Sunday, September 30, 2018

1 + 1(కథ)


1 + 1(కథ)




సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

ఐ యామ్ ఎ మాన్!
మై స్పర్మ్ కౌంట్ ఈజ్ గుడ్!
అండ్, దట్ ఈజ్ మై సిన్!
6:01 PM
తన్నుకొస్తున్న ఆవేశాన్ని గొంతులో నొక్కేసి, రెండు బొటనవేళ్లలో బలాన్నంతా మొబైల్ కీబోర్డుపై చూపించి, ఆ మెసేజ్ వాట్సాప్ చేశాడు. ఒక క్షణం ఆగి చూశాడు. మెసేజ్‌ల పక్కన ఒక టిక్ మార్క్ వచ్చింది. వెంటనే రెండోది కనిపించింది. అవి నీలం రంగులోకి మాత్రం మారలేదు. నిట్టూర్చి, ఇంకా ఏదో టైపు చేయడం మొదలుపెట్టాడు. అనుకుంటున్నవన్నీ అనటానికి ఆటో కరెక్ట్ అడ్డుపడింది. గొంతులో అణిచి ఉన్న ఆవేశం ‘ఫక్’గా తప్పించుకుంది. సోఫాలో రెండు పల్టీలు కొట్టి కుషన్ల మధ్య ఖాళీలో ఫోన్ దాక్కుంది.

సోఫా ముందున్న కాఫీ టేబుల్ మీదకు కాళ్ళు చాచి, కాలితోనే ఎదురుగా వున్న మాక్‌బుక్‌ను ఒక పక్కకు నెట్టి, కళ్ళుమూసుకున్నాడు.

ఇంతలో ఫోన్ గుర్రుమంది, నొక్కేసిన గొంతుతో. కదలకుండా అలానే ఉండి చేతులతో వెతికాడు. పక్కకు వంగితేగాని దొరకలేదు. సైలెంట్‌మోడ్‌లో పెట్టబోతుంటే లాక్ అయ్యున్న స్క్రీన్ మీద సంధ్య పేరు కనిపించింది. ఒక్కసారిగా తల ఎత్తి కూర్చున్నాడు. వచ్చిన మెసేజ్ ఏంటో చూసుకోకుండా ఆమెకు తను పెట్టిన మెసేజిలు చదువుకున్నాడు. అందులో స్పర్మ్ ప్రస్తావన లేదని నిర్ధారించుకొని ఊపిరి తీసుకున్నాడు.

బావా! మీ ఇద్దరి గురించి బెంగగా ఉంది.
డోంట్ టార్చర్ యువర్ బాడీస్ ప్లీజ్.
6:09 PM
ఫోన్‌ని బోర్లా తిప్పి గుండెలపై పెట్టుకున్నాడు. ఎనిమిది నెలల క్రితం ఫామిలీ గెట్‌టుగెదర్‌లో కూడా సంధ్య ఇలానే ఏదో అంది, పిల్లలు లేకపోతేనేం? దత్తత తీసుకోవచ్చుగా! అని. అంతే! వాళ్ళమ్మ కొట్టినంత పనిచేసింది. అతడి అమ్మానాన్నలు కళ్ళతోనే కసిరారు. ‘ఏం? తన పిల్లల్ని అక్కకి ఇచ్చేస్తుందటనా?’ అని చుట్టాల్లో కొందరు వినిపించేట్టు గుసగుసలాడారు. ఆ రోజు ఆ మాట విని అక్కడ నుండి వెళ్ళిపోయిన అతడి భార్య మళ్ళీ చెల్లెలితో మాట్లాడలేదు.

ఫోన్ చేతిలోకి తీసుకుని మళ్ళీ వాట్సాప్ తెరిచి చూశాడు. విజయ్ నుంచి రిప్లయ్ లేదు. ఇంజనీరింగ్ హాస్టల్‌లో ఒకే గది పంచుకున్నవాళ్ళు. నాలుగేళ్లు అయ్యాక ఆ గదిని కూడా తమతో పాటు మోసుకెళ్లినవాళ్లు. దూరభారాల మీద ఫోనుల్లో మాట్లాడుకోవడం, లైట్లు ఆపేసి, ముసుగులు తన్నేశాక చీకట్లో కబుర్లు చెప్పుకున్నట్టు అనిపించదు. మెసెంజర్లలో మాట్లాడుకోవడం మాత్రం ఒకళ్ళు గదిలో లేనప్పుడు ఇంకోళ్ళకి కాగితం మీద రాసి పెట్టి వెళ్లిన మెసేజెస్‌లా ఉంటుంది. ఏదో అత్యవసర విషయం చెప్పడానికే కానీ, మనసులో మాట చెప్పుకోడానికి కుదరదు.

‘విజయ్ టైపింగ్’ వాట్సాప్ చూపించింది. మొబైల్‌లో టైపింగ్ కష్టమని పక్కకు పెట్టి మాక్ తీసుకున్నాడు. ఇంకేమన్నా మెసేజెస్ వస్తాయేమోనని ఎదురుచూశాడు. తాను పంపిన మెసేజెస్ మళ్ళీ చదువుకుని మొహం పక్కకు తిప్పేసుకున్నాడు. ఇందాకటి ఆవేశమంతా నీరుకారిపోయింది. వాట్సాప్ స్టేటస్ ఇంకా మారలేదు. మాక్ మూసేసి బైటకు చూశాడు.

బైట చిన్నగా చీకటి పడుతోంది. లేచి బాల్కనీకి ఉన్న గ్లాస్ డోర్ తీయబోయాడు. అది జరగలేదు. బలంగా లాగాడు. ఆన్‌సైట్లో ఉండగా ఇంట్లో అద్దెకు ఉన్నవాళ్ళు అప్పుడే నడక వస్తున్న పిల్లాడికోసం అతి జాగ్రత్తతో, బాల్కనీ తలుపు తెరిచేవాళ్ళుకాదు. వాడకం లేక తలుపు బిగుసుకుపోయింది.

ప్లేగ్రవుండ్‌లో లైట్లు వెలుగుతున్నాయి. ఆడింది చాలని పిల్లల్ని ఇళ్ళల్లోకి లాక్కుపోతున్న తల్లిదండ్రులు. ప్లేగ్రవుండ్ ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్ కోసం అప్పట్లో ఎక్కువ డబ్బులు పోసి కొన్నారు. పెళ్ళయిన ఏడాదికే తీసుకున్న ఫ్లాట్. ఆఫీసు నుండి ముందుగా అతడే ఇంటికి చేరుకునేవాడు. గంటన్నర ప్రయాణంచేసి వచ్చే ఆమె కోసం తినడానికి ఏదో ఒకటి చేసిపెట్టి, బాల్కనీలో ఎదురు చూస్తుండేవాడు, ఆడుకునే పిల్లల్ని చూస్తూ. ఆమె ఇంటికి వచ్చాక, అతను చేసిన పకోడీలో, శాండ్‌విచ్‌లో తింటూ, ‘పిల్లలకు నీ పోలిక వస్తే, మాస్టర్ చెఫ్ అవ్వడం ఖాయం’ అనేది. ‘ఏమన్నా అవనీ గాని, కొడుకు పుడితే సచిన్ అని, కూతురు అయితే శచి అని పేరు పెడతా’నని అనేవాడు. వాళ్ళ అమ్మలు దాన్ని కాస్తా సాయి వెంకట సచిన్‌గా మార్చేస్తారని ఉడికించేది ఆమె. ‘పిలుచుకోమను పర్లేదు, రిజిస్టర్‌లో రాయనియ్యను. పిల్లలకి ఊహ తెలిశాక, సచిన్ ఇండియాలో ఆడే మ్యాచులన్నింటికి తీసుకెళ్తా’ అంటుంటే అతని కళ్ళు మెరిసేవి. వరల్డ్ కప్ తర్వాత సచిన్ ఆడడేమో అని గుర్తుచేసేది ఆమె. ‘రైట్! అవును కదా. పద పద, టైమ్ లేదు మన దగ్గర,’ అంటూ ఆమెను దగ్గరకు తీసుకునేవాడు. ‘ఏంటిది బాల్కనీలో, ఎవరన్నా చూస్తే…’ అంటూ విడిపించుకునేది నవ్వుతూ, లోపలికి నడుస్తూ.

పట్టుకున్న బాట్‌లో సగం హైట్ కూడా లేని పిల్లలంతా, ఇప్పుడు అండర్ 10 టోర్నమెంట్స్‌లో ఆడుతున్నారు. పట్టుకున్న బాట్‌లో సగం హైట్ కూడా లేని పిల్లలు కొత్తగా వస్తూనే ఉన్నారు.

ఫోన్ రింగయింది. అమ్మ. కాల్‌ తీసుకోలేదు. వాట్సప్‌లో కదలిక, విజయ్ నుండి.

ఆర్ యూ ఓకే? కెన్ ఐ కాల్?
7:23 PMకుదరదు. పక్క గదిలోనే ఉంది.
7:23 PMఅబే గిరీ… నువ్వు ఇష్యూని ఇంకా కంప్లికేట్ చెయ్యకురా.
డాక్టర్‌తో మాట్లాడి, కొంచెం బ్రేక్ తీసుకోండిబే.
7:24 PMఒప్పుకోదురా.
7:24 PMపోనీ, గెట్ హర్ బాక్ టు వర్క్?
తన మైండ్ ఆక్యుపైడ్ అవుతుంది.
7:26 PMఅవ్వదురా! జాబ్ వల్లే ఇదంతా అంటుంది. షి ఈజ్…
7:26 PM
గాజుల చప్పుడు, సెల్ ఫోన్ రింగ్ దగ్గరవ్వటంతో హోమ్ బటన్ నొక్కాడు ఠక్కున. దాటకూడని గీతున్నట్టు ఆమె ఇవతలి నుండే ఫోన్ అందించింది. అతడే బాల్కనీ తలుపు దగ్గరకు వచ్చాడు. ‘అత్తయ్య కాలింగ్’ కనిపించింది ఆమె ఫోనులో.

“ఆఁ, అమ్మా, చెప్పు.”

“అమ్మనేరా! కనీసం, నా ఫోను కూడా తీయలేవురా?!”

“ఫోను సైలెంట్‌లో ఉందమ్మా. నేనేదో పనిలో ఉన్నా.” విసుగు వినపడకుండా సంజాయిషీ ఇవ్వడం ఎందుకింత కష్టం. ఎందుకీ అవసరం.

“అంతే! మీకెంతసేపూ పనులే! మీ జీవితాలు బాగవ్వాలని మేం కిందా మీదా పడాలి గానీ, మీకేం పట్టింది?”

అతడు బాల్కనీలోంచి ఇంట్లోకి వచ్చాడు. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ, డైనింగ్ టేబుల్ చేరుకుంది. టేబుల్ మీదున్న ప్రసాదం బాగులోంచి కొబ్బరి చెక్కలు తీసి బయటపెట్టింది.

“స్పీకర్‌లో పెట్టు. ఇద్దరితో మాట్లాడాలి.”

“దేని గురించి?”

అతడూ మెల్లిగా నడుస్తూ డైనింగ్ టేబుల్ చేరుకున్నాడు. కుర్చీ లాక్కుని కూర్చుంటూ స్పీకర్ ఆన్ చేసి, ఫోన్ టేబుల్ మీద పెట్టాడు.

“మీ నాన్నా, నేనూ మొన్న ఒక బాబాగారిని కలిశామని చెప్పాను కదా!” అతడు భుజాలు జారిపోయాయి. సగం మొహం చేతిలో దాచుకున్నాడు. ఆమె తల ఎత్తకుండా కొబ్బరి చెక్కల్లోంచి కొబ్బరి తీస్తోంది, ముక్కలుగా.

“మీ జాతకాలు చూపించాం. ఏ దోషమూ లేదు. దేవుడు పరీక్ష పెడుతున్నాడంటే గొప్ప వరమే ఇవ్వబోతున్నాడు అని అన్నార్రా ఆయన!”

ఆమె కొబ్బరిని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కోయడం మొదలుపెట్టింది.

“ఆయన రేపు హైదరాబాదులోనే ఉంటారు. మీరిద్దరూ వెళ్ళి కలవండి.”

“రేపా? రేపంటే ఎలా అమ్మా. ఇవ్వాళ చిత్రకి మళ్ళీ టెస్టులు చేశారు మధ్యాహ్నం అంతా. పొద్దున్న గుడికెళ్ళి 108 ప్రదక్షణలు చేసొచ్చాం. ఇద్దరం అలసిపోయున్నాం.”

“నూటఎనిమిది కాకపోతే, వెయ్యిన్నూట పదహార్లు చెయ్యండి! నేను పొమ్మన్లేదే! అది వీసాలొచ్చే గుడి. పిల్లల కోసమని ఎవరూ వెళ్ళగా నేను వినలేదు. మళ్ళీ పారిపోయే ఉద్దేశాలు ఉన్నాయేమో మరి మీకు!”

ఆమె చేతిలోని చాకు ఆగింది. ఆ గుడికి వెళ్ళమంది చిత్ర వాళ్ళ అమ్మ అని గుర్తొచ్చి నాలుక కర్చుకున్నాడు. స్పీకర్ ఆఫ్ చేశాడు.

“సరే! ఎక్కడ?”

“చాంద్రాయణగుట్టలో. మీ నాన్న అడ్రస్ మెసేజ్ చేస్తారు. ఐదింటికల్లా అక్కడ ఉంటే స్పెషల్ దర్శనం కుదురుతుందని ఆ సెక్రటరీ చెప్పాడు.”

“ఐదింటికా! గంటన్నర దూరం మాకు.” అన్నాడు, కాలు ఒత్తుకుంటూ. అవతలివైపునుంచి అసహనంగా మౌనం.

వెంటనే సర్దుకొని, “సరే! వెళ్తాంలే.” అంటూ కాల్ కట్ చేశాడు.

ఇంతలో తన ఫోన్‌లో విజయ్ నుండి మెసేజ్. సారీ రా! అర్జున్‌ని సాకర్‌కి తీసుకెళ్ళాలి. మళ్ళీ మాట్లాడతా.

రెండు ఫోన్లు టేబుల్ మీదే పడేసి, స్టవ్ దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే చట్నీకి కావాల్సిన పోపు చిటపటలాడుతోంది. గరిటెకి, గిన్నెకి మధ్య పోట్లాట జరుగుతున్నట్టు శబ్దాలు. కారుతున్న టాప్‌లోంచి నీళ్ల చుక్కలు క్లాగ్ అయిన సింక్‌లో టప్ టప్ అంటూ పడుతున్నాయి.

నీళ్ళు వెళ్ళడానికి ఆమె ఒక పుల్లతో పొడుస్తోంది డ్రెయిన్ కన్నాలలోకి. అతడు స్టవ్ దగ్గరకు వెళ్ళాడు. ఆమె పుల్లతో కసిగా విసురుగా పొడుస్తోంది. నీరు పోలేదు. చేతిలో పుల్ల సింక్‌లోకి విసిరేసి చటుక్కున కింద పైపు లాగడానికి వంగబోయింది. అతడు ఒక్క అడుగులో ఆమెను చేరుకొని, పట్టుకొని కూర్చీలో కూర్చోబెట్టాడు. ఆమె కళ్ళు మూసుకొని అలానే ఒక నిమిషంపాటు ఉండిపోయింది. లేచి, చేతులు కడుక్కొని, అతడి చేతిలోంచి గరిటె తీసుకుని, కొబ్బరి ముక్కలతో పాటు పోపు మిక్సీలో వేసింది.

అతడు వచ్చి సోఫాలో వాలాడు. కళ్ళు మూసుకొని నుదుటి మీద చేయి అడ్డంగా పెట్టుకొన్నాడు.

మిక్సీ మోత ఆగుతూ మొదలవుతూ ఆగుతూ. అతడికి తల బరువుగా అనిపించింది. కళ్ళు మండుతున్నాయి. ఆమె మిక్సీ ఆపింది, మళ్ళీ ఆన్ చేసింది. బహుశా, కొన్ని నీళ్లు పోసుండాలి, మిక్సీ చప్పుడు సాఫయింది.

తన ఆలోచనల్లో కూడా ఎవరన్నా కాసిన్ని నీళ్లు పోస్తే తల ఇంత గోలగా ఉండదు కదా అని అనుకున్నాడు.

“గిరీ, గిరీ!” అని పిలుపు. మెత్తని చేయి అతని తల నిమిరిన భావన. కుక్కర్ విజిల్ లీలగా వినిపించింది.

అతడికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు, లేచి కూర్చుంటూ. తల మీద చెయ్యి వేసేంత దగ్గరగా లేదు ఆమె.

కాఫీ టేబుల్‌కి అటే నిలబడి వేళ్ళని ముద్దలా నోటి దగ్గర పెట్టుకొని సైగ చేసింది. అతడు వాల్చిన తల ఎత్తకుండా ఆమెనే చూశాడు. ఆమె క్షణంపాటు చూసి, కళ్ళు పక్కకు తిప్పేసుకుంది.

మొహం మీద చిలకరించుకున్న నీళ్లు సరిపోలేదు. వెళ్లి షవర్ కింద నిలబడ్డాడు. పట్టేసిన నరాల మీద వేన్నీళ్లు పడుతుంటే కొద్దిపాటి ఊరట కలిగింది.

అతడు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి కుక్కర్ మళ్ళీ స్టవ్ ఎక్కింది.

“రేపు ఎప్పుడు బయలుదేరాలి?” ఆమె అడిగింది అనునయంగా.

“ఐదింటికి అక్కడ ఉండాలంటే నాలుగింటికల్లా బైటపడాలి.”

“నీరసంగా ఉందా?” అంటూ అతడి చేతిని నిమిరింది. చేతినిండా ఎర్రని గాజులు. అవి వేసుకుంటే ఫలితం ఉంటుందని చెప్పారు. ఎవరో అతడికి ఠక్కున గుర్తురాలేదు. ఆ ఎరుపును తప్పించుకోడానికి ఆమెను చూశాడు.

ఉబ్బిన మొహం. కళ్ళ కొసల్లో ఎరుపు. చెదిరిన జుట్టు.

“నీకు బాలేకపోతే మానేద్దాం. అమ్మను మానేజ్ చేయొచ్చు.”

“ముందు ఆవిడ కాల్స్ మిస్ అవ్వకు. అదేదో నేను ఎత్తనివ్వటం లేదన్నట్టు మాట్లాడుతుంది.”

“…”

ఆమె లేచి, సింక్‌లో కంచం పడేసి, టేబుల్ మీద ఉన్నవన్నీ ఫ్రిడ్జ్ లోపల పెట్టేసి, అక్కడ నుండి వెళ్ళిపోయింది.

చేయి ఎండిపోయేవరకూ అక్కడే కూర్చుండిపోయాడు.

ఫోన్ ఆగకుండా వైబ్రేట్ అవుతుండడంతో, చేయి కడుక్కొని, ఫోన్ తీసుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాడు. టీమ్ గ్రూప్ అంతా కంగ్రాట్స్‌తో నిండిపోతోంది. మూడేళ్ళ క్రితం తను కాంపస్‌లో సెలెక్ట్ చేసిన అబ్బాయికి బాబు పుట్టాడు, ఆ సాయంత్రమే. ఆ విషయం తను పాపాయి ఫోటోతో పాటు, ‘ఇట్స్ ఎ బాయ్ ఫర్ వినీత్. బోత్ మదర్ అండ్ బేబీ ఆర్ డూయింగ్ ఫైన్!’ అంటూ టీమ్ లూప్ చేస్తూ అఫీషియల్ మెయిల్ పెట్టాడు, మానేజర్ కాబట్టి. కంపెనీ తరఫున ఇచ్చే గిఫ్ట్ వోచర్లు అతడికి పంపించాడు. ‘కంగ్రాట్స్! రేపు మాట్లాడుకుందాం’ అని మెసేజ్ పెట్టబోయి, కాల్ చేశాడు. “నాకు ముట్టుకోవాలన్నా వణుకు వచ్చేస్తుంది సర్! ఎంత డెలికేట్‌గా ఉన్నాడో!” ఆ అబ్బాయి గొంతులో సంతోషం, ఆత్రం. “వర్క్ గురించి ఆలోచించకు. టేక్ యువర్ టైమ్. కంగ్రాట్స్ అగైన్!” అని పెట్టేశాడు.

చాలామందికి పిల్లల్ని కనటం ఒకటికి ఒకటి కూడినంత తేలిక. వాళ్ళకి మాత్రం ఎందుకో మరి అంత కాంప్లెక్స్ ఈక్వేషన్ అయిపోయింది. వారం క్రితం కఫెటేరియాలో కనపడ్డ వైస్ ప్రెసిడెంట్ గుర్తొచ్చాడు. వాడూ వాడి ఈగోటిస్టికల్ ఆటిట్యూడూ. ‘హేయ్ గిరీ! ప్లానింగ్ ఎనీ కిడ్స్ యెట్?’ ‘యా! వియ్ ఆర్ ట్రయింగ్…’ ‘అవునా! మాకు మొదటిసారే అయిపోయింది. వియ్ డిడ్ ఇట్ ఇన్ వన్ షాట్ యూ నో,’ అన్నాడు అదేదో వాడు ప్లాన్ చేసి చేసినట్టు, వాడేదో ఎక్కువ మగాడు అయినట్టూ. ఒళ్ళు మండిపోయింది. ‘యూ బ్లడీ మోరాన్, ఇట్స్ జస్ట్ టైమింగ్. ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ యూ యూ ప్రిక్!’ అని అరుద్దామనుకున్నాడు. కోపం ఆపుకొని భుజాలెగరేసి ట్రే తీసుకొని వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చిత్ర చెప్పేది కాదు గాని ఇలాంటి సూటిపోటి మాటలు ఆమెకూ రోజూ అలవాటే! ఉద్యోగం చేసినప్పుడు ఒకరకంగా, అది మానేసినాక ఇంకో రకంగా.

మ్యూట్‌లో ఉన్న టి.వి.లో 9పి.ఎమ్. న్యూస్ వస్తోంది. బెడ్రూమ్‌లో నుండి ఏ చప్పుడూ లేదు. ఏ చిన్న కదలిక అయినా, ఆమె గాజుల గలగలల వల్ల తెలిసిపోతుంది. గాజుల గురించి కొన్ని వివరాలు గుర్తొచ్చాయి. అవి వేసుకొని ఏడు మంగళవారాలు గుళ్ళో దానాలు చేయాలన్నారు. ఎవరు? ఎవరో.

సింక్ టాప్ లీక్ అవుతూ కారుతున్న నీటి చుక్కల శబ్దం అతని తల మీద సుత్తిపోటులా ఉంది. లేచి వెళ్ళి, సింక్‌ కింది పైప్ ఊడదీసి శుభ్రం చేశాడు. సింక్‌లో నిలిచిపోయిన నీళ్ళన్నీ బుడబుడమంటూ వెళ్ళిపోయాయి. టాప్‌ని బలమంతా ఉపయోగించి మూయడానికి ప్రయత్నించాడు. అయినా చుక్కలు పడుతూనే ఉన్నాయి.

మళ్ళీ టి.వి. ముందుకొచ్చి కూర్చున్నాడు. క్రికెట్ హైలైట్స్ వస్తున్నాయి. ఫోన్ తీసి టు-డూ ఆప్‌లో ప్లంబర్‌కి కాల్ చేయాలని నోట్ చేసుకున్నాడు. మరుసటి ఉదయం బాడ్మింటన్ ఆడడానికి వెళ్ళాలని గుర్తుచేసింది. ఇగ్నోర్ కొట్టాడు. ఆప్ నుండి బయటకు రాబోతుంటే పొరపాటున అనలటిక్స్ లింక్ మీదకి వేలు వెళ్ళింది. హాస్పిటల్ రిలేటెడ్ ఐటమ్స్ – 73%. ప్రొఫెషనల్ ఐటమ్స్ కంప్లీటెడ్ – 89%. ఫిట్‌నెస్ టు-డూ ఐటమ్స్ – 13%. మూవీ లిస్ట్ కంప్లీటెడ్ – 4%. స్క్రీన్ ఏకరువు పెట్టింది.

