Thursday, April 29, 2021

''దుఃఖభాగులు'' అంటే ఎవరు?

 ''దుఃఖభాగులు'' అంటే ఎవరు?





సాహితీమిత్రులారా!


ప్రపంచంలో సుఖం ఎరుగనివారు
ఎవరైనా ఉన్నారా? అంటే
ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు" అంటారు
వారి వివరాల్లో కెళితే వారు ఆరు రకాలు-

1. ఈర్ష్యాళువు - 
వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.

2. జుగుప్సావంతుడు- 
వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది.

3. నిస్సంతోషి -
వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖమెక్కడ

4. క్రోధనుడు-
వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ 
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోషమెక్కడ

5. నిత్యశంకితుడు -
అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది
సుఖం.

6. పరభాగ్యోపజీవి -
ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే 
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా.

ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ, 
ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని "దుఖఃభాగులు" అంటున్నాయి 
శాస్త్రాలు.


Monday, April 26, 2021

''సాని'' అంటే ఏమిటి?

''సాని'' అంటే ఏమిటి?




సాహితీమిత్రులారా!



సాని అనే పదం మనకు సుపరిచితమే కానీ దాని అర్థం మాత్రం

మనకు వేరుగా వ్యవహారంలో గమనిస్తాం. 

సాని అంటే సంపూర్ణ సంగీత పరిజ్ఞానం కలది అని.

 - నుండి ని - వరకు పరిపూర్ణ సంగీత పాండిత్యాన్ని సంపాదించుకొన్న

గంధర్వాంగనకు సాని అని బిరుదునిచ్చేవారు. 

ఈ బిరుదుపొందిన ప్రథమ సంగీత విద్వాంసురాలు రంభయే అయి ఉండాలి.

తరువాత కాలంలో సాని అనేది ఒకబిరుదుగా ఉండేది. 

ఈ బిరుదును సంపాదించుకోవడానికి ప్రతి దేవనర్తకి ఎంతో కష్టపడాల్సివచ్చేది.  

కొందరు రాణులకు గౌరవప్రదంగా ఈ బిరుదు ఉండేది. 

పిల్లలమర్రిలోని ఎరుకలేశ్వరునికి దేవాలయం కట్టించిన 

బేతరాజు భార్యపేరు ఎర్రక్కసాని

ఎరుకలసాని, మంత్రసాని, దొరసాని అనే పదాలు

 గౌరవప్రదమైనవే కాని నీచమైనవికావు. 

రానురాను ఈ పదం విశిష్టత అంతరించి కళంకాన్ని ఆపాదించే 

నీచమైన  అర్థంగా మారిపోయింది.

                                                              (ఈ సమాచారం డా. నటరాజు రామకృష్ణ గారి

                                                                     రుద్రగణిక నుండి.)

Saturday, April 24, 2021

షష్టిపూర్తి ఎందుకు?

 షష్టిపూర్తి ఎందుకు?




సాహితీమిత్రులారా!



మనం ప్రతిరోజూ ఎక్కడోఒకచోట

షష్టిపూర్తి చేసుకొనేవారిని గమనిస్తుంటాం

అది ఎందుకు చేసుకోవాలి ఇలాంటివేమైనా

ఇంకా ఉన్నాయా అనే దాన్ని గురించి ఇక్కడ

తెలుసుకుందాం-

60 సం., 70సం., 81 సం.లకు మనిషికి గండం 

వుంటుందని వాటికి శాంతి చేసుకోవాలని 

మన శాస్త్రకారులు  చెబుతారు. 


షష్టిపూర్తి - 

ఇది 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో

చేసుకొనే వేడుకని అందరూ అను కుంటారు కాని

శాస్త్రకారులు 

"జన్మతః షష్టిమేవర్షె మృత్యు రుగ్ర రథోనృణాం" - అని 

చెబుతారు. అంటే పుట్టినది మొదలు 60వ సంవత్సరమున

ఉగ్రరధము అనే పేర మృత్యువు మానవుని వెన్నాడుతుంది.

ఈ 60వ సంవత్సరగండం దాటడానికై షష్టిపూర్తి శాంతి చేసుకో 

తగిందని దీనికే ఉగ్రరధ శాంతి అని పేరు.


70 సంవ్తరాల గండం-

"జన్మనాసప్తమేవర్షె మృత్యుర్భీ మరధోభవేత్" - అని 

శాస్త్రకారులు చెబుతారు. అంటే 

పుట్టింది మొదలు 70 వ సంవత్సరమునకు

భీమరధమని పేర మృత్యువు వెన్నాడుతూంటుంది. 

దీని శాంతి కొరకై భీమరధ శాంతిని చేసుకోవాలి.


81 సంవత్సరముల ఉత్సవం -

అశీత్యేకాబ్దమాసేస్యాత్ అధికమాసైస్సమన్వితే

సహస్ర సోమదర్శస్యాత్ ఊర్జ్యంస్యాత్ పుణ్యకృత్

ఎనబై ఒకటవ సంవత్సరమన శతాభిషేక మహోత్సవం 

చేయదగింది. పుట్టినది మొదలు అధికమాసంలతో కూడ 

లెక్కిస్తే 81వ సంవత్సరానికి 1000 సంద్రదర్శనాలవుతాయి

కావున శతాభిషేకోత్సవం చేసుకోదగింది.

Thursday, April 22, 2021

బారిష్టర్ పార్వతీశం (ఆడియో నవల)

 బారిష్టర్ పార్వతీశం (ఆడియో నవల)




సాహితీమిత్రులారా!


మొక్కపాటి నరసిహమూర్తి గారి

హాస్యనవల బారిష్టర్ పార్యతీశం

రెడ్డి సాయ్ సందీప్ యూటూబ్ ఛానల్ నుండి

ఆడియో నవలగా ఆస్వాదించండి-



Sunday, April 18, 2021

రామరాజభూషణుడి వసు చరిత్ర కథాంశం

 రామరాజభూషణుడి వసు చరిత్ర కథాంశం





సాహితీమిత్రులారా!



రామరాజభూషణుని వసుచరిత్రను

జయంతి పబ్లికేషన్స్ వారి కమలాసనుడు వచన రచన ఆధారంగా

వనం జ్వాలా నరసింహారావుగారు

జ్వాలాస్ మూజింగ్స్ నందు

రామరాజభూషణుడి వసు చరిత్ర కథాంశంగా పోస్ట్ చెశారు దాన్ని ఇక్కడ ఆస్వాదించండి-

--------------------------------------------------

యావత్ మహీతలాన్ని పరిపాలించి, పేరు ప్రఖ్యాతులు గడించి, దేవేంద్రుడి నుండి వరంగా ఎన్నో గౌరవ చిహ్నాలను పొంది, మిలమిల మెరిసిపోతున్న విమానంలో ఎక్కి తిరుగుతూ వుండే, ఛేది దేశాధిపతైన వసువు అనే మహారాజు కథే వసుచరిత్ర. దీన్ని సూతుడు శుకశౌనకాది మహామునులకు నైమిశారణ్యంలో తెలియచేశాడు.


అధిష్టానపురం అనే మహానగరం రకరకాల శోభలతో అలరారుతూ వుంటుంది. సకల విద్యలకు ఆ నగరం ఆటపట్టు. నగరంలో ఎక్కడ చూసిన ధాన్యపు రాశులే! వేదసమ్మతమైన హితోక్తులు చెప్పే బ్రాహ్మణోత్తములు ఎందరో వున్నారానగరంలో. వారు సకల విద్యలలోను ఆరితేరినవారు. సువర్ణ సంపదలతో నిండి అలరారుతూ వుంటుంది ఆ మహానగరం. ఆ నగరంలోని రాజులు ప్రతిభావైవిధ్యాలతో వెలుగొందుతుంటారు. కుబేరుడిని మించిన ధనవంతులు ఆ నగర వైశ్యులు. రైతులు ధాన్యపు రాశులను భద్రపరుస్తారు.


ఆ మహానగరానికి పరాక్రమవంతుడైన వసు నృపాలుడు అధిపతి. వసురాజు ఎనలేని కీర్తి సంపద ఆర్జించాడు. శౌర్యంలో అతడికి సమానులెవరూ లేరు. దానంలో, వితరణలో ఆయనకు ఆయనే సాటి. ప్రజలపట్ల అనుగ్రహం చూపేవాడు. అవసరమైతే పరాక్రమం ప్రదర్శించేవాడు. సర్వసమర్థుడై పరిపాలన చేశాడు. ఒకనాడు హిమవత్పర్వత శాఖైన కోలాహల పర్వతం శుక్తిమతి నదీప్రవాహానికి అడ్డు నిలవగా వసురాజు తన కాలిగోటితో ఆ పర్వతాన్ని పక్కకు నెట్టాడు. దాంతో అతడి కాలిగోరు ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైనదిగా చెప్పుకున్నారు. ఆ పరాక్రమాన్ని తిలకించిన ఇంద్రుడు వసురాజుతో స్నేహం చేయసాగాడు. సామంతరాజులు ఆయనకెప్పుడూ లోబడి వుండేవారు. వసురాజు చేత పరాభవించబడిన పర్వతం కొన్నాళ్లు ఆయన కాళ్ల దగ్గరే పడి వున్నది. ఆ తరువాత దానిమీద దయతలచి వదిలేశాడు. ఆ పర్వతం మీద రాజు అప్పుడప్పుడూ విహారం చేసేవాడు.


ఇదిలా వుండగా ఒక సంవత్సరం వసంత ఋతువు ప్రవేశించింది. రాజుగారి ఉద్యానవనంలో చెట్లు చిగురులు వేశాయి. మన్మథదేవుడు చైత్రమాసంలో మీనధ్వజారోహణం చేస్తాడు. మలయమారుతం అనే రథం ఎక్కి ప్రయాణం చేస్తాడు. మారుతం వసంత సమాగమంతో విజృంభిస్తుంది. అది చేసే అల్లరి అంతా-ఇంతా కాదు. వనపాలకులు మారుతం చేస్తున్న అల్లరిని, ఆగడాన్ని వసురాజుకు విన్నవించారు. వారి మాటలు వినగానే ఉద్యానవనం అంతా ఒక్కసారి తిరిగిరావాలని, విహరించాలని రాజుగారికి కోరిక కలిగింది. తనకొరకై సిద్ధం చేసిన అపురూపమైన రథంలో ఉద్యానవన విహారానికి బయల్దేరాడు రాజు.


మహారాజు దర్శనానికి అదే సరైన సమయం అని భావించిన సామంతరాజులు అక్కడికి చేరుకున్నారు. రాజుగారి రథం ఉద్యానవనం దగ్గర ఆగింది. ఆయన రథం మీదనుండి కిందికి దిగాడు. వెంటవచ్చిన సామంత రాజులను పొమ్మన్నాడు. తన స్నేహితులతో కలిసి ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. వనాగ్రసీమను పరికించి చూశాడు రాజు. అరటి చెట్లను, పాడుతున్న చిలకలను, సాష్టాంగపడుతున్న వన వృక్షాలను, సంపెంగచెట్లను, ఇంకా ఆనేక రకాల వృక్షాలను చూశాడు రాజు. ఇంతలో వసురాజుకు శుక్తిమతీనదిలో ఒదిగి దాక్కుని వున్న కోలాహల పర్వతం గుర్తుకు వచ్చింది. దాని దగ్గరికి వెళ్లాలని కుతూహలం కలిగింది.


వసురాజు తన మంత్రితో సహా కోలాహల పర్వత ప్రాంతాన్ని చేరుకునేసరికి వారికి సురాపాన మత్తతతో మునిగిపోయిన దేవతాస్త్రీల మనోహర సంగీత నాదం వినవచ్చింది. ఆ నాదానికి తన్మయుడైపోయాడు వసురాజు. మరో పక్కనుండి కోకిలల గేయసముదాయం వినవస్తోంది. ఇంకో పక్క నుండి నెమళ్ళ గుంపుల నాట్యధ్వని వినవస్తోంది. అలా...అలా...అనేక గాన సంపుటలు ఒకే సమయంలో వినపడసాగాయి. పర్వత విశేషాలను తనివితీరా చూడ సాగాడు వసురాజు. తన మంత్రితో కూడి వసురాజు ఒక చంద్రశిలమీద కూచున్నాడు. ఆ సమయంలో వారికొక మధురగానం వినవచ్చింది. అది ఎక్కడినుండి వస్తున్నదో, ఎవరిదో, వారు ఎక్కడ వున్నారో కనుక్కొని రమ్మని మంత్రికి చెప్పాడు రాజు. ఆ వివరాలు తెలిస్తే అక్కడికి పోదామని అన్నాడు రాజు.


