Thursday, February 28, 2019

నడిచొచ్చిన తోవ


నడిచొచ్చిన తోవ




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి............

ఏం కాలేదులే
కళ్ళు తుడుచుకో

చెప్పానా పిల్లా?
ఆ జ్ఞాపకాల పెట్టె తెరవకని.
పోనీలే, ఏదీ మనది కాదులే
మన పేరన ఏ ఆకాశమూ
రాసిపెట్టి లేదులే!

కొత్తేం కాదుగా, ఇద్దరికీ
పగిలిన గుండె ముక్కలు
అబ్బా, చెదురుమదురుగా,
ఏది నీదో ఏది నాదో
విడివిడిగా మూటగడదాంలే!

నువ్వేం వినలేదులే
నేనేదీ గుర్తుంచుకోనులే
కలబోసుకున్న కథలిక్కడే వదిలి
గొంతులో చిక్కుబడ్డ
దిగుళ్ళన్నింటినీ గుటక వేసి
నడుద్దాం కాసేపు, లే!

ఏదీ, నవ్వు ఒకసారి
ఈ కథ విప్పకముందు లాగా.
ఎటుపోయిందీ ఆ నవ్వు
నా నవ్వుతోపాటుగా?

రా, వెళ్ళి వెతుకుదాం
సూటిగానో, పక్కగానో
వెనక్కి మాత్రం వెళ్లొద్దు
ఇంకెప్పుడూ… ఇక లే.

ఆ పెట్టె మూసెయ్యవా!
----------------------------------------------------
రచన: రేఖాజ్యోతి, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, February 27, 2019

అనుబంధం


అనుబంధం




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి......................

వరసగా ఐదు రోజులు పనిచేసిన అలసటని శనివారం విశ్రాంతితో మరిపిస్తున్న వేళ.  డిష్ టీవీలో క్రికెట్ మాచ్ చూస్తూ, జరుగుతున్న ఆట గురించీ, ఆటగాళ్ళను గురించీ వ్యాఖ్యానిస్తూ, బీరు తాగుతున్న వాళ్ళను చూస్తూ కూర్చున్నాడు రాజు.  కొత్తగా కలిసిన మిత్రులు వీళ్ళు.  ఆరు నెలలుగా అమెరికాలో ఉన్నా, అతనికి ఇంకా అంతా కొత్తగా, గజిబిజిగా ఉంది.  సాటి తెలుగు వాళ్ళు కనిపిస్తే ప్రాణం లేచివచ్చినట్టు అయింది.

ఆట అయిపోయింది.  టీవీ కట్టేస్తూ తృప్తిగా నిట్టూర్చాడు నరేంద్ర.  “ఎంతయినా మన వాళ్ళతో కలిసి సరదాగా గడిపినట్టు ఇక్కడి వాళ్ళతో ఉండలేం.”

“ఎందుకని?” అప్రయత్నంగా అడిగాడు రాజు.

“ఎందుకంటే — అసలు మనకీ వాళ్ళకీ పొత్తు కుదరదు.  మనమయితే హాయిగా ఏ ఫ్రెండింట్లోనో కబుర్లు చెప్పుకుంటాం.  లేకపోతే హోటలుకెళ్ళి ఓ కప్పు కాఫీతో గంట సేపు బాతాఖానీ వేస్తాం.  అదీ లేకపోతే, రోడ్డుమీద నడుస్తూనో, చెట్టుకింద నిలబడో కాలక్షేపం చేస్తాం.  ఇక్కడి వాళ్ళతో అలా కుదరదుగా.”

“ఎందుకు కుదరదు?” ఇంకా అర్ధం కాలేదు రాజుకి.

గోపాల్ అందుకున్నాడు.   “ఇక్కడి వాళ్ళతో అంతా అప్పాయింటుమెంట్ల గొడవ.  శనివారం రెండు గంటలకు కలుసుకుని అయిదు గంటల వరకూ ఫలానా గేముకి వెళ్ళి చూసొద్దాం, అని ఖచ్చితంగా చెబుతారు.  రెండు గంటలకి ముందు వెళ్ళడానికి వీల్లేదు, అయిదు గంటల తర్వాత ఉండడానికీ వీల్లేదు.  ఆ మధ్యలో అయినా మన ఇష్టమొచ్చినట్టు గడపడానిక్కూడా ఉండదు.  వాళ్ళు చెప్పినట్టు ఏ ఫుట్ బాల్ గేముకో, బేస్ బాల్ గేముకో చచ్చినట్టు వెళ్ళి తీరాలి.  అవేమో మనకి అర్ధమయ్యి చావవు.   మనమయితే, వీకెండ్ లో ఒకసారి కలుద్దాం, అంటే, ఎప్పుడో అప్పుడు మన ఇష్టమొచ్చినప్పుడు వెళతాం, మనకి  ఇష్టమున్నంత సేపు ఉంటాం, ఇష్టమైనప్పుడు తిరిగి వచ్చేస్తాం.  మనం కలుసుకున్నప్పుడుకూడా ఏదో ఫలానా పని చెయ్యాలని లేదు.  ఆ క్షణాన ఏం చెయ్యాలని తోస్తే అది చేస్తాం.  ఎవరికీ బాదరబందీ ఉండదు.  అంతా కాం గా జరిగిపోతుంది.”  గుక్క తిప్పుకునేందుకు ఆగి, ఎండిపోతున్న గొంతుకి కాస్త బీరు పోశాడు గోపాల్.

అప్రయత్నంగా రాజుకి తను అవ్వాళ పొద్దున్న ఎలా గడిపినదీ గుర్తొచ్చింది.  తనకి ఇంకా కారు లేదని నరేంద్ర వచ్చి తీసుకువెళ్తానంటే చాలా సంతోషించాడు.  కానీ అతను ఎప్పుడొస్తున్నదీ చెప్పక పోవడంతో తన పనులన్నీ గందరగోళమయ్యాయి.  మామూలుగా శనివారాలు చేసుకునే బజారు పనులు చెయ్యడానికి టైమున్నదో లేదో తెలియలేదు.  పోనీ నరేంద్రని అడుగుదామంటే, ఎన్ని సార్లు ఫోను చేసినా అతను దొరకలేదు.  మొత్తానికి పనులేమీ జరగలేదు.  తీరా అతనొచ్చాక హఠాత్తుగా తన స్నేహితుడి ఇంటికి వెళ్దామని ఉదయ్ దగ్గరకి తీసుకువచ్చాడు.  సహజంగా మొహమాటం, బిడియం కొంచెం ఎక్కువ పాలున్న తనకి ఇలా ముఖ పరిచయమైనా లేని వాళ్ళింటికి భోజనాల వేళకి వెళ్ళటం చాలా ఇబ్బందిగా అనిపించింది.  కానీ వాళ్ళెవరూ పట్టించుకోలేదు.

“నిజమే,” అంటూ గోపాల్ ని బలపర్చాడు ఉదయ్.  ఇక్కడివాళ్ళంతా మరీ బిజినెస్ మైండెడ్.  వర్కైనా, రిలాక్సేషనైనా, అంతా ఒకటే.  అంతా చాలా యాంత్రికంగా గడిపేస్తారు.”

“నిజమే.  ఊరికే కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం వీళ్ళు చెయ్యరనుకుంటాను.  ఏదో ఒక పనో, వ్యాపకమో ముందుగా నిర్ణయించుకుంటే తప్ప వాళ్ళకి తోచదు,” అన్నాడు నరేంద్ర.

అంతవరకూ విరామం లేకుండా వాగిన టీవీ వైపు చూసి మౌనంగా ఉండిపోయాడు రాజు.

“అయినా ఇక్కడి వాళ్ళతో మనం మాట్లాడ్డానిక్కూడా అంత కంఫర్టబుల్ గా ఉండదు నాకు,” అంది ఉదయ్ భార్య సునీత.  “మనసులో మాట చెప్పుకునేందుకు ఫ్రీగా ఉండదు.  ఎంతసేపూ మానర్స్‌ అనీ, ప్రైవసీ అనీ అదనీ, ఇదనీ, నోరు కట్టిపడేస్తారు.  ఏమంటే ఏం ముంచుకొస్తుందోనని భయం.  మనుషులకీ, మనుషులకీ మధ్య సంబంధాలు ఎలా ఉండాలో అసలు వీళ్ళకు తెలియదనుకుంటాను.”

“మీరయితే కొత్తగా వచ్చారు కాబట్టి అలా అనిపిస్తున్నదేమో.  మీరు వచ్చి రెండు నెలలేగా అయిందన్నారు?” రాజు అడిగాడు.

“నిజమేకానీ, ఉదయ్ ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నారు కదా.”

“ఎన్నాళ్ళనుంచీ ఉంటున్నారు మీరు?” అని ఉదయ్ ని అడిగాడు రాజు.

“ఓ అయిదారేళ్ళయింది.  ముందు ఎమ్మెస్ చేసేందుకు వచ్చాను.  తర్వాత ఉద్యోగం ఓ రెండేళ్ళు చేశాక, ఈ ఊరికి వచ్చాను.  ఇక్కడికి వచ్చి రెండేళ్ళు అవుతోంది.”

“మరిన్నేళ్ళుగా ఇక్కడున్నా, వేరే వేరే ఊళ్ళలో ఉన్నా, మీక్కూడా అలాగే అనిపిస్తోందా?” ఆశ్చర్యంగా అడిగాడు రాజు.       

“నన్నడిగితే, ఎన్నేళ్ళున్నా, మనకి ఇక్కడ ఫ్రెండ్సంటూ దొరకరు,” అని తేల్చేశాడు ఉదయ్.

నమ్మలేకపోయాడు రాజు.  “అదేమిటి, ఆరేళ్ళలో మీకు ఒక్కరితో కూడా స్నేహమవలేదా?  ఏది ఏమైనా వీళ్ళు కూడా మనుషులేకదా?”

“ఆఁ, మనుషులే.  మనుషులు కాకపోతే జంతువులన్నానా?  కానీ వాళ్ళ లోకం వేరు, మన లోకం వేరు.  ఆ రెండిటినీ కలపలేం.”

మాట్లాడకుండా కూర్చున్న రాజుని, “ఏమిటాలోచిస్తున్నావు?” అనడిగాడు నరేంద్ర.

“మీ అందరి మాటలూ వింటూంటే, నేనిక్కడకి రావడంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది.  కొత్త మూలాన తికమకగా ఉందనుకున్నానుగానీ, ఎప్పటికీ ఇక్కడ ఇమడననీ, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాననీ తల్చుకుంటే చాలా భయంగా ఉంది.”

“భయమెందుకు?  మన వాళ్ళు  మనకి ఉంటారు కదా?  మేం ముగ్గురం క్లాస్ మేట్స్ ఇక్కడకొచ్చినట్టే, నీ క్లాస్ మేట్స్ కూడా వస్తారు,” ఓదార్చాడు నరేంద్ర.

“అందుకే నేను గ్రీన్ కార్డుక్కూడా అప్లై చేశాను.  ఏవో నాలుగు డబ్బులు చేసుకుఏందుకు వచ్చాం.  మనకు చాలినంత డబ్బు రాగానే తిరిగి వెళ్తాం.  ఆ డబ్బు కోసం ఇక్కడ పని చేస్తున్నన్నాళ్ళూ ఏదో పైపై మొహమాటాలకి మర్యాదగా ఉంటాం.  కానీ నేననేది, ఇక్కడి వాళ్ళెప్పటికీ మనకు దగ్గరివాళ్ళూ, అయిన వాళ్ళూ కారని.”

గోపాల్  మళ్ళీ మొదలుపెట్టాడు.  “పోనీ మాట్లాడదామన్నా మనకేముంది వీళ్ళతో మాట్లాడడానికి? క్రికెట్టంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.  అసలు ఆ ఆటెలా ఆడతారో తెలియదు.  ఇక ప్లేయర్స్ సంగతి అడగక్కరలేదు.  ఇంకేం మాట్లాడతాం?”

“నాకు మాత్రం తెలుసా?” నవ్వాడు రాజు.

“అదేమిటి?  మీరు ఇండియాలో క్రికెట్టెప్పుడూ చూళ్ళేదా?” గోపాల్ ఆశ్చర్యపోయాడు.

“లేదు,” ముక్తసరిగా జవాబిచ్చాడు రాజు.

“అదేమిటి?  మీ పేరెంట్స్ అంత స్ట్రిక్ట్ గా ఉండేవారా?  పాపం! ఏమిటి, ఒక్కసారి కూడా చూళ్ళేదా?”  నరేంద్ర కూడా ఆశ్చర్యపడ్డాడు.

“లేదు.”

“అయ్యో పాపం.  మీ స్కూల్లో, కాలేజీలో ఆడేవారు కాదా?”  ఇప్పుడు జాలి పడడం సునీత వంతైయింది.

“లేదు.  నేను చదివిన స్కూల్లోగానీ, కాలేజీలోగానీ, అలాంటి ఆటలేవీ జరగలేదు,” అన్నాడు రాజు.

“క్రికెట్టాడని స్కూళ్ళు కూడా ఉంటాయా?  నేనెప్పుడూ వినలేదే?”  ఉదయ్ విస్మయంగా అడిగాడు.  “ఏం స్కూలది?”

రాజు కొంచెం ఇబ్బంది పడి, “ఇంగ్లీష్ మీడియం కాదు లెండి,” అని ఊరుకున్నాడు.

“అయినా టీవీ కూడా చూడనివ్వకుండా పెంచడం మరీ దారుణం బాబూ,” అంది సునీత జాలిగా.

రాజు మౌనంగా ఉండిపోయాడు.  మా ఇంట్లో అసలు టీవీ లేదు, అని చెప్తే వీళ్ళేమనుకుంటారు?  టీవీ మాట దేవుడెరుగు, అసలు రేడియోకి కూడా డబ్బుల్లేని ఇంట్లో తను పెరిగాడని తెలిస్తే వీళ్ళు తననిక్కడ ఉండానిస్తారా అని ఒక సందేహం కలిగింది.

గోపాల్ మళ్ళీ ప్రారంభించాడు.  “గేముకి కాకపోతే గో ఔట్ ఫర్ డ్రింక్స్ అంటారు.  ఏ బార్ కో వెళ్ళాలి.  అక్కడేం చెయ్యాలో ఎలా మాట్లాడాలో మనకేం తెలుసు?  తీరా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏదో అమ్మాయిలతో మొదలు పెడతారు.  అదంతా మనకలవాటు లేదు కదా?  ఇంకేం వెళ్తాం?”

అంతలో నరేంద్ర అడ్డొచ్చి, “అన్నీ కొట్టి పారేయక్కరలేదు.  వీళ్ళకి కొన్ని మంచి అలవాట్లు కూడా ఉన్నాయి.  అమ్మాయిల మాట వదిలేయ్.  బారుకెళ్ళడం ఫర్వాలేదు,” అన్నాడు.

“బారంటే గుర్తొచ్చింది.  మనకింకొన్ని బాటిల్స్ తేవోయ్,” అన్నాడు ఉదయ్ భార్యనుద్దేశించి.

సునీత వంటింట్లోకి వెళ్ళినప్పుడు రాజుని చూసి, “మీరేమిటి ఇంకా ఆ కోకా కోలా పట్టుక్కూర్చున్నారు?” అనడిగాడు వేళాకోళంగా.

“నాకింకేం వద్దండీ,” అన్నాడు రాజు.

“అరె!  అమెరికా వచ్చి కూడా మడికట్టుక్కూర్చుంటే ఎలా?  ఇక్కడున్నన్నాళ్ళైనా ఇక్కడి లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి.”

“లేదండి, నాకు తాగుడంటే ఇష్టం లేదు,” అన్నాడు రాజు.

“తాగుడేమిటి?  మరీ అంత పెద్ద మాటలు వాడకు.  అసలు బీర్లో ఆల్కహాలే లేదు, తెలుసా?” అన్నాడు నరేంద్ర.

“కరెక్ట్.  కోకా కోలాలో ఉన్నంత కూడా ఉండదు,” అన్నాడు గోపాల్.

రాజు కొంచెం వింతగా చూస్తూ, “అదేమిటి?  కోకా కోలాలో ఆల్కహాల్ ఎప్పటినుంచీ ఉంది?” అనడిగాడు.

ఇంతలో సునీత తిరిగొచ్చి, బీరంతా అయిపోయిందని విచారకరమైన వార్త వినిపించింది.

“అయిపోయిందా?  సరిగ్గా చూశావా?” అని ఉదయ్ ఆశ్చర్యపోయాడు.

“ఆఁ, చూశాను.  మీరంతా ఇందాకణ్ణించీ ఖాళీ చేస్తున్నారుకదా?” అంటూ నవ్వింది సునీత.

“ఇప్పుడెలా?” అని వాపోతున్న గోపాల్ తో, “ఎలా ఏమిటి? వెళ్ళి ఇంకొన్ని కొన్నుక్కొద్దాం.  కాస్త షికారుకెళ్ళినట్టు కూడా ఉంటుంది.  పదండి,” అంటు అందర్నీ బయల్దేరదీశాడు ఉదయ్.

లికర్ షాపు దగ్గిర కారు పార్క్ చెయ్యగానే అందరూ బిలబిలమంటూ దిగారు.  అందరి వెనకగా నెమ్మదిగా దిగాడు రాజు.  హుషారుగా కేరింతలు కొడుతూ లోపలికెళ్ళబోతూంటే, “ఎక్స్ క్యూజ్ మీ,” అని సన్నటి గొంతు వినిపించింది.  ఎవరా అని అటూ ఇటూ చూస్తే, గుమ్మానికి అయిదడుల దూరంలో ఓ చిన్న పిల్లాడు వీళ్ళని పిలుస్తున్నాడు.  పదేళ్ళుంటాయేమో?

“నువ్వేనా పిలిచింది?” ఇంగ్లీషులో అడిగాడు ఉదయ్.

“అవును,” అన్నాడా అబ్బాయి.

“ఏం కావాలి?”

ఆ కుర్రాడు కొంచెం తటపటాయించి, “ఏం లేదు.  కొంచెం లోపల్నించి నాకు ఒక విస్కీ సీసా తెచ్చిపెడతారా?” అనడిగాడు.

“ఏమిటీ? విస్కీయా?!” అంటూ నవ్వేశాడు ఉదయ్.  స్నేహితుల వైపు చూస్తూ, తెలుగులో, “చూశారా దారుణం?  ఇంత చిన్న పిల్లాడు విస్కీ తాగుతాడట, విస్కీ!” అన్నాడు.

“ఆఁ, తేరగా వస్తే అందరూ తాగుతారు,” అన్నాడు నరేంద్ర.  “మనం తీసుకొచ్చి పెట్టాలిట!”  మళ్ళీ భాష మార్చి ఇంగ్లీషులో, “పద!  పద!   ఊళ్ళో అందరికీ ఫ్రీగా విస్కీ కొనేందుకు మాకు వేరే పనేంలేదనుకున్నావా?” అని అదిలించాడు.

ఆ కుర్రాడి మొహం ఎర్రబడింది.  “నేనేం ఊరికే ఇమ్మంటం లేదు.  డబ్బులిస్తాను,” అని జేబులోంచి డబ్బులు తీసి చూపించాడు.

చిన్నబోయిన ఆ అబ్బాయి వంకే చూస్తున్న రాజు, “నీ దగ్గిర డబ్బులుంటే నువ్వే ఎందుకు వెళ్ళి కొనుక్కోవు?” అనడిగాడు.

“వాళ్ళు నాకు అమ్మరు, ” అన్నాడు ఆ అబ్బాయి నిస్సహాయంగా.

“అదేమిటి?”

“నా వయసు వాళ్ళకు వాళ్ళు అమ్మరు,” అన్నాడు అబ్బాయి.

“ఎందుకమ్మరూ?” అని రాజెంతో ఆశ్చర్యంగా అడుగుతూంటే, మిగతా వాళ్ళు, “ఆఁ, వీడితో పనేమిటి మనకి?” అంటూ రాజుని లోపలకి లాక్కెళ్ళారు.

బయట కుర్రాడు నిరాశగా వీళ్ళవంక చూడ్డం షాపు అద్దాల్లోంచి రాజుకి కనిపిస్తూనే ఉంది.  మిగతా అందరూ ఏమేం కొనాలో చూసేందుకు షాపులో తిరుగుతూంటే, రాజు కాష్ కౌంటర్ దగ్గిరకి వెళ్ళాడు.  అక్కడి క్లర్కుతో, “చిన్న పిల్లలకి ఆల్కహాల్ అమ్మరా?” అనడిగాడు.

“ఊఁహుఁ,” అన్నాడా క్లర్కు.

“ఎందుకమ్మరు?”

“అమ్మితే మా లైసెన్స్ పోతుంది కనక.”

“ఆంటే?  ఎందుకు పోతుంది?”  రాజుకేమీ అర్ధమవ్వలేదు.

రాజుని దద్దమ్మని చూసినట్టు చూస్తూ, “ఇరవై ఒక్కేళ్ళ లోపు వాళ్ళకి ఆల్కహాల్ అమ్మకూడదు.  అది చట్టం.  ఆ చట్ట ప్రకారం నడుచుకోకపోతే, మా బిజినెస్ లైసెన్స్ తీసేస్తారు.  ఇంకప్పుడు మా మొత్తం షాపు మూసేయాల్సొస్తుంది,” అన్నాడు.

“మరయితే ఆ అబ్బాయి తన కోసం మమ్మల్ని విస్కీ కొనుక్కు రమ్మన్నాడు.  కానీ మీరమ్మరన్నమాట,” అన్నాడు రాజు.

క్లర్కు నవ్వేసి, “అదేం లేదు.  కొనేవాళ్ళు మీరైతే నిక్షేపం లా అమ్ముతాం,” అన్నాడు.

“కానీ మేం కొంటున్నది చిన్న పిల్లాడి కోసమని తెలిసినా అమ్ముతారా?” అన్నాడు రాజు నివ్వెరపోతూ.

క్లర్కు మళ్ళీ నవ్వేసి, “తాగే వాళ్ళెవరైతే మాకేం పట్టె?  కొనేవాళ్ళెవరనేదే మాకు ముఖ్యం.  పెద్ద వాళ్ళు ఇంటికి తీసికెళ్ళి వాళ్ళ పిల్లలకు తాగిస్తారో, పసిపిల్లలకు పడతారో, అదంతా మాకనవసరం,” అన్నాడు.

అంత దాకా ఇది చాలా మంచి చట్టమని లోలోపల సంతోషిస్తున్న రాజుకి ఈ మాట వినగానే విచారమేసింది.  ఇలాంటి చట్టం ఉన్నందుమూలాన వచ్చిన లాభమేమిటి?

ఇంతలో మిగతా వాళ్ళు అక్కడికొచ్చి, వాళ్ళు తీసుకున్న సరుకులకి డబ్బులిచ్చారు.  బయటికొచ్చినప్పుడు ఇంకా ఆ అబ్బాయి అక్కడే నుంచుని ఉండడం గమనించాడు రాజు.  వీళ్ళ చేతుల్లోని సంచులనీ, సంచులలోని బుడ్లనీ ఆశగా చూస్తున్నట్టనిపించింది రాజుకి.  అందరూ కారు దగ్గరికి వెళ్ళ్తున్నా, రాజు వాళ్ళతో బాటు వెళ్ళలేకపోయాడు. ఒక్క నిముషం తటపటాయించి ఆ అబ్బాయి దగ్గిరకి వెళ్ళి, “చూదు.  నీ పేరేమిటి?” అనడిగాడు.

“మార్క్,” అన్నాడా అబ్బాయి.

“చూడు, మార్క్.  నువ్వు ఇంత చిన్నవాడివి కదా.  నువ్వు ఇప్పటినించే తాగడం మంచిది కాదు.  అందుకనే షాపు వాళ్ళు కూడా నీకు అమ్మటం లేదు.  చక్కగా ఇంటికి వెళ్ళి ఆడుకో,” అని బుజ్జగించబోయాడు రాజు.

మార్క్ ఆవేశంగా, “ఇది నాక్కాదు.  నేనేం తాగుతాననుకున్నావేమిటి?  మా నాన్నకోసం,” అన్నాడు.

“మీ నాన్న కోసమా?”  రాజు  మనసులో ఏవేవో జ్ఞాపకాలు  మెదిలాయి.  ఒక్క క్షణం గొంతు పూడుకుపోయినట్టయింది.  ఎలాగో సంబాళించుకుని, “ఫర్వాలేదులే.   షాపు వాళ్ళు అమ్మరని మీ నాన్నకి చెప్పు,” అన్నాడు.

“ఆ సంగతి మా నాన్నకి తెలియదేమిటి?  అందుకనే ఎవరినో ఒక పెద్ద వాళ్ళనడిగి కొనమంటాడు.  నేనేం లేకుండా మళ్ళీ తిరిగి వెళ్తే నన్ను కొడతాడు.”  మార్క్ కళ్ళలోని నీళ్ళు జారకుండా ఉండడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు..

“కొడతాడా?” అంటూ స్థంభించిపోయాడు రాజు.

ఇంతలో రాజు కోసమని నరేంద్రా, గోపాలూ తిరిగి వచ్చారు, “ఇక్కడే ఉండిపోయావేమిటి?” అనడుగుతూ.

“చూడండి పాపం, ఈ అబ్బాయి.  ఇది కొనమని వాళ్ళ నాన్న పంపించాడట.  అది లేకుండా ఇంటికి వెళ్తే కొడతాడుట,” అన్నాడు రాజు బాధగా.

నరేంద్ర నవ్వేశాడు.  “ఆఁ!  ఇలాంటి కాకమ్మ కథలు నమ్మకూడదు.  ఈ దేశం లో ఎవరైనా పిల్లలని కొడితే వాళ్ళని వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెడతారు.  అందుకనే ఇక్కడి పిల్లలకు ఎవరి మీదా భయమూ, భక్తీ ఉండవు.  పద, వెళ్దాం.  వీడితో మనకేమిటి?”

కానీ రాజు కదల్లేక పోయాడు.  తన చిన్నప్పుడు ఇలాగే ఎన్నోసార్లు సారా దుకాణానికి వెళ్ళడం గుర్తుకొచ్చింది.  కనీసం మార్క్ వాళ్ళ నాన్న అతనికి డబ్బులైనా ఇచ్చాడు.  తనకొక్కోసారి అదీ ఉండేదు కాదు.  అలాగే దుకాణం దగ్గిర పడిగాపులు పడుతూ, ఎలాగో అలాగ వాళ్ళ నాన్నకు కావాల్సిన సరుకు సంపాదించి తీసుకెళ్ళి ఇచ్చేవాడు.  దొరకకపోతే తన్నులు తప్పేవి కావు.  ఎన్ని సార్లు చీకటిలో తచ్చాడుతూ, ఇంటికి వెళ్ళలేక భయంతో బెదురెత్తి పోయాడో బాగా గుర్తు.  ఎన్ని సార్లు తనని రక్షించే నాథుడెవరైనా ఉన్నాడోనని ఆశగా ఎదురుచూశాడో ఎవరికి తెలుసు?  ఏం లాభం?  తన పరిస్థితీ, తన నాన్న సంగతీ అందరికీ తెలిసినా, కల్పించుకున్న వాళ్ళు మాత్రం ఎవరూ లేకపోయారు.  తండ్రి తనని చావబాదుతున్నప్పుడు అడ్డుపడేవాళ్ళే లేకపోయారు.  కదుములతో, గాయాలతో, వెక్కి వెక్కి ఏడ్చి అలసటతో సొమ్మసిల్లి పోతూంటే, అప్పుడప్పుడు ఎవరైనా చేరదీసి తలనిమరడం కద్దే.  కానీ వాళ్ళ ఆదరణా, ఆప్యాయతా అంతటితో ఆగేవి.  ఒక్కరికికూడా తండ్రిని నిలదీసి “ఏమిటిది?” అని అడిగే తీరికో, ఓపికో, ధైర్యమో లేకపోయింది.

అదంతా మనసులో మెదులుతూంటే,  “అలాగా?  ఇది కూడా చట్టమేనా?” అనడిగాడు రాజు.

“ఆహా, నిక్షేపంలా.  ఇక్కడ ప్రతిదానికీ ఏదో ఒక రూలూ, ఏదో ఒక చట్టం.”  నరేంద్ర గొంతులో కొంచెం ఎకసెక్కం వినిపించింది రాజుకి.

“చాలా మంచి చట్టం,” అన్నాడు రాజు.

“ఏం మంచి?  తల్లితండ్రులకీ పిల్లలకీ  మధ్య కూడా రూల్సూ, చట్టాలూ, పోలీసులూ అంటూంటే ఎలా?  అదేగా ఇందాక మనమన్నదీ?  వీళ్ళకి మానవ విలువలూ, మానవ సంబంధాలూ అంటే ఏమిటో తెలియదు,” అన్నాడు గోపాల్.

“పద, బయల్దేరుదాం,” అని తొందర చేశాడు నరేంద్ర.

కానీ రాజు మార్కుని వదల్లేక పోయాడు.  “మీరు వెళ్ళండి.  నేను తర్వాత కలుస్తాను,” అన్నాడు.

నరేంద్ర ఆశ్చర్యంగా చూశాడు.  “ఆదేమిటి?  నువ్వేం చేస్తావు?”

“నేనీ అబ్బాయితో కొంచెం మాట్లాడుతాను,” అన్నాడు రాజు.

నరేంద్రా, గోపాల్, ఇద్దరూ విసుగ్గా చూశారు.  “ఈ అబ్బాయితోనా?  వీడికోసమేమిటి నీ తాపత్రయం?  వీడు నీకేమవుతాడని?  వాడి కర్మకి వాణ్ణి ఒదిలేయ్.  ప్రపంచం లో అందరినీ మనం ఉద్ధరించలేం,” అన్నాడు నరేంద్ర.

