Saturday, June 29, 2019

టేబుల్ పై చేతి వాచీ


టేబుల్ పై చేతి వాచీ




సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి...............

టేబుల్ పై చేతి వాచీ
నెలవు తప్పిన కలువలా ఉంది.

ఇది విచ్చలవిడిగా తిరిగిన దూరాల్లోంచి కానీ
అపురూపంగా చూసుకొన్న నడకల్లోంచి కానీ
ఒక్క అడుగు కూడా తిరిగి రాదు కదా!

దాని డయల్ నూతిలో అనుభవాలు
జ్ఞాపకాలు, కాలపు తునకలు.
ఎంత జీవితాన్ని ముక్కలు ముక్కలుగా
కత్తిరించి ఉంటాయో కదా దీని ముళ్ళు.

ముసలిదైపోయిన కాలంలా
టేబుల్ పై చేతి వాచీ

ఎంత కాలాన్ని పోతలు పోసి ఉంటుందో కదా
నిరీక్షణలు, నిస్ప్రుహలు, అసహనాలుగా.
ఎన్ని టిక్కట్టు ముక్కల్ని చింపిందో.
ఎన్ని సిగరెట్ పీకల్ని రాల్చిందో
ఎన్ని నిలుపుకోలేని
వాగ్దానాల్ని పరిహసించి ఉంటుందో కదా.

ఒక వనాన్ని పొడి చేయగల
వడ్రంగి పిట్ట ముక్కంత బలంగా
ఒక జీవితాన్ని పొడుచుకుంటూ
పోయుంటుంది ఈ ముల్లు గర్ర.

టేబుల్ పై చేతి వాచీ
అపుడూ, ఇపుడూ అదే
మోనాలిసా నవ్వుతో.

టేబుల్ పై చేతి వాచీ, ఒకనాటి పెళ్ళి కానుక
ఇల్లు ఖాళీ చేసేపుడు డ్రాయర్ సొరుగులో దొరికింది.
మా నాన్న పోయిన మూడోరోజున అది ఆగిపోయి ఉంది
యుద్దానంతరం విస్మరింపబడే సమరయోధునిలా.
----------------------------------------------------------
రచన: బొల్లోజు బాబా, 
ఈమాట సౌజన్యంతో

Thursday, June 27, 2019

చిన్న ప్రశ్న – పెద్ద దూరం


చిన్న ప్రశ్న – పెద్ద దూరం





సాహితీమిత్రులారా!

ఎప్పుడైనా క్యాంటీన్‌కు పోయినప్పుడు ఆమె ఇంకో టేబుల్‌ మీద భోంచేస్తూ కనబడుతుంది. ఆఫీసుకు వస్తున్నప్పుడు షిఫ్ట్‌ ముగించుకుని పోతూ కనబడుతుంది. ఎప్పుడైనా మగ స్నేహితుడితో టీ తాగుతూ కనబడుతుంది. ఎప్పుడో తెగిపోయిన చెప్పును తన్నుకుంటూ ఆమె వెళ్తున్నప్పుడు ఏమైనా సాయం చేయగలమా అనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేం.

ఆమె వార్తలు చదువుతుంది. రెండు మూడు తరాలుగా కలిగిన ఇంట్లో పుడితే తప్ప ఉండని ఒంటి మెరుపు. ఆ స్కిన్‌ టోన్‌ దాన్ని అలాగే ఫొటో తీసి ఎప్పుడైనా పుస్తకం వేస్తే కవర్‌గా వేసుకోవచ్చు. వీటికంటే కూడా నీలపు రంగు కళ్లు మరింత బాగుంటాయి నాకు.

బస్సుకోసం బస్టాపులో ఆమె నిలబడటం చూసి వుంటాం. రద్దీ లేనప్పుడు సరే, ఉన్నప్పుడు ఆమె అందరిలా వేళ్లాడుతూ వెళ్లడం తలుచుకుంటేనే దిగులేస్తుంది. తర్వాతెప్పటికో ఒక కొత్త స్కూటీ కొనుక్కుని రావడం మొదలవుతుంది. అటుపై క్యాబ్స్‌లో పోవడం చూస్తూ వుంటాం. కొన్నాళ్లకు చిన్న కారు తోలుకుంటూ కంటబడుతుంది. బహుశా ట్రెయినీగా చేరినప్పటినుంచి, ఉద్యోగంలో పర్మనెంట్‌ అయి, పేరు వస్తున్న కొద్దీ పెరుగుతున్న వేతనపు మార్పేదో ఈ మొత్తం ప్రయాణ సాధనాల ద్వారా అంతుబడుతూ ఉంటుంది.

ఏదో ఒకరోజు ఉన్నట్టుండి ఆమె ముఖంలోకి ఒక అద్భుతమైన కళ వచ్చి చేరుతుంది. అది అంతకు ముందు ఎప్పుడూ చూడని మెరుపు. ఇప్పుడు ఇంత అందంగా కనబడుతోందంటే, మరి నిన్నటిదాకా కనబడిన అందం అందం కాదా? ఆ మార్పేమిటో ఈ మగబుర్రకు వెంటనే తట్టదు. కొన్నాళ్లు ఆఫీసులో అసలు కనబడదు. కనబడినప్పుడు కనబడుతోందని చూస్తాం గానీ, కనబడనప్పుడు కనబడలేదని ఎలా గుర్తిస్తాం?

ఏదో ఒకరోజు ఉన్నట్టుండి మళ్లీ ఊడిపడుతుంది. ఈ వెలుగు మాయమైనా మన జీవితంలో ఏం చీకటి సంభవించినట్టు? అప్పుడు ఎన్ని రోజులుగా కనబడటం లేదో ఒక అంచనాకు వస్తాం. మళ్లీ మామూలే. మళ్లీ అదే జీన్సులో, మళ్లీ అదే సల్వార్‌ కమీజులో, ప్రత్యేక సందర్భాల్లో చీరకట్టులో కనబడుతుంది. కానీ ఏదో ఒకసారి మరీ దగ్గర నుంచి వెళ్లినప్పుడో, టేబుల్‌ మీద కూర్చుని కాళ్లు ఊపుతూ కాఫీ తాగుతున్నప్పుడో ఛక్‌మని వెండిమట్టెలు మెరవడం చూస్తాం. అప్పటి గ్యాప్‌ ఎందుకో ఇన్నాళ్లకు గానీ అంతుపట్టనందుకు మన మందబుద్ధిని తిట్టుకుంటాం. మళ్లీ జీవితం పరుగెడుతూ, నత్తనడుస్తూ, కూలబడుతూ, లేస్తూ సాగుతూనే ఉంటుంది.

ఒకరోజు ఆడ్‌ టైములో మనం క్యాంటీన్‌కు వెళ్తాం, ఎవరో ఫ్రెండొస్తే టీ తాగించడానికి. అప్పుడామె అద్దాల పక్కని టేబుల్‌ మీద ఒంటరిగా కూర్చుని పళ్లు ఫలహారం చేస్తూ వుంటుంది. ఏమిటో ఇంత శ్రద్ధ. తర్వాతెప్పటికో ఆమె తిండిలో మార్పేదో వస్తుందని గమనించడం మొదలుపెడతాం. అంతకుముందు కనబడ్డ బుల్లి బుల్లి డబ్బాలు కాస్తా పెద్దవవుతాయి. జ్యూసులు గ్లాసులు గ్లాసులు తాగేస్తూ ఉంటుంది. మన మగబుర్ర అప్పటికి చిక్కుడుకాయలు చుంచుతూ కొంత సంసారంలో నలిగివుంటుంది కాబట్టి, ఈసారి అంచనా వేయడంలో పొరపాటు పడం. అయ్యో, ఈ బక్కప్రాణి అప్పుడే తల్లవుతోందా?

ఆ తర్వాత కొన్నిరోజులకు ఉబ్బుపొట్టతో దర్శనమిస్తుంది. జీన్సుప్యాంట్లలో అస్సలు కనబడదు. బట్టలు వదులుగా వేసుకుంటూ ఉంటుంది. నడకలో తేడా తెలుస్తుంది. అంతకు ముందు కొవ్వు అసలు కనబడని పిరుదులు కండపడతాయి. బుగ్గలు చిక్కనవుతాయి. మనిషిలోకి మరింత దివ్యత్వం ఏదో వచ్చి చేరుతుంది. మరి ఇది అందమైతే అప్పుడు కనబడిన అందం అందం కాదా? అంతకు ముందుది అందం కాకుండా పోయిందా? స్త్రీ అందం దశలు దశలుగా ఎలా విప్పుకుంటూ వస్తుంది!

పోతూ వస్తూ దాటేసుకుంటూనే ఉంటాం. కానీ ఇంతకాలమైనా పరిచయం కాకుండా ఎందుకు ఉండిపోయింది? రిటైర్‌ అయ్యేదాకా ఒకే ఆఫీసులో ఉన్నా, మనతో ప్రత్యేకించి పని పడకపోతే, ఉద్యోగరీత్యా సంభాషించుకోవాల్సిన అవసరం రాకపోతే ఎలా పరిచయం అవుతుంది? పనిగట్టుకొని పరిచయం చేసుకోవడంలో నాకు ఉత్సాహం లేదు. జరిగిపోవాలంతే. మన చుట్టూనే జీవితాలు ప్రవహిస్తూవుంటాయి. మనం వాటిని ఖండించుకుంటూనో, ఒరుసుకుంటూనో పోము. అసలు ఆ ప్రవాహానికీ మనకూ నిమిత్తమే లేదు. ఇదెంత శూన్యం?

మళ్లీ కొన్నాళ్లదాకా ఆమె మనకు కనబడదు. ఆపాటికి మనకూ ఒక కొడుకు పుట్టి వుంటాడు. వాడిని చూడటమే గుండెల్ని పొంగిస్తూ వుంటుంది. ఊయల్లో తప్ప వాడు నిద్రపోడని పాత చీరల్ని కట్టి ఊయల చేస్తాం. వాడు మొదటిసారి బోర్లా తిరుగుతాడు. పాకుతాడు. మనల్ని చూసి గుర్తుపట్టి నవ్విన రోజు జీవితంలో మరిచిపోలేం.

చాలా రోజుల తర్వాత ఉన్నట్టుండి ఆమె మళ్లీ ఆఫీసులో ప్రత్యక్షమవుతుంది. గత జీవితం ఏదీ ఆమెతో వెంటలేనట్టే పొట్ట ఖాళీ చేసుకుని తిరిగివస్తుంది. మనిషి మాత్రం కొంచెం నిండుగా అయివుంటుంది. మళ్లీ క్యాంటీన్‌లో ఎదురవుతూ, షిఫ్టు చేసుకుని పోతూ ఉంటుంది. ఉన్నట్టుండి, ఒకరోజు వేరే ఛానల్‌ స్క్రీన్‌ మీద దర్శనమిస్తుంది.

అయ్యో, ఒక్కసారైనా ఆమె దగ్గరికి వెళ్లి, ‘పుట్టింది పాపా, బాబా?’ అని అడగాలనిపించింది. కానీ ఎట్లా పోయి అడుగుతాం? ఏ ఆడ స్నేహితురాలి సాయంతోనో సేకరించగలిగే సమాచారం కాదు నాకు కావలసింది. ఆమె జీవితపు సంరంభంలో మిళితం కాగలిగే ఒక చిన్న ఉనికి, ఈ భూమ్మీది సకల జీవులతో పంచుకోగలిగే ఒక ఏకత.
----------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, June 25, 2019

ఒక ఊహ – ఒక కల


ఒక ఊహ – ఒక కల




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి................

ఒక సినిమా దర్శకుడు, పేరు చెప్పను, కానీ ఆయనకు గడ్డం ఉంటుంది, సాయంత్రం లాన్‌లో కూర్చుని ఒక పుస్తకం చదువుతున్నాడు. ఎందులో? తూగుటుయ్యాల్లో. దీన్ని అంత నిర్దిష్టంగా చెప్పడానికి ప్రాధాన్యతేమీ లేదు. కానీ కూర్చునే స్థలాన్ని నేను అట్లా నిర్ణయించాను. ఆకుపచ్చ గడ్డిలో ఆయన పుస్తకాన్ని సీరియస్‌గా చదువుతుండగా ఒక పొడుగ్గా ఉన్నతను, ఇతడెవరో నాకు తెలుసు, ఈ దర్శకుడి దగ్గరకు ఒక పని మీద వచ్చాడు. ఈ పొడవు మనిషి భార్యకూ–ఈమె ఒక చిన్నపాటి నటి–ఆ దర్శకుడికీ కొంచెం పరిచయం ఉంది. ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో తనకు బహుశా వేషం అడగటానికి వచ్చాడు.

అనామకంగా వచ్చినదానికీ, చిన్నదే అయినా ఒక రిఫరెన్స్‌తో వచ్చినదానికీ ఉండే తేడాకొద్దీ ఆ దర్శకుడు కళ్లెత్తి, అతడు ఎవరో తెలుసుకుని, కూర్చోమన్నట్టుగా చేయి చూపించాడు. ఆ ఉయ్యాల ముందు ఒక టీపాయ్, ఇది తెల్లరంగుది, మరో అదనపు కుర్చీ కూడా వేసుకుందాం.

ఇతడితో మాట్లాడటానికి వీలుగా ఆ దర్శకుడు తను చదువుతున్న పుస్తకాన్ని టీపాయ్‌ మీద పెట్టాడు. ఆ పెట్టడంలో బ్యాక్‌ కవర్‌ పైకి వచ్చింది. బ్యాక్‌ కవర్‌ మీద ‘రచయిత’ ఫొటో ఉంది. మామూలుగా ఒక వేషం కోసమే వచ్చినవాడి దృష్టి అలాంటి సందర్భంలో ఆ దర్శకుడి మీద తప్ప ఉండకూడదు; కానీ ఆ బ్యాక్‌ కవర్‌కూ తనకూ ఉన్నట్టుగా స్ఫురించిన అస్పష్టమైన లింకేదో అతడిని ఆ పుస్తకం వైపు తదేకంగా చూసేలా చేసింది. ఫొటోలోని మనిషి, నమ్మలేనట్టుగా చూస్తున్న ఈ కళ్లకు తెలిసివుంటాడని పసిగట్టిన ఆ దర్శకుడు, ఆ పుస్తకాన్ని ఇతడు స్పష్టంగా చూసేలా ఇతడివైపు తిప్పి, ‘నీకు తెలుసా ఈయన?’ అని అడిగాడు. ‘నాకు బామ్మర్ది అవుతాడు సార్‌’ అని అప్పుడే తెలుసుకుంటున్నంత ఎక్సయిటింగ్‌గా జవాబిచ్చాడు.

ఆ బామ్మర్దిని నేనే! నేను రాస్తానని గానీ, ఒకట్రెండు పుస్తకాలు వచ్చివుంటాయని గానీ ఇతడికి తెలియదు. అసలు అతడా లైన్లో లేడు. ఏ నాలుగైదేళ్లకో ఒకసారి ఎక్కడైనా ఉమ్మడి బంధువర్గపు సందడిలో తారసపడే దూరపు చుట్టరికం మాది.

కేవలం తనను వేషం అడగటానికి వచ్చిన ఒక అతి మామూలు వ్యక్తి, తాను చదువుతున్న ఒక రచయితను ‘బామ్మర్ది’ అన్నప్పుడు, ఆ దర్శకుడికి ఆ రచయితపట్ల ఏర్పడిన ఇష్టాన్నో అభిమానాన్నో ఇది ఎలా ప్రభావితం చేస్తుంది?

బహుశా ఏదైనా పెళ్లయివుండాలి; లేదా ఏదో ఒక ఫంక్షన్‌. అంటే ఆ ఎర్రటి రిబ్బన్లు వేలాడదీయడమూ ఆ హంగామా ఏదో తెలుస్తోంది. పెళ్లి కాకపోవచ్చు, ఏదో గెట్‌టుగెదర్‌ లాంటిది. చాలామందిమి ఒక పెద్ద గదిలో గుండ్రంగా నిల్చునివున్నాం. నేను ఎంట్రన్స్‌ దగ్గరే కుడివైపు ఉన్నాను. నా వెనక నా కొలీగ్స్, ఆఫీసు లెక్క ప్రకారం నా సబార్డినేట్స్‌ ఒక నలుగురైదుగురు ఉన్నారు. అంటే మిగతావాళ్లు కూడా మా ఆఫీసువాళ్లే అయివుండాలి; కాకపోతే వేర్వేరు డిపార్ట్‌మెంట్ల వాళ్లు.

ఒకావిడ, ముఖం గుర్తు లేదు, వయసులో చిన్నదే, కానీ అందరమూ బహుశా ఆమె కోసమే ఎదురు చూస్తున్నంత ప్రాధాన్యత గల మనిషి, వడిగా అడుగులేస్తూ లోపలికి వస్తోంది. మాలో మేము ఏదో మాట్లాడుకుంటున్న మా దృష్టి ఆమెవైపు మళ్లింది. చిత్రంగా, ఆమెతోపాటు వెంట వస్తున్న నలుగురైదుగురిలో బాల్‌రెడ్డి ఉన్నాడు. ఇతనిది మా ఊరే. నాకు చిన్నప్పటినుంచీ పరిచయం. ఏదో చిన్నపని చేసుకుంటూ హైదరాబాద్‌లోనే చాలా ఏళ్లుగా ఉంటున్నట్టు తెలుసు కానీ ఎప్పుడూ కలవలేదు. పండగలప్పుడు ఊరికి పోయినప్పుడు కలుస్తూనే ఉంటాం మళ్లీ. అంటే, హైదరాబాద్‌ లోని మా పరస్పర ఉనికిలతో మాకు సంపర్కం లేదు. కాకపోతే ఇక్కడ ఇలా ఉన్నట్టుండి ప్రత్యక్షం కావడంతో ‘అరే మా బాల్‌రెడ్డి’ అనుకునే ఒక ఎక్సయిట్‌మెంట్‌ నా లోపలికి ప్రవేశించింది. ఇద్దరమూ మనసారా కళ్లతో పలకరించుకున్నాం.

ఆమె లోపలికి వస్తూనే, అందరితో కరచాలనాలు చేసేందుకు వీలుగా ముందు మేమే నిల్చున్నాం కాబట్టి, మా వైపు రాబోయింది. ఇంతలో నా కుడిపక్కనే కొంచెం దూరంలో నిల్చున్న ఇంకో డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ రెండడుగులు ముందుకు వేయడంతో ఆమె దృష్టి అతడి మీద పడి అటువైపు మరలింది. బాల్‌రెడ్డీ, నేనూ గట్టిగా హేండ్‌షేక్‌ చేసుకున్నాం. ఆమె వెనక ఉన్నతనికీ నాకూ పరిచయం ఉందని ఆమెకు తెలిసిపోయేలా ఈ కరచాలనం జరిగింది.

ఆ రెండోగుంపుకు షేక్‌హేండ్‌ ఇచ్చాక ఆమె నావైపు తిరుగుతుందనుకున్నాను; కానీ ఆమె మూడో గుంపు వైపు సాగిపోయింది. అలా మొత్తం గుండ్రంగా అందరినీ చుట్టేశాక వాతావరణం ఫంక్షన్‌ స్టార్ట్‌ అయిన మూడ్‌లోకి వచ్చేసింది. నేను మాత్రం చిన్నబుచ్చుకున్నాను. దాన్నుంచి బయటపడి ఎంత మామూలుగా ఉందామనుకున్నా ఆమె నన్ను స్కిప్‌ చేసి వెళ్లిన విషయమే గుర్తొస్తోంది. ఈ బాల్‌రెడ్డి ఆమె దగ్గర ఏదో చిన్నస్థాయి ఉద్యోగి అయివుండాలి. అది మా స్నేహంలో ఏ మార్పూ తేదు. కానీ ఆమె దాన్ని ఎలా చూస్తుంది? ఆమె ఎలాగైనా చూడనీ, నేనొక డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ను అయినప్పుడు మర్యాదకొద్దీ నాకు షేక్‌హేండ్‌ ఇచ్చివుండాల్సింది. కానీ ఆమె స్కిప్‌ చేసింది. ఈ స్కిప్‌ చేయడానికి ఈ బాల్‌రెడ్డి ఫ్యాక్టరే పని చేసి వుంటుందనే నమ్మిక నన్ను తొలిచేస్తోంది.

మనకు కొత్తగా వచ్చిన మేనేజర్, గతంలో మన దగ్గర అటెండర్‌గా పని చేసినవాడి కొడుకే అన్నప్పుడు కలిగే భావం ఎలాంటిది? ఆ మేనేజర్‌ను ‘మేనేజర్‌ స్థాయి’ నుంచి తగ్గించడానికి అది కచ్చితంగా కారణం కాగలదు. బహుశా బాల్‌రెడ్డి అట్లా ఒక డిపార్ట్‌మెంట్‌ హెడ్‌నైన నన్ను డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ స్థాయి నుంచి తగ్గించి వుంటాడు. అందుకే ఆమె నాకు షేక్‌హేండ్‌ స్కిప్‌ చేయగలిగింది. షేక్‌హేండ్‌ ఇవ్వకూడదని కూడా కాదు; నా స్థానంలో ఇంకెవరైనా ఉంటే, ఆమె కచ్చితంగా ఇటువైపు తిరిగి దాన్ని పూర్తి చేసుకునే మూడోవ్యక్తి వైపు మరలేది; కానీ ఇటు తిరగాల్సిన మనిషిని అటు తిరిగేట్టు చేసిన ఆ బలహీన క్షణానికి బాల్‌రెడ్డి కారణమయ్యి ఉంటాడు. అది నన్ను ఇంకా మనస్తాపానికి గురిచేసింది. నాకు కోపం వస్తోంది. నేను ఆమెవైపే అడుగులు వేస్తున్నాను. దీన్ని ఇగ్నోర్‌ చేద్దామనే అనుకుంటున్నాను, కానీ నా అడుగులు ఆమెవైపే పడుతున్నాయి. ఇక దీన్ని తేల్చుకోకుండా నేను ఉండలేను. ఆమెకు ఎదురుగా వెళ్లాను. ‘అట్లా నన్ను స్కిప్‌ చేసి ఎలా వస్తారు?’ ఈ హఠాత్‌ ప్రశ్న అర్థం కానట్టుగా ఆమె నన్నే చూస్తోంది. నేను మళ్లీ అదే అడుగుతున్నాను: ‘అట్లా నన్ను ఎందుకు స్కిప్‌ చేశారు?’ నా గొంతు మామూలుకంటే తీవ్రమైంది. నా ఒంట్లోకి వణుకు వచ్చేసింది. ఫంక్షన్‌ వాతావరణం గంభీరంగా మారిపోయింది. ఆమె ఏమీ జవాబివ్వడం లేదు. నా గొంతు ఇంకా పెరిగింది. నాకు ఏడుపుతో కూడిన కోపం వస్తోంది. ‘నన్ను ఎట్లా మీరు స్కిప్‌ చేయగలిగారు?’

