Sunday, November 29, 2020

వటపత్రశాయి కథానిక

వటపత్రశాయి  కథానిక 



సాహితీమిత్రులారా!


సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్ 

                     నుండి

వటపత్రశాయి  కథానిక ఆస్వాదించండి- 



Friday, November 27, 2020

పెరంబుదూరు వారి చమత్కారం

 పెరంబుదూరు వారి చమత్కారం




సాహితీమిత్రులారా!



పెరంబుదూరు లక్ష్మీనరసింహాచార్యులుగారు

ఒకసారి తిరుమల వెళ్ళినపుడు అక్కడి పరిస్థితులు

నచ్చక భగవంతునితో మొరపెట్టుకున్నట్లు కొన్ని

పద్యాలు రాశారు. వాటిలోని ఒక పద్యం ఇది చూడండి


తిండిలేక గాదు, పరదేశము చూచుటకిచ్చగాదు, మా

యండలు బాసివచ్చి భవదంగణమందున పస్తుపండగా

గండమదేమి భక్తులను గాచెడి సాహసివండ్రుగాని నీ

తొండిదివాణమందు వడ దోశెల నమ్ము దురయ్యదుర్గతిన్


భక్తులు తిండిలేక గాని,

దేశాలు చూడాలని గాని నీ దగ్గరికి రారు,

వారి బలగాన్ని వసతులను వదలుకొని వచ్చి

నీ వాకిట్లో పస్తుపడుకోవలసి రావటం ఏమిగతి

నీవు భక్తులను కాపాడే వాడవంటారే,

కాని నీ అక్రమాల కార్యాలయంలో వడలు,

దోసెలు వంటి ప్రసాదాలను అమ్ముతారా

అది ఏమి దుర్దశ భక్తులకు నీ ప్రసాదం కూడ

ఉచితంగా అందించలేవా - అని ఆవేదనతో

కవి అన్నాడని భావం


అది శ్రీవారు విన్నారేమో

ఇప్పుడు నిత్యాన్నదాన సత్రం ఏర్పడింది.


Tuesday, November 24, 2020

మద్దుపల్లి సుబ్రహ్మణ్యంగారి చమత్కారం

 మద్దుపల్లి సుబ్రహ్మణ్యంగారి చమత్కారం





సాహితీమిత్రులారా!



మద్దుపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు

1959-60 సంవత్సరమునందు కర్నూలు

సెంట్ జోసెఫ్స్ గరల్స్ హైస్కూలులో

ప్రధానాంధ్ర పండితుడుగా పనిచేయు సమయంలో

అక్కడి ఉపాధ్యాయులుగా ఉన్న సిస్టర్స్ అక్కడి క్రమశిక్షణ

గురించి చెబుతూ ఇక్కడ ఆకుకూడ కదలదని చెప్పిరట.

దానికిగాను ఆయన చమత్కరించిన ఈ శ్లోకం చూడండి-

పత్రం వాపి ప్రచలతి న వై బాలికా పాఠశాలా
స్వేవం శిక్షాక్రమ ఇతిపదే దేవమే వాస్తుఃకింతు
మద్భావోయంన చలతి మరుత్త్వత్రభిత్యేతి యస్మా
ద్వేణి బంధైర్విషధరనిభైరత్ర కాంతాశ్చరన్తి


క్కడ ఆకులు కదలక పోవటానికి
కారణం ఇక్కడి క్రమశిక్షణకాదు

మద్భావోయం - నా అభిప్రాయమేమనగా
నచలతి మరుత్త్వత్ర భీత్యేతి-
ఇక్కడ గాలి సంచరించటంలేదు
కాన ఆకులు కదలటంలేదు
గాలి సంచరించలేదనగా
భీత్యా - భయంచేత,
గాలి ఎందుకు భయపడవలసిన పని
ఏమంటే విషధర నిభై - పాముల వంటి
వేణిబంధైః - జడలతో
అత్ర కాన్తాశ్చరన్తి- ఇక్కడ యువతులు పెక్కు
మంది తిరుగుతున్నారు కనుక
పాములు వాతాశనములు(గాలిని భుజించేవి)గనుక
తన్నెక్కడ మ్రింగిపోతాయో అని భయపడి గాలి
ఈ ప్రక్కకు రాకుండా పోయింది.
అందుచే ఆకు కదలాడకున్నది.

Sunday, November 22, 2020

జాలి (టెలిఫిల్మ్)

 జాలి (టెలిఫిల్మ్)






సాహితీమిత్రులారా!


శ్రీశ్రీ గారి కథ జాలి

దూరదర్శన్ లో ప్రసారమైన

టెలిఫిల్మ్ - జాలి

వీక్షించండి-



Friday, November 20, 2020

భావచమత్కారం

భావచమత్కారం



సాహితీమిత్రులారా!



చమత్కారాలలో భావ చమత్కారమొకటి

చెప్పదలచుకొన్న భావాన్ని సూటిగా

చెప్పకుండా చిత్రమైన మలుపు త్రిప్పి

చమత్కారంగా చెప్పటాన్ని

భావచమత్కారం

అంటారు.