గుళ్ళూ గోపురాలు, బాబాలు, ఫకీర్ల లిస్ట్ పెట్టుకోలేదింకా. లేకపోతే, వాటికి కేటాయించిన సమయమేం తక్కువ కాదు. జాతకాల్లో దోషం కనిపించదు. మెడికల్ రిపోర్ట్స్‌లో నో ఛాన్స్ అని చెప్పగలిగేంత ఇష్యూ కనిపించదు. ‘అయ్యా, ప్రతి షష్ఠినాడు, మీరు పసుపు రంగు వస్త్రాలు ధరించి గుళ్ళోని రావిచెట్టు చుట్టూ ప్రదక్షణాలు చేసినట్టయితే, మీకు తప్పకుండా వంశోద్ధారకుడు పుడతాడు!’ అంటాడు పూజారి. ‘మిస్టర్ అండ్ మిసెస్ గిరీ, లెట్స్ ట్రై దిస్ ప్రొసీజర్ అవుట్. బీ హోప్‌ఫుల్. లెట్స్ కీప్ ట్రయింగ్!’ అంటుంది డాక్టరు. కొంత రహస్యంగా ప్రయత్నించిన ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సక్సెస్ కాలేదు. ఇన్‌విట్రో ఖర్చు సంగతి ఎలావున్నా, ముందు ఇంట్లోవాళ్ళ అడ్డంకులు ఎక్కువ, అదేదో చేయగూడని పని అన్నట్టు.

ఇరవై ఓవర్లో, ఐదు రోజులో, కనీసం ఆడాల్సిన ఓవర్లు మిగలకపోతే ఓటమని నిర్ధారణ అయిపోతుంది. అది క్రుంగదీస్తుందో, రాటుతేలుస్తుందో తెలుస్తుంది. ఆశ నిరాశల ఈ ఊగిసలాట ఎన్నాళ్ళో అతనికి అర్థంకాటల్లేదు.

మ్యూట్ చేసిన టివిలో కూడా అందరూ డిబేట్‌లో గొంతు చించుకొని అరుచుకుంటున్నారని తెలుస్తోంది. కాసేపు ట్విట్టర్‌లో తచ్చాడాడు. టెక్, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా, ట్రోల్స్, మీమ్స్ అన్నీ కలగలుపుగా చదివాడు. ‘యు హావ్ ఎ మెమరీ’ అంటూ ఫేస్‌బుక్, అటెన్షన్ కోసం తపిస్తూ. తెరిచి చూస్తే నాలుగేళ్ళ క్రితం యూరప్‌లో స్కైడైవింగ్‌కి వెళ్ళినప్పటి ఫోటో. ఆమె యూరప్‌లో ఉన్నప్పుడు అతను యూఎస్ నుండి సెలవు పెట్టుకొని వెళ్ళాడు. అతను ఎక్కడ జారిపడతానో అన్నట్టు భయభయంగా చూస్తూ ఇబ్బందిగా నవ్వుతూ, ఆమె భరోసాగా, మొహమంతా నవ్వుతో బొటనవేళ్ళు ఎత్తి చూపిస్తూ. ఆమె ప్రొఫైల్‌కి వెళ్ళాడు. మూడేళ్ళ నుండి ఏ ఆక్టివిటీ లేదు. ‘ఎక్కడున్నావే? ఏం చేస్తున్నావ్?’ అన్న పోస్టులకి సమాధానం లేదు.

ఇంకాసేపు ఫేస్‌బుక్‌లోనే పొలిటికల్ మీమ్స్, కొత్తగా రిలీజైన తెలుగు సినిమా గురించి ఎడతెగని చర్చలు, రైట్‌వింగ్-లెఫ్ట్‌వింగ్ గలాటాలు, పిల్లల్ని ట్రోఫీల్లా ఎత్తుకొని ముద్దుపెట్టుకునే ఫోటోలు, పిల్లల్ని పెంచడమెంత కష్టమో అంటూ మురిసిపోతున్న తల్లిదండ్రుల పోస్టులూ చూశాడు.

తొమ్మిదింటి వార్తలే పదకొండింటి బులెటిన్లో చదువుతున్నారు. అతడికి కళ్ళు గుచ్చుకుపోతున్నాయి. టి.వి. ఆఫ్ చేసి కళ్ళు నలుపుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు. అతడి పక్కవైపు బెడ్ లైట్ తప్పించి, గదంతా చీకటిగా ఉంది. అతడు చప్పుడు చెయ్యకుండా వీలైనంత నెమ్మదిగా మంచం ఎక్కాడు. ఆమె గాజులు కదిలాయి.

దుప్పటి కింద ఆమె గాజులు చేస్తున్న శబ్దం బట్టి ఆమె నాడా విప్పుతోందని అతనికి అర్థమయ్యింది. చీకట్లో ఆమె కాళ్ళు దగ్గరకు తీసుకుని పెట్టి పైజామా కిందకి లాగుతోందని తెలిసింది. అతడు లైటు ఆర్పి, అటు తిరిగి పడుకున్నాడు.

గదిలో గడియారం మాత్రమే ఉన్నట్టనిపించింది. భుజం మీద మెల్లగా ఆమె చేయి పడింది.

“ప్లీజ్ గిరీ! ఈ సైకిల్‌లో ఇంకా రెండు రోజులే ఉన్నాయి!”

ఆమె కన్నీళ్ళలో తడిసిన మాటలు అతడిని నిలువనివ్వలేదు. ఆమె వైపుకు తిరిగాడు.

“సారీ. నేను కోపం తెచ్చుకోకుండా ఉండాల్సింది.”

తల నిమిరే కొద్దీ ఆమె కన్నీళ్లు ఎక్కువయ్యాయి. అతడు ఆమెకు దగ్గరగా జరిగాడు. కాలిపై కాలు వేసి హత్తుకున్నాడు. ఆమె అతన్ని దగ్గరగా తీసుకుంటూ వెనక్కి వాలింది. మీదకు వంగి ముద్దుపెట్టుకున్నాడు, ఆమెను చుట్టిన చేతితో తల నిమురుతూనే. ఆమె భుజంలో తలను దాచుకున్నాడు. ఆమెకి అర్థమయ్యింది. సుతారంగా వీపుని నిమిరింది.

కొన్ని నిమిషాల తర్వాత, భుజం పైకి ఎత్తింది ఆమె, అతడిని కదిలించడానికి.

“ఇంకా రెండే రోజులు, గిరీ! ప్లీజ్!”

“నా వల్ల కాదు!” అతడి గొంతుకి ఆమె ఉలిక్కిపడింది. అతడు ఆమె మీదుగా మంచం దిగేశాడు.

“ఈ 1-2-3 సీక్వెన్స్ నా వల్ల కాదు. ఐ కెన్ మేక్ లవ్, కానీ ఇలా డ్రిల్‌లా కాదు…” బయటకు అనకూడదు అనుకుంటూనే అనేశాడు.

అతడు లైట్ వేశాడు. ఆమె దుప్పటి పైకి లాక్కుంది.

“నీకేం? నీ టెస్టులు ఫెయిల్ అయ్యుంటే తెలిసేది.”

అతడు ఒక్క అంగలో ఆమె దగ్గరకు వచ్చి, బుగ్గ గట్టిగా వత్తుతూ, “సో! ఇది నీ టెస్టులు నా టెస్టులు గురించా? చెప్పూ?!” అంటూ గద్దించాడు. ఆమె గొంతులో వినిపించిన నొప్పి మళ్ళీ అతన్ని దూరంగా నెట్టింది.

ఆమె దుప్పటిలో డ్రస్ సర్దుకుంది. జుట్టు ముడివేసుకుంది. దుప్పటిని పక్కకు తోసేసింది.

“చూడూ, ప్రతీ రాత్రి… ఐ కాంట్ గో త్రూ దిస్ షిట్. ఇలా డెడ్‌లైన్ల టార్చర్ నా వల్ల కాదు. ఐ నీడ్ ఎ బ్రేక్!”

“ఆ సంగతి మీ అమ్మను అడుగు.” ఆమె మంచం మీద నుండి లేచింది.

“మా అమ్మను తీసుకురాకు మధ్యలో!”

అతడిని దాటుకుంటూ ఆమె వార్డ్‌రోబ్ వైపుకి విసవిసా వెళ్ళింది. మూలన తాళం వేసున్న ఒక తలుపును తీసి, “ఏంటి? మీ అమ్మను తీసుకురావద్దా?” అంటూ అందులో ఉన్న బొమ్మలన్నీ తీసి ఒక్కొక్కటీ బయటకు పారేసింది.

“మా అమ్మది మనవల కోసం ఆరాటం అంతే! ఏం, మీవాళ్లు మాత్రం గొలుసు, మురుగులు చేయించలేదా?”

“మీ వాళ్ళు. మా వాళ్ళు. అంతా వచ్చి నా నెత్తి మీద కూర్చోండి. నా కడుపులో నలుసు నిలవడం లేదు, నన్ను పొడిచి పొడిచి చంపండి అందరూ…” అంటూ తలను గోడకు కొట్టుకుంది.

అతడు ఒక్క అంగలో బొమ్మలను దాటుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు.

“చిత్రా, ఏం చేస్తున్నావు. ఏంటిది?” ఆమెను గట్టిగా పట్టుకున్నాడు.

“నేను చావను కూడా చావడం లేదు.” అతడిని విడిపించుకుంది చేత్తో నుదురు గట్టిగా కొట్టుకుంటూ, పెద్దగా ఏడుస్తూ.

“షటప్! జస్ట్ షటప్!” అంటూ ఆమె భుజాల్ని గట్టిగా కుదుపుతూ ఆమెను సగం తెరిచిన తలుపు మీదకు తోశాడు. “నిజంగానే చంపేస్తాను! ఆ మాట ఇంకో సారి వినిపిస్తే!” తలుపు మెల్లగా మూసుకుంది.

“నాకు పిల్లలు వద్దు గిల్లలు వద్దు. నువ్వు కావాలి.”

ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

“నాకు కావాలి, గిరీ! నాకెందుకు పిల్లలు పుట్టరు? నేనే పాపం చేశాను గిరీ?”

అతడు ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమె భుజాలపై చేతులుంచాడు.

“గాడ్ ప్రామిస్! ఇలా… అవుతుందని తెలిస్తే… నువ్వు ఎక్కడికి… వెళ్తే అక్కడికి… వచ్చేదాన్ని… నా ఉద్యోగం… నా కెరీర్ అని… నేను…” ఆమె వెక్కిళ్ళ మధ్యలో ఆగాగి అంటున్న మాటలు ఏరుకొని పేర్చుకున్నాడు. అవి అర్ధమయ్యి తల అడ్డంగా ఆడించాడు.

ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “వియ్ డోంట్ డిజర్వ్ దిస్! నాట్ ఎట్ ఆల్!” అన్నాడు.

“నావల్లే నీకీ కష్టం!” ఆమె నోటిని చేత్తో మూశాడు. మొహం మీద పడుతున్న జుట్టును పక్కకు తోశాడు.

“ఎవరి వల్లయితేనేం. ఇది మన కష్టం. నీదీ నాదీ కాదు! ఏం? ప్రాబ్లమ్ నాలో ఉండుంటే?” ఆమె జుట్టును సవరిస్తూనే ఉన్నాడు.

“నేను అమ్మను కాలేనా, గిరి? ఎప్పటికీ కాలేనా?” అతడి షర్ట్ ఆమె గుప్పిట్లో నలిగిపోయింది.

“ఉయ్ కీప్ ట్రయింగ్, సరేనా. కానీ దానికోసం లెట్ అజ్ నాట్ బికమ్ లైక్ దిస్. మీవాళ్ళు మావాళ్ళ కోసం కాదు, ఇంక ఎవరికోసమూ కాదు. ఉయ్ డూ ఇట్ ఆన్ అవర్ టర్మ్స్. ఎందుకంటే నాకు నువ్వు ముఖ్యం. మనం ముఖ్యం.” అంటూ ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ వార్డ్‌రోబ్ తలుపుకు ఆనుకుని కూలబడ్డాడు.

పాత బొమ్మ ఒకటి, కాలి కింద పడి కొన ఊపిరితో ఉన్న బాటరీ వల్ల కుయ్యిమంది. అతడు దాన్ని కాలితో పక్కకు తోసేశాడు.
----------------------------------------------------------
రచన: పూర్ణిమ తమ్మిరెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

Saturday, September 29, 2018

మిథ్య ఎగ్జిబిషన్


మిథ్య ఎగ్జిబిషన్





సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి..............

“అన్యాయం! అక్రమం!! లోపల ఘోరం జరిగి పోతోందక్కడ… కానీ లోపలికి వెళ్ళాల్సిందే! అన్యాయాలు అరికట్టాల్సిందే!”

ఏటీవీ, బీటీవీ, సీటీవీ, డీటీవీ… ఇలా పేర్లు రాసి వున్న రకరకాల మైకు గొట్టాలు పట్టుకుని అరుస్తూ వున్నారు కొందరు పూనకం పట్టినట్టు. కింద మెత్తటి పట్టలు, పైన షామియానాలు, మధ్యన నీడలో గుంపులు గుంపులుగా మైకుల్లో మాట్లాడుతున్న వారి చుట్టూ జనాలు మూగివున్నారు. ‘వాళ్ల మాటలు నమ్మకండి. లోపల ఏం జరిగినా అది మన మంచికోసమే’ అంటూ నవ్వుతూ ప్రేమగా ఆహ్వానిస్తున్నారు మైకుల్లో మాట్లాడుతున్నవారు. జనాలు దగ్గరకు రాగానే లాగి ఎగ్జిబిషన్ గుమ్మం దగ్గరికి వారిని నెడుతున్నారు.

దేశంలోని ప్రజలందరికీ అదొక పెద్ద పండుగ. ఆరోజు గుమ్మం దగ్గరకి నెట్టబడ్డ వారందరికీ నమస్కరించి ఒక పూలగుత్తి అందించి ఆ ఎగ్జిబిషన్ కాంపౌండ్ లోపలికి పోనిస్తారు. ప్రతి నగరంలోనూ ఆరోజు అక్కడక్కడ ఎన్నిక చేసిన ప్రాంతాల్లో ఎన్నో తళుకుబెళుకులతో కాంపౌండ్లు కట్టి ప్రభుత్వం ఆ పండుగ నిర్వహిస్తుంది. ప్రజల్లో చాలామంది ఆ పండుగలో ఆసక్తిగా పాల్గొంటారు. వింత వింత అలంకారాలతో భారీగా నోరు తెరుచుకుని అదేమిటో అర్థంకాని ఒక జంతువు నోటిద్వారం గుండా కాంపౌండ్ లోపలికి వందలాది మంది జనం క్యూలో నిలబడి పోతూ వున్నారు. అలాగే అవతల ఆ జంతువు ఇంకో ద్వారం నుండి గుంపులు గుంపులుగా మరికొందరు బైటకి వస్తూ వున్నారు. అక్కడక్కడా అంగట్లో బొమ్మలు, ఆటవస్తువులు, పిల్లలు పెద్దలతో వాతావరణమంతా కోలాహలంగా వుంది.

ఆ భారీ ప్రాంగణంలో రకరకాల ఎంబ్లమ్స్ వున్న బనీను ఒకటి వేసుకుని, ఒక తురాయి చెట్టుకింద టేబుల్ పైన పట్ట పరుచుకుని వున్నాడు ఒక వ్యక్తి. కాంపౌండ్ అంతా రంగు రంగుల పట్టలు పరుచుకుని ఎక్కడ చూసినా అలాంటివారే కనిపిస్తున్నారు. ప్రతి టేబుల్ చుట్టూతా పది పదిహేను మంది గుమిగూడి వున్నారు. టేబుల్ మీద పరిచివున్న గుడ్డపై మూడు రంగుల ముక్కలని అటూ ఇటూ మార్చి మార్చి పరుస్తున్నాడు ఒక వ్యక్తి. అలా మూడు ముక్కలని మార్చుతూనే, “రండి బాబూ రండి! మాయా లేదు, మర్మం లేదు! ఒకటికి పది, పదికి వంద, వందకి వెయ్యి! రండి బాబూ రండి!” అని అరుస్తూ జనాలని పిలుస్తూ వున్నాడు. ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో భాషలో అరుపులు. ఏ ప్రాంతం ప్రజలని ఆ ప్రాంతపు భాషల్లో పిలుస్తున్నారు.

అక్కడ ఆడా మగా తేడా లేదు, ఆట నిర్వహిస్తున్న వాళ్ళలోను, ఆట ఆడుతున్న వాళ్ళలోను. అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

“ఏంటిది?” ఒక టేబుల్ దగ్గర ఆగి అక్కడ వున్న ఒక మనిషిని అడిగాడో యువకుడు. వయసు ఓ ఇరవై ఏళ్ళు ఉండొచ్చు.

“జాగ్రత్తగా గమనించు. కింద జోకరున్న ముక్క మీద పందెం కాయి. చాలా ఈజీ. ఇవన్నీ నేను సంపాదించిన డబ్బులే! చూడు!” సగం మడిచిన యాభైలు, వందలు, ఐదొందలు కాగితాల బొత్తిని జేబులోంచి తీసి చూపించి డబ్బుని మళ్ళీ జేబులోకి తోసుకున్నాడు ఒక మనిషి.

“అసలు నీదగ్గర ఎంట్రీ కార్డు ఉందా?” అడిగాడు ఇంకో వ్యక్తి.

“ఉంది. ఎందుకు?”

“అదుంటేనే ఆడనిస్తారు. అందుకు.”

“రా… రా… ఇటు చూడు. ఈ ముక్కమీద పెట్టుకో! నేను కూడా వంద కాస్తున్నాను,” అంటూ 100 నోటుని మధ్య ముక్కపై వేశాడు ఇంకో వ్యక్తి.

యువకుడు సందేహంలో పడ్డాడు.

“ఏంటి? ఆలోచిస్తున్నావా? అక్కడ చూడు! ఇక్కడ చూడు! ఇటు చూడు! ఎక్కడ చూసినా ఆడేవాళ్ళు నీకు కనపడుతుండారా- లేదా?” ఎగదోశాడు ఒక మనిషి.

ఆ పక్కన ‘ముక్క తెరు, ముక్క తెరు!’ తొందరపెడుతున్నారెవరో.

ముక్కలు మారుస్తున్న ఒక వ్యక్తి ముక్కలు తెరిచాడు. ఆశ్చర్యంగా వంద నోటున్నచోట జోకర్ బొమ్మ. జోకర్ బొమ్మపై వున్న వంద తీసుకుని రెండు ఐదొందల కాయితాలు అక్కడ పడేశాడు ఆట నడుపుతున్న ఒక వ్యక్తి. వందకి వెయ్యి రూపాయలు తిరిగి ఇస్తున్నా ఇసుమంతైనా విచారం మొహంలో కనపడలేదు. ఎందుకన్నది ఈ యువకుడికి అర్థంకావడం లేదు. డబ్బు సంపాదించడం ఇంత సులభమా! ఆశ్చర్యం!

“ఈసారి కట్టవోయ్!” ప్రోత్సహించాడు ముందు పలకరించిన ఒక మనిషి.

యువకుడు సంశయిస్తూ పది రూపాయల కాగితం తీసి ఒక ముక్కపై పెట్టాడు.

వందొచ్చింది.

ఇరవై వేశాడు.

రెండొందలు వచ్చింది.

వంద కట్టాడు.

వెయ్యొచ్చింది.

ఇంక చాలు వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాడు యువకుడు.

“అదృష్టం మనపక్క ఉన్నప్పుడే ఆట ఆడాలి.” ఇంతలో ప్రోత్సహించిన ఇంకో వ్యక్తి అందుకున్నాడు.

“మంచి ముక్కని ఎన్నుకోవడంలోనే వుంది మన భవిష్యత్తు!” మేధావి అని రాసుకున్న బనీను వేసుకున్న మరో వ్యక్తి అప్పుడే వచ్చి చిరునవ్వుతో కొందరికి సూచనలు ఇస్తున్నాడు.

కాంపౌండు బయట మైకుల గోల. లోపల కాయ్ రాజా కాయ్ గోల. రకరకాల భాషలలో పాటలు వినపడుతున్నాయి. విలేఖర్లు, కెమేరామన్లు రకరకాల వ్యక్తులను ఇంటర్‌వ్యూలు చేస్తున్నారు. బహుశా వాళ్ళు లోపలున్న స్టాల్స్ యజమానులు కావచ్చు.

యువకుడు ఐదొందలు కట్టాడు.

పోయింది.

సరిగ్గా కనపడలేదు ఆ ముక్క… తనలో తనే గొణుక్కున్నాడు. వచ్చిన డబ్బే కదా పోతే పోయిందిలే అందుకున్నాడు.

ఈ సారి వెయ్యి కట్టాడు. లక్కీ. పదివేలు వచ్చాయి.

మళ్ళీ ముక్కలు మంత్రించినట్టు అటూ యిటూ వేగంగా మారిపొయ్యాయి.

“మంచి ముక్క చూసి జాగ్రత్తగా ఎన్నుకోండి! మన భవిష్యత్తు, మన జీవితం బాగుండాలంటే మంచి ముక్కని ఎన్నుకోవాలి!” అంటూ ఇంతకుముందు అరుస్తున్న బనీను మేధావి ఇప్పుడు కరపత్రాలు పంచుతున్నాడు.

మధ్యలో కొందరు మోటర్‌సైకిళ్ళపై బీప్ బీప్ మనే హారన్లతో వచ్చి హెచ్చరిస్తున్నారు.

“ఎవ్వరూ డబ్బు పెట్టి ఆడకండి! ప్రలోభాలకు లొంగకండి!” అరుస్తూ అంతే వేగంగా వెళ్ళిపోతున్నారు.

ముక్కలు మార్చే ఒక వ్యక్తి యథావిధిగా వేగంగా మంత్రించినట్టు ముక్కలు మారుస్తున్నాడు. కొందరు అయిదువందలు, వంద కాగితాలు ముక్కలపై పందెంగా విసురుతున్నారు.

ప్రోత్సహించిన ఇంకో వ్యక్తి హఠాత్తుగా, “ఇదే ఇదే!” అంటూ ఎడమ వేపున్న ముక్కపై తన జేబులోని డబ్బులకట్ట అంతా తీసి పెట్టేసి, ఇతడికి కన్నుకొట్టి, “అంతా పెట్టు నువ్వు కూడా,” అని తొందర పెట్టాడు.

ఇంకో వ్యక్తి కన్నుకొట్టి సైగచేయడంతో యువకుడికి నమ్మకం పెరిగింది. జేబులోని మొత్తం అంతా తీసి చివరి ముక్కపై పెట్టాడు, ఈ దెబ్బతో రాత మారిపోవాలి… అనుకుంటూ. డబ్బు సంపాదించడం సులభమే, అని మనసులో క్షణకాలం అనుకున్నాడు కూడా.

ఒక వ్యక్తి ముక్క తెరిచాడు. తెల్లగా వుంది తెరిచిన ముక్క. యువకుడి కళ్ళు మసకబారాయి. పగలే రాత్రిలా చిక్కటి చీకటి. ఏదో లోతైన లోయలోకి జారిపోతున్నట్టనిపించింది. కళ్ళముందే మోసం జరిగినట్టయింది. ఏడుపు వస్తుందా? రావడం లేదు. కాని వస్తున్నట్టే వుంది. తన డబ్బుతో పాటు ఇచ్చినట్టే ఇచ్చి వాడి డబ్బు కూడా వాడు గుంజేసుకున్నాడు. ప్రోత్సహించిన ఇంకో వ్యక్తి డబ్బు కూడా ఆడిస్తున్న ఒక వ్యక్తి రెండు చేతులతో ముందుకు లాక్కున్నాడు.

ప్రోత్సహించిన వ్యక్తికి బాధలేదా? నవ్వుతున్నాడు! అవును… లోపల సంతోషం… ఉన్నట్టుంది సన్నగా…

“నీ మాట విని మొత్తం పోగొట్టుకున్నాను.” యువకుడు గొణిగాడు.

“నా డబ్బు పొయ్యి నేనేడుస్తుంటే నీ ఏడుపొకటి! పోరా అవతలకి! ” ఇంకో వ్యక్తి కొట్టబోయాడు, ఒక వ్యక్తిని చూసి కన్నుకొడుతూ.

