Monday, December 30, 2019

కథాకావ్యం శుకసప్తతి


కథాకావ్యం శుకసప్తతి
సాహితీమిత్రులారా!

సంస్కృతంలోని కథాకావ్యం శుకసప్తతి గద్యంరూపంలో వ్రాయడం జరిగింది.
ఇప్పుటికి ఈ కావ్యం కూర్చినదెవరో తెలియడంలేదు.
దీనిలో 70 కథలున్నాయి. ఒక ధనికుడు దూరప్రయాణం వెళ్ళగా
ఆయన పెంచుకునే శుకము(చిలుక) తప్పుదారిలో వెళ్ళే యజమాని భార్యకు 
ప్రతిరోజూ మొదటిఝాములో మొదలు పెట్టి తెల్లవారు వరకు
కథలు చెప్పేది. ఆ కథలు 70. వీటిలో ఎక్కువభాగం శృంగారం వుండటం చేత
మనోరంజకంగా ఆసక్తిదాయకంగా ఉండటంవల్ల ఇవి ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. భారతీయభాషల్లోనేకాక పర్షియన్ మొదలైన విదేశీభాషల్లోకి అనువదించబడ్డాయి. సంస్కృతంలో శుకసప్తతికి రెండు ప్రతులు దొరకుతున్నాయి.
వాటిలో ఒకటి చింతామణి భట్టు, రెండవది ఒక శ్వేతంబర జైనసాధువు రచించారు.
14వ శతాబ్దంలో ఈ కథలను తుతినామా అనే పేరుతో పర్షియన్ భాషలోకి
అనువదించారు. మలయన్, మంగోలియన్, టర్కిష్, ఇంగ్లీష్,
జర్మన్, ఇటాలియన్ మొదలైత అనేక భాషల్లోకి అనువదింపబడింది.

మన తెలుగులో సయితం పాలవేకరి కదిరీపతి నాయుడు కూర్చినట్లు
చెప్పబడుతున్నది. ఈయన కదిరి ప్రాంతాన్ని పాలించినట్లుగా చెప్పబడుతున్నది.
కానీ కదిరి వీరేశలింగంగారు నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు చెప్పాడు కాని అది ఒకప్పుడు కడపజిల్లాలోను ఇప్పుడు అనంతపురం జిల్లాలో కనబడుతున్నది.
ఈయన సంస్కృతాంధ్రల్లో సమానమైన ప్రజ్ఞకలవాడు. ఇతని కవిత్వం
సమయోచితములైన వర్ణనలతో రొత్తరుచుల్ని పుట్టిస్తూ ప్రౌఢమై
హృదయంగమమంగా రచించారు.

మొత్తానికి శుకసప్తతి కథలు పూర్వకాలంలోనే కాదు
నేటికీ ఆసక్తిని కలిగించే కథలే కావున
సాహితీమిత్రులు దొరికిలే వదలక చదవగలరు.

Thursday, December 26, 2019

ఎంచక్కని కల


ఎంచక్కని కల
సాహితీమిత్రులారా!

ఆరుద్ర గారి గాయాలు గేయాలు నుండి
ఈ గేయం చూడండి -

మీటనొక్కి చంద్రుణ్ణి వెలిగించు
మీటనొక్కి చిరుగాలి విసరించు
ప్రియురాలి పెదవిమీద పెదవిమూసి
సన్నని సంగీతంలాంటి నడుంచుట్టూ చెయ్యివేసి
ఆనందించు అబ్బాయీ ఆనందించు
అందించు అమ్మాయీ పెదవి అందించు
సద్దుచెయ్యకుండా పడుక్కొంది సముద్రం 
ముద్దు పెట్టుకుంది చంద్రుణ్ణి మేఘం
మీ యిద్దరి కోసమే ఆగిపోయింది రాత్రి
మీ కోసమే వెలుగుతూంది అగరువత్తి
కావలించుకొండి కావలసినంత ఏకాంతం
కలకల నవ్వండి మీ చుట్టూ ప్రశాంతం

          నిన్న సాధ్యంకాని తీరుబాటు
          నిన్న అందనటువంటి  ఆనందం
          ఇవాళ ఒడ్డులొరసి పారుతూంది
          చేతినిండా దొరుకుతూంది

నిన్న మన తండ్రులు నిస్సహాయులు
వాళ్ళ తండ్రులు  అంతకన్నా అసహాయులు
వాళ్ల చుట్టూతా మైళ్లకొద్దీ బీళ్లు
ఎప్పుడో యింకిపోయాయి వాళ్ల కన్నీళ్ళు
నిన్న చెరువులూ చెట్లూ ఎండిపోయాయి
బావులూ బతుకులూ యింకిపోయాయి
పశువులూ శిశువులూ చచ్చిపోయాక
కడుపు దహిస్తే ఆడువాళ్ళు పడుకొన్నాక
కడుపున పుట్టిన వాళ్ళని అమ్ముకున్నాక
మన తాతలూ తండ్రులూ విలపించారు
తమ దరిద్రం కారణం గుర్తించారు

           తెరచిన కన్నులు మూయక ముందే 
           దీనులు పేదలు లేచేవారు
           తీరుబాటుగా నిదురించే 
           తొలికోడిని తామే లేపేవారు

అరక కట్టుకు దున్నబోతే అంతా మెరక
అందులో మొలిచేదికాదు కనీసం గరిక
బక్కచిక్కిన ముసలి ఎద్దులకు, పాపం,
దుక్కి దున్నకముందే వచ్చేది ఆయాసం
ఒళ్ళు హూనం చేసుకొని పండించిన పంట
కళ్లలో వత్తులేసుకొని కాపు కాచిన పంట
సగం వడ్డీకింద తతమ్మాది శిస్తుకింద
రోజంతా పనిచేస్తే అరగంట విశ్రాంతి
తన బతుకులాగే మాసికలు సైతం చిరిగి
అమావాశ్య ఆకాశంలా ఆరవేసేది చీర
గుడిసెలోంచి బయటికి వచ్చేదికాదు చెల్లి
పొయ్యిలోంచి లేచేదికాదు ముడుచుకున్న పిల్లి
అప్పుడు అందరం కలిసి ఆలోచించాం
ఎగుడు దిగుళ్ళను చదునుచేసే
యంత్రాన్ని తీసుకు వచ్చాం
అప్పుడు అందరం కలిసి సంతోషించాం
బండలూ బాధలూ పగిలిపోయాయి
చింతలూ వంతలూ చితికిపోయాయి
తాళ్ళూ రాళ్ళూ నలిగిపోయాయి
కంచెలూ కరువులూ కరిగిపోయాయి
కలకల నవ్వుతూ యంత్రాలు తోలుతూ
కనుచూపు మేర చదునుచేశాం
మళ్ళు కట్టి పొలం పదునుచేశాం
అరగంట పనిచేస్తే రోజంతా విశ్రాంతి
వానలు కురిశాయి పంటలు విరిశాయి
చెరువులు నిండాయి చేలు పండాయి
గనులు దొరికాయి పనులు దొరికాయి
ఫ్యాక్టరీలు వెలిశాయి పట్నాలు నవ్వేయి
ఇవాళ విశాఖపట్నం సందిట్లో గోదావరి పరిహాసం
ఇవాళ అనంతపురం పందిట్లో కృష్ణవేణి దరహాసం
శోభనం పెళ్ళికూతురిలా పండింది ధాత్రి
పచ్చపైరు తలవంచి సిగ్గుపడుతూంది
పుష్కలంగా పంటలు ఆశలూ పండే 
పుష్యమాసమంతా మనకి పండగే
కోతలు కోశాక కుప్పలు వేశాక 
చేతినిండా మనకీక తీరుబాటే 
తాతానగరంలో చెంజీకటిలాగ
ఆంధ్రదేశ మంతటా ఎర్రనిరాత్రి
ఆరుబయట చలిమంటలు వేసుకుని
ఆడా మగా సాయలా సాయలా ఆడుతూ పాడుతూ
అప్పుడే గానుగాడిన చెరుకు పానకం తాగుతూ
మూడోఝాము దాటాక అలసిపోయాం

          జామిచెట్టుమీద జాతి రామ చిలుక
          చింతచెట్టుమీద చిన్ని గోర్వంక
          జోడీలుగా వాళ్ళకి వలపులు
          బేడీలుగా చెట్టాపట్టాలు

అందించండి అబ్బాయిలూ ఆనందించండి
ఆనందించండి అమ్మాయిలూ పెదవులందించండి
ఒంటరిగా ఎవ్వరూ వుండకూడదు
జంట మాత్రం విడువనేకూడదు
పంటకాలువల్లో పడవషికార్లు చేయండి
పరవశత్వంలో కన్నులు మూయండి
పోయింది పాడు కలలాంటి నిన్నటి రూపు
పోబోదు తియ్యనికల మనకి నేడే రేపు
చీకూ చింతాలేని ఏదేశంలోనైనా
కౌగిలో కనుమూసిన ప్రియురాలి పెదవి
కలకాలం కోరదగ్గ దేవేంద్రపదవి

Monday, December 23, 2019

తల్లి! నీసాటి దాతలీ ధరణి గలరె


తల్లి!  నీసాటి దాతలీ ధరణి గలరె
సాహితీమిత్రులారా!

మనం అన్నదానంలో డొక్కాసీతమ్మ తరువాతే మిగిలినవారిని గురించి చెప్పుకోవాలి ఈమె బ్రాహ్మణకులంలో, వ్యవసాయ వృత్తి ఆధారంగా జీవించే కుటుంబంలో 1841లో జన్మించారు. ఈమె భర్త డొక్కా వెంకట జోగన్నగారు. ఈయన దయాహృదయుడు, అన్నదాత. వీరి సహకారంతోనే  సీతమ్మ మహాదాతకాగలిగారు. ఈమె 68 సంవత్సరాలు
జీవించి అన్నార్తులకు ఆశాదీపంగా వెలుగొందారు. ఈమె 1909 ఏప్రిల్ 28న స్వర్గస్థులయ్యారు. ఈమన గురించి ఒక అజ్ఞాతకవి ఈ పద్యంతో ఆమెను కీర్తించారు. ఆపద్యం -

నిరతాన్న దానంబు, నిర్మలమగుమది, 
                             చేతి కడ్డిను లేక చేసినావు 
నీ నామధేయంబు, నీ గ్రామ నామంబు 
                            నిండియుండెనుగ భూమండలమున
యిదిగాక, నీనామ మింగ్లాండు వరకేగి
                            రారాజసభలోన రాణకెక్కె
నీ తల్లిదండ్రులు, నిరుపమ గుణశాలు 
                             రవుటచే, నీకింత ఖ్యాతిగల్గె
గన్నవరంబునఁ గీర్తిగాంచినావు 
తల్లి! నీసాటిదాతలీ ధరణి గలరె
యన్న దానంబు నీ వెన్క సన్నగిల్లె 
నతుల డొక్కా న్వయమణి సీతమ్మ తల్లి

ఈ పద్యం వల్ల సీతమ్మ దాతృత్వం, కీర్తి ప్రతిష్ఠలు
తేటతెల్లమవుతున్నాయి కాని ఆ కవి పేరు మనకు లభించలేదు.
ఇలాంటి వారు చరిత్రలో మిగులుతున్నారేకాని ఒక్కరైనా నేటి కాలంలో
కనిపించడంలేదుకదా

Thursday, December 19, 2019

పాడు ప్రాణము పోదేమి వదలి బొంది


పాడు ప్రాణము పోదేమి వదలి బొంది
సాహితీమిత్రులారా!

అనేక మంది కవులు గౌతమ బుద్ధుని చరిత్రను తమ కావ్యాలుగా వ్రాయడం జరిగింది. వారిలో పేరెన్నిక గన్నవాడు అశ్వఘోషుడు ఈయన బుద్ధచరిత్ర వ్రాశాడు. మన తెలుగులోమన తిరుపతి వేంకట కవులు   వ్రాశారు.  ఆధునిక కాలంలో అద్దంకి కేశవరావుగారు ''తథాగతీయం'' పేరుతో వ్రాశారు. అందులోని ఈ సన్నివేశ చిత్రీకరణ చూద్దాం.

సిద్ధార్థుడు మహాభినిష్క్రమణం రోజునాటి రాత్రి అర్థరాత్రి పడకగది దాటి బయటికి రాగానే కునికిపాట్లు పడుతున్న తన రథసారథి ఛన్నుడిని లేపి తన గుర్రాన్ని సిద్ధం చేయమన్నాడు. తన గుర్రాన్ని ఛన్నుడు సిద్ధం చేయగానే గుర్రాన్నెక్కి బయలుదేరాడు ఛన్నడు తన గుర్రాన్నిక్కి సిద్ధార్థుని అనుసరించాడు. ఆ సమయంలో ఎక్కడి వెళుతున్నాడో ఏమోనని ఏమీ మాట్లాడకుండా వెళ్ళగా వెళ్ళగా ఒక అడవిలోని ప్రవేశించాడు సిద్ధార్థుడు. ప్రయాణం చేయగా తెల్లవారేసరికి అరోమా నదీతీరానికి చేరుకున్నారు. అక్కడి చేరాక చెప్పాడు సిద్ధార్థుడు అసలు విషయం. తాను ఈ ప్రాపంచిక బంధాల్లో ఇమడలేనని తను ఇల్లు విడిచి పోతున్నానని రాజోచిత వస్త్రాలను, ఆభరణాలను తీసి ఛన్నుని చేతిలో పెడుతూ తన తల్లిదండ్రులకు భార్యకు చెప్పి ఓదార్చమని పురమాయించాడు. దానితో ఛన్నునికి నోట మాటరాలేదు. సరికదా
ఒళ్లంతా చెమటలు పట్టాయి.
ఈ సందర్భంలో అద్దంకి కేశవరావుగారు కరుణరసప్లావితంగా చిత్రించారు.

చితికిపోయెడు చిత్తమున్ చేతబట్టి
గాద్గదిక గళరవళితో, కనుల తీరు
వెల్లువైపార, ఛన్నుండు బేల పడచు
ననియె నీరీతి గౌతవగ నరసి యరసి (1272వ పద్యం)

ఛన్న! నా సుతు డెందు చనెనొ జెప్పు మటన్న
         మారాజు కేమని మనవి సేతు
అయ్య! నాకొడుకేడి యని నన్ను బ్రశ్నించి
         మారాణి కేమని మారుసెపుదు
అన్న! నా పతి యేడ నని దీనతను వేడు
         యువరాణి నేమని యూరడింతు
ఓరి! మా యువరాజు యున్కి జెప్పు మటన్న
         పౌరుల కేమని పలుకువాడ
సచివు లాదిగ సేవక చయము వరకు
నిలువ దీసిన నేమిగతి పలుక గలను!
ఇన్నిటికి మించి నిను వీడి యెట్టు లేను
బొందిలో ప్రాణాల నిల్పి యుందు నయ్య! (1276వ పద్యం)

ఛన్నున్ని విన్నపాలు సిద్ధర్థుని బుద్ధినేమీ మార్చలేక పోయాయి.
పైగా మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్లమని కఠినంగా ఆదేశించాడు.
అపుడు ఛన్నుడు అన్నమాటలు -

కంటికి రెప్పవోలె నినుగాంచిన భృత్యుడ, న్ను నీ గతిన్
గెంటి యనంత విశ్వమున యొంటరి వాడవౌచు పో
నుంటివి, నీదు నీడవలె నుండెడు నన్నిటు లేచ పాడియా
తొంటి కృపారసం బిపుడు దోపని రీతి చరింతు వేలనో!
                                                                                                                  (129వ పద్యం)

ఇట్టి ఘోరంబు జూచుచు నెట్టు సైతు!
పిడుగు నా నెత్తి పడదేమి! వ్రీల దేమి
గుండె! కను లాబలై పోవ కున్నవేమి!
పాడు ప్రాణమగ పోదేమి వదలి బొంది!(1296వ పద్యం)

అంటూ వలవల ఏడ్చాడు. బ్రతిమిలాడుకున్నాడు- ప్రాధేయపడ్డాడు. గౌతముని మనసు కరగలేదు. ప్రయత్నమంతా విఫలమైంది. యజమాని ఆజ్ఞను పాటించాకదా భృత్యుడు తాను ఈవిషయాన్ని అంతఃపుంలో చెప్పాలి ఇక చేసేదిలేక - భారహృదయంతో వెనక్కి మళ్ళాడు.

చూశారుకదా!  ఈ పద్యాలు ఎంత కరుణరసప్లావితంగా ఉన్నాయో
-----------------------------------------------
వాఙ్మయి పత్రికలోని 
దేవవరపు నీలకంఠరావుగారి వ్యాసం నుండి 
కొంత భాగం ఆధారం

Monday, December 16, 2019

మొట్టమొదటి సారాకాపు


మొట్టమొదటి సారాకాపు

సాహితీమిత్రులారా!

మొహం వేళ్ళాడేసుకుని చిన్నభూతం నరకం లోకి వచ్చి పడింది. ఉట్టి చేతుల్తో లోపలకొచ్చిన చిన్నభూతాన్ని చూసి అందరూ నొసలు చిట్లించేరు. ఎన్ని సార్లు అవకాశం ఇచ్చినా ఈ భూతం పాఠం నేర్చుకున్నట్టులేదు. ఎంత చెప్పినా నరకానికి తీసుకొచ్చే వాళ్ళలో వర్తకులో, మామూలు జనమో, మిగతా దొంగలో, దొరలే కానీ ఒక్కడు కూడా ఒళ్ళు వంచి కష్టపడే వ్యవసాయం చేసుకునే వాడు లేడు. ఇదెలా కుదురుతుంది? ఇలా అయితే నరకంలో సమతూకం ఉండొద్దూ? అందుకే ఆ పని చిన్నభూతానికి అప్పగించేరు. ఈ చిన్న భూతానికి పని నేర్చుకుందామనే పట్టుదలా, శక్తీ లేవా? పనికిరాని భూతాలు నరకంలో దేనికీ? రెండు దెబ్బలు తగిల్తే ఒళ్ళు దగ్గిర పెట్టుకుని పని చేయొచ్చు.

“ఈ సారి కూడా అంతేనా?” చిన్నభూతాన్ని అడిగింది పై అధికారైన ముసలి పిశాచం.

“ఎంత కష్టపడినా…” నీళ్ళు నానుస్తున్న చిన్న భూతం కేసి ఉరిమి చూసింది ముసలి పిశాచం.

“నోట్లోంచి మాట రాదేం? ఎంతమందిని తీసుకొచ్చేవు ఈ రోజున?”

“ఎవరినీ తీసుకురాలేదు.”

“ఓరి చేతకాని వెధవా? ఇక్కడున్న వాళ్ళని చూడు. వీళ్లందరూ నీతో పాటు మొదలు పెట్టిన వాళ్ళే ఈయన రెండువేలమంది వకీళ్ళనీ, అటుపక్కనున్నాయన ఆరువేలమంది వర్తకులనీ, ఆ చివర్లో ఉన్నాయన పదివేలకి పైబడి జనాల్ని తీసుకొచ్చేరు. నువ్వేమో చేతులుపుకుంటూ వచ్చావా? నీకు పని చెప్పిన ఈ రెండేళ్ళలో నువ్వు నేర్చుకున్నదేం లేదన్నమాట. సిగ్గూ, శరం లేదూ?” ముసలి పిశాచం అరిచింది.

“రెండువేలమంది వకీళ్ళే? వకీళ్ళని తీసుకురావడం సులువా?” చిన్న భూతం నోరెళ్ళబెట్టింది.

“సులువా అంటే సులువే. మొదట్లో ఈ వకీళ్ళు న్యాయమూర్తులతో కలిసి జనాల్ని మోసం చేసేవారు. ఇప్పుడేమో ఈ వకీళ్ళు జనాలతో కలిసి వాళ్ళనే మోసం చేస్తున్నారు. ఇదెంతవరకూ వచ్చిందంటే కారణం ఏమీ లేకుండానే వ్యాజ్యాలు బయటకొస్తున్నాయ్. అంటే వాళ్ళకు వాళ్ళే నరకంలోకి రావడానికి తహతహ లాడిపోతున్నారు. నేనక్కడ నుంచుని చేసేది, రండి రండి అని స్వాగతం పలకడమే,” కన్ను కొడుతూ చెప్పింది వకీళ్ళ భూతం చిరునవ్వుతో.

చిన్న భూతం నాయకుడి కేసి తిరిగి అంది క్షమాపణలతో, “నా తప్పేం లేదండి ప్రభో. ఎంత కష్టపడి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా ఈ రైతులెవరికీ కోపం రాదు. ఎంత ఏడిపించినా కోపం తెచ్చుకోకపోతే నేనేం చేయనూ?”

“నువ్వు ఇప్పటిదాకా ఏం చేశావో చెప్పి అఘోరించు ముందు!”

“ఓ రైతు పొలం దున్నుతుంటే వాళ్ళావిడ మధ్యాహ్నం భోజనం పంపించింది. అది వాడికి కనపడకుండా ఎత్తుకొచ్చాను. ఏదో దొరికినది తిని కడుపు నింపుకుందాం అనుకుంటూంటే ఏమీ దొరక్కుండా చేశాను. ఆఖరికి వాడు తాగే నీళ్ళలో మట్టి కలిపేశాను. అయినా వాడు అవే తాగుతూంటే మధ్యలో గిన్నె కింద ఒలికిపోయేలా చేశాను. దేనికీ కోపం తెచ్చుకోలేదు.”

“మరి ఏమంటాడు?”

“నా భోజనం పోతే పోనీయ్. దొంగతనం చేసినాయినకి నాకంటే ఎక్కువ ఆకలేస్తోందేమో. భగవంతుడు నాకు మరేదో పంపించడా, అని ఖాళీ కడుపుతో కళ్ళు మూసుకు పడుకున్నాడు.”

“మళ్ళీ భగవంతుడి పేరెత్తావూ? నువ్వు చేసేదేమీ లేదు కానీ ఆయన పేరెత్తి నా దుంప తెంపేలా ఉన్నావు.”