ఒక లోకంలో పలుకుతున్న నా గొంతు ఇంకో లోకంలోని నా చెవులకు వినిపిస్తూ ఉండగా, ఆ స్వరంలో ఉన్న తేడా నాకే అర్థమవుతూ ఉండగా, నా భార్య నన్ను ‘ఏమైంది, ఏందో కలవరిస్తున్నవ్‌?’ అంటూ ఉండగా, నేను కలలోంచి వాస్తవం లోకి మేల్కొంటూ, ‘నేను గట్టిగా మాట్లాడిన గదా’ అంటూ ఒక రకమైన ఆశ్చర్యంతో లేచి కూర్చున్నా.

కలల్లో కొందరు మాట్లాడుతారంటారు. నా మీద అట్లాంటి ఫిర్యాదు గానీ గమనింపు గానీ ఎవరూ ఎప్పుడూ నా దృష్టికి తేలేదు. నాకు తెలిసి ఈ ఒక్క సందర్భంలోనే నేను బయటికి మాట్లాడాను.

ఇట్లా ఊహల్ని కూడా పెయిన్‌గా మారేంత లోలోపలికి జొప్పిస్తూ, నా గురించి నేను హాయిగా బాధపడుతూ బతికేస్తున్నానని నా ఊహాపాఠకుడికి చెబితే–-‘మీ బోడి ఊహలు, కలలు కూడా మాకు అవసరమా?’ అని అడిగాడు. లోకం గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. నా గురించి రాసుకోగలిగేది నేను ఒక్కడినే కదా!
----------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

Sunday, June 23, 2019

మధ్యాహ్నం మాణిక్యం


మధ్యాహ్నం మాణిక్యం




సాహితీమిత్రులారా!

“అరవయ్యేళ్ళొచ్చాక చదువుకోక మన్ను కొట్టుకోనా అని అందిట వెనకటికి” మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది. అలాగే మేము సీనియర్‌ సిటిజెన్స్‌ హోదా వచ్చాక, పిల్లలూ మనవలూ రమ్మని పేచీ పెడితే సాహసించి అమెరికా బయల్డ్దేరాం.”మనకి ఫారెన్‌ రేఖ లేదని చెయ్యి చూసి ఇదివరకు చెప్పారనుకో. కానీ ఈ రోజుల్లో అమెరికాలో పిల్లలు ఉన్న వాళ్ళు ఫారెన్‌ రేఖలు ఓ బ్లేడు పెట్టి గీసుకుంటే వీసా దానంతటదే ఒచ్చేస్తుందిట” అన్నారు మా వారు.మొత్తానికి బారిష్టరు పార్వతీశం లండను ప్రయాణంలా అలవాటులేని సాక్సులు, బూట్లు, స్వెట్టర్లూ కొనుక్కుని, ఇక్కడి పిల్లలు ఇక్కడి ఏర్పాట్లు చూసి, అక్కడి పిల్లలు అక్కడ అన్నీ అమర్చి, మాకేమీ ఇబ్బంది లేకుండా చూసుకోగా అమెరికా చేరుకున్నాం.

ఒక వారం శలవలకి దగ్గరలో San Antonio లో చూడవలిసినవి చూపిస్తామని పిల్లలు తీసుకుని వెళ్ళారు. అక్కడ river walk  అంటే ఏదో నది పక్కన షికారులా ఉంటుందేమో, మన ఊళ్ళో చాలా సార్లు చూసిందే కదా అనుకున్నాను. క్యూ ఎక్కువగా ఉందంటే పోనీ మానేద్దామన్నాను. కాదు ఇది వేరని చెప్పి అబ్బాయి పట్టు బట్టి తీసుకెళ్ళాడు. వెళ్ళాక తెలిసింది, ఈ బోటు షికారు విశేషమయిందేనని. నదిని ఊరు మధ్యనించి మళ్ళించి చూడవలిసిన ప్రదేశాలన్నీ బోటునించే చూసేలా ఏర్పాటు చేశారు. రెండు పక్కలా చాలా ఎత్తయిన భవనాలూ పెద్ద పెద్ద చెట్లూ, వాటి నిండా దీపాలూ, కొన్ని చోట్ల సంగీతం, కొన్ని చోట్ల డ్యాన్సులూ, కొన్ని బోట్లలో డిన్నరు పార్టీలూ, చాలా గొప్పగా ఉంది. అచ్చు చిన్నప్పుడు దీపావళికి నాన్న తన చేతులతో చేసిన మతాబాలు నాచేత కాల్పించినప్పుడు కలిగినంత సంబరమేసింది.

అక్కడి నించి natural caverns కి వెళ్ళాం. అక్కడ ప్రవేశ ద్వారం దగ్గిర ఎవరైనా శారీరిక ఇబ్బందులుండి నడవలేకపోతే అక్కడే ఆగిపోవలిసుంటుందని రాసారు. ఈ వయసులో, ఈ ఒంటి బరువుతో అంత లోతుకి దిగి మళ్ళీ ఎక్కగలనా అని భయం వేసిన మాట నిజమే. ఆయన పక్కనుండి “నీకేవిటి, తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు, మీ నాన్న పోలిక నీది, ఆయన మిట్ట మధ్యాహ్నం తారు రోడ్డు మీద ఆయాస పడుతూ నడిచినట్లే ఇదీనూ” అన్నారు. లేని నేర్పు కూడా ఉందని భ్రమ పడేలా ప్రోత్సాహమివ్వడం ఆయన అలవాటు. సరే ముందుకెళ్ళాం. సాహసించి రాలేకపోతే చాలా అపురూపమయిన అందాలు చూడలేకపోదుమనిపించింది. చెప్పడానికి అలవికాని అద్భుతమైన గుహలవి. రక రకాల స్తంభాల ఆకారాలతో పైనించి వేళ్ళాడే ఊడల మాదిరిగా, చిన్ని చిన్ని ఆశ్రమాల లాగ, గుడి గోపురాల మీద చెక్కిన శిల్పాల లాగ, ఎవరి చూపుకి ఎలా తోస్తే అలాగే ఊహించుకోవచ్చు. తెలుపులో లేత పసుపు రంగు కలిసిన సున్నపు రాతి కొండ గుహలవి.

ఆకురాలు కాలమొచ్చింది. ఓ రోజు పొద్దున్నే కాఫీ తాగుతూ కూర్చుని చూస్తే ఎదురుకుండా ఉన్న చెట్టుకి ఒక పక్కనించి తోపురంగు కలిసిన ఎరుపు, మరో పక్క లేత నారింజ రంగు, ఇంకా పసుపూ, అక్కడక్కడ ఊదా రంగు కలగలిసి కనిపించి భలే ముచ్చటేసింది. మొదట చిగురాకులో, ఎండుటాకులో తెలియలేదు. దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్టుమొదళ్ళలో చిగురాకులూ, పైన రాలిపోయే ఎండుటాకులూ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. వసంత కాలపు వైభవాలు అలవాటు పడ్డ  కళ్ళకి రాలేముందు కూడా ఇంత అద్భుతమైన అందం వెదజల్లే చెట్ల ఆకులు చూడ్డం మిగిలిన అమెరికా అనుభవాలతో పోటీ పడి నెగ్గే కొత్త వింత. కొంచెం తియ్యగా, కొంచెం చేదుగా, జ్ఞాపకాలు కదిలాయి, చెట్టు మీద చిక్కుకున్న గాలిపటంలా ముందుకీ వెనక్కీ ఊగిసలాడుతూ.


నా బతుకు దారి మీదా, తీరు మీదా చెరగని ముద్ర వేసిన నాన్న అపురూప వ్యక్తిత్వం గులాబీ రంగరించిన పాల తెలుపు రంగూ, గుండ్రని మొహం, నవ్వే కళ్ళూ, సాఫుగా దువ్వాక కొంచెం చెదిరిన జుట్టూ, తెల్లని షర్టూ, గ్లాస్కో పంచె, ఒక చేతిలో సిగరెట్టూ, ఒక చేతిలో కోవా బిళ్ళల పొట్లం “అమ్మాయ్‌” అంటూ ఇంట్లోకి వస్తూంటే పేచీలూ, ఏడుపులూ ఆగిపోయి నవ్వులూ కేరింతలూ మొదలవడం, ఇల్లంతా మారిపోయి ఇంకాస్త వెలుగ్గా కనిపించినట్లుండడం నా చంటితనం జ్ఞాపకాలు.

పిల్లల్ని దగ్గిరికి తీసుకుని కథలు చెబుతూ, సరదా కబుర్లు చెబుతూ ఉడుక్కునే వాళ్ళని వేళాకోళం చేసి ఉడికిస్తూ, ఇంటి మొత్తాన్నీ రోజూ పండగే అనుకునేలా చేసేవారు. ఊరెళ్ళినప్పుడల్లా ఏదో కొత్త బొమ్మో వస్తువో తెచ్చేవారు. తెచ్చిన గంటలోనే నేనో తమ్ముడో పగలకొట్టి అమ్మ చేతా బామ్మ చేతా తిట్లు తినే వాళ్ళం. నాన్నుంటే మటుకు “పోన్లేవే, వాళ్ళ సరదాకోసం కాకపోతే నీకోసం, నాకోసమూనా బొమ్మలు?” అనేవారు.

ఆ రోజుల్లో గ్రామఫోను తప్పనిసరి సౌకర్యంగా ఇంట్లో ఉండేది. ఎవరికి తోచిన రికార్డు వాళ్ళు పెట్టుకుని వినే వాళ్ళు. నాన్న సైగల్‌ పాడిన “దునియా రంగ్‌ రంగేళీ బాబా, దునియా రంగ్‌ రంగేళీ” చాలా మాట్లు వింటూ ఉండేవారు. ఆ మాటలకి పూర్తి అర్థం ఆయనకి తెలుసునోలేదోగానీ, నాకు అర్థం కాకుండానే ఆ పాట వింటూంటే రంగు రంగుల దారాల కలనేత కళ్ళకి కట్టినట్లుండేది. ఎందుకో, నాన్నా ఆ పాటా ఒకటే అనిపించేది.


ఇన్నేళ్ళకి మా అబ్బాయి CD player  లో ఆ పాట మళ్ళీ విన్నాను. ఎందుకో కలిమిలో నాన్న, కష్టాల్లో నాన్న, కలగలుపుగా ఒకే పిక్చరు మనసులో మెదిలింది.


“పొద్దున్న వేళలా పొడిచేటి భానుడు పొన్న పువ్వూ ఛాయ, మధ్యాహ్న వేళల పొడిచేటి భానుడూ మంకెన్న పూఛాయ”.

“ఏవిటీ ఎప్పుడూ లేనిది కూని రాగాలొస్తున్నాయి, పూర్తిగా పాడరాదా” అన్నారు మా వారు.

“ఆ, నా మొహం నాకొకటి ఒస్తే కదా! నా చిన్నప్పుడు మా దొడ్డ పాడే పాటలు గుర్తొచ్చాయి, ఈ ఆకుల వైభవం చూస్తుంటే. మా వూళ్ళో నా వానా కాలం చదువుకి వొంటి పూటి శలవులప్పుడు బడి నించి ఇంటికి వస్తూంటే దారిలో రెండు పక్కలా దుబ్బులమీద తీగలకి పూసిన ఎర్రని మధ్యాహ్నం మాణిక్యాలు, వాటి తొడిమలు తుంపి నోటిలో పెట్టుకుంటే కొద్దిగా మకరందం రుచీ, తీరీ తీరని దాహం,  ఏవేవో జ్ఞాపకాలొస్తున్నాయి” అన్నాను.

“మధ్యాహ్నం మాణిక్యాలేమిటీ, నేనెప్పుడూ చూడలేదూ, వినలేదూ?”

“ఏమో, మా దొడ్డా మంకెన్న పువ్వుల్నే మధ్యాహ్నం మాణిక్యాలంటారని చెప్పేది”

మా వూళ్ళో చేలగట్లమ్మట అడివి మల్లి పూలు, ముళ్ళా గొబ్బి పూలు, పంటకాలవ పక్కని చెట్లకి ఏవో పేర్లు తెలియని గుత్తులుగా పూసే తెల్లని పూలు, ఇంటి పెరట్నిండా బొడ్డు మల్లి, పందిరి మల్లి, దుబ్బు మల్లి, విరజాజి, సన్నజాజి, చేమంతి, బంతి, రాధా మనోహరం, మన్మధ బాణాలు, కనకాంబరాలూ, నీలాంబరాలూ ఉండేవి. ఇప్పుడెక్కడా నీలాంబరాలూ, మధ్యాహ్నం మాణిక్యాలూ కనబడటమే లేదు.

“ఎన్ని పువ్వులున్నా దీనికి పిచ్చి పువ్వులంటే సరదా. ఎప్పుడూ చేలగట్లమ్మట తిరిగి ఆ పిచ్చి పువ్వులన్నీ కోసి తెచ్చుకుంటే గానీ దానికి తోచదు” అనే వాళ్ళు మా వాళ్ళు. నిజమే, అడివి మల్లి పూలు ఎంత బావుంటాయో! గమ్మత్తయిన వాసన, కొంచెం ఎరుపు కలిసిన తెల్లని పువ్వులు. చూడగలిగితే పిచ్చిపువ్వుల్లో కూడా ప్రపంచంలో ఉండే అందాలన్నీ చూడొచ్చు.



మా తాత గారిది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆయన తమ్ముళ్ళూ, మేనల్లుళ్ళూ, బావ మరిదీ, మొత్తం పిల్లా పెద్దా కలిసి ఎప్పుడు చూసినా పెళ్ళి ఇల్లులా ఉండేది. ఎప్పుడూ ఏవో నోములూ పేరంటాలూ పురుళ్ళూ తద్దినాలూ సమారాధనలూ చాలా సందడిగా ఉండేది. పక్కన అతిథి కూచుని భోంచేస్తేనే మా తాతగారు తినే వారు. ఆస్థి ఉండి అట్టహాసముండి సరదాలూ సంబరాలూ వేడుకలతో నిండి, బొత్తిగా ముందు చూపూ జాగ్రత్తా లేని ఆ కాలపు పెద్ద కుటుంబం మా తాతగారిది.

పెద్ద మండువా ఇల్లూ నాలుగు వేపులా పెద్ద పెద్ద వసారాలూ, పెద్ద భోజనాల సావిడీ, నాలుగు పెద్ద పడక గదులూ, కొన్ని చిన్న గదులూ, పాల మజ్జిగలకి ప్రత్యేకం గదీ, వంటకి వేరే, పిండి వంటకి వేరే గదులూ ఉండేవి. మా బామ్మ కూర్చుని పిండి వంటలు చేస్తూ ఉంటే మేవంతా చుట్టూ కూర్చుని ఖాళీ చేసేవాళ్ళం.

“చేసినంతసేపు పట్టదర్రా, ఖాళీ అయిపోవడానికి” అనేదావిడ.

మా నాన్న కన్నతల్లి చంటితనంలోనే పోతే తాతగారి రెండో భార్య దగ్గిరే ఆయన పెరిగారు. “అమ్మా” అనే పిలిచే వారు. చాలా కాలం దాకా ఆవిడే మా అసలు బామ్మని అనుకునే వాళ్ళం.

దేవుడి గుళ్ళో ఏ వేడుక జరిగినా మా ఇంటికే పెద్ద పీటగా ఉండేది. దేవుడి కళ్యాణానికి బామ్మా తాత గారూ,  తరవాత కాలంలో అమ్మా నాన్నా, పీటలమీద కూర్చునే వారు. ఆ అయిదు రోజులూ, ఏ రోజుకారోజు కొత్త బట్టలు మడత నలగకుండా కట్టుకునే వారు.

మా అమ్మకి సినీమాలంటే చాలా ఇష్టం. నాన్న మమ్మల్నందరినీ కాకినాడ తీసికెళ్ళి అక్కడ ఉన్న చుట్టాలతో సహా సినీమాకి తీసుకెళ్ళేవారు. అమ్మ స్థిమితంగా సినీమా చూసేందుకు వీలుగా పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళీ ఆడిస్తూ ఏవో కొనిపెడుతూ, కథలు చెబుతూ కాలక్షేపం చేసేవారు.

కథలంటే ఆయనకి మహా సరదా. ఆయన చెప్పే కథలు ఇంటిల్లిపాదీ ఆసక్తిగా వినేవారు.

దీపావళొస్తే మా ఇంట్లో సంబరం చూడవలిసిందే.  సూరేకారం, పటాసూ పేక ముక్కలూ, పాత పోస్టు కార్డులూ పెట్టి మతాబాలు, చిచ్చుబుడ్లు, టపాకాయలూ చెయ్యడంలో నాన్న నేర్పు గురించి ఊరంతా చెప్పుకునే వారు. గది నిండేలా బాణసంచా పేర్చి, బాగా ఆరనిచ్చి, దీపావళికి ముందూ తరవాతా వారం రోజులు ఊరందరికీ పండగలా నడిపించే వారు. ఊరి పిల్లలందరికీ ఆయన పెద్దన్నయ్య.

అంత మందిలోనూ మాకేలోటూ రాకుండా చూస్తూనే, అందరితో కలిసి మెలిసి ఉండేలా, అందరితో మంచీ చెడ్డా పంచుకునేలా అలవాటు చేశారు.



యుద్ధమొచ్చింది. చాలా మంది డబ్బు చేసుకునే దార్లు చూసుకుంటుంటే మా వాళ్ళు మాత్రం తాకట్లు వాకట్లవుతున్నా, ఆస్థులు హరిస్తున్నా పద్ధతులు మార్చుకోకుండా ఎప్పుడూ ఒకలాగే ఉండాలనే భ్రమల్లో ఉండే వారు.

తాతగారు పోయాక బాధ్యతంతా నాన్న మీద పడింది . మేఘాల్లో తేలే మనిషి నేల మీద ఒక్కమాటుగా చతికిల పడ్డట్టయ్యింది. అలాగని కదలకుండ నిమిత్తమాత్రుళ్ళా కూర్చునేందుకు వీల్లేని పరిస్థితి. ఆస్థీ ఆడంబరం పరిధుల్లో ఒంటికి పట్టి పోయిన పద్ధతులూ అలవాట్లూ, తాహతు తగ్గగానే ఓ పట్టాన మారవు. బ్రేకు వేసాక రైలైనా కారైనా కొంత దూరం ఇంకా అదే వేగంతో వెళ్ళినట్లే. మనుషులు పరిస్థితులు గమనించి అవగాహన చేసుకునే లోపే ఇంకా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది పైన బాధ్యత ఉన్న వాళ్ళ మాట.

ఇంక మిగిలిన జనాలకి బాధ్యత మోసేవాళ్ళేమవస్థలు పడుతున్నారో పట్టనే పట్టదు.వాళ్ళకి కావలిసిన పనులు సాగాల్సిందే. పెద్దరికాలూ, పది మందిలో పరువూ, పోయిన వాళ్ళ ఓరిమి, ఇంకా ఇలా ఎన్నో రకాల ఆయుధాలు ఉపయోగంలోకొస్తాయి. ముఖ్యంగా వెనకటితరం ఆడవాళ్ళకి.

నాన్నకి వాళ్ళతో ఎదిరించి మాట్లాడటానికి తగినంత అవగాహన ఉండేది కాదనుకుంటాను, మరీ ముంచుకుపోయిందాకాను.

“ఈ పని జరగాలి, ఇన్నేళ్ళుగా జరుగుతోంది. మీ బాబయ్య ఎప్పుడేనా డబ్బుల గురించి ఆలోచించారా?” అని బామ్మో దొడ్డమ్మో అంటే నాన్న డబ్బులేని పరిస్థితికి తనే మూల కారణమన్నట్లుగా బాధపడిపోయేవారు . నోములకోసం, వ్రతాలకోసం, సమారాధనలకోసం, ఇంటికొచ్చిన వాళ్ళకి తాహతుకి మించిన మర్యాదలకోసం, అమ్మ వొంటి మీదున్న బంగారు నగలన్నీ ఒక్కొక్కటే బజారుకెళ్ళిపోయాయి.

మెల్లి మెల్లిగా రోజులు గడవడమే క్ష్టమయ్యాక చుట్టాలు నిష్టూరాలాడుతూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. మా చుట్టాల్లో ఒకాయన తాసిల్దారు. ఆయన పరపతి వల్ల ఆట్టే చదువుకోని మా నాన్నకి మధ్య వయసులో చిన్న మేస్త్రీ ఉద్యోగం దొరికింది, బతుకు వెళ్ళమార్చుకోడానికి.



