Showing posts with label అనువాదం. Show all posts
Showing posts with label అనువాదం. Show all posts

Thursday, January 24, 2019

ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము


ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము




సాహితీమిత్రులారా!

ఈ అనువాద లేఖను ఆస్వాదించండి...........

(1910 – భారతి మాసపత్రిక , సాధారణ సంవత్సరాది సంచికనుండి)

[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలు లో 1877 లో జన్మించారు. భువనగిరి, నాగపూర్లలో విద్యాభ్యాసం. సంస్కృతం, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. చరిత్ర పరిశోధకులుగా ప్రసిద్ధికెక్కారు. మహమ్మదీయ మహాయుగం, హిందూమహాయుగం, శివాజి, హైందవ చక్రవర్తులు అన్న గ్రంథాలు రాశారు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల స్థాపించి, భౌతిక శాస్త్రం, దేశ చరిత్రలపై పుస్తకాలు ప్రకటించారు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం పేరుతో తెలుగులో మొట్టమొదటి ఎన్‌సైక్లోపీడియా మూడు సంపుటాలు ముద్రించారు.

ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం ఆయన 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు  పాఠకులు గుర్తించగలరు. లక్ష్మణరావు గారు 1923 లో మరణించారు]

ఔరంగజేబునెడల నెన్ని దుర్గుణములున్నను అతడు గొప్ప విద్వాంసుడని చెప్పక తప్పదు. అతనికి భాషా పాండిత్యమును, లౌకికవ్యవహార జ్ఞానమును, దూరదృష్టియు గలవు. అతని యక్షరములు ముత్తియములవలె ముద్దులమూట గట్టుచుండెను. తనయొద్దకు బంపబడిన ముఖ్యమైన యర్జీల కన్నిటికిని, అతడు స్వహస్తముతో బ్రత్యుత్తరములు వ్రాయుచుండెను. అతనికి చిన్ననాడు చదువు చెప్పిన ముల్లా సాలె అనునతడొకప్పుడు తనకు గొప్పయుడ్యోగ మీయుమని యర్జీ పంపగా, అందుకు బాదుషహా ఈ క్రింది విధమున బ్రత్యుత్తర మంపెను.

” మీరు నాకు అనావశ్యక మైనట్టి అరబ్బీభాష నేర్పుటయందు పెక్కు సంవత్సరములు నిరర్థకముగ గడిపి కోమలమైన నా బుద్ధిని, తీక్ష్ణమైనట్టి నా స్మరణశక్తిని వ్యర్థపుచ్చితిరి. జీవితమునందెన్నడును ఉపయోగపడని భాష రాజపుత్రులకు నేర్పుటకు పది పన్నెండు వత్సరములు వెచ్చించుటయు, ఆభాషయందు నన్ను వైయాకరిణిగను, ధర్మశాస్త్ర జ్ఞు నిగను చేయ యత్నించుటయు నెంత హాస్యాస్పదములు. ఉపయోగమైన విద్యలును, జ్ఞానమును బాలకులకు వారి వారి బుద్ధిననుసరించి చిన్ననాడు నేర్పుటయందు కాలము గడుపుటకు మాఱుగా మా గురువులవారగు మీరు మా బాల్యమును వ్యర్థపుచ్చితిరిగదా! అయ్యో! భూగోళజ్ఞానమా ఏమియును లేదు. పోర్చుగలు, హాలండు, ఇంగ్లండు మొదలగు దేశములు కొన్ని కలవనియు, అవి ఆయా స్థలము లందు కలవనియు, నాకు నేర్పితిరా? ఆ దేశములు ద్వీపములా, ద్వీపకల్పములా, సమభూమియందున్నవా, లేక ఎత్తుస్థలములందున్నవా యన్న సంగతులు నాకు తెలియ వలదా? చీనా, పారసీకము, పెరు, తార్తారి మొదలైనదేశముల రాజులు హిందూదేసపు బాదుషహా పేరువిని గజగజ వణికెదరని నా ఎదుట మీరు చేసిన ముఖస్తుతి వలననే దేశ దేశ చరిత్రములన్నియు నాకు తెలిసినవనుకొంటిరా? ఈ జగత్తుమీదనున్న వేరువేరు రాజ్యములెవ్వి? అందలి ఆచారవిచారములు, రాజ్యవ్యవహారములు, మతములు నెట్టివి? ఆ యా రాజ్యములను గల సంపత్తులును, విపత్తులును, ఆ యాదేశము సంపద్విపత్తులలో, ఆ దేశస్థు ల యొక్క ఏ యే గుణావగుణములవలన ఎట్టి యెట్టి మార్పులు గలిగినదియు, ఎట్టి మహత్కారణములచే గొప్పరాజ్యములు తలక్రిందగునదియు అను మహద్విషయములు చరిత్రాధ్యయనములేకయే మా కెట్టుల తెలియ గలవు? ఈ విషయములు మాకు నేర్పితిరా?