“రైతు అన్నదే నేను చెప్పాను, నన్నేం చేయమంటారు? పోనీ నన్ను వేరే చోటకి మార్చి చూడొచ్చు కద?” బతిమాలుతున్నట్టూ అంది చిన్న భూతం.

“కుదరదు,” కరుగ్గా వచ్చింది సమాధానం, “నువ్వు ఈ రైతుల పని పట్టేదాకా అక్కడ ఉండవల్సిందే. నీ చేతకానితనం ఇంకోచోట ఎందుకూ? ఇంకా ఏమైనా కొత్త ఆలోచనలు ఉన్నాయా నీ దగ్గిర?”

“లేవు.” ఏడుపు మొహంతో తల అడ్డంగా ఊపింది చిన్న భూతం.

“చూడబోతే నీ పని కూడా నన్నే చేయమనేలా ఉన్నావే?”

“…”

“పోనీ కదా అని ఇప్పటిదాకా ఊరుకుంటూంటే ఇదన్న మాట నువ్వు చేసే నిర్వాకం. ఎవరక్కడ? ఇలా కొరడాలు పట్టుకుని రండి. ఈ చిన్నభూతానికో రుచి చూపిద్దాం”

“ప్రభో ఇంక కొట్టకండి. ఏదో ఒకటి చేసి ఈ సారి రైతుల్ని తీసుకొస్తా.” చిన్నభూతానికి వంటిమీద నాలుగు తట్లు తేలేసరికి ఏడుస్తూ అరవడం మొదలెట్టింది.

“ఏం? ఏమన్నా కొత్త విషయాలు తెలిశాయా?”

“లేదు. కానీ ఏదో ఒకటి కనిపెట్టి ఈ సారి తీసుకొస్తాను.”

“సరే ఫో అయితే. ఆఖరుసారిగా నీకు మూడేళ్ళు గడువు ఇస్తున్నాను. ఈ మూడేళ్లలో కావాల్సినంత మంది రైతుల్ని తీసుకొచ్చావా సరే సరి లేకపోతే పాతరేయిస్తాను ఇక్కడే.”

“ఈ సారి రైతు దగ్గిర పనిచేసే పాలేరులా మారి వాళ్ల లోపలి రహస్యాలు కనిపెడతానులెండి. ఓ సారి అవి తెలిస్తే ఏదో ఒకదారి కనిపించకపోదు.”

రైతు ఇవానోవిచ్ ఇంట్లోంచి బయటకొచ్చేడు ఖాళీ కుంచం తోటి. బయట పాలేరు నికోలాస్‌ గింజలు కొలుస్తున్నాడు.

“ఇంకా ఎన్నున్నాయ్? అవతల మన గిడ్డంగి పూర్తిగా నిండిపోయినట్టే. ఇంకేమీ పట్టేలా లేదు లోపల.”

“ఎందుకు పట్టదూ? లోపలకెళ్ళి పైనుంచి అంతా మళ్ళీ సర్దుదాం చదునుగా. నేను చేస్తాను కదా? ఇక్కడ ఇంకో రెండు మూడు బస్తాల గింజలున్నాయి. ఇప్పుడు దాచుకుంటే చలికాలం కష్టపడ్డక్కర్లేదు కదా?”

“సరే, కొలవడం అయ్యాక మళ్ళీ వస్తాను నేను. ఇప్పుడు చిన్న పనిమీద అలా ఊళ్ళోకెళ్ళాలి.”

“సరే వెళ్ళి రండి. ఇక్కడ పని నేను చూస్తాను.”

ఇవానోవిచ్ అటు వెళ్ళగానే పని తొందరగా కానిచ్చి పక్కనే ఉన్న గడ్డిమీద కాళ్ళు చాపి వెన్ను వాల్చేడు నికోలాస్. “హమ్మయ్య, ఈ పనితో వళ్ళు హూనం అవుతోందే కానీ ఇవానోవిచ్‌కి కోపం వచ్చే మార్గం కనిపించడం లేదే? నా పక్కనే నుంచుని నే చేసేదంతా చూస్తూంటాడు కనక నా టోపీ, బూట్లూ తీయడం కుదరదు ఆయన ముందు. టోపీ బూట్లూ తీయకపోతే తలా, కాళ్ళూ ఒకటే దురద. తీస్తే నా తలమీద కొమ్ములూ కాలివేళ్ళూ నేను చిన్న భూతాన్నని చెప్పేయవూ? ఆ రహస్యం కానీ తెల్సిందా మళ్ళీ నరకం దాకా వెళ్ళడం కాదు గానీ ఈ రైతే నన్ను ఇక్కడ పాతిపెడితే నా గతేమిటి? పంట నేను చెప్పినట్టు సాగు చేశాక ఇప్పుడు గిడ్డంగులన్నీ నిండి ఉన్నాయి. నా మీద గురి కుదిరింది కనక ఈ సారి కూడా నేను చెప్పినది చేయడానికి వెనుకంజ వేయడు. ఇదే అదను చూసి ఏదో మంత్రం వేశానా ఇంక వీణ్ణి బుట్టలో వేయడం సులభం. ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయాయి. నాకున్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటే…”

నికోలాస్ ఆలోచనల్ని తెగ్గొడుతూ ఎవరిదో కంఠం వినిపించింది, “ఇవానోవిచ్ ఉన్నాడా ఇంట్లో లోపల?” వచ్చినాయన పక్కింటి రైతు, ఏదో చేబదులు కావాల్సి వచ్చినట్టున్నాడు.

“మా రైతు ఇంట్లో లేడు కానీ, చెప్పండి ఏం ఇలా వచ్చేరు?” నికోలాస్ అడిగేడు కంగారుగా టోపీ బూట్లూ సవరించుకుంటూ.

“చిన్న పని మీద వచ్చాను గానీ ఈ ఏడు పంట బాగుందా?”

“బాగానా? భలేవారే ఈ గింజలన్నీ దాచుకోవడానికి ఉన్న గోదాం సరిపోవట్లేదు. కళ్ళు అదిరిపోయేటట్టూ ఉంది మా దిగుబడి. ఇదిగో చూడండి,” గింజల్ని చేత్తో చూపిస్తూ అన్నాడు నికోలాస్.

“అదృష్ఠం అంటే మీదేనయ్యా, రెండేళ్ళ బట్టీ చూస్తున్నాను. ఊళ్ళో ఎవరికీ రాని దిగుబడి మీకెలా వస్తోందో కాని. ముందు ఎలా తెలుస్తోందో కానీ సరిగ్గా ఎక్కడ వెయ్యాలో అక్కడే వేస్తున్నాడు పంట ఇవానోవిచ్. పోయినేడు వర్షాలు అంతగా లేవు. చిత్తడి నేల చూసి పంట వేసుకున్నాడు ఈ ఏడు వర్షాలు అదే పనిగా కురుస్తూంటే ఏదో ముందే తెల్సినట్టూ మెరక మీద వేశాడు పంట. మొత్తం మీద రెండుసార్లూ బాగా దిగుబడి సంపాదించేడు సుమా. దిగుబడి మాట అటుంచి ఇంక ఈ గింజలకేసి చూడు, ఒక్కో గింజా దున్నపోతులా లేదూ?”

మాటల్లో ఇవానోవిచ్ వచ్చి నవ్వుతూ పలకరించేడు పక్కింటాయన్ని, “ఏం ఇలా వచ్చేరు?”

“ఆ, అదే ఈ పంట దిగుబడి గురించి మాట్లాడుతున్నాను మీ పాలేరుతో. ఏం దిగుబడీ, ఏం గింజలూ! ఎక్కడ సంపాదించారో గానీ ఈ విత్తనాలు. గిడ్డంగులన్నీ నిండిపోయాయని నికోలాస్ చెప్తున్నాడు. ఊళ్ళో రైతులం మాకు పంటలు అరకొరగా పండుతున్నాయి కానీ మీ అదృష్ఠం మాకు లేదు.”

“నిజమే, అసలు ఇదంతా నికోలాస్ మూలంగానే అనుకో. ఏ ఏడు పంట ఎక్కడ వెయ్యాలో నన్ను బలవంతంగా ఒప్పించి మరీ వేయించాడు. మొదట్లో నేను నమ్మలేదు కానీ తర్వాత్తర్వాత ఒప్పుకోక తప్పలేదు. ఈ నికోలాస్ మంచి పనిమంతుడే కాదు సరిగ్గా ఏది ఎప్పుడు చేయాలో తెల్సినవాడు కూడానూ.”

“అది మాత్రం ఒప్పుకోక తప్పదులే. ఇంతకీ ఈ గింజలన్నీ అమ్మేస్తున్నారా?”

“చూద్దాం లెండి ఇంకా ఆలోచించుకోలేదు. ఇంతకీ ఇలా వచ్చేరేం?”

“మా ధాన్యం ఈ ఏటికి అయిపోయినట్టే. తినడానికేమీ లేదు. మీకు బాగా పండుతోంది కనక ఓ బస్తా ధాన్యం ఇప్పిస్తారేమో అని అడగడానికొచ్చాను. మళ్ళీ వచ్చే ఏడు పంటకి తీర్చేస్తాను.”

రైతు ఇవానోవిచ్ ఏదో అనబోతూంటే పక్కింటాయన వెనకనున్న నికోలాస్, ‘వద్దు ఇవ్వకు’ అని సైగ చేసేడు. అది పట్టించుకోకుండా ఇవానోవిచ్ చెప్పేడు, “తప్పకుండా తీసుకెళ్లండి. ఇదంతా మేము తినగలిగేదా? అమ్మినా ఇంకా బోలెడు మిగుల్తాయి.”

నికోలాస్ నొసలు చిట్లించేడు. పక్కింటాయన బస్తా మోసుకెళ్ళేక ఇవానోవిచ్ నికోలాస్‌ని అడిగేడు, “ఎందుకివ్వద్దన్నావు? ఆయనెంత మంచివాడో నీకు తెలియదు కాబోలు. నాకెన్నోసార్లు సాయంచేసేడు.”

“ఇవ్వడం ఒకెత్తూ ఆ తర్వాత రాబట్టుకోవడం మరో ఎత్తూ. అవన్నీ మళ్ళీ వెనక్కి ఇస్తాడని ఏమిటి? వాటి కోసం ఎన్నిసార్లు వాడింటి చుట్టూ తిరగాలో?” నికోలాస్ గునిసేడు.

“పోనీయవయ్యా, ఇదంతా మనం తినగలిగేనా? రెండేళ్ళు కూర్చుని తిన్నా కరగనంత లేదూ? ఏం చేసుకుంటాం ఇదంతా? వాళ్ళ ఖాళీ కడుపులకి ఇస్తే కాస్త పుణ్యం రాదూ?”

“ఏం చేసుకుంటామా? ఇదంతా నేను కష్టపడింది మీకో పానకం తయారుచేసి ఇద్దామనే.”

“పానకమా? గింజలు తిండికి కదా? దానికీ ఈ తిండి గింజలకీ ఏమిటి సంబంధం? ఆ పానకంతో ఏం చేస్తావేం?”

“ఓ సారి రుచి చూడండి మళ్ళీ వదలరు మరి. నీరసంగా ఉన్నవాళ్లకి బలం ఇచ్చేదీ, ముసలి వాళ్లని యువకులుగా మార్చేదీ ఇదే పానకం. మీకు తెలియదు లెండి.”

“అటువంటిదెక్కడా ఉన్నట్టు వినలేదే? ఏం పరాచికాలు మాట్లాడుతున్నావ్?”

“అవున్లెండి నేను మాట్లాడేది అంతా పరాచికాలే. నేను పంట మెరకమీద వేయమన్నప్పుడు కానీ చిత్తడిలో వేయమన్నప్పుడు కానీ పరాచికాలాడేనా? మొదట్లో నమ్మేరా నేను చెప్పింది? పంట దిగుబడి చూశాక తెలిసొచ్చింది కదా నేను మాట్లాడేది పరాచికమో కాదో?”

“సరే ఒప్పుకుంటున్నా. అయితే ఈ పానకం ఎలా ఉంటుందంటావ్?”

“మీరే చూస్తారు కదా?”

“దేనితో తయారు చేస్తారు దాన్ని?”

“దేనితోనా? ఈ గింజల్తోటే. అందుకే పక్కింటాయనకి ఊరికే ఇచ్చేయవద్దని చెప్పేను ఇందాక.”

“అన్యాయం నికోలాస్. ఈ తిండి గింజల్ని అలా పాడు చేయడం పాపం కదూ?”

“పాపమా? ఎవడండీ చెప్పేడు? మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకోమనే బుర్ర నిచ్చేడు మనకి సృష్టికర్త. ఆ బుర్ర ఉపయోగించి గింజలు ఉడకబెట్టుకు తినొచ్చు, పిండిచేసుకుని రొట్టె చేసుకోవచ్చు, లేకపోతే పానీయాలు చేసుకోవచ్చు. పక్కింటాయనకి ఓ బస్తా ఇవ్వగా లేంది మీ ఆనందం కోసం ఓ బస్తా గింజలు విదల్చలేరూ? అదీ మీరు తాగబోయే పానకం కోసమే కదా?” పగలబడి నవ్వేడు నికోలాస్.

ఇవానోవిచ్ మెచ్చుకుంటున్నట్టూ చూసేడు నికోలాస్ కేసి, “ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావ్ నికోలాస్? నా దగ్గిరున్న రెండేళ్ళ పై చిల్లరలోనూ నువ్వెప్పుడూ బూట్లు విప్పినట్టు నాకు గుర్తే లేదు. తీరిగ్గా కూర్చున్నట్టు కానీ, ఓ పుస్తకం చదివినట్టు గానీ చూడలేదు. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావ్?”

“అదో పెద్ద కధలెండి. మరో మారు మాట్లాడుకుందాం.”

“ఈ పానకం తాగితే బలం వస్తుందన్న మాట నిజమేనా?”

“మీరే చూస్తారుగా?”

“మరి దీన్ని ఎలాగా తయారు చేయడం?”

“దానంత సులభం మరోటి లేదు ఓ సారి చేసి మీకు చూపిస్తాను; మీరే చూద్దురు గాని.”

“తాగడానికి బాగుంటుందా?”

“బాగానా? తేనె కన్నా మధురం.”

“సరే మరి దీన్ని చేయడానికేం కావాలో చెప్పు”

“రెండు రాగి హండాలూ, రెండు ఇనుప గిన్నెలూ చాలు.”

“నిజమా? మన పక్కింటాయన దగ్గిర రాగి హండాలు చూశాను. ఇస్తాడేమో ఓ సారి అడుగుదాం.”

ఓ వారం గడిచేక నికోలాస్ ఇవానోవిచ్‌ని పొలం బయట పాకలోకి తీసుకెళ్ళేడు. లోపల మంట మీదనున్న ఓ హండాలో ఏదో మరుగుతోంది. కిందనో కుళాయిలా ఏదో ఉంది. ఇది చూసి ఆశ్చర్యంగా అడిగేడు ఇవానోవిచ్.

“ఏమిటిది నికోలాస్? కిందన కుళాయిలోంచి నీరు కారుతున్నట్టుందేం?”

“నీళ్ళు కాదు. మీకు చెప్పిన పానీయం ఇదే.”

“అవునా మరి ఇది గింజల రంగులో ఉంటుందనుకున్నాను కానీ నీళ్ళలాగా ఉందేం?”

“వాసన చూడండి ముందో సారి.”

వాసన చూసిన ఇవానోవిచ్ ముక్కు మూసుకుని అన్నాడు, “అదో రకం వెగటు వాసనేస్తోందేం?”

“వాసన అలాగే ఉంటుంది లెండి. ఓ గ్లాసు పుచ్చుకోండి. జాగ్రత్త! ఒలకబోసేరు సుమా.”

“ఏదీ మరో గ్లాసు తీయ్, ఓ గ్లాసుతో నాలుక మీద ఏమీ తెలిసినట్టులేదు.” తాగిన ఇవానోవిచ్ అన్నాడు.

తన పాచిక పూర్తిగా పారిన నికోలాస్ నవ్వేడు, “చూశారా నే చెప్పలేదూ? దీని తఢాఖా మీకే తెలుస్తుంది.”

రెండో గ్లాసు పూర్తి చేసిన ఇవానోవిచ్ అరిచేడు, “నికోలాస్ ఏం పానీయం చేసేవయ్యా? మా ఆవిడ మార్తాని పిలుద్దాం. ఏమంటుందో?”

నికోలాస్ ఇంట్లోకెళ్ళి మార్తాని ఉన్నచోటు నుంచి పిలుచుకొచ్చేడు పాకలోకి. పదేళ్ల పిల్లతో లొపలికొచ్చిన మార్తా చుట్టూ చూసి అంది, “ఎందుకంత తొందరగా రమ్మని పిల్చుకొచ్చేడు?”

“ఈ పానీయం నికోలాస్ చేసేడు ఇప్పుడే. తాగి చూడు ఎలా ఉందో?”

“ఈ వాసన బాగున్నట్టు లేదు. తాగితే లోపల జబ్బు చేస్తుందేమో?”

“తాగి చూడవే వెర్రిమొహమా!”

“తాగితే బాగానే ఉన్నట్టుందేం? దేంతో చేశారు దీన్ని?” తాగి రెండు గుటకలేశాక అడిగింది మార్తా.

“నేనూ నికోలాస్ కలిసి గింజలన్నీ పాడు చేస్తున్నాం అని ఏడిచావు కదా? ఇప్పుడర్ధం అయిందా ఈ గింజల్తో ఏం చేశామో? ఇది తాగితే ఎలా ఉంది మజా?” ఇవానోవిచ్ తూల్తూ అడిగేడు మార్తా బుగ్గమీద చిటికె వేస్తూ.

“ఒక్కొక్కరూ ఎన్ని గ్లాసులు తాగొచ్చు?”

“నికోలాస్ చెప్పడం ప్రకారం ఇది తాగితే ఒళ్ళూ, మనసూ తేలికౌతాయ్. కుర్రాళ్ళందరూ ముసలాళ్ళౌతారు. కాదు కాదు, ముసలాళ్ళందరూ కుర్రాళ్లౌతారు. నేను రెండు గ్లాసులు తాగానంతే. అప్పుడే ఒళ్ళు గాలిలో తేల్తున్నట్టుంది. ఇరవై ఏళ్ల కుర్రాడిలాగా లేనూ? దా, ఇద్దరం కల్సి మరో గ్లాస్ తాగుదాం,” మార్తాని దగ్గిరగా లాక్కుంటూ అడిగేడు ఇవానోవిచ్.

“అవును నేను కూడా మళ్ళీ చిన్నదాన్నయినట్టనిపిస్తోందే?”

“కాదు మరీ? నేన్చెప్పలే?”

“అత్తగార్ని పిలుద్దామా ఇది తాగడానికి? ఆవిడ నాగురించి ఎప్పుడూ దెప్పుతూనే ఉంటుంది కదా?”

“అవునవును పిలు,” అంటూ ఇవానోవిచ్ పాపతో చెప్పేడు, “పాపా, పోయి మామ్మనీ తాతనీ ఇక్కడున్నట్టు రమ్మన్నానని తీసుకురా. క్షణంలో రావాలి సుమా?”

పాప తుపాకీ గుండులా పాకలోంచి బయటకి పరుగెట్టింది. నికోలాస్ నవ్వుకున్నాడు, “పని పూర్తయింది. ఇంక అందర్నీ ఓ సారి కట్ట కట్టుకుని తీసుకుపోవడమే.”

పాకలోకి వచ్చిన మామ్మా తాతా చేతిలో గ్లాసుల్తో చెట్టాపట్టాలేసుకుని గెంతులేసే ఇవానోవిచ్‌నీ మార్తానీ చూసి నిర్ఘాంతపోయేరు. తాతే తేరుకుని అరిచేడు, “మేకేమన్నా మతి పోయిందేమిట్రా? పనిచేసుకునే సమయంలో అలా గెంతులేస్తున్నారు? ఇంతకీ ఏమిటి తాగుతున్నారు ఆ గ్లాసుల్తో?”

మామ్మ కూడా అరిచినట్టే అంది, “మార్తా ఇంట్లో పనంతా వదిలేసి ఇక్కడ గంతులేమిటే? బుద్ధి లేదూ? కోడళ్లందరూ ఇంతేలే.”

“మా మీద ఎగరకపోతే మాతో బాటూ ఓ గ్లాసు తాగి చూడరాదూ?” ఇవానోవిచ్ అన్నాడు మామ్మతో.

వాసన చూసిన మామ్మ అంది, “ఏం దరిద్రపుగొట్టు వాసనరా, ఇది తాగితే చావరూ?”

“చావా? ఓ గ్లాసు తాగితే జీవితం అంటే తెలిసొస్తుంది.”

రెండు గుక్కలేసిన మామ్మ తాతతో అంది, “వాసన అదోలా ఉంది గానీ తాగితే బాగున్నట్టే ఉంది. మీరో గ్లాసు పుచ్చుకుని చూడరాదూ?”

తాత అడ్డంగా తలాడిస్తూ అక్కడే కూలబడటం చూసి నికోలాస్ అన్నాడు, “ఆ ముసలాయన్ని పట్టించుకోకే అమ్మా. ఓ గ్లాసుతోటి దీని రుచి తెలియదు కానీ ఇదిగో మరోటి పుచ్చుకోండి. మజా అంతా మూడో గ్లాసు నుంచే మొదలౌతుంది.”

రెండో గ్లాసు తాగుతూన్న మామ్మ అడిగింది, “మార్తా, లోపలకి దిగుతూంటే గొంతులో మండుతున్నట్టుందే? నీకు అలా అనిపించిందా?”

“అవును. ఈ రెండో గ్లాసు లోపలకెళ్ళాక ఏమౌతుందో చూసుకోండి మజా.”

“సరే ఇలా తే!”

రెండో గ్లాసు ఖాళీ చేసిన మామ్మ అంది ఇవానోవిచ్‌తో, “కాళ్ళు తేలుతున్నాయిరా, మీ నాన్న గానీ చూస్తే నేను మళ్ళీ ఇరవైల్లోకి వెళ్ళినట్టు ఉందనేవాడు కాదూ?”

“చూశావా నేను ముందే చెప్పాను కదా?”