“ఉద్ధరిస్తాననలేదు నేను.  కొంచెం మాట్లడుతానన్నాను.  మీరు వెళ్ళండి,” అని రాజు వాళ్ళతో బాటు కారు దగ్గిరకి వెళ్ళి, ఉదయ్ కి కూడా సర్ది చెప్పి, చివరికి ఎలాగైతేనేం వాళ్ళందరినీ పంపించాడు.

మళ్ళీ మార్క్ దగ్గిరకి తిరిగొచ్చాడు.  తన వైపే అనుమానంగా చూస్తున్న మార్క్ తో లాలనగా, “చూడు.  మీ నాన్నంటే నీకు భయమా?” అనడిగాడు.

అవునంటూ తలాడించాడు మార్క్.

“భయపడక్కరలేదు.  కావాలంటే నేను పోలీసులని పిలిచి మీ నాన్న నిన్ను కొడుతున్నాడని చెప్తాను.  వాళ్ళొచ్చి ఆపిస్తారు,” అన్నాడు రాజు ఓదార్పుగా.

“వద్దు, వద్దు,” అంటూ మార్క్ అడ్డొచ్చాడు.

“ఏం?  ఎందుకు వద్దు?” ఆశ్చర్యంగా అడిగాడు రాజు.

“వద్దు.  పోలీసులొస్తే మా నాన్నని ఏదైనా చేస్తారేమో.  జైల్లో పెట్టేస్తారేమో.”

“లేదు.  ఫర్వాలేదు.  ఊరికే వాళ్ళు మీ నాన్నని మందలిస్తారు, అంతే,” అని నచ్చచెప్పబోయాడు రాజు.

మార్క్ తల ఇంకా గట్టిగా అడ్డంగా ఊపుతూ, “ఊఁహూఁ.  అలా ఏం చెయ్యరు.  ముందు నన్ను తీసుకెళ్ళి ఇంకెవరింట్లోనో పెట్టేస్తారు,” అన్నాడు.

“ఎవరింట్లో పెడతారు?”

“ఫాస్టర్ హోం లో పెడ్తారు.  మా నాన్న సంగతేమిటో చూసినన్నాళ్ళూ నన్ను వేరే ఎవరితోనో పెట్టేస్తారు.”

“అంటే మీ బంధువులా?” అనడిగాడు రాజు సరిగ్గా అర్ధం కాక.

“బంధువులు కాదు.  ఊరికే ఎవళ్ళో ఒహళ్ళు.  ఇలా అమ్మా నాన్నా సరిగ్గా లేని పిల్లలని చూసుకునేవాళ్ళు.”

“వాళ్ళు నిన్ను బాగా చూడరా?” అనడిగాడు రాజు, మార్క్ అభ్యంతరమేమిటో అర్ధం కాక.

“బాగానే చూస్తారు.  అది కాదు.”

“మరి?”

“నేనింట్లో లేకపోతే మా నాన్ననెవరు చూస్తారూ? అందుకే — ఇదివరకోసారి నన్నలా పెట్టారు కానీ, నేను పారిపోయి వచ్చేశాను.”

ఛెళ్ళుమన్నట్లయింది రాజుకి.  అవును.  ఇది కూడా తనకనుభవమే.  ఇది రక్త సంబంధపు ప్రభావం కాబోలు.  ఎంత నిరాదరించినా, ఎంత నిర్లక్ష్యం చేసినా, మళ్ళీ ఆ తండ్రి కోసమే తనూ పాకులాడేవాడు.  ఒక్కసారి తనని గమనించాలనీ, తనంటూ ఒక వ్యక్తి ఉన్నట్టు గుర్తించాలనీ, ఒక్కసారంటే ఒక్కసారి, ఒక చిన్న మాట, ఒక చిన్న మెచ్చుకోలుగానీ, ఒక చిన్న ఓదార్పు గానీ, ఏదో ఒకటి, దొరుకుతుందేమోనని ఎదురు చూసేవాడు.  వాత్సల్యం, ఆప్యాయతా, ఆదరణా, ఇలాంటి మాటలేవీ ఆ వయసులో తనకు తెలీవు.   కానీ ఆ అనుభూతులని మాత్రం తన మనసు కోరుకునేది.  అవి దొరకనప్పుడు, నీళ్ళు లేని మొక్క లాగా, తన మనసూ ఎండిపోయింది.

పూర్తిగా వడలి, వాడి, చావడానికి సిద్ధంగా ఉన్న తరుణం లో మాష్టారు తనని చేరదీశారు.  ఇక్కడిలా తనని ఇంట్లోంచి తీసుకెళ్ళక పోయినా, తనని స్కూలుకి రమ్మని ప్రోత్సాహించారు.  అక్కడ తనని కూర్చోబెట్టి శ్రద్ధగా, ఎన్నాళ్ళనుంచో వట్టిబోయిన తన చదువుని పునరుద్ధరించారు.  మిగతా పిల్లలతో పోలిస్తే చాలా వెనకబడిపోయాడు తను.  ఆ సిగ్గుతో, నామోషీతో, తను స్కూలుకి వెళ్ళడానికే సంకోచించేవాడు.  కానీ, మాష్టారు బుజ్జగింపులూ, బెల్లింపులూ, ఆయన చల్లటి మాటల మురిపింపులూ, అన్నీ కలిసి తనని ప్రోద్బలించి స్కూలుకి తీసుకెళ్ళాయి.  అక్కడ ఆయన శ్రద్ధగా, ఓపిగ్గా, ఇన్నాళ్ళనుంచి తను నేర్చుకోనివి, ఒకప్పుడు నేర్చుకున్నా మరిచిపోయినవీ, పాఠాలన్నీ నేర్పించారు.  త్వరలోనే తనలో ప్రతిభ దాగుందని మాష్టారు చెపితే తను నమ్మలేదు.  కానీ, మాష్టరి నిరంతర శ్రమతో, ఎక్కడో తన అంతరాంతరాల్లో, ఏ మారుమూలో కప్పడిపోయిన చిన్న రవ్వ లాంటి తన తెలివికి గాలిపోసీ, చమురుపోసీ, క్రమక్రమంగా దాన్ని జ్వలింపజేశారు.  ఆయన ప్రోత్సాహమూ, ఆశీర్వాదమే కాదు, ఆయన చేతి డబ్బు కూడా పడినట్టు తన అనుమానం.  కాలేజీ చదువుకు తనని వెళ్ళమంటే, అది తన కందుబాటులో లేదని నిరుత్సాహపడ్డాడు.  కానీ మాష్టారే పూనుకుని, తనకి ఎక్కడెక్కడనుంచో, ఎవరెవరిదగ్గిరనుంచో, డబ్బులు ఎలా దొరుకుతాయో వాకబు చేసి, ఆ ఏర్పాట్లన్నీ ఆయనే చేశారు.   చందాలతో, స్కాలర్ షిప్పులతో గడిచింది తన చదువు. 

రాజు తదేకంగా ఆ కుర్రవాడి ముఖంలోకి చూశాడు.  చివరిసారి మాష్టార్ని కలిసినప్పుడు ఆయన వంక ఇలాగే చూశాడు తను.

కృతజ్ఞతతో, భక్తితో, ఆయన కాళ్ళకి నమస్కరించబోతే మధ్యలోనే వారించారు ఆయన.  తన ఉద్యోగ వివరాలన్నీ చెప్పి, “ఇదంతా మీ దయమూలానే మాష్టారూ.  మీ ౠణం ఎన్నటికీ తీర్చుకోలేను,” అంటే ఆయన నవ్వేశారు.

“నేను చేసిందేముందోయ్.  చదివినవాడివి నువ్వు.  కష్టపడిపైకొచ్చినవాదివి నువ్వు.”

“కాదు, మాష్టారూ.  మీరు పూనుకోకపోతే అసలు చదువనేదే నాకు తెలిసేది కాదు.  అడుగడుగునా మీ సహాయం లేకపోతే అది ఇంత వరకూ వచ్చేదీ కాదు.  నేను మీకేమవుతానని ఇంత శ్రద్ధా, శ్రమా తీసుకున్నారు మీరు?”

“ఏమవుతావేమిటి?  సాటి మనిషివి.  అది చాలదూ?” అంటూ నిండుగా నవ్విన మాష్టారి ముఖం రాజు మదిలో మెరిసింది.  మాష్టారి ౠణం ఎలా తీర్చుకోవాలో స్ఫురించింది.

“పద.  మీ ఇంటికి వెళదాం,” అన్నాడు.

అర్ధం కాక చూస్తున్న మార్క్ తల నిమిరి, “నేను కూడా వస్తాను.  ఇకనుంచీ ఇలాంటి పనులకు నిన్ను పంపించకూడదని మీ నాన్నకు నేను చెప్తాను.  ఏం భయం లేదు.  ఇక అన్నిటికీ నేనుంటానుగా,” అని ధైర్యం చెప్పాడు.

మానవులున్న ప్రతిచోటా మానవ సంబంధాలూ, అనుబంధాలూ తప్పకుండా ఉంటాయి.  ఎటొచ్చీ అవతలి వ్యక్తిని మనిషిగా మనం గుర్తించి గౌరవించాలి.

మార్క్ భుజం మీద చెయ్యి వేసి ధృఢంగా అడుగులు వేశాడు రాజు.
---------------------------------------------------------
రచన: మాచిరాజు సావిత్రి, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, February 26, 2019

కాపరి భార్య


కాపరి భార్య




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి............

రెండు గదుల ఆ ఇల్లంతా కలప దుంగలతో కట్టిందే. గచ్చురాళ్ళు పరిచిన నేల పగిలిపోయి బీటలు వారింది, ఆ గదుల వెనక ఒక పెద్ద వంటిల్లూ, ముందు చావడీ వున్నాయి.

చుట్టంతా దట్టమైన పొదలు. అరచేయిలా, ఎత్తు పల్లాలేవీ లేకుండా, నిర్భావంగా వుంది. అడవన్న పేరే కానీ, అక్కడ పచ్చదనం అతి తక్కువ. కొన్ని గిడచబారిన ఆపిల్ చెట్లూ, ఇంకొన్ని సరుగు చెట్లూ, దాదాపు ఎండిపోయిన చిన్న వాగూ! వూరు పంతొమ్మిది మైళ్ళ దూరం!

కాపరి గొర్రెలతో అడివిలోకెళ్ళి చాలా రోజులే అయింది. ఇంట్లో అతని భార్యా, పిల్లలు మాత్రం వున్నారు. నలుగురు పిల్లలు, చిరిగిన బట్టలతో, ఎండిపోయిన దేహాలతో ఇంటి బయట ఆడుకుంటున్నారు.

“అమ్మా! పాము, పామొచ్చింది!” వున్నట్టుండి, పిల్లలు గొల్లుమని అరిచారు. వాళ్ళ అమ్మ ఒక్క పరుగున వంటింట్లోంచి బయటికొచ్చింది. బక్కగా, ఎండకు కమిలిపోయిన శరీరంతో ఉంది ఆమె.

“ఎక్కడ? ఎక్కడుంది పాము?” పరిగెత్తుకొని వస్తూనే, నేల మీద పడున్న చంటి వాణ్ణి చంకనేసుకుంది, ముందు. పిల్లలని అడుగుతూనే రెండో చేతితో కర్ర పట్టుకుంది.

“అదిగో! ఆ కట్టెల మోపులోకెళ్ళింది.” అందర్లోకి పెద్దవాడు, పదకొండేళ్ళ టామ్ అరిచాడు. చురుకైన ముఖంతో తల్లి వంక చూశాడు. తనకంటే పొడుగైన కర్ర ఒకటి చేతిలో పట్టుకొచ్చాడు.

“నువ్వక్కడే వుండమ్మా! ఆ పాము పని నే పడతాగా!”

“టామ్! నువ్విటురా ముందు! అది కాటేస్తుంది. రమ్మనంగానే రా, వెధవా!” తల్లి కేకలకు వాడు చిన్నబోయిన మొహంతో పక్కకొచ్చి నిలబడ్డాడు. అంతలోకే వాడి కళ్ళు మెరిశాయి. కట్టెల మోపు నుండి పాకి ఇంటికిందకు దూరుతున్న పామును చూపించాడు. గోడల పగుళ్ళనుంచి ఇంటికిందకు కలుగులున్నాయి.

“అదిగో అమ్మా, పాము!” కర్ర ఎత్తి పాము మీద దెబ్బ వేయబోయాడు. ఇంతలో వాళ్ళ పెంపుడు కుక్క జరుగుతున్న గందరగోళమేమిటో చూడడానికి వొచ్చింది. పాముతోకను అది ఒడిసి పట్టుకునేంతలో అది మాయమైపోయింది. సరిగ్గా అప్పుడే టామ్ వేసిన కర్ర పోటు కుక్క మొహం మీద పడింది. అది పట్టించుకోకుండా గుర్ గుర్ మంటూ అక్కడే నిలబడింది పాము వెళ్ళినవైపు చూస్తూ. కాపరి భార్య వెళ్ళి కుక్కను కట్టేసి వచ్చింది. దాని పేరు మొసలి. పేరుకు తగ్గట్టే దాని ముఖం మొసలి ముఖంలా ఉంటుంది. పాములనుంచీ, పాముల్లాంటి మనుషుల నుంచీ అదే తనకు దిక్కు.అది ఎటైనా తప్పిపోతే ఇంకా కష్టం మరి. పిల్లలందరినీ కూడ గట్టి వాళ్ళని కుక్క పక్కన నిలబెట్టి తను పామును పట్టుకునే ప్రయత్నంలో పడింది. చిన్న గిన్నెలో పాలు పోసి తెచ్చి కలుగు పక్కన పెట్టి పాము కోసం ఎదురు చూస్తూ కూర్చుందామె. గంట గడిచినా పాము బయటికొచ్చిన జాడే లేదు.

సాయంకాలం అవుతుండడంతో చిన్నగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. రాత్రికి పెద్ద వర్షం వొచ్చేలాగుంది. పిల్లలని అలా ఎంత సేపని బయటే వుంచడం. పోనీ లోపలికి తీసికెళ్దామంటే పాము లోపలే వుందేమో! పైగా గచ్చులో అక్కడక్కడా నెర్రెలు పడి వున్నాయి. గోడ పగుళ్ళ కలుగుల్లోంచి పాము బయటికొస్తే!

కాసేపటి తరవాత ఏదో ఆలోచించుకొని, కట్టెల మోపులోంచి కొన్ని కట్టెలు తీసుకొని వంటింట్లో పొయ్యిలో పడేసింది. తరవాత పిల్లలందరినీ ఇంట్లోకి తీసికెళ్ళింది. వంటింట్లో గచ్చు లేదు. బురదతో అలికిన నేల మీద, చెక్కపేడు కాళ్ళతో మొరటుగా చేసిన ఒక పెద్ద బల్ల తప్ప ఇంకే సామానూ లేదు. ఆ బల్ల పైకి వాళ్ళందరినీ ఒకళ్ళ తరవాత ఒకళ్ళని ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళకి అక్కడే తిండి పెట్టింది. పాము ఎటునుంచి వస్తుందోనని వేయి కళ్ళతో కనిపెడుతూనే ముందు గది నుంచి చేతికందిన పక్క బట్టలు అందుకోని దడ దడ లాడే గుండెలతో వంటింట్లోంచి కొచ్చి పడింది. ఆ బల్ల మీదే దుప్పట్లు పరిచి పిల్లలని నిద్ర పుచ్చింది. పిల్లలు పడుకున్నరని నిర్ధారించుకొని ఇక పాము కోసం ఎదురు చూడసాగింది ఆమె.

పాము వున్న నెర్రెల వైపే చూస్తూ వంటింటి గుమ్మం దగ్గరే కుర్చీ వేసుకుని కూర్చున్నదామె. పక్కనే కర్ర, ఆమె కుట్టు పని సంచీ, ఒక పత్రిక పెట్టుకుంది. పక్కన కుక్కని కూర్చోబెట్టుకుంది. అమ్మని ఒంటరిగా పాముతో వదిలేసి పడుకోవడం టామ్ కసలే మాత్రమూ నచ్చలేదు.

“అమ్మా! రాత్రంతా నీతో పాటే కూర్చొని ఆ దరిద్రగొట్టు పాము తల పచ్చడి చేస్తాను!” శపథం చేశాడు.

“చాల్లే! నోరు మూసుకొని పడుకో! తిట్లు వాడడొద్దన్నానా? తల్లి కసిరింది. టామ్ ఒక దుడ్డుకర్రను పక్కలోనే పెట్టుకున్నాడు, పాముని చంపడానికి. అది తగిలి తమ్ముడు జాకీ ఫిర్యాదు చేశాడు.

“అమ్మా! టామ్ కర్ర నన్ను డొక్కలో పొడుస్తూంది. అది తీసి పడెయ్యమని వాడితో చెప్పూ!”

“జాకీ! నోరు మూసుకొని పడుకో రాస్కెల్, పాముతో కరిపించుకుంటావా?!” టామ్ బెదిరించాడు. జాకీ నోరు మూసుకున్నాడు.

“ఒరే జాకీ! పాము కరిచిందనుకో. నీ ఒళ్ళంత ఎర్రగా, నల్లగా అయిపోయి నువ్వు ఉబ్బిపోయి కంపుకొట్టి చచ్చిపోతావ్, తెలుసా!”

“అమ్మా, టామీ చూడు ఏమంటున్నాడో!”

“టామ్, చిన్నపిల్లవాడు. వాణ్ణి భయపెట్టకలా!”

సణుగుతూనే నిద్రలోకి జారిపోయాడు జాకీ. మెల్లిగా పిల్లలంతా నిద్రపోయారు, టామ్ తప్ప.

“అమ్మా, పామొస్తే నన్ను లేపుతావు కదూ?” నిద్రమత్తులో తూగుతూనే గొణిగాడు టామ్.

“అలాగేలే నువ్వు పడుకో!”

మధ్య రాత్రయింది. అంతటా చీకటి, చిక్కగా అలుముకున్న నిశ్శబ్దం. ఆమెకీ నిద్ర ఆగటం లేదు. అయినా కాసేపు కుట్టుకుంటూ, కాసేపు పత్రిక చదువుతూ, కట్టెల మోపు వైపే చూస్తోంది. చీమ చిటుక్కుమన్నా కర్ర మీదికి చేయి పోతుంది.

అనుకున్నట్టే ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. గోడల నెర్రెల్లోంచి లోపలికొస్తున్న ఈదురు గాలికి కొవ్వొత్తి ఆరిపోయేలా వుంది. లేచి కొవ్వొత్తిని బల్ల పైన పెట్టి అట్ట ఒకటి అడ్డంగా పెట్టింది. మెరుపు మెరిసినప్పుడల్లా గోడల మీది నెర్రెలు వెండి తీగల్లా కనిపిస్తున్నాయి. కుక్క గుమ్మానికడ్డంగా సాగిలపడి పడుకోని వుంది. ఎంత ధైర్యం చెప్పుకున్నా ఆమెకి గుండె దడదడ లాడుతూనే వుంది. తను పిరికిది కాదు కానీ ఈమధ్యే పాము కాటుకి గురై చచ్చిపోయిన బావగారి కొడుకు ఙ్ఞాపకం ఆమెను భయపెడుతోంది. భర్త అడవిలోకెళ్ళి ఆరు నెలలు అయింది. ఒక్క కబురూ లేదు. ఇక వొచ్చేస్తే బాగుండనుకొంది. ఈమధ్యే వచ్చిన కరువుతో అంతా నష్టపోయారు. దానితో మళ్ళీ అడవిలోకి పోక తప్పలేదు. ఈ సారి పశువులతో వెనక్కి రాగానే ఈ అడవీ, పల్లే వొదిలేసి పట్నంలో కాపురం పెడతానన్నాడు. అక్కడికి కొంచెం దూరంలోనే వున్న బావగారు అప్పుడప్పుడూ ఒక గొర్రెను చంపి కొంత తను తీసుకుని అందుకు బదులుగా వీళ్ళకి కావల్సిన వెచ్చాలు తెచ్చిపెడుతుంటాడు.

ఆమెకీ ఒంటరితనం అలవాటే నిజానికి. ఇంతకు ముందొకసారి పద్దెనిమిది నెలలపాటు ఒక్కతే ఇంట్లో వుంది అతని కోసం ఎదురు చూస్తూ. ఆమెకి వున్నట్టుండి తన చిన్నతనం గుర్తొచ్చింది. అందరు ఆడపిల్లల్లానే తనూ ఎన్నో కలలు కన్నది, గాల్లో మేడలు కట్టుకుంది. అన్నీ కరిగిపోయి చాలా యేళ్లయింది. ముందున్న నిజాలని ఒప్పుకోనూ లేకా, వాట్నించి తప్పుకోనూ లేక, తనక్కావల్సిన ప్రపంచాన్ని అప్పుడప్పుడూ ఆసక్తిగా చదివే ఆ పత్రికల్లో వెతుక్కుంటుంది.

నిజానికామె భర్త చెడ్డవాడేమీ కాదు. కొంచెం నిర్లక్ష్యం వున్నా, ఆమెని ప్రేమించే మనిషే. ఆమె కోరుకున్నట్టే ఆమెని రాజకుమార్తెలా గారాబం చేయలనీ, మహారాణీలా చూసుకోవాలని ఆశలున్నవాడే. పరిస్థితులే కలిసి రావడంలేదు. ఈ పశువుల పనిలో పాపం, నెలలతరబడి అడవుల వెంట తిరుగుతాడు. జీత భత్యాలతో తిరిగొచ్చి పట్నం తీసికెళ్తాడు. అప్పుడప్పుడూ అతను అధైర్యపడినా, ఆమే అతనికి ధైర్యం చెప్పి పంపిస్తుంది. పిల్లలు పుట్టినప్పుడు మరీ దిగులుగా భయంగా వుండేది ఆమెకి. ఇద్దరు బిడ్డలు ఈ అడవిలోనే పుట్టారు తనకు. ఇలాటి ఒంటరితనంలోనే ఒక బిడ్డను పోగొట్టుకుంది. చేతిలో బిడ్డ శవాన్నెత్తుకొని ఒంటరిగా పంతొమ్మిది మైళ్ళు వెళ్ళింది ఆ రోజు!

ఒక పెద్ద మెరుపూ, ఉరుముతో ఉన్నట్టుండి జడివాన మొదలయింది.

ఆలోచనల్లోనే రాత్రి గడుస్తోంది. ఝాము రెండయి వుంటుంది. మొసలి ఇంకా కళ్ళార్పకుండా పడుకొని గుమ్మం వైపే చూస్తోంది. వాడి వొంటి మీద గాయాలు చూస్తూ పాపం, వీడూ పెద్దయిపోయాడు, అనుకుందామె. వాడికి భయమనేదే లేదు. దేనికైనా ఎదురుపోతాడు. ఎన్నో పాములనూ చంపాడు. ఏదో ఒకరోజు పాముకాటుతోనే పోతాడు. ఇలాంటి కాపలా కుక్కల బతుకు అలాగే ముగుస్తుంది.

అప్పుడప్పుడూ చేతిలో పుస్తకం పక్కన పెట్టి ఆలోచనల్లోకి మళ్ళీ మళ్ళీ జారిపోతుందామె. వర్షం ఇంకా కురుస్తూనే వుంది. ఈ వర్షానికి గడ్డి ఇంతెత్తున పెరుగుతుంది. ఎండలకి ఎండి పోతుంది. అప్పుడూ అగ్గి భయం.

ఒకసారిలాగే పెరిగి ఎండిపోయిన గడ్డి అంటుకుంది. ఆ అంటుకున్న అగ్గి ఆర్పేసరికి బ్రహ్మ ప్రళయమైపోయింది తనకి. ఆదరా బాదరా చేతికందిన భర్త పాంటూ షర్టూ వేసుకొని ఒక పెద్ద చెట్టు కొమ్మతో మంటల్ని బాదడం మొదలు పెట్టింది తనారోజు. మంటలు ఆరిపోయినై కానీ తన మొహమూ చేతులూ అంతా బూడిదా మసీ కలిసిపోయి ఒక విచిత్రమైన రంగులోకి తిరిగిపోయాయి. తండ్రి బట్టల్లో వున్న తనని చూసి టామ్ పక పకా నవ్వితే, నల్లబడ్డ తన మొహం చూసి చంటి వెధవ జాకీ కెవ్వుమన్నాడు. వాడి ఏడుపు చూసి కుక్క తన పాంటు పట్టుకుని లాగింది, అదీ తనను గుర్తుపట్టలేదు. పాత జ్ఞాపకాలతో ఆమె మొహం మీద నవ్వు విచ్చుకుంది.

ఒంటరితనంతోనూ, చుట్టూ ఉన్న క్రూరమైన అడవితోనూ ఎన్ని యుద్దాలో! జబ్బు చేసి రెండు ఆవులు పోయినప్పుడూ, పైన బడుతున్న ఎద్దుని ఒంటరిగా ఎదురొన్నప్పుడూ, ఆఖరికి తమ కోడి పిల్లలని కాకుల నించీ గద్దల నించీ నిరంతరం కాపాడుకొటున్నప్పుడూ, ఇదే ఒంటరితనంతో పోరాటం చేస్తూ వచ్చింది తను. ఆ మాటకొస్తే, ఒంటరి ఆడదాని కోసం పొంచి వుండే మగవాళ్ళకి కొదవా?

కుక్క సాయంతోనూ, మొరటు మాటల సాయంతోనూ, అబధ్ధాల సాయంతోనూ అలాటి మగవాళ్ళనుండి తనని తాను కాపాడుకొంటూ వచ్చింది. అంతెందుకు, సరిగ్గా కిందటి వారం వొచ్చాడు ఒక దరిద్రుడు. అడివి దారంట పోతున్నాననీ, దాహంతో చచ్చి పోతున్నాననీ వేడుకున్నాడు. వాడి వాలకం నచ్చకపోయినా, జాలి పడి కొంచెం తిండి పెట్టి మంచి నీళ్ళిచ్చింది. సాయంత్రం కాగానే తన దారిని తాను వెళ్తాడనుకుంటే, ఒక వెకిలి నవ్వుతో “ఈ రాత్రికి ఇక్కడే వుండి పోతా” అన్నాడు.

మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఒక పెద్ద దుడ్డుకర్ర ఒక చేతిలో, భయంకరంగా పళ్ళు చూపిస్తూ గుర్రులాడుతున్న మొసలిని గొలుసుతో ఇంకో చేతిలో పట్టుకొని బయటికొచ్చింది. “ఇంకొక నిమిషంలో ఇక్కణ్ణించి కదలకపోతే, నేనూ నా కుక్కా కలిసి నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేయడం ఖాయం,” అని చెప్పింది వాడి కళ్ళల్లోకి చూస్తూ. ఆమె కళ్ళలోకి చూసి వాడేమనుకున్నాడో ఏమో, గబగబా మూటా ముల్లే సర్దుకుని, “వెళ్ళొస్తామ్మా!” అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.

బుష్‌ల్యాండ్ జీవితాలు అవి. ఆ అడవిలో బ్రతకాలంటే అది చెప్పే పాఠాలు నేర్చుకోవాలి. ఆమె వాటిలో రాటుతేలిపోయిన మనిషి.

ఐతే తన జీవితంలోనూ చిన్న చిన్న సంతోషాలూ, సరదాలూ లేకపోలేదు. అన్ని రోజులూ ఒక ఎత్తు, ఆదివారం మాత్రం ఒక ఎత్తు ఆమెకి. ఆదివారం మధ్యాహ్నం పనంతా ముగించుకుని, చక్కటి బట్టలు కట్టుకొని, పిల్లలనీ ముస్తాబు చేసి అడవిలో ఒంటరిగా కాసేపు నడిచొస్తుందామె. అప్పుడు ఆమె ముస్తాబూ, పిల్లల ముస్తాబూ చూస్తే వాళ్ళేదో పట్టణంలో విందుకెళ్తున్నట్టు వుంటారు! ఆ ఒంటరితనంలో అదొక్కటే ఆమెకి ఆటవిడుపు. నిజానికి ఆ అడవిలో ఇరవై మైళ్ళ వరకూ ఇంకొక ప్రాణి కనబడకుండా నడవొచ్చు! ఎంత దూరం నడిచినా అదే అడవి, అవే పిచ్చిమొక్కలూ. ఏ మార్పూ లేని ఆ పరిసరాలు, ఆ మాంద్యం తట్టుకోలేకే మొగవాళ్ళు పట్టణానికి పారిపోదామనుకుంటారు. కనీసం కొత్తగా వేసిన రైలుపట్టాల పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోదామనుకుంటారు. పెళ్ళైన కొత్తలో పిచ్చెత్తినట్టు వుండేది, ఇప్పుడలవాటై పోయింది. భర్త ఇంటికొచ్చినప్పుడు సంతోషమే కానీ, అతను ఎప్పటికీ ఇంటి పట్టున వుంటాడన్న నమ్మకమూ ఆశా లేవామెకి. పిల్లలంటే ప్రేమ ఆమెకు. పైకి కఠినంగా ఉంటుంది. పరిస్థితులు ఆ ప్రేమను పైకి చూపించనీయవు. చుట్టూ వున్న మొరటుతనం స్త్రీ సహజమైన సున్నితపుతనాన్ని పెరగనీయదు.