ఒక రోజు మిట్ట మధ్యాహ్నం ఎర్రని ఎండలో చెమటలు కక్కుకుంటూ తారు మరకల పంచెతో వచ్చిన నాన్నని చూసి బామ్మ, “ఏవిటో నాయనా, ఎండ కంట పడితే కంది పోతావని ఇంటి చుట్టూ చల్లగా తాటాకుల పందిరి వేయించి కంటికి రెప్పలా పెంచుకున్నాము, ఈ నాటికి నీ రాత ఇలా మారింది” అని బాధ పడింది.మళ్ళీ ఆవిడే “ఏవిటో ఉద్యోగం పురుష లక్షణమని సొంత ఊరు ఒదులుకుని వచ్చాడు కానీ, మాకేవిటీ తరాలు తిన్నా తరగని ఆస్థి, పిల్ల జమీందారీ అమ్మా మాది” అనేది ఇరుగు పొరుగు వాళ్ళతో. వాళ్ళు పక్కకి తిరిగి ముసి ముసి నవ్వులు నవ్వుకునే వారు. పాపం ఆవిడకి తెలీదు, అప్పటికే ఆస్థి పూర్తిగా హరించుకుపోయి ఉన్న కొద్ది పాటి నేలా ఇల్లూ తనఖాలో ఉన్న సంగతి.

నాన్న దొరికిన చిన్నపాటిపని తక్కువనుకోకుండా చేస్తూ మమ్మల్ని జాగర్తగా చూసుకునే వారు.

“ఎప్పుడూ కూడా లేకపోవడం అనేది తక్కువ కాదర్రా! ఉన్నంతలోనే మనం సంతోషం వెతుక్కోవాలి” అనే వారు. జీవితం కొట్టిన అంత పెద్ద దెబ్బకి క్రుంగి కృశించకుండా కొత్త వాతావరణానికి ఎలా తట్టుకున్నారో నా పదేళ్ళా వయసులో అర్థమయ్యేది కాదు. నా మటుక్కు నాకు తలవంపులయినట్లుండేది. నేనెప్పుడైనా ఈ గడ్డు రోజులు గడుస్తాయా అని భయంగా ఉందంటే, “ఎందుకమ్మా భయం, భయం మన్ని చూసి భయపడాలి” అనే వారు.

అమ్మ ఓనాడు భరించలేక “ఏం చెయ్యనర్రా, ఇంత విషం కొనుక్కుని చద్దామన్నా అణా డబ్బులు లేవు!” అంది. నాన్న నవ్వుతూ “ఒక అణా దొరికితే విషమెందుకే కొనడం, టీ కాచుకుని తాగుదాం” అన్నారు.

ఇంట్లో ఎవరైనా మొహాలు ముడుచుకుని కూర్చుంటే ఇన్ని చింత గింజలో గవ్వలో తెచ్చి నవ్విస్తూ కబుర్లు చెబుతూ ఆడించేవారు. ఎన్ని ఇబ్బందుల్లోనూ ఎదురుదెబ్బలలో కూడా ఆయన సహనం కోల్పోకుండా నిత్య సంతోషిలా కనిపించే వారు.

ఒక సారి మావయ్య మమ్మల్ని చూడ్డానికి వస్తూ మా కోసం తెచ్చిన పెద్ద బిస్కెట్ల డబ్బా రైల్లో మర్చిపోయాడు.

“అయ్యో, పిల్లలు తింటారని పెద్ద డబ్బా కొన్నాను, ఎవరికి దొరికిందో?” అన్నాడు.

“పోనీలేవోయ్‌ అయ్యో అనకూడదు, ఎవరికి దొరికినా తింటారు, ఎవరైతేనేం, తినడానికీ, సంతోషించడానికి?” అన్నారు నాన్న.

“నీలా అందరూ అనలేరు బావా!” అన్నాడు మావయ్య.

“ఈ నాటికి బిస్కెట్ల డబ్బా పోయిందని విచారించమంటావా రావుడూ?” అన్నారు నాన్న.

ఎంత లేమి పరిస్థితుల్లోనూ లోపలి బాధ పైకి కనపడకుండా తిరుగుతున్న రోజుల్లో మా మేనత్త కూతురు పెళ్ళయింది. మొదటి రోజు వంట చేసిన వంట వాళ్ళు ఏదో పేచీ పెట్టుకుని చెప్పకుండా వెళ్ళిపోయారు. నాన్న తువ్వాలు నడుముకి చుట్టుకుని గాడి పొయ్యి రాజేసి గుండిగలూ కుళాయిలూ ఎక్కించేశారు. కంగారు పడుతున్న అత్తయ్యా, మావయ్యగారూ, మిగిలిన పెళ్ళి వారూ ఆశ్చర్యం నించి తేరుకునే లోపే, ఉప్మా, కాఫీ మొగ పెళ్ళి వారి విడిదికి పంపించడానికి సిద్ధం చేశారు. మాలాంటి పిల్లల్ని కొంచెం సాయం తీసుకుని, కూరలు తరిగించేసి, వీలయినంతలో వంటలు సిద్ధం చెయ్యడం చూసి అందరూ ముక్కుమీద వేలేసుకున్నవాళ్ళే. అప్పుడాయన వంట చెయ్యడానికొచ్చిన వాళ్ళలాగే మాసిన అంగోస్త్రమే కట్టుకున్నారు. ఆయాసం తగ్గడానికి టీ తప్పించి మరోటి తీసుకోలేదు, పనయ్యేదాకా. వడ్డనల టైములో ఆయాసం తట్టుకోలేక పైగదిలోకెళ్ళిపోయారు తిండి తినకుండానే.



ఎప్పుడైనా ఇబ్బంది పరిస్థితుల్లో అమ్మ విసుక్కుంటూంటే, “అన్నం దగ్గిర గొడవ చెయ్యకే, నేను తినకుండా లేచేస్తే నువ్వు రోజంతా ఉప్పోషముంటావని తింటున్నాను, తినగలిగి కాదు”.  అనేవారు. ఆయన తినకుండా ఆవిడెప్పుడు తినేది కాదు. ఆవిడ విసుగులోనూ, ఆయన సౌమనస్యంలోనూ కూడా ఆపేక్షా, అనురాగం మటుక్కే కనపడేవి. అలాగే పాపం ఒడుదుడుకులు తట్టుకుంటూ మమ్మల్నందర్నీ ఒక ఒడ్డుకి చేర్చాలని ప్రయత్నం చేస్తూ ఉండే వారు.

రెండేసి రోజులు పొయ్యి మీదికీ, పొయ్యి లోకీ ఏవీ లేక పోయినా మూడో రోజు ఏ కొంచెం డబ్బు సమకూడినా ఏవో తినుబండారాలు కొని రాత్రి ఏ టైముకొచ్చినా నిద్రపోయే పిల్లలందరినీ పేరు పేరునా లేపి తినిపించేవారు.

వేడి తార్రోడ్డు మీడ పని చేసి వచ్చి పడుకుంటే తగని ఆయాసమొచ్చి నిద్రపోనిచ్చేది కాదు సగం రాత్రి దాకా. అలా ఉన్నప్పుడు కొంచెం పల్చగా టీ తాగితే ఆయాసం తగ్గినట్లుండేది. ఒక రోజున అలా టీ అడిగినప్పుడు అమ్మ “టీ పొడుం అయిపోయిందండీ,  ఇందాకటి చారు కొంచెముంది, వేడి చేసిస్తాను ఘాటుగా ఉంటుంది తాగండి” అంది.

ఏమనకుండా చారు తాగుతున్న నాన్నని చూసి “పాపిష్టి దాన్ని, అంత ఆయాస పడుతుంటే కాసిన్ని టీ నీళ్ళు కాచియ్యలేకపోయాను” అంది. “లేదే, ఈ చారు వేడిగా ఘాటుగా టీ కంటే బావుంది, గొంతు కొంచెం సద్దుకుంది” అన్నారు నాన్న, ఇంకా తన్నుకొస్తున్న దగ్గూ ఆయాసం లోపల అణిచేసుకుంటూ.

ఇంకోమాటు అలాంటి పరిస్థితిలో అమ్మ దొడ్లో తులసాకులు నీళ్ళల్లో కాచి ఇచ్చింది. అది తాగి నవ్వుతూ, “గొంతులో తులసి నీళ్ళ టైమింకా రాలేదనుకున్నాను” అన్నారు నాన్న. అమ్మ బావురుమంది. “లేదే, ఊరికే సరదాకన్నాను, నిన్ను బాధ పెట్టడానిక్కాదు, నేను చాలా కాలం బతుకుతాను” అని అటు తిరిగి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నారు.

అలాంటి పరిస్థితుల్లోనే నాకు పెళ్ళీడొచ్చింది. నా జాతకం చాలా బావుందనే వారు అంతానూ. చిన్నప్పుడు ఏం జాతకాలో ఏమిటో అని ఈసడించుకునే దాన్ని. కాని ఆ పరిస్థితుల్లో అనుకోకుండా మా దూరపు చుట్టాలబ్బాయి కావాలని నన్ను చేసుకునేందుకు సిద్ధ పడ్డాడు. అప్పటికి తణఖాలో ఉన్న పల్లెటూళ్ళో పాతిల్లు అమ్మేస్తే ఎనిమిది వందలు అప్పు పోగా మిగిలింది. దాంతోటి, అటూ ఇటూ ఏ కాస్తో సొమ్మోఒ సరుకో సాయంతోటీ మా పెళ్ళయిందనిపించారు.

నేను మొదటి సారి అత్తారింటినుంచి వచ్చిన రోజున వేడి వేడి బటాణీలు తువ్వాల్లో కట్టుకుని, గుప్పెడు మల్లె పూలు జేబులోంచి తీసి ఇస్తూ “ఈ ఏడాది ఆఫీసు గెస్టు హౌసులో మల్లె పూలు తక్కువ పూసాయమ్మా!” అన్నారు. ఆపేక్షతో తెచ్చిన ఆ గుప్పెడు మల్లె పూల గుబాళింపు ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది.

ఇంకా తమ్ముడూ, చెల్లాయీ చిన్న వాళ్ళే. స్కాలర్షిప్పులతో ఎలాగో చదువు సాగిస్తున్నాడు తమ్ముడు. చెల్లాయి చదువు మానేసి కుట్లు నేర్చుకుంది. నాన్న మధ్య వయసవకుండానే బాగా ముసలితనమొచ్చినట్లు కనపడే వారు. అయినా ఆ చిన్న ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం సాగిస్తూనే ఉండేవారు.

డొక్కు సైకిలు మీద మండే ఎండలో రోడ్డు మీద వస్తూనే ఉన్నారు. మొహంలో నవ్వుని అణిచేస్తూ బాధ ఆక్రమించుకుంటూ ఉండేది. మేమక్కడికి వెళ్ళినప్పుడల్లా బాధ కనపడకుండా నవ్వే కనపడాలని ప్రయత్నం చేసేవారు పాపం. మా పాపాయి కోసమని దీపావళికి అవస్థ పడుతూనే మతాబాలు కట్టారు. “మతాబాల వెలుతురులో గులాబి పువ్వులా మెరిసిపోతున్నావు తల్లీ,” అన్ని పాపాయిని ఆడిస్తూ, నవ్విస్తూ కాలక్షేపం చేసేవారు.

కట్టిన కొద్ది బాణసంచాలోనూ సగం  ఇరుగు పొరుగు వాళ్ళకమ్మి ఆ ఖర్చుకి తట్టుకునే వారు కానీ, లేకపోతే ఇన్నేళ్ళుగా మానేసిన బాణసంచాకి ఇప్పుడు డబ్బులెక్కడివి? ఆయన కట్టిన సరుకు సీమ సరుక్కంటే బావుందని బజారుకంటే చవకనీ మళ్ళీ బోల్డు మందొచ్చి సరుకులిచ్చి మతాబాలూ చిచ్చుబుడ్లూ కట్టించుకున్నారు.


తమ్ముడు ఫోను చేసాడు నాన్నకి సీరియస్‌ గా ఉందని. హడావుడిగా బయల్దేరి వచ్చేప్పటికి కొంచెం తేరుకున్నట్లుగా కనిపించారు. మా వారిని చూస్తూనే “రావోయి, బేస్తులాడుకుండాం, చాలా రోజులయ్యింది” అన్నారు. నాకేసి చూసి “అమ్మాయీ నువ్వొచ్చేసావు, నాకింకే బెంగా లేదమ్మా!” అన్నారు. “ఆ మాటలన్నీ ఎందుకు నాన్నా, స్థిమితంగా ఉండండి” అన్నాను. నాన్న అడగంగానే పేకలూ సిగరెట్లూ తెచ్చారు మా ఆయన.

డాక్టరొచ్చి చూసి వెళ్ళాడు. ఏమీ వివరంగా చెప్పలేదు. మందులు రాసిచ్చి వెళ్ళిపోయాదు. సాయంత్రం కాసేపు పేకాడుకున్నాం ఇంట్లో అందరం కలిసి. “మానేసిన సిగరెట్టు ఇవాళ మళ్ళీ కాల్చాలనిపిస్తోందర్రా!” అని సంతోషంగా సిగరెట్టు కాలుస్తూ ఆడారు నాన్న.

పడుకునే ముందు మళ్ళి సీగరెట్టు కాల్చారు.


మళ్ళీ ఇన్నాళ్ళకి చూశాను మధ్యాహ్నం వేళ చెట్ల మధ్యనుంచి నవ్వుతున్న నాన్న ముఖాన్ని.
----------------------------------------------------------
రచన: నందివాడ శ్యామల, నందివాడ భీమారావు, 
ఈమాట సౌజన్యంతో

Friday, June 21, 2019

సశేషమ్‌


సశేషమ్‌



సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి...............

“ఎయిర్‌ పోర్ట్‌” లో వెయిట్‌ చేస్తుంటే,
బయట పిల్ల తెమ్మెర తుర్రుమని పారి పోయింది
రేపటి కోసం ఆతృత పడుతూ ఉంటే,
నిన్నటి చక్కని రాత్రి చెప్పా పెట్టకుండా చేజారి పోయింది
వెన్నెల చమురింకి పోయి పున్నమి దీపాలెన్నో కొండెక్కి పోతున్నా,
జీవన పరుగు పందెంలో పగలూ రాత్రీ తెలియక పరుగెడుతున్నా..

“అలారం” ఎప్పుడు మ్రోగుతుందా అని, రాత్రంతా కలవర పడుతూ,
మంచి నిద్ర కోసం పగలంతా కలలు కంటూ,
“గోలైవ్‌” ల లెక్కల్లో లైఫంటూ లేకుండా పోతున్నా
“కార్పొరేట్‌” వైకుంఠ పాళీలో పెద్ద పెద్ద నిచ్చెనలెక్కేస్తున్నా,
“లేఆఫ్‌” ల పాము కాట్లకి స్టాకు స్ప్లిట్ల కట్లు కట్టేస్తున్నా..

బృహత్‌టాస్కుల “ప్రాజెక్టు” ఫ్రేమ్‌వర్కు లో,
తేలికగా ఊపిరి తీసుకోగలగడమే ఒక పెద్ద “మైల్‌ స్టోన్‌”
చెప్పండి మీ “లైఫ్‌ స్పాన్‌” కి “కెపాసిటీ ప్లానిన్గ్‌” కావాలా ?
లేక మీ “థాట్‌ ప్రోసెస్‌” కి “రిసోర్స్‌ కోఆర్డినేషన్‌” కావాలా ?
స్వంత “ఫ్యామిలీ టైం” కుంచించుకు పోతున్నా,
“సిస్టం స్కేలబిలిటీ” గురించి పేద్ధ లెక్చరు ధంచ గలను,
“బేబీ” పుట్టిందన్న వార్త “క్లైంటుసైటు” లో ఉండగా వస్తే,
“ఏ వెర్షనో” అడిగి తెలుసుకోగలను

యంత్రాలతో నియంత్రించ బడుతున్న జీవితానికి,
“ఓవర్‌టైము వైరస్‌” నుండి తప్పించే “వెకేషన్‌ వాక్సీన్‌” కావాలి,
“ప్రయారిటీస్‌” తారుమారయి ఆలోచనలు తలక్రిందులయిన మనిషికి,
వెన్ను తట్టి మేలు కొలుపు పాడే “క్వాలిటీ” కోడి కూత కావాలి,

జీతాన్ని “డౌన్‌గ్రేడ్‌” చేసైనా, జీవితాన్ని “అప్‌గ్రేడ్‌” చేసుకోవాలి,
ఒక్క రోజైనా రవ్వంత ఆగి, ఎందుకు పరిగెడుతున్నానో తెలుసుకోవాలి..
-------------------------------------------------------
రచన: రామభద్ర డొక్కా, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, June 19, 2019

సౌందర్యం


సౌందర్యం





సాహితీమిత్రులారా!

నందుడికి కాలూ చేయీ ఆడటం లేదు, మరో రెండు రోజుల్లో తన పెళ్ళి. తనకి నచ్చిన అతిలోక సుందరి జనపద కల్యాణి ఒప్పుకుంది. కళ్ళు మూసుకున్నా తెరిచినా కల్యాణి రూపం మనసు లోంచి పోవడంలేదు. తాను అతి అదృష్టవంతుడనడానికి అనేక కారణాలు. మొదటిది తాను సిద్ధార్థుడికి తమ్ముడిగా పుట్టినా, ఆయన సన్యసించడం వల్ల తనకి రాజపదవి లభించబోతోంది. రెండోది, ఎప్పట్నుంచో తాను రాజ్యంలో సుందర నందుడిగా పిలువబడుతున్నాడు, తన అందం వల్ల. మూడోది ఇంత అందగాడైన తనకి అతిలోక సుందరి అయిన జనపద కల్యాణి భార్యగా రాబోతోంది. ఇంతకన్నా కావాల్సిందేముంది ఎవరికైనా?

ఆలోచనల్లో ఉన్న నందుడికి లోపలకి వచ్చిన సేవకుడు చెప్పేడు. “రేపు తథాగతుడు భిక్షకోసం వస్తున్నారుట. ఆ తర్వాత మీకూ కుటుంబానికీ ఆశీర్వచనం, మిగతా విషయాలూ చూస్తారని వినికిడి.”

నందుడు తల పంకించాడు.

మర్నాడు తమ్ముణ్ణి చూడ్డానికొచ్చిన బుద్ధుడికి అలంకరణతో వెలిగిపోతున్న నందుడు కనిపించేడు. ప్రజాపతిని, తండ్రిని పలకరించి యశోధరనీ, రాహులుణ్ణీ కూడా చూశాక భోజనాలు వడ్డించబడ్డాయి. కూడా తెచ్చుకున్న కమండలం పక్కనే పెట్టి కావలిసినది మాత్రమే మితంగా భుజించాక శిష్యులతో పాటూ వెళ్ళడానికి లేచాడు భగవానుడు. గుమ్మం దాటుతుంటే ఏదో మర్చిపోయినట్టున్నాడు, నందుణ్ణి పిలిచి చెప్పాడు, “భోజనం చేసిన చోట, కమండలం మరిచాను. కాస్త తీసుకొస్తావా?”

నందుడు కమండలం పట్టుకుని వచ్చేసరికి తథాగతుడు గుమ్మం దాటి బయటకు, అక్కడ నుంచి తన విహారానికి వెళ్ళిపోయాడు. నందుడు కమండలం పట్టుకుని విహారానికి వచ్చాక తథాగతుడు చెప్పాడు, “ఎవరి జీవితంలోనైనా సరే రెండే రెండు విషయాలు తప్పకుండా జరిగేవి. జననం, మరణం. పెళ్ళీ, పిల్లలూ, బంధువులూ, స్నేహితులూ ఎవరూ మనకూడా రారు. ఏ జనపద కల్యాణి అతిలోక సుందరి అనుకుంటున్నావో ఆమే కొన్నేళ్ళు గడిచేసరికి నీకు మరో వికారమైన రూపంలో కనిపిస్తుంది. అందం అనేది అతి చంచలమైనది. ఈ పెళ్ళివల్ల నీకేదో సౌఖ్యం, ఆనందం సమకూరుతుందనుకుంటున్నావు కానీ దానితో సంసారంలో పీక లోతు కూరుకుంటున్నావు. దీనికి తరుణోపాయం సన్యసించడం, అర్హతుడవడమూను. నీకు కావాల్సింది ఆనందమే అయితే అది సన్యసించడంలో ఉంది కానీ పెళ్ళిచేసుకోవడంలో లేదు. చెప్పు నందా, నీకు కావాల్సింది నిజమైన శాశ్వతానందమా లేకపోతే ఏదో కొన్నేళ్ళు మాత్రం ఉండే శారీరికానందమా? ఇది అడగడానికే నిన్ను విహారానికి రప్పించాను. రాజ భవనంలో అయితే ప్రజాపతి, మహారాజు నేను చెప్పినదానికి ఏ పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని తెలిసిందే కదా?”

“అన్నా, శాశ్వతానందమే కావాలని ఉంది కానీ అతిలోక సుందరి జనపద కల్యాణిని మర్చిపోవడం ఎలా?”

“సరే అయితే ఇలా కూర్చుని కళ్ళు మూసుకో. నీకు కనిపించే విషయాలు చూస్తూ నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉండు. నీకే తెలుస్తుంది ఏమి చేయాలో.”

