష్కరించి ముద్రించి అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఉపయోగపడింది. ప్రభువు ఆనతి ఉంటే అలా ఒక్కో ప్రయత్నం అనేక విధాలగా ఉపయోగపడుతుంది.” నిజంగా ఇన్ని పుస్తకాలూ ఇన్ని చదువులూ సాధ్యమయ్యాయి. నాగరికత పెరిగి సుఖాలూ సుళువులూ కొందరికి అందుబాటులో ఉన్నాయి. కాని ఇంత దుఃఖం ఇంకా ఇంత మందిలో చూస్తూనే ఉన్నాం. బోధపట్టంలేదు.

మళ్ళీ వినేప్పటికి మాసిలామణిగారి గొంతు గంభీరంగా ఉంది “… గొల్లనో గొర్రెల కాపరనో భయాన్ని అసహాయతనీ తట్టుకునేందుకు సృష్టించిన కట్టుకథలని నాస్తికుల వాదన. శక్తి ఉందనీ, ధనం ఉందనీ విర్రవీగి ఇతరులని పీడించడమో లేకపోతే బలం ఉన్న వాడికి లొంగిపోడమో కంటే మనిషికున్న పరిమితులు అర్థం చేసుకుని సర్వ వ్యాప్తమైన దైవ శక్తిని నమ్ముకోడం ఉత్తమ లక్షణం కదా?”


పోనీ భగవంతుణ్ణి నమ్ముకుని సర్వశక్తివంతుడని ఒప్పేసుకుందామా రేషన్‌ రోజుల్లో చాటుగా బియ్యమమ్మి బతుకు వెళ్ళదీసుకునే మార్తమ్మ పట్టుబడి దెబ్బలు తింటే, పాలుగాడు జేబులుకొట్టి జెయిలుకెళ్ళడం, బయటికి రావడం, మళ్ళీ వెళ్ళడం అలవాటు చేసేసుకుంటే, నీలయ్య ఆరేళ్ళకే బీడీలు తాగడం నేర్చుకుంటే, తరాలుగా ఆడపిల్లలు కొబ్బరితోటల్లో భుక్తి వెతుక్కుంటుంటే కలడో లేడో తెలియని ఈ భగవంతుడే దారీ చూపెట్టడేమి?


మా పంతులుగారనేవారు “అందరికీ అవకాశాలు అందుబాటులో ఉండటానికేనర్రా, నెహ్రూ గారూ, అంబేద్కరూ పార్లమెంటుని ఒప్పించి రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు. పైగా చూడండి, ఈమధ్యన ఎన్ని స్కాలర్షిప్పులు ఇస్తున్నారో. బాగా చదువుకోండి, ఎదగండి” అని. కానీ ఆయనే చిరుగులు కుట్టిన చొక్కాలే వేసుకునేవారు. చదువుకోవడంతో ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందని అనిపించేది కాదు. అదృష్టంఉండి స్వంతంగా పట్టుదల ఉన్న వాళ్ళో, లేదా అమ్మా నాన్నల ప్రోద్బలమున్న వాళ్ళో తప్ప పిల్లలు స్కూళ్ళు ఒదిలెయ్యడం మామూలయిపోయింది. అక్కడక్కడ నాలా అడ్డాలు దాటి అవకాశాలందుకుని “పైకొచ్చినవాళ్ళు” కొంతమంది మాత్రమే. సాధారణంగా ఈ పైకొచ్చినవాళ్ళకీ వెనకుండిపోయినవాళ్ళకి మధ్యన ఒక తెర దిగుతుంది. ఒకే కుటుంబంలో కూడా వృద్ధి క్షయాల మధ్య అంతరాలు మొలకెత్తి కాలం గడిచిన కొద్దీ నాటుకుపోతున్నాయి.


మా పంతులుగారమ్మాయి సంధ్య చురుగ్గా ఉండేది. మాకిద్దరికీ calf love ఉండేది, ఇంకా లవ్‌అనే మాటకి అర్థం తెలియని రోజుల్లో. నేను ముందుకెళ్ళాను. ఆమె చదువు టీచర్సు ట్రెయినింగుతో పూర్తయ్యింది. అటూ ఇటూ కూడా అభ్యంతరాలున్నా, జంట కట్టాలన్న కోరిక కలిగింది. కలుసుకుంటూ ఉండే వాళ్ళం. ఆమెకి దేవుడంటే నమ్మకం. సుఖ దుఃఖాలకి కారణాలు ఈ జన్మలో కనబడకపోతే వెనకజన్మల్లో ఉంటాయనీ, దేవుడు లెక్క తప్పు వెయ్యడనీ వాదించేది. నేను “ఈ దరిద్రం అనే అగాధం పూడ్చడం మన తరం కాకపోయినా, వెనక్కి వెళ్ళి కారణాలు మనలోనే వెతుక్కోవద్దు. నిబ్బరంగా ముందుకి చూద్దాం” అనేవాణ్ణి. అప్పటికి నాకూ తెలీదు అసలు తిరకాసేంటో. కానీ వెతకాలనీ, వెతికి తెలుసుకున్నవాళ్ళని కలుసుకోవాలనీ ఉండేది. ఇదంతా మార్చడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న చాలా రోజులు వేధించింది.


మాసిలామణి గారు ప్రశ్నలకవకాశమిచ్చారు. నేను లేచి “దయామయుడయిన దేవుడు పేదరికమూ అందులోంచి పుట్టే రకరకాల క్రూరత్వాలూ కుళ్ళూ ఎందుకు సహించి ఊరుకుంటున్నాడో చెప్పండి” అని అడిగాను. ఆయన జవాబిచ్చే లోపల ఆరోజు సభకి అధ్యక్షులయిన ఒక పేరుగల సాంఘిక శాస్త్ర విద్యావేత్త డా. ప్రసాదు గారు “దయచేసి నన్ను చెప్పనివ్వండి” అన్నారు. రివరెండు గారు ఆశ్చర్యపోయినా కూర్చుండిపోయారు. ప్రసాదు గారు “బీద వాళ్ళు అలాగే ఎందుకుండిపోతున్నారో తెలుసా? ఎన్నో అవకాశాలున్నా ఓపిగ్గా అవి అందుకోవడం కానీ, కష్టపడి సంపాదించి కుటుంబ పోషణ చేసుకోడం కానీ లేకుండా అడ్డదారులు తొక్కడంలోనే సుఖముందనుకుంటారు. వాళ్ళల్లో చాలామందికి సూటిగా ఆలోచించడమే ఇష్టముండదు. వాళ్ళ నడవడికలోంచే వాళ్ళ కష్టాలన్నీ వస్తాయి. పిల్లల్ని చదువులు మానిపించి కూలి పనుల్లో పెట్టే తల్లిదండ్రులున్నారు తెలుసా?” అన్నారు అసలు బతగ్గలిగితే కదా చదువులు అన్నది ఆయన మేధావి బుర్రకి తట్టలేదేమో.

అడక్కుండానే వేదికమీదున్న ఓ రాజకీయ పెద్ద “పొగరండీ పొగరూ! స్టేషన్నించి మహారాణీపేటకి పన్నెండణాలడిగాడు రిక్షావాడు. ఇవ్వనంటే పక్కకి తిరిగి బీడీ ముట్టింఛాడు. వీళ్ళని ఉద్ధరించడం ఎవరి తరమండీ? మా ప్రభుత్వం అక్కడికీ వీలయినంత తంటాలు పడుతూనే ఉంది” అన్నాడు ఆ తంటాల్లో మూడు పాళ్ళు ఎవరికి చేరుతోందీ చెప్పలేదు.

మాసిలామణి గారు నిలబడ్డారు. మొహంలో విషాదం కనబడుతోంది, “ప్రశ్న నన్నడిగారు. దేవుడికి, మనిషి దుఃఖానికీ సంబంధించిన ప్రశ్న. సమాధానం నా బాధ్యత. ప్రభువు దీనుల పక్షం, అమాయకుల అసహాయుల పక్షం. భగవంతుడి సన్నిధి పేదవాడికి దొరికినట్టు క్రూరులు స్వార్థపరులు, సంపద పోగేసుకునేవాళ్ళకి దొరకదు. వాళ్ళు దేవుడివాళ్ళవడం సూది బెజ్జంలోంచి వొంటే దూరడమంత కష్టం. పేదరికంలో కష్టాలు ఓర్చుకునేవాళ్ళకి దేవుడు దగ్గరవుతాడు” కొంచెమాగి కూర్చున్నవాళ్ళలో చిన్నవాళ్ళకేసి, ఇంకోమాటు నాకేసి, నిదానంగా చూశారు “మీ ప్రశ్నకి సమాధానం పూర్తి చెయ్యలేదు కదూ! మీకు పరలోకంతో లింకులేకుండా ఇక్కడ పరిస్థితికి అవగాహన కావాలి. మతం ఓర్చుకోమంటుందిగానీ, నోరుమూసుకుని సహించమనదు నాయనలారా! క్రూసేడ్లు జరగలేదూ? రిఫర్మేషన్‌రాలేదూ? మార్చాలి సంఘాన్ని. మార్చండి. కాని సాధ్యమయినంత మంచితనంతో మనసులు మార్చండి …” ఇలా సాగింది చాలా సేపు.

వేదికమీదున్న పెద్దలకేసి తిరిగి “గమనించండి. మనమే నిజమయిన అడుక్కుతినే వాళ్ళం. వాళ్ళ శ్రమ విత్తనమేసి, డబ్బు చెట్టుని పెంచి దక్కించుకుని పెత్తనం చెయ్యడం వాళ్ళు సహించడం మానేసినప్పుడు చెల్లదు. మాలాంటి మతగురువులం ఓర్పు బోధించి మార్పు మంచితనంతో తెచ్చుకోమని చెప్పుతాం. మీరు మా మాటల వెనకాల గూడుపుఠాణీ చేస్తూ మీ పబ్బంగడుపుకుంటూంటే క్రమంగా పరిస్థితి చెయ్యిజారిపోతుంది” అన్నారు.

వింటున్న నాకు Red Dean of Canterbury Hewlett Johnson గుర్తుకొచ్చాడు. కాని ఇలాంటి కరుణలోంచి పుట్టిన అంచనాలూ సలహాలూ అసలు ప్రశ్న దగ్గిర ఎవరి కొమ్ము కాస్తాయి? అని సందేహంకూడా వచ్చింది.


దేవుడికే కాదు, గురితప్పిన తుపాకీ గుళ్ళకి కూడా లేని వాళ్ళూ చిన్న వాళ్ళూ అంటేనే ఇష్టం. సంధ్య పని చేస్తున్న స్కూలు పక్కన ఫ్యాక్టరీలో కమ్యూనిస్టుల నాయకత్వంలో పెద్దపెట్టున సమ్మె జరిగింది. కార్మికులని రెచ్చగొట్టేందుకు అతివాదులు ప్రవేశించారని పోలీసులు అనుకున్నారట. ఎవరో తెలియనివాళ్ళకోసం కాలిస్తే అందరికీ తెలిసిన వాళ్ళూ, మంచివాళ్ళూగా పేరుతెచ్చుకున్న వాళ్ళూ ముగ్గురికి గుళ్ళు తగిలాయి. అందులో సంధ్య ఒకరు. ఆమె కథ అయిపోయింది. తుపాకీ గుళ్ళకి ముందు జన్ముండదు కాబోలు, ఈ పాపఫలం అనుభవించడానికి.


మంచి పొజిషనున్న వాడికి ఏవీ అడ్డురావు దుఃఖం కూడా పలకరించి పక్కకు తప్పుకుంటుంది. సంధ్య వాలింది. నిద్రలేచేప్పటికి కొత్త పొద్దు నాముందు నిల్చుంది. ఒక IAS ఆఫీసరూ, ఒక పెద్ద బిజినెస్సు మనిషీ, ఒక పాలిటీషియనూ నాకు పిల్లనివ్వడానికి పోటీ పడ్డారు. business man నెగ్గాడు కారు కొన్నాను. పిల్లలు పుట్టి ఎదుగుతున్నారు. వాళ్ళ కోరికలన్నీ తీర్చగలుగుతున్నాను.

వెనకటి వాళ్ళెప్పుడయినా తగుల్తూ ఉంటారు. వాళ్ళ కష్టాల్లో స్వయంగా సాయపడలేకపోయినా, నా influence ఉపయోగించి వాళ్ళకి ఉపయోగపడుతున్నాను. కానీ ఈ రెండు తరహాల జీవితాలకీ ఉన్న తేడా చాలా విస్తృతమయ్యింది. నాబోటిగాడి దగ్గర రాడానికే చాలా మందికి జంకుంటూంది. అవసరం కోసం జంకుని తట్టుకుని వచ్చినా, నా పిల్లల్నీ భార్యనీ చనువుగా పలకరించే ధైర్యముండదు. ఏదో మొక్కుబడి, నాకు చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. కొంచెం ఉడుకుమోత్తనం కూడాను. నా తోటి ఆఫీసర్లలాగా మామూలు జనాల బెడద లేకుండా విలాసంగా ఎందుకు గడపలేకపోతున్నానని అప్పుడప్పుడనుకుంటాను. కానీ మళ్ళీ అలా అనుకున్నందుకు నన్ను నేనే తిట్టుకుంటూంటాను. కొందరు మొదట్నించీ పయి మెట్ల వాళ్ళు. సరదాగా మాట్లాడుతున్నట్టే ఉండి అప్పుడప్పుడు విసుర్లు వదుల్తారు. ఎదుర్కునేంత సూటిగా అన్నరు. అలా అని గుచ్చుకోడం మానదు. noveau riche అనే పలుకుబడి మొదటిసారిగా ఇలాంటి సందర్భంలోనే విని తరవాత డిక్షనరీ చూసి అర్థం తెలుసుకుని లోపల్లోపల గుంజుకున్నాను.


మనసు క్లేశమనుభవిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు పూర్తిగా కలిమినే నమ్ముకోవడం, కిందవాళ్ళని చులకనగా చూడడం బాధ కలిగిస్తోంది. వాళ్ళుకూడా బయట ఒక వేళ కులం పేరుతో రిజర్వేషన్ల తాలూకన్న ఎత్తిపొడుపులతో మానసికంగా దెబ్బలు తింటున్నారేమో. అది కప్పిపెట్టి వాళ్ళకున్న కలిమిని పొజిషన్నీ పెద్దగా అనుకుంటూ కాంప్లెక్సుల కాంప్లెక్సిటీలో సతమతమవుతున్నారేమో.


రాని నిద్రకి సిగరెట్ల ధూపం. నిద్ర మాత్రల దారిలో కలత పడ్డ మనసు కుదుట పడుతుందా? నిద్రలేపే అలారం నాలోనే ఉందేమో? అలిశెట్టి ప్రభాకర్‌కవిత కళ్ళముందు కదిలింది.

“పడుకుని ఉన్నా
గుండె
గడియారమవుతుంది
ఒక్కొక్కప్పుడు
నిద్ర పట్టనివ్వని
అలారం అవుతుంది”


చాలా రోజులయింది. చాలా పైకొచ్చాను. నా ఉనికికీ, నా మాటకీ విలవ పెరిగింది. మనుషులనించి దూరం ఎక్కువయింది.

పేరుకి దసరా పందిరి. పాట కొత్తగా ఉంది. విందామని వెళ్ళాను. కాలి గజ్జెల చిందూ, ఎప్పుడూ దూరంగా వినపడే డప్పూ, ఊరి మధ్యకొచ్చింది.

“దుక్కులు దున్నిన నాగలి
ఈ దుక్కులు నావంటున్నది
మొక్కలు నాటిన చేతులు
ఈ మొక్కలు నావంటున్నవి
కోతలు కోసిన కొడవలి
ఈ కోతలు నావంటున్నది
కమ్మరి కొలుములు రాజినయి
కుమ్మరి ఆములు మండినయి
మంగలి కత్తులు మెరిసినయి”

నేను మరుస్తున్నకొద్దీ చుట్టూ చూడడం మానేసి లోపలికి కుదించుకుపోయినప్పటినుంచీ, జీవితం చాలా మారినట్లుంది. జనం విషయం పసిగట్టేసినట్టున్నారు.

యేళ్ళ తరబడి బతుకు భయం, పవరు పెరిగిన మనస్థితీ, కింది దట్టమయిన పొరల అడుగున గడ్డకట్టిన హృదయం, మళ్ళీ ఇన్నాళ్ళకి ద్రవించి

“ఎదమెత్తనవుటకయి సొదగుందరా
అంత మదిగల అహమ్మెల్ల వదలిపోవునురా”

బతుకు వేగాన్నీ కాలం పెంచిన వ్యవహారాల తాకిడినీ తట్టుకుని కొంచెం టయిము పిల్లలకి కేటాయించాలి. ఎక్కడినుంచొచ్చారో వాళ్ళకి తెలియాలి. వెనక బతుకుల యెరుక, అవగాహనా, ముందుచూపూ కలిగించాలి. సాధ్యమేనా? వీళ్ళు నాకు దొరుకుతారా? ఇన్నేళ్ళ తరవాత? లేక రెవరెండ్‌మాసిలామణి చెప్పినట్లు పరిస్థితి చెయ్యిజారిపోతుందా?
------------------------------------------------------
రచన: నందివాడ భీమారావుజనవరి, 
ఈమాట సౌజన్యంతో 

Sunday, October 27, 2019

డాట్కామ్‌ మాయోపశమన వ్రతము


డాట్కామ్‌ మాయోపశమన వ్రతము

సాహితీమిత్రులారా!

సూతమహాముని శౌనకాది మునులకు డాట్కామ్మాయా ప్రభవమును, తన్నివారణోపాయంబును ఇట్లని చెప్పదొడంగెను.

పూర్వము త్రేతాయుగంబున మహావిష్ణువు అసుర సంహారార్ధియై శ్రీరామచంద్రమూర్తిగా నవతరించి యుండెను. తపస్వియు పరాక్రమవంతుండును అయినట్టి రావణాసురుండను రాక్షసాధిపతి, భూపుత్రియు శ్రీరాముని ధర్మపత్నియు నగు జానకిని మాయోపాయమున అపహరించి లంకానగరంబున గల అశోకవనమందుంచెను. కారణజన్ముడగు శ్రీరాముడు వానర సైన్యపు సహాయమునంది సముద్రము దాటి రావణునిపై సంగ్రామము ప్రకటించెను. ముల్లోకములు, దేవ దానవ మానవ సర్వ జనావళి భయకంపితులయి చూచుచుండ ఘోర సంగ్రామమారంభమాయెను.

రావణాసురుని సుతుండును, బహు మాయావియు, జిత్తులమారియును అయినట్టి ఇంద్రజిత్తును, శ్రీరాముని ప్రియ సోదరుండును, అరణ్యవాసమున సైతము వెన్నంటి నడిచినట్టి వాడును నగు లక్ష్మణుండు ఎదుర్కొనెను. ఇరువురి మధ్యను ఘోర సంగ్రామము జరిగెను. ఎట్టకేలకు లక్ష్మణుండు ఇంద్రజిత్తును జయించెను. మరణావస్థలో నున్న ఇంద్రజిత్తు లక్ష్మణుని జూచి, ఓయీ లక్ష్మణా, ఈ విజయమయిననూ అపజయమయిననూ మనిద్దరిదీ కానోపదు. నా తండ్రి కోసము నేనును, నీ సోదరుని కోసము నీవును తెగించితిమి గాని మనిద్దరిలో స్వార్థచింతనమేమున్నది జెప్పు మనెను.

