Saturday, March 31, 2018

ఎవరి పాదచిహ్నములు లివి?


ఎవరి పాదచిహ్నములు లివి?
సాహితీమిత్రులారా!
"దాశరథి"గారి "అమృతాభిషేకము"
నుండి ఈ కవిత వీక్షించండి-


ఎవరి పాదచిహ్నము లివి?
ఎవరి పాదచిహ్నములు?

       ఆతని ప్రతిఅడుగు గురుతు 
       ఆలయమై తలయెత్తును
       ఆతని చేయి గొడుగు క్రింద
       అఖిల జగము శయనించును

దానవులను కరిగించిన 
మానవుడత డెవ్వడు?

         గుండెనొడ్డి తుపాకీల 
         గుండె పగులగొట్టె నతడు
         రాటంతో రణశూరుల
         ఈటెల నెదిరించె నతడు

హిమాలయముకన్న నెత్తు 
ఎవడాతం డెవ్వడు?

          ప్రతి మానవు హృదయమ్మున 
          నొదిగిపోవ జాలు నతడు
          విశ్వములో ప్రతిప్రాణిని
          ప్రేమించగ జాలు నతడు

కత్తికి కన్నీరుగూర్చు 
కరుణాకరు డెవ్వడు?

          విషమిచ్చిన వాని కమృత
          చషకమిచ్చె నాతడు
          కారాగారము స్వర్గము
          గా మారిచె నాతడు

తరతరాల మన సంస్కృతి 
తానై నిలిచిన దెవ్వడు?

          " ఓపిక" రూపం దిద్దుక 
           ఉరికి వచ్చు నతనిలో-
           "శాంతి" శరీరమ్ము బూని
           సాగి వచ్చు నతనితో-

"మంచి" మరాళము వోలిక
మసలు నతని మనసులో-

            "క్షమ" శిశుశశి నవరేఖా
            సదృశమయ్యె నతని శిరసి
            "ఔదార్యం" అతని నుండి
            అమరవాహినిగ దూకును

ఎవరిని తనువు గతాగతము
లేకమైన యటుల తోచు?
ఎవని చిన్ని నివాసము
అవనికి కైలాసము?

        గుండెలలో ఆతడున్న
        కొంచెము సేపాపుడీ
        కనులలో ఆతడున్న
        కాస్త నాకు చూపుడీ!

ఎవరి పాదచిహ్నము లివి
ఎవరి పాదచిహ్నములు?

Friday, March 30, 2018

యజ్ఞవరాహావతార వర్ణన


యజ్ఞవరాహావతార వర్ణన
సాహితీమిత్రులారా!


"పోతన" కృత "శ్రీమదాంధ్రమహాభాగవతం"
లోని తృతీయస్కంధంలో శ్రీయజ్ఞవరాహ
అవతార వర్ణన వుంది. దానిలోని కొన్ని
పద్యాలను ఇక్కడ చూద్దాం-

సృష్టివిషయమై బ్రహ్మదేవుడు శ్రీహరిని తలంచగానే
ఆయన నాసికా రంధ్రం నుండి ఎదుట అంగుష్ఠ
మాత్రంతో పుట్టి అప్పటికప్పుడే పెద్ద ఏనుగంత
స్వరూపంతో నిలబడ్డాడు శ్రీయజ్ఞవరాహమూర్తి.
నామనసులో ఉన్న విచారాన్ని పోగొట్టటానికి
యజ్ఞవరాహరూపంలో శ్రీమహావిష్ణువు ఈ విధంగా
పుట్టడం చాల చిత్రంగా ఉందని బ్రహ్మ వితర్కించు
సమయంలో

ప్రళయ జీమూత సంఘాత భయద భూరి
గర్జనాటోపభిన్నదిగ్ఘన గభీర
రావ మడరింప నపుడు రాజీవభవుఁడు
మునులు నానందమును బొంది రనఘచరిత

(యజ్ఞవరాహమూర్తి చేసిన గుర గుర మనే గర్జన
ప్రళయకాలంనాటి మేఘంసమూహం చేసే ఉరుములాగా
దిక్కులను పిక్కటిల్లేట్లు చేసింది. ఆ శబ్దం విని బ్రహ్మ
మరియు అక్కడ మూగిన యతీశ్వరులు ఆనందించారు.)

కఠినసటాచ్ఛటోత్కట జాతవాత ని
           ర్ధూత జీమూత సంఘాతముగను
క్షురనిభ సునిసిత ఖురపుటాహతచల
           త్ఫణిరాజ దిగ్గజ ప్రచయముగను
జండదంష్ట్రోత్థ వైశ్వాన రార్చి స్స్రవ
           ద్రజత హేమాద్రి విస్రంభముగను
ఘోర గంభీర ఘుర్ఘుర భూరి నిస్వన
            పంకిలాఖిలవార్ధి సంకులముగఁ
బొరలు గెరలు నటించు నంబరము దెరల/దెసల
రొప్పు నుప్పర మెగయును గొప్పరించు
ముట్టె బిగియించు ముసముస మూరుకొనుచు
నడరు సంరక్షితక్షోణి యజ్ఞ ఘోణి

(భూమిని ఉద్ధరించటాని ఉద్భవించిన వరాహమూర్తి
సంరంభం ఇలావుంది. అది తనజూలును విదల్చినపుడు
ఏర్పడిన పెద్దగాలికి  మబ్బులన్నీ చెల్లాచెదరయ్యాయి.
చురకత్తులవలె వాడియైన కాలిగిట్టలు సోకి ఆదిశేషుడు మరియు
దిగ్గజాలు వణికిపోయాయి. దాని తీక్ష్ణమైన కోరలనుండి ఎగసిన
మంటలకు వెండికొండ బంగారుకొండ కరిగిపోయాయి. అతి
భయంకరమైన దాని ఘురఘురల అరుపులకు
సప్తసముద్రాలనీరు ఇంకి బురదయింది. అది అటు
ఇటు భూమిపై పొర్లుతూ, ఎగసి చిందులేస్తూ, నింగి
బద్దలయేట్లు శబ్దిస్తూ, ఆకాశ మంత ఎత్తు ఎగిరిదూకుతూ,
కోపంతో మూతి బిగిస్తూ, చిరచిర లాడుతూ  అతిశయించింది.)

మఱియు నయ్యజ్ఞవరాహంబు,
(ఇంకా ఆ వరాహం చేష్టలిలా వున్నాయి.)

తివిరి చతుర్దశభువనంబులను దొంతు
           లొరగఁ గొమ్ములఁ జిమ్ము నొక్కమాటు
పుత్తడికొండ మూఁపురమను నొరగంట
           నుఱుముగా రాపాడు నొక్కమాటు
ఖురముల సప్తసాగరముల రొంపిగా
           నుంకించి మట్టాఁడు నొక్కమాటు
నాభీల వాల వాతాహతిచే మింటి
           నొరసి బ్రద్దలుసేయు నొక్కమాటు
గన్నుఁగోనల విస్ఫులింగములు సెదర
నురుభయంకరగతిఁదోచు నొక్కమాటు
పరమయోగీంద్రజనసేవ్య భవ్య విభవ
యోగ్యమై గానఁగా నగు నొక్కమాటు

(ఆ వరాహం తన కొమ్ములతో పదునాల్గు లోకాలను
వరుసగా కుప్పకూలి పడునట్లు చిమ్ముతుంది.
కనకాద్రిని తన రొమ్ముతో కుమ్ముతుంది.
ఏడు సముద్రాల్ని తన గిట్టలతో రొంపి చేసి
దాని పై విజృంభించి తిరిగింది.
తన తోకతో విసరిన గాలితాకిడి చేత
ఆకాశాన్ని బద్దలు చేస్తుంది. కన్నుల్లో
నిప్పులు కరిపిస్తూ భీకరంగా కనిపిస్తుంది.
ఒక్కొక్క పర్యాయం మహర్షులు భక్తితో
సేవలందించటానికి అనువైన ఆకారంతో
సాక్షాత్కరిస్తుంది.)

Thursday, March 29, 2018

వందే విష్ణు సహోదరీ


వందే విష్ణు సహోదరీసాహితీమిత్రులారా!


"కట్టా అచ్చయ్య"గారి కృత
"చౌడేశ్వరీశతకం"(1919లో ముద్రితము)
లోని కొన్ని పద్యాలు ఇక్కడ చూద్దాం-

వందే విష్ణుసహోదరీ జయకరీ బ్రహ్మండభాండోదరీ
వందేసారకృపావలంబనకరీ వాగర్థశోభంకరీ
వందే క్రూరనిశాటభీషణకరీ భర్గప్రియా శాంకరీ
వందే భక్తవశంకరీ యనుచు నిన్బ్రార్థింతు చౌడేశ్వరీ!

తప్పుల్ గల్గిన నొప్పుగాగొనెడు పెద్దల్ గల్గరే యొప్పులన్
దప్పుల్ గాగణియించి యోర్వమిని వాదంబాడు దుష్టాళిచే
మెప్పుంజెందినఁ జెందకున్న నదిభూమిన్ గొప్పగాదేరికిన్
గొప్పౌనీపదపంకజాశ్రయము నాకుంజూడ చౌడేశ్వరీ!

