Tuesday, June 27, 2017

పురాణాలలోని అరణ్యాలు


పురాణాలలోని అరణ్యాలు
సాహితీమిత్రులారా!


రామాయణంలోను, మహాభారతంలోను
పేర్కొనబడిన అరణ్యాలు మొత్తం 14
అవి-
1. నైమిశారణ్యము 2. బదరికారణ్యము
3. దండకారణ్యము 4. చంపకారణ్యము
5. కామికారణ్యము  6. బృందారణ్యము
7. కదళికారణ్యము 8. గృహారణ్యము
9. దేవతారణ్యము  10. కేదారణ్యము
11. ఆనందారణ్యము 12. దారుకారణ్యము
13. వృక్షారణ్యము  14. మహారణ్యము

Monday, June 26, 2017

సంగీత వాద్యాలు - రకాలు


సంగీత వాద్యాలు - రకాలు
సాహితీమిత్రులారా!వినడానికి ఇంపైన స్వరంతో, భావస్పోరకంగా,
శ్రుతి లయానుగుణంగా, రాగబద్ధంగా ఆలపించే
బడేది గానం. ఈ గానం సౌందర్యభరితం కావడానికి
వాయిద్యాలు సహకరిస్తాయి.
ఇవి నాలుగు రకాలు.

1. తతం - తంత్రీ వాద్యాలు
                 (వీణ, ఫిడేలు, తుంబుర మొ.)
2. ఘనం - కంచుతాళం మొదలైనవి
3. అనవద్దం - చర్మవాద్యం (డప్పు, డోలు, 
                          మద్దెల, డమరుకం మొ.)
4. సుషిరం - వాయుపూరములైనవి 
                       (వేణువు, సన్నాయి, 
                       కొమ్ముబూర మొదలైనవి)

Sunday, June 25, 2017

పంచభక్ష్య పరమాన్నాలంటే?


పంచభక్ష్య పరమాన్నాలంటే?
సాహితీమిత్రులారా!


మనం మాట్లాడే సమయంలో
పంచభక్ష్య పరమాన్నాలనే మాటను వింటుంటాం
పంచ అంటే అయిదు భక్ష్య - తినదగినవి
పరమాన్నాలు - అని అర్థం
అదే ఆ తినదగిన 5 భక్ష్యాలు ఏవి
పదార్థాలు(భక్ష్యాలు) -
1. నమలదగినవి - భక్ష్యాలు
2. తినదగినవి   - భోజ్యాలు
3. లేహ్యాలు     - నాక్కునేవి
4. జుఱ్ఱుకోగదినవి - చోష్యం
5. త్రాగదగినవి   - పానీయం
వీటన్నినిటిని కలిపి పంచభక్ష్యములు అంటారు
ఏవి తినగలవి ఏవినమలదగినవి
ఏవి జుర్రుకోదగినవి
ఏవి నాక్కోదగినవి విడిగా చెప్పక్కరలేదనుకుంటాను.

రాత్రౌ చోర ప్రసంగేన


రాత్రౌ చోర ప్రసంగేన
సాహితీమిత్రులారా!


ఈ చాటువు చూడండి-

ప్రాతః ద్యూత ప్రసంగేన
మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః
రాత్రౌ చోర ప్రసంగేన
కాలో గచ్ఛతి ధీమతః

దీనిలో చూడటాని అన్నీ వ్యసనాలే కనిపిస్తాయి.
కానీ వీని అర్థం గమనిస్తే గమ్మత్తైనది చూడండి-

ప్రాతః ద్యూత ప్రసంగేన- అంటే ఉదయంపూట
భారతం గురించిన విషయాన్ని మాట్లాడాలట
(ద్యూత ప్రసంగము భారతంలో ధర్మరాజు ద్యూతం
గురించి ఉందికదా)

మధ్యాహ్నే స్త్రీ ప్సంగతః - అంటే
మధ్యాహ్నం పూట సీతా చరితమైన
రామాయణాన్ని గురించి మాట్లాడుకోవాలట.

రాత్రౌ చోర ప్రసంగేన - అంటే
రాత్రిపూట నవనీత చోరుడైన శ్రీకృష్ణుని
గాథలను వివరించే భాగవతం గురించి
మాట్లాడుకోవాలట.
ధీమంతులకు ఈ విధంగా కాలం గడుస్తుందట.
ఇంత విషయం ఉంది దీంట్లో.

Thursday, June 22, 2017

స్త్రీ పర్యాయ పదాలు - వ్యుత్పత్యర్థాలు


స్త్రీ పర్యాయ పదాలు - వ్యుత్పత్యర్థాలు
సాహితీమిత్రులారా!మనం మాట్లాడుతుంటాము.
వింటుంటాము ఆ పదాలకు
వ్యుత్పత్యర్థాలేమిటో మనం
తెలిసి ఉండము అందుకే
కొన్ని స్త్రీ పర్యాయ పదాలకు
ఇక్కడ వ్యుత్పత్యర్థం గమనిద్దాం-

తన్వి - కృశించిన శరీరంగల ఆడుది - స్త్రీ

తరళేక్షణ - చలించు కన్నులు గలది - స్త్రీ

తరుణి - కన్యావస్థను దాటి 30 సం. లోపు స్త్రీ- యౌవనవతి

అలివేణి - తుమ్మెదవలె నల్లని రంగుగల జడ గలది

అతివ - ఎక్కువ వన్నెలు కలది - పుణ్యస్త్రీ

అంగన - మంచి అంగములు కలది - సుందరి

తలోదరి - సూక్ష్మమైన ఉదరము కలది

నారి - నరుని వశము చేసికొనునది - స్త్రీ

నితంబిని - గొప్ప పిఱుదులు కలది - స్త్రీ

ననబోఁడి - పుష్పమువలె సుకుమారమైన శరీరముగల 
యువతి

మగనాలు - మగడు జీవించియున్న ఆడుది - పుణ్యస్త్రీ

మత్తకాశిని - మదములేకయే మదముగలదానివలె ప్రకాశించు స్త్రీ

లలన - నిరసన శీలముగల ఆడుది - స్త్రీ

వామలోచన - చక్కని కన్నులుగల స్త్రీ

వాలుఁగంటి - దీర్ఘములైన కన్నులుగల ఆడుది -స్త్రీ

అభిమన్యుడు ఛేదించిన పద్మవ్యూహం


అభిమన్యుడు ఛేదించిన పద్మవ్యూహం 
సాహితీమిత్రులారా!


అభిమన్యుడు ఛేదించిన పద్మవ్యూహం
అంటూంటే వినడమేగాని దాని చిత్రమైనా
చూడలేదని అనుకోవద్దు ఇదే ఆ వ్యూహం
చూడండి -
దీన్ని నానార్థగాంభీర్యచమత్కారిక - నుండి
తీసుకొనడమైనది.
దీనిలో దు- అనే అక్షరం దుర్యోధనుడు
స - అనే అక్షరం - సైంధవుడు
దుర్యోధనుణ్ని చేరాలంటే సైంధవుని దాటి వెళ్ళాలి
అది ఆ రోజు సాధ్యం కాలేదు భీమ నకుల సహదేవులకు
సరే ఆ చిత్రం చూడండి పోయి రావడానికి వీలౌతుందేమో
Wednesday, June 21, 2017

ఏ దినాలలో జ్వరము వస్తే ఎన్నిరోజులు


ఏ దినాలలో జ్వరము వస్తే ఎన్నిరోజులు
సాహితీమిత్రులారా!మన పూర్వుల విజ్ఞానం ఎంత గొప్పదో
దీన్ని చూస్తే తెలుస్తుంది
ఎంతటి పరిశీలనో గమనించండి-

జన్మనక్షత్రంలో, జన్మదినంలో, జన్మవారంలో
ఇలాంటివాటిలో జ్వరం వస్తే ఎన్నిరోజులకు
తగ్గుతుందో ఈ శ్లోకాలు చెబుతాయి చూడండి-

జన్మనక్షత్రరోగాస్తౌ
మండలం దేహపీడనం
జన్మవారే జ్వరోత్పత్తౌ
మండలార్థం వినిర్ధిశేత్

పుట్టిన నక్షత్రంలో రోగం వస్తే 40 రోజులు
పుట్టినవారంలో అయితే 20 రోజులు ఉంటుంది.