ఇంద్రజిత్తు మాటలకు కలత పడిన లక్ష్మణుండు, మారు మాటాడక శిబిరమునకేగి అన్నగారికి జెప్పెను. “ఇంద్రజిత్తునకును నాకును భేదమేమున్నది? నీ ధర్మ వర్తనము నన్ను కాపాడుచున్నది. రావణుని దుర్మార్గము ఇంద్రజిత్తును కాల్చినది గాని అతగాని త్యాగమునకు వేరర్థమే లేదా? యుద్ధమున నేనోడిపోయియుండినచో నా గతియునూ అంతియే గదా” అనెను. ఆ మాటలకు చిరునవ్వు నవ్వి శ్రీరాముడు, “ఓయీ లక్ష్మణా, ఈ జన్మలన్నీ కర్మానుసారములని నీవెరుంగవా? మనకు లభించు సోదరులు, బంధువులు అన్ని బంధములూ కర్మానుసారములే అని శాస్త్రములు పల్కుటలేవా?” అని ఊరడించెను. లక్ష్మణుని మనసెరిగిన శ్రీరాముడు తమ్ముని ఆనందపరచనెంచి ఇంకా ఇట్లనెను “ఇంతటి విజయుడవయి యుండి ఇట్లు ఖేద పడుట నేచూడలేను.ఇంద్రజిత్తునకు మరణానంతరము వరమిచ్చు చున్నాను. అతగాడు అదృశ్యరూపుడై తన మాయాజాలమును కలియుగాంతమున ప్రయోగించగలందులకు నేనవకాశము నిచ్చు చున్నాను. ఏ భవ బంధములూ, బాధ్యతలూ లేని మాయావి తన శక్తులనెట్లుపయోగించనెంచునో చూచెదము”.

శ్రీరాముని ఔదార్యమునకు దేవతలు పూలజల్లులు కురిపించిరి. అసువులు బాసి వీరస్వర్గమున కేగుచున్న ఇంద్రజిత్తు, వెల్లువలై వర్షిస్తున్న పుష్పములను గాంచి “ఏమిటీవింత?” అని సమీపమున నున్న నారదమునీంద్రుల నడిగెను. నారదుడు ఇంద్రజిత్తునకు జరిగిన వృత్తాంతమునెరింగించి, కలియుగమున నాతడికి సంక్రమింపబోవు శక్తులను వివరించెను.

కాలచక్రము గిర్రున తిరిగెను. త్రేతాయుగము, ద్వాపరయుగములు గడచి కలియుగంబారంభమయ్యెను. ధర్మాధర్మ విచక్షణము సన్నగిల్లెను. మానవ జాతి ఇహ పరములనొక్కటి జేసి మాటాడదొడగెను. దైవచింతన, ధర్మచింతన క్షీణించి స్వార్థచింతనే మానవజాతిని నడిపించ సాగెను. యుగాంతము సమీపించు చున్నదా అన్నంత దైన్య స్థితికి మానవ జాతి దిగజారెను.

మరో పక్క అదేమానవ జాతి, విద్యా వైజ్ఞానిక రంగములలో అధ్భుతమైన ప్రగతి సాధించి విమానములను, రాకెట్లను, కంపూటర్లను సృష్టించెను. కొత్త జీవరాసులనే మనిషి సృజించెను. బ్రహ్మ సృష్టించిన జీవ జాతులు కొన్నింటిని భూలోకమునుండి పూర్తిగా చెరిపి వేసెను.

దీనినంతను జన్మరహితుడై స్వర్గమున నున్న ఇంద్రజిత్తు అత్యంతాశ్చర్యముతో గమనించుచుండెను. తాను త్రేతాయుగమున సాధించి ప్రయోగించిన మాయాజాలము, కలియుగపు మానవుని ముందు పారదని తోటి స్వర్గవాసులు హేళనజేయ జొచ్చిరి. ఇంద్రజిత్తు తన శక్తి యుక్తులను పరీక్షించు కొనుటకు అదే సందర్భమని ఎంచి, అదృశ్యరూపుడై భూలోకమునకరుదెంచెను.

ఖండములన్నీ గాలించెను. తన శక్తియుక్తులకు దీటయిన పరీక్ష కోసమై అన్ని మూలలా శోథించెను. చివరికాతడు అమెరికా ఖండంబును జేరి అదేతనకు సరియయిన ప్రయోగశాలయని నిర్ణయించుకొనెను. ప్రపంచపు నలుమూలలనున్న మానవ మేథా సంపత్తికీ మాయా జాలమునకూ అదే కేంద్ర బిందువని ఆ మాయావి గుర్తించెను.

అనుకొన్నదే తడవుగా ఆతడు తన మాయాజాలమును కేంద్రీకరించి, మానవమేథకు పరాకాష్ట యని విర్రవీగి ప్రజ్వరిల్లుతున్న అత్యాధునిక సాంకేతిక వ్యాపార సామ్రాజ్యమయిన కాలిఫోర్నియా పై దండెత్తెను. “హ్రీమ్‌ డాట్కామ్‌, క్రీమ్‌ డాట్కామ్‌” అని మంత్రించి ఓ మహా మాయను మానవాళి పై సంధించెను.

అంతవరకును కొన్ని సూత్రములకు, మానవమేథకు లోబడి నడిచిన సాంకేతిక వ్యాపార రంగము ఒక్క సారిగా పూనకము వచ్చిన చందమున ఊగిసలాడినది. జాతి, వర్గ, వర్ణ భేదముల్లేక జనావళి మొత్తము “డాట్‌ కామ్‌” “డాట్‌ కామ్‌” అంటూ ఏదో చావులాటి మగతలో కలవరించ సాగెను. అది ఆనందమో బాధో తెలియని ఒక యోగస్థితి, ఒక పెను మాయ!

భరతఖండమున కాలిక్యులేటర్‌ కూడా చూడనోపని ఓ యువకుడు ఈ మంత్ర జపమున కాలిఫోర్నియా జేరెను. పదేండ్లలో పదవీకాలము ముగియనున్న తరుణమున ఓ ప్రభుత్యోద్యోగి అదే మంత్రము జపిస్తూ పిల్లా పాపలను వదిలి దేశములు పట్టిపోయెను.

అన్ని సంస్థలలో అన్నిరంగములలో అన్ని విభాగములలో ఇదే జపం నిర్దేశించిరి. అందరికన్న ఎక్కువ నష్టము సాధించిన సంస్థ, డాట్‌ కామ్‌ జపం నేర్చిన కారణాన ఎక్కువమందికి ప్రీతిపాత్రమాయెను. తత్కారణమున దీనిని నమ్మి స్టాకులు కొనియున్న వారు కన్ను మూసి తెరిచి నంతలో అత్యంత ధనికులయ్యిరి. మానవమేథకు మూల విలువలూ, కొలబద్దలూ అయినట్టి లాభనష్టములు, నాణ్యత, ఇత్యాది విశేషములు ఆ మాయను వివరింప జాలకపోయినవి. మరో ప్రదేశమున నూట ఏబది వేల డాలర్లకు లభించగల గృహము ఆరునూర్ల వేలకు జేరుకొనెను. కొన్నవాళ్ళకు గాని, అమ్ముకున్న వాళ్ళకు గానీ ఏమి జరుగుతున్నదో తెలియని అమాయక స్థితి, ఆ మాయ సృష్టించియుండిన పరిస్థితి!

ఇట్టి మాయను ప్రయోగించిన ఇంద్రజిత్తు చిద్విలాసమున చిత్రము జూచుచు నుండెను. కొంతకాలమట్లు గడిచెను. ఓ నాడు అతడకస్మాత్తుగా తన మాయను ఉపసంహరించు కొనెను. మానవాళి మేలుకొనెను. మాయ స్థానమున హేతువు పునః ప్రతిష్టితమయ్యెను. తిరిగి ఓడలు బండ్లయ్యెను. బండ్లు ఓడలయ్యెను. ప్రోగ్రామర్లు, డిబిఏలు, ఉద్యోగులు, గంటకూలీలు అన్ని జాతులవారికిని ఉద్వాసనలు ప్రారంభమయ్యెను.

అంతవరకూ అందరికీ ప్రీతి పాత్రమయిన “డాట్‌ కామ్‌” మంత్రము క్షుద్ర మంత్రమయ్యెను. అది ఉచ్చరించుట అన్ని సంస్థలకూ, సర్వ మానవాళికీ దుష్ఫల హేతువూ గానూ, నష్ట దాయకము గానూ పరిగణించబడసాగెను.

ఇది ఇట్లుండగా ఇంద్రజిత్తు తన శక్తి యుక్తులకు సంతుష్టుడై మరో మాయ ప్రయోగించుటకు సిద్ధమై యున్నాడు.

అని చెప్పి సూత మహాముని “ఇది వర్తమానము, కానున్నది వేచి చూడవలెను” అని చెప్పి ముగించెను.

వృత్తాంత మంతను అత్యంత శ్రద్ధాసక్తులతో విన్న శౌనకాది మునులు భయావహులై, మరిట్టి మాయకు ఉపశమనమో, మరో ఉపాయమో లేదా? మరి ఈ మానవజాతికి ముందున్న మార్గమేమిటి అని ప్రశ్నించిరి.

సూతముని ఇట్లు ప్రసంగించెను.

శిష్యులారా, ఉపశమన మార్గమున్నది. ఒకనాడు బే ఏరియా కు నారదుడు విహారార్థియై వెళ్ళెను. ఫ్రీమాంటు లోని ఉడుపి రెస్టారెంటులో సౌత్‌ ఇండియన్‌ కాంబో తిని బయట పడు సందర్భమున మునీంద్రునికి ఓ యువకుడు తారసపడెను. ఆ యువకుని క్రెడిట్‌ కార్డ్‌ రిజెక్ట్‌ అయిన కారణాన మొహము జెల్లక సిగ్గుతో తలవంచుకొని వ్యాలెట్‌ తీసి చిల్లర పైసలు వెతికి బిల్లు కట్టు చుండెను. క్రితం సారి బే ఏరియా విచ్చేసిన సందర్భమున అదే యువకుడు BMW లో విచ్చేసి పదిమందికి భోజనమిప్పించి, ప్లాటినమ్‌ కార్డుతో చెల్లించి బయటికి నడిచిన సంగతి జ్ఞప్తికి రాగా, అదే సంగతి ఆ యువకుని అడిగెను.

ఆ యువకుడు నారదమునీంద్రుని గాంచి, “మునీంద్రా మిమ్ములను జూచి బాటా వారేసిన దీపావళి నాటికనుండి కాస్య్టూము మార్చకుండానే భోజనమునకొచ్చిన ఓ బే ఏరియా ప్రోగ్రామరాధముడనుకొంటిని. నన్ను క్షమించి నా కష్టము తీరగల ఉపాయము జెప్పుడి” అని బ్రతిమిలాడెను. ఆ యువకుడు “డాట్‌ కామ్‌” మాయలో పడి ఉన్న ఏబదివేల స్టార్టప్‌ కంపెనీ ఆప్షన్లనూ ఎర జూపి మిలియన్‌ డాలర్ల అప్పుతో ఓ బ్రహ్మాండమయిన భవంతిని, వసతి గృహముగా జేసికొనియుండెను. మాయ జల్లారిన పిదప ఆ కంపెనీ మూతబడెను, ఇతగాడు రోడ్డునబడెను.

కథ విన్న నారదమునీంద్రులు నిట్టూర్చి, ఇట్లు పలికిరి. “నాయనా డాట్కామ్మాయోపశమన వ్రతమను ఒక వ్రతము కలదు. రానున్న కష్టము ముందే తెలిసిన శ్రీరాముడు చిరంజీవి యగు హనుమంతునికిని నాకును ఈ వ్రతమును జెప్పియుండెను. సబీర్‌ భాటియా ఈ వ్రతము నాచరించినందుననే స్క్రీన్‌ సేవర్‌ నుండి ప్రత్యక్షమయిన బిల్‌ గేట్స్‌ హాట్‌ మెయిల్‌ ను తనలో ఐక్యమొందించు కొనెను. పది మిలియన్ల డాలర్ల వరమును భాటియాకొసంగి, డాట్కామ్మాయ నుండి ఆతనిని రక్షించెను. ఆ వ్రత విధమిట్టిది అని చెప్పనారంభించెను.

ఈ వ్రతమును అత్యంత క్లిష్టతరమయిన 3వ క్వార్టర్‌ నందు మీ కంపెనీ రిజల్స్ట్‌ ప్రకటించుటకు ముందురోజున ఆచరించవలెను. దీనికి లింగ, జాతి భేదములు లేక ఎవరైనను ఆచరించవచ్చును. కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, Visual Basic, UNIX, C++, Oracle, SAP, PeopleSoft, DBA, Java ఇత్యాది సర్వ మతస్థులునూ ఈ వ్రతమును ఆచరించ వచ్చును. భక్తులు తమ స్థాయికి తగిన విధముగా పెద్ద సర్వరును గానీ, డెస్క్టాప్ను గానీ, లాప్టాప్ను గానీ, ఫ్రైస్‌ ఎలెక్ట్రానిక్స్‌ వాడు మెయిల్‌ ఇన్‌ రిబేట్‌ ద్వారా వుచితముగానిచ్చు పనికిరాని కంపూటరనబడు డబ్బాను గాని ఇంటికి దెచ్చి తూర్పు ముఖమున ప్రతిష్టించ వలెను.

అంత వరకు జెప్పిన సూత మహాముని, అక్కడితో నాపి ఇట్లనెను. “తదుపరి విధమును పూర్తిగా నారదుండాయువకునికి జెప్పి రక్షించెను. కానీ నేను మీకు మిగిలిన వ్రత విధానమును జెప్పలేను. ఈ విధమును నారదునినుండే విన్న సర్వోత్తమ పటేల్‌ అనునొక గుజరాతీ ప్రోగ్రామరుడు, నారదునికిని నాకూనూ కూడా తెలియకుండా, ఆ ప్రొసీజర్‌ కి అమెరికాలో తన పేర ఓ పేటెంట్‌ సంపాదించెను. వేయి నూట పదహారు డాలర్లను www.dotcommayavratamu.com కు వెళ్ళి రాయల్టీ జెల్లించినచో మీకు ఆ మిగిలిన విధము తెలియ గలదు” అని జెప్పి సూతముని నిష్క్రమించెను.

స్వస్తి!
-------------------------------------------------------
రచన: అక్కిరాజు భట్టిప్రోలు, 
ఈమాట సౌజన్యంతో

Friday, October 25, 2019

గోవిందా! గోవిందా!


గోవిందా! గోవిందా!
సాహితీమిత్రులారా!

“ఏడుకొండల వాడా! వెంకట రమణా! గోవిందా! గోవింద!”

పెద్దగా కేకలు పెడుతూ రోడ్డు మీద ఎవరో మేళ తాళాలతో ఊరేగింపుగా వెడుతున్నారు, జోలి ఎత్తుకుంటున్నారు కాబోలు! అటువంటి పార్టీ వస్తే, ఇంతో అంతో డబ్బును వాళ్ల జోలిలో వెయ్యకుండా ఉండరు సాధారణంగా భక్తులెవరూ. ఎంతటి భాగ్యవంతులైనా సరే ఆపద గడిస్తే చాలనే, ఆపదమొక్కుల వాడి పేరుతో జోలెత్తుకోడానికి ఏమాత్రం మొహమాటపడరు. స్వామి మీద జనానికున్న భయ భక్తులు అటువంటివి మరి!

“గోవిందా! గోవింద!”. జోలెత్తుతున్న భక్తులందరూ కలిసి మళ్ళీ ముక్త కంఠంతో పెద్దగా అరిచారు. ఆ కేకలు గోడలు దాటి వచ్చి వంటగదిలో పని చేసుకుంటున్న జానకి చెవిలో దూరాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి “అపచారం, అపచారం” అంటూ చెంపలమీద టపటపా కొట్టుకుంది, హఠాత్తుగా ఎప్పుడో పెట్టుకున్న మొక్కు గుర్తుకు రావడంతో.

జానకి ఆ మొక్కు పెట్టుకుని ఐదేళ్లకు పైనే అయ్యింది! అప్పుడు అబ్బిగాడు చంటాడు. అకస్మాత్తుగా వాడికి జబ్బుచేసి ప్రాణమ్మీదికి వచ్చినప్పుడు, “స్వామీ! ఆపద మొక్కుల వాడా! బ్రతికి బట్ట కడితే, వీడి పుట్టువెంట్రుకలు నీ సన్నిధిలో తీయిస్తాను” అంటూ జానకి ఆ మొక్కు పెట్టుకుంది. ఇద్దరు ఆడపిల్లల తరువాత అపురూపంగా పుట్టిన అబ్బిగాడు మాట దక్కించాడు. జబ్బు నయమయ్యింది. జానకి మొక్కు ఫలించింది. ఆ తరువాత, ఆ జబ్బు కుదిర్చిన స్పెషలిస్టుకి గడ్డు రోగాల్ని కుదర్చడంలో దిట్ట అనే మంచిపేరు కూడా వచ్చింది. అది వేరే కథలెండి! ఆ తరువాత ఆ మొక్కు మాటే మర్చిపోయింది జానకి. వాడిప్పుడు కాన్వెంట్ స్కూల్లో ఫస్టు స్టాండర్డులో ఉన్నాడు. ఐదో ఏడు రాగానే వాడికి పుట్టువెంట్రుకలన్న హంగామా ఏమీ లేకుండానే, బజారు వీధిలో ఉన్న గాంధీ సెలూన్లో, వాడిని కాన్వెంట్‌లో చేర్పించీ హడావిడిలో, వాళ్ల నాన్న తీసుకెళ్లి అత్యవసర క్షురకర్మ జరిపించేశాడు. అప్పుడు కూడా మొక్కున్న సంగతి భార్యా భర్త లిద్దరిలో ఎవరికీ గుర్తు రాలేదు.

“హమ్మయ్య, ఇప్పుడైనా గుర్తొచ్చింది నయమే” అనుకుంది జానకి. స్వామికి ఆపద మొక్కులూ కొత్తవి కావు, సంపద మరుపులూ కొత్తవి కావు! అప్పు చేసిన వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు చేసిన అప్పును చచ్చినట్లు తీర్చక తప్పదు అన్నది ఆయనకు బాగా తెలుసు. అప్పిచ్చిన వాడికి, అప్పు చేసినవాడు ఆ అప్పును తీర్చడంలో ఎంత ఆలస్యం చేస్తే అంత లాభం! ఎక్కువ వడ్డీ వస్తుంది. ఆయన అప్పు తీర్చుకునే తాపత్రయంలో ఆయనున్నాడు మరి, నిజమైన భక్తులు, కుహనా భక్తులు అన్న వివక్ష మర్చిపోయి అడిగిన వారి కందరికీ అడిగినవీ అడగనివీ వరాలను గుప్పిస్తూ, ఆలస్యం చేస్తే వడ్డీ మీద వడ్డీని గుంజుతూ.

“స్వామీ! నన్ను మన్నించు. మొక్కు విషయం మర్చిపోయి ఇప్పటికే ఒక తప్పు చేశా, మళ్లీ వడ్డీ కాసులు మర్చిపోయి మరో తప్పు చెయ్యను. దయ ఉంచు తండ్రీ” అంటూ మరోమారు చెంపలేసుకుంది జానకి. సీతాపతి ఇంటికి రాగానే తేల్చి చెప్పేసింది తిరపతి కెళ్ళాల్సిందే అని. ఆ రాత్రే యుద్ధ ప్రాతిపదిక మీద నిర్ణయాలు జరిగిపోయాయి. పిల్లలకు దసరా సెలవులు రాగానే తిరుపతి ప్రయాణానికి ముహూర్తం పెట్టేశారు. ఇంక ఆట్టే వ్యవధి లేదు. రేపటినుండే సన్నాహాలు ప్రారంభించేసెయ్యలి అనుకున్నారు ఆ దంపతులిద్దరూ కూడబలుక్కుని.

ప్రయాణం ఇక రెండురోజుల్లో ఉందనగా, దారిలో తినడానికి చిరుతిళ్ళు చేసే సన్నాహంలో పడింది జానకి. అంతలో దొడ్లోంచి ‘అమ్మగోరూ’ అన్న కేక వినిపించడంతో తలెత్తి గుమ్మం వైపు చూసింది. తనవైపే చూస్తూ నిలబడివున్న రత్తాలు కనిపించింది.

“ఏమిటి రత్తాలూ, ఏం కావాలి” అని అడిగింది జానకి.