ఏజన్మంబున గష్టసౌఖ్యముల నేనేలీలగన్నాడనో
యీజన్మంబున కేమిగోచరముతల్లీ ఘోరదారిద్య్ర బా
ధాజీమూతనికేతనస్థిత మహాంధ్యంబైన సంసారమా
యీజన్మంబున నాకమర్చుటలు లేదే కూర్మి చౌడేశ్వరీ!

మునునే భజింపకుంటినొ, మఱేమో, యెట్టపాపిష్టినో
గనజాలంగద నేటికైనమనుమార్గం; బిష్టకామ్యార్థమున్
జననంబందినదాది కష్టములలోనన్ దూగగానయ్యె నో
జననీ యింతచలంబె బ్రోవుమిక మోక్షబిచ్చి చౌడేశ్వరీ!
-----------------------------------------------
- ఏ.వి.రమణరాజు


Wednesday, March 28, 2018

వసంతాన్వేషణ


వసంతాన్వేషణసాహితీమిత్రులారా!"దాశరథి"గారి "జ్వాలాలేఖి"ని
నుండి ఈ కవిత చూడండి-


వసంతం వచ్చేసిందని ప్రకటించేశారు;
వసంతానికి స్వాగతం చెప్పటానికి ఎదురేగాను

వనాంతాలకు వచ్చిందని అటు వెళ్ళాను
వనాలు నరికిపారేశారు, జనాలు బసచేశారు!

వసంతం, కవుల కవితల్లోనైనా వుంటుందనుకున్నాను
ప్రళయార్భటులు, ప్రభంజనాలు దర్శించుకున్నాను!

విషాదాంత వివాదాంత రచనలు 
విప్పితే పత్రికా ప్రపంచంలో కోకొల్లలు!

ఇంతకీ, వచ్చింది, వచ్చింది అన్న వసంతం యెటుపోయినట్లు?
గొంతెత్తి తీయతీయగా కోయిలలు యెక్కడ పాడినట్లు?

మండిపోయే ఈ యెండల్లో  వసంత సుకుమారి 
గుండె పగిలి మండి మసిబొగ్గయిపోయిందా మరి?

కాళిదాస రుతుసంహారంలోని కమనీయ వసంతం 
కాలం మార్పుకి భయపడి రావడం మానేసిందేమో! పాపం!

వనితా హృదయాల్లో వసంతంకోసం గవేషించాను
ప్రణయానికి బదులు ప్రళయాన్నే సాక్షాత్కరించుకున్నాను

అభినవ్య చిత్రకారుడి చిత్రాల్లో అన్వేషించుకున్నాను
అయోమయ వికృతరూపాలు చూసి భయపడ్డాను

నవగాయకుడి గళంలో ప్రశాంత వసంతరాగం వెదికాను
నన్ను జడిపించే హాలాహల కోలాహలరాగం విన్నాను!

మండిపోయే గుండెలతో మహీమండలం అంతా గాలించాను
మోడుపడిన లోకంలో నలుమూలలా సంచరించాను

ఆఖరుకి యెవరికీ పట్టని పంచాంగం విప్పిచూచాను
అదుగో! "వైశాఖమాసః వసంతరుతుః" అని చదివాను

పంచాంగంలో దాక్కున్న వసంత రుతువును
పంచమ ప్రాణంగా లాక్కుని గుండెల్లో దాచుకున్నాను!

Tuesday, March 27, 2018

అక్షయతూణీరం


అక్షయతూణీరం
సాహితీమిత్రులారా!


"నండూరి రామమోహనరావు"గారి
కవితాసంపుటి "మనస్విని" నుండి
ఈ కవిత చూడండి

ఆధునిక కవితాధుని చేసే ధ్వని
అస్తమానం అదేపనిగా విని విని
అంటే తప్పా, తలపగులుతోందని?
       నవకవనమా! నువ్వొక ఐరన్ కర్టెన్!

ఏమిటి రాస్తాడో, ఎవడికీ బోధపడదు
ఎలుగెత్తి చెబుతాడు, ఎవడికీ వినబడదు
జీవితసత్యం జనుల భాషలో ఇమడదు
    కవిభావమా! నువ్వెంత అన్ సర్టెన్!

నీ దగ్గిరున్న శబ్దాల డబ్బా బిగ్గిరిగా వాయించు
సర్రియలిజం చేత వెర్రితలలు వేయించు
భావాలచేత శీర్షాసనం ప్రాక్టీసు చేయించు
       కవిత్వమా! నీపేరు అయోమయత్వం!

ఇలియట్ తో కలిసి వేస్ట్ ల్యాండ్ లో పరిభ్రమించు
మెక్నీస్ లో మునిగి స్పెండర్ లో తేలి ఆచమించు
ఆడెన్ తో క్రీడించు హెర్బర్టు రీడింగు విశ్రమించు
                         అబ్ స్క్యూరిటీ! నీవేనా పొయిట్రీ?

Monday, March 26, 2018

చాటుపద్యం


చాటుపద్యంసాహితీమిత్రులారా!

అల్లంరాజు సుబ్రహ్మణ్యకవిగారు
ఏదో పనిమీద కాట్రావులపల్లె వెళ్ళాడట
అక్కడ ఉండేవన్నీ ఉప్పునీటి బావులే
ఆ నీటిని నోట పోసికొనేసరికి
ఈ పద్యం బయటికి తన్నకొచ్చిందట

దేవాసుర లబ్ధిఁ దరువ
నావిర్భూతమయి హలాహల మపుడు మహా
దేవునకున్ భీతిలి కా
ట్రావులపలి నూతులందు డాఁగెను జుండీ.

సముద్ర మథనంలో పుట్టిన హాలాహలం శివునికి
భయపడి కాట్రావుల పల్లె నూతుల్లో దాక్కుందట
పాపం ఎంత ఇబ్బంది బడ్డాలో ఆ నీరు నోట బట్టి.


Sunday, March 25, 2018

సుఖం ఎరుగనివారు


సుఖం ఎరుగనివారు
సాహితీమిత్రులారా!


ప్రపంచంలో సుఖం ఎరుగనివారు
ఎవరైనా ఉన్నారా? అంటే
ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు" అంటారు
వారి వివరాల్లో కెళితే వారు ఆరు రకాలు-

1. ఈర్ష్యాళువు - 
వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.

2. జుగుప్సావంతుడు- 
వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది.

3. నిస్సంతోషి -
వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖమెక్కడ

4. క్రోధనుడు-
వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ 
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోషమెక్కడ

5. నిత్యశంకితుడు -
అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది
సుఖం.

6. పరభాగ్యోపజీవి -
ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పూ ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే 
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా.

ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ, 
ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని "దుఖఃభాగులు" అంటున్నాయి 
శాస్త్రాలు.

శుభాకాంక్షలు


శ్రీరామనవమి శుభాకాంక్షలుసాహితీమిత్రులకు, 
శ్రేయోభిలాషులకు
శ్రీరామనవమి శుభాకాంక్షలుSaturday, March 24, 2018

కచ్చిపయప్పర్ - కందపురాణం


కచ్చిపయప్పర్ - కందపురాణంసాహితీమిత్రులారా!

సంస్కృతంలో 18, తమిళంలో 9
పురాణాలసంగతి. పురాణాలు సంస్కృతంలో 
అష్టాదశపురాణాలనిపేరు కాని తమిళం వాఙ్మయంలో 
నవపురాణాలుగా ప్రసిద్ధి. వాటిలో మిక్కిలి ప్రసిద్ధిచెందినది 
కందపురాణం. స్కందుడు(సుబ్రహ్మణ్యుడు)తమిళులకు 
అత్యంత  ఇష్టమైన వేల్పు కావడమే దానికి కారణం. కచ్చియప్ప 
శివాచార్యార్ అనే భక్తుడు కంపురాణం తమిళంలో రచించారు.
ఇతన్ని గురించి తెలుసుకోడానికి ప్రత్యక్షచారిత్రకాధారాలు
లేకపోయినప్పటికి ఈయన జీవితాన్ని గురించి తెలియజేసే
గ్రంథాలు తమిళంలో కనిపిస్తాయి. "వామదేవ మురుగ 
భట్టారకుడు" 173 పద్యాల్లో కచ్చియప్పర్ జీవితాన్ని ఒక 
పురాణంగా రచించారు. ఇది 1917వ సంవత్సరంలో 
ముద్రించబడింది. "పురాణముదయార్" అనే మరో 
పండితుడు కూడ కచ్చియప్పర్ నుగురించిన ఒక
గ్రంథం రచించారు. 

కాంచీపురం కుమారకోట్టంలో కారత్తియప్ప శివాచార్యర్ అనే 
అర్చకుడు ఉండేవాడు. క్చియప్పర్ ఇతని కుమారునిగా 
జన్మించాడు. బాల్యంలోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు.
మతసంబంధమైన విద్యల్ని కూడా క్షుణ్ణంగా అభ్యసించాడు.
వయసులోనూ, విద్యలోనూ ఇతనికి పరిపక్వత వచ్చింది.