వీళ్లందర్నీ అలా వదిలేసి తాత మెల్లిగా లేచి వెళ్ళి కుళాయి పూర్తిగా తిప్పేడు. మొత్తం పానీయం అంతా నేలమీద ఒలికిపోతూంటే ఇవానోవిచ్ ముసలాయన మీద విరుచుకు పడ్డాడు, “బుద్ధి లేని ముసలోడా తప్పుకో పక్కకి. మొత్తం అంతా నేల మీద ఒలికిపోయినట్టుందే? ఇప్పుడేం దారి?”

“ఓరి దరిద్రుడా ఇదెక్కడ నేర్చుకున్నావురా? తిండి గింజలు దేవుడిచ్చినవి. వాటిని ఇలా తగలేస్తే నరకానికి పోతావ్. ఆ గింజలు తగలేసి దీన్ని పానీయం అనుకుంటున్నావా? ఇది నిప్పు, నిన్ను నిలువునా నాశనం చేసే నిప్పు. చూడు కావలిస్తే,” తాత అరుస్తూ అక్కడే ఉన్న మంటల్లోంచి ఓ కట్టె తీసి ఒలికిన పానీయం మీద పడేసేడు. భగ భగమంటూ నేలంతా అంటుకుంది. అందరూ చూస్తూండగా తాత కోపంగా బయటకి నడిచేడు.

నికోలాస్ తీరిగ్గా పొలంలో కూర్చునున్నాడు. ముసలి పిశాచం ఇచ్చిన మూడేళ్ల గడువు పూర్తయ్యేది ఈరోజు రాత్రే. ఇక్కడ జరిగే తంతు చూస్తే తనకి పదోన్నతి ఖాయం. మొదటిరోజు కాచిన పానీయం ముసలాయన ఒలకబోసేయడం వల్ల చుట్టాలకీ ఇంటి చుట్టుపక్కల వారికీ రుచి చూపించడం కుదర్లేదు. దాంతో ముసలాయనకీ ఇవానోవిచ్‌కీ మధ్య తగాదా మొదలయింది. అప్పట్నుంచీ కొట్టుకు ఛస్తున్నారు రోజూ. ఆస్తి వేరే పంచమని గొడవపెట్టడం మొదలెట్టాడు ఇవానోవిచ్. ఈ వయసులో వ్యవసాయం చేయలేడు కనక ముసలాయనకేమీ ఆస్తి రాదు ఇందులో. ముసలాయనకి తెలీకుండా ఇంకో పీపాడు పానీయం చేసి కనిపించకుండా దాచేరు తర్వాత. అది ఇవాళొచ్చే అతిథులకీ, తండ్రీ కొడుకుల మధ్య వచ్చిన ఆస్తి తగువులు తీర్చడానికొచ్చే పెద్దమనుషులకీ రుచి చూపిస్తే తన పని పూర్తయినట్టే. ఆ తర్వాత నరకానికి వద్దన్నా ఈ రైతులందరూ వస్తూనే ఉంటారు. తన పని వకీలు భూతం పని కంటే కంటే సుళువైపోతుంది. ఈ రాత్రి ముసలి పిశాచం చూడ్డానికొచ్చేసరికి అంతా సరిగ్గా ఉండేలా చూసుకుంటే చాలు.

సాయంకాలం అతిథులందరూ రావడం మొదలౌతూనే ముసలి పిశాచం నికోలాస్ కేసి చూసి అడిగింది, “నీకిచ్చిన మూడేళ్ళు పూర్తయ్యాయ్, ఏదైనా అఘోరించావా? లేకపోతే కొరడా మళ్ళీ రుచి చూపించాలా?”

“కొరడాలూ అఖ్ఖర్లేదు, కత్తులూ అఖ్ఖర్లేదు. ఈ రోజు మీరే చూద్దురుగాని. నేను లోపలకెళ్ళి వాళ్లందరికీ ఒక్కో గ్లాసూ అందిస్తూ ఉంటాను. మీరు ఓ మూల కూర్చుని జరిగే తతంగం అంతా గమనించండి.”

“సరే పద పోదాం.”

నికోలాస్ లోపలకి నడిచేడు. ముసలి పిశాచం అందరూ కనబడేటట్టుగా చూడ్డానికి కుదురుగా కూర్చుంది. వచ్చిన పెద్దల్లో ఒకాయన నికోలాస్‌ని అడిగేడు, “సారా కాచి పెట్టారా?”

“అదెప్పుడో సిద్ధంగా ఉంది.”

“ఇది రెండో సారి కాదూ కాచడం? మొదటి విడతలో కాచిన దానికీ, దీనికీ ఏమైనా తేడా ఉందా?”

“ఇప్పుడు చేసింది మొదటిదానికన్నా బాగా వచ్చింది.”

“ఓ పట్టు పడదాం రండి, మరెందుకాలస్యం?”

ఇవానోవిచ్, మార్తా గ్లాసులూ సరంజామా అన్నీ తెచ్చాక ఓ గుక్క వేసిన పెద్దాయన అడిగేడు నికోలాస్‌ని “భలే రుచి. ఎక్కడ నేర్చుకున్నావ్ ఇలా సారా కలపడం?”

“ప్రపంచంలో కళ్ళు తెరిచి చూస్తే నేర్చుకోవడానికెన్ని కొత్త విషయాలు లేవు?” నికోలాస్ నవ్వేడు.

“నిజం, నిజం!” పెద్దలందరూ గాడిదల్లా బుర్రలూపేరు.

వీళ్ళిలా తాగుతూ ఉంటే నికోలాస్ ముసలి పిశాచం దగ్గిరకెళ్ళి చెప్పేడు, “ఇంతకు ముందు వీడి తిండీ నీరు పాడు చేసినా కోపం తెచ్చుకునేవాడు కాదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో.” ఇలా అంటూ ఎదురుగా వచ్చే మార్తాకి కాలు అడ్డం పెట్టేడు. ఆవిడ తూలి నేల మీద పడింది. చేతిలో గ్లాసూ, సారా ఒలికిపోయేయి నేల మీద.

ఇవానోవిచ్ ఉగ్రుడైపోయేడు ఇది చూసి. “ఏమే దరిద్రపు మొహమా కళ్ళు కనిపించవా? ఈ సారా కాచడానికి ఎంత సమయం పడుతోందో నీకు తెలుసా? నీ వేళ్ళు అన్నీ బండబారిపోయినట్టున్నాయే?”

“నేను కావాలని చేయలేదే?”

“కావాలని చేసే అంత ధైర్యం ఏడిసిందా నీకు? వీళ్లందర్నీ వెళ్ళనీయ్, నిన్నేం చేస్తానో చూద్దువు గాని,” ఇలా అరిచిన ఇవానోవిచ్ నికోలాస్ కేసి తిరిగి అన్నాడు, “ఒరే నువ్వు ఇక్కడ అన్నీ అమర్చాక బయటకి పోకుండా ఇక్కడే మా చుట్టూ తిరుగుతున్నావ్ దేనికీ? నిన్నో దెయ్యమో భూతమో ఎత్తుకుపోనూ.”

ఇవానోవిచ్ అందరి కేసీ తిరిగి అడిగేడు, “పోనీయండి ఆ గ్లాసు పోతే మరోటి వస్తుంది కానీ మీరిక్కడకి ఎందుకొచ్చారో తెల్సు కదా? చెప్పండి ఇప్పుడు ఆస్తి అంతా నాకేనా లేకపోతే ముసలాయనకి కట్టబెడదామనుకుంటున్నారా? నేనిచ్చేవన్నీ పందుల్లా తిని తాగేసి నాకెసరు పెట్టే ధైర్యం ఉందా మీకు?”

“ఆస్తి అంతా నీదేనయ్యా. నువ్వూ నీ పాలేరు నికోలాస్ కష్టపడి పండించినది ముసలాయనకి ఎలా వదుల్తాం?” అందరూ తలో నవ్వూ పారేసి ముక్త కంఠంతో అనడం అదృశ్యంగా అక్కడే ఉన్న ముసలి దెయ్యానికి స్పష్టంగా వినిపించింది. పక్కనే ఉన్న నికోలాస్‌ని మోచేత్తో పొడిచింది సంతోషంగా.

“తాతను లోపలకి పిలవరా నికోలాస్,” చెప్పేడు ఇవానోవిచ్.

తాత లోపలకి రాగానే అన్నాడు ఇవానోవిచ్, “ముసలోడా ఇప్పుడు చెప్పు ఇక్కడున్న ఈ పెద్దల సమక్షంలో. నీకేదో ఆస్తి రావాలంటున్నావ్ కదా? చెప్పు, మాట్లాడగలవా? నేనూ ఈ నికోలాస్ గడించిందంతా నీక్కావాలా? ఎవడబ్బ సొమ్మనుకుంటున్నావ్?”

“నిన్ను తాగుడు మానమన్నాను కానీ ఆస్తి కావాలనలేదే? తాగుడు మానితే నీ అంత మంచివాడు మరోడు లేడు.”

“నా పంట నా ఇష్టం. ఇందులో ఉన్న మజా నాకు తెల్సు, ఇక్కడ పెద్దలకీ తెల్సు.”

“అవునవును!” పందులన్నీ తలూపేయి.

“అదీగాక ఇవానోవిచ్ మా స్నేహితుడు కూడా,” ఇంకో పెద్దాయన చెప్పేడు.

“తాగనప్పుడు మీరందరూ ఎలా తన్నుకునేవారో నేనెరగనా?” తాత అసహనంగా అన్నాడు.

కోపం వచ్చిన పెద్దలందరూ తాత మీద తలో దెబ్బ వేసి తలుపు తీసి బయటకి తోశారు. మత్తులో నవ్వుకుంటూ అదే తలుపులోంచి బయటకి వెళ్ళబోయిన ఇవానోవిచ్ బొక్కబోర్లా పడ్డాడు రోడ్డు మీద. అదేమీ పట్టించుకోకుండా పెద్దమనుషులు చేతులు కలిపి గ్లాసులెత్తారు మరో గుటక తాగడానికి.

ఇదంతా చూస్తోన్న ముసలి పిశాచానికి నికోలాస్ చెప్పేడు, “చూడండి ఈ పానీయం నోట్లో పడగానే ఒకరితో ఒకరు పందుల్లా ఎలా కొట్టుకుంటున్నారో ఆస్తి కోసం, అమ్మాయిల కోసం, డబ్బుల కోసం. అవేవీ దొరక్కపోతే సరదా కోసం?”

“మిగిలిన కధ చివరిదాకా చూడక్కర్లేదు కానీ నువ్వు చేసిన గారడీ అద్భుతంగా ఉంది. ఏ మాత్రం కోపం తెచ్చుకోని మనుషులు, ఒకర్నొకరు గౌరవంగా చూసుకుంటూ బతికే మనుషులు ఇలా తయారవ్వడానికి కారణం ఏమిటి? ఇదంతా ఎలా సాధ్యమైంది? మనిషి రక్తంలో పందుల, నక్కల, కుక్కల, తోడేళ్ల రక్తం ఎలా సాధ్యపడింది? ఆ సారాలో ఈ జంతువుల రక్తం కానీ కలిపేవా నువ్వు?”

“అబ్బే అంత లేదు కధ. జంతువులు వీళ్ళకన్నా వంద రెట్లు నయం. నేను చేసిందేమిటంటే వీడికి కావాల్సిన దానికన్నా ఎక్కువ గింజలివ్వటం. ఎప్పుడైతే రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి లోంచి బయటకొచ్చాడో అప్పుడే వీడి వంట్లోని కుక్క, నక్క, తోడేలూ అన్నీ బయటకొచ్చాయి. తినడానికి సరిపోయినంత మాత్రమే ఉన్నప్పుడు ఆ జంతు స్వభావం వీడి వంట్లో అంతర్గతంగా బయటకి రాకుండా పడి ఉంది. ఒక్కసారి గింజలెక్కువయ్యేసరికి అప్పటివరకూ నోరెత్తకుండా పడి ఉన్న జంతువులన్నీ ఒక్కసారి విజృంభించాయి అంతే!” చిన్న భూతమైన నికోలాస్ నవ్వేడు.

ముసలి దెయ్యం నికోలాస్‌ని శెభాష్ అన్నట్టూ చేత్తో భుజం మీద తడుతూ చెప్పింది, “మొత్తం మీద మాట నిలబెట్టుకున్నావ్ మూడేళ్ళూ కష్టపడి పని చేసి. ఇంక ఇప్పట్నుంచీ మనకి నరకంలో రైతులకి కూడా కొదువ ఉండబోదు. మనం చేయవల్సిందల్లా వీళ్లకి సరిపడా సారా పోయిస్తూ ఉండడమే.”

“మరి నా పని పూర్తైంది కదా అయినా ఇక్కడే ఉండాలా?” చిన్న భూతం అడిగింది నాయకుడైన ముసలి పిశాచాన్ని.

“ఇంకా ఇక్కడేముంది చేయడానికి? నీలాంటి ప్రతిభావంతులకి వేరే పని చూసి పెట్టాను. రా పోదాం.”

భూతాలు రెండూ కీచుగా అరుచుకుంటూ నరకం వైపు ఎగిరి పోయేయి.
------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి,
మూలం: లియో టాల్‌స్టాయ్ 
(మూలం: The First Distiller.)
ఈమాట సౌజన్యంతో

Saturday, December 14, 2019

ర-కారం


ర-కారం
సాహితీమిత్రులారా!

‘జుఁయ్, జుఁయ్’ అంటూ చెవుల మీద చప్పుడు. బలమైన వత్తిడితో తోసేస్తున్నట్టూ గుండెల మీద ఎవరో వేసిన దెబ్బతో వంట్లో సత్తువంతా పోయి గడ్డిపరకలా గాలిలో తేలిపోతున్నాడు. కొట్టినవాడెవరో తాను వేగంగా ఎగిరిపోతుంటే విజయగర్వంతో నవ్వడం, నెప్పి వల్ల తన మెదడు పనిచేయకపోవడం, భయంతో వెన్ను వణుకడం తెలుస్తోంది. ప్రాణం పోతోందా? తన తమ్ముడు ఇలాగేనా భయంతో చచ్చిపోయింది? లేకపోతే నిజంగా తగిలిన దెబ్బ రక్తం తోడేసి వాడి ప్రాణం తీసిందా?

చటుక్కున మెలుకువ వచ్చిన మారీచుడు చుట్టూ చూసేడు. హమ్మయ్య, ఇదంతా కలన్నమాట. తానింకా తన కుటీరంలోనే ఉన్నాడు. చావలేదు. విశ్వామిత్రుడి అక్క కౌశికి నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తుంటే తాను చెట్టు మీదనుంచి ఆవిడ ముందు దూకి రక్తం ఎముకలూ అవీ విసిరి బెదిరిద్దామనుకున్నాడు కానీ ఆవిడ తనని అసలు పట్టించుకున్నదే కాదు. తర్వాత ఒకసారి యాగదీక్షలో కూర్చున్న విశ్వామిత్రుడు కోపం తెచ్చుకోడని ఆయన యాగం పాడుచేద్దామనుకుంటే జరిగినది తెల్సినదే. అసలీ మునులకీ, వాళ్ల కుటుంబంలో ఆడవారికీ రాక్షసులైన తమని చూసినా బెదరని ధైర్యం ఎలా వస్తుందో? ఈ విశ్వామిత్రుడి అక్క కౌశికి రోజూ శ్రీచక్రాన్ని పూజిస్తుందని తర్వాత తెల్సింది. వీళ్ళ ధైర్యం అంతా ఆ పూజల వల్ల కాదు కదా? ఎప్పుడో ఓరోజు రావణుడికి ఈ శ్రీచక్రం వల్లే కీడు అని ఎక్కడో విన్నాడు…

తన ఆలోచనలు ఎవరైనా గమనించారేమో అన్నట్టూ ఓసారి చుట్టూ చూశాడు మారీచుడు. తాను ఇలా ఆలోచిస్తున్నట్టూ రావణుడికి కానీ తెలిస్తే ప్రాణం తీస్తాడు. అయినా ఖర్మ కాకపోతే ఇటువంటి స్త్రీలోలుడైన రాజుకా ఊడిగం చేయాల్సి రావడం? విశ్వామిత్రుడు యాగంలో సహాయానికి ఈసారి ఎవరో కుర్రాళ్ళని తీసుకొచ్చాట్ట. ఆ మాట తెలిసి కూడా, ఈ కుర్రకుంకలు తమనేం చేస్తార్లే అని మీద పడబోయేరు. ఈ కుర్రాళ్ళెవరో కానీ రెండే రెండు బాణాలతో ముగించారు తమ కథ. ఒక బాణంతో సుబాహుడు పోతే తనకింకా నూకలు మిగిలాయి, ఆ రెండో బాణం ఛాతీమీద కొట్టి సముద్రంలో పారేసింది తనని. ఆ దెబ్బ కలలోకూడా మర్చిపోలేకపోతున్నాడు తాను. ఎప్పటి మాట! తల్లి తాటకీ, తానూ, సుబాహుడు ఎంత సంతోషంగా ఉండేవారో! ఏ జన్మలో చేసిన ఖర్మో కాకపోతే అగస్త్యమహాముని దగ్గిరకి వెళ్ళి ఆయన్ని ఏడిపించనేల? ఆయన శపించాక రావణుడి సహాయంతో జనస్థానంలో, ఈ అరణ్యాల్లో అధికారం దొరికింది. అలా రావణుడికి తాము ఋణపడి ఉన్నారు ఏం చెప్పినా చేయడానికి. సుబాహుడు పోయాక తనకి తెలిసొచ్చిన విషయాలు అనేకం.

తమని బాణాలతో కొట్టిన ఆ రాముడే కొద్ది రోజుల ముందు, తమ తల్లి తాటకిని కడతేర్చాడు. ఆ కుర్రాడు పినతల్లి కైక దగ్గిరే విలువిద్య అంతా నేర్చుకున్నాడనీ, ఆవిడ ఈ కుర్రాణ్ణి స్వంత తల్లికంటే ఎక్కువగా చూసుకుంటోందనీ తెలిసొచ్చింది. సవతితల్లి అంటేనే తన పిల్లలు కానివారిని రాచిరంపాన పెడుతుందని కదా లోకంలో అనుకునేది? ఇదో వింత అయితే, తన తల్లి తాటకిని చంపినందుకు విశ్వామిత్రుడు తన దగ్గిరున్న అస్త్రవిద్యనంతా ఈ రాముడికి ఉచితంగా ధారపోశాడు. ఈ కుర్రాడికెందుకో ఆ విలువిద్యంతా? రాక్షసరాజైన రావణుడి లాంటి వారికిస్తే ఉపయోగం కానీ బొడ్డూడని కుర్రాడికా అస్త్రవిద్య?!

భయంతో ఇక కంటిమీద కునుకు రాదని తెలిశాక లేచి కుటీరంలోంచి బయటకొచ్చాడు మారీచుడు. ఒకప్పుడైతే లేవగానే ఎవర్ని ఎలా చంపుదామా, ఏ యాగం ఎలా ధ్వంసం చేద్దామా అనే ఆలోచనల్తో సతమతమయ్యే మారీచుడిప్పుడు సాధువు. స్నానం చేసి, విభూదిరేఖలు పెట్టుకుని శివస్మరణ చేయడమే. ఉన్న ఇద్దరు ముగ్గురు అనుచరులూ ఏదో పెడితే, లేకపోతే తనకి ఏది దొరికితే అది తినడం. చావు భయం ఎంత పనిచేస్తుందీ జీవితాలకి! ఓ అనుచరుడొచ్చి చెప్పాడు, ‘రాత్రి రత్నాలతో పొదిగిన ఒక రథం ఇటువైపు రావడం…’

రాత్రి, రత్నం, రథం, రావడం. తర్వాత మనసులో మెదిలేది రుథిరం. ర-కారం మళ్ళీ వినిపిస్తోందే? ఆ వెంఠనే తనకి వద్దన్నా గుర్తుకొచ్చేది, ఏదైతే మర్చిపోదామనుకున్నాడో అదే పదం, అదే కుర్రాడు. రా…ము…డు. చెవుల వెంట జుఁయ్, జుఁయ్ అని బాణాలు దూసుకుపోతున్న చప్పుడు. ఛాతీ మీద తగిలిన మానవాస్త్రం వత్తిడి దెబ్బా, దాని తాలుకు నెప్పీ; వెన్నులో, కాళ్లలో సన్నటి వణుకు. మనసులో ఉన్న బెరుకు మొహంలో కనపడకుండా కప్పిపెట్టుకుంటూ అడిగేడు అనుచరుణ్ణి, “ఎవరా వచ్చినది?”

“రావణుడెటో వెళ్ళి వెనక్కి లంకానగరానికి తిరిగి వెళ్తున్నారని అనుకున్నాం. ఇక్కడ ఆగలేదు కానీ రథం ఈ దారిన వచ్చినప్పుడు మాకు మెలుకువ వచ్చి గమనించాం.”

కుటీరంలోకి వచ్చాక మళ్ళీ ఆలోచనలు. జరిగినదంతా గుర్తుకువస్తోంది మళ్ళీ మళ్ళీ. ఈ రాముడు తనని వదిలేలా లేడు… ఏ పినతల్లి అయితే రాముణ్ణి అత్యంత ఇష్టంగా చూసేదో ఆవిడే రాముణ్ణి పధ్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపించింది. ఆ రాముడి భార్య సీత ఆయన్ని వదలకుండా కూడా వచ్చింది. ఈ అడవిలో ఏం తింటుందో మరి. అన్నింటికన్నా వింత ఆయన తమ్ముడు స్వంత భార్యని ఇంట్లో వదిలేసి ఈయన కూడా వచ్చాడు అడవికి. పిచ్చివాడు కాకపోతే స్వంత భార్యకన్నా అన్న ఎక్కువా? ఏమిటో ఈ మానవుల ఆలోచనలు, అంతుబట్టవు. తన తల్లినీ తమ్ముణ్ణీ చంపినందుకు, తనకొచ్చిన మాయలతో వాళ్లకి కనబడకుండా వెళ్ళి ఆ రాముణ్ణి చంపేద్దామనుకున్నాడు. మరి తాను వచ్చినట్టు రాముడెలా గమనించాడో, ఒక్క చురకత్తి లాంటి బాణం సంధించాడు. దాని తాకిడికి తాను చచ్చిపోయాడనే అనుకున్నాడు. సరి సరి ఇంకా మరికొన్ని నూకలున్నాయి తనకి. ఇంక ఈ రాముడి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం అనవసరం. తనకి మరోసారి అటు వెళ్తే చావు తప్పదనేది తెలుస్తూనే ఉంది. నమో నమఃశివాయ, శివాయ, రామ, రామ, నమఃశివాయ… రామ, రామ.

