Showing posts with label దేవులపల్లి కృష్ణశాస్త్రి. Show all posts
Showing posts with label దేవులపల్లి కృష్ణశాస్త్రి. Show all posts

Sunday, October 2, 2022

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వ పరిచయము

 దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వ పరిచయము



సాహితీమిత్రులారా!

ఈరోజు మనం ఆధునిక కవులలో మహాకవులు అనదగ్గవారి చేతనే కైమోడ్పులు అందుకున్న మహోన్నత కవి, భావకవితా ప్రపంచపు రవి అయిన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత్వం గురించి మాట్లాడుకుందాం.


Rajan PTSKగారికి ధన్యవాదాలు

Saturday, March 19, 2022

ఏల ప్రేమింతును?

ఏల ప్రేమింతును?




సాహితీమిత్రులారా!



దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి

కృష్ణపక్షంలోని కవిత

ఏల ప్రేమింతును? ఆస్వాదించండి


సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికలనేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను?


మావిగున్న కొమ్మను మధుమాసవేళ

పల్లవము మెక్కి కోయిల పాడుటేల?

పరుల తనియించుటకొ ?తన బాగుకొరకొ?

గాన మొనరింపక బ్రతుకు గడవ బోకొ?

 

Wednesday, December 8, 2021

నా జీవితము

నా జీవితము




సాహితీమిత్రులారా!

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కృష్ణ పక్షంలోని

కవిత నా జీవితము - ఆస్వాదించండి-


వింతగా దోచు నాదు జీవితము నాకె!

జిలుగు వెన్నెలతో చిమ్మచీకటులతొ;

అమల మోహన సంగీతమందు హృదయ

దళన దారుణ రోదన ధ్వనులు విందు;

వక్రగతి బోదు చక్కని పథమునందె,

రాజపథమునకై కుమార్గమున జూతు;

గరళమేతిందు కడుపార నెరిగి యెరిగి;

అవల ద్రోతు చేతులార నమృతరసము;

విస మమృతమట్టు లమృతంబు విసమురీతి;

చిత్రచిత్రగతుల మార్చు జీవితంబు! 

Saturday, October 9, 2021

నా ప్రేమ

నా ప్రేమ




సాహితీమిత్రులారా!



దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి

కృష్ణపక్షం నుండి నా ప్రేమ - అనే

ఈ కవిత ఆస్వాదించండి-

క్రౌర్య కౌటిల్య కలుష పంకంబు వలన

మలినమౌ నా హృదయము ధామ మెటులయ్యె

నతి విశుద్ధము  మధురము నఘరహితము

ప్రణయమున కంచు సందియ పడుదువేమొ


ప్రేయసీ! శర్వరీ తమోవీధుల బడి

చంద్రుడు రాడె పూర్ణతేజస్వియగుచు

అఘవిదూషిత మీ హృదయంబునందె

ప్రేమ కోమల తమము పవిత్రమయ్యె

Saturday, February 29, 2020

అందరము పొందుగ బతకాలి


అందరము పొందుగ బతకాలి




సాహితీమిత్రులారా!

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కోరిక
చూడండి.
ఇది ఆయన గేయసంపుటిలోది
ఆస్వాదించండి-

ఈ జీవిక ఏనాడును ఏ నెరుగను తీరిక
వాడక కలచును నా మది వీడక ఒక కోరిక-

పుడమి నెల్ల లవలేశము విడువక తిరుగాలి
అడు గడుగున ఆగి ఆగి అరసి అరసి సాగాలి

ప్రతి మానవ గేహమునకు అతిథిని కావాలి
ప్రతి ఎదలో నా నెయ్యపు పాలు పోసి నింపాలి

వసుధను నా వీటిలోన వసుధలోన నా వీటిని
పొసగించి అందరము పొందుగ బతకాలి

Sunday, February 2, 2020

గొంతు చీకటి


గొంతు చీకటి




సాహితీమిత్రులారా!

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి
కృష్ణశాస్త్రి పద్యాలు సంకలనం నుండి
ఈ గొంతు చీకటి కవిత ఆస్వాదించండి-

నాటి యామని వరువాత తోటలోన
పాటలో మేలుకొన్న స్వప్నములు, మూగె
పాటల పలాశములు, నా గవాక్ష వీథి
నా నయనముల నుండి, నాలోన నిండి!

ఎంత మెత్తని యడుగుల నేగుదెంచి
నావొ నాకయి నాకుటీరాజిరమున
''నేను రావచ్చునా'' యన్న నీ పిలుపు వి
నంబడదు నాటి యూహాంగణముల జొచ్చి!

పోయె నాకోయిలల కారు, పోయెను నవ
మల్లికల వేళ, శ్రావణ మ్మా శరత్తు;
మూలమూలల ఈ పర్ణశాల నేడు
హిమపదాంకములెే తలయెత్తి పిలుచు!