మంత్రి రాజుగారి ఆదేశానుసారం బయల్దేరాడు. ఆయనకు ఒకలోయ కనిపించింది. అక్కడ నదీ ప్రవాహం, అనేక రకాల చెట్లు, పక్షులు కనిపించాయి. అక్కడ మంత్రికి ఒక దివ్య మందిరం కనిపించింది. ఆ మందిరం ముందర నవరత్నాల ముగ్గులు కనిపించాయి. అది నానా శోభలతో వెలిగిపోతున్నది. ఆ మందిరంలో కొందరు వనితా రత్నాలు వున్నట్లు ఆయన భావించాడు. చెట్లచాటునుండి ఆ మందిరంలోకి చూడసాగాడు. లోపల ఒక సుందరి కూచుని వుండడం గమనించాడు. ఆమె అక్కడ కూచుని వీణ వాయిస్తూ వున్నది. ఆమె చుట్టూ కొంతమంది చెలికత్తెలున్నారు. ఆమె గురించి మహారాజుకు చెప్పిరావడానికి మంత్రి వసురాజు దగ్గరికి వెళ్లాడు.


మంత్రి తాను చూసినదంతా చెప్పాడు. తాను చూసిన సుందరి అందాన్ని వర్ణించాడు. ఆమెకు ఎదురుపడకుండా దూరంగా చెట్ల చాటు నుండి చూసిన సంగతి విన్నవించుకున్నాడు. త్వరగా వెళ్లి ఆమెను సందర్శించుకొని రావాలని రాజుగారు కుతూహలపడ్డాడు. వసురాజు విరహ వాతావరణంలో మునిగిపోయాడు. రాజు, మంత్రి కలిసి బయల్దేరారు. కన్య వున్న మందిరం కనిపించింది. ఆ దివ్యమందిరాన్ని పొదల మాటున నిలబడి అతి జాగ్రత్తగా పరిశీలించి చూశాడు వసురాజు. ఆ సుందరిని చూడగానే ఆయన కన్నులకు ఉత్సుకత ఎక్కువైంది. శరీరం అంతా అనురాగంతో నిండిపోయింది. ఆమె సౌందర్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలని అనుకున్నాడు. ఆమెను ఆపాదమస్తకం గమనించాడు.


వసురాజు మనస్సు ఇంతవరకూ పరాయత్తం కాలేదు. ఇప్పుడు ఆయన తన మనస్సులో ఈ కన్యారూపాన్ని నిలుపుకొని కొనియాడసాగాడు. ఆమె సౌందర్యానికి ముగ్దుడైపోయాడు. రాజు, మంత్రి ఆలోచన చేసిన తరువాత ముని వేషంలో మంత్రి ఆమె దగ్గరికి పోయాడు. ఆయన్ను చూసి సుందరి ఆయనకు నమస్కారం చేసింది. ప్రియపురుషుడిని వివాహం చేసుకుంటావని ఆమెను ఆశీర్వదించాడు ముని వేషంలోని మంత్రి. మునికి అర్ఘ్యపాద్యాది సేవలను చేసిన తరువాత ఆయన వివారాలను అడిగింది సుందరి చెలికత్తె మంజువాణి. తాను గౌతముడి వంశీయుడినని, క్షీర సముద్రంలో పుట్టానని, తన పేరు కూడా గౌతముడే అని, తాను సూర్యుడిని ప్రేమిస్తున్నానని, ఉద్యానగతుడైన తన స్వామితో అటువైపుగా వచ్చానని, అపర లక్ష్మీదేవిలాగా కనిపిస్తున్న ఆ సుందరి గోత్రనామాలు చెప్పమని అడిగాడు.


ఆ కన్య పేరు సింధునందన అని, ఆమెనే అంచలేంద్ర నందన అని కూడా అంటారని, దానర్థం నదీ పుత్రి, పర్వత పుత్రి అని, అంటూ, మంజువాణి ఆ సుందరి జన్మక్రమాన్ని తెలియచేసింది ఇలా. “ఈ భూమ్మీద వసురాజు అనే చక్రవర్తి వున్నాడు. అతడి పరాక్రమం లోకాతీతమైనది. అతడి నివాస స్థలమైన అధిష్టానపురం సంపదలతో అలరారుతూ వుంటుంది. రాజధానికి కంఠాభరణం లాగా శుక్తిమతి అనే నది వున్నది. ఆ నదికి ఇష్టసఖి నర్మదానది. వేత్రవతి, సరస్వతి నదులు చెలికత్తెలు. అంతా కలిసి ఒకనాడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లివస్తుంటే ఒక సంఘటన జరిగింది. శుక్తిమతీదేవికి పర్వత శ్రేష్టుడైన ఒక పురుషుడు తారసపడ్డాడు. అతడు అనుపమ భాగ్యశాలైన హిమవంతుడి కుమారుడు. పార్వతీదేవికి తమ్ముడు. పరమేశ్వరుడికి ముద్దుల మరది. పర్వతరాజు శుక్తిమతీదేవిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఇద్దరూ మోహంలో చిక్కుకుపోయారు. కోలాహలుడు శుక్తిమతి చెంతకు చేరాడు. ఆమె కూడా రాజుకు స్వాగతం పలికింది. అర్ఘ్యపాద్యాదులను ఇచ్చింది. పూజావిధులు నెరవేర్చింది”.



“తాను ఆమె పొందుకోరి వచ్చానని, ఎల్లప్పుడూ ఆమెను విడువకుండా వుంటానని, తనను అంగీకరించమని పర్వతరాజు కోరాడు శుక్తిమతిని. తన స్వభావం నీచాతినీచమైనదని, ఎప్పుడూ పల్లానికే పోతుంటానని, అతడేమో చలించని స్వభావం కలవాడని, తాను పరుగులు తీస్తుంటానని, అతడేమో ధైర్యంగా ఒక్క చోటే నిలుచుంటాడని, ఇలా పరస్పర విరుద్ధ గుణాలు కల ఇద్దరు ఒకటిగా కూడడం సమంజసంగా వుండదని, తమకు స్నేహం సరిపడే విషయం కాదని, కాబట్టి ఆయన పట్ల అనురాగం కలగడం కష్టం, అసాధ్యమని శుక్తిమతి తేల్చి చెప్పింది. పర్వతరాజు ఆమె చెప్పిన మాటలు వినకుండా బలం ప్రయోగించి, పరాక్రమం ప్రదర్శించి, శుక్తిమతిని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. శుక్తిమతి అసహయురాలై వసురాజును ప్రార్థించింది. శుక్తిమతికి అడ్డుగా నిలిచాడు కోలాహలుడు. నదీగర్భం పగిలిపోయి నీరు భూమ్మీద అనేక పాయలుగా స్రవించసాగింది. భూమండలంలో సంచలనం బయల్దేరింది. జనం కూడా వసురాజుకు మొరపెట్టుకున్నారు. వసురాజు తన కాలిగోటితో కోలాహల పర్వతాన్ని ఆకాశం వైపుకు ఎగురవేశాడు. ప్రజలంతా సంతోషించారు”.


“కోలాహల పర్వత గర్వాన్ని అణచిన వసురాజును ప్రజలు కీర్తించారు. తాను చేయలేని పని వసురాజు చేసినందుకు దేవేంద్రుడు ఆనంద భరితుడయ్యాడు. స్వయంగా వసురాజు దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చాడు. ఒక అపురూపమైన రథాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ రథం మీద లక్ష్మీదేవి, విష్ణుమూర్తి సూర్యమండలం అంతా పర్యటన చేశారని చెప్పాడు. ఆ విమాన యజమానికి సువర్ణప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. ఆ విమానం ఎక్కే అర్హత బ్రహ్మకు, విష్ణువుకు, శంకరుడికి తప్ప అన్య దేవతలకు లేదన్నాడు. ఆ విమానాన్ని ఎక్కి వసురాజు తన నివాసానికి రాకపోకలు సాగించాలని కోరాడు ఇంద్రుడు. వసురాజు ఆ కానుకను స్వీకరించాడు. శుక్తిమతీ తీరవాసులైన మునులు వసురాజుకు ‘ఉపరిచరుడు’ అనే బిరుదు ఇచ్చారు. వసురాజు ఆయన అనుకున్నప్పుడల్లా ఆ విమానం మీద విహారం చేస్తూ నానలోకాలు తిరిగేవాడు.ఆయనకు శుక్తిమతీ నది క్రీడా సరోవరం కాగా, కోలాహల పర్వతం క్రీడా పర్వతమైంది”.


“జలప్రవాహానికి అడ్డుగా నిలిచిన కోలాహల పర్వతరాజు సంఘర్షణవల్ల శుక్తిమతీనదికి గర్భం ఏర్పడింది. ఒక శుభ ముహూర్తాన ఒక ఆడ శిశువు, ఒక మగ శిశువు కలిగారామెకు. ఈ విషయం తెలుసుకున్న కోలాహలుడు కూడా సంతోషపడ్డాడు. శుక్తిమతి తన కుమారుడికి ‘వసుపదుడు’ అని పేరు పెట్టింది. బాలికకు ‘గిరిక’ అని నామకరణం చేశారు బ్రాహ్మణులు. తన ఇద్దరు సంతానాన్ని శుక్తిమతి జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తోంది. గిరిక అల్లారుముద్దుగా పెరిగింది. తల్లి కుమార్తెను చదువుల సరస్వతిగా తయారు చేసింది. తండ్రి ఆమెను వీణా వాద్య ప్రవీణురాలిగా చేశాడు. ఆమె వీణానాదం చేయడానికి ఒక మణి గృహాన్ని నిర్మించి ఇచ్చాడు. ఆ ‘గిరిక’ యే ఈ కన్య. చెలికత్తెలైన వారంతా వనదేవతలు”.


ఈ విధంగా మంజువాణి ఉపరిచర వసువు కథను, గిరికాదేవి జన్మ వృత్తాంతాన్ని మునివేషంలో వున్న మంత్రికి సవివరంగా చెప్పింది. పొదలమాటున వున్న రాజు కూడా ఆ కథంతా విన్నాడు. గిరిక నెమ్మదిగా తలెత్తి వసురాజును చూసింది. సిగ్గు పడింది. వసురాజు చక్కదనాన్ని చూస్తూ ఉండిపోయింది. రాజు అక్కడికి వచ్చాడు కాబట్టి తమ అభిమతాలన్నీ తీరాయని మంజువాణి అన్నది. ఆయన్ను పొందగలిగినందుకు గిరిక చాలా అదృష్టవంతురాలని అన్నది. ఆ భువనమోహిని చిన్నతనం నుండీ వసురాజును కీర్తిస్తూనే వున్నదని అన్నది. ముని వేషంలో వున్న మంత్రి వసురాజును, గిరికను ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లిపోయి, తన కపట వేషాన్ని తీసేసి మంత్రి వేషంలో తిరిగి అక్కడికి వచ్చాడు. గిరికను, వసురాజును వంటరిగా వదిలి అంతా అక్కడి నుండి తప్పుకున్నారు. వసురాజు మనస్సు పూర్తిగా గిరిక మీదే లగ్నమైపోయింది. ఆమె పరిస్థితి కూడా అంతే.


ఇంకా అక్కడే ఎక్కువకాలం వుంటే మంచిది కాదని, గిరిక ఎలాగూ రాజును ప్రేమించిందని, రాజధానికి పోయి పురోహితులను సంప్రదించి గిరికతో వివాహానికి ముహూర్తుం నిర్ణయం చేద్దామని మంత్రి అన్నాడు. ఆ తరువాత మంత్రితో కూడి వసురాజు ఆలోచనలలో మునిగి తేలుతూ నగరానికి వెళ్లాడు.


మంత్రితో కలిసి అధిష్టానపురం నగరానికి చేరుకున్న వసురాజు ఏపనిమీదా ఆసక్తి కనపరచలేదు. ప్రతి పనీ పరధ్యాసతో లాంఛనప్రాయంగా ముగించేవాడు. అనుక్షణం గిరికన్యను తలచుకుంటూ నీరసించి పోయాడు. అక్కడ స్త్రీరత్నమైన గిరిక ఏమీ దొరకని స్థితిలో పడిపోయి తన హృదయ చోరుడి వర్ణచిత్రం వ్రాసింది. ఆమెకూడా వసురాజులాగానే విరహావస్థలోపడి ఉన్మత్తురాలైపోయింది. కూతురు అలా మానసిక వ్యధతో కుంగిపోవడం తల్లి శుక్తిమతీదేవి గమనించింది. కూతురును తన కౌగిట్లో పొదివి పట్టుకున్నది.