ఇదెక్కడి గొడవ తన జీవితానికి? శివస్మరణ చేద్దామనుకునేలోపునే మనసులో రాముడు కదుల్తున్నాడు. ఎంత వద్దనుకున్నా వెన్ను వణికించే ఒకే ఒక పదం గుర్తుకొస్తోంది. రా… ము…డు. అగస్త్యులవారిని కలిశాక ఇలా దండకారణ్యంలో దిగాడట. మాట తప్పనివాడనీ, ఆఖరికి తాను వెళ్ళి శరణువేడినా అభయం ఇస్తాడనీ చెప్పుకోవడం తాను విన్నాడు. రాముడు అంత మంచివాడైతే తన తల్లినీ, తమ్ముణ్ణీ ఎందుకు చంపినట్టో?

అంతలోనే మారీచుడి అంతరాత్మ అరిచినట్టూ అంది లోపలనుంచి. ‘నువ్వూ నీ తమ్ముడూ యాగం ధ్వంసం చేయబోతూ చేసిన పనిని రాముడు అడ్డుకున్నాడు. రాముడి తప్పేమిటిందులో?’ ఉత్తరోత్తరా తనకి తెలిసివచ్చిన విషయాల ప్రకారం, రాముడు థర్మమూర్తి. తండ్రి మాట కోసం ఇలా వచ్చిన కుర్రాడికి దారిలో మునులందరూ ఏదో ధనుస్సో, ఖడ్గమో, అస్త్రమో ఇవ్వడం. ఇదంతా చూస్తే ఈ రాముడూ, సీతా, ఆ లక్ష్మణుడూ దండకారణ్యంలో రాక్షసులనందర్నీ చంపడానికి యముడు పంపిన దూతలే అనిపిస్తోందంటే అనిపించదూ మరి?

లంకలో రావణుడి చర్చలు సాగుతున్నై. రాముడి చేతిలో చావుదెబ్బ తిన్నాక ఆ అస్త్రవిద్యాపాటవం గురించి మారీచుడిచ్చిన సలహా గుర్తుంచుకుని తాను వెళ్ళకుండా జనస్థానంలో రాముణ్ణి ఓ కాపు కాయమని పంపించిన ఖర, దూషణ, త్రిశరులూ, వాళ్ల రాక్షస సేనా తుడిచిపెట్టుకుపోయేయి. శూర్పణఖ చెప్పడం ప్రకారం ఈ రాముడి విలువిద్య ఎక్కడా విన్నదీ కన్నదీ కాదు. బాణం ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో ఏమీ కనిపించదు. రాక్షస సేన అలా మట్టిలో పొర్లుతూ చావడం ఒకటే కనిపించేది. తానే యుధ్ధానికి వెళ్తే? ఓడిపోడు కదా? అసలే తనకి మానవులనుంచి అపాయం ఉందని అందరూ ఎరిగిందే. ఇదికాదు దారి, మరోటి ఏదో ఆలోచించాలి.

అకంపనుడు చెప్పేడు, “సీత లేకుండా రాముడు బతకలేడు. సీతని ఎలాగో ఒకలాగ మాయచేసి అపహరించుకొని తీసుకురా. తర్వాత నయానో భయానో ఆవిణ్ణి లోబర్చుకోవచ్చు. సీత ఒకసారి రావణ సామ్రాజ్యం చూడగానే మనసు మారి రాముణ్ణి వదిలేస్తుంది. ఆ తర్వాత రాముడు బతకడం అసంభవం.”

రావణుడికి సందేహం తీరక అడిగేడు. “అపహరించుకుని వచ్చాక సీత నన్ను తిరస్కరిస్తే?”

“రావణా, నువ్వు త్రిలోకాధిపతివి, నీ సామ్రాజ్యం, నీ కట్టుబడిలో ఉన్న నవగ్రహాలూ, నువ్వు యముణ్ణి జయించడం, కుబేరుడి దగ్గిరనుంచి పుష్పకం తేవడం అవీ విన్నాక కూడా నీకు లొంగని ఆడది ఈ త్రిలోకాల్లో ఉంటుందా?” నవ్వేడు అకంపనుడు.

“మరి సీతని తీసుకురాగల వాడెవరు?”

“మాయల్లో ఆరితేరిన మారీచుడే దీనికి తగినవాడు. ఏదో విధంగా మారీచుడు రాముణ్ణి కనక సీతకు దూరంగా తీసుకెళ్లగలిగితే, నువ్వు వాళ్ళుండే కుటీరం దగ్గిరకెళ్ళి సీతని ఎత్తుకొని రావచ్చును.”

ఆలోచన నచ్చిన రావణుడు మారీచుడి దగ్గిరకి బయల్దేరాడు.

“ఏమిలా వచ్చావు? లంకలో అంతా కులాసాయేనా?” అడిగేడు మారీచుడు.

“నువ్వేదో నాకు సహాయం చేస్తావనుకుని వచ్చాను. ‘రాముడి దగ్గిరకి వెళ్లకు, ఎవర్నో పంపించు’ అంటే ఖర, దూషణ, త్రిశరులని, వాళ్ల సేనలతో పంపించాను. ఒక్కడు మిగల్లేదు. జనస్థానం నుంచి దండకారణ్యం దాకా మనదే రాజ్యం. ఇప్పుడిక్కడో మానవుడు మన సైన్యాన్ని చంపుతూంటే నోరు మూసుకుని కూర్చోవడం ఎలా?”

కాసేపు నోటమ్మట మాట రాని మారీచుడు తేరుకుని చెప్పేడు, “క్రితంసారి వచ్చినప్పుడు చెప్పాను కదా, నువ్వు వెళ్ళినా రాముడు నిన్నీపాటికి యమలోకానికి పంపి ఉండేవాడు. విను రావణా! రాముడు ధర్మమూర్తి, నిష్కారణంగా ఎవర్నీ ఏమీ చేయడు. ఆయన ఈ దండకారణ్యం ప్రాంతాలలో ఉన్నన్నాళ్ళూ అసలు ఆయన్ని గమనించనట్టు ఉండు. వచ్చినవాడు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతాడు. ఓ కుటీరం ఏర్పాటు చేసుకుని అక్కడ భార్యా తమ్ములతో శాంతంగా ఉండేవాడిని రెచ్చకొట్టవద్దు. ఆయనకి కోపం వస్తే….”

“ఆపుతావా ఇంక? ఇంత పిరికివాడిలా ఎప్పుడు తయారయ్యేవు?” రావణుడు గర్జించాడు.

“…పిరికితనం కాదు, రెండుసార్లు చిటికెలో చావుదెబ్బ తిన్నాక చెప్తున్న మాట ఇది రావణా. ఆ దెబ్బ ఇప్పటికీ వెన్నులో చలి పుట్టిస్తోంది. ఇన్ని దేనికీ, అసలు శూర్పణఖ వల్ల వచ్చినదే ఈ అనర్థం. నీకన్నా పెద్దవాణ్ణి, నీ క్షేమం కోరి చెప్తున్నాను విను. శూర్పణఖ ముక్కూ చెవులూ కోసినా ఖర దూషణులని చంపినా రాముడు నిష్కారణంగా చేసినపని కాదు అది. నీకు లంకలో సుఖాలకి తక్కువలేదు; రాముడి మాట వద్దు మనకి…”

“స్వామిభక్తి పోయి శత్రువుని పొగుడుతున్నావే? నేను అన్నీ కనుక్కునే వచ్చాను. ఈ రాముడికి చేతనైతే పినతల్లినీ, తండ్రి, తమ్ముళ్ళనీ తరిమేసి రాజ్యం ఆక్రమించుకోడూ? పాపి, ధూర్తుడు, పిరికివాడు, తిండీ గుడ్డా లేకుండా అడవుల్లో తిరుగుతున్న రాముడి గురించేనా నువ్వు చెప్పేది? నేను రాజుని, నిన్నూ సుబాహుణ్ణీ తాటకినీ చేరదీయకపోతే మీ ముగ్గురూ ఏమై ఉండేవారు? రాముడు మనకి శత్రువు. వాడి భార్యని అపహరించడానికి నీ సహాయం కోసం వస్తే, ఏమిటి నీ ప్రేలాపన ఇంకా?”

రావణుడి కంఠంలో కోపం చూసి ఈ సారి మారీచుడికి నీరసం ఆవహించింది. తన సమయం ఆసన్నమైనట్టేనా? రావణుడు చేయబోయే ఈ పనివల్ల తన చావుతో మొదలై మొత్తం రాక్షసకులం సర్వనాశనం కాబోదు కదా? దాని బదులు తానొక్కడూ పోవడం మంచిది. మారీచుడి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతూంటే రావణుడి కంఠం వినిపించింది.

“ఏమైంది నీకు మారీచా, మాట్లాడవేం?”

మెల్లిగా నోరు విప్పాడు మారీచుడు.

“అడిగావు కనక చెప్తున్నాను విను రావణా!

సులభా పురుషారాజన్, సతతం ప్రియవాదినః
అప్రియస్యసచ పాథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభః

పక్కనుండే భజనపరులు కో అంటే కోటిమంది సులభంగా దొరుకుతారు. అయితే, నీ క్షేమం కోసం, నీకు నచ్చనివైనా అప్రియమైన విషయాలు చెప్పేవారు నీకు దొరకడం అసాధ్యం. ఒకవేళ దొరికినా నువ్వు వినలేవు. రావణా! చావు దగ్గిరకొచ్చినప్పుడు ఎవరేం చెప్పినా నచ్చదు మనకి. లేకపోతే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొందిన నువ్వు ఇలా మాట్లాడగలవా? ఇన్నేళ్ళు నువ్వు ఏ మానవుడూ పైకి రాకుండా తొక్కిపెట్టి ఉంచావు కానీ అసలు రాముడి గురించి నువ్వూ నీ చారులూ గమనించినట్టే లేదు. రాముడు పిరికివాడా? ఎవరా చెప్పినది? నన్నూ, నా తల్లినీ, నా తమ్ముణ్ణీ చావగొట్టి వదిలాడు. నాకు నూకలు మిగిలి ఉన్నాయి కనక నేను బతికిపోయాను. నువ్వే చెప్తున్నావు కదా, ఖర, దూషణ, త్రిశరులని రాముడు ఒక్కడూ తేల్చిపారేశాడు. పిరికివాడైతే విల్లంబులు చేత్తో పట్టుకుని ఎదురొచ్చేవాడా దేవతలని జయించిన వీళ్ళకి? రాముడు పాపాచారుడా? ఆయన చేసిన పాపం ఒకటి చూపించగలవా? పినతల్లి ఎందుకు కోరిందో అసలు ఆవిడ అలా కోరడానిక్కారణం ఏమిటో అని ఆలోచించకుండా, ‘నువ్వు వనవాసం చేయాలి’ అంటే, ‘ఓ, అంతే కదా’ అంటూ రాజ్యాన్ని తృణప్రాయంగా వదులుకున్న రాముడు ధూర్తుడా? నీ రాక్షస ధర్మం రాముడికి ఆపాదించి రాముణ్ణి అటువంటి మాటలనకు. ప్రపంచం అనుకునేదేమిటో నీకు తెలియదులా ఉంది.

రామో విగ్రహాన్ థర్మః సాథు సత్యపరాక్రమః
రాజా సర్వస్యలోకస్య దేవానా మివవాసవః

ధర్మం పోత పోసిన విగ్రహమే రాముడు. సాధువూ, అసత్యం అనేది నోట్లోకి, మనసులోకి రానీయని వాడూను. పధ్నాలుగు లోకాలనీ ఏలడానికి సరైనవాడు. రాజ్యం రాజభోగాలు అన్నీ వదులుకుని వచ్చినవాడు. తనకి ఇలా అయినందుకు పినతల్లిని కానీ తండ్రిని కానీ నిందించినట్టు ఒక్కమాట వినలేదు నేను ఎవరినోటా. అటువంటి వాడు లుబ్దుడా, ధూర్తుడా? మరో విషయం చెప్తున్నాను విను. రాక్షస లోకం పైకి అనలేనిదీ, నీ వెనక చెప్పుకుంటున్నదీను. నీకు వేదవతి ఇచ్చిన శాపం, శ్రీచక్రం వల్ల రాబోయే ఉపద్రవం అన్నీ కలిసి నీ మరణానికి కారణం కాబోతున్నాయి. రాక్షస రాజువైన నువ్వు ఇటువంటి తుఛ్ఛమైన పనులు చేయవచ్చా? లంకకి పోయి సుఖంగా ఉండు…”

రావణుడి మొహంలో ఏమీ తేడా కనిపించకపోవడం చూసి మారీచుడు కొనసాగించాడు.

“… ఏకపత్నీవ్రతుడైన రాముడు అగ్నిహోత్రుడైతే ఆ మండే అగ్నిశిఖే ఆయన భార్య. దాన్ని ముట్టుకోవడం అంటే కావాలని చేతులు కాల్చుకోవడమే. అలా కాదు రాముడు పాపాచారుడే అనుకుంటే ఆయన భార్యని అపహరించడమే అనవసరం. అసలు పరాయి వాడి భార్యని అపహరించాలనే నీచమైన కోరిక పులస్త్యబ్రహ్మ వంశసంజాతుడవైన నీకెలా పుట్టిందో నా ఊహకి అందడం లేదు. నువ్వు చేయబోయే ఈ పని వల్ల రాముడికి కోపం వచ్చి మొత్తం రాక్షస సంహారానికి బీజం పడకుండా పరమేశ్వరుడు రక్షించాలి. నీకు ధైర్యం ఉంటే ఒక్కడివీ రాముణ్ణి యుద్ధానికి ఆహ్వానించు. ఆ యుద్ధంలో నువ్వు గెలిస్తే సీతని నీ దాన్నిగా చేసుకో. అసలంటూ నువ్వు బతికి బట్టకడితే…”

“మారీచా,” తనపేరు సార్థకం చేసుకుంటూ అరిచాడు రావణుడు, “నేను రాజుని. నువ్వు నా సేవకుడివి. నేను ఇక్కడకి వచ్చినది నిన్ను ఏం చేయాలో చెప్పడానికి, సలహా కోసం కాదు. నువ్వు ఎందుకు నోరుపారేసుకుంటున్నావో? రాజు చెప్పిన పని చేయకపోతే సేవకుడికి పడే శిక్ష తెలుసా?”

తన చావు దాదాపు ఖాయమైపోయినట్టూ తెలిసిన మారీచుడు చెప్పాడీసారి స్థిరంగా, “తెలుసు రావణా. నీ ఆజ్ఞ ధిక్కరిస్తే పడే శిక్ష మరణం. ఆ మరణానికి నేను రెండుసార్లు అతి చేరువలోకి వెళ్ళి వచ్చాను కనక నీకు ఆ గతి పట్టకుండా ఉండడం కోసం మరోసారి చెప్తున్నాను విను. నువ్వే కనక ఆ జానకిని అపహరించి లంకకి తీసుకెళ్ళగలిగితే ఆవిడే నీ పాలిట మృత్యుదేవత. ఆ సీత నిన్నూ, నీ రాక్షసకులాన్నీ సర్వనాశనం చేయడానికే పుట్టినట్టనిపిస్తోంది.”

“ఒక ఆడదా నన్ను నాశనం చేసేది?” రావణుడు నవ్వేడు.

“నువ్వు అపహరిద్దామనుకుంటున్న ఆ సీత నిన్నేమీ చేయలేకపోవచ్చు. కానీ అగ్నిహోత్రుడైన రాముడు నిన్ను సర్వనాశనం చేసి తీరుతాడు. నీకు మానవుల చేతిలో చావు రాసి పెట్టి ఉందని పరోక్షంగా అందరూ అనుకుంటున్నదే. రాముడి గురించి నీ అంచనాలూ, నువ్వు విన్నదీ తప్పు. నేను చెప్తున్నది స్వానుభవం, ఎవరి ద్వారానో విన్నది కాదు. రాముడి చేతిలో చావు దెబ్బలు తిన్నప్పటినుండీ నాకెలా ఉందో చెప్తున్నాను మరో సారి విను.

రకారాదీని నామాని రామత్రస్తస్య రావణః,
రత్నాని చ రథాశ్చైవ విత్రాణం జనయంతిమే.

రత్నం, రథం, రామ, రావణ అనే రకారంతో వచ్చే ఏ మాటా, పదం విన్నా నా వెన్ను వణుకుతోంది. మన వరకూ ఎందుకు, బలి, నముచి వంటి మన పూర్వుల వల్ల కూడా అధర్మం జరుగుతుంటే నిలబెట్టి వాళ్ల తల తీయగల సమర్థుడు రాముడు. ఇదంతా శూర్పణఖ కామోద్రేకం వల్ల వచ్చిన గొడవ. నా మాట విని, రాముడి వైపు వెళ్లవద్దు. నిప్పుగుండంలో పడే శలభాల్లాగా మాడిపోతాం.”

జేవురించిన మొహంతో రావణుడు అన్నాడు, “ఇదన్న మాట నిన్నూ, నీ తల్లినీ, సుబాహుణ్ణీ చేరదీసినందుకు నువ్వు విభూది రేఖలు పెట్టుకుని శతృవుని పొగుడుతూ నాకు నూరిపోసే పిరికిరసం, భేష్. ఇలా నువ్వు నా వెన్నులో పొడవడానికి తయారవుతున్నావనే విషయం నాకు ఇప్పటికైనా తెలిసివచ్చింది. ఇంతవరకూ వచ్చాక వెనక్కి తగ్గే ప్రసక్తిలేదు. సేవకుడివైన నువ్వు నేను చెప్పిన పని చేయవు కనక మరణదండనే నీ ఖాయం. లేదా నీకు మరణ భయమే కనక ఉంటే నేను చెప్పినట్టూ మాయలేడిగా బయల్దేరు. చిటికెలో అయిపోయే పనికి ఇంత రాద్ధాంతం అనవసరం. నేను సీతని ఎత్తుకుపోగానే నువ్వు మారీచుడిలా మారి మళ్ళీ వెనక్కి వచ్చేసి నీ శివస్మరణ చేసుకోవచ్చు.”

“ఎంత సులభంగా చెప్పావు రావణా! రామబాణం తగిలి నా ప్రాణం పోయినప్పుడు నీకు సంతోషం కాబోలు. అయినా నువ్వే చెప్పావు కదా, నీ ఆజ్ఞ ధిక్కరించి నీ చేతిలో చావడమో లేకపోతే లేడిలా మారి రాముడి చేతిలో చావడమో అనేదే నేను తేల్చుకోవాల్సినది. నాకు చావే తథ్యం అయితే ఇటువంటి తుఛ్ఛమైన ఆలోచనలు చేసే నీ చేతిలో చావడం కంటే ధర్మాత్ముడైన ఆ రాముడి చేతిలో చావడం మంచిది. నడు రాక్షసేశ్వరా, నడు పోదాం. కానీ నీతో ఆఖరి మాట చెప్పనియ్యి. నీ ప్రణాళిక ప్రకారం నేను లేడిలా మారి రాముణ్ణి దూరంగా తీసుకెళ్తాను. ఆ తర్వాత, ఇప్పటికే రెండుసార్లు కనికరించిన రామబాణం ఈ సారి నా ప్రాణాలు తీస్తుందనేది తధ్యం. తర్వాత ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ, నువ్వు పధ్నాలుగు లోకాల్లో సీతని ఎక్కడ దాచినా ఆ రాఘవుడు నిన్ను సింహం జింకని వేటాడినట్టూ వేటాడి చంపుతాడు. ఇందులో మరో దారుణమైన విషయం ఏమిటంటే నువ్వు రాక్షస రాజువి కనక ముందు నువ్వు యుద్ధానికి రాకుండా నీ అనుచరులని–నన్నూ, ఖర దూషణాదులనీ పణంగా పెట్టినట్టే, ఒక్కొక్కర్నీ పంపిస్తావు. దాంతో వాళ్ళందర్నీ యమలోకానికి పంపిస్తూ రాముడు చివరకి నీ సంగతి తేలుస్తాడు. విభీషణుడి వంటి ధర్మం తెలిసినవారు నీకు మంత్రులైనా నీ బుద్ధి ఇలా వికటించడం చూస్తే ఇదే నాకు తెలిసి వస్తోంది. నీ ఉప్పు తిన్నందుకు ప్రాయశ్చిత్తం అనుభవించే సమయం ఆసన్నమైనట్టుంది. నీ వల్ల మొత్తం రాక్షస కులం తుడిచిపెట్టుకు పోబోతోందనే ఒక్క బాధ తప్ప నా గురించి ఏ విచారమూ లేదు. నడు రావణా, నడు ఇప్పుడే పోదాం. రాబోయే చావుని అడ్డుకోవడం ఎంత తెలివి తక్కువతనం?”

“నేను బ్రహ్మ చేత వరాలు పొంది యముణ్ణి గెలిచి కైలాసం ఎత్తిన దశకంఠుడిని. ఎవరో నీచమానవుడు విల్లు పట్టుకుని రెండు బాణాలు వేయగానే బెదిరిపోయే మారీచుణ్ణి కాదు, నడు పోదాం. ఇప్పుడు నువ్వు సరైన స్వామి భక్తుడివి.” తన మాట నెగ్గినందుకు సంతోషంగా నవ్వుతూ రావణుడు లేచాడు. రకారంతో మొదలయ్యే ధర్మమూర్తి రూపం మనసులో మెదుల్తుండగా, నోటిలో ఆయన నామం వద్దనుకున్నా వస్తూంటే, మారీచుడు వణుకుతున్న కాళ్లతో రావణుడి వెంట నడిచేడు.