      కచ్చియప్పర్ స్వప్నంలో కుమారస్వామి సాక్షాత్కరించి
సంస్కృతంలోని స్కందపురాణంలోని 6 సంహితలలోనూ 
శంకరసంహిత ప్రథమకాండ(శివరహస్యకాండ)లో ఉన్న తన
చరిత్రను తమిళంలో విశదంగా పాడమని ఆదేశించాడు. 
ఆశ్చర్యంతో దిక్కుతోచని కచ్చియర్ కు ఒక పద్యపాదాన్ని 
కూడా ఇచ్చి సుబ్రహ్మణ్యస్వామి అదృశ్యమయ్యాడు. మరుసటి 
రోజు కుమార కోట్టంలో పూజముగించుకొని కుమారస్వామి ఇచ్చిన 
పద్యపాదంతోనే కచ్చియప్పర్ కందపురాణ రచనకు శ్రీకారం చుట్టాడు.
రోజుకో వంద పద్యాలు వ్రాసేవాడు. వ్రాసిన పద్యాల్ని స్వామి ముందుంచి 
వాకిళ్ళు వేసుకొని వెళ్ళేవాడు. మరుసటిరోజు వచ్చి చూసేసరికి అవసరమైన 
చోట్ల స్వామి స్వహస్తాలతో చేసిన సవరణలు కనిపించేవి. ఈ విధంగా 
కందపురాణం 6 కాండలుగా,  10,345 పద్యాల్లో కూర్చబడింది.

                             ఒకరోజు స్కంధుని సన్నిధిలో గ్రంథావిష్కరణ ఏర్పాటైంది.
దిగడ సకరసెమ్ముగం అయిందులాన్ - అని కచ్చియప్పర్ చదవడం మొదలుపెట్టాడు. అసూయాగ్రస్తుడైన ఒక పండితుడు దాన్ని అధిక్షేపించాడు.  సంధివ్యాకరణ దోషముందన్నాడు. సశాస్త్రీయమైన ఆధారం చూపమన్నాడు. ఇది తన సొంతపద్యంకాదని స్కంధుడే స్వయంగా చెప్పాడు అని తన స్వప్నవృత్తాంతం చెప్పాడు. స్కంధుని సాక్ష్యమే, గ్రంథస్థ ఆధారమే కావాలని పండితుడు పట్టుపట్టడంతో కార్యక్రమం మరుసటిరోజుకు వాయిదా పడింది. సుబ్రహ్మణ్యస్వామి  కచ్చియర్ కు ఆ రాత్రి స్వప్నంలో మళ్ళీ కనిపించి దానికి "వీరసోళియం" అనే గ్రంథంలో ఆ సంధికి ఆధారం వుందని, ఒక చోళ దేశ పండితుడు మరుసటిరోజు దాన్ని సభకు తీసుకువస్తాడని చెప్పాడు. మరుసటిరోజు సభలో కచ్చియప్పర్ తాను గతరాత్రి కన్న కలను గూర్చి చెప్పాడు. ఒక పండితుడు వీరసోళియం అనే వ్యాకరణ గ్రంథాన్ని తెచ్చియిచ్చి మాయమయ్యాడు. కచ్చియప్ప శివాచార్యుని ఘనతను అందరూ వేనోళ్ల వినుతించారు. కచ్చియప్పర్ జనన మరణ తేదీలకు సంబంధించిన సమాచారమేదీ లభించడంలేదు. మొత్తానికి గొప్ప శైవునిగా, స్కంధభక్తుడుగా, స్కంధానుగ్రహ పాత్రుడుగా, గొప్ప కవిగా తమిళ సాహిత్య చరిత్రలోనూ, తమిళుల చరిత్రలోనూ కచ్చియప్ప శివాచార్యర్ కు ఒక ఉన్నతస్థానం ఉందనడం నిర్వివాదాంశం.


Friday, March 23, 2018

విజయ విహారం


విజయ విహారం


సాహితీమిత్రులారా!

"ఆరుద్ర"గారి కవితాసంకలనం నుండి
ఈ కవితను చూడండి-

ఎండిన దేహాల
మండిన హృదయాలకు 

         చెయ్యండ్రా రక్తదానం
         పొయ్యండ్రా వీరామృతం

ప్రపంచమంతటా 
ప్రజలను లేపి

         చీల్చండ్రా శత్రు సమూహం
         పీల్చండ్రా వారల జీవం 

భూగోళపు
టంచులమీద

తియ్యండ్రా రక్తం చందనం
పుయ్యండ్రా వీరుల మెడలకు -

                  (తెలుగుతల్లి - 1943)

Thursday, March 22, 2018

కుల్లాయించితి, గోకజుట్టితి


కుల్లాయించితి, గోకజుట్టితి
సాహితీమిత్రులారా!
చాటువులంటేనే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది
కవిసార్వభౌముడైన శ్రీనాథుడు. ఆయన చెప్పిన
ఈ చాటువును గమనిద్దాం-

కర్ణాటక రాజ్యమును దర్శించినపుడు రాజదర్శనమునకు
కాలయాపన జరిగింది ఆ సందర్భంలో అనేక ఇబ్బందులను
ఎదుర్కొన్నాడు అందుకే కర్ణాటకరాజ్యలక్ష్మిని ఇలావేడుకున్నారు.

కుల్లాయించితి, గోకజుట్టితి, మహాకూర్పాసముందొడ్గితిన్
వెల్లుల్లిం, దిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్తవడ్డింపగాఁ
జల్లాయంబలిద్రావితిన్, రుచుల్ దోసంబంచు బోనాడితిన్
దల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా నేను శ్రీనాథుడన్

తల్లీ! కర్ణాటకరాజ్యలక్ష్మీ!  కుల్లాయి పెట్టుకొంటిని, కోకను
చుట్టుకొంటిని, పెద్దకూర్పాసము తొడిగాను, వెల్లుల్లి(ఉల్లి)
తిన్నాను. విధవ వడ్డింపగా తిన్నాను.(భర్తలేని స్త్రీ వడ్డించటం
ఆ కాలంలో నిషేధం) చల్లను, అంబలిని త్రాగాను. రుచులు
ఎంచటం తప్పని విడిచేశాను. నేను శ్రీనాథమహాకవిని నా పై
దయలేదా అనుగ్రహింపుము అని ప్రార్థించారు - అని భావం.

Wednesday, March 21, 2018

నగలన్నీ విడిచిరా


నగలన్నీ విడిచిరా
సాహితీమిత్రులారా!


"దేవులపల్లి కృష్ణశాస్త్రి"గారి
"బదనిక" అనే కవితా సంపుటిలోని
ఈ కవిత చూడండి-

నగ లన్నీ విడిచిరా,
        వగలమారి నా కవితా
నవరసవాహిని, గీతా
        నాగర మోహిని రావా
కనక మేఖలాధ్వనులను
        కంకణ మణి కింకిణులను-
నగలన్నీ విడిచిరా
        వగలమారి నా కవితా

Tuesday, March 20, 2018

ఇవి తెలుసుకుందాం


ఇవి తెలుసుకుందాం


సాహితీమిత్రులారా!మనం ప్రతిరోజూ ఎక్కడోఒకచోట
షష్టిపూర్తి చేసుకొనేవారిని గమనిస్తుంటాం
అది ఎందుకు చేసుకోవాలి ఇలాంటివేమైనా
ఇంకా ఉన్నాయా అనే దాన్ని గురించి ఇక్కడ
తెలుసుకుందాం-
60 సం., 70సం., 81 సం.లకు మనిషికి గండం 
వుంటుందని వాటికి శాంతి చేసుకోవాలని 
మన శాస్త్రకారులు  చెబుతారు. 

షష్టిపూర్తి - 

ఇది 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో
చేసుకొనే వేడుకని అందరూ అను కుంటారు కాని
శాస్త్రకారులు 
"జన్మతః షష్టిమేవర్షె మృత్యు రుగ్ర రథోనృణాం" - అని 
చెబుతారు. అంటే పుట్టినది మొదలు 60వ సంవత్సరమున
ఉగ్రరధము అనే పేర మృత్యువు మానవుని వెన్నాడుతుంది.
ఈ 60వ సంవత్సరగండం దాటడానికై షష్టిపూర్తి శాంతి చేసుకో 
తగిందని దీనికే ఉగ్రరధ శాంతి అని పేరు.

70 సంవ్తరాల గండం-

"జన్మనాసప్తమేవర్షె మృత్యుర్భీ మరధోభవేత్" - అని 
శాస్త్రకారులు చెబుతారు. అంటే 
పుట్టింది మొదలు 70 వ సంవత్సరమునకు
భీమరధమని పేర మృత్యువు వెన్నాడుతూంటుంది. 
దీని శాంతి కొరకై భీమరధ శాంతిని చేసుకోవాలి.

81 సంవత్సరముల ఉత్సవం -

అశీత్యేకాబ్దమాసేస్యాత్ అధికమాసైస్సమన్వితే
సహస్ర సోమదర్శస్యాత్ ఊర్జ్యంస్యాత్ పుణ్యకృత్

ఎనబై ఒకటవ సంవత్సరమన శతాభిషేక మహోత్సవం 
చేయదగింది. పుట్టినది మొదలు అధికమాసంలతో కూడ 
లెక్కిస్తే 81వ సంవత్సరానికి 1000 సంద్రదర్శనాలవుతాయి
కావున శతాభిషేకోత్సవం చేసుకోదగింది.

Monday, March 19, 2018

హృదయ కోకిల


హృదయ కోకిల
సాహితీమిత్రులారా!