ఆలోచనల్లోనే తెల్లారుతూ వుంది. గడియారం చూద్దామంటే ముందు ఇంట్లో వుంది. కొవ్వొత్తి పూర్తిగా ఆరిపోయింది. వేరే కొవ్వుత్తులు లేవు. బయట వర్షం ఆగిపోయినట్టుంది.

రాత్రంతా నిద్రలేమితో ఆమె అలసిపోయింది. ఎందుకో కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి. చేతిగుడ్డతో తుడుచుకోబోయి వేళ్ళతో కన్ను పొడుచుకుంది. చేతిగుడ్డలో చిల్లులనుంచి ఆమె వేళ్ళు పొడుచుకొచ్చున్నాయి. ఆమెకు నవ్వొచ్చి పెద్దగా నవ్వింది. మొసలి ఆశ్చర్యంగా చూసింది. ఆమెకిలా తనమీద తాను నవ్వుకోవడం అలవాటే.

ఇంతలో ఉన్నట్టుండి కుక్క శరీరం బిగుసుకుంది. కదలకుండా ఊపిరి బిగబట్టి నేలలో వున్న నెర్రె వైపే చూస్తూన్న దాని శరీరంలో వెంట్రుకలన్నీ అదో మాదిరి ఉద్వేగంతో నిక్కబొడుచుకున్నాయి. ఆమెకి అర్థం అయింది. వంటింటి గోడ కింద వున్న నెర్రె వైపే తనూ చూస్తూ చేతి కర్ర అందుకుందామె. చిన్న కంతలోంచి గాజు గోళీల్లాంటి రెండు చిన్న కళ్ళు కదలకుండా బయటికి చూస్తున్నాయి. ఒక క్షణం బయట ఆమె, ఆమె పక్కన కుక్క, లోపల పాము కాలంతో పాటు స్తంభించి నిలబడ్డారు. కొంచెం సేపటికి పాము ముందు కదిలి మెల్లగా కొంచెం బయటికొచ్చింది.

ఆమె ఇంకా మెల్లిగా చేతి కర్ర పైకెత్తింది. ఆపద గ్రహించినట్టు పాము మళ్ళీ కలుగులోకి తల లాక్కుంది. ఒక్క నిమిషం తరువాత మళ్ళీ మెల్లిగా తల బైటకు పెట్టింది. కుక్క ఒక్క ఉదుటున పాము మీదికి దూకింది. పాము దాదాపు తప్పించుకొని పోబోయింది. కుక్క మళ్ళీ దాని పైకురికి పళ్ళతో దాన్ని ఒడిసి పట్టి పామును ఒక అడుగు బైటకు లాగింది. ధడ్! ధడ్! ఆమె పాము తలపై కొట్టింది. మొసలి పామును పట్టుకుని మరింత బయటకు లాగింది. ధడ్! ధడ్! ధడ్! ఐదడుగుల పొడవు, నల్లగా భయంకరంగా ఉంది పాము. సందడికి టామ్ లేచి తల్లికి సాయానికి రాబోయాడు. ఒక్క చేత్తో పిల్లవాణ్ణి దూరంగా నెట్టేసింది బలంగా, రెండో చేత్తో పాముని బాదుతూనే. మొసలి మూతి మీద ఒకట్రెండు దెబ్బలు తగిలాయి. వాడు పట్టించుకోలేదు. ఆమె ఆగకుండా ఆ పామును కొడుతూనే వుంది, అది ఇక కదలిక లేకుండా చచ్చి పడేదాకా.

పాము శరీరాన్ని మెల్లిగా కర్రతో లేవనెత్తి బయట మండుతున్న నెగడులో వేసిందామె. కుక్క, పిల్లవాడూ కదలకుండా దూరంగా నిలబడ్డారు కాలిపోతున్న పామును చూస్తూ. కర్ర పక్కన పడేసి వొచ్చి కుక్క పక్కన కూర్చుందామె. ఇద్దరినీ దగ్గరకు లాక్కుంది. ఆమె చేతి స్పర్శతో పిల్లవాడూ, కుక్కా కొంచెం కుదుట పడ్డారు.

తలెత్తి తల్లి వైపు చూశాడు టామ్. ఆమె కళ్ళల్లో నీళ్ళు. తల్లి మెడ చుట్టూ చేతులేసి ఆమెని హత్తుకుపోయాడు.

“అమ్మా! నేను పెద్దయిన తరవాత ఎప్పుడూ నిన్నొదిలి ఆ దరిద్రపు అడవిలోకెళ్ళను,” అన్నాడు. కొడుకుని తన గుండెకి పొదువుకుందామె. సన్నగా తెల్లవారుతున్న అడవిలో అలా కూర్చుండిపోయారు వాళ్లలా.
---------------------------------------------------------
(మూలం: హెన్రీ లాసన్ కథ, ది డ్రోవర్స్ వైఫ్.)
రచన: శారద, 
మూలం: హెన్రీ లాసన్, 
ఈమాట సౌజన్యంతో

Monday, February 25, 2019

మనుషులపై మదుపు


మనుషులపై మదుపు




సాహితీమిత్రులారా!


ఈ అనువాదకథను ఆస్వాదించండి............

నాకంతా తిమకమగా ఉంది. కోపంగా ఉంది, చికాకుగా ఉంది. మీరేమయినా అనుకోవచ్చు. ఎక్కడ తప్పు జరిగింది? నేను ఏది మిస్సయ్యాను…?

నాకు తెలియడం లేదు లేదా అర్థం కావడం లేదు. మా బాల్కనీ లోంచి కనిపిస్తున్న హోర్డింగ్‌లోని ప్రకటన – నాలోని అగ్నికి ఆజ్యం పోస్తోంది.

నా పేరు శారద. నాకు 55 సంవత్సరాలు. మావారి పేరు వెంకటేశ్. ఆయనకి 60 ఏళ్ళు. పాతికేళ్ళ క్రితం కొనుక్కున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో ఉంటాం మేము. పాతికేళ్ళ క్రితం మద్రాసు మహానగరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటంటే చాలామందికి ఓ లగ్జరీ వంటిది. అప్పట్లో మాది పైకొస్తున్న కుటుంబం. మేమిప్పటికీ అదే ఫ్లాట్‌లో ఉంటున్నాం, ఈ ఇల్లే మాకు భారం అయిపోయింది. మరిక్కడే ఎందుకు ఉండడం అంటే, ఇంకెక్కడికి వెళ్ళలేం కనుక… వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం మాకు పెద్దగా ఆసక్తి కూడా లేదు.

పరిమళని కలవడం నాకు బాగా చిరాకు కలిగించింది. పరిమళ కుటుంబం పదేళ్ళ క్రితం మా పక్కింట్లో ఉండేవారు. తర్వాత కొన్నాళ్ళకి ట్రిప్లికేన్‌కి వెళ్ళిపోయారు. పరిమళ ఈ రోజు ఇంత సంతోషంగా ఉంటుందని నేనెన్నడూ ఊహించలేదు. పరిమళ చేసే మూర్ఖపు పనుల వల్ల భవిష్యత్తులో తానెంతో బాధపడుతుందనీ, నా తెలివైన చర్యల వల్ల నేనెంతో సంతోషంగా ఉంటానని అనుకున్నాను. నేను మేధావిననీ, నన్ను నేను కాపాడుకోగలననీ భావించాను.
కానీ నేను పరిమళ చేతిలో పరాజయం పొందాను. పూర్తిగా ఓడిపోయాను.

నాకు పెళ్ళయ్యే సమయానికి సుమారుగా 30 ఏళ్ళు. మావారిది ఉమ్మడి కుటుంబం. ఆయన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అమ్మ… వీళ్ళే కాకుండా ఆయన బాబాయి పిల్లలు కూడా ఉండేవారు. ఇక రోజూ వచ్చి పోయే బంధువుల మాట చెప్పనే అక్కర్లేదు. ఇంత పెద్ద కుటుంబంలో ఉండాలని నేను ఏనాడూ అనుకోలేదు. నాకున్నది ఒకే ఒక జీవితం. దాన్ని నేను కోరుకున్నట్లుగా జీవించాలని అనుకున్నాను. వేరు కాపురం పెడదామని మావారిని ఒత్తిడి చేశాను. కుటుంబ పోషణ కోసం కావాలంటే డబ్బిద్దామని నచ్చజెప్పాను. ఆయన ఒప్పుకోలేదు. నేనేం చిన్నపిల్లని కాదుగా… అంత సులువుగా ఓటమిని ఒప్పుకోడానికి. నాకూ, మా అత్తమామలకి పొసిగేది కాదు. రోజూ ఇంట్లో గొడవలే. చివరికి వాళ్ళే మమ్మల్ని వేరు ఉండమని అడిగారు. మా ఆయన వాళ్ళ కుటుంబానికి దోచి పెట్టకుండా జాగ్రత్తపడ్డాను. నేను కూడా ఉద్యోగంలో చేరాను. ఈ ఇల్లు కొనుక్కున్నాం. మా అత్తమామలతో మాకు పెద్దగా మాటలు లేవు. మా ఆడపడుచుకి పెళ్ళి చేసి, ఉన్నంతలో మా మరుదులని స్థిరపరిచారు మా మావగారు. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూసొచ్చేవాళ్ళం. కొంతకాలానికి నేను తల్లినయ్యాను.

ఈ సమయంలోనే పరిమళ వాళ్ళు మా పక్కింట్లోకి అద్దెకి దిగారు. వాళ్ళదీ పెద్ద కుటుంబమే. అత్తగారూ, మావగారు, మరుదులు, ఆడపడుచులు, ఇంకా పినమావగారి పిల్లలు… ఇలా చాలామందే ఉండేవారా ఇంట్లో. నాకు నా పెళ్ళయిన కొత్తలో మా అత్తగారిల్లు ఉన్న పద్ధతి గుర్తొచ్చేది.

అయితే పరిమళ నాలా గడుసుది కాదు. అమాయకురాలు. నెమ్మదిగా మాట్లాడేది, ఎవరితోనూ గొడవ పెట్టుకునేది కాదు. చిరునవ్వుతో కుటుంబంలోని అందరికీ సేవలు చేసేది. ఎంతో మంది బంధువులు. పెద మావగారు, పెద అత్తగారు, పినమావగారు, పినత్తగారు… వాళ్ళ పిల్లలు, మనవలు… వచ్చి పోతుండేవారు. వీళ్ళందరికి వినయంగా వండి వడ్డించేది పరిమళ.

ఈ తాబేదారు పద్ధతి మార్చుకోమని నేను పరిమళకి ఎన్నోసార్లు చెప్పాను. వేరు కాపురం పెట్టుకుని తన బ్రతుకు తనని బ్రతకమని సలహా ఇచ్చాను. భర్త తెచ్చేదంతా బంధువులకి ధారపోస్తూ ఇదే ఇంట్లో ఉంటే తన కోసం, తన పిల్లల కోసం ఏమీ మిగుల్చుకోలేదని హెచ్చరించాను. కుటుంబం నుంచి విడివడి తన బాగు తనని చూసుకోమన్నాను. ఆమె ఓ చిరునవ్వు నవ్వేసేది, నా మాటలు పట్టించుకునేది కాదు. కొన్నాళ్ళకి నేనూ చెప్పడం మానేశాను.

ఆమెకి సలహాలివ్వడం ఎందుకు మానేశానంటే, నాకూ ఆమెతో అవసరం ఉంది. నాకెంతో సాయం చేస్తుంది. దాన్ని నేను కోల్పోవాలని అనుకోలేదు. మా పిల్లలు బడి నుంచి రాగానే తను పిల్లల్ని వాళ్ళింట్లో కూర్చోబెట్టి, సాయంత్రం నేను ఇంటికి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకునేది.

పరిమళ లేకపోతే, నేనసలు ఉద్యోగం చేయగలిగేదాన్నే కాదు. నేను రోజూ తొందరగా ఇంటికి రావాల్సి వచ్చేది. మా ఆయన నగరానికి దూరంగా ఉద్యోగం చేసేవారు. వాళ్ళ అత్తామామల్లానే, నేనూ కూడా పరిమళని వాడుకున్నాను.

మేము, మా పిల్లలు రాజాల్లా జీవించాం. నాకో అబ్బాయి, ఓ అమ్మాయి. పరిమళకి కూడా అంతే. ఓ కొడుకు, ఓ కూతురు. మేము ప్రతీ వారాంతం హోటల్‌కి వెళ్ళేవాళ్ళం. ప్రతీ నెలాఖరు లోనూ ఓ వినోద కార్యక్రమానికి, ప్రతీ ఏడాది చివర్లో కొత్త ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్ళేవాళ్ళం. పరిమళా, వాళ్ళ పిల్లలు ఇలాంటివాటికి నోచుకోలేదు. వాళ్ళు హోటళ్ళకి గాని సినిమాలకి గాను వెళ్ళడం చాలా అరుదు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మందంతా కదలాల్సిందే.

పరిమళ వాళ్ళ ఆయన తన సొంత కుటుంబం మీద కన్నా ఉమ్మడి కుటుంబం మీద ఎక్కువ ఖర్చు పెడతాడు. దూరపు బంధువులకి సైతం సాయం చేస్తాడు. అదంతా దుబారా అని నా ఉద్దేశం. నిజానికి ఆయన మావారికన్నా ఎక్కువే సంపాదిస్తాడు. కాని ఆయనకి గాని పరిమళకి గాని తమ భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం తెలియనే తెలియదు.

మేము షేర్లు, స్టాకులు, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, భూములలోనూ మదుపు చేశాం. వీటి సాయంతోనే నేను మా అబ్బాయిని ఇంజనీరుని, అమ్మాయిని డాక్టర్ చేయగాలిగాను. వీళ్ళ కాలేజి చదువులకే మేము సుమారుగా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. మావారి తరపు బంధువుల బరువు బాధ్యతలు మేం మోయలేదు కాబట్టే ఇది సాధ్యమైంది.

పరిమళ పిల్లలు మాములు చదువులు చదివారు. కొడుకు బిఎస్సీ కెమిస్ట్రీ చదివాడు, అమ్మాయి బి.కామ్ చేసింది. ఈ మాత్రం చదువులకే వాళ్ళెంతో కష్టపడ్డారు. విదేశాల్లో చదువుకోడానికి మా అబ్బాయిని నేను స్పాన్సర్ చేసాను. అక్కడే ఎంఎస్ చేశాడు. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. పై చదువులకు మా అమ్మాయి యు.కె. వెళ్ళింది.

పరిమళ కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్ అయ్యాడు. కూతురు బి.కామ్ తర్వాత ఏదో నర్సరీ స్కూల్‌లో టీచర్‌గా చేరింది. పరిమళ మూర్ఖత్వం పట్ల నాకు విచారం కలిగేది. మా పిల్లల్ని తన పిల్లలతో పోల్చి చూసి, ఆమె తన జీవితాన్ని, పిల్లల జీవితాన్ని ఎలా పాడు చేసుకుందో చెబుతూంటాను. పాపం పరిమళ, ఈ మాటల్ని కూడా నవ్వుతూనే వినేది. ఎప్పుడు ప్రతిస్పందించేది కాదు.

పరిమళ పట్ల జాలి కలిగేది.

అమెరికాలో నా కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడు. మాకిష్టం లేకపోయినా ఆ పెళ్ళికి మేము అంగీకరించాల్సి వచ్చింది. ఆ విషయంలో మేమేమీ చేయలేకపోయాం. నా కొడుకు కోడలు గ్రీన్‌కార్డ్ సంపాదించుకుని అక్కడే స్థిరపడ్డారు. కొన్నాళ్ళకి మా కోడలు గర్భవతని తెలిసింది. తొమ్మిది నెలలు గడిచాక మాకు మనవడు పుట్టాడని తెలిసింది. నేనూ మా ఆయన వచ్చి సాయంగా ఉంటామని మా అబ్బాయితో అన్నాము. మాకు ‘ఇబ్బంది’ కలిగించకూడదనుకున్నాడు మా అబ్బాయి. ఆ ఇబ్బందేదో వాళ్ళ అత్తగారూ, మావగార్లనే పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత మావాడి అత్తగారు, మావగారు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు.

మా అమ్మాయిని యు.కె. లోనే మరో భారతీయ వైద్యుడికిచ్చి పెళ్ళి చేశాం. తనూ అక్కడే స్థిరపడిపోయింది. మేము అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటూంటాం. రోజూవారి పనులు, అత్తామామలు, పిల్లలు, భర్త… వీళ్ళందరితోనూ అమ్మాయి తీరుబడి లేకుండా ఉంటుంది.

సుమారుగా పదేళ్ళ క్రితం, పరిమళ వాళ్ళ కుటుంబం ట్రిప్లికేన్‌కి వెళ్ళిపోయారు. క్రమంగా మా మధ్య సంబంధాలు తెగిపోయాయి.

మావారు రిటైరైపోయారు. నేనూ ఉద్యోగం మానేశాను. రోజూ పొద్దున్నే లేస్తాం. నాలుగు వైపులా ఉన్న రంగు వెలసిన గోడలని చూస్తాం. అవి ఒకప్పటి మా తీరికలేని జీవితాలకి ప్రతీకలని అనుకుంటాను. పైకప్పు కేసి, నేల గచ్చు కేసి, గోడల కేసి చూసుకుంటాం. మా పిల్లలతో గడిపిన రోజులని గుర్తు చేసుకుంటాం. కాసేపు అలా నడిచి వద్దామని గుడికి గాని, పార్క్‌కి గాని బయల్దేరదీస్తాను మా వారిని. ఒక్కోసారి మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకుంటాం… ఒక్కోసారి అస్సలు మాట్లాడుకోం.

కాలక్షేపం కోసం ఒకదాని తర్వాత మరొకటిగా టివి సీరియళ్ళు చూస్తాం. కుటుంబాలని విడదీసే కోడళ్ళను టీవీ సీరియళ్ళలో చూసినప్పుడు నాకేదో అయిపోతుంది. అలాంటప్పుడు మావారు నన్ను ఆ పాత్రధారులతో మనసులో పోల్చుకుంటారు, చాలాసేపటి వరకూ నాతో మాట్లాడరు. ఆయనకి మరో మార్గం లేదు మరి. ఆయన సంతోషాన్ని పోగొట్టింది నేనేనని అనుకుంటూంటారు. నేనే లేకపోతే, ఆయన కుటుంబం ఈ పాటికి ఆయన్ని పీల్చి పిప్పి చేసి నడిరోడ్డు మీద పడేసి ఉండేదని గ్రహించరు.

మేము ఎవరిళ్ళకీ వెళ్ళం. ఎవరితోనూ పెద్దగా సంబంధాలు ఏర్పరుచుకోనందుకు నేనేం బాధపడను. మా అత్తామామలు ఎప్పుడో చనిపోయారు. నా తరపు వాళ్ళతో గాని, ఆయన తరఫువాళ్లతో గాని మాకు ఎవరితోనూ రాకపోకల్లేవు, మాటామంతీ లేవు. అయినా కొత్తగా మళ్ళీ మొదలుపెట్టాలంటే ఎంతో కష్టం. అందుకే మేం ఒంటరిగానే ఉంటాం. ఆర్థికంగా మాకేమీ ఇబ్బందులు లేవు. మా పిల్లలపై ఖర్చు చేయగా మిగిలిన సొమ్ము మాకింకో 15-20 ఏళ్ళ వరకూ సరిపోతుంది. అన్నేళ్ళు ఎలాగూ బ్రతకం కాబట్టి ఇబ్బంది ఉండదు.

ఈ సమయంలోనే, ఓ రోజు ట్రిప్లికేన్ పార్థసారథి ఆలయంలో పరిమళ కలిసింది.

పరిమళ అలాగే ఉంది. పెద్దగా మారలేదు. కాని నేను మారాను. ముసలిదానిలా కనిపిస్తున్నాను. తను నా చేతులని ఆప్యాయంగా స్పృశించింది. మేము చాలా సేపు మాట్లాడుకున్నాం. ట్రిప్లికేన్‌లోని వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. వాళ్ళిల్లు అంత పెద్దదా అని నాకు ఆశ్చర్యం కలిగింది. నాకు గుర్తున్నంత వరకూ వాళ్ళు ట్రిప్లికేన్‌లో ఓ చిన్నింట్లో దిగారు.

“నిజానికిది మా వారి బాబయిగారి ఇల్లు. ఆయన మాకు అమ్మేశారు. మా పినమావగారు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయికి మా ఆయన సాయం చేశారు. మా పినమావగారూ, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అందుకని మాకీ ఇల్లు తక్కువ ధరకే అమ్మేశారు.” చెప్పింది పరిమళ.

“ఏ పినమావగారు? మీకు చాలామంది బంధువులున్నారుగా…” అడిగాను నేను.

“రాజా మావయ్యగారు. నీకూ తెలిసే ఉంటుంది. వాళ్ళబ్బాయి ఎక్కువ రోజులు మా ఇంట్లోనే ఉండేవాడు. ఆ కుర్రాడు నైట్ కాలేజీలో చదివేవాడు. కాలేజీకి దగ్గర అని మా ఇంట్లో ఉండేవాడు…” అంటూ గుర్తు చేయడానికి ప్రయత్నించింది పరిమళ.

“అవునా… ఇంతకీ మీ పిల్లలేం చేస్తున్నారు?” అడిగాను.

“మా వాడు మెడికల్ రిప్రజెంటేటివ్‌గానే నీకు తెలుసు. కాని మా సుందరం ఉన్నాడు చూశావు… మా అబ్బాయి చేత ముంబయిలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివించాడు. ఆ తర్వాత మా వాడు ఐఐటి, ఢిల్లీ నుంచి పిహెచ్‌డి చేశాడు. ఐఐటిలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్-డాక్టరల్ రీసెర్చ్ చేస్తున్నాడు. మా అమ్మాయి నర్సరీ స్కూల్‌లో టీచర్‌గా ఉండేది. కాని మూర్తి ఊరుకోలేదు. తనతో పాటు తీసుకువెళ్ళి సి.ఎ. చదివించారు. ఇప్పుడు అమ్మాయి తన భర్తతో కలసి ముంబయిలో ఆడిటర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది…” అని చెబుతూ-

“నువ్వు మా పిల్లల పెళ్ళిళ్ళకి రానే రాలేదు!” అంది పరిమళ.

“అవును. అప్పట్లో ఏవో సమస్యల వల్ల పెళ్ళిళ్ళకి రాలేకపోయాను…” అని చెప్పి, “ఈ సుందరం, మూర్తి ఎవరు? నాకు గుర్తు రావడం లేదు,” అన్నాను.

“సుందరం మా బంధువుల కుర్రాడే. తెల్లగా, సన్నగా ఉండేవాడు. నువ్వూ చూశావు. ఓసారి అతనికి పెద్ద యాక్సిడెంట్ అయి ట్రీట్‌మెంట్‌కి బాగా డబ్బు ఖర్చయింది. మా మావగారు అత్తగారివి నావి నగలు, మా ఇల్లు తనఖా పెట్టి ఆ కుర్రాడికి చికిత్స చేయించారు. దేవుడి దయ. ఆ అబ్బాయి కోలుకున్నాడు. తర్వాత బార్క్‌లో సైంటిస్ట్ అయ్యాడు. మేమంటే ఆ కుర్రాడికి బాగా అభిమానం.” అని చెప్పి, “మూర్తి వాళ్ళు మన కాంపౌండ్‌లోనే ఉండేవాళ్ళు గుర్తులేదా?” అని అడిగింది పరిమళ.

“మూర్తి అంటే… గ్రౌండ్ ఫ్లోర్‍లో ఉండే మూర్తిగారా? ఆయన మీకెందుకు సాయం చేశాడు?” అడిగాను ఆశ్చర్యంగా.

“నిజమే. సాయం చేయడానికి పెద్ద కారణం కూడా ఏమీ లేదు. మేము ఆయనకి ఎటువంటి మేలు చేయలేదు. ఒకసారి వాళ్ళ ఆవిడకి ఆరోగ్యం బాలేకపోతే… నెల రోజుల పాటు వాళ్ళకి మా ఇంటి నుంచే భోజనం పంపాను. అంతే. మిగతాదంతా దేవుడి దయ…” చెప్పింది పరిమళ.

ఇంట్లో ఎవరూ కనపడకపోయేసరికి, “ఇంట్లో నువ్వూ, మీ ఆయనేనా ఉండేది?” అన్నాను.

“లేదు. అబ్బాయి కోడలు మాతోనే ఉంటారు. వీళ్ళంతా బయటకి వెళ్ళారు. ఇప్పుడు నేను, మావారు మా అత్తమామల పాత్ర ధరిస్తున్నాం. రోజూ మా ఇంటికి ఎంతోమంది వచ్చి పోతూంటారు. పని అంతా కోడలి మీదే వదిలేసి తనని ఇబ్బంది పెట్టను. నాకు చేతనైన సాయం చేస్తాను. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిచిపోతుంది నాకు. బయటకి వచ్చేది చాలా తక్కువ. నాకు పెద్దగా టైం దొరకదు…” అని చెబుతూ,

“ఈసారి మీవారిని తీసుకుని రా. మిమ్మల్ని చూస్తే మా ఆయన ఎంతో సంతోషిస్తారు…” అని చెప్పింది.

తనకి నిజంగానే సమయం తక్కువని గ్రహించాను. ఈ వయసులో కూడా ఇంత పని చేయాల్సి వస్తున్నందుకు నాకు తనమీద జాలేసింది. ‘పాపం, పరిమళ’ అనుకున్నాను.

వీడ్కోలు చెప్పి అక్కడ్నించి బయల్దేరాను. మా ఇంటి సమీపంలోకి వచ్చాక, నా మూడ్ మారిపోయింది. నాకన్నా పరిమళ ఎంతో సంతోషంగా ఉందని అనిపించింది.

ఎలా…?

నేనెక్కడ తప్పు చేశాను? జీవితంలోని ప్రతీ అంశంలోనూ పరిమళ కంటే నేనే మెరుగు. నేను తెలివైన దాన్ని. పరిమళ తెలివితక్కువది. నేను ఉద్యోగం చేశాను. పరిమళ గృహిణిగా మిగిలిపోయింది. నేనెన్నో ప్రణాళికలతో జీవితాన్ని నడుపుకొచ్చాను. పరిమళకి ఎలాంటి ప్రణాళికలు లేవు. నా పిల్లల్ని నేను ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దాను. పరిమళ ఏమీ చేయలేదు. ఆమె పిల్లలు వాళ్ళంతట వాళ్ళే ప్రొఫెషనల్స్‌ అయ్యారు. నాకు ఇల్లు ఉంది. పరిమళకి లేదు. కాని అదృష్టవశాత్తు… ప్రస్తుతం ఆమెకో ఇల్లుంది. అయినా ఎందుకో… తనే నాకన్నా సంతోషంగా ఉన్నట్లనిపిస్తోంది.

నేను చేసినన్ని ఇన్వెస్ట్‌మెంట్లు తను చేయలేదు. నా పిల్లల కోసం నేను ఖర్చు చేసినట్లుగా తను తన పిల్లల కోసం ఖర్చు చేయలేదు. మరి ఆమె దేంట్లో ఇన్వెస్ట్ చేసింది? ఈ రోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతోంది?

సరిగ్గా, ఈ ఆలోచనల్లో ఉన్నప్పుడే నేను మా బాల్కనీ లోంచి ఆ హోర్డింగ్‌లోని ప్రకటనని చూశాను. అందులో “వుయ్ ఇన్వెస్ట్ ఇన్ పీపుల్!” అని తాటికాయంత అక్షరాలతో రాసుంది.

దాంతో నాకు వెర్రెత్తిపోయింది. ఆ వాక్యం ఎంత మూర్ఖపు ఆలోచనో, ఎంత అసంబద్ధమో, ఎంత అవివేకపు భావనో… అని అనిపించింది. ‘మనుషులపై మదుపు’ అనేది ఎక్కడైనా ఉందా? మూర్ఖత్వం కదూ…!

---------------------------------------------------------
రచన: కొల్లూరి సోమ శంకర్,  
మూలం: రాజారామ్ బాలాజీ,
(ఆంగ్ల మూలం: Invest-men-ts, 2007.)
ఈమాట సౌజన్యంతో

Sunday, February 24, 2019

బతుకు ఎంత పొరపాటై పోయేది!


బతుకు ఎంత పొరపాటై పోయేది!



సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి..............

చేపపిల్లని
గబుక్కున కరుచుకోవటానికి
ముక్కుని చాచి నుంచున్న కొంగల్లా మైకులు
ఎత్తైన గోడల గది నిండా
రకరకాల విదేశీ పెర్ఫ్యూముల రేగు పొదలు
ఎక్కడ కూచుంటావ్
చిట్టచివర వెనకాతల మూసీసిన
తలుపు నానుకుని నిలబడు.