అన్యాయం… దారుణం… మోసం… ఘోరం…

కాంపౌండ్ బయట నుంచి బీప్ బీప్ మని చప్పుళ్ళు. ‘ఎవరూ డబ్బు పెట్టి ఆడకండి. నిజాయితీగా ఆడుకోండి. సరదాగా ఆడుకోండి. డబ్బు పోగొట్టుకుని జీవితాలను నాశనం చేసుకోకండి.’ అంటూ హెచ్చరికలు.

యువకుడి కళ్ళముందటి చీకటి తెరలు మెల్లగా మాయమయ్యాయి. కళ్ళు తడిబారాయి. కన్నీరు చుక్కలుగా రాలిపడింది.

బనీను మేధావి ఎదురయ్యాడు.

తన విషయం మొత్తం చెప్పాడు మోచేత్తో కన్నీళ్ళు తుడుచుకుంటూ.

“పోయిందా! అరరే… మొత్తం పోయిందా? అయ్యయ్యో! పోతుంది. ఎందుకుపోదూ? ఇది అయిదేళ్ళకి ఒకసారి వచ్చే పెద్దపండగ కదా! జాగ్రత్తగా మంచి ముక్కని గుర్తించి ఎన్నుకోవాలి. అప్పుడే కదా మనకి ఫ్యూచర్ బాగుండేది.” అన్నాడు బనీను మేధావి.

“ఇప్పుడెలా సార్? నా బతుకు బజారున పడిపోయింది.”

“నీదేకాదు. నీలాంటి చాలామందే ఉన్నారు మరి. నేనింతకు ముందే చెప్పాను గదా! ఇప్పుడిక ఏమీ చేయలేం! అయిదేళ్ళు ఆగాల్సిందే. తప్పదు. అప్పుడు గెలువు నువ్వు! ఇంతకింత గెలువు! గుర్తుంచుకో! మంచిముక్కపై పందెం కట్టు! నాకు చాలా పనులున్నాయి. నేను అందరినీ హెచ్చరించాలి!” బనీను మేధావి వేగంగా వెళ్ళిపోయాడు.

ఇంతలో బీప్ బీప్ మని సైరను మోతతో ఒక జీపు వచ్చి ఆగింది. అందులో కూర్చున్న వ్యక్తి అడిగాడు. “ఎందుకేడుస్తున్నా?”

యువకుడు చెప్పాడు.

“ఒకపక్క అరుస్తూనే వున్నాం గదరా బాడుకోవ్! డబ్బులు పెట్టి ఎందుకాడినవ్? మీరు బాగుపడర్రా? గొంతు పొయ్యేట్టు బైకుల్లో, జీపుల్లో అరుస్తూ తిరగతానే వుండాం గదరా?”

కూర్చున్న వ్యక్తి అడిగాడు, “ఎక్కడ ఆడావో గుర్తుందా?”

“గుర్తుంది సార్. 79 నెంబరు.” చూపించాడు యువకుడు.

కూర్చున్న వ్యక్తి వేగంగా అక్కడికెళ్ళాడు. కర్ర పైకెత్తాడు అరుస్తూ. “డబ్బులతో ఆడతా వుండార్రా మీరు? ఎన్నిసార్లు జెప్పాల్రా మీకు? వీడి డబ్బులు పోయింది మీకాడేనా?”

“వీడెవడో నాకేం తెలుసు సార్? ఇక్కడెవరూ డబ్బులు పెట్టి ఆడ్డంలేదు సార్? ఇవి ఉత్త టోకెన్లు సార్!” ఎర్రగా వున్న టోకెన్లు తీసి బయటపెట్టాడు ఒక వ్యక్తి.

“లేదు. డబ్బులు పెట్టే ఆడాను నేను. టోకెన్లు గురించి నాకు అసలు తెలీదు.” ఒక మనిషిని చూపించి, “ఇతని డబ్బులు కూడా పొయ్యాయి.” అన్నాడు యువకుడు.

ఒక మనిషి “ఎవుర్రా రేయ్? నేను డబ్బులు పెట్టి ఆడానా?” అంటూ చెయ్యి పైకెత్తాడు.

“సరే మర్చిపో ఏమయిందో. నువ్వు ఇలారా…” అంటూ దూరంగా తీసుకెళ్ళి పర్సులోంచి ఐదు వందల కాగితం ఒకటి తీసి చేతిలో పెట్టాడు కూర్చున్న వ్యక్తి.

“ఇక్కడొక పక్కన మీరు చెప్తూనే వున్నా అందరూ డబ్బులు పెట్టి ఆడుతూనే వున్నారు సార్!”

“రేయ్! ఆ అయిదొందలు ఇటివ్వరా!”

“వద్దు సార్! నీను ఊరికి పోవాల సార్! ఇంకేం మాట్లాడను సార్!”

“అయితే ఇంకేమీ మాట్లాడకుండా నోర్మూసుకునే వెళ్ళు!”

యువకుడు అటు తిరిగి జంతువు ఇంకో ద్వారం వేపు నడిచాడు.

బనీను మేధావి వచ్చి భుజమ్మీద చెయ్యి వేసి అన్నాడు,” ఐదేళ్ళ తర్వాత ఇంతకింత డబ్బు తెచ్చి నమ్మకమైన ముక్కమీద పందెం కాయి! ఇంతకింతా సంపాదించు! తప్పదు!”

అతడిని ఏవేవో ఆలోచనలు కమ్ముకుంటున్నాయి. ‘నీకంతా తెలిసిపోయింది, నువ్వెళ్ళు. ఇక మళ్ళీ రాకు,’ అంటూ ఎవరో తరుముతున్నట్టుగా వుంది. జంతువు నోటిద్వారం నుంచి ఇంకా గుంపులు గుంపులుగా జనం వస్తూనేవున్నారు. యువకుడు పెద్దగా “అంతా మోసం! ఎవరూ డబ్బులుపెట్టి ఆడకండీ!” అని పెద్దగా అరిచాడు. ఎవరికీ వినపడలేదు.

యువకుడు జంతువు ఇంకో ద్వారం నుంచి బయటకొచ్చి వెనక్కి తిరిగి చూశాడు. లైట్ల వెలుగులో లోపల తెలియలేదు గాని బయట అంతా చీకట్లు ముసురుకుని వున్నాయి. ఆకాశం నల్లగా వుంది.

వింత వింత అలంకారాలతో భారీగా నోరు తెరుచుకున్న అర్థంకాని జంతువు నోటిద్వారం పైన పెద్దక్షరాలతో ‘మిథ్య ఎగ్జిబిషన్’ అని రాసి ఉంది. ఆ జంతువు నోటిద్వారానికి అటూ ఇటూ వరుసగా భీకరంగా తెల్లటి బట్టల్లో రాక్షసుల బొమ్మలు. ఇంతకు ముందర నోరు తెరుచుకుని ఆహ్వానిస్తున్నట్టున్న ఆ బొమ్మలు ఇప్పుడు నిజమైన రాక్షసులుగా కనిపిస్తున్నాయి. దీపాలు పురుగుల్ని ఆకర్షించినట్టు తమ ధగధగలతో మనుషులని ఆకర్షిస్తున్నాయి.

యువకుడు నిస్త్రాణతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. తిరిగి లేచేసరికి అక్కడ ఏమీ లేదు. మైదానం అంతా ఖాళీగా ఉంది. ఎవరూ లేరు. ఎండ మండుతూ ఉంది. సుడిగాలికి రంగురంగుల చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ బ్యాగులు దుమ్ములో సుళ్ళు తిరుగుతున్నాయి. యువకుడి ముఖం మీదకు ఒక చిత్తుకాగితం వచ్చి కొట్టుకుంది. అది ఒక దినపత్రిక. అక్కడ ఎగురుతున్న చిత్తుకాగితాలన్నీ అవే. పెద్దపండగ దిగ్విజయం! మాయ లేదు మర్మం లేదు! అందరికీ లాభం పంచిన పండగ! డబ్బు లేదు, జూదం లేదు. అన్యాయం మోసం అసలే లేవు! అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ఆ కాగితాల నిండా రాసి వుంది, రాక్షసుల రంగురంగుల బొమ్మల చుట్టూ. ఒక వ్యక్తి, ఒక మనిషి, ఇంకో వ్యక్తి, మరింకో వ్యక్తి, కూర్చున్న వ్యక్తి, బనీను మేధావులందరూ ఒకరినొకరు అభినందించుకుంటున్న ఫోటోలు కనిపిస్తున్నాయి.

ఇంక ఈ వైపుకు చస్తే రాను! గొణుక్కున్నాడు యువకుడు, అనుకున్న వెంటనే అన్నీ మర్చిపోతూ.
----------------------------------------------------------
రచన: దగ్గుమాటి పద్మాకర్, 
ఈమాట సౌజన్యంతో

Friday, September 28, 2018

కార్తీక శివజ్యోత్స్న


కార్తీక శివజ్యోత్స్న






సాహితీమిత్రులారా!


శా. ప్రారంభించి చకోరపోతము మహీయజ్జ్యోత్స్నయం దుత్సవ
       శ్రీరంజిల్లుచు సోలుచుండు గతి నా చిత్తంబు నీ దివ్యశృం
       గార ధ్యానమునం దహర్నిశము జొక్కంజేయవే దేవ శ్రీ
       గౌరీలోచననర్తకీనటనరంగస్థాన సర్వేశ్వరా!

కార్తీకపు చిరుచలిలో పున్నమి రాతిరి ఆరుబయటో డాబాపైనో పడుకొని, పిండారబోసినట్టు ఆకాశమంతా పరుచుకున్న తెలివెన్నెలని కనులతో, తనువుతో, మనసుతో జుఱ్ఱుకోవడం ఒక అందమైన అనుభూతి. అప్పుడు మనం అచ్చంగా ఒక చకోరపక్షి అయిపోతాం. శివభక్తులయితే బహుశా, కైలాసంలో సాక్షాత్తూ ఆ సర్వేశ్వరుని దర్శించినట్టే అనుభూతి పొందినా ఆశ్చర్యం లేదు. నెలతాలుపుకీ వెన్నెలకీ ఏదో అనాది అనుబంధం! అలాటి అనుబంధమే యీ పద్యం వ్రాయడానికీ కవిని పురికొల్పిందేమో!

ఇది అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకంలోని పద్యం. ఈ అన్నమయ్య తాళ్ళపాక అన్నమయ్య కాదు, యథావాక్కుల అన్నమయ్య. ఇతను పదమూడవ శతాబ్దానికి చెందిన శైవకవి. తెలుగు సాహిత్యంలో శతకాలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శతకసాహిత్యానికి చాలా విస్తృతి ఉంది. మనకు శతకాలు వేలాదిగా కనిపిస్తాయి. తెలుగులో శతకాలకు మూలం శివకవులే. మొదటగా లభించిన శతకం మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారమని సాహిత్యకారులు భావిస్తున్నారు. ఆ తర్వాత మరొక శతాబ్దానికి వెలసినవి యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వరశతకమూ, పాల్కురికి సోమన వృషాధిపశతకమూను. అన్నమయ్య సోమనలలో ఎవరు ముందు ఎవరు వెనుక అన్న విషయం గురించి వాదోపవాదాలున్నాయి. అన్నమయ్య తన గురువు పేరు ‘ఆరాధ్య సోమేశ్వరు’డని చెప్పుకున్నాడు. అతను పాల్కురికి సోమనాథుడే అని నిడదవోలు వెంకటరావుగారు అభిప్రాయపడ్డారు. కాని యితను వేరనీ, పాల్కురికి సోమన అన్నమయ్యకు తరువాత వాడనీ శతకవాఙ్మయసర్వస్వము వ్రాసిన విద్వాన్ వేదము వేంకటకృష్ణశర్మగారు అన్నారు. ఆ గ్రంథానికి పీఠిక వ్రాసిన మల్లంపల్లివారు కూడా దానితో ఏకీభవించారు.

ముందువెనుకల మాట ఎలా ఉన్నా, తెలుగు సాహిత్యాన్ని శతకాలతో సుసంపన్నం చేసిన ఘనత మాత్రం శివకవులదే! శతకాలను చాటుప్రబంధాలుగా పూర్వ లాక్షణికులు పేర్కొన్నారు. వీటినే ముక్తకాలని కూడా అంటారు. చాటువులలో కథా పాత్రల ప్రమేయం లేకుండా కవి నేరుగా తన సొంత అభిప్రాయాలనూ, భావాలనూ, అనుభూతులనూ వ్యక్తీకరిస్తాడు. శతకాలలో అధికశాతం భక్తిశతకాలే. భక్తులు భగవంతునిపై తమకున్న అమితభక్తిని రకరకాలుగా చాటుకునే పద్యాలతో నిండి ఉంటాయి. ఇందులో ఎక్కువగా భగవత్‌స్తుతి, ఆత్మార్పణా కనిపిస్తాయి. మతపరమైన ఆచారాలు, తత్త్వము, భక్తుల కథలూ భక్తిశతకాలలో భాగమే. ముఖ్యంగా శివకవుల శతకాలలో వీరశైవ మతాన్ని గురించి చాలా సమాచారం దొరుకుతుంది. వారు సాహిత్యాన్ని మతప్రచారానికి సాధనంగా వాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే శివకవుల యితర శతకాలతో పోలిస్తే యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వరశతకంలో వీరశైవం తీవ్రరూపంలో కనిపించదు. ఇతను లింగధారణ చేసిన జంగముడు కాదని తన గురించి అతను చెప్పుకున్న వివరాలబట్టి అనుకోవచ్చు. ఈ శతకంలో తన గురించీ, కృతిరచనా కాలాన్ని గురించీ కవి కచ్చితమైన వివరాలని ఇవ్వడం ఒక విశేషం. తనని యజుశ్శాఖకి చెందిన ఆరాధ్యబ్రాహ్మణునిగా చెప్పుకోవడాన్ని బట్టి, యితను వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన శైవుడు అనిపిస్తుంది. ఇతను అద్వైతాన్ని కూడా ఆమోదించినట్టుగా వేదం వేంకటకృష్ణశర్మగారు భావించారు. కాని నాకు అది పూర్తిగా నిజం కాదని అనిపించింది. ఎందుకంటే, ఒక పద్యంలో “సోహం” “సోహం” అనేవాడు “మోహధ్వాంతములో మునింగిన మహామూఢు”డనీ, “అతిభ్రష్టు”డనీ, అతను శివునికి చాలా దూరంగా ఉండిపోతాడనీ, ఎవడయితే అహంకారాన్ని వీడి సద్భక్తితో నీకు “దాసోహం” అంటాడో, అతనే నీవై ఉంటాడనీ వర్ణిస్తాడు. ఇక్కడ “సోహం” అనే అద్వైతమతాన్ని చాలా స్పష్టంగా ఖండించడం గమనించవచ్చు. భక్తునికి భగవంతుని స్థానాన్ని యివ్వడం శైవవైష్ణవ మతాల రెంటిలోనూ కనిపిస్తుంది. కాని అది అద్వైతభావన కాదు. అన్నమయ్య యీ శతకంలో జ్ఞానమార్గాన్ని ఖండించి, కర్మ భక్తి మార్గాలను బోధించినట్టుగా నాకనిపింది.

ఈ శతకంలోని మరొక విశేషం ఏమిటంటే, ఇతర శివకవుల శతకాలతో పోలిస్తే, యిందులో కవిత్వం పాలు ఒకింత ఎక్కువగా గుబాళించింది. పాల్కురికి సోమన వృషాధిపశతకంలో భక్తి, మతవిషయాలతో పాటు మనలని ఆకర్షించేది అందులోని భాషాగరిమ. అందులో పద్యాలు శబ్దాలంకారశోభితాలు. రకరకాల భాషలలో, మణిప్రవాళశైలిలో ఉన్న పద్యాలు కూడా అందులో కనిపిస్తాయి. ఈ సర్వేశ్వరశతకంలో, సమాసబందురమైన చిక్కని ధారతో పాటుగా, చక్కని పోలికలూ దృష్టాంతాలూ అర్థాంతరన్యాసాలంకారాలు మన మనసులని మురిపిస్తాయి. అలా నా మనసుని ఆకట్టుకొన్న ఒక పద్యమే యీ నెల వెన్నెల పద్యం.

పోతము అంటే పక్షిపిల్ల. చకోరపోతము అంటే ఒక పిల్ల చకోరం అన్న మాట. పిట్ట గొంతే కొంచెం, అందులో పిట్టపిల్లది ఇంకెంత చిన్న గొంతుకుంటుంది! కాని పిల్లలకు సహజంగా ఆత్రం ఎక్కువ. ఇష్టమైనది తాగేటప్పుడో తినేటప్పుడో వారు పడే ఆత్రం భలే ముచ్చటగా ఉంటుంది. తనని తాను అలాంటి చకోరపు పిల్లగా అభివర్ణించుకుంటున్నాడు కవి. అందుకే ఆరంభంలోనే “ప్రారంభించి” అన్నాడు. అంటే ప్రయత్నంతో కూడి అని అర్థం. వెన్నెలేమో “మహీయజ్జ్యోత్స్న.” అంటే దిగ్దిగంతాల దాకా వ్యాపించిన గొప్ప వెన్నెల. అంత వెన్నెలనీ తాగేయాలని యీ చకోరపోతానికి ఉత్సాహం. ఆ ఉత్సాహంలో అది నిరంతరంగా సొక్కిసోలుతూ ఉంటుంది. సరిగ్గా అలాగే, శివుని దివ్యమైన శృంగార ధ్యానములో తన చిత్తం నిమగ్నమైపోయేలాగా అనుగ్రహించమని కోరుకుంటున్నాడు కవి. ఇక్కడ దివ్యశృంగారము అంటే దివ్యమైన సౌందర్యం. నింగీనేలా అంతటా పరచుకున్న వెన్నెలంత దివ్యసౌందర్యం శివునిది. ఒక్కసారి ఆలోచించి చూస్తే, వెన్నెలకీ శివునికీ ఎంత దగ్గరి పోలికో మనకి అవగతం అవుతుంది! వెన్నెల ఎప్పుడూ రాత్రే ప్రకాశిస్తుంది. అంచేత అది నలుపు తెలుపుల చిత్రమైన సమ్మేళనం. శివుడూ అంతే! ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, అతను ఎంతటి జ్ఞానమూర్తియో, అంతటి తామసికశక్తి. మనం చిత్రించుకున్న భౌతిక రూపాన్ని ఊహలోకి తెచ్చుకున్నా, అతను నలుపు తెలుపుల చిత్ర సంగమమే! శివుడు స్వయంగా తెల్లని తెలుపు, పక్కనే వామభాగంలో అమ్మవారు శ్యామలాస్వరూపంలో వెలుగుతూ ఉంటారు. తలపైన గంగమ్మ, నెలపూవు, ధవళకాంతులీనుతూ ఉంటారు. మెడలోని నాగన్నా, గొంతుకలోని గరళమూ, కట్టిన గజచర్మమూ నల్లగా నిగారిస్తూ ఉంటాయి. ఆ శివస్వరూపమే కార్తీకపు వెన్నెల. వెన్నెలనయితే కనులతో చూడవచ్చు, మనసుతో ఆస్వాదించవచ్చు. మరి శివుని దివ్యశృంగారమో? అది కనులకి కడుతుందా? మన కళ్ళకి అది సాధ్యంకాదు. అందుకే ఆ దివ్యసౌందర్యాన్ని ధ్యానిస్తానని అంటున్నాడు కవి. అయితే, అంతటి మహాదేవుని శృంగారమూ, ఒకే ఒక కంటిజతకి కనిపిస్తుంది. మామూలుగా కనిపించడం కాదు, నిరంతరం ఆ చూపులకి గమ్యస్థానమే ఆ సౌందర్యం! ఆ నేత్రాలు ఎవరివో, పద్యం చివరిపాదంలో ఒక అద్భుతమైన విశేషణంతో చెప్పాడు కవి. “శ్రీగౌరీలోచననర్తకీనటనరంగస్థాన” – పద్యానికంతటికీ మకుటాయమానమైన ప్రయోగం ఇది! శ్రీగౌరి – పార్వతీదేవి, లోచన – కనులనే, నర్తకీ – నర్తకి, నటన – నాట్యానికి, రంగస్థాన – రంగస్థానమైన ఓ సర్వేశ్వరా. పార్వతీదేవి కన్ను అనే నర్తకి (కనులు రెండయినే చూపు ఒకటే కాబట్టి) నిరంతరం నాట్యం చేసే రంగస్థలం అట శివుడు! ఎంత గొప్ప ఊహ చూడండీ యిది! అమ్మవారి చూపులు ఎప్పుడూ అయ్యవారిపైనే కదులుతూ ఉంటాయన్న విషయాన్ని ఎంత అందంగా చెప్పాడు అన్నమయ్య! “గౌరీలోచన నర్తకీ నటన రంగస్థాన సర్వేశ్వరా!”

చాటుసాహిత్యంలో తరచూ కనిపించే లక్షణం – పద్యాల గురించీ, కవుల గురించీ జనవ్యవహారంలో వ్యాప్తమైయ్యే కథలు. ఈ శతకం గురించి కూడా అలాంటి ఐతిహ్యం ఒకటి ఉంది. అన్నమయ్య యీ శతకాన్ని రచించడం మొదలుపెట్టినప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడట. ప్రతి పద్యాన్నీ ఒక తాటాకు మీద వ్రాసి కృష్ణానదిలో వదిలిపెడతాననీ, అది తిరిగి వస్తే స్వామి ఆ పద్యాన్ని స్వీకరించినట్టు భావించి శతకరచన కొనసాగిస్తాననీ, ఎప్పుడైనా ఒక పద్యం తిరిగి రాకపోతే, అక్కడితో ఆపేసి గండకత్తెర వేసుకొని ప్రాణత్యాగం చేస్తాననీ ఆ ప్రతిజ్ఞ. అలా సాగుతున్న రచనలో ఒక పద్యం దగ్గరకి వచ్చేటప్పటికి అది తిరిగి రాలేదట. అప్పుడు తన శపథం ప్రకారం మెడ కత్తిరించుకొనేందుకు సిద్ధపడితే ఒక పసులకాపరి ఒక తాటాకుని తెచ్చి యిచ్చాడట. దాని మీద తన పద్యం కాకుండా అదే మకుటంతో మరొక పద్యం ఉన్నదట. దానిని, శతకరచన కొనసాగించమన్న శివుని ఆజ్ఞగా భావించి, ఆ పద్యాన్ని కూడా స్వీకరించి శతకాన్ని పూర్తి చేశాడని కథ. శతకంలో తిరిగిరాని పద్యమూ, తిరిగి వచ్చిన కొత్త పద్యమూ రెండూ ఉన్నాయి! నా దృష్టిలో కవిత్వపరంగా చూస్తే, ఆ రెంటిలోనూ, తిరిగిరాని అన్నమయ్య పద్యం ఉత్తమమైనది. తాత్త్వికదృష్టితో ఆలోచిస్తే, తిరిగివచ్చిన రెండో పద్యం ఉన్నతమైనది! సరే ఇంత చెప్పుకున్నాక ఆ రెండు పద్యాలనూ కూడా చదివి ఆస్వాదించండి మరి.

తిరిగిరాని అన్నమయ్య పద్యం:

తరులం బువ్వులు పిందెలై యొదవి, తత్తజ్జాతితో బండ్లగున్
హర! మీ పాదపయోజ పూజితములై యత్యద్భుతం బవ్విరుల్
కరులౌ, నశ్వములౌ, ననర్ఘమణులౌ, గర్పూరమౌ, హారమౌ
దరుణీరత్నములౌ, బటీరతరులౌ, దథ్యంబు సర్వేశ్వరా!

తిరిగివచ్చిన పద్యం:

ఒక పుష్పంబు భవత్ పదద్వయముపై నొప్పంగ సద్భక్తి రం
జకుడై పెట్టిన పుణ్యమూర్తికి బునర్జన్మంబు లేదన్న, బా
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచుం బెద్ద నై
ష్ఠికుడై యుండెడివాడు నీవగుట దా జిత్రంబె సర్వేశ్వరా!
----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, September 26, 2018

పునరావృతమ్


పునరావృతమ్






సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి............

‘రెడీ ఫర్ ట్రాన్స్‌పోర్ట్’ అని సిగ్నల్ ట్రాన్స్‌మిట్ చేశాను. వెహికల్ ఆన్ ది వే ఫర్ హ్యూమన్ ట్రాన్స్‌పోర్ట్ – రోబో కన్ఫర్మ్ చేసింది. ఎలివేటర్ లోకి వెళ్ళి ల్యాండింగ్ డాక్ బటన్ నొక్కాను. ఇంతలో బీప్ అంటూ సిగ్నల్, దానితోపాటే ఎదురుగా హెచ్-804 హాలోగ్రామ్ వచ్చింది.