తథాజన్మదినే రోగో
మాసం పీడయతి ధ్రువం
రోగోద్భవో జన్మలగ్నే
ద్వాదశాంబుధావిధుః

పుట్టిన రోజున జబ్హు చేస్తే నెలకు,
జన్మలగ్నంలో జబ్బు చేస్తే 12 రోజులకు
రోగం మానుతుంది.


శుక్లాంబర ధరం విష్ణుం(హాస్యార్థం)


శుక్లాంబర ధరం విష్ణుం(హాస్యార్థం)
సాహితీమిత్రులారా!

వేదం వేంకటరాయశాస్త్రిగారు శుక్లాంబర ధరం విష్ణుం - అనే
శ్లోకం హాస్యార్థం ఒకమారు ఒక గోష్ఠిలో ఈ విధంగా వివరించారు

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే

ఇక్కడ శాస్త్రిగారు గాడిద పరంగా చెప్పిన అర్థం-
శుక్లాంబరధరం - శుభ్రమైన బట్టలు అనగా 
               చలువ గుడ్డలు మోయునది
విష్ణుం - సర్వత్రా వ్యాపించునది(ఒచోట నిలువకుండా 
        తిరుగుచుండుట గాడిద స్వభావం)
శశివర్ణం - చంద్రుని వన్నెగలది(గోదావరి ప్రాంతపు 
         గాడిదలు తెల్లనివిగదా)
చతుర్భుజం - నాలుగుబుజములు(చేతులు గలుగవు గావున)కలది
ప్రసన్నవదనం - సౌమ్యమగు ముఖము గలది. ఇది ఏవార్థకము.
వదనమేవ - వదనమే - ప్రసన్నము.
ఏలనగా గాడిద వెనుక సమీపించిన దాని కాలితన్నులే ప్రాప్తియ
ధ్యాయేత్ - ధ్యానింతును
సర్వవిఘ్నోపశాంతయే - అన్ని విఘ్నములు శమించుట కొరకు.

విఘ్నశాంతికి గార్ధభ ప్రార్థన ఎట్లనగా ఇట్లు-
ఓ గాడిదయ్యగారు
దయచేసి ఓండ్ర పెట్టడవద్దు
మీరు ఓండ్ర పెడితే ఈ రేవులోని మీతోటి
గాడిదలన్నీ ఒక్కసారిగా ఓండ్ర పెడతాయి
ఆ శబ్దంతో మాకు దిక్కుతోచదు
మా పనులన్నిటికి భంగము కలుగుతుంది.
కావున ఓ గాడిదయ్యా ఓండ్ర పెట్టవద్దు- అని ప్రార్థన.

(వేదం వేంకటరాయశాస్త్రి సంస్మృతి పుట సంఖ్య 62-63)

అంతర్జాతీయ యోగాదినోత్సవ శుభాకాంక్షలు


అంతర్జాతీయ యోగాదినోత్సవ శుభాకాంక్షలు


ఈ సందర్భముగా 12 ఆసనాలు 
రామ్ దేవ్ బాబా గారి వీడియో 
చూడండి నేర్చుకోండి


Tuesday, June 20, 2017

అంతా సుకవులు గారా?


అంతా సుకవులు గారా?


సాహితీమిత్రులారా!
ఈ చాటుపద్యం చూడండి.

అంతా సుకవులు గారా?
అంతింతో పద్య చయము నల్లగలేరా!
దంతివి నీతో సమమా?
కాంతా సుమబాణ! సూరకవి నెరజాణా!

దీనికి శ్రీశ్రీ పేరడీ చూడండి.

అంతా సురా ఘటేశులె
అంతింతో ఆచమాన మడిగేవారే
పంతానికి మాత్రం శివ
చింతా దీక్షితుల మండ్రు, సిరిసిరిమువ్వా!

Monday, June 19, 2017

పురుషులు ఆభరణాలు ధరించేవారా?


పురుషులు ఆభరణాలు ధరించేవారా?
సాహితీమిత్రులారా!


భాగవతంలోని ఈ పద్యం చూస్తే
పురుషులు ఎక్కడెక్కడ ఆభరణాలు
ధరించేవారని రూఢిగా తెలుస్తుంది

రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై,
శ్రవణాలంకృతమై, గళాభరణమై, సౌవర్ణ కేయూరమై
ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘట్టమై, నూపుర
ప్రవరంబై, పదపీఠమై, వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్
                        (భాగవతము - 8 -627)

శిరోభూషణాలు(తలకుధరించేవి) - కిరీటము
కర్ణభూషణాలు(చెవులకు ధరించేవి)- కుండలాలు,
కంఠాభరణాలు(మెడలో ధరించేవి) - ముత్యాల రత్నాల దండలు,
కూర్పరోపరి భూషణాలు(మోచేతికి పైన
ధరించే ఆభరణాలు) - కేయూరము(భుజకీర్తులు)
బాహునాళీ భూషణాలు(చేతులకు వేసుకునేవి) - కంకణాలు
కటి విభూషణాలు(మొలచుట్టూ ధరించేవి) -తలకము, సూత్రము
పాదాలకు ధరించేవి - నూపురుము
ఇలా అనేక రకాలైనవి మగవారు కూడ పూర్వం ధరించేవారు.

ఇందు గల డందులేడని (పేరడి)


ఇందు గల డందులేడని (పేరడి)సాహితీమిత్రులారా!

భాగవత పద్యమైన ఈ పద్యం ప్రహ్లాదచరిత్రలోనిది
ప్రహ్లాదుని హరి ఎక్కడున్నడో చెప్పమన్నపుడు
ప్రహ్లాదుడు చెప్పిన పద్యం.

ఇందు గల డందు లేడని,
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు, దానవాగ్రణీ వింటే!
                                                                                   (7-275)

ఈ పద్యానికి పేరడీ
వెలిదండ నిత్యానందరావుగారు
ఆనాటి రాజకీయాలకు అన్వయిస్తూ
చేసిన పేరడీ ఆంధ్రప్రభ దినపత్రికలో
18-12-1982లో వెలువడినది ఇది.

ఇందుగలదందులేదని
సందియము వలదవినీతి సర్వోపగతం
బెందెందు వెదకి చూచిన 
నందందే గలదు ఇందిరాకాంగ్రెసునన్

Sunday, June 18, 2017

మధమేహవ్యాధి పై వ్యాసం


మధమేహవ్యాధి పై వ్యాసం
సాహితీమిత్రులారా!


ఈ రోజుల్లో మధుమేహవ్యాధి చాల ఎక్కువగాను
సర్వసాధారణంగాను అయింది కావున దానిపై
డా. గన్నవరపు నరసింహమూర్తిగారు అందించిన
ఈ వ్యాసం అందరికి ఉపయుక్తంగా ఉెంటుందని
ఈ సాహితీనందనంలో ఉంచడం జరిగింది
అందరు చదివి మంచి చెడులను గ్రహింతురుగాక!