ఎంత దూరంగా ఉంటే ఏం?
తెల్లని లాల్చీలోని ఆ చేతివేళ్ళు
సితార్‌ను మీటగానే నీకు అర్థమైపోతుంది
ఏ గుండె ఆరోగ్యం గురించి
ఆ కార్డియాలజీ ప్రొఫెసర్‌కి
ఎంత తెలుసునో ఏమో గానీ
ఈ కిక్కిరిసిన ఏకాంతంలో
నీ గుండె మాత్రం
ఆ సితార్ మీటే చేతులలో
ధా ఘే తిటకిట తకతిరికిటమని
కొట్టుకుంటూ క్షేమంగా ఉంటుందని

ఎవరికి వారు తన కోసమే ఈ ఆలాపన అనుకుంటూ
సాగుతూ రంగు రంగులుగా వస్తున్న స్వరాల్ని
ఆస్వాదించేస్తున్నారు చూడు
పీచుమిఠాయిని చప్పరించినట్లు
తీన్ తాల్‌లో భాగీశ్వరి
ఆనందం
అర్ణవమైతే-మునిగి
అంబరమైతే-తేలి
ఉన్నట్టుండి
మరుక్షణంలో పీక తెగి కింద పడి పోయే
కోళ్లలాగా…

ఏమిటి?
వాదనం ఎవరూ అందుకోలేని
వేగం పుంజుకుంది
వ్రేళ్ళు తీగల్ని మీటుతున్నాయా
తీగలే వచ్సి వ్రేళ్ళకు తగులుతున్నాయా
తబలా పూర్తిగా ఆగిపోయింది
బిర్ర బిగిసిపోయిన శ్రోతలు
వాదకుడి కపోలాల అశ్రుధారలు!
ఆయన ఎక్కడో చూస్తున్నాడు…

తను పుట్టిన కొద్ది రోజుల్లోనే
తన తల్లిని వదిలేసి
ఎవరినో చేసుకుని వెళ్లిపోయిన తండ్రి
స్వర్గంలో దేవుడి తోట ఈడెన్*లో
తన తల్లిని మళ్ళీ కన్నెగా కలుసుకున్న దృశ్యాన్ని-
తాను ఈ జీవితమంతా ఎదురుచూసిన కలయికని
చూస్తున్నాడా!

తల ఒంచుకుని
“సంగీతమే లేకపోతే బతుకు ఎంత పొరపాటయిపోయేది!”**
ఒప్పేసుకుని
తల తాటిస్తూ నిశ్శబ్దంగా
శౌచాలయం వైపు నడు!

(*ఈ కవిత కోసం ఈడెన్ స్వర్గంలో ఉన్నాదనే తీసుకున్నాను.
**Without music life would be a mistake. – Friedrich Nietzsche.)
--------------------------------------------------------
రచన: తఃతః, 
ఈమాట సౌజన్యంతో

Saturday, February 23, 2019

హృదయం ఇక్కడే వుంది!


హృదయం ఇక్కడే వుంది!




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి .....................

నిజానికది ఆహ్వానం కాదు. అర్ధింపు. ‘ఒకసారి రాగలవా? ప్లీజ్,’ అంటూ!

మళ్ళీ ఇన్నాళ్ళకి విహారి నుంచి మెసేజ్. తను ఇచ్చిన అడ్రస్ చూశాను. మా వూరికి కొంత దూరంగా వున్న ఖరీదైన గెస్ట్ హౌస్ అది. వింటమే కానీ నేనెప్పుడూ చూసే అవకాశం రాలేదు, ఇప్పటిదాకా. ఇంకేమీ అడగకుండా వెంటనే బయలుదేరాను.

అప్పుడూ అదే మెసేజ్. అదే వాక్యం. ఎన్నేళ్ళు తనని వెంటాడింది? ఎంత ఆర్ద్రత నింపుకున్న అక్షరాలని అవి! ఆనాడు గండి తెగిన తన గుండెకి నన్నొక ఆనకట్టగా భావించాడేమో? జీవన్మరణ సంధిలో తననొక రాయబారిగా పంపాలనుకున్నాడేమో?! ఆరిపోతున్న తన ప్రాణజ్యోతికి నేనొక ఆసరాగా నిలుస్తానని ఆశపడ్డాడేమో? ఆ తర్వాత కదూ తనకు తెలిసింది!

మనసంతా మళ్ళా అప్పటి విషాదం చుట్టుకుంటోంది. వర్షం కురవని కరిమబ్బవుతోంది.

వెంటనే తులసి గుర్తొచ్చింది. తలొంచుకుని భాషే రాని మూగ దానిలా నా ముందు నుంచుని కనిపించింది.

విహారి. ఆ చీకట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒంటరిగా ఎంతగా కుంగిపోతూ కనిపించాడు? మిన్ను విరిగి వెన్ను మీద పడ్డవానిలా తలొంచేసుకుని, రెండు భుజాలు కుదించేసుకుని… తనకిక పగలన్నది లేదు, మిగిలింది అమావాస్య మాత్రమే అన్న వైనాన శోకమూర్తిలా రైలెక్కి వెళ్ళిపోవడం… ఎంత చేదయిన జ్ఞాపకం!

ఆ ఆఖరి దృశ్యం కళ్ళ ముందు మెదిలినప్పుడల్లా అదంతా, ఇప్పుడే కళ్ళముందు జరుగుతున్నట్టుంటుంది. నా ఆలోచన్లతో ప్రమేయం లేకుండానే నా చేతుల్లో స్టీరింగ్ వీల్ కదులుతోంది.

‘ఒక్క సారి రాగలవా? ప్లీజ్!’ విహారి మెసేజ్ చూసి వెంటనే ఫోన్ చేశాను.

“ఏమైందీ విహారీ?” ఆందోళనగా అడిగాను.

అవతల్నించి ఒక సెకనుపాటు నిశ్శబ్దం. నా మనసుకెందుకో భయమేసింది. చాలా, భయమేసింది.

“విహారీ, అంతా బాగానే వుందా?” మెల్లగా అడిగాను.

అవతలనించి ఒక్కసారిగా దుఖం పెల్లుబుకింది. “లేదు, గీతా. ఏమీ బాగాలేదు. తను నన్నిలా ఒదిలేసి వెళ్ళిపోవడం ఏమీ బాగోలేదు. ఏం చేయాలో తోచడం లేదు. అడిగితే కారణమూ చెప్పటం లేదు. గీతా! నువ్వొక్క సారి వెళ్ళి తనతో మాట్లాడవా? తను లేకపొతే, నేను… నే…ను చచ్చిపోతానని చెప్పవా! ప్లీ…జ్!” అతికష్టంతో ఆగిన స్వరం. సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న వారికి మిగిలిన చిట్టచివరి ఆసరాలా వుంది ఆ అవస్థ. వింటున్న నాకు ఏమీ అర్ధం కాలేదు. అతని దీనావస్థకి కంగారుపడి నిలువునా నీరైపోతూ అడిగాను.

“అసలేమైంది విహారీ?”

“తులసి పెళ్ళి చేసుకుంటోంది గీతా! నన్ను కాదని వేరే అతన్ని…”

మాట పూర్తి చేయలేక, వెక్కిళ్ళని నొక్కిపెట్టుకుంటున్నా వినిపిస్తూనే వుంది నాకు స్పష్టంగా. అతని గుండె ఎంత ఏడుస్తోందో! నోట మాట రానిదాన్నయిపోయాను. ఏమని చెప్పి ఊరడిస్తానని? జీవితంలో మగాడికెలాటి కష్టమొచ్చినా ఓదార్చి, ఊరుకోబెట్టొచ్చు. కానీ ప్రేమలో ఘోరంగా విఫలమైన ఒక సున్నిత మనస్కుడికి కలిగే దుఖాన్ని ఊరడించడానికి మాత్రం ఎంత స్నేహమూ చాలదు. ప్రేమికుణ్ని నిలువునా దహించివేసే అగ్ని జ్వాల అది. ఆమాటకొస్తే, ఎవ్వరి వల్లా కూడా సాధ్యమయ్యే పని కాదు బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చడం.

ఒక గాయపడిన గుండెకి మందేమిటో, గాయం చేసిన వారికే తెలుస్తుంది. కానీ అప్పటికే, ఆ ఒక్కరు పిలుపందుకోలేని దూరంలో వుండిపోతారు. ‘కాలిన శవంలా బ్రతకడకొమొకటే మిగిలింది చెలీ, నువ్ రగిల్చి వెళ్ళిన ప్రేమాగ్నిలో’ అని అంటాడు ఒక కవి.

అప్పటికే నా మెదడు పనిచేయడం ఆగిపోయి చాలా సేపయింది. అందుకు రెండు కారణాలు. ఒకటి – తులసిపై నా అనుమానం నిజమైనందుకు. రెండు – విహారి ఇంత బేలవాడైపోతాడని అనుకోనందుకు.

ఎవరికైనా, పగిలే దాకా తెలుస్తుందా, హృదయం అద్దమని?

కాంపస్‌లో అతని కళ్ళు తులసి కోసం వెదుకుతున్నప్పుడు గమనిస్తుండే దాన్ని. చూపందనంత దూరం నించి ఒక చిన్న చుక్కలా కదలి వస్తున్నా, ఆ బిందువు తులసి అని ఇట్టే గుర్తుపట్టేసేవాడు. అతనికంత ప్రేమ! ఆ సంగతి అతనెప్పుడూ నోటితో చెప్పేవాడు కాడు. కాని, ఆ కళ్ళల్లోంచి పుట్టుకొచ్చే కాంతి, ఆమె దగ్గరౌతున్న కొద్దీ ముఖమంతా కమ్ముకునేది. చూపుల కాంతులే దీపాలు, ఆశల ఊపిరులే నీకై పూజించే పుష్పాలు. నా ధ్యానం నీ కోసం. నా ప్రాణం నీతో జీవించడం కోసం… – ఒకసారి కవిత రాశానంటూ మా ఇద్దరికి చదివి వినిపించాడు.

తులసి మాత్రం మామూలుగా వినేది. పట్టరాని సంతోషం, ఆశ్చర్యం వంటి భావాలు ముఖంలో కనిపించేవి కావు. బిడియం వల్ల కావచ్చు. కానీ, అతనంటే ఆమెకి ఓ ప్రత్యేకమైన ఇష్టం వుందన్న సంగతిని మాత్రం నా నించి దాచలేకపోయింది. బహుశా నాపైన నమ్మకం కావచ్చు. ఇలాటి కథలు కడుపులో పెట్టుకుని కాపాడేందుకో మనిషి కావాలి ఏ రహస్యమైన ప్రేమ కైనా! ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు అలకల తగవులొచ్చినప్పుడు – కారణాలు చెప్పుకునే తడిక పాత్ర పోషణకి ఒక మనసున్న మనిషి చాలా అవసరం కదా మరి.

ముగ్గురం స్నేహితులమే అయినా నాకు వారిద్దరితో ఉన్న బంధం కంటే వేరొక రకమైన బంధం వారిద్దరి మధ్య అని తెలిసిపోతూనే ఉండేది. అందుకే వాళ్ళు మాట్లాడుకోవడం కోసం, బీచ్ కెళ్ళినా, పార్క్ కెళ్ళినా కొంచెం పక్కకి తప్పుకుంటూ వుండేదాన్ని, నా బుక్స్ లోనో, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నాకు నచ్చిన పాటల్లోనో దాగిపోతూ. వెళ్ళడం ముగ్గురం కలిసే అయినా, జంటగా మాత్రం వాళ్ళిద్దరూ కలిసి షికార్లు కొట్టేవాళ్ళు. ఏదో విలువైనది వెతుక్కోవడం కోసం వెళ్తున్నట్టుండేది వాళ్ళిద్దరూ కలిసి నడిచే విధానం! సముద్రం తీరం వెంట మాట్లాడుకుంటూ, మాట్లాడుకుంటూ అలా పోతూ వుండేవారు. మధ్యమధ్యలో అతను వొంగి, రంగు రాళ్ళనో అరుదైన శంఖాలనో ఏరి ఆమెకిస్తుండేవాడు. ఆమె వాటిని అపురూపంగా అందుకుని, పరిశీలిస్తూ ఆగిపోయేది. కొన్ని క్షణాల్లో తిరిగి నడక సాగించే వాళ్ళు. ప్రేమించుకునే వాళ్ళకి వాళ్ళది మాత్రమే ఒక లోకంగా తోస్తుంది. నా ముందు దాచుకునేవారూ కాదు, అలా అని పైకి చూపించేవారూ కాదు.

నాకు నవ్వొచ్చేది ఈ జంటనిలా చూసినప్పుడల్లా. తాగిన వాని చేష్టలు తాగని వారికి వినోదం అయినట్టు. ఇద్దరూ స్నేహితులే, ఆప్తులే. ఆనందంగానూ ఉండేది. నేనిక్కడ వెనక్కి వాలి, ఇసుకలో చేతులు ముంచి, వెనక నించి ఆ వాళ్ళను అలా చూస్తుండేదాన్ని. గవ్వలేరుకునే ఈ మాత్రం సరదాకి అంతదూరం… నడచి నడచి పడి పోవాలా? కాదు. అప్పటి దాకా కాస్త దూరం దూరంగా నడుస్తున్న ఆ ఆకారాలు మెల్లమెల్లగా దగ్గరకి జరిగేవి. అతని చేయి మెల్లగా ఆమె చేతినందుకునేది. ఆమె తల అతని భుజం మీద వాలేది. పడమటి సూర్యుడు వాళ్ళిద్దరి మీంచి జారిపోతూ చేయి తిరిగిన చిత్రకారుని చేతిలోంచి జారిన రెండు వొంపుల గీతల్లా మార్చేవాడు ఇద్దరినీ.

హబ్బ! ఎంత బావున్నారీ జంట, లైలా మజ్ఞూల్లా!

ఒకసారి ఇలానే, ఓ సాయంత్రం బీచ్ కెళ్ళినప్పుడు – వాళ్ళకి తెలీకుండా ఫోటో తీసి చూపించాను. విహారి ముఖం వెలిగిపోయింది. తులసి మాత్రం కంగారు పడింది. ఎందుకు ఇదంతా? అంటూ కోపగించుకుంది. ఆ కళ్ళల్లో ఆనందానికి బదులు ఆందోళన చోటు చేసుకోవడం ఆశ్చర్యమేసింది. నన్ను ఆలోచనలో పడేసింది.

ప్రేమ అనేది ఒక తీపి పదార్ధం. ఇద్దరిలో ఎవరిష్టపడకున్నా, అది చేదైపోవడం ఖాయం. తులసికి అతనంటే వుండే ఇష్టంలో ఏదో తేడా వుందనిపిస్తోంది. ఊహుఁ, కాదు. అలా అయివుండదు. ఆమెని అర్ధం చేసుకోవడంలో నేనే పొరబడ్డానేమో? నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఆ తర్వాత మరి కొన్ని సందర్భాలలో మరింత పట్టుబడింది. తల మీద అప్పుడే తీగలెత్తుకుంటున్న లేత మొలక తులసి. దగ్గరగా ఏ ఆధారం దొరికినా చాలేమో అల్లుకోడానికి. కానీ, విహారి అలా కాదు. చాలా స్థిరమైన గట్టి గుంజ లాంటి వాడు. తనచుట్టూ అల్లుకున్న తీగని పందిరిగా చేసుకుని బ్రతుకుదామని కలలు కంటున్న వాడు.

అందరిలో వున్నప్పుడు – అతనితో టచ్ మీ నాట్‌లా ఏమీ ఎరగనట్టుండే తులసి, ఎవరూ లేనప్పుడు అతనితో మమేకమై కబుర్లు చెప్పే తులసి, ఒక్కరు కాదనే నిజాన్ని నేనెప్పుడూ పైకి చెప్పే సాహసం చేయలేకపోయాను. కనీసం ప్రయత్నమైనా చేయలేదు. అదే నే చేసిన పెద్ద తప్పేమో విహారి విషయంలో. కనీసం ఒక హింట్ అయినా ఇచ్చి వుంటే అతను కొంత వరకు జాగ్రత్త పడేవాడేమో? తులసి కళ్ళలో కనపడే ప్రేమ ఎంత నిజమైందో నాకూ తెలుసు, చెప్పలేక పోయాను, అందుకేనేమో.

అనుకుంటాం కానీ, అసలు ప్రేమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, కొందరి హెచ్చరికలు, మరి కొన్ని సూచనలు సలహాలు చూసి, చదివి, విని భద్రకవచాలు ధరించి ప్రేమలో పడతారా ఎవరైనా? అసలా మాటకొస్తే, ఈత రాని వాడు నీళ్ళలోకి దూకితేనే ఈది ఒడ్డుచేరతాడట. వలపు ఈదులాటా అంతే. ప్రేమలో విఫలమైన వాడు ఆ మునకలో మరణించడానికైనా సిద్ధపడతాడు కానీ, ప్రాణాల కోసం ఒడ్డున పడదాం అని అనుకోడు. అలాటి మానసిక స్థితిలోని ప్రేమికునికి ఈత వచ్చినా దండగే కదూ? ఖుస్రో అన్నట్టు దరియా ప్రేమ్ కా ఉల్టీ వా కీ ధార్, జో ఉతరా సో డూబ్ గయా, జో డూబా సో పార్. నాలో నేనే విశ్లేషించుకుంటూ నన్ను నేను సమాధానపర్చుకునే ప్రయత్నం చేశాను.

ఏదైనా కాని, ఇది వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయం. ఎంత స్నేహితులమైనా నా జోక్యం కొన్ని విషయాలలో తగదు. అందుకని వాళ్ళని ఏ రకంగానూ ఏమీ అనకుండా నా దూరం నేను పాటిస్తూనే వచ్చాను.

కానీ ఇప్పుడు విహారి బాధ చూసి నా మనసు భగ్గుమంది. కోపం హద్దులు దాటింది. వెంటనే ఉన్నదాన్ని వున్నట్టు బయల్దేరాను. పట్టలేని కోపంతో ఆఘమేఘాల మీద తులసి ఇంటికెళ్ళాను. లాక్కెళ్ళి విహారి కాళ్ళ మీద పడేయాలన్నంత ఉద్వేగంతో బయల్దేరాను. ఎందుకంటే – ఆ అమాయకుడికి, ఆ ఆరాధకుడికి జరుగుతున్న అన్యాయానికి ఏకైక బాధ్యురాలు తులసి అన్న సంగతి నాకొక్కదానికి మాత్రమే తెలుసు కాబట్టి.

గేట్ తీసుకుని ఇంట్లోకడుగు పెడుతుంటే ఎదురొచ్చింది. అప్పటి దాకా అణచిపెట్టుకున్న ఆవేశమంతా ఇక ఆగనంటూ ఉప్పెనలా ఉరికింది కంఠంలోకి.

“ఏమిటీ, విహారిని వొదిలేసి, వేరే పెళ్ళి చేసుకుంటున్నావా?” రొప్పుతూ అడిగేశాను.

“హుష్!” అంటూ అటు ఇటు చూసింది, భయం భయంగా. నన్ను చేయి పట్టుకుని తన గదిలోకి త్వరత్వరగా లాక్కుపోయి, తలుపులు మూసేసింది. మనిషి నిలువునా వొణికిపోతోంది పట్టరాని భయంతో.

రూమ్ అంతా చిందరవందరగా వుంది.

“గీతా, ప్లీజ్! గట్టిగా మాట్లాడకు. నాకు పెళ్ళని బయట ఎవ్వరికీ తెలీదు. మా వాళ్ళు చెప్పొద్దన్నారు. విహారికి మాత్రమే చెప్పాను. చెప్పకుండా ఉండలేకపోయాను. నాకు తప్పలేదు,” అంటూ కళ్ళు వాల్చుకుంది.

“అది అడగడానికే వచ్చాను. ఎందుకు? ఎందుకిలా?”

“హుష్! మెల్లగా, మెల్లగా మాట్లాడు. మా అమ్మ వింటే అఘాయిత్యం చేస్తుంది,” అంది లోగొంతుకలో.

గొంతు తగ్గించి మళ్ళీ అదే ప్రశ్న వేశాను సూటిగా. తలొంచుకుని చెప్పింది. “మేము బ్రాహ్మలం. మా వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు.”

“ఓహో! అలానా? మరి నీకాసంగతి అతనితో కలిసి బీచ్‌ల వెంబడి షికార్లు కొట్టేటప్పుడు తెలీలేదా?”

“తెలుసు.”

షాక్ అయ్యాను ఆ జవాబుకి. “తెలిసీ ఎందుకు ప్రేమించావ్?” వెంటనే అడిగాను.

“అతన్ని కాదనుకోలేకపోయాను.”

నాకు మాట పడిపోయింది. నేననుకున్నంత తెలివి తక్కువది కాదు తులసి. జీవితంలో ఏ పరిస్థితిలో ఏ ఎమోషన్ ఎంత శాతంలో వుంటే ఆనందంగా ఉండవచ్చో తెలిసిన సిద్ధాంతినిలా కనిపించింది నాకా క్షణంలో. మన సంతోషం కోసం మనుషులతో ఆడుకోవచ్చు. కానీ, మనసులతో కాదు కదా?

“ప్రేమంటే ఏవిటో తెలుసుకున్నావు కదా, మరి సొంతం చేసుకోవాలనిపించలేదా ఆ ప్రేమని?” కోపంగా అడిగాను.

“అనిపించకుండా ఎలా వుంటుంది గీతా? అతనితో తిరుగుతున్నానని ఎలా తెలిసిందో ఏమో మా నాన్నకి. చచ్చేలా బాదాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గదిలోకెళ్ళి తలుపులు మూసుకున్నాడు. అమ్మ నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. ఇల్లు నరకమవడానికి కారణమయ్యానని అన్నయ్య నన్ను దోషిని చేశాడు. బామ్మ కర్మఫలాన్ని బోధించింది.” విరాగినిలా చెప్పింది.

“కుటుంబం కోసం ప్రేమని త్యాగం చేశానంటావ్? మరి నీకోసం ఏకధారగా ఏడుస్తున్న విహారినేం చేయాలనుకుంటున్నావ్?”

“అతనికి వీడ్కోలు చెప్పేశాను గీతా. ఇక చెప్పాల్సిందేమీ లేదు.”

ఏం జరిగినా తనకెలాటి బాధ్యతా లేదు అని ఖచ్చితంగా చెప్పకనే చెబుతోంది పరోక్షంగా. తులసిలో కొత్త మనిషిని చూస్తున్నా. పరిస్థితులు మనిషికి మాటలు నేర్పిస్తాయి. అవసరమైతే ఎదురువాదం చేయమంటాయి. బతక నేర్చే ఒక పక్క మార్గాన్ని సృష్టిస్తాయి. అసలు మనిషిని తయారు చేసేది పరిస్థితులే. నాకర్ధం కాని పాయింట్ ఒకటే. సముద్రంలో పడి తేలుతున్న వాడికి ప్రయాణిస్తున్న పడవే కదా ఆధారం? మరి తులసేమిటీ, తన పడవతో బాటు నావికుణ్ణి కూడా ముంచేస్తూ ఇంత పిచ్చి పని చేస్తోంది? తలెత్తి నేనామె వైపు చూడబోయాను. అప్పటికే ఆమె అటువైపుకు తిరిగి నించుంది. ఆమెని తీసుకెళ్దామని వచ్చాను కానీ, ఈమె వైనం అందుకు పూర్తి భిన్నంగా వుందన్న సంగతి అర్ధమైపోయింది. మనిషినైతే బంధించి తీసుకెళ్ళొచ్చు. కానీ లేని హృదయాన్ని ఏ గుప్పిట్లో పట్టి తీసుకెళ్ళగలం? ఆఖరు ప్రయత్నంగా అడగాలి కాబట్టి అడిగాను.

“నువ్వు లేకుండా బ్రతకలేనంటున్న విహారికి ఏం చెప్పమంటావ్, చివ…?”

నా మాట పూర్తి కాకముందే అందుకుంది. “జీవితంలో ఇంకెప్పుడూ కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పు. తను నాకు ఈ ఒక్క సహాయం చేస్తే చాలని చెప్పు. ఇదొక్కటే నా చివరి మాటగా చెప్పు చాలు.” మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో ఎలాటి జీర వినిపించలేదు. చివరి నిర్ణయాన్ని ఎంతో స్థిరంగా చెప్పింది. ఇక మార్చుకునే ప్రసక్తి ఎక్కడిది? లేదు. నిరాశ ముంచెత్తింది నన్ను.

కొంతమందికి బ్రతకడమే ముఖ్యం. ఎలా అయినా పెద్ద పట్టింపు వుండదు. శరీరం కదులుతుంటే చాలు. మనసు మొద్దు బారినా ఫర్వాలేదు. ఆత్మని నొక్కేశాక, ఇక అంతరాత్మలతో పనేముంటుంది?

నేనక్కణ్ణించి నిశ్శబ్దంగా బయటకొచ్చేశాను. విహారి వుంటున్న హాస్టల్ దాకా ఎలా చేరానో నాకే తెలీదు. తులసి ఏమంది? అని ఆశగా అడిగే విహారికి జవాబు ఏం చెప్పాలన్న బాధ నన్ను నన్నుగా నిలవనీడం లేదు. హాస్టల్ ముందు గుంపులు గుంపులుగా జనం. ఆంబ్యులెన్స్ లైట్లు. పారామెడిక్స్ కారిడార్ ఆ మూల నించి స్ట్రెచర్ తోసుకుంటూ వస్తున్నారు. శివ కనిపించాడు ఇంతలో.

“గీతా, విహారి పాయిజన్ తాగాడు. బ్రతికే ఛాన్స్ లేదంటున్నారు.” కళ్ళనీళ్ళ ధారలు తన చెంపలపై.

అనుమానం భయమై నిజమయింది. దేవుడా, ఇంకేమిటి ఇప్పుడు చేయడం?

పోలీస్ విజిల్స్, అంబులెన్స్ సైరన్, అరుపులు, కేకలు, అడుగుల చప్పుళ్ళు… చలనం లేని రాయిలా నేను.

గీతా! నువ్వొక్క సారి వెళ్ళి తనతో మాట్లాడవా… తను లేకపొతే, నేను… నే…ను చచ్చిపోతానని చెప్పవా! ప్లీ…జ్”

రెండు చేతుల్లో ముఖం దాచుకుని కూలిపోయాను. దుఃఖం ఆగలేదిక.

“గీతా…”

ఎంతో ఆర్ద్రంగా వుందా పిలుపు. నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ చెప్పాడు విహారి.

“నీకెలా థాంక్స్ చెప్పాలో తెలీడం లేదు గీతా! నువ్వు చేసిన సేవలు, నీ సహాయం మరచిపోలేను. ఈ జన్మంతా గుర్తుంచుకుంటాను. నువ్వన్నట్టు నేనీ వూరు మారాలి. నేనూ మారాలి. అన్నిటికంటే ముఖ్యంగా గుండె మార్పిడి జరగాలి.” గుండె మీద చేయుంచుకుంటూ అంటున్నప్పుడు అతని కళ్ళల్లోకి చూడలేకపోయాను. అవి, వర్షిస్తుంటే!

అతని స్నేహితులు గుంపుగా వచ్చారు. అందరి దగ్గరా సెలవు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. యుధ్ధంలో ఘోరంగా పోరాడి పరాజయం పొందిన వాడిలా, మిన్ను విరిగి వెన్ను మీద పడ్డవానిలా తలొంచేసుకుని, రెండు భుజాలు కుదించేసుకుని… తనకిక పగలన్నది లేదు మిగిలింది అమావాస్య అన్నట్టు… శోకమూర్తిలా రైలెక్కి వెళ్ళిపోయాడు.
ఇంటికొచ్చి లోపలకెళ్ళ బుద్ధి కాక, బయట గార్డెన్ చెయిర్లో కూర్చుని ఆలోచిస్తున్నా, ఏవిటీ, ఇలా ఎందుకు జరిగింది అనుకుంటూ!

ఇంతలో తులసి పరుగు పరుగున వచ్చి నా ముందు నించుంది. నేనేం మాట్లాడలేదు. నిర్లిప్తంగా చూశానామె వైపు. ఛటాల్న కూలబడిపోయింది మోకాళ్ళ మీద. ఆ మరుక్షణమే నా వొళ్ళో ముఖం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగింది.

అప్రయత్నంగా నా చేయి – ఆమె తల నిమిరింది.

నిజానికి ఇద్దరూ నా స్నేహితులే. ఎవర్ని ద్వేషించగలను. ఎవరిది తప్పని నిందించగలను.

ఇంకా ఏడుస్తూనే వుంది తులసి.

దేనికోసమని? విహారి బ్రతికినందుకా? లేక ఆమె కోరినట్టు బ్రతికున్నంత కాలమూ రాకుండా పంపించేసినందుకా?

పిచ్చి మనసు. కారణం తెలుసుకుని ఏడ్వటం దానికెప్పుడొస్తుందనీ? నాకూ చెప్పలేనంత బాధగా వుంది.

కాలమే అన్ని ప్రశ్నలకీ జవాబు. అంతే కాదు, అన్ని బాధలకూ అదే ఓదార్పు.

మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి! విహారి రావడం, రమ్మని కబురంపడం నాకు చాలా ఆనందంగా వుంది. అంతకు మించి చిత్రం గానూ వుంది.

ఇప్పుడెలా వుంటాడు? అతనెలా ఉంటాడో ఊహించ ప్రయత్నించినా ఆ విహారే కళ్ళముందు నిలుస్తున్నాడు.

నాకోసమే చూస్తున్న విహారి నవ్వుతూ ఎదురొచ్చాడు. గీతా! అంటూ. దగ్గరకొచ్చి హగ్ చేసుకున్నాడు. “హౌ ఆర్యూ మై ఫ్రెండ్?” అంటూ ఆత్మీయంగా పలకరించాడు. ఆ కళ్లు స్వచ్చంగా నవ్వుతున్నాయి అప్పట్లాగే. మనిషిలో మార్పేమీ లేదు, కొద్దిగా చెంపల దగ్గర తెల్లబడుతున్న జుట్టు తప్ప. మనిషికి గొప్ప హోదానిచ్చేవి నిజానికి సిరిసంపదలు కావు. మంచితనం, హృదయమున్నతనం, ఎనలేని హుందా ఆపాదించి పెడతాయనుకుంటా.