భగవానుడి ఎదురుగా పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్న నందుడికి మొదటగా కనిపించినది, కాలుతున్న ఇనప స్తంభం. దానిమీదకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న ఒక కోతి. స్తంభం మీద చేయి వేసినప్పుడల్లా కోతి చేయి కాలుతోంది. చేయి వెనక్కి తీసుకోవడం మళ్ళీ మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కోతి కాళ్ళూ చేతులూ నోరూ చెవులూ కాల్తున్నాయి. అదేమి వింతో, ఎర్రగా కాలుతున్న స్తంభం ముట్టుకునేకొద్దీ వళ్ళు కాలుతున్న కోతి నెప్పితో అరుస్తున్నా మరింత కురూపిలా తయారౌతోంది కానీ స్తంభం ఎక్కడం మాత్రం ఆపడం లేదు. ఈ లోపునే పక్కనుంచి తథాగతుని వాక్కు వినిపిస్తోంది నందుడికి.

“జనపద కల్యాణి ఈ కోతికన్నా అందంగా ఉంటుందా?”

“ఈ కోతి కన్నా లక్షకోట్ల రెట్లు అందంగా ఉంటుంది, అసలు పోలికే లేదు.”

“సరే మరోసారి దృష్టి కేంద్రీకరించి చూడు, ఇప్పుడేం కనిపిస్తోందో?”

నందుడికి ఈ సారి ఊర్ధ్వలోకాలు కనిపించడం మొదలుపెట్టాయి. భూలోకం కాదని తెలుస్తూనే ఉంది. ఏదో సభలో ఉన్నట్టుంది. అందంగా అలంకరించుకున్న స్త్రీలు పానీయాలు అందిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్రతీ స్త్రీ కళ్ళు తిప్పుకోలేని సౌందర్యరాశి. నందుడు అలా చూస్తుంటే భగవాన్ స్వరం మరోసారి వినిపించింది.

“ఈ స్త్రీల సౌందర్యం అంత బాగుంటుందా, జనపద కల్యాణి సౌందర్యం?”

“లేదు. ఈ సౌందర్యరాశులతో పోలిస్తే జనపద కల్యాణి ముందు నాకు కనిపించిన వళ్ళు కాలిపోయిన కోతిలా ఉంది. ఇక్కడ కూడా పోలికే లేదు.”

తన ప్రయత్నం లేకుండా కళ్ళు తెరుచుకున్న నందుడు భగవానుడి కేసి చూశాడు ఈ సారి ఆశ్చర్యంగా. తథాగతుడు స్థిరంగా అన్నాడు. “ఇప్పుడు చెప్పు నందా, నీకు జనపద కల్యాణి కావాలా లేకపోతే ఈ సౌందర్య రాశులు కావాలా? ఈ సౌందర్యరాశులు స్వంతం అవ్వాలంటే సన్యసించి తీరాలి మరి.”

వేరు ఆలోచన లేకుండా చెప్పేడు నందుడు, “ఈ సౌందర్య రాశులు నా స్వంతం అవుతారంటే జనపద కల్యాణికి వదులుకోవడానికి నేను సిద్ధం! ఇప్పుడే సన్యసిస్తాను.”

తథాగతుని మొహంలో కనీకనిపించని చిరునవ్వు. మర్నాడు పెళ్ళి చేసుకోబోయే నందుడు, భగవానుడి మొహం చూడగానే సన్యసించాడనే వార్త శుధ్ధోధన మహారాజు రాజ్యంలో దావానలంలా వ్యాపించింది.

నాలుగేళ్ళు గడిచాక ఓ రోజు విహారంలో బుద్ధుడు ఇచ్చే ప్రసంగం కోసం వచ్చిన స్త్రీలని, వాళ్ల సౌందర్యాన్ని ఇంకా కామంతో చూస్తున్న నందుడు ఆనందుడి కంటపడ్డాడు.

“సన్యసించినా మనసు అదుపులో పెట్టుకోలేని నువ్వు అర్హతుడవడానికి పనికిరానివాడివి.” అన్నాడు కోపంతో ఆనందుడు.

ఈ మాట ముల్లులా మనసులో గుచ్చుకున్నప్పుడు నందుడు మరోసారి భగవానుడిని చూడబోయేడు. ఎప్పుడు తనకి బుద్ధుడు ధ్యానంలో చూపించిన సౌందర్య రాశులు స్వంతం అవుతారో, తన మనసు ఇంకా ఆ అందం మీదనుంచి వెనుతిరగడం లేదో కనుక్కోవడానికి.

అంతా విన్న తథాగతుడు అడిగేడు, “నందా నీకు కనిపించిన కాలుతున్న ఇనుప స్తంభం, ఆ కోతి, ఏమిటో తెలుసా?”

“తెలియదు.”

“ఆ ఇనుప స్తంభం ఈ సంసారం. అది ఎవరినీ వదలదు. ఆ కోతి నీ మనసు. ఈ సంసారం ఎంత భాధిస్తున్నా దాన్ని వదలడానికి మనసు ఒప్పుకోదు. అందువల్ల ఇప్పుడు నీ మనసు ఇంకా ఆ సంసారం మీదే ఉంది. అలా నీ వళ్ళు ఇంకా కాలుతూనే ఉంది. ఎప్పుడైతే నీ మనసుని సంసారం మీద నుంచి లోపలకి మరల్చావో అప్పుడు అది నీకు మరింత సంతోషం ఇవ్వడం మొదలుపెడుతుంది. ఓ సారి ఆ ఆనందం అనుభవం లోకి వచ్చాక నీకే తెలుస్తుంది.”

“అలా మనసుని మళ్ళించడం ఎలా?”

“సజ్జన సాంగత్యం వలనా, సంఘంలో ఉండి బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉండడం వలనా.”

“సజ్జన సాంగత్యం ఎటువంటిది, దానివల్ల నాకు ఉపయోగం ఏమిటి?”

“సరే, సజ్జన సాంగత్యం గురించి నాలుగు విషయాలు విను.

యదృచ్ఛయాప్యు పానీతం, సకృత్సజ్జన సంగతం
భవత్యచల మత్యంతం నాభ్యాసక్రమమీక్షతే.

అనుకోని విధంగా అయినా సరే ఒకసారి సజ్జన సాంగత్యం కలిగితే అది స్థిరమై ఉండిపోతుంది తప్ప ఆ సాంగత్యం స్థిరం అవడానికి మాటిమాటికీ పరిచయాలని అది ఆపేక్షించదు.

న సజ్జనాద్దూరచరః క్వచిద్భవేద్భజేత సాధూన్ వినయక్రమానుగః
స్పృశంత్య యత్నేన హి తత్సమీపగం విసర్పిణస్తద్గుణ పుష్పరేణువః

ఎప్పుడైనా సరే వినయంగా సజ్జనులని సేవిస్తూ ఉండాలి. సజ్జనుల సమీపంలో ఉన్నవారికి అప్రయత్నంగానే వాళ్లకున్న మంచిగుణాలు, పుష్పరేణువులు అంటుకున్నట్టూ సోకుతాయి.

రథానృపాణాం మణిహేమభూషణా వ్రజంతి దేహశ్చ జరావిరూపతాం
సతాం తు ధర్మం న జరాభివర్తతే స్థిరానురాగా హి గుణేషు సాధనః

బంగారం, మణులతో చేసినా రాజుల రథాలు చివరకి వాడకం వల్ల పాతబడ్డట్టే మనిషి శరీరం కూడా ముసలితనం వల్ల కురూపమవుతుంది. కానీ సజ్జనులు ఆచరించే ధర్మానికి ముసలితనం అనేది లేదు. అందువల్లే ధర్మం మీద స్థిరమైన అనురాగం అలవరచుకోవాలి.

నభశ్చదూరే వసుధాతలాచ్చ పారాదవారం చ మహార్ణవస్య
అస్తాచలేంద్రాదుయతోస్తతోపి ధర్మః సతాం దూరతరే సతాంచ

గగనానికి భూమికీ ఎంత దూరమో, మహాసముద్రానికున్న ఇవతలి ఒడ్డుకీ అవతలి ఒడ్డుకీ ఎంతదూరమో, ఉదయాచలానికీ అస్తాచలానికీ ఎంత దూరమో, దానికన్నా ఎక్కువగా ఉంటుంది, సజ్జనులకీ దుష్టులకీ మధ్య ఉన్న దూరం. అందువల్ల సజ్జన సాంగత్యంతోనే మనసు మరల్చుకోవచ్చు.”

ఈ సుభాషితాలు విన్న నందుడు మరింత పట్టుదలతో సాధన చేసి అర్హతుడయ్యేక మనసులో కలిగిన ఆనందాన్ని తలుచుకుని, మొదట్లో పెళ్లవబోతున్న తనని భగవానుడు విహారానికి బలవంతంగా తీసుకొచ్చి సన్యసించమనడం గుర్తొచ్చింది. తనలో తాను నవ్వుకున్నాడు, ఇప్పుడున్న తన ఆనందంతో పోలిస్తే, జనపద కల్యాణిని పెళ్ళి చేసుకుని ఉంటే ఏమై ఉండేది? ఒళ్ళు జలదరించింది.

“ఏమిటి నందా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?” ఎప్పుడొచ్చాడో నందుడి వెనకకి తథాగతుడు, అడుగుతున్నాడు,

“నా లోనే ఉన్న అఖండానందం చూసుకోకుండా నేను వివాహం తలపెట్టుకుంటే భగవానుడు నన్ను సన్యసించమనడం, ధ్యానంలో పైలోకంలో ఉన్న సౌందర్యరాశులని చూపించడం గుర్తొచ్చి నవ్వు వచ్చింది.” చెప్పాడు నందుడు.

“చూశావు కదా? జనన మరణ చట్రం లోంచి తప్పుకోవడం ముఖ్యం కానీ ఈ రోజు ఉండి రేపు హరించిపోయే క్షణికానందం కోసం బతకకూడదు. నీలో ఉన్న ఆనందమే మొదట్లో నేను చూపబోయిన ఆ సౌందర్యం. పైలోకాలు ఉన్నాయా లేదా అనేది అటుంచితే, అఖండానందం ఉన్నది సరిగ్గా ఇక్కడే, నీలోనే. నిరంతరం బాహ్యంగా ఉన్న ప్రపంచాత్మకమైన దృష్టి ఎప్పుడైతే అంతరంగా చూడ్డం మొదలుపెడుతుందో అప్పుడు ఆ దారికి అలవాటు పడి బయటకి రావడానికి ఇష్టపడదు. ఆ అంతర్దృష్టి అందుకోవడానికి చేసే మొదటి ప్రయత్నం కోరిక విడిచిపెట్టడం. దానికి మొదటి దారి సన్యసించడం. మామూలుగా సన్యసించమంటే ఎవరికీ ఇష్టం ఉండదు కనక ఎక్కడో పైలోకాల్లో సౌందర్యరాశులున్నారని నమ్మించడం మొదలుపెట్టి, అంతర్దృష్టితో లోపలకి చూడడం మొదలుపెట్టగానే తనలోనే అఖండానందం ఉందని తెలుసుకోగలుగుతున్నాం. మోక్షంమీద కోరికతోనో మరోదానికో సన్యాసంతో ఓ సారి అలా లోపలకి చూడ్డం మొదలుపెట్టాక చివరి అడుగు మోక్ష సన్యాసం–ఏ కోరికతో సన్యసించామో ఆ కోరిక కూడా వదులుకోవడం. ఎప్పుడయితే కోతి ఇనుప స్తంభాన్ని వదిలిందో అప్పుడే దానికి సంతోషం. ఇదంతా అర్థమయింది కదా?”

“సంఘంలో ఉంటూ ఆనందుడు, మిగతా శిష్యుల సజ్జన సాంగత్యంతోనే నేను ఈ జ్ఞానం సంపాదించుకోగలిగాను; మీరు చెప్పిన సతాం తు ధర్మం న జరాభివర్తతే అన్నది పూర్తిగా అర్థమైంది.” నందుడు చేతులు జోడించాడు.

మొహంలో చిరునవ్వు కదలాడుతుండగా భగవానుడు ముందుకి కదిలేడు.
--------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి, 
ఈమాట సౌజన్యంతో

Monday, June 17, 2019

కొలమానం


కొలమానం





సాహితీమిత్రులారా!

దూరాన్ని మైళ్ళలో చెబుతాం.

భారాన్ని కిలోల్లో తూస్తాం.

నీటిని లీటర్లలో కొలుస్తాం.

కాలాన్ని సెకండ్లలో లెక్కిస్తాం.

చావుని గణించడం ఎలా? బాధతోనా? వేదనతోనా? ఎలా? డౌటొచ్చింది కత్తిమేకకి. మీరు సరిగానే విన్నారు. అది ‘కత్తిమేకే’, ‘కంచిమేక’ కాదు.

కత్తిమేక పుట్టగానే బొడ్డుకోసి ఎవరూ దానికాపేరు పెట్టలేదు. దానికాపేరుని ఓ కుర్రమేక పెట్టింది. దాని వెనక పెద్ద ప్రహసనమే నడిచింది.

మేకకి సంబంధించినంతవరకూ చావు అనేది, కత్తికీ దాని కుత్తుకకీ మధ్య కార్యకారణ సంబంధం. ఇందులో వాదోపవాదాలకీ తర్కోపతర్కాలకీ తావు లేదన్నది కత్తిమేక ప్రగాఢ విశ్వాసం. చావుని దూరం లాగో, భారం లాగో, కాలం లాగో, వేగం లాగో కొలవడం సాధ్యం కాదని, అన్నీ కలగలిపిన ఓ క్రొత్త ప్రక్రియని కనిపెట్టాలని, చావుని బెత్తడు దూరం నుంచి తప్పించుకొన్నప్పుడే కత్తిమేక నిశ్చయించుకొంది.

మేకకి ఇలాటి అతి తెలివితేటలు ఎక్కడనుంచొస్తాయి, వెటకారం కాకపోతే? అని కొంతమందికి చాలా సందేహాలే రావొచ్చు.

ఏం… ఎందుకు రాకూడదు? అది అన్ని మేకల్లా నానాగడ్డీ తిని బలిసిన మేక కాదు. మఠంలో మేకవన్నెపులుల మధ్య మసిలిన అజ్ఞాని అంతకంటే కాదు. మేనిఫెస్టోల మహత్తు తెలిసిన ఆత్మజ్ఞాని.

దానికి మేషత్వం వుంది. దానికి దానమ్మాబాబూ ద్వారా సంక్రమించిన మెదడుంది. ఆ మెదడు ఎల్లప్పుడూ దాని మోకాళ్ళని తడుముకొంటుంది. దానికీ దేహముంది. అప్పుడప్పుడూ ఆ దేహం ఉప్పు, వర్ర వగైరా కలగలిసిన మసాలాని కోరుకొంటుంది. ఇంకా మనిషికి లేని తోక మేకకుంది. దానితో అది తన మానమర్యాదలని మసిపూసి మారేడురొట్ట చేసుకొంటుంది.

మేకకి ఇంకా అవీ ఇవీ బోలెడన్ని వున్నా… వాటి అవసరం దానికి ఇంతవరకూ రాలేదు. అందుకే, అవి వున్నాయన్న సంగతిని అది మర్చిపోయింది. ఆ అవసరం వస్తే… మరిచిపోయిన సంగతులేవో బహుశా అప్పుడు దానికి గుర్తుకురావచ్చేమో!

‘కస్సాక్… స్సాక్… స్సాక్… స్సాక్…’

కత్తికి సానబడుతున్న కఠోర సంగీతం. చావుకేక రాగం. నెత్తుటి కీర్తన.

ఒకటి కాదు రెండు కాదు, వందల కుంకుడు గింజల్లాటి కళ్ళు. వాటికి రెట్టింపు మడతబందుల్లాంటి కాళ్ళు. కత్తి పదునంచు కుంకుడు గింజల్లో తళుక్కుమంటోంది. బందులదొడ్డికీ, వధ్యస్థలికీ మధ్య వంద బారల దూరం. అక్కడి తెగనరుకుడు, ఇక్కడకి హారీపోటర్ సినిమాలా కనిపిస్తోంది.

‘కసా కసా’ పైకీ కిందకి కదులుతున్న కత్తి. అది మాత్రమే కనిపిస్తోంది మేకల కళ్ళకి. అంతకు మించి అవి పైకి ఎప్పుడూ చూడలేదు. చూసే సాహసం చేయలేదు. అది చావంటే వున్న భయంతోనా? కత్తి మీద వున్న భక్తితోనా? అన్నది వాటి విజ్ఞతకే వదిలెయ్యడం ఉత్తమం.

కత్తికీ, మేక మెడకీ మధ్య వున్నది కాలమా? వేగమా? భారమా? దూరమా? ఎప్పట్లాగే ఆలోచనల్లోకి జారిపోయింది కత్తిమేక.

సర్ మంటూ గాలిని చీల్చుకొస్తున్న కత్తికి స్పీడ్ బ్రేకర్‌లా, ఓ అనామక మేక మెడ అడ్డు తగిలింది. అంతే… మేక మెదడుకీ, దాని మడతబందులకీ మధ్య తంత్రులు తెగతెంపులయ్యాయి. గిలగిల్లాడుతున్న దాని దేహం మొగలాయీ కలలు కంటోంది.

అక్కడ జరుగుతున్న దాన్ని, ఏమీ జరగనట్టే చూస్తున్న కొన్ని అయోమయం మేకలు ఎప్పటిలాగే పోచుకోలు కబుర్లు చెప్పుకుంటున్నాయి.

“కటికోడు. టైటిల్ ఎలావుంది?” అడిగిందో బక్కమేక, ప్రక్కనున్న చుక్కమేకని.

“బాంది… కద రాత్నావా? కవిత్వం రాత్నావా?” కుతూహలం ప్రదర్శించింది చుక్కమేక.

వాటి మాటలకి గతాన్ని నెమరేస్తూ కులాసాగా కునుకుతీస్తున్న ముదరమేకకి మెలుకువ వచ్చేసింది. దిగ్గున లేచి, ‘యూ ఇడియట్స్!’ అన్నట్టు రెండిటి వైపూ ఉఱుముఱిమి చూసింది. ఎదరకాళ్ళని ముందుకి చాపి, వాటిని సగానికి వంచి, మెడని అటూ ఇటూ తిప్పి బద్ధకంగా వళ్ళు విరుచుకొంది. తర్వాత మామూలుగా నిలబడి బక్కమేకనీ చుక్కమేకనీ చూసి సన్నగా నవ్వింది. మేకనవ్వు భలేగుంటది మార్మికంగా. మేక నెమరేసినా నవ్వుతున్నట్టే వుంటుంది.

‘మెమ్మెమ్మే’ అని గొంతు సవరించుకొని… “కుర్రసన్నాసుల్లారా! కతలు, కవిత్వం రాయడమేటిరా? కత చెప్పాల! కవిత్వం చూడాల!” ఆవులిస్తూ ఖాళీగా వున్న మరోవైపు పడుకోవటానికి కదిలింది. అక్కడున్న మేకలన్నిటిలోకీ తానే పెద్ద మేధావినని ముదరమేకకి మహాబలుపు.

అది ఇలా కదిలిందో లేదో… అలా వచ్చిన రెండు చేతులు దాని చెవులు పట్టుకుని బరబరా కత్తిగారి దర్బార్‌లోకి లాక్కుపోయాయి. దాంతో బక్కమేకా చుక్కమేకా అవాక్కయ్యాయి. కాస్సేపు తలవంచి పైకీ కిందకీ ఖుషీగా కదులుతున్న కత్తి వైపు దొంగచూపులు చూశాయి. మళ్ళీ తామేమీ చూడనట్టే రెండూ ఒకదాని కళ్ళల్లో మరొకటి కళ్ళు పెట్టి మాటల్లో పడ్డాయి.

“ఇది నేనసలూహించలే!” ఆశ్చర్యం ప్రకటించింది బక్కమేక.

“దీని కాళ్ళు బలంగా కావిడిబద్దల్లా వున్నాయి, ‘పాయా’కి బాగుంటాయని… ఇందాకా వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. అప్పటికైనా జాగ్రత్తపడాలి కదా! పేద్ద బడాయికి పోయి వాళ్ళ ముందుకెళ్లి మరీ అంగాంగ ప్రదక్షిణ చేసింది. తొందరపడి ముందరే పరమపదించింది,” నిట్టూర్చింది చుక్క మేక.

“నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా, మేక పుట్టుక పుట్టాకా… ఎవరోకరికోసం, వాళ్ళు వరడైనా, నరుడైనా గిట్టక తప్పదు.” వేదాంతం వల్లించింది బక్కమేక.

“ఏంటీ డైటింగా? మరీ సన్నబడ్డావు!” వాతావరణాన్ని తేలిక చేసే పనిలో పడింది చుక్కమేక.

“ఆ…” అంది బక్కమేక సిగ్గుపడుతూ.

“అయితే… నువ్వు కూడా నీ చావుని మా అందరికన్నా ముందరే ఆహ్వానిస్తున్నావు.”

“నేన్నాజూగ్గా వున్నానని నీక్కుళ్ళు!”

“నీ తలకాయ్.”

“హే… ఏం మాట్లాడ్తున్నావు?”

“మనల్ని ఇక్కడ కుక్కేసి, పొట్టలనిండా రొట్ట ఎందుకు కూరుతున్నారు?”

‘ఏమో’ అన్నట్టు తలెగరేసింది బక్కమేక.

“ఒబీసిటీ కోసం. నిరాహారదీక్ష చేసి నువ్విలా గంటకో గ్రాము తగ్గిపోతున్నావని తెలిస్తే, ముందే వేసేస్తారు.”

“హమ్మో…” గబగబా బక్కమేక, రొట్ట దగ్గరకి పరిగెడుతుంటే… ప్రక్కనే వున్న ఓ గొర్రె తుమ్మింది.

“శుభమా అని మేత మెయ్యడానికి వెళుతుంటే తుమ్ముతావా? యూ బ్లడీషీప్!” బక్కమేక మాటల్లో జాతివివక్ష బుస్సుమంది.