రాజపుత్రులు పైని వర్ణింపబడినట్టి యత్యంతావశ్కములగు వివిధ విషయములను నేర్చుకొని జ్ఞానసంపన్నులై తమ బుద్ధిని వికసింపజేయవలయును. కావున రాజపుత్రులయొక్క జ్ఞార్జనకాలమగు బాల్యదశయందలి యొక్కొక్క క్షణము మిక్కిలి విలువ గలదియని యెఱింగి నా బాల్యదశను మీరు చక్కగ వినియోగపఱచితిరా? మీరు నాకు లేనిపోనట్టియు, బుద్ధినిభ్రమింపజేయునట్టియు లౌకికవ్యవహారమునకు నిరుపయోగకరమైనట్టియు పరభాషాజ్ఞానము గఱపుటయందే కృతకృత్యులమైతిమని తలంపలేదా? మొదట పరకీయ భాషనొకదానిని నేర్పి దాని మూలముగా శాస్త్రములు, ధర్మవివేచనము, న్యాయనీతి మొదలైన యావశ్యకములైన విద్యలనేర్పుట సులభమని తలంచితిరా? ఈయావశ్యకములగు విద్యలన్నియు మీరు నాకు నామాతృభాషలోనే నేర్పియుండకూడదా? “నేను ఔరంగజేబునకు తత్త్వజ్ఞానశాస్త్రమును నేర్పెదను” అని మీరు నా తండ్రియగు శహజహాను బాదుషహా గారితో వొకప్పుడనియుంటిరి. మీ రనేకసంవత్సరములకు బ్రహ్మ, ఆకాశము, ఖటపటములు, మొదలైన నీరస శబ్దములచే నేదోయొక విషయము నాకు బోధింప యత్నించినట్లు నాకు జ్ఞాపకమున్నది. ఆ విషయమును గ్రహింపవలయునని నేను పెక్కు పర్యాయములు యత్నించితిని. కాని యందువలన నా జ్ఞాన భాండారమునకును, రాజ్యకర్తృత్వమునకును, ఏమి లాభము కలిగినది? మీరి తేప తేప యుచ్చరించుచున్నందున నీరసములును, పలుకుటకు కఠినములును అగు ఖటపటాది పదములు కొన్ని నాకు జ్ఞాపకమున్నవి. కాని వానితోసంబంధించిన, విషయచర్చ మాత్రము నేను ఎప్పటిదప్పుడు మర చిపోవుచుంటినని మీఱెరుగరా? నేడు ఆవిషయచర్చ జ్ఞాపకమున్నను దాని వలన నాకు ప్రయోజనమేమి? ఇట్లు మీరు కోమలమైనటువంటి నా బుద్ధిని, చురుకుదనమును, వ్యర్థము చేసితిరిగాదే?