దాశరథి కృష్ణమాచార్యులవారి
జ్వాలాలేఖిని నుండి ఈ కవిత
చూడండి-

నవ వసంతోదయానంద సమయంలో
నా హృదయ కోకిల పలికే  గీతంలో
నిస్సహాయులలోని నిరాశను పోగొట్టే
నిస్సీమ శక్తిని కోరుకొంటున్నాను

అవని అనే ఆమ్రశాఖపై చిగిర్చిన
అతి కోమల మానవతా పల్లవాలు ఆరగించి
ప్రశాంత రాగాలాపనలతో ప్రజాళిని
పరవశింపజేసే శక్తిని కోరుకుంటున్నాను

నిరాశా మహాగ్ని తోరణ మాలికలతో 
నిరంతరం భీతిల్లజేసే ఈ ప్రపంచంలో
ఆశా వసంత వనాంత పవనాల వీచికలను
అవనికి అంచిగల శక్తిని కోరుకుంటున్నాను

అన్నమో రామచంద్రా! అనే మనిషి లేనినాడు
అసలైన ఉగాది ఆనంద రథంమీద వస్తుంది
ఆ నవరథ సారథినై  ప్రజాపథాల మీద
అనుగమించగల శక్తిని కోరుకుంటున్నాను

పండుగనాడు గుండె మంటలను మరచి 
ప్రజావళి సంతోషాతిరేకంతో
తరతమ భేదాలు విడిచి జీవించ గల 
తరణ సామ్యవాద సాధనశక్తిని కోరుకుంటున్నాను

నవ హృదయ కోకిలాగళం పలికే శబ్దం
చెవిని పడగానే పరుగెత్తుకొని వస్తుంది నవాబ్దం
అనంతకాలంలో అవనిలో వసంతాన్ని ఆపి ఉంచగల
ఆ ఉగాదిని తేగల శక్తిని కోరుకొంటున్నాను

Sunday, March 18, 2018

ఉగాది కోయిల


ఉగాది కోయిలసాహితీమిత్రులారా!

ఇది 1983లో వ్రాయబడిన ఉగాది కవిత

మాటలురాని కోయిలా కూయకే
        కుహూఁ కుహూఁ యంటూ
            ఈ లిప్స నీకేలే కోయిలా
అది ప్రమదనాదమా
మరి ప్రళయనాదమా
               చూతప్రవాళ మంజరులు చూతమన్నా
               సరిగా దొరకని యీ యెడారివుగాదిపై
మధుపాళి సైతం రాగాలుమాని వసివాడిన
విటపవాటి దాటి యేయాశకో యేగిన యీవుగాదిపై
ఎండినఎడారిలో పండని జీవితాల
పండించి రాలేలా చేసే యీవుగాదిపై
                  ఈ లిప్స నీకెందుకే కోయిలా
ఎవరికి తెలియనిదీ యుగాది ఉగాది
ఎవరికి తెలియని చేదు తీపి జీవితామని
                                  ఎడారి ఏడాది వుగాది
మాటలురాని కోయిలా కూయకే
         కుహూఁ కుహూఁ యంటూ
             ఈ లిప్స నీకేలే కోయిలా


                                                          (1983 ఏప్రిల్ మానసవీణ)

బ్రహ్మపురాణం


బ్రహ్మపురాణం
సాహితీమిత్రులారా!
అష్టాదశ పురాణాల్లో మొదటిది బ్రహ్మపురాణం. 
విష్ణుపారమ్యం కలది విశేషించి కృష్ణగాథలు ఉన్నది.
బ్రహ్మకల్పంలో ప్రవర్తితమైన రాజస పురాణం ఇది.
ఋషులకు బ్రహ్మ చెప్పినట్లుంది. ఇందులో 5 సర్గలు,
పదివేల శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణ ప్రశస్తి 
ఇతరపురాణాల్లో ఎక్కువగా కనబడుతుంది.

        ఇందులో మొదట బ్రహ్మ సృష్టిక్రమం, వర్ణన,
రాక్షస, దేవతా వంశాల, సూర్యచంద్ర వంశాల విస్తృత
వర్ణన ఉన్నాయి. ప్రతిసర్గంలో దక్షప్రజాపతితో సృష్టి
ప్రారంభం కావడం, దక్షుడు అదేపనిగా సృష్టి చేస్తూండగా,
ఆ సృష్టికి కావలసినంత స్థలం వున్నదో లేదో తెలుసుకొమ్మని
నారదుడు ఉపదేశించడం, దక్షుని కుమార్తెలు భూవిస్తృతిని
తెలుసుకొని రావడానికి పోయి తిరిగి రాకపోవడం చెప్పబడింది.
సూర్యవంశ వర్ణన సందర్భంలో సగరకుమారులు యాగాశ్వాన్ని
వెదకుతూ ముని ఆగ్రహానికి గురుయై భస్మంకావడం అనే కథలో
ఆ ఆరువది వేల మందిలో నలుగురైదుగురు ముని అనుగ్రహం 
పొంది చావు తప్పించుకొని వారే యాగాశ్వాన్ని తిరిగి చెచ్చారని
ఈ పురాణం చెబుతుంది. భగీరథుడు తపస్సు చేసి గంగను 
భూమిపైకి తేవడం కూడా వర్ణితమైంది ఇందులో.

         చంద్రవంశ గాథా ప్రారంభంలో చంద్రుడు అత్రిమహర్షి
కుమారుడై పుట్టి చంద్రవంశాన్ని విస్తంరింపచేసినట్లుంది. ఆ తరువాత
రుద్రమహాత్మ్యవర్ణన ప్రసక్తం కాగా పార్వతీ పరమేశ్వరుల వివాహం 
వర్ణింపబడింది. గౌరి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను
ప్రేమించినట్లు చెప్పాడని, గౌరి శివుని తన తండ్రితో కలిసి 
మాట్లాడమని కోరిందని, శివుడు హిమవంతుని వద్దకుపోగా ఆయన
తన కుమార్తెకు స్వయంవరం చాటిస్తాడని కథనం. తిరిగి గౌరి వద్దకు 
పోయి మావంటి పేదలు స్వయంవర సభలోకి ఎట్లా రాగలరని అడగగా 
గౌరి శివుని మెడలో అప్పటి కప్పుడే పూలమాలవేసిందట. స్వయంవరంలో 
శివుడు శిశురూపంలో గౌరి అంకతలంపై క్రీడించగా, గౌరి ఆ శిశువు మెడలో 
స్వయంవరమాల ఉంచింది. దేవతలు అందుకు కోపించి యుద్ధం 
చేయబోయి ఓడిపోయారు. చివరకు నిజం తెలుసుకొని వారు శివుని స్తుతించారు.

                    తరువాతి కథ జగన్నాథక్షేత్రం()పూరి)లో వెలసిన
జగన్నాథ, బలరామ, సుభద్రామూర్తుల ఆవిర్భావంతో సంబంధించిన
ఇంద్రద్యుమ్న చరిత్రం. శ్రీకృష్ణచరిత్రం కూడా విపులంగా వర్ణించబడింది.  
భాగవత కథాంశాలకంటె ఇందులోని కథాంశాలు భిన్నంగా ఉన్నాయి.

                    ఇందులోని ఒక విశేషాంశం దశావతారకథనం. అగ్నీధ్ర రాజవృత్తాంతం 
మాయ అంటే ఏమిటో నిరూపించి,  దానిని నిరాసం(తిరస్కరం) చేయటానికి 
యోగాభ్యాస ఆవశ్యకతను నిరూపించి  ఆ సందర్భంలో సాంఖ్యయోగాన్ని వివరించటం జరిగింది. ప్రసక్తానుప్రసక్తంగా అక్షరాక్షర స్వరూపనిరూపణం, విద్యావిద్యా మహిమ స్వరూపనిరూపణం చేయబడ్డాయి. ఆ తరువాత సర్వపురాణాలకు సామాన్యమైన 
తీర్థవర్ణనలు, ద్వీప, వర్ష వర్ణనలు ఉన్నాయి. పురూరవ చక్రవర్తి పూర్వజన్మ 
వృత్తాంతం ఒక ప్రత్యేక గాథగా ఉంది. ఈ పురాణాన్ని జనమంచి శేషాద్రి శర్మ(1892-1950)
గారు పద్యానువాదం చేశారు. వెంకట పార్వతీశ్వరకవులు కూడా నడకుదుటి వీరరాజుతో 
కలిసి మరో అనువాదం చేశారు.