రోజుమారింది.

సీను మారలేదు.

కత్తి వేగంగా మెడని తాకబోతుంటే…

“ఆగు…” గద్దించింది కత్తి మేక.

దాని మాటలో బెరుకు లేకపోవడం, కళ్ళల్లో చురుకు తగ్గకపోవడం కత్తిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇలా ఆఖరి నిమిషంలో మెడలు ప్రాధేయపడ్డం, కత్తికి కొత్తేమీ కాదు. ఆ సమయంలో కళ్ళల్లో బెదురూ, కాళ్ళల్లో వణుకూ కామన్. మాటలో ‘బాబ్బాబ్బన్న’ వేడుకోళ్లుంటాయి. అయితే కత్తిమేక వ్యవహారం కొంచెం కొత్తగా వుంది.

“ఏం…” మెడకి బెత్తెడు దూరంలో ఆగింది కత్తి.

“నా బదులు ఇంకో మేకనిస్తాను నన్నొదిలెయ్.”

“నువ్వేం చేస్తావ్?”

“డాక్టర్‌తో అపాయింట్‌మెంటుంది. ఆంత్రాక్స్ అని అనుమానం. అన్నట్టు ఇక్కడ డాక్టరుండాలికదా! కనబడడే?” మెడ పొడుగు చేసి అటూ ఇటూ చూసింది.

“ఆ… ఆ… వుండాలి. వాల్ పోస్టర్స్ వెయ్యడానికి బయటకి వెళ్లుంటాడు…” గతుక్కుమన్న కత్తి, మాటల కోసం తడుముకొంది.

“…”

“ఇంకా ఇక్కడే నిలబడ్డావే, పక్కకి తప్పుకో!”

కత్తిమేక క్రీగంట కత్తిని చూస్తూ స్టైల్‌గా అక్కడ నుంచి కదిలింది.

వరసగా మేకల తలలు తెగిపడుతున్నాయి.

కత్తికీ మెడకీ మధ్య వున్న అప్పు తీరిపోయాకా తలలకి బాధ తెలియడం లేదు.

వధ్యస్థలి నుంచి చాకచక్యంగా తప్పించుకొచ్చిన కత్తిమేకని చూసి, దాని మిత్రమేక చకితురాలయ్యింది. ‘ఇదెలా సాధ్యం?’ అని పడుకొని, వంగుని పరిపరి విధాల ఆలోచించింది. ఇక ఉండబట్టలేక…

“ష్… ష్, ఇదిగో బ్రదరూ” బందుల దొడ్డి బయట విహరిస్తూ లేత ఆకులని పలకరిస్తున్న కత్తిమేకని పిలిచింది.

“నాకూ… తప్పించుకునే కిటుకు చెప్పవా ప్లీజ్!” గుసగుసగా అడిగింది.

“ఇందులో ప్రత్యేకంగా చెప్పడానికి ఏం వుంది? ఏదో కట్టుకథ చెప్పడమే… ఫినిష్!”

కత్తిమేక చెబుతుంటే, మిత్రమేకతో పాటూ ఓ దొంగమేక కూడా ఆ రహస్యం వినేసింది. మొహంలో ఎక్కడా ఆ సంగతిని కనిపించనీయకుండా మనస్సులోనే గంతులేసింది. మిగతా మేకలన్నిటినీ తోసుకుని వెళ్ళి, ముందు వరసలో నిలబడి కనిపించిన ప్రతి మేకకీ కన్నుకొట్టడం మొదలెట్టింది.

రెండు చేతులొచ్చి దొంగమేకని బర్రుమని ఈడ్చుకువెళదామనుకునే లోపే… వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా తనే జంకూ గొంకూ లేకుండా వెళ్ళి కత్తి కింద నిలబడి విజిలేసింది.

కత్తి మూరెడు దూరంలో వుండగా….

“ఆగు!” అంది దర్పంగా.

“ఏం… ” అంటూ హుంకరించింది ఆగిన కత్తి.

“ఇంకో మేకనిస్తాను నన్నొగ్గెయ్,”

“ఏం? ఎందుకలా?”

“ఇంటి దగ్గర మా మామగారున్నాడు. ఆయనకో కట్ట తంగేడు రొట్ట ఇచ్చి వస్తాను,” ఆవూ పులి కథని మోడ్రనైజ్ చేస్తూ చెప్పింది దొంగమేక.

ఏ మేక ఎలాటిదో, అది కథ చెబుతుందో, కహానీ చెబుతుందో, ఇలాటివన్నీ తెలుసుకోవడానికి కత్తికి కన్నూ ముక్కూ కాళ్ళూ వ్రేళ్లూ లాంటి పరికరాలేం లేవు. కానీ కనిపించని నాలుకుంది. అది చాలు, దేన్నయినా ఈజీగా పసిగట్టెయ్యడానికి.

“వావ్… నైస్!” అంటూ ఆగిపోయిన కత్తి నాలుక చప్పరిస్తూ పైకి లేచింది. నిజానికి నరికేటప్పుడు కరుగ్గా వున్నా, కత్తిది చాలా మెత్తటి మనస్సు. తోలు వలిచేటప్పుడు తరచూ ఆ సంగతి బయటపడుతూ వుంటుంది. కానీ చూసే మెడలకి తప్ప, తోలు వలిపించుకునే పీకలకి ఈ విషయం తెలీకపోవడం మేకతాళీయం.

‘నేనింక బయట పడ్డట్టే…’ అనుకున్న దొంగమేక, అక్కడనుంచి కదలబోతుంటే సర్ మంటూ కిందకి దిగిన కత్తి దాని మెడకి కనెక్ట్ అయ్యింది.

అది చూసి షాకైన మిత్రమేక కత్తిమేక వైపు బేలచూపులు చూసింది.

“కథ చెప్పమంటే… ఏకంగా సినిమా చూపించింది. అందుకే అసువులు బాసింది. యూ డోంట్ వర్రీ. నేను చెప్పినట్టు చెయ్యి.” ధైర్యం నూరిపోసింది కత్తి మేక.

కధలు చెప్పి తప్పించుకొన్న కత్తిమేక మిత్రబృందంతో బందులదొడ్డి వెలవెలబోతోంది.

బందులదొడ్డిని మళ్ళీ కళకళ్ళాడించడానికి వచ్చిన కొత్తమేకలు లారీల్లోంచి ‘మేమే’ పాటలు పాడుతున్నాయి.

“ఒకట్రెండు… మూన్నాలుగు… ఐదారు…”

“ఏంటి లెక్కపెడ్తున్నావు?” కుర్రమేకని అడిగింది గడ్డంమేక.

“మనం ఎంత మందిమి మిగిలామా అని…” చెప్పింది కుర్రమేక తమ జనగణనని ఆపకుండా.

“మిగలడమా? హ్హు… కత్తి నుంచి తప్పించుకోవడం అంటే చావునుంచి తప్పించుకోవడం కాదు. బతుకుని పొడిగించుకోవడం. చంపేవరకూ కత్తి మన మెడమీద వ్రేళ్ళాడుతూనే వుంటది,”

“ఈరోజుతో భూమ్మీద మనకి ఆకులు చెల్లిపోయినట్టేనా?”

“తప్పదు. కత్తికీ పీకకీ వున్న అనుబంధం అలాటిది. మౌనంగా వెళ్లి మెడ వంచడమే.”

“ఆకులు, అలములు, చెట్లు, చేమలు వీటన్నిటినీ వదిలి మనం అంతరించిపోతామా? నాకు భయమేస్తోంది మామా. ఈ కత్తి మనల్నే ఎందుకు చంపేస్తోంది? మనకంటే రెండుకాళ్ళ జంతువులు కోకొల్లలుగా వున్నాయి కదా! హాయిగా బతుకుతున్నాయి కదా?” గగ్గోలు పెడుతోంది కుర్రమేక.

“అవి చస్తే, ఎవరికి ఉపయోగంరా? ఎవడన్నా కోసి కూరొండుకోగలరా? మన చావులో పరోపకారం వుంది.” ఊరడించింది గడ్డంమేక.

“అంతేనా! ఉప్పూకారం, గడ్డీ గరంమసాలా కూడా వున్నాయా?” దూరంనుంచి ఆలకిస్తున్న కత్తిమేక గొణుక్కుంటూ అక్కడకి వచ్చింది.

“ఏంట్రా అల్లుడూ… పొద్దుపొద్దున్నే ఏంటి అల్లరి?”

“నాకు బతకాలని వుంది మామా!” బావురుమంటూ దాని పొట్టలో బుర్రెట్టింది కుర్రమేక.

“ఉరుకో… ఊరుకో…”

“నేను చూడాల్సింది, అనుభవించాల్సింది చాలా వుంది,” కుర్రమేక గారం గుడుస్తుంటే… దాని లేతకొమ్ములు కత్తిమేక మెత్తటి పొట్టలో చురుక్కుమని గుచ్చుకుంటున్నాయి. దాన్ని ఎలా ఓదార్చాలో అంతుబట్టక కత్తిమేక మీనమేషాలు లెక్కపెడుతోంది.

బక్కమేక, చుక్కమేక, కుర్రమేకని ప్రక్కకి తోసుకుంటూ పోయి కత్తిమేకకి వెసులుబాటు కల్పించాయి.

కత్తి యథాప్రకారం కొలువు దీరింది.

“అటు చూడండి,” గంభీరంగా అంది కత్తిమేక.

మేకలన్నీ కొలువుదీరిన కత్తివైపు కలవరంగా చూశాయి.

“రోజూ కనిపించేదే. ఏం వుంది చోద్యం?” వెక్కిరింపుగా అంది తిక్కమేక.

“మనం ఇప్పటిదాకా కత్తినే చూస్తున్నాం. దాన్ని చూసే భయపడుతున్నాం…”

మేకలు మౌనంగా కత్తినీ, కత్తిమేకనీ మార్చి మార్చి చూస్తూ వింటున్నాయి.

“…కానీ ఈరోజు కత్తిని పట్టుకున్నవాడు కనిపిస్తున్నాడు.”

“కొత్తగా వీడెందుకు వచ్చాడు మధ్యలో?” పాయింటు లాగింది చుక్కమేక.

“వీడు మధ్యలో వచ్చినవాడు కాదు. ఆది నుంచీ వున్నవాడే. మనం ఆపదలో పడితేగానీ అసలైనవాడు కనబడలేదు.”

మేకలన్నీ కొంచెం మెడలని పైకి లేపి చూశాయి.

కత్తితోపాటూ కత్తిని పట్టుకున్న చేయి కనబడింది.

“కత్తి దానంతట అది మనల్ని నరకడం లేదు. కత్తితో వాడు మనల్ని నరుకుతున్నాడు. తప్పు కత్తిదనుకున్నాం. కాదు మనదే. తలపైకెత్తి చూడకపోవడం. భయంతో తలదించుకోవడం. మన ఎముకల్లో మూలుగు బదులు భయం దూరింది.”

“దీన్నే సంధిప్రేలాపన అంటారు!” తిక్కమేక కోపంగా తలాడించింది. దాంతో దాని కొమ్ము గడ్డంమేకకి చురుక్కుమని గ్రుచ్చుకొంది.

“అబ్బ… చచ్చాను! తిక్కతిక్కగా వుందా?” బాధగా అరచింది గడ్డంమేక.

“చూసుకోలేదు…”

“తల తెగాకా ఇంక చూడ్డానికి ఏం ఉంటదిలే…”

“దీని కొమ్ముపోటు కన్నా ఆ కత్తివేటే నయం. మొన్న నన్నూ అలాగే పొడిచేసింది. చచ్చాననుకున్నాను.” బక్కమేక గడ్డంమేకకి వత్తాసు వచ్చింది.

బక్కమేక మాటలకి కత్తిమేక ఓసారి తలతిప్పి అర్థవంతంగా నవ్వి, మళ్ళీ కత్తి వైపు తల తిప్పింది.

“కత్తిని ఆడించేవాడొక్కడే. కానీ వేటేయించుకునేవాళ్లం వందలు, వేలు, లక్షలా!” చిర్రుబుర్రులాడింది కుర్రమేక.

“…”

“మనం పదిమందే కదా ఇక్కడ మిగులత! కత్తినైనా, కత్తినాడించేవాడినైనా ఇంక పీకేదేముంది? మన చావు మనం చస్తే, ఇంకో కొత్తమంద వచ్చి ఇక్కడ మెడ వంచుతుంది,” తిక్కమేక గుక్క తిప్పుకోకుండా ఉపన్యసిస్తోంది.

“…”

కత్తికి సానపెట్టి, పదును పరీక్షించిన కసాయి వచ్చి బందులదొడ్డి తలుపు తెరిచాడు.

“ఖామోష్!” గట్టిగా అరిచింది కత్తిమేక.

మేకలన్నీ గప్‌చిప్ అయిపోయాయి.

“అంతా నేను చేసినట్టే చెయ్యండి, కమాన్ క్విక్!” నాలుగడుగులు వెనక్కి వేసింది.

కసాయి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. చేతిలో కత్తి విలాసంగా నాలుక ఆడిస్తోంది.

“రడీ…”

“రడీ. డీ.. డీ…” మేకలన్నీ కోరస్‌గా అరిచాయి.

“కుర్రమేక వన్ టూ త్రీ… అనగానే అందరం పరిగెత్తుకెళ్ళి కుమ్మేద్దాం, నా కొడుకుని… కే?”

“కె కె కె!” కేరింతలు కొట్టాయి మేకలన్నీ.

“వన్…”

కుర్రమేక లెక్క మొదలెట్టింది.

“టూ…”

కసాయి దగ్గరకొచ్చేస్తున్నాడు.

“త్రీ…”

అంతే! గేలప్ అందుకున్న మేకలన్నీ వెళ్ళి మూకుమ్మడిగా కసాయిని కసకసా పొడిచేశాయి.

జరిగిన దాడి చూసిన కత్తి బిత్తరపోయింది.

కసాయి బాధగా కత్తిని త్రిప్పుతూ మేకలని కట్టడి చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ… లాభం లేకపోయింది. చేతిలోని కత్తి జారి కిందపడింది.

“మావా, నువ్వు కత్తి!” అంది కుర్రమేక.

కసాయినీ కత్తినీ తొక్కుకుంటూ మేకలు మేతకి బయలుదేరాయి.

ఇది జరిగిన చాన్నాళ్లకి కత్తికి, మళ్ళీ కత్తిమేక కనిపించింది. ముందు అది అదేనా? కాదా? అని అనుమానమొచ్చినా… గుర్తు పట్టింది. కానీ అదే కత్తిని గుర్తు పట్టలేక పోయింది. వార్ధక్యం వల్ల కత్తిమేక చూపు మందగించింది.

చుట్టూ వున్న నాలుగైదు మేకల మధ్య సాగిలబడి, సాధువులాగా ఏదో మేతోపదేశం చేస్తోంది.

“గురూగారూ… ఇంతకీ చావుకి నిర్వచనం కనిపెట్టారా? కొలమానం ఏంటి?” సందేహం వచ్చిన ఓ శిష్యమేక గొంతు సవరించుకొని అడిగింది.

“సందేహాలే చావుక్కారణం. చావంటే మెడకాయమీద తలకాయ లేకపోవడం. చచ్చేదాకా సాగదీయడమే దాని కొలమానం…” అంటూ ఏదో మకతికగా చెప్పడంతో మేషబృందం కత్తిమేక కాళ్ళని పరవశంతో నాకాయి.

“నీ మొహం. నువ్వూ నీ చావు తెలివితేటలూ! చావుకి కాలమానమే కానీ కొలమానం లేదు.” గంభీరంగా అంటూ తమ మధ్యకి వచ్చిన కత్తిని చూసి అక్కడున్న మేకలన్నీ తలోదిక్కుకీ పటాపంచలయ్యాయి.

లేచి పరిగెత్తే ఓపిక లేకపోవడంతో కళ్ళు విప్పార్చి చూసిన కత్తిమేక కత్తి ముందు మెడ వంచింది.

కత్తిమేక వైపు జాలిగా చూసిన కత్తి, దాని మానాన దాన్ని వదిలేసి పరిగెడుతున్న మేకల వెనకపడింది.
---------------------------------------------------------
రచన: చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, June 16, 2019

ఇద్దరు పిల్లలు


ఇద్దరు పిల్లలు




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...................

ఒకడు కొంచెం చామనఛాయ. రెండోవాడు తెల్లగా ఉన్నాడు. పార్కులోని వాకింగ్‌ ట్రాక్‌లో ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. వాడు అటునుంచి ఇటు తన్నడం, వీడు ఇటునుంచి అటు తన్నడం. అన్నాతమ్ముడూ కావొచ్చు. దానికి నాకున్న ఆధారం ఈ తెల్లవాడు ఒక అంగుళం పొడవు తక్కువుండటమే. బహుశా ఎడం తక్కువ అయివుంటుంది. పెద్దవాడు తండ్రి పోలిక, చిన్నవాడు తల్లి పోలిక అయ్యుండాలి. నాకు తెలియని మగవాళ్లు కొంచెం నల్లగా ఉంటారనీ, ఆడవాళ్లు తెల్లగా ఉంటారనీ నా ఊహ.

పార్కులో ఐదారుగురు నడుస్తున్నారు; ఒకరిద్దరు కూర్చుని ప్రాణాయామం చేసుకుంటున్నారు. ఒక బెంచీ మీద అన్సారీసాబ్‌ భార్య, కషాయాలు తాగడం గురించి ఒకసారి నాతో మాట్లాడిన ఒక పెద్దావిడ కూర్చుని ముచ్చట పెడుతున్నారు. ఈ పెద్దావిడ జుట్టు పొట్టిగా ఉంటుంది. గుండు చేయించిన తర్వాత ఒక మాదిరిగా పెరిగిన జుట్టు. బహుశా తిరుపతిలో తలనీలాలు ఇచ్చివుండొచ్చని నా ఊహ. ఏదో వంటకం గురించి వారి సంభాషణ సాగుతోంది.

వాళ్లిద్దరూ అన్నదమ్ములని నాకు నేనే నిశ్చయం చేసుకోవడానికి ముందు నాకు తట్టింది వాళ్లిద్దరూ ముస్లిమ్ పిల్లలు అని. నలుగురైదుగురు బురఖా స్త్రీలూ, ముస్లిమ్‌లని తెలిసే ఆహార్యంతో మరో ఐదారుగురు మగవాళ్లూ రోజూ వాక్‌కు వస్తారు. ఎవరి పిల్లలై ఉంటారు?

నా పిల్లలు దసరా సెలవులకు ఊరెళ్లారు. వాళ్లు ఉన్నప్పుడు వాళ్లు స్కూలుకు వెళ్తే తప్ప ఇంట్లో ప్రశాంతత లేదనిపిస్తుంది. కాని వాళ్లు వారం రోజులుగా ఇంట్లో లేకపోవడంతో ఈ దొరికిన ప్రశాంతతకు అసలు అర్థమే లేదనిపిస్తోంది.

పెద్దోడు ఆ ఎర్రరంగు బాల్‌ను గట్టిగా తన్నాడు, ఈ చిన్నోడు దాన్ని ఆపలేక దాని వెనకాలే పరుగెత్తాడు. ఇద్దరూ నైట్‌ప్యాంట్లు వేసుకున్నారు. ఇద్దరి కాళ్లకూ బూట్లు ఉన్నాయి. పెద్దోడు నల్లచొక్కా తొడుక్కుంటే, చిన్నోడు టీ షర్ట్‌ వేసుకున్నాడు. చిన్నోడికి మొన్న మొన్నే హెయిర్‌ కట్‌ చేసినట్టుగా కొంత మొండి తల కనబడుతోంది. పెద్దోడి బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయి. వాడు పరుగెత్తినప్పుడు వాడి నల్లటి జుట్టు కూడా వాడిలాగే గంతులేస్తోంది.

వాళ్ల దోవకు అడ్డు వస్తున్నప్పుడు రెండు చేతులు వాళ్ల భుజాల మీద వేసి సున్నితంగా పక్కకు జరుపుతూ పెద్దవాళ్లు నడుస్తున్నారు. అట్లా జరపలేని ఒక స్థూలకాయురాలు అటు పచ్చికలో ఆడుకొమ్మన్నట్టుగా చేయి చూపించింది. ‘అక్కడ ఆడొద్దన్నారు’ అని చిన్నోడు జవాబిచ్చాడు. పచ్చికను పాడు చేస్తారని అందులోకి వెళ్లొద్దని ఉంటాడు వాచ్‌మాన్‌. ‘వీళ్లు’ తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారే. ముస్లిం పిల్లలు అయివుండరేమో. రోజూ గుడిమల్కాపూర్‌ ఆటోడ్రైవర్ల ముక్కల తెలుగు వినే నా చెవులకు వీళ్లు భిన్నమే. ఆ మాటకొస్తే, మా పెద్దోడి రెండో తరగతి క్లాస్‌మేట్‌ రుకయ్యా ముద్దొచ్చే తెలుగు మాట్లాడేది. వాడిని ఆ స్కూలు మానిపించినప్పుడు నేను ఫీలైన అంశాల్లో ఇదీ ఒకటి. కానీ నాకు రుకయ్యాల కంటే ఆటోడ్రైవర్లే ఎక్కువ తగులుతారు.

చిన్నగా పొద్దుటి ఎండ పడుతోంది. పిల్లల జుట్లలోంచి చెమటలు కారడం మొదలైంది. కొందరు వెళ్లిపోతున్నారు. ఒక టోపీ అతను వెళ్లిపోయాడు, బయట గేటు దగ్గర పార్క్‌ చేసిన బైకు మీద. వీళ్లు పరుగెత్తి అది ఎక్కుతారేమో అనుకున్నా. అయితే ఆయన పిల్లలు కాదన్నమాట.

