Showing posts with label చేమకూర. Show all posts
Showing posts with label చేమకూర. Show all posts

Tuesday, October 18, 2016

తోయజశాత్రవ మిత్ర బింబముల్


తోయజశాత్రవ మిత్ర బింబముల్



సాహితీమిత్రులారా!


విజయవిలాసములోని సాయంకాల వర్ణన పద్యం చూడండి-

అంగజరాజు పాంథ నిచయంబుపై విజయం బొనర్ప నేఁ
గంగఁ దలంచునంత మునుఁగల్గఁగ దాసులు పట్టు జాళువా
బంగరు టాలవట్టముల భంగిఁగనంబడెఁ బూర్వ పశ్చిమో
త్తుంగ మహీధ రాగ్రములఁ దోయజశాత్రవ మిత్ర బింబముల్
                                                           (విజయవిలాసము -1-208)

అంగజరాజు - మన్మథుడు అనే రాజు,
పాంథ నిచయంబుపైన్ - విరహులనే మార్గస్థులమీద,
విజయంబు ఒనర్పన్ - విజయము సాధించటానికి,
ఏఁగంగన్ తలంచునంతన్ - దాడిచేయాలని ఊహించేంతలో,
మునుఁగల్గగన్ - అందరికంటే ముందుగా,
దాసులు - సేవకురులు, పట్టు(కొనే),
జాళువా బంగరు- జాళువాదేశపు మేలైన బంగారుతో చేయబడిన,
ఆలవట్టముల భంగిన్ - సుర్యపాను చంద్రపానులనే రాజ చిహ్నముల విధంగా,
పూర్వ పశ్చిమ ఉత్తుంగ మహీధర అగ్రములన్ -
తూర్పునా పడమటా ఉన్న మిక్కిలి ఎత్తైన కొండల శిఖరములమీద,
తోయజశాత్రవ మిత్ర బింబముల్ - చంద్రుని యొక్కయు
సూర్యుని యొక్కయు బింబములు, కనంబడెన్ - కనబడెను.


మన్మథుడనే రాజు మార్గస్థులను జయించి కొల్లగొట్టటానికి
దాడి చేయడానికి బయలుదేరాలనుకున్నంతలోనే సేవకులు
మున్ముందుగానే సూర్యపాను చంద్రపాను
లనే ఆలవట్టాలలాగ, తూర్పు పడమర కొండలమీద
చంద్ర, సూర్యబింబాలు కనిపిస్తున్నాయని - తాత్పర్యం.

Monday, October 17, 2016

నీరజముల్ కుముదంబు లౌను రేల్


నీరజముల్ కుముదంబు లౌను రేల్



సాహితీమిత్రులారా!

విజయవిలాసములోని
ఈ చమత్కారపద్యం చూడండి-

నెల యుదయించునప్పు డల నీరజముల్ కుముదంబు లౌను రేల్
కలువలదాయ రాకకుఁ బగల్ కుముదంబులు నీరజంబులౌఁ
దలఁపఁగ నింత వింత గలదా యని కందువమాట లాడుచున్
బళిర కిరీటి మీఱెఁ దన ప్రౌఢి విశారదుఁ డెన్నుచుండఁగన్
                                                            (విజయవిలాసము -1-207)








అర్జునుడు తన చెలికాడైన 
విశారదునితో అన్న పద్యం ఇది -

రేల్ - రాత్రులందు, నెల - చంద్రుడు, 
ఉదయించునప్పుడు, అల నీరజముల్ - 
ఆ పద్మములు, కుముదంబులు అగున్ - కలువలగును, 
(చెడిన సంతోషము కలవగును అనగా ముడుచుకొనును), 
పగల్ - పగటి యందు, కలువదాయ రాకకున్ - కలువకు 
శత్రువైన సూర్యుడు వచ్చినపుడు, కుముదంబులు - కలువలు, 
నీరజంబులౌన్ - తామరలగును,(రజము(పుప్పొడి)లేనివగును 
అనగా ముడుచుకొనును), తలఁపన్  - ఆలోచింపగా, ఇంతవింత 
గలదా - ఇంత చిత్రం ఉంటుందా - అని విశారదుడు తన, 
ప్రౌఢిన్ - నేర్పును, ఎన్నుచుండగన్ - పొగడుతుండగా, 
కందువ మాటలు - చమత్కారమగు మాటలను, 
ఆడుచు - పలుకుతూ, కిరీటి - అర్జునుడు, 
మీఱెన్ - అతిశయించెను, బళిర - సెబాష్!