నిజముగా నిరుపయోగములైనను మీరు ఆవశ్యకములని తలచిన ఈ విషయములు మీరు నాకు నేర్పినందున మీకు మాత్రమొక లాభము కలిగినది. మూఢులును, అజ్ఞానులును అగు మావంటివారికి మీరు సర్వజ్ఞులనియు, సర్వశాస్త్రపారంగతులనియు, అత్యంతపూజ్యగురువర్యులనియు, నిరథకగౌరవభావమును కొంతకాలమువఱకు పుట్టింపగలిగితిరి. అందువలన పెక్కుదినములవఱకు మీ మాటను మేము మన్నించుట తటస్థించెను. రాజులను వ్యర్థముగా స్థుతించుట, సత్యమును తలక్రిందు చేయుట, నక్కవినయములు నటించుట యను గుణములు మాత్రము మీయందు చక్కగ వసించుచున్నవి. మిమ్ముల నేను నారాజసభయందు, ఒక సరదారునిగ నియమింపవలయునని మీరు కోరితిరిగదా. మీ యొక్క ఏ గుణమును జూచి నేను మీకాపదవినొసగవలయును? మీరు నాకు రాజకీయ, సైనిక, వ్యావహారికవిద్యలలో నేవిద్య నేర్పితిరని మిమ్ములను నేను గౌరవింతును? నన్ను నావశ్యకములైన విద్యలలో బారంగతునిజేసి యుండిన యెడల సికందరు (అలెగ్జాండరు) బాదుషహాకు పరమపూజ్యగురువర్యుడగు మహావిద్వాంసుడైన అరిస్టాటుల్‌ ఎడలగల పూజ్య భావమునే చూపియుందును. అట్టి యుపయోగకరములగు శిక్షణ గాని లాభకరములగు విద్యలనుగాని నేను మీవలన బడయలేదు. కావున మీ విషయమై గౌరవముగాని, పూజ్యభావముగాని నాకు లేదు. మీరు వచ్చిన త్రోవనే వెళ్ళుడు. మీ పల్లెటూరిలోనే దేవుని స్మరణ చేసికొనుచు కాలము గడుపుడు. మీరు నారాజసభలో ప్రవేసింపకూడదనియు, మీరెవరో ఇచ్చటివారెవరికిని తెలియకూడదనియు నా యభిప్రాయము.”

ప్రస్తుతకాలమందు బాలబాలికా విద్యను గుఱించియు, జాతీయవిద్యను గుఱించియు మనదేశమందు కొంత యత్నము జరుగుచున్నది. ఇందును గుఱించి పాటుపడుతున్న మహనీయులకీ యుత్తరములోని రెండుమూడు సంగతులాదరణియములు. బాలబాలికలకు బోధింపబడు విషయములు వారికి, వారి జీవితకాలములో నుపయోగకరముగానుండవలయును. కేవలము పాండిత్యము జూపుటకై అనుపయోగకరములగు విషయములు వారికి నేర్పి గుడ్డిపాఠముచేయించి కాలము వ్యర్థపుచ్చుట, వారికిని, దేశమునకును హానిప్రదము. బాలురకు శాస్త్రములన్నియు వారి మాతృభాషలోనే నేర్పవలయునుగాని పరభాషలో నేర్పుట కేవలము ద్రావిడప్రాణాయామమని ఔరంగజేబు ఉత్తరము వలన మనవారు ముఖ్యముగా నేర్చుకొనవలయును. మొదట పరభాషనభ్యసించుటకు బాలుర కాలమెంతయో వ్యర్థమగును. అట్లు పరభాషవచ్చిన తరువాత, ఆభాషలో శాస్త్రములనభ్యసించుటకంటె మొదటనుండియు స్వభాషలోనే శాస్త్రాధ్యయనము చేసిన యెడల బాలురకెంతయో కాలము, శ్రమయు కలిసివచ్చును కదా? తెలివిగల పిల్లవానికి ఇంగ్లీషుభాష చక్కగ నభ్యసించుటకు సుమారు ఆరేడు సంవత్సరములు పట్టును. అప్పటికా బాలునకు ఇంగ్లీషులో గ్రంథావలోకనము చేయుటకును, శాస్త్రాభ్యాసము చేయుటకును అధికారము కల్గును. ఇట్లు పరభాషాధ్యయనమునకై ఏడెనిమిది సంవత్సరములు వ్యర్థమగుచున్నవి. దేశ భాషలలో శాస్త్రములు జెప్పిన యెడల నీ ఏడెనిమిది సంవత్సరములలో నెన్నియో విద్యలలో పారంగతుడు కావచ్చును. ఇప్పుడు మనదేశమందు ఇంగ్లీషువారి ప్రభుత్వమున్నందునను, ఇంగ్లీషుభాషలో గ్రంథభాండార మసంఖ్యముగ నున్నందునను ధనము గలవారు కొందఱా భాషనభ్యసించుట యావశ్యకమే. మేము వలదనము. కాని సకల శాస్త్రజ్ఞానమును, ఇంగ్లీషుభాషయను గదిలోబెట్టి తాళమువైచి, ఏ.బి.సి.డి. అను తాళపుచెవిని సంపాదించుటకు ఎనిమిది సంవత్సరములు ముక్కు పట్టుకొని తపస్సు చేయనివారలకు జ్ఞానభాండారములోని సొత్తును కొల్లగొట్టునధికారము లేదనియు, విద్యామహిమయు మాతృభాషాప్రభావమును తెలియని దూరదృష్టి విహీనులు తప్ప మరెవ్వరును చెప్పజాలరు.