చిన్నోడికి గట్టిగా తన్నరావడం లేదు. బాల్‌ను గాల్లోకి ఎగిరేసి ఎట్లా తన్నాలో చూపిస్తున్నాడు పెద్దోడు. చిన్నోడు కాలు ఎత్తే లోపే బాల్‌ కింద పడిపోతోంది. పెద్దోడు ఉత్సాహపరుస్తున్నాడు: ‘మార్‌’ ‘మార్‌’. ఒక నాలుగైదు ప్రాక్టీసుల తర్వాత చిన్నోడు పైకి ఎగరేసి తన్నగలిగాడు. ఈ మాటలతో రూఢీ అయింది, వీళ్లు ముస్లిమ్‌ల పిల్లలే. ఆమెకు జవాబిచ్చినప్పుడు అవసరంగా తెలుగు మాట్లాడటం వేరే; కానీ వాళ్లది వాళ్లు ఏం మాట్లాడుకుంటారో అదే కదా వాళ్ల భాష.

నేను వాకింగ్‌ ఆపేసి, బల్ల మీద కూర్చున్నాను. పిల్లలు తన్నడంలో ఒకసారి బంతి దాదాపుగా నా దగ్గరికి వచ్చి ఆగింది. పెద్దోడు పరుగెత్తుకొచ్చాడు. ‘సారీ అంకుల్‌.’ అంకుల్‌ అన్న పిలుపును కూడా అంత ఆనందిస్తానని నాకు అంతకుముందు తెలీదు. ‘ఆఁ! నో ప్రాబ్లమ్‌.’

తన్నులాట వదిలేసి ఇద్దరూ భుజాల మీద చేతులు వేసుకుని కాసేపు పార్కు చుట్టూ మాట్లాడుకుంటూ తిరిగారు. హిందీ మాటలు వినబడుతున్నాయి.

తన నడక కూడా ముగించుకుని అన్సారీసాబ్‌ వచ్చి నా పక్కనున్న బల్ల మీద కూర్చున్నాడు. ఈయన ఈమధ్యే నాకు పరిచయం. ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్‌ అయ్యాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి వస్తారు. జపమాల తిప్పుతూ నడుస్తుంటాడు. నాకు ఇంకా కుతూహలం ఆగట్లేదు.

“వో బచ్చే ఆప్‌కా పెహచాన్‌ కా హై క్యా?”

తల తిప్పి పిల్లల వైపు చూస్తూ, “మేరీ బేటీ కీ బేటా హై వో” చెప్పాడాయన. దసరా సెలవులకు కరీంనగర్‌ నుంచి వచ్చాడన్నాడు.

“ఎవరందులో?”

అన్సారీగారు తెలుగులో కూడా బాగా మాట్లాడతారు. “ఆ అదే ఆ బ్లాక్‌ షర్ట్‌ వేసుకున్నాడు గదా.”

అయితే వీళ్లు అన్నదమ్ములు కాదన్నమాట. “మరి ఇంకొకడు?”

ఆ కషాయాల అమ్మ వైపు చూపిస్తూ, “ఆ మేడమ్‌ ఉంది గదా, వాళ్ల మనవడు అంట.”

మనుషులు కలిసిపోవడానికి బాగా పరిచయం ఉండాలేమో అనే అమాయకత్వం నాది.

“అట్లనా, మరిద్దరూ అంత పరిచయం ఉన్నట్టు భుజాల మీద చేతులేసుకొని తిరుగుతున్నరూ?”

మాటను సాగదీస్తూ చెప్పారాయన: “ఇక్కణ్నే… ఇప్పుడే… పిల్లల్ది ఎంత సేపు.”

నా పిల్లలు ఏం చేస్తున్నారో ఊళ్లో. రోజుటి కంటే మరో పది నిమిషాలు ఎక్కువసేపు గడిపి వచ్చాను.
-------------------------------------------------------
రచన: పూడూరి రాజిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

Friday, June 14, 2019

బ్రహ్మ సృష్టి


బ్రహ్మ సృష్టి





సాహితీమిత్రులారా!

ఆవేళ ఆదివారం. తెల్లవారకముందే, భూదేవి బ్రహ్మదేవుడి ఇంటికొచ్చి, బ్రహ్మదేవుడిని లేపి మరీ మరీ మొర పెట్టుకుంది.

“స్వామీ! మీరు హాయిగా ఉన్నారు; మీ సొమ్మేం పోయింది, చెప్పండి. ఈ కలికాలం ప్రారంభంలోనే నా కొంపతీసిందంటే నమ్మండి. ఇప్పుడు భూలోకంలో వావివరసలు వదిలేసి వివాహాలు చేసుకుంటున్నారు. అంతేనా? మొగవాడు మొగవాడిని, ఆడది ఆడదానినీ మోహించి మరీ పెళ్ళిచేసుకుంటున్నారు. ఆడవాళ్ళు మొగవాళ్ళుగాను, మొగవాళ్ళు ఆడవాళ్ళుగానూ శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. కుతర్కవాదులు, వితండవాదులు, కపట సాక్షులు, కులట పక్షులూ, దొంగలూ, దొరలూ ఒకరేమిటి! రకరకాల మోసగాళ్ళు పెరిగిపోయారు. వీళ్ళు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. భరించటం అసాధ్యం కాలేదంటే నమ్మడానికి లేదు. భ్రూణహత్యలు పెరిగి పోయాయి. మ్లేచ్చుల అధికారం పెచ్చు పెరిగిపోయింది. హెగ్గడికత్తెలు అంతఃపురకాంతలుగా చెలామణి అవుతున్నారు. శిష్టులు దాసులవుతున్నారు. దుష్టులు రాజులవుతున్నారు. భ్రష్టులు మంత్రులవుతున్నారు. ద్రష్టలు అడుక్కోతింటున్నారు. దైవభక్తి తరిగిపోతున్నది. నాస్తికత్వం పెరిగిపోతున్నది. కాషాయం కట్టిన ప్రతివాడూ యతిగా, కలం పట్టిన ప్రతివాడూ కవిగా చలామణి అవుతున్నాడు. మీసృష్టిలో అర్థంతరంగా ఏమిటీ అనర్ధం. నాకెందుకీ ప్రారబ్ధం? ఇదంతా మీ సృష్టి ఫలం. ఇదంతా మీ ఘర్మ జలం. అందుచేత మీరు వెంటనే నివారణోపాయం కనుక్కోవాలి. నా వర్క్‌లోడ్ తగ్గించాలి.”

బ్రహ్మకి మాత్రం ఆవిడ ఆదివారం పొద్దుపొద్దునే నిద్దర్లేపినందుకు మహా చిరాగ్గా ఉంది. పైగా రాత్రి సరస్వతితో కాస్త మాట అటూ ఇటూ వచ్చి, అది చిలికి చిలికి గాలివాన అయింది. దాంతో రాత్రంతా కలత నిద్రే. ఇంకానయం, బెడ్రూం తలుపు వేసేసుకుని పెళ్ళాం తనని పోయి ఆ తామరపూవులో పడుకోమన్లేదు. అలవాటు తప్పిన ప్రాణం ఠారెక్కిపోయేది. కాస్త పొద్దెక్కేదాకా పడుకుందామనుకుంటే భూదేవి పొద్దునే తయారు కష్టాల చిట్టా చదువుతూ. నాలుగు తలలతో వింటున్నట్టు నటిస్తున్నాడు కానీ ఒక్కదాంతోటే వింటున్నాడు, అందులోనూ ఒక్క చెవితోటే. అయినప్పటికీ భూదేవి కథనం వింటుంటే ఆయనకే సందేహం కలిగింది. ఈ రభస, మామూలుగా మహాయుగాంతంలో రావలసింది. ఇప్పుడే మొదలయ్యిందేమిటి, చెప్మా, అని అనుమానం వచ్చింది. ప్రతియుగంలోనూ తను సృష్టి విషయంలో ఎన్ని జాగర్తలు తీసుకున్నా ఎక్కడో అక్కడ చటుక్కున రాక్షసజనం పుట్టటంలేదూ! అప్పుడప్పుడు ఈ అనంత విశ్వ సృష్టిలో కొద్దో గొప్పో విపరీతాలు రావని కాదు. అవి తనకి తెలియనివీ కావు. అయితే, ఇంత దారుణంగా జన్య కణాలు అడ్డంగా బెడిసికొట్టటం ఈ ఇరవై ఎనిమిది మహాయుగాలలో ఎన్నడూ జరగలేదే!

బ్రహ్మ పరధ్యాసలో పడ్డాడని సందేహించిన భూదేవి, “తండ్రీ! నా మొరవింటున్నావా, లేదా?” అని నిలదీసి అడిగింది.

“వింటున్నాను భూదేవీ, వింటున్నాను. ఈ దుస్థితి కలియుగ ప్రారంభంలోనే వచ్చిందేమిటా అని నాకూ ఆశ్చర్యంగానే ఉంది. అప్పుడే కలిపురుషుడు ఇంత ఘోరంగా విజృంభించాడేమిటా అని ఆలోచిస్తున్నాను. ఒక్కవారం రోజుల వ్యవధి ఇయ్యి. నీ బాధలకి నివారణోపాయం కనిపెడతాను, సరేనా?” అని బ్రహ్మ భూదేవికి అభయం ఇచ్చి ఆదరించి పంపిచేశాడు.

దీని నివారణోపాయం బ్రహ్మకి తెలుసు. శ్రీమహావిష్ణువు వెంటనే మహానిద్ర చాలించి, కల్కి అవతారం ఎత్తాలి, అంతే. అయితే, అది ఎట్టా సాధ్యం? శ్రీమహావిష్ణువు మహానిద్ర లోకి వెళ్ళి కొద్ది దేవ క్షణాలు కూడా కాలేదు కదా! ఆయన్ని ఇప్పుడు లేపటం ఎవరితరం?

బ్రహ్మదేవుడు సోమవారం ప్రొద్దున్నే కాస్త ఎర్లీగా లేచి, హడావిడిగా స్నానం చేసి, కాఫీ మగ్గులో పోసుకొని బ్రేక్‌ఫాస్ట్ బారొకటి జోబులో పడేసుకుని, భార్యామణి లేవకముందే హంసవాహనమెక్కి ఆఫీసుకి వెళ్ళిపోయాడు. కంప్యూటర్ స్విచాన్ చేసి ఆలోచనలో మునిగి పోయాడు. గడుస్తున్న మహాయుగం మనసులో కలలా మెదిలింది.

‘కృతయుగం సత్యయుగం. అనుకున్నట్టుగా పని జరిగిపోయేది. సృష్టి యధావిధిగా జరిగిపోయింది. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ వగైరాలు, ఏ విధమైన ఆటంకాలూ లేకండా క్లాక్‌ వర్క్‌లా సజావుగా జరిగిపోయాయి. కాస్త ఇబ్బంది పడినా, త్రేతాయుగంలో పరశురాముడి లాంటి ప్రభృతులు అప్పుడప్పుడు అవకతవకలు తెచ్చిపెట్టినా కూడా మరిన్ని ఆటంకాలు ఏవీ రాలేదు. ద్వాపర యుగంలోనూ అంతే! కృష్ణుడు అనుకోకండా గొడవలు తెచ్చిపెట్టినా, ఏదోవిధంగా ఆ యుగమూ గట్టెక్కిపోయింది. ఎటొచ్చీ ఈ కలియుగంలోనే మొదటినుంచీ ఇబ్బందులు! ఏమిటి చెప్మా’ అని బ్రహ్మ సతమవుతున్నాడు. మనసులో ఏదో అనుమానం మెల్లిగా మొలకెత్తుతున్నది కానీ, పట్టించుకోకుండా నొక్కి పెడుతున్నాడు. ఇంతలో టెలిఫోను మోగింది.

“హలో!”

“నేనే. పొద్దున్నే చడీ చప్పుడు కూడా లేకండా పారిపోయారే?”

“నిన్న పొద్దున్నే భూదేవి వచ్చి నానా గొడవా పెట్టింది. రాత్రి చెప్పానుగా, నీతోటి! అందుకని…”

“అందుకని? ఈ పని ఒత్తిడి మీకెప్పుడు లేదనీ! పొద్దున్నే పెళ్ళాంతో కూర్చుని కాఫీ తాగే టైం కూడా లేదా? అసలు మనిద్దరం పొద్దున్నే కలిసి కూచోని కాఫీ తాగి ఎన్నాళ్ళయ్యిందో తెలుసా?”

“సతీ, ప్లీజ్. ఈ వారం కాస్త ఓపికపట్టు. వచ్చేవారమంతా నీకు నేనే బ్రేక్‌ఫాస్ట్ ఇన్ ది బెడ్ నా స్వహస్తాలతో చెసిపెడతాను, సరేనా?” బుజ్జగించాల్సొచ్చినప్పుడు సరస్వతిని సతీ అనడం బ్రహ్మ టెక్నిక్.

“అంత అదృష్టమా! సరి సరి! ఇలానే ఇంతకు ముందు ఈ యుగం మొదట్లో…”

“అవునూ, అడగడం మర్చే పోయాను. ఇవాళ నీ కార్యక్రమం ఏవిటి? ” అన్నాడు బ్రహ్మ, వెంటనే విషయం మారుస్తూ.

“ఏముందీ? నాకేమైనా మీలాగా బ్రహ్మ విద్యలొచ్చా! ఒకరోజు నారదుడు, ఒకరోజు తుంబురుడు. సంగీతం పంతులమ్మకేవుంటుంది లేండి, కార్యక్రమం!”

“సరే! సాయంత్రం తొందరగా రావటానికి ప్రయత్నిస్తాను, ఓకే. బై!” ఇక లాభం లేదని వెంటనే ఫోన్ పెట్టేశాడు, ఎందుకైనా మంచిదని.

యుగలక్షణాల ప్రకారం, బ్రహ్మ వేసిన లెక్కల ప్రకారం దక్షిణభారతదేశాగ్రంలో శంబళ అనే కుగ్రామంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా రావాలి. అదెలాగంటే, శంబళ గ్రామంలో విష్ణుయశుడనే వాడికీ, వాడిభార్య సుమతికీ శిశువుగా ఆయన జన్మమెత్తాలి. ఆయనకి కవి, ప్రాజ్ఞుడు, సుమంతుడు అనే ముగ్గురన్నలుండాలి. అతగాడు, పరశురాముని దగ్గిర విద్యాభ్యాసం చెయ్యాలి. ఇది కర్మానుగుణ్యంగా జరగవలసిన వరస. ఈ తతంగంలో మార్పు తేవడం ఏ ‘బ్రహ్మ’ తరం కాదే! ఇదంతా కలియుగం నాలుగవపాదం ఆఖరి రోజుల్లో జరగవలసిన కథ. మరి ఇప్పుడే, అంటే ఇంకా నాలుగులక్షల ఇరవైఎనిమిదివేల ఏళ్ళముందే కల్కి అవతరించడం, కలిని ధ్వంసం చెయ్యడం ఎలా కుదురుతుందీ?

కంప్యూటర్‌ ముందు కూచొని బ్రహ్మ గూగుల్‌లో భూగోళం అంతా వెతికాడు. ఒకసారి కాదు; పది సార్లు వెతికాడు. స్పెలింగ్ మారుస్తూ, గూగుల్ ట్రాన్సిలేటర్‌లో వేరే వేరే భాషల్లో ప్రయత్నిస్తూ, రోజంతా వెతికాడు, శంబళ కుగ్రామం కోసం. ఊహూ! ఎక్కడా దొరకలేదు. ‘గూగుల్‌ లోకి ఇంకా ఎక్కని బుల్లి బుల్లి ఊళ్ళు అన్నేమీ మిగల్లేదు, భూప్రపంచంలో!’

నావిగేటర్ పెట్టించిన తర్వాత కూడా హంస తన రెక్కల కింద రాండ్ మెక్‌నాలీ రోడ్ మ్యాప్స్ దాచుకోటం బ్రహ్మకి గుర్తొచ్చింది. వెంటనే ఇంద్రసభలో ఉన్న బృహస్పతికి ఫోను చేసి తాటి ఆకుల మీద ఉన్న నాడీ జాతకాలు, జాగ్రఫీ పుస్తకాలు, నేషనల్ జియో మ్యాపులు రేపటికల్లా తన ఆఫీసుకి పంపించమని బృహస్పతిని ఆదేశించాడు. ఎందుకన్నా మంచిదని డాన్‌ బ్రౌన్‌కి, స్పీల్‌బర్గ్‌కి, కామెరూన్‌కి కూడా ఒక ఈమెయిల్ పడేశాడు. ఏమో! ఏపుట్టలో ఏ పామున్నదో ఎవరికెరుక?

ఊరికే కూర్చోలేక పోనీ టీవీ అన్నా చూద్దామని, టీవీ ఆన్‌ చేశాడు.

టెలివిజన్ లో ఏదో టాక్ షోలో ఎవరో పెద్దమనిషి పరమ ఉద్రేకంగా మాట్లాడేస్తున్నాడు. “భ్రూణ హత్యలు, మ్లేచ్ఛ సంపర్కం, నాస్తికత్వం, మత విద్వేషం… వీటన్నిటినీ ప్రోత్సహిస్తూన్నది మన ప్రస్తుత ప్రభుత్వమే! నా ప్రభుత్వం వస్తే…” ఆ మాటలింతకు ముందు విన్నవే. ఓ నాలుగు దేవ క్షణాలు క్రితం ఈయనా లాగానే సూట్లు బూట్లూ వేసుకున్న నలుగురు పెద్దమనుషులని మరో సూటూ బూటూ వేసుకున్న పెద్దమనిషి ఏవేవో ప్రశ్నలు అడుగుతుండేవాడు. వీళ్ళు నలుగురూ ఒకరితర్వాత ఒకరు సమాధానం చెపుతుండేవారు. చూస్తుంటే, ఈ నలుగురిలో ఎవడికీ ఏ ప్రశ్నా సరిగా బోధపడిన్నట్టు ఉండేది కాదు. లేకపోతే ఏవిటి? ప్రతి ప్రశ్నకీ అందరూ ఒకే సమాధానం చెప్తుండేవారు, అరిగిపోయిన యల్.పీ లా! అమెరికా ఆర్థిక మాంద్యం గురించి అడిగినా, ఆఫ్రికాలో కరువు గురించి అడిగినా ప్రతి ఒక్కడూ “భ్రూణ హత్యలు, మ్లేచ్చ సంపర్కం, నాస్తికత్వం, మత విద్వేషం… వీటన్నిటినీ ప్రోత్సహిస్తూన్నది మన ప్రస్తుత ప్రభుత్వమే! నా ప్రభుత్వం వస్తే…” అంటూ నలుగురూ పరమ ఉద్రేకంగా మాట్లాడేసేవారు. ఒకాయనైతే మరీనూ, ‘దేవుడెలా చెప్తే అలానే చేస్తా నా ప్రభుత్వమొస్తే’ అని అనేవాడు. ఒక పది నిమిషాల పాటు చూసి చికాకేసి టీవీ ఆఫ్ చేసి రిమోట్ గిరాటేశాడు.

సాయాంకాలం కావొచ్చింది. బ్రహ్మతో రమ్మీ ఆడుకోవటానికని విశ్వకర్మ వచ్చాడు, ఎప్పట్లానే. వర్క్ స్ట్రెస్ తగ్గించుకోడానికి బ్రహ్మ కదో అలవాటు. బ్రహ్మకి ఆటమీద ఏమాత్రం ధ్యానం కుదరటల్లేదు. జోకర్లు పారేస్తుంటే చూసి,

“ఏమిటి స్వామీ! ఇవాళ ఇంత పరధ్యాన్నంగా ఉన్నారు?” అని అడిగాడు విశ్వకర్మ.

“ఏదో తల్నొప్పి. సరే గానీ రేపో, ఎల్లుండో నీకో పెద్దపని తగలచ్చేమో!” అన్నాడు బ్రహ్మ.

“అదేమిటో ఇప్పుడే చెప్పండి. ముందుగా ప్రిపేర్‌ అవుతాను. లోకలా, అవుటాఫ్ స్టేషనా?”

“ఇంకా కొన్ని విషయాలు తెమలాలి. ఎల్లుండికి అన్నీ సిద్ధం కావచ్చు. అప్పుడు చెపుతా. ఇవాళ్టికి ఈ ఆట చాలు,” అన్నాడు బ్రహ్మ. విశ్వకర్మ కిమ్మనకుండా వెళ్ళిపోయాడు. కునికిపాట్లు పడుతున్న హంసని లేపి, బ్రహ్మ ఇంటికి బయల్దేరాడు. సరిగ్గా గుమ్మం ముందు హంస ఆగి తను దిగుతుండగానే గుమ్మం దగ్గిర నారదుడు కనిపించాడు.

“పాఠం బాగా జరిగిందా?”

“ఏదో మీ దయవల్ల,” అన్నాడు, నారదుడు తలవంచుకుంటూ.

“నాదయ ఏముంది? అంతా ఆ అమ్మ దయ,” అంటూ త్వరత్వరగా ఇంట్లోకి పోబోయాడు.

“స్వామీ! మీరు మీరుగా అగపడటల్లేదు. మీ ముఖంలో ఏదో ఆత్రుత కనిపిస్తూన్నది. ఏమిటి కారణం?” అన్నాడు నారదుడు.

“నాలుగు ముఖాల్లో, ఏ ముఖంలో నీకు ఆత్రుత కనిపిస్తూన్నది?” జోకేశాడు బ్రహ్మ.