ఉగాది శుభాకాంక్షలు


విళంబి నామ సంవత్సర 

ఉగాది శుభాకాంక్షలు

సాహితీమిత్రులకు 
శ్రేయోభిలాషులకు
విళంబినామ సంవత్సర శుభాకాంక్షలు

Saturday, March 17, 2018

జలధివిలోల వీచి విలసత్కల


జలధివిలోల వీచి విలసత్కలసాహితీమిత్రులారా!యయాతి చరిత్ర
శ్రీమదాంధ్రమహాభారతం
ఆదిపర్వం తృతీయాశ్వాసంలో ఉంది.
దీనిలో శుక్రాచార్యుని కుమార్తె దేవయానికి
వృషపర్వుడనే దానవరాజు కుమార్తె
శర్మిష్ఠకు జరిగిన వివాదంలో దేవయానిని
శర్మిష్ఠ బావిలో త్రోసివేసి వెళ్ళింది.
అక్కడకు వేటకై వచ్చిన యయాతి
దాహంతో బావిలోని నీరు త్రాటానికి
ఆ ప్రాంతం వచ్చి బావిలో చూడగా
అక్కడ దేవయాని బావిలో కనిపించింది.
అప్పుడు యయాతి దేవయానిని
బావినుండి బయటకులాగిన సందర్బములోని
పద్యాలు గమనిద్దాం-

బావిలోని దేవయానిని ఎవరివి నీవు
ఈ బావిలో ఎలా పడ్డావని అడగ్గా
అంతకుమునుపు వేటకు వచ్చిన సమయంలో
యయాతిని చూచి వున్నందున తనగురించి ఇలా చెప్పింది-

అమరసన్నిభ యేను ఘోర సురాసురావహభూమి న
య్యమరవీరులచేత మర్దితులైన దానవులన్ గత
భ్రములఁగా దనవిద్య పెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి య
త్యమిత శక్తి మెయిన్ వెలింగిన యట్టి భార్గవు కూతురన్

(దేవతలతో సమానుడైన యయాతీ నేను భయంకరమైన
దేవాసుర సంగ్రామమున వీరులైన దేవతలచే చంపబడిన
రాక్షసులను తన మృతసంజీవనీ విద్యతో మళ్ళీ బ్రతికించే
గొప్ప శక్తితో ప్రకాశించే శుక్రాచార్యుని కుమార్తెను)

దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతంబడి వెలువడ
నేరకున్న దానను నన్నుద్ధరించి రక్షింపుమనిన నవ్విప్రకన్యక
యందుఁదద్దయు దయాళుండై

(నేను దేవయాని అనే పేరు గలదాన్ని. ఏమరుపాటున ఈ
నూతిలోపడి పైకి రాలేకున్నాను నన్ను పైకితీసి రక్షించుమని
పలుకగా ఆ బ్రాహ్మణకన్య అయిన దేవయాని ఎడల మిక్కిలి దయగలవాడై.)

జలధివలోలవీచివిలసత్కలకాంచిసమంచితావనీ
తలవహన క్షమంబయిన దక్షిణహస్తమునం దదున్నమ
ద్గళదురు ఘర్మవారి కణకమ్రకరాబ్జమువట్టి నూతిలో
వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్

(ప్రసిద్ధికెక్కిన కీర్తికలవాడగు యయాతి సముద్రమందలి చలించు
అలల ప్రకాశముయొక్క లావణ్యముకల మొలనూలుతో ఒప్పుచున్న
భూతలమును భరించుటకు యుక్తమైన తనయొక్క కుడిచేతితో
దేవయానియొక్క పైకెత్తబడినదియు స్రవించు పెద్ద చెమటనీటి బిందువులతో మనోహరమైనదియు అయిన హస్తపద్మమును పట్టి నూతిలోనుండి వెలికి వచ్చునట్లు సంతోషముతో లాగెను.)

Friday, March 16, 2018

శ్రీకృష్ణ కీర్తన


శ్రీకృష్ణ కీర్తన


సాహితీమిత్రులారా!
వంగభాషలో రాధాకృష్ణుల మీద ప్రణయకావ్యాన్ని రచించిన భక్తకవి
చండీదాసు(1417-77). వసంతరంజన్ రామ్ అనే పరిశోధకుడు
చండీదాసు పదాలను పరిష్కరించి 1916లో వంగీయసాహిత్య
పరిషత్తు తరపున ప్రచురించాడు. ఆయనే ఈ పదాలకు శ్రీకృష్ణకీర్తన
అనే పేరు పెట్టాడు. భగవంతుని ప్రియునిగా భావించే మధురభక్తి
సంప్రదాయం ఈ పదాలలో కనిపిస్తుంది. ఇందులో అక్కడక్కడా
భక్తికన్నా రక్తి హద్దులుదాటి అస అసభ్యతకు కూడ దారి తీసినట్లు
గమనించవచ్చు. 
        చిన్నవయసులోనే తండ్రిపోగా జీవికకోసం వాసతీదేవి (కాళికాదేవి) ఆలయంలో అర్చకుడుగా చేరాడు. ఆ గుడిలేో పరిచారిక అయిన చాకతె రామితో ఈ యువపురోహితునికి సంబంధం ఏర్పడింది. వీరిద్దరి శారీరక ప్రణయం లోకోత్తరమైన జీవేశ్వరైక్య సంధాయకమైన విశుద్ధ ప్రణయానికి దారితీసింది. తెలుగులో క్షేత్రయ్య కూడ ఒక దేవదాసిని గాంచి మోహితుడై తద్వారా గొప్ప భక్తునిగా పరిణతి చెందాడని చెబుతారు. కామం మోక్షానికి దారితీసే సంఘటనలు మన భారతీయ సాహిత్యంలో కొల్లలుగానే కనిపిస్తాయి. 

       దాదాపు 1200పదాలున్న శ్రీకృష్ణకీర్తనలో 13 విభాగాలున్నాయి. అవి జన్మఖండం, తాంబూలఖండం, దానఖండం, నౌకాఖండం, భారఖండం, ఛత్రఖండం, బృందావనఖండం, యమునాఖండం, వస్త్రాపహరణఖండం, బాణఖండం, వంశీఖండం, కాళీయదమన ఖండం, విరహఖండం. గేయనాటికగా సాగిపోయే ఈ కావ్యంలో  ఒక బడాయి(ముసలి) ప్రధానపాత్రలు. సంవాదాత్మకంగా సాగే ఈ గేయనాటికలో గేయాలను అనుసంధానం చేస్తూ మధ్యమధ్య ఒకటి
రెండు సంస్కృత శ్లోకాలు వస్తాయి. 
        నవయౌవనవతి అయిన రాధను చూచి శ్రీకృష్ణుడు ఆకృష్టుడవుతాడు. "బడాయి" అవ్వ కృష్ణుని తరపున కానుకలు తీసుకొని రాధ దగ్గరకు వెళుతుంది. రాధ కోపంతో తిరస్కరిస్తుంది. నాలుగు చీవాట్లు పెడ్తుంది. బడాయి అవ్వ సలహామేరకు కృష్ణుడు పన్నులు వసూలు చేసే ఉద్యోగివేషంలో వచ్చి మధురలో పాలు అమ్ముతు న్నందుకు పన్నుకట్టమని రాధను నిర్భంధిస్తాడు. రాధ డబ్బులిచ్చే స్థితి లేక కృష్ణుడికి లొంగిపోతుంది. ఇదీ దానఖండంలోని కథ. రాధ కృష్ణుని వశమైనా ఆమె హృదయంలో మాత్రం కృష్ణునికి చోటు లేకపోయింది. బడాయి అవ్వ చెప్పిన ఉపాయం మేరకు కృష్ణుడు నావికుని వేషంలో ఉంటాడు. రాధ ఈ నావికుని పడవలో ఎక్కుతుంది. మధ్యలో కృష్ణుడు నావను తలక్రిందులు చేయడంతో రాధ ప్రాణభీతితో కృష్ణుని కౌగిలించుకుంటుంది. ఇది నౌకాఖండంలోని ఇతివృత్తం. రాధ మధురకు అమ్మకానికి వస్తువులు తీసుకొని పోతుండగా కృష్ణుడు కూలివేషంలో వాటిని మోసికొని పోవడం, తిరిగి వచ్చేటప్పుడు రాధకు ఎండ తగలకుండా కృష్ణుడు ఛత్రం పట్టడం వరుసగా భారఖండం, ఛత్రఖండంలోని అంశాలు. బృందావన ఖండంలో 
రాధ కలహాంతరితగా రసరమ్యంగా చిత్రించబడింది. యమునా ఖండంలో రాధాకృష్ణుల జలక్రీడలు, బాణఖండంలో రాధ విరహతాపం, కృష్ణుడు స్వాంతనపరచడం, వంశీఖండంలో తప్పించుకు తిరుగుతున్న కృష్ణుని మురళిని దొంగిలించి రాధ కృష్ణుని తన వశం చేసుకోవడం ప్రసక్తాంశాలు. కంసాదిరాక్షస సంహారం, లోకోద్ధరణలో మునిగితేలుతున్న కృష్ణునికి దూరమై రాధ విరహాతిశయాన్ని ఎంతో ఉజ్జ్వలంగా చిత్రించాడు.

   చండీదాసు పదాలు  Amours de Radha et Krishnaఅనే పేరుతో ప్రెంచిభాషలోకి అనూదితమైనాయి.  చండీదాసు పేరుతో మరో ఇద్దరు ఉన్నారు వారు దీనచండీదాసు, ద్విజచండీదాసు అనే వారు. వీరు కూడ
రాధకృష్ణుల ప్రణయగీతాలనే రచించారు.

Thursday, March 15, 2018

నెలబాలుఁడు


నెలబాలుఁడు


సాహితీమిత్రులారా!