విహారి! నే బ్రతికించిన విహారి! కొత్త జీవితాన్నెంచుకుని హాయిగా వున్నాడు. నాక్కావాల్సిందీ అదే. ఇన్నేళ్ళూ విహారిని అస్సలు కలవకపోవడానికి గల ప్రధాన కారణమూ ఇదే. అతని సంతోషాన్ని ఆ జ్ఞాపకాలు హరించకూడదనే! అతన్ని దూరంగా వెళ్ళమని సలహా ఇచ్చి, తను మాటిమాటికీ దగ్గరై మాట్లాడ్డానికి కాదు కదా.

“ఎలా వున్నావ్ విహారీ?” అంటూ మాటల్లోకి తీసికెళ్ళాను.

అతను గడ గడా మాట్లాడేస్తున్నాడు. తన గురించి, తను చేస్తున్న బిజినెస్ గురించీ, హైదరాబాద్లో వాళ్ళబ్బాయి సాఫ్ట్ వేర్ కంపెనీ గురించి, వాళ్ళమ్మాయి ఫేషన్ డిజైనింగ్‌లో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతుల గురించి, వాళ్ళావిడ గురించి… మాట్లాడుతున్నాడు.

నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. వింటున్న నాకెందుకో సందేహమొచ్చింది. విహారి ఏం మాట్లాడుతున్నాడూ అని? మాటల వెనక దాస్తున్న మనసు అతని ముఖం లోంచి అప్పుడప్పుడు తొంగి చూడటం గమనించా. సంభాషణ పొడిగింపు కోసమన్నట్టు నా గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. నిజానికి శ్రధ్ధ పెట్టడం లేదని తెలుస్తోనే వుంది. పరాకుగా ఊఁ, ఊఁ, గుడ్, గుడ్,’ అంటూ ఆగిపోవడంతో.

మాటల్లో తనే చెప్పాడు. ఆంధ్రాకి పని మీదొచ్చినట్టు, ముఖ్యంగా నన్ను కూడా కలిసినట్టుంటుందని. మరుసటి ఉదయం ఫ్లయిట్‌లో వెళ్ళిపోతున్నట్టు చెప్పాడు.

“ఓహో. అలానా! నా నెంబర్ ఎలా తెలిసింది నీకు?” అడిగాను గబుక్కున గుర్తొచ్చి.

“నాకు అన్నీ తెలుస్తూనే వుంటాయి గీతా. ప్రభాకర్ని కాంటాక్ట్‌లో వుంచుకున్నాను…” అంటూ ఆగాడు ఏదో అడగబోతూ.

నేనేమీ చెప్పదలచుకోలేదు. తెలిసినా సరే. అతనికిష్టమైన గాయం తులసి అని నాకు తెలుసు. అతను బ్రతకాలంటే – ఆ గాయం మానకపోయినా ఫర్వాలేదు. మరింత రేగ కూడదనేది నా ఉద్దేశం.

కుర్చీ లోంచి లేచి చేతివేళ్ళతో జుట్టు సరిచేసుకుంటూ తడబడుతూ అన్నాడు, మెల్లని స్వరంతో. “గీతా! నన్ను కోప్పడనంటే నిన్నొక మాటడుగుతాను చెబుతావా?”

“ఏవిటీ?” అన్నాను సంకోచంగా.

“అదే, తులసి భర్త…” అంటూ ఆగిపోయాడు.

“అవును. పోయాడు.” తొణక్కుండా చెప్పాను.

అతను గబుక్కున నా చేతులు పట్టుకున్నాడు. “గీతా, ఒక్కసారి ఒక్క సారి తులసిని చూడాలనుంది. ఎంత బాధలో వుందో కదూ?” అతని కళ్ళనిండా కన్నీళ్ళు. ప్రేమతో నిండిన కన్నీళ్ళు. ఎంత పిచ్చి ప్రేమ! ఆమె పట్ల ఎంత దయ ఇతనికిప్పటికీ? చూడలన్న ఎంత కాంక్ష?

అప్రయత్నంగానే నా కళ్ళలోనూ నీళ్ళు నిండాయి. ఇప్పుడర్ధమైంది. విహారి ఈ వూరెందుకొచ్చాడో. ఎవర్ని వెతుక్కుంటూ వచ్చాడో.

అంతా అర్ధమైన దానిలా తలూపుతూ, “సరే. తులసికి చెబుతాను. సరేనా?” అన్నాను, బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ.

అతని కళ్ళు అప్పట్లానే మెరిశాయి. “థాంక్స్ గీతా.” చెప్పాడు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.

తిరిగి వొచ్చేస్తుంటే మనసుకేమీ తోచనట్టు అయింది. ఇంతగా ప్రేమించే మనుషులుంటారా, ఈ కాలంలో కూడా. ఆశ్చర్యం! ప్రేమకి అంత శక్తి వుంటుందా? ప్రేమించిన మనిషిని ఒక జన్మంతా గుర్తుకుంచుకునేంత హృదయం ఎక్కడైనా వుంటుందా? ఒక్క సారైనా ఆమెని చూడాలని, పలకరించాలనీ అసలిదెలా సాధ్యం? విహారి వంటి బ్రిలియంట్ ఇంత బేలగా అయిపోవడమేమిటీ?

ఒక పక్కన సంసారం పిల్లలు సమాజం పరువు ప్రతిష్టలు ఇన్నున్నా మరో వైపు ఆ గతం, ఆ జ్ఞాపకం అలానే వున్నాయా మనిషితో బాటు తామూ వెంట తిరుగుతున్నాయా ఇన్నాళ్లూ? అంటే మనిషి వేరు. మనసు వేరా? అతను నవ్వుతూ బ్రతుకుతోంది నిజమైన మనసుతో కాదా?

ఏమో. ఇప్పుడు నేను చేయాల్సిన పని? ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తులసి ఇంటికి ఎందుకు వెళ్ళానో ఇప్పుడు మళ్ళీ అందుకే వెళ్ళాలి. తను విషయం చెప్పేలోగా ఆమె ‘హుష్’ అంటూ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి ఏడుస్తుంది. పిల్లలు వింటే పరువు పోతుందని. కోడలు చూస్తే జీవితమే నాశనమైపోతుందని, కొడుకు ఛీ కొడ్తాడని కారణాలు చెబుతుంది.

‘విహారికేం చెప్పమంటావ్’ అని అడుగుతాను. అప్పుడు చెప్పిన మాటే ఇప్పుడూ చెప్తుంది. కారణాలు మాత్రమే వేరు.

నేను బాధపడుతూ విహారి దగ్గరకొచ్చి చెప్తాను. అతను ఆ రాత్రి లాగానే తలదించుకుని వెళ్ళిపోతాడు. కొత్తగా రేగిన గాయం ఈసారి మానదు. అదే సన్నివేశం పునరావృతం అవుతుంది. నిర్ణయం మార్చుకుని, కారుని ఇంటి వైపుకి మళ్ళించాను.

నిస్త్రాణగా బ్యాగ్ ఇంట్లో పడేసి బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేక, అలానే మొక్కల మధ్య కుర్చీలో కూర్చుని టీ తాగుతున్నాను. ఉక్కపోత, మబ్బులు కమ్ముకుంటున్నాయి. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. విహారి ఎదురు చూస్తుంటాడేమో, నేను చేసింది తప్పేమో, స్నేహితుడి కోసం ఇంకొక్క సారి తులసిని అడిగివుండాల్సిందేమో… లేదు లేదు. ఇద్దరూ స్నేహితులే, కానీ తాను కాపాడవలసింది ముందు విహారిని. తులసికి ఆ అవసరం లేదు. నా నిర్ణయం సరైనదే.

చినుకులు పడడంతో వరండాలోకి వచ్చి కూర్చున్నాను. ఇంతలో పరుగు పరుగున మెరుపులా వచ్చింది తులసి. వచ్చి, నా కుర్చీ పక్కన రొప్పుతూ నిలబడింది. నేనామె వైపు నిర్లిప్తంగా చూశాను.

మనిషంతా కంపించిపోతూ వొణుకుతున్న పెదాలతో అడిగింది. “విహారి వచ్చాడటగా? నువ్వెళ్ళి కలిసొచ్చావట?” ఆ కంఠంలో ఎప్పుడూ లేని ఆత్రం వినిపించింది. నేనిన్నాళ్ళూ వినని ఒక కొత్త గొంతు వింటున్నాను.

“అవును వచ్చాడు. ఏం?” సూటిగా చూశాను.

ముఖాన్ని గుండెల దాకా వొంచుకుంది. “ఒక్కసారి కలవనా?” అంది ఎంతో ఆశగా. నేను విస్తుపోయాను.

“ఏం, ఎందుకు?”

“ఎందుకో చెప్పలేను. అలా అని ఇంక దాచుకోనూ లేను. ఇప్పుడిక ఏమీ మారదు, ఏ ప్రయోజనమూ లేదు. కానీ ప్లీజ్ గీతా… విహారిని ఒక్కసారైనా కలవాలి”

రాళ్ళను కరిగించే దైన్యం ఆ గొంతులో. ఇన్నేళ్ళుగా తనను తాను అసహాయతతో నిర్దయగా హింసించుకున్న ప్రాణి ఆఖరుసారి ఆశపడుతున్న గొంతు అది.

ఆశ్చర్యం. తులసిలో కూడా ఇంత క్షోభ దాగి ఉందా?

కన్నీళ్ళాగడం లేదు.

గేటు చప్పుడైతే తల తిప్పి చూశాను.

వర్షంలో తడుస్తూ విహారి లోపలికి వస్తున్నాడు.

అతనికెలా తెలిసిందీ?
--------------------------------------------------------
రచన: ఆర్. దమయంతి, 
ఈమాట సౌజన్యంతో

Friday, February 22, 2019

నిర్నిమిత్తం


నిర్నిమిత్తం




సాహితీమిత్రులారా!


ఈ కవితను ఆస్వాదించండి.............

ఏళ్ల కొద్దీ ఎదురుచూసిన మాట
గడప దాటకుండానే
లెక్కలేసుకుని
మురిపెంగా అంటుంది: “నువ్వంటే ఇష్టం.”

అక్కడెవరో ఉన్నారనుకుని కిటికీ తెరలు రెపరెపలాడుతాయి
ఎవరూ ఉండరు
కాసింత గాలిని ఒక్కో మడతలో చిక్కించుకుని మెల్లగా సర్దుకుంటాయవి

కొన్ని మాటలంతే
మరీ ఆలస్యంగా నన్ను అందుకోవాలని చూస్తాయి

అనుభవించినదీ అనుభూతించినదీ నిరర్థకమని అణువణువూ వణికిపోతుంది
అంతలోనే, హఠాత్తుగా, ఎందుకో నవ్వొస్తుంది
పోన్లెద్దూ అనిపిస్తుంది
ఇక చాలనిపిస్తుంది!

తెరల సంగతి సరే, మరి నేను?
నేనా?
నేనొక ముద్దగన్నేరు పువ్వును!
ఇటువైపు వచ్చినవాళ్లు
సీతాకోకలై సేదతీరుతారో, పిచ్చుకలై పీక్కుతింటారో ఎవరికి తెలుసు?

ఇంత జరిగాక తెలుసుకున్నది
కాసేపు విరబూసి
వెళ్లిపోవడమే!
--------------------------------------------------------
రచన: మమత, 
ఈమాట సౌజన్యంతో

Thursday, February 21, 2019

తెలిసీ పలికిన విలువేమో!


తెలిసీ పలికిన విలువేమో!



సాహితీమిత్రులారా!


ఈ కథను ఆస్వాదించండి...................

“శ్రీ గురుభ్యోన్నమః” నాటకీయంగా అంటూ ఇంట్లోకి వచ్చాడు భాస్కర్.

“సమస్త సన్మంగళాని భవంతు” అని ఉషశ్రీ ఫక్కీలో అతన్ని ఆశీర్వదించాను.

భాస్కర్ మా అల్లుడు శరత్‌కన్నా నాలుగయిదేళ్ళు పెద్ద. మా ఎపార్ట్‌మెంట్ కాంప్లెక్సులోనే వుంటాడు. నేనేం చెప్పినా, “పెద్దల మాట” అనుకుంటూ వింటూంటాడనుకుంటాను. ఒంటరిగా వుండే నాకు అతను అప్పుడప్పుడూ రావడం మంచి కాలక్షేపాన్ని కలుగజేస్తుంది. ఆ రోజు ఎందుకో మూడీగా వున్నాడనిపించింది.

“ఏమిటయ్యా అలా వున్నావ్?” అడిగాను.

“భార్యా రూపవతీ శత్రుః అని పెద్దవాళ్ళు నా గూర్చే అన్నారనిపిస్తుందండీ” అన్నాడు.

భాస్కర్ భార్య అందంగా వుంటుంది. వయసు ఆమె అందాన్ని ఇనుమడింప జేసిందనే చెప్పుకోవచ్చు. ఆమె ఎదురుగా వస్తుంటే చూపులు తిప్పుకోవడం కొంచెం కష్టం, నా వయసు వాడిక్కూడా. పధ్ధెనిమిదేళ్ళ కూతురు పక్కన ఆమె నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్ళనుకుంటారు తెలియని వాళ్ళు.

“ఇవాళ్ళ ప్రత్యేకంగా ఏమయింది?”

“ఇంటి సందులోకి తిరిగి, నడిచి వస్తుంటే పట్టుమని పదిహేనేళ్ళు కూడా లేని మగపిల్లలు – జులాయి వెధవలు – మాట్లాడుకుంటున్నారు. ఇవాళ్ళ ఆంటీ ఏం జాకెట్టేసిందిరా! ఆ వీపు మీద సెవెంటీ ఎమ్మెం సినిమా వెయ్యొచ్చు అని ఒకడంటే, రెండోవాడు, సరేలే, మొన్నీమధ్య వేసిన జాకెట్టయితే, ముందునించీ చూసేను, గుండెలదర కొట్టేసిందీ అంటున్నాడు. వాళ్ళకి నేను ఆ ఆంటీ మొగుణ్ణని తెలిసి వుండే అలా అన్నారని నా నమ్మకం. మామూలుగా అయితే సందులో ఎప్పుడూ నడిచే అలవాటు లేదు కాబట్టి, అలాంటి వ్యాఖ్యానాలు నా దాకా రాలేదు. ఇవాళ్ళ కారు రిపేరుకివ్వడం, సందులో నడిచి రావడం వల్ల ఆ మాటలు నా చెవినపడ్డాయి. రోజూ వాళ్ళేకాక ఇంకా ఎంతమంది ఇలా మాట్లాడుకుంటారోనని అనుకుంటే గుండె బద్దలవుతోంది. ఆ సినిమావాళ్ళు వేసుకునేలాంటి జాకెట్లు నీకొద్దే అంటే వినదు. ఆఖరికి పూజలు వ్రతాలు జరుగుతున్న చోట్లక్కూడా వేసుకొస్తుంది.” అన్నాడు.

రోజూ బాల్కనీలో గంటలు గంటలు కూర్చుంటాను కాబట్టీ, అక్కణ్ణించీ నాకు సందు చివరిదాకా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టీ ఆ ఆంటీ అతని భార్యే అని నాకూ తెలుసు. మరీ మరీ చూడాలనిపించే ఆ చెంపకు చేరడేసి కళ్ళు. నవ్వితే సొట్టపడే బుగ్గలు. పెదవులమీద మొదలై కళ్ళల్లో ప్రతిఫలిస్తూ నవ్వుకే నిర్వచన మనిపించే ఆ పెదవుల వంపు. భార్య అందం రోజురోజుకీ ఇనుమడిస్తుంటే ఇతనికి తనమీద తనకి నమ్మకం తగ్గిపోతున్నట్లనిపిస్తుంది. వాళ్ళిక్కడికొచ్చిన అయిదారేళ్ళల్లో భార్యని తనతో సినిమాలకి గానీ షికార్లకి గానీ తీసుకుని వెళ్ళగా నేను చూడలేదు. ఎవరో బాగా దగ్గరి బంధువుల యిళ్ళల్లో జరిగే శుభకార్యాలకి తప్ప ఇద్దరూ కలిసి వెళ్ళింది లేదు – అదికూడా వున్న ఊళ్ళో అయితేనే! ఆఫీసర్ సెలవివ్వట్లేదనో, పిల్లల చదువులు పాడైపోతాయనో ఎప్పుడూ ఏవో కుంటిసాకులు నాకు చెబుతూనే వుంటాడు. నా అభిప్రాయమల్లా ఆమె అందం ఇతగాణ్ణి భయపెడుతోందని.

ఆమె లోకట్ బ్లవుజులు వేసుకునే మాట నిజమే. అయితే, మరీ సీత్రూ పైటని ఒకే పొరగా ఛాతీమీద వున్నట్టా లేనట్టా కనుక్కొమ్మన్నట్టుగా ఛాలెంజ్ చేస్తూ చాలామంది ఆడవాళ్ళు వేస్తున్న ఈ రోజుల్లో కూడా ఆమె రెండుమూడు పొరలుగా పైటని వేస్తోంది. దానికి భర్తగా అతనానందపడలేకపోతున్నాడు. ఆఫీసు పని అని చెప్పి ఏ రోజూ చీకటి పడేముందు ఇంటికి చేరింది లేదు. ఆదివారం నాడు తీరిక దొరికితే నాదగ్గరకి వచ్చి కూర్చుంటాడు. ఇంట్లో పన్లేం లేవా? అని పరోక్షంగా అడిగితే వాళ్ళావిడ టీవీ చూస్తోందనో, లేక ఆవిడతో బాటు గుడికి వెళ్ళడం ఇష్టంలేదనో చెబుతాడు. అతని వయసు స్నేహితులు గానీ కొలీగ్స్‌ కానీ అతనింటికి రాగా నేను చూసిన గుర్తు లేదు. పాపం ఆవిడకి ఎపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా కూర్చోవడానికి చికాకు పుట్టి అప్పుడప్పుడూ కొడుకునో కూతుర్నో తీసుకుని కొద్ది దూరం నడిచి రావడమో లేక పక్కింటావిణ్ణి తీసుకుని గుడికి వెళ్ళి రావడమో చేస్తూంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు కొంచెమయినా అలంకరించుకోరూ?

అతను ఉదహరించిన సామెత వినగానే నాకు క్రితం అమెరికా ట్రిప్పులో ఎదురయిన అనుభవం అతనికి చెబితే లాభం వుంటుందనిపించింది. ఇప్పటిదాకా ఎవరికీ చెప్పవలసిన అవసరం రాలేదు – రిటైరయిన ఒంటరిగాణ్ణి, నన్ను పట్టించుకునే వాళ్ళెందరున్నారు గనుక! సమయానుసారంగా కొంత కలిపి మరీ చెప్పాల్సిన అవసరం నాకు కనిపించింది.

“క్రితంసారి మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళొచ్చిన తరువాత అక్కడ నాకెదురైన అనుభవాలని నీతో పంచుకోవడానికి నువ్వు ఒక నెలపాటు ఊళ్ళో లేవు. ఆ తరువాత నీకు చెప్పడానికి నాకు గుర్తు లేదు. ఇప్పుడు సమయం వచ్చింది గనుక చెబుతున్నాను విను. మొత్తం మూణ్ణెల్ల గూర్చీ చెప్పన్లే, భయపడకు!” అంటూ మొదలుపెట్టాను.

“తాతయ్యా, మేం తెలుగు నేర్చుకుంటున్నాం” అన్నది పన్నెండేళ్ళ యామిని నన్ను వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుంటున్నప్పుడు.

“నేను కూడా” వంతపాడాడు పదేళ్ళ యశ్వంత్.

“‘వుయ్ ఆర్ లెర్నింగ్ టెలుగూ,’ అని మీరు అనలేదంటేనే ఎంత తెలుగు వచ్చేసిందో వెంఠనే అర్థమైపోయింది,” అన్నాను ఇద్దరినీ అక్కున చేర్చుకుని.

“ఎప్పటినించీ?” అనడిగాను.

“మీరు క్రితం ఏడాది ఇండియా తిరిగి వెళ్ళినప్పటినించీ,” అన్నది మా అమ్మాయి.

“మరి ఈ పదినెల్లపాటూ ఫోన్లో ఒక్కసారయినా చెప్పలేదేం?” అనడిగాను. నన్ను తెలిసినవాళ్ళు, పిల్లలని చూసిన దానికంటే వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారన్న విషయానికే ఎక్కువ సంతోషం పొందాననుకునేవాళ్ళు.

“మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఇలా దాచి వుంచారు,” అన్నాడు మా అల్లుడు శరత్.

“మేమిప్పుడు తెలుగు చదవగలం కూడా తాతయ్యా!” అన్నాడు యశ్వంత్.

ఇన్నిసార్లు అమెరికా వచ్చినా, వచ్చిన ప్రతీసారీ వాళ్ళని తెలుగులో మాట్లాడమని బ్రతిమిలాడితే ‘నో’ అన్నవాళ్ళు ఇప్పుడు అడగకుండానే ఇంతగా మారారా! ఎలా సాధ్యం?

“ఇక్కడ మాకు తెలిసిన ఒకాయన ప్రతి ఆదివారం తెలుగు క్లాసులు నడుపుతున్నారు. వాళ్ళమ్మాయి, ఇదీ మంచి స్నేహితులు. వాళ్ళు మాకు ఫామిలీ ఫ్రెండ్స్ కూడా. దానితోబాటు వీడూ వెడతానన్నాడు. వీళ్ళతోబాటు ఇంకో పదిమంది వుంటారు,” చెప్పింది మా అమ్మాయి.

ఇంటికి చేరిన తరువాత వాళ్ళు నాకు వాళ్ళ తెలుగు పుస్తకాలు చూపించారు. అక్షరాలమీద వేళ్ళుపెట్టి కూడబలుక్కుంటున్నట్టుగా యశ్వంత్ చదివితే, యామిని అంతకన్నా చాలా వేగంగా చదివింది. మరునాడు ఆదివారం కావడంతో వాళ్ళతోబాటు నేను కూడా ఆ తెలుగు క్లాసుకి వెళ్ళాను.

“మీరు వస్తున్నారని వీళ్ళు ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో వున్నారు. మీకు తెలుగంటే చాలా యిష్టమనీ, కవితలూ పద్యాలూ రాస్తారనీ చెప్పారు. మీ ముందు పాఠం చెప్పేటప్పుడు తప్పులేమయినా దొర్లితే క్షమించాలి,” అన్నాడు టీచర్ రఘురాం.

“ఏమయినా తప్పులున్నా పిల్లలముందు చెప్పను. మీరు సాఫ్ట్‌వేర్ వుద్యోగం చేస్తూ ఇలా మాతృభాష మీద మమకారంతో మీ సమయాన్ని వెచ్చించల్లా ఈ పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నందుకు నా అభివందనాలు,” అన్నాను.

ఆరోజు రఘురాం తెలుగులో సామెతల గూర్చి పాఠం చెప్పాడు.

“సామెతలంటే ప్రావెర్బ్స్ అన్నమాట. ఇవి, ఎన్నో వేల ఏళ్ళుగా తెలుగువాళ్ళు వాళ్ళ జీవితంలో నేర్చుకున్న పాఠాలని గుర్తుండేలా క్లుప్తంగా – అంటే కన్సైజ్‌గా – చిన్న చిన్న వాక్యాలల్లో చెప్పినవన్నమాట. ఉదాహరణకి, ‘ఇంటిదొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు’ అన్న సామెతని తీసుకోండి. దీనికెవరైనా అర్థం చెప్పగలరా?”

“ఈవెన్ ఈశ్వర్ కాంట్ కాచ్ హోం థీఫ్,” అన్నది యామిని. నేనే కాక రఘురాం కూడా కష్టపడ్డాడు నవ్వు నాపుకోవడానికి.

“నో. ఐ కెన్,” అన్నాడు ఒక కుర్రాడు. వాడి పేరు ఈశ్వర్ అని తెలిసింది. వాడు యామినికంటే రెండు మూడేళ్ళు పెద్దవాడయి వుండాలనిపించింది. కావాలనే చిలిపిగా అలా అన్నాడనుకుంటాను. ఆ పిల్లవాడి తెలుగు కూడా అద్భుతంగా ఉంది.

“క్లోజ్. ఇక్కడ ఈశ్వర్ అంటే గాడ్ అని అన్నమాట. అంటే, ఇంట్లో వున్న మనుషుల్లో ఎవరో ఒకళ్ళు చెప్పకుండా డబ్బే కాదు – ఏ వస్తువయినా తీస్తే, ఇంట్లోవాళ్ళెవరికీ తెలియదు అని అర్థం. ఇది అనుభవంతో తెలుసుకున్న దన్నమాట. ఇంకో సామెత – పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. దీనికి అర్థం తెలుసునా?”

వీళ్ళకి వాత అంటే ఏమిటో ఎలా తెలుస్తుందనుకున్నాను. పనిష్మెంట్‌కింద ‘వాత పెడతా’ నని అమెరికాలో వుండే తల్లులెవరు పిల్లలని బెదిరిస్తారు గనుక! సమాజం మారుతుంటే కొన్ని సామెతలు ఇందుకే మరుగున పడిపోతాయనిపించింది.

నేను అనుకున్నట్లుగానే, “పులి అంటే టైగర్, నక్క అంటే ఫాక్స్. కానీ, వాత అంటే ఏమిటి?” అనడిగాడు ఒక కుర్రాడు.

“ఇలా రండి,” అని వాళ్ళని పిలిచి, “ఇదీ వాతంటే” అని నా అరచేతిని చూపించాను.

“అది బర్న్ మార్క్. తాతయ్య చిన్నప్పుడు కాకర పువ్వొత్తు – అంటే స్పార్క్‌లర్ అన్నమాట – కాలుస్తుంటే అయింది.” తనకు అదేమిటో ముందే తెలుసునన్నట్లు గర్వంగా చెప్పాడు యశ్వంత్. “ఇట్స్ నాట్ ఇరేజబుల్, యు నో?” అని కూడా చేర్చాడు.

“ఆ సామెతకి అర్థం ఏమిటంటే, ‘పులికి చారలున్నాయి, అందుకే దానికంత బలం’ అని ఒక నక్క అనుకుని వంటినిండా వాతలు పెట్టుకుంటే దానికి ఆ బలం రాదు కదా! అంటే, ఇంకొకళ్ళని చూసి అసూయ పడొద్దు అని అర్థమన్నమాట,” అన్నాడు రఘురాం.

“వచ్చే వారానికి హోంవర్క్ ఏమిటంటే, ఈ సామెతలని ఉపయోగిస్తూ ఒక ఆటని – ఒక గేంని – మీరు తయారు చెయ్యాలి. మీ పుస్తకాలల్లో కొన్ని సామెతలుంటాయ్. ఇంటర్నెట్ లింకులు కొన్ని ఇవాళ ఇస్తున్నాను – వాటిల్లో ఇంకా చాలా దొరుకుతాయ్,” అన్నాడు రఘురాం. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇప్పటిదాకా అలాంటి ఆటని నేను ఇండియాలోనే విన్లేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న ఈ అమెరికా తెలుగు పిల్లలకి ఇలాంటి ఛాలెంజా?

“పిల్లలు ఏం చెయ్యగలరు? పెద్దవాళ్ళే ఇప్పటిదాకా చెయ్యలేదు,” అన్నాను రఘురాంతో.

“ఇక్కడి పిల్లలు ఇండియాలో పిల్లలకంటే తెలివయినవాళ్ళని కాదు కానీ, ‘కుర్రకుంకవి నీకేం తెలుసు?’ అన్న వాతావరణంలో నేను పెరిగితే, ‘మీరు చెయ్యలేనిది ఏదీ లేదు’ అన్న ప్రోత్సాహంతో ఇక్కడ వీళ్ళు పెరుగుతారు. ఇక్కడ రోబోటిక్స్, ఆడిస్సీ ఆఫ్ ది మైండ్ లాంటి పోటీలల్లో ఈ వయసువాళ్ళు చేసే ఫీట్లు చూస్తే నాకు తల తిరిగిపోతూంటుంది,” అని జవాబిచ్చాడు. వీళ్ళు రఘురాం మాటని నిలబెడతారో లేదో తప్పక చూడాలనిపించింది. వచ్చే వారం కూడా తప్పకుండా ఆ క్లాసుకి వస్తానని అతనికి చెప్పాను.

ఇంటికొచ్చిన తరువాత యశ్వంత్ సామెతల పుస్తకాలు తిరగేస్తుంటే యామిని ఇంటర్నెట్ సర్ఫ్ చేసి, దొరికిన వాటిని ప్రింట్ చేసింది. వేసవి సెలవులు కాబట్టి, అమ్మానాన్నలు ఆఫీసుకి వెళ్ళిన తరువాత రోజంతా నా చుట్టూ తిరిగి వాటికి అర్థం చెప్పించుకున్నారు. వాళ్ళ ఎక్సైట్‌మెంట్‌లో నేనూ భాగం పంచుకోవడంతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి.

తరువాతి ఆదివారం నాడు క్లాసులో రఘురాం, “సామెతల గేం గూర్చి ముందెవరు చెబుతారు?” అనడగ్గానే యామిని, యశ్వంత్‌లు చేతులెత్తారు.

“దూరపు కొండలు నునుపు” అన్నది యామిని.

“పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది” అన్నాడు యశ్వంత్.

“దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు” అన్నది యామిని.

“కోటివిద్యలు కూటికొరకే” అన్నాడు యశ్వంత్.

“కుక్కకాటుకు చెప్పుదెబ్బ” అన్నది యామిని.

“అబ్బ, అర్థమైంది! సామెతలతో అంత్యాక్షరి. వండర్‌ఫుల్” అని అంటూ రఘురాం చప్పట్లుకొట్టాడు.