Monday, April 30, 2018

సుందర లోకం


సుందర లోకం



సాహితీమిత్రులారా!



దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత
సందరలోకం వారిమాటల్లో
ఆలోకం అవలోకించండి-


చుక్కల కావలి దిక్కున 
             సుందరలోకం
మిక్కలి దూరం ప్రయాణ
           మెంతైనా భారం-
అక్కడ నా చిట్టితల్లి 
          హాయిగానే ఉంటుంది-
ఒక్కతే వాళ్ల మామ్మ 
          ఒడిలో కూర్చుంటుంది-
అక్కడ ఇంద్రధనుస్సులు 
          అల్లిన పందిళ్లు
అక్కడ వెన్నెల కలాపి
          చల్లిన వాకిళ్లు.....

Friday, April 13, 2018

అతిథిశాల


అతిథిశాల




సాహితీమిత్రులారా!




"దేవులపల్లి కృష్ణశాస్త్రి"గారి కవిత
"ఉమర్ ఖయ్యాం" నాటిక నుండి-


తళుకు జలతార్ బుటా లద్దిన
నీలి వలయమ్మీ గుడారం
చాల సుఖద మ్మీబిడారం

పరం అపరం తెలియజాలం-
ప్రస్తుత మ్మిటనే బిచానా-
ఇంతలో ఎటకో రవానా

మౌల్ సెరీ జాయీ గులాబీ
మేల్ జుహీ చంపా చమేలీ
మనకు చుట్టా లీ హవేలీ

ఒక్క, షాయ్రీ - ప్రక్క ప్యారీ-
అవని అంతా మా గులిస్తాన్
అతిథి శాలయె మాకు బుస్తాన్

చేయి చెయి మెయి మెయి తగిలిచి
చెంతనే ఉండాలి ప్యారీ
చెలియయే మా పాలి హౌరీ

పూవు లోపల మధువు లుంటే 
తీవ తీవ ఒయారి సాకీ
తీర్చు వేగ సుకాల బాకీ

పాచ్ఛా జలాల్ ప్యారీ జమాల్
మలుసందెల వన్నెల వోలె ఝూటా
మనకు సత్యం మధువు లోటా


సుల్తాన్ ఫకీర్ నాబాబ్ గరీబ్
ఈ మన్నులో సర్వమ్ము మాయం
ఉన్నదీ సారాయి ఖాయం

ఏడిరా బైరాం హాతిం ఖైఖస్రు
రుస్తుం అల సికందర్
పారెరా సామ్రాట్టు సీజర్ 

నిన్న రాబో, దెల్లి రాలే
దన్న మాటిది సిసల్ ఖయ్యాం
ఉన్నరోజే మనది హయ్యాం

Wednesday, March 21, 2018

నగలన్నీ విడిచిరా


నగలన్నీ విడిచిరా




సాహితీమిత్రులారా!


"దేవులపల్లి కృష్ణశాస్త్రి"గారి
"బదనిక" అనే కవితా సంపుటిలోని
ఈ కవిత చూడండి-

నగ లన్నీ విడిచిరా,
        వగలమారి నా కవితా
నవరసవాహిని, గీతా
        నాగర మోహిని రావా
కనక మేఖలాధ్వనులను
        కంకణ మణి కింకిణులను-
నగలన్నీ విడిచిరా
        వగలమారి నా కవితా

Tuesday, December 26, 2017

యతో భావః తతో రసః


యతో భావః తతో రసః




సాహితీమిత్రులారా!



రసం ఎలా పుడుతుందంటే
ఈ శ్లోకం చూడాల్సిందే
ఇది అభినయ దర్పణంలోనిది-

యతో హస్త స్తతో దృష్టిః
యతో దృష్ట స్తతో మనః
యతో మనః తతో భావో
యతో భావః తతో రసః

హస్తమున్నచోట దృష్టి ఉండాలి,
దృష్టి ఉన్నచోట మనసు లగ్నంకావాలి,
మనసు లగ్నమైనచోట భావం,
భావం ఉన్నచోట రసం తప్పక ఉంటాయి
-అని భావం
ప్రదర్శన కళలో ఇవి వర్తిస్తాయి.
అలాగే పాఠ్య (కేవలం చదివే) కావ్యానికి
కూడ వర్తిస్తాయి. ఇక్కడ హస్తమనేది కొన్ని
సంకేతాల సంపుటిని వ్యక్తం చేసే చిహ్నం.
చదువుకొనే కవితలో ఈ సంకేతాలను
పదచిత్రాలు తెలియ చేస్తాయి ఒక రకంగా
ఇవి కవిసమయాలు. పాత కవిసమయాల
స్థానంలో కొత్తవాటిని ఆధునికిలు సృష్టిస్తే
ఏ సంజ్ఞని దృష్టిలోకి తెచ్చుకోవాలన్నది
ముఖ్యం. అప్పుడు మనస్సు దానిమీదే
లగ్నమౌతుంది. భావరసాలు రెండూ
ఒకదాని తర్వాత ఒకటి నిష్పన్నమై
ఆనందం కలుగుతుంది. నిజమైన కవిత్వాన్ని
చదువుకొన్నా, విన్నా ఇది సిద్ధిస్తుంది.
భావహీనమైన రసం ఉండదు అలాగే
రసహీనమైన భావమూ ఉండదు.
అని నాట్యశాస్త్రం చెబుతున్నది.