రాముడున్న కుటీరం వేపు వెళ్ళబోతూ మనసు మార్చుకుంటాడేమో అన్నట్టూ బంగారు లేడి రావణుడి కేసి చూసింది. రావణుడి మొహం సీతని అపహరించే దృశ్యం ఊహించుకుంటూ వెలిగిపోతోంది. ఇంక తానేం మాట్లాడినా అనవసరం. అయినా చివరి మాటగా చెప్పాడు మారీచుడు, “రావణా నిన్ను మళ్ళీ చూసే అవకాశం శూన్యం. నా తల్లీ తమ్ముడితో సహా మమ్మల్ని చేరదీసినందుకు కృతజ్ఞతలు. ఇంక సెలవు.”

రావణుడు లేడిని తట్టి చెప్పాడు, “ధైర్యంగా వెళ్ళు. విజయం మనదే.”

కుటీరం దగ్గిరలో లేడికి వినిపించిన మాటలు రామ లక్ష్మణులు అన్నవే. తమ్ముడు “అన్నా! ఇటువంటి బంగారు లేడి ఆ మారీచుడి మాయే. నేను వెళ్ళి దీని సంగతి తేల్చి వస్తాను” అన్నాడు.

దానికి రాముడిచ్చిన సమాధానం, “లేదు, నేనే వెళ్తున్నాను. నువ్వు చెప్పినట్టూ ఇది ఆ మారీచుడే అయితే, రెండుసార్లు కనికరించిన వాడి సంగతి ఈ రోజు తేల్చవల్సిందే.”

అంతటి చావు భయంలోనూ మారీచుడు ఆశ్చర్యపోయేడు, తనని లక్ష్మణుడూ, రాముడూ ఎలా గుర్తుపట్టారో? ఇదేనా ధర్మాచరణ వల్ల కలిగే జ్ఞానం? ఆ తర్వాత రాముడు తనని అనుసరిస్తుంటే, నెమ్మదిగా నడక; దూకడం, పరుగు, బాణానికి అందనంత దూరంలో ఆగి రాముడి కోసం వేచి చూడడం; మళ్ళీ దగ్గిరలో రాముణ్ణి చూసి దూరంగా పరుగు. గుండెల్లో బెదురు; రామ, రామ. రాముడు బాణం తీశాడా? సంధించాడా? నమఃశివాయ, రామ, రామ, నమఃశివాయ… కాలం ఎంతసేపు గడిచిందో, రాముడు తన కూడా ఎంత దూరం వచ్చాడో గమనించలేదు కానీ మారీచుడికి చివరగా తెలిసి వచ్చిన విషయం తన కడుపులో గుచ్చుకున్న రామబాణం ప్రాణం తోడేస్తోంది. శూర్పణఖ చెప్పినది నిజమే. రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో కనిపించదు. అయినా రెండు సార్లు తనని కనికరించిన రాముడు ఈ సారి ఊరుకోడని తనకి ముందు తెలియకపోతే కదా? శరీరం అదుపు తప్పేలోపుల, స్వామి కార్యం కోసం చేయాల్సిన పని ఒక్కసారి గుర్తొచ్చి అరిచేడు మారీచుడు పెద్ద గొంతుతో, “హా సీతా! హా లక్ష్మణా!”

నేల మీద పడి ఉన్న మారీచుడి దగ్గిరకొచ్చి రాముడు అడుగుతున్నాడు, “ఎవరు చేసినదీ కుట్ర? దీని వెనకనున్న మోసం ఏమిటి?”

ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్న మారీచుడి మనసులో రెండు పరస్పర విరుధ్ధమైన భావాలు శరవేగంతో కదలడం మొదలుపెట్టినై. తాను గడిపిన నికృష్టమైన రాక్షస జీవితం ఒక్కసారి కళ్ల ముందు తిరిగింది. ఇన్నేళ్ల జీవితంలో తననీ, తల్లినీ, తమ్ముణ్ణీ పెంచి పోషించిన రకారంతో మొదలయ్యే రాక్షసేశ్వరుడి పేరు ఇప్పుడు తనకెదురుగా ఉన్న శతృవుకి నోరు విప్పి చెప్పేయడమా లేకపోతే ధర్మమూర్తిగా మరో రకారంతో మొదలయ్యే శతృవు పేరు తన నోట్లో నానుతుండగా ఈ తుఛ్ఛమైన శరీరం విడిచేయడమా? స్వామి ద్రోహమా? స్వకార్యమా? స్వామి ద్రోహం చేసినవాడికి నిష్కృతిలేదని ధర్మాత్ముడైన ఈ రాముడు గ్రహించలేడా? రావణుడి పేరూ, అతనెక్కడుంటాడో తాను రాముడికి చెప్పకపోయినా, చూడబోతే సర్వ రాక్షస సంహారం కోసమే దండకారణ్యం చేరిన ఈ రాముడు ఏదో విధంగా తెలుసుకోగలడు. ఈ అవసాన దశలో తనెదురుగా నిల్చున్న ధర్మాత్ముణ్ణి చూస్తూ ఈ రాముడి పేరు తల్చుకోవడమే మంచిది. ఈ ఆలోచన వస్తున్నప్పుడే శరీరం అదుపు తప్పుతూండగా రాముడు రెట్టించి అడిగినదే అడగడం వినిపిస్తోంది మారీచుడికి.

ప్రాణం పోతుందని తెలిసిన మారీచుడు, మొహంలో విరక్తితో కూడిన నవ్వుతో చెప్పేడు, “నా దురదృష్టం ఏమిటంటే, నా యజమాని ఉప్పు తిన్నందుకు చావబోయే ఆఖరి క్షణంలో కూడా నీ పేరు నా నోట్లోంచి రాకూడదని ఆయన ఆజ్ఞ. అందువల్లే ‘హా సీతా, హా లక్ష్మణా’ అనాల్సివచ్చింది. రెండుసార్లు నన్ను దయతల్చిన నువ్వు ఎవరివో నాకు ఇప్పటికి తెలిసి వచ్చింది. నీ రూపాన్ని చూస్తూ, పైకి అనలేకపోయినా నీ నామం నోట్లో మెదులుతూండగా ఈ శరీరం విడిచేస్తాను. రాక్షసుడిగా పుట్టినా నీ చేతిలో చావడం అదృష్టమే.”

“ఎవరు నీ యజమాని, ఏమిటీ మాయ అంతా?” రాముడు మరోసారి అడుగుతున్నాడు.

దిక్కులు దద్దరిల్లేలా ‘హా సీతా, హా లక్ష్మణా’ అని పెద్ద గొంతుకతో అరిచిన మారీచుడికి, అతి కష్టం మీద ఆఖరి శ్వాస తీసుకుంటూ మైకం కమ్మేసి, కళ్ళు మూసుకుపోతున్నప్పుడు రకారంతో మొదలయ్యే ఏ నామం అయితే తనని ఇన్నాళ్ళూ భయపెట్టి అనుక్షణం గుండెల్లో దడ పుట్టించిందో అదే నామం పెదవుల మీద ‘రామ, రామ, రామ…’ అని శబ్దం రాకుండా కదులుతుండగా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయేయి.

తాను అడిగిన ప్రశ్నలకి సమాధానం రాకపోవడంతో మారీచుడి శరీరం నిశ్చేతనం అవడం గమనించిన రకారంతో పేరు మొదలయ్యే ఆజానుబాహుడు, కావాలని తనతో బద్ధశతృత్వం కొనితెచ్చుకున్న రకారంతో పేరు మొదలయ్యే మారీచుడి యజమాని ఎక్కడుంటాడో కనుక్కుని, ఆతన్ని బంధుకోటితో సహా మారణహోమంలో సర్వనాశనం చేయడానికి భుజాల మీద కోదండం, అక్షయతూణీరాలూ కదులుతుండగా వడివడిగా ముందుకి నడిచాడు.
-----------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి, 
ఈమాట సౌజన్యంతో

Thursday, December 12, 2019

సింహం చెట్టు


సింహం చెట్టు
సాహితీమిత్రులారా!


జైభారత్ సర్కస్ వూళ్లోకి వస్తోందని ఆనోటా యీనోటా విన్నాం. పిచ్చి ఆనందం! పిచ్చి వుత్సాహం! ఒక రోజు పొద్దున చద్దన్నాల రేవు కాగానే మొత్తం ముఠా ముఠా నిజానిజాలు తేల్చుకోడానికి వూరిమీద పడ్డాం. బాపట్ల మా తాతగారి వూరు. ఆ రోజుల్లో సంవత్సరానికి నాలుగు నెలలు బడిసెలవులుండేవి కదా! ఒక్క రోజు వృధా కాకుండా ఎక్కడెక్కడినించో అందరం వచ్చి వాలేవాళ్లం. కుడి ఎడమలుగా ఒకే సైజు మనవళ్ళం ఆరుగురం వుండేవాళ్లం. తాతగారి వూరు మాకు కొట్టిన పిండి. చెరిగిన చేట. ఇంకో నలుగురు పిల్లల్ని పోగేసుకుని బయలుదేరాం. మున్సిపల్ గ్రౌండ్స్‌లో రంగుల డేరా విచ్చుకుంటూ కనిపించింది. మా ఆనందానికి అవధులు లేవ్. డేరా దగ్గరికి చేరేసరికి మాది పదిమంది గుంపయింది. అక్కడ నేలలో పెద్దపెద్ద ఇనప శీలలు దిగ్గొడుతూ మోకులు బిగిస్తూ చాలామంది కనిపించారు. ‘ఒరే వీడేరా బఫూను, వీడు రింగుమాష్టరు, వీడు…’ అని కేకలేస్తూ కనిపించిన మమ్మల్ని తరిమేశారు. దాన్ని మేం చిన్నతనంగా ఏమాత్రం భావించలేదు. డేరా బయట ఒంటెల్ని చూశాం. పెద్ద వలలో వున్న కోతుల్ని పలకరించాం. ఎలుగుబంటి మీద మా వాడెవడో చిన్న రాయి విసిరాడు. అక్కణ్ణించి తరిమివేయబడ్డాం. దులిపేసుకుని బోనులో వున్న సింహాన్ని చూశాం. పులి, నీటిగుర్రం కూడా వున్నాయనీ అవింకా రాలేదనీ స్పష్టమైన సమాచారం సేకరించాం. రెక్కలు తెగిన పక్షిలా అక్కడో జీపు ఆగివుంది. ‘ఇదేరా జంపింగ్ జీప్!’ అని నలుగురొకేసారి అరిచేసరికి, అక్కడ నిద్ర పోతున్న పిల్లలు లేచి ఏడుపు లంకించుకున్నారు. ఈసారి ఆడవాళ్లు మళయాళంలో మమ్మల్ని కసురుకున్నారు.

ఓ పక్కన వంటలైపోతున్నాయ్. అంటించాల్సిన మైదా వుడుకుతోంది. మరో మూల గడ్డిమంట మీద డప్పులు వేడి పెడుతున్నారు. మా శీనుగాడు గుర్రం తోకలోంచి వెంట్రుక పీకే ప్రయత్నం చేశాడు. గుర్రం ఒక్కసారి తుళ్లిపడి భయంతో సకిలించింది. అంతే! మున్సిపల్ గ్రౌండ్స్ హద్దులు దాటేదాకా తరిమారు. బతుకు జీవుడా అని బయటపడ్డాం. ఇహ మాకు అవే కబుర్లు. ఎవడి అనుభవాలు వాడు తవ్వుతున్నాడు. బావిలో సైకిలు, మోటారు సైకిలు తొక్కే ఫీట్ వుందో లేదో తెలుసుకోలేకపోయాం. రాత్రిపూట డేరా లైటు ఆకాశంలోపడి తిరుగుతుందో లేదో కూడా తెలియలేదు. రెండు రాత్రిళ్లు మాకు అవే కలలు. పాపం! ఓ పిల్లాడు వుయ్యాల మీంచి వుయ్యాలకి మారుతూ గురి తప్పాడు. గ్యాలరీలోకొచ్చి నామీద పడ్డాడు. పెద్ద కేకతో లేచాను. ఇల్లంతా లేచింది. తలో మాటా అన్నారు. కాళ్లు కడిగించి, నీళ్లు తాగించి మళ్లీ పడుకోపెట్టారు.

మూడో రోజుకల్లా సర్కస్ ఆట మొదలైపోయింది. ఆ రోజు పొద్దుటే వూళ్లోకి వూరేగింపు వచ్చింది. ఒక ఏనుగు, దాని పక్కన గున్న ఏనుగు, నాలుగు ఒంటెలు, నాలుగు గుర్రాలు వూరేగింపులో పాల్గొన్నాయ్. డప్పులు, బ్యాండ్ మేళం దుమ్ము లేపుతున్నాయ్. ఇద్దరు మనుషులు వెదురు గడలమీద కరెంటు స్తంభం ఎత్తున పొడుగాటి చారల పైజమాలతో నడుస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. జీప్ నిండా కోతులు కొలువు తీరి వున్నాయ్. నిదానంగా కోతుల జీపు వూరేగింపులో నడుస్తోంది. మైకుల్లో మధ్యమధ్య జైభారత్ సర్కస్ గురించి, వింతలూ విడ్డూరాల గురించి అరుస్తూ చెబుతున్నారు. గులాములు కొట్టుకుని బఫూన్ టోపీలు పెట్టుకున్న ఇద్దరు గడపోటు వేసుకుంటూ ఒంటె మీంచి గుర్రం మీదికి, అట్నించి ఏనుగు మీదికి జంప్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు. వూరేగింపు బాపట్ల మెయిన్ రోడ్లన్నీ చుడుతోంది.

ఆ రోజునించే సర్కస్ మొదలు. రోజుకి రెండాటలు! మాకు గంగవెర్రులెత్తుతున్నాయ్. కుర్చీ, గ్యాలరీ రెండు తరగతులున్నాయ్. కుర్చీ టిక్కెట్ రూపాయ్, గ్యాలరీ అర్ధ రూపాయ్. పిల్లల హడావిడి చూసి, మా తాతగారు సర్కస్ టెంట్ల మీద బడిపెట్టారు. “మీకు తెలియదు, సర్కస్ డేరాకో నీతి నియమం వుంది. ఏది ఏమైనా, మిన్నొచ్చి మీదపడ్డా సర్కస్ ఒక్క రోజు కూడా ఆగడానికి లేదు. పొన్నూరులో సర్కస్ పది రోజులు ఆడుతుంది. అప్పుడే మన బాపట్లలో టెంట్ వేయడం మొదలవుతుంది. అవీయివీ ఒక్కొక్కటే రావడంతో ఇక్కడ ఆటలు మొదలవుతాయ్. పొన్నూరులో చివరి అయిదు రోజులు కొన్ని ఫీట్లుండవ్. అన్నీ పూర్తిగా రావడానికి అయిదు రోజులు టైమ్ పడుతుంది. మన బాపట్లలో పది రోజులు కాగానే డేరా ఒకటి చీరాలకు వెళ్తుంది. అందుకని సర్కస్‌కెప్పుడూ వారం గడిచాక వెళ్లాలి. ఆ కంపెనీవాడిదగ్గర రెండు డేరాలు సిద్ధంగా వుంటాయ్, తెలిసిందా?” అనగానే మా ప్రాణం లేచొచ్చింది. ఆ బడికి అంత త్వరగా గంట కొడతారని మేమెవ్వరం అనుకోలేదు.

ఇదిలా వుండగా, సర్కస్ జీపు మా వాకిట్లో వచ్చి ఆగింది. ఇద్దరు దిగి లోపలికి వచ్చారు. మా తాతగారి వాకిట్లో కనిపిస్తూ అయిదు కొబ్బరి చెట్లున్నాయ్. ‘ఒంటెల తిండికోసం కొబ్బరి మట్టలు ఇస్తారా, కొట్టుకు పోతాం?’ అని అడిగారు. వాటికిగాను ఆరు కుర్చీ టిక్కెట్ పాస్‌లు యిస్తామన్నారు. మా తాతగారు నాలుగు కుర్చీ, ఆరు గ్యాలరీ పాస్‌లయితేనే చెట్లెక్కమన్నారు. సరేనని చెట్లెక్కి మొవ్వాకు తప్ప మరో మట్ట లేకుండా చేశారు. మొత్తం ఒంటెల వీపుల మీద కట్టుకుని కదిలారు. అన్నప్రకారం పాస్‌లు ఎప్పుడైనా చెల్లే విధంగా యిచ్చారు. మా మనసులు కుదుటపడ్డాయ్. ఇక వెళ్లడం తరువాయి.

మేం రోజులు లెక్కపెట్టుకుంటూ ఎలాగో నాలుగురోజులు గడిపాం. ఆఖరికి నీటిగుర్రం కూడా పాత డేరా నించి వచ్చేసిందని తెలిశాక తాతగారు మమ్మల్ని వదిలారు. అసలు స్పెషల్ పాస్ వాళ్ళకక్కడ చాలా గౌరవం వుంటుందనుకున్నాం గాని అదేం లేదు. మున్సిపల్ వుద్యోగులు, కరెంటువాళ్లు, పోలీసులు, ఇంకా బోలెడుమంది ఫ్రీ పాస్‌లతో వస్తారట. అందుకని పాస్‌ల వాళ్లని అస్సలు ఖాతరు చెయ్యరు. ఏదైతేనేంగానీ మా కొబ్బరి మట్టల ముఠా సర్కస్‌ని యమాగా ఆనందించింది. ఆట వదిలాక రెండో ఆట కోసం డేరా మీద తిప్పే లైటుని పూర్తిగా గమనించాక ఇంటిదారి పట్టాం. దారి పొడుగునా సర్కస్ ముచ్చట్లు తనివితీరా చెప్పుకున్నాం. మా ముఠాలో ఒకరిద్దరికి సర్కస్ ఫీట్ల మీద కొన్ని డౌట్స్ వున్నాయ్. అందుకని మళ్లీ ఓసారి రావాలని అనుకున్నాం గాని కొబ్బరి మట్టలు ఎప్పటికి పెరిగేను? సర్కస్ మాట ఎట్లావున్నా, డేరాకెళ్లి ఏనుగు లద్దె తొక్కిరావాలని మాత్రం గట్టిగా అనుకున్నాం. దానివల్ల ఎంత బలమొస్తుందో చంద్రం చూసినట్టే చెప్పాడు.

ఉన్నట్టుండి సర్కస్ సింహం చచ్చిపోయిందనే వార్త బాపట్లంతా నిండిపోయింది. ఏ నోట విన్నా ఇదే మాట. ఆదుర్దాగా వెళ్లాం. నిజమే. సింహాన్ని లారీ మీదికి ఎక్కిస్తున్నారు. మున్సిపల్ గ్రౌండ్స్ జనంతో కిక్కిరిసిపోయింది. నిలబడే చోటు కూడా లేదు. మేం ఎలాగో బయటపడ్డాం.

మధ్యాన్నానికి సింహం శవయాత్ర మొదలైంది. లారీలో ఏటవాలుగా బల్ల బిగించి దాని మీద సింహాన్ని పడుకోపెట్టారు. పూలదండ వేశారు. సర్కస్‌లో వున్న ఆడ మగ పిల్లాజెల్లా లారీ వెంట నడిచారు. నీరసంగా బ్యాండ్ మేళం మోగుతోంది. పాపం, నిన్నగాక మొన్ననే కదా చూశాం! ప్రతి షోలో దానివంతు వచ్చినప్పుడు బోను చక్రాల మీద రింగులోకొస్తుంది. రింగ్ మాస్టర్ తలుపు తీసి బోనులోంచి సింహాన్ని దింపుతాడు. రింగ్‌మాస్టర్ తన మెడలో హంటర్‌ని తీసి ఝుళిపిస్తాడు. సింహం వులిక్కిపడుతుంది. పిల్లిలా అయిపోతుంది. రింగ్‌మాస్టర్ మెరిసే దుస్తుల్లో నల్ల కళ్లద్దాల్లో ప్రత్యేకంగా కనిపిస్తాడు. సింహాన్ని రింగులో రెండుమూడుసార్లు నడిపించి ప్రేక్షకులకి ప్రదర్శిస్తాడు. తర్వాత సింహం ముందుకాళ్లు తన అరిచేతుల్లో పెట్టుకుని వెనక కాళ్లమీద నడిపిస్తాడు. మాస్టర్ జూలు మీద చెయ్యి వెయ్యగానే సింహం నోరంతా తెరిచి గర్జించేది. అప్పుడు టెంట్‌లో లైట్లారిపోతాయ్. సింహం మీద స్పాట్‌లైట్ పడుతుంది. తగినట్టు బ్యాండు మోగుతుంది. అంతా అయాక సింహాన్ని వొళ్లంతా నిమిరి ఓ కుందేలుని దాని నోటికి అందిస్తాడు. దాన్ని కరుచుకుని సింహం బుద్ధిగా బోనులోకెళ్లిపోయేది. ఇహ డేరా అయిదు నిముషాలు చప్పట్లతో యీలల్తో దద్దరిల్లిపోతుంది. ఇప్పుడా సింహం శవమై వూరేగుతోంది. దారుణం!

కొట్టాయం నించి సర్కస్ యజమాని నంబియార్ వచ్చి వాలాడు. అడ్డపంచె మీద సిల్కు చొక్కా, దాని మీద జారిజారిపోతున్న సిల్కు వుత్తరీయం, వేళ్లనిండా వుంగరాలు, సగం మొహాన్ని మింగేస్తున్న నల్లద్దాలతో లారీ వెనక నడుస్తున్నాదు. హంటర్ మెడలో వేసుకుని లారీలో సింహం పక్కన నిలబడి రింగ్‌మాస్టర్ తలవంచి అందరికీ అభివాదం చేస్తున్నాడు.

వూరివారు కూడా వూరేగింపు వెనక నడుస్తూ సింహం మాటలే మాట్లాడుకుంటున్నారు.

‘ప్చ్… ఎంతటి సింహమైనా ఆ కొర్రగింజంతా వున్నంత వరకే. అది కాస్తా పోయాక ఒఠి తోలుబొమ్మే!’