క్రీస్తు పూర్వము1500 సంవత్సర ప్రాంతములోనే " మధుమేహ వ్యాధిని " భారతీయ వైద్యులు వర్ణించారు. ఈ వ్యాధిగ్రస్తుల మూత్రము చుట్టూ చీమలు చేరడము గమనించి , వారి మూత్రము మధుకరమని గ్రహించారు. ఈజిప్టు దేశ వైద్యు లా వ్యాధిని అతిమూత్రవ్యాధిగా వర్ణించారు. శుష్రుతుడు, చరకుడు మధుమేహవ్యాధి రెండు విధములని, పిల్లలలో ఒకరకముగను, పెద్దలలో వేఱొక లక్షణములతో ఉంటుందని పసిగట్టారు. చిరకాలము క్రితమే కనుగోబడిన యీ వ్యాధి ప్రాబల్యము ఇరువది శతాబ్దములో బాగా హెచ్చినది. ఒకప్పుడు ధనిక వర్గాలలో ప్రాబల్యమైన యీ వ్యాధి యీ తరములో పేద, మధ్యతరగతి వారిలో విరివిగా పొడచూపు చున్నది.
శరీరమునకు అవసర మయ్యే శక్తి ఆహారము ద్వారా మనకు లభిస్తుంది. ఆహారపదార్ధాలలో పిండిపదార్థములు ( Carbohydrates ), క్రొవ్వులు ( Fats ) , మాంసకృత్తులు ( Proteins ) శక్తి నిస్తాయి. వాటి నుంచి లభ్యమయ్యే శక్తిని ( ఉష్ణమును ) కాలరీలు ( Calories ) గా కొలుస్తారు.
శరీర సాధారణ జీవప్రక్రియలకు కొన్ని కాలరీలు ఖర్చవుతాయి. మనము పడే శారీరక శ్రమ, వ్యాయామము, క్రీడలకు , బాల్య కౌమారకావస్థలలో పెరుగుదలకు అదనముగా శక్తి వెచ్చింప బడుతుంది. పెరుగుదల నిలిచాక మనకు ఆహారపు టవసరాలు త్రగ్గుతాయి. దైనందిక అవసరాలకు మించి తినే తిండి కాలేయము ( Liver ), కండరములలో మధుజని ( Glycogen ) అనే సంకీర్ణ శర్కర గాను, క్రొవ్వుగా చర్మము క్రింద పొరలోను ( Adipose tissue ), ఇన్సులిన్ సహకారముతో దేహమంతటా నిలువవుతుంది. రక్తములో, చక్కెర గ్లూకోజు ( Glucose ) రూపములో ప్రవహించి దేహములో కండరములకు, వివిధ అవయవాలకు , కణజాలమునకు యింధనముగా చేరుతుంది.
మధుజని ( Glycogen ) ఉత్పత్తిని Glycogenesis అని అంటారు.
శక్తి అవసరమయినప్పుడు , చక్కెర ( Glucose ) స్థాయి త్రగ్గినప్పుడు, కాలేయము, కండరములలో మధుజని ( Glycogen ) చక్కెరగా విచ్ఛిన్నమవుతుంది. క్రొవ్వు పొరల లోని క్రొవ్వు నుంచి శర్కరజనితము ( Gluconeogenesis ) అనే ప్రక్రియ వలన చక్కెర ( Glucose ) ఉత్పత్తి అవుతుంది. ఈ చక్కెర రక్తము ద్వారా కణజాలమునకు, చేరి వినియోగపడుతుంది.
సాధారణముగ రక్తపు చక్కెర విలువ ఉపవాస సమయములలో ( Fasting values ) 80 మి.గ్రా నుంచి 100 మి.గ్రాముల వఱకు ఉంటుంది. భోజనానంతరము రెండు గంటలప్పుడు పరీక్షిస్తే చక్కెర 140 మి.గ్రా. వఱకు ఉండవచ్చును. ఉపవాసపు విలువ 126 మి.గ్రా లైనా , రెండు గంటల భోజనానంతరపు విలువ 140 మి.గ్రా మించినా మధుమేహవ్యాధి ఉన్నదని నిర్ణయించవచ్చును. ఈ విలువలు పొలిమేరలలో ఉంటే శర్కర అసహనము ( Glucose Intolerance ) గాను , మధుమేహవ్యాధికి చేరువలో ( Borderline Diabetes ) ఉన్నట్లు గాను పరిగణించి వ్యాధి నివారణకు కృషి చెయ్యాలి.

మధుమేహవ్యాధికి కారణాలు :-
జీర్ణాశయపు సమీపమున దిగువగా ఉన్న క్లోమగ్రంధి ( Pancreas ) క్లోమరసమును ఉత్పత్తి చేసి ఆహారము జీర్ణమవుటకు తోడ్పడుతుంది. ఆ క్లోమరసము క్లోమనాళము ద్వారా డుయోడినంకు ( Duodenum ; చిన్నప్రేవుల తొలిభాగము ) చేరుతుంది.
క్లోమగ్రంధిలో చిన్న చిన్న దీవులుగా ( Islets of Langerhans ) ఉండే బీటా కణములు ( beta cells ) " ఇన్సులిన్ " అనే హార్మోన్ ని ( వినాళ రసం ) స్రవించి రక్తము లోనికి విడుదల చేస్తాయి. ఈ దీవులలో ఉండే ఆల్ఫా కణములు ( alpha cells) గ్లూకగాన్ ( Glucagon ) అనే వినాళ రసము నుత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్ , గ్లూకగాన్ లు ఒకదాని కింకొకటి వ్యతిరేకముగా పనిచేస్తాయి.
రక్తములో ఆహారము తిన్న తరువాత, చక్కెర విలువలు పెరిగినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తములో ఇన్సులిన్ విలువ పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ చక్కెరను కణాలలోనికి పంపుతుంది. కాలేయము, కండరాలలో అదనపు చక్కెరను మధుజని ( Glycogen ) గా మారుస్తుంది. క్రొవ్వుకణాలలోనికి చక్కెరను చేర్చి క్రొవ్వుగా మారుస్తుంది. కణములలో చక్కెర వినియోగపడి శక్తి విడుదల కావటానికి కూడా ఇన్సులిన్ దోహదకారి.
రక్తములో చక్కెర విలువలు బాగా పడిపోతే గ్లూకగాన్ స్రావము పెరుగుతుంది. గ్లూకగాన్ మధుజని విచ్ఛిన్నమును( Glycogenolysis , కాలేయము, కండరములలో ) , మద విచ్ఛిన్నమును ( Lypolysis , క్రొవ్వుపొరలలో ) ప్రేరేపించి చక్కెర ఉత్పత్తిని పెంచుతుంది. అందుచే చక్కెర విలువలు పెరుగుతాయి.. ఎడ్రినలిన్, ఎడ్రినల్ కార్టికోస్టీరాయిడ్ ల వంటి హార్మోనుల ప్రభావము కూడా చక్కెర విలువలపై ఉంటుంది.
ఇన్సులిన్ ఉత్పత్తి త్రగ్గినా, ఇన్సులిన్ కి అవరోధ మెక్కువయి ( Insulin Resistance ), ఉత్పత్తి అయిన ఇన్సులిన్ నిష్ఫలమైనా , చక్కెరపై అదుపు త్రగ్గుతుంది. చక్కెర కాలేయము, కండరాలలో మధుజనిగా మారదు. క్రొవ్వుపొరలలో క్రొవ్వుగా మార్పు చెందదు. కణజాలములోనికి తగినంతగా ప్రవేశించదు. చక్కెర ప్రాణవాయువుతో కలిసి బొగ్గుపులుసు వాయువు, ఉదకములుగా విచ్ఛిత్తి జరిగి ,శక్తి విడుదల కావటానికి కూడా ఇన్సులిన్ అవసరమే .
ఇన్సులిన్ లోపము, అసమర్థతల వలన రక్తములో చక్కెర విలువలు పెరిగి మధుమేహ వ్యాధిని కలుగ జేస్తాయి.
మధుమేహ వ్యాధి రెండురకాలు. (1) మొదటి రకము ( Type -1 or Insulin Dependent ) ఇన్సులిన్ ఉత్పత్తి లోపము వలన కలుగుతుంది. వ్యాధిగ్రస్థులలో ఇన్సులిన్ విలువలు తక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ తోనే వ్యాధిని నయము చేయగలము. ఈ మధుమేహము ఇన్సులిన్ అవలంబితము( Insulin Dependent ). తరుణప్రాయములోనే ఈ వ్యాధి ప్రస్ఫుట మవుతుంది. ఇన్సులిన్ తప్ప యితర మందులు ఈ వ్యాధికి నిష్ప్రయోజనము .
(2) రెండవ రకము ఇన్సులిన్ పై ఆధార పడనిది ( Type -2 or Non Insulin Dependent) . దీనిని వయోజనులలో చూస్తాము. స్థూలకాయులలో , ఇన్సులిన్ సమర్థత త్రగ్గుట వలన ఈ వ్యాధి కలుగుతుంది. అంత్యదశలలో తప్ప ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉంటుంది. ఇన్సులిన్ కి అవరోధము
( Resistance ) పెరిగి, దాని ప్రయోజనము త్రగ్గి మధుమేహము కలుగుతుంది. జీవనశైలి, మార్పులు, నియమితాహారము, వ్యాయామములు వ్యాధి నివారణకు, వ్యాధిని అదుపులో ఉంచుటకు తోడ్పడుతాయి. మెట్ ఫార్మిన్, ఇన్సులిన్ స్రావకములు( Insulin Secretagogues ), ఇన్సులిన్లను అవసరము బట్టి వ్యాధిని అదుపులో ఉంచుటకు వాడుతారు.
కారణాలు :
(1) మొదటి రకపు మధుమేహపు వ్యాధి జన్యుసంబంధమైనది. శరీరరక్షణ వ్యవస్థ ఆత్మాక్రమణ వలన ( Autoimmune process ), క్లోమములోని బీటా కణములు నాశనమొందుట వలన ఇన్సులిన్ ఉత్పత్తి వీరిలో లోపిస్తుంది.
(2) రెండవరకపు వయోజన మధుమేహము కూడా వంశపారంపర్యముగా వచ్చే జన్యుసంబంధ మవ వచ్చును. కాని జీవనశైలి, వ్యాయామలోపము, అమితాహారము, శర్కర సహిత పానీయములు, మితిమీరిన క్రొవ్వుపదార్థ వాడుకలు ( Saturated fats ) ధూమపానము, స్థూలకాయములు ఈ మధుమేహము కలుగుటకు ఎక్కువగా తోడ్పడుతాయి. కణాలలో ఇన్సులిన్ గ్రాహకముల ( Receptors ) అవరోధము పెరుగుటచే ఇన్సులిన్ సమర్థత త్రగ్గుతుంది. రక్తములో ఇన్సులిన్ విలువలు ఎక్కువగా ఉన్నా దాని ఫలితము తక్కువే.
గర్భిణీ స్త్రీలలో పెక్కు వినాళగ్రంధస్రావకముల వలన ( Harmones) గర్భసంబంధ మధుమేహము ( Gestational Diabetes ) కలుగ వచ్చును.
ఇతర వినాళగ్రంధుల వ్యాధులు, క్లోమ వ్యాధులు, గ్లూకోకార్టికోస్టీరాయిడుల వంటి మందులు, శస్త్రచికిత్సతో క్లోమమును తీసివేయుట , మరికొన్ని యితర వ్యాధుల వలన మధుమేహము కలుగ వచ్చును.
వ్యాధి లక్షణాలు:-
రక్తములో చక్కెర స్థాయి పెరిగి మూత్రములో చక్కెర నష్టము కలిగితే, చక్కెరతో బాటు జలనష్టము కూడా కలిగి అతిమూత్రము కలుగుతుంది. జలనష్టము వలన దాహము పెరుగుతుంది. చక్కెర నష్టము వలన బరువు త్రగ్గుతారు . ఆకలి పెరిగి వారు తిండి ఎక్కువగా తిన్నా బరువు త్రగ్గుతారు. కళ్ళ కటకములలో చక్కెర , నీరు చేరి కటకపు ఆకృతి మారడము వలన దృష్టిలోపాలు కలుగ వచ్చును. కొందఱిలో విశేషముగ లక్షణాలు పొడచూపక పోవచ్చును. కొందఱు క్లిష్టపరిస్థుతులతోనే వైద్యులను సంప్రదించ వచ్చును.
మధుమేహము వలన వచ్చే జటిలములు :
మధుమేహవ్యాధి వలన సూక్ష్మరక్తనాళములు కుచించుకుపోతాయి.రక్తనాళములు బిరుసెక్కుట వలన ( ధమనీ కఠిన్యత , Atherosclerosis ) కలిగి హృద్రోగములు, మస్థిష్కవిఘాతములు( Cerebrovascular accidents ) మూత్రపిండముల వైఫల్యము
( Renal failure ) దూర నాడుల ధ్వంసము ( Peripheral Neuritis ) వలన స్పర్శలోపము, దూరరక్తప్రసరణ లోపాలు ( Peripheral Vascular disease ) దృష్టిదోషాలు మధుమేహము వలన కలుగ వచ్చును.
ఇన్సులిన్ లోప మధికమైతే చక్కెర ఆమ్లజనీకరణ( Oxygenation ) అసంపూర్తి కావుటచే
కీటోనులు( Ketones ) పెరిగి రక్తము ఆమ్లీకరణ మవవచ్చును ( Diabetic Keto Acidosis ) దీని వలన అత్యవసర పరిస్థితి కలుగ వచ్చు. అపస్మారకత రావచ్చును. చక్కెర స్థాయి బాగా పెరిగి Hyperosmolar coma కలుగ వచ్చు.
వ్యాధి నిర్ణయము : రక్తములో చక్కెర విలువలు చూసి వ్యాధిని నిర్ణయించవచ్చును. Glycated Haemoglobin విలువలు కూడా తోడ్పడుతాయి.

