Showing posts with label హాస్య పద్యాలు. Show all posts
Showing posts with label హాస్య పద్యాలు. Show all posts

Friday, March 3, 2017

తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?


తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?




సాహితీమిత్రులారా!


ఎంతటివాడైనా
విధికి వశుడు కావలసిందే కదా
ఆ విషయాన్నే వేమన
ఈ పద్యంలో పరిహాసంగా చేబుతున్నాడు

కనక మృగము భువిని కలదు లేదనకుండ
తరుణి విడచి పోయె దాశరథియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వదాభిరామ! వినురవేమ!

బంగారులేడి లోకంలో ఉంటుందా ఉండదా
అనే విమర్శన చేయకుండా సీతకోరిందికదా అని
రాముడు దాన్ని తేవడానికి వేళ్లాడు కొంచెంకూడ
ఆలోచించకుండా వెళ్ళే ఈయన దేవుడెలా అయినాడు
అంటే విధి వంచితుడై వెళ్ళాడనికదా!

Thursday, October 13, 2016

జామాతా దశయో గ్రహ:


జామాతా దశమో గ్రహ:

సాహితీమిత్రులారా!


మనకు గ్రహాలు తొమ్మదని తెలుసు.
పదోగ్రహంకూడా ఉందట దానిపేరే అల్లుడు.
దాని ప్రత్యేకతను చెప్పడి శ్లోకం చూడండి-


సదా వక్ర స్సదాక్రూర: సదా పూజా మపేక్షతే
కన్యారాశి స్థితో నిత్యం జామాతా దశమో గ్రహ:


నవగ్రహాలకు ఈ గ్రహానికి తేడాలున్నాయి.
ఆ గ్రహాలు ఎప్పడో ఒకసారి వక్రీకరిస్తాయి.
సూర్యచంద్రులకు అసలు వక్రగతిలేదు.
రాహుకేతువులు ఎప్పుడూ వక్రంగానే చరిస్తాయి.
మిగిలిన గ్రహాలు అప్పుడప్పుడు వక్రిస్తాయి.
కాని జామాత(అల్లుడు) ఎప్పుడూ వక్రంగా ఉంటాడు.
శని మొదలైన వారు కొన్ని సమయాల్లోనే క్రూరులు,
కొన్నిసార్లు శుభులుగా ఉంటారు. కాని అల్లుడు
ఎల్లపుడూ క్రూరుడే. నవగ్రహాలు నియమిత కాలంలోనే
పూజను జరుపుతారు.కాని  జామాత ఎప్పుడూ పూజ కోరతాడు.
ఇతరగ్రహాలు రాశులుమారుతుంటాయి. కాని జామాత ఎప్పుడూ
కన్యారాశిలోనే ఉంటాడు.
అందువల్ల ఈ దశమగ్రహం మిగిలినవాటికంటె
విలక్షణమైనది - అని భావం.


Tuesday, September 13, 2016

'మని' లేదా మాకు పంపు మగవాడైనన్


'మని' లేదా మాకు పంపు మగవాడైనన్


సాహితీమిత్రులారా!




మనవారు ఎంత చతురులో
హాస్యానికైనా ఒక హద్దుండాల్నాలేదా
ఒక కవి కన్యాశుల్కం(ఓలి) ఇచ్చే
రోజుల్లో కట్నలను నిరసిస్తూ
ఎంత వికృతాకారునికైనా,
 బ్రతుకుదెరువు లేనివానికైనా మగవాడైతే
పిల్లనిచ్చి ఎదురు డబ్బిస్తారు మావారు ఓ శివా!
నీవు గణపతి పెళ్ళికి డబ్బులేక చేయలేకున్నవేమో?
మాకుపంపు ఆయన్ను అని వేళాకోళంగా ఈ పద్యం రాశాడు చూడండి.

గణపతికి పెండ్లి చేయవు
"మని" లేదా మాకు పంపు మగవాడైనన్
కనుముక్కు తీరు లేకు
న్నను భువిని కట్నంబు లెదురు నడచును శంభో

ఇలాంటి వాటిని  అధిక్షేప పద్యాలంటారు.

Friday, August 19, 2016

త్రోవదొరికిన వట్టి గందోళిగాడు


త్రోవదొరికిన వట్టి గందోళిగాడు


సాహితీమిత్రులారా!

పద్యాలలో హాస్యాన్ని ఉత్పాదింప చేసినవారిలో
తిరుపతివేంకటకవుల శిష్యులు
మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారొకరు.
ఆయన గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం హీరో
గిరీశం మీద చెప్పిన పద్యం చూడండి.

గొంగడి పురుగు కట్టింగు మీసలవాడు
        గంపశ్రాద్ధపు తలకట్టువాడు
ఎపుడు కాఫీ దుకాణపుఠేవిణీవాడు
      సిగరుపీలుపు బుగబుగలవాడు
పైపటారమును లోపలలొటారము వాడు
       పట్టుతప్పిన చలోభాయిగాడు
తుదమొదల్ లేని గాడిద గత్తరవాడు
        జలసాలతో పడి చచ్చువాడు
తడి యనెడి దున్నచో చేత తుడుము మొదలు
దేవతార్చన వర కొక్క తీరువాడు
వలను పడకున్న శ్రీశుకు వంటివాడు
త్రోవ దొరికిన వట్టి గందోళిగాడు

(గిరీశం ఎలాంటివాడంటే, ముక్కు మొదట్లో గొంగళిపురుగువలె,
ప్రెంచి కట్టింగు నల్లని మీసాలతో ఉండేవాడట.
అతని తలకట్టు గంపశ్రాద్ధం కొలుపువంటిది,
ఎల్లపుడూ కాఫీహోటలులో తిష్ఠవేసి, సిగరెట్టు పొగవాసనలు
బుగబుగ వ్యాపింపజేసేవాడు, పైన పటారం లోన లొటారంగా, దబాయిస్తూ,
పట్టుతప్పితే, మళ్ళీ కనబడకుండా మాయమయ్యేవాడు.
మొదలు చివర, క్రమంలేని గాడిద కొలువు, జల్సాలంటే జారిపడి చచ్చేవాడు.
బండతడి గుడ్డతో, ఒకడే అన్నిపనులు చేసేవాడు,
వీలుపడితే, విడవకుండా ఉపయోగించుకొవడం,
లేకపోతే శుకబ్రహ్మ దారే, దారిదొరికితే మాత్రం
తోలుబొమ్మలాటలోని గందోళి(హాస్య)గాడు సుమా!
గిరీశం అలాంటి విలక్షణవ్యక్తి.)

(దీనిలోని కొన్ని దేశీయ నుడికారాలు
ఇప్పటివారికి కొత్తగా కనబడతాయి.
అవి ఆకాలంలో వాడే నుడికారాలు.)