“ఇంకొక్కసారి ఆలోచించుకో. ఇదంతా ఎప్పుడో శతాబ్దం నాటి పద్దతి. ఇప్పుడు అవసరమా! ఇట్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ ఇనెఫిషియెంట్ ప్రాసెస్. సింపుల్‌గా ఎగ్ డొనేట్ చేసేసి, ఒక్కసారి సక్సెస్ అవగానే మెన్‌స్ట్రువల్ సైకిల్ టర్మినేట్ చేయించుకో. నువ్వు ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. అవన్నీ రిస్క్ చేయకు…”

ఇలా ఈ విషయం మాట్లాడటమే కొత్తగా ఉంది. ఏం చెప్పాలో కూడా తెలియలేదు. ఇంతలో ఎదురుగా హాలోగ్రామ్ మాయం అయిపోయింది. నిజానికి మేం హ్యూమన్స్ పెద్దగా కబుర్లాడుకోవడం ఉండదు. నేరుగా కలిసి మాట్లాడుకోడం చాలా అరుదు. ఉండే వందల మంది భూమి అంతటా ఒక్కో సెక్షన్‌లో రోబోలతో పనిచేస్తూ బిజీ.

వెహికల్‌ పాడ్‌లో కూర్చున్నాను. డెస్టినేషన్ దానికి తెలుసు. టేకాఫ్ తీసుకున్న పాడ్‌తో పాటే నా ఆలోచనలూ. ఇలా నా గురించి నేను ఆలోచించడం కొత్తగా ఉంది. ఎర్త్ సస్టెనాన్స్ ఇంప్రూవ్‌మెంట్స్ నా పని. పని తప్ప వేరే ధ్యాస లేదు ఇప్పటిదాకా. ఇదంతా తొమ్మిదిరోజుల క్రితం వచ్చిన ఆ రెండు మెసేజెస్ వల్లనే.

స్లీపింగ్ పాడ్ నుంచి బైటకు రాగానే బర్త్ డే విషెస్ చెప్తూ కొత్త వరల్డ్ ప్రెసిడెంట్ నుంచి ఒక మెసేజ్. ఉయ్ నీడ్ టు రీక్రియేట్ హ్యుమానిటీ, ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్ అని ప్రోత్సహిస్తుంటారు. నిజమే మరి. ఉన్న ఈ కొద్ది మంది హ్యూమన్స్ పోతే ఇక రోబోలు తప్ప భూమి మీద ఇంకా ఎవ్వరూ ఉండరు. అందుకోసమే సాటి హ్యూమన్స్‌తో మాట్లాడాలి అంటే కనీసం హాలోగ్రామ్ అయినా తప్పనిసరిగా వాడండి, అని ఆయన ఆదేశం.

ఇంకో మెసేజ్. వెలుగుతూ ఆరుతూ, ఇంపార్టెంట్ అని సూచిస్తోంది. యు హేవ్ టు డొనేట్ యువర్ ఎగ్ దిస్ యియర్ టు ప్రొడక్షన్ బాంక్. మాన్‌డేటరీ ట్రయినింగ్ అండ్ ప్రి-ఎవాల్యుయేషన్ స్కెడ్యూల్‌డ్. దానితో పాటే స్కెడ్యూలింగ్ డిటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఏమిటిది? ఓ! ఈ రోజుతో నాకు సరిపోయిన వయసు వచ్చినట్టుంది. ఏ ఓరియెంటేషన్ కయినా హాలోగ్రామ్ పంపితే సరిపోతుంది. బయోమెడిక్స్ వింగ్‌కి కూడా స్వయంగా వెళ్ళక్కర్లేదు. ఎంబెడెడ్ చిప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పంపుతూ ఉంటుంది. ట్రీట్‌మెంట్ అంతా హ్యూమనాయిడ్ రోబోలే మా వర్క్ ఏరియాకో, రెస్ట్ మాడ్యూల్ లోకో వచ్చి చేస్తాయి. పదో యేడు నుంచీ ప్రతి ఏడాది పుట్టినరోజునాడు ఆ ఏడాది మా శరీరాలలో ఎలాంటి మార్పులు వస్తాయో వివరించే ట్రెయినింగ్ కూడా అలాగే ఉంటుంది. కాని, ఈ ఒక్క దానికి మాత్రం మేమే స్వయంగా వెళ్ళాలి, ఇదేమిటో! ఇదీ ప్రెసిడెంట్ ఆదేశాల వల్లేనేమో.

అటెండింగ్ రోబో బయోమెట్రిక్స్ స్కాన్ చేసి ఐ. డి. నిర్ధారించుకున్నాక ఒక రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోపెట్టి వెళ్ళింది. అక్కడ కనిపించింది తను. బహుశా తన పుట్టినరోజు కూడా ఈ రోజే అయుండాలి.

ఎలా పలకరించుకోవాలో మాయిద్దరికీ తెలియలేదు.

“అయామ్ హెచ్-804. ఎబయాటిక్ ఆపరేషన్స్ వింగ్.”

“అయామ్ హెచ్-805. ఎర్త్ సస్టెనాన్స్ ఇంప్రూవ్‌మెంట్స్.”

ఇంకో హ్యూమన్ రాగానే ఇద్దరం తల తిప్పి చూశాం. “అయామ్ హెచ్-304. ఐ రిమెంబర్ ఉయ్ హేవ్ మెట్ బిఫోర్,” డాక్టర్ లోపలికొస్తూనే మాట్లాడింది. హ్యూమన్స్‌ని ఎన్ని సార్లు హాలోగ్రామ్‌గా చూసినా ఎదురుగా చూడటం కొత్తగానే ఉంటుంది.

నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. దేనికైనా రోబో అటెండెంట్స్. గ్రోత్ ఛాంబర్స్‌లో పెరుగుతాం. అప్పుడప్పుడు ప్రెసిడెంట్, ఆయన కేబినెట్ మెంబర్స్ – హాలోగ్రామ్స్ వచ్చి పలకరించి వెళ్ళేవి. మొదటి పదహారేళ్ళు బిహేవియరల్ అబ్సర్వేషన్, మాకు చదువు, ఇతర విషయాలు నేర్పించడం, అన్నీ రోబోలే చూస్తాయి. తరువాత ఎఫిషియెన్సీ ఏ పనిలో ఉందో పరీక్ష చేయడం, ఆ పనికి సంబంధించిన సెక్షన్‌లో రోబోలతో కలిసి పనిచేస్తూ, చేయిస్తూ కొత్త పరిశోధనలు కూడా చేయడం. ఎవరి వింగ్ వారిదే. ఎక్కడి వాళ్ళు అక్కడే. అలాంటిది మేమే ఇక్కడకు రావడం, మాకోసం ఇంకో హ్యూమన్ రావడం కొత్తగా ఉంది.

ఎవరి కుర్చీల్లో వాళ్లం కూర్చున్నాక డాక్టర్ సర్కమ్‌ఆక్యులార్ ప్రొజెక్షన్ మొదలుపెట్టమని రోబోను ఆదేశించింది.

ది ప్లానెట్ ఎర్త్ ఫార్మ్‌డ్ 4.6 బిలియన్ యియర్స్ ఎగో… రోబో కామెంటరీ మొదలు కావడంతో పాటుగా మెల్లిగా మాచుట్టూ పరిసరాలు మారిపోయాయి. మండుతున్న భూగోళం క్రమేణా చల్లబడింది. చుట్టూ వాతావరణం, మబ్బులు, నీటిబిందువులు, నీలంగా సముద్రం. యూకేరియాటిక్ సెల్స్, సయనోబ్యాక్టీరియా. అమీబా, పారమీసియమ్… పరచుకుంటున్న ఆల్జీ, మొలకెత్తిన పచ్చదనం. జలచరాలు, ఉభయ చరాలు, అకశేరుకాలు, సకశేరుకాలు, సరీసృపాలు, క్షీరదాలు. అర్థం కాకపోయినా కొత్తగా తెలుస్తున్న పేర్లు.

నీటిలో తిమింగిలాలు. దిస్ ఈజ్ కాల్డ్ మేల్. దిస్ ఈజ్ ఫిమేల్. మూల్గుతున్నట్టుగా అరుపులు. ఆవ్యులేషన్, స్పెర్మటోజోవా. రిప్రొడక్టివ్ ఆర్గన్స్… దీజ్ ఆనిమల్స్ మేట్ టుగెదర్ టు ప్రొడ్యూస్ న్యూ సిమిలర్ లైఫ్‌ఫార్మ్స్ అన్డ్ దజ్ ఎక్స్‌టెండ్… ఆనుకుని రుద్దుకుంటున్నట్టుగా రెండు తిమింగలాలు. ది ఫిమేల్ కేరీస్ ది ఛైల్డ్ ఇన్ హర్… అంటిల్ ది జెస్టేషన్… ఆ ఆడతిమింగలం నుండి బయటకు వచ్చిన చిన్న తిమింగలం. ది ఫిమేల్, నౌ కాల్డ్ ఎ మదర్, ఫీడ్స్ హర్ ఛైల్డ్. పుట్టిన వెంటనే అమ్మ పొట్టకిందకి వెళ్లి మెల్లిగా ఒక ప్రొట్రూషన్ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ… దాని నోటిలోకి ధారగా వస్తూ తెల్లగా… ఏమిటో అది? ఇట్ ఈజ్ కాల్డ్ మిల్క్… పాలు, అవి ఆ బిడ్డకు ఆహారం. నాకు అనుమానం రాగానే మెదడులోని న్యూరల్ ఆక్టివిటీని గమనించి వెంటనే జవాబిస్తున్న రోబో. ఆహారం పౌచెస్‌లో కదా ఉంటుంది! అది ఇప్పుడు. ఒకానొకప్పుడు బిడ్డ కొంత పెరిగేదాకా తల్లి తన శరీరం లోంచి పాలు ఆహారంగా ఇచ్చేది.

మారిపోతున్న జంతువులు. వాటి ఆకారాలు, వాటి ప్రవర్తన. కొత్తగా పుడుతున్న బిడ్డలు, వాటిని నాలుకతో నాకుతున్న తల్లులు, పొంగుతున్న వాటి పాలిండ్లు, పాలు పీల్చుతూ బిడ్డలు. నాలో ఏదో తెలియని ఆసక్తి. ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తోంది. చింప్స్, ఒరాంగుటాన్స్, బానబాస్… మెల్లిగా వాటి వెంట్రుకలు రాలిపోతూ ఉన్నాయి. శరీరంలో మార్పులు వస్తున్నాయి. శ్రద్ధగా చూస్తున్నాను. …అండ్ దస్ ఎవాల్వ్‌డ్ హోమో సెపియన్. ద మోడర్న్ హ్యూమన్ బీయింగ్. కొనసాగుతున్న వివరణ. చాలా చిన్నగా ఒకేలా ఉన్న రెండు హ్యూమన్ బిడ్డలు. ఒకేలా ఉన్నా పెరిగేకొద్దీ ఒకేలా లేని రెండు శరీరాలు. అందులో ఒకటి బాగా తెలిసినట్టుగా… ‘అరె, అది నా బాడీలాగే ఉంది!’ అనుకున్నాను. అవును, ఎందుకంటే నువ్వూ ఫిమేల్ కాబట్టి. పొడూగ్గా జుట్టు, తల మీద, ముఖం మీద, ఒంటి మీద. మాట్లాడుతూ అటూ ఇటూ కదుపుతున్న చేతులు, ముఖాలలో ఎన్నో వేరీడ్ ఎక్స్‌ప్రెషన్స్. ఎన్నో రకరకాల బట్టలు వాళ్ళ ఒంటిని కప్పుతూ. ఏవీ కూడా నేను వేసుకునే రేడియేషన్ సూట్‌లా లేవు. ఎన్నో రంగుల్లో, ఎంతో నాజూగ్గా ఉన్నాయి. వారు తినేవీ తాగేవీ కూడా ఎంతో ప్రత్యేకంగా రంగులురంగులుగా ఉన్నాయి.

ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మేల్, ఫిమేల్ హ్యూమన్స్. పెదవులు విడతీసి పళ్ళు చూపిస్తూ… దానిని నవ్వు అంటారు. హ్యూమన్ బ్రెయిన్‌లో కెమికల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. వాటిని ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ అంటారు. అవి కలిగినప్పుడు వారి ముఖంలోని భావాలు మారతాయి. ఆనందం అనే ఒక భావన కలిగినప్పుడు అలా ప్రకటిస్తారు. అది ఒక ప్లెజంట్ రియాక్షన్. …ఒకరిచేతులొకరు పట్టుకుని, దగ్గరగా ఎదురెదురుగా నిలబడి కళ్ళలోకి చూసుకుంటూ… ఒకరి శరీరం చుట్టూ ఇంకొకరు చేతులు చుట్టుకుని, శరీరాలు తాకుతూ… ఏ హ్యూమన్ ఎంబ్రేస్, ఆల్సో కాల్డ్ ఎ హగ్, ఈజ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటిమసీ. ఇంటిమసీ? ఎన్ ఆక్ట్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఫర్ రిప్రొడక్టరీ ప్రొసీజర్స్.. నాలో పెరుగుతున్న ఆసక్తి.

ఫిమేల్ మెల్లిగా కళ్ళు మూసుకొని మేల్ చెంపకు చెంప ఆనించింది. మేల్ తనను చుట్టుకున్న ఫిమేల్ చేతులను అల్లాగే ఉంచి మెల్లిగా ఫిమేల్ పెదవుల మీద పెదవులు ఆనిస్తూ… ఇంకేదో ఎక్స్‌ప్రెషన్ మేల్ మొహంలో. ఇంటిమసీతో వారి ముఖాల్లో శరీరాల్లో మార్పులు, వారి ముఖాల్లో ఏవో ఫీలింగ్స్ కొత్తకొత్తగా. హ్యూమన్స్‌లో ఇన్ని అనుభూతులు ఉంటాయా? ఇప్పుడెవరూ అలా లేరే. హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ కెమికల్ స్ట్రక్చర్… నాలోనూ ఏదో తెలియని ‘ఎమోషన్?’. యువర్ బాడీ టెంపరేచర్ ఈజ్ ఎలివేటెడ్ స్లైట్‌లీ. ఇట్ ఈజ్ ఎ నార్మల్ రియాక్షన్. నార్మల్ అయితే నాకు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఇన్నేళ్ళలో నాకు తెలిసిందల్లా ప్లెజంట్ రియాక్షన్స్, అన్‌ప్లెజంట్ రియాక్షన్స్. అవి కూడానూ పూర్తిగా రెగ్యులేట్ చేయబడ్డాయి. ఏదైనా రియాక్షన్ కొంత తీవ్రంగా ఉంటే అటెండర్ రోబో వచ్చి డ్రగ్ ఒకటి అడ్మినిస్టర్ చేస్తుంది. ఇప్పుడు నాలో ఉన్నది ఏ ఎమోషన్? నాకు సరిగ్గా అర్థంకావడం లేదు. తీవ్రమైన అనుభూతి ఇలా ఉంటుందా?

ఇన్సెమినేషన్. ఫర్టిలైజేషన్. తొమ్మిది నెలల ప్రోగ్రెషన్‌లో హ్యూమన్ బాడీగా మార్పు. మదర్ నుంచి ఛైల్డ్‌కు ఉంబిలికల్ కార్డ్. తలకిందులుగా తిరిగిన బేబీ బాడీ. బైటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా. మదర్ ముఖంలో ఏవో ఎక్స్‌ప్రెషన్స్. పెద్దగా అరుస్తోంది. ఇట్ ఈజ్ కాల్డ్ పెయిన్, ఏన్ అన్‌ప్లెజంట్ ఫీలింగ్… నాచురల్ డెలివరీ ఈజ్ ఎ వెరీ పెయిన్‌ఫుల్ ప్రాసెస్. మదర్ మే లూజ్ హర్ లైఫ్ సమ్‌టైమ్స్…

ఫిమేల్ మదర్ ఆ చిన్న బేబీని చేతిల్లోకి సుతారంగా తీసుకుంది. మెల్లిగా ఆ బేబీ వీపును, చేతులను నిమిరింది. మెల్లిగా గుండె వద్దకు తీసుకెళ్లి ఆ చిన్ని పెదాలను ఒక ప్రొట్రూషన్ పైన (దానిని నిపుల్ అంటారు.) ఉంచింది.

నాకు తెలుసు, ఇప్పుడు పాలు వస్తాయి ధారగా! మదర్ ముఖంలో ఏదో ప్లెజంట్ ఎక్స్‌ప్రెషన్. కన్నార్పకుండా తన బిడ్డనే చూస్తోంది. పెదాలు కొంచెం సాగి సన్నగా నవ్వు లాంటి భావం ఏదో. ఇంతలో మేల్ వచ్చింది. ఆ ముఖంలో కూడా నవ్వు. చూస్తూ ఉంటే చాలా బాగుంది. అనుకోకుండా నా పెదవులు తడుముకున్నాను. ఆశ్చర్యంగా నా పెదవులూ అలా సాగి పైకి తిరిగివున్నాయి.

బిడ్డ పెరిగి పెద్ద అవుతోంది. తల్లి బిడ్డకు నోట్లో ఆహారం పెడుతోంది. ఆజ్ దే గ్రో, ది బేబీ ఈజ్ ఫెడ్ సాలిడ్ ఫుడ్… ది మదర్, ఫాదర్ అండ్ ఛైల్డ్ లివ్ ఇన్ ది సేమ్ రెసిడెన్స్. టుగెదర్ దే ఆర్ కాల్డ్ ఎ ఫ్యామిలీ.



అన్డ్ ఆజ్ ది సివిలైజేషన్ ప్రోగ్రెస్‌డ్ హ్యూమన్స్ బిగాన్ టు డిస్క్రిమినేట్ ఎగైన్‌స్ట్ ఈచ్ అదర్ అన్డ్ ఈవెన్చువల్లీ డిస్ట్రాయ్‌డ్ దెమ్‌సెల్వ్‌స్ లీడింగ్ టూ ది కరంట్…

ఎదురుగా ఇప్పటి ప్రొసీజర్ వస్తూ ఉంది. ఓవమ్‌నీ, స్పెర్మ్‌నీ విడివిడిగా ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఉంచుతున్నారు. వాటి డిఎన్‌ఏ మ్యాచ్ చేసి, సక్సెస్ రేషియో ఆల్గారిదమ్స్ వాడి ఏ ఎగ్ ఏ స్పెర్మ్‌తో మ్యాచ్ అవుతుందో చూస్తున్నారు. అ తర్వాత ఆర్టిఫిషియల్ ఊంబ్‌లో ఇంక్యుబేట్ చేస్తున్నారు. బేబీ కంప్లీట్‌గా ఫార్మ్ అయినాక గ్రోత్ ఛాంబర్స్‌లోకి. పదిహేనేళ్ళు వచ్చేదాకా అటెండర్ రోబోలు పిల్లలను పెంచి పెద్దచేస్తాయి. వచ్చే హ్యూమన్ బేబీ? మేల్ అయినా ఫిమేల్ అయినా ఒకటే. మరి చాలామంది బేబీస్ ఇలా ఇప్పటికే పుట్టి… ఇంతకు ముందే చెప్పినట్టు హ్యూమన్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ క్రీచర్స్.

“నీనుంచి మూడుసార్లు ఓవమ్ ఎక్స్‌ట్రాక్ట్ చేస్తాం. ఆ తరువాత నీ మెన్‌స్ట్రుయేషన్ టెర్మినేట్ చేశాకనే నీ హార్మోనల్ ప్రొడక్షన్, నీమీద వాటి ఎఫెక్ట్ ఎలిమినేట్ చేస్తాం…” డాక్టర్ గొంతు వినిపించింది.

“నా ఎగ్ ఏ స్పెర్మ్‌తో కలుపుతారో నాకు చెప్తారా?”

“లేదు. యూ విల్‌హావ్ నో ఫర్దర్ రోల్ టు ప్లే.”

“నా ఎగ్‌తో పుట్టే హ్యూమన్ బేబీ మేల్ ఆర్ ఫిమేల్…”

“ఇట్ డజ్‌నాట్ మ్యాటర్ టు అజ్. ఆజ్ లాంగ్ ఆజ్ ది ప్రొడక్షన్ ఈజ్ ఎ సక్సెస్…”

“బట్, నేను ఇక్కడ మేల్ హ్యూమన్స్‌ను చూడలేదు…”

“ఓ! ఒక ఏజ్ వచ్చాక వారిని వేరే డివిజన్‌లో ట్రెయిన్ చేస్తాం. దెయిర్ బాడీస్ బిహేవ్ డిఫరెంట్లీ దేన్ యువర్స్. దటీజ్ వై ఉయ్ అవాయిడ్ ఇంటరాక్షన్స్.”

“డాక్టర్, వన్ లాస్ట్ క్వశ్చన్. పుట్టిన బేబీని నేను చూడచ్చా?”

“హెచ్-508, ఎందుకు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నావ్? యూ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్, యెస్? హ్యూమన్స్ చాలా తక్కువగా ఉన్నాం. మనందరం మరింత ఎఫిషియెంట్‌గా ఉండకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదా. అందువల్లనే కదా చాలా అన్‌నెసెసరీ ఎమోషన్స్ రెగ్యులేట్ చేస్తున్నాం గ్రోత్ ఛాంబర్స్‌లో పెరిగేప్పుడే. ఐ నో, అందరు హ్యూమన్స్ ఒకేలా రెస్పాండ్ కారు వాటికి. ఇఫ్ యూ నీడ్, ఐ కెన్ సెండ్ యూ టు…”

“నో నీడ్ డాక్టర్. అయామ్ ఫైన్.”

నా కళ్ళముందు ఆ తల్లి, బిడ్డ కనిపిస్తూనే ఉన్నారు. ఆమె ముఖంలోని అన్ని భావాలు ఇంకా అలానే ఉన్నాయి నా ఆలోచనల్లో.

నన్నూ హెచ్-804నూ కొంతసేపు అక్కడే ఒంటరిగా వొదిలిపెట్టారు. చాలా చిన్నగా ఇబ్బందిగా మొదలైనా నేనూ తనూ మా వర్క్ వివరాలు పంచుకున్నాం. ఇంతలో డయాగ్నాస్టిక్స్ రోబోలు వచ్చి తమ పని తాము మొదలుపెట్టాయి. చివరిగా వాటి స్క్రీన్స్ మీద కొన్ని ప్రశ్నలు, వాటికిందే మేము ఎంచుకోడానికి కొన్ని సమాధానాలు వచ్చాయి.

పక్కనే ఉన్న హెచ్-804 చకచక ఆప్షన్స్ క్లిక్ చేసింది. ఆర్టిఫిషియల్? యెస్. అటెంఫ్ట్స్? మాక్సిమమ్ త్రీ. టెర్మినేట్ మెన్‌స్ట్రువల్ సైకిల్? యెస్. ఆఫ్టర్ థర్డ్ అటెంప్ట్. పూర్తి చేసి నావైపు చూసింది. నాకు ఇదంతా ఇంకా కొత్తగానే ఉంది. ఎందుకు నేను తనలా చకచకా సమాధానాలు ఎంచుకోలేకపోతున్నాను? కళ్ళు మూసుకున్నాను. అలా పెదవులు ఒంపు తిరగడం నవ్వు కదూ. అది ఒక ప్లెజంట్ సెన్సెషన్ కదూ. ఎంత ఇంటెన్స్‌గా ఉంటుందో కదా, అలా బేబీని పట్టుకున్నప్పుడు. మెల్లిగా నా ఆప్షన్స్ సెలక్ట్ చేసుకున్నాను.

ఆర్టిఫిషియల్? నో. కన్‌ఫర్మ్ నాచురల్? యెస్. అటెంప్ట్స్? ఆజ్ మెనీ ఆజ్ నీడెడ్. సైకిల్? స్టాప్ ఓన్లీ ఆఫ్టర్ మినిమమ్ టూ సక్సెసెస్.

రూమ్‌లోకి డాక్టర్ వచ్చింది, రోబో పంపిన సిగ్నల్ అందుకుని. ఆమెకూ ఇది కొత్తగా అనిపించినట్టుంది. నా వైపు చూసింది.