చికిత్స:-
తరుణ మధుమేహమునకు ఇన్సులిన్ వాడుక తప్పనిసరి.
వయోజన మధుమేహమునకు జీవనశైలి మార్పులు తప్పనిసరి. పరిమితాహారము, క్రొవ్వులు, చక్కెరల వినియోగమును నియంత్రించుట, వ్యాయామము, చక్కెరపానీయాలు మానుట, పొగత్రాగడము మానుట చాలా అవసరము.
మెట్ ఫార్మిన్, ఇన్సులిన్ స్రావకములు, క్రమరీతిలో వైద్యులు వాడుతారు. అవసరమయితే ఇన్సులిన్ వాడుక తప్పదు. రక్తపుపోటు నదుపులో పెట్టడము, స్టాటిన్స్ తో కొలెస్ట్రాల్ని తగ్గించుట, మూత్రపిండముల రక్షణకు ఆఛే ఇణిబితొర్స్ వాడడము, హృదయాఘాతకములను
( Heart attacks ) మస్తిష్క విఘాతకాలను నివారించుటకు ఎస్పిరిన్ వాడుకలు, కళ్ళపరీక్షలు, పాదరక్షణలు చికిత్సలో భాగమే. స్థూలకాయములను తగ్గించుట చాలా అవసరము.


తఱచు చక్కెర విలువలు పరీక్షించుట , చక్కెరలు అధికము , అల్పము కాకుండా చూసుకొనుట అవసరము. మందుల వలన విపరీతఫలితములు ఉండవచ్చును. మెట్ ఫార్మిన్ వలన
ఆమ్లరక్తత ( Metabolic Acidosis ) మూత్రపిండముల వైఫల్యములు కొందఱిలో కలుగవచ్చును. అందువలన అప్పుడప్పుడు రక్తపరీక్షలు అవసరమే. వ్యాధిగ్రస్థులకు క్రమశిక్షణ , వైద్యుల సలహాలను పాటించుట, తఱచు చక్కెరలను పరీక్షించుకోవడము, వాడే మందులపై సదవగాహము అవసరము. తగినంత వ్యాయామము చాలా అవసరమే . జటిలపరిస్థితుల లక్షణాలు కలిగితే సత్వర చికిత్సకు వైద్యులను సంప్రదించుట చాలా ముఖ్యము. ప్రపంచములో 400,000,000 మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్థులున్నారంటే వ్యాధి ప్రాబల్యము తెలుస్తుంది.

శివామృత లహరి


శివామృత లహరి
సాహితీమిత్రులారా!
డా. ఏల్చూరి మురళీధరరావుగారి కృత
శివామృత లహరి చూడండి-


శ్రీనాదాంతవిభావనీయపరమశ్రేయోనిధానా! త్రివే
దానుస్వారవిధాన! వైదికలతాంతారూఢతత్త్వైకవి
ద్యానన్యాదృశకేళిరమ్య! ప్రణవధ్యానైకగమ్యా! స్వస
ర్గానూనస్థితిసంహృతిత్రితయముక్తాకార! విశ్వేశ్వరా!

కలరూ పేర్పడరాని వైద్యుతలతాకల్పంబవై పొల్చి, పెన్
వెలుఁగై నిల్చిన నాదబిందుసుకళాభిజ్ఞాస్పదభ్రూయుగీ
విలసన్మధ్యతలావతార! కరుణావిస్తార! నాలోన ని
న్నెలమిం దాపము తీఱఁ జూచుటెపుడోయీ, స్వామి విశ్వే శ్వరా!