“నేనిప్పటిదాకా ఇలాంటిది వినలేదు” అంటూ నావైపు దొంగచూపులు చూశాడు. ఆ ఆటకి నేను కూడా ఆశ్చర్యపోయి, “నేనేం వాళ్ళకి సహాయం చెయ్యలేదు. ఆ ఐడియా పూర్తిగా వాళ్ళదే” నని చెప్పి వాళ్ళని అభినందించాను.

“తరువాతెవరు?” అనడిగాడు రఘురాం. ఈశ్వర్ చెయ్యెత్తాడు. “చెప్పు” అనగానే, “ఈ గేంలో ఒక సామెత ఎలా వచ్చిందీ అన్నదానిమీద కథ అల్లాలి,” అన్నాడు.

“అలాగా. నువ్వే సామెత మీద కథ అల్లబోతున్నావ్?” “భార్యా రూపవతీ శత్రుః అన్నదాని మీద.” అని మొదలుపెట్టాడు.

“ఒకప్పుడు మగధరాజ్యాన్ని మహీపాలుడు పాలించేవాడు. మహీపాలునికి మహారాణీ, మహామంత్రి యుక్తిపరుడూ ఆప్తులు. ఆయన కళలను బాగా పోషించేవాడు. ఆయన ఆస్థానం కవులకూ, పండితులకూ నిలయమైవుండేది.”

“ఆ అబ్బాయి ఇంతమంచి తెలుగులో మాట్లాడాడా గురూజీ?” అడ్డం వచ్చాడు భాస్కర్.

“కథనం నాది. మధ్యలో అడ్డం రాకు.”

“మరేం లేదు, నాకే అలాంటి తెలుగు రాదే అనుకుని అడిగానంతే.”

మారువేషాల్లో వెళ్ళి రాజ్యపాలనని గూర్చి ప్రజలేమంటున్నారో తెలుసుకునే అలవాటు మహీపాలుడికీ, యుక్తిపరుడికీ వుండేది. ఒకనాడు వాళ్ళు అలా తిరుగుతున్నప్పుడు యుక్తవయస్సులో వున్న ఒక అందమైన యువతి పిల్లలతో ఒక ఆట ఆడుతూ కనిపించిది. ఆ ఆటలో, ఒకళ్ళు కేవలం అభినయంతో చూపే ఒక పదాన్నో, సమాసాన్నో, వాక్యాన్నో వేరొకళ్ళు దానికి నోటితో పదరూపాన్నిచ్చి కనుక్కుంటే వాళ్ళు గెలిచినట్టు అని అర్థంచేసుకున్నారు. (అలాంటి ఆటని Dumb Charades అని అంటారని రఘురాం నాకు చెప్పాడు.) మహీపాలుని కళ్ళు మాత్రం ఆ యువతికే అతుక్కుపోయాయి. “ఏమి అందం!” అన్నాడు యుక్తిపరుడితో.

మరునాడు మారువేషాలతో అదేచోటికి వెళ్ళి, ఆ యువతీ ఆ పిల్లలూ అదే ఆట ఆడడం చూశారు. మూడోరోజు కూడా ‘మళ్ళీ అక్కడికే వెడదాం’ అని మహారాజు అనడంతో ఆయన పరిస్థితి మహామంత్రికి అర్థమయింది. సంజ్ఞలతోనే తాను ఆ యువతికి తన కోరికని తెలియజేస్తానన్నాడు మహీపాలుడు.

యుక్తిపరుడు ఆ యువతి వద్దకు వెళ్ళి, “తల్లీ, వీరు నువ్వాడుతున్న ఆటలోనే నీకొక పరీక్ష పెడతానన్నారు. వారు చేసే అభినయానికి నువ్వు పదరూపాన్నివ్వగలవా?” అనడిగాడు. ఆమె కుతూహలంతో సరేనన్నది.

మహారాజు తన కుడిచేతి చూపుడు వేలితో ఆమెను చూపించాడు. “నువ్వు” అన్నదా అమ్మాయి. అది సరైన సమాధానమే నన్నట్లు తలవూపి, రెండవ పదమని చేతివేళ్ళతో చూపించి, కుడిచేతి చూపుడువేలిని తనవైపు తిప్పుకున్నాడు. “నేను” అన్నది ఆ యువతి. “అదే అర్థం వచ్చేలా ఇంకో పదం” అని చేసిన సంజ్ఞని బట్టీ, “నాకు,” “నేను” అంటూ “నన్ను” అనేసరికి అది సరైన పదమని ఆపి, ఇంక తరువాత పదమని చూపి, రెండు చేతులతో తాళికట్టడాన్ని అభినయించాడు. “పెళ్ళాడ్డం” అన్నది. అప్పుడు మహీపాలుడు కుడిచేతి బొటనవేలిని మాత్రం పైకెత్తి, మిగిలిన నాలుగు వేళ్ళనీ ముడిచి, గుప్పిటని ప్రశ్నార్థకంలాగా పైకీ, కిందకీ ఆడించాడు. “ప్రశ్న” అని జవాబిచ్చింది. ఇంక మొత్తం కలిపి చెప్పమన్నాడు. “నువ్వు… నన్ను… పెళ్ళాడ్డం…?” అని ఆగిపోయి, ఇంట్లోకి పరుగెత్తింది.

“ఎవరు ఇక్కడ నా చెల్లెలు రూపవతిని అల్లరి పెట్టింది?” అంటూ కత్తి దూసుకొచ్చిన వ్యక్తిని యుక్తిపరుడు అడ్డగించి, ఆ వచ్చింది మహారాజు అని చెప్పడంతో అతనూ, వాళ్ళ తల్లిదండ్రులూ సంతోషించి రూపవతిని మహీపాలునికిచ్చి పెళ్ళి జరిపించారు.

పెళ్ళయిన దగ్గర్నుంచీ మహీపాలుడూ రూపవతీ మూకాభినయపు ఆటని నిర్విరామంగా ఆడేవారు. ఒకనాడు, ఈ ఆటలో పోటీని తన కొలువులో నిర్వహించాలని మహీపాలునికి అనిపించింది. గొప్ప బహుమతులు ప్రకటించి రాజ్యంలో నలుమూలలా దండోరా వేయించాడు. ఈ పోటీలు దాదాపు ప్రతీ వారమూ జరుగుతూండడంతో కొద్దికాలం లోనే వాటిలో పాల్గొనడానికి విదేశాలనించీ కూడా రావడం మొదలుపెట్టారు.

ఈ పోటీలలో పడి మహీపాలుడు ఆస్థానంలోని కవులనీ, పండితులనీ పట్టించుకోవడం మానేశాడు. రాజాస్థానం పామరులతో నిండిపోతోందని కోపగించిన ఆ కవులూ పండితులూ రాజుని ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనుకున్నారు. రూపవతి మోజులో మహారాణిని ఎలాగో అశ్రధ్ధ చేశాడు కాబట్టి, రాజాస్థానానికి పూర్వపు కళాకాంతులను తిరిగి తెప్పించడమే తమ ధ్యేయమని మహారాణిని చేరి ఆమెని నమ్మించారు. ఆమె పొరుగు రాజు శూరసేనుడికి కబురంపింది – ఒక చెల్లెల్ని కాపాడమంటూ. శూరసేనుడు తన సైన్యంతో వచ్చి మహీపాలుణ్ణి ఓడించి, మళ్ళీ అతణ్ణే గద్దె మీద కూర్చోబెట్టి, జాగ్రత్త! అని బెదిరించి, వెళ్ళిపోయాడు.

మహీపాలుడికి రక్తం ఉడికిపోయినా చెయ్యగలిగినదేమీ లేక మౌనంగానే రగిలిపోయాడు. ఇలా ఒక వారం గడవక ముందే తోటలో పరిచారికల గుసగుసల వల్ల ఇది రాణి చేయించిన పనే అని తెలిసి ముందు క్రోధంతో మండిపోయినా తరువాత విలవిలా ఏడ్చాడు. కవిత్వానికీ, సంగీతానికీ, నాట్యానికీ ఇచ్చినంత విలువని మూకాభినయానికి ఇవ్వడంలో తప్పేమిటి? అని బాధపడ్డాడు. మూకాభినయానికి తనిచ్చిన విలువకి తనకింత శిక్షా అని విచారపడ్డాడు. పైగా దాన్ని నిరసించి తనకీ పరిస్థితిని కలిగించిన విధి మీద అతనికి కోపం వచ్చింది. ఇంత రాజద్రోహం మహామంత్రికి కూడా తెలియకుండా జరిగినదని తెలుసుకుని ఇంకా నిరాశకు లోనయ్యాడు. చివరికి వజ్రపుటుంగరాన్ని పొడిచేసి పాలల్లో కలుపుకుని తాగాడు.

దాదాపు అచేతనంగా పడి వున్న మహారాజుని పరిచారికలు మంచం మీదకు చేర్చి వైద్యులకీ, మహారాణికీ, రూపవతికీ, యుక్తిపరునికీ కబురంపారు. వైద్యులు, తాము చెయ్యగలిగినదేమీ లేదన్నారు. వారందరూ మంచం చుట్టూ నిల్చొని దుఃఖిస్తూ వుండగా యుక్తిపరుడు మహారాజు చేతిని పట్టుకొని, పెద్దగానే “ఏమిటిది మహారాజా?” అని భోరుమన్నాడు.

కొంచెం స్పృహ వచ్చిన మహీపాలుడికి తనకి ఆ పరిస్థితిని కలిగించిన వారెవరో యుక్తిపరుడికి చెప్పాలనిపించింది. కళ్ళు తెరిచి, చెప్పడానికి నోరు పెగలకపోగా సంజ్ఞలతో చెబుతానని సంజ్ఞ చేశాడు. మహామంత్రి ఆదుర్దాగా, “చెప్పండి మహారాజా, కనుక్కోవడానికి మేము సిధ్ధమే!” అన్నాడు. మహీపాలుడు చుట్టూ కలియజూసి చూపుని రాణీమీద నిలిపాడు. ‘రాణి’ అన్నది రూపవతి. అది సరైన పదమేనని తలవూపి రూపవతిని గుర్తించి ఆమె మీద తనచూపుని నిలిపాడు. ‘రూపవతి’ అన్నాడు మహామంత్రి. అవునన్నట్లుగా తలవూపి తరువాత పదం కోసం ఒక్క క్షణం ఆలోచించిన తరువాత, మెల్లగా ఎడం చేతినెత్తి ధనుస్సుని పట్టుకున్నట్లుగా పెట్టి, కుడి చేతిని అభయమిస్తున్నట్లుగా పెట్టాడు. రూపవతి వెంటనే, ‘రాముడు’ అన్నది. ఆమెని మెచ్చుకోలుగా చూసి, కుడిచేతిని రామునికి కుడిపక్కన వుండేదెవరన్నట్లుగా సంజ్ఞచేశాడు. ‘లక్ష్మణుడు’ అన్నాడు యుక్తిపరుడు. ఆ కుడిచేతిని ఇంకా కుడివైపుకు చూపించాడు. ఇంకా పక్కన వుండేదెవరబ్బా అని అలోచిస్తూండగా కుడిచేతిని కొంచెం ఎత్తు తగ్గించి చూపించాడు. ‘భరతుడు’ అన్నది రూపవతి. కళ్ళు కొంచెం కాంతిని నింపుకోగా, ఇంకొంచెం ఎత్తు తగ్గిస్తున్నట్లు చూపించాడు. ‘శత్రుఘ్నుడు’ అన్నాడు మహామంత్రి. కాదన్నట్లు అక్కడే ఆగమన్నట్లు సంజ్ఞచేసి, కుడి చేతిని కొంచెం పైకెత్తి, కత్తితో నరుకుతున్నట్లుగా మంచమ్మీదకు వాల్చాడు. ‘శత్రు’ అని రూపవతి ఆపగానే మహీపాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మహీపాలుడు ఏమి చెప్పబోయాడన్నది ఆ తరువాత పండితపామరుల నోళ్లల్లో ఆడిన ప్రశ్న. తెలిసిన పదాలు మాత్రం — రాణి, రూపవతి, శత్రు. మూడింటినీ కలిపి చదివితే వచ్చేది రాణి రూపవతి శత్రు అని. అయితే, ఇది తెలుగులో వుండాలో లేక సంస్కృతంలో వుండాలో ఎవరికీ తెలియలేదు. మామూలుగా అయితే, విడిపదాలను కనుక్కున్న తరువాత ఆ పదాలకు వ్యాకరణాన్ని చేర్చి వాక్యంగా తయారు చెయ్యవలసిన బాధ్యత కూడా మూకాభినయం ఆట ఆడేవాళ్ళకి వుంటుంది. అది అవునో కాదో చెప్పవలసింది ఆ సమస్యని ఇచ్చినవాళ్ళు. మహీపాలుడు లేకపోవడం వల్ల, పెద్ద సమస్యే ఎదురయ్యింది. ‘రాణి రూపవతికి శత్రువు’ అని వాక్యాన్ని పూర్తిచేస్తే, అందులో వింతేమిటని అనిపించి, ఆ జగమెరిగిన నిజాన్ని చెప్పడానికి అవసానదశలో రాజు అంత కష్టపడాలా? అని ప్రశ్నించి, అది అయ్యుండదని కొట్టిపారేశారు. ఒక మగాడికున్న ఇద్దరు భార్యలు సఖ్యంగా వున్నదెప్పుడు గనుక! రూపవతి మీద అసూయతో రాణి శతృవుతో చెయ్యి కలిపింది, అన్న నిజం పండితజనానికి తెలిసినా, వాళ్ళని ఎవరూ వేలెత్తి చూపించకుండా వుండేటందుకు, మూడు ముక్కలతో అంత పెద్ద నిర్ణయానికి రావడానికి కుదరదని అడ్డం కొట్టడానికి వాళ్ళు సిధ్ధంగా ఉన్నారు. అయితే, మిగిలిన వాళ్ళెవరి ఆలోచనలూ ఆ దారిలో వెళ్ళలేదు.

‘రాణి, రూపవతి, శత్రు’ అన్న మాటలు ప్రజల నోళ్లల్లో నానుతూండగా, ఒక సంస్కృతపండితుడు, రాజుగారికి సంస్కృతంలో ప్రావీణ్యత వున్నది గనుక, ఆ భాషలోనే ఇది చెప్పి వుంటారు, అందుకని చివరి పదం శత్రుః అయివుంటుంది అని ప్రతిపాదించాడు. అతి చిన్న సవరణతో మూడు ముక్కల్లో వ్యాకరణానికి అనువుగా వుండే వాక్యం తయారయింది. ఇదే ఆయన చెప్పబోయినది అని వాళ్ళు నిర్ధారించ బోతుండగా, ఒకడు, ఈ వాక్యానికి, ‘రూపవతి అయిన రాణి శత్రువు అని కూడా అర్థం వుందే, మరెట్లా?’ అన్నాడు. మహీపాలుడు రాణిని చూపిన మాట నిజమే కానీ, భార్య అని చెప్పడానికి మాత్రమే ఆమెని చూపి వుండాలన్న నిశ్చయానికి పెద్దలంతా వచ్చారు. మహారాజు పోయిన దాదాపు సంవత్సరం తరువాత, భార్యా రూపవతీ శత్రుః అన్నదే మహీపాలుడు చెప్పదలచుకున్నదనీ, ఆ వాక్యాన్ని సమాజాని కుపయోగపడే సందేశంలాగా మాత్రమే ఆయన ఇవ్వాలనుకున్నారు గానీ, మహారాణిని గానీ రూపవతిని గానీ చిన్నబరచే ఉద్దేశం ఆయనకి లేదనీ నిర్ధారించారు. ఆ వాక్యంకాస్తా సామెత లాగా వాడుక లోకి వచ్చేసి, దాని పుట్టు పూర్వోత్తరాలు మరుగున పడిపోయాయ్.” అని ముగించాడు ఈశ్వర్.

“వీళ్ళమ్మగారు మంచి రచయిత్రి” అని నాతో అని, “ఏమోయ్, ఇది మీ అమ్మగారు చెప్పిన కథ గదా!” అని ప్రశ్నించాడు రఘురాం.

“అవునంకుల్. అయినా, మీరు ఎవరి హెల్పూ తీసుకోవద్దన్లేదుగా!” అన్నాడు ఈశ్వర్.

“చాలా గొప్పగా వున్నదని ఆవిడతో చెప్పు,” అన్నాడు రఘురాం.

నువ్వు చెప్పిన సామెత వెనుక నాకు నచ్చిన కథ అదయ్యా. ఎందుకంటే, ప్రతీ సామెతనీ ఊర్కేనే అన్వయించుకోకూడదని ఈ కథ వార్నింగ్ ఇస్తుంది. ఉదాహరణకి, నువ్వు పుటుక్కున ఆ సామెతని నీకు అన్వయించుకున్నావు గానీ, మీ ఆవిడ తను నీకు శత్రువులాగా ఎప్పుడయినా నీకు అనిపించేలా ప్రవర్తించిందా అని ఆలోచించావా? లేకపోతే, ఆమె నిన్ను వదిలిపోతుందేమోనన్న భయం నీలో కలిగించిందా?” మెల్లగానే అడిగాను.

“లేదు గురూజీ. పిల్లలన్నా నేనన్నా ఆమెకు ప్రాణం,” అన్నాడు భాస్కర్ తల వంచుకుని.

“నీ భార్య అందంగా వుంటుందని నీకు తెలుసు. అందుకని ఎవడో కామెంట్ చేసేసరికి అక్కడ ఆవిడేదో నీకు అన్యాయం చేసినట్లు బాధపడ్డావ్. ఆవిడ అంత అందంగా లేకపోతే నువ్వు పెళ్ళి చేసుకునేవాడివా?”

“బహుశా కాదు,” అన్నాడు భాస్కర్. నిజాన్ని ఒప్పుకున్నందుకు కొంచెం సంతోషం కలిగింది.

“భార్యా కురూపీ మిత్రః” అని ఒక సామెత వుండుంటే నువ్వెళ్ళి ఓ కురూపినీ, ఓ అనాకారినీ పెళ్ళి చేసుకునేవాడివా?”

“పొరపాటున కూడా చేసుకునే వాడిని కాదు.”

“చూశావా, ఈ సామెతని ప్రజల మీద వదిలిన వాడికి కూడా తెలివితేటలున్నాయ్. ఎవడో పెళ్ళాం లేచిపోయినవాడే మగాళ్ళకి వార్నింగ్ నివ్వాలనుకున్నా, ‘భార్యా కురూపీ మిత్రః’ అని వుంటే వాడి మాట నెవరూ పట్టించుకోకుండా, ‘ఆఁ, చేసుకునేది భార్యగానే గానీ మిత్రురాలిగా కాదుగా!’ అని సమాధానపర్చుకుని దాన్ని పెడచెవిని పెట్టి, అందగత్తెల కోసమే మగాళ్ళందరూ వెదుకుతారని వాడికి తెలుసు. అందుకే ఇట్లా మార్చాడు. నీ భార్యకి నలభయ్యేళ్ళు దాటినా ఆమె అందాన్ని నలుగురూ నోళ్ళు తెరుచుకుని చూస్తుంటే ఆవిడ నీకొక్కడికే దక్కిందని సంతోషపడక – నీకే ఛాయిస్ ఇస్తే, ఆవిడని చొంగలార్చుకుంటూ చూసే మగాడిలా మిగిలిపోతావా లేక ఆవిడ భర్తగా వుండడాన్ని ఎంపిక చేసుకుంటావా?” జవాబేమొస్తుందో తెలిసినా అడిగాను అదేదో అతని నోటినుంచే వినాలని.

“మంచి ప్రశ్నే అడిగారు సార్. ఇంకెప్పుడూ ఇలా పిచ్చిపిచ్చిగా ఆలోచించను. నా కళ్ళు తెరిపించారు,” అని నాకు నమస్కారం పెట్టాడు.

తరువాత, చీకటి పడకముందే అతను ఇంటికి రావడం, వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్ళడం నాకు చాలాసార్లు కనిపించింది. అతను ఆమె భుజం చుట్టూ చెయ్యివేసి నడవడం ఆమె తనసొత్తని గర్వంగా చాటడానికో లేక ఆమె వీపుకి ఆఛ్ఛాదన నివ్వడానికో అతనికే తెలియాలి.
---------------------------------------------------------
రచన: తాడికొండ కె. శివకుమార శర్మ, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, February 20, 2019

భర్తృహరి అభాషితం


భర్తృహరి అభాషితం





సాహితీమిత్రులారా!


“ఏమిటింతలా చిక్కిపోయావ్? నిన్నూ, నన్నూ పక్కపక్కన చూసిన వాళ్లెవరూ మనం క్లాస్‌మేట్ల మనుకోరు!” అన్నాడు వెంకటరెడ్డి.

“కృష్ణుడి పక్కన కుచేలుణ్ణి చూసినవాళ్లు కూడా అలాగే అనేవాళ్లే. నేను ఎంత తలకు రంగేస్తే మాత్రం, మీరు అమెరికా నుంచీ అనీ, నేను ఇండియా సరుకనీ చూసేవాళ్లకి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమా?” అన్నాను జాగ్రత్తగా. కోట్లకి పడగెత్తిన వాడినీ, రిటైరయిన తరువాత ట్యూషన్ సెంటర్లు రాల్చే పైసలకోసం రానూ, పోనూ రెండు గంటలసేపు బస్సులో నిల్చొని ప్రయాణం చేసే నన్నూ క్లాస్‌మేట్లని ఎవరనుకోగలరు? ఎంత ఎలిమెంటరీ స్కూల్లో మొదలుపెట్టి హైస్కూల్ దాకా ఒకే క్లాసులో కలిసి చదువుకున్నా గానీ, యాభయ్యేళ్ల తరువాత కలుస్తున్నాం. డబ్బు మా మధ్య నిలిపిన అఖాతం వుండనే వున్నది. “అదేమిటిరా, మీరు అంటావు, నువ్వు అని అనకుండా?” అని వాడు గదిమితే అప్పుడు చూసుకోవచ్చు.

“లింక్డ్ఇన్లో నీ హైస్కూల్నించే నంటూ నిన్నది చూపిన తరువాత నీనుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. నీ ఫోటో చూసి ఆశ్చర్యపోయాను ఇంతలా మారిపోయావేమిటని!” అన్నాడు రెడ్డి. సంబోధనలో నేను జాగ్రత్త పడడం మంచిదే అయింది. “రామరాజుని కలిశాను అని చెప్పకపోతే నన్నిలా కలిసేవాడివా?” మనసులోని ప్రశ్నని బయటకు రానివ్వకుండా అడ్డుకున్నాను.

పైకి మాత్రం, “రిక్వెస్టుని ఆక్సెప్ట్ చేస్తారో లేదోనని అనుమానమే,” అని జవాబిచ్చాను.

“నీ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేస్తూ, నీకు రామరాజు జాడ తెలుసా అనడిగి మంచిపని చేశాను!”

“రాజుని కలవడం వల్ల మిమ్మల్ని కలిసే అదృష్టం కలిగింది!” అన్నాను, అసలు అందామనుకున్న ‘నిన్ను కలిసినందుకు సంతోషంగా వుంది,’ అన్న వాక్యం గొంతులో ఫిల్టర్ చెయ్యబడ్డంవల్ల. దానికి కారణం, మొదట ‘మిమ్మల్ని’ అన్నప్పుడు వెంకట రెడ్డి అడ్డం చెప్పకపోవడం. పైగా, నా మనవళ్ల గూర్చో, మనవరాళ్ల గూర్చో భవిష్యత్తులో వాడిని సహాయం చెయ్యమని అడిగే అవకాశం మిగలాలంటే ఈమాత్రం జాగ్రత్త ఇప్పుడు అవసరం.

“రేపు నాతో కలిపి ఆరుగుర్ని నువ్వు రామరాజుండే చోటుకు తీసుకెళ్లాలి. కార్ ఏర్పాట్లూ అవీ అయిపోయాయి గానీ, ఆ డ్రైవర్‌కి శ్రీకాకుళం అడవి మార్గాలేవీ తెలియవుట. పైగా, ఒకచోట కార్లు వెళ్లగలిగే రోడ్ కూడా ఏదీ లేదు, కాలి నడకన వెళ్లాలన్నావు గూడా. నాతో బాటు వచ్చే యునైటెడ్ నేషన్స్ డెలిగేషన్‌కి నువ్వు తోడు రాకపోతే వాణ్ణి కలిసే అవకాశమే లేదు.”

“యునైటెడ్ నేషన్స్ డెలిగేషనొస్తోందా వాణ్ణి చూడ్డానికి? పైగా, సెక్యూరిటీ ఏర్పాట్లేవీ లేకుండా!” ఆశ్చర్యపోయాను.

“ఏదో చిన్నతనపు చనువుతో జోక్ చేశాను. అంతే! నేనిట్లా అన్నానని నువ్వెక్కడా అనవనుకో. వచ్చేవాళ్లల్లో నాతో బాటు ఇంకొక ఇండియన్, అంతే. అంటే, అదే – నాలాగే ఇండియా ఆరిజిన్ వాడు. మిగిలిన వాళ్లల్లో ఒకడు నల్లవాడు. ఒకామె కొరియన్. ఇంకొకతను అర్జెంటీనా నుంచి. మరొకతను తెల్లవాడు. ఇది నానాజాతి సమితి గాక మరేమిటి?”

“వీళ్లందరూ మీ కంపెనీలో పనిచేస్తారా?”

“ఒక్క లిండా, హోర్హే మాత్రమే. రవి యూనివర్సిటీలో ప్రొఫెసర్. డేవిడ్ వాడి దగ్గర పిహెచ్.డి పూర్తి చేస్తున్నాడు. జేమ్స్ ఇంకా హైస్కూల్ పూర్తి చెయ్యకుండానే ఒక ఐఫోన్ యాప్ తయారు చేస్తే మా కంపెనీ మిలియన్ డాలర్లిచ్చి కొనుక్కుంది. రవి వుండే యూనివర్సిటీలో, కాకపోతే స్టాన్‌ఫర్డ్‌లో జేరతాడు బాచిలర్స్ చెయ్యడానికి.”

“వీళ్లంతా రాజుని కలవడానికి ఇండియా వచ్చారా!”

“అంత లేదులే. ఒక్క జేమ్స్ తప్ప అందరం హైదరాబాద్లో కాన్ఫరెన్స్‌కి వచ్చాం. మొదటి రోజున అక్కడ కీనోట్ స్పీచ్ ఇచ్చాను. అదవగానే వైజాగ్ వద్దామని ముందునించీ అనుకున్నదే. ఇక్కడ మా బ్రాంచ్ ఒకటి ఓపెన్ చెయ్యడానికి ఏర్పాట్లకోసం కొందరిని కలవాలి. మూడురోజుల క్రితం నీతో మాట్లాడాను కదా. అప్పుడే రాజు ఎక్కడున్నాడో నీకు తెలుసని, నువ్వు అక్కడికి తీసుకెళ్లగలవని చెప్పగానే ఆ రోజు వాళ్లకి చెబితే ఎగిరి గంతేసి ఇంత దూరమొచ్చి వాణ్ణి కలవకపోతే ఎలాగన్నారు. ఈ సంగతి తెలిసి జేమ్స్ కూడా ఫ్లయిటెక్కాడు. పొద్దున్న దిగి వుంటాడు హైదరాబాద్‌లో. ఈ రాత్రికి అందరూ ఇక్కడకి చేరతారు. అవునూ, ఇంత హడావుడి పడి మేమెడితే వాడు అక్కడ దొరుకుతాడా లేక ఎక్కడి కయినా వెళ్లాడంటారా? అలా జరిగితే ఇంత ట్రిప్పూ వేస్ట్ అయిపోతుంది.”

“వాడికి అక్కణ్ణించి బయటపడి జనారణ్యంలోకి అడుగు పెట్టడం ఇష్టంలేదు. ఇంతమంది వాణ్ణి కలవడానికి వస్తున్నారంటే ఆశ్చర్యంగా వున్నది.”

“ఎవరి పిచ్చి వాళ్ల కానందం అన్న సామెత వీళ్లకోసమే పుట్టించి వుంటారు. అందరికన్నా అతి పిచ్చివాడు రాజు. కాదు కాదు. చిన్నప్పుడేదో ఒక శ్లోకం చెప్పేవాడు మన తెలుగు మాష్టారు – ఆకాశంలోంచి ఊడి పడ్డ గంగాదేవి అంటూ తెలివి లేనివాళ్లకి ఉదాహరణగా చూపిస్తూ. నువ్వు తెలుగు పంతులుగా చేసే రిటైరయ్యా నన్నావు గదా, నువ్వూ చెప్పేవుంటావ్. గుర్తుందా?”

“ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి బయోధి నుండి పవనాంధోలోకముం జేరె గం
గా కూలంకష పెక్కు భంగులు వివేకభ్రష్ట సంపాతముల్”

“కరక్ట్. అదే పద్యం. సంపాతముల్ అంటే ఏమిటి? మర్చిపోయాను.”

“ఇక్కట్లండీ. వివేకం భ్రష్టుపట్టిపోతే వచ్చే ఇక్కట్లని ఉదాహరణగా చూపిన ఏనుగు లక్ష్మణ కవిగారి పద్యం, భర్తృహరి భావమూ నండీ అది.”

“ఆకాశంలో వుండే గంగాదేవి శివుడి శిరస్సు మీదికి దూకింది. అక్కణ్ణుంచీ హిమాలయం మీదికీ… తరువాత ఏమిటీ? ఆ పదాలేవీ నాకు నోరు తిరిగే అవకాశమే లేదు.” పెద్దగా నవ్వాడు వెంకటరెడ్డి.