చందమామను గురించి
ఖండకావ్యంలో జాషువా
కూర్చిన పద్యాలు-

గగనకల్యాణి గండభాగమున నిడ్డ
కాలపురుషుని గురునఖక్షతముఁ బోలి
మంచునవ్వుల నదె చందమామ బుడత
జననమైనాడు పశ్చిమశైలశిఖరి

నిండుపున్నమనాటి కీ నీటుకాఁడు
కళలు బదియారు నేరిచి గర్వపడును
అమరులు భుజించు రితని దేహమును గమిచి
యమవసకుఁ గానరాఁ డీతఁ డల్పజీవి

కుముదము తేనెతో నెదురుకొన్నది పూజకు, చందమామ యం
దముగలవాఁడు చుట్టమని నాలుగు దిక్కులనుండి సర్వలో
కము తలయెత్తి పిల్ల నెలగానికి వందన మాచరించె, సాం
ద్రము లగు వీని చూపు లమృతంబును జిందును శీతలంబులే

చుక్కపొలంతి నీకొఱకు స్రుక్కుచునున్న దమాసనుండి కెం
పెక్కిన కన్ను మూసికొనియెం గుముదంబు, నిశావధూటి, నీ
చిక్కని మంచు వెన్నెల భుజించు చకోరము కంటినీరు న
ల్దజిక్కులఁ జిమ్ముచున్నది మదించి జగంబును మ్రింగెఁజీకటుల్

పున్నమనాఁడు నీవు పరిపూర్ణ శరీరుఁడవై సుధావిలా
సోన్నతి నవ్వుచుం బొడముచుందువు లోకము సంతసింప నో
క్రొన్నెలబాల యారుపది రోజులజీవికి నవ్వువచ్చునే?
యన్నము పట్టునే? పరమహితార్థివి నీకు విచారమున్నదే?

అదిగో! సింహికపట్టి నీ తెరవునం దడ్డంబుగా నిల్చి నీ
రదకుంజంబున నక్కినా, డతని దంష్ట్రల్ గ్రూరముల్ సుమ్ము నీ
మృదుదేహంబును గాసిపెట్టుకొని యిట్లెన్నాళ్ళు లోలోన గ్రు
ళ్ళెద వన్నా! ధరణీ హితార్థము నిశాలీలావతీ వల్లభా!

Wednesday, March 14, 2018

నా పాటలు


నా పాటలుసాహితీమిత్రులారా!

"ఆరుద్ర"గారి కవితలనుండి
ఒక కవిత ఈ "నాపాటలు"
చూడండి-

నేను విడిచిన 
కుబుసాలను
నేనే
ఏరుకుంటూ 
నేస్తున్నాను
చికాకోలి మజ్లిన్లను
కాశ్మీరశాలువాలను
అందాకా
మైలాపురం కాలువ
వడ్డున నాసరస్వతి
నగ్నంగా కూర్చొని 
బట్టలుతుక్కుంటుంది
త్వరలోనే 
నానేత పూర్తవగానే
నాకూతురు
నా పాటల కన్నె
శృంగారించుకొని 
వస్తుంది
మీ అభిమాన థియేటరులోకి
ఎదురు చూడండి
నేను బ్రహ్మని
నా పాటల పడుచుది
ఉడుం మాసం
దంతాల ఎముకలు
విద్యుచ్ఛక్తే రక్తం
నా పాటలు 
జీవితమనే 
నోటికి
ట్రూత్ బ్రష్ లు
బతుకు సబ్ మెరైన్లకు
గాలిగొట్టాలు

(ఆనందవాణి - 1944)

Tuesday, March 13, 2018

డిండిమ కవిసార్వభౌముడు ఒకరుకాదా?


డిండిమ కవిసార్వభౌముడు ఒకరుకాదా?
సాహితీమిత్రులారా!


ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉండి
శ్రీనాథునిచే వాదంలో ఓడింపబడిన
"డిండిమ భట్టు" ఒకరుకాదని వారివంశ
వివరాల్లోకెళితే తెలుస్తుంది. 

విజయనగరరాజుల ఆస్థానం అలంకరించిన 
సంస్కృత కవులు డిండిమ కవులు.
వీరి చరిత్ర విభాగరత్నమాల అనే గ్రంథంలో
వివరింపబడింది. గంగాతీరంలో మందార 
గ్రామంలో నివసించే ఎనిమిదిమంది శైవ
బ్రాహ్మణులను ఒక చోళరాజు కాశీనుండి 
దక్షిణానికి తీసుకొచ్చాడని, వారికి ఉత్తర
ఆర్కాడు జిల్లాలోని మెట్టుపడిని(తల్పగిరి)
అగ్రహారాన్ని ఇచ్చారని, అఇక్కడే ఆ 
వంశంవారు క్రమంగా 70 కుటుంబాలుగా
వృద్ధిచెందారని ఆ గ్రంథంలో చెప్పబడింది.
ఆ వంశంలోని అరుణగిరినాథుడు అనే
పండితుని ప్రౌఢదేవరాయలు(1422-48)
ఒక ఆరామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు.
అప్పటి నుండి ఆ వంశం వారు విజయ
నగరరాజుల కొలువులో ఆస్థానపండితులుగా
కవులుగా ఉన్నారని ఈ గ్రంథం ద్వారా
తెలుస్తుంది.
మొదటి అరుణగిరినాథుడు మొదటి రాజనాధుని
కుమారుడు. ఇతని మాతామహుడైన అభిరాముడు
శ్రీకంఠాగమమున పండితుడై డిండిమ ప్రభువు
(డిండిమ - 1) అనే పేరుతో వ్యాప్తిచెందాడు.
అరుణగిరినాథుని యశస్సు డిండిమవాద్య ధ్వనిచే
ఘోషించబడుతున్నందువల్ల ఇతనికి డిండిమ 
కవిసార్వభౌముడు (డిండిమ - 2) అనే బిరుదు 
కలిగింది. ఇతడు ప్రౌఢదేవరాయల కొలువులో 
ఉండి ప్రతివాది భయంకరుడై విలసిల్లాడు.
శ్రీనాథుడు వాదంలో ఇతనిని ఓడించి, ఇతని
కంచు ఢక్కను పగులగొట్టించి, ఇతని 
కవిసార్వభౌమబిరుదాన్ని తాను గ్రహించాడు.
ఇతడు యోగానంద ప్రహసనం అనే ప్రహసనాన్ని
వ్రాశాడు. అరుణగిరినాథుని కుమారుడైన రెండవ
రాజనాథునికి కూడ డిండిమకవి సార్వభౌముడు
(డిండిమ - 3) అమే బిరుదు ఉంది. ఇతడు 
నాట్య, తత్త్వశాస్త్రాల్లోనూ, పలు భాషల్లోనూ
పండితుడై తండ్రికంటే కూడా ఎక్కువ కీర్తిని 
గడించాడు. ఇతడు విజయనగరరాజుల సేనాని
అయిన సాళ్వనరసింగుని ఆదరాన్ని సంపాదించి
సాళువాభ్యుదయం(1480) అనే 13 ఆశ్వాశాల 
కావ్యాన్ని, దండయాత్రలను, పరాక్రమాన్ని 
వర్ణించాడు.

రెండవ రాజనాథుని కుమారుడు రెండవ అరుణగిరినాథుడు.
ఇతడు వారేంద్ర అగ్రహార నివాసి. ఇతడు వీరనరసింహ, 
శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఉండి, వారిచే పోషించబడిన
వాడు. ఇతనికి పలుభాషలలో పాండిత్యం ఉంది. 
ఇతడు వీరభద్రవిజయం అనే డిమ రూపకాన్ని రచించాడు.
ఇది రాజనాథదేవుని ఉత్సవ సందర్భంలో ప్రదర్శించబడింది.
ఇతనికి కవిరాజరాజు, డిండిమ కవిసార్వభౌముడు, కుమార
డిండిముడు(డిండిమ - 4) అనే బిరుదులున్నాయి.

కుమార డిండిముని తరువాత ఆ వంశంవారు గొప్ప పండితులై,
ఆ వంశగౌరవాన్ని నిలబెట్టారు. ఇతని కుమారుడు మూడవ
రాజనాథుడు భాగవతచంపువును, అచ్యుతరామాభ్యుదయం రచించి
పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

(ఆధారం - విజ్ఞాన సర్వస్వం - 6(భారతభారతి))

Monday, March 12, 2018

జాషువా - "శ్మశానవాటి" - 2


జాషువా - "శ్మశానవాటి" - 2
సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి..........

ఆకాశంబును కాఱుమబ్బుగము లాహారించె, దయ్యాలతో
ఘూకంబుల్ చెరలాడసాఁగినవి వ్యాఘోషించె నల్దిక్కు లన్
గాకోలంబులు గుండె ఝల్లుమనుచున్నంగాని యిక్కాటి యం
దా కల్లాడిన జాడ లేదిచట సౌఖ్యం బెంత క్రీడించునో


ఇచ్చోట నేసత్కవీంద్రుని కమ్మని 
           కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
యిచ్చోట నేభూములేలు రాజన్యుని
           యధికారముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూ
           సలసౌరు గంగలోఁ గలసిపోయె
యిచ్చోట నెట్టిపే రెన్నికం గనుఁగొన్న
           చిత్రలేఖకుని కుంచియె నశించె
ఇది పిశాచులతో నిటలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్థలంబు
ఇది సరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు

ఈ పద్యాన్ని పాడుతాతీయగా
కార్యక్రమంలో పాడిన తీరు గమనించండి-Sunday, March 11, 2018

జాషువా - "శ్మశానవాటి" - 1


జాషువా - "శ్మశానవాటి" - 1
సాహితీమిత్రులారా!