ఓంకారాభిధమంత్రబంధశుభవర్ణోర్జస్వలప్రౌఢిమా
లంకర్మీణ! భవార్తభక్తజనకల్యాణైకపారీణ! భా
వాంకూరశ్లథనైకదక్ష! దురితవ్యాఘ్రౌఘహర్యక్ష! య
స్తుంకారమ్మును జూపి బాపవె మనోదుఃఖమ్ము విశ్వేశ్వరా!

సేవింతున్ నిగమాగమాంకితశుభశ్రీనామధేయున్, నినున్
భావింతున్ జతురాస్యకేశవనిలింపాదృష్టచూడాపదుం,
గావింతున్ భవదీయదాసజనకైంకర్యంబు, నీ పాదరా
జీవద్వంద్వనిరంతరార్చనవిధిన్ జీవింతు విశ్వేశ్వరా!

చిరమై శారదచంద్రికారుచిరమై శీర్యణ్యగంగాశుభా
కరమై శాంతజితేంద్రియప్రకరమై కైవల్యమందారసుం
దరమై విద్రుతభక్తలోకదరమై ధర్మానుసంధానసు
స్థిరమై పొల్చెడు వెల్గు నిన్ను నొకఁడే సేవింతు విశ్వేశ్వరా!

నతభక్తార్ణవచంద్రమండలఘృణీ! నైజాత్మయోగారణీ!
స్తుతకల్యాణమణీ! జటాటదమరస్రోతస్వినీధోరణీ!
శ్రితలోకైకశిరోమణీ! శ్రుతిశిరస్సీమంతముక్తామణీ!
ప్రతిమానన్యు నినున్ భవాబ్ధితరణీ! ప్రార్థింతు విశ్వేశ్వరా!

నీవై యుంచెదు మంటినేల మొలకన్; నీర్వోసి పేరాదటం
జేవ న్నించెద; విట్లు పెంచెదవు హృత్సీమన్ వెలుంగై మ ము
న్నీవే నొంచెద; వింకఁ ద్రుంచెదవునున్ నీలాభ్రధూర్జాట జూ
టీవిస్తీర్ణసురాపగాశివచిరంటీరమ్య! విశ్వేశ్వరా!

బ్రతుకెల్లన్ వరిబీడుగా నెఱియలై వాటిల్లు నెచ్చోట నీ
వు తిరంబై కొలువున్న చిన్నెలివి కాబోలు న్వగ, ల్లేవడుల్
జత గోరంబుల పంటలయ్యె నను నొల్లంబోక చూ
పితి వీ నిన్నుఁ దలంచు నెమ్మదిఁ దమిన్ విశ్వాత్మ! విశ్వేశ్వరా!

తరణాతీతభవాబ్ధిలో మునిఁగి శ్రీ తారుణ్య కారుణ్య స
ద్వరణామోఘగుణౌఘగాన మొనరింతున్ స్వామి ! రాని మ్ము త్వ
చ్చరణాంభోజము లాత్మ నిల్పికొను దాసశ్రేణిపైఁ గొంత నీ
కరుణాపూర్ణకటాక్షవీక్షణము నాకై కొంత విశ్వేశ్వరా !

శర్వాణీరమణీమణీహృదయశశ్వత్పద్మభృంగాణ! నీ
నిర్వాణప్రదనిర్మలాకృతిని మౌనిప్రాజ్ఞు లూహింప దృ
క్పర్వంబై యగుపింతు వెట్లు దయఁ బ్రోవన్ రావె తండ్రీ! నను
న్నర్వాచీనవటద్రుమూలఫలవిద్యామూర్తి! విశ్వేశ్వరా!

Saturday, June 17, 2017

మురుపు


మురుపు
సాహితీమిత్రులారా!


తుమ్మూరి రామ్మోహన్ రావుగారి
ఈ కవితను చూడండి-
సమకాలీన సమాజాన్ని
ఎలా ప్రతిబింబిస్తున్నదో

భాషల్ని ప్రేమిస్తున్నాం
వేదాల్ని వెక్కిరించే వెబ్సైట్లతో
భేదాల్ని ప్రబోధిస్తున్నాం
చేర్చుకుంటూ వస్తున్న చెలిమి గొలుసుల్ని
విద్వేషాల కొలిమిలో విడదీసుకుంటున్నాం
నదులనుండి ఎదిగిన నాగరికతను
నగశిఖరం ఎక్కించి అగాధంలోకి తోస్తున్నాం
అప్పుడు అజ్ఞానంలో ఆకులు కప్పుకున్నాం సరే
ఇప్పుడు విచ్చుకున్న విజ్ఞానంలో గుడ్డలిప్పుకుటున్నాం
గుహలనుండి గ్రహాలకు చేరినా
ఆగ్రహాగ్నుల అరణులమవుతున్నాం
మానవత్వం మాట మరచి
మనుజులమని మురిసిపోతున్నాం


Thursday, June 15, 2017

సతతం ప్రియవాదినః


సతతం ప్రియవాదినః
సాహితీమిత్రులారా!


రామాయణంలోని
సుభాషితాలు ఇక్కడ
కొన్నిటిని చూద్దాం-

సులభాః పురుషా రాజన్
సతతం ప్రియవాదినః
అప్రియస్య తు  పథ్యస్య
వక్తా శ్రోతా చ దుర్లభః

(నీకు ప్రియమైన మాటలు చెప్పేవారు
సులభంగా దొరుకుతారు- కానీ
అప్రియమైనా సరే హితం చెప్పేవారుగాని
వినేవారుగాని దొరకటం దుర్లభము.)

ధన్యాస్తే పురుషశ్రేష్ఠా
యేబుధ్యా కోపముత్థితం
నిరుంధంతి మహాత్మానో
దీప్తమగ్ని మివాంభసా

(మండే అగ్నిని నీటితో
చల్లార్చినట్లు కోపాన్ని
వివేకంతో అణచివేయగల
పురుషులు ధన్యులు)

శ్మశానవాటి పద్యాలు


శ్మశానవాటి పద్యాలుసాహితీమిత్రులారా!


సత్యహరిశ్చంద్ర ఎంత పేరెన్నిక గన్న
నాటకమో చెప్పక్కరలేదు. సత్యహరిశ్చంద్రుని
కథ కూడ గొప్పపేరు పొందినదే అందుకే మన
చలన చిత్రాలలో సత్యహరిశ్చంద్ర మొదటిది.
బలిజేపల్లి లక్ష్మీకాంతంగారి సత్యహరిశ్చంద్ర
నాటకం గతంలో ఎంత మంది మన పూర్వులను
ఆనందాబ్దిలో ఓలలాడించిందో చెప్పలేము.
కాని  జాషువాగారి ఖండకావ్యంలోని శ్మశానవాటి
పద్యాలు  ఏమహనీయుడు చేర్చాడో వాటికికూడ
ప్రజలు అంతగా హక్కున చేర్చుకున్నారు
వాటిలోని కొన్ని పద్యం ఇక్కడ చూద్దాం-

ఎన్నోయేండ్లు గతించి పోయినవి గానీ, యీ శ్మశానస్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ, డక్క టా!
యెన్నాళ్ళీ చలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగి పోయినవి నిక్కంబిందు పాషాణముల్!


ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
                      కలము, నిప్పులలోనఁగఱఁగిపోయె!
యిచ్చోట; నే భూములేలు రాజన్యుని
                     యధికారముద్రికలంతరించె!
యిచ్చోట; నేలేఁత యిల్లాలి నల్లపూ
                    సలసౌరు, గంగలోఁగలసిపోయె!
యిచ్చోట;  నెట్టిపేరెన్నికం గనుఁగొన్న
                     చిత్రలేఖకుని కుంచియ, నశించె!
ఇదిపిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె, గదిలించి యాడు రంగస్థలంబు;
ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టులొలయ
నవనిఁబాలించు భస్మసింహాసనంబు


వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁబాలఱాతి గో
రీకదఁ బారవేయఁబడి ప్రేలికలం  బొరలాడు ప్రేత మే
యాకటి చిచ్చునన్ గుమిలి, యార్చి, గతించిన పేదవాని దౌ
నోకద! వానికై వగవఁడొక్కండు; దాఁచదు కాటినేలయున్

ఈ పద్యాలను పాడటంకాదు
చదువుతున్నా కళ్లముందు
కదలాడే విధంగా కూర్చిన
జాషువాగారిని తెలుగువారు
ఎన్నటికి మరువరు.