ఇద్దరు ప్రేమికులు గోదావరీతీరంలో

ప్రతిదినం ఒక పూలతోటలో ప్రొద్దున్నే

కలుసుకొంటున్నారు. అదే సమయానికి

ఒక బైరాగి పూలకోసం అక్కడికి వచ్చేవాడు.

ఆ సన్యాసివేషం చూచి కుక్క ఒకటి

మొరుగుతూ అతని మీదికి వచ్చేది.

కుక్క మీదికి రావటం అతనికి ఇబ్బంది.

అతడు అక్కడికి రావడం ఈ ప్రేమికులకు

ఇబ్బంది. ప్రేమికులైన యువతీయువకు

లిద్దరు ఆ సన్యాసిని అక్కడకు రాకుండా

చెయ్యాలనుకున్నారు. అట్లని,

బైరాగీ నీవు రావద్దని

అతనితో ఎలా చెప్పగలరు

యువతి ఆలోచించించింది-

అతణ్ణి రాకుండా చెయ్యటానికి --


ఇచ్చకొలఁదిఁ దిరుగు మింక బైరాగి గో

దావరీతటమున దట్డమైన

పొదలఁ జేరి యొక్క పొగరైన సింగ మా

కుక్కపోతు నిపుడె కూల్చి చంపె

                                                 (గాథా సప్తశతి)

అని చెప్పింది.


ఆ బైరాగి ఇక స్వేచ్ఛగా రావచ్చట

అతణ్ణి ఇబ్బంది పెడుతున్న కుక్కను

అక్కడే దట్టమైన పొదల్లో ఉన్న పొగరైన

సింహం ఇప్పుడే కూల్చి చంపిందట

కుక్కతోనే ఇబ్బంది పడుతున్న సన్యాసి

ఇక వస్తాడా రానే రాడు. కాని, ఆమె

ఆ సన్యాసిని రావద్దని చెప్పిందా

చెప్పలేదే. అట్లని రావద్దని చెప్పలేదా

చెప్పింది. చెప్పకుండా చెప్పింది.

ఆ సన్యాసి మనస్సు నొచ్చుకోకుండా

చెప్పింది. దీన్నే భావ చమత్కారం అంటారు.

 

Wednesday, November 18, 2020

ఆమె ఎంత గయ్యాళో!

 ఆమె ఎంత గయ్యాళో!



సాహితీమిత్రులారా!

విశ్వనాథ సత్యనారాయణగారు

తన విశ్వనాథ పంచశతిలో

కూర్చిన పద్యం చూడండి -

ఇందులోని చమత్కారమేమో

గమనించండి-

ఊరిభార్య లెల్ల రూహించి యామె మం

చంబుతో నిడిరి శ్మశానమందు

నట పిశాచకాంత లాలోచనము చేసి

పడతి మరల నూరి నడుమ నిడిరి

                                                      (విశ్వనాథ పంచశతి)

ఇందులో ఒక మహాతల్లి ఎంత గయ్యాళో

కవి చెప్పదలుచుకొన్నాడు కానీ ఆమె గయ్యాళి

అని ఒక్కమాటైనా అనకుండానే ఎలా చెప్పాడో

చూడండి-

ఊళ్ళో ఉన్న భార్యలంతా సమావేశం జరిపి

ఈ గయ్యాళిని విదిలించేందుకు ఇదే సరైన మార్గమని

రాత్రివేళ ఆమెను మంచంతో కూడ మోసుకొని పోయి

శ్మశానంలో ఉంచి వచ్చారు. ఆ శ్మశానంలోని పిశాచకాంతలు

తెల్లవారే సరికి ఆమెను పీక్కుతింటాని ఊరివారంతా సంతోషించారు.

పాపం వాళ్ళకోరిక నెరవేరలేదు. శ్మశానంలోని పిశాచకాంతలంతా

ఆలోచించి తెల్లవారేలోగా ఆమెను మంచంతో సహా మోసుకొని వచ్చి

ఊళ్ళో దించి వెళ్ళారట.


దీన్ని బట్టి ఆమె ఎంత గయ్యాళో

చెప్పక్కరలేదుకదా!

ఎంత చమత్కరించారో కదా!

Monday, November 16, 2020

కోమలితో పవళించునట్టి నాసరసుని జేరవే

 కోమలితో పవళించునట్టి నాసరసుని జేరవే




సాహితీమిత్రులారా!


పానకాలరాయకవి

తన మనసుకు ప్రబోధిస్తూ

విష్ణువును తలవమని చెబుతూ చెప్పిన పద్యం ఇది

తన మానస శతకంలో శ్రీమహావిష్ణువు దినచర్యను 

ఎంత చక్కగా నేటి మన ముఖ్యమంత్రుల, ప్రధానమంత్రుల

దినచర్యతో సరిపోల్చే విధంగా వివరించాడో గమనించగలరు-

తిరుమలలో ప్రభాత విధి తీరిచి, నీలగిరిన్ భుజించి, కే
సరగిరి చందనం బలది చల్లని దాహము మంగళాద్రిలో
గురు రుచి ద్రావి రంగపురి కోమలితో పవళించునట్టి నా
సరసుని జేర నీవు మనసా! హరిపాదము లాశ్రయింపుమా!