‘ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో… పాపం, ఆఖరి కళ్లం యిక్కడ రాసిపెట్టుంది…’

‘వేరే సర్కస్ కంపెనీ దగ్గర పదేళ్లనాడు కొన్నార్ట. వీటికి ట్రయినింగులు అందరూ యివ్వలేరుట. ఇచ్చిన వాటినే కొంటార్ట. ఏంటో, అదో ప్రపంచం!’

‘చూశారా, క్షణభంగురం! ఫస్ట్ షోలో కూడా నోరంతా తెరిచి గర్జించిందిట. రెండో ఆటకి బోను తెరిచేసరికి చచ్చిపడివుందిట. అనాయాస మరణం! అదృష్టం…’

దారి పొడుగునా షాపుల షట్టర్లు మూసేశారు. కొందరు లారీ ముందు కొబ్బరికాయలు కొట్టారు.

గడియార స్తంభం సెంటర్లో గానుగ వీరాస్వామి ఇద్దరి సాయంతో లారీ ఎక్కాడు. గులాం కొట్టుకుని సింహం పక్కన నిలబడ్డాడు. వెంటనే జిందాబాద్‌లు, వర్ధిల్లాలి నినాదాలు చెలరేగాయ్. వీరాస్వామి మున్సిపల్ వార్డు మెంబరు. సముద్రానికి వెళ్లే దారిలో రోడ్డు పక్క పోరంబోకులో సింహాన్ని గుంటపెట్టడానికి పర్మిషన్ యిప్పించింది ఈయనే కావడం వల్ల యీ జిందాబాదుళ్లు. చాలామందికి జరగనంత వైభవంగా సర్కస్ సింహం అంతిమ యాత్ర సాగింది.

టౌనుకు దూరంగా రోడ్డువార అనుకున్న చోట గొయ్యి సిద్ధంగా వుంది. వూరేగింపు అక్కడికి చేరింది. అందరూ కలిసి వుపాయంగా సింహాన్ని గోతిలోకి దింపారు. శ్రద్ధగా పడుకోబెట్టారు. సర్కస్‌వాళ్లు గోతి చుట్టూ నిలబడి ప్రభువు ప్రార్థన చేశారు. మళయాళంలో ఏమో మాటలన్నారు.

రింగ్‌మాస్టర్ మెడలో హంటర్ తీసి, పెద్ద ధ్వనితో ఝుళిపిస్తూ తను షోలో అరిచే అరుపు అరిచాడు. ఒక్కసారి… రెండుసార్లు… మూడుసార్లు… ఇక హంటర్ కిందపడేసి బావురుమన్నాడు. చేతుల్లో మొహం కప్పుకుని నా రాజు చచ్చిపోయాడంటూ గోలగోలగా ఏడ్చాడు. అంతా రింగ్‌మాస్టర్‌ని ఓదార్చారు. యజమాని నంబియార్‌తో మొదటి పిడికెడు మట్టి వేయించారు.

ఆ రోజు సర్కస్ డేరా ఆటలు లేక నిలిచిపోయింది. మొదటిసారి సర్కస్ డేరా ఆగింది!

సింహం పని చివరిదాకా చూసి, మేం ఇంటికి చేరాం. తాతగారు మాకోసం బయట గేట్లో కాపు కాస్తున్నారు. “నాకేం చెప్పద్దు. పదండి…” అంటూ బావి గట్టుకు తోలుకుపోయి లాగుచొక్కాలమీదే నీళ్లు తోడించి పోయించారు. ఏవిఁటో పరమ చాదస్తం!

తర్వాత ఏ సెలవలకు వచ్చినా సింహాన్ని గుర్తుచేసుకుంటూ ఆ వైపు వెళ్లొస్తుండేవాళ్లం. వూరివాళ్లక్కూడా అది బాగా గుర్తే. కొన్నాళ్లకి ఆ దిబ్బ మీద ఏదో అడవి మొక్క పడి మొలిచింది. మొక్క మానుకట్టింది. అది మొక్కగా వున్నపుడు దాని ఆకుల్ని, చిగుళ్లని మేకలు కూడా ముట్టుకునేవి కావుట! ‘భయం. అడుగున సింహం వుంది కదా!’ అనుకునేవారు. కొంచం పెరిగి పెద్దయాక దానికో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు దాన్నందరూ ‘సింహం చెట్టు’ అని పిలుస్తారు.
--------------------------------------------------------
రచన: శ్రీరమణ, 
ఈమాట సౌజన్యంతో

Monday, December 9, 2019

అసలేం చేశానని?!


అసలేం చేశానని?!
సాహితీమిత్రులారా!


ఎండిన కొమ్మల్ని కాస్త కత్తిరించి
కాసిన్ని నీళ్ళు మొదల్లో చిలకరించి
అడ్డగోలుగా చాచే చేతుల్ని ఒద్దికగా
ఒక దగ్గరకు చేర్చడం తప్ప
అసలేం చేశానని?!

నీ పచ్చని నవ్వుల నాట్యం
మొగ్గలు తొడిగే కొమ్మ చివర్లు
ప్రసరించే రంగుల మేళవింపు
నేల గుండెపై పసిపాదాల తప్పటడుగులను
గుర్తు చేస్తే, మళ్ళీ అదే ప్రశ్న-
అసలేం చేశానని?!

ఇదిగో ఇక్కడే నీ మొదళ్ళున్నాయని
కాసిన్ని నీళ్ళు చల్లి పలకరిస్తే
ఏమీ పట్టనట్లు, పట్టించుకోనట్లు,
ఆకాశాన్నంటాలని ఆదుర్దాగా ఎదుగుతూ,
ఇంక నీతో పనేముందన్నట్లు తలెగరేశావే-

అసలు నేనేం చేశానని?!
-------------------------------------------------
రచన: కె. వి. గిరిధరరావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, December 7, 2019

ఆకాశ వంతెన 1


ఆకాశ వంతెన 1

సాహితీమిత్రులారా!


నేను రైలు దిగగానే కనబడిందా వంతెన.

దూరంగా రెండు కొండల మధ్యనుందది. ప్లాట్‌ఫామ్ మీదనుంచి చూస్తే ఆకాశంలో ఉన్నట్టు కనబడింది.

నేను వెళ్ళాల్సిన చోటు పేరు ‘ఎద్దు పడిన లోయ.’ మూడు సామ్రాజ్యాల చరిత్ర కథలో [1]ముగ్గురు రాజులుంటారు. ఆ ముగ్గుర్లో ల్యూ పే అనే రాజు దగ్గిర పంగ్ టోంగ్ అనే సేనాని ఉంటాడు. పంగ్ టోంగ్‌కే అగ్నిపక్షి అని ఇంకో పేరు. మూడు సామ్రాజ్యాల చరిత్రలో ఈ పంగ్ టోంగ్ తన సైన్యాన్ని ఒక చోటుకి నడిపించి అక్కడ ఓటమికి గురవ్వడమే కాకుండా తన ప్రాణాల్నే పోగొట్టుకుంటాడు. ఇప్పుడా చోటును ‘అగ్నిపక్షి కూలిన వాలు’ అని పిలుస్తారు. మా అమ్మ ఎద్దు సంవత్సరంలో పుట్టింది. ఆవిడ ఎద్దు పడిన లోయలో చనిపోవడం కాకతాళీయమో కాదో. రైల్లో ఈ విషయం గురించే ఆలోచించాను గానీ నా ఆలోచన పూర్తయ్యేలోపలే నేను దిగాల్సిన చోటొచ్చేసింది.

నాతో పాటు రైలు దిగిన వాళ్ళందరిలో నేను విలక్షణంగా కనబడుండాలి. ఎందుకంటే ఈ స్టేషన్లో దిగిన వాళ్ళందరూ సంత నుంచి తిరిగి వస్తున్న రైతులే. అందరి తలల మీదా రెల్లు టోపీలు, భుజాల మీద కావడి బద్దలు కనబడ్డాయి. కావడి బద్దలకి ఒక కొసన ఖాళీ సంచులున్నాయి. సిటీ నుంచొచ్చింది నేనొక్కణ్ణే. ఈ సంగతి గమనించగానే, అప్పుడే పెట్టుకున్న చలువ కళ్ళద్దాలు తీసేశా. మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రతకి కళ్ళు మిరుమిట్లుగొలిపి కళ్ళకి చెయ్యడ్డం పెట్టుకున్నా. అదుగో, అలా కళ్ళకడ్డం పెట్టుకున్న చేతి వేళ్ళమధ్యనుంచి కనబడిందా వంతెన మొదటిసారిగా.

ఆ వైపుగా ప్లాట్‌ఫామ్ చివరకి నడిచాను. నా ఛాతీ ఎత్తున్న రాతిగోడ ఉందక్కడ. గోడకవతలి పక్కనో లోయ. ఓ ఐదారువందలడుగుల లోతుంటుందేమో. గోడ మీదకు వంగి లోయ అడుక్కు చూశాను. చిన్నా పెద్దా గుండ్రాళ్ళు తప్పించి నీళ్ళు కనబడలేదు. ఒకప్పుడు నీళ్ళుండేవేమో తెలీదు. ప్రస్తుతం మాత్రం నీటి చాయల్లేవు. రెండు శిఖరాల మధ్యనుందా వంతెన. ఎదురుగా కనబడుతూ, తల ఎత్తి చూడాల్సినంత ఎత్తుగా ఉంది. కొండమీంచి క్రిందకి కాలిబాటొకటి అస్పష్టంగా కనబడుతుంది. గడ్డిలో మెట్లు మెట్లుగా క్రిందికి దిగి, క్రిందనున్న బండరాళ్ళని దాటి వంపు తిరిగి రెండవ కొండ మీదికి మెట్లు మెట్లుగా సాగింది. వంతెన కొండచరియను తాకుతున్న చోట ఒక పెద్ద స్థూపం లాంటి కట్టడం కనబడుతోంది. ఎవరి జ్ఞాపకార్థమో కట్టుండవచ్చు. ఆ వంతెన నిజంగా ఆకాశంలో ఉన్నట్టుందన్న సంగతి అప్రయత్నంగా స్ఫురించింది.

“ఎవరండీ అదీ? ఏం చేస్తున్నారక్కడ?” వెయిటింగ్ రూమ్ బయట నుంచున్న ఒక వ్యక్తి గట్టిగా కేక పెట్టాడు. కాసేపట్నించీ నన్నే గమనిస్తున్నాడల్లే ఉంది. ఏమనాలో తెలీలేదు. “జాగ్రత్త!” నా వైపు చూపుడువేలు సారించి మళ్ళీ తనే మాట్లాడాడు, “ఇంతకుముందు అక్కడ నుంచే కొందరు క్రిందకి పడ్డారు. రెండు నెలల క్రితమే ఒక అబ్బాయి పడ్డాడు. బుర్ర చితికిపోయింది.”

నాకు అతనితో చెప్పాలనిపించింది. ఆ అబ్బాయొక్కడే కాదు… ఇరవయ్యేడు సంవత్సరాల క్రితం ఒకావిడ కూడా ఇక్కడే చచ్చిపోయిందని. ఎద్దు సంవత్సరంలో పుట్టినావిడ. కాకపోతే అదే సమయంలో గుర్తుకొచ్చింది నాకు… నేను పుట్టింది కూడా ఎద్దు సంవత్సరంలోనేనని. ఔను. నేను పుట్టింది పంతొమ్మిదివందల ముప్పైఏడులో. పంతొమ్మిదివందల యాభయ్యేడుకి నాకు ఇరవయ్యేళ్ళు.

వెయిటింగ్ రూమ్ బయట నిలబడి కేకలు పెట్టిన వ్యక్తి స్టేషన్ మాస్టరని తరవాత తెలిసింది. నేనతని దగ్గరికి నడిచి స్టేషన్ మాస్టరెక్కడుంటాడని అడిగేను. ఆ వ్యక్తి నా వంక నింపాదిగా చూసి, “ఎందుకు?” అన్నాడు.

“ఏదో కుటుంబ విషయం,” అన్నాను.

“అలాగా! ఐతే చెప్పండి. స్టేషన్ మాస్టర్ని నేనే.”

జేబులోంచి కర్చీఫు తీసి నుదురు తుడుచుకుని, “అబ్బ, చాలా వేడిగా ఉందిక్కడ,” అన్నాను.

“ఉండదూ మరీ,” గొంతులో వ్యంగ్యం తొంగిచూస్తుండగా అన్నాడతను. “మీరు వేసవి విడిదికోసం వెతుకుతూ దారితప్పి ఇక్కడ దిగారు కాబోలును. వేసవి విడిది కావాలంటే చింగ్ డావ్‌[2] వెళ్ళాలి.”

అతనన్నది నిజమే. నేనిక్కడకి వేసవి విడిది కోసం రాలేదు. మా అమ్మ సమాధిని వెతకడానికి వచ్చేను. కానీ, ఆ సంగతి చెప్పడానికి చాలా ఓపిక కావాలి. ఎందుకంటే నేనా సంగతి చెప్పగానే, విన్నవాళ్ళు మా అమ్మ సమాధి ఇలాంటి చోట ఎందుకుందీ అంటారు మొదట. అదో పెద్ద కథ. నేనది చెప్పేసరికి, వాళ్ళింకో ప్రశ్నడుగుతారు. ‘మీ అమ్మ తెల్లగుర్రపు సరస్సుకు బయల్దేరింది నిన్ను చూడ్డానికన్నావు కదా, అసలు నువ్వు తెల్లగుర్రపు సరస్సులో ఏం చేస్తున్నావ్?’

చచ్చాను. అదింకో పెద్ద కథ.

ఈ కథన్నేను గత రెండు రోజులుగా చెప్పుకొస్తున్నాను. నిన్న నాన్ జింగ్‌లో. మొన్న బాంపూఁలో. అసలు మా ఫాక్టరీలో సెలవు కోసం అడిగినప్పుడెన్నిసార్లు చెప్పాల్సి వచ్చిందో! ఈ కథనిలా చెప్పుకుంటూ పోతే ఏదోక నాటికి నేను కథలు చెప్పడాన్ని వృత్తిగా చేసుకోవచ్చు.

2
కొంతకాలంపాటు నా కథనెవరికన్నా చెప్పడానికి నాకు విముఖత ఉండేది కాదు. నాకైతే అందులో సిగ్గుపడాల్సిన విషయమేం కనబడేది కాదు. కాకపోతే నా కథ విన్నవాళ్ళకలా అనిపించేది కాదు. నిజానికి మా కాలేజీ స్టూడెంటైతే నా మొహమ్మీదే అన్నాడు, నాకు తగిన శాస్తి జరిగిందని. అతగాడి ఉద్ధేశ్యం అదంతా నేను కోరి తెచ్చిపెట్టుకున్నదేనని.

పంతొమ్మిదివందల యాభయ్యేడులో నాకిరవయ్యేళ్ళు. అప్పట్లో నేను డాషిన్ మెషీన్ ఫాక్టరీలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు మా వర్క్‌షాప్ డైరెక్టర్ నా దగ్గరకొచ్చాడు, నోట్లో సిగరెట్టుతో సహా. “వాంగ్ బావ్! నువ్వు మన ఫాక్టరీ యాజమాన్యానికి వాళ్ళ లోటుపాట్ల గురించి చెప్పాలి.”

లోటు పాట్ల గురించి నేను చెప్పవల్సిందేం లేదన్నాను.

“ఈ ఫీడ్ బాక్ కావాలని ప్రభుత్వమే అడుగుతుంది[3],” అన్నాడతను. “నువ్వు మిగతావాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి. దీనికి పెద్దగా చేయాల్సిందేం లేదు. ముందు నువ్వు చెప్పదల్చుకున్న దాన్ని పెద్ద అక్షరాలతో ఒక పోస్టర్‌లా తయారు చేసి నోటీస్ బోర్డ్‌లో పెట్టు. తరువాత కొద్ది నిముషాలపాటు చిన్న ఉపన్యాసమివ్వు.”

“నాకు పని బాగా ఎక్కువగా ఉంది. అస్సలు టైమ్ లేదు.”

“అలాక్కుదరదు. అసలే నువ్వు మీ ప్రొడక్షన్ టీముకి లీడరువి. ఆ సంగతి మర్చిపోతున్నావులా ఉంది.” సిగరెట్టుని నా మెషీన్ మీద రుద్ది ఆర్పుకుని బయటకి నడిచాడు మా డైరెక్టర్.

నేనతగాడు చెప్పినట్టే చేశాను. ఎందుకంటే, మా డైరెక్టరన్నట్టుగానే నేను మా ప్రొడక్షన్ టీముకి లీడర్ని. కమ్యూనిస్ట్ యువతలో సభ్యుణ్ణి. పై పెచ్చు, మా ఫాక్టరీ ఫుట్‌బాల్ టీములో సెంటర్ ఆడేవాణ్ణి. ప్రతీ సోమ, బుధ, శుక్ర వారాలు నైట్ స్కూల్లో మెషీన్ డ్రాయింగూ, రష్యనూ నేర్చుకునేవాణ్ణి కూడా! ఆ రోజుల్లో, నేను ఏదోరోజున రష్యన్ ఇంజినీర్లతో ముఖాముఖీ మాట్లాడుతానని కలలు కనేవాణ్ణి. ఇప్పుడు, ఒకటి రెండు ముక్కల రష్యన్ తప్ప మిగతాదంతా మర్చిపోయేను.

మళ్ళీ మళ్ళీ అడిగించుకోకుండా ఉండాలని, నేను కోటాను మించి ఏడు పేజీల పోస్టర్ తయారుచేశాను. వర్క్‌షాప్ మీటింగ్‌లో రెండు గంటలసేపు మాట్లాడేను. నిజానికి నేనంతసేపు మాట్లాడేనంటే అది నాకు ఎలా మాట్లాడాలో తెలీకపోవడం వల్ల మాత్రమే. నేనదే చెప్తే, చాలా తెలివైన సాకు చెబుతున్నానన్నారు నన్ను ఇన్వెస్టిగేట్ చేసిన అధికార్లు. కానీ నిజం మాత్రం ఇదే. వేదికలెక్కి ప్రసంగించే అలవాటు ఉన్నవాళ్ళు ఒక పద్ధతి ప్రకారం తాము చెప్పదల్చుకున్నదాన్ని సూటిగా స్పష్టంగా చెప్తారు. నేనెప్పుడూ అలా ప్రసంగాలిచ్చిన వాణ్ణి కాదు. నా దగ్గిర వాచ్ కూడా లేదు. నేనెంతసేపు మట్లాడుతున్నానో నాకెలా తెలుస్తుంది?

నా ‘ఉపన్యాసం’ రోజున నేను గుర్తుపెట్టుకుని కొత్త యూనిఫామ్ వేసుకున్నాను. ముందుగానే తయారుచేసుకున్న ప్రసంగాన్ని చాలాసార్లు జాగ్రత్తగా మననం చేసుకున్నా. అయితే, స్టేజీ ఎక్కి నేను ‘గుడ్ ఆఫ్టర్‌నూన్, కామ్రేడ్స్!’ అన్నానో లేదో క్రింద కూర్చున్న నా టీమ్‌మేట్లందరూ ఏకకంఠంతో ‘గుడ్ ఆఫ్టర్‌నూన్, వాంగ్ బావ్!’ అని చిలిపిగా సమాధానమిచ్చారు. దాంతో నా బుర్రంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. స్టేజీ దిగిన తర్వాత నా ఉపన్యాసంలో ఒక్క ముక్క కూడా నాకు గుర్తులేదు. నేను మా డైరెక్టర్‌ను అడిగాను ఎలా మాట్లాడేనని.

“బాగానే మాట్లాడేవు గానీ, మీ నాన్న రిక్షా లాగుతాడనీ, మీ అమ్మ పాచి పని చేస్తుందనీ చెప్పాల్సిన అవసరమేమొచ్చింది?” అన్నాడు ఆయన.

కాలేజీ స్టూడెంటు ఈ కథని విన్నప్పుడు మంచంలో పడుకున్నవాడల్లా ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. ఆ రాత్రి చాలా చలిగా ఉంది. మా రూము బయట నీటి కుంట పూర్తిగా గడ్డ కట్టుకుపోయేంత చలిగా ఉందా రాత్రి. అంత చలిలోనూ, వాడు తను కప్పుకున్న కంబళీ విసిరేసి తన ఊచకాళ్ళతో నా మంచం దగ్గరకి పరుగెత్తుకొచ్చాడు. “నాలుగు ముక్కలు వ్రాయమంటే ఏడు పేజీలు వ్రాశావు. రెండు నిముషాలు మాట్లాడమంటే రెండు గంటలు మాట్లాడేవు. నన్నడిగినా కూడా నీకు సోషలిజమంటే ద్వేషమనే చెప్తాను. నీకు తగినశాస్తి జరిగింది,” అన్నాడు.

“నీక్కూడా తగినశాస్తే జరిగింది,” అన్నాన్నేను. దాంతో వాడు నా మంచం ముందు ఒక్క క్షణమాగి వాడి మంచానికి తిరిగి వెళ్ళేడు. తలనిండా కంబళి ముసుగేసి మళ్ళీ మాట్లాడలేదు వాడు.

వాడు మారు మాట్లాడకపోవడానికి కారణం నేనన్నది నిజం కావడమే. నిజానికి నా విషయంలో కంటే వాడి విషయంలోనే ‘తగిన శాస్తి’ అన్నమాట నిజం. అంతేకాక వాడు పనిచేసే ప్రొడక్షన్ టీముకి నేను లీడర్ని. వాడు నా సహాయం లేకుండా బ్రతకలేడు. పోయినసారి కోతల సమయంలో, మా కోటా 10 టన్నులైతే వాడు 6 టన్నులకే చేతులెత్తేసేడు. మిగిలిన నాలుగు టన్నులూ నేను పూర్తిచేశాను.

“ఒరే బచ్చాగా! నువ్వు ఈపాటి బరువు కూడా మొయ్యలేవు. అసలు నువ్వు చెయ్యగలిగిన పనేమన్నా ఉందా?” అని ఎగతాళి చేశాన్నేను వాణ్ణి.