Tuesday, June 13, 2017

గజేంద్ర మపి కర్షతి


గజేంద్ర మపి కర్షతి
సాహితీమిత్రులారా!కొన్ని పద్యాలకు శ్లోకాలు
అతికినట్లు సరిపోతాయి
కాని పద్యం ముందా
శ్లోకం ముందా అంటేనే
సమస్య -
ఈ శ్లోకం చూడండి-

నక్ర స్స్వస్థాన మాసాద్య
గజేంద్ర మపి కర్షతి,
న ఏవ ప్రచ్యుతి స్థానా
చ్చునాపి పరిభూయతే

మొసలి తన స్థానమైన నీళ్లలో ఉన్నంతసేపు
ఎంత బలవంతమైన ఏనుగునైనా పట్టువిడువక
చిక్కించుకుంటుంది. కాని అటువంటి మొసలి
నీటి బైటికి వస్తే ఊరకుక్క సైతం దాన్ని
చీల్చి చెండాడుతుంది. స్థానబలంఅంటే ఇదే
ఎవరికేది అసలైన స్థానమో వారు అక్కడే ఉండి
తమ కార్యాలను చక్కదిద్దుకోవాలి. తనదికానిచోట
ఆధిక్యం ప్రదర్శిస్తే శృంగ భంగమౌతుంది - భావం

ఇదే శ్లోకానికి వేమన పద్యం చూడండి-

నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు
బైట కుక్కచేత భంగపడును
స్థాన బలిమి గాని తనబల్మిగాదయా
విశ్వదాభిరామ!వినుర వేమ!

తేడా ఏమైనా ఉన్నదా శ్లోకానికి దీనికి
మరి ముందేది. చెప్పడం కష్టం.

Monday, June 12, 2017

లేకుంటే మాట్లాడకుండా ఊరుకోవాలి


లేకుంటే మాట్లాడకుండా ఊరుకోవాలి
సాహితీమిత్రులారా!
తంజావూరు పాలకుడైన
రఘునాథనాయకుడు
పాలకుడే కాక మంచి కవి
ఆయన రచించిన రామాయణంలోని ఈ పద్యం
చూడండి కవిత్వంపై ఆయనకుగల అభిప్రాయం
తెలుస్తుంది

పలుకవలె నవరసములు
కులుకం బద్యములు చెవులకున్ హృద్యముగా
వళుకక యటుగాకున్నం
బలుకకయుండుట మేలు బహుమానముగన్

కవి అనేవాడు కవిత్వం చెబితే నవరసాలు
జాలువారుతూ పాఠకుని చెవులకు మనసుకు
విందొనర్చాలి, లేకుంటే మాట్లాడకుండా
ఊరుకోవాలి - అని భావం

నిజమేకదా!

గోలి గారి - బొట్టుపై పద్యాలు


గోలి గారి - బొట్టుపై పద్యాలు
సాహితీమిత్రులారా!


కుక్కపిల్లా
సబ్బుబిల్లా
అగ్గిపుల్లా
........
కాదేదీ కవిత కనర్హం
అని శ్రీశ్రీ గారి కవనం విన్నాం కదా
కుక్కపిల్ల, అగ్గిపుల్లల కంటే పవిత్రమైనది
కదా బొట్టు దాని గురించి గోలి శాస్త్రిగారు
పద్యరూపకంగా అందించిన కవితంను చూడండి-

   
కందము:
శ్రీకరమగు నిది నుదుట వ
శీకరమని తలచ బోకు క్షేమంకరమౌ
'ఛీ' కరమున తుడుపకుమా
మీకరమే తిలక మిడగ మెత్తురు సురలే.

కందము:
పుట్టిన పట్టికి దిష్టియె
వట్టిగనే తగులకుండ పట్టుచు " చాదే "
పెట్టును తల్లియె నుదుటన
బొట్టుగ మన మొట్టమొదటి బొట్టది గదరా!

కందము:
ళులుళులుళాయీ యనుచును
తల ద్రిప్పెడు బిడ్డ నుదుట తంటాల్ బడుచున్
కలిపిన ' చాదును ' బెట్టెడు
తెలుగింటను తల్లిని గన తీయని తలపౌ.

కందము:
ఇంటికి వచ్చిన బొట్టే
ఇంటికి రమ్మనుచు జెప్ప నింతికి బొట్టే
కంటికి " నో " యెబ్బెట్టే
వింటిరె మన సంసృతిగన వేడ్కగు నిట్టే!

కందము:
గోటికి గోరింటాకే
మేటిగ కాలికినిగజ్జె మీదట తీరౌ
కాటుక కంటికి, జడయును
బోటికియందమ్ము నుదుట బొట్టే సుదతీ!

కందము:
శోభను గూర్చునుగద నొక
యాభరణము చేరియున్ననది మగువలకే
ఆభరణమె బొట్టొక్కటి
సౌభాగ్యమె నుదుట బెట్ట చక్కటి మోమున్.

కందము:
అద్దము చేతను బట్టుచు
నొద్దికగా ముఖము గనుచు నొకచేతన్ తా
ముద్దుగ నుదుటను కుంకుమ
దిద్దెడు భంగిమ పడతికి తీరుగనుండున్.

కందము:
నీమము వీడక కొందరు
కోమలులే బొట్టు నుంత్రు క్రొత్తగ, కలియున్
లేమకు చర్మపు రంగున
నేమైనా " ఉంది' 'లేద" నేటట్లుండున్.

కందము:
హిందువు నీవేయైనచొ
బిందువుగా నుదుట బొట్టు పెట్టుము చాలున్
అందునలౌకిక భావన
మందును మనమనమున కొక హాయే గలుగున్.

కందము:
తిలకము నుదుటన దిద్దుము
తిలకించుము మోము చుట్టు తేజము హెచ్చున్
పులకింతలు మది గలుగగ
తిలకమవై సాటివారి తీరును గనుమా!

సీసము:
విష్ణు పూజనుసల్పి వినయమ్ము తోడను
                    నిలువు బొట్టును బెట్టు నిష్ట తోడ
భవుని మదిని దల్చి భయముల బోద్రోల
                     భస్మ ధారణ సల్పు భక్తి తోడ
ఆంజనేయుని చెంత నాకుపూజను జేసి
                     సిందూరమును దాల్చు శ్రీకరముగ
అమ్మవారిని గొల్చి యఘములే నశియింప
                      కుంకుమ నేదిద్దు కోరికోరి.

ఆటవెలది:
అడ్డ నిలువు బొట్టు లదిగాదు ముఖ్యమ్ము
బొట్టునుదుటనుంట పుణ్యప్రదము
ఎరుపు తెలుగు రంగు లేవైన మనకేమి
పట్టుబట్టి పెట్టు బొట్టు నిట్టు.

తేటగీతి:
దూర ముగ సేయబోకు సిందూర బొట్టు
కుంకుమను బొట్టు బెట్టుట గ్రుంక నీకు
బూదిలోన గలుపకు వీబూది బొట్టు
మనదు సంస్కృతి నిలబెట్టు మరచి పోకు.

ఆటవెలది:
దోసగింజ బొట్టు దొడ్డగనే బెట్టు
శనగగింజ బొట్టు సరిగ బెట్టు
కాసు వంటి బొట్టు కనిపించగా బెట్టు
ముఖము తగ్గ బొట్టు సుఖము - " ఒట్టు "

ఆటవెలది:
అడ్డబొట్టు జూడ నదియొక యందమ్ము
నిలువు బొట్టు గూడ కళగనుండు
చుక్క బొట్టు గనగ చక్కగ గనుపించు
మూడు గలిపి బెట్ట ముఖము నిండు.


కందము:
బొట్టును వలదను మతములు
బెట్టుగనే పట్టుబట్టి భీష్మించగ, నీ
బొట్టును బెట్టెడి మతమున
పెట్టక నీవుండ నిటుల ప్రియమన దగునా?

Sunday, June 11, 2017

యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో


యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో
సాహితామిత్రులారా!