“గంగమ్మ తల్లి నదిగా ప్రవహించి సముద్రంలో కలిసి, అక్కణ్ణించీ పాతాళానికి జేరినట్లు…”

“అద్గదీ. ఈ పోలిక సరిగ్గా సరిపోతుందయ్యా రాజుకి. మా కంపెనీకి బిలియన్ డాలర్ బ్లాక్‌బస్టర్ డ్రగ్ ఇంచుమించుగా అందించినవాడు శ్రీకాకుళం అడవుల్లో పడి తిరుగుతున్నాడంటే వినడానికే కష్టంగా వుంది. వాడికిష్టమైన టాపిక్స్ మీద రిసర్చ్ వద్దన్నానని కోపం వచ్చింది. వాడు చేరిన దాదాపు పదేళ్ల తరువాత అనుకుంటా, లిండా పిహెచ్.డి. అవగానే మా కంపెనీలో చేరింది. కలిసే పనిచేసేవాళ్ళెప్పుడూ. ఏవో రూమర్లు పుట్టాయి. లాబ్‌లో కలిసి డిస్కషన్లు చేస్తూ, కాన్ఫరెన్సులకి కలిసి వెడుతూ – ఎవరికయినా అనుమానమొస్తుంది. వాడి భార్యకీ వచ్చింది. డైవోర్స్ తీసుకుని పిల్లలతో వెళ్లిపోయింది. రాజు మా కంపెనీని విడిచి వెడుతున్నప్పుడు ముందు బాధేసినా, పోన్లే, యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరుతున్నాడు గనుక అక్కడ రీసర్చ్ చేస్తాళ్ళే అనుకున్నా.”

“ఆకాశంబున నుండి – అంటారు మీరు!”

“కాదూ మరి? వాడు లేకపోతే ఏమిటిట? తరువాత లిండా ఒక్కతే ఆ బిలియన్ డాలర్ల డ్రగ్ పరిశోధన పూర్తిచేసింది. దానికి పేటెంట్స్ అప్లయ్ చేస్తున్నప్పుడు ఇది రాజు చేసిన రీసెర్చ్ ఎక్స్‌టెన్షనే కదా వాడి పేరుని కూడా జతచేస్తానన్నది అప్లికేషన్‌లో! ఐ పుట్ మై ఫుట్ డౌన్. నో అన్నాను. ఇప్పుడామె మా కంపెనీ సీఈఓ. కాకపోతే హోర్హేని తయారు జేసినందుకు మాత్రం వాడికి థాంక్స్ చెప్పుకోవాలి. చాకులాంటి బుర్ర. రాజు దగ్గర పిహెచ్.డి. అవగానే లాగేశాం. వాడిప్పుడు మా రీసెర్చ్ హెడ్. అలా ఇంకొందరిని తయారు చేస్తాడని ఆశ పడ్డాను. రెండేళ్ళు కాగానే అది వదిలేసి, అక్కణ్ణుంచి ఏదో కమ్యూనిటీ కాలేజ్‌లో చేరాట్ట.”

“అంటే, శంభుని శిరంబందుండి శీతాద్రి!”

“ఆ పోలికని మాత్రం నే నొప్పుకోను. గొప్పగా వుండేవాటికి హిమాలయాలతో పోలిక పెట్టాలి గానీ కమ్యూనిటీ కాలేజీని దానితో ఎలా పోలుస్తాం?”

“కమ్యూనిటీ కాలేజీ అంటే – వొకేషనల్ స్కూల్స్ అంటాం, అలాంటివా?”

“కొంచెం అలాంటివే. చిన్నసైజు కాలేజీలనుకో. యూనివర్సిటీల్లో అడ్మిషన్ రానివాళ్లూ, అక్కడి ట్యూషన్ ఫీజులు కట్టలేని వాళ్లూ జేరతారందులో. మొదటి రెండేళ్ళు అక్కడ చదువుకుని ఆ క్రెడిట్లు తీసుకుని యూనివర్సిటీకొస్తారు డిగ్రీ పట్టా కోసం. పెద్ద యూనివర్సిటీ ఒదిలేసి లోకల్ కాలేజీలో అలాంటి కుర్రాళ్ళకి పాఠాలు చెప్పుకోడం అదేం పిచ్చి? వాడి గూర్చి ఇంక పట్టించుకోకూడదనే అనుకున్నా.

ఒక రోజున నేను, లిండా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు హోర్హే తను ఇంటర్‌వ్యూ చేస్తున్న కేండిడేట్‌ని తీసుకుని వచ్చాడు – గెస్ హూ హాజ్ ది మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆన్ దిస్ జెంటిల్మన్ హియర్! అంటూ. రాజు! అన్నాడు తనే మళ్లీ. వెన్ విల్యూ స్టార్ట్? వుయ్ విల్ బీట్ ఆల్ ది అదర్ ఆఫర్స్! అన్నాన్నేను. రవి – అది ఆ కాండిడేట్ పేరులే – మా ఆఫర్ వారం తరువాత రిజెక్ట్ చేశాడు, యూనివర్సిటీలో టీచ్ చెయ్యడం తన ధ్యేయమంటూ. రవి ఈజ్ స్మార్ట్. సో, వుయ్ ఆఫర్‌డ్ టు ఫండ్ హిస్ రిసర్చ్.”

“రాజుని రవి ఎలా కలిశాట్ట?” అడిగాను.

“రాజు కమ్యూనిటీ కాలేజీలో టీచ్ చేసేవాడని చెప్పాగా! రవి అక్కడ చదివింది రెండేళ్లు. మిగతా రెండేళ్లూ యూనివర్సిటీలో పూర్తిచేశాడు. ఆ తరువాత ఎంత లేదన్నా పి.హెచ్.డి. పూర్తి చెయ్యడానికి అయిదేళ్లు పడుతుంది. అంటే మొత్తం తొమ్మిదేళ్లు. రాజు అన్నేళ్ళనుంచీ అక్కడే ఉన్నాడా అని ఆ కాలేజీ వాళ్లకి ఫోన్ చేస్తే వాడు అక్కడ పనిచేసింది రెండేళ్లే నన్నారు. అక్కణ్ణించి హైస్కూల్లో టీచర్‌గా చెయ్యడానికి వెళ్లాట్ట! తల తిరిగిపోయిందనుకో!”

‘ఆకాశంబున నుండి-‘ అన్న పద్యాన్ని వెంకటరెడ్డి ఎందుకు అడిగాడో అప్పటికి చాలా వరకూ అర్థమై, “సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి -” అన్నాను.

“చెప్పాగా, కమ్యూనిటీ కాలేజీకీ, హిమాలయాలకీ పోలిక లేదని! కానీ, నా కంపెనీలో రిసర్చ్ హెడ్ నుంచి బడిపంతులు ఉద్యోగానికి…”

ఫోన్ మోగింది. “హలో! ఇప్పుడా?” అని వాచీ వైపూ, నా వైపూ చూసి, “సరే,” అని ఫోన్ పెట్టేశాడు. “మినిస్టర్‌ నించి కలవడానికి రమ్మనమని ఫోన్. నీ అడ్రసూ ఫోన్ నంబరూ రాసివ్వు. రేప్పొద్దున్నే కారు పంపిస్తాను,” అని డ్రస్ చేసుకోవడానికి తయారవుతుంటే లేచి బయలుదేరబోయాను.

“ఇంతకీ, నువ్వు ఆ అడవుల్లో దారి తప్పి మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టవు గదా?” అపనమ్మకాన్ని నిద్రపుచ్చేటందుకు అడిగాడు.

“మీకా భయం అక్కర్లేదు. గత అయిదారేళ్లల్లో చాలాసార్లు వెళ్లొచ్చాను,” అని బయటపడ్డాను.

మరునాడు పొద్దున్న బయలుదేరడం ఆలస్యమైంది. దానికి కారణం వెంకట రెడ్డి చేసిన బందోబస్తుని వదిలించుకోవడం. నేను వెళ్లేటప్పటికి సెక్యూరిటీ కోసం ముందొక జీపూ, వెనకొక జీపూ బయలుదేరదీసి అరడజను మందిని ఆయుధాలతో సహా వాటిల్లో ఎక్కించాడు. సాయుధ నక్సలైట్లు తిరిగే చోటికి అలా వెడితే మనం ప్రాణాలతో వెనక్కు రావడం అసాధ్యమని అనేటప్పటికి వెంకటరెడ్డికి వాళ్లని వద్దని పంపడం తప్పలేదు.

అందరిలో చిన్నవాడు జేమ్స్. డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. లిండా, వెంకట్ మధ్య వరుసలో కూర్చున్నారు. వాళ్ల వెనుక వరుసలో నేనూ, రవి. మా వెనగ్గా చివరి వరుసలో కూర్చున్నారు హోర్హే, డేవిడ్. నేను వీళ్ల వయసుల గూర్చి వేసిన అంచనాలు దాదాపు సరిపోయాయి. జేమ్స్‌కి పధ్ధెనిమిదేళ్లుంటాయి మహా అయితే. కొరియన్లు ఎలా వుంటారో, వాళ్ల వయసులని అంచనా వెయ్యడమెలాగో నాకు తెలియకపోయినా, ‘లిండా రాజుకంటే దాదాపు పదేళ్లు చిన్న’ అని వెంకటరెడ్డి అనడం గుర్తుంది. హోర్హేకి వయసు యాభై చేరుతూ వుండాలి. రవి వయసు ఇంకా నలభై చేరలేదని అతణ్ణి చూడగానే అనిపించింది. పిహెచ్.డి. చేస్తున్న డేవిడ్ వయసు 26-28 మధ్యలో వుండొచ్చు. వాన్ ఎక్కే ముందరే అందరినీ వెంకటరెడ్డి నాకు పరిచయం చేశాడు.

“నిన్న రాత్రి మేమందరం ఎవరి కెంత కాలం రాజుతో ఇంటరాక్షన్ వున్నదో లెక్కేశాం. యూ హావ్ ది లాంగెస్ట్ టైమ్ విత్ హిమ్!” లిండా వెనక్కు తిరిగి నాతో అన్నది వాన్ బయలు దేరిన తరువాత. ఆవిడ ఇంగ్లీషు యాక్సెంట్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైంది.

“నో. ఐ టోల్డ్ యు! అయామ్ ది లక్కియెస్ట్ వన్. రిమెంబర్! నేను వాడితో హైస్కూల్లో ఒక ఏడాది ఈ చలపతి కంటే తక్కువ వుంటేనేం, తరువాత రాజు నా కంపెనీలో దాదాపు పదేళ్లు పనిచేశాడు! దెన్, దేరీజ్ ది బిలియన్ డాలర్స్ డ్రగ్!” గర్వంగా అన్నాడు వెంకటరెడ్డి.

“డబ్బు మాటటుంచితే, నీ కంపెనీలో రాజు పనిచేసినంత కాలంలో నువ్వు అతనితో గడిపిన దెంతసేపో చెప్పు? కంపెనీ మీటింగులు లెక్కలోకి రావు. అంతా కలిపితే రెండు గంటల కన్నా మించదని పందెం కాస్తాను!” అన్నది లిండా. పాతికేళ్లకి పైగా వెంకట రెడ్డి కంపెనీలో పనిచెయ్యడం వల్ల వచ్చిన చనువో, ధైర్యమో. రాజు కన్నా పదేళ్లు చిన్నదయిదేతేనేం, నిన్న వెంకట రెడ్డి అన్న మాటల వల్ల ఆ పిల్లి కళ్లల్లో రాజు ఏం చూసి వుంటాడన్న ప్రశ్న నన్ను వెంటాడింది.

“యస్. యు ఆర్ రైట్. అయామ్ నాట్ ఎ వుమన్, సో…” కినుకతో అన్నాడు వెంకటరెడ్డి.

“ఐ నో వాట్ యు ఆర్ ఇంప్లయింగ్. మా యిద్దరి గూర్చి వున్న రూమర్స్ గూర్చి నాకు తెలుసు. హౌ ఐ విష్ దేర్ వజ్ ట్రూత్ ఇన్ దెమ్! ఒక డైమండ్ నీ చేతిలో ఉంటే దాని విలువ దాని విలువ నీకు తెలుసు గానీ, దాని విలువ దానికి తెలీదు. తన విలువని పట్టించుకోకపోవడంవల్ల అది నీ గుప్పెట్లోంచి ఎప్పుడు జారిపోతుందో నన్న భయం నిన్ను అనుక్షణం వేధిస్తూనే వుంటుంది. ఒకవేళ దాన్ని పోగొట్టుకుంటే కలిగే బాధని నువ్వు తట్టుకోలేవు. అందుకే ఐ నెవర్ ట్రైడ్ టు బి క్లోస్ టు హిమ్ పర్సనల్లీ,” అన్నది లిండా. ఆమె గొంతులో జీర కదలాడింది.

రాజుని వజ్రంతో పోల్చిన ఆమె పక్కన, వాడి గొప్పదనాన్ని గుర్తించని నా స్నేహం ఏపాటిది? ఆ పదేళ్లూ చిన్నప్పటివి గాబట్టి అని సర్దిపుచ్చుకోవాలి. నేనామె పిల్లికళ్లని గమనించడం దగ్గరే ఆగిపోయానని గుర్తించేసరికి నాకు సిగ్గేసింది.

“చిన్నప్పుడే కాదు తెలియనిది. దాదాపు అయిదారేళ్లుగా కలుస్తూనే వున్నా, గత రెండు మూడేళ్లల్లోనే రాజు వజ్రమని తెలిసింది,” అన్నాను.

“ఎలా తెలిసింది?” అందరూ దాదాపు ఒకేసారి అన్నారు.

“అది చెప్పే ముందర రాజుతో మీ పరిచయం గూర్చి వినాలనుంది. నిన్న వెంకట్ చెబుతుండగా ఫోన్ రావడం వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. రాజుని మీరు ఎంతో గౌరవించకపోతే తప్ప ఇలా బయల్దేరరు. రవీ, మీరు మొదలుపెట్టండి!” అన్నాను.

“అయిదేళ్లుగా ఆయనతో మాట్లాడుతున్నా నన్నారు గదా, మా గూర్చి ఆయన ఏమీ చెప్పలేదా?” రవి ఆసక్తిగా అడిగాడు.

“గురువులు శిష్యుల గొప్పలు తప్ప మరేం చెప్పరని మీకు తెలుసు కదా!”

రవి చిన్న నవ్వు నవ్వి మొదలుపెట్టాడు.

“అమ్మా, నాన్నా డాక్టర్లు. నా గూర్చి పట్టించుకోవడానికి వాళ్లకి ఎక్కువ టైమ్ వుండేది గాదు. చదువంటే బొర్ కొట్టింది. ఎలానో హైస్కూల్ పూర్తి చేశాను. డబ్బులకి లోటులేదు గనుక ఇండియాకో, రష్యాకో, జమైకాకో పంపి మెడిసిన్ చదివిద్దామన్నది అమ్మ. నేను పోనన్నాను. నాకు ఏ మంచి యూనివర్సిటీలోనూ అడ్మిషన్ వచ్చే ఛాన్సే లేదు గనుక కమ్యూనిటీ కాలేజీలో రెండేళ్లు చదివి ఆ తర్వాత యూనివర్సిటీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అని అని నన్నక్కడ చేర్పించారు.

“నా అదృష్ట మేమిటంటే, తీసుకున్న మొదటి కోర్సులోనే రాజు టీచరవడం. ఆయన నాలో చదువంటే ఆసక్తిని కలిగించారు. అది ఇంకొకళ్లకోసం కాదనీ, చదువుకోవడ మనేది ఊపిరి పీల్చడం లాగా, నీళ్లు తాగడం లాగా ఎవరికి వాళ్లు చెయ్యలసిన పని అనీ చెప్పారు. అంతటితో ఆగకుండా, ఊపిరి పీల్చడం వల్ల, నీళ్లు తాగడం వల్ల, నువ్వొక్కడివే లాభపడతావు. అదే, చదువు నీకు విజ్ఞానాన్ని అందిస్తే దానివల్ల నీ చుట్టుపక్కల సమాజానికి తోడ్పడే అవకాశాన్ని అంది పుచ్చుకుంటావు అని చెప్పారు. ఇంక పాఠాలు చెబితే – ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఆయన టీచ్ చేసేవి కాకపోయినా సరే, సందేహాలొస్తే నెక్స్ట్ క్లాస్ కల్లా సమాధానాలు రెడీగా వుంచేవారు. చదువుకోవడం అనే ఒక ప్రాసెస్ ఎంత గొప్పగా ఉంటుందో నేర్పించారు. ‘ఇఫ్ ఐ కెన్ డూ యిట్, యు కెన్ డూ యిట్!’ అని ఆసక్తితోబాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగించారు నాలో. మా పేరెంట్స్ నేను బాచెలర్స్ డిగ్రీ పూర్తి చేస్తేనే ఆశ్చర్యపోయారు. పిహెచ్.డి. పూర్తి చేసిన తరువాత వాళ్ల ఆనందానికి హద్దుల్లేవు. అయామ్ వాట్ అయామ్ జస్ట్ బికాజ్ ఆఫ్ హిమ్!”

“ఐ వజ్ ప్లెయిన్ లక్కీ!” అని మొదలుపెట్టాడు హోర్హే.

“ఐ వజ్ హిజ్ ఫస్ట్ రీసెర్చ్ స్టూడెంట్. ఇద్దరం ఒకేసారి చేరాం యూనివర్సిటీలో. పైగా, ఆయన ఒక డ్రగ్ కంపెనీలో పనిచేసి వచ్చారని కూడా తెలిసింది. ఆయనతో రీసెర్చ్ చేస్తే పెద్ద డ్రగ్ కంపెనీలో మంచి ఉద్యోగం గారంటీ అనుకున్నాను. ఆయనతో పనిచెయ్యడం మొదలయిన తరువాత, ఉద్యోగ మెవడికి కావాలి, ఇలానే రీసెర్చ్ చేస్తూనే వుంటే బావుంటుం దనిపించింది. ఆయన గొప్పదన మేమిటంటే, ఏ సబ్జెక్ట్ టీచ్ చేసినా రాసుకున్న నోట్స్ నుంచి చెప్పేవారు కాదు. ది మోస్ట్ ఎమేజింగ్ టీచర్ ఐ ఎవర్ హాడ్! మొదట్లో గ్రాడ్యుయేట్ క్లాసులు మాత్రమే టీచ్ చేసేవారు. రాను రానూ అడిగల్లా మొదటి సంవత్సరం అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకి మాత్రమే పాఠాలు చెబుతూ గడిపారు. స్టూడెంట్స్ లాభపడ్డారు గానీ రీసెర్చ్ మీద దృష్టి తగ్గించడం యూనివర్సిటీకి నచ్చక ఆయన కాంట్రాక్ట్ రెన్యూ చెయ్యలేదు. ఒక కొలీగ్ ‘టీచింగ్ మాత్రమే చెయ్యాలనుకుంటే కమ్యూనిటీ కాలేజీ కెళ్లచ్చు,’ అని అనడంతో రాజు నిజంగానే కమ్యూనిటీ కాలేజ్‌కి వెళ్ళిపోయారు. అప్పటికి నా పిహెచ్.డి. పూర్తయింది. నేను కూడా టీచింగ్ ప్రొఫెషన్ లోకే వెడతానన్నాను. ఆయన, ‘నీ స్ట్రెంగ్త్ రీసర్చ్ చెయ్యడం,’ అని చెప్పి లిండాని కాంటాక్ట్ చెయ్యమన్నారు. అప్పటికే ఆవిడకు నా రిసర్చ్ తెలుసు. షి వెల్కమ్డ్ మి!”

“నేనూ రాజు దగ్గర చాలా నేర్చుకున్నాను. మూడు సంవత్సరాల, తొమ్మిది నెలల, ఇరవైరెండు రోజులు రాజుతో నా సాన్నిహిత్యం. పరిశోధనలో నాకు తెలియని ఎన్నో కోణాలని చూపించాడు రాజు. అంత అనుభవం వున్నదనే రాజు వెళ్లిన తరువాత అయిదేళ్లు పూర్తి కాకుండానే ఒక బ్లాక్‌బస్టర్ డ్రగ్ కనుక్కుంటానని వెంకట్ నామీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. పదిహేనేళ్లు పట్టింది. అది కూడా, రాజు చేసిన పరిశోధనలో, ఆయన చూపిన మార్గంలోనే ముందుకు వెళ్లడంతోనే సాధ్యమయింది,” అన్నది లిండా.

“నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు. ఆ డ్రగ్‌కి ముందు ఇంకొన్ని కనుక్కున్నావు, వాటిని మార్కెట్ చేశాం కూడా కదా!” అన్నాడు వెంకటరెడ్డి.

“అవేవీ నాకు శాటిస్‌ఫాక్షన్ ఇవ్వలేదు. ఇట్స్ నాట్ ది మానిటరీ ఆస్పెక్ట్. ఇట్స్ ది ఎక్సయిట్మెంట్ యు ఫీల్ వెన్ యు ఆర్ ది వన్ షోయింగ్ ది పాత్ ఫర్ అదర్స్. పైగా, అది హోర్హే వేలుపెట్టకుండా వుంటే జరిగేదే కాదు,” అన్నది లిండా.

“అయామ్ లక్కీయర్ దేన్ రావీ – ఐ స్పెంట్ ఫోర్ యియర్స్ విత్ హిమ్ ఇన్ హైస్కూల్,” అని మొదలు పెట్టాడు డేవిడ్. ఆ మాట అంటూ రవి వైపు చూపించకపోయివుంటే ఆ రావీ ఎవరో నాకు అర్థమయ్యేది గాదు. ‘నిన్న రెడ్డి గుర్తుచేసిన భర్తృహరి పద్యంలో ఇది రాజు గడిపిన భూలోక మయ్యుండాలి!’ అనుకున్నాను.

“అప్పటికి ఒకటి, రెండేళ్లబట్టీ రాజు అక్కడ టీచ్ చేస్తున్నార్ట గానీ మా బాచ్ నించే నైంత్ స్టాండర్డ్ నుంచి సీనియర్ యియర్ దాకా ప్రతీ ఏడాదీ ఆయన టీచ్ చేశారు. రవి చెప్పినట్టుగా ఏ డౌట్ అడిగినా ఎంతో చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. అలానే డౌట్ వచ్చినప్పుడు ఎలా క్లారిఫై చేసుకోవాలో ఆ ఇన్వెస్టిగేటివ్ మెథడ్ చూపించేవారు. దట్ వజ్ ఎ గ్రేట్ ఫౌండేషన్. హి గేవ్ అజ్ ది టూల్ వుయ్ నీడెడ్ మోస్ట్ – హౌ టు థింక్! ఓన్లీ రావీ కెన్ సే వెదర్ అయామ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్!” అని రవి వైపు చూశాడు.

రవి చిరునవ్వుతో సమాధాన మిచ్చాడు గానీ, “హి ఈజ్ ప్రౌడాఫ్ యు! ఐ కెన్ టెల్యూ దట్. హి ఈజ్ లక్కీ టు హావ్ యు యాజ్ ఎ స్టూడెంట్!” అన్నది లిండా.

“ఐ వజ్ ది లీస్ట్ ఫార్ట్యునేట్ ఇన్ మై సెకండ్ గ్రేడ్,” అన్నాడు జేమ్స్. ‘హైస్కూల్నించీ ఎలిమెంటరీ స్కూల్‌కి మారడం – భూలోకంబునందుండి యస్తోకాంబోధి-‘ అనుకున్నాను రాజుని తల్చుకుంటూ.

“నాకు అమ్మా నాన్నా లేరు. నన్ను తాతయ్య, అమ్మమ్మ పెంచారు. స్కూల్లో ఫ్రీ లంచ్ అక్కర కొచ్చింది. రాజు నన్ను మాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేశారు. స్కూల్ అయిన తరువాత కూడా నాతో చాలా సమయం గడిపేవారు. హోమ్ వర్క్ చేయించేవారు. బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, టెక్నాలజీ ఇలా అన్నిటికీ నన్ను ఎక్స్‌పోజ్ చేశారు. నాలుగవ తరగతిలో అందరం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవాలి. స్కూల్ వాళ్లే వాటిని ప్రొవైడ్ చేసేవాళ్లు. ఇంటిదగ్గర కూడా నేను ప్రాక్టీస్ చెయ్యడంకోసం నాకు రాజు ట్రంపెట్ కొనిపెట్టారు. తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు మ్యూజిక్ కాంపిటీషన్‌లో అది వాయిస్తేనే బహుమతిగా ఐఫోన్ ఇచ్చారు.

“ఆఫ్రికన్ అమెరికన్స్‌లో మగవాళ్లకి బ్లడ్ ప్రెషర్ మేజర్ ప్రాబ్లం. ఎమర్జెన్సీ అయితే తప్పితే ఎవరూ డాక్టర్ దగ్గరికి వెళ్లరు. హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకపోవడం ముఖ్య కారణం. తాతయ్యతో బార్బర్ షాపుకి వెళ్లినప్పుడల్లా అక్కడికి వచ్చేవాళ్లు తమ రోగాల గూర్చి చెప్పుకోవడం విన్నాను. అన్నీ బ్లడ్ ప్రెషర్‌కి సంబంధించినవే. అయితే, ఎవరూ రెగ్యులr^gA చెక్ చేసుకోరు, చెకప్ కోసం వెళ్లరు. అందరి దగ్గరా ఎలానూ స్మార్ట్ ఫోన్లుంటున్నాయి. అప్పుడు ఐడియా వచ్చింది. గ్రోసరీ స్టోర్లల్లోనూ, ఫార్మసీలల్లోనూ బి.పి. ఎంతో చెప్పే మెషీన్లుంటున్నాయి గానీ, బార్బర్ షాపుల్లో ఎందుకు పెట్టకూడదూ అని! ఆ రీడింగ్స్ వాళ్ల స్మార్ట్ ఫోన్‌కి పంపవచ్చు. వాటిని ట్రాక్ చేసే యాప్ తయారు చేస్తే రెడ్డీస్ కంపెనీ కొనుక్కుంది. ఐ కెన్ యూజ్ ది మనీ, ఐ నీడెడ్ ఇట్ బట్ ఇట్స్ నాట్ వాట్ దట్ కౌంటెడ్. ఒక అనారోగ్య సమస్యని మొదట్లోనే కనుక్కుని తుంచెయ్యడానికి సహాయం చెయ్యగల్గడం తుంచెయ్యగలిగేలా చేయడం… అయాం ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆల్ డ్యూ టు డాక్టర్ రాజు!”

“నౌ యువర్ టర్న్!” అన్నది లిండా నన్ను చూసి.

“నా దురదృష్టం రాజుని దాదాపు యాభయ్యేళ్లపాటు మిస్సవాల్సి రావడం,” అంటూ నాకొచ్చిన కొద్దిపాటి ఇంగ్లీష్‌లో మొదలు పెట్టాను.

“అదృష్టం, ఆ గాప్ వున్నా గానీ, వాడు నాతో చిన్నప్పటి లాగానే ఏమాత్రం గర్వం లేకుండా మాట్లాడ్డం. వాణ్ణి కలవడం, మా అక్కయ్య మనవణ్ణి అమెరికా పంపడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పుడు జరిగింది. వాడు బయటకు వస్తున్నాడు. వయసు ముదిరినా పెద్దగా మారలేదు. భార్య పోయిందని తెలిస్తే వెళ్లి పిల్లలనీ, వాళ్ల కుటుంబాలనీ పరామర్శించి వస్తున్నాట్ట. వాడు వుండేది ట్రైబల్ ఏరియా కాబట్టి వాళ్లు రాసిన ఉత్తరం రాజుకు చేరేటప్పటికి ఆవిడ పోయి నెలరోజులు దాటిందట. ‘నే నిక్కడికి వచ్చిన తరువాత వాళ్లని ఇదే చూడడం. మళ్లీ వాళ్లు నన్ను చూస్తారో లేదో నని వెళ్లివచ్చాను,’ అన్నాడు.

“మేముండే చిన్న యింటికి తీసుకెళ్లాను. అమెరికాలో అన్నేళ్ళు గడిపినా మా ఇంట్లో ఏమీ ఇబ్బంది పడనట్లే ఉన్నాడు. ఒకరోజు వున్న తరువాత నన్ను తనతోబాటు రమ్మన్నాడు. మా కోచింగ్ సెంటర్‌లో సెలవు లనేవి ఇవ్వరు. అయినా సరే, తెగించి రెండ్రోజులు వెళ్లాను. ఆ వాతావరణాన్నీ, వాళ్లు రాజు కిస్తున్న గౌరవాన్నీ, వీడు వాళ్లతో కలిసిపోవడాన్నీ చూశాను. వాడు చదువు చెప్పే పధ్ధతి పిల్లలెవరికీ విసుగుని కల్పించలేదు. పైగా, అది వాళ్లల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ పిల్లలకి రాజు గురువు, మిత్రుడు. వాళ్ల తల్లిదండ్రులకి రాజు దైవం.

తరువాత చాలాసార్లు వెళ్లాను. మెల్లగా వాడి మాటల్లో వాడి జీవన ప్రయాణాన్ని అర్థం చేసుకున్నాను. మీ గూర్చే కాక ఇంకా చాలామంది శిష్యుల గూర్చి గొప్పగా చెప్పాడు.

నిన్న రాజు గూర్చి వెంకట్ ఒక ఫేమస్ పద్యాన్ని గుర్తుచేశాడు. ఆకాశంబున నుండి…” అంటూ ఆగి, “వెంకట్, ప్లీజ్ టెల్ దెమ్ ది మీనింగ్ ఇన్ గుడ్ ఇంగ్లీష్!” అన్నాను. వెంకటరెడ్డి చెప్పిన తరువాత ఇంతకు ముందుకులాగే నా హైస్కూల్ ఇంగ్లీష్ భాషలో కథ కొనసాగించాను.

