Thursday, March 31, 2016

చమత్కార పద్యం - 4

చమత్కార పద్యం - 4




సాహితీమిత్రులారా!


చాలామంది తెలుగు సులువు అంటుంటారు
అది అంత సులువేమీకాదు. అని ఒకసారి
తిరుపతి వేంకటకవులు ఈ పద్యం చెప్పారట.

తెలుగు తెలుగని యద్దాని దిగుటెకాని,
సంస్కృతముకన్న దాన కష్టంబు హెచ్చు
సంస్కృతమునకు ఒక పరిశ్రమము చాలు
తెలుగునకు సంస్కృత జ్ఞాన మలవడ వలె.

సంస్కృతం నేర్చుకోవాలంటే దానినొక్క దాన్ని శ్రమిస్తే చాలు.
తెలుగు అలాకాదు. తెలుగుతోటి సంస్కృత పాండిత్యం తప్పనిసరి.
అందువల్ల తెలుగు కంటే సంస్కృతమే సులువు అని వారి భావం.

Wednesday, March 30, 2016

చమత్కార పద్యం - 2

చమత్కార పద్యం - 2


సాహితీమిత్రులారా!

అడిదము సూరకవి, రేకపల్లి సోమనాధకవి ఇద్దరూ ఒకసారి ఒకరికొకరు తారసపడ్డారు.
సూరకవి సోమకవిని ఇలా పరామర్శించారు.


ఏమేమో శాస్త్రంబులు
తామిక్కిలి సతికెనంట తద్ధయుఁగవితా
సామర్ధ్యమెఱుంగ నేరని
సోముని జృంభణము గలదె సూరుని యెదుటన్

(సోముని - చంద్రుని - విజృంభణం సూర్యుని ఎదుట ఉండదని అర్థం)
సోమకవి విజృంభణం సూరకవి ముందు సాగదని అర్థం.
దీనికి సమాధానంగా సోమకవి ఈవిధంగా బదులిచ్చాడు. 


సోమ శబ్దర్థ మెఱుఁగని శుంఠవగుట
పదిరితివి గాక సూర్యుని రదనములకు
భంగకరుఁడగు సోము జృంభణము లీలఁ
దెలియ వయ్యొయొ నీ గుట్టు దెలిసెఁ గుకవి


( సోమ అనే శబ్దానికి అర్థం ఈవిధంగా తీసుకుంటే - సోమ = స + ఉమ = శివుడు. దక్షయజ్ఞసమయంలో శివుని విజృంభణతో సూర్యుని రదనము(దంతము)లకు భంగంవాటిల్లింది. దాన్ని కవి ఇక్కడ ప్రస్తావించాడు చమత్కారంగా.)

Sunday, March 27, 2016

చమత్కార పద్యం -2




చమత్కార పద్యం -2


సాహితీమిత్రులారా!

కూచిమంచి తిమ్మకవి రచించిన రసికజనమనోరంజనం చదివిన ఒక వేశ్య ఒకానొకరోజు తిమ్మకవి ఆదారి వెంబడి పోతూ ఉండగా చూచి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ను వాటేసుకుందట దానితో ఏమీ అర్థంకాని ఆయన మొగం పక్కకు తిప్పుకున్నాడట. దాని ఆవేశ్య ఇలా అన్నది.

"చతురులలోన నీవు కడు జాణవటంచును నెంచి కౌగిలిం
   చితి నిటు మారుమోమిడగ చెల్లునె యో రసికాగ్రగణ్య?" 
- అన్నదట.

                                            దానికి తిమ్మకవిగారు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారు.

                                                                          "అ
ద్భుతమగునట్టి బంగరపు బొంగరపుంగవబోలు నీ కుచ
ద్వితయము ఱొమ్మునాటి అల వీపున దూసెనటంచు చూచితిన్"
- అని అన్నాడట.

Friday, March 25, 2016

చమత్కార పద్యాల్లో దీవెన

చమత్కార పద్యాల్లో దీవెన 

సాహితీమిత్రులారా!

 పద్యాల్లో దీవెనలు చాలా చమత్కారాలు వాటిలో ఒకటి
క్రింది శ్లోకంలో చూడగలం.  గమనించండి.

శ్లో. విష్ణో రాగమనం నిశమ్య, సహసా కృత్వా ఫణీంద్రం గుణం
     కౌపీనం పరిధాయ చర్మకరిణ: శంభు: పురోధావతి:
     దృష్ట్వా విష్ణురథం సకంప హృదయ: సర్పో పతత్ భూతలే
     కృత్తి ర్వి స్ఖవితా హ్రియా నతముఖో నగ్నో హర: పాతువ:

శివుడు దిగంబరంగా ఉన్నాడు. విష్ణువు వస్తున్నాడని తెలిసింది. పామును మొలతాడుగా, గజచర్మాన్ని కౌపీనంగా పెట్టుకొని వెళ్ళాడు. గరుత్మంతుని చూడగానే పాముకు గుండెలవిసి కిందపడింది. గోచీ వూడిపోయింది. నగ్నుడై తలవంచుకొని వున్న పరమేశ్వరుడు మిమ్ము రక్షించుగాక - అని భావం

ఇందులో శంకరుని దిగంబరత్వం, పామునకు గరుత్మంతునకు గల
సహజవైరం మొదలైనవానితో కవి చమత్కారపూర్వకంగా ఆశీర్వదించాడు

సాహితీ నందనం

శ్రీవక్షోజకురంగనాభ మెదపై జెన్నొంద విశ్వంభరా
దేవిం దత్కమలా సమీపమునఁ బ్రీతిన్ సల్పినాఁడో యనం
గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిందోఁచు రా
జీవాక్షుండు గృతార్థుఁజేయు శుభదృష్టిం .......... 

                                                 ఈ సాహితీ నందనం బ్లాగున్
అని దైవాన్ని వేడుకుంటూ.......... నేడు సాహితీప్రియుల ఆరామసీమ ఈ సాహితీ నందనం అనే వనం ప్రారంభం చేయుటకు సంతసిస్తూ
                                                                                                               ఏ.వి.రమణరాజు
                                                                                                               సాహిత్యాభిలాషి