జ్ఞానార్జనమార్గము లన్నియు పరభాషయొక్క యధీనమునందుండిట కంటె దేసము పాలించి మూర్తీభవించిన యజ్ఞానాంధకారము మఱొకటి కలదా? కావున స్వభాష మూలముననే జ్ఞానార్జనము చేయవలయునని ఔరంగజేబు నుత్తరములో నున్న విషయమును నా జాతీయపాఠశాలాధ్యక్షులు గమనింపవలెను. అట్లు చేయక వారు ఇంగ్లీషుభాషనే జ్ఞానసాధనముగా బెట్టిరేని ఔరంగజేబు తన గురువును నిందించినట్లు రాబోవుతరమునందలి విద్యార్థులు తమ యాయుష్యములోని పది సంవత్సరములు పాడుచేసినందులకు మనలను నిందింపక మానరు.
-----------------------------------------------------------
రచన: కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, 
మూలం: ఔరంగజేబు, ఈమాట సౌజన్యంతో 

Monday, September 3, 2018

తత్త్వశాస్త్రం యొక్క ఆవశ్యకత


తత్త్వశాస్త్రం యొక్క ఆవశ్యకత




సాహితీమిత్రులారా!

"The Ultimate Belief" by CLUTTON BROCK ను మౌలిక విశ్వాసం
పేరున అనువదించడం జరిగింది అందులోని ఉపోద్ఘాతం ఈ రోజు
చూద్దాం.................