జాషువా వారి ఖండకావ్యంలోని
"శ్మశానవాటి" పద్యాలు
నాటకరంగంలో పడి దిగంతాలకు చేరినాయనటం
తప్పుకాదేమో. అవి నాటకరంగంలో పడినవా
లేక నాటకరంగమే ఈ పద్యాల్లో పడినయో
గాని వాటిని విన్నవారు ఎవరైనా వాటిలోని
సాహితికి, వాటిలోని వాస్తవిక తత్త్వానికి
సంగీత ప్రియులు వాటిని వారిసొంతం
చేసుకున్నారనవచ్చు.

మొదటి పద్యం -
ఎన్నోయేండ్లు గతించిపోయినవి గానీ యీ శ్మశానస్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యు డొకఁడైనన్ లేచిరాఁడక్కటా
యెన్నాళ్ళీ చలనంబులేని శయనం బేతల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్

ఇక్కడ ఒక పద్యాన్ని దాన్ని పాడుతాతీయగాలో
పాడిన విధానాన్ని చూడండి-Saturday, March 10, 2018

పురాణాలంటే ఏమిటి దాన్లో ఏముంటాయి


పురాణాలంటే ఏమిటి దాన్లో ఏముంటాయి
సాహితీమిత్రులారా!పురాణం అంటే ప్రాచీన కథాగుచ్ఛం అనే అర్థం స్ఫురిస్తుంది.
వేదవాఙ్మయంలోో ఇతిహాసం, ఆఖ్యానం మొదలైన శబ్దాలతోపాటు
పురాణశబ్దం కూడ కనిపిస్తుంది.  ప్రపంచోత్పత్తి, వీరుల, ఋషుల 
జీవితాలు మొదలైన వృత్తాంతాలు వేదయుగంలోనే రచించి ఉండవచ్చు. 
వాటికే పురాణాలని పేరు. సాధారణంగా వాటిని రచించినవారి పేర్లు తెలియవు. 
హరివంశంలో పురాణాల సంఖ్య  గురించిన ప్రస్తావన ఉంది. గౌతమ, ఆపస్తంబుల 
ధర్మశాస్త్రాలు (క్రీ.పూ.500) కూడా పురాణాలను పేరొంటున్నాయి. పురాణాల 
కాలం ఇది అని తేల్చడానికి వీలు లేదు. వీటిలో అతిప్రాచీనమై
నవి, ప్రాచీనము కాని కూడ ఉన్నాయి. రాజవంశాలను వివరించే
పురాణాలలో హర్షుడు మొదలైన వారి వంశవివరణం లేనందువల్ల
పురాణాలు క్రీ.పూ. 500 సంవత్సరాలకు పూర్వమే వ్రాయబడినట్లు
విమర్శకుల అభిప్రాయం.
          పురాణాలలో సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశావతారవర్ణన 
అనే అయిదు లక్షణాలు అన్నిటిలో కనిపించటం
వల్ల వీటికి పంచలక్షణాలు అనే పేరు వచ్చింది. వేదాల్లో చెప్పబడిన
నీతి ధర్మతత్త్వాది విషయాలను పురాణాలు కథలు, ఉపాఖ్యానాల 
ద్వారా వివరిస్తున్నాయి. లాక్షిణికులు వీటిని మిత్ర సమ్మతములుగా 
పరిగణించారు. చారిత్రకంగా కూడా పురాణాలకు ప్రాముఖ్యత ఉంది.
వీటిలో శుంగ, నంద, మౌర్య, గుప్త, ఆంధ్ర మొదలైన రాజవంశా చరిత్రలు 
సమగ్రంగా ఉన్నాయి. విమర్శ దృష్టితో వీటిని కొంచెం సవరించి చూస్తే 
ఇవి చారిత్రక వృత్తాంతాలతో  కూడ సరిపోతున్నాయి. 18 మహాపురాణాలను, 
18 ఉపపురాణాలను వ్యాసుడే రచించాడని ప్రతీతి. కానీ వ్యాసుడు 
ఒక్క బ్రహ్మపురాణం మాత్రమే వ్రాశాడని, మగిలినవి అతని శిష్యులు 
రచించారనీ మరొక అభిప్రాయం. వ్యాసునికి ముందే పురాణాలున్నాయని 
వాటి సారాంశం వివరించి వాటికి ప్రచారం కలిగించాడని మరొక అభిప్రాయం.


హిమగిరిపతాకే కరుణయా


హిమగిరిపతాకే కరుణయాసాహితీమిత్రులారా!మూక శంకర విరచిత
మూకపంచశతిలోని
స్తుతిశతకంలోని
54వ పద్యం ఇది చూడండి-

ఘనశ్యామాన్కామాంతకమహిషి కామాక్షి మధురాన్
దృశాం పాతానేతానమృతజలశీతాననుపమాన్
భవౌత్పాతే గీతే మయి విరత నాథే దృఢభవ
న్మనశ్శోకే మూకే హిమగిరిపతాకే కరుణయా

కామాంతకుడైన శివుని యజమానురాలివై,
ఇల్లాలివైన ఓ కామాక్షీ
మేఘములవలె నల్లనైన కురులతో,
చల్లనైన అమృత జలముతో
మధురమైన వాక్కులతో కలిగిన నీవు
దృష్టి పాతములతో భయాందోళనలతో
నున్న భక్తుల కష్టములను చూచి కరిగి
అప్పుడప్పుడు ఆమె కన్నులు చెమ్మగిల్లును.
ఆమె కన్నులలో
శీతలామృతమును కురింపించుచూ
భక్తుల భయాందోళనలను
కరుడు గట్టిన శోకమును హరించును - అని భావం.


Friday, March 9, 2018

ఒకించుక భాగ్యము గల్గియుండినన్


ఒకించుక భాగ్యము గల్గియుండినన్
సాహితీమిత్రులారా!


మన శతకాల్లో చెప్పిన విషయాలను
మనం మరువకూడదు ఎందుకంటే
వారు జీవితానుభవాన్ని కాచి వడపోసి
చెప్పిన విషయాలవి ఇక్కడ
మారద వెంకయ్యగారి భాస్కర శతకంలోని
ఈ పద్యం చూడండి-

ఏల సమస్తవిద్యల? నొకించుక భాగ్యము గల్గియుండినన్
జాలు ననేక మార్గముల సన్నుతి కెక్కు నదెట్లొకో యనన్
ఱాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీఁద? భాస్కరా!

భాస్కరా! సకలవిద్యలు రావలసిన పనియేమిగలదు
అదృష్టము ఉంటే అనేక విధముల కీర్తి రాగలదు.
శిలలకు విద్యవస్తుందా కాని వాటిని దేవతారూపం
లో చెక్కినట్లయిన అందరూ వాటిదగ్గర చేరి
సాష్టాంగనమస్కారాలు పెట్టి పువ్వులు పెట్టి
పూజింపకుందురా అంటే పూజచేస్తారని భావం.
అంటే ఎన్ని విద్యలున్నా
అదృష్టం ఏకొంచెమైనా ఉంటే
ఆ విద్యల్నీ క్రిందే కదా అంటాడు కవి
నిజమో కాదో ప్రతి ఒక్కరికి తెలుసుకదా!

Thursday, March 8, 2018

బెంగుళూరు నాగరత్నమ్మ


బెంగుళూరు నాగరత్నమ్మ
సాహితీమిత్రులారా!

భారతదేశంలో అత్యంత పేరుపొందిన
నారీమణుల్లో బెంగుళూరు నాగరత్నమ్మగారు ఒకరు.
ఆమె పాండిత్యంలోనే కాదు సంగీతంలోనూ
నాట్యంలోనూ పేరు పొందినవారు. విద్యాసుందరి
అనే బిరుదు పొందినవారు త్యాగరాజస్వామి
ఆలయంలో ఆయన ఎదురుగా ఈయమ
విగ్రం ఉంచారంటే ఆమె ఎలాంటిదో చెప్పవలసిన
అవసరంలేదు. అటువంటి ఆమెను గురించిన
యస్.వి.బి . ఛానల్ వారు కూర్చిన
ఈ డాక్యుమెంటరీ చూడండి-Wednesday, March 7, 2018

కృతజ్ఞత


కృతజ్ఞత
సాహితీమిత్రులారా!

శ్రీమదాంధ్రమహాభారతంలో 
"అనుశాసనిక పర్వం"
మొదటి ఆశ్వాసంలో ధర్మరాజు భీష్ముని
ఈ విధంగా అడిగాడు -
తమ జీవితాలకు ఆధారమైన యజమాని యెడల
అతని దగ్గర బతికే వారెట్లా నడచుకోవాలో చెప్పుమని
అడగగా భీష్ముడు ఈ విధంగా చెప్పాడు.

విను కాశీశశ్వరు దేశం
బున నొక లుబ్ధకుఁడు వేఁట పోయిన చోటన్
ఘనతర విషదిగ్ధ శరం
బున నేసిన మృగము ద్పి భూజము దాఁకెన్

(కాశీదేశంలో ఒక వేటగాడున్నాడు.
వాడొక రోజు వేటకు పోయి విషంపూసిన బాణాన్ని
ఒక జింకపై వేయగా అది తప్పిపోయి ఒక చెట్టుకు
తగిలింది.)