వాడు అప్పుడే నూర్చిన ధాన్యపు కుప్ప మీద వెల్లికిలా పడుకుని, వగరుస్తూ, “నువ్వు మనుషుల్ని వాళ్ళ శరీరాల్ని బట్టి అంచనా వేయడం మంచిది కాదేమో. ఏదోరోజు నీకు నా అవసరం కలక్కపోదు,” అన్నాడు.

తరవాత్తరవాత వాడు నిజంగానే నాకు చాలా సహాయం చేశాడు. వాడు నాకు ముగ్గురాడవాళ్ళని పరిచయం చేశాడు. ఆ ముగ్గురిలో ఒకావిడ ఇప్పుడు నా భార్య.

నేను అలా స్టేజీ మీద నవ్వులపాలైన కొద్ది నెలలకు యాంటీ రైటిస్ట్ మూవ్‌మెంట్ మొదలయ్యింది. దాంతో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అందరూ నా మీద పోస్టర్లు వ్రాయడం, నన్ను తిట్టడం మొదలుపెట్టేరు. అయితే, నేను కార్మికుణ్ణవ్వడం వల్ల నాకు రైటిస్ట్ అనే ముద్ర వేయడం కుదరలేదు. అయినా వాళ్ళు నన్ను యాంటీ సోషలిస్ట్‌గా పరిగణించడం మొదలయింది. కొంతకాలానికి మా ఫేక్టరీ వాళ్ళు నన్ను లేబర్ ఎడ్యుకేషన్ కేంప్‌కి పంపించడానికి నిర్ణయించారు. ఆ కేంప్ ఉన్నది తెల్లగుర్రపు సరస్సు ఫార్మ్‌లో.

నేను కేంపుకి బయల్దేరినప్పుడు మా వర్క్‌షాప్ డైరెక్టర్ నన్ను గేటుదాకా సాగనంపేడు. నా భుజం తట్టి, “వాంగ్ బావ్! నువ్వు కష్టపడి పనిచెయ్యి. వయసులో ఉన్నవాళ్ళకు ఇలాంటి చిన్న చిన్న ఎదురుదెబ్బలు ఒక లెక్కలోకి రావు. నువ్వు ఆ గ్రామాల్లో ఒక రెండు సంవత్సరాలు కష్టపడి పనిచెయ్యి. తిరిగి రా. నేను నీ మెషీన్‌ని మళ్ళీ నీకే అప్పగిస్తాను,” అని ధైర్యం చెప్పేడు. అతను మాట్లాడిన తీరు నేను లేబర్ ఎడ్యుకేషన్‌కి కాక సైన్యంలో చేరడానికి వెళుతున్నట్లుగా ఉంది.

అతనే కాదు. మా నాన్నా నేనూ కూడా లేబర్ ఎడ్యుకేషన్ అంటే తేలిగ్గానే తీసుకున్నాం. మేం చాలా పేద కుటుంబం నుంచి వచ్చినవాళ్ళం. కాయకష్టం చేసుకు బ్రతకడానికి అలవాటు పడ్డవాళ్ళం. ఫేక్టరీలో పనిచేయడమన్నా పొలాల్లో పనిచేయడమన్నా ఒకటే మాకు. పై పెచ్చు, మేమసలు ఉత్తర జాన్‌సూ నుంచి వచ్చినవాళ్ళమే. యుద్ధం వల్లనే మేము షాంగ్‌హాయ్‌కి మారిపోయాం.

మేం షాంగ్‌హాయ్ వచ్చింది పంతొమ్మిదివందల నలభయ్యెనిమిదిలో. ఆ తర్వాత రెండేళ్ళకి షాంగ్‌హాయ్ ఒక తీవ్రమైన తుఫానుకి గురయ్యింది. ఒక పక్క తుఫానూ, మరో పక్క వరదలూ! దాంతో మేమంతా మళ్ళీ మా స్వస్థలం ఉత్తర జాన్‌సూకి పారిపోయాం. అప్పటికి నాకు పదమూడేళ్ళు. పొలంలో ఏ పనన్నా చేయగలిగేవాణ్ణి.

నాకు గ్రామానికి తిరిగి వెళ్ళడంలో ఏమాత్రం కష్టం అనిపించలేదు. మా నాన్న కూడా ఉత్సాహంగానే కనబడ్డాడు. నేను షాంగ్‌హాయ్ వదిలి వెళ్ళే ముందురోజు రాత్రి మా నాన్న మా గ్రామాల గురించి ఆపకుండా కథలు చెపుతూనే ఉన్నాడు. అన్నీ మంచి తమాషా కథలు.

ఈ మధ్యనే పేపర్లో చదివేను. పంతొమ్మిదివందల యాభైలో షాంగ్‌హాయ్ మేయర్ చెన్ యీ [4] గ్రామాల్నుంచి వలస వచ్చినవాళ్ళను వెనక్కు పంపించడానికి ప్రయత్నించాడట[5]. అతడా పనికి చాలా మంది పార్టీ అధికారుల్ని నియమించేడు గానీ, లాభం లేకపోయిందట. అయితే, ఆ వేసవిలో వచ్చిన తుఫానూ, వరదల దెబ్బకి వలసదారులందరూ తమంతట తామే తిరుగుముఖం పట్టేరట. అది చూసి చెన్ యీ, ‘ఇంత మంది కమ్యూనిస్టు పార్టీ మెంబర్లు చెయ్యలేని పని ఈ తుఫానూ, వరదలూ చేసినయ్య’ని చమత్కరించేడని కథనం.

పేపర్లో ఈ విషయం వ్రాసిన రిపోర్టర్ ఆ సమయంలో పార్టీ మెంబరట. అతడు వ్రాయడం, కామ్రేడ్ చెన్ యీ ఇలా చమత్కరించిన కొంత కాలానికే, వరదలు తగ్గిపోవడమూ, వలసదారులందరూ తిరిగి షాంగ్‌హాయ్ చేరుకోవడమూ జరిగినయ్యట. అంతేకాదు, ఈసారి వలసదారులు వాళ్ళ బావల్నీ, బాబాయిల్నీ, మేనమామల్నీ, అల్లుళ్ళనీ, ఇంకా ఇరుగుపొరుగుల్నీ కూడా తీసుకు మరీ వచ్చేరట. ఆ దెబ్బకి వలసదారుల సంఖ్య రెట్టింపయ్యిందట. చెన్ యీ మళ్ళీ వీళ్ళని తరిమేయడానికి పథకాలు వేసిన దాఖలాలు లేవు.

తలుచుకుంటే నవ్వొస్తుంది. అప్పట్లో ఆ బడా మేయరు చెన్ యీని అలా ఏడ్పించిన వాళ్ళలో ముగ్గురు మా కుటుంబం నుంచే!

మా నాన్న అలా పల్లెల గురించి తమాషా కథలు చెప్తుంటే మా అమ్మ చిన్న పీట మీద కూర్చుని నా చిరిగిన చొక్కా కాలరు కుడుతూన్నది. ఆవిడ కుడుతున్నంత సేపూ కన్నీరు కారుస్తూ, ఆ కుడుతున్న చొక్కా తోనే కళ్ళు తుడుచుకున్నది. తరువాత నేనా చొక్కాని పెట్టెలో పెట్టుకునే సమయానికి అది సగం తడిసిపోయుంది.

ఈ ఎడబాటు తరువాత, మేమిద్దరమూ మళ్ళీ ఒకరినొకరం చూసుకోమని ఆవిడకి ఎలానో తెలిసుండాలి.

3
నాకు ఫేక్టరీ నుంచి మూడ్రోజుల సెలవు దొరికింది. అవసరమైన కాగితాలు నింపడానికి మా వర్క్‌షాప్ డైరెక్టర్ నాతోపాటూ హెడ్డాఫీసుకి వచ్చాడు. తర్వాత ఫేక్టరీ గేటు దాకా నన్ను సాగనంపేడు. నా భుజం తట్టి “వాంగ్ బావ్! ఎలాగైనా మీ అమ్మ సమాధిని కనుక్కో. ఆవిడ కొడుగ్గా నీ విధి అది. వీలైనంత త్వరగా తిరిగి రా,” అన్నాడు. పాపమాయన చాలా మంచి మనిషి. ఆయన్ని నేనెన్నడూ తప్పుపట్టలేదు. పోయినసారి నన్నిలా గేటు దాకా సాగనంపినప్పుడు కూడా ఇలానే వీలైనంత త్వరగా తిరిగి రమ్మన్నాడు. కాకపోతే, అప్పుడు నేను తిరిగి రావడానికి ఇరవై రెండేళ్ళు పట్టింది.

నేను బాంపూఁకి టికెట్ కొనుక్కుని రైలెక్కాను. ఈ ప్రయాణం వల్ల ప్రయోజనం ఉంటుందో లేదో తెలీదు గానీ నాకా నెల సెలవు తీసుకోకుండా పనిచేస్తే వచ్చే బోనస్ రాదనిపించింది. నిజం చెప్పాలంటే మా అమ్మ సమాధిని పట్టుకోగలనో లేదో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఆవిడ చచ్చిపోయిందన్న విషయం మాత్రమే. ఆవిడ ఇరవయ్యేడేళ్ళ క్రితం షాంగ్‌హాయ్, బాంపూఁల మధ్య మరణించింది.

మిట్ట మధ్యాహ్నానికి రైలు నాన్‌జింగ్ చేరుకుంది. అప్పటికి నా అపనమ్మకం ఇంకా పెరిగింది. 1980లో నేను తెల్లగుర్రపు సరస్సు నుంచి వచ్చేసినప్పుడు భోజనం ఖరీదు 30 పైసలుండేది. ఈసారి అది రూపాయిన్నరైంది.

నేను చొక్కా జేబులోంచి చిల్లర డబ్బులు తీసేను. నోట్లన్నీ దొంగజేబులో ఉన్నాయి. అది నా చిన్నప్పట్నుంచీ మా అమ్మ చేసిన అలవాటు. రద్దీగా ఉన్నచోట దగ్గరున్న డబ్బులు పైకి కనబడకుండా దాచుకోవాలని చెప్పేదావిడ. (అందులోని సత్యం తరువాత తెలిసొచ్చింది. చాలా విలువైన మాటది.) మా టీములో కొంతమంది దొంగవెధవలుండేవాళ్ళు. టాయిలెట్ పేపర్నయినా సరే కొట్టేయడానికి తయారుగా ఉండేవాళ్ళు. నా దొంగజేబులో ఇంకో కాగితం కూడా ఉంది. అది బాంపూఁ రైల్వే పోలీసులిచ్చిన మరణ ధృవీకరణ పత్రం.

మా అమ్మ ఎవరనేది కనుక్కోవడం రైల్వే పోలీసులకి చాలా పెద్ద పనయ్యింది. మొదట వాళ్ళకు ఊరూ పేరూ తెలీని స్త్రీ శవం దొరికింది. తరవాత వాళ్ళకు హంతకుడు దొరికేడు. వాడు 381 నంబరు రైల్లో ఒకావిణ్ణి ఖూనీ చేసినట్టు అంగీకరించాడు. అయితే వాడికి తను చంపినావిడ ఎవరు, ఏమిటనేది తెలీలేదు. ఈలోగా, 381 నంబరు రైలును శుభ్రంచేసిన క్లీనర్లకి ఒక సీటు కింద ఎవరో ప్రయాణీకులు పోగొట్టుకున్న బుట్ట దొరికింది. బుట్టని పోగొట్టుకున్నవాళ్ళని కనుక్కోలేక వాళ్ళు దాన్ని రైల్వే పోలీసులకు అందజేసేరు. పోలీసులు ఆ బుట్ట చనిపోయినావిడది అయ్యుంటుందని నిర్ణయించి దాన్ని వెతికితే అందులో రెండు జతల బట్టలు (దాదాపూ కొత్తవి), డజను బిస్కట్లు, చిన్న సంచీడు బియ్యం, కొన్ని పొట్లాల నూడిల్స్, రెండు పెట్టెల సిగరెట్లూ కనబడినయ్యట. బిస్కట్లూ, నూడిల్సూ షాంగ్‌హాయ్ ఫేక్టరీలలో తయారయ్యుండడాన్ని బట్టి పోలీసులు చనిపోయినావిడ షాంగ్‌హాయ్ నుంచయ్యుంటుందని ఊహించగలిగేరు. పోలీసులకి బుట్టకడుగున వ్రాసున్న పేరు కనబడింది.

వాళ్ళక్కనబడిన పేరు, ష్యూ గూయింగ్. గవర్నమెంటు రికార్డుల్లో మా అమ్మ పేరది. (ఇలా అన్ని వస్తువుల మీదా పేరు వ్రాయడం మా అమ్మ నాకు నేర్పిన ఇంకో అలవాటు. నేను తెల్ల గుర్రపు సరస్సుకు వెళ్ళే ముందు నా వస్తువులన్నిటిమీదా, నా పెట్టెలన్నిటి మీదా నా పేరు రాయించిందావిడ. ఇప్పటికీ నా చొక్కా లోపలిపక్క ‘వాంగ్ బావ్, 1వ టీమ్’ అన్న అక్షరాలు కనబడతాయ్.

నేను షాంగ్‌హాయ్ తిరిగి వెళ్ళినప్పుడు మా నాన్న నాకీ విషయాలన్నీ విపులంగా చెప్పేడు.

మా అమ్మ తెల్లగుర్రపు సరస్సుకు వెళ్ళుండడం వల్ల ఆరోజు మా నాన్న రిక్షా తొక్కడానికి వెళ్ళలేదు. మరి వంట తనే చేసుకోవాలి కదా! తను కుంపటి విసురుకొంటూ జానపద గీతాలు పెద్ద వాల్యూమ్‌తో వింటూండడం వల్ల మూడోసారి తలుపు తట్టేదాకా ఆయనకి వినబడలేదు. మా నాన్న తలుపు తీసేసరికి ఎదురుగా లోకల్ కమిటీ మెంబరు మిసెస్ ల్యూతోపాటూ యూనిఫారంలో ఉన్న ఆఫీసరొకతను కనబడ్డాడు. మొదట నేనే మళ్ళీ ఏదో పీకలమీదకి తెచ్చుకునుంటానని అనుకున్నాడట మా నాన్న.

“ఇతను కామ్రేడ్ గావ్. ఈయన మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతారు,” అన్నది మిసెస్ ల్యూ. మా నాన్న వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి రేడియో నోరు నొక్కేడు.

“మీ భార్య పేరు ష్యూ గూయింగేనా?” కామ్రేడ్ గావ్ ప్రశ్నించేడు.

“అవునండీ.”

“ఆవిడ ఇంట్లోనే ఉన్నదా?”

“లేదండీ. ఊరెళ్ళింది.”

“ఏ ఊరు?”

“తెల్లగుర్రపు సరస్సుకి వెళ్ళిందండీ. మా అబ్బాయిని చూడ్డానికి.”

“ఆవిడ వయసెంతుంటుంది?”

“ఆమె ఎద్దు సంవత్సరంలో[6] పుట్టింది. ఈ ఏడు నలభయ్యేడు నిండుతాయి.”

“ఏ రైలెక్కింది?”

“మధ్యాహ్నం మూడు గంటల బండి.”

“ఏ రోజు?”

“మొన్న.”

“ఆవిడ తనతోపాటు ఏం తీసుకువెళ్ళింది?”

“ఒక బుట్ట.”

“ఆహా!” కామ్రేడ్ గావ్ ఆనందం పట్టలేకపోయాడు. “మీ భార్యను రైల్లో ఎవరో హత్య చేశారు.”

మా నాన్నకి కామ్రేడ్ గావ్‌ని చాచి లెంపకాయ కొట్టాలనిపించిందిట. మా అమ్మ చనిపోతే అతనికెందుకానందమో మా నాన్నకర్థం కాలేదు. నిజానికి, కామ్రేడ్ గావ్ ఆనందమల్లా, తను ఇంకా వెతకాల్సిన పని తప్పినందుకు మాత్రమే. కామ్రేడ్ గావ్ మా నాన్నతో తరువాత అన్నాడట. “షాంగ్‌హాయ్‌లో ఎంతమంది షూ గూయింగ్‌లున్నారో, మీకు తెలుసునా? 288 మంది! వాళ్ళలో ఒక మగవాడు కూడా ఉన్నాడు.[7]”

బాంపూఁ నుంచి అందిన సమాచారం ప్రకారం, ఆ మగ షూ గూయింగ్‌ని లిస్టులోంచి తీసేయగలిగేరట. తరువాత మరీ పడుచువాళ్ళనీ, మరీ ముసలివాళ్ళనీ తీసేస్తే 127 మంది మిగిలేరట. కామ్రేడ్ గావ్ తలుపు కొట్టిన ఇళ్ళలో మాది 74వ ఇల్లట. కాళ్ళు విరిగినంత పనైందన్నాడు గావ్. “చాలా ఇళ్ళు ఫర్వాలేదు. తలుపు కొడతాం, షూ గూయింగ్ ఇంట్లో ఉందో లేదో అడుగుతాం. తలుపు తీసినావిడ తనే షూ గూయింగ్ అన్నదా? అడగాల్సిందేం లేదు. కానీ కొన్ని ఇళ్ళకు తాళం వేసి ఉంటుంది. ఆ ఇంట్లోని షూ గూయింగ్ పనికెళ్ళిందో, కూరగాయలకెళ్ళిందో, స్నేహితుల ఇళ్ళకెళ్ళిందో ఎలా చెప్తాం? ఇరుగూ పొరుగూ ఇళ్ళలో ఉంటే ఫర్వాలేదు. లేరా? ఆ ఇంటిముందు పడిగాపులు పడ్డమే గతి. ఆ చచ్చిపోయినావిడ దొరికిపోవడం వల్ల ఇక నేను బతికిపోయాను.”

కామ్రేడ్ గావ్‌కి షూ గూయింగ్ అంటే ఒక పేరు మాత్రమే.

వెళ్ళేముందు, ‘ఎందుకన్నా మంచిది. మీరు తెల్లగుర్రపు సరస్సులో వాకబు చేసి మీ భార్య ఆచూకీ కనుక్కోండ’ని మా నాన్నకి సలహా ఇచ్చాడు కామ్రేడ్ గావ్. ‘అదృష్టం బాగుంటే…’ వాక్యం పూర్తిచేయకుండా వెళ్ళేడు. అదృష్టం బాగుండడమంటే మా అమ్మ బ్రతికుండడమో లేక అతగాడికి మళ్ళీ పనిపడకపోవడమో మనం ఊహించుకోవాల్సిందే!

రెండు వారాల తరువాత, పోస్ట్‌మేన్ డెత్ సర్టిఫికేట్ తెచ్చిచ్చేడు. దాన్ని చూసి మా నాన్న సొమ్మసిల్లిపోయాడు. అదృష్టవశాత్తూ, మా పల్లెనుంచి ఏదో పనిమీద షాంగ్‌హాయ్ వచ్చిన మా బాబాయి మా నాన్నని మా ఊరు తీసుకెళ్ళిపోయాడు. మా నాన్న మా పల్లెలో ఆరు నెలలుండిపోవడం వల్ల మా అమ్మ శవాన్ని తీసుకువెళ్ళడానికెవరూ లేకపోయారు. మా నాన్న వెళ్ళగలిగినా, ఆపాటికి మా అమ్మ సమాధి మాత్రమే కనబడుండేది.

షాంగ్‌హాయ్‌లో ఇక 287 మంది ష్యూ గూయింగ్‌లే మిగిలుంటారు. అక్కడ తెల్లగుర్రపు సరస్సులో నాకు అందాల్సిన బుట్ట కోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాసినయి.

మా అమ్మ తీసుకువస్తున్న బుట్టకోసం రెప్ప వేయకుండా ఎదురు చూసేన్నేను.

(సశేషం)

అధస్సూచికలు   [ - ]

“Romance of the three kingdoms” a fourteenth century epic written by Luo Guanzhong. This covers the period of Chinese history from 220 A.D. to 265 A.D. and is about the rise and fall of the three kingdoms — Wei, Shu, and Wu — that covered most of China. This has been translated into English at least by two sets of translators. One of the two English translations can be read at www.threekingdoms.com. This is also made into an acclaimed TV series in China. ↩
Qing Dao (translates to “green island”) is a well-known summer resort which is in the San Tong province. ↩
In 1956 April, Mao Zedong encouraged intellectuals and others to voice criticisms of party policy so that the party could correct itself. This campaign became known as The Hundred Flowers Campaign and lasted from 1956 May through 1957 May. (The name of the campaign was derived from a slogan from Chinese classical history:”let a hundred flowers blossom and a hundred schools of thought contend”.) However, the extent of criticism was beyond Mao’s expectations. Those that had spoken against the party policy and personnel during the Hundred Flowers Campaign paid a heavy price during the 1957 anti-rightist campaign that followed. Some 200,000 critics were denounced and either imprisoned or sent to labor reform camps. ↩
Chen Yi (1901-72) was one of the outstanding Chinese Communist military commanders of the 1930s and ’40s. After the Communist takeover in 1949, he became mayor of Shanghai and a major figure in eastern China. He was made a member of the ruling Politburo in 1956 and served as the foreign minister from 1958 to 1966. He was stripped of all his power during the cultural revolution. ↩
In China, there are restrictions on where one can live within China. Probably, these restrictions are meant to prevent rural labor from migrating to the cities on a large scale. ↩
According to the Chinese traditional calendar, each year is associated with one of twelve animals — tiger, dragon, snake, rooster, hare, ox, dog, pig, sheep, rat, horse, and monkey. It’s a twelve year cycle with the same animal repeating after every twelve years. ↩
It’s a unisex name. ↩
----------------------------------------------
రచన: కొండలరావు పలకా, జియన్
మూలం: లీ షావ్ (Li Xiao)
ఈమాట సౌజన్యంతో

Thursday, December 5, 2019

ఉండేలు


ఉండేలు
సాహితీమిత్రులారా!