అన్నీ భగవంతుడే అంతా భగవద్విలాసమే
అంటుంటారు కొందు కానీ అలానే ఎంత
మంది ఉంటున్నారు. ఈ శ్లోకం చూడండి-

ఆత్మా త్వం, గిరిజా మతిః, పరిజనాః ప్రాణాః, శరీరం గృహం
పూజతే విషయోపభోగరచనా, నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిస్తోత్రాణి సర్వాగిరః
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనమ్

ఓ ఈశ్వరా నాలోని జీవుడివినీవే,
నా బుద్ధి నీ యర్థాంగి పార్వతి,
నాప్రాణాలే నీ పరిజనులు(సేవకులు)
నా శరీరమే నీ గృహము(కైలాసము)
నా పంచేద్రియ అనుభూతియే నీపూజ.
నిద్రయే నాకు సమాధ్యవస్థ.
నా పాదసంచారమేనీ ప్రదక్షిణ విధానం
నా మాటలన్నీ నీ స్తోత్రాలే.
నేనే పనిచేసినా అది నీ ఆరాధనే పరమ శివా-
అని భావం.

ఈ భావంతో చరించే దెందరు
చరించేవారు ఉన్నా మనం
వారిని గుర్తించగలమా

మామూలు వాళ్ళకే చలి


మామూలు వాళ్ళకే చలి
సాహితీమిత్రులారా!ఈ చమత్కార పద్యం చూడండి-
కవి ఏమంటున్నాడో-


చలి మమ్మీగతి బాధపెట్టెదవు నీ సామర్థ్యముల్ వట్టి బీ
దలపైగాక - ధగద్ధగాయిత మణిస్తంభోన్నతాంతఃపుర
స్థల సంవాసిత కామినీ దృఢ పరిష్వంగానుసంయుక్తి ని
శ్చలులౌ భోగుల మీద లేశమును నీ జంఝాటముల్ సాగు నే?


బాధలన్నీ పేదలకే
చక్కని గృహంలో - భార్యా పరిష్వంగం(కౌగిలి)లో
ఉన్న ధనికులను చలి ఏమీ చేయజాలదు
- అని చమత్కరిస్తున్నాడు కవి.

Saturday, June 10, 2017

జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలి


జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలి
సాహితీమిత్రులారా!


విదురనీతిలోని ఈ సూక్తి చూడండి-

దివసేనైవ తత్కుర్యాద్ యేన రాత్రౌ సుఖం వసేత్
అష్టమాసేన తత్కుర్యాద్ యేన వర్షాః సుఖం వసేత్
పూర్వం వయసి తత్కుర్యాద్ యేన వృద్ధః సుఖం వసేత్
యావజ్జీవనేన తత్ కుర్యాద్ యేన ప్రేత్య సుఖం వసేత్

రాత్రి సుఖంగా ఉండాలంటే పగలు దానికి తగినంత
శ్రమ చేయాలి ఆ పనివలన రాత్రి ఏ చింతాలేకుండా
నిద్రపట్టాలి. ఇదే విధంగా సంవత్సరంలో 8 నెలలు
ప్రయత్నం చేసి వర్షఋతువులో సుఖంగా ఉండాలి.
పరలోకంలో(జన్మలో) సుఖంగా ఉండటానికి తగిన
కర్మలను ఈ జన్మలో జీవితమంతా ప్రయత్నించి
సాధించాలి - అని భావం

మూడక్షరాలే మూర్చకలిగించాయే


మూడక్షరాలే మూర్చకలిగించాయే
సాహితీమిత్రులారా!


భాసుని నాటకాలలో అభిషేకనాటకం ఒకటి
దీనిలోని ఒక ఘట్టంలోని ఒక అంశం చూద్దాం-

హనుమంతుడు సీతాన్వేషణ చేస్తూ లంకలో
అంతా తిరిగాడు అశోకవనంలో ప్రవేశించాడు
అక్కడ రావణుడు సీతను  చూస్తూ రాముని
నిందాపూర్వకంగా మాట్లాడుతూ సీతపై
అనురాగపూర్వకంగా మాట్లాడాడు
ఆసందర్భంలో సీత నోటినుండి మహాప్రభావంతో
వెలువడిన మూడక్షరాలు - శప్తో2సి( ఛీ నింద్యుడా)
అనే మాటవినగానే రావణుని హృదయం
భయాక్రాంతమైపోతుంది అప్పుడు
అతడు ఇలా అనుకుంటాడు-

హ హ హ అహో పతివ్రతాయా స్తేజః
దేవాః సేన్ద్రయో భగ్నా దానవాశ్చ మయా రణే
సోహం మోహం గతోస్మృద్య సీతాయాస్త్రిభిరక్షరైః
                                                                         (అభిషేకనాటకం - 2.18)

ఆహా ఈ పతివ్రత తకేజస్సు ఏమి తేజస్సు
నేను రణరంగంలో ఇంద్రాది దేవతలను
దానవులను కూడ ఓడించాను అలాంటి నాక్కూడా
సీత ఉచ్ఛరించిన ఈ మూడు అక్షరాలు వినగానే
మూర్ఛవచ్చినట్లవుతూన్నది- అని భావం

సీతాదేవిలో ఉన్న ప్రభావవంతమైన ఆత్మశక్తిని
చిత్రించే ఈ చిన్న శ్లోకం భాసునికి కూడ నచ్చి
ఉంటుంది. సామాజిక ప్రజలకు కూడ.


Friday, June 9, 2017

నీతి శ్లోకం


నీతి శ్లోకం
సాహితీమిత్రులారా!
విశాఖదత్తుని మృచ్ఛకటికంలోని
సూక్తి చూడండి-


నిస్తేజాః పరిభూయతే పరిభవాన్నిర్వేద మాపద్యతే
నిర్విణ్ణ శ్శుచమేతి శోక పిహితః బుద్ధ్యాపరిత్యద్యతే
నిర్బద్ధిః క్షయమేతి

తేజములే్నివారు సంఘముచే అవమానింపబడుదురు
అవమానము వలన దుఃఖము కలుగును. దుఃఖముతో
దిగులు పడును. దిగులువలన బుద్ధి మందగిస్తుంది
బుద్ధిహీనుడు నశించును - అని భావం.

అని బారిన విధి నవ్వును


అని బారిన విధి నవ్వును
సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి-
ఎవరు ఎవరిని చూచి నవ్వుతారో చెబుతున్నది-

అనిబారిన విధి నవ్వును,
ధనసంపద నవ్వు నుచిత దానవిహీనున్
తనయుని ముద్దాడంగా
పెనిమిటిగని జారనవ్వు పిచ్చెయరేచా!

ఓ పిచ్చయరేచా!
యుద్ధంలోనుండి పారిపోతే విధి నవ్వుతుంది.
సముచితమైన వానికి దానం చేయనివాని చూచి
ధనసంపదలు నవ్వుతాయి. తనయుని, భర్త
ముద్దాడుతుంటే జారస్త్రీ, తనయునికి కారణము
తానేనని భ్రమించే భర్తను చూచి నిరసనగా
నవ్వుతుంది- అని భావం.

Thursday, June 8, 2017

ఇది సరైందేనా?


ఇది సరైందేనా?
సాహితీమిత్రులారా!
మనసు చాల చిత్రమైంది. దానికి బాధకలిగినా
సంతోషం కలిగినా ఇతరులతో చెప్పుకోవానిపిస్తుంది.
మరి కామార్తులైతే దేనితో చెప్పవచ్చునో కూడదో
అనేదాన్ని కూడ చూడరు. నలుడైతే హంసతో రాయబారం
నడిపాడు, దీని ప్రాణముంది. కానీ ప్రాణంలేని
మేఘంతో సందేశం పంపాడు కాళిదాసు మేఘసందేశంలో
యక్షుడు. మేఘసందేశంలోని ఈ  శ్లోకం చూడండి-

ధూమజ్యోతిః సలిల మరుతాం సన్నిపాతః క్వ మేఘః
సందేశార్థాః క్వ పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః
ఇత్యౌత్సుక్యాదపరిగణయన్గుహ్యక స్తం యయాచే
కామార్తా హి ప్రకృతి కృపాణాశ్చేతనా చేతనేషు

పొగ, నిప్పు, నీరు, గాలి - అనే వాటి కలయికతో
ఏర్పడిన మేఘమెక్కడ సమర్థములయిన ఇంద్రియములు
గల ప్రాణులచేత ప్రాణీయములైన సందేశార్థములెక్కడ
అని ఆలోచింపక ఔచిత్యం వల్ల యక్షుడు దానిని(మేఘాన్ని)
యాచించాడు. కామార్తులు చేతనాచేతనముల విషయమున
స్వాభావికముగానే దీనులుకదా - అని భావం
ప్రాణంలేని మేఘం ప్రాణసంబంధమైన ప్రేమ
ను గురించి ఎలావివరింపగలదు - ఇది సరైనదేనా
అని ప్రశ్న. దానికి శ్లోకంలోనే సమాధానం దొరికింది.
కామార్తులకు ప్రాణమున్నదా లేదా అనే దానితో పనిలేదట.