నారదుడు నవ్వుతూ బ్రహ్మకి నమస్కరించి నిష్క్రమించాడు. అమ్మయ్య! అనుకుంటూ బ్రహ్మ ఇంటిలోపలికి వెళ్ళాడు. శంబళకుగ్రామం దక్షిణ భారత దేశం కొసలో ఎక్కడా కనిపించకపోవడంతో, బ్రహ్మ రాత్రి డిన్నర్‌ టేబుల్‌ దగ్గిర కూడా సరస్వతితో ముభావంగానే ఉన్నాడు. సరస్వతి వేసిన ప్రశ్నలన్నింటికీ ఆ, ఊ అంటూ మొక్కుబడిగానే సమాధానాలు చెప్పాడు. సరస్వతి అర్థం చేసుకున్నట్టుంది. రెట్టించి మరేమీ అడగలేదు.

మంగళవారం పొద్దున్నే సిరియల్ కూడా తినకండా ఒక్క కాఫీ మాత్రమే తాగి, తిన్నగా ఆఫీసు కొచ్చాడు బ్రహ్మ. ఇవాళా సరస్వతిని లేపలేదు. కాలుకాలిన పిల్లిలా కాస్సేపు అటూఇటూ తచ్చాడుతూ కంప్యూటర్‌ ఆన్‌ చేశాడు. ఇంటర్నెట్ పనిచేస్తున్నట్టు లేదు. పేజీలు లోడ్ కాలేదు. దేవలోకం ఇంట్రా మెయిల్ తెరిచాడు. పనిచేస్తోంది, కనీసం అదైనా. ఇన్‌బాక్సులో కొత్త మెసేజీలేమీ లేవు. బృహస్పతి దగ్గిరనుంచి జాగ్రఫీ పుస్తకాలు, నాడీజాతకాలూ వస్తాయేమో అనుకుంటే హెవెనెక్స్ వాడింకా డెలివరీకి రాలేదు. ‘మనకి కావలసినప్పుడు ఈ వెధవ హెవెనెక్స్ ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది,’ ఆంటూ చిరాకు పడ్డాడు. బృహస్పతికి ఫోన్ చేశాడు. ఆయన ఎత్తలేదు. ‘ఏముందీ, ఇంద్రసభకు పోయుంటాడు పొద్దున్నే. అక్కడికి వెళితే ఈ మహా ఋషులకి కూడా మిగితా ప్రపంచ విషయాలు పట్టవు,’ అని విసుక్కున్నాడు. ఇన్‌బాక్స్ మీద పదిసార్లన్నా క్లిక్ చేసుంటాడు కొత్త మెయిల్ కోసం. ఇంతలో టెలిఫోన్‌ మోగింది.

“హలో” అన్నాడు, బ్రహ్మ నీరసంగా, ఆ ఫోన్ ఎక్కణ్ణుంచో ముందే ఊహించి.

“ఆఁ, హలోనే! ఇవాళా నన్ను లేపకండానే వెళ్ళిపోయారు. ఏమిటంత హడావిడి?”

“చెప్పానుగా! భూదేవి రభస గురించి.”

“అవుననుకోండి. అంత ప్రళయం ఏం వచ్చిందని? రాత్రి మిగిలిపోయిన పీజ్జా లంచ్‌బాక్స్‌లో పెట్టి పెట్టాను కదా. తీసుకొని పోలేదేం? ఎదురుగా ఉన్నవే కనపడకపోతే ఎట్లా మీకు? అంత ముంచుకొచ్చిన పనేమిటో. ఎప్పుడూ లేనిదిదేం చోద్యం?”

“సరస్వతీ, ప్లీజ్! నేను వెతుకుతున్నది ఈ వారంలోగా దొరక్కపోతే నా ఉద్యోగానికే ముప్పు రావచ్చు. నా రాత నాకే బెడిసి కొట్టచ్చు.”

“గూగుల్‌ చెయ్యలేక పోయారా?”

నువ్వింకా చెప్పలేదనీ ఎదురుచూస్తున్నా, అసహనంగా అనబోయి నాలిక్కర్చుకున్నాడు బ్రహ్మ. అనుంటే ఆ తర్వాత జరగబోయేది ఆపడం బ్రహ్మ వల్ల కూడా కాదని తెలుసు.

“నిన్నంతా చేసిన పనే అది. గూగులే కాదు. అసలు వెతకని చోటు లేదు! నా ఆఫీసులో ఉన్న రాయల్‌ కంపెనీ అట్లాసులు, చేటల్లాంటి నేషనల్‌ జాగ్రఫీ సొసైటీ మ్యాపులన్నీ దుమ్ము దులిపి మరీ వెతికా. కళ్ళు కాయలు కట్టుకో పోయినాయనుకో. ఈ చెత్త ఊరు ఎంత వెతికినా దొరకలా. బృహస్పతికి కూడా చెప్పా…”

“సరే లేండి. వీలైతే తొందరగా ఇంటికి రండి. ఇన్నేళ్ళైనా ఒక అచ్చటా ముచ్చటా లేదు. ఇలా ఎన్నేళ్ళుంటాం…”

“సరే సరే. అలాగే. బై ఫర్ నౌ.”

అమరావతి నుంచి ఒక పెద్ద ప్యాకెట్ రానే వచ్చింది. దాంట్లో ఉన్న తాటి ఆకు పుస్తకాలన్నీ తిరగేశాడు. కొన్ని తాటాకులయితే మరీ పాతబడిపోయి నట్టున్నాయి; ముట్టుకుంటే చాలు, విరిగిపోతున్నాయి. జాగ్రఫీ తాటాకులన్నీ, ఒకదాని తరువాత ఒకటి అతి జాగ్రత్తగా పరిశీలించాడు. కొన్ని మ్యాపులయితే చెరిగే పోయినాయి. బృహస్పతి మీద విపరీతమయిన కోపం కూడా వచ్చింది. పాత తాటాకులు కాస్త జాగ్రత్తగా దాచద్దూ? ఎప్పుడేమన్నా, ఇంద్రుణ్ణుంచి ఫండ్స్ రాటల్లేదంటాడు. ఎక్కడా శంబళకు గ్రామం పత్తా లేదు. ఉన్న నాడీ జాతకాలన్నీ ముందునుంచి వెనక్కి, వెనకనుంచి ముందుకీ చదివాడు. ఎక్కడన్నా విష్ణుయశుడు సుమతీ అనే భార్యాభర్త ల జంట దొరుకుతుందేమోననే ఆశతో! అదీ లేదు. అసలు శంబళగ్రామం దొరికితేనేగా, వీళ్ళు దొరికేది! ఆ తాటాకులన్నీ ఓ మూల పారేసాడు, విసుక్కుంటూ!

ముందైతే శివుణ్ణి పిలుద్దామని అనుకోలేదు. ఎందుకంటే, ఈ కలి పురుషుడు బ్రహ్మ రాక్షసి. కామరూపి. రకరకాల వేషాలలో వచ్చి మోసం చెయ్యగలడు. ఈ మహేశ్వరుడు, ఒక భోళా మనిషి. ఎవడన్నా ఒక బిళ్వపత్రం పారేస్తేనో, మురిసి పోయి, వాడు అడక్కండానే వరాలు ఇచ్చి పారేయగలడు. అందాకా ఎందుకూ? తనకు ఎంగిలి తాంబూలం పెట్టినవాడిని కొడుకు కంటే ప్రేమగా చూసుకోగలడు, వెర్రి బాగులవాడు. అదొక చావు, ఈ మహానుభావుడితో!

అయినా కైలాసంలో శివుణ్ణి పిలిచాడు, గత్యంతరంలేక. ఆయన తిరుగుళ్ళలో దక్షిణభారతాగ్రంలో ఎక్కడన్నా శంబళ అనే కుగ్రామం తగిలిందా అని అడగటానికి. శివుడు తాండవపు మైకంలో ఉన్నట్టున్నాడు, డమరుక నాదం జోరుగా వినిపిస్తోంది, టెలిఫోనులో. శివుడు వెంటనే సమాధానం చెప్పలేదు. పదినిముషాలు లైన్‌ మీద ఉన్నాడు బ్రహ్మ, డమరుకం వింటూ! తాండవానంతరం కుమారస్వామితో కూడా మాట్లాడి, సమాధానం చెప్పాడు, శివుడు. ‘నీ సృష్టి ఏమో గాని, శంబళ అనే కుగ్రామం ప్రస్తుతం ఎక్కడా లేదు,’ అని.

ఏమీ తోచక, విశ్వకర్మ కార్ఖానాకి పిలిచాడు. అతగాడు దొరకలా. ‘అమరావతిలో పాత రధాలు రిపేర్ చేయటానికి పొద్దున్నే పోయాడ’ని రిసెప్షనిస్ట్ చెప్పింది. మళ్ళీ టీ.వీ. ఆన్‌ చేశాడు. ఈ సారి మరో ఛానల్‌. అందులోనూ ఇందాకటి ఇంటర్వ్యూయే వస్తూన్నట్టుంది. చానల్ మార్చాడు. ఎవరో వయసు మళ్ళినాయన, పత్రికలు అచ్చేసుకుంటాట్ట, అన్ని ప్రభుత్వాల ఫోన్లూ దొంగతనంగా ట్యాప్ చేశాడని ఆయనని ప్రభుత్వ నాయకులే మర్యాదగా ప్రశ్నలడుగుతున్నారు. ఆయనేమో వినయంగా నేను నిమిత్తమాత్రుణ్ణి. నాకంతగా ఏమీ గుర్తుండవు. బ్రహ్మని అడగండి ఆయన ఎలా రాసుంటే అలానే కదా జరిగేది. అని ఏ ప్రశ్న కైనా ఒకటే జవాబు చెప్తున్నాడు. ఒళ్ళు మండిపోయింది. ఈ సారి టీ.వీ. రిమోట్‌ దూరంగా విసిరి పారేశాడు. మూలకేసిన తాటాకులనే చూస్తూ కూర్చున్నాడు కాసేపు.

మనసులో నిన్న మొలకెత్తిన అనుమానం మళ్ళీ పీడించసాగింది. ఇక ఇలా కాదని, టైం చూశాడు. ‘అబ్బో! అప్పుడే మూడయిందే! కాసేపు శ్రీమతితో మాట్లాడితే మనసు కుదటపడవచ్చు,’ అని, ఇంటికి పిలిచాడు బ్రహ్మ.

“సతీ, నువ్వేమిటి చేస్తున్నావు?”

“టీ.వీ. చూస్తున్నా.” అన్నది సరస్వతి.

“అవునా? తుంబురుడు..”

“తుంబురుడికి జలుబు చేసింది. గొంతు పూడిపోయింది. అందుకని, అతనికి స్వరం కుదరటల్లేదు. ఇంటికి పంపించేసా.”

“అవునా, ఏ ప్రోగ్రాం చూస్తున్నావ్?”

“ఏదో రియాలిటీ షో. హూ ఈజ్ ది బెస్ట్ స్కామర్ అని. దొంగడబ్బు ఖర్చు పెట్టి గెలిచి నాయకులు కాగానే, ఖర్చుపెట్టిన డబ్బుకు పదింతలు ఎవరు ముందర దోచుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి, వాళ్ళ బంధుమిత్ర పరివారానికి ఇంకో ఐదేళ్ళు ఇంకా దోచుకోటానికి చోటిస్తారు. ఓడిపోయిన వాళ్ళేమో సైడ్‌లైన్స్లో అరుస్తుంటారు, సోపాన పటంలో లాగా, కోర్టులు, చట్టాలు ఇలా పాములూ, వ్యాపారాలు, బ్యాంకులు ఇలా నిచ్చెనలు కూడా. ఉత్తుత్తి పాములే అనుకోండి. సరదాగా ఉంది ఈ పోటీ.”

బ్రహ్మకి మతిపోయినంత పనైయింది.

“భలే సరదా ఏమిటంటే, నాయకులెవరూ కూడా వాళ్ళు దోచుకుంటున్నట్టు ఇంకెవరికీ తెలియకుండా ఉండాలట. కానీ అందరికీ తెలుసు. అయినా ఎవరికేమీ తెలీనట్టే నటిస్తున్నారు. చెప్పడం మర్చిపోయాను, వాళ్ళప్పుడప్పుడూ మీ పేరే అంటున్నారు కూడా. ప్రస్తుతం గెలుస్తున్నది జగజ్జెంత్రీలనే జట్టు. ఒక కుర్రాడు, ముసలాడు….”

సరస్వతి వాక్యం పూర్తి చెయ్యకండానే బ్రహ్మ మధ్యలో అడ్డుపడి, “ఇంతకీ తుంబురుడికి ఏ పాట నేర్పుతున్నావు?” అని అడిగాడు, విషయం మార్చి, సంభాషణ పొడిగించడానికా అన్నట్టు.

“బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము, చెలగి వసుధ కొలిచిన నీ పాదము…” అంటూ ముఖారిలో ఆలాపించింది సరస్వతి. బ్రహ్మకు నవ్వాలో ఏడవాలో తెలీలేదు.

“నారదుడికీ, తుంబురుడికీ, ఇద్దరికీ ఈ పాటే నేర్పుతున్నా. మీకు నచ్చిందా?”

“… అది సరేగాని, నువ్వు ఏదో చెప్పబోతుంటే నేను అడ్డుపడ్డాను. ఇంతకీ నువ్వు ఏదో అడుగుదామనుకున్నావు కదూ?”

“ఆ! అదే! తుంబురుడికి గొంతు పూడి పోయింది అన్నాను కదూ? అతనికి , టీ లో తేనె కలిపి ఇద్దామనుకున్నా. తీరా చూస్తే, ఇంట్లో తేనె అయిపోయింది. మీరు ఇంటికి తిరిగొచ్చేటప్పుడు పబ్లిక్స్‌ లోనో, క్రోగర్‌ లోనో ఆగి కాస్త తేనె సీసా ఒకటి పట్టుకోనిరండి. సరేనా? ఇంతకీ దొరికిందా మీ గ్రామం?”

“అలాగే! బృహస్పతి పంపించిన తాటాకులన్నీ వెతికా. నాకయితే ఇంతవరకూ ఆ దిక్కుమాలిన కుగ్రామం దొరకలేదు. అది దొరికేవరకూ…” నసిగాడు బ్రహ్మ.

“ఔట్ సోర్స్‌ చెయ్యరాదూ? బెంగుళూరులో అదేదో కంపెనీ వాళ్ళు ఎవరి ఆరా అయినా సరే, ఏది కావాలన్నా సరే, ఇట్టే కనుక్కోగలరట. ఈ మధ్య మాటల సందర్భంలో రంభ చెప్పింది. ఆ ప్రయత్నం కూడా చెయ్యండి, ఇందులో పోయిందేముంది?” అన్నది సరస్వతి.

‘సరే! ఆఖరి ప్రయత్నం. అదీ చేసి చూద్దాం,’ అని, ఆ పనికుపక్రమించాడు, బ్రహ్మ. బెంగుళూరు కంపెనీ తేలిగ్గానే దొరికింది. వాళ్ళకి వివరాలన్నీ ఇచ్చి, కాంట్రాక్ట్ ఒప్పుకునేసరికి సాయంత్రం అయిదయ్యింది.

హంస వాహనం ఎక్కి ఇంటికి బయల్దేరాడు. సడెన్‌గా గుర్తుకొచ్చింది, తేనె సీసా కొనుక్కెళ్ళాలని. ఇవాళ ట్రాఫిక్‌ పరమ ఘోరంగా ఉన్నది. షాపింగ్‌ సెంటర్‌ దగ్గిరకి రావటానికి తనకే అరగంట పట్టింది. పబ్లిక్స్‌ గ్రోసరీ పక్కన టెలివిజన్‌ కొట్లో ఏదో కోలహలంగా ఉన్నది. ఆ కొట్లో అన్ని టెలివిజన్ల చుట్టూ జనం మూగి శ్రద్ధగా చూస్తున్నారు.

ఏవిటి చెప్మా అని తనుకూడా టెలివిజన్‌ కొట్లోకి వెళ్ళాడు. ఒక టెలివిజన్‌లో సూటేసుకున్నాయన, ఇంకోదాంట్లో పేపర్ల ముసలాయన, ఆ పక్కనే ఎవరో కుర్రాడు, వాళ్ళ బాబాయి, ఇంకోదాంట్లో చాలా మంది ముసలీ ముతకా, ఇంకో రెండింట్లో గడ్డాలూ, తలపాగాల మనుషులు. ఇంకోదాంట్లో అన్ని దొంగ వార్తలు. ఒకాటో రెండొ స్క్రీన్ల మీద ఎవరో, అంగారక గ్రహంలో కూడా మన భాషా సంస్కృతులని వృద్ధి చేసేది, చేస్తున్నది నేనే. నన్ను గుర్తించాల్సిన అవసరం అందరికి ఉన్నది అని నొక్కి వక్కాణిస్తున్నాడు, పక్కన వాళ్ళని డొక్కల్లో పొడుస్తూ. అన్నీ భూలోకం షోలు. అందరూ ఒకటే అంటున్నారు. ఆదివారం పొద్దున్న భూదేవి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.

“మ్లేచ్చులు విర్రవీగి పోతున్నారు. లైంగిక సంబంధాలకి లింగభేదం లేదు. లంచగొండి తనం ప్రబలిపోయింది. రాజకీయ వాతావరణం కలుషితం అయ్యింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో భ్రూణహత్యలు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అవినీతి పరిపాలిస్తోంది. మన భూమండలాన్ని శని పూర్తిగా ఆవహించింది. మ్లేచ్ఛులు శిష్టుల్ని బెదిరించి భయ పెడుతున్నారు. ఈ పరిస్థితి ఏవిధంగానైనా సరే వెంటనే మార్చాలి. ఈ మార్పు తేగలిగింది ‘నేనే’. మరెవ్వరికీ సాధ్యంకాదు… బ్రహ్మ వల్ల కూడా కాదు…” ఇదీ వరస!

కలి కామరూపుడని, వాడు రకరకాల వేషాలు వేసుకొని జనాన్ని మోసం చెయ్యగలడని, మభ్యపెట్టగల సమర్ధుడనీ, ఠక్కున గుర్తుకొచ్చింది, బ్రహ్మకి. వీళ్ళు గాని…

ఈ మాటలు వింటూ ఉంటే ‘ఆదివారం పొద్దున్న భూదేవి వేషంలో వచ్చింది కలిపురుషుడు కాదుకదా ?’ అన్న అనుమానం కూడా వచ్చింది. ఛ! ఛ! అనుమానం పెనుభూతం అంటారు.

వెంటనే ఇంటికొచ్చేశాడు.

గడపలో నారదుడు, తుంబురుడూ పకపక నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆశ్చర్యం! వీళ్ళిద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది! వీళ్ళిద్దరూ ఇంత కులాసాగా కబుర్లు చెప్పుకోవటం, తను ఒకే ఒక్కసారి చూశాడు ఎప్పుడో కృతయుగంలో ఇంద్రసభలో! బ్రహ్మని గుమ్మంలో చూసి ఇద్దరూ ‘గూడీవినిన్’ అని విష్‌ చేసి, ఒకడి వెంట ఒకడు వెళ్ళిపోయారు.

సరస్వతి కూడా సరదా గానే మాట్లాడింది. డిన్నర్ చేసి తొందరగా బెడ్డెక్కి పడుకున్నాడు బ్రహ్మ. మనసులో పెరుగుతున్న అనుమానాన్ని పెరగనీయకుండా.

బుధవారం ఇదే తంతు. ఎర్లీగా లేచి, కాఫీ గబ గబా తాగేసి ఆఫీస్ కొచ్చేశాడు బ్రహ్మ. ఎవరినుంచీ మెయిళ్ళు లేవు. కొత్తగా సమాచారమేమీ లేదు.

సాలోచనగా మానిటర్ మీద తిరుగుతున్న గూగుల్ ఎర్త్ చూస్తూ కూర్చున్నాడు. మనసంతా గజిబిజిగా ఉంది.

…ఎదురుగా ఉన్నవే కనపడకపోతే ఎట్లా మీకు? …నీ సృష్టి ఏమో గాని, శంబళ అనే కుగ్రామం ప్రస్తుతం ఎక్కడా లేదు. … మీ సృష్టిలో అర్థంతరంగా ఏమిటీ అనర్ధం. నాకెందుకీ ప్రారబ్ధం? ఇదంతా మీ సృష్టి ఫలం. … భ్రూణ హత్యలు, మ్లేచ్ఛ సంపర్కం, నాస్తికత్వం, మత విద్వేషం… వీటన్నిటినీ ప్రోత్సహిస్తూన్నది మన ప్రస్తుత ప్రభుత్వమే! … ఈ మార్పు తేగలిగింది ‘నేనే’. మరెవ్వరికీ సాధ్యంకాదు. బ్రహ్మ వల్ల కూడా కాదు. …ఇన్నేళ్ళైనా ఒక అచ్చటా ముచ్చటా లేదు. ఇలా ఎన్నేళ్ళుంటాం… ఎన్నేళ్ళుంటాం… ఎన్నేళ్ళుంటాం…”

తనదే తప్పు. తన సృష్టే తప్పు. శంబళ గ్రామం దక్షిణ భారత దేశాగ్రం లోనే ఉండాలని నిర్దేశించడం తప్పు కాదూ? ఇంతకుముందు తొమ్మిది అవతారాలూ ఉత్తర భారతంలోనేగా అవతరించింది! ఈ పదో అవతారం జంబూద్వీపంలో ఒకానొక కుగ్రామంలో అని అస్పష్టంగా రాజకీయనాయకుడి పంథాలో రాసిఉంటే బాగుండేది. అయినా ఇప్పుడు అనుకోని ఏం ప్రయోజనం? చేతులు కాలింతర్వాత తాటాకులు పట్టుకున్నట్టు! బ్రహ్మ రాత మార్చడం బ్రహ్మకే సాధ్యం కాదు. తనమీద తనకే కోపం వచ్చింది.