“ఏం నేదండి అమ్మగోరూ! దినామూ మా మావతొ ఏగలేకపోతుండానమ్మా” అంటూ ఒక కాగితపు పొట్లం అందించింది రత్తాలు.

“ఇది సోమోరి డబ్బు. ఆడికి తాగుడుకి డబ్బు సాలనప్పుడల్లా ఈ డబ్బు లాక్కోవాలని సూత్తాడు. ఇది జోలడుక్కున్న డబ్బు, సోమోరి సొమ్ము ఏరెవోటికి వోడుకోడం అపశారం కదమ్మా. ఈ డబ్బు మీరట్టుకెల్లి ఉండీలో ఏస్తిరా సచ్చి మీ కడుపున పుడతా! దయుంచండమ్మా”

“సర్లే. దానికేముంది, అలాగే. అసలు మొక్కు ఎందుకుపెట్టుకున్నావే”, కుతూహలంగా అడిగింది జానకి.

“సెప్పుకోడానికి సిగ్గైతాదమ్మా, ఏం సెప్పుకోను! వరాసకీ నాకు ఆడపిల్లలే పుడ్తండారని ‘ఈ పాలీ మల్లీ ఆడకూతుర్నే కన్నేవా నిన్ను ఒగ్గెయ్యడం క్కాయం’ అంటూ నిక్కచ్చిగా చెప్పేసిండు నా పెనిమిటి. సామికి మొక్కుకుంటే పుట్టినోడే మా ఏడుకొండలసామి! ఆసామి పేరే ఎట్టినా ఆడికి. ఆ తరువోత మొక్కు తీర్సాలని ఓపాలి జోలెత్తిన గని రైలు కర్సులకు కూడా రాలే. మరో పాలి జొలెత్తితే సరిపోద్దని దాన్ని దాసిన. కాని మా మావ నన్ను బతకనిచ్చీలాలేడు” అంటూ దణ్ణం పెట్టింది రత్తాలు.

రత్తాలే కాదు, ఇంకా చాలామంది ఇరుగుపొరుగు వాళ్లు, ఎరుగున్నవాళ్లు ఎంతమందో వచ్చి, తమపేరు చెప్పి స్వామికి సమర్పించమంటూ ఏవేవో ముడుపులు తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు. స్వామి కార్యాన్ని తమ కార్యంగా భావించి, సీతాపతి వాటిని జాగ్రత్తగా కాగితంలో పొట్లం కట్టి, ఎప్పటికప్పుడు ఆ ఇచ్చినవారి పేరు దానిమీద రాసి ఒక పెట్టెలో పెట్టేవాడు. ప్రయాణం రేపటికి వచ్చేసింది. ఈ రోజు తొందరగా పడుకుంటే రేపు తొందరగా లేచి ప్రయణ సన్నాహాలు చేసుకోవచ్చని, ఎనిమిది గంటలకే పడుకునే యత్నంలో పడ్డారు వాళ్లు. అంతలో వీధి గుమ్మం తలుపు తట్టారు ఎవరో. పడుకోబోతున్నదల్లా లేచి వెళ్లి తలుపు తెరిచింది జానకి. శాంత వచ్చింది లోపలికి.

శాంత, సీతాపతి పెద్దమ్మకి చిన్న కూతురు. వాళ్లూ ఆ ఊళ్లోనే కొంచెం దూరంలో ఉంటారు. శాంత భర్త కాలేజి ప్రొఫెసర్. ఒక మైలు దూరంలో ఉంటుంది వాళ్ల ఇల్లు. చీకటి వేళ శాంత ఇలా వచ్చిందేమిటా అని ఆశ్చర్యపోయారు సీతాపతి, జానకి కూడా.

“వదినా! రాజుకి ఒళ్లు తెలియని జ్వరం. మూసిన కన్ను తెరవకుండా మంచానపడి ఉన్నాడు. ఇందాకా అన్నయ్య ఫోనుచేసి మీరు తిరుపతి వెడుతున్నాట్లు చెప్పగానే, ఎవరో నా చెంపమీద ఛెళ్లున కొట్టి, గుర్తుచేసినట్లుగా జ్ఞాపకం వచ్చిందంటే నమ్ము! రాజుకి కాన్వెంటులో సీటు వస్తే తిరుపతి వచ్చి, హుండీలో ఐదు వందలు వేస్తానని మొక్కుకున్నా. సీటు వచ్చింది. ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చనేలేదు, ఏంచెప్పమంటావు వదినా! ఇలాంటివి అసలు పట్టనే పట్టవు ఆయనకు. వట్టి చార్వాక మతమనుకో! ఇన్నాళ్లిల్లాగా జాప్యం చేస్తే స్వామికి కోపం వచ్చిందన్నా ఆశ్చర్యం లేదు. రాజుకి అంత జ్వరం వచ్చిందా, ఐనా ఆయనకేం చీమ కుట్టినట్లు కూడా లేదు. నాదగ్గర ఐదొందలుంటే తెచ్చా. వీటిని హుండీలో మా రాజు గాడి పేరు చెప్పి వేసి, స్వామిని మా అపరాధం మన్నించమని మా తరఫున కోరండి వదినా, మీకు పుణ్యముంటుంది” అంది శాంత గుక్కతిప్పుకోకుండా. చాలా ఆదుర్దా పడుతోంది ఆమె అపరాధ భావంతో.

“స్వామి వడ్డికాసులవాడు కదా వదినా. మొక్కు తీరిస్తే సరిపోదు, పైన ఇంకా కొంచెం డబ్బు అదనంగా వెయ్యాలి. లేకపోతే చెల్లు రాసుకోడుట స్వామి, తెలుసా?”

“అలాగా వదినా! ఐనా ప్రస్తుతం నా దగ్గర ఇంకేమీ లేదు. ఆయనని అడిగినా లాభంలేదు. దేవుడికోసం అంటే ఆయన అసలు ఇవ్వరు. అదో వితండం” అంటూ నిట్టూర్చి, సీతాపతి వైపు తిరిగి, “అన్నయ్యా! నువ్వే ఒక వంద సద్దుబాటు చెయ్యి. తరవాత నీకు ఇచ్చేస్తాను” అంటూ తన దగ్గరున్న ఐదువందలూ జానకి చేతిలో పెట్టి, తన మొక్కు తీర్చేభారం వాళ్ల మీద ఉంచి, సెలవు తీసుకుని వెళ్లిపోయింది శాంత.

మర్నాడు తొందరగా తెమిలి భోజనాలు చేసేశారు. ఇరుగుపొరుగుల కందరికీ వీడ్కోలు చెప్పి, మొక్కుబళ్లు మొత్తం ఉంచిన పెట్టె పట్టుకుని వచ్చి టాక్సీ ఎక్కింది జానకి. పిల్లలు రైలెక్కబోతున్న సంతోషంతో కేరింతలు కొట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేషన్‌లో తిరుమలా ఎక్సుప్రెస్‌ ఎక్కింది సీతాపతి కుటుంబం. వీళ్లు ఎక్కి కూర్చున్న కాసేపటికే రైలు కదిలింది. కంపార్టుమెంటులో ఉన్న అమాంబాపతు తుప్పతలల భక్త జనం యావన్మందీ ముక్త కంఠంతో “గోవిందా గోవింద” అంటూ ఏకగ్రీవంగా పెద్దగా కేక పెట్టారు. కిటికీ వార కూర్చుని ఏదో పుస్తకం శ్రద్ధగా చదువుకుంటున్న యువకుడు, చిరాకుగా మొహం చిట్లించుకున్నాడు.

మొక్కు పెట్టుకుని జుట్టూ గడ్డం విపరీతంగా పెంచేసి ఉన్న ఒక భక్తుడు అది చూసి ఉడుక్కున్నాడు. “ఇదిగో అబ్బాయా! ఈ బండి ఎందుకెక్కావు, ఇది భక్తుల బండని తెలీదా” అన్నాడు కోపంగా.

ఆ అబ్బాయికి కూడా కోపం వచ్చింది. “వెళ్లాల్సింది తిరుపతి ఐనప్పుడు, ఈ బండి కాక ఏ బండి ఎక్కాలి? ఎంత భక్తి ఉంటే మాత్రం అంత గట్టిగా అరవాలా, ఆ అదురుకు రైలు పట్టాలు తప్పకుండా ఉన్నందుకు సంతోషించాలి” అన్నాడు కసిగా.

అక్కడున్న వాళ్లలో ఒక పెద్దాయన టప టపా లెంపలేసుకున్నాడు. “అపచారం నాయనా, అపచారం! అలా ఎప్పటికీ జరగదు. స్వామి ఆపద్బాంధవుడు. నమ్మిన భక్తులను దగా చెయ్యడు. ఇక్కడున్న వారిని ఎవరినైనా అడుగు, స్వామి కృప వల్ల కొండల్లాంటి ఆపదలు మంచులా ఎలా విడిపోయాయో చెప్పి, నీ కళ్లు తెరిపిస్తారు.”

“నా కళ్లు తెరిచేఉన్నాయి. ఎవరూ తెరిపించవలసిన పనిలేదు. మీరే తెలుసుకోవాలి. ఏ పనైనా జరగడం జరక్కపోవడం అన్నవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సుతో ఉంటాయి. మీరంతా మొక్కులు చెల్లించుకోడానికి బయలుదేరారంటే, మీ కోరికలు తీరాయనే కదా అర్ధం! తక్కిన సగం మందీ కోర్కెలు తీరక నిరాశతో ఇళ్లల్లోనే ఉండిపోయి ఉంటారు. అలాంటి కుటుంబాల్లో మాదీ ఒకటి. మా అమ్మ పెట్టుకున్న ఏమొక్కూ కూడా మా నాన్నని కేన్సర్ బారినుండి రక్షించలేకపోయింది. అందుకే నాకు ఈ మొక్కులన్నా మొలతాళ్లన్నా నమ్మకం పోయింది”.

“తప్పు బాబూ! అలా మాట్లాడకూడదు. ఒక్కొక్కప్పుడు మన కర్మానుభవం ఎక్కువ పట్టుతో ఉండి, దైవకృపకు అడ్డం నిలుస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా, చేసిన పాపాలు ఊరికే పోవు. జన్మ జన్మలా కట్టి కుడుపకుండా వదలవు. అందుకే, ఏ కష్టం వచ్చినా, మనవాళ్లు ‘ఇది ఏనాడు చేసుకున్న పాప ఫలమో’ అంటారు! సరిగా అర్ధం చేసుకో బాబూ” అంది ఆ కంపార్టుమెంట్‌లో ఉన్న ఒక ఇల్లాలు అతని మాటలకు రవంత బాధపడిపోతూ.

“బాగానే ఉంది మీరు చెప్పేది వినడానికి. ఇలాగే పరస్పర విరుద్ధంగా ఏవేవో చెప్పి చివరకు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామేమో ఆలోచించండి. మనల్ని సృష్టించింది దేవుడు కాదు, మనమే దేవుణ్ణి సృష్టించాం అనిపిస్తుంది. తనకున్న మంచిచెడ్డలన్నీ ఆయనకీ ఆపాదించి, ఒక రూపాన్ని కల్పించి, కథలల్లి ప్రచారం చేస్తున్నాడు మనిషి. మనం దేవునికే ఉపచారాలంటూ చంచాగిరీ చేస్తూ, ముడుపులు పేరుతో లంచమిచ్చి పనులు చేయించుకోవాలని చూస్తున్నామంటే, ఇక మన దేశంలో కరప్షన్ మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లక ఏమౌతుందిట” ఆమెకు వెంటనే జవాబు చెప్పాడు ఆ అబ్బాయి ఉద్వేగంతో.

ఆ కంపార్టుమెంట్‌లో హాహాకారాలు చెలరేగాయి . అందరూ తలోమాటా మాట్లాడసాగారు. కొందరికి చాలా కోపం వచ్చి అతని వైపు కొర కొరా చూశారు. ఇంకా మాట్లాడితే, ఇక తన ఆబోరు దక్కదు అనిపించిందేమో, వెంటనే లేచి పై బెర్తు మీదికి ఎక్కి గొణుక్కుంటూ వెనక్కి తిరిగి పడుకున్నాడు ఆ కుర్రాడు. ఒక్కసారిగా భక్తులందరూ విజయోత్సాహంతో గొంతెత్తి గట్టిగా ‘గోవింద’ కొట్టారు. చాలా సేపటివరకు ఆ గోవిందుల కలకలం అలా సాగుతూనే ఉంది.

రాత్రంతా ప్రయాణం చేసి, తెల్లవారేసరికి గూడూరులో ఆగింది రైలు. మళ్ళీ బయలుదేరబోతుండగా, అప్పుడే ఫ్లాట్ఫారం మీదకి వచ్చిన ఒక కుటుంబం, కదుల్తున్న రైలు బండిని అందుకుని పెట్టెలో ఎక్కబోయారు. ఆడమనిషి ఒక చేత్తో పెట్టె మరొక చేత్తో ఒక కర్ర పట్టుకుంది. వాళ్ల కొడుకు కాబోలు, ఆమె భర్త పదేళ్ల కుర్రాడిని చంకనెత్తుకుని ఉన్నాడు. మొత్తానికి ఎలాగైతేనేం వాళ్లు పెట్టెలో ఉన్న ప్రయాణీకుల సాయంతో లోపలకు రాగలిగారు. ఆమె పెట్టె దించి ఉస్సురని నిట్టూర్చింది. అతడు పిల్లాడిని కిందకు దించగానే వాళ్ల అమ్మ కర్ర అందించింది. ఆ కర్ర ఆసరాతో నిలబడ్డాడు ఆ పిల్లాడు. రైలుపెట్టె తిరుపతి ప్రయాణీకులతో కిట కిటలాడుతోంది, ఎక్కడా కూర్చునే చోటు లేదు. ఒక పుణ్యాత్ముడు లేచి ఆ అబ్బాయికి చోటిచ్చాడు.

దగ్గరలోనే కూర్చుని ఉన్న జానకి ఆమెను, “మీరూ తిరుపతేనా? మొక్కుందా” అని పలకరించింది. ఆమె ఏమీ మాట్లాడకుండా భర్త వైపు చూసింది.

“లేదమ్మా! మా కష్టాలు మొక్కులతో తీరేవి కాదమ్మా. మాకు వీడొక్కడే బిడ్డ. మా అదృష్టం బాగోక వీడికి పోలియో వచ్చింది. కాలు ఔడు, నాలా కాయకష్టం చేసి బ్రతకలేడు, చదువు చెప్పిస్తే ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాడనే ఆశతో బడిలో వేశా. డబ్బు బోలెడు కట్టాల్సి ఉంది. మా నాయన సాయం చేస్తాడేమో అడగడం కోసం మా ఊరు వెడుతున్నాం. తిరపతిలో దిగి బస్సుమీద వెళ్లాలి” అన్నాడతను.

అతని మాటలు అక్కడున్న వాళ్ల మనసుల్ని కదిలించాయి. పెదవి విరుస్తూ అందరూ తలలడ్డంగా వూపారు. లాభసాటి వ్యాపారంగా మారిపోయిన విద్యారంగాన్ని దుయ్యబట్టి, భావిభారత పౌరుల్ని తీర్చి దిద్దవలసిన విద్యాలయాలకు పట్టిన దుర్గతిని గురించి, పట్టని ప్రభుత్వం గురించి తలోమాటగా వాపోయారు. ఈ చర్చతో కాలం తెలియకుండా గడిచిపోయింది. రైలు తిరుపతిని సమీపించింది. తిరుమల దర్శనం కాగానే భక్తులు ఇంకోసారి “గోవిందా! గోవింద!” అంటూ దైవ నామ స్మరణ చేసి నెమ్మదిగా దిగే సన్నాహంలో సామాను సద్దుకోడం మొదలుపెట్టారు.

ప్రయాణం ఒక కొలిక్కి వచ్చినందుకు ‘అమ్మయ్య’ అనుకున్నారు జానకీ సీతాపతులు. జనం లేచి గుమ్మం దగ్గరకి చేరుకోడం మొదలుపెట్టారు. కిటికీ పక్క సీట్లు ఖాళీ కాగానే అక్కడ చేరిపోయారు పిల్లలు. సీతాపతి బెర్తు కిందనున్న పెట్టెలు బయటికి లాగాడు. జానకి సామాను లెక్క పెట్టింది. ఒకటి తక్కువ కావడంతో మళ్లీ మళ్లీ లెక్కేసింది.

“ఏమండీ మొక్కుబళ్లు ఉంచిన పెట్టె ఏదండీ” అని అరిచింది, ఆర్తనాదం లాంటి కంఠస్వరంతో.

సీతాపతి కంగారుగా పైనాకిందా వెతికాడు. కాని అది ఎక్కడా కనిపించలేదు. నిర్ఘాంతపోయారు ఇద్దరూ. భయం భయంగా చూశాడు భార్య వైపు సీతాపతి.

“దాన్ని ఆ మూలకంతా పెట్టా కదే! ఏమైపోయిందే” అని బుర్ర గోక్కున్నాడు.

“బాగానే ఉంది వరస! నన్నడుగుతారేమిటి? నా కెల్లా తెలుస్తుంది” అంటూ ఎదురడిగింది జానకి.

బిక్కమొహం పెట్టాడు సీతాపతి. రైలు దిగే జనం, కంగారుపడుతున్న ఆ దంపతులవైపు ఒక్కక్షణం సానుభూతితో చూసి తమ దారిన తాము వెళ్లిపోసాగారు. సీతాపతి పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు.

“ఏమండీ, పోనీ పోలీసులకు రిపోర్టు ఇద్దామా?”

“పోలీసులకా? అలా చేస్తే వాళ్లు కేసు, గీసు అంటూ మనల్ని ఇక్కడే కట్టి పడేయ్యగలరు. అంతేకాదు, “ఆ పెట్టెలో ఏమున్నాయి” అని అడుగుతారు. కరెక్టుగా చెప్పాలి మనం. పిసరంత తేడా కూడా రాకూడదు, ఏమనుకుంటున్నావో!” సీతాపతి కంగారుపడ్డాడు.

“అమ్మో! అవన్నీ మనo ఇప్పి చూస్తే కదా చెప్పేందుకు! ఇచ్చినవి ఇచ్చినట్లుగా పొట్లాలు కట్టి పెట్టేశాం, ఇప్పుడెల్లాగ?”

“అదే నాకూ తెలియడం లేదు. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చిందిట… అలాగుంది మన పని”

“అయ్యో, అలా దిగులు పడకండీ. నేను చెప్పేదొకసారన్నా విని అర్ధం చేసుకోండి. దేవుడి సొమ్మది, ఆయనే దాన్ని తీసుకెళ్లిపోయాడనుకుని నోరు మూసుకుందాం” అంది జానకి తుని తగవుగా.

“నేను కాంపుకి పట్టుకెళ్లే వి.ఐ.పి. సూట్కేసు కదే పోయింది! చూస్తే, పోయీ భూతం చెట్టు కొమ్మనుకూడా పట్టుకుపోయింది అన్నట్లుగా ఉంది, అయ్యో!” అన్నాడు సీతాపతి ఇంకా దిగులుగానే .

ఫ్లాట్ఫారం మీద తిరుగుతున్న భక్తులు కొందరు అకస్మాత్తుగా “గోవిందా! గోవింద!” అంటూ ముక్త కంఠంతో ఓ పొలికేక పెట్టారు. ఉలిక్కిపడ్డట్లై ప్రస్తుతానికి వచ్చారు భార్యా భర్తలు.పిల్లల్ని లేవగొట్టే ప్రయత్నంలో పడింది జానకి. సామాను తీసుకుని గుమ్మం దగ్గరికి నడిచాడు సీతాపతి. రష్ తగ్గాక రైలు దిగొచ్చు లెమ్మని వేచి ఉన్న పోలియో వచ్చిన అబ్బాయి, అతని తల్లితండ్రులూ అప్పుడే దిగుతున్నారు. వాళ్లని చూడగానే సీతాపతి మనసులోకి ఒక ఆలోచన వచ్చి, ముల్లులా కుట్టింది.