“కుర్ హోయ్… కుర్ హోయ్…” బక్కడు పిలుస్తుంటే వారగా తెరిచిన దొడ్డి తలుపులోంచి ఊరిమీదకి ఉరుకుతున్న పందులు, మళ్ళీ వెనక్కి ‘డ్రోంక్ డ్రోంక్’ అంటూ పరిగెత్తుకొచ్చేశాయి. తెల్లారగట్టే చెరకు గానుగుల నుంచి కుండలతో మోసుకొచ్చిన తేపను వాడు తాటి డొల్లలో పోస్తుంటే ఒకదాన్ని ఒకటి ముట్టిపెట్టి కొట్టుకుంటూ ఆబగా తాగుతున్నాయి.

రకరకాల సైజుల్లో బలంగా ఎదిగిన పందులని చూసుకున్న బక్కడు, ఓసారి కళ్ళకి చెయ్యడ్డుపెట్టి ఆకాశం వైపు చూశాడు. చల్ది వేళ అయింది. కాస్సేపట్లో వాడి బామ్మర్ది నతానేలు వస్తాడు. వాడికిచ్చి ఓ పందిని సంతకి తోలాలి.

బక్కడు ఏడాది పొడవునా ప్రతిబుధవారం ఓ పందిని సంతలో అమ్ముతుంటాడు. పొరుగూరులో వుండే నతానేలు అందుకు సాయం చేస్తాడు. ఓ విధంగా పెంపకం వీడిది, వ్యాపారం వాడిది.

తేప త్రాగిన పందులు ఒకదాన్నొకటి తరుముకుంటూ కుమ్ముకుంటూ ఊరిమీద పడ్డాయి. తేప కావిడ్ని గుడిసె చూరు కింద పెట్టిన బక్కడు అప్పమ్మ సర్దివుంచిన చల్ది గెంజి ముందు కూర్చున్నాడు.

“ఏంవాయ్, ఏంటివ్వాళ వేట?” మీసం తిప్పుకుంటూ అడిగారు కలిదిండి జనార్ధనరాజు.

“పావురాయండే దివానం.”

“భేష్.”

జనార్ధనరాజుకి రోజూ పిట్ట మాంసం వుండాలి. లేకపోతే ముద్ద దిగదు.

నల్లగా నేరేడుపండులా నిగనిగలాడే జనార్ధనరాజు వయస్సు యాభైకి అటూ ఇటూ వుంటాయి. అంతటి నలుపు మొహంలోనూ ఎర్రటి పెదాలు ఎప్పుడూ తాంబూలం వేసుకున్నట్టు కనిపిస్తాయి. కాంతులీనే ఆయన కళ్ళు ఎలాటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆడవాళ్ళనైతే మరీను. ఆయన్ని బాగా తెలిసినవాళ్లకి మాత్రమే ఆయన కళ్ళ వెనక కదిలే భావాల గురించి తెలుస్తుంది. కోరింది క్షణాల్లో అమర్చిపెట్టే దాసదాసీజనం, వందిమాగధులు, లంకంత కొంప, వందల ఎకరాల తోటలకీ పొలాలకీ ఆసామీ అయిన రాజుగారికి పిల్లా జెల్లా ఎవరూ లేరు. దీనంతటికీ పిట్ట శాపమే కారణమంటూ ఊళ్లో జనం గుసగుసలాడుతుంటారు. ఈ పిట్టలని కొట్టడం, పొయ్యిమీద పెట్టడం మానుకోవాలని ఆయన భార్య ఎంత పోరుపెట్టినా వినకపోవడంతో ఆవిడ పుట్టింటికి వేంచేశారు.

పందుల పెంపకం కంటే, రాజుగారికి రోజుకో పిట్టని కొట్టిపెట్టడమే బక్కడికి ప్రధాన వ్యాపకం. ఇందుకుగానూ వాడికి అయిదు ఎకరాల మామిడితోటని రాజుగారు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దానిమీద వచ్చిన ఫలసాయం వాడిదే. అంతేకాకుండా రాజుగారి తోటలలో రాలిన మామిడి టెంకలన్నీ వాడివే. టెంకల్లో వుండే జీడి అంటే పందులకి మహాప్రీతి.

ఒక్క బక్కడనే కాదు రాజుగారి ప్రతి అవసరాన్నీ… తమ అవసరం కంటే ఎక్కువగా భావించి ప్రభుసేవలో తరించే చాలామందికి, ఆయన ఇలాటి సదుపాయాలనే ఏర్పాటు చేస్తారు.

రామకోవెల దగ్గర పులీమేకా ఆడుతున్న బుల్లియ్య అండ్ కో కళ్ళల్లో పడకుండా తప్పించుకుపోవడానికి సన్నాసులు, ఆ గోడ ప్రక్కా ఈ గోడ ప్రక్కా నక్కుతూ నడుస్తున్నాడు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది.

సన్నాసిని ఓరకంట చూసిన బుల్లియ్య “ఒరేయ్ మీరు కాస్సేపు ఆగండ్రా… సన్నాసిగాడు వస్తున్నాడు, ఓ ఆట పట్టిద్దాం,” అన్నాడు మిత్రబృందాన్ని. బుల్లియ్య బ్యాచ్ గప్ చుప్ అయిపోయారు.

“ఏట్రా సన్నాసులూ, బుట్ట బుజాన్నేసుకు దిగడ్డావ్. ఇల్రా…” పిలిచాడు బుల్లియ్య.

“ఆగాహె… అవతలీధికి అర్జంటుగా పోవాలి, అయినా నీలాటి పోస్కోలెధవలతో మాటాడొద్దంది మా మామ్మ,”

“నంగనాచి తుంగబుర్ర… ఏటి? అంత మాటనీసిందా! ఎల్దీ గానిలేరా? రా ఇలారా కూర్చో,”

ఇక తప్పదన్నట్టు చేతిలో జంగిడిని పక్కన పెట్టి కూలబడ్డాడు సన్నాసులు.

“బాగా బరువున్నట్టుంది? యేంట్రా బుట్టలో?”

“కోడిగుడ్లాయ్. కొత్తేపారం మొదలెట్టేను. మనూళ్ళో గుడ్దు పావలాక్కొని, రాంపురం అట్టుకెళితే అద్రూపాయి!”

“ఏ ఎధవ చెప్పేడ్రా నీకు గుడ్లేపారం ఎట్టమని? బుట్ట కిందడితే మొత్తం బంక బంకైపోయి లాభం గూబల్లోకి వచ్చేత్తాది,”

“అవున్రా సన్నాసీ, పొద్దున మా కోడి గుడ్డెట్టింది కదాని ఇలా తీశానో లేదో అలా చేతిలోంచి జారి చిదిగిపోయింది. ప్రాణం ఉస్సూరుమందనుకో…” చింతించాడు రాంబాబు.

“మరేం చెయ్యమంటార్రా? కాళీగా తిరుగుతున్నావని, మా మామ్మ కాల్చుకు తినేత్తంది.”

“సుబ్బరంగా మిలట్రీలో జాయినయిపో.”

“నేనా? మిలట్రీలోనా? చెయ్యగలనంటావా?”

“ఏం నీకేం తక్కువ? కోడిగుడ్ల యాపారంకన్నా అదే ఈజీ.”

“ఏటి నిజవే…”

“ఆఁ. కావాలంటే రాంబాబుగాడిమీదొట్టు. నీ బుట్టలో ఒక్కో గుడ్దూ తీసి కిందెట్టు,”

సన్నాసులు జంగిడిలో వున్న ఒక్కో గ్రుడ్డునీ జాగ్రత్తగా క్రింద పెట్టాడు.

“ఈటన్నాటినీ… ఎలా తీసేవో అలా జంగిట్లో పెట్టెయ్,” చెప్పాడు బుల్లియ్య.

సన్నాసులు మళ్ళీ గ్రుడ్లన్నిటినీ జంగిట్లో పెట్టేసుకున్నాడు.

“ఇంతేరా. ఇలా చేత్తేచాలు. మిలట్రీలో బాంబుకాయలు కోడిగుడ్లలాగే వుంటాయి. నువ్వొకోటీ తీసి జార్తగా ఆళ్ళకిస్తే… నోటితో ఆళ్ళు ముచ్చుకు లాగి చైనావోళ్లమీదేసేస్తారు. అంతే…”

“బాగుంద్రా, నన్ను మిలట్రీలో జాయిన్ చేసెయ్యండ్రా…” అన్నాడు సన్నాసులు ఉత్సాహంగా.

“అలాగే. ఇంక నీకీ గుడ్లెందుకు? మనోళ్ళు నలుగురుకీ తలా పుంజీడు ఇచ్చెయ్. నీ పేరుమీద ఆట్టేసుకు తింటారు పాపం.”

అందరికీ నాలుగేసి గుడ్లు పంచేసిన సన్నాసులు. “నడండి మరి,” అన్నాడు.

“ఆగరా బాబూ… అంత కంగారేటి? బాంబుకాయలందించగానే సరేటి? అప్పుడప్పుడూ ఆళ్ళకి చేతులు పీకితే… నువ్వు టుపాకట్టుకొని నలుగురైదుగురు చైనావోళ్ళని పేల్చిపారెయ్యాలా వద్దా? కాంత అదికూడా నేర్చుకో…”

“భలే ఫిటింగ్ ఎట్టావురా? అదెక్కడ నేర్చుకోవాలి.”

“మన బక్కడున్నాడు కదా! ఎవడు? పందుల బక్కడు. నెల్రోజులు ఆడికూడా తిరుగు. ఆడి దగ్గర ఈటెలు, బరిసెలు, బాణాలు, ఉచ్చులూ, వడిసెలలూ, ఉండేళ్ళూ బోలెడన్నుంటాయి. అయ్యన్నీ నేర్చేసుకున్నావనుకో, ఇంక నువ్వు బాంబుకాయలందిచక్కర్లేదు. డాం డాం డామ్మని టుపాకెట్టి కాల్చి పారేయడమే!”

“మరే… మరే…” అంటూ బుల్లియ్య మాటలు పూర్తికాకుండానే సన్నాసులు పరుగు లంకించుకున్నాడు.

రాత్రి పెట్టిన ఎలకల బుట్టల్ని తియ్యడానికి, పొలంబాట బట్టిన బక్కడికి కాలవ దగ్గర ముసానం చేటలందుకుంటున్న ఆడవాళ్లు కనబడ్డారు. ఊళ్ళో ఏ పుణ్యస్త్రీ పోయినా బంధువుల్లో పుణ్యస్త్రీలకి ఇలా చేటలివ్వడం సంప్రదాయం. బక్కడి పెళ్ళాం అప్పమ్మ, ఈ చేటలు అల్లడంలో సిద్ధహస్తురాలు. మామూలుగా వెదురుతో చేటలు అల్లడం బక్కడి కులవృత్తికాదు. ఈత మట్టలతో రైతులకి కావాల్సిన తట్టలు, బుట్టలు అల్లడానికే వాళ్ళకి సమయం చాలదు. కానీ ఊళ్ళో చేటలు అల్లేవాళ్లెవరూ లేకపోవడంతో అప్పమ్మకి, ఈ చేటలు అల్లే బాధ్యత తప్పడం లేదు. దాన్ని అప్పమ్మ పుణ్యకార్యంగా భావిస్తుంటుంది.

“ఏరా బక్కా, ఏం జూత్నావిక్కడ?”

అక్కడి తంతుని దూరాన్నుంచి చూస్తున్న బక్కడు, సన్నాసులు పిలుపుతో ఆలోచనల్లోంచి బయటపడ్డాడు.

“పాపవండే… పసుపుకొమ్ములా వుండీది. కాలుజారి నూతిలో అడిపోయిందంట.”

“ఇలాటోళ్లందరికీ రాజుగారి పెద్దనుయ్యే దిక్కులా వుంది. ఆ నుయ్యి కప్పెట్టెద్దారేట్రా?” అన్నాడు సన్నాసులు ఏదో ఆలోచిస్తున్నట్టు.

“మనకెందుకులెద్దురూ, నడండి.” అన్న బక్కడు చేలగట్లవెంట పెట్టిన బుట్టల్ని ఒక్కోటీ ఏరి పోగెడుతుంటే… సన్నాసులు సాయం చేస్తున్నాడు.

“చూడండెలా బలిసిపోయాయో! పుట్టి మూన్నెల్లయ్యుండదు ఒక్కోటీ బత్తాడొడ్లు బుక్కేసుంటాయి.” బుట్టల్లోంచి చచ్చిన ఎలకలని తీస్తున్న బక్కడు చెప్పాడు.

వాటివంక నిర్వికారంగా చూసిన సన్నాసులు జేబులోంచి బీడీ తీసి వెలిగించాడు.

పంటకాల్వ గట్టున మాటువేశాడు బక్కడు. వాడి నిక్కరు జేబులో మట్టి గోళీలు బరువుగా వున్నాయి. గుబురుపొదలు, నీటివసతి వున్నచోట చెవుడు కాకులు వుంటాయన్న సంగతి వాడికి గోచీ పెట్టుకునే వయస్సు నుంచే తెలుసు.

ఓ మట్టి గోళీని, కేటల్ బార్‌లో వుంచి పొదవైపే చూస్తున్నాడు. ఎక్కడా అలికిడి లేదు. ఒకటి. రెండు.. మూడు… క్షణాలు గడుస్తున్నాయి. చెవుడుకాకి అలికిడి లేదు. ఓ పెద్ద రాయి తీసి పొదమీదకి విసిరాడు. వెంటనే కేటల్ బార్‌ని పొజిషన్ లోకి తీసుకున్నాడు. ప్చ్! లాభం లేకపోయింది. చెవుడు కాకి ఆనవాలు లేదు. వుంటే రాయి దెబ్బకి భయంతో బయటపడేదే. మాటు మార్చాలి. రాజుల చెరువు వైపు నడిచాడు.
బక్కడి ప్రతి కదలికనీ నిశ్శబ్దంగా పరిశీలిస్తున్న సన్నాసులు వాడిని అనుసరించాడు.

రాజుగారి వంటకి ఆలస్యమైపోతోంది. సూర్యాస్తమయం కల్లా భోజనం ముగించటం రాజుగారికి ఆనవాయితీ. పిట్ట మాంసం రుచి మరిగినప్పటినుంచీ రాజుగారు ఎన్ని పిట్టలని తినేశారో, ఆయన కోసం ఇప్పటివరకూ తాను ఎన్ని పిట్టల ఉసురు తీసి వుంటాడో… నడుస్తున్న బక్కన్ని ఆలోచనలు చుట్టుముడుతున్నాయి.

వడిసెల విసరడం, ఉండేలు ఉపయోగించడం, ఉచ్చులు పన్నడం, మత్తు గింజలు చల్లి పిట్టలని పట్టడం బక్కడికి ఇష్టం వుండదు. గుండు గురిచూసి కొట్టడమే వాడి నైజం. గువ్వలు, గునపంకోళ్లూ, పావురాలు, కారుకోళ్ళు, చిలకబాతులు, జమ్ముకోళ్లు, చెవుడుకాకులు, గూడకొంగలు, నీటికోళ్లు. ఒకటా? రెండా? తనవల్ల జంటలని కోల్పోయి ఎన్ని పక్షులు ఒంటరయిపోయాయో? అవి మళ్లీ జంటకట్టడం అనేది జరగని మాట. గుండు దెబ్బతిని నేలకూలిన పిట్టల నిర్జీవమైన కళ్ళల్లో ఆ బాధ, బక్కడికి ఎప్పుడూ కనబడే అవకాశంలేదు. కానీ ఆ వియోగం గురించి వాడికి తెల్సినంతగా మరెవరికీ తెలియదు.

కానీ ఏం చేస్తాడు? ఇది తన వృత్తి. వృత్తి ధర్మం ప్రకారం, రాజుగారి పంటికిందకి ఇంత పిట్ట మాంసాన్ని సంపాదించి పెట్టడమే. అది తప్పా? ఒప్పా? పాపం-పుణ్యం అవేమీ వాడికి తెలీదు. కళ్లెదురుగా చెరువు గట్టున వాలిన చిలకబాతుల గుంపు బక్కడి ఆలోచనలని చెల్లాచెదురు చేసింది. ఈ మధ్య కాలంలో అన్ని బాతులు కనబడడం ఇదే.

కేటల్ బార్ చేతిలోకి తీసుకున్నాడు. మట్టిగోళీని పెట్టి, ఓ కన్నుమూసి రబ్బరుని చెవిదాకా లాగి వదులుతుండగా… సన్నాసులు వాడిని ప్రక్కకి ఒక్క తోపు తోశాడు. గుండు గురితప్పి, ఓ పొదని అదిలించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన బాతుల గుంపు అక్కడ నుంచి పలాయనం చిత్తగించింది.

“యాటి బాబు మీరు చేసిన పనేటి?” పైకి లేస్తూ సన్నాసులు మీద ఆగ్రహం ప్రదర్శించాడు బక్కడు.

“పాపం రా!”

“పాపం లేదు గీపం లేదు. అటికీభూమ్మీద నూకలు చెల్లిపోతే చత్తాయి అంతే. చచ్చీ పెతి పిట్ట మీద రాజుగారి పేరు రాసుంటది.”

“రాజుగారికెప్పుడు చెల్లిపోతాయిరా నూకలు? అప్పుడుగానీ ఈ పిట్టలు బతికి బట్టకట్టవా?”

సన్నాసులు ప్రశ్నకి బుర్రగోక్కున్న బక్కడు “మీరు తింగరోళ్ళో… గడుసోల్లో… నాకద్దమవట్లేదు. మీకోదన్నం. నా కూడా రాకండి.” అని పొదల్లోకి పోయి మాయమైపోయాడు.

పొద్దున్నే తేప పెట్టి, పందులని ఊరిమీదకొదిలేసిన బక్కడు రాజుగారి పిట్టల కోసం వేటకి పోయాడు. వాడు తిరిగొచ్చేసరికి సన్నాసులుతోపాటూ నతానేలూ వాడి స్నేహితుడూ గుడిసెముందు కూర్చుని వున్నారు. నతానేలు, వాడితోపాటూ వచ్చినవాడి చేతుల్లో బలమైన వెదురు గడలున్నాయి. వాటికి చివర తాడుతో ఉచ్చులు బిగించి వున్నాయి. వాటిని ఆసక్తిగా చూస్తున్నాడు సన్నాసులు.

“యారా బావా ఎంసేపయ్యింది వచ్చి?” బామ్మర్దిని చూసి కుశల ప్రశ్నలేశాడు బక్కడు.

“ఉప్పుడే అరగంటయ్యింది. బేగా నడు, ఇప్పటికే ఆలీసవైపోయింది.” అన్నాడు నతానేలు.

“నాకాడకి రావొద్దన్నాను కదా! మల్లెందుకొచ్చేరు?” సన్నాసులు మీద చిరాకుపడ్డ బక్కడు గుడిసె చూరులోంచి పెద్ద బాణాకర్ర తీశాడు. ఎవరి కర్రలు వాళ్ళు పట్టుకొని, ముగ్గురూ ఊరి మీదకి బయలుదేరారు. సన్నాసులు కూడా వాళ్లవెనకేపడ్డాడు. కొంతదూరం వెళ్ళేసరికి బురదలో దొర్లుతూ పందుల గుంపు కనిపించింది.

“అగో… ఆ తెల్లపందినేసేద్దాంరా” చెప్పాడు బక్కడు.

నతానేలూ, వాడి స్నేహితుడూ ఇద్దరూ చెరో రాయీ తీసి బురద గుంటలోకి విసిరారు. పందులు బీకబీకలాడుతూ గుంటలోంచి లేచి, తలో దిక్కూ పరిగెత్తాయి. మిత్రులిద్దరూ తెల్ల పంది వెనక ఉచ్చుకర్రలతో పడ్డారు. అది ఆ సందులోంచీ ఈ సందులోంచీ దూరుతూ, పారిపోతూ వాళ్లిద్దర్నీ పరుగులు పెట్టిస్తోంది.

“ఒరే తింగరెదవా! పొద్దున్నే దొడ్లోనే దాన్ని వుంచెయ్యొచ్చు కదరా, ఇప్పుడు ఉరుకులూ పరుగులూ పెట్టేబదులు?” ప్రశ్నించాడు సన్నాసులు.

ఒకసారి సన్నాసులు కళ్ళలోకి సూటిగా చూసిన బక్కడు “అది ఏట నియమం బాబూ. ఏటాడి చంపడం మా నీతి.” అన్నాడు.

డ్రోంక్… డ్రోంక్… తెల్లపంది హృదయ విదారకంగా అరుస్తోంది. దాని మెడకి నతానేలు ఉచ్చు బిగుసుకుంది. అయినా అది జంకూ గొంకూ లేకుండా ఉచ్చుతోపాటూ వాడ్నీ ఈడ్చుకుంటూ పరిగెడుతోంది.

పంది సరిగ్గా తన ముందుకు రాగానే… బాణా కర్రెత్తి బక్కడు దాని తలమీద బలంగా ఒక్క దెబ్బ వేశాడు. అంతే అది కీచుమంటూ విరగబడిపోయింది. నతానేలూ వాడి స్నేహితుడూ కిందపడ్డ పంది కాళ్లని కదలకుండా కట్టేసి, బాణాకర్రకి దాన్ని తగిలించుకొని మోసుకుపోతుంటే… బక్కడి కళ్ళముందు రాజుగారు, చేటలు మార్చుకుంటున్న ఆడంగులు ఏకకాలంలో మెదిలి మాయమయ్యారు.

సంజ చీకట్లు ముసురుకుంటున్నాయి.

చక్కటి పిట్టమాంసంతో విందారగించిన జనార్ధనరాజు మామిడితోటలోని విశ్రాంతి భవనం ముందు తాంబూలం నములుతూ పచార్లు చేస్తున్నారు.

నూతి వెనకనుంచి లేచిన బక్కడు ఒకే ఒక్కసారి దానిలోకి చూశాడు. తర్వాత కేటల్ బార్‌లో మట్టిగోళీని వుంచి ఓ కన్ను మూసి చూస్తుండగా… రాజుగారు ఒక్కసారిగా విరుచుకుపడిపోయారు.

చెట్టు చాటునుంచి చీకట్లోకి కలిసిపోయిన సన్నాసులు బక్కడికి కనబడలేదు.
----------------------------------------------------
రచన: చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు, 
ఈమాట సౌజన్యంతో