తిరుమలలో భక్తులు "శ్రీ వేంకటాచలపతే! తవ సుప్రభాతం" అని
నిద్ర లేపితే లేచి ప్రభాత విధులు తీర్చి,
నీలాచలంలో నైవేద్యం స్వీకరించి,
సింహాచలంలో గంధం పూసుకొని,
మంగళగిరిలో పానకం తాగి దాహం తీర్చుకొని,
శ్రీరంగంలో దేవేరితో రంగశాయి అయి పవళించే సరసుడైన
ఆ శ్రీమహావిష్ణువు పాదాలను ఆశ్రయించే మనసా!


Saturday, November 14, 2020

మురారి చమత్కారం

 మురారి చమత్కారం




సాహితీమిత్రులారా!

అనర్ఘరాఘవ నాటకాన్ని రచించిన మురారి గొప్పదనాన్ని

వివరించే పద్యం ఇది చూడండి-


దేవీం వాచ ముపాసతేహి బహవ స్సారంతు సారస్వతం
జానీతే నితరామసౌ గురుకులక్లిష్టో మురారిః కవిః
అబ్దిర్లంఘిత ఏవ వానరభటైః కింత్వస్యగంభీరతా
మాపాతాళనిమగ్న పీవరతను ర్జానాతి మంథాచలః


ఎందఱో కవులు కవితా సరస్వతిని ఉపాసించువారున్నారు
కానిీ అత్యంతమైన గురుకులక్లేశమును అనుభవించి విద్యలు
సాధించిన ఒక్క మురారికవి మాత్రమే సారస్వతసారమును
చాలా బాగా పూర్తిగా తెలిసివున్నాడు. వానర గణాలకు
సముద్రమును పైపైనదాటి పోవడం మాత్రమే తెలుసు.
పాతాళం వరకు మునిగిన మందరగిరి మాత్రమే సముద్రంయొక్క
గాంభీర్యాన్ని లోతును తెలిసినది. అనగా చపలచిత్తులైన
వానరులవలె కవితా చాపల్యముగల యితరకవులు తమ భావాలకు
అనుగుణమైన నైఘంటికార్థాలు గల పదాలను వాడి పద్యరచన పూర్తి
చేసికొని ఆనందిస్తారేకాని, పద పదై కదేశ ప్రకృతిప్రత్యయాదుల
అర్థవిశేషాలను సమర్థతతో తెలుసుకొని సుష్ఠుప్రయోగాలను చేయలేరని
- శ్లోకభావం.

దీన్ని బట్టి కేవలం కవిత్వం నిఘంటువుల్లోని పదాలను వాడటమేకాదు
కవి అనేవాడు ఆ పదాలకు సంబంధించిన లోతైన విషయాలనుకూడా
తెలిసి వుండాలని శ్లోకాంతరార్థం. మరియు ఇది కేవలం మురారి కవికేకాదు
అందరు కవులకు సంబంధించినది.

దీపావళి శుభాకాంక్షలు

 దీపావళి శుభాకాంక్షలు





సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు

దీపావళి శుభాకాంక్షలు

Wednesday, November 11, 2020

కొత్తకోణం (హాస్యకథానిక)

 కొత్తకోణం (హాస్యకథానిక)




సాహితీమిత్రులారా!


పొత్తూరి విజయలక్ష్మిగారి హాస్యకథానిక

వసంతవల్లరి నుండి

ఆస్వాదించండి-



Monday, November 9, 2020

నా ఇల్లు(కథ)

నా ఇల్లు(కథ)




సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్ 

                     నుండి

నా ఇల్లు  కథ ఆస్వాదించండి- 



Saturday, November 7, 2020

పారిపోయిన లెక్కల మాస్టారు

 పారిపోయిన లెక్కల మాస్టారు




సాహితీమిత్రులారా!

భమిడిపాటి రామగోపాలం కథలు

దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి

వాటిలోని ఒక కథ

పారిపోయిన లెక్కల మాస్టారు

ఇక్కడ వీక్షించండి- 



Thursday, November 5, 2020

కొత్తరూపాయి (కథ)

 కొత్తరూపాయి (కథ)





సాహితీమిత్రులారా!

న్యాయపతి రాఘవరావు గారి కథ

దూరదర్శన్ లో ప్రసారమైంది.

కొత్తరూపాయి కథ

ఇక్కడ ఆస్వాదించండి-



Tuesday, November 3, 2020

చాలు(కథ)

 చాలు(కథ)




సాహితీమిత్రులారా!


సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్ 

                     నుండి

చాలు కథ ఆస్వాదించండి-



Sunday, November 1, 2020

డు ము వు లు(కథ)

 డు ము వు లు(కథ)




సాహితీమిత్రులారా!


కొప్పర్తి సాహితీ వాహిని నుండి

మల్లాది రామకృష్ణశాస్త్రి గారి

డు ము వు లు - కథ

కొప్పర్తి రాంబాబుగారి గళంలో 

ఆస్వాదించండి-