మన్మథబాధ భరించలేక గిరికన్య ఉద్యానవనంలో విహారానికి పోయింది. చెట్టు-చెట్టునూ, పుట్ట-పుట్టనూ వసురాజు గురించి అడిగింది. ఆమె పడుతున్న విరహ తాపాన్ని గమనించిన ఆమె ఇష్టసఖి మంజువాణి ఆమెను ఉపశమింపచేయడానికి పరి-పరి విధాల ప్రయత్నం చేసింది. తాను పోయి గిరిరాజ కన్య వృత్తాంతాన్ని వసురాజుకు చెప్తానని, ఆయన మనస్సు, ఆలోచన తెలుసుకొని వెంటనే వస్తానని, శుభవార్తను తీసుకు వస్తానని అంటుంది గిరికన్యతో, ఇతర చెలికత్తెలతో. ఆమె వెళ్లిన తరువాత మిగిలిన చెలికత్తెలు గిరికన్యను ఊరడించసాగారు. ఇంతలో వసురాజు దగ్గరికి వెళ్లిన మంజువాణి ఆయనిచ్చిన పద్మరాగముద్రికతో కూడిన ఉంగరాన్ని పుచ్చుకుని వినువీధిలో రాసాగింది. మంజువాణి గిరికన్యను చేరుతున్నకొద్దీ దాని అరుణిమ ఎక్కువ కాసాగింది.


మంజువాణి వచ్చి వసురాజు ఇచ్చిన ఉంగరాన్ని గిరికకు ఇచ్చింది. అక్కడి వృత్తాంతం చెప్పమని చెలికత్తెలు మంజువాణిని అడిగారు. జవాబుగా ఇలా చెప్పింది మంజువాణి: “మీరు చెప్పిన విధంగానే, గిరిక మనస్సులోని విచారాన్ని వసురాజుకు చెప్పడానికి గగన మార్గంలో ప్రయాణం చేసి ఆయన్ను చేరుకున్నాను. మొదట వసుమహారాజు నగరం ఏదో కనుక్కోవడం కష్టమైంది. కొంత పరిశీలన చేసి ఆయన నగరమైన అధిష్టానపురాన్ని గుర్తించగలిగాను. ఆయన రాజ సౌధం మీద వ్రాలాను. వసురాజు గృహద్వారాన్ని సమీపించాను. అదృశ్య రూపంలో వసురాజు కేళీ భవనంలో ప్రవేశించాను. అక్కడ వసురాజును, ఆయన మందిరాన్ని చూశాను. అక్కడ వున్న స్త్రీలు వసురాజు పరిస్థితిని గురించి చర్చించుకుంటున్నారు. గిరిక వున్న క్రీడావనానికి వెళ్లివచ్చినప్పటి నుండి ఆయన అదోలా ఉన్నాడని వారు మాట్లాడుకుంటున్నారు. రాజు వున్న రత్నమందిరంలో ప్రవేశించాను. వసురాజు నీమీద విరహతాపంతో కుమిలి పోతున్నాడని గ్రహించాను”.


“గిరికను ఉద్దేశించి వసురాజు కఠినంగా మాట్లాడడం, నిష్ఠూరాలు ఆడడం గమనించి అదే సరైన సమయమనుకొని మాట్లాడసాగాను. నా మాటల ద్వారా గిరిక హృదయ తాప వర్ణన వసురాజు హృదయానికి ములుకులాగా తాకినట్లయింది. మాట్లాడుతున్నదెవరో వసురాజుకు మొదలు అర్థం కాలేదు. మంజువాణి ఏదైనా సందేశం తీసుకు వచ్చిందా అన్న అనుమానం కలిగింది వసురాజుకు. తనకు గిరిక అంటే పూర్ణమైన అనురాగం వున్నదని, గిరిక కూడా అదే భావనతో వున్నదని తెలుసుకున్నాను కాబట్టి ఇక తనకు ఊరట కలిగిందన్నాడు. తానేం చేయాలని అడిగాడు. ఆయన ఆత్మీయతకు, మమకారానికి నాకు ఆశ్చర్యం కలిగింది. నేను గిరిజాదేవి ఆనవాలుగా తీసుకెళ్లిన ఆమె కంఠహారాన్ని వసురాజు హృదయ స్థానంలో వుంచాను. ఆ హారం ఆయన శరీరాన్ని తాకడంతోనే ఆయన తాపం పోయినట్లు మాట్లాడసాగాడు”.


“అ ఆతరువాత నేను నా అదృశ్య రూపాన్ని వదిలి, వచ్చింది నేనేనని, హారం ఇచ్చింది నేనేనని, మంజువాణినని చెప్పాను. వసురాజు తన మనస్సులో గిరిక పట్ల వున్న అనురాగాన్ని వివరించాడు. ఇంద్రుడికి తన వృత్తాంతం తెలిసిందని, ఒక మంచి రోజు చూసుకొని కోలాహలుడి దగ్గరికి వెళ్లి వివాహ ప్రస్తావన చేయనున్నాడని అన్నాడు వసురాజు. ఈ శుభ వార్తను నీకు (గిరికకు) తెలియచేయమని అన్నాడు. అలా అంటూ తన చేతి ఉంగరాన్ని నాకు నిదర్శనంగా ఇచ్చి పంపాడు”.


ఈ విధంగా జరిగిన కథ అంతా మంజువాణి ద్వారా విన్న గిరిక ఆ ఉంగరాన్ని చేతిలో తీసుకున్నది. వంటికి అద్దుకున్నది. ఆ ఉంగరం మీద వసురాజు పేరు చూసి, ఆయన్నే చూసినట్లు సిగ్గు పడింది. ఆ ఉంగరాన్ని తన వేలుకు ధరించింది. అప్పుడే వివాహం అయిపోయినంత ఉత్సాహంగా వున్నదామెకు. ఈ విషయమంతా విన్న గిరిక తల్లి శుక్తిమతీదేవి కూడా సంతోషించింది.


ఇదిలా వుండగా ఇంద్రుడు మొదలుగాగల దిక్పాలకులు కోలాహలుడి దగ్గరికి వచ్చారు. శుభకార్య నిర్వహణకు వస్తున్న ఇంద్రుడికి కోలాహలుడు స్వాగతం పలికాడు. ఇంద్రుడికి అతిథి పూజ చేశాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. తన ఉన్నతికి తగినట్లుగా ఇంద్రుడిని గౌరవించాడు. ఆయన వెంట వచ్చిన వారందరినీ పలకరించి, మన్నించి, గౌరవించాడు. తన కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. తండ్రి ఆదేశం ప్రకారం గిరిక అందరికీ నమస్కారం చేసింది. అంతా ఆమె చక్కదనాన్ని, సౌందర్యాన్ని చూసి మెచ్చుకున్నారు. గిరికకు తగిన వరుడు ఒకడున్నాడని అంటూ, ఇంద్రుడు, వసురాజు గురించి చెప్పాడు. అలాంటివాడు అల్లుడు కావడం కంటే అదృష్టం ఇంకేమి వుంటుందని అన్నాడు. కోలాహలుడు ఆ మాటలకు కృతజ్ఞతాపూర్వకంగా ఇంద్రుడి వైపు చూశాడు. తనకు ఇంతకన్నా సౌభాగ్యం ఏముందని అన్నాడు. ఇంద్రుడి స్నేహితుడైన వసురాజుకు తన కూతురును ఇచ్చి వివాహం జరిపించమని వేడుకున్నాడు కోలాహలుడు.


అంతకు ముందే అక్కడికి చేరుకున్న శుక్తిమతీదేవి, ఆమెతో పాటు వచ్చిన ఇతర నదీకాంతలు (నర్మద, గంగ, వాఘిరా, యమునా, రుద్రాంఘ్రిజ, తామ్రపర్ణి, పినాకిని, శీతాద్రిజాత) గిరిక వైభవానికి సంతోషపడ్డారు. హిమవంతుడు మేనక సమేతంగా వచ్చాడు. మైనాకుడు సముద్ర గర్భం నుండి పైకి వచ్చాడు. మేరు, మందర పర్వత శ్రేష్ఠులు వచ్చారు. ఇంకా ఎందరో గిరిక వివాహం చూడడానికి వచ్చారు. ఆ పర్వతం మొత్తం పెద్ద పట్టణంగా తయారైంది. ఆ రాత్రే వివాహానికి ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించమని, వదూవరులకు శుభం కలిగే విధంగా ఆశీర్వదించమని దేవేంద్రుడు తన గురువు బృహస్పతిని కోరాడు. వివాహానికి మిథున లగ్నం అనుకూలం అన్నాడు బృహస్పతి.


ఇంద్రుడు ఆ తరువాత వసురాజు దగ్గరికి వెళ్లాడు. వాస్తవానికి వసురాజు ఆయనకొరకు ఎదురు చూస్తున్నాడు. తనకు పాదాభివందనం చేసిన వసురాజును ఆశీర్వదిస్తూ ఇంద్రుడు, ఆయన్ను “పెండ్లికొడుకువు అగుదువుగాక” అని అన్నాడు. కోలాహలుడి దగ్గర జరిగిన విషయాలన్నీ చెప్పి, ఆ రాత్రే ముహూర్తమని అంటూ అక్కడికి బయల్దేరమన్నాడు. వెంటనే రాజాజ్ఞప్రకారం అధిష్టానపురం స్వర్గధామం లాగా అలంకరించడం జరిగింది. వసురాజును దేవతాస్త్రీలు పెండ్లికొడుకును చేశారు. ఆ తరువాత ఆయన వివాహ వేదిక దగ్గరికి వచ్చాడు. సమస్త అలంకారాలతో పెళ్లికూతురుగా తయారైన గిరిక కూడా వివాహ వేదిక మీదికి వచ్చింది. ఆమె లక్ష్మీదేవిలాగా శోభాయమానంగా ఒప్పుతున్నది.


దిక్పాలకుల భార్యలంతా గిరికాదేవికి వివాహ సమయంలో అలంకార విశేషాలను కానుకలుగా పంపారు. అంతకు ముందే వసురాజును అలంకరించారు. గిరిజావసురాజుల వివాహం చూడడానికి సంధ్యాదేవి వచ్చింది. ఇంతలో లగ్నం సమీపించింది. సరస్వతీదేవి వసురాజును చూడడానికి వచ్చింది. గిరిక, వసురాజులు శ్రీ మహాలక్ష్మి, విష్ణుమూర్తి లాగా వున్నారు. సుముహూర్తం కాగానే కోలాహల రాజు, వసురాజుకు తన కూతురును కన్యాదానం చేశాడు. బృహస్పతి మంత్రాలు చదివాడు. గిరిక కంఠానికి వసురాజు మంగళ సూత్ర ధారణ చేశాడు. బృహస్పతి శుభాశీస్సులు పలికాడు. వధూవరులు తలంబ్రాలు పోసుకున్నారు. ఆ తరువాత వారి వివాహ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన వారందరికీ విందులు చేశారు.


వసురాజు, గిరిక ఈ విధంగా ఇంద్రుడి ప్రేరణ వల్ల వివాహితులయ్యారు. పెళ్లి నాలుగు రోజులు పూర్ణాహుతులు మొదలైన హోమక్రియలు చక్కగా జరిగాయి. దేవతలు సంతృప్తిచెందారు. వదూవరులకు ఎన్నో వరాలిచ్చారు. దీవెనలిచ్చారు. కానుకలిచ్చారు.  ఇంద్రుడు వసురాజుకు దివ్యమైన వేణు దండాన్ని ఇచ్చాడు. అది శతకోటి వజ్రాయుదాలకు సమానమని చెప్పాడు. కోలాహల పర్వతరాజు, శుక్తిమతీదేవి, వసురాజు వివాహ మహోత్సవానికి వచ్చిన ఇరుపక్షాల బంధువులను తగురీతిగా సత్కరించారు. అత్తగారింటికి వెళ్లనున్న గిరికకు అన్ని రకాల సలహాలు, సూచనలు ఇచ్చింది తల్లి శుక్తిమతీదేవి.


అంపకాలైన తరువాత వసురాజు గిరికతో కలిసి విమానం ఎక్కి ఆకాశమార్గంలో తన నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ తరువాత రాజ గృహానికి చేరుకున్నారు. క్రమంగా సమస్త ప్రజలచేత కొనియాడబడుతూ వసురాజు శుభ సంపదలతో వెలగసాగాడు. వసురాజు, గిరిక, రతీమన్మథుల్లాగా; వాణీవిరించులలాగా; శచీసురేంద్రుల లాగా; లక్ష్మీనారాయణుల్లాగా సుఖ సంతోషాలతో కాలం గడిపారు. వసురాజు గిరిక పట్ల నిరంతరాసక్తితో మెలుగుతూ వున్నాడు. అతడి కీర్తి దశదిశలా వ్యాపించింది. అతడి జయలక్ష్మి, రాజ్యలక్ష్మి సుస్థిరంగా, ఐశ్వర్యంతో అలరారింది.