ఉపోద్ఘాతం

ఈ చిన్ని పుస్తకాన్ని ఎప్పుడైనా రాసి ఉండొచ్చు గాని, ఈ ప్రపంచ యుద్ధం దానికి ప్రేరణనిచ్చింది. జర్మన్లు వాళ్ళ పాఠశాలల్లో, అక్కడి జనాభాలో ఎక్కువమంది ఆమోదించే ఒక రకమైన భావజాలాన్ని బోధిస్తారు, దానికి అనుగుణంగానే వాళ్ళు ఇప్పుడు ఆచరిస్తున్నారు. అది వాళ్ళకి ఒక ఐకమత్యాన్నీ, మొండి ధైర్యాన్నీ ఇచ్చింది; అంతే కాదు, మనందరకూ తెలిసిన అనేక నేరాలు చేసేలా ప్రేరేపించింది కూడా. మనం, దానికి విరుద్ధంగా, మన పాఠశాలల్లో ఏ భావజాలాన్నీ బోధించము, కనీసం తత్త్వచింతనగా పిలవదగ్గదేదీ బోధించము; అలా చెప్పనందుకు గర్వపడతాము కూడా. ఒక భావజాలం జర్మన్లు అంత క్రూరులుగా మారిస్తే, మనకి ఏ రకమైన భావజాలం లేకపోవడమే మెరుగు అనుకుంటాం. కానీ జర్మను భావజాలం చెడు ఫలితాలనివ్వడానికి కారణం ఆ ఆలోచనలలోని చెడుదనం; నైతికంగానే కాదు, మేధోపరంగా చూసినా. ఒక భావజాలంలో దోషం ఉన్నంత మాత్రం చేత ఏ రకమైన భావజాలాన్నీ కలిగి ఉండకపోవడమే మంచిదనుకోకూడదు. జర్మనులు వాళ్ళ చెడు ఆలోచనలా ప్రోద్బలం వల్ల కొన్ని మంచి విలువల్ని కూడా వాళ్ల చెడు లక్ష్య సాధనకి దుర్వినియోగం చేశారు; కానీ వాళ్ళు ప్రపంచం నిర్ఘాంతపోయేలా ఆచరించేరు; మనం ఏ రకమైన ఆలోచనా లేకపోవడం వల్ల, మంచిది గాని చెడ్దది గాని, మనం ఏ విలువలూ ప్రదర్శించలేకపోయాము. మనకి మన విద్యావిధానం ఉంది, కానీ దానికి మనిషిగురించినది గాని, విశ్వం గురించినది గాని, ఏ తాత్త్విక ప్రాతిపదికా లేదు. మనకీ ఒక మతం ఉంది, కానీ, అందులోనూ ఏ రకమైన తాత్త్విక చింతనా లేదు. ఏ తాత్త్విక చింతనా లేని మతం సజీవమైన మతంకాదు. అది దాని విశ్వాసాలని నిలబెట్టుకోవచ్చునేమోగాని, ఆ నమ్మకాల వెనుకనున్న అసలు కారణాలు తెలుసుకోలేదు. ఉదాహరణకి ఒక బాలుడున్నాడు. వాడికి దేముడున్నాడనీ, దేముణ్ణి ప్రేమించాలనీ చెప్పారు; కానీ దాని వెనుక ఒక తాత్త్విక ప్రశ్న ఉంది: అతడు దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? అన్నది. దానికి గాని సరియైన సమాధానం చెప్పకపోతే, అతడు దేవుణ్ణి తప్పుడు కారణాలకి ప్రేమించడం నేర్చుకుంటాడు, దానివల్ల అతన్ని ప్రేమించడంలో విఫలమౌతాడు. అతడు తనని ప్రేమించుకుంటూ, దేవుణ్ణి ప్రేమిస్తున్నాననుకుని తనని తాను మోసం చేసుకుంటుంటాడు. మనం స్వర్గానికి వెళతాం కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలనుకునే వాళ్ళది కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ స్వలాభాపేక్ష స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక రగిలిస్తోంది; మీరు భగవంతుణ్ణి గాని, మరెవరిని గాని, ఏ వస్తువుని గాని, స్వంతలాభం ఆశిస్తున్నంత సేపూ ప్రేమించలేరు.

తత్త్వశాస్త్రం ఒక్కటే మీకు దేవుణ్ణి గాని మరెవరినైనా గాని ఎందుకు ప్రేమించాలో; అసలు ప్రేమ అంటే ఏమిటో చెబుతుంది. కనుకనే మనం తత్త్వచింతనలేకుండా బ్రతకలేము, మనకి ఎంత ధార్మిక చింతన ఉన్నప్పటికీ. నిజానికి, మనకి ధార్మిక చింతన ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువగా మనం తత్త్వచింతన ఆవశ్యకతనీ, యువతకి చిన్నప్పటినుండీ దాన్ని బోధించవలసిన అవసరాన్నీ గ్రహించగలుగుతాము. మనం మంచి అంటే ఏమిటో, మనుషులు ఎందుకు మంచిగా ఉండాలో స్పష్టమైన అవగాహనలేకపోతే, మనం మంచిగానూ ఉండలేము, మంచిగా ఎలా ఉండాలో ఇతరులకి చెప్పనూ లేము. ఒక చిన్న పిల్ల వాడికి ఒక పని ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెబుతూ, అలా చెయ్యమని చెప్పడానికి వెనకగల కారణం చెప్పకపోతే, జీవితం ఏ నిబంధనలూ లేని ఎవరు ఎలాపడితే అలా ఆడే ఆట అని చెబుతున్నట్టు లెఖ్ఖ; అదే నిజమైతే, జీవితానికి విలువలేదు.