పూవులఁ గాయలఁ బెరిగిన
యా వృక్షము శుష్కమయ్యె నవ్విషమున ధా
త్రీవర తదీయ కోటర
మావాసము గాఁగ నొక మహాశుకముండున్

(పూలతో కాయలతో ఏపుగా పెరిగిన చెట్టి
ఆ విషపుబాణమువల్ల నిలువునా ఎండిపోయింది
ఆ చెట్టు తొర్రలో ఒక పెద్ద చిలుక వుండేది.)

అది తరువు విడిచి పోవక,
హృదయంబున భక్తి పేర్మి నెండను గాలిన్
బెదరక, ధృతిమైనయ్యెడఁ
గదలక యుండె, ననుజీవిగౌరరవ మెసఁగన్

(అది ఆ చెట్టు ఎండిపోయినా ఎండకు గాలికి బెదరక
ఆ చెట్టును ఆశ్రయించే ఉన్నది. ఇన్నాళ్లు తనకాశ్రయ
మిచ్చిందన్న గొరవభావంతో ఎటూవెళ్లక అక్కడే వుంది.)

దాని యుదాత్తవృత్తము శ
               తకిరతుఁ డాత్మ నెఱింగివచ్చి బెం
డైనది యిమ్మహీజము మ
               హా తరువుల్ ఫలవృద్ధినొంది యి
క్కాన ననేకముల్ గలుగఁ 
               గా నిటు లేటికి నిందు నిల్వ నో
మానిత కీరమా యనియు
               మానుష భంగిక రూపమొప్పఁగన్

(ఇంద్రుడు చిలుక వృత్తాంతమంతా తెలిసి అక్కడి వచ్చి
ఓ చిలుకా ఈ అడవిలో ఇన్ని రకాల ఫలించిన వృక్షాలుండగా
 ఎండిపోయిన దీన్నే ఆశ్రయించున్నావెందుకు అన్నాడు)

అనిన విని యాశుకంబు
(అనగా చిలుక విని)

అనయము పండుచుండు నెడ
               నాశ్రయమొప్పిన నిల్చి, యెండి పో
యిన తఱిఁ బాసిపోక తగ
               వెట్లు కృతఘ్నతకాదె యివ్విధం
బనిమిషనాథ యన్న నతఁ
               డచ్చెరువంది పురాకృతోప సం
జనిత విశేషమీ ఖగము,
               జానుగ నున్న నెఱింగె, దీనికిన్

(చెట్లు పండినపు ఉండి ఎండినపుడు విడిచి వెళ్లడం
కృతఘ్నతకాదా ఓ మహేంద్రా అన్నది. అరే దీనికి
పూర్వజన్మ వాసనవల్ల నన్ను గుర్తించగలిగింది.
కనుక ఈ గొప్ప పక్షికి....)

మేలొనర్చెదంగాక!
(మేలు  చేస్తునుగాక)

అని తలఁచి, నీదు పలుకులు
విని మెచ్చితి, వరముగోరు విహంగోత్తమ నీ
వనిన శుకంబు మహీజం
బునకున్ బేరెలమివేఁడె, భూపవరేణ్యా!

(రాజా ఇంద్రుడా విధంగా మనసులో భావించుకొని
చిలుకతో ఓ మహాశుకమా  నీమాటలు నాకు ఆనందాన్ని
కలిగించాయి కనుక నీవేదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు.
వెంటనే ఆ చిలుక స్వామీ ఈ చెట్టుకు పూర్వవైభవం కలిగించు
అని అన్నది(చూచావా ఆ చిలుక ఎంత గొప్పదో తనకు ఏ మేలు
కోరకుండానే చెట్టుమేలు కోరుకుంది.))

అమర వల్లభుండు నమృత సేచనమున
భూజమునకుఁ దొంటి పొలుపుకంటె
మిగుల నెలమిసేసె మేలి యాశ్రితులట్ల
మనుతు రధిపుఁ గురు కుమారవర్య!

(కురు వంశంలో ఉత్తమమైనవాడా  ఇంద్రుడు అమృతం చల్లి
చెట్టుకు పూర్వ వైభవం కలిగించాడు. తనను కాపాడిన వారికి
మంచి ఆశ్రితులు ఇట్లాగే రక్షిస్తారు అని అన్నాడు.)

Tuesday, March 6, 2018

బాలచంద్రుని వీరవాక్కులు


బాలచంద్రుని వీరవాక్కులు
సాహితీమిత్రులారా!

"పలనాటి వీరచరిత్ర"లో బ్రహ్మనాయుని
కుమారుడు బాలచంద్రుడు నాయకురాలు
నాగమ్మ మంత్రాంగంతో అన్నదమ్ముల మధ్య
వైరం పెరిగి చివరికి భారత యుద్ధంలో వలెనే
యుద్ధం ఆరంభమైంది అందులో పాల్గొనటానికి
ప్రయాణమైన బాలచంద్రుని నీవు పసివానివి
యుద్ధానికి పోవద్దని వారించినారు వీరులు
వారిని చూచి చెప్పిన వాక్యాలను
శ్రీనాథ మహాకవి "పలనాటివీరచరిత్ర"లో
బాలచంద్రుని నోట పలికించిన వాక్యాలు
ఇక్కడ చూడండి -
(ఇది ద్విపదలో వ్రాయబడిన కావ్యం)

"బాలుఁడీతండని పలుకఁగ రాదు
నాపూర్వమంత విన్నప మొనరింతు
వీరనాయకులారా; విఖ్యాతులార!
వినుఁడు చెవుల నొగ్గి విశదముగాఁగ
నురుతరనగర మయోధ్యఁ బాలించి
చనినట్టి యా హరిశ్చంద్ర భూపతికిఁ
జంద్రమతికి నేను జనియించి మించి
లోహితాస్యుఁడనైతి లోకము లెఱుఁగ
నాఁడు బాలుఁడగానె నాయకులార;
కిష్కింధ నేలెడు కీశాధిపతికిఁ
దార కంగదుండనై ధరబుట్టునాఁడ
రామచోదితుఁడనై రావణుకడకు
రాయబారిగా నేఁగి, రక్షసుల్ గ్రమ్మ
వారిని ఖండించి వడి చూపినాఁడ
నాఁడు బాలుఁగానె నాయకులార;
రఘువంశమందున రామచంద్రునకుఁ
గుశుఁడనై పుట్టితి గురుశూరుఁడైతి
నాఁడు బాలుడఁగాదె నాయకులార;
పాండు భూవరునకుఁ బౌత్రుఁడనగుచు
నభిమన్యుఁడనుపేర నవని జన్మించి
వీర ధర్మము చూపి వెలసి వాఁడ
నాఁడు బాలుడఁగానె నాయకులార;
ఇటువంటి జన్మంబు లెన్నియొ కలవు
చెప్పశక్యముగాదు చెన్నునియాన
ప్రతిజన్మమందైన ప్రౌఢవిక్రమము
శ్రీపురాణంబులు చెప్పుచునుండు
గలియుగంబున నిప్డు కడసారి నేను
కుంతాలవారింట గూరిమిమీఱ
బ్రహ్మనాయనికినిఁ బడఁతి యైతమకు
బాలునిపేరిటఁ బల్నాటిలోన
జనన మొందినవాఁడ సమరశూరుండఁ
బేరె బాలుఁడుగాని బిరుదు మగండఁ
బగవారిఁ గొట్టని బ్రదుకదియేల!
తలిదండ్రులను బ్రోవఁ దనయుండె కర్త
మానాభిమానముల్ మగటిమిమించఁ
బ్రబలింపఁ గలవారు బాలురె సుమ్ము
బాలురె పెద్దలు; బల్లిదుల్ వారు
బాలురకే వృద్ధి పరికించి చూడఁ
బెద్దలు మతిచెడి పిరికిపాఱుదురు
పాంచ భౌతిక దేహపటిమ క్షీణించు
మనసు చలించును మాటిమాటికిని
ధైర్యంబు తగ్గు నుత్సాహంబు లుడుగు
వయసు మీఱినవేళ వచ్చునా; బలిమి?
కీర్తి కైనను నపకీర్తికినైన
బాలురపైనుండు భారమంతయును
మైలమకాముని మడియంగఁ జేసి
నాయకురాలిని నయహీనఁజేసి
పరదళంబులఁ జంపి పంతంబు తీర్తుఁ
బడుదును రణభూమిఁ బవరంబుచేసి
చూచి యాస్వర్గంబు చూఱలుగొందు."

ఈ విధంగా వారిని ఒప్పింప
ప్రయత్నించినాడు బాలచంద్రుడు.

(ఉరుతరము - మిక్కిలిగొప్పది, దుర్ఘట చేష్టలు - గొప్పపనులు,
కీశ - అధిపతి - వానరులకు రాజు(వాలి), తార - వాలి భార్య,
చోదితుడు - ప్రేరేపింపబడినవాడు, ప్రౌఢవిక్రమము - గొప్ప పరాక్రమము, సమరశూరుడు - యుద్ధవీరుడు, బిరుదుమగఁడు - మేటివీరుడు, మానాభిమానములు - గౌరవము, పరువు,
మగటిమి - శౌర్యము, బల్లిదులు - బలవంతులు, నయహీన - నీటిమాలినది,  పరదళంబులులన్ - శత్రుసేనలను, బవరంబు - యుద్ధం, చూఱలుగొనుట - కొల్లగొట్టుట(వశపఱచుకొనుట))