Friday, April 16, 2021

రామాయణం(కథ)

 రామాయణం(కథ)




సాహితీమిత్రులారా!


సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

రామాయణం (కథ) ఆస్వాదించండి-




Tuesday, April 13, 2021

మనుచరిత్ర కథాసంగ్రహం

 మనుచరిత్ర కథాసంగ్రహం




సాహితీమిత్రులారా!



సంక్షిప్త మనుచరిత్ర ఆస్వాదించండి-


శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో, ఆయన భువనవిజయ అష్టదిగ్గజాలలో పేరొందిన పెద్ద కవీంద్రుడు అల్లసాని పెద్దనామాత్యుడు. ఆయనే “ఆంధ్ర కవితా పితామహుడు” అన్న బిరుదు కలవాడు. ఏదైనా మంచి ప్రబంధ కావ్యం రచించి లోకానికి పరమోపదేశం చేయాలని భావించిన అల్లసాని పెద్దన్న మనుచరిత్ర రచన చేశాడు. సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రంథానికి కృతిపతి. కృతిని అందుకొనే సమయంలో పెద్దన ఎక్కిన పల్లకిని తన చేత్తో లేవనెత్తి రాయలు ఆయన పట్ల తన గౌరవాన్ని ప్రదర్శించాడు.

స్వారోచిషమనువు జన్మ వృత్తాంతం ఇతిహాసంగా రచించబడిన మార్కండేయ పురాణం ఆధారంగా అల్లసాని మనుచరిత్ర రాశాడని అంటారు. మనుచరిత్రలోని ప్రతిపదం ‘అల్లసానివాని అల్లికజిగిబిగి’ అన్న మాటను సార్థకపరుస్తున్నది. పెద్దన మనుచరిత్ర రచనానంతరం అనేక ప్రబంధాలు దానికి ప్రతిరూపాలుగా వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయలు కృతి రచించమని అల్లసానిని కోరినప్పుడు పెద్దన్నగారు ఈ పద్యం చెప్పారని అంటారు.

"నిరుపహతి స్థలంబు, రమణీప్రియ దూతిక తెచ్చి యిచ్చు క

ప్పుర విడె మాత్మ కింపైన భోజన ముయ్యెల మంచ మొప్పు త

ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్

దొరకని గాక ఊరక కృతుల్ రచియింపుమనంగ శక్యమే!"

ఇల్లాలికి ఇష్టురాలైన చెలికత్తె (రమణీప్రియదూతిక) ప్రియమారగా తెచ్చి ఇచ్చే కర్పూర తాంబూలం (కప్పురవిడెము) ఉండాలి. మనసుకు నచ్చిన (ఆత్మకింపైన) భోజనమూ, భోజనం చేశాక కర్పూర తాంబూలం వేసుకొని విలాసంగా ఊగడానికొక ఉయ్యాలమంచం ఉండాలి. తాను చెప్పే కవిత్వంలో తప్పొప్పులు చూడగలిగే రసజ్ఞులూ, కవి ఊహను ముందుగానే తెలుసుకోగల వారూ అయిన ఉత్తమలేఖకులూ, ఉత్తమపాఠకులూ దొరకాలి. వీళ్ళందరూ దొరికినప్పుడే కానీ ఊరికే కృతులు రచించమంటే కుదురుతుందా (శక్యమే)? కుదరదు అంటున్నాడు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన చెప్పిన ఈ పద్యం తెలియని సాహిత్యోపజీవులు తెలుగునాట దుర్లభులనే చెప్పొచ్చు. మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యాలు, అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యాలు:


“అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్”


“ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ ఒంటి చరించె దోటలే

కివ్వనభూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడ త్రోవతప్పితిన్‌

క్రొవ్వున నిన్నగాగ్రమునకున్‌ చనుదెంచి పురంబుచేర నిం

కెవ్విధి కాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్‌”


“ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ

కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా

గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ

కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్”


           ఇక మనుచరిత్ర కథ విషయానికొస్తే......ఆర్యావర్త దేశంలో, వరణానది ఒడ్డున, అరుణాస్పదం అనే ఒక పురం వున్నది. ఆ పురంలో ప్రవరాఖ్యుడు అనే సద్బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. ఆయన వేదవేదాంగ పారంగతుడు. ధనికుడు. సఛ్చీలుడు. ఆయన భార్య సోమిదమ్మ భర్తకు అన్ని విధాల అనుకూలవతి. ప్రవరుడికి అతిథి పూజ అంటే పరమానందం. భర్త ఆనందానికి అనుగుణంగా ఆయన భార్య సోమిదమ్మ ఎంతమంది అతిథులు వచ్చినా వంటచేసి వడ్డించడానికి వెరువదు. అతిథులు అర్థరాత్రి వచ్చినా మహానందంతో వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తుంది.


         ఇలా వుండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారింటికి అతిథిగా వచ్చాడు. ఆయనకు సకలోపచారాలు చేసిన తరువాత, ఆయన ఎక్కడెక్కడ తిరిగాడని, ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నాడని ప్రశ్నించాడు ప్రవరుడు. అయన చూడని ప్రదేశం లేదని చెప్పి అదంతా తన దగ్గరున్న పాదలేపం మహిమని చెప్పాడు. ప్రవరుడి ప్రార్థనను మన్నించి సిద్ధుడు ఆయనకు ఆ పసరు ఇచ్చి పాదాలకు పూసాడు. తక్షణమే ప్రవరుడు హిమగిరిని చూడాలనుకోవడం, వెంటనే అక్కడికి పోయి నిలవడం జరిగింది. అక్కడ అనేక దివ్యస్థలాలను చూసి మధ్యాహ్నానికల్లా ఇంటికి పోదామని అనుకున్నాడు. అయితే ఆయన కాలికున్న పసరు హిమాలయాల మంచుకు కరిగిపోవడం వల్ల ఎగరలేకపోయాడు. దిగులుతో ఏంచేయాలో తోచక అటూ-ఇటూ తిరగసాగాడు.   


ఇంతలో సమీపంలో ఆయనకొక గంధర్వ రమణి వీణ వాయిస్తూ కనిపించింది. ఆమె ఎవరని అడిగి, తన విషయం చెప్పి, తనకు ఇంటికి పోవడానికి దారి చూపమని కోరాడు ప్రవరుడు. అతడిమీద ఆపాటికే మది తగిలిన ఆమె, తన పేరు వరూధిని అనీ, తన చెలికత్తెలతో అక్కడు వుంటున్నాననీ, తన ఇంటికి రమ్మనీ, విందు ఆరగించమనీ అన్నది. తానక్కడ వుండడానికి వీలులేదని, అగ్నిహోత్రాది కర్మకాండలు చేయాలని, తనను ఇంటికి పంపే ఏర్పాటు చేయమని కోరాడు ప్రవరుడు. అక్కడే వుండిపోయి తనను కూడి సుఖించమని వరూధిని కోరినప్పటికీ ప్రవరుడు అంగీకరించలేదు. ఆయన తిరస్కారానికి వరూధిని భంగపడ్డది, బాధ పడింది, కోపం తెచ్చుకున్నది. కళ్లల్లో నీరు తెచ్చుకుంటూ, వరూధిని, ప్రవరుడి మీద పడి కౌగలించుకొని పెదవులను నొక్కడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని కొనసాగనీయకుండా ప్రవరుడు ఆమెను తోసాడు. ఆమె తనకు జరిగిన పరాభవానికి దుఃఖించింది. చివరకు ఆమెను వదిలి ప్రవరుడు ఏదో విధంగా స్వస్థలానికి చేరుకున్నాడు.


         ఇదిలా వుండగా, అంతకు పూర్వం నుండి వరూధినిని మోహించి తిరస్కారానికి గురైన గంధర్వుడు ఒకడు, ఈ వృత్తాంతాన్ని ఆసాంతం గమనించి ప్రవరుడి రూపంలో ఆమెను చేరాడు. వరూధిని అతడిని చూసి నిజమైన ప్రవరుడనే భావించింది. కాసేపు అసలైన ప్రవరుడి లాగానే వరూధిని అంటే ఇష్టంలేనట్లు ప్రవర్తించాడు. చివరకు కొన్ని నిబంధనలు పెట్టి ఆమె పొందుకు అంగీకరించాడు. ఆ తరువాత వారిద్దరూ చిరకాలం సుఖాలను అనుభవించారు. వరూధిని గర్భవతి అయింది. తనకు పాదలేపనం ఇచ్చిన సిద్ధుడు కనిపించాడని అబద్ధం చెప్పి వరూధినిని ఒప్పించి, ఆమె దగ్గర సెలవు తీసుకొని, తన మార్గాన తాను పోయాడు ప్రవరుడి రూపంలో వున్న గంధర్వుడు. వరూదినికి అసలు విషయం తెలియదు. 


         ఒక శుభ ముహూర్తాన వరూధిని చక్కటి కుమారుడిని కన్నది. అతడికి స్వరోచి అని పేరు పెట్టింది. సకల విద్యలు నేర్పించింది. అతడు ఆ ప్రాంతంలో రాజ్యపాలన చేయసాగాడు. ఒకనాడు ఒక మహారణ్యానికి వేటకు పోయాడు సైన్యంతో. ఆ సమయంలో ఒక దుర్మార్గుడైన రాక్షసుడు ఒక అనాథ రమణిని బాధించడం చూసాడు. ఆమె గురించిన విషయాలు తెలసుకున్నాడు. ఒక ముని శాపం వల్ల తన చెలికత్తెలు క్షయ రోగం పాలయ్యారని, తనను ఒక రాక్షసుడు వెంటాడుతున్నాడని ఆమె చెప్పింది. తానొక గంధర్వ కన్యను అన్నది. తాను ఇందీవరాక్షుడు అనే గంధర్వుడి కుమార్తె మనోరమను అని చెప్పింది. తనకు తెలిసిన ‘అస్త్రహృదయం’ అనే విద్యను స్వరోచికి నేర్పింది. దాని సహాయంతో తనను వెంబడిస్తున్న రాక్షసుడిని చంపమన్నది. స్వరోచి రాక్షసుడిని చంపాడు. అతడి దేహం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడింది. తాను శాపవశాన వున్న ఇందీవరాక్షుడు అనే గంధర్వుడిని అన్నాడు. తనకు, తన కూతురుకు చేసిన మహోపకారం కారణాన ఆయుర్వేద విద్యను నేర్పుతానని, తన కూతురు మనోరమను ఇచ్చి వివాహం చేస్తానని అన్నాడు స్వరోచితో. ఇరువురి అంగీకారంతో వారి పెళ్లి జరిగింది.


         తనకు తెలిసన ఆయుర్వేద విద్య ద్వారా మనోరమ చెలికత్తెలకు చికిత్స చేసాడు స్వరోచి. వారికి వారి పూర్వ సౌందర్యం వచ్చింది. వారిద్దరిని కూడా స్వరోచి వివాహం చేసుకున్నాడు. ఆ ముగ్గురితో స్వరోచి చాలా కాలం సుఖంగా జీవించాడు. ఆ తరువాత ఆ అరణ్యంలోని వనదేవత కోరిక మీద ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు స్వరోచి.


         కొన్ని దినాలకు స్వరోచి ద్వారా వనదేవత గర్భం దాల్చింది. నవమాసాలు నిండిన తరువాత ఒక చక్కటి కుమారుడిని కన్నది. స్వారోచిషుడు అనే పేరుకల ఆ బాలుడు యుక్తసమయంలో శ్రీహరిని గురించి తపస్సు చేసాడు. శ్రీహరి ప్రత్యక్షమై, భూలోకంలో ధర్మాన్ని రక్షించమని, రెండవ మనువై పాలించమని ఆదేశించాడు స్వారోచిషుడిని. ఆయన అలాగే చేసి చివరకు శ్రీహరిలో ఐక్యం అయ్యాడు.   


“వరుణాద్వీపవతీ తటాంచలమునన్, వప్రస్థలీ చుంబితాం...”


ఆర్యావర్త దేశంలో, వరణానది ఒడ్డున, (వరుణాద్వీపవతీ తటాంచలమునన్, వప్రస్థలీ చుంబితాం....) అరుణాస్పదం అనే అద్భుతమైన పురం వున్నది. అక్కడ పుట్టిన చిగురు కొమ్మ కూడా చేవ (గట్టిదనం) కలదిగా వుంటుంది. అక్కడి బ్రాహ్మణులు సమస్త విద్యలు నేర్చినవారు. అక్కడి క్షత్రియులు సామర్థ్యం కలవారు. వైశ్యులు కుబేరుడికి కూడా పెట్టుబడి పెట్టగల ధనవంతులు. శూద్రులు పంటలు పండించి, భాగ్యం గడించి, సత్పాత్రదానం చేయడంలో సుప్రసిద్ధులు. వెలయాండ్రు రంభాదులైన అప్సరసలను కూడా అందంలో ఎదుర్కొనే సమర్థులు.