ఆ విషయంలో జర్మనులు పిల్లలకి కనీసం ఒక స్పష్టమైన సిద్ధాంతాన్ని బోధించారు. వాళ్ళు తమ పిల్లలకి వాళ్ళు మంచిగా ఉండాలనీ, వాళ్ళు ఏమి చేసినా దేశం మంచి కోసం చేయాలనీ చెప్పారు; వాళ్ళ పిల్లలు దీన్ని నమ్మి, జర్మనుల దృష్టిలో ఏది మంచి అయితే, ఆ దృష్టిలో ఆశ్చర్యకరంగా అంత మంచిగానూ ప్రవర్తించగలిగేరు. వాళ్ళు చాలా శ్రమించారు, విధేయత కలిగి, ఆత్మ-త్యాగం చేసుకున్నారు. వాళ్ల దేశం పరిశుభ్రమైన దేశంగా, అత్యంత నైపుణ్యవంతమైన దేశంగా, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా, మానవాళికి భరింపరాని ఉపద్రవంగా తీర్చిదిద్దేరు. ఇందులో మనకి స్పష్టంగా తెలుస్తున్నది, “మంచితనం” అంటే వాళ్ళకున్న అభిప్రాయం మనకున్న అభిప్రాయం ఒకటి కాదని; కానీ, వాళ్ళ భావజాలపు అంటురోగం మన మనసులకి సోకకూడదనుకుంటే మన దృష్టిలో మంచితనం అంటే ఏమిటో మనకి తెలియాలి. మన అభిప్రాయం ఏమిటో అంచనా వెయ్యడంలో గాని, మనపిల్లలకి బోధించడంలో గాని మనం ఘోరంగా విఫలం అయ్యాము.

మనకే అదేమిటో తెలియకపోతే, మనం మనిషి మనసు గురించి ఏం అనుకుంటున్నామో, ఈ జీవితం లక్ష్యం ఏమిటో, ఈ సృష్టి తత్త్వం ఏమిటో తెలుసుకోకుండా, పిల్లలకి బోధించలేము. ఈ విషయాలేవీ చెప్పకుండా మనం ఏది చెప్పినా అది పేలవంగానూ, నమ్మలేనిదిగానూ ఉండి పిల్లలు వ్యతిరేకించే అవకాశం ఉంది నిజానికి, చాలా సార్లు సవాలు చేస్తారు కూడా. ఇంగ్లండులో ఒక గుడ్డిగా ప్రతిదాన్నీ వ్యతిరేకించే, నిష్ప్రయోజనమైన ప్రతిస్పందన యువతలో కనిపిస్తుంది. మనం దాని గురించి చాలా గర్వపడతాం గాని, దానికి తగిన కారణం కనిపించదు.

వాళ్ళకి సత్యం అంటే ఏమిటో బోధిస్తే, అది వాళ్ళు నేర్చుకుని, విశ్వాసం ఉంచితే మంచి జరుగుతుంది. మనం వాళ్ళకి సత్యం ఏమిటో చెప్పలేనపుడు, వాళ్ళకి ఏదీ చెప్పకుండా ఉండవలసింది. తిరుగుబాటు అంటే ఎప్పుడు తప్పే, అది తిరగబడినవాళ్లలో గాని, తిరగబడిన వాళ్ళమీదగాని; కనుక అది మనకి గత్యంతరంలేని చివరి మార్గం. మంచి బోధనకి ఋజువు ఏమిటంటే, అది విద్యార్థి నమ్మడం, నమ్మిన వాళ్ళకి అది లాభం చేకూర్చడం. జర్మను బోధన ఎందులో బాగుంది అంటే, దాన్ని అందరూ నమ్మేరు; అది ఎందులో బాగులేదంటే, అది వాళ్ళకి మంచి చెయ్యలేదు. మన బోధన ఎక్కడ చెడ్దగా ఉందంటే సర్వసామాన్యంగా యువతలో ఒక మోస్తరు దాటి తెలివైన పిల్లలకి అది నమ్మశక్యంగా కనిపించదు; వాళ్ళకి అలా కనిపించడానికి కారణం అందులో పొంతనా లేదు, స్థిరత్వమూ లేదు.

