Showing posts with label ధూర్జటి మహాకవి. Show all posts
Showing posts with label ధూర్జటి మహాకవి. Show all posts

Thursday, September 17, 2020

కాయల్గాచె వధూనఖాగ్రంబులచే

కాయల్గాచె వధూనఖాగ్రంబులచే




సాహితీమిత్రులారా!



ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మాహత్మ్యంలో

అనేక నగ్నసత్యాలను వాక్రుచ్చారు

అందులోనివి కొన్ని-

వీడెం బబ్బినప్పుడున్, దమనుతుల్ విన్నప్పుడుం, బొట్టలో

గూడున్నప్పు, శ్రీ విలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్ 

పాడంగా వినునప్పుడుం చెలగు దంభప్రాయ విశ్రాణనా

క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా!


ఓ కాళహస్తీశ్వరా! నిన్ను నీ ధ్యానాన్ని మరచి,  తమకు తాంబూలము దొరికినప్పుడు( భోగములు కలిగి ఆరురుచులతో కూడిన అన్నం భుజించిన తరువాత), తనను ఎవరైనా పొగిడినప్పుడు, కడుపునిండా తిండి ఉన్నప్పుడు, ఐశ్వర్య వైభవవిలాసాలు ఉన్నప్పుడు, గాయకులు పాడినప్పుడు, తమ గొప్పతనాన్ని చూపడానికి ఆడంబరంగా దానధర్మాలు చేస్తూ విర్రవీగువారిని ఏమనాలో తెలియడంలేదు.


కాయల్గాచె వధూనఖాగ్రంబులచేఁ గాయంబు, వక్షోజముల్

రాయన్రాపడె ఱొమ్ము, మన్మథవిహారక్లేశ విభ్రాంతిచే

ప్రాయంబాయను, బట్టగట్టెఁదల, చెప్పన్ రోత సంసారమేఁ

జేయంజాల విరక్తుఁ జేయఁ గదవే శ్రీకాళహస్తీశ్వరా


ఓ కాళహస్తీశ్వరా! స్త్రీల నఖక్షతాలతో శరీరం కాయలు గాచింది, వారి ఉరోజాల రాపిడితో నారొమ్ము స్పర్శలేకుండా గట్టిపడి రాయైపోయింది, మన్మథక్రీడాసక్తితో వయసంతా పోయి వయసైంది, తల వెండ్రుకలూడిపోయి బట్టతలైంది ఇలా ఎన్ని చెప్పను ఇప్పుడు సంసారం మీద అసహ్యం కలుగుతోంది. ఇక నాకు సంపూర్ణ వైరాగ్యాన్నిచ్చి భవబంధవిముక్తిని కలిగించు.