విశారదా చూచావా చంద్రుడు వచ్చినపుడు 
తామరలు కలువలవుతాయి. 
సూర్యుడు వచ్చినపుడు కలువలు 
తామరలవుతాయి. ఇంతవింత ఎక్కడైనా ఉందా! 
అని అర్జునుడు చమత్కారంగా అంటూండగా 
విశారదుడు అతని కవిత్వాన్ని మెచ్చుకుంటాడని - భావం

Friday, July 15, 2016

గణింపరు జాణలు జాఱుపాటులన్


గణింపరు జాణలు జాఱుపాటులన్


సాహితీమిత్రులారా!


చేమకూర వేంకటకవి కృత విజయవిలాసములో
అర్ఝునుడు ఉలూచిని వివాహమాడిన తొలిరేయినాటి
విశేషాల్లోనిది ఈ పద్యం

శయ్యకుఁదార్పఁగా దుఱుము జాఱె; న దంతటఁ జక్కదిద్దఁబోఁ
బయ్యెద జాఱె; నయ్యదిరిపాటున గ్రక్కున నీవి జాఱె; రా
జయ్యెడ నవ్విలాసిని యొయారముఁ జూచి కవుంగిలించె; నౌ!
నెయ్యడ మేలె చూతురు, గణింపరు జాలు జాఱుపాటులన్.
                                                              (విజయవిలాసము -1-172)

పక్కమీదికి చేరుతుండగా కొప్పు జారిపోయింది.
అది సరిదిద్దబోయేలోగా పైటజారింది.
అది సవరించుకొనే టప్పటికి చీరముడి సడలిపోయింది.
ఇన్ని జారుపాటులున్నా అర్జునుడు ఉలూచి ఒయ్యారాన్ని
చూచే కౌగిలించుకున్నాడు.
తెలిసినవారు దేనిలోనైనా మంచే చూస్తారు కాని
జారుపాటులనూ, లోపాలనూ ఎంచరని భావము.

ఇందులో మరో విశేషంకూడ ఉంది
అదేమిటంటే
కావ్యాలలో ఉండే వ్యాకరణ విరుద్ధాలవంటి స్వల్పలోపాలను
గణింపక, రసభావాది సుగుణాలనే ఎంచాలని
పండిత విమర్శకులకు
చేమకూరివారు
మనవి చేశారు.

Monday, June 6, 2016

వారి నేరీతిఁ బ్రతిసేయవచ్చు



వారి నేరీతిఁ బ్రతిసేయవచ్చు


సాహితీమిత్రులారా!

చేమకూర వేంకటకవి విజయవిలాసకావ్యంలో
రఘునాథనాయకుని దానగుణం
ఏవిధంగా
వర్ణించాడో చూడండి.

అడుగు మాత్రమె కాక యంత కెక్కుడుగ నీఁ
           జాలెనే యల బలిచక్రవర్తి?
యావేళ కటు దోఁచినంత మాత్రమె కాక
           కోర్కి కెచ్చిచ్చెనే యర్కసూతి?
తూఁగిన మాత్ర మిత్తుననెఁగా కిచ్చవ
           చ్చినది కొమ్మనియెనే శిబివిభుండు?
కలమాత్ర మపుడిచ్చెఁగాక కట్టడగాఁగ
           ననిశంబు నిచ్చెనే యమృతకరుఁడు?
వారి నేరీతిఁ బ్రతిసేయవచ్చు నెల్ల
యర్థులఁగృతార్థుల నొనర్చునట్టి యప్ర
తీప వితరణికి మహాప్రతాప తిగ్మ
ఘృణికి నచ్యుత రఘునాథ నృపతి మణికి?
                                  (విజయవిలాసము -1-25)

నాడు బలిచక్రవర్తి వామనునకు ఆయన అడిగిన అడుగులే
ఇచ్చినాడుకానీ ఒక్క అంగుళంకూడా
ఎక్కువ ఇవ్వలేకపోయాడు
ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలు అడిగినపుడు
అడిగినంతే ఇచ్చాడు కానీ కోరినదానికన్న
ఎక్కువ ఇవ్వలేక పోయాడు.
శిబి చక్రవర్తి శరణార్థియైన పావురము తూగినంత బరువుకు
బదులుగా తన శరీరంలోని మాంసం డేగకు తూగినంతనే ఇచ్చాడు
కానీ కొంచం కూడా ఎక్కువ ఇవ్వలేదు.
అమృతకిరణుడైన చంద్రుడు తన పదహారు కళలలో
ఏదినానికి ఆదినం ఒక్క కళమాత్రమే
నియమం ప్రకారం ఇస్తున్నాడు కానీ ఏల్లప్పుడూ
(రాత్రికాని సమయంలోను) ఇవ్వగలిగెనా
ఇవ్వలేకున్నాడు.
యాచకులందరికి సఫలమనోరథులుగా చేయునట్టి
ఎదురులేని దాతయు,
తేజములో సూర్యునితో సమానమైనవాడు
అయిన
రఘునాథనృపాలునికి ఆ బలి, కర్ణ, శిబి, చంద్రులు
ఏరీతిగా సరి పోల్చవచ్చు.
- అని భావం.