నేను స్వయంగా ఉపాధ్యాయుడిని కాను; కాని నేను స్వయంగా నేర్చుకున్నాను, నాకు చెప్పినదానిపట్ల నాకు గుడ్డిగా కలిగిన ప్రతిస్పందనలు గుర్తున్నాయి. ఒకసారి గతంలోకి చూసి వాటిని తలుచుకున్నప్పుడు, నాకనిపిస్తుంది, నేనెందుకు ప్రతిఘటించేనంటే, నాకు ఎవ్వరూ చెప్పనూ లేదు, చెప్పే ప్రయత్నమూ చెయ్యలేదు, నేను ఎందుకు జ్ఞానాన్ని ప్రేమించాలో, అందాన్ని లేదా ధర్మాన్ని ఎందుకు ఆరాధించాలో. చెప్పిన పాఠాలు నేర్చుకోవాలనీ, కొన్ని నియమాలు పాటుస్తూ నడుచుకోవాలనీ నాకు చెప్పారు, దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది నేను మా ఉపాధ్యాయులకి దానివల్ల సౌకర్యంగా ఉంటుంది కాబట్టీ, నేను అలా చెయ్యకపోతే వాళ్ళు నాకు జీవితం దుర్భరం అయిపోతుందికాబట్టీ అలా ఉండాలనీ. నిస్సందేహంగా ఇందులో నాది కొంతవరకు తప్పు ఉంది. నేను వాళ్ళ బోధనలకీ, నేను జీవితంలో పైకి రావాలనుకుంటున్న ఆకాంక్షలకీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించవలసింది. కానీ, వాళ్ళూ దీన్నే మరింత స్పష్టంగా చెప్పి ఉండాల్సింది. పర్యవసానంగా, మనిషి మనసంటే ఏమిటో, జీవితానికి లక్ష్యం ఏమిటో, ఈ సృష్టి యొక్క లక్షణాలు ఏమిటో నా అంతటగా నేను దాన్ని తెలుసుకోవలసి వచ్చింది… నెమ్మదిగా, అస్తవ్యస్తంగా ఎంతో వేదనపడుతూ.

ఈ పుస్తకంలో, ఈ నమ్మకాల్ని క్లుప్తంగా, స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. అవి నా స్వంత ఆలోచనలని చెప్పే దుస్సాహసం చెయ్యను. బదులుగా, అవి చాలా మంది మనుషులు విశ్వసించేవనీ, చాలామంది ఉపాధ్యాయులు బోధించడానికి ఉత్సాహపడతారనీ అనుకుంటున్నాను. అవి ఎంత తక్కువగా ప్రస్తావించడంగాని, బోధించడంగాని జరుగుతుందంటే, అసలు అలాంటివి ఉన్నాయన్న ఎరుకే ఉండదు. ఈ యుద్ధం, జర్మను ప్రజలు చేసిన ఘాతుకాలూ నా నమ్మకాల్ని నేను స్పష్టంగా అవగాహన చేసుకునేలా చేశాయి. యువకులూ వృద్ధులూ అన్న తేడా లేకుండా నేను చాలా మందిలో ఇదేరకమైన కోరికని గమనించేను. జర్మనుల ప్రవర్తన వెనుక ఒక తాత్త్విక చింతన ఉందనీ, ఆ తప్పుడు ఆలోచనా విధానం వాళ్ళ దేశప్రయోజనాలకోసం ప్రచారం చెయ్యబడిందనీ మనకందరికీ తెలిసిందే. వాళ్ళు చేసిన పొరపాట్లే మనం కూడా చెయ్యకుండా ఉండడానికీ, మనకున్న బలహీనతలనుండీ, దోషాలనుండీ తప్పించుకోవాలంటే మనకి ఎటువంటి తాత్త్విక చింతన అవసరం? ఇక్కడ ఇంగ్లండులో, గత కొన్నితరాలనుండీ అటు చెప్పుకోదగ్గ ఉపాధ్యాయులమూ కాదు, నేర్చుకునే విద్యార్థులమూ కాదు. ఈ దౌర్భాగ్యమే దానికి అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని మన ప్రమేయం లేకుండా, ప్రపంచమంతటా ఆవరించి ఉండవచ్చు. మన మేధస్సుని ఒక చేతిరుమాలులో చుట్టి, మానవాళిని ముందుకీ తీసుకుపోలేదు, వెనక్కీ తీసుకుపోలేదు. మనం ఇటువంటి నకారాత్మకమైన స్థితిలో కొనసాగలేమని గ్రహించాము. మనం కూడా జర్మనులు నమ్మినదే నమ్మడం గాని, లెదా దానికి వ్యతిరేకమైనది ఏదో ఒకటి సృజనాత్మకమైనదీ, అద్భుతమైనది నమ్మడం గాని చెయ్యాలి. మనకంటూ మన పిల్లలకిమప్పగల ఒక భావజాలం మనకి ఉండాలి