Wednesday, June 7, 2017

తెలుసుకుందాం


తెలుసుకుందాం
సాహితీమిత్రులారా!


ముఖపుస్తకంలో ఈ రోజు(7-6-17)న
అంబాళం పార్థసారథి గారు చేసిన
ఈ పోస్టు చదవండి కొన్నివిషయాలు
తెలుసుకోగలం-శ్లో|| అద్యాష్టమీతి నవమీతి చతుర్దశీతి, జ్యోతిష్కవా చోపవసంతి భక్త్యా
      శ్రుతేస్త్వహో తత్వమసీతి వాక్యం న విశ్వసన్త్యద్భుత మేత దేవ
                                                                                     --మహావాక్య దర్పణం.
"ఈరోజు అష్టమి, రేపు నవమి, ఆ తర్వాత ఎప్పుడో వచ్చేది చతుర్దశి", అనుకుంటూ లోకంలో జ్యోతిష్యుల వాక్కులను అందరూ భయంతోనో, భక్తితోనో స్వీకరించి అనుసరిస్తుంటారు. అయితే, అన్నింటికీ ప్రమాణమైన శ్రుతులు, 'తత్వమసి' అని దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తున్నా, ఒక్కడూ వినిపించుకోడు, విశ్వసించడు. ఇది అద్భుతాల్లో పరమాద్భుతమే అంటారు శంకరులు.
మామూలుగా మనం ఎదుర్కొనే అక్కరలేని, అనవసరపు వేదాంత భయాన్ని 'రజ్జు సర్ప భ్రాంతి' అంటారు. అంటే, చీకట్లో ఒక తాడు వంకరటింకరగా, హఠాత్తుగా కనిపించగానే పామేమోనని భయమేస్తుంటుంది. తీరా చూస్తే అది తాడే. వైరాగ్య భావన ఉంటే, ఇలాంటి వాటికి అవకాశమే లేదంటాడు భర్తృహరి. భయంగల వ్యక్తులు, వారి వారి పనులను సక్రమంగా నిర్వర్తించుకోలేరు. ఏదిఏమైనా, ఇలాంటి భ్రాంతి భయాల కంటే, మనల్ని మానవతా విలువలు కలిగిన వారిగా తీర్చిదిద్దే భయం చాలా అవసరం.
చాలా మంది అనవసరంగా చిన్న చిన్న వాటికి భయపడుతుంటారు. పాపమో, అన్యాయమో చేస్తే భయపడాలి గానీ, మంచిపనులు చేయడానికి భయమెందుకు? అయితే, ధర్మ భీతి, పాప భీతి, న్యాయ భీతి ఉండడంలో తప్పు లేదు. ధర్మభీతితో పాండవులు 13 యేళ్ళు కష్టాలను ఎదుర్కొన్నారు. ధర్మ విరుద్ధంగా ఏ పని చేసినా, పాప భీతి కలుగుతుంది. పురాణ కథలలో అస్త్రం లేనివాడిని, అలసిపోయిన వాడిని న్యాయభీతితో యుద్ధంలో చంపేవారు కాదు. ఇది మన ఆర్ష సనాతన సంస్కృతి.
భయమనేది అందరికీ సర్వసాధారణం.  'ఆహార నిద్రా భయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం' శ్లోకంలో, చెప్పిన నాలుగు అవస్థలు, మనుషులకు పశువులకు సమానంగా ఉంటాయి. అయితే, ఎక్కువ శాతం పశువులు కేవలం భయంతోనే జీవిస్తాయి. కారణం, వాటికి జ్ఙానం లేదు కనుక. జ్ఞానమున్న మానవుడు మాత్రం భయపడదగని అనేక విషయాలకు భయపడుతాడు.
జ్యోతిషంలో శని, రాహువులంటే భయం. ఆ రెండు గ్రహాలు కుజుడు, జాతక చక్రంలో అనుకూలం లేని రాశులలో ఉంటే భయం. అంతెందుకు? నెలలో రెండు సార్లు వచ్చే అష్టమి, నవమి, చతుర్దశులలో, ఏ మంచి పని చేయాలన్నా ఎక్కడి లేని భయం. ఎల్లప్పుడూ మనం కొలిచే శ్రీకృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు, శ్రీరాముడు నవమి నాడు జన్మించాడు, మనమంతా నవమి నాడే రామచంద్రుడి కల్యాణం చేస్తున్నాము. మనలో చాలా మంది, ఈ రెండు తిథులను మంచి పనులకు వర్జిస్తారు. అష్టమి, నవములను కేవలం ప్రయాణానికే నిషిద్ధమంటారు.
అలాగే, అద్వైత వేదాంతంలో నాలుగు మహావాక్యాలున్నాయి. అవి, 1. అయమాత్మా బ్రహ్మ, 2. ప్రజ్ఙానం బ్రహ్మ, 3. తత్వమసి, 4. అహం బ్రహ్మాస్మి. వీటి అర్థం, జీవుడు బ్రహ్మమూ వేరు కాదని రెండు కలసి ఒకే తత్వమని, జీవుడే బ్రహ్మమని బ్రహ్మం, జ్ఞాన స్వరూపమని, నువ్వే బ్రహ్మమని, నేను కేవలం బ్రహ్మమే ఇంకొకటి కాదని పై నాలుగు మహావాక్యాలకు అర్థం చెబుతారు. అందుకని, వీటిని శ్రవణం చేసి, వాటి అర్థాన్ని ఎప్పుడూ మననం చేసుకొని, సర్వాత్మ భావాన్ని మన అనుభవానికి తెచ్చుకోవడమే అన్ని సమస్యలకు పరిష్కారం. ఇదే మన జీవితానికి పరమార్థమని విశ్వసించాలి.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.

Thursday, June 1, 2017

ఈవూరికి ఆవూరెంతో ..........


ఈవూరికి ఆవూరెంతో ..........

సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-
ఎంత చిత్రంగా ఉందో

రామకృష్ణపరమహంస, రమణమహర్షి లాంటివాళ్ళు
మొదట ప్రపంచానికి అర్థంకాక పిచ్చివాళ్లనుకుంది.
కానీ వారు ప్రపంచాన్నీ అలాగే అనుకున్నారు.
అలాంటి విషయం వివరించే శ్లోకమే ఇది చూడండి-

జ్ఞాత తత్త్వస్య లోకోయం జడోన్మత పిశాచివత్
జ్ఞాత తత్త్వోపి లోకస్య జడోన్మత్త పిశాచివత్

మిథ్యా ప్రపంచాన్ని అర్థం చేసుకొన్న జ్ఞానికి
లోకం వెఱ్ఱివాళ్ళమయమని అనిపిస్తే
మరి మొదటినుండి తత్త్వజ్ఞానులున్ని
అందరినీ వెఱ్ఱివాళ్ళకిందే జమకట్టింది
ఈ మాయాలోకం- అని భావం

అంతే కదా మరి
మమ్మల్ని వెర్రివాళ్లంటే
మేమనమా

ఎలా ప్రవర్తిస్తే పండితుడు?


ఎలా ప్రవర్తిస్తే పండితుడు?


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
ఎలా ప్రవర్తించేవాడు
పండితుడో చెబుతుంది-


ప్రస్తావ సద్ృశం వాక్యం
స్వభావ సదృశీం క్రియామ్
ఆత్మశక్తి సమం కోపం
యో జానాతి నపండితః

సమయానికి తగిన మాటను,
ఇతరుల మనస్సునందలి
అభిప్రాయానికి సరిపోయే పనిని,
తన శక్తికి దీటైన కోపమును
ఎవడు ప్రవర్తిస్తాడో వాడే పండితుడు-
అని భావం.