ఈ ఉదాహరణ సూస్తే పై విషయం బోధపడుతుంది.
ఇది దేవులపల్లి వారి అన్వేషణ అనే ఖండకావ్యంలోనిది-
ఇది వచనంలా చదువుకొన్నా చిత్రాలు కనబడతాయి
చూడండి-

సన్నని యెల్గెత్తి జాలిగా నెవరినో
        అరయుమా! పిలుచుచున్నదియె యమున!
ప్రక్క నిర్జీవ ధావళ్యమ్ముతో నున్న 
        సికతా తలమ్ము గాంచితివె, దాని?
తుది మొదల్ లేదిదే త్రోవరుల్ త్రొక్కని
        యీదారినే పరువెత్తినాను
ఈ మొండి చేతులనెత్తి యీవనతరుల్
        శూన్య దృక్కుల దిశల్ చూచునయ్యొ
ఇచటనె యిచటనే యతడిచట నేను-
ఇచట నీ జావూ బొదరింట నేను -
ఈ కడిమి చెట్టు క్రింద ముమ్మీ యతండు -
సరిగ కన్నుల గట్టిన సరణి దోచు

ఈ పద్యంలోని కవితానర్తకి మొదటి సన్నని గొంతుకతో
జాలిగా పిలుస్తున్న యమునను కంఠంతో అనుకరిస్తున్నట్ట
నిపిస్తుంది. ఇసుక తిన్నెలను కళ్ళతో చూపెడుతుంది.
చెట్లు మొండి చేతులెత్తాయన్నప్పుడు తన చేతులు ఎత్తినట్టే
కనబడుతుంది. అవి శూన్య దృక్కులతో దిశలో చూస్తున్నావని
ఖాళీ చూపులతో ఇటూ, అటూ, అటూ ఇటూ చూస్తున్నట్టు
కనబడుతుంది. ఇదుగో తానక్కడ, నేనిక్కడ అని చోట్లు
మార్చి మార్చి చూపెట్టడం అలా చూపిస్తూ పాతదృశ్యాలు
తన కన్నులకు కట్టినట్టుందని చెబుతుంది.
నాయిక కన్నులకే కాదు పఠిత కన్నులకు కూడ కట్టినట్లు
చెప్పగలగడమే అభినేయార్థ ఖండకావ్యం.
ప్రదర్శనకళను పుణికి పుచ్చుకొంటే
రసభావాలు నిష్పన్నమౌతాయి.


Saturday, May 28, 2016

జయజయ ప్రియభారత జనయుత్రి

జయజయ ప్రియభారత జనయుత్రి


సాహితీమిత్రులారా

దేవులపల్లి వారి
 "జయజయ ప్రియభారత జనయిత్రి" 
- అనే దేశభక్తి గేయాన్ని ఆలకించండి.


Tuesday, May 24, 2016

బాటసారి


బాటసారి


సాహితీమిత్రులారా !

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి
బదరికలోని కవిత ఇది
చూడండి


ఏటికి నే బిడ్డను ,
తోటకు తోబుట్టువును;
పాట నాకు కూడు,
పక్షి నాకు సైదోడు-
నా పేరు బికారి, మ
రో పేరు బాటసారి
మన సున్న చోట మజిలీ
మరి కాదంటే బదలీ!

Saturday, May 7, 2016

ఏల ప్రేమింతును?


ఏల ప్రేమింతును?


సాహితీమిత్రులారా!
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు "కృష్ణపక్షము"లో
ప్రేమ గురించి రాస్తూ ..........
ఎందుకు ప్రేమిస్తానంటే?(ఏల ప్రేమింతును?)
-అని ఒక కవిత రాశాడు
చూడండి.

సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల పాడు టేల?
పరుల తనియించుటకొ? తన బాగు కొరకొ?
గాన మొనరింపక తన బ్రతుకు గడవ బోకొ?


ఇవన్నీ ఎంత సహజమో? 
నా ప్రేమ కూడా అంతే సహజం అని కదా!