“రాజు తన జీవితం గురించి చెప్పిన తరువాత నాకు కూడా అదే పద్యం గుర్తొచ్చి, అమెరికాలోని ఎలిమెంటరీ స్కూల్నించీ ఇక్కడ అడవుల్లోకి రావడం అంటే సముద్రంలోని నీళ్లు పాతాళానికి చేరినట్టుగా కాదా అని అనిపించి వాణ్ణడిగాను. ‘ఇండియన్లు అమెరికా జేరడమంటే ఆకాశాన్నందుకోవడమేనని నిర్ధారిస్తే, నువ్వేమిటి ఇలా ఆకాశాన్నుంచీ మెట్లు దిగుతూ వచ్చి ఇక్కడ అడవుల్లో చేరావ్? వెంకట్ కంపెనీలో కాకపోతే ఇంకొక కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. ఒక యూనివర్సిటీ వాళ్లు కాదంటే నీకున్న పేరుతో ఇంకో యూనివర్సిటీకి వెళ్లచ్చు. అలాగే, ఒక కాలేజీ వాళ్లు కాదంటే ఇంకొక కాలేజీకీ, ఒక హైస్కూల్ నచ్చకపోతే ఇంకొక హైస్కూల్ వెళ్లి వుండచ్చు గదా?’ అని వాణ్ణడిగాను,” అని ఆగి ఊపిరి పీల్చుకున్నాను.

‘వాళ్లెవరూ ఇందుకు కారణం కాదు. వెంకట్‌తో సహా!’అన్నాడు రాజు.”

“వాట్?” ఆశ్చర్యపోయాడు వెంకట్.

“ఏ కంపెనీలో అయినా రీసర్చ్ అనేది ఒంటరిగా కూర్చుని చేసేది కాదు. మా టీమ్‌లో వున్నవాళ్ల ఆలోచనా విధానాలు – సబ్జెక్ట్ గూర్చే చెబుతున్నాను సుమా – నన్నిబ్బంది పెట్టాయి. ఒక్క లిండా తప్ప. షి వజ్ బ్రిలియంట్. మళ్లీ అందరూ పేరున్న యూనివర్సిటీల నుంచి పెద్ద పెద్ద డిగ్రీలతో వచ్చినవాళ్లే. వాళ్ల పరిధిని దాటి అర్థం చేసుకుందామని ప్రయత్నించరు. ఇలా ఎందుకవుతోందో తెలుసుకుందామనీ, వీలయితే మార్చడానికి నా వంతు ఏమయినా చెయ్యగలనేమోననీ యూనివర్సిటీకి మారాను వెంకట్ కంపెనీని వెరీ కేపబుల్ లిండా చేతుల్లో పెట్టి – అన్నాడు రాజు.”

లిండా కళ్లు తుడుచుకుంది. “ఐ నో యు విల్ బి అప్సెట్. బట్ హి డిడ్‌నాట్ లీవ్ బికాౙాఫ్ యు!” అన్నది వెంకట్ చేతిమీద తడుతూ.

“యూనివర్సిటీలో తనకు నచ్చనివి రెండు అంశాలన్నాడు. మొదటిది, ‘ఎవరయినా పాఠాలు చెప్పగలరు, నువ్వు రీసర్చ్ మీదా, దానికోసం ఫండ్స్, గ్రాంట్స్ తేవడంమీదా కాన్సన్ట్రేట్ చెయ్యి!’ అని అడ్మినిస్ట్రేషన్ అనడం మొదటిది. ‘మిడ్-టర్మ్ ఎగ్జామ్‌లో ఇవాళ్టి పాఠం కూడా వుంటుందా? ఫైనల్ ఎగ్జామ్‌లో మిడ్-టర్మ్ తరువాతి నించీ వున్న మెటీరియలేనా లేక సెమెస్టర్ మొదటినించీ చెప్పినదంతా వుంటుందా?’ అని స్టూడెంట్స్ వేధించడం రెండవది; ఇంకొక విధంగా చెప్పాలంటే, గ్రేడ్ల మీద వున్న ఆసక్తి సబ్జెక్ట్ తెలుసుకోవడం మీద ఆ విద్యార్థుల్లో కనిపించకపోవడం. పిహెచ్.డి. చేస్తున్న వాళ్లతో మొదలుపెట్టిన అతని టీచింగ్, ఆలోచనా మార్గానికి సరయిన త్రోవని చిన్నప్పుడే చూపాలి అని అతననుకోవడంవల్ల ఫస్టియర్ అండర్గ్రాడ్యుయేట్ చేస్తున్న వాళ్లదాకా చేరింది. అయితే, స్టూడెంట్సులో అన్నిచోట్లా ఇదే యాటిట్యూడ్ కనిపించడం అతనికి నచ్చలేదుట. అప్పటికీ, ‘మీలో కొంతమంది డాక్టర్లవచ్చు, లేక మైక్రో చిప్ డిజైనర్లో పెద్ద బ్రిడ్జ్ డిజైనర్లో కావచ్చు. ఏదయినా అంశాన్ని పరీక్షలో వదిలేస్తే అదే తరువాత జీవితంలో ఎదురయితే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించాట్ట. ‘టీముల్లో పనిచేస్తాం కదా, నాకు తెలియనివి ఇంకొకళ్లకి తెలుస్తాయి, వాళ్లకి తెలియనివి నాకు తెలియవచ్చు గదా!’ అని ఒక తుంటరి అంటే నవ్విన కొందరి అభిప్రాయం కూడా అదేనని వాడికి చిరాకేసి, కమ్యూనిటీ కాలేజీకి మారాడట.”

“నాకూ ఆ రెండు అంశాలూ నచ్చనివే. వాటిని రోజూ ఎదుర్కొంటూనే వుంటాను!” అన్నాడు రవి.

“కమ్యూనిటీ కాలేజీలో ఇంకొంతమందిని ప్రభావితం చెయ్యగలిగానన్నాడు గానీ, అక్కడ కూడా అసంతృప్తి చెంది, హైస్కూల్లో సరిగా ఫౌండేషన్ పడకపోవడమే దీనికి కారణ మనిపించి అక్కడికి మారాట్ట.”

“దట్ వన్ వజ్ ఫర్ మై బెనిఫిట్!” అన్నాడు డేవిడ్.

“అక్కడి ప్రెషర్స్ అక్కడా వున్నాయన్నాడు. తొమ్మిదవ తరగతిలో చేరినప్పటి నుండీ మంచి గ్రేడ్స్ రాకపోతే మంచి కాలేజీలో సీటు దొరకదని వాటికోసం పిల్లలే కాక వాళ్ల తల్లిదండ్రులు కూడా ఒత్తిడి పెట్టారట. అందుకని, ఎలిమెంటరీ స్కూల్లో గ్రేడ్స్ పట్టించుకోరు గనుక ఎక్కువ మందిని సరయిన ఆలోచనా మార్గంలో పెట్టే వీలవుతుందనుకుని అక్కడికి మారాట్ట. అయితే, అక్కడ కూడా, టీచర్లు సరిగ్గా చెప్పడం లేదనీ, లేకపోతే, వాళ్ల పిల్లలకి సహాయం కోసం కాక గ్రేడు లెవల్ కన్నా ఎక్కువ స్థాయిలో వుండేలా చూడడం కోసమని, కోచింగ్ సెంటర్లల్లో పిల్లలని జేర్పించి ప్రెషర్ పెడుతున్నారని తెలుసుకున్నాట్ట. ‘మనం ఎలిమెంటరీ స్కూల్లో వున్నప్పుడు రోడ్ల మీద గోళీలూ, గిల్లీ దండా ఆడుకోలేదూ? అవేమయినా మన చదువులకి ఆటంకాన్ని కలిగించాయా, తెలివితేటలని దగ్గరకు రానియ్యకుండా అడ్డుపడ్డయ్యా?’ అని నన్నడిగాడు. వెంకట్ విల్ ప్రొవైడ్ ది ఆన్సర్!” అన్నాను నవ్వుతూ.

“ఇండియాలో పట్నాల్లో ఎలిమెంటరీ స్కూల్స్‌లో పరిస్థితి అంతకంటే భిన్నంగా వుంటుందనుకోను! కొరియా, వియత్నాం, తైవాన్, చైనా, మలేషియా – డెవలప్డ్ కంట్రీస్ కంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్‌లో ఇంకా అధ్వాన్నంగా వుంటుంది పరిస్థితి!” అన్నది లిండా.

“ఇక్కడ ఇప్పుడు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి!” అన్నాన్నేను.

“అందుకనా వాడు అడవిలో చేరి తపస్సు చేసుకుంటున్నది?” వ్యంగ్యంగా ప్రశ్నించాడు వెంకటరెడ్డి.

“అడవుల్లో వుండే వాళ్లంతా తపస్సు చేసుకుంటా రనుకోవడం తప్పు. హెమింగ్‌వే రాసిన ఓల్డ్ మేన్ అండ్ ది సీ చదివారా ఎవరయినా?” అనడిగాను. ఒక్క రెడ్డి తప్ప అందరూ చేతులెత్తారు.

“మా కది హైస్కూల్లో రిక్వయిర్డ్ రీడింగ్,” అన్నాడు డేవిడ్.

“అలాంటి నవలే ఒకటి తెలుగులో కేశవరెడ్డి రాశాడు ‘అతడు అడవిని జయించాడు,’ అన్న శీర్షికతో. అడవిని బోర్డర్ చేస్తూ వున్న గ్రామంలోని ఒక పాడి జంతువు అడవిలోకి వెడితే దానికోసం రాత్రంతా అడవిలో గడిపి, అక్కడ రకరకాల జంతువులతో పోరాడి గెలిచిన పశువుల కాపరి కథ అది. గూగుల్ చెయ్యండి. ఇంగ్లీషులో అనువాదం వచ్చివుండచ్చు. ఓల్డ్ మేన్ అండ్ ది సీ లో బాగా అనుభవజ్ఞుడయిన ఒక జాలరికి మాత్రమే తెలిసిన చేపల తత్వం లాగా అడవిలో జంతువుల తత్వాన్ని ఆకళింపు చేసుకున్న మనిషి జీవితాన్ని కేశవరెడ్డి మనముందుంచుతాడు. థామస్ హార్డీ పంధొమ్మిదవ శతాబ్దంలో రాసిన ‘ఫార్ ఫ్రమ్ ది మాడింగ్ క్రౌడ్’లో కూడా, రాబోయే ఈదురు గాలులతో కూడిన పెద్ద వర్షాన్ని గూర్చి గొర్రెలూ, చిన్నప్రాణులూ ఇచ్చిన సంకేతాలను గూర్చిన వివరాలున్న య్యన్నాడు రాజు. అలాంటి వివరాలు ఈనాడు ఎంతమందికి తెలుస్తున్నాయి? అంతా నాగరికత ప్రభావం. అదొక చిరుతపులి లాంటిది. పిల్ల ముద్దుగా వున్నది గదా అని తెచ్చుకుంటే అది పెద్దయిన తరువాత వాళ్లని కబళించక మానదు! నాగరికత ప్రకృతిని మనిషికి దూరం చేస్తోంది!” అన్నాను.

“అయామ్ సారీ. యూ కన్‌ఫ్యూజ్డ్ మి. రాజు అడవుల్లోకి వెళ్లడానికి కారణం నాగరికతని తప్పించుకోవడానికా లేక ప్రకృతి నర్థం చేసుకోవడానికా?” హోర్హే అడిగాడు.

“రాజు దిగినట్టు కనిపిస్తున్న మెట్లకీ ఆ రెండింటికీ సంబంధం కనిపించడం లేదు.” రవి.

“సముద్రం మీద వున్నాడంటే చేపలు పట్టడానికి మాత్రమే అనుకోవక్కర్లేదు!” జేమ్స్.

“ఆఫ్‌షోర్ ఆయిల్ డ్రిల్లింగ్ ప్లాట్‌ఫామ్ మీదున్నాడని అనుకోవచ్చుగా?” డేవిడ్.

“ఐ రిట్రాక్ట్ మై స్టేట్‌మెంట్!” అన్నాడు వెంకట్.

“ఓ.కె. తపస్సు చెయ్యడానికి కాదు రాజు అడవిలో వున్నది. అయితే, నాగరికత లేకపోతే, మందులు కూడా వుండవు కదా!” అన్నది లిండా.

“అంటే, నాగరికత లేకుండా ప్లేగు లాంటి రోగాలొచ్చి లక్షలమంది చస్తూ వుంటే బావుంటుందంటావ్! ఇప్పుడు రాజు కూడా అనాగరికంగా బ్రతకుతున్నాడన్నమాట!” అన్నాడు వెంకటరెడ్డి విచారంగా.

“ప్రభుత్వ యంత్రాంగం వెళ్లడానికి బధ్ధకించే చోట్ల స్వంత డబ్బులతో వేక్సినేషన్లు వేయిస్తూనూ, చిన్నచిన్న రోగాలకి మందులు యిస్తూనూ, నాగరికతని ఊరవతలే వుంచాలన్న వాళ్ల ఆశయంతో సహకరిస్తున్నాడు. నాగరికత అంటే బండి పట్టే వెడల్పున్న రోడ్డు. అది గనుక పడ్డదా, అది ఆ జీవనశైలి అంతానికి ఆరంభం.” అన్నాను కారాగారి యజ్ఞం కథ గుర్తుకొచ్చి.

“మరి, పిల్లలకి జ్ఞానబోధ గూర్చిన ఆశయాన్ని రాజు ఏం చేసినట్లు?” ప్రశ్నించింది లిండా.

“ఆ పిల్లలని అలానే అజ్ఞానంలో వుంచుతున్నాడా?” అన్నాడు వెంకట్.

“మీరు అనుకోకుండా నయినా సరే అవిద్య అనకుండా అజ్ఞానం అన్నారు. వాడిలో నేనర్థం చేసుకున్నదేమిటంటే, పిల్లలకి పొట్టపోసుకోవడానికి మాత్రమే పనికొచ్చే విద్యనిస్తూ, జ్ఞానాన్నందివ్వడంలో తను విఫల మవుతోందన్న సంగతిని సంఘం గమనించడం లేదని. చీకట్లో చెట్లమీదకి ఎగబాకాలనే పిల్లల మనస్తత్వాలని ఆధారం చేసుకుని, రాత్రిపూట చెట్ల చిటారు కొమ్మల మీదకి వాళ్లతో బాటు ఎగబాకి నక్షత్రాలని చూపిస్తూ ఆ పిల్లలకి ఆస్ట్రానమీ నేర్పిస్తాడు. భూమి తిరుగుతోందన్న సత్యాన్ని మారుతున్న నక్షత్ర మండలపు పొజిషన్ ఆధారంతో ఋజువు చేస్తాడు. చంద్రుడిలో మచ్చల గూర్చి చెప్పకుండా చంద్రమండలం మీద అడుగు పెట్టిన మనుషుల గూర్చీ, అదెలా సాధ్యమయిందీ అన్న విషయం గూర్చీ చెబుతాడు. పక్షులని చూపించి విమానాల గూర్చి చెబుతాడు,” అని ఆగాను.

“అడవిలో ఒక ద్రోణాచార్యుడన్నమాట!” అన్నాడు వెంకటరెడ్డి కొచెం సేపాగి.

“ద్రోణుడికంటే గొప్పవాడు. మొదటి కారణం, జనారణ్యంలో కాకుండా అడవిలోనే వుండడం. రెండవది, అందరు విద్యార్థులనీ ఏకలవ్యుడు, అర్జునుడు అయ్యేలా తీర్చి దిద్దుదామన్న ఆశయ సాధనకై నిరంతరం కృషి చెయ్యడం. మూడవది, అందరికీ విలువిద్యని మాత్రమే బోధించడం గాకుండా, తత్వాన్ని అర్థం చేసుకుని ఎవరికి సరిపడే మార్గాన్ని వాళ్లకు చూపడం – ఆ మార్గాలకి ఫిజిక్స్ అనీ, కెమిస్ట్రీ అనీ, మేథమేటిక్స్ అనీ పేర్లేవీ పెట్టకుండా! అన్నింటికన్నా ముఖ్యం, సమాజంలో ప్రతి ఒక్కళ్లకీ ఒక ప్రత్యేక మయిన స్థానం వున్నదనీ, దాన్ని వేరొకళ్లు భర్తీ చెయ్యడం సాధ్యం కాదనీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడం. అలాగని, తనకే అన్నీ తెలుసు ననుకోకుండా, అడవిని చదువుతూ అందులో మనగలగడం గూర్చీ, అది చెప్పే రహస్యాలని ఎలా వినాలీ అన్నదాన్ని గూర్చీ, వాళ్ల నుంచీ తనూ నేర్చుకుంటూ నిరంతరం తెలుసుకోవడానికి ప్రయత్నించడం – ఇవేవీ ద్రోణుడు చేసినట్లుగా నేనెప్పుడూ చదవలేదు!” అన్నాను.

“ఇంత నాగరికతని గూర్చి వివరిస్తున్నప్పుడు, కనీసం నాగరిక ప్రపంచంలోని కొన్ని మందులని వాళ్లకి అందుబాటులో వుంచుతున్నప్పుడు, రోడ్డు రావడాన్ని ఎందుకు ప్రతిఘటిస్తున్నాడు?” అడిగాడు రెడ్డి.

“కోయల జాతులు ఎన్నో వేల ఏళ్ల నుంచీ మూలికలనించి తయారు చేసిన ఓషధులతోనే జీవనాన్ని సాగిస్తున్నాయని గుర్తుంచుకోండి. మీకు తెలియని చాలా మందులు వాళ్ల దగ్గరున్నాయి. అలాగే, వాళ్ల పూర్వీకులు అడవిలోనే వుంటూ, కౄరజంతువులతోనూ, ఇతర వనచరాలతోనూ మనగలిగారని అర్థం చేసుకుంటే చాలు. నాగరికత రాకూడదని కోరుకుంటున్నాడు తప్ప దాని రాకని ప్రతిఘటించడానికి ఏ దండునీ తయారు చెయ్యట్లేదు.”

“హి ఈజ్ వర్కింగ్ టు మేక్ దట్ సొసైటీ రిచర్!” అన్నాడు రవి.

“ఇట్స్ ఎ లాబ్ ఫర్ హిమ్! ఐ హావ్ నో డౌట్ దట్ ది ప్రాడక్ట్స్ విల్ బి వెరీ వేల్యుబుల్!” అన్నది లిండా.

“వాట్స్ ది యూజ్? ఆ అడవి బయట వుండే వాళ్లెవరికీ ఆ ప్రాడక్ట్స్ వల్ల లాభమేమీ వుండదు! ఉదాహరణకి, ఒక కాన్సర్ క్యూర్ చేసే డ్రగ్!” అన్నాడు వెంకటరెడ్డి.

“అలా క్యూర్ చేసే ఎర్బ్ ఏదో మనకు తెలిస్తే, దాని కోసమని ఆ అడవిని కొల్లగొట్టకుండా ఆగం. దాన్ని వేరే చోట పెంచినా దానివల్ల లాభం రాకపోతే అది పెరిగిన నేలలో ఆ శక్తి వున్నదేమోనని ఆ అడవిని తల్లకిందులు చెయ్యకుండా వుండం. అలాకాక, అక్కడి వాళ్లకి కాన్సరే రాదని మనకు తెలిస్తే మనమేం చేస్తాం? ముందుగా వాళ్లు ఏం తింటారు, ఎలా తింటారు, ఎంత తింటారు, వాళ్ల దిన చర్య ఏమిటీ, ఆ అడవిలోనే ఎవరికీ అర్థం కానిదే మయినా కెమికల్ వాళ్లకు తెలియకుండానే వాళ్లకి ఆ బెనిఫిట్ చేకూరుస్తుందా అని ఆలోచించి, ఆ అడవిని మొత్తం ధ్వంసం చేసి పెట్టి వదిలేదాకా ఆగం!” అన్నాడు హోర్హే.

“వాటె వేస్ట్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ టాలెంట్! వాటెవర్ ఈజ్ దట్ సంపాతముల్! దేర్ ఆర్ మెనీ వేస్ టు గో డౌన్ ఫర్ ది డమ్బ్ వన్స్!” అన్నాడు వెంకట రెడ్డి. అది రాజుని గూర్చే అన్నాడని అందరికీ అర్థమయింది.

“బట్ హి ఈజ్ నాట్ డమ్బ్! ఫార్ ఫ్రమ్ ఇట్!” లిండా ప్రతిఘటించింది.

“నాకు చిన్నప్పటినించీ ఆ పద్యం నచ్చేది కాదు. ఎందుకంటే, గంగాదేవి ఆకాశంలో గానీ, ఎంత గొప్పదయినా సరే శంభుని శిరం మీద గానీ వుండిపోతే, ఎవరికీ లాభం లేదు. శీతాద్రి మీదకి చేరడం ఆమెకు భూమి మీద పారే శక్తి నిచ్చింది. దానితో భూమి మీద వందల మైళ్లు ప్రవహిస్తూ, ఆ నది పరీవాహక ప్రాంతాలని సస్యశ్యామలం చేస్తోంది. చివరకు సముద్రంలో కలిసిన తరువాత పాతాళానికే జేరుకున్న దనుకున్నా, అలా చేరడం వల్ల ఆ నదీ తీరాలకి దూరంగా వున్నవాళ్లకి గూడా అత్యంత అవసర మయిన నీటిని బావుల ద్వారా చేరుస్తోంది. ఇంత గొప్ప చరిత్ర వున్న గంగాదేవికి వివేక భ్రష్టత నాపాదించడం సమంజసమెలా అవుతుంది? అందుకే, ఆ పద్యంలోని చివరి పాదాన్ని ‘వివేకద్యుమ్న సంభావనల్’ అని మార్చా లంటాను! సంస్కృత శ్లోకంలో నయితే, ‘వివేకద్యుమ్నానాం భవతి సుమభావః శతముఖః,’ అనీను,” అన్నాను.

“అర్థం చెప్పు!” అన్నాడు వెంకటరెడ్డి.

“ద్యుమ్నము అంటే సంపద. సంభావనలు అంటే మంచి ఆలోచనలు. వివేకమనే ధనాన్ని పోగు చేసుకున్న వాళ్ల ఆలోచనలు ఇంత గొప్పగా వుంటాయని అర్థం!” అన్నాను. వెంకట్ తప్ప అందరూ చప్పట్లు కొట్టారు.

“నువ్వు సూచించిన మార్పు బాగానే వున్నది గానీ, రాజుకి గంగానదితో పోలిక పెట్టడం అతణ్ణి తక్కువ చేసినట్లవుతుంది. ఎందుకంటే, ఆవిడ ఆకాశంలోనూ, లేక శివుడి నెత్తిమీదా వున్నప్పుడు ఎవరికీ ప్రయోజనం లేదన్నావు. నిజమే! రాజు మాత్రం మా కంపెనీలో వున్నప్పుడు మాకు లాభాలు ఎలా చేకూర్చాడంటావు? ఆ మందుని వాడి ప్రయోజనం పొందిన వాళ్ల వల్లే గదా! అలాగే, యూనివర్సిటీలో వున్నప్పుడు కూడా విద్యా బోధన చేశాడు, రీసర్చ్ చేశాడు, హోర్హేని సరయిన మార్గంలో గైడ్ చేశాడు. అంటే, రాజు ఏ స్టేజిలో గూడా కనీసం ఒక్కరికయినా తనవల్ల ప్రయోజనాన్ని చేకూర్చకుండా లేడు. నా ఉద్దేశంలో రాజు మా కంపెనీలో వున్నన్నాళ్లు మాత్రమే మానవాళికి ఎక్కువ ప్రయోజనాన్ని చేకూర్చాడు! ఎందుకంటే, గత పాతికేళ్లల్లో ఆ మందువల్లే కాక, దాని ఆధారంగా తయారయిన మందుల వల్ల కూడా లక్షలాది మంది బాగు పడ్డారు కదా!” అన్నాడు వెంకట రెడ్డి.

నేను ఖంగు తిన్నాను. ఏమనాలో తోచలేదు.

“నువ్వు చెప్పిన ఆ భర్తృహరి ఇంకొకటి మరిచిపోయాడు!” అన్నాడతనే మళ్లీ. నేను ఆశ్చర్యపోయి చూశాను.

“గంగానది సముద్రంతో కలిసిన తరువాత ఆవిడకి పాతాళం ఒక్కటే గమ్యం కాదు. ఆవిరై మబ్బుగా మారడం కూడా. అట్లా మళ్లీ హిమాలయాలని చేరుతుంది!”

“రాజుని మళ్లీ ఆకాశానికి చేర్చాలనుకుంటున్నారేమిటి?” రవి ఆశ్చర్యపోయి అడిగాడు. వెంకట రెడ్డి చిరునవ్వు నవ్వాడు.

“ఎలా?” అన్నది లిండా. రాజుని మళ్లీ కంపెనీలోకి తీసుకురావడానికి వెంకట రెడ్డి ఏదో పథకం వేస్తున్నాడంటే ఆమెకి కూడా అది నమ్మశక్యం కావడం లేదు.

“అయిదేళ్లకి పైగా ట్రైబల్ పీపుల్‌తో గడిపాడు గనుక మానవుల్లోని వైవిధ్యం ఆ గుంపు శాంపుల్ సైజ్ ఎంత చిన్న అయినా గానీ, ఆ శాంపుల్ ఏ మూల నించీ వచ్చినా గానీ కనపడక తప్పదని రాజుకీ పాటికి అర్థమయే వుండాలి. అదే – అందరూ ఐన్‌స్టైన్లు కాలేరన్న సంగతి. నా ఊహే నిజమయితే, అతణ్ణి మనతో రమ్మనమంటే రాకపోతే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే, రాజుది స్వతహాగా అందరికీ మంచి చెయ్యాలనే మనస్తత్వం గనుక కోయజాతి వాళ్ల దగ్గర మూలికల గూర్చి తెలుసుకున్న వివరాలని అందరికీ అందజెయ్యాలన్న తపన అతనికి వుండక తప్పదు. ఆఫర్‌ని స్వీట్ చెయ్యడానికి అక్కడి పిల్లల్లో అతడు బాగా మెచ్చినవాళ్లని మనతో తీసుకుపోయో, లేకపోతే ఇక్కడేనో ప్రత్యేక శిక్షణ నిచ్చేలా చూడవచ్చు. నా ఊహ తప్పని ఋజువవుతే మాత్రం…” అని టెన్షన్ని పెంచడం కోసం ఆగి చిరునవ్వు నవ్వుతూ చుట్టూ చూసి అడిగాడు. “నీరు ఆవిరవ్వాలంటే వేడి కదూ, కావలసింది?”

వేడి పెట్టి రాజుని బయటకు రప్పించడం, కలుగులో వున్న ఎలుకని బయటకు రప్పించడానికి పొగ బెట్టేటటువంటిదేగా! నాకు ఆ ఆలోచనే గిట్టడం లేదు. కానీ, నేను చెయ్యగలిగిందేమయినా మిగిలి వున్నదా?

“వాళ్లుండే చోటికి కారు పట్టే వెడల్పుండే రోడ్డు వస్తే సరిపోదూ? తారు రోడ్డే అక్కరలేదు. మట్టి రోడ్డు చాలు!” వెంకటరెడ్డి చాలా మామూలుగా అన్నాడు.

“యు ఆర్ గోయింగ్ టు పుట్ దిస్ యాజ్ ఎ కండిషన్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్ ఫర్ స్టార్టింగ్ యువర్ ఫాక్టరీ ఇన్ వైజాగ్?” లిండా అడిగింది.

“రోడ్డు శాంక్షన్ అయిందనీ, పని త్వరలో మొదలుపెడతారనీ చెబితే చాలదూ? హౌ డజ్ హి క్రాస్ చెక్?”

‘సమయానికి తగు మాటలాడి! నయాపైసా ఖర్చు లేకుండా వేడి పెట్టడం!’ అనుకున్నాను మనసులో.

రాజు ప్రశాంతతనీ, బలమయిన ఆశయాలనీ మంటగలపడానికి సహకరిస్తున్నానని అర్థమై, వాళ్లకి రాజు ఎక్కడున్నాడో చెప్పనని మొండికేసి, కారుని వెనక్కు తిప్పిద్దామనుకున్నాను గానీ, రాజు కనుక్కున్న మందుని వాడి క్రానిక్ డిసీజ్ కలిగించే బాధనించి ఉపశమనాన్ని పొందుతున్న పేషెంట్లల్లో నేనూ ఒకణ్ణనని గుర్తొచ్చింది. ఆ సంగతి రాజే చెప్పాడు నా కొకసారి. నీరు ప్రవహించడానికి భూమిలో ఒకవైపు పల్లం వుండాలి. అలాగే ఆవిరి కావాలంటే వేడి సెగ తగలాలి. ఆ పల్లాన్ని గానీ వేడిని గానీ ప్రతిఘటించడం నీటి స్వభావం కాదు. వెంకటరెడ్డి అన్నట్టు ఆకాశంలో వుంటేనే రాజు ఎక్కువ మందికి మంచి చెయ్యగలుగుతాడని ఒప్పుకోక తప్పట్లేదు.

అడ్డు చెప్పడానికి నాకేం మిగల్లేదు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. వ్యాన్ గమ్యం వైపుకు సాగిపోయింది.
---------------------------------------------------------
రచన: తాడికొండ కె. శివకుమార శర్మ, 
ఈమాట సౌజన్యంతో