అటువంటి తాత్త్వికచింతనని ప్రస్తావించడానికి ప్రయత్నించేను, పిల్లలకి చెప్పగలిగే విధంగా కాదు గాని, నాకంటే బాగా పిల్లలకి ఎలా చెప్పాలో తెలుసు కాబట్టి, ఉపాధ్యాయులకి అర్థం అయేలా. వాళ్లు దీన్ని నమ్మి, దాని మీద పరిశ్రమిస్తే, వాళ్ళు చెప్పే విధానంతో బాటు చెప్పే విషయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది; ఎలా చెప్పాలన్నది వాళ్ళకి సంబంధించినది, నాకు బోధనలో ఏ రకమైన అనుభవమూ లేదు.

బెనెడెట్టో క్రోసే Aesthetics గురించి పరిచయమున్న వాళ్ళకి ఈ శాస్త్రంలో నేను అతని దగ్గరనుండి చాలా నేర్చుకున్నానని తెలుస్తుంది. వాళ్ళకి ఒక సందర్భంలో అతని అభిప్రాయానికి భిన్నంగా జరిగేననీ తెలిస్తుంది. కాని దాని గురించి నాకే స్పష్టంగా తెలియదు. అతను ఏ సిద్ధాంతాలు ప్రతిపాదిస్తాడని నమ్ముతున్నానో అవే ప్రతిపాదిస్తున్నాను. ఏది ఏమయినా, ఇక్కడ అతనికి నేను ఎంతో ఋణపడి ఉన్న విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను.
                                       [ఇంకా ఉంది...]
---------------------------------------------------------
రచన - నౌడూరి మూర్తి, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Friday, December 15, 2017

శ్లోకానువాదం ఎలా వుండాలి?


శ్లోకానువాదం ఎలా వుండాలి?




సాహితీమిత్రులారా!

సంస్కృత శ్లోకాలను అనువదించేప్పుడు
శ్రీనాథుడు పెట్టుకొన్న నియమాలను
అనుసరిస్తేనే మూలం చదువుతున్నంత
తృప్తి దొరుకుతుందట-
ఆ నియమాలు
1. శబ్దాన్ననురించి ఉండటం  
2. అభిప్రాయాన్ననుసరించి ఉండటం
3. భావాన్ని ఉపలక్షించటం
4. రసాన్ని పోషించటం
5. అలంకారాలను భూషించటం
6. ఔచిత్యాన్ని ఆచరించటం
7. అనౌచిత్యాన్ని తీసివేయటం
చేసినప్పుడే "మాతృకను అనుసరిచి చెప్పబడిన 
కావ్యంమే హృదయంగమం"గా ఉంటుందట.
ఇక్కడ ఒక శ్లోకాన్ని విద్వాన్ విశ్వంగారు
రెండు కందాల్లో అనువదించిన తీరు గమనిద్దాం-

మందాక్రాంత వృత్తం -
ధూమజ్యోతి స్సలిల మరుతాం సన్నిపాతః క్వమేఘః
సందేశార్ధాః క్వపటు కరణైః ప్రాణిభిః ప్రాపణీయాః
ఇత్యౌత్సుక్యాదపరి గణయన్ గుహ్యకస్తం యయాచే
కామార్తాహి ప్రకృతి కృపణా శ్చేతనా చేతనుషం

దీనికి విశ్వంగారి తెనిగింపు(ఆంధ్రీకరణం)-

ధూమజ్యోతి స్సలిల మ
హా మారుత సన్నిపాతమగు మబ్బేడా?
ధీమంతులు గొంపోయెడు
క్షేమ సమాచారమేడ? చిత్రము కదా?

అయినన్ తన తమి పెనగొని
వయికొన్నన్, యక్షుడబ్దపతి యాచించెన్
దయితాదూరుల మతి, కెం
తయినా చేతనవిచేతనము లొకటిగదా?