ఆ పురంలో మన్మథుడిలాంటి సౌందర్యం కలవాడు, బ్రాహ్మణ కులానికే అలంకారప్రాయం లాంటివాడు, వేదాధ్యయనంలో ఆసక్తి వున్నవాడు, ప్రవరాఖ్యుడు అనే పేరున్నవాడు నివసిస్తున్నాడు. ఆయన తల్లితండ్రులు పార్వతీపరమేశ్వరుల లాగా ఈడూ-జోడుగా, మిక్కిలి వృద్ధాప్యంలో వున్నారు. ప్రవరాఖ్యుడు చిన్నతనం నుండే యజ్ఞయాగాదులు చేస్తూ, మిక్కిలి ధనవంతుడిగా వుంటూ, తల్లితండ్రుల సేవ చేస్తూ, తన ప్రియభార్య సోమిదమ్మను సుఖపెట్టుతూ సౌఖ్యంగా కాపురం చేస్తుండేవాడు. ప్రవరుడి యోగ్యతను చూసి రాజులు నానారకాలైన దానాలను ఇవ్వడానికి ఆసక్తి కనపర్చినప్పటికీ ఆయన సాలగ్రామ దానం కూడా తీసుకొనేవాడు కాదు. ఆయనకున్న మాన్యపు భూములే మంచిగా పండడం వల్ల అతడి ఇంట్లో పాడి పంటలకు కొరత లేకుండా వుండేది. ప్రవరుడి భార్య సోమిదమ్మ అతిథులకు పెట్టి పోయడంలో అన్నపూర్ణాదేవికి సమానురాలు. అర్థరాత్రి అతిథులు వచ్చినప్పటికీ వారికి ఇష్టమైన పదార్థాలను వండి పెట్టేది.


ప్రవరాఖ్యుడికి వున్న కోరికలలో ఒకటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం. ఎలాగైనా అసాధ్యమైన క్షేత్ర సందర్శనం చేసుకొని కృతార్థుడిని కావాలని అనుకునేవాడు. ఇలా వుండగా ఒకనాడు మధ్యాహ్న సమయంలో కమండలం చేతబట్టుకొని, జింకతోలు కప్పుకొని, విభూతి పెట్టుకొని ఒక సిద్ధ పురుషుడు ప్రవరుడి ఇంటికి వచ్చాడు. ఆ సిద్ధుడికి నమస్కారం చేసి అర్ఘ్యం, పాద్యం మొదలైనవాటితో పూజ చేసాడు ప్రవరుడు. అతడికి ఇష్టమైన మృష్టాన్నము పెట్టి సంతోషపరిచాడు. ఆ తరువాత “మీరు ఎందుండి ఎందు పోవుచు ఇందుల కేతెంచినారు” అని ప్రశ్నించాడు ప్రవరుడు ఆ సిద్దుడిని. ఆయన తన ఇంటికి రావడం వల్ల తన జీవితం సార్థకం అయిందని, ఆయన పాద ధూళి సోకినందున సంసార బంధం వీడిపోయిందని అన్నాడు. జవాబుగా సిద్ధుడు, ప్రవరుడి లాంటి గృహస్థులు సుఖంగా వున్నప్పుడే తనలాంటి వారు తీర్థయాత్రలు చేయగలరని అన్నాడు. తనలాంటి వారికే కాకుండా దిక్కుమాలినవారికి అందరికీ రక్షకుడు గృహస్థుడే అనీ, గృహస్థాశ్రమాన్ని మించిన ఆశ్రమం లేదని కూడా చెప్పాడు.


సిద్ధుడు తిరిగిన పుణ్యక్షేత్రాల వివరాలను అడిగాడు ప్రవరుడు. ఆయన వున్న దేశాలను, ఆడిన తీర్థాలను, చూసిన కొండలను, చొచ్చిన దీవులను, విహరించిన పుణ్యారణ్యములను, సముద్రాలను, వాటిలోని వింతలను విశదంగా చెప్పమని కోరాడు ప్రవరుడు సిద్దుడిని. తాను నాలుగు దిక్కులనూ చుట్టి వచ్చానని, ప్రపంచంలోని వింతలన్నీ దర్శించానని జవాబిచ్చాడు సిద్ధుడు. “కేదారేశు భజించితిన్, శిరమునన్ గీలించితిన్...” అని వివరించాడు. ఆయన మాటలకు ఆశ్చర్యపోయిన ప్రవరుడు అన్ని ప్రదేశాలు రెక్కలు కట్టుకొని పోయినా తిరగడం కష్టం కదా! ఎన్నో సంవత్సరాలు పట్తాయి కదా! ఆయన ఎలా పోగలిగాడని అడిగాడు. సిద్ధుడి మహాత్మ్యాన్ని పొగిడాడు. తాము సిద్దులం కాబట్టి ముసలితనం తమకు రాదని, దైవానుగ్రహం వల్ల తనకు ‘పాదలేపం’ అనే ఒక దివ్యఔషధం లభ్యమయిందని, దాని సామర్థ్యం వల్ల వాయువేగంతో, మనోవేగాన్ని మించిన వేగంతో తాను తిరుగుతున్నానని చెప్పాడు. ఆకాశాన సూర్యాశ్వాలు ఎంత వేగంగా, సునాయాసంగా తిరుగుతాయో, తామూ అంతే వేగంగా భూమ్మీద చకచకా నడకతో తిరగగలమని అన్నాడు.


సిద్ధుడి మహాత్మ్యాన్ని గురించి వివరంగా విన్న ప్రవరుడు ఆయన శిష్యుడినైన తనను కరుణించి, తీర్థయాత్రలు చేయించమని ప్రార్థించాడు. అలా చేసి తనను కృతార్థుడిని చేయమని కోరాడు. వెంటనే సిద్ధుడు తన దగ్గరున్న బుట్టలో నుండి ఒక పచ్చటి ద్రవాన్ని (పసరు) తీసుకొని ప్రవరుడి పాదాలకు పూసాడు. ప్రవరుడు పరమ రహస్యమైన ఆ పసరు పేరు అడగలేదు, సిద్ధుడు చెప్పలేదు. ఆ పాదలేపనం పూసుకున్న ప్రవరుడు హిమాలయా పర్వతం మీదికి పోవాలని కోరుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ మంచుకొండకు చేరుకున్నాడు.

“అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ….”

సిద్ధుడి సహాయంతో పాదలేపనం పొంది, దాని మహాత్మ్యం వల్ల మంచుకొండ హిమాలయ పర్వతం మీదికి చేరుకున్న ప్రవరాఖ్యుడు ఆకాశాన్ని తాకుతున్న హిమవత్పర్వతాన్ని చూశాడు. సెలయేళ్ల చప్పుళ్లను, పింఛాలను విచ్చుకొని నృత్యం చేస్తున్న నెమిళ్ల సమూహాన్ని, ఏనుగులు కదిలిస్తున్న చెట్లను, ఇవన్నీ కూడి వున్న హిమవత్పర్వతాన్ని చూశాడు ప్రవరుడు. ఆ తరువాత నరనారాయణులనే మహర్షులు తపస్సు చేసిన బదరీవనాన్ని చూసి, దాని మధ్యనుండి పోసాగాడు. అలాగే భగీరథుడు తపస్సు చేసిన చోటును, ఆకాశగంగ భూమ్మీద అవతరించిన ప్రదేశాన్ని, పార్వతి శివుడికి శుశ్రూష చేసిన ప్రదేశాన్ని, మన్మథుడు శివుడి కంటి మంటకు నీరైన ప్రదేశాన్ని, అగ్నిదేవుడు సప్తర్షుల కాంతల మీద మోహం చెందిన ప్రదేశాన్ని, కుమారస్వామి జన్మించిన రెల్లు దుబ్బలను చూసి సంతోషించాడు ప్రవరుడు.

ఆహ్లాదకరంగా వున్న ఇంకా-ఇంకా ఎన్నో ప్రదేశాలను తనివితీరా చూసిన ప్రవరుడు, ఆ పర్వతం మహాత్మ్యాన్ని గణుతింప బ్రహ్మకైన తరం కాదని, సూర్యకిరణాలు తాకి, ఆవేడికి మంచు కరిగిపోవడం గమనించి, మధ్యాహ్న సమయం అయిందని అర్థం చేసుకున్నాడు. ఇక ఇంటికి పోదామని, తిరిగి మర్నాడు వచ్చి చూడవచ్చని అనుకున్నాడు. అలా అనుకుంటూ మరలి పోవడానికి ఎగిరే ప్రయత్నం చేశాడు. అయితే అతడి పాదాలకు పూయబడిన పాదలేపనం మంచుకు కరిగిపోయింది. ఆ విషయాన్ని ప్రవరుడు గమనించి ఏంచేయాల్నా అని విచారించసాగాడు. దైవకృతానికి అసాధ్యం లేదని నిశ్చయించుకున్నాడు. తాను ఆ ఘోర ప్రదేశంలో చిక్కుపడిపోవడానికి సిద్ధుడు కేవలం నిమిత్తమాత్రుడని, దైవం ఆపద కలిగించాలనుకుంటే అలా ఒక నిమిత్తమాత్రుడిని కలిపిస్తాడని అనుకున్నాడు. ఏం చేయాలా అని దుఃఖించాడు ప్రవరుడు.        

‘అరుణాస్పుద పురం ఎక్కడ? మంచు కొండ ఎక్కడ? పొగరుతో ఇక్కడకు నేను రావచ్చా? ఇక్కడికి వచ్చిన మార్గం తెలియదు కదా? ఇంక ఇక్కడి నుండి పోవడం ఎలాగా?’ అని ఆలోచించ సాగాడు. “బుద్ధిజాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్” అని అనుకున్నాడు. సిద్ధుడు తనకు ఇచ్చిన పాదలేపనాన్ని ఉపయోగించుకోవడానికి మాయకో, ద్వారకకో, అవంతికో, కురుక్షేత్రానికో, గయ-ప్రయాగాలకో, లేక మరేదైనా పుణ్యక్షేత్రాలకో పోకుండా ఈ మంచు కొండకు ఎందుకు రావాల్సి వచ్చింది అనుకున్నాడు. ఆ విధంగా ఆ నిర్మానుష్య ప్రదేశంలో వచ్చి దారి తెలియక చింతాసాగరంలో మునిగాడు ప్రవరుడు. ఆ సమయంలో సంగీతంతో ఒప్పారుతున్న ఒక ప్రదేశాన్ని చూశాడాయన.

ద్రాక్షతీగలతో వ్యాపించివున్న గరుడ పచ్చలు పొదగబడిన ఒక ఇల్లు చూశాడక్కడ. అక్కడి నుండి కస్తూరి, పచ్చకప్పూరం మొదలైన పరిమళ ద్రవ్యాలు కలిసిన సువాసన వచ్చింది. దాన్ని బట్టి అక్కడ ఒక జవరాలు వుండవచ్చన్న భావన కలిగింది ప్రవరుడికి. ప్రవరాఖ్యుడు ఆ సువాసన గాలిని పట్టుకొని ముందుకు సాగగా ఆ ప్రదేశంలో మెరుపుతీగలాంటి శరీరం, కమలాల లాంటి కన్నులు, తుమ్మెదల లాంటి కురులు, చంద్రుడి లాంటి ముఖం కల ఒక జవరాలిని కనుగొన్నాడు. ఆమె ఆ సమయంలో వీణ వాయిస్తూ వున్నది. తన సమీపానికి వచ్చిన నలకూబరుడిని పోలిన ప్రవరాఖ్యుడిని చూసింది వీణ వాయిస్తున్న ఆ సుందరి. ఆ దేవతా స్త్రీ ప్రవరుడిని చూసి తన అందెలు గల్లుగల్లుమని మోగుతుంటే దగ్గరిలో వున్న ఒక పోకచెట్టు చాటుకు పోయి అతడినే గమనించసాగింది. అతడిని చూస్తున్నంతసేపు సంతోషంతో ఉప్పొంగిపోయింది.