“ఆర్ యూ ఓకే? యూ నో యూ డోన్ట్ హేవ్ టు డూ దిస్. ఈ నాచురల్ ఆప్షన్ కేవలం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల ఉంది తప్ప…”

“యెస్. దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ టూ డూ ఇట్.”

“ఇంకోసారి ఆలోచించుకో!” డాక్టర్‌కి ఎప్పుడూ ఎదురు అయినట్టు లేదు ఇలాటి పరిస్థితి. అసలు ఆ ఆప్షన్ ఉందని కూడా తనకు గుర్తు ఉన్నట్టు లేదు.

“అక్కర్లేదు డాక్టర్. నాకు ఇలానే కావాలి. అయామ్ సర్టన్ ఆఫ్ ఇట్.”

“లెట్ మీ సీ. అసలు ఇది ఎలా జరుగుతుందో నాకూ తెలీదు. ముందు ప్రెసిడెంట్‌కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన అప్రూవల్‌ వచ్చినాక నాచురల్‌కి ఒప్పుకునే మేల్‌ని వెతకాలి. దొరికినాక ప్రొసీజర్స్ ఏంటో, ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు తెలియదు. నీకూ చాలా డ్యూటీస్ ఉన్నాయి. అలాగే దే హేవ్ దెయిర్ ఓన్ డ్యూటీస్. నాచురల్‌కి ఒప్పుకోవడం అంటే ఇద్దరు హ్యూమన్స్ వర్క్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎనీ వే, నేను చేయాల్సింది నేను చేస్తాను. వితిన్ త్రీ మంత్స్ మ్యాచ్ దొరకకుంటే ఆర్టిఫిషియల్ కంపల్సరీ అవుతుంది నీకు. ఓకే? నౌ, యూ కెన్ గో బ్యాక్ టూ యువర్ సెక్షన్స్.”

ట్రాన్స్‌పోర్టేషన్ డాక్ దగ్గర హెచ్-804 చెప్పింది నెమ్మదిగా. నేను నీతో మాట్లాడతాను ప్రతిరోజూ అని. నా శరీరంలో ఒక ప్లెజంట్ రియాక్షన్ మైల్డ్‌గా.

అసలు మేల్ హ్యూమన్ ఎలా ఉంటుందో! దగ్గరగా చూడాలి. హాలోగ్రామ్స్ ఎక్కడికైనా వెళ్ళడం సులభం కాని, ఇలా నా వర్క్ మాడ్యూల్ నుంచి నిజంగా బైటకు రావడం అలసటగా ఉంది. ఎక్సోమాడ్యులార్ అట్మాస్ఫియర్ ప్రభావం అది. వెహికల్ ఇండికేటర్ పోవాల్సిన ప్లేస్ దగ్గరకు వచ్చిందని సూచించింది. ఇక దిగి వెళ్ళడమే. డోర్స్ తెరుచోకోగానే రిసీవింగ్ రోబో నన్ను మెల్లిగా అక్కడ ఉండే మానిటరింగ్ హ్యూమన్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది.

“వెల్‌కమ్. అయామ్ హెచ్-109. మిమ్మల్ని మేల్ హ్యూమన్‌ని ఇక్కడ హోస్ట్ చేయమని ప్రెసిడెంట్ చెప్పారు. మీరు ఎన్ని రోజులు అయినా ఇక్కడ ఉండొచ్చు. మీకు కావాల్సినవి ప్రోగ్రామ్ చేశాం. మీరు కావాలంటే మారుస్తాం. ఈ రోజు ప్రోగ్రామ్ బీచ్ వద్ద.”

“బీచ్?”

“యెస్. సీ కోస్ట్.”

హెచ్-109కు కూడా కొత్తగా ఉన్నట్టుంది ఇలా హ్యూమన్స్‌ని చూడటం. అందులోనూ మాలాంటివాళ్ళను. స్పెషల్ కాబట్టే సెగ్రిగేటెడ్ ఎన్‌క్లోజర్‌లో డీకంటామినేట్ చేసి కాపాడుకున్న కొంత సీ కోస్ట్ ఏరియాని మా మీటింగ్ కోసం అరేంజ్ చేశారుట ప్రెసిడెంట్. ఇంకా ఎర్త్ మీద అలా డోమ్స్ వాడి కాపాడుకున్న అడవులు, జలపాతాల వంటి సీనిక్ ఏరియాస్ కూడా ప్లాన్ చేసి ఉంచారు మాకోసం.

నాకు అవేమంత ఆసక్తిగా అనిపించలేదు. అవన్నీ ఎలా ఉంటాయో జూవనైల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్‌లో వర్చువల్‌గా చూసినవే.

“మేల్ హ్యూమన్ ఎప్పుడు వస్తుంది?”

“అదిగో.”

చటుక్కున అటు వైపు చూశాను.

తల తిప్పి చూడగానే దూరంగా ముందు రోబోతో పాటుగా వస్తున్న ఆకారం. దగ్గరకు వచ్చేసరికి ఇంకా స్పష్టంగా, రేడియేషన్ సూట్, మాస్క్‌లలో ఉంది అందరి లాగే! తనేమి ఇటు చూడలేదు. రిసీవింగ్ హ్యూమన్ వద్ద ప్రోగ్రామ్ తెలుసుకుంటోంది. రిసీవింగ్ హ్యూమన్ ఇద్దరినీ చూసి చెప్పింది.

“యూ బోత్ కెన్ నౌ గో అండ్ రిలాక్స్ ఇన్ యువర్ రూమ్స్. ఉయ్ విల్ అరేంజ్ యువర్ మీటింగ్ అండ్ ఇన్ఫార్మ్ యూ.”

అటెండెంట్ రోబో దారి చూపుతుంటే మా రూమ్స్‌కి వెళ్ళాం. డెస్క్ దగ్గర పెట్టిన ఫుడ్. మీల్స్ పౌచ్, ఫ్లూయిడ్ కాప్స్యూల్స్. చూడటానికీ తేడాగా ఉన్నాయి రోజూ వేసుకునే వాటికంటే. వేసుకుని పడుకున్నాను. చిన్నగా మ్యూజిక్ ఎక్కడి నుండో, ఏదో వాసన, ప్లెజంట్‌గా. అలిసిపోయానని మానిటర్ చెప్పినపుడు మ్యూజిక్ వినడం మామూలే కాని ఇదేమిటో మరి ఏదోగా, ఆలోచనలు అన్నీ పోయి హాయిగా, వళ్ళు తూలుతూ ఉంది. గంట ఎలా గడిచిందో తెలీదు. రోబో లేపే వరకు.

“హెచ్-805, యు హేవ్ అన్ అపాయింట్‌మెంట్ విత్ మేల్.”

గబుక్కున లేచి సూట్ వేసుకోబోయాను.

“నో, దిస్ ఈజ్ ఫర్ యు. యూ డునాట్ నీడ్ రేడియేషన్ సూట్స్ హియర్.”

వైట్ స్లాక్స్, వైట్ షర్ట్. చాలా మెత్తగా, సుకుమారంగా ఉన్నాయి. రోబో ఒక రిస్ట్‌డివైస్ అందించింది. “దిస్ విల్ హెల్ప్ యూ.”

సముద్రపు ఒడ్డున కుర్చీలో కూర్చున్నాను. మేల్ కూడా ఇలాగేనా! నేను వీడియోలో చూసినట్లే ఉంటుందా!

మొట్టమొదటిసారి వర్క్ గురించి కాక ఇంకో విషయం ఆలోచిస్తున్నానని ఉన్నట్టుండి గుర్తొచ్చింది. అనుకోకుండా ‘నవ్వు’ వచ్చింది.

తల తిప్పి చుట్టూ చూశాను. సముద్రం నీలి రంగులో తెల్లని అలలతో ఇసుకను తాకుతూ ఉంది. ఇదంతా ముందే చూసినా ఏదో కొత్తగా ఉంది. ముందు మేల్ హ్యుమన్‌ని చూడాలి. అప్పటి ఫాదర్ మేల్ లాగా ఉంటుందా?

ఇంతలో మేల్ మెల్లిగా వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నాలాగే తెల్లటి దుస్తులు, చేతికి రిస్ట్‌డివైస్. గబుక్కున మొహం చూశాను. ముఖం నున్నగా ఉంది. నో ఫేషియల్ హెయిర్. ఆ దుస్తుల వెనక శరీరం నేను వీడియోలో చూసినట్టు ఆ పాతకాలం మేల్స్‌లా ఉంటుందా? ఇంతలో మేల్ కూడా నావైపు చూసింది. అప్రయత్నంగా వెంటనే తల తిప్పుకొని సముద్రం వైపు చూశాను. చెవులు వెచ్చబడ్డాయి. ఇప్పుడేం చేయాలి? వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్? హూ షల్ ఇనీషియేట్ ది ఇంటిమసీ ప్రొసీజర్స్? ఎంతసేపలా ఉన్నామో!

రిస్ట్‌డివైస్ ఆక్టివేట్ అయింది. ప్రెసిడెంట్ ఫేస్ అందులో. “థాంక్యూ ఫర్ టేకింగ్ దిస్ రిస్క్. ఉయ్ ఆల్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. దిస్ విల్ బి ఎ న్యూ బిగినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అజ్. యూ ఆర్ కంప్లీట్‌లీ ఫ్రీ టు డూ వాటెవర్. నో ప్రోటోకాల్స్ ఎట్ ఆల్. మీకు మొదట మొదట బెరుకు ఉంటుంది. ఇన్‌హిబిషన్స్ ఉంటాయి. అవి పోగొట్టేందుకు మీ రిస్ట్ డివైసెస్ సహాయం చేస్తాయి. బెస్ట్.”

ఇద్దరం మళ్ళీ ఒకరినొకరు చూసుకున్నాం. మేల్ తన రిస్ట్‌డివైస్ వైపు చూసుకుంది. ఇంకేదో మెసేజ్ వచ్చుండాలి.

“అయాం హెచ్-800. ఇన్టర్‌స్టెల్లార్ వర్క్.”

“హెచ్-805, సస్టెనాన్స్ ఇంప్రూవ్‌మెంట్స్.”

“ఓహ్, వాడ్డూయూడూ?”

“ఫుడ్ పౌచ్ వారానికి ఒకటి సరిపోయేట్టుగా ప్రయత్నిస్తున్నాం.”

“మరి వాటర్?”

“ఉయ్ స్టిల్ నీడ్ ఇట్. బాడీ కన్సంప్షన్ చాలా తగ్గించాం కాని మెయింటెనన్స్ కోసం రోజూ రెండు కేప్స్యూల్స్ తప్పటంలేదు.”

మామూలుగా ఎపుడూ హ్యూమన్స్ ఇలా మాట్లాడుకోరు. ప్రెసిడెంట్‌కి, కౌన్సిల్‌కి మాత్రం ప్రోగ్రస్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. మేల్ ఇలా అడగడం, నేను చెప్పడం కొత్తగా ఉంది. వర్క్ ఎలా జరుగుతోందో నా మాడ్యూల్‌లో! మానిటరింగ్ రోబోలు అన్ని నిర్ణయాలూ తీసుకోలేవు. నేనక్కడ ఉండటం తప్పనిసరి.

“న్యూ ప్లానెట్స్ వెతుకుతుంటాం హ్యూమన్ లైఫ్ కోసం. సో ఫార్ నన్ ఫౌండ్. నాన్ కార్బన్ లైఫ్‌తో రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేస్తుంటాం. చాలా వర్క్ హ్యూమనాయిడ్ రోబోస్ చేస్తున్నాయి ఇప్పటికే. కాని హ్యూమన్స్ అవసరం ఇంకా చాలా ఉంది. ఉయ్ నీడ్ మోర్ హ్యూమన్స్ ఫర్ ఎర్త్. ఒకవేళ వేరే ప్లానెట్ దొరికినా హ్యూమన్స్ కోసం రీబిల్డ్ చేయడానికి టైమ్ పడుతుంది చాలా.” నేను అడగకుండానే చెప్పింది మేల్.

మౌనంగా మళ్ళీ కూర్చుండిపోయాం. సముద్రపు అలల చప్పుడు తప్ప ఇంకేమీ లేదు. అలవాటుగానే వర్క్ గురించిన ఆలోచనల్లోకి పడిపోయాను. సూట్స్ లేకుండా రిమోట్ కమ్యూనికేషన్స్ చేయలేం. ఇక్కడ ఏం చేయాలో తెలీటల్లేదు. వెళ్ళిపోదామా? ఇంతలో కళ్ళ ముందు ఏదో కదిలేసరికి ఉలిక్కిపడ్డాం ఇద్దరమూ. రిక్రియేషనల్ డ్రోన్ గాలిలో తేలుతూ ఎదురుగ్గా కనిపించింది, సంగీతం పాడుతూ. దాని చేతుల్లో ఒక చిన్న ట్రే. అందులో ఒక ఫ్లవర్, రెండు చిన్న చిన్న గ్లాసెస్. అందులో ఏదో లిక్విడ్ ఉంది. మేల్ తన రిస్ట్‌డివైస్ వైపు మళ్ళీ చూసుకుంది.

కుర్చీలోంచి లేచి ఆ పూవు తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకుని పీల్చింది. మేల్ ముఖంలో ప్లెజంట్ ఎక్స్‌ప్రెషన్. నాకు అందించింది.

వేర్ ఇట్ ఆన్ యువర్ హార్ట్– నా రిస్ట్‌డివైస్ చెప్పింది. ఛాతీ మీద ఎడమ వైపుగా ఆ పూవుని క్లిప్ చేసుకున్నాను. పూవునుండి సన్నగా వస్తున్న సువాసన ఇందాక రూమ్‌లో వాసన లాగా.

మేల్ లేచి ఆ గ్లాసెస్ తీసుకుని ఒకటి నాకు ఇచ్చింది. రిస్ట్‌డివైస్ ఎలా తాగాలో చూపించింది. సందేహిస్తూ ఇద్దరం సిప్ చేశాం. వెరీ యునీక్ టేస్ట్. వెరీ ప్లెజంట్ రియాక్షన్ ఫ్రమ్ ది బాడీ. గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. మేల్ ముఖంలో కూడా అదే ప్లెజంట్‌నెస్.

గో అండ్ డిప్ యువర్ లెగ్స్ ఇన్ వాటర్ – రిస్ట్‌డివైస్.

మెల్లిగా సముద్రం వైపు నడిచాం. ఉత్తకాళ్ళతో ఇసుకలో నడవడం ఇంకో కొత్త అనుభవం. నీళ్ళల్లో కాళ్ళు పెట్టి నిలబడ్డాం. పెద్ద అల వచ్చి కాళ్ళని తడుపుతూ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది మెల్లిగా పాదం క్రింద ఇసుకను లాక్కుంటూ… ప్రతీ చిన్న విషయమూ ఎంతో ఆహ్లాదానిస్తోంది. ఆ వీడియోలో నేను గమనించినదీ ఇదే!

మెల్లిగా తల తిప్పి చూశాను. మేల్ ముఖంలో నవ్వు. నన్ను అప్పుడే చూసిన మేల్ ముఖంలో వేరే ఎక్స్‌ప్రెషన్. నాకు అర్థమయింది, అది ఆశ్చర్యం! నా ముఖంలో నవ్వు చూసి అని. ఇంకోసారి ఇంకో అల పాదం కింద నుంచి జారిపోతూ, ఇసుక కరిగిపోతూ. మా ముఖాల్లో నవ్వు పెరిగింది. మేల్ పెదవులు విచ్చుకున్నాయి. పళ్ళు కనిపించాయి, పెద్దగా నవ్వుతుంటే, అచ్చు ఆ వీడియోలో ఫాదర్ మేల్ లాగే. మేల్ కళ్లల్లో కూడా అదే హ్యూమన్ ఎక్స్‌ప్రెషన్! తెలీకుండానే నేనూ నవ్వాను నోరు తెరిచి. మేల్ నన్ను చూసి తనూ ఇంకా నవ్వింది.

ఇంతలో ఒక్క పెద్ద అల లాగేసరికి ముందుకు పడిపోబోయాను. మేల్ చాలా చురుకుగా కదిలింది. నా నడుము చుట్టూ చేయి వేసి నన్ను పడిపోకుండా పట్టుకుంది. ఇంకో అల, తనకెదురుగా నేను. మరింత దగ్గరగా. మేల్ కళ్ళలో ఒక కొత్త ఎక్స్‌ప్రెషన్. నేను నిలదొక్కుకున్నా నన్ను చుట్టిన చేయి వదలడం లేదు. మేల్ కళ్ళల్లోకి చూశాను. మెరుస్తున్నాయి అవి. నాకు తెలీకుండానే కళ్ళు మూసుకున్నాను. తెరుద్దామంటే చేతకావటంలేదు. మేల్‌ని హగ్ చేసుకున్నాను. నా చేతులు మేల్ నడుము చుట్టూ. మేల్ ఊపిరి నా మెడ మీద వెచ్చగా. నా శరీరంలో రానురానూ పెరుగుతున్న ప్లెజంట్ సెన్సేషన్. పెయిన్‌ఫుల్ బట్ ప్లెజంట్. హద్దులు దాటిన అనుభూతి ఇంత తీవ్రంగా ఉంటుందా? ఏమైపోతున్నానో తెలియని భయం. కాని ఆగలేకపోతున్నాను. కష్టం మీద కళ్ళు తెరిచి చూశాను. మేల్ కళ్ళు నన్నే చూస్తున్నాయి. తల వంచి తన పెదవులు నా పెదవులకు తాకిస్తుండగానే మా కళ్ళు మళ్ళీ మూసుకున్నాయి. తెలీకుండానే ఒకరినొకరం మరింత గట్టిగా హగ్ చేసుకున్నాము.

ఉన్నట్లుండి ధడేల్‌మని శబ్దం భూమి కంపించినట్లు, సంకెళ్ళు ఏవో బిగుసుకున్నట్టుగా భూమి తిరగడం ఆగిపోయింది.

సహజమైన బంధాన్ని సంకెళ్లతో బంధించిన సమాజపు కట్టుబాట్లతో విసిగిపోయిన స్త్రీ ఏ సృష్టినైతే నిరాకరించిందో, తిరిగి ఆ స్త్రీ కోరుకోవడంతో అదే సృష్టి మళ్ళీ మొదలయింది. భూకంపంతో కదిలిపోయిన భూమి వెనకకు తిరగసాగింది నెమ్మదిగా ఎలా ఉండబోతోందో తెలియని భవిష్యత్తు లోకి.
-----------------------------------------------------------
రచన: వాయుగుండ్ల శశికళ, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, September 25, 2018

బండలు(కథ)


బండలు(కథ)



సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...............

ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ మొదలవకముందు, ఇండియన్ ఎయిర్‌లైన్సే రాజై వెలుగుతున్నప్పటి కాలంలో– ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తుండేవాళ్ళం.

“ఇందూ, గంటవరకూ గ్యాంగుకి డ్యూటీలేవీ లేవు. మళ్ళీ ఎండ పోతుంది. బండలు ఖాళీగానే ఉన్నాయా?” ఇంటర్‌కామ్‌లో అడిగింది ప్రీతి.

మా గ్యాంగులో వారి డ్యూటీలు- ఎయిర్‌బస్ టెర్మినల్‌లోనూ బోయింగ్ టెర్మినల్‌లోనూ. నన్ను మాత్రం ఈ రెండిటికీ మధ్యనున్న డొమెస్టిక్ కార్గో సెక్షన్‌లో పడేశారీ మధ్య.

“వచ్చేయండి, ఖాళీగానే ఉన్నాయి. నేనూ నా డ్యూటీ బ్రేక్ ఇప్పుడే తీసేసుకుంటాను.” చెప్పాను.

మూడవవస్తోంది.

కార్గో బిల్డింగ్‌కి సరిగ్గా బయట, టార్మాక్ వైపు, అందరికీ ‘అడ్డా’ -అడ్డంగా పడేసున్న ఆ పొడుగాటి స్తంభాలు. మూడడుగుల వెడల్పున్న ఆ భారీ, చదరపు, నలుపురంగు స్తంభాలు కార్గో డివిజన్‌లో భాగమే అనిపిస్తాయి. అవే మా అందరి ‘బండలు’! ఎండలకి కాలవు. వానలకి జడవవు. చలికి వణకవు. వడగళ్ళకి చితకవు. ఏ పది నిముషాలో ఖాళీ ఉన్న ప్రతీ ఒక్కరమూ శీతాకాలంలో వాటిమీద కూర్చోక మానం.

అటునుంచిద్దరూ, ఇటునుంచిద్దరూ వచ్చారు.

కాంటీన్ ట్రాలీ తోసుకుంటూ ఎటెండర్లు వస్తుంటే- సాండ్‌విచ్‌లూ సమోసాలూ పేపర్ ప్లేట్లలో సర్దుకుని, టీ, కాఫీలూ అక్కడే వున్న ప్లాస్టిక్ టేబుల్స్ మీద పెట్టుకున్నాం. కబుర్లూ, టీలూ పూర్తయాయి. ఎవరి డ్యూటీ పాయింట్లకి వాళ్ళు తిరిగి వెళ్ళారు. నేనూ కార్గో బిల్గింగ్ లోపలికి వచ్చాను.

నాకోసమే ఎదురు చూస్తున్నాడు ఫెడ్‌ఎక్స్ ఏజెంట్, ‘మాడమ్, నా కన్‌సైన్‌మెంట్ సంగతేమయింది?’ అంటూ. నక్షత్రకుడు! పది రోజుల కిందట సీ-నోట్ అని మేం పిలుచుకునే ఏడేళ్ళనాటి పాత కన్‌సైన్‌మెంట్ నోట్ ఒకటి తెచ్చినప్పటినుంచీ విసుగూ విరామం లేకుండా రోజూ ఇక్కడే చక్కర్లు కొడుతున్నాడు. ఆ నోట్‌లో బుక్ చేసిన వ్యక్తి పేరు సతీష్ అగర్వాల్ అని రాసుంది.

“బాబూ, కార్గోలోనే కాదు, ఎయిర్‌పోర్టంతటా వెతికించినా మీ సామాను కనబడలేదు. అయినా 40 కోట్ల విలువయిన సామాను అని ఇన్‌వాయిస్‌లో ఉంది. అదీ, పన్నెండు టన్నుల మెటల్!” అరిగిపోయిన రికార్డులా చెప్పి, “అయినా ఇన్నేళ్ళూ మీ క్లయింట్ పట్టించుకోనేలేదేం?” చివరికి కుతూహలం పట్టలేక అడిగాను.

“నేను కొత్తగా చేరాను మామ్, నాకంత తెలియదు. బుక్ చేసిన సతీష్‌గారు పోయి ఆరేళ్ళు దాటిందట. ఇప్పుడు ఆయన కొడుకు నీరజ్ అగర్వాల్, ‘సామాను వెతికిస్తారా, చస్తారా!’ అంటూ మా పీకలమీద కూర్చున్నారు. మీకూ ఫోన్ చేస్తానన్నారు. ప్లీజ్, మళ్ళీ చూడండి…” బతిమాలుకున్నాడు.

జాలేసింది కానీ కనిపించని వాటినెక్కడినుంచి తెచ్చేది! ఏ ఈగో దోమో చిన్న పాకెట్టో కూడా కాదు, ఎక్కడో పోయిందనుకోడానికి.

“మళ్ళీ రెండ్రోజుల్లో రండి. ఇంకెక్కడైనా దొరికే వీలుంటుందేమో ప్రయత్నిస్తాను.” వాగ్దానం లాంటిది చేశాను.

సీ-నోట్ కాపీలు తీయించి, అవేవో కరపత్రాలయినట్టు హెల్పర్లకి పంచి, కన్‌సైన్‌మెంట్ వెతకమని అన్ని చోట్లకీ పరిగెత్తించాను.

ఈ వ్యవహారం అంతు తేలనప్పటికీ మా బండల మీది సంబంధాల్లో మాత్రం మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పట్లాగే. మిత్రులు శత్రువులవుతున్నారు. ఒకరి మొహం ఇంకొకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ప్రాణ స్నేహితులయిపోతున్నారు. కొత్త రొమాన్సులు మొదలవుతున్నాయి. అత్తగారి ఆరళ్ళ గురించిన కబుర్లకి అంతమే లేదు.

‘రాజకీయాలు చర్చించుకోవద్దు మొర్రో!’ అని ఒకళ్ళిద్దరు గీపెట్టినా వినక, వాటి గురించిన వాదనలూ భేదాభిప్రాయాలూ మొహాలు ముడిచెట్టుకోవడం, రుసరుసలూ ఎలాగూ సామాన్యమే.

కొత్తగా హైదరాబాదునుంచి బదిలీ అయి వచ్చిన రాధిక నోట్లోంచి వచ్చీరాని హిందీ తప్ప ఇంకో భాష ఊడిపడదు. ‘పోనీ, ఇంగ్లీష్‌లో ఏడవ్వమ్మా,’ అన్నా వినదు.

పూనమ్ మగవాళ్ళందరి అందాన్నీ గ్రేడ్ చేస్తూ ఉంటుంది. మేం విన్నా వినకపోయినా, తనకున్నాయని ఊహించుకునే రోగాలన్నిటినీ రాజ్ ఏకరువు పెడుతుంటాడు.

డైటింగ్ చిట్కాలు చెప్తుంది అనుభ. సునీతకి ఎప్పుడూ తన వంటల గోలే!

ఈ మధ్యెవరో కొత్తమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఆ వేటలో పడి జయంత్ రానే రావడంలేదు. వినితకి ఎప్పుడూ ‘నేను, నాకు’ అన్న టాపిక్ తప్ప మరేదీ పట్టదు.

అన్ని సమస్యలకూ పరిష్కారం అజయ్ దగ్గిర మాత్రం తప్పక ఉంటుంది. వద్దు నాయనా అన్నా, ఉచిత సలహాలు ఇవ్వడం మానడు.

ఒకరోజు మామూలుగా ఏ మూలో కూర్చుని ప్రేమ ఒలకబోసుకుంటుండే నీలేష్, నీనా ఎప్పుడూ లేనిది ఇక్కడికి వచ్చారు, మొహాలు చిటపటలాడించుకుంటూ! ఒక బండ చివర్న కూర్చుని లోగొంతుకలతో వాదించుకున్నారు. ఉన్నట్టుండి ఒకపక్క చెమర్చిన కళ్ళని అద్దుకుంటూనే నీనా అతన్ని చెంప మీద కొట్టింది. అతనూ తిరిగి కొట్టాడు. మేం నిశ్చేష్టులమై, చలనం లేకుండా బండలలో కలిసిపోయాం. తను ఇంచుమించు పరిగెత్తుతూ బోయింగ్ టర్మినల్ వైపు నడిచింది. అతనూ అనుసరించాడు. అదృష్టం కొద్దీ మేము తప్ప అక్కడింకెవరూ లేరు. లేకపోతే, అదో కేస్ అయి కూర్చునేది. అదంతా చూసి మేము కంగారు పడ్డాం.

బండలు మాత్రం నిర్వికారంగానే గమనించాయి అంతా.

ఇంతలో ఎండాకాలం వచ్చింది. బండలు వేడెక్కాయి. వాటిమీద కూర్చోవడం కాదు కదా సమీపించాలన్నా కాల్చేస్తున్న ఎండ వద్దు, వద్దంటూ వారిస్తోంది. మరవి చిన్నబుచ్చుకున్నాయో ఏమో కానీ కారునలుపుకి మారాయి.

కొన్నాళ్ళు ఫెడ్‌ఎక్స్ అబ్బాయీ రాలేదు, నీరజ్ అగర్వాల్‌ నుంచి ఫోనూ లేదు. ‘హమ్మయ్యా, ప్రస్తుతానికి కొంత ఉపశమనం’ అనుకుంటూ కార్గోలో పనిచేస్తున్న వాళ్ళందరం ఊపిరి పీల్చుకున్నాం. హెల్పర్లు కూడా ఆకాశంవైపు తలెత్తి దండాలు పెట్టుకున్నారు.

ఒకరోజు నీరజ్ అగర్వాల్ నుండి ఫోనొచ్చింది– మీ ఎయిర్‌లైనుని కోర్టుకీడ్చకపోతే చూడండి. ‘విలువైన సామాను కాజేసి, అందరూ కలిపి డబ్బు పంచుకుంటున్నట్టుగా ఉంది,’ అన్న బెదిరింపులతో. కోపంతో భగభగమంటున్నాడు.

“సర్, అంత భారీ సామాను సెక్యూరిటీ కంటపడకుండా ఎవరు బయటకి తీసుకెళ్ళగలరో మీరే ఒక్కసారి ఆలోచించండి…” అనునయంగా చెప్పాను.

కొంత వాదన తరువాత, నా శాంతస్వరం వినో ఏమో కానీ అతనే చల్లబడి, “మా ఫాక్టరీ మానేజర్ చాలాకాలంగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్ళో లేడు. వెంటతెస్తాను. ఆయనే గుర్తుపడతాడు.” అన్నాడు. సరే ఆయనొచ్చాక చూడచ్చులే అని నేనూ మర్చిపోయాను.

హఠాత్తుగా ఒకరోజు, రీజినల్ డైరెక్టర్ నన్ను వెంటనే రమ్మంటున్నారన్న కబురుతో, ఎయిర్‌పోర్ట్ మానేజర్ ఫోనొచ్చింది. ఎందుకా! అనుకుంటూ, ఉరుకులూ పరుగులతో ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టాను.

“ఈయన నీరజ్ అగర్వాల్!” అక్కడ కూర్చుని తీరిగ్గా టీ తాగుతున్న ఒక వ్యక్తిని పరిచయం చేశారాయన. ‘ఓహో, ఇతనేనా! పైనుండి నరుక్కు వస్తున్నాడన్నమాట! అందుకే, ఉలుకూ పలుకూ లేదీ మధ్య’ అనుకున్నాను.

“ఏమమ్మా, ఈయన కన్‌సైన్‌మెంట్ పోయిందట. మీరెవరూ సహకరించడం లేదంటున్నారీయన. మీరే కదూ ఈ కేసు చూస్తున్నదీ?” తిన్నగా విషయానికి వచ్చారు డైరెక్టర్‌.

పని అయిందో లేదో అని తప్ప ఆయన వివరాలు పట్టించుకోరని, నెపాలు చెప్తున్నానని అనగలిగే అవకాశం ఉందని తెలిసీ ఉండబట్టలేక, వెతికించడానికి ఎంత కష్టపడుతున్నామో క్లుప్తంగా చెప్పాను.

“దాని విలువెంతో చూశారా! ఇంత నిర్లక్ష్యం ఏమిటి?” అడిగారాయన. అవును, చూశాను కానీ ‘మెటల్’కి ఆ ధరెందుకో అంతు పడితే కదా!

“అది బుక్ చేసినదెవరో, ఏమిటో కనుక్కోండి. రేపట్లోగా రిపోర్ట్ కావాలి నాకు.”

‘ఇంక నువ్వు దయచేయి’ అన్నారని అర్థమై, తిరుగు మొహం పట్టాను. నాకెందుకు తట్టలేదీ సంగతి? బుక్ చేసిన ఆ కొలీగ్‌నే అడిగుంటే సరిపోయేది కదా! నన్ను నేను తిట్టుకుంటూ నా ఫైల్లో ఉన్న కాపీ తీశాను. ఆర్.కె.జి. అన్న ఇనీషియల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి తప్ప సంతకం గిలికేసినట్టుంది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. అది పట్టుకుని ఎయిర్‌పోర్ట్ మానేజర్ వద్దకి వెళ్ళాను.

“ఆ టైములో మీ సెక్షన్లో ఎవరెవరి పోస్టింగ్ అయిందో కనుక్కుంటాను,” అన్నారాయన.

మర్నాడే, ఆ వ్యక్తి రాధాకృష్ణ గుప్తా అని తెలిసింది. ఇండోర్‌ నుంచి శ్రీనగర్‌కి బదిలీ అయే మధ్యన మూడ్రోజులు ఇక్కడ టెంపరరీ డ్యూటీ పడిందట. ఇప్పుడతని పోస్టింగ్ బాంకాక్‌లో అట. ఫోన్‌లో మాట్లాడితే, ‘అవును. మొదటిరోజే భారీ సీ-నోటేదో తయారుచేశానన్న గుర్తే. కార్గోలో పనిచేసిన అనుభవం లేదప్పటికి. సలహా అడగడానికి చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఏజెంటెవరో తెచ్చిన కాపీలో ‘ఇంత ఇనుమో, ఏదో’ అని రాసుందని లీలగా తప్ప మరేదీ జ్ఞాపకం రావడం లేదు. ఎన్నేళ్ళ కిందటి సంగతో!’ అని చెప్పాడట.

అయినా, బుక్ చేసింది తనే కాబట్టి అతన్ని మర్నాటి ఫ్లైటులోనే రప్పించారు. మొత్తానికి గుప్తా అయితే వచ్చాడు కానీ సామాను ఆకారం కూడా గుర్తు లేదు అన్నాడు. సిటీ, ఇంటర్నేషనల్ కార్గోతో సహా అన్ని చోట్లకీ ఇద్దరు హెల్పర్లని వెంటబెట్టుకుని తిరిగొచ్చాం. ఫలితం లేకపోయింది.

రెండ్రోజుల తరువాత, మరేం తోచిందో ఏమో కానీ ఆత్రంగా వచ్చి మా బండల చుట్టూ తిరుగుతూ, “ఇదే ఆ కన్‌సైన్‌మెంట్ అనుకుంటాను…” అన్నాడు.

కనుక్కోడానికి జూనియర్ అగర్వాల్‌కి ఫోన్ చేస్తే, తన మానేజర్ ఊరినుంచి తిరిగి వచ్చాడనీ, అతన్నీ తనతో పాటు తెస్తాననీ అన్నాడాయన ఉత్సాహంగానే.

మేనేజర్‌కి 50 ఏళ్ళుంటాయి. వచ్చీ రావడంతోనే బండల్ని చూసి, ‘ఇవే, ఇవే!’ అంటూ సంతోషం పట్టలేక ఇక గెంతులేయడమొక్కటే తక్కువ!

అంతటా కబురు పాకింది. ఎయిర్‌పోర్ట్ మానేజర్ కూడా వచ్చి అయోమయంగానే ఆయన్ని అడిగారు, “అయితే, మీ బిల్లుమీద కోట్ల విలువ రాసుందేమిటండీ? అసలే మెటలైనా అంత ధర పలుకుతుందా!”

మేనేజర్ చిద్విలాసంగా నవ్వి, “ఇది వెండండీ!” అన్నాడు.

అందరం నోళ్ళు వెళ్ళబెట్టాం.

“అసలేమయిందంటే, వీటిని మా చెన్నై ఫాక్టరీకి పంపించాలనుకున్నాం. ఇంత బరువున్న వెండి కడ్డీలు వంగిపోతాయి కదా అని వాటికి ఇనప తాపడం చేయించాం. అప్పటికే సతీష్‌గారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన వీటిని బుక్ చేయించినప్పుడు నేను లేనక్కడ. నీరజ్‌గారేమో యుఎస్‌లో ఉన్నారు. ఫెడ్‌ఎక్స్ వాళ్ళే సలహా ఇచ్చారట, ఏదో మెటల్ అని రాసేయమని. సతీష్‌గారు పోయాక, ఎవరూ వీటి సంగతి పట్టించుకోలేదు. ఫాక్టరీ లెక్కలు చూస్తున్నప్పుడు అవి తేలకపోయి ఫైల్సన్నీ చెక్ చేస్తుంటే ఈ మధ్యే నీరజ్‌గారి కంటపడింది.” ప్రశ్నార్థకంగా పెట్టిన మా మొహాలని చూస్తూ తేలిగ్గా తేల్చేశాడాయన.

హమ్మయ్యా, చిక్కు ముడి విడింది!

మర్నాటి చెన్నై ఫ్లైట్‌లో వాటిని లోడ్ చేయడానికి పెద్ద క్రేనులూ పటాటోపం కనిపించాయి. దూరంగా ఉన్న బే మీద నిలుచున్న ఎయిర్‌బస్ వెనకాతల హెల్పర్లందరూ గుమిగూడి ఉన్నారు. వెళ్ళి చూస్తే, వెనకనున్న కార్గో హోల్డుల్లో కడ్డీలు పట్టలేదు. వాటిని దింపేసి మళ్ళీ ఎత్తి, ముందు హోల్డులో ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటే పొడుగు చాలలేదు. ఇంక వీలవక రెండిటినీ దించేశారు. ఇన్నేళ్ళూ అవిక్కడే ఎందుకు పడున్నాయో అర్థమయింది. అవసలు మా విమానాలు వేటిల్లోనూ పట్టగలిగే కొలతలున్నవి కావు!

అవి తిరిగి అగర్వాలుల ఇంటికి రాజసంగా పెద్ద ట్రక్కులో ప్రయాణమయాయి.

గుప్తా తప్పు కేవలం సీ-నోట్ సరిగ్గా తయారు చేయకపోవడం మాత్రమే అనుకున్నారు ముందు. కానీ, ఈ సంఘటన తరువాత కడ్డీల పొడుగు సరిగ్గా కొలిపించకుండానే బుక్ చేసి, ఆ తరువాత అవి లోడ్ అయాయో లేదో అని కూడా పట్టించుకోని అతని నిర్లక్ష్యానికి అతని ఇంటర్నేషనల్ పోస్టింగ్ రద్దు చేసి, మూడు నెల్లు సస్పెండ్ చేశారు.

ఇప్పుడు కాంక్రీట్ మీద మా అందరి అనుభూతులకీ సాక్షిగా ఉండే చలనరహితమైన మా బండలైతే లేవు కానీ వాటి కింద ఇన్నేళ్ళూ వర్షం, ధూళి, నుండి తప్పించుకున్న తారూ ఇసుకా మేళవించిన టార్మాక్ భాగం మట్టుకు తళతళలాడుతోంది!
కానీ మేము మాత్రం మా కబుర్లకి మరో చోటోదే వెతుక్కోవాలి.
-----------------------------------------------------------
రచన: కృష్ణ వేణి, 
ఈమాట సౌజన్యంతో

Monday, September 24, 2018

ఆవిడ


ఆవిడ






సాహితీమిత్రులారా!


ఈ కథను ఆస్వాదించండి............

శ్రీ లక్ష్మీ విలాసులో ప్రొద్దుటే ఒక ప్లేటు ఇడ్లీ తిని కాఫీ తాగడం అలవాటైంది కొద్ది రోజులుగా.  హోటలు ఎదుటే వున్న గవర్నమెంటు హాస్పిటల్లో రొటేషను మొదలు పెట్టినప్పణ్ణించి, మా మెడికల్‌ ప్రొఫెసర్తో రౌండ్సుకు వెళ్ళే ముందు ఇదొక తంతు.

ఈ బుధవారపేట నాకెప్పుడూ వేరేగా కనిపించలేదు.  కోట దగ్గరైనా, రాజవిహార్‌ అయినా మద్దూరు నగరైనా ఈ పేటలో అయినా అన్నీ ఒకే రకంగా, ఎక్కడా ఏ ప్రత్యేకతా లేకుండా కనిపిస్తాయి.  అంతా చెప్పుకోవడం ఈ పేట చుట్టుపక్కల వేశ్యావృత్తి కొంత ఎక్కువే అని.

అసలు వేశ్యలంటే వాళ్ళ మొఖాల మీద రాసి ఉంటుందని అనుకునేటంత అమాయకుణ్ణి కాదు కాని ఒక ఆడ మనిషి వేష భాషలను బట్టి కొంతవరకూ వాళ్ళ జీవితాలను ఊహించొచ్చేమో అనిపిస్తుంది.  ఎంత పెద్ద చదువులు చదివినా కొంతవరకు లోకపుతీరు తెలుసుకోవాలని చెప్తూ ఉండేది మా నాయనమ్మ.  మరి కాబోయే డాక్టరుగా అలాంటి ఊహలు నాకు ఉండాలో లేదో అని తర్జన చేసేటంత సమయం ఎన్నడూ చిక్కలేదు.  ఎంతసేపటికీ మెడికల్‌ సీటు ఎలా సాధించాలా అనే తప్ప నాలాంటి మామూలు వాళ్ళకు ఇలాంటివి పట్టవనుకుంటా.  లోకపుతీరు తెలిసి మెలగాలంటే మరి మనిషిని బట్టి, వాళ్ళేసుకున్న బట్టలను బట్టి మందులివ్వాలి మరి, రోగాన్ని బట్టికాక.  రాను రాను మెకానికల్‌ పట్నపు బతుకుల్లో మనుషులను విభజించే రీతులు మారిపోయి చాన్నాళ్ళు అయినట్లు తోస్తుంది, కొంతవరకూ పాత వాసనలు పోయినాకూడా అసలు ఇదే మంచిదని ఖచ్చితంగా చెప్పేలా మాత్రం లేదు ఈ తీరు ఎంతయినా.

వేరే ప్రాంతాల్లో పుట్టి పెరిగిన నాకు ఈ రాయలసీమ కర్నూలు వాతావరణం బాగా నచ్చింది.  చాలా మంది అమ్మాయిలు బస్సెక్కే దగ్గరైనా, కొంచెం పక్కకు జరగమని చెప్పడానికైనా, ‘ అన్నా ‘  అని పిలిచి మరీ అడిగే సంప్రదాయం చూసి కొంతవరకూ ముచ్చటేసింది కూడా.  మనుషుల ప్రవర్తన ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకుంటా, ఎంతో సౌమ్యంగా తమ దార్లో తాము తలకూడా తిప్పకుండా వెళ్ళిపోయే అమ్మాయిలను ఏవో కామెంట్లు చేస్తూ బయట రోడ్డుమీద తిరిగే వెధవలంటే నాకుండే చిరాకు కర్నూలుకొచ్చాక ఇంకొంచెం ఎక్కువే అయింది.  దానికి కారణమిదే అని సరిగ్గా చెప్పలేను కాని ఇక్కడి ఆడపిల్లల ఒద్దిక కొంతవరకూ సాయపడిందని చెప్పొచ్చు.

ఏదో ఆలోచిస్తా నడిచినా చుట్టూతా మనుషులున్నారని గుర్తు పెట్టుకోవాలి, శ్రీను మాటలకు ఆలోచనల్లోంచి బయటకు జారాను.

ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియక వాడి మొఖంలోకి చూసాను.

నాతో పాటు రౌండ్సుకు వచ్చే నా క్లాస్మేటు శ్రీను హోటల్‌ పక్కన కొంత వారగా నిలబడి వున్న ఒకావిడ వైపు తను  అటువైపు చూడకుండా నన్నే చూడమని కళ్ళతో సైగ చేస్తూ చెప్పాడు.  నేను వెంటనే తల తిప్ప బోతే చిన్న గొంతుతో, మరీ అంతలా అందరికీ తెలిసేలా చూడకు రమ్మని పిలిచినా పిలిచేస్తుంది, హెచ్చరిస్తూ చెప్పాడు.

హోటల్లోకి వెళ్తూ కొంత చూసీ చూడనట్టుగా గమనించాను, తను ఒక చెయ్యి నడుం మీద పెట్టుకుని లోకాన్నే ప్రశ్నిస్తున్నట్టు నిలబడుంది ఒకావిడ.  క్లాసులో అమ్మాయిలతో అన్నిరకాల జోకులేసే నాకు కూడా చూడ్డానికి కొంచెం బెరుకుగా  అనిపించింది.  తను మాత్రం నా లాంటి అనామకులను రోజుకు కోటొక్కమందిని చూసినదాని లాగ అసలు మమ్మల్నే కాదు, చుట్టుపక్కల ఉన్న మనుషులంతా ఎవో చీమలో, ఈగలో అన్నట్టు పెద్దగా పట్టించుకోకుండా నిలబడి వుంది అంతే.  ఈ లోపు హోటల్లోకి దూరడంతో టిఫిను తినే పనిలో పడ్డామిద్దరమూ.

మరుసటి రోజుకూడా తను రాత్రంతా అక్కడే నిలబడుందా అన్నట్టు మళ్ళీ కనిపించింది.  ఈ సారి రోడ్డు దాటకముందునించే గమనించడం వల్ల కొంత సమయం తీసుకుని ఆవిడను పరిశీలనగా చూసాను.  మనిషిని చూసి వయసు   చెప్పడం కష్ఠమే అయినా నలభై అన్నా వుండొచ్చేమో అనుకున్నా.  జుట్టు సిగలాగా వేసుకున్నట్టుంది.  అంత అందగత్తె అని చెప్పలేకపోయినా ఏదో ఆకర్శణ వుంది ముఖంలో, అది పచ్చ పొదిగిన చిన్న ముక్కుపుడక వల్ల ఇంకొంచెం ఎక్కువై  ఉండొచ్చు.  పవిటను కుడిచేతికిందుగా చుట్టూతిప్పి ఎడంవేపు చీరలో నడుం దగ్గర చెక్కింది.  అయినా వేశ్యలదగ్గరకెళ్ళేవాళ్ళు అందచందాలను బేరీజువేసి వెళతారేమో నాకు తెలియదు.  కానీ ఈవిడ అందరిలా ఏదో ఒక విటునికోసం ఎదురుచూస్తున్నదంటే నా మటుకు నాకు నమ్మబుద్ధికాలేదు.

అయినా ఆ సందు మొదట్లో హోటలు పక్కన పొద్దున్నే నిలబడి ఉండే పని తన వృత్తిపని కోసం తప్ప మరింకేముంటుంది అనిపించింది.

ఎవరో ఒకాయన సైకిలు మీద కూర్చుని, ఎడంకాలు కింద పెట్టి తనతో మాట్లాడుతుంటే, తను మాత్రం రోడ్డు వైపు చూస్తూ ఆయనకు పెడమొఖంగా నిలబడి ఉంది.  అదే దారిన పోతున్న ఒక కానిస్టేబులు ఆవిడను పక్క చూపులు చూసుకుంటూ వెళుతూ వుంటే తను అంతకు ముందు రోజులాగే మళ్ళీ చెయ్యిని నడుం మీదకు చేరుస్తూ ‘ ఏరా కళ్ళు ముందుకు పెట్టుకు నడుపు, గుడ్లు అటూ ఇటూ తిప్పుక నడుస్తె ముందు ఏదో రాయి తగిలి మూతి పండ్లు రాల్తయి ‘  గొంతు పెంచి గట్టిగా చెప్పింది.  అసలు ఆవిడ గొంతే అంతో లేక కోపంతో అనిందో కాని మాతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉలికిపడ్డారనుకుంటా.  హోటలు బయట మొక్కజొన్న కంకులమ్మే బండి దగ్గర నిలబడున్న నలుగురూ మాట్లాడ్డం ఆపేసి, మాతో పాటు తలలు తిప్పి చూసారు, ఒక్క క్షణం మాత్రమే.  ఆ కానిస్టేబులు ఒక్క మాటయినా మాట్లాడకుండా తనను కాదన్నట్టు, ఒకింత జంకినట్టు తన దారిన తను వెళ్ళిపోయాడు.  ఉరిమింతర్వాత అప్పటిదాకా ఒకే స్వరంలో లేని ధ్వనులన్నీ ఒక్కసారిగా గాడిలో పడ్డట్టు, రోడ్డు మీదుండే గొణుగుడంతా మళ్ళీ  మామూలు లెవెల్లోకొచ్చేసింది.

మా శ్రీను గాడు, నా భుజం మీద చెయ్యి వేసి నా చూపులు కూడా మరల్చుకోమని, ఆవిడ నిన్ను కూడ అలాగే తిట్టగలదు జాగ్రత్తరోయ్‌ అని హెచ్చరించకపోతె, నా ముందు పళ్ళు విరిగేలా క్రింద పడే వాడినే హోటలు మెట్లు తగిలి.

మళ్ళీ తెల్లారి అదే తంతు, అప్పుడే అర్ధమైంది, అసలు ఆమె తనుండే ఆ మూలను సొంత ఇల్లులాగే చూసుకుంటుందని, తను వ్యభిచారే కాక, ఒకరిద్దరిని చేరతీసి వ్యాపారం కూడా నడుపుతుందేమోనని మొదటిసారిగా అనుమానమేసింది.  తన కింద ఒకరిద్దరు ఆడపిల్లలను చేరదీసి అలవాటయిన క్లయింట్లను వెదకడమే ఆమె పని అనుకుంటా.  అసహ్యం వేసింది, ఇంతకీ చేసేది బ్రోకర్‌ పని అన్న మాట, పైగా ఆ రోడ్లో పొయ్యే వాళ్ళందరిని బెదిరించడం ఒకటి.

ఆ రోజు బిల్లు కడుతూ హోటల్‌ ప్రొప్రయిటరును అడిగాను, అసలావిడ గురించి పోలీసు కంప్లైంటు ఇవ్వొచ్చుకదా అని.

ఆయన నా దిక్కు చూసి మళ్ళీ ఆవిడకెక్కడ వినిపిస్తుందో అన్నట్టు మెల్లగా, మీకెందుకు సార్‌ అసలు పోలీసోళ్ళకే ఆవిడంటే భయం అని చెప్పాడు.  ఆయన మాటల్లో అసలు ఈ విషయాలన్నీ నీకెందుకోయి అన్న ధ్వని వినిపించి ఆశ్చర్యమేసింది, ఈయనేంటి ఇలా ఆవిడను సపోర్టు చేస్తూ మాట్లాడేలా వున్నాడే అని.  అయినా నాకు మనుషులెప్పుడు సరిగ్గా అర్ధమై చచ్చారుగనక అనుకుని నోరుమూసుకుని బిల్లుపోగా వచ్చిన చిల్లర ప్యాంటు జేబులో వేసుకుంటూ బయటపడ్డాను.

శ్రీనే తరువాత చెప్పాడు, ఎక్కడనించి ఆరా తీసుకుని వస్తాడో ఏమిటో, ఆ ఏరియా డీ ఎస్పీ ఒకప్పుడు ఇక్కడే ఇన్‌ స్పెక్టరుగా వున్నప్పుడు తనను చేరదీసాడని.  చేరదీసాడో, రేప్‌ చేసాడో ఎవరికి తెలుసు కానీ అప్పణ్ణించి ఆవిడసలు ఎవ్వరినీ ఖాతర్‌ చెయ్యదని.  పైగా ఆ డీ ఎస్పీ ప్రాణాలు తన చేతిలోనే వున్నట్టు అందరినీ ఆయన పేరు చెప్పి తిట్టడం కూడా అలవాటే అని.  అంత నోరున్నావిడ దగ్గరికి వెళ్ళే కంటే రోట్లో తల పెట్టడం సులభమేఏమో అని.

నేనే అన్నాను, మరి ఆవిడ తనను తాను కాపాడుకోవడానికే అలా నోరు పెంచుతుందేమో అని.  నువ్వన్నదీ నిజమేనేమో ఎవరికి తెలుసు, కొందరంతే బతకాలంటే తప్పదు మరి అంటూ జీవిత సత్యం చెప్తున్నట్టు చూసాడు నా వైపు.  శ్రీను, ఉన్నట్టుండి పేదవాళ్ళకోసమే తను పుట్టినట్టు ప్లేటు ఫిరాయిస్తూ మాట్లాడే శ్రీను, మెల్లగా గొణిగాడు, మనకేం తెలుసు ఎవళ్ళ బాధలు వాళ్ళకుంటయి, అని.  ఆవిడ చెడ్డదై మనల్ని చెరిపింది లేదు కదా, అయినా.  మనిషిని చూసి మంచాళ్ళా చెడ్డ వాళ్ళా ఎలా చెప్పగలం అని నన్నే అడిగాడు.

ఇంకో రోజు, అందరి ముందే చేతికందిన కట్టెతో ఒకడిని కొడుతూ కనిపించింది, ఏంటో గొడవ అని చూడ్డానికి వెళ్ళబోతే హోటలాయిన ఆపేసాడు.  మీకెందుకు సార్‌ ఆవిడతో వుండే ఆడపాపను ఎవడో ఏదో అన్నాడని గొడవ చేస్తూ వుంది, మీ పనిలో మీరు పోండి సార్‌ లేకపోతె మీ పనికూడ అయితది మట్టసంగ, మా మంచికోరి చెప్పాడాయన.

తను అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా అర్ధమైతున్నట్టు అనిపించింది నాకు, తను చేరదీసిన వాళ్ళకు పోలీసులనించి, లోకల్‌ రౌడీలనించి రక్షణ కోసమన్నట్టుగా కొంతవరకు కవచంగా పనిచేస్తుంది ఈవిడ, తనకు నోరు తప్ప వేరే ఆయుధం లేదనుకుంటా, ఇవ్వాళ ఎదో ఒక కట్టె చేతిలో వున్నా కూడా.

ఈ రోజేమో, అక్కడెవరూ లేరు కాని తను పెద్దగా ఏడుస్తూ అరుస్తూంది, ‘ మగలంజకొడుకులంతా ఒకటేరా అని తెలిసినా కూడ పెంచి పెద్ద చేసిన కదర ముండా కొడుకా ‘  అని ఎవరినో తిడుతూంది.  ఇక ఈవిడ ఇంతే అని మా దారిన మేం టిఫిను చేస్తున్నాం ఏదో మాటల్లో పడిపోతూ.  హోటల్‌ బోయ్‌ లేడనుకుంటా, ఓనర్‌ టీ తెచ్చి ఇస్తూ చెప్పాడు, ఆవిడ దగ్గర ఒకే ఒక్క అమ్మాయి వుండేదట.  ఆ అమ్మాయిని తన కొడుకే లేవదీసుకు పోయాడట పొద్దున లేచి చూసుకుంటే ఇద్దరూ లేరట.  ఆవిడ బాధ ఇంతకీ బంగారు గుడ్లు పెట్టే బాతు పోయినందుకే అన్నమాట.  దానికి కొడుకుని ఇంత పచ్చిగా తిట్టవలిసిన అవసరం ఏం వుందో అర్ధం కాలేదు.  వ్యభిచారపు జబ్బుకు ఇన్నాళ్ళూ ఉన్న డబ్బు మందు ఇకముందు లేదే అనే ఈ ఏడుపంతా.

తన కొడుకును తనే తిడుతోంది.  ఆవిడకు ఒక కొడుకున్నాడని అప్పుడే తెలిసిన మాకు, ఆవిడ నోట్లోనించి వస్తున్న తిట్లు వినకుండా వున్నాం ఇంక.  అసలు సభ్య సమాజంలో మగ వాళ్ళు కూడా ఎప్పుడూ తిట్టుకోని మాటలు ధారాళంగా వచ్చేస్తున్నాయి ఇవ్వాళ.  గుమిగూడిన జనం మొఖాల్లో కనిపించని ముసి ముసి నవ్వులు, పైకి నవ్వితే తమనెక్కడ తిడుతుందో అని.  ఆ తిట్ల ప్రవాహం భరించలేక మేంఉ హాస్పిటలు వెఇపు నడిచాం, రొటీను ప్రకారం.

సాయంత్రం హాస్టలుకు వెళ్ళే ముందు మళ్ళీ ఏం చూడాల్సొస్తుందో అని భయపడుతూనే టీ తాగుదామని హోటల్లోకి వెళ్తే కౌంటరు ముందున్న టేబుల్‌ దగ్గర కూర్చుని టీ తాగుతూ కనిపించింది ఆవిడ.  పొద్దుటి కోపం కనిపించలేదు కాని, రోజంతా ఏడుస్తున్నట్టే వుంది.  మొహమంతా పీక్కు పోయి, అసలు మామూలు ఆడ మనిషిలాగే కనిపించింది దగ్గరి నించి చూస్తే.

తను వేరే ఎవరూ చుట్టూ లేనట్టే, ఈ లోకంలో తనకు మిగిలిన పనల్లా ఆ కాలే టీని సాసర్లో ఒంపుకుని ఒకసారి ఊది తాగడమే అన్నట్టు కనిపించింది.  ఎంతో ఉద్వేగంతో మెడనరాలన్నీ బిగుసుకున్నట్టు ప్రొద్దుట కనిపించిన ఈ మనిషిలో ఇంత ప్రశాంతత వుందా అనిపించింది.

అసలు ఇదే మొదటిసారి  తనని చూస్తూ వుండేదుంటే, కొద్దిరోజులుగానో, ఇవ్వాళ పొద్దుట చూసిన జ్నాపకాలు కానీ లేకుండా ఉంటే, ఆవిడ నాకు కొత్తగా కనిపించేదే కాదు.  అందుకేనేమో మొన్నెన్నడో చూసిన ఇంగ్లీషు సినిమా ‘ ది ఇయర్‌ ఆఫ్‌ లివింగ్‌ డేంజరస్లీ ‘  లో వాక్యాలు గుర్తొచ్చినయి, ‘ ఈ దేశంలో కాక ఇంకెక్కడైనా పుట్టి వుంటే ఈవిడ మర్యాదస్తురాలే అయివుండేది ‘ , అని.  నా ఈ దేశవాసులంతా భాగ్యవంతులూ, శాంతి తత్వం వుట్టిపడేవాళ్ళూ అయి వుండేవాళ్ళు అనిపిస్తుంది, మనిషిని చూడగానే అంచనా వేసే మన వెధవ మనస్తత్వాలే లేకుంటే.

ముందు ముందు డాక్టరుగా తప్పకుండా మనిషిని చూసే చేస్తాను వైద్యం అని నాకు తెలుసు.  మొఖం చూసి మందులిచ్చి సంఘంలో గొప్ప డాక్టరుగా పేరు తెచ్చుకోవడానికివే సోపానాలు అన్నట్టు ఇప్పుడిప్పుడే పాఠాలు మొదలు పెట్టాను. మనంచూసేవన్నీ నిజాలే అని నమ్మే మెజారిటీ వాళ్ళలో నేనున్నందుకు నన్ను నేను అభినందించుకోవాలి కూడా.  అలా అయితే అనవసరమైన రిస్కులుండవు.

లోకరీతిప్రకారం నడుచుకునేవాళ్ళలో అవార్డు పుచ్చుకున్నవాళ్ళలా, మా నాయనమ్మ మెచ్చుకునేలా ఆవిడకు దూరంగా ఇంకో మూలకున్న టేబులు వైపు నడిచాము, శ్రీను, నేను.

టీ తాగాక వెళుతూ, అన్నా, నేనిక వెళ్తాను అని ఓనరుకు చెప్పి, బయటకు నడిచింది.  ఆవిడ గొంతులో ప్రొద్దుటి కోపం కాని, ఏడుపు కాని ధ్వనించలేదు.

చూస్తుండగానే హోటలు బయట చెట్టుకింద, కంకులమ్మే బండి పక్కనే వున్న రిక్షా ఎక్కి మా ముందే వెళ్ళిపోయింది.

ఓనర్‌ మాకు టీ తెచ్చి ఇస్తూ చిన్న గొంతుతో పొద్దున సగంలో ఆపిన కథ పూర్తి చేసాడు.  ఆవిడ చేర దీసిన అమ్మాయి చిన్నప్పుడెప్పుడో తల్లి వదిలేసి పోతే తనే పెంచిందని, ఆవిడ కొడుకు ఒక పెద్ద లోఫర్‌ అని, వాడు ఇప్పుడు ఆ అమ్మాయిని లేవదీసుక పోయింది ఎక్కడో అమ్మెయ్యడానికే తప్ప ఏదో సదుద్దేశంతో కాదు అందుకే తను కోపం పట్టలేక, ఇంకేం చేయ్యాలో తోచక లోకం మీద కసితో పొద్దున అట్లా తిట్లు అందుకుంది అని.  తను హోటల్‌ పెట్టిన ఇరవై ఏండ్లుగా ఆవిడ ఒక్కటీ అడగలేదని, వున్నంతలో తినిందే తప్ప మందిని అడగడమెన్నడూ లేదని బాధగా చెప్పాడు.  ఇక ముందు ఆవిడకు తన ఒళ్ళమ్ముకునో, ఇలా మంది మీద నోరు చేస్తూనో బతకాల్సిన అవసరం లేదట.  ఆవిడ ప్రేమించిన, చుట్టూ మూగే ఈగల్లాంటి జనానికి కొంత బెదురు పెడుతూ అయినా సరే కాపాడాలనుకున్న ఒకే ఒక్క అమ్మాయి కూడా కుక్కల పాలే అయిందని ఇకముందు తను రోజూ కనిపించక పోవచ్చు అని చెప్తూ, ఆవిడ మిమ్మలను ఇక  విసిగించదు లెండి అన్నాడు.

ఎవరు ఎవరిని విసిగించారో నాకర్ధం కాలేదు.

జాలిగా మొఖం పెట్టిన నన్ను చూస్తూ, ఆవిడ గురించా లేక ఇకనుంచీ పూర్తిగా తెలియకుండా ఎవరినైనా అంచనా వేయొద్దని మనకావిడ తెలియజెప్పినందుకా నీ బాధ, సూటిగా వచ్చిన శ్రీను ప్రశ్న నాకిక వినబడనట్టు తల బయటకి తిప్పేసాను.
----------------------------------------------------------
రచన: విప్లవ్, 
ఈమాట సౌజన్యంతో

Sunday, September 23, 2018

టోరాబోరా వంటమనిషి


టోరాబోరా వంటమనిషి



సాహితీమిత్రులారా!
ఈ అనువాదకథను ఆస్వాదించండి..........

ఆరోజుల్లో నాకొక వంటమనిషి కావలసి వచ్చాడు. మనిషంటూ దొరికితే, అతని పని చాలా సులువుగానే ఉంటుంది, సందేహం అక్కరలేదు. వంట చెయ్యాల్సింది నా ఒక్కడికి మాత్రమే. ఉదయం అల్పాహారం నేనే చేసుకుంటాను. టోస్ట్ చేసుకుని బ్రెడ్‌కి వెన్న రాసుకోడానికీ తినడానికీ నాకు సరిగ్గా నాలుగు నిముషాలు సరిపోతుంది. మధ్యాహ్నానికీ, రాత్రి భోజనానికే ఇబ్బంది.

నాకప్పుడు పాకిస్తాన్‌లోని ఈశాన్య మూలనున్న పెషావర్‌లో ఉద్యోగం. నా భార్య రావడానికి ఆరు నెలలు పడుతుంది. ఆ ఆరు నెలల కోసం ఒక వంటమనిషిని ఏర్పాటు చేసుకొనే అవసరం వచ్చింది. అక్కడ ‘వంటమనిషి కావలెను’ అని ఎవరూ ప్రకటనలివ్వరు. తెలిసిన వాళ్ళకీ వీళ్ళకీ చెప్పి అలా విచారించి పట్టుకోవాలి.

పెషావర్ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా నేను కొన్ని శతాబ్దాలు వెనకకు వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతుంది. తెల్లవారుజామున గుర్రాల డెక్కల ‘టక్కు టక్కు’ చప్పుళ్ళతోనే రోజూ మెలుకువ వచ్చేది. ఒక్కోసారి నిద్రా మెలకువా కాని స్థితిలో ఉండగా నా పడకగది కిటికీకి బాగా దగ్గరగా గుర్రపు డెక్కల చప్పుడు విని, పొరుగు దేశపు రాజెవరో నాకు లేఖ పంపాడేమో అన్న ఊహతో ఉలిక్కిపడి లేచేవాడిని.

కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు తమ భర్త ఇంటికి పల్లకిలో వచ్చి దిగడాన్ని కూడా నేను మా ఇంటి మేడ మీద నుండి చూస్తుండే వాడిని. బంధువుల సమేతంగా, మంగళ వాద్యాలు మ్రోగుతుండగా, నలుగురు బలమైన బోయీలు పల్లకీని మోసుకొస్తారు. ముందుగా పల్లకినుండి ఒక తెల్లటి పాదం నేలమీద మోపబడుతుంది. తర్వాత జరీ పరదా వేసుకునున్న అమ్మాయి ఆకారం కనిపిస్తుంది. ఆ నాజూకైన నడకలోనే ఆమె ఎంత గొప్ప అందగత్తో తెలిసిపోతుంది!

బళ్ళకూ ఉద్యోగాలకూ వెళ్ళే జనంతో వాహనాలతో రద్దీగా కిటకిటలాడే పొద్దునపూట కూడా, ఒంటి గుర్రపు చెక్కబండి మీద వెళ్ళే కుర్రకారు, బెన్‌హర్ సినిమాలోని గుర్రబ్బళ్ళ రేసుని గుర్తు చేస్తుండేవారు. సరికొత్త మాడల్ కార్లు, రంగురంగుల బొమ్మలు వేయబడిన బస్సులు, ఆటోలు, స్కూటర్లు, సైకిళ్ళతో కిక్కిరిసే రోడ్డు మీద ఈ గుర్రబ్బళ్ళు ఆశ్చర్యంగానే అనిపించేవి. రోడ్ల మీద ఎటువైపు చూసినా షటిల్ కాక్‌ని బోర్లించినట్టు నల్లటి పర్దా వేసుకున్న ఆడవాళ్ళూ, తెల్లటి సల్వార్ కమీజ్ వేసుకునున్న మగవాళ్ళూ తిరుగుతూ వుండేవారు.

అన్ని వసతులూ వున్న నగరమే అయినప్పటికీ ఒక వంటమనిషి దొరకడం మాత్రం ప్రయాసే అయ్యింది. ఆఫీసులో చాలామందికి చెప్పి ఉంచాను. నేనుండే ఇంటి ఓనర్‌కి చెప్పినప్పుడు, రష్యా యుద్ధంనుండి తిరిగివస్తున్న అఫ్గాన్లలో అద్భుతమైన వంటవాళ్ళుంటారు, వాళ్ళలో ఒకర్ని చూసుకోండి–అని సలహా ఇచ్చాడు.

మా యింటికి కొంచం దూరంలో ఒక నీటి కాలువ ఉంది. ఒకరోజు కొందరు పిల్లలు ఆ కాలువలో గేదెల్ని తోముతున్నారు. ఒక పిల్లాడు నల్లటి గేదె మెడ పట్టుకుని వేలాడుతున్నాడు; వీళ్ళు వాడినీ కలిపి కడుగుతున్నారు. పొడవైన ముక్కుల పక్షులు కొన్ని పైకి ఎగురుతూ ఆ కాలవ నీటిలో డైవ్ చేస్తున్నాయి. ఒకరోజు మా ఇంటి మేడమీద నిల్చుని అవన్నీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను.

ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. వచ్చింది మా ఆఫీసులో పని చేసే ముంతాజ్ (ముంతాజ్ అంటే సినీ నటి పేరు కాదు; పెషావర్‌లో ముంతాజ్ మగవాడి పేరు!) వాడు ఉద్యోగం చేసేది మా ఆఫీసులోనే అయినా వాడి మనసు మాత్రం వేయి అడుగుల ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. గద్దలను పట్టి, ప్రతి ఏడూ వచ్చే అరబ్ దేశపు వ్యాపారులకు అమ్మడమే వాడి అసలు ఉద్యోగం. టోపీ వేయడాన్ని అలవాటు చేసిన నల్లరంగు ఆడ గద్ద ఒక్కదాన్ని అమ్మితే, ఆఫీసులో ఏడాది పనిచేస్తే వచ్చే జీతమంత వస్తుందనేవాడు.

ముంతాజ్ పక్కన ఒక మసలాయన తాడిచెట్టులో సగం ఎత్తుతో నిల్చుని ఉన్నాడు. మందపాటి గాడా గుడ్డతో కుట్టించుకున్న సల్వార్ కమీజ్ వేసుకుని, దానికంటే మందమైన శాలువా కప్పుకొని దాని కొంగును వెనక్కి వేసుకునున్నాడు. పండిన జామపండులా పచ్చగా ఉన్నాయి అతని కళ్ళు. చూస్తే వంటమనిషిలా అనిపించలేదు. నన్ను చూడగానే మిలిటరీవాడిలా ఒక కాలుతో నేలను తన్ని స్టిఫ్‌గా నిలబడి సల్యూట్ చేశాడు. సల్యూట్ అవ్వగానే ఎర్రని చిగుర్లు కనిపించేలా నవ్వాడు.

ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను. జవాబులన్నీ ఒకటీ రెండు పదాలతో మాత్రమే వచ్చాయి. తనకు తెలిసిన పదిహేను ఆంగ్ల పదాలతో జవాబు చెప్పగలిగే ప్రశ్నలు మాత్రమే నేను అడుగుతున్నాననుకున్నాడేమో. అతనిది అఫ్గాన్‌లో టోరాబోరా గ్రామం. అమెరికా అగ్రరాజ్యపు B-52 బాంబర్లు ఆ గ్రామం మీద వేయికి పైబడిన బాంబులను వేసి నేలకూల్చబోతుందన్నది అప్పటికి ఆ ముసలాయనకి తెలియదు. నాకూ అది ఊహించడానికి అవకాశం లేదు. అతని ఇద్దరు కొడుకులూ రష్యా యుద్ధంలో చనిపోయారట. మిగిలున్న ఒక్క కూతురితో ఉండిపోదాం అని పెషావర్ వచ్చినట్టు చెప్పాడు.

అతను పట్టుకొచ్చిన గోనెసంచి నుండి ఓ పెద్ద సైజు దానిమ్మ పండును తీసి నా చేతికిచ్చాడు. మా ఇంటినుండి రెండు నిముషాల దూరంలోనున్న సంతలో చౌక ధరకే ఇలాంటివి దొరుకుతాయి. అలాంటిది ఎనభై మైళ్ళ దూరంలోనున్న టోరాబోరా నుండి మోసుకొచ్చాడు, మా తోటలో పండినవి అంటూ. అయినా, ఇంత ఎర్రని పళ్ళు సంతలో దొరక్కపోవచ్చుననిపించింది.

“మీకు ఏం వంటలొచ్చు?” అడిగాను.

“అన్నీ వచ్చు!” జవాబిచ్చాడు. ఆ జవాబు నిడివి సరిపోదని అనుకున్నాడో ఏమో, చెప్పక వదిలేసినదాన్ని నవ్వుతో పూరించాడు.

ముంతాజ్ బహుభాషా ప్రావీణ్యుడు. ముసలాయన ఆంగ్లంలో చెప్పలేని వాటిని అనువాదం చేశాడు. అప్పుడప్పుడూ తనవంతుగా ముసలాయన తరఫున కొన్ని విన్నపాలూ పెట్టాడు. ఏవి ముసలాయన చెప్తున్నవో, ఏవి ముంతాజ్ చెప్తున్నవో తెలియని గజిబిజి! ఈ ముసలాయనకి ఉద్యోగం ఇవ్వాల్సిన అవశ్యకతను, అతను పడుతున్న కష్టాలను, కొన్ని రహస్యమైన కుటుంబ పరిస్థితులనూ బహిరంగపరిచాడు. ఆ వివరాలకూ ముసలాయన వంట పరిజ్ఞానానికీ సంబంధం ఏంటో నాకర్థంకాలేదు.

ఇంటర్‌వ్యూ ఒక కొలిక్కి వచ్చింది. అతని జవాబులు క్లుప్తంగానూ, నవ్వులు నిడివిగానూ వున్నాయి. నేనేదో మిలిటరీకి మనుషుల్ని ఎంపిక చేస్తున్నట్టుగా ఎవరో అతనికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా, ఇంకా స్టిఫ్‌గానే నిల్చుని ఉన్నాడు. అతని వంట పనితనం గురించిన సమాచారం మాత్రం ఇంటర్‌వ్యూ మొదలుపెట్టినప్పుడు ఎలాగైతే ఉందో ముగిసేటప్పుడూ అలానే ఉంది. మరోసారి అతణ్ణి, “మీకేం వంటలొచ్చు?” అని అడిగాను. అతను మళ్ళీ, “అన్నీ వచ్చు!” అనే అన్నాడు. టోరాబోరా కొండనుండి పెషావర్ దాకా తాను చేసిన ప్రయాణమంతా ఈ ఒక్క వాక్యాన్నే కంఠతా పట్టినట్టుగా ఉన్నాడు.

ఇతనితో ఎలారా దేవుడా అని నాలో సందిగ్ధం మొదలయ్యిన విషయం నా ముఖం చూసి పసిగట్టేసినట్టున్నాడు ముసలాయన. దీన్ని సుఖాంతం చేసుకోడానికి ఏదో ఒక యుక్తి తన మదిలో మెరిసి ముఖంలో వెలిగింది. ఆరు గంటలు చూపిస్తున్న గడియారపు ముల్లు తొమ్మిదికి తిరిగినట్టుగా, స్టిఫ్‌గా నిల్చుని ఉన్న మనిషి సర్రుమని పక్కకు వంగాడు. తన కమీజ్ అంచు అందుకుని పొట్ట పైదాకా లాగి సల్వార్ జేబులో చేయిపెట్టి ఏదో బయటకు తీశాడు. ఆశ్చర్యపడి పోవడానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. నీటిలో, చెమటలో, మరేరకమైన ద్రవంలోనూ తడిసిపోకుండా ఉండాలని చుట్టిపెట్టిన పాలిథిన్ కవర్ విప్పి, అందులోనుండి మరో పేపర్ కవర్ తీశాడు. బాగా పాతబడిపోయున్న ఆ కవర్‌ను నా చేతికిచ్చాడు. జాగ్రత్తగా ఆ కవర్ తెరచి అందులోని ఉత్తరాన్ని బైటికి తీశాను. అది ఎనిమిదిగా మడిచిన కాగితం. ఎప్పుడెప్పుడు ముక్కలుగా విడిపోయి గాలికి ఎగిరిపోతుందా అన్నంత అపాయకర స్థితిలో ఉంది ఆ లేఖ. మడతలని జాగ్రత్తగా సవరించి విప్పాను. తేదీ చూశాను. నేను పుట్టిందదే సంవత్సరంలో. ముసలాయన ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడు అతను చాకిరీ చేసిన తెల్లదొర రాసిన లేఖ అది. తన దగ్గర పనిచేసిన ఒకరి విశ్వాసానికీ పనితనానికీ సాక్ష్యం పడుతూ ఎన్నో ఏళ్ళక్రితం ఒక తెల్లదొర టైపు చేసి ఇచ్చిన లేఖ అది!

“To Who It May Concern” అని మొదలైంది.

‘ఇందుమూలాన చెప్పొచ్చేదేమిటంటే, ఈ లేఖను మీరు చదువుతున్నారంటే గులాం మొహమ్మద్ నజూరుద్దీన్ మీదగ్గర పనికోసం దరఖాస్తు పెట్టుకున్నాడని అర్థం. ఇతను నావద్ద రెండేళ్ళు వంటమనిషిగా పనిచేశాడు. ఇతనికి వంట రాదు. చాలా మంచి వ్యక్తి. మిగిలిన ఏ పని ఇచ్చినా చేస్తాడనే నమ్ముతాను.

విల్‌ఫ్రెడ్ స్మిత్ (సంతకం)’

క్లుప్తమయిన ఆ లేఖను ఎలా ఉన్నదో అలా చిరిగిపోకుండా కవర్లో పెట్టి అతనికందించాను. అతను ప్రపంచంలోని ఏ ఒక్క భాషనీ చదవడం రాయడం చేతకానివాడు అని తెలిసిపోయింది. అందులో ఏం రాసివుందో తెల్సుకోడానికి ఎటువంటీ ప్రయత్నమూ చెయ్యకనే ఇన్నేళ్ళుగా దాచుకున్న ఆ లేఖను రెండు చేతులతో తీసుకున్నాడు. సానుకూలమైన స్పందనకోసం నా ముఖంలోకి చూశాడు. ఇరవై సెకండ్లలో తనకివ్వబోతున్న ఉద్యోగ బాధ్యతలను చేపట్టాలన్న ఉత్సాహం ముసలాయన కళ్ళలో కనిపించింది. ముఖంలో విజయగర్వం. నోరు మరో రెండంగుళాలు పెద్దది చేసుకుని నవ్వాడు. అతను మోసుకొచ్చిన దానిమ్మ పండు రంగులో ఉంది ఆ నవ్వు!
(మూలం:‘టోరాబోరా సమయల్‌కారన్.’.)
-----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, 
మూలం: ఎ. ముత్తులింగం, 
ఈమాట సౌజన్యంతో 

Saturday, September 22, 2018

పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి(అనువాదకథ)


పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి(అనువాదకథ)






సాహితీమిత్రులారా!


ఈ అనువాదకథను
ఆస్వాదించండి...........

పాకిస్తాన్‌లో దిగి రెండు గంటలైనా కాలేదు, ఉద్యోగమిమ్మని నాచేతికి ఐదారు దరఖాస్తులొచ్చాయి. అప్పటికి నేనింకా ఆఫీసుకెళ్ళి రిపోర్టయినా చెయ్యలేదు. నా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి ఇంకా పదిహేను గంటల సమయం కూడా ఉంది. అయినా వినతి పత్రాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌ నుండి తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ దగ్గర్నుండి హోటల్ సిబ్బంది దాకా అందరూ ఉద్యోగం కోరుతూ అర్జీలిచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అందరూ అదివరకే తయారుచేసి పెట్టుకున్న దరఖాస్తు పత్రాలనివ్వటం. ‘ఏం ఉద్యోగంకోసం విన్నపం పెట్టుకుంటున్నారు?’ అనడిగితే, ‘ఏ పనైనా ఫరవాలేదు’ అన్నారు. వీళ్ళందరూ తెల్లవారుతూ ఇంటినుండి బయటికొచ్చేప్పుడే ఒకటి రెండు దరఖాస్తు పత్రాలు తయారుచేసుకుని బయలుదేరేలా ఉన్నారు.

పాకిస్తాన్‌లోని వాయవ్యప్రాంత నగరమైన పెషావర్‌లో నాకు ఉద్యోగం. నగరంలో ఏ మూలన చూసినా నటి శ్రీదేవి ముఖం కనిపిస్తోంది. ఎక్కడ కాస్త ఖాళీ ఉంటే అక్కడ శ్రీదేవి ఉన్న పోస్టర్‌ని చూడవచ్చు. ఆటోరిక్షాల వెనకున్న తెర మీద కూడా శ్రీదేవి నవ్వుతూ ఊగుతూ ఉంది. హిందీ సినిమాల్లో శ్రీదేవి పేరు మారుమోగుతున్న కాలం అది. పాకిస్తాన్‌లో అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆమె గనక పోటీ చేసి వుంటే కచ్చితంగా నెగ్గివుండేది. వాయవ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయుండేదేమో, ఎవరికి తెలుసు!

నేను బస చేసిన హోటల్‌ నుండి బయటకెళ్ళి ఇల్లు వెతుక్కోవాలంటే వందలాదిమంది బ్రోకర్‌లు ఉన్నారు. వాళ్ళు హోటలుకే వచ్చి నన్ను తీసుకెళ్ళి ఇళ్ళు చూపించేవారు. ఒకరితో వెళ్ళి చూసొచ్చాక మరొకరు వచ్చి తీసుకెళ్ళి అవే ఇళ్ళను చూపించేవారు. పాకిస్తాన్‌లో ఇల్లు వెతకడం బాగా అలుపొచ్చే పనే. అప్పటికే వర్షాకాలం మొదలైపోయుండడంవల్ల తలుపులన్నీ ఉబ్బి బిగుసుకుపోయున్నాయి. తలుపులను తోసి, కాదు, పగలగొట్టి తియ్యాల్సొచ్చింది. ఇంటిముందున్న ట్యూబ్ లైట్ స్విచ్ ఆన్ చేస్తే, ఇల్లంతా చూసి బయటికొచ్చేటప్పుడు అది వెలుగుతుంది.

ఒక ఇంటికి వెళ్ళినప్పుడు డైనింగ్ టేబిల్ మీద ప్లేట్లలో భోజనం సగం సగం తిన్న దశలో ఉంది. టేబుల్ కోళ్ళు నాలుగూ నీళ్ళు నింపిన నాలుగు డబ్బాలలో నానుతూ ఉన్నాయి. ఆ భోజనం తింటూ ఉన్న మనుషులు మాత్రం కనబడలేదు. దాన్ని తినలేని చీమలు కూడా కనబడలేదు. నెమ్మదిమీద తెలిసిందేంటంటే ఇళ్ళు చూపించేప్పుడు ఈ బ్రోకర్‌లు ఆ ఇంటి ఆడవాళ్ళనీ పిల్లల్నీ ఒక గదిలో పెట్టి తలుపేసేస్తున్నారని. ముఖ్యంగా యవ్వనంలో ఉన్న స్త్రీలను ఎవరి కంటా పడనీయరని. ఐదు గదులున్న ఒక ఇల్లు చూసేందుకు వెళ్ళామంటే బ్రోకర్ నాలుగు గదులనే చూపిస్తాడు. అన్ని గదులూ చూడటం సాధ్యం కాదు.

మొదటి వారం చూసిన వాటిలో నాకు ఒక్క ఇల్లూ దొరకలేదు. అయితే బ్రోకర్లు ఇచ్చిన ఉద్యోగ దరఖాస్తు పత్రాలు మాత్రం చాలానే పోగయ్యాయి. దానిలో ఒకటి సైరా దరఖాస్తు. చేతిరాతలో ఉన్న ఎన్నో అప్లికేషన్‌ల మధ్య ఆమెది మంచి కాగితంపై అందంగా అచ్చువేయబడి ఉంది. వివరాలవీ చక్కగా ఉన్నాయి. ఉద్యోగానికి అవసరమైన అర్హతలన్నీ ఉన్నాయి. ఇంటర్వ్యూకి పిలవబడినవారిలో ఆమె పేరు కూడా ఉంది. నేను ఊహించినట్టే మనిషి కూడా తేడాగానే ఉంది. వచ్చిన అమ్మాయిలందరూ బుర్ఖా ధరించి తల కప్పుకునే వచ్చారు. ఈమె బుర్ఖాలాంటిదేమీ వేసుకోలేదు. జుట్టు ఎడం వైపు సగం కంటిని కప్పుతూ జలపాతంలా జారుతోంది. నవ్వాలా వద్దా అన్నట్టు ముఖాన ఎల్లవేళలా అంటిపెట్టుకునున్న ఒక సన్నటి చిరునవ్వు. అడిగిన ప్రశ్నలు వేటికీ ఆమె టేబుల్‌కేసి చూస్తూ జవాబివ్వలేదు. ఆమె భుజాన పొడవైన లెదర్ సంచీ వేలాడుతూవుంది. లోపలికొచ్చినప్పుడూ, తిరిగి వెళ్ళేటప్పుడూ ఆమెలో ఆత్మవిశ్వాసం కనబడింది. అయినా ఏం ప్రయోజనం? ఆమెకు ఆ ఉద్యోగం దక్కలేదు.

మా ఆఫీసులో ఏ ఉద్యోగానికి ప్రకటన ఇచ్చినా తక్కువలో తక్కువ రెండువందలకు పైగానే దరఖాస్తులొచ్చేవి. వాటిని తిరగేస్తుంటే అందులో కచ్చితంగా సైరా దరఖాస్తు కూడా కనిపించేది. ఒక్క ప్రకటనని కూడా వదలదనుకుంటా. ఆమెను పదే పదే ఇంటర్వ్యూలలో చూడటంవల్ల ఆమె నాకు బాగానే పరిచయం అయింది. ఇంటర్వ్యూ పేనల్ అడిగే ప్రశ్నలన్నీ ఆమెకు కంఠోపాఠం. అన్నిటికీ సరిగ్గానే జవాబిచ్చేది. అయినప్పటికీ పేనల్‌ను ఆమె జయించలేకపోయేది.

సైరాకి ఇరవైరెండేళ్ళు. ఆమెకు పదహారేళ్ళప్పుడు పెళ్ళయ్యి, పదిహేడులో విడాకులొచ్చి, మళ్ళీ పెళ్ళి చేసుకుంటే, ఆ పెళ్ళి కూడా విఫలమైంది. పట్టుదలంటే ఏంటో ఆమెలో చూడవచ్చు. నాకు ఫోన్ చేసి ఏవైనా ప్రకటనలు రాబోతున్నాయా? ఆ వివరాలేంటీ? అనడిగేది. అయితే ఒక్కసారి కూడా పేనల్ నిర్ణయం ఏంటనో, తనకెందుకు ఆ ఉద్యోగం రాలేదనో అడిగేది కాదు.

ఒకరోజు నాకొక శుభలేఖ వచ్చింది. ఇంతకుముందు నన్నెవరూ అలా పెళ్ళికి పిలవలేదు. ఒక పాకిస్తాన్ వివాహం ఎలా జరుగుతుందో చూడాలన్న ఆశ ఉండేది నాకు. మరి కొందరు తోటి ఉద్యోగులూ ఆ పెళ్ళికి వెళ్తుండటంతో నేనూ వాళ్ళతో కలిసి వెళ్ళాను. అదే నేను మొట్టమొదట చూసిన మహమ్మదీయుల పెళ్ళి అనొచ్చు. సైరా చెల్లెలు పెళ్ళికూతురు. వాళ్ళ ఆచారం ప్రకారం వరుడూ వధువూ ఒకరినొకరు చూసుకోనేలేదు. విడివిడిగా కుర్‌ఆన్‌లో సంతకాలు చెయ్యడం మాత్రమే పెద్ద సంప్రదాయ వేడుకగా భావిస్తారు.

లాహోర్‌నుండి రప్పించిన అమ్మాయిల ముజ్రా నాట్యం రహస్యంగా జరిగింది. వాకిట ఇద్దరు తుపాకీలు పట్టుకుని రక్షణ ఇస్తున్నారు. పెషావర్‌లో ఇలాంటి డాన్సులకి అనుమతి లేదు. నలుగురు అమ్మాయిలూ ఎన్నో సినిమాల్లో మనం చూసినట్టే సినిమా పాటలకి డాన్సులు చేశారు. మగవాళ్ళు డబ్బు నోట్లను వాళ్ళమీద చల్లడం మొట్టమొదటసారి చూశాను. కొంచం తెగించిన మగరాయళ్ళు లేచి దగ్గరకెళ్ళి వాళ్ళ రవికల్లో నోట్లు దూర్చారు. ముజ్రా నాట్యం రాజస్తాన్‌లో పారంపర్యంగా కొనసాగుతున్న కళారూపం అని చెప్పారు. అయితే నేను చూసింది మాత్రం హిందీ సినిమాలు చూసి నేర్చుకుని ఆడిన అమ్మాయిల్నే!

సైరా నన్ను పిలిచి తన తల్లికీ తమ్ముడికీ పెళ్ళికూతురుకీ అందరికీ పరిచయం చేసింది. వాళ్ళందరికీ నా గురించి ముందే తెలుసని అర్థమయింది. నా గురించి సైరా చాలా చెప్పినట్టు చెప్పారు. ఉద్యోగ ప్రకటనలు ఏవైనా వస్తే వాటి గురించి ఆమె ఫోన్ చేసినప్పుడు తెలియజేయడం, ఆమె వచ్చినప్పుడు అప్లికేషన్ పారం ఇవ్వడమే నేను చేసిందల్లా! నా మీద అంత గౌరవభావం వచ్చేంతగా నేనేమీ చెయ్యలేదు తనకి. అయినప్పటికీ వాళ్ళ అభిమానాన్ని అంగీకరించాను.

ఒకరోజు సాయంత్రం ఐదుగంటల సమయంలో అప్లికేషన్ ఫారం తీసుకోడానికి వచ్చిన సైరా నన్ను చూడాలని అడిగిందట. నాకు బాగా గుర్తుంది. అంతకు కొన్ని గంటల క్రితమే ఒక భూకంపం వచ్చి మేమందరం భయపడిపోయున్నాము. మా ఆఫీసున్న నాలుగవ అంతస్తు ఒక్క క్షణం ఒక పక్కకి ఒరిగి, మళ్ళీ మరోవైపుకి ఒరిగి నేరుగా నిలబడింది. ఆఫీసులో సగంమంది భయపడి ఇళ్ళకెళ్ళిపోయారు.

ఈ అమ్మాయి వేరే గ్రహంనుండి వచ్చిన మనిషిలా ఏ కంగారూ లేకుండా కనిపించింది. నా ముందున్న కుర్చీలో కూర్చుని అప్లికేషన్ ఫారం నింపడం గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది. నేను చెప్పాను. కొంతసేపటికి ఏ ప్రశ్నా అడగడంలేదేమా అని తల పైకెత్తి చూస్తే ఆమె కళ్ళనిండా నీళ్ళు! పెదవులు పైకీ కిందకీ వణికాయిగానీ చిన్న ఏడుపు శబ్దమైనా బయటికి రాలేదు. ఆమె ఎంత నిబ్బరంగా దాచుకోవాలనుకున్నా కళ్ళలో నీళ్ళు మాత్రం ఆగట్లేదు. నేను కంగారుపడి, “ఏంటి, ఏమైంది?” అనడిగాను.

ఆమె నోరు మెదపడానికి ప్రయత్నించింది. ఆమెవల్ల కాలేదు. మాటలు మింగేస్తోంది.

“నాకెందుకు ఉద్యోగం రావడంలేదో నాకు తెలుసు.” అంది.

“ఎందుకు?”

“నా కట్టూబొట్టూ ఎవరికీ నచ్చదు. తలమీద ముసుగువేసుకుని రావాలని కోరుకుంటారు. రెండుసార్లు పెళ్ళిచేసుకుని విడిపోయినదాన్ని అన్నది మరో కారణం. అయినప్పటికీ నేనెందుకు ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నానంటే నా కొడుకుని క్రిష్టియన్ కాన్వెంట్‌‌లో చదివించడానికే…”

“మీకొక కొడుకున్నాడా?”

“ఐదేళ్ళు. తొలి భర్తకి పుట్టినవాడు. నా అప్లికేషన్‌లు చదివేవారు మీరొక్కరే. పేనల్లో ఉన్న అందరికీ నా అప్లికేషన్‌లో లేని మరెన్నో వివరాలు తెలుసు.”

మా ఆఫీసునుండి వెలువడే ప్రతి ఉద్యోగ ప్రకటనకీ నిరాశచెందకుండా దరఖాస్తు పంపిస్తుంది. ఆమెకున్న ఒకే ఒక జీవిత లక్ష్యం మా ఆఫీసులో ఏదో ఒక ఉద్యోగంలో చేరడమే అన్నట్టు ప్రవర్తిస్తోంది. ఒకసారి డ్రైవర్ ఉద్యోగానికి ప్రకటన ఇచ్చినప్పుడు కూడా దానికి దరఖాస్తు పెట్టింది. ఇంతకంటే తక్కువ అర్హతలున్న ఉద్యోగం మా ఆఫీసులో లేదు. చిట్టచివరి స్థాయిదైన ఈ ఉద్యోగం చెయ్యడానికి ఐక్యూ 150 ఉండాల్సిన అవసరంలేదు. అయినప్పటికీ ఆమె దరఖాస్తు పెట్టింది. ఆ ఉద్యోగం కూడా ఆమెకి రాలేదు. నాలుగేళ్ళు పూర్తయ్యి నేను పెషావర్ వదిలేసి వెళ్ళిపోయేప్పటికి కూడా ఆమె దరఖాస్తులు పెడుతూనే ఉంది.

పెషావర్‌లో మా పక్కింట్లో నివసించినతని పేరు అహ్మద్. పెద్ద బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసేవాడు. మంచి వ్యక్తి. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అన్న తేడాల్లేకుందా తెల్లవారు ఝామున బాతులు కాల్చడానికి వెళ్ళొచ్చాకే ఆఫీసుకెళ్ళేవాడు. నేను వీడ్కోలు తీసుకోడానికి వెళ్ళినప్పుడు ఎముకలు విరిగిపోయేంత గట్టిగా కౌగిలించుకుని వీడ్కోలిచ్చాడు. నేను కొన్ని వస్తువులు వదిలి వెళ్ళాల్సి వచ్చింది. వాటిని నాకు చేరవేస్తానని అతను హామీ ఇచ్చాడు. అమెరికాకి వచ్చాక అహ్మద్‌కు ఫోన్ చేశాను. అతను నన్ను మాట్లాడనివ్వలేదు. ఫోన్ తీయగానే, “మీకు ఒక పూలగుత్తి వచ్చింది!” అన్నాడు.

“పూలగుత్తా! నాకెవరు పంపిస్తారు?” అన్నాను.

“నిన్న ఒక అమ్మాయి వచ్చి ఒక పూలగుత్తి ఇచ్చి వెళ్ళింది. ఆమె పేరు సైరా. చాలా అందమైన అమ్మాయి!” అన్నాడు.

“పూలగుత్తిలో ఏం పువ్వులున్నాయి?” అడిగాను.

“కార్నేషన్ పువ్వులు మాత్రమే!”

“ఏం రంగువి?”

అతను “లేత ఎరుపు” అన్నాడు.

పువ్వుల నిఘంటువు ప్రకారం లేత ఎరుపు కార్నేషన్ పువ్వులకు ‘నిన్ను ఎప్పటికీ మరిచిపోను’ అని అర్థం. మగవాళ్ళు ఆడవాళ్ళకి పువ్వులు పంపించడం ఆనవాయితీ. నేను చదివిన నవలల్లోగానీ చూసిన సినిమాల్లోగానీ ఒక అమ్మాయి మగవాడికి పూలగుత్తి పంపించిన సందర్భం లేదు. చివరివరకు ఒక విచిత్రమైన మనిషిగానే సైరా అనిపించింది. దేశం వదిలి వెళ్ళిపోతున్న చివరి రోజున ఒక అమ్మాయి ఒక మగవాడికి కానుక ఇచ్చిందంటే, అది కచ్చితంగా దేన్నో ఆశించి అయుండదు.

మిత్రుడు ‘అందమైన అమ్మాయి’ అన్నాడు. అది తప్పు. ఆమె గొప్ప సౌందర్యవతి! ఇందులో బాధాకరమైనదేమిటంటే ఆమెకు అది తెలియదు. నేను పాకిస్తాన్‌లో చూసిన ఆడవారిలోనే ఆమెకంటే అందమైన అమ్మాయిని చూడలేదు. దేశం విడిచి వచ్చేప్పుడైనా ఆమెకు ఉద్యోగం ఎందుకు దొరకదోనన్న నిజమైన కారణాన్ని చెప్పి వుండవచ్చని నాకనిపించింది.

మిత్రుడు అహ్మద్ ‘ఉక్కిరిబిక్కిరి చేసే అందం!’ అని పదే పదే అనేవాడు. అది ఇదే. ఏ కోణంనుండి చూసినా ఆమె అందంగానే కనబడుతుంది. బైబిల్‌లో వచ్చే సాలమన్ కథలో రాచభవనంలో చలువరాయితో నిర్మించిన నేల గురించి ఒక ప్రస్తావన వుంటుంది. రాణి షీబా రాజుని చూడటానికి వచ్చినప్పుడు ఆ నేలను చూసి నీళ్ళేమోననుకొని తన దుస్తులని కొంచం పైకెత్తి పట్టుకుని నడిచిందట. ఆమె ముఖంకంటే ముందుగా ఆమె పాదాలను చూసి రాజు మోహించినట్టుగా కథ ఉంది. సైరా నన్ను మొట్టమొదటిసారి చూడటానికొచ్చినప్పుడు కాలిమీద కాలేసుకుని కూర్చుంది. సగం పాదం కనిపించే చెప్పులు వేసుకుంది. పాదం అంతలా మెరవడం అప్పుడే చూశాను. ఆమెకు ఉద్యోగం దొరక్కపోవడానికి కారణం ఆమెకున్న అపారమైన అందమే. ఆమెకున్న అంత అందాన్ని అమ్మాయిలే భరించలేరు. ఆమెతో పని చేసేవాళ్ళు ఓర్వలేరు. అంత అందాన్ని ఆఫీసే ఓర్వదు.

చాలాకాలం తర్వాత అరబిక్ తెలిసిన ఒక మిత్రుడు సైరా అంటే ‘నవ్వు చెదరనిది’ అని ఒక అర్థం ఉన్నట్టు చెప్పాడు. ఆమె పువ్వులు తీసుకుని నన్ను చూడాలని వచ్చినప్పుడు కూడా కచ్చితంగా ఆమె పెదవులమీద ఆ చిరునవ్వు అలానే ఉండి ఉంటుంది. ఏడున్నరకి వచ్చిందని అహ్మద్ చెప్పినట్టు గుర్తు. నేను అప్పుడు అట్లాంటిక్ సముద్రం మీద న్యూయార్క్‌కు వెళ్తున్న విమానంలో 35000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నాను.                       
-----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, 
మూలం: ఎ. ముత్తులింగం 
(మూలం:‘పూంగొత్తు కొడుత్త పెణ్’.), 
ఈమాట సౌజన్యంతో