మనసులో తొక్కిపెడుతున్న అనుమానం తన్నుకుంటూ పైకి రావడం మొదలైంది.

గబ గబా కలియుగానికి రాసిన ప్రోగ్రాం లోడ్ చేసీ ఆటోమేటెడ్ టెస్టింగ్ మొదలు పెట్టాడు, సిమ్యులేటెడ్ మోడ్‌లో కలియుగం చివరిదాకా రన్ చేస్తూ. తన అనుమానం నిజమే. అనుకోకుండా అనర్థాలు వచ్చినప్పుడు, వాటికి రెమెడీగా ఎప్పుడూ రాసే కాంటిన్జెన్సీ సబ్ రొటీన్స్ రాయలేదు. సరస్వతితో పెద్ద తగాదా అయింది అప్పుడేగా, ఈ ప్రోగ్రాం రాస్తున్నప్పుడేగా. మీకు మీ సృష్టే ముఖ్యమైతే నన్నెందుకు పెళ్ళి చేస్కున్నారో చెప్పండి, ఒక అచ్చట ముచ్చట లేకుండా ఎందుకీ కాపురం చేయడం అని ప్రతి రోజూ తగాదాలే. పని ఒత్తిడికీ సతికీ మధ్యలో నలిగిపోయిన ఆ రోజులు. సంపాదనంతా అరుంధతి విజిటేషన్లకే సమర్పించుకున్న రోజులు.

బ్రహ్మ కణతలు రుద్దుకున్నాడు. పూర్తిగా అర్థమైపోయింది జరిగినదీ, జరగబోయేది కూడా. టైం చూశాడు, నాలుగయింది. ఏదో నిశ్చయానికొచ్చిన వాడిలా చటుక్కున రన్ అబార్ట్ చేసి కంప్యుటర్ కట్టేశాడు. వెంటనే బైటికొచ్చి ఇంటికొచ్చేశాడు.

హటాత్తుగా మొగుడు పెందరాళే ఇంటికొచ్చేటప్పటికి సరస్వతి మొఖం వెలిగిపోయింది.

“ఏమిటిలా.. ఈ రోజేదో…” అనబోయింది నవ్వుతూ.

సరస్వతిని ఒక్క మాట కూడా మాట్లాడనీయలేదు బ్రహ్మ. సరస్వతి నడుంచుట్టూ చెయ్యి వేసి, ఒక్క ఉదుటున హంసవాహనం ఎక్కించాడు. ఇద్దరూ, సరాసరి సినీప్లెక్స్‌కి వచ్చారు. ఆలుమగలిద్దరూ హాయిగా పాప్‌ కార్న్‌ తింటూ, కోక్‌ తాగుతూ, 3-డి లో ‘హ్యూగో’ సినిమా చూశారు. సినిమా చూస్తున్నంతసేపూ, బ్రహ్మదేవుడు సినిమాలో లీనమై పోయాడు. సినిమా మధ్యలో సరస్వతి అడిగింది,

“ఇంతకీ మీకు ఆ ఊరేదో దొరికిందా?” బ్రహ్మ భుజమ్మీద తలానిస్తూ.

తదేకంగా సినిమాలో నిమగ్నమయిన బ్రహ్మ ఒక్కసారి వులిక్కి పడి, “ఏ వూరు…?” అని అడిగాడు.

“అదే! శంబళకుగ్రామం…” అని, మెల్లగా గొణిగింది సరస్వతి.

బ్రహ్మ అనుమానంగా నాలుగు తలలూ ఒక్కసారి సరస్వతి వైపు తిప్పాడు. సరస్వతి కూర్చున్న సీటులో నల్లటి నీడ మిగిలింది.

“లేదు. బట్ ఐ క్విట్ ది జాబ్. యెస్. ఐ క్విట్‌! ఐ క్విట్‌! అండ్, ఐ క్విట్‌!!” అని ముచ్చటగా మూడుసార్లు అన్నాడు బ్రహ్మ.

(If any of the astute readers get a wind that they have read about a similar idea, then they must have read Simon Rich’s article in January 9, 2012 The New Yorker, just like me! – author.)
--------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, June 11, 2019

తలుపుల రసీదు


తలుపుల రసీదు




సాహితీమిత్రులారా!


ఈ కథను ఆస్వాదించండి.......................

బొబ్బిలిలో యూనివర్సిటీ పెట్టే విషయంలో పెద్దగొడవ జరిగింది. గొడవ బొబ్బిలి వాళ్ళకి విజయనగరం వాళ్ళకి మధ్య కాదు. బొబ్బిల్లో ఉన్న బొబ్బిలి వాళ్ళ మధ్యే. యూనివర్సిటీ పేరు పెట్టడంలో పేచి వచ్చింది. కొందరు వీరబొబ్బిలి యూనివర్సిటి అనాలని, కొందరు “కాదహే…. రెండొందల ఏబైమంది ఇక్కడ మిగలకుండా చచ్చిపోతే ఈరత్వం ఏడంటుంది? ఉప్పుడు మనం అంతా కేవిస్ కాబట్టి వి బిల్ కాదు కెవిబిల్ ఊనివర్సిటి అని పేరు పెట్టాలి” అని. ఇదీ గొడవ. కేవి అని పెడితే కులం తీసుకొచ్చినట్లవుతుందని కొందరు వాదించారు. యూనివర్సిటీ అత్యున్నత అధికారులను కులపతి, ఉపకులపతి అని అంటారు కదా అని వెంఠనే మరొకరన్నారు. కులపతి అంటే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అని బోధపరిచి ఎలాగో ఒకలాగా అందరిని ఒక కొలిక్కి తీసుకొచ్చాను.

బోష్టన్ యూనివర్సిటిని బియు అంటారు. బ్రౌన్ యూనివర్సిటి ఉంది. బర్మింగ్ హమ్ యూనివర్సిటీ ఉంది. ఇలా చాలా బితో మొదలయ్యే యూనివర్సిటీలు ఉన్నాయి. మనం కూడా బొబ్బిలి యూనివర్సిటి అని పేరు పెడితే బియు ఆఫ్ ఇండియా అంటారు. వాళ్ళంతా మనతో కలిసి బొబ్బిలి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తారు అని రాత్రి పగలు కష్టపడి అందరిని బొబ్బిలి యూనివర్సిటీ అన్న పేరుకు ఒప్పించాను.

అందరిని ఒప్పించేను కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేసి యూనివర్సిటిని నిలిపి నాలుగు డిగ్రీలు ఇచ్చి పదిమందికీ పనికి వచ్చేలా ఓ రూపకల్పన చెయ్యమన్నారు. దేశంలో వేల వందల యూనివర్సిటీలు కావాలని అందరూ అంటున్నారు. కాని వాటిని నడపడానికి, పాఠాలు చెప్పడానికి, మంచి రిసెర్చి చెయ్యడానికి కావల్సినంత మంది మనుషులు లేరు. ఇంజినీరింగ్ కాలేజీలకే దిక్కు లేకుండాపోతున్నాది మరి యూనివర్సిటీ అంటే మాటలా. మీరు ఇక్కడ ఉండి ముఖ్యమైన వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకొని అప్పుడు కాని మీరు వెళ్ళండి అన్నారు.

బొబ్బిలి యూనివర్సిటి నడపడానికి అర్హులైన వాళ్ళు అన్ని రకాల ఉద్యోగాలకి కావలెను అని ప్రపంచవ్యాప్తంగా నెట్ ప్రకటన ఒకటి ఇచ్చాం. వచ్చినవాళ్ళకి ఇవాళ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఇప్పటికే ఓ ఇరవై మందిని ఎడ్మినిస్ట్రేషన్ లో ఒక ముఖ్యమైన ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేసాం. దేశదేశాల నుండి వచ్చిన తెలుగు వాళ్ళున్నారు. ఇంకా మరో పది మందిని ఇంటర్వ్యూచెయ్యాలి. ఒక్క పదినిముషాల విరామం తరువాత మొదలుపెడ్తాం అని అనుకొన్నాం.

నేను ఎలక్ట్రానిక్ పేపరు రెండు చేతుల మధ్య పట్టుకొని చదువుతున్నాను. ఈ ‘ఈ-పేపరు’ పూర్వం అచ్చం పేపరు చదివినట్లే విప్పి రెండు చేతులతో పట్టుకొని చదువుకోవచ్చు. పూర్వం లేప్‌టాప్ లాంటి స్క్రీన్ లో చక్కగా అన్ని రంగులు అచ్చం కాగితం మీద కనిపించినట్లు కనిపిస్తాయి. సేటిలైట్ ద్వారా వచ్చే సంకేతాలతో మొత్తం పేపరంతా చదవచ్చు. ఈ పరికరంలో ఏ పేపర్ కావాలంటే ఆ పేపరు, ఇంగ్లీషు, తెలుగు ఏభాష కావాలంటే ఆ భాషలో చదవచ్చు. తెలుగు పేపరుని ఇంగ్లీషులో, లేమాంద్ అన్న ఫ్రెంచి పేపరుని తెలుగులో చదవచ్చు. అంతా గూగుల్ టెక్నాలజీ మహిమ.

సరిగ్గా అలాంటపుడు ‘మే ఐ కమిన్… నేను రావచ్చా?’ అని రెండు భాషలలో అంటూ పొడవైన ఒక అభ్యర్థి లోపలికి వచ్చాడు. అంటే విరామ సమయం అయిపోయిందన్నమాట అని అనుకొన్నాను, ఈపేపర్ ని చుట్టి జేబులో పెన్నులా పెట్టుకొంటూ!

అతన్ని ఎక్కడో చూసాను సుమా అని అనుకొన్నాను. అచ్చం మా కనకప్రసాద్ లాంటి మొహం. కళ్ళద్దాలు కూడా అలాగే అనిపించాయి. వయస్సు 55 దాటి ఉంటుంది. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎవరూ కళ్ళద్దాలు పెట్టుకోవడం లేదు. కళ్ళకి కావలసిన సర్జరీలు చేయించేసుకొంటున్నారు. ఇదుగో ఇలా ఏభైలు దాటిన వాళ్ళే అలవాటు కొద్ది కళ్ళజోళ్ళు పెట్టుకొంటున్నారు.

“మీపేరు” అని అడిగాను.

“తలుపుల రసీదు” అన్నాడు తెలుగు కొత్తగా నేర్చుకున్నవాడిలా.

“తలుపుల ఇంటిపేరు అయ్యుండాలి, రైట్!” అన్నాను నవ్వుతూ.

“అవునండి. మాదికూడా బొబ్బిలే” అదో క్వాలిఫికేషన్ లా అన్నాడు.

“కాని ఈ రసీదు అన్న పేరే ఆశ్చర్యంగా…”

“నా అసలు పేరు రషీద్ అండీ. చాలామంది సరిగ్గా పిలవలేక చివరికి రసీద్, రసీదు అయిపోయిందండి” అన్నాడు కొద్దిగా సిగ్గుపడుతూ.

“సరే. మీరేం చదువుకొన్నారు…” అని బటన్ నొక్కి నా అరచేతిలో ఉన్న గూగుల్ ఆర్గనైజర్లో అతని పేరుతో ఉన్న బయోడేటాని వెతుక్కోవలసి వచ్చింది. ఎక్కడా డిగ్రీ కనిపించలేదు. మిస్సయ్యేనేమోనని మరొకసారి చూసాను. లేదు. మీకు ఏ డిగ్రీ లేదా? అన్నాను ఆశ్చర్యంగా.

“లేదండి…” అన్నాడు వినయంగా

“మరి ఇంటర్వ్యూలోకి ఎవరు రానిచ్చేరు” అని గట్టిగా అరిచాడు ఇంటర్వ్యూ చేసే మరో కమిటి సభ్యుడు.

“నన్ను పిలవలేదండి. కానీ ఉద్యోగం తప్పక ఇస్తారన్న ఆశతో నా అంతట నేనే లోపలికి తలుపు తోసుకొచ్చానండి” అని ఓ క్షణం ఆగి “క్షమించండి” అన్నాడు.

“క్షమించేం. వెళ్ళండి. పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లతో ఎంతోమంది బయట వెయిట్ చేస్తున్నారు” అన్నాను చిరాగ్గా.

“నా బేక్ గ్రౌండ్…”

“రిజర్వేషన్లంటే లాభం లేదండి. రిజర్వేషన్లు పోయి చాలా ఏళ్ళు అయ్యింది. మీరు ముస్లిం అయినా మరేదయినా నో యూజ్” అన్నాను వెళ్ళమని చెయ్యి చూపిస్తూ.

“నా ఎక్స్పీరియన్స్…”

“ఏంటి మీ ఎక్స్పీరియన్స్…” ఒక కమిటీ సభ్యుడు మర్యాదగా అడిగాడు.

“అమెరికాలో…”

“అమెరికాలో ఎక్స్పీరియన్స్ ఎవడికి కావాలండి…” అన్నాడు ఇంకో కమిటీ మెంబరు.

“అమెరికాలో నేను ఒక పెద్ద సంస్థ నడిపానండి.” అన్నాడు ఒక పెద్ద ఫైల్ తీసి టేబుల్ మీద పెడుతూ.

“ఆ సంస్థ ఏం చేసేది.”

“కంప్యూటర్ల ఆపరేషన్ సిస్టమ్స్, ప్రోగ్రామ్ లు…”

“సరే మరి అవన్ని మీరు మాకు పంపారా?”

“పంపానండి”

“మరి మా గూగుల్ ఫోన్ ఆర్గనైజర్ డేటాబేస్ లో లేవే!” అన్నాం అందరం గబగబ మరోసారి వెతికి.

“బహుశా ఫార్మాట్ ప్రాబ్లమ్ అయింటుందండి… నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010లో పంపానండి.”

“అలా చెప్పండి గూగుల్ డాక్స్ లోనే గత పదేళ్ళుగా ప్రపంచం ఉంటే మీరు ఇంకా ఎప్పుడో పాత మైక్రోసాఫ్ట్ పట్టుకు వేలాడితే ఎలా?” అతను చెప్తున్న ప్రతి మాటని నేను గూగుల్ ‘బ్రెయిన్’ లోకి పంపుతున్నాను. కంప్యూటర్లు పోయి లేప్‌టాప్‌లు, లేప్‌టాప్‌లు పోయి గూగుల్ బ్రెయిన్‌లు వచ్చేసాయి. నానో టెక్నాలజీ, బయోమెటీరియల్ సైన్సులు బాగా డెవలప్ అయి టెరాబైట్ కంప్యూటర్లు చిన్న క్రెడిట్ కార్డు సైజుకి దిగిపోయాయి. దాన్ని కూడా అతి పల్చగా తయారు చేస్తున్నారు. దాన్ని విడిగా పట్టుకొని తిరగడం కష్టం కాబట్టి కావాలనుకొన్న కొంతమంది తలపై భాగంలో ఓ చిన్న సర్జరీతో అమరుస్తారు. దానిని మనుషులు ఆలోచనతో నడుపుతారు. ఆలోచనల తీరు, జోరు, ఆ గూగుల్ బ్రెయిన్ కనిపెట్టి అడిగిన వివరాలను అందిస్తుంది. దానికి కావలసిన విషయాల కొన్ని దానిలో పొందు పరిచినా అపారమైన విజ్ఞానాన్ని, విశేషాలని, వివరాలని సేటిలైట్ ద్వారా నానో సెకన్ల లో తీసుకొంటుంది. మౌఖికం పోయి తాళపత్రాలు, తాళపత్రాలు పోయి అచ్చుపుస్తకాలు, అచ్చుపుస్తకాలు పోయి కంప్యూటర్లు, కంప్యూటర్లు పోయి గూగుల్ బ్రెయిన్ వచ్చేసింది.

సాధారణంగా మాలాంటి వాళ్ళంతా గూగుల్ బ్రెయిన్ తో పని చేస్తున్నాం చాలా మట్టుకి. అప్పుడప్పుడు మాత్రమే స్వంత బ్రెయిన్ వాడేది. అది కూడా ఏదో అమ్మాయితో, ప్రేమగా కబుర్లు చెప్పడానికి మాత్రమే. అనుభూతులు ఇంకా గూగుల్ బ్రెయిన్ పరిధిలోకి రాలేదు. అనుభవాలని మాత్రం దాస్తున్నది.

మిగిలిన కమిటీ సభ్యులు అతనిని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అతను తాపీగా సమాధానాలు చెప్తున్నారు. నేను కళ్ళు మూసుకొని అతని సమాధానాలని నా గూగుల్ బ్రెయిన్ లోకి పంపుతున్నాను. గూగుల్ బ్రెయిన్‌ని ఈ సమాధానాలని అన్నింటి శోధించి అతని గురించిన అసలు వివరాలని ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అది ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యంతో లేచి నిలుచున్నాను. నోటమాట రాలేదు. ఏమైయిందో తెలియక నాతో పాటే అందరూ నిలుచున్నారు. నేను కొద్దిసేపటికి తేరుకొని…

“మీరు బిల్ గేట్సా?” అన్నాను ఒక్కొక్క అక్షరం వత్తి పలుకుతూ.

“అవును. చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయాను మా కుటుంబంతో. అసలు పేరు మీద మమకారంతో తలుపుల రసీదు పేరుని బిల్ గేట్స్ గా మార్చుకొన్నాను”, అన్నాడు చిర్నవ్వుతో!

(అక్షరాలతో ఆటలాడుకోవడం అలవాటున్న అప్పారావుకి అభిమానంతో)
--------------------------------------------------------
రచన: కలశపూడి శ్రీనివాసరావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, June 9, 2019

ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు


ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు



సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి.............

ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు
కాయకష్టం కానీ అన్నాడు కలిగినంతలో తిన్నాడు
ఎండా ముసురు గాలీ వాన చలికాలం
ఎవడి కష్టం వాడిది ఎవడు చూడొచ్చేడు

పది గడపల వాసమ్మా గడప నాలుగిళ్ళు
ఇందమ్మంటే అందమ్మంటే ఇంటిల్లిపాదీ ఓ జట్టు
ఎవడి మాను వాడు నాన్నా ఎవడు ఎవడిక్కావాలి
ఫెళఫెళ్ళాడి ఎండా గాలీ వలవల్లాడి వాన

ఏదీకాన్దాన్ని చూసి నవ్వేరు ఎవడిమీదనమ్మా దీని రోకు
పసిపిల్ల బాలాదీ పడివాట్లు పచ్చి దోసపాదు దీన్నట్టిల్లు
ఊరూపేరూలేన్దానికేనుటేనే అమ్మా ఎవడూకానివాడి ఆను
ఊరికే ఏం వెర్రోనమ్మా వాడి గాలీ వానా దాని ఎండ

ఎవడి చింతకి దాని గాలి ఎవడి ఎండకే దాని గొడుగు
ఏ ఏడుపే అదేడిచింది విన్నావా ఏ నవ్వుకే దాని నవుతాలు
ఏదీకాన్దాని కన్నీళ్ళు ఎవడో ఒహడమ్మా వాడి వేణ్ణీళ్ళు
చలికాలం పెందరాళే మబ్బూ వణ్ణం చారూ గాలీ నొవ్వా ముసురు

ఎవరో ఒకళ్ళని చేసీసుకుని ఎక్కడో ఓక్కడ వాళ్ళవాళ్ళు
అక్కడివాళ్ళకిందే లెఖ్ఖటమ్మా ఇక్కడిదిక్కడే ఏదీ ఎవడూ
ఇరుగూ పొరుగూ ఇటుతెన్న అటుతెన్న గొడుగూ చిరగా వడగళ్ళు
ఒచ్చేం ఒచ్చేం అమ్మా నాన్నా చూసేం వెళ్ళేం వెళ్ళేం

ఉక్కా గొల్లూ చీకటమ్మా వేసాకాలం ఎండ
బిడ్డల్నాటి అడ్డాలు కాదు ఎవడి దేనిమీదనా మరిలేదు
ఎవడూకానివాడి దీవి దానిమీదేనే ఏమీకాన్దాని దీని మీద
దూరానున్నారు చుక్కలమ్మా పిల్లలంటే ఆకాశ పంట

కాగా పోగా ఎవడు వాడిమానాన్న వెఱ్ఱినవ్వుల నిద్దట్లో పోయేడు
ఏమీకాన్దాని చెయ్యి ఎవడి చేతిలోనే ఎవడివేపోనమ్మా దాని చూపు
అయిపోయిందమ్మా ఇద్దర్నీ దింపి నీళ్ళు ఎవళ మానూ రాళ్ళు వాళ్ళు మన్నాడు
ఆ ఊరికీ ఊరు కర్రా నిప్పూ ఎంతోనమ్మా ఈ ఊరికీ వానా మన్నూ ఆ ఊరు

దోనె పక్కన దొప్పమ్మా వత్తిని తడిపితే వత్తి
ఏట్లో దీపం వెలగా ఆరా వెర్రి నిద్దట్లో భ్రాంతి
ఏమీకాన్దీ ఎవడోవాడూ ఎండలో వానా ఏమిట్ల పెళ్ళి
కనీ కనపణ్ణట్టు మెరుపమ్మా కొసాకి వినీ వినపణ్ణట్టు గాలి.

ఫది గడపల చింతాడ పసిపిల్ల బాలాది
గడప నాలుగిళ్ళమ్మా మానిందే ఊరు
ఎంత చెట్టుకా గొడుగు ఏ ఎండకా గాలి
ఏదీ ఎవడూ కాని పొగ మంచు చెదిరిపోతే ఆ యింతా మరిపింత.
---------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
[ఆంగ్ల మూలం: Anyone lived in a pretty how town – e. e. Cummings]
ఈమాట సౌజన్యంతో