ఇంత చక్కటి అందగాడు (ప్రవరుడు) తనను ప్రేమించినట్లయితే మన్మథ సుఖాలను నిరాటంకంగా అనుభవించ వచ్చని ఆ స్త్రీ భావించింది. ప్రవరుడి అందాన్ని పదే-పదే ఆస్వాదించసాగింది. ఇలా అనుకుంటూ, చింతిస్తూ, ఒక విధంగా మనోవేదనకు గురవుతూ, తత్తరపాటు చెంది, సిగ్గుపడి, ఆ దేవతాస్త్రీ పోక చెట్టున చాటునుండి బయటకు వచ్చి, ప్రవరుడి దారికి అడ్డంగా నిలుచున్నది. అది చూసి ప్రవరుడు విభ్రాంతుడయ్యాడు. ఆమె దగ్గరిపోయి “ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ యొంటి జరించె దోట లే కివ్వనభూమి...” అని ప్రశ్నిస్తూ ఆమె ఎవరని అడుగుతూ, ఎందుకు అలా ఒంటరిగా అడవిలో తిరుగుతున్నదని అంటూ, తాను బ్రాహ్మణుడినని, పేరు ప్రవరుడు అని, కొవ్వెక్కి ఆ మంచు కొండకు వచ్చి దారి తప్పానని, ఎలా తాను తన పురం చేరగలనని తెలపమన్నాడు.

జవాబుగా ఆమెకూడా తిరిగి ప్రశ్నించింది ఇలా: “ఇంతలు కన్నులుండ దెరు వెవ్వరివేడెదు భూసురేంద్ర...” అని అంటూ, ‘ఓ బ్రాహ్మణుడా! చేరెడేసి కన్నులు పెట్టుకొని ఇతరులను దారి అడుగుతున్నావేమిటి?’ అని ప్రశ్నించింది. ఒంటరిగా వున్న వయసుగత్తెలను పలకరించే విధం కాకపోతే, వచ్చిన తోవ ఆయనకు తెలియదా? అలా భయం లేకుండా దారి అడగడానికి తాను ఆయనకు చులకనగా కనబడుతున్నానా? అని అన్నది. ఆ తరువాత తానెవరో వివరించింది. లక్ష్మి తన తోబుట్టువని, వీణాగానం చేస్తానని, సంగీతం తనకు వచ్చిన విద్య అని, కామశాస్త్ర సిద్ధాంతాలను చిన్నతనం నుండే చదువుతున్నానని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సభలు తమకు నాట్యశాలలని, తానున్న ప్రదేశం తన ఉద్యానవనమని అన్నది. తన పేరు వరూధిని అని చెప్పింది. ప్రవరుడు తమ అతిథి అని తన ఇంటికి వచ్చి విశ్రమించి అతిథి సత్కారాలను పొందమని కోరింది.

‘ఓ చిన్నదానా! నువ్వు చేయదలచుకున్న మర్యాదలన్నీ చేసినట్లే అనుకో. నేను ఇక్కడ వుండడానికి వీలులేదు. శీఘ్రంగా మా ఇంటికి పోవాలి. దయచేసి దారి చూపి నన్ను పంపు’ అని అన్నాడు ప్రవరుడు. తానింక నిజం దాచుకోదలచుకోలేదని, తన మనసు ప్రవరుడి మీద వున్నదని, తనను మన్మథ బాధలకు గురిచేయవద్దని, తనతో కొంతకాలం గడపమని వరూధిని అన్నది. అగ్నికార్యం, దేవతార్చన మిగిలి వున్నదని, భోజనకాలం అతిక్రమించిందని, తన తల్లిదండ్రులు ముసలివారని, తనకొరకై ఎదురు చూస్తుంటారని, తాను ఆహితాగ్నినని, ఇల్లు చేరకపోతే స్వర్వధర్మాలు చెడిపోతాయని వేడుకున్నాడు ప్రవరుడు.

వరూధిని ముఖం చిన్న బుచ్చుకోన్నది. భోగాలను అనుభవిస్తూ తనతో కూడి అక్కడ ప్రతిదినం సంభోగిస్తూ వుండమని ప్రాదేయపడ్డది. ప్రవరుడికి స్వర్గసుఖాలు చూపిస్తానని చెప్పింది. ఆమె అంటున్న విషయాలు తనకేమీ పట్టవని, అలాంటి మాటలు తనతో అనవద్దని, ఇంటికి దారి చూపమని మళ్లీ అడిగాడు. ప్రవరుడు తన మీద అయిష్టాన్ని మళ్లీ-మళ్లీ వెళ్ళబుచ్చుతుంటే, ఎవరికైనా స్త్రీ తనంతట తానే వలచి వస్తే చులకనై పోవాల్సిందే కదా అని అంటుంది. ప్రవరాఖ్యుడి తిరస్కారానికి గురైన వరూధిని అవమానంతో సిగ్గుపడి, కోపంగా అతడిని చూసింది. ప్రవరుడిని సమీపించిన వరూధిని అతడు తోసినప్పుడు ఆయన గోరు తనకు తాకిందని మారాం చేసింది. ‘ఓ భూసురోత్తమా! యజ్ఞాలు, తపస్సు చేసానన్నావు. దయా స్వభావం లేనప్పుడు ఎన్ని పుణ్యాలు చేసినా ఏమి ఫలితం? నీ చదువు వ్యర్థం’ అన్నది వరూధిని ప్రవరుడితో.

ఆ తరువాత ప్రవరుడు అగ్నిని స్తుతించగా అగ్నిదేవుడు ప్రవరుడి దేహంలో ఆవేశించి అమితమైన తేజోబలాన్ని కలిగించాడు. అప్పుడు ప్రవరుడు వరూధినిని వదిలించుకొని వాయువేగంతో ఇంటికి చేరుకున్నాడు. చేరుకొని యధాప్రకారం నిత్య కర్మలను సక్రమంగా నిర్వర్తించుకున్నాడు.    

ప్రవరుడి రూపంలో వరూధినిని పొందిన గంధర్వ కుమారుడు

ప్రవరాఖ్యుడు తనను తిరస్కరించి, తన్ను తోసిపుచ్చి వెళ్లిపోయిన తరువాత వరూధిని అతడి ఆకారాన్నే తన చిత్తంలో నిలుపుకొని, క్షోభకు గురై, అతడి చక్కదనాన్ని మరీ-మరీ తలచుకుంటూ మన్మథబాణాల తాకిడికి తట్టుకోలేక పోయింది. దుఃఖంతో అక్కడ వుండలేక ఆ కొండ దరిదాపుల్లో అడవుల్లో పడి తిరుగుతూ, ప్రవరుడు వెళ్లిన జాడ వెదికి-వెదికి కానలేక చెలికత్తెల దగ్గర తన బాధను వెళ్లబోసుకుంది. దైవమా! ఏంచేయాలి అని వాపోయింది. ఒకటికి పది మార్లు ప్రవరుడిని తలచుకుంటూ, అతడి సౌందర్యాన్ని గుర్తుచేసుకుంటూ, అలాంటివాడితో సౌఖ్యం పొందని ఆడుదాని చక్కదనం, యౌవనం, ప్రాణం నిష్ప్రయోజనం అని అనుకున్నది వరూధిని. దేవతాస్త్రీ కావడం వల్ల చావులేని తన చక్కదనమంతా పాడుకొంపకు దీపంలాగా అయిపోయిందే అనుకున్నది. ఇలా వితర్కించుకుంటూ వరూధిని మన్మథ తాపానికి శరీరం తల్లడిల్లుతుంటే ఆ విరహానికి తాళలేక పోయింది.

వరూధిని పడుతున్న అవస్థ ఇంత అని వర్ణింప సాధ్యపడలేదు. ఇంతలో కటిక చీకట్లు కమ్ముకున్నాయి. ఆ వెంటనే చంద్రోదయం అయింది. వెన్నెల నిండారింది. ముడుచుకొని పోయిన పద్మాల నుండి తుమ్మెదలు రొద చేస్తూ బయటికి వచ్చాయి. కలువలు వికసించాయి. చంద్రకాంత శిలలు కరిగాయి. సముద్రం ఉప్పొంగిపోయింది. మన్మథుడు వరూధిని లాంటి విరహులను వేధించసాగాడు. చంద్రుడి వల్ల బాధకు తాళలేక వున్న వరూధినిని ఆమె చెలికత్తెలు ఒప్పించి ఇంటికి తీసుకోనిపోయారు. తనకు విరహతాపం కలగడానికి ప్రేరేపిస్తున్న చంద్రుడి మీద వరూధిని కోపగించుకున్నది. మన్మథుడినీ నిందించింది. మన్మథ తాపం హెచ్చుకాగా చల్లగా వీస్తున్న దక్షిణపు గాలిమీదా కోప్పడ్డది. ఇలా పలుకుతూ వరూధిని తాపం పెరిగిపోయి మూర్ఛిల్లింది. చెలికత్తెలు ఉపచారాలు చేసి ఆమె తెరుకునేట్లు చేశారు. ఇంతలో తెల్లవారింది. సూర్యోదయం అయింది.

చెలికత్తెలు వరూధినిని ఊరడిస్తూ ఆమెను తిరిగి మామూలు మనిషిని చేసే ప్రయత్నం చేశారు. వీణ మీటమన్నారు. పంజరంలో వున్న చిలుకలకు, గోరువంకలకు మాటల నేర్పమన్నారు. ప్రవరుడి ప్రసక్తి తెస్తూ చెలికత్తెలు, “ఆ ప్రవరుడేమన్నా ఇంద్రుడా? చంద్రుడా? అతడి పొందుకు ఇంతగా చింతపడడం ఎందుకు? ఇవ్వాళ కూడా ఆ ఉద్యానవనానికి పోదాం. మనం పోయేసరికల్లా ఆ ప్రవరాఖ్యుడు అక్కడికి రాకుండా వుండలేదు. నీ అందచందాలు చూస్తే ఎవరికైనా వెర్రి పుట్టదా? అతడిని వశపర్చుకోవడం ఎంతపని? వాడు మళ్లీ నిన్ను చూస్తే ఆగుతాడా?” అని అన్నారు. చెలికత్తెల మాటలకు ఓదార్పు చెందిన వరూధిని దగ్గరలో వున్న గంగానదిలో ముఖం మాత్రం కడుక్కొని, ఎలాంటి అలంకారం చేసుకోకుండా కృశించిన శరీరంతో మెల్లగా చెలికత్తెలతో శృంగారపు తోటకు పోయింది.

ఇదిలా వుండగా, మునుపొక గంధర్వుడు వరూధిని సౌందర్యాన్ని, ఆమె శృంగారచేష్టలను చూసి, మోహించి, ఆమె దానికి సమ్మతించకపోవడంతో ఆమెను ప్రేమించే ఉపాయం కొరకు అన్వేషిస్తున్నాడు. వరూధిని ప్రవరాఖ్యుడిని వలచిన విషయం, ఆమెను అతడు తిరస్కరించడం వల్ల వరూధిని మన్మథ వ్యధ పడుతున్న వృత్తాంతం విని ఒక ఆలోచన చేశాడు. ఎలాగైనా ప్రయత్నించి వరూధిని సమాగాన్ని పొందాలని నిర్ణయించుకొని ఆమెకన్నా ముందుగా ఆమె విహరించడానికి వచ్చే ఉద్యానవనానికి చేరి ఒక చెట్టు నీడన ప్రవరాఖ్యుడి రూపంలో, బ్రాహ్మణ తేజస్సుతో నిలుచున్నాడు.

ఇంతలో వరూధిని చెలికత్తెలతో ఉద్యానవనానికి వచ్చి ఒక తామరకొలనులో దిగి జలక్రీడ చేయసాగింది. ఆ కొలను సమీపంలో వున్న ఒక చెట్టుకింద ప్రవరాఖ్యుడి రూపం దాల్చి వున్న గంధర్వ కుమారుడిని చూసి, ప్రవరుడే అని మనస్సులో నిశ్చయించుకొని, ఆతడిని చేరింది. ప్రవరుడి వేషంలో వున్న అతడిని చూడగానే వరూధిని గుండె జల్లుమన్నది. అతడి దగ్గరికి పోతుంటే అడుగులు తడబడ్డాయి. ముఖంలో దైన్యం కనిపించింది. కన్నుల్లో నీరు కారింది. తనను మోసపుచ్చావుకదా అని అంటూ డగ్గుత్తిక పడ్డది. తనను ఏలుకొమ్మని ప్రార్థించింది. గడచిన తాను పడ్డ బాధ చెప్పింది. ప్రవరుడు తన సదాచారాన్ని కాపాడుకుంటూ వుండమని, చిరకాలం లాగే బతకమని, తనను మాత్రం ప్రేమించమని కోరింది.