” ఆ పెట్టెలో డబ్బు ఈ అబ్బాయికి ఇచ్చినా సద్వినియోగమై ఉండేది కదా! కాని, భవిష్యత్తు ఏమిటో తెలియని తప్పు నాది కాదు, ఆ దేవదేవుడిదే! గోవిందా! గోవింద!” అనుకున్నాడు మనసులో.

టాక్సీ బేరం చేసుకుని కొండ పైకి వెళ్ళి, ముందే బుక్‌చేసి ఉంచుకున్న కాటేజ్ చేరుకున్నారు సీతాపతి, కుటుంబం. ఆ రోజు స్వామి వారికి ప్రియమైన శనివారం కావడంతో, కల్యాణ కట్టకు వెళ్లి మొక్కు తీర్చుకోవాలనీ, అప్పటికప్పుడే దైవ దర్శనం చేసుకోవాలని పట్టుపట్టింది జానకి. వెంటనే వాళ్లు స్నానాలు చేసి తయారైపోయారు. అదృష్టం బాగుండి, కల్యాణకట్ట దగ్గర పని తొoదరగానే జరిగిపోయింది. పిల్లవాడికి జుట్టు తీయించడంతోపాటుగా, మొక్కు తీర్చడంలో జరిగిన జాప్యానికి వచ్చిన అపరాధ భావంతో సీతాపతి కూడా తన తలనీలాలు ఇచ్చాడు. జానకీ, కూతురూ తలో మూడు కత్తెరలూ ఇచ్చి తమ భక్తిని నిరూపించుకున్నారు. కాటేజ్‌కి తిరిగి వచ్చి మళ్లీ స్నానాలు కానిచ్చి, ముస్తాబై వెళ్లి దైవ దర్శనం చేసుకోడం కోసం క్యూలో నిలబడ్డారు.

అది మంచిరోజు కావడంతో క్యూ చాలా పొడుగ్గా ఉంది. ఆ వరసలో వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. రాత్రంతా ప్రయాణం చేసి ఉన్నారేమో, పిల్లలు బడలికతో వాడిన తోటకూర కాడల్లా వేల్లాడిపోసాగారు. ఇలా కాదని దర్శనానికి దగ్గర దారులు వెతికాడు సీతాపతి. తలకొక వంద చొప్పున ఇచ్చి, దగ్గర దారి టిక్కెట్లు కొన్నాడు. దాంతో తొందరగానే గర్భ గుడి దగ్గరికొచ్చారు. సింహద్వారానికి మొక్కి గడప దాటి, ప్రవహిస్తున్న నీళ్లలో నడిచి వెళ్లే సరికి కృతక ఓంకార నాదం వినిపించసాగింది. అక్కడనుండి తొందరగా నడవమని భక్తులకు హెచ్చరికలు చెపుతూ తోసేస్తూ వుండే వాలంటీర్ల సంఖ్య కూడా పెరిగింది.అక్కడికి చేరిన యాత్రీకుల హృదయాలు భక్తి భావంతో బరువెక్కి ఉండడంతో ఎవరెంత హెచ్చరించినా, గర్భవతుల్లా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తోపుళ్ళను ఓపుకుంటూ కదులుతున్నారు.

చివరికెలాగో జానకి సీతాపతులు పిల్లలతో స్వామి దగ్గరకి చేరుకున్నారు. ఎదుట నున్న వాళ్ల తలల పైనుండి, కనీ కనిపించకుండా వున్నాడు ఆ దేవదేవుడు. సీతాపతికి గాలి స్థంభించి పోయినట్లనిపించింది. ఓంకారమే జగత్తు మొత్తం నిండిపోయి ఉన్నట్లు తోచింది. స్వామిని ఎదురుగా కళ్లారా చూడాలని తహతహలాడాడు. అక్కడున్న వారందరి పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. ఇది అది అని చెప్పలేని ఏదో ఉత్సుకతతో జనం ముందు ముందుకి జరిగి స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు. స్వామికి ఎదురుగా వచ్చిన సీతాపతి కళ్లు పైకి లేపి నిండుగా అలంకరించబడి ఉన్న ఆ దివ్యరూపాన్ని కళ్లారా చూడాలని ప్రయత్నించాడు. అంతలోనే వాలంటీర్లు జబ్బపట్టుకు అతన్ని పక్కకి నెట్టేశారు, వెనకాలే జానకిని కూడా. వెనకవాళ్లు ముందుకు వచ్చేశారు. ముందు వాళ్లు ముందుకి కదలక తప్పలేదు. ఉసూరుమన్నారు సీతాపతి, జానకీ. దీనికోసమేనా ఇంత దూరం వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చింది, అనిపించింది వాళ్లకి. కాని అంతలోనే వాళ్లు హుండీ ఉన్న చోటుకి వచ్చేశారు. అక్కడితో, వాళ్ల ఆలోచనల దారి మారింది.

వాళ్ల తరఫున మొక్కుల్ని హుండీలో వెయ్యమంటూ, తమమీద నమ్మకం ఉంచి అప్పగించిన స్నేహితులూ, ఇరుగుపొరుగువారూ గుర్తు వచ్చి, జానకీ సీతాపతులకు గుండెలు బరువెక్కాయి. వాళ్లందర్నీ పేరు పేరునా తలుచుకున్నారు మనసులో. తమకు తోచిందేదో హుండీలో అందరి పేరు మీదా వేసి అక్కణ్ణుంచి కదిలారు. కొంచెం అటుపైగా దేవస్థానం వారు తలో కాస్తా ప్రసాదం చేతిలో ఉంచారు. అక్కడే ఉన్న అరుగుమీద విశ్రాంతిగా కాసేపు కూర్చుని, ఆ ప్రసాదం నోట్లో వేసుకోడంతో వాళ్లకు మొక్కు చెల్లించిన తృప్తి కల్గింది. కాళ్ళసందుల్లోంచి దేవుణ్ణి చూశాగా! అన్నాడు అబ్బిగాడు. వాడి బోడిగుండు తడిమి ఆ చెయ్యి ముద్దు పెట్టుకున్నారు ఆ తల్లీ, తండ్రీ. మొక్కు తీర్చుకున్న సంతోషం వారి మనసుల్లో నిండిపోయింది.

ఆ తరువాత లడ్డూల వేట మొదలయ్యింది. దేవస్థానం వాళ్ల షాపు దగ్గర పెద్ద క్యూ ఉంది. చచ్చిచెడి ఆ క్యూలో పడి వెడితే, డబ్బు తీసుకుని తలకొక లడ్డూ అంటూ లెక్కపెట్టి మరీ ఇచ్చారు వాళ్లు. ఇంక ఎంత బ్రతిమాలినా, ససేమిరా ఇవ్వడం కుదరదు పొమ్మన్నారు. ఆ లడ్డూల్ని చూసి బిత్తరపోయాడు సీతాపతి. లడ్డూ ఉరవ చూస్తే, తమ పెళ్లైన కొత్తలో దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఇచ్చిన లడ్డూలో సగం కూడా లేదు ఇప్పటి లడ్డూ.

“ఇంత చిన్నవేమిటి! ఈ నాలుగూ ఏమూలకీ రావు. మనకి మొక్కులందించిన వాళ్లకి మనం ప్రసాదమైనా ఇవ్వాలా వద్దా! బ్లాకులో కొనాలి, తప్పదు” అంది జానకి. వెర్రి మొహం పెట్టుకు భార్య వైపు అదోలా చూశాడు సీతాపతి. దాన్ని అపార్ధం చేసుకున్న జానకి రుస రుస లాడింది.

“మీరు మరీనండీ! జరిగిందేదో జరిగిపోయింది. దానికి మనమేం చెయ్యగలం? కనీసం మనం వాళ్లకి కొంచెం ప్రసాదాలైనా ఇస్తే బాగుంటుంది కదా. ఇక్కడ పీనాసితనం చేయకండి. ఔనంటారా, కాదంటారా, చెప్పండి” అంది.

“అదికాదే బాబూ! దేవుడి ప్రసాదం బ్లాకులో అమ్మడమా! అలాగైతే అది ప్రసాదం ఎలాగౌతుందీ అని ఆలోచిస్తున్నా, అంతే. కొంటాలే” అన్నాడు సీతాపతి ఇంకా అదోలానే.

వాళ్లు బయటికి వచ్చేసరికి కొందరు, సినిమాహాళ్ళ దగ్గర బ్లాకులో టిక్కెట్లు అమ్మేవాళ్లల్లా చుట్టుముట్టి, “లడ్డూ కావాలా, లడ్డూ కావాలా” అంటూ వీళ్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. జానకి అరడజను కావాలంది. కాని సీతాపతి, పది లడ్డూలకు ఆర్డర్ చేశాడు.

వెంటనే జానకి “నేను ఆరంటే మీరు పదంటారేం” అంది.

“నీ తస్సాదియ్య, ఆగవే బాబూ! అవంటే నాకు చచ్చేటంత ఇష్టం. ఈ తిరుపతి లడ్డూకున్న రుచి మరే లడ్డూకీ రాదు. నీకిష్టం లేకపోతే మానెయ్. నేనూ పిల్లలూ నాల్గునాళ్లు దాచుకు తింటాం. ఈ ఫారమ్లాయే వేరు. ఇలా ఇల్కెవలూ చెయ్యలేలు” అన్నాడు సీతాపతి నోరూరుతూండగా.

జానకి నవ్వింది. ఆ రాత్రికి కాటేజీలో ఉండి, తిరుమల అంతా తిరిగారు. అక్కడే కావలసినవన్నీ కొనుక్కుని , తిరుగు ప్రయాణమై కుటుంబమంతా మరునాటికల్లా ఇంటికి తిరిగి వచ్చేశారు.

వీళ్లు యాత్ర ముగించుకుని తిరిగి వచ్చినట్లు ఎలా కబురందిందో ఏమో, ఒక్కొక్కళ్లూ వచ్చి, పలుకరించి, కుశల ప్రశ్నలడిగి వెళ్లడం మొదలుపెట్టారు. అందరిదీ మొదటి ప్రశ్న దర్శనం బాగా అయిందా అనే. సమాధానం అయింది అనే. తిరుమల కబుర్లు చెప్పి, కొంచెం లడ్డూ ముక్క, స్వామివారి చిన్న పటం, యాత్రా తోరం ఇచ్చి చిరునవ్వుతో అందర్నీ సాగనంపింది జానకి.

సాయంకాలం శాంత వచ్చింది. వస్తూనే, జానకిని కౌగిలించుకుని, “వొదినా, నీ మేలు ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. ఆవేళ నీ చేతికి మొక్కుకున్న డబ్బు ఇచ్చి, స్వామివారి హుండీలో వెయ్యమని చెప్పి వెళ్లానా, నేను ఇల్లు చేరే సరికి రాజు దోరాటం తగ్గి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. కాసేపట్లో కళ్లు తెరిచి, “అమ్మా దాహం” అని అడిగి గ్లాసుడు నీళ్లు తాగి పడుకున్నాడు. అంతా ఆ ఏడుకొండలవాడి దయ. మీ అన్నయ్యగారు సరేలే, ‘నువ్వటెళ్ళావో లేదో, డాక్టర్ ప్రసాద్ వచ్చి ఇంజక్షన్ చేసి, మందులు రాసి ఇచ్చి వెళ్లాడు. అరగంటలో గుణం కనిపిస్తుందని చెప్పాడ్లే. అది ఆయన దయ’ అన్నారు. ఎడ్డెమంటే తెడ్డెం! నువ్వు చెప్పు వదినా! మందు అంత తొందరగా గుణమిచ్చిందంటే, అది స్వామి మహిమ కాక మరేమిటిట! మీరు వడ్డి కాసుల కోసం ఇచ్చిన వందా ఇదిగో” గుక్కతిప్పుకోకుండా అంటూ శాంత ఒక వంద కాగితాన్ని తీసి జానకివైపుగా చెయ్యిచాపి అందించింది.

ఆ నోటు తీసుకోవాలో, వద్దనాలో తెలియక వెర్రిమొహం వేసుకుని భర్త వైపు చూసింది జానకి. ఏమని చెప్పాలో అర్ధం కాక తెల్లమొహం పెట్టుకుని గోడనున్న వెంకటేశ్వరస్వామి పటం వైపు చూశాడు సీతాపతి.

శాంత చేతిలోని వంద రూపాయల నోటు ఫానుగాలికి నవ్వినట్లుగా రెపరెపలాడింది.
-----------------------------------------------------
రచన: హేమ వెంపటి, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, October 23, 2019

జన్మదిన రాహిత్యం


జన్మదిన రాహిత్యం

సాహితీమిత్రులారా!

నాకు పుట్టినరోజులన్నా, పెళ్ళిరోజులన్నా వళ్ళు మంట! సంవత్సరాలు లెక్క పెట్టుకోవడానికి తప్ప అవెందుకూ పనికిరావని నా గాఢ విశ్వాసం. ఈ రోజుల పేరిట జనాలు జరుపుకునే సెలబ్రేషన్సు నాకు చాలా ఇరిటేషన్‌ కలిగిస్తూ వుండేవి.

కానీ పుట్టినప్పటి నించీ చుట్టూ వున్న వాతావరణం వల్ల నేను కూడా ఈ పుట్టినరోజుల, పెళ్ళి రోజుల సంస్కృతిలోనే పెరిగాను. చిన్నప్పుడు నా పుట్టినరోజు వొచ్చినప్పుడల్లా మా అమ్మ పరమాన్నం వండేది. ఎప్పుడన్నా కొత్త బట్టలు కుట్టించేది. పెళ్ళయిన యేడాదికి పెళ్ళిరోజంటూ ఫ్రెండ్సందరినీ పిలిచి పార్టీ చెయ్యడం, అందరూ వచ్చి గిఫ్ట్‌లు ఇవ్వడం కూడా జరిగాయి. నేనూ ఎగురుకుంటూ పిలిచిన వాళ్ళందరి ఇళ్ళకీ గిఫ్ట్‌లు తీసుకుని వెళుతూ వుండే వాడిని కూడా.

ఒకసారి మా కొలీగ్‌ కుమార్‌, వాళ్ళమ్మాయి మొదటి యేడాది పుట్టినరోజుకి వాళ్ళింటికి పార్టీకి పిల్చాడు. నన్నే కాకుండా మా కంపెనీలో ఇంకా కొంతమందిని పిలిచాడు.

వాళ్ళలో ఒకరికి కొత్త అయిడియా వచ్చింది. ఆయన నా దగ్గరకి వచ్చి, “అందరూ తలో పదో, ఇరవయ్యో పెట్టి ఏదో చిన్న గిఫ్ట్‌ కొనే బదులు, అందరం డబ్బు పోగు చేస్తే, ఏదన్నా పెద్ద వస్తువు కొనివ్వచ్చు కుమార్‌ వాళ్ళమ్మాయికి. ఏమంటారూ?” అని అడిగాడు.

నాకు, ఈ అయిడియా నచ్చింది. వెంటనే ఆయనకి ఇరవై రూపాయలిచ్చేశాను. ఆయన మిగిలిన వారందరి దగ్గర నించీ కూడా ఇలాగే పోగుచేసి, ఏదో పెద్ద గిఫ్ట్‌ కొన్నాడు. పార్టీకి రాలేమన్న వాళ్ళు కూడా కొంతమంది గిఫ్ట్‌కని డబ్బులిచ్చారు. వాళ్ళకి వేరే పనులుండటం చేత రామన్నారు.

ఆ రోజు సాయంత్రం ఆఫీసు అవగానే అక్కడ నించీ బయలుదేరాను కుమార్‌ వాళ్ళింటికి మా కొలీగ్‌ మురళితో కలిసి. గేటు దగ్గ ఇంకో కొలీగ్‌ గోపాల్‌ కలిశాడు.

“మా ఆవిడ వూళ్ళో లేదు. నేను ఒక్కడినే వస్తున్నాను” అన్నాడు గోపాల్‌.
“మా ఆవిడా వూళ్ళో లేదు. మీ సంగతేమిటీ?” అని అడిగాను మురళిని.
“ఆవిడకి ఆఫీసులో ఏదో మీటింగు వుంది. రావడం కుదరదని ఫోను చేసింది” అని చెప్పాడు మురళి.
“అయితే మనం ముగ్గురం కలిసి ఆటోలో వెళ్దామా?” అన్నాను.

వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. మురళి ఆటో పిలిచాడు. దారిలో, “మన ఆఫీసు వాళ్ళందరం కలిసి ఒక గిఫ్ట్‌ ఇస్తున్నాము కదా? మనం విడి విడిగా కూడా ఏదన్నా గిఫ్ట్‌ ఇవ్వాలా?” అని అడిగాను సందేహంగా.

“అక్కర్లేదండీ! ఒక్కొక్కరూ ఎన్ని గిఫ్ట్‌లని ఇస్తాం?” అన్నాడు మురళి.
“అవును” అంటూ తలూపాడు గోపాల్‌.

మేము కుమార్‌ వాళ్ళింటికి చేరుకున్న కాస్సేపటికి నిద్రపోతూ వున్న వాళ్ళమ్మాయిని లేపి హాల్లోకి తీసుకువచ్చారు. వెంటనే గోపాల్‌ మాయల ఫకీరులాగా తన భుజానికున్న బేగ్‌ లోంచీ ఏదో గిఫ్ట్‌ పేకెట్‌ తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు, “హేపీ బర్త్‌ డే” అంటూ.

నేనూ, మురళీ ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. నాకైతే వళ్ళు మండిపోయింది. అక్కడే గోపాల్‌ని దులిపేద్దామనుకున్నాను గానీ, మరళి నన్ను వారించాడు.

ఈ లోపల మా ఆఫీసులోని ఇంకొకాయన ఒక పెద్ద గిఫ్ట్‌ బాక్సు, పుట్టినరోజు పిల్ల పక్కనే పెట్టి, “హేపీ బర్త్‌ డే టూ యూ” అంటూ ఒక పెద్ద కేక పెట్టాడు. ఆ యేడాది పిల్లా ఒక్కసారిగా దడుచుకుంది. వెం టనే యేడుపు మొదలు పెట్టింది. అసలే నిద్దట్లో లేచిన పిల్ల! తల్లీ, తండ్రీ పిల్లని సముదాయించడం మొదలుపెట్టారు. మా ఆఫీసు వాళ్ళిచ్చిన గిఫ్ట్‌ని పరికించి చూశాను. ఆ పెద్ద బాక్సు మీద “హేపీ బర్త్‌ డే” అన్న చిన్న కార్డు మాత్రం వుంది.

“మురళీ! ఆ గిఫ్ట్‌ మీద మన పేర్లు రాయలేదు. కనీసం ఇది మనందరి తరపున గిఫ్ట్‌ అని కూడా చెప్పలేదు ఆ మనిషి. మనందరం కాంట్రిబ్యూట్‌ చేసినట్టు వాళ్ళకెలా తెలుస్తుందీ?” అని అతన్ని గుస గుసగా అనుమానంగా అడిగాను.

“మీరొకరు! మీ కన్నీ అనుమానాలే! ఆ విషయాలెవరూ పట్టించుకోరు ఈ పార్టీల్లో!” అన్నాడు మురళి సముదాయిస్తూ.

“యేడిసినట్టుంది పద్ధతి! ఎవరేం ఇస్తున్నారో పట్టించుకోకపోతే, ఇవ్వడం ఎందుకూ, తీసుకోవడం ఎందుకూ?” విసుక్కున్నాను నేను.

అంతలో లోపల్నించీ ఒకాయన వొచ్చి, ఆ పుట్టినరోజు పిల్ల మెడలో ఒక పూల దండ వేశాడు. ఆ దండ పిల్లంత పొడుగూ వుంది. అది ఒకటే గుచ్చుకోడం. పిల్ల యేడుపు ఎక్కువ చేసింది.

వెంటనే ఫొటోల ప్రహసనం మొదలుపెట్టారు. యేడుస్తున్న పిల్లని సముదాయిస్తూనే, ఆ యేడుస్తున్న పిల్లతో అందరూ విరగబడి ఫొటోలు తీయించుకున్నారు. యేడుస్తున్న పిల్ల కేక్‌ మీద కొవ్వొత్తి యేం ఆర్పుతుంది!? కాస్సేపు పిల్లని బతిమాలి, ఎంతకీ పిల్ల వినకపోవడం వల్ల, తండ్రే ముందర కొచ్చి కొవ్వొత్తి ఆర్పాడు. పిల్ల ఇంకా యేడుస్తూనే వుంది గానీ, ప్రజలందరూ కేక్‌ తినడం ముగించి, భోజనాల మీద పడ్డారు.

ఆ పుట్టినరోజు పార్టీ ప్రహసనం చూసినప్పటినించీ బుద్ధుడిలాగా నాకూ జ్ఞానోదయం అయి, విరక్తి మొదలైంది. అప్పటి నించీ పుట్టిన రోజులకీ, పెళ్ళిరోజులకీ దూరంగా వుండేవాడిని.

“ఒక యేడాది పూర్తి చేసిన సందర్భంగా సెలబ్రేట్‌ చేసుకుంటే తప్పేమిటీ?” అని ప్రశ్నించేవారు అందరూ.
“ఒక యేడాది పూర్తి చేయడంలో నీ ఘనత ఏంఇటీ? ప్రకృతిలో చీమలూ, దోమలూ కూడా యేడాది పూర్తి చేస్తాయి.

మీరేదైనా గొప్ప పని చేస్తే, దాన్ని మీ అఛీవ్‌మెంటుగా సెలబ్రేట్‌ చేసుకుంటే అర్థం వుంటుంది. మీ పిల్లలకి పరీక్షల్లో తాము కోరుకున్న మార్కులు కష్టపడి సంపాదించుకుంటే, అది అఛీవ్‌మెంటుగా మీ స్నేహితులని పిలిచి పార్టీ చేసుకోండి. కనీసం అందులో కొంతన్నా అర్థం వుంది” అనేవాడిని.

“పిల్లల అఛీవ్‌మెంటు గురించి పార్టీ చేస్తే, అందరూ మేము గొప్ప పోతున్నామని మా వెనకాల చెవులు కొరుక్కుంటారు. అందుకే ఇలాంటి పార్టీలు. అందరికీ అవకాశం వస్తుంది. ఇందులో తప్పేముందీ?” మళ్ళీ అదే పాట.

“మీరూ, మీ కుత్రిమ సంస్కృతీ! మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి” అని వూరుకున్నాను.
మురళి వూరుకోలేదు. “మీరు కూడా మీ మొదటి పెళ్ళిరోజూ, మీ అమ్మాయి మొదటి పుట్టినరోజూ చేసుకున్నారు కదా!” అని ఎత్తి పొడిచాడు.
“అవును. అప్పట్లో నాకు బుద్ధి లేదు. ఇప్పుడొచ్చింది” నిజాయితీగా ఒప్పేసుకున్నాను.
“అప్పుడే మీకు బుద్ధి వున్నట్టుంది. ఇప్పుడే పోయినట్టుంది. మళ్ళీ వస్తుందేమో లెండి!” అన్నాడు మురళి నవ్వుతూ.

నేనూ నవ్వాను ఆ మాటలకి. అభిప్రాయ భేదాలున్నా మురళి మంచి మనిషి. జాలీ, కరుణా, సానుభూతీ వున్న మనిషి. ఇతరులకి సాయపడేవాడు కూడా. సరదాగా వుంటాడు. మరీ ఎక్కువ చాదస్తాలు లేవు. ముఖ్యంగా కుల పిచ్చి లేదు. అందుకే మా స్నేహం ఇంకా కొనసాగుతూనే వుంది. ఇద్దరం రెండు, మూడు నెల్ల తేడాలో అమెరికా వచ్చాం కుటుంబాల సమేతంగా.

మాతో పాటూ కుమార్‌, గోపాల్‌ వాళ్ళు కూడా వచ్చారు అమెరికాకి. ఇక్కడకి వచ్చినప్పటి నించీ ఈ పార్టీలూ, సెలబ్రేషన్లూ పెరిగిపోయాయి అందరికీ. కొన్ని పుట్టినరోజుల పార్టీల్లో బెల్లీ డాన్సులు పెట్టిస్తారు. కొన్ని పుట్టినరోజుల పార్టీల్లో మనుషుల్ని పిలిపించి మాజిక్‌ చేయిస్తారు. ఒక్కోసారి బఫూన్లు వస్తారు. వీళ్ళ పుట్టినరోజు పండగలు చూస్తే, చిన్నప్పుడు చదివిన చందమామ కథల్లో రాజుల పుట్టినరోజు పండగలు గుర్తొచ్చేవి. నలభై యేళ్ళు దాటిన వాళ్ళు కూడా పుట్టినరోజంటూ కేకులు పంచుకుంటూ తిరగడం చూస్తే సిగ్గేసేది నాకు. చిన్నపిల్లలకే కాకుండా అన్ని వయసుల వారికీ పక్షపాతం లేకుండా పుట్టినరోజులు జరిపేవారు. కొంతకాలానికి నా విముఖత తెలుసుకుని, నన్ను ఇటువంటి వాటికి పిలవడం మానేశారు. రోగీ పాలే కోరాడూ, వైద్యుడూ పాలే ఇచ్చాడూ అన్న తీరుగా సుఖంగా వుండేవాడిని.

కొన్నేళ్ళు గడిచాయి. మురళీతో స్నేహం మరింత గట్టిపడింది. ఎంతో ఇష్టంగా వుండేది స్నేహితుడంటే. ఒకసారి పిల్లలనడిగాను.

“మురళీ అంకుల్‌ నాతో ఎంతో స్నేహంగా వుంటాడు ఎప్పుడూ. అతని కోసం ఏదన్నా స్పెషల్‌గా చేద్దామనుకుంటున్నాను. మీరేమైనా సలహాలివ్వకూడదూ?”

“వచ్చేవారం అంకుల్‌ బర్త్‌డేట. వాళ్ళబ్బాయి చెప్పాడు నిన్న. ఆ రోజు ఏదన్నా గిఫ్ట్‌ ఇవ్వచ్చు అంకుల్‌కి. నువ్వెప్పుడూ బర్త్‌డే గిఫ్ట్‌లు ఇవ్వవు గాబట్టీ, అంకుల్‌ చాలా స్పెషల్‌గా ఫీలవుతారు” అన్నారు పిల్లలు. “మరి అలా బర్త్‌డే గిఫ్ట్‌లు ఇవ్వడం నాకు ఇష్టం లేదు కదా? నా పద్ధతులకీ, నా భావాలకి విరుద్ధంగా నేనెలా ప్రవర్తించగలుగుతానూ?” అభ్యంతరం చెప్పాను.

“చేసేది అంకుల్‌ కోసం చేస్తున్నప్పుడు, ఆయన కిష్టం అయినది చెయ్యాలి కదా? ఇది మరీ చెడ్డ విషయం కాదు గాబట్టి, నీకు ఇష్టం లేకపోయినా, ఈ ఒక్కసారికీ అంకుల్‌ కోసం చేస్తే, అది మీ స్నేహానికి సింబల్‌గా వుంటుంది. ఆలోచించు” అంది మా అమ్మాయి నాకన్నా రెండాకులు ఎక్కువ చదివిన తెలివితో. ఇదేదో కాస్త బాగానే వుందనిపించింది.

“సరే! ఈసారికి అలాగే చేస్తాను. అలా అని చెప్పి వచ్చే యేడాది కూడా ఇలా చేస్తాననుకోవద్దు. అలాగే ఇప్పుడేదో చేస్తున్నాను గాబట్టి, మీ పుట్టినరోజులకి కూడా ఏదో చేస్తానని ఆశించవద్దు” అని నిక్కచ్చిగా చెప్పాను పిల్లలకి.

నేను వేసిన ముందరి కాళ్ళ బంధాలకి పిల్లలిద్దరూ నవ్వారు.

మురళి పుట్టినరోజు పొద్దున్నే లేచి ఇంటిల్లిపాదిమీ మురళీ వాళ్ళింటికి వెళ్ళాము కేకూ, గిఫ్ట్‌లూ మోసుకుంటూ. మమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు మురళి. కానీ బాగా సంతోషించాడు కూడా.

“మీకిలాంటివి ఇష్టం లేదు కదా! ఎలా చేస్తున్నారు మరీ?” అని మురళీ భార్య అడిగింది.
“ఇండియాలో పోయిన బుద్ధి మళ్ళీ ఇప్పుడు వచ్చిందేమో!” అన్నాడు మురళీ నవ్వుతూ. నేనూ నవ్వాను ఆ మాటలకి.
“అదేం కాదండీ! మురళీకి ఇష్టం కదా అని నేను కాస్త నా మనసుని మంచి చేసుకుని చేస్తున్నాను” అన్నాను.
కాస్సేపు కూర్చుని వచ్చేశాము. స్నేహితుని మనసు సంతోష పెట్టినందుకూ, వ్రతం చెడ్డా ఫలం దక్కినందుకూ సంతోషించాను.

కొన్నాళ్ళకి ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. ఒకరోజు పొద్దున్న ఆరింటికే డోర్‌ బెల్‌ మోగితే, “ఇంత పొద్దున్నే ఇంటికి వచ్చేదెవరబ్బా” అనుకుంటూ, కళ్ళు నులుముకుంటూ వెళ్ళి తలుపు తీశాను. మురళి తన కుటుంబంతో సహా వచ్చాడు చేతిలో గిఫ్ట్‌ పేకెట్లతో.

చూడగానే, “హేపీ బర్త్‌ డే” అన్నాడు మురళి.
ఆశ్చర్యపోయాను నేను. “ఇవాళ నా బర్త్‌ డే అని మీకెవరు చెప్పారూ?” అడిగాను.
అంతా లోపలకి వచ్చి కూర్చున్నారు. ఆ మాటలకి మా ఇంటిల్లిపాదీ కూడా లేచి వచ్చారు.

“నిన్న ఆఫీసులో మీ డ్రైవర్‌ లైసెన్సు చూశాను. అప్పుడు తెలిసింది ఈ రోజు మీ పుట్టినరోజని!” సంతోషంగా చెప్పాడు మురళి.

“అయ్యో! నా అఫీషియల్‌ డేటాఫ్‌ బర్త్‌ తప్పండీ. నన్ను స్కూల్లో చేర్చడం కోసం అది తప్పుగా వేశారు. అదీగాక నాకు ఇలాంటి బర్త్‌ డే సెలబ్రేషన్లు ఇష్టం లేవని మీకు తెలుసు కదా?”

“అది కాదండీ! ఆ మధ్య మీరు మా ఇంటికి నా బర్త్‌డే నాడు వచ్చి నన్ను విష్‌ చేసి, గిఫ్ట్‌లిచ్చి సంతోష పెట్టారు కదా! అందుకని మిమ్మల్ని కూడా సంతోష పెట్టడానికి వచ్చాను” అన్నాడు మురళి సంజాయిషీగా.

“ఇదా నన్ను సంతోషపెట్టడం? మీ బర్త్‌డే అని చెప్పి, మీ కిష్టమైన పని చేస్తే మీరు సంతోషపడ్డారు. ఈ రోజు నా బర్త్‌డే అని చెప్పి, మీ కిష్టమైన పని చేస్తూ, మళ్ళీ మీరే సంతోషపడుతున్నారు. ఇందులో నా సంతోషం ప్రసక్తి ఏదీ? ఇదెక్కడి న్యాయం మన స్నేహంలో?” సూటిగా అడిగాను.

“అంటే?” అర్థం గాక అడిగాడు మురళి.
“మిమ్మల్ని సంతోషపెట్టడానికి మీకిష్టమైనది నేను చేస్తే, నన్ను సంతోష పెట్టడానికి మీరు నాకిష్టమైనది చెయ్యాలి కదండీ న్యాయంగా?”
“అలాగా! ఏం చేస్తే మీకు సంతోషం కలుగుతుందీ?”

“ఇప్పుడు తెచ్చిన గిఫ్ట్‌లు మీరు తిరిగి తీసుకు వెళ్ళిపోతే నాకు సంతోషం కలుగుతుంది. నా పద్ధతి ప్రకారం అయితే ఈ రోజు నా పుట్టిన రోజు అయినా, మీరు ఏమీ పట్టించుకోకుండా, ఆ విషయం గుర్తు పెట్టుకోకుండా వుంటే నాకు సంతోషంగా వుంటుంది. నా పద్ధతికి విలువిచ్చి, నన్ను గౌరవించారని నేను ఫీలవుతాను” “పోనీలెండి! ఈ సారికి తెచ్చేశాను కదా, తీసేసుకోండి. ఇక మీదట తీసుకురాను లెండీ”

“ఈ ఒక్కసారికీ నన్ను బాధపడమంటున్నారు కదూ?”

“అంత మాటెందుకు లెండి! గిఫ్ట్‌లు తీసుకోవడంలో అంత బాధ యేముందీ?”

“ఇదన్న మాట మీరు నన్నర్థం చేసుకుంది! ఎప్పుడూ మీకు నచ్చిందే ఇతరులకి చెయ్యడం చాలా అన్యాయం. మీరు దయచేసి మీ గిఫ్ట్‌లు తీసుకుపొండి” అన్నాను నిక్కచ్చిగా.

చిన్నబుచ్చుకున్న మొహంతో మురళి తీసుకువచ్చిన గిఫ్ట్‌లు తీసుకుని కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు. ఇప్పుడే అర్థమయింది నాకు నేను చేసిన తప్పు. తను చెయ్యకూడని పని ఎదటివాళ్ళ సంతోషం కోసం కూడా చెయ్యకూడదు అని. ఇప్పుడిక ఏమనుకుంటే ఏం లాభం? పుట్టిన రోజులు పాటించని నేను దానికి గిఫ్ట్‌లు ఇవ్వడం ఏమిటీ? ఆ తప్పే కదా ఇలా వచ్చి పడిందీ? “చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత” అని అంటే ఇదేనన్న మాట. నాకీ శాస్తి కావలిసిందే!

“మా స్నేహానికేదో ముప్పు వస్తుందని” దిగులు పడ్డాను ఆ రోజంతా.

కానీ మర్నాటి నించీ మురళి తన ప్రవర్తనతో ఒక మంచి స్నేహితుడని రుజువు చేసుకున్నాడు.
------------------------------------------
రచన: జె. యు. బి. వి. ప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

Monday, October 21, 2019

కలకీ కలకీ మధ్య


కలకీ కలకీ మధ్య

సాహితీమిత్రులారా!

“అయినా లాభం లేదు. ఫ్లైట్‌ వెళ్ళిపోయింది” కౌంటర్లో మనిషి నిర్లక్ష్యంగా చెపుతూనే ఉన్నాడు. ఇటు తిరిగి చూస్తే ఫ్లైట్‌ గాల్లోకి ఎగురుతూ.. ఒక క్షణంసేపు ప్రపంచమంతా నిలిచిపోయినట్టూ.. వొళ్ళంతా చెమటలు కక్కుతూ..ఏంచేయాలో అర్థంకాదు..

చటుక్కున ఉలికిపాటుతో మెలకువ వచ్చింది. పాడుకల. అదే పీడకల మళ్ళీ మళ్ళీ ఎందుకొస్తుందో? కరెంటెప్పుడు పోయిందో, పైన సీలింగ్‌ ఫాన్‌ ఆగిపోయి ఉంది. ఉక్కకి ఒకటే చెమట.

“లేచావా?” అంటూ గదిలోకి వచ్చింది వదిన. చేతిలో ప్లేటులో కారప్పూసా, పప్పుచెక్కా.
“కరెంటు పోయినట్టుందిగా!. వరండాలో కూచుందువు రా!” అంటూ బయటికి నడిచింది ప్లేటుతో.
(“పెట్టుకోలేవూ? అన్నమూ, కూరలూ టేబుల్‌ మీదే ఉన్నాయిగా? అత్తయ్యో నేనో వచ్చి పెట్టిందాకా కూచోవటమేనా?”)
వదిన ముచ్చటపడి చేయించుకున్న డబుల్‌ కాట్స్‌. పక్కనే దానికి మేచ్‌ అవుతూ డ్రసింగ్‌ టేబుల్‌.
(“ఏమిటి, మా గదిలోకెందుకొచ్చావు?”
“నా చొక్కా చినిగి పోయింది. మిగతావన్నీ ఉతుకులోకి పోయాయి. అన్నయ్య పాతచొక్కా ఏమన్నా ఉందేమోనని ..”
“నన్నడిగితే ఇచ్చేదాన్నిగా! బయటికి పద!”)

బయటికి వరండా లోకి. టీపాయ్‌ మీద ప్లేట్‌. పక్కనే స్టీల్‌ గ్లాసులో మంచి నీళ్ళు. ఉండుండీ వెచ్చటి గాలి.
ఒక తేపొచ్చింది. లంచ్‌ అరిగినట్టు లేదు. ఇంత భారీగా తినడం అలవాటు లేదన్నా వినిపించుకోలేదు వదిన. కొసరి కొసరి వడ్డించింది చేపల పులుసు.
కాఫీ కప్పు తీసుకుని అమ్మ వచ్చి గడపమీద కూచుంది.
“తీసుకోబ్బాయ్‌! మీ వొదెనే చేసింది నీకిష్టమని!”
“అరగలేదమ్మా! ఇందాకేగా తింది!”
“అయితే కొబ్బరి బోండామొకటి తాగరాదూ! శాంతీ! అబ్బాయికి ఒక కొబ్బరి బొండామంట ఇయ్యమ్మా!” లోపలికి కేకేసి చెప్పింది.
నవ్వొచ్చింది.
(“తొందరగా తిను! మీ వొదినొచ్చే టైమయింది.”
“అంత భయపడుతూ తినకపోతే ఏమయింది?”
“ఆఁ నీకిష్టమని మీ వొదినకి తెలియకుండా కొన్నా! మళ్ళీ తెలిస్తే దుబారా చేస్తన్నానని గొడవ చేసుద్ది. ఎందుకు లేనిపోని తగూలు!”)
“అయిపోయినట్టున్నయ్యి అత్తయ్యా! తెప్పిస్తాలే!” వదిన గొంతు.
“ఇప్పుడేం వద్దొదినా!” వినిపించుకున్నట్టు లేదు.

బదులుగా కాసేపటికి అన్నాయ్‌ వచ్చాడు చొక్కా గుండీలు పెట్టుకుంటూ.
“బాగా నీళ్ళున్నయ్యి తేబ్బాయ్‌!” అమ్మ.
“ఇప్పుడెందుకన్నాయ్‌ ఈ ఎండలోపడి? సాయంత్రం నే తెస్తాగా!”
“ఆఁ ఇదేమెండలే!” స్కూటర్‌ స్టాండ్‌ తీసి నెట్టుకుంటూ బయటికి నడిపిస్తూ అన్నాడు తల తిప్పకుండానే.
(“ఇదేమెండ? ఆ ఇస్త్రీ షాపెంత దూరమని? నాలుగడుగులు వేస్తే అరిగిపోతావా లేకపోతే స్కూటర్‌ మీద పోతే గానీ మన లెవల్‌కి సరిపోదా?”)

వదిన కూడా కాఫీ కప్పు తీసుకుని కూచుంది.
“ఇంకా అమెరికా కబుర్లేమిటి రవీ?”
(“పొద్దుణ్ణించీ చెపుతున్నా కాసిని కూరగాయలు తీసుకు రమ్మని. ఎప్పుడు చూసినా ఫ్రండ్స్‌తో ఆ పోచుకోలు కబుర్లేగానీ ఒక్క పనీ అందుకోకపోతే ఎట్లా?”)
“అన్నీ చెప్పేసినట్లే వదినా! ఇంకేంఉన్నాయి!”
“ఇంతకీ సెలవులెన్ని రోజులబ్బాయ్‌?”
“ఇంకా నాలుగు వారాలు!”
(“మహా అయితే నాలుగు లేదూ అయిదు వారాలు! ఇన్ని ఫ్రయ్స్‌ మిగిలిపోయినయ్‌ కెచప్‌ అయిపోయింది పట్టుకొస్తానుండు!”)
“ఇంకో పదిరోజులు ఎక్కువ తీసుకోవల్సిందబ్బాయ్‌! ఆ కోటేసర్రావు మామయ్య కబురుమీద కబురు చేస్తన్నాడు!”
“ఏ కోటేశ్వర్రావు మామయ్య, ఏంకబురు?”
“నువ్వెరగవులే! మా పెద్దమ్మమ్మ మనవడు! రాకపోకల్లేక దూరమయ్యాంగానీ దగ్గిరాళ్ళే! బాగనే సంపాయించాడంట. ఒక్కటే కూతురు. నువు అమెరికా ఎల్లావని ఎట్ట తెలిసిందో మరి, ఒకటేమైన ఎమ్మటపడతన్నాడు. పిల్ల పొటోలు కూడా తీసుకొచ్చాడు పోయినసారి!”
“అమ్మాయి బాగానే ఉంది. కొంచెంనలుపుగానీ!” వదిన.
“నలుపెక్కడలేమ్మాయ్‌ కొంచెంచామనచాయగ ఉంటది.”
“ఇప్పుడదేంలేదులేమా! ఇంకో ఏడాది దాకా పెళ్ళిమాటే వద్దు.”
(“సంవత్సరం కూడా పట్టదు మార్కెట్‌ పుంజుకోవటానికి! మళ్ళీ ఫెడరల్‌ రేట్స్‌ తగ్గిస్తూనే ఉన్నారుగదా! జనాల్లో కొంచెం కాన్ఫిడెన్స్‌ వస్తే ఏముందిక?”)
“ఏమోనయ్యా నీ ఇష్టం అసలొచ్చి మాట్టాడతానన్నాడులే నీతో ఒకపాలి.”

మాట మార్చాలి. “కవిత పెళ్ళి బాగా అయిందా?”
“ఆఁ బాగనే అయిందిలే! మీ పెద్దమ్మ కారేసుకొచ్చి బొట్టు పెట్టి పిలిచింది. మీ వదినకీ నాకూ చీరలు పెట్టింది. పదేళ్ళ తర్వాత ఇయ్యే పిలుపులు. ఏదో నువ్వు అమెరికా ఎళ్ళబట్టిగానీ ఆమె కంటికి మనంఆనేవాళ్ళమా? మడుసుల్ని బూజు దులిపేసినట్టు దులిపేది ఇప్పుడు బంగారంలాగ మాట్టాడతంది!”
నవ్వుమొహంతో చెపుతోంది అమ్మ. గొంతులో స్థాయి పెరిగిన గర్వమూ, తృప్తీ.
“రంగారావు బాబాయ్‌ కనపడలేదే? ఎప్పుడూ ఇక్కడే తిరిగేవాడు?”
“వాళ్ళ పనయిపోయిందిలే! పిల్లలకి చదువులనీ అయ్యనీ ఎక్కడెక్కడో జేరిపిచ్చాడు బోలెడు డబ్బులు పెట్టి. ఎక్కడ బట్టినా అప్పులేనాయె. మడిసికి మొహంచెల్లితేగా? ఎక్కడన్నా బజాట్లో కనబడి డబ్బులడుగుతాడేమో ఇయ్యబాక!”

బోండాలు పట్టుకొచ్చాడు అన్నాయ్‌. వదిన అందుకుని లోపలికి పట్టుకెళ్ళి ఒక గ్లాసులో పట్టుకొచ్చి ఇచ్చింది.
“అదేమిటి నాఒక్కడికే ఎందుకు? మీరు కూడా తాగండి!”
“మేమెప్పుడూ తాగేయ్యేగా, నువ్వు తాగయ్యా!”
“మా మేనేజర్‌ బాగా ఆనమ్దపడిపోయాడు నువు తెచ్చిన ఆ కార్డ్‌లెస్‌ బాగా పనిచేస్తుందని. అయితే వాళ్ళ అల్లుడొచ్చి ముచ్చటపడి పట్టుకెళ్ళాడట అది! ఎట్లాగయినా ఈసారి ఇంకోటి తెప్పించమని ఒకటే అడుగుతున్నాడు!” అన్నాయ్‌ నవ్వుతూ చెపుతున్నాడు.
ఈసారి!?
“ఇందాక నేను పడుకున్నప్పుడు ఫోనులేమైనా వచ్చాయా వదినా?”
“లేదే?”
అవును, ఈ టైమ్‌లో ఎందుకు చేస్తాడు? ఇది టైంకాదు!
“ఎవరన్నా ఫోన్‌ చేస్తే నిద్రపోతున్నా లేపొదినా!”
(“ఎందుకూ నీకు ప్రతివారం ఈ ప్రాజెక్ట్‌ సంగతి ఎంతవరకొచ్చిందీ ఫోన్‌ చేసి చెప్తానుగా! మూణ్ణెళ్ళనించీ నలుగుతున్నదే కదా! టైం పట్టొచ్చుగానీ అది మనకే ఖాయం! ఆ డైరెక్టర్‌ ఎప్రూవల్‌ ఒక్కటే కావలసింది. “)
“సరేలే”

శీను మామయ్య వచ్చాడు హడావుడిగా. పల్లెటూరి రాజకీయాల్లో పడి గుంటూర్లో ఫైనాన్సింగ్‌ బిజినెస్‌ దాకా లాక్కొచ్చాడు. ఎప్పుడెక్కడుంటాడో ఏంచేస్తాడో తెలియదు.
“ఏందబ్బాయ్‌ ఎట్టుందక్కడ? రెండేళ్ళ పైమాటేగా నువ్వక్కడికెళ్ళి?”
“బాగానే ఉంది!”
“సెలవులెన్నాళ్ళు? పెళ్ళి చేసుకుపోవూ? ఏంది అందర్నీ ఎనక్కి పంపించేత్తన్నారంట నిజమేనా? ఇంతకీ నీది పర్మనెంటేనా?”
ప్రశ్నల వర్షం. ఆయనకి జవాబులు అక్కర్లేదు.
“ఏందోనబ్బాయ్‌ మావాణ్ణి కూడా ఈ కంప్యూటర్‌ కోర్సుల్లోనే పెట్టా! ఏమయిద్దో ఏమోగాని!”
“మీ వాడికి ఉద్యోగమెందుకులే! నీ బిజినెస్‌లోనే పెట్టు!” అన్నాయ్‌
“నీ సంగతేందబ్బాయ్‌ ఆమద్దెన బిజినెస్‌ బిజినెస్‌ అంటివి. ఏమయింది? అబ్బాయొచ్చాడుగా మాట్టాడావా మరి?”
బిజినెస్‌? అన్నాయ్‌ బిజినెస్సా?
“ఏదీ నువా లెక్క మొత్తం చెప్పకపోతివి. మళ్ళీ నీతో మాట్లాడటం కుదరకనేపోయె!”
” పదయితే మాట్టడదాం! అయితే స్టాకుల్లో కూడా ఏమన్నా పెట్టావ అబ్బాయ్‌?ఎంత నష్టమొచ్చినేంటి?”
(“నేను చెపుతూనే ఉన్నా మరీ అంత ఆశకి పోవద్దని! ఇప్పుడు అమ్మితే మాత్రంఏమొస్తుంది? ఎటూ మునిగావు, గోచిపాత ఉంటే ఎంత ఊడితే ఎంత? ఇంకో ఏడు ఆగి చూడు!”)
“ఏందబ్బాయ్‌ ఏ మాట్టాడవ్‌? ఆఁ మొదట్నుంచీ నువ్వంతేగా పెద్దగ మాట్టాడవాయె!”
“శాంతీ, శీను బాబాయ్‌కి కాఫీ తీసుకురామ్మా!”
“వొద్దులేమ్మాయ్‌ ఇప్పుడేమొద్దక్కాయ్‌ ఎళ్ళాలి, ఇంకా చాన పనులున్నయి. ఈసారి తీరిగ్గా వస్తాలే!”
“నేనూ వస్తున్నా మామయ్య! వెళదాంపద!”
అన్నాయ్‌ ఆయన వెంటే వెళ్ళాడు.
బిజినెస్‌ అన్నాయ్‌ బిజినెస్సా?

కాసేపటికి గేటు తీసుకుని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ గురవాయొచ్చాడు.
“దణ్ణాలు బాబూ! గుర్తుపట్టా నన్ను?”
“ఆఁ గురవాయవి కాదూ?”
“అబ్బో, గుర్తే అయితే!”
“మర్చిపోతే నువ్వూరుకుంటా?” అమ్మ అందుకుంది. “గురవాయ్‌ కేమబ్బాయ్‌ పొలంకవులుకి తీసుకుంటన్నాడు సొంతంగా. సుబ్బరంగా చేసుకుంటన్నాడు.”
“అది పెద్ద దండగమారి పనిలేండే! పంట పండి సావదు, బాగ పండిందిరా అనుకుంటే రేటు పలకదు. ఏదో రేయింబొగుళ్ళూ కొట్టుకులాడతమేగానీ పైసా మిగిలేదిలేదు సచ్చేది లేదు. అందుకే ఈ ఏడు మీ నాలుగెకరాలేగా సేత్తంది. మా అగసాట్లకేమొచ్చెగానీ నీ సంగతులేంది సెప్పండే?”
“ఏమున్నయ్‌ అంతా బాగానే ఉందక్కడ!”
(“పదేళ్ళనించీ కాంట్రాక్టులు చేస్తున్న నాకే మూణ్ణెల్ల కాంట్రాక్ట్‌ దొరకటానికి రెణ్ణెల్లు పట్టింది. ఇంత వరస్ట్‌ పీరియడ్‌ ఎప్పుడూ చూడలేదు నేనింతవరకూ!”)
“సిన్నప్పుడంతా నా బుజాలమీదేగా ఆడింది! ఎప్పుడన్నా తలుసుకుంటావాండీ అయన్నీ?”
“అంత టైంఎక్కడ ఉంటదిలే అబ్బాయికక్కడ?”
“గుర్తుందీ ఒకపాలి కాలుజారి సెర్లో పడితే ఎవురూ సూడకపోతిరి! నేను సమయానికి సూసి దూకి వొడ్డుకి లాక్కొత్తిని!”
“నిజమే, నువు సూడకపోతే ఏమయ్యుండేదో? ఇంతకీ నీ సంగతులేంటి గురవాయ్‌”
“పిల్ల పెల్లి కుదిరిందండే! సరే అబ్బాయ్‌ గూడ వొచ్చాడని సెప్పారు. సూసిపోదామనొచ్చా!”
“కాసుక్కూచుంటారు మీరంతా పిల్లాడు ఎప్పుడొస్తాడాని!” అమ్మ నవ్వుతూ అంది.
లోపలికెళ్ళి పర్స్‌ లోంచి అయిదొందలు తీసుకొచ్చి ఇవ్వబోతే తీసుకోలేదు గురవాయ్‌.
“ఈ డబ్బులెందుకండే నాకు?”
” అదేమిటి తీసుకో!”
“తీసుకో గురవయ్యా! నువ్వడక్కుండానే అబ్బాయిస్తన్నాడుగదా!”
“ఈ డబ్బులు నేనేంసేసుకునేది? ఈ డబ్బులు బొబ్బులు నాకొద్దులేయ్యా!”

“ఎంత ఆశ్చర్యపోయానో వాడి మాటలు విని. డబ్బుతో ముడిపడని సంబంధాలు కూడా ఉండొచ్చనిపించింది.”
మేస్టారు ఆశ్చర్యపోతూ వింటున్నారు.
“కానీ వాడి ఉద్దేశం అదికాదు. నాపేరు మీద ఏదయినా వస్తువు కొనాలట. ఒక నగో, బీరువానో..”
నవ్వేశారు మేస్టారు. “పోనీలే మనుషులు మనుషుల్లానే ప్రవర్తిస్తున్నారు!”
శకుంతలగారు టీ పట్టుకొచ్చారు.
“అయ్యో ఆ కుర్చీ కాలు విరిగినట్లుంది బాబూ! ఇటు బెంచీ మీద కూర్చోకపోయావూ?”
లేచి బెంచీ మీద.
(“మూణ్ణెల్లవటంలా? ఇంకా ఇక్కడుండి ఏంచేస్తావ్‌”)
టీ ఇచ్చి వెళ్ళిందామె.
“రోజులట్లా ఉన్నాయి. ఏదీ నమ్మకంలేదు; నిలకడ లేదు. ఒకదాన్నే పట్టుకుని బతుకంతా గడిపేసే పరిస్థితి లేదిప్పుడు. అన్ని తలుపులూ తట్టవలసిందే! అన్ని దారులూ ప్రయత్నించి చూడవలసిందే! ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు! ఒక స్వామి కాకపోతే ఇంకో స్వామి! ఈ మనిషి కాకపోతే ఇంకో మనిషి! ఈ ఉద్యోగంకాకపోతే ఇంకో ఉద్యోగం! ఒక ఉద్యోగానికి గడుస్తుందా? రెండు ఉద్యోగాలు కావాలి. లేకపోతే భార్యాభర్తలిద్దరూ చేయాలి. లేకపోతే బిజినెస్‌. ఒక రోజుకు ఒక్కటే సమస్య ఎపాయింట్‌మెంట్‌ తీసుకుని వస్తుందా? బొచ్చెబోలెడు సమస్యలెప్పుడూ చుట్టుముట్టే ఉంటాయి. పంజరంలో చిలకమాదిరి గిలగిల కొట్టుకుంటూనే ఉండాలి. లేచిందగ్గర్నుంచీ వెయ్యి మార్గాలు చూసి పెట్టుకోవాలి. తెలిసిన ప్రతి మొహంలోనూ ఒక అవకాశాన్ని వెదకాలి!”

రెండు గుక్కలు టీ తాగి సర్దుకున్నారు.
“అయితే సెలవులన్నీ ఇక్కడే గడుపుతావా, ఎటన్నా వెళుతున్నావా?”
ఇంకో అవకాశాన్ని వెదకాలి. ఇక్కడుండి లాభంలేదు. కెచప్‌ దొరకదు. ఫ్రైస్‌ చప్పబడిపోతాయి. ఫోన్‌ రాదు. “వచ్చే వారం హైద్రాబాదెళ్ళి అక్కణ్ణుంచి బెంగుళూర్‌ వెళ్ళి వద్దామనుకుంటున్నా. అక్కడ కొంతమంది ఫ్రండ్స్‌ ఉన్నారు.”
(“ఇక్కడ పరిస్థితీ అంతే ఉందిరా! ఏవో ప్రాజెక్టులు వస్తాయొస్తాయంటున్నారు గానీ నమ్మకంలేదు!”)
“పై అరలో డబ్బా అందిద్దురుగాని ఇటు రండి!” శకుంతల గారు లోపల్నుంచి పిలుస్తున్నారు.
“వస్తానుండు!” అంటూ లోనికి వెళ్ళారు మేష్టారు.
” అడుగుతానని చెప్పి అడగరేమిటి? నన్నడగమంటారా?” శకుంతలగారి గొంతు సన్నగా వినిపిస్తూంది.
“అడుగుతానంటున్నాగదా? అసలు తన పరిస్థితి ఎట్లా ఉందో ఏమిటో కనుక్కోనీ..”
“సరే, మీరడక్కపోతే నేనే అడుగుతాను. మళ్ళీ కోపంతెచ్చుకోవద్దు!”

ఒక్కసారి లేచి ఇక వెళ్ళి పోదామన్పించింది. ఎక్కడికి? మళ్ళీ అలవాటైపోయిన నీరసం.
మేస్టారొస్తున్నట్టు అడుగుల చప్పుడు.

* * *

గుండె దడదడ కొట్టుకుంటూంది. పాస్‌పోర్ట్‌ ఎక్కడ? జేబులో.. ఉహుఁ.. బేగ్‌లో.. ఉహుఁ.. ఇదుగో ఈ కవరులో.. టిక్కెట్టేదీ.. పాస్‌పోర్ట్‌లోనే ఉండాలి కదా.. అవును ఇదుగో.. పాస్‌పోర్ట్‌లో వీసా కనపడదే మరి? ఎక్కడికి పోతుంది.. కంగారేంలేదు. ఇదుగో.. హమ్మయ్య.. ఇంతకీ ఫ్లైట్‌ ఎన్నింటికి? ఇవిగో అన్నీ ఉన్నాయి. ఏదీ మిస్‌ కాలేదు.
“అయినా లాభంలేదు. ఫ్లైట్‌ వెళ్ళిపోయింది” కౌంటర్లో మనిషి నిర్లక్ష్యంగా చెపుతూనే ఉన్నాడు.
----------------------------------------------------
రచన: చంద్ర కన్నెగంటి, 
ఈమాట సౌజన్యంతో

Friday, October 18, 2019

ఒక సూఫీ సాయంత్రం


ఒక సూఫీ సాయంత్రం
సాహితీమిత్రులారా!

ఏమైందో ఆ మాసిన టోపీ.
ప్యాంటుజేబుల్లోంచి కర్చీఫ్‌ ముక్క తీసి
తలకు చుట్టాను
జుట్టు జూలు విదిలించకూడదు

సమాధి చుట్టూ బిగుసుకున్న తలుపులు
ఇంకా తెరుచుకోలేదు
ఎదురుచూపులు
అసర్‌కోసం

అజా పిలుపుతో
పావురాలు ఆకాశం గూటిలోకి రెక్కలెగరేశాయి
పుట్టింటికి చేరుకున్న ఆనందం వాటికి

చానాళ్ళకు
అసర్‌ సమాజ్‌ అయ్యింది.

వందేళ్ళ క్రితం కన్ను మూసి
ఆ రాళ్ళల్లోంచి మళ్ళీ కళ్ళు తెరుచుకుంటున్న
ఆ సూఫీ మునిని కప్పుకున్న దాదర్‌లోంచి
ఆయన దేహంలోకి చూశాను
నా దేహాన్నంతా వొంపి
ఆయనని కళ్ళకి అద్దుకున్నాను
దువా చదువుతూ
మూతపడిన రెండు కళ్ళూ రెండు నీటి చుక్కలై
ఆయన దాదర్‌పైన వాలాయి
అవి రెండు పక్షులై
ఎటో టపటపా శబ్దం చేసుకుంటూ వెళ్ళాయి

బయటికి రాలేకపోయాను
ఆయనలోంచి.

ఒక పాతకాలపు అరబ్బీ పుస్తకం
ఏ కాస్త మోటుగా తాకినా
చిరిగిపోతుందేమోనన్నంత భయంగా తెరిచినట్టు
ఆయన జ్ఞాపకాల్లోకి మెల్లిగా వెళ్ళాను
ఈ యాత్రకి అర్థం ఏమిటి?

బయటికి అడుగుపెట్టానో లేదో!
ఒక పక్షుల సమూహంలో
ఏదో పేలిన శబ్దం.
అందరూ పారిపోతున్నారు
ఎవరూ కనిపించడం లేదు
కత్తులు తప్ప.

ఏమీ వినిపించడం లేదు
కొసప్రాణం అరుపులు తప్ప.

మళ్ళీ లోపలికి పరిగెత్తాను
అక్కడా నిశ్శబ్దం
ఒక పక్షి మాత్రం నెత్తుటి రెక్కతో
దర్గా రాయి మీద ఏదో రాస్తోంది

దాదర్‌లోకి ముక్కు దూర్చి
వెక్కివెక్కి ఏడుస్తున్నట్టుగా వుంది

ఎక్కడికి వెళ్ళాలిక?
నాలోపల వొక సమాధి తవ్వుకుంటున్నాను
-------------------------------------------
రచన: అఫ్సర్, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, October 15, 2019

మన దీపావళి కథ


మన దీపావళి కథ
సాహితీమిత్రులారా!

దీపావళి అనగా దీపముల వరుస, ఆ రోజు పెందలకడనే లేచి…
అంటూ పరీక్షల్లో వ్యాసాలు రాసేస్తావే గానీ, నిజంగా దీపావళి గురించి రాయాలంటే బోల్డుంది. దానికేమో ఫది మార్కులిచ్చి, రెండు పుటలకు మించకుండా వ్రాయునది, అనటం ఎంత అన్యాయం! “దశమ గ్రహం” పాఠంలోంచి సందర్భం రాస్తే దానికీ ఫది మార్కులే, దీనికీ ఫది మార్కులే..ఈ పేపర్లిచ్చేవాళ్ళెప్పుడూ దీపావళి జరుపుకోరేమో, రెండు పుటలట, రెం..డు..

వళ్ళు మండేది. సుబ్భరంగా పేపరు నిండా “ఢాం..ఢాం..ఢాం” అని రాసేసి, ఇదే వస్తుంది మీరిచ్చిన మార్కులకి..అనెయ్యాలనిపించేది. పైగా పేపరు చివర్లోనే ఇస్తారు వ్యాసాలన్నీ. గేపకం తెచ్చుకుని రాయాలికదా, ఒకటా రెండా, ఏకంగా నెల ముందు నించీ మొదలెడితేనేగాని అవదు కదా..

దసరాలు అలా వచ్చి, ఇలా వెళ్ళిపోతాయి, తొమ్మిదిరోజులూను. అయినా అవి అమ్మాయిల పండగలు కదా, అందుకే, మనకి అంత పని వుండదు. సాయంత్రం కామాక్షీ పీఠానికి వెళితే అక్కడ తెల్లగెడ్డం తాతగారు పంచామృతాలు, పరవాన్నం ప్రసాదం ఇస్తారు, మన ఆటలయ్యాకా ఓమాటు అటెళ్ళి, దేవుడికి దణ్ణం పెట్టేసుకుని, ప్రసాదం తిని వచ్చెయ్యడమే. ఆ తరవాత వచ్చే ఆది వారం, నాన్నగారితో కలిసి భాస్కర్రావు కొట్టుకెళితే వాడు బీడు, సూరేకారం, గంధకం ఇస్తాడు, ఇంకా అదేదో నీలంరంగు పొడి కూడా ఇస్తాడు. అవి తెచ్చుకుని, నాలుగు చాటల్లో పోసి, ఎండబెట్టుకోవాలి. ఒక రోజు అన్నకీ, ఒక రోజు నాకు కాపలా డ్యూటీ. బీడేమో స్టీలు గిన్నెలా మెరుస్తూ భలే ఉంటుంది. రెండు రోజుల తరవాత కుండలమ్మే తాత వస్తాడు కదా, వాడి దగ్గిర డజను పెద్ద ప్రమిదలూ, నాలుగు డజన్ల చిన్న ప్రమిదలూ కొనేది అమ్మ.

పెదనాన్నగారేమో తెల్ల వెంట్రుక ఒక్కోదానికీ ఐదు పైసల చొప్పున ఇచ్చి, నన్నూ అన్నయ్యనీ తియ్యమనే వారు, అలా వచ్చిన డబ్బులతో, కిష్ణారావు వీధిలో కొట్టు కెళ్ళి సిసింద్రీలు కొనుక్కొచ్చే వాళ్ళం. వాటి తోకగిల్లి ఆ రోజు రాత్రే వేసే వాళ్ళం. సరిగ్గా వెళ్ళేవి కావు. వీడు మోసం చేసేసాడ్రా, నేను మాతంసెట్టి గాణ్ణి అడిగి కనుక్కుంటానుండు, పెద్ద సైజు సిసింద్రీలు ఎక్కడ దొరుకుతాయో అనేవాడు అన్న.

మర్నాడు అన్న సీతాఫలం బొమ్మలో దాచుకున్న నాణేలు జాగర్తగా తీసి, నారాయణపేట కి వెళ్ళి అక్కడనించి కొనుక్కొచ్చే వాళ్ళం. అవి భలే వెళ్ళేవి, అంతే వెంఠనే వాడిదెగ్గిరకెళ్ళి మాకు మూడువందలు కావాలి, ఎలా ఇస్తావు?అడిగేవాడు అన్న. మూడువందలైతే ముప్ఫై రూపాయలు బాబు, ఐదువందలు తీసుకుంటే నలభై ఐదు కిస్తాను అనేవాడు కొట్టు వాడు. సరే, సరేఅనేవాణ్ణి నేను. అన్న కాసేపు అలోచించి, వద్దులే అనేవాడు. నేను కూడా కాసేపు ఆలోచించి, పోనీ, ఈసారి పాం బిళ్ళలు, తాళ్ళూ మానేద్దాం అనేవాణ్ణి, ఎలాగైనా సిసింద్రీలు తగ్గించకూడదని అలోచిస్తూ. సరేలే, అమ్మకి అప్పుడే చెప్పకుఅనేసి, వాణ్ణి పురమాయించేసి వచ్చేసేవాడు అన్న, వెనకాలే నేను.

పెదనాన్న గారు బళ్ళో హాజరుపట్టీ చేసేప్పుడు వాడతారు, ఆ రూళ్ళ కర్ర తెచ్చి, మతాబా గుల్లలు చేసేవారు నాన్నగారు. అమ్మ మైదాపిండి వుడికిస్తే అన్న మైలతుత్తం వేసేవాడు. నేను గుల్లలు ఎండ బెట్టేవాణ్ణి. నాన్నగారు మొబర్లీ పేట వెళ్ళి చిచ్చుబుడ్ల కుండీలు తెచ్చేవారు, రెండు డజన్లు పెద్దవీ, నాలుగు డజన్లు చిన్నవీని. ఇంక వారం రోజుల్లో దీపావళనగా, ఆ ఆదివారం మాయింట్లో పేద్ద కార్ఖానా. అమ్మ ఎండబెట్టిన మందులన్నీ వేయించేది. ఆవదం కలిపేది. నాన్నగారేమో, అన్నీ సరైన పాళ్ళల్లో కలిపేవారు, ఒకటి మతాబా మందు, ఒకటి చిచ్చుబుడ్ల మందు. అన్నీ ఓపికగా, జాగ్రత్తగా కూరేవారు నాన్నగారూ, అన్నా. నేను మతాబా గుల్లల్లో ఇసకపోసి అందిస్తూ వుండే వాణ్ణి. కేపులూ, రీళ్ళూ, తుపాకీలు చిన్నప్పుడు కాల్చేవాళ్ళం గాని, తరవాత మానేసాం, సిసింద్రీలు వేసే వయసులో కేపులేంటీ?, చామర్తాడు చూస్తే స్కూల్లో అందరికీ చెప్పేస్తాడు కూడా, అందుకనే.

అద్దివాటాలో వుండే ఏ.సీ.టీ.వో తాతగారేమో అన్నయ్యకి జువ్వ వెయ్యడం నేర్పించారు ఓసారి. జువ్వ గేట్టిగా పట్టుకుని, అంటించి పది అంకెలు లెక్కపెట్టాలిరా రామం, ఏవైనా సరే ఈలోపల వదలకూడదుఅనేవారు.

అన్న అడిగాడు తరవాత?
వదిలెయ్యడవేతాతగారి జవాబు.

అంతే, అన్న వదిలేసాడు. ఆ జువ్వ కాస్తా వెళ్ళి బాచి మావయ్య గదిలో పడింది, ఓ రెండు నిమిషాల సేపు ఇంట్లో అందరినీ తెగ పరిగెత్తించింది. అందరూ ఒకటే నవ్వు. ఆ తరవాత అన్న జువ్వలు, పేలుడు జువ్వలూ కూడా వెయ్యడం నేర్చుకున్నాడు బాచి మావయ్య దగ్గర, నాకూ నేర్పాడు.వారం రోజులు ఎలా గడిచిపోయేవో తెలిసేది కాదు, దీపావళి వచ్చేసేది. ఆరోజు నిజంగానే పొద్దున్నే లేచి, తలంటు పోయించేసుకుని, జిలేబీల డిజైను ఉన్న పాలిష్టరు చొక్కా నీలం లాగూ వేసేసుకుని ఎప్పుడు చీకటి పడుతుందా అని చూసే వాళ్ళం. నాన్నగారేమో మధ్యానం వెళ్ళి భూచక్రాలూ, విష్ణు చక్రాలూ, కాకరపువ్వత్తులూ, వెన్నముద్దలూ, అగ్గిపెట్లూకొనుక్కొచ్చేవాళ్ళూ, తాళ్ళూ, పాంబిళ్ళలూ కూడా. వాటిల్లోంచి కొన్ని తీసి అమ్మ సత్తెమ్మ కిచ్చేది, అదిఅంట్లుతోమడానికొచ్చినప్పుడు.

మధ్యాన్నం పెదనాన్నగారితో సైకిలు మీద నేనూ అన్నా షికారుకెళ్ళే వాళ్ళం. సిసింద్రీలు పెదనాన్నగారి ఖాతాలో అన్నమాట, అందుకే వచ్చేప్పుడు నారాయణపేటలో ఆగి, అవి తీసుకుని, మళ్ళీ గాంధీ బొమ్మ దెగ్గిర ఆగి, సీమటపాకాయ గుత్తులు తీసుకుని వచ్చే వాళ్ళం.

చీకటి పడుతూండగానే అమ్మ దివిటీ పట్టించేది. గోంగూరకాడలకి అవేవో తెల్లటి మూటలు కట్టి, నూనిలో ముంచి వాటిని కాల్చి, అవి ఆరే దాకా పట్టుకోవాలి. అవి ఓ పట్టాన ఆరేవి కావు. ఈలోపలే వీధి చివర వుండే గన్నవరపు వాడు వేసిన నేలబారు జువ్వలూ, సిసింద్రీలూ మమ్మల్ని పలకరించి వెళ్ళేవి. సరే  దివిటీలు వో గంట తరవాత ఆరేవి. ” దిబ్బూ దిబ్బూ దీపావళీ మళ్ళీ వచ్చే నాగుల చవితీ” అనేసి,  వెంఠనే కాళ్ళు కడిగేసుకుని, బాదుషా తినేసి, బైటకొచ్చేవాళ్ళం. అన్న రెండు చాంతాడు ముక్కలు వెలిగించి తెచ్చేవాడు. వాటిని వూదుకుంటూ సిసింద్రీలతో మొదలెట్టేవాళ్ళం.నోటితో సిసింద్రీ తోకలు కోస్తుంటే అన్న తిట్టి, వాడే గిల్లి ఇచ్చేవాడు. వీధి వీధంతా సందడి. అందరూ మతాబాలు, కాకర పువ్వత్తులూ, చిచ్చుబుడ్లూ  కాల్చేవారు. బాచెమ్మామ్మా వాళ్ళ మనవరాలు అరుణ,  బియ్యం డ్రమ్ము మూతమీద పాంబిళ్ళలూ, వెన్నముద్దలూ కాల్చేది, దానికి మరి కాకర పువ్వత్తి అన్నా భయమే కదా. మతాబా ఇస్తే, గెట్టిగా కళ్ళు మూసుకుని పట్టుకునేది. మేవేమో, పేలుతోంది, పేలుతోందిఅని భయపెట్టేసరికి అది కాస్తా వదిలేసి పరుగు, మళ్ళీ పాంబిళ్ళల దగ్గరికి.ఇంతలో అమ్మ లక్ష్మీ పూజ చేసి, ప్రమిదల్లో దీపాలు వెలిగించి, ఇంటి చుట్టూ పెట్టేది, అన్ని దీపాలుకూడా సరిపోయేవి కావు, ఒకపక్క నించి మావీ, ఇంకో పక్క నించి యే సీ టీ వో అమ్మమ్మగారివీ.

మూడు గంటలు కాల్చి కాల్చి చేతులు నొప్పెట్టేవి. సిసింద్రీలూ, సీమటపాసులూ అయిపోయేవి. జువ్వలు కొన్ని మిగిలేవి. అవి నాగుల చవితికి అని చెప్పి దాచేది అమ్మ. అటు గన్నవరపాడూ, వాళ్ళూ ఇంకా జువ్వ లేసే వారు. అన్నకి వళ్ళుమంది వో ఉపాయం చెప్పాడు. అంతే, వెంఠనే నేను, మా చీపురు కట్టని తిరగేసి బాల్చీలో పెట్టి మా ప్రహారీ గోడమిద పెట్టి, చూసుకో, మాకింకా వంద జువ్వలున్నాయి, కానీ మేము నాగుల చతివికి దాచుకుంటాము అనేసి, వాళ్ళు సరిగ్గా చూసేలోపు, బాల్చీ లోపల పెట్టేసే వాణ్ణి.వాళ్ళు నిజంగానే భయపడి, కాల్చడం అపేసేవారు. అప్పుడు అన్న నవ్వి, చూసావా.. అనేవాడు. అంతే, ఇంక అంతా అలిసిపోయి, లోపలికొచ్చి కాళ్ళూ చేతులూ కడుక్కుని భోజనాలు చేసే వాళ్ళం. అప్పుడు పేలేది దుర్గా సిల్కు హౌసు వాళ్ళ సీమటపాసు గుత్తి. ఫదివేలో ఎన్నో వుండేవి.

ఒక ఫదినిముషాల సేపు చెవులు గళ్ళు పడిపోయేవి. అది పూర్తవడంతో దీపావళి పూర్తయ్యేది మావూళ్ళో.

ఒక్కోయేడాది, నరేంద్ర పురంనించి గోపాలం పెదనాన్నగారు వచ్చేవారు, ఆయనకి తాటాకు టపాకాయలు కట్టడం వచ్చు. అందుకే వస్తూ వస్తూ ఒక వందో, రెండొందలో టపాకాయలు తెచ్చేవారు. తాటేకు టపాకాయని చూస్తే, గ్రోమోర్‌ప్రకటనలో, తలపాగా కట్టుకున్న రైతులా, భలేగా వుంటుంది. పెటేపు కాయలన్నా, ఎలక్ట్రిక్‌కాయలన్నా తాటేకు టపాకాయలే. అవి పేల్చేవాళ్ళం. కానీ ఓ సారి వత్తి అంటించి పడేసాకా, అంటుకుందో లేదో చూడ్డానికి దగ్గిరికెళ్ళకూడదు, అంతగా అంటుకోపోతే మర్నాడు తీసుకోవడమే..అన్న చెప్పాడుగానీ నేనువినలేదు ఓ సారి. ఆ తరవాత నాకెవ్వరూ చెప్పాల్సిన అవసరం రాలేదు.

హైదరాబాదొచ్చేసాకా కూడా దీపావళి బాగా చేసుకునే వాళ్ళం. అయితే, ఇంట్లో చేసేవస్తువులు తగ్గిపోయాయి, చిచ్చుబుడ్లు కొనేసే వాళ్ళం, తాటకు టపాకాయలకి బదులు హైడ్రోజను బాంబులు కాల్చే వాళ్ళం, కొన్నాళ్ళు జువ్వలు చేసాం గానీ, ఆనక అవి కూడా కొనేవాళ్ళం. సిసింద్రీల సంగతి మర్చే పోయాం..దొరికేవికావు. పేకెట్లో లెఖ్ఖపెట్టి సరిగ్గా పదో పన్నెండొ చిచ్చుబుడ్లిస్తాడు, అవి కాలినవి కాలతాయి, పేలినవి పేలతాయి, ఎంత శివకాశీ వైనా, మేం చేసుకున్న చిచ్చుబుడ్లకు సాటికాదు కదా. ఇంక రాకెట్లని చూస్తే నవ్వొస్తుంది. పైగా వాటిని సీసాల్లో పెట్టి కాల్చాలిట, బడాయికాకపోతే. ఇంతా హడావిడి చేసి అవి కరెంటు స్తంభవంత ఎత్తెళ్ళేవేమో, మా జువ్వలైతే చంద్రుణ్ణి పలకరించి వచ్చేవా, అనిపించేది. సీమటపాసు గుత్తుల్ని హెదరాబాదులో లడీ అంటారు. చివర్లో, మా సేథియాగారూ వాళ్ళూ కాల్చిన లడీ సుమారు అరగంట సేపు అందరినీ పలకరించి, దీపావళిని పట్నం పొలిమేరలదాకా వెళ్ళి సాదరంగా సాగనంపుతుంది.

అల్లాంటి దీపావళి అందరిలోనూ ఆనందం నింపుతుంది, మనమంతా ఒక కుటుంబం వాళ్ళమే అనే భావన కలిగిస్తుంది. గోడమీద పేర్చిన దీపాలు గుండెల్లో వెలుగుతాయి. మతాబాల పూలన్నీ మనసు కొమ్మల్లో పూస్తాయి. కాకరపువ్వత్తులు కళ్ళలో కోటి నక్షత్రాలు నింపుతాయి. ఆ అనుభూతులన్నీ, ఈ శీతల దేశాల్లో ఘనీభవించి, మన గుండెలో ఏదో మూల దాంకుంటాయి. ఇలాంటి పండగ రోజుల్లో వాటిని వెతికి పట్టుకుని, వేడి చేసుకుని, ఆ వెచ్చదనాన్ని, ఆనందాన్ని అనుభవించినన్నాళ్ళూ, మన దీపావళి బతికివున్నట్టే.
----------------------------------------------
రచన: శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా, 
ఈమాట సౌజన్యంతో

Sunday, October 13, 2019

చిరుదీపం


చిరుదీపం

సాహితీమిత్రులారా!

ఉదయం 7.30 కావస్తోంది. కిటికీలోంచి కనిపిస్తూన్న ఆహ్లాదకరమైన దృశ్యాన్ని గమనిస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు రామారావ్‌. చుట్టూరా మంచి తోట. ముందుభాగంలో ఒక చిన్న సరస్సు. అందులో బాతులు. పరిసరాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఏప్రిల్‌ నెల కావడం వల్ల చలి తగ్గింది. ఉదయం 6.00 కాకుండానే సూర్యోదయం అవుతోంది. ఆరోజు తన 70వ పుట్టినరోజు. బయటకి పోవాలని, విచ్చలవిడిగా తిరగాలని, బలమైన కోరిక కలిగింది రామారావుకి. కాని తను ఖైదీ. నర్సింగ్‌హోమ్‌లో బందీ. తనకి నచ్చినట్లు చేయడానికి కావలసిన స్వాతంత్య్రం, సత్తువా లేవు తనకి. అక్కడి రొటీన్‌ అలవాటు పడలేకపోతున్నాడు రామారావు. ఇక తనకిదే ప్రపంచం. ఆలోచనలు పరిపరి విధాల పోయాయి రామారావుకి.

“గుడ్‌ మార్నింగ్‌ మిష్టర్‌ గేంటీ … హేపీ బర్త్‌డే. హియరీజ్‌ యువర్‌ బ్రెక్‌ ఫాస్ట్‌. ఇటీజ్‌ ఎ వండర్‌ ఫుల్‌ బ్రీజౌట్‌ సైడ్‌ ఎంజోయ్‌ యువర్‌ మీల్‌” అంటూ డే ట్రేని తన ముందుకి తోసి, భారమైన తన శరీరాన్ని ఊపుకుంటూ బయటకు పోయింది నర్సింగ్‌ ఎయిడ్‌ బ్రెండా. అలవాటు ప్రకారం ఆ ట్రేని పరిశీలించాడు రామారావ్‌. ఒక బౌల్‌ లో సీరియల్‌, చిన్న కార్టన్‌లో పాలు, రెండు టోస్ట్‌ పీస్‌లు, జెల్లీ, ఆరంజ్‌ జ్యూస్‌. ఎందుకో అవి తినబుద్ధి అవలేదు. నిర్లిప్తతతో ప్రక్కకి తోసేసాడు. ఆరంజ్‌ జ్యూస్‌ మట్టుకు గబగబా త్రాగేశాడు. ఎలాంటి బ్రతుకు బ్రతికాడు తను? ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటాడని కలలో కూడా అనుకోలేదు.

గంటి రామారావు 45 సంవత్సరాల క్రితం పాతికేళ్ళ వయసులో ఈ దేశం వచ్చాడు భార్య వసంతతో. వసంత నిజంగా అతని జీవితంలో వసంతం తీసుకొచ్చింది. నల, భీమ పాకంతో పాటూ, సంగీతం, సాహిత్యం, తెలుగు సంస్కృతీ అన్నీ అతని జీవితంలో నింపింది. ఉదయాన తనకు నచ్చినట్లుగా జీడిపప్పు ఉప్మా, ఇడ్లీ, సాంబారు, దోసెలు, చేస్తూ ఉండేది. “రోజూ ఎందుకంత కష్టపడతావు?” అని తాను ఎంత వారించినా, కారం కారంగా, పుల్ల పుల్లగా ఉంటే తనకు నచ్చుతాయని ఉదయాన్నే వంట చేసి లంచ్‌ పేక్‌ చేసి ఇచ్చేది. రామారావుకి లేవగానే ఎమ్‌.ఎస్‌. సుబ్బులక్ష్మిదో, బాలమురళిదో సంగీతం, సాయంత్రం ఘంటసాల, సుశీల సినిమా పాటలు, శని ఆది వారాల్లో తెలుగు సినిమాలు, కచేరీలు, సాహితీ సదస్సులతో రామారావు జీవితం గడిచిపోయేది. కొడుకు ఆనంద్‌ని, కూతురు అరుణని కూడా చాలా పద్ధతిగా సంప్రదాయంతో పెంచేరు రామారావు, భార్య. పిల్లలిద్దరూ తల్లిదండ్రుల ఇష్టాలకు భిన్నంగా కాకుండా లక్షణంగా తల్లిదండ్రులు ఒప్పుకున్న ఆంధ్రా పిల్లల్నే పెళ్ళి చేసుకున్నారు. మంచి మంచి ఉద్యోగాల్లో సెటిలయ్యారు. అంతా చూసి తన అదృష్టం అని మురిసిపోయాడు రామారావు. అరుణ కొడుకు, కూతురు పెంపకంలో తాము చేయగలిగినంత సహాయం చేసేరు కూతురికి రామారావు, భార్య. ఆనంద్‌, లతలకు,  పదేళ్ళ క్రితం కవల పిల్లలు పుట్టినప్పుడు అతనూ భార్య ఏడాది పాటు వాళ్ళ ఇంట్లో ఉండి ఎంతో సాయం చేశారు. అప్పుడప్పుడు కోడలు ముభావంగా ఉన్నా వేరే భావించకుండా ఎలాగో సర్దుకుపోతూ వచ్చేరు తనూ, భార్య.

ఆరు సంవత్సరాల క్రితం భార్యకు కేన్సరు రావడం, రెండేళ్ళు తిరక్కుండానే 62వ ఏట కన్నుమూయడం రామారావు జీవితంలో పెద్ద అశనిపాతం. అంతే అప్పటి నుండి తను కోలుకోలేదు. కీళ్ళవాతం, నరాల జబ్బు, మొదలెట్టి పనిచేయలేక 65 వెళ్ళాక రిటైరైపోవాలిసి వచ్చింది. ఒక ఏడాది ఒంటరిగా తన ఇంట్లోనే ఉన్నాడు రామారావు. కాని రాను రాను జబ్బు ముదిరి, మరొకరి సహాయం లేకుండా నడవలేక పోయేవాడు. చివరికి వీల్‌చైర్‌లో కూర్చోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఒకటి, రెండు నెలలు కొడుకు, కోడలి దగ్గర ఉన్నాడు రామారావు. కాని అక్కడి వాతావరణం మనస్సుకి కష్టంగా తోచింది రామారావుకి. గత్యంతరంలేక తన కొడుకు ఉన్న ఊళ్ళోనే కొడుకు ఇంటికి దగ్గరగానే ఉన్న నర్సింగ్‌హోమ్‌లో చేరాడు. అతను తన తల్లి ఇండియాలో చనిపోతే, వెంటనే తండ్రిని తన దగ్గరకు తెచ్చుకొని, ఆయన మరణించిన దాకా తనూ, భార్యా సాకేరు. అంత్యక్రియలన్నీ సవ్యంగా జరిపించేరు. తనకి కూడా అలాగే జరుగుతుందని తనెప్పుడూ బలంగా ఆశించలేదు. కాని ఇలా నర్సింగ్‌హోమ్‌లో బందీగా అయిపోతానని కూడా ఎన్నడూ ఊహించలేదు రామారావు.

నర్సింగ్‌హోమ్‌లో చేరిన మొదట్లో కొడుకు, కోడలు, వారం వారం అతన్ని చూడడానికి వచ్చేవారు. రాను రానూ నెలకో సారి రావడం మొదలెట్టారు. కొన్నాళ్ళకి ఆ ఊరు వదిలి, మంచి ఉద్యోగం వచ్చిందని టెక్సస్‌కి వెళ్ళిపోయారు. తండ్రిని ఆ ఊళ్ళో వదిలేసి వెళ్ళడం ఆనంద్‌కి ఇష్టం లేదు. తమ ఊరు రమ్మని బలవంతం చేశాడు. కాని రామారావే వద్దన్నాడు. ప్రస్తుతం కొడుకు టెక్సస్‌లో కూతురు కాలిఫోర్నియాలో ఉన్నారు. రామారావు మాత్రం నేష్‌విల్‌లో నర్సింగ్‌హోమ్‌లో సెటిలయి పోయాడు. అందరూ ఇచ్చిన పాటలు విన్నవే విని పుస్తకాలు చదివినవే చదివి మెదడు మొద్దుబారిపోయింది రామారావుకి. ఎప్పుడో ఆరునెలలకో, ఏడాదికో కొడుకో, కూతురో, అల్లుడో వస్తూ ఉంటారు. నెలకో, రెణ్ణెల్లకో ఫోన్‌ చేస్తూ ఉంటారు. మిగతా సమయం ఆ నర్సింగ్‌హోం నాలుగు గోడల మధ్య. రామారావు కాళ్ళూ, చేతులూ స్వాధీనంలో లేవు గాని మెదడు మట్టుకు చురుగ్గా బాగా పనిచేస్తుంది. దాంతో ఆలోచనలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి. దానికి తోడు అక్కడ తిండీ, పద్ధతులూ ఏవీ రామారావుకి అలవాటు పడలేదు. బ్రతుకంటే విసుగొచ్చింది రామారావుకి.

అతని ఆలోచనలని కట్టిపెట్టేస్తూ, జోరుగా తలుపు తీసుకుంటూ లోపలికి వచ్చిందో తెల్ల అమ్మాయి.

“హేయ్‌ మిష్టర్‌ గేంటీ, హేపీ బర్త్‌డే!” అంటూ, అక్కడున్న ట్రే వైపు చూసి, “యు ఆర్‌ ఇన్‌కారిజబుల్‌. మీరు మళ్ళీ మొదటికొచ్చారు. ఏమీ తినలేదు ఈరోజు కూడా. ఇలా ఐతే ఎలా? మీరు తినేస్తే, మీకు మంచిది చూపిస్తా” అంటూ తన చేతిలో సంచీ చూపించింది ఆ పిల్ల.

“హాయ్‌ క్రిస్టీ, వాటీజిట్‌?” అన్నాడు నిర్వికారంగా రామారావు.

“వెల్‌ మా నైబర్స్‌, పటేల్స్‌ ఇచ్చేరు ఈ విడియో. ఇది చాలా మంచి సినిమా మీకు నచ్చుతుందని చెప్పేరు. ఇది హిందీ సినిమా అనాడీ. రాజ్‌కపూర్‌ సినిమా తెలుసా?” హిందీ బాగా వచ్చిన దానిలా ఆరిందాలా కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్పింది క్రిస్టీ.

“బి ఎ గుడ్‌ బాయ్‌ ఎండ్‌ ఈట్‌ యువర్‌ బ్రెక్‌ ఫాస్ట్‌. ఐ విల్‌ గెట్‌ ది విసీఅర్‌ ఫర్‌ యూ” అంటూ బయటకు పరిగెత్తింది. క్రిస్టీ పదిహేడేళ్ళ అమెరికన్‌ పిల్ల. ఆ నర్సింగ్‌ హోమ్‌లో వలంటీరు పని చేస్తూ ఉంటుంది. ఆవారం స్ప్రింగ్‌ బ్రేక్‌ అవడం వల్ల వారం అంతా అక్కడే పని చేస్తోంది. బలవంతాన ఏదో కుక్కుకుని, సినిమా చూడ్డానికి నిశ్చయించుకున్నాడు రామారావు.

తనకి ఎన్‌.టి. రామారావు సినిమాలంటే ఎంత ఇష్టమో! ఎన్నాళ్ళయింది ఆ సినిమాలు చూసి. పోన్లే ఏదో ఒకటి  పాత సినిమా కదా అనుకుంటూ ఆ హిందీ సినిమా చూడ్డంలో లీనమయిపోయాడు రామారావు. ఫోన్‌ రింగయితే, రిసీవర్‌ ఎత్తాడు.

“మామయ్య గారూ, నేనూ లతని, బాగున్నారా? పుట్టినరోజు శుభాకాంక్షలు” కోడలు పలకరించింది. “ఆఁ బాగానే ఉన్నా. ఆనంద్‌, పిల్లలూ ఎలా ఉన్నారు?”

“అంతా బాగున్నాం. ఆనంద్‌ యూరప్‌ వెళ్ళేరు. వారం అయింది. తనకి పని వత్తిడి అంతా ఇంతా కాదు. పైగా ఇదిగో ఈ కొత్త ఇల్లు కట్టిస్తున్నామా, మొత్తం ఆరువేల అడుగులు. మూడు లెవెల్స్‌. పెద్ద ఇల్లు. దగ్గరుండి కట్టించడం మాటలతో పనా? పగలూ రాత్రి ఇంటికి కావలసిన పనులతోనే సరిపోతుంది. ఈ ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో గాని నాకు ఊపిరి తీసుకోవడానికి ఒక్క నిముషం దొరకడం లేదు. ఇంకో విషయం మీ మనవరాళ్ళు ఉన్నారే అచ్చంగా మీవి, అత్తగారివి భావాలన్నీ పుణికిపుచ్చుకు పుట్టారంటే నమ్మండి. ఆషాకి ఎన్‌.టి. రామారావు సినిమాలంటే పిచ్చి. ఉష ఎమ్‌.ఎస్‌. సుబ్బులక్ష్మి పాటలంటే చెవికోసుకుంటుంది. మీ పుణ్యమా అని మా పిల్లలందరికీ మన సంస్కృతి, సంప్రదాయం అంటే మహా ఇష్టం సుమండీ. దాంతో వాళ్ళ భరతనాట్యం క్లాసులు, వాళ్ళ సంగీతం క్లాసులతో సతమతమవుతున్నానంటే నమ్మండి. అందుకే ఈ మధ్య ఇంట్లో పనులే చేసుకోలేకపోతున్నా.

ఈ రోజు మీ పుట్టిన రోజు అని మొన్న కొన్ని జంతికలు, కాజాలు చేసి పంపేను అందేయా?” అడిగింది లత. “లేదు” అన్నాడు రామారావు ముభావంగా.

“ఇవ్వాళో, రేపో అందుతాయేమో. ఆనంద్‌ యూరప్‌ నుండి రాగానే కొంచెం వీలు చేసుకొని, మిమ్మల్ని చూడడానికి వస్తారు. ఇవ్వాళ నాకు ఇంటీరియర్‌ డెకరేటర్‌తో ఎపాయింట్‌మెంట్‌ ఉంది. వెళ్ళాలి. ఉంటా. మీ ఆరోగ్యం జాగ్రత్త. మందులు వేసుకోవడం మర్చిపోకండి” హెచ్చరించి మరీ ఫోన్‌ పెట్టేసింది. నవ్వొచ్చింది రామారావుకి.

నర్సింగ్‌ హోం లో ఉంటూ మందుల గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తనకేమిటీ! ఏమిటో వాళ్ళ  జీవితాలు వాళ్ళవి. వాళ్ళ జీవితాలకీ, తన జీవితంకీ ఎక్కడా సంబంధం లేదు. మళ్ళీ సినిమా చూడ్డంలో మునిగిపోయాడు రామారావు.

“వాటార్‌ యు వాచింగ్‌” అంటూ లావుపాటి నర్సు లోపలికి వచ్చింది రామారావుకి మందులివ్వడానికి.

“అనాడీ” అన్నాడు సినిమా కట్టేస్తూ రామారావు. “అంటే” ప్రశ్నార్థకంగా అంది బ్రెండా. “చేతకానివాడు బ్రెండా. దట్స్‌ హౌ ఐ ఫీల్‌ నౌ. మై లైఫ్‌ ఈజ్‌ ఎ వేస్ట్‌. మై కిడ్స్‌ డోంట్‌ వాంట్‌ మి. ఐ జస్ట్‌ హావ్‌ టు లివ్‌ ఎ మిజెరబుల్‌ లైఫ్‌ ఆల్‌ ఎలోన్‌ హియర్‌” విసుగ్గా తనలో తానే గొణుక్కున్నాడు రామారావు.

“కమాన్‌ మిష్టర్‌ గేంటీ. లెట్స్‌ బి ప్రాక్టికల్‌. ది ప్రాబ్లం విత్‌ యూ ఇండియన్స్‌ ఈజ్‌ దట్‌ వెన్‌ యూ హేవ్‌ కిడ్స్‌ యూ కేంట్‌ కట్‌ ది అంబిలికల్‌ కార్డ్‌ ఎండ్‌ లెట్‌ గో. ఇప్పుడు మీకు ఏం తక్కువయింది? మేమంతా లేమూ! మీవాళ్ళు వీలయినప్పుడు వస్తూ  ఉంటారాయె. అప్పుడప్పుడు ఫోన్‌ చేసి మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకాలా? వాళ్ళ పిల్లలూ, వాళ్ళ ఉద్యోగాలతో వాళ్ళు సతమతమవుతూ ఉంటే, వాళ్ళ పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. స్టాప్‌ థింకింగ్‌ టూ మచ్‌ అబౌట్‌ ఇట్‌. గో, మిక్స్‌ విత్‌ అదర్స్‌. వాచ్‌ సం గేంస్‌, మూవీస్‌ ఎండ్‌ ఆల్‌. యు ఆర్‌ ఎ ఫైన్‌ మేన్‌. ఉయ్‌ లైక్‌ యూ” అంటూ మాత్రలు ఒక చిన్న కప్పులో, నీళ్ళు వేరే గ్లాసులో ఇచ్చి, రామారావు అవి మింగిన తరువాత భారీగా నడుచుకుంటూ బయటికి పోయింది బ్రెండా.

అవును బ్రెండా చెప్పింది నిజమే. ప్రపంచంలో తినడానికి తిండి, నిలవడానికి నీడ లేనివాళ్ళు ఎంత మంది లేరు? ఉన్నదానికి తృప్తి పడక, తనెందుకు ఇలా విసుక్కుంటున్నాడు? అని ఒక్క క్షణం అనిపించింది రామారావుకి. ఇంకా ఎన్నాళ్ళిలా బ్రతకాలా అని అనుకుంటూ నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. తలుపు చప్పుడుకి తెలివి వచ్చి “కమిన్‌” అన్నాడు.

తలుపు తోసుకుంటూ లోపలికి ఓ యువకుడు వచ్చాడు. “తాతయ్య, బాగున్నారా?” దగ్గరగా వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు. “కిరణ్‌ నువ్వా, ఎప్పుడొచ్చావు?” కిరణ్‌ రామారావు మనవడు. అరుణ కొడుకు. హైస్కూల్‌ సీనియర్‌. 18 సం. ల వయస్సు.

“నిన్న రాత్రి వచ్చాను తాతయ్యా! డాడీ ఫ్రెండ్‌ సుదర్శన్‌ అంకుల్‌, లక్ష్మి ఆంటీ ఇంట్లో ఉన్నాను. అంకులే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. కారు పార్క్‌ చేసి వస్తారాయన” అన్నాడు కిరణ్‌. “ఏమిటి ఇలా వచ్చావు? నువ్వు హార్వర్డ్‌కి వెళ్తావని మీ అమ్మ చెప్పింది చాలా సంతోషించాను. ఇక్కడికి వట్టినే వచ్చావా? లేదా స్కూల్‌ పని మీద వచ్చావా?” అడిగాడు రామారావు.

“అదికాదు తాతయా. నాన్న గారికి నేను హార్వర్డ్‌కి వెళ్ళడం ఇష్టం తాతయ్యా. కాని మా ఫేకల్టీ అడ్వైజర్‌ జిం కాలిన్స్‌ తమ్ముడికి కూడా హార్వర్డ్‌లో సీటు వస్తే, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ వేండర్‌బిల్ట్‌లో రిసెర్చ్‌ స్కాలర్‌షిప్‌తో అండర్‌గ్రాడ్యుయేట్‌ చేసేడు. ఇప్పుడు హార్వర్డ్‌లో న్యూరోసర్జరీ. అతను చెప్పిందేమిటంటే బోలెడంత డబ్బు ఖర్చు పెట్టుకొని హార్వర్డ్‌కి వెళ్ళేబదులు ఇక్కడ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో చదువుకుంటే మంచిదని.

ఇంకో విషయం, అమ్మ మీ గురించి బాధ పడుతూ ఉంటుంది ఎప్పుడు తాతయ్యా, మీరొక్కరూ ఇక్కడ ఉన్నారని. నేను ఇక్కడ నాలుగేళ్ళు ఉంటే వారానికొకసారి మిమ్మల్ని చూడవచ్చు కదా! అందుకే నాకు ఫుల్‌ స్కాలర్‌షిప్‌ రాగానే ఇక్కడికే రావడానికి నిర్ణయించుకున్నాను. నిన్న ఓరియంటేషన్‌కి ఈ ఊరు వచ్చా” వచ్చీ రాని తెలుగులో చెప్పేడు కిరణ్‌. రామారావుకి నోట మాట రాలేదు.

“తాతయ్యా, ఈ రోజు మీ పుట్టిన రోజు కదా. అందుకని మీకిష్టమైన పులిహోర, పెరుగు గారెలు లక్ష్మి ఆంటీ చేత చేయించి పట్టుకొచ్చాను. తినండి తాతయ్యా. తరువాత మిమ్మల్ని గణేష్‌ టెంపుల్‌కి తీసుకెళ్తా. వస్తారు కదూ!” అంటూ చేతిలోని కేరియర్‌ తెరిచి రామారావు ముందు ఉంచాడు.  “తప్పకుండా వస్తా కిరణ్‌” అంటూ, రుచికరమైన తిండి తిని ఎన్నాళ్ళయిందో ఏమొ, తిండి ముఖం ఎరుగని వాడిలా ఆవురావురుమని తిన్నాడు రామారావు.

“తాతయ్యా, నేను రెగ్యులర్‌గా మీ దగ్గరకు వస్తుంటే నాకు తెలుగు బాగా నేర్పిస్తారా? నాకు నేర్చుకోవాలని ఉంది” అన్నాడు కిరణ్‌.

“అంతకంటేనా నాయనా” సంతోషంతో తబ్బిబ్బయిపోతూ అన్నాడు రామారావు. తన జీవితంలో ఇటువంటి సంతోష ఘడియ వస్తుందని ఊహించలేదు రామారావు. తను తెచ్చిన కొత్త డుయల్‌ సీడీ, టేప్‌ రికార్డర్‌లో తాత కిష్టమైన ఘంటసాల, సుశీల పాటల కేసెట్‌ పెట్టేడు కిరణ్‌. తాత చేతిని నిమురుతూ ప్రక్కనే కూర్చున్నాడు.

వెలుగునీడలు సినిమాలో ఘంటసాల పాట వస్తోంది. “అగాధమౌ జలనిధి లోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏదీ తనంత తానే నీదరికి రాదు. శోధించి సాధించాలి. అదియే ధీరగుణం” తను అనుభవిస్తున్న ఈ సుఖం దానంతట అదే తన దగ్గరకు వచ్చింది అనుకుంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు ఆ తాతయ్య.
----------------------------------------------
రచన: పూడిపెద్ది శేషుశర్మ, 
ఈమాట సౌజన్యంతో