Monday, May 23, 2016

రుచి రాంగ రుచుల నయ్యంగనకున్


రుచి రాంగ రుచుల నయ్యంగనకున్


సాహితీమిత్రులారా!

విజయవిలాసంలోని ఈ పద్యం చూడండి.
సుభద్రను కవిగారు ఎలా వర్ణించారో

అయ్యారే! చెలువెక్కడ!
న య్యారే గెలువఁ జాలు నంగజు నారిన్
వెయ్యాఱులలో సరిలే
రయ్యా, రుచి రాంగ రుచుల నయ్యంగనకున్ ((1-103)

అయ్యారే = ఓహోహో ,
చెలువు ఎక్కడ = ఆ సుభద్ర అందము,
ఎక్కడ = తక్కిన కాంతల అందమెక్కడ,
ఆ ఆరే = ఆ సుభద్ర నూగారే,
అంగజు = మన్మథునియొక్క,
నారిన్ = వింటి అల్లెత్రాడు(తుమ్మెదల పంక్తిని),
గెలువన్ చాలున్ = గెల్వగలదు - ఓడించగలదు
(లేదా)
అంగజు నారిన్ = మన్మథుని భార్య రతీదేవి,
గెలువఁజాలును(నూగా రొక్కటే రతీదేవిని గెలుస్తుందని ఈలాగా కవి నిరూపించాడు),
రుచిర అంగ రుచులన్ = మనోహరమైన (యావత్)శరీరమునందుగల అందములలో,
ఆ అంగనకున్ = ఆ సుభద్రకు,
సరి = సమానమైన అందగత్తెలు,
వెయ్యాఱులలోన్ = వేలకొలది కాంతలలో,
(ఎవ్వరూ) లేరు అయ్యా = లేదు సుమా!

(ఇది తాపీధర్మారావుగారి హృదయోల్లాస వ్యాఖ్యలోనిది)

Friday, May 20, 2016

నడుమే పసలేదుగాని నారీమణికిన్!


నడుమే పసలేదుగాని నారీమణికిన్!


సాహితీమిత్రులారా!

ఇంటిపేరు "నస" - కవిత్వం బహు"పస" అని అంటూ ఉంటారు.
ఆయనే చేమకూర వెంకటకవి.
ఈయన విజయవిలాస, సారంగధర మొదలైన కావ్యాలను రచించినవారు.
విజయవిలాసం అనేది అర్జునుని తీర్థయాత్ర.
దీనిలో ముగ్గురు నాయికలతో అర్జునుని విలాసం.
అందులోని 1-104వ పద్యం ఇది చూడండి.

కడుహెచ్చు కొప్పు దానిన్ 
గడవన్ జనుదోయి హెచ్చు, కటి యన్నిటికిన్
కడుహెచ్చు, హెచ్చు లన్నియు
నడుమే పసలేదుగాని నారీమణికిన్!

ఇది చిన్నపద్యం.
దీనిలో కవి సుభద్ర
కొప్పూ, స్తనాలూ, కటిప్రదేశమూ, నడుమూ వర్ణిస్తున్నాడు.

సుభద్ర కొప్పు పెద్దది.
దాన్ని మించి చనుకట్టు పెద్దది.
అన్నిటికంటె కటిప్రదేశము పెద్దది.
అన్నీ పెద్దవేకాని
నడుమే సారంలేనిది స్వల్పవిషయమని భావం.

కవి ఏదో లోపం చెబుతున్నట్లు చెబుతున్నాడు
కాని ఇదిలోపంకాదు.
నడుం ఎంత సన్నగా ఉంటే అంత అందమంటారు.
అందగత్తెలు సింహమధ్య, అణుమధ్య అని అనడం
సర్వసాధారణంకదా!

ఎంత చమత్కారంగా వర్ణించాడో కదా! ఈ పద్యాన్ని.