వరూధిని మాటలకు ప్రవరుడి రూపంలో వున్న గంధర్వుడు నిజంగా ప్రవరుడే అనిపించుకోవడానికి ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వును కప్పిపుచ్చాడు. శరీరంలో కనపడే శృంగారచేష్టల ఉద్రేకాన్ని అభినయంతో దాచాడు. సన్నటి గొంతుతో ఇలా అన్నాడు. ‘నా ముసలి తల్లితండ్రులను వదిలి, భార్య వియోగ దుఃఖం అనుభవిస్తుంటే ఇక్కడ ఎలా వుంటాను? ప్రేమతో నీ కౌగిట చేరే సుఖం ఇంద్రుడికి కూడా కలగదు. నువ్విలా నన్ను ప్రేరేపిస్తుంటే కూడదని అనడానికి నేనేమన్నా సన్న్యాసినా? ఇల్లు, తల్లిదండ్రులు ఏమయ్యారన్న చింత వున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వింతగా దైన్యంతో అడుగుతున్నావు కాబట్టి నా నియమాన్ని వదుల్తున్నాను. అయితే ఒక నియమం. మా ఆచారం ప్రకారం మన సంభోగ సమయంలో పరస్పరం మనం ముఖాలు చూసుకోరాడు. కన్నులు మూసుకోవాలి. ఈ నియమానికి నువ్వు అంగీకరిస్తే నాకు ఇష్టమే’.

వ్రతం చెడ్డా సుఖం దక్కాలని, వరూధిని ఆమె వాంఛితం తీరగానే తనను వదలరాదని, తనంతట తాను పోదల్చుకున్నంతవరకు తనను విడువరాదని నిబంధన పెట్టాడు గంధర్వుడు. అలా బాస చేస్తే తనకు ఆమెతో వుండడానికి అంగీకారమే అని చెప్పాడు. ఆయన మాటలు విన్న వరూధిని, తన నోములు పండాయని అంటూ ఆయన చెప్పినట్లే చేద్దామని అన్నది.

ఆ తరువాత వరూధిని, మాయా ప్రవరుడుడైన గంధర్వ కుమారుడు ఇతర వ్యాపకాలు అన్నీ మాని చాలాకాలం ఆనందంగా గడిపారు. ఇంతలో వరూధిని గర్భవతి అయింది. ఆ దేవతాస్త్రీ తన మోసాన్ని కనిపెట్టుతుందేమోనని భయపడ సాగాడు గంధర్వ కుమారుడు. శపిస్తుందేమోనని కూడా భయపడ్డాడు. ఆమెను విడిచి ఇక వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు ఆమెతో ఇలా అన్నాడు. ‘నాకు పసరు రాసిపోయిన సిద్ధుడు ఈ కొండకు వచ్చాడు. నాకు కనిపించాడు. ఇంతకాలం నేనిక్కడ వుండడం వల్ల అక్కడ మా ఇంట్లో మా సంసార గతులన్నీ తారుమారయ్యాయి. నా తల్లిదండ్రులు దుఃఖించి శుష్కించిపోయారు. నీకు ధర్మం, అధర్మం తెలుసు. నేను ఇంటికి పోవాలి. నా వియోగానికి పరితపించవద్దు’.

గంధర్వ కుమారుడి మాటలకు వరూధిని దుఃఖపడ్డది. ఆమెను ఊరడించాడు. యోగవియోగాలు శాశ్వతం కాదన్నాడు. ఆమెను శాశ్వతంగా తాను వదలనని, సిద్దుడిని ప్రార్థించి అతడిచ్చే పాదలేపముతో తరచూ వస్తూ-పోతూ వుంటానని అన్నాడు గంధర్వ కుమారుడు. ఆ విధంగా వరూధిని నమ్మేవిధంగా ఎన్నోరకాల ఇచ్చకపు మాటలు చెప్పి గంధర్వ కుమారుడు తన ఇష్టం వచ్చినట్లుగా వెళ్లిపోయాడు.

వరూధిని కుమారుడు స్వరోచి శరణు కోరిన గంధర్వ కన్య మనోరమ

గర్భం దాల్చిన వరూధినికి తొమ్మిదినెలలు నిండాయి. ఒక శుభ గ్రహంతో కూడిన లగ్నంలో దేదీప్యమానుడైన, దేవేంద్రుడితో కొనియాడతగినవాడైన, మహత్తరకాంతి సంపన్నుడైన ఒక కుమారుడిని కన్నది వరూధిని. సూర్యచంద్రాదుల కాంతితో సమానమైన కాంతి, చక్కటి శరీర ఛాయ కలవాడైన ఆ బాలుడికి ఋషులు స్వరోచి అని పేరు పెట్టారు. ఆ బాలుడు దినదినాభివృద్ధి చెంది, మునీంద్రుల ఆశీర్వాద బలం కలిగి, ఉపనయనం చేసుకొని, ధనుర్వేదం అభ్యసించి, వేదార్థాలను నేర్చుకొని, యుద్ధం చేయడంలో గొప్పవాడై, సకల న్యాయ విచారణ చేయడంలో సమర్థుడై, కళావంతుడయ్యాడు. స్వరోచి సామ్రాజ్యాన్ని అనుభవిస్తుండగా ఒకనాడు ఆయనున్న కొండ మీద వడగళ్లు రాలాయి. వర్షం కురిసింది. సెలయేళ్లు ఎత్తైన ప్రదేశం నుండి ప్రవహించడంవల్ల పెద్ద ధ్వని కలిగింది. ఆ ధ్వనికి నెమిళ్లు కేకలు వేస్తూ నాట్యం చేశాయి. అలాంటి సుందర దృశ్యాన్ని చూద్దామని అనుకున్నాడు స్వరోచి ఆ మర్నాడు.

స్వరోచి అనుకున్నట్లుగానే కొండమీది నుండి చూస్తూ వినోదిస్తున్నప్పుడు అక్కడికి ఒక శబరుడు తమ రాజైన స్వరోచిని చూడడానికి వచ్చాడు. తాను తెచ్చిన దనుర్భాణాలను రాజుకు ఇచ్చి నమస్కరించాడు. సమీపంలోని కైలాసపర్వతం దగ్గరున్న అడవిలో ఘాతుక మృగాలు అమితంగా వున్నాయని, వాటిలో అడవి పందులు, సూకరాల గున్నలున్నాయని, బాగా బలసిన రుష్యాలున్నాయని, దుప్పులు కూడా వున్నాయని, ఇంకా వృషతాలు, యిర్రిపోతులున్నాయని, ఎన్నో రకాల పక్షులున్నాయని చెప్పి స్వరోచిని వేటకు ప్రేరేపించాడు. స్వరోచికి కూడా వేటాడడానికి మనసు కలిగి తన నగరానికి పోయి దానికి కావాల్సిన సన్నాహాలు చేసుకున్నాడు. ఒక ఉన్నతాశ్వాన్ని ఎక్కి స్వరోచి పరివారంతో కలిసి వేటకు బయల్దేరాడు. వారి వెంట వేటకుక్కలు కూడా వున్నాయి. వేటకాండ్రు కూడా బయల్దేరారు. అంతా కలిసి విచ్చలవిడిగా వేటాడారు. జింకలు, సివంగులు, ఎలుగులు, పెద్ద పందులు, పెద్ద పులులు ఇలా ఎన్నో జంతువులు వేటకాండ్రను చూసి పరుగెత్తాయి.

ఇలా వేట సాగుతుండగా దాదాపు పూర్తికావస్తున్న సమయంలో స్వరోచికి ఒక ఆడుదాని దుఃఖం వినిపించింది. వనితనని, అనాథనని, ఆర్తురాలినని, తనను రక్షించి పుణ్యం కట్టుకొమ్మని ఆక్రందనం వినగానే స్వరోచి ఆవైపునకు చూశాడు. ఒక స్త్రీ మట్టెలు మోగుతుంటే, స్తనద్వయం కదుల్తుంటే, కన్నీరు ధారలుగా కారుతుంటే, దైన్యం పొందిన ఆకారంతో స్వరోచి ఎదుట నిలిచింది. ఆమె వెక్కి-వెక్కి ఏడుస్తున్నది. ఆమెదొక వింత సౌందర్యంలాగా వున్నది. భయపడి దిక్కులు చూస్తూ స్వరోచికి ఒక మాట చెప్తానన్నది. భయపడవద్దని, ఆమె ఎవరని అడగ్గా ఆమె ఇలా చెప్పింది.

ఒక రాక్షసుడు తనను చంపడానికి మూడు రోజుల నుండి వెంటాడుతున్నాదని, దిక్కులేని తనను కాపాడమని ప్రార్థించింది. తన తల్లి మరుదశ్వుని కూతురని, తండ్రి ఇందీవరాక్షుడు అనే గంధర్వుడని, తన పేరు మనోరమ అని, తన చెలికత్తెలు కళావతి, విభావసి అని అన్నది. తెలియక చేసిన తప్పు వల్ల ముని శాపానికి ముగ్గురం గురయ్యామని చెప్పింది. రాక్షసుడి వల్ల శ్రమపడమని తనను ముని శపించాడని అన్నది. తన చెలికత్తెలను క్షయ రోగంతో బాధపడమని శపించినట్లు కూడా చెప్పింది. శాప కారణాన తనను రాక్షసుడు మూడు రోజుల నుండి వెంబడిస్తున్నాడని, తనను మింగుతానని అంటున్నాడని అన్నది.

తనకు అస్త్రహృదయం అనే విద్య వచ్చని, అది తనకు పరమ శివుడు నుండి క్రమాగతంగా వచ్చిందని, అది సకల శత్రు నాశనం చేస్తుందని, యశస్కరమైనదని, దానిని నేర్చుకొని ఆ రాక్షసుడిని చంపమని మనోరమ స్వరోచికి చెప్పింది. ఆ విద్యను నేర్చుకోవడానికి స్వరోచి అంగీకరించడంతో, మనోరమ అస్త్రహృదయాన్ని మిక్కిలి రహస్యంగా ఆయనకు నేర్పింది. ఇంతలో ఆ దానవుడు భయంకరంగా అరుస్తూ స్వరోచిని ఎదుర్కొన్నాడు. స్వరోచి మీద వాడిగల బాణాలను ప్రయోగించాడు. స్వరోచి వాటిని తునాతునకలు చేశాడు. కాసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగిన తరువాత స్వరోచి ఆగ్నేయబాణాన్ని ప్రయోగించడంతో దాని మంటలు రాక్షసుడి శరీరాన్ని చుట్టుకొన్నాయి. అప్పుడు వాడి రాక్షసాకారం పోయి గంధర్వుడి ఆకారాన్ని దాల్చాడు. విమానాన్ని ఎక్కి ఆకాశమార్గాన కనపడ్డాడు.

వరూధిని కొడుకు స్వరోచికి ఇందీవరాక్షుడి కూతురు మనోరమతో వివాహం

స్వరోచి బాణ ప్రయోగం వల్ల రాక్షసాకారాన్ని వీడి నిజరూపాన్ని ధరించిన గంధర్వరాజు ఆకాశంలో వున్న తన విమానం నుండి భూమ్మీదకు దిగాడు. తనతో పోరాడిన రాక్షసుడు గంధర్వాకారం దాల్చడం స్వరోచికి విస్మయం కలిగించింది. కిందికి దిగిన గంధర్వుడు స్వరోచిని ఆలింగనం చేసుకున్నాడు. తాను స్వరోచి తల్లికి సోదరుడినని, అందువల్ల అతడు తన మేనల్లుడని, తన పేరు ఇందీవరాక్షుడని, మనోరమ తన కుమార్తె అని, ముని శాపాన తనకు రాక్షసత్వం కలిగిందని, చివరకు తన ప్రియపుత్రికనే భక్షించడానికి పూనుకున్నానని అన్నాడు గంధర్వరాజు. ఇలా ఇందీవరాక్షుడు తన విషయం చెప్తుంటే ఆయన కూతురు మనోరమ తండ్రి పాదాలకు నమస్కారం చేసింది.

ఆ తరువాత ఇందీవరాక్షుడు తన శాప వృత్తాంతాన్ని వివరించాడు స్వరోచికి. మోసం చేసి తాను ఒక ముని దగ్గర వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన కారణాన ఆయన తనను రాక్షసుడివి కమ్మని శపించినట్లు చెప్పాడు. తన అపరాధాన్ని మన్నించమని మునిని కోరానని, శాపం పోవడానికి ఎన్ని దినాలు పట్టుతుందని అడిగానని, అప్పుడాయన కనికరించి స్వల్పకాలంలోనే అని చెప్పాడని అన్నాడు. రాక్షసాకారంలో తాను తన కుమార్తెను మింగబోయే సమయంలో ఒకానొక మహానుభావుడు వేసిన బాణం వల్ల తన శరీరం దహించి దివ్యరూపం వస్తుందని శాప విమోచన కూడా చెప్పాడని అన్నాడు. తన రాక్షసత్వం పోగొట్టి తనకు మహోపకారం చేసిన స్వరోచికి ప్రత్యుపకారంగా తన కూతురునిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు ఇందీవరాక్షుడు. తాను నేర్చుకున్న వైద్యశాస్త్రాన్ని కూడా తన కూతురుతో సహా స్వరోచికిస్తానని అన్నాడు. స్వరోచి దానికి అంగీకరించాడు.

తమరాజుకు శాప విమోచనం కలిగిన సంగతి తెలుసుకొని, మర్నాడు, ఇందీవరాక్షుడి పూర్వ సేవకులైన గంధర్వులు అక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకొన్నారు. స్వరోచి, మనోరమ సహితంగా ఇందీవరాక్షుడు స్వర్ణమయ రథం ఎక్కి ఆకాశమార్గాన మందరగిరికి (గంధర్వ పురానికి) పోయారు. ఆ తరువాత ఇందీవరాక్షుడు మందరాద్రి విశేషాలను స్వరోచికి వివరించాడు. ఒక రాజమందిరంలో స్వరోచిని విడిది చేయించాడు ఇందీవరాక్షుడు. స్వరోచిని, మనోరమను పెళ్లికొడుకుగా, పెళ్లికూతురుగా అలంకారం చేశారు పేరంటాలు. ఆ తరువాత ఇరువురూ వివాహ వేదికకు చేరుకున్నారు. పెండ్లికుమారుడైన స్వరోచికి మామైన గంధర్వరాజు శాస్త్రోక్తంగా మధుపర్కాన్ని ఇచ్చాడు. గంధర్వరాజు విష్ణుమూర్తిని పూజించిన విధంగా అల్లుడిని గౌరవించి లక్ష్మీ సమానురాలైన కూతురును స్వరోచికి ధారాపూర్వకంగా సమర్పించాడు. అంటే కన్యాదానం చేశాడు. తదనంతరం మంగళసూత్ర ధారణ, తలంబ్రాల కార్యక్రమం నడిచింది. అగ్నికి ప్రదక్షిణ నమస్కారాలు కూడా జరిగాయి. అరుంధతీదేవికి నమస్కారం చేయించారు వధూవరులను.

వంద భద్రజాతి ఏనుగులను ఇందీవరాక్షుడు అల్లుడైన స్వరోచికి అరణంగా ఇచ్చాడు. తండోపతండాలుగా హయాలను కానుకగా ఇచ్చాడు. రత్నాలతో ప్రకాశించే విమానాన్ని కానుకగా ఇచ్చాడు. కూతురు మనోరమకు అనేక రకాల ఆభరణాలను, పనిముట్టులను, వస్త్రాలను, వస్తుసమూహాలను దాచుకోవడానికి చక్కటి పెట్టెలను, సుగంధ ద్రవ్యాలను, పనికత్తెలను, దాసీజనాన్ని అరణంగా ఇచ్చాడు ఇందీవరాక్షుడు. కొన్ని గ్రామాలను కూడా వివాహ సమయంలో అరణంగా ఇచ్చాడు కూతురుకు.

పెండ్లికి వచ్చిన వారందరికీ కట్నకానుకలు ఇచ్చి ఇందీవరాక్షుడు సత్కరించాడు.

స్వరోచికి, వనదేవతకు పుట్టినవాడే స్వారోచిష మనువు

స్వరోచి, మనోరమలు వివాహానంతరం కలిసిమెలిసి సుఖాలను అనుభవించారు. అలా వుండగా ఒకనాడు విచారంగా వున్న భార్యను చూసి కారణం అడిగాడు స్వరోచి. తన మీద అమితమైన ప్రేమకల ఇద్దరు చెలికత్తెలు ఒక ముని శాపం వల్ల రోగపీడితులై వున్నారని, వారి రోగం పోగొట్టే విధానం తెలియక విచారపడుతున్నానని, కాబట్టి స్వరోచి ఆ రోగం పోగొట్టుతే తనకు సౌఖ్యం వుంటుందని చెప్పింది మనోరమ. భార్యను విచారపడవద్దని అంటూ, తాను నేర్చుకొన్న వైద్యశాస్త్రాన్ని ఉపయోగించి ఆమె చెలికత్తెల రోగబాదను మాన్పిస్తానని అన్నాడు స్వరోచి. ఆమె చెలికత్తెలు ఎక్కడున్నారో చెప్తే వైద్యం చేస్తానని, అక్కడికి మనోరమను కూడా తనతో రమ్మని చెప్పి, ఇద్దరూ కలిసి వారిదగ్గరికి వెళ్లారు. తనకు తెలిసిన వైద్యం ద్వారా వారికి దివ్య ఔషధం ఇచ్చి, ఆ రోగానికి తగ్గ అనుపానం, పథ్యం కూడా ఇచ్చి, రోగ నిర్మూలన చేసి వారిని ఆరోగ్యవంతులుగా మార్చాడు స్వరోచి.

రోగబాధ నుండి విముక్తి పొందిన ఆ ఇరువురు చెలికత్తెలు పూర్వపు కాంతిని పొంది, స్వరోచిని స్తోత్రం చేశారు. ఆయన చేసిన మహోపకారానికి ప్రత్యుపకారంగా తాము ఏమీ ఇవ్వలేకపోయినప్పటికీ, ఆయన సంపాదించదానికి అవసరమైనవి కొన్ని తమ దగ్గరున్నాయని వాటిని ఇస్తామని చెప్పారు. వారిలో ఒకామె, తాను మందారుడు అనే విద్యాధరుడి కూతురినని, తన పేరు విభావసి అని, భూమ్మీద కల మృగాల, పక్షుల మాటల అర్థం తనకు తెలుసని, ఆ గొప్ప విద్యను తన దగ్గరనుండి గ్రహించి తనను పెండ్లి చేసుకొమ్మని స్వరోచిని కోరింది. ఆ వెంటనే మరొకామె తన పేరు కళావతి అని, తాను ఒక ముని కుమార్తెనని, తనతల్లి తనను పుట్టగానే వదిలి వెళ్లిపోయిందని, ఒక గంధర్వుడు తనను కోరగా తన తండ్రి నిరాకరించడం వల్ల ఆయన్ను ఆ గంధర్వుడు చంపాడని, తనకు దిక్కుతోచక ప్రాణత్యాగం చేద్దామనుకుంటే ఆకాశవీధిలో పోతున్న పార్వతీదేవి వారించిందని, తనకు మహారాజైన స్వరోచి భర్త కాగలదని అన్నదని, అతడిని వివాహం చేసుకొని సకల సౌఖ్యాలు అనుభవించమని అన్నదని చెప్పింది.

తనకు పార్వతీదేవి ‘పద్మిని’ అనే విద్యను కూడా ఉపదేశించినట్లు పేర్కొన్నది కళావతి. దానిని స్వరోచికి ఉపదేశిస్తానని చెప్పింది. విభావసి, కళావతిల నుండి రెండు విద్యలను నేర్చుకున్నాడు స్వరోచి. ఒక సుముహూర్తంలో ఆ ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు. వారి వివాహ సమయంలో దేవదుందుభులు మోగాయి. మలయమారుతం వీచింది. ఆ విధంగా మనోరమను, విభావసి, కళావతిలను పెండ్లి చేసుకొని తన ముగ్గురు భార్యలతో సుఖంగా జీవించసాగాడు స్వరోచి.


ఈ నేపధ్యంలో స్వరోచి ఒకనాడు వేటాడదలచి అడవికి పోయాడు. ఆయన వేటాడుతుంటే జంతుజాలాలు భయపడి పారిపోసాగాయి. ఆపుడు ఆయన దృష్టి ఒక అడవి పందిమీద పడింది. స్వరోచి ఆ సూకరాన్ని చంపడానికి ధనుస్సు సంధించగా ఒక ఆడ లేడి రాజును చూసి మనుష్య భాషలో దాన్ని చంపవద్దని, అది అతడికి ఏ అపకారం చేయలేదని, దాన్ని వదిలి తనను చంపమని అన్నది. ఎందుకు ఇలా చావడానికి సిద్ధపడ్డావని లేడిని అడిగాడు స్వరోచి. తన హృదయం స్వరోచి మీద లగ్నమై వున్నదని, మదన తాపంతో బాధపడుతున్నానని, తనను కూడమని కోరింది లేడి. ఆమె మృగమని, తాను నరుడినని ఇద్దరికీ సంబంధం ఎలా కుదురుతుందని ప్రశ్నించాడు స్వరోచి. తనను స్వరోచి ప్రేమతో కౌగలించుకుంటే చాలునని అనగానే స్వరోచి అలాగే చేశాడు.

తక్షణమే ఆ లేడి ఒక మనుష్య స్త్రీ ఆకారంలో కనిపించింది. అలా ఆమె  లేడి రూపం ధరించడానికి, ఆ తరువాత మనుష్య స్త్రీ కావడానికి కారణం ఏమిటని అడిగాడు స్వరోచి. తాను ఆ వనానికి దేవతనని, స్వరోచి వల్ల ఒక ‘మనువు’ను కనాలని దేవతలు కోరగా ఆయన దగ్గరకు వచ్చానని, తనను కలిసి కొడుకును కనమని, దానివల్ల పుణ్యలోకాలు కలుగుతాయని చెప్పింది. దానికి అంగీకరించిన స్వరోచి ఆమెతో సుఖాలను అనుభవిస్తుండగా ఆమె గర్భాన్ని దాల్చింది. ఒక శుభ దినాన సింహపరాక్రమ సమానుడైన, మన్మథుడిని మించిన సౌందర్యం కల, సార్వభౌమ లక్షణాలు కల, సద్గుణాలు కల, అభిమానధనుడైన ఒక కుమారుడిని కన్నది ఆ వనదేవత.

స్వారోచిషుడు అన్న పేరు కల ఆ బాలుడు ఇంద్రియ నిగ్రహం కలవాడై, విష్ణుదేవుడిని గూర్చి బహుకాలం తపస్సు చేశాడు. ఆ ఆదినారాయణుడు కొంతకాలానికి అతడికి ప్రత్యక్షమయ్యాడు. స్వారోచిషుడు విష్ణును పరిపరి విధాల స్తోత్రం చేశాడు. ఆయన దశావతారాలలో ఏమేమి చేశాడో వర్ణించాడు. విష్ణుమూర్తి ఏం వరం కావాల్నో కోరుకొమ్మని స్వారోచిషుడికి చెప్పాడు. విష్ణుమూర్తి సమీపంలో సంచరించే వృత్తిని తనకిమ్మని స్వారోచిషుడు ప్రార్థించాడు. రెండవ మనువుగా నీతిని, ధర్మాన్ని వృద్ధిపరచి, చక్కగా భూమిని పాలించి, ఆ తరువాత సాలోక్య పదవిని పొందమని స్వారోచిషుడికి చెప్పాడు నారాయణుడు. అలా చెప్పి స్వారోచిషుడిని మనుపదానికి పట్టాభిషిక్తుడిని చేసి అంతర్థానం అయ్యాడు విష్ణుమూర్తి.

స్వారోచిషుడు మనుత్వాన్ని పొంది శాస్త్ర పద్ధతిన దుష్టులను శిక్షిస్తూ, శిష్టులను రక్షిస్తూ, భూమిని పాలించాడు. స్వారోచిష మనువుగా ప్రసిద్ధికెక్కాడు. చివరకు దేవత్వాన్ని పొందాడు. 

(వనం జ్వాలా నరసింహారావుగారి 

జ్వాలాస్ మూజింగ్స్ నుండి )

Sunday, April 11, 2021

స్త్రీపర్వం(ఆడియో నవల)

 స్త్రీపర్వం(ఆడియో నవల)





సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

స్త్రీపర్వం(ఆడియోనవల) ఆస్వాదించండి-




Friday, April 9, 2021

గౌతమ మహర్షి చరిత్ర

 గౌతమ మహర్షి చరిత్ర



సాహితీమిత్రులారా!

డా. శివానంద మూర్తిగారి గళంనుండి

గౌతమ మహర్షి చరిత్ర ఆకర్ణించండి- 



Wednesday, April 7, 2021

త్రాహి(కథ)

 త్రాహి(కథ)




సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

త్రాహి(కథ) ఆస్వాదించండి-



Monday, April 5, 2021

కర్దమ - కపిల మహర్షుల చరిత్ర

 కర్దమ - కపిల మహర్షుల చరిత్ర





సాహితీమిత్రులారా!

డా. శివానంద మూర్తిగారి గళంనుండి

కర్దమ - కపిల మహర్షుల చరిత్ర ఆకర్ణించండి- 




Saturday, April 3, 2021

అమ్మ(కథ)

 అమ్మ(కథ)




సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

అమ్మ(కథ) ఆస్వాదించండి-



Thursday, April 1, 2021

అత్రిమహర్షి చరిత్ర

 అత్రిమహర్షి చరిత్ర



సాహితీమిత్రులారా!

డా. శివానంద మూర్తిగారి గళంనుండి

అత్రిమహర్షి చరిత్